చంద్రభానుచరిత్రము/ప్రథమాశ్వాసము

శ్రీరస్తు

చంద్రభానుచరిత్రము[1]

ప్రథమాశ్వాసము

గ్రంథావతారిక

శా.[2]

శ్రీలీలావిభవాప్తి కాశ్రితజను ల్చింతింపఁగాఁ జేరుటే
సౌలభ్యం బనుచు న్నిజాగమనసంజాతస్మృతిం బొల్చుభ
తాలిం గోర్కు లొసంగి ప్రోచుటకు దత్తాత్రేయదివ్యాకృతిన్
శ్రీలాలిత్యము గన్ననిత్యకరుణాసింధున్ హరిం గొల్చెదన్.

1


సీ.

తొడవులఁ దనరూపు దోఁప సేవాసన్నకాంతాంతరమనీష [3]గప్పుకరణి
జగదంబ గాన భూజనుల కవ్యయసౌఖ్యవిభవంబు లిమ్మని వేఁడుకరణి
బలిబంధవేళ సంధిలు[4]ననంతాచంక్రమణభూరివిశ్రాంతి మడఁపుకరణి
నన్యాబ్జములు మాని యమృతకరప్రకాశోన్నతాబ్జములు గైకొన్నకరణి
నభినవదుకూలచేలాంకితాంకపాళి
నంబుజోదరుపదపల్లవంబు లుంచి
యెలమి సంవాహ మొనరించు కలిమి చెలువ
చిరతరైశ్వర్యములు మాకుఁ [5]జేయుఁగాత.

2


చ.

కమలదళాక్షుభక్తుల కగాధభవార్ణవ మింతబంటి య
న్రమణఁ గటిస్థలంబునఁ గరం బిడి రాముఁడె సర్వదైవతో
త్తముఁ డని చాటుచుండెడివిధంబున దక్షిణపాణి నెత్తి ని
త్యమును బ్రతాపముద్ర నటరారు సమీరకుమారుఁ గొల్చెదన్.

3


మ.

పరమప్రౌఢి నశేషవర్ణరచనాపారీణుఁ డౌ భర్త హృ
త్సరణిం డాయుదు నేన యేన యనునోజన్ వర్ణసంధానభా

స్వరవృత్తి న్సమమూర్తులై యొరయు నాసంగీతసాహిత్యబం
ధురవక్షోజము లూను తల్లిని భజింతుం [6]దత్ప్రసాదాప్తికిన్.

4


సీ

శారదోన్మేషంబు జగతి సంధించియుఁ బరమ[7]నారదమైత్రిఁ బరఁగుసుకృతి
నుపమైకధన్యుఁడై యొనరియు ననుపమప్రఖ్యాతి గాంచిన భవ్యచరితు
నసమబాణాంకత నలరారియు నలికనేత్రు మెప్పించిన నిర్మలాత్ము
ఘనశబ్దవిస్ఫూర్తిఁ దనరియు హంససమాగమశ్రీఁ గాంచు ననఘశీలు
మఱియు నగణితసుమనస్సమాజమునకు
నక్షరామృతధారారసార్పణమున
నామెతల నిచ్చలు నొనర్చు నలఘుమహిమ
నెఱపినవిచిత్రసత్కళానిధులఁ దలఁతు.

5


గీ.

ఏమహాత్ములు మువ్వురు నిలఁ ద్రిమూర్తు, లట్ల గుఱియై త్రిలింగభాషాహ్వయము య
థార్థ మొనరించి యలరించి రట్టిశబ్ద, శాసనుని దిక్కమఖిశంభుదాసుఁ దలఁతు.

6


చ.

సరసవిశుద్ధవర్ణగుణసంపదయు న్శుచి[8]వృత్తి భావభా
స్వరగరిమంబుఁ బూనని యసారపుమిన్కుఁగరళ్లు సాహితీ
శరనిధిగర్భశోభన[9]కళావిముఖు ల్పచరింప వాని నొ
ల్లరుఁ జెవిఁ బెట్ట రింతయు నలంకృతివైభవధన్యతానిధుల్.

7


వ.

అని యిష్టదేవతాపదాంభోజపూజనంబును సుకవిసభాసభాజనంబును గుకవిజ
నోద్వేజనంబునుం గావించి విరించిగురుకరాంచలసంచాలితామందమందరవ
ధ్యమానదుగ్ధాంభోనిధానసంజాయమాననవీనతరసుధారసమధురతాబ
ధురనవరసభావానుబంధంబును జతురజనశ్లాఘనీయచంద్రభానుచరిత్ర[10]విచి
త్రానల్పచమత్క్రియానిబంధంబును నగు[11]నొక్కప్రబంధంబు నిర్మింపంబూ
నుసమయంబున.

8


ఉ.

కావ్యము సత్కవిప్రకరకర్ణసుధా[12]పరిపూరణక్రియా
భవ్యముగా నొనర్చుట తపఃఫల ముర్విఁ దలంప నట్టిస
త్కావ్య[13]ము నిష్టదైవతవతంసున కిచ్చి కృతార్థుఁడైన యా
యవ్యయభాగ్యరాశిఁ గొనియాడఁ దరంబె జగత్త్రయంబునన్.

9

మ.

అని యూహించి మదిష్టదైవతము భక్తాభీప్సితార్థోపపా
దనకారుణ్యకటాక్షశాలియు రమా[14]ధామావతారాగ్రగ
ణ్యనవోన్మేషపవిత్రమూర్తియును దత్తాత్రేయుఁడే కాన నా
ఘను నస్త్మత్కృతినాథుఁ జేయఁగ నమోఘప్రీతితో నున్నెడన్.

10


సీ.

ద్విజరాజకార్శ్యము ల్దీర్చు నీవిభుకీర్తి ద్విజరాజకార్శ్యము ల్దీర్చు టరుదె
యాజిభవస్ఫూర్తి నడరు నీనృపుశౌర్య మాజిభవస్ఫూర్తి నడరు టరుదె
యతిసురభిఖ్యాతి నలరు నీఘనునీగి యతిసురభిఖ్యాతి నలరు టరుదె
చంద్రగోత్ర[15]శ్రీఁ బొసంగు నీపతికల్మి చంద్రగోత్ర[16]శ్రీఁ బొసంగు టరుదె
యనుచు బుధు లెన్న వెలయు రాజాధిరాజ, రాజపరమేశ సకలకర్ణాటకాంధ్ర
రాజధౌరేయ తిరుమలరాయతనఁయ, చంద్రుఁడగు వేంకటపతిక్షితీంద్రమణికి.

11


చ.

అనుపమకార్యకర్తయును నగ్రజుఁడు న్మహనీయసత్కళా
ఖనియు నఖండకీర్తీకళికాసురభీకృతసర్వదిఙ్ముఖుం
డును నగుదత్తనార్యుఁడు నను న్వినయాన్వితుఁ బార్శ్వవర్తిఁ గ
న్గొని పలికె న్సుధారసనిగుంభనజృంభితవాక్యవైఖరిన్.

12


మ.

గురువిద్వచ్చరణారవిందభజనాంకూరన్మహోదారధీ
గరిమ న్నీ వొనరింపఁబూనుకృతికిం గైవల్యలక్ష్మీమనో
హరు నస్మత్కులదైవతోత్తముని దత్తాత్రేయయోగీశ్వరు
న్వరుఁ గావింపఁ దలంచి తెన్నఁ దరమే వత్సా భవద్భాగ్యముల్.

13


క.

ఈపరమయత్న మఘని, ర్వాపణ [17]మన ఘాస్మదీయవంశగురుతప
స్యా[18]పారంబున నీమది, దీపించెన్ బళి కులప్రదీపక యనినన్.

14


ఉ.

సంతన మంది యేను బితృసన్నిభుఁడున్ హితదేశికుండు న
శ్రాంతశుభప్రదుండు నయి రంజిలుదత్తనమంత్రివాక్య మ
త్యంతవినీతిఁ గైకొని కృతార్థుఁడనై బహుపుణ్యగణ్యత
ల్గాంతు నటంచుఁ గౌతుక[19]విలాసవిభాసితమానసంబునన్.

15


క.

శ్రీమద్దత్తాత్రేయమ, హామునిముద్రావిభూషితాత్మీయకృతి
శ్రీముఖభూషణముగ మ, త్స్వామిగుణస్తుతి యొనర్తు సమధికభక్తిన్.

16

సీ.

కోరి కన్నుల నొత్తికొనుఁ బలితాభోగి యెద నుంచు సకలకళేశ్వరుండు
శిరమునఁ దాల్చు భాషితదేవి యడు గెడఁబాయంగనీఁడు కల్పకగురుండు
పూను నుత్కటమైత్రి బుధకుంజరము ముఖంబున నుండఁ జూపు సత్పుంగవుండు
కంఠభూషణముగాఁ గావించు సర్వజ్ఞుఁ డంక మొందించు శేషాంశజాతుఁ
డెట్టియక్షరవిఖ్యాతి నెనసెనో య, ఖండజయ మూరురాయరగండబిరుద
వీరతిరుమలరాయపృథ్వీతలేంద్ర, తనయుఁ డగువేంకటక్షమాధవునికీర్తి.

17


మ.

క్షితి మత్తాత్ము సహాయశూన్యుని గృహచ్ఛిద్రంబువాని న్సమా
హతతారుం గికురించి వేంకటపతిక్ష్మాధీశ్వరుం జెందఁ ద
ద్గతరేణుల్ తదధిష్ఠితాంబువులుఁ దద్గంధానిలంబుం దదం
చితభూజంబులు గాంచి యుండుదురు విశ్లేషార్తి వా రెప్పుడున్.

18


సీ.

సర్వతోముఖవృత్తిఁ బర్వునౌర్వమహాగ్నియుదు టెల్ల సింధుదేశోద్భటంబు
దీర్ఘకాలస్ఫూర్తి దీపించువిలయాగ్నిబెడిద మెల్లను సమాపితశకంబు
భీమరోషోద్వృత్తిఁ బెనుపొందుఫాలాగ్నిపెం పెల్లను విదేహభీషణంబు
బహుసత్త్వభీకరప్రౌఢిఁ బొల్చుదవాగ్నితేజ మెల్లను విమర్ధితవనాయు
వహహ యవి సింధుశకవిదేహకవనాయు, లాదిగాఁ గలనిఖిలదేశాళి నెల్ల
రాయిడించునె తిరుమలరాయ వేంక, టావనీంద్రభుజప్రతాపాగ్నికరణి.

19


మ.

