చంపూరామాయణము/తృతీయాశ్వాసము

శ్రీరస్తు

చంపూరామాయణము

తృతీయాశ్వాసము

క.

శ్రీనందనసౌందర్య బు, ధానందనసూక్తిధుర్య యరినృపసేనా
మానమదేభనఖాయుధ, కోనమదేవీకుమార గుణమణిహారా!

1


విశ్వామిత్రుఁడు రామునకు గంగావతరణం బెఱిఁగించుట

మ.

కని యయ్యేటితెఱం గెఱుంగుటకు నైక్ష్వాకుండు గాంక్షించినం
గొనియాడం దలకెక్కుటెక్కులది పేర్కో శక్తుఁడా యిట్టిగం
గ నొకండై న వచింతుఁ గొంత యనుచున్ గాధేయుఁ డాలోకపా
వనిఠీవి న్నొడువం దొడంగెఁ దదనుధ్వానాయమానార్భటిన్.

2


చ.

చలిమల మున్ను మేకుతనుజూతయనందగు మేనిటెక్కు చ
న్నులవలినిక్కునుం గల మనోరమఁ జేకొని కాంచె దానియం
దలికచలున్ రథాంగకుచ లంబుచరాయతనేత్ర లబ్ధవ
క్త్రలు నగుముద్దుఁగూఁతులను గంగయు గౌరి యనంగ నిర్వురన్.

3


గీ.

వారిలో వారిలోలకల్హారకమల, వనరటద్భృంగ గంగఁ జేకొనిరి సురలు
మారునిమిటారిచికటారి గౌరియనెడు, హొంతకారి వరించె నయ్యంతకారి.

4


మ.

గిరిజం గూడి శివుం డనేకయుగముల్ గ్రీడింపఁ దత్తేజ ము
ర్వర దాల్చెన్ ధర యోర్వలేమి గని గీర్వాణుల్ శిఖింబూన్పఁ జే
సిరి గర్భచ్యుతియంచు సంతతి నిజస్త్రీలందు లేకుండ ని
ర్జరకోటిన్ బహుభార్య గాఁగ ధరణిన్ శాపించె నద్దేవియున్.

5


మ.

పడవాలున్ ఘటియింపుమంచు దివిజుల్ బ్రార్థింప నవ్వహ్నియుం
దొడుకుందత్తడిజోదుతేజము సుధాంథోవాహినీవారిని
ల్పుడు నయ్యేఱు వడంకుమెట్టకడ ఱెల్లుం దార్ప సాఱెల్లునం
బొడమెన్ దైవతమొక్కఁ డిత్తిగలమోముల్ కృత్తిక ల్మెచ్చఁగన్.

6


ఉ.

అట్టి హితావహున్ గుహు మహామహుఁ దా దళవాయిపట్టముం
గట్టికొనంగఁబట్టి భయకారకతారకవీరకాహళీ

ధట్టరవశ్రుతిన్ బెదరు దాడి దొఱంగి నిజామరావతీ
పట్టణమేల నోఁచెఁ బవిపాణి యపారరమాధురీణుఁడై.

7


సీ.

తొలకరితఱియాటపులుఁగుఁదేజీరౌతు నడుగుదోరుమిపక్కిపడగవాని
నలువపాగాబాటయలవరించినమేటి రాకాసిముక్కాఁక డాకవాని
తెఱగంటిరాచకూతురిఁ గైకొనినజాణఁ గొమరు మన్నెఱికంపుఁగొమరువాని
జాళువానెత్తమ్మిసరిదాల్చునీటరి మలచెంచురాచూలివలపువాని


గీ.

మేలుబలువాలుతోడికెంగేలువాని, వేలుపులచాలుఁ గృపఁ జాల నేలువాని
షణ్ముఖుని బేరుకొన్న నీచరిత విన్న, నొదవునయ్య తదీయసాయుజ్యపదవి.

8


చ.

విరిసరి నేనలిం, గళభువి న్మణివల్లరి, యంఘ్రి వజ్రపు
న్సరిపణినాఁ ద్రిలోకి యనుచానకుఁ దానొకనీటు వెట్టు సం
బరతటినీవతంస మిది పావకమూర్తి గతిం ద్రిథాపరి
స్ఫురణముఁ బూనుకొన్నవిధము న్వివరించెద నీకు రాఘవా.

9


క.

పొగడొందె మును దయాంచ, ద్దృగళుఁడు భుజదండపరిణకృతభరణమిళ
జ్జగదండమహీనగరుఁడు, సగరుఁ డనం జక్రవర్తి సాకేతమునన్.

10


చ.

తరణికులేంద్రుఁ డాతఁడు విదర్భజఁ గేశిని వైనతేయసో
దరి సుమతిన్ వివాహమయి తత్సతులందు సమాశతవ్రతా
చరణవరప్రదాయి భృగుసత్కృపచే నసమంజసంజ్ఞతో
నఱువదివేవుఱొక్కరగు నాత్మజులంగనియెన్ మహౌజులన్.

11


క.

అసమంజసచరితుం డని, యసమంజసమాఖ్యు వెడల నడిచి పురిన్ ష
ష్టిసహస్రకుమారులు గొ, ల్వ సహస్రకరప్రతాపవారితరిపుఁ డై.

12


మ.

సగరుం డంతట వాజిమేధమఖదీక్షం బూని యాగోచితం
బగు తేజి న్విడిపింప నాహరి నహల్యాజారుఁ డింద్రుండు చౌ
ర్యగతిన్ దాఁచె నిశాచరుం డగుచు జారత్వంబు వర్తిల్లుచోఁ
దగుచోరత్వముఁ జేరె నంచుఁ దను విద్వాంసు ల్మదిన్ రోయఁగన్.

13


చ.

హరి నరయన్ గురుం డనుప నత్తఱి సాగరు లుర్వి రోసి వే
సరి ధర ద్రవ్విత్రవ్వి బలిసద్మగు లై హరిబుద్ధి దక్కి చి
క్కెర మునిము చ్చటంచు గమకింపులచేఁ గపిలుం గెరల్చి త
ద్గురుతరకోపదీపమునకున్ శలభాకృతిఁ జెంది రందఱున్.

14

క.

తనయులు దడయుట కధిపతి, మనుమనిఁ బనుచుటయు నతడు మహిబిల పదవిం
జని నిగుఱైన పితృవ్యులఁ, గని వారిం దడుప వారిఁ గాంక్షించు నెడన్.

15


క.

చదలేటినీటఁ దడుపక, కొద లేటికిఁ దీఱు సగరుకొమరుల కని ప్రే
మ దివంతచరుఁడు గరుడుఁడు, మదివంత యడంప నంశుమంతుండంతన్.

16


చ.

కపిలు సహాశ్వపార్శ్వతలుఁ గన్గొని జన్నపుఁదేజియంచు వి
న్నప మొనరించి వానికరుణన్ హయమున్ గొని తెచ్చి యిచ్చినన్
నృపుఁడు తనూజమన్యువు భరించియు మన్యుసమాప్తిఁ గాంచి ది
వ్యపదవి కర్హుఁ డయ్యె నతివార్ధక మొందియు నిర్జరోన్నతిన్.

17


క.

అసమంజసుతుం డంతట, వసుమతిఁ బెక్కేండ్లు పూని వలిమలకడఁ దా
పసియై తిరిగియు సురనది, వసుధకుఁ దేనోపఁ డయ్యె వానిసుతుండున్.

18


గీ.

తండ్రి క్రియఁ బో నలదిలీపతనయుఁ డగుభ
గీరథుండు గోకర్ణంబుఁ జేరి సలుపు
తపమునకు మెచ్చి యిలఁ దూఱు తనదు వేగ
మాఁగికొనఁజూచు నుగ్రుపై నాగ్రహించి.

19


సీ.

తొగఱేని పరివార మగుతారసంఘంబు శంఖరింఖ న్మణిసరణిఁ జూప
జవనీతహరిదంతజలధరవ్రాతంబు కూలశైవలజాలలీలఁ దోఁప
సుడివడి తిరిగెడు సురవిమానశ్రేణు లెడనెడఁ బడవలవడువుఁ దెలుప
భిదురాసి తను నెందు వెదకింపఁ జౌదంతి డిండీరఖండపాండితి భజింప


గీ.

గగన మేకోదకీభూత మగుట నబ్జ, హితుఁడు దిఙ్మోహము వహింప నతని తేరి
హరులఁ దరఁగలవెల్లిఁ బో నాఁపలేని, తహతహ ననూరుఁ డాత్మలోఁ దల్లడిల్ల.

20


మ.

నురుఁగన్నవ్వు ముఖాబ్జమం దొదవ నన్నుం బూని పోనీక శం
కరుఁ డే యాఁగెడువాఁడు చూతమనుచుం గల్లోలవాచాలతన్
సురకల్లోలిని కేలినీరమణహృజ్జూటీజటారుద్ధయై
గఱికిం బట్టిన మంచుబొట్టు కరణిం గన్పట్టెఁ జిత్రంబుగన్.

21


క.

పృథుకేందుమౌళి సురనదిఁ, బృథివికి రానీక యడ్డువెట్టుటయు భగీ .
రథుఁ డాత్మ నపూర్ణమనో, రథుఁడై నుతియించె ధరణిరథు నీకరణిన్.

22


సీ.

కుసుమవాటియు మహానసము నై పొసఁగు నేదేవదేవునకును దేరివలువ
చూపులు రూపులు నై పొల్పుమీఱు నేపరమపూరుషునకు బండికండ్లు

లాయంబుఁ గంచంబు నై యుల్లసిల్లు నేదంటవేల్పునకును గంటసరము
లీలాబ్జ మంపముల్కియు నై చెలంగు నేయసమవైభవునకు నొసలికన్ను


గీ.

నతని జితకంతు నతులబాహాప్రతాప, దూరతోవార్యమాణసింధూరసింధు
రాశరకళత్రసీమంతు నంఘ్రిహతకృ, తాంతు వామార్ధశుద్ధాంతు నభినుతింతు.

