చంపూరామాయణము/ద్వితీయాశ్వాసము

చంపూరామాయణము

ద్వితీయాశ్వాసము


క.

శ్రీజనక ధీర బొమ్మ, క్ష్మాజనపతిగర్భశుక్తిమౌక్తిక చినకృ
ప్లాజిమదేవీమానస, రాజీవమరాళ! కసవరాజనృపాలా!

1


మ.

అమరు ల్గాంచి రవేలకేళి జలమర్త్యస్త్రీసమాలింగన
ప్రమదాపాది పయోవినోది ఘనగర్జానీతవేలావన
ద్రుమయూరీనటనావలోకపరయాదోరాజదారేక్షణ
భ్రమకృద్వల్లనమీనధోరణి సుధాపాథోనిధిగ్రామణిన్.

2


సీ.

పాథోదసమితికిఁ బానీయశాలిక ఫణిరాజశాయికిఁ బడుకటిల్లు
మనుముద్దరాలికి మగఱాలమొలనూలు కలవానిచెలికాని కలరుఁదోట
మింటికాపరులకు మృష్టాన్నసత్రంబు సకలదివ్యవదాన్యజన్మభూమి
మఘవగజాంతసంపద కాదికారణం బఖిలాచలేశున కనుఁగుటల్లుఁ


గీ.

డార్యతోఁబుట్టుగట్టురాయలపతత్ర, యుగళికిఁ దనుత్ర మెవ్వఁ డయ్యుదధి గాంచి
నీలవర్ణుండు నిద్దుర మేలుకాంచి, యున్నవేళ విచారించి యుత్సహించి.

3


మ.

కలశాబ్ధిం దెలిదీవి నైందవశిలాగారంబులో ముత్యపుం
దళుకుందిన్నియమీఁదఁ గల్పసుమనస్తల్పోపరిం జిల్వరా
యలమై నిద్దపుగద్దెపీఁటపయి సధ్యాసీనుఁడై యెఱ్ఱజీ
రుల కన్గ్రేవల నమ్రపత్రముల బారుల్ దీర్చు భద్రాకృతిన్.

4


సీ.

రోహణాచలశృంగమోహనాకృతిఁ జొకాటం బగుమణికిరీటంబువానిఁ
దొగలకు నెత్తమ్మితెగలకు దాంపత్య మాయితం బిడుకన్నుదోయివాని
మొసలిపోగులనిగ్గుటొసపరిసాముకూటము లైనచెక్కుటద్దములవానిఁ
గలుములొయ్యారియుయ్యెలపచ్చగొలుసుతీ రగునురస్థ్సలివైజయంతివాని


గీ.

నంబుదతటిన్నిభశుభాంబరంబువానిఁ, గమలజాండంబునకు నాల్గుకాళ్లమండ
పంబిడుభుజావిజృంభణంబైనవాని, హరిఁ గని నుతించి ర ట్లని యమరు లపుడు.

5

దేవతలు విష్ణుని స్తుతించుట

కవిరాజవిరాజితము.

జయ మదవారణ ఖేదనివారణ సంభ్రమకారణ చక్రధరా!
జయ ఖగచారణగీత! మహారణసాహసధారణబాహుభరా!
జయ భవతారణ! గంధసమీరణసాదివిదారణదివ్యశరా!
జయ రవికైరణ శక్త్యవధీరణ సత్త్వరచారణ కాంతిఝరా!

6


లయగ్రాహి.

శ్రీకర విభాకరసుధాకరవిలోకన నృలోకపతినాకనదనీకసుతలౌక
శ్శ్లోకవిభవాకర నృపాకలనచాకసదశోకసుమకోకనదభాకలవిలోకా!
ఆకమలినీకమనమాకుముదినీకమితృమేకుశలమాకలయఢౌకితవివేకా
పాకరిపుతోకసఖమౌకురవిషాకముఖకేకిశిఖికాకలితమౌకుటతటీకా!

7


ఫాలభుజఖేలన కరాళశిఖిలాలన విలోలనరపాలక విఫాలకరవాల
వ్యాళముఖకేళిసఖకేళివహశూలి పరిపాలితమమీలలిత బాలిజభజావే
హాలహలనీలగళఫాలతలలోలదలివేలశిఖికీలతతిఖేలదరిఖేలా
కీలితవిభీలహరిధీలుఠదశీలకుజపాలయజపాలయజనాలయ కృపాళూ.

8


చ.

అనిమిషవృత్తి నంబునిధి నాశరజైత్రతఁ దెచ్చినట్టిప్రా
మినుకులు నల్వ కిచ్చుటకు మెచ్చిరిగా యతిబోకనర్తనుం
డని జను లెల్ల నిన్ను; జనకార్జిత మైనసువర్ణసంపదల్
తనయులఁ జేరు టేమి యరుదా! మురదానవభేదకోవిదా!

9


చ.

కలిమిపడంతిగుబ్బకవగబ్బితనంబు భుజాంతరంబునన్
జలనిధిమేఖలారమణిచన్గవగట్టితనంబు మూఁపున
న్నెలకొనియుండుమోపరివి నీ వగుటన్ భవదీయకేవలా
చలవహనక్రియచణత సన్నుతిసేయఁగనేటి కచ్యుతా!

10


మ.

మకరాంకార్ణవమగ్నభావకలనం బాటిల్లుకంపంబు కం
టకలీలాకబళీకృతం బయినమేనం బూనుభూదేవిఁ బా
యక శృంగారము దార్చినట్టి భవదీయస్తబ్ధరోమాకృతి
ప్రకటాకారము ప్రోచు మమ్ము నవినారంభప్రియంభావుకా!

11


చ.

కులిశధరాదినిర్జరులకున్ వసపోనిహిరణ్యదైత్యు పం
ఫులు రసదాడి గాంచుఫలము ల్విదళింప నయస్ఫురన్నఖా

వళి మెఱయించుచు న్వెడలవా బలుగంబమునందు నంటిపం
డొలుచుట కుక్కుగో ళ్లనుజనోక్తి నిజంబుగ దంభకేసరీ.

12


ఉ.

దానవనాథచంద్రుఁడు పదత్రయమాత్రపయోధిమేఖలా
దానజలంబు నీకరముఁ దార్చియుఁ దార్పకమున్న పద్మజాం
డానఘబాహ్యవారి చరణాగ్రనఖాహతి జాఱి పాఱి యే
ఱై నెగడంగఁ జిత్రకృతి నాకృతిఁ బెంచి తళీకవామనా!

13


మ.

దనుజాధీశ్వరుఁ బట్టి కట్టిన భవత్రైవిక్రమాకార మొ
క్కనదిం గాంచుట వింత నాఁగ రిపురక్తవ్రాతసంజాతపం
చనదాకల్పక న తావకభృగుస్వామీ భవద్రూప మొ
క్కనికి న్సన్నుతిసేయ శక్యమె జగత్కల్యాణసంధాయకా!

