చంద్రభానుచరిత్రము/తృతీయాశ్వాసము

శ్రీరస్తు

చంద్రభానుచరిత్రము

తృతీయాశ్వాసము

క.

శ్రీదత్తాత్రేయ సదా, మోదితసకలాదితేయ మునిగేయ చిదా
స్వాదాప్రమేయ యనసూ, యాదేవీశుక్తిమౌక్తికానఘకాయా.

1


వ.

అవధరింపు మాసమయంబున.

2


గీ.

అచట హితుఁ జూచి హరిసుతుం డనియె మనల
కిచట మ్రొక్కంగఁ జన దేవుఁ డెదురువచ్చె
మునివచనభంగి రెం డొకపనియ గాఁగఁ
[1]దెలిపెఁ గుండినమునకుఁ బోవలయు మనకు.

3


క.

మనవీరసేనునకుఁ గుం, డినమునఁ దుంబురుఁడు వీణ నేర్పెడునఁట యా
తనియనుజ యొకతె కుముదిని, యనఁ గలదఁట కార్యసిద్ధి యగు మన కచటన్.

4


[2]ఉ.

కావునఁ బంచసాయకుఁడు గంజభవాత్మజుచేతఁ గానవి
ద్యావిదుఁ డై ప్రసిద్ధిఁ గనునంతకు మున్నుగ నేగి గేయలీ
లావిధు లెల్లఁ జాలఁ బదిలంబుగ నేరిచి యెట్టులైన నే
నావనజాక్షిఁ దెచ్చెద సఖా యట కీవును సంభ్రమంబునన్.

5


క.

నావెంటనె ర మ్మిఁక మన, మీవిధము పురంబుఁ జేర నేగి హరికి స
త్యావనితకు నెఱిఁగించినఁ, [3]బోవఁగనీ రిదియ వెడలిపోఁ దఱి యనినన్.

6


చ.

అతఁడును నట్లకాక యన నప్పుడ వా రసహాయశూరు లై
ప్రతిదివసప్రయాణములు బట్టనపక్కణదుర్గదుర్గమా
యతతటినీవనీగిరు లనంతము లొక్కట దాఁటి పోయి రు
ద్ధతగతి నంత నిచ్చటఁ దదాప్తచమూనివహంబు లెంతయున్.

7


చ.

క్రమమున నెల్లెడ న్వెదకి కానక క్రమ్మఱిపోయి యయ్యదూ
త్తమునకు విన్నవించుటయుఁ దత్ప్రమదాసుతబాంధవాప్తవ
ర్గము లడ లొంది భావిశుభకార్యము నారదుచే నెఱింగి హృ
త్ప్రమదముఁ గాంచె నిచ్చట నృపాలకుమారవతంసు లొక్కెడన్.

8

క.

కని రలదుర్వాసుతపో, వనము న్సతతోజ్జ్వలత్సవనముం బుణ్యా
వనము న్సంయమిపదపా, వనమున్ జనదుష్క్రియానివహధావనమున్.

9


క.

కనుఁగొని యానందము నె, మ్మనమునఁ దళుకొత్త ధరణిమండలపతు ల
వ్వనమధ్యము దఱియఁగఁ జని, కనుఁగవలకు మోద [4]మిడు నొకానొకచోటన్.

10


ఉ.

మార్గాయాసము పో నికుంజపటలీమధ్యంబు సొత్తెంచి యం
తర్గేహంబునయందపోలె సుఖనిద్రం జెంది రుల్లోలసం
సర్గానర్గళభానుజానిలసదాసంఘృష్టరంభావనీ
వర్గోత్తాలపలాశవీజనముహుర్వ్యాధూతఘర్మంబుగన్.

11


ఉ.

ఆయెడ నాశ్రమైణయుగ మచ్చట నచ్చట లేఁతపచ్చికల్
మేయుచు సారె నొండొకటి మేనులు మూర్కొనుచు న్రయంబునన్
డాయఁగ వచ్చి యాధరణినాథుల [5]మౌనిజనభ్రమంబునన్
రాయిడిఁ జేసెఁ బైఁ బడి చిరంతనతాదృశవాసనారతిన్.

12


చ.

అలయిక నిద్రవోవుతఱి నాగతి సారెకు రాయిడించినన్
దెలిసి తటాన మేలుకని దిగ్గున లేచి యదూద్వహు ల్దముం
గలఁగుచుఁ జూచి చెంగునను గంతులు వేయుచుఁ బాఱునట్టి జిం
కల బెదరించి జోడు దలఁగం గలగుండు వడంగఁ దోలినన్.

13


చ.

మిగుల భయార్తి నొండొకటి మించఁగ రెండును రెండుదిక్కు లై
తగ బుసకొట్టుచుం బొదలు దాఁటుచుఁ గ్రమ్మఱి చూచు చుప్పరం
బెగయుచు గాలిఁ దీన చలియించిన ననఁ దొలంగిపోవుచున్
దిగులున నచ్చి యమ్మునిపతిం గని యుల్కుచుఁ జెంత నిల్చినన్.

14


శా.

ఆదుర్వాసుఁడు వానిఁ జూచి యపు డత్యంతారుణాపాంగవీ
క్షాధామంబులు దిగ్విటంకముల నుల్కాజాలము న్నింప మ
ర్యాదాలంఘనజాంఘికాగ్రహముతో నౌరా మదీయైణలీ
లాదాంపత్యముఁ బాపె నెవ్వఁ డని యల్కన్ ధ్యానసంసక్తుఁ డై.

15


క.

యదునాథనందనులఁ గా, మది నెఱిఁగి కటంబు లదర మౌని కటకటా
తుదమొద లెఱుఁగక మదమునఁ, జెదరినమది నింత సేయ చెల్లున యనుచున్.

16


సీ.

ఎఱుఁగరే దేవతాధీశుసంపద లెల్లఁ గడలిలోఁ గలిపినగబ్బితనము
మఱచిరే సత్యభామామురారుల బండి[6]గొడ్డులఁ జేసినగొడ్డతనము

తలఁపరే యరవిందధామునిల్లాలి ధాత్రికిఁ గూల ద్రొబ్బినదిట్టతనము
చూడరే రోఁకటిచూలికై సాంబుతోఁ దమునెల్లఁ దిట్టినదంటతనము
పెక్కు లేమిటి కరయరే భీషణాక్షి, వీక్షణాక్షుద్రరూక్షాశుశుక్షణిక్ష
ణోక్షిపజ్జ్వాలికలలోక మొక్కమొగిన, భస్మముగఁ జేయఁజాలిన బంటుతనము.

17


క.

అని శము లోహో యన ముని, యనిశములో నడరురోష మగ్గల మగుచుం
గనికరము మాఁపఁ జుఱచుఱఁ, గని కరమున శాపజలముఁ గైకొనునంతన్.

18


సీ.

బహుకాలసాధ్యతపస్స్వ మేటికి మంటిపాలు సేసెద నని పలికె నత్రి
యాదవాన్వయులఁట యన్న యీతెగువ నీ కనుచితం బనెఁ గర్దమాత్మజాత
సాంజలియై యుపాధ్యాయ యీయొకతప్పు సైరింపు మనియె శిష్యవ్రజంబు
అంతకు నెంత నీ వటువలెఁ గోపింప నది లక్ష్యమా యని రన్యమునులు
మఱియుఁ దలకొకమాటగా మౌనినాథ, తాళుమన సడ్డసేయక తపసి నిజమృ
గంబు లె ట్లట్ల వారును గవ దొఱంగి, కలఁగ నిమని శాపోదకంబు విడిచె.

19


క.

అట్టిమహారభసపుఁదఱిఁ, జెట్టున డిగినట్టు లగ్రసీమ మొలచిన
ట్లుట్టిపడినట్టు [7]మౌనుల, కట్టెదుట న్వ్యాసమౌని గనుఁగొననయ్యెన్.

20


సీ.

సత్యవతీమానసము నొందుహంసేంద్రు ముడివడునిడుదకెంజడలవాని
భరతరాజాన్వయోద్ధరణుఁ డై మనుసౌమ్యు విరిదమ్మిపూసలసరమువాని
వాసిష్ఠవంసాప్తి వఱలుముక్తాగ్రణి పలుచనినిడుయోగపట్టెవాని
నలఘుభారతకళాకలితుఁ డొసత్పతిఁజిఱుత [8]పప్పళివన్నెచేలవాని
బ్రాక్తనవచోవిభాగవైభవధురీణు, గేల మున్నీటిక్రొన్నీటిగిండివాని
నాపరాశరపుత్రు నుద్యత్ప్రకోప, రౌద్రతరనేత్రుఁ గాంచి దుర్వాసుఁ డపుడు.

21


క.

సవసవవినయముఁ బల్కుచు, నవనతగతిఁ దోడి తెచ్చి యాతిథ్యంబుల్
సవరించిన నమ్మునిపతి, యవి గైకొన కనియె భీషణార్భటి మెఱయన్.

22


ఉ.

బాలురు పుట్టుభోగులు నృపాలతనూభవు లెండకాఁకచేఁ
దూలినవారు నిద్రతమిఁ దోఁగెడువా రొకతప్పు సేసినం
దాళక యేల కావరమున న్శపియించితి వోయి యిట్టినీ
కేల మునిత్వ మేల జన మేల జటాధర మేల నేమముల్.

23


[9]సీ.

