తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 233


రేకు: 0233-01 రామక్రియ సం: 03-186 దశావతారములు

పల్లవి:

ఎదిరించి పోట్లాడ నెవ్వరితరము లిఁక
త్రిదశవంద్యుఁడు హరిఁ దేరి చూడఁగలరా

చ. 1:

ఘాత మీస మదరితే గగ్గులకాడవుదురు
యీతఁడు దలచూపితే నెదిరించ రరులు
ఆతురాన గొరిశరాయడికి నోపఁగలేరు
చేతిగోరు మీటితేనే ఛిన్నభిన్న మవుదురు

చ. 2:

పైపై నితఁ డడుగిడ పాతాళానఁ గుంగుదురు
కోపించినంత నెత్తురుగుండాల పాలౌదురు
తూపు చేత నంటితేనే తుత్తుమురై పారుదురు
రాపునీలికాశ గంటే రణభీతి గొందురు

చ. 3:

మంతన మీతఁ డాడితే మానము గోలుపోదురు
కొంత గుఱ్ఱ మెక్కితేనే గుంటఁ గూలిపోదురు
యింతటా శ్రీవేంకటేశుఁ డెక్కడఁ జూచినఁ దానే
వింత ప్రతాపముతోడ విఱ్ఱవీఁగీ నిదివో


రేకు: 0233-02 వరాళి సం: 03-187 భక్తి

పల్లవి:

కలిమి గలిగియు నధమగతి యదేల
బలిమి గలిగియు లోఁగి బతిమాలనేల

చ. 1:

ఇలువేలుపొకఁడు హరి ఇంటనే వుండఁగా
పలు వేలుపులతోడి భ్రమతలేల
మెలఁగి సూర్యు డొక్కఁడు మిక్కిలిని వెలుఁగఁగా
వెల లేని దీపములు వేయి నేమిటికి

చ. 2:

హరిభక్తి యొక్కటే ఆత్మలో నుండగా
పరయుక్తు లెంచేటి పనులేల
సిరులఁ జింతామణటు చేతిలో నుండఁగా
సరి గాజుఁబూస మెచ్చఁగ నదేమిటికి

చ. 3:

నాలుకను మంచి హరినామ మొకటుండగా
గాలిఁ బోయెటి వూరగాథ లేల
యీలీల శ్రీవేంకటేశుఁ డెదుటనె వుండగా
మూలలకుఁ జేచాఁచి మొక్క నిఁకనేలా


రేకు: 0233-03 గుండక్రియ సం: 03-188 శరణాగతి

పల్లవి:

నీవే యెరిఁగి సేయు నీ చిత్తము వచ్చినట్టు
తావులఁ గొసరేనన్నా తనివోదు నాకు

చ. 1:

హరి నిన్ను నమ్మితి నే నననెట్టు వచ్చు నాకు
ఇరవైన బుద్ధి నా ఇచ్చగాదు
వెరవున నొకటి నే విన్నవించెదనంటేను
సరి నీవు వెలిగాను స్వతంత్రుఁడఁ గాను

చ. 2:

యిట్టె నీపై భారము నే నెట్టు వేయఁగవచ్చు
పట్టి నీకుఁ బురుషార్థపరుఁడఁ గాను
గుట్టుతోడ నే నిన్నుఁ గొలువఁగఁ గొలువఁగఁ
యెట్టైనాఁ గానిమ్ము యెరఁగ నెవ్వరిని

చ. 3:

యింతటి దైవమవు ని న్నిఁక నెందు వెదకేను
చెంత శరణాగతుల చేతివాఁడవు
వింతగాదు నీకును శ్రీవేంకటేశ నాకును
అంతర్యామివి నీయానతిలో వాఁడను


రేకు: 0233-04 బౌళి సం: 03-189 శరణాగతి

పల్లవి:

ఇట్టి యవివేకబుద్ధి యే పనికి వచ్చునిఁక
జట్టిగొని నాగుణము చక్కఁజేయఁ గదవే

చ. 1:

హరి నీయిచ్చఁ బ్రపంచమంతా నీవు నడపఁగ
అరసి నీశక్తి దలియక నమ్మక
వెర వెరఁగనియట్టి వెఱ్ఱివాఁడ నే నొక్క-
దొరనంటాఁ బనుల కుద్యోగించేను

చ. 2:

అంతరాత్మవై నీవు అన్నియుఁ బెర రేఁచఁగ
బంతినే నీ మహిమెల్లా భావించక
చెంత నీసంసారము సేసేవాఁడ నే నంటా
దొంతుల కోరికలతోఁ దూరిపారేను

చ. 3:

ఆదినుండి స్వతంత్రుఁడవై యేలినట్టి నిన్ను
సోదించి శరణు నాఁడే చొరఁగలేక
యీదెస శ్రీవేంకటేశ యిప్పుడు నీదాఁసుడనై
నీ దయ కలిమితోడ నేఁడు మొక్కేను


రేకు: 0233-05 లలిత సం: 03-190 ఉపమానములు

పల్లవి:

ఓపితేఁ దానే తగిలి వోపకున్నఁ దానే మాని
మాపురేపు నలయించే మాయ మాకేలా

చ. 1:

చింతాయకుఁడగు(?) హరి చిత్తములో నుండఁగాను
వింతవింత విచారాల వెఱ్ఱి మాకేలా
చెంతల పరుసవేది చేతిలోనే వుండఁగాను
దొంతరవిద్యలతోడి దోవ మాకేలా

చ. 2:

తోడునీడై యచ్యుతుఁడు తొలఁగక వుండఁగాను
జాడ దప్పి తిరిగేటి జాలి మా కేలా
యేడనో కోకలు వేసి యేమియు నెరఁగలేక
వేడుకతో కొక్కెరాలవెంట మాకేలా

చ. 3:

వెల్లవిరై యెదుట శ్రీవేంకటేశుఁ డుండఁగాను
బల్లిదుఁ డీతనిఁ బాసి భ్రమ మాకేలా
యెల్ల ధాన్యములు మా యింటిలో నుండఁగాను
పాల్లి కట్టు దంచేమని బుద్ధి మాకేలా


రేకు: 0233-06 గుజ్జరి సం: 03-191 వైష్ణవ భక్తి

పల్లవి:

మాకేమి నీకరుణ మహాప్రసాదమనేము
నీకు నీదాసుల చేతినింద బెట్టుగాదా

చ. 1:

పమ్మి మిమ్ముఁ గొలిచినబంట్లఁ బరులు దమ
సొమ్మనుచుఁ దియ్యగాఁ జూచేదా
వుమ్మడి నీవిందుకెల్లా నూరకున్నఁగన మిమ్ము
నమ్ముమన్న వేదాలయానతి కొంచెపడదా

చ. 2:

నీముద్ర మోచినవారి నీచులు దడవఁగాను
యీమేర నడ్డమురాక యిట్లుండేదా
వోమక నీవీవేళ నూరకున్న నల్లనాఁటి-
సామజముఁ గాచినది సందేహించఁబడదా

చ. 3:

మీరు మన్నించినవారు మీవాకిలి గావ కేడో-
వారి వాకిలి గావఁగా వద్దనరాదా
నేరిచి శ్రీవేంకటేశ నేఁడు నన్ను గావకున్న
ధారుణి మీ దయే మిమ్ముఁ దప్పులెంచుకొనదా