14


గీ.

మనుకులీనత రామనామమున మదన, జిన్మహిమ దుష్టనరపాలశిక్షణమున
భావిచతురవతారవైభవము దెలుపు, పరశుధౌరేయపాణికి శరణు నీకు.

15


మ.

భృతశుద్ధాంతభుజాంతరాయ నిజనాభీపల్వలాంభోరుహెూ
దితలోకత్రయకారణాయ బలిదైతేయప్రతాపాతపా
వృతివర్షాగమవాసరాయ నలినశ్రీజైత్రనేత్రాయ ధ
న్యతమస్వాంతసరోజినీదినకృతే నారాయణా యోన్నమః.

16


క.

అనుబుధనుతి సుఖితశ్రుతి, యును సుప్నయు నఖరయుక్తయుఁ బదోజ్జ్వలయున్
జనపాపహారిణియునై, తనయవతారములగతి ముదం బొదవింపన్. [1]

17


మ.

వనజాక్షుం డనియె న్నిజస్తవనరావంబుల్ దిశావాటిఁ బ
ర్వ నతు ల్పెక్కు లొనర్చి లేచి యెదుట వర్తిల్లుగీర్వాణులన్
నునుఁగెందమ్ముల కన్నదమ్ము లగుకన్నుందోయిచాయల్ పయిం
దనుకం జూచి తదీయమానసము లానందంబు నందించుచున్.

18


మ.

హరికి న్సేమమె భద్రమే శిఖికిఁ గళ్యాణంబె మార్తాండికిం?
బరిణామంబె పలాశికిం గుశలమే పాథోనిధిస్వామికిన్?
హరిణారోహి కనామయంబె సుఖమే యక్షావళీనేత కా
మరభూమీధరధన్వికిం బ్రమదమే మాంగళ్యమే? ధాతకున్?

19


మ.

చెలువంబే వినువీటినీటరులకు జేజేలకున్ లెస్సయే
దళితాభీలవిభావరీచరచమూదంభంబె దంభోళికౌ

శల మూహాధికదేవతాగురుమనీషాశీలితోపాయర
క్షలచే నయ్యమరావతీపురికి యోగక్షేమ మాశ్చర్యమే!

20


ఉ.

నా విని దేవ నిన్ను మది నమ్మినవారలకు న్విపద్గతుల్
రావు గదయ్య! నీవిజయలాంఛన మోర్వఁగలేని దుష్టస
త్త్వావలి కింతె కాక యటుల లయ్యు వినం దగుఁ బిన్నవిన్నపం
బోవనజాక్ష! మామనవి యొక్కటి యున్నది చిత్తగింపుమా.

21


చ.

బలువిడి నాలకింపు బుధపాళికలంక దలంక వార్ధిలోఁ
గల దొకలంక లంక యనఁగా నొకదానవరాజధి యు
జ్జ్వలతరమందిరప్రకరసంఘటితాంబుజరాగరత్నకం
దళరుచి ము న్వెలుంగు దినదర్శితదీపదశన్ భజింపఁగన్.

22


ఉ.

సానువసన్మణీగణలసన్నగరీతిక సాలధూర్వహం
బానగరీవతంసము దశాననుఁ డేలు దిశాధినాయకా
నూనయశోనిశాధిపతనుగ్రసనాగ్రహసైంహికేయజి
హ్వానటనప్రదర్శనచణాయతబాహులతాకృపాణుఁడై.

23


మ.

భువికి న్మింటికి మంట వుట్టెడుతపంబు ల్వాఁడు గావించి వే
ల్పువజీరు ల్వడయంగఁ జాలనివరంబు ల్పెక్కు లిక్కంజసం
భవుచేఁ గాంచి నిజాజ్ఞలోన మెలఁగ న్మమ్ము న్నియోగించి యీ
భువనక్రోడములోన దండుగయు జంపుం జెల్ల వర్తిల్లెడున్.

24


సీ.

చేరఁబోయిన నేమినేరమో యనుచు నందనవనీస్థలి దాఁకి తలఁపరాదు
కావలిబుడుత లెక్కడఁ జూతురో యని [2](సురలగౌరును) దేఱి చూడరాదు
మనసైన నొకపారి తనుఁదానె బయకాని మునిఁ బిల్చి పాడించుకొనఁగరాదు
సరి దిక్పతులయిండ్ల కరుగువేళల నైన నిక్కువీనులజిక్కి నెక్కరాదు


గీ.

పగలు రేలును బౌలస్త్యభటు లొనర్చు, దుడుకుచే వేల్పుమన్నీనికొడుకుఁగుఱ్ఱ
కక్కటక్కట! పూనశక్యంబె వజ్ర, ధరున కిటువంటియంబేదదొరతనంబు.

25


చ.

మెఱుఁగుగడానిదద్దడపుమెట్టుపయిన్ దశకంధరుండు కొం
దఱు చిగురాకుఁబోఁడు లిరుదారుల రా నడ దూలియాడు న
త్తఱిఁ జలిమాన్పుపాటిజిగిఁ దాల్చి యినుం డపరాధశంకచేఁ
జుఱుకుఁదనంబుఁ జూపవెఱచుం గరచుంబితదిఙ్ముఖాబ్జుఁడై.

26

మ.

జలకంబింటికి రావణుండు మృగయాశ్రాంతిం బ్రవేశించుచోఁ
జలువంజోతి తదంతరస్ఫటికపాంచాలీకరోద్యన్నిజో
పలకుంభీశతనీలశీతలజలప్రాచుర్యుఁడై వేల్పురా
యలకున్ లేనితదీయవింశతినిరీక్షానుగ్రహం బందెడున్.

27


లయగ్రాహి.

నందనములోని హరిచందనముఖద్రుమములం దశముఖుండు నిజమందిరవనీవా
టిం దిరముకొల్పం జెఱలం దగిలియున్న సురసుందరులు కంజడి సెకం దొడరుజాళ్వా
బిందియలవారిలహరిం దడుపఁ దోఁచునసటం దనరుపాదు లనఁగందగినయావే
ల్పుందరులరాలు విరులం దొరఁగనీనిగతులం దిరుగుగంధవహబృందము ముకుందా!

28


సీ.

అజసమాఖ్యకు మేఁక యలవడ్డకైవడి నాహితుండికు నరేంద్రాఖ్య వీఁక
వావి లింద్రాణినా వర్ధిల్లుహవణిక నసుర పుణ్యజనాహ్వయంబుదారి
మద్ది కింద్రద్రునామము చెల్లువడువునఁ గవిసంజ్ఞ జలపక్షి గనినజాడ
గుడనగప్రథ ఱాతిగుట్ట చెందినయోజ స్వర్ణారిని గళాదుఁ డన్నమాడ్కి


గీ.