23


మ.

జయ మృత్యుంజయ! వాసరాత్యయవియచ్చారీవినోదప్రియా!
జయ గంగాధర! మేదినీధరధనుర్జ్యాకర్షణోద్యత్కరా!
జయ గౌరీధవ! సారసోద్భవరమాజానీప్రణీతస్తవా!
జయ విశ్వాధిక! దారుకావనమునిశ్యామాప్రియంభావుకా!

24


వ.

అని యిట్లు నిజకపర్దనిర్దయరుద్ధసిద్ధవాహినీమహీతలావతారకరణ నైఫుణంబుఁ
జూపునాదిలీపభూపాలతనయు నాత్మీయచిత్రచారిత్రబహువిధోచ్చారణంబునకు
మెచ్చి వైయచ్చరపరంపరాకిరీటకోటిమణిఝాటపాటలమరీచి మాలికారచితనీరాజనోపచారచారుచరణరాజీవుండును, గైవల్యవితరణానుకూలకరుణారసార్ద్రభావుండును, శిఖండిపదమార్గణవ్యగ్రశాబరీ మరాళగమనరోధికాదంబినీడంబరవిడంబికాకోలకాళిమాళీకమృగమదానులేపన మనోహరగ్రీవుండును, వినోదమేదినీధరాయమాణరాజతగ్రావుండును, నఖండస్వయంవ్యక్తసూక్తిశీలితానేకభావమోహకప్రకాశితానన్యదేవసామాన్య దివ్యప్రభావుండును, నభంగురస్వీయసంగరోపకరణతాసమంచితప్రపంచ దురహంకరణవంచనాచుంచుకించిదవదాతహసితమాత్రనిర్వాపిత పురత్రితయపూర్వదేవుండును, నగుమహాదేవుండు దను నవని కవతరించుట కనుమతించుటయుఁ బంచశరపంచశాఖామండలితపుండ్రకోదండదండంబునం దుండి చిటిలిపడు బటువుకట్టాణిముత్తియంపుఁబూసకరణి ధరణిజనపాతకప్రతతి కుత్పాతహేతువై గగనపదవిం దెగిపడిన మిక్కుటంపుఁదోఁకచుక్కతేఁకువ మరకతంపుటుప్పరిగకొణిగదప్పి యుఱుకుబకదారిపారువామిటారితీరునఁ గుమారనారాచధారావిదారితధరాధరవివరసరణి నిర్గమించు రాయంచమించుఁబోఁడి పోడిమి హిమాద్రిమంజులనికుంజంబు నిష్క్రమించు పంచాననప్రమదకొమరున నమరపురవనాంతరాళతంతర్యమాణనిష్క్రాంతియైన చౌదంతియొప్పిదంబున నంబరగవీలలామంబు పొదుగునం బరిస్రుతం బగునురుక్షీరపూరంబుడంబున నాదేవదేవుపాటలజటాజూటంబు వెలువడి చిలువచెలువ చెలువలర, దంష్ట్రికలసెకలం దొలంగించు బలుచలువఁబరివసతి నెలకొన, నలకమఠపతి వీఁపుచిప్పఁ దాకి యుప్పరం బెగసి జగదండక

ర్పరంబునఁ గుంటుపడి మగుడువేగం బడరఁ బుడమికి డిగి నలుగడల వెల్లివిరిసి పెల్లగుచుంజాలుకొని యిద్దరులు నేరుపడు నుద్దవిడి నేఱుబడి వెడలి పులియడుగుతపసికొడుకు వెనుకొనెడు పాలకడలి వడువున, వసంతసమయంబు ననుసరించు కుసుమసముదయసమృద్ధిపగిది, విశదపక్షానుశీలనాలక్షితవినోద యగు కౌముదీసమితిరీతిఁ, గృత్తికాషట్కంబుననువర్తించు కార్తికనిశాచక్రవర్తిమూర్తిలాగునఁ, బరమభాగవతుననుగతికి హత్తు సత్త్వగుణసంపద విధంబున, వదాన్యమూర్ధన్యునకు ననుకూల యగుకీర్తిబాలిక పోలిక, భగీరథురథంబు వెంటనంటి పంటవలంతికంటసరి సరవి మీఱి నీహారగిరికుమారి భాగీరథీప్రథాసమాకలిత యై యనేకనగరఖేటకర్వటీగ్రామటీకోటులందాఁటి జహ్నుమునిసవననాటిపై నాటోపగరిమ నెఱపం గోపించి పుక్కిటఁ జిక్కంబట్టి యెట్టకేలకు గరుణవుట్టి యాజటివరుండు కర్ణఫుటి విడువఁ గడువడిం గదలి జాహ్నవీసమాహ్వాయంబు మెఱయ నరిగి సాగరులపయిం బఱవ నయ్యేటి వరవ నమ్మేటియఱువదివేవురునరేంద్రనందనులు సంక్రందనపురంబుఁ జెంది రంత భవదీయవంశకర్తయగు సగరప్రణప్త సంతర్పితపితామహగురుప్రసాదాసాదిత ప్రాజ్యసామ్రాజ్యవైభవుం డై యుండె. పుండరీకలోచనా! సమాచీన యౌష్మాకీణకుల
విజయవైజయంతి యన నీసురస్రవంతి మెఱయుచున్నది. మఱియు నీవియన్నది జగన్నుతాపదాను లగుభవత్కులీను లీనిఖిలజలనిధిమేఖలావలయభారంబు భరియించుటం జేసి నిర్భరుం డయ్యు దుర్భరపురావసుంధరాభరణధౌరంధరీలక్ష్యమాణయగు బుభుక్షం బోనిడ వడంకుమెట్టకడఁ దోఁక వెట్టుకొని గట్టుచట్టుపల మట్టుపెట్టుదిట్టదెస మొగంబుగాఁ జాఁగి నిగిడి వేయుపడగలకొలందిఁ బూర్వపారావారలహరీజలకణాసారధోరణీవిసారణపరాయణసమీరణకిశోరసారణాకుతూహలి యగునాదికుండలియన సహస్రథావిజృంభమాణప్రవాహగాహితపయోరాశి యై కాననయ్యె నవలోకింపుము.

25


మ.

అని మందాకిని భూమికిం దిగినచర్యం దెల్పి యాలోకపా
వని వారిం గొనియాడి యావలికిఁ బోవ న్ముందటన్ సౌధకే
తనధూతశ్రమహంస మొక్కనగరోత్తంసంబు నీక్షించి యే
వ్వని దివ్వీ డని రామచంద్రుఁ డడుగన్ వాచంయముం డి ట్లనున్.

26


సీ.

అఖిలమోహిని యైనహరి మాయచే వజ్రి యమృతాపహృతి కేగునసురవరులఁ
దెగటార్పఁ గుపితయై దితి మహేంద్రు జయింప దగుపుత్త్రుఁ బడయ వేఁడఁగ మరీచి

పనుపునఁ దపము సల్ప నగారి కైతవంబునఁ బరిచర్య సల్పుచు వినీతుఁ
డై యుండి యొక్కనాఁ డంఘ్రి నెన్నెఱులంట నశుచియై కూర్కునయ్యతివకుక్షిఁ


గీ.

దూఱి గర్భంబుఁ బవి నేను తునుకలుగ నొ, నర్ప నవి సప్తమారుతినాఁ జెలంగె
నాశరులతల్లి వసియించు నప్పు డిప్పు, రము గుశప్లవమనుకాన రవికులీన.

27


క.

పొడమెన్ సుకృతి యలంబస, యెడ నొకఁడు విశాలుఁ డనఁగ నిక్ష్వాకునకుం
గొడు కతనిపేరి దఘమున, కెడయీదు విశాల యయ్యు నిది రఘువీరా!

28


చ.

సుమతినృపాలుఁ డేలుపురిఁ జూత మనం జని మువ్వు రాధరా
రమణుసపర్య గైకొని పురందరుఁ డేజడదారి నారిపైఁ
దమి గతశోకుఁడై పిదపఁ దాల్చె నజాండభరంబు నట్టిగౌ
తమజటి యున్నయాశ్రమపదంబు కుఱంగటత్రోవఁ బోవఁగన్.

29


క.

పాషాణ మొకటి రఘుకుల, భూషామణి పదపరాగములు పైసోఁకన్
యోషాతిలకం బగుచుఁ దు, రాషాడరవిందగంధిరహిఁ జూపట్టెన్.

30


మ.

మనువంశేంద్రుపదాబ్జరేణువు పయిం బాఱంగ నెమ్మోము కౌ
ను నెఱుల్ పొక్కిలి పాణిపాదములు కన్నుల్ పుష్కరచ్ఛాయ మ
య్యె నయారే యనఁ బద్మవాసనలు మేనెల్లం గన న్నోఁచియుం
జనుదోయి న్విడదయ్యె శైలగరిమస్వాభావ్య మయ్యింతికిన్.

31


గీ.

అరిది యనఁగఁజెల్లదె రజోగుణమె ఖేద, మునకు మోదమునకు మూలమగుట
రజమువలన వికృతి భజియించిన యహల్య, ప్రకృతిఁ దాల్పె రామపదరజమున.

32


సీ.

తనచంచలత వాయ దని తపంబొనరించు తొలకరిమెఱుఁగొ యీతలిరుఁబోఁడి
హరసాంధ్యకృతిధాటి ధరకు జాఱినసుధాకరరేఖయేమొ యీకంబుకంఠి
వసుమతి తనపేరు వాసింపఁ గన్న పైఁడిసలాకయేమొ యీబిసరుహాక్షి
తన చెలికాని కామని కనంగుఁ డొసంగిన కృపాణియేమొ యీనలినపాణి


గీ.

యనఁదగు నహల్యయాతిథ్యమునకు నలరి
కౌశికుఁడు రాఘవులతోడఁ గదలి యంత
జనక మఘవాటి కరుగఁ బూజన మొనర్చి
యనకులునితో శతానందుఁ డిట్టులనియె.

33


రామలక్ష్మణులకు శతానందుఁడు గాధేయవృత్తాంతముం జెప్పుట

శా.