మునుమున్న యపకీర్తి జనియించి నటియించు నామీఁద భ్రూయుగం బాడు నుదుట
ముంగల దురితసమూహంబు లుదయించు నామీఁదఁ బులకంబు లంకురించుఁ

దొలుదొల్త నఖిలవిద్యలును నీరై జాఱు నామీఁద ఘర్మాంబు వడరు మేన
మొదట నే తపము సమూలంబుఁ జలియించు నామీఁదఁ బెదవి బిట్టదరసాగుఁ
గాన నూఱక శపియింప మౌనిపతికి, దీరునే యోయిమానిసిదిండితబిసి
విసపుఁజెట్టున కూడలు [10]విడిచినట్లు, జడలు జనియించి చెఱిచె మస్తమున నీకు.

24


చ.

ముని నని పేరు పెట్టికొని ముక్కునఁ గోపముఁ దాల్చి యీగతిన్
జనుల శపింప దీన నొకసద్గతి గల్గునె మర్త్యమాత్రులే
వనజదళాక్షనందనులు వారలు వారలఁ జూడకున్న న
ద్దనుజవిభేదిఁ జూడవలదా ఖల దారుణ ధూర్తవర్తనా.

25


[11]క.

అని యనితరసహ్యం బైఁ, గనగనమనుచూడ్కిఁ గోపకళ క్రాలుకొనన్
ముని మునిసి యత్రితనయుం, గని కనికర ముడిగి పలికి కటకటఁ బడినన్.

26


క.

రోషారుణాక్షివీక్షా, భీషణవదనంబుతోడఁ బెదవు లదర నా
దోషాకరానుజుఁడు కటు, భాషణముల వ్యాసుఁ జూచి పలికెను గలఁకన్.

27


ఉ.

వంచన నావనంబునకు వచ్చి మదించి దయావిహీనులై
పెంచిన యేణశాబముల బి ట్టదలించినఁ జూచి నేను గో
పించి యథోచితంబుగ శపించితి నిందుల కీవు వచ్చి గ
ద్దించఁగ నేమికారణము దెల్పఁగదోయి భవత్ప్రతాపముల్.

28


[12]క.

వాకిలి చెఱచినఁ జాలున్, సాకిరి బలికెద నటంచుఁ జనుదెంచి కడుం
జీకాకువడఁగ నాడిన, నీకు న్వెఱచెదమె తెలియనేరవు మమ్మున్.

29


చ.

నను మునిమాత్రు నాడుగతి నాటఁగ నాడిన నేఁడు నీకు నే
ననునయభాషణంబులఁ బ్రియంబులు పల్కుదునే యమర్షసం
జనితనితాంతభీషణనిశాతకశాతరళేక్షణంబులం
గినుక నడంతుఁ గాక [13]వెడగిర్పులు నాయెడ మాను మం చొగిన్.

30


స్రగ్ధర.

క్రుద్ధుండై బల్విడిం బల్కుచు నపుడు దృఢాకూరితాహంక్రియాసం
బద్ధద్వేషంబుతోడం బ్రళయశిఖిగతి న్మండుదుర్వాసు వ్యాసుం
డిద్ధామర్షంబుతో బి ట్టెగసి పలికె వా రిద్దఱుం దాళలేక క
త్యౌద్ధత్యం బొప్ప నన్యోన్యము శపనవిధాయత్తు లై యుండునంతన్.

31

క.

విఱిగె ధర జరిగె నుడుతతు, లొఱగె నభం బరిగె వార్ధు లూటాడె గిరుల్
వెఱచె జగ మఱచె దిశ ల, త్తఱి వారలరోషగద్గదధ్వానములన్.

32


ఉ.

గ్రక్కున లేచి యంపసెలగల్ దగు పెన్పొదులూని సింగిణీ
లెక్కిడి చేత నాలుగయి దేర్చినతూపులు సంతరించి నల్
ప్రక్కలఁ జూచుచుం గలకలం బుదయించినత్రోవ నిల్చి యా
దిక్కునఁ బాఱుసంయములు దెల్ప నశేషము నాలకించుచున్.

33


మ.

చని యగ్రావని వారు గాంచిరి జటాసంచ్ఛన్న[14]సర్వాంగులన్
జనితేర్ష్యావశులన్ మిథశ్శపనదిత్సాప్రస్ఖలద్వాక్యులం
గనదాలోకవికీర్ణపావకుల హుంకారోర్జితాన్యోన్యత
ర్జనులన్ భ్రూకుటిభీకరాకృతులఁ బారాశర్యదుర్వాసులన్.

34


[15]క.

కాంచి ప్రదక్షిణవిధు ల, త్యంచితగతి నాచరించి సాష్టాంగము ల
ర్పించి యలమునుల వారు ను, తించిరి గంభీరభారతీగుంభనలన్.

35


సీ.

శౌరిపాదాబ్జసంసక్తాయ ముక్తాయ సోమచూడారత్నసోదరాయ
సకలపురాణప్రశంసాయ హంసాయ బలభేదిగర్వవిభంజనాయ
సత్యవతీగర్భజాతాయ పూతాయ కర్దమజానందకందలాయ
శ్రీవసిష్ఠకులప్రసిద్ధాయ శుద్ధాయ శాంభవతేజోంశసంభవాయ
నతిరమర్త్యనుతాయసువ్రతిహితాయ, నతిరవార్యనవార్యమద్యుతియుతాయ
నతిరతివివిక్తతనయాయతతనయాయ, నతిరశేషవిశేషమత్యతిశయాయ.

36


క.

అని యిరువురఁ బొగడిన నం, దనసూయసుతుండు శాంతుఁడై నిజశాపో
క్తినిశాతశూలకృతశా, తనుల యదూద్వహులఁ జూచి దయతోఁ బలికెన్.

37


ఉ.

మీ రొకయేఁడు జో డెడసి మీఁదటఁ గుండిన[16]పట్టనేందిరా
గారములోన నొండొకని గన్గొని వాంఛితవైభవంబు చే
కూరిన నింపుసొం పెసఁగ గోపవధూపతితోడఁ గూడి మీ
ద్వారావతీపురంబునకు వత్తురుగాని తలంక నేటికిన్.

38


క.

అని పలికిన దుర్వాసో, మునిచేఁ బనివిని దయాసమున్నతు వ్యాసుం
గని పునరవనతి సలిపిన, ననుపమవాత్సల్యగరిమ నతఁ డి ట్లనియెన్.

39

చ.

అభిమతకన్యకాపరిణయైకకుతూహలశాలు లై మహా
విభవవిశాలు లై మనుఁడు విశ్వధరావలయంబు మెచ్చ నో
శుభమతులార యంచుఁ దముఁ జూచి యనుగ్రహ మాచరింప వా
రభినవధైర్యధుర్యహృదయాంబుజు లై చనుచు న్మనంబునన్.

40


[17]సీ.

వనతరు ల్మఱువైనఁ గనకపోదుమొ యంచుఁ దమపరస్పరవదనములు గనుచు
గెడవాయఁ దెరువున నెడసిపోదుమొ యంచు నన్యోన్యహస్తము లలమికొనుచు
ఘనఝిల్లికార్భటి వినకపోదుమొ యంచు సారె మిథోవాక్యసరణి వినుచు
మదగజాదినిరీక్ష మఱపువచ్చునొ యంచు నితరేతరవిమర్శ మీయకొనుచుఁ
దఱచు వంకల ననుచు మాధవులఁ బెనచు
జమళిమల్లియ లునుచు వాసనలఁ గొనుచుఁ
బొలయుగాడ్సుల నినుచు చల్వలనె మనుచుఁ
గలయఁ దేఁటులఁ బెనుచు మార్గములఁ జనుచు.

41


క.

ఈఱములు గుబురుకొనునెడఁ, దాఱుచు వా రేగుతెరువు దప్పి చెమట మై
నేఱులుగఁ గాకి దూఱని, కాఱడవిని బోవుచో నొకానొకచోటన్.

42


ఉ.

అధ్వరదత్తతిలాక్షతగ్రహణసంకులమూషికారాజికూజితములు
శ్లథవప్రపాషాణసంధిజాతవటావనీరుహాలోలఝిల్లీరవములు
లూతాఘటితతంతుజాతాభివృతదారుగోపానసీ[18]నటద్ఘుణరుతములు
ప్రశిథిలప్రాసాదభాగగేహాన్యోన్యనీడభ్రమాత్పక్షినిస్వసములు
జీండ్రుమని మ్రోయఁ జెదరినచిత్తరువులఁ, బడినగోడల నొరగుకంబములఁ బట్టు
వదలుగారలతోఁ గానవచ్చె బహుశి, వాలయం బైనశూన్యశివాలయంబు.

43


మ.

ఘనమౌళిం బెనఁగన్నబల్లిపర రేఖాచంద్రుఁ డంగంబుఁ జెం
దిన జీర్ణోరగకంచుకచ్ఛటలు తాదృగ్భూష లందంద చిం
దునుసుల్ భూతిరజంబు నై తనర రుద్రుం డట్టిశూన్యాలయం
బునఁ గాఁపుండియుఁ గాంచుఁ బ్రాక్తనమహాభోగంబు లెల్లప్పుడున్.

44


గీ.

ఆమిషభ్రాంతిచేఁ జించినట్టిజీర్ణ, చిత్రపటఖండములు పైనిఁ జెదరి రాలఁ
దాల్చి తగు నందు మూషికతతి గణాధి, పతికుథాలంకృతానేకపము లనంగ.

45


సీ.

