చందమామ పిల్లల మాసపత్రిక/సంపుటము 1/జూలై 1947/జిత్తులమారి నక్క బావ

అనగా అనగా ఒక అడివిలో ఒక నక్క ఉండేది. అది చాలా జిత్తుల మారిది. అది ఎక్కడినించి వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో ఎవరికి తెలియదు. దానితరహా అంతా చిత్రంగా ఉండేది. అందుకని మిగతా నక్కలన్నీ "నువు మా కులముదానివేకాదు పొ" మ్మన్నవి. దానితో మాట్లాడటంకూడా మానివేసినై.

ఇక నక్క ఏమిచేస్తుంది? అక్కడ తన ఆటలు సాగకపోయేవరకు అడవికి దగ్గరగా ఉన్న ఊరు పోయి అక్కడ మంగలివానితో స్నేహం చేసుకున్నది. పాపం, ఆ మంగలి చాలా మంచివాడు. అతనికి ఈనక్క సంగతి తెలియదు. పైగా నక్క చాలా పెద్దమనిషిలాగా తియ్యతియ్యగా మాట్లాడేది. అది నిజమని మంగలి నమ్మాడు.

వాళ్లిద్దరికీ మంచిస్నేహము కలిసింది. ఒకనాడు నక్క మంగలితో అన్నది కదా - "మంగలి మామా, మంగలి మామా! మనం పళ్లతోట వేసుకుంటే ఎట్లా ఉంటుంది? మనం తిన్నన్ని తినవచ్చు, మిగాతావి అమ్ముకుని పొదినిండా డబ్బులు పోసుకోవచ్చు."

పాపం మంగలికి ఈ మాటలు వినేవరకు నోరు వూరింది. మామిడి మొక్కలు, సపోటా మొక్కలు, అరిటి మొక్కలూ తెచ్చి తోటవేశాడు. అక్కడక్కడా గుమ్మడిపాదులూ, దోసపాదులూ పెట్టాడు. తనూ పెళ్లామూ కలిసి పాదులుచేసి, నీళ్ళు తెచ్చి చెట్లకు పోసేవాళ్ళు. నక్క పైన కర్రపెత్తనం చేస్తూ కావలి కాస్తున్నాననేది.

కొన్నాళ్లకు తోట కాపుకు వచ్చింది. నక్క



రాత్రంతా మేలుకొని కడుపు ఉబ్బేదాకా, పళ్ళు కాయలు మెక్కేది. ఒక్కపండు కాయ కనపడనిచ్చేది కాదు.

ఒకనాడు మంగలి "నక్కబావా, నక్క బావా: తోటలో కాయలేమైనా ఉన్నాయా?" అని అడిగాడు. "ఇప్పుడెక్కడివి? వానాకాలం వస్తేగా దొరికేదీ?" అన్నది నక్క. పాపం, మంగలి నమ్మాడు. వానాకాలంవచ్చినాక అడిగాడు. "వానాకాలంలో ఎక్కడన్నా కాయలు ఉంటాయా? చలికాలం రావాలి:" అన్నది.చలికాలం వచ్చినాక అడిగితే, "పిచ్చివాడా: చలికాలంలో కాయలు దొరకుతాయా, పిందెలు ఉంటాయి, ఎండాకాలంలో అడుగు," అని ఇట్లా ఏదో ఒకసాకు చెప్పుతూ మంగలిని ఒక్క కాయ తిననివ్వలేదు. ఇంతలో ఎండాకాలం వచ్చింది. కాయలు కాచినై. నక్క ఒకనాటి రాత్రి అడివికిపోయి మిగతా నక్కలతో చుట్టరికం కలుపుకోవాలని వాటినన్నిటినీ విందుకు పిలిచింది. అవి వచ్చి, పొట్ట పట్టినన్ని తిని, మిగాతావి తుంచి, కొరికి, మట్టిలో పారవేసిపోయి చక్కా పండుకొన్నవి.

