చంద్రికా పరిణయము/పంచమాశ్వాసము

శ్రీలక్ష్మీనరసింహాయనమః

చంద్రికాపరిణయము

పంచమాశ్వాసము

క. సుభగంభావుకఘనకౌ
స్తుభ! సాధ్వవనసహకృత్వదుర్దమచక్రా!
ప్రభవాసురసర్వంకష
విభవమ్మన్యప్రతాపవృత! గోపాలా! 1

తే. చిత్తగింపుము శౌనకా ద్యుత్తమర్షి
సమితి కిట్లను రోమహర్షణతనూజుఁ
డువిద తద్రాజచంద్రైకవివరిషావి
ధానపాణింధమాత్మచేఁ దనరునపుడు. 2

మ. సుతతారుణ్యశుభోదయస్థితి తదస్తోకాశయాలంబితే
హితము న్బోటులచే నెఱింగి, తదమూల్యేష్టార్థసంసిద్ధికై
చతురత్వంబునఁ దత్స్వయంవరవిధిన్ జాటింపఁ బంచెన్ భట
ప్రతతి న్వే క్షణదోదయేశ్వరుఁ డతిప్రహ్లత్తిలిప్తాత్ముఁడై. 3

చ. ధరణీనాథభటచ్ఛటాముఖరితోద్యచ్చంద్రికైకస్వయం
వరకర్ణేజపడిండిమాదికమహావాదిత్రనాదంబు దు
స్తరమై యత్తఱిఁ బొల్చె నద్భుతగతి న్సప్తార్ణవీమధ్యభూ
వరకోటీపుటభేదనౌఘవిశిఖావల్గుప్రఘాణంబులన్. 4

మ. శ్రవణాభ్యుత్సవపోషయిత్నుసముదంచద్భూరిభేరీసము
ద్భవభాంకారము లప్డు మేల్కన నదభ్రప్రావృషేణ్యాంబుదా
రవభంగి న్సుమకాండకోదయసమగ్రత్వంబు చాలం దలం
ప విచిత్రం బొకొ? చిత్తవీథి నవనీపశ్రేణికిం జేరుటల్. 5

చ. కమలశరుండు ప్రాప్తకటకాముఖవైఖరి నిక్షుచాపవ
ర్యము గొని కూర్చు భంభరగుణారవ మెంతయు నాత్మనా ద్వితీ
య మయి యెసంగ దేశవసుధాధిపముఖ్యపురీలలామబృం
దములఁ జెలంగెఁ దత్పటహనవ్యగభీరనినాద మత్తఱిన్. 6

మ. మును తాతస్తతలోకవాగమృతసంభూతిం గడుం జంద్రికా
వనితామోహముఁ గాంచి మన్మథశరజ్వాలావళిం గుందు వి
శ్వనరాధీశ్వరకోటికిం ద్వర యిడె న్స్వాంతప్రియంభావుకా
తనుతద్ఘోషము తత్స్వయంవరముఁ జెందం బోవ నప్పట్టునన్. 7

మ. వరభంభాకులనిస్వనప్రతతి నవ్వామావతంసస్వయం
వరభద్రోన్నతి యెయ్యెడ న్దెలిసెనో వైళంబె యవ్వేళ న
వ్యరతిశ్రీగతి నేగఁగాఁ దొడఁగె విశ్వారాట్కులం బౌర యు
ర్వర నేమంచు నుతింపవచ్చు జలజాస్త్రస్ఫీతమాయావిధిన్. 8

చ. నెలఁత వరించుఁ దమ్మిదియె నిక్కమటంచుఁ దలంచి వేడుక
న్గలసి పయోజబాణజయకారణరూపసహాయత న్విరా
జిలు సకలాంతరీపనృపశేఖరు లెల్లఁ బ్రయాతుకాములై
వెలలిరి దంతిచక్రపదవీతిపదాతిసమూహసంవృతిన్. 9

మ. సకి యెవ్వాని వరించిన న్నిజశితాస్త్రవ్యాజవాతంధయా
ళికిఁ దజ్జీవసమీరపానమును హాళి న్జేర్చి యాతామ్రకం
జకర న్గైకొని వత్తు మంచుఁ దలఁ పెచ్చన్ గొంద ఱుర్వీశపు
త్త్రకు లేతెంచిరి లేఖవర్ణ్యపృతనావ్రాతంబు సేవింపఁగన్. 10

చ. సొగసు చెలంగ నప్డు శతశోమణిభూషణభూషితాంగులై
యగణితహస్తిరాజవృతి నంచితభద్రగజాధిరూఢులై
ద్విగుణితహర్షయుక్తి నరుదెంచిరి కొందఱు దేశవల్లభుల్
నగకుచ నన్యదీయఁగఁ దనర్పదు మద్రమ యంచు నెంచుచున్. 11

మ. మఱియున్ వచ్చిరి దేశనాయకులు భామామంగళస్ఫూర్తి న
త్తఱి వీక్షింప సురేంద్రనీలరథసంతానంబుపై నెక్కి శ్రీ
మెఱయ న్వారిధరాళిపైఁ దగుధరామిత్రుల్ బలె న్వేడుకల్
దొఱయ న్సంగరపారదృశ్వబలసందోహంబుతోఁ జయ్యనన్. 12

చ. మొనసినయెక్కు చక్కఁదనమున్ నెఱనీటును మించ మోదపూ
ర్తి నపుడు వచ్చురాజసుతబృందము గన్గొన నయ్యె మారు నొ
క్కనిఁ గని యుబ్బు లచ్చిపయి గాటపుటీసు భజించి ధాత్రి నూ
తనవనజాస్త్రకోటుల నుదారమహాత్మతచే సృజించె నాన్. 13

మ. జగతీమార్గము లెల్ల నిండి యిసుము ల్చల్లన్ ధరం జేర న
ట్టుగ నేతెంచిరి రాజపుత్త్రకులు నీటు ల్మీర నప్పట్టునన్
జగదంధంకరణాఢ్యసైన్యవిధుతక్ష్మాధూళిమేఘాళికిన్
మిగులన్ గర్జలఁ గూర్ప మర్దళజధింధిమ్యార్భటీపేటికల్. 14

చ. వనితస్వయంవరోత్సవము వాసిగఁ గన్గొన వచ్చు భూమికాం
తనికర మప్డు దోఁచెఁ గరినాయకపాళులపై నిజైకతై
క్ష్ణ్యనియతి మాని చల్లఁదనమంది మహోదయశైలకోటులన్
దినముఖవేళఁ జూడఁ బడుదీధితిరాజసమూహవైఖరిన్. 15

మ. నెఱి నంకాంచితమూర్తు లందఱు కలానీకైకరోచిష్ణు లం
దఱు సత్పాలనదక్షు లందఱు దగన్ శ్యామాభిరామాత్ము లం
దఱు గానం బఱతెంచురాసుతులు నేత్రప్రీతి చేకూర్చి ర
త్తఱి నౌనా నన విశ్వరూపగతిచేతం దోఁచుచంద్రస్థితిన్. 16

చ. వనజశరు న్హసించుపరువంపువిలాసములేనివాఁడు నూ
తనవరరత్నభూషణవితానము దాల్పనివాఁ డుదారపా
వనబలయుక్తి రాజిలనివాఁ డొకఁడైన నయారె దోఁపఁ డ
య్యె నపుడు పన్నిదంబున కిలేశసుతావళిలోనఁ గన్గొనన్. 17

చ. శరజహితాన్వయేంద్రుఁడు సు చంద్రధరాధిపచంద్రుఁ డప్డు త
త్తరుణిస్వయంవరోత్సవవిధానము దా విని త న్వరించుఁ బో
హరిమణివేణి యంచు ముదమాంతరవీథికఁ గందళింపఁ గి
న్నరవిభుఁ డాత్మసఖ్యకలన న్వెను పాయక కొల్వ వే తగన్. 18

మ. ద్విరదాధీశ్వరు నెక్కి పౌరవసుగాత్రీరత్నవారంబు క్రొ
వ్విరిసేసన్ బయి నింప విప్రతతి దీవింప న్నవానేకపాం
డురపట్టాతపవారణావృతముఖుండున్ జారుభూషావిభా
స్వరగాత్రుండును నై పురి న్వెడలి ఠేవ న్వచ్చె నప్పట్టునన్. 19

చ. అసురవిదారి కాంచనశతాంగరథాంగపరిభ్రమిప్రకా
రసముదితారవంబు లిభరాట్పటలీఘనబృంహితంబు లు
ల్లసితమహాచమూకలకలంబు జగత్త్రితయంబు గప్ప సం
తసమున సర్వదేశజననాథులు గన్గొన వచ్చె నత్తఱిన్. 20

చ. ఘనకమలేశ్వరాత్మజవికస్వరదీప్తివిలాసహారిపా
వనరుచిజాలలబ్ధి దయివాఱుచుఁ దోఁచినయట్టిలోకబం
ధు నతని విస్మయంబునఁ గనుంగొని రయ్యెడ నప్డు చక్కఁ బ
ద్మిని తదధీనగాఁ దమమతిం దలఁ పుంచిరి రాజు లందఱున్. 21

మ. అతులంబై యనవద్యమై కువలయోదారప్రమోదప్రదా
త్మత సంధించి కరంబు రాజిలు సుచంద్రప్రాజ్యతేజోవ్రజం
బతివేలం బగుచున్ వెలుంగఁగ ననంతాస్థాని నాక్షత్రసం
తతి చూపట్టె సముజ్ఝితస్వకమహాధామాళిచే నయ్యెడన్. 22

తే. ఇట్టు లపు డేగుదెంచినయట్టి సకల
మనుజకాంతులఁ బాంచాలజనవిభుండు
రహి నెదుర్కొని యభినవ్యరత్నమయమ
హోన్నతనివేశపాళులనునిచె నంత. 23

