చంద్రభానుచరిత్రము/పీఠిక
శ్రీరస్తు
పీఠిక
చంద్రభానుచరిత్రమును రచించినకవి తరిగొప్పుల మల్లనమంత్రి. ఈతఁ డాఱువేలశాఖలోనివాఁడు. మధ్వమతస్థుఁడు. స్వతంత్ర కపిసగోత్రుఁడు. తండ్రి నృసింహుఁడు. తల్లి తిప్పాంబ. జన్మస్థాన మేదియో తెలియదు గాని కృతి రచించుకాలమునఁ జంద్రగిరి నివాసముగా నున్నవాఁడు. తనకృతిని మాహురపురమునందు వెలసిన దత్తాత్రేయదేవున కంకితము చేసెను. ఈదేశమం దిప్పు డాఱువేలవారి నాఱువేలనియోగు లనుట యాచార మై యున్నది. ఈశాఖవారు గొందఱు పూర్వము కర్ణాటదేశమునకు వెళ్లి యచ్చట రాజకీయాదిపదవుల సంపాదించి ప్రసిద్ధి వడసిరి. వారిలోఁ గొందఱు మధ్యమత మవలంబించిరి. కావున వీరి నాఱువేలమాధ్వు లనవచ్చును. ఇట్టివా రిప్పుడును మైసూరురాజ్యమునం దనేకులు గలరు. సుప్రసిద్ధు లగు దివాను పూర్ణయ్యగారి కుటుంబము కూడ నిట్టిదే. వీరు వేఱు నాఱువేలనియోగులు వేఱు నని గ్రహించునది.
కాలనిర్ణయము — మల్లనకవి రాయనముగను నీతని యన్న యగు దత్తనామాత్యుఁడు ప్రధాని (కార్యకర్త) గను గర్ణాటప్రభువగు వేంకటపతిరాయలయాస్థానమందు నియుక్తు లయి యున్నట్లు గ్రంథమువలనఁ దెలియుచున్నది. ఈ వేంకటపతిరాయలు క్రీ.శ. 1586 మొదలుకొని 1614-వ సంవత్సరమువఱకు రాజ్యము చేసెను. ఈగ్రంథము 1600-వ సంవత్సరప్రాంతమున రచింపఁబడిన దని యూహింపవచ్చును.
వేంకటపతిరాయలకు వీరవేంకటపతిరాయ లను పేరు గూడఁ గలదు. ఈతఁడు వసుచరిత్రకృతిపతి యగు తిరుమలరాయల చతుర్థపుత్రుఁడు. తిరుమలరాయలు కృష్ణదేవరాయని యల్లుఁ డయిన యళియరామరాజు తమ్ముఁడు. వీరికి వేంకటాద్రి యనునొకతమ్ముఁ డుండెడివాఁడు. వీరు ముగ్గురును తుళువవంశపురాజులలోఁ గడపటివాఁ డగు సదాశివదేవరాయల మంత్రులును గార్యకర్తలుగ నుండిరి. క్రీ. 1565-వ సంవత్సరములో జరగిన తాళికోటయుద్ధములో రామరాజు మృతినొందెను. పిదపఁ దిరుమలరాయలు సదాశివదేవరాయని ముఖ్యమంత్రిగ నుండి క్రీ. 1570-వ సంవత్సరప్రాంతమందు సదాశివదేవరాయలు మరణింపఁగాఁ దా నారాజ్యము నాక్రమించుకొని రా జయ్యెను. క్రీ. 1574-వ సంవత్సరములోఁ దిరుమలరాయని ద్వితీయపుత్రుఁడు రా జయినట్లు శాసనములవలనఁ గనఁబడుచున్నది. కావునఁ దిరుమలరాయలు మూఁడుసంవత్సరములకంటె నెక్కువకాలము రాజ్యము చేసిన ట్లగపడదు. తాళికోటయుద్ధానంతరము తురుష్కులు కర్ణాటరాజధాని యైనవిజయనగరముపై దండెత్తి వచ్చి యానగరమును బాడుచేసి యుండుటచేఁ దిరుమలరాయలు, అనంతపురమండలములోని పెనుగొండను దనరాజధానిగాఁ జేసికొనియెను. తిరుమలరాయనికి రఘునాథరాయలు, శ్రీరంగరాయలు, రామరాయలు, వేంకటపతిరాయలు నని నలుగురు కొడుకు లుండిరి. రఘునాథరాయలును రామరాయలును రాజ్యము చేసినట్లు కనఁబడదు. తిరుమలరాయలపిదప శ్రీరంగరాయలును నాతనితరువాత వేంకటపతిరాయలును రాజు లయిరి. శ్రీరంగరాయల రాజ్యకాలములో విజాపురపుఁ దురుష్కరాజులు పెనుగొండ నాక్రమించుకొనుటచేఁ చిత్తూరుజిల్లాలోని చంద్రగిరి కర్ణాటరాజ్యరాజధాని యయ్యెను. వేంకటపతిరాయలు రాజ్యమునకు వచ్చినప్పటి కిదియే రాజధానిగా నుండెను గాని,
