చిత్రభారతము/సప్తమాశ్వాసము

శ్రీరస్తు

చిత్రభారతము

సప్తమాశ్వాసము



కర నిజగోత్రాబ్ధిసు
ధాకర నతరాజమకుటతటఘటితమణి
శ్రీకర [1]ఘృణిమయపదయుగ
భీకర రిపుగోత్రవజ్ర పెద్దామాత్యా.

1


వ.

అవధరింపుము మృదుమధురవచనరచనాపరితోషితముని
జాతుండగు సూతుండు హరికథాశ్రవణాహ్లాదులగు
శౌనకాదులకు నిట్లనియె నట్లందఱుం దమతమ నివాసం
బుల నున్నయంత నర్జునానుమతంబున దుర్యోధనుండు
సకలసైన్యంబులవారలఁ గురుక్షేత్రంబునకు నడుపుండని
చెప్పించి ప్రస్థానభేరి సఱపించిన.

2


సీ.

పటుగదాతాడితఘటముచందంబున
             బ్రహ్మాండభాండకర్పరము పగిలె
ఝుంఝానిలాధూతశాఖిశాఖలభంగిఁ
             గులవసుధాధరంబులు చలించె

విలయకాలానలవిస్ఫులింగములన
             నొక్కుమ్మడిని మింటఁ జుక్క లురిలె
వజ్రసాధ్వసమున వాపోవుకైవడిఁ
             జక్రవాళము ప్రతిస్వనము నీనె


తే.

మఱఁగఁ గ్రాఁగు కషాయంబుతెఱఁగు మీఱి
జలధు లంతంతకును మంపుజాఱ నింకె
ధరణి చక్రంబుకైవడిఁ దిరుగఁజొచ్చెఁ
గౌరవేంద్రుప్రయాణభేరీరవమున.

3


వ.

ఇవ్విధంబునఁ బ్రయాణభేరి సెలంగిన యమ్మఱునాఁడు
ప్రభాతసమయంబున.

4


తే.

సకలసేనాధిపతులును సంభ్రమమున
సంగరోచితశృంగారభంగి మెఱసి
డెందముల సంతసంబు వాటించి గబ్బు
మీఱి యంతంత సన్నద్ధులైరి యధిప.

5


వ.

అర్జునుండునుం బరిమితపరిజనంబుతో నంతిపురంబునకుం
జని గాంధారీధృతరాష్ట్రులకును విదురసంజయులకును
నెఱింగించి తదనుమతి గొని వెడలి భూసురాశీర్వాదంబు
లును మంగళపాఠకగీతరవంబులును వందిమాగధజయ
జయస్వనంబులును శంఖభేరీమృదంగారావంబులును
దుములంబులై రోదసి నిండ దివ్యరథారూఢుండై యుద
యాద్రిపైఁ బొడకట్టు చండభానుండుసుంబోలె భీష్మ
ద్రోణ కృపాశ్వత్థామ కర్ణ గాంధారరాజాదులుం
జతుర్ధనుండును యుధిష్ఠిరాదిసోదరులును దమతమచందం
బులు మెఱయ సామజసైంధవస్యందనారూఢులై తోడరా
నిజరాజధానియగు హస్తిపురి నిర్గమించె నప్పుడు.

6

చ.

పిడుగులు నల్గడం బడియెఁ బెల్లుగ నెత్తురువాన వట్టె మి
న్నడరెఁ దురంగపుచ్ఛముల నగ్నికణంబులు రాలెఁ గైదువుల్
పొడిపొడి యయ్యె మత్తగజపుంగవగండమదాంబుధారలున్
దొడిఁబడి యింకె సైనికధనుర్ధరు లాత్మ భయంబు నొందఁగన్.

7


వ.

ఇట్లు మహోత్పాతంబులు గనుంగొని యగ్గాండీవి శాంతన
వానుమతంబునఁ దచ్ఛాంతివిధానంబు గావించి నడచిన
యవసరంబున.

8


సీ.

మత్తవారణగండమండలీనిస్సర
             ద్దానధారల సముద్రములు పొంగ
నాశీరచరణగంధర్వరింఖోద్ధూత
             ధూళిచే గగనసింధువు గలంగ
నిష్ఠురస్యందననేమిఘంటానినా
             దముల హేమాద్రి[2]సింహములు చెదర
బరభయంకరవీర బలబాహుఖడ్గదీ
             ధితులచేఁ జండాంశుదీప్తి పొదల


తే.

విజయదుందుభికాహళవేణుశంఖ
మురజఢక్కాహుడుక్కాసమూహరావ
మఖిలదిక్కులు నిండ బ్రహ్మాండ మగల
సేన లరుదెంచె నాకురుక్షేత్రమునకు.

9


క.

పాండవులుఁ గౌరవులు భీ
ష్ముండును ద్రోణుండు ద్రుపదముఖ్యులు నచటన్
మండితనివాసములయం
దుండిరి జయకాము లగుచు నుచితప్రీతిన్.

10

వ.

అంత నర్జునుం డాత్మస్కంధావారంబునకు రక్షగాఁ
దూర్పున ధృష్టకేతుని నాగ్నేయంబున విందానువిందు
లను దక్షిణభాగంబున సుదక్షిణుని నైరృతిప్రదేశంబున
నీలునిఁ బశ్చిమస్థలంబునఁ గేకయులను వాయవ్యంబున
నంగాధీశ్వరుని నుత్తరంబున భగదత్తుని నైశాన్యంబున
సింధుదేశాధీశ్వరుని వారిమధ్యంబునఁ బాంచాలరాజ
మత్స్యవల్లభులను నియమించె నంతకుమున్న సుయో
ధసునియోగంబునఁ బనులవారును సకలపదార్థంబులు
వలయువారలకు నొసంగుచుండి రెల్లజనంబులు సంతోష
భరితాంతఃకరణులై యుండిరని చెప్పుటయు.

11


క.

అనవుడు శుకయోగికి న
ర్జునసూనుం డనియె నాకురుక్షేత్రముసం
దనికై పాండవు లుండిన
వనజాక్షుం డెవ్విధమున వచ్చె నచటికిన్.

12


తే.

అనుడు శుకయోగి యయ్యర్జునాత్మజాతు
తోడ నిట్లనుఁ బాండుపుత్రులు శమంత
పంచకంబున నుంట యాప్తచరు లెఱిఁగి
విన్నవించిన నయ్యదువిభుఁడు నవ్వి.

13


వ.

కొలువుకూటంబున కేతెంచి బలభద్రసాత్యకిప్రముఖులం
బిలిపించి వారలతో నిట్లనియె జతుర్ధనరక్షణార్థం బర్జును
నకు సహాయులై యవంతీవిభులగు విందానువిందులును
విదర్భాధిపతియగు రుక్మియు యవనపాండ్యాధీశ్వరులును
గాంభోజపతియగు సుదక్షిణుండును జేదిపతియగు ధృష్ట
కేతుండును గేకయమహీశు లేవురును బ్రాగ్జ్యోతిషాధికుం
డగు భగదత్తుండును బాంచాలపతియగు ద్రుపదుండును

మత్స్యమద్రసింధునాథులగు విరాటశల్యసైంధవులును
రాక్షసరాజేంద్రుండు నాదిగాఁగల నానాదేశాగతరాజన్య
బలంబులు పదునాల్గక్షౌహిణులును ధర్మజసుయోధనుల
మూలబలంబులు నాలుగక్షౌహిణులును గూడఁ బదునెనిమి
దక్షౌహిణు లయ్యె నంతటికి నర్జునుం డధిపతియై భీష్మ
ద్రోణ కృపాశ్వత్థామ కర్ణ బాహ్లిక సోమదత్త భూరి
శ్రవులు మొదలుగా సమస్తయోధులుం గొలువఁ గురు
క్షేత్రంబున కేతెంచియున్నవారని జారులు చెప్పిరి కావున
మన మచ్చటికిఁ బోవవలయు. వారలకు సమానులయిన
మనయోధుల నేర్పఱచెదనని హలాయుధున కిట్లనియె.

14


సీ.

నీవు భీష్మునకు శైనేయుఁ డశ్వత్థామ
             కును వృకధ్వజుఁడు ద్రోణునకుఁ జేకి
తానుండు బాహ్లికతనుజాతునకు నని
             రుద్దుండు కృపునకు నుద్ధవుండు
మత్స్యేంద్రునకు దీప్తిమంతుండు రాజరా
             జునకు సాంబుఁడు సూర్యతనయునకు గ
దుండు మారుతికి వృకుండు కేకయులకుఁ
             జారుదేష్ణుండు దుశ్శాసనునకుఁ


ఆ.

బుష్కరుండు పాండ్యభూపాలునకు గాంది
నీసుతుండు ద్రుపదునికి సునంద
నుండు నాసుదక్షిణునకును గృతవర్మ
శల్యునకు శుకుండు సైంధవునకు.

15


వ.

వెండియుఁ దక్కినయోధులు వారలయోధులకు నే నర్జు
నునకుం బాలుపడిన జయింపవచ్చునని కొలువు సాలించి
యంతఃపురంబున కరిగె నందఱుం దమతమనివాసంబు

లకుఁ జని రంత నయ్యదువల్లభుండగు శ్రీకృష్ణుని యను
మతంబునఁ జారుదేష్ణుండు ప్రయాణభేరి వేయించిన.

16


మ.

శరధివ్రాతము పంకమై నిలిచె నక్షత్రంబు లుర్లె న్దిశా
కరిసందోహము మ్రొగ్గె భూధరము లాకంపించె సూర్యాగ్నిచం
ద్రరుచుల్ మాసె నభంబు బిట్టడరెఁ బాతాళంబు భీతిల్లె శం
కరనీరేరుహసంభవుల్ బ్రమసి రుగ్రంబైన భేరీధ్వనిన్.

17


వ.

అయ్యవసరంబున యదువృష్ణిభోజాంధకాదులు యుద్ధ
సన్నధ్ధులైరి. కృష్ణుండును సముచితశృంగారం బంగీకరించి
యంతఃపురంబు వెడలి.

18


తే.

సైన్యసుగ్రీవమేఘపుష్పకబలాహ
కములతో సరిచాపమార్గణగణాది
సకలసాధనములతోడఁ బ్రకటగరుడ
కేతనముతోడఁ దగుతేరు ప్రీతిఁ జూచి.

19


వ.