రమణీయాత్మకరప్రరూఢవసుధారాలాభనందద్భుధో
త్తమనిత్యాన్నవితీర్ణి సర్వసుమనోదైన్యంబు వారింప భూ
రమణీధేనుగజేశ్వరాత్మకబహుశ్రీ లిచ్చు శ్రీవేంకటే
శమహీవల్లభుసాటియే విధుఁడుఁ దజ్జన్మక్రియాకర్తయున్.

20


సీ.

మిథ్యాభిమానసమ్మిళితుల వివరణకలితోత్తరంగులఁగా నొనర్చుఁ
గలనైన ధర్మకౌశలము నేమఱనివారలకు హేమాద్రిమార్గంబుఁ దెలుపు
నతినయజల్పాభిరతుల వీక్షించి చింతామణి హస్తగతంబు సేయుఁ
బ్రబలతంత్రవిచారపారీణు లగువారి దొరసి ప్రభాకరసరణిఁ జూపుఁ
దత్తదధికారులకు నిట్ల [20]తదుపయోగ, గతులఁ గఱపెడుగురు వై యఖండసమర
విజయవేంకటపతిరాయ భుజకృపాణ, ముఖిలదర్శనాద్భుతశక్తి నతిశయిల్లు.

21


ఉ.

ధీరవతంసవేంకటపతిత్రుటితారిసితాతపత్రముల్
భూరిజవంబునం దిరుగుఁ బోరులఁ దజ్జయలక్ష్మికిం దిగం

భోరుహనేత్ర లెత్తుతెలిముత్తెపుటారతిపళ్లెరంబు లై
చారుతదీయహేమకలశంబులు దీపము[21] లై వెలుంగఁగన్.

22


ఉ.

వేంకటభూవరుం జెనకువీరులు తూఱఁగనైన గంటితోఁ
బంకరుహాప్తబింబము విభాసిలు నాజి నసృగ్ఝరంబులన్
సంకులవృత్తిఁ దద్వరణసంభ్రమసంభ్రమదాదితేయతా
టంకవతీపదాంబుజహఠచ్యుతనూపురరాజమో యనన్.

23


క.

ఆవేంకటపతినృపతి ద, యావీక్షాగౌరవమున నతిశాశ్వతల
క్ష్మీవైభవంబుఁ గాంచిన, నావంశం బభినుతింతు నవమధురోక్తిన్.

24


శా.

శ్రీవిద్యావిభవాస్పదం బయిన యార్వేలాన్యవాయంబునం
బావిత్ర్యాభినుతస్వతంత్రకపిసన్మౌనీంద్రగోత్రుల్ ధరా
దేవోత్తంసులు మించి రందు బెడఁగొందెన్ భూజనశ్రేణి సం
భావింపం దరిగొప్పులాంకుఁ డగు శ్రీమల్లప్రధానుం డిలన్.

25


చ.

విముఖతఁ బూను మిత్రునెడ వే ఘనులం గని డాఁగు శుద్ధప
క్షమున వసుచ్ఛట ల్విడువఁజాలఁడు సారెఁ బ్రకాశితాంశుఁడై
తమి వెలయించుఁ గాని తనుదానమునం గడుఁ గుందు నేగతిం
గుముదహితుండు సాటి తరిగొప్పుల మల్లనమంత్రి కీగులన్.

26


[22]క.

ఆతరిగొప్పుల మల్లసు, ధీతిలకుఁడు గాంచె నరసధీనిధి నతిఖ
ద్యోతద్యుతి నతులితవి, ద్యాతతి నతిసుకృతి నాగమాంబికయందున్.

27


సీ.

తననిశాతకృపాణియును బాణియును బతిశ్లాఘాధురానిరాసము ఘటింపఁ
దనకరుణాసారమును సారమును నరిశాసనస్మయవివాసనము చలువఁ
దనసద్గుణనికాయమును గాయమును సుధాకిరణవిస్ఫురణ ధిక్కృతి యొనర్పఁ
దనమనీషాభోగమును భోగమును సుధాంథఃప్రధానావధూననము దెలుపఁ
దసప్రభావంబు భావంబు ధర ననంత
ధృతి సమాసాదనంబునఁ దేజరిల్ల
వఱలు నాశ్రితబాంధవాననపరుండు
మంత్రిమాత్రుండె నరసయామాత్యవరుఁడు.

28


చ.

చతురాస్యాననపాళిక న్మెలఁగు నంచత్పాండుపద్మాసన
స్థితి దీపించు వినిర్మలాంబరరుచిశ్రీ మించు హంసాళి న

ప్రతిమానోన్నతిఁ [23]దోలియాడుఁ దిలకింప న్శుద్ధవర్ణాధిదే
వత గాదే నరసప్రధానమణిదివ్యత్కీర్తి యశ్రాంతమున్.

29


చ.

నరసామాన్యచరిత్రుఁడే ధర బుధానందప్రదానూనదా
నరసామాన్యయశోవిశోభితదిగంతశ్రేణిగంధర్వకి
న్నరసామాత్యభిరామశుద్ధతర[24]గాంధర్వైకసంస్తుత్యుఁ డౌ
నరసామాత్యవరం డనంతపదచింతాపావనుం డెంతయున్.

30


గీ.

వెలయు నాతనిదేవేరి విజితభర్తృ
దేవతాజననికురుంబ తిప్పమాంబ
బహుమహాభోగముల నుంచుభర్తకుఁ దల
వంపు లొనరించినధరిత్రిపెంపుఁ దెగడి.

31


సీ.

సకలసన్నుతచర్య సద్గురుపరిచర్య పావనయదువర్యపదసపర్య
యన్నదానఖ్యాతి యనఘసాధ్వీనీతి నియతార్యజనతాతిశయవినీతి
బంధురక్షాశక్తి పరమధర్మాసక్తి నిత్యసూనృతయుక్తి నిర్మలోక్తి
యాశ్రితాశాపూర్తి యలఘుశీలస్ఫూర్తి బహుసతీముఖవర్తిభవ్యకీర్తి
యార్తసంరక్షణంబును నతులభాగ్య, లక్షణంబును గారుణ్యవీక్షణంబు
సహజసిద్ధంబు లీపుణ్యచరిత కని ను, తింపఁ బొగడొందు నరసయతిప్పమాంబ.

32


చ.

గురుపరిభూతి లేనిసతి గోత్ర[25]ధరస్థితి లేనియుర్వి సో
దరపరిపాలనావిముఖధామవిహారము లేనికల్మి బి
త్తరి యని బాంధవాశ్రితవితానము సన్నుతి సేయఁ బొల్చు నా
నరసయతిప్పమాంబ భువనస్తవనీయగుణావలంబ యై.

33


శా.

అత్రిప్రాభవుఁ డానృసింహుఁ డనసూయాత్యంతసంస్తుత్యచా
రిత్రశ్రీనిధి తిప్పమాంబవలనం బ్రీతిన్ బుధానీకని
త్యత్రాణైకధురీణు నప్పవిభు నేత్రానందపూర్ణేందు ద
త్తాత్రేయాహ్వయు మల్లికార్జునుని నార్యాసక్తుఁ గాంచె న్మహిన్.

34


శా.

తారారాజి గణించుఁ జుల్కఁగఁ గళాధామాంశుమాద్యత్సుధా
పారావారతరంగరేఖలఁ దృణప్రాయంబుగా నెన్నుఁ దా
నౌరా యప్పయమంత్రిశేఖరుని సంఖ్యావత్త్వముద్రామహా
ధౌరంధర్యనిరూఢనిర్మలయశోధారాపరీవాహముల్.

35

చ.

అనవరతాన్నదాననిధి యానరసప్రభు నప్పనార్యు నీ
డనఁ దగునే సుతా[26]పరిణయంబున వేల్పుల కొక్కనాఁడు భో
జన మతిశీతలం బిడిన సాగరరాజుఁ బదింట నైదిటన్
ఘనరుచి దక్క నొక్కొకనిగ్రాన మొసంగుతుషారభానుఁడున్.

36


సీ.

తనదిక్కుఁ జేరుమిత్రునకుఁ దేజము మించఁ దగుసర్వమంగళోత్పాదకుండు
ఘనుల నానాదిగా గతులఁ గైకొని పూర్ణజీవనం బొసఁగులక్ష్మీగురుండు
వరధర్మమున గోత్రవర్గంబుఁ [27]దగుతావు లెనయించి నిలిపినపృథుసమాఖ్యుఁ
డాశ్రితద్విజనాయకావనుం డై తదిష్టైకసంపదఁ గూర్చులోకబంధుఁ
డరయఁగఁ బ్రధానమాత్రుఁడే యఖిలవినుత
మాధ్వదర్శనధౌరేయమాననియమ
పరమహరిగురుచరణాబ్జభజనపరుఁడు
మంత్రినరసయ్య యప్పనామాత్యవరుఁడు.

37


చ.

తదనుజరత్న మై వెలయు దత్తనమంత్రి మహావిపక్షదు
ర్మదబలమర్మదారణధురంధరసంగరచాతురీవిశా
రదుఁ డగు వేంకటక్షితిపురందరు నప్రతిమానరాజ్యసం
పదలు [28]ఫలింప నాకు లిడు భవ్యగతిశ్రితపారిజాత మై.

38


సీ.

వర్ణంబులనె కాదు వరవృత్తతాస్ఫూర్తి సన్నుతోభయవంశజనులయందుఁ
బత్రంబులనె కాదు పంక్తిశోభ సదాప్రదీయమానాన్నభుద్ద్విజులయందు
వాచికోక్తినె కాదు సూచితార్థబహుత్వమతులసత్కవిబుధాశ్రితులయందు
లిఖనక్రియనె కాదు లీలాశుభావనం బానతారాతిప్రధానులందుఁ
బొరయఁలదిర్మలరాయేంద్రభూరిపుణ్య, రాశి యగువేంకటోర్వీసువ్రాయసములు
వ్రాయుచాతుర్యమున నిజస్వామిహితవి, ధానసురమంత్రి నరసయదత్తమంత్రి.

39


మ.

అరుదార స్వరపత్రవృత్త యయి దత్తాత్రేయసంస్పర్శనా
క్షరయోగోన్నతిఁ గన్నలేఖిని మహాగర్వాంధసామ్రాజ్యసం
హరణం బున్నతరాజ్యసంభృతియు ద్వీపాంతరకృపాకర్షణ
స్ఫురణంబు బహుదేశవస్తుభరణంబుం గాంచు నంచద్గతిన్.

40


సీ.