చ. అవనితలేంద్రు లెల్లఁ బ్రమదాతిశయంబునఁ దత్స్వయంవరో
త్సవదినవేళ దివ్యమణిజాతవినిర్మితమంచమండలిన్
బ్రవిమలచిత్తపద్ము లయిబాగుగఁ జేరి వసించి రంగనా
నివహము చామరల్ వలయనిక్వణనంబులు మించ వీవఁగన్. 24

మ. అలవేళన్ హరిపుత్త్రహారకమహుండై నిస్తులాహీనహా
రలతాశోభితమూర్తియై తగుసుచంద్రక్ష్మాతలేంద్రుండు ని
ర్మలపాండుద్యుతిమన్మణీమయమహామంచాగ్రభద్రాసన
స్థలిఁ దాఁ జేరి వసించె రూప్యగిరిఁ గాత్యాయన్యధీశుం డనన్. 25

మ. ఘనముక్తామణికాసనంబున సిరిం గన్పట్టు నాదైత్యభే
దనుఁ డౌరౌర నుతింప నయ్యె ఖరరు క్తైక్ష్ణ్యంబుచేత న్విక
ర్తనబింబమ్మున నుండుట న్సడలి శీతచ్ఛాయబింబంబు చే
రిన వారాశిసుతామనోహరునిదారిం బూని యప్పట్టునన్. 26

సీ. సురగణ్యలావణ్యగరిమ రాజులకుఁ బాం
చాలినిరాశ హెచ్చంగఁ జేయ,
మణిమంచబింబితాత్మచ్ఛాయ తనుఁ గొల్వఁ
దఱియుమన్మథుబుద్ధిదనరఁ జేయ,
హీరభూషణవిభావారంబు వెన్నెల
వలగొన్న రేఱేనిఁ దలఁపఁ జేయ,
వందికంఠధ్వనుల్వైభవశ్రీ నభ్ర
మెనసి చూచుసురాళి కెఱుక చేయ,

తే. కంకణక్రేంకృతు ల్పర్వఁ బంకజాస్య
లలరువింజామరలు వీవ యక్షనేత
పార్శ్వమునఁ గొల్వ బుధపాళిప్రస్తుతింప
మంచతటి నాసుచంద్రుండు మించె నపుడు. 27

క. నరనాయకకులమంచాం
తరముల వలిగాడ్పు మసలెఁ దపనతనయమం
దిరకేళీవనపాళీ
సురసాళీవాసనాభిశోభితగతియై. 28

వ. అంత ననంత కాంచన మంచాగ్ర సమంచిత సింహాసన సమాసీన మానవనాయక సేవా సమాగమి తత్త త్సేనాధిప సంఘ పరస్పర సంఘర్షణ సముత్తిష్ఠ చ్చిరత్న రత్నాంగద పరాగపూగ తామ్రపట్ట పటాస్తరణ విభ్రాజితంబును, నంతరీపకాంత శిరోవిభాసి తానంతచరనాథమణిమయ మకుటతట నరీనృత్యమాన వినీలకాంతి ప్రరోహ కుహనా ధూపధూమ పూరితంబును, శంబరాక్షీ కదంబక కరాంబుజ సముద్గచ్ఛదరు ణాంశుక శుభాడంబర కంకేళి కుసుమగుళుచ్ఛ రింఛోళికా వితాన విభూషితంబును నై యొప్పుమీఱు గగనా స్థానంబునఁ బాకారి పావక పద్మాప్తసుత పలాశ పయోధీశ పవమాన పౌలస్త్య పార్వతీపతి పరివృ తుండై తదుత్సవంబు వీక్షింప నిండుపేరోలగం బుండె. గాలవ శాండిల్య కౌశిక వసిష్ఠ ప్రముఖ మహర్షులు హర్షో త్కర్షంబునఁ జూడం దొడంగిరి. గరుడ కిన్నర గంధర్వ సిద్ధ సాధ్యముఖ్యు లంతంతం గాంచి సంతసిల్లిరి. అపుడు రాజసభాస్థలం బపరిమిత వేత్రధర సాహోనినాదవాచాలంబై, అభినవభూషణమరీచికావిహార వాటంబై, యతులితంబై యతిశయిల్లం గనుంగొని యాక్షణదోదయ క్షమాధ్యక్షుండు నెమ్మనంబున నీ స్వయంవరంబునకు వచ్చిన ధరాధిపతుల యన్వయగుణాదికంబులు పేర్కొని కుమారి కెఱింగింప నెవ్వరు చాలుదు రఖిలజగజ్జనని గిరిరాజతనుజ గాక యని తలంచి యప్పుడు. 29

మ. పరిపూతాత్మసమన్వితుం డగుచుఁ దత్పాంచాలధాత్రీతలే
శ్వరచంద్రుండు కరాబ్జము ల్మొగిచి శశ్వద్భక్తివైపుల్య మాం
తరవీథిం దళుకొత్త నిల్చి వినయాత్మ న్సన్నుతించె న్మహీ
ధరసమ్రాట్సుత నిర్మలామృతధునీధారాళధారోక్తులన్. 30

దండకము

జయ జయ జగతీనాయికే! భక్తలోకేష్టసంధాయికే! నిత్యబిన్దుత్రికోణాష్టకోణాదికోణావళీవిస్ఫురచ్చక్ర సింహాసనోద్ద్యోతమానాత్మికే! సర్వమన్త్రాత్మికే! సద్వటానోకహోపాన్తసీమావసద్బోధముద్రాన్వితాశామ్బరస్వాన్తనిద్రాళుపఞ్చాశుగోన్మీలనాకారకాపాఙ్గసంచారభఙ్గీసముద్భూతసర్గాదికార్యత్రయీసక్తవైధాణ్డభాణ్డప్రకాణ్డే! దయాత్రాతయోగిప్రకాణ్డే! వినీలాఙ్కరేఖావృతాబ్జారిబిమ్బోపమాసమ్మిళత్కుణ్డలీ భూత హీరోపలప్రోత కోదణ్డదణ్డోత్తమోద్వాన్త శైత్యప్రకారోజ్జ్వల ద్గోనికాయోపభుక్తోగ్రధూమ్రాక్ష దర్పచ్ఛలధ్వాన్తికే! వార్షుకామ్భోదజిత్కాన్తికే! రోచమానాత్మభూమిత్రతారాహితీయుక్త చిత్రక్రియా సంచరన్మధ్వవష్టమ్భ విధ్వంసనోదార లక్ష్మీశనిద్రాపహార్యద్భుతక్రీడనాశాలి మాయాఘనప్రక్రమాభ్యఞ్చితే! సత్కు లాళీనిరాకుఞ్చితే! మత్త దన్తీన్ద్రగర్జామృదఙ్గవ్రజధ్వాన దైత్యేన్ద్రసేనావళీ సింహనాదాఖ్య గానాభిరఙ్గన్మహా జన్యరఙ్గస్థలీ నృత్య దుగ్రాసివల్లీ నటీప్రాపితా ప్రత్నపుష్పాఞ్జలీభూతశుమ్భాదిక క్రవ్యభుఙ్మాలికా నిర్గళ న్మౌక్తికశ్రేణికే! పుణ్య మర్త్యోత్కరారోహ్య సౌభాగ్య సౌధార్పితోదార కారుణ్యనిశ్రేణికే! శివగృహిణి నిజౌ పమ్యలీలా నిశోజ్జృమ్భమాణేన్దుజాయా పరివ్యక్తజాగ్రత్క్రుధాఙ్కూర శఙ్కాసమాపాది లాక్షారసోల్లిఙ్గి తాంఘ్ర్యబ్జ దీవ్యన్నఖవ్రాత విభ్రాజితే! దేవతాపూజితే! నిత్యసత్కాన్త సంసేవ్యపాదామ్బుజాతాధరీభూత పద్మాకరోదయాఞ్చితామ్భోజ హైన్యక్రియావాచి శిఞ్జారవోద్భాసిమఞ్జీరభూషానుషఙ్గే! కనజ్జాఙ్ఘికశ్రీజి తోద్యన్మనోభూ నిషఙ్గే! మహాయౌవనాళీకమల్లాదిభూకేళికాస్తమ్భ సంవిత్ప్రదాత్రూరుకాణ్డే! సరోరాజ సౌభాగ్యజిన్నాభికుణ్డే! వలగ్నస్థలీకార్శ్యజిజ్ఞాసుపుష్పేషుబద్ధస్ఫురన్ముష్టికాబన్ధన ప్రోత్థగమ్భీరనాభీ గుహాన్తస్తటధ్వాన్త రేఖామనీషాప్రదశ్యామరోమాళికే! సారశృఙ్గారవారాశిభఙ్గప్రమాకృద్వళీపాళికే! చారు తారుణ్యమాయా మహాకుమ్భికుమ్భద్వయీద్వాపరద్వారవక్షోభవే! పాణిభాత్రాతపాథోభవే! సంతతా సక్తసర్వజ్ఞదృగ్జాత పాతక్రియాజాయమానాత్మలావణ్య కూలఙ్కషాబుద్బుదశ్రేణికారూపముక్తావళీభాస మానే! శుభామోదికాశ్మీరకస్తూరికాపఙ్కచర్చాపరిద్యోతమానే! మనోజ్ఞాస్యపద్మాహితార్చాపరామ్భోజ బాణప్రతిష్ఠాపితామూల్యశఙ్ఖీభవత్కన్ధరే! పాణితప్రాణబన్ధూభవద్భవ్యవాగ్బన్ధురే! సలలితఖగచక్రాఙ్గకాణ్డ ద్విజావిక్షతాఙ్కాన్వితప్రస్ఫురత్పక్వబిమ్బప్రతీకాశరమ్యోష్ఠబిమ్బే! నవాదర్శసద్గర్వనిర్వాపణోద్యుక్త గణ్డద్వయాంచన్మరీచీకదమ్బే! స్వకశ్రీసమఙ్కూరిత త్రాసయోగాటవీ లీన కున్దోపరివ్యక్త నవ్యానుకమ్పా రసోహాకరాశ్రాన్త వీటీరసవ్యాప్త దన్తాళికాద్వైతవా ద్యుజ్జ్వలద్దాడిమీబీజజాలే! సునాసాజితామూల్యసౌవర్ణ జాలే! లసత్కజ్జలాఙ్కోపధిత్రోటికాయుక్తరమ్యాస్యలావణ్యకేళీవనీవీథికా సంచరత్ఖఞ్జరీటాయమానోల్లసల్లోచనే! భ్రూలతాయుగ్మసంప్రాపితానఙ్గచాపత్విషామోచనే, భవ్యకాశ్మీరభూచిత్రకాకార ఫాలాన్తరభ్రాజ మానానిలాప్తేక్షణే! వక్త్రతేజఃపరిక్షీణపూర్ణక్షపానాథకాన్తిక్షణే! సంతతాభ్యర్ణసీమావసద్వేణికారాహుసంద ర్శనోద్విగ్నచేతస్క చూడామణీభూత శీతాంశురేఖా గళత్పాణ్డురస్వేదపాథః పృషన్మాలికా మోహదా నర్ఘ్యముక్తాలలన్తీలతాలంకృతే!రత్నతాటఙ్కయుగ్మాన్వితే! కాలకణ్ఠాన్తరఙ్గప్రమోదప్రదాప్రత్నచామ్పేయ దామాఖ్య సౌదామినీవల్లికాయుక్తవేణీపయోదాభిరామే! నతాగారిరామే! సతత మగజే! త్వమే వాత్మమాతా శివే! త్వాం భజే దేవదేవి! త్వయా రక్షితోఽహం విశాలాక్షి! తుభ్యం మనోభక్తి విత్తం దదామ్యమ్బికే! నాశ్రయామి త్వదన్యాం మహాకాళి! దాస్యం తవ ప్రాప యాబ్జావతంసే! త్వదీయే పదాబ్జ ద్వయే సంవసత్వస్మదీ యాశయో గౌరి! రక్షాద్యమాం, దేవి! తుభ్యం నమో, యోగిమృగ్యోజ్జ్వలచ్చిత్కళాయై నమో, గోధిభాః కృత్తరాత్రీట్కలాయై నమో, ౽ శేషగీర్వాణనిత్యోత్సవాయై నమో, నిత్యపూతామిత ప్రాభవాయై నమో, హస్త సంబద్ధనీరేశయాయై నమో, దేవతారూపశయ్యాశయాయై నమస్తే, సఖీభూత పద్మాలయాయై నమస్తే, స్వభక్తాళిచిత్తాలయాయై నమస్తే, మృగాధీశవాహోత్తమాయై నమస్తే , పయో జాస్త్రశత్రూత్తమాయై నమః, కాన్తిమత్యై నమః, కాన్తమత్యై నమ, స్సర్వసూత్యై నమ, స్సౌమ్య భూత్యై నమ, శ్శర్మదాయై నమ, శ్శైల జాయై నమః, కామదాయై నమః, కాళికాయై నమస్తే , నమస్తే, నమః. 31