అన్యోన్యనాదకుప్యత్సింహహుంకృతి హోరనురొదఁ దలయేరు వొడమ
భుజగభీమాలయభూమిఁ బేర్కొనిన పిచ్ఛిలవిషంబున నోరు చేఁదుదాల్పఁ

జటులఝంఝాప్రభంజనమహోద్ధతిఁ గ్రమ్ముసురమంటఁ గనుఁదమ్మి చుఱుకుఁ బూన
సమదవాహారివిషాణఘట్టనభీతి నిగుడునన్నున మేను సగము గాఁగ
నహహ చట్రాతివంటివాఁ డగుట నచట, శంభుఁ డొకయించుకేనియు శంక లేక
నిలిచెఁ గాక మఱెవ్వరుఁ దలఁచిరేని, తోలు నెమ్ములుఁ గనుపట్టఁ దూల రెట్లు.

46


చ.

మును గజవైరియం చడుగుముట్టఁగ వప్రము ద్రొబ్బి తో గజా
ననజనకత్వ మెంచియొ వనద్విరదమ్ములు దుమ్ముఁ గర్ణచా
లనముల ద్రోఁచి హస్తసలిలంబున దాఁచి ఘటించుఁ బద్మినీ
ఘనరసయోగసంతతవికస్వరపుష్కరము ల్తదీశుపైన్.

47


[19]సీ.

చీలలు చెదరి బచ్చెన చిట్లి వానలఁ గూలుకొమ్మలతోడి గోపురములు
పొరుగూరిప్రజ పాడుపొలము మేఁపుచు రేలమంద లాఁగినభోగమండపములు
నుసిపట్టి పడి నుగ్గునూఁచంబులై బండికండ్లు దక్కఁగ నేలఁ గలియుతేరు
లెడ లేక తఱచు వ్రేలెడు జిబ్బటీలచే గబ్బులు వెదచల్లు గర్భగృహము
లోరఁగలుఁజులు వడి తాప లూడి ప్రాఁచి, బూరటిలి నీరు గననీక పూరి మొలచు
బావులును గల్లు నచట భూపాలసుతులు, చేరి యొకచోట నలఁత వసించునంత.

48


క.

భీషణతరహయహేషా, ఘోషము వినవచ్చుటయును గుఱఁగట వా ర
న్వేషించి కాంచి రస్త్రవి, శేషోజ్జ్వల మైనయొక్కచిత్రరథంబున్.

49


ఉ.

కాంచి తదగ్రధీరతురగస్ఫురణంబుఁ దదీయలోహచ
క్రాంచలపాటనంబును దదస్త్రసమృద్ధియుఁ దత్పతాకికా
భ్యంచితకాంతియు న్నయనపర్వముగాఁ జెలికాని సూతుఁ గా
వించి ముకుందనందనుఁడు వేడుకఁ దద్రథ మెక్కి తోలఁగన్.

50


సీ.

వంకరగొంకరవలుదకోఱలు మించు సెలవులపొల కీఁగ లలమి మూఁగఁ
బెలుచ బీఱవరాలు పెనఁగొన్న మువ్వంక బరుసుగుత్తుకఁ బ్రేవుసరులు వ్రేల
నీచవోయినయట్టియూఁచపిఱుందుపైఁ గఱకుతోల్దట్టి పెన్ముఱికివలన
నిఱుకటంబుగఁ గ్రుంగి యొఱగువోయినగూడమూఁపుపై గద మిన్ను ముట్టి వెలుఁగఁ
గోఱమీసల గిజిగానిగూఁడువోని, నోర మానిసితలలు లేనారికెడపుఁ
బొండ్లములవలెఁ బీల్చుచు భువనభయద, కాయుఁ డొకరక్కసుఁడు వారిఁ గదియవచ్చి.

51


[20]మహాస్రగ్ధర.

కఠినోగ్రగ్రంథిసృక్వగ్రథితపిశితదుర్గంధసంబంధశశ్వ
చ్ఛరనాసాదేశవాసిశ్వసనవిసరసంచారఘోరాననాయః

పిఠరప్రవ్యక్తదంష్ట్రాపృథుమథనభవత్ఫేనసంతానకుల్యా
లుఠనార్ద్రోన్నిద్రజిహ్వాలుఠనభయదఫల్గుధ్వనిన్ రాజుఁ బల్కెన్.

52


ఉ.

ఓరి వరాక నేఁడు మది నోడక మామకకాననాంతముం
జేరుట యెట్లు చేరి పయిచేటు గణింపక కండక్రొవ్వునం
దే రిది యెక్కు టెట్లు విధి ద్రిప్పుకరాఁ బొలకై కడంగునా
బారికి నగ్గమైతి విదె [21]బల్విడి మ్రింగెద నీక్షణంబునన్.

53


క.

ఎచటికి నరిగెద వని రా, త్రిచరుం డాభీలశూలరేఖఁ [22]జదలఁ ద్రి
ప్పుచుఁ జటులహుం,క్రియార్భటి, నచలము లూటాడ నతిరయంబున వైవన్.

54


[23]స్రగ్వణి.

గాఢనక్తంచరగ్రామభస్మీకృతి, ప్రౌఢరుద్రేక్షణప్రాయశృంగత్రయీ
లీఢఘంటారవాళీకరాళాంతకృ, ద్రూఢగర్జాప్రజారుంతుదధ్వాన మై.

55


శా.

ఆశూలం బరుదేరఁ గ్రూరతరబాహాగర్వదుర్వారుఁ డై
యాశాభూధరకూటకోటి వడి నూటాడంగ బిట్టార్చి ధా
త్రీశోత్తంసము విల్లువంచి గొనయం బెక్కించి చే మించి నా
నాశాతాశుగము ల్నిగుడ్ప నది సాంద్రజ్వాలికాభీల మై.

56


భుజంగప్రయాతము.

కరాళాశుగౌఘంబుఁ గైకోక పైపై
నరాళాకృతి న్రా మహాబాహువీచీ
మరాళచ్ఛటాస్ఫూర్తిమద్వజ్రహేతి
త్వరాలక్ష్మిఁ దచ్ఛూలదండంబుఁ ద్రుంచెన్.

57


గీ.

త్రుంచుటయు నఖర్వదుర్వారకోపిఁ డై, యసురశక్తి వైవ హరిమతుండు
దానిఁ బటుకృతాంతదంష్ట్రానితాంతశి, ఖాంతకాంతకుంతహతి నడంచె.

58


క.

తనశక్తి యిట్లు వడనం, తన భక్తి వహింప కసుర తత్సమరమునం
దనుశయముఁ దొఱఁగి క్రమ్మఱ, ననుశయమున లీల నొకమహాగద గొనుచున్.

59


[24]మత్తకోకిల.

రాజరాజయకాంక్ష న న్నెదుర [25]న్నరుం డితఁ డెంత యా
రాజరాజసఖుండు నోపఁ డరాతిఘాతిధృతాసిధా
రాజరాజున కస్మదస్త్రపరంపరల్ జత జంభవీ
రాజరాజముఖామరావళి నైన నే [26]నలయింపుదున్.

60


మాలిని.

అని యనితరధార్యాహార్యశౌర్యాస్పదం బై
కనకన మని నిప్పు ల్గ్రక్కునుద్యద్గదం గ్ర

క్కనఁ గనలుచు రోషాయత్తచిత్తంబుతో వాఁ
డని ననియతమార్గుం డౌచు రాచూలి వైచెన్.

61


ఉ.

వైచిన నమ్మహాగద యవార్యగతిం దను డాయ వచ్చినం
జూచి నృపాలుఁ డోరసిలి శూరతమైఁ బరిఘంబు సాఁచి రెం
డై చటులాకృతిం బడ రయంబునఁ ద్రుంచిన నన్నిశాచరుం
డేచినకిన్కతో నొకమహీరుహముం బెకలించి యార్చుచున్.

62


క.

బిరబిరనఁ గేలఁ ద్రిప్పుచు, దురదుర నేతేర ధరణిధూర్వహుఁ డతనిం
బరిమార్పఁగరా దొండొక, తెరువున నని యసమసమరదృఢసంభ్రముఁ డై.

63


వ.

ఆసమయంబునఁ బగఱపొగ రిగుర నెగుచుతఱి సబలంబు లగుసబళంబు
లును విలిప్తహాటకంబు లగుఖేటకంబులును ముసురువిసమున నెసకమెసఁగుచి
లువపిలుకలఁ గలకల నగుతళతళనిచిలుకుములుకులను నవక్రరుచిక్రమా
క్రాంతదిశాచక్రంబు లగుచక్రంబులును బరరాజసమాజంబు నాజిం బరా
జయంబు నొందించు తేజంబులు గల నేజంబులును నిజకషణజనితవిస్ఫుటస్ఫు
లింగసంఘసంఘృష్టవియత్తలంబు లగునత్తలంబులు మొదలగునానాయుధం
బులు గల్గ నాయోధనంబులం బ్రతివీరదరదం బగునరదంబు వఱవ నిరు
పమప్రభాప్రభాతభానుం డగుచంద్రభానుం డాతతకేతనాకుంఠఘంటాఘణ
ఘణాత్కారంబులును రంగత్తురంగగళకలితకింకిణీక్రేంకారంబులును నధిజ్య
కోదండశింజినీటంకారంబులును సైంధవతోలనాలోలవిజయలోలహుంకా
రంబులునుం గలసి యుద్వేగకలకలంబుఁ జిలుక నలుక సమిద్ధరయంబున
నెదురుపడి కదిసినఁ జుట్టుముట్టి కట్టడియై మట్టుమీఱి నెట్టుకొనిన దిట్టతనం
బునఁ బుట్టు నట్టహాసంబున ధరాధరధట్టంబులు బిట్టవియ నొక్కట నా
రక్కసుం డుక్కు మిగిలి గ్రక్కున నక్కుమారశిరోమణి కిరీటపాటనత్వరా
పరాయణంబుగా [27](నుత్తాలసాలం బాభీలగతి గిరగిరం ద్రిప్పి వైచె వైచిన
నుఱక రాజు దాని నఱకె నఱకినం బిఱికిగొనక యయ్యసుర కుప్పించి
యెగసి మగతనంబున సారథిపేరురంబున బోరన ధారాళరక్తంబులు గురియ
సురియగొని పఱియలువడ నడిచినప్పు డప్పుడమిఱేఁడు కడువడిం దొడరి
కడలుకొను కడిమిం బొడముసిడిముడిఁ దడఁబడక గడిసేరు నసురనిడుద
యొడలు సుడివడఁ దొడివడ నలుగడలు గడగడగడ వడంక జడిగొని
వెడలు వెడందవాలికడిందియంపఱ నింప నన్నిలింపారి తలంపాఱి కంప

