తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 386
రేకు: 0386-01 రామక్రియ సం: 04-498 కృష్ణ
పల్లవి:
కంటిఁగంటి వీఁడివో కని కృతార్థుఁడనైతి
వింటి నిందరిచేతా నీ విట్ఠలేశు సుద్దులు
చ. 1:
యీతఁడా గోవర్ధనమెత్తిన పసిబాలుఁడు
కాతరీఁ డీతఁడా గోపికా వల్లభుఁడు
పూతన నీతఁడా పట్టి పొరిగొన్నయట్టివాఁడు
చేత గచ్చకాయలాడీ శ్రీ విట్ఠలేశుఁడు
చ. 2:
యీ దేవుఁడా కుచేలుని కిష్ట సంపదిచ్చినాఁడు
పోదిగొని యీ దేవుఁడా భూభార మడఁచినాఁడు
వేదమయుఁ డీ దేవుఁడా విశ్వరూపు చూపినాఁడు
సేదదేరీ మహిమల శ్రీ విట్ఠలేశుఁడు
చ. 3:
యీ మూరితా పాండురంగ మిరవై వుండినవాఁడు
కామించీ మూరితి శ్రీ వేంకటగిరి నున్నవాఁడు
దోమటి నీమూరితే యాధ్యులుపాట మెచ్చినాఁడు
క్షేమముతో వరాలిచ్చీ శ్రీ విట్ఠలేశుఁడు
రేకు: 0386-02 నాట సం: 04-499 హనుమ
పల్లవి:
సరిలే రితనికి సాహస విక్రముఁ డీతఁ -
డరయ కలశాపుర హనుమంతుఁడు
చ. 1:
వుదధి లఘించినాఁడు వుబ్బున మైనాకముచే
పొదలి నట్ట నడుమఁ బూజ గొన్నాఁడు
సదరాననే లంక సాధించి వచ్చినాఁడు
అదివో కలశాపుర హనుమంతుఁడు
చ. 2:
సంజీవి దెచ్చినాఁడు సమరరంగమందు
భంజించి వానరుల బదికించినాఁడు
అంజనీదేవికిఁ గొడుకైనాఁడు యేపనుల-
నంజఁడు కలశాపుర హనుమంతుఁడు
చ. 3:
బలు రాకాసులనెల్లా పట్టి చదిపినవాఁడు
ఇల రామునికిఁ గడు హితుఁడైనాఁడు
చెలఁగి శ్రీ వేంకటేశు సేవ సేయుచున్నవాఁడు
అలరి కలశాపుర హనుమంతుఁడు
రేకు: 0386-03 సాళంగనాట సం: 04-500 నృసింహ
పల్లవి:
సేవించరో జనులాల చేతులెత్తి మొక్కరో
వావిరిఁ బ్రహ్లాదునికి వరదుఁడు వీఁడే
చ. 1:
జగన్నాథుఁడు వీఁడే సర్వరక్షకుఁడు వీఁడే
నిగమవేద్యుఁడైన నిత్యుఁడు వీఁడే
సగుణవంతుఁడు వీఁడే సర్వకాముఁడు వీఁడే
నగు మొగము సుగ్రీవ నరసింహుఁడు వీఁడే
చ. 2:
మరు జనకుఁడు వీఁడే మహిమాధికుఁడు వీఁడే
పరగ శ్రీ లక్ష్మీపతి వీఁడే
సురల కేలికె వీఁడే శుభ మూరితి వీఁడే
నరసఖుఁడ సుగ్రీవ నరసింహుఁడు వీఁడే
చ. 3:
భువనాధిపతి వీఁడే పురుషోత్తముఁడు వీఁడే
వివిధ ప్రతాప కోవిదుఁడు వీఁడే
ఇవల శ్రీ వేంకటాద్రి నిరవైనతఁడు వీఁడే
నవమూర్తి సుగ్రీవ నరసింహుఁడు వీఁడే
రేకు: 0386-04 బౌళి సం: 04-501 హనుమ
పల్లవి:
ఎంతని పొగడవచ్చు నితని ప్రతాపము
పంతము లెల్లా మెరసి ప్రతాపించీ వాఁడే
చ. 1:
చేతులనే పెరికి సంజీవి కొండ దెచ్చినాఁడు
ఆతఁడువో తొల్లి పెద్ద హనుమంతుఁడు
ఘాతలఁ దానొక్కఁడే లంక సాధించి వార్ధి దాఁటి
యీతలకి వచ్చినాఁడు ఇదివో వాఁడే
చ. 2:
ముదమున బ్రహ్మ లోకము దాఁకాఁ బెరిగినాఁడు
అదివో ఇప్పుడు పెద్ద హనుమంతుఁడు
వదలక తోఁక చక్రవాళ పర్వతము వెంటా
వుదుటునఁ జుట్టుకొని వున్నాఁడు వాఁడే
చ. 3:
మెల్లనే జంగ చాచి మెడ నిక్కించుకొన్నాఁడు
అల్లదివో మించే పెద్ద హనుమంతుఁడు
వెల్లవిరైనాఁడు శ్రీ వేంకటేశ్వరుని బంటై
చల్లఁగా లోకములేలీ సంతతము వాఁడే
రేకు: 0386-05 పాడి సం: 04-502 రామ
పల్లవి:
ఎంత ప్రతాపము వాఁడు యెంతటి నేరుపరి
యెంతని పొగడవచ్చు నీ రాముని
చ. 1:
వాలి నొక్క కోలనేసి వారిధి గట్టిన వాఁడు
తాలిమితో సుగ్రీవుని లాలించినాఁడు
పాలించి విభీషణునిఁ బట్టము గట్టిన వాఁడు
యేలుమని లంక కెల్లా నీ రాముఁడు
చ. 2:
కుచ్చి పర మొండెముగా కుంభ కర్ణుఁ గొట్టినాఁడు
హెచ్చి రాకాసులఁ జంపె నీ రాముఁడు
తచ్చి రావణాసురుని తలలు చెండాడినాఁడు
ఇచ్చ కొలఁదుల నిట్టె యీ రాముఁడు
చ. 3:
సీత తో విమాన మెక్కి చేరి యయోధ్యకు వచ్చి
యీతలఁ బట్ట మేలినాఁ డీ రాముఁడు
శ్రీ తరుణితోఁగూడి శ్రీ వేంకటేశుఁడైనాఁడు
యీతఁడే దరసించరో యీరాముఁడు
రేకు: 0386-06 లలిత సం: 04-503 రామ
పల్లవి:
సర్వరక్షకుఁడైన సర్వేశుఁడేకాక
వుర్విమీఁద నందరిలో నొక్కఁడా రాముఁడు
చ. 1:
కొండ పొడవులైన ఘోర వానర బలము
గుండుగా వారిధి దండఁ గూడఁబెట్టి
నిండు జెలనిధి గట్టి నిగిడి లంక సాధించె
అండనే రాముఁడు నరుఁ డనవచ్చునా
చ. 2:
అన్నిటా దేవతలకు నసాధ్యమైన రావణు -
నెన్నికగాఁ బుత్ర మిత్ర హితుల తోడ
పన్నుకొని శస్త్రాస్త్ర పంక్తులనే ఖండించె
సన్నుతి నిట్టే రాముని జనుఁడన వచ్చునా
చ. 3:
చలపట్టి లంక విభీషణునికిఁ బాలించి
బలువుగ సీతఁగూడి పట్టమేలి
యిలలో శ్రీ వేంకటాద్రి నిరవై లోకము గాచీ
నలువంక రాముఁడు నరుఁడనవచ్చునా