గోపీనాథ రామాయణము/బాలకాండము

శ్రీః

బాలకాండము

కథాప్రారంభము

నారదమహర్షి వాల్మీకికడ కేతెంచుట

వ.

శ్రీకృష్ణదేవునకు సమర్పితంబుగా నాయొనర్పం బూనిన శ్రీ మద్రామాయణం
బునకుఁ గథాప్రారంభం బెట్టి దనిన శతకోటిప్రవిస్తరంబై బ్రహ్మలోకంబునందు
సుప్రసిద్ధం బైనరామచరితంబు భూలోకవర్తులయిన నాలుగువర్ణంబులవారికిఁ
దాపత్రయవిమోచనంబుకొఱకు సంక్షేపించి రచియింప నుద్యుక్తుండై పరమ
కారుణికుం డైనపరమేష్ఠి వాల్మీకిరూపంబున విశ్వంభరయం దవతరించె నట్టి
బ్రహ్మాంశసంభూతుం డైన వాల్మీకి తనచేతఁ జికీర్షితం బైన రామచరితంబు గురు
ముఖంబువలన వినం గోరి భగవత్కథోపదేశంబునందు సర్వగురుండైన నార
దుం బ్రతీక్షించుచుండ నొక్కనాఁడు భగవంతుండైన యన్నారదుండు బ్రహ్మ
నియోగంబున వాల్మీకికడకుం జనుదెంచిన నత్తపస్వివర్యుండు తపస్స్వాధ్యాయ
నిరతుండును వాగ్విశారదుండును దేవమునిశ్రేష్ఠుండు నైననారదు నవలోకించి
పూజించి మునీంద్రా యిప్పు డీలోకంబున దృష్టగుణవ్యతిరిక్తప్రశస్తగుణ
వంతుండును దా నక్షతుం డగుచుఁ బరులజయించు వీర్యవంతుండును సామా
న్యవిశేషరూపధర్మజ్ఞుండును దనకొఱకుఁ గావింపం బడిన యువకారం బల్పం
బైనను బహుత్వంబున నెఱుంగునట్టి కృతజ్ఞుండును సర్వావస్థలయందును సత్య
వచనశీలుండును ఫలపర్యంతంబు సమారబ్ధంబైన వ్రతంబు విడువనట్టి స్వ
భావంబు గల దృఢవ్రతుండును వంశక్రమాగతాచారయుక్తుండును నపరా
ధంబు గావించినవారియందైనను హితంబుఁ జేయునట్టి శీలంబు గలవాఁడును
విదితసకలవేద్యపదార్థుండును నన్యులకు నిర్వహింపంగూడనికార్యంబు నిర్వ
హించుటకు సమర్థుండును నద్వితీయప్రియదర్శనుండును నసమానసర్వాంగ
సుందరుండును నాత్మవంతుండును విధేయకోపుండును జితారిషడ్వర్గుండును
ద్యుతిమంతుండును నసూయారహితుండును నగుపురుషుం డెవ్వఁడు సంయుగం
బునందు జాతరోషుం డగునప్పు డెవ్వానికి సురాసురాదులు దలంకుదు రట్టి
వాని వినం గుతూహలం బగుచున్న దట్టి పురుషశ్రేష్ఠు నెఱుంగ నీవె సమర్థుం
డవు కృపామతి నెఱింగింపు మని యభ్యర్థించినఁ ద్రిలోకగోచరజ్ఞానుం డయిన
నారదుం డవ్వాల్మీకిప్రశ్నజాతంబు విని యమ్మునిశ్రేష్ఠు నేకాగ్రసిద్ధికొఱకు నభి

ముఖుం గావించి యీప్రశ్న సకలగుణవిశిష్టసార్వభౌమవిషయకంబై యున్న
దైనను సార్వభౌమమాత్రంబునందు నీయడుగంబడిన ప్రశస్తగుణసంపత్తి
యంతయు సంభవింపనేరదు సకలజగద్రక్షణార్థంబు మనుష్యరూపంబున నవ
తీర్ణుం డైన పరమపురుషునందు సులభం బగు దైవయోగంబున దద్గుణకీర్త
నంబు లబ్ధంబయ్యె నని ప్రహృష్టుండై ప్రాచేతను నవలోకించి నీచేత గీర్తితంబు
లైన యీవీర్యాదిగుణంబు లన్నియు దుర్లభంబు లేతాదృశప్రశస్తసమస్త
గుణవిశిష్టుండైన మహాపురుషు నిశ్చయించి చెప్పెద నట్టిపురుషు నాకర్ణింపు
మని యిట్లనియె.

75

నారదుఁడు వాల్మీకికి శ్రీరామకథ నెఱింగించుట

మ.

మతిమంతుండును నీతిమంతుఁడును శ్రీమంతుండు సర్వజ్ఞుఁడున్
ధృతిమంతుండును వాగ్మియున్ వశియు విద్విడ్వర్గసంహర్తయుం
ద్యుతిమంతుండు గుణోన్నతుండు నియతాత్ముండు న్మహావీర్యుఁడున్
హితుఁడు న్రాముఁ డనంగఁ జెన్నలరు న య్యిక్ష్వాకువంశంబునన్.

76


సీ.

వెడఁదకన్నులవాఁడు విపులాంసములవాఁడు రాకేందుబింబవక్త్రంబువాఁడు
కంబుకంఠమువాఁడు ఘనలలాటమువాఁడు రమణీయమృదుకపోలములవాఁడు
పీనవక్షమువాఁడు పృథునితంబమువాఁడు సముదగ్రచారుమస్తకమువాఁడు
దివ్యదేహమువాఁడు దీర్ఘబాహులవాఁడు కమనీయశుభలక్షణములవాఁడు


తే.

ప్రబలచాపంబు మూఁపునఁ బరఁగువాఁడు, శ్యామవర్ణంబువాఁడు ప్రశస్తగూఢ
జత్రుదేశంబు గలవాఁడు సమవిభక్త, సముచితమనోజ్ఞసుందరాంగములవాఁడు.

77


వ.

మఱియు వృత్తపీవరబాహుండును గామాదివికారరహితుండును గజసింహ
గతిసదృశగమనుండును షణ్ణవత్యంగుళవిగ్రహుండును నిర్ణిక్తేంద్రనీలవర్ణుం
డును శ్రవణమాత్రంబున శత్రుహృదయవిదారకత్వంబుచేతఁ బ్రశస్తపౌరు
షుండును సర్వోత్తరావయవసౌభాగ్యయుక్తుండును సాముద్రికశాస్త్రోక్తమంగ
ళాయతనసర్వలక్షణలక్షితుండును శరణాగతరక్షణరూపధర్మజ్ఞుండును సత్యప్ర
తిజ్ఞుండును బ్రజాహితకరణతత్పరుండును నాశ్రితరక్షణముఖ్యయశుండును సర్వ
విషయజ్ఞానశీలుండును బాహ్యాభ్యంతరశుద్ధియుక్తుండును నాశ్రితపరతంత్రుం
డును బిత్రాచార్యవినీతుండును నాశ్రితరక్షణచింతాభిరతుండును జగద్రక్ష
ణార్థంబు ప్రజాపతితుల్యత్వంబును నవతీర్ణుండును నఖండితైశ్వర్యసంపన్నుం
డును సకలలోకసముద్ధరణపరిపోషణశక్తియుక్తుండును నాశ్రితజనవిరోధినిషూ
దనుండును బ్రజల కరిష్టనిరసనపూర్వకంబుగా నభీష్టప్రాపణకర్తయు వర్ణా
శ్రమధర్మపరిపాలకుండును శరణాగతపరిపాలనరూపస్వధర్మరక్షకుండును యజ
నాధ్యయనదానాది స్వధర్మపరిపాలకుండును నాశ్రితబాంధవాది జీవలోకంబు

లకు రక్షితయు ఋగ్యజుషాదిచతుర్వేదపదార్థవిదుండును శిక్షాదిషడంగపారగుం
డును ధనుర్వేదనిష్ఠితుండును సాంఖ్యయోగతర్కవైశేషికపూర్వోత్తరమీ
మాంసావ్యాకరణధర్మశాస్త్రాదిశాస్త్రార్థతత్త్వజ్ఞుండును విజ్ఞాతార్థవిషయంబు
నందు సదావిస్మరణలేశరహితుండును బ్రతిభానవంతుండును సర్వలోకప్రియుం
డును నపకారులయందైన నుపకారశీలుండును వ్యసనపరంపరలయందైన నక్షు
భితాంతఃకరణుండును నతిగంభీరప్రకృతియుక్తుండును దత్తత్కాలకర్తవ్యచతు
రుండును నై ప్రకాశించు నదియునుం గాక.

78


క.

సింధువులతోడఁ గూడిన, సింధువుచందాన గుణవిశిష్టుఁడు కరుణా
సింధువు రాముఁడు ప్రజ్ఞా, సింధువులగు బుధులఁ గూడి చెలఁగు ననిశమున్.

79


తే.

అనుదినంబు సర్వావస్థలందు సారె, సారె కవలోకితుం డయ్యు జనులచేతఁ
బరఁగ మున్నెప్పుడును జూడఁబడనివాని, యట్ల విస్మయదర్శనుం డైనవాఁడు.

80


క.

అలఘుచరిత్రుఁడు పూజ్యుఁడు, సలలితచిత్తుండు మిత్రశత్రూదాసీ
నులయం దవిషముభావము, గలవాఁ డానందకరుఁడు కౌసల్య కొగిన్.

81


సీ.

గాంభీర్యమందు సాగరముఁ బోలినవాఁడు ధైర్యంబుచే మహీధరనిభుండు
వీర్యసంపదచేత విష్ణుతుల్యుఁడు శశధరునికైవడిఁ బ్రియదర్శనుండు
కరము క్రోధమునందుఁ గాలాగ్ని కెనయగు, క్షమచేతఁ బృథివికి సాటివచ్చుఁ
ద్యాగంబునందు ధనాదిపసదృశుండు నపరధర్ముండు సత్యంబునందు


తే.

భూరివిజ్ఞానరమకుఁ దాఁ బుట్టినిల్లు, దానదాక్షిణ్యదయలకుఁ దావకంబు
నీతిసత్యధర్మములకు నిలయ మతఁడు, లలితసద్గుణసందోహములకుఁ బేటి.

82


వ.

అని యిట్లు నారదుండు సాక్షాద్భగవదవతారంబైన రామభద్రునందలి సకలా
నంతకల్యాణగుణంబు లన్నియు వక్కాణించి యిక్ష్వాకువంశప్రభవుం డను
శబ్దంబున రామావతారకథనంబును శత్రునిబర్హణుఁ డనుశబ్దంబునఁ దాటకాది
వధంబును మహావీర్యుం డనుశబ్దంబున సర్వాస్త్రశస్త్రగ్రహణంబును లక్ష్మీవం
తుం డనుశబ్దంబున సీతాపరిణయంబును సత్యపరాక్రముం డనుశబ్దంబునఁ బర
శురామభంగంబును మొదలుగాఁగల బాలకాండకథ యంతయు సంక్షేపంబు
గా సూచింపంజేసి యయోధ్యాకాండ కథాక్రమణిక నెఱింగించువాఁడై వెం
డియు వాల్మీకి నవలోకించి యిట్లనియె నిట్టిసమస్తసద్గుణగరిష్ఠుండును బురుష
శ్రేష్ఠుండును రాజ్యాభిషేకసముచితవిశిష్టగుణవరిష్ఠుండును నమోఘపరాక్ర
మవంతులలోన నతిశ్రేష్ఠండును బ్రకృతిజనేష్టుండును గుమారజ్యేష్ఠుండు నైన
కల్యాణగుణాభిరాము రామునిం జూచి తండ్రియగు దశరథుండు పరమానంద
భరితాంతఃకరణుండై సకలజనంబులకు హితంబు సంపాదింపఁ దలంచి యౌవ
రాజ్యంబున కభిషిక్తునిం జేయ సమకట్టినఁ దదభిషేకార్థసంభృతదధ్యాదిమంగళ
ద్రవ్యవిశేషంబుల విలోకించి దశరథునికొండొకభార్య కైకయనునది మంథరా

వాక్యచోదితయై తొల్లి దేవాసురయుద్ధంబునందు వల్లభునిచేత దత్తవరయైనది
గావున నాసమయంబునఁ గట్టఁడితనంబున దిట్ట యై రామునకు వివాసనంబును
నిజపుత్రుండైన భరతునకు రాజ్యాభిషేకంబునుం గోరిన నమ్మహీరమణుండు సత్య
వాది గావున ధర్మమయపాశనిబద్ధుండై విడివడ సమర్థుండు గాక ప్రియపుత్రుండైన
ను రాముని వనంబునకుం బనిచిన నవ్వీరోత్తముండు కైకేయీప్రీతినిమిత్తంబు
పితృవచననియోగంబువలనఁ దద్వచనపరిపాలనవిషయస్వకృతప్రతిజ్ఞను బరిపా
లించుచు వనంబునకుం జనిన నమ్మహాత్మునితమ్ముండు సుమిత్రానందవర్ధనుం
డగులక్ష్మణుండు సహజప్రీతిమంతుండును నిష్టుండును గావున వినయసంపన్నుం
డై సౌభ్రాత్రంబుఁ జూపుచు స్నేహంబువలన ననురూపం బగు వ్రతం బంగీ
కరించి యన్నవెంట నరణ్యంబునకుం జనియె.

83


ఉ.

ఆరఘునాథుభార్య జనకాలయజాత సమస్తలక్షణ
శ్రీరమణీయరూప హితశీల సతీతిలకంబు నిందిరా
కారయు సాధ్వి ప్రాణములకంటే గరీయసి యైన సీత సొం
పారఁ బతిన్ భజించి చనె నప్పుడు రోహిణి చంద్రునిం బలెన్.

84


క.

పౌరులచే జనకునిచే, దూరం బారాముఁ డనుగతుం డగుచు రయం
బారఁగ ననుజుఁడు సీతయు, వారక తనతోడ రాఁగ వనమున కరిగెన్.

85


తే.

ఈతెఱంగునఁ జని జాహ్నవీతటమున, శృంగిబేరాఖ్యపట్టణ మేలువానిఁ
బరమసఖుని నిషాదాధిపతిని గుహునిఁ, జేరి సూతునిఁ గ్రమ్మఱ నూరి కనిచి.

86


ఆ.

అట నిషాదనాథుఁడైన యాగుహునితో, నలఘుయశుఁడు చాలఁ జెలిమిఁ జేసి
వానియనుమతమున జానకీలక్ష్మణ, కలితుఁ డగుచు వేగ గంగ దాఁటి.

87


క.

భూవల్లభుండు రాముఁడు, తేవనమున వనము సొచ్చి ధీరత్వమునం
ద్రోవ నవవారిపూరిత, పావననదు లుత్తరించి పరమప్రీతిన్.

88


తే.

చతురుఁ డగుభరద్వాజునిశాసనమునఁ, జిత్రకూటాద్రిఁ జేరి తచ్చిఖరిమీఁద
వేడ్కతోఁ బర్ణశాలఁ గావించి యందు, నిండుసుఖగోష్ఠి వసియించి యుండె నంత.

89


వ.

దేవగంధర్వసంకాశు లైన సీతారామలక్ష్మణులు మువ్వురు చిత్రకూటోపాంత
వనంబునందు రమమాణులై సుఖంబుగా నివసించి యుండి రిట సాకేత
పురంబున.

90


క.

ఆరఘువర్యుఁడు శైలముఁ, జేరుట విని పుత్రశోకచింతార్దితుఁడై
దారుణగతి విలపించుచు, భూరమణుఁడు మేను విడిచి పోయెన్ దివికిన్.

91


వ.

దశరథమరణానంతరంబున మహాబలుండగు భరతుండు వసిష్ఠప్రముఖ మహర్షుల
చేత రాజ్యంబునందు నియుజ్యమానుండయ్యును దానినంగీకరింపక చతురంగ

బలంబులతోఁ గూడి రామపాదప్రసాదకుండై వనంబునకుం జని యార్యభావ
పురస్కృతుండై మహాత్ముండును సత్యపరాక్రముండును నభిరామదర్శనుండును
నగురామునిం జేరి మహాత్మా నీవు సర్వగుణశ్రేష్ఠుండైనను కనిష్ఠునకు రాజ్యా
ర్హత్వంబు లేమి యెఱింగి ధర్మజ్ఞుండవు గావున నీవె రాజ వని పలికిన సర్వస్వరూ
పగుణంబులచేత నాశ్రితచిత్తరంజకస్వభావుండయ్యును వనీపకాభీష్టప్రదానత
త్పరుండయ్యును యాచకజనలాభంబుచేతఁ బ్రసన్నవదనుండును మహాయశుం
డయ్యును నేకసాయకవిమోచనమాత్రంబున సమస్తదానవహననసమర్థుం
డయ్యును రాముండు పితృవచనగౌరవంబున రాజ్యం బంగీకరింపక రాజ్యంబు సే
యుట కహల్యాదృష్టవైభవపాదసంస్పృష్టంబు లైనపాదుకలు న్యాసరూపంబున
భరతున కొసంగి బహువిధసాంత్వవచనంబుల సారెసారెకు నతనిఁ గ్రమ్మఱించిన
నాభరతుం డభిషేకార్థంబు రామప్రత్యానయనలక్షణమనోరథంబు నొందక
నందిగ్రామంబునం దనుదినంబును రామపాదుకలకు నమస్కరించుచు రామా
గమనకాంక్షుండై రాజ్యంబుఁ బాలించుచుండె నంత సర్వాతిశయకాంతిమం
తుండును సత్యప్రతిజ్ఞుండును రాజ్యభోగలౌల్యరహితుండు నగురాముండు భర
తుండాదిగాఁ గల పురజను లందఱు వెండియుఁ జిత్రకూటంబునకుం జనుదెంతు
రని తలంచి పితృవచనపరిపాలనంబునం దేకాగ్రచిత్తుండై దండకారణ్యంబుఁ
బ్రవేశించె నని యి ట్లయోధ్యాకాండకథ యంతయు సంక్షేపంబుగా నెఱిం
గించి యద్దేవమునిశ్రేష్ఠుం డారణ్యకాండకథాక్రమం బెఱింగించువాఁడై
వెండియు నిట్లనియె నట్లు రాజీవలోచనుండగు రాముండు మహారణ్యంబగు దండ
కారణ్యంబుఁ బ్రవేశించి యపూర్వసంస్థానవనవిలోకనజనితకుతూహలంబు
చేతను మహావనప్రవేశసంభావితరాక్షసరణారంభోర్జితహర్షంబుచేతను విక
సితలోచవారవిందుండై.

92


తే.

మునివిరోధి విరాధుని మొనసి చంపి, మాననీయాంగు శరభంగుమౌనిఁ జూచి
ఘను సుతీక్ష్ణమహాముని గని యగస్త్యు, ననుజుఁ జూచి యగస్త్యునిఁ గని ముదమున.

93


తే.

ఆయగస్త్యమహామునియనుమతమున, నైంద్ర మగుకార్ముకంబు మహాసిపత్రి
దారుణాక్షయబాణతూణీరములును, రిపువినిగ్రహార్థంబు పరిగ్రహించె.

94


వ.