మానమానసుం డై దరిసి మురిసియు) వివిధసవిధకుధరకూటఝాటంబులు
నిరాఘాటపాటవంబున నుత్పాటించి మించినక్రొవ్వున నవ్పీరవరేణ్యునెడ
ఱువ్వి నవ్వుచు నార్చి కార్చిచ్చుపగిదిఁ బేర్చి వికటకటతటనికటదంష్ట్రాపుటం
బులు గిటకిట గీఁటుచుఁ గుటిలగతి నుడుమండలంబు సోఁక నేకజాంఘికత
లంఘించి మించినం గాంచి యమ్మంచువెలుంగుకొలముదొర మెచ్చి యిచ్చం
బొగడునయ్యెడన గగనతలంబుననుండి మగిడి రథచక్రంబు లిరుసులకొలఁది
దిగఁబడ నొగలిమీఁదికి దుమికి కిఱు కనకుండ సూతు నాతతకరచపేటా
స్ఫోటంబు పెల్లునఁ ద్రెళ్లి మూర్ఛిల్లం జేసి యుబ్బి బొబ్బ లిడునబ్బలియుని
జూచి యద్ధానవరిపుసూనుండు నిజనిశితకరకరవాలధార నురంబు చుఱుకు
చుఱు కన నఱకినఁ బిఱికితనంబున నెఱచఱచి పిఱుతిగిచి యుఱికి పఱచు
టయుఁ దానును వానివెంట నంటి బంటుతనంబునఁ బృథుతరరథావతరణం
బొనర్చి యఖండకోదండపాండిత్యంబునఁ బెఱచు మెఱుంగులు గిఱికొన
మిఱమిఱ మెఱయు నుఱిది గొఱక లురవణిం గెరలి సరిపెణంబఱపి నఱుము
చుఁ దఱిమినఁ దెఱపి గనలేక నాకద్వేషి కాలికొలందికి నరిగియుఁ దిరిగి
మరలం బిరుదుమెఱసి తరుపరంపరల మాటుకొని సమీపశిలాశకలంబు
లదవదం బదంబుల నందికొని యనుపమానగతిఁ జిఱ్ఱుచిఱ్ఱున వైచుచు రా
చూలిం గదిసిన నతండు ఖేటంబు చాటుగా వెనుకనడ నడరి తేరెక్కునెడ
నెక్కుడుజవంబున నక్కఱకుఁబొలసుఁదిండి గండుమీఱి యొండెఱుంగక
తదీయస్యందనంబు క్రిందికి మోరత్రోపునఁ జొరంబాఱి మాలెచాఁపు గల
మూఁపుల నెత్తి నేలఁ గూలంబడ నెట్టిన నట్టులు వీడి పుట్టచెండుమెండున
మిక్కుటంబుగఁ బుటంబు లెగయ నిజేచ్ఛం జనుహయంబులు తొడివడంబో
వుట చూచి రాచవారు రథికప్రమేయులు గాన బెగ్గిలి చనుయుగ్యంబులఁ
బట్టి యరదంబు మెఱపు మెఱసినచందంబున నందంబు సూప మరల్చి యే
పున నసహ్యరంహసింహనాదంబుగఁ గోదండంబు సారించి పే రెంచి యాపిశి
తాశి నాశీవిషసమాననానానూనబాణసంతానంబుల మానంబు దూలించి
కీలాలజాలంబులఁ దేలించిన నించుకవడి బెడఁకువడి యడలున నిడుముకొను
బడలిక నొకయనోకహంబునీడ నొఱంగి వెఱఁగుపడి పరికించుతఱి నెడమీక
పొడమి రథచోదకుం డాదటఁ గ్రుద్ధుండై బిట్టువైరంబునఁ బ్రేంఖత్కంఖాణ
బాణపుంఖసంఘాతసంజాతజ్యాతలధూళికాపాళియు నదభ్రభ్రమణవిభ్రమ
కృత్ప్రభవత్తలాతలకఠినలుఠదయోమయనేమిఘర్ఘరనిర్ఘోషంబును దక్క నొండె

వ్వియుఁ గనవినఁబడకుండఁ బండి త్రోలినంత నంతకాకారుండై పంతంబు మె
ఱయ సంతమసవతీచరప్రవరుండును గరాళకరాలక్షితకంకాళుండై హుంక
రించి యహంకారంబున నీ వెందుఁ బోయెద వని యుదుటునం బొదలుమదం
బున హత్తి మొత్తుటయుఁ గత్తలానులుం బెగ్గిలి మ్రొగ్గిన సోఁగవాగియలు
సారథి నిజభుజాయుగంబునఁ గుదియంబట్టి బి ట్టెత్తినం దత్తరంబున నుత్తేజ
కాశ్వరాజీముఖరనూపురపురశ్చరణఖరఖురశిఖరంబు లంబరంబున బయలు
వ్రాఁక జోకఁ బిఱిందిపదంబులన కొంతదూరంబు తే రీడ్చికొని తమకంబునన్
దుముకుగమకంబున వియచ్చరు లచ్చెరువడి చూడ నమ్మహీమండలాఖండ
లుండును నయ్యంతదురంతసాహసబాహాసాహాయ్యంబు నూహించి యహో
యని సంతసించి పొంగి యతండు నిండుమనంబున ఘోటకబృందంబుకం
దంబులు ప్రోదిగ నప్పటప్పటి కప్పళించుచుఁ జెవులు నివిరి మొగంబులు
దుడిచిన భూరిపూత్కారభూషితతాలువుల డిండీరఖండంబులు తండతం
డంబులుగ వడఁ గఱకఱఁ గళ్లెంబులు కొఱుకుచు జోడనల నవేలంబుగా
మగుడుటయుఁ దోడన వెంబడిం బఱచి యురుతరశక్తి నన్నక్తంచరుండు
పిఱిందికి వచ్చి భుజార్గళంబున నిరుగడ నిరుసుకొన దివియంబట్టి జంగయిడి
క్రుంగి కుతికిలంబడి సాఁగనీక కూఁకలిడ నారాకొమారుండు పెడమరలఁ
తిరిగి యత్యాగ్రహంబునఁ బ్రత్యాలీఢపాదుం డై వింట నొం డొంట
మంట లుమియుకుఱుగంటుములుకు లెదురు చిమ్మినకైవడిఁ గణుదురీఁగలు
మూఁగినతెఱంగున నాదారకుం డాపాణిద్వయతలప్రతలంబులు సూటివడ
నాట సవ్యసాచియై యేసి యీసు నులుకుఁ బుట్టించినం బట్టువదలి కళవ
ళించి నిలువరింపలేక కదలి పఱచుటయు వెనుకనడ నడరి తేరెక్కి వెంట
నంటి కవిసి మనుజపతి ప్రబలం బగుసబళంబు వక్షస్స్థలంబున గ్రుచ్చినఁ
జచ్చినపోల్కి వెలికిలఁబడి పొలిసెఁ బొలిసెఁ బలాశి యనుతఱినె పొరలి వడి
సడలక దిటంబున మచ్చెపుటంబు లెగయుచు బెగడునఁ గొన్నియడుగులు
నిగిడి మగంటిమి మిగుల డగరతనంబున లేచి యాచేరువ గండోపలఖండం
బుఁ గేలఁ గైకొనుతఱి సాత్రాజితీపుత్రుండు గోత్రనిభగాత్రుం డగునీసత్రా
శనశత్రుండు శరమాత్రభేద్యుండు గాఁ డని యూహించి యానిశాచర
వీరుపై సౌరాస్త్రంబుం బ్రయోగించుటయును.

64


క.

గిరు లొరఁగఁ దరులు విఱుగ, న్శరనిధులు గలంగఁ దరణి చాయ దొలంగన్
హరిదంతంబులు వగులఁగ, నురవడి నఱచుచు నిశాటుఁ డుర్విం గూలెన్.

65

ఉ.

కూలినదైత్యుఁ జూచి సురకోటి యమందమరందబిందువుల్
జాలుగఁ గ్రొవ్విరు ల్గురిసె జంత్రపుబొమ్మలరీతి జక్కిణుల్
కేళిక చేసి రచ్చరలుఁ గిన్నరకన్యక లున్ తశ్రుతిన్
మేళము గూడి పాడి రెలమిన్ యదువర్యుని సన్నుతించుచున్.

66


క.

కనుపట్టె నగ్రసరణిన్, ఘనదనహతవేత్రభసితకదళన్యాయం
బున విశిఖదగ్దదానవ, తనువున నొకయక్షరాజతనయుం డంతన్.

67


శా.

ఆయక్షాగ్రణి విస్మితాత్ముఁ డగుసత్యానందనున్ భక్తితో
డాయన్వచ్చి నతాంగుఁ డై పటుకిరీటప్రోతరత్నాంకుర
చ్ఛాయ ల్భూమి నలంకరింపఁగ నమస్కారంబు గావించి జే
జే యంచు న్వచియింప నాతఁ డనియెం జిత్తంబు రంజిల్లఁగన్.