ఆరథమునకుఁ బ్రదక్షిణము గావించి మహీదేవతల దీవనలు
గొని వాదిత్రనాదంబులు చెలంగ రథారోహణంబు చేసిన
బలభద్రసాత్యకిప్రభృతిభ్రాతృవ్రాతంబును బ్రద్యుమ్న
సాంబసారణచారుదేష్ణదీప్తిమద్భానుభానువిందశుక
వృకపుష్కరవేదవాహశ్రుతదేవసునందచిత్రబర్హ
వరూధికవిన్యధారుణాదికుమారసంఘాతంబును ననిరు
ద్ధాదిపుత్త్రసమూహంబును, నుద్ధవాక్రూరకృతవర్మచేకితా
నాదిబంధుసందోహంబును గూడి తమతమబలంబులు గొలువ
నిజకేతనచ్ఛత్రచామరశంఖశిరస్త్రాణతనుత్రాణధనుర్బా

ణాది నానావిధచిహ్నచిహ్నితంబు లగురథంబు లెక్కి
రయ్యవసరంబున.

20


సీ.

శుభమస్తు దేవతాచూడావతంస యం
             చు సరోజగర్భాదిసురలు పల్క
భద్రమస్తు సుపర్వపరిపంథిహర యని
             సిద్ధమునీంద్రు లాశీర్వదింప
మంగళమస్తు రమానాథ యని యక్ష
             వనితలు గర్ణపర్వముగఁ బాడ
విజయోస్తు తే జగద్వినుతవిక్రమ యని
             వందిమాగధులు గైవార మొసఁగ


తే.

నాగఘీంకారఘంటానినాదములును
ఘోరగంధర్వవిపులహేషారవంబు
నిష్టురస్యందనోదగ్రనేమిరావ
మును దిశల్ నిండఁ గదలె నా మురహరుండు.

21


వ.

ఇవ్విధంబున నశేషబలసమేతుండై కదలి రాజమార్గంబున
నల్లనల్లన చనుదెంచు నప్పుడు.

22


తే.

పౌరపుణ్యపురంధ్రు లభ్రంకషకన
కమయసౌధాగ్రములనుండి కంసవైరి
మీఁదఁ జల్లిరి లాజసమ్మిళితపుష్ప
ములు జయధ్వను లాకాశమునఁ జెలంగ.

23


వ.

అందు.

24


ఉ.

అక్కట యింతమాత్రమునకై భువనంబులయందు నెల్లఁ బే
రెక్కిన యాదవోత్తము లనేకులు కొల్వఁగ మేటికయ్యముల్
పెక్కులు గెల్చినట్టిహరి పెంపునఁ దాఁ జన నేల యిందులో

నొక్కఁడ చాలు నోర్వఁగ రణోర్వినిఁ
గౌరవపాండవేయులన్.

25


క.

అని పలుకువారు గొందఱు
ఘను లర్జునుమూఁకలోనఁ గలరు నదీనం
దన గురు కర్ణాశ్వత్థా
మ నకుల కృప వాయుతనయ మద్రేశాదుల్.

26


క.

వారలయం దొక్కొక్కఁడ
యీరేడుజగంబులందు నెక్కుడు కడిమిం
దేరినవారు వీరలు
నారూఢబలాఢ్యు లిఁక జయము విధి యెఱుఁగున్.

27


క.

అనువారలునై చూడఁగ
ననుజులుఁ దనుజులును గొల్వ నతిసంతోషం
బున సేనలు మున్నుగ న
న్వనజాక్షుఁడు వెడలె ద్వారవతిపుర మనఘా.

28


వ.

అప్పుడు.

29


సీ.

పరశు తోమర గదా ప్రాస కృపాణ చా
             పశరాఢ్యులై వీరభటులు చనఁగ
సమరసన్నాహభీషణయోధజనమనో
             రథసమానంబులై రథము లరుగ
నిజవేగజితమనోనిలజవవాజిసం
             హతి ధరాతలము గ్రక్కతిలఁ బర్వఁ
బృథులఘంటాజాతభీషణారావంబు
             సురల బెగ్గిలఁజేయఁ గరులు నడవ


తే.

నామహాభార మోర్వక యవని గ్రుంగ
దిక్కరులు మ్రొగ్గె శేషుండు దిరిగె ముదుక

కచ్చపంబును దలయెత్తఁ గానదయ్యెఁ
గ్రోడమును నిల్వనోపక కొమ్ము వంచె.

30


వ.

ఇవ్విధంబున బంధుభ్రాతృపుత్త్రమిత్రాదిజనంబులు పరి
వేష్ఠించి కొలువ శమంతపంచకంబునకుం జనుదెంచి
యంతకమున్న పన్నినం గనుపట్టు పట్టాంశుకవిరచితాభ్యం
తరనివాసంబులును, నీలపటకల్పితానల్పకుంజరశాల
లును, ధవళాంబరకృతమందురలును, చిత్రచేలనిర్మితంబు
లగు గుడారంబులును, విలసిల్లు నిజశిబిరంబు గోధూళికా
లగ్నంబునం బ్రవేశించి సాత్యకి ప్రదుమ్నానిరుద్ధాదుల
నయ్యైఠావుల నుండ నియమించి బలభద్రాదుల నుచిత
స్థానంబుల కనిపి రథంబు డిగ్గి యభ్యంతరంబున కరిగి.

31


తే.

నలిననేత్రుండు పన్నీట జలకమాడి
వస్త్రభూషణమాల్యముల్ వరుసఁ దాల్చి
బుధులతోఁ గూడి సంధ్యాదివిధులు దీర్చి
యన్నపానాదికృత్యంబు లాచరించి.

32


క.

అరవిరిపూఁబానుపుపై
మురాంతకుఁడు పవ్వళించె ముద్దియ లడుగుల్
పరిపరిలాగుల నొత్తఁగ
మరువపుసురటీలు వీవ మది ముద మొదవన్.

33


వ.

అనవుడు నుదారస్వాంతుండగు నిలావంతుండు హరి
గుణానురాగియగు శుకయోగి కిట్లనియె.

34


క.

హరి యివ్విధమున సేనా
పరికరములతో శమంతపంచకమునకుం
ద్వరితముగ వచ్చినంతట
హరిసూనుం డేమి చేసె నానతి యీవే.

35

వ.

అనుడు శుకయోగీంద్రుం డిట్లను నాతెఱంగున హరి సుఖ
నిద్రం జెందినఁ దత్సైన్యంబులవారలును మజ్జనభోజనాది
కృత్యంబులు దీర్చి విశ్రమించి రంత నిక్కడఁ బాండవస్కంధా
వారంబున నొక్కరమ్యప్రదేశంబునఁ గరదీపికాసహ
స్రంబులు వెలుంగ బాహ్లికాదికురువృద్ధులును ద్రుపదాది
బంధులును ద్రోణాదిమాన్యులును గర్ణాది[3]దొరలును
ధర్మజసుయోధనాదిపౌత్త్రులును బరివేష్టింపఁ గాంచన
పీఠికాసీనుం డైయున్న గాంగేయునకు నర్జునుం డిట్లనియె.

36


మ.

హరి యేతెంచె సమస్తబంధువులు సైన్యాధీశులున్ నందనుల్
కరిగంధర్వరథాశ్వసేనలు సమగ్రప్రీతిఁ గొల్వంగ సం
గరకేళీపరులై మదీయరథులుం గాల్ద్రవ్వుచున్నారు ని
ర్భరదర్పంబున మించి రేపకడ సంగ్రామంబు సేయందగున్.

37


క.

అనుడుఁ గిరీటికి గంగా
తనయుం డిట్లనియె నతని తలఁ పెఱిఁగి ప్రియం
బున నట్లే చేయుద మీ
జననాథుల ననుపు యుద్ధసన్నద్ధులు గాన్.

38


వ.

అన నప్పార్థుండు పార్థివోత్తములం గనుంగొని యిట్లనియె.

39


మ.

హరితో నీధరణీవరాగ్రణికినై యాయోధనక్రీడకున్
బురిగొంట న్ననుఁ గూడి మేనులు తృణంబుల్ గా విచారించి వీ
రరసోద్రిక్తమనస్కులై మెఱయువారల్ నిల్వుఁ డాత్మన్ శరీ
రరతిం జెందినభూవరుల్ చనుఁడు పుత్రభ్రాతృసంయుక్తులై.

40


వ.

అనిన వారెల్లను నైకమత్యంబున నర్జునున కిట్లనిరి.

41

క.

సురనాథతనయ సంగర
ధరణిని బ్రాణంబు లొసఁగెదము "కా చింతా
మరణే రణే” యనెడు పలు
కెఱుఁగమె నీ కేల మమ్ము నిట్లాడంగన్.

42


వ.

అనిన నట్లేని యెల్లి కయ్యంబునకుఁ జయ్యన సన్నద్ధులై
రండని యనిపిన నెల్లవారలుం దమతమ విడిదల కరిగిరి.
అనంతరంబ భీష్ముండును బాహ్లికద్రుపదాదులును నిజ
నివాసంబులకుం జనిరి. వారలచేత ననుజ్ఞాతుండై తానును
నిజస్థానంబున కరిగి యుచితప్రకారంబున నుండె నంత.

43


క.

తెలతెల వేగినఁ బణిహా
రులచే నన్నరుఁడు భూవరులకు దొరలకున్
బలములతో నాయితమై
నిలుఁడని చెప్పించె నంత నిజశిబిరములన్.

44


సీ.

పక్కెరల్ [4]వన్నింప భద్రదంతావళ
             ఘటలు గావించు ఘీంకారరవముఁ
బల్లనల్ గట్టుచో నుల్లాసముగఁ జేయు
             సైంధవశ్రేణి హేషారవంబు
నాయిత మొనరింప నందంద తిరుగంగఁ
             దేరులఁ బరఁగు చక్రారవంబు
సన్నద్ధులగుచు నుత్సాహంబుతో వీర
             వరు లొనరించు నాహ్వానరవము


తే.

విజయభేరీమృదంగాదివివిధతూర్య
రవము లొక్కట దివి భువి నవియఁ జేయఁ

బూర్ణచంద్రోదయాత్యంతఘూర్ణమాన
సాగరంబును బోలి తత్సైన్య మడరె.

45


వ.

