చంద్రికా పరిణయము/చతుర్థాశ్వాసము

శ్రీలక్ష్మీనరసింహాయనమః

చంద్రికాపరిణయము

చతుర్థాశ్వాసము

క. కమలాకుచకలశతటీ
విమలాంచితమృగమదాభివిలసన్ముద్రా
కమలామతికృల్లాంఛన
విమలాలసరిపువిభేదవిధ గోపాలా! 1

తే. చిత్తగింపుము శౌనకా ద్యుత్తమర్షి
సమితి కిట్లను రోమహ ర్షణతనూజుఁ
డంత రంగద్వధూమోహ మన్నృపాలు
డంతరంగస్థలంబున నతిశయిల్ల. 2

సీ. వరియించు టెన్నఁడో వరమనోమోదంబు
నలువార రాజకన్యాలలామ,
విహరించు టెన్నఁడో గృహవన్య నాతిమి
న్నలు వారక భజింపఁ గలికిఁ గూడి,
నెలకొల్పు టెన్నఁడో నిశితపాణిరుహాంక
నలు వారణేంద్రయా నాకుచములను,
దేలించు టెన్నఁడో హాళిఁ గ్రొంజెమటసో
నలు వాఱ నెలఁతఁ గందర్పకేళిఁ,

తే. జెలువ మరుపోరు వెనుక సొ మ్ముల నలర్చి
చెలు వమరురక్తి నెన్నఁడో కలిసియుండు
టనుచుఁ దలపోయుచుండుఁ దా నాత్తచంద్రి
కాభిలాషానుగుంభితస్వాంతుఁ డగుచు. 3

చ. లలి మదిఁ జాల మించ నవలా! నవలాలితకంతుకల్యనా
విలగతిఁ బ్రోవ కున్కి దగవే తగ వేమరు కౌఁగిలింతచేన్
గలయక యున్నఁదాళఁ గలనా కలనాద! యటంచుఁ బల్కు భూ
తలపతిమారశారపవితాపవితానము మేనఁ గూరఁగన్. 4

సీ. అహిరోమలతికపొందందినఁ గాని నొం
పఁగ రాదు మలయాగమారుతములఁ,
గనకాంగికౌఁగిలి యెనసినఁ గాని పెం
పఁగ రాదు మధుపభామారుతముల,
ఘనవేణిఁ గూడి మించినఁ గాని రూపుదూ
ల్పఁగ రాదు శశభృన్నవప్రకరముల,
వనజారివదనఁ జేరినఁ గాని సిరు లడం
పఁగ రాదు వనసంభవప్రకరముల,

తే. ననుచు రాజీవనేత్రమోహంబు చాల
ననుచు రాజీవసాయకానల్పభయము
మలయ గాహితచింతమైఁ గలఁగఁ జిత్త
మల యగాహితనిభుఁడు తాపాప్తి నడల. 5

చ. నరపతిధైర్యభంగము దనర్చె నవీనరతీశధాటిఁ గై
కరభసలీల చందననగచ్యుతమారుతపాళి చాంద్రదు
ష్కరభ సలీలకోకిలనికాయశుకవ్రజశారికాసము
త్కరభసలీలసద్ధ్వనివిధానము లత్తఱిఁ జిత్రవర్తనన్. 6

సీ. ఘనసింహగతికి స్రుక్కనిదిట్ట హంసవీ
క్షణదారకవ్రాతగతికి బెదరు,
దనుజాస్త్రకీలి కోర్చినమేటి పూర్ణిమా
క్షణదారమణహేతిజాతి కడలుఁ,

గలిరవాళికిఁ గలంగనిదంట కిసలభ
క్షణదారనిస్వనచ్ఛటకుఁ దెరలుఁ,
దామిస్రశస్త్రిఁ గుందనిసామి విరహిహృ
త్క్షణదారయుతమారశస్త్రి నొదుఁగు,

తే. నఖిలలేఖావగీర్ణనవాజిరాజి
తాజరారిధనుర్ముక్తవాజిరాజి
దోడ్త మయి నాట నలఁగనిదొర యనలగు
రూత్కరము గాత్రసీమయం దొరయ నలఁగు. 7

చ. నిరతము వ్రాయు నాహరిణనేత్రతలంబు నవామలాలస
స్ఫురణ విభుండు దృగ్యుగళముం గరముం గురులున్ మొగంబునున్
వెర దొరయింప నాహరిణనేత్రతలంబున వామలాలస
త్సరసిజమందిరాతనయశాంబరికాకృతమోహరేఖనాన్. 8

చ. ఎనసినరాగసంపద నరేశిత తా హితచంద్రికావధూ
తనురుచిఁ గాంచి మోహభృతిఁ దాల్చిన నాయెడనుండి కీరభూ
రినినదభంగిఁ గుందు, బళిరే! సితతాహితచంద్రికావధూ
తనిజధృతిన్ భ్రమించు, మదిఁ దార్కొనుచింతఁ గలంగు నెంతయున్. 9

సీ. తనువేల తావకోదార స్తనవసుధా
ధర పాళిఁ గౌఁగిటఁ దార్పకున్న,
శ్రుతు లేల భవదుదంచితగాన నవసుధా
ద్వీపికోర్మిరుతముల్ వినకయున్నఁ,
గనుదోయి యేల నీగాత్రాంచన వసు ధా
లంధల్య విభవముల్ గాంచకున్న,
ఘ్రాణ మేల త్వదాస్యరాకార్జునవసు ధా
మక సుగంధశ్రేణి మరగకున్న,

తే. రసన యిది యేల నీయోష్ఠరమ్య మధుర
సోత్కరము వేడ్కఁ గ్రోలక యున్న మధుర
వాణి యని పల్కుఁ బతి యాత్మ వఱల మధు ర
మాధిపసుతోత్థ తాపజాతాసమధుర. 10

చ. అలయవిరాజమానకుచ నాయవనీపతి చిత్తవీథిలో
నలయవిరాజమానరతి నంది దలంపఁగ నొందు మేనునం
బులక లుషంబునన్ మధువుఁబోలెఁ బరిస్ఫుటపద్మసీమ నం
బు లకలుషంబు లెప్పుడును బొల్పుగ నుబ్బు విలోచనంబులన్. 11

మ. వరపాంచాలకుమారికాతిలక భవ్యధ్యాన సంపత్తిచే
నరుదారన్ భరియించె హృత్సరణిలో నశ్శ్యామలాభాయతిన్
హరిసంభేది తదీర్ష్యనో కనియె మే నశ్శ్యామలాభాయతిన్
సరసీజాస్త్రుఁడు మున్నె చేకొన నదానశ్శ్యామలాభాయతిన్. 12

చ. అలనరపాలచంద్రుహృదయాంబురుహం బితరప్రవృత్తిచేఁ
జెలఁగక యుండ నూన్చి చెలిఁ జేర్చెఁ గడున్ సితపక్షరాజమం
డల మధు పాళికాభ్రచరనాథ మరు త్సితపక్షరాజమం
డల మధుపాళికల్ గొలువ నవ్యభవోన్నతిఁ గంతుఁడయ్యెడన్. 13

తే. పతిహృదయ మిట్లు నిజశౌర్యపటిమ నంబు
నామకచఁ జేర్చి యెనయించె నలి మనం బు
రద్విషద్వైరి శితశరప్రథిమ నంబు
జహితకులుపైఁ దదేణలోచనమనంబు. 14

చ. అలవిరివింటిదంట తదిలాధిపమోహము నెమ్మనంబునన్
గల వలమానభేదిమణికైశికఁ గెందలిరాకుముల్కులన్
గలవల మాన నూన్చె నలుకన్ నవసంగరముద్ర నిల్చి మం
గలవలమాన మీనతిలక ధ్వజశోభి మరుద్రథంబునన్. 15

మ. జననాథస్మర చింతనా పరవశ స్వాంతంబునం బొల్చుకో
కనదామోద రయంబుచేఁ గమిచి పొంగంజేసెఁ దాపంబుఁ జ
క్కన దామోదరసూను ఘోటపటలీ గాఢధ్వనిశ్రేణి యా
కనదామోదరసాప్త భృంగకుల ఝంకారంబు లప్పట్టునన్. 16

సీ. వినఁ గొంకు శుకపికధ్వని మనోభవ మాన
రాగ కాతనుబలారభటి యనుచు,
నంట భీతిలుఁ బల్లవాళి హృద్భవ మాన
నీయ ధామశిఖానికాయ మనుచు,
నెనయ నోడు విలాసవనవాటి భవమాన
హర భూరిదుర్గచయం బటంచుఁ,
గన స్రుక్కునవకోరకచ్ఛటాభ వమాన
కారి కందర్పాసిధార యనుచు,

తే. నిటులు వలవంతఁ గుందు నానృపతిరూప
ఘనవిభవ మానరానియుత్కలికఁ గాంచి
నట్టితఱినుండి క్షణదోదయావనీశ్వ
రాత్మభవ మానసంబు తాపార్చిఁ గలఁగ. 17

చ. ఉదుటున మోహనాదిక మహోగ్రతరాస్త్ర నిరూఢిఁ దత్తమి
స్రదనుజభేదిపై నెడయఁజాలనికోరిక నానవీనతో
యదకచ కొందఁజేయ నభవారి శయమ్ములఁ గంకణావళుల్
వదలెఁ దొలంకెఁబో నయనవారిశయమ్ములఁ గంకణావళుల్. 18

చ. కనుదొవదోయి నిర్నిమిషగౌరవ మందఁగ నబ్బురంబుతో
ననుపమరక్తితోఁ బ్రియమహాఫలకాలసమానరూపమున్
గనుఁగొను నెప్పు డెప్పు డలకామిని యాతఱి యెల్ల నెన్నఁగా
ననువుగఁ బొల్చెఁ బూనియ మహాఫలకాలసమానరూపమున్. 19

సీ. కన నింపుఁ గూర్చు చక్కనిమోమువలిమిన్న
మనసార ముద్దు గైకొనఁగఁ దివురు,
నేల వే లనుచుఁ గపోలలవలి మిన్న
కయ పునర్భవపాళిఁ గరము మీటుఁ,
గలికిచన్గుబ్బలికవ యాన వలిమిన్న
వాసక్తిఁ గౌఁగిట నందఁ జూచు,
లలితాధరోష్ఠపల్లవసుధావలి మిన్న
లము సమ్మదమునఁ గ్రోలంగఁ దలఁచుఁ,

తే. జెలఁగి యాశీతకరకళాజేతృఫాల
ఫలక రమణీయమోహసంభ్రాంత యగుచు
ఫలక రమణీయరూపంబు ప్రౌఢి వ్రాసి
యంబురుహబాణకేళికాశాప్తి నపుడు. 20

చ. చలనముఁ బొందసాగెఁ జెలిస్వాంత మరాళమరాళవృత్తికిన్
విలయకృశానుహేతి తులనీయ నిశాత నిశాతపాళికిన్
ఫలనిభవాయుకీర్ణ మధుపాదప రాగ పరాగ పాళికిన్
లలిత రసాల సంగత కలస్వనవీన నవీన గీతికిన్. 21

మ. జనరాట్కన్య స్వసంగతి న్మను మహాచక్రాంగనాళీకలో
చన పొందున్ నిజజీవబంధురతిరాట్చక్రాంగనాళీకయో
జనమున్ నిర్మలభాస్వదాప్తమతిమచ్చక్రాంగనాళీకన
ద్ఘనసంసర్గము నొంద లేదుగ సుచంద్రవ్యక్తలోభంబునన్. 22

