చిత్రభారతము/ద్వితీయాశ్వాసము

శ్రీరస్తు

చిత్రభారతము

ద్వితీయాశ్వాసము



ధర్మపురనృసింహా
రాధనతాత్పర్యబంధురక్షామణి ధా
త్రత్రీధవనుత యెనుములపలి
మాధవతనుజాత పెద్దమంత్రివరేణ్యా.

1


వ.

అవధరింపుము మృదుమధురవచనరచనాపరితోషితముని
జాతుం డగుసూతుండు హరికథాశ్రవణాహ్లాదు లగుశౌన
కాదులకు ని ట్లనియె.

2


క.

పగ లెల్ల జలదరాశికిఁ
బగలై కొనసాగె నంతఁ బద్మాప్తుండున్
మిగులంగ నుగ్రుఁడై జగ
ము గలంచఁగ గ్రీష్మకాలము న్వడి వచ్చెన్.

3


ఆ.

విశ్వశర్మబిడ్డ వేదన మాన్పంగ
రవి మధించి కిరణనివహములను
ధరణీమీఁద వైవ నురుతరోగ్రంబులై
వఱలె ననఁగ దావవహ్ను లొదవె.

4

తే.

లోకములజీవనం బెల్ల [1]లోనుబుచ్చి
తనకరంబులఁ గువలయస్థలము మేలుఁ
జెఱిచి కడువెట్టయైన రాజీవబంధుఁ
డెట్లు తా మిత్రుఁ డయ్యెనో యెంచిచూడ.

5


సీ.

భూతలంబెల్ల నద్భుతముగాఁ బగులంగఁ
             బాతాళలోకంబు బైలుపడియె
జలధిలోఁ గల నీరజంతుసంఘాతంబు
             నుడు కెక్కి యంతంత నొదుఁగఁ జొచ్చె
ధూళీసమాక్రాంతతోయదపదముగా
             నెస రేఁగి గాడ్పులు విసరఁదొడఁగె
నతిగభీరనదీమహాప్రవాహంబుల
             నిసుమేరుపడఁగ నీ రెల్ల నింకె


తే.

నౌర పురుహూతకమలభవాదులకును
[2]వెస వనితల యధరరసము సవి సుఖముఁ
గనిన నోరికి వేఁడి పాల్గొనినభంగిఁ
జేయునన పెట్ట మఱి వేఱ చెప్పనేల.

6


మ.

అమరస్థానవిశేషమై తనరు హేమాద్రిన్ శివావాసమై
రమణీయం బగురౌప్యభూధరముఁ దేరన్ బ్రహ్మ వీక్షించి నె
య్యము సంధిల్లఁగ వానిపై సురనదిన్ హత్తించె లేకున్న నా
యమరక్ష్మాధరము న్హరాచలము నీఱై పోవవే యెండచేన్.

7


క.

మృగతృష్ణల కగ్గలమై
మృగతృష్ణలు దిక్కులందు మించందొడఁగెన్

మృగరాజులు నానావిధ
మృగరాజులు [3]హరులు కరులు మెలఁగక డాఁగెన్.

8


చ.

మిటమిటఁ గాయు నాతపము మించఁగ నోర్వక గండశైలముల్
పెటపెట ప్రేలి పేలములపెంపు వహించెను జీవకోటులున్
బొటబొటఁ బొక్కె భూమిగల భూజములందు మహోగ్రవృత్తిమైఁ
జిటచిట నిప్పు లుప్పతిలెఁ జెప్పఁగరాని నిదాఘవేళలన్.

9


వ.

అట్టి సమయంబున.

10


మ.

గురుబాహాయుగ మెత్తి వామచరణాంగుష్ఠంబునన్ భూమిఁ ద్రొ
క్కి రమావల్లభు నాత్మలో నునిచి వీక్షింపంగ రానట్టి భా
స్కరుపైఁ జూపులు నిల్పి తుల్యుఁడు సమగ్రబ్రహ్మనిష్ఠారతిన్
బరమాశ్చర్యముగాఁ దపంబు సలిపె న్బంచాగ్నిమధ్యంబునన్.

11


వ.

అంత.

12


క.

జీమూతాక్రాంతంబగు
భూమండల [4]మనఁగ నానభోమండలమున్
జీమూతాక్రాంతముగా
జీమూతాగమము దోఁచెఁ జిత్తం బలరన్.

13


చ.

అనిమిషనాథుఁ డమ్మునితపోనలకీలల నబ్ధి యింకినన్
దనకు విపక్షుఁడై యచట దాఁగిన యాహిమవన్నగాత్మజున్
గినిసి విపక్షుఁ జేయఁ గమకించి ప్రచేతసునింట నిర్గమం
బనిచెడువి ల్లనంగ సపరాశసురేశ్వరుచాప మొప్పెఁ దాన్.

14

తే.

ఇంద్రగోపంబు లవనిపై నెల్లయెడలఁ
గానిపించె సురేంద్రుఁ డగ్గలికతోడఁ
దపముగావించు మౌనిఁ గ్రోధమునఁ జూడఁ
గన్నుగమిరాలు విస్ఫులింగము లనంగ.

15


చ.

కరములు చాఁపి వడ్డిడుటకై బుధశుక్రులసాక్షి పెట్టి య
య్యరుణుఁడు భూమిచేతఁ దగ నప్పులు గైకొని యియ్యకున్నచో
ధర తనమూలవృద్ధులకుఁ దక్కక సాగినవారిఁగూర్చి య
క్కఱగుడి వ్రాసి యాఁగె ననఁగాఁ బరివేషము చుట్టె నాతనిన్.

16


తే.

ఉత్తరపుదిక్కు మెఱుపుల నుల్లసిల్లెఁ
బూర్వదిగ్వాయుసంచయంబులు చెలంగెఁ
దగ నహోరాత్రములును సంధ్యలును దెలియ
రాకయుండెను మేఘసంరంభమునను.

17


సీ.

నిష్కంటకాత్మయై నెగడు వసుంధర
             యత్యంతపంకాత్మయై చెలంగె
నమృతప్రవాహాఢ్య లయిన మహానదు
             ల్గలుషవిషాఢ్యలై కలఁగఁబాఱె
రాజహంస మనోహరం బగుగగనంబు
             సంతతఘనతమశ్ఛన్న మయ్యె
మాధవలక్ష్మీసమన్వితం బగునబ్ధి
             పరజీవనాపేక్షఁ బరఁగి డొంకెఁ


తే.

జాతకంబుల మనములు చల్లనయ్యె
మలయుదావానలంబులు మ్రగ్గిపోయె
సస్యజాతంబు నానాఁట సఫలమయ్యె
విమలమైనట్టి వర్షాగమమున నధిప.

18

మ.

ఘనరావంబు చెలంగ భృంగి వినుతుల్ గావించి పాడంగఁ గా
ననమం దెచ్చట నీలకంఠవిలసన్నాట్యంబు రంజిల్లెఁ దా
ఘనరావంబు చెలంగ భృంగి వినుతుల్ గావించి పాడంగఁ గా
ననమం దెచ్చట నీలకంఠవిలసన్నాట్యంబు రంజిల్లదే.

19


తే.

పృథుతటిద్దేహనవ్యతాపింఛచికుర
గురుపయోధరకుచయునై కోర్కి మీఱఁ
బ్రావృడంగన యినునిపైఁ జేవఁగొన్న
తమిని వెడలంగనీయక దాఁచె నతని.

20


తే.

మొగులుగతి నిమ్ముకొన్నట్టి మొగులు చెలఁగ
నలరు మెఱుపులకైవడి నలరుమొగ్గ
గములఁ బొడమెడుతావి భృంగములు గ్రోలి
తరులఁ గనుపట్టెఁ గేతకీతరుల మెఱసి.

21


సీ.

కులపర్వతములు ఱెక్కలతోడ నెగసెనాఁ
             గంధరంబులు మింటఁ గలయఁ బర్వె
మందరాచలమథ్యమానార్ణవధ్వాన
             మన మేఘనిర్ఘోష మతిశయిల్లెఁ
గల్పాంతసమయాగ్నికణము లొక్కుమ్మడిఁ
             బడియెనో యనఁగఁ బెన్బిడుగు లురలె
వజ్రంబు దేవతావల్లభుం డురువడి
             జళిపించె ననఁగఁ జంచలలు మెఱసె


తే.