68


[28]ఉ.

ఎక్కడ నుండు దెవ్వఁడ విదేమికతంబుకు రక్కసుండ వై
యిక్కడ సంచరించితివి యింతయుఁ దెల్పు మటన్నఁ గ్రమ్మఱన్
మ్రొక్కి యతండు హస్తములు మోడ్చి ఘనాఘనధీరనిస్స్వన
న్యక్కరణైకతానవచనస్ఫురణంబు చెలంగ ని ట్లనున్.

69


మ.

వెలయుం గాంతిమతీపురంబున మనోవేగుండు నా యక్షరా
ట్కులనాథుండు తదగ్రసూనుఁడ మణీకోటీరకాఖ్యుండ నీ
జలజాతారికళాకిరీటుఁ గొలువ న్సంప్రీతితో నొక్కనాఁ
డలఘుప్రౌఢిమ మీఱ నింద్రపురినీలాబ్జేక్షణల్ గొల్వఁగన్.

70


సీ.

బిందుమాధవుఁ డుండు నెం దబ్ధి [29]రిత్తయై ప్రకటఫేనాహికందుకము లెగయ
నిందుమౌళి వసించు నెందుఁ గైలాసంబు పాత్రగుహాచ్ఛిద్రపటలిఁ జెంద
నిరవొందులోలార్కుఁ డెం దుర్వి శూన్యమై బలుచుక్కగమి బల్లిపఱలు పురవ
మందాకిని తనర్చు నెందు మేరువు ఖిలంబై పచ్చిరాపూరి నావహింప
నట్టి కాశీపురంబున కరుగుదెంచి, యభినవభవాయమానజనార్థాంచిత
బహుళగీర్వాణవాహినీభ్రమదవజ్ర, శకలకుట్టిమ[30]వీథికాసరణి జనుచు.

71


శా.

కంఠేకాలపదారవిందములపైఁ గైవ్రాలి లోలార్కునిన్
డుఠీశు న్వినుతించి భైరవుని మోడ్పుంగేలుతో డాసి వై
కుంఠస్వామికిఁ జాఁగి మ్రొక్కి హిమవత్గోత్రాత్మజం జూచి యు
త్కంఠం దక్కినవేల్ఛులం బొగడి యంతస్మందయానంబునన్.

72

సీ.

చికిలిచంద్రికవన్నెజీబులేఁగరకంచువలిపెదుప్పటి వల్లెవాటు వైచి
రవసందిదండజీరల దోరవాఱినమెడ నిండఁ గస్తూరి మెదిచి మెత్తి
కఠినవక్షోజసంఘట్టనాంకితభుజాంతరమునఁ దుమ్మెద తాళిఁ జేర్చి
నవమాలికాప్రసూనకరంభితం బైనశిఖనిండఁ దాయెతుచేరుఁ జుట్టి
వీట నెవ్వరిఁ గనుఁగొన్న వెకలిరీతి, నర్మసచివుని గనుగీఁటి నవ్వుకొనుచు
నారజము మీఱఁ దత్పురాభ్యంతరమున, నల్లనల్లన చనుదెంచు నవసరమున.

73


క.

గంగన్ హిమగిరితటభా, గంగం బరిఫుల్లహల్లకామోదితసా
రంగ న్విధురుచిరుచిరత, రంగం గనుతమి హృదంతరంబునఁ జెలఁగన్.

74


శా.

ప్రేంఖచ్చందనగంధగంధవహనిర్ణిద్రోచ్చలద్వీచికా
ప్రేంఖాళీస్మితఫేనఖండములకుం బెన్నుద్ధులై పద్మభూ
కంఖాణంబులు సంచలింపఁ దగుతద్గంగాస్రవంతీతటిన్
న్యుంఖావర్తకు గాలవాఖ్యమునిఁ గన్గొంటిం బ్రమోదంబునన్.

75


క.

కనుఁగొని యవహితమతి నై, వినయంబునఁ జాఁగి మ్రొక్కి వీక్షింప కతం
డనుపమమనుపరనిశ్చల, మసస్కుఁడై యుండ వయసుమదమున నేనున్.

76


చ.

తొడిఁబడ మాయచేత నతిధూర్తనిశాచరవేషధారి నై
యడరి ఘనాఘనౌఘనిబిడారవభైరవహుంకృతంబుతో
నుడుపథముం గులాచలము లుర్వరయుం గకుబంతసీమలున్
జడనువడంగ నార్చుచుఁ బ్రచండగతిం గనుగ్రుడ్లు ద్రిప్పుచున్.

77


శా.

కుప్పింతుం దటమౌనికోటి వెఱవేఁకు ల్పూన ఘోరార్భటిన్
నొప్పింతుం దిగధీశకర్ణములు కన్నుం గ్రేవల న్నిప్పుకల్
రప్పింతు న్వినువీథిఁ గ్రాలుకొన శూలం బుద్ధతం ద్రిప్పుచున్
విప్పింతుం జనధైర్యసంపద పృథూజ్వేలాగ్రహగ్రంథినై.

78


క.

ఈగతిఁ [31]దను వెఱపింపం, గా గాలవమౌని యపుడ కన్నుఁ దెఱచి మా
యాగౌరవాధిగతర, క్షోగాత్రుని నను నెఱింగి క్రోధాన్వితుఁ డై.

79


[32]మహాస్రగ్ధర.

అధరం బల్లాడఁగా బిట్టవుడుగఱచి సాహంక్రియామర్షభాషా
బధిరాశాభాగుఁ డై భూభ్రమణపటునటద్ఫాలఘర్మంబు నిండన్
బధురస్వాంతంబుతో దృగ్వితతరుచి నభోవీథి రంజింపఁ జిత్తా
త్యధికాటోపంబునం బంతము పలుకుచు దుర్ధర్షవేషంబు మీఱన్.

80

శా.

ఓరీ సంపదఁ గన్నుఁ గానక వధూయుక్తుండ వై వచ్చి మ
మ్మౌరా యి ట్లడకింపఁ జెల్లునె దురాత్మా యంచుఁ గోపించి నీ
వీరూపంబు వహించి కాన జనతాహింసాదికృత్యంబులన్
నోరారం బొల మేసి త్రుళ్లు మని నన్నుం జూచి శాపించినన్.

81


క.

గజగజ వడఁకుచు నే నా, రజనీచరవేష ముడిగి ప్రతిపతిపాదాం
బుజములపై వ్రాలి భయా, ర్తిజదీనాలాపగద్గదిక ని ట్లంటిన్.

82


శా.

చేతోవీథి భవన్మహామహిమముల్ చింతింపఁగా లేక యీ
రీతి న్మన్నును మిన్నుఁ గానక మదోద్రేకంబునం ద్రుళ్లితిన్
నాత ప్పొక్కటి సైఁచి శాపవచనాంతంబుం గృపం దెల్పవే
యోతండ్రీ నను బ్రోవవే యనిన నాయోగీంద్రచంద్రుం డనున్.

83


శా.

వత్సా మామకశాపవాక్యములు దుర్వారంబు లౌ నైన నే
తత్సంరంభము మాని నీ [33]వడల నార్ద్రం బయ్యె నాచిత్త మీ
కుత్సాపాత్రతనూవియోగ మగు నీకు న్శూన్యదివ్యాప్తగా
భృత్సద్మాంతరసీమ నొక్కనిశరార్చిం గొంతకాలంబునన్.

84


క.

అనుమాట లోను వెలి గా, ఘనగర్జాతర్జనాదికస్ఫురణవచో
ధ్వని సెలఁగ రక్కసుఁడ నై, చనుదెంచితి నిటకు సకలజగములు బెగడన్.

85


ఉ.

నాపిశితాశనత్వమును నాబహుపాతకహేతునిత్యహిం
సాపరతంత్రరోషపరుషత్వముఁ బాపితి వీక్షణంబునన్
భూపవతంస నీవలనఁ బూర్వ[34]శుభోన్నతి నొందఁ గాంచితిన్.
నీపరమోపకారమహనీయత కేఁ బ్రతి సేయ నేర్తునే.

86


[35]క.

ఐన నొకమే లొనర్తు మ, హీనాయక మాఱువలుక కియ్యకొనుము ప్ర
జ్ఞానిధులు సత్క్రియాలవ, మేనియును బహూకరింపరే మది నెందున్.

87


చ.

అతులితశౌర్య నీతలఁచినప్పుడు వచ్చి సమిజ్జయంబు ల
ద్భుతముగఁ గూర్తు నీయరదముం దఱితోడయి వచ్చు నాయదృ
శ్యతయును గామరూపతయు సంధిలఁ జేయుదుఁ గొ మ్మటంచు నా
క్షితిపతి కిచ్చి యక్షుఁ డరిగెం దదనుజ్ఞ నిధీశువీటికిన్.

88


శా.

ఆసత్యాసుతుఁడుం బ్రియాప్తసహితుం డై యాత్మసౌరాస్త్ర [36]వి
న్యాసోచ్ఛాసితరాక్షసావయవయక్షాపాదితాత్యంతమై

త్రీసంపత్తికి సంతసిల్లుచు సముద్వేలాజిలీలాభవా
యాసం బాఱఁగ నొక్కనిరలసరఃప్రాంతంబునం బోవుచున్.

89


క.

దరవికచసరసిజాంతర, పరిఖేలచ్చంచరీకపక్షచలితపు
ష్పరజోనితాంతశీతల, మరుత్కిశోరములు మీఁద మల్లడిఁగొనఁగన్.

