తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 383


రేకు: 0383-01 రామక్రియ సం: 04-482 విష్ణు కీర్తనం

పల్లవి:

ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము
వేమరు నో పుణ్యులాల వినరో యీ కతలు

చ. 1:

అనంత సూర్య తేజుఁడట కాంతి చెప్ప నెంత
దనుజాంతకుఁడట ప్రతాప మెంత
మనసిజ గురుఁడట మరి చక్కఁదన మెంత
వనజజుఁగనినట్టి వాఁడట ఘన తెంత

చ. 2:

గంగా జనకుఁడట కడుఁ జెప్పే పుణ్య మెంత
చెంగట భూ కాంతుఁడట సింగార మెంత
రంగగు లక్ష్మీశుఁడట రాజసము లెంచ నెంత
అంగవించు సర్వేశుఁడట సంప దెంత

చ. 3:

మాయానాథుఁడట మహిమ వచించు టెంత
యేయెడఁ దా విష్ణుఁడట యిర వెంత
పాయక శ్రీ వేంకటాద్రిపతియై వరములచ్చే
వేయి రూపులవాఁడట విస్తార మెంత


రేకు: 0383-02 గౌళ సం: 04-483 హనుమ

పల్లవి:

తలఁచరో జనులు యీతని పుణ్య నామములు
సులభముననే సర్వశుభములు గలుగు

చ. 1:

హనుమంతుడు వాయుజుఁ డంజనా తనయుఁడు
వనధి లంఘన శీల వైభవుఁడు
దనుజాంతకుఁడు సంజీవనీ శైల సాధకుఁడు
ఘనుఁడు కలశాపుర హనుమంతుఁడు

చ. 2:

లంకా సాధకుఁడు లక్ష్మణ ప్రబోధకుఁడు
శంకలేని సుగ్రీవ సచివుఁడు
పొంకపు రాముని బంటు భూమిజసంతోష దూత
తెంకినే కలశాపుర దేవ హనుమంతుడు

చ. 3:

చటులార్జున సఖుఁడు జాతరూప వర్ణుఁడు
ఇటమీఁద బ్రహ్మ పట్ట మేలేటి వాఁడు
నటన శ్రీ వేంకటేశు నమ్మిన సేవకుఁడు
పటు కలశాపుర ప్రాంత హనుమంతుఁడు


రేకు: 0383-03 లలిత సం: 04-484 శరణాగతి

పల్లవి:
 
ఇన్నిళ్ళు నెఱఁగక యిందులోనే వోలాడితి
మన్నించఁగా నీవల్లనే మరిగితి నిన్నును

చ. 1:

ముందు నేఁజేసినకర్మములు దోలుకరాఁగాను
అంది మరఁగుఁ జొచ్చితి నందుకే నీకు
కందువఁ బంచేంద్రియాలు కదిమి పై కొనఁగాను
చందములన్నిటా నీకు శరణంటిని

చ. 2:

వెనకటి సంసారము విడువక వుండఁగాను
వినయాన నీడాగు వేసుకొంటిని
ఘనమైన జన్మములు కాణాచియై తగులఁగ
మొనసి నీ పాదాలకు మొక్కితి నేను

చ. 3:

జీవుల సంగాతాలు చిమ్మి రేఁచి యంటుకోఁగా
భావించి నీ మీఁదటిబత్తి వట్టితి
శ్రీ వేంకటేశుఁడవు నీదేవు లలమేలుమంగ
నీవు నాకు బుద్ధియ్యఁగా నిన్నే పాడితిని


రేకు: 0383-04 దేవగాంధారి సం: 04-485 రామ

పల్లవి:

ఎంతని నుతియింతు రామరామ యిట్టినీప్రతాపమురామరామ
పంతాన సముద్రము రామరామ బంధించవచ్చునా రామరామ

చ. 1:

బలుసంజీవనికొండరామరామ బంటుచేఁ దెప్పించితివిరామరామ
కొలఁదిలేనివాలిని రామరామ ఒక్కకోల నేసితివట రామరామ
వెలయ నెక్కువెట్టి రామరామ హరువిల్లు విరిచితివట రామరామ
పెలుచు భూమిజను రామరామ పెండ్లాడితివట రామరామ

చ. 2:

శరణంటే విభీషణుని రామరామ చయ్యనఁగాచితివటరామరామ
బిరుదులరావణుని రామరామ పీఁచమడఁచితివట రామరామ
ధరలోఁ జక్రవాళము రామరామ దాఁటి వచ్చితివఁట రామరామ
సురలు నుతించిరట రామరామ నీచొప్పు యిక నదియెంతో రామరామ

చ. 3:

సౌమిత్రి భరతులు రామరామ శత్రుఘ్నులుఁ దమ్ములట రామరామ
నీ మహత్త్వము రామరామ నిండె జగములెల్లా రామరామ
శ్రీమంతుఁడ వన్నిటాను రామరామ శ్రీవేంకటగిరిమీఁది రామరామ
కామితఫలదుఁడవు రామరామ కౌసల్యానందనుఁడవు రామరామ


రేకు: 0383-05 లలిత సం: 04-486 హనుమ

పల్లవి:

బిరుదు బంటితఁడు పెద్ద హనుమంతుడు
సిరులతో రామునికి సీతాదేవికిని

చ. 1:

మూఁడులోకములుఁ దుదముట్టఁ బెరిగినవాఁడు
వాఁడె హనుమంత దేవరఁ జూడరో
పోఁడిమి దైత్యుల గెల్చి పూఁచి చేయెత్తుకున్నాఁడు
వాఁడి ప్రతాపముతోడ వాయుజుఁడు

చ. 2:

ధ్రువమండలము మోవఁ దోఁక యెత్తుకున్నవాఁడు
సవరనై పెనుజంగ చాఁచుకున్నాఁడు
భువిఁ గవచ కుండలంబులతోఁ బుట్టినవాఁడు
వివరించ నేకాంత వీరుడైనవాఁడు

చ. 3:

పెనచి పండ్లగొల పిడికిలించుకున్నాఁడు
ఘనుఁ డిన్నిటా స్వామి కార్యపరుఁడు
వినయపు శ్రీ వేంకటవిభునికి హితవరి
యెనసి మొక్కఁగదరో యెదుట నున్నాఁడు