చిత్రభారతము/పంచమాశ్వాసము

శ్రీరస్తు

చిత్రభారతము

పంచమాశ్వాసము



మన్మాణిక్యలస
చ్చామీకరకటకరుచిరశయదాన[1]ఝరీ
స్తోమపరితోషితాబ్ధీ
క్ష్మామండలకల్పభూజ మాదయపెద్దా.

1


వ.

అవధరింపుము మృదుమధురవచనరచనాపరితోషితముని
జాతుం డగుసూతుండు హరికథాశ్రవణాహ్లాదు లగుశౌన
కాదులకు ని ట్లనియె నట్లు తృతీయవ్యూహాధిపతి యగు
జనార్ధనదేవుం గని నమస్కరించి తనకు గోచరించినచందం
బున వినుతించి తత్తురంగాయత్తుండై చని ముందట.

2


మహాస్రగ్ధర.

కనియెన్ భూపాలుఁ డత్యుగ్రమకరకమఠగ్రాహపాఠీనరంగ
ద్ఘనభంగాభంగఘోషక్షపితనిఖిలదిక్చక్రకుంభీంద్రనిద్రున్
వినుతాత్మద్వీపమధ్యావిరతపటుసభావేశ్మనిద్రావశశ్రీ
వనితారాట్తల్పభోగిశ్వరభరమణిదుర్వర్గభద్రున్ సముద్రున్.

3

వ.

కని యిట్లని తలంచె.

4


సీ.

పద్మపత్రాక్షుండు పవళించు సౌధంబు
             పుష్పబాణునితల్లి పుట్టినిల్లు
రాజశేఖరుని గారాబంపుఁ బూఁదోఁట
             విపులామహాదేవి వెల్లచేల
యప్సరాంగనల నెయ్యంపుఁగేళాకూళి
             యజ్ఞోదయస్థితి నమరు సరసి
కల్పవృక్షంబులు ఘనత మొల్చినకోన
             పాకశాసను నడబాలగృహము


తే.

మంచిసురధేను వుదయించు మందపట్టు
దివ్యరత్నంబు పొడమినతెంకి శివుని
యువిదసైదోడు భయ మంది యున్నగొంది
యఖిలసౌభాగ్యరాశి యీయంబురాశి.

5


వ.

మఱియును.

6


ఉ.

ఆపురుహూతుదాడి భయమంది సమస్తసువస్తురాజిచేఁ
జూపడు శైలముల్ జలముఁ జొచ్చి సురేంద్రునిరాక చూడఁగా
నేపున నిక్కెనో యన ననేకవిశేషములం బొసంగి యీ
ద్వీపము లెల్లెడన్ వననిధిం గనుపట్టె మహోన్నతాకృతిన్.

7


మ.

వలమానోరగరాజరజ్జువలయవ్యాపారమన్మందరా
చల మీసింధువునందు నిల్పి సుమనస్సంఘాతమున్ దానవా
వలియున్ ద్రచ్చినఁ జూచి నిర్భరమహావర్తంబులం బొల్చె నీ
జలముల్ దద్ధరణీధరభ్రమణ మోజ న్నేర్చుచందంబునన్.

8

వ.

అని కొనియాడుచు నమ్మహార్ణవంబు సరిగడచి చనునెడఁ
దన్మధ్యంబున.

9


సీ.

కొండయల్లునిమేనఁ గొమరారుసిరి మించి
             చదువుతొయ్యలిమేని చాయఁ దెగడి
నిండువెన్నెలమించు తండ ముల్లసమాడి
             విరిమల్లెపువ్వులఁ బరిఢవిల్లి
వేలుపుఁజెట్లపై వింతకొమ్మలు చూపి
             నింగి పెన్నేటి బెడంగు మీఱి
చలిగొండవెలిగట్టు చాయల గిలుమాడి
             కొండెంపుఁదపసిఁ గైకొనక చెలఁగి


తే.

చుక్కలమెఱుంగు లన్నియుఁ జూఱలాడి
పాలమున్నీటితరగల పసల నేలి
దెసలపైఁ దనవెలుఁగుల మిసిమి నెఱయఁ
బాపరాయఁడు [2]గడలిలో నేపునొందె.

10


వ.

తదుపరిభాగంబున.

11


సీ.

కమనీయ తపనీయ కౌశేయ మొసపరి
             బాగుగా రింగులు వాఱఁగట్టి
మృగనాభికర్పూరమిళితచందనచర్చ
             నీలదేహంబున గీలుగొలిపి
యనుపమదివ్యరత్నాంచితభూషణం
             బులు మెఱుంగుల నీనఁ బొసఁగఁ దాల్చి
శంఖకౌమోదకీచక్ర[3]పద్మంబులు
             కరచతుష్టయమున గరిమఁ బూని

తే.

పారిజాతనవీనపుష్పములతోడఁ
గుంతలంబుల నీటుగాఁ గొప్పు దీర్చి
సతతయౌవనశాలియు సకలలోక
పాలకుఁడునై ముదంబునఁ బవ్వళింప.

12


క.

సరసిజభవాదిదివిష
ద్వరులు దనుజబాధఁ దెలుప వారల మనవుల్
సరవిని నాకర్ణింపుచు
నిరుపమగతి నున్నదేవు నృపుఁ డీక్షించెన్.

13


వ.

ఈక్షించి యిట్లని తలంచె.

14


సీ.

శ్రీసర్వదేవతాసేవితపదపద్మ
             పద్మాలయామనోబ్జాతమిత్ర
మిత్రకోటిప్రభామేయతేజోమూర్తి
             మూర్తిమద్భృతమహాముఖ్యవిభవ
భవశిరోవాహినీప్రభవాంచితచరణ
             రణవిదారితదైత్యరాజచక్ర
చక్రనీరజగదాశంఖభూషితశయ
             శయనీకృతోరగస్వామిదేహ


తే.

దేహభృన్మానసాబ్జవర్ధితవిహార
హార[4]హరిపుండరీకాబ్జహీరతార
తారకాభ్రనగేంద్రగంధర్వశర్వ
శర్వరీశ్వర సమకీర్తి సర్వవిజయ.

15


వ.

అని యివ్విధంబునఁ జతుర్థవ్యూహాధిపతి యగుశేషశాయి
నతిభక్తి నూహించునవసరంబున నాగంధర్వంబు విచిత్ర

గమనంబునఁ దన్నుం కొని చన దధిఘృతసురేక్షురసలవణ
సముద్రంబులు గడచి కింపురుషాదివర్షంబులు దాఁటి భరత
ఖండోర్ధ్వభాగంబునఁ గుండిననగరంబున కేఁగునవసరంబున.

16


క.

అనఘా, కృష్ణుఁడు నారద
మునితోఁ జెలికాండ్రతో యమునలో జలకే
ళి నెఱపి యొకపులినస్థల
మున భానునిగూర్చి యర్ఘ్యము నొసఁగెడుతఱిన్.

17


క.

వినువీథిఁ జనెడు హరియా
ననఫేనకణము సమీరణవశంబున న
వ్వనజాక్షు జలాంజలియం
దుననే పడె దైవఘటనను గిరీటిసుతా!

18


క.

ఆనురువుఁ జూచి కృష్ణుం
డానఁగ రానట్టి కినుక నక్షద్వయి కెం
పూన మదంజలిలోపలి
కేనెపమునవచ్చె నిట్టి యెంగిలి దలఁపన్.

19


చ.

అని తలయెత్తి మింటఁ జను సాశ్వనరేంద్రునిఁ జూచి వీని మ
త్కనదిషువహ్నినేని నిశితం బగుచక్రముచేతనేని యే
నని తల బ్రహ్మ కాచిన రయంబున ముప్పదినాళ్ల లోపలన్
దునియెద నాదు వాక్యము వినుండు చరాచరభూతజాలముల్.

20


ఆ.

అని ప్రతిజ్ఞఁ జేసి యనిమిషమౌనియు
సకలయాదవులును సంభ్రమమునఁ

గొలువఁ గృష్ణుఁ డలఘుగుణశాలి నిజధామ
మైనద్వారవతికి నరిగె నంత.

21


వ.

ఇట్లు కృష్ణుండు ప్రతిజ్ఞఁ జేసి చనిన యనంతరంబ యిచటఁ
జతుర్ధనుం డవ్విధం బేమియు నెఱుంగఁడు గావున నధిక
సంతోషంబున నానాలోకాంతరస్థంబు లగుకల్పవృక్షకామ
ధేనుచింతామణులను గరుడగంధర్వకిన్నరకింపురుషయము
రాక్షసదిక్పాలబ్రహ్మలను దృతీయచతుర్థవ్యూహాధిపతు
లగుజనార్దనశేషశాయులను దర్శించితిఁ గృతార్ధుండ నైతి
నని తలంచునంతలో నవ్వారువంబు యథేచ్ఛం దిరిగి నిజ
నివాసంబుఁ జేరు వారువంబుచందంబున నధికవేగంబునఁ
గుండిననగరంబుఁ జేరి క్రమంబున నగరిమొగసాలఁ గదిసి
నిలిచిన.

22


ఉ.

ఆనరనాయకాగ్రణి హయం బనురాగము నందునట్లుగా
నాననమల్ల దువ్వి వినయంబునఁ గంధర నప్పళించి లో
నూనినవేడ్క దాని డిగి యెయ్యన లోనికి నేగెఁ దేజియుం
దోనరుదేర మంత్రులు గనుంగొని సంభ్రమ మొప్ప మ్రొక్కఁగాన్.

23


వ.

అ ట్లేగి.

24


తే.

చంద్రకాంతశిలానద్ధసౌధమధ్య
వేదికాపద్మరాగనవీనభద్ర
పీఠికాసీనుఁడై రాజబృందభృత్య
జనముఁ గన్గొని తగినమన్నన లొనర్చె.

25


వ.

అయ్యవసరంబున మంత్రులు గరంబులు మోడ్చి యిట్లని విన్న
వించిరి.

26

సీ.

చంద్రహీనంబైన క్షణదాముఖముఁబోలె
             జారచోరానందకారి యగుచు
ఘనమండలచ్చన్నదినముతెఱంగున
             మానితతేజోవిహీన మగుచు
మాధవరహితమౌ మధువనంబునుబోలె
             సిరిఁ బాసి పాదఱి చెన్ను దొఱఁగి
యధిపతి లేనిసైన్యంబుచందంబున
             నత్యంతదైన్యంబు నావహించి


తే.

