తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 385
రేకు: 0385-01 రామక్రియ సం: 04-492 నృసింహ
పల్లవి:
కొలువరో మొక్కరో కోరినవరము లిచ్చీ
సులభుఁ డిన్నిటా వీఁడె సుగ్రీవ నరహరి
చ. 1:
కంబములోనఁ బుట్టి కనకదైత్యునిఁ గొట్టి
అంబరపు దేవతల కభయ మిచ్చి
పంబి సిరిఁ దన తొడపైఁ బెట్టుక మాటలాడీ
అంబుజాక్షుఁ డైనట్టి యాదమ నరహరి
చ. 2:
నానా భూషణము లున్నతి తోడ నిడుకొని
పూనికతో ప్రహ్లాదుని బుజ్జగించి
మానవులకెల్లను మన్నన చాలా నొసఁగి
ఆనందముతో నున్నాడుఁ అదిగో నరహరి
చ. 3:
మిక్కిలి ప్రతాపముతో మించిన కాంతులతోడ
అక్కజపు మహిమల నలరుచును
తక్కక శ్రీ వేంకటాద్రిఁ దావుకొని వరాలిచ్చీ
చక్కఁదనముల కెల్లాఁజక్కని నరహరి
రేకు: 0385-02 సాళంగనాట సం: 04-493 హనుమ
పల్లవి:
ఈతని దెంతప్రతాప మీతని దెంతవుదుట
యీతఁడు రామునిబంటు యీతని సేవించరో
చ. 1:
వుదయాస్త నగముల కొకజంగ చాఁచినాఁడు
చదివె రవితో సర్వ శాస్త్రములు
తుద బ్రహ్మాండము మోవఁ దోఁక మీఁది కెత్తినాఁడు
పెద పెద కోరల పెను హనుమంతుఁడు
చ. 2:
కుడిచేత దనుజులఁ గొట్ట నూఁకించినాఁడు
యెడమచేఁ బండ్లగొల పిడికిలించె
వుడుమండలము మోవ నున్నతిఁ బెరిగినాఁడు
బెడితపు మేనితోడఁ బెనుహనుమంతుఁడు
చ. 3:
పుట్టుఁ గవచ కుండలంబులతోడ నున్నవాఁడు
గట్టి బ్రహ్మపట్టానకుఁ గాచుకున్నాఁడు
ఇట్టే శ్రీ వేంకటేశు నెదుటఁ బనులు సేసీ
బెట్టిదపు సంతోసానఁ బెనుహనుమంతుఁడు
రేకు: 0385-03 లలిత సం: 04-494 రామ
పల్లవి:
నమో నమో జగదేకనాథ తవ సర్వేశ
విమల విశ్రుత అసద్విఖ్యాతకీర్తే
చ. 1:
రామ రఘువర సిత రాజీవ లోచన
భూమిజా రమణ త్రిభువన విజయ
కోమలాంగ శ్యామ కోవిద రణరంగ
భీమ విక్రమ సత్యబిరుద ప్రవీణ
చ. 2:
దళిత దైతేయ కోదండ దీక్షాదక్ష
జలజాప్తకుల విభీషణ రక్షక
కలిత దశరథ తనయ కౌసల్యానంద
సులభ వానర ముఖ్య సుగ్రీవ వరద
చ. 3:
చారులక్ష్మణ భరత శత్రఘ్నపూర్వజ
తారక బ్రహ్మ నిత్య స్వరూప
ధీర శ్రీ వేంకటాధిప భక్తవత్సల
భూరిగుణ సాకేత పుర నివాసా
రేకు: 0385-04 నాట సం: 04-495 నృసింహ
పల్లవి:
ఎక్కడఁ జొచ్చెదరింక రక్కసులు
చిక్కి చెడుఁడు నరసింహునిచేత
చ. 1:
వుడుగని కోపపుటుగ్రపుఁ జూపుల
మిడుగురు లెగయఁగ మిన్నంది
పిడుగుల మ్రోఁతలఁ బెళపెళ నార్చుచు
వెడలెఁ గంభమున వీరసింహుఁడు
చ. 2:
కాలాగ్ని కీలలు గక్కెడి చక్రము
కేలఁ బూని కుల గిరు లదర
భాల లోచనము ప్రకటింపుచు లయ -
కాలుఁడై వెలసెఁ గడిఁది సింహుఁడు
చ. 3:
కుటిల నఖంబుల ఘోరాకారత
తొట తొట నెత్తురు దొరుగఁగను
చటుల దానవులఁ జదుపుచు శ్రీవేం-
కటమున నిలిచె సాకారసింహుఁడు
రేకు: 0385-05 గుజ్జరి సం: 04-496 మనసా
పల్లవి:
కొండవంటి దేవుఁడు నేఁ గొలిచే దేవుఁడు వీఁడే
నిండుకున్నాఁడు తలఁచు నెమ్మదినో మనసా
చ. 1:
నన్నుఁ బుట్టించే దేవుఁడు నాలోనున్నాఁడు దేవుఁడు
కన్నచోటులనే వుండే కాచే దేవుఁడు
వెన్నతోఁబెంచే దేవుఁడు వివేకమిచ్చే దేవుఁడు
యెన్నెని పొగడవచ్చు యీతఁడే మా దేవుఁడు
చ. 2:
సిరులిచ్చన దేవుఁడు సేవగొనేటి దేవుఁడు
గురుఁడై బోధించి చేకొన్న దేవుఁడు
మరిగించిన దేవుఁడు మాటలాడించే దేవుఁడు
ఇరవై మాయింటనున్నాఁడీ దేవుఁడు
చ. 3:
దాపుదండైన దేవుఁడు దరిచేర్చిన దేవుఁడు
రూపు చూపె నిదివో బోరున దేవుఁడు
శ్రీ పతియైన దేవుఁడు శ్రీ వేంకటాద్రి దేవుఁడు
చేపట్టి మమ్మేలినాఁడు చేచేతనే దేవుఁడు
రేకు: 0385-06 సామంతం సం: 04-497 నృసింహ
పల్లవి:
ఔనయ్య జాణఁడవు ప్రహ్లాదవరదా
ఆసలు వెట్టకుము ప్రహ్లాదవరదా
చ. 1:
వేసరక శ్రీ సతితో వేడుక నవ్వులు నవ్వి
ఆసలు చూపేవు ప్రహ్లాదవరదా
సేసవెట్టిన చేతుల చెఱఁగువట్టి తీసేవు
ఆ సుద్దులే చెప్పేను ప్రహ్లాదవరదా
చ. 2:
నంటునఁ దొడమీఁదను నలినాక్షి నెక్కించుక
అంటేవు సిగ్గులు ప్రహ్లాదవరదా
గెంటక యేపొద్దును కేలుగేలుఁ గీలించుక
అంటువాయ వదివో ప్రహ్లాదవరదా
చ. 3:
కందువతోఁ గాఁగిలించి కైవసము సేసుకొంటి -
నందముగ నీకెను ప్రహ్లాదవరదా
పొంది శ్రీవేంకటమున పొంచి యౌభళములోనా
అంది వరాలిచ్చేవు ప్రహ్లాదవరదా