90


క.

తలిరిచి దట్టముసై త, జ్జలజాకరశీతవాతసక్తిఁ బొదలి మొ
గ్గలఁ బూవులఁ బిందెలఁగా, యలఁబండులఁ దనరుతరుచయంబున నొకచోన్.

91


సీ.

వాసంతికారసాస్వాదమత్తాంగి యై తెలిసి వల్లభుఁ జేరు తేఁటిలేమఁ
బ్రణయకోపంబునఁ బఱచి నాథుఁడు మ్రొక్కఁ గేరడంబులు పల్కు కీరతరుణి
నన్యానుషంగచిహ్నము లెల్లఁ బరికించి వరుని దూఱెడుగోరువంకజోటిఁ
దమి దొలంకఁగ సాము గమిచిన చిగురాకుఁ జెలువున కిచ్చుకోయిలవెలందిఁ
గనుఁగొనుచు వచ్చి యొకదివ్యకాంతియుతమ
యూరయుగళంబుఁ గని పట్ట నూహ సేసి
తదనుసపణపరాయణత్వమున వార
లాత్మవిశ్లేషము గణింప కరిగి రపుడు.

92


క.

అందు హరిసుతుఁడు పులుఁగుబ, డిం దప్పక యరిగె యది వడిం బఱవ నిరా
నందుఁ డయి తిరిగి తత్పద, విం దమ్మునిఁ గానలేక వెదకుచు నార్తిన్.

93


ఉ.

అక్కట యున్కిఁ దెల్పు మనుజా మనుజాగమవర్జితోర్వి నే
నిక్కడ నొంటి సైపఁగలనే కలనేనియుఁ బాయలేని నీ
వెక్కుడు క్రూరవృత్తిఁ దగవే తగ వేముఱుఁ బల్కరించు నన్
మక్కువ తొంగలింపఁ గనుమా కనుమాయలు పెట్ట నేటికిన్.

94


గీ.

అనుచు విపినవీథి [37]నరిగెడుగంధాంధ, కరులఁ గిరులఁ బేచకములఁ గీచ
కములు జటులఁ గిటుల ఘనదైన్యఫణితితో, ననుజుమార్గ మడిగి యడిగి యలసి.

95


చ.

యతిపతిప ల్కలంఘ్య మని యాత్మ నెఱింగి నిజాంతరంగసం
గతధృతి యై యదూద్వహుఁడు కాననవాటము దాఁటి యధ్వగ
ప్రతతులవెంట నేగి పరపట్టనగర్వవిఖండనంబు దృ
క్కుతుకదసౌధమండనముఁ గుండినముఁ గనియెం బ్రియంబునన్.

96


మ.

కని తత్పట్టనకేళికాననలతాగారైకవాస్తవ్యు భో
జనృపాపత్యవిపంచికాభినవశిక్షాకర్మఠున్ విశ్వరం

జనగీతామృతతోషితద్విరదరాట్చర్మాంబరుం దుంబురున్
వినయప్రౌఢిమఁ జేరఁబోయి నతి గావించెం బ్రమోదంబునన్.

97


చ.

అపు డమరేంద్రగాయనుఁ డనన్యజసోదరభావసూచనా
నిపుణతనూవిలాసు నతనిం గని యెచ్చటనుండి వచ్చి తే
నృపతనయుండ వేమికత మిచ్చటికిం జనుదేర నంచు స
త్కృప నడుగ న్యదూద్వహుఁడు దీపితసూనృతసూక్తి ని ట్లనున్.

98


సీ.

కరగతచక్రుండు హరిబలాన్వితుఁడు సన్మహితవిక్రముడు మామకగురుండు
ప్రాణేశకలితసురాగసంస్తుత్యసత్యాఖ్యాతగోత్ర నాయనుఁగుజనని
సరసధర్మధురీణుఁ డురుసుమనోమార్గణావలంబనుఁడు నాయగ్రజన్ముఁ
డక్రూరసుగుణోద్ధవాధారశూరసంతానశేఖరులు మద్బంధుజనులు
పొదలురాలచ్చి యెపుడు మాయదుకులమున
మాకు రత్నాకరపురోత్తమము నివాస
మట్టినే నీకు నిచట శిష్యత వహించి
వీణ నేర్వంగ వచ్చితి విమలచరిత.

99


గీ.

అనుచుఁ జతురోక్తిఁ దెలిపిన విని తదీయ, వృత్త మఖిలము మనమున నెఱిఁగి తుంబు
రుం డతని గారవించి యారుక్మబాహు, నృపతనూభవుతో వీణ నేర్చుచుండె.

100


ఉ.

అంత దిగంతదంతురలతాంతనిశాంతనితాంతకాంతన
న్యాంతికతాంతపాంథజనతాంతరసంతతకృంతనప్రథా
త్యంతసమంతతస్స్ఫురదుదంతపరంతపకాంతిసంతతి
క్రాంతదురంతకుంతరతికాంతము పొల్చె వసంత మెంతయున్.

101


[38]క.

వనలక్ష్మి మాధవాగతి, కనువుగఁ బూనీట జలకమాడుటకై ముం
దనువున నలుఁగిడఁగా ను, ర్లినచిక్కస మనఁగ ధరఁ దొరిఁగెఁ గారాకుల్.

102


ఉ.

పూని వసంతహాళికుఁడు పొంగెడురాగగరసంబుచే గడు
న్నానుజనాళిమానసపునట్టులు దున్ని మనోజకందళిం
గానఁగఁ జేసి యంత నెగఁగట్టినయట్టిహలంబులో యనం
గా నెఱసెం బలాశకళిక ల్మునుమున్న వనాంతరంబులన్.

103


క.

ఎలఁదీవెచెలులు నలిగా, డ్పులపైఁ దేనియవసంతములు చల్లఁగఁ చే
తులఁ బూనినవేత్రపుఁది, త్తులు నాఁ దలిరాకుపొదలఁ దోఁచె న్మొగ్గల్.

104

ఉ.

ఆలమునన్ దిశ ల్గెలిచి యాడఁగఁ బోవ వియుక్తరక్తముల్
హాళి ననంటిపూవుపెర లన్బలుదోనెల నించి చిల్కతే
జీలకుఁ జూపఁబోలు ననసింగిణిజో దిటు గాక యున్నచో
నేల వహించుఁ గెంపుజిగి నీకదళీసుమకీరతుండముల్.

105


ఉ.

మావుల మారు క్రొంజిలుకమావులవేడెము దిద్ద గండపుం
దావులగాడ్పుసాహిణి లతాకశ పూని మిళిందయుక్త మౌ
లేవిరిగుత్తిగిల్కఁ గదలించుచు ధే యని కూఁతవైచె నా
నావిధపల్లవాశనకనత్కలకంఠకుహూరవార్భటిన్.

106


సీ.

శాపనివృత్తికై చనుదెంచు వెడవేల్పురాచత్రాఁ చన భృంగరాజి తనర
సంగడి శాస్త్రము ల్చదివెడుశిష్యుల చెలువునఁ గెలయుకోవెలలు సెలఁగ
విన్నందుటకు మనవికి డాయువింధ్యశృంగములు నాఁ బుప్పొడిగట్టు లెసఁగఁ
గట్టినకావికోకలచెఱంగులరీతి నెడనెడఁ దలిరాకు లెగసియాడ
నెలమిఁ దనుఁ గన్నద్విజపంక్తు లెదురుకొనఁగ
సారెఁ బెల్లుబ్బు యువజనశ్రమజలాబ్ధి
నిముడుకొన దక్షిణము వాసి యేగుదెంచెఁ
గొదలునడతోడఁ బవమానకుంభజుండు.

107


[39]ఉ.

అంతట రుక్మబాహువసుధాధిపనందన యొక్కనాఁడు శు
ద్ధాంతగృహంబు వెల్వడి విహార[40]రతిం జనుదెంచె నెచ్చెలుల్
చెంతలఁ గొల్వ గుంజదళిశింజితరంజితకుంజమంజుల
ప్రాంతగళత్ఫలాసవరతాంగజఘోటికిఁ బుష్పవాటికిన్.

108


క.

ఏతెంచి చందనాచల, శీతలతనుగంధవహవశీకృతలవలీ
చూతైలావాసంతీ, జాతామోదములఁ దేలి సంతస మందన్.

109


సీ.

[41]కమ్మనిపూనీటికాల్వ వ్రీలినచోటఁ గంబూరమున నంటఁ గట్టి కట్టి
వలపుతోఁ గురువేరు వాడువాఱినచోటఁ బూనీరు కుండలఁ బోసి పోసి
చలిమావిరసముల జౌకు లెత్తినచోటఁ గలువపుప్పొడి నించి బలసి బలసి
పరువంపుమరువంబు పదను దప్పినచోట వలిమంచు గూడల వైచి వైచి
సుమములకు మూఁగుతేఁటులఁ జోపి చోపి
యీరముల రాలుతనిపండు లేఱి యేఱి

గ్రక్కుపాటున రాజన్యకన్యఁ గాంచి
యపుడు వనపాలికలు రయవ్యగ్ర లగుచు.

110


క.

ఒండొకతె మీఱి నృపసుత, దండకు నేతెంచి మెట్టదమ్ములు విరిపూ
దండలుఁ గమ్మనిగొజ్జఁగి, చెండులుఁ గైకానికిచ్చి చేరి మృదూక్తిన్.

111


చ.