కన్యాకుబ్జపురి న్వసించునపు డీగాధేయుఁ డక్షౌహిణీ
సైన్యంబుం గొని యొక్కనాఁడు మృగయాజాతాశయానందుఁడై

వన్యం గ్రుమ్మరఁ దోఁచు ఘర్మమడఁగన్ వాసిష్ఠుసద్మంబునం
దన్యూనామరధేనుకర్తృకతదీయాతిథ్యసంతుష్టుఁ డై.

34


ఉ.

ఈపసి రాచయింట వసియించుటకుం దగుఁగాక దక్కునే
తాపసి కంచుఁ దద్దవికతం బగునుధ్ధతిపెట్టుఁ జేసి దా
త్రిీపబలంబు బ్రహ్మబలధిక్కృత మౌట యెఱింగి చాపమున్
రోపముఁ బాఱవైచి మునిరూపముఁ దాలిచి తత్క్షణంబునన్.

35


చ.

తపమొనరించునత్తఱిఁ బతంగకులాబ్ధిశశాంకుఁ డాశయ
వ్యపగతశత్రుశంకుఁ డగునట్టిత్రిశంకుఁడు బొందితోడి ది
వ్యపదవికై వసిష్ఠు విడనాడి తదాత్మజులన్ దురుక్తిచేఁ
గుపితులఁ జేసి శాపము దగుల్పడి తన్ శరణంబుసొచ్చినన్.

36


ఉ.

మాలఱికంబు సూడక సమస్తఋషుల్ తనుఁ గూర్చి వచ్చున
వ్వేళ వసిష్ఠసూను లొదవెం గద రాజకయాజకుండు చం
డాలపుసోమయాజి కని నవ్విన వారి యవాచ్యజాతులై
కూల శపించి వేలుపులు కుంభినికిన్ దిగమి న్సకోపుఁ డై.

37


చ.

దివికిఁ ద్రిశంకుఁ బంపుటయు దేవవిభుండు తదీయకశ్మల
ప్లవపతివేషముం గని యిలం బడద్రొబ్బ నభంబునందు న
య్యవనిపు నుండఁబంచి భవనాంతరకల్పన మంత నబ్జసం
భవకృతసాంత్వవాదుఁ డయి మాని తపోభరితాంతరాయతన్.

38


క.

పశ్చిమదిక్కువ కరిగి వి, పశ్చిదపశ్చిముఁ డితండు బహువర్షము లం
దాశ్చర్యకృతాస్తోకత, పశ్చర్య వహించె భూసభశ్చరనుతుఁ డై.

39


మ.

నరమేధంబుస కంబరీషుఁ డడుగం దన్ దల్లిదండ్రుల్ ధనా
తురులై యమ్మికొనం బశూకరణభీతుం డై శునశ్శేఫుఁ డీ
కరుణాబ్ధిన్ శరణంబు వేఁడ నతనిన్ గాధాయుగప్రీణితా
మరుఁగావించి భజంచె నిట్టి త్రిజగన్మాన్యుండు సామాన్యుఁడే.

40


క.

వెండియుఁ బడమటిచాయని, తం డుగ్రతఁ బూనుకొన్న తపముఁ జెఱుప నా
ఖండలుఁ డలనుమనఃకో, దండుని వేదండ మైన తనుఁ బనుచుటయున్.

41


క.

మేనక మౌనివిరక్తి భ, యానక రతిరాజరణజయానక నిభసిం
జానకనత్తరనూపుర, యానకళానుగతగాంగహంసాంగన యై.

42

సీ.

మించుతోడ రమించు మేఘంబు కైవడి వ్రేలుకొ ప్పొకనీటు గీలుకొలుప
మరుపతాక వహించుమకరచిహ్నమురేఖ సోఁగకన్గవ బెళ్కు సొగసుచూపఁ
బండుగురే దాల్చు నిండుజాబిలిరీతి మొగము లేనగవుతో ముద్దుగులుక
నెలదీవఁ దళుకొత్తు నలరుగుత్తులఠీవి బటువుగుబ్బలు నేత్రపర్వ మొసఁగ


గీ.

మహికి దిగివచ్చి తనయాశ్రమంబుకెలన, మెలఁగ నా వేల్పుజవరాలివలకుఁ దగిలి
యలఘుకళలకు నిధిగాన నతనుశాస్త్ర, దేశికుం డయ్యె నప్పుడు కౌశికుండు.

43


మ.

నునుఁగెమ్మోవి జపానుబంధ మణఁపన్ నూగారు సామీరణౌ
దనచర్య న్మఱపింపఁ గౌను హరిచింతం బోనిడం గోకపా
లనదృష్టిం జనుదోయి మాన్పఁ జిరకాలం బీఘనుం డావిలా
సినితోఁ గూడి మెలంగి యంతట నుదీచి న్యోగియై యున్నెడన్.

44


సీ.

వేలుపుదొరవీటివేశవాటిమిటారిమిన్నల కిదిగదా మేలుబంతి
హయమేధముఖయాగయజనశీలురఫలాకలనల కిదిగదా కల్పలతిక
పవిచేత వసపోనిదివిజేంద్రరిపుతపోవితతికి నిదిగదా వేఱువిత్తు
జగమెల్ల గెలువఁ గెంజిగురుటాకుజిరావజీరున కిదిగదా జీవగఱ్ఱ


గీ.

యనక కినుక శిఖాకృతి దనుకఁ దిట్టె, నమరపతి పంపఁ దనదుడెందము గలంప
వచ్చురుచిరోరురంభ యౌవనవిజృంభ, మానసంరంభ రంభ నిమ్మౌనివరుఁడు.

45


క.

తదనంతర మీతఁడు పూ, ర్వదిగంతరమున నిరంతరశ్వాసనిరో
ధదురంతతపోబిభ్య, త్త్రిదివుం డయి విలయతరణితెఱఁగున మెఱయన్.

46


శా.

బ్రాహ్మీవల్లభుఁడు న్వసిష్ఠుఁడు నిలింపశ్రేణియు న్నీవపో
బ్రహ్మర్షిప్రవరుండ వంచుఁ దను సంభావింప లోకోత్తర
బ్రాహ్మణ్యేకశరణ్యమంత్రజుషియన్ ప్రఖ్యాతి వర్తిల్లె నీ
బ్రహ్మజ్ఞానధురీణుఁ డంచు గణుతింపన్ మౌని సంప్రీతుఁ డై.

47


క.

రాతిరి యచ్చట నుండి వి, భాతం బగుటయు నొసంగెఁ బ్రామినుకులప్రో
గై తమ్ముల కనుఁ గై తగు, జోతికి నర్ఘ్యంబు దర్భసుమగర్భముగన్.

48


క.

శ్రీరామలక్ష్మణులు సం,ధ్యారచితప్రణతులై నిజానుగతిన్ రా
వారికి జనకపురాలం, కారము వివరింపఁ దొడఁగెఁ గౌశికుఁ డెలమిన్.

49


శ్రీరామునకు విశ్వామిత్రుఁడు మిథిలావృత్తాంతము జెప్పుట

మ.

కిరిధౌరేయునికోఱ హీరఖచితక్రీడాద్రి, మున్నీరు చ
ల్వ రహింబాయనిచీర, మేరుగిరి జాళ్వాపీఁట, మిన్నేఱు బి

త్తరపున్ హారము గాఁ జెలంగుధర సీతారత్నముం గాంచఁ దాఁ
బురుటి ల్లైనపురీమతల్లి మిథిలం బోలంగఁ బ్రో లున్నదే!

50


మ.

శివకోదండవిఖండనంబు సలుపన్ సీతానురక్తిన్ విదే
హవిభుం డున్నపురంబు డాయఁగల నీయత్నంబు చింతించి తా
భవచాపం బగుభీతి నిన్ను నతిచేఁ బ్రార్థింప నుస్నట్టి మే
రువురీతిం గనుపట్టె వప్ర మిచటన్ రోధో౽౦తరవ్యాప్త మై.

51


చ.

జగతికిఁ గూఁతు రై కలిమిజవ్వని జానకి యన్సమాఖ్య ని
న్నగర వసించి యున్నకతనం బెడఁ బాయనికూర్మి కాశయం
బగపడఁ జుట్టఁబెట్టు కలశాంబుధికైవడిఁ జూడనొప్పె నిం
దగడిత పుండరీకకుముదావలిధాళధళీయుతాంబు వై.

52


చ.

ఇప్పురి గొప్పయుప్పరిగ లిక్కువ టెక్కువహించు మించులై
యొప్పులకుప్ప లుండ విడనొల్లని నల్లని మబ్బులోయనం
దెప్పలఁ దేలుఁ దన్ముఖవనేరుహసౌరభవారిరాశి నె
ల్లప్పుడు దూర[1]ఖేచరవనాగతసాంద్రమదాళిమాలికల్.

53


మ.

మినుకుంబైఁడిమెఱుంగుమేడ లిచట న్మిన్నంది యుండం గనుం
గొని యాదిత్యులు రత్నసానువులు పెక్కుల్ దోఁచె నౌరయ్య! ప్రా
క్కనకక్షోణిధరంబు శంకరుఁడు విల్లా వంచిన న్వంచుఁగా
కనికేతంబులు మాకు లేవె యనుచుం గర్వింతు రత్యున్నతిన్.

54


చ.

హరిహయనీలకీలితమహత్తరగోపురకాంతిధోరణిన్
దరణి భ్రమించి నీకుఁ దగునా యమునా వడిసుళ్లఁ జెంద సా
గరుఁ బెడఁబాసి వచ్చుటకుఁ గారణ మేమి యనం దదీయమౌ
ఖరికి నగు న్సురీతతి పకాపక నిప్పురిమింటిచాయలన్.

55


క.

పరిమిళితాగరుధూప, స్ఫురణం బై యిచట ధరణిసుత రతనపుటు
ప్పరిగ గగనారవిందము, సురభియనుట నిజ మొనర్చు సురతతిమదికిన్.