సీ. కొమిరె యాయీశుకూటమి గోరుఁ బో యాత్మ
కరవాలశిఖిహేతిఁ గంతుఁ డేచ,
నువిద యాఘనునిపొందూహించుఁ బో చైత్రి
కరవాలపనసూచి గాఁడి పాఱఁ,

దెఱవ యాకనకమూర్తిఁ దలంచుఁ బో మధు
కరవాలకచ లెల్లఁ గలఁగఁ జేయ,
మగువ యాభోగిపై మన ముంచుఁ బో సుదు
ష్కరవాలపవనంబు గాసి వెట్ట,

తే. నినుని వినుతించుఁబో మదిఁ గనలి నారి
క నలినారిమరీచిసంఘాత మలమ,
నారమణి నిత్య మిటులు హృత్సారసంబు
సారసంబుద్ధతాపసంసక్తి నెనయు. 23

చ. సతతము తీవ్ర హేతిధర సార సమాన వరాజసూను సం
జిత విరహోగ్ర తాప తతిచేఁ జలియించు నిజాంతరంగకం
జతలము తన్ముఖేందుజితసారస మానవరాజసూనుసం
గతముగ నూన్చి కూర్చె నవిఖండితసమ్మదవార్ధివీచికన్. 24

చ. నలినసమాననా ధృతిఘనత్వ మడంచె రుషార్చి నెమ్మదిన్
మలయ సమీరణాళికుసుమవ్రజబోధిత భృంగశింజినిన్
నలి నసమాన నాల సుమన శ్శర మండలిఁ గూర్చి నొంచుచున్
మలయసమీరణాఖ్యరథమధ్యగుఁడై ననవిల్తుఁ డుద్ధతిన్. 25

తే. అంత వలఱేనికి సహాయమగుచు హితఫ
లాభికాంక్షి శుకత్రిదశాళిసురభి
జగతి గనుపట్టె నవసూనశాలి సురభి
లామ్రతిలకైకసంగమాశాలి సురభి. 26

సీ. సుమనోగసమ చూత సుమనోగణ పరీత
సుమనోగణిత సార శోభితాళి,
కలనాదసంతాన కలనాద సమనూన
కలనా దలిత మానబల వియోగి,

లతికాంతరిత రాగ లతికాంతసపరాగ
లతికాంతపరియోగలక్ష్యకాళి,
కమలాలయాస్తోక కమలాలయదనేక
కమలాలసితపాకకలితకోకి,

తే. జాలకవితానకవితానపాళిభూత
చారుహరిజాతహరిజాతతోరణోల్ల
సద్వ్రతతికావ్రతతికావ్రజక్షయాతి
భాసురము పొల్చె వాసంతవాసరంబు. 27

సీ. కిసలార్పితానందరసలాభకపికాళి
కామనం బబలాప్తకామనంబు,
సుమభావిధాన్యోన్యసమభావయుతరాగ
పర్ణకం బాపతత్పర్ణకంబు,
నవపారిజాతప్రసవపాళిపుష్టాళి
దారకంబు వియోగిదారకంబు,
కురువామితపరాగగురువాసనాకీర్ణ
పుష్కరం బుద్దీప్తపుష్కరంబు,

తే. సారమాకందఫలలగత్కీరమాని
నీక్షణంబు క్షరద్యామినీక్షణంబు
మంజులానేకకుసుమవద్వంజులాది
కాగమమువొల్చె నిలఁ జైత్రికాగమంబు. 28

చ. వరపురుషోత్తమాప్తి ననివారితసైంధవరత్నయుక్తి ని
ర్భరవసుకూటలబ్ధిఁ దనరారి నభోబ్ధిఁ జరించు నుజ్జ్వల
త్తరణి యనంగహారిసఖధామపథంబును బొందె నయ్యెడన్
దరణి యనంగ హారియమనాథదిశానిలజాలధారచేన్. 29

చ. మొనచిగురాకుమోవిపస మున్ మగతుమ్మెద చూపుకోపు పెం
పునఁ గలికాకుచోజ్జ్వలతపొందున నావనలక్ష్మి పొల్చినన్
గని యతనుప్రతాపపరికల్పితమోహనిరూఢిమైఁ దలం
గని యతనుప్రతాపగతిఁ గైకొనె భానుఁడు మందవర్తనన్. 30

చ. నిరుపమకేళికావనుల నీటుగ నామని తోఁచునంతలో
విరహిమృదుప్రవాళపద వీవలితావి లతాపరాగముల్
వెరవిఁడిఁ జేయఁ జిత్తపదవీవలితావిలతాపరాగముల్
గరము వహించి దూఱె రతికాంతునిఁ దూఱ మదిన్ స్మరాస్త్రముల్. 31

మ. ధరఁ బాంథుల్ బెగడొందఁ ద్రిమ్మరియె భద్రశ్రీమహీభృన్మృషా
సరసాలాన వసత్యశృంఖలిత చంచన్మారుతేభంబు కే
సరసాలానవపత్త్రముల్ తులుముచున్ జైత్రాహజాగ్రద్విలా
సరసాలానవధిప్రసూనరజముల్ సారెన్ బయిన్ రువ్వుచున్. 32

చ. వనచరపాళికా నినదవారము మించఁగఁ గాననంబులన్
వనచరపాళికాప్త కుహనాశబరాగ్రణి నిల్చి యాశుగా
ళి నలమ సాలసంతతి చలించుచు నంత శుచిచ్ఛదావళుల్
చననిభయాప్తి వైచె నన జాఱె ననంత శుచిచ్ఛదావళుల్. 33

సీ. మధుయంత విటపిసామజకటమ్ముల వ్రాయ
నలరు గైరికరేఖికాళు లనఁగ,
హరివిదారితపత్త్రయగు నగశ్రేణిపై
నడరు గైరికరేఖికాళు లనఁగ,
నళిధూమకందళి యలమఁ గన్పడు దవాం
గణవిరోచనమయూఖము లనంగ,
మును మ్రింగి వెగటైనవనతమస్తతి గ్రక్కు
ఘనవిరోచనమయూఖము లనంగ,

తే. నహహ యవ్వేళ పత్త్రతోయధితటస్థ
లకనదతిరోహితప్రవాళము లనంగ,
నమరె నతిరోహితప్రవాళముల నంగ
కనకకరవాలికాప్రమాకరము లగుచు. 34

చ. కలికల రంగదుజ్జ్వలతఁ గన్పడెఁ గాననసీమ ముత్తెముల్
కలి కలరంగ నొంచి నిజగౌరిమచే, నడఁగించి చంద్రమః
కలికల, రంగమై నవసుగంధపరంపర కెల్లఁ, జాల ను
త్కలికలరం గనారతముఁ గాంచిన చూపఱచూడ్కి కుంచుచున్. 35

చ. విరిగమి వొల్చె సర్వవనవీథులఁ, దారకదీధితి చ్ఛిదా
పర మహిమానివారణము, పాంథవధూజన దృష్టిమాలికా
పరమహి, మానితాళికులభవ్యవిహారనివాస, ముజ్జ్వల
త్పరమ హిమానికాజయజ భాసుర చైత్రికకీర్తి యత్తఱిన్. 36

సీ. ఫలియించెఁ దిలకముల్ భసలేక్షణమ్ముల
సురసాలతా సముత్కరము గాంచఁ,
జివురించె నునుఁబొన్న నవసూనసంతతి
సురసాలవల్లరుల్ సరస నవ్వ,
ననఁజూపె బొగడచాల్ నవమధుచ్ఛట నింద్ర
సురసా లలితశాఖ కరము నుమియఁ,
గుసుమించె లేఁగ్రోవి కొమరు వీవలి విభా
సుర సాలవల్లికల్ సొరిది నలమ,

తే. సితవసు రసాల చారుమారుత ముఖాప్త
వరులు మెచ్చంగ మధు వలర్పకయ మున్నె
యలరి సురసాలవైఖరిఁ జెలువు గాంచె
నపు డగశ్రేణి యిట్లు దోహదనిరూఢి. 37

చ. తలిరులు దోఁచెఁ గోకిలవితానము వేడుకఁ గాంచ, సూనముల్
వొలిచె మిళింద ముబ్బి కడుఁ బూన నవాంగము, మారుతాంకురం
బొలికెఁ బరాగముల్ వని లతోత్కర మాకులపాటు నందగన్,
దొలుదొలుతన్ వియోగిసుదతుల్ కర మాకులపాటు నందఁగన్. 38

మ. అలరెన్ జైత్రబలాధినేత మదసారంగాళి సద్వాజిమం
డలి రాగంబున మించుక్రొందళములన్ రమ్యాత్మఁ జేకూర్పఁగాఁ
గలనాదారి తమీన మారుతయుతిన్ గంజాస్త్రుఁ డుద్యత్సహః
కలనా దారిత మీనదృక్పురుష జాగ్రద్ధైర్యుఁడై యయ్యెడన్. 39

మ. కలకంఠీకులపంచమస్వరగృహత్కాంతారవారంబులన్
దలిరా కాకమలేశ్వరాత్మజ మహస్త్వంబున్ సుమచ్ఛాయకం
దలి రాకాకమలేశ్వరాత్మజ మహస్త్వంబున్ గడుం బూని క
న్నుల కుద్వేలభయంబు గూర్ప మఱి పాంథుల్ గుంది రప్పట్టునన్. 40

తే. అలవసంతంబున రహించెఁ దిలక భాస
మాన హిందోళగీత నిస్వాన, మహిమ
దీప్త్యుదయకాల గాయికాతిలక గీయ,
మాన హిందోళగీత నిస్వానమహిమ. 41

చ. నెలవున రాగసంపద వనీరమ చారుపికారవంబునన్
దెలిసి వసంతురాక, సుమనీర మహోర్మికఁ దాన మూన్చి, పూ
ని లలితసుచ్ఛదాళి, నళినీరమణీయసరంబు లూని, మేల్
నెలవునఁ బొల్చెఁ, గుంజభవనీరమమాణశుకీసఖీవృతిన్. 42

సీ. రమ్యపున్నాగోర్వరాజాతిసౌరభా
రూఢి పై నలమ మారుతము నిగుడ,
రసఁ బల్లవరుచిధారాజాతిసౌరభా
గారితవంజులాగములు దోఁపఁ,

బ్రబలు సంభ్రమ మెచ్చ రాజాతిసౌరభా
వలినివాసి శుకౌఘములు నటింప,
రాజత్పికాబ్జకరాజాతిసౌరభా
నేహోర్పితారావనియతి మెఱయ,

తే. నధ్వగులు గుంది రధికతాపార్చి పఱవఁ
గాననంబుల నపుడు చక్కనిప్రియాళి
కాననంబులఁ గాంచు మోహంబు లాత్మ
కాన నంబుల మారుఁ డుద్ధతి నటింప. 43

చ. సరససమీరపోతములు చక్కఁ జరింపఁగఁ జొచ్చె నప్డు సుం
దరవకుళాగకేసరలతాసుమనోరసవీచిఁ దేలుచున్
దరుణనమేరుకేసరలతాసుమనోనరజంబు లాగుచున్
దరముగ నాగకేసరలతాసుమనోరమగంధ మానుచున్. 44

