చిత్రభారతము/చతుర్థాశ్వాసము

శ్రీరస్తు

చిత్రభారతము

చతుర్థాశ్వాసము



నరసింహపదాబ్జ
ధ్యానపరాయణమరాళ తారాధిపభో
గీనసమకీర్తి పూర్వ
క్ష్మానాయక వినుతచరిత మాదయపెద్దా.

1


వ.

అవధరింపుము మృదుమధురవచనరచనాపరితోషితముని
జాతుం డగుసూతుండు హరికథాశ్రవణాహ్లాదు లగుశౌన
కాదులకు ని ట్లనియె నట్లు చతుర్ధనజననాథుం డభ్యంత
రంబునకుం జని.

2


క.

ఒడలఁ గల తొడవులన్నియు
నెడలిచి కామినులచేతి కిచ్చి ప్రియం బే
ర్పడఁ బందిరిలోపలఁ దగ
నిడినకనకపీఠి నున్నయెడ ముద మొదవన్.

3


మ.

కొనగోరుల్ దలసోఁకఁ జన్నులమెఱుంగుల్ దిక్కులం బర్వ స
ల్లన లేఁగౌను వడంకఁ గంకణము లుల్లాసంబుగా మ్రోయ న
క్కునఁ బేరుల్ [1]గుదులై పెనంగొన బెణంకుంజూపు లొడ్డింపఁగా

జననాథాగ్రణి కంటె నొక్కతె [2]తలన్ సంపెంగతైలంబునన్.

4


చ.

ఒక చపలాక్షి యొయ్యన నృపోత్తము నౌదలపైఁ దనర్చు నా
చికురభరంబు పాపిటలు చేసి మనోహరచందనంపుటం
టకలి యిడెం గరంబులు తడంబడ రాచుచు రత్నకంకణ
ప్రకరముఁ గుండలంబులును రాపడి మ్రోయఁగఁ దూఁగి యాడఁగన్.

5


ఉ.

కొందఱు భామినీమణులు గొజ్జఁగినీరు సువర్ణకుంభరా
జిం దగ ముంచి చేరి యభిషేకము చేసిరి మోము లప్పు డం
దందఁ జెమర్పఁ జన్ను లొరయం గరమూలరుచుల్ దిశావళిం
జిందఁగ వింతసంభ్రమముచేఁ బదనూపురకోటి మ్రోయఁగన్.

6


ఉ.

వేఱొకప్రౌఢ చేరి పృథివీరమణాగ్రణికిన్ శిరంబు నీ
రారిచి మేనిపైని గనుపట్టు తడి న్వెస నొ త్తి పచ్చక
ర్పూరముఁ జందనంబు నగరు న్సమకూర్చిన ధూప మిచ్చి యొ
య్యారపుబాగునన్ సురఁటి యల్లనఁ ద్రిప్పె మనోహరంబుగన్.

7


తే.

చెలువయొక్కతె వెలిపట్టుచేలఁ గట్టెఁ
గాంతయొక్కతె మేఖలఁ గటి నమర్చె
నిందుముఖయో_ర్తి యుత్తరజందియంబు
లంసపీఠికఁ జేర్చె జనాధిపతికి.

8


శా.

బంగారంచులపట్టుపచ్చడము శుంభల్లీలమై నొక్కసా
రంగీలోచన గప్పె నొక్కతె కచవ్రాతమ్ము సారింపుచున్

జెంగల్వల్ సవరించి కొప్పిడియె రాజీవాక్షి యొక్కర్తు ప్రే
మం గస్తూరిని బొట్టుఁ బెట్టె నభిరామం బైనఫాలంబునన్.

9


ఉ.

శ్రీ విలసిల్లి సంతతసువృత్తమునం గడువన్నె కెక్కి నా
నావిధసద్గుణాళివలనం బొగడొందుచు నాయకప్రమో
దావహమై లతాంగిగతి నక్కునఁ జేర్పఁగ నందమైన హా
రావళి యొక్కకోమలి నృపాగ్రణికంఠముఁ జేర్చె వేడుకన్.

10


క.

శ్రుతిభూషణ యోగ్యుం డీ
పతి యని తలపోసి యొక్కభామామణి వి
శ్రుతరత్నకీలితములగు
శ్రుతిభూషణయుగళ మిడియె శోభనలీలన్.

11


చ.

హరితరుపంచకంబు నిఖిలార్థుల కర్థము లిచ్చునప్పుడున్
గరఁగక వ్రేళ్లు క్రిందు పడెఁగా యని డెందమునందు రోసి యీ
నరపతివ్రే ళ్లుదారత ధనం బిడునప్పుడు క్రిందుగామికి
[3]న్బిరుదు ఘటించె నాఁగఁ దరుణీమణి యొక్కతె గూర్చె నూర్మికల్.

12


ఉ.

వేఱొకపద్మనేత్ర నునువింతమెఱుంగుల నొప్పు మేలికై
వారముతీరు గన్గొని ధ్రువంబుగ నిందుల తారతమ్య మీ
డేరఁగఁ బల్కుమంచుఁ బ్రకటించినకైవడి నిల్పె మోహనా
కారపుటద్దముం దెలిమొగంబును మానవనాథుముందటన్.

13


ఉ.

రాజశిరోవతంసునకు రమ్యగుణంబులఁ బొల్చి స్నేహసం
యోజన దాల్చి చంచలతనొంది మెఱుంగుల నుల్లసిల్లి వి

భ్రాజితనైజదృక్తతిని బాటియనం గనుపట్టునట్టి నీ
రాజన మిచ్చి రింతులు గరంబులఁ బళ్లెర మెత్తి త్రిప్పుచున్.

14


వ.

ఇవ్విధంబున నలంకృతుండై నిజదేవతానమస్కారంబు
గావించి షడ్రసోపేతరుచిరాన్నంబులు భుజియించి హస్త
ప్రక్షాళనం బొనరించి కర్పూరతాంబూలం బవధరించి
యశ్వారోహణకుతూహలుండై యంతఃపురంబు వెడలి.

15


సీ.

ఆత్మఫాలాగ్రబద్ధాంజలులై చేరి
             సామంతలోకంబు సాఁగి [4]కొలువ
నవ్యఘంటాకేతనశ్రేణు లొరయంగ
             భద్రదంతావళపంక్తు లమరఁ
గల్యాణపల్యాణకలితంబు లైనట్టి
             ఘనజవనాశ్వసంఘములు మెఱయ
బహువిధశస్త్రాస్త్రపాణులై యిరుమేలఁ
             [5]బాటిల్లివడి వీరభటులు చెలఁగ


తే.

శంఖభేరీమృదంగనిస్సాణపటహ
కాహళీవేణుముఖవాద్యఘనరవంబు
చక్రవాళాద్రిగహ్వరస్థానసుప్త
మృగకులాధీశజలంబు మేలుకొలుప.

16


ఉ.

ఒద్ధికతోడ మంత్రులు నయోచితభాషలు పల్కఁ గర్ణముల్
బ్రద్దలువాఱు వాయిని బళా యని వందిజనంబు మాగధుల్
తద్దయుఁ జేరి యాత్మబిరుదప్రకరంబుల సన్నుతింపఁగా
ముద్దియ లింపుగా భువనమోహనవైఖరిఁ గూడి పాడఁగన్.

17

ఆ.

సంతసము నొంది మేదినీకాంతుఁ డపుడు
గన్నుసన్నల నిజమంత్రిగణముఁ బిలువ
నదియ సుముహూర్తమంచు నాహయముఁ దెచ్చి
నిండువేడుకతో మ్రోల నిల్పుటయును.

18


సీ.

వలుద ముత్యాలకోవల నేర్చి కట్టిన
             మంచిబంగరుకనుమఱువుతోడఁ
బచ్చలు గూర్చిన పయిఁడిపుట్టముమీఁది
             కెంబట్టు జగి తలాటంబుతోడఁ
బద్మరాగోపలబంధబంధుర మైన
             నవ్యకాంచనఖలీనంబుతోడఁ
బనిరువాణంబున భాసిల్లు మేలివ
             జ్రంబుల పసిఁడిపల్లంబుతోడ


తే.

నిరుగెలంకులఁ గట్టిన యొరలనున్న
ఖడ్గములతోడ మెఱుఁగు సంగడులతోడ
బిరుదు నూపురములతోడ మెఱయుహయము
పార్థివోత్తమునకు నేత్రపర్వ మయ్యె.

19


క.

ఆసామ్రాణికిఁ జూపుల
దోసము పాయంగ నగరుధూపంబు మహో
ల్లాసంబుగ నిడి పూజలు
చేసి జయధ్వనులు నిగుడ శ్రీకరలీలన్.

