చంద్రభానుచరిత్రము/చతుర్థాశ్వాసము

శ్రీరస్తు

చంద్రభానుచరిత్రము

చతుర్థాశ్వాసము

క.

శ్రీధర శుభావతార , యాధారాధారదృగ్విహార సతమన
శ్శోధన నయబోధన వి, ద్యాధనలక్ష్మీసహాయ దత్తాత్రేయా.

1


వ.

అవధరింపు మాసమయంబున.

2


క.

ఈరీతి సంచరించుచు, నారామవిహారకేవలాలసమతి యై
యారామ యంతఁ జెంగట, మారుబిడారంబు లైనమావులదండన్.

3


చ.

చలువలు చల్లుగొజ్జఁగులసందులఁ దుమ్మెదఱెక్కసోఁకులన్
వలిపిరి వచ్చు తేనె లిరువంకల జో రనుచోట దట్టమై
బలితపుఁదావు లీనువిరిపందిరిక్రిందటఁ గ్రమ్ము తెమ్మెరల్
తొలఁకెడు కప్రపుంజవికెలో వసియించినఁ దోడినెచ్చెలుల్.

4


క.

వినయమున ననునయించుచు, నెనరునఁ జేపట్టి కుముదినీకన్యకఁ దో
డ్కొని యేగి కేళికావన, వినుతవిశేషములు [1]విన్నవించుచు వేడ్కన్.

5


చ.

చిలుకలకొల్కి చూచితివె చెంగట మ్రోయుచుఁ దేంట్లు చుట్టిరా
సలపువునీరు గ్రమ్ముజలయంత్రపుఁగంబములందుఁ బైపయిం
బొలయుచు వ్రాలుచు న్లికుచము ల్దగు నీవనలక్ష్మి గాజుచా
లులియఁ బెమర్చు కేలఁ జెలువొందఁగ నమ్మనలాడుకైవడిన్.

6


చ.

కను లసమాత్రనిష్ఫలవికాసతృణాకృతు లిక్షువంశముల్
గనుపుల ముత్తె ముల్ గురియఁగాఁ దృణరాజములై ఫలోన్నతిం
దనరిన పూగము ల్దమయుదారతకుం దగఁ బెక్కుముత్యము
ల్చినికినరీతిఁ బొల్చుఁ గుహళీపతత్కళికాసహస్రముల్.

7


చ.

మరుఁ డనురౌతు రాచిలుక మావులకు న్వెఱ మానునట్లుగా
నురవడిఁ దేఁటిక్రొంబొగలహోరును కెంజిగురాకుమావుల
న్బిరుసులదిక్కుఁ జూపి నడపించినఁ ద్రొక్కుచు వచ్చి శంక లే
కిరుగడ నిల్చి మంజురుతహేషలు మీఱ లతాంగి చూచితే.

8

ఉ.

ఊయెల నూఁగులేమ పదమూనినమాత్ర నవీనరాగల
క్ష్మీయుతమై ముదశ్రువులు సీధుకణంబులపేరఁ జిల్కుచుం
బాయక భృంగగీతిఁ దనభాగ్యము మెచ్చుకొనం దొడంగెఁ బ
ద్మాయతనేత్ర చూడు మిది యర్హమ కాదె యశోకసంజ్ఞకున్.

9


చ.

ముదిత యొకర్తు తేంట్లు తను మూఁగిన నెచ్చెలిఁ [2]గాన కార్తయై
కుదురు మెఱుంగునిబ్బరపుగుబ్బల నొత్తినఁ దత్స్వయంగ్రహా
భ్యుదితరసానుభూతిఁ జెలువొందుచుఁ గ్రోవి తదాప్తిహేతుమ
ట్పదతతి కిచ్చు మెచ్చి నిజబంధురగంధరజోవిశేషముల్.

10


ఉ.

సామజయాన యీచిఱుతసంపఁగిసొం పరుదయ్యె నంచుఁ నా
ళీమణి యెచ్చరింప నొకలేమ ముఖాంబుజ మెత్తి చూడఁగా
నామహిజంబు పూనె సుమనోధికరాగసమృద్ధిఁ గాన నె
చ్చో మహితాళిసంగ్రహణశూన్యుల కిట్టితెఱంగు చోద్యమే.

11


చ.

రమణియొకర్తు నవ్వుచు మరందముఁ బుక్కిట నించి బోటిపై
నుమియఁగ నేగె నమ్ముగద యొండొకచెంతకుఁ బోక కేసర
ద్రుమముమఱుంగుఁ జేరె నది తోడన తన్ముఖసీధుసిక్తమై
యుమియక మానెనే యభినవోపగతప్రసవాసనంబులన్.

12


చ.

వనిత యొకర్తు కేళివనవాటి గతాగతఖిన్నయె కరం
బునుపఁగఁ దత్కరగ్రవామహోజ్జ్వలమై ముదితద్విజావళీ
ఘననినదంబు మీఱ [3]సహకారశిరోమణి వేల్చెఁ గంటె నూ
తనకిసలానలంబున సుదారమరుచ్చ్యుతనూనలాజముల్.

13


ఉ.

ఏలకితీవయుయ్యెలిపయిం జెలి [4]యూఁగ నొకర్తు లీలతో
నాలతి సేయఁగా విని ప్రియాళము పూవులవాన నించి యు
న్మీలితసీధుబాష్ప మయి మెచ్చులఁ దేలఁ దదగ్రసీమ మ
త్తాళియుఁ బాడెడు న్విను మదాంధులచెయ్వులు హాసయోగ్యముల్.

14


చ.

అసదృశధీరతాధికమదాప్తి సుదృఙ్మణు లిద్ద ఱుల్లస
ద్రసకళికోపలబ్ధికయి రాయుచుఁ బల్క సమీరణోన్నమ
[5]త్ప్రసవితశాఖికాంచలకరంబున వాద మడంచె గోఁగు వె
క్కస మగు ఱంతు సైఁతురె [6]యగంధసువర్ణసమగ్రతానిధుల్.

15

చ.

చలువలు చల్లునీడల నిఙశ్రమ మార్చిన మెచ్చి చూచుతొ
య్యలి నలరించె వెండియు శుకాలపనాలఘులాలనోక్తిసం
కలవముతో మనోజ్ఞతిలకంబు మృదుచ్ఛదవీజనంబులన్
లలితమరందసేచనములన్ ఘనసారపరాగచర్చలన్.

16


ఉ.

కేకిసకొట్టి యోర్తు గిలిగించిన నొక్కవిలోలనేత్ర లీ
[7]లాకలకంఠకూజితముల న్నగఁ జెంగట నున్నపొన్న లీ
లాకలకంఠకూజితముల న్నగుచు న్సుమనోవిజృంభితా
నేకవిలాసము ల్దెలిపె నిట్టివివో పురుషానుభావముల్.

17


ఉ.

సారెకుఁ బూల కోర్తు తను సన్నలఁ దిట్ట నొకింత వుచ్చుని
ట్టూరుపుధూపము ల్శుకపికోత్కరనాదము పంబమ్రోఁతయుం
గా రతిరాజు సేర నవగంధవహాకులసిందువారశా
ఖారుచిరాక్షి లోలదళికైశికయై సివమాడెఁ గంటివే.

18


క.

అని పలికి కురులు బిగియం, బనుపఱిచి చెఱంగుఁ జెక్కి పయ్యెద లొడిగా
నొనరిచి యొండొరు మీఱన్, వనజాక్షులు కుసుమహరణవాంఛాపర లై.

19


సీ.

కొమ్మ యొకతె చేరి కొమ్మ వంచినఁ గోసె నలరుఁ గ్రొన్నన లొక్కయలరుఁబోఁడి
కలికి యొక్కతె తేఁటికళికి గొందులు దూఱ నతివర్ణ్యగతి నవ్వె నతివ యోర్తు
బాల యొక్కతె పూవుఁబాళకై గీలించి యాన నొక్కతె దాని నానయిడియె
ముదితయై మొగడలు ముదిత యొక్కతె రాల్పఁ జెలువందఁగాఁ నేఱెఁ జెలువయోర్తు
వెలఁది గురివెందపొద లొక్కవెలఁది సూప, రామణీయకనిధి యొక్కరామ పఱచె
నిట్లు వనకేళిఁ దేలుచు నిందుముఖులు, సరసవాచావిలాసంబు నెరపువేడ్క.

20


రగడ.

నెలఁత [8]నెమ్మి నెమ్మిఁ జూపె నీకు నీకుజాళినీడ
నలయక కమ్మ కమ్మఁదావి నలరు నలరుబంతులాడఁ
గలయ నీడ నీడగాదు కదలి కదలికడకు రమ్ము
వెలఁది నన్ను నన్నువిరులు వేఁడి వేఁడిమాట చిమ్ము
వనిత రాదు రా దువాళి వలదు వల దుపవనసీమ
ననలు గోర గోరఁ జీర నాన నాన వెట్టె లేమ
తమ్మికంటి కంటిఁ బొదలఁ దారుదారుచుండ ముందు
కొమ్మ మావి మావిననలు గోయకోయటంచు నిందు

కొలఁది గాదు గా దురాశ కొమ్మ కొమ్మనంచు బోకఁ,
గలఁకఁదిట్ట దిట్ట వైతి కన్నె కన్నెఱుంగ లేక
రమణి ననకు ననకుఁ జేర రాఁగ ఱాఁగవగుచుఁ జేడి
సమరుతావి తావిదా గయాళి యాళి గొల్లలాడి
ముడిత మూలమూలఁ జాల ముడువు ముడువువగల పూలఁ
బదరనేల నే లతాంగి పట్టుపట్టు జీనువాలఁ
గనిరి లలన లలనవామ్రకలిక కలికచ ల్గడంగఁ
గనలు కలికి కలికితేల కావికావికనఁ గడంగఁ
గొఱలి వీడవీడనేల గుట్టుగుట్టు నలులమొనల
నెఱయ నింపునింపు నిచట నెలఁత నెలఁత తళుకుననలు
అతివ వట్టి వట్టివేరు నాడనాడ వైచె దేల,
సతులతరమె తరమెఱుంగ సరస సరసముడిగి బాల
సావి నిక్క నిక్క గాదు చాలుఁ జాలు [9]దఱుగువళులు
తావివండ దండమాకుఁ దమకతమకమూనువళులు
క్రోవు లేమి లేమిఁ జెలులు గుంప గుందరదనయులుకఁ
ద్రోవగట్టు గట్టుచాయ తోఁపుతోఁపుముక్కు చిలుక
నంగమలయ మలయపవన మానియానిని వడదేరెఁ
జెంగునీకు నీకు ముద్దుచిలుకఁ జిలుకఁ బిలువువారె
కింక మాను మానుషంబు గెంట గెంటసంబు లేల
కొంక కేల కేలఁబూని కొంటె కొంటె పూవుఁబాల
జగడ మొల్ల మొల్లకెట్టు చనవు చనవు బలిమితోన
నగిన మేల మేల యని పెనంగ నంగభవునియాన.