దేవ నీలేమిఁ జేసి ధాత్రీతలంబు
చిన్నపోయెను విగతలక్ష్మీవిహార
మగుచు నీపురి పతి లేనియతివఁ బోలి
కడునమంగళమై వింతబెడఁగు నిగిడి.

27


మ.

అవరోధాంబుజపత్రలోచనలు దేవా నీనియోగంబుచే
నవరోధంబునఁ బొంది వాడిన శరీరాంగంబులన్ భూషణా
దివిశేషంబుల నుజ్జగించి సలిలార్ద్రీభూతనేత్రాబ్జలై
దివసం బెన్న మహాయుగంబులుగ నార్తింజెంది రత్యంతమున్.

28


క.

మాపాలి భాగ్యవశమున
భూపాలక, నీవు మగుడఁ బుట్టితి విఁక ధా
త్రీపాలనంబు సేయుము
శ్రీపెంపు దలిర్పఁ శుభము చేకూఱంగన్.

29


వ.

అనునవసరంబున మెఱుంగు మెఱసినచందంబునఁ జూచు
వారలకు నతివిచిత్రంబుగ.

30


సీ.

చివురాకుఁ జేసినఁ జేసెఁగా కజుఁ డందుఁ
             దాఁబేటి నేసూటిఁ దారుకొలిపెఁ

జిఱుదొనల్ చేసినఁ జేసెఁగా కజుఁ డందుఁ
             ననఁటుల నేరీతి నలవరించె
సింగంబుఁ జేసినఁ జేసెఁగా కజుఁ డందుఁ
             గుంభికుంభము లెట్లు కుదురుపఱిచె
శీతాంశుఁ జేసినఁ జేసెఁగా కజుఁ డందుఁ
             దిమిరంబు నెట్టిచందమున నిలిపె


తే.

ననుచు జనులెల్ల నచ్చెరువందఁ బాద
ములును మీఁగాళ్లు జంఘ లూరు లవలగ్న
మును గుచంబులు మోముఁ గొప్పును మెఱయఁగ
నామహాశ్వంబు నీరజాతాక్షి యయ్యె.

31


వ.

ఇత్తెఱంగున నత్తురంగంబు నత్తుల్యమునీశ్వరుశాపార్ణ
వంబుఁ గడచి విచిత్రంబుగాఁ గామినియై దివ్యవిమానా
రూఢయై మేఘమధ్యవిరాజమానశంపాలతకైవడి నొప్ప
నప్పు డాచతుర్ధనుండు విస్మితాత్ముండై యయ్యిందువదన
నీక్షించి యి ట్లనియె.

32


ఉ.

పువ్విలుకాని గారవపుఁబోటివొ శైలవిరోధిభామవో
యెవ్వతె వీవు నీరజదళేక్షణ మున్ను తురంగరూపమై
యివ్వగఁ బొంద నేమి నెప మెచ్చట నుండుదు నామ మెద్ది నీ
కెవ్వఁడు నాథుఁ డివ్విధము లెల్ల యథార్థము గాఁగఁ జెప్పుమా.

33


తే.

అనిన నాపువ్వుఁబోఁడి నెయ్యమునఁ బలికెఁ
జిలుకకైవడి గండుఁగోయిలవిధమున
వీణెలాగునఁ జెవులకు విందు గాఁగ
నెట్టనంబునఁ దేనియ లుట్టిపడఁగ.

34


తే.

ప్రాభవోపేంద్ర నాపేరు రంభ నాని
వాసదేశంబు స్వర్గంబు వాసవుండు

నిచ్చఁ గ్రొత్తగ మన్నింప నెగడుదాన
నప్సరోభామినులలోన నధికురాల.

35


చ.

అఱిముఱి లోకజాలము భయంబునఁ జెంద హరింగుఱించి ని
ష్ఠురతప మాచరించెను వసుంధరఁ దుల్యుఁ డనంగ సన్మునీ
శ్వరుఁడొకఁ డాతపంబు నెఱవాదితనంబున మాన్పు మంచు స్వ
ర్గరమణుఁ డంపె నన్ను నధికంబుగ మన్ననఁ జేసి భూవరా!

36


ఉ.

ఆదివిజాధినాయకునియానతి యౌదలమోచి నేను ని
మ్మేదిని కేఁగుదెంచి మునిమీఁద ననేకవికారలీలలం
జాదుకొనంగఁ జేసినఁ గషాయితమానసుఁడై యతండు హృ
త్ఖేద మెలర్ప నన్నుఁ దమకించి శపించెను వారువంబుగాన్.

37


తే.

అంత నే నమ్మునీంద్రు పాదాంబుజాత
ములకు నెఱిఁగిన నాతండు కలఁక యుడిగి
కరుణ మీఱంగ శాపమోక్షక్రమంబుఁ
జెప్పె నిట్లని నరనాథ, చిత్తగింపు.

38


ఉ.

నీకు సమస్తలోకములు నిండినవేడుకఁ జూపి తెచ్చి ల
క్ష్మీకరమైన యిప్పురముఁ జేర్చిన యాక్షణ మంద నీవు పూ
ర్వాకృతిఁ బొందఁజాలు దని యమ్ముని చెప్పిన నట్ల యేను లో
కైకశరణ్య నిన్ను భువనావలిఁ జూడఁగఁ జేసి తెచ్చితిన్.

39


తే.

అనఘ నీదేహ మంటిన యట్టిపుణ్య
వశముమై నాకు సురలోకవాసమహిమ
దివ్యదేహంబు శాపంబు దీఱుఁగడయుఁ
గలిఁ బ్రత్యుపకృతి నీకు నెలమిఁ జేతు.

40


వ.

అని సకలజనవశీకరణంబును సర్వదేవతాకర్షణంబును నిఖిల
జగన్మోహనంబును నిత్యలక్ష్మీకరంబును మోక్షప్రదంబును

నగునారాయణమంత్రరాజంబు నీకు నిచ్చెదనని యన్నరేం
ద్రునిం గృతస్నానుం గావించి హస్తమస్తకసంయోగంబుఁ
జేసి దక్షిణకర్ణంబునం బ్రణవపూర్వకంబుగా నుపదేశంబుఁ
జేసి మంత్రసిద్ధి యయ్యెడుమని దీవించి యారంభ దననివా
సం బగునాకలోకంబున కరిగె నిచ్చట నచ్చతుర్ధనజననాయ
కుండును దదుక్తప్రకారంబున మంత్రానుష్ఠానంబు జరుపు
చుండె నంత.

41


శా.

ఆరాజేశ్వరుఁ డొక్కనాఁడు నిజహర్మ్యాగ్రంబునన్ మంత్రులుం
దారవ్రాతము గొల్వఁ దాఁ గనిన నానాలోకవృత్తాంతముల్
గారాబంబునఁ జెప్పునత్తఱి వియద్గంగానిశానాథదు
ర్గారాజాచలకాంతులం గెలుచు నంగస్ఫూర్తిఁ జెన్నొందఁగన్.

42


సీ.

భర్గాద్రిశృంగస్థపద్మరాగము లన
             శిరమునఁ గెంజడ లొరపు చూప
శశిలోనఁ దనరు లాంఛనము చందంబునఁ
             గృష్ణాజినము మేనఁ గీలుకొనఁగఁ
గాలకూటాశివక్షఃఫణీంద్రునిఁ బోలి
             ధవళయజ్ఞోపవీతంబు దనరఁ
బ్రాలేయభూధరప్రాంతసంధ్యారాగ
             వైఖరిఁ గటిసీమ వల్క మమర


తే.

నాల్కపై నువ్వుగింజైన నాననట్టి
యారివేరంపుఁదపసి కయ్యంబుగడుపుఁ
గూడుగాఁ జేసి మెలఁగెడు కోడిగీఁడు
ముదురుచదువులబాపనిముద్దుపట్టి.

43

ఉ.

నారదుఁ డేగుదెంచి నరనాథునిముందట నిల్చె వేడుకల్
దేరఁగ గాడ్పుచేత మహతీవరతంత్రులు విష్ణు కృష్ణ నీ
రేరుహనేత్ర భూమిధర శ్రీధర యచ్యుత రుక్మిణీమనో
హార ముకుంద కేశవ జనార్దన యంచుఁ జెలంగి మ్రోయఁగన్.

44


వ.

ఇవ్విధంబున సకలవిద్యావిశారదుండును నిజతనుప్రభా
విజితశారదనారదుండును నగునారదుండు వచ్చిన నాచతు
ర్దనుండు నిజపరిజనసహితంబుగాఁ బ్రత్యుత్థానంబుఁ జేసి
తనకిరీటం బతని పాదాగ్రంబులు మోప సాష్టాంగం బెఱఁగి
యమ్మహామౌని పాదరేఖలు దనమందిరం బలంకరింప నడ
పించి సుఖాసీనుం గావించి యాతిథ్యం బొనరించి కృతాం
జలియై యిట్లనియె.

45


చ.

మునివర, యెల్లకాలమును మ్రొక్కులచే నినుఁ బూజ సేయునా
యనిమిషనాథు నింటికి నొకప్పుడు పండువు రీతి వట్టి నీ
వ వనుఁ గృతార్థుఁ జేసి విభవంబులు నా కొనఁగూర్చుకారణం
బునఁ జనుదెంచి తిచ్చటికిఁ బుణ్యుఁడ నైతిఁగదా జగంబునన్.

46


వ.

అనిన నమ్మహీధవునకుం గలహభోజనుం డిట్లనియె.

47


తే.

భద్రమే నీకు రాజేంద్ర, ప్రజల కెల్లఁ
గుశలమే నీవు పాలించుక్షోణితలము
సత్యసంపదచేతఁ బ్రశస్తమగునె
పరిజనంబులకెల్ల శోభనమె చెపుమ.

48


పరికించి పనులవారలఁ
దరబడి పదములను నిల్పు దానికి రాజ్య
స్ఫురణ దగ మేన సకలా
భరణంబులరీతి వీడుపడకుండ నృపా.

49

వ.

అని యడిగిన నాచతుర్ధనుండు మునీంద్రా, నానేర్పుచందం
బునఁ బుడమిఁ బరిపాలింపుచునున్నవాఁడ, నన్నుఁ గరుణా
కటాక్షంబునం జూచి ధరణీపాలనవిధానం బానతీయ
వలయు నని యడిగిన నమ్మునీంద్రుం డతని కిట్లనియె.

50


క.

పరులకును జింత సేయం
బరికింప నశక్యముగను బ్రజలం గనిపె
ట్టి రమణ మీఱఁగ ధరణిన్
నరనాథుం డేలవలయు నాతుకఁబోలెన్.