20


ఉ.

ఆతఱిఁ జేరవచ్చి వినయమ్మున నమ్మనుజేశ్వరుండు సం
ప్రీతిఁ బ్రదక్షిణంబు లొనరించి నమస్కృతిఁ జేసి పండిత
వ్రాతము దీవనల్ వినుచు వామపదాబ్జము మున్ను గాఁగ వి

ఖ్యాతిగ నెక్కె దైవతహయంబు సురేశ్వరుఁ డెక్కువైఖరిన్.

21


వ.

ఇత్తెఱంగున నత్తురంగారోహణంబుఁ జేసి సంతోషభరి
తాంతఃకరణుండై చతురంగబలంబులుం గొలువ రాజ
మార్గంబునం జనునప్పుడు.

22


శా.

ఆరాజేంద్రుని రూపరేఖయుఁ దురంగారోహణక్రీడయున్
ఘోరానేకపసంచయంబులతెఱంగున్ ఘోటకవ్రాతసం
చారప్రక్రియయున్ బదాతులవిలాసంబు న్నిరీక్షింపఁగాఁ
బౌరుల్ నిల్చిరి భర్మహర్మ్యశిఖరవ్రాతప్రదేశంబులన్.

23


వ.

అప్పుడు.

24


ఉ.

మించిన నీలహర్మ్యతతి మేఘము సొంపు వహింప నందు వ
ర్తించు సతుల్ తటిల్లతలతీరు భజింప మృదంగమండలో
దంచితరావముల్ స్తనితధర్మముఁ దాల్పఁగ మానవేశ్వరు
న్ముంచెఁ బ్రసూనవృష్టి జనముల్ గొనియాడ ననేకభంగులన్.

25


వ.

అయ్యవసరంబునఁ గొందఱు ప్రౌఢకాంతలు చతుర్ధనమహీ
కాంతునిం జూచి తమలో ని ట్లనిరి.

26


మ.

తరుణీ, వీనికి సార్వభౌమత యథార్థం బయ్యెఁ గాకుండిన
న్వరదానంబు మహాప్రవాహములు దిగ్వ్యాప్తంబు లౌ నేయటే
హరు తేకైవడిఁ గొల్చివచ్చు విను కొమ్మా రాజకంఠీరవ
స్ఫురణన్ బొల్చుఁగదే పరాక్రమకళాస్ఫూర్తి న్వివేకించినన్.

27


మ.

చెలియా, మిక్కిలి చిత్రమయ్యెడి నిరీక్షింపం గళావైభవో
జ్జ్వలుఁడై వేగినవేళ రాజు విహరింపం బూనెఁ దత్సంగతి

జలనం బందక పుండరీకము వికాసస్ఫూర్తిఁ జెన్నొందెఁ గాం
తులఁ బెంపెక్కి సమస్తతారకలు సంతోషంబునంబొందెడిన్.

28


క.

అని పౌరులు కొనియాడుచుఁ
దనుఁ జూడఁగ ధరణివిభుఁడు తద్ఘోటకప
ల్గనకేళి నధికవేగం
బునఁ బుటభేదనము వెడలి పోయె నరేంద్రా.

29


వ.

ఇవ్విధంబున నద్ధరణీపురుహూతుండు సకలసేనాసమేతుండై
పురంబు వెలువడి యొక్కవాహ్యాళిప్రదేశంబున కరిగి
సమస్తసైన్యంబులును దిదృక్షాధీనంబులై యంతనంత నిలువ
నచ్చట.

30


ఉ.

అప్పుడు సాహిణీలు గదియం జని రెండుకెలంకులం బ్రియం
బొప్పఁ జెలంగ మాగధమృదూక్తినినాదమె కాని సేనలోఁ
జప్పుడు మాన్పఁగన్ జబుకుసాదులు గుఱ్ఱముఁ [6]గుస్తరింపగా
నప్పృథివీశ్వరుండు దనహస్తములం గశలంది వేడుకన్.

31


చ.

కొదమమహాతురంగమముఁ గోరిక లీరిక లెత్త నెంతయున్
బెదరఁగనీక యల్ల నడపించెను వీథులఁ జూపఁబూని త
త్పదములయందియల్ చెవులపండువుగా మొరయంగ దేహమున్
గదలనియట్ల తోఁచ మెడఁ గట్టిన జంగు గణంగి మ్రోయఁగన్.

32


చ.

పొడవుగ ఱాఁగ నెక్కి మది పూనిక మోదము నామతింప లే
వడి యనరానితీవ్రమున వాటముగాని తెఱంగు దోఁపఁగా

నడుగులజాడ యేర్పడఁగ నానరనాథుఁడు నేర్పు పెంపునన్
బొడమెడుజుంటితేనియలఁ బోలెడు పల్కుల బుజ్జగింపుచున్.

33


ఉ.

రాగల సన్నఁ జేసి సుకరంబుగ వామకరంబులోని య
న్వాగె యొకింత చేర్చి కళ వైచుచు ధేయను నంతలోన ను
ద్వేగ మెలర్పఁ జూపులకు వెక్కసమై కనుపట్టి దివ్యశో
భాగుణశాలి యైనహరి పాఱెఁ జెలంగి దువాళి వీథులన్.

34


వ.

మఱియును.

35


సీ.

వాగెలు గుదియించి రాగసన్నలు సేయ
             హరిణపుటంబుల ననఘళించు
నోర చందంబుగా నొక్కింత చూపిన
             మండలీకరణక్రమంబు నిల్పుఁ
గేలు సారించి జంకించి యల్లల్లన
             పట్టినఁ గుఱుచలఁ బాఱి తిరుగు
సమముగా నిల్పి హస్తముల సళ్లించిన
             నలసత లేక నూఱాఱు దాఁటు


తే.

మూఁడుపదములు ధరణిపై మోపియాడు
రెండువంకల జమిలిపేరెములు వాఱు
సకలసైనికు లెల్ల నాశ్చర్య మనుచు
వర్ణనము సేయ మించె నవ్వారువంబు.

36


క.

జననాథుఁడు దనగుణములుఁ
గనియున్ విని యెఱుఁగలేనికతనఁ బదాబ్జం
బునఁ దాటించినఁ దురగం
బనిమిషమార్గమున కెగసె నాతనిఁ గొనుచున్.

37

వ.

ఇత్తెఱంగున నయ్యుత్తమాశ్వంబు కారణజన్మంబు గావునఁ
బార్ష్ణీఘాతావమానంబు సైరింపక యమ్మహీకాంతునిం
గొనుచు గగనంబునకు నుద్గమించె నిక్కడ మంత్రిపురో
హితసేనాపతిప్రముఖాఖిలజనంబులు చింతాక్రాంతస్వాం
తులై చేయునది లేక పునఃపునరవలోకితగగనభాగు లగుచు
మగుడి పురంబునకు వచ్చి వేదనాదోదూయమానం బగు
తత్పుత్త్రకళత్రవర్గంబు నూఱడించి దివసంబులు గడుపు
చుండి రంత నక్కడఁ జతుర్ధనుండు మందాకినీతీరంబుఁ
జేరుసమయంబున.

38


ఉ.

నారదుఁ డేగుదెంచి నరనాథుని కి ట్లను నోమహీశ యీ
వారువ మిట్లు నిన్నుఁ గొనివచ్చుట యొండువిధంబు గాదు బృం
దారకు లెన్న దివ్యభువనంబుల నన్నిటిఁ జూపి తావకా
గారముఁ జేర్చు నిందు కొకకారణ మున్నది నిక్క మింతయున్.

39


క.

అని యనిమిషముని చనుటయుఁ
దనమనమున నున్నభయము దలఁగించి చతు
ర్ధనజనపతి మందాకినిఁ
గనుఁగొని కొనియాడఁ దొణఁగె గంభీరోక్తిన్.

40


సీ.

ధన్యుఁడై భువనైకమాన్యుఁడై కనుపట్టు
             శాంతనవున కిది జన్మ భూమి
మునిశాపసంతాపమునఁ గ్రాఁగిపోయిన
             సగరుల కది మోక్షసాధనంబు
బ్రహ్మహత్యాదిపాపప్రపంచమునకు
             నెన్ని చూడఁగ నిది యెదురుచుక్క
కృత్తికాషడ్గర్భగేహనిర్గతుఁడైన
             కొమరుసామికి నిది గూర్మి దాది

తే.