21

జలకేళీవర్ణనము

క.

అని చెలులు సుమాపచయం, బొనరించి మరందకణము లొలికెడులతలో
యనఁ దనువుల నునుజెమరులు, చినుకఁగ జలకేళిసక్తచిత్తాంబుజలై.

22


క.

[10]వరసీధుమత్తమధుకర, దరశీర్ణనవీననళినదళమిళనకళా
చిరశీలితశరశీకర, భరశీతలసరసిఁ దఱిసి ప్రమదలు తమలోన్.

23


క.

గరుదనిలాహతి సుమరజ, మిరుగడ రా నడుమ భృంగ మెసఁగె న్సరసీం
దిర దాల్చు కమ్మబంగరు, సరిపెణఁ దగు తేఁటితాళిచాడ్పున సుదతీ.

24

చ.

చిఱునును జెందొవల్ చికిలిచంద్రికపై పఱపు, ల్పరాగముల్
పఱచినపైఁడివ్రాతవలిపంబులు, పాయని జంటజక్కవల్
కుఱుచతలాఁడబిల్లలుగఁ, గోమలి యిచ్చటఁ గాననయ్యె నె
[11]త్తఱు లలరాజ[12]హంసవనితాతతి దూఁగెడు డోలలో యనన్.

25


[13]క.

బలిసద్మద్వారేంద్రో, పలఫలకకవాట మనఁగఁ బరఁగె సరసి యూ
ర్ములు గందపట్టియలుగాఁ, జిలుగుసరోజములు బిగువుచీలలు గాఁగన్.

26


క.

అలిగర్భకుముదముకుళము, పలిజక్కనమేను సోఁకి వడఁకుచు నంత
ర్విలసితద్రుతి నలరెన్, గొలంకుసిరిచంట సకినె కులికె ననంగన్.

27


క.

సూనయుతనాళమానస, మానం గ్రేంకార మొక్కహంస మొనర్చెన్
మానిను లట రా జలఖగ, సేవల కెఱిఁగింప నఫిరిసేసె ననంగన్.

28


చ.

అని కొనియాడి కొమ్మలు శయంబులఁ బూనిననర్మవాక్యముల్
పనుపడఁ గోక లూడ్చి [14]కరపావడ లంట బిగించి సొమ్ము లొ
య్యన సడలించి యొండొరులయంసము లూఁతలు గొంచుఁ జొచ్చి రిం
పున సరసి న్మరుం డొఱలు పుచ్చిన కత్తులఁ బోలి బిత్తరుల్.

29


గీ.

చెలువ లప్పుడు నెలకొన్నసిగ్గుచేత, వక్షముల జేరిచిరి కరస్వస్తికముల
నెగసి చనుజక్కవలఁ గూడి యేగు ననుచుఁ,బదరి చనుజక్కవల నంటఁబట్టిరనఁగ.

30


ఉ.

కొండొకపాయపుంగొమరుగుబ్బెత యోర్తు కొలంకు డిగ్గుచో
నండకు వచ్చినట్టి చెలియంసము చేతులఁ బట్టి వ్రేలె లో
నిండినభీతి నాత్మకళ నేర్పుటకై వలరాచయొజ్జ కో
దండము వైచెనాఁ దఱటుదార్కొనుకైవడి వేణి తూలఁగన్.

31


క.

చెలువలు సరసీజలముల, నిలిచిన లోఁ గన్నుఁగవలనీడలు దోఁచెం
జెలిచెక్కుఁజందురులకై, తలఁకుచు నడుగంటు నచటితమ్ములరీతిన్.

32


గీ.

చెలులు కొందఱు తమమీఁద జలముఁ జల్ల
మగువ లొకకొంద ఱవి కేల మగుడ నాని
రలఘుజఘనాభిఘాతార్తి నరుగుదెంచు
సలిలముల కిచ్చి రభయహస్తంబు లనఁగ.

33


చ.

నెలఁత యొకర్తు నెమ్మొగమునీడ నవాంబుజమంచుఁ గైకొనం
దలఁచి కరంబు సాఁచుటయుఁ దక్కరముం బెఱతమ్మిరీతి సం

దలరిన నొండు రెం డగుట యద్భుత మం చొకప్రోడనెచ్చెలిం
బిలిచి యెఱుంగఁబల్కె నది మేలమునం దనుఁ గేరి నవ్వఁగన్.

34


సీ.

కల్లోలమున నన్నుఁ గదిసి యీఁదుటకు నో యుద్వేలకచజాల యోలయోల
సూటిఁగొ మ్మూని నాసాటి వ్రేయుటకు నో యుల్లోలకరనాళ యోలయోల
చేపట్టి నావెంటఁ జేరి పట్టుటకు నో యుద్దామకటిసీమ యోలయోల
దగలేక నాతోడఁ దడవు గ్రుంగుటకు నో యుజ్జృంభకుచకుంభ యోలయోల
యోయువిద యిందు రాకున్న నోలయోల
యాచెలియ యూఱకుండిన నోలయోల
యోసకియ యెందుఁబోయిన నోలయోల
యనుచు నుద్దులు గూడి పోరాడి రపుడు.

35


చ.

తరఁగల డాయుచున్ మొగడతమ్ములు గోయుచుఁ గోరి తిట్టుచుం
గరములు పట్టుచు న్మునిఁగి గ్రక్కునఁ దేలుచుఁ జాల సోలుచున్
దరులకుఁ జేరుచుం దఱుముదంటల దూఱుచు నీట ఱువ్వుచున్
దొరకొని నవ్వుచుం జెలులు తోయవిహారినితాంతతాంత లై.

36


సీ.

కరిహస్తసాదృశ్య మిరవు కొల్పుటఁ జేసి తొడ లార్ద్రభావంబుతోఁ జలింపఁ
గదళీచ్ఛదౌపమ్య మొదవఁజేయుటఁ జేసి నిలువున నుదరము ల్నిక్కుఁ జూప
హైమదర్పణసామ్య మలవరించుటఁ జేసి మెఱుఁగుఁజెక్కులు కెంపుమిసిమిఁ బూన
జలద[15]సాధర్మ్యంబు సవదరించుటఁ జేసి విప్పుగొప్పులు పయోవృష్టి నెఱప
హస్తికుంభోపమానంబు లగుటఁ జేసి
చన్నులు నఖాంకురాంకుశక్షతులఁ దెల్ప
నంబుకేళిక చాలించి యలసగతుల
సరసి వెలువడి తత్తీరధరణి నిలిచి.

37


చ.

చలువలు గట్టి తొంటి సుమసౌరభము ల్నలుచక్కిఁ గ్రమ్మఁగా
నలకలు చిక్కు [16]పుచ్చి తడియాఱిచి కొప్పులు పెట్టి పువ్వుదం
డలు గయిసేసి చాలమృగనాభి తనూతలందుఁ బూసి సొ
మ్ములు ధరియించి లత్తుకలు మోపులఁ జేర్చి వయస్య లందఱున్.

38


క.

[17]లీలావన[18]జలవిహరణ, కేళీకృత్యంబు లెట్టకేలకుఁ గలఁకం
జాలించి యుచితరచనలఁ, గూలంబున నున్నయట్టికుముదినితోడన్.

39

కుముదిన్యాదులు మన్మథపూజఁ గావించుట

గీ.

ఓలతాతన్వి యీవసంతోత్సవమునఁ
గోరి మదనుని బూజించుకువలయాక్షి
తనకు ననుకూలుఁడైనట్టి ధవునిఁ గూడి
చెలఁగి మనుఁగాన మనము పూజింత మనుచు.

40


సీ.

వలగొన్న గొజ్జంగియెలదీవెమగులున కసదుమొగ్గలు [19]పిల్లనసులు గాఁగ
గొప్పకప్రపనంటిగుమురుటుప్పరిగెకుఁ దెములునాకులు కేతనములు గాఁగఁ
బ్రబలిన సురపొన్నభవనేశ్వరమునకు సుమపాంసువులు వితానములు గాఁగఁ
బొదలిన గురివెందపూఁబొదచవికెకు సమదభృంగములు ధూపములు గాఁగఁ
దనరు విరిదోఁటనగరిలోఁ దావిమావి, జగహజారంబునెడ ఘనసారవేది
కర్ణికాసింహపీఠిపైఁ గలువఱేకు, పట్టు జముకాళ మనువందఁ బఱచి యందు.

41


గీ.

చిగురుపటమునఁ బూఁదేనె మొగడకణికఁ
గొలువుమెఱసిన మరు వ్రాసి కోపులందు
రతివసంతుల వ్రాసి తత్ప్రాంతసీమ
భ్రమరకీరపికాదుల వ్రాసి నిలిపి.

42


క.

ద్రాక్షామధురాధర ల, య్యిక్షుశరాసుం బ్రసూనహేతిదళితఫా
లాక్షు నుచితోపచారవి, చక్షణలై పూజసల్పి సమధికభక్తిన్.

43


ఉ.

దండము నీకు సామి రచితప్రమదేశశరీర మోడ్పుఁగే
లండజరాజగామిహృదయంగమవిక్రమ వందనంబు దో
ర్దండయశస్సమాశ్రయపితామహవక్త్ర జొహారు సూనకో
దండవిలాసవీక్షణవిధానధురీణసహస్రలోచనా.

44


ఉ.

సాయుధుఁడై త్రిపుండ్రధరుఁడై నిటలాక్షుఁడు గాడ్పుసోఁకులం
బోయెడు నొండురెండు[20]పురము ల్దెగనేయు టిదేమివింత యే
యేయెడ నేకపుండ్రము వహించి సమస్తజగత్ప్రపంచముల్
మాయఁగఁ జేయు నీయెదుట మన్మథ మానవతీభయంకరా.