సీ. ఔదలఁ దళుదళుక్కనురిక్కఱేనితోఁ
గూర్మి పైఁ గ్రమ్ముకన్గొనలతోడ,
నెమ్మోముతమ్మిపై నిగుడులేనవ్వుతో
నుదుటిచూపున నొప్పునుదుటితోడ,
పాలిండ్ల నొరయుముత్యాలసరాలతోఁ
బూలదండఁ దనర్చుకేలితోడ,
నడుగుల జీరుపుత్తడివలిపెమ్ముతోఁ
దావి గ్రమ్మెడు మేనితీవతోడ,

తే. నలరి వలిగట్టుపట్టి తన్గొలిచి వేల్పు
టింతితలమిన్న లేతేర నెల్లవారు,
గాంచి యబ్రమ్ము మదిఁ జాలనుంచఁ బుడమి
సామిముంగల నపుడు సాక్షాత్కరించె. 32

ఉ. ఇట్టు లపారతత్పరత హెచ్చఁగ నాసెగకంటివేల్పురా
పట్టపుదేవి తద్ధరణిపాలకుముంగలఁ దోఁప వేడుక
ల్మట్టెగయ న్మహీశ్వరులు మంచతలంబుల నిల్చి భక్తిఁ జే
పట్టి లలాటవీథిఁ గరపంకరుహాంజలు లుంచి రందఱున్. 33

శా. ఆవేళన్ క్షణదోదయక్షితితలాధ్యక్షుండు తత్పాదరా
జీవద్వంద్వము మౌళిఁ జేర్చి వినయశ్రీఁ జంద్రికం దన్మహా
దేవప్రేయసి కప్పగింప నటఁ దోడ్తెప్పించె వేగ న్వయ
స్యావారంబుల నాత్మలోచనకృతవ్యాపారము ల్పంపఁగన్. 34

సీ. నానావనీపాళి నవ్యరాగోత్సవ
సంధాయకామూల్యచైత్రవేళ,
రతిసర్గవిలసనోదితచాతురీకనీ
రజసూతికల్పితరత్నపుత్రి,

యద్రికన్యాబ్ధిముఖ్యవిధావినిర్యాత
పాంచాలభూపాలభాగ్యలక్ష్మి,
దివ్యాళిపరివారదేవతాజనమధ్య
తలరోచమానకందర్పవిద్య,

తే. తనువిభాద్విగుణీభూతధాగధగ్య
సంగతానర్ఘమణిపరిష్కారయుక్త
తన్మహారాజపుత్త్రిక ధరణినాయ
కాజ్ఞ సొగ సెచ్చ నాస్థాని కపుడు వచ్చె. 35

ఉ. వచ్చుసువర్ణగౌరి జనవర్యకుమారి విలోచనంబులం
గ్రచ్చుక పట్టి యచ్చటిధరాపతిసూనునికాయ మయ్యెడ
న్మెచ్చి నుతించె నిశ్చలత మేనులఁ గన్నుల సమ్మదాశ్రువు
ల్మచ్చిక లాత్మ నౌదలఁ జలాచలభావము నివ్వటిల్లఁగన్. 36

సీ. క్రొమ్మించుతీవయో క్రొమ్మించుతీవకు
నిశ్చలాంగద్యుతి నెగడు టెట్లు,
జాళువాబొమ్మయో జాళువాబొమ్మకు
మేనఁ జల్లనితావి మెలఁగు టెట్లు,
మందారవల్లియో మందారవల్లికి
మందయానంబు పెంపొందు టెట్లు,
మరుఁ డెక్కుదంతియో
మరుఁ డెక్కుదంతికిఁ
బలువాక్యనైపుణుల్ గలుగు టెట్టు

తే. లౌర యీనారిచారుశృంగారభంగి
బళిరె యీచానసౌందర్యవిలసనంబు,
లహహ యీబోటిబిబ్బోకహావగరిమ
మనుచు కొందఱు వర్ణించి రనుపమోక్తి. 37

చ. పలుచనివారికిం బొడమి భాసురపుణ్యజనాహితాత్మునిం
గలసి చెలంగ నొప్ప దని కల్మివెలంది దలంచి ధాత్రి ని
య్యలఘునకు న్జనించె సముదంచితపుణ్యజనాప్తు నొక్కరా
జు లలి వరింపఁగోరి యని సొంపుగ నెంచిరి కొంద ఱాత్మలన్. 38

సీ. అఖిలవర్ణితచర్య యగునార్యఁ గర్కశా
కృతికి రాతికిఁ బుట్ట నెనపినసడి,
యసమకళాజాలవసతికి రతి కనం
గవిలాససంలబ్ధి గఱపు రట్టు,
ఘనరసోదయయుక్తిఁ దనరునుర్వరఁ బంక
సంకులఁగాఁ దార్పఁజాలు మాట,
సుమనోవనాఢ్యవృత్తి మహేంద్రవనిత స్వ
శ్శ్రీయుక్తగాఁ ఘటించినకొఱంత,

తే. సత్కులోద్భవ వరవిలాసయుత ననఘ
మానితశ్రీవిరాజిత నీనెలంతఁ
గోరి నిర్మించి వారించికొనియె నలువ
యనుచు నెంచిరి కొంద ఱింపెనయువేడ్క. 39

క. అని యీగతి నృపతతి తి
య్యనిపలుకులు వెలయఁ బొగడు నయ్యెడ నాళీ
జనములు చెంతలఁ గొలువఁగఁ
గనకలతాగాత్రి జనకుఁ గదిసె ముదమునన్. 40

మ. తరుణీతల్లజ మిట్లు తన్నృపతిచెంతం జేరి యవ్వేళ భ
క్తి రహింపం దదనుజ్ఞఁ గంతురిపుపంకేజాక్షికి న్మ్రొక్కె ని
ర్భరవీక్షాగతి మారకాండపరిస ర్గం బూన్చి యుర్వీశదు
ష్కరమానంబు హరించుమంతుఁ గని చక్కన్ బాపు మన్ పోలికన్. 41

తే. నతి యొనర్చిన చెలువ కన్నగతనూజ
యపు డభీష్టార్థసంసిద్ధిరస్తటంచు
హాళి దీవించి కౌఁగిట నలమి కనక
మంగళాక్షతపాళికల్మౌళిఁ దార్చె. 42

వ. అంతఁ జతురంతయానంబున నాకాంతాశిరోమణి నుండ నియోగించి, యంచిత మనోంచలనిరా కుంచితప్రమదసమాజయై, యాగిరిరాజతనూజ సఖీజనంబులు వెనువెంట నడువ నెచ్చెలిచెలు వూని తత్పార్శ్వంబున నడచుచు, రాజసభముఖంబుఁ జేరి, యభంగమేరుశృంగంబులం దోఁచుసింగంపుఁ గొదమలతెఱంగునఁ గాంచనమంచనికాయంబులం జూపట్టు సకలాంతరీపానంతాకాంతలతాంతసాయక సంతానంబులం జూపి క్రమంబున నొక్కొక్కని దేశాదికంబులు దేటపడఁ జాతుర్యంబున నిట్లనియె. 43