మత్తశుండాలశుండాసమానపతద
నూనధారాళధారానవీననీర

పూరపరిపూరితాశానభోధరిత్రి
గాఁగ వానలు గురిసె లోకములు [5]బెదర.

22


వ.

అప్పుడు.

23


తే.

పరమహంస యనంగఁ దాఁ బరఁగి యమృత
దేహియై మంగళాకృతిఁ దేరి బుధతఁ
జెంది విజ్ఞానగురుఁడు నాఁ జెలఁగి యతఁడు
పర్వతభృగుస్థలమునఁ దపంబు సలిపె.

24


వ.

మఱియును.

25


క.

తొరలెడువానలఁ దడియుచు
గిరిచఱిఁ గూర్చుండి యోగికేసరి దినముల్
మరుదశనంబునఁ గడపుచుఁ
జిరకాలం బుగ్రతపముఁ జేయుచు నుండెన్.

26


వ.

అంత.

27


తే.

ఎలమి మేలైనవర్షంబు లెల్లజాఱ
స్వాంతమునఁ దూలి గద్గదస్వరము గదురఁ
దుదిశరత్తులఁ బొదివి వృద్ధులవిధమున
నరిగె నెందేని మేఘంబు లాకసమున.

28


క.

జలదములముంపు దప్పినఁ
గలితప్రభఁ బొల్చె దిశలు గర్దమ మింకెన్
జలి యంతంతకుఁ మించెం
గొలఁది తఱిగి నదములెల్లఁ గొంచెము లయ్యెన్.

29


క.

కమలారు లైన హేమం
తముఁ దద్రాత్రిచయమును ఘనములై తోఁచెన్

గమలాప్తములగు నినుతే
జముఁ బగళులు గొంచెపడియెఁ జలిచే నధిపా.

30


క.

అనుపమ మగుహేమంతము
ఘనసత్త్వం బేమొ యుష్ణకరునిన్ శీతాం
శునిఁ గావించెను దన్నిశ
లను బగలుగఁ జేసె జనములకుఁ జిత్రముగాన్.

31


తే.

స్థావరములైన యద్రులుఁ జలికి వెఱచి
యీడుమీఱినసానులతోడికూట
ములు విసర్జింప లేవన్నఁ దలఁప నొరులు
సతులఁ బాసి [6]చరింపఁగఁ జాలఁగలరె.

32


తే.

జ్వలనుఁ డెపుడు జగత్ప్రాణసఖుఁ డటంచుఁ
బలుకుమాట యథార్థమై నిలిచె ననఘ
యట్లు గాకున్న హేమంత మడరినప్పు
డతనిప్రాపున బ్రతుకునే యఖిలజనము?

33


సీ.

ఇంతంత యనరాని యివము లెల్లెడఁ బర్వ
             [7]వసుమతి వడవడ వడఁకఁజొచ్చె
వసనాభివిసము లప్పసముఁ బూనిన వాయు
             విసరంబు ఱివ్వున విసరఁదొడఁగె
భూనభోదిగ్భాగములుఁ గానరాకుండ
             గుఱి లేని పెనుమంచు గురియఁదొడఁగె
శీతంబునకు నరశ్రేణు లొనర్చిన
             నెగడులు తఱుచుగా నెగడి మెఱసె

తే.

నెల్లరోగంబులును నిండి వెల్లివిఱిసె
వెజ్జులకుఁ బండువయ్యెఁ బూవిలుతుమామ
విపులశీతలచంద్రికావితతి చల్లెఁ
దరులుఁ దామరసిరులు సుద్దవిడి మురిసె.

34


క.

చేతోభవకోపంబున
శీతలమని విటులు సతులుఁ జేరక యంతం
జేతోభవదండన మీ
శీతలమని వెఱచి కలసి చెలఁగుదు రాత్మన్.

35


ఉ.

అమ్ముని యట్టివేళ హృదయంబున నంబురుహాక్షు నిల్చి లో
కమ్ముల కద్భుతంబుగ వికార మెఱుంగక కంఠదఘ్ననీ
రమ్ములలోననుండి యుదర మ్ముదకంబులఁ బ్రోది సేయుచున్
నెమ్మిఁ దపం బొనర్చె ధరణీవరులున్ సురలు న్వడంకఁగన్.

36


తే.

ఇవ్విధంబున నేడువేలేండ్లు తపము
ఘోరమతిఁ జేసె నామౌనికుంజరుండు
గరుడగంధర్వయక్షకింపురుషసిద్ధ
సాధ్యవిద్యాధరాదులు సన్నుతింప.

37


క.

ఆసమయంబునఁ దనమది
వాసవుఁ డి ట్లని తలంచె వసుధాభుజగా
వాసనివాసులవర్తన
మీసారి వినంగరా ది దేమివిధంబో.

38


క.

సారమతిఁ గీడుమేలును
జారులచేఁ దెలియవలయు జగతీశులకున్
జారులు రాజులకెల్లను
దూరము గనిపించు కన్నుదోయి తలంపన్.

39

వ.

అని వితర్కించి.

40


క.

చారుల లోకత్రయసం
చారులు సూనృతవచఃప్రచారుల విమలా
చారుల సంతతగూఢవి
చారుల రావించి యతఁడు సమ్మతి ననియెన్.

41


సీ.

మీరు భూమికి నేగి గౌరవం బొనరంగ
             నచ్చోటఁ దనరు బ్రాహ్మణులు వేద
విధి సంచరించు నవ్విధము రాజులు నీతి
             విహరించు తెఱఁగుఁ బ్రవీణులైన వేద
వైశ్యుల [8]పుణ్యభావంబును శూద్రుల
             వర్తనమును బ్రజావళి చరించు
కట్టడయును యోగిగణములు గావించు
             తపముచందంబు సద్ బ్రహ్మచారు


తే.

లైనవారలగతియు గృహస్థు లయిన
వారినడకలుఁ దగుపతివ్రతలమేలుఁ
దెలిసి పాతాళభువనవార్తలు నిజంబు
గాఁగఁ బరికించి రండు వేగంబు మీఱ.

42


వ.

అని రహస్యంబుగాఁ జెప్పి యనిచినఁ జారులు క్రమంబున
ధరణీతలంబునకు డిగ్గి భూకాంతానితంబావలంబితరత్న
మేఖలాకారంబు లగుపారావారంబులను, సమస్తవస్తు
విస్తారరూపంబు లగుసప్తద్వీపంబులను, దటప్రదేశదేదీప్య
మానరత్నజాలంబు లగుపుణ్యశైలంబులను, ననవరతాసీన
యోగిజనంబు లగువనంబులను, నిరంతరవికసితసితకమల

కల్హారమాలికాసారంబు లగుకాసారంబులను, మహాపాత
కంబుల నెల్లం బుణ్యంబులుగాఁ జేయ సమర్థంబు లగుతీర్థం
బులను బవిత్రంబు లగుపుణ్యక్షేత్రంబులను, ముక్తికాంతా
నితాంతనిధానంబు లగుమహానదీ[9]విధానంబులను, ననంత
తపోధను లగుమునులను, నానావిధవస్తుసమాస్పదంబు
లగుజనపదంబులను, నజస్రలక్ష్మీవిహారంబు లగుపురంబు
లను, వేదవిద్యావినిర్జితవాణీవరు లగువిప్రవరులను, సర్వ
సర్వంసహాభారభరణదక్షదక్షిణబాహాదండవిజృంభమాణ
కఠోరకుఠారధారావినిర్జితవైరిరాజన్యు లగురాజన్యులను,
సంపజ్జితయక్షవర్యు లగునార్యులను, బుణ్యగుణభద్రు లగు
శూద్రులను గనుంగొనుచు వచ్చివచ్చి పురోభాగంబున.

43


చ.

కనుఁగవ యింత మూసి కరకంజము లూరుయుగంబుఁ జేర్చి మే
ను నిగుడఁజేసి శ్రీవరు మనోజలజంబున నిల్పి యింద్రియా
ళిని బిగఁబట్టి గాడ్పులఁ జలింపఁగనీక కడంగి స్వస్తికా
సనమున నున్నతుల్యమునిచంద్రునిఁ గాంచిరి భీతచిత్తులై.

44


వ.

ఇవ్విధంబున నమ్మౌనీంద్రుం గనుంగొని తమలో నిట్లనిరి.

45


ఆ.