హుతవహాభిఖ్యరూఢి యన్మతి ఘటింప, గార్హపత్యాది యగుపావకత్రయంబు
వంటలక్కతనంబె రావణునియింట, జరిపెను ఘనాఘనఘనాభ జలజనాభ!

29


సీ.

కడహజారంబుచావడి కెదుర్కొను వజ్రికైదండ గొని వచ్చుగరిమ మెల్ల
నొడువుజవ్వనిపోఁకముడి కాసపడుపెద్దసరిగద్దె నుండు పెద్దఱిక మెల్ల
సనకాదులకు లేని చనవుతోఁ దెలిదీవిదొరచెంగట మెలంగుమురిపె మెల్లఁ
దళుకుగిబ్బపటాణిబలురౌతుకనుసన్న మణివీథి నుండుసన్మాన మెల్ల


గీ.

బో నిడి విపంచి గొని కాళిమానదండి, కచ్చరలవెంటఁ దిరుగఁ బాలైతి నని వి
చారపడు నౌర! నర్తనాగరకృతవి, హారదశకంఠవశవృత్తి నారదుండు.

30


క.

కమలావల్లభ! విను మ, య్యమరారిం గినుకఁ జెనకునతనికి మఘవ
ప్రముఖులలో వే ఱొకఁడీ, జముఁ డొక్కడు దక్క వెఱచు శరణం బొసఁగన్.

31


శా

వాగ్దేవీపతిచే నరేతరజనావధ్యత్వముం గన్న యూ
ప్రాగ్దేవాగ్రణి మెట్టతామరకు నారణ్యద్విపంబుంబలెన్
దిగ్దంతావళదంతకుంతపటలోదీర్ణవ్రణాంకావళీ
ప్రాగ్ధౌరంధరుఁడై జగత్రయికి నిర్బంధావహుం డయ్యెడిన్.

32


వ.

మఱియు నురుయుగావసాదకరవీరవరవినోదమేదినీధరధురంధరోద్ధరణసాహసప్ర
సిద్ధబాహామహాబల విహరణానీతనిరధికరణకాందిశీక సుప్రతీక పుండరీక వా

మన కుముద సార్వభౌమ పుష్పదంతాంజ నైరావణుం డగు రావణుం డనార
తారచితభువనవిద్రావణుండై తొడరి గరుడఖచరకిన్నరకింపురుషసిద్ధసాధ్య
విద్యాధరమరుచ్చారణప్రధాను లగునేము తావకీను లనెడుబహుమానంబు
మాని యాత్మనీనయాతుధానసేనావితానంబువలనఁ బలాయమానులం గా
వించిన విమాను లనుస్మదభిధానం బపగతార్థసంధానంబుగా ధరణ్యంతరం
బున శరణ్యుండు నీవే తక్క వే ఱొక్కండు లేమి సామియామిన్యధిపసా
మాచీన్యవన్నఖముఖపరిస్ఫురణంబులు, సరీసృపవిరోధికరసరసిజోదరాభరణం
బులు, నకృత్రిమముక్తికాంతాసీమంతసిందూకకందళవిమోహాహవబహుగు
ణారుణిమాభరణంబులు నపారసంసారనీరపారావారతరణకరణంబులు ననంకు
రత్కళంకమునిమనఃపంకేరుహాలంకరణంబులు నగుభవదీయదివ్యచరణంబులే
శరణంబు లని వచ్చితి మనువియచ్చరులయుచ్చైస్ఫురత్తరంబు లగువాగ్విస్త
రంబు లాకర్ణించి యంచితస్వకీయషదసకృత్ప్రపన్నవిపన్నదైన్యభయవిమో
చనుం డగు నప్పుండరీకలోచనుండు.

33


క.

పలికెన్ హరినీలాచల, కలితశరచ్చంద్రచంద్రికాధవళం బై
యెలన వ్వొలయ సుధాసా,రలసన్మృదుమాధురీధురంధరఫణితిన్.

34


మ.

దుడుకు ల్మీయెడ నిన్ని సల్పెడుపలాదుం గైదువుం బంపి యి
ప్పుడె దండించుట దొడ్డు గా దయినచోఁ బొల్వోవు నీయంచత
త్తడిరాహుత్తునిమాట చెల్లుబడి, చింతల్ దక్కుఁ డిం కయ్యెడుం
గొడుకుం గోరి యజించుపఙ్క్తిరథుకోర్కు ల్మీమనోవాంఛలున్.

35


ఉ.

రాచవజీరుఁ డీతఁ డన రాక్షసలోకమహాతిరేకశి
క్షాచణచాపదీక్షఁ గొని కాంతు జగన్నుతి నంచు లోచనా
గోచరుఁ డైనయచ్యుతునకు న్నతిఁ జేయుచు వేలుపుల్ సుధా
వీచిమదంతరాళ మటు వెల్వడి యొక్కెడ నిల్వ నల్వయున్.

36


మ.

త్రిదశాగ్రేసరులార! నీరధికుమారిం జానకిం దోడుపా
టొదవం ధారణి నుద్భవించుటకు నుద్యోగింపుఁ డయ్యప్సరో
మదిరాక్షీమణులందుఁ దాదృశజనిం బాటించియున్ మీకుఁ ద
ప్పదు నాకీశత వాయునే జనులకుం బ్రాగ్వాసనావైఖరుల్.

37


క.

దంభోళిసహస్రమహో, దంభాపహదేహాపరుషతావహుఁ డస్మ
జ్జృంభోదితుఁ డొకభల్లుక, జంభారి విజృంభి యయ్యె జాంబవదాఖ్యన్.

38

చ.

అని నియమించుధాతపలు కంబుధరాగమనాభ్రగర్జతో
నెనయఁగ రామవాహిని మహిం బొడసూపకమున్న రాక్షసేం
ద్రునిసితకీర్తిహంసి వెఱతోఁ బఱచెం, దమ రున్నచోట్లకుం
జనిరి సురల్, విరించియు నిజం బగుఠావు భజించె నంతటన్.

39


క.

ప్రాజాపత్యాఖ్యాయుతుఁ, డాజన్నమునందు హుతవహావిష్కృతుఁడై
భూజానికి నమృతరస, భ్రాజిత మగుహేమపాత్రఁ బాయస మొసఁగెన్.

40


క.

ఒసఁగినఁ గైకొని సంతస, మెసఁగ సదస్యులు ఫలించె నృప నీసుకృతం
బు సమస్తం బని పలుక, ముసిముసిలేనగవు తనదుమోమునఁ దొలఁకన్.