పాపం, మర్నాడు పొద్దున మంగలి వచ్చి తోట చూసుకుంటే కళ్ల వెంబడి నీళ్ళు వచ్చినై. చెట్లుని ఒక్క కాయ లేదు. ఒక్కమూలనుమాత్రం గుమ్మడి పాదుకు ఒక గుమ్మడికాయ ఉంది. అదీ ఆకులు కమ్మిఉండటం మూలాన కనపడటంలేదు. నక్కచేసిన మోసానికి దాన్ని దండించాలనుకున్నాడు మంగలి. ఇంటోకిపోయి పొదిలోనుంచి మంగలి కత్తులు తీసి బాగా సానపట్టి గుమ్మడికాయకి చుట్టూ కట్టాడు. ఆ కత్తులు కనపడకుండా ఆకులు అడ్డం పెట్టి, ఇంటికిపోయి హాయిగా నిద్రపోయాడు. మర్నాడురాత్రి తీరిగ్గా నక్క వచ్చింది. దానికి బాగా ఆకలి వేస్తున్నది. తోటలో కాయలన్నీ తోటినక్కలు అదివరకే పాడుచేసినై. తోట అంతా గాలించటం మొదలుపెట్టింది. ఆఖరికి ఆ గుమ్మడికాయ కనపడింది. అది అతి ఆశతో ఒక్కమాటుగా గుమ్మడికాయ మీద దూకింది. ఇంకేం, దానివొళ్లంతా తెగింది. నెత్తురు కారటం మొదలు పెట్టింది. వొల్లంతా మంటలు. ఏడ్చుకుంటూ, కాళ్ళీడ్చుకుంటూ పోయి ఒక రాతిమీద కూర్చున్నది. చాలాసేపటిదాకా నెత్తురు కారిపోతూనే ఉన్నది. ఇక ఇలాంటి తప్పుడుపని చెయ్యకూడదని మనస్సులోకున్నది. మంగలిని దొంగముండా కొడుకని తిట్టింది. ఎన్నితిట్టినా, ఎవరిని తిట్టినా దానినొప్పి తగ్గుతుందా? నెత్తురు కారకుండా ఉంటుందా ? నెత్తురు కారటం ఆగినతర్వాత బయలుదేరుదామనుకున్నది. కాని ఆ నెత్తురు ఎండి గడ్డకట్టి అందులో ఇరుక్కుపోయింది. అందులోంచి కదలాలేదు, మెదలాలేదు. నక్కకి మంగలిమీద భలేకోపం వచ్చింది. "నన్ను ఇందుట్లోనించి బయటికిరానియ్యి వీడిపని పట్టకపోతే!" అని శపధం చేసింది.

పాపం: ముందు ఇది బయటపడితే కదా మంగలిపని పట్టటానికి. అబ్బాయిలూ, మనంకూడా చూద్దాము, నక్క వాడిపని ఎట్లా పట్టుతుందో:

నగా అనగా ఒక ఊరు. ఆ ఊరిబైట వాములదొడ్లో ఒకపిల్లి ఉండేది. దానికో బుల్లి పిల్లికూన పుట్టింది. పాపం! పిల్లికూనని కన్నవెంటనే దాని తల్లి చచ్చిపోయింది. తల్లిలేని పిల్లికూనకి పిల్లిభాష తెలియనేలేదు.

పిల్లికూనకి ఆకలివేసింది. పాలు కావాలి. కాని, ఎలా అడగాలో తెలియ లేదు దానికి.

పాపం, ఆకలితో ఆవు రావురు మంటూ పిల్లికూన వీధిలో పడింది. ఏడుస్తూ నడుస్తోంది. దారిలో దానికొనొ కుక్కపిల్ల కనబడింది. పిల్లికూనని కుక్కపిల్ల అడిగిందిగదా:

       'పిల్లికూనా పిల్లికూనా

        గళ్ల గళ్ల పిల్లికూనా
        కళ్లనీళ్లు ఎందుకమ్మా?'
    ఏడుస్తూనే అంది పిల్లి కూన:
       "కుక్కపిల్లా! కుక్కపిల్లా!
        ఒక్కసంగతి చెప్పగలవా?
        ఆకలేస్తే పాలకోసం
        అమ్మనేమని అడుగుతావ్?'
    కుక్కపిల్ల అంది:
       'భౌభౌమని అరుస్తాను
        పసందైన కుక్కభాష
        పాలు నీకుకావాలా
        భౌభౌమని అరిచిచూడు.'


మాయాదేవి