అయ్యవసరంబున సూర్యోదయంబైనఁ జతురంగబలంబులు
సవరణలఁ గనుపట్టి నేల యీనినచందంబున సంగరంబు
నకు నరుగం దొడంగె నంత.

46


సీ.

కాంచనపద్మరాగశ్రేణిచే నొన
             ర్చినయట్టి దివ్యకీరీట మమర
నతులితవజ్రమయంబై యభేద్యమై
             తనరు వర్మము మేన ఘనత చూప
మరకతమాణిక్యమయదండయుక్తప్ర
             తాపాంకవానరధ్వజము మీఱ
నంభోజసంభవస్యందనరథ్యవి
             భ్రాజితగంధర్వరథము మెఱయ


తే.

మద్రనాథుండు నొగలపై మహిమఁ జెలఁగ
గాండివంబును గవదొనల్ కాంక్షఁ బూని
దేవదత్తనినాదంబు దిశలు నిండ
విజయంఁ డత్యుగ్రమూర్తియై వెడలె ననికి.

47


వ.

వెండియు భీష్మ ద్రోణ కృపాశ్వత్థామ కర్ణ బాహ్లిక సోమ
దత్త భూరిశ్రవులుసు ధర్మజ భీమ నకుల సహదేవులును
దుర్యోధన దుశ్శాసన దుర్దర్షణ దుష్ప్రసహాది ధార్తరాష్ట్ర
శతంబును ద్రుపద శిఖండి ధృష్టద్యుమ్నాది పాంచాల
వర్గంబును విరాట ధృష్టకేతు సుదక్షిణ యవన నీల
విందానువిందులును గేకయమహీపాలు లేవురును భగ
దత్తాలంబుస హలాయుధ ఘటోత్కచాదులును రుక్మి

సైంధవశకున్యాదినానాదేశాధీశ్వరులును దమతమచతు
రంగబలంబులు గొలువ రథారూఢులై నిజకేతనచ్ఛత్ర
చామరాదినానాలాంఛనంబులు మెఱయ శంఖంబులు
మ్రోయించుచు నొండొరుల సంగరోచితాలాపంబు లాడుచు
నద్దేవేంద్రనందనుఁగూడ నడచి రంత నందఱం గలయం
జూచి.

48


సీ.

వివిధశాస్త్రాస్త్రప్రవీణులై తగు వీర
             బలము నొక్కుమ్మడిఁ బౌజుకొలిపి
వానికిఁ బ్రాపుగా వాయువేగములైన
             గుఱ్ఱంపుదళములఁ గుదురుపఱచి
వానికిఁ గాపుగా నానారణక్రియా
             శూరులచే మీఱు తేరు లునిచి
వానికి బాసటగా నున్న తద్విప
             ప్రచయంబు చాలుపువాఱఁజేసి


తే.

నడుమ నొక్కొక్కరాజు నేర్పడఁగ నునిచి
యనిమిషాధీశనందనుం డను వెఱింగి
మానుషవ్యూహ మొనరించె భూనుతముగ
సకలయోధులుఁ జూచి యాశ్చర్య మొంద.

49


వ.

ఇవ్విధంబున మానుషవ్యూహంబుఁ బన్ని యందునకుముం
దట గాంగేయరాధేయులును దానును వామభాగంబున
గురుకృపాశ్వత్థామలును దక్షిణపార్శ్వంబున భీమధృష్ట
ద్యుమ్నఘటోత్కచులును నడుమ యుధిష్ఠిరనకులసహ
దేవదుర్యోధనదుశ్శాసనాదులును జతుర్ధనుండును వెనుక
బాహ్లికసోమదత్తభూరిశ్రవులును నెడనెడ ద్రుపద

శిఖండి విరాట దృష్టకేతు కేకయ నీల సుదక్షిణ విందాను
విందులును భగదత్తాలంబుస హలాయుధ రుక్మి సైంధ
వాదులు తమతమతనుత్రాణశిరస్త్రాణచాపబాణతూణం
బులు ధరియించి హస్త్యశ్వరథారూఢులై వీరాలాపంబులు
నిగుడం బడమరమొగంబై నిల్చిన నమ్మొన పరభయం
కరంబై యుండె నంతకమున్న యక్కడ.

50


మ.

వనజాక్షుండును వైణికోత్తములు భవ్యప్రక్రియంబాడ మే
ల్కని కాలోచితకృత్యముల్ నడపె నక్కౌంతేయు లాయోధనం
బున కేతెంచువిధం బెఱింగె బలరాముండు న్మదిం బొంగి గొ
బ్బున సేనల్ వెడలింప వేత్రసమితిం బుచ్చెన్ రణక్షోణికిన్.

51


వ.

తదనంతరంబ.

52


ఆ.

గరుడకేతనంబు గగనంబు నొరయంగ
ఖడ్గబాణచాపగదలమెఱుఁగు
లెల్లదిశలు నిండ నెలమి దారకుఁ డర
దమ్ముఁ జేరఁ గడుముదమున నెక్కి.

53


మ.

రమణీయంబగు పాంచజన్యజనితారావంబు గర్జావిశే
షముగా ఖడ్గమరీచిజాలము తటిత్సంఘంబుగా నుగ్రచా
పము దేవేంద్రశరాసనంబుగను శుంభత్కృష్ణమేఘంబు
పార్థమహాగ్నిచ్ఛటమీఁది కేగె శరధారాఖేలనోన్మాదియై.

54


వ.

మఱియును.

55


ఉ.

విధ్వమలాంశురేఖ యన వెల్లవిగాత్రము చెంగలింపఁ దా
లధ్వజ మొప్ప సీరముసలంబులు భీషణవృత్తిఁ జూప శం
ఖధ్వని లోకజాలములు గంపము నొందఁగఁ జేయ వచ్చె న

భ్రాధ్వమునన్ సురాళి గొనియాడఁ బ్రలంబవిరోధి యాజికిన్.

56


ఉ.

అత్యధికప్రతాపము జనావళి సన్నుతిఁ జేయ సంగరౌ
చిత్యము మీఱి వర్మము విచిత్రకిరీటముఁ దాల్చి శస్త్రసాం
గత్యమున న్విరోధులకుఁ గాలుఁడనం గడుభీకరాకృతిన్
సాత్యకి వచ్చె భర్మరథజాలము మ్రోయఁగ యుద్ధభూమికిన్.

57


శా.

విద్యుల్లీలఁ జెలంగు ఖడ్గలతికావిర్భూతరుగ్జాలముల్
ఖద్యోతప్రభ నించఁ శంఖరవ మాకాశంబునం బర్వ యు
ద్ధోద్యోగంబున మత్స్యకేతనముతో యోధావళు ల్వెంట
రాఁ బ్రద్యుమ్నుం డరుదెంచె వైరికులగోత్రచ్ఛేదదంభోళియై.

58


మ.

ఘనబాణాసనబాణకుంతపరిఘాఖడ్గంబుల న్మించు మిం
చినతే రున్నతలీల నెక్కి సిడమున్ జిత్రాతపత్రంబు మీ
ఱ నవీనోజ్జ్వలదివ్యవర్మము శిరస్త్రాణంబుఁ జూపట్టఁగా
ననిరుద్ధుం డనిరుద్ధవృత్తి నడచెన్ హర్షంబు సంధిల్లఁగన్.

59


శా.

చండప్రక్రియ మేఘడంబరము లాశాచక్ర మొక్కుమ్మడిన్
నిండ న్నవ్యరథంబుపై నిలిచి తూణీరంబులున్ సజ్యకో
దండంబున్ ధరియించి కంకటశిరస్త్రచ్ఛన్నుఁడై చారుదే
ష్ణుం డేతెంచె మహోజ్జ్వలాకృతి రణక్షోణీజయోత్సాహియై.

60


ఉ.

అంబుజలోచనప్రతిముఁ దాహవకేళిధురంధరుండు బీ
రంబున విల్లునమ్ములుఁ గరంబులఁ బూని విపక్షభీకరా
డంబరవృత్తి దిక్కులు వడంక మహారథ మెక్కి వేడ్కమై
సాంబుఁడు వచ్చె వాహినులసంఖ్యలు గొల్వఁగ యుద్ధభూమికిన్.

61

సీ.

ఇద్ధసంగ్రామస్థలోద్ధవుం డుద్ధవుం
             డుగ్రసేనుం డాజి నుగ్రసేనుఁ
డభియాతిరాజమహాక్రూరుఁ డక్రూరుఁ
             డరితమోనిచయోద్యదరుణుఁ డరుణుఁ
డతులితధీరతాకృతవర్మ కృతవర్మ
             కాంచనమణిమయాంగదుఁడు గదుఁడు
దారుణసమరైకతానుండు చేకితా
             నుం డాస్యజితపుష్కురుండు పుష్క


తే.

రుండును శుకుండు దీ ప్తిమంతుండు భాను
విందుఁడు సునందనుండును వేదవాహుఁ
డును బృహద్భానుఁడును వృకుండును రథంబు
లెక్కి చని రనికి ధరణి గ్రక్కతిలఁగ.

62


వ.

మఱియు భానుదేవుండును సారణుండును శ్రుతదేవుండును
వరూధియుఁ జిత్రబర్హియు నాదిగాఁగల యోధులు దమ
తమసేనాసమేతులై యొండొరులఁ గడవఁ బంతంబులు
పలుకుచు సింహనాదంబులు సేయుచు శంఖంబులు పూరిం
చుచుఁ గృష్ణునిం గూడి చని రంత నిరంతరదానధారా
గంధలుబ్ధపుష్పంధయఝంకారబధిరితదిక్తటంబులై
చలితఘంటాఘణఘణారావనిజఘీంకారప్రతిధ్వనిత
చక్రవాళాచలగహ్వరంబులైన మత్తదంతావళంబులును,
మత్తదంతావళమదజలకలితమార్గదుర్దమకర్దమంబుడెక్కల
త్రొక్కుడులచే నింకి పగిలి బీటలై రజోవికారంబుఁ జెంది
యెగసి మొగసి చూచు గంధర్వగరుడసీమంతినుల సీమంతసీ
మల సిందూరరేఖలై తత్కబరీభరవిలసితమందారతరు

ప్రసూననిష్యందమానమరందమదవదిందిందిరంబులపై
బుప్పొడియొప్పునం గప్పి మెఱయ నడతెంచు భీషణహేషా
ఘోషంబుల జయసూచనంబు చేయు వాయువేగతురంగం
బులును, వాయువేగతురంగంబుల గట్టిపఱచి సారథులు
వలసినయెడలకు నడిపింప యుద్ధసన్నద్ధులగు రథికులకు
నెఱకలై యెఱకలు వచ్చిన భుజంగమంబుల తెఱుంగునం
దనరు విచిత్రకేతనంబులును, గేతనంబులఁ బొలుపొంది
యాత్మచక్రనేమిధ్వానంబులచేత శైలగహ్వరంబుల ని
ద్రించు సింగంబుల మేలుకొల్పు రథంబులును రథంబుల
కంటె వడి గలిగి ధనుర్బాణపట్టిసప్రాసపరశ్వధశూలభిండి
వాలకరవాలతోమరక్షురికాగదాదినానావిధాయుధ
సన్నద్ధులై యుబ్బున నిబ్బరంబైన బెబ్బులులచందంబునఁ
గొదమసింగంబులతెఱంగునం బొంగి నింగి పగుల
నార్చుచు నొండొరులఁ గడవఁ బఱతెంచు వీరభటులుం
గలిగి యెడ లేక ఘోషించు విజయభేరీమృదంగకాహళా
దుల యారావంబుల నమరి యిరువది యక్షౌహిణులుం
గనుపట్టు నాత్మసేనాసముద్రం బర్జునద్వీపంబు ముంపుట
కునై యెదురునడచి నిల్చిన.