ఇతఁడు పరమహంసుఁడే నిక్క మగుఁ గాక
యున్న నుగ్రగతిని నుండు టెట్టు
లిమ్మహాత్ముతేజ మేచినఁ గువలయం
బెల్ల ముచ్చముడుఁగదే తలంప.

46


మ.

హరుఁడో యీతఁ; డటైన శూలమును నేణాంకుండు ఫాలాక్షమున్
బరిశీలింపఁగ నేల కానఁబడ; వబ్జప్రోద్భవుండో; ముఖాం

బురుహంబుల్ మఱినాల్గు గావలదె; యంభోజాక్షుఁడో ఖడ్గమున్
విరిగెందమ్మియు శంఖచక్రములు నేవీ బుద్ధి నీక్షించినన్.

47


ఉ.

ఇమ్మునినాథుఁ డేపనికి నీగతి ఘోరతపంబు సేయ నె
య్యమునఁ బూనెనో కడుభయంకరమై ప్రసరించు నిట్టితే
జమ్మున నెల్లలోకములు స్రగ్గవె వాయువు లేనిచోట దీ
పమ్మునుబోలె వీఁ డచల భావము నొందె దృఢవ్రతస్థుఁడై.

48


తే.

ఇతఁడు గావించుతపము సురేశ్వరునకుఁ
జెప్పకుండిన మోసంబు చెందు ననుచు
నచట నిల్వక దివమున కరిగి రంత
వాయువేగులు వేగులు వారు వెరచి.

49


వ.

ఇట్లు చారు లతిత్వరితంబున నాకలోకంబున కేగి యమ
రేశ్వరుం గాంచి దండప్రణామంబు లాచరించి నిటలతటం
బున నంజలిపుటంబు ఘటియించి యి ట్లనిరి.

50


ఉ.

దేవరపంపున న్ధర కతిత్వరితంబున నేగి యచ్చటన్
బావను లైనభూసురులఁ బార్థివులం బరికించి పుణ్యతీ
ర్థావళుల న్మహానదుల నారసి మౌనులఁ జూచి బంధుర
గ్రావములన్ వనంబులను గన్గొని జాహ్నవిఁ జేరఁబోవుచోన్.

51


శా.

చండాంశుండునుబోలె నుగ్రతరతేజఃస్ఫూర్తి ఫాలానలా
క్షుండున్బోలె మహాప్రభావమున రక్షోహంతయున్ బోలె బ్ర
హ్మండాంతర్గతజంతుసంఘహృదయవ్యాప్తాకృతిం బద్మగ
ర్భుండుంబోలెఁ దపంబునం దగు మునీంద్రుం డున్నవాఁ డచ్చటన్.

52

తే.

అతనితపమున లోకంబు లడరె గిరులు
వడఁకె జలధులు పిండలి వండు లయ్యె
ధరణి కంపించె సూర్యచంద్రరుచు లడఁగెఁ
దారకంబులు రాలె దిక్తటులు వ్రీలె.

53


వ.

కావున నమ్మహామునీంద్రుం డేమినిమిత్తంబున నట్టితపంబుఁ
జేయుచున్నవాఁడో దానికిం దగినకార్యం బూహింపు
మనియును, నతనిపేరు తుల్యుం డనియును, విన్నవించిన
దురంతచింతాక్రాంతుండై కొలువుకూటంబున కేతెంచి
ప్రతీహారులచే దిక్పాలపూర్వకంబుగా సకలదేవతావరు
లను స్వాచార్యుం డగుగురుని రావించి యథోచితంబుగా
సత్కరించి వారలు చుట్టునుఁ బరివేష్టింప భద్రచింతామణి
పీఠికాసీనుం డై యందఱఁ గలయం గనుంగొని యి ట్లనియె.

54


చ.

ఘనుఁ డొకయోగి తుల్యుఁ డనఁగా ధరణీస్థలియందు నేరికి
న్వినఁ గనరానితేజమున విఱ్ఱనవీఁగి తపంబు సేయఁగా
వనరుహమిత్రచంద్రనగవర్గసముద్రనదీనదక్షమా
జనతతియు న్జలించెనని చారులు చెప్పినమాట వింటిరే.

55


తే.

ధరణియాపద మానువిధంబుఁ దుల్య
మునితప ముడుగురీతియు మనకు విపుల
సౌఖ్యమున నుండుకార్యంబుఁ జర్చ చేసి
పలుకుఁడీ మీరు మీయుక్తిబలము మెఱయ.

56


వ.

అనవుడు నప్పాకశాసనునకు నఖిలామరాధిపులయనుమతం
బున సకలనీతివిద్యాగురుం డగుగురుం డి ట్లనియె.

57


ఆ.

బలిమిఁ జేయరానిపని యెట్టిదైన ను
పాయబలముచేతఁ జేయవచ్చు

సాహసంబు చేసి చనరాని జలనిధి
నావచేఁ దరించు ఠేవ ననఘ.

58


ఆ.

మునులు తపముఁ జేయుచును బహిరింద్రియం
బుల మనంబుతోడఁ గలిపి నిలిపి
యచలనిష్ఠఁ బొల్తు రదిగాన వారి మ
నంబుఁ గలఁపఁ దద్వ్రతంబు చెదరు.

59


క.

మనసిజు నీక్షణమున రాఁ
బసుపు మతం డమ్మునీంద్రుభావముఁ గడునే
ర్పునఁ జొచ్చి తపము మాన్పెడు
ననఘా! యాతని కసాధ్య మైనది గలదే.

60


వ.

మఱియును.

61


ఆ.

ధరణిజనులు వడఁకఁ దపము గావించు ము
నీంద్రకోటి మాన్ప నిందువదన
లోపినట్లు విధుఁడు నోపఁడు నిక్కువ
మచ్చరలను బిల్వనంపి పంపు.

62


వ.

అని యమ్మునితపోవిఘ్నోపాయంబుఁ జెప్పిన గురు నభి
నందించి పురందరుండు పుండ్రేక్షుకోదండనిర్జితయోగిజన
తపోదర్పుండైన కందర్పునిం దలంచిన.

63


సీ.

వనితల చేతి వేదనకొప్పు తనకొప్పు
             పసఁ జూడ నొసపరిబాగు మీఱఁ
దనమోముసిరినీడు కొనఁగోరి కొనగోరి
             కస్తూరికాతిలకంబు చెలఁగ
వనజాక్షి[10]సంతన తనమేన తనమేన
             మామ [11]పెన్ బ్రాయంబు మహిమఁ జూప

మెఱుఁగుఁజుక్కలతోడ సరులైన సరులైన
             తనయురంబున నిండి తళుకులీన


తే.

కేళి సలిపెడు తనమంచికేలియుంగ
రములకాంతులతతి యుంగరముల విరుల
నందియల మించు పదముల నంది యలర
వంబు మీఱంగ నింద్రుభావంబు దనర.

64


చ.

ననువులు మందెమేలములు నారుల పెన్ బొలయల్కవేళలం
బెనఁగి కవుంగిలించునెడ పేరులయెత్తులు గోరుటొత్తులుం
దనువున మీఱఁగా నలసతం శిఱునవ్వులుఁ గొప్పుఁబువ్వులున్
గనుఁగవకెంపులున్ రతులగర్వము సొంపులు నింపు దోఁపఁగన్.

65


ఉ.

పూవులవిల్లు నమ్ములును బూనుచు బంగరువ్రాఁత నిండుమా
దావళి దట్టిగట్టి యొరదాఁకిన కెంజిగురాకుబాకు శో
భావృతిగా నమర్చి వలిపంబుఁ బయిన్ వలెవాటు వైచి ల
క్ష్మీవనితాకుమారకుఁడు మేనిమెఱుంగు జగంబు నిండఁగన్.

66


మ.

చెలికాఁడైన వసంతుఁ డాదరముతోఁ [12]జేయూఁదఁగాఁ జల్లగా
లి లసచ్చామరపాణియై నడవ [13]నాళీకద్విషుండున్ సుధా
జలపూర్ణంబగు గిండి దేరఁ దనదక్షత్వంబు మీఱంగ నిం
తులమానం బెడలంగ వచ్చె నమరేంద్రుం డిచ్చలో మెచ్చఁగన్.

67


వ.

ఇట్లు వచ్చిన భావసంభవుని నయ్యింద్రుం డాలింగనంబు
చేసి గారవించి సుఖాసీనుం గావించి కుశలం బడిగిన
యనంతరంబ రంభం దలంచిన.

68

చ.

