చిత్రభారతము/అష్టమాశ్వాసము

శ్రీరస్తు

చిత్రభారతము

అష్టమాశ్వాసము



రంగరాజసేవా
పారంగతహృదయ కమలభవవంశపయః
పారావారసుధాకర
మారసమానావతార మాదయపెద్దా.

1


వ.

అవధరింపుము మృదుమధురవచనరచనాపరితోషితముని
జాతుం డగుసూతుండు హరికథాశ్రవణాహ్లాదులగు శౌన
కాదులకు ని ట్లనియె నట్లు రామకృష్ణులుఁ దక్కిన యోధ
వరులును సూర్యోదయంబుఁ గోరుచు నాహవకుతూహలా
యత్తచిత్తు లై యుండి రనవుడు శుకయోగీంద్రునకు నిలా
వంతుం డిట్లనియె.

2


క.

ఈరీతి నుభయసేనలుఁ
బోరాడఁగ దినము లెన్ని పోయెన్ గలనన్
భూరిబలు లెవ్వరెవ్వరు
వీరత్వము మీఱఁ దెగిరి వివరింపఁగదే.

3

వ.

అనుడు నయ్యిలావంతువకు నయ్యోగికేసరి యిట్లను
నిత్తెఱంగున మఱియునుం బదియాఱుదినంబులు [1]సంగ్రా
మంబు భీమంబై చెల్లె నందుఁ బాండవసైన్యంబున భీష్మ
ద్రోణకృపాశ్వత్థామకర్ణభూరిశ్రవులును యుధిష్ఠిరభీమా
ర్జుననకులసహదేవదుర్యోధనదుశ్శాసనులును శిఖండిధృష్ట
ద్యుమ్నులును శల్యుండును నుత్తమోజుండును యుథా
మన్యుండును ఘటోత్కచాలంబుసహలాయుధులును సైం
ధవవిందానువిందులును నీలసుదక్షిణపాండ్యయవనకేకయు
లును జతుర్థనుండును [2]నక్షౌహిణీబలంబులుం దక్కఁ దక్కిన
[3]సైన్యంబులతోడ బాహ్లికాదులు గెడసిరి. యాదవబలంబున
రామకృష్ణసాత్యకిగదులును బ్రద్యుమ్నసాంబసారణచారు
దేష్ణబృహద్భానుభానుదేవదీప్తిమదరుణాదికృష్ణకుమార
వర్గంబును ననిరుద్ధచేకితానకృతవర్మలును నక్షౌహిణీ
ద్వయంబునుం దక్కఁ దక్కినసైన్యంబులతోడంగూడ నుద్ధ
వాదులు మడిసిరి. పదునెనిమిదవనాఁడు ప్రభాతసమయం
బునఁ బార్థుండు మేల్కాంచి సంధ్యాదికృత్యంబులు నిర్వ
ర్తించి గురుకృపాశ్వత్థామయుధిష్ఠిరదుర్యోధనకర్ణాది
యోధవీరసమేతుం డై యున్న [4]గంగానందనుపాలికిం జని
యతనియనుమతి నొక్కయుచితాసనంబునం గూర్చుండి
వినయపూర్వకంబుగా నతని కిట్లనియె.

4


క.

అనఘా నేఁ డెవ్విధమున
మొన దీర్పఁగవలయు నందు మురవైరికిఁ గుం

డినపతి దగులుపడకయుం
డ నుపాయము దలఁచి చెప్పుఁడా వెర వడరన్.

5


క.

అనవుడు గంగాసుతుఁ డ
య్యనిమిషరాజాత్మజునకు ననియెం గడునే
ర్పున శకటాకృతిగా మన
మొన నిల్పుదమందు దాతము చతుర్ధనునిన్.

6


వ.

అని సంగరంబునకుఁ జయ్యన వెడలుం డని యనిపిన సకల
సైన్యంబులు గొలువ నతండు గట్టాయితం బైనరథంబు
శల్యుండు దేర రథారోహణంబు గావించి కపికేతనంబు
మెఱయఁ జక్రరక్షకులగు నుత్తమోజుండును యుథా
మన్యుండును దోడరాఁ జనియె ననంతరంబ భీష్మద్రోణ
కృపాశ్వత్థామకర్ణయుధిష్ఠిరవృకోదరనకులసహదేవసుయో
ధనాదియోధవీరులు సంగరోచితశృంగారంబు లంగీకరించి
నిజకేతనచ్ఛత్రచామరశరశరాసనాదినానావిధచిహ్నచిహ్ని
తంబు లగురథంబు లెక్కి విజయభేరీమృదంగశంఖకాహ
ళాదివాద్యంబులు మొఱయ యుద్ధభూమికిం బోయి రంత.

7


క.

స్వారాజనందనుఁడు దన
తే రొయ్యనఁ బోవనిచ్చి దృఢతరశకటా
కారంబుగా నమర్చెన్
వారణరథతురగసుభటవర్గమువరుసన్.

8


వ.

ఇవ్విధంబున శకటాకారంబుగా మోహరంబు మీఱం బన్ని
యందు నంతరవ్యూహంబుగాఁ బద్మవ్యూహంబు సమకట్టి
దాని మధ్యప్రదేశంబున సూచీవ్యూహం బేర్పఱచి
తన్ముఖంబునఁ గేకయపంచకంబును నట పిఱుందు సుదక్షి

ణుండును దత్పశ్చాద్భాగంబున నక్షౌహిణీబలంబు ము
న్నిడుకొని నకులసహదేవసహితుం డై యుధిష్ఠిరుండును
దత్సూచీమూలస్థానంబునఁ జతుర్ధనుండును నతనిచుట్టును
గురుకృపాశ్వత్థామకర్ణదుర్యోధనదుశ్శాసనహలాయుధా
లంబుసవిందానువిందరుక్మిసైంధవభగదత్తయవనపాండ్యా
ధీశులు నుండునట్లుగా నియమించి యర్జునుండు తానును
గాంగేయుండును వృకోదరుండును భూరిశ్రవుండును
శిఖిండియు ధృష్టద్యుమ్నుండును ఘటోత్కచుండును దమ
తమ యడియాలంబులు మెఱయ శంఖంబులు పూరించుచు
ధనుష్టంకారంబులు నిగిడించుచు సింహనాదంబులు గావిం
చుచు నప్పెనుమొగ్గరంబుముందట నిల్చియుండి రది గనుం
గొని పురందరాదిబృందారకు లద్భుతం బంది రక్కడ.

9


మ.

బలభద్రుండును గృష్ణుఁడున్ భుజబలప్రస్ఫీతులై నందను
బ్బలియుల్ పౌత్రులుఁ దమ్ములున్ సమరఖేలాలోలతం గొల్వ నా
ర్పు లెసంగం జనుదెంచి రాకలనికిన్ భూషాకిరీటధ్వజం
బులకాంతు ల్నభమెల్ల నిండ రభసంబు న్వేడ్కయు న్మీఱఁగాన్.

10


వ.

ఇవ్విధంబున యాదవవీరులు చదిమి పెట్టిన బంటుతనంబునఁ
జతురంగబలసమేతు లై పాండవబలంబునకు ననతిదూరం
బున రామకృష్ణులు మున్నుగా నుండి రందు.

11


ఉ.

ఆహరి వెన్నుదన్ని కుసుమాయుధసాత్యకిసాంబసారణుల్
బాహుబలంబు మీఱఁగఁ గృపాణశరాసనసాయకాదిస
న్నాహముతోడ నిల్చి రరుణప్రముఖాత్మజులున్ విరోధిసే
నాహరణప్రవీణులయి నవ్వుచుఁ బొల్చిరి వారిచక్కటిన్.

12

వ.

అంతకమున్న రామకృష్ణులం గడచి కృతవర్మయుఁ జేకితా
నుండును సవరణలతోడి యరదంబు లెక్కి తమతమబలం
బులును దామును నిజశంఖంబులు మొరయించి సింహ
నాదంబు లొనరించి యతిరయంబునం జని యర్జును
సైన్యంబుఁ దాఁకిన నిరువాఁగునుం గలసి పదాతులుఁ
బజాతులును రథంబులు రథంబులునుఁ దురంగంబులుఁ
దురంగంబులును గుంజరంబులుఁ గుంజరంబులును ఘోరం
బుగాఁ బోరు నయ్యవసరంబున.

13


శా.

ధృష్టద్యుమ్నుఁడుఁ జేకితానుఁడును సందీప్తప్రతాపాఢ్యులై
ద్రష్టల్ మెచ్చఁగఁ బోరిపోరి తమరథ్యంబుల్ ధరం గూలినన్
ముష్టాముష్టిఁ జెలంగ నంతట బలంబున్ గర్వమున్ మీఱ ను
త్కృష్టుండై ద్రుపదాత్మజుం డతని మర్దించెన్ రిపుల్ బెగ్గిలన్.

14


తే.

అది గనుంగొని కృతవర్మ యదరులుమియు
బాణములఁ గప్పె ద్రుపదభూపాలసుతుని
నతఁడు నడుమన వారించి యతనిమేనఁ
దొమ్మిదమ్ములు గ్రుచ్చి సూతుని హరించె.

15


సీ.

సారథ్యమును దాన సల్పుచు నుభయసై
             న్యంబు లచ్చెరువంద నాయదుప్ర
వీరుఁడు పాంచాలవిభుకుమారునిఫాల
             మున నొక్కబాణంబుఁ జొనుప నతఁడు
మూర్ఛిల్లె నప్పుడు ముమ్మరంబైన శో
             కమున శిఖండి యాగ్రహము నిగుడఁ

గృతవర్మఁ దాఁకి తత్కేతనచ్ఛత్రచా
             మరకిరీటంబులు ధరణిఁ గూల్చె


తే.

నతఁడు నట్లన గావించె నలుక వొడమి
యమ్మహావీరుఁ డతనిరథ్యములఁ జంపె
విరథుఁడై యాదవుఁడు గద వేసె నతఁడు
నడుమనే త్రుంచి నొప్పించె నారసమున.

16


క.

కరవాలము గొని సైనికు
లరుదందఁగ నాశిఖండిహయముల నతఁడున్
ధరణిం గూలిచె నాతఁడు
శరమునఁ గృతవర్మశిరము చయ్యనఁ దునిమెన్.

17


ఉ.

అప్పుడు రుక్మిణీరమణుఁ డాగ్రహ మాత్మఁ దలిర్ప దేవతల్
డెప్పరమంది కన్గొనఁ గడిందిమగంటిమి మీఱఁ బార్థుపై
నిప్పులు చిందుబాణములు నించి నభం బడరంగ నార్చినన్
గప్పె నతండు నంపగమిఁ గాలునుఁ జేయియు నాడకుండఁగన్.