63


ఉ.

ఆ హరి పాండవేయులు నయంబునఁ బన్నినయట్టి మానుష
వ్యూహముఁ జూచి యందునకు నోర్చి జయించుటకై మహాచల
వ్యూహ మొనర్చె నంత నరియోధులు విస్మయ మొంది సంగరో
త్సాహముఁ దక్కి రాత్మల భుజంగమరాజసుతాతనూభవా.

64


వ.

అని మఱియు నిట్లనియె నట్లు పన్నిన యమ్మొగ్గరంబుముం
దఱఁ దానును బలభద్రుండును సాత్యకియును వామ

భాగంబునఁ గృతవర్మ ప్రద్యుమ్నానిరుద్ధులును దక్షిణ
పార్శ్వంబున గద సాంబ చారుదేష్ణులును మధ్యప్రదేశం
బున బంధుమిత్రామాత్యసహితుండై సెలయేరులతోడి నడ
గొండలనఁ బొల్చు గంధసింధురంబులు పరివేష్టింప రథా
రూఢుండై యుగ్రసేనుండును బశ్చాద్భాగంబున యుద్ధ
వాక్రూరచేకితానసారణాదులును నెడనెడ బృహద్భాను
భానుదేవ శ్రుతదేవ నృక శుకారుణాదికుమారులునుం
దమతమ యడియాలంబులు మెఱయనుండిరి. వారల
యుద్ధంబుఁ జూడ నంతకమున్న పురందరాదిబృందారకులు
విమానారూఢులై యంతరిక్షంబున నిల్చి రంత.

65


క.

మోహరములు రెండును స
న్నాహంబునఁ దారసించినన్ ఫల్గున సే
నాహంకృతి యుడివో ను
త్సాహంబున శౌరి పాంచజన్యం బొత్తెన్.

66


క.

వెండియు రాముఁడుఁ బ్రద్యు
మ్నుండును సాత్యకియు సారణుండును ననిరు
ద్ధుండును గృతవర్మయు సాం
బుండును శంఖంబు లపుడు మొరయించి రొగిన్.

67


తే.

సకలయాదవసేన యుత్సవముతోడ
సింహనాదంబు లొనరింప సింహనాద
ముల యటంచును భీతిపెంపునఁ గిరీటి
బలములోఁగల కుంజరంబులు వడంకె.

68


వ.

మఱియుఁ గృష్ణుని సైన్యంబునందు విజయభేరీశంఖకాహ
ళాదులు మొరయించిన నారావంబు ప్రళయశాలఘూర్ణ

మానార్ణవధ్వానంబు ననుకరించె సకలయోధవీరులును
గయ్యంబునకుఁ గాలు ద్రవ్వుచు ధనుర్గుణటంకారంబులు
నిగిడింపుచుఁ జతురంగబలంబులు మున్ను నడపించినంత.

69


క.

ఈకైవడి హరిసేనా
నీకము నడతేరఁ జూచి నిష్టురకోపో
ద్భ్రూకౌటిల్యమున సుభ
ద్రాకాంతుఁ డపుడు దేవదత్తం బొత్తెన్.

70


సీ.

తదనంతరంబున ధర్మపుత్త్రుం డనం
             తవిజయంబును వృకోదరుఁడు పౌండ్ర
మును మాద్రి పెద్దనందనుఁడు సుఘోషంబుఁ
             దెలివి మీఱఁగ సహదేవుఁడు మణి
పుష్పకంబును నదీపుత్రుండు గురుఁడును
             గృపుఁడు ద్రౌణియుఁ గురుక్షితివిభుండు
హైడింబుఁడును ద్రుపదాధీశుఁడును మత్స్య
             పతి వికర్ణుఁడు నలంబుసుఁడు నర్క


తే.

పుత్త్రుఁ [5]డాదిగ యోధు లద్భుతము గాఁగ
శంఖములను మ్రోయింపఁ దత్స్వానములను
విజయదుందుభి తమ్మట వ్రజరవంబుఁ
గూడి యొక్కట సర్వదిక్కులుఁ బగిల్చె.

71


ఉ.

వాసవిఁ జేరవచ్చి మనవారలకున్ సెల విమ్మటంచు దు
శ్శాసనుఁ డాడి యవ్విభుని సమ్మతినొంది చెలంగి యాత్మసే
నాసమితిన్ రయంబున రణంబునకుం బురికొల్పునంత ను
ల్లాసముతోడ నమ్మొన చలంబున యాదవసేన దాఁకినన్.

72

చ.

హరులు హరుల్ రథావళి రథావళి యోధులు యోధు లుగ్రకుం
జరములు కుంజరంబులును సందడిగాఁ దలపడ్డ నప్పు డ
బ్బరవస మిట్టిదట్టిదని పల్కఁ దలంప నశక్యమయ్యె నా
సరసిజసూతికైనను భుజంగమహారునకైనఁ జూడఁగాన్.

73


వ.

మఱియు నుభయసైన్యంబులం గనుపట్టు వీరభటులు
చటులచక్రచంక్రమణవిలాసనిరుపమాభ్యాసులై యీసున
రేసి పోతరించి యాఁబోతులరీతి గంధసింధురంబుల
చందంబునఁ గొదమసింగంబులతెఱంగునం దలంపడి
పోరుచోఁ గఠోరంబుగ వారలు మీఱినపంతంబుల
నంతంతకు నడుగులెక్క లెక్కగొనక యొండొరుల నేరు
పునం బొడువఁ గడుపడిన్ డింపుచు నిప్పులొలుక సరి
దాటులుగ విళంగీలవయిచుచు బిరుదునం దివురుకొనునెడ
వెఱపులు గని కుమ్మి నెమ్మి సంతసిల్లి ఱంకెలు వైవ నంకంబు
లకు సూడిపట్టి నెట్టనఁ జంపి చచ్చువారలు, నడ్డాయుధం
బులఁ బ్రవీణులై సంచలింపక యొకండొకండు పడుగురేగుర
తోడ భ్రమరీవిశేషంబులం జరియింపుచు డాయుచు
చేయుచు నొండొరుల వ్రేట్లు దప్పించి దాఁటుచు నీటున
నరి కెదిరించి యుఱుకుచుఁ బరస్పరహేతిగతుల నంగం
బులు వ్రీలినఁ బిఱికివాఱక సాహసంబున మించి నేల
కొఱగువారును, నానావిధాయుధానీకంబులు ధరియించి
బంటుతనంబున శూరులతోడం దలపడి సంగరప్రకారం
బునం బెఱవారలు చూచుచుండఁ బోరాటం బొనరించుచు
హుంకారంబు నిగిడించుచు నొక్క సధనంబు దమమేను
నొంప నది నెత్తురుకాఁక వీఁకఁ దిగువరాకున్న నొండొక

యాయుధంబు గొని నఱక నదియుఁ దుత్తుమురైన వేఱొక
శస్త్రంబునఁ బొడిచి విడిచి పుడమి యద్రువఁ గలియంబడి
బాహబాహిం బెనంగి త్రెళ్లువారును, గైదువు లంకించి
ఱంకెలు వైచుచుఁ బదువురు నేవురు జోకలై యురువడించి
మేనులు సింపుచుఁ బొంచి పొంచి పదలాఘవంబుల నెదిరి
యితేరేతరముష్టాముష్టి మోములు పగులఁ బోరి పడువార
లును, మఱియు నూఱు నిన్నూఱుఁ దుటుముతుటుములై
చటులగతిం గయ్యంబులు సేయఁ జొచ్చి హెచ్చినగర్వం
బున నన్యోన్యప్రాసంబులఁ గర్ణాద్యవయవంబులు దెగిన
సిబ్బితి నిబ్బరంబై మగుడఁజాలక వీడని మచ్చరంబునఁ గచా
కచిం బెనంగి మడియువారును సహస్రసంఖ్యలగు శూరులు
గుంపులై గర్వంబు పెంపున మూఁకల కుఱికి గదలఁ గదల
నీక పోరి యొండొరులయేట్ల లుకలుకలై కూలువారలును,
దమతమ దొరలు తెరలి యొరఁగు టెఱుంగక యరిగియరిగి
తిరిగివచ్చి పతులకడఁ జతురతఁ బోరి ప్రాణంబులు విడుచు
వారలును, మున్నొకని గుఱి చేసి కూడం జనునెడ నడుమ
నొకండు దల ద్రెంచినం బడక వాని నఱికి పడిపొరలు
మొండెంబులుసు, ననుజులుం దనుజులుం జుట్టంబులు
మొదలగువారలు పోరునెడ నడుమ సొచ్చి తెంపు చేసి
మృతిఁబొందువారలును, భయంకరంబైన పొలికలనం
దొరఁగు రక్తమాంసపుఁదిట్టలు సూచి వెఱచి తలకోక
లెఱుంగలేక వెఱ్ఱియాటలాడుచు నుభయసైన్యంబుల
వారలు చూచి నవ్వఁ బరువులు వెట్టువారును గశాతాడ
నంబునం జేసి తురంగమంబులం గదలించి డాసి యితరే
తరప్రహరణంబుల నశ్వపల్యాణసహితంబుగా వ్రేటాఱు

తునియలై కీలుదప్పిన బొమ్మలచందంబునం గూలు రాహు
త్తులును నంకుశాఘాతకుపితంబు లై యొండొంటి మర్మం
బులు గాడ దంతాదంతిం బోరి మావంతులతోడఁ బీనుంగు
లైన యేనుంగులును, సారథులు రవడించి యుగ్యంబుల
పగ్గంబులు వదలి కదియఁ ద్రోలినఁ బరస్పరబాణఘట్టనల
రథంబులు తిలప్రమాణఖండంబు లై దొఱఁగిన విరథులై
కరవాలంబులుం బలుకలుం గొని యోలమాసగొనక యొం
డొరుం డాసియు వ్రేసియుఁ దప్పించియుం గుప్పించియుఁ
బోరిపోరి పొలిసిన రథికులుం గలిగి యాసందడి కయ్యంబు
భయంకరంబై యుండె నంత.