యనగఁ బెంపొందు నీనది కబ్జగర్భు
కరకమండలువఁట [7]జనుఃకారణంబు
హరిపదంబఁట తెంకి శంకరునిమౌళి
కేలిగృహమఁట మహిమ యింకేల పొగడ.

41


చ.

తెలుపగు నీటిపైఁ బసిమిదేఱెడు నల్లదె హేమనీరజం
బుల నడరొందఁ గప్పుకోను పుప్పొడి యొప్పిదమో సురాంగనా
వలి విహరింపఁగాఁ దలఁచి వచ్చి మదంబున నీదులాడఁ జ
న్నులఁ గల కుంకుముల్ గరఁడి నూతనరాగము మీఁదఁ జూపెనో.

42


ఉ.

ఫేనసమూహముల్ రుచులఁ బెంపగు గొజ్జఁగిపువ్వుగుంపులై
కానఁబడంగఁ దుంపరలు గమ్మనిమల్లియలై తనర్పఁ బెం
పానిన సుళ్లు మొల్లవిరులై విలసిల్లఁగ నింపు పుట్టియో
పూనె హరుండు [8]వేనలిని పొందఁ గడుందగు నిమ్మహానదిన్.

43


వ.

అని మఱియుం దదీయవిశేషంబులు గొనియాడి సంతోష
భరితాంతకరణుండై మనంబున నమస్కరించె నంత.

44


చ.

అనిశము దానవారి కిరవై యమృతాకృతిఁ బొల్చి యభ్రమున్
దనకు వశంబుగా మెలఁగఁ దా హరిలక్ష్మికి మూలకారణం
బనఁదగి దుగ్ధవారిధిక్రియం గనుపట్టు సురేభమంబు సే
చనమున కేగుదేర నృపచంద్రుఁడు గన్గొనెం దత్తటంబునన్.

45


క.

తెలిచెలువము వడి బెడఁగున్
లలితావర్తములఁగల విలాసము ఫేనం

బుల యొప్పుఁ గలిగి సురనది
పొలుపునఁ జను దివిజతురగముం గనుఁగొనియెన్.

46


వ.

ఇట్లు కనుంగొని యాశ్చర్యహృదయుండై చనిచని ముందట.

47


సీ.

బహువిధమాణీక్యపటలకాంతిచ్ఛటా
             రాజితకృతికధరాధరములఁ
గాంచననీరేజకల్హారవాసిత
             విమలాంబుదీర్ఘికాసముదయముల
సురతక్రియాసముత్సుకవిలాసివ్రాత
             సంచారయోగ్యకుంజస్థలముల
మార్గణయాచనాదౌర్గత్యమోచనా
             కల్పవిభ్రాజితకల్పకముల


తే.

దేవతాసార్వభౌమకీర్తిప్రతాప
భవ్యబీరుదాంకమాలికాపఠనలీలఁ
గిన్నరీద్వంద్వశారికాకీరపికము
లను నిరీక్షించి పొంగె నా జనవిభుండు.

48


వ.

మఱియు.

49


క.

అటఁ జనిచని కనుఁగొనియెం
బటుతురగనిరూప్యమాణపథమున నతఁ డు
త్కటవినుతదైత్యమానస
పుటభేదనమైన దివిజపుటభేదనమున్.

50


వ.

కనుఁగొని తదుపరిభాగంబునం జనిచని.

51


చ.

కరకరితోడి రిత్త యలుక ల్పచరించి మనోజకేళికిం
బురిగొననీక [9]కోపమునఁ బోనడవం గడునల్గి వేలుపుం

దెఱవలతోడఁ బాసి తమదివ్యగృహంబుల కేఁగి శయ్యలం
బొరలెడు దేవతావిటుల పోఁడిమిఁ జూచి హసించె నెంతయున్.

52


ఉ.

శూరులు గొంద ఱుద్ధవిడిఁ జొచ్చి నిలింపవధూగృహంబులం
జేరిన సోమయాజులను జిందఱవందఱగా నదవల్తినం
దోరపుఁగయ్య మైనయెడ దూఱి రసజ్ఞులు కొంద ఱచ్చటన్
ధీరత నిల్చి యాతగవు దీర్పఁగఁ జూచె విభుండు నవ్వుచున్.

53


ఉ.

ఒక్కవిటోత్తముండు [10]దనుఁ బొందఁగఁ జూచిన కొంతఁ జూచి వే
ఱొక్కఁడు గన్నులార్చుటకు నోర్వక కోపము మీఱి వానితో
నెక్కటిపోరికై తివిరి యింతులు మూఁకలు గట్టి చూడఁగా
నిక్కువసాము సేయ నతనిం గని నవ్వె నరేంద్రుఁ [11]డెగ్గుచేన్.

54


చ.

వరుఁ డొకకొంతకాలము ప్రవాసముగాఁ జని వచ్చినంత స
త్వరమతి నాపరానిప్రమదంబున డగ్గఱి కౌఁగిలించి మో
విరుచుల నానె నొక్కయరవిందదళాయతనేత్ర యంత ని
ద్దఱును విచేష్టులైరి వసుధాతలనాథుఁడు చూచి మెచ్చఁగన్.


సీ.

కలలోవలను వియోగములేక విభులతో
             సౌధడోలాకేళి సలుపువారుఁ
గినిసిపోయిననాథులను బుజ్జగింపఁగాఁ
             దరుణులతోఁ గూడి తనరువారు
సంతతనిధువనశ్రాంతలై పతుల వే
             రురముపాస్సులపైనిఁ బొరలువారుఁ

జందనప్రసవభూషణముల కాంతులు
             శృంగార మొనరింపఁ జెలఁగువారుఁ


తే.

బ్రియులయధరామృతం బెల్లం బీల్చి సొక్కి
ప్రేమతోడుత నరగన్ను పెట్టువారు
నగుచు విహరించు నచ్చరచిగురుఁబోండ్ల
చేతఁ గన్పట్టువాడ వీక్షించె నతఁడు.

56


వ.

ఇవ్విధంబున వివిధవిలాసంబులుగల దేవతావిలాసినీవాటికం
జూచి యల్లన చనిచని సహస్రమణికుంభప్రభాకిమ్మీరిత
వ్యోమతలంబును, గేతనోపకేతనసమూహవిరాజితంబును,
మరకతమణిమయతోరణాలంకృతంబును, బద్మరాగగేహళి
సంయుతంబును, నీలమణిబద్ధకుడ్యప్రదేశంబును, సహస్ర
విద్రుమస్తంభసంలక్షితంబును, దివ్యవైడూర్యమణికల్పిత
సౌపానవిశేషంబును, బుష్యరాగవేదికోపలక్షితంబును,
మనోజ్ఞకాంతివిరాజమానగోమేధికకృతప్రాంగణస్థలంబును,
వజ్రనిర్మితరంగవల్లీసముదాయాభిరామంబును,
విడంబముక్తాఫలవితానమనోహరంబును నై మెఱయు
పురందరసభామందిరంబుఁ గని.

57


ఉ.

ఆమహనీయహర్మ్యమున నత్యధికప్రభఁ బొల్చునట్టి చిం
తామణిపీఠికాతలమున న్మణిభూషణపుష్పమాలికా
స్తోమమనోజ్ఞవస్త్రపరిశోభితుఁ డై సురసార్వభౌముఁ డు
ద్దామరణస్థలీవిజయదంబగు వజ్రము కేల మీఱఁగన్.

58


సీ.

మేనులు గైకొన్న మెఱుఁగుఁదీఁగె లనంగ
             నప్సరోభామిను లలమి కొలువ
గాత్రముల్ పూనిన గానవిద్య లనంగ
             గంధర్వకాంతలు గదిసి పాడ

నంగంబు దాల్చిన శృంగారరస మన
             నూర్వశి నటనల నుబుసుపుచ్చ
దేహంబు లెత్తిన తేటవెన్నెల లనఁ
             గిన్నరాంగన లూడిగెములు సేయ


తే.

నిర్జరీనీజ్యమానమాణిక్యకలిత
చామరోద్భవపవమానచలితలలిత
కుటిలకుంతలవికసితనిటలుఁ డగుచు
నిండుగొలువుండఁ గనుఁగొనె నృవవరుండు.

59


వ.

కనుంగొని మనంబున ఘనంబగుసంతోషంబునం జెంది
తత్ప్రాంతంబుననున్న సిద్ధవిద్యాధరగరుడగంధర్వాదిదివ్య
గణంబుల నాలోకింపుచుఁ దురంగగమననీయమానుండై
చనిచని.

60


ఉ.