యాదవాగ్రజునిపటాటోప మెల్ల [29]గౌరీవరుసుగ్రీవభావమెల్లఁ
గుముదాప్తుమండలక్రమణచిహ్నం బెల్ల నుడుపరంపర నుండునునికి యెల్ల

సిరిఁగన్నతండ్రియాంతర మెల్లఁ బలుకులకొమ్మయుఁ దలయెత్తికొనుట యెల్ల
శేషపన్నగమునున్మేషవైఖరి యెల్లఁ జదలుమ్రానికడిందిచాయ యెల్ల
నగి తెగడి మీఱి కేరి తృణం బొనర్చి, యడఁచి కారించి వారించి యడరు నేవి
వేకనిధికీర్తి యతఁ డొప్పు [30]వేంకటేంద్ర, దత్తసామ్రాజ్యవిభవుండు దత్తమంత్రి.

41


మ.

ఘనగోత్రోద్ధరణం బసంఖ్యసుకవిగ్రామప్రదానైకసా
ధనసద్భావధురంధరత్వము మహాదర్పోద్దతారీప్రధా
ననిరాసోద్భటపాటవంబు నిరవొందన్ దత్తనార్యుండు శ్రీఁ
దనరు న్వేంకట[31]రాయదక్షిణభుజాదండావిశేషస్థితిన్.

42


క.

ఆదత్తమంత్రి యనుజుఁడ, శ్రీదత్తాత్రేయయోగిశేఖరసేవా
మోదితుఁడ సుధారసధా, మోదితుఁడ న్మధ్వమునిమతోద్ధారకుఁడన్.

43


సీ.

వరగంధచర్చిక ల్వాగ్విస్తరమచర్చికలు సూరిహృదయభాగములఁ గూర్చుఁ
గర్పూరమయవీటికవనాశుపదధాటికలు రసజ్ఞసుహృన్ముఖములఁ జేర్చు
నతిచిత్రనేత్రముల్ యమకాదిచిత్రము ల్మాన్యసత్కవిజనాత్మల ఘటించు
మహితసువర్ణము ల్మధురసందర్భవర్ణములు ప్రాజ్ఞమహాశయముల నించు
గండభేరుండబిరుదవిఖ్యాతమతికి
రాయసము మల్లనికిఁ గవిరాయనికిని
మహిని గవిమానులును మంత్రిమాత్రులును స
మానమే యన వెలసినమానఘనుఁడ.

44


ఉ.

నా కుపకర్త నాకుఁ జెలి నాకు సహాయుఁడు నాకుఁ బ్రాపిల
న్నాకు బహుప్రదుం డని మనంబున వేంకటరాట్సభాజనా
నీకము సంస్మరింప మహనీయగుణోన్నతిఁ గన్న యుత్తమ
శ్లోకుఁడ మల్లనాహ్వయుఁడ సువ్రతు మత్కృతినాథు నెన్నెదన్.

45


[32]సీ.

నిజగర్భగతజగన్నిచయ మారయులీల నంతర్ముఖాపాంగుఁ డైనవాని
నలినజాండావృత్తి నాభివీథికి నేర్పురీతి నక్షసరంబుఁ ద్రిప్పువాని
శ్రుతు లాత్మయంద నిల్పుటఁ దెల్పుతెఱఁగున నవరుద్ధనిశ్వాసుఁ డైనవాని
దనపూనినధరిత్రికి నలోలత ఘటించుపగిది [33]జటిలవృత్తిఁ బరఁగువాని
బ్రాక్తనస్వీయదామోదరత్వ మెఱుఁగఁ
జేయుగతి యోగ[34]పట్టికఁ జెలఁగువాని

యోగముద్రైకసూచితాచ్యుతచరిత్రుఁ
డైనవాని దత్తాత్రేయమౌనిఁ గొలుతు.

46


మ.

యతిలీలాయితదత్తచిత్తుఁ డగుపద్మాక్షుండు విశ్వావన
స్థితికిన్ రాజు నొనర్చి యాత్మభుజహేతిన్ సర్వసౌభాగ్యయో
గ్యత లెల్లం గరుణించు నాఁగఁ గృతవీర్యక్ష్మాపసూతి న్నిరా
హతచక్రేశ్వరవృత్తి గా మనుచుదత్తాత్రేయుఁ గీర్తించెదన్.

47


మ.

కమలాకాంతున కెంతసత్కృపయొ లోకశ్రేణిపై బ్రహ్మశ
క్రమహేశాదుల నమ్మ కీజగముయోగక్షేమముం గాంచునె
య్యమునం దానె చరించు నెల్లెడల దత్తాత్రేయయోగీంద్రవే
షమునన్ దీనులఁ బ్రోచుచున్ ఖలులయుచ్ఛ్రాయంబు వారించుచున్.

48


సీ.

ఈముని మునివ్రేళ్ల నెనయునక్షసరంబు పద్మాక్షవిస్ఫూర్తిఁ బరిఢవిల్లె
నీయతి యతిపుణ్యధృతిఁ గాంచుకుండిక తీర్థపదఖ్యాతిఁ దేజరిల్లె
నీయమి యమితసత్కృపఁ గన్న యజినంబు నీలవర్ణనిరూఢి నివ్వటిల్లె
నీశమి శమితాఘవృత్తి నూనినదండ మురుతరానంతవైఖరిఁ దనర్చెఁ
దనపరికరంబు లెల్ల ని ట్లనుపమాచ్యు
తప్రభావంబు లై మించఁ దా ధరిత్రి
నరుదె యోగీశ్వరేశ్వరుం డగుట యనఁగఁ
బొలుచుధన్యు దత్తాత్రేయుఁ బొగడఁ దరమె.

49


మ.

అను వొప్పం బరమాచలాత్మఘటితోద్యత్కుండలిస్ఫూర్తిచే
ఘనపంకాబ్ధి మథించి నిత్యతరయోగశ్రీనితాంతోపగూ
హనరోమాంచసమంచితాంగుఁ డగుదత్తాత్రేయనారాయణుం
డనవద్యామృతసారము న్విబుధలోకాధీనముం జేయఁడే.

50

షష్ఠ్యంతములు

క.

ఏతాదృశబహుచరితున, కాతారకనిత్యనిజశుభాచరితునకున్
శ్రీతనయాధూతనయా, [35]పాతనయాపితభవర్షిపరిచరితునకున్.

51


క.

అస్మత్కులదేవత కన, ఘస్మరఘస్మరవిరించిఘటితచటుశ్లా
ఘాస్మేరున కస్మయపర, మస్మృతి[36]గోచరునకును నమత్ఖచరునకున్.

52

[37]క.

సద్యోజితతాపత్రయ, సద్యోజిత[38]భద్రమననచాతుర్యునకున్
విద్యోతితవిద్యోచిత, హృద్యోదితబోధితార్యహితచర్యునకున్.

53


క.

మాహురపురకృతవసతి క, నీహనుతోన్నతికి నఖిలనిర్జరశుభసం
దోహదవరణోహదవర, దోహదయాశిశిరమతికి ధుతసంసృతికిన్.

54


క.

తత్తాదృశవిత్తాభృశ, కృత్తాదృశరాగయోగికృతచిత్తమహో
దాత్తమతిధ్యేయునకును, దత్తాత్రేయునకు నాశ్రితవిధేయునకున్.

55


వ.

[39]అంకితంబుగా నాయొనర్పంబూనిన చంద్రభానుచరిత్రం బనుమహాప్రబంధం
బునకుం బ్రారంభం బెట్టి దనిన.

56

ద్వారకాపురవర్ణనము

మ.

సిరికిం బ ట్టయి యొప్పు ద్వారవతి యక్షీణాబ్జరాగోజ్జ్వల
ద్వరణాధిష్ఠితహీరకేసరికరద్వంద్వప్రభిన్నాభ్రసిం
ధురనిర్యన్నవమౌక్తికచ్ఛలసుమస్తోమంబులం గేతనో
త్కరము ల్సారెకు సాఁచి విష్ణుపద ముద్యల్లీలఁ బూజించుచున్.

57


మ.

పరిఖావారిధికూఁతు రైనసిరి కబ్జాతంపుటిం డ్లొక్కెడ
న్విరియు న్మోడ్చు నొకప్పు డంచు మది వానిం జాల నిందించి సు
స్థిరతం బన్నిన సంతతోన్మిషిత మౌ చెందమ్మిచందమ్మునం
బరఁగుం బంగరుకోట వీటఁ బయికొమ్మల్ ఱేకు లై మించఁగన్.

58


క.

ప్రోల న్ముత్యవుఁగొమ్మల, చా లింపగు నమృతపూరసంగతపరిఖా
వాలయుతకర్బురాహిత, సాలంబునఁ జెడనిననలు జనియించె ననన్.

59


మ.

వరణేంద్రోపలకాంతిశర్వరి నిజస్వర్ణంబు లెల్లం బయో
ధరముల్ మ్రుచ్చిలి మారుతత్వరఁ జనం దత్ఖేయవారాశి గో
పురకేతుచ్ఛలన న్మహోర్మినికరంబుల్ సాఁచి వేయన్ గళ
త్కరకాదంతములై భజించు నవి యుద్యన్నీరదాఖ్యానమున్.

60


క.

నరవరమణిహర్మ్యవిభా, కరబంధురకనకవరణకైతవజాగ్ర
త్పరిధియుతమధ్యతలమై, పరిఖాపుష్కరము తేటపడు నవ్వీటన్.

61


ఉ.

ఆపురి నిండువెన్నెలల నగ్రవిధూపలసంభవాంబుధా
రాపటలచ్ఛలామరతరంగిణి ఖేయపయోధిఁ గూడరాఁ

బ్రాపున గచ్చునిచ్చెనలు పన్నినకైవడి గోపురావళుల్
కైపు వహించె మెట్టుపలకల్వలె వాకిళు లుల్లసిల్లఁగన్.

62


ఉ.

సారెకుసారెకున్ గవనినందుల నప్పురి సొచ్చి యేగువాఁ
డై రజనీకళత్రుఁడు తదగ్రతలస్థితరక్షివర్గముం
జేరి మెయిన్ సికాగుఱుతు చేకొనఁబోలును గాకయున్నచోఁ
బేరినవెన్నవంటిశశిబింబమున న్నెఱ[40]కందు దోఁచునే.

63


చ.

కురుఁజులు సారె లచ్ఛమణికుట్టిమభాగము లిండ్లు మధ్యగో
పురము పణంబుగా నిడిన భూరిసువర్ణము[41]గాఁ జతుర్దిశా
సరసిజనేత్ర లర్థిఁ జవుసారెల నాడఁగ నుత్కటాక్షసం
చరణము మీఱఁ [42]బూ న్పగడసాల యనం జవువీథి చెల్వగున్.

64


చ.