సీ. శ్యామోదయము కొంచియము చేయ నేతెంచి
శ్యామోదయంబు హెచ్చగఁ దనర్చె,
సుమనోవిలాసంబు చూఱపుచ్చఁగఁ జేరి
సుమనోవిలాసంబు లమరఁ జేసెఁ,
దుంగకదంబాభ దూల్పంగఁ బొడకట్టి
తుంగకదంబాభ పొంగఁ దార్చె,
హైమజాలకరూఢి నపహరింపఁగఁ బొల్చి
హైమజాలకరూఢి యడర నూన్చె,

తే. శుచిపలాశాళిహృతిఁ గూర్ప నచల వెలసి
శుచిపలాశాళివర్ధకస్ఫూర్తిఁ బొదలె,
నహహ కమలేశ్వరాత్మజాతైకమైత్త్రి
కతనఁ జైత్రుండు సమ్మదాకలన నొంది. 45

చ. అలమధువేళఁ దీవ్రవిరహాగ్నిశిఖాపరితప్తగాత్రి యౌ
నలినవిరోధివంశజననాయకపుత్త్రి దలంక సాగె న
త్యలఘుసువర్ణకాననవిహార్యసమాశుగకాండధారకున్
హలహలధారిదర్పపరిహార్యసమాశుగకాండధారకున్. 46

తే. బాల యీలీల మదనరోపాలికల క
రాలవర్తనచే మనఃపాలిఁ గలఁకఁ
జెంది కుందంగఁ దన్నేత్రజితచకోరి,
చేరి యిట్లను సూక్తిరాజితచకోరి. 47

చ. తలఁకెదవేల కీరవనితాజనవృత్తికిఁ, దేఁటిరానెలం
తల, కెద వేల మీఱునిజధైర్యము పాయఁగఁ గుందె దేల, కో
యిలనవలాలసారరుతి, కింతి, మనోజుఁడు సంఘటించుఁ బో
యిల నవలాలసాప్రచయ, మీయెడఁ ద న్భజియింప సత్కృపన్. 48

తే. కాన నమ్ము నటద్భక్తికలనమునఁ గ
రమ్ము నలినాశుగునిఁ గొల్వ రమ్యకేళి
కాననమ్మున కోనీలకంజనయన!
రమ్ము నలి నాశుగతి యిప్డు ప్రబల ననుచు. 49

మ. చెలి కేలందిన మాఱు పల్కక మనశ్చింతాకులస్ఫూర్తిఁ ద
త్కలకంఠీర వనంబుఁ జేర నరిగెన్ దత్పద్మినీమౌళి స
త్కలకంఠీరవజాలకంబులు కడున్ గాటంబులై యుజ్జ్వల
త్కలకంఠీరవకామినీనినదరేఖం బల్వెఱన్ గూర్పఁగన్. 50

శా. భ్రాజద్భక్తి నెదుర్కొనంగ వనగోపస్త్రీజనం బాప్తనీ
రేజాస్యానికరంబు తన్ గొలువఁ జేరెన్ గేళికారామ మా
రాజీవాంబక శింజినీనికరగర్జల్ హంసి నేర్వ న్మహా
రాజీవాంబక శింజినీవిరుతిఁ బర్వన్ వేఁడి నిట్టూర్పులున్. 51

క. కువలాస్త్రరుజాగతిఁ బొ
క్కు వలాహకకచకు వనికకొమ రయ్యెడఁ ద
త్కువలాంబకాళి సుధ తేఁ
కువ లార్చుశుభోక్తిఁ దెల్పెఁ గూరిమి పొదలన్. 52

సీ. బాలాంబుజతమాలమాలాభినవజాల
జాలామృతోల్లోలషట్పదౌఘ,
రాగాదిపరమాగమాగాంతసుపరాగ
రాగావరణభాగరాళపవన,
కేలీగృహన్మౌలిమౌలిస్థితపికాలి
కాలీనరవలోలితాధ్వగాత్మ,
రాజీవశరవాజివాజీననిరతాజి
తాజీజనకరాజితామ్రఫలిక,

తే. భవ్యఋతుకాంతకాంతతాత్పర్యసృష్ట
ఘనవిషమబాణబాణసంఘాతకలిత
తిలకమధుగంధగంధసంచులుకితాశ
కనదచిరధామధామ యివ్వనిక గంటె. 53

చ. తలిరుమెఱుంగుచాయ శుకదారరవస్తనితంబు లెచ్చ ని
స్తులతిలకాభ్రముల్ గురియఁ జొచ్చెఁ బయోజదళాక్షి గాడ్పుచాల్
గలయ మరందదంభమున గాటపువర్షము గంటె సాంద్రము
త్కల యమరం దదంభమునకై యళిచాతకకోటి పర్వఁగన్. 54

చ. హితమహిలాలలామ వరియింపఁగ నిప్డు నిరస్తహీరభా
తతికరదీ! పికాళివనితాశుభగీతి సువర్ణజాలసం
తతికరదీపికాళి వని దార్కొన నామని రాఁగఁ దుంగసౌ
ధతలము లెక్కెఁ గన్గొన ముదంబునఁ జిల్కలరాణివాసముల్. 55

చ. నలువుగ మొగ్గగుబ్బ లెదనాటఁగఁ గౌఁగిటఁ జేర్చి నేర్పుతో
మలయధరాధరానిలకుమారవిటుండు లతాప్రసూనకో
మలయధరాధరాసవము మాటికి నానుచుఁ జొక్కె మోదముల్
మలయ ధరాధరాగ్రణికుమారిక! చూపటు నిల్వఁ జేయవే. 56

శా. స్ఫీతాళ్యావృతిభూర్యయోవలయలక్ష్మిం బూని పాంథాంగనా
జాతాసృక్పరిషిక్తరీతి నరుణచ్ఛాయల్ మనం బొల్చు నీ
శాతప్రాససమూహజాలకుల మెచ్చన్ జేసెఁ బో చిత్తభూ
శాతప్రాససమూహ జాలజవిభాసంజేతృవక్త్రేందుకా! 57

చ. వలదొర మెచ్చఁగా ఘనసువర్ణపలాశకవాసనాగతిన్
గలసి రజస్స్ఫులింగములు గ్రక్కుచు వీవలి వేగ చేరి రా
నలిని భయానఁ దాఱె నసియాడెడు నెమ్మది పూని కంటివే
నలి నిభయాన దా రెనసి నవ్వ లతల్ తెలిపూలచాలుచేన్. 58

మ. అలరెం గొల్వయి కీరభూపతి రసాలాస్థానదేశంబునన్
లలితోఁ దాఱనిసొంపు మించ నళిబాలారత్నలాస్యైకలీ
ల లితోదారపికాళిగీతవిహృతుల్ రాజిల్లఁ గన్గొంటివే
లలితోదారనగప్రసూనరసజాలద్వేషిదంతాంశుకా! 59

చ. అళినికరాందుకాప్తిఁ గిసలావళిరాంకవవస్త్ర[1]లబ్ధి ను
జ్జ్వలసుమపద్మయుక్తి మధుసాతిరసాప్లుతి నొప్పి చైత్రభూ
తలవరకుంజరాజితవిధానముఁ గైకొనెఁ గాంచు నీలకుం
తల! వరకుంజరాజి వెఱ దార్చుచుఁ బాంథజనాక్షివీథికిన్. 60

మ. సరసం గాంచవె, రూపదర్శనవిధాజాతాత్మవైచిత్ర్యవ
త్సుర! సారంగము లొందెఁ జెంత విగళత్సూనాసవప్రోజ్జ్వల
త్సురసారంగము లధ్వగాంతరసరఃక్షోభావహోద్వృత్తి భా
సురసారంగము లంగజానలశిఖాస్తోకాన్యధూమాకృతుల్. 61

క. అని వారణయానామణి
కనివారణ వాణిఁ దెలిపి యవ్వనిసిరి యొ
య్యన సారసగంధివితతి
యనసారసుమప్రతానహరణోత్సుకతన్. 62

వృషభగతి రగడ


చెలువ చెలువపుమొగ్గచా ల్కొని చేరు చేరుగఁ గూర్తు విచ్చట
నలిని నలినిభకుంతలామణి నన్ను నన్నులు వేఁడ ముచ్చట
తిలకతిలకకులంబు గన్గొన దివ్యదివ్యాగముల పోలిక
నలరు నలరుల నెనయు రోలంబాళి బాళి చిగుర్ప బాలిక
యింతి యింతిటఁ జేరఁ దగదె సుమేర మేరయె వకుళపాళిని
కాంతకాంతవశరము లల్లవె కాంత కాంతమె చాల హాళిని
నారి నారికెడంబుచాయల నవ్వ నవ్వలిపొన్న పూచెను
కోరకోరసిజ రతి నది నేఁగోర గోరఁట లజ్జ నాఁచెను
రాగరాగపరాగ మిచ్చ నరంగురంగునఁ బొల్చె నెక్కవె
రాఁగ రాగతఁ బట్టుకొనఁ గలరవమురవములు దెరల దక్కవె
పొదలుపొదలును దఱిసి నెలఁతలు బొగడఁ బొగడలమీఁద మాటికి
మదిర మది రహి మించ నుమిసిన మధురమధురస మెనపుఁ బోటికి
కొమ్మ కొమ్మలఁ గోసి విరులు చకోరి కోరినపొదలు దూఱుచు
నిమ్ము నిమ్ముదితగమి వేఁడిన నీక నీకనకాళిఁ దాఱుచు
నాస నాసవ మాన నీలలనాళి నాళిక పిలుచుఁ బెంపున
వాసవాసమదీప్తి గల నన వనిత వని తగె గోఁగు సొంపునఁ
గేలి గేలి యొనర్ప నలకంకేలి కేలిడి యూఁచు హావళి
సాలసాలపనశుకపికమధుపాలిపాలిటి కూర్మికావళి
రామ రామవినీలవంజులరాజి రాజిలు నంఘ్రి చేర్పవె
శ్యామ శ్యామల కోరకమ్ములను సరససరసముదయము గూర్పవె
యక్క యక్కనకమున మనె నీయాన యానవకళిక యిత్తఱి

నిక్క నిక్కము ద్రుంచి యొసఁగుదు నీవు నీవు లొసంగ బిత్తరి
ప్రమద ప్రమదతఁ గేల నంటఁగ రమ్మ రమ్మమరంగఁ జూతము
కొమరె కొమరె సఁగించు నవసుమకులముకులముల భృంగజాతము
అప్ప యప్పల్లవకదంబకమాఁగు మా గురుజవము నెగడఁగ
నిప్ప నిప్పద్మాననావ్రజ మించుమించుపలుకులఁ బొగడఁగ
నలమ నలమదిరాక్షి గొరవిఫలాలి లాలితమైన డాయుచు
కలికి కలికిఁ గడంగె సారసకాండకాండచయంబు మ్రోయుచు
వేఁడు వేడుక నిత్తు నీ కివ్వేళ వే లతికాంతవారము
దాడి దాడిమగమికిఁ జేరఁగఁ దగునె దగునెడ కరిగెఁ గీరము
తరుణి తరుణికఁ జేరు నెచ్చెలి దరము దరమున నూర్పు వీవలి
పరువఁ బరువముఁ బొందె వావిలి బాల బాలచ్ఛదసుమావళి
యీవ యీవరకిసలసంతతి కేవ కేవలరయతఁ జేరకు
మావి మావిభు సూను సేనకుమహిమ మహి మనుటెంకి దూఱకు
లతిక లతికమనీయపక్వఫలమ్ము లమ్మును మున్నె హెచ్చఁగ
రతిని రతినిభ పాటఁబాడఁగరా ధరాధరకుచలు మెచ్చఁగ
యలసి యలసితపత్ర మెనసె ఘనాత్మ నాత్మకు హితము చేకొన
నలికె నలి కెరలంగ వల దిభయాన యానగమౌళిఁ బైకొన
నెలమి నెలమి న్నలము నెమ్మొగమెత్త మెత్తనికుసుమజాలము
లలినిలలిని నడంచెఁ గనుమో యతివ యతివరకనకసాలము
నలఁచె నలచెలి నతులకీరపికాళికాళిధ్వనుల బలువగ
వలయు వలయుతిఁ జిత్రగతి దైవాఱువారుహబాణుఁ గొలువఁగ. 63

