రేకు: 0345-01 మేఘరంజి సం: 04-262 దశావతారములు
పల్లవి : |
అని బ్రహ్మాదులెంచేరు హరిబాలలీలలు
వెనక శుకాదులచే వింటిమి నేమిదివో
|
|
చ. 1: |
పొత్తులలోఁ బవ్వళించె పురుషోత్తముఁడు దొల్లి
హత్తి మఱ్ఱాకుపైఁ బండినటువలెనె
వొత్తగిలి బోరగిలి వుండఁజొచ్చెఁ గృష్ణుఁడు
తత్తరానఁ గూర్మావతారమైన గతిని
|
|
చ. 2: |
తప్పుటడుగులు వెట్టె తగఁ ద్రివిక్రముఁడై
గొప్పపాదాలను భూమి గొలచినట్టు
అప్పుడే కొదలు మాఁటలాడఁ జొచ్చెఁ గృష్ణుఁడు
తప్ప నసుర సతులఁ దగఁ బోధించినట్లు
|
|
చ. 3: |
అచ్చపు రేపల్లెలోన నాడఁజొచ్చెఁ గృష్ణుఁడు
మెచ్చుల వైకుంఠాన మెరసినట్లు
నిచ్చలు శ్రీవేంకటాద్రినిలయుఁడై యున్నవాఁడు
అచ్చుగ జీవులలోన నాతుమైనయట్లు
|
|
రేకు: 0345-02 గుండక్రియ సం: 04-263 నృసింహ
పల్లవి : |
నరరూప ప్రహ్లాదనరసింహా
అవిరళతేజ ప్రహ్లాదనరసింహా
|
|
చ. 1: |
పగరపై కోపము బంటుఁజూచి మరచితి
నగుమొగము ప్రహ్లాదనరసింహా
యెగువ నీకోపమున కితఁడె మాఁటుమందు
అగపడే మాకును ప్రహ్లాదనరసింహా
|
|
చ. 2: |
అంటముట్టరానికోప మంగనఁ జూచిమానితి
నఁటుచెల్లుఁ బ్రహ్లాదనరసింహా
జంట నీ బుద్ది తిప్ప సతియె యంకుశము
అంటు వాయమిఁకను ప్రహ్లాదనరసింహా
|
|
చ. 3: |
ధర మొరపెట్ట దేవతలే మొక్కితే మానితి
గరుడాద్రఁ బ్రహ్లాదనరసింహా
యిరవై శ్రీవేంకటాద్రి నిందు నందు నీదె సుద్ధి
అరసితి మిదివో ప్రహ్లాదనరసింహా
|
|
రేకు: 0345-03 లలిత సం: 04-264 వైరాగ్య చింత
పల్లవి : |
ఏదాయ నేమి హరి యిచ్చినజన్మమే చాలు
ఆదినారాయణుఁడీ యఖిలరక్షకుడు
|
|
చ. 1: |
శునకముబతుకును సుఖమయ్యే తోఁచుఁగాని
తన కది హీనమని తలఁచుకోదు
మనసొడఁబడితేను మంచిదేమి కానిదేమి
తనువులో నంతరాత్మ దైవమౌట దప్పదు
|
|
చ. 2: |
పురువుకుండేనెలవు భవనేశ్వరమై తోఁచు
పెరచోటి గుంతయైన ప్రియమైయుండు
యిరవై వుండితేఁజాలు యెగువేమి దిగువేమి
వరుస లోకములు "సర్వం విష్ణుమయ"ము
|
|
చ. 3: |
అచ్చమైన జ్ఞానికి నంతా వైకుంఠమే
చెచ్చెరఁ దనతిమ్మటే జీవన్ముక్తి
కచ్చుపట్టి శ్రీ వేంకటపతిదాసుఁడైతే
హెచ్చుకుందేమిలేదు యేలినవాఁడితఁడే
|
|
రేకు: 0345-04 ఆహిరి సం 04-265 శరణాగతి
పల్లవి : |
ఎందరి వెంటల నేఁగేము
చందపు హరి నీ శరణనియెదము
|
|
చ. 1: |
పెంచినఁబెరుఁగును పెక్కుబంధములు
చినుఁగును దుఃఖములు
యెంచఁగనేటికి యింద్రియమహిమలు
చుంచుల హరి నీ సూత్రములివియే
|
|
చ. 2: |
పఱపినఁ బారును బహళపుటాసలు
తఱపినఁ దరగును తన మదము
వెఱవఁగనేఁటికి వెడకర్మములకు
కఱకులహరి నీ కల్పితమివియే
|
|
చ. 3: |
చేసినఁ జెలఁగును జిగి సంసారము
మూసిన ముణుఁగును మోహములు
యీసులఁ శ్రీవేంకటేశ్వర యివి నీ-
దాసులఁ దడవవు తగు నీమహిమ
|
|
రేకు: 0345-05 పాడి సం: 04-266 శరణాగతి
పల్లవి : |
కలదొక్కటే గురి కమలాక్ష నీ కరుణ
యిల నేనెట్టుండినాను యెంచకుమీ నేరమి
|
|
చ. 1: |
మనసులోనికి గురి మాధవ నీ పాదాలు
తనువుపై గురి నీ సుదర్శనము
కనుచూపులకు గురి కమలాక్ష నీ రూపు
పను లెన్నిగలిగినఁ బట్టకు నా నేరమి
|
|
చ. 2: |
చేతులు రెంటికి గురి సేసేటి నీ పూజలు
నీతి నా నాలికగురి నీ నామము
కాతరపునుదుటికిఁ గల తిరుమణి గురి
పాతకపు నావలనఁ బట్టకుమీ నేరము
|
|
చ. 3: |
యిహపరాలకు గురి యీ నీ శరణాగతి
సహజ మాత్మకు గురి సంతతభక్తి
మహిలో శ్రీవేంకటేశ మన్నించి నన్నేలితివి
బహువిధముల నింకఁ బట్టకుమీ నేరమి
|
|
రేకు: 0345-06 నాదరామక్రియ సం: 04-267 అధ్యాత్మ
పల్లవి : |
దైవము దూరఁగనేల తమనేర్పు నేర మింతే
యీవలఁ దమకర్మము లెంచరు మనుజులు
|
|
చ. 1: |
మొల్లమి గాలియెకటే ముంచి తూరుపెత్తుచోట
పొల్లకట్టు కడఁబడె పోగువడె గట్టివెల్లా
వుల్లములో శ్రీహరి ఒకఁడై వుండునతని-
నొల్లరైరి యసురలు వొలిసిరి సురలు
|
|
చ. 2: |
మించిన జల్లి యొకటె మీఁదనుండు దొడ్డవెల్ల
చంచుల సన్నములెల్లా సందులఁ గారు
యెంచఁగ హరి యొకఁడే యెరఁగక కొందరైతే
కొంచమై రీతనిఁ గొల్చి కొందరైతే ఘనులు
|
|
చ. 3: |
కోవిలలుఁ గాకులును కోరి యొక్కరీతి నుండు
యీవల వసంతవేళ నేరుపడును
శ్రీవేంకటేశ్వరునిసేవకులు మనుజుల-
భావ మొకరీతి నుండు ఫలములే వేరు
|
|