51


క.

అరిఁ గోరుఁ గొనెడు తఱి భూ
వరుఁడు ప్రజలమనసు నలఁపవలవదు దలఁపన్
ధరణి గుసుమములఁ గలిగిన
పరిమళములు గొనెడు తేఁటిబాగున నధిపా.

52


క.

హితవరియై వెరవరియై
మతిమంతుఁ డనంగఁ దనరి మంత్రవిధాన
ప్రతిభాన్వితుఁ డగు నిత్యో
చితవితరణశాలి మంత్రిఁ జేయఁగవలయున్.

53


క.

ధరణి శరీరము జీవుఁడు
నరపతి జను లంగములును నయనయుగము మం
త్రిరమణుఁడు గావున సచి
వరహితుఁ డరయంగఁ జీకువడువున మెలఁగున్.

54


క.

శూరుల విశ్వాసము గల
వారల ధీరులను హితుల వదలక దయ చే
కూఱఁగ నేలఁగవలయును
భూరమణుల కెల్ల నిక్కముగ మనుజేంద్రా!

55

చ.

అనవుడు నమ్మహీపతి సురాధిపమౌనివరేణ్యుతోడ ని
ట్లనియె భవత్ప్రసాదమున నత్యధికం బగునీతి రీతియె
ల్లను వినఁగల్గె నింక సఫలత్వము నొందె మదీయవర్తనం
బనఘవరేణ్య, నాకు భవదాగమనం బెఱిఁగింపఁగాఁదగున్.

56


వ.

అనుడు నమ్మునీంద్రుం డమ్మనుజేంద్రున కిట్లనియె.

57


క.

నినుఁజూడ దుఃఖ మయ్యెడు
ననఘా నీయట్టివాని కాయాపద వ
చ్చిన కారణ మిది యని చె
ప్పిన నీనెమ్మనము మిగుల బెగ్గిలునేమో.

58


తే.

అయిన నీ కొకయతిరహస్యంపుఁబలుకుఁ
దెలియఁజెప్పంగఁ బూని యేతెంచినాఁడ
నిచటికాంతల సచివులనెల్ల ననుపు
మంత్రభిన్నంబు గాకుండ మానవేంద్ర.

59


వ.

అనిన నమ్మునీంద్రునివాక్యంబున వారల నంపిన నమ్మహీ
పతికి నాతం డిట్లనియె.

60


క.

అనఘా మాయాతురగం
బు నెక్కి నీ వుపరిలోకముల కేగి రయం
బున నీకుండినపురమున
కనిమిషమార్గమున రాఁగ యమునానదిలోన్.

61


ఆ.

నీహయోత్తమంబు నెమ్మొగంబునఁ బుట్టి
ఫేనఖండ మనిలవేగవశము
నం దదంబుతర్పణము సేయుకృష్ణుని
హస్తయుగళజలములందుఁ బడియె.

62

మ.

అది వీక్షించి బలానుజుండు పటుకోపాయత్తుఁడై యుగ్రతం
బెద వల్లాడఁగఁ గన్నుదోయి యరుణస్ఫీతాకృతిన్ మీఱ ను
న్మదుఁడై యెవ్వనిఘోటకాననజఫేనం బీగతిన్ వచ్చె వా
ని దివౌకస్పతి గాచినం దునుముదు న్వేమాసమాత్రంబునన్.

63


ఆ.

అని ప్రతిజ్ఞఁ జేసి యనుపమసంతోష
భరితుఁ డగుచు నాత్మపురికి నేఁగి
యున్నవాఁడు భుజము లున్నతాకృతిఁ బొంద
ననఘ దేహరక్ష యరసికొనుము.

64


వ.

ఇవ్విధంబున నాకైలాటకంబుదపసి వేఁడినారసంబులు గర్ణం
బులఁ జొనిపినచందంబున నమ్ముకుందప్రతిజ్ఞాప్రకా
రంబు వినిపించి యథేచ్ఛం జనియె నిటఁ జతుర్ధనుండును
భయాక్రాంతుండై తనలో నిట్లని చింతించె.

65


ఉ.

ఏటికి వేఁటఁ బోయి తఁట నేటికి మాయపుఁదేజిఁ గంటి? నే
నేటికి దానిఁ బట్టికొన నేటికి నెక్కితి నిత్తెఱంగు నా
కేటికి వచ్చె నివ్విధికి నెవ్వనిపాదము పట్టికొందు నీ
వేఁటయు నన్నుఁ బాండుపృథివీపతిభంగిఁ గలంచె దైవమా.

66


సీ.

అని వెచ్చనూర్చి ధైర్యంబూఁత గాఁగ న
             మ్మనుజాధినాథుఁ డిట్లని తలంచె
నత్యంతచంచలం బైనప్రాణముతీపిఁ
             గులశీలధర్మముల్ గుందుపఱిచి
సరియైన మేదినీశ్వరులు నవ్వఁగ బాంధ
             వులు సిగ్గుపెంపునఁ దలలు వంప
గులహీను గుణశూన్యు గోపాలు మాయి కృ
             తప్రతిజ్ఞుని నెవ్విధమున శరణు

తే.

చొత్తు నామంత్రరాజవిస్ఫురణచేత
దేవతాకర్షణముఁ జేసి తెగువ మెఱసి
సంగరస్థలి నెదిరించి శౌర్య మెసఁగఁ
జత్తుఁ జంపుదు లోకముల్ సన్నుతింప.

67


వ.

అని నిశ్చయించి శుచియై త్రైలోక్యనాయకుండైన జంభా
రాతిం గుణించి రంభాదత్తమంత్రానుష్ఠానంబు విధ్యుక్త
ప్రకారంబున నాచరించి యాకర్షించిన.

68


సీ.

శిరమున దోఁపిన సురమహీరుహపుష్ప
             ములతావి దిక్కులఁ గలయఁ బొలయ
ననవిలుకానిబాణములఘాతము లనఁ
             దనవేయికన్నులు దళుకుఁ జూప
వైరిగోత్రములఁ గ్రొవ్వారఁజేసిన వజ్ర
             కాంతులు రోదసి గప్పుకొనఁగ
దివ్యమాణిక్యసందీపితభూషణం
             బులు మేనిచెలువంబు నెలమి గొలుప


తే.

గరుడగంధర్వదేవకింపురుషవరులు
గొలువ నైరావతము నెక్కి కుంభినీంద్రుఁ
డతులమంత్రంబు జపియించు నాక్షణంబ
యమరగణనాయకుండు ప్రత్యక్ష మయ్యె.

69


వ.

ఇవ్విధంబున నాదేవతాసార్వభౌముఁడు ప్రత్యక్షంబై నిలి
చిన నతండు సంతోషభరితాంతఃకరణుండై సాష్టాంగదండ
ప్రణామం బాచరించిన నతం డిట్లను రాజేంద్రా నీవు నా
వలనం గోరు నభీష్టం బెయ్యడి చెప్పుమనిన.

70


క.

ఆరాజు ముకుళితకరాం
భోరుహుఁడై నేత్రయుగ్మమున హర్షాశ్రుల్

జారఁగ నెంతయు నతనికిఁ
గారుణ్యము పొడమునట్లుగా నిట్లనియెన్.

71


ఉ.

నన్ను నకారణంబ యల నందకుమారకుఁ డుగ్రవృత్తి మీ
ఱ న్నిఖిలం బెఱుంగ సమరంబునఁ జంపఁగఁ బూనినందుకే
నిన్ను గుఱించి యీజపము నిష్ఠ నొనర్చితిఁ జిత్తగింపు వే
గన్నులవేల్ప, సత్కరుణఁ గాచి భయంబుఁ [5]దలంగఁజేయవే.

72


వ.

అనవుడు దేవతావల్లభుం డాకుండినవల్లభున కిట్లనియె.

73


మ.

వనజాతోద్భవదత్తచండవరగర్వస్ఫూర్తి లోకమ్ము లె
ల్లను జీకాకుపడంగఁజేసి భయదోల్లాసంబున న్మీఱు దై
త్యనికాయంబుల మాటమాత్రమునఁ జక్రాగ్రంబునం ద్రుంచు కృ
ష్ణుని నోర్వంగలవాఁడవే కలన నేనుం గూడినన్ భూవరా!

74


మ.

తనకాంతామణి సత్యభామకు వినోదక్రీడకై దేవలో
కనివాసం బగుపారిజాతము సురౌఘం బెల్లఁ గాపున్నచోఁ
గొని కృష్ణుం డరుగంగ నేఁ దొడరి తద్ఘోరాజి బెండొంది వీఁ
గినవాఁడ న్వినుమా నరేంద్ర, నిను రక్షింపంగ శక్తుండనే.

75


వ.

అనిన నాచతుర్ధనుండు దేవా, దేవకీతనయుం డగుకృష్ణుండు
సురలోకంబునకు నేతెంచి పారిజాతం బేవిధంబునఁ దెచ్చె?
నయ్యవసరంబున నీకు నతనికి నేకైవడిఁ గయ్యం బయ్యె
నానతీయవలయుననిన నతని కమరేంద్రుం డిట్లనియె.

76


ఉ.

ద్వారకలోనఁ గృష్ణుఁడు ముదంబున రాజ్యము సేయుచు న్మనో
హారిణియైన రుక్మిణిగృహంబున నొక్కదినంబునందు శృం
గారరసంపుఁగుప్ప లనఁగాఁ దగు చంద్రముఖీసహస్రముల్

గోరిక గొల్వఁ దారకలలోని శశాంకునిఁ బోలియుండఁగన్.

77


వ.

అయ్యవసరంబున బదరికాశ్రమవాసు లగుభరద్వాజకణ్వ
కశ్యపవసిష్ఠవామదేవాదిమునీంద్రులు చనుదెంచి మొగ
సాల గడచి నిలిచి దౌవారికులచేతఁ దమరాక యవ్విభున
కెఱింగించి తదనుజ్ఞాపూర్వకంబుగా నాస్థానంబుఁ బ్రవే
శించి యమ్ముకుందునిచేత నుచితసత్కారంబులఁ బడసి సుఖా
సీనులై యుండ నద్దేవదేవుం డాగమనప్రయోజనం బడిగిన
నమ్మును లిట్లనిరి దేవా, నరకాసురుం డను దానవేంద్రుండు
ధరణీమండలంబునఁ గల రాజకన్యకలం గొని చని కారా
గారంబున నిడి తక్కినభువనంబులం గలంచుచున్నవాఁడు
గావున నతనిం బరిమార్చి సమస్తజనుల రక్షింపుము.