| "తనకు వేలూరు వరరాజధాని గాఁగ, వీరవేంకటపతిరాయవిభుఁడు మిగుల | |
అనురామరాజీయపద్యమును బట్టి యాతనికాలములో రాజధాని యుత్తరార్కాడు మండలములోని వేలూరునకు మార్పఁబడినట్లు కనఁబడుచున్నది. ఈహేతువుచేతనే యీ పట్టనమునకు రాయవేలూ రనుపేరు వచ్చినది.
వసుచరిత్రకాలమునకును జంద్రభానుచరిత్రకాలమునకు నంతర మెంత గలదో చూతము. క్రీ. 1574-వ సంవత్సరమునకుఁ బూర్వమే తిరుమలరాయలరాజ్యకాలము ముగిసినందున నాతని కంకితము చేయఁబడిన వసుచరిత్రము క్రీ. శ. 1572-వ సంవత్సరప్రాంతమందుఁ బుట్టియుండెసనియు దీనిపిదప నించుమించుగా ముప్పదిసంవత్సరములకుఁ జంద్రభానుచరిత్రము పుట్టియుండుననియు నూహించుట సమంజసముగాఁ దోఁచుచున్నది.
వసుచరిత్రములోని కృతిపతి వంశావతారవర్ణన పద్యములంబట్టి తిరుమలదేవరాయల రాజ్యకాలమందు శ్రీరంగరాయలు యువరాజుగ నుండె ననియు, రామరాయలు శ్రీరంగపట్టనరాజ్యమును వేంకటపతిరాయలు చంద్రగిరిరాజ్యమును బాలించుచుండి రనియుఁ గాన్పించుచున్నది. మఱియును శ్రుతిరంజని యను గీతగోవిందవ్యాఖ్యలో—
| "జయతి తిరుమలేంద్ర స్తేషు విఖ్యాతకీర్తిః | |
అని యున్నది. ఈపద్యముల నాధారము చేసికొని శ్రీరంగరాయలు రా జైనతరువాతఁ గూడఁ దిరుమలరాయలు కొంతకాలము జీవించియున్నాఁ డనియు వసుచరిత్రము క్రీ. 1574-వ సంవత్సరము తరువాతనే పుట్టిన దనియుఁ గొంద ఱూహించుచున్నారు. కాని, యిది యుక్తము కాదు. శ్రుతిరంజనీపద్యభావము తిరుమలరాయలు రాజుగా నుండియే రాజకార్యములఁ గొన్నిటిని గొడుకులచేఁ జేయించి తాను విద్యాగోష్ఠియం దెక్కువకాలము వినియోగపఱుచుచుండె నని యే కాని రాజ్యమును వదలుకొన్నాఁడని కాదు. "మదరినృపమాళిస్తోమనీరాజితాంఘ్రిః" అనువిశేషణ మీయూహను బోషించుచున్నది. తిరుమలరాయలు రాజ్యము వదలుకొన్నమాటయే నిజ మైనయెడల నారాజ్య మొక్కకొడుకునకే గాని నలుగురకు సంక్రమించదు. వసుచరిత్రపద్యము లీయర్థమునే దృఢపఱుచుచున్నవి. తిరుమలరాయలకాలములో శ్రీరంగరాయలు యువరాజుగను రామరాయలు శ్రీరంగపట్టనరాజ్యాధికారిగను వేంకటపతిరాయలు చంద్రగిరిరాజ్యాధికారిగ నుండి రని యున్నది. వా రాయాకార్యములను దిరుమలరాయల యాజ్ఞానుసారముగనే నెఱవేర్చుచుండి రని నిర్ణయించవలసియున్నది. యువరాజు రా జగునా? కాఁబట్టి తిరుమలరాయలు క్రీ. 1574-వ సంవత్సరమునకు ముందే చనిపోయినాఁ డనియు వసుచరిత్ర మంతకుఁ బూర్వమే పుట్టిన దనియు సిద్ధాంతీకరింపవచ్చును.