చ. అని వనకేళికల్ సలిపి యమ్మహిళాతిలకాళిరాగపు
ష్ట్యనువలితాత్మ చాల వెలయ న్మహిళాతిలకాళి రాగపు
ష్పనికర మప్డు గైకొనియెఁ బద్మకరాప్తసుతాపహారిశో
భనగతిఁ బూని మించ నలపద్మకరాప్తసుతార్హణేహచేన్. 64

సీ. తలిరాకు ద్రుంపరే కలకంఠసమవాయ
దర్పంబు దఱుఁగనీ తరుణులార,
విరిదుమ్ము దూల్పరే విస్ఫుటాసమవాయ
వీయాభ దెఱలనీ వెలఁదులార,
యలరులు దునుమరే యళి విలాసమ వాయఁ
గలఁకచే బ్రమయనీ చెలువలార,
ఫలకాళి గోయరే చిలుకచాల్ సమవాయ
గతిఁ జాల నడలనీ యతివలార,

తే. యని మనోంబుజవీథిఁ బాయని మదాప్తి
మారబలరాజ్యవష్టంభమారకప్ర
చార మూనుచు నపు డనీచారలీల
రామ లందఱు వెడలి రారామపదవి. 65

క. వరవనకేళీభవదు
స్తరఘనచూళీతనూతతశ్రమ ముడిపెన్
సరళలతాసరళలతా
విరళలతాంతాప్తపవనవిసరము లంతన్. 66

ఉ. ఆరమణీలలామనివహంబు గనుంగొనెఁ జెంత నున్నమ
త్సారముదారసాభియుతజాలపదార్భకదోలదూర్మికా
సారము దారసావరణసారసశోభితతీర మొక్క కా
సార ముదారసారసనిశాపవృతాసితఫేనతారమున్. 67

వ. కనుంగొని యభంగపదాంగదనిస్వానభంగిం దాము వచ్చుతెఱం గెఱింగి యుప్పొంగుచుం దటకటక కాననదేవతాజనంబులు దార్చిన విడిఁదిపిండులవడువునం గమనీయకళికాముక్తావళికావితానంబులం గమ్రసమీరసమాగమ గళత్కంకేళిపాళికా ప్రసవధూళికారింఛోళికా రాంకవాస్తరణవితానంబులం గనక కక్ష్యామార్గ భాసమాన పరిపక్వ ఫలాభిరామ రంభాపూగంబులం గనత్సుగంధ మరందరసగంధ తైల బంధుర బంధుజీవకోరకదీపకళికాపూగంబులం గనుపట్టుచు రంగుమీఱు కూలరంగ రంగత్కుడుంగంబు లంతరంగంబునకు వేడుక రంగలింప మరాళమందయానా ధవళవర్ణ పరిపూరితంబై యొప్పుమీఱు ప్రతీరశోభనభవనంబున నిస్తులస్థలపద్మవివాహపీఠికాసీమం గూర్చున్న బెగ్గురుపెండ్లికొడుకునకు సుంకులు చల్ల ఘనవేణికాసమాజంబు విరంజిత కింజల్కకలమపుంజ సంజిత దరవికసితశోణకంజోదూఖలంబునన్ దంచు ముసలంబుల సొంపునఁ దదంతరంబునం బతనోత్పనంబు సలుపు మత్తమధుపమాలికలు లోచనానులాసంబు చాలం బొందింపఁ గాసారకళిందనందినీహ్రదప్రదేశంబు చయ్యనం జొరఁబాఱి కాలకమల లతాకాళియకాకోదరపర్యంకంబు మెట్టి తన్మృణాలభోగంబు వలఱెక్కకేలి సందునం బొందుపడ నిందీవరపలాశఫణాముఖంబుల మరందవిషపరంపరలు వెడల న్నిజకృష్ణమూర్తిభావంబు సార్థకంబై వర్తిల్ల నర్తనంబు సలుపు కలహంసకులావతంసంబులు ప్రశంసనీయంబులై చూపట్టఁ జందనాచలపవమాన కందళీసముద్గత లోహితారవిందరజోవ్రజ సమావృతగగనభాగకల్పిత సంధ్యాసమయ ముకుళితపుండరీ కాంతరసంవస దమందహిందోలఝంకారంబు లుపాంగంబులుగా నఖిలజగజ్జయసముజ్జృంభితశంబరారిబిరుదగద్యపద్యజిగాసా కలితమానస జలాధిదేవతాజనంబులు పూనిన పసిండికాయలదండియల దండిఁ దిర్యక్ప్రసారి తైకైకనాళకైకైకకోకరాజంబులు హర్షోత్కర్షంబు పచరింప మిత్రమండలసంయోజిత మహోత్సవంబు నవంబుగా నొంది యాత్మప్రియకామినీయుక్తంబై సారసచారులోచనాశుభగానంబు లనూనంబై తనరఁ గుశేశయనిజనివేశనూతనప్రవేశమంగళ మంగీకరింప నొయ్యనొయ్యన నరుదెంచు రథాంగవంశరత్నంబున కెత్త హల్లకినీపల్లవాధరామతల్లికలు పూనిన జాళువాకదలారతిపళ్లెరంబుల సొంపున హరిత్పరాగ హరిద్రాచూర్ణ సంవ్యాప్త తత్ప్రసవరసపూరాంతర దృశ్యమాన మానితకేసర భక్తాభిరామంబు లగు హల్లకస్తోమంబు లుల్లాసంబు పల్లవింపఁజేయ నిజాంత రంగఖేదకర నిరర్గళఘనా ఘనైకప్రకారం బెల్లకాలంబు నెనయకుండం గోరి కమలకాండభక్షణంబు సలుపుచుఁ గమలాసనాధీనమాన సంబునం గరంబు స్వకీయహంసత్వంబు ప్రసిద్ధిం బొందఁ దపంబుసలుపుపొలుపున నస్తోకకోకనదాశ్రమ మధ్యంబున నుదాత్తతత్పత్త్రవీతిహోత్రకీలంబులు చుట్టు వలగొన నఖండానందంబున నక్షియుగం బర మోడ్చి యచలితస్ఫురణంబు వహించి రహించు రాయంచలు హృదయాంచలంబున కంచితాద్భుతంబు మించం గావింప నిజవిలోచనసౌందర్య సమాలోకనజనితత్రపాభరంబున ముడింగియున్న కుముదంబులం గాంచి యుబ్బునఁ దద్విలాసదిదృక్షాగరిమంబు పక్షీకరించి యక్షుద్రస్యదంబున నెగసి తద్విభవంబునకు వెఱచి మరలం దాఱుతీరున నుద్వర్తనాపవర్తంబులం బరంగు బేడిసమీల మిట్టిపాటు లతికౌతుకంబు వుట్టింప నతిసమీపసంచరచ్చిత్రభానుహేతిజాలంబులఁ బరితాపంబు నొంది మందపవనసందోహాందోళిత నవీనేందీవరబృందమధుబిందు సేచనంబు గోరి వారిజాతాంతరంబున లీనంబైన యంభోధరపథంబున రోధోదేశవలయిత మనోజ్ఞ మాలతీ మాధవీ మహిలా మల్లికా ముఖ్యవల్లికాకీర్ణ నీరంధ్రపలాశ పాండిత్యం బునం బ్రద్యోతనద్యోతప్రభావంబు పాయం గనుపట్టు తారకావారంబుల మురువున నరవిందమందిరా ళిందనివాసి సానందమిళిందసుందరీ సుందరాపఘనఘనప్రభాక్రాంతజలంబులపయిం బొడకట్టు పాండుర డిండీరఖండమండలంబులు సంబరంబులు పొదలింప నమరియు నక్కొలంకు మహితాబ్జకామినీజాలపరి భ్రాజితంబు గావున నళిమిథునమీనకుళీరమకరాదిసంయుతంబై మంజులహర్యన్వితార్యమలసద్విహార భాసురంబు గావునఁ గమనీయ కాదంబసుమనోవికసనవిరాజితంబై మనోజ్ఞహంసకులాధిరాజరామాభి రామప్రస్థానవిశేషంబు గావున నకుంఠతరతరోవిజృంభమాణనానాప్లవగవీ రారాజత్కోలాహలలీలాచుళి కితదిశాంతంబై యొప్పుమీఱి చెప్పరాని మోదంబు ముప్పిరిగొనఁజేయ నప్పడంతు లప్పద్మాలయజల విహారదోహదంబునఁ జిలుఁగుపుత్తడివలువలు సడల్చి పావడలు దాల్చి శృంగంబులు గైకొని యొయ్య నొయ్యన నొయ్యారంబు మించ డిగ్గి యపుడు. 68

ఉ. తమ్ములఁ జేరి రోదరశతమ్ములఁ గైకొని తావి భృంగపో
తమ్ముల కుంచి యౌవతయుతమ్ముల మత్తమరాళరాజజా
తమ్ముల మించి చిత్రచరితమ్ముల నీఁదిరి కొమ్మ లెల్లఁ జి
త్తమ్ముల వారిదేవతలు తమ్ము లలిన్ వినుతింప నయ్యెడన్. 69

మ. తరుణాంభోరుహపీఠిఁ బొల్చి సుమనోదంతుల్ నవాంభఃపరం
పర పైపైఁ గడుఁ జల్ల సారసము ప్రేమన్ గేలునన్ బట్టి క
ర్బురసంహారిసుగాత్రికాతిసమతాస్ఫూర్తిన్ గర మ్మొక్క క
ర్బురసంహారిసుగాత్రికాతిలక మింపుల్ గూర్చెఁ ద న్గన్గొనన్. 70

చ. అలరుమృణాళవల్లరి స్వయంవరసూనసరాభ వ్రేలఁగా
నలనికటంబుఁ జేరఁగ జనన్ రతిఁ గైకొనె నొక్క పుష్పకో
మల దమయంతికావనితమాడ్కి మరాళనృపుల్ స్వచిత్తసీ
మలఁ దమయంతికావనిఁ గ్రమంబున నొందిన సంభ్రమింపఁగాన్. 71

సీ. రతిఁ బట్టుకొనఁ జేరె రాజీవరామాని
కరము సద్గుణజాలకలిత యొకతె.
రహి వ్రాల్చె నవదాతరాజీవరాజిత
రజము పావనవిహారయుత యొకతె,
యడలించె వడిఁ బుష్కరాజీవరాజహం
సముల శంపాలోకసక్త యొకతె,
ప్రౌఢి నొంచె రథాంగరాజీవరామోద
పటిమ సత్కాంతిసంభరిత యొకతె,