అలుగక దంపతు ల్గదిసి యర్ధసతీశ్వరు పెక్కుమూర్తు లై
యలరఁగఁ జూచి యాత్మవిశిఖావళు లొక్కెడ జైత్రకార్ముకం
బు లొకకడ న్మరుండు వెఱవూని కలంగుచుఁ బాఱవైచె నా
నలరులు నిక్షుదండములు నప్పురవీథుల నొప్పు నెప్పుడున్.

65


ఉ.

సోరణగండ్లవెంట వెలజోటులు వీథులయొప్పుఁ జూచు నొ
య్యారపుఁజూపు లింపెసఁగు హర్మ్యపతాకలు రాయిడింప బృం
దారకదీర్ఘికాంబుజవనంబులు పంపిన దూఱు సెప్పఁగాఁ
గోరి పురాబ్జగేహకడకుం బఱతెంచునళివ్రజం బనన్.

66


మ.

రయగచ్చత్కమలాప్తఘోటకఖురాగ్రక్షుణ్ణకేళీహిర
ణ్మయసౌధాగ్రగళత్పరాగములు గప్పట్టుం బురీనీరజా
లయ యత్యున్నత సంపద న్సురపురీలక్ష్మిం దుటారించి తా
జయముం గాంచిన మెచ్చి బ్రహ్మ కనకస్నానంబు గావించె నాన్.

67


చ.

తళతళ మించు మాడువులఁ దాచినవజ్రపుఁజెక్కడంపుఁగీ
ల్గలజలయంత్రహేమమయకాండము లింద్రునివీటఁ బొల్చుమే
డలు సురసౌధము ల్గెలిచి ఢాకగ నచ్చట గెల్పుఁగంబము
ల్నిలిపినరీతిఁ బై కెగయు నీరు యశోవిభవంబుఁ జూపఁగన్.

68


చ.

చక్కనిమింట నేగునెఱచందురుజింక నవేందుకాంతపుం
జక్కటిఁ [43]దోఁచు రత్నమయసౌధములందుఁ గిరీటిపచ్చఱా

మొక్కలడాలుపేరిససిమొత్తము నిచ్చలుఁ జొచ్చి మేఁతకై
ద్రొక్కునటంచుఁ బందిచొరఁదోలెఁ బురేందిర నాఁగ రాకలన్.

69


ఉ.

ఆనినవేడ్క సారసవనౌఘవివర్ధనకృత్కరాగ్రసం
జనితనిర్మలామృతము నాకుల కిచ్చుచు నాత్మవల్లభుం
డై సకళాధినాయకునియట్ల మెలంగుఁ బురద్విజాళి రా
జానుమతంబు ధర్మ మనునర్థము డెందమునం దలంచుచున్.

70


చ.

పురినరపాలనందనులభూరిభుజాభుజగాసిధారచే
సరిధరణీధవుల్ నిహతులై తనబింబముఁ దూఱిపోవఁగాఁ
దొరఁగినక్రొత్తనెత్తురులఁ దోఁగి సరోరుహిణీమనోహరుం
డరుణత పూని కాదె చరమాంబుధిఁ గ్రుంకెడు మాటిమాటికిన్.

71


చ.

వెలయుఁ గిరాటకోటి గృహవీథుల మేటికిరీటిపచ్చరా
మళిగలకంబముల్ శుభరమారమణీయసమాగమంబునం
బొలుపుగ నిడ్డరంభ లస బోదెకుఁ గట్టినరత్నగుచ్ఛముల్
గెలలుగ నగ్రసంఘటితకేతనముల్ చిగురాకు లై తగన్.

72


చ.

అలవికి మీఱిఁ బండి పురిహాలికవర్యులు వైచి కొల్చుతి
ప్పలతుదధాన్యము ల్కలనఁ బర్వు విభావసుహేతిఁ జిట్లి క్రే
వలఁ జెదరు న్వసుంధర నవగ్రహదోషహఠాద్విరామముం
దెలుపఁగఁ జాలి సారె నలుదిక్కుల రాలునుడువ్రజం బనన్.

73


చ.

తెలియక యావిమానములఁ దెచ్చి యమానము లంచు నెల్లరుం
బలుకుదు రింతెకా కవి సమానములై మహిమీద నెచ్చట
న్మెలఁగుట గాన మంచు నిజనేమిరవార్భటిఁ జాటి చెప్పుచు
న్వలదభిజాతకేతుభుజవల్లరు లెత్తుఁ బురీశతాంగముల్.

74


ఉ.

ఆనగరంబుకోట యిడునప్పుడు లోపలఁ జిక్కి పోవఁగా
లేనిఘనౌఘము ల్కరటిలీలఁ జరింపఁగఁబోలుఁ గానిచో
దానము గల్గి పుష్కరము దాల్చి ఘనాఘనతావిజృంభణం
బూని ప్రభిన్నపద్మకసముజ్జ్వలభావమున న్వసించునే.

75


ఉ.

ఆశుగతాగ్రహం బెనయు నమ్ములుఁ దెమ్మెరలున్ స్వవేగవీ
క్షాళుగతాగ్రహంబు లయి హత్తి నిజోభయపార్శ్వవర్తితా

కౌశలిఁ జామరగ్రహణకర్మము లూన జనాత్మ లద్భుతా
వేశమునం దముం బొగడ వీటిహరుల్ నెఱపు [44]న్సుధారలన్.

76


చ.

అరుణుఁడు సైంహికేయులకు నల్కి మణీమయఖేటకాకృతిం
గరముల వాల నుగ్రతరఖడ్గమిషంబునఁ బట్టి తెచ్చి యా
సరసిజబంధుశాత్రవుని సారెకు నప్పురిమేటిజోదు ల
య్యిరువురఁ బంత మొప్పఁ గలయింతురు దండకుఁ [45]బూంచి సాములన్.

77


సీ.

ఒక ప్రొద్దు బిగిగూడి యుండుచక్రము లెంత యొకవంకఁ బొగడొందుశకులి యెంత
యొకవేళఁ గాంతిచే నొప్పువిద్రుమ మెంత యొకమూలఁదగుకుందనికర మెంత
యొకపూఁట నివసించునుడుసమూహం బెంత యొకచాయ దీపించుముకుర మెంత
యొకతటి [46]సిరి గూడ నొదవినసుధ యెంత యొక[47]పక్ష మడరుచంద్రకళ యెంత
గరిమ వీరల గుబ్బలు కన్ను లధర
ములు రదంబులు నఖములుఁ దళుకుఁజెక్కు
లలఁతినగవులు [48]మొగములుఁ దలఁచునెడల
ననఁగ వెలయుదు రచటిపణ్యాబ్దముఖులు.

78


సీ.

లలితప్రవాళజాలపయోనిధానముల్ ధారిణిమృగమదద్రవరచనలు
నవ్యపతంగమండలనభస్థలములు రోదసీసురభి[49]ధూపోదయములు
సంవలచ్చపలాళిజలదసందోహంబు లలఘుపురాబ్జగేహాకచములు
చలదుదగ్రపలాశజాలతమిస్రముల్ హరిదేణనేత్రాసితాంశుకములు
కలితసుమధూళిసుమధూళి[50]వలయమలయ
నికటఘటమానపవమాననికరసుకర
చలితఘనసారఘనసారసహితమహిమఁ
దనరు నవ్వీట వాసనావనులు వనులు.

79


సీ.

తావులు లేకున్నఁ దతరత్నశృంగచయంబులో లేమావు లరయు టెట్లు
మ్రోఁతలు లేకున్న ముగ్ధేందుకాంతమార్గములలో సెలయేళ్లు గనుట యెట్లు
చలువలు లేకున్న శాతమన్యవమణిస్థలులలోఁ గలఁకులఁ దెలియు టెట్లు
మలయుట ల్లేకున్న మరకతోన్నతశిలాప్రతతిలో ననఁటు లేర్పఱుచు టెట్లు
జనము లన గొజ్జఁగుల[51]జాఱి చఱుల దుమికి
దొనలఁ గ్రేళ్లుబ్బి కోసలఁ దూఱి జంత్ర

ముల నిగిడి తుంపురుల్ చల్లు పూవునీటఁ
దనరువలిగొండ లనఁ గేళిధరము లచట.

80


ఉ.

పచ్చనిరాజనంపుమడిపజ్జబలాకలు చుట్టు నుండఁగా
నచ్చపుఁజెందొవ ల్వెలయు నాపురలక్ష్మికి భూతధాత్రి దా
నచ్చులపేరిహస్తముల సంచుల ముత్తెము లుంచి యెత్తుక్రొం
బచ్చలపళ్లెరంబునడుముం దగునారతిదీవెలో యనన్.

81


సీ.

తనసమీరణవృత్తి తథ్యంబు గావింప గణికావశీకారగరిమఁ బూని
తనగంధవహరూఢి తథ్యంబు గావింప నలసయానప్రౌఢి నలవరించి
తన గత్ప్రణత తథ్యంబు గావింప జనుల కామోదంబు సవదరించి
తనపృషద్వాహాఖ్య తథ్యంబు గావింపఁ జలువ లంతంతకు సంతరించి
తనమరున్నామకంబు తథ్యం బొనర్ప, నసమసాయక[52]సాయకాత్యంతతాంత
విగ్రహులమీఁద నవపుష్పవృష్టి గురిసి, యాపురంబున మెలఁగు [53]మందానిలంబు.

82


క.

ఆనగర మేలు [54]దానవ, మానవతీకుచకురంగమదమకరీసం
తానతిరోధానవిధా,మానితతరవారి శౌరి మహిమోన్నతుఁ డై.

83


క.

ఆవనమాలికిఁ బట్టపు, దేవేరులు గలరు మదవతీమణు లెనమం
డ్రావెలఁదులలో మెఱుఁగుం, దీవెలవలెఁ దనరు రుక్మిణీసత్యలకున్.

84


గీ.

శౌరి మిక్కిలి చనవిచ్చి సంతరించు, సవతు లందఱు లోఁగి యిచ్చక మొనర్తు
రందు రుక్మిణి గనియె ముకుందుకరుణఁ, జెఱకువిలుకాని సురలు జేజేలు పెట్ట.

85


ఉ.

[55]ఇక్కగ ముజ్జగంబు నుతియింపఁగ బంధులు గారవింపఁగాఁ
జక్కనిముద్దులాని నెఱజాణని ఱెక్క మెఱుంగుఁబచ్చఱా
పక్కెరతేజి నెక్కు [56]నవపంచశరుం గని భోజకన్య య
మ్మక్క యనంగఁ జాలు విభవాతిశయంబున విఱ్ఱ[57]వీఁగుచున్.

86


ఉ.