78


తే.

అనిని దానవకోటి నుక్కడంచి సాధు
జనులఁ గరుణ దలిర్ప రక్షణ మొనర్చు
నీవ యక్కుజను నరకు నేలఁగూల్చి
భువనములనెల్ల దయతోడఁ బ్రోవవలదె.

79


వ.

అని విన్నవించిన యమ్మునిముఖ్యులపలుకు లంగీకరించి యని
పిన వారు నిజనివాసంబుల కరిగి రంత నరకాసురవధార్థంబు
ప్రయాణోన్ముఖుండై సత్యభామకు నెఱింగించి యయ్యం
గనాసమేతుండై గరుడారోహణంబు గావించి ప్రాగ్జ్యో
తిషపురంబు దఱియం జని.

80


ఉ.

ఆపురరక్షకాసురుల నందఱఁ జక్రమునన్ హరించి యా
టోపముతో మురాసురుఁ గఠోరకరాసి నడించి చాపవి
ద్యాపరుఁడై మదాంధునరకాసురుతోడ రణాంగణంబులో
నేపు దలిర్పఁ బోరి యొకయించుక కృష్ణుఁడు డస్సియున్నచోన్.

81

తే.

సత్యభామ విరోధి యాశ్చర్య మందఁ
బోర నంతటఁ దెలిసి యప్పుండరీక
నయనుఁ డుద్దండచక్రంబున సురవైరి
శిరము ఖండించె దివిజులు చెంగలింప.

82


క.

తదనంతరంబ తత్సం
పదతోడుత నతనియాఁక మగువగముల నిం
పొదవఁ గొని కుండలంబుల
నదితికి నీయంగఁ జనియె నమరావతికిన్.

83


తే.

వచ్చి సతితోడ నదితికి వందనంబుఁ
జేసి కుండలయుగళ మిచ్చిన యనంత
రంబు నే నిల్ప నాకపురంబులోన
మూఁడుదినములు నిల్చె నమ్మురహరుండు.

84


తే.

అంత నొకనాఁడు పౌలోమి యరిగి సత్య
భామఁ దో డ్తెచ్చి భూషణాంబరము లొసఁగి
మచ్చికలతోడఁ దేనియ పిచ్చిలంగ
నుచితసంభాషణము లాడుచున్నవేళ.

85


క.

బృందారకుఁ డొక్కఁడు దా
నందనవనపారిజాతనవ్యకుసుమరా
జిం దెచ్చి మద్వధూటికి
నందిచ్చిన సత్యభామ కందొకటయినన్.

86


తే.

ఇడక యా లేమప్రేమ నుపేక్ష సేయఁ
దానె కబరీభరంబునఁ దాల్చె దివ్య
గంధలుబ్ధభ్రమద్భృంగగణవిచిత్ర
ఝుంకృతులు దిక్కులను బ్రతిస్వనము లీన.

87

వ.

ఇట్లు ధరించి.

88


ఆ.

మనుజకామినులకు విను దేవతాయోగ్య
వస్తువితతి యొసఁగ వలను గాదు
సత్యభామ, పారిజాతపుష్పంబులు
నీకు నీయరాదు నిక్కువంబు.

89


వ.

అని పులోమజ శ్రీకృష్ణుప్రభావం బెఱుంగనిదై నోనాడిన
నాహరిప్రియ యచట నిల్వక తనవిడిదికి నరిగి.

90


ఉ.

ఈసును గోపము న్మది వహించి పులోమజవేఁడిమాటకై
గాసిలి మేనసొ మ్ముడిపి కన్నులఁ గ్రమ్మెడునీటఁ జందనం
బోసరిలంగఁ జేసి శిర మొయ్యన వంచి కపోలపాళిపైఁ
జే సమకొల్పి యొక్కయెడఁ జింతిలుచుండెడునంతలోపలన్.

91


మ.

హరి యబ్భామినిఁ జేరవచ్చి యను నీ వానందశూన్యాత్మ వై
పరితాపంబునఁ బొంద నేమినెప మాపౌలోమి [6]కల్పించెఁ? బె
ద్దఱికం బేమియుఁ జేయదో యచటికాంతల్ నిన్ను నెగ్గాడిరో
హరిఁగన్నమ్మయు గారవింపదొకొ నెయ్యం బొప్పఁగా మానినీ!

92


చ.

నరకునితోడఁ బోరునెడ నా కొకయించుక కేలు డస్సినన్
సుర లరుదంది నీవిధముఁ జూడ శరావలిచేత వైరితో
దుర మొనరించు సాహసము [7]దూఁకొని పైకొని కన్యకావళిం
బరిణయమౌటకై పురికిఁ బంపినయందుకుఁ గోపగించితో.

93


ఉ.

ఏమిటి కింతవంత తరళేక్షణ! చెప్పుమటన్న లేచి య
బ్భామిని చన్నుదోయిపయిఁ బయ్యెదకొంగు దలంగి జాఱ నె
మ్మో మరవాల్చి యూరుపుల ముంగరముత్యము గంద నేడిచెన్

గోమలనూతనస్వరముఁ గ్రోలుచు కోయిలపిల్లయో యనన్.

94


తే.

ఏడ్చి యాసత్య హరితోడ నింద్రుదేవి
పారిజాతమహీజపుష్పముల నీయ
దయ్యె మానవకాంత వీ వనుచు నన్ను
నేవగింపుచుఁ దానే వహించె ననిన.

95


ఉ.

ఆరమణీశిరోమణిఁ బ్రియంబునఁ గౌఁగిటఁ జేర్చి కంటినీ
రారిచి చిక్కువడ్డకురు లల్లన కొప్పున దోపి యక్కునం
బేరులు చక్కదిద్ది వలిపెంబు చనుంగవఁ గేలఁ గొల్ఫి యం
భోరుహపత్రలోచనుఁడు మోము గరంబున నెత్తి యిట్లనున్.

96


క.

మానవసతివని ని న్నవ
మానము గావించి శచి సుమము లీదయ్యెం
గా నీకుఁ? బారిజాతం
బే నీయుద్యానవీథిఁ బెట్టెద ననుచున్.

97


చ.

హరి పెకలించి తెచ్చి విహగాధిపుపై నిడియె న్ముదంబునన్
స్మరహరమౌళిచంద్రసహజాతము బంధురగంధలుబ్ధష
ట్చరణపరీతమున్ సతతసత్ఫలపోషితదేవజాతమున్
దరుణఫలాశపుష్పసముదాయసమేతముఁ బారిజాతమున్.

98


వ.

ఇట్లు పారిజాతం బవహరించి సత్యభామాసమేతుండై గరుడ
గరు దుద్భూతవాతపరాభూతమేఘవ్రాతుండై చనునెడ.

99


శా.

నావారందఱుఁ గూడి యొక్కమొగమై నానాస్త్రసంతానముల్
వైవన్ వారల లెక్కఁబెట్టక ప్రభావస్ఫూర్తి శోభిల్లఁగా
వేవేగంబున శంఖ మొత్తిన భయావిద్దాత్ములై పాఱిరే

నావజ్రప్రతిమానబాణతతి నేయన్ వ్యర్థమయ్యెం దుదిన్.

100


క.

ఏ నలిగి మఱియు నేసితి
నానగధరుమీఁద బంధురావనిధరసం
తానపతత్రసమూహత
మోనిర్హరణోగ్రహేళి మును దంభోళిన్.

101


వ.

అదియును విఫలంబైన నేనును నిజావాసంబునకుం జనితిం
గావున నమ్మహాత్మువలన నిన్ను రక్షింప శక్తుండఁ గానని
యంతర్ధానంబు నొందిన నాచతుర్ధనుండు.

102


సీ.

కడువేఁడినిట్టూర్పు లడరించి కొండొక
             చింతించి చిత్తంబు చిక్కఁబట్టి
తనమంత్రమున బృహద్భానుభానుతనూజ
             రాక్షసాంబుపవాయుయక్షఫాల
నయనుల నాకర్షణం బొనరించి కృ
             ష్ణప్రతిజ్ఞావిధానంబుఁ జెప్పి
తనుఁ గావుఁడంచు మోమున దైన్య మడరంగ
             మ్రొక్క నీక్షించి వారును ముకుంద


తే.

మహిమ మెఱిఁగినవారలై మానవేంద్రుఁ
గావలేమని చనిన నాక్షణమ పార్వ
తీమనోనాథు శివు మిహికామయూఖ
ఖండధరు శూలపాణి శంకరుఁ దలంప.

103


సీ.

కటి నమర్చినచేలఁ గన్గొన నీక్షించి
             నెమ్మి భీతిలి వాహనమ్ము బెదర
వేయుమొగంబుల వింతఁజూపెడు తల
             చుట్టుపై నెలవంక చుంగుగదల

నురము నిండినపాపసరముపైఁ దలకొన్న
             తోరంపుఁబునుకలపేరు లొరయ
మలఁచిపెట్టిన రత్నములఁ బొల్చు మేలి వీ
             నుల మించు కుండలంబులు చలింప


తే.

నపుడు పొడచూప మ్రొక్కి పాదాంబుజములు
ఫాలమునఁ గీలుకొల్పి భూపాలకుండు
నన్నుఁ గృష్ణుండు చంపెదనన్నవాఁడు
గావుమన్న నాతనికి శంకరుఁడు పలికె.

104


క.

క్షోణీశ్వర, విను మే నీ
ప్రాణంబులు గాపనోప హరివలనం; ద
ద్బాణసమిద్దవిలాసము
ఋణసమిద్ధరణిఁ గానఁబడినకతమునన్.

105


వ.

అనిన దేవా యవ్వసుదేవనందనునకును మీకును గయ్యం
బైనతెఱం గెఱింగింపవే యనిన నారాజశేఖరునకు నా
రాజశేఖరుం డిట్లని యానతిచ్చె.

106


తే.

బాణుఁ డనుబలిసుతుఁడు మద్భక్తవరుఁడు
దనకరంబులు సాహస్రతను జెలంగ
నసమవిక్రమశాలియై యతిశయిల్లి
శోణనగరంబు నేలు నక్షీణమహిమ.

107


వ.

ఆ రక్కసులఱేఁ డొక్కకన్యం గని యుష యనుపే రిడి
ప్రియంబునం బెనుప బాలచంద్రరేఖయుం బోలి దినదిన
ప్రవర్ధమానయై తల్లిదండ్రులకు నుల్లంబున నుల్లాసంబు
వెల్లిగొలుపుచుండె నంత.