పుష్కరద్వీపాధిపతి


మ. కనుఁగొంటే విరిగల్వకంటి మహితోత్కంఠాసముద్భూతి నీ
జననాథాగ్రణి నుజ్జ్వలాంఘ్రిసరసీజాతద్వయవ్యాప్తనూ
తనసామంతనృపచ్ఛటామకుటముక్తాకాంతిసూనోత్కరు
న్వినుతామర్త్యనికాయుఁ బుష్కరమహాద్వీపావనీపాలకున్. 44

మ. పరరాజప్రబలప్రభావహరణప్రౌఢస్థితిం బొల్చునీ
నరనాథోత్తమదోఃప్రతాపకుహనానాళీకమిత్రుండు దా
ధర నిర్మించుఁ జుమీ యమస్వస, మిళిందద్వేషిధమ్మిల్ల! త
త్పరమారాతివధూసకజ్జలదృగబ్జాతాంబుధారాగతిన్. 45

మ. అతులాంభోరుహపీఠిఁ బొల్పెసఁగు సత్యస్వామి కీ వి య్యిలా
పతితోడ న్రహిఁ బెండ్లిమ్రొక్కు ఘటియింపం జేర నీ కూన్చుఁ బో
యతఁ డాత్మేష్టఫలంబు లంతకయ ము న్నబ్జాక్షి యాత్రోవ నూ
ర్జితశాఖావళి సాఁచి వాని వటధాత్రీజాత మర్పింపఁగన్. 46

చ. సరసతపాగమంబున నిశాకరసోదరదాస్య! యీమహీ
శ్వరుఁ గవగూడి నీవు విలసజ్జలఖేల నొనర్పఁ జేరఁగా
వరసరసీభవద్విమలవారిపయోనిధివీచు లారతుల్
కరము ఘటించుఁ గా కరుణకంజకరమ్ముల నాళి పాడఁగన్. 47

తే. అని తెలిపి హైమవతి యాలతాంగి చిత్త
సారసము తజ్జనాధీశచంద్రరక్తి
నలర లే కున్కి తెలిసియు నవ్వలఁ జనఁ
జేసె శిబికాధురంధర శ్రేణి నపుడు. 48

వ. చెంత నొక్కమహీకాంతునిం జూపి యక్కంతువిరోధికాంత యాశకుంతరాజయాన కిట్లనియె. 49

శాకద్వీపాధిపతి


మ. జలజాతచ్ఛదదేశ్యనేత్ర! కనుమీ! “శాకాంతరీపేశు” ను
జ్జ్వలధామౌఘవృతాశు నీఘను బుధస్వామివ్రజస్తుత్యయై
యలరు న్వీనిసుకీర్తిశీతకిరణాస్యామౌళి వేధోండపం
క్తులు మేల్మేలిమి గుండ్లపేరుగతి కన్గో నొప్ప నెల్లప్పుడున్. 50

చ. ధర నేతన్మహిపాలచంద్రకృతనిత్యస్పర్శనాంభఃపరం
పర లప్రత్నమహాంబురాశిగతిఁ దోఁపం గొమ్మ! నిచ్చల్ తదం
తరవీథి న్బడబాగ్నికీలతతి యందం బూని భర్మావనీ
ధరము న్మౌక్తికరీతిఁ దాల్చి యుడుసంతానంబులుం జూ పడున్. 51

సీ. పవనాహతోర్మికానవనాదయుతపయో
ర్ణవనాథఖేలనారమ్యగతులు,
కలశాబ్ధిసంశోభిబిలశాయిపర్యంక
తలశాయిపురుషసందర్శనములు,

సరసాత్మహితసుమోత్కరసారఫలదళా
కరసాలవల్లికాపరివిహృతులు,
చరమాన్యనగవనీవరమార్గచారి కి
న్నరమానినీమణిపరిచయములు,

తే. తావకపురాణపుణ్యసంతానకలనఁ
బారిమాండల్యవన్మధ్య!చేరు నీకు
మహితసుమదామకమున నీమానవాధి
కాంతపుంగవుకంఠంబు గట్టు మిపుడు. 52

మ. అని యాశాంకరి వల్క ముంగలికి వేగారూఢిచే నేగున
వ్వనజాస్యామణి దృష్టి తన్నృపతినిర్వాంఛావిధిం దెల్పఁ జ
య్యనఁ దద్యానధురీణు లంద ఱొక గోత్రాధీశునిం జేర, న
య్యనఘుం జూపి యపర్ణ యిట్లనియె మత్స్యండీసమానోక్తులన్. 53

క్రౌంచద్వీపాధిపతి


శా. పాంచాలాత్మజ! గాంచు వీని దధిరూపక్ష్మాపటప్రావృత
“క్రౌంచద్వీప”ధరాధురంధరుని నీరాజన్యుదానాంబు ల
ర్పించున్ వాశ్చరపాళి కెంతయు మహర్ధిన్ వానిపై నీసుతో
మించన్ బోలె నమూల్యలావణి తదున్మేషంబు గూల్చున్ గడున్. 54

చ. వరహరిజాత్యఖండరుచివారము నొంచి మహాబ్జమండలి
న్ధరణి నడంగఁ ద్రొక్కి వనితామణి! యీవిభుసద్యశోవిభాం
కురహరుఁ డొప్పుఁ గుండలితకుండలినేత పదాంగదంబు నై
శరదపథంబు దంత్యసురచర్మమునై చెలువార నెప్పుడున్. 55

మ. సరసీజోపమగంధి! సంతతము క్రౌంచద్వీపసంవాసి శం
కరపూజాగతి మించెనా నలరు నిక్కం బీనృపాలుండు శం
కరభావమ్మున సద్గణావృతియు రంగద్భూతియు న్విద్విష
త్పురసంభేదనవృత్తియు న్సమగుణస్ఫూర్తి న్విజృంభింపఁగన్. 56

చ. అవిరళరత్నకూటముల హారిమహాసుమనోవితానవై
భవములఁ బొల్చు క్రౌంచగిరి బంధురనూతనబంధుజీవబాం
ధవరదనాంశుకామణి! యనారత మింపగుఁగాక నీకుఁ బ్రో
త్సవకరకేళికాకనకసౌధవిధానముఁ దాల్చి యెంతయున్. 57

వ. అని యయ్యిందుధరసుందరి యెఱింగింప నన్నృపపురందరునిపై నక్కుందరదన డెందంబు పొందు పడ కున్కి తెలిసి, యానధుర్యు లమందరయంబున వేఱొక్కమహీశకందర్పుఁ జేరం జన నందు నతనిం జూపి యాగోత్రధరపుత్త్రి తన్మేచకశతపత్రసగోత్రనేత్ర కిట్లనియె. 58

కుశద్వీపాధిపతి


చ. నెలఁత! “కుశాంతరీప”ధరణీరమణీంద్రుఁడు వీఁడు వీనియౌ
దలపయి నుంచు మీవు కరతామరసార్జితమౌక్తికాళి ని
య్యలఘుఁడు మారవీరవిశిఖౌఘవిలోడితచిత్తధైర్యుఁడై
దలఁచుఁ జుమీ నిరంతరము త్వత్కుచదుర్గము లాశ్రయింపఁగన్. 59

చ. నిరుపమవిశ్రవస్తనయనిగ్రహకృద్ద్రవిణాఢ్యుఁడై మహా
హరిబలసంయుతుండయి బుధార్చితరామసమాఖ్య నొప్పు నీ
నరకులసార్వభౌముని మనం బలర న్వరియింప మేదినీ
వరసుత! నీకు నెంచ ననివార్యకుశోదయ మబ్బు టబ్రమే. 60

మ. బలజూటీమణిదీప్తిదీపకులసంభారాప్తయౌ జన్యమం
గళగేహాంగణవీథి వీఁడు గుణటంకారాఖ్యమంత్రధ్వనుల్
సెలఁగ న్సాహసలక్ష్మిఁ గూడి కరనాళీకంబుల న్గూర్చుఁ బో
నలిమై నాకబలిన్ ద్విషత్కరిశిరోనర్ఘోరుముక్తాతతిన్. 61

మ. వరభోగాన్వితుఁ డీనృపాలకుఁడు ప్రోవన్ నిచ్చలు న్మించు స
ర్పిరపాంపత్యభివేష్టితోర్వర ధరాభృద్భేదిసంత్రాతని
ర్జరపుర్యుత్తమలీల నిత్యసుఖవిభ్రాజద్బుధశ్రేణికా
పరిషక్తిన్ హితదాయిరాజమణిసంప్రాప్తిం గురంగేక్షణా! 62

క. అని తెలుప మనం బచ్చట
మొనయమి శిబికాధరాళి ముదిత నొకమహీ
శునిచెంతఁ జేర్ప శివ యి
ట్లను నావిభుఁ జూపి చెలువ కమృతజిదుక్తిన్. 63

శాల్మలిద్వీపాధిపతి


శా. ఓపద్మానన! గాంచు మీనృపతి రమ్యోత్కంఠమై “శాల్మలి
ద్వీప”త్రాణచణుం డితం డితనివిద్విట్కాంతకుత్ప్రత్నకే
ళీపిచ్ఛందకవైఖరి న్వలయశైలీయోరుకూటంబు లా
ళీపాళీగతి భిల్లరాడ్యువతిమౌళిశ్రేణి పొల్చున్ గడున్. 64