ఆ చెలిఁ జూచిచూచి కడుపారఁగ ముద్దులపట్టిఁ గానఁగా
నోఁచనియింతిజన్మము గనుంగొన [58]రత్త యటంచు సత్యభా
మాచపలాయతాక్షి పలుమాఱును దాఁ దను దూఱుకొంచుఁ జిం
తాచలచిత్త యై యదవద న్మదిఁ గుందుచు[59]నుండ నత్తఱిన్.

87

శ్రీకృష్ణుఁడు సత్యభామసౌధమున కేగుట

క.

ఒకనాఁడు నందకులనం, దకుఁ డాసత్యావధూటిధామంబున నా
హ్నికకృత్యంబులు దీరిచి, యకలంకామోదమానసాంభోరుహుఁ డై.

88


సీ.

ఒక కొంత యొరఁగినసికమీఁది ముడివువ్వుటెత్తుల దొరయఁ దాయెతులఁ జుట్టి
పన్నీటిచినుకులఁ బద నైననికరంపుఁగస్తూరివరతిలకంబుఁ దీర్చి
గంబూర మించి కదంబంబు చేసినపలుచనికుంకుమకలప మలఁది
చెక్కుటద్దములపైఁ జికిలివెన్నెలసోన లొలికెడు కట్టాణియొంట్లు దాల్చి
మెఱుఁగుఁజంద్రిక[60]గోణము చెఱఁగుడాలు
వలిపె[61]వలెవాటుదుప్పటి వెలికిఁ గ్రమ్మ
మినుకురవకెంపుఁబావలు మెట్టి యొక్క
యతివ కైదండ యొసఁగ నొయ్యార మెసఁగ.

89


చ.

పవడపునిల్వుఁగంబములపై నెలకొన్నపసిండిబోదెలం
జివురుచు కెంపుడా ల్మదనచేతులఁ దార్చినవేల్పురాచఱా
సవరనికేలుఁదామరలచాయలు సోరణగండ్ల ధూపపుం
బొవలుగమించు కేళిగృహముం బ్రమదంబున డాసి యచ్చటన్.

90


చ.

అలఁతిగ నంటినం బొలుచునారజపున్ జగజంతరీరొదల్
గులుకుమెఱుంగుఁగెంపుతఱిగోళ్ల నమర్చిన నాగవాసపుం
గొలుకుల జళువాగొలుసుగోళ్లఁ దగుల్కొని వ్రేలుపచ్చఱా
చిలుకలతూఁగుమంచమున శ్రీరమణుండు వసించు నత్తఱిన్.

91


చ.

చికిలికిరీటిపచ్చరవిచెక్కడపుంబని కీలుఁజిల్కతో
రక మగుపైడియాకుపదరంబున నుంచినపండుటాకు లి
చ్చకపుటొయారము ల్వెలయ సత్య కరంబునఁ బూని వేడ్క నొ
క్కొకమడు పొయ్య నిచ్చుచు మృదూక్తుల ని ట్లనియె న్మురారికిన్.

92


సీ.

పినపినయపరంజిబిరుదులయడపంబు గట్టఁ బాండ్యక్షమాకాంతతనయ
కళ గలపచ్చకంకణములకాళాంజి దాల్పఁ గోసలమహీధవకుమారి
చకచక మించువజ్రంపుటీనెలకుంచె నీవఁ గర్ణాటభూవిభుతనూజ
తళతళ వెలుఁగు రేవెలుఁగుఱానునుగిండి పూన మాళవధరాజనిపుత్రి

యఖిలవైభవముల మించినట్టినాకు, వాంఛిత మొకండు లే దైన [62]వలయుఁ దెలుప
విన్నవింపఁగఁ [63]దగినట్టిచిన్న దొక్క, మనవి గల దాలకింపుము మనుజనాథ.

93


క.

అని పలికి ఱెప్పతుదల, న్నునుసిగ్గు దొలంకఁ దనుఁ గనుఁగొనుసత్యా
వనితతలఁ పెఱిఁగి చూడ్కుల, ననుపమవాంఛితము లొదవ హరి కరుణించెన్.

94


క.

జలజాతాక్షికి నంతట, నెల మసలెం జన్నుమొనల నీలిమ దోఁచెం
దెలు పెసఁగె మేనఁ గోర్కులు, దలమయ్యె న్నిదుర మిగులఁ దావలమయ్యెన్.

95


క.

నవలావణ్యాకర మగు, నవలానెన్నడుము బలిసె నడ జడనయ్యెన్
లవలీపల్లవలీలల, నవలీల జయించెఁ జెక్కు లవదాతరుచిన్.

96


ఉ.

నిద్ధపుసన్ననెన్నడుము నింగి పరిస్ఫుటవృత్తిఁ బూనె లే
నిద్దుర [64]పైకొనందొణఁగె నిర్మలలోచనవారిజాతముల్
గద్దఱిచన్నుజక్కవమొగంబులఁ గప్పు దొలంకసాగె న
మ్ముద్దియ చంద్రభాను నవమోహనసంపదమేనఁ దాల్పఁగాన్.

97


గీ.

అంతరస్థితరాజహంసార్భకాప్తిఁ, గాంతమానస ముత్కలికలు వహింప
[65]నౌర పద్మిని సరసాంతరంగసగసి, సరణి కాందోళనము గల్గె నరుదు మెఱయ.

98


గీ.

చంద్రభానూదయము సమాసన్న[66]మైనఁ
బ్రాచిఁ గనుపట్టు కాంతివైభవ మనంగఁ
జంద్రభానూదయము సమాసన్నమైనఁ
బడఁతిమొగమునఁ గనుపట్టెఁ బాండిమంబు.

99


[67]శా.

లోకప్రస్తుతచంద్రభానుకలితాలోకాత్మనాథానురా
గైకప్రౌఢిమఁ జంద్రభానుకమనీయాలోకసంపన్న యౌ
నాకళ్యాణికి సత్యకు న్సరియె నిర్వ్యాజైకచంద్రప్రభా
సాకల్యంబును బూనలే కెసఁగునాశర్వాణియు న్వాణియున్.

100


మ.

ఒకనాఁ డంతట యాదవేంద్రుహృదయం బుబ్బంగ సౌభాగ్యసూ
చకనిర్వక్రగతిన్ శుభగ్రహము లుచ్చస్థంబు లై భానుచెం
తకుఁ బోకుండెడుసన్ముహూర్తమున నాతన్వంగి గాంచె న్సుతు
న్సుకుమారు న్సురలోకదుందుభీరవస్ఫూర్తుల్ విజృంభింపఁగన్.

101


మ.

కమలాధీశ్వరుఁ డంత గర్గముని యుక్తప్రక్రియన్ జాతక
ర్మము గావింపఁగ నాత్మసూతి కఖిలప్రహ్లాదకాక్షీణధా

మము కల్మిం దగఁ జంద్రభానుశుభనామం బుంచె ధాత్రీసురో
త్తమమిత్రప్రియబంధువర్గహృదయోత్సాహంబు దీపింపఁగన్.

102


క.

తల యంటి జలక మారిచి, కలకంఠీమణులు నుదుటఁ గాటుక నిడి పొ
త్తులలోన నుంచి కూరిమి, చెలఁగఁగ నానాఁటఁ బ్రోది సేయుచుఁ బెనుపన్.

103


ఉ.

భూరమణాత్మజుండు నునుఁబొత్తులోఁ దల యెత్తి యాడుచున్
బోరగిలంగ నేర్చెఁ బువుఁబోణులు జోలలువాడ వీనులం
జేరుప నేర్చె నెన్నొసలిచెక్కడపుంబనిరావిరేక చే
సారెఁ దెమల్ప నేర్చెఁ గనుసన్నల నవ్వఁగ నేర్చె నల్లనన్.

104


[68]చ.

పొలఁతులు మోవి గుల్కి కనుబొమ్మల నిక్కులు దోఁపఁ జూత్కృతుల్
చలిపి యదల్చిన న్నగు నెలం జెయిసన్నలఁ బిల్బుఁ దొట్లపైఁ
గొలఁదిగ వ్రేలురత్నమయగుచ్ఛముఁ దప్పక చూచు నక్కునం
గలపులిగోరు లాల దొలఁక న్వదనంబున నుంచు నెంతయున్.

105


శా.

కేలం బట్టినకెంపుఱాగొలుసులం గించిచ్చలోరోజదో
ర్మూలచ్ఛాయలు కుందనంపురవగుంపు న్నింప బాలు న్చోవ
లాలిత్యంబున నిద్రపొమ్మనుచుఁ దొట్లం బెట్టి జోకొట్టుచున్
లాలోలాలి యటంచు నూఁపుదురు జోలల్పాడి లీలావతుల్.

106


[69]మ.

అలసత్యోదితుఁ డొయ్యనొయ్యఁ గమనీయావ్యాజవాగ్వైఖరుల్
చిలుక న్నేర్బె ధరాప్రసాధనములై చెన్నొందుపాదాంకని
ర్మలలీలం దగఁ జంద్రభానుఁడు చరింపన్నేర్చె సద్వర్ణితో
జ్జ్వలవృత్తిం గళలెల్ల నేర్చె విధుసంజ్ఞాతుండు సౌమ్యస్థితిన్.

107


శా.

నానాఁటం బురియెక్కె నంగముల నందం బై యురఃపీఠి వి
ప్పూనెం జేతులఁ గండెముల్ దిరిగె లో నూహించె శృంగారలీ
లానందంబుల మానసంబు నడ నొయ్యారంబు దీపించెఁ గ
న్గోనల్ వింతలు [70]పూనె రాసుతునకు న్నూనూఁగుఁబ్రాయంబునన్.

108


మ.

కులుకుంజంద్రికపూరుమాలుకొనచుంగు ల్దూల బంగారుచి
ల్కలగోణాముచెఱంగు మించుకటిసేలాదుప్పటిం గట్టి పొం

గళుకున్వజ్రపుఁగీలు చేసరపణిం గన్పట్ట నారామవీ
థులలోఁ దాళము పూని యాకొమరుఁ డాప్తు ల్వెంటరాఁ ద్రిమ్మరున్.

109


[71]చ.

ఉడిగపువారు చే సగతు లూనుచుఁ బజ్జలఁ జేరి పాద పా
పడెయలిరాగెనాంగదలెస్వామి యహో జతనయ్య యంచు వెం
బడిఁ బలుమాఱు నెచ్చరిక పల్కుచుఁ గుల్కుచు రా హుమాయిత
త్తడి దుమికిఁచుచుం జను నతండు వయాళి హయాళి గొల్వఁగన్.

110


క.