41


ఉ.

కోకనదప్రియాన్వయుఁడు కోసలరాజసుతాలలామకుం
గైకకుఁ బ్రేమతోఁ జెఱిసగం బమృతాన్నము పంచి యిచ్చినం
జేకొని వారు భూవరునిచిత్త మెఱింగి సుమిత్రకు న్సువ
ర్ణాకృతిజైత్రగాత్రకు నిజాంశములం దిడి రర్ధమర్ధమున్.

42


గీ.

అవభృథస్నాన మైనయనంతరమున, వశగతమనోరథుం డగుదశరథుండు .
దొరల మౌనుల వీడ్కొల్పి మరలె రత్న, కీలితనికేతమునకు సాకేతమునకు.

48


గీ.

అంతఁగతివయదినముల కానృపాలు, మదవతులయందు వింతగా నొదవెఁ బఙ్క్తి
వదనయోషావిభూషావివాసనావి, చక్షణము లైనదౌహృదలక్షణములు.

44


చ.

జడిమ వహించునెన్నడలు సన్నఁదనం బెడలించు కొంచెపు
న్నడుములుఁ దెల్లబంగరువున ల్వగుచెక్కులుఁ బెక్కుదోయపుం
దొడవులబర్వు లోర్వనితనూలత లూడనిఁబాడు మువ్వళుల్
బడిబడినిద్ర లూరుపుటలంతలుఁ గాంతల కొప్పె నయ్యెడన్.

45


సీ.

శివచాపవిదళనస్పృహ చెల్లునే చెల్వ కది కన్బొమలరూపమదము గాక
కుహనామృగజయాశ గొలుపునే జవరాలి కది నేత్రయుగము సోయగము గాక
శరధిబంధనచింత శక్యమే విరిఁబోఁడి కది జంఘలవిలాసపదవి గాక
యసురదుర్గజిగీష వసమే కృశోదరి కది గబ్బిగుబ్బలయుదుటు గాక
తే. యనఁగ గోసలరాజన్యతనయమదికి, గోచరం బయ్యె నిజగర్భకుహరవిహర
దంబురుహనేత్రశుభచరిత్రానుసరణ,చతురబలవత్తరోద్యోగసముదయంబు.

46


క.

పరమాణుతఁ గృశతం దగు, వరవర్ణినియుదర మపుడు వటపత్రశయుం
డిరవుకొనం దొలుతటిగతి, హరిపదబహుపాద్దళాభమై తగె నంతన్.

47

చ.

రవి యజముం, గుజుండు మకరంబు, తుల దినరాజసూనుడుం
గవి తిమి నొందఁ జెంద గురుకర్కటలగ్నమునందు శుద్ధపు
న్నవమిఁ బునర్వసున్ బుధదినంబున నొక్కవెలుంగు కోసలో
ద్భవజఠరారణిం బొడవుదాల్చెఁ బలాశసమిద్దిధక్షువై.

48


మ.

దివిజప్రాణసమీరణగ్రహిళపఙ్క్తిగ్రీవమాయాభుజం
గవిభంగప్రద మైనపూనిక విహంగస్యందనుం డీగతిన్
రవివంశంబు నలంకరించెఁ దన శ్రీరామాభిధానంబు స
త్కవిసందర్భములం దవంధ్య మగుసౌగంధ్యంబు సంధిల్లఁగన్.

49


క.

ధరణీవరునియనుంగుం, దరుణీమణి కమితనయుఁడు తనయుఁడు పొడమెం
జరణాంభోరుహనతసం, భరణప్రారంభరతుఁడు భరతుఁ డనంగన్.

50


క.

మిత్రకులజలధిమణులు సు, మిత్రకు నుదయించి రప్రమేయతరశ్రీ
వృత్రఘ్ను లైన లక్ష్మణ, శత్రుఘ్ను లమిత్రనగరసత్రఘ్ను లనన్.

51


చ.

విరచితజాతకర్ము లభివృద్ధులునై యలరాకొమాళ్లనం
తర ముపనీతులై చదువునం బలుసాదనలం బ్రవీణులై
కరితురగాధిరోహముల గద్దఱులై విలువద్దెలందు నే
ర్పరు లయి చాతురంగరణరంగసమర్థులు నైరి ధారణిన్.

52


సీ.

పుంవ్యక్తులై తోఁచు పురుషార్థములరీతిఁ దనువు గైకొన్న వేదములపగిది
నయనగోచరము లైనయుపాయములఠీవి నరులైన జలనిధానములకరణి
సుఖదర్శనతఁ గన్నశిఖిశృంగములభంగి ప్రభులైన ధాతృవక్త్రములభాతి
నడవడి గలదివ్యనాగదంతములట్లు బాహుజు లగుశౌరిబాహులక్రియ


గీ.

ధర్మముఖ్యత నిత్యసత్యత నయాను
సృతి గభీరిమ శుచిభవోన్నతియు వాఙ్ము
ఖాకృతిఁ బలాశహృతియుఁ బంచాయుధాతి
విలసనముఁ బూని వెలసి రన్నలువు రంత.

53


చ.

నలినహితాన్వయేశుఁ డొకనాఁ డినుఁ డిందిరయిండ్లబీగము
ద్రలు కరకుంచి విఘటితం బొనరింపకమున్న గాయకా
వళి నుతిగీతి మేలుకని వచ్చి యహర్ముఖనిత్యకృత్యము
ల్సలిపి మణీమయాభరణజాలవిడంబితరోహణాద్రియై.

54

చ.

చరణములందుఁ బావ లొకజవ్వని పూనుకఁ జూమరంబు లి
ద్దఱు మరుచిక్కటారు లిరుదారులయం దిడ నొక్కపాటలా
ధర కయిదండ యీయఁగ మధావళమంధరుఁడై మరుత్సభా
గురు వగుకొల్వుకూటమునకుం జనుదెంచి తదంతరంబునన్.

55


మ.

వలిపంపుందెరమాటులం దిరుగు జాళ్వామేలికీల్బొమ్మలం
దెలనాదుల్ విరిచందువామొకరిలేఁదేంట్లార్భటు ల్వేత్రహ
స్తులు సామంతులు కొల్వు దెల్పుబలుసద్దుల్ చామరగ్రాహిణీ
వలయారావము వందిమాగధులకైవారంబు తోరంబుగన్.

56


ఉ.

మన్నెకొమాళ్లు రాదొరలు మంత్రులు మిత్రులు రాయబార్లు వీ
ద్వన్నివహంబులుం గవులు వైణికులు న్నటులుం భజింపఁగాఁ
బున్నమచందురుండు పొడుపు న్మలచక్కి వసించియున్నచా
య న్నవరత్నపీఠిఁ గొలువై బలువైభవ మొప్ప నున్నెడన్.