చెలువము రచ్చ కాముకులజీవన మంగజరాజ్యలక్ష్మి శూ
రులు గనునట్టిసద్గతి మరుద్గణికామణి సోమయాజుల
న్వలవఁగఁజేయు నౌషధము స్వర్ణవిభూషణ మంబురాశి స
త్కులభవపుణ్యరాశి నలకూబరుప్రాణపదంబు రంభ దాన్.

69


మ.

కురులం [14]దావిచయం బొసంగు విరులం గొప్పొప్పుగాఁ దీర్చి క
స్తురి ఫాలంబున సోగబొ ట్టిడి కళాస్తోమంబుపైఁ జల్లు ముం
గర నాస న్ధరియించి లేనగవు వీఁక న్మోవి పల్లొత్తులున్
మరువై దాచఁగఁ గ్రొత్తముత్తియపుఁగమ్మ ల్వీనుల న్మించఁగాన్.

70


ఉ.

ఏపునఁ దారహారము వహించి మనోహరహీరకాంతి సం
దీపితమైన క్రొమ్మొగపుతీఁగ ధరించి సమస్తరత్నసం
స్థాపితమేఖలాకృతనితంబము సోయగ మూరుశోభలం
బై పడి మేలి సన్నవలిపంబున మీఱి దుబాళి చేయఁగాన్.

71


ఉ.

చేరిక గోరు[15]కోణములఁ జెక్కి విలాసము వేసినట్టి బం
గారపుఁగుండలన్ గెలువఁగాంచి నిశాతనవాంకుశంబుల
న్జీరిన కుంభికుంభములచెన్ను వహించినయట్టి క్రొత్తకెం
జీరలతోడి చన్నుఁగవ చెల్వముఁ బయ్యెదఁ జౌకళింపఁగాన్.

72


సీ.

తనకన్నుదోయి యుద్ధండమన్మథబాణ
             జలజమీనములకు సామి గాఁగఁ
దననెమ్మొగంబు చంద్రసరోజమణిదర్ప
             ణావళులకు బడియచ్చు గాఁగఁ
దనతనూయష్టి సౌదామినీవల్లికా
             తపనీయములకు విధాత గాఁగఁ

దనమందగమనసౌందర్యంబు మదకేకి
             దంతిహంసల కోజబంతి గాఁగఁ


తే.

దనమృదుధ్వని కోకిలోత్కరవిపంచి
కాశుకాళికి నొజ్జగా గర్వ మొప్పఁ
దనవిలాసంబు మదనవిత్తంబు గాఁగ
రమణఁ గనుపట్టె విభ్రమారంభ రంభ.

73


తే.

అందియలు మ్రోయ మేనిసోయగపుఁదావి
కళులు పెల్లుగ మూఁగి ఝుమ్మని చెలంగ
గురుపయోధరధమ్మిల్లభరముకతన
నడచువేళల నిరుపేదనడుము వడఁక.

74


ఉ.

మేనకమూఁపుతోడ నునుమే నొరయం గరపద్మ మూఁది చే
తోనయ మొప్పఁగా హరిణితోఁ దనముచ్చట చెప్పుచుం బ్రియం
బాని సుకేశితోఁ జదురులాడుచు నొయ్యన మంజుఘోషతో
లేనగ వొప్ప మానము చలింపఁగ మర్మము లెత్తి యాడుచున్.

75


సీ.

తాటంకమణిభానుధాళధళ్యంబులు
             చెక్కుటద్దములపైఁ జిందులాడ
నవ్యహారప్రభానైగనిగ్యంబులు
             కుచపర్వతంబులఁ గుప్ప లుఱుకఁ
దరణిరుఙ్మేఖలాధాగధగ్యంబులు
             కటిమండలంబుపైఁ బుటము లెగయఁ
జారుకంకణదీప్తిచాకచక్యంబులు
             హస్తపంకజముల నలముకొనఁగ


తే.

గరిమఁ బదియాఱువన్నె బంగారుసిరులు
మెఱపులును గూడి రూపమై మెలఁగునట్టి

యనువుమీఱంగ వచ్చె దేవాధినాథు
కొలువునకు రంభ కుచజితకుంభికుంభ.

76


వ.

ఇవ్విధంబున వచ్చి కృతాంజలి యై యున్న రంభనుం దక్కిన
రంభోరులం గరుణావలోకనంబుల మన్నించి జంభారి నిజ
కార్యారంభం బెఱింగింపందలంచి పంచబాణున కి ట్లనియె.

77


సీ.

అనఘ నీరూపతేజోంశంబు సౌందర్య
             వంతుల కుపమానవస్తు వయ్యె
భవదీయకోదండపాండిత్యవిభవంబు
             సకలధానుష్కసౌష్ఠవము గెలిచెఁ
దావకవిపులప్రతాపానలజ్వాల
             నగచాపుదేహంబు సగము చేసె
యుష్మదీయశరప్రయోగవైద్యంబు
             కంజగర్భుని తల [16]గడిచి పాఱె


తే.

నిన్ను నొకపరి మదిఁ జేరుకొన్నయంత
సర్వవిరహులు నాజ్ఞావశంవదైక
మానసాంభోజు లగుచుఁ ద్రిమ్మరుదు రనిన
[17]మీఱి వినుతింప శేషుండు నేరఁగలఁడె.

78


మ.

ననరేవిల్లు మదాళిసంఘము గుణం బబ్జాతపత్రాక్షిదృ
ష్టినికాయంబు శరోత్కరంబు లవియుం జేపట్టి నీవిద్య నే
ర్పున రెం డొక్కటి గాఁగఁ జేయుదు బళీ రూపంబునం జెందకే
యనఘా! నీకు సమానుఁడుం గలఁడె బ్రహ్మాండాంతరాళంబునన్.

79

ఉ.

ఆయమరాచలంబు ధనువై విలసిల్లఁగ విష్ణుఁ డమ్ము గా
వేయిశిరంబులం బరిఢవిల్లెడుశింజినిఁ గూర్చియున్న శూ
లాయుధు మాటమాత్రమున నంగము వ్రయ్యఁగ మోఁది మించితౌ
తీయనివింటనే వెనుకతీయనిబీరమునన్ మనోభవా.

80


క.

[18]కఱకై మీఱియు నాయ
క్కఱకై చనుదేఱ నిన్నుఁ గనుఁగొనినపుడే
చెఱకువిలుఁ బూనఁజూచిన
చెఱకున్ లోనైరి సకలసిద్ధులుఁ దనరన్.

81


ఉ.

చండకఠోరవిష్ణుకరచక్రముకంటె మదీయదీర్ఘదో
ర్దండవిజృంభమాణభిదురంబునకంటెఁ బరేతరాడ్గదా
దండముకంటెఁ జంద్రధరదారుణశూలముకంటే నెక్కుడై
మెండుకొనుంగదా భవదమేయమృదుప్రసవాంబకంబు దాన్.

82


క.

హరిహరకమలభవాదుల
సరకు గొనక గెలుచునీకు సామాన్యమునీ
శ్వరులను జయించు టనఁగా
సరకా నరకాంతకాత్మసంభవ తలఁపన్.

83


వ.

ఐన నొక్కకార్యంబు వినుము. తుల్యుం డనుమునీం
ద్రుండు దారుణం బగుతపంబు గావింప లోకంబులు చీకాకు
పడియెఁ గావున నతనితపంబునకు విఘ్నంబు సేయవలయు;
నీకు సహాయంబుగా రంభాదిదేవతాంభోజాక్షుల నంపెద
ననిన నింద్రునకు నిందిరానందనుం డి ట్లనియె. మద్దనుః
ప్రభావం బవధరింపుము.

84

క.

పిడికిట నడఁగెడునడుమున్
గడుఁదియ్యని మేను భృంగకలితగుణంబున్
విడివడనికొప్పు నేర్పడి
పడఁతుక గతి యయ్యె మించి పౌరుషవృత్తిన్.

85


క.

మును లెంత నాకు రుద్రుం
డన లక్ష్యస్థాణురూప మాపద్మజుఁడున్
గనుఁగొనఁగ నజప్రాయం
బనఁ దక్కినవారి నెన్నఁదగునే యెచటన్.

86


వ.

దేవా! యమ్మునితపంబు వారించి నీకు మెప్పు పుట్టించెదఁ
జూడుమీ యన నతండు మనంబున ఘనం బగుసంతసంబున
ననర్ఘ్యమణిభూషణాంబరాదులు గట్టనిచ్చి ప్రియపూర్వ
కంబుగా ననిపి రంభ కి ట్లనియె.

