చంద్రికా పరిణయము/తృతీయాశ్వాసము

శ్రీలక్ష్మీనరసింహాయనమః

చంద్రికాపరిణయము

తృతీయాశ్వాసము

క. విలసత్కమలాపదయుగ
లలితానుపమానదివ్యలాక్షాలక్ష్మో
జ్జ్వలతరకౌస్తుభమణిపి
చ్ఛిలరుచివక్షోవిశాల శ్రీగోపాలా! 1

తే. చిత్తగింపుము శౌనకాద్యుత్తమర్షి
సమితి కిట్లను రోమహర్షణతనూజుఁ
డప్పు డామోద మూని యక్షాధిపతి మ
హీంద్రుఁ దిలకించి వెండియు నిట్టు లనియె. 2

చ. ఇరఁ గల పద్మినీతతులయింపును సొంపు నడంచు మంపునం
గరముఁ బొసంగు చంద్రిక యఖండవిలాసము సన్నుతింపఁగాఁ
దరమె తదీయదీధితివితానము గన్గొనుమాత్రఁ బెంపు దు
ష్కరగతి మించు భూర్యసమకాండగవోదితతాపమండలిన్. 3

సీ. నెలఁత చన్గవదారి నెఱికొప్పు కటియొప్పు
ఘనచక్రవైఖరి నని నడంచుఁ,
గొమ్మ కన్నులరాణ నెమ్మోము మెడగోము
కలితాబ్జమహిమంబుఁ దలఁగఁ జేయు,
సకి నుందొడలరీతి చికురాళి నఖపాళి
సుకలభోర్జితజయస్ఫూర్తి నలరుఁ,
జెలి వలగ్నాభ పల్కులతీరు నూఁగారు
హరిమదాపహవృత్తి నతిశయిల్లు,

తే. నహహ! త్రైలోక్యవర్ణనీయాజరాంగ
నావతారవిలాసాప్తి నడరు కతన
మహిప! పాంచాలరాట్సుతామంజులాంగ
కాంతి చిత్రకరస్థేమఁ గాంచు టరుదె? 4

చ. సమరహితాత్మమై యతనుసాయకశక్తి భరించు నాసుదే
హమెఱుఁగుమేనితోఁ గడు ఘనాళి సహాయముఁ గన్న చంచలౌ
ఘము పగ లొందిన న్విగతకాంతిక మౌ ననఁ దద్విహీనతా
క్రమమున మించు చంపకము గాంచునె సొంపు విరోధ మూనినన్. 5

మ. జగతీనాయక కన్యపాదనఖముల్ సజ్జాలకత్రాణమా
న్యగతిం జేకొని లోకవర్ణ్యవిధుకాంతాకారసంపత్తి మిం
చఁగ ముత్యంబులు శుక్తికాతటిఁ దపశ్చర్య న్విజృంభించి హె
చ్చగు తాద్రూప్యముఁ బొందెఁ గానియెడ ముక్తాభిఖ్య యెట్లబ్బెడిన్. 6

చ. అనిశవిభాసితాత్మమృదుతారుణతాజితపల్లవాభ యై
తనరువెలందిపాదరుచిఁ దమ్ము లిరం గమలాప్తుగోక్రమం
బునఁ గని మించఁగాదె సిరి పూని కరమ్ములఁ జక్క నొత్తు లో
చనములు గంతుకేళివిధిజక్లమదారణదంభధీగతిన్. 7

చ. వెలఁదిమెఱుంగుపిక్కల యవేలమరీచిక ధాటి వెల్వడెన్
జలమున నంచుఁ గాహళిక సాంద్రరుతిన్ బయలూన్ప శాలి లోఁ
గలసినభీతి వాహినులకాండముతో హరిమండలంబుతో
వల నగు పొందుఁ గాంచియును వప్రము వెల్వడ కుండు నెంతయున్. (చిత్రతన్). 8

ఉ. రాజవరాత్మజాతపరిరంభసుఖం బొనగూర్చు నాకుభృ
ద్రాజకుచోరుకాండములు రంభలు గావున నొక్కొ నిచ్చలున్
రాజిలురక్తి సారసవనప్రవివర్ధనవృత్తిఁ బూనుఁ బో
రాజితహస్తిహస్తనికరంబులు తత్ప్రియభావ మూనఁగాన్. 9

చ. సతిజఘనప్రభాగరిమ సైకతముల్ పరిశుద్ధతీర్థవా
సితఁ దగి శారదాదరణచే నిసుమంతగ్రహించి మించ స
మ్మతిఁ గన నోపకే యవని మాటికిఁ గప్పికొను న్సమీరసం
తతిగతినిశ్చ్యుతాసనవనప్రసవౌఘపరాగశాటికన్. 10

చ. స్థిరతపనీయసారసనదీప్తిమృషాతపనాతపంబు భా
స్వరకటిహర్మ్యనాభిమిషజాలకవీథికఁ బర్వినం దదం
తరమున నక్షిలక్ష్యగతిఁ దాల్చినసూక్ష్మతరాణు వౌఁ జుమీ
కరికులరాజయాననునుగౌను మనంబునఁ జింత యూన్పఁగన్. 11

మ. అలివేణీమణినాభి తుంగఘనపుష్పాభంగశోభాగతిం
జెలు వందం దదమూల్యసద్గుణగణశ్రీఁ గానఁగా లేమినో
జలజాతాకరపాళి చుట్టుకొను నిచ్చల్ దుర్యశోవల్లికా
వళి నస్పృశ్యనిరంతరావిశదశైవాలాళి దంభంబునన్. 12

చ. తలకక యౌవనాంబునిధిఁ దానముఁ జేసి, కటీవితర్దిఁ జెం
ది, లలితవిప్రసేవితుఁడు నీరజబాణుఁడు పాంథభేదనో
జ్జ్వలమతి నాభికుండమునఁ జయ్యన హోమ మొనర్పఁ బర్వు శ్యా
మలతరధూమరేఖ యన మానిని యారు పొసంగు నింపుగన్. 13

మ. నవరోమావళియష్టికాగ్రముపయి న్రాజిల్లి చందోయి తా
నవి మెప్పించి తదాత్మత న్మన నసూయన్ గ్రీవ యబ్జాప్తువై
భవముం జేకొనె, నొందె మున్నరుణబింబస్ఫూర్తిఁ గెమ్మోవి, వే
ణి విరాజిల్లెఁ దమస్సపత్నగతి నెంతేఁ దాల్చి యయ్యింతికిన్. 14

సీ. సకియురోజములసాటికి గహ్వరముఁ బూని
కుధరపాళిక కలఁగుండు వడియె,
కలికిగుబ్బలపెంపుఁ గనఁ జాలఁ దమిఁ గాంచి
కోకముల్ రాజుచేఁ గుందువడియెఁ,

జెలికుచంబులఁ బోల నొళవున సరిఁ జూచి
కనకకోలంబముల్ గట్టువడియె,
నెలఁతచందోయితోఁ దులఁదూఁగ రతిఁ బూని
భృంగారుతతి వేగ యెత్తువడియెఁ,

తే. దఱియు గోత్రమ్ములకును గోత్రమ్ము లరుల
కరులు కాయమ్ములకును గాయములు భద్ర
ఘటకములకు సదాభద్రఘటకములు బ
ళిరె వధూకులమణిపయోధరము లెన్న. 15

మ. భువిఁ గశ్చిత్పదపూర్వకంబుగ సుధీపుంజంబు తన్బల్క నా
త్మ వెతం జేకొని దేవదత్తము మిళిందద్వేణికంఠాత్మ సొం
పు వెలుంగం జనియించి మించె బళి సత్పూగాంచితంబై ప్రసి
ద్ధవరాభిఖ్య నెసంగి భూరిగుణరత్నప్రాప్తి సంధించుటన్. 16

చ. వనితభుజాప్రసూనసరవల్గువిలాసముఁ జెందఁగోర్కిఁ గై
కొని వనజాకరాళి బిసకోటి గళద్వయసాంబుసీమ ని
ల్చి నయనపద్మము ల్దెఱచి సేయుఁ దరణ్యవలోకనం బహం
బున నిశ వాని మోడ్చి పెనుపుం దదుదంచితచింతనాగతిన్. 17

సీ. ఎంత సద్గుణలబ్ధి నెనసి మించిన నైన
మణులరంధ్రములె నెమకు ననంగ,
నెంతవారికిఁ బుట్టి యెమ్మె గాంచిన నైన
సుధపెంపుఁ బలుచగాఁ జూచు ననఁగ,
నెంత బల్మొనఁ గూడి యింపుఁ జెందిన నైనఁ
జిగురాకు నగవీథిఁ జేర్చు ననఁగ,
నెంత రసోదయం బెచ్చఁ బొల్చిన నైనఁ
జెఱకు నిష్ఫలముగాఁ జేయు ననఁగ,

తే. ననిశ మామోద మొక్కింత గనక వాయు
రీతిఁ జాంచల్యము వహించి రిత్త విరిసి
సొంపు చెడ వాడు బంధూకసుమచయంబు
తెఱవకెమ్మోవితో విరోధింపఁ గలదె. 18

మ. హరిమధ్యానఘదంతకోరకసమత్వారూఢి పుణ్యాకర
స్ఫురణల్ గాంచినహీరసంతతి కిలం బొల్పొందుఁగా కబ్బునే
పరమాఘంబునఁ బొల్చు మా కని వనిం బల్మాఱు ఖేదించు బం
భరనాదంబున మొల్లమొగ్గలు గళన్మధ్వశ్రుపూరంబుగన్. 19

ఉ. మానినిమేటితావి గల మాటలతేట గ్రహింపఁ గోరి నా
నానగరాజితప్రవచనద్విజరాజులఁ జేరి యీప్సితం
బూనమి వాక్సతీపదపయోరుహయావకవారిఁ గ్రోల నౌ
నౌ నెఱకెంపు సొంపెసఁగె నాననసీమలఁ గీరరాజికిన్. 20

చ. కలికికపోలయుగ్మరుచి కాంచనదర్పణకాంతిసంతతుల్
కలయఁగఁ జేరఁ బ్రేమమునఁ గౌఁగిటఁ గూర్చి నిజోజ్జ్వలాంకసం
స్థలి నిడి కర్ణపూరవిలసత్సితరత్నమరీచిపాళికా
చ్ఛలమునఁ బాలు వోసి వరుస న్వరపత్త్రికడోల నూఁచెడున్. 21