74


ఉ.

వాసవనందనుం గడచివచ్చి వికర్ణుఁడు దోడు గాఁగ చు
శ్శాసనుఁ డేచి సాంబుని నిశాతశరంబుల నేయ నవ్విభుం
డీసును మచ్చరంబు మడి హెచ్చఁగఁ గృష్ణుఁడు మెచ్చ నార్చి యు
ల్లాసముతోడ వాఁడి దెరల న్విశిఖంబుల నొంచి వెండియున్.

75


క.

శరముల రెంట వికర్ణుని
తురగంబుల నొంచి పడగఁ దొమ్మిదితూపు
ల్వఱపి పొడి చేసి సారథి
నురువడి నొకకోలచేత నుక్కడఁగించెన్.

76


ఉ.

అత్తఱి దుస్ససేనుఁడు రయంబునఁ దీవ్రశరంబుచేత వీ
రోత్తము సాంబు నొంచి మఱియుం బదునేనుమెఱుంగుటమ్ము లు
వ్వెత్తున సారథిం దగులనేసి తెరల్చినఁ గృష్ణనందనుం
డొత్తిలి శాతబాణమున నొక్కట నేసె నతండు మూర్ఛిలన్.

77

చ.

కడువడి సారణుండు తెలిగన్నులఁ గెంపు దలిర్ప నగ్రజుం
గడచి శరద్వయంబున వికర్ణునిసారథిఁ జంపి యుబ్బునన్
సిడ మిడు మూఁడుబాణములఁ జెక్కలు వాపుచు వానిబాహులం
బెడిదపుటమ్ము లాఱు పఱపెన్ గగనంబు గలంగ నార్చుచున్.

78


ఉ.

వాఁడును రోషమెత్తి హరివాహిని బెగ్గిల సాంబుతమ్ముని
న్మూఁడు నిశాతబాణముల నొంచి హయంబులఁ గేతనంబుఁ గ్రొ
వ్వాఁడి శరంబు లేసి నెఱవాదితనంబునఁ ద్రుంప నాతనిన్
బోఁడిమి మాన్చి యార్చెఁ గురుపుంగవసైన్యము దైన్య మొందఁగన్.

79


తే.

అది గనుంగొని కృష్ణుసైన్యంబు లెల్ల
నార్చి భేరులు మొదయింప నర్జునుండు
తనబలంబులఁ బురికొల్పి తానుఁ గడఁగి
తోరమగుకిన్కతోడఁ బ్రద్యుమ్నుఁ దాఁకి.

80


తే.

అతనిపై జాలుకొన ముంచె నంపవెల్లి
మీనకేతుండు నతనిపై మించి నూఱు
సాయకంబులు వఱపె మాద్రేయు లలిగి
చారుదేష్ణునిఁ దాఁకి రుత్సాహ మొదవ.

81


క.

ఆ రుక్మిణికొమరుండును
వారలరథ్యములమీఁద వడి నూఱమ్ముల్
తోరముగ నేయ వారును
ఘోరాస్త్రము లేసి హరులఁ గూల్చిరి నేలన్.

82


వ.

అంత.

83

సీ.

సురనదీసూనుండు హరిపూర్వజునిమేన
             నాలుగు బాణముల్ నాటె నతఁడు
కోపించి హలముచేఁ గూల్చె రథ్యంబుల
             భీముండు సాత్యకిఁ బేర్చి నూఱు
శరముల నేసిన బరవసంబున వాఁడి
             తూపుల నేడింటఁ దునిమెఁ బడగ
ద్రోణుండు కృతవర్మఁ దొడరి తొమ్మిది నార
             సంబులు పరఁగింపఁ జండసాయ


తే.

కముల నేనింట నతఁడు దత్కంకటంబు
చూర్ణముగఁ జేసె నల్కమైఁ గర్ణుఁ డంబ
కంబు లిరువది ననిరుద్ధుఁ గాఁడనేయ
నతఁడు నన్నింట నొప్పించె నతనిమేను.

84


తే.

ద్రోణి వడిఁ జేకితానుని తనువు మూఁడు
బాణముల నొంచె నతఁడు నక్షీణశక్తి
నాలుగమ్ముల నతని గంధర్వములను
దనువు లెడఁబాపి యొకటఁ గేతనముఁ ద్రుంచె.

85


తే.

బాహ్లికుం డుగ్రసేనునిఁ బదిశరముల
నొంచె నాతండుఁ దూపు లేను నిగిడించె
నతనిదేహంబు దల్లడమంద సోమ
దత్తుఁ డొకయమ్ముచేత నుద్ధవునిఁ గ్రుచ్చె.

86


క.

భూరిశ్రవుఁ డరుణునిపై
ఘోరాస్త్రంబులరవది నిగుడఁగ నాతం
డీరేడు వెడఁదతూపుల
సారథిరథచాపకేతుజాలముఁ ద్రుంచెన్.

87

వ.

వెండియు ధర్మనందనుండును, సుయోధనుండును, ఘటోత్క
చుండును, నీలుండును, గేకయులును, ద్రుపదుండును, విర
టుండును, సుదక్షిణుండును, విందానువిందులును, గురు
కరూశాదిదేశాధీశులును నొక్కుమ్మడి శరపరిఘశక్తి
తోమరశూలాదిబహువిధాయుధంబుల నరిబలంబులు
బడలువడ నుద్దండవృత్తి మోడుపఱచి రందు ఘటోత్క
చుండు.

88


శా.

మౌర్వీరావము దిక్కులందు వెడల న్మాయాబలస్తోముఁడై
వార్వాహంబున మింటికిం జని శిల ల్వర్షించు నొక్కొక్కచో
గర్వోద్రిక్తమనస్కుఁడై రథికులన్ ఖండించు నొక్కొక్కచో
దుర్వారాశుగకోటిఁ గాలుబలముం దూలించు నొక్కొక్కచోన్.

89


వ.

మఱియును.

90


మ.

ఒకచో నాఱుచు నొక్కచోఁ జటుల చాపోల్లాసము ల్సేనవా
రికిఁ గానంబడఁ జేయు వేఱె యొకచోఁ గ్రీడాగతిం గుంజర
ప్రకరంబు న్వడిఁ జెండివైచు నొకచో రథ్యంబుల్ గూల్చు నొం
డొకచోఁ జీఁకటిఁ గొల్పు నంపగమిచే నుద్దామతేజంబునన్.

91


క.

ఈరీతి నింద్రనందను
వారలు వెఱఁగందఁ గృష్ణువాహిని గలఁగన్
ఘోరాస్త్రపరంపరచే
వారక పదివేలరథుల వడి మడియించెన్.

92


ఉ.

వెండియుఁ గృష్ణుసైన్యములు వీఁగి సన న్వడిఁ ద్రోలఁ జూచి సాం
బుండును సాత్యకిం గలసి పూనికతోడ ఘటోత్కచున్ మహా

కాండము లేసి నొంచి తురగంబుల పించ మడంచి సారథిన్
గుండెలు వ్రీలఁజేయుటయు ఘోరపరాక్రమవృత్తి నాతఁడున్.

93


ఉ.

ఒండురథంబుపై కుఱికి యుగ్రత సాత్యకిఁ గృష్ణనందనుం
బెండుపడ న్నిశాతశరబృందము లేసిన వారలిద్దఱున్
వెండియు భీమనందనునివిల్లుసిడంబునుఁ దేరు సారథిం
జండతరాశుగప్రతతిఁ జక్కుగఁ జేసి చెలంగి యార్చినన్.

94


క.

విరథుండై యవ్వీరుఁడు
కరమున గదఁ బూని విలయకాలుం డనఁగాఁ
బఱతేరఁ జూచి సాత్యకి
శరముల నేనింట దానిఁ జక్కుగ నేయన్.

95


క.

అనిరుద్ధుండును ఝషకే
తనుఁడు బలుఁడు సారణుఁడు నుదగ్రస్ఫూర్తిన్
ఘనబాణజాలముల నొం
చిన నాతఁడు ఱిచ్చపడి విచేష్టితుఁ డయ్యెన్.

96


వ.

అప్పుడు.

97


క.

తనకొడుకుఁ బెక్కురథికులు
గనుకని నొప్పింప నుదరి కడువడిని మరు
త్తనయుఁడు ప్రళయాంబుదని
స్వనమో యన వార్చి బాహుసారము మీఱన్.

98


ఉ.

సారణు నైదుతూవులను సాంబుని తొమ్మిదిసాయకంబుల
న్సీరిఁ బదేడుబాణముల నిష్ఠురపత్రుల రెంట సాత్యకిన్
గ్రూరశరంబుచేత ననిరుద్ధుని మారుని మూఁడుకోలలం
దూఱఁగ నేయ వారలును దోడనె కప్పిరి భీము నమ్ములన్.

99

వ.

వెండియు.

100


మ.

అనిరుద్ధుం డొకతూపుచేత బకదైత్యధ్వంసిచాపంబు గ్ర
క్కన ఖండించె బలుండు నాగట రథాంగంబు ల్వడంగొట్టెఁ గే
తన మాసాత్యకి ద్రుంచివైచె విలసత్కాండద్వయి న్మీనకే
తనుఁడున్ సాంబుఁడు నేసి రాఱుగతతిం దత్కాయ మత్యుద్ధతిన్.

101


వ.

అంత.

102


మ.