87


సీ.

నీకుచంబులు శూరనికరంబులకునెల్ల
             రమణీయశైలదుర్గములు గావె
నీవాలుఁజూపులు నిఖిలపల్లవులకుఁ
             బంచాస్త్రశరపరంపరలు గావె
నీముద్దులొల్కెడి నెయ్యంపుఁబల్కులు
             విటజనాకర్షణవిద్య గాదె
నీమందహాసంబు కాముకశ్రేణిపై
             మరుఁడు చల్లెడి సొక్కుమందు గాదె


తే.

సరసిజానన నీతోడి సురతకేళి
పరమమైనట్టి సాయుజ్యపదము గాదె
నీవిలాసంబు మదిలోన [19]నేర్పు మీఱఁ
దలఁచుచుండుటయును జన్మఫలము గాదె.

88

సీ.

అతివ హవ్యములు దేవాళి కిచ్చుటలు నీ
             [20]విందుల నాదటఁ బొందఁగోరి
దీక్షితు లగుచు వేదికమీఁద నిలుచుటల్
             నీకుచవేదిపై నిల్వఁదలఁచి
సోమపానముఁ జేసి సొక్కుట దలఁప నీ
             యధరామృతంబున కాసఁ జేసి
యపభృథస్నానంబు లాచరించుట లెల్ల
             నీనునుఁజెమటల నానఁబూని


తే.

వీతిహోత్రునిలో నేయి వేల్చుటయును
బొలఁతి పొలయల్కకాఁకలఁ బొరయఁ జూచి
యనుదినమును గ్రీడింతురు యజ్వ లిట్లు
సవనములఁ జేసి నీవిలా[21]సంబుఁ గనఁగ.

89


తే.

కడునిశాతంబులైన ఖడ్గములకైన
నింతయును భీతినొందక యెదురు శూరు
[22]లోడుదు రొకింత నీవల్గి చూడఁ గీర
వాణి నీచూడ్కి యది యెంతవాఁడి చెపుమ.

90


క.

ధరణీతలమున యోగీ
శ్వరుఁ డొక్కఁడు తుల్యుఁ డనఁగ సంతతనిష్ఠా
పరుఁడై తప మొనరింపఁగఁ
దరుణీ, భువనంబులెల్లఁ దల్లడ మందెన్.

91


క.

కావున భువనత్రయమును
గావుము; ననుఁ బ్రోవు; తుల్యుఘనతప ముడుపం

గావు నయోపాయంబులు
వేవేలును నీవు దక్క, విమలేందుముఖీ!

92


వ.

అని ప్రియంబును మన్ననయుం దోఁప నానతిచ్చినఁ గరకమ
లంబులు మొగిడ్చి రంభ జంభారి కి ట్లని విన్నవించె.

93


ఉ.

ఇచ్చక మొప్ప నీయెదుట నిచ్చెలు లెల్లను బుద్ధిమాలి తా
రిచ్చకు వచ్చినట్టిగతి నేవిధినైనను బల్కనిమ్ము కా
ర్చిచ్చను నమ్మహామహుని చిత్తము నొచ్చినఁ గీడు దప్పునే
పచ్చనివింటిజోదు హరుపైఁ బడి యేగతి యయ్యెఁ జెప్పుమా!

94


ఆ.

ఎదిరిసత్వ మెఱిఁగి యెదిరినచోఁ గదా
విభుఁడు జయము నొందు వేవిధములఁ
గొలఁది కానిపనులకును బోవఁగాఁ గీడు
కొలఁదిగనక వెంటఁ గూడకున్నె.

95


ఆ.

ఐనఁ గానిమ్ము నీయాజ్ఞ ననిమిషేంద్ర!
ధరణిపై నుగ్రవృత్తితోఁ దపము సేయు
తుల్యుని భుజంగతుల్యుఁగాఁ దుది నొనర్చి
యతులసంభోగముల సోలి యాడఁజేతు.

96


క.

నీయాన నమ్ము చూపెద
నాయోగిని నగుచు నేరుపంతయు నట నే
నీయాననమ్ము చూపెద
నాయోగికి నగుచుఁ బోయి యనిమిషనాథా!

97


వ.

అని యప్పద్మలోచన సహస్రలోచనుచిత్తంబు మెచ్చు
నట్లుగాఁ బలికిన నతండు సంతసిల్లి యయ్యిందువదనకు నపరి
మితభూషణాంబరాదులు వినయపూర్వకంబుగా నొసంగి
యనిపిన.

98

క.

అంత సకలవనలక్ష్మీ
కాంతము వనరాశికన్యకాసుతవిజయో
దంతము జితమానవతీ
స్వాంతము నై నివ్వటిలు వసంతము వచ్చెన్.

99


సీ.

మంచున [23]మే నెల్ల మర్ధించి పత్రసం
             చయమును డుల్చు విశల్యకరణి
ముదిసిన తరుజాతమునకుఁ జిత్రంబుగాఁ
             దారుణ్య మొసఁగు సంధానకరణి
పసరుచందము దోఁచి యొసఁగెడు కోరక
             వ్రాతంబునకును సౌవర్ణకరణి
హరునిచే మటుమాయమై మేనెఱుంగని
             చిత్తజాతునకు సంజీవకరణి


తే.

పలుకనేరని కోకిలప్రకరమునకు
నంచితస్వర మిచ్చు మహౌషధంబు
కాముకశ్రేణులకు నెల్లఁ గాలకూట
మనఁగ మించె వసంతసమాగమంబు.

100


చ.

చలమున మూగలైనపికసంఘము నమ్మరుచే కటారి మూ
గలుగునొనర్చు టొప్పగు జగంబున ఱాఁగలు గానియట్టి రా
చిలుకలనెల్ల ఱాఁగలుగఁ జేసి మనోభవుసేనలోన రాఁ
గలుగనొనర్చెఁ జిత్రములు గావె వసంతునిచేత లన్నియున్.

101


తే.

తరువులకు మేఘుఁ డప్పులు దా నొసంగి
యవి వసంతుని కిమ్మని యప్పగింప
దానికి ఫలము లియ్యఁ బత్రంబు లిచ్పె
ననఁగఁ దరువులపత్రంబు లవని రాలె.

102

తే.

అల వసంతుఁడు కొమ్మలయందుఁ బ్రేమఁ
బత్రభంగము లొనరింప బహుళభూరు
హములఁ గనుపట్టు కొమ్మలయందునెల్లఁ
బత్రభంగంబు చేసె నభంగలీల.

103


సీ.

కెంజాయ పల్లనపుంజంబు గీల్కొని
             యధికసంధ్యారక్తి ననుసరింప
గట్టియై యెండసోఁకని తరుచ్ఛాయలు
             తిమిరంపుగుంపుల కొమరు దాల్పఁ
గోరకంబులు నిండుకొని సందడిలునట్టి
             తారకంబులతోడఁ ద్రస్తరింప
బుప్పొడి దట్టమై కప్పిన ఠావులు
             వరచంద్రికావైభవంబుఁ జూపఁ


తే.

దొరుఁగుపూఁదేనియలు మంచుతోడ నొరయ
నేఱులై పాఱు ఫలరస మిందుకాంత
జనితసలిలంబుఁ దులకింప వనము లెల్లఁ
జాల సితపక్షరాత్రులచంద మయ్యె.

104


మ.

ఒగరెక్కం గడులేఁతలై మృదువులై యోగ్యంబులై యున్నయా
చిగురాకు ల్దమకంఠదోషముల నుచ్ఛేదింపఁగాఁ జాలు మం
దుగతిన్ మేసి పికంబులెల్లఁ దరుసందోహంబులన్ వ్రాలి సో
లి గరిష్ఠంబగు పంచమస్వరముఁ గ్రోల్చెన్ మన్మథప్రీతిగాన్.

105


క.

పరిపక్వఫలము లెల్లం
బరికించి తదీయరసముఁ బానము గావిం
చి రుచులఁ జొక్కి కడుం బో
తరమున రొదఁ జేసెఁ శుకవితానము పేర్మిన్.

106

తే.

భూరిమధుపానమునఁ జొక్కి పుష్పరేణు
పటలి భూతిగఁ దాల్చి నేర్పరితనమున
ఝంకృతులు శృంగనాదంబుజాడ గాఁగఁ
దుమ్మెదలపిండు మించె సిద్ధులవిధమున.