45


గీ.

చెలువమున నీకుఁ దమ్ముఁడై [21]చెలఁగువాని, ననఘవిక్రమహరిసూతి యైనవాని
గనుఁగవకుఁ జంద్రభానువై తనరువానిఁ, గుముదినికి భర్తఁగాఁ జేయు కుసుమవిశిఖ.

46


క.

అని ప్రార్థించుచుఁ గుముదినిఁ గనుఁగొని మదనునికి వినతి గావింపుమనన్
మనమున లజ్జయు నలఁతయుఁ, బెనఁగొన నొకరీతి మ్రొక్కి బిత్తరికలఁకన్.

47

కుముదినీవిరహవర్ణనము

చ.

కలయఁగ మ్రోయుకోయిలల కాకలికాకలనాన మచ్చటన్
నిలిచి సహింపలేక బలునెవ్వగ నుల్లము తల్లడిల్లఁగా
నలసకటాక్షపాతముల నాళిజనంబులవంకఁ జూచుచున్
నిలయముఁ జేరి యేమియు [22]మనీషకు నింపమిఁ జింతఁ గుందుచున్.

48


చ.

గొడఁగెడుపావురాలరొదఁ గూడి ప్రతిధ్వను లిచ్చు కెంపుతా
గొడిగెల వ్రేలుబంగరపుగూడులఁ బల్కెడుచిల్కచాలుచే
నడరు పసిండియోనరులయంత్రపుబొమ్మలు మీటు కిన్నెరల్
గడుసుతిఁ గూడి గమ్ముమనఁగాఁ దగు సౌధముఁ జేరి ముచ్చటన్.

49


చ.

చికిలిపసిండిచాయపనీ చిత్తరువన్నియవేల్పురాచఱా
సకినెలకోళ్లతోఁ దళుకుఁజాయల గుజ్జరినేఁతపట్టెతో
రకమగు నిండుచంద్రిక ఖురాళముతో హురుమంజిపాన్పుతోఁ
జకచకలీను కప్పురపుఁ[23]జప్పరమంచమున న్వసించుచున్.

50


సీ.

పలుమాఱు రాచూలిఁ దలపోసి బెడిదంపునిట్టూర్పుగాడ్పులు నిగుడఁజేయు
నిట్టూర్పుగాడ్పుల నిగుడఁజేసి మెఱుంగుకన్నుల బాష్పము ల్గ్రమ్మఁజేయుఁ
గన్నుల బాష్పము ల్గ్రమ్మఁజేసి యనంతకంతురాజ్యం బేలఁ జింత సేయుఁ
గంతురాజ్యం బేలఁ జింత సేసి మనోంబుజమునఁ గోర్కులు కొనసాగఁజేయు
సరవిమైఁ గోరుకులు గొనసాఁగఁజేసి, కలయ వలవంతఁ నంతంతఁ గళవళించు
నిట్లు కుముదిని యానంగహేతిహలహ, లార్చి సైరింపంగా లేక యాత్మలోన.

51


ఉ.

ఆయెలమావియోవరుల నాననమాధవికాలతాగృహ
చ్ఛాయల నాసితాభ్రకృతశయ్యల నాకమనీయదేవతా
నాయకరత్నకేళిసదసంబుల నా[24]విరిచప్పరంబులం
బాయక యాతనిం గదిసి భావజకేళి సుఖంపఁగల్గునే.

52


సీ.

పాదాబ్జముల తొట్రుపాటు నేమనవచ్చుఁ బెఱిచె గొబ్బునఁ జెంతఁ జేరనీక
నినుపారఁ బాఱుకన్నీటి నేమనవచ్చు నొంచెఁ గన్నార వీక్షించనీక
వడఁకొందు మై పరవశత నేమనవచ్చుఁ గనలించెఁ బలుకులు వినఁగనీక
[25]యుజ్జగింపఁగరాని లజ్ఞ నేమనవచ్చు నడచెఁ గేలునుగేలు నంటనీక

మన సెఱుంగని చెలియ నే మనఁగవచ్చుఁ, బిలిచె మఱికొంతతడ వందు నిలువనీక
యని తలంపఁగఁ జింతాలతాధిరూఢ, దర్పకదశాంకురమ్ములు దలముకొనియె.

53


చ.

తనువున నిండి కాలుకొను [26]తాపముసోఁకు సహింపలేక జీ
వన మతిశైత్యకాంక్ష నిజవాసము వెల్వడి కర్ణకూపశీ
లనసరసస్రఫుల్లకమలద్వితయంబున విశ్రమింప వే
గనటకు వచ్చెనో యనఁగఁ గన్నులఁ బ్రాణము నిల్చె [27]లేమకున్.

54


శా.

ఆలజ్ఞావతి [28]నంత నొక్కచెలి డాయ న్వచ్చి యాశ్చర్యదో
లాలీలాలసచిత్తయై యకట యేలా వచ్చె నీ[29]వంత యీ
నాళీకాయతనేత్ర కంచు మదిఁ జింతం జెంది తద్దీనదీ
నాలాపంబులచే లతాంతశరబాహాప్రౌఢి నూహించుచున్.

55


చ.

అలకలు గూడదిద్ది సరు లల్లన చిక్కెడలించి జాలుగా
నొలికెడు బాష్పము ల్దుడిచి యొయ్యనఁ బయ్యెదకొంగుఁ జేర్చి సొ
మ్ములు సవరించి ఘర్మజలము ల్దొలఁగం దడియొత్తి యెత్తి తొ
య్యలి నెదఁ జేర్చి చేర్చి కరుణాకులగద్గదనిస్వనంబునన్.

56


చ.

చెలియ యిదేమి నేఁడు గడుఁజిత్రము నీదుతెఱంగుఁ జూచినం
దలఁపఁగరాని బెట్టిదపుఁదాపము రూపము వింతకోపమున్
నెలకొనినట్లు తోఁచె నిది నిక్కము దక్కులు పల్కనేల నీ
కలకకు నొండు కారణముఁ గానముగా మదిఁ జింత సేసినన్.

57


సీ.

దగరతేఁటులకప్పు పగఱనీటులఁ గప్పు వలుదపెన్నెఱికొప్పు వదలె నేల.
మెఱపునక్కులఁ జిక్కువఱపు టెక్కులనిక్కు లలఁతినిద్దపుఁజెక్కు లడలె నేల
చలువ[30]చాయలఁజేర్పు కలువపూవులనేర్పుఁ దెగడు కమ్మనియూర్పు దెరలె నేల
పసిమితీవలమించు [31]మిసిమిలేవలమించు వలపుమైఁ గ్రొమ్మించు వాడె నేల
మొగడతమ్ముల జిగినేలి పొగడఁజాలి, నిగుడుచన్నులఁ జెమటలు నిండె నేల
తళుకు బేడిసకవచాయఁ దళుకుఁ జేయ, నేర్చుకన్నులఁ గెంజాయ నిలిచె నేల.

58


ఉ.

గో మగునీమొగంబు గనుఁగొన్నను గ్రొన్ననవింటిదంటచే
బాములు నోమినట్లు గనుపట్టెడు నిట్టియెడ న్మఱుంగు లిం
కేమిటికే మిటారి తలఁ పెల్లను చెల్లమి గాఁగఁ దెల్పవే
యామకరాంకు నైనను జయంతుని నైనను దెత్తు నిత్తఱిన్.

59

చ.

అన మది మట్టు పెట్టికొని యల్లన పయ్యెదఁ జేర్చి దీర్ఘలో
చనములఁ జాల [32]జాలుకొని జాఱెడు నశ్రులు గోర మీటుచున్
వినతముఖాబ్జయై మిగుల వ్రీలిన కొ ప్పొకకేలఁ జెక్కి చి
క్కనిసెగఁజల్లు నూరుపులు గ్రమ్మఁ బదాంగుళి నేల వ్రాయుచున్.

60


ఉ.

ఏమియొకో యెఱుంగఁ జెలి యే మును గేళివనంబులోనికై
యామనిసొంపుఁ [33]జూడఁ జనినప్పటినుండియు డెంద మాకులం
బై మననీని కాఁక కిర వయ్యె నటన్న నొకింత నవ్వుచుం
గోమలి యిప్డుగా మనసు కోరికి తెల్లమి యయ్యె నెంతయున్.

61


[34]చ.

అని చెలి వెండియుం బలుకు నంబుజనేత్ర వనంబులోన నీ
కనుఁగొనినట్టి యాకుసుమకాండసమానుఁడు వీరసేనునిం
బెనఁగొని యుండు నెచ్చెలి సుమీ యిది యేమి దురాపకృత్యమే
మనమున దీని కేల పలుమాఱును గుందెద వేను గల్గఁగన్.

62


చ.

వనిత తలంపులోని వలవంతఁ దొఱంగగదమ్మ యిప్పు డేఁ
జని మనవీరసేనుచెలి జన్మము వంశము నూరుఁ బేరు నె
ల్లను సవిశేషరీతిఁ బదిలంబుగ నారసి వత్తు నింక నీ
వనిపినఁ జాలు నంచుఁ గమలానన నూఱడఁ బల్క నత్తఱిన్.

63

సంధ్యాకాలవర్ణనము

క.

పగటిసెగ వదలి పడమరఁ, డిగియె న్రవిమండలము వడి న్రశ్ములు పై
నిగుడ నల విష్ణుపదమున, దిగదిగయని [35]వ్రేలు తూఁగుదీవియ వోలెన్.

64


చ.

ఇనుఁ డపరాద్రియం దొఱగ నేగెడిచోఁ బయిరాజు వచ్చుటల్
[36]గనుఁగొనుఁ డంచు నున్నతతలంబుల నంచులఁ గోపురంబుగా
నునిచినయట్టి యాత్మబలమో యన భూధరశృంగసీమలన్
వనతరుశాఖలం [37]దొగరువన్నియయెండలు నిల్చె నయ్యెడన్.

65


మ.

దినలక్ష్మీజనకాత్మజాపహరణోద్వేలస్థితిం బొల్చు న
స్తనగేంద్రక్షణదాచరేశ్వరుని భాస్వన్మౌళిబృందంబు నూ
తనతారావరకాలకీశపతి యౌద్ధత్యంబుచే నుర్లినం
గినుకం బర్వుతదక్షి[38]రాగములమాడ్కి న్మించె సంధ్యారుచుల్.