తే. వనజగృహవీథి నిట్టు లావర్తనాభి
కాజనంబులు సముచితగతి నెసంగె
వారిదేవత లపుడు తద్వర్తనాభి
దర్శనస్ఫూర్తి నవ్యహార్దంబుఁ గాంచ. 72

చ. స్మరమదదంతి నా నొకమసారసముల్లసితప్రవేణి త
త్సరమున నత్తఱిం బవనసారసముల్లలదూర్మిజాతముల్
సరగునఁ జొచ్చి పాదముల సారసముల్ గర మించె మెట్టుచున్
సరసకలారవాకలనసారసముల్లహరిన్ హరించుచున్. 73

చ. అనుపమరాజహంసభరణాదరణాత్మతఁ దత్సరోవరం
బున నలరాజహంససుతబోటులు మించిరి పూర్వవైరముల్
సన భృతరాజహంసత నెసంగుదివాక్షణదాధిదేవు లౌ
నని వనరాజహంసగమనాళి మనంబున సన్నుతింపఁగన్. 74

సీ. వాసంతి యనఘాళివరరసంబునఁ గప్పి
వాసంతి యన సముజ్జ్వలతఁ బొల్చె,
సారంగి యనపాయజలజాంబుతతి నాని
సారంగి యనఁ జాల సంభ్రమించె,
శశిలేఖ యనసారచక్రాళి నలయించి
శశిలేఖ యన శుభచ్ఛాయఁ దోఁచె,
చక్రాంగి యనవద్యచారూర్మికల నూఁగి
చక్రాంగి యన హృద్యచర్య మసలె,

తే. చూతకళిక యనర్ఘ్యరజోవృతిఁ గని
చూతకళిక యనం గడుఁ జూడ నొప్పె,
హరిణి యనరాళకమలైకపరిచితిఁ గని
హరిణి యన నవ్వనాస్థాని నప్పు డలరె. 75

క. నలి నాకరజితకిసలల్
నలినాకరకేళి యిటు లొనర్చి జలార్ద్రాం
గలతాళులు హిమవృతకుం
దలతాభం దోఁప నపుడు దఱిసిరి తటమున్. 76

చ. లలనలు వాఃప్లుతాంశుకములన్ సడలించి తగం భరించి మేల్
చలువల నైకజాతిసుమజాలసరంబులు వేణిఁ దాల్చి ని
చ్చలు వలనై కనంబడులసన్మణిమాలిక లూని పూసి మై
చలువల నైకమత్యగతిఁ జాలిన తావుల నొప్పు గంధముల్. 77

క. అతిపావనచాతురి నా
క్షితిపాలకపుత్త్రిక గయిసేసి యలవనిన్
రతినాయకదేవార్చన
రతి నాయక లపుడు పూని రమ్యోత్కలికన్. 78

సీ. మాకందములు మహిమాకందములు కొన్ని
యింపైన ఫలముల నిచ్చుచోట,
సురసౌఘము లుదారసురసౌఘములు కొన్ని
యురుమకరందంబు గురియుచోట,
సుమనంబు లభిరామసుమనంబు లొకకొన్ని
క్రొన్ననల్ చాలఁ జేకూర్చుచోట,
రాగంబులు గళత్పరాగంబు లొకకొన్ని
పుప్పొడిధూపముల్ పూన్చుచోట,

తే. నెట్టన యశోకకిసలము ల్మట్టుమీఱి
యుట్టివడఁ గాయు లేయెండఁ బుట్టి యెలసి
నట్టి చెలువునఁ జూపట్టు మెట్టదమ్మి
తీవెగమి తమ్మియారతుల్ దీర్చుచోట. 79

చ. అలఘుమరందవర్షమహిమాతిశయమ్మున సప్తలాద్యమం
దలతల మంచుపొన్నగమి దార్కొనుపందిరిక్రింద వేదికం
దలతల మంచు మించుసుమనవ్యరజంబులఁ దార్చి తారలం
దలతల మంచు నొప్పెడుకనత్కలికాతతి మ్రుగ్గువెట్టుచున్. 80

ఉ. జవ్వను లెల్ల సమ్మదము చాల రహింపఁగ నందు వెన్నెలం
జివ్వకుఁ బిల్చుపాండుపటిఁ జిక్కనికస్తురినీట రాణితో
నవ్వలరాజు నాశుగశరాసనయుక్తుని వ్రాసి నేర్పుతో
నవ్వల రాజు నాశుగసుమాకరముఖ్యుల నిల్పి యత్తఱిన్. 81

సీ. గందంబు వెట్టి రుత్కటనీలశరజాత
శరజాతహృతహరస్వాంతధృతికి,
విరిచాలు నించిరి పరియోజితనయాన్య
తనయాన్యమితమోహధాతృమతికి,
ధూప మర్పించి రద్భుతసంపదబలాప
దబలాపహృతవిష్ణుదర్పగతికి,
దీప మెత్తిరి నైజతేజోలహరిభావ
హరిభావయుక్తఘస్రాధిపతికి,

తే. తళియ వట్టిరి నిత్యసత్కాంతమధుప
కాంతమధుపవనాద్యాప్తకాండవృతికి,
వినతి సల్పిరి శృంగారజనికి ‘రతిప
తే నమో భవతే’యంచుఁ దెఱవ లపుడు. 82

క. కమలాప్రియసుత, కరుణా
కమలాధిప, కలితకార్ముకత్కుసుమ, కన
త్కమలాశుగ, యని భక్తిన్
గమలాక్షులు పొగడిరిట్లు కలరవఫణితిన్. 83

చ. కరము మహాబలావళులు గాఢతరోవిచరద్ధరీశ్వరో
త్కరము మహాబలావృతవిఖండహితాళులు గొల్వ మించుచున్
సిరి గలసామికిం బొడమి చెన్నగు నీకు సుమంబు లూన్చుటల్
స్థిరకృప మాధవస్య తులసీదళ మంచు వహింపు మంగజా! 84

చ. కలరవమూన్చు నల్లపజ కప్పుక రా వెనువెంట రాజమం
డలి నడతేరఁ జైత్రబలనాథునిఁ గూడి నిలింపజాలకం
బలరుచు సన్నుతింప విషమాంబకమానసశోభిరాగతా
హళహళిఁ గూర్చి తౌర విషమాంబక మానసమాజవైఖరిన్. 85

చ. దళమయి చిత్తవీథి సముదారరుషారస మెచ్చ నీ వయో
యలహరిదంబరాసహనమై తగు గేదఁగిఱేకువంకిచా
యల హరిదంబరావనుల నన్నిటిఁ గప్పుక పర్వుతేరిమా
యల హరిదంబరాత్మజ మృగాక్షుల నొంపఁదలంపు గాంతురే. 86

క. కలికాకులకరకుచ కు
త్కలికాకుల మిమ్ము రాగకలఁ గీరమణీ
కలగీరమణీయోన్నతి
కలగీరమణీలలామ కలఁగు ననంగా. 87

చ. అని వనజాతబాణుఁ గొనియాడి వధూమణు లాదరంబుతో
ననలసమానతీవ్రవిరహాఖ్యమహాజ్వరరేఖ మించ మే
న నలసమానసం బెనయునాతికిఁ గంతున కూన్చినట్టి క్రొ
న్నన లసమానహార్దకలనంబులు దార్ప గ్రహించి రందఱున్. 88

చ. చెలువ మెసంగినట్టి యలచిత్తభవార్పితసూనపాళికల్
బలుమరునారసా లనుచుఁ బాయనినివ్వెఱ యాత్మ మించఁగన్
బలుమఱు నారసాధిపకుమారిక వింతలె దాల్పకుండుటల్
నలి నవి మారయుక్తి గనినన్ సుమనస్తతి యంటఁ బాత్రమే. 89

చ. నలినకరాలలామక మనస్థభయంబు తలంగఁ జేసి వే
నలి నకరాలసత్ప్రియమునం జలజాస్త్రుప్రసాద ముంచి చా
న లినకరాలఘుక్రమమునన్ దొవతీవియ నా స్మరాశుగా
వలులఁ దలంకుకొమ్మ గొని వచ్చిరి కేళినిశాంతసీమకున్. 90

తే. వాసవోపలకచ కేళివాస మెనసి
యంత విరిశయ్య మయిఁ జేర్చి యంతరమున
నరతి రాజిల్లఁ గటువర్తన రతికామ
నుం డెడయ కుబ్బ విరహాప్తి నుండె నపుడు. 91

చ. జవగతి మిత్రుఁ డబ్ధిపతిసన్నిధిఁ జేరఁగ నేగె నత్తఱిన్
రవరవ సంతతత్వగతి రాజిల మారుఁడు మారుతాళికీ
రవరవసంతముఖ్యబలరాజియుతిన్ దగి రిత్త యాకలా
రవరవ సంతతంబుఁ బ్రదరమ్ముల నేఁచఁగ గాంచ నోపమిన్. 92

తే. అమితనిజధామగరిమ పాయ వనజాత
హితుఁడు గాలైకగతిఁ దూల నిల యనినత
నంద నభివృద్ధిచేఁ బొల్చు యవనజాత
బలములో యన నీడచాల్ ప్రబలె నపుడు. 93

చ. ఉరుతిమిరేభభేదనచణోగ్రకనత్కరజాతశాలి యౌ
హరి యనివారితాస్తకుధరాధిపశృంగముఁ జేరి యత్తఱిన్
హరి యని వారితాత్మతనుహార్యనుబింబము గాంచి రాగవై
ఖరి వడి గుప్పునం దుముకుకైవడిఁ గ్రుంకెఁ బయోనిధిస్థలిన్. 94

సీ. భాస్వద్ధరిక్రమోపరిగతాంబుధితటో
జ్జ్వలరక్తకవనీరజము లనంగ,
నభ్రబింబితచరమాగపద్మాకరా
స్థానరోహితనీరజము లనంగ,
వనజిని కర్కవర్తన దెల్ప నెగసి బ
ల్వడి వచ్చు చక్రవాలము లనంగ,
రవి నక్రపదముఁ జేరఁగ శ్యామఁ బూన్చు ను
త్తమదీపచక్రవాలము లనంగ,

తే. తమి నినుఁడు చేర వరకలాపము లనంగ
సీమ వారుణి దాల్ప రాజిలు తదీయ
విమలమణికావిభాకలాపము లనంగ
నహహ నవసాంధ్యరాగమ్ము లపుడు పొలిచె. 95

చ. ఘనకమలోదయం బెడయఁ గాలగతి న్వన మందుచు న్రథాం
గ నలగవాధినేత సనఁగాఁ గడుఁ దత్సతి యాత్మఁ జింత పొం
గ నలఁగ వారి కన్నుఁగవఁ గ్రమ్మఁ దనూస్థలి తాపభోగిచేఁ
గనలఁగ వాడుచు న్నెమకెఁ గాంతునిఁ గాననమండలంబునన్. 96

ఉ. మక్కువ సారసాకరసమాజము చేరుచుఁ బట్టఁబూనుఁ బో
జక్కవనాతి మానితనిజప్రతిబింబము గాంచి భర్తయం
చక్కట పిల్చుఁబో పతి వనావళి కుంజచయంబు దూఱుచున్
జక్కవనాతి మానితతసమ్మదసంపద లెల్ల నత్తఱిన్. 97

