తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 384
రేకు: 0384-01 దేవగాంధారి సం: 04-487 గురు వందన, నృసింహ
పల్లవి:
నమ్మితిఁజుమ్మీ వోమనసా నాకే హితవయి మెలంగుమీ
ముమ్మాటికి నేఁ జెప్పితిఁజుమ్మీ మురహరునామమే జపంచుమీ
చ. 1:
తలఁచకుమీ యితరధర్మములు తత్వజ్ఞానము మఱవకుమీ
కలఁగకుమీ యేపనికైనను కడుశాంతంబుననుండుమీ
వలవకుమీ వనితలకెప్పుడు వైరాగ్యంబున నుండుమీ
కొలువకుమీ యితరదైవములు గోవిందునినే భజించుమీ
చ. 2:
కోరకుమీ దేహభోగములు గొనకొని తపమే చేకొనుమీ
మీరకుమీ గురువులయానతి మెఱయఁ బురాణములే వినుమీ
చేరకుమీ దుర్జనసంగతి జితేంద్రియుఁడవై నిలువుమీ
దూరకుమీ కర్మఫలంబును ధ్రువవరదునినే నుతించుమీ
చ. 3:
వెఱవకుమీ పుట్టుగులకు మరి వివేకించి ధీరుఁడవగుమీ
మఱవకుమీ యలమేల్మంగకుమగఁడగుశ్రీవేంకటపతిని
కెఱలకుమీ మాయారతులను కేవలసాత్వికుఁడవుగమ్మీ
తొఱలకుమీ నేరములను సింధురక్షకునినే సేవించుమీ
రేకు: 0384-02 సాళంగనాట సం: 04-488 నృసింహ
పల్లవి:
దాసుల పాలిటి విధానమై వున్నాఁ డదిగో
ఆసాబాసా నితఁడే అహోబలేశుఁడు
చ. 1:
నగె నదె వాఁడిగో నారసింహదేవుఁడు
పగదీర హిరణ్యాక్షుఁ బట్టి చించి
మృగరూపై గద్దెమీఁద మెఱసీవాఁ డదిగో
అగవూఁ దగవెఱిఁగి యహోబలేశుఁడు
చ. 2:
తేరిచూచీ నదిగో దేవాదిదేవుఁడు
ఘోరపు నెత్తురు గోళ్ళఁ గురియఁగాను
నేరుపుతోఁ బేగుల జన్నిదాలవాఁ డదిగో
ఆరితేరి కొలువున్నాఁ డహోబలేశుఁడు
చ. 3:
కరుణించీవాఁ డదిగో కమలాపతి దేవుఁడు
సురలు గొలువఁగాను సొంపుతోడను
యిరవై లోకములెల్లా నేలుచున్నాఁ డదిగో
హరి శ్రీవేంకటాద్రియహోబలేశుఁడు
రేకు: 0384-03 సామంతం సం: 04-489 నృసింహ
పల్లవి:
సముఖా యెచ్చరిక వో సర్వేశ్వరా
అమరె నీ కొలువు ప్రహ్లాదవరదా
చ. 1:
తొడమీఁదఁ గూచున్నది తొయ్యలి యిందిరాదేవి
బడిఁ జెలులు సోబానఁ బాడేరు
నడుమ వీణె వాఇంచీ నారదుఁ డల్లవాఁడె
అడరి చిత్తగించు ప్రహ్లాదవరదా
చ. 2:
గరుడోరగాదు లూడిగములు నీకుఁ జేసేరు
యిరుమేలాఁ గొలిచేరు యింద్రాదులు
పరమేష్టి యొకవంక పనులు విన్నవించీ
అరసి చిత్తగించు ప్రహ్లాదవరదా
చ. 3:
పొదిగొని మిమ్మునిట్టే పూజించేరు మునులెల్లా
కదిసి పాడేరు నిన్ను గంధర్వులు
ముదమున నహోబలమునను శ్రీ వేంకటాద్రి -
నదె చిత్తగించుము ప్రహ్లాదవరదా
రేకు: 0384-04 మాళవిగౌళ సం: 04-490 హనుమ
పల్లవి:
అవధారు చిత్తగించు హనుమంతుఁడు వీఁడె
భువిలోన గలశాపుర హనుమంతుఁడు
చ. 1:
రామ నీ సేవకుఁ డిదె రణరంగ ధీరుఁడు
ఆముకొన్న సత్వగల హనుమంతుఁడు
దీమసాన లంక సాధించి వుంగరము దెచ్చె
కామిత ఫలదుఁడు యీ ఘన హనుమంతుఁడు
చ. 2:
జానకీరమణ సప్తజలధులు లంఘించి
ఆనుక సంజీవి దెచ్చె హనుమంతుఁడు
పూని చుక్కలెల్లా మొలపూసలుఁగాఁగఁబెరిగి
భాను కోటి కాంతితోఁ జొప్పడు హనుమంతుఁడు
చ. 3:
యినవంశ శ్రీ వేంకటేశ నీ కరుణతోడ
అనుపమ జయశాలి హనుమంతుఁడు
పనిపూని ఇటమీఁది బ్రహ్మపట్టమునకు నీ -
యనుమతిఁ గాచుకున్నా డదె హనుమంతుఁడు
రేకు: 0384-05 పాడి సం: ౦4-491 రామ
పల్లవి:
దేవదేవోత్తమ తే నమో నమో
రావణదమన శ్రీ రఘురామా
చ. 1:
రవికులాంబుధిసోమ రామ లక్ష్మణాగ్రజ
భువి భరత శత్రుఘ్నపూర్వజ
సవనపాలక కౌసల్యానందవర్ధన
ధవళాబ్జనయన సీతారమణా
చ. 2:
దనుజ సంహారక దశరథ నందన
జనక భూపాలక జామాత
వినమిత సుగ్రీవ విభీషణసమేత
మునిజన వినుత సుముఖ సుచరిత్రా
చ. 3:
అనిలజవరద యహల్యా శాప మోచన
సనకాది సేవిత చరణాంబుజ
ఘనతర శ్రీ వేంకటగిరి నివాస
అనుపమోదార విహార గంభీరా