56


శా.

ఋగ్వేదార్ణవకర్ణధారులు, యజుశ్శ్రీవల్లభుల్, సామస
మ్యగ్వైదుష్యనిధుల్, భృతద్వివిధమీమాంసారిరంసుల్, శ్రవో
దృగ్వాణీపరిణేత, లక్షచరణోక్తివ్యాపకుల్, సాహితీ
భృగ్వంశంబులు, జాణ లన్నికళలం దీప్రోలి విప్రోత్తముల్.

57

ఉ.

ఈవికిఁ జాల దర్ణవమహీస్థలి, [2]పోరికిఁ జాల దీత్రిలో
కీవరవీరలోక, మురుకీర్తి వసించుట కిమ్ము కాదు రా
జీవభవాండ, మిన్నగరిఁ జెన్నగురాచకొమాళ్ల కన్నచో
నావశమా గణింప రఘునందన వారిగుణప్రభావముల్.

58


గీ.

ఒకరొకరియింటిముందటి యుదిరిపసిఁడి, మేరువం తేసి రాసులై మెఱయు ననఁగఁ
దెల్లబేగడకొండ యాస్తి యగునలకు, బేరుఁ డెనయౌనే యీవీటిబేరులకును.

59


ఉ.

ఏరులసంఖ్యఁ జెప్పుటకు నెన్విరికి న్వసపోనిదారిఁ గా
శ్మీరధరిత్రిఁ బైరులు సమృద్ధి వహింపఁగజేసి గోగణా
ధారత రాజశేఖరవతంసములై సయిదోడు గంగకు
న్వీరికి బోల్కి చెల్లు నన విష్ణుపదోద్భవు లుందు రిచ్చటన్.

60


మ.

వినువీథిం జనునప్పు డిప్పురములో వేతండతండంబు చె
క్కున నెక్కొన్నమదంబు లంబుజవిపక్షుం జెంది పెంపొంది కం
దనుపేరం దనరారుఁ గాని భువనఖ్యాతావదాతాంశుసాం
ద్రునకుం జంద్రునకుం గళంక మను టెందుం జెప్పఁగా నొప్పునే.

61


మ.

చరణాబ్జంబులు సాది కుర్విఁ గదియం జాఁగు న్రయప్రౌఢిఁ జి
త్తరుతేజీలను మించుఁ దిన్ననినడన్ ధాటిం బరీక్షించుచో
శరధుల్ దాఁటి చివుక్కున న్మరలు నాజానేయరత్నంబు లి
ప్పురి నారట కరూశ బాహ్లిక శక ప్రోద్భూతభావోన్నతిన్.

62


మ.

కొఱఁతం జెందనిచందురుం డడుగునం గూర్మాకృతిం జొప్పడం
దరిత్రాడై తొలుకారుమించు లమరన్ సౌందర్యమంథాద్రిచేఁ
జెఱకున్సింగిణిజోదు చైత్రయుతుఁ డై శృంగారసారాంబుధిం
దరువం గల్గిన వేల్పు చెల్వ లిచట న్వర్తిల్లువారాంగనల్.

63


ఉ.

చిత్తరుచిత్తరుల్ నడభజించి రనన్ జిగినీలి కాసె ద
ళ్కొత్తెడు పాత్రకత్తియల కొజ్జఱికంబు వహించి కోహళుం
దత్తలునైనఁ గా దనెడునైపుణి మార్గవిధంబు దేశియుం
బెత్తము కేలఁ బూని వినిపింపఁగ నోపుదు రిందు నట్టువల్.

64


ఉ.

సంగరభోజి కాస్తి యగు జంత్రము, గాత్రమునందు రక్తిచూ
పం గొఱగాఁడ్గు, చాలఁ డలపావని రాగము విస్తరింప, నెం

చం గొదుకుంబరాశ్వతర జ్ఞులకు శ్రుతిదప్పునంచు వీఁ
కం గయికోరు ముజ్జగముగాణల నిచ్చటి గాయకోత్తముల్.

65


క.

ఉఱు ముఱిమినట్లు భరముం, దరితీపుమిటారిపలుకుదారి నయంబు
న్మెఱయింపనేర్తు రిప్పురి, నెఱమద్దెలకాండ్రు వాద్యనినదప్రౌఢిన్.

66


ఉ.

చక్కెరమోవికాటు, దమసానులచీరలవల్లెవాటు, లేఁ
జెక్కుల గోటినీటు, మెయిఁ జెల్వగు కీల్జడవాటు, నార్జపుం
డెక్కు ఘటింపఁ గుంకుమసటీరకురంగమదాదివాసనల్
సొక్కులిడ న్నడ న్విటులు సోలుదు రిచ్చటివేశవాటులన్.

67


చ.

పలుతెలినిగ్గు మొల్లగమి, బాహులు చంపకమాలిక,ల్మొగం
బులు వికచారవిందములు. పొన్నలు నాభులు, వాలుఁగన్ను లు
త్పలములు నై చెలంగ బహుతం గనుపట్టు వసంతలక్ష్ము ల
ట్లలరుల జట్టిగొందురు విటాశయ మిచ్చటి పుష్పలావికల్.

68


చ.

మొగముల తమ్మివాసనకు మూఁగెడుతేఁటులఁదోలుకేలి కై
చిగురులమేపరు ల్గదియఁ, జిల్కెడు పల్కులఁ జేరఁ గీరముల్
బెగడఁగ, మించు నందె రవలిం గలహంసలు రా, ససైన్యయై
తగుమరుమించుఁబోణి కెనదాలుతు రిచ్చటిశాలిపాలికల్.

69


క.

జనకుఁడు నిమివంశయశో, జనకుఁడు నిజకీర్తివిజితశారదఘనతే
జనకుఁడు పటుబోధనిరం, జనకుఁడు పాలించు దీని సరసాస్థానిన్.

70


మ.

మొగలిం గేదఁగి రేకు, వంశకుహళి న్ముత్యంబు, చట్రాతిలో
[3]మొగఱాత, ళ్కనఁటిన్ మిటారి కపురంపుంబల్కు, గారాకుఁదీ
వగమి న్లేఁజిగు రుద్భవిల్లునటు లీవైదేహుయాగక్రియా
జగతిం బాల యొకర్తు సీత యనుసంజ్ఞం గల్గి వర్ధిల్లఁగన్.

71


మ.

కటి దొడ్డై కననౌటఁ, గన్గవకటాక్షశ్రీలగర్వంబు చూ
పులుఁ జన్నుల్ మొనసేసి యుంట, బగడంబుం దార్కొన న్మోవి పూ
నుటఁ, దారుణ్యపు బందుక ట్టగుట మేనుందీవకుం జెప్ప కె
చ్చటికో పోయె మిటారి బాల్య మసమాస్త్రప్రాప్తి దౌర్బల్య మై.

72

చ.

గొనబుటొయారినెన్నెఱులు కొప్పున కందుట చూచి వానికి
న్ననలకుఁ దాము రాఁగలుగునంటు గణించి నిజోసమానయో
జన మొనగూర్ప వేడుటయుఁ జంపక మిందుకు సమ్మతింపమిం
గనకలతాంతవాటిపయిఁ గంటు వహింపఁగఁబోలుఁ దుమ్మెదల్.

73


క.

విరితేనెమేపరులకున్, హరినీలపుసరుల కిరుల కబ్జాక్షికురుల్
గురు లై వెడవిలుతుని బెడ, గుఱులై తగ నెమ్మిపురుల కొక దాఁపరులై.

74


ఉ.

నీ విఁకఁ బాల ముంచినను నీళ్లను ముంచిన మే లటంచు మీ
లావిరిఁబోణికన్నుఁగవ కాశ్రితవృత్తి వహించి తత్కటా
క్షావళికాంతిపూర మమరాపగ యై యమునాస్రవంతి యై
తావుకొన న్భజించె నమృతప్రభవానిమిషత్వసంపదన్.

74


క.

శ్రీలగు వీనులసంగతి, నాళీకత బెళుకు కలికినయనమ్ములపై
వ్రాలినమదాళిమాలిక, పోలికఁ దారకల సొలపుపొలుపు వహించెన్.

75


శా.

ఆవామేక్షణనాసఁ బోలుట కనర్హం బౌటనో మిక్కిలి
న్నూవుంబువ్వుఘనంబు దాళనిగతిం దోఁచె, న్మహీమండలిం
దావయ్యె న్సరసాళి గర్హ్యరుచికి న్సంపంగి, వంశంబు ము
క్తావాసం బగుచున్ విరక్తయతిచిహ్నం బయ్యె నూహింపఁగన్.

76


గీ.

నెలనెలకు భానుమండలిఁ గలయుఁ జంద్ర
బింబ మందురుగా కిందుబింబమందు
నరుణబింబంబు గలయునే యరు దనంగ
మొగమున కొసంగు నొకఠీవి ముదితమోవి.

77


చ.

హరమకుటావతంస మగునర్ధసుధాకరుఁ డష్టమీనిశా
కరుఁ డెదిరించి లొ చ్చగుట గానఁబడంగ నపాంగమాలికా
పరిచితకాళిమ న్నిటలపాలికపై నిడి మోయఁబోలు నీ
సరణి నన న్బొమ ల్మెఱయు జవ్వనికి న్నెలవంక బాగునన్.

78


క.

చిత్తజుఁ డను దొమ్మరి లా, గెత్తి వడిం దూఱి చనఁగ నిడినకడానీ[4]
బెత్తపువలయములో యన, బిత్తరితాటంకయుగము బెడఁ గై తోఁచెన్.

79


గీ.

చిగురువిలుతుపగతుఁ డగునుగ్రునకు శేఖ, రత్వ మొందు తనకొఱంత దీఱ
నర్ధచంద్రుఁ డలిక మై తోఁచెనేమొ యీ, మదనజనని యైనమానవతికి.

80

మ.

