తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 323

రేకు: 0323-01 భూపాళం సం: 04-130 మేలుకొలుపులు


పల్లవి :

రాతిరెల్ల సతులతో రతుల నలసెనేమో
రీతిగాదు హరి నెచ్చరికె సేయరే


చ. 1:

పైపై బొద్దువొడచి పంకజములు విరిసె
గోవింద మేలుకొన మనరే
దీపములు దెల్లఁబారె తిమిరమింతయు జారె
శ్రీపురుషోత్తమునిఁ జేయంటి లెమ్మనరే


చ. 2:

కలువలు ముకుళించీ కలవింక లెలుగించీ
నెలఁతలు దేవదేవు నిద్ర దెల్పరే
జలనిధి పొంగణగె చాయలచుక్కలు మాసె
వలరాచగురు నుప్పవడము గమ్మనరే


చ. 3:

జీవులు మేలుకొనిరి చెంగలించె దరువులు
భావించి యచ్యుతునిట్టె పలికించరే
కావిరింతయు విరిసే కడు సంధ్యకు బొడ్డాయ
శ్రీవేంకటేశుని విచ్చేయ మనరే

రేకు: 0323-02 బౌళి సం: 04-131 మాయ


పల్లవి :

పుట్టెడి దింతా బూటకంబులే
గట్టిమాయ హరిఁ గానఁగ నీదు


చ. 1:

ముక్కున నున్నది ముందటఁ బ్రాణము
యెక్కడ నమ్మేదిఁకఁ దనువు
చుక్కలు మోఁచీ జూపులెదుటనే
నెక్కొను మతికిని నిలుకడ యేది


చ. 2:

నాలుక నున్నవి నానారుచులును
వేళావేళకు వెరవేది
తోలున నున్నది దొరకొని బ్రతుకిది
కాలంబెటువలెఁ గడపేది


చ. 3:

ఆతుమనున్నది యఖిలజ్ఞానము
ఘూతల నెటువలెఁ గనియేది
శ్రీతరుణీపతి శ్రీవేంకటపతి
యాతనిఁగొలిచితి మడ్డంబేది

రేకు:0323-03 సాళంగనాట సం: 04-132 వైష్ణవ భక్తి


పల్లవి :

ఉమ్మడికర్మములాల వుండఁ జోటు మీకు లేదు
యిమ్ముల నెందైనాఁ బోరో యివి లేనిచోటికి


చ. 1:

పెట్టినది నుదుటను పెరుమాళ్ళ లాంఛనము
దట్టమై భుజములందు దైవశిఖామణిముద్ర
నెట్టన నాలుకమీఁద నీలవర్ణునామమిదె
అట్టే హరిదాసులకంటునా పాపములు


చ. 2:

మనసునఁ దలచేది మాధవుని పాదములు
దినముఁ గడుపునించేది హరిప్రసాదము
తనువుపైఁ దులసిపద్మాక్షమాలికలు
చెనకి హరిదాసులఁ జేరునా బంధములు


చ. 3:

సంతతముఁ జేసేది సదాచార్యసేవ
అంతరంగమున శరణాగతులసంగమిదే
యింతటాను శ్రీవేంకటేశుఁడు మమ్మేలినాఁడు
అంతటా హరిదాసుల నందునా అజ్ఞానము

రేకు: 0323-04 శ్రీరాగం సం: 04-133 విష్ణు కీర్తనం


పల్లవి :

ఇలవేల్పితఁడే ఇందరికిని మరి
పలు వేల్పులతో పని యిఁకనేలా


చ. 1:

కమలారమణుని కరుణేకాదా
అమరులు గొనియెడి యమృతము
అమితపు శ్రీహరి యాధారముగాదా
నెమకేటి ప్రాణులు నిలిచినభూమి


చ. 2:

దనుజాంతకు బొడ్డుతామెర కాదా
జననకారణము సర్వమునకు
మనికై హరిసతి మహిమే కాదా
నినుపై భువిలో నిండినసిరులు


చ. 3:

యితనికొడుకు రచనింతాఁగాదా
సతుల పతుల సంసారరతి
గతి శ్రీవేంకటపతిలోకమె వు-
న్నతి వైకుంఠపు నగరపు ముక్తి

రేకు: 0323-05 భవుళి సం: 04-134 మాయ


పల్లవి :

పురుషుఁడే యధముఁడు పొంచి యెందు దగులక
పురుషోత్తమునికంటే పుణ్యుఁడవు నపుడే


చ. 1:

పురుషజంతువులెల్ల పొంచి యాఁడుజంతువుల
తరవాయి గొని వెంటఁ దగులుఁగాని
ధర నాఁడు జంతువులు తగ పురుషజంతువుల
యిరవు వెదకఁజోవు యిది యెట్టిమాయో


చ. 1:

సారెకు నర్థమునకు జనులెల్ల దాసులై
కోరి వెదకుచు దిరుగుదురు గాని
చేరువ యర్దములెల్ల జీవులకు దాసులై
యీరీతి వెదకవు యిది యెట్టిమాయో


చ. 1:

లోకమునడవ డిది లోనుగాక యిందుకెల్లా
యేకచిత్తమున నుంటే యెక్కుడుగాని
దాకొని శ్రీవేంకటేశు దాసుఁడైన వానికిని
యేకముగఁ బంపుసేసు నేమిమాయోకాని

రేకు: 0323-06 మలహరి సం: 04-135 వైరాగ్య చింత


పల్లవి :

మఱి విచారించఁబోతే మంచంముకిందే నూయి
మెఱయఁగ హరిఁ గెల్చి మించరో ప్రజలు


చ. 1:

యేల మాను దేహమెప్పటి తనగుణము
యేల మాను మనసెడలేనియాసలు
ఱలు దింటా మలిగండ్లేఱఁగనేల హరి మన-
పాలఁ బెట్టుక కొలచి బ్రతుకరో ప్రజలు


చ. 2:

పొమ్మంటేనేలపోవు పూర్వకర్మములు
పొమ్మంటేనేలపోవు పొంచిన యింద్రియములు
కుమ్మరావమునఁ జెంబు కోరి వెదకనేల
పమ్మిని శ్రీపతిఁ గొల్చి బదుకరో ప్రజలు


చ. 3:

భోగించకేల పోవుఁ బుట్టిన జన్మఫలము
లోఁగుచుఁ బిండికూరలోన నలుపెంచనేల
వేగిరమేఁటికి శ్రీవేంకటేశుమాయ లివి
బాగుగ నాతనిఁగొల్చి బ్రదుకరో ప్రజలు