చ. వనములఁ జేరి పుణ్యతమవాసనఁ గాంచి మలీమసాళిమై
త్త్రి నడఁచి మాధవాదృతి సిరి న్భరియించి సమత్వ మెంచు కాం
చనకళికావళి న్నిజరుచాబలవైఖరి రిత్తవుచ్చనో
తనుతరమధ్యనాస తిలదాన మొనర్చుఁ జుమీ యజస్రమున్. 22

సీ. తారకావరదీప్తిఁ దనరారఁగానె కా
గనియె సతీర్థతఁ గలువగుంపు
ఘనరోహితహితాత్మ ననువొందఁగానె కా
నెనసె సగోత్రత నేణికాళి

ప్రద్యుమ్నబోధివర్తనఁ దాల్పఁగానె కా
గాంచె సపక్షత ఖంజనములు
నమలినశ్రీ నన్వహము మించఁగానె కా
పడసె సమిత్త్రతఁ బంకజమ్ము

తే. లనుచు హృద్వీథిఁ దలఁప శ్యామాళిమైత్త్రి
నిరతచకితస్వభావతాసరణి నతను
వాజిభావాప్తిఁ బక్ష్మసమాజలబ్ధి
నిందుముఖికన్నుదోయి తానొందు టరుదె? 23

చ. నరవరతాపదాత్మకత నాతి తపాంతరమాభ మించఁగా
హరిహయచాపముల్ బలె నయారె బొమ ల్గనుపట్టు నాపయి
న్సరససువర్ణసూనసరచంచలతోఁ జెలువందు కైశ్యకం
ధర మిలఁ గాలకంఠకులదర్పవిభేదనశక్తి నొప్పఁగన్. 24

మ. వరబాల్యాహ మడంగ యౌవననిశావక్త్రంబునం గంజజి
త్కర దంతాంశుకశోణకాంత్యుదయరాగశ్రీలు హాసావదా
తరుచుల్ గన్పడఁ బ్రాచిఁ బోల నలికస్థానంబు దృక్చంద్రికా
శ్యురుహర్షం బొనగూర్చు సామ్యుదితచంద్రోత్కర్షమున్ బూనుచున్. 25

మ. ఘనముక్తామయకుండలద్యుతులఁ దత్కాంతాశ్రుతు ల్సాటిగా
వని నవ్వన్ సరి దామె యంచు నతితీవ్రాగ్నిచ్ఛటాతప్తతై
లనికాయంబులు ముట్టి శష్కులులు నిల్వ న్మేల్రుచిం గాంచి యం
గన లేగింతురు సారెపేర రహి నిక్కం బ్రత్యగారమ్మునన్. 26

చ. తరుణిమొగంబె తా నని సుధానిధి విష్ణుపదమ్ము ముట్టి దు
ష్కరకరజాతపాండిమ విగర్హితుఁడై యశుచిం గృశింపఁ బం
కరుహము తన్ముఖోపమము గా నని తా హరిపాద మంటి యిం
దిర దనుఁ జేరఁ గీర్తిఁ గని దీపితజీవన మయ్యె నెంతయున్. 27

సీ. శుభకలాపాప్తి మించుమయూరి ఘనపోష్య
కోటిలోఁ దొలుదొల్తఁ గొమరు గాంచె,
నఖిలశిరోధార్యయైన యుదీచ్యసం
తతి స్వవాలాఖ్యానగతి రహించె,
నతనుగుణస్ఫూర్తి నలరుహిందోళౌఘ
మనివారితాళితావ్యాప్తి నెనసె,
వరరసోన్నతి నొప్పు వర్షుకాంభోదజా
తము సుమనోహితత్వమున వెలసె,

తే. నైన భాస్వత్సహాయత స్వాంతసీమ
నించు కంతయుఁ గోరక మించుతమము
తరుణి కైశ్యంబుతో విరోధంబు గాంచి
చిత్రము మహానిశోదయశ్రీల మనుట. 28

మ. అలరుంగల్వలనీటు, మంచుజిగియొయ్యారంబునుం, దమ్మిమొ
గ్గలచెల్వంబును, గెంపుదామరల చొక్కాటంపుటందంబు, రి
క్కలడాల్ పెంపును, మించ నిచ్చెలువురేఖం బొల్చు నాశ్యామ ని
ర్మలరక్తిం గన రాట్సుతేక్షణచకోరంబుల్ ముదం బూనవే. 29

శా. ఆవామేక్షణవిభ్రమస్ఫురణమా యాతన్వియొయ్యారమా
యావామామణిచారుదీప్తిచయమా యాకొమ్మసౌందర్యమా
యావక్రాలకసత్కళావిభవమా యాలేమబిబ్బోకమా
భావంబందు నుతింప నల్వ వశమా పద్మాప్తవంశోత్తమా! 30

చ. అలఘుమనోభవోదయకరాంగయుతిం దగు నామిళిందకుం
తల, నలమీననేత్ర, నలతామరసానన, నాపికారవో
జ్జ్వలవరమంజులాబ్జగళసంగత, నాబిసబాహ, నాప్రవా
ళలలితపాద, నాచెలిఁ దలంపఁగ నీకెతగు న్నృపాలకా! 31

చ. సరసతరోక్తి నమ్ముని సుచంద్రసమాఖ్య రహించుభూపతిం
బరిణయ మందు మంచు సకిఁ బల్కెఁ దదాఖ్య రహించుమేదినీ
శ్వరమణి వీవె కాన నలసారసలోచన ని న్వరించు న
ప్పరమయతీశువాక్తతి యపార్థతఁ గైకొనునే మహీస్థలిన్. 32

మ. అని యిట్లాత్మకథాప్రవృత్తి కలవాహాస్యుం డుపోద్ఘాతవ
ర్తన రాజిల్ల వినిర్మలోక్తిచయధారం జంద్రికాసుందరీ
జననైకక్రమ మంతయుం దెలుప నిష్ఖండైకతానాత్మచే
విని యాశ్చర్యసమగ్రతం బెనిచెఁ బృథ్వీభర్త చిత్తంబునన్. 33

శా. పాంచాలీవరవిభ్రమశ్రవణసంపద్రేఖనో, మాన్మథా
భ్యంచచ్ఛాంబరికా సమున్నతినొ, పూర్వాదృష్టసంభూతినో,
మించెం దన్మహిపాలహృత్పదవి నిర్మేయస్థితిం బూను త
త్పంచాస్యోపమమధ్యమాకులమణీభవ్యానురాగాళికల్. 34

తే. కలితమానసకైరవం బలరఁ జంద్రి
కావిలాసంబు వినిన భూకాంతమౌళి
కపుడు నేత్రచకోరంబు లమితమోద
మొదవఁ దిలకింప లాలసం బుదిత మయ్యె. 35

క. ఈకరణి మదిం దద్రజ
నీకరముఖిఁ గాంచువాంఛ నిక్కం ధరణీ
లోకరమాసుతుఁడు మధు
శ్రీకరవాక్పటిమ యక్షశేఖరుఁ బలికెన్. 36

ఉ. ధీరవరేణ్య! నీ విపుడు దెల్పిన నిర్మలచంద్రికోదయో
దారసుధారసంబు మది కప్రమితప్రమదంబు నించి, యెం
తే రచియించె నవ్వనజనేత్రఁ గనుంగొన నూత్నలాలసా
పూరము గానఁ జానఁ గనఁబోవుద మాస్పద మావహిల్లగన్. 37

చ. అనఁ గుముదుండు వల్కు వసుధాధిప! నీశుభరూపరేఖికల్
గనుఁగొనుమాత్ర నామహిపకన్య యెద న్నినుఁ జేర్చి దా వరిం
చు నిది నిజంబు కంజముఖిఁ జూడఁగ రమ్ము మదభ్రయాన మీ
వనువుగ నెక్కి యంచు నతఁ డయ్యెడ దానిఁ దలంచె నంతలోన్. 38

చ. బలువగు విస్మయంబున నృపాలుఁడు గన్గొనఁ జెంత నిల్చె ని
ర్మలధనరాజపుష్పకసమానము, సద్వలభీతసుప్రభా
గిలితదినేశమానము, వికీలితచారుమణీవితానకో
జ్జ్జ్వలరుచిరోచమాన, మలవాహముఖేంద్రవిమాన మయ్యెడన్. 39

చ. నిలిచిన యవ్విమాన మవనీపతిచంద్రుఁడు మిత్త్రయుక్తుఁడై
యలధనదాభ్రయానము ధరాత్మభవాపతివోలె నెక్కి ని
స్తులరయసంగతిం జనియెఁ దోడ్తఁ దదర్వముఖాన్వయాధిరా
ట్కలితమహాత్మభావగతిఁ గన్పడకుండఁ బరాళి కత్తఱిన్. 40

మ. వనితాదర్శనదోహదాతిశయధావత్స్వాంతరంగాగ్రవ
ర్తనకన్న న్మునుమున్న యేగు మయుసమ్రాడ్వ్యోమయానంబునన్
జననాథేంద్రుఁడు వేడ్కతోఁ జనియె వీక్షాలక్ష్యతం బూన దా
వనికాయంబులు పట్టణంబులు నదీవారంబు లందంబుగన్. 41

చ. చని చని తత్తరోమహిమఁ జయ్యన నాక్షణదోదయక్షమే
శనగర మప్పు డబ్బుర మెసంగఁ గనుంగొని యంతఁ జంద్రికా
వనజముఖీవిలాసవనవాటికఁ దత్తిలకామ్రకుందచం
దనసుమవాసితానిలవితాన మెదుర్కొనఁ జేరి యచ్చటన్. 42

చ. హరిముఖనేత సూప వసుధాధిపచంద్రుఁడు గాంచె ముంగలన్
హరినిభమధ్యమన్, హరికరాదృతశంఖసమానకంధరన్,
హరిజయశాలివాణి, హరిదంశుకవైరిశరాససుభ్రువున్,
హరిణసపత్ననేత్ర, హరిణాంకముఖిన్, హరినీలకుంతలన్. 43

సీ. తానచాతురి కద్భుతముఁ దాల్చుపోలిక
వరమణిపుత్రికల్ శిరము లూఁప,
ఘనగానసుధఁ గ్రోలి తనివొంది బయ లూన్చు
గతి శిలాతతి జలౌఘమ్ముఁ గురియ,
యతిలయశ్రుతులవిస్తృతితత్త్వ మూనిన,
చాయ నాళులు వినిశ్చలతఁ దాల్ప,
బలురక్తి లోనిండి పట్టఁజాలక వెలు
వడుదారి వల్లికల్ కడుఁ జిగుర్ప,