అచట విలాసభూధరము లచ్చటఁ గ్రొన్నెలఱాలతిన్నె ల
ల్లచటఁ బరాగసైకతము లచ్చటఁ దేనియయేటినీటిజా
లచటఁ బయోరుహాకరము లచ్చటఁ బూచినకన్నెమావు ల
ల్లచట లతాకృతాలయము లందుఁ గరంబులఁ జూప వారితోన్.

112


సీ.

విందులు గైకొన్నె యిందిందిరమ్ములు వాసంతికాప్రసూనాసనముల
దోమటి దొడుకునే ప్రేమఁ గోకిలములు పాటలసహకారపల్లవముల
బువ్వంబు గుడుచునే ప్రోదిరాచిలుకలు పరిపక్వదాడిమీఫలరసముల
బొ త్తారగించునే మత్తఖంజనములు చంపకస్రవనిజసౌరభముల
సామెతలు సేయునే శారికాన్వయములు
గోస్తనీవల్లికా[42]ఫలగుచ్ఛకముల
నలరువలపులు గాంచునే తలిరుఁబొదలు
మలయగిరికందరాయాతమారుతముల.

113


చ.

అనుచు లతాంగి పూవుఁబొద లారసి పుప్పొడితిప్ప లెక్కి కుం
దనవమరందవాహినుల దాఁటి సరస్తటిసీమ మట్టి పూ
చినయెలమావిజొంపములఁ జేరి [43]మెలంగుచు నంతఁ జెంగటం
గనుఁగొనియె న్లవంగలతికాపరికల్పితకాయమానముల్.

114


క.

కాంచి యచటం దదీయసు, మాంచలసంచరణచంచదళిగానకళా
వంచనచుంచువిపంచీ, పంచమనాదంబు చెవులపండువు సేయన్.

115


[44]మ.

ఇది నాయన్నవిపంచినాద మగుఁజుమ్మీ నెచ్చలీ యీలతా
సదనంబు ల్ప్రతినాద మూనఁదొడఁగెం జర్చింతమే యంచు మ
న్మదకాదంబరవానుకారివిచలన్మంజీరశింజారుతం
బొదవం జేరి సహోదరుం గనియె నత్యుత్కంఠ దీపింపఁగన్.

116


క.

సోనలుగాఁ గమ్మనిపూఁ, దేనియతుంపురులు చల్లుతీవలలో న
మ్మానవతి నిలిచి యన్నన్, గానరతుం గాంచి తదుపకంఠక్షోణిన్.

117

సీ.

మేరుసంగతి గేయసౌరవాహిని మూఁడుతెగ లాయె ననఁగఁ దంత్రికలు మెఱయ
స్వరదేవతారోహసమవరోహక్షోణిఁ గట్టు మెట్టికలు నా మెట్టు లమరఁ
గరివె ఫణంబుగా గానలోలత డాయు చిలువరా జన వెండియొళవు మీఱ
శ్రుతతంత్రికాబిసాహృతికి నేతెంచినకవజక్కవలు నాఁగఁ గాయ లొలయఁ
దనరువీణియఁ జేఁ బూని తంత్రి దీటి
బిరడలు బిగించి శ్రుతిఁ గూర్చి కరివె నివిరి
జాఱుగా మీటి సారెలు చక్కనొత్తి
సారెఁ బలికించుసత్యాకుమారుఁ గనియె.

118


క.

కనుఱెప్ప లిడక యతనిం, గనుఁగొనియుం చనిని చనక కామిని యన్నం
గనునెపమునఁ బొద వెలువడి, [45]చని నిలిచె న్మొగులు వాయుచంద్రకళ యనన్.

119


శా.

ఆవేళం దుదఱెప్పల న్నిలిచి [46]నేత్రాంతత్రిభాగంబులన్
డావై చెక్కుల జాఱి కర్ణవిచలత్తాటంకహీరప్రభన్
దీవ ల్సాఁగుచు నొయ్య రాకొమరుపై నిండారె రాజన్యక
న్యావీక్షాంకురముల్ స్మరప్రథమముక్తాస్త్రప్రతానం బనన్.

120


గీ.

పూపగుబ్బెతఁ గన సిగ్గు పొదలుచుండ
రాచకూతురు గాన సంకోచ మడర
నన్నసన్నిధి నున్కి భయంబు నిగుడఁ
గలికి గనుఁగొనఁ దలఁచు లోనులుకు నళుకు.

121


క.

వనజాస్యకు మై నిండ, న్నినుపారెం బులక లపుడు నిఖిలాంగములం
గనుఁగవసాటికిఁ దారుం, గనఁగఁ గటాక్షాంకురములు శ్రమించె ననన్.

122


[47]క.

తమినేత్రచకోరకయు, గ్మము నరపతివదనచంద్రికల నఱుమ్రోవం
గమిచి యెదఁ బట్టుచాలమి, నుమిసెనొ యన నశ్రుబిందు లొలికెం జెలికిన్.

123


ఉ.

తత్తఱపాటుతోడఁ గనుఁదమ్ములడాలు దిగంతరంబులం
జిత్తరు నింప లేఁజెమటఁ జేల కుచంబులపొంత జాఱ నా
బిత్తరి మ్రానుపా టొదవఁ బిమ్మిటిఁ దా నొకకొంత గొంకి లోఁ
జిత్తము మట్టు పెట్టికొని చేరి సహోదరుదండ నిల్వఁగన్.

124


ఉ.

అప్పుడు లేమపాదకటకారవము ల్నిజవల్లకీరుతిం
దప్పులు సూప వింతనినదం బిది యెక్కడిదంచు నెల్లెడం

దప్పక చూచి కన్గొనియె దాననమానవిఘాతిసూతి యా
కప్పురగంధిఁ గంజముఖి గాంతిమతిం గలకంఠిఁ గామినిన్.

125


క.

అంతటఁ గాంతావీక్షా, తాంతాత్ముని నతని దనదుదాయాది పగం
బంతంబునఁ గంతుఁడు విరి, కుంతంబులపాలు సేసి కో యని యార్చెన్.

126


క.

గొబ్బునఁ బొడమినతమి యా, గుబ్బలు దేఱంగ రాచకొమరుఁ డపుడు లో
నబ్బురపడి యాచిటిపొటి, గుబ్బెతఁ గని చొక్కి వింతకోర్కులు నిగుడన్.

127


[48]సీ.

బిరడలు బిగియించుకరణి నెమ్మొగ మెత్తి చొక్కుతోఁ గ్రీఁగంటఁ జూచి చూచి
శ్రుతి మీటి యాలకించుతెఱంగుతో ముద్దు దనరుమాటకుఁ జెవిఁ దార్చి తార్చి
ధాలు నల్కిన మెచ్చులీల రూపమునకు సుడివోనితమిఁ దల యూఁచి యూఁచి
యలసతచే నూరుపులు వుచ్చుతీరునఁ గ్రొమ్మించుమేతావిఁ గ్రోలి క్రోలి
నిలువరించఁగ రానిక్రొందలిరువాలు
తళుకులకుఁ డెందమునఁ జాలఁ దలఁకియుఁ బ్రియ
సఖుఁడు చెంగట నున్కి నిశ్చలునిరీతిఁ
గొంత సైరించి [49]యాయదుకుంజరుండు.

128


క.

తనవీణఁ బ్రతిఫలించిన, వనజాననఁ జూచి సౌఖ్యవారిధిలోఁ దె
ప్పునఁ దేలి యాత్మగతమున, నొనరించె న్వినుతిఁ జిత్త మువ్విళ్లూరన్.

129


చ.

పొలఁతుకవేణి కుల్కి నిశ పువ్వులపేరిటిచుక్కపౌఁజులం
జలదము మౌళిఁ జందిరపుఁజంచల నెప్పుడు గొల్చునట్లుగా
నిలుపుటఁ జేసి చామరము నిచ్చలు తానె భజించె నన్నియుం
[50]దెలిసియకాదె సారెకు నుతించు నళు ల్సముదగ్రఝంకృతిన్.

130


చ.

నలినభవుండు కన్నియ నొనర్పఁగఁ జిక్కినమించు లీక్షణం
బుల నిడి పుండరీకదళము ల్పయి నుంచి ఘటించెఁ దారకా
చ్ఛలమున లక్కముద్ర లనిశంబుఁ దనర్చునె కాకయున్నఁ జా
పల మిరుమేనఁ దెల్పు కనుపాపలపేరిటి యొత్తుబొమ్మలన్.

131


క.

శ్రవణశ్రీ లింపలకుం, గనయుతమిన్ సుముఖవిధుఁడు కాంతనిరీక్షా
ధవళరుచికరము లెంతయు, నవిరళగతిని జాఁపఁగా ననంతస్ఫూర్తిన్.

132


చ.

జలజదళాక్షి నాప నవచంపక మౌ నటుగాక యున్నఁ జిం
తల నెలకొన్న చారునయనభ్రమరద్వితయంబు చాల ప

గ్గల మగుకాతరత్వమునఁ గ్రమ్మఱి కోమలకర్ణిపాళికా
కలితవతంసపద్మనవగంధవిశేషము లానఁ [51]బోవునే.

133


చ.

జగములు గెల్వఁగోరి సుమసాయకుఁ డెత్తుపసిండిటెక్కెముల్
మగువకపోలయుగ మనుమానము లే దటుగాక యున్నచో
నగణితకర్ణకుండలసమగ్రమణిప్రతిబింబదర్పణం
బగుచుఁ జెలంగునే మకరికాంకిత మై చెలువంబు సూపునే.

134


తే.

కమలసూతి సుధాకరుకందుఁ గడపి, బింబమున దీనిమోముఁ గల్పింపనయ్యె
నలికమగ్రంబు పార్శ్వము ల్తళుకుఁజెక్కు, లందు బింబాధరంబు బింబాధరంబు.