సీ. చక్రభయాపాదిసమయఘనాఘనా
లిసుతనూవ్యక్తమాలిన్య మనఁగ,
పరినటచ్ఛివకటీభ్రష్టఘనాఘనా
త్మకదానవాజినాంశుక మనంగ,
ద్యుమణిరథాంగహత్యుత్థఘనఘనా
శ్మమయాస్తగిరినితంబరజ మనఁగ,
నిశ్శేషబంధకీనికరఘనాఘనా
శ రతీశసృష్టశాంబరిక యనఁగఁ,

తే. బ్రకటదివసాత్యయాఖ్యనభస్యకాల
కలితసాంద్రఘనాఘనకళిక యనఁగ,
నౌర యతినీలదీప్తిజాలానుపూర్తి
నమరె నవ్వేళ నిర్వేలతిమిరరాశి. 98

చ. ఇనుఁ డతిదూరదేశమున కేగఁ దదాగమనంబుఁ గోరి పా
వనజలతాళితాంగపరివారితపంకనికాయయై తమిన్
వనజలతాళి గప్పుఁగలువన్ మధుసూదని నావహించి స
ద్వనజలతాళిగాత్రి కథ వల్కఁగ మోడ్చెఁ బయోజహస్తముల్. 99

సీ. నటదీశమౌళి దిఙ్నారులు చల్లు మం
గళసితాక్షతజాలకంబు లనఁగ,
నచలావపతనవేళాభ్రలగ్నతమఃక
దంబాపగాజాలకంబు లనఁగ,
వనరాశి రవి మాధవతఁ దోఁప నంబరా
గమునఁ బొల్చినజాలకంబు లనఁగఁ,
దఱి రా శుభము వేల్పుతెఱవచాల్ గన నాక
ఘనకుడ్యకృతజాలకంబు లనఁగ,

తే. గురుసరశ్శ్రేణిరాజీవకులము నడఁచి
యంబరస్థలి నాఱ దిష్టాఖ్య మైని
కతతి పఱచిన వరజాలకంబు లనఁగఁ
జొక్క మగు మింటఁ గనుపట్టె రిక్క లపుడు. 100

మ. శరజద్వేషి నిశావధూటివరణేచ్ఛన్ రాఁగ మున్మున్నె బల్
త్వరఁ గాలోపధికారు లూనునవచంద్రజ్యోతిరాళీలస
త్పరివర్ణ్యస్వకవర్ణనిర్ణిహతచంద్రజ్యోతిరాళీలస
ద్గరిమం బెంపయి దోఁచెఁ బ్రాచి నవదాతత్విట్కులం బయ్యెడన్. 101

సీ. గగనబాలుం డూర్ధ్వగతరశ్మి దివియఁ బైఁ
జక్కఁ జేర్చుపసిండిచక్ర మనఁగఁ,
బాంథభీకరలీలఁ బ్రబలునిశాభూత
సతి గొన్న యాలాతచక్ర మనఁగ,

చీఁకటిపొలదిండిమూఁక గూల్పఁగఁ గాల
శౌరి చే నెత్తినచక్ర మనఁగ,
నినుఁడు వోయినదారిఁ గనఁ బూర్వగిరిశిఖా
స్థల మెక్కి నిల్చినచక్ర మనఁగఁ,

తే. బ్రాచి తెలిచాయ యనుమంచు ప్రబల భాస్వ
దంశుకవిహీన గానఁ దానందు కోర్వఁ
జాల కూన్చిననవకీలిచక్ర మనఁగ
నపుడు దొలికెంపుతో సారసారి వొలిచె. 102

చ. ఒనరఁగ రాజ వయ్యు నిర నుంచితి తమ్ముల సాధుచక్రమో
దనహృదయంబు నంది తని దార్కొన దుస్తరచింతనాధునిం
దనహృదయంబు నందితనితాంతబుధాత్మకలాకుఁ డాసుధా
జని కడు వెల్లఁబాఱె ననుచాడ్పునఁ బాండిమ నొప్పె నయ్యెడన్. 103

మ. మునుమున్ చంద్రఘటిన్ భరించి యమృతమ్ముల్ నించె వేళా ప్రపా
వనశాలాక్షి తిరోహితాన్యహితభావశ్రీ మరుత్త్వద్దిశా
వనశాలాక్షి తిరోహితాంశుసురభివ్యాపారముల్ దూల నూ
తనసంధ్యాతపశక్తి డప్పిగొను జ్యోత్స్నాపాయిపాంథాళికిన్. 104

మ. తనరెన్ వెన్నెల దిష్టవిష్ణుకృప సద్బాలోదయాసక్తమై
తనయాశాబలమెల్లఁ జేకుఱ శశిస్థాలి న్మనోజ్ఞాదితీ
తనయాశాబల మెల్లమెల్లనె ముదాత్మం బొంగలి న్బెట్టఁ జా
ల నవీనోదయరాగకీలధరకీలం బొంగుదుగ్ధాళి నాన్. 105

సీ. మలినాన్యశిఖిహరిన్నలినాంచితాక్షీజ
ఘనసారసనహీరకాంతి నెగడి,
సుకరాశరాశాసితకరాననోరోజ
ఘనసారహారయోగము భజించి,

వరవాయుకకుబంబుధరవాలికావక్త్ర
ఘనసారతిలకసఖ్యము వహించి,
యతికాంతశివదిశాలతికాతనూవేణి
ఘనసారసుమపాళి గౌఁగిలించి,

తే. మేదినీదేశపాటలామోదినీభృ
తాతిఘనసారసావతంసాభఁ బెంచి
యపుడు పొడసూపెఁ బథికభయప్రదసుమ
హాదినేంద్రాతపంబు చంద్రాతపంబు. 106