తే. హారివసుపీఠికాసీనయై విపంచిఁ
గలసి గానము సేయు భూకాంతపుత్త్రిఁ
గనకనిభగాత్రిఁ గాంచి యయ్యినకులుండు
చాల నాశ్చర్యజలరాశిఁ దేలె నపుడు. 44

చ. తెఱలక కన్యఁజేరి తదధీనతఁ బొల్చి యినావలోక మ
త్తఱి నలర న్మిళద్ధరిరథంబయి మున్నె మనోభ్ర మెంతయున్
మెఱయఁగ నంతకన్న మును మించె శ్రమోదకవృష్టి చిత్రతన్
దొఱయఁగ మున్నె క్షేత్రమునఁ దోరముగాఁ బులకాఖ్యసస్యముల్. 45

చ. తరుణిమెఱుంగుటారుగడ దారున నెక్కి నృపాలుచూపుదొ
మ్మరి రమణీయహారగుణమండలిసందునఁ దారుచుం బయో
ధరసృతి లాగు వైచి వడిఁ దార్కొని సమ్ముఖరాజుఁ జేరఁ బం
కరుహశరుండు శార్యభిధకాహళి మ్రోయఁగఁ జేసె నత్తఱిన్. 46

చ. అవనిపకన్యనాభిజలజాకరసన్నిధి రోమవల్లికా
నవతరయష్టికాపదమునం బ్రియయోగము వూని శ్రీసతీ
భవమహిమాప్తి సిద్ధరసపాళికఁ బొందియుఁ బొంద వయ్యెఁ ద
త్ప్రవిమలకంధరాధ్వచరతన్ నృపునేత్రము లద్భుతస్థితిన్. 47

మ. స్తనమేరుస్థలవృత్తి నుబ్బు వళికాస్వర్ద్వీపినీభంగకు
ర్దనఁ జొక్కుం గను మధ్యనాకవిహృతిన్ రమ్యోరురంభోపగూ
హనలబ్ధిం జెలఁగు న్నృపేక్షణము లాహా చిత్ర మేణీవిలో
చనయాస్యేందుసుధైకసేవ ననిమేషత్వంబు సంధిల్లుటన్. 48

తే. ఉజ్జ్వలతరానురాగసంధ్యోదయంబు,
దగ మహాస్తంభభావంబు దాల్చినట్టి
పతిమనంబున నీరజాంబకుఁడు దోఁచె
నపుడు హరిరథసంలబ్ధి ననుసరించి. 49

చ. నిరుపమపద్మినీకులమణీపరిదర్శనశక్తి నైశ్చలీ
గరిమ భజించి సమ్మదవికాసమునం గనుపట్టుకుంభినీ
శ్వరతిలకంబు నుద్ధతి నిశాతపలాశసుమాంకుశంబుచేఁ
గర మసమాస్త్రయంత నఱకం జనియించె శిరశ్చలనస్థితుల్. 50

చ. అలరెడిశ్యామకెంజిగురుటాకులఁ జేరినఁ గోరకంబులన్
మలయుచు నున్నఁ జారుసుమమాలిక లొందిన మంజుమంజరీ
స్థలములపొందు గన్న మధుసంతతిఁ గూడినఁ బాయ వయ్యెడం
జెలఁగుటనో ద్విరేఫగతిచే మహిపాలకురమ్యనేత్రముల్. 51

తే. ఇట్లు తచ్చంద్రికాయత్తదృక్చకోరుఁ
డై రసాధీశపద్మాకుమారుఁ డపుడు
ప్రమదము, నవాద్భుతంబును బల్లవింప
నాత్మ నాయింతి నిట్లని యభినుతించె. 52

సీ. కాఁబోలు నీహేమగాత్రి క్రొత్తగ సానఁ
దీరిన వలఱేనిచారుహేతి,
కాఁబోలు నీకంబుకంఠి పాల్కడలిజి
డ్డడఁగఁ జూపట్టుశీతాంశురేఖ,

కాఁబోలు నీతమ్మికంటి చిరద్యుతుల్
మించఁ బొల్చిన తళ్కుమించుఁదీవ,
కాఁబోలు నీనీలకైశ్య మన్మథశిల్పి
బాగుగాఁ దీర్చిన పసిఁడిబొమ్మ,

తే. యౌర యీచెల్వచెలువ,మయారె యీపొ
లంతి యొయ్యార, మహహ యీయింతిమిన్న
సొంపు, మజ్జారె యీచానసొగసుపెంపు
బళిరె యీలేమఁ బొగడ వాక్పతివశంబె. 53

మ. అతిశోణం బతికోమలం బతివిశాలాత్మం బతిశ్లక్ష్ణకం
బతినిమ్నం బతిమేచకం బతిదృఢం బత్యంతపారిప్లవం
బతివక్రం బతిదీర్ఘ మౌర బళి యీయంభోజపత్త్రాక్షి య
ప్రతిమానావయవప్రతానము మనఃపద్య న్విచారింపఁగన్. 54

సీ. అలరారు నేమొ రమ్యాళిపాళి నెలంత
కులుకుపెన్నెఱులతోఁ జెలిమిఁ గాంచి,
చరియించు నేమొ బల్ మరుమార్గణశ్రేణి
పడఁతిదృగ్రుచి కర్థిభావ మూని,
చెలువొందు నేమొ మంజులకుచంబులు పక్వ
బింబోష్ఠిచనుదోయి పేరు మోసి,
మనఁజేయు నేమొ యింపున ధాత్రి చెలికటి
తటవిస్తృతికి దాదితనముఁ దాల్చి,

తే. యతిశయిలు నేమొ పద్మంబు లనుదినంబు
భామపాదద్వయప్రభాప్రాప్తి నొప్పి
మహిమ గను నేమొ సద్వంశమణిచయంబు
కలికిపదనఖజననశేఖరత నొంది. 55

మ. వలజారత్నము దోఁచు నెన్నడు మణుత్వస్థేమఁ గాంచం గటి
స్థల మెంతేని మహత్త్వ మంద జడ దోడ్తం దీర్ఘతం బూన ని
చ్చలు గుల్ఫంబులు హ్రస్వతం గన రతీశబ్రహ్మలీలాకృతో
జ్జ్వలమాయాపరిమాణవైభవసమచ్ఛాయ న్విరాజిల్లఁగన్. 56

చ. హరిణధరాస్యమోవిపసలా, కిసలాకృతిఁ బొల్చు నంఘ్రు లా,
యరుణతరోష్ఠిగుబ్బవగ లా, మృగలాలస మూన్చు కన్నులా,
హరినిభవాణిమేనిసటలా, నిటలాకరవాలకమ్ములా,
యరిభిదురోజ నెన్న వసమా యసమాశుగమానభేదికిన్. 57

సీ. కలికిచీఁకటిపిండుగలికిఁ బిల్చుకచాళి
వాలుగలసజాలు వాలుఁగనులు,
బింబమ్మునకుఁ బ్రతిబింబంబు కెమ్మోవి
యేపూను రేరేనియేపు మోము,
ఇంచుమేలిమి నలయించు మేల్పలుకులు
కంబులకన్నఁ బొంకంబు గళము,
జక్కవకవ నేఁచుఁ జక్క వలుదగుబ్బ
లలివధూకులము నాలలిత మారు,
వాపులసిరి సారె వాపు లసన్నాభి
మెఱుఁగురంభలరూపమెఱుఁగుఁ దొడలు,

తే. తమ్ము లన మంజులశ్రీయుతమ్ము లడుగు
లుడుపురాణాస్యకాంతుల నుడుపు గోరు,
లవని నీకొమ్మలావణ్య లవనిరూఢి
యమరసుందరులం దైన నమరఁ గలదె? [1]58

చ. అని పతి సన్నుతించు, హృదయంబున విస్మయ ముంచు, నేఁడుగా
యనుపమశక్తి దర్పకున కబ్బె నటంచు వచించు, నవ్విరిం
చనుశుభసర్గకోవిదత సారెకు నెంచు, నిమేషరాహితిం
గనుఁగవ వూన వెండియును గాంచు వెలందిఁ దదేకతానతన్. 59

చ. అపుడు మహీంద్రుతోడ నలయక్షవిభుండు వధూటిఁ గంటివే
తపనకులేంద్ర నాపలుకు తథ్యత గాంచెఁ గదా తదాప్తి నే
నిపు డట కేగి కొమ్మకుఁ ద్వదేకమతిం బొడమింతు నంచు న
న్నృపతియనుజ్ఞఁ గైకొనుచు హృద్యవిమానము డిగ్గి యత్తఱిన్. 60

చ. వనధరఁజేరి చారుతరువారము చయ్యన దాఁటి పూర్వవ
ర్తన నవలాలఁ జేరఁ జనఁ దామరసానన లెల్ల వచ్చెఁ గా
ఘనగురుఁ డంచు నబ్రమునఁ గాంచఁగఁ గాంచనపీఠి డిగ్గి యా
జనవరకన్య యాళిజనసంవృతిఁ దా నెదు రేగి భక్తితోన్. 61

చ. గురుకుచభారరేఖ నొగిఁ గోమలి యానతి సేయ నాదయా
కరమతి పెండ్లికూఁతురవు గమ్మని దీవన లిచ్చి తద్వధూ
త్కరకృతపూజనావిధులు గైకొని తద్వనితాసమర్పితాం
బరచరరాజరత్నచయభాసురపీఠి వసించె నయ్యెడన్. 62

తే. మనుజపతికన్య సఖులతో మణిమయాస
నమున వసియించె నప్పు డాకొమిరెమిన్న
నెచ్చెలి చకోరి యన మించు నెలఁత యోర్తు
కుముదుఁ దిలకించి యిట్లనుఁ గుతుకఫణితి. 63

చ. హరిసమధామ! యుష్మదరుణాంఘ్రులు గన్గొన నిప్డు మద్దృగం
బురుహము లెంతయుం జెడనిమోదముఁ జేకొనె, దూరమయ్యె దు
స్తరహృదయాంధకారసముదగ్రత లెల్లఁ, బ్రవృద్ధిఁ గాంచె వి
స్ఫురదభిలాషచక్రములు, పొల్పడఁగె న్నిబిడప్రదోషముల్. 64

చ. అనుదినముం బ్రియంబును దయామహిమంబును మించ వత్తు రీ
జనవరపుత్త్రికామణికిఁ జక్క విపంచిక నేర్ప నేఁటికిన్
జనియె సుమీ యనేకదివసంబులు మీ రిట రాక నేఁడు నిం
దునిఁ దెలికల్వలో యన నినున్ గనఁ గోరు మదీయనేత్రముల్. 65