66

[39]సీ.

[40]పరిణతాసమపత్రపాతనపరనగంబునఁ బుట్టిన ప్రవాళపుంజ మనఁగ
[41]విరహార్తిఁ జల్లార్ప వేగ రమ్మని యినుఁ బ్రార్థింపఁ జనుచక్రపంక్తి యనఁగఁ
దొవలచ్చి విభుఁడు వేడ్క వరింపరా మ్రోలఁ బన్నిన కెంపుచప్పర మనంగ
నలఘుమహాతపాత్యయమునఁ బొడసూపు తరుణసౌదామనీధామ మనఁగ
విష్ణుపదసక్తుఁడును దమోద్వేషియు నగు
హంసుఁ డలవారుణీస్పృష్టి నైనదోష
మడఁప నంభోధిలోఁ దాన మాడఁ జనుచు
దరినిడిన [42]ధాతుశాటినాఁ దనరె సంధ్య.

67


చ.

[43]తమము లినవ్యపాయపటుదర్పము లై యళికైతవంబునం
దముఁ గదియంగవచ్చి యుచితధ్వనితో నిజకర్ణికాకలా
పమునకు మూఁగఁ బద్మినులు బద్ధదళాంబుజముష్టిఁ బట్టెఁ దే
జముగల మేటిబోటులు వెస న్మలినాత్ముల నాఁపఁజాలరే.

68


సీ.

సామిదష్టాబ్జకేసర మూను మది నిండి వెలిఁ బర్వు తాపాగ్నిఁ దెలుపుకరణిఁ
దమ్మిచెంగట మ్రోయుఁ దానకాత్మజుఁ డిట్టు తూలించె మము నని దూఱుకరణి
వనజాంతరాళి ముక్కున గ్రుచ్చు మైకాఁక నానఁజాలక విష మానుకరణి
మగనిఁ జీరుచు సారె మొగడదామర యెక్కు వలరాజునలుఁగుపై వ్రాలుకరణి
సరసబిసినీపలాశంబు చాటుపూని, నిలుచు నానంగసాయకానీకహతికి
లోఁగి ఫలకాంతరంబున డాఁగుకరణిఁ, గాంతు నెడఁబాసి యొక్కజక్కవవెలంది.

69


సీ.

ఘనపరంపర లివి గాఁబోలుఁ గాకున్న హంసమండలము ము న్నరుగు టెట్టు
గహనమాలిక లివి గాఁబోలుఁ గాకున్న ఋక్షసంఘము సంచరించు టెట్టు
గంధేభఘట లివి గాఁబోలుఁ గాకున్నఁ బేచకంబులు విజృంభించు టెట్టు
గరళకూటము లివి గాఁబోలుఁ గాకున్న నార్తిఁ జక్రములెల్ల [44]నఱచు టెట్టు
లనఁగ హరితనుహరతనుహరిహయమణి, హరితహరిగుణహరిహవిరశనసరణి
హరిణధరగళహయరిపుహలికవసన, హసనపటురుచిఁ దిమిరము లలముకొనియె.

70


చ.

ఘనపదకాయమానమునఁ గ్రమ్మి తలిర్చు విభావరీవినూ
తన[45]తరగోస్తనీలత యుదగ్రతమోమయధూమదోహదం
బున నలరారఁగాఁ బొడము భూరితరస్తబకంబులో యనం
దనరె నతిప్రశస్తరుచిధామములై తగు తారకావళుల్.

71

చ.

ఇనకరతాపతప్త యగునింద్రదిశాసతికాఁక దీఱ మో
మున నిడునూతనామృతసముజ్జ్వల మౌ పటికంపుగిండి[46]లా
గున నెలదోఁచెఁ దోఁచెఁ బయిఁగ్రొందొగ రప్పుడు నెమ్మితో [47]నిశా
వనిత మఱుంగుపట్టిన రువారపుఁజంద్రికపావడో యనన్.

72


మ.

తొలుగెంప న్నలఁ గింపుమై నలఁది తోడ్తోఁ బ్రాగ్దిశాతన్వి గ్రొ
న్నెలయన్ పాపని దానమార్ప మును గన్నీ రుబ్బెనా నూత్నర
శ్ములు మించెం బిడప న్విరుద్ధసలిలంబు ల్పర్వెనా వెన్నెలల్
నలువొందెం బయి దృష్టిబొ ట్టనఁగఁ జిహ్నం బొప్పె నీలద్యుతిన్.

73


సీ.

విధుఁ డౌట లోకైకవేద్యంబు గావింప శ్రీవత్సచిహ్నంబుఁ జేర్చె ననఁగ
సోమాభిధానంబు సువ్యక్త మొనరింప నఱుతఁ గప్పు ధరించి వఱలె ననఁగఁ
బద్మాసనుం డౌటఁ బ్రకటంబు గావింపఁ [48]గలహంసఁ జెంగట నిలిపె ననఁగ
ద్విజరాజవిఖ్యాతి నిజముగా నొనరింప హోమపావకరక్ష నూనె ననఁగ
నబ్జనామంబు సార్థమై యతిశయిల్ల, మత్తమధుపంబుఁ జెంత నమర్చె ననఁగ
నంకసంయుక్తుఁడై చెలువందె నపుడు, కమల[49]గర్వవిదారి రాకావిహారి.

74


చ.

నెలకొని రాజు తేజములు నించుచురాఁ గుముద[50]చారముల్
దళములు విచ్చియుం బొగడుదాల్చె దళంబులు వేయి గూర్చియున్
విలసన మొంద వయ్యె నరవిందగణంబు లినుండు నిల్వమిం
దలఁప బలప్రచారములు ధారిణి నీశ[51]ణానురూపముల్.

75


చ.

విరహులపైఁ గరాస్త్రములు వే నిగిడింపఁ గడంగి కందు చ
క్కెరవిలుకాఁడు నెక్కసపుఁగిన్క దొలంక మృగాంకబింబమున్
విరివిలుచుట్టుగాఁ దివియ వేమఱు రాలు తేదీయసీధుశీ
కరములకైవడిం దొఱఁగె గాఢతుషారతుషారవారముల్.

76


సీ.

కలువకొప్పెరల జక్కవయూర్పు సెగఁ గ్రాఁగు నులివెచ్చ[52]పూఁదేనె జలకమాడి
తఱినిండుజాబిల్లి తళుకుబొక్కసములోపల మించువలిమంచు[53]వలువఁ బూని
విరిబొండుమల్లెపూబరణులనెత్తావి జడియు పుప్పొడిగందవడి యలంది
[54]చిలుకునీరు దొలంకఁ దెలివొందు నెలచట్టు పళ్లెరంబులమ్రోల బంతి సాఁగి
యలరుఁ బొదరిండ్ల ముంగిళ్ల వలఁపుకలన, [55]నలయు జవరాండ్ర క్రాల్గన్నుచెలులఁ గూడి
పండువెన్నెలచిలువాలపాయసంబు, లారగించెఁ జకోరరాజాన్వయంబు.

77

[56]సీ.

బలిధామ మెనసినఁ బట్టి బంధింపడే చీఁకటి దళమేది చెదరెఁగాక
యడవులు బలసిన నడఁపదే నీడ ప్రకంపనాకులవృత్తిఁ గాంచెఁగాక
రాజు చేరినఁ గావరము మాన్పదే యంక మనినిశ్చితాకృతి యయ్యెఁగాక
దుర్గేశుఁ డంటినఁ దునుమదే యలకప్పు మదమేది కదలక యొదిఁగెఁగాక
రోదసీపూర్ణవిధుపాదరోచమాన, విమలధారావిశేషమై వెలయు దీని
మహిమచేఁ దూలవె యశేషమలినగుణము, లనఁగ వెన్నెల జగమెల్ల నాక్రమించె.

78

వెన్నెలవచనము

వ.

వెండియుం బుండరీకభవాండంబునం దండతండంబుగా నిండుపండువెన్నెల
[57]బిరుదుకస్తూరితోడఁ జుక్కలను జొక్కపుటరవిరులు వలగొన నునిచి తావి
గట్టిన నిశాకాంతుఁ డనుదంతపుబరణి నిర వగు తెల్లగందపడిఁ బగలు
గగనమణి నిగిడిచిన సెగలఁ బొడమిన బదలిక నడలి బిసకుసుమరసమును
జమరి పురరోదసియనుచెలువ [58]చలువ నెలకొన మైనెల్లఁ జల్లికొనిన మొల్లం
బున నుల్లసిల్లి మఱియు నాత్మీయనూతనదశాసముచితంబుగా శీతలతరశీతకర
శిలాతలంబులఁ బాఱిఁ జీరుకలాడుచు మందపవమానకందళస్యందమానేం
దీవరమరందధారాసందోహంబులం దేలి యోలలాడుచు నెల్లెడ వెల్లివిరియు
నుల్లోలతల్లజంబులఁ [59]బిల్లదీవు లాడుచు, నుత్ఫుల్లమల్లికామతల్లికావేల్లిత
పల్లకీకుడుంగంబులఁ గడంగి డాఁగిలిమ్రుచ్చు లాడుచుం బిసాళించి మ
ఱియు నలుకం గలయికలకుఁ దలపడని చెలువ [60]కీలితములు గిలుబందలంచు
చెలువున జాలకంబుకన్నంబులఁ బ్రవేశించి తలిరుగుమురుల నిరవగు నిరులు
విరియించు నెరవున నీరములసందులు దూఱి గగనావతరణశ్రమంబు నపన
యించువడువునఁ జంద్రశాలావిహారలోలబాలాకపోలఫలకంబుల నధివసిం
చి కవయెడలి యడలు జక్కవచెలువలయూర్పుసెగల నొగిలి [61]సెగమాన్పు
తెఱంగునఁ బుంభావసంభావనాపరిశ్రాంతకాంతాకుచాంతనిర్వాంతస్వే
దంబు లాని, మఱియు, నింద్రనీలమణిమయసౌధవిటంకంబులకు ధవళపారా
వతవ్రజంబై సావిగల తీవగుంపులకుఁ బూవుజొంపంబై కాసారతీరంబులకు
మించుగల యంచపిండై, బంగరుముంగీళ్లకు రంగవల్లికయై, మఱియుఁ గఱ
కుదొరతెఱంగునఁ దమ్ముల నొగిలించుచు, దైష్టికునిపోలిక దెసలు గడచుచు
భోగిపడువునఁ గడివోనిచలువలు దాల్చుచు నారదుని[62]వడువున జగడాలు

