రేకు: 0346-01 సాళంగనాట సం: 04-268 శరణాగతి
పల్లవి : |
అలబ్రహ్మాదుల కణఁగ దిది
గెలువఁగ వశమా కేశవ మాకు
|
|
చ. 1: |
పాపము మనసునఁ బారకమానదు.
కోపము మానఁగఁగూడదు.
యేపున దేహం బెన్నాళ్లు మోఁచెను
తీపుల యిది యా దేహపు గుణము
|
|
చ. 2: |
ఆఁకలిదీరదు యటు నానాఁటికి
కాఁకలు మానవు కాంత లేక
మాఁకువంటి జన్మము గలకాలము
చీఁకటి దేహపు చిత్తపు గుణము
|
|
చ. 3: |
నీవు వొసఁగినదె నిర్మలదేహము
నీవె నా నేర్పునేరములు
శ్రీవేంకటేశుఁడ జిగి నీ శరణని
దీవెనఁ బొందితి దేహపు గుణము
|
|
రేకు: 0346-02 కేదారగౌళ సం: 04-269 అద్వైతము
పల్లవి : |
మీ మతము పరిభాష మీవల్లనే పుట్టెఁగాక
యేమునులైనాఁ దొల్లి యెంచిరా యీమాఁట
|
|
చ. 1: |
ముడిగి నాలుగు సూత్రములె మీ వివరణము
కడమ వ్యాససూత్రాలు కల్లలా యేమి
కడు ముఖ్యము మహావాక్యమే చాలుననెను
అడరి వసిష్ఠాదు లాడిరా యీమాఁట
|
|
చ. 2: |
తానె బ్రహ్మమనంటే తగ జీవన్ముక్తేనేరు
పూని లోకులెల్లా ముక్తిఁ బొందవలెఁగా
పాని కర్మానుభవాలు బాధితాను వృత్తనేరు
వీనుల సర్వపురాణాలు వింటీమా యీమాఁట
|
|
చ. 3: |
పైకొని బ్రహ్మజ్ఞానము భక్తిరూపము గాదని
చేకొని కొచ్చెదరట్టె శ్రీవేంకటేశు
దీకొనుచుఁ జేసేరు దేవపూజాది యజ్ఞాలు
యేకాత్మవాదులాల యితవా యీమాట-
|
|
రేకు: 0346-03 శంకరాభరణం సం: 04-270 అద్వైతము
పల్లవి : |
చెప్పఁబోతే యీ యర్ధము చిత్తము వొడఁబడదు
తప్పులు వెదకకురో తత్వజ్ఞులాల
|
|
చ. 1: |
చెలఁగి మిథ్య యంటాఁ జేసేయజ్ఞాలు ఫలించునా
యిల శూన్యోపాసకుల కేడ దేవుఁడు
లలి మాయా శబళితులకు మోక్ష మెక్కడిది
నలి నభేదవాది కానందానుభవ మేది
|
|
చ. 2: |
హరి శరణు చొరనియట్టివారికి దిక్కేది
గురుఁడు వేరే లేఁడట కోరి వుపదేశమేది
వెరసి శిఖాసూత్రాలు విడిచితే ప్రణవమేది
పరగ భక్తి లేదట భవమేట్టు గడచె
|
|
చ. 3: |
శ్రీవేంకటేశుముద్ర ధరించక వైకుంఠమేది
యీ విభుపేరు జపించకెట్టు పాపా లుత్తరించు
వేవేగ దాసుఁడుగాక వెట్టికేల కరుణించు
సేవించినఁగాక సర్వచింతలేల యుడుగు
|
|
- రేకు: 0346-04 శ్రీరాగం సం: 04-271 నృసింహ
పల్లవి : |
అహోబలేశ్వరుఁ డఖిలవందితుఁడు
మహి తనిఁ గొలిచి మనుఁ డిఁక జనులు
|
|
చ. 1: |
మూఁడుమూర్తులకు మూలం బీతఁడు
వేఁడిప్రతాపపు విభుఁ డీతఁడు
వాఁడిచక్రాయుధవరధుఁ డీతఁడు
పోఁడిమిఁ బురాణపురుషుఁ డీతఁడు
|
|
చ. 2: |
అసురలకెల్లఁ గాలాంతకుఁ డీతఁడు
వసుధ దివ్యసింహం బితఁడు
విసువని యేకాంగవీరుఁ డీతఁడు
దెసలఁ బరాత్పరతేజం బితఁడు
|
|
చ. 3: |
నిగిడి శ్రీవేంకటనిలయుఁ డీతఁడు
బగివాయనిశ్రీపతి యితఁడు
సొగిసి దాసులకు సులభుఁ డీతఁడు
తగు నిహపరములదాతయు నీతఁడు
|
|
రేకు:0346-05 మాళవి సం: 04-272 హనుమ
పల్లవి : |
అంజినీదేవికొడుకు హనుమంతుఁడు
సంజీవినిదెచ్చినాఁడు సారె హనుమంతుఁడు
|
|
చ. 1: |
కలశాపురముకాడ కదలీవనాల నీఁడ
అలవాఁడె వున్నవాఁడు హనుమంతుఁడు
అలరుఁ గొండలకోన అందలిగుహలలోన
కొలువు సేయించుకొనీఁ గోరి హనుమంతుఁడు
|
|
చ. 2: |
పసలుగా జంగవెట్టి పండ్లగుత్తి చేతఁబట్టి
అసురలనెల్లఁ గొట్టీ హనుమంతుఁడు
వసుధ బ్రతాపించి వడిఁ దోఁక గదలించి
దెసలెల్లాఁ బాలించీ దివ్యహనుమంతుఁడు
|
|
చ. 3: |
వుద్దవిడి లంకచొచ్చి వుంగరము సీతకిచ్చి
అద్దివో రాము మెప్పించే హనుమంతుఁడు
అడ్డుక శ్రీవేంకటేశు కటుబంటై వరమిచ్చి
కొద్ది మీర సంతోసాలే గుప్పీ హనుమంతుఁడు
|
|
రేకు: 0346-06 వరాళి సం: 04-273 హనుమ
పల్లవి : |
పంతగాఁడు మిక్కిలి నీ పవనజుఁడు
రంతుకెక్కె మతంగపర్వతపవనజుఁడు
|
|
చ. 1: |
వాలాయమై యెంతభాగ్యవంతుఁడో దేవతలచే
బాలుఁడై వరములందెఁ బవనజుఁడు
పాలజలనిధి దాఁటీ పరగ సంజీవి దెచ్చి
యేలికముందరఁ బెట్టె యీ పవనుజుఁడు
|
|
చ. 2: |
సొంటులు సోదించితెచ్చి సుగ్రీవు రాఘవునికి
బంటుగాఁగఁ బొందుసేసెఁ బవనజుఁడు
వొంటినే రామునిముద్ర వొసఁగి సీతముందర
మింటిపొడవై పెరిగె మేఁటి పవనజుఁడు
|
|
చ. 3: |
కిట్టి శ్రీవేంకటేశ్వరుకృపచే ముందరిబ్రహ్మ-
పట్ట మేలనున్నవాఁడు పవనజుఁడు
చుట్టి చుట్టి తనకు దాసులయినవారికి
గట్టి వరములిచ్చె నీ ఘనపవనజుఁడు
|
|
-