135


తే.

మంజుభాషిణి కంఠసామ్యము [52]వహింప, నబ్జ ముత్తమసుమనోర్హ మయ్యెఁ గాక
వార్ధిజాతసజాతీయవస్తు లుండ, నాదరము గాంచు టెట్లు తదాదరంబు.

136


తే.

మధుపసంగతవిటపసమాజములును, బల్లవాశ్లిష్టవల్లికాపాళికలును
సవతు వచ్చునె యీసతి సకలభువన, వర్ణనీయభుజాకల్పవల్లరులకు.

137


చ.

మును పొకకృష్ణమూర్తి ఘనము ల్గురియన్ గిరి నెత్తి గోవివ
ర్ధన మొనరింప నత్తెఱఁగు దా నది చిత్రమె యంచుఁ గొమ్మయా
రనియెడుకృష్ణమూర్తి మదనాశుగవృష్టిఁ దనర్ప గోవివ
ర్ధన మొనరించెఁ దత్కుచధరాధరయుగ్మము నుబ్బ నెత్తుచున్.

138


చ.

సరసవయో[53]విభాతమున సారసగంధిగభీరనాభి తా
మరసకుటీరము న్వెడలు మంజులరోమలతాళిరాజి బం
ధురతరపక్షవాయువుల నూత్నతదీయపరాగమాలికల్
వరుసనె రాలి రేక లగువైఖరిఁ బొల్చు వళీవిభంగముల్.

139


తే.

సుప్రతీకోత్తమాంగ మీసుదతిపిఱుఁదు, గాక యున్న రత్నాకరకాంచికాప్ర
యుక్తిఁ గనునే నితాంతవృత్తోరుసుకర, కాంతిపదపుష్కరస్ఫూర్తి గడలుకొనునె.

140


[54]తే.

కలమగర్భంబు లబలజంఘల జయింప, మళ్లఁ బడి నిక్కి కడపటఁ బొల్లువోయి
రాలిపడి కాఱికంటకాక్రాంతి విరిసెఁ, బరఁగునె వివేక మిల జడప్రకృతులకు.

141


క.

[55]తామేటివెన్నుఠీవి స, తీమణిప్రపదములు దనరె దివ్యోరుదిశా
సామజకరోపరికటీ, భూమండలి యందుమీఁదఁ బొలుపగుకతనన్.

142


చ.

ప్రమఢపదంబులం దొరయఁ బంకజముల్ వనమధ్యసీమఁ జ
క్రములకు నింపుగాఁ దపముఁ గాంచుతఱి న్మధుపాళితోడఁ బా

యమి మలినత్వ మందియును హంసకసంగతిచేతఁ బాదసా
మ్యముఁ గని మించె నేరి కమలాత్ములసంగతి ఱిత్తవోవునే.

143


గీ.

అలరె వారిజనేత్రాపదాంగుళీన, ఖాళి యౌవనవనసీమ నడరునవ్య
విద్రుమలతాగ్రకోరకవితతి నాఁగ, నగ్రలాక్షారసంబు సుమాసనముగ.

144


క.

అనుమాన మేల నిజ మీ, ననఁబోఁడియె రుక్మబాహునందన యలనా
వినుకలియును గనుకలియును, మనమునఁ [56]దలపోయ నైకమత్యముఁ గాంచెన్.

145


మ.

అనుచో నాలలితాంగి నొక్కచెలి డాయ న్వచ్చి యోనెచ్చెలీ
వనవాసంతికకు న్రసాలమునకు న్వైవాహికప్రక్రమం
బొనరింపం జనుదెమ్ము వేగ యన నయ్యో దైవ మీపాటిమే
లును సైరింపఁగఁ జాలదంచు నది నాలోలత్వముం జెందుచున్.

146


క.

ఆపడఁతి యప్పు డఱవిరి, తూపులచే డీలుపడుట తోఁబుట్టునకున్
దీపింపకుండఁ జని పు, ష్పాపచయాసక్తిపై మనోంబుజ మడరన్.

147


సీ.

కైలాగు జతన మీకలువరాచలువరాల్ జీరుకుల్ వారు [57]రాజీవనయన
పాదావధాన మీపరువంపుమరువంపుఁగనిమల దాఁటుచోఁ గంబుకంఠి
[58]మేలుప్పరంబు తుమ్మెదమందరొద మందటిలు పొదల్ దూఱుచోఁ గలువకంటి
చిత్తేశు చూడు మీచిన్నారిపొన్నారికేకినీలాస్యము ల్కీరవాణి
యనుచుఁ దనప్రాణసఖులు నెయ్యంబు మీఱ, నెచ్చరికఁ దెల్స నిచ్చలో ఱిచ్చవడుచు
వెచ్చ నూర్చుచుఁ గలఁగుచు విన్న నగుచు, రామ విహరించెఁ బుష్పితారామసీమ.

148


[59]మ.

అరుణాంఘ్రిద్యుతిసారసీకృతసుధీహర్యక్ష హర్యక్షదో
ర్ధరణార్ధకృతితాభృతామరకదంబాధ్యక్ష బాధ్యక్షమా
హరణాస్తోకహృషీకచోరకనిరాసారక్ష సారక్షమా
శరకోటీపరిపాటితాంతరరిరంసల్లక్ష సల్లక్షణా.

149


క.

సంసారదూరసరణరి, రంసాధిగతప్రశంసరాగహరిణవై
తంసికసంసన్మానస, హంస మహోహంస పరమహంసవతంసా.

150


స్రగ్విణి.

ధ్యానకృత్సేవధీ దంభవిద్యావధీ, దానలక్ష్మీనిధీ దాంతహృత్సన్నిధీ
మౌనభూషావిధీ మంజుభాషానిధీ, జ్ఞానసంమోదధీ సత్త్వసామోదధీ.

151


గద్యము.

ఇది శ్రీ మద్దత్తాత్రేయయోగీంద్రచంద్రచరణారవిందవందనసమాసాది
తసరసకవితారసోదాత్త దత్తనామాత్యసోదర్య మల్లనమంత్రివర్యప్రణీతం
బైనచంద్రభానుచరిత్రం బనుమహాప్రబంధంబునందుఁ దృతీయాశ్వాసము.

  1. చ-దెలిసి
  2. ట-లో లేదు.
  3. చ-బోవఁగనీ రిపుడ వెడలిపోవుద మనినన్.
  4. చ-మొసఁగఁగా
  5. చ-మౌని భ్రమంబున న్వడిన్
  6. చ-గోల చేసినయట్టి
  7. చ-తపసుల
  8. చ-పుప్పొడి
  9. ట-లో లేదు
  10. చ-వీఁగినట్లు
  11. ట-లోఁ బద్యమునకుమాఱు “అనిన" అనుమాటమాత్రము గలదు.
  12. ట-లో దీనితో నైదుపద్యములకు “ఆయిద్దఱుం బెద్దప్రొ ద్దుద్దవిడిం బిఱుతివియక పోరునెడ నబ్బాలకద్వయంబు" అనువచనముమాత్రము గలదు.
  13. చ-వెడకిర్దలు
  14. క - దివ్యాంగులన్
  15. ట-లో దీనితోఁ బై మూఁడుపద్యములకు మాఱు "చూచి ప్రదక్షిణనమస్కారంబు లర్పించి యున్నం జూచి యనసూయాసుతుండు దయార్ద్రచిత్తుండై” యనువచనము గలదు.
  16. చ-పట్టనామరా
  17. ట-లో లేదు.
  18. చ-నదద్ఘుణరుతములు
  19. ట-లో నిదియు దీనిక్రిందిదియు లేవు.
  20. ట-లో లేదు.
  21. చ-ట-బట్టి మెసంగెద
  22. చ-ట-జెదరఁ
  23. ట-లో లేదు.
  24. ట-లో నీక్రింది నాలుగుపద్యములు లేవు.
  25. చ-ధర న్నరుఁడెంతయా
  26. బొలియించెదన్
  27. ()ఈగ్రంథము చ-లో మాత్రమున్నది.
  28. ఈపద్యము మొదలు 10 పద్యములు ట-లో లేవు.
  29. చ-గులటయై
  30. చ-వాటికా
  31. చ-ట-కడు
  32. ట-లో లేదు.
  33. ట-వలన
  34. చ-సుఖోన్నతి
  35. ట-లోలేదు.
  36. ట-విన్యాసోద్భాసిత
  37. ట-నడరెడు
  38. ట-లో లేదు.
  39. ఈపద్యము ఆంధ్రకవులచరిత్రములో ఎలకూచి బాలసరస్వతి గ్రంథములోని దని యున్నది.
  40. చ-గతిన్
  41. పన్నీటికాలువ పజ్జఁబొర్లినచోట గంబూరమున నడ్డుకట్టఁ గట్టి
  42. ట-స్వచ్ఛ
  43. చ-తొలంగుచు
  44. ట-లో లేదు.
  45. చ-చనియె న్జలదంబుఁ బాయు శశికళ యనఁగన్
  46. ట-నేత్రాంచద్విభాగంబునన్
  47. ట-లో లేదు.
  48. ట-లో లేదు.
  49. చ-యాదవ
  50. చ-దెలియుట
  51. చ-నోపునే
  52. ట-వహించి, యబ్జ
  53. చ-వినాసమున, ట-విభాగమున
  54. ట-లో లేదు.
  55. తామరలవెన్ను విఱిచి
  56. చ-ట-వివరింప
  57. రాజీవగంధి
  58. ట-మేలుప్పరంబీరసాలరసాలంబు పొదరిండ్లు దూఱుచో
  59. ట-లో లేదు.