రేకు: 0344-01 దేసాళం సం: 04-256 నామ సంకీర్తన
పల్లవి : |
ఎదురేది యింక మాకు యెందు చూచినను నీ-
పదము లివి రెండు సంపదలు సౌఖ్యములు
|
|
చ. 1: |
గోపికానాథ గోవర్ధనధరా
శ్రీపుండరీకాక్ష జితమన్మథా
పాపహర సర్వేశ పరమపురుషాచ్యుతా
నీపాదములే మాకు నిధినిధానములు
|
|
చ. 2: |
పురుషోత్తమా హరీ భువనపరిపాలకా
కరిరాజవరద శ్రీకాంతాధిప
మురహరా సురవరా ముచుకుందరక్షకా
ధరణి నీపాదములె తల్లియును దండ్రి
|
|
చ. 3: |
దేవకీనందనా దేవేంద్రవందితా
కైవల్యనిలయ సంకర్షణాఖ్య
శ్రీవేంకటేశ్వరా జీవాంతరాత్మకా
కావ నీపాదములె గతి యిహముఁ బరము
|
|
రేకు:0344-02 గౌళ సం: 04-257 మాయ
పల్లవి : |
బాపురే నీమాయ భమ్రయించీ జీవులకు
దాపున నున్నదేకాని దవ్వలకుఁ జొరదు
|
|
చ. 1: |
మోక్షమురుచి గానదు ముందర నుండఁగాను
సాక్షియై జగమిది చవి చూపఁగా
దీక్షకుఁ జోరదు మరి దేవ నీపై భక్తి లేదు
దక్షులై యాలుబిడ్డలు దండనుండఁగాను
|
|
చ. 2: |
జ్ఞానమితవు గాదు సంగడి నుండదుగాన
నానాయోనులమేను ననిచుండఁగా
ఆనకమై వైరాగ్యమంట దలవాటులేక
కానఁబడ కర్మములు గాసిఁ బెట్టఁగాను
|
|
చ. 3: |
మంచిదని నీ తిరుమంత్రము దలఁచుకోదు
పంచేంద్రియములాత్మ బలిశుండఁగా
యెంచుకొని శ్రీవేంకటేశ నీకే శరణని
అంచల నీదాసులైతే నన్నిటా గెలిచిరి
|
|
రేకు: 0344-03 పళవంజరం సం: 04-258 కృష్ణ
పల్లవి : |
వెఱపించబోయి తానె వెఱచెఁ దల్లి యశోద
మఱచి యీబాలు నెట్టు మానిసెంటా నుండెనో
|
|
చ. 1: |
వెంట రాకుమని కృష్ణు వెరపించి యశోద
వొంటి మందలో గొంగ వున్నాఁడనె
అంటి గొంగ యెందునున్నాఁడని నోరు దెరచితే
పెంటలై బ్రహ్మాండాలు పెక్కు గానవచ్చెను
|
|
చ. 2: |
చందమామఁ బాడి తల్లి సరిఁ బొత్తుకు రమ్మంటే
చందురుఁ జూచి కృష్ణుఁడు సన్నపేసెను
ముందరఁ జంద్రుఁడు వచ్చి మొక్కితే యశోద చూచి
ముందేలా యంటినో యని ముంచి వెరగందెను
|
|
చ. 3: |
పాలార్చి తొట్టెలలోఁ బండఁబెట్టి యశోద
నీలవర్ణుఁ దొంగిచూచె నిద్దురో యని
వోలి శంఖచక్రాలతో నురము శ్రీసతితోడ
యీలీల శ్రీవేంకటేశుఁడై యున్నాఁడు
|
|
రేకు: 0344-04 గుజ్జరి సం: 04-259 వైష్ణవ భక్తి
పల్లవి : |
ఏమన వచ్చును చెల్లుచున్నవివె యీశ్వర నీమాయలు గొన్ని
శ్రీమాధవ నీ చిత్తము కొలఁదిఁక చెప్పెడిదేఁటికి జీవులకు
|
|
చ. 1: |
కలిదోషనిరుహరణ కైవల్యాకర హరి
తలఁచినవారిది నేరుపు మిముఁ దలఁచనివారిది నేరమి
కలుషమెడలి సూర్యోదయమైనా కానవుకొన్నిజంతువులు
తెలిసినవారలు కందురు యీతెరఁగలు రెంటికి దినమొకటే
|
|
చ. 2: |
శరణాగతరక్షణచతుర సర్వాంతరాత్మక యచ్యుత
సరి నిన్నుఁ గొలిచినవారిది పుణ్యము చలమున మానుటే పాపము
సరుగనఁ గాచేటి చల్లని చంద్రుఁడు జారచోరులకుఁ గడు వేఁడి
అరయఁగఁ గలువలకును హితుఁడు అందుకు నిందుకు గురి యితఁడే
|
|
చ. 3: |
శ్రీవేంకటగిరినిలయ శ్రీసతీశ పురుషోత్తమ
మివొద్దనుండితే వైకుంఠము మిమ్ము నెడసితే నరకము
భావములోపల నీవే వుండఁగ భక్తి లేదు కొందరికైతే
శ్రీవైష్ణువులకు నిత్యము యీ చింతలు రెంటికి నీ మహిమే
|
|
రేకు: 0344-05 దేసి సం: 04-260 గురు వందన, వైష్ణవ భక్తి
పల్లవి : |
అజ్ఞానులకివి యరుహము లింతే
సుజ్ఞానులకివి చొరనేలయ్యా
|
|
చ. 1: |
దైవమునమ్మినదాసులకు
కావింపఁగ మరి కర్మము లేదు
దావతిజలనిధి దాఁటినవారికి
వోవల మరియును వోడేలయ్య
|
|
చ. 2: |
గురుకృప గలిగిన గుణనిధికి
అరయఁ బాపపుణ్యము మరి లేదు
విరసపుఁ జీఁకటి వెడలినవారికి
పరగ మరియు దీపంబేలయ్య
|
|
చ. 3: |
జగములెరుఁగు వైష్ణవులకును
తగిలెటి యపరాధంబులు లేవు
అగపడి శ్రీవేంకటాధిపుఁ గొలిచితే
యెగువ దిగువ మాకెదురేదయ్య
|
|
రేకు: 0344-06 బౌళి సం: 04-261 వేంకటగానం
పల్లవి : |
హరి సర్వాత్మకు డాదిమపురుషుఁడు
పొరి నెరుఁగువారి పుణ్యముగాన
|
|
చ. 1: |
నాలుకకొననే నారాయణుఁడిదె
వైళము దలఁచనివారిదె పాపము
నేలయు మిన్నును నిజవైకుంఠము
పోలించి చూడని పురుషుల వెలితి
|
|
చ. 2: |
మనసులోననే మాధవుఁడున్నాఁడు
కనుఁగొనని వారికడ మింతే
తనువే విష్ణుని తత్వసాధనము
వొనరఁగ శ్రీపతి యున్నాఁడుగాన
|
|
చ. 3: |
చేరువ నిదివో శ్రీవేంకటపతి
ధారుణిఁ గొలిచేటి దాసులభాగ్యము
కారణ మితఁడే కలిగినదైవము
కోరినవారల కొంగులపసిఁడి
|
|