రేకు: 0324-01 భవుళి సం: 04-136 శరణాగతి
పల్లవి : |
కటకట నేమూ కర్తలము ము
ఘటన శ్రీపతి నీవే కావఁగదవయ్యా
|
|
చ. 1: |
పుడమిఁ బుట్టితిమి బుద్ది నెరిఁగితిమి
కడుపే చెరువవుత గానమయ్యా
వొడలు మోఁచితిమి వున్నతిఁ బెరగితిమి
వెడఁ జిల్లులఁ గారేది విడిపించ లేవయ్యా
|
|
చ. 2: |
నిన్న నిద్రించితిమి నేఁడే మేలుకొంటిమి
తిన్న వెల్లఁ దీరినటే తెలియమయ్యా
కన్నులఁ జూచితిమి కమ్మర మూసితిమి
వున్నచే నుండదు మతి పూరట లేదయ్యా
|
|
చ. 3: |
సరిఁ జదివితిమి శాస్త్రముఁ జూచితిమి
గురుఁడే రక్షకుడౌత గురుతౌనయ్యా
నిరతి శ్రీవేంకటేశ నిన్నే నమ్మితిమి
పరదైవములతోడిపని మాకు లేదయ్యా
|
|
రేకు: 0324-02 దేశాక్షి సం: 04-137 వైష్ణవ భక్తి, నృసింహ
పల్లవి : |
ఇందే వున్నది కానమెందో వెదకితిమి
కందర్పగురుభక్తి గంటిమి నే మిదివో
|
|
చ. 1: |
కోటికోటి వేదముల కొన యర్థము
సాటి వేదముల లోని సకలార్థము
సూటీగా గురుఁడు మాకుఁ జూపినర్థము
గాటపు మనసు దవ్వి కనుగొంటి మిదివో
|
|
చ. 2: |
పరమయోగీంద్రులు పట్టీన యర్థము
సురలు మునులు నెంచి చూచి నర్థము
సరి మూఁడులోకములఁ జూటి నర్థము
గరిమ నీదేహమెత్తి కంటిమి మే మిదివో
|
|
చ. 3: |
పలుశరణాగతుల పాలి యర్థము
మలయుచుండేటి తిరుమంత్రార్థము
నిలచి శ్రీవేంకటాద్రి నిండినర్థము
కలసి విజ్ఞానవీధిఁ గనుఁగొంటిమయ్యా
|
|
రేకు:0324-03 ధన్నాసి సం: 04-138 శరణాగతి
పల్లవి : |
తొల్లిటివారు వెట్టినతోవ యిది
బల్లిదులై యిందునే బదుకుటే మేలు
|
|
చ. 1: |
కలఁడు సర్వేశ్వరుఁడొక్కఁడు దిక్కందరికిని
సులభుఁడు శరణము చొచ్చితేఁ గాచు నతఁడు
బలుతపములు చేసి పాట్లఁ బడ నోప మని
బలువుఁడాతని నమ్మి బ్రదుకుటే మేలు
|
|
చ. 2: |
వున్నాఁడు మనసులోనే వొక్కచో వెదకవద్దు
ఇన్నిటాఁ దలఁచుకొంటే నిచ్చు నిహముఁ బరము
కన్నచోట్ల వెదకి కడు నలయనోపము
పన్నుగ నితనిఁ గొల్చి బ్రదుకుటే మేలు
|
|
చ. 3: |
శ్రీవేంకటేశ్వరుఁడు చేరి నిలుచున్నవాఁడు
సేవించిన యంతలోనే చేకొని యేలు నీతఁడు
దేవతలఁ బ్రార్ధించి తెలియఁగ నేరము
భావించితని నుతించి బ్రదుకుటే మేలు
|
|
రేకు:0324-04 సాళంగనాట సం: 04-139 కృష్ణ
పల్లవి : |
శ్రావణ బహుళాష్టమి జయంతి నేఁడు
సేవించరో నరులాల శ్రీకృష్ణుఁడిఁతఁడు
|
|
చ. 1: |
భావింప వసుదేవుని పాలిటి భాగ్యదేవత
దేవకీ గనినయట్టి దివ్యరత్నము
చేవమీర సురల రక్షించే కల్పతరువు
యీవేళ జన్మించినాఁడు యిదే కృష్ణుఁడు
|
|
చ. 2: |
హర విరంచాదులకు నాదిమూల కారణము
పరమమునుల తపఃఫల సారము
గరుడోరగేంద్రులకుఁ గలిగిన నిధానము
యిరవుగా నుదయించెనిదె కృష్ణుఁడు
|
|
చ. 3: |
బలుయోగీశ్వరుల బ్రహ్మానందము
చెలఁగు భాగవతుల చింతామణి
అలమేల్మంగకు బతియట్టె శ్రీవేంకటాద్రి-
నీలపై జన్మించినాఁడు యిదె కృష్ణుఁడు
|
|
రేకు:0324-06 రామక్రియ సం: 04-140 నృసింహ
పల్లవి : |
వెలసె నహోబలాన విదారణసింహము
షురల నరుల దయజూబీని వీఁడివో
|
|
చ. 1: |
సరి వలకేలను చక్రము పీటఁగాఁ బెట్టీ
గరిమ నొకచేత శంఖము వట్టి
హిరణ్యకలిపుని నిరుచాతులాఁ జించి
అరిదిఁ బేగులు జందేలవే వేసుకొనెను
|
|
చ. 2: |
ఘనమైన కోరలతో కహకహ నవ్వుకొంటా
దనుజు ముంద రొకచేతనుఁ బట్టి
పెనఁగకుండా రొమ్ము పెడచేతుల నడిచి
నినువు వంకరగోళ్ళ నెత్తురు చిమ్వీని
|
|
చ. 3: |
అంతటఁ బ్రహ్లదుని నటు దయఁజూచి లక్షీ
కాంతఁ దొడపై నడుక కడు శాంతుఁడై
చింత దీర గరుడాద్రి శ్రీవేంకటాద్రిని
పంతము మెరసి నిల్పి ప్రతాపించీనీ
|
|
రేకు:0324-06 శంకరాభరణం సం: 04-141 హనుమ
పల్లవి : |
ఆతడాఁ యీతఁడు పెద్దహనుమంతుఁడు
చేతులారా నక్షునిఁ జెండివేసినాఁడట
|
|
చ. 1: |
తొలుత రాముని గాంచి తోడనే సుగ్రీవుని
కొలువఁ బెట్టి యాతనికొమ్మ నిప్పించి
జలనిధి దాఁటి లంక సాధించి చొచ్చి సీతకు -
నలర నుంగర మిచ్చె నతిసాహసమున
|
|
చ. 2: |
సీతాదేవి యానవాలు శ్రీరామునికి నిచ్చి
నీతి విభీషణుని మన్నించఁజేసి
చేతులనే పోట్లాడి చెండివేసి రాక్షసుల
ఘాతల సంజీవికొండ గక్కనఁ దాఁ దెచ్చెను
|
|
చ. 3: |
గక్కన రావణుఁ గొట్టి కాంతను రాముని గూర్చి
అక్కడ నయోధ్యఁ బట్ట మటుగట్టి
నిక్కి కలశాపురిని నిండి శ్రీవేంకటాద్రిని
వుక్కమీరి హరిఁగొల్చి వున్నాఁడు వేడుకల
|
|