108

శా.

ఆరామామణి యొక్కనాఁడు దనహర్మ్యాగ్రంబునన్ హేమడో
లారమ్యస్థలిఁ బువ్వుఁబానుపున బాల ల్పాదపద్మంబు లొ
య్యారం బొప్పఁగ నొత్త మే నలఁతవాయ న్నిద్దురం జెందె నా
నారాగంబులఁ గామినీజనము విన్నాణంబుగాఁ బాడఁగన్.

109


తే.

ఎన్నఁడును జూచి వినియును నెఱుఁగనట్టి
సూనసాయకుముద్దులసూనుఁడైన
ఘనునిఁ బెంపునఁ గలలోనఁ గాంచి సిగ్గు
లీల రతిసౌఖ్యమునఁ దేలి మేలు కాంచి.

110


చ.

కల యని యంటినేని మది గాసిలునే నిజమేని నాథుతోఁ
గలయిక లేక యుందునె జగన్నుతవీరుఁడు మారుఁ డీగతిన్
గలఁచఁ దలంచి మాయ యొడికంబుగఁ జేసెనొ కాక యీగతిన్
గలయును నిక్కముం గలసి కానఁగవచ్చునె ముజ్జగంబులన్.

111


చ.

కనుఁగవ నీరు నించుఁ గరకంజము లల్లన మోడ్చి మ్రొక్కు ము
ద్దునకును మోవి సాచుఁ జనుదోయి బయల్పడఁ గౌఁగిలించుఁ జ
క్కనఁ గరుణింపవే యను నొకానొకయప్పుడు నవ్వు నీవి స
య్యన విడఁబాఱ మేనుగరుపాఱఁగ సీత్కృతి సేయు నెంతయున్.

112


ఉ.

ఏమిటి కింతయల్క? నిను నేమని దూఱితిఁ బ్రాణనాథ నీ
సామెయిదాన నైతి మనసందున నొండొకయడ్డపా టదే
లా మొగ మిచ్చి చూచి మనసందలి నెవ్వ యడంచి నన్ను నీ
కామునిబారి కప్పనముగా నొనరింపక బ్రాణ మెత్తవే!

113

చ.

[8]అలయికఁ జెంది కన్నుఁగవ యల్లన మోడ్చిన నన్నుఁ జూచి నీ
వలరఁగ బుజ్జగింపఁగఁ బ్రియంబులఁ జెప్పక నవ్వెదేల యో
దలఁచితికా చెలంగ జనితంబగు వెన్నెలచేత నా కనుం
గలువలమోడ్పు మాన్పు; మనకా పగ? కైరవబాంధవాననా!

114


చ.

[9]తనువును జింతఁ గొల్పెడిని దర్పకుఁడుం దయ మాలి నొంచఁగో
రెను [10]నిలుపోప కేమి యొనరింతును మిమ్మును నేను గూడఁగాఁ
గొనకొని కప్పురంబు నొకగ్రుక్కెడు గొందునొ? వేఁడివెన్నెల
న్మునుఁగుదునో? ప్రసూనముల ముంచినపాన్సునఁ బవ్వళింతునో?

115


చ.

అను బయలాలకించు హృదయంబునఁ బాయని నాథుఁ జూడఁగాఁ
గనుఁగవ మూయ మ్రోలఁ బొడగానఁక వచ్చినయట్టులైనఁ గ్ర
క్కునఁ జని పట్టఁజూచుఁ బొడగానక కన్నుల నీరు నించు లో
ననిచినయట్టికూరిమి ఘనంబగుమారునిబారి కగ్గమై.

116


ఉ.

హారము భారమై మణిగణాకరబంధురసౌధరంగసం
చారము దూరమై తనువు సంగతి నొప్పెడు చందనాదిశృం
గారము క్రూరమై చెలియకైవడి నెమ్మి యొనర్చునట్టి రా
కీరము వైరమై నిగిడెఁ గేసరిమధ్యకు నొక్కపెట్టునన్.

117


వ.

ఇవ్విధంబున నవ్విలాసిని [11]యవ్వలరాచవారిపువ్వులవింటి
నారి కగ్గమై.

118

చ.

శిర మొకయింత వంచి వెతఁ జెంది కపోలమునందు హస్తపం
కరుహముఁ జేర్చి యూరువులు కాఁకలచేతఁ గరంగునట్టిముం
గరఁ గనుదోయి నీట నొడికంబుగ నార్చుచుఁ గొప్పు జాఱఁగాఁ
జరణసరోరుహంబున రసాస్థలి వ్రాయుచు నూరకుండినన్.

119


వ.

అయ్యవసరంబున నలికజతశీతమయూఖరేఖ యగుచిత్ర
రేఖ యనుతత్ప్రియసఖి పంచబాణదోదూయమానమానస
యగునమ్మానినిఁ జేరం జని యిట్లనియె.

120


తే.

నీమనంబునఁ దగిలిన నెవ్వయెల్లఁ
బలుకు నాతోడ నాతోడు పద్మనేత్ర!
దాఁచనేటికి నెనరుగాదా, భవన్మ
నంబు సంతస పెట్టెద నమ్ము మబల!

121


తే.

మఱియు నొక్కవిధంబు రామా! యెఱుంగఁ
జెప్పెద విరహవేదనఁ జెందువారిఁ
గావఁజుండో యటంచు నాకాయజుండు
దిరుగుచున్నాఁడు వలపులదిమ్మెకాఁడు.

122


వ.

అని చెప్పిన నప్పయోజముఖి యక్కప్పురగంధి కిట్లనియె.

123


క.

సుకుమారతనుఁడు నభినవ
మకరాంకుఁడు చంద్రసముఁడు మానవతీరం
జకుఁడగు నొక్కఁడు ననుఁ గలఁ
జికురంబుల దిద్ది కళలచేఁ గరఁగించెన్.

124


క.

ఆరాకొమరుని నన్నుం
గూరిచినన్ బ్రతుకుదానఁ గువలయనేత్రా!

నారీతియెల్లఁ జెప్పితిఁ
బోరామి దలంచి నీకు బొంకక యనినన్.

125


వ.

ఆచిత్రరేఖ యిట్లనియె.

126


ఆ.

గణన కెక్కిన మూఁడులోకములవారిఁ
జిత్రపటమున వ్రాసి రాజీవపత్ర
నేత్ర, నీమ్రోల నిడుదు నానేర్పు మెఱయ
నందు నీపతిఁ జూపు నే నతనిఁ దెత్తు.

127


వ.

అని తదనుమతి నొక్కయేకొంతస్థలమున కరిగి యాకాంతా
మణి ముల్లోకంబులయందుం బేరుగల రాకుమారుల వ్రాసి
తెచ్చి యమ్ముద్దియముందటం బెట్టి.

128


తే.

స్వర్గలోకంబు దేవతావరులఁ జూపి
యురగలోకంబు పన్నగేశ్వరులఁ జూపి
మధ్యలోకంబు భూపాలమండలంబుఁ
జూపుచోఁ గృష్ణపౌత్త్రునిఁ జూపె నంత.

129


తే.

సిగ్గుతోఁ గూడఁ బులకలు చెంగలించె
నవ్వుతోఁ గూడఁ జెమట యాననము నిండె
సంతసముతోడ గద్గదస్వరము నిగిడెఁ
గామినీమణి యాతనిఁ గాంచినపుడు.

130


క.

ఆసన్న యెఱిఁగి బాణసు
తాసఖి యాకృష్ణపౌత్త్రుఁ దననేర్పున సం
తోసంబు దనర మృదువా
చాసంపద నిట్టులనియె జగతీనాథా!

131


క.

వనితా, యీతఁడు కృష్ణుని
మనుమఁడు ప్రద్యుమ్నునికిఁ గుమారుఁడు నామం

బున ననిరుద్ధుఁడు సంగర
మున ననిరుద్ధుండు రూపమున గురు మీఱన్.

132


వ.

అని చెప్పిన.

133


తే.

కలకలను నవ్వి యాకలకంఠి కలర
వమునఁ దనప్రాణసఖి గారవమునఁ బలికెఁ
బలుకుపలుకునఁ గపుకంపుఁబలుకు లొలుకఁ
దేనియలు చిల్క మానంబులోనఁ దొలఁగ.

134


తే.

అంబుజానన యెంతగయ్యాళివాఁడె
రేయి నన్నింత చేసి కూరిమి ఘటించి
పెక్కుభంగుల నాతోడఁ బెనఁగి యిప్పు
డూరకున్నాఁడు ముగ్ధుఁడొకో యనంగ.

135


వ.

కావునఁ జెలియా నామీఁది మక్కువంబు నీమనంబునం
గలిగెనేని నన్ను మారునిబారికి నొప్పనంబు చేయక యప్పం
చబాణునికుమారునిం గూర్చి కూర్చినతనంబున మీఱుమని
చెప్పిన నప్పొలంతుక యనుమతి నప్పుడ యప్పడంతుక
మనోవేగంబునం ద్వారకానగరంబున కరిగి నిజరమ్య
హర్మ్యమధ్యకాంచనప్రేంఖోళికాకుసుమశయ్యాతలంబునఁ
బ్రియారతిశ్రమసుఖనిద్రాముకుళితనయనుం డగుననిరుద్ధుం
దనమాయాబలంబు పెంపున మేలుకొనకయుండఁ దెచ్చి
నెచ్చెలియగు నయ్యుషాతల్పంబునఁ బెట్టిన.

136


ఆ.

ఆసరసిజనేత్ర యధికసంభ్రమమునఁ
జిత్రరేఖఁ దనవిచిత్రవాక్య
ఫణితి వినుతి చేసి ప్రాణవల్లభు నని
రుద్ధుఁ జూచెఁ జంద్రరుచిరముఖుని.

137

వ.

అయ్యవసరంబున ననిరుద్ధుండు మేలు కాంచి వింతలై తోఁచు
కాంతాజనహర్మ్యశయ్యాతలంబులఁ జూచి కలయో
యథార్ధంబో యని చింతించి ముందటనున్న చిత్రరేఖం
గనుంగొని.

138


క.

తరుణీ, నీ వెవ్వతె వి
ప్పురి యేరిది? నన్నుఁ దెచ్చుపూనికి యేమి
త్తఱి నన నాతనికి సవి
స్తరతఁ దెలిపి యేలుమని యుషాసతిఁ జూపెన్.

139


చ.