వేంకటపతిరాయలయాస్థానమం దనేకులు పండితులుఁ గవులు నుండిరి. తిరుమల తాతాచార్యులు, కందాళ అప్పలాచార్యులు నను వైష్ణవాచార్యులు వేంకటపతిరాయల మతగురువులుగా నుండిరి. సుప్రసిద్దుఁ డగు నప్పయదీక్షితులు గూడ నీకాలపువాఁడే. ఈయన వేలూరు సామంతరాజైన చినబొమ్మనాయఁకుని యాస్థానవిద్వాంసుఁడుగా నుండి రాయలచేతఁ గూడ గౌరవింపఁబడుచుండెను. ఈయన కువలయానంద మనునలంకారగ్రంథమును వేంకటపతిరాయలనియోగముచేత రచియించిన ట్లాగ్రంథమందలి
| “అముం కువలయానంద మకరో దప్పదీక్షితః | |
అనుశ్లోకమువలనఁ దెలియుచున్నది. తెనాలి రామకృష్ణకవి, చిన్ననారనకవి, మట్ల అనంతభూపాలకవియు నీకాలమువారే.
కృతివిషయము — శ్రీకృష్ణునకు సత్యభామయం దుదయించిన చంద్రభానుఁడు, రుక్మబాహునికూఁతు రగుకుముదిని యనుకన్యకను వివాహమైనకథ యిందు వర్ణింపఁబడినది. ఈకథకు మూల మేపురాణమం దున్నదో. జటప్రోలు సంస్థానాధిపతి యగు శ్రీసురభిమాధవరాయలను కవిరాజు చంద్రికాపరిణయ మను నొకప్రబంధరాజమును రచియించెను. దానికిని జంద్రభానుచరిత్రమునకును బోలికలు విశేషముగా నుండుటచే మాధవరాయలగ్రంథమును జూచి మల్లనకవియో మల్లనకవి గ్రంథముం జూచి మాధవరాయలో నిర్మించి యుందు రని తోఁపకమానదు. కృతినామమునఁ జంద్రపదము రెంటను గలడు. చంద్రికాపరిణయము నందలి నాయకుఁడు సుచంద్రుఁడు. చంద్రభానుచరిత్రము నందలినాయకుఁడు చంద్రభానుఁడు. అందలినాయిక చంద్రిక, యిందలినాయిక కుముదిని, చంద్రిక పూర్వభవమునఁ జిత్రలేఖ యనునచ్చర; వసంతుఁ డనుమునివరుతపంబునకు భీతిలిన నలువపంపునఁ దపోవిఘ్న మొనరింప నేగి పూనినపని సేయఁజాలక యామునిచే శప్త యై మానుషలోకంబున జనించినది. కుముదిని పూర్వజన్మమునఁ జంద్రకళ యనునచ్చర; భరద్వాజముని తపోభీతిచేఁ ద్రస్తుఁడగు సురరాజునానతిని దపోంతరాయం బాపాదించి శపింపఁబడి నరలోకమునఁ జనియించినది. చిత్రరేఖకు శతసహస్రవర్షంబులు మాత్రమే మనుష్యజన్మమును బిదప దేవత్వమును ముని నిర్ణయించెను. చంద్రకళ కట్లు మనుష్యజన్మమోక్ష మనుగ్రహింపఁబడలేదు. కావుననే కుముదినికి వీణ నేర్ప సురరాజు తుంబురు నంపి దివ్యగానము నేర్పించుటయే గాక స్వర్గవాసవరఫల మగుపారిజాతతరువునకు నిలయ మగుసత్యభామకుఁ గోడలిఁగా ఘటియించెను. చంద్రభానుచరిత్రములోని నాయకుఁ డొకపరి మృగయావినోదంబు సలువుచున్నతఱిఁ దుంబురునిస్నేహితుఁడు సిద్ధుఁ డొకఁ డేతెంచి మార్గమధ్యమం దున్నచంద్రభానునికిఁ దుంబురునియుఁ గుముదినియు వృత్తాంతములు వర్ణించి పోయెను. చంద్రికాపరిణయనాయకునకు శాండిల్యుఁ డనుమునినిదేశమ్మునఁ దమిస్రాసుర విఘాతమ్మున కేగుమార్గమునఁ గుముదుఁ డనుశాపోపహతగంధర్వుఁడు చంద్రికారూపాతిశయమును వర్ణించుటయే కాక తాను వసుచరిత్రముం జదివినవాఁడుం బోలెఁ దనతో రాజును జంద్రికకడకుఁ దోడ్కొనిపోయి నాయికానాయకులకుఁ బరస్పరానురాగము సంఘటించెను. చంద్రభానుఁడు లోకసామాన్యముగ విద్యార్థివేషమునఁ దుంబురుపరిచర్య సేయుచు నొకనాఁడు కార్యవశమున నేతెంచిననాయికం జూచి మదనపరతంత్రుం డై తుద కామెపాణి గ్రహించెను. సుచంద్రుఁ డట్లుగాక యకారణబాంధవుం డగు నామునివాక్యములు వినినంతనె కామపరవశుఁ డై యెక్కడనో యున్ననాయికం జూడ వేడుకపడి వానివిమానమున నాయికోద్యానముం జేరి తుదకుఁ దద్దర్శనలాభము ననుభవించెను.
చంద్రికాపరిణయమునందలి నాయకతండ్రి నైషధీయచరితముం జదివినవాఁడుఁబోలెఁ దనకూఁతుమనంబు సుచంద్రలగ్న మయ్యె నని యెఱింగియు సాటికి స్వయంవరము చాటించెను. స్వయంవరకాలమునఁ జంద్రికకు భూపాలురప్రతాపాటోపాదికమును వర్ణింపఁ బార్వతిని నియోగించెను. పార్వతియు నైషధీయభారతిం బోలె భువనేశ్వరమంత్రమును సుచంద్రున కుపదేశించి యంతర్హిత యయ్యె. చంద్రభానుచరిత్రములోని నాయికానాయకులు రుక్మిణీస్వయంవరము నెఱిఁగినవారు గనుక మాయవలన నేమి యేవిధముననైన నేమి సర్వావస్థలను వారినే యనుకరించిరి. రుక్మబాహుండును దనతనయను శిశుపాలునితనయునకే యొసంగ నిశ్చయించి వియ్యమును రావించి యతనికి ద్వితీయపరాభవమును గూడ సంఘటించెను. చంద్రభానుఁడు కాదంబరీరసాస్వాదనపరవశునట్టులు తనకు సాత్యకితనూభవు నొకని దోడు చేసికొని యడవిలో మృగయావ్యాపారమునఁ జంద్రాపీడుఁడువలెఁ దాను గానవిద్యాభ్యాసమిషంబున స్వజనులఁ బాసి దుర్వాసశ్శాపగ్రస్తుఁ డై యాతండు కిన్నరమిథునముఁ బట్టఁబోయి యేకాకియై గానపరవశయగు మహాశ్వేతం గాంచి తద్వారమునఁ గాదంబరీలాభము నందినయట్టులు వనమయూరములం బట్టఁబోయి శాపవశమున నేకాకియై గానాచార్యుం దుంబురుం గని తన్నికటమున విద్య నభ్యసించుచుఁ గుముదినీలాభముం బొందెను. కాదంబరిలోని పుండరీకునట్లు నిందు విజయలోలుఁడు శాపతాపితుఁ డై యొకవత్సర మెట్లో చరించి తుద కనురూపకాంతాసమాగమమును బ్రధాననాయకునితో సమముగ నందెను.