చ. మునుపటియట్ల యిచ్చటికి మోదముతో నరుదేరకున్కి కో
జనపరివర్ణ్యదివ్యగుణజాలక కారణ మేమి యేపురం
బెనసితి రేవిశేషగతు లింపుగఁ గాంచితి రేనృపాలుతో
ననువగు మైత్త్రి సల్పితిరి యంతయుఁ దెల్పఁగదే దయామతిన్. 66

క. అన వనితావాక్యసుధా
జనితామోదవృతమానసపయోరుహుఁడై
యనువార యక్షవిభుఁడి
ట్లను వారణయానఁ గని మహామధురోక్తిన్. 67

మ. కలఁ డత్యుత్కటధాటికాతురగరింఖాజాతభూక్షోదక
జ్జలచిహ్నాప్తమహఃప్రదీపహృతతీక్ష్ణధ్వాంతవేలాకుభృ
ద్బిలగేహప్రతిమాయితామితసమిద్భేరీకులధ్వానమం
డలనిర్విణ్ణరిపుక్షితీంద్రుఁడు సుచంద్రక్ష్మాపచంద్రుం డిలన్. 68

మ. సరసీజాతహితాన్వయేశ్వరుయశోజాతంబు చక్రాప్తమై
హరిశోభాంచితమై భృతాబ్జనికరంబై రాజిలం దత్తులే
తరభావోదితపంక మంకవిధిచేత న్మేనునం గప్పినన్
సురకుత్కీలవరప్రదక్షిణముఁ బూనుం జంద్రుఁ డశ్రాంతమున్. 69

మ. పరవాహిన్యధినాథజీవనహృతిం బాటిల్లు తద్భూపని
ర్భరధామస్థితి తన్మహాప్రథనగోత్రాధూళి తద్వృత్తిమైఁ
గర మొప్ప న్వలయాద్రిఁ జేరుఁ దదరిక్ష్మాపాళినైజాంగముల్
వరకీరాళిపికవ్రజం బనుచరత్వం బూనఁగాఁ జేయఁగన్. 70

చ. సరసకలాంచితాస్యుఁ డయి, చారువిలోచనపద్ముఁడై, కళం
కరహితగాత్రుఁడై, జగతిఁ గన్పడు నానృపమౌళితో జనుల్
హరిముఖునిన్, సుమాంబకుఁ, గళంకసమన్వితగాత్రుఁ బోల్తురే
నిరుపమసౌందరీవిధికి నిచ్చలు సాటి యటంచు నెమ్మదిన్. 71

చ. అవనిపచంద్రరూపవిభవాతిశయశ్రవణోయమానమో
హవితతి యూను భోగిమనుజామరకన్యల నిచ్చ నేఁచుఁ బం
చవిశిఖుఁ డాశుగత్రితయిఁ జక్కగ శేషశరద్వయంబుఁ గాం
క్ష వెలయ డాఁచు ముంగల నఖండఫలంబు వహించు నన్మతిన్. 72

తే. ఇట్టి సకలానఘగుణోత్కరాబ్ధి యైన
యామహీకాంతుతో మైత్త్రి యడరు కతన
నిన్నిదినములు తద్యోగ మెనసి యుంటి
నెడయ నేఁ గొమ్మ హృద్వీథిఁ బొడమ కున్కి. 73

ఉ. ఈనృపకన్యఁ జూచురతి నిప్పుడు తజ్జనరాడనుజ్ఞ చేఁ
బూని రయాప్తి వచ్చితి, నపూర్వవిలాసినియై రహించు నీ
మానినిఁ గాంచ నిత్తఱి నమందముదావళిఁ జెందె నాత్మ, కం
జానన! యంచు నామయుకులాగ్రణి వెండియుఁ బల్కు నాచెలిన్. 74

చ. అళికచ! నెమ్మదిం దలఁప నప్పతికే తగు నీవెలంది, యీ
జలరుహనేత్రకే తగు రసారమణేంద్రుఁడు, గాన నామనో
జలలితమూర్తి యీలలనఁ జక్క వరించినఁ గాక మామదిం
దళమయి మించ నేర్చునె యుదారకుతూహలవార్ధివీచికల్. 75

మ. కనుగల్వ ల్వికసిల్ల, మోదము పొసంగన్ దజ్జనాధీశచం
ద్రుని వీక్షించినఁ గాని మామకహృదుద్భూతస్పృహారేఖ యి
మ్మెనయం జాలదు, చాన, యవ్విభుని మీకీలోపలం గాంచఁ గ
ల్గు నన, న్గోమలి కిన్నరేశ్వరునిఁ బల్కు న్గోర్కి దైవాఱఁగన్. 76

మ. హరివంశోత్తము సద్గుణాళి విని నిత్యం బేము వర్ణింప స
త్వరబుద్ధిం గనఁ జాన గోరుఁ బతి నాత్మం, గాంచ మాకుం దదం
తర మెల్లప్పుడు మించుఁ గాన, నలగోత్రాభర్త నే మిప్పు డే
కరణిం గాంతుము, గాంచుదారిఁ గృప నిక్కం దెల్పవే నావుడున్. 77

మ. వనితా యావిభుఁ గాంచువాంఛ మదిఁ జెల్వం బూనినం గాంచవే
జనితాసక్తి నృపాలు మామకకరచ్ఛాయ న్మనోవీథి నూ
త్ననితాంతాద్భుత మబ్బ నంచు మహిమం దత్సద్గుణశ్రేణికా
ఖని తాఁ బ్రాక్కృతమాయ నంతయుఁ జనం గావింప నప్పట్టునన్. 78

సీ. బెళుకుచూపులవానిఁ, బలుమాఱు బలుమారు
సొంపు నిందించుమేల్సొబగువాని,
నొఱపు మించినవాని, నెఱమించునెఱమించు
మెలపుఁ గందించు నెమ్మేనివాని,
సొగసు మీఱినవానిఁ, బగడంబుపగడంబు
తలఁపుఁ గుందించుమేల్తళుకువానిఁ,
గళుకు హెచ్చినవానిఁ, గపురంపుకపురంపు
వలపుఁ జిందించునవ్వొలయువానిఁ,

తే. గళ మెలకువాని, మంజులోజ్జ్వలమువానిఁ
జెలువు గలవాని, నొయ్యార మలరువాని,
నభ్రయానసమాసీను, నాక్షితీశుఁ
జూచి వెఱగంది నిలిచి రాసుదతు లపుడు. 79

చ. పులకలు మేన నిక్క, వలపుంబస మానసవీథిఁ జిక్క, దృ
క్స్థలి ననిమేషవిస్ఫురణ దక్కఁ, బ్రమోదము చిందు ద్రొక్క, ని
ర్మలమణిపీఠి డిగ్గి యొకమానిని కేల్కయిలాగు వూని యా
యలికులవేణి రాజకుసుమాశుగుఁ గాంచె నొకింత సిబ్బితిన్. 80

చ. జనపతియాస్యచంద్రుఁ గనఁ జాలఁ జెలంగు వధూటికావలో
కనకుహనాచకోరములు గ్రక్కున వ్రీళతమశ్చయంబు పొ
ల్చిన భ్రమియింప దాని సడలించె మరుండు విచిత్రశక్తి నూ
తనశరజాతనిర్వమదుదారశిఖోదయరాగవైఖరిన్. 81

తే. చెలిఁ దఱియ వచ్చునరపాలసితదృగాళి
దారి నానారిచూపుచా ల్దవిలి నడచె
నపుడు గగనధునీప్రవాహంబు సొచ్చి
వేగ యెదురెక్కు మీనౌఘవిధి వహించి. 82

చ. నిజబలరూఢి దోఁపఁ దఱి నివ్వటిలెన్ బళి యంచుఁ దాఁ జతు
ర్భుజుఁడయి పంచసాయకుఁడు భూరిధృతిన్ క్షణదోదయాధిపా
త్మజబొమవింటిదోయి నసమానవిలోచనమాలికాసితాం
బుజవిశిఖాళి నించె నలభూపతి పేరెద గాఁడి పాఱఁగన్. 83

చ. అలవిభుఁ గాంచుఁ, గాంచి యెద నప్పతిరూపము నుంచు, నుంచి ని
శ్చలమతి నెంచు, నెంచి మది జాఱనికోర్కుల ముంచు, ముంచి యూ
ర్పులు కడు నించు, నించి వలపుల్ మన నాత్మ భ్రమించు, మించుఁబోఁ
డి లసదనంగసాయకతటీవిలుఠత్పటుశాంబరీగతిన్. 84

క. ఈలీల నృపతిదర్శన
కేళీభవవిస్మయానుకీలితమతియై
నాళీకనయన ఆ! లల
నాళీకమలాస్త్రుఁ డనుచు నతనిం బొగడెన్. 85

సీ. తనవిధుత్వ మ్మాస్యమున నొప్ప ఘనలక్ష్మి
యొనరఁ దోఁచినపూరుషోత్తముండు,
తనతమోగతి కైశ్యమునఁ దోఁప సద్గణ
త్రాణంబునకుఁ జేరు రాజమౌళి,

తనయంగమహిమ నేత్రముల రాజిలఁ గళా
వ్యాప్తిఁ జూపట్టుప్రజాధినేత,
తనశోణరుచి మోవిఁ దగ జగమ్ములమ్రొక్కు
లంది చెల్వూనులోకైకబంధుఁ,

తే. డట్టి యీదిట్ట పతి యంచు నబ్జపాణి
యవనిభృన్నాయకకుమారి హంసయాన
పద్మినీమణి మానసపదవి మెచ్చ
సన్నుతింపఁ దరంబె భుజంగపతికి. 86

మ. గళపూగచ్ఛవి యబ్జకాండపరిసర్గం బూన్పఁ, గన్నుల్ గనన్
నలరూపంబులు పెంప, లేనగవు చంద్రశ్రేణుల న్మన్ప, ని
ర్మల మౌమోవి మధూత్కరంబు ఘటియింప, న్మించు నీభర్తతోఁ
దలఁపం జెల్లునె సాటి యౌ ననుచుఁ దద్రమ్యాంగసౌభాగ్యముల్. 87

చ. ఘనఖరతామిళద్విషమకాండసమున్నతహేతిజాతతా
పనికర మంతయుం గడకుఁ బాయఁగ నీసదధీశుపాదసే
వనగతి యేతదీయఘనవర్తనఁ గాంచక యున్నచోఁ గరం
బెనయదె నాదుశ్యామతనమెంతయు నుర్వి నిరర్థకత్వమున్. 88