57


దశరథునొద్దకు విశ్వామిత్రుఁడు వచ్చుట

సీ.

కడజాతిఱేనియాగము నిర్వహించిన యఘటనఘటనావిహారహారి
సృష్టికిఁ బ్రతిసృష్టి చేసి వాసికి నెక్కు భారతీసహచరప్రతిభటుండు
మేనకాలావణ్యమానసాధీనుఁడై పరమహంసతఁగన్న వరతపస్వి
తనరాచదొరపుట్టువు నిరాకరించి బ్రహ్మర్షియై మెఱయుమహామహుండు


గీ.

వచ్చె భువనోచ్చయాద్భుతావహనశీల, పాలితజటాలబాలవాక్ప్రముదితాది
తేయధౌరేయుఁ డల్లగాధేయుఁ డాతి, థేయుఁడై మించునైందుమతేయుకడకు.

58


శా.

కావ్యప్రాకృతసూత్రబోధనలరేఖన్ సర్గభేదంబు వ
ర్ణవ్యత్యాసము గల్గి సోమసుతుఁ డైనాఁ డంచు సాహిత్యవా
స్తవ్యుల్ శాబ్దికు లధ్వరుల్ తను మదిం దర్కింప సాక్షాన్మునీ
శవ్యంజార్కుఁడపోలె వచ్చుకుశవంశస్వామి నీక్షించుచున్.

59


ఉ.

లేచి కరాంబుజాతముకుళీకృతయున్నతియున్ ఘటిల్ల మా
యాచతురక్షపాచరభయానకజన్యవిహారకాతర
ద్యోచరవీరపాలకరథుం డగుపఙ్క్తిరథుం డొనర్చు పూ
జాచరణంబుచే ముదితుఁడై యతఁ డామహినేత కిట్లనున్.

60


సీ.

చిప్పకూఁకటితోడి శిరసునం దిడినట్టి జిగిమట్టికుళ్లాయ సొగసుమీఱ
హురుమంజిముత్యాలయొంటులచకచకల్ తళుకుఁజెక్కులదండఁ దాండవింప

గోణముపైని రింగులువారఁ గట్టిన వలిపెదుప్పటి కటిస్థలి రహింప
నెడమకెంగేల నెక్కిడిన విల్ కుడిచేత నొకటిరెండులకోరు లొఱపు నెఱపఁ


గీ.

గవదొనలు బూని వెంట లక్ష్మణుఁడు నడువ
రామభద్రుండు నావెంట రా నియోగ
మొసఁగితివయేని రాకాసిదొసఁగు మాని
యపభృథస్నాత నగుదు నోయధిప యనుడు.

61


రాముని విశ్వామిత్రునితోఁ బంపుటకు దశరథుఁడు విచారించుట

క.

ములుకులు గాఁడినగతి ముని, పలుకులు వీనులకుఁ దోఁప భయసంగతి మూ'
ర్ఛిలి తనకుఁ దానె తెప్పిఱి, తలపోఁతకుఁ జొచ్చె నిట్లు దశరథుఁ డాత్మన్.

62


గీ.

వెడతపసి నాటె నెద గొడ్డువీఁగికన్న, రాము నెడఁబాపునతినిష్ఠురంపుఁబలుకు
జిలుకు తనవంటి పెనుదంటచేతఁగాని, మఘము నాచిన్నిపాపఁడే మనుచువాఁడు.

63


ఉ.

అక్కట ! దిక్కటాహభయదార్భటిఁ బర్వెడు సోఁకుటెక్కటీ
లెక్కడ! కాకపక్షధరుఁ డీనిసు వెక్కడ! వారితోడ వీఁ
డెక్కటిపోరికిం దొడరు టెక్కడ! యెక్కడి సంగతంబు లీ
మొక్కలపుంబ్రసంగములు మోసముఁ దెచ్చుదురూహలే కదా!

64


సీ.

బాలామణులజోలపాటలా నైశాటవాహినీఝాటకోలాహలములు
గరిడిసాదనలా సగర్వపూర్వసుపర్వగహనసంగరరంగవిహరణములు
చెండుగోరింపులా కండూలభుజదండచండదానవశిరఃఖండనములు
పెన్నుద్దికొమరులపెనఁగులా పలలాశనద్వంద్వబంధురానందనములు


గీ.

చెల్లఁబో చూచిచూచి నిశీధినీచ, రప్రభులతోడిగొడవ కీరాచపుడమి
వేలుపుతుటారితాపసివెంట నరుగు, మనుచు నీకాము నేరీతిఁ బనుచువాడ.

65


చ.

అని యెడఁద న్విచారపడునాదొరతోడ వసిష్ఠుఁ డి ట్లనున్
జనవర! కౌశికుం డనఁగ నల్వకు జో డితఁ డిత్తఱిం దపో
ధన ముడివోనిపూనిక వితాన మొనర్పఁ గడంగినాఁడు నీ
మనుకులకీర్తికామినికి మైకసిగందనిచాయ సంధిలన్.

66


చ.

అనిమిషరాజసంపదల కర్హుఁడు గోత్రవహుండు నెల్లమే
దిని భరియింప నోపునతిధీరుఁడు మానవసింహుఁడున్ జగ
జ్జననుతవిక్రమోన్నతుఁడు శాత్రవరాజహరుండు నైన నీ
తనయుఁడు వూనుకొన్న నొకతాపసిజన్నముఁ గావ నోపఁడే!

67

క.

నీరాముని లక్ష్మణుతో, నీరామునివెంటఁ బనుపు మింక నితనిచే
నీరజనీచర యగు ధర, నీరజహితవంశ చింత నీ కేమిటికిన్.

68


దశరథుఁడు రామలక్ష్మణుల విశ్వామిత్రునితోఁ బంపుట

గీ.

అని వసిష్ఠుఁడు పల్కువాక్యములవలనఁ, దనయుమహిమంబు నిజమని తలఁచె నృపుఁడు
విశ్వసింతురె! భూపతుల్ వింతవార, లెంతవారైనఁ దమపురోహితుని గాక.

69


క.

యోగవిధేయుం డెవ్వఁడు, యోగీంద్రుల కతఁడు గురునియోగవిధేయుం
డై గాధేయుని వెనుకొనె, యాగపరిత్రాణమునకు ననుజాన్వితుఁడై.

70


ఉ.

పైనముచేసి తండ్రి వనుపం బెనుపంతముతోడ ని ట్లయో
ధ్యానగరంబు వెల్వడి పదాంక పవిత్రితమార్లు లైరి త
న్మౌనికృపానుభావభజమానబలాతిబలాభిధానవి
ద్యానిరవద్యబోధవిజితశ్రములై మహిపాలబాలకుల్.

71


చ.