మ. కలుమున్నీ రనుపెన్కొలంకునడుమ న్గన్పట్టి వీఁ డేలు శా
ల్మలికాద్వీపము శ్రీయుతిం దనరుఁ గొమ్మా! తమ్మి నా మధ్యసం
స్థలి జ్యోతిర్లతికాఖ్యకేసరవృతోద్యత్కర్ణికాస్ఫూర్తి రా
జిల ద్రోణాద్రి తదగ్రగాభ్ర మళిరాజిస్థేమఁ జూపట్టఁగన్. 65

మ. తరుణీ! వీనియశోవదాతశుక ముద్యచ్ఛక్తి మిన్నొంది బం
ధురతారాకులగోస్తనీఫలములం దోడ్తో భుజింప న్విభా
వరి తద్దైన్యముఁ జెంద దేతదతిదీ వ్యజ్జైత్రభేరీరవో
త్కరఫక్కద్ద్రుహిణాండకర్పరగళద్బాహ్యాంబుబిందుచ్ఛటన్. 66

ఉ. ఈవసుధేశుఁ గూడి హరిణేక్షణ! నీవు ముదంబు నిక్క వే
లావనవాటికావిహృతులం జరియించుచు మించువేళ నీ
మై వలగొన్న సంశ్రమసమాజము దూలఁగఁ బొల్చుఁ గాక హా
లావనరాశివాఃకణకులస్థగితానిలపోతజాతముల్. 67

వ. అని యప్పంచాస్యపంచాస్యమధ్య యెఱింగించిన నాకాంచనాంగినేత్రాంచలం బతనిపైఁ బ్రవర్తింప దయ్యె, నది యెఱింగి వేఱొక్క మహీశపుంగవుఁ జేర నియోగించి యారాజేంద్రుం జూపి యన్నెలఁత కన్నెలతాల్పువేల్పు పట్టపుదేవి యిట్లనియె. 68

ప్లక్షద్వీపాధిపతి


మ. అరిజన్యాంబుధిసంభవజ్జయరమాహాసాంకురత్కీర్తి నీ
శరజాస్త్రోపమమూర్తిఁ గాంచు చెలి! ప్లక్షద్వీపభూభర్త స
ప్తరసాభృద్ధరణీయయై పొదలు గోత్రం దాల్చు నీమేటి భా
స్వరదోర్యష్టిభుజాంగదాగ్రఖచితాంచచ్ఛక్రనీలోపధిన్. 69

మ. అనిశంబు న్బుధవర్ణ్యకల్పతరుదీవ్యద్వాసనాలబ్ధిఁ జే
కొని యద్వైతరుచిం గరంబు మను నీ క్షోణీస్థలాధీశవ
ర్యునికీర్తిప్రకరంబు మించ సకి! యోహో పూర్వపక్షావలం
బనత న్రాజిలు నట్టిధ్వాంతపరధామం బెచ్చునే యెచ్చటన్. 70

చ. సరససితోపమాధర! రసాలపయోనిధిరాజవేష్టితో
ర్వర కధినేత నీపతి నవారితవైభవశాలి నీమహీ
శ్వరు నవలాలసాతిలకవల్లిక చయ్యనఁ బల్లవింప స
త్వరగతిఁ గాంచవే నయనవారిరుహాంతమునం బ్రియంబునన్. 71

వ. అని యిట్టు లాగట్టుదొరపట్టి వివరించిన నారాచపట్టి యాదిట్టపై వైరాగ్యంబు దెలుపు చిన్నినవ్వు నవ్వ, నవ్వనిత దరహాసచంద్రిక తదీయసంతాపకారణంబై ప్రవర్తిల్లె నంత యానావలంబకకదంబంబు జంబూద్వీపభూపాలలోకంబుఁ జేర్ప నన్నగాధిరాజకుమారి యోనారి నేరెడుదీవియరాజులు వీరు వీరిలో నొక్కరాజకుమారునిపైఁ జూపు నిలుపు మమ్మహాత్మునిగుణంబులు వర్ణించెద నని యానతిచ్చిన నాకాంత యఖిలదేశనాయకగుణశ్రవణకౌతూహలపూర్యమాణస్వాంతయై శాలీనతాభరంబున నూరకుండెనది యెఱింగి సర్వమంగళ యక్కురంగనేత్ర కందఱం దెలుపునదియై వారిలో నొక్కరాజుం జూపి యిట్లనియె. 72

గౌడదేశాధిపతి


చ. పొలఁతుక! గౌడదేశనరపుంగవుఁ డీతఁడు, వీనిఁ గాంచు, మి
య్యలఘుఁడు నిత్యసద్గుణచయస్ఫురణన్ శుభకీర్తిపుత్రికా
వలి నటియింపఁ జేయుఁ గడు వాగ్రమణాండము లెల్లఁ గంచుకుం
డలగతిఁ బాయ కూని భ్రమణక్రమణంబులు చక్కఁ జేకొనన్. 73

మ. సమిదుద్ద్యోతితహేతిభృద్దళనవిస్ఫారప్రభావాప్తిమై
క్షమఁ బెంపొంది యుదగ్రజిష్ణుయుతి నిచ్చల్ బల్ మొన ల్సూపు శం
బముపై ధాటికిఁ జయ్యన న్వెడల నీక్ష్మాభర్తధామాగ్ని క
ర్యమబింబోపధి నారతిచ్చు నహరబ్జావాస యాత్రోవలన్. 74

చ. వనజగృహంబుల న్విడిచి వారిధిరాజకుమారి యీమహీ
శనయనపద్మసీమముల సంతతము న్వసియింపఁ బాడు గై
కొనిన తదాలయాళి సుమకోమల! బల్ రొద నివ్వటిల్లఁగా
ననిశము మొత్తు లాడు మలినాత్మకబంభరదంభభూతముల్. 75

తే. అనిన ద్వైతార్థమునకు వేదాంత మనఁగ
వనితస్వాంతం బలజనేంద్రు నెనయ కున్కి
వేఱొకనిచెంతఁ జేర్చి యవ్వెలఁది కద్రి
తనయ యారాజుఁ జూపి యిట్లనియె నపుడు. 76

మథురానగరరాజు


చ. రతి దళుకొత్తఁ గాంచు మథురానగరీపరిపాలనక్రియో
ర్జితమతి నీమహీపతి విశేషకలక్షణశోభితాస్య సం
భృతతపనీయమేఖలిక నీనరపాలకఖడ్గపుత్రి న
ద్భుతగతిఁ గాంచి శత్రుతతి పూను నని న్నవమోహ మాత్మలన్. 77

సీ. మథురాపురీమణిమహనీయసౌవర్ణ
హర్మ్యసందోహవిహారములకు,
ననవద్యబృందావనాంతాంతలతికాంత
లతికాంతహరణఖేలాగతులకుఁ,

గలితసారసమిత్రకన్యకాకల్లోల
మాలికాపాలికాకేలికలకుఁ,
జారుగోవర్ధనాచలకందరామంది
రాళినిగూహనవ్యాపృతులకుఁ,

తే. దరుణచపలాయమానకైతకదళాప్త
కబరికాబంధ! యాకాంక్షగలిగె నేని,
నీధరాధీశకులమౌళి నెనయఁజేయు
మలఘులజ్జావలద్దృష్టివిలసనంబు. 78

చ. కువలయసంభ్రమప్రదతకు న్నెలవై పరచక్రదర్పవై
భవహరణాఢ్యవర్తనకుఁ బాదయి యీవిభుదోర్మహంబు గో
త్ర వెలయఁ దత్తులావిరహితాజనితోరుమలీమసత్వ మో
యువతి వసద్రమేశతనుభోపధిఁ బర్వు దినేంద్రుమేనునన్. 79

తే. అని యెఱింగింప నపుడు పక్ష్మాంచలములు
వ్రాల్ప శిబికాధరు ల్తద్విరక్తి నెఱిఁగి
వేఱొకనృపాలుఁ జేర్ప నావెలఁది కగజ
యమ్మహీశునిఁ జూపి యిట్లనుచుఁ బలికె. 80

కాశీరాజు


మ. వలజాలోకలలామ గన్గొనవె యీవారాణసీరాజు ను
జ్జ్వలతేజోదినరాజు నిప్పతి భుజావష్టంభరేఖ న్ద్విష
ద్బలకోటి న్మథియించి నిల్పె విజయస్తంభంబు లాశాగజా
వలికి న్నిచ్చలు కట్టుఁగంబముల ఠేవ న్దోఁప దిగ్వీథులన్. 81

మ. వరదానంబు ననల్పసౌకరియు శశ్వద్భోగసంపత్తి ని
బ్బరపుంగూటపుమేల్మి యీపతియెడం భాసిల్ల నశ్రాంత ము
ర్వర తాఁ జేరి పయోజలోచన! కరిస్వామిం గిరిస్వామి నా
హరిరాజు న్గిరిరాజు నెంచక ప్రమోదావాప్తి మించు న్గడున్. 82

మ. అవనీనాయకపద్మసాయకుని దివ్యానందకాంతారవ
న్యవిహారాన్వితు వీని నీయురముఁ జెందం జూడవే దృష్ట్యలే
హ్యవలగ్నామణి! నీకు గాంగజలఖేలాభోగముల్ హస్తిదా
నవవిద్వేషిపదాబ్జసేవనవిధానం బబ్బు నశ్రాంతమున్. 83

క. అని తెలుప వినియు నలజ
వ్వని విననటు లుండ యానవహు లొక్క నృపా
లునిఁ జేర్ప గౌరి యావిభు
వనజాక్షికిఁ జూపి యిటులు పల్కె న్వేడ్కన్. 84

కర్ణాటభూపతి


శా. కర్ణాటేశ్వరుఁ డీతఁ డిమ్మనుజలోకస్వామి వీక్షింపుమా
కర్ణాంతాయతనేత్ర! వీనిజయజాగ్రద్భర్మభంభాకులో
దీర్ణధ్వానము దిక్ప్రభిత్తిపరిభిత్తిస్ఫూర్తిఁ జేపట్టఁగాఁ
దూర్ణం బుర్వరఁ ద్రెళ్లు వైరినృపసందోహంబు చిత్రంబుగన్. 85