చ. అని యనివార్యదోహదసమన్వితమానసవల్లియై, వినూ
తనచపలాతనూకులమతల్లి దలంచుచునుండునంతలో
వనిత యొకర్తు చేరి చెలువా నిను రమ్మనె నిప్డు వీణియన్
విన జనయిత్రి యన్న గురుని న్వినయంబునఁ గాంచెఁ గాంచినన్. 89

ఉ. కిన్నరకంఠి యీనృపతికి న్సతి వయ్యెదు నాదుమాట యా
సన్నశుభంబు పొమ్మనుచుఁ జక్కగ నంచినఁ దద్గురూక్తిచేఁ
గన్నియ యేగె మాతసముఖంబును గాంతలు వెంట రాఁగ ను
ద్యన్నవహీరపాదకటకార్భటి యంచల బుజ్జగింపఁగన్. 90

మ. అలయోషామణి యిట్టు లేగ రవివంశాధీశుఁ డుద్భ్రాంతహృ
త్తలయోగంబున నెందుఁ జెందె లతికాతన్వంగి వీక్షించుటల్
గలయో మారశరాళి నేకరణి వేఁగ న్వచ్చు నివ్వేళ నా
నలయోషిత్సమఁ గాంచ కే ననుచుఁ జింతారేఖ సంధించుచున్. 91

సీ. శారి పూఁబొదఁ జేరి చక్కఁబల్కినదారి
నారి వల్కె నటంచు సారె దలఁచు,
రామచంపకధామరాజి పర్వెడుసీమ
భామ నిల్చె నటంచుఁ బ్రేమఁ గాంచు,
నంచ యింపు రహింప నడుగు వెట్టినయంచఁ
గాంచనాంగి చరించె నంచుఁ జూచు,
బాలకోకిల చాలనోలి మ్రోసెడుమూల
బాల పాడె నటంచుఁ జాల మెచ్చు

తే. లలితపవమాన మాన నాలయవనస్థ
లాబ్జలసమానసౌమనసానుమోద
మలమ నసమానమానస మతులప్రమద
మానఁగ సుచంద్రమానవాధ్యక్షుఁ డలరు. 92

చ. అళినికరంబు కీలుజడ, యందపుఁగెందలిరాకు మోవి, ని
స్తలతరమంజరుల్ మెఱుఁగుఁజన్నులు, మొగ్గలచాల్ పదాంబుజ
స్థలనఖపాళి గాఁగ, వనధాత్రిఁ గనంబడుతీవ లెల్ల నా
చెలిసొబ గానృపాలు మదిఁ జేర్చి భ్రమింపఁగఁజేసె నయ్యెడన్. 93

సీ. కమ్మపుప్పొడిగాడ్పు గ్రమ్మ నొప్పగుబండి
గురివెందవిరిగుత్తికొమరుఁ జూచి,
యలరు సంపెఁగతీవ యలమ నింపుగఁ దోఁచు
కలికిక్రొమ్మల్లియచెలువుఁ జూచి,

మగతేఁటి వేడ్క మించఁగ ముద్దుగొనిన చ
క్కనిమెట్టదామరకళుకుఁ జూచి,
సొలపుచక్కెరతిండిపులుఁగు నొక్కెడిబింబి
కాపక్వఫలముపొంకంబుఁ జూచి,

తే. తరుణిచనుదోయి, కెంపుగందవొడిఁ బూసి
చెలువనెమ్మేను కౌఁగిటఁ జేర్చి కొమ్మ
మోము ముద్దిడి, పూఁబోణిమోవిఁ గ్రోలి
చెలఁగు టెపు డబ్బునో యంచుఁ దలఁచు నృపతి. 94

సీ. ఎంతమాధవదయాసంతానసంసిద్ధిఁ
బొలిచెనో యిచ్చటితిలకపాళి,
యెంతపుణ్యద్విజాధీశసంసేవన
వఱలెనో యిచ్చటిచిఱుతమావి,
యెంతమహాసవోద్ధృతిగతాత్మసుమాప్తి
మనియెనో యిచ్చటికనకరాజి,
యెంతసదాళిచిత్తేష్టదానస్ఫూర్తి
వెలసెనో యిచ్చటికలికిక్రోవి,

తే. చెలికటాక్షైకధారచేఁ జెలఁగ నెలఁత
పాణిలాలనమున మించఁ
బడఁతిమోము
గని యలర, నాతిపరిరంభగరిమఁ జొక్క
ననుచు నృపమౌళి కడుఁజింతఁ బెనుచు మదిని. 95

మ. నవలా యేగినదారిఁ గాంచు, మదిఁ దన్నాళీకపత్త్రేక్షణా
నవలావణ్యవిశేష మెంచు, వలవంతం జాలఁ జింతించు, రా
జవలారాతి తదేకమోహలహరీసంసక్తచిత్తంబునన్
గువలాస్త్రాతినిశాతసాయకశిఖాకుంఠీభవద్ధైర్యుఁడై. 96

చ. నరవిభుఁ డిట్లు తత్సతియనర్గళమోహగతిం భ్రమింపఁ గి
న్నరపతి యప్డుచేరి మహినాయక యీగతి వంత నాత్మ నుం
తురె నినుఁ బ్రేమఁ జూచిన వధూమణి నింతకు మున్నె యేఁచెఁ ద
త్స్మరశరకోటి త్వద్గతసమగ్రమనోరథగా ఘటించుచున్. 97

క. నీలాలక వరియించెద
వేలా వలవంత మేదినీశ్వర యన నా
కాలాబ్జవిమతకులజన
పాలాగ్రణి కూటధృతివిభాస్వన్మతితోన్. 98

తే. గగనయానోత్తమస్యదగతి ధరిత్రి
నగరకాననకుధరసంతతులఁ గనుచుఁ
జని తనబలంబు నెనసి యాక్ష్మావిభుండు
కూర్మి గనుపట్ట నంత నాకుముదుఁ బనిచె. 99

చ. మును మునితోడఁ బల్కిన యమూల్యనిజోక్తిఁ దలంచి యారసా
జనపతిమౌళి సత్వరత సంగరభూమిఁ దమిస్రదానవేం
ద్రుని వధియింతు నంచు లలితోఁ దపనీయరథాధిరూఢుఁడై
చనియె రణానకప్రకరసాంద్రరుతుల్ దెస లెల్లఁ గ్రమ్మఁగన్. 100

సీ. అతులరింఖోద్భవక్షితిధూళి నానాశ
రాధీశమహిమఁ బోనాడు హయము,
లతిశాతదంతప్రహతిఁ గర్బురాచల
స్థితి నెల్ల మాయించు ద్విరదచయము,
లలఘుకేతనమారుతాళి మహాసురో
త్తమమండలిఁ దెరల్చు విమలరథము,
లాత్మభాసురసమాఖ్యాశక్తి యామినీ
చరభయంబు ఘటించు సద్భటేంద్రు,

తే. లపుడు వేవేలు గొలువ, నయ్యవనిభర్త
యిటులు కల్యాణమయరథం బెక్కి వేగ
శిశిరగిరిఁ జేర నరిగె నక్షీణదనుజ
దళనచణదివ్యసాధనోద్భాసి యగుచు. 101

శా. భాస్వన్మండలమధ్యగుం డగురమాభామావిభుండో యనన్
వస్వభ్యంచితచక్రపాదమున నందం బంది భూభర్త సై
న్యస్వాముల్ భజియింప దైత్యకటకేంద్రద్వారభూభృద్దరీ
భాస్వన్మార్గము సొచ్చె నంత ఘనబంభాఘోషముల్ హెచ్చఁగన్. 102

మ. పతి గాంచెన్ నవగోపురేశమకుటాబ్జద్వేష్యుదంశుచ్ఛటా
మతికృత్కేతనధౌతదీప్రము మహాక్ష్మాహంసకజ్ఞానదా
యతవప్రంబు సమగ్రసాలవలయాగాంతస్థితాన్యాచలా
కృతిమత్సౌధసముత్కరంబు దనుజశ్రీమత్పురం బయ్యెడన్. 103

చ. కనుఁగొని యానతియ్య మహికాంతుననుజ్ఞ బలంబు లెల్లఁ ద
ద్ఘనవరణంబు చుట్టి, పరిఖాతతిఁ బూడ్వఁగఁ గోట ద్రవ్వ, గ్ర
క్కున బలుమేరువుల్ నిలుప ఘోరతరోగతి సంభ్రమించెఁ ద
త్స్వనము సురారిపాళి కనివార్యరణక్రమ ముగ్గడింపఁగన్. 104

వ. అంత నద్దురంత కోలాహలార్థవిజ్ఞాపక చారవార వాచా జాయమాన ప్రతిఘాసముద్దాముండగు నా తమిస్రతమిస్రాచరసార్వభౌముం డనూనకువలయ భయంకర కోపాటోపశోణిమధురీణ వదనాంబురుహ బంధుబింబ వినిర్గత కిరణాంకూరమాలికాయమాన నిస్తబ్ధతామ్రశ్మశ్రుజాలుండును, నధరాధర ఫలగ్రాస సమాసక్తోపరి ద్విజోపరిగతాగ్రహ తదితరద్విజారబ్ధ కలహసముదిత నినాదమతికృద్రదనాగ్రాఘాత సంజాతకిటకిటారవ బధిరీకృత పర్యంతవర్తికుండును, నరిరాజహంస మదాపహారి కరశరద ధగధగాయ మాన నూతనైరావతీ ప్రమాకర కనకకరవాలికాతారళీ ముకుళీకృత సభాజనలోచనాబ్జుండును, నతంద్ర సుచంద్రరాజచంద్ర ప్రతాపవీతిహోత్ర పరంపరాప్రకార సమున్నమ దంతరంగకరండాఖండరోషపార దౌల్బణీ విదార్యమాణ చీలబంధనశేముషీదాయక సాంపరాయిక లాలసాక్రమ సమేధమానాపఘన ఘనత్వ ఫలత్తనుత్రాణుండును, నలఘుబలాహితకాండాసమానవిలాస విక్షపణదీక్షాదక్ష వికటభ్రుకుటి కుండును, నఖిలప్రపంచ పంచతాకరణచణ విలయకాల మహాకాలసరూపరూపుండును, నగుచు నేఁడు గదా మదాశయపూర్తి గావించెఁ బంచజనమాంసంబని తలంచుచు, మణిమయాసనంబు డిగ్గన డిగనుఱికి, నిజావాసంబు వెడలి, వినీతసారథివరానీత శతాంగరాజం బెక్కి, క్రక్కిఱిసి రక్కసిదొరలు వెనువెంటం గొలువ, నభంగురమతంగజతురంగమ చక్రాంగపదాతిసముదయంబులతో నాహవోత్సాహంబున వెడలె నయ్యెడ. 105