కలువ ల్మంకెన కుందచంపకములుం గందోయి కెమ్మోవియుం
బలుచా ల్నాసయు నౌటఁ దమ్మి తలఁచుం బద్మాస్యమో మెల్ల నా
బలగం బంచు; మృగాంకుఁ డట్ల పొగడుం బల్కు ల్సుధల్ చిన్నివె
న్నెల లేనవ్వు కపోలముల్ కళలు నై నిచ్చల్ ప్రకాశించుటన్.

81


మ.

సహజశ్రీహరిణాంకపంకరుహముల్ సౌందర్యదాయాహృతి
స్పృహచే దర్పణబింబదంభమునఁ దన్ జేరం గృపం గారవిం
చి హసాక్షిద్యుతిఁ బంపకం బిడి భృతజ్యేష్ఠత్వముం దమ్మల
న్రహియుం బూన్పఁగఁబోలు బాలమొగ మారాజారవిందంబులన్.

82


క.

సంకుమదంబు వహించియు, సంకుమదం బణఁచు నౌర సతికంధర మీ
సాంకావహజయకాహళ, శంకావహమృదునినాదచతురిమయుతమై.

83


మ.

కులుకుల్ నేర్పెడు పైఁట సూటుకొని రేఁగుంబండ్లు పూగీఫలం
బులు మాలూరశలాటువు ల్లికుచము ల్పూబంతులుం దమ్మిమొ
గ్గలు తాళంబులు నారికేళములు చక్రంబుల్ నునుం బైఁడికుం
డలునుం గొండలు నై చెలంగెఁ గుచము ల్నానాఁటికిన్ బోఁటికిన్.

84


చ.

జనకునిపట్టిగట్టిజిగిచన్గవ సామజకుంభదంభనో
దనగరిమ గ్రహించు టరుదా ? కరిదారణకారియైనయా
కనకగిరీంద్రధన్వివరకార్ముకముం దునియించుప్రాయపుం
ఘనత వహించి యున్న దనఁగా నిఁక భానుకులాధినాయకా.

85


చ.

నడు మతిసూక్ష్మ మైనకతనన్ రతినర్మసఖుండు సిబ్బెపుం
బొడ నునుగబ్బిగుబ్బకవఁ బుట్టెడు రాయిడి కావలగ్నముం
జడియఁగనీక యానికయొసంగిన నీలశలాకపోలికం
బడఁతుకరోమరాజి కనుపండువు నిచ్చు జనంబు చూడ్కికిన్.

86


చ.

ఘనుఁడు గదా విధాత సతికౌ నణుమాత్రమునన్ ఘటించినాఁ
డని చరణాబ్జరేణుపరమాణువుచే మునిసార్వభౌమగే
హినితనువల్లి యెల్ల సృజియించిన నీయెదుట న్నుతింపఁ బో
యినభవదీయచి త్తమున కేగతి వింతయగున్ రఘూద్వహా.

87


గీ.

కౌనుసోయగంబు గగనంబు నుతియింప, ననుచుఁ గన్న విన్న జనులు దలఁపఁ
దనకుఁ దానె తోఁచె వనితపొక్కిలికి మ,హాబిలప్రసిద్ధి యద్భుతముగ.

88

చ.

గురుకుచబాహువల్లరులకుం దమపాలిటిపుణ్యవాసన
న్సరులుగ నోచినార మని చంపకమాలిక లుండఁ బంకసం
కరములు తమ్మితూఁడు లురుకాండబలంబువహించి బల్మొనల్
సిరిఁ బచరింపఁ దత్తనువు చిల్లులు వోవఁగ నాడరే జనుల్.

89


సీ.

వేణిబంధమయారవిందబంధుకుమారికాసమాకలితసైకత మనంగఁ
దారుణ్యహిమకరార్ధకిరీటశుద్ధాంతవిహరణోచితమణిద్వీప మనఁగ
రతిమన్మథవివాహరచనామహెూత్సవప్రకటితకనకవేదిక యనంగ
హరిశరాసదురాసదాధిరోపణపణగ్రహమనోరథరథాంగం బనఁగ


గీ.

భృతమృదాకారమేదినీకృతి జుగుప్సి, తాశయకుశేశయభవప్రయత్నగౌర
వస్ఫురత్తైజసక్షోణివలయ మనఁగ, బాలిక పిఱుందు కన్నులపండు వయ్యె.

90


చ.

అతిశయరూపరీతి కరభాలికిఁ జొప్పడఁబోదు హస్తినీ
పతులకరంబులు న్మలినభావము దోఁచు ననంటికంబముల్
గతమృదులేతరాకృతులు గాన మనోజ్ఞతయు న్సువర్ణజి
ద్ద్యుతియు మృదుత్వముం గలతలోదరియూరుల కెవ్వి పోలికల్.

91


చ.

తలిరుకటారికాని బలుదంటదొనల్ వెనువెంట నంటు ను
జ్జ్వలశరశాలిసార మొదవ న్మకరాంకము లూని హేమకా
హళగరిమన్ జగత్త్రయజయంబు వహింపఁగఁ జేయునట్టి యి
జ్జలరుహపత్రనేత్రమృదుజంఘికల న్నుతియింప శక్యమే.

92


క.

కంజనయనాశిరోమణి, కిం జరణయుగంబు సొబగు కెంజిగు రగుటన్
సంజాతకోరకంబు ల, నం జితతారకములైన నఖములు మెఱయున్.

93


సీ.

రాజీవచర్యధుర్యకుఁ బాల్పడినఁ గాక ఘనకూర్మరేఖ చేకొనినఁ గాక
వసుమతీభరణలాలసత కోపినఁ గాక మతకరిహరిదారి మనినఁ గాక
దళితారి విక్రమోధ్ధతిఁ జెలంగినఁ గాక రాజహారితకు నేర్పడినఁ గాక
మణివితానాయోధ్యమహిమఁ జెందినఁ గాక కోటేరుటెక్కు నెక్కొనినఁ గాక


గీ.

శ్రీఘనోన్నతి కలికి మై చెలువు నెఱపి, కాక చెలి పాదయుగళి మీఁగాళ్లు పిఱుఁదు
నెన్నడుము చన్నుఁగవ మోము చిన్ని మోవి, సాస వేనలి యొకని కెన్నంగఁదరమె.

94


క.

ఈపగిది న్నవయౌవన, యై పరఁగఁ దనూజపెండ్లి కాజనకుఁడు ధా
త్రీపమదాక్షేపణమగు, చాపారోపణము పణము సలిపెఁ గుమారా.

95

క.

అని యీగతి మునితిలకుఁడు, ననవిలుతుని చిలుకుటమ్ము నాటినచందం
బున డెందంబున సీతా, వనితామణి గీలుకొనఁగ వర్ణించుటయున్.

96


క.

ధరణికుమారీకుచభర, పరిరంభముగోరు రామభద్రుని మదికిన్
మరువిల్లు మేరువయ్యెన్, హరువిల్లు నమేరు వయ్యె నతివైచిత్రిన్.

97


వ.

ఇత్తెఱుగునం దత్తపస్వికీర్తితం బగునమ్మత్తకాశినీరత్నంబు శంభుచాపాధిరోపణప్రయత్నంబు చిత్తంబున హత్తింప నక్షత్రవర్తనాయత్తతల నత్తమిలు వృత్తంబుల నిమిత్తంబువలన సత్రసోదాత్తులై యుత్తమక్షత్రియకుమారు లగు విభాకరనిశాకరుల ఠీవి, దేవతావిగ్రహపరిగ్రహాభావభావనావిలకుమారీలతోరరికాముఖరపామరధరామరానీకదుర్వివేకం బపాకరించుటకు భూచరులలోచనంబులకు గోచరించిన యనింద్యసౌందర్యసాంద్రులగు నింద్రోపేంద్రులచందంబున, నిజాపకారకారణశుచిస్ఫురణ కయనం బగుభవతృతీయనయనంబులీలఁ, గలహవేళాకుపితశైలాధిపదుహితృచరణకిసలయవిలసితాలక్తరసవ్యతికరానువేలముకుళితం బొనర్చియుఁ బెచ్చు పెరుఁగుమచ్చరంబు లిచ్చలం బాయక తదీయకోదండదండంబు ధరణీమండలంబునం దుండుట యెఱింగి ఖండించుటకుఁ బంతగించుకొని యేతెంచిన లతాంతశరవసంతులకరణిఁ, దెఱగంటి కలువకంటు లెటువంటి యొప్పులకుప్పలైన ఱెప్పపాటు వాటిల్లక చూపుటొరపులం దరిది దోఁప దని తత్పురీవారపారిప్లవేక్షణాకటాక్షవీక్షణప్రేక్షణీయు లగుట నై జగతి నవతరించిన జయంతనలకూబరులహవణిక, మహీభర తృణగ్రాహీకృతమహానీలశకలబృందంబు లగు చికురబంధంబులును, సౌగంధికవనీబాంధవస్తనంధయకుటిలతాచపేటీపాటవనిరాఘాటంబు లగులలాటంబులును, జంబూనదరసవిలిఖతశ్రీలకు సవర్ణంబు లగుకర్ణంబులును, ధనుర్లతల వంపు దింపులకుఁ దెచ్చుకొమరుగల కనుబొమలును, గమలదళవిదళనావహచరిత్రంబు లగునేత్రంబులును, సపత్రాకృతిభరితచాంపేయకళిక లగుకాళికలును, ముకురనికరాపిధానకరవైశద్యవిశాలంబు లగుకపోలంబులును, బింబఫలకదంబకమదంబున నతనుఘోటధాటి నుద్ఘాటించు కావులకుఁ దావు లగుమోవులును, నవీనకుందకోరకతపశ్చారకారకోదంతంబు లగుదంతంబులును, ననౌపమ్యవాహనానుకూలహిబుకంబు లగు చిబుకంబులును, పర్వదినశర్వరీమాత్రపరిపాలితాఖండమండలపయోరుహాభియాతిస్మయావలోకనస్మితోన్ముఖంబు లగుముఖంబులును, శంఖసంఘాధికదరత్వసంపాదనధురంధరంబు లగుకంధరంబు