18


క.

బలభద్రుండును భీముం
దలపడి వక్షము ముసలమున నడువ నాతం
డలుకఁ బదమ్ముల నతని హ
రులఁ గూలిచి స్యందనము విఱుగనేసె వడిన్.

19


మ.

విరథుండై యమునావిదారకుఁడు పృథ్వీభూతసందోహసం
హరణోద్యుక్తకృశాంతుఁడో యనఁగ రోషావేశచేతస్కుఁడై
కరసీరాగ్రమున మరుత్సుతు శతాంగం బుద్ధతిన్ బట్టినన్
హరిసైన్యంబులు నవ్వ నాతఁ డుఱికెన్ హర్యక్షలీల న్వెసన్.

20


వ.

ఇట్లు భీముఁడు భూమికి లంఘించిన.

21

క.

అఱిముఱి సారథితోడన్
ముఱియుపడగతోడ హయసమూహముతోడన్
జిఱజిఱను ద్రిప్పి యరదము
పఱపఱిగాఁ గొట్టి భీముఁ బైకొని కినుకన్.

22


క.

ముసలమున వ్రేయ నాతం
డసమున గేడించి దాఁటి హలధరువక్షం
బసరొత్తఁగ గదచేఁ గొ
ట్టె సురలు గనుఁగొని తనమగఁటిమి నుతియింపన్.

23


శా.

ఆలో భీమునిపైఁ బురత్రితయసంహారంబు గావించు న
ప్ఫాలాక్షుం డన నేగి మాధవుఁడు శుంభల్లీలఁ దద్బాహులన్
గీలించెన్ బదునాల్గుతూపు లది వీక్షిం చర్జునుం డాహరిం
దూలించెన్ విశిఖంబులన్ సురలు సంతోషించి భూషింపఁగన్.

24


క.

హరి యంతట కోపంబున
నరునియురం బాడనేసె నారాచములతో
శర మొకటి గ్రుచ్చె నొసటను
గరవాలున బలుఁడు గొట్టి కడువడి నార్చెన్.

25


వ.

ఆసమయంబున.

26


చ.

అవనీమండల మెల్ల గ్రక్కదల బ్రహ్మాండంబు భేదిల్ల వా
సవి రోషంబున రామకృష్ణులపయిన్ సమ్మోహనాస్త్రంబు మం
త్రవిధి మౌర్వి నమర్చి యేయుటయు మూర్ఛం బొంది రద్ధారకుం
డు వడిన్ వారలఁ గొంచు [5]సత్యకసుతుండుం దోడ నేతేరఁగన్.

27

క.

చనియె నిట వాయుతనయా
ర్జును లార్చి కడంగి హరివరూధినిపైఁ బే
ర్చి నిశితశరములఁ గురియం
గని వారలఁ గప్పె మరుఁడు కాండంబులచేన్.

28


వ.

వెండియు.

29


మ.

అనిరుద్ధుండు ధనుర్గుణధ్వనులు మిన్నందంగ నేతెంచి లో
చనయుగ్మంబున వహ్నికీల లురులన్ సవ్యాపసవ్యంబులన్
ఘనబాణంబులు పింజపింజ గఱవంగా వారిపై నేసీ యా
ర్చిన భూరిశ్రవుఁ డుగ్రమూర్తి యయి వచ్చెన్ సేన లగ్గింపఁగన్.

30


సీ.

వచ్చి యాయనిరుద్ధువక్షస్స్థలంబు మూ
             డంబకముల నేసి హయములపయి
బదితూపు లడరించి గుదియించి సారథి
             గుండె వ్రీలఁగ నొక్కకోలఁ జొనిపి
కత్తివాతమ్మున కాండాసనంబు న
             డిమికి వ్రయ్యలుగ ఖండించి బిరుదు
చిందంబు నాల్గువిశిఖముల భేదించి
             భల్లత్రయంబునఁ బడఁగ ద్రుంచి


తే.

యార్చిన నతఁడు వేఱొక్కయరద మెక్కి
యొండువి ల్గొని యవ్వీరు బెండుపఱచి
గొడుగుఁ బడగయు విల్లును గుఱ్ఱములును
సూతునిం ద్రుంచె నమ్ములసోన గురిసె.

31


క.

వాలున భూరిశ్రవుఁడుం
గేలీగతి వైవ ఋశ్యకేతుఁడు దానిన్

వాలమ్మునఁ జూర్ణంబై
నేలం బడనేసి యాతనిన్ సోలించెన్.

32


వ.

వెండియు.

33


శా.

ఖద్యోతోజ్జ్వలమూర్తియై రిపులకుం గాన్పించు కౌరవ్యవీ
రోద్యోగంబు నిరర్థకంబయి చనన్ యోధావళిన్ ముంచు ధృ
ష్టద్యుమ్నాదిరణప్రవీణులయవష్టంభంబు వారించునా
ప్రద్యుమ్నాత్మజుఁ డొంటిమైఁ గురుచమూపాథోధిమంథాద్రియై.

34


వ.

అయ్యవసరంబున భూరిశ్రవుండు దెలివొంది యెక్కడఁ
జూచినఁ దానయై విహరించు హరిపౌత్త్రుని పయికి నడరు
నెడ వృకోదరుండు రోషురక్తాక్షుండై యట్టహాసంబుఁ జేసి
నిలు నిలుమని యదల్చి గదాదండంబున నవ్వీరుని వక్ష
స్థలంబు పగుల నేసిన నతండు వాతాహతం జలించు మహీ
రుహంబు చందంబున నీషత్కంపితతనుండై కోపంబున
నతనిం గరవాలంబున నేసిన నది ఖండంబులు గావించి
యంతకాకారుం డై.

35


క.

మరుదుద్భవుండు గదచే
హరిపౌత్త్రునిశిరము వ్రేయ నది దునిసి సమి
ద్ధరణీస్థలమునఁ బడియెన్
హరియనుచుం బార్థుసేన నార్పులు నిగుడన్.

36


వ.

ఇవ్విధంబున ననిరుద్ధుం జంపి సింహనాదంబుఁ జేసి సరో
వరంబుఁ గలంచు గంధసింధురంబుచందంబున యాదవ
సైన్యంబు జొచ్చి హెచ్చిన గర్వంబున గదఁ ద్రిప్పుచు రథులఁ
గెడపియు సారథుల మడిపియు సిడంబులు పొడిఁ జేసియు

గొడుగులు పడఁగొట్టియుఁ దురంగంబుల నిరంగంబులఁ
గావించియు భటులఁ జటులగతి సంహరించియుఁ దనివి
చనక మఱియును.

37


సీ.

కుంభరక్తము చివుక్కున నెమ్మొగమ్ముపైఁ
             జిందంగ గదచేతఁ జిదిమి చిదిమి
యొకటిఁ జేపట్టి యొండొక్కటిపై ద్రొబ్బి
             చరణాగ్రమున నేలఁ జమరిచమరి
తుండముల్ చుట్టి చేతుల తీఁట వోపంగ
             ఘోరవిక్రమకేళిఁ గొట్టికొట్టి
కడకాళ్లు పట్టి ఘీంకారంబు సేయంగ
             వీచి నల్గడఁ బాఱ వైచివైచి


తే.

కింకిణీఘంటికాపతాకాంకుశప్ర
కరవరత్రశస్త్రాసిచామరనియంతృ
భీషణోదగ్రమత్తకుంభివ్రజంబు
భీముఁ డవలీలఁ జంపె నాభీలలీల.

38


వ.

అయ్యవసరంబున.

39


చ.

కొడుకువిధం బెఱింగి కనుగోనల నీరును విస్ఫులింగముల్
వడిఁ గురియంగఁ బాండవబలంబు భయంపడిచూడ మారుఁ డ
వ్వడముడిఁ దాఁకి యార్చి యదువర్గము మెచ్చ గుణంబు మ్రోయఁగాఁ
బిడుగులవంటి బాణములు పెల్లుగ నేయ నతండు నుగ్రుఁ డై.

40


వ.

ఆ శంబరాంతకుపైఁ గవిసి యంతకదండంబునుం బోలిన తన
గదాదండంబున సతనివక్షస్స్థలం బుపలక్షించి వేసిన నవ్వీ
రుండు సోలి యాలోన మేలుకని విలయకాలుండునుం

బోలె విజృంభించి విశిఖంబులవెల్లి ముంచి మఱియు
నొక్కఘోరనారాచంబున నమ్మారుతకుమారుజత్రు
దేశంబు గాడనేసిన నతండు మూర్ఛిల్లె నది గనుంగొని
యాదవబలంబున సింహనాదంబులు చెలంగె నాభీముండు
దెలివొందునంతకు ధృష్టద్యుమ్నుండు ప్రద్యుమ్నునిం
దాఁకి పుంఖానుపుంఖంబులుగా నిశితశరపరంపరలు పరఁ
గించి యొక్కభల్లంబున నుల్లంబు నోనాడ నేసిన నతండు
వెడఁదతూపున నతని విల్లు విఱుగనేసిన నవ్వీరుండును
వేఱొండుకోదండంబుఁ గొని యమ్ముల దొరఁగించిన నవి
తోడనె తునియలై దొఱఁగునట్లుగా నేసి మఱియును.

41


క.

ప్రద్యుమ్నుఁడు దరిగా ధృ
ష్టద్యుమ్నుని నేసె నశనిసమసాయకముల్
ప్రద్యోతములై నిగిడి జ
యోద్యోగము హెచ్చఁ బార్థుయోధులు బెదరన్.

42


క.

అవియెల్ల ద్రుపదనందనుఁ
డవలీలం దూల నేసి యవ్వీరుని [6]మూ
డువిషమశాతశరము లే
సి వెగడుపఱచెను విరోధిసేనలు చెదరన్.

43


వ.

వెండియు నా దండిమగలు దమలో నొండొరులపై నిగి
డించు నిష్ఠురకాండంబులచే సూతాశ్వచ్ఛతచామరధ్వజ
సహితంబులుగా రథంబులు గూలిన విరథులై కృపాణంబు
లును ఖేటకంబులుం బూని మిక్కుటంబైన యుక్కున
నొక్కరొక్కరుల లెక్క గొనక డాసియు వ్రేసియు వ్రేట్ల

కుం దప్పించి కుప్పించియు బహువిధగతులం గొంత
ప్రొద్దు పోరునెడఁ దెఱపిగని యా ధృష్టద్యుమ్నుండును
బ్రద్యుమ్నునిశిరంబు హరించి సింహనాదంబుఁ జేసిన
యాదవసైన్యంబు దైన్యంబు నొంది నల్గడలం బఱచినం జూచి
శోకరోషంబులు మనంబునం బెనంగొన సాంబసారణాదు
లెలుంగుఁ జూపి తమసేనకుం జెయి వీచి మరల్చి తిరంబు చేసి
ధృష్టద్యుమ్నాదులపై నురువడించిన నుభయసైనికులకుఁ
బోరు ఘోరం బయ్యె నందు.