మ. కరిఘీంకారము లాశరేశబలహుంకారంబు లర్వవ్రజ
స్థిరహేంకారము లక్షిచక్రవిలసత్క్రేంకారముల్ గూడి స
త్వరతం ద్విద్వయసాగరోర్మిచటులధ్వానంబు నాఁ జేర భూ
వరసేనాజన మాయితం బగుచు దైవాఱెన్ రణోత్సాహతన్. 106

మ. అరుణాభ్రోదితరక్తవృష్టి యనుకూలాన్యానిలశ్రేణి భా
స్వరకేత్వగ్రవిలగ్నగృధ్రము శివాజాతామితారావముల్
పరిదశ్యోల్క నిజాజయంబు వివరింపన్ వానిఁ జింతింప కా
సురవంశేశిత సంగరోర్వి నెనసెన్ శూరత్వ మొప్పారఁగన్. 107

ఉ. దానవనాయకాజ్ఞ సమదక్షణదాచరసైన్యకోటులున్
మానవనాయకాజ్ఞ నసమానమహాజనసైన్యకోటులున్
బూనినరోషచండిమ నపూర్వకలంబసమీకకేళి వై
మానికవార మభ్రమున మాటికిఁ గన్గొన సల్పె నేర్పునన్. 108

చ. అపుడు మహోగ్రవర్తన భటాగ్రణిఁ బోరె భటాగ్రయాయి, హ
స్తిపకవరేణ్యుతో రణముఁ జేకొనె హస్తిపకేశ్వరుండు, సా
దిపటలిఁ జయ్యనం గదిసె ధీరత సాదిచయంబు, దోర్బలై
కపటిమచేఁ బరస్పరజిఘాంస మనంబుల నంకురింపఁగన్. 109

మ. ద్రుఘణంబుల్ పరఁగించి, కుంతములచేఁ దూలించి, కోదండము
క్తఘనాస్త్రాళులఁ గ్రమ్మి శూలతతి వేగన్ గ్రుమ్మి, దుర్వారపా
రిఘధారాగతిఁ జీరి, సంగరధరిత్రిన్ మించెఁ దద్వీరసే
న, ఘనాధ్వంబు పగుల్పఁ దత్తుముల సన్నాదంబు చిత్రంబుగన్. 110

మ. నరనాథేంద్రభటుల్ సురారిభటులున్ స్వస్వాభిధాశౌర్యముల్
వరుసం దెల్పుచుఁ బోరి రుగ్రరణఖేలాపాండితిన్ నిర్జరో
త్కరముల్ వ్యోమవితర్దిఁ జేరి యని ఖడ్గాఖడ్గిలీలల్ శరా
శరియుజ్జృంభణముల్ గదాగదివిలాసంబుల్ మదిన్ మెచ్చగన్. 111

శా. ఆలో నాదిననాథవంశమణి చక్రాంగోత్తమాస్థానిఁ బ్ర
త్యాలీఢస్థితిఁ బొల్చి కుండలితబాణాసోజ్జ్వలత్పాణియై
చాలన్ శింజినికానినాదమున నాశావీథి మేల్కాంచ ని
ర్వేలాస్త్రప్రకరంబు నించె నసుహృద్వీరాసుహృద్వృత్తిచేన్. 112

మ. పరబర్హ్యుద్ధతిఁ దూల్చి తార్క్ష్యహరణప్రౌఢిన్ విజృంభించి ని
ర్భరశక్తిన్ ధర గాఁడి పాఱె నలగోత్రాభృన్మహాజిహ్మగో
త్కరముల్ తద్విహృతిప్రకారభయరేఖావన్మహాజిహ్మగో
త్కరమున్ నిందయొనర్పఁ దత్పురము వేగం జేరు చందంబునన్. 113

చ. అమితనృపాలసాయకచయంబు నిశాటచమూతనుత్రఝా
టము వడిఁ దాఁకి పై కెగయుటల్ వినుతింపఁగ నయ్యె నౌర యు
త్తమనవకాముకచ్ఛట ముదంబున వచ్చె నటంచు నిర్జర
ప్రమదల కెల్లఁ జక్కఁ దెలుపం జనుపెంపు వహించి యయ్యెడన్. 114

చ. ఘనగజదర్పభేదన మఖండసురారిపురప్రభంజనం
బు నలఘుధర్మఖండనముఁ బూనిచి వేలుపు లెంచ నుగ్రవ
ర్తనఁ దనరారు నమ్మనుజరాజకలంబము చిత్రవైఖరిన్
దనిపె నజాత్మజాంతర ముదారతరప్రమదోర్మి నయ్యనిన్. 115

ఉ. ఆది గుణచ్యుతిన్ గనినయట్టినృపాలు నజిహ్మగాళి త
న్మేదినిలోన సుజ్జ్వలనమిత్త్రపరంపరఁ గ్రోలి వేగ మెం
తేఁ దనరన్ బళీ యసురనేతృకులంబు తదేకయుక్తిఁ ద
చ్ఛ్రీ దయివాఱె నొక్కొ యజరీవృతి నాకపదంబుఁ జేరఁగన్. 116

మ. నరవర్యాశుగకృత్తతద్దనుజసైన్యం బప్డు చూపట్టె దు
స్తరఝంఝానిలధూతదావగతి భ్రశ్యత్కాంచనస్యందనో
త్కరమై, నశ్యదనేకవాజివరజాతంబై, పతన్మౌళియై,
పరిశీర్యద్ఘనకుంభ్యనీకమయి, భూభాగంబు దాఁ గప్పుచున్. 117

మ. బలుపాదంబులు కూర్మముల్, మెఱుఁగు దోఁప న్మించు నేజల్ జలా
హులునుం, దెల్లనిచాయపట్టుగొడుగుల్ ప్రోద్ధూతడిండీరకం
బులు, చిక్కుల్వడు కేశపాశనికరంబుల్ నాఁచులుం గాఁగ ద
త్పలభుగ్గాత్రజరక్తనిర్ఝరిణి గన్పట్టెన్ శరోత్కర్షతన్. 118

సీ. భూరిదైత్యకపాలపూర్ణరక్తముపేరి
కాశ్మీరపంకంబు కలయఁ బూసి,
రథములజాళువారావిఱేకులపేరి
పసిఁడిబొట్టులు ఫాలపదవిఁ దీర్చి,
మహిఁ ద్రెళ్లి యున్న రమ్యశిరస్త్రములపేరి
కులుకుకుళ్లాయి తాఁ దల దవిల్చి,
యసృగంబుసిక్తధ్వజాంబరంబులపేరి
బలుచంద్రకావిదుప్పటులు గప్పి,

తే. యలఘుపలభక్ష్యభోజ్యము లారగించి
మహితచక్రపదాస్థానమండపమునఁ
జక్కఁ గొలువిచ్చె నపు డెద నిక్కువేడ్కఁ
జటులబేతాళవంశ్యరాజన్యసమితి. 119

వ. అప్పు డప్పొలసుదిండిమూఁకలదండం బఖండదోర్దండమండితశౌర్యచండిమంబున నమ్మహీమండ లేశ్వరుం జుట్టుముట్టి యుట్టిపడుకట్టల్క నట్టిట్టు దెమలక పరిఘ పట్టిస ముద్గర గదా భిందివాల తోమర శూలాది నానావిధాయుధ యూథంబులం గప్పి, మరుత్కులాభినుత్య సమిత్కుతల చమత్కారోత్క ర్షంబు సూపుచు విజృంభించినం దిలకించి, మనోంచల ప్రపంచిత ప్రతిఘారస ప్రకాండుండై యామనుజ నాయకమార్తాండుండు వలయితచాపవల్లికాతల్లజంబున నిశితభల్లంబులు గూర్చి నేర్పు వెలయం బఱపి, కరంబులు శిరంబులు పదంబులు రదంబులు నురంబులు నుదరంబులు వేఱుపఱుపరాకుండం దుని యలు చేయుచు నరిభయంకర ప్రచురతర సహోవిభవంబునం దనచటులసాయకచాతుర్యంబు సూపు నెడ నొక్కొక్కయెడ నుదారతీవ్రాశుగధారాప్రచారంబున నుద్వేలకీలాలపూరంబులు బోరునం గురియ ముక్తాహారంబులు సారెకుం బుడమిఁ ద్రెళ్ల విగతకరకంబులై నిజఘనాఘననామంబు నిజం బగుటకుంబోలె ననంతాస్థానంబున భ్రమించు దంతావళసంతానంబులును, నొక్కొక్కయిక్క మిక్కుటం బగు చాంచల్యం బున ధరాపరాగపూగసంవళితంబై రూపఱి నానాజిహ్మగసంహతిక్రమంబునకుఁ దల్లడిల్లుచు నాత్మ హర్యభిధానంబు సార్థకంబు గావించుటకుంబోలె మూలలకుఁ జేరు హయనిచయంబులును, నొక్కొక్క వంక విశంకటశింజినీటంకార జలదగర్జా సమూర్జనంబున నాంతరంబు వ్రీల విముక్తకాండజాతంబులై వాహినీమధ్యంబున గతివిశేష మొక్కింత యెఱుంగక చక్రాంగభావంబు సత్యంబగుటకుంబోలె సడలు స్యందనసందోహంబులును, నొక్కొక్కచెంత సుచంద్రసాంద్రధామ స్తోమంబు గనుంగొనం బాయక నెమ్మ నంబుల సాధ్వసం బుప్పొంగి పొంగ మహాబలాతివియోగంబున స్రుక్కుచు మిక్కిలి రయంబునం బొదలు దూఱం దలఁచుచుఁ జిందువంబై పఱచుచు స్వచక్రనామంబు సిద్ధంబుఁజేయనుంబోలెఁ జలియించు సేనా జనంబులును, నొక్కొక్కమూల యాతుధానతనుత్రాణ వితానాయసచూర్ణపరంపర శోణితఝరపూరం బున శాదభూతంబై యేపుసూపఁ బుండరీకసమాఖ్యాకలితంబు లగుటంబోలె బహుశిలీముఖసమాక్రాంతం బులై విదళితత్వంబు వహించు తెలుపట్టుగొడుగులును, నొక్కొక్కపొంత నవక్రచక్రఘాతంబుల విశకలి తోత్తమాంగంబులై భాస్వచ్చంద్రరథాచ్ఛాదనం బంబరంబునం గావించుచుఁ గేతువిఖ్యాతిం బొగడొం దుటం బోలె నిశాటకాంతానుషంగంబు డింపని బిరుదపతాకానికరంబులును, నొక్కొక్కచాయఁ బరు లతోఁ గలహంబులు మాని యసమాంబకలగ్నహృదయలై ద్విజపక్షపాతంబు చేకొని తాము సాదు లగుటం బోలె నైశ్చల్యంబునం దోఁచువాహారోహకులును, నొక్కొక్కదిక్కున హరిదంశుక స్తవనీయ నరవర ప్రక్ష్వేడనతాడనంబుల విగతప్రాణంబులై రాజరా జుల్లసద్విస్మయంబున వీక్షింప సూతజాతతా గతిం బరఁగుటంబోలె ధరణిం బడిన యంతృకులంబులును, నొక్కొక్కక్రేవలఁ బుణ్యజనానంగీకృతంబు లై యెంతయు సౌగుణ్యంబు సంపాదింపక నిశ్శరయోగంబు బెరసి ధన్వాహ్వయంబులగుటంబోలెఁ బెంపు గననికోదండంబులును, నొక్కొక్కసీమల ఘనకాండాసారమహిమంబున వీతపత్రంబులై యలఘు ఫల నికాయసాంగత్యంబు గానక సొంపుచెడి బాణాత్మంబునఁ బరఁగుటంబోలె ధరాపదవి వ్రాలిన నారాచ జాలంబులును, బొలుపొంద నత్యద్భుతంబై దేవదానవాయోధనధరాస్థలంబు నందంబున జిష్ణుకరాసి ఖండిత కర్బురచక్రాంగసంగతంబై, రామరావణయుద్ధదేశంబుడంబున చటులహరిపటలరటనాఘటి తంబై, హరపురాసురసమరాస్థానంబుపోలిక ననంతకలంబవిజృంభణగుంభితంబై, కుమార తారకా స్కందనతలంబు చందంబున నభేద్యశక్తిసంయుతంబై, కౌరవపాండవసంగ్రామాంగణంబుచెలువునఁ జక్రికేతనవిదారణచణ భీమగదాక్రియాసముపేతంబై, యమ్మహాసంగరరంగంబు వినుతికెక్కె నయ్యవ సరంబున. 120