తనకూర్మిసఖుఁడు సాత్యకి, తనయుం డగువిజయలోలుఁ దగఁ గూడి జగ
ద్వినుతుఁ డతఁ డట్లు మాధవు, నెనసినమకరాంకు[72]పగిది నింపొందుతఱిన్.

111


సీ.

సర్వతోముఖమార్గసంచారి యగువాఁడు తనప్రజల్ దనివొందఁదలఁచువాఁడు
భూదారవిఖ్యాతిభూషితుం డగువాఁడు హితునియక్కఱకునై యెసఁగువాఁడు
బలిగర్వసర్వస్వభంజనుం డగువాఁడు పూన్కి దప్పని రూఢిఁ బొల్చువాఁడు
ధర్మాభి[73]వర్ధనతత్పరుం డగువాఁడు పరువీటిసిరు లేటఁ బఱపువాఁడు
వినుతసర్వజ్ఞతాస్ఫూర్తి వెలయువాఁడు, హరి దువాళింప నేర్పరి యైనవాఁడు
దనుజులోకాభియాతిసంతతవిభూతి, నవని యేలుచు నొకనాఁ డహర్ముఖమున.

112


మ.

పలుమాఱు న్సముఖా యటంచుఁ బలుదబ్బ ల్పూని వేర్వేఱ ది
క్తలరాజన్యుల నెల్లఁ గంచుకులు వక్కాణింప సాత్రాజితీ
లలనాభర్త జగాహజారమున జాళ్వాసింహ[74]పీఠంబుపైఁ
గొలువుండెం గురు[75]పాండవప్రభులు కింకుర్వాణులై యుండఁగన్.

113

నారదాగమనము

సీ.

స్వర్గాపవర్గము ల్సవదరించినబిరుదము నాఁగ మహతి యంసమునఁ దనర
నమితతపోనిధానముఁ గాచుభుజగనాయకుఁడు నా యోగపట్టిక యెసంగఁ
దనుకాంతి వెడఁదహస్తమున వ్రాలిననిశానేత నా స్ఫటికకుండిక చెలంగఁ
గంజవిభ్రాంతిఁ జెంగట డాయుతేంట్లు నా వలకేల నలినాక్షవలయ మమర
నారదుఁడు గానఁ బెనఁగొన్న నవ్యచంచ, లాలతలకైవడి జటాకలాప మెసఁగ
నపుడు దివినుండి యుట్టిపడ్డట్లు వచ్చె, దివిజసంయమి హరిసభాభవనమునకు.

114


క.

ఈరీతి నరుగుదెంచిన, నారదునకు నెదురుగాఁగ నడతెంచి నమ
స్కార మొనరించి యుచితా, చారంబుల నతిథిపూజ సలుపుచు నంతన్.

115

గీ.

స్వర్ణమయపీఠమున మునీశ్వరుని నునిచి, యతనియనుమతిఁ దాను నర్హాసనమును
నధివసించి కృతాంజలి యై మురారి, ప్రబలజలధరధీ[76]రవాక్పటిమఁ బలికె.

116


సీ.

మౌనిమార్తాండ నీమహితపాదనిషేవ మామకపంకసమ్మర్ద మడఁచె
యతిశక్ర నీదుకళ్యాణధామప్రసంగతి సుధర్మావాప్తిఁ గఱపె నాకు
ప్రతిలోకచంద్ర నీరాక మద్వీక్షణోత్ఫలముల కామోదములు ఘటించె
మునిసార్వభౌమ నీఘనహస్తలాలనం బసమదానసమృద్ధి నొసఁగె నాకుఁ
బారికాంక్షిహర్యక్ష నీభాసమాన, గుణసమున్నతి యున్నతకుంభినీశ
గర్వనిర్వాపణధురీణుఁగా నొనర్చె, [77]నన్ను భవదీయవైభవం బెన్నఁదరమె.

117


క.

అన విని నారదుఁ డి ట్లను, వనజోదర నీవు [78]నొరునివైఖరి నీచొ
ప్పున నన్ను వినుతిసేయం, జనునే నినుఁ బొగడఁ గమలసంభవువశమే.

118


గీ.

అఖిలసంయమివరులు బ్రహ్మాదిసురులు, ప్రస్తుతింపఁగ వసుమతీభార ముడుప
యాదవాన్వయమునఁ బుట్టినట్టినీవు, మతిఁ దలంచిన నారమాపతివి గావె.

119


[79]మ.

స్తనపానం బొనరించుచో శిశువునోజం బూతనాక్షీరజీ
వనకీలాలవిషంబు లొక్కమొగి దుర్వారస్థితి న్నీవు గ్రో
లిన నేకార్థవిబోధకంబు లయి పొల్చెం గాదె తత్క్షీరజీ
వనకీలాలవిషంబు లన్పదము లవ్యాజప్రభావోదయా.

120


మ.

సురలోకేంద్రనియుక్తకల్పజలదస్తోమంబు లొక్కుమ్మడిం
గురియన్ ధేనులఁ బ్రోవ నెత్తునపు డాగోవర్ధనోద్యద్ధరా
ధర మింపొందదె నీభుజార్గళమునఁ ధారాధరప్రక్రియన్
[80]హరి నీ వెప్పుడు నాదివర్ణము గురుఖ్యాతిం గటాక్షించుటన్.

121


ఉ.

క్రుంగినకాళియోరగము [81]కూఁకటివేరు భుజార్దళంబు లు
త్తుంగతరప్రకాండములు తోరపునవ్వులు పూలు నర్తనా
సంగచలచ్ఛిరోజములు షట్పదపంక్తులుగా సురద్రులీ
లం గమలాక్ష కోరినఫలంబు లొసంగవె [82]యెట్టివారికిన్.

122


[83]క.

ఏపట్టునఁ గువలయపీ, డాపహృతి యొనర్తు ననుచు యదువంశమునన్
దీపించియుఁ గువలయపీ, డాపహృతి యొనర్పఁ జెల్లునయ్య మురారీ.

123

క.

అని విన్నవించి యతఁ డో, జనార్దనా యిప్పు డేను సవసవగా నే
ర్చినపాటి యొక్కగీతము, వినిపించెద నంచుఁ [84]జేతివీణె చెలంగన్.

124


క.

సరిగమపదనిసమాఖ్య, స్వరసందర్భంబు మెఱయ సారెలమీఁదం
గరమిడి గమకము లేర్పడ, మొరయించుచుఁ గొన్నిగీతములు పలికింపన్.

125


సీ.

ఒక లేమ యతనికి నుద్ది లేదని యిచ్చుకరము నా మడు పొండుకడకుసాఁరె
గేయ మౌఁ గాదన్న గెలువఁగొంగిచ్చె నాఁబావడ యొకయింతి బయలొసంగె
నువిద యొక్కతె మెచ్చి యొసఁగూనె నాఁజామరం బెత్తి వంచనేరక వసించెఁ
బరులవిద్యలు బరాబరి సేయుతెఱఁగు, నాసుదతియొక్కతె మోడ్పు సురటి విసరె
నిట్లు కొలువున నున్నపూర్ణేందుముఖులు, సమహితాశ్చర్యపరవశస్వాంత లైరి
హరియుఁ గన్నుల చెవులుగా నాలకించె, నాతపోధనుమహతీరవామృతంబు.

126


శా.

ఔరా మీటు బళీరె కంపిత మహో యాందోళితస్ఫూర్తి యో
హోరే మూర్ఛన బాపురే శ్రుతులు మే లుల్లాసితప్రౌఢి మ
జ్ఝారే లీనము చాఁగురే స్ఫురితమున్ శాబాసు ధా లంచు న
త్యారూఢప్రమదోన్నతి న్మురహరుం డాలించి వర్ణించుచున్.

127


గీ.

హృద్యతరతద్విపంచికావాద్యవిద్య, [85]నభ్యసింప మనఃకుతూహలము పూని
తనదు చెంగట [86]నలరు వైదర్భికూర్మి, సుతుని సత్యా[87]తనూభవుఁ జూపి పలికె.

128


క.

ఓవాచంయమి కొన్నా, ళ్లీ విక్కడ నధివసించి యీ బాలకులం
దావకశిష్యులుగా దయఁ, బ్రోవు మన న్ముఖసరోజమున నగవొలుకన్.

129


శా.

అంగీకార మొనర్చి [88]మౌనివరహర్యక్షుండు వా రిర్వురన్
సంగీతాభ్యసనైకతత్పరులఁ జెంతం జేరఁగాఁ బిల్చి త
న్మాంగళ్యాచరణం బొనర్చి కవవీణ ల్గూర్చి కౌతూహలా
భంగప్రౌఢి నుపక్రమించె శుభదప్రఖ్యాతలగ్నంబునన్.

130


సీ.

సప్తస్వరములమూర్ఛనలు తప్పకయుండ గుఱుతుపట్టుటకు కొన్నినాళ్ళు
సూళాదితాళము లొగియ నలంకారగుంఫనం [89]బొనఁగూర్పఁ గొన్నినాళ్లు
ప్రాగ్గేయకారవిరచితగీతంబులు [90]గ్రుక్కపట్టుటకునై కొన్నినాళ్లు
గౌళనాటవరాళికాముఖ్యరాగము ల్కొదలేక పలికింపఁ గొన్నినాళ్లు

వన్నియప్రబంధములు మీటఁ గొన్నినాళ్లుఁ
[91]గోరి గాయంబు లొదవింపఁ గొన్నినాళ్లుఁ
గాఁగ వారల కాజగరాగతపసి
నిరుపమవిపంచికాప్రౌఢి [92]నేర్పి యపుడు.

131


శా.

ఆలేఖవ్రతి మున్ను రుక్మిణికి సత్యాతన్వికిం బూలకై
కైలాటంబులు దా నొనర్చుట మొదల్గా నెక్కడన్ జాఠర
జ్వాలాశాంతి యొనర్పకున్ని మిగుల న్సంతప్తుఁ డై యప్పు డ
బ్బాలుర్ దత్సుతు లౌట నెమ్మనమున న్భావించి సోత్కంఠుఁ డై.

132


ఉ.

ఆహరిసూను లిద్దఱు మహామతిమంతులు గాన సంతతో
త్సాహముతోడ నొండొరులచందము మెచ్చక వల్లకీకళా
దోహలులై చెలంగఁ గని తోడనె వారికి వాదు పెట్టఁగా
నూహ యొనర్చి యందు మరు నొక్కనిఁ గైకొని వీణ నేర్పుచున్.

133

నారదుని పక్షపాతము

,
గీ.