భీష్మపరాక్రమస్ఫురణఁ బేర్చిన వీరులయుజ్జ్వలప్రతా
పోష్మవిజృంభణంబున మహోగ్రవిభావసుపాలనంబునం
గ్రీష్మము దానయయ్యుఁ బ్రజఁ గేవలశైత్యము నందఁ జేయు న
ర్చిష్మతిపేర నొప్పిడు పురి న్వెఱఁగొందుచుఁ జూచె దవ్వులన్.

61


శా.

ప్రాకారంబులు రమ్యహర్మ్యమణికుంభస్తోమముల్ గోపురా
నీకంబున్ ధనధాన్యరాసులును మాణిక్యావళికల్పితా
నేకక్షోణిధరంబులుం సరసులున్ లీలావనవ్రాతమున్
శ్రీకిం బట్టగు పౌరసంచయము నర్థిం గాంచి యాముందటన్.


సీ.

సంతుష్టమానసస్వాహాస్వధాకాంత
             లుభయపార్శ్వంబుల నోలగింప
శృంగచతుష్టయాంచితమస్తకద్వయం
             బున రత్నకోటీరములు వెలుంగ

సమిదాజ్యచరుహవిశ్చర్వణోజ్జ్వలముఖం
             బులయందు సప్తజిహ్వలు చలింప
మూఁడునాలుగుహస్తముల స్రుక్సువాదిసా
             ధనసముదాయంబు తనరుచుండఁ


తే.

జబుకుసాదులు మ్రోల కైజా యొనర్చి
సూటివడవాఁగె బట్టుపొట్టేటితేజిఁ
గూర్మిఁ జూచుచు విబుధులు గొలువనున్న
యవలు నీక్షించి యవిభుం డనియె నిట్లు.

63


సీ.

ఈపుణ్యనిధి పార్వతీశ్వరునకుఁ బ్రతా
             పసమృద్ధి గావించుఫాలనేత్ర
మీసర్వభక్షకుం డేచిన వాహినీ
             పతిపొం గణంగించు బాడబాగ్ని
యీమహాతేజస్వి భీమవిక్రమశాలి
             యగుకుమారునిఁ గన్నయట్టిప్రోడ
యీభవ్యమూర్తి దేవేంద్రముఖ్యులకు భా
             మపదార్థరుచి గూర్చు మంజులాస్య


తే.

మీజగద్రక్షకుఁడు రేల నినునితేజ
మెల్లఁ గైకొని వెలుఁగొందు బల్లిదుండు
గాన నిట్టి బృహద్భానుఁ గానఁగల్గు
వాఁడెపో పుణ్యుఁ డనుచు భావమున మ్రొక్కె.

64


వ.

ఇట్లు కృతనమస్కారుండై హయగమనవేగంబున
నగరంబు గడచి యరిగి యరిగి.

65


ఉ.

దారుణపాశతోమరగదాపరిఘాదులఁ బూని లోకసం
హారసమర్థులై కడుభయంకరులై కనుపట్టి కింకరుల్
సారము మీఱఁ గావఁదగుసంయమనీనగరంబుఁ గాంచి య

బ్భూరమణేంద్రుఁ డద్భుతముఁ బొందుచు భావములోన నుబ్బుచున్.

66


సీ.

భూరిభుజాదండభూషణంబుగ నొప్పు
             దారుణతరగదాదండ మమర
నతిభయానకమూర్తి యగుమృత్యుదేవత
             గరములు మోడ్చి ముంగల వసింపఁ
[12]జండకోదండభీషణపాణియై వైరి
             దుర్వారవీరజిత్తుఁడు భజింప
నఖిలప్రపంచభయంకరకింకర
             శ్రేణులు గ్రందుగాఁ జేరి నిలువఁ


తే.

బ్రాణిసంఘాతముల పుణ్యపాతకాయు
రర్థములజాడ వ్రాసి యాయవ్యయముగఁ
జిత్రగుప్తుండు వినిపింపఁ జిత్రలీలఁ
గొలువు గూర్చున్న జమునిఁ గన్గొనియె నంత.

67


వ.

కని తద్విశేషంబు లిట్లని తలంచె.

68


సీ.

పాపపుణ్యములందుఁ బక్షపాతము లేక
             వర్తించుటను సమవర్తి యయ్యె
వరుసఁ దప్పక ప్రజాపరిపాలనము సేయ
             ధర్మరాజఖ్యాతి దాల్చి మించెఁ
బ్రళయకాలమునాఁడు ప్రాణిసంఘాతంబు
             నణఁగించుకతనఁ గృతాంతుఁ డయ్యె
సమదారివీరుల సంగ రాంగణములఁ
             బ్రహరించుటను దండపాణి యయ్యె

తే.

నిమ్మహాత్మునిగరిమంబు నెన్నవశమె
నాలుగైదాఱుమోముల నలినగర్భ
హరకుమారులకైనఁ దథ్యముగ ననుచుఁ
దలఁచి లోపల నమ్మహీధవుఁడు మ్రొక్కె.

69


వ.

అయ్యవసరంబున నత్తురంగంబు గగనంబునఁ దన్నుం గొని
చన నరిగి నైరృతీపరిపాలితం బగు పుణ్యవతీపురంబుఁ
గాంచి.

70


తే.

కర్బురావాసయోగ్యతకలిమిఁ జేసి
కర్బురావాసమహిమంబుఁ గాంచి మించి
పుణ్యజనములు తనయందుఁ బొల్చుకతనఁ
బుణ్యవతి యనుపేర నీపురము దనరె.

71


వ.

అని సంతసిల్లునెడ నాహయంబు రయంబున నభ్రపథంబునం
గొనిచనం జనిచని యసురవతీనగరంబు డగ్గఱి యందు.

72


తే.

త్రిపథగాసూర్యనందనాకృష్ణవేణి
కాదినదులును మిహికాచలాత్మనంద
నాప్రముఖనదులు నతిసౌందర్యమహిమఁ
దాల్చి యిరుమేర నిండి మోదమునఁ గొలువ.

73


క.

ప్రియ మొందు వరుణుఁ గని వి
స్మయ మొందుచు నచటఁ బాయఁజాలకయుండన్
రయమున నేగె నరేంద్రుఁడు
హయరత్నాయత్తుఁ డగుచు నట ముందఱికిన్.

74


తే.

అతిజవంబున నారీతి నరిగి యరిగి
మంజులోపవనవ్రాతమహితకుసుమ
జాతమకరందసంసిక్తశీతపవన
కలిత యగుగంధవతి వేడ్కఁ గాంచి యందు.

75

చ.

అనిశముఁ బద్మినీసముదయంబు రతిం బసిగొంచు నొయ్యనొ
య్యనఁ జనుచుం బయిన్ గువలయస్థితరేణువు చల్లుకొంచుఁ ద
ద్వనములయందుఁ గ్రుమ్మరుచుఁ దార్కొని తుమ్మెదపిండు వెంటరాఁ
గనఁబడియెన్ నృపాలునకు గంధవహుండును గంధనాగమై.

76


వ.

అప్పుడు.

77


క.

మానసవేగతురంగా
ధీనుండై సురలు పొగడ దివ్యపథమునన్
నానాద్భుతములఁ జూచుచు
నానరనాయకుఁడు చనియె నలకాపురికిన్.

78


సీ.

పల్లవసంయోగభవ్యసౌభాగ్యంబు
             నొందిన కొమ్మలయొప్పిదంబుఁ
గమనీయపద్మరాగప్రభాతతుల చేయ
             గడుఁ బొల్చు సరసులగౌరవంబు
భువనసంచారవిభూతిఁ బెంపొందిన
             రాజహంసాళివిక్రమగుణంబు
ననుపమశాఖాచయాలంబనంబున
             వఱలు సద్ద్విజకోటివైభవంబుఁ


తే.

గలిగి సుమనోవితానవిఖ్యాతిఁ జెంది
మానితం బగునిప్పురిమహిను యుపవ
నంబులగరిమ మొక్కచందమున నున్న
దారయఁగఁ జిత్ర మనుచు నయ్యవనివిభుఁడు.

79


సీ.

భూషణమాణిక్యములు నీరమై పాఱఁ
             గిన్నరుల్ మోహనక్రీడఁ బాడఁ

దాళసంఘప్రభేదంబుల గతులచే
             యక్షకామినులు నాట్యంబు లాడఁ
గ్రంత లంతంతఁ జక్కటి గాఁగ జడియుచు
             వేత్రహస్తులు నిండువేడ్క నిలువ
నైజప్రతాపగుణంబు లొక్కుమ్మడి
             వందిమాగధకవివరులు పొగడఁ


తే.