107


క.

వెన్నెలతళుకును మించిన
వెన్నెల బిసకాండములు ప్రవీణతతోడన్
గ్రొన్నెలఁ దగు రాయంచల
గున్నలు జవరాండ్ర కిచ్చెఁ గోరికతోడన్.

108


చ.

మలయము నేలి పద్మినుల మంజులసౌరభ మెల్లఁ గ్రోలి పు
వ్వులఁ గనుపట్టు మేలితనువు ల్ముద మందఁగ వ్రాలి కైతకం
బులఁ బొడకట్టుధూళి దివి బోవఁగఁ ద్రోలి మృదుత్వశీలియై
కలయఁ జరించెఁ జల్లనగుగాలి పదాను[24]పదన్మదాలియై.

109


వ.

ఇట్లు సమస్తమహీరుహంబులకు సంతసం బొసంగు వసంత
సమయంబున ననంతధ్యానపరాయణుడై హృదయస్థిత
నారాయణుండును నిర్మలప్రచారుండును నిర్వికారుండును
నగు తుల్యుం డుగ్రతపంబుఁ సేయుచుండె నంత.

110


సీ.

చెలువైన చిల్కతేజీమీఁద నొసపరి
             కెందమ్మిపక్కెరఁ బొందుపఱిచి
క్రొత్తదాసనపుఱేకులు గీలుకొల్పిన
             బిరుదైన దగులాల సరియొనర్చి
కురువేరు నెరులచిక్కులు దిద్ది సవరించి
             కట్టిన [25]సరివెలికట్లు వైచి
నవకింశుకప్రసూనదళంబు సరి లేని
             యరిగఁ బ్రియంబున నవధరించి

తే.

యిరుఁగెలంకుల నుంచిన యొఱలతోడఁ
దనరు చిగురాకుఖడ్గా లుదారలీల
నొనరఁ దామరనూలున బెనఁచికట్టి
కలువతావులుఁ జెలువంపుగతి ఘటింప.

111


సీ.

తనకు జో డెఱుఁగని దంట తామరఱేకు
             జొంపంపు సొంపైన జోడు దాల్చి
తన కొక[26]దాపు కోర్వని మహావీరుఁడు
             [27]దాపున చిగురుటత్తళము గట్టి
తనతలమీఁద నింతయు లేని నెఱజోదు
             కలిగొట్టుపూబొమ్మికంబుఁ బూని
తన కొక్క[28]మాఱైనఁ దలఁపని కడుదిట్ట
             కమలకర్ణిక ఖేటకముగఁ గట్టి


తే.

తనకుఁ [29]జేమించినట్టి దిద్ధరణి లేని
ఘనుఁడు నాళంబుతోడి పంకజముఁ గేల
నిడుగుఁగాఁ బట్టి సురలు వర్ణింప నపుడు
ననలవిల్కాఁడు యుద్ధసన్నద్ధుఁ డయ్యె.

112


మ.

చెలువంబై కనుపట్టు రాచిలుకతేజీ నెక్కి మిన్నంద భం
జళిఁ ద్రొక్కింపుచు వింతవింతగతుల న్సవ్యాపసవ్యంబులన్
గలయంద్రోలుచు మండలీకరణరేఖ న్జూపుచు న్మించెఁ బూ
విలుకాఁ డభ్రగరాజువాహనముపై విష్ణుండు నాఁ బొల్పుగన్.

113


వ.

మఱియును.

114

సీ.

పక్షపాతముకల్మి పార్శ్వభాగంబుల
             [30]నీలకంఠంబులు సోలి నడువఁ
బల్కుల నమృతంబు లొల్కఁ బల్కెడుశుక
             ప్రముఖసద్ద్విజకోటి బలసి కొలువఁ
గన్నుల కింపైన కాంతిఁ బ్రొద్దులు పుచ్చు
             రాజహంసలు క్రమారంభ మొనర
నరమర లేనినెయ్యమున నల్లల్లనఁ
             గదిసి ముందఱ మరుద్గణము రాఁగ


తే.

పంబి భృంగీశ మధురగానంబు చెలఁగ
మాధవుఁడు నెయ్యుఁడై మహామహిమ మొసఁగఁ
దలఁప నొరులకు లేనట్టి బలము మెఱయఁ
దథ్యవిషమాంబకఖ్యాతి దాల్చి యతఁడు.

115


వ.

సపరివారుఁడై నిజకేతనఛత్రచామరాదిలాంఛనంబులు
వెలుంగ బ్రహ్మవిద్యాకల్యుండగు తుల్యుండు దపంబు
సేయు వనంబు వొచ్చి నిల్చె నంత రంభయు జంభారిపంపుఁ
బూని దననెయ్యంపుఁజెలులు కొలువ వచ్చుచుం దనలోన.

116


చ.

అనిమిషనాథుఁ డిట్టిమునికై ననుఁ బరఁపిఁ దదీయకార్య మే
యనువుననైనఁ జేసి హృదయంబున సంతసమందిఁ గందునో
మునివరు మోసపుచ్చుటకు ముందఱ నిల్వ నతం డెఱింగి నె
మ్మనమునఁ గందునో చనుట మానితినేని బలారి [31]గందునో.

117


క.

అని తలపోయుచుఁ గూరిమి
వనజాక్షులఁ గూడి మనసు చదలియు బీరం

బు నిగుడ మునివరు నాశ్రమ
వనమున కేతెంచె దివ్యవనితామణి దాన్.

118


వ.

ఇట్లు వచ్చి సఖీసమేతంబుగా దివ్యయానావతరణంబుఁ జేసి
యందు.

119


ఉ.

ఇచ్చకు వేడ్క సేయఁదగు నీడల నీడలఁ గమ్మతావులం
బొచ్చెము లేక చల్లఁగలపొన్నల[32]గున్నల మించుచాయలన్
నిచ్చలుఁ బూచి పెంపొదవు నిమ్మల యిమ్ములఁ బాంథకోటిపై
మచ్చరికించునట్టి యెలమావులఠావుల సంచరించుచున్.

120


ఉ.

మూఁగుచుఁ దోడిచేడియల ముచ్చటలం గికురించి యొండుచో
దాఁగుచుఁ బుష్పసౌరభకదంబములన్ గల తీవయుయ్యెలం
దూఁగుచుఁ బువ్వుఁదేనియలతుంపురుగుంపులచేత నిచ్చమై
దోఁగుచు నిండుజవ్వనముతో మురిపంబున విఱ్ఱవీఁగుచున్.

121


క.

చెలఁగుచు మర్మపుఁబలుకులఁ
గలఁగుచుఁ గరతాళగతుల కనురూపముగా
మలఁగుచు రాయంచలగతి
మెలఁగుచు నంతంత వేల్పుమెలఁతలు వరుసన్.

122


వ.

ఇత్తెఱంగున నమ్మత్తకాశినులు దమలోన.

123


క.

మరువము మేను లతాంగీ
మువము దగ [33]మమ్ము హరుని మాఱుకొనిన య
మ్మరువమ్ము మానుటకు నై
మరువ మ్మిది బ్రహ్మ చేసె మానస మలరన్.

124

క.

వ్రీడావతి చనుదోయికి
నీడని పోల్పంగ ఫలము లేవి యనం దా
నీడన కలవని వేఱొక
ప్రోడ వలుకఁ దోడిచెలులు పొదలిరి వేడ్కన్.

125


క.

పడఁతీ! తావులకున్ బై
పడ నేటికిఁ బొగడ లివియ పంచాస్త్రునకున్
విడిపట్టు సతులసిగ్గుల
విడిపట్టుగదా యటంచు వెఱతురు చేరన్.

126


మ.

చెలియా, యప్రతిమానగంధములచేఁ జెన్నొందు సంపెంగ దాఁ
గలుషాకారు లటంచు భృంగవరుల న్గారించి సంపెంగదా
తలఁపన్ దీనిగుణంబు లెల్ల విని పాంథవ్రాతముల్ సంతసం
బుల పొందం గని భీతి నొందు ననినన్ భూమిన్ విచిత్రంబుగాన్.

127


ఉ.

మానిని, యెఱ్ఱనై తనరు మంకెనపువ్వులమీఁది భృంగసం
తానముఁ జూచితే వనమున న్విహరించు రమావధూటికిన్
బూనికఁ బుష్పజాలములఁ బూజ లొనర్చి వసంతుఁ డింపుతోఁ
దా నిడు ధూపవహ్నిజనితం బగుధూమమురీతి నొప్పెడున్.