గద చేఁ ద్రిప్పుచు రౌద్రవైఖరి మహాకల్పాంతకప్రౌఢి బె
ట్టిదుఁడై భీముఁడు చండభాస్కరునికంటెన్ దీవ్రమై నెమ్మొగం
బు దలిర్పం గనుదోయి నిప్పు లురులన్ భూమండలంబెల్ల గ్ర
క్కదలన్ రామునితేరు దత్క్షణమ నుగ్గై రాలఁగొట్టె న్వడిన్.

103


శా.

ఆవీరుండును బాదచారి యయి బ్రహ్మాండంబు గంపింపఁ గ్రో
ధావష్టంభమునన్ మరుత్తనయు సంహారంబు గావింపగా
వేవేగం బఱతేరఁ గన్గొని మహావీరుండు పార్థుండు రో
షావేశంబున నేగుదెంచెఁ బరయోధానీకము ల్బెగ్గిలన్.

104


వ.

అతనితోడన యుత్తమోజుండును, యుధామన్యుండును,
ధృష్టద్యుమ్నుండును, విరాటుండును, రుక్మియు, భగదత్తుం
డును, గేకయులును నేతించి రంతకమున్న.

105


శా.

అశ్వత్థామయు భీష్ముఁడుం గృపుఁడు ద్రోణాచార్యుఁడుం గర్ణుఁడున్
విశ్వం బెల్ల వడంక నార్చి సమరోర్వీరేణుసంఘంబు స
ప్తాశ్వుం గ్రమ్మ శతాంగము ల్వఱపి తాలాంకు న్మంబేద నీ
లశ్వేతోరుగరుద్వితాన శరజాలం బేయఁగా నత్తఱిన్.

106

శా.

అగ్రధ్వానసమానశార్ఙ్గ నినదం బాకాశసంచారులన్
విభ్రాంతిం బొరలింపఁ గేతనరుచు ల్విన్నంద నత్యంతకో
పభ్రూమండలి భుగ్నయై మెఱయ శుంభత్పాంచజన్యారవా
దభ్రవ్యాప్తి మహీధ్రము ల్వడఁక దైత్యధ్వంసి యేతెంచుచున్.

107


సీ.

భీష్ము నిన్నూట నొప్పించి యశ్వత్థామఁ
             బదియేనుతూపులఁ బాఱఁగొట్టి
ద్రోణుని నిరువదిబాణంబులఁ దెమల్చి
             భీముని మున్నూట బెండుపఱచి
కర్ణుఁ బండ్రెండుమార్గణముల నోనేసి
             ద్రుపదనందనుమేనఁ దూపు సొన్పి
మత్స్యనాయకుని మైమఱు వాఱుశరములఁ
             జించి యొక్కట రుక్మి నొంచి నరక


తే.

తనయ కృపులను నిష్ఠురాస్త్రముల గ్రుచ్చి
కాండపంచకమునను గేకయుల నోర్చి
నిమిషమున నొక్కయక్షౌహిణీ బలంబుఁ
బిలుకుమారిచె నానాస్త్రముల నరేంద్ర!

108


వ.

అయ్యవసరంబున నర్జునుండు గర్జత్కాలమేఘంబు చందం
బున సింహనాదంబుఁ జేసి దేవదత్తంబు పూరించి కర్ణ
గాంధారేయాదులఁ గయ్యంబునకుఁ బురికొల్పిన.

109


ఉ.

వారలు తూర్యబంధురరవంబు లెసంగఁగ సింహనాదముల్
బోరనఁ జేసి యద్భుతముఁ బొంది సుర ల్గన శౌరిసైన్యమున్
దారుణలీలఁ దాఁకినఁ బదంపడి యయ్యదుయోధవర్యులుం

ఘోరపరాక్రమస్ఫురణఁ గోల్తలఁ జేసిరి పార్థనందనా.

110


వ.

అందు బలభద్రుండును భీష్ముండును, సాత్యకియు నశ్వ
త్థామయు, బ్రద్యుమ్నుండును ద్రోణుండును, జేకితా
నుండును సోమదత్తుండును, సనిరుద్ధుండును గృపుండును,
గృతవర్మయు ధృష్టద్యుమ్నుండును, నుగ్రసేనుండును
బాహ్లికుండును, సాంబుండును గర్ణుండును, నక్రూరుం
డును నజాతశత్రుండును, నుద్ధవుండును ద్రుపదుండును,
గలియు విరాటుండును, గదుండును భీముండును, సార
ణుండును ఘటోత్కచుండును, జారుదేష్ణుండును దుశ్శా
సనుండును, దీప్తిమంతుండును దుర్యోధనుండును, భాను
దేవుండును భూరిశ్రవుండును, బృహద్భానుండును ధృష్ట
కేతుండును, రుక్మియు భానువిందుండును, వృకుండును
గేకయులును, నరుణుండును భగదత్తుఁడును, బుష్కరుం
డును పాండ్యాధీశ్వరుండును, యవనాధిపుండును వేద
వాహుండును, శ్రుతదేవుండును సుదక్షిణుండును,
సునందనుండును నీలుండును, జిత్రబర్హియు వరూధియు,
విందానువిందులును న్యగ్రోధుండును, నకులసహదేవు
లును దక్కిన యోధులును దుర్మర్షణాదులును, హేతి
ప్రాసపరశ్వధపట్టిసభిండివాలధనుర్బాణనానావిధా
యుధసన్నద్ధులై యొండొరుల వ్రేసియుఁ ద్రోసియుఁ
ద్రుంచియుఁ జించియుఁ బొడిచియు నడిచియుఁ జిమ్మియుఁ
గ్రుమ్మియు మొత్తియు హత్తియు ననేకప్రకారంబులఁ
జమిలికయ్యంబు సేయునెడఁ గుంజరంబులఁ గుంజరంబు
లును, ఘోటకంబుల ఘోటకంబులును, నరదంబుల నర

దంబులును, బదాతులఁ బదాతులుం దలపడి పిఱుతివియని
బీరంబునఁ బరస్పరశస్త్రంబులఁ బొడిచియు నొడిచియు,
వ్రచ్చియు గ్రుచ్చియుఁ గుదిపియుఁ జడిపియుఁ గొట్టియు
ముట్టియు ననేకోపాయంబులఁ బోరుసమయంబున.

111


క.

రారాజు తమ్ములెల్లన్
ఘోరమదేభముల నెక్కుకొని యఱువదివే
లేరుపుటేనుంగులతో
నారామునిమీఁది కేఁగ నతఁ డుద్వృత్తిన్.

112


క.

ఏనిక మొత్తము లెదిరెడు
నే నిఁక మొత్తకయడంగ నెగ్గగునని మ
త్తానేకపములఁ గొన్నిటిఁ
బీనుంగులఁ జేయఁదొడఁగెఁ బేర్చినకినుకన్.

113


వ.

అట్టియెడ నా సుయోధనుతమ్ములు దుష్ప్రహ దుర్మర్షణ
దుర్ముఖ దీర్ఘబాహు భీమబాహు భీమ సుషేణ సులోచన
సేనాపతి జలసంధ విచిత్ర తర్షణోగ్రాలోలుపులు పదు
మువ్వురును మత్తకుంజరంబుల నొక్కపెట్టునం డీకొల్పి
చుట్టుముట్టిన నతం డందఱికి నన్నిరూపులై హలంబునన్
దగిలిచి తిగిచి ముసలంబునఁ దత్కుంభమధ్యంబులం దివిచి
జంభారాతి కుంభినీధరంబుల దంభోళిచేఁ గూల్చుచందం
బున నందంద కూల్చి దుష్ప్రహు సాయజంబుతోడన చదిపి
తత్సోదరుఁడగు భీమునిశిరంబు డొక్కసొర నడఁచి
తత్కుంభికుంభములు పగులందన్ని యనంతరంబ భీమ
బాహుం డురసడించి తన దంతావళంబుచే నవ్వీరునిం
బొడిపించిన నతం డచలాకారుండై తద్దంతిదంతంబులు

వెఱికి వానిన వానినేనుంగుతోడఁ బీనుంగుఁ గావించినం
దక్కిన పదుగురుసు చలపడి సింహనాదంబులు చేసి యెదిరిన
నా హలాయుధుండు వారలతోడన యవ్వారణంబుల
మారిమసంగి పొంగి నింగి వగులనార్చిన.

114


ఉ.

తమ్ములు సచ్చిరంచును ముదంబఱి యర్జునుఁ జేరవచ్చి శో
కమ్మున రాజరాజు పలుకన్ సురరాజతనూభవుండు వే
గన్మున రాజులున్ గజనికాయములుం దనతోడ రాఁగ నొ
క్కుమ్మడిఁ దన్నుఁ దాఁక బలుఁ డుద్ధతితోడ హలంబుఁ ద్రిప్పుచున్.

115


చ.

నిలిచిన సర్వసైన్యధరణీవరముఖ్యులు రేగి సాయకం
బులు నిగిడించి రాకసము పోఁడిమి గానఁగరాకయుండ న
బ్బలుఁడును వానిఁ గైకొనక బంధురహస్తహలంబుచేత రా
జులఁ బొలియించి వాజుల వసుంధరఁ గూల్చె రథాలి నూర్చఁగాన్.

116


ఉ.

అర్జునుఁ డగ్నికల్పనిబిడాశుగముల్ పరఁగించి వానిపై
నూర్జితశక్తి సూప నతఁ డుగ్రత నాఁగలిఁ గేలఁ దిప్పుచున్
నిర్జరనాథనందనుని నేలకుఁ దే నడతేర సీరి వి
స్ఫూర్జితమూర్తి చూచి దివిజుల్ భయమంది చలించి రందఱున్.

117


వ.

అయ్యవసరంబున భీమసేనుం డర్జునుం దలకడచి యమ్మహా
వీరు నెదుడువెడఁ బ్రద్యుమ్నానిరుద్ధ సాత్యకి కృతవర్మ
గద చేకితానులు రథారూఢులై కదలి పాండవసేనా
మధ్యంబున నొక్కండును బాదచారియై భీమార్జునుల
మీఁద నురువడించు బలభద్రుం గనుంగొని వాయువేగం
బున వచ్చి వివ్వచ్చుం దాఁకి.

118

సీ.