జండకోదండశరఖడ్గభిండివాల
శూలకుంతగదాపరిఘాలిఁ బూని
వీరరసమెల్ల రూపులై మీఱినట్లు
యక్షకిన్నరవరులు నెయ్యమునఁ గొలువ.

80


సీ.

ఆత్మప్రియావిరహానలజ్వాలచేఁ
             గందుట నంగంబు కాంతి చెదర
వేఁడినిట్టూర్పుల వెచ్చవాడినయట్టి
             బింబాధరంబున బీట లెగయ
నంతరంగములోని చింతాభరంబున
             విమలాననంబు వెల్వెలకఁబాఱ
ననవరతంబు నిద్రాహారములులేమి
             బడలిక తొడవులు సడలి రాల


తే.

నుబుసుపోకకుఁ దనయొద్ద నున్నవారి
తోడఁ బ్రియురాలి మేలిసుద్దులు నుడువుచుఁ
గాంచనాంచితమణిపీఠికాతలమున
నుండి చేరువ నలకూబరుండు గొలువ.

81


తే.

పెద్దకొలువున మాణిక్యపీఠియందు
నుచితవైభవ మేర్పడ నున్నయట్టి

కిన్నరేశ్వరుఁ బ్రేమ నీక్షించె నా న
రేశ్వరుఁడు దనమనమున నెసఁక మెసఁగ.

82


సీ.

సత్ప్రవాళప్రభాసమితి యెల్లెడఁ బర్వి
             యధికసంధ్యారాగ మట్లు చెలఁగ
నీలంపుమణులందు జాలువాఱినకాంతి
             యొఱపు చీఁకటిగుంపు వెఱపు జూప
నభినవముక్తాఫలానీకములయొప్పు
             తారకాదీప్తిచందంబు గెలువ
నిర్మలవజ్రమాణిక్యసౌభాగ్యంబు
             పూర్ణిమాచంద్రికాస్ఫురణ నెఱపఁ


తే.

బద్మరాగావళిప్రభాపటల మెల్ల
లేఁతయెండలతెఱఁగున భాతిఁ దనర
మీఱి నక్తందివంటులేమియును బుద్ధి
నెఱుఁగనీనట్టి [13]బాందురునిండ్లఁ జూచె.

83


తే.

అంత నారాజు ఘోటకాయత్తుఁ డగుచు
నరిగి యభ్రంకషస్వచ్ఛహర్మ్యసాల
మహితనానామణిప్రభామహితచండ
భానుమండలియైన యైశానిఁ గనియె.

84


క.

కని యచ్చటఁ బ్రమథులు మును
లును సిద్ధులు సాధ్యులు సురలున్ రుద్రులుఁ గొ
ల్వున నిల్వ నలరు నీశా
నునిఁ జూచి నమస్కరించి నుతియించె వెసన్.

85

క.

ఆసైంధవవశగతుఁడై
భాసురగతి నతఁడు చనియెఁ బ్రమథేశనిజా
వాసమునకు నున్నతకై
లాసమునకు ధవళరుచివిలాసంబునకున్.

86


వ.

చని.

87


క.

భూకాంతుఁడు తత్తటమున
శ్రీకంఠశిరశ్శశాంకరేఖాకిరణ
వ్యాకులితస్థలనలినీ
లోకంబగు నుపవనంబు లోలతఁ గాంచెన్.

88


వ.

ఇట్లు కాంచి.

89


తే.

కోరి వెండియు నావెండికొండ డాయ
నరిగి భక్తియు ముదము నచ్చెరువు నాత్మ
లోన సందడిగొనఁగ నెమ్మేను పొంగ
నాననము వంచి మ్రొక్కి యి ట్లని నుతించి.

90


తే.

శృంగములబాగుఁ బై చాయ చెలువుఁబాద
వైపులంబును జూడఁ బర్వతవరంబు
నందికేశ్వరుచందంబునం దనర్చె
భాసురంబుగ శంకరావాస మగుట.

91


చ.

హరిచరణంబునం బొడమె నండ్రు విధాతృకమండలూదక
స్ఫురణ జనించె నండ్రు మనుజుల్ సురవాహిని నట్లు గాదు నీ
వెరవునఁ జూచి తారపృథివీధరబంధురకందరంబునం
దిరవుగఁ బుట్టినట్టి సెలయేఱని యిప్పుడు నిశ్చయించితిన్.

92

చ.

హరహర యిగ్గిరిస్థలము సందులమింటికనామలంతలుం
గరముల రుక్మిణీప్రభలు గల్గినపాదము లియ్య కున్న నా
డరుచుల కోరనించక యొడంబడి వేడుకతోడ బ్రాలు ప్రో
వరు నెలవంకచుంచుల నవశ్యము గట్టక నవ్వ రెంతయున్.

93


వ.

అని వినుతింపుచుం బురోభాగంబున నొక్కమహోత్సేధ
సౌధంబునందు.

94


చ.

అనుపమరాజశేఖరు లనంతవిభూతులు సద్విభూతివ
ర్ధనులు హరిద్విశేషపరిథాను లుదారులు శంకరులా జగ
ద్వినుతపరాక్రమాఢ్యులు పవిత్రులునైన గణంబు లెల్ల స
ద్వినయముతోడఁ గొల్వఁగ నవీనరుచుల్ దిలకించు పీఠికన్.

95


చ.

కదలుప రానితేరు గిరికందరభాగపుటూరు చుట్టగా
మెదలెడు పేరు సౌఖ్యములు మీఱి యొసంగెడు పేరు మౌళిపైఁ
బొదలెడు నేఱుఁగల్లు ఫణిభూషణుఁ డింపులు మీఱ వేడుకన్
ద్రిజశులు కోరి కొల్వఁగ సతీయుతుఁడై ఘనరాజసంబునన్.

96


సీ.

మొలకకెంజడలలో మూఁడుత్రోవలయేఱు
             బాలేందురేఖ జంపాల [14]లూఁగఁ
జెఱకువిల్కానికిఁ జుఱుకుచూపినకన్ను
             తేట కుంకుమబొట్టుతెఱఁగు దాల్పఁ
గళలచేఁ బ్రొద్దులు గడపనేర్చిన లోచ
             నంబులఁ గరుణారసంబు చిల్క
వెకిరింత బెదరించు మెకమువన్నియ మించు
             చెఱఁగుదుప్పటి కటిసీమ మెఱయ

తే.

మొదలిచదువులు
పదురులఁ బొదలునట్టి
మ్రోఁత గనుపట్టు బహుముఖంబులఁ దనర్చు
బిరుదమణి నూపురము సవ్యచరణ వారి
జమున వెలుఁగొంద సంతతోత్సాహలీల.

97


సీ.

నెలవంకతీరునఁ బొలుపగుదంతంబు
             నెమ్మోముమీఁద వెన్నెలలు గాయ
దానవారికి మూఁగి తలరనితేఁటులఁ
             గర్ణచామరము లొక్కట హరింప
నడుముఁ దార్కొలిపిన నాగబంధపుముడి
             పొంకంబుగల కుండబొజ్జ గదలఁ
బసిఁడినిగ్గులు దేరు బాహుదండంబులఁ
             బాశాంకుశంబులు బాగుఁజూప


తే.

మౌళి శశిరేఖ దిలకింప మద మెలర్ప
నంబ చిఱునవ్వు నవ్వ నెయ్యమున నెలుక
పిలుకవార్వంబు నంతంతఁ బేరెమెక్కి
యాడు లంబోదరుఁడు మోద [15]మామతింప.

98


శా.

చాపజ్యాకిణకర్కశంబు లగుహస్తంబుల్ [16]మరుద్భూజశా
ఖాపాణింధమరీతిఁ జెన్ను మెఱయంగా మౌళి మాణిక్యశో
భాపుంజంబు దివేంద్రమండలముఁ గప్పం జాపబాణంబు లా
టోపం బొప్ప ధరించి యచ్చట గుహుండున్ ప్రేమతోఁ గొల్వఁగన్.

99


వ.

