తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 220
రేకు: 0220-01 గుజ్జరి సం: 03-108 శరణాగతి
పల్లవి:
అయ్యో సదా మత్తుఁడను హరి నీ దాసులు నన్ను
ఇయ్యెడనే దయఁజూచి యీడేర్చిరిఁ గాక
చ. 1:
తెగక కన్నులుమూసి దేహము మఱచేవాఁడ
నిగిడి దేవుఁడవని నిన్నెరిఁగేనా
తగఁ బసిఁడి చూచి నే ధర్మము మరచేవాఁడ
జగతి విజ్ఞానము సరవెరిఁగేనా
చ. 2:
వలచి సతులనేటి వలలఁ బడేటివాఁడ
మలసి తప్పించుక నీ మాయ దాఁటేనా
వెలయ నన్నీఁ జదివి వివేకమొల్లనివాఁడ
చలివాసి నీభక్తి చవిగొనేనా
చ. 3:
మించు సంసారము చొచ్చి మీఁదు దెలియనివాఁడ-
నంచ నీ వంతర్యామివని మొక్కేనా
యెంచక శ్రీవేంకటేశ ఇటు నన్ను నేలితివి
మంచిదాయ నిఁక నిది మానబొయ్యేనా
రేకు: 0220-02 గుండక్రియ సం: 03-109 అధ్యాత్మ
పల్లవి:
గోవింద హరిగోవింద గునిసి యాడుదం జటురారో
ఆవటించి మనమెట్టు గడచెదము ఆశ్చరియంబిది హరిమాయా
చ. 1:
కర్మానుగుణము కాలము
ధర్మానుగుణము దైవము
మర్మము రెంటికి మనుజుఁడు
అర్మిలిఁ బొదిగీ హరిమాయా
చ. 2:
అజ్ఞానహేతువు లాసలు
విజ్ఞానహేతువు విరతొకటి
తజ్ఞులు రెంటిఁ దగిలిరి (?)
జిజ్ఞాను(సు?) గప్పెను శ్రీహరిమాయా
చ. 3:
సకలకారణము సంసారము
ప్రకటకారణము ప్రపంచము (?)
అకటా శ్రీవేంకటాద్రీశుదాసులు
వొకరిఁ దడవదువో హరిమాయా
రేకు: 0220-03 శంకరాభరణం సం: 03-110 వైరాగ్య చింత
పల్లవి:
ఉడివోని సంసారాన నున్నారము నట్ట-
నడుమాయ నవ్వులకు నాబ్రతుకు
చ. 1:
పుట్టని జన్మము లేదు పొందని భోగము లేదు
నెట్టన మాయలఁ జిక్కి నేఁ దొల్లి
కొట్టఁగొన కెక్కలేదు కోరి మొదలను లేదు
నట్టనడుమ నున్నది నాబ్రదుకు
చ. 2:
చొరని లోకము లేదు చూడని విద్యలు లేదు
నిరతి మాయలఁ జిక్కి నేఁ దొల్లి
దరి చేరుటా లేదు తగులు లేదు నానాఁడు
నరకమే కురిసీని నాబ్రదుకు
చ. 3:
చేయని కర్మము లేదు చెందని ఫలము లేదు
నీయిచ్చ మాయలఁ జిక్కి నేఁ దొల్లి
యీయెడ శ్రీవేంకటేశ యిట్టె నీవు నన్నేలఁగా
నాయిచ్చ సఫలమాయ నాబ్రదుకు
రేకు: 0220-04 గుండక్రియ సం: 03-111 అధ్యాత్మ
పల్లవి:
ఒక్కటి తరువాత వేరొకటై కాచుకుండు
చక్క దెరనాటకము సంగతి సంసారము
చ. 1:
వొండె నాపద దీరితే నొండె సంపదైనా వచ్చు
అండ నెన్నఁడుఁ దీరదు హరిఁ దలఁచ
తండోపతండములై తలమోపులు పనులు
చండిపెట్టి పనిగొను సంసారము
చ. 2:
పాప మొల్లనంటేను బలుపుణ్యమై తగులు
యేపొద్దుఁ దీరదు హరి నిటు దలఁచ
వోపనన్నాఁ బోనీదు వూరకైనఁ బనిగొను
చాపకింది నీరువలె సంసారము
చ. 3:
పగలెల్లా నలసితే పైకొను రాతిరి నిద్ర
అగపడ దెప్పుడును హరిఁ దలఁచ
తగిలి శ్రీవేంకటాద్రి దైవమే పొడచూపఁగా
జగడము సంతమాయ సంసారము
రేకు: 0220-05 ముఖారి సం: 03-112 కృష్ణ
పల్లవి:
ఆడరమ్మ పాడరమ్మ అందరు మీరు
వేడుక సంతసములు వెల్లవిరియాయను
చ. 1:
కమలనాభుడు పుట్టె గంసుని మదమణఁచ
తిమిరి దేవకిదేవి దేహమందును
అమరులకు మునుల కభయమిచ్చె నితఁడు
కొమరె గొల్లతలపై గోరికలు నిలిపె
చ. 2:
రేయిఁ బగలుగఁ జేసి రేపల్లెఁ బెరుగఁజొచ్చె
ఆయెడ నావులఁ గాచె నాదిమూలము
యీయెడ లోకాలు చూపె నిట్టే తనకడుపులో
మాయ సేసి యిందరిలో మనుజుఁడై నిలిచె
చ. 3:
బాలలీలలు నటించి బహుదైవికము మించె
పాలువెన్నలు దొంగిలెఁ బరమమూర్తి
తాళి భూభార మణఁచె ధర్మము పరిపాలించె
మేలిమి శ్రీవేంకటాద్రిమీఁద నిట్టె నిలిచె
రేకు: 0220-06 ధన్నాసి సం: 03-113 కృష్ణ
పల్లవి:
అంతవాని కింతసేయ నమరునటే
వింతలు యీసుద్దులకే వెరగయ్యీ మాకు
చ. 1:
కదిసి బ్రహ్మాండములు గర్భములోనున్నదేవుఁ-
డిదె దేవకి గర్భాన నెట్టు పుట్టెనే
అదె మఱ్ఱాకుమీఁదట నటు పవ్వళించువాఁడు
యెదుట యశోదచేత నెట్టు వినోదించీనే
చ. 2:
అడుగులుమూఁట లోకాలటు గొలచినవాఁడు
బడిబడి రేపల్లెఁ బారాడీని
అడరి యజ్ఞభాగము లారగించే దేవుఁడు
సడితో వెన్న ముచ్చిలి చవిగొనీనిదివో
చ. 3:
వేదపల్లవములందు విహరించే దేవుఁడు
సాదుగొల్లెతల రతిసంగడిఁ జిక్కె
మోదపు వైకుంఠాన ముదమందే కృష్ణుడు
యీదెస శ్రీవేంకటాద్రి నిరవాయ నిదివో