సాత్యకి యిరువదిసాయకంబుల శల్యు
             నేసెఁ బ్రద్యుమ్నుండు నేడు వెడద
తూపుల వర్మంబు దూఱనిగిడ్చె గ
             దుండు తొంబదియాఱుకాండములను
గపికేతనము సించె విపులాస్త్రములునాల్గు
             కృతవర్మ హయములఁ గీలుకొల్పెఁ
జేకితానుండు నిశితభల్లముల రెంటఁ
             దఱిమి గాండీవంబు దాఁక నేసె


తే.

మీనకేతనసూనుండు మెఱుఁగులొల్కు
రత్నపుంఖశరంబు లుగ్రంబు గాఁగ
భూనభోంతర మదరంగ నా నిలింప
సార్వభౌమాత్మజుని నేసె గర్వ మడర.

119


వ.

అప్పుడు.

120


ఉ.

ఆ జగదేకవీరుఁడగు నర్జునుఁ డందఱ నన్నిరూపులై
రాజితపుంఖసాయకపరంపర లభ్రము నిండ నాత్మసే
నాజనులెల్ల నుబ్బ గదనం బదునార్వుర నొక్కపెట్టునం
గాజుపడంగ నేసెఁ దెలిగన్నులఁ గెంపు దొలంక వెండియున్.


సీ.

కృతవర్మ సారథిఁ గెడపె మూఁడమ్ముల
             గదునిపై నాల్గుమార్గణము లేసె
నంబకయుగళి సాత్యకిమేన నాటించెఁ
             గ్రూరాస్త్రమున ననిరుద్ధుసిడము
పడవైచెఁ బుడమిని బ్రద్యుమ్ను నక్షుద్ర
             భల్లసంహతి మూర్ఛపాలుచేసె
నతనిసారథి నేరుపడర నవ్వీరునిఁ
             గొనియేగెఁ దమసైన్యమునకు వేగ

తే.

చేకితానునియురము నిశితమహాస్త్ర
పంచకమ్మున గ్రుచ్చె నప్పార్థుఁ డంతఁ
గర్ఁ గాంగేయ గురు కృపు ల్గడిమి మెఱసి
హరికిఁ గ్రేడించి తత్సేన కరిగి రపుడు.

122


శా.

ధృష్టద్యుమ్నుఁడు నా సుయోధనుఁడు మాద్రీసూనులున్ సంగరా
వష్టంభోజ్జ్వలమూర్తులై హరిని దివ్యస్ఫూర్తి బాణంబులన్
ధృష్టప్రక్రియ నేసి యార్వ నతఁడు ధీరాత్ముఁడై యందఱం
జేష్టల్ దక్కఁగ శార్ఙ్గముక్తవిశిఖశ్రేణి న్వెసం జేసినన్.

123


మ.

భగదత్తుండు నలంబుసుండును విదర్భస్వామియున్ సైంధవుం
డు గురుప్రోద్భవుఁడున్ హలాయుధ విరాటుల్ నీలుఁడుం గేకయుల్
దగుభూపాలురుఁ గూడి యవ్విభునిమీఁద మార్గణవ్రాతముల్
నిగుడం జేసి ధరాతలంబు వడఁకన్ విక్రాంతులై యార్చినన్.

124


తే.

అప్పు డయ్యంపవెల్లికి నరుదు గాఁగ
సంచలింపకయుండె నాసారక్షుఁ
డంబుదంబులు జలధార లగ్గలముగఁ
గురియఁ గనుపట్టు నీలాద్రితెఱుఁగు మీఱి.

125


వ.

తదనంతరంబ యతఁడు.

126


సీ.

భగదత్తుమేన డెబ్బదితూపు లడరించి
             ద్రౌణిబాహుల శరద్వయము నాఁటి
నారాచయుగళి సైంధవువిల్లు ఖండించి
             మూఁడుబాణము లలంబుసునిమేనఁ

గీలించి యొకవాఁడికోల రుక్మిఁ దెమల్చి
             ద్రుపదనందను[6]నిపై గ్రూరభల్ల
[7]పంచకం బేసి యంబకషట్కమున సుయో
             ధను మూర్ఛనొందించి ఘనశిలీము


తే.

ఖముల రెంట విరాటువక్షంబు వ్రస్సి
కవల నెనిమిదియమ్ములఁ గాడనేసి
కాండవింశతి నీలగేకయుల గ్రుచ్చి
యుగ్రమార్గణమున హలాయుధుని నొంచె.

127


వ.

అయ్యవసరంబున.

128


ఉ.

వీరరసంబు వెల్వడిన వీఁకను [8]రక్తము గ్రమ్మ నద్దొర
ల్కోరకితోరుకింశుకములో యనఁ బొల్చియు ధీరచిత్తులై
తోరము గాఁగ నార్చి జయదుందుభు లొక్కట మ్రోయఁ బేర్చి య
వ్వీరశిఖామణిం దఱిమి వేయికరంబుల నేసి రుద్దతిన్.

129


ఉ.

అత్తఱిఁ గృష్ణుఁ డార్చుచు మహాశుగసంహతి వానినన్నిటిన్
దుత్తుమురై పడంగ వడితో నొనరించుచు వారికెల్ల వి
ల్లెత్త శరంబు లెత్తఁ దల లెత్త నశక్యము గాఁగ నేసె ను
వ్వెత్తున యాదవోత్తములు హెచ్చఁగఁ బాండవసేన భీతిలన్.

130


చ.

మఱియు నతండు వారలఁ దెమల్పఁగఁ బూని తదీయవాజులన్
నెఱి చెడఁగొట్టి సారథుల నేలపయిం బడఁద్రోచి తేరుల
న్విఱుగఁగమోఁది కేతువులు విండ్లును నొక్కటఁ ద్రుంచి వర్మము

ల్పఱియలు చేసి త్తతనువులన్ నిగిడించె ననేకబాణముల్.

131


తే.

వార లెల్లను విరథులై పోరికెడగఁ
దలఁగిపోయినఁ గృష్ణుఁ డుద్దండ[9]లీల
నరిబలంబులు దల్లడమందఁ జూచి
యశనికల్పాశుగంబు లేయంగ నంత.

132


క.

ఒరలెడు మత్తేభంబులుఁ
దెరలెడు తురగములు నేలఁ ద్రెళ్లెడు రథముల్
పొరలెడు యోధులు నల్గడ
వఱలెడు రక్తంబు లయ్యె వాసవిసేనన్.

133


వ.

అది గనుంగొని యర్జునుండు.

134


శా.

కృష్ణుం దాఁకి గుణధ్వనుల్ నిగుడ సక్షిణాశుగశ్రేణి న
త్యుష్ణజ్వాలలు గ్రమ్మనేయ నతఁడుం దోడ్తోన వారించి యా
జిష్ణుప్రోద్భవుమేన శాతశరరాజి న్నిండఁ గీలింప వ
ర్ధిష్ణుండై యతఁడున్ మదిం గనలి శౌరి న్ముంచె వాలమ్ములన్.

135


వ.

మఱియును.

136


ఉ.

మచ్చర మెచ్చఁ గృష్ణుఁడు సమగ్రభుజాబలలీలఁ బేర్చి వి
వ్వచ్చుని దేహమంతయును వాఁడిశిలీముఖకోటి నుద్ధతిన్
గ్రుచ్చ నతండు నాహరి నకుఠింతవైఖరి నట్లు చేయఁ గ
మ్మచ్చులరీతిఁ బొల్చిరపు డా దనుజారియు నా కిరీటియున్.

137


వ.

ఇవ్విధంబున నా కృష్ణార్జునులు మనంబున ఘనంబగు మచ్చ
రంబున రామరావణులకైవడి నంధకాంతకాంతకుల
లాగున జలధరంబులచందంబున గర్జనతర్జనంబులు నిగుడ

హుంకారఠంకారంబులు మెఱయఁ బోరుచుండి రంత ఘటో
త్కచాలంబుసహలాయుధులును బాహ్లికసోమదత్త
భూరిశ్రవులును ధృష్టకేతునీలసుదక్షిణులును విందాను
విందులును గేకయమహీపాలు రేవురును యవనపాండ్యాధి
పతులును ద్రుపదవిరాటరుక్మిసైంధవులును గూడి యాదవ
సైన్యంబు దైన్యంబు నొంద శంఖంబులు పూరించియు ధను
ష్టంకారంబులు గావించియుఁ గ్రూరనారాచంబుల మేనుల
గ్రుచ్చియు శరంబుల నురంబుల వ్రచ్చియు భిండివాలం
బుల గుండెలు వ్రీలనొంచియు భల్లంబుల శిరంబులు డొల్లఁ
ద్రుంచియుఁ బేర్చి యార్చి రయ్యవసరంబున.

138


సీ.

బాహ్లికుఁ డుఱక యంబకములు మూఁ డుగ్ర
             సేనుపైఁ బఱపినఁ [10]జిడ రేఁగి
యతఁ డొక్కతూపున నతనివి ల్ఖండించి
             యాఱుబాణముల రథ్యములఁ జంపి
విరథుఁడై తను నేయు కురువృద్ధుపై శక్తి
             యడరింప నది ఘోరమగుచు వచ్చి
యతనివక్షస్థలం బవలీల నాఁటిన
             నెత్తురు గ్రక్కుచు నేలఁ గూలె


తే.

నది గనుంగొని తత్పుత్త్రుఁడైన సోమ
దత్తుఁ డాభోజపతిమీఁద దారుణాస్త్ర
కోటు లడరించి యొకవాలు గొని రథమున
కుఱికి యాతని తల తెగ నఱకెఁ గడిమి.

139


వ.

మఱియు.

140

క.

ఆయుగ్రసేను రథికుల
వేయివిధంబులఁ గలంచి విగతాసులుగాఁ
జేయుచు బాహ్లికనందనుఁ
డాయోధనభీష్మమూర్తియై తను నొంపన్.

141


తే.

నూఱుతూపులఁ జేకితానుండు సోమ
దత్తుపై నేసె నతఁడు చే యెత్తకుండ
మఱియుఁ బిడుగున కెనయైనమార్గణమున
నలిగి యేసిన నవ్వీరుఁ డవనిఁ గూలె.

142


వ.

ఇట్లు సోమదత్తుండు పడిన.

143


తే.

పార్థుసేనలు దుఃఖవిభ్రాంతిఁ బొందె
హరివరూథిని సంతోష మడరి యార్చె
నది గనుంగొని మత్స్యేంద్రుఁ డలుకతోడ
నుద్ధవునిఁ దాఁకి యేసె శరోత్కరమున.