ఇవ్విధంబున గరుడగంధర్వకిన్నరకింపురుషయక్షరాక్షస
సిద్ధసాధ్యవిద్యాధరామరేంద్రాదిదిక్పాలకులు గొలువం

బేరోలగంబున్న పన్నగాభరణుం డగుపరమేశ్వరుండు
మనంబున మెచ్చునట్లుగా మణికుండలహయగ్రీవులు కుంభీ
నసరాజకుమారులు నుదంచితస్వయంభూతస్వరామోదను
లగు పరివాదినులు ధరించి సమ్మేళనంబుఁ జేసి షడ్జగాంధార
మధ్యమనామంబులం బ్రసిద్ధంబు లగు గ్రామత్రయంబు
లును, స్థాయ్యారోహ్యవరోహిసంచారిభేదంబుల నొనరు
నలంకారవిధంబు లరువదిమూఁడును, జనసమ్మోహనకారి
ణు లగుమూర్ఛన లైదువేలున్నలువదియుఁ, దచ్చతుర్గుణితం
బులగు శుద్ధంబు లిఱువదివేలున్నూటఱువదియు ననేకంబు
లగుకూటతానంబులును ద్వావింశతిశ్రుతిభేదంబులుం
గల షడ్జాదిసప్తస్వరంబులం దనరుసప్తగ్రహవిశేషంబులం
జెన్నొందు షాడవౌడవసంపూర్ణంబు లనంబరఁగు రాగం
బులు మున్నూటఱువదినాల్గుఁ దత్తన్మిత్రసంయుక్తంబుగా
నప్పరమేశ్వరుప్రబంధంబులు పాడఁ జిత్రసేనమణిపూరు
లను గంధర్వనాయకులు తాళంబులు ధరించి త్రుటిక్షణ
లవకాష్ఠానిమేషకళాచతుర్భాగానుద్రుతద్రుతలఘు
గురుప్లుతంబు లనుకాలభేదంబులను ధ్రువచిత్రవార్తిక
దక్షిణచిత్రతరంగంబు లగుమార్గచతుష్టయంబులు నావాప
నిష్క్రామవిక్షేపప్రవేశకనిశ్శబ్దాదిక్రియాభేదంబులు నగు
ద్రుతలఘుగురుప్లుతకృతంబులగు పంచాంగంబులు నతీతా
నాగతసమంబు లగుగ్రహంబులను జతురశ్రత్యశ్రమిశ్ర
ఖండసంకీర్ణజాతులును ద్రుతమధ్యవిలంబితంబు లగులయ
లును గోపుచ్ఛస్రోతోవహపిపీలికాయవాదిభేదంబు లగు
యతులును దత్తత్ప్రస్తారంబులు ప్రాణదశకంబునం దనరు
చంచత్పుట చాచపుట షట్పితాపుత్రక సంపద్వేష్టా

కోద్భుట్టాదితాళదర్పంబులు మొదలగు నూటొక్కతాళం
బుల నొత్త భృంగీశ్వరుండు పతాకాత్రిపతాకార్ధచంద్ర
కటకాముఖ్యాద్యసంయుతహస్తంబు లిఱువదినాల్గును
స్వస్తికగజదంతాదిసంయుతహస్తంబులు పదుమూఁ
డును స్థాయిసంచారివ్యభిచారిభేదంబులం దనరు దృష్టులు
ముప్పదితొమ్మిదియుం గుంచితావనతకంపితసమంబు లనం
బొల్చు శిరోభేదంబులను వృశ్చిక[17]ఛిద్రమయూరమండలాది
కరణంబులుం జక్రాదిభ్రమణవిశేషంబులు గలతాండవంబు
బహువిధగతులం జూపి రంత.

100


శా.

శుభ్రాంశూజ్జ్వలమౌళి మెచ్చి శిర మస్తోకంబుగా నూఁపె జూ
టాభ్రద్వీపవతీప్రవాహచలనవ్యాధూతహేమాంబుజా
దభ్రామోదభరప్రమత్తమధుపద్వంద్వాతిఝంకార[18]రిం
ఖాభ్రాజచ్చటులోర్విరావములు దిగ్వ్యాప్తంబులై నిండఁగన్.

101


వ.

అయ్యవసరంబున.

102


శా.

ఆవిశ్వేశ్వరుఁ జూచి యవ్విభుఁడు జాతానందుఁ డై "శ్రీమహా
దేవాయ త్రిపురాంతకాయ గిరిజాధీశాయ కుంభీనస
గ్రైవేయాయ నమో నమోస్తు విమలాకారాయ తే మేచక
గ్రీవాయ ప్రమథాధిపాయ” యని మ్రొక్కెన్ నిర్వికారాత్ముఁడై.

103


మ.

అనఘా, వెండియు నూర్ధ్వమార్గమున నశ్వాధీనుఁడై రాజు దాఁ
జనియెన్ భూమికి లక్షయోజనముపై చాయ న్విలోకింప భా
వన సేయంగ నశక్యమై తనరు దివ్యజ్యోతిరాకారమై

ఘనమై మించిన భానుమండలము వేడ్కం జూచి
సాశ్చర్యుఁడై.

104


ఉ.

సారథి కుంటియట్టె రథచక్ర మొకండటె పాముపిండు దు
ర్వారపురజ్జుసంఘమఁటె వాహము లెన్నఁగ బేసియట్టె సం
చారతలంబు రిత్తయఁటె సర్వము పొందుగఁ గూర్చి యెప్పుడుం
మేరువుచుట్టి వారునఁటె మిత్రచరిత్రము చిత్ర [19]మంతయున్.

105


సీ.

జలజాలయానాథు చక్కనికుడికన్ను
             జగముల మించు తేజముల చెన్ను
ద్విజసమూహములు సేవించు మ్రొక్కుల దిన్న
             చదువులఁ గొనియాడు మొదలిపన్న
మనఘులబ్జజలోకమున కేగు పెంద్రోవ
             సానదీఱిన రశ్మిచయము చేవ
గాఢాంధకారసంఘమునకు వెఱగొంగ
             ధరణీజలంబులఁ దార్చుదొంగ


తే.

తెలివి మీఱంగ మింటను దిరుగుదంట
కలువలకుఁ గుందు జక్కవ కవలపొందు
మూఁడుమూర్తులు కలరూపు వేఁడిప్రాపు
నగునితనిఁ గంటి భవముల నడఁపఁగంటి.

106


వ.

అనునవసరంబున.

107


చ.

అనుపమ వేగశాలి యగునశ్వము ద న్గొనియేఁగ రాజు స
య్యనఁ జనియెం దినేశనిలయంబునకంటెను మీఁద లక్ష
యోజనములమేర నెంతయు విశాలతఁ బొల్పగు చంద్రమండలం

బునికటసీమకున్ దివిజపుంగవు లద్బుతమంది చూడఁగన్.

108


క.

చని యాజననాథుఁడు దన
మనమున సంతసము సంభ్రమంబు న్వెఱఁగున్
బెనఁగొనఁగ వనజవైరిం
గని యీగతిఁ బొగడె నాగకన్యాతనయా.

109


సీ.

సురవరు లమృతంబు వరుసఁ గ్రోలెడుకోర
             కాముకశ్రేణికి ఖడ్గధార
శివునియౌఁదలమీఁది చిన్నిక్రొవ్విరిమొగ్గ
             మిసిమి మించిన సుధారసముబుగ్గ
కలుముల నిచ్చు చక్కనికాంత సైదోడు
             తోయజబాంధవుతోడిజోడు
నిఖిలలోకంబుల నిక్కు చీఁకటిమిత్తి
             విలసిల్లు షోడళకళలగుత్తి


తే.

నిండు చెలువంపుఁబ్రోవు వెన్నెలలఠావు
కలువలకు విందు తామరగములకుందు
దీధితులసీమ రోహిణీదేవిప్రేమ
లోకహితకారి యీచక్రవాకవైరి.

110


సీ.

అనుచు నబ్జారాతిఁ గొనియాడు యాచతు
             ర్ధనుఁడు హయంబు త న్గొని చనంగఁ
దారకాకవిసౌమ్యధరణిజగురుసౌరి
             సప్తర్షిమండలస్థలులు గడచి
ధ్రువుని నాలోకించి మొక్కి తదూర్థ్వలో
             కంబులు దాఁటి తేజంబులకును

నిత్యాలయంబగు సత్యలోకముఁ జేర
             నరిగి నేత్రానంద మావహిల్లఁ


తే.

జారుమాణిక్యకీలితసౌధయూధ
వారిజోత్పలరుచిరకాసారవార
సతతఫలభారనతపారిజాతజాత
భూషితంబగు నొకమహాపురవరంబు.

111


క.

వీక్షించి యందు నృపహ
ర్యక్షుం డైందవశిలామయంబును మణిసం
లక్షితవేదీయుతమ
ధ్యక్షోణియు నైనయొక్కహర్మ్యములోనన్.

112


సీ.