44


తే.

మేఘముల్ పెక్కు గూడి భూమిధరంబు
నంబుధారలచేఁ గప్పు ననువు దోప
నమ్మహావీరు లర్జును నాక్రమించి
శరపరంపరఁ గప్పిరి సాహసమున.

45


వ.

వెండియు.

46


సీ.

చారుదేష్ణుఁడు శతసాయకంబుల నారిఁ
             ద్రెంచె సాంబుండు పదింట సిడము
జవ్వాడ నేసెను సారణుం డేనుమా
             రణముల శల్యునురంబు గ్రుచ్చె
భానువిందుఁడు బృహద్భానువిందుఁడు భాను
             దేవుండు వృకుఁడుఁ [7]బన్నెండుదూపు
లఁ దురంగమములఁ దూలనొనర్ప నరుణపు
             ష్కరులు తచ్చక్రరక్షకుల నొంచి


తే.

రొకమొగిఁగలియ వేదవాహుఁడు సునంద
నుండు శుకుఁడును దీప్తిమంతుండు నాది

యైన కృష్ణతనూభవు లతని మెదలఁ
గదలరాకుండ నేసి రాగ్రహము నిగుడ.

47


తే.

అప్పు డాసవ్యసాచియు హరకరాగ్ర
దీప్తశూలంబుగతి మించుదివ్యశరము
నారి సంధించి వేయ నానావిధముల
నతివిచిత్రంబుగా నొంచె నారథికుల.

48


వ.

ఇవ్విధంబున నర్జునుండు హరికుమారుల నిశ్శేషంబుగా వధి
యించిన దుర్యోధనప్రముఖయోధులు హతశేషబలం
బును జలంబునఁ జంపి రంత నిట రామకృష్ణులు సాత్యకి
దారకులు సేయు శిశిరోపచారంబులవలన మూర్ఛందేఱి
ఖండంబులైన శుండాలంబులును నొరఁగిన తురంగంబులును
బఱియలైన యరదంబులుం గూలిన కాలుబలంబును
మ్రగ్గిన కుమారవర్గంబునుం గలిగి నిర్మనుష్యంబైన
యాత్మసైన్యంబుఁ జూచి శోకవ్యాకులితమనస్కులై
రయ్యవసరంబున.

49


సీ.

సంవర్తచండభాస్కరమండలంబు నా
             నాస్యంబు భీకరంబై వెలుంగఁ
గల్పాంతవిస్ఫులింగంబు లొక్కుమ్మడి
             నిగిడె నాఁ గన్ను అనిప్పు బుగులఁ
బ్రళయకాలోగ్రనిర్భరసింహనాదంబు
             నాఁ బాంచజన్యస్వనంబు నిగుడఁ
గల్పాంతసమయమేఘవ్రాతనిర్దోష
             మన శార్ఙ్గగుణరావ మగ్గలింపఁ

తే.

బక్షతిఛ్చాయ దిక్కులఁ బర్వుపన్న
గాశపతికేతు వభ్రంబునందుఁ గ్రాల
దానవధ్వంసి శత్రులు దల్లడిల్ల
రామసాత్యకు లిరువంక రాఁగ నడచె.

50


వ.

ఇవ్విధంబున రామసాత్యకి సమేతుండై కృష్ణుఁడు రాఁజూచి
భీష్మార్జునులు తమతమబలంబులం బురికొల్పిన దూర్య
స్వనంబులు చెలంగఁ జండభానుమండలంబునుం బొదువు
నీహారంబు విహారంబున దావపావకజ్వాలాజాలంబు
పయిం జను శలభంబులవిధంబున నొక్కమొగి నురు
వడించి యమువ్వురపయి లెక్కకు నెక్కువ యగునమ్ములం
గప్పిన ముప్పిరికొను రోషంబున.

51


సీ.

పర్జన్యుఁ డద్రులఁ బడఁగొట్టువైఖరిఁ
             గుంజరంబుల నేలఁ గూలఁ దన్ని
శార్ధూల ముద్ధతి సారంగములభంగి
             సైంధవంబుల బారి సమరి వైచి
కరి పద్మములఁ ద్రుంచుకైవడి రథికుల
             గళము లొక్కుమ్మడి నులిమివైచి
బలుగాడ్పు తరువులఫలముల డుల్చువ
             డువునఁ బదాతుల డొల్లఁగొట్టి


తే.

భీష్ము నొప్పించి భీముని బెండుపఱచి
యర్జునుని మోఁది హైడింబు నదటడంచి
ద్రుపదనందను సారథిఁ ద్రుంచి రథము
చక్కు గావించి యార్చె ముసలధరుండు.

52

క.

గొడుగులు గడువడిఁ ద్రుంపుచు
సిడములు గెడుపుచును జోళ్లు చింపుచు రథముల్
పొడిపొడి సేయుచు నమ్ముల
మడియించెన్ యోధుల మురమర్ధనుఁడు వెసన్.

53


తే.

కరుల హరుల రథంబులఁ గాల్బలముల
రూపు మాపి చెలంగి మెఱుంగు మెఱసి
నట్టు లెల్లెడఁ బొలయుచు నాశినిప్ర
వరుఁడుఁ బెక్కండ్రు రథికుల వసుధఁ గూల్చె.

54


సీ.

భూరిమదోత్కటపున్నాగజాలని
            వాసంబు గంధర్వవారపదము
నిష్ఠురస్యందననికరాలయము శాత
            కుంతసహసరవిశ్రాంతభూమి
యర్జుననకులశల్యద్రోణనిలయంబు
            గాంగేయభూదారఖడ్గసీము
శకునిపలాశసంచయనిత్యవాసంబు
            కమనీయపుండరీకస్థలంబు


తే.

నగుచుఁ గనుపట్టు పార్థునిసైన్యంపుటడవి
రామకృష్ణశినిప్రవరప్రచండ
వీతహోత్రత్రయం బుగ్రహేతు లడరఁ
గాల్చె లోకంబులెల్ల నాకంప మొంద.

55


వ.

అయ్యవసరంబున నర్జునుండు కోపోద్ధీపితమానసుండై రామ
సాత్యకులతో తలపడి పోరుచుండంజూచి కృష్ణుం డమ్మొ
గ్గరంబుఁ గదియునెడ భీష్మభీమనందనభూరిశ్రవశిఖండి
ధృష్టద్యుమ్ను లడ్డంబు సొచ్చి సాయకాసారంబుల ముంచిన

నతండును నవ్వీరవరుల నంపగమిం గప్పి నిశ్చేష్టితులఁ
గావించి భేదించి సూచీవ్యూహంబు సొచ్చి యచ్చట నెదు
రుపడు కేకయులపై నిశితశరానీకంబులు నిగిడించి వారలం
గడచి చనునెడ సుదక్షిణుం డడ్డంబు వచ్చిన నతని నొక్క
నారాచంబునఁ జచ్చినట్ల యుండునట్లుగాఁ జేసి పోవు
నప్పుడు ధర్మనందనుండు గవలునుం దానును నతనిపై
నాశుగసముదాయంబులు వఱపిన నవి నడుమన చూర్ణం
బులై తొరఁగనేసిన యమ్మువ్వుర మూఁడువాఁడిబాణం
బుల నొప్పినొందించి తద్బలంబు బడలుపడ నడచి పద్మ
వ్యూహంబు డగ్గఱి పాంచజన్యం బొత్తిన.

56


సీ.

ఆకృష్ణుఁ జూచి సైన్యంబు భీతిల్లి బె
             బ్బులిఁ గన్న మృగములపోల్కిఁ బఱవ
నది చూచి యర్జునుఁ డాకుండినేశ్వరుఁ
             [8]డటఁ జచ్చియుండునో యని తలంచి
తనతోడఁ బోరు సాత్యకి సీరపాణుల
             డించి తీవ్రమున నేతెంచి సేన
మగుడంగఁ బురికొల్పి బెగడు చతుర్ధన
             జననాథుఁ దెల్ఫి యా చక్రపాణిఁ


తే.

దాఁకి నిబిడాశుగంబుల తళ్లు గురియ
నతఁడు నాతనిఁ గప్పెఁ బేరంపసమితి
నంత నారామశైనేయు లరుగుదెంచి
యామురాంతకుఁ గూడి రుద్దామలీల.

57

వ.

ఇవ్విధంబున నాయిద్దఱు కృష్ణుని గూడి రంతకమున్న
భీష్మాదియోధవీరులు సరుగుదెంచి గాండీవిం గలసి
యండఱు నొక్కపెట్టున నమ్ముగ్గురిపైఁ గవిసిన దారుణం
బైన రణం బయ్యె నందు సాత్యకిం దలపడి ధృష్టద్యు
మ్నుండు మగఁటిమి మీఱిన నయ్యిద్దఱు నన్యోన్యబాణ
ఘట్టనల శతాంగతురంగసూతకేతుబాణాసనతను
త్రాణశిరస్త్రంబులు ధరణిపయిం దొరఁగిన విరథులై
నేలకు లంఘించి కుంతంబులు గొని పంతంబులు పలుకుచు
బెబ్బులులనయంబున గంధసింధురంబులచందంబున సింగం
బులభంగిఁ బొంగి నింగి వగుల నార్చుచుఁ బదాభిఘాతంబుల
భూతలంబు చలింపఁ జిమ్మియుఁ గ్రుమ్మియు బహువిధ
గతులఁ బోరుచుండి రయ్యవసరంబున.

58


చ.

కడువడిఁ బాఱు తేరు పదఘట్టన భూమి వడంక మోమునం
బడిన గజంబులం జిదిమి సాముచు యోధుల నుగ్గుసేయుచున్
గడఁగిన రాము నొంచె బలగర్వమునన్ శరజాల మేసి య
వ్వడముడిపట్టి యవ్విభుఁడు వాని తురంగములన్ వధించినన్.

59


క.

వెండియు ఘటోత్కచుం డు
ద్దండత బాణంబు లేయఁ దలఁకక బలభ
ద్రుండు హలంబునఁ దత్కో
దండము రాఁదిగిచి విఱిచి తను వ్రేయుటయున్.

60


మ.