కురులు మొగంబునన్ జెదరఁ గ్రొమ్ముడి యించుక వీడఁ జెక్కులన్
జిఱునగవుల్ దొలంక మృదుచేలము జాఱఁగఁ గన్నుదోయి క్రొ
మ్మెఱుఁగులు చింద నెచ్చెలియమేను గరంబున నూఁది నిక్కి త
త్తఱమును వేడ్కయుం [12]నఁగఁ ద న్గను కామినిఁ జూచె నత్తఱిన్.

140


క.

తరుణీతరుణులు దా రొం
డొరుల మొఱఁగి చూచుచూపు లొనరె న్మరుఁ డి
ద్దఱపై నిగిడించు మనో
హరకువలయమల్లికామహాశుగము లనన్.

141


ఆ.

చిత్రరేఖ యర్దశీతాంశురేఖాల
లాటక న్నెఱింగి బోటిపిండుఁ
దోడుకొనుచు నేగె మేడ వెల్వడి వారి
తలఁపుతోడఁ దలుపు దారుకొలిపి.

142


వ.

అంత.

143

క.

అందందఁ బొడము తమకము
ముందటికిం దిగువ సిగ్గు మునుకొని నిలుపం
డెంద మురియాడ నిలిచిన
మందగమనఁ జూచి హరికుమారసుతుండున్.

144


చ.

తలఁపునఁ దత్తఱం బొదవఁ దత్కరపద్మము కేల నంటినన్
డులిచె వధూటికంకణమనోజ్ఞనినాదము మీఱ వెండియున్
వలవులఱేనిపట్టి మగువా తగవా యన నూరకుండె నా
నలినదళాయతాక్షి చిఱునవ్వులు ఱెప్పల నప్పళింపుచున్.

145


తే.

అంగుళీయకసౌభాగ్య మరసిచూచు
వానికైవడిఁ గరపల్లవంబు కేల
నంటి యల్లన నాకుసుమాస్త్రతనయుఁ
డావధూమణిఁ జేర్చె శయ్యాతలంబు.

146


వ.

తదనంతరంబ.

147


సీ.

క్రొవ్విరుల్ బాగుగాఁ గొప్పునఁ జెరివెడు
             నెపమునఁ దలపైని నెరులు ముడిచి
కస్తూరిపత్రభంగములు దీరుచులీలఁ
             గరుపాఱ గండయుగ్మంబు పుణికి
వేరులు చక్కఁగాఁ బెట్టెడుమిషమునఁ
             జిన్నీిగుబ్బలు గోరఁ జివుకఁ జేసి
చేరంగఁ దిగిచి మచ్చికమాటలాడువై
             ఖరి గళరవము చొక్కముగఁ జిల్కి


తే.

కప్పురముపల్కుఁ గొఱికించు కపటమునను
దక్క కందంద యధరామృతంబు [13]బీల్చి

పారవశ్యంబు నొందించి వారిజాక్షి
లీల రతిసౌఖ్యజలధిలో నోలలార్చె.

148


వ.

ఇత్తెఱంగున నత్యంతసంతోషంబున నుద్యానవనవిహారంబు
లను జలక్రీడావినోదంబులం గపటద్యూతంబులఁ బ్రొద్దు
గడుపుచునుండె నంతట.

149


చ.

అలసతతోడఁ గౌను ఘనమయ్యెఁ దనూరుహరాజితోడఁ జ
న్నులు నలుపెక్కెఁ జొక్కపుఁ గనుఁగవతోడుత నంతకంతఁ జె
క్కులు తెలుపొందె నిక్కమగుకోరిక లీరిక లెత్తె మట్టితోఁ
బులుసుపయిం బ్రియం బొదవె బోటికి గర్భము నిల్చె నంతటన్.

150


వ.

ఇవ్విధంబున నయ్యుషాకన్యక గర్భంబు దాల్చుట యెఱింగి
యమ్ముద్ధియముదుసళ్లు విచారించి యాశ్చర్యంబు నొంది
వందురి తద్దయు భయంబునం జెంది రయంబున బాణుని
యొద్దకు నేతెంచి యేకాంతంబున నిట్లనిరి.

151


క.

భానునికరములకున్ హిమ
భానునికరములకు మందపవనునకుఁ జొరన్
రానిభవద్దృహమున ర
క్షోనాయక యుషకు నిపుడు చూ లేర్పడియెన్.

152


తే.

అని యెఱింగించి రంత నత్యంతరోష
కలుషితమనస్కుఁడై యాత్మకరసహస్ర
శస్త్రములు మంట లుమియఁ దత్క్షణమ బాణుఁ
డాయుషభర్మ్యహర్మ్యంబు డాయ నరిగి.

153


చ.

అలసతతోడ నెన్నొసల నంటిన లత్తుకబొట్టుతోడఁ జె
క్కులఁ గనుపట్టు క్రొన్నెలల గుంపులతోఁ బొలయల్కకాఁకలం

దులదుల రాలుచందనముతోడ నొయారపురీతి నిడ్డ కుం
తలములతోడ నింపెసఁగు దర్పకనందనుఁ జూచె నత్తఱిన్.

154


మ.

కని భీమంబుగ బెట్టదల్చి చటులోగ్రస్ఫూర్తితో నార్చి య
ద్దనుజేంద్రుం డరుదేరఁ జూచి కుసుమాస్త్రప్రోద్భవుండు న్వడిన్
ఘసబాణాసనపాణియై యెదిరి రక్షస్సార్వభౌమున్ మహా
శనికల్పాశుగకోటి నేసి పటురోషం బెచ్చఁగా నార్చినన్.

155


వ.

అయ్యవసరంబున నారాక్షసేశ్వరుండు నక్కుసుమసాయక
సంభవుం డగుననిరుద్ధుం డేసినయాశుగంబులు నడుమన
ఖండంబులై పుడమిం బడునట్లుగా నొనరించె నంత నొం
డొరులు దమయిచ్చల విచ్చలవిడిఁ బెచ్చు పెరుఁగుమచ్చ
రంబునం బోరుచుండి రందు.

156


ఉ.

ఆదనుజాధినాథుఁడు భయంకరవైఖరిఁ జేరిపోరి బా
ణాదిసమస్తసాధనవిహారము సల్పుచు బాలికామనః
ఖేదము దైత్యమోదమును గీడ్పడఁ బన్నగపాశరాజిచే
రోదసి వ్రీల నార్చి యనిరుద్ధుని బద్ధునిఁ జేసె నుద్ధతిన్.

157


వ.

తదనంతరంబ.

158


క.

ఈవార్త నారదుఁడు చని
యావిష్ణుని కెఱుఁగఁజెప్ప నతఁడును ఘనసై
న్యావళులతోడ నగ్రజు
తో వేగముతోడ వచ్చె దుర్వారగతిన్.

159


వ.

ఇట్లు వచ్చిన.

160

ఉ.

యాదవులెల్లఁ గబ్బు మెఱయన్ బలినందనుపట్టణంబు ప్రా
సాదములెల్లఁ గూల్చి వనసంఘము నుగ్గుగఁ జేసి గోపుర
క్షోద మొనర్చి యున్నతపుఁ గోటలు ద్రొబ్బి సమస్తదేవతా
హ్లాదము గాఁగ దోర్బలవిలాసముఁ జూపిరి దైత్యనాథుఁడున్.

161


క.

తనబలముతోడఁ గూడన్
నను సన్నుతిఁ జేసి సిల్చిన న్వచ్చితి నే
నును నాగణములతోఁ గృ
ష్ణునిరణపాండిత్యమహిమఁ జూడ నరేంద్రా.

162


ఉ.

మారుఁ డుమాకుమారుఁడును మాధవుఁ డేనును సీరపాణియున్
ధీరుఁడు కూపకర్ణుఁడు శినిప్రవరుండు గజాస్యుఁడున్ రణో
దారబలు ల్పదాతులుఁ బదాతులుఁ దల్పడి యొండొరుల్ మహా
శూరత నప్డు పోరితిమి చోద్యము నొంది సురల్ గనుంగొనన్.

163


వ.

అప్పుడు.

164


క.

హరిబలము చేత బలముం
హరిచే మద్బాహుసత్త్వ మడఁగియు బాణా
సురుఁడు గడుభక్తుఁ డగుట
బొరిఁబొరిఁ బోరితిమి కోపమున మనుజేంద్రా.

165


వ.

తదనంతరంబు బాణుం డక్షీణబలుండై సాక్షాద్విష్ణుం డగు
కృష్ణునితోఁ దలపడిన సంగ్రామంబు భీమం బయ్యె నంత
నాకృష్ణుండు దనచక్రధారచే విచిత్రంబుగ నబ్బాణుని
బాహుశాఖలు వేయియు మొదలంట నఱకి మోడుపఱ
చిన నస్మత్పూజార్థంబు కరం బరుదుగా రెండుకరంబు లిప్పిం
చితి నంత నబ్బలితనయు సంభావించి యుషాసమేతుం డగు
ననిరుద్ధు దోడుకొని సకలబలంబులు గొలువ ద్వారకానగ

రంబున కరిగెం గావునఁ గృష్ణునివలన నిన్ను రక్షింపరాదని
యప్పరమేశ్వరుండు ప్రమథగణంబులు గొలువఁ గైలా
సంబునకుం జనిన.

166


ఆ.

ఆచతుర్ధనుండు నత్యంతభయవిహ్వ
లాత్ముఁ డగుచుఁ జేయునదియు లేక
యతివిచారబుద్ధి నాహారనిద్రావి
హారసౌఖ్యములకు దూరుఁ డగుచు.

167


వ.

కొండొక చింతించి కమలగర్భు నారాధించిన.

168


సీ.

పాలునీరును నేరుపఱుపఁజాలినయట్టి
             పులుఁగుబాబా మింటఁ బుటము [14]గులుక
బసిఁడివన్నియ మించు పైమించుతళుకులు
             బాలాతపప్రభ గేలిబెట్ట
ముఖనీరజమున సమ్మోదమ్ముతో నిల్చి
             పలుకులబోటి విభ్రమము నెఱప
సకలలోకములకు జననకారణమైన
             తనదుచిత్తము గృప ననఁగి పెనఁగ


తే.

సర్వదివిజులు దిక్పతుల్ సన్మునులును
గొలువఁ దన్మంత్రమహిమంబుఁ దలఁప నరిది
గాఁగ నాకంజగర్భుండు కడురయమున
వచ్చి యానరనాయకువద్ద నిలిచె.

169


వ.

ఇవ్విధంబునఁ బ్రత్యక్షంబైన యవ్వేలుపుపెద్దం గనుంగొని
యతండు ప్రణామం బాచరించి యంజలిపుటంబు ఘటించి
యిట్లని విన్నవించె.