ఇ ట్లీరెండుగ్రంథములకు భిన్నభిన్నగ్రంథానుకరణములును సాధర్మ్య వైధర్మ్యంబులును గలవు. కేవలసాధర్మ్యములనే యాలోచించినచో నీయిరువురుకవులలో నొకరి నొకరు తప్పక యనుకరించి రని స్ఫురింపకతీరదు. ఇరువురిలో నెవ్వరు ప్రాచీనులో వారి నర్వాచీను లనుకరించి రనుట సమంజసము గదా! మల్లన పూర్వుఁ డనియు మాధవరాయఁ డర్వాచీనుఁ డనియు మాయభిప్రాయము.
ఎలకూచి బాలసరస్వతి తాను రచించిన యాంధ్రశబ్దచింతామణి భాష్యములోఁ దనవంశావతారము నీక్రిందిరీతి నిచ్చియున్నాఁడు—
1. తిప్పన, 2. వల్లభసోమయాజి, 3. తిప్పన, 4. భైరవార్యుఁడు, 5. తిరుమలార్యుఁడు (రామయ), 6. భైరవుఁడు, 7. కృష్ణకవి, 8. బాలసరస్వతి. వీరిలో నైదవపురుషుఁ డగు తిరుమలార్యుఁడు "అళియరామావనీంద్రదత్తయెడవిల్లిముఖ్యసద్గ్రామవిభుఁ" డని వర్ణింపఁబడియెను. ఈతిరుమలార్యుఁడు 1564 సంవత్సరప్రాంతమున నున్నను నతనిమనుమని కొడు కగు బాలసరస్వతి మఱి యఱువదిసంత్సరముల పిదప, ననఁగా 1614 ప్రాంతమం దుండియుండవలయును. ఈబాలసరస్వతిచే మల్లభూపాలీయమును గృతిఁగొన్న పెద్దమల్లభూపాలుఁడు నాకాలమందే యుండునుగదా. చంద్రికాపరిణయకర్త యగుమాధవరాయఁ డీమల్లభూపాలుని కొడు కని కొందఱును మునిమనుమఁ డని కొందఱును జెప్పుదురు. కొడు కనుకొన్న నాతనికాలము క్రీ. 1644 సంవత్సరప్రాంత మగును. కావున నీతఁడు తరిగొప్పుల మల్లనకంటె నర్వాచీనుఁడే.
గ్రంథములపోలికలు
చంద్రభానుచరిత్రము—ద్వితీయాశ్వాసము
సీ. | నిడుచాలు వెనుచాయ నడకనిద్దపుఁ దేఁటిగమివీరజడలతో గంధవహుఁడుఁ | 131 |
ఉ. | చొక్కపుఁబువ్వుజొంపములసొంపున మ్రాఁకులు విఱ్ఱవీఁగె నల్ | 132 |
క. | కనుఁగవ మోడ్చి నిదిధ్యా | 133 |
సీ. | ఉడురాజు నిజనిశితోత్తాలకిరణసంఘముపేరి బలుచివ్వ గడలఁ జిమ్మి | 134 |
చంద్రికాపరిణయము-ద్వితీయాశ్వాసము
సీ. | అరిరాజచిత్తభీకరకరకాండప్రచండిమ మను రాజమండలంబుఁ | 76 |
ఉ. | అపుడు రణోత్సుకుం డగుసితాంబుజనాయకుకంటెసన్నఁ గీ | 77 |
సీ. | చైత్యవత్కరకుంఠచటులధారారేఖ శమినేత నాటించెఁ జలువమిన్న | 78 |
చంద్రభానుచరిత్రము-ద్వితీయాశ్వాసము
సీ. | అరయ ననగ్నికుండాహుతిస్తోమమై బూది గూడె సుమాస్త్రుపోఁడి మెల్లఁ | 165 |
చంద్రికాపరిణయము - ద్వితీయాశ్వాసము
సీ. | తనక్రొందళములమన్నన చెట్లపాలుగాఁ జనియె సూనశ్రీల నెనసి మధువు | 114 |
జంద్రభానుచరిత్రము - ద్వితీయాశ్వాసము
సీ. | జాతరశిఖిశిఖాజాతధూమంబులచాడ్పున నల్లనిచాఱ లెసఁగఁ | |
| భూరిభీకరభాంకృతు ల్పొదలఁ గొన్ని | 39 |
క. | ఆపులి నిజతురగదిదృ, క్షాపరత న్నిగుడ దాని ఘనపరుషరుషా | 40 |