లును, సమద వేతండశుండావితానచాంచల్యదానసన్నాహు లగుబాహులును, జగదభయవితరణశరాసనాకర్షణపురస్సరణసంజనిత కీర్తిపుంజమంజిమవిశంకాకారి హీరకంకణాలంకృతప్రశస్తంబు లగుహస్తంబులును, విపులతరకవాటవిఘటనాతిదక్షంబు లగువక్షంబులును, సింహసంహననత్వయాథార్థ్యబోధావధాను లగుకౌనులును, జలభ్రమీవిభ్రమప్రదాయిగంభీరిమాభిశోభు లగునాభులును, నంతరీపంబుల నకూపారంబుల ముంపఁజాలు నతివర్తులాకృతీఘనంబు లగుజఘనంబులును, సకలభువనజలజనయనామానవప్రనిర్భేదనప్రోద్యమాన శీలికేలినీరమణపాణికీలితగదాయుధానుకారచారువు లగునూరువులును, సంతతస్ఫర్ధాధురీణతూణీరజాతానీతశరసంఘ లగుజంఘలును, నభినవప్రవాళముల నధ్యుషితసాలమ్ములు గావించు చంచదారుణ్యశరణమ్ము లగుచరణమ్ములును, మెఱయ సరయగమనంబులతో యాగభాగంబులకుఁగా ము న్ననుశ్రుతచ్యవనజటిలధౌరేయు లగునాశ్వినేయు లన గాధేయు వెంబడి నడచు నభిరామలక్ష్మణు లగురామలక్ష్మణు లాత్మీయరామణీయకనిరీక్షణ క్షణత్వరాసమారుహ్యమాణకాంచనప్రాసాదమంచోపరిప్రవేశ పౌరశాతోదరినిశాతదృక్కోణరుచిగణవిసార్యమాణదరవికసదుత్పలపలాశ వర్గం బగు రాజమార్గంబు నంఘ్రితలకలితహలకులిశకలశతామరసచామరపతాకాతపత్రాదిరేఖాంకంబుల నలంకరించునవసరంబున.

98


రాముఁడు శివుని విల్లు విఱుచుట

సీ.

ఘనరేఖతో ఘనాఘనరేఖ చెలి గాఁగ మెఱుఁగుఁజామనిచాయమేనివాని
రాజీవపత్రేందిరాజీవదాయి గ దోయి నాఁ జనుకన్నుదోయివాని
రాకారమాసోదరాకారసౌందర్య మోముచక్క నిముద్దుమోమువాని
యుగలీల నిభహస్తయుగలీలలితరీతి కేలికయగు కేళికేలివాని


గీ.

దరము చెలువంబుఁ దఱుముకంధరమువాని, నరరి నురరీకరించు పేరురమువాని
రాము సౌమిత్రిమైత్ర్యభిరాముఁ జూచి, పౌరులు భజించి రక్షిసాఫల్య మపుడు.

99


మ.

పొలయల్క న్ముడిగొన్నభూమిజనతద్భ్రూవల్లిచే మారచా
పలతాటంకృతి దోఁప రాముఁ డది సైఁపం జలియో శూలిబ
ల్విలు మోపెట్టి తదీయభంగసమయావిర్భూతనాదార్తి దై
త్యులఁ దార్ప న్మునివెంట నేగె నిమివంశోత్తంసునాస్థానికిన్.

100

గీ.

ఏగి తనరాక విని మున్న యెదురుకొన్న, జనకునిసపర్య గన్న యామునులమిన్న
కన్నుసన్నఁ దదానీతకార్ముకం బ, తండు గీలించె డాకేల బెండులీల.

101


మ.

[5]ధనువంశం బది విష్ణునంశ మగునాధానుష్కధౌరేయుచే
మనువంశంబుగతిన్ గుణోన్నతి వహింప న్నోఁచి యంత న్విదే
హనరేంద్రాత్మజమానసంబుక్రియ వేగాకృష్ట మై లేఖలో
కనికాయారిమదంబుకైవడి విభగ్నం బయ్యెఁ జిత్రంబుగన్.

102


సీ.

ప్రతిపక్షవిక్షోభశితపక్షవిక్షోభకరుణాంబుదకదంబగర్జ యనఁగ
భుజమందిరాసాది విజయేందిరాదాన సమయపుణ్యాహఘోషం బనంగ
మహికుమారీకరగ్రహణసంఘటిత మాంగళికసంగీతమౌఖరి యనంగ
నానురాన్వయజిగీషాసముద్యతమహాప్రస్థాన భేరికార్భటి యనంగఁ


గీ.

జండకరవంశమండనోద్దండబాహు, దండకృతమండలీకార ఖండితేందు
ఖండకోటీరకోదండకాండరవ మ,జాండభాండంబు గుమ్మని నిండికొనియె.

103


క.

జనకుం డంతట రఘుపతి,కిని సీతకుఁ బెండ్లి సలుపఁ గృతనిశ్చయుఁ డై
తనుఁ బిల్వ బంచ మిథిలకుఁ, జనుదెంచెం బఙ్క్తిరథుఁడు సమనోరథుఁ డై.

104


సీ.

కననోఁచు తిలక మెవ్వనికీర్తి నప్పరస్తోమసంగీతగోష్ఠీముఖంబు
తలిదండ్రు లనుబంధములకుఁ బాలయ్యె నెవ్వానిచేఁ బరతత్త్వ మైనవేల్పు
మనియె రాజన్వతి యనఁగ నెవ్వనివంక మున్నీటిమొలనూలి ముద్దరాలు
దురమునం దరిజాతదుర్దశ విడుచు నెవ్వనికేతుదశ చూచి వజ్రపాణి


గీ.

అట్టియజుపట్టి కెదురుగా నరిగి పురికిఁ, దోడుకొని తెచ్చి రతనపుదొడ్డనగ రొ
కటి విడిది చేసి తలఁప శక్యంబు గొని, యులుప పట్టించి నిమివంశతిలకుఁ డంత.

105


మ.

అనుజుం డైనకుశధ్వజున్ జితసుధన్వావాప్తి సాంకాశ్యప
ట్టనరాజుం బిలిపించి యాఘనుఁడు తోడన్ రా నయోధ్యాధినే
తనికేతంబున కేగి యున్నయెడ మార్తాండాన్వయాచార్యుఁ డి
ట్లను బాంధవ్యకథానుబంధమధురవ్యాహారధౌరంధరిన్.

106


మ.

మను విక్ష్వాకు భగీరథుండు రఘువు న్మాంధాతయు న్మున్నుగాఁ
గ ననేకు ల్గలరే కదా రవికులఖ్యాతుల్ నృపుల్ తత్ప్రసి
ద్ధి నవీనోన్నతిఁ దాల్చు పఙ్క్తిరథుఁ డిద్దివ్యోపకృద్ధన్విక
న్ననతిశ్లాఘ్యులు రాముఁడున్ భరతుఁడున్ సౌమిత్రులున్ భూవరా.

107

ఉ.

ఈవనజాతబంధుకులుఁ డీనిమివంశ్యునితోడి బాంధవ
శ్రీవచరింపఁ జూచుట శచీధవుఁ డీశుఁడు వీయమందిన
ట్లై వెలయించు నింకఁ గన నానగభేదనశక్తి రామునం
దావహిలు న్మహీదుహితయం దగు నింద్రజయానుకూల్యమున్.

108


ఉ.

వింట గుణంబు గూర్చి రఘువీరుఁడు పంటవలంతి గన్నవా
ల్గంటిఁ బరిగ్రహించుక్రియ లక్ష్మణుఁడు న్నిజకీర్తిసంపద
న్వింటికి సద్గుణాప్తి యొదవించుటఁ జేసి వరించుఁగాక నీ
యింటను మించుమించుహసియించు నిభోర్మిళ నూర్మిళ న్నృపా.

109


క.

భరతుఁడు శత్రుఘ్నుండును, వరియింతురు భవదనుజభవల మృదులవచ
స్సురభిలకాండవి మాండవి, ధరణీశ్రుతకీర్తి యనఁగఁ దగుశ్రుతకీర్తిన్.

110


శ్రీరామలక్ష్మణభరతశత్రుఘ్నులవివాహసన్నాహము

గీ.

అని వసిష్ఠుఁడు తన యోపయామలగ్న, నిర్ణయ మొనర్ప సాకేతనేతవిడిది
వెడలి నిజగేహమున కేగి వీ డలంక, రింప మిథిలేశ్వరుండు సాటింప నపుడు.

111


చ.

అలికిరి కస్తురిన్ గృహము లన్నియుఁ గుడ్యము లెల్లఁ గుంకుమం
బులు గొని పూసి రెల్లకడ మ్రుగ్గులు వెట్టిరి క్రొత్తముత్తియం
బుల మఱి వీథివీథులను బూన్చిరి పచ్చలతోరణంబు లి
చ్చెలువునఁ బట్టనంబుఁ గయిసేసిరి పౌరు లనేకవైఖరిన్.

112


చ.

తొగచెలిఱాతిజోతి హిమతోయముఁ జిల్క గిరీటిపచ్చఱా
నిగనిగ లల్క ముత్తియపునిగ్గులు మ్రుగ్గులు వెట్ట దట్టపుం
బగడపుఁజాయ జాజు నినుపం గనుపట్టు విదేహరాజు హొ
న్నగరునకుం బరిష్కరణనాటిక లేటికి మాటిమాటికిన్.

113


మంగళస్నానవర్ణనము

వ.

అనంతరం బంతరంగసంగతానందుం డగుశతానందుండు పరిణయోచితాభ్యుదయకాలికకరణీయంబు లాచరించి పంచశరవీరసంచాలిత సువర్ణపాంచాలికల పోలికల మేలికలం గీలుకొను జనకజాదిబాలికలం గైసేయుం డనినఁ దదీయాలిక లగువిధుకలాలికలు లాలికలగుచుఁ దొలుదొలుత జగతీకుమారిం గూరిమిం జేరి రయ్యెడ.

114

సీ.