170

చ.

జలరుహగర్భ నన్ను మురశాసనుఁ డూరక వైర మెత్తి క
ట్టలుక హరింపఁ బూనె నది యమ్మువిధంబున నెమ్మనంబులో
పల మెఱుమంగ నీచరణపద్మములన్ శరణంబుఁ జొచ్చితిన్
గలఁక యణంచి కావుము జగన్నుతకీర్తులు మిన్ను ముట్టఁగన్.

171


వ.

అనిన వాణీవల్లభుండు క్షోణీవల్లభున కిట్లనియె.

172


సీ.

పురుడు వెళ్లకమున్న పూతనవిషదిగ్ధ
             కుచదుగ్ధముల నెల్లఁ గ్రోలి చంపెఁ
బసిబాలుఁ డగునాఁడ బండిరూపము దైత్య
             వీరునిఁ గుసులకు విఱుగఁదన్నె
నేఁడాదిప్రాయంబువాఁ డై రయంబున
             నెరయఁ దృణావర్తు నెలమిఁ గూల్చె
నడిచి యాడెడునాఁడ కడునద్భుతంబుగా
             లీలమై మద్దుల నేలఁ గలిపె


తే.

బకునిఁ జెండాడె [15]వత్సకు బారి సమరెఁ
జిలువ యైయున్న దానవుఁ బిలుకు మార్చె
[16]బాలవత్సాపహరు నన్ను భంగపఱచె
మనుజమాత్రుండె కృష్ణుండు మానవేంద్ర.

173


క.

అనవుడు నమ్మనుజేంద్రుఁడు
వనజాసనుతోడ ననియె వాణీశ, నినుం
గనుబ్రామ నతఁడు చాలెనె
యనవుడు నాతనికిఁ దెలియ నతఁ డిట్లనియెన్.

174


సీ.

ధరణీశ, యొక్కనాఁ డరుదుగాఁ గృష్ణుండు
             దనతోడి గోపనందనులఁ గూడి

బృందావనంబునఁ గ్రేపుల మేపుచు
             నాఁకొని చల్ది జలాశయంబు
దరిఁ [17]జేరి వాండ్రతోఁ దా నారగింపఁగ
             నేగఁ దన్మహిమంబు నే నెఱుంగఁ
దలఁచి బాలుర వత్సములఁ దలఁగింప నా
             కృష్ణుఁ డవ్విధము నెఱిఁగియుఁ దాన


తే.

కొమరులును లేఁగలును నయి గొల్లగుబ్బె
తలకు నాలకు ముద్దుగాఁ దనర నొక్క
వత్సరం బగునంత నే వచ్చినం జ
తుర్భుజాకృతితో నాకుఁ దోఁచె మఱియు.

175


తే.

బాలవత్సకములయందుఁ బార్థివేంద్ర
శంఖకౌమోదకీచక్రశార్ఙ్గకరుఁడు
కౌస్తుభోరస్కుఁడును నీలకాంతితనుఁడు
నగుచుఁ బొడకట్టె నే నంత నమ్మహాత్ముఁ.

176


క.

చరణముల కొరఁగితి మ
చ్ఛిరములు దద్రేణుపటలిచేఁ బూతములై
పరగఁగ నానందాశ్రులు
గురియఁగ నాదేవుకడ ముకుళితకరుఁడనై.

177


మ.

శివ సర్వాత్మక వాసుదేవ హరి రాజీవాక్ష గోవింద మా
ధవ దామోదర యజ్ఞభోక్త జగదాధారా ప్రపంచాత్మ దా
నవసంహారక చక్రపాణి మునివంద్యా బ్రహ్మవైకుంఠకృ
ష్ణ విరాజధ్వజ యాదవేంద్ర సుగుణా నారాయణా భూధరా.

178

క.

అని సన్నుతించి కృష్ణున
కును నే దొంగిలిన బాలకులఁ గ్రేపులఁ గ్ర
క్కున నిచ్చితి నది గావున
ననఘా నినుఁ గావనోపనని యజఁ డరిగెన్.

179


వ.

తదనంతరంబ.

180


తే.

నిఖలరాజ్యంబు పాలించు నేర్పు లుడిగి
దొరల సుపలాలనము సేయు వెరవు మాని
యంబుజాతులతోడి సయ్యాట మెడలి
యానృపాలుండు భీతి నిట్లని తలంచె.

181


ఆ.

హరి ప్రతిజ్ఞఁ జేసె శరములచే నొండెఁ
జక్రధార నొండె సంగరమున
నొక్కమాసమున మహోద్ధతి ననుఁ జంప
నందుఁ గొన్నిదినము లరిగె నిపుడు.

182


వ.

 అని బహుప్రకారంబులఁ బరితాపంబునం బొరలు చతుర్ధను
సమ్ముఖంబున కొక్కభిల్లుం డరుదెంచి కేలు మొగిడ్చి.

183


క.

జనవర మనపొలముల క
ర్జునుఁడు మృగయసమితితో నరుగుదెంచినవాఁ
డని విన్నవింప సంతస
మునఁ జెంది యతఁడును జిత్తమున నిట్లనియెన్.

184


క.

కాయమునకుఁ బ్రాణములకు
నేయక్కఱ యట్టిచెలిమి యేనరునకుఁ బ
ద్యాయతలోచనునకు నే
నేయనువున మొఱఁగి యతని కిది యెఱిఁగింతున్.

185

వ.

అని కొంతదడవు చింతించి శౌరిపేరు నుడువక శరణు
వేఁడెద నని తలంచి చంచునిరూపితమార్గంబున నరిగి.

186


క.

కనుఁగొనియె నాచతుర్ధన
మనుజాధీశ్వరుఁడు శూరు మందరధీరున్
ఘనతరకీర్తివిహారున్
నననిధిగంభీరు జంభవైరికుమారున్.

187


తే.

కని మనంబున భయభక్తు లనఁగి పెనఁగఁ
గానుకలు మ్రోలఁ జాలుపుగా నమర్చి
చక్కఁ జాగిలి మ్రొక్కి హస్తములు మొగిచి
వినయమున వాని కిట్లని విన్నవించె.

188


క.

మిన్నక బలియుఁ డొకఁడు నను
మన్నిగొనంబూని మెఱయ మన మెరియఁగ నా
పన్నశరణ్యుఁడవని నీ
మన్ననఁ గన వచ్చినాఁడ మనుపుము నన్నున్.

189


తే.

అనుచుఁ గ్రమ్మఱ మ్రొక్కి యజ్ఞనవిభుండు
లేవకుండిన హస్తరాజీవమున న
తనిఁ బ్రియమున నెత్తి యర్జునుఁడు పలికె
నినుఁ బ్రియంబునఁ గాచెద ననుచు మఱియు.

190


మ.

మనుజాధీశులఁ జెప్పనేల సకలామర్త్యుల్ దగన్ రేఁచి వ
చ్చిన శ్రీకృష్ణునిపాదమాన నిను రక్షింతున్ భయం బెద్ది న
మ్ము నరేంద్రా విను మత్ప్రతిజ్ఞ భువనంబుల్ సాక్షిగాఁ గావకుం
డిన మనూర్ధ్నము నాదు నిష్ఠురకృపాణిం ద్రెంచుకొందు న్వడిన్.

191

చ.

అని యాచతుర్ధనుమనంబున నమ్మిక లొదవునట్లుగా ఘోర
ప్రతిజ్ఞఁ జేసి యనంతరంబ కృష్ణం దొడరి యతండును
దానును ననేకాక్షౌహిణీబలంబులతోడ రణంబుఁ జేసి
యతనిచక్రధారచే ధర్మనందనుం డొక్కరుండునుం
దక్క నందఱు సమసి క్రమ్మఱఁ దత్కరుణాకటాక్షంబున
బ్రతికితిమని కలగాంచి యదరిపడి లేచి యప్పార్థుం డప్పార్థి
వున కిట్లనియె.

192


ఉ.

ఎవ్వఁడు నీకు వైరి కత మెయ్యది నీయెడ వైర మెత్త నీ
కెవ్విధి భీతి పుట్టె నెప మేమి సమస్తము చెప్పుమన్న వాఁ
డవ్విధ మెల్లఁ దెల్పుటకునై కరయుగము మోడ్చి పల్కె నా
కవ్వడితోడుతం దనమొగంబున దీనత యంకురింపఁగన్.

193


తే.

కాననంబున నేఁ దురంగంబుఁ గాంచి
దాని నెక్కిన నతివిచిత్రంబు గాఁగ
దివ్యలోకంబులకు నేగి తీవ్ర మెసఁగ
మగిడి ఫల్గున, యాకాశమార్గమునను.

194


ఆ.

యమునమీఁద వెడలి యరుదేర నత్తురం
గాస్యఫేన మంబుజాక్షుహస్త
జలములోనఁ బడిన నలిగి యాతఁడు నన్నుఁ
జంపఁబూనె నెలకుఁ జక్రమునను.

195


క.

అది కారణమున భీతిం
గదిసిన డెందంబుతోడఁ గమలోద్భవ రు
ద్ర దిగీశులఁ గావుఁ డనిన
నది దమచేఁ గాదటంచు నరిగిరి యంతన్.

196

వ.

దురంతచింతాక్రాంతస్వాంతుండ నై యుండి మద్భాగ్యవశం
బునఁ జింతాసముద్రంబు నీకరుణాకటాక్షంబను నావచేఁ
దరింపఁగంటి మంటినని విన్నవించిన.

197


ఉ.

ఆనరనాథువాక్యము భయంకరమై తనవీనులందు ను
గ్రానలకీల సోఁకినక్రియం బరితాపము నొందఁజేయఁ గ
న్గొనల నశ్రు లుప్పతిల గుండెలు జల్లన వెచ్చనూర్చుచు
న్మానసవీథిఁ జింతిలుచు మ్రాన్పడియుండె నరుండు దుఃఖియై.

198


వ.

ఇవ్విధంబునం గొంతదడవు చింతించి తనలో నిట్లని వితర్కించె.

199


ఆ.

ఏమి చేయువాఁడ నిట్టి దుస్సంధికి
నేటి కేగుదెంచి తీ పొలమున
కేడనుండి వచ్చె నీనృపుఁ డిచటికీ
వీనిఁ గావ నేల పూని తిపుడు.

200


మ.