చంద్రికాపరిణయము - ద్వితీయాశ్వాసము
సీ. | అఖిలజంతునిఖాదనారూఢిమైఁ బోలె నతివివృతంబైన యాస్య మమర | 27 |
క. | వెలలి జిఘృక్షాగౌరవ, కలనన్ లంఘించునృపతిఁ గల్గొని నిజని | 28 |
ఇట్టిపోలిక లనేకములు గలవు గాని గ్రంథవిస్తరభీతి నిట నుదాహరింపలేదు. ఇట్టు లీయుభయగ్రంథములకు సాదృశ్య మున్నను వైదృశ్యము గూడఁ చాలఁ గలదు. మల్లన తఱచుగా వర్ణనములందు మనుచరిత్రము ననుకరించి మృదులమృదులము లగు పదముల నేర్చి కూర్చువాఁడు. మాధవరాయఁ డన్ననో వసుచరిత్రానుకరణుఁడై శ్లేషాద్యలంకారముల గుప్పించుటకై కొంచెము క్లిష్టపదప్రయోగము గావించువాఁడు. మల్లనకవియు శ్లేష నతిమాత్రముగ నుపయోగించెను. పదకాఠిన్యమున కంతగా సహించువాడు కాఁడు. మాధవరాయలు పదలాలిత్యము నాలోచింపక శ్లేషాద్యలంకారగరిమకే ప్రాధాన్య మిచ్చువాఁడు. మల్లనకుఁ గథాభాగ మధికముగా నుండుటయుఁ గార్యవశమునఁ గొంచెము కొంచెముగా వర్ణనలఁ బెంచుటయు నభిమతము. మాధవరాయనిగ్రంథమందుఁ గథాభాగ మత్యల్పమైనను వర్ణనలచే గ్రంథము పెంచఁబడినది. ఈయిరువురుకవులు నసాధారణపాండిత్యప్రకర్ష గలవారు. శాస్త్రమర్యాదలఁ జక్కఁగ నెఱింగినవా రనుటకు వారిప్రయోగములే ప్రమాణము. ఇతరగ్రంథములందుఁ గానరాని సంస్కృతపదములు వీరిగ్రంథముల దగపడును. మల్లన తఱచుగాఁ గర్ణాటాదీతరదేశ్యపదములను బ్రయోగంప నలవాటు పడినవాఁడు. మాధవరాయ లట్లొనర్చినట్లు కానరాదు. రెం డుత్తమప్రబంధములం గొని తారతమ్యవిచారము చేయుట కష్టము. ప్రస్తుతచంద్రభానుచరిత్రమునకు వత్తము.
కథావిమర్శనము
చంద్రభానుచరిత్రమునఁ గథానిర్మాణము విచిత్రముగ నున్నది. ఈకవి క్రొత్తమార్గముం త్రొక్కినాఁడు. ప్రప్రథమమున రుక్మిణీవైభవాసూయచే సత్యభామకుఁ జంద్రభానూదయమును వర్ణించినాఁడు. పిదప నారదాగమనమున సంగీతాభ్యాసమను కథాబీజమును నాటెను. కలహాశనముని కుముదినీలాభమునకు మార్గదర్శకుఁ డయ్యెను. అడవిలో వేటాడుచున్న చంద్రభానునకుఁ దుంబురుని చెలికాఁ డొకసిద్ధుఁడు కుముదినీజన్మప్రకారంబుకు నామెకుఁ దుంబురుఁడు గానవిద్య నేర్పుటయుఁ దెలిపి కుముదినియందుఁ జంద్రభానునిమనం బొకింత లగ్నమగునటులు వర్ణించి యంతర్హితుండయ్యె. చంద్రభాను చెలికాఁ డగువిజయలోలునితోఁ గూడ వనమార్గమునం బోవుచు నొకచో బడలి నిద్రించుచుండ నొకజింకజంట వారిమెయి నాక నిద్రాభంగవ్యాకులమనస్కులై వారు హరిణపోతముల బెదరించిరి. ఈపనికై కోపించి దుర్వాసముని వీరిరువురకు వియోగము గలుగ శపించెను. పిదపఁ గాఱడవి నొకయుద్ధసాధనసన్నద్ధమగు రథ మీయదుకుమారులకు గోచర మగుడు నీరథికమగు నా తేరు