ఆకిటుకు గూటిపఱచి గయ్యాళితపసి, యెంతప్రియములు సెప్పిన నియ్యకొనక
చంద్రభానునిపేరన్న సైఁప కట్లు, పక్షపాతంబు మీఱ నుపేక్ష సేసె.

134


సీ.

సారెలు బెళకినఁ జక్కఁజేయు మటన్న నిదె వత్తు నిలుమని నదికి నేగుఁ
దంత్రు లూడినయవి తగఁ గట్టి యిమ్మన్న జపవేళ యనుచు నిశ్చలత నొందు
శ్రుతు లెల్ల డిగ్గినచోఁ గూర్చి యిమ్మన్న దేవపూజావిధి దీర్చెద నను
నాలాపరక్తికి మేళవింపు మటన్న ధ్యానవేళ యొకింత తాళు మనును
మఱియు నేమాట యడిగిన మమత లేక, చెంగిచెంగి చరించునాచేష్ట లెల్ల
మౌనివరుపక్షపాతంబు గా నెఱింగి, చంద్రభానుఁ డసూయావిచారుఁ డగుచు.

135


క.

ఒకనాఁ డాముని సాగర, సికతాస్థలి నొంటి జపము సేయఁగఁ దనలోఁ
దుకతుకఁ దాళఁగ లే కచ, టికి సత్యాత్మజుఁడు చని నొడివెను మృదూక్తిన్.

136


శా.

అయ్యా నీవు లతాంతసాయకునిపట్టై వల్లకీవాద్యముల్
నెయ్యంబుం బ్రమదంబు నేరుపడ [93]నిర్ణిద్రస్థితిం దెల్ఫి న
న్సయ్యాటంబుల నిద్రపుచ్చితి రహస్యం బేమియుం దెల్పలే
దయ్యా యే నపకారినే తెలుపరాదా నాకు నాచందముల్.

137

సీ.

ఎదుటఁ బిమ్మట నైన నెప్పుడేనియు భక్తి సేయనే న న్నింత సేయనేల
యేయెడ నీ వానతిచ్చినదాస్యంబు సేయనే న న్నింత సేయనేల
[94]నిత్యకృత్యంబుగా నీపాదసంసేవ సేయనే న న్నింత సేయనేల
కలనైన నీమూర్తిఁ గనుఁగొన్న వినయంబు సేయనే న న్నింత సేయనేల
భావవాక్కాయకర్మము ల్నీవశంబు, సేయనే నీవు న న్నింత సేయనేల
సవతిబిడ్డల కిట్లు మత్సరముఁ బెంచి, చివ్వ యొనరింప నింత సేసితివి గాక.

138


క.

అని యిట్లు పలుకుపలుకు, ల్విని తనయత్నంబు కడుఫలించె ననుచు న
మ్ముని యలరి రిత్తబొమముడి, గొని యప్పుడు తెచ్చికోలుకోపముతోడన్.

139


మ.

తగు నయ్యా నను నిట్లు పల్కుటకు సత్యానందనా నీవు ము
న్నుగ నీవీణియ మీటి యీశ్రుతులసంధు [95]ల్గూర్చి యీశుద్ధసా
ళగభేదంబు లెఱింగి యీసకలమేళప్రాప్తము ల్నేర్చి యుం
టిగదా పెక్కులు పల్క నేల బళిరే నీశిష్యతల్ చేకుఱెన్.

140


[96]మ.

మరుఁ డెంతేనియుఁ దెల్సినం దెలియు నీమార్గంబు నీకంటె మా
సరవిన్ ఱొమ్మున నమ్ముగట్టుకొని యాసాయంప్రభాతంబు ని
ద్దురయుం గూడును మాని తెల్పినను నీదుర్బుద్ధి యిట్లయ్యె నెం
తురె మానేరమి గాఁగ నిట్టి వకటా ధూర్తస్వభావంబునన్.

141


క.

తగ వెఱుఁగలేక యిటువలెఁ దెగువరి వై పలుక నీకె తీరెనొ కుసుమా
శుగునకును నీకు నిపు డీ, జగడంబులు సేయఁగా నిచట నిల్చితినే.

142


సీ.

చెల్లఁబో నీచేతివల్లకీరత్నదండము దాల్ప యోగదండంబె మాకు
[97]నయ్యయో నీ చేతియసమవిపంచికగవిసెన ల్కాషాయకములె మాకు
నక్కట నీచేతియలపరివాదినీ[98]తంత్రీలతలు జన్నిదములె మాకుఁ
గటకటా నీచేతికప్పువీణియకాయ సలిలపూరితకమండలువె మాకు
బాపురే నీకు విద్య నేర్పంగవలసి, పడినపా యెల్ల నుగ్రతపంబె మాకు
హరిహరీ నిన్ను నిట్టిదుష్టాత్ముఁ డౌట, నెఱుఁగలేనైతి విడువు మి దేడగొడవ.

143


క.

ఆనలినాక్షుఁడు నేర్పుము, గా నమ్మని ప్రియము చెప్పఁగా [99]బాలుఁడుగా
పోనిమ్మని యే నిందుకుఁ, బూనినఫల మబ్బెఁ జాలుఁ బోపొ మ్మనినన్.

144

ఉ.

ఆయదురాజసూనుఁ డెదురాడఁగ నుల్కుచు విన్నఁబాటుతో
నాయెడ నుండఁగా నళికి యల్లన నైజనివాససీమకున్
డాయఁగ వచ్చి యాత్మనికటస్థితుఁ బాణసభాగ్రగణ్యు శై
నేయతనూజుఁ గాంచి మది నిండిననెవ్వగతోడ నిట్లనున్.

145


ఉ.

లోకమునందు నోవిజయలోల కటా యిటువంటిదిట్టప
ల్గాకి[100]మునీశ్వరు న్వెదకికంటిమె యే నిపు డేగి గానము
న్నా కొకయింత తెల్పు మనిన [101]న్మునుజేసినపక్షపాతముం
గాక పొకాలు మంచుఁ గలఁకం బలికెం బనిలేనిపాటకున్.

146


మ.

అరయ న్వీణకుఁ దానె బ్రహ్మకొడు కేహంకారము ల్గాక తుం
బురు విశ్వావసు శంబళాశ్వతరు లుద్భూతప్రభావోన్నతు
ల్పరికింపం దనుఁ బోలలేరె యిఁక నే యీవితాజోలి యే
వెరనైనం గని కాంతు నిందొకరిచే వీణాప్రవీణత్వమున్.

147


క.

అని సాత్యకితనయుఁడుఁ దా, నును దుంబురువలన నఖిలనుతవీణావా
దనవిద్య నభ్యసింపం, జనుటకు మార్గంబు [102]వెదకుసమయమునందున్.

148


సీ.

కాసారతప్తోర్మికాసారపరిఖిన్నసారసం బున్నాళసారసంబు
భానవజ్వలనోగ్రభానవజ్వలనార్తకువలయం బామ్లానకువలయంబు
ఘనసారసౌరభఘనసారరతవల్లవీజనం బుద్భ్రాంతవీజనంబు
వారణసైరిభావారణక్షుభితనీరాశయం బలననీరాశయంబు
పాటలలతాంతమంజరీపాటలంబు, దారుణధరాపరాగసదారుణంబు
ధూమలలితాటవీవహ్నిధూమలం బు, దగ్రతపనాతపము మించె నాతపంబు.

149


[103]చ.

పుడమి మహోగ్రతాపమునఁ బొక్కఁగఁ బాదము లూఁది త్రొక్కఁగా
జడియుచు భానుఁ డేగ దివసంబులు దీర్ఘము లయ్యె నర్థితో
నడరె మరీచికాచయము లయ్యినునార్తి సహింపలేక వే
యడుగులకు న్మడుంగు లెనయన్ దినలక్ష్మి యొనర్చెనో యనన్.

150


[104]క.

బీరెండల జలజంతులు, దారిన యాదోవరుండు తహతహచే నీ
ట్టూరుపు పుచ్చెనన సెగం, బేరినప్రత్యగ్దిశాసమీరము విసరెన్.

151

క.

మిటమిట నికటికి యెండం, [105]బటపటపటఁ బగిలి పాయవడినవెదురులం
బుట మెగయుచు ముత్తియము, ల్చిటిలినగతి నాడె శాల్మలీతూలంబుల్.

152


[106]చ.

అనలుఁడు రే లినప్రమద యైనప్రభం [107]గెడగూడి యుండి వే
గ నతఁడు దారుణాశుగముఖంబులు వేఁడిమిచూప భీతిచేఁ
గనలుచు ధూమదామమిషఁ గైశికము ల్చెదరంగఁ గానకుం
జనియె ననం దనర్చెఁ దరుసంధుల దావహుతాశకీలముల్.

153


[108]చ.

సవితృమయూఖము ల్నెఱెలసందులఁ దూఱుట యొప్పె దేహసం
భవ మగునట్టిడప్పి యడఁపన్ ధరఁ గల్గుమహానదీనదాం
బువు నెడఁగ్రోలియుం దనివిఁబొందక భానుఁడు ధారిణీతలం
బవిలిచి భోగవత్యుదకమానఁగరంబులు సాఁచెనో యనన్.

154


మ.

తరణిగ్రాహహుతాశహేతి ఫణిపూత్కారార్చిఁ గాంతారదు
స్తరవైశ్వానరకీలఁ దప్తపథికశ్వాసాగ్నినర్కాంశువి
స్ఫురణం గ్రూరతపంబు సైఁచి యచలాంభోజాక్షవాత్యావిసృ
త్వరధూళీపరిపాటి విష్ణుపదపద్యం బొందె నందంబుగన్.

155


చ.

వికచముఖాబ్దము ల్నొగుల వేణులు దూలఁగ నూర్మికాంచిహం
సకవితతు ల్దొలంగ రవిబారి నజీవనలై తరంగణీ
ముకురకపోల లెల్లెడ సముద్గతతాపము సెందఁ గ్రమ్ముఘ
ర్మకణికలో యనంగఁ జెలమ ల్దగు నధ్వగకల్పితంబు లై.

156


మ.

ఘనతాపంబున జంతువు ల్నొగుల మేఘశ్రేణి [109]లే కెందునుం
జనునే వీనిమహార్తి యంచు విధి తత్సామగ్రి గల్పించె నాఁ
దనరున్ దావమునం బొగ ల్వ్యజనబృందవ్యాప్తి వాతూలముల్
మనుజాంగంబుల ఘర్మతోయము లినాశ్మశ్రేణికం దేజమున్.

157


శా.