కచభాగం బురియాడి వెన్నొఱయ రక్షస్సైన్యము ల్పాఱ నే
ల చలింప న్మణిహారజాలములు రాల న్వ్యోమయానస్థులై
ఖచరుల్ గన్గొని నవ్వఁ జేలము విడంగా భీతిమై నాఘటో

త్కచుఁ డేగెం దనతండ్రితేరునకుఁ జిత్తం బుత్తలం బందఁగన్.

61


వ.

అప్పుడు కృష్ణుండు కుండిననాథుండగు చతుర్ధనుం జేర
వచ్చిన ధనంజయుండు దేవదత్తంబు పూరించి నారి సారించి
యొక్కసారవంతంబగు సాయకంబున దారకుపేరురంబు
దూఱనేసి హయమ్ముల రయమ్మున నొక్కొక్కయమ్మున
నెమ్ములు వ్రీలునట్లుగాఁ జేసి సింహనాదంబు చేసినం గించి
దరుణితనయనుండై.

62


ఉ.

పుష్కరలోచనుండు వసుపుంఖశరంబుల నాలిగింట ధా
నుష్కకులాగ్రగణ్యు నరు నొవ్వఁగఁజేసి కడంగి డగ్గఱం
బుష్కరసంచరుల్ భయముఁ బొంది రతండును గోపగించి య
వ్విష్కరరాజకేతనుని వేయిశరంబుల నేసె నత్తఱిన్.

63


శా.

భుగ్నభ్రూకుటిఫాలభాగుఁ డయి యంభోజాక్షుఁ డప్పార్థుపై
నాగ్నేయాశుగ మేయ నాశరము బ్రహ్మాండంబు భేదిల్లఁగా
నగ్నిజ్వాలఁ గరాళమై యరిగినం బ్రాణేచ్ఛఁ దత్సైన్య ము
ద్విగ్నంబై నలువంకల న్విఱిగి వేవేగంబునన్ బాఱినన్.

64


వ.

అప్పుడు.

65


శా.

జంభారాతితనూభవుం డలిగి తచ్ఛస్త్రంబుపై నేసె సం
రంభం బొప్పఁగ వారుణాస్త్ర మది ఘోరంబై నభోవీథి నీ
లాంభోదంబులు నిండఁగప్పెఁ దిమిరం బంతంతకున్ బర్వ ది
క్కుంభుల్ మ్రొగ్గఁగ మ్రోయుచున్ భువనసంక్షోభంబు గావింపుచున్.

66

క.

కడువడిఁ బిడుగులు దొరుగుచుఁ
బుడమి యడల నిష్ఠురాశ్మములు గురియుచు న
ప్పుడదాచి నడచి వివిదల (దివిజుల)
సుడివరపుచు వచ్చుశరముఁ జూచి కడంకన్.

67


మ.

వనజాక్షుండును మంత్రపూర్వకముగా వాయవ్యబాణంబు నే
సినఁ దచ్ఛస్త్రము దానిఁ ద్రుంచి కుధరశ్రేష్ఠంబు లుఱ్ఱూతలూఁ
గ నిలింపుల్ భయ మొంద నబ్ధులు గలంగన్ భూమి గంపింప న
ర్జునుపై నుద్ధురలీల వచ్చుటయు ధీరుండై యతం డుగ్రతన్.

68


క.

నాగాస్త్ర మేయ నదియున్
భోగిసహస్రములచేతఁ బొడవడఁచెం ద
ద్వేగం బంతటఁ బోవక
యాగోవిందుం దెమల్ప నడరిన నతఁడున్.

69


సీ.

కడుభయంకరలీల గరుడాస్త్ర మేసిన
             నర్జునుండును దాని నైంద్రబాణ
మునఁ దుత్తుమురుఁ జేసె వనజాక్షుఁ డలిగి రౌ
             ద్రాశుగంబు నిగిడ్చె ననిమిషేంద్ర
తనయుండు దానన దా నివారించె యా
             దవనాయకుండు చిత్తమున నల్గి
బ్రహ్మాస్త్ర మురుపడిఁ బఱపిన ఫల్గునుం
             డును బ్రతిశరము లే కునికి వేగ


తే.

మడర బ్రహ్మాస్త్ర మేయ నయ్యాశుగములు
నిగిడి యొండొంటిఁ దాఁకి వహ్నిచ్ఛటలు చెఁ
దరఁగఁ బోరాడి తాము శాంతంబు లయ్యె
నఖిలదేవత లాశ్చర్య మంది చూడ.

70

వ.

అంత.

71


చ.

ఒకగుఱిఁ బెక్కుచాపధరు లొక్కమొగిం దగులంగ నేసిన
ట్ల కమలనేత్రుఁ జట్టికొని డాసి ఘటప్రభవుండు భీష్ముఁడున్
నకులుఁడు కర్ణుఁడుం గృపుడు నాగపతాకుఁడు దుస్ససేనుఁడున్
శకునియు ధర్మజుండును నిశాతశరంబుల నేసి రుగ్రతన్.

72


వ.

మఱియు నశ్వత్థామయు సహదేవుండును ఘటోత్కచుం
డును శిఖండియు ధృష్టద్యుమ్నుండును భగదత్తుండును
నీలుండును సుదక్షిణుండును గేకయులును విందానువిం
దులు నాదిగాఁగల సకలయోధులు చండకాండంబుల
బెండుపడనేసిన.

73


ఉ.

అప్పుడు కృష్ణుఁడున్ మనమునందుఁ జలింపక కుంభజాతునితో
నిప్పులవంటి బాణమున నివ్వెఱఁ గందఁగ నేసె వారలు
న్ముప్పిరిగొన్నయట్టిచలమున్ బలమున్ గరువంబు మీఱఁగాఁ
గప్పిరి కేతనంబుఁ దురగంబుల సారథిమేను నమ్ములన్.

74


చ.

అలుఁగులు దాఁకి కౌస్తుభమునం దనలాగ్నికణంబులోలిమై
జలజల రాల నాభరణజాలము నుగ్గుగ డుల్లి జోడులో
పల నడఁగంగ మే న్దరలఁబాఱఁగ రక్తము గ్రమ్మి బాఱఁ దూ
పులు నిగిడించి చేదివిభు భూమిపయిం బడనేసి యార్చినన్.


సీ.

పరిపూర్ణచంద్రబింబసముజ్జ్వలాస్యంబు
             ప్రళయకాలానలప్రభల నీన
శారదచంద్రికాసమకటాక్షంబులు
             గల్పాంతసమయాగ్నికణము లుమియఁ

బుష్పచాపోల్లసద్భ్రూమండలము భూప
             జాతనాశకధూమకేతువుగను
దందశూకాధీశతుందిలదోర్దండ
             మంతకదండభయంకరముగ


తే.

గుంభినీధ్రంబు లూఁగ దిక్కుంభివరులు
ముణుఁగ నబ్ధులు గలఁగ నంభోజహితుఁడు
ద్రోవ దప్పంగ దేవత ల్దొట్రుపడఁగ
రాక్షసారాతి ఘోరచక్రంబుఁ దలఁచె.

76


వ.

అప్పుడు.

77


శా.

రక్షోనాయకకంఠరక్తయుతధారాశోణరోచుల్ దినా
ధ్యక్షాంశుప్రకరంబు నుద్దవిడి మాయంజేయఁగా భూమిభృ
త్పక్షచ్ఛేదనదక్షఘోరసురరాడ్దంభోళికోటిప్రభా
నాక్షీణంబగు చక్ర మక్షణమ దైత్యారాతిచే నిల్చినన్.

78


క.

కరచక్రముఁ జూచి యుధి
ష్ఠిరు నొక్కనిఁ గాచి నిఖలసేనాధరణీ
వరనరచతుర్ధనులఁ జెం
డి [9]రమ్మని హరి గనలి వడిఁ బ్రయోగించెన్.

79


తే.

మన్ను మిన్నును నేకమై మంట లెగయఁ
జక్ర మేతేరఁగాఁ జూచి సవ్యసాచి
యున్నయత్నంబులన్నియు నుడిగి యాచ
తుర్ధనునిఁ దనవెనుకకుఁ ద్రోచి నిలిచె.

80


వ.

అంత.

81


మ.

ఘననిర్ఘోషసమానరావ మడరంగాఁ జక్ర మేతెంచి కుం
డినభూనాథున కడ్డమై నిలుచు గాండీవిన్ హరించెన్ జతు

ర్ధను కంఠంబును గ్రక్కునన్ దునిమె దుర్గాధీశ నీరేజజా
త నిలింపాధిపు లాత్మ భీతిలఁగ భూతవ్రాతము ల్బెగ్గిలన్.

82


వ.

ఇట్లు తునిమిన.

83


చ.

నరునిశిరంబు కేశవ! వినాయకకేతన! చక్రి! దైత్యసం
హర! పరమాత్మ! మాధవ! మురారి! సరోరుహపత్రనేత్ర! భూ
ధరధర! యిందిరారమణ! దానవవైరి! యటంచుఁ బల్కుచున్
ధరపయి వ్రాలె నంతట సుదర్శన ముగ్రత మీఱ వ్రేల్మిడిన్.

84


సీ.

గాంగేయ కుంభజ కర్ణ దుర్యోధనా
             శ్వత్థామ శల్యుల సంహరించి
మాద్రేయ కృప హిడింబతనూజవర జగ
             త్ప్రాణసంజాతుల బారిసమరి
సింధుభూవర దుస్ససేన ధృష్టద్యుమ్న
             రుక్మి శిఖండుల రూపుమాపి
కేకయాధిప సుదక్షిణ నీల భగదత్త
             విందానువిందుల వెల్లిఁబుచ్చి


తే.

పౌండ్య సౌబల యవన భూపాల ధృష్ట
కేతు బాహ్లికపౌత్త్రులఁ గీటడంచి
యుత్తమోజు యుథామన్యు నుర్విఁ గూల్చి
మఱియుఁ దక్కిన శూరుల మారిమసఁగి.

85


వ.