సిరసంటె జవ్వాజిచే నొక్కమృదుపాణి జలకమారిచె నొక్కజలదవేణి
తడియొత్తె జిలుగుపావడచే నొకమిటారి కట్టె నంశుక మొక్కకంబుకంఠి
ననదండ నిడుకీల్జడను జుట్టె నొకబోటి దిద్దెఁ జిత్రక మొక్కముద్దుగుమ్మ
యలఁదె గందము నొక్కహరిచందనామోద తొడిగెఁ గంచుళి నొక్కపడఁతిమిన్న


గీ.

తీర్చెఁ గాటుక నొక్కయిందీవరాక్షి
మెత్తె లత్తుక యొక్కచాంపేయగంధి
పూన్చె మణిభూషణము లొక్కపువ్వుఁబోఁడి
చూపె ముకురంబు సతి కొక్కసొబగులాడి.

115


క.

సతు లట్లూర్మిళ మొదలగు, లతకూనల కతులమంగళస్నానాలం
కృతు లొనరిచి హిమభూభృ, త్పతిసుతకడ నిలిపి రంత దశరథునగరన్.

116


మ.

అలివేణు ల్రఘుసూను మాంగళికపీఠాసీనుఁ గావించి ము
న్నలికంబందు శుభాక్షతంబు లిడి కల్యాణీజను ల్శోభనం
బులు వాడ న్సిగఁ జుట్టియున్న తళుకుంబొందాయెతు ల్వీడ్చి కుం
తలము ల్దువ్వి తలంటి రింపుగులుక న్సంపంగి లంబునన్.

117


గీ.

మలయజోద్వర్తన మొనర్చి మరకతంపుఁ, గొప్పెరల వాసనజలంబుఁ గుందనంపు
బిందియలఁ గొంద ఱందీయ నిందుముఖులు, జలకమార్చిరి మనువంశతిలకమునకు.

118


సీ.

కలువరాజిగిమిన్న చలువ దువ్వలువచేఁ దడి యొత్తి రధికసౌందర్యనిధికి
వలిపె హొన్నంచుదోవతియు సౌవర్ణాంబరముఁ గట్ట నొసఁగిరి రాఘవునకు
పరువంపువిరవాదివిరిసరు ల్చికురబంధమునిండఁ జుట్టిరి దాశరథికి
ఘనసారహిమవారికలితకుంకుమపంక మలఁదిరి తరణివంశాబ్ధిమణికి


గీ.

మకరకుండలకేయూరమకుటహార, కాంచికాదామకటకోర్మికానికాయ
గండపెండార[6]ముఖపరిష్కారనివహ, మువిదలు ఘటించి రఖిలదేవోత్తమునకు.

119


మ.

కలకంఠీమణు లీగతి న్రఘుపతిం గైసేసి యాఠీవి మాం
గలికాభ్యంజనమజ్జనాచరణలం గైసేయఁ బాటీరపం
కలతాంతాభరణానుకారితచలత్కల్పావనీజాతరీ
తులఁ గావించిరి లక్ష్మణున్ భరతు శత్రుఘ్నున్ బ్రమోదంబునన్.

120


చ.

పరికరచారులీలఁ గనుపట్టెడు పెండ్లికొమాళ్ల కంబుధీ
శ్వరుసతి యింద్రురాణియు నివాళికి నెత్తు పసిండివెండిప

ళ్ళెరములరేఖఁ దత్సమయలేఖవిరోధివిదారిదోర్యుగ
స్ఫురదరిపాంచజన్యముల పోల్కి రవీందులు దోఁచి రంతటన్.

121


సీ.

పంచధానిరవద్యభద్రవాద్యవితాన మానందముఖరాబ్ధి ననుకరింపఁ
గరదీపికాకోటి ఘనతరతారకాపటలీవిలాసము పరిఢవింపఁ
బాదచారినరాధిపకిరీటసందోహ మబ్జకోరకభావ మభినయింప
మౌక్తికచ్ఛత్రచామరదామరచ్ఛాయ కౌముదీరేఖవైఖరి ఘటింప


గీ.

గురుకవిబుధానుసరణి సోదరులు దెలుప, నెక్కినగజంబు గగనంబుటెక్కు గొలుప
నయనపర్వదరుచిసాంద్రుఁ డయినరామ, చంద్రుఁ డొగి వచ్చె జనకుహజారమునకు.

122


చ.

ఇనకులుఁ డాహజారమున నేనుఁగు డిగ్గి యనుంగుమంత్రిసూ
నుని కయిదండ గైకొని తను న్నిమివంశవరుం డెదుర్కొనన్
మినుకుటొయారి పాదుకలు మెట్టి నివాళి మిటారు లెత్త శో
భనపువితర్దిఁ జెంది మధుపర్కము నంది వసించు నయ్యెడన్.

123


ఉ.

మేను తళుక్కు రంచుఁ దొలుమించునడం జనుదోయి రాయిడిం
గౌ నసియాడ నందియలు గల్లనఁ గీల్జడ పార్ష్ణిరంగసీ
మానటియై రహింపఁ దెరమాటునకున్ మరుకుదంతి నీటునన్
జానకి వచ్చె నెచ్చెలులు సందడిఁ గ్రమ్మ నొయారి నెన్నడన్.

124


క.

శతపత్రహితాన్వయవి, శ్రుతునకు “నారాయణస్వరూపవరాయ
ప్రతిపాదయామితే” యని, సుత జనకుఁడు దారవోసె సూనృతసూక్తిన్.

125


గీ.

రతియు మదనుండుఁ బ్రణయవిగ్రహముఁ బూని
యుత్పలపయోజకరము లొండొకరిమీఁద
నేయుక్రియ జానకీరాఘవేశు లప్పు
డిరువు రొనరించి రన్యోన్యవీక్షణములు.

126


మ.

తనక్రేఁగంట, రహించు తుంటవిలుతున్ దండించె నేయుగ్రుఁ, డా
యనవిల్ ద్రుంచితి వెంత జోద వనుచున్ హర్షించి వైదేహి రా
మాన కచ్చోఁ దలఁబ్రా ల్నె పంబు దొలఁక న్ముక్తాభిషేకం బొన
ర్చె నుదంచధ్వనిఁ గంకణంబులు ప్రశంసింపఁ గృతజ్ఞత్వమున్.

127


క.

అంగజశంఖజయశ్రీ, కిం గట్టుదుఁ బట్ట మనెడు క్రియ నాసీతా
శృంగారిణికంఠంబున, మంగళసూత్రంబు గట్టె మనుకులుఁ డెలమిన్.

128

గీ.

కడలిగట్టుపనికి గరిడిసాదన వీరి, కిది యటంచుఁ దజ్జ్ఞు లెంచుకొనఁగ
జనకరాజకన్యయును రామభద్రుండుఁ, గట్టి రథికమైత్రిఁ గంకణములు.

129


చ.

తెలిగనుదోయి చెందొగలతీరుగఁ దాంతవతుసితాసితో
త్పల యగు హోమధూమ్య పయిఁ బర్వ ఘనంబున నత్తమిల్లు న
త్తొలుకరిమించు మించునలతొయ్యలి దోయిట నుంచి నించులా
జలు వడగండ్లు గాఁగ శిఖిచాలె శిఖావళితో నటింపఁగన్.

130


చ.

తనకులకర్తమిత్ర మగుతామరచెల్వు హరించుకొన్న మ్రు
చ్చున కతిరోహితత్వ మిటు చొప్పుడునే యని పట్టుకొన్నపో
ల్కిని మిథిలాధినాథసుతకే ల్నిజపాణిఁ బరిగ్రహించె న
య్యినకులసార్వభౌముఁడు సమృద్ధతరప్రణయాభిరాముఁ డై.

131


మ.

నగము న్మున్నుగఁ దన్ని క్రొన్న నలు వూనంజేయునీయంఘ్రి డా
య గరీయం బగుఱాయి తా నలరుటే యాశ్చర్య మంచు న్సఖుల్
పొగడ న్సిగ్గు వహించు భూమిజపదంబు న్రాఘువుం డంటి గో
ళ్లగుమిం బువ్వుగమిన్ భజింప సనెక ల్మట్టించె హస్తంబునన్.

132


క.

మింటం దోఁచునరుంధతి, యింటన్మెలఁగెడు పురోధ కిల్లాలఁట క
న్గొంటిమి తత్సతి నున్నతి, గంటి మనుట యెంత వింత కాకుత్స్థులకున్.

133


గీ.

అమరనగకోటి యైనఁ బర్యాప్తమాధ, నాంబరవితీర్ణికావివాహంబునం ద
నంతకళ్యాణగుణహేతు వైనరాము, సన్నిధిమహోత్సవం బట్లు సాగెఁ గాక.

134


ఆ.

లక్ష్మణు లగునూర్మిలాలక్ష్మణులలో భ,రతులు మాండవీభరతులు నఘవి
జఘ్నులు శ్రుతకీర్తిశత్రుఘ్నులును నట్ల, పరిణయార్హకృతులు జరపిరంత.

135


మ.

ననఁబోణుల్ రతనంపుఁబళ్లెరముల న్శాల్యోదనం బొల్పుఁ బ
ప్పును శాకంబులుఁ బిండివంటలు ఘృతంబుం బాయసం బానవా
లును బచ్చళ్లు రసావళుల్ దధి మొద ల్బువ్వం బమర్పంగ భో
జనము ల్బంధుజనంబుతోఁ జలిపి రైక్ష్వాకు ల్సభార్యాకులై.

136


చ.

హరిహయవిస్మయావహరమాధికుఁ డాజనకుండు ముద్దుఁ గూఁ
[7]తురుల వివాహము ల్జనతతు ల్గొనియాడఁగ ని ట్లొనర్చి య
ల్లుర కరణం బొసంగె హరులుం గరులు న్రథము ల్ధనమ్ము లా
భరణము లంగనామణులు పట్టపరీమళవస్తు లాదిగన్.

137

గీ.