పచరించుచు నెఱుకు తెఱంగున విర్ల నుర్లఁద్రోయుచు నామనిగోమునఁ
గొమ్మల నలరించుచు మానిని [63]యనువున నుడువుల నాఁగుచుఁ [64]గాకము
లకు నభిసారికానీకములకు నడలు వెంచుచుఁ దరంగనదీతీరంబులకుఁ గురం
గేక్షణావారంబులకుఁ గలువసొంపులు [65]నింపుచు, మఱియు నొక్కయెడ
లలితమణిమయసౌధతలంబులఁ బ్రసవశరకేళికై మల్లాడు నిజవల్లభు లల్లన
పోఁకముడి [66]కేల సడలించినఁ దెగడువడి వెగ్గలంబుగ బెగ్గిలి డిగ్గన లేచి
వాతాయనాయాతశీతకరకరాంకురంబులఁ దారి గనఁబడకునికి మనంబునం
బెనఁగొనిన నాన నానతవదనలై కెళవులు గనుఁగొను నవోఢాంగనల
మెఱుంగుకన్నులచాయఁ దుఱంగలించుచు, మఱియు నెల్లెడఁ బాలవెల్లి
వెల్లివిరిసినచందంబున నందంబు చూపు బయట చిట్టకంబులకుఁ [67]బట్టువడని
ముగుదలఁ దదీయాంగంబులు బయలుపఱుపఁబడనీనితరుచ్ఛాయాతలంబు
లకుఁ దార్చి పేర్చినతమిఁ గట్టువాదిట్టమగలు వలరాచకయ్యంబులఁ దేలిం
చిన నెలవులఁ జెలువార నెరిసిన హారమౌక్తికంబు లని పొడవెన్నల లేఱం
బోవుసకియల వికావికనవ్వు నవ్విటీవిటులు దంతకాంతిప్రకాండంబుల దండి
చూపుచు, మునుపు ననుపుగల మగనియనువున ననయము ననునయించి
వెండియు నొండొకతె యండనుండఁ గని చేరి సారెకు దూఱి మగిడి చను
నెడ వెనుగదిసి ప్రియంబులు వలికి పదంబుల వ్రాలిన భర్తల నెగనెత్తి
మొగంబులు మగిడించి చేఁబట్ట నదలించి కరంబులు విదురుచు జగజంత
దగఱమగునల కంకణంబుల నంకితంబులైన హీరంబుల కాంతిపూరంబుల
నీరిక లెత్తుచు ననుంగుఁజెలుల వచనంబులు విని యన్యాంగనాసంగం బా
రోపించి క్రించుఁదనంబు గల్పించుకొని పొలయలుకల కలఁకల నునికి నిజ
ప్రాణనాయకులు మగిడి చనిన నిగిడిన నెవ్వగఁ బశ్చాత్తాపంబునుం బొంది
జాఱు కన్నీరు సారెకు నీటునఁ బోమీటు సారసాక్షుల గోరుల కాంతితీరు
చూపుచు, నొండొరువు లుద్దులు గూడుకొని తుఱుములు విరియఁ జిలుపచె
మటలు దొలఁక నలయికలు దలంపక గోడల నీడల నిజోరోజకుంభపరిమా
ణంబుఁ దెలుపువిధంబునఁ జెన్నగు వెన్నెలకుప్పలు వోసి యరయుటకుఁ
గడువడినడరు నీషన్ముక్తశైశవ లైనకప్పురగంధుల యురఃస్థలంబులఁ బింపిళ్లు
గురియు ముత్తియపుఁబేరులడాలుతోఁ బొత్తు గలియుచుఁ బ్రకాశించి య

మృతప్రదుం డగువిధుండు దయార్ద్రహృదయుండై యఖిలభువనంబు సత్త్వప్ర
ధానంబు గావించె నన మించి రోదసీవలయంబు కర్పూరఫలకకల్పితం
బనుశంక నంకురింపఁజేయుచు విజృంభించె నట్టిసమయంబున.

79


క.

కంతునకుఁ దోడు రాకా, కాంతుఁడు కరకాండముల వెగడుపడఁజేయం
గాంతాలలామ కంతట, నంతంతకు మేనికాఁక యగ్గల మైనన్.

80

మన్మథాద్యుపాలంభనము

క.

నెచ్చెలి వెచ్చగ నూర్చుచు, విచ్చలవిడిఁ బెచ్చు పెరిఁగి వెగడుపఱుచు నా
పచ్చవిలుకానిజైత్రమ, రుచ్చంద్రుల ననియె నత్యరుంతుదఫణితిన్.

81


సీ.

రాజమండల మాత్మవాజిసంభరణపాత్రము చేసె జగత్ప్రాణమూర్తి
బహువాహినీభర్తఁ బ్రబలాత్మకేతుచయంబు మోయించె నేయసమశరుఁడు
దుర్గాధిపతిమౌళి దొరయించె నాత్మపాదవిజృంభణంబు నేకువలయాప్తుఁ
డతిగంధతరులచే నాత్మానుగశ్రేణిఁ బూనించె నేసుమనో[68]నిధానుఁ
డట్టిదాక్షిణ్యశాలియు నట్టియతనుఁ, డట్టిసన్మార్గవర్తనుఁ డట్టిసురభి
కీర్తనుండును నీరీతిఁ గెరలిభీరు, హనన మొనరింపఁ గడఁగి రేమనఁగఁగలదు.

82


సీ.

అంధకప్రియసూతి వై విషపంకసంకలితాంకము వహించుఖలుఁడ వీన
యనయమ్ము నెత్తమ్ములనె మాఱుకొని సత్ప్రధానత లెఱుచు నీ మేనమామ
ధరణి నెల్లెడఁ బ్రసూతప్రసవఖ్యాతి వహియించి తిరుగు నీసహచరుండు
భాసురద్రుపదజాపాండుచ్ఛదాపకర్షణదంచలుండు నీసహజమిత్రుఁ
డకట దర్పక మీరు కృష్ణాలకాప, కారవైరస్యమున ధర్మదూరు లగుట
భీమవిజయాహితగుణానభిజ్ఞవృత్తి, నవని దుష్టచతుష్టయం బగుట యరుదె.

83


చ.

కనుగలవిల్లు నంటకయ [69]ఖంగని మ్రోయుగుణంబు గంటిలే
కనె యిరుమేనఁ గాఁడిచనుకాండములుం గలయట్టిమేటి జో
దున కతనుప్రభావున కెదుర్పడ లక్ష్యముగారు భీరువుల్
మనసిజ దోస మాఁడుకొల మానఁగదయ్య తలంచి మ్రొక్కెదన్.

84


సీ.

ఒసఁగఁగాఁబోలుఁ గల్పోదగ్రహరమూర్తి పుష్పచాపముపేర భ్రుకుటిలతిక
దయసేయఁగాఁబోలు లయకాలశిఖి యలిస్తోమశింజినిపేర ధూమరేఖ
సంఘటింపఁగఁబోలు సంవర్తసమవర్తి టంకారములపేర హుంకృతములు
కరుణింపఁగాఁబోలుఁ గల్పాంతరవిహల్లకాస్త్రసంఘముపేర నంశువితతి

యుపధ పెట్టఁగఁబోలు మహోగ్రకాళి. వాయురధ మనుపేర నిశ్వాసపంక్తి
కాకయుండిన వారూరకయ వసింపఁ, నీ వెపుడు లోక మేర్తువే భావజన్మ.

85


సీ.

కోకస్తనియటంచుఁ గుందింపజూచితే తరుణచకోరాక్షి యరయరాదె
యరవిందపద యంచుఁ బొరపొచ్చె మెందితే కువలయామోద గైకొనఁగరాదె
తిమిరకైశిక యంచుఁ దెగువమైఁ జూచితే కౌముదీనరహాస కావరాదె
యహిరోమలత యంచు నలయింపవచ్చితే తారకాసఖ దయఁదలఁపరాదె
యహితగుణశాలిని యటంచు ననకయాప్త, నివహలీలాభిరామ మన్నింపరాదె
చాలఁ జెప్పెడి దేమి యీచంద్రవదనఁ, బ్రోవఁగారాదె పౌర్ణమాసీవిలాసి.

86


సీ.

జింకపేరిటఁ గందఁజేసె నింతియకాని హరుఫాలశిఖి చాల నంటదయ్యె
మించుపేరిటఁ గరఁగించె నింతియ కాని బాడబశిఖ క్రిందుపఱుపదయ్యెఁ
గాంతిపేరిట నీఱు గప్పె నింతియ కాని రాహుదంష్ట్రాగ్ని మై బ్రాఁకదయ్యె
నుదయరాగముపేరఁ [70]బొదిగె నింతియ కాని ప్రాగద్రిదవ మాత్మఁ బఱపదయ్యె
నకట నీ వోషధీశుఁడ వగుటఁ జేసి, సంతరించితివో శిఖిస్తంభనంబుఁ
గాకయుండిన నవి నిన్ను గ్రాఁచకున్నె, పాంథసంతతిపుణ్య మాపాటి చంద్ర.

87


[71]సీ.

మొదల మహాబిలంబునఁ దేజరిల్లుట కుండలాకృతిని నిందుండ వగుట
విషముతోఁ గూడ నావిర్భావ మందుట బహుపాదవిస్ఫూర్తిఁ బాఁదుకొనుట
సడలనీక శశంబుఁ గడిమిమైలోఁ గొంట యాబాల్యకౌటిల్య మందుకొనుట
రాజితవీక్షణశ్రవణాంచితుఁడ వౌట తరుణమరుద్గ్రాసతనువుఁ గొనుట
నీవు పెనుబాఁపఱేఁడవై నిలిచి తరయఁ, గ్రూరభావంబు నీ కసాధారణంబు
భయదవిషధారి తలక్రిందుపఱుపఁజాలఁ, డితఁడు నీలీల నీలకంఠావతంస.

88


చ.

ఎలమి శుకాదికద్విజసమీహితదివ్యఫలప్రదుండ వై
యలరుచుఁ గాలకంఠనుతి కర్హుఁడవై సుమనోనురాగి వై
యలఘు[72]మరుత్సమాశ్రయుఁడ వై తగుమాధవ నీవు నీసుదృ
క్కుల నలయింతువే మధుపకోటులఁ బంచి దయావిహీనతన్.