ఇట్లు జగదేకవీరుం డగురాముండు స్వవీర్యసదృశవరాయుధలాభంబు నొంది
పరమప్రీతుండై శరభంగవనంబున నివసించియుండ నప్పు డచ్చటి మహర్షులు
చిత్రకూటపంపావన నివాసులయిన వానప్రస్థులం గూడి యసురరాక్షసవధా
కాంక్షులై రాముని సమీపంబునకుం జనుదెంచి రాక్షసబాధ నెఱింగించిన

నారఘుపుంగవుండు రాక్షసావాసభూతంబైన వనంబునందు నమ్మహామునుల
ప్రార్థనావచనం బంగీకరించి.

95


ఆ.

దహనకల్పు లైనదండకారణ్యని, వాసిమునులమ్రోల వరుసతోడ
సంగరమున నింక సకలరాక్షసుల వ, ధించువాఁడ నని ప్రతిజ్ఞఁ జేసి.

96


క.

అనఘుఁడు రాఘవుఁ డక్కా, ననమున నివసించి తగ జనస్థాననివా
సిని యగుశూర్పణఖను గ్ర, క్కునఁ బట్టి విరూపఁ జేసె ఘోరాసిహతిన్.

97


వ.

ఇట్లు కామరూపిణియైన శూర్పణఖను గర్ణనాసికాచ్ఛేదంబున విరూపిణిం జేసి.

98


క.

శూర్పణఖాప్రేరితుఁ డై, దర్పంబున సమరమునకుఁ దఱిసినఖరుని
న్నేర్పున వధించె రాముఁడు, సర్పాభీలోగ్రతీవ్రశాతశరములన్.

99


వ.

ఇట్లు రాక్షససేనాధ్యక్షుం డైన ఖరునిం బరిమార్చి తదనుచరు లైనదూషణ
త్రిశిరుల వధించి పదంపడి చతుర్దశనహస్రసంఖ్యాకప్రధానరాక్షసుల నాజిరం
గంబున నంతంబు నొందించి తదనుచరు లైనయామినీచరుల నందఱ నిశ్శేషం
బుగా రూపుమాపె నంత నకంపనశూర్పణఖలవలస జ్ఞాతివధం బంతయు విని
రావణుండు క్రోధమూర్ఛితుం డై సీతాహరణకార్యంబునందు మారీచుండను
రాక్షసుని సహాయునిఁగా వరించి బలవంతుం డైన యారామునితోడి విరోధంబు
యుక్తంబుగా దుడుగు మని బహుప్రకారంబుల నమ్మారీచునిచేత నివార్య
మాణుం డయ్యును వానివచనం బనాదరణంబు చేసి కాలచోదితుం డై మారీ
చసహితంబుగా రాముని యాశ్రమస్థానంబునకుం జనుదెంచి.

100


శా.

మారీచుం డొకమాయఁ బన్ని యల రామక్ష్మావరున్ లక్ష్మణున్
దూరంబు న్గొనిపోయినప్పు డదయన్ దోషాచరాధీశ్వరుం
డారామామణి సీత నెత్తికొని ఘోరాకారుఁ బక్షీంద్రు దో
స్సారోదారు జటాయువుం దునిమి భాస్వల్లీల నేగె న్వడిన్.

101


తే.

అంత రాముండు దైత్యశితాసిలూన, పత్రపాదుఁ డై పడియున్న పక్షినాథుఁ
గని మహీపుత్రి హృత యౌట విని దురంత, గాఢతరదుఃఖభరమున గాసిపడుచు.

102


క.

చలితేంద్రియుఁ డై మిక్కిలి, పలవించుచు రామవిభుఁడు పక్షీంద్రునకు
న్విలసితశాశ్వతసౌఖ్యము, గలుగఁగ సంస్కారవిధులఁ గావించి వెసన్.

103


క.

వనమున జానకి వెదకుచుఁ, జనిచని యొకచోటఁ గాంచె సత్త్వోద్రేకం
బున జగము మ్రింగఁ జాలెడు, ఘనరూపుని ఘోరవికృతకాయుఁ గబంధున్.

104


వ.

కనుంగొని వానిభుజంబులు రెండును నిశాతఖడ్గంబుల ఖండించి పంచత్వంబు
నొందించి తత్కళేబరంబు దహించిన వాఁడు స్వర్గగమనయోగ్యం బగుస్వకీ
యం బైనగంధర్వరూపంబు నొంది రామునిం జూచి మహాత్మా నీవు శ్రవణకీర్త
నాదిభగవధ్ధర్మాచరణశీలయు సామాన్యవిశేషధర్మనిపుణయుఁ జతుర్థాశ్రమ
ప్రాప్తజితేంద్రియత్వపూర్వకమోక్షోపయుక్తాచారనిష్ఠయు నైనశబరిఁ గానం

జను మని పలికీ దివంబునకుం జనిన నారఘువల్లభుండు తద్వచనప్రకారంబున
శబరిం గానం జని దానిచేత నర్ఘ్యాదిఫలసమర్పణాంతోపచారంబున నర్చితుం
డయ్యె నని యిట్లు సత్యప్రతిజ్ఞత్వప్రధానం బైనయారణ్యకాండచరిత్ర సం
క్షేపంబుగా సూచించి మిత్రకార్యనిర్వాహకత్వపరం బైన కిష్కింధాకాండ
కథావృత్తాంతం బెఱింగించువాఁడై వెండియు వల్మీకజన్ము నవలోకించి యిట్ల
నియె మునీంద్రా యిట్లు రాముండు శబరిచేతం బూజితుం డై పంపాసరోవర
తీరవరంబునందు హనుమత్సమాగమంబుఁ జేసి హనూమద్వచనంబున సుగ్రీ
వునితోడ సాచివ్యంబుఁ జెసి మహాబలుండగు రాముండు జన్మప్రభృతిస్వవృత్తాం
తంబును రావణహృతత్వాదిసీతావృత్తాంతంబును సర్వంబును సుగ్రీవునకుం
జెప్పిన నాసుగ్రీవుండు రామసంబంధి యైనతత్సర్వంబును విని సమానదుఃఖ
మహాబలసంబంధంబు గలుగుటకు సుప్రీతుం డయి రామునితోడ వహ్నిసాక్షి
కంబుగా సఖ్యంబుఁ జేసి సుహృత్సన్నిధియందు స్మృతదుఃఖుం డై తనకును
వాలికిం గలవైరం బంతయు సాకల్యంబుగాఁ బ్రణయంబువలన నెఱింగించిన
నారఘుసత్తముండు వైరవృత్తాంతంబు విని వాలిం బరిమార్చెద నని ప్రతిజ్ఞఁ
జేసిన సుగ్రీవుండు రామున కుత్సాహవర్ధనార్థంబు వాలిపౌరుషం బంతయు
నెఱింగించి రామునకు వాలిహననసామర్థ్యంబు గలదో లేదో యని శంకించి
బలపరిజ్ఞానార్థంబు తొల్లి వాలిచేత నిహతుం డైనదుందుభి యను రాక్షసుని
కళేబరంబు మహాపర్వతసంకాశం బైనదాని రామునకుం జూపి యీ రాక్షసకళేబ
రంబు వాలిచేత నింతదూరంబు విక్షిప్తం బైనదని పలికిన విని నఖాగ్రంబున
లోకవిరోధిసకలదానవదైత్యాదిహననశక్తియుక్తుండును నపరిచ్ఛేద్యబలుండు
నగు రాముం డుదారబలోత్సాహవికసితాననుం డై యస్థినిచయరూపం బైన
రాక్షసశరీరంబుఁ జూచి దాని దశయోజనపరిమితమాత్రంబు దవ్వులం
బడఁ బాదాంగుష్ఠంబునం జిమ్మి తచ్ఛరీరంబు తొల్లి యార్ద్రం బిప్పుడు
శుష్కం బై యున్న దనియెడు సుగ్రీవునియభిప్రాయంబు విమర్శించి వెండియు
విశ్వాసంబుం బుట్టించుచు సప్తసాలవృక్షంబులును దత్సమీపశైలంబును
రసాతలంబు నొక్కసాయకంబున భేదించిన నవ్విధం బాలోకించి సుగ్రీ
వుండు సర్వప్రకారంబులు రాముండు దర్శనమాత్రంబున వాలిని వధింపం
గలఁ డని విశ్వాసంబు నొంది కపిరాజ్యంబు శీఘ్రంబునఁ గరగతం బగు నని
హర్షించి.

105


క.

భూవరుననుమతమున సు, గ్రీవుఁడు కిష్కింధ కేగి కీశాధీశున్
దేవేంద్రసుతుని వాలిని, గావరమున ననికిఁ బిలిచె ఘననాదమునన్.

106


క.

పిలిచిన వాలి రయంబున, వలవ దుడుగు మనుచుఁ దార వారించినఁ దా
నిలువక వచ్చి భుజాబల, మలర రవిజు దాఁకె నాతఁ డాతనిఁ దాఁకెన్.

107

క.

ఇత్తెఱఁగునఁ దలపడి కపి, సత్తము లుగ్రగతిఁ బోరు సమయంబున రా
జోత్తముఁ డొకబాణమున వి, యత్తల మద్రువంగ వాలి ననిఁ బడ నేసెన్.

108


మ.

అటు వాలిం బరిమార్చి రాముఁడు తదీయంబైననామ్రాజ్య మం
తట సుగ్రీవున కిచ్చినం గొని సముద్యత్ప్రీతితో నాతఁ డం
తట నల్దిక్కుల కమ్మెయిం బనిచి సీతం జూచి రం డంచు ను
త్కటవేగోద్ధతులన్ వలీముఖుల నందం బొప్పఁ బంచెన్ వడిన్.

109


వ.

అని యిట్లు కిష్కింధాకాండకథాసంగ్రహం బెఱింగించి వెండియు నిట్లనియె
నంత బలవంతుం డగు హనుమంతుండు దక్షిణదిక్కునకుం జని సంపాతీవచ
నంబున శతయోజనవిస్తీర్ణం బైన సముద్రంబు దాఁటి లంకాపురంబు సొచ్చి
యం దశోకవనికాఖ్యం బైన రావణుప్రమదావనంబున.

110


తే.

ఒనర రామునిఁ జింతించుచున్నదాని, సీతఁ గనుఁగొని ప్రమదంబు సెలఁగ విభుని
కుశల మెఱిఁగించి ముద్రిక గుఱు తొసంగి, మానితంబైనతచ్ఛిరోమణి గ్రహించి.

111


ఆ.

వనము నీఱు సేసి వనపాలకులఁ ద్రుంచి, సప్తమంత్రిసుతుల సంహరించి
పంచసైన్యపతులఁ బంచత్వ మందించి, యసమసమరదక్షు నక్షుఁ దునిమి.

112


ఆ.

శక్రజిత్ప్రయుక్తచటులలోకేశాస్త్ర, పాశమున రణోర్విబద్ధుఁ డయ్యు
విధివరంబుకలిమి వేగ విముక్తుఁ డై, దేవరిపుల యవమతికి సహించి.

113


ఆ.

పరఁగఁ దనకుఁ దానె బద్ధుఁడై రాక్షన, వరునిపాలి కేగి వానితోడ
నవనివిభునిమహిమ లన్నియుఁ బ్రకటించి, చుట్ల నున్న రాక్షసుల వధించి.

114


చ.

ఘనవాలాగ్నిశిఖాపరంపరల లంకాపట్టణం బంతయుం
దను శక్రాదులు మెచ్చ నొక్కత్రుటిలో దగ్ధంబు గావించి గ్ర
ద్దన భూపుత్రికిఁ జెప్పి రామునకు సీతాక్షేమముం దెల్పఁగా
వనధిం గ్రమ్మఱ దాఁటి వచ్చె విజయవ్యాపారధౌరేయుఁ డై.

115


వ.

ఇట్లు చనుదెంచి మహాత్ముం డగురామునకుఁ బ్రదక్షిణంబుఁ జేసి యమేయా
త్ముం డగుహనుమంతుండు తనచేత సందృష్ట యయ్యె సీత యని యెఱింగించె
నని యిట్లు సుందరకాండవృత్తాంతంబు సంక్షేపంబుగా నెఱింగించి క్రమ్మఱ
నిట్లనియె నట్లు సీతావృత్తాంతం బెఱింగించిన విని రాముండు సుగ్రీవసహితం
బుగాఁ గదలి మహోదధిదక్షిణతీరంబుఁ జేరి సంతరణోపాయం బెఱింగించు
టకు సముద్రునిం బ్రార్థించి యతండు పొడసూప కున్న నలిగి.

116


క.

ఇనకిరణనిభశరంబుల, వననిధి శోషిల్లఁ జేయ వారిధి భీతిం
జనుదెంచి రాఘవునిముఖ, వనజము వీక్షించి మధురవైఖరిఁ బలికెన్.

117


వ.

మహాత్మా యిన్నలుండు సేతువుఁ గావించుంగాక యని యరిగిన నారఘుపుం
గవుని శాసనంబున సముద్రవచనప్రకారంబున నలుండు సేతువుఁ గావించె నంత
రాముండు నలవిరచితసేతుమార్గంబున శరనిధిం దాఁటి లంకమీఁదికిం జని.

118

క.

దురమున దశకంఠుని శిత, శరముల వధియించి పుచ్చి జనకకుమారిం
బరమపతివ్రతఁ గనుఁగొని, నరపతి వ్రీడాభరమున నతవదనుం డై.

119


వ.

వానరరాక్షససభామధ్యంబునఁ బరుషంబు లాడిన నద్దేవి పాతివ్రత్యవిషయసం
శయవచనంబు సహింపక వహ్నిప్రవేశంబుఁ జేసిన నయ్యగ్నిదేవుం డద్దేవి కతి
శీతలుండై రామునకుం బొడసూపి సీత నర్పించి మహాత్మా విశుద్ధభావ యగు
సీతం బరిగ్రహింపు మని పలికిన నారాముం డగ్నివచనంబువలన జానకిని విగత
కల్మషఁగా నెఱింగి సీతాదేవిం జేకొని సంప్రహృష్టుండై దేవతలచేత నర్చితుం
డై ప్రకాశించె నప్పు డయ్యద్భుతకర్మంబుఁ జూచి చరాచరాత్మకం బైన త్రైలో
క్యం బంతయు సంతోషంబు నొందె నంత రాముండు విభీషణుని లంకారా
జ్యంబున కభిషిక్తునిం జేసి కృతకృత్యుండును విగతమనస్తాపుండును నై జగ
త్కంటకుం డైనరావణుని వధించుటవలనం బొడమిన హర్షవశంబునం దన్ను వి
లోకింపం జనుదెంచిన శంకరహిరణ్యగర్భమహేంద్రప్రముఖబృందారకులచేత
దుర్ల భంబులైనవరంబులు వడసి రాక్షసులచేత నిహతులైనవానరుల నందఱఁ
బునస్సంజీవితులం జేసి సీతాలక్ష్మణహనుమత్సుగ్రీవాంగదవిభీషణాదులం
గూడి పుష్పకవిమానం బారోహించి యయోధ్యాపురంబునకుఁ బోవుచు భర
ద్వాజాశ్రమంబుఁ బ్రవేశించి నిజాగమనబోధనంబుకొఱకు హనుమంతుని
భరతునిపాలికిం బనిచి యతం డెదుర్కొని తోడ్కొనిపోవ సీతకుం బూర్వ
వృత్తాంతం బెఱింగించుచుం జనిచని నందిగ్రామంబుఁ జేరి యందు భ్రాతృ
సహితంబుగా మునివేషంబు విడిచి చతుర్విధాలంకారంబులఁ గైసేసి సీతా
నాదృశ్యంబు నొంది క్రమ్మఱ నయోధ్యాపట్టణసింహాసనాధ్యక్షుం డయ్యె
నని యిట్లు యుద్ధకాండకథాప్రపంచంబు సంగ్రహంబుగా నెఱింగించి వెండి
యు నిట్లనియె నట్లు సామ్రాజ్యపట్టాభిషిక్తుండై మహాత్మం డగురాముండు
రాజ్యపరిపాలనంబు సేయునప్పుడు సర్వజనంబు సంజాతరోమాంచం బై ముది
తాంతఃకరణంబై సర్వకామలాభజనితప్రీతియుక్తంబై రామసంశ్లేషణ
పరిపుష్టసర్వాంగం బై యిష్టదేవతానమస్కారాదిరూపధర్మఫలలాభసమన్వి
తం బై మనఃపీడారహితం బై వ్యాధిరహితం బై దుర్భిక్షుభయవర్జితం బై
యలరెఁ బురుషు లొకానొకప్పుడైన నొక్కింతైనఁ బుత్రమరణంబు లేక
సుఖించుచుండిరి యువతులు వైధవ్యం బెట్టిదో యెఱుంగక పతివ్రత లై సుఖిం
చుచుండిరి జలాగ్నివాతజ్వరతస్కరక్షుత్పిపాసాప్రముఖాధ్యాత్మికాధిదైవికా
ధిభౌతికబాధలం బొరయక జనంబు లానందించుచుండిరి నగరంబులు రాష్ట్రం
బులు ధనధాన్యోపేతంబు లై ప్రహృష్టజనాకీర్ణంబులై నిత్యోత్సవయుక్తంబు
లై కృతయుగంబునందుం బోలె ప్రముదితంబు లై యొప్పె రాముండు బహు
సువర్ణాఢ్యయాగవిశేషంబుల నశ్వమేధశతంబుల దేవతలం దృప్తి నొందించి

రాజవంశంబుల శతగుణితంబులఁ బ్రత్యేకంబుగా రాజ్యదానంబున సంస్థాపించి
యసంఖ్యేయం బగుధనంబును గోకోటిసహస్రంబులను బ్రాహ్మణుల కొసంగి
యీలోకంబునందు నాల్గువర్ణంబులవారిని స్వస్వధర్మనిరతులం జేసి పదునొకొం
డువేలవత్సరంబులు రాజ్యంబుఁ జేసి స్వలోకం బైనవైకుంఠంబునకు వేంచే
యఁగలండు.

120


క.

అనఘము శ్రుతినిభము శుభం, బనుపమసేవ్యంబు దురితహర మగునీరా
మునిచరితముఁ బఠియించినఁ, జనుఁ డఘములఁ బాసి పొందు శాశ్వతసుఖమున్.

121


క.

ఆయుష్యం బగు నీరా, మాయణముఁ బఠించు మనుజుఁ డైహికసౌఖ్య
శ్రీయుతుఁడై సుతపౌత్రస, మాయుక్తుం డై యమర్త్యుఁ డగు నటమీఁదన్.

122


ఉ.

భోగము మోక్ష మిచ్చురఘుపుంగవ దోశ్చరితప్రబంధముల్
బాగుగ విన్న విప్రనరపాలకవిట్పదజు ల్క్రమంబున
న్వాగృషభత్వమున్ క్షితిధవత్వముఁ బుణ్యఫలత్వము స్సము
ద్యోగమహత్త్వముం గలిగి యొప్పుదు రెంతయు వీతశోకులై.

123


వ.

అని యి ట్లుత్తరకాండకథాసమన్వితంబుగా సప్తకాండకథావృత్తాంతం బం
తయు సంక్షేపంబుగా నెఱింగించిన వాక్యవిశేషజ్ఞుండును ధర్మాత్ముండును మహా
మునియు నగువాల్మీకి యన్నారదుని సంపూర్ణార్థప్రతిపాదకపదసమూహరూపం
బైనతత్ప్రశ్నానురూపోత్తరవాక్యంబు విని శిష్యసహితుండై యద్దేవర్షివర్యుం
బూజించిన నన్నారదుం డవ్వాల్మీకిచేత యథార్థంబుగాఁ బూజితుండై యా
మంత్రణంబు వడసి యాకాశంబున కుద్గమించి స్వల్పకాలంబులోన బ్రహ్మలో
కంబునకుం జనియె.