ఎల్లదివ్యులకు మునీంద్రసంఘములకు
             మొదలై చెలంగెడు మూలదుంప
పాలు నీరును వేరుపఱుప నేర్చినయట్టి
             యంచతేజీ నెక్కి యాడురౌతు
పని లేనిపని కైనఁ బాఱి కైలాటకం
             బులు సేయుమునిఁగన్న ప్రోడవేల్పు
దొడ్డ కొంచెము లేక తుది నెట్టివరమైన
             జనవున నిచ్చు జన్యాళికాఁడు


తే.

వెలఁది తనతలవాకిలి వెడలనీక
పలుకులోపల నడపించుసాటి జాణ
బొడ్డుతామరపువ్వునఁ బొడమినట్టి
[20]ముద్దుపాపఁడు నాలుగుమోములాఁడు.

113

తే.

సకలయోగీంద్రవరులును సంయములును
గరుడగంధర్వయక్షకింపురుషసిద్ధ
సాధ్యసురనాగకిన్నరసముదయంబు
వినయసంభ్రమరీతి సేవింపుచుండ.

114


సీ.

ఏరాజవదనకు హేమగర్భానన
             కమలముల్ భవ్యశృంగాటకంబు
కంబుకంఠికి నిందురేఖ దలంపఁ
             గొప్పుపైఁ జెలువొందు కుసుమకళిక
యేపద్మనేత్రకు నిందిరాపార్వతీ
             కంజాతముఖులు సంగడపుఁజెలువ
లేనీలవేణీకి నానావిధామ్నాయ
             [21]పఠన యాదృచ్ఛికభాషణంబు


తే.

లేజగజ్జననికి నంచ యెక్కిరింత
యేలతాకోమలాంగికి నీసరోజ
సంభవాండంబులో నున్న సకలభువన
ములును జిన్నారిపొన్నారిబొమ్మరిండ్లు.

115


తే.

అట్టివాగ్దేవి మాతృక లలమి కొలువఁ
గమలపీఠికఁ దనయంతికంబునందుఁ
గదిసి కూర్చుండఁ బేరోలగమున నున్న
నలినగర్భునిఁ జూచి వందన మొనర్చె.

116


వ.

ఇవ్విధంబున సమస్తమునియోగిదేవతాసమేతుండును,
భారతీసమన్వితుండును నగునప్పయోరుహగర్భునకు రత్న
గర్భావల్లభుండు విసయపూర్వకంబుగా నమస్కరించియున్న

యవసరంబున నయ్యుత్తమాశ్వంబు సత్యలోకంబుననుండి
తిరిగి తుల్యమునిశాపార్ణవంబునకుఁ దరియనంబోని చక్ర
వాళపర్వతంబునకు డిగ్గుటయు నన్నగంబుఁ జూచి యతండు
సంతోషభరితాంతఃకరణుండై యిట్లని తలంచె.

117


సీ.

అనిశంబుఁ బగగొన్నయట్టి తేజస్తమం
             బులకును బొలిమేరఁ దెలుపు నిక్క
సర్వంసహాకాంత సవరించు హేమ నా
             నారత్నరచితశృంగారరచన
పుండరీకాదిదిక్శుండాలసంఘంబు
             దండమై విహరించు తానకంబు
గ్రహతారకాదు లొక్కట నహర్నిశమును
             సరవితోఁ దిరుగు విశ్రామభూమి


తే.

పొడవులకు నెల్లఁ బొడవు వేల్పులు చరించు
నెలవు దివ్యౌషధంబులు గలపొలంబు
గండభేరుండశరభసంఘాతములకు
మనికిపట్టును నయ్యె నీక్ష్మాధరంబు.

118


వ.

అని పొగడునవసరంబున నాహయంబు దన్నుంగొని చన
నతివిశాలంబగు హేమ[22]భూమీధరంబు గడచి శుద్ధోదక
సముద్రోత్తరతీరంబు చేరునెడ.

119


క.

పాపాంధకారపటలీ
దీపము సనకాదిసకలదివ్యమునీంద్రా
టోపము భాస్వచ్ఛ్వేత
ద్వీపము[23]ను జతుర్థనాఖ్యవిభుఁ డీక్షించెన్.

120

వ.

అది మఱియు ననంతచంద్రప్రభాపాండురంబును, నగణిత
కల్పపాదపసమాకీర్ణంబును గనకకమలకల్హారగంధబంధురం
బునునై కనుపట్టెఁ దన్మధ్యంబున.

121


క.

అమరావతియను నొక్కపు
రము శంకరధరకనకధరాధరశృంగో
పమరమ్యహర్మ్యమహిమల
విమలప్రాకారములను విలసిల్లుఁ గడున్.

122


ఆ.

బహువితానవితానవిభ్రాజితములు
భూరిఘంటాసహస్రవిభూషితములు
చిత్రరత్నమయూఖభాసితములు నగు
పుష్పకంబులు మెలఁగు నప్పురవరమున.

123


సీ.

ఱెక్కతేజీలపై నెక్కి మిన్నులు ముట్ట
             నందందు వడిఁ దోలి యాడువారి
ఘనభుజాసత్వంబు గనుపట్ట సంగడం
             బులు చేసి శైలముల్ మోచువారి
విపులబాహామధ్యవీథిఁ గాంతులు నిండఁ
             గెంపులు దార్చి సుఖించువారిఁ
ప్రేమాతిశయముల భామల నురమున
             డించక యేప్రొద్దు నుంచువారి


తే.

[24]వేయి తలగడలనుగల వెల్లపాన్పు
లందుఁ బవళించి యానంద మొందువారిఁ
గన్నుసన్నల ప్రొద్దులఁ గడపువారిఁ
గని నృపాలుండు బుద్ధి నిట్లని తలంచె.

124

మ.

నరపాలత్వము దోషహేతువు మహేంద్రత్వంబు నీక్షింప న
స్థిర మంభోరుహసంభవత్వము మదిం జింతింప లోలంబు నీ
నిరతం జెందఁగ నేల యంచు నెఱుపూన్కిన్ వైష్ణవుల్ దేవతాం
తరమంత్రాంతరసాధనాంతరములన్ వర్జించి శుద్ధాత్ములై.

125


మ.

గురుఁ డేకైవడి విష్ణుపూజనము దక్షుండై కృపం జెప్పె నా
వెర వొప్పన్ గమలాధినాథు [25]దమహృద్వీథికిన్ మహాభక్తి సు
స్థిరుఁ గావించి సమస్తకర్మములుఁ దత్ప్రీత్యర్థమై చేయుచున్
హరిచిహ్నంబులు మేనఁ దాల్చి నిరపాయంబైన యిచ్చోటునన్.

126


క.

ఉన్నారు విష్ణుభక్తిన్
మన్నారు సమస్తలోకమహిమల నెల్లన్
గన్నారు హరిచరిత్రలు
విన్నారు మహాత్ము లీపవిత్రులు దలఁపన్.

127


తే.

అనుచు నావిష్ణుభక్తుల కతిముదమున
మ్రొక్కి యజ్జననాథుఁ డంభోజగర్భ
సదృశు [26]లయినట్టి నమ్మునీశ్వరుల కెల్ల
వినయపూర్వకముగను వందనముఁ జేసి.

128


సీ.

విమలరహస్యమంత్రముల నెమ్మదిఁ బూని
             తంత్రంబు లెల్ల [27]మోదమున నడిపి
సకలాంగములనెల్లఁ బ్రకటంబు గావించి
             షడ్గుణైశ్వర్యవిశ్రాంతిఁ జెంది

యరిసమూహములఁ బొరిఁబొరి నణఁగించి
             కడుదోరమైన దుర్గముల నిల్పి
సతతసర్వంసహాసంపత్తిఁ జెలువొంది
             సంతోష బుద్ధి నిచ్చలును బొదలి


తే.

యవ్యయతపోధనంబు లత్యంతనియతిఁ
గూర్చి శ్రేయఃపదప్రాప్తిఁ గొమరు మిగిలి
రాజులను రూఢి కెక్కినరాజయోగి
రాజులను జూచి మ్రొక్కె నారాజవిభుఁడు.

129


వ.

అయ్యవసరంబున ఘోటకంబు దన్నుం గొనిచనఁ జనిచని
తత్పురలక్ష్మీతిలకాయమానం బగుశతకోటిబాలార్క
ప్రభాబ్జరాగరౌప్యహేమమయంబై చందనాగరుధూప
వాసనావాసితంబై దివ్యకాంతాసహస్రసేవితంబై యనవ
రతపఠత్కీరశారికాసామగానమనోహరంబై యొప్పు నప్పు
రంబున.

130


తే.