144


క.

ఆతఁ డవి నడుమఁ జడియుచు
భూతల మగలంగ నొక్కభూరితరాస్త్రం
బాతనిపై నిగుడించిన
భూతము లార్వంగఁ దనువు బోరన విడిచెన్.

145


వ.

ఇవ్విధంబున మత్స్యమహీనాయకుండగు విరాటుండు
దెగినఁ దద్బలంబులు హాహానినాదంబు గావించె నయ్యాదవ
నాయకుబలంబులు సింహనాదం బొనరించె నంతం బాం
చాలపతి క్రుద్ధుండై యుద్ధవునిపై శరపరంపరలు పరఁగిం
చిన నతండును దోడ్తోన వారించె నయ్యవసరంబున
ద్రుపదుండు.

146

తే.

ఆఱుతూపుల నతనిరథ్యములఁ దునిమి
నాలుగమ్ముల సారథి నఱికి యొక్క
కోల విలు ద్రుంచి వర్మంబు వ్రీల రెండు
శరము లేసి యతనిమీఁద శక్తిఁ బఱపె.

147


క.

అది భూతల మద్రువంగా
నదరులు గ్రక్కుచును వచ్చి యాయుద్ధవు బె
ట్టిదముగఁ దాఁకుడు ధరణిం
జదికిలఁబడి కూలె పార్థుసైన్యము లార్వన్.

148


వ.

ఇవ్విధంబున నుద్ధవుండు సమిద్దరణిం బడిన నడలుచు నక్రూ
రుండు క్రూరనారాచంబుల ద్రుపదు గ్రుచ్చి నాలుగుబాణం
బుల ఘోటకంబులఁ గూల్చి సారథి నొక్కనిశాతశరంబున
శిరంబు ద్రుంచి కేతుచ్ఛత్రచామరంబులు భూతలంబునం
దొరలించిన నతండు విరథుండై వాలునుం బలకయుం
బూని సింహచంక్రమణవిలాసంబున నతని తేరిపయిం గవి
యుడు నతం డనేకనిశితశరంబులం బరఁగింపం దనవాలున
జడియుచుఁ జేర నేతెంచిన నయ్యక్రూరుం డర్ధచంద్రబాణం
బున నప్పాంచాలపతి మూర్ధంబు ద్రుంచి సింహనాదంబు
గావించిన.

149


క.

ఆ రవము విని శిఖండి మ
హారోషం బెత్తి చూడ్కి యక్రూరునిపై
ఘోరముగ నిడి రయంబునఁ
జేరఁగ నేతెంచి పటువిశిఖములఁ గప్పెన్.

150


తే.

అతఁడు నేర్పునఁ ద్రుంచె నాయంబకముల
మఱియు ద్రుపదాత్మజుఁడు వాఁడిమార్గణముల

నతని రథ్యధనుర్వైజయంతులను హ
రించి యొకకోల నతని ఖండించి యార్చె.

151


వ.

ఇవ్విధంబున నక్రూరుండు దెగిన నయ్యాదవబలంబుఁ
జలంబున బోరి కడికండలు సేయు శిఖండిం గనుంగొని
హైడింబహలాయుధాలంబుసులును ధృష్టకేతుసైంధవ
యవనరుక్మిపాండ్యభూరిశ్రవులును గేకయపంచకం
బును విందానువిందులును దమతమశంఖంబులు పూరించి
యాదవబలంబు దఱియం జొచ్చి యొక్కపెట్టున.

152


సీ.

కర్ణము ల్గుంభము ల్గరములుఁ బాదము
             ల్దంతముల్ దనువులుఁ దఱిగి తఱిగి
ముఖములుఁ గేసరంబులు వాలములు ఖురం
             బులు నీరుపక్కియ ల్మోది మోది
యగములు చక్రముల్ నొగలాతపత్రముల్
             చిందంబులును బొడి చేసి చేసి
శిరములు సురములుఁ జెక్కులు ముక్కులుఁ
             దొడలుఁ గరంబులుఁ దునిమి తునిమి


తే.

యేనుఁగుల నొంచి హయముల యేపు డించి
యరదములఁ ద్రుంచి కాల్వురయద టడంచి
సంగరంబున నిబ్భంగి శౌర్య మెసఁగ
నేర్పుమైఁ గూల్చి రక్షౌహిణీబలంబు.

153


వ.

అంత మధ్యాహ్నం బయ్యె నప్పుడు శిఖండిఘటోత్కచా
దులవిక్రమంబునకు దేవత లద్భుతంబు నొంది యిట్లనిరి.

154

ఉ.

రావణకుంభకర్ణులపరాక్రమము [11]న్గనకాక్షువిక్రమ
శ్రీవిభవంబుఁ గైటభునిచేఁతయు నంధకుదోర్బలంబు నా
భూవనితాకుమారకునిపోఁడిమిఁ గంటిమిగాని యిట్టిశౌ
ర్యావహకేళి సల్పెడు మహాత్ములఁ జూచి యెఱుంగ మెన్నఁడున్.

155


వ.

అని యగ్గింప నయ్యోధవరులు సింహనాదంబులు చేసినఁ
దద్రవంబు నిని సాత్యకిప్రద్యుమ్నానిరుద్ధాదులు రయం
బునఁ బఱతెంచి వారలపై శరవర్షంబులు గురియించి నిలువ
రించి రయ్యవసరంబున నవ్వలిచక్కి భీష్మద్రోణకృపకర్ణు
లొక్కుమ్మడిఁ బ్రళయకాలరుద్రచతుష్టయంబుతెఱంగున
మెఱపు మెఱసినభంగి యంత్రకారులబాగున మెఱసి
యొక్కచో ధనుర్గుణటంకారంబులు నిగిడింపుచు,
నొక్కచో నిజహేతిప్రభావిలసితంబులు గావింపుచు
నొక్కచోఁ గేతనంబులు మెఱయ రథవేగంబులు గను
పట్టు జేయుచు, నొక్కచో సింహనాదంబులు సేయుచు
నొక్కచో శంఖంబులు పూరించి విజృంభించుచుఁ, గీలూ
డ్చినఁ గెడయు బొమ్మలయోజం గూలి కుప్పలుగొన నేకా
క్షౌహిణీబలంబుఁ దునుమాడి యందు రక్తప్రవాహంబులు
వఱపిరి. హతశేషులు గాందిశీకు లై యెండొరులు విఱిగి
పడిన రథంబులసందున వీఁగియు గజకళేబరంబుల నొది
గియు సమసిన సైంధవంబుల పక్కెరలఁ జొచ్చియు శవం
బులనడమంబడి కాలుచేయాడించకయుం గొందఱు నిలు
పం దక్కినవారు కృష్ణకృష్ణ గావుమను నెలుంగు సూప
దన్నాదంబు విని యామురాంతకుండును దారకునిచే

రథంబు వేగంబునం బఱపించి తనసేనకుం జెయివీచి యోడ
కుం డని నిలువరించు నవసరంబుఁ బ్రొద్దు గ్రుంకె నంతక
మున్న యర్జునుండు తమసైన్యంబులం దివియించి భీష్మ
ద్రోణకృపాశ్వత్థామధర్మజసుయోధనకర్ణాదులుఁ దానును
గరదీపికాసహస్రంబులు వెలుంగ నిజస్కంధావారంబున
కుం జని సముచితప్రకారంబున నందఱ ననిపి మజ్జనభోజనా
దులు సల్పి సుఖంబున నుండె నంత నిక్కడ.

156


ఉ.

సీరియు మాధవుండు హతశేషవరూథినితోడఁ గూడి య
క్రూరుని యుద్ధవుం దలఁచి కుందుచుఁ బాండుతనూజసేనపై
వైరము మిక్కుటంబుగ నివాసము చేరఁగఁబోయి మందిర
ద్వారమునందు నిల్పి పరివారము నంపి యథోచితంబుగన్.

157


వ.

అన్నపానాదికృత్యంబుల
నిర్వర్తించి యెప్పుడెప్పుడు
సూర్యోదయం బయ్యెడు నని రణకుతూహలాయత్తచిత్తు
లై యుండి రయ్యుభయబలంబులు తమతమశిబిరంబుల
కరుగంజూచి దేవతలు దివంబునకుం జనిరని శుకయోగీం
ద్రుం డిలావంతునకుం జెప్పె నని చెప్పిన నటమీఁది
వృత్తాంతం బేమని యడుగుటయు.

158


మ.

శతపత్రోద్భవవంశపావనదయా సత్యాన్వితస్వాంతసం
తతగోకాంచన ఘోటకాంబరధరాధాన్యాదిదానాఢ్య యూ
ర్జితనానావనదేవతాగృహధరిత్రీదేవకళ్యాణ శా
వ్యతటాకోరునిధానసంతత సమగ్రైశ్వర్యభాగ్యోన్నతా.

159


క.

దుర్మంత్రివదనముద్రా
కర్మఠ దుగ్ధాబ్ధికన్యకాధవపూజా

నిర్మలమానస నృపనయ
మర్మజ్ఞ దయాసముద్ర మానగుణాఢ్యా.

160


మణిగణనికరము.

శరశరవణభవజనకగిరి సుధా
కరకరహరిహయ కరిహరిహరి భూ
ధరధర సీతజలధరసురతరు సుం
దరదరవృషవిబుధమునిసమయశా.

161


గద్యము.

ఇది శ్రీమత్కౌండిన్యగోత్రపవిత్ర చరిగొండ తిమ్మ
నామాత్యపుత్త్ర సకలవిద్యాపారీణ శతఘంట సురత్రాణ
సుకవిజనవిధేయ ధర్మననామధేయప్రణీతం బయినచిత్ర
భారతం బనుపురాణకథయందు సప్తమాశ్వాసము.

  1. మణిమయ
  2. శిరములు చెదర
  3. ప్రభులును
  4. వేయుచో
  5. డు మొదలు యోధు
  6. మేను దూసిపాఱ
  7. భల్లపంచక మేసి బాణషట్కమున సుయోధను మూర్ఛపా లొనరిచి విశి
  8. మేనులఁ గ్రమ్మ నెత్తురు ల్కోరకితోరుకింశుక
  9. వృత్తి
  10. జిమ్మ రేఁగి
  11. మధుమగ్రవిక్రమ