వడి గొరవంకబారు లిరువంకల రాఁ జెలరేఁగి చిల్కత
త్తడి దుమికించుకొంచు జడదాలుపువేలుపుకంటిమంటలో
బడి వెడవిల్తుఁ డంగ మెడఁబాసిన మోసపుటెంకి యౌటచేఁ
బడసిన యంగసంజ్ఞ నిల భాసిలుదేశ మతిక్రమించుచున్.

72


చ.

అలకకెలంకునం దొలఁకు నాటకొలంకుననుండి వచ్చు గం
ధిలనలినీమిళద్రథపథిన్ సరయూనది దాఁటి వృత్రని
ర్దళనసముద్భవత్రిదశరాడఘనాశఘనప్రకాశముల్
మలదకరూశముల్ గడచి మార్గమునం జనుచుండువారికిన్.

73


సీ.

యక్షాన్వయసుకేతుకుక్షివారిధిఁ దోఁచు కాలకూటమువంటికలువకంటి
దివివెలయాలి కై దెగు నన్నదమ్ములం దగ్రజుకా ల్ద్రొక్కినట్టిజంత
మాయచే జగ మెంచు మారీచుఁ డనియెడు పాతకుఁ గనినట్టిపాపజాతి
వనధి గ్రోలినమౌనికినుకచేఁ దనయుండు తానును బొలదిండియైనదుండి


గీ.

యాత్మసాత్కారితచరాచరాత్యయప్ర
యత్నకృతకృత్యమృత్యుదుస్త్యజకృతాంత
నగరశృంగాటకశయాగ్రనర్తితోగ్ర
నిఖిలఖేటక తాటక నిలిచె నెదుట.

74


క.

ఆదారుణ నీదారి న, రాదకులోత్పాతసంధ్య యనఁ దగు రుధిర
క్షోదారుణఁ గని ఘృణి యగు, నాదశరథసుతునిఁ జూచి యతివరుఁ డనియెన్.

75

సీ.

వనిఁ ద్రోయఁడే చంద్రవతిఁ గూఁతు రనక యుద్ధతి నాచికేతుమాతామహుండు
పినతల్లి యనక నిర్భేదింపఁడా మున్ను దితినిండుగర్భంబు శతమఖుండు
ప్రియకాంత యనక డుల్పింపఁడా రేణుకాతరుణియౌదల జమదగ్నిమౌని
బ్రాహ్మణి యని గణింపక తెంపుతోఁ బట్టి చంపఁడా భృగురాణిఁ జక్రపాణి


గీ.

నడతదప్పినయప్పుడె కెడపఁజెల్లు, బుధవితతినైన యతినైనఁ బొలఁతినైన
దయదలఁప నీకు నిటువంటి భయదబలత, మనుకుటిలశీల యబలయె మనుకులేశ.

76


ఉ.

నా విని యావినీతరిపునాముఁడు రాముఁడు కర్ణపాళియం
దావిబుధారి నారి గుణ మంటియు నంటకమున్న టంక్రియా
రావమునన్ ధనుర్గుణము రక్కసినొంచుట కెచ్చరింప ర
క్షోవిసరాంగశోణితముఁ గ్రోలియెఱుంగనికోల యేయుడున్.

77


తాటకను రాముఁడు వధించుట

క.

ప్రాణాహుతి గొనె నాశిత, బాణావలి యాతుధానభామినిపంచ
ప్రాణముల రావణాదిమ, కోణపసముదయము బుత్తికొనుటకు మొదలన్.

78


క.

తాటక నీగతి శరహతి, గీటడఁచి నిజాతఝాటకీర్తికవాట
జ్యాటంకృతి యగురఘుపతి, యాటోపముఁ జూచి పొంగి రమరులు నింగిన్.

79


క.

అంతటఁ గౌశికుఁడు గృశా, శ్వాంతికభృతజృంభకాదిశస్త్రనికాయం
బంతేవాసికి రామున, కెంతేవాసిగ నొసంగె నింద్రునియాజ్ఞన్.

80


ఉ.

కౌశికుఁ డస్త్రదేశికుఁ డొకానొకదేశము సత్యలోకనీ
కాశముఁ జూపి యోరిపువిఖండన కంటివె నైగమాంతవా
ణీశరణీభవన్మునిమణీఖని నీవని నాశరేందిరా
నాశకళాపటుండు కుహనావటుఁ డున్నజనైకపావనిన్.

81


చ.

క్షితి నుదయంబుఁ జెంది బలిగీమునకున్ వడి వేరువాఱి యు
న్నత మగురూపుఁ బూని గగనస్థలి లోఁగొని యచ్చటం దరు
ప్రతతి చెలంగు లోకపరిరక్షకభిక్షుకచర్యఁ గన్న యా
మతకరిపొట్టిదిట్టమహిమంబు విడంబ మొనర్చు కైవడిన్.

82


విశ్వామిత్రుఁడు యజ్ఞమునకుఁ బ్రారంభించుట

వ.

అని యిత్తెఱంగునం దరంగితామందమందాకినీవికచకనకారవిందమకరంద
నిష్యందమధురిమానర్ఘ్యంబును, సచిరసంకోచిత ప్రచురతరమార్గదైర్ఘ్యంబును,

నగునిజలాపసరణిం దరణికులపావనుల వీనులకు విందు సంధించుచు మదాంధ
సింధురపురంధ్రీకర్ణాంచలచలనసంచారితసమీరణనివార్యమాణపంచాననద్వ్య
ణుకమధ్యాశ్రమం బగుసిద్ధాశ్రమంబునకు నేగి యాగాధినందనుండు యాగం
బునకు నుద్యోగం బొనర్చి యున్న సమయంబున నంభోజినీకుటుంబబింబ
గోచరుండగు హిమాచలకుమారికాసహచరశిరోభూషణం బైనయోషధీ
రమణుకతన భీతిలుచు వెలువడిన తద్గళాంతరాళవసదరాళతరకరాళహాలాహ
లంబు పోలికఁ త్రిలోకీవిక్షోభకారియగు రక్షోబలారికి నగారంబైన తనదు
నేరంబు పరిహరింప దాశరథియై యున్న వెన్నునకు విన్నపంబు సేయింపఁ
దదీయవంశకర్త యగువికర్తనుసమీపంబునకు యామునానుబంధంబునం
జేరఁబోవులవణవారాశితీరున నఖండపటుకళాధూర్వహుండై పర్వశర్వరింగూడి
క్రీడించుజాడ రేఱేఁడు నాతోడివేడుకకు రాఁడని యుపశమంబుతో హరిపదో
పాంతసీమాసమాసన్న యగునమాయామినివిధంబున నంబరైకదేశంబునం
ద్రిశంకుండు నివసించుటం జేసి నానాఁటికీఁ బ్రబలు నీచవాటిక నతిస్ఫూర్తి
వర్తిల్లు దివాకీర్తిబృందంబుచందంబున దశస్యందననందనాగ్రణి మహోగ్రచాప
ప్రతాపకీలికీలాకలాపంబున నకూపారకుమారవిహరదమరారివీరవరశరీరపటలం
బులం బుటంబు లిడుట కంభోరుహకుమారుం డనునయస్కారుండు సంఘ
టించిన యింగాలసంఘంబుభంగి బంగరుగట్టుపట్టు కాఱడవి నిర్గమించు
సౌవర్గవాహినిజలావగాహంబునకు వచ్చు నుచ్చైశ్శ్రవోవనస్తంబేరమకదంబ
కంబు డంబున, నిలింపసంపత్కలమపారంపరుల కింపు సొంపు సంపాదించు
రాత్రించరవధూటికాకోటికన్నీటియలజళ్ల కాదికారణంబై, కౌశికారాధ
నీయచిత్రభానుప్రభానిరోధకం బైనధారాధరనికాయంబుసోయగంబున మహా
బిలంబునం దుండియు మరుద్గ్రసనలాలసంబై తోచు మేచకాస్తోకదర్వీకరా
నీకంబువీఁక, నాకసంబున భయానకం బగుపలాదలోకంబు నాలోకించి కించి
త్తైన ధైర్యంబు లేక యాకులంబైన యాజకసమూహంబు లితరేతరంబు
ని ట్లని గణియింపం దొడంగె.