89


చ.

అలులు మధువ్రతంబులు సుమాస్త్రుఁ డనంగుఁడు పక్షపాతి చు
క్కలదొర కోకిలంబు బలుకాకులపెంపుడుగున్న ప్రాప్తస
త్ఫలదళనం బొనర్చు శుకపంక్తి యివన్నియుఁ ద్రోఁచి పోవఁగాఁ
దలఁచిన నోసదాగతి సదాగతి వీవసుమీ లతాంగికిన్.

90


సీ.

ప్రత్యగ్రవక్ర[73]దంష్ట్రాశిఖాచయ మనుపట్టుకాఱుల సారెఁ బట్టిపట్టి
శా.................లమానవిషములన్ కఱకుమంటల సారెఁ గాఁచికాఁచి

యాలోలసృక్వాగ్రలాలాద్రవం బనునలఁతి నీరుననారె నడ్డియద్ది
యత్యంతభయదజిహ్వాంచలం బనునాకు ఱాతిచే నారెకు రాచి రాచి
త్రాఁచువాకొల్మియందుఁ గందంపుఁగొండ, యోజ ని న్నాశుగముఁ జేసి యొసఁగె నతనుఁ
డేయఁ గాఁబోలుఁ బవన కా దేని సకల, జీవనం బగునీ వింత సేయు టెట్లు.

91


చ.

అని సుమబాణచైత్రపవనాబ్జుల నెచ్చెలి దూఱునంతలోఁ
దనువున హెచ్చినట్టి పరితాపము సైఁపఁగలేక యప్పు డ
వ్వనరుహపత్రనేత్ర నెఱవా డెడుక్రాల్గనుదోయి ఱెప్ప లొ
య్యనఁ గదియించి సంజ్వరభరాలసయై పొరలాడునంతటన్.

92


చ.

చెలి కలఁకం దలోదరికిఁ జెందిన తాపముఁ [74]బాపు నేర్పునం
జలువలు నింపఁగాఁ దలంచి నారెఁ బటీరతుషారనీరముల్
తలిరులుఁ గప్రము ల్గుముదతామరసంబులు నించి యైందవో
పలకృతవేదికాతలముపై మృగలోచన నుంచి గొబ్బునన్.

93


క.

విలువ యిడరాని చలువలు, చెలువకు నొనరించి [75]పయినుశీరవ్యజనో
చ్చలనజనితమందానిల, వలనంబునఁ గొంతకొంత వా డెడలింపన్.

94


క.

తనుపొంది యొయ్యనొయ్యన, కనుదమ్ములు విచ్చిచూచి క్రమ్మెడు కన్నీ
రనయము ఱెప్పలఁ గ్రుక్కుచు, సనియెం జెలితోడ ధైర్య మవలంబముగాన్.

95


సీ.

చెలియ నేఁ బెంచిన యెలమావిమోకకు సేవంతికకుఁ బెండ్లి సేయవమ్మ
సుదతి నే సాఁకిన శుకశారికల దేవతామందిరములకుఁ దార్పవమ్మ
మగువ నేఁ బెంచిన మరువంపునుడికట్టు లప్పటప్పటికిఁ బెం పరయవమ్మ
[76]పడఁతి నే నడపిన బాలసారంగంబు ఋషినివాసముల కర్పింపవమ్మ
యబల నాతోడఁ గెడఁగూడి యాడునట్టి, నెచ్చెలుల నెల్ల నీవు మన్నింపవమ్మ
భావిజని నైన నాతఁడె భర్త యగుట, కింతి మరునకు మే నప్పగింతుఁ గాన.

96


చ.

అనుచు వడిం గడంగి కుముదాప్తునికై యెదు రేగునంతలో
ఘననిభవేణి వ్రీలుటయు గ్రక్కునఁ బువ్వులం రాలెఁ దో నురం
బునఁ జొరఁబాఱినట్టి యలపూర్ణశశాంకమయూఖపంక్తి వె
న్నున వెసదుస్సి పాఱె నన నూత్నసరోరుహపత్రనేత్రకున్.

97


క.

అత్తఱి సఖి డగ్గఱి యా, బిత్తరిఁ దనబాహులతల బిగియించి కడున్
మెత్తని మేచెమటలు వడి, నొత్తుచు విధుమణివితర్ది నునిచినయంతన్.

98


చ.

కలఁక తలంక నేత్రములకాఁకఁ దెరల్పఁగఁ జేరవచ్చెనో
పలుమఱు నేత్రరాజ మనఁ బయ్యెద కొంగు మెఱుంగుఁగన్నులన్

నిలిపి లతాంగి యేడ్చె మది నెవ్వగతోఁ గురరీపరంపరా
కలితనవీనదీనతరకాకలికాకలనిస్స్వనంబునన్.

99


క.

ఈరీతి నెమ్మనమ్మున, గూరిన వగ నేడ్చునట్టి కుముదిని నెదపైఁ
జేరిచి చెక్కుల డిగుక, న్నీరు కరాబ్జమునఁ దుడిచి నెచ్చెలి వలికెన్.

100


చ.

వదలుదురమ్మ యాత్మకులవర్తన మీలువు దూలి సారెకున్
బదరుదురమ్మ లేఁదలిరుఁబ్రాయవుమేని నలంతురమ్మ యి
ట్లదరుదురమ్మ మండుశశికైనఁ దలంకక పండువెన్నెలన్
గదియుదురమ్మ యిత్తెఱఁగు కన్నెకుఁ జెల్లునటమ్మ నెచ్చెలీ.

101


మ.

మెలఁతా నీ విఁకఁ జింత సేసెదవు సుమీ వీరసేనుండు నీ
లలితోద్యానముఁ బాసి వచ్చి నిజలీలాగేహముం జేరె నా
చెలువుం డచ్చట నుండఁబోలు నిఁక నీచేకంకణం బిమ్ము నే
నల కేళీవని కేగి యీక్షణమె నీప్రాణేశుతోఁ దెల్పెదన్.

102

తరళిక చంద్రభానుకడ కేగుట

క.

అని తెలియఁబలికి యపు డా, వనితకుఁ గ్రమ్మఱఁగ శిశిరవస్తువు లెల్లం
బనుపఱిచి యాకెవలయము, తనచేఁ గొని కూర్మిబోటి తరళిక యంతన్.

103


ఉ.

చెంతఁదనర్చు కేళివనిఁ జేరి నికుంజము లెల్లఁ గాంచి య
త్యంతసుగంధబంధురలతాంతనితాంతవిలోలగుచ్ఛకా
శ్రాంతసరన్మరందరససంగతభృంగతతారవావృతా
శాంతలతావితానకలికాలయ మొక్కటి డాయవచ్చినన్.

104


క.

మును తా వీణియ మీటుచుఁ గనుఁగొన్నలతాంగిరూపు కన్నులయెదుటన్
గనుపట్టఁ జంద్రభానుఁడు, మనసిజశరధూయమానమానసుఁ డగుచున్.

105


ఉ.

నీపవనీధునీకమలినీమకరందమిళన్మిలిందగ
ర్జాపటుఝుంకృతుల్ సయిఁపఁజాలక నీలకచాకుచాంతరా
రోపిత మైనడెందము మరు ల్మగిడింపఁగలేక చిక్కి లీ
లాపరికల్పితైందవశిలాతలశీతలవేదికాస్థలిన్.

106


క.

పవళించి చందనాచల, పవమానకిశోర[77]చలితఫలగళితరసా
సవమత్త[78]కీరశారీ, రవములు బెట్టుగ హృదంతరం బెరియింపన్.

107


క.

తలపోయుఁ దలఁకు నలుకుం, దలవంచుం దత్తఱించుఁ దహతహపడు లోఁ
దిలకించుం బులకించుం, బలికించు న్బట్టబయల భామా యనుచున్.

108

చంద్రభానుని పరితాపము

సీ.

హృదయవాసిని యైనమదిరాక్షి, లేనవ్వు లభినవపాండిమం బలవరింప
స్వాంతసంగత యైన కాంతలేఁజూపులు తనువునఁ జాంచల్య మనువుపఱుపఁ
జిత్తచారిణి యైనమత్తకాశినిమోవి కన్నులనెఱసంజ గడలుకొలుప
సంకల్పగత యైనపంకజాననకౌను తానవం బంతకంతకు నిగుడ్ప
మానసావాస యైనభూజానిపుత్రి, పిఱుఁదు కోర్కులకెంతయుఁ బెంపు నెఱపఁ
బలవరించుచు నాచంద్రభానుఁ డపుడు, నిలువరింపఁగ లేక కన్నియఁ దలంచి.

109


చ.

చుఱుకుచుఱుక్కునం దనువు సోఁకెడు వెన్నెల కాలుకొల్పుచుం
జఱవఁగఁజొచ్చెఁ దెమ్మెరలు చక్కనిజోదు శరమ్ము లేయఁగాఁ
గఱకరియయ్యె నిట్టియెడఁ గౌఁగిట న న్దయఁజూడ కక్కటా
తెఱవ యెఱింగితే నెగులు దీర్పఁగదే [79]తగవే కలంపఁగన్.

110


ఉ.

కన్నుల దోరచాయ లలికంబున లేఁజెమ రుబ్బుగుబ్బలన్
గ్రొన్నెలవంకసొమ్ము లఱగ్రొమ్ముడి జాఱినపూలు వాతెఱం
జిన్నిమెఱుంగుకెంపు లెదఁజిట్లిన గందము గల్గునట్లుగాఁ
గన్నియ ... ... ... ... ... ... ... ... ... ...

111


ఉ.

రాణమెఱుంగువెన్నెలఁ గరంగిన క్రొన్నెలఱాలమేడలం
బ్రాణసమా .... .... .... .... .... .... ...
వీణయ ముట్టి పంచశరవిక్రమము ల్పచరించుగీతముల్
గాణతనంబు మీఱఁ బలుకం గలభాగ్యము నాకుఁ గల్గునే.

112


చ.

