చందమామ పిల్లల మాసపత్రిక/సంపుటము 1/జూలై 1947/తల్లి లేని పిల్లి కూన
అనగా అనగా ఒక ఊరు. ఆ ఊరిబైట వాములదొడ్లో ఒకపిల్లి ఉండేది. దానికో బుల్లి పిల్లికూన పుట్టింది. పాపం! పిల్లికూనని కన్నవెంటనే దాని తల్లి చచ్చిపోయింది. తల్లిలేని పిల్లికూనకి పిల్లిభాష తెలియనేలేదు.
పిల్లికూనకి ఆకలివేసింది. పాలు కావాలి. కాని, ఎలా అడగాలో తెలియ లేదు దానికి.
పాపం, ఆకలితో ఆవు రావురు మంటూ పిల్లికూన వీధిలో పడింది. ఏడుస్తూ నడుస్తోంది. దారిలో దానికొనొ కుక్కపిల్ల కనబడింది. పిల్లికూనని కుక్కపిల్ల అడిగిందిగదా:
'పిల్లికూనా పిల్లికూనా
గళ్ల గళ్ల పిల్లికూనా
కళ్లనీళ్లు ఎందుకమ్మా?'
ఏడుస్తూనే అంది పిల్లి కూన:
"కుక్కపిల్లా! కుక్కపిల్లా!
ఒక్కసంగతి చెప్పగలవా?
ఆకలేస్తే పాలకోసం
అమ్మనేమని అడుగుతావ్?'
కుక్కపిల్ల అంది:
'భౌభౌమని అరుస్తాను
పసందైన కుక్కభాష
పాలు నీకుకావాలా
భౌభౌమని అరిచిచూడు.'
మాయాదేవి
పిల్లికూన అంది:
'భౌభౌమని అరవలేను
బాగులేదు కుక్కభాష
మాతృభాషతప్ప నాకు
మరోభాష వద్దు వద్దు.'
అని పిల్లికూన అక్కణ్ణుంచి వెళ్లిపోయింది. దారిలో కోడెదూడ కనబడింది. అడిగితే, అంభా అని అరవమంది. పిల్లి కూనకి ఆ భాషా నచ్చలేదు. కాకిపిల్ల కనబడింది. కాకా అని అరవమంది. కప్పపిల్ల కనబడింది. బెకబెకమని పిలవమంది. మేకపిల్ల కనబడింది. మేమే అని అడగమంది.
పిల్లికూన ఏడుస్తూ వెళ్లిపోయింది. ఈ భాషలేవీ నాకు వద్దనుకుంది.
ఆఖరికి ఒక పెద్దపిల్లి కనబడింది. ఏడుస్తున్న పిల్లికూనని బుజ్జగించి,
'పిల్లికూనా, పిల్లికూనా
ఎందుకమ్మా ఏడుస్తావ్?'
అనిఅడిగింది.
' ఆకలేస్తే పాలకోసం
అమ్మ నేమని అడుగుతావ్ '
అని అడిగింది పిల్లికూన.
" మ్యావ్ మ్యావ్ మ్యావ్ మ్యావ్ " అని బోధించింది పెద్దపిల్లి.
పిల్లికూనకి తల్లిభాష దొరికింది. మ్యావు మ్యావు మని పాడుకుంటూ ఒక ఇంట్లోకి వెళ్లింది. ఆ యింట్లో శారద అనే అమ్మాయి ఉంది. " మ్యావు మ్యావు " అంది, తల్లిలేని పిల్లికూన. శారద దానిభాష తెలుసుకుంది.
" ఓహో! ఆకలేస్తోందా పిల్లికూనా, పాలు తెస్తాను తాగు " అని శారద ఒక పళ్లెంనిండా పాలుపోసి తెచ్చింది. పిల్లికూన సంతోషంతో పాలన్నీ తాగింది. తరవాత పిల్లికూనా, శారదా చాలాసేపు ఆడుకున్నారు. ఆఖరికి అలసిపోయి శారద నిద్రపోయింది. పిల్లికూన కూడా ఒకమూల హాయిగా నిద్రపోయింది.
ఇక కథ కంచికీ, మనం ఇంటికీ.