124

వాల్మీకి స్నానార్ధము తమసానది కరుగుదెంచుట

ఉ.

ఆజటినాథుఁడుం జనిన యవ్వల నమ్ముని స్నానకాంక్షి యై
యోజ దలిర్ప డెందమున నూరెడుభక్తిరసంబుతో భర
ద్వాజుఁడు వెంట రా వికచతామరసోత్పలభూరిసౌరభ
భ్రాజితదివ్యగంధవహబంధుర యౌ తమసాస్రవంతికిన్.

125


క.

చని తత్తటినీమహిమకు, జనితప్రమదాభియోగసంభ్రమమతి యై
ఘనసుజనావనపావన, వనగాహన మాచరింప వడిఁ దివురు చెదన్.

126


తే.

తగ నకర్దమ మైనయత్తటినితీర్థ, మది విలోకించి తనక్రేవ నతివినీత
చిత్తుఁ డై యున్న యమ్ముఖ్యశిష్యునిఁ గని, యింపు దళుకొత్త మధురోక్తి నిట్టు లనియె.

127


ఆ.

అనఘ కంటె రమ్యమై నిష్కళంక మై, స్వాదుయుక్త మై, ప్రసన్నసలిల
మై నుతింప నయ్యె నీనదీతీర్థంబు, సాధుపురుషమానసంబుకరణి.

128

క.

కలశం బచ్చటఁ బెట్టుము, తలఁగక వల్కలముఁ దెమ్ము తమసాతటినీ
జలమజ్జన మొనరించెద, మలఘుగుణా సాంధ్యకృత్య మది దీర్చుటకున్.

129


క.

అని పలుక భరద్వాజుఁడు, ఘనముగ వల్కల మొసంగఁ గైకొని ఘనుఁ డ
మ్ముని తత్తీరవనంబున, వినుతతపోధనుఁడు వేడ్క వీక్షించు నెడన్.

130


మ.

హరిదళస్ఫుటవర్ణతుల్యనవదూర్వాంకూరకాంతిచ్ఛటా
భరితస్ఫీతవిశాలశాద్వలచరత్పంచాస్త్రకేళీవినో
దరసోన్మత్తమనోజ్ఞనాదశకునద్వంద్వంబు క్రీడింపఁగాఁ
దరులం బొంచి నిపాదుఁ డొక్కఁ డలుకన్ దర్పాంధుఁ డై గ్రక్కునన్.

131


క.

మించినవేడ్క రమించెడు, క్రౌంచంబుల రెంటిలోనఁ గనుఁగొని పురుష
క్రౌంచమును జంపె నురవడి, వంచించి నిషాదుఁ డెంత పాపాత్మకుఁడో.

132


వ.

అప్పుడు శోణితపరీతగాత్రంబుతో వివేష్టమానుండై నేలం బడి యున్ననిజ
వల్లభుం జూచి భర్తృమరణశోకాక్రాంతయై సహచరి యగుక్రౌంచాంగన దీన
స్వనంబునఁ గరుణంబుగా విలపించిన.

133

వాల్మీకిమహర్షి క్రౌంచమును సాధించిన నిషాదుని శపించుట

ఉ.

ఆరవ మాలకించి ముని యద్దెస ఘోరనిషాదపాతితుం
డై రస వ్రాలి యున్న విహగాధిపు రక్తపరీతశీర్షుని
న్వారక గాంచి భూరికరుణ న్మధురోక్తి ననూనయించి యౌ
రౌర యధర్మ మింత తగునా యని బుద్ధిఁ దలంచి యి ట్లనున్.

134


శ్లో.

మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమ శ్శాశ్వతీ స్సమాః,
య త్క్రౌంచ దేశ మవధీః కామమోహితమ్.


మ.

అని యి ట్లామునిరాజు పల్కినఁ దదీయాలాపముల్ శ్లోక మై
తనరం గ్రౌంచవిధంబుఁ గాంచి నగచేతం దూలు నాచేతఁ జ
య్యన నీలక్షణయుక్తపద్య మెటు లాహా వ్యాహృతం బయ్యె నేఁ
డని చింతించుచు శిష్యునిం బిలిచి నెయ్యం బొప్పఁగా నిట్లనున్.

135


వ.

క్రౌంచీశోకార్తుండనై యిప్పు డేను నిషాదుని శపించిన శాపోక్తి చతుష్పాద
యుక్తం బై సమాక్షరపదం బై లక్షణోపేతం బై యనేకార్థప్రతిపాదకం బై తం
త్రీలయసమన్వితం బై శ్లోకరూపం బయ్యె శ్లోకంబుకంటె నన్యం బైన కేవల
పదసందర్భంబు గాదు వింటివే యని పలికిన నా భరద్వాజుండు వాల్మీకివచ
నంబు విని హృష్టచిత్తుం డై బహుప్రకారంబుల నుత్తమం బైనయాశ్ల్లోకరా
జంబుఁ బఠించిన సంతుష్టాంతరంగుం డై.

136


తే.

సత్వరంబుగ వాల్మీకిసంయమీంద్రుఁ డన్నదీపుణ్యజలమున నర్హభంగి
స్నాన మొనరించి యిదియె మంత్రంబు గాఁగ, నచలభక్తి జపించుచు నచటు వాసి.

137

మ.

తనవెంటం జలకుండిఁ గైకొని భరద్వాజుండు సంతోషి యై
చనుదేరంగ ననేకవైఖరుల భాస్వత్పద్యభావంబు శి
ష్యునకుం జెప్పుచు నాశ్రమంబునకుఁ బుణ్యోదారుఁ డేతెంచి తా
ననిశధ్యాతత్పర్థవర్ణపదుఁ డై యాసీనుఁ డై యుండఁగన్.

138

వాల్మీకిమహర్షికడకు పరమేష్ఠి యేతెంచుట

ఉ.

బంగరుటంచతేజిపయి బాగుగ నెక్కి సనందనాదులుం
బొంగుచు వెంట రాఁగ నలుమోముల వేదరవంబు లుప్పతి
ల్లం గమలాసనుండు మునిరాజును బుణ్యచరిత్రుఁ గన్గొనన్
సంగతి మీఱ వచ్చె సురసాధ్యులు మ్రోల జొహారు సేయఁగన్.

139


ఉ.

వచ్చినధాతఁ గాంచి మునివర్యుఁడు దిగ్గున లేచి యాత్మలో
నొచ్చెము లేనిభక్తిరస మూరఁ బ్రదక్షిణముం బ్రణామము
న్మెచ్చుగ నాచరించి తమి మించి యథావిధిఁ బూజ లిచ్చి తా
నచ్చుగ ఫాలభాగఘటితాంజలియై గురుబుద్ధి నుండఁగన్.

140


క.

వసజాసనుండు ముదమునఁ బనిగొని వాల్మీకిదత్తపరమాసనమం
దనువుగ నాసీనుండై, మునిపతిఁ గూర్చుండఁ బనిచె మునుకొని ప్రేమన్.

141


వ.

ఇట్లు బ్రహ్మచేత ననుజ్ఞాతుండై వామలూరుతనయుం డుచితనిజాసనంబునం గూ
ర్చుండి క్రౌంచగతం బైనచిత్తంబున ధ్యానంబుఁ బూని యెవ్వండు చారుర
వం బైనతాదృశక్రౌంచంబు నకారణంబుగా వధించె నట్టి నిషాదుం డెంత పా
పాత్ముం డెంత వైరగ్రహణబుద్ధి యయ్యె నని సారెసారెకుఁ గ్రౌంచాంగన
నుద్దేశించి దుఃఖించుచు హృద్గతావశోత్పన్నశ్లోకార్థంబునందు నివేశితచిత్తుం
డై సాక్షాల్లోకపితామహుం డైన పరమేష్టి కిట్లనియె.

142


మ.

కలుషాత్ముండు నిషాదుఁ డొక్కఁ డలుకం గ్రౌంచంబు హింసింపఁగాఁ
గలఁక న్భర్తృనియోగదుఃఖమున నాక్రందించు క్రౌంచాంగన
న్బెలుచం గన్గొని యేను శోకమున వానిం దిట్టితిం దిట్ట న
ప్పలుకుల్ వి న్మొకపద్య మై తనరె శుంభల్లక్షణోపేతమై.

143


వ.

అని పలికి యాశ్లోకంబుఁ బఠించి దేవా యిది యేమి కారణంబున నుత్పన్నం
బయ్యె నాశ్చర్యరసావిష్టచిత్తుండ నై యున్నవాఁడ నెఱింగింపవే యని యభ్య
ర్థించిన నాకర్ణించి విరించి యుదంచితకరుణాకటాక్షవీక్షణంబుల నిరీక్షించి మదా
జ్ఞానుసారంబున నపతీర్ణ మైనసరస్వతి నెఱుంగఁ డయ్యె నని మందహాసంబుఁ
జేసి యిట్లనియె.

144


తే.

తాపసోత్తమ మత్ప్రసాదమునఁ జేసి, భారతీదేవి నీజిహ్వఁ బాదుకొనియె
నట్లు గాకున్న నీచేత ననఘ నేఁడు, పరఁగ నీశ్లోక మిబ్భంగి బద్ధ మగునె.

145


తే.

అనఘ నీమీఁది కూర్మిచే నమరమౌని, నారదుఁడు సర్వలోకవిశారదుండు

తెలిపి పోయిన రాముని దివ్యచరిత, మఖిలము సవిస్తరంబుగా నర్థిఁ జెపుమ.

146


క.

శ్రీమంతుఁడు గుణవంతుఁడు, ధీమంతుఁడు ధార్మికుండు ధీరుం డగునా
రామునిచరితముఁ జెప్పుట, ప్రామాణ్యము పుట్టువునకు ఫల మగుఁ జుమ్మీ.

147


ఉ.

ఉత్తమవిక్రముం డగురఘూత్తముసచ్చరితంబు జానకీ
వృత్తము సర్వరాక్షసులవృత్తము లక్ష్మణువృత్త మంతయుం
జిత్తముఁ జేరి యున్నయవి నేరక యున్నవి నేఁడు పూర్ణవి
ద్వత్తమ మత్ప్రసాదమునఁ దప్పక తోఁచెడు నీకు సర్వమున్.

148


క.

దురితహరంబును జేతో, హర మీదృశ్శ్లోకబద్ధ మగురామునిస
చ్చరితముఁ జేయుము నీపలు, కరయఁగ నొక టైన ననృతమై యుండ దొగిన్.

149


మ.

క్షితి నెందాఁకఁ గులాచలంబులు రహిం జెల్వొందుఁ బుణ్యావగా
తతి యెందాఁకఁ జరించు నర్ణవము లెంచాఁకం జెలంగు న్భవ
త్కృతరామాయణకావ్య మందనుక సూరిస్తుత్యమై యుండు స
మ్మతి నందాఁక సుఖంచె దీవు తగ నస్మల్లోకసంవాసి వై.

150


మ.

అని దీవించి విరించి సమ్మదరనవ్యాకోచచిత్తాబ్జుఁ డై
చనియెం బిమ్మటఁ దాపసోత్తముఁడు చంచత్ప్రీతి నాశ్లోకముం
బనిగా శిష్యులు సారెసారెకుఁ బఠింప న్వేడ్క నాలించి త
ద్ఘనరామాయణపుణ్యకావ్యరచనాకౌతూహలోల్లాసి యై.

151


వ.

మఱియుఁ గ్రౌంచాంగనాదీనస్వరసమాకర్ణనసంజాతశోకంబు సమాక్షరచతు
ప్పాదగీతం బైనశ్లోకం బయ్యె నింక నాశీర్నమస్క్రియావస్తునిర్దేశముఖం
బును నితిహాసకథాసంయుక్తంబును నితరద్వారసంశ్రయంబును జతుర్వర్గ
ఫలప్రదంబును జతురోదాత్తనాయకంబును నగరసముద్రశైలర్తుచంద్ర
సూర్యోదయోద్యానజలక్రీడామధుపానోత్సవవిప్రలంభవివాహకుమారో
దయమంత్రకరణదురోదరప్రయాణరణనాయకాభ్యుదయవర్ణనంబుల
చేత సమలంకృతంబును నసంక్షిప్తంబును రసభావనిరంతరంబును సుసంధి
శ్రావ్యవృత్తానతివిస్తీర్ణసర్గోపేతంబును లోకరంజనంబును నగు యశస్విరామ
చరితరూపమహాకావ్యంబు వృత్తాశ్రయంబు లైనశృంగారాదిరసంబులును నర్థా
శ్రయంబు లైన ద్రాక్షాపాకనారికేళపాకరసాలపాకంబులలో బహిరంతర్వ్యాప్త
రనం బైనద్రాక్షాపాకంబును బదాశ్రయంబు లైనశయ్యలును వైదర్భీగౌడీపాం
చాలీప్రముఖరీతులలోన బంధపారుష్యశబ్దకాఠిన్యాతిదీర్ఘసమాసవర్జితంబైన
వైదర్భీరీతీయందు విషమాక్షరవృత్తరాహిత్యంబును శబ్దార్థాశ్రయంబు లైన
యనుప్రాసోపమాద్యలంకారజాతంబును శబ్దావయవాశ్రయంబు లైన గుణం
బులును గైశిక్యాదివృత్తులును దేఁటపడునట్లుగా రచించెద సమాసదోషసంధి
దోషపదదోషాది సమస్తదోషపరివర్జితం బగుదానిని నన్యూనాతిరిక్తమహా

నందైకరసోపనతవాక్యబద్ధం బగుదాని మద్విరచితం బగుదాని రావణవధం
బధికరించి కావింపంబడినదాని నీరామచరితంబు సమాజాతచిత్తుల రై వినుం
డని శిష్యులతోడం బలికి కీర్తిమంతుండును నుదారబుద్ధియు నగునమ్మునిశ్రేష్ఠుండు
ప్రక్షాళితపాణిపాదుం డై ప్రాచీనాగ్రదర్భాసనంబున నుపవిష్టుం డై యంజలి
ఘటించి విరించనోక్తప్రకారంబున నచలసమాధియోగంబుఁ బూని నారదో
క్తం బైనరామచరితవస్తుతత్త్వంబు వ్యక్తం బగునట్లు కథారహస్యంబు లన్వే
షింప నప్పుడు చతుర్ముఖప్రసాదబలంబున దశరథునివృత్తంబును సీతారామలక్ష్మ
ణు లయోధ్యయందు నివసించునప్పు డేవృత్తంబు సంజాతం బయ్యెఁ దద్వృత్తం
బును వారలహసితభాషితగతిచేష్టితంబులును సాకేతపురనిర్గమనానంతరంబున
వనవాసంబునం దెయ్యది సంజాతం బయ్యె నట్టివృత్తంబును సత్యసంధుండగు
రామునిచేత రచింపంబడిన కార్యంబు లన్నియుఁ గరతలగతామలకంబునుం
బోలె నిరీక్షించి.

152

వాల్మీకిమహర్షి రామాయణమహాకావ్య మొనరించుట

తే.

అఖిలధర్మార్థగుణయుక్త మైనదాని, రమ్యకామార్థగుణవిస్తరంబు నైన
దాని నీరధిఁబోలె రత్ననిభలలిత, మానితపదార్థసంపూర్ణ మైనదాని.

153


సీ.

షడ్జాదికస్వరసంబంధికాంతాదికాఖిలశ్రుతిహృద్య మైనదాని
వేడ్కతో వినువారి వీనులఁ జిత్తంబు నభిముఖంబుగఁ జేయునట్టిదాని
సర్వోపనిషదర్థపారసంభూతాశయప్రతిపాదకం బయినదాని
నరసురగంధర్వపరమర్షియక్షవిహంగకిన్నరసేవ్య మయినదాని


తే.

నర్కకులమున నవతీర్ణుఁ డైన పరమ, పురుషుఁ డగురామభద్రునిపుణ్యచరిత
నమరముని నారదుఁడు సెప్పినట్టి ఫణితి, నంతయును గావ్య మొనరింప నాత్మఁ దలఁచి.

154


వ.

రామునిజన్మంబును దన్మహావీర్యంబును సర్వానుకూలత్వంబును సర్వప్రియ
త్వంబును క్షాంతియు నిరతిశయప్రియదర్శనత్వంబును సత్యశీలత్వంబును
విశ్వామిత్రసమాగమంబును నానావిచిత్రకథలును జానకీవివాహంబును ధనుర్వి
భేదనంబును రామరామవివాదంబును దాశరథిగుణానుకీర్తనంబును రామాభి
షేకసమారంభంబును గైకేయీదుష్టభావంబును నభిషేకవ్యాఘాతంబును
రామవివాసనంబును దశరథశోకవిలాపంబును దశరథునిపరలోకగమనంబును
బ్రకృతివిషాదంబును బ్రకృతివిసర్జనంబును నిషాదాధీపసంవాదంబును సమం
త్రోపావర్తనంబును గంగానదీతరణంబును భరద్వాజదర్శనంబును భరద్వాజుని
శాసనంబునఁ జిత్రకూటప్రవేశంబును జిత్రకూటంబునందు గృహనిర్మాణంబును
బర్ణశాలావస్థానంబును భరతాగమనంబును రామపాదప్రసాదనంబును దశర
థునకు సలిలప్రదానంబును బాదుకాగ్ర్యాభిశేకంబును నందిగ్రామమునందు
భరతనివాసంబును బాదుకాస్థాపనంబును ననసూయాసంవాదంబును నంగ