పలుచనిమేను లేఁగొసరు[80]పల్కులు ముద్దులమోము చిన్నిగు
బ్బలు జడగూడువెండ్రుకలు బంగరుచెక్కులు చేరెఁడేసిక
న్నులు నునుముత్తఱుల్ మినుమినుక్కనుకౌను మెఱుంగువెన్నెలల్
కులికెడు నవ్వునుం [81]గులుకుకోమలి ని న్మదిఁ [82]ర్చ చేసెదన్.

113


క.

కలువా కనుఁగవ గొఱనెల, చెలువా నెన్నొసలు కప్పుఁజిలువా జడ యో
చెలువా పదివే లైనను, విలువా నినుఁ జూచి గారవిలువారలకున్.

114


క.

తుహినకరవదన నీగతి, బహుభంగులఁ బలికి చంద్రభానుండు ముహు
ర్ముహురుపహితవిరహార్తిం, దహతహపడి యాత్మచర్యఁ దలఁచి కలంకన్.

115

సీ.

ఉన్నట్ల యుండి ప్రద్యుమ్నుతోఁ గలహించి విద్యార్థినై యేల వెడలవలసె
వలసెఁబో త్రోవ దుర్వాసుశాపంబున విజయలోలుం డేల విడిచిపోయెఁ
బోయెఁబో నేను నీ[83]పురి సొచ్చినది మొద లీ[84]కుముదిని రూప మేల వింటి
వింటిఁబో వనములో వీణ వాయించుచో నేతెంచునాకన్నె నేల కంటిఁ
గంటిఁబో యంతలోననె కమ్మవింట
గొనయ మెక్కించి మరుఁ డేల కూఁత నేసె
నకట శౌరికి సత్యకు నవతరించి
నట్టినాకును దైవ మీ[85]యడలు దెచ్చె.

116


సీ.

తరియింతు నెటువలెఁ బరవాది విరవాది నెఱవాదితావుల [86]మెఱయుగాడ్పు
భరియింతు నెటువలెఁ బరువంపుమరువంపుగరువంపువిలునింపుశరచయంబు
మలఁగింతు నెటువలె నెలదీవి యలదీవి నలదీవియల మీఱు తలిరుడాలు
దొలఁగింతు నెటువలెఁ బలుమాఱుఁ బొలి మీఱు బలుమారు బాబాలకలికిరొదలు
సొరిది నేత్రాబ్జములు విచ్చి చూతు నెట్లు
సాంద్రమోహతమంబుతో సైఁతు నెట్లు
ప్రౌఢశశిమాంత్రికవికీర్ణపథికహనన
భసితసితసాంద్రచంద్రికాపాటవంబు.

117


మ.

అనిపల్క న్విని యంత నాతరళికాబ్జామోద యత్యంతసం
జనితాశ్చర్యముతోడ నాత్మ నతని న్సత్యాసుతుం జంత్రభా
నునిగా నెన్నుచు నాకుమారకుపయి న్నూల్కొన్న యాత్మీయస
ఖ్యనురాగం బుచితోపయుక్త మని యత్యానందముం జెందుచున్.

118


సీ.

చంద్రభానుఁడు కాన సమధికంబై మించు వెల్లఁదనంబున వెలయువాని
గృష్ణపక్షంబున నెనఁగినరాజౌట నంతకంతకుఁ గార్శ్య మడరువాని
బ్రద్యుమ్నరుచిగాన భరియింపఁగారాని గాటంపుఁగాఁకచేఁ గరఁగువాని
నిత్యానిరుద్ధనుస్నేహదీపకుఁడౌట మలయానిలమునకుఁ దలఁకువాని
నరయ సత్యాత్మసంభవుఁ డైనకతన
నతనుశరవర్ధితాంగుఁడై యలరువాని
నాకుమారవరేణ్యు డాయంగ నరిగి
వినయవినమితవదనయై వనజగంధి.

119

తరళిక చంద్రభానునకుఁ గంకణము నిచ్చుట

గీ.

దేవ [87]చిత్తేశు సాత్రాజితితనయ........కాంతికుముదిని నిజకరకంకణంబు
ననిపె దేవర కిదె దీని నవధరింపు, మనుచుఁ బ్రాంజలి యైన నయ్యవనిభర్త.

120


క.

వితతాశ్చర్యతరంగిత, మతియై యాలేమచేతిమణిమయవలయం
బతిమోదంబునఁ గైకొని, స్మితమంజులవాక్యసరణిచే ని ట్లనియెన్.

121


శా.

రాగాంకూరలతాలవాలమవొ దౌర్భాగ్యాక్షరాక్షేపణో
ద్యోగాధిష్ఠితకుండలాకృతివొ [88]హృద్యుక్తాంగనాధైర్యసం
ధాగాఢాంగజదత్తవాగురవొ లేదా మత్తమో[89]రాహువుం
బ్రాగల్భ్యంబునఁ [90]ద్రుంచుచక్రమువొ భామాకంకణగ్రామణీ.

122


క.

మణిబంధబంధురస్థితి, మణిబంధనవాధివాసమహిమ మెఱయు నిం
బ్రణుతించెద ననుఁ గన్యా, మణిబంధుం జేయవే సమంచితకరుణన్.

123


క.

చెలువ మతితెఱఁగు నాతోఁ, బలికి కలఁక నడఁతు ననుచుఁ బఱతెంచితివౌ
వలయ ప్రకోష్ఠవాసికి, [91]నలవడు నీమదికిఁ దెలియు నంతర్వార్తల్.

124


చ.

అగణితమన్మథాశుగమహాజ్వలితానలమామకీనహృ
ద్ద్విగుణితతాప మెంచదొ మది న్మహిభృద్వరజాత యాసమ
గ్రగుణకలాప సింధుమణి గానియెడన్ ఘనసారయుక్తిఁ జె
న్నగు విషులోర్మికం బనుప కంపునె ని న్నొకకంకణాకృతిన్.

125


చ.

తొలువలఱాచకయ్యమునఁ దొయ్యలి నీవికి నెగ్గు వేఁ దమిం
దలఁచిన నడ్డగించుకరతామరసంబునఁ గూడునిన్ను నే
నలఁకువబెట్టఁ గంకణమ నమ్ము భవద్రుచిం కాంతయంగముం
దెలియఁగఁ జేయుమేలు మది నిల్పెదఁ గీ లెడలింప నొక్కెడన్.

126


మ.

చెలి సంతోషముఁ గాంచునే సఖులకు న్సేమంబు సంధిల్లునే
లలనాపోషితశారికాశుకమరాళంబు ల్సుఖం బుండునే
సిలుగు ల్సూపునె పంచసాయకుఁడు రాజీవాక్షిపై రత్నభా
నిలయం భావలయంబ తెల్పు మని కన్నీరోడిక ల్గట్టఁగన్.

127


గీ.

వివశుఁ డైయున్న యమ్మహీవిభుని జేరి, శిశిరవస్తులచేఁ గొంత సేదఁ దేర్చి
తలిరుకెంజాయసురటిచే నలవరించి, యొయ్య విసరుచుఁ దరళికాయువతి పలికె.

128

క.

జననాథచంద్ర యేమని, వినిపించెద మున్ను నిన్ను వీణారతునిం
గనుఁగొని కుముదిని యట వో, యినమొదలుం దాల్మి దూలి హెచ్చినకూర్మిన్.

129


సీ.

మలయానిలంబు పైఁబొలసిన నీభుజాపన్నగంబుల మది నెన్నునయ్య
కమలకాండములు పైఁగ్రమ్మిన నీయాననేందుమండలము నూహించునయ్య
వదరుతుమ్మెదలు పైవ్రాల నీనాసికావికచచంపకము భావించునయ్య
రాయంచపదువు లాఱడి పెట్ట నీకుంతలఘనాఘనములఁ దలంచునయ్య
బ్రమసి యూరక పనిలేనిపనికిఁ గూర్మి, చెలియఁ జీరెదనని నిన్నుఁ జీరునయ్య
చిత్రఫలకంబుపై నలచిత్తజాతు, వ్రాయఁ దలపోసి నీరూపు వ్రాయునయ్య.

130


ఉ.

చక్కెరబొమ్మ కొమ్మ యెలజవ్వని యచ్చట నిట్లు గుంద నీ
విక్కడ నుందువయ్య చెలి యీలువుదూలి మనోజుగాసిచేఁ
జిక్కెఁగదయ్య యింతపని సేయుదు రయ్య యిఁ కేమి సేయునో
చుక్కలరాజు వేఁడితల సూపెను రాగదవయ్య మ్రొక్కెదన్.

131


[92]మ.

అని పల్క న్విని చంద్రభానువసుధాధ్యక్షుండు సంతోషనీ
రనిధిం దేలుచు నోలతాంగి యిపు డేఁ బ్రచ్ఛన్నవేషంబుతో
నునికిం జేసి యథేచ్ఛఁ [93]జేర నది నీ వూహించి యేవేళ నీ
కనుకూలం బగు నట్టివేళ ననుడాయ న్వచ్చి పల్కించినన్.

132


క.

హరి రుక్మిణిఁ బలె నేనుం, దరుణీమణిఁ గొంచు శత్రుదమనుఁడనై మా
పురి కేగెద మది నీ వొం, డరయక పరికింపు మట్టియవకాశంబున్.

133


చ.

అని పతి వెండియుం బలుకు నంగన నా తెఱఁ గానుపూర్విగా
వనితకుఁ దెల్పు మేను దనవాఁడ సుమీ యనిపల్కు నాపయిం
దనదయ యుండనిమ్మనుము దైవికమై యితరేతరంబు హె
చ్చినతమి నెట్టులైన దరిఁ జేర్చు నదృష్ట మటంచుఁ జెప్పుమీ.

134


చ.

తరళిక నీవు వచ్చి కడుఁ దామస మయ్యెను దమ్మికంటి లో
విరహదవానలంబు కడువెగ్గలమైన సహింప కేగతిం
బొరయుచునున్నదో మగిడిపొ మ్మని యూర్మికఁ జేతి కిచ్చినన్
దరుణి జొహారు దేవ యని తన్మణిముద్రికఁ గొంచు గొబ్బునన్.

135


శా.

ఆలీలావనవాటిఁ బాసి తరుణీహర్మ్యంబు సొత్తించి యా
నాళీకాక్షికి లేమ తాఁ జనినచందం బంతయుం దన్మహీ

పాలోదంతముఁ బంచనాయకునిదోనపాండిత్యముం దెల్పి కెం
గేల న్రంజిలు ముద్దుటుంగర మొసంగె న్మందహాసంబునన్.

136


చ.

ఒసఁగినఁ బొంగి యచ్చెలువ యొయ్యన నేత్రయుగంబుఁ జేర్చి సం
తసమునఁ గేలఁదాల్చియుఁ బునఃపునరుక్తసఖీసనర్మవా
గ్విసరరసంబు చిప్పిలుచు వీనులవిందులు సేయఁ గొంతచిం
త నడలి యున్నయంతటఁ గనం దగియె న్శశి ధూసరచ్ఛవిన్.

137


గీ.

భార్గవుఁడు గానఁ బరుసంపుఁ బస దలిర్ప
రాజజృంభణ మాత్మ నోర్వంగలేక
తదపకర్షంబుకొఱకు నభ్యుదయమందు
చొప్పుతోఁ దూరుపున వేగుఁజుక్క తోఁచె.

138


మ.

కమలాప్తుం డిట బ్రహ్మయై యఖిలముం గల్పింపఁగా నిమ్ముహూ
ర్తము బ్రాహ్మంబునఁ బొల్చు నేతదనుసంధానంబు నించు న్హితా
ర్థము లంచున్ జనకోటికిం జెలుపుచందం బొప్ప ఘోషించె ద
త్సమయారాధనజాతవాఙ్మహిమ మించం దామ్రచూడౌఘముల్.

139


చ.

చెలియలి యిల్లు మందటిలఁజేసిన దోషము సద్వసూత్కరం
బులు గిలుబా నైనయఘమున్ బహుచక్రవిమర్దనంబునం
గలిగినదుష్కృతంబుఁ దొలఁగన్ భృగుపాత మొనర్చెనో యనన్
గలువలఱేఁడు వ్రాలెఁ దుదిగట్టున నుండి కలావిహీనతన్.

140


గీ.

అర్కుఁ డపరాద్రి కేగుచో నతనికాంతిఁ
గొల్లగొని యాతఁ డేతేరఁ గొఱలుభీతి
నప్పగింపఁగ నెదుకుగా నరిగి కాచి
యున్న శిఖియనఁ బ్రాచిఁ జెన్నొందె సంధ్య.

141


[94]ఉ.

కాలపయోదమూర్తి పయిఁ గ్రమ్మి మహాబిలమండలంబు త
త్పాలకుఁడైన ఋక్షవరు బంధయుతంబుగఁ గూల్చి తత్ప్రభు
త్వాలఘుకాంతిలక్ష్మిఁ గొని యయ్యరుణద్యుతిరత్నరాజముం
జాలసముద్దరించె హితచక్రముఖాబ్దము లుల్లసిల్లఁగన్.

142


[95]మ.

మును దా నేగెడువేళఁ జీఁకటులఁ బై ముక్కాకగాఁ బంచి వే
చనుదేరం దము [96]గామినింబలె గుహాసద్మంబుల న్వానిలోఁ

గొని యుండం గని తచ్చిఖాగ్రహణ మర్కుం డల్కఁ గావించెనో
యనఁ బైపై నిగిడెం గరంబు లగకూటాభోగభాగంబులన్.

143


మ.

సరవిం దామరబానవాల్మగువ భాస్వద్రామపాదాప్తి భా
గ్యరమోత్కర్షము కల్మిఁ గర్కశమహాగ్రావస్థితు ల్వో ముఖ
స్ఫురణ ల్దాల్చి సముజ్జ్వలాపయనయై సొంపూనఁ దత్ప్రాప్దుత
స్తరశాపాక్షరపంక్తినా వెడలె నంతర్మగ్నరోలంబముల్.

144


గీ.

అట్టియెడఁ గాల్యకృత్యంబు లలసగతులఁ
గడపి నెవ్వగఁ గుముదినీకాంతయాత్మ
నెలకొనిన తాప మొరులకుఁ దెలియనీక
విభుని వరియింప సమయంబు వెదకుచుండె.

145


మ.

అలఘుజ్ఞానతరంగరంగదళికస్యందిద్రవేందుస్పృహా
చల[97]షట్కంజభుజంగ జంగమగుణాంచత్కాంచనోర్వీధరో
జ్జ్వలలక్ష్మీ[98]వశగాంగ గాంగఝర[99]వైశద్యాస్పదాభంగని
ర్మలచిత్తోజ్ఝితసంగ సంగరజయప్రాప్తిప్రహృష్టార్జునా.

146


క.

అత్రిమునిపూర్వపర్వత, మిత్ర జగన్మిత్రబల[100]సమిత్త్రస్తగుహా
చ్ఛాత్రోష్మవీతిహోత్రధ, విత్ర యసత్తృణలవిత్ర వినయపవిత్రా.

147


[101]మాలిని.

ఉదరదహరసద్మాభ్యుద్గతోన్నిద్రపద్మా
పదయుగచిదమోఘాపాతిదివ్యామృతౌఘా
విదితశయనయోగావిష్కృతోద్బోధనాగా
హృదయ[102]నిటలసీమాహిండితాఘర్మదామా.

148


గద్య.

ఇది శ్రీదత్తాత్రేయయోగీంద్రచంద్రచరణారవిందనందనసమాసాదిత
సరసకవితారసోదాత్త దత్తనామాత్యసోదర్య మల్లనమంత్రివర్యప్రణీతం బైన
చంద్రభానుచరిత్రం బనుమహాప్రబంధంబునందుఁ జతుర్థాశ్వాసము.

  1. చ-ట-విన్నవించిరి
  2. ట-గూడకార్త
  3. చ-ఘనసార
  4. చ-నూఁచుచు నోర్తు
  5. ట-రీశాఖికాంచల
  6. ట-సుగంధ
  7. చ-ట-లలో నీపాదమే లేదు.
  8. చ-ట-నెమ్మి నెమ్మిఁ జూపె నీకు నాకు జాలి నిండ
  9. చ-దగదువళులు, ట-దరుగుజిరులు
  10. ట-లో నీరెండుపద్యములు లేవు.
  11. చ-తరగలు
  12. ట-హంసకవితానము
  13. ఇదియుఁ బైదియుఁ ట-లో లేవు.
  14. క-కనెపావడలు
  15. చ-సౌందర్యంబు
  16. చ-దీర్చి
  17. ట-లో నీపద్యము లేదు.
  18. చ-విహరణబల
  19. చ-ట-పిల్లిపసలు
  20. ట-పురము ల్పగనేయు
  21. చ-ట-యలరువాని
  22. ట-యును నింపులుగామిని
  23. క-మంచముపై మహోన్నతిన్.
  24. ట-వలిచప్పరంబులన్
  25. ట-బుజ్జగింపఁగరాని
  26. చ-తాపము సైఁపఁగ లేక యంత
  27. ట-నొయ్యనన్.
  28. ట-నొక్కనాఁడు
  29. చ-ట-చింత
  30. చ-పూవుల, ట-తావుల
  31. క-ట-నుసిమి
  32. క-జాలుకొనఁజాలెడు
  33. ట-జూడఁగాఁ జనినయప్పటి
  34. ట-లో నీపద్యమునకు మాఱుఁగా "అనిన" యని వచనము గలదు.
  35. చ-వ్రేలతూలదీవియ
  36. చ-తను గొనునంచు
  37. చ-ట-దొరఁగువన్నియు
  38. ట-రాగ మనుమాడ్కిన్
  39. ట-లో లేదు
  40. చ-పరిణతాసమపత్రపాతనగంబునఁ బుట్టినట్టి ప్రవాళపుంజ మనఁగ
  41. చ-విరహాగ్ని
  42. చ-కావిశాటి
  43. క-తమము దినవ్యపాయ
  44. ట-నడలు
  45. క-వరగోస్తనీ
  46. చ-ట-బాగున
  47. క-దిశావనిత
  48. చ-నలహంస
  49. చ-గర్వాపహరి
  50. చ-ట-ప్రతానముల్
  51. ట-రణానురూపముల్
  52. చ-ట-పూనీట
  53. చ-చలువ లూని
  54. ట-చినుకునీరు
  55. చ-నలరు
  56. ట-లో నీపద్యము లేదు.
  57. చ-గుఱుతు
  58. చలువ లలముకొన
  59. చ-బిల్లదిప్పాడుచు
  60. చ-నిశితములు నిలుపుండటంచు
  61. చ-జలమాను
  62. చ.రీతిని
  63. ట-యొడుపున
  64. చ-గోరకములకు నభిసారికానికరములకు
  65. చ-నింపుచు విజృంభించి
  66. చ-దొడివి
  67. చ-మట్టుపడని
  68. చ-నిధాన మట్టి
  69. చ-ఖంగున వారియగంటిలేక గ్రక్కన
  70. చ-బొదలె
  71. చ-ట-లలో లేదు.
  72. చ-మరుత్సఖా
  73. క-దంష్ట్రాశుగ
  74. చ-మాపు
  75. క-చెలులుశీర
  76. చ-వనిత
  77. చ-జనితఫల
  78. క-కీరశాదికరవములు
  79. ట-తగదే
  80. చ-పల్కులముద్దులమోము
  81. చ-ట-గలుగుకోమలి
  82. చ-ట-చింత సేసెదన్
  83. చ-ట-పురిఁ జేరినది
  84. క-కుముదినిరూపంబు గుఱుతువింటి
  85. చ-యడరు
  86. చ-నొరయుగాడ్పు
  87. చ-ట-చిత్తేశ
  88. చ-హృద్యోషాదృఢీభావముద్రాగాఢోద్యదనంగపాశమవొ, ట-హృద్వేషాదృఢీభాగముద్రాగాఢోద్యమనంగపాశమవొ
  89. చ-ట-వైఖరిన్
  90. చ-బాపుచక్రమవొ
  91. చ-ట-నలవడునే నీకుఁ దెలియ నంతర్వార్తల్
  92. ట-లో నీపద్యమునకు మాఱుగ "అనిన విని" యని వచనము గలదు.
  93. చ-రాఁజనదు
  94. ట-లో లేదు.
  95. ట-లో లేదు.
  96. చ-కానినింబలె
  97. చ-షట్కాబ్జ
  98. చ-శుభ
  99. చ-వైపద్యాస్పదా
  100. చ-సమిర్ధ్వస్తగురుచ్ఛాత్రోష్మ
  101. ఈపద్యము ట-లో లేదు.
  102. చ-నికటసీమా