వ. వెండియు నాపండువెన్నెలదండం బఖండకాండజారిమండల మాయామౌక్తికమయ భద్రాసన సమాసీననీలాంక లంకావరాహితపట్టాభిషేచనావరసమయ మహర్షిరాజాభిషిక్త గంగాదిపుణ్యతరంగిణీవిశద జలప్రవాహంబులపోలికం బ్రవహించుచు, నస్తాచలసంగతాహిమాంశుకిరణకూటతృణాంకురనికరంబుల నన్నింటి మేసి దర్పించి రథాంగజనంబులకు వైకల్యంబు చేకూర్చి సముజ్జృంభమాణ సత్ప్రభావాప్తిం జెలరేఁగు నిశానైచికిం బట్టి చకోరవత్సంబులు గుడువం జేఁపు తారాధవోధస్థల పరిదృశ్యమాన నవాంశుక స్తనంబుల ధరిత్రీపాత్రి దిష్టగోపాలకుండు పిదికిన నవీనపయఃపరంపరలదారిం జూపట్టుచు, దినాంత పర్యంతం బొక్కప్రొద్దుండి యతికాంత కాసారసోపానోపాంత శశికాంతసంతానమరీచికా వీచికావతీవీచికా జాతంబులం జొచ్చి యెడలి వికసితారుణశరజపీఠి వసించి కమలాహితధ్యానకలితాంతరంగంబున నున్న చకోరసువాసినీజనంబుల కవ్రతఘ్నంబు లగువిశదాపూపంబులు సమకూర్పఁ దత్ప్రియశ్యామా ప్రకాండంబు పూర్వదిశావదాతశోభాచ్ఛాదనంబుపైఁ జంద్రఘరట్టంబు వెట్టి యొయ్యననొయ్యనం దారాసుభద్రా పటలంబులు వైచి విసరం బ్రసరించు తదీయపిష్టధట్టంబుల చందంబునం బెంపొందుచు, నెట్టుకొని గట్టు గములతటంబులం బొడకట్టు నెలచట్టులం గరంగి మట్టుమీరం గురియు పెన్నీటి బలురొద యభంగ తరంగనినాదంబును ముందుముందుగ మందగతిం దోఁతెంచు చందనాచలపవనకందళిం దరళితంబులై నిండార విరిసిన బొండుమల్లియవిరులపిండులు పాండురడిండీరఖండమండలంబులును మదిఁ గదురు ముదమునఁ దమతమసుదతుల గవఁగూడి యెదుర్కొను రేపులుఁగుకొలము లెదురెక్కు సమానవతీక మీనవితానంబులునుం గాఁగ ననూనపథికమానినీమానసాల మూలసమున్మూలనంబు సేయం బరఁగి దినాంతవిలయకాలమ్మున వేలాతిగం బైన పాలవెల్లిపొడవునం బొడసూపుచుఁ, గోకనదపరాగమహో దయరాగవిలసనంబునం గోరకితనీరజతారకాసమున్మేషంబునం గోమలశ్యామలేతర కుముదవలయ సుధాకరధామ విశేషంబునం గొమరొంది తద్రజనీసమయ భాసమాన పయోధరపథంబున కన్న మున్ను మున్న కన్నులకు వెగ్గలంబై దొలంకుకొలంకుగమిం బాసి సన్నంపు వెన్నెలమిన్న చొరరాని లతానివాసంబుల దాఁగం బోవుచుఁ దదంతర సంఫుల్ల్యమాన మల్లికావల్లికామతల్లికా ప్రసవ ధవళద్యుతి ప్రకాండం బులు నిండి రేయెండ మెండు కొనఁజేయ దాఁగ వచ్చిన చోటన్ దలవరు లున్నతెఱం గొయ్యనఁ గని ఖేదించు రోదరతలోదరీవారమ్ముల నయనమ్ముల జాలుగా జాఱు ననావిలజలమాలికలతో మేలంబు లాడుచుఁ, దళతళమను నెలచలుపగిన్నెలయెడలం గలయ నించిన యతిబంధురసౌగంధిక సుగంధ ధురంధర గంధోత్తమారసంబు దమతమరమణుల కెమ్మోవిపండు లుపదంశమ్ములుగా నాదారం గ్రోలి తదీయమాహాత్మ్య కల్పితమానసవిభ్రమంబునఁ దత్పాత్రల సరగ నెఱమించు నిగనిగల మఱలన్ సలిలంబు లూర మదిర నించి నారని గైకొని యచటం బ్రతిఫలించు పల్దెరవాసనకు నిడిన కెందలిరుటాకని దివిచియు విలోచనమాలికలువానితావికిం జేరు తుమ్మెద లని గదిమియు ముదంబునఁ బ్రియుల కందీ యంబోవు మందగామినీబృందమ్ముల హస్తారవింద సందీపిత హీరకటక శోభాధట్టంబులం జెట్టవట్టుచు, ననూనపానశాలాచత్వరంబుల విమలాసవంబు లాలస మెచ్చం ద్రావి నిర్మితహర్మ్యరాజంబులఁ జేరం బోవు నెడఁ జంద్రికాహాలాపానలీలాగతి నంబరంబునం జరించుచుఁ దత్సమర్పిత మదఘూర్ణితంబులగు చకోరకోరకకుచా నిచయంబుల కటాక్షతారళ్యంబులు నెఱమించులై కోకనదకోటరకోటి లీన మధుకర ఝంకారంబులు గర్జనంబులై నిగుడం బొడసూపు వెన్నెల జడివానగాఁ దలంచి యౌదలలఁ బయ్యెదలు గప్పి నెచ్చెలికేలు కైలాగుఁ బూని బుడిబుడి రయం బడర నడచు పడఁతిమిన్నల యున్నతస్తనాంతర విలంబమాన ముక్తా హార గౌరరుక్తతిం బునరుక్తం బగుచు, వెగ్గలమై నెమ్మదిఁ గ్రమ్ము సిగ్గు వెనుకకుఁ దివియ నగ్గలిక మరుండు వైచు మొగ్గములికిగములు ముంగలికి నూకం గరంబు మదంబున దూఁగి యాడు వలదొరపట్టంపుటేనుంగురంగునఁ జూపట్టుచు నెచ్చెలుల కుశలత్వంబున మందమందకలనం బునఁ గేళికామందిరంబులు చేరి యధిపుఁడు కరంబు పట్టి శయ్య నుంచి ముత్తియంపుపేరు లంటుపేరఁ జన్నులు ముట్టుచు మురిపెంపు నెమ్మోమున మడుపు నందిచ్చుదారిఁ గెమ్మోవి నొక్కుచు దమి రేఁచి బంధురబంధవిశేషసంబంధంబున ననవిల్తుకయ్యంబునఁ జొక్కించి చొక్కంపుఁగళల యిక్కువ లెఱింగి మిక్కిలి గలయ గ్రక్కున వెక్కసంబై తనువునఁ జెమటలు గ్రిక్కిఱిసిన మదనమాయావిలసనంబునం బొడమిన ప్రోడతనంబున నెంతగమ్మంబు గ్రమ్మెనని పతులకుఁ దెలియకుండం బలుకుచుఁ జేలచెఱంగున విసరికొను నవోఢానికరంబుల ధవళాంబరాంచల విభాతరంగంబులం బొంగి పొరలుచుఁ, దొలుతటి కలయికల మన మలరఁ గలసిన చెలువరతనంబులఁ దలఁపునం దలఁచుచు నలమరాని విరాళిం గొని నెల వొడుపు వెనుక నలరువాల్దొరకలికిఁ జెలరేఁగన్ దమి నేతెంచినపతు లపుడు తమయెడఁ బొడముమమత నిదుర గదియమిఁ గెంజిగిం గదురుకొను కనుతుదలును దనుతలమ్మునఁ దొలఁకు గురువిరహజ్వర భరంబున విరిపాన్పునం బొరలఁ జిక్కువడు మణిసరంబులును మరుని యిరువాఁడికైదువు పేరెదం జుఱు చుఱుక్కున నాటఁ దాళక నెఱపు నిట్టూర్పులునుం బరయువతితిలకసంపర్కప్రకారంబు తోరంబుగా నెఱింగింప నలివి యవలిమొగంబై శయనించి మాటిమాటికి బోటికత్తెలపలుకుల నిజప్రేమాతిశయజనిత వియోగవేదనాకార్యంబులుగాఁ దెలిసి యినుమడికూటముల నలమి రతిబడలిక వాయఁ గరం బురం బులఁ జల్లులాడు పువ్వుబోఁడుల శయకుశేశయసమాక్షిప్తఘనసారక్షోదంబులం బక్షీకరించుచు, నలరు మల్లియవిరిసరులు దుఱిమి యమలమౌక్తికదామంబులు దాల్చి కపురంపుబొట్టులు దీర్చి కమనీయమల యజకర్దమం బలంది కలికి తెలిచలువ లూని వెన్నెలం దలవరులు గనకుండ సంకేతనికేతంబులకుఁ బోవు త్రోవం బొంచి కమలకలికాసంలగ్నమధుపనినాదవలయ ఘీంకారసంకలితమృణాళయష్టికరం బూని యడ్డమ్ము పఱతెంచువా రెవ్వ రెవ్వరనఁ దలంగు మనంబున ఘట్టకుటికం బ్రభాతంబగు దారియయ్యె నని మాఱు వలుక నేరక మూలమూలల నొదుఁగుచుఁ దలంకునెడఁ గిలకిల నవ్వుచుఁ దమ్మెఱుఁగఁ జేయ నొక్కింత చిగిరించు నలుక నభిసారికా జనంబులు ప్రియులపై రువ్వు మవ్వంపు విరిగుత్తులం జివ్వకుఁ బిలుచుచు, వన్నె గల వెన్నెలబయిట నెన్నరానివేడుక పన్నిదంబులు వన్ని సుహృన్నికరంబులతోఁ బెన్నేర్పున జూదంబు లాడుచున్నకతం బునఁ గొంతదడ వగుటఁ బటుతరమహానట మనస్తట నానటద్ధైర్య విపాటనాటోప సముత్కట శంబరప్రతిభట కృపీటజకోరక శరపటలధారా దోధూయమాన మానసంబుతో విచ్చలవిడిం బెచ్చుపెరుఁగుతాపంబున వెచ్చనూర్చుచు నెమ్మదిం గ్రచ్చుకొని హెచ్చుమోహంబున నెచ్చెలిచేతికి నచ్చంపుగుఱుతిచ్చి మచ్చికల వల్లభుం దోడ్కొని రమ్మంచు నంచి యంచిత బహిరంగణ ప్రదేశంబుల నిలిచి పతిరాక కెదురుచూచునదియును నెయ్యంపుఁబొదలతూఁగుటుయ్యెలపై నొయ్యారం బునం గూర్చుండి ప్రియుండు పసిండిదండియ బూని సుతి మీట విభునిచెంత వసియించి చిన్నికిన్నెరం బూని పంచశరదేవతా విజయప్రపంచసమంచితంబు లగు నూతనగీతంబులు పలికించి చెలులఁ జొక్కించు నదియు నడుగు లొరయం గొనసాగ నల్లిన జడకుఁ జుట్టిన మొల్లవిరితావి యెల్లెడలకుం బరవ మంజుల చరణకంజ సంజిత కంజరాగ మంజీర శింజా రవంబులు కర్ణగ్లాని మాన్ప నొఱ దొఱపిన వలదొరపరు వంపుఁగైదువుతెఱఁగున నిండార దువ్వలువ గప్పి కాంతునిశాంతంబునకుఁ బోటులవెంటం జనునదియును దనమనం బలరఁ గలసి కళలఁ దేలించి మేలుంచి యేలిననాయకునియెడ నెడయని ప్రియమ్మునఁ దఱిసి విరిసరులు దుఱిమి చలువ వెదచల్లుకలపం బలఁది యంతంతం బొడము మోహమ్ముల నలమి కెమ్మోవి నొక్కి పునారతులకు వేడుక రేఁచి పైకొనునదియును నై వెలయు వెలయువిదల గలితచందనచర్చాపాలి కలం గనత్తరదరహాసవిభారింఛోళికలం గర్ణావతంసిత కైరవపత్త్రమంజరికావిభాళికలం గబరికాభివేష్టిత లతాంతమాలికలం గలసి మెలఁగుచు, మహోత్పలమండల త్రాణైకవిహారవిలాసితం బయ్యును మహో త్పలమండలహరణైకవిలాసాంచితంబై యసమకాండ చండప్రతాపనాశకనిజోదయంబయ్యును నసమ కాండచండ ప్రతాపసంవృద్ధికరనిజోదయంబై, దివ్యచక్ర చిత్తానందసంధాయకం బయ్యును దివ్యచక్రచిత్తా నందభేదకం బై రాజిల్లుచు ద్రుహిణాండకరండంబునకు వెండి జలపోసనంబుదారిం బ్రకాశించె నయ్యవస రంబున. 107

మ. అలపాంచాలకుమారి యేపఱి సువర్ణాంచత్పరాగాళికిన్
నెలవై రా నలకాండధామగతి కెంతేఁ దోఁచి పెల్లేఁచ వె
న్నెల వై రానలకాండధామనయనోన్మేషస్ఫురత్కోకిలా
బల మ్రోయన్ వెఱ నూని మున్ సితరుచిన్ బల్కున్ విరోధోక్తులన్. 108

చ. కమలక యౌర్వహేతితతి గాఢనవోదయరాగకీలిచేఁ
దెమలక రాహువక్త్రసముదీర్ణవిషాగ్ని నడంగ కున్నమ
త్కమలకరాళికాధికశిఖాహతిఁ దూలక పొల్చి తక్కటా
కమలకరాళికాధిగతకాలుషి నేమన వచ్చుజాబిలీ. 109

శా. స్వచ్ఛాయన్ వనితాళిఁ దూల్చుటలు, దీవ్యచ్చక్రమోదచ్ఛిదా
స్వచ్ఛందోహ! యనూనధామహృతచంచత్తావకోజోఖిల
స్వచ్ఛందోహయమాన మేఁచుటలొ యుష్మద్భేదనాఢ్యాంఘ్రిభా
స్వచ్ఛందోహయమాన మేఁచుటలొ నిచ్చల్ దల్పుమా హృత్స్థలిన్. 110

సీ. అనురక్తి పొదల దివ్యాచార్యునవలా ల
లితకంతుకేళికాగతిఁ దెమల్చి,
మాతంగసఖ్య మేమఱక గన్నవలాల
నేలు మారునిచెల్మి నెడయ మాని,

చక్రవిప్రవరతేజం బెల్ల నవలాల
సారూఢిఁ గరశక్తి నపహరించి,
పరమలింగాప్తిఁ జూపట్టు తా నవలాల
సద్దీప్తిఁ బాషండసరణిఁ దాల్చి,

తే. మలినతరకీర్తిజాతంబులిల నలర్చి
ప్రోది గను నిన్నుఁ దిలకింప రోహితాంక
పతి కడుపు మండకుండునే బాడబాగ్ని
రూఢ కీలాపరంపర రోహితాంక! 111

మ. అలరం గామవిమోహనైకవిహృతుల్ ప్రాంచన్నలశ్రీగతుల్
దలఁగన్ రాజిలునీమహాభ్యుదయ మాత్మం జూడఁగా విస్ఫుర
త్కలికాలాభ మనంగఁ జెందునె సుదృగ్వ్రాతంబు చాల న్నవో
త్కలికాలాభ మనంగశత్రునిటలోగ్రజ్వాలితుల్యద్యుతీ! 112

సీ. కల సూపి తొలుదొల్త గాంచితో మేషవా
హలసమానార్చిశ్చయస్ఫురణము,
వెనువెంటఁ జనుచుఁ జయ్యన లాగితో సదో
హలసమాన్యహయోత్కటాంశుమహిమ,
జడల నడుమనుండి పడసితో కందర్ప
హలసమాతతనిటలాగ్నిశక్తి,
ననుజుండ ననుచుఁ బాలందితో ఘనహలా
హలసమాభీలకీలాలిరూఢి,

తే. నకట చల్లనిరాజ వీవట్టినీకుఁ
బొసఁగె నేదారి నీసర్వభువనజాత
సుఖదతేజంబు సన నిట్లు శుంభదౌర్వ
పుంజనిభధామ మవధూతభువనజాత! 113

క. ఈలీలఁ జంద్రు నని, ల
క్ష్మీలలనాతనయుఁ బలికెఁ గినుక మధుపరా
జాలక శరభవజాలక
జాలకశరభవదురంతసంతాపికయై. 114

చ. కలుగునె నీకు సద్యశ మఖండరుషాగతి నిస్వనద్గుణో
జ్జ్వలవిశిఖాసముక్తశితసాయకధారఁ గృపీటజాంబకా
వలిఁ గర మేఁచఁ ద్వద్బలనివారకసారకృపీటజాంబకా
తులితభుజాసహోమహిమఁ దూల్చినఁ గాక కృపీటజాంబకా! 115