83


చ.

తపసులపాలిమృత్యువులు దైత్యులు వీ రిల నున్ననాళ్లకుం
దప మని చేయఁ గూడునో వ్రతం బని పట్టఁగ శక్యమో వితా
యిపు డిది యేటియత్నము వహించె వివేకవిహీనుఁ డైనయీ
నృపముని యంచుఁ గౌశికు పయిం గడు నేరము లెంచువారలున్.

84

ఉ.

హత్యకు రోయఁ జూతురె దురాత్మకులై చరియించు రాక్షస
వ్రాత్యులు వీరివంక నగురట్లకుఁ దిట్లకుఁ బెట్ల కోర్చునౌ
ద్ధత్యవిశేష మెక్కడిది తాపసిబక్కల కింక మీర లా
ఘాత్యము చూప భూపతులు గారు చనుం డని పల్కువారలున్.

85


మ.

అరణు ల్పాత్రము లగ్ను లాస్తరణముల్ హవ్యంబులు న్నేఁటితో
డ రసాభాసత దోఁప దీక్ష కడముట్ట న్నోచెఁగా మౌని ప
ఙ్క్తిరథుం డప్పుడె బాలుఁ డితఁ డని సందేహింపఁడా యూరకే
యరుదే నేటికిఁ జేతగానిపని కీయైక్ష్వాకుఁ డన్వారలున్.

86


మ.

మన మధ్వర్యుల మై కనం దగినసామ్రాజ్యంబు లే మున్న వీ
యనయజ్ఞంబున కేల వచ్చితిమి లెస్సాయెం గదా కూలిపో
యినయౌద్గాత్రము చాలు చాలు నీఁక హోతృత్వం బటంచుం బలా
యనపారాయణు లైన ఋత్త్విజులు నై రచ్చో మఘాగంతుకుల్.

87


సీ.

కేల నున్మూలించి గిరిశృంగములు పూచి కాచినతరులపై వైచివైచి
కన్నుల మిణుఁగుఱుల్ గ్రమ్మ నాశ్రమభూమి నెల్ల క్రొన్నెత్తురు చల్లిచల్లి
వడి ఖేచరుల నేలఁ బడ నీడ్చి సిగలూడ్చి కరములు పెడకేలు గట్టికట్టి
యట్టహాసము చేసి హస్తఘట్టనలతో నటునిటు పాతరలాడియాడి


గీ.

నిండిరి నిశాటు లెడము లేకుండ మింట, వింట లే దిట్టిదుడుకు నీవింట మమ్ము
మనుపవే రామ యభిరామ యనుచు మౌను, లార్తినెఱిఁగింప లేనగ వంకురింప.

88


మ.

విలు కేలం గొని రామభద్రుఁడు రణోర్విం దమ్ముఁడుం దాను బె
క్కులకోరు ల్నిగిడించి రక్కసులముక్కుల్ చెక్కులుం గాళ్లు పి
క్క లురమ్ముల్ కరము ల్శిరమ్ములును బ్రక్క ల్డొక్కలుం చక్కు చ
క్కులు గావింప నిలింపు లెక్కు డని రక్కోదండపాండిత్యమున్.

89


గీ.

కలితవర్ణాంతరుం డైనగాధిసూను
సహచరత నేమొకో నిజక్షత్త్రజాతి
కయినసిప్పలదండ మూనియుఁ బలాశ
దండకరుఁ డయ్యె నపుడు మార్తాండకులుఁడు.

90


శా.

మారీచక్షణదాచరుం డపుడు రామస్వామితోఁ బోరికై
యారంభించి తదీయమారుతశరవ్యాపారతూలీకృతా

కారుం డై మృతి దప్పి యుప్పుకడలిం గాఁపయ్యె వార్ధీశకాం
తారత్నంబులు నీటిపాప యనుచుం దన్నట్టి యాడింపఁగన్.

91


క.

ఆహేళికులుం డనిమిష, బాహుళహిమకరణరాహుబాహుసుబాహున్
వాహారివాహగేహ, ప్రాహుణికుం జేసె ననలబాణప్రౌఢిన్.

92


మ.

విదితస్నేహము, సాధువంశము, గుణాన్వీతంబు, సత్పక్షమున్
హృదయగ్రాహిఫలంబు నై యొలయు నయ్యిక్ష్వాకురాట్ప్రేరిత
ప్రదకోత్తంసమువెంట నంటి చనియెన్ రాత్రించరప్రాణప
ఙ్క్తి దయం బాయఁగ లేనిమానవతిరీతిన్ రక్తభావాత్తయై.

93


చ.

నిజమఘపూర్తి దోఁప రజనీచరహారిణియై కకుత్స్థత
ల్లజుని వరించి యున్న జయలక్ష్మికి నొక్కసపత్నిఁ గూర్ప గా
ధిజమునిచంద్రుఁ డంతట విదేహమహీపరిణీపురోన్ముఖ
వ్రజనము చేకొనెం గృతము వర్ణవిపర్యయచర్యుఁ డెంచునే.

94


చ.

