తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 343

రేకు: 0343-01 మలహరి సం: 04-250 భక్తి


పల్లవి :

మానరో వో లోకులాల మాకు మీకు నేమి దోడు
నాఁటికిఁక మీకు నవ్వుఁబాటు నేము


చ. 1:

యిరవై నానోటికి యెన్నెన్ని చదివిన
హరియనేయంతరుచి అందు లేదు
గరిమ నెన్నిరూపులు కన్నుల నేఁ జూచినాను
పురుషోత్తముఁ జూచినపూర్తి యందు లేదు


చ. 2:

యెచ్చోట నుండినాను యిందిరేశుమందిరము
చొచ్చి యుండేసుఖ మంత చొప్పడ దందు
కచ్చుపెట్టి వీనులకుఁ గతలెన్ని విన్నాను
అచ్చుతుకీర్తన వినేయందు సరి రాదు


చ. 3:

కైపుగాఁగ కన్నవారికాళ్ళకు మొక్కినాను
శ్రీపతికిమొక్కినంత సెలవు గాదు
యేపున శ్రీవేంకటేశు విటులఁ బూజించినట్టు
మాపుదాఁకా నితరుల మనసురాదు

రేకు: 0343-02 దేవగాంధారి సం: 04-251 విష్ణు కీర్తనం


పల్లవి :

పట్టిన ముట్టనుండరు పదరుదు రంతలోనే
యెట్టనెదుటీమిమ్ము నెరిఁగీ నెరఁగరు


చ. 1:

గుక్కక మూఁడులోకాలు గొలిచితివని నీకు
మొక్కుదురు; పరులకు మొక్కకుండరు
అక్కరదీర శ్రీపతివని నిన్ను వేఁడుదురు
వెక్కసపుఁ దైవాల వేఁడుకోక మానరు


చ. 2:

కందువ బ్రహ్మగన్నట్టి ఘనుఁడవు నీవార-
మందురు; పరులవారమనకుండరు
అంది వేదాలు దెచ్చేయాతఁడవు నీవే యని
యెందు నెంచి, పరులను యెంచకుండరు


చ. 3:

యిత్తల నారదాదుల కేలికని నీమరఁగు
చొత్తురు; పరులమాఁటు చొర కుండరు
అత్తిన శ్రీవేంకటేశ యన్నియు నీమాయలింతే
యెత్తిన వెఱ్ఱులు లోకులిట్టే భ్రమతురు

రేకు: 0343-03 లలిత సం: 04-252 శరణాగతి


పల్లవి :

ఇంక నేమిసేసేము యిన్నిటాఁ దనిసితిమి
సంకెలెల్లాఁ దీరెఁ దీరె చాలుఁజాలుఁ గర్మము


చ. 1:

కోరి పుణ్యము లేమైనాఁ గొన్ని సేసేమంటిమా
కోరిక లిచ్చేటి హరి కూడి మాలోనున్నాఁడు
చేరఁ జోటువెదకి పొంచి తిరిగేమంటిమా
చేరేటివైకుంఠపతి చేతిలో నున్నాఁడు


చ. 2:

భవహరముగ వేదపఠన సేసేమంటే
భవహరమగుహరిపాటలు నోట నున్నవి
తవిలి సంపదలకై దానమిచ్చేమంటిమా
భువిలోన శ్రీపతి మాపూజలో నున్నాఁడు


చ. 3:

యిహసుఖములకుఁగా యిందరి వేఁడేమంటే
యిహమిచ్చే శ్రీ వేంకటేశుఁ డెదుట సున్నాఁడు
సహజమయినయట్టి సర్వేశఁ డీతడే
మహిమలన్నియుఁ దానె మాకు నిచ్చినాఁడు

రేకు:0343-04 ధన్నాసి సం: 04-253 మాయ


పల్లవి :

నీవే దయసేసి నేఁడు మమ్ముఁ గాతుగాక
శ్రీవల్లభుఁడ నీకు సేవ సేసే వారమా


చ. 1:

యిదిపుణ్య మిది పాప మెట్టని తెలిసేమయ్య
అదన నన్నపు నామే యన్నువట్టెను
యిదేదైవ మిదెగురుఁ డెట్టని యెరిఁగేమయ్య
మొదల నానాయోనిముట్టంటువారము


చ. 2:

ఆచారమేది యిఁక ననాచారమేదయ్య
కాచినయాఁకటికరిగాపులము
యేచినబంద మిది మోక్ష మిది యనలేమయ్య
పూచినపంచేంద్రియాలపొరుగైతి మిదివో


చ. 3:

ముంద రిది వెన కిది ముట్టి యేమనెంచేమయ్య
కందువసంసారపుగర్వ మెక్కెను
అందపు శ్రీవేంకటేశ యన్నియు నీమాయ లివి
పొంది నీకొప్పనసేసి భోగించేమయ్య

రేకు: 0343-05 పళవంజరం సం: 04-254 మాయ


పల్లవి :

హరినే యడుగరో ఆమాఁట
సరుగ నిందరికి సర్వేశ్వరుఁడు


చ. 1:

కామముఁ గ్రోధము కాయపు గుణములు
నేమపుటాత్మకు నిందేది
గామిడి మాయే కర్త యిందుకును
సోమరి మమ్మంటఁ జోటేది


చ. 2:

పాపముఁ బుణ్యము భావవికారము
పైపై నాత్మకుఁ బనిలేదు
శ్రీపతి పంపిటు సేసితి మింతే
తాప మమ్ముఁ దగులఁ దగవేది


చ. 3:

కాయముఁ బ్రాయము కర్మపు గుణములు
సేయని యాత్మకు సెలవేది
యేయెడ శ్రీవేంకటేశునాజ్ఞలివి
చాయల నితనికి శరణంటిమి

రేకు: 0343-06 నాదరామక్రియ సం: 04-255 దశావతారములు


పల్లవి :

కలఁడా యింతటి దాత కమలనాభుఁడేకాక
కలఁడన్న వారిపాలఁ గలిగిన దైవము


చ. 1:

యిచ్చెను సంపద లితఁడింద్రాదులకునెల్ల
యిచ్చెను శుకాదుల కిహపరాలు
యిచ్చెను వాయుజునికి యిటమీఁద బ్రహ్మపట్ట-
మిచ్చల ఘంటాకర్ణుని కిచ్చెఁ గుబేరత్వము


చ. 2:

కట్టెను ధ్రువపట్టము కమలజుకంటే మీఁద
కట్టె విభీషణుకు లంకారాజ్యము
కట్టియిచ్చె నజునికి గతచన్నవేదాలు
కట్టెను శ్రీసతిచేత గంకణ సూత్రములు


చ. 3:

పెట్టెను దేవతలకు పేరినమృతపువిందు
వెట్టెను భక్తవత్సలబిరు చితఁడు
యిట్టె శ్రీవేంకటాద్రి నిందరికిఁ బొడచూపి
పెట్టెఁ దనపస్రాదము పృథివి జీవులకు