128


ఉ.

శంబరవైరి వీని సుమజాలముచేతనె నేర్పుతోడఁ గ్రో
ధంబున శంబరాసురుని దార్కొని యేచిన వాని మాంసర
క్తంబులు పీల్చి యాగదురుద్రాళఁగ నోపక క్రక్కుచున్న భా
వం బన రాగవత్కుసుమవల్లరుల న్గనుపట్టె నీపముల్.

129


ఉ.

విన్నఁదనంబుతోడఁ గడువెల్వెలఁబాఱెడు నిందువంక నే
మున్నది గెల్వ నాకనుచు నుద్థతి మారుఁడు చందమామనున్

బిన్నఁగఁ జేసి మోదుగకుఁ బెద్దఱికంబిడి యిందువంక నే
కొన్న జయంబులెన్నియని కోరి పఠింపుదు నంబుజాననా!

130


ఉ.

వారిజము ల్మహీజమగువారిజము ల్సమమైన నేరికై
పోరుచు మన్మథుం డనుపఁ బోయి తమిన్ యువకోటిఁ గాఁడుచో
సారసమై చెలంగమిని సారసము న్ముణిగించి మించె నీ
వారిజ మాత్మరాగజితవారిజబంధురరాగపూరమై.

131


ఉ.

ఓ యెలనాఁగ, కేసరము లోలిఁ గనుంగొని తమ్ములంటి వౌ
నో యలనాగకేసరములో వివరింపుము రాకపోకలన్
రాయని మేలు గల్గి ద్విజరాజకరగ్రహణోచితంబులై
వేయువిధంబుల న్బరిఢవిల్లునె పద్మము లెన్ని చూడఁగన్.

132


చ.

తరువరమైన యాకొఱవిదయ్య మెఱుంగ మరుండు పాంథులన్
వెఱవఁగఁజేయఁ బెంచి వనవీథుల నుంచిన నెల్లవారల
న్దఱిమి హరించు నక్కొఱవిదయ్యముఁబోలె [34]నటచ్ఛిలీముఖో
త్కరరవఘోరహుంకృతిఁ బతత్సుమనోనల[35]జాలకీలలన్.

133


చ.

కొసరనితావిమించు కలిగొట్టు మనోభవభూవిభుండు సం
తసమును జెందునట్లుగ ధనంబులు పెట్టెడుఁ గాపుఁబోలెఁ దాఁ
గొసరునఁ జాల భక్తిఁ [36]గలిగొట్టు మనోహరగంధబంధుర
ప్రసవసమాజ మంచు మదిఁ బాంథులు భీతి వహింతు రెంతయున్.

134

చ.

మారుఁడు కోపగించి కుసుమంబులచేఁ గడకంటఁ జూచి బ
న్నీరని తా మధువ్రతనిజేష్టభటాళికి నప్పగించినన్
వారణఁ జేసి యాకులమువార లొసంగెడు పన్ను గాఁగఁ బ
న్నీ రనిశంబు నిచ్చుఁ గడునేర్పరి గొజ్జగిగా తలంచినన్.

135


చ.

చెలువముతోఁ బ్రవాళములచే సుమనోనికరంబు గప్పి ని
ర్మలగురుభక్తిమై ఫలసమాజము విప్రకరార్చితంబుగా
మెలఁగుచు మాధవుండు మరి మెచ్చఁగ లచ్చికి మందిరంబు నా
నలరి యశస్వితోడ నెనయౌ వనచూతము చూత మంగనా!

136


చ.

వినుతవయోవిలాసమున వీఁగురసాలము నంటుకొమ్మయం
చు [37]నొకసరోజనేత్ర దనచుట్టఱికం బెఱిఁగింపఁ జేరినం
తనె నిజకుంతలంబుల బెనంగుచుఁ జన్నుల నంటినంత న
ప్పనికయి సిగ్గుఁ జెందె నవపల్లవకృత్యము గాఁగ నవ్వుచున్.

137


శా.

నెమ్మి న్శంకరుఁ డాత్మమాళిఁ గదియ న్నీరేజవిద్వేషితో
నిమ్మారేడుదళంబు దాల్చి తనలో నిందీవరాప్తప్రకా
శ మ్మెల్లం బదియైదునాళ్లపనిగాఁ జర్చించి మెచ్చున్జుమీ
యిమ్మారేడు గణింపనైన జగము ల్వీక్షింప నీభూజమున్.

138


ఉ.

చందన మెల్ల భోగులకు శైత్యగుణంబున మంచిదయ్యు వె
[38]చ్చందనమయ్యుఁ బాంథుల సజస్రము నేచు నెపంబు రాజు మె
చ్చం దనమీఁదితప్పునకుఁ జాలఁగ ఱంపపుకోఁత కోర్చియున్
డెందము చల్లఁ[39]జేసెడి నదే కడుచిత్రము దీనిశాంతమున్.

139

ఉ.

లాలనతోఁ బయోధరఫలంబులపెంపున నారిగా రస
జ్ఞాళిఁ దలంచి వచ్చిన రయంబున దట్టము గాఁగ [40]నవ్వుటన్
హేల దలిర్ప నారి కెడమే యని తక్కినవార లెల్లఁ గాం
తా లలిఁ బల్క నారి కెడ మయ్యెఁ జుమీ యిది మ్రానుజాతిలోన్.

140


క.

కరవీరము మన్మథభీ
[41]కరవీర మ్మార్తవమగుగతి నుండంగాఁ
బరికించి విటులు సిగ్గునఁ
బరికించిరి దానిపూఁత పస లెఱుఁగరొకో.

141


క.

అరిఁ బూని మదనుఁ డేసిన
యరిఁ బూనికఁ జెఱుచుఁ జిన్నవైనంగా నీ
విరవాదు లనుచుఁ గడున
వ్విరి వాదులు నూని వేల్పువెలఁదులు తమలోన్.

142


క.

ఏలాలత లెన్నైనను
నేలా లత లుండ ననుచు నింతులు తమలో
నేలలు పాడుచుఁ దగు ను
య్యాలలుగాఁ జేసి యూఁగి రతిముద మొదవన్.

143


క.

పొదరిండ్లకంటెఁ జెలువగు
పొదరిండ్లుం గల్గ విటులపొందికకై యి
మ్మదనాగయానలకు న
మ్మదనాగమ పర్ణశాల మఱియొం డేలా.

144


క.

ఈకుసుమగుచ్ఛ మతిభృం
గాకీర్ణం బగుచు నొప్పె నతివా, చూడన్

రాకాంతంబున గ్రహణ
వ్యాకులితశశాంకబింబ మని పోల్పంగన్.

145


వ.

అని వినోదాలాపంబు లాడుచుం జని చని.

146


ఉ.

సుందరు లెల్లఁ దత్తరపుఁజూపులు నవ్వన మెల్లఁ జూడ నిం
డం దిమిరంబు బర్వినఁ గడంగి యొకించుక నవ్వినంతలో
నం దమమీఁద వెన్నెల బెణంగయి తోఁచిన రాత్రి యన్న బు
ద్ధిం దళదంబుజాతములఁ దేఱి గనుంగొన మాని రంతటన్.

147


వ.

అందు.


ఉ.

అందనిపువ్వుఁగొమ్మలకు నై చరణాగ్రము లూఁది నిక్కి యా
నందముతోడ హస్తనలినంబులు సాంచినఁ గక్షదీధితుల్
చిందులు ద్రొక్క నీవి [42]విడి చీరకటిప్రభ లెల్లదిక్కులం
జిందఁగ నాననాబ్జములఁ జెల్వపుఘర్మకణంబు లొల్కఁగన్.

149


ఉ.

నిక్కలనాత్మసంచయము నిక్క లతాతతు లంటి యత్తఱిన్
జిక్కనిపువ్వుఁదేనియలు చిక్కఁ గరంబులు జీరువాఱఁగాఁ
జొక్కపుఁదావికి న్మదులుఁ జొక్క నఖాగ్రముల న్సురాంగనల్
దక్కఁగఁ బుష్పగుచ్ఛములు దక్క మనోహరలీలఁ గోయఁగన్.

150


తే.