ముని రఘురాముతో నరిగి ముందట శోణతటానుబంధి చం
దనవనవాటి నాఁటిపయనంబు వసించి పయోధిరాజది
గ్వనజముఖీవినోదమణికందుకతన్ రవి చెంద సాంధ్యవం
దనముఖకృత్యము ల్నడిపి తజ్జ్ఞులగోష్ఠి మెలంగె నయ్యెడన్.

95


క.

ఈజనపదమున కధిపతి, యేజనపతియో మునీంద్ర యిది కృతయుగవ
ద్భ్రాజిత మని వెఱఁగందెడు, నాజితనూభవునితోడ యతివరుఁ డనియెన్.

96


సీ.

పౌరాభిమతచిత్ర బలసాంబుఁడు కుశాంబుఁడనఁగఁ గౌశాంబికి నధిపుఁ డొకఁడు
సరశరీరసృజనాభుఁడు కుశనాభుఁ డన మహెూదయమున కినుఁ డొకండు
దోశ్శక్తిశరజుఁ డౌధూతరజుఁడన ధర్మారణ్యపురికి నధ్యక్షుఁ డొకఁడు
నవనివిభావసుడు వసుండునా గిరివ్రజరాజధానికి రా జొకండు


గీ.

నైన వైధాత్రకుశరాజసూనులందు, వసువు పాలించు దేశ మీవసుధయందు
రల్ల కుశనాభుఁడు ఘృతాచివల్ల గనియె,నతను సైన్యాయితంబుఁ గన్యాశతంబు.

97


ఉ.

కిన్నెర మీటి వీణెఁ బలికించియుఁ దంబుఁఱబూని రక్తిగాఁ
దిన్ననిపాట పాడియును దేశియు మార్గము నింపు సొంపు నిం
ప న్నటియించియుం దివిరి మద్దెల వాచియుఁ బ్రొద్దువోక యా
కన్నెలు కేళికావని నొకానొకనాఁడు మెలంగి రయ్యెడన్.

98

చ.

కరువలి వారిమేనులును గౌనులుఁ గీల్జడలుం దొడ ల్నడల్
తఱులుఁ గురు ల్మరుల్కొలుపఁ దానిపు డెక్కడ సంతరించెనో
శరశత మైదుకైదువులజంత యటంచు విరాళి కొగ్గి డ
గ్లఱుటయు రాచకూఁతురుల గాలికి గీలికి సోఁక శక్యమా.

99


చ.

చులుకఁదనంబుఁ గోడిగముఁ జూపకు మోపవమాన మానినీ
తిలకములం గవుంగిటికిఁ దీసెద విట్టి విచార మాజడా
త్ముల దని పల్కగా డ్పలుకతో విరిఁబోండ్లయొడళ్లు వంపు దిం
ఫులుగొనరానిపెందెపులుఁ బూంచె; నిశాంతముఁ జెంది రింతులున్.

100


చ.

తనయలవాతచేష్టఁ గని తత్ప్రతికార మొనర్పఁ జూళినం
దనుఁ డగు బ్రహ్మదత్తునకుఁ దండ్రి యొసంగినఁ గన్యకామణుల్
నునుజిగిసానదేఱిన మనోజులకోరుల మించి రద్దిరా!
మునిసుతుఁ జెట్టవట్టుశుభమూర్తుల కెక్కడిగాలిసోఁకుడుల్.

101


మ.

కుశనాభుం డల సౌమదేయున కనుంగుంగూఁతులం బెండ్లి స
ల్పి శుభౌన్నత్యముఁ గన్నపిమ్మట జగత్ప్రేంఖోలికావర్తికీ
ర్తిశరచ్చంద్రసుధాపయోధి యగుగాధిం గాంచె నస్మద్గురుం
గుశసంజ్ఞుం డగుమత్పితామహుకృపం గోదండవిద్యానిధిన్.[3]

102


గీ.

అనుచు నిజవంశకథఁ దెల్పు నతనియుక్తి
రక్తిగనుచాయఁ గెంజాయ ప్రాచిడాయ
దినముఖవిధేయములు దీర్చి మనుకులీనుఁ
డనుజుఁడును దాను మునివెంట నవల గదలి.

103


సీ.

భవఫాలదృగ్వృతప్రవహత్తదీయకిరీటకోటిసుధాంశురేఖ యనఁగ
శైలాధిపాలానమూలకీలితసింధుగజరాజరజతశృంఖల యనంగ
నపవర్గమార్గసౌధారోహణాధారహీరమయాధిరోహిణి యనంగ
నతివేలసుకృతపక్షాహూతిహేతుశారదవారివాహధోరణి యనంగఁ


గీ.

గమలకువలయకహ్లారకుముదసాధు, సీధుమాధుర్యమేదురక్షీరయై భ
గీరథునిపాలి సౌరశృంగిణి యనంగ, మించు గంగాతరంగిణిఁ గాంచె నెదుట.

104


శా.

హస్తాంభోదనిరస్తయాచనకధారాటచ్ఛటాదైన్యసా
ధ్వస్తిక్షీరగవీవదాన్యదినరాజామ్నాయమూర్ధన్య వి

ధ్వస్తారాతినృపాలసైన్య! యమృషావాణీపదాధ్వన్య! ధీ
రస్తోమస్తవనీయజన్యగరిమప్రాధాన్యయోధాగ్రణీ!

105


క.

కంధరవాహనసింధుర, సైంధవచందనసుగంధ సౌగంధికినీ
బంధుసుసింధురశరమరు, దంథఃపరిపంథిబంధురాయతకీర్తీ!

106


మానిని.

పాటవసంగితురంగభటోద్భటబుధురగంధగజేంద్రఘటా!
హాటకకూటధురీణపులీనమహత్తరమత్తరిపుక్షితిభృ
ఝ్ఝాటవిపాటనశాతవిపాఠ! నిశాటవిరోధికటాక్షనిరా
ఘాటకృపారసపూరసమేధితగాఢనిరూఢనిజాభ్యుదయా!

107


గద్యము.

ఇది శ్రీమదుమామహేశ్వరవరప్రసాదసమాసాదితసరసకవితావిలాసవా
సిష్ఠవంశకీర్తిప్రతిష్ఠాసంపాదక ఋగ్వేదికవి తిరువేంగళార్యకలశరత్నాకర
సుధాకర జగద్విఖ్యాత కవిరాజకంఠీరవబిరుదాంక వేంకటాచలపతి
ప్రణీతం బైనచంపూరామాయణం బనుమహాప్రబంధంబునందు,
ద్వితీయాశ్వాసము

  1. ఈపై స్తుతిపద్యములలోఁ గొన్నియర్థసందేహములున్నవి. మాతృకలోనున్నట్లే ముద్రించితిమి.
  2. సూళగెరికి - మాతృక
  3. ఇందలి వ్రాతతప్పులు సంస్కృతరామాయణచంపువు ననుసరించి సవరింపఁబడినవి.