చ. చకితనిశాటమై, పతితసాదిజనంబయి, సుప్తయంతృజా
లకమయి, భిన్నకుంజరకులంబయి, లూనరథంబునై, తద
ర్కకులనృపాలశక్తి నిల వ్రాలిన యాత్మబలంబుఁ గాంచి, పా
యక మను రోషరేఖ యెడనంది తమిస్రసురారి యత్తఱిన్. 121

మహాస్రగ్ధర. వరకోదండప్రకాండోజ్జ్వలగుణనినదవ్రాతసాహాయ్యవద్దు
స్తరకంఠక్రోధనృత్యత్కహకహరవముల్ తన్నృపానీకినీభీ
కరలీలన్ దోఁపఁ బ్రోత్థోత్కటరుడరుణితేక్షావిధిం దత్త్రియామా
చరుఁ డక్షీంద్రంబు భూమీశరథము నెదుటం జక్కఁ బోనిచ్చి యంతన్. 122

క. వలయితచాపజ్యాసం
స్థలి రోపత్రితయిఁ గూర్చి జనపతియెద నే
ర్పలవడ నాటించి మహీ
వలయాధిపుఁ గాంచి యసురవరుఁ డిట్లనియెన్. 123

మ. మతి నొక్కింత విచార మూన కురుసంపద్గర్వరేఖ న్మహా
దితిజాధీశవిరోధ మంది యిటు లేతేర న్మనం బుంతురే
రతి ధాత్రిన్ మనఁ గల్గినన్ జనుము మద్రాజద్భుజాదండమం
డితకోదండవినిర్వమద్విశిఖముల్ నిం గాఁడ విప్పట్టునన్. 124

మ. మునివాక్యంబున మోసపోయితివి తన్మూలంబుగాఁ జుమ్ము నీ
కెనసెన్ గాలము మద్రణేహ గనువాఁడెవ్వాఁడిలన్ మించెఁ జొ
చ్చెనొ నీవీనుల లేదొ భూమివర యాజిప్రాప్తదేవేశకృం
తనసంలోలమదాశయాన్యవిధికృద్ధాత్రుక్తమిత్త్రోక్తికల్. 125

సీ. లలనాళిగీతకల్యాణగీతిక గాదు
చెవి యాన ఘనసింహరవము గాని,
సరసకేళీచంద్రశాలికావళి గాదు
విహరింప సంగ్రామవీథి గాని,
బంధురకర్పూరగంధచర్చిక గాదు
మే నూన మొనముల్కిసోన గాని,
సేవాపరాప్తధాత్రీవరౌఘము గాదు
తిలకింప దనుజేంద్రబలము గాని,

తే. గురుహితజనావృతవిహారఖురళి గాదు
శరగరిమఁ జోప శాత్రవాంతరము గాని,
తరము గాదిట్లు రణ మూనఁ దరణికులజ
తఱిమి వధియింతు నీవేళఁ దలఁగి చనుము. 126

త్వరితగతి. అనియసురకులరమణుఁ డరుణతరవీక్షా
జనితరుడనలకణవిసర మరిమనోభీ
జనక మయి పొదల శితశరచయముచేఁ ద
ద్వనజహితజననపతిఁ ద్వరితగతిఁ గప్పెన్. 127

చ. తెఱలనిశక్తి నప్పొలసుదిండికొలంబులమేటి యిట్టు ల
త్తఱి విశిఖాళిఁ గప్ప వసుధాపతి దట్టపుమంచుపిండు బల్
కఱకఱిమించులం దునుముకంజహితుం డన వాఁడితూపులన్
మఱలఁగఁ జేసి యాదనుజనాథుఁ గుఱించి మృదూక్తి నిట్లనున్. 128

చ. అలఘురణోర్విఁ జేరి యసురాధిప యీగతి వట్టిపల్కుచాల్
పలుకుట వీరధర్మమె నభస్స్థలి నిర్జరు లెల్లఁ జూడ నీ
చలము బలంబు శస్త్రకులచాతురిఁ జూపుము చూచి యంతటన్
బ్రలయకృశానుహేతిసమబాణపరంపరఁ గూల్తు గ్రక్కునన్. 129

తే. ఈయెడఁ దమిస్ర నీదర్పమెల్లఁ గూల్చి
యరిభయదలీలఁ దనరు దీవ్యత్సుచంద్ర
శైత్యవత్కరకాండముల్ చక్కఁ గాంచి
త్రిదశబృందంబు లానందరేఖఁ జెందు. 130

చ. యతుల వధించి తత్కృతసవాళి హరించి ధరిత్రి ధార్ష్ట్యసం
గతిఁ దగునీవు నాయెదురుకట్టున నిల్చితిగా నిశాట త
త్కృతికి ఫలంబు నీ వెనయ నిత్తఱిఁ దార్చెద మద్భుజోగ్రధ
న్వతరుణభోగివాంతవిషవహ్నిసమానకలంబధారచేన్. 131

మాలిని. అని మనుజకులేంద్రుం డయ్యెడన్ భూరిబాణా
సన మెనసి శరాళిన్ జాల దైత్యేంద్రు నొంచెన్
ఘనము నగముపై నిష్ఖండవార్ధారచే నా
ఘనగుణరుతి గర్జాగౌరవం బూని మించన్. 132

చ. జనపతి వైచినట్టి శితసాయకముల్ నిజసాయకచ్ఛటన్
దునియఁగఁ జేసి దైత్యపతి తోడనె యమ్ములు కొన్ని గూర్చి వై
చినఁ గడుఁ జూర్ణతన్ గగనసీమను గప్పఁగ నాత్మబాణవ
ర్తన నెనయించెఁ జూచునజరప్రకరంబులు కేలఁ బాపఁగన్. 133

చ. అలపతి వైచు బాణముల నాదనుజేశుఁడు, వాఁడు వైచు న
మ్ముల హరిభేది తున్ముచు, నపూర్వరణం బొనరించి రయ్యెడన్
తలఁకక విల్లునన్ ఖగవితానము గూర్చుట వాని వైచుటల్
దెలియఁగ నోప కెంతయు మతిన్ సురసంతతి సన్నుతింపఁగన్. 134

ప్రహరణకలితవృత్తము
అభినవధృతి లోనడరఁగఁ బలభు
గ్విభుఁ డరిబలముల్ వెడలి నడవఁగన్
స్వభటనికర మెంచఁగఁ జటులగదన్
ప్రభుకులమణిపైఁ బఱపెను వడిగన్. 135

పంచచామరము
సురారిరాజు మీఁద వైచుశూరహర్షమార్గదన్
స్థిరధ్వనిప్రభావదీర్ణదిక్పదన్ మహాగదన్
ధరావరాగ్రయాయి ఖడ్గధారఁ ద్రుంచె నుర్వరా
ధరోరుకూట ముగ్రవజ్రధార నింద్రుఁడో యనన్. 136

మ. గద యీలీల నృపాసిధార ధరఁ ద్రుంగం దీవ్రరోషం బెదన్
గదురం దానవమాయచే నసురలోకస్వామి యవ్వేళ వై
రిదరాపాది మహాసురాస్త్రము ధరిత్రీభర్తపై వైచె స
త్పదవిన్ జూచు సురాళి కన్నులకు నిద్రాముద్ర చేకూడఁగన్. 137

శిఖరిణి. ఖరాస్యాస్త్రంబుల్ ఘూకముఖశరముల్ కాకవదన
స్ఫురద్బాణంబుల్ తన్బొదివికొని రా భూరిపరిఘ
క్షురప్రాసిశ్రేణిన్ గురియుచు వెఱంగూల నజరుల్
త్వరన్ దద్దైతేయాస్త్రము నడచెఁ దత్సైన్య మలరన్. 138

మందాక్రాంతవృత్తము
ఉర్వీశస్వామి ఘనమతితో నుగ్రకీలాళి పైపైఁ
బర్వన్ రాఁ జూచి వెఱఁగు మదిన్ బాయకెచ్చన్ దదీయా
ఖర్వప్రస్ఫూర్తి నడఁచుతమిం గాంచి దోశ్శక్తిమై గాం
ధర్వాస్త్రం బప్డు మహిపతి సంతానముల్ మెచ్చవైచెన్. 139

భుజంగప్రయాతము
ఖరాంశుచ్ఛటన్ వహ్నికాండంబులన్ శీ
తరుక్పాళిని న్మించి ధాత్రీనభంబుల్
స్వరోచిం బ్రకాశింప క్ష్మానాయకాస్త్రం
బిరం దానవాస్త్రీయవృత్తిన్ హరించెన్. 140