సీ. తరుణతురంగాయితశుకాండజాతము
ల్పంజరకారలోఁ బడక యున్న,
సతతనారాచితసితకాండజాతముల్
కడు నిశాతత్వంబుఁ గాంచి యున్న,
మది ఘనభయరేఖ మధుకాండజాత ము
ల్లలితపత్రిబలంబు గలఁగ కున్నఁ,
జక్కఁ దే రైనపృషత్కాండజాతముల్
పొదలుచాంచలి మూల నొదుఁగ కున్న,

తే. సారకాంతాలసాయకాసన మఖండ
తాగతి భజించి యున్న నీధాత్రి నవమ
సారకాంతాలకాపాళి ఘోరతావ
కీనధాటికి బ్రతుకునే సూనబాణ! 116

క. మదనానాపికకలగతి
మదనాహతనాదరేఖ మసల నిటులు మ
మ్మదనా యేఁచఁగ నీయెడ
మదనావిలవినుతి నలరి మన్పవె మదనా! 117

సీ. పరమరుత్పరమారిపరమారిధర్తయై
కర్తయై వెలయు శ్రీభర్తయుండఁ,
బరిణతాసురరాజసురరాజపాళియై
శీలియై తగు తమ్మిచూలి యుండ,
సముదారశమనాత్మశమనాత్మభారియై
హారియై మించు దక్షారి యుండ,
దళితోగ్రబలమానబలమానవాదియై
మోదియై మనుశైలభేది యుండ,

తే. నకటకట సత్కదంబవైరాప్తిఁ బొల్చి
చెలఁగుచైత్రికుతోఁ జెల్మి నలరు టెల్ల
ధరణి నార్యాళిమథనవర్తనకుఁ గాదె
వారి నెవ్వారిఁ గానవే వారిజాస్త్ర! 118

వ. అని యానారి శంబరారిం దూఱి యమ్మారున కెక్కుడై పైఁ జేరు సమీరు నిట్లనియె. 119

ఆ. మలయఁ జెంత నీవు మహి నొప్పుపటుతరుల్
సారె వడఁక నెంత భీరు లనఁగ
నలఁప రాఁగ వల దనిల విజృంభితశోణ
నలపరాగవలదనలకణాళి. 120

సీ. గురుకలకంఠికాపరిరక్తి మాధవా
శయము రాజిలుట గాంచంగ లేదొ,
విప్రయోగుల నొంచువిధ మూను మాధవా
పత్యహృద్రీతి చూపట్ట లేదొ,
యనవద్యవసుహారి యగుచు శ్యామాధవా
త్మ రహించుటల్ చాలఁదలఁప లేదొ,
యఖిలభృంగాంతరవ్యాపృతి మాధవా
దృతి నిచ్చ చెలరేఁగుటెఱుఁగ లేదొ,

తే. కటకటా యట్టివారితోఁ గరము నంటు
గని మలినపంకజాతవాసన చిగుర్ప
ధర సుదృక్పాళి దూలింపఁ దగవె పవన
కడు ననఘవృత్తిఁ దగుసదాగతికి నీకు. 121

తే. అంతరమున నటించు పేరాస మీఱఁ
దోడ్త భజియింతు మాకు సంతోస మీర
సారెఁ బయిఁ గ్రమ్మి యిప్పు డేఁచకు సమీర
ణాంకురాభాంగ మింపుఁ బాయఁగ సమీర! 122

క. అని యాజలజేక్షణ యి
ట్లనిలాదులఁ జాల దూఱి యపుడు కిసలజీ
వనగోవిభుసూను మధుప
వనగోవిభుసూను మధుపవారము లేఁచన్. 123

సీ. వకులాగనవపల్లవకులాలిఁ జొరఁబాఱు
గఱకుకైదువులపై నుఱుకుపగిది,
సుమనోజ్ఞచాంపేయసుమనోరజముఁ దూఱు
ఘోరాగ్నిమండలిఁ జేరుపగిది,
మధుపాదపానూనమధుపాళిఁ దిలకించు
ఘనవిషోదక మానఁ గాంచుపగిది,
లతికానికరగౌరలతికాంతతతి మున్గు
మించుపెన్నదిఁ బ్రవేశించుపగిది,

తే. దోడ్తఁ బలుమాఱు బలుమారుదోర్బలమున
నాత్మ వలవంత వలవంతమగుచు నిగుడఁ
జటులకలనాదకలనాదపటలి కలికి
బడలి యారామ యారామపదవి నెనసి. 124

చ. లలన సమీరధార పొదలన్ బొదలన్ వడిఁ దూఱు శారికా
కులములు మ్రోయఁ జాలఁ గలఁగుం గలఁగుండువడన్ మనంబు గో
ర్కు లెడయ హా యటంచుఁ బలుకుం బలుకుందపుమొగ్గచిల్కుట
మ్ములు మరుఁ డేయఁ బూనుఁ దరముం దరముం జెలి చెంతఁ జేరినన్. 125

వ. ఇట్లు పంచబాణపంచకప్రపంచితవిరహసంతాపంబునం భ్రమించు నమ్మించుఁ బోఁడిం దోడ్తెచ్చి మచ్చిక గ్రచ్చుకొన నెచ్చెలిచెలువపిండు లచ్చంపుఁజలువ వెదచల్లు మొల్లవిరిసజ్జ నుంచి ప్రియకథానులాపంబులం బ్రొద్దు గడుపు నవసరంబున. 126

చ. కనికర మింతలే కసమకాండుఁడు శ్యామ నలంప వేడ్కఁ జ
క్కని కరహేతిధారఁ గలఁగన్ ఘటియింపఁగఁ బాడి గాదు మా
కని కర మాత్మఁ దత్పరత నందుచుఁ జయ్యన నేగె నప్డు లో
కనికరతాపహారి యుడుకాంతుఁడు వారిధినేతఁ జేరఁగన్. 127

క. ఆరామ కపుడు శుభవా
గ్ధారాగతిఁ దెలిపె నొక్కతరుణి వరకళా
వారనిశాంత మితవు నలు
వార నిశాంతమితిరహితహారివిభవమున్. 128

చ. వెలసెఁ బదాయుధార్భటులు వింటివె యోయధరానులిప్తనా
విలసిత పుష్కరారి పృథివీపతి పాంథపరాళి గెల్చి తా
విలసితపుష్కరాధిపనవీనపురేశముఁ జేరఁగాఁ జనన్
దొలుత నుషోభటధ్వనితదుస్తరకాహళికాధ్వనుల్ బలెన్. 129

మ. స్ఫురదాజాండఘటి న్నిశాతపపయస్సుల్ పేరఁ బూర్వావనీ
ధరగోపాలతనూజమౌళి గని దోడ్తం జంద్రమండంబు వా
పి రహిం దద్దధిఖండ మూనె నన నొప్పెం గంటివే ప్రాగ్దిశా
ధర గోపాలతనూజ వాసవహరిత్పద్మావిలాసాబ్జమై. 130

మ. ఘనమిత్త్రైకవసుప్రతానముల రాగశ్రీ గొనం గజ్జలా
భ నఘవ్రాతము చేర గేహకుముదాప్తగ్రావధామద్యుధా
మనదీపాళికఁ దాన మంద శుచితం బాటిల్లె నాఁ బాండిమల్
మన దీపాళిక దా నమందగుణసీమా మించె నీక్షింపవే. 131

మ. తనుమధ్యా గను రోదసిం గముచుజ్యోత్స్నావల్లికల్ కల్యవా
తనికాయాహతిఁ దూలఁ ద్రెళ్లెఁ దొలుతం దారప్రసూనవ్రజం
బనవద్యామృతపూరపూరితనవోదారప్రసూనవ్రజం
బున డిందెన్ శశి పత్త్రిమండలరవంబుల్ గ్రమ్మె నల్దిక్కులన్. 132

మ. అల పెన్వేగురుఁజుక్కపేరియతి దీవ్యత్పాండుభాభూతి మైఁ
జెలువారంగఁ దరోర్జితస్థితి వియత్సీమం జనం గంటివే
చెలువా రంగదరోర్జితస్థితిదినాస్యీయైకసంధ్యాంశుకూ
టలసచ్ఛాటిక తన్మనుస్ఫురణ వెంటన్ బర్వెఁ జిత్రంబుగన్. 133

మ. ననుచున్ మోదము కోకవిప్రతతి చంద్రద్యోతరాజీవలో
కన మెల్లన్ జన జోడు గూడి నిలువం గంగొమ్ము రాజీవలో
కనికారేక్షణ నాళభూమివరసంఘాతంబు రాజీవలో
కనమౌకుళ్యము జాఱ మేలుకనియెన్ గాసారశయ్యాస్థలిన్. 134

మ. అమలాంగీమణి కాంచు వేళ యనునైజాప్తాళి మేల్ నేర్పునం
గమలాగారముఁ దా రయాత్మ నలరంగావింపఁ గా నచ్చటం
గమలాగార ముదారసంబు మదిఁ బొంగం గొల్వు గూర్చుండె ను
త్తమభృంగీమిషగాయికావితతి గీతవ్రాతముల్ వాడఁగన్. 135

చ. హరినిలయంబు తూర్పుదెసయై మనుటన్ సమయాఢ్యమౌళి వి
స్ఫురితతదంతికోచ్చతరపూర్వబలాహకకూట భూరిగో
పురమునఁ గైశ్యగుప్తసమపూర్వబలాహకకూటభూరిగో
వరమిషరీతి నిల్పె ననివార్యమణీకలశంబుఁ గాంచితే? 136

తే. అనుచుఁ జెలి విన్నవింప నయ్యంబుజాక్షి
చారుసుమశయ్య డిగ్గి తత్సమయకృత్య
మెల్లఁ గావించి, గురు భజియించి రవికు
లోత్తము వరించుతఱిఁ గోరుచుండె నంత. 137

ఆశ్వాసాంతపద్యములు


మ. సతతానందితనంద! నందనవనీసంచారజాగ్రత్ప్రియో
ద్ధతకౌతూహలకంద! కందసుషమోదారాంగసాక్షాత్క్రియా
రతినందన్ముచికుంద! కుందరదనారత్నాంఘ్రిలాక్షాంకగుం
భితవక్షస్త్విడమంద! మందరధరాభృద్భూరిభారాంచితా! 138

క. చక్రప్రహరణ! రక్ష,శ్చక్రప్రహరణవిహార! సారంగద్వి
ణ్ణక్రప్రమథన! జ్ఞానా,వక్రప్రమథనతశంభువర్ణితవిభవా! 139

ఉత్సాహ. వారణప్రభూతదంతవైరిదోర్విసారణా!
సారణాంకమౌనిరాజచక్రతోషకారణా!
కారణప్రభాతిఘోరకంసమల్లమారణా!
మారణద్దనుప్రభూతమండలీనివారణా! 140

గద్యము
ఇది శ్రీమదనగోపాలప్రసాదసమాసాదితోభయభాషాకవిత్వకలాకళత్ర
రేచర్లగోత్రపవిత్ర సురభిమల్లక్షమాపాలసత్పుత్ర కవిజనవిధేయ
మాధవరాయప్రణీతం బైన చంద్రికాపరిణయం
బను మహాప్రబంధంబునందుఁ
జతుర్థాశ్వాసము

  1. ఇచ్చట ‘రాంకవవస్త్ర’కు బదులు ‘రాంకవవర్ణ’ అను పాఠ ముండినట్లు తోచును.