వారధిగమించిరి. ఇంతలో నెక్కడనుండియో యకాండజలదాగమంబుంబోలి యొక్కరక్కసుం డరుదేరఁ జంద్రభానుఁడు ఘోరముగఁ బోరి వాని నుక్కడించెను. ఈయుద్ధవర్ణనము చదువుట కెంతయు మనోహరముగా నున్నయది. కూలిన యాదానవుండు శాపవిముక్తుఁడై కుముదినీలాభప్రధానసాధనం బగు మాయ నాయిరుపురుబాలకుల కిచ్చి యథేచ్ఛం జనియె. పిదస శాపవశంబున వియుక్తుండైన విజయలోలుఁడు తిరుపతికిని జంద్రభానుఁడు కుండినమునకు నేగిరి. చంద్రభానుని చరిత్ర మిఁకఁ బై నంతవిశేషములు కలది గాదు. విజయలోలునికథ ముఖ్యమైనది. విజయలోలునిపాత్రము శేషశైలవర్ణనమునకును గడపట గుముదినీ వేషముం దాల్చి ఫలమును సులభము సేయుటకునే కల్పింపఁబడినది. తిరుమలయం దాతనికిఁ గూడ ఫలప్రాప్త్యాశ యుదయించినది. కాని తుద కాతనిఫలప్రాప్తి ప్రధానము కానందునఁ గవి దాని నంతగా వర్ణింపక చంద్రభానునివలె విజయలోలుఁ డనువిందుని కూఁతు వివాహమయ్యె నని తేల్చివేసినాఁడు. ఇది కొంతవిరసముగ నగపడుచున్నది కాని యిట్లు తేల్చివేయుట యుచితమే. రామాయణమున రామపట్టాభిషేకము నట్లు విభీషణుని లేక సుగ్రీవుని పట్టాభిషేకములు వర్ణింపఁబడియెనా.
ఇందు గ్రంథాదిని నారదవృత్తాంతము వర్ణింపబడినది. ఇదియే ప్రబంధ మెల్లఁ గల్పించుట కనువుపడినది. కలహాశనుఁడు రుక్మిణీనత్యాకుమారులకుఁ గయ్యము పెంప నూహించి చంద్రభాను ననాదరించెను. దానిచే నాతఁడు నారదునిపైఁ గినిసి తుంబురునివలన విద్య నేర్చి రా నుద్యుక్తుఁడై యట కేగి గానవిద్యతోపాటు కుముదినింగూడ సంగ్రహించుకొని వచ్చెను. తుదకుఁ దా నభ్యసించివచ్చిన గానవిద్య హరికిని బ్రద్యుమ్మునకును వినిపించి మెప్పునందెను. గానవిద్యయే కుముదినీప్రాప్తహేతు వగుటచే దానినే బీజస్థానమం దనువు పఱిచెను. విజయలోలునిపాత్ర మంత సార్థకముగ లేదు; మాయాకుముదినీరూపముం దాల్చి వాస్తవకుముదినిం జంద్రభానునితోఁ బంపుట కుపకరించినది. అసురయుద్ధమున రథచోదనమున కనువుపడినది. కాని శేషశైలవిశేషములఁ దెల్పి తన్నుఁ దా సార్థకపఱిచికొన్నది. వనములో నసురుఁడు యుద్ధమును గుముదినీలాభమునకు సాధన మగుశాంబరీవిద్య నేర్చుటకై కల్పింపఁబడినది. యుద్ధము లేనిచో మహాకావ్యలక్షణానురోధ మని కల్పించిన నుండవచ్చును. విజయలోలునికొఱఁత తీర్చుటకుమాత్రమే యనువిందునికూఁతురు కల్పింపఁబడినది. ఇంకను దరళికాదిపాత్రములు యథోచితకార్యసాధనమునకై యౌచితి నాలోచించి కల్పింపఁబడినవి.అందందుఁ గొన్నినెరసు లగపడుచున్నయవి. రసలోలుపుల కవి పాటింపఁదగనివి. ఈయుత్తమగ్రంథ మెల్లర కవశ్యాదరణీయ మని నొడువుటయే శివము.
కఱ్ఱి సాంబమూర్తిశాస్త్రి