ఆవర్తానిలముల్ పరిభ్రమణవిద్యాప్రౌఢి సన్మార్గమ
ధ్యావాసంబులు గాంచుట ల్తెలిసి యీర్ష్యాప్తి న్సుపర్వోరువం
శావిర్భూతవిచిత్రభవ్యవనమం దావిద్య సాధింపఁగా
నావేశించినరీతి మందపవమానాంకూరముల్ ద్రిమ్మరున్.

158

క.

ధారాగారప్రతిమా, కారార్పితయంత్రవారికణములు దనరెం
బేరెండ నచేతనులశ, రీరములను జెమటజడి కురియుచందానన్.

159


సీ.

అఱకాల సెగ సోఁకి చుఱు కనఁగాఁ జెట్లబడి త్రోవ నడిచిరి పథికు లెల్ల
బలుదప్పిచే నాలుకలు వెల్వడఁగఁ జాఁచి దగదొట్టి పడియుండె మృగము లెల్లఁ
బొదలలోఁ దలఁ దూర్చి యొదిఁగి సారెకు శీకరములు చీఁదెడు సింధురము లెల్లఁ
దరుకోటరములలో సురిఁగి క న్నఱమోడ్చి తలనిక్క రవిఁ జూచెఁ బులుఁగు లెల్ల
నుప్పరము లేచు కెంధూళి చప్పరములఁ
బాటలవిభావిభాసితాంబరము మెఱయ
నురిదిబలుగాడ్పు వేఁడినిట్టూర్పు లొలయ
శ్రాంత లై యుండి రపుడు దిక్కాంత లెల్ల.

160


ఉ.

చక్కెరచింతపం డొడిని సందిట నేలకి చద్ది మౌళిపై
జెక్కినకానుగాకు వలచే జలకుండిక వీజనంబు వే
ఱొక్కకరంబునందుఁ బదయుగ్మమునం బిగివాళ్లు గల్గి న
ల్దిక్కుల నధ్వగు ల్బడలి త్రిమ్మరి రట్టికడిందియెండలన్.

161


చ.

పరఁటులపేరిపెన్బడియపట్టుల నీరము లుంచి యచ్చటం
దరుణులపేరిదీమములు దార్చి తదీక్షణరాజిపేరిపే
రురులు ఘటించి పాంథమృగయూధము లోపఱుపం దలంచి క్రొ
వ్విరివిలుబోయ తావుకొను వేఁటపొలంబు లగు బ్రపావళుల్.

162


చ.

ఇరుగడఁ జిమ్ముధూమముపయిం దొలఁకం బువునీరు పచ్చక
ప్పురమును మేళవించి మెయిఁ బూసి చద్వ్యజనానిలచ్చటల్
నెరయఁగఁ గేళికృత్రిమధునీతటులం గలవట్టివేరుచ
ప్పరములఁ బవ్వళించి నరపాలురు నిద్దురఁ జెంది రయ్యెడన్.

163


శా.

ఆవేళ న్మురవైరినందనుఁడు శైత్యాకాంక్ష సంభోధివే
లావిస్తీర్ణలవంగికాలవలికైలామాధవీకాయమా
నావాసాంగణసైకతస్థలములం దాలోలకల్లోలడో
లావిశ్రాంతమరుత్కిశోరజనితోల్లాసాప్తి నుండె న్రహిన్.

164


మ.

ప్రణతాభవ్యవిదార దారకనకారజ్యత్పరీవార వా
రణసంరక్ష్యవతార తారధరధైర్యప్రౌఢిమాధార ధా

రణవన్మానససార సారససుహృదర్మ్యోజ్జ్వలాకార కా
రణశూన్యోక్తివిహార హారహరవిభ్రాజద్యశోవైభవా.

165


క.

దహరాజితరాజితచి, ద్రృహరాజ హరాజనుత జరాజననరుజా
రహిత యజరహితయతిజను, రహితల్ప యనల్పధ్రుతిజితాబహిరహితా.

166


పృథ్వి.

సదాశయ సదాశయాంబురుహసంస్ఫురత్కుండికా
మదచ్యుతిమదచ్యుతశ్రుతిశయప్రసన్నాత్మకా
పదానతపదానతత్పర యపారబోధోర్మికా
ముదాత్తసముదాత్తసత్త్వగుణ ముక్తికన్యాభికా.

167


గద్యము.

ఇది శ్రీమద్దత్తాత్రేయయోగీంద్రచంద్రచరణారవిందవందనసమాసాదిత
సరసకవితారసోదాత్త దత్తనామాత్యసోదర్య మల్లనమంత్రివర్యప్రణీతం బై
నచంద్రభానుచరిత్రం బనుమహాప్రబంధంబునందుఁ బ్రథమాశ్వాసము.

  1. క-పరిషత్పుస్తకభాండాగారములోని 14 సంఖ్య గల తాళపత్రపుస్తకము.
    చ-రాజకీయప్రాచ్యలిఖితపుస్తకభాండాగారములోని 12-7-8 సంఖ్యగల పుస్తకము. (తాళ)
    ట-రాజకీయప్రాచ్యలిఖితపుస్తకభాండాగారములోని 14-4-4 సంఖ్య గలపుస్తకము. (కాగిత)

  2. ఇది మొదలు 15వ పద్యముకడవఱకు క-ప్రతిలోఁ బత్రములు విఱిగిపోయినవి.
  3. చ-గఱపుకరణి
  4. చ-ననంతాధ్వసంక్రమణ భూరిశ్రాంతి కఱపుకరణి
  5. చ-జేర్చుఁగాత
  6. చ-ద ద్రసావాప్తికిన్
  7. ట-సోదరమైత్రి
  8. చ-వృత్త
  9. చ-దశా
  10. చ-చిత్రికరానల్ప
  11. చ-నొక్కమహాప్రబంధ
  12. చ-రస
  13. చ-మభీష్టదైవ
  14. క-ధారాప్రధారాగ్రగణ్యనగోన్మేష
  15. చ-శ్రీ లొసంగు
  16. చ-శ్రీ లొసంగు
  17. చ-ఘన మస్మదీయ
  18. చ-పాశంబున
  19. చ-వికాస
  20. చ-తదుపయోగ్య
  21. చ-దీవియ
  22. ఇది మొదలు "యాదవాగ్రజు” ననుపద్యమువఱకు ట-ప్రతిలో లేదు.
  23. చ-దోఁపనాడు
  24. క-గాంధర్వేశ
  25. చ-భర
  26. క-పరిచయంబున
  27. చ-తనతావు లెనయించి నిలిపినఘనసమాఖ్యు
  28. క-భరింప
  29. చ- గౌరీవిభు
  30. ట-వేంకటాద్రి
  31. చ-ట-రాజ
  32. ఈసీసముమొదలు, “ఏతాదృశ” యను షష్ఠ్యంతపద్యమువఱకు ట-లో లేదు.
  33. చ-నిశ్చల
  34. చ-పెట్టియ
  35. చ-పాతనయాభితభవర్షి; ట- పాతనయాపీతవర్షి
  36. చ-రోచనునకును
  37. ఈపద్యమును దీనిక్రిందిపద్యమును ట-లో లేవు.
  38. చ-మననభద్ర
  39. ట-సమర్పితంబుగా
  40. చ-ట - కప్పు
  41. ఇక్కడనుండి "దానము గల్గి”యను పద్యమువఱకు క-లో లేదు.
  42. బూనఁగడసాలె
  43. ట-నున్న
  44. క-చ-సువాలమున్
  45. ట-జూచి
  46. క-గిరిగూడ
  47. క-ట-యాశన
  48. చ-ట-మోములు
  49. భూషోదయ
  50. ట-వలయవలయ
  51. చ-జాఁది, ట-జూచి
  52. (సంగరా)
  53. ట-మందానిలుండు
  54. క-దుర్మదమానవతీ
  55. చ-ఇక్కరణిం జగంబు
  56. ట-నజభవ్యతరు, చ-రతిభవ్యతరు
  57. చ-ట-వీఁగఁగన్
  58. ట-జింత
  59. చ-నుండు నయ్యెడన్
  60. ట-గోణాము
  61. చ-దుప్పటివలెవాటు
  62. చ-స్వామి కిపుడు
  63. చ-ట-తగినది
  64. చ-ట-గైకొనం
  65. ట- ఔర పరపద్మినీరసనాంతరంగ, చ-ఔర పురపద్మినీ
  66. చ-ట-మగుట
  67. ఈ పద్యము ట-లో లేదు.
  68. ట-లో లేదు.
  69. ట-లో లేదు.
  70. చ-ట-గోనె
  71. ట-లో నీపద్యము లేదు.
  72. చ-కరణి
  73. చ-వర్తన
  74. చ-పీఠంబునన్
  75. చ-పాండవాధిపులు, ట-పాండవాదికులు
  76. క-ట-వాక్ఫణితి
  77. ట-నన్న
  78. 'నరునివైఖరి' యనుట లెస్స.
  79. ఇదియు దీనిక్రిందిపద్యమును ట-లో లేవు.
  80. క-హరి నీ వెప్పుడు నాదివర్ణగురువిఖ్యాతిన్
  81. క-కొమ్మలు నీదు
  82. చ-ట-తత్ప్రియాళికిన్
  83. ట-లో నీపద్యము లేదు.
  84. చ-ట-వీణియ చెలఁగ
  85. చ-ట-అభ్యసింపఁ గుతూహల మాత్మఁ బూని
  86. చ-ట-నడరు
  87. చ-ట-తనూజుని
  88. ట-యామునికులాధ్యక్షుండు
  89. ట-బొనరింప
  90. చ-ట-గొంకులేక వహింపఁ గొన్నినాళ్లు
  91. ఈచరణము క-లో లేదు
  92. చ-ట-నేర్పి నేర్పి
  93. చ-ట-నిర్ణిద్రుండ వై తెల్పి
  94. చ-లో నీచరణము నాల్గవదిగా నున్నది. ట-లో నీచరణమునకు మాఱు 'పోరామి చెడకుండ గారాముతో భక్తి సేయనే న న్నింత సేయనేల' అని కలదు.
  95. చ-చూచియుం
  96. క-లో నీపద్యము లేదు.
  97. ట-నయ్యరో
  98. చ-తంత్రిక ల్బలుజన్నిదములె
  99. ట-మొకమోటన్
  100. ట-తపస్వి ము న్వెదకి
  101. క-ట-న్ముని చేసిన
  102. చ-ట-నరయు
  103. ట-లో నీపద్యము లేదు.
  104. ట-లో నీపద్యము లేదు.
  105. చ-పటపటమని
  106. ట-లో లేదు.
  107. చ-జతగూడి
  108. 154,155,156,157,159,160 పద్యములు ట-లో లేవు.
  109. చ-గాకేమిటన్