బాలభానున కెనయైన భవ్యదివ్య
నవ్యమాణిక్యసింహాసనంబుమీఁద
నాత్మవక్షస్స్థలీకౌస్తుభాయతప్ర
భాసమూహంబు దిక్కులఁ బరిఢవిల్ల.

131


చ.

కనకమహీధరాగ్రమునఁ గానఁగవచ్చు నినేంద్రమండలం
బన మకుటంబు చెన్ను మెఱయంగ మెఱుంగిడినట్టి పైఁడిక
మ్మి నగెడుమేన వెన్నెలలమించులు చూపెడి వెల్లపట్టు[28]చే
ల నెఱులు వాఱఁగట్టి కమలాహృదయేశ్వరుఁ డేపు మీఱఁగన్.

132

సీ.

కౌస్తుభమాణిక్యకలితమై విలసిల్లు
             నురమున ముత్యాలసరులు మెఱయ
నతులితవజ్రకీలితదివ్యకుండలం
             బులకాంతి మెఱుఁగుఁజెక్కుల నటింప
భర్మాచలోభయపార్శ్వస్థశశిచండ
             కరులుగా శంఖచక్రములు దనరఁ
గమలాలయాంఘ్రిలాక్షాలాంఛనం బన
             నొసలఁ గుంకుమబొట్టు పసలు చూపఁ


తే.

గలువలకుఁ దమ్ములకు నవ్వుఁ గఱువు లోచ
నంబుల ననూనకరుణారసంబు చిలుక
నఖలమోహనాకారుఁడై యాజనార్ధ
నుండు గొలువుండెఁ గన్నులపండువుగను.

133


సీ.

తనపాదలాక్ష భూధరసుతాది నిలింప
             భామినీసిందూరపటలి గాఁగఁ
దనయపాంగము జగద్దారిద్ర్యతిమిరౌఘ
             పరిపూర్ణచంద్రాతపంబు గాఁగఁ
దనవినోదక్రీడకును బద్మసంభవాం
             డంబులు చిన్ని[29]పన్నళ్లు గాఁగఁ
దనదృష్టికిని విరించనముఖ్యదేవనా
             యకులెల్ల సాలభంజికలు గాఁగఁ


తే.

దనరు నేయింతి యట్టిపద్మావధూటి
కమలవసుపాత్ర మాతులుంగ ముకురములు
నాల్గుచేతుల నలర నానలిననేత్రు
నంకపీఠిక నుండె నయ్యవసరమున.

134

వ.

ఆ చతుర్ధనజననాయకుం డద్దేవదేవుసభామంటపంబున సన
కసనందనాదులం గనుంగొని వినమితశిరస్కుండై పురో
భాగంబున.

135


తే.

శ్రీహరికి నాత్మభోగ మర్పించి శాంత
మూర్తియై పెక్కుభంగుల మొనసి సేవ
సేయు పన్నగరాజు నీక్షించి యమ్మ
హీవరుఁడు నాతనికి నమస్కృతులు చేసి.

136


వ.

తదనంతరంబ.

137


సీ.

తనతల్లి దాస్యంబు దప్పింప హరి నోర్చి
             యమృతంబుఁ దెచ్చిన యధికుఁ డితఁడు
క్ష్మాధరంబులఁ బోలు గజకచ్ఛపంబులఁ
             గబళించి మ్రింగిన ఘనుఁ డితండు
బ్రహ్మాండసంఘధురంధరుం డగు విష్ణు
             నవలీలఁ దాల్చు మహాత్ముఁ డితఁడు
సకలవేదములు శాస్త్రములు సంగములుగా
             జనన మొందిన పుణ్యచరితుఁ డితఁడు


తే.

పాపరాయని మదిలోని భయము మాన
శాంతిఁ ద్రిమ్మరు పాపభంజనుఁ డితండు
అనుచు నారాజశేఖరుఁ డహివిరోధిఁ
గని నుతుల్ చేసె క్షేమంబు గడలుకొనఁగ.

138


శా.

విష్వద్ర్యఙ్మహనీయకీర్తిఁ ద్రిజగద్విఖ్యాతచారిత్రుఁ డీ
వ్యేష్వాసోజ్జ్వలహస్తు సర్వరిపువాహిన్యంధకారార్కునిన్
విష్వక్సేనపదాంబుజార్చనవిధావిజ్ఞానపారీణు న
విష్వక్సేనునిఁ జూచి మ్రొక్కె నిఖలోర్వీభర్త సంప్రీతితోన్.

139

వ.

ఇట్లు మ్రొక్కి యనంతరంబ జయవిజయులకుం బ్రణమిల్లి
యష్టమహాశక్తుల కభివందనంబు చేసి.

140


తే.

తమ్మిలోఁ దరితుమ్మెద కొమ్మలెల్ల
నెమ్మి సుడిగమ్ము లొనరింప సమ్మదమునఁ
బొదలు కలశాబ్ధికన్యకుఁ బుండరీక
నయనునకుఁ బ్రేమ నెఱఁగి యన్నరవరుండు.

141


వ.

తదనంతరంబున నిట్లని తలంచె.

142


చ.

అనిశము నేమునీంద్రులు మహానియమంబున నేజగత్పతిం
గనుఁగొనఁ గోరి పుత్త్రధనకాంతల నాదిగ నుజ్జగించి కా
ననములు చేరి ధీరత ననారతముం దప మొప్పఁ జేసి రా
ఘనులు నెఱుంగలేని హరిఁ గంటిఁ బురాకృతపుణ్య మెట్టిదో?

143


క.

అని తలఁచుచు నజ్జనపతి
మనమున సంతసముఁ బ్రేమ మార్కొన నొండొం
[30]టిని దరుమ హర్షపులకిత
తనుఁడై వినుతించె బహువిధంబుల భక్తిన్.

144


వ.

అని శుకయోగీంద్రుం డిలావంతునకుఁ జెప్పినవిధం బెఱిం
గించిన విని యటమీఁదివృత్తాంతం బేమని యడుగుట
యును.

145


శా.

శ్రీలక్ష్మీశ్వరపాదభక్తినిరతా చిత్తాబుఖానక్షమా
పాలాగ్రేసర సత్కృపాకలిత దీవ్యద్వీటికాపేటికాం
దోళీఛత్రకళాచికామణిగణానూనాంకచేతోభవ
ప్రాలేయాంశు జయంతరూప రిపువీరవ్రాతసంహారకా.

146

క.

సతతాన్నదానసువ్రత
శతమఖవిభవాఢ్యదీనజనదౌర్గత్య
క్షితిధరశతకోటిమహా
వితరణగుణభూషసుజనవినుతచరిత్రా.

147


తోదకము.

భావజమూర్తి నృపస్తుతకీర్తీ
పాపనశీల కృపారసలోలా
రావణవైరి పరాక్రమహారీ
యౌవతనేత్రవరాంబుజమిత్రా.

148


గద్యము.

ఇది శ్రీమత్కౌండిన్యగోత్రపవిత్ర చరిగొండ తిమ్మ
నామాత్యపుత్త్ర సకలవిద్యాపారీణ శతఘంట సురత్రాణ
సుకవిజనవిధేయ ధర్మననామధేయప్రణీతం బయినచిత్ర
భారతం బనుపురాణకథయందుఁ జతుర్థాశ్వాసము.

  1. నిరులై
  2. దగన్
  3. న్దరుణి యొకర్తు మెచ్చి బిరుదంబుగ నుం... పలన్ ఘటించెగాన్.
  4. నిలువ
  5. బటవణి యిడి వీ
  6. మస్తరింపఁగా
  7. జన్మకారణంబు
  8. లేనగవు పొంద
  9. కాఁకమెయిఁ బోరడనం
  10. నను పొందగ
  11. డేగుచోన్
  12. జండకోదండభీషణఖడ్గపాణియై
                 దుర్వారలీలఁ జిత్రుఁడు భజింప
  13. రతనంపుటిండ్ల
  14. లూఁపఁ
  15. మావహించి
  16. నమే రుద్రుశాఖా
  17. ఛత్ర
  18. కం, కాభ్రాచ్ఛచ్చటులోర్విరావములు
  19. మీత్రయిన్.
  20. ముదుకలాగుల
  21. పటలి
  22. భూమి గడచి
  23. న తురంగుఁ డైనవిభుఁ
  24. వేయుదలలతలగడల
  25. నిజహృద్వీథిన్
  26. లై తగుసన్మునీశ్వరుల కెల్ల
  27. మోదమునఁ జల్పి
  28. చీ,ర
  29. పనంట్లు గాఁగఁ, పన్నార్లు గాఁగఁ
  30. టను బరమహర్షపులకిత