రాగసమర్పణంబును దండకారణ్యగమనంబును విరాధవధంబును శరభంగ
దర్శనంబును సుతీక్ష్ణసమాగమంబును నగస్త్యదర్శనంబును జటాయువుతో
సమాగమంబును బంచవటీగమనంబును శూర్పణఖం జూచుటయు శూర్పణఖా
సంవాదంబును విరూపకరణంబును ఖరాదివధంబును రావణునిజానకీహరణో
ద్యోగంబును మారీచవధంబును వైదేహీహరణంబును రామునివిలాపంబును
జటాయుర్నిబర్హణంబును గబంధదర్శనంబును బంపాదర్శనంబును శబరీదర్శ
నంబును హనుమద్దర్శనంబును ఋశ్యమూకగమనంబును సుగ్రీవసమాగమం
బును సాలభేదనంబున సుగ్రీవునకు విశ్వాసంబుఁ బుట్టించుటయు సుగ్రీవునితోడి
సఖ్యంబును వాలిసుగ్రీవులయుద్ధంబును వాలిప్రమథనంబును సుగ్రీవరాజ్యసం
స్థాపనంబును దారావిలాపంబును రామసు గ్రీవులసంకేతంబును వర్ష రాత్రనివా
నంబును రామునికోపంబును వానరులపరస్పరమేళనంబును హరిత్ప్రస్థాపనం
బును సుగ్రీవునిచేత వానరుల నుద్దేశించి పృథివీసంస్థానకథనంబును నంగుళీయ
కదానంబును బిలదర్శనంబును బ్రాయోపవేశనంబును సంపాతిదర్శనంబును
బర్వతారోహణంబును సముద్రలంఘనంబును సముద్రునివచనంబున మైనాకదర్శ
నంబును సింహికానిధనంబును లంకాద్వీపగతమలయగిరిదర్శనంబును నేకాంత
విచింతనంబును రాత్రియందు లంకాప్రవేశంబును రావణదర్శనంబును బుష్పక
దర్శనంబును నాపానభూమిగమనంటును నవరోధదర్శనంబును నశోకవనికాయా
నంబును సీతాదర్శనంబును రావణాగమనంబును రాక్షసీతర్జనంబును ద్రిజటా
స్వప్నదర్శనంబును నంగుళీయకప్రదానంబును సీతాసంభాషణంబును సీతామణి
ప్రదానంబును వృక్షభంగంబును రాక్షసీవిద్రవంబును గింకరనిబర్హణంబును వా
యుసూనుగ్రహణంబును లంకాదాహాభిగర్జనంబును బ్రతిప్లవనంబును మధుహ
రణంబును రాఘవాశ్వాసనంబును మణినిర్యాతనంబును విభీషణసంసర్గంబును
వధోపాయనివేదనంబును సముద్రసంగమంబును సేతుబంధనంబును సముద్రత
రణంబును రాత్రియందు లంకావరోధంబును గుంభకర్ణనిధనంబును మేఘనాదనిబ
ర్హణంబును రావణవినాశంబును నరిపురంబున సీతావాప్తియు విభీషణాభిషేకంబు
ను బుష్పకదర్శనంబును నయోధ్యాగమనంబును భరతసమాగమంబును రామా
భిషేకోత్సవంబును సర్వసైన్యవిసర్జనంబు నివి యన్నియు విచిత్రపదార్థంబులగు
యిరువదియొక్కవేయుం బదియుఁ దొమ్మిదిశ్లోకంబులను నేనూటముప్పదియేడు
సర్గలను నాఱుకాండంబులను జేసి యాత్మవంతుండును భగవంతుండును మహ
ర్షియు నైనవాల్మీకి విచిత్రపదంబును రామచారిత్రప్రతిపాదకంబును నైన కా
వ్యంబుగా రాముండు సంప్రాప్తసామ్రాజ్యుం డై యుండునప్పుడు లోకహితా
ర్థంబు రచించి స్వరాష్ట్రరంజనంబును సీతావిసర్జనంబును బ్రాహ్మణపుత్రజీవనా
శ్వమేధాదిభవిష్యత్కథలును నుత్తరకాండంబుగా రచించె నుత్తరకాండం

బుతోఁగూడ నీరామాయణంబునం దిప్పుడు యార్నూట నలువదియేడు సర్గ
లును నిరువదినాల్గువేలయిన్నూటయేఁబదిమూడు శ్లోకంబులును గలిగి
యుండు నందు బాలకాండమునందు డెబ్బదియేడు సర్గలును రెండువేలయి
న్నూటయేఁబదియాఱు శ్లోకంబులును నయోధ్యాకాండంబునందు నూటపం
దొమ్మిది సర్గలును నాలుగువేలనన్నూటపదియేను శ్లోకంబులును నారణ్యకాం
డంబునందు డెబ్బదియయిదుసర్గలును రెండువేలయేడ్నూటముప్పదిరెండు శ్లో
కంబులును గిష్కింధాకాండంబునం దఱువదియేడు సర్గలును రెండువేలయా
ర్నూటయిరువది శ్లోకంబులును సుందరకాండంబునం దఱువదియెనిమిది సర్గలును
మూఁడువేలయాఱు శ్లోకంబులును యుద్ధకాండంబునందు నూటముప్పది
యొక్క సర్గలును నయిదువేలతొమ్మన్నూటతొమ్మిది శ్లోకంబులును నుత్తర
కాండంబునందు నూటపది సర్గలును మూఁడువేలయిన్నూటముప్పదినాల్గు
శ్లోకంబులునుం గలిగి యుండు మహర్షి యగువాల్మీకి చతుర్వింశతిసహస్రశ్లోక
పరిమితంబుఁ జేసి యిమ్మహాకావ్యంబు రచించెఁ గావునఁ దక్కిన యిన్నూట
యేఁబదిమూడు శ్లోకంబులు జగతీచ్ఛందం బాదిగాఁ గల ఛందంబులవలనం
బుట్టినవృత్తంబులయక్షరాధిక్యంబున నుత్పన్నంబు లయ్యె నని కొంద ఱందురు
బహుయుగంబు లతీతంబు లగుటవలన వాల్మీకి ప్రతిజ్ఞాతసంఖ్యకు వ్యత్యయంబు
గలుగుట యుక్తం బని కొంద ఱందురు వాల్మీకిమహర్షివరుం డిరువదినాల్గు
వేల శ్లోకంబులు పరిమితంబు చేసి గ్రంథంబు రచించె ననియెడునది వాల్మీకి
సంకల్పమాత్రంటే కానీ పరిసమాప్తిదశయందు గ్రంథపరిపూర్తికొఱకు నీశ్లో
కంబులు కథితంబులై యుండఁబోలు నని కొందఱు వక్కాణింతురు చతుర్విం
శతిసహస్రశ్లోకనిర్ణయంబు కావ్యంబుకొఱకు నన్యూనాభిప్రాయంబె కాని
యనతిరిక్తాభిప్రాయంబు కాదని కొందఱు వచింతు రిరువదినాల్గువేల శ్లోకంబుల
మీఁద నల్పసంఖ్యాతంబులైన యిన్నూటయేఁబదిమూడు శ్లోకంబు లధికంబు
లై యుండు టది వ్యత్యయంబు గా దెట్లనిన విరించికి మహాయుగంబులు వేయుఁ
జనిన నొక్కపగ లనియు నాపగటికిఁ బదునలుగురు మనువులు చనుదు రని
యు మనుకాలంబు డెబ్బదియొక్క మహాయుగంబు లనియుఁ బురాణంబు
లందు వినంబడు వేయుమహాయుగంబులఁ బదునాల్గు మనువులకు విభాగించిన
డెబ్బదియొక్క మహాయుగంబులకంటె నించుకకాలం బధికం బై కానఁ
బడిన నది యెట్లు వ్యత్యయంబుగా గణింపంబడకుండు నట్టుల యయ్యల్పం
బైనయాధిక్యంబు పరిగణితంబు గా నేరదు భగవంతుం డగు ప్రాచేతసుండు
చతుర్వింశత్యక్షరసంఖ్యాకగాయత్రీ వర్ణంబు లీరామాయణంబునందు వేయి
శ్లోకంబుల కొక్కొక్కయక్షరంబు శ్లోకఘటితంబుగాఁ జేసి బాలకాం
డంబునందు మూఁ డక్షరంబులును నయోధ్యాకాండంబునందు నా ల్గక్ష

రంబులును నరణ్యకాండమునందు రెం డక్షరంబులును గిష్కింధాకాండము
నందు రెం డక్షరంబులును సుందరకాండంబునందు మూఁ డక్షరంబులును యుద్ధ
కాండమునం దా ఱక్షరంబులును నుత్తరకాండంబునందు నా ల్గక్షరంబులును
సంస్థాపించి రచించె నిక్కావ్యంబు చతుర్వింశత్యక్షరాత్మకగాయత్ర్యాఖ్యవర
బ్రహ్మనివాసం బై యుండు నుత్తరకాండంబునందు సమస్తజనులకు భగవంతు
నితోఁ గూడఁ దల్లోకప్రాప్తి యతిశయం బై యుండుటం జేసి యిక్కావ్యంబు
ప్రాచుర్యంబుగాఁ బరత్వాభివ్యక్తి కలిగియుండు దానం జేసి సర్వోత్తరత్వంబు
వలన నిది యుత్తరకాండం బనం బరఁగె నివ్విధంబున రామాయణంబు సమ
గ్రంబుగా రచియించి.

155


క.

మునిపతి కృతార్థుఁ డై తా, నొనరించిన రామచరిత మొప్పారఁగ నె
వ్వనిచేఁ జదివించెదనో, యని మదిఁ దలపోయుచుండ నాసమయమునన్.

156

వాల్మీకిమహర్షి శ్రీరామాయణమహాకావ్యముఁ గుశలవుల కుపదేశించుట

సీ.

రూపవంతులు తుల్యరూపులు తుల్యవయస్కులు ధర్మకామార్థవిదులు
సుకుమారమూర్తులు సుందరాంగులు యశస్కరు లన్నదమ్ములు చారుముఖులు
లలితలక్షణలక్షితులు మధురస్వరభాషులు గంధర్వవేషధరులు
శ్రుతినిష్ఠితులు బహుశ్రుతులు మేధావులు మునివేషధరులు సంపూర్ణతేజు


తే.

లఖిలగాంధర్వతత్త్వజ్ఞు లఖిలశాస్త్ర, విదులు మూర్ఛనాస్థానకోవిదులు రాజ
నందనులు సర్వసంపన్ను లిందుసదృశ, లపనులు కుశీలవులు కుశలవులు వచ్చి.

157


తే.

భక్తి వాల్మీకిమునినాథుపాదములకు, వందనముఁ జేసి పేశలవాగ్విభూతి
మమ్ముఁ జదివింపుఁ డనవుఁడు మౌనివిభుఁడు, కరుణ దళుకొత్త వారల గారవించి.

158


తే.

పరఁగ రామదేహాఖ్యబింబంబువలన, సముదితము లైనయపరబింబములరీతి
నమరువారి మనోజ్ఞవేషములవారి నక్కుమారోత్తములఁ జాల నాదరించి.

159


మ.

సమతంత్రీలయయుక్తమై మధుర మై సప్తస్వరోపేత మై
రమణీయామృతకల్ప మై నవరసప్రాగల్భ్య మై సన్మనో
రమ మై యొప్పెడురామచంద్రచరిత ప్రత్యగ్రకావ్యంబు స
ర్వము సార్థంబుగ నక్కుమారులకు నవ్వాల్మీకి సెప్పె న్రహిన్.

160


తే.

చెప్పినఁ గుశీలవులు ముదఁ మొప్ప మౌని, కరుణ నక్కావ్య మంతయు వరుసఁ జదివి
రమణ సర్వంబు వాగ్విధేయముగఁ జేసి, తావసకులోత్తమునిప్రసాదంబు వడసి.

161


మ.

మదనాకారులు రాజనందనులు సమ్యగ్గానవిద్యారహ
స్యధురీణు ల్మధురస్వరు ల్గవలు చందన్మూర్ఛనాస్థానకో
విదు లై రామకథాప్రబంధము లసద్వీణానుకూలంబుగా

ముద మొప్ప న్మునినేతయొద్ద సతతంబు న్బాడి రిం పొందఁగన్.

162


తే.

మఱియుఁ గడువేడ్క నమ్మనివరునికడకు, వరుస మౌనులు సాధులు వచ్చినపుడు
వారిమ్రోల నప్పార్థివవరతనయులు, గాన మొనరించి రమ్మహాకావ్యకథను.

163

కుశలవులు శ్రీరామయజ్ఞవాటములో శ్రీరామాయణగానముఁ జేయుట

వ.

మఱియు నిసర్గమధురశబ్దప్రపంచసంచితం బైనయక్కావ్యంబు దదీయమధుర
స్వరవాగ్విధేయం బై పరిమళోపేతం బైనకుందనంబుచందంబున నందం బై
యొప్పె నంత నొక్కనాఁడు సర్వాంగసుందరు లగునారాజనందనులు మునిపతి
చేత ననుజ్ఞ వడసి మునివేషంబులు ధరించి సాకేతపురంబున కరిగి రామభద్రుం
డశ్వమేధయాగంబుఁ జేయుచుండ నయ్యజ్ఞవాటంబుఁ బ్రవేశించి మునిసభా
మధ్యంబున విపంచిక లలవరించి రంగురక్తులు గులుకఁ గవ గూడి జంత్రగా
త్రంబు లొక్కటి యై మధురంబుగా మ్రోయఁ జేతనాచేతనత్వనిరూపణంబు
లేర్పడకుండ సమాక్షరపాదవిచిత్రపదార్థవ్యక్తం బగుదాని స్వరూపోచ్చారణ
మాత్రంబునందును స్వరవిశేషసమన్వితగానంబునందును మధురం బగుదా
నిఁ ద్ర్యశ్రచతురశ్రమిశ్రసంజ్ఞకద్రుతమధ్యవిలంబితగానధ్వనిపరిచ్ఛేదకాన్వితం
బగుదాని షాడ్జీటీనైషాదీధైవతీపాంచమీమాధ్యమీగాంధర్వ్యార్షభీసంజ్ఞకసప్త
జాతిబంధం బగుదాని వీణాతంత్రియం దధిరోపించి తాలవేణుమృదం
గాదివాద్యంబులతోఁ గూడ నభివ్యక్తంబుగాఁ బాడం దగినదాని శృంగార
కారుణ్యహాస్యవీరభయానకరౌద్రబీభత్సాద్భుతశాంతరససహితం బగుదాని
నుద్దీపనాలంబనాదివిభావయుక్తం బగుదాని సంభోగవిప్రలంభసంజ్ఞకద్వివిధ
శృంగారరసోపేతం బగుదాని సీతాచరితపౌలస్త్యవధరామశోకప్రతిపాదకం
బగుటం జేసి శృంగారవీరశోకరసప్రధానం బగుదాని సర్వాలంకారపూర్ణంబగు
దాని వేదార్థవ్యక్తీకరణంబుకొఱకు వాల్మీకిచేతఁ గథితం బైనదాని సీతాచరిత
రావణవధప్రతిపాదకం బైనదాని రామాయణకథాప్రబంధంబు మునిపతి
యభిప్రాయంబు మనంబున నిడికొని శృంగారాదిరసావిర్భావం బెట్లగు నట్లు
మధురంబును రంజనంబును సమీచీనరాగయుక్తంబునుం గాఁ బాడిన.

164


శా.

ఆశ్లోకప్రచురత్వ మామధురశబ్దార్థోపమానోపమే
యశ్లేష్యాదికసౌష్ఠవంబు ఘనగీతౌదార్య మాలించి పు
ణ్యశ్లోకు ల్మునిపుంగవు ల్భువనవిఖ్యాతుల్ ప్రశస్తప్రభా
వశ్లాఘ్యు ల్పరమాద్భుతంబు ముదమున్ వైదుష్య మేపారఁగన్.

165


శా.

ఆహా! యెంత విచిత్ర మంచుఁ గనులన్ హర్హాశ్రువార్బిందుసం
దోహంబుల్ చినుకం గుమారకుల నస్తోకప్రభావాఢ్యుల

న్నీహారాంశుసమానవక్త్రుల రహి న్వీక్షించి కారుణ్య ము
త్సాహంబుం జెలఁగ న్నుతించి రతిచిత్రప్రౌఢివాగ్వైఖరిన్.

166


వ.

మఱియు నీరామచరితంబు బహుకాలనిష్పన్నం బైనను బాకవిశేషంబునఁ
బ్రత్యక్షంబుగా ననుభూయమానం బైనపగిది దర్శితం బగుచున్నదాని
యిట్లు ప్రశంసించి.

167

కుశలవులకు మునీశ్వరులు బహుమతు లొసంగుట

సీ.

ఒకమౌని వల్కలం బకలంకమతి నిచ్చెఁ గరుణతో నొకమౌని కలశ మొసఁగెఁ
దపసియొక్కఁడు గూర్మి జపమాల దయచేసెఁ బ్రీతితో నొకమౌని బృసి నొసంగె
నొకసంయమీంద్రుఁ డాయువ్యంబు గృప నిచ్చె యతియొక్కఁ డిచ్చెఁ గృష్ణాజినంబు
మునిపతియొకఁ డిచ్చె ముంజియు దండంబు మఱియొక్కఁ డిచ్చెఁ గమండలువును


తే.

దపసి యొక్కఁడు యజ్ఞసూత్రం బొసంగె, మఱియుఁ బెక్కండ్రుమునులు క్రమంబుతోడఁ
దమకుఁ గలిగిన వస్తువుల్ దయ దలిర్ప, నొసఁగి రవ్వేళ నక్కుమారోత్తములకు.

168


వ.

ఇట్లు రామాయణకథాశ్రవణసంజాతపరమానందానుభవవరవశు లై మునీంద్రు
లుచితసత్కారంబుల నారాజపుత్రులఁ బ్రీతిచేతస్కులం జేసి మహాత్ముం డగు
వాల్మీకిచేత నిక్కావ్యంబు కల్పితం బయ్యె నీయాఖ్యానం బింక సమస్తకవుల
కాధారం బయి సర్వగీతంబులయం దుత్తమగీతం బై సర్వశ్రుతిమనోహరం బయి
మహాభ్యుదయకారణం బై యాయుష్కరం బై యద్భుతం బయి ప్రాశస్త్యంబు
వహించుఁ గాక యని పలికి రంత నక్కుమారు లొక్కనాఁ డయోధ్యానగర
రాజమార్గంబులందు సుధామధురపేశలసమాక్షరపాదవిచిత్రపదార్థభవ్యం బైన
యక్కావ్యంబుఁ గాంతాప్రభావతీప్రభృతిసర్వశ్రుతిమనోహరం బగునట్లుగా
గానంబు చేసిన.

169


క.

 కలరవ మై జితకోకిల, కులరవమై యారవం బకుంఠితగతి వీ
నులవిం దై యమృతపుసో, నలపొందై పురమునిండ నలువుగ మ్రోసెన్.

170


ఉ.

మ్రోసిన నాలకించి రఘుముఖ్యుఁడు రాముఁడు భూరిసమ్మదో
ల్లాసవిలాసి యై తపనరాజులకైవడిఁ గ్రాలువారిఁ బే
రాసఁ గనుంగొన న్నిజగృహంబునకుం బిలిపించి మించి సీ
తానుభగుండు పేశలసుధామధురోక్తి బహూకరించుచున్.

171

శ్రీరాముండు గుశలవులం దనగృహంబునకు రావించుట

వ.

సచివసామంతభ్రాతృసమన్వితంబుగా నొక్కకమనీయకాంచనకమ్రకిరణసముజ్జ్వ
లదివ్యసింహాసనంబున నాసీనుం డయి యుదయమహీధరోపరిభాగసముజ్జ్వల

పుండరీకవనబంధుండునుంబోలెఁ దేజరిల్లుచు లక్ష్మణభరతశత్రుఘ్నుల నవలో
కించి.

172


ఉ.

వీరిమనోజ్ఞవేషములు వీరివచోరచనాచమత్కృతుల్
వీరివిలాసవైఖరులు వీరిమృదుస్వరకల్పనంబులున్
వీరికళాకలాపములు వీరిసమంచితగానసాహితుల్
చారుతరంబు లై ముద మొసంగుచు నున్నవి మీరు వింటిరే.

173


చ.

సరసవిచిత్రశబ్దపదసంగత మై కడువిశ్రుతార్థ మై
సురుచిరరక్తిఁ దంత్రిలయశోభిత మై మధురాంచితాయత
స్వర మయి పొల్చుమామకరసస్ఫుటదోశ్చరితప్రబంధముం
గర మనురక్తిఁ బాడెదరు కంటిరె యీసుకుమారసుందరుల్.

174


క.

మానసహర మై కర్ణపు, టానందం బై సుధాభ మై మధురం బై
యీనవ్యకథాగానం, బానందబ్రహ్మ మయ్యె నాలించితిరే.

175


వ.