మాధవీపుష్పమున నున్న మత్తషట్ప
ద మని యెఱుఁగక జంబూఫల మని చేరి
పట్టఁబోయిన నది కేలు కుట్టినంత
నులికిపడె నొక్కసఖి తోడిచెలులు నగఁగ.

151

ఉ.

పయ్యెద జాఱ సంతసము పర్వఁ గడున్నిగుడించు నూర్పులుం
బయ్యెదఁ జేరఁ జన్నుగవబాగులు గన్గొని చక్రవాకముల్
దయ్య మెఱుంగు లుప్పతిలి తార్కొని చంపలఁ జెంపఁ గొట్టఁగా
దయ్య మెఱుంగు వీరలవిధం బని కొందఱు బంతు లాడఁగన్.

152


వ.

మఱియుఁ గొంద ఱిందీవరాక్షు లక్షీణప్రభావంబున భావ
సంభవుని పట్టపుటేనుంగులచందంబున మందమందగమనం
బులు మీఱ మిక్కిలి చలంబున మక్కున లెక్క లెక్క
మిగిలి పిక్కటిలిన చొక్కపుఁదేనియ లొక్కపెట్టఁ దొరఁగం
దిరుగుపడి పరిమళంబులు మరిగి పరిభ్రమించు తుమ్మెదలు
తండోపతండంబులై యండఁగొన నీలమేఘఘటాచ్ఛన్న
చంద్రబింబసహస్రంబుల నవ్వు మవ్వంపుఁబువ్వు[43]గుత్తులు
చేరఁ దదలికఫలకలులితచికురనికరంబులం దమపిల్లలని
యుల్లంబుల నుల్లసిల్లి మాటిమాటికిం జేరు తేఁటిదాఁట్లఁ
జోపంజాఁపు కరంబులు కిసలయవిసరంబు లనెడు నాస
మెసవం జేరి కోకిలంబుల చీకాకు పఱప వెఱపునం గడవ
నడువ నమ్మురిపంబుఁ జూచి యచ్చటచ్చటఁ దిరుగు తమ
కొదమలని రాయంచులు ముంచుకొనినం జనలేక నిలిచి
పయ్యెదచెఱంగుల విసరఁ గవిసి చెన్ను గల గబ్బిగుబ్బలఁ
దమకులంబువారలని ప్రేమపెక్కువల జక్కవలు చుట్టు
ముట్టిన నలయికలఁ జెమర్చి వణఁకునంగంబుల నిష్యంద
మానమరందబిందుసందోహమందపవనచలితలలితలతానిక
రంబు ననుకరించి మించిన వేడుకఁ దమ తమ యిచ్చల

విచ్చలవిడి సంచరించి యలరు నలరులం దెచ్చి యొక్కచో
నిలిచి యొకర్తు నుద్దేశించి.

153


చ.

ఫలరసపూర్ణవాహినియు భవ్యమరందమహాస్రవంతియున్
జలజవిరోధికాంతమణిజాతతరంగిణి గూడి యిచ్చటన్
గలఁకలు దేఱిపాఱు ననఁగా నదిఁ జూచి త్రివేణిసంగమ
స్థలమని మాధవుండు విడఁజాలఁడు సంతతసమ్మదంబునన్.

154


తే.

కీరవారంబు [44]మెప్పుదేఁ గీరవాణి
వాణిఁ జేరంగ నేప్రొద్దు వదరుచున్న
దకట ద్విజకులమయ్యుఁ బాంథాలినేచు
నతివ బలుగూళ్లఁ బెరిగినకతన నేమొ?

155


ఈ కోకిలములు విరహులఁ
జీకాకు పడంగఁజేయుఁ జెలియా యివి ప
ల్గాకులు పెంచినకతమున
నో కడుఁ [45]బుల్లాకుమేఁతనో వివరింపన్.

156


వ.

అని యానందరసపూరితహృదయారవిందలై సరసాలా
పంబు లాడుకొనుచు నందఱుం గూడి.

157


సీ.

సమపీవరోన్నతస్తనమండలంబులు
             మహనీయకుంభయుగ్మములు గాఁగఁ
సోయగంబులఁ దనరెడు నూరుకాం
             డంబు లనూనతుండములు గాఁగఁ
ధవళాంశుసంకాశదశననిర్యత్ప్రభా
             సముదయం బతులదంతములు గాఁగఁ

గరఁగి చెక్కులవెంట దొరుఁగు కస్తూరిబొ
             ట్లాతతదానధారాళి గాఁగఁ


తే.

శంబరారాతి పట్టపుసామజముల
పోల్కిఁ బరిణతి మీఱంగఁ బోతరించి
మందగమనంబు లెసఁగ నమందలీల
వనములోపల విహరించి వచ్చివచ్చి.

158


క.

చందనగిరిభవపవన
స్యందితకల్హారకమలసందోహరసా
నందభరపరిభ్రమదిం
దిందిరమగు నొకకొలను గనుఁగొనిరి సురతరుణుల్.

159


వ.

అని శుకయోగీంద్రుం డిలావంతునకుఁ జెప్పినవిధంబు
దప్పకుండ నెఱింగించిన విని యటమీఁది వృత్తాంతం
బేమని యడుగుటయు.

160


శా.

ముగ్ధాంభోరుహలోచనామదన, [46]శంభుప్రాభవోపేత, స
మ్యగ్ధాత్రీధరధీర, భోగికులసమ్రాద్బంధురప్రజ్ఞ, శ్రీ
దుగ్ధాంభోధిగభీర, దానఘన, సింధుశ్రీదతారేట్సుధా
భుగ్ధేనుప్రతిమానభోగకలనా, భూమండలాఖండలా!

161


క.

భూరిపరిపంథినిచయా
వారణకుంజరఘటానివారణలీలా
ఘోరపరాక్రమఘనకం
ఠీరవ సుగుణాఢ్య సత్యనిత్యాభరణా.

162

భుజంగప్రయాతము.

సరోజాతనిద్విడ్భుజంగేంద్రతారా
హరక్ష్మాధరాజప్రియాకుందహారా
మరక్షోణిజాతద్యుమత్తేభదుగ్ధా
బ్ధిరమ్యోల్లసత్కీర్తిదీప్తిప్రచారా.

163


గద్యము.

ఇది శ్రీమత్కౌండిన్యగోత్రపవిత్ర చరిగొండ తిమ్మ
నామాత్యపుత్త్ర సకలవిద్యాపారీణ శతఘంట సురత్రాణ
సుకవిజనవిధేయ ధర్మననామధేయప్రణీతం బయినచిత్ర
భారతం బసుపురాణకథయందుఁ ద్వితీయాశ్వాసము.

  1. లోఁచిపుచ్చి
  2. వేసవిని తలఁప దినంబు వీలు దినము
  3. సిరుల హరుల
  4. మున్ స్ఫురన్నభోమండలమున్
  5. చెదర
  6. తరింపఁగఁ
  7. వనభూమి
  8. పణ్యభావంబును
  9. వితానంబులను
  10. కోరిన
  11. లేఁబ్రాయంబు
  12. జేయూతగాఁ
  13. బల్వీకన్ హిమాంశుండు దా
  14. బాపటయుం బొసంగ
  15. బాణముల
  16. గడచి
  17. నిన్ను
  18. కఱకు లయి మించి నాయ
    క్కఱకుం జనుదేని వారిఁ గని నీ వపుడే
    చెఱుకువిలుఁ బూనునంతనె
  19. నెవ్వదీఱ
  20. పొరుగువారని వారిపొందుఁ గోరి
  21. సవనములను
  22. లోడుదురు డొంకి నీ వల్గి చూడ
  23. మేలెల్ల డించిన
  24. సరస్మదాలియై
  25. వెలిసమకట్లు
  26. తావు గోరని
  27. ఠావుల
  28. మాడైనఁ దలఁపని పెనుదిట్ట
  29. జెయి మించినట్టి దిద్ధరణి లేని
  30. నీలకంఠాశ్వంబు, నీలకంఠాంగము
  31. గుందునో
  32. తిన్నెల
  33. మున్ను
  34. రటీ
  35. కీలభిన్నతన్
  36. గలకొంటి
  37. నగ
  38. ల్చందనమాని
  39. చేసె వినుఁడీ
  40. నప్పుడే
  41. కరవీరము మూర్తమైన
  42. తతి చీరఁ గటి
  43. గుత్తులజాడఁ
  44. ముక్కునఁ గెంపు దేర
  45. బల్లా
  46. శుంభత్ప్రాభనోతేత