మ. బలభిన్నీలసహోదరచ్చికుర! యీపట్టాభిషిక్తేంద్రు హృ
త్థ్సలి వర్ణింపఁ దరంబె యిప్పతి తనుచ్ఛాయాగతిన్ మన్మథుం
గలనం గెల్చి తదంకమండలముఁ జక్కం గైకొనెం గానిచోఁ
దలఁప న్వీనికిఁ జెల్ల నేర్చునె సముద్యన్నక్రకేతుచ్ఛటల్. 86

చ. ఇనకులనుత్యరాజపరమేశ్వరలక్షణశాలి యివ్విభుం
డనిశము చక్రహార్దదమహావసుదాన మొనర్ప నేర్చువాం
ఛ నెనయుచంద్రుఁ డౌఁ జుము రసావలయాతపవారణంబు త
ద్ఘనజవజశ్రమాంబుకణికల్ సుము ముత్తెపుకుచ్చు లెంచఁగన్. 87

మ. వరసామ్యంబు ఘటిల్లె నంచు నృపతుల్వర్ణింప రాజాధిరా
జు రవిద్యోతనరూపతేజు నితని న్సోమాస్య! యుద్వాహమై
నిరతం బొప్పుము సర్వభూపహరిణీనేత్రాశిరోరత్నది
వ్యరుచుల్ త్వత్పదవీథి యావకరసాన్వాదేశముం బూనఁగన్. 88

వ. అని తెలిపియాయుర్వీశుపై మనంబు పర్వ కునికి నాశర్వప్రేయసి సుపర్వరాజగర్వాపహవైభవ ధూర్వహుం డగు నొక్కరాజకులోద్వహుం జేర నియోగించి యాపర్వేందువదన కతనిం జూపి యిట్లనియె. 89

కాశదేశాధిపతి


మ. వనితా! కన్గొను కాశరా జితఁడు దైవాఱు న్మహిన్ రాజరా
జన నార్యేశ్వరమైత్రి సద్ద్రవిణధుర్యత్వంబు నాత్మాంఘ్రిసే
వనతాత్పర్యయుతాప్తపుణ్యజనశశ్వత్సంపదాపాదకాం
చనధీవృత్తియు సార్వభౌమనిభృతాశాగుప్తియుం బూనుచున్. 90

సీ. గురుపద్మినీరాగగుంభితస్వాంతంబుఁ
గని యొప్పుఁ జక్రపక్షప్రతాన,
మతివేల మధుపాళికాప్తిచే నెవ్వేళ
నలరారుఁ బారిజాతాగమౌళి,
బాడబవర్ధనప్రౌఢిప్రచారంబు
భాసిల్లఁ గడుఁ బొంగుఁ బాలకడలి,
సద్వసుహారియై సంలబ్ధదోషాను
సృతిఁ బొల్చు వాసతేయీశ్వరుండు,

తే. తత్సమాసక్తిఁ బంకసంతతిఁ గరంబు
ను విరళశ్రీ వహించుఁ గైరవచయంబు
ననఘమై మించు నీమేటియశముతోడ
సాటి యగు నెట్లు సారసజ్ఞాతినయన! 91

చ. వలదొర మీఱురూపు దయివాఱఁగ రాజిలు నిర్జరాధిపో
పలనిభనీలవర్ణు మహిపాలకశేఖరు వీనిఁ బెండ్లియై
నెలఁతుక యీమహాత్ము నెద నిచ్చలుఁ బాయక యుండు మంజనా
చలతటభాసమాననవచంపకవల్లి తెఱంగు పూనుచున్. 92

తే. అనఁగా నమ్మాట వినియును నలర కున్కి
తెలిసి మఱియొక్కభూపాలతిలకుఁ జేరఁ
దార్చి శర్వాణి రాజనందనను బలికెఁ
దద్గుణశ్రేణి యమృతజిద్భవ్యవాణి. 93

అంగదేశాధిపతి


మ. అనవద్యద్యుతి నంగభూమిపతి నోయబ్జాక్షి వీక్షింపు మొ
య్యన నేతన్నృపధాటికానవకథావ్యాఖ్యాతృభేరీకుల
స్వనసంద్రావితనాథవద్రిపుపురీజాతంబు కాంతారత
న్మనఁ జిత్రం బగుఁ గాదె గోత్ర కవనీనామంబు చేకూఱుటల్. 94

సీ. అభ్రంబు రాయుపుణ్యజనాలయంబులఁ
గమలించి తగుకీలి నమరు శూలి,
సరసచక్రము లాత్మసాధ్వసం బంద వి
షశ్రేణుల నొసంగుజలధరంబు,
కడు సదాళుల మోదగరిమఁ బెంప నెసంగు
నతనుశస్త్రము లూనునమరతరువు,
ఘనబుధద్యుమ్నంబు గొని యజ్ఞహితభావ
మలర ధాత్రి రహించు బలిసురారి,

తే. లలి గురుక్షేత్రము హరించి
చెలఁగు రాజు
నితరరామలరసగతి నెనయు నుదధి
యింతి మదిలో ననాతతాయిత వహించు
నివ్విభుని సాటి గా నీగి నెన్నఁ దరమె. 95

మ. పరసత్యప్రియభావభావుకలసద్వర్ణాంచితశ్రీద్విజో
త్కరసంరక్షణదక్షిణాశయుని లోకస్వామి నిమ్మేటి నం
బురుహమ్మన్యముఖీమచర్చిక! జగంబుల్ మే లనం బెండ్లియై
సరసీజాసనుఁ బల్కుచాన యన నిచ్చల్ మించు ముత్కంఠతోన్. 96

వ. అని యెఱింగింప ననంగీకారభంగి నయ్యంగనయంతరంగం బెసంగిన నాచెంత నొక్క నరపుంగవుం జూపి సారంగధారిసారంగయాన తరంగవళీమణిం గుఱించి యిట్లనియె. 97

కేరళదేశాధిపతి


చ. ఇనకులమౌళి కేరళమహీపతి యీతఁడు గాంచు ప్రీతితో
మనఁగ నపారిజాతమహిమంబున రాజిలు నివ్విభుఁ డుర్వరన్
మను ననపారిజాతమహిమంబునఁ గుందరదాలలామ! పా
వనసుమనోహృదిష్టఫలవారవితీర్ణికలాచమత్కృతిన్. 98

మ. అనిశం బీఘనుకీర్తిధామయుగళంబన్యోన్యవైరాప్తినో
యన నం దొక్కటి ప్రోవ వేఱొకటి వజ్రారూఢిఁ గూల్చున్ విరో
చను వేఱొక్కటి యేఁచ నందొకటి మించం జేయు హంసోన్నతిన్
మును మున్నొక్కటి నొంప వేఱొకటి మన్పుం గొమ్మ! చిత్రంబుగన్. 99

చ. సలలితచక్రసంభరణసక్తమహాశయు దేవవర్ణితో
జ్జ్వలదయుఁ బూరుషోత్తము నిశాచరసాధ్వసకృత్సమాఖ్యు ని
య్యలఘునిఁ జెట్టవట్టి హరి నంబుధిరాజతనూజ వోలె ని
చ్చ లురముఁ బాయ కింపున నెసంగుము వాసవనీలకుంతలా! 100

ఉ. నా విని కొమ్మ యక్షివలనంబునఁ దన్నృపచంద్రనిస్పృహ
శ్రీవెలయింప ముంగలికిఁ జేర ఘటించె వయస్య యోర్తు దో
డ్తో వరయానధుర్యతతితో వివరించుచు నప్పు డొక్క పృ
థ్వీవిభుఁ జూపి గౌరి సుదతిం బలుకుం బ్రియవాక్యనైపుణిన్. 101

దహళభూపాలుఁడు


క. నాళీకనయన! పార్థివ
మౌళీమణిఁ గాంచు దహళమహివిభు రతిరా
ట్కేళీనూత్నకళాసౌ
శీలీమన్మనుజలోకశేఖరు వీనిన్. 102

చ. నెలఁత గభీరపుష్కరధునీపరిగాహనముల్ సురాగమం
డలఫలభక్షణంబులు కనత్సుమనోమహిళానికేతన
స్థలపరివాసముల్ సమతఁ దాల్చు భయాభయయుక్తిఁ బొల్చుని
య్యలఘునిశత్రుకోటి కచలావళిలేఖపురుల్ విచిత్రతన్. 103

సీ. దరిసించుచో నెల్లఁ దాఱించుఁ దాప మీ
యవనీంద్రుచూపు చంద్రాతపంబొ,
ఎనసినచో నెల్ల మనుపు నామోద మీ
రారాజు చిత్తంబు సారసంబొ,
నెరసినచో నెల్ల దొరపు దేవత్వ మీ
యరిభేదిమాట నవ్యామృతంబొ,
యుంచినచో నెల్ల నించు నిష్టంబు లీ
ధీరునిపాణి మందారలతయొ,

తే. యనుచు సత్కవిలోకంబు లభినుతింప
నలరు నీదహళోర్వరాధ్యక్షరత్న
మతివ నీభాగధేయంబుకతన నిటకు
వచ్చె వరియింపు మితని భావము చిగుర్ప. 104

వ. అనిన నయ్యొప్పులకుప్ప యప్పతియెడం జిత్తం బొప్పింపకున్కి దెలిసి యాచాయ నొక్కనృపతిం జూపి నొసలిచూపువేల్పుజవరా లాచివురాకుఁబోఁడి కిట్లనియె. 105

భోటదేశరాజు


చ. కనుఁగొను బోటి! భోటనరకాంతశిఖామణి ధామధిక్కృతా
తనుఘృణి వీఁడు జన్యవసుధాస్థలి శింజిని కార్తిపొందు దా
ర్చిన నరి తద్భృతిం గనుఁ బరిస్ఫుటకాండనికాయముల్ నిగి
డ్చిన నవి తద్వధూటి నిగిడించుఁ గనుంగవ నద్భుతంబుగన్. 106