అని పలికి యమందానందకందాయమానమానసుం డై రాముండు ముఖార
విందంబునకు మందహాసంబు చెలు వొసంగ సుమిత్రానందనాదు లభినందింపఁ
దక్కథాశ్రవణకుతూహలపరుండై మెల్లన సింహాసనంబు డిగ్గి సభామధ్యంబున
నాసీనుండై తత్సభాసదనంబు నెల్ల నలంకరింపంజేయుచు.

176


చ.

సురుచిరమూర్తుల న్భువనసుందరుల న్మునివేషధారులన్
వరనృపలక్షణాఢ్యుల దివాకరతేజుల దివ్యబోధసు
స్థిరుల సమానరూపులఁ గుశీలవులం గని మాకు వేడ్క న
న్నిరుపమకావ్యరాజకథ నే ర్పలర న్వినిపింపుఁ డింపుగన్.

177


వ.

అని పలికి సభాసదుల నందఱ విలోకించి మహానుభావు లగునీకుమారులు పార్థివ
లక్షణలక్షితులయ్యు మునులై కుశీలవులయ్యు మహాతపస్వు లై యొప్పుచున్న
వారు వీరివలన శ్రేయస్కరం బైనమదీయచరితంబు వినుండని పలికె నంత నా
రాజనందనులు సభామధ్యంబున విపంచిక లలవరించి ఘనరక్తిరాగంబు లెఱింగి
కాలంబు వీక్షించి మధురస్వరజాతు లేర్పఱిచి సార్వత్రికం బైనమార్గంబును
గ్వాచిత్కం బైన దేశీయంబునుం దెలిసి మధురంబును మనోహరంబును రంజ
నంబును స్వేచ్ఛానురూపస్వరాయామంబును దంత్రీలయవంతంబును బ్రసిద్ధా
ర్థంబును మనస్సంహ్లాదజనకంబును శ్రోత్రేంద్రియముఖకరంబును సకలవిద్వజ్జన
సేవ్యంబు నగు శ్రీమద్రామాయణమహాకావ్యంబు గానంబు సేయ నుపక్రమించి
కావ్యముఖంబునం దాశీర్నమస్క్రియావస్తునిర్దేశంబు లావశ్యకంబు లని యా
లంకారికోక్తి గలుగుటం జేసి రామరూపవస్తునిర్దేశపూర్వకంబుగా ని ట్లని చదు
వం దొడంగిరి.

178

శ్రీరాముని సభయందుఁ గుశలవులు రామాయణంబు గానము సేయుట

సీ.

తొల్లి యావైవస్వతుఁడు మొదల్గాఁ గొని యేవంశమున వారి దీధరిత్రి
యేవంశమునఁ బుట్టె నృపలోకవిద్వేషి సమవర్తి సగరాఖ్యచక్రవర్తి
వారిధు లేపుణ్యవంశమువారిచే నటు ద్రవ్వఁబడి సాగరాఖ్య నొందె
నేవంశమునఁ బుట్టె నిలకు మందాకినిఁ గోరి తెచ్చినయాభగీరథుండు


తే.

నట్టియిక్ష్వాకువంశంబునందు శుభద, మైనరామాయణాఖ్యమహాప్రబంధ
మంచితంబుగ నుత్పన్న మయ్యె నిదియ, ధర్మకామార్థసహితమై తనరుచుండు.

179


క.

ఈయాఖ్యానము సర్వ మ, సూయారహితాత్ము లగుచు సూరిజను లుపా
దేయంబుగఁ గొని వినఁ దగుఁ, బాయక వినకున్నఁ బ్రత్యవాయము గల్గున్.

180


క.

స్ఫీతం బై ధనధాన్యో, పేతం బై ముదిత మై యపేతదురిత మై
ఖ్యాతిగ సరయూనామన, దీతటమునఁ గోసలాఖ్యదేశం బలరున్.

181


సీ.

శ్లాఘ్యమానానంతలక్ష్మీవిలాసమై పొలుపారు వైకుంఠపురముభంగి
రాణించుఁ జతురాస్యవాణీసుహృద్యమై కమనీయసత్యలోకంబుకరణి
గురుసుధర్మామోఘసురభిశతక్రతుకలిత మై స్వర్గలోకంబుకరణి
ధననాథవరపుణ్యజనసమాకీర్ణమై, రాజిల్లు నలకాపురంబురీతి


తే.

వీరభద్రగణేశకుమారసహిత, మై నగాధీశుపురముచందానఁ దనరుఁ
గనకకలశితదినమధ్యగతమనోజ్ఞ, ధామనిధిగోపురం బయోధ్యాపురంబు.

182


ఉ.

ఆనగరంబు తొల్లి మను వానఁగరానిమనోరథంబుతో
శ్రీ నలువందఁగా సరయుచెంగట ద్వాదశయోజనాయతం
బౌ నిడుపుం ద్రియోజనమునంత తనర్పును గల్గునట్లుగా
దాని రచించె నేర్పలర ధారుణిఁ గోసలదేశమండలిన్.

183


క.

ముక్తాప్రసూనకలికా, యుక్తంబై శీతపరిమళోపేతవయ
స్సిక్తం బై తనరెడుసువి, భక్తమహాపథముచేత వఱలుచు నుండున్.

184


తే.

చారుశిల్పవిశేషంబు సర్వశస్త్ర, యంత్రములు సువిభక్తాంతరావణములు
హాటకవిచిత్రసౌధకవాటగోపు, రములు గలిగి చెలంగు నారాజధాని.

185


క.

అతులప్రభ మై సుశ్రీ, యుత మై యట్టాలకధ్వజోపేతం బై
వితతశతఘ్నీశతపరి, వృత మై యప్పురము వఱలు విశ్రుతభంగిన్.

186


తే.

సూతమాగధయుక్త యై సురుచిరామ్ర, వణమహొద్యానరచిత యై వరణదామ
కలిత యై కామినీనాటకప్రకీర్ణ, యై యనారత మప్పురి యలరుచుండు.

187


క.

కరిహరిరథోష్ట్రగోఖర, పరివృత మై ఘనగభీరపరిఖావృత మై
పరులకు దురాసదం బై, కర మద్భుతభంగిఁ బురము గ్రాలుచు నుండున్.

188


సీ.

బలిదాతృసామంతపార్థివసంఘంబు వివిధదేశాగతవిడ్జనంబు
రత్ననిర్మితబహుప్రాసాదపఙ్క్తు లత్యున్నతక్రీడాశిలోచ్చయములు

మహనీయకూటాఖ్యమందిరశ్రేణులు హృద్యమృదంగాదివాద్యములును
నలు వొప్ప వరసరనారీగణంబులు నిక్షుకాండరససదృక్షజలము


తే.

సర్వరత్నంబులు విమానసమగృహములు, శాలితండులములు చిత్రశాల లఖల
మణినిబద్ధభూములు హేమమండపములు, గలిగి యప్పురి భువనవిఖ్యాతి పడయు.

189


తే.

అనుపమాష్టాపదాకార మై విచిత్ర, మై యవిచ్ఛిద్ర మై రమ్య మై దివమున
సిద్ధులు దపంబుచే వడసినవిమాన, మట్లు సురుచిరగతి నొప్పు నప్పురంబు.

190


సీ.

పరసతీక్రీడావిభవభంగ మౌటచే జగతిఁ గామ్యవనంబు శప్త మయ్యె
వసుమతీజార్తిసంపాదక మగుటచేఁ దగ నశోకవన ముత్ఖాత మయ్యె
నజరభుజంగభోగాస్పదం బగుటఁ బుణ్యజనశూన్యం బయ్యె నందనంబు
కౌశికాధీన మై క్రాలుచుండుటఁ జేసి ధరణి ఖాండవవని దగ్ధ మయ్యె


తే.

ననుచు వీని నన్నింటిని యపహసించి, రాజరాజసేవ్యము లౌట రమణ చైత్ర
రథము లౌట నొక్కింత చైత్రరథమీడు, సేయఁదగి యొప్పు నుద్యానసీమలందు.

191


ఉ.

పాఱెడువానిఁ గైదువులఁ బట్టనివాని వివిక్తునిం గులా
ధారుని భీరుఁ గాంచి రణధాత్రి మహాలఘుహస్తు లయ్యు సొం
పారఁగ యుద్ధధర్మవిధ మంత నెఱింగి వధింప కెంతయున్
వారలఁ గాచి పుచ్చుదురు వారక వీటిమహారథోత్తముల్.

192


చ.

నిరుపమబాహుసత్వమున నేర్పున వ్యాఘ్రవరాహభల్లకే
సరిముఖవన్యసత్వముల సాహస మొప్పఁగఁ గాననంబులోఁ
గరమునఁ బట్టి వాఁడి గలఖడ్గము చేతఁ దలల్ గఱుక్కునన్
నఱికెడునట్టిసాహసజనం బొకకోటి వసించు నప్పురిన్.

193


చ.

అనఘులు బ్రహ్మకల్పులు మహాత్ములు వేదషడంగపారగుల్
మునిసము లాహితాగ్ను లతిపూజ్యులు శాస్త్రవిశారదుల్ తపో
ధనులు సహస్రదు ల్సుగుణధాములు సత్యరతు ల్జితేంద్రియుల్
దనరుదు రందు భూసురులు రామరసప్రియతుల్యతేజు లై.

194


సీ.

రమణీయచారుసరస్వతీకలితు లై చతురాస్యు లనఁగ విశ్రుతి వహించి
యరుణప్రభామనోహరసారసహితు లై లోకబాంధవుల నారూఢి మెఱసి
సమధికాక్షరసమస్తపదార్థకర్త లై పుణ్యజనేశ్వరస్ఫూర్తిఁ గాంచి
సమవర్తిగురుదత్తసత్కళావాసు లై ద్విజరాజు లనఁ జాలవినుతి కెక్కి


తే.

ధర శతానందులును ద్రయీతను లనంగ, ధనదు లనఁగ జైవాతృకు లనఁగఁ జాలఁ

బొగడు వడసి సర్వజ్ఞతాస్ఫురణ నెగడి, వఱలుదురు విప్రు లప్పురవరమునందు.

195


చ.

అతులితదివ్యశక్తిధరు లైనకుమారులు జన్యదుర్ధరా
హితబలహంత లై తగుమహేంద్రులు రాత్రిచరైకశిక్షణో
ద్ధతు లగునారసింహులు మహాహవదీక్షితదక్షభంజనో
ద్యతు లగు వీరభద్రులు జితశ్రము లప్పురి రాజనందనుల్.

196


మ.

తనమిత్రుం డొగి భైక్షవృత్తి నటు నిత్యంబుం బ్రవర్తింపఁగాఁ
గని వారింపని శ్రీదుఁ డెం తని రహిన్ గర్వించి సన్మిత్రులన్
ఘననానావిధకామదానముల వేడ్కం దృప్తి నొందించి మిం
చి నుతిం గాంచెద రప్పురీవరమునం జెల్వొందువైశ్యోత్తముల్.

197


మ.

వల నొప్పన్ హలముం ధరించి కుజనవ్రాతంబులం ద్రుంచె నా
బలభద్రుం డది యేఘనంబు ముద మొప్ప న్మేము తత్సీరముం
బొలుపారం గొని నిత్యముం గుజనులం బోషింతు మీ డౌనె నీ
స్తులతం బేర్కొనుమాకు నాముసలి యంచున్ బొల్తు రప్పాదజుల్.

198


తే.

లలి నదీజవనాయుజారట్టజములు, చీనబాహ్లీకకాంభోజసింధువిషయ
సంభవంబులు హరిహయసన్నిభంబు, లగుహయంబులచే నొప్పు నప్పురంబు.

199


చ.

అనుపమసార్వభౌమకుముదాభ్రము వల్లభరమ్యవామనాం
జనవరసుప్రతీకకులసంభవము ల్గిరితుల్యము ల్దురం
తనిబిడభూరిసత్వకలితంబులు నైనమదేభసంఘము
ల్ఘనతరబృంహితధ్వని సెలంగ రహి న్విహరించు నప్పురిన్.

200


తే.

భద్రమంద్రమృగంబులు భద్రములును, మంద్రములు మృగములు భద్రమంద్రములును
బరఁగ మృగమంద్రములు మృగభద్రములును, మదరసకటంబు లై యొప్పుమత్తకరులు.

201


వ.

మఱియు నప్పురంబునం దల్పసన్నిచయుండును నసిద్ధార్థుండును గామైకపరుం
డును గదర్యుండును నృశంనుండును నవిద్వాంసుండును నాస్తికుండును నకుం
డలియు ననుకుటియు నస్రగ్వియు నల్పభోగవంతుండును ననిర్మలశరీరుండును
నననులిప్తాంగుండును నసుగంధుండును నమృష్టభోజియు నవదాన్యుండును నసం
గదనిష్కుండును హస్తాభరణరహితుండును ననాత్మవంతుండును ననాహితా
గ్నియు యాగరహితుండును క్షుద్రుండును దస్కరుండును వర్ణసంకరుండును
ననృతవాదియు నబహుశ్రుతుండును నమాయకుండును నసమర్థుండును నష
డంగవిదుండును నపండితుండును నవ్రతుండును నసహస్రప్రదుండును దీనుం
డును విక్షిప్తచిత్తుండును వ్యాధితుండును నరూపవంతుండును నరాజన్యభక్తి

మంతుండును నొక్కం డైన లేఁడు బ్రాహ్మణజనంబులు ధర్మాత్ములును ముదితు
లును బహుశ్రుతులును సత్యవాదులును ద్యాగశీలురును గుటుంబవంతులును
గవాశ్వధనధాన్యవంతులును సుసంయుతులును శీలవంతులును వృత్తసంపన్ను
లును మహర్షికల్పులును స్వకర్మనిరతులును విజితేంద్రియులును దానాధ్య
యనశీలురును బ్రతిగృహంబునందు సంయుతులును నై ప్రకాశించుచుండుదు
రు క్షత్రియులును వైశ్యులును జఘన్యజులును నీమూఁడువర్ణంబులవారు కృతజ్ఞు
లై శూరు లై వదాన్యు లై విక్రమసంయుతు లై యలరుచుండుదురు మఱియు
నప్పురంబునం గలసర్వజనంబులు దీర్ఘాయుష్మంతు లై సత్యధర్మరతు లై పుత్ర
పౌత్రసహితు లై కళత్రవంతు లై వఱలుదురు మఱియును.

202


క.

ద్విజుల భజింతురు నృపతులు, ద్విజనృపుల భజింతు రెపుడు వీటికి రాటుల్
ద్విజన్మపవైశ్యుల నిత్యము, భజియింతురు పాదజనులు పరమప్రీతిన్.

203


శా.

హర్యక్షప్రతిమానశౌర్యులు మహాహంకారులుం గాంచనా
హార్యాభస్ఫుటధైర్యు లుగ్రసమరవ్యాపారులున్ విక్రమౌ
చార్యస్ఫీతమతు ల్మహామహులు యోధగ్రామణుల్ నిత్యమున్
హర్యక్షంబులు వోలె ద్రిమ్మరుదు రుద్యత్ప్రీతితో నప్పురిన్.

204


సీ.

రంభ యీడను టెట్లు లలితోరుకాండము ల్పరికించి సిగ్గున శిరము వంప
హరిణి జో డను టెట్లు స్ఫురితేక్షణవిలాస మది కాంచి నంతనె బెదరి పఱచు
నలతిలోత్తమ సాటి యను టెట్లు నాసికాకృతిఁ గనుంగొని తలక్రిందు గాఁగ
శశిరేఖ సరి సేయఁ జను టెట్లు నెన్నొస ల్పసఁ గాంచి కళలకుఁ బాసిపోవ


తే.

హేమ యెన యగు టెట్లు యహీనగాత్ర, కాంతిఁ జూచినమాత్రనె కరఁగిపోవ
నఖిలభువనమనోజ్ఞరూపాఢ్య లగుచుఁ, దనరు నవ్వీటివారకాంతామణులకు.

205


తే.

అలఘుతరతారకాహృద్య మై యమేయ, వసువిశాల మై యుచితధ్వజము నగుచు
రాజమార్గంబుకరణి నారాజధాని, రాజమార్గంబు శోభిల్లు రమ్య మగుచు.

206


తే.

ఎలమి శక్రుండు సురలోక మేలినట్లు, శ్రీదుఁ డల కాపురంబు రక్షించినట్లు
ధరణి రాజోత్తముం డైనదశరథుండు, లీలతో నప్పురంబుఁ బాలించుచుండు.

207


చ.

అలఘుతరప్రతాపమున నారయ శీతలచిత్తవృత్తికిం
వలరఁగ నామసామ్యమున నయ్యినరాజులె సాక్షిగాఁ జతు
ర్జలనిధు లెన్ని చూడ వరుస న్బొలిమేరలుగా సమస్తభూ
తలగురుభారవాహి యయి తద్దయు నొప్పె నతండు ధారుణిన్.

208


వ.

మఱియు నచ్చట నివసించి దశరథుండు జగంబుఁ బరిపాలించుచుండు నట్టియో
జనత్రయవిస్తారం బైనసాకేతపురమధ్యంబునందు యోజనద్వయమాత్ర
ప్రదేశంబున కయోధ్య యనెడునామంబు సత్యనామం బై యుండు నట్టిమహా
రాజధానిఁ బరిపాలించుచు నమ్మహారాజశేఖరుండు సర్వవిదుండును సర్వసంగ్ర

హుండును దీర్ఘదర్శియు మహాతేజుండును బౌరజానపదప్రియుండును నిక్ష్వాకు
శ్రేష్ఠుండును యాగశీలుండును ధర్మరతుండును నియతేంద్రియుండును మహర్షి
కల్పుండును రాజర్షిముఖ్యుండును ద్రిలోకవిశ్రుతుండును బలవంతుండును జితా
మిత్రుండును సుమిత్రవంతుండును విజితేంద్రియుండును శక్రవైశ్రవణసంకాశుం
డును నై ప్రసిద్ధి వహించినవాఁడు మఱియును.

209


క.

అనిమిషపతి సురలోకం, బనువుగఁ బాలించుభంగి నన్నరపతి మే
దినిఁ బాలించుచునుండును, మను విక్ష్వాకుండువోలె మంజులఫణితిన్.

210


తే.

ఆమహారాజమౌళి కర్ధాంగు లగుచు, గరిమతో సర్వమంగళాఖ్యాతి వడసి
వరసతీత్వవిశేషవిస్ఫురణఁ బొల్తు, రెలమి మున్నూటయేఁబండ్రు జలజముఖులు.

211


తే.

మించి కౌసల్య గైక సుమిత్ర యనఁగ, హంసగతి సతీజలజాతహస్త లగ్ర
సతులు గల రందు మువ్వు రాసకలలోక, ధవున కారాజమౌళి కాదశరథునకు.

212


క.

ఆరాజవరున కభిరత, కారులు ఋత్విజులు మునులు గల రిరువురు సొం
సారఁగ వసిష్ఠుఁ డనఁగా, ధీరోదారుండు వామదేవుం డనఁగన్.

213


చ.

వినయవరు ల్వివేకగుణవిశ్రుతిధన్యులు మంత్రకోవిదుల్
జనపతికార్యసాధనవిచారసమర్థులు శత్రుమర్మభే
దనసదుపాయధుర్యు లతిధార్మికు లుత్తము లష్టమంత్రు లా
ర్యనుతులు సత్యవాదులు మహామహులుం గల రాజితారికిన్.

214


తే.

అర్థసాధకవిజయసిద్ధార్థదృష్టి, మంత్రపాలకాశోకసుమంత్రులును జ
యంతుఁ డనుపేర్ల నొప్పగునట్టివారు, ధన్యులు సునీతిపరులు ప్రధానవరులు.