మునుపే యాతఁడు కృష్ణుపే ర్నుడివినన్ మోసంబునుం జెంద కే
మనుదుం దద్విభుతో రణాంగణమున మార్కోలుఁ గల్పించి నే
మనుదున్ దైవము మాకు నెల్లఁ దనువున్ ప్రాణంబులున్ రక్షకుం
డును నెయ్యుండును దేశికుండు నల కృష్ణుండే కదా చూచినన్.

201


తే.

అట్టి పరమాత్ముతోడ నే నని యొనర్చు
టెట్లు దేహంబుతోఁడఁ జయించు టెట్టు
లీధరాధిపుఁ గాపాడు టెట్లు దీని
కేమి చేయుదు నిందఱ కేది గతియొ.

202

సీ.

[18]బ్రహ్మదేవుని యంతవాఁడును వనభూమి
             మాయ సేయఁగఁబోయి మాయఁబడియె
వామదేవుని యంతవాఁడును నిజభక్తుఁ
             గాపాడఁబోయి దా గాసిఁబడియె
వరుణుని యంతటివాఁడును నిజభటా
             నీతార్భకు నొసంగి నిలిచి పొగడె
వాసవు నంతటివాఁడును సంగర
             స్థలమున నెదిరించి [19]చాలఁ దూలె


తే.

మఱియుఁ దక్కటి రిపువీరమండలంబు
పిలుకుమారె సరోజాక్షుపెంపుచేత
నరుఁడ నాకథ యెంత భండనమునందు
నిలువఁగలనే, యటంచు వెండియు నతండు.

203


వ.

తనమనంబున నిట్లని వితర్కించె.

204


క.

తన తనువు నిలుపుకంటెన్
దనమాట నిజంబుఁ జేయఁదగు ధీరులకున్

దనపలుకు నిలిపి సురలకుఁ
దను వొసఁగి దధీచి కీర్తిధన్యుఁడు గాఁడే.

205


క.

శరణాగతుఁ డగువానిన్
గరుణం దనువైన నిచ్చి కావఁగఁదగు భూ
వరునకుఁ బక్షికినై తన
శరీరమాంసంబు శిబి యొసంగఁడె కరుణన్.

206


క.

జీమూతవాహనుం డొక
పామునకై విహగపతికిఁ బ్రాణము లీఁడే
యామాట సూర్యచంద్రులు
భూమియుఁ గలకాలమును విబుధులుఁ బొగడఁగన్.

207


క.

శరణా[20]తు గాచిన భూ
వరుఁడు దురగమేధయాగవర్గముఁ బుణ్యం
బరుదుగఁ జేకొనలేదా
నరకమునం [21]గూలి వేదనలఁ బడు నెపుడున్.

208


క.

కావున శరణాగతుని
భూవరుఁ గాచెదను సమరభూమిన్ హరిచే
జావైన లెస్స యటుగా
దా విజయంబైన మిగుల ధన్యత గాదే.

209


క.

తాతకును ధర్మసూతికి
నీతెఱఁ గెఱుఁగంగఁ జెప్పి యేనును వారుం
జేతనగుకొలఁదిఁ బెనఁగెద
మాతల [22]మఱి దైవ మున్నదని యాతనితోన్.

210

క.

అనఘా యిప్పుడు నీపుర
మునకు నరిగి నీదుసైన్యములఁ గూడి రయం
బున రమ్మని పంపి సురేం
ద్రనందనుం డపుడు తనపురమ్మున కరిగెన్.

211


వ.

ఇ ట్లర్జునుం డరిగినయనంతరంబ యాచతుర్ధనజననాయకుండు
మనంబున సంతోషంబు నొంది నిజరాజధాని యైనకుండిన
నగరంబున కరుగుదెంచి కతిపయదినంబు లుండి చతురంగ
బలసమేతుండై యమరావతీపురంబునుంబోలిన యింద్ర
ప్రస్థపురంబునకుఁ జనుదెంచి యందు.

212


చ.

అనిలతనూభవుండు దివిజాధిపనందనుఁడుం గవ్ల్ ముదం
బునఁ గొలువన్ మణిప్రకరభూషితసౌధమునందుఁ గామినీ
జనమృదుహస్తసంకలితచామరవీజనజాతవాతపో
తనికరలోలకుంతలుని ధర్మతనూజునిఁ గాంచె వేడుకన్.

213


ఆ.

కని యుపాయనంబుగా మత్తకరులు మ
ణులు మృగేక్షణామణులుఁ దురంగ
రత్నములు సువర్ణరాసులుఁ బ్రేమ స
మర్పణంబు చేయ నతఁడు మెచ్చి.

214


క.

ఆనరనాయకునకు స
న్మానం బొనరించి నవ్యమణిపీఠిక నా
సీనుం జేసి సురేశ్వర
సూనుని దెసఁ జూచి ధర్మజుఁడు గనుసన్నన్.

215


తే.

ఈతఁ డేభూవిభుండు పే రేమి యిటకు
రాఁ బ్రయోజన మే మిది క్రమముతోడఁ
దెలియఁజెప్పుమటన్న నాదేవరాజ
తనయుఁ డిట్లని పల్కె హస్తములు మొగిచి.

216

చ.

అనఘవరేణ్య కుండినపురాధిపుఁ డితఁడు పేరిటన్ జతు
ర్ధనుఁ డసునాతఁ డేను మృగరాజి నణంపఁగ వేఁటఁ బోయియుం
డ నచటి కేగుదెంచి కపటంబునఁ బల్కెను న న్విరోధి యొ
క్కనృపుఁడు చంపఁబూనెఁ దగఁ గావు మటంచు మహార్తితోడుతన్.

217


తే.

శరణుఁ జొచ్చినవారి రక్షణము సేయ
వలయు వీరులకని మదిఁ దలంచి కావఁ
బ్రతినఁ జేసితిఁ దదనంతరంబ శౌరి
వైరి యని చెప్పె నీతండు వసుమతీశ.

218


క.

శ్రీవిభునితోడి నెయ్యము
భూవరుప్రాణంబు గాచు పూనికయును నా
కేవెరవునఁ గూడెడునని
దేవర కెఱిఁగింప నరుగుదెంచితి భీతిన్.

219


తే.

నాప్రతిజ్ఞయు నితనిప్రాణములుఁ గావ
నేది తెరవగు నట్టి దూహించు మనుచుఁ
బాదములమీఁద వ్రాలు నప్పార్థుఁ జేరఁ
దిగిచి యిట్లని పల్కె యుధిష్ఠిరుండు.

220


మ.

సకలోపాయవిశారదుండు నయశాస్త్రప్రౌఢుఁ డాయోధనో
త్సుకుఁ డుద్దండవిరోధిసంహరణదక్షుం డుగ్రశస్త్రాస్త్రజా
లకళావేది గిరీంద్రధీరుఁడు సరోల్లాసాత్మపంకేరుహుం
డకలంకుం డగుకృష్ణు నోర్వ నజదుర్గాధీశులున్ శక్తులే.

221


క.

పోనీ శరణాగతికై
మేనులు హరి కొసఁగి కీర్తి మించి సురేంద్ర
శ్రీ నెగడెద మిది విడిచిన
హీనపుబ్రతు కేల రాజ్య మేటికి మనకున్.

222

తే.

వాసవాత్మజ మును నీవు చేసినట్టి
ప్రతినయే మత్ప్రతిజ్ఞ యీరాజుఁ గాతు
ననుచుఁ దమ్ముని నూఱార్చి యమ్మహీశు
భయము మాన్పియు సంతోషభరితుఁ జేసె.

223


వ.

ఇవ్విధంబున నమ్మహీపతి యగుచతుర్ధనుభయం బుడిపి
యయ్యజాతశత్రుం డంతఃపురంబున కరిగె నని శుక
యోగీంద్రుం డిలావంతునకుఁ జెప్పినవిధం బెఱింగించిన
నటమీఁది వృత్తాంతం బేమని యడుగుటయు.

224


మ.

అసికృత్తారినికాయకాయజబుధాధ్యక్ష్మాత్మసంజాతభీ
మసఖోద్భూతసమాన మానవధరామందార, మందారము
ఖ్యసమస్తగ్రహదత్తరాజ్యబలభోగశ్రీయశోనిత్య, ని
త్య సమభ్యర్చితకృష్ణ! కృష్ణమకుమారా! మారజిత్ప్రాభవా!

225


క.

ఉర్వీదేవసమూహా, శీర్వాదసమేధమానసింధురతురగా
ఖర్వశ్రీసంతానా, గర్వితరిపుహరణకరణకౌక్షేయకరా.

226


తోటకము.

కరుణాకరమానస కమ్రయశః
పరిపూరితనిర్మలపద్మభవాం
డ రమారమణీమణినాథపదాం
బురుహద్వయపూజనపుణ్యనిధీ.

227


గద్యము.

ఇది శ్రీమత్కౌండిన్యగోత్రపవిత్ర చరిగొండ తిమ్మ
నామాత్యపుత్త్ర సకలవిద్యాపారీణ శతఘంట సురత్రాణ
సుకవిజనవిధేయ ధర్మననామధేయప్రణీతం బయిన చిత్ర
భారతం బనుపురాణకథయందుఁ బంచమాశ్వాసము.

  1. ధునీ
  2. నెగడె నీప్రాంతమందు
  3. ఖడ్గంబులు
  4. నీహారపుండరీకాబ్జతార
  5. దొఱంగఁజేయవే
  6. గర్వించి పె
  7. తో విడిపించినకన్యకావళిం
  8. అలుకబు
  9. తనువున నింతఁ గొల్పెడిని
  10. నిల నోప నేమి యొనరింతును
  11. యవ్వలరాజు పువ్వులవింటినారి
  12. బెనఁగ దండను గామినిఁ జూచె నత్తఱిన్
  13. గ్రోలి
  14. లులుక
  15. వత్సునిఁ
  16. బాలవత్సాత్ముఁడయి
  17. జెలికా
  18. వనరుహోద్భవునంతవాఁడు బాలకవత్స
                 ముల దాఁచి తనయంత మోసపోయె;
    వాసవునంతటివాఁడును సంగర
                 స్థలమున నెదిరించి ధరణిఁ గూలె;
    వేఁడిచూపఱియంతవాఁడు బాణాసుర
                 యుద్ధంబులోపల నోసరిల్లె;
    వసుధాసుతునియంతవాఁడును సంగర
                 స్థలమున సేదిరించి ధరణిఁ గూలె;
  19. ధరణిఁ దూలె
  20. తరక్షకు
  21. గూడి
  22. నున్నాఁడు దైవ మని యాతనితోన్.