చ. ఉరగమువక్రవృత్తి నచలోత్తముసత్పథరోధకోన్నతి
స్ఫురణఁ గిరీంద్రుపంకరతబుద్ధి ఢులీశుజడప్రచారమున్
కరిపతిదుర్మదక్రమము గన్గొని రోసి ధరిత్రి తద్గుణే
తరగుణశాలి నివ్విభునిఁ దన్వి వరించి చెలంగు నిచ్చలున్. 107

ఉ. ఇన్నరనాథచంద్రు వరియించి ముదంబున నేగుదెంచునిం
గన్నులపండువై యలరఁ గన్గొని నీపయి నించుఁ గాక యే
తన్నగరీవధూమణివితానము సౌధచయంబు లెక్కి యు
ద్యన్నవమౌక్తికాక్షతసుమావళికాకలికాకులంబులన్. 108

తే. అనఁగా తూష్ణీంస్థితి భజించె నంబుజాక్షి
తన్మనోమోహదుర్విధత్వంబు దెలిసి
యప్పు డాచెంత వేఱొక్కయధిపుఁ జూపి
యింతి కమ్మేనకాపుత్రి యిట్టు లనియె. 109

సింధుదేశాధిపతి


మ. తులకింపం బ్రమదంబు కన్గొనుము సింధుస్వామి నీదంటఁ బ
క్ష్మలనేత్రామణి! పాండుకాండయుతశుంభద్వాహినీమద్రణ
స్థలకాశి న్రిపుకోటి చేరి కడు మించ న్దివ్యరామోపదే
శలసద్వృత్తి ఘటించు వీనియసియజ్ఞధ్వంసి నిక్కంబుగన్. 110

చ. అలఘుశరౌఘవృత్తిమహిమాభిహతప్రతికూలు సంతతా
తులితగభీరభావభరితు న్సుమనోజనమోదకారిని
ర్మలమణిదాత నియ్యవనిరాజకులాజరరాజు నాత్మ నో
నెలఁతుక! సింధురా జనుచునిచ్చ నుతింపఁగఁ జెల్లకుండునే. 111

చ. సకి! రతివేళ నీవు గళసంయుతనిస్వనబృంహితార్భటుల్
రకమయి మీఱఁ గంతుకరిరాజనిరూఢి విశృంఖలైకవృ
త్తికఁ దగ నీమహీతలపతిచ్ఛలయంత ఘటించుఁ గాక తా
వకకుచకుంభవీథి ననివార్యనఖాంకుశఘాతజాతముల్. 112

తే. అనిన నెమ్మోము మరలిచె వనజవదన
యది కనుంగొని గిరిజ యప్పదవిఁ గుకురు
వరునిఁ జేచాయఁ జూపి యవ్వనిత కిట్టు
లనియె మహతీరవామిత్రనినదకలన. 113

కుకురుదేశరాజు


చ. చెలి! కుకురుక్షమారమణశేఖరుఁ డీతఁడు వీనిఁ గాంచు మీ
జలజశరోపమాను నెఱచక్కఁదనంబు జగంబు లెంచ ని
చ్చలు నెదఁ గుందఁజేయుఁ దొవసామి వనావళిఁ దోలు నామనిన్
దలఁచుఁ దృణంబుగా నలజనప్రభుఁ దా నెగఁబట్టు వాసవిన్. 114

చ. సరసమహాత్మత న్భువనజన్మవినాశనహేతువైన యీ
నరపతికీర్తి దైవము గనం బ్రతికూలతచేఁ జరింప ని
ర్జరతరుపాళి కేపు తనచాయ పొసంగునె చుట్టమై కడున్
ఖరదనుజారికిం బగయ గాదొకొ కట్టిన కోఁక యెంచఁగన్. 115

క. అని పాంచాలక్షితివర
తనయామణి కద్రిరాజతనయ తెలుపఁగా
నెనయింప దయ్యె నపుడా
ఘనుపైఁ గలకంఠి చిత్తగతరాగంబున్. 116

వ. అంత నయ్యనంతజూటనీలకుంతల యక్కాంత కిట్లు సకలదేశకాంతసంతానంబులం గ్రమక్రమంబునం దెలుపుచుం జని చని యారాజసభామధ్యంబున నక్షత్రనికరాంతరద్యోతమానరాకాసుధాకరుండునుం బోలె నమూల్యలక్షణలక్షితగాత్రుండును ననుపమానకలాపాలికాసమన్వితుండును జకోరలోచనానంద సంధాయకతేజస్సాంద్రుండును నగుచుఁ జూపట్టు సుచంద్రమనుజేంద్రుం జూపి తదీయచిత్తంబు తదాయత్తం బగుట దెలిసి యాకనకగౌరి కాగౌరి యిట్లనియె. 117

మ. లలనా! కన్గొనుమీ రవిప్రభు విశాలారాజధానీప్రభు
న్లలిమై నీపతి యొప్పుఁగాక యెద వ్రేలం ద్వత్కరాంభోరుహ
స్థలి రాజిల్లుప్రసూనదామకము చంచద్వైజయంతీభృతిం
జెలువుం బూనురమావిభుం డన సురశ్రేణుల్ ప్రమోదింపఁగన్. 118

చ. నెలఁతుక! యీసుచంద్రధరణీపతి శాతశరచ్ఛటం బలా
ద్బలగళరక్త మర్ఘ్యముగఁ దత్కరికుంభమహామణు ల్సుమాం
జలిగఁ దదాతపత్రములు చక్కనియార్తులుగాఁ దనర్చుచున్
బలి రణచండి కూన్చె మునిపాళి నుతింపఁ దమిస్రదానవున్. 119

మ. అని నేతద్విభుసాయకాభిహతి మిన్నంటం బయిం బర్వి శ
త్రునృపాళీమకుటీవలక్షమణిపంక్తుల్ ద్రెళ్ళుటల్ పొల్చు వ
ర్ణన సేయం జెలినిర్భరానకరవభ్రశ్యన్మహోడుస్థితిన్
ఘనలేఖోత్కరవర్షితాభ్రతరురంగత్కోరకవ్యాపృతిన్. 120

చ. జలజదళాక్షి! యీపతి సుచంద్రసమాహ్వయ మెట్లు పూనెనో
తెలియఁగ రాదు ధాత్రిఁ బరదేవమనఃప్రమదాపహారి ని
శ్చలకరకాండుఁడై, భువనజాతనవోత్సవదాయకోదయో
జ్జ్వలుఁడయి, సద్బుధాప్తుఁడయి సంతతము న్నలువారుచుండఁగన్. 121

ఉ. మానిని! యీనృపాలకరమాసుతు సుందరతాలవంబు దా
మానుగ నంది చంద్రుఁ డసమానమహస్థితి మిన్ను ముట్టఁగా
నౌనన కేలొకో మధు వహంకృతిచే సుమనోవిరోధమున్
బూని ఘనుల్ గరంపఁ గరము న్వని రూపఱుఁ బెంపు వాయఁగన్. 122

సీ. ఏలోకమిత్రుధామాలోక మరిరాజ
సమ్మోదవర్ధనచ్ఛాయ వెలయు,
నేరాజు నెమ్మేనితోరంపుసిరి పద్మి
నుల మానగతి నెల్లఁ దలఁగఁ జేయు,
నేసద్గుణాంభోధిభాసురదానవై
ఖరి బుధావళి మహోత్కంఠఁ గూర్చు,
నేధరోద్ధారువిశ్వైషణీయసమాఖ్య
 భువనమాలిన్యంబు పొడ వడంచు,

తే. నమ్మహాభావుఁ డీతఁ డోయబ్జపత్ర
బాంధవన్నేత్ర! సకలభూభరణశాలి
వీనిపై నీమనం బిప్పుడూనఁ జేసి
యతనుసామ్రాజ్యసంలబ్ధి నతిశయిలుము. 123

తే. సకలనుత్యకళాశాలి సౌరవంశ
మౌళి నిమ్మేటి వరియింపు మామకోక్తి
నీమనఃపద్మ మామోదనిభృతి మీఱ
బింబవిమతోష్ఠి! యింక విలంబ మేల. 124

వ. అని యాలోకజనని యానతిచ్చిన, నాచంద్రిక తత్సుచంద్రరాజచంద్ర సద్గుణగణశ్రవణసంజాయమాన కౌతూహలయును, దన్మహిపవర్య సౌందర్యలహరీపరివర్తమానలోచనమీనయును, దల్లోకరమణాలోక సముజ్జృంభమాణసాత్త్వికభావ సంభావితయును, దజ్జనేంద్రసమీపస్థితిప్రకార సంఫుల్ల్యమానలజ్జాంకుర యును, దన్మనోనాయక సంవరణసముద్వేగవలమానమానసయును నై, యమ్మహాదేవిముఖంబు గన్గొని తదనుజ్ఞాగౌరవంబున. 125

చ. కనకవిమాన మప్డు డిగి కన్గొన సర్వనరేంద్రలోకము
ల్మనమున వేడ్క నిండఁ గయిలా గొసఁగం గిరిరాజకన్య యా
ఘననిభవేణి తన్మహితకాంచనమంచక మెక్కి నిల్పె నా
మనుజకులేంద్రుకంఠమున మంజులమంగళపుష్పదామమున్. 126

ఉ. ఆవనజాక్షి యాతఱి నజాంగనయానతిఁ దత్సుచంద్రధా
త్రీవిభుని న్వరించి యలరె న్నలు భైమి యనంగ సమ్మద
శ్రీ వెలయంగఁ జిత్తముల జిష్ణువిరోచనసూర్యసంతతీ
రావరు లెల్ల సమ్మతిఁ గరంబు మనంబున సంతసిల్లఁగన్. 127