215


తే.

క్రోధమున నైనఁ గామంబుకొఱకు నైన, నర్థకారణమున నైన ననృత మాడ
రన్యులం దైన స్వజనులం దైన వారి, కవిదితం బైన కార్య మింతైన లేదు.

216


తే.

సంతతముఁ జారముఖమున సర్వరాష్ట్ర, కృత్యము లెఱింగి హితశత్రువృత్తిఁ దెలిసి
పరులకలిమియు లేమియు నరసి యభయ, మొసఁగి వ్యవహారకుశలు లై యుందు రెపుడు.

217


తే.

తప్పు గలిగినవేళ నందనుల నైనఁ, గూర్మి విడిచి దండింతురు ధర్మభీతిఁ
దప్పు లేనిచో సరి నైన నొప్పు విడిచి, కడిమి దండింప రెంతయుఁ గలుషభీతి.

218


క.

సతతంబు విషయవాసులు, వ్రతశీలుర శుచుల నరసి రక్షించుచు దు
ర్మతుల వెదకి శిక్షించుచు, క్షితిపతికోశాభివృద్ధిఁ జేయుదు రెలమిన్.

219


చ.

పురుషబలాబలం బెఱిఁగి పొందు ఘటించుచు వర్ణధర్మముల్
దఱుఁగక యుండునట్లు సతతంబును బ్రోచుచు నేకబుద్ధులన్
వెరవరులం దగం బనులవెంటఁ జరింపఁగఁ బంపుచున్ మహీ
వరునకుఁ గీర్తిలాభవిభవంబులఁ దా రొనఁగూర్తు రెంతయున్.

220

క.

పురమందు రాష్ట్రమందును, బరదారరతుండు కల్లఁ బలికెడువాఁడున్
గురుదూషకుండు ఖలుఁ డొ, క్కరుఁ డైనం గలుగకుండఁ గాతురు మిగులన్.

221


క.

పతిహితముకొఱకు ననిశము, చతురత నయలోచనమున జాగ్రన్మతు లై
సతతంబు నఖిలకార్యము, లతులితముగఁ దీర్చుచుందు రధికప్రీతిన్.

222


క.

మతినిశ్చయంబువలనను, వితతపరాక్రమమువలన వీర్యమువలనన్
ధృతిపెంపునఁ బరవిషయ, ప్రతతులయం దైనఁ బొగడువడయుదు రెందున్.

223


క.

ప్రకృతివినీతులు జితరిపు, లకలంకులు గపటరహితు లద్భుతశీలుల్
సకలజ్ఞులు మనబృందా, రకగురుసన్నిభులు వరకళాశాలు రిలన్.

224


వ.

మఱియు మంత్రజ్ఞులును ముఖవికాసాదిచిహ్నంబుల చేతఁ బరాభిప్రాయవిదు
లుకు బ్రియహితరతులును విద్యావినీతులును నియతేంద్రియులును హ్రీమంతు
లును బరస్పరానురక్తులును నీతిమంతులును బహుశ్రుతులును శ్రీమంతులును
మహాత్ములును శాస్త్రజ్ఞులును దృఢవిక్రములును గీర్తిమంతులును సర్వ
కార్యంబులయందు సావధానులును నానాస్త్రప్రయోగప్రతిపాదకధనుర్వేద
విదులును యుక్తవచనకారులును దేజఃక్షమాయశోయుక్తులును స్మితపూ
ర్వాభిభాషులును వీరులును సువాసులును సువేషులును సుశీలురును విఖ్యాత
పరాక్రములును గుణదోషవిశారదులును సర్వాభిజ్ఞులును మంత్రరక్షణంబు
నందు యుక్తులును సూక్ష్మార్థవిషయనిశ్చయంబునందు శక్తులును నీతిశాస్త్ర
విశేషజ్ఞులును బ్రియవాదులును భృశానురక్తులును సమర్థులును నై యొప్పు
చుందు రిట్టిమంత్రులచేత నద్దశరథుండు పరాభిభవసామర్థ్యప్రచురమయూఖ
సహస్రంబులచేత నుదితార్కుండునుం బోలె దీప్తి నొంది సర్వగుణంబులకు
మూలంబై చారముఖంబువలన స్వపరరాష్ట్రకృత్యంబు లెఱింగి ధర్మంబునఁ బ్ర
జల రక్షించుచు లోకత్రయంబునందుఁ బ్రసిద్ధి వహించి తనకు సమానునిఁ దన
కంటె నధికునిం గానక ప్రతాపనిహతకుంటకుం డై వశీకృతసామంతుం డై
మిత్రవంతుండై శక్రుండు స్వారాజ్యంబునుంబోలె స్వరాజ్యంబుఁ బెద్దకాలం
బుఁ బరిపాలించుచుండె.

225


ఆ.

నీతిధర్మవిదున కేతాదృశప్రభా, వునకు సుతనిమిత్త మనవరతముఁ
దపము సలుపునట్టి దశరథునకు వంశ, కరుఁడు నందనుండు గలుగఁ డయ్యె.

226


క.

ఘనముగఁ జింతించెడు నా, మనుజవిభుని కిన్నినాళ్లు మఱి యే నేలా
తనయార్థ మశ్వమేధ, మ్మొనరింపఁగ నైతి ననుచు నొకమతి వొడమెన్.

227


ఉ.

మానుగ నమ్మహీవిభుఁడు మంత్రుల నందఱఁ గూడి యాగముం
బూనికిఁ జేయువాఁడ నని మోదముతో మది నిశ్చయించి తా
మానక మంత్రిసత్తము సుమంత్రునిఁ గనొని నీవు సర్వవి
ద్యానిధు లైనమద్గురుల నందఱఁ దోడ్కొని రమ్ము నావుడున్.

228

వ.

రయంబునం జని పురోహితుఁ డగువసిష్ఠుని వేదపారగు లైనసుయజ్ఞవామ
దేవజాబాలికాశ్యపులను మఱియుం దక్కినబ్రాహ్మణోత్తముల రాజప్రియ
చికీర్షుల రాజసకాశంబునకుం దోడ్కొని వచ్చిన నద్దశరథుం డమ్మహాత్ముల
నుచితసత్కారంబులఁ బ్రీతులం జేసి మృదుపూర్వకంబుగా ధర్మార్థసహితం బగు
వాక్యంబున ని ట్లనియె.

229

దశరథుండు పుత్రార్థ మశ్వమేధచికీర్షుఁడై వసిష్ఠాదులతో నాలోచించుట

తే.

వరసుతార్థము పెక్కుసువ్రతము లేను, జాలఁ జేసియు వడయంగఁ జాల నైతి
ననఘమతులార యిపుడు మీయనుమతమునఁ, బూని హయమేధ మొనరింప బుద్ధి వొడమె.

230


క.

కావున హయమేధం బేఁ, గావించెద శాస్త్రదృష్టకర్మంబున నా
కేవిధిఁ దనయుని వడయం, గా వలనగు నట్టితెఱఁగు ఘటియింపుఁ డిఁకన్.

231


చ.

అని జనభర్త పల్కుటయు నమ్మునినాథులు తన్ముఖేరితం
బును బరమార్థసాధన మమూల్యము నైనతదుక్తిఁ గౌశలం
బును విని కౌతుకంబు ముదముం జెలువార బహూకరించుచున్
మనుజవరేణ్యుతో సనిరి మానుగ వెండియు మంజులోక్తులన్.

232


చ.

క్షితివర నీతలంపు పరికింపఁగ మంచిది దీన నీదువాం
ఛితము ఫలించు నిక్కముగఁ జెప్పెడి దే మిఁకఁ దత్ప్రయత్నముం
జతురతఁ జేయు మశ్వమును సత్వరత న్విడిపింపు మాప్తసం
యుతముగ యజ్ఞశాల సరయూత్తరమందు రచింపు మింపుగన్.

233


చ.

అన విని భూమిభర్త ముద మంది యమాత్యులఁ జూచి వారి కి
ట్లను గురువాక్యపద్ధతి మఖాశ్వము నుగ్రబలాన్వితంబుగా
నొనరిచి చెచ్చెర న్విడువుఁ డొప్పుగ నాసరయూతటంబునన్
ఘనతరశాస్త్రసమ్మతముగా రచియింపుఁడు యజ్ఞవాటికన్.

234


వ.

మఱియుఁ గల్పోక్తప్రకారంబున యథాశాస్త్రంబుగా యజ్ఞవిఘ్ననివారకకర్మం
బులు నిర్వహింపుఁ డీయజ్ఞంబునందు మంత్రలోపక్రియాలోపాద్యపరాధంబులు
గలుగకుండెనేని యీయజ్ఞంబు సర్వమహీపతులచేతఁ బ్రాపించుటకు శక్యం బై
యుండు విద్వాంసులు బ్రహ్మమునుంబోలె విద్వాంసు లగు బ్రహ్మరాక్షసు లిందు
ఛిద్రం బన్వేషించుచుండుదురు వారివలన యజ్ఞంబు నిహతం బయ్యె నేని
యజ్ఞకర్త నశించు మీరు సమర్థులరు గావున నట్టివిఘ్నంబు లెవ్వియుఁ గలుగ
కుండుశాస్త్రదృష్టవిధానంబున యజ్ఞంబుఁ బరిసమాప్తి నొందించునట్టి
భారంబుఁ బూనవలయు నని పలికిన నయ్యమాత్యులు మహీరమణుని వచ
నంబుల కలరి దేవా భవత్ప్రసాదంబున నెల్లపనులు గొఱంత పడకుండ నిర్వ

ర్తించెద మని పలికి యతనిచేత ననుజ్ఞాతులై నిజనివాసంబులకుం జనిరి వసిష్ఠాది
మహర్షులు యుక్తప్రకారంబున దశరథునిచేతఁ బూజితులై యాశీర్వదించి య
నుజ్ఞ వడసి తమతమవిడుదులకుం జని రంత నమ్మహీకాంతుండు సచివుల నంద
ఱ నిజనివాసంబులకుం బోవం బనిచి తాను నభ్యంతరమందిరంబునకుం జని
మనోహారిణు లగునిజపత్నులం జూచి యేను సుతార్థంబు హయమేధయాగంబుఁ
జేసెద మీరు దీక్ష వహింపుం డనిన వారు మనోహరం బైనపతివచనంబు విని
హిమాత్యయంబునందలిపద్మంబులుం బోలె ముఖపద్మంబు లత్యంతశాంతి
సౌకుమార్యంబునం దనరఁ బరమానందభరితహృదయ లై యుండి రప్పు
డేకాంతంబున సూతుం డంజలి ఘటించి దశరథున కి ట్లనియె.

235

సుమంత్రుండు దశరథునకు సనత్కుమారోక్తరహస్యముం దెలుపుట

తే.

నరవరోత్తమ తొల్లి సనత్కుమార, మౌనివర్యుండు మునిసభామధ్యమందుఁ
బొసఁగ మీకుఁ గుమారులు పుట్టునట్టి, విధము దెలియంగఁ బలికె సవిస్తరముగ.

236


మ.

అది యేను న్విని యున్నవాఁడఁ దగ నయ్యర్థంబు మీ కర్థిఁ దె
ల్పెద నాలింపుము కాశ్యపాత్మజుఁడు నక్లిష్టస్వభావుండు ని
ర్మదుఁ డార్యుండు విభాండకుం డనఁగ విప్రశ్రేష్ఠుఁ డుద్యద్గుణా
స్పదుఁ డొక్కండు గలండు నిశ్చలతపస్సంపన్నుఁ డమ్మౌనికిన్.

237


చ.

ఘనమతి ఋశ్యశృంగుఁ డనఁగా నొకపుత్రుఁడు గల్గు నాతఁ డా
వనమున నిత్యముం బెరిగి వారక పిత్రనువర్తనంబుచే
ననవరతంబుఁ గాననమునందె చరించుచు నుంటఁ జేసి తా
మనమున నించుకైనఁ బరమర్త్యు నెఱుంగక యుండు నెంతయున్.

238


క.

ధీవరుఁ డగునమ్మౌనికిఁ, బావనలోకప్రసిద్ధపరమర్షికృతం
బై వఱలు బ్రహ్మచర్య, ద్వైవిధ్యము గలుగు నధికతాత్పర్యమునన్.

239


క.

పితృశుశ్రూష యొనర్చుచు, సతతముఁ బావకునిసేవ సలుపుచు యోగా
న్వితుఁ డై యీగతి నిత్య, వ్రతుఁడై మునిసుతుఁడు గాన వర్తించు నెడన్.

240

రోమపాదమహారాజవృత్తాంతము

చ.

అనఘవిచారుఁ డంగవిభుఁ డద్భుతవీర్యుఁడు రోమపాదుఁ డ
త్యనుపమలీల లోకనుతుఁ డై బుధసమ్మతుఁ డై యరాతిసూ
దనుఁ డయి రాజధర్మ మది దప్పక రాజ్యము సేయుచుండుఁ జం
దనశశికుందపాదరసధామవిడంబియశోభిరాముఁ డై.

241


వ.

అమ్మహీపతి విధినిషేధోల్లంఘనంబున.

242


తే.

అఖిలభూతక్షయావహ యై సుఘోర, యై సుదారుణ యై లోక మబ్జదళస
లిలముగతిఁ దల్లడిల ననావృష్టి దోఁచె, నమ్మహీపతి సేయు రాజ్యంబునందు.

243


తే.

అట్టికాలవిపర్యాస మంతఁ జూచి, ధారుణీభర్త శోకసంతప్తుఁ డగుచు

వేదవేదాంగవిదు లైనవిప్రవరులఁ బిలువ నంపించి యిట్లని పలుకు నపుడు.

244


క.

మునివర్యులార మీ రెఱుఁ, గనియర్థ మొకింత లేదు కద ముల్లోకం
బున నేయుపాయ మొనరిం, చిన వానలు గురియు దానిఁ జెప్పుఁడు మీరల్.

245

వ.

అని యడిగిన నమ్మునీంద్రు లన్నరేంద్రునిం జూచి యీయనావృష్టి వాయు
టకుం దగినయుపాయం బెఱింగించెదము వినుము.

246


క.

ఘనుని విభాండకతనయునిఁ, బ్రణుతగుణుని ఋశ్యశృంగు రావించి భవ
త్తనయను శాంత నొసఁగి మిం, చినయనురాగమునఁ బెండ్లి సేయుము ప్రీతిన్.

247


తే.

ఈయుపాయంబుఁ దక్కి యెం డేయుపాయ, మునఁ జనదు యీయనావృష్టి యని మునీంద్రు
లానతిచ్చిన విని విభుఁ డామునీంద్రుఁ, డిచటి కరుదెంచుట కుపాయ మెద్ది యొక్కొ.

248


వ.

అని బహుప్రకారంబులం దలపోసి నిశ్చయించి.

249


క.

తనమంత్రులను బురోహితుఁ, గనుఁగొని మునినాథునిం దగం దోడ్కొని రం
డని పలికిన వారు మనం, బున నెక్కుడు భయము గదుర భూపతితోడన్.

250


క.

మోమున దైన్యం బడరఁగ, నే మామునిసుతునిపాలి కేగఁగ లే మో
భూమిూశ యనుచు వేఁడిన, నామనుజవిభుండు చిత్తమందుఁ దలఁకుచున్.

251


వ.

ఇంక నెయ్యది కార్యం బని విచారించుచున్నంత.

252

రోమపాదుండు వేశ్యలచే ఋశ్యశృంగుఁ దోడి తెప్పించుట

క.

లలితసుకుమారయౌవన, కలితాంగులు రూపవతులు గణికలు నృపు ముం
గల నిల్చిరి నయమున నం, జలిఁ జేసి మృదూక్తు లలరఁ జతురత మెఱయన్.

253


క.

జనవర యే మామునినుతు, ననుపమచాతుర్య మొప్ప నతిరయమునఁ దో
డ్కొని వచ్చెద మిప్పురమున, కనుపుము మము మా కసాధ్య మవనిం గలదే.

254


వ.

అని పలికి యమ్మహీపతిచే ననుఙ్ఞాత లై యవ్వారకాంతలు వనంబునకుం జని
వివిధోపాయంబుల నమ్మునిసుతునిచిత్తంబు లోఁగొని పురంబునకుం దోడ్తేరఁ
గల రట్లు దోడ్కొని వచ్చిన.

255


క.

మునిపతి వచ్చినమాత్రనె, తనివి సన న్వృష్టి గురియు ధరణీవిభుఁ డా
యన సత్కరించి గ్రక్కునఁ, దనకూఁతును శాంత నొసఁగుఁ దద్దయుఁ బ్రీతిన్.

256


తే.

రోమపాదునిజామాత లోకనుతుఁడు, ఋశ్యశృంగుఁడు మీకు సంప్రీతి సుతుల
నిచ్చు నని పల్కె తొల్లి మునీంద్రుఁ డాస, నత్కుమారుఁడు మునులు వినంగ నధిప.

257


వ.

ఏ నత్తెఱంగు సంక్షేపంబుగా మీకుం జెప్పితి నని విన్నవించిన విని యద్దశర

థుండు సంతుష్టాంతరంగుండై సుమంత్రుతో ఋశ్యశృంగుండు గణికలచేత
నెత్తెఱంగున నానీతుం డయ్యె దాని సవిస్తరంబుగా వినవలతుం జెప్పు మని
యడిగిన నతండు సనత్కుమారోక్తప్రకారంబున మహీరమణున కి ట్లనియె.

258

సుమంత్రుఁడు దశరథునకు ఋశ్యశృంగానయవిధంబుఁ దెల్పుట

ఆ.

అధిప రోమపాదుఁ డాఋశ్యశృంగుఁ డిం, కెవ్విధమున నిచటి కేగుదెంచు
నని తలంచుచుండ నాసమయమునఁ బురోహితుండు పలికె నూహఁ జేసి.

259


తే.

మాకు శక్యంబు గాదు యమ్మౌనిసుతునిఁ, దోడి తెచ్చుట కాత్మలోఁ దోఁచినంత
పాటినిరపాయ మైనయుపాయ మొకటి, యేను జెప్పెద వినుము మహీశవర్య.

260


ఉ.

ఆమునినందనుం దుదయ మాదిగఁ గానల నుంటఁ జేసి తాఁ
గామినిరూపయౌవనవికాసము నింద్రియసౌఖ్యసౌష్ఠవం
బేమి యెఱుంగఁ డించుకయు నెప్పుడు నన్యులతోడిపొత్తుఁ గై
కోమి గుణప్రభూత మగుకోపముఁ గైకొన కుండుఁ గావునన్.

261


వ.

ఇప్పుడు రూపయౌవనసంపన్న లగువారకాంతలు బహువిధాలంకారంబులం
గైసేసి మునిపాలికిం జని మనోరమాభిమతేంద్రియార్థంబులచేత నతనిచిత్తం
బు వడసి నానావిధోపాయంబుల నిచ్చటికిం గొనితెచ్చెదరు శీఘ్రంబున నట్టి
వారి నేర్పఱించి పంపు మనిన నమ్మహీరమణుండు రూపయౌవనవిలాసతిర
స్కృతాప్సరఃకాంత లగువారకాంతల నమ్మునిపుత్రుపాలికిం జనుం డని.

262


చ.