ఇవ్విధంబున సంవర్తసమయసముజ్జృంభమాణకుంభీనస
రాజకటకచటులనిటలతటశిఖిశిఖాసంకాశజ్వాలంబై ప్ర
ళయకాలప్రచండమార్తాండమండలవిడంబివిస్ఫులింగ
భయంకరంబై కల్పాంతప్రవర్థమానబృహద్భానుజిహ్వా

సంహతి దుర్నిరీక్షంబై పుష్కలావర్తకాది మహాంభోధర
సంభూతనిర్ఘాతజాలబంధురధ్వానానూనస్వానముఖరిత
బ్రహ్మాండంబై కాలకూటంబులీల సంస్పృష్టరాజశేఖర
కంఠంబై బడబానలంబుచందంబున నపహృతవాహినీనాథ
జీవనంబై వర్షాకాలంబుతెఱంగునఁ బ్రవర్ధితక బంధంబై
భగవదవతారంబుచెలువున సంస్థాపితధర్మంబై పాటితరక్ష
శ్చక్రంబగు చక్రం బాక్రమించినఁ దత్సైన్యంబునం గెడ
యురథులును మడియుసారథులుసు విఱుగుతేరులును
నొఱగుశూరులును డొల్లుమాతంగంబులును ద్రెళ్లు
తురంగంబులును నొరలుసవారులును బొరలుయోధు
లును గూలినపదంబులుసు రాలినరదంబులును జిదిసినశిరం
బులును జదిసినకరంబులును దునిఁగినమెడలును బెనఁగిన
తొడలుసు బగిలినఱొమ్ములును నొగిలినయెమ్ములును
దరలుగుండెలును నొరులుకండలును జూర్ణంబులైన
గొడుగులును విశీర్ణంబులైన పడగలును నుగ్గైననానావిధ
శస్త్రంబులును దుత్తుమురైన తనుత్రాణశిరస్త్రాణంబులును
గూడి నెత్తురుటేరులం గలసి పఱచె నందు.

86


సీ.

కీలాలవాహినీజాలంబు ప్రవహింప
             నందంద వడి నోలలాడుఁ గొన్ని
తెగగలమాంసంబు తెట్టెల దిట్టలై
             వేడుకఁగని పాతులాడుఁ గొన్ని
గజమస్తకంబు లక్కజముగాఁ జేపట్టి
             యచ్చనగండ్లుగా నాడుఁ కొన్ని

సమరోర్విఁ బడియున్న శస్త్రఖండంబుల
             ననువుమీఱఁగ వేటులాడుఁ గొన్ని


తే.

భూమిపాలకభూషణంబులు ధరించి
మెఱసి దమవారిముందట ముఱియుఁ గొన్ని
యివ్విధంబున భూతంబు లెసక మెసఁగఁ
గ్రీడ సల్పుచుఁ జనియెఁ గిరీటితనయ.

87


వ.

ఇవ్విధంబున భూతంబులు దిరుగ నంతకమున్న తనబలంబు
సుదర్శననివృత్తం బగుట ధర్మనందనుఁ డెఱింగినవాఁడు
గావునఁ గురుపితామహజ్ఞాతిబంధుమిత్రామాత్యుల
నానాదేశాగతరాజన్యులం గనుంగొనియెడువాఁడై రథం
బు డిగ్గి వచ్చి గాంగేయుం గనుంగొని మూర్ఛం జెంది కొంత
తడవునకుఁ దెలిసి కన్నీరు దొరుఁగ నతనిపాదంబులపై
వ్రాలి యిట్లనియె.

88


తే.

అనఘ! స్వచ్ఛందమరణుండ పవనిఁ గల్గు
మగలకెల్లను మగఁడనఁ బొగడనెగడు
పరశురాముని గెల్చిన బాహుబలుఁడ
వైన నీవును బొలిసి తేమందు విధిని.

89


వ.

అని శోకించి యచ్చటఁ బాసి గురుకృపాశ్వత్థామకర్ణదుర్యో
ధనాదులం జూచుచు నేగి యొక్కచో నిల్చి యందఱం
దలంచి యిట్లనియె.

90


సీ.

సంగరోగ్రులు దివ్యశస్త్రాస్త్రనిపుణులు
             గురుకృపాశ్వత్థామ లరిదిమగలు
ప్రకటదోర్బలులు బాహ్లికసోమదత్తభూ
             రిశ్రవుల్ విపులకీర్తిప్రతాపు

లభియాతి శైల జంభారులు గర్ణ దు
             ర్యోధన శోకుని శల్యులు దలంప
మార్తాండతేజులు మత్స్యకేకయ పాండ్య
             పాంచాలదేశాధిపతులు మఱియు


తే.

నఖిలవిశ్వంభరాఢ్యుల కధికు లిట్టి
వారలును వచ్చి చచ్చిరి పోర నా ని
మిత్తమయి యాయఘంబు నేమిట నడంగు
దైవమా యని చింతించుఁ దల్లడించు.

91


వ.

ఇవ్విధంబునఁ గొంతప్రొద్దు దుఃఖించి యనంతరంబ యచ్చో
టు వాసి ముందఱం బరశుపట్టిసప్రాసముద్గరతోమర
గదాశూలభిండివాలకరవాలాదినానావిధాయుధ
శకలంబులపై నవయవభేదంబు లెఱుంగరాక కూలిన
కాల్బలంబులకు నెడగలిగిపోవుచుఁ గేతనచ్ఛత్రచామర
ధనుర్బాణరథతురంగసారథిసమేతంబుగా సమసిన రథిక
వరులకు నీసడింపుచు రాహుత్తసహితంబుగాఁ గుప్పలు
గొనఁబడిన గుఱ్ఱపుఁదిట్టలకు నోసరిల్లుచు మావంతులతోడఁ
బీనుంగులైన యేనుంగులకు నోహటింపుచుఁ జని యచ్చట
భీమసేనునిఁ దద్వామదక్షిణపార్శ్వంబులఁ ద్రెళ్లినకవలనుఁ
గని యొల్లంబోయిన యుల్లంబున మూర్ఛిల్లి యెట్టకేలకుఁ
దెలిసి పేరుపేరున నిట్లని విలపింపందొడంగె.

92


సీ.

దుర్యోధనుండు బద్ధునిఁ జేసి ముంప నా
             నదినుండి వచ్చిననాఁటిశక్తి
మమ్ము లాక్షానివాసమ్మునఁ గీడు చెం
             దకయుండఁ దెచ్చిననాఁటిశక్తి

వనమధ్యమున హిడింబుని యుద్ధమునను బ్రా
             ణములను గొన్నట్టి నాఁటిశక్తి
విక్రమంబున నేకచక్రమున బకదా
             నవు జీరివైచిన నాఁటిశక్తి


తే.

యెవ్విధంబున
మడఁగే నేఁ డెం దడంగె
నేతెఱంగున డాఁగె నేఁ డెచటి కేఁగె
హా మదేభాయుతత్రాణ హా గదాప్ర
వీణ హా వీర హా జగత్ప్రాణతనయ.

93


తే.

నకులసహదేవులార భండనపటిష్ఠు
లార సౌందర్యలక్ష్మీకుమారులార
పోయితిరె మీరు నేఁడు నాపొందు విడిచి
యంచు విలపించు నలుదిక్కు లాలకించు.

94


తే.

మఱియు భీమాత్మసంభవు మానసమునఁ
దలంచి యంతంత నార్తనాదంబు నిగుడ
నేడ్చె నది విని భూతంబులెల్ల నడలె
మృగనమూహంబు పక్షులు మేఁత లుడిగె.

95


చ.

ఇవ్విధంబున రోదనంబు చేయుచుఁ గొన్నియడుగులు నడచి
చతుర్ధనుం గనుంగొని పుడమిం బడి యిట్లనియె.

96


క.

నినుఁ గావఁ బూని యర్జునుఁ
డనిఁ దనశౌర్యంబు నెఱపి హరిచేఁ దెగెఁ గుం
డిననాథ, యిట్టిభాగ్యము
గనఁజాలఁగనైతి నెంత కలుషాత్ముఁడనో.

97

వ.

అని నివ్వెఱపడి నిట్టూర్పు నిగిడించి లేచి తత్పురోభాగం
బున నున్న యర్జునుని నతనిముందు నున్న శల్యుని నతని
పార్శ్వంబులఁ గూలిన యుత్తమోజయుథామన్యులను
దేఱిచూచి దుఃఖాక్రాంతస్వాంతుండై దానిచెంగటం బడి
యున్న యన్నరుకళేబరంబు డగ్గఱం జని తచ్ఛిరంబు తన
యంకతలంబున నిడుకొని నెమ్మనంబునం గ్రమ్మిన యుమ్మలి
కంబు పెంపున రిమ్మగొని సొమ్మసిలి యమ్మహీతలంబునం బడి
పెద్దతడవునకుఁ గ్రమ్మఱఁ దెలివొంది కన్నీరు దొరుఁగ
నిట్లనియె.

98


సీ.

ద్రోణుశాసనమున ద్రుపదుఁ దెచ్చినయట్టి
             నీభుజావిభవంబు నేఁ డడంగె
నంగారపర్ణుని భంగపెట్టినయట్టి
             నీదివ్యశక్తి దా నేఁ డడంగె
దారుణమత్స్యయంత్రం బేసి మించిన
             నీశరాసనవిద్య నేఁ డడంగెఁ
బాంచాలికై మహీపాలుర గెల్చిన
             నీవిక్రమస్ఫూర్తి నేఁ డడంగె


తే.

హా సరోజాతవైరికులావతంస
హా జితోద్దండపరిపంథిరాజహంస
హా మహాశౌర్య హ సురాహార్యధైర్య
హా జయద్వీర హా హరిహయకుమార.

99


వ.

అని పనవి రోదనంబు సేయుచున్న యమ్మేదినీనాథుదైన్యా
తాపంబులు విని బలభద్రసాత్యకులు కృష్ణునిపాలికిం జని
సాంత్వనవచనంబుల నిట్లనిరి.

100

చ.

వనజదళాక్ష! యింద్రసుతువాహిని గాల్చిన పోటిలో మెఱుం
గొనరు తెఱంగునన్ నిలిచి కుందుచు నొక్కఁడు విన్నవారికి
న్మన మెరియంగ బాంధవసమాజము మాటికిఁ బేరు గ్రుచ్చి యొ
క్కనితల మ్రోలఁ బెట్టుకొని గద్గదకంఠము మీఱ నేడ్చుచున్.

101


వ.

నీచక్రంబునకుఁ దప్పియున్నవాఁ డెవ్వఁడో దెలియఁడు.

102


క.

అని చూడుమనిన వారల
కనియె దనుజారి యేడ్చునాతఁడు యమనం
దనుఁడు ధనంజయశిర మది
మన మరుగుద మతనియడలు మాన్పఁగవలయున్.

103


వ.

అని యాసంకర్షణసాత్యకులుం దానును రథారూఢులై
కదలి యాత్మసేనామధ్యంబున మాతంగతురంగాదిచతు
రంగబలసమేతులై భూతలంబునం బడిన ప్రద్యుమ్న
సాంబసారణాదికుమారుల ననిరుద్ధయుద్ధవాక్రూరచేకి
తానకృతవర్మగదాదియాదవవీరులం గనుంగొనుచు
శోకవ్యాకులితమనస్కులై చని పాండవబలంబు దఱిసి
పోవుచుఁ గృష్ణుండు వారల కి ట్లనియె.

104


సీ.

ఇతఁడు గంగాసూనుఁ డీతఁడు కుంభజుఁ
             డీతఁ డశ్వత్థామ యితఁడు కృపుఁడు
ఈతఁడు రాధేయుఁ డీతఁడు సైంధవుఁ
             డితఁడు దుర్యోధనుఁ డితఁడు ద్రుపదుఁ
డితఁడు దృష్టద్యుమ్నుఁ డితఁడు శిఖండి యి
             తఁడు పాండ్యనాథుఁ డితఁడు వరాటుఁ
డీతఁడు హైడింబుఁ డీతఁడు భగదత్తుఁ
             డితఁడు సుదక్షిణుఁ డితఁడు నీలుఁ

తే.

డితఁడు కాంభోజనాయకుం డితఁడు యవనుఁ
డితఁడు శిశుపాలనందనుఁ డితఁడు రుక్మి
యితఁడు వడముడి యితఁడు బాహ్లికసుతుండు
ఈతఁడు తదాత్మసంభవుఁ డితఁడు శకుని.

105


వ.

అని మఱియు నకులసహదేవాదులఁ బేరు పరం జెప్పుచుఁ
బాడరియున్న పార్థుతేరు చేరం జని రథంబు డిగ్గి నిలిచిన.

106


చ.

తనతొడమీఁదనున్న విబుధప్రవరాత్మజునుత్తమాంగ మొ
య్యన యరదంబుమీఁద నిడి యాహరిపాదములందు వ్రాలి లో
చనముల నశ్రుపూరము వెసన్ బ్రవహింపఁగ దీనభావ మా
ననమున నంకురింప యమనందనుఁ డాతనితోడ నిట్లనున్.

107


ఆ.

అఖిలభూతసముఁడు నపవర్గదాయకుం
డంబుజాతనేత్రుఁ డనుచుఁ బలుకు
మాట దప్పకుండ మాధవా ననుఁ జక్ర
కోటిఁ ద్రుంచి వీరిఁ గూడ నంపు.

108


వ.

అనిన బలభద్రసాత్యకిసమేతుండై యప్పద్మలోచనుండు
నట్లు పరిదేవనం బొనర్చి తనకుఁ దాన యూఱడిల్లి యతని
మాఱార్చుచుండ వెండియు నతం డిట్లనియె.

109


ఉ.

తమ్ములు రాజులుం దెగినదానికి నీగతి నిల్వ లేక శో
కమ్మున నుంటగాదు తనుఁ గావు మటంచుఁ జతుర్ధనుండు త్రా
సమ్మున నన్నుఁ జేరె మనుజప్రభుఁ డంచును నిట్టివానిఁ జ
క్రమ్మున కప్పగించి తిఁకఁ బ్రాణము లేటికి నాకు మాధవా.

110


క.

అని కరుణ పుట్టఁ బల్కెడు
మనుజేంద్రునిమీదఁ గృప నమర్చినచూడ్కుల్

కొనసాగ నినిచి హస్తం
బున నిమిరి యతని కపుడు విభుం డి ట్లనియెన్.

111


ఉ.

ఇంత దలంక నేల ధరణీశ్వర యీ రణభూమిఁ బడ్డ భూ
కాంతులలోన నొక్కరుని గ్రక్కున నిచ్చెద వేఁడుమన్న నా
యంతకనందనుండు వినయంబున హస్తయుగంబు మోడ్చి దై
త్యాంతక యీచతుర్ధనన్నృపాగ్రణి నిమ్మన నాతఁ డిట్లనున్.

112


క.

గురు కృప భీష్మాశ్వత్థా
మ రాజరాడ్భీమపార్థ మాద్రేయ దివా
కరసుత ఘటోత్కచాదులు
హరివిక్రము లుండ నితని నడుగఁగ నేలా.

113


వ.

అనవుడు ధర్మనందనుండు కృష్ణున కిట్లనియె.

114


సీ.

సకలరాజన్యచారుకిరీటఘృష్టపా
             దద్వందుఁ డగుసుయోధనునికంటె
మత్ప్రాణసములు భీమప్రతాపులునైన
             మరుదుద్భవాదిసోదరులకంటె
పరమపుణ్యులు కృపాపరులైన కర్ణగాం
             గేయగురుద్రౌణికృపులకంటె
బలవంతులగు మత్స్యపాంచాలకేకయ
             పాండ్యాదివిశ్వభూపతులకంటె


తే.

నిష్టుఁడై నట్టి కుండినాధీశు నిమ్ము
చాలు నిదియె సమస్తవిశ్వంభరాధి
పత్య మిచ్చుట యేరికిఁ బడయరాని
బ్రహ్మపదము నొసంగుట పద్మనాభ.

115


వ.

అనవుడు నప్పరమేశ్వరుం డిట్లని యానతిచ్చె.

116

తే.

సర్వభూతదయాపర సత్యసంధ
రాజపూజితపదపద్మ రాజతనయ
శోభనాకార నీచిత్తశుద్ధి కాత్మఁ
జాల మెచ్చితిఁ గుండినేశ్వరునితోడ.

117


క.

జీవించుఁగాత మత్కృపన్
జీవాతువు గాఁగ నుభయసేనలు నిపుడే
దేవాధిప శంకర వా
ణీవల్లభు లాత్మలోన నివ్వెఱఁగందన్.

118


ఆ.

అని యతండు పల్క నఖిలజనంబును
మిగుల నిదురఁబోయి మేలుకొన్న
చెలువ మామతింపఁ జెక్కు చెమర్పక
లేచె నపుడు సవ్యసాచితనయ.

119


వ.

అంత.

120


క.

నరనాథాగ్రణి వినుమా
బరవసమునఁ జచ్చుటయును బ్రతుకుటయు మదిన్
బరికింపక రోషంబున
దురమునకును నుభయబలముఁ [10]దొడరుడు నంతన్.

121


క.

హలధరుఁడు ధర్మజుండును
బలమున కడ్డంబు వచ్చి బ్రతికినచందం
బుల విప్పి చెప్పఁ దిరిగెన్
నలివాక్షునిమహిమఁ దమమనములఁ బొగడుచున్.

122


వ.

ఇవ్విధంబున నజాతశత్రునకుఁ బ్రియంబుగా నుభయ
సైన్యంబులకుఁ బ్రాణంబు లొసంగిన సకలలోకాధ్యక్షుం

డగుపుండరీకాక్షుని యక్షీణప్రభావంబునకు సమందానంద
కందళిత హృదయులై పురందరాదిబృందారకులు మందా
రాభినవప్రసూనవర్షంబులు గురియించిరి సిద్ధవిద్యాధరా
దులును గిన్నరకింపురుషాప్సరోజనంబులును గీతనృత్య
వాద్యంబుల సంతసించి రట్టియెడ సుయోధనాదిధార్త
రాష్ట్రులును యుధిష్ఠిరాదిపాండవేయులును ద్రుపదవిరా
టాదినానాదేశాధీశ్వరులును గాంగేయుండు మున్నుగాఁ
దమతమసైన్యంబులు గొలువ నరుగుదెంచి రథంబులు డిగ్గి
యద్దేవునకుఁ గృతప్రణాములై నిలిచి యనంతరంబ
విజ్ఞాననిధి యగు నా దేవవ్రతుండు కృతాంజలియై యిట్లని
స్తుతించె.

123


దండకము.

శ్రీ కామినీమానసాంభోజమిత్రాదళత్పద్మనేత్రా
రిపువ్రాతజైత్రా మునిస్తోత్రపాత్రా సదానందయోగీంద్ర
సన్మానసారామచైత్రా మహాఘౌఘవల్లీలవిత్రా జగజ్జాల
రక్షావిధాదక్షదక్షాత్మజానాథవంద్యా సముద్రంబులన్
బుద్బుదవ్రాత ముద్భూతమై పొల్చి తన్నీరమధ్యంబునన్
లీనమైపోవురీతిన్ సరోజాతగర్భాండముల్ నీప్రభావం
బుచే నుద్భవించున్ జెలంగున్ మడంగున్ ముకుందా
భవద్రోమకూపంబులం దత్పయోజాతగర్భాండసంఘంబు
వాతాయనాయాత యాతాణుజాతం బనన్ బొల్చు నం
దొక్కబ్రహ్మాండమధ్యంబునన్ రాజసుల్ తామసుల్ సోమ
రుద్రాజముఖ్యుల్ జగన్నాయకా తావకానంతకళ్యాణ
లీలాగుణశ్రేణిలో నొక్కఁడైనన్ యథార్థంబుగా బుద్ధి
నీక్షించి వర్ణింపఁగా శక్తుఁడే భక్తవశ్యా పయఃపూరసం
పూరితానేకకుంభాంతరద్యోతమానేందుబింబాకృతిన్

బెక్కుదేహంబులం దాల్చియున్ భిన్నమార్గంబులం దోఁచి
నీ వద్వితీయుండవై యుండు దీశా భుజాచక్రధారావినిర్భిన్న
రక్షఃకులాధ్యక్షకంఠా నృకంఠీరవా మేదినీనీరతేజోనభ
స్వద్వియత్స్వాంతచిద్బుధ్యహంకారసంఘంబుచే నీప్రపం
చంబు గావించి [11]తద్వోఢసూక్ష్మాకృతిం బొల్చు దేహంబుల
న్నిత్యపూర్ణుండవై యుండియుం [12]చ్ఛరీరంబు జీవాకృతిన్
నీవిశేషంబు చింతింపఁగా శక్తి లేకుండి నీమాయ గీలించినన్
గామినీపుత్త్ర హేమాదిసంపద్విశేషంబులం జొక్కి నిక్కం
బుగా నమ్మి నెమ్మిన్ భవత్పాదపంకేరుహధ్యానమున్ మాని
గర్వంబునం బర్వి మూఢాత్ములై చచ్చుచుం బుట్టుచున్ సద్గతిం
గాన రంభోజపద్మాధిపా యందులోఁ గొంద ఱత్యంతయుక్తా
త్ములై సుందరీనందనస్వర్ణసంఘంబుల న్రోసి కాంతారముం
జేరి యాధారలింగస్ఫురన్నాభిహృత్తాలు మూలాది
కాధోముఖవ్యాప్తచక్రంబులన్ సంతతాఖ్యాసలీలాపటు
త్వంబున న్మీఁదుగాఁ ద్రిప్పి యాధారశక్తిం బ్రకాశింపఁగాఁ
జేసి బాహ్యేంద్రియద్వారముల్ మూసి వాతాగ్నులం
గూర్చియు న్మధ్యమార్గంబుచే నూర్ధ్వసంచారులై మీఱఁ
గాఁ జేయుచుం జిత్సుధాపానకేళీరతిం జెందుచున్ నిన్ను నా
నందరూపంబుగాఁ జూతు రాజన్మశుద్ధాత్ములై కొందఱార్యుల్
దుదిం గామ్యకర్మంబులన్ మాని యేదేవతాభక్తియు న్దించి
యేమంత్రసంసక్తియున్ లేక దంభంబు గామంబు లోభంబు
క్రోధంబు మోహంబు మాత్సర్యమున్ దవ్వుగాఁ ద్రోఁచి నీ
చిహ్నముల్ బాహుయుగ్మంబులం బూని నీదాసభావంబు