తే. ఇట్లు తనయస్త్రసామర్థ్య మెల్లఁ దూల
నౌడు కఱచుచు హుమ్మని యాగ్రహమున
మీసములు నిక్క నపుడు తమీచరుండు
శక్తి నృపు వైచె నిజమంత్రశక్తి గరిమ. 141

పృథ్వి. కనత్కనకఘంటికాకలఘుణత్కృతిప్రక్రియన్
జనాధిపమహాచమూశ్రవణభేదనం బూన్చుచున్
ఘనప్రతిమ ధూమసంఘములఁ జీఁకటు ల్నించుచున్
ఘనస్యదనిరూఢిచేఁ గదలి శక్తి యేతేరఁగాన్. 142

క. మనుజపతి దానిఁ గనుఁగొని
యనిఁ గుండలితాశుగాసుఁడై శరపంక్తిం
దునియలుగాఁ బడ వైచెన్
మనమున వేల్పులు నిజైకమహిమను బొగడన్. 143

చ. తనవరశక్తి యిట్లు వసుధాపతిమార్గణధారఁ ద్రెళ్ల నా
దనుజవిభుండు శత్రుబలదారణశీలము స్వాగ్రనిర్గళ
త్సునిశితకీలికీల మొకశూలము చయ్యనఁ బూని దీనిచే
మనుము నృపాల యంచుఁ బరమప్రతిఘోద్ధతి వ్రేయ నెత్తఁగన్. 144

చ. జనవిభుఁడంతలోఁ గరము చాతురి హెచ్చఁగ ధన్వ మూని వే
గనియతి నర్ధచంద్రవిశిఖద్వయి పావకమంత్రరేఖతోఁ
దనరఁగఁ గూర్చి వైచి ధరఁ దార్కొనఁ జేసెఁ దదీయదోర్యుగం
బనుపమశూలకాంచనశరాసనముల్ తొలుదొల్త డిందఁగన్. 145

ఉ. అంత ననంతరోషశిఖి యాంతరవీథికఁ జిందు ద్రొక్కఁ గా
లాంతకతుల్యమూర్తి యలయాశరసంతతిచక్రవర్తి దు
ర్దాంతరయంబుతో మణిశతాంగము డిగ్గన డిగ్గి వ్యాత్తవ
క్త్రాంతర మూని మ్రింగెద రసాధిపు నం చరుదెంచె నుద్ధతిన్. 146

వ. ఇట్లప్రతిమానప్రతిపక్షహర్యక్షవర్యంబు వీక్షించి మహాక్షితిధరాసన్నక్షోణివలనం గుప్పించు పంచాన నంబు తెఱంగునఁ దచ్చక్రాంగం బభంగురామర్షసాంగత్యంబున డిగ్గ నుఱికి గోత్రాధిపవిచిత్రపత్త్రిరాజ పరి త్రుటితబాహార్గళయుగళుండై, నిస్తంద్రసురేంద్ర శతకోటిశితకోటి పాటితపక్షద్వయంబగు నంజనాచలంబు చందంబునం జూపట్టుచు నశేషారిబలవిలోచనోత్సవవిమోచనంబు గావించు మేచకప్రభాధట్టంబున నెట్టన మట్టుమీఱు కటికచీఁకటిం బుట్టించుచుఁ బొడకట్టు నుద్దండతనూదండంబు శింశుమారచక్రవీథి రాయం బెరుఁగఁ జేయుచు, నిష్ఠురదీర్ఘనిశ్వాసధూమ నిష్కాలనీరదనికాయంబులకు శంఖారవోత్థహుంకారవారం బుల విశంకటగర్జనావిశేషంబులు నెగడించుచు, గ్రీష్మదినమధ్యందినమార్తాండమండలం బొడియం దమ కించు విధుంతుదగ్రహంబుదారి నున్మీలితవదనకోటరుండై మహిపమార్తాండుంగుఱించి యనంతాధ్వంబు నన్ బరువూన్చుచు, నతిభయంకరాకారంబునన్ బఱతేర, నప్పు డప్పొలసుదిండిమన్నీనిఁ గన్నారంజూచి ధీరోదాత్తుండగు నాసుచంద్రరాజేంద్రుండు నిజకోదండంబున సమంత్రకంబుగ నారాయణాస్త్రంబు గూర్చి ప్రయోగించిన నయ్యస్త్రశిఖావతంసంబును నతివేలశుచిజాలసమన్వితంబుగావునఁ బుష్కరస్థానసంస్థాయి నానానిమేషసంతానభంగంబు చేకూర్చుచు, ననేకదివ్యకాండసర్గచమత్కారి ఘనప్రకారభాసమానంబు గావున భువనజాతవిలాససముత్సారణంబు సంఘటించుచు, నమలకమలాప్త దైవతప్రభావిభూషితంబు గావున నాత్మమిత్రచక్రానందసంధాయకతేజోవైఖరిన్ దేజరిల్లుచు, నమితరయంబున నభ్రమార్గంబు చేపట్టి యెదురుగఁ బఱతెంచు నాదైతేయనాయకుశిరంబుఁ ద్రుంచె నయ్యవసరంబున. 147

సీ. గంధర్వసతులు చొక్కపుపాట వాడిరి
వాడిరి తద్భవ్యవార్తమయులు,
కులరాజమంత్రిముఖ్యులు సంభ్రమించిరి
మించిరి సాధ్యు లమేయసుఖిత,
నరనాథసిద్ధు లందఱు కొనియాడిరి
యాడిరి బృందారకాబ్జముఖులు,
ప్రద్రవద్రిపుల రాడ్భటులు మన్నించిరి
నించిరి విరిసోన నిఖిలలేఖు,

తే. లాత్మ సామంతనృపు లబ్రమంది రిష్ట
సిద్ధి మును లాశ్రమంబులు చెంది రసుర
కువలయాక్షులు మిక్కిలి గుంది రభయ
భూతి జానపదుల్ మదిఁ బొంది రపుడు. 148

మ. హరిదీశానసురాళితోఁ బ్రమథవర్యశ్రేణితో సర్వని
ర్జరయోగీశ్వరకోటితో రయిత గోత్రంజేరి గౌరీమనో
హరుఁ డాభూపతి గారవించి మహిలోకాత్యద్భుతాపాదిబం
ధురనానావిధపారితోషికములన్ దోడ్తో నొసంగెన్ గృపన్. 149

చ. దనుజకులేంద్రసైన్యవరదారుణసాయకపాళి నుర్విఁ ద్రె
ళ్లిన మహిపాలసైన్యపటలిన్ మనఁజేసె శచీవిభుండు పా
వనకరుణాసుధానికరవర్షపరంపరకన్న మున్న ప
ర్విన నిజశక్తికల్పితనవీనసుధారసవృష్టిధారచేన్. 150

మ. దివిజాలభ్యతమిస్రదైత్యవిజయాప్తిన్ సేవితుం డైన యా
యవనీనాథవరేణ్యుఁ జేరి వినయాత్మాత్మ గాధేయగా
లవశాండిల్యవసిష్ఠముఖ్యమునిజాలం బేకవాచాగతిన్
నవకల్యాణకరాదిదివ్యవరసంతానంబు లూన్చెన్ రహిన్. 151

చ. జనవిభుఁడిట్లు దైత్యబలజాతజయంబు వహించి దేవతా
జనములచే బహూకృతిని జాల భరించి కడుం దలంచె నె
మ్మనమునఁ జంద్రికాయువతిమంజుకటాక్షసమేధితేందిరా
తనయమహాజయం బెపుడు దారునొకో యని కోర్కి మించఁగన్. 152

క. ఈలీల నపుడు తత్పాం
చాలీమోహాత్తచిత్తసారసుఁడై భూ
పాలాగ్రణి సకలాజర
జాలానుమతిన్ బ్రమోదసంతతి మెఱయన్. 153

మ. అనఘోచ్చైస్తనకుంభలబ్ధి ఘనవాలావాప్తి హీరాభదం
తనిషక్తిన్ నవపద్మభాలసితవక్త్రస్ఫూర్తి రాజిల్లు ప
ద్మిని రూఢానుశయాఢ్యహృత్సరణి భూమిస్వామి దా నెక్కి కాం
చనబంభారభటుల్ తమిస్రవిజయచ్ఛాయన్ బ్రబోధింపఁగన్. 154

చ. అలఘుఝరీతరంగవిభవాతిశయంబు కనద్వనీలతా
వలిమహిమల్ సరోలలితవారిజవైఖరియున్ నగోజ్జ్వల
జ్జలదమహంబు తన్మహిపచంద్రసుతాంగవిభావిలాసముల్
దెలుపఁగఁ గాంచుచున్ జనియెఁ ద్రిమ్మరునెమ్మదితోడ వీటికిన్. 155

చ. తనపుర మంతఁ జేరి వసుధాపతి భోటవరాటలాటము
ఖ్యనిఖిలదేశభూపతుల నంచి నిజాంచితహైమమందిరం
బెనసి యనీహ మించ దినకృత్యము లూన్చి విలాసహర్మ్యమౌ
ళి నలరుశయ్య నప్డు పవళించె నృపాలసుతైకమోహతన్. 156

ఆశ్వాసాంతపద్యములు

మ. ప్రతిమాతీతగభీరతావిజితపారావార, రావారసం
యతనానాశరకర్ణకోటరపృషత్కాసార, కాసారజాం
చితనేత్రాజనతామనోహరమహాశృంగార, శృంగారసం
భృతమార్గైకవిహారలాలసమనోబృందార, బృందారతా! 157

క. రణభీమ! భీమనుతవా
రణవిజయైకాభిరామ! రామాత్మకకా
రణధామ! ధామనిధికై
రణరాజద్భామ! భామరహితాచరణా! 158

కవిరాజవిరాజితము
నరకవిభేదన, నారజఖాదన, నారదవాదనకేళి, దరీ,
యరిగణశాదనవారుణపాద, నయాంచితవాదన, భూరిదరీ
చరరిపుమాద, నరాశ్వవిచోదన, సారఫలార్జనవార్జహరీ,
పరనిజపాదనతావన, రాదనభాజితకుంద, నరేశ, హరీ! 159

గద్యము
ఇది శ్రీమదనగోపాలప్రసాదసమాసాదితోభయభాషాకవిత్వకలాకళత్ర
రేచర్లగోత్రపవిత్ర సురభిమల్లక్షమాపాలసత్పుత్ర కవిజనవిధేయ
మాధవరాయప్రణీతం బైన చంద్రికాపరిణయం
బను మహాప్రబంధంబునందుఁ
దృతీయాశ్వాసము

  1. ఇది పంచపాది సీసము