పనిచిన వేడ్కతోఁ దపసి భవ్యతరాశ్రమభూమి కేఁగి రా
వనరుహగంధు లందమున వారక గంధవహాస్యపుష్పనూ
తనశుకశారికాభిసముదాయమరాళమయూరపఙ్క్తు లొ
య్యన సయిదోడుగా నడువ నవ్వలరాయనితూపులో యనన్.

263


వ.

ఇట్లు తదాశ్రమసమీపంబునకుం జని.

264


తే.

వనచరుఁడు ధీరుఁ డాశ్రమవాసి పురుష, మానినీతారతమ్య మింతైన నెఱుఁగఁ
డమ్మునికుమారుఁ జూచు టె ట్లతనితోడఁ, బలుకు టెట్లు తచ్చిత్తంబు పడయు టెట్లు.

265


క.

పితృపూజాతత్పరుఁ డై, సతతతపోయుక్తి నాత్మసంతుష్టుం డై
చతురత నొప్పెడు నమ్ముని, పతి యె ట్లాశ్రమము విడిచి పఱతెంచునొకో.

266


తే.

జనన మాదిగ నమ్మహామునిసుతుండు, పురమునందు రాష్ట్రమునందుఁ బుట్టినట్టి
పురుషునైనను సతినైన మఱియు నన్య, మెెద్ది యేనియు నెఱుఁగఁ డొకించుకైన.

267


క.

అనుచుఁ దలపోయునెడ న, మ్మునిపుత్రుఁడు దైవయోగమునఁ జేసి తనం
తన తాను వారియొద్దకుఁ, జనుదెంచినఁ జూచి చెలులు సంభ్రమ మలరన్.

268


చ.

సలలితచిత్రకంచుకము చాటునఁ గుల్కు మిటారిగబ్బిగు
బ్బ లొలయఁగా హిరణ్మయవిపంచికలం ధరియించి వారకాం
తలు మునిపుత్రుకట్టెదుటఁ దంత్రులు మీటుచు రాగసంపద

ల్దలకొనఁ బాడి రందు సుకలస్వరముల్ సరవిం జెలంగఁగన్.

269


వ.

ఇట్లు సుస్వరంబుగా గానంబుఁ జేయుచు నమ్మునిచెంత నిలిచి యతనితో ని
ట్లనిరి.

270


క.

ధరణీసుర నీ వెవ్వఁడ, నరయఁగ నతిఘోర మీమహాగహనమునన్
జరియించె దేల యొంటిగఁ, దిరముగ నీకలతెఱంగుఁ దెలియం జెపుమా.

271


ఆ.

అనుచు వార లడుగ నమ్మునితనయుండు, హృష్టచిత్తుఁ డై యదృష్టపూర్వ
లగుటఁ జేసి మిగులహార్దంబువలన న, య్యిందుముఖులఁ జూచి యిట్టు లనియె.

272


తే.

బ్రహ్మసముఁడు మాతండ్రి విభాండకాఖ్యుఁ, డతని కౌరసపుత్రుండ నౌదు నేను
బృథివి నానామ మది ఋశ్యశృంగుఁ డనఁగ, నధికవిశ్రుతమై యొప్పు ననుదినంబు.

273


వ.

ఇది మదీయాశ్రమంబు మీ కందఱికి విధిపూర్వకంబుగా నతిథిసత్కారంబుఁ
గావించెదఁ బ్రతిగ్రహింపుం డని పలికిన నతనిపలుకుల కలరి యవ్వెలందులు
పర్ణశాలలోనికిం జనిన.

274


క.

మునినందనుండు వారికిఁ, బనిగొని యుచితాసనార్ఘ్యపాద్యంబులు నూ
తనమూలఫలంబులు స, య్యన నొసఁగి కృపన్ గ్రహింపుఁడని వేఁడుటయున్.

275


క.

వారంద ఱుత్సుకంబున, గౌరవమునఁ దపసిపూజఁ గైకొని మరలన్
శైరీషకుసుమపేశల, సారామృతకల్పసూక్తి సంయమితోడన్.

276


ఆ.

మునికుమార నీకు ముఖ్యఫలంబులు, దివిరి కాన్క గాఁగఁ దెచ్చినార
మివె పరిగ్రహింపు మిప్పుడె భక్షింపు, మలఘుతేజ శుభము గలుగు నింక.

277


చ.

అని నయ మారఁ బల్కి చెలులందఱు కౌతుక ముప్పతిల్లఁగా
మునిసుతుఁ గౌఁగిలించుకొని మోద మెలర్పఁగ మోదకాదినూ
తనబహుభవ్యభక్ష్యము లుదారత నిచ్చిన నారగించెఁ బా
వనగుణమూర్తి నిక్కముగ వన్యఫలంబు లటంచు నెంచుచున్.

278


వ.

అంత నక్కాంతలు మునివలని భయంబున వ్రతచర్యోపదేశంబు నతనికిం జెప్పి
యరిగిన నవ్విభాండకనందనుం డస్వస్థహృదయుండై తద్వియోగజనితదుఃఖం
బునం బెటలిపడుచు నారేయి గడిపి మరునాఁడు తదాశ్రమసమీపంబున విహ
రించునెడ నెప్పటియట్ల యలంకృత లై వెలయాం డ్రమ్మునికిం బొడసూపి తగు
తెఱంగున నుపసర్పించి తచ్చిత్తం బాత్మాయత్తం బయ్యెనని హర్షించి యతని
కిట్లనిరి.

279


చ.

అనఘచరిత్ర తాపనకులాంబుధిపూర్ణశశాంక మీతపో
వనమున కేగుదెంచితిమి వారక మే మిఁక మీరు మాతపో
వనమున కర్థి రావలయు వంచన సేయక యంచుఁ బల్క
మునిసుతుఁ డట్ల కాక యని మోద మెలర్పఁగ సమ్మతించినన్.

280


చ.

తరుణులు నత్తపస్విని ముదంబున గ్రుచ్చి కవుంగిలించి చె

చ్చెర నధరంబు నాని తమిఁ జెక్కులు నొక్కి యురం బురంబునం
గర మనురక్తి హత్తి జతనంబున హస్తముఁ బట్టి యిమ్మెయి
న్వరఁకులఁ బెట్టి తెచ్చిరి యవార్యరతిన్ నృపవర్యువీటికిన్.

281


క.

ఈకరణి మునికుమారుం, డాకమలాసనసమానుఁ డప్పురమునకున్
వీఁకఁ జనుదేర నప్పుడె, ప్రాకటముగ వృష్టి గురిసె పర్జన్యుఁ డిలన్.

282


మ.

జననాథుం డెదు రేగుదెంచి మదిలో సంతోష మేపారఁగా
బ్రణతుం డై పురవాసు లందఱు నుతింపన్ వైభవాడంబరం
బున నత్తాపసపుత్రుఁ డచ్చెరువుతో మోదింప సద్మాంతరం
బునకుం దోడ్కొని వచ్చి యర్హవిధులం బూజించి యత్యున్నతిన్.

283


మ.

తనకూఁతుం దరలేక్షణం దతకటిం దారుణ్యపాథోనిధిన్
ఘనవేణిన్ నతనాభి నిందువదనం గళ్యాణి శాంతన్ మహా
మునిరాజానుమతంబునం దపసి కామోదంబుతో నిచ్చి య
జ్జననాథాగ్రణి పెండ్లిఁ జేసె నృపు లెంచ న్మంచిలగ్నంబునన్.

284


క.

ఈసరణిం దనపుత్రిక, నాసంయమి కొసఁగఁ గూతు రల్లుఁడు నింటం
భాసిల్లుచుండఁగాఁ ద, ద్దేశం బతిసుఖద మయ్యెఁ దేజం బెసఁగన్.

285


వ.

ఇట్లు ఋశ్యశృంగుండు శాంతావశంగతమానసుం డై యంగపతిగృహంబున
నభీష్టవినోదంబులం దేలుచుండు.

286


సీ.

అత్తఱి భానువంశాంభోధిచంద్రుండు దశరథుం డనియెడు ధరణివిభుఁడు
సత్యప్రతిశ్రవుం డత్యంతశౌర్యుండు గొడుకులఁ బడయంగఁ గోరి క్రతువుఁ
గావింపఁదలఁచి యంగక్షితీశ్వరుఁ డైన రోమపాదునితోడ రూఢి మెఱయ
సాచివ్య మొనరించి చతురత నాతనియనుమతి వడసి మహాత్ముఁ డైన


తే.

ఋశ్యశృంగునిఁ బత్నీసహితునిఁ జేసి, వేడ్కఁ గొనివచ్చి యమ్మహాద్విజవరేణ్యు
నధ్వరప్రజాస్వర్గార్థ మటు వరించి, శిష్టసమ్మతి జన్మంబు సేయఁగలఁడు.

287


వ.

మఱియు నమ్మనిపుత్రునిప్రసాదంబున నిమ్మహీపతికి వంశప్రతిష్ఠానకరులును
సకలలోకవిశ్రుతులును వీర్యవిక్రమసంపన్నులు నగుకుమారులు నలుగు రుద
యింతు రని భగవంతుండును దేవప్రవరుండు నగుసనత్కుమారుండు ము
న్నెఱింగించెఁ గావున.

288


చ.

పురుషవరేణ్య నీ విపుడు పొందుగ సర్వబలాన్వితుండ వై
గురుమతి నమ్మునీంద్రుకడకుం జని సత్కృతిఁ జేసి వీఁకతో
నరుదుగఁ గోరి తెచ్చి తగ నాయనచే హయమేధయాగముం
జిరశుభలీల నాంగముగఁ జేసితి వేని జనింతు రాత్మజుల్.

289


క.

అని యాసచివాగ్రణి యా, యనతో మునిపుత్రుచరిత మంతయుఁ జెప్ప
న్విని సంతోషము గుతుకము, జనియింపఁగ దశరథుండు సంభ్రమపరుఁ డై.

290

క.

ఆవేళనే వసిష్ఠుని, రావించి యమాత్యవరుల రావించి నతుల్
గావించి చాల మన్ననఁ, గావించి యనుజ్ఞ వడసి గమనోన్ముఖుఁ డై.

291

దశరథుఁడు ఋశ్యశృంగమహామునిఁ దోడితెచ్చుట

తే.

మంత్రిబాంధవసచివసమన్వితముగఁ, గదలి వనములు నదములు నదులుఁ గడచి
విషయములు గొన్ని దాఁటి యవ్విభుఁడు ఋశ్య, శృంగముని యున్నదేశంబుఁ జేరఁ బోయి.

292


క.

అలరుమఖాయతనంబున, విలసిల్లెడుదీపవహ్నివిధమున నిత్యం
బలరోమపాదుగృహమున, నలరారెడుఋశ్యశృంగు నర్మిలిఁ గాంచెన్.

293


క.

కని వినయవిధేయుం డై, జననాథకులోత్తముండు సముచితగతి న
మ్మునివంశశిఖామణి కా, సనార్ఘ్యపాద్యాదిపూజ సలిపి ముదమునన్.

294


వ.

నానావిధనయవాక్యంబులం బ్రస్తుతించి యున్నంత.

295


క.

ఆరోమపాదుఁ డల్లుని, తో రమణీయార్కవంశతోయధిచంద్రుం
డీరాజు దశరథుం డను, పేరన్ విలసిల్లువాఁడు పృథుబలుఁ డుర్విన్.

296


ఆ.

అనుచుఁ దెలిపి యంగజనపతి దశరథ, జనవరేణ్యుఁ బ్రీతి సత్కరించి
ప్రాభవమునఁ జాలఁ బ్రార్థింపఁ బదియైదు, దినములుండి యొక్కదినమునందు.

297


వ.

రోమపాదుని కి ట్లనియె.

298


క.

జనవర నీపుత్రిని శాం, తను గాంతోపేతఁ జేసి దయ మత్పురికిం
బనుపంగ వలయు మా కొక, పని గల దమ్మౌనివలనఁ బరికింపంగన్.

299


ఉ.

నా విని రోమపాదుఁడు మనంబున సంతస మంది యల్లునిం
ధీవరుఁ గాంచి యీమనుజదేవునివెంట సతీయుతంబుగాఁ
బోవలె నన్న నాజటిలపుంగవుఁ డ ట్లగుఁ గాక యంచు నా
క్ష్మావరువెంట నేగెఁ గుతుకం బలరన్ వనితాయుతంబుగన్.

300


వ.

ఇవ్విధంబున నవ్వసుమతీవల్లభుండు రోమపాదునిచేత సంభావితుం డై య
తనిఁ దగినతెఱంగున సంభావించి యతం డుచితసత్కారంబులఁ బ్రీతునిం
జేసి యనుప శాంతాసమేతుం డైనఋశ్యశృంగునిం దోడ్కొని పరమా
నందంబున మగిడి తనపురంబునకుం జనుదెంచుచుఁ బురం బలంకరించు
వారుగాఁ బౌరుల నియోగింపుం డని శీఘ్రగమను లగుదూతల నయో
ధ్యకుం బనిచిన వార లతిత్వరితగమనంబునం బఱచి రాజాగమనం బెఱిం
గించి పురం బలంకరింపుం డని యాజ్ఞాపించిన వారును సమ్మదాయత్త
చిత్తు లై తత్తఱంబున సిక్తసమ్మార్జితపథంబును సముచితధ్వజపతాకాశోభి
తంబును నానావిధసుగంధద్రవ్యవాసనావాసితంబునుం గా నగరం బలం
కృతంబుఁ గావించి రంత నమ్మహీకాంతుండు శంఖదుందుభినిర్ఘోషపూ

ర్వకంబుగా ఋశ్యశృంగునిం బురస్కరించికొని పురంబుఁ బ్రవేశించి రాజ
మార్గంబునం జని పురజను లమందానందంబున నభినందింప సుముహూర్తం
బున నంతఃపురంబుఁ బ్రవేశించి వివిధప్రకారంబుల నమ్మహర్షినందనుం బూ
జించి తన్నుఁ గృతకృత్యునింగాఁ దలంచుకొనుచు సుఖం బుండె నంత పుర
కాంతలెల్ల శాంతామహాదేవి నర్హవిధులఁ బూజించి యుపసర్పించి వివిధోప
చారంబుల సంప్రీతం జేసి రిట్లు ఋశ్యశృంగుండు సత్కారసత్కృతుండై శాం
తం గూడి పరమానందంబున నభీష్టోపభోగంబు లనుభవించుచు సుఖంబుండు
నంత నొక్కింతకాలమునకు సకలజగన్మనఃకాంతం బైనవసంతంబు వనాం
తంబుల నలంకరించిన నమ్మేదినీకాంతుండు స్వాంతంబున మఖంబుఁ జేయం
దలంచి శాంతాకాంతుని రావించి నమస్కరించి ప్రసన్నుం గావించుకొని
కులసంతానంబుకొఱకు హయమేధంబుఁ గావింప నిశ్చయించితి సాంగ్రహణేష్టి
గావించుటకు మొదల బ్రహ్మత్వంబున ఋత్విగ్వరణంబుఁ గావించెద నంగీకరింప
వలయు నని ప్రార్థించిన.

301


క.

నా విని యామునిపుత్రుఁడు, భూవరుతో మంచిపనియె పూనితి వింకన్
నీ వాయత్నము సేయుము, పావనగుణ విడువు మింక భద్రహయంబున్.

302


క.

అని పలుక నతనియనుమతిఁ, గొని భూరమణుండు మంత్రకోవిదుని సుమం
త్రునిఁ గని యస్మద్గురులం, గొని తెమ్మనవుడు నతండు కుతుకం బెసఁగన్.

303


చ.

రయమున నేగి కోసలధరావరునానతిఁ బుణ్యకర్ములన్
నియతుల వేదపారగుల నిత్యతపోధనులన్ మహాత్ములన్
నయవిదులన్ వసిష్ఠమునినాథముఖాఖిలసంయమీంద్రులం
బయనముఁ జేసి భూవిభునిపాలికి గ్రక్కునఁ దోడి తెచ్చినన్.

304


క.

భూవిభుఁడు వారినెల్ల య, థావిధిఁ బూజించి వినయతత్పరమతి యై
భావించి భక్తి నంజలిఁ, గావించి ముదం బెలర్పఁగా ని ట్లనియెన్.

305

దశరథుఁడు ఋశ్యశృంగమునియనుమతంబున నశ్వమేధంబుఁ జేయఁ బూనుట

తే.

వరసుతార్థము పెక్కుసువ్రతము లేను, జాలఁ జేసియు వడయంగఁ జాల నైతి
ననఘమతులార యిపుడు మీయనుమతమునఁ, బూని హయమేధ మొనరింప బుద్ధి వొడమె.

306


క.

కావున హయమేధం బేఁ, గావించెద శాస్త్రదృష్టకర్మంబున నీ
పావనుఁ డగుమునిపుత్రుప్ర, భావంబున నిష్టసిద్ధి వడసెద నింకన్.

307


చ.

అని జనభర్త వల్కుటయు నమ్మునినాథుఁడు దన్ముఖేరితం
బును సకలార్థసాధన మమూల్యము నైన తదుక్తిఁ గౌశలం
బును విని కౌతుకంబు ముదముం జెలు వార బహూకరించుచున్

మనుజవరేణ్యుతో ననియె మానుగ వెండియు మంజులోక్తులన్.

308


చ.

క్షితివర నీతలఁపు కడుసిద్ధము యాగ మొనర్ప నీదువాం
ఛితము ఫలించు నిక్కముగఁ జెప్పెడి దే మిఁకఁ దత్ప్రయత్నమున్
జతురతఁ జేయు మశ్వమును సత్వరతన్ విడిపింపు మంగసం
యుతముగ యజ్ఞశాల సరయూత్తరమందు రచింపు మింపుగన్.

309


తే.

ధారుణీనాథ నీ విట్లు ధర్మసహిత, మైనయీబుద్ధి జనియించినందువలన
భూరివీర్యుల నల్వురఁ బుత్రవరుల, నెల్లభంగులఁ బడసెద విది నిజంబు.

310


చ.

అన విని భూమిభర్త ముదమార నమాత్యులఁ జూచి వారి కి
ట్లను గురువాక్యపద్ధతి మఖాశ్వము నుగ్రబలాన్వితంబుగా
నొనరిచి చెచ్చెరన్ విడువుఁ డొప్పుగ నాసరయూతటంబునన్
ఘనతరశాస్త్రసమ్మతముగా రచియింపుఁడు యజ్ఞవాటికన్.

311


వ.