ఉ. నించిరి వేలుపుల్ ప్రియమునిక్కఁగఁ గ్రొవ్విరిసోన చక్క దీ
వించిరి తాపసాధిపు లవేలమృదంగరవాళి మించ సం
ధించిరి నాట్యవృత్తి సురనీరజనేత్రలు చిత్తవీథి మో
దించిరి సర్వదేశజగతీరమణుల్ నిరసూయ మెచ్చఁగన్. 128

మ. తనుమధ్యామణి వైచినట్టి సుమనోదామంబు వక్షస్థలిన్
గనుపట్టం బొలిచె న్దినేంద్రకులభూకాంతేశుఁ డప్పట్టునన్
ఘనతారావళికాధరుం డయినరాకాయామినీకాముకుం
డన శ్యామానయనోత్పలోత్సవకరోదారప్రభాసంభృతిన్. 129

మ. వికసచ్చంద్రకలాపయుక్త యయి ఠీవి న్దేవయోషామణి
ప్రకరంబు ల్గొలువంగఁ జేరి యలగోత్రాభృత్కలాధీశక
న్యక తన్నప్డు వరింపఁ దత్కుసుమమాలాప్తి న్విరాజిల్లె సూ
ర్యకులోత్తంసము సద్గణోత్సవము లార న్దక్షిణామూర్తి నాన్. 130

చ. మగువ దవిల్చినట్టి సుమమాలికతావికిఁ జేరు తేఁటిదం
టగమిరొద ల్సెలంగెఁ బొగడ న్మలినాత్మత మున్ను మన్మథా
నుగుణత నేఁచు మంతువు గనుంగొన కిష్టసుమార్పణంబుచేఁ
దగ మముఁ బ్రోవవే యనుచుఁ దత్పతికై వివరించుపోలికన్. 131

చ. నరపతిదేహదీప్తి సుమనస్సరవల్లరి శోణభాధురం
ధర యయి చూడ రాజిలె నెదం దను నేలఁ దలంచుచంద్రికా
తరుణికటాక్షభాస్వదమృతచ్ఛట పర్వఁగ నిల్వ లేక దు
ష్కరమదనాస్త్రపావకశిఖాలత వెల్వడుదారిఁ బూనుచున్. 132

చ. జనవరసార్వభౌమునెద సామ్యనుబింబితమై నెలంత యుం
చిన సుమదామకంబు గనఁ జేర్చె ముదంబు తదంతరంబునం
దెనసి కలంచునట్టి కుసుమేషుశరాళులఁ బట్టి తెత్తుఁ జ
య్యన నిఁక నిల్వఁ జేయుదు నటంచు వడిం జొరఁబాఱుకైవడిన్. 133

చ. పుడమిమగండుదాలిచినపువ్వులదండ తదంగకాంతిచేఁ
గడుఁ గనకప్రసూనసరగౌరవ మూనఁగఁ దుమ్మెద ల్భయం
బడరఁగ జాఱ సాగె నచలాధిపకన్య వరించె నీశునిన్
గడిమికిఁ జేర కింక నని కంతునకు న్వివరింపనో యనన్. 134

మ. ఘనపంకేరుహరాగహారరుచిరేఖావ్యాప్తమై యింతి వై
చిన యాక్రొవ్విరిదండ భర్తయెదఁ బొల్చెన్ దన్మృగాక్షీవినూ
తనరాగేందిర చేరి యద్ధరణినేత న్గౌఁగిటం దార్చి నం
తనె కన్గో నగుతద్భుజావసులతాద్వంద్వైకబంధం బనన్. 135

చ. అలవిరిదండచాయ కర మయ్యెడఁ బర్వఁగఁ దన్నృపాలహా
రలతలచాయ గాంచఁగ విరాజిల దయ్యెఁ దలంప నౌ విని
ర్మలమహిరాట్సుతాంచితకరస్థితి మించుచుఁ జేరువారి మేల్
చెలువముచెంగటన్ ధరణిఁ జిల్లరపేరులవన్నె హెచ్చునే. 136

మ. హరిమధ్యార్పితసూనదాముఁడయి గోత్రాధీశ్వరుం డత్తఱిన్
జిరకాలేహితకాంక్ష యంతయును దం జేరం బ్రమోదాశ్రుసం
భరితాక్షిద్వయితో గళద్విరహతాపశ్రీకచిత్తంబుతో
నురురోమాంచపినద్ధవిగ్రహముతో నొప్పూనెఁ జిత్రంబుగన్. 137

వ. అయ్యెడ నయ్యగరాజకుమారి యాసప్తసముద్రమధ్యరాజలోక వర్ణనాసమయోరరీకృత మానుషా కారంబు దూరంబు కావించి, యుదంచిత చంచరీకకులాకర్షణప్రకార భావసంమిళిత పరిమళమిళిత పారి జాతకుసుమమాలికాసంవేష్టితవేణీకలాపయును, జూడావలంబిత చూడారత్నాయమానతారావరయును, భుజాచతుష్టయసంభృతపాశాంకుశరసాలశరాసనప్రసవరోపయును, నిజచరణసరసిజ భజనాపరాయణ సకలభువనజనోపబహిర్నిర్గతానురాగమోహద గౌరాంగరాగయును, ఆత్మోపఘన ఘనప్రభాలింగిత దివ్యమణిభూషణపూగయును, సముజ్జ్వలజ్జ్వలనమయనయనకలిత ఫాలభాగయును నగుచు జగద ద్భుతతేజోవిలసనంబున నమ్మహారాజేంద్రుముంగల నిలిచి, మంగళకరంబులగు ననేకవరంబు లొసంగి, వెండియును బావకవిబుధమహౌన్నత్యతంత్రం బగు నొక్కమంత్రంబు దెలుపం దలఁచి యానృపతి కిట్ల నియె. 138

మ. నిరవద్యంబయి, నిష్కలంకమహమై, నిర్వాపితాఘౌఘమై,
హరమాయాలవకాంచితాత్మమయి, నిత్యంబై, మహేంద్రాదిని
ర్జరసేవ్యంబయి, యిష్టదంబయి, యజస్ర మ్మొక్కమంత్రం బిలన్
అరిసంభేదన మించుఁ జుమ్ము భువనేశ్యాఖ్యాసముజ్జృంభియై. 139

ఉ. అమ్మహనీయమంత్రము రసాధిప నీ కిపు డిత్తు దానిఁ గై
కొమ్ము త్వదీహితమ్ము లొనగూర్చుఁ బఠించినమాత్రఁ దత్ప్రకా
రమ్ములు సద్గురుప్రవరరమ్యవచోగతిచే నెఱింగి ని
త్యమ్ము జపింపుమీ దినకరాభ్యుదయావసరమ్ములన్ మదిన్. 140

చ. అని భువనేశి యామనుకులాభరణమ్మున కున్నమత్కృప
న్మనుతిలకమ్ము నిచ్చి నృపమౌళి లలిన్ ఘటియించుమ్రొక్కు గై
కొని యలచంద్రికావనితఁ గూడి హరిప్రమదాదిలేఖిక
ల్తను భజియింపఁగా నెనసెఁ దత్పురరాజము సంతసంబునన్. 141

చ. అపుడు నిజాత్మలాలసిక యంతయుఁ జేకుఱ నాసుచంద్రభూ
మిపతి నిజాప్తబంధునృపమిత్రజనంబులు చేరి రా సువ
ర్ణపటహరావ మెచ్చ శిబిరస్థలిఁ జేరె నెలంత లెల్ల న
చ్చపురతనాలయారతులు చక్క నొసంగఁగ నాత్మ నుబ్బుచున్. 142

మ. సకలాంభోనిధిమధ్యదేశవసుధేశవ్రాత మవ్వేళఁ జం
ద్రిక యామేటి వరించుటల్ గరము నిర్ణిద్రప్రమోదోర్మిదా
యకత న్మించఁ దదీయశోభనదిదృక్షాయత్తచిత్తంబులన్
స్వకరాజచ్ఛిబిరాళిఁ జేరి నిలిచెన్ సైన్యేశ్వరు ల్గొల్వఁగన్. 143

మ. జననాథేంద్రు సుచంద్రుఁ జంద్రిక వరింప న్నేఁడుగా మత్కృతా
తనుపుణ్యంబు ఫలించె నంచు ముద మాత్మ న్గాంచి పాంచాలభూ
వనితావల్లభమౌళి వేగ మహిదేవశ్రేణి రావించి శో
భనలగ్నం బలరాత్రివేళ ఘటియింపం జేసె నప్పట్టునన్. 144

ఆశ్వాసాంతము


మ. తనుభానారద! నారదాదివినుతోద్దామాహవప్రక్రియా
ఘనతాశారద! శారదాపకృతజాగ్రద్గోపవత్సప్రగో
పనభాసారద! సారదానవభిదాప్రాంచద్యశోనిర్జితా
తనుసత్పారద! పారదాత్మచరితధ్వస్తాఖిలాఘోదయా! 145

క. శరధీనశరధిఘనభా
స్వరధీవిషయా! నిబద్ధశరధీ! స్వరధీ
శరమావలంబ! శంబర
పరమాకరకరణభరణ!పరమాభరణా! 146

పంచచామరము


ధరాధరా! ధరారిమౌళిధామధామసత్పదా!
పరాపరా! పరాగపూతభామ! భామహోజ్జ్వల
చ్ఛరాశరాశరాజదస్త్రసార! సారభేదనా!
దరాదరా! దరాన్వితౌఘతార! తారకౌస్తుభా! 147

గద్యము
ఇది శ్రీమదనగోపాలప్రసాదసమాసాదితోభయభాషాకవిత్వకలాకళత్ర
రేచర్లగోత్రపవిత్ర సురభిమల్లక్షమాపాలసత్పుత్ర కవిజనవిధేయ
మాధవరాయప్రణీతం బైన చంద్రికాపరిణయం
బను మహాప్రబంధంబునందుఁ
బంచమాశ్వాసము