ఈగతి విదేహపతి యింటఁ గృతవివాహు, లైనతనయులతోఁ గూడ నతనివీడు
కొని దశస్యందనుం డంతఁ దనదు పురికి, నడచునెడ నొక్కనాఁటిపైనంబునందు.

138


సీ.

తను వెల్ల నిండి యౌదలకు నెక్కిన రౌద్రరసము కైవడి జటారాగ మమరఁ
జేఁజిక్కి కృశియించు రాజన్యయశము వైఖరి జపస్ఫటికాకాక్షసరము దనర
నగభేది యనెడు చిహ్నంబుఁ దెల్పెడి జాడ గండగొడ్డలి భుజాగ్రమున మెఱయ
మరు గెల్చి యావీరవరు వి ల్లఱుత వైచికొనిసట్లు జందెంబు కొమరు నెఱప


గీ.

హరకుధరశృంగతుంగవంశాగ్రరంగ, నానటత్కీర్తినర్తకీనటనపటిమ
వర్ణనోదీర్ణతద్గృహద్వార్గవుండు, మార్గమున కడ్డ మై తోఁచె భార్గవుండు.

139


గీ.

తోఁచుటయు గుండె కడుఁ బాచుపాచుమనఁగ
భృగుసుతుఁ డమందగతిధుర్యుఁ డగుట గనియు
వినియు నెక్కడి సడివచ్చె వీఁ డటంచు
దిగులుపడి పఙ్క్తిరథుఁడు చింతింపఁ దొడఁగె.

140


శా.

ఈడో యేమి లలాటనేత్రుఁడు నహెూ యీధన్వితోడన్ గుహ
వ్రీడాదాయి భుజాబలుం డితఁడు మున్ ద్రిస్సప్తకృత్వోరణ
క్రీడాకృత్తరిపుక్షమాధిపవపుఃకీలాలవారాశి నీ
రే డాఱొక్కతరాలవారలకుఁ దా నీఁడా నివాపాంజలుల్.

141


శా.

ముల్లోకంబులుఁ దల్లడిల్లు నిపు డీముంగోపి కేనుంగుతోఁ
జెల్లాడం జనుబాలులీల నితనిం జేష్టించినం గీడు వా
టిల్లుం గా దని వేఁడుకొన్న మదిఁ జండించుం గదా వీనికిం
దల్లిం జంపిన దుండగీనికి దయాదాక్షిణ్యము ల్గల్గునే.

142


శా.

ఐన ట్లయ్యెడుఁగాక వేఁడుటయ కార్యం బంచు నర్ఘ్యాదిపూ
జానిర్మాణ మొనర్చుపఙ్క్తిరథభూజానిం గటాక్షింప కో
హో సారి న్మదనారిధర్మమునకు న్యోజించినాఁ డెవ్వఁడో
వానిం జూతముగాక యిప్పు డని గర్వగ్రంథియై ముందటన్.

143


చ.

నిలిచిన భార్గవుం గని మునిప్రవరుం డని తేరు డిగ్గి యం
జలియొనరించురాఘవు నిశాటకులద్విపఝాటకూటపా
కలకరబాణలాఘవుని గన్గొనని గ్గరుణాబ్జపత్రబా
హుళిఁబచరింపఁ జూచి తలయూఁచి యతం డతిచండిమోద్ధతిన్.

144

శా.

నీవా రామసమాహ్వయుండవు? జను ల్నిన్నేకదా మన్యుర
క్షావైచక్షణి భీరువుం దురములో ఖండించినాఁ డందు రో
రీ విశ్వాధికధర్మనిర్మధనపారీణప్రచారుండవై
నా వీ వెక్కడిరాచబిడ్డఁడవురా నారీతనుత్రాన్వయా!

145


చ.

శివు దృఢముష్టి నొగిలి శ్రీహరికోపరసాబ్ధిమగ్నతం
జవికినప్రాఁతవి ల్లొకటి సద్మమునం దిడికొన్న మీవిదే
హవిభుఁడు దాని నెక్కిడుట యాత్మజఁ గోరి యొనర్ప నిప్పుడా
చివుకుచిదారపుంధనువుఁ జీల్చుట కింత మదింప నేటికిన్.

146


శా.

నీలా విందునఁ గాననయ్యెడు మదానీతోగ్రచాపంబుఁ గెం
గేలం గైకొని మండలీకరణశక్తిం జూపెదే యంచు వీ
రాలాపంబు వచింప నారఘువరుం డావీర్భవన్మందహా
సాలోకంబున సన్నసేయుడు సుమిత్రానందనుం డిట్లనున్.

147


మ.

జననీకంఠవిలుంఠనాచరణమో శస్త్రాస్త్రభృద్బ్రాహ్మవ
ర్తనమో మత్తనిశాచరీవధ మఘత్రాణంబు లుగ్రస్ఫుర
ద్ధనురాకర్షణనైపుణంబును మహత్త్వం బై విజృంభింప ని
మ్మనువంశప్రభవాగ్రగామి యగురామస్వామికిన్ భార్గవా!

148


శా.

ధానుష్కోన్నతి చెప్పఁదీరునె మునీంద్రా మేరువో మందరం
బో నీచాపము దాని బైసియు నిఁక న్మోపెట్టఁగాఁ గాననౌ
నే నింతే మది కింతలోఁ బదటమా యీవట్టియౌద్ధత్య మే
లా నీ న్విప్రత చూచి కాచితి దురాలాపంబు చాలింపుమా.

149


చ.

అనుచుఁ బరశ్వథాయుడుఁ డహంకృతిఁ నిచ్చినట్టి వి
ల్దనకడకంటిచాయ మణిధన్వత గన్పడ నెక్కువెట్టి సం
జనితగుణధ్వనిస్తనితసంగతి నొప్పె ఘనాఘనంబు పో
ల్కిని నరపుంగవుండు నరలేఖశిఖావళకోటి రంజిలన్.

150


క.

భజియించిరి నమ్రత్వం; బజతనయ తనూజ భుజసమర్పితగుణులై
త్రిజగన్నుతి గలభృగువం, శజనిం దగు చాపదండ జమదగ్నిభవుల్.

151


క.

ఋజు వగుచాపము వక్రత, భజియించుట వక్రుఁ డైన భార్గవుఁ డెంతే
ఋజుతం గనుటయు భరతా, గ్రజయుగపత్ప్రాప్తగుణతకతమునఁ గాదే.

152

గీ.

మునితిలకుఁ డంతట నమోఘ మనుకులీన, మార్గణ నిరుద్ధ సౌవర్గమార్గుఁ డయ్యె
దద్గతిక్షణవిఘ్నకృత్యమునఁ దోఁచు, ఫలము చేసేత ననుభూతి సలిపె ననఁగ.

153


వ.

అంత సంక్రాంతం బైనజామదగ్న్యశక్తిసంపత్తిచే సంపన్నుండును పన్నగపరిబృఢభోగసాభోగభుజాభిరాముండు నగురాము నాలింగనంబు సేసి మూర్ధంబు నాఘ్రాణించి దశరథుండు కఠితురగపురస్సరరథుం డై పరిఘయుంబలెఁ బరిసరంబునం బ్రవహించు సరయూతరంగిణిచేఁ బరీతం బగు సాకేతంబును సదారు లైనదారకుల సాదరంబుగా నవలోకించు పౌరపురంధ్రుల నీరంధ్రితగవాక్షంబు లగుకటాక్షంబులచేఁ బింఛాతపత్రాయమాణధవళాతపత్రుం డగుచుం బ్రవేశించె.

154


ఉ.

సారతరత్రపాభరవశంబున గూఢమనోజవిక్రియా
భారవిశేషలో జనకపార్థివకన్యలఁ గూడి సంతత
స్ఫారసుఖానుభూతి గను పఙ్క్తిరథాత్మజులన్ భజించె శృం
గారము యౌవనస్ఫురదగారము ధీరనుతప్రచార మై.

155


మ.

కుటిలారిద్విరదావళీవిదళనక్రూరాసి[8]పారీంద్ర కై
యటకౌమారిలకాపీలాది బహుశాస్త్రాభిజ్ఞఋగ్వేదివేం
కటనారాయణసత్కవిప్రముఖసంఖ్యావన్మరాళచ్చటా
పటువాగారభటీవిభాసురసభాపద్మాకరాహస్కరా!

156


క.

అనుదినసురభిస్రక్చం, దనఫలదానక్రియాభినందితనానా
జనపదవసుధానిర్జర, వినుతకళాభోజరాజ విభవబిడౌజా!

157


మాలిని.

మదనజనకరూపా మంజుధర్మానులాపా!
వదనవిజితచంద్రా వైభవశ్రీమహేంద్రా !
పదనతరిపురక్షా పండితోద్యత్కటాక్షా!
కదనజయధురీణా గానవిద్యాప్రవీణా!

158


గద్యము.

ఇది శ్రీమదుమామహేశ్వరవరప్రసాద సమాసాదిత సరసకవితావిలాస వాసిష్ఠవంశకీర్తిప్రతిష్ఠాసంపాదక ఋగ్వేదికవి తిరువేంగళార్యకలశరత్నాకర సుధాకర జగద్విఖ్యాత కవిరాజకంఠీరవబిరుదాంక వేంకటాచలపతి ప్రణీతం బైన చంపూరామాయణం బనుమహాప్రబంధంబునందుఁ దృతీయాశ్వాసము.

ఇది బాలకాండము.

  1. ఖేచరవనము = నందనవనము
  2. పోరికినాలమీ౼ అని మూ.
  3. మగఱా యనుటకు మొగఱాయని ప్రయోగించెను.
  4. “కడానీ” యని దీర్ఘ మెట్లు వచ్చెనో.
  5. ధనుర్వంశ మనుట కిది యపప్రయోగము
  6. గండపెండారము. ఈ తెనుఁగుపదము సంస్కృతసమాసమధ్యమున నిముడ్పఁబడినది. దీనిసాధుత్వము చింత్యము.
  7. తఱచిక్కవి యిట్లు ప్రయోగించుచున్నాఁడు.
  8. పారీంద్రము = పాము-సింహము