మఱియుఁ గల్పోక్తప్రకారంబున విధిపూర్వకంబుగా శాంతిక్రియలు నిర్వ
ర్తింపుఁ డిమ్మహాయజ్ఞం బెల్లనృపులకు దుర్లభంబు గావున నిం దొక్కిం తైన
నపరాధంబు గలుగకుండ నిర్వర్తింపుఁడు విద్వాంసు లగుబ్రహ్మరాక్షను లిందు
ఛిద్రంబు లన్వేషించుచుండుదురు వారివలన యజ్ఞంబునకు విఘ్నంబు గలిగె
నేని యజ్ఞకర్త నశించుం గావున నట్లు గాకుండ మీరు సమర్థు లై యిమ్మఖంబు
శాస్త్రదృష్టవిధానంబున నిర్విఘ్నంబుగాఁ బరిసమాప్తి నొందించునట్టిభారం
బుఁ బూనవలయు నని చెప్పిన నయ్యమాత్యులు మహీరమణునిపలుకుల కలరి
భవత్ప్రసాదంబున నెల్లపనులు గొఱంత పడకుండ నిర్వర్తించెద మని పలికి
యతనిచేత ననుజ్ఞాతు లై నిజనివాసంబులకుం జనిరి వసిష్ఠాదిమహర్షులును
యథోచితవిధానంబుల నద్దశరథునిచేత నభీష్టపూజలు వడసి యతని ననురూప
వాక్యంబులం బ్రశంసించి యతనిచేత ననుజ్ఞ వడసి తమతమవిడుదులకుం జని
రంత నమ్మహీకాంతుండు సచివుల నందఱ నిజనివాసంబులకుం బోవం బనిచి
తాను నభ్యంతరమందిరంబునకుం జని ప్రథమవసంతచిత్రాపౌర్ణమాస్యయందు
సాంగ్రహణేష్టిఁ గావించి రెండవనాఁడు బ్రాహ్మౌదనంబును నుత్తమాశ్వ
బంధనప్రోక్షణవిమోచనాదికంబునుం గావించి ప్రతిదినంబును సావిత్రాది
కర్మంబులు సలుపుచుండు సంవత్సరంబు పూర్ణం బగుటయు రెండవవసంత
కాలంబు సంప్రాప్తంబయ్యెఁ బ్రథమసంవత్సరాంతిమావాస్యయందుఁ గావింపం
దగినయుఖాసంభరణ త్రైధాతవీయదీక్షణీయాదికంబులు నైనదేవయజనంబు
లు నిర్వర్తించి చిత్రాపౌర్ణమాస్యయందు సంతానార్థం బశ్వమేధయాగంబుఁ
గావింప నుద్యుక్తుండై యధ్వర్యుత్వంబున వరింపంబడిన వసిష్ఠు నవలోకించి
నమస్కరించి పూజించి వినయంబున నిట్లనియె.

312


సీ.

అనఘాత్మ నీవు మా కనిశంబు సఖుఁడవు గోప్తవు శాస్తవు గురుఁడ వట్లు

గాన నే నొనరింపఁబూనిన యిమ్మహాక్రతుభారమున నీవు కరుణఁ దాల్చి
విఘ్నంబు గాకుండ విధియుక్తి నాచేతఁ జేయించి నాదువాంఛితముఁ దీర్పు
మనవుడు నమ్మహామునినేత నీచెప్పినట్లు సర్వముఁ దీర్తు ననుచుఁ బలికి

312


తే.

యజ్ఞకర్మ నునిష్ఠితు లయినద్విజుల, ఖనకకర్మాంతికుల శిల్పకరుల నటుల
నర్తకుల గణకుల మఖన్యాయవిదుల, వేదవిప్రుల నెల్ల రావించి పలికె.

313


వ.

మీరురాజశాసనంబున యాగకార్యంబుల నన్నియు నిర్వర్తింపుం డిష్టకాసహ
స్రంబులు శీఘ్రంబునం దెం డౌన్నత్యవిశాలత్వాదిబహువిధగుణసమన్వి
తంబు లైనరాజగృహంబులు రచింపుండు బహువిధభక్ష్యాన్నపానసమేతంబు
లుగా వృష్టివాతంబులచేత నప్రకంప్యంబులుగా శుభంబు లైనబ్రాహ్మణగృహం
బులు నిర్మింపుం డట్లు పౌరజనంబునకు బహుభక్ష్యంబు లయి సర్వకామసమ
న్వితంబు లై యుండునట్టుగా ననేకనివాసంబులు గల్పింపుం డట్లు జానపదజనం
బునకు నుచితనివాసంబులు గల్పించి సత్కరించి సరసపదార్థసంపన్నం బైనయ
న్నంబు యథేష్టంబుగాఁ గుడువం బెట్టుఁడు వారల నవజ్ఞ సేయ వలదు చతుర్విధ
వర్ణంబులవారి నత్యాదరంబున నుచితసత్కారసత్కృతులం జేయుండు కామక్రోధ
వశంబువలన నైన నవజ్ఞ సేయ వలదు మఱియు యజ్ఞకర్మంబునందు పరినిష్ఠితు
లగుపురుషుల విశేషించి వసుభోజనాదిదానంబుల సత్కృతులం జేయ వలయు
మఱియు నెల్లపనులకుం జాలనేర్పరు లయి వర్తింప వలయు నని పలికిన వారలం
దఱు వసిష్ఠుండు చెప్పినక్రమంబున సర్వంబు నిర్వహించుటకుం జాలి యర్హకృ
త్యంబులు సల్పుచుండి రంత వసిష్ఠుండు సుమంత్రుని రావించి యి ట్లనియె.

314


మ.

ధరణీచక్రమునందుఁ గల్గినసమస్తక్ష్మాతలాధీశులన్
మఱియుం దక్కినదేశవాసు లగుబ్రహ్మక్షత్రవిట్ఛూద్రులన్
నరనాథాగ్రణిశాసనంబున వెస న్జన్నంబు వీక్షింపఁగా
నరుదారం దగఁ బిల్వ పంపుము సమస్తాశావకాశస్థులన్.

315


మ.

మిథిలాధీశుని సత్యసంగరుని సన్మిత్రున్ మనీషాంబుధిన్
విధిసంకాశుని శాస్త్రనిష్ఠితుఁ జతుర్వేదజ్ఞు నుద్యన్మతిన్
బ్రధనోత్సాహు విదేహరాజు జనకేలానాథుఁ దోడ్తెమ్ము శౌ
ర్యధురీణుం డతఁ డీమహావిభుని కత్యంతప్రియుం డారయన్.

316


క.

సతతప్రియవాదిని రణ, చతురుని సద్వృత్తు దేవసన్నిభుఁ గాశీ
పతిని జగన్నుతశీలుని, నతిరయమునఁ దోడి తెమ్ము యజ్ఞముఁ జూడన్.

317


క.

నృపశార్దూలుని మామను, విపులపరాక్రమునిఁ బరమవృద్ధుని ధర్మా
ధిపునిన్ గేకయరాజును, జపలమ్మునఁ దోడి తెమ్ము జన్నముఁ జూడన్.

318


క.

అంగేశ్వరుని మహాగుణ, సంగుని నలరోమపాదజననాథుని మి
త్రుం గాంచనగిరిధైర్యుని, సంగతిగాఁ దోడి తెమ్ము సవనముఁ జూడన్.

319

మ.

పరమోదారులు దాక్షిణాత్యులు కురుల్ పాశ్చాత్యకోదీచ్యకు
ల్వరుసం బ్రాచ్యులు సింధుమాత్స్యకులు సౌరాష్ట్రీయసౌవీరకుల్
మఱియుం దక్కినదేశనాథులు జగన్మాన్యుల్ బలోపేతు లై
తలు చై వీటికి వచ్చువారలుగ సూతా సేయు ముద్యన్మతిన్.

320


ఉ.

నా విని సూతుఁ డాజటిలనాథుఁడు చెప్పినయట్ల సర్వధా
త్రీవరులన్ మహామహుల ధీరులఁ జారులచేత గొందఱిం
గోవిదుఁ డౌటఁ దానె సని కొందఱి నందఱి నంద మొందఁగా
క్ష్మావిభుమాటఁ దెల్పి వరుస న్వెసఁ దోడ్కొని వచ్చె వీటికిన్.

321


క.

అంత భవచ్ఛాసనమునఁ, బంతంబున వలయునట్టిపను లన్నియు నే
మెంతయుఁ దీర్చితి మని క, ర్మాంతికు లరుదెంచి పలికి రమ్మునితోడన్.

322


చ.

పలికిన నాలకించి మునిపాలుఁడు వారి బహూకరించి సొం
పలరఁగ నిమ్మహామఖమునం దపరాధము గల్గె నేనియు
న్దలఁగక యజ్ఞకర్తకు వినాశము సేకుఱు నట్లు గాన మీ
రలు దగ నిర్వహింపుఁ డపరాధ మొకింతయుఁ గల్గకుండఁగన్.

323

ఆశ్వమేథయాగంబునకు నానాదేశములనుండి రాజు లేతెంచుట

వ.

అని పలికి బహుప్రయత్నంబుల నప్రమాదు లై యుండుం డని యందఱ నయ్యై
పనుల వెంటం బంచి తానును దగిన చందంబునం బ్రవర్తించుచుండు నంతఁ
గొన్నివాసరంబు యాగోత్సవసమాలోకనకౌతుకోల్లాసంబున నానాధనరత్న
సంచయంబు లుపాయనంబులుగాఁ గొని నానాదేశాధీశు లందఱుఁ జతురంగ
బలపరివృతు లై యయోధ్యకుం బఱతెంచిన వారి నందఱ నుచితసత్కారం
బులం బ్రీతులం జేసి యథార్హస్థానంబుల విడియ నియమించి మునిశ్రేష్ఠుం
డగువసిష్ఠుండు దశరథున కి ట్లనియె.

324


క.

నరవర నీశాసనమున, నరపతు లందఱును వచ్చినారలు వారిం
బరమప్రీతులఁ జేసితి, సరసత్వముతో యథార్హసత్కారములన్.

325


క.

క్షితివర సరయూతటమునఁ, జతురత శాస్త్రోక్తభంగిఁ జక్కఁగ యజ్ఞా
యతనము రచించినారము, వితతంబుగ నెల్లపనులు వేడుక నయ్యెన్.

326


చ.

నృపవర జాగు సేయ నిఁక నేటికి సన్మఖదీక్షితుండ వై
నిపుణుల వేదపారగుల నిర్మలచిత్తులఁ గూడి వేడ్కతో
నుపహృతసర్వకామముల నొ ప్పగునధ్వరశాల సొచ్చి ని
ద్దపుఁదమి యజ్ఞకర్మము యథావిధిగా నొనరింపు మిత్తఱిన్.

327

శ్రీమదశ్వమేధయాగప్రారంభము

వ.

అని పలికిన నమ్మహీరమణుండు వసిష్ఠానుమతంబున ఋశ్యశృంగుం బురస్కరిం
చుకొని వసిష్ఠవామదేవాదిమహర్షిసమేతుండై సునక్షత్రం బైనయొక్కశుభదినం

బున నానావిధమంగళవాక్యఘోషస్వస్తివాదపూర్వకంబుగా సరయూతటవి
రచితం బైనయజ్ఞవాటంబుఁ బ్రవేశించి శాస్త్రంబు నతిక్రమింపక కల్పసూ
త్రానుసారంబుగా యజ్ఞకర్మారంభంబుఁ గావించి హయాగమనంబుఁ గోరుచుం
డ సంవత్సరంబు పరిపూర్ణం బగుటయు నయ్యుత్తమాశ్వంబు సనుదెంచె నంత
వసిష్ఠాదిమహర్షులు ఋష్యశృంగుం బురస్కరించుకొని కల్పసూత్రప్రకారంబున
మఖకర్మం బాచరింప నుపక్రమించి శాస్త్రోక్తభంగిఁ బ్రవర్గ్యంబు నుపసదంబు
నుం గావించి యుపదేశశాస్త్రంబునకంటె నధికం బైనకర్మం బంతయు నిర్వ
ర్తించి బహిష్పవమానాదులచేతఁ దత్తత్కర్మదేవతలఁ బూజించి ప్రాతస్సవనం
బుఁ గావించి పదంపడి యింద్రగ్రహనిష్ఠం బైనసోమాంశంబు విధ్యుక్తంబుగా
నింద్రున కొసంగి పాపనివర్తకుం డైనసోమరాజును స్తోత్రశస్త్రంబులచేత నభిను
తించి యథాక్రమంబుగా మాధ్యందినసవనంబును దృతీయసవనంబునుం గావిం
చి పాత్రాదిస్ఖలనప్రభృతిదోషంబు లెవ్వియుం గలుగకుండ సర్వంబును మం
త్రవంతంబుగా నిర్విఘ్నంబుగా నిర్వర్తించి.

328


తే.

పరఁగ నయ్యజ్ఞమునఁ గలసాఱులందు, నార్తుఁ డశతానుచరుఁడు క్షుధాతురుండు
శ్రాంతుఁ డపరీక్షితుఁడు విద్య రానిమూఢుఁ, డరసిచూచిన లేఁ డొక్కఁడైనఁగాని.

329


చ.

వరమును లగ్రజుల్ నృపులు వైశ్యులు పాదజను ల్క్రమంబునం
దరుణులు బాలవృద్ధులును దత్క్రతురాజమహోత్సవస్థితిన్
సురుచిరభంగిఁ బ్రత్యహముఁ జూచియు స్వాదురసోచితాన్నముం
జిరశుభలీల నిత్యము భుజించుచుఁ దృప్తి వహింతు రెంతయున్.

330


శా.

అశ్రాంతంబును మ్రోయు సమ్మఖమునం దాలించినన్ దట్ట మై
యశ్రాంతస్ఫుటయాజకోక్త మగుస్వాహానాద మాశ్రావయా
స్తుశ్రౌషణ్ణినదంబు తీవ్రముగ వాసోదీయతాం దీయతాం
చశ్రాణౌదన మస్రవంబు కృపయా క్షంతవ్య మన్నాదమున్.

331


ఆ.

అన్నపర్వతంబు లాజ్యప్రవాహముల్, భవ్యసూపశాకభక్ష్యరాసు
లేమి చెప్ప వచ్చు నేకోత్తరశతంబు, లగుచుఁ జూడ నయ్యె ననుదినంబు.

332


శా.

నానాదేశనివాసు లైనపురుషు ల్నారీమణు ల్నాగరుల్
నానాభంగుల నన్నపానవసువిన్యాసంబులం దృప్తు లై
యానందంబున భద్ర మస్తు నృపతే యంచు న్నుతింపం గరం
బానాదంబు వినంగ నయ్యెఁ బతి కిం పారంగ నశ్రాంతమున్.

333


తే.

విప్రవరుల కలంకృతవేషు లైన, జనము లిష్టపదార్థము ల్చాల నొసఁగి
రందుఁ గుండలశోభితు లైనకొంద, ఱనుసరించిరి వారిసాహాయ్యమునకు.

334


మ.

అనిశంబు న్మఖమందు విప్రులు సువేషాఢ్యు ల్కృతాలంకృతు
ల్కనదుద్యన్మణికుండలస్ఫురితు లై కర్మాంతరంబందుఁ బా

యనివైదుష్యమునం బరస్పరజిగీషాయతచేతస్కు లై
ఘనయుక్తిన్ బహుహేతువాదము లొగి న్గావింతు రత్యున్నతిన్.

335


క.

ధరణీసుర లమ్ముఖమున, నొరవుగ నానాఁటికిం బ్రయోగకుశలు లై
గురుమతిఁ గర్మము లన్నియుఁ, గర మరుదుగ యుక్తభంగిఁ గావించి రొగిన్.

336


తే.

వెలయ నయ్యజ్ఞమునఁ గలవిప్రులందు, నవ్రతుఁ నవాదరతుఁ డషడంగకోవి
దుం డగుణవంతుఁ డబహుశ్రుతుం డయోగ్యుఁ, డననులిప్తాంగుఁ డొక్కరుఁ డైన లేఁడు.

337


వ.

ఇ ట్లభినవవిభవవిశేషంబున నయ్యాగంబు సెల్లుచుండ నప్పు డయ్యాగశాస్త్ర
జ్ఞు లగుఋత్విజులు ప్రయోగకుశలు లై యజ్ఞవేదియందు నడుమ యొక్కశ్లే
ష్మాతకయూపంబు సంస్థాపించి దానిదక్షిణోత్తరపార్శ్వంబుల బాహుద్వయ
మాత్రంబుదవ్వుల రెండుదేవదారుయూపంబులును దానిదక్షిణోత్తరపా
ర్శ్వంబుల నంతియదూరంబున నాఱుబిల్వయూపంబులును దానిదక్షిణోత్తర
భాగంబుల నంతియదూరంబున నాఱుఖాదిరయూపంబులును దానిదక్షిణోత్త
రపార్శ్వంబుల నంతియదూరంబున నాఱుపాలాశయూపంబులుగా ని ట్లేకవిం
శత్యరత్నిప్రమాణంబు లైనయేకవింశతియూపంబులు శాస్త్రోక్తక్రమంబున సం
స్థాపించి శోభార్థంబు నొక్కొక్కయూపంబు నొక్కొక్కచేలంబుచేత నాచ్ఛా
దించి గంధపుష్పంబులచేత నలంకరించిన నమ్మహాయూపంబు లన్యూనాతిరి
క్తంబు లై సుషిరాదిదోషవర్జితంబు లై యష్టాశ్రయుక్తంబు లై సుస్నిగ్ధంబు లై
దివియందు దీప్తిమంతు లైనసప్తర్షులచందంబునఁ బ్రకాశించుచుండె నిత్తె
ఱంగున యూపోచ్ఛ్రయంబుఁ గావించి శుల్బకర్మంబులయందు నిపుణు లైన
బ్రాహ్మణోత్తములు యూపసంస్థాపనంబుకంటెఁ బూర్వంబె కావింపం దగిన
చయనంబుఁ గావింప సమకట్టి యథాశాస్త్రంబుగాఁ బ్రమాణవిశిష్టంబు లైన
యిష్టకల నగ్న్యాగారవేదియం దుపధానంబు సేసిన నది స్వర్ణగర్భపక్షంబై
యధోగతవీక్షణం బై ప్రాఙ్ముఖం బై యష్టాదశప్రస్తారాత్మకం బై గరుడాకా
రంబుగా నొప్పుచుండె నంతఁ బూర్వోక్తయూపంబులందు శాస్త్రానుసారంబుగా
నింద్రాదిదేవతల నుద్దేశించి గ్రామ్యపశువులం బంధించి యారోకంబులందు
సూకరపన్నగపతత్రిప్రముఖారణ్యపశువులం బంధించి వేదోక్తప్రకారంబునఁ
బర్యగ్నికృతంబు లైనయారణ్యపశువుల విసర్జించి శామిత్రస్థానంబునందు యాగీ
యం బైనహయంబును గూర్మాదిజలచరంబులను దదన్యం బైనగ్రామ్యపశుజా
తంబును విశసనార్థంబు సంగ్రహించి రిట్లు యూపనిబద్ధంబు లైనమున్నూఱు
ప్రధానపశువులను సర్వరత్నవిభూషితం బైనహయరత్నంబును విశసించి రంతఁ
గౌసల్యాదిరాజపత్నులు శామిత్రస్థానంబునందు మృతం బైనహయంబుకడకుం

జని సవ్యాపసవ్యంబుగాఁ బరిచరించి నిరవధికశ్రద్ధచేత సువర్ణముఖం బైనసూచీ
త్రయంబున నయ్యశ్వశ్రేష్ఠంబున కసిపథంబులఁ గల్పించి రంతఁ గౌసల్య ధర్మసిద్ధి
వడయం గోరి మృతహయకళేబరస్పర్శనిందారహితచిత్త యై యయ్యశ్వంబు
తోఁ గూడ యొక్కరాత్రి నివసించె నప్పుడు తత్కాలదక్షిణార్థంబు దశర
థునివలన బ్రహ్మమహిషిని హోత వావాతను నుద్గాత పరివృత్తిని నధ్వర్యుండు
పాలాకలినిఁ గ్రమంబునఁ బ్రతిగ్రహించి భర్తలుం బోలె హస్తగ్రహ
ణంబుఁ గావించి యద్దశరథునివలనఁ దత్ప్రతినిధిద్రవ్యంబుఁ గొని వారలఁ
గ్రమ్మఱ నతని కొసