చందమామ పిల్లల మాసపత్రిక/సంపుటము 1/జూలై 1947/ఉడత పాటలు
సీత
ఏరోప్లేన్ తెచ్చావా, ఉడతా, ఉడతా, నే
యూరోపు వెళ్లాలి ఉడతా, ఉడతా!
ఉడత
హోరుగాలి కొట్టొచ్చు,
కారుమబ్బు పట్టొచ్చు,
ఏరోప్లేను తేలేను సీతా, సీతా, నే
యూరోపు రాలేను సీతా, సీతా!
సీత
స్టీమరేనా తెచ్చావా, ఉడతా, ఉడతా, నే
సీమకెళ్లి రావాలి, ఉడతా, ఉడతా!
ఉడత
ఏ తుపాను వస్తుందో!
ఏ కెరటం లేస్తుందో!
స్టీమరేనా తేలేను సీతా, సీతా! నే
సీమకేనా రాలేను సీతా, సీతా!
సీత
రైలుబండి తెచ్చావా ఉడతా, ఉడతా, నే
రామేశ్వరం వెళ్ళాలి ఉడతా, ఊదతా !
ఉడత
అడుగడుక్కి వంతెనలు,
నడుమ నడుమ సొరంగాలు,
రైలుబండి తేలేను సీతా, సీతా, నే
రామేశ్వరం రాలేను సీతా, సీతా !
సీత
కారుగాని తెన్చావా ఉడతా, ఉడతా, నే
కాకినాడ వెళ్లాలి ఉడతా, ఉడతా !
ఉడత
పెద్ద బస్సు లెదురొస్తయ్,
ఎద్దుబళ్లు అడ్డొస్తయ్,
కారేన తేలేను సీతా, సీతా, నే
కాకినాడ రాలేను సీతా, సీతా !
సీత
సైకిలేన తెచ్చావా ఉడతా, ఉడతా, నే
సరదాగా వెళ్లాలి ఉడతా, ఉడతా !
ఉడుత
మలుపు గిలుపు తిరగాలి,
మనిషొస్తే ఒరగాలి,
సైకిలేన తేలేను సీతా, సీతా, నే
సరదాగా రాలేను, సీతా, సీతా !