నిక్కంబుగా నాత్మలోఁ బట్టి నీనామసంకీర్తనల్ జిహ్వఁ
గీలించి నీపాదతీర్థంబు నిత్యంబునుం గ్రోలి నీభుక్తశేషంబు
భక్షించి నీదాసవర్గంబుతోఁ గూడి క్రీడించి సత్కర్మముల్
నీకు సంప్రీతిగాఁ జేయుచున్ ధన్యులై మించి నీసన్నిధానం
బునం దెప్పుడున్ నిత్యసౌఖ్యంబుతో నుందు రంభోధి
శాయీ సరోజాతగర్భు న్విచిత్రంబుగా మూర్ఛ నొందించి
తద్వక్త్రపద్మస్థవేదంబులం గొన్న విన్నాణి యున్నట్టి యం
భోధిలోఁ జొచ్చి దాఁగున్న యాసోమకుం జోరమీనా
కృతిం బట్టి కట్టల్కతోఁ జంపి యావేదముల్ బ్రహ్మమోదం
బునం బొందఁగా నియ్యవే దుగ్ధవారాశిమధ్యంబునన్ మంద
రానగంబు మీఱంగఁ గవ్వంబుగాఁ జేసి భోగీశ్వరుం
ద్రాడుగాఁ జుట్టి దేవాసురుల్ మచ్చరం బెచ్చఁగాఁ ద్రచ్చుచో
నగ్గిరీంద్రంబు పాథోధిలోఁ [13]గ్రుంగినన్ గచ్ఛపస్వచ్ఛరూపం
బునం దద్ధరం బుద్ధరింపన్ ధరన్ మోసి దేవాలికిం బ్రాపు
గావే ధరామండలం బెల్ల యుద్దండకేళిన్ హిరణ్యాక్షుఁ
డక్షీణదోర్వీక్రమారంభుఁడై చాపచందంబున జుట్టి పాతా
ళలోకంబున న్నిల్చినన్ ఘోరదంష్ట్రాకరాళోగ్రభూదార
లీలావతారంబున న్వైరిదైతేయునిం జించి చెండాడి సర్వం
సహా కామినిం [14]గొమ్మున న్నిమ్ముగా నెత్తవే మత్తవేదండరీతిన్
మదోద్రిక్తుఁడై యుగ్రదైత్యుండు పుత్రుం బరీక్షించి నీ
దేవునిన్ స్తంభగర్భంబునం జూపుమా యంచుఁ దా నుక్కు
కంబంబు వ్రేయర్ మహాక్రోధరంహంబునన్ శ్రీనృసింహా
కృతిం [15]బేర్చి యద్దానవేంద్రున్ నఖాగ్రంబులన్ జీఱవే

మీఱి లోకత్రయిం బాదపద్మంబుల న్మట్టి వైరోచనిన్
నాగలోకంబునన్ ముంపవే త్రెంపవే సర్వరాజన్యకంఠా
నలిం జండబాహకుఠారోగ్రధార న్వడిన్ జామదగ్న్యుం
డవై పెంపుమీఱ న్నిలింపారియైనట్టి యాలోకవిద్రావణు
న్నిర్జితైరావణున్ రావణుం బుత్త్రమిత్రాదియుక్తంబుగా
భానువంశాబ్దిరాకాసుధాంశుండవై త్రుంపవే బాహు
శక్తిన్ బ్రలంబాదిదుష్టాత్ములం గొట్టి కాళింది నుద్దండ
లీల న్విభేదింపవే రౌహిణేయుండవై దానవుల్
భీకరాకారులై లోకజాలంబు గారింపఁగా వారి
[16]నిర్బంధులంగా మహాశైలకోదండుచే [17]పట్టి గెల్పించి మున్
మించవే కల్కిరూపంబునన్ దేవ నీమోము దిక్పాలురున్
వహ్నియు, న్నేత్రముల్ చంద్రసూర్యుల్, శ్రుతుల్
దిక్కులున్, భూమి గర్భంబు స్వేదంబు పాధోధు, లుఛ్వా
సనిశ్వాసముల్ వాయువుల్, శైలముల్ శల్యముల్,
రోమముల్ వృక్షముల్, నాభి యభ్రంబు శీర్షంబు స్వర్గంబు
భార్యల్ ధరిత్రీరమాకామినుల్ పార్శ్వయుగ్మం బహో
రాత్రములొ గాఁగ విశ్వాత్ముడై పొల్చు నీమోమునన్
బ్రాహ్మణుల్ బాహులన్ రాజు లూరుప్రదేశంబునన్
వైశ్యు లంఘ్రిద్వయిన్ శూద్రులుం బుట్టిన న్వారికిన్ ధర్మ
మార్గోపదేశంబుగా వేదశాస్త్రమ్ములం జేసితౌ నీశ నిన్ను
న్నుతింపంగ నే నెంతవాఁడన్ జడుండ మహాహీన
చిత్తుండ మత్తుండ నన్నుం గటాక్షింపుమీ భక్తమందార
వేదాంతసంచార భవ్యప్రకారా నమస్తే నమస్తే నమః.

124

వ.

అని బహుప్రకారంబుల వినుతించు నప్పరమభాగవతో
త్తము నయ్యాదవనాయకుండు మృదుమధురభాషణంబుల
నాదరించి ధర్మజభీమదుర్యోధనాదులను సకలరాజన్యు
లం దత్తదుచితప్రకారంబుల సంభావించి చిన్నవోయి
యున్న యర్జునుని జేరం దిగిచి యాలింగనంబుఁ జేసి హృద
యానందంబుగా గౌరవించి చరణంబుల కెరఁగిన చతుర్ధనుని
మన్నించి గాంగేయాదుల ద్వారకానగరంబునకు రానియ
మించి తత్తన్నివాసంబుల కనిచి బలభద్రుండును దానును
జతురంగబలపరివృతుండై నిజస్కంధావారంబునకుం జని
యథోచితంబుగా నుండి యమ్మఱునాఁ డుభయసైన్యంబులుఁ
గొలువ ద్వారకానగరంబునకుం జను నవసరంబున.

125


మ.

బలము ల్ముందరఁ గాంచెఁ గాంచనమయప్రాసాదహర్మ్యాగ్రని
ర్మలగంధోత్కటకుంభధిక్కృతనభోమధ్యజ్వలత్తారకన్
లలితారామసదాత్తపల్లవలతాంతప్రోల్లసత్కోరకన్
కలుషాంభోనిధితారకన్ భటసమగ్రద్వారకన్ ద్వారకన్.

126


సీ.

భవ్యప్రవాళసంబద్ధమందిరరోచు
             లుభయసంధ్యారక్తి నోటుపఱప
హరినీలమాణిక్యహర్మ్యాగ్రశోభలు
             దర్శక్షపాతమస్తతి జయింపఁ
జారువజ్రాంచితసౌధశృంగద్యుతుల్
             పండువెన్నెలతోడ మెండుకొనఁగఁ
బద్మరాగోపలప్రాసాదకాంతులు
             చండభానుప్రభఁ జౌకఁజేయ

తే.

సంజ కడ లివి కృష్ణపక్షత్రియామ
లివ్వి శుక్లనిశీధిను లివ్వి దినము
లివ్వి యని బుద్ధిలోపల నేర్పరింపఁ
బద్మగర్భుండు నేరఁ డప్పట్టణమున.

127


సీ.

అనవద్యవేదవేదాంగశాస్త్రాంభోజ
             గర్భోరగేంద్రులై గణన కెక్కి
యధికకోదండవిద్యాభీమభార్గవ
             రామదాశరథులై రాశి కెక్కి
నానానిధానరత్నవ్రాతగుహ్యకే
             శ్వరసింధురాజులై వాసి కెక్కి
రణరంగరిపుసంహరణక్రియాజంభారి
             బలభద్రులై చాలఁ బ్రణుతి కెక్కి


తే.

యజ్ఞము లొనర్చి శత్రుల నడటడించి
వృద్ధి జీవనమున మించి విప్రసేవఁ
జేసి చెలఁగుదు రప్పురసీమ ధరణి
సురలు రాజులు వైశ్యులు శూద్రవరులు.

128


క.

నిరుపమసుధామయములై
పరమోన్నతిఁ జెంది మధ్యభాగవినీల
స్ఫురదురుచిహ్నంటులచే
సరసతహర్మ్యములు చంద్రసామ్యము దాల్చెన్.

129


సీ.

కరికుంభములఁ బోలి కందుకంబుల నేలు
             నున్ననివట్రువచన్ను లమరఁ
గలువఱేకుల మీఱి జలచరంబులఁ గేరు
             తిన్ననినిడువాలుఁగన్ను లమర

నళులకైవడిఁ బొల్చి హరినీలముల గెల్చు
             కప్పున గిరికొను కొప్పు లమరఁ
గుందనంబు హరించి క్రొమైఱుంగుల మించు
             మేలిమిఁ దగు [18]బొదమేను లమర


తే.

మెలఁగుదురు ముద్దుఁబలుకులు దొలఁకుకలికి
మొలకనగవుల వెన్నెలతళుకు చిలుక
నలరుదురు లీల రతిపతినై న మిగుల
వలవఁగాఁ జేయనేర్చిన వారసతులు.

130


చ.

ప్రవిమలలీలఁ దద్వనవిరాజితకేళి మహీధరాగ్రవ
జ్రవిపులపద్మరాగరుచిజాలము లెల్లపుడున్ జెలంగుచుం
గువలయపద్మసంహతులకు న్మది హెచ్చును గుందు లేని యు
త్సవ మొనరింప డెందమున సంశయ మంది కృశించె జక్కవల్.

131


చ.

హరియును గుంభసంభవుఁడు నాగ్రహ మెత్తి ధరాధరంబులన్
శరధుల నుద్ధతిం గొన మనంబునఁ జూచిన భీతి నొంది ద
ద్ధరముఁలు వార్డులున్ హరిపదం బొగిఁ జొచ్చి భయంబు దక్కి ని
ల్చురమణ సాలము ల్పరిఖలు గనుపట్టె మహోజ్జ్వలాకృతిన్.

132


వ.

అది మఱియును.

133


సీ.

కకుబంతవిశ్రాంతగందేభములజోడు
             కోడెలో యన నొప్పుకుంజరములుఁ
గమలాప్తరథతురంగంబులపిల్లలో
             యనఁ బొలుపొందు భవ్యాశ్వములును

సౌరమాఘవనకౌబేరరథంబుల
             యాకృతిఁ గనుపట్టు నరదములును
శౌర్యతిరస్కృతచండకంఠీరవ
             ఘోరపరాక్రమవీరభటులుఁ


తే.

గలిగి పదభీషణాకృతిఁ జెలఁగి నిత్య
కాహళీవేణుడమరుఢక్కామురజక
దుందుభిమృదంగశంఖదుత్తుంభడిండి
మధ్వనిశ్రేణి దిశలు గ్రమ్మఁగఁ దనర్చు.

134


తే.

అమితతేజోమయంబైన యప్పురంబు
మెఱయుఁ గైవారమై తగుపరిఖతోడఁ
బరిధి సంయుక్తమై పొల్చు పద్మమిత్ర
మండలంబును బోలి యఖండమహిమ.

135


సీ.

పగడంపుఁగంబాలపైఁ గట్టినట్టి ర
             త్నమణీనికరతోరణములచేతఁ
కర్పూరకస్తూరికావజ్రరాసులఁ
             గనుపట్టు మేలియంగళ్లచేత
గందాన నల్కి ముక్తారంగవల్లికల్
             గీలింపఁదనరు ముంగిళ్లచేతఁ
గాంచనదండసంకలితనానావస్త్ర
             సమితిఁ జెన్నొందు సౌధములచేత


తే.

విమలమణిజాలనీరాజనములచేత
ననుపమదశాంగధూపవాసనలచేత
నమితమంగళగీతవాద్యములచేతఁ
బుడమిలోఁ గడునొప్పు నప్పురవరంబు.

136


వ.

కాంచి యబ్బలంబు చేరంజను నవసరంబున.

137

సీ.

పరశుతోమరగదాపట్టిసశూలచా
             పశరాఢ్యమౌ కాలుబలము నడచె
రమణీయవివిధచిత్రచ్ఛత్రకేతన
             కాంతులఁ దగుశతాంగములు నడచె
నూపురకింకిణీనూతనక్వణనంబు
             గడునొప్పు ఘనతురంగములు నడచె
దాన గంధాంధలుబ్ధభ్రమద్భ్రమరఝం
             కారనాదము మీఱఁ గరులు నడచెఁ


తే.

దమ్ములును గర్ణుఁడును సోమదత్తుఁడును ద
దాత్మజుండును రుక్మియు యవనపతియు
నాదిగా భూమిపతులెల్ల నలమి కొలువ
రాజసము మీఱి నారాజరాజు నడచె.

138


వ.

తదనంతరంబ యజాతశత్రుండు బాలశీతాంశురేఖయుం
బోని యంకుశంబు కేలం గీలించి మాణిక్యశాతకుంభమయ
ప్రకరచామరరమణీయఘంటానిగళభూషితైరావతకుల
సంభవచతుర్దంతదంతావళారూఢుండై నకులసహదేవు
లుభయపార్శ్వంబుల నిలిచి వింజామరలు వీవఁ బరిపూర్ణ
చంద్రమండలసమానపుండరీకంబు భీమసేనుండు పూన
నర్జునుండు తాంబూలకరండంబు ధరింపఁ జతుర్ధనుండు
మందమందానిలంబు సుడియునట్లుగా సురటి ద్రిప్ప సాంబ
సారణచారుదేష్ణబృహద్భానుభానుదేవభానువిందసునం
దనాదిహరికుమారవర్గంబు ముందట బలసి కొలువఁ సాత్యకి
గదప్రద్యుమ్నానిరుద్దు లుత్తమాశ్వంబుల నెక్కి [19]పాయు
తొలంగు లొనరింప నుగ్రసేనుండును యుద్ధవుండును నక్రూ

రుండును చేకితానుండును గృతవర్మయు నాదిగాఁ గల
యాదవవీరులు భీష్మద్రోణకృపాశ్వత్థామల మున్నిడు
కొని పశ్చాద్భాగంబునం కొలిచి యేతేర ఘటోత్కచాది
రాక్షసవీరులు తమతమబలంబులతోడఁ బిఱుందరా వామ
దక్షిణభాగంబుల సామజంబు లెక్కి వచ్చు రామకృష్ణుల
తోడ నుచితాలాపంబు లాడుచుఁ బౌరపుణ్యాంగనలు రమ్య
హర్మ్యాగ్రములనుండి మంగళపల్లవలాజపుష్పంబులు చల్లి
దీవింప భూసురాశీర్వాదనాదంబును మంగళపాఠకగీతరవం
బును వందిమాగధజయధ్వానంబునుం జెలంగఁ గుంజర
ఘంటానినాదంబులు రోదోంతరాళంబు నిండ విజయభేరీ
మృదంగకాహళవేణుశంఖతమ్మటమురజఢక్క
హుడుక్కాదినానావిధవాజ్యధ్వానంబులు లోకాలోక
పర్వతంబున ప్రతిశబ్ధంబు నిగిడింప నైరావతారూఢుండైన
దేవతాసార్వభౌముచందంబునం ప్రవేశంబు చేసె నంతక
మున్న యాయతంబు లయిన హర్మ్యప్రాసారంబుల బల
భద్రపుండరీకాదులు నానాదేశాగతరాజన్యులను భీష్మా
దులను విడియ నియమిుంచి యక్రూరుమందిరంబున ననుజ
సమేతుండైన యజాతశత్రు నుంచి యఖిలబలంబులకు సకల
పదార్థంబు లొసంగుచుఁ గతిపయదినంబులు నిల్పి యొక్క
నాఁడు కృష్ణుం డుగ్రసేనశూరసేనవసుదేవపురస్సరంబు
గా భీష్మద్రోణాదిమాన్యులకును యుధిష్ఠిరాదిపాండ
వేయులకును సుయోధనాదిగాంధారేయులకును రాధే
యాదిమహాయోధవీరులకును ద్రుపదవిరాటాదినానా
దేశాధీశ్వరులకును ఘటోత్కచాలంబుసహలాయుధాది

రక్షోనాయకులకును జీనిచీనాంబరానర్ఘ్యరత్నాభరణ
తురంగరత్నచతుర్దంతదంతావళాదినానావస్తువ్రాతం
బులును వలయువారలకు దోరహత్తుగా నొసంగి యందఱ
ననిచి యందు నయ్యుధిష్ఠిరున కెఱిఁగించి యర్జునుం దన
యొద్ద నునుచుకొని సుఖం బుండె నంత.

139


సీ.

అయ్యుధిష్ఠిరుఁడు భీష్మాదికౌరవవృద్ధు
             లును ధార్తరాష్ట్రులు జనపతులును
దనతోడ నేతేర ననుపమసంతోష
             భరితుఁడై ఖాండవప్రస్థమునఁ బ్ర
వేశంబు చేసె భూమీశులనందఱఁ
             దమనాళ్ల నిలిపి సోదరులుఁ దాను
నిత్యసంతుష్టులై నిరతంబు బ్రాహ్మణ
             పూజ సేయుచు మహాభూరిమహిమఁ


తే.

గీర్తిసౌహర్దములు గడుపూర్తిఁ జెంది
యెపుడుఁ దనయందె నిలువంగ విపులశౌర్య
వీర్యధైర్యజనములతో విభవ మెసఁగఁ
జిరతరశ్రీల రాజ్యంబు సేయుచుండె.

140


క.

అని శుకయోగీంద్రుం డ
య్యనిమిషరాట్పౌత్త్రునకు దయాపరుఁడై చె
ప్పిన వృత్తాంతము సంతస
మున సూతుఁడు శౌనకాదిమునులకుఁ జెప్పెన్.

141


శా.

శ్రీమత్కాశ్యపగోత్రదుగ్ధజలధిశ్రీకామినీసోదరా
హేమక్ష్మాధరధీర బుద్ధిజితభోగీంద్రామరాచార్య సం
గ్రామోపార్జితభూరిభూవరసమగ్రప్రాభవా పన్నగ
స్వామి క్ష్మాధరకూర్మభూమిభరవాస్తవ్య స్వబాహార్గళా.

142

క.

కృష్ణాంబికాకుమారక
కృష్ణాంఘ్రిసరోజయుగళకీర్తనసేవా
నిష్ణాత నిఖిలభువనచ
రిష్ణుసముజ్జ్వలయశఃపరిష్కృతమూర్తీ.

143


శ్రీవృత్తము.

శ్రీరమణివార సరసీరుహమదభ్రమర
             శిష్టజనరక్షణమహీమం
దార జలజాతనయనాహృదయకైరవసు
             ధాకర నదీవరగభీరా
వైరివసుధారమణవారణసమూహమృగ
             వల్లభ నిలింపపతిభోగా
నీరజభవప్రణయినీకరలసత్కమల
             నిస్స్రుతమరందనిభవాక్యా.

144


గద్యము.

ఇది శ్రీమత్కౌండిన్యగోత్రపవిత్ర చరిగొండ తిమ్మ
నామాత్యపుత్త్ర సకలవిద్యాపారీణ శతఘంట సురత్రాణ
సుకవిజనవిధేయ ధర్మననామధేయప్రణీతం బయినచిత్ర
భారతం బనుపురాణకథయందు సర్వంబును నష్టమా
శ్వాసము.

సంపూర్ణము

  1. సమరంబు భీమంబై
  2. జతురక్షౌహిణీబలంబులుం
  3. బలంబులతోడ
  4. గంగానందనుం గాంచి యతనియనుమతి
  5. సత్యసుతుఁడుం దోడ్తోడ నేతేరఁగన్.
  6. పైఁ, బవిసమశాతశరము లేసి
  7. బండ్రెండుదూపు
  8. డలజడిఁ బొందునో యని తలంచి
  9. రమ్మనుచుఁ బల్కి పారె
  10. దొడరుటఁ గనుచున్.
  11. తద్వ్యూఢసూక్షాకృతిం బొల్చు
  12. దచ్ఛరీరస్థజీవాకృతిన్
  13. పాథోధిలో మ్రగ్గినన్
  14. గొమ్మున న్నెమ్మితో నెత్తవే
  15. బొల్చి
  16. బౌద్ధావతారంబుచేతన్ మహాశైల
  17. బిట్టు
  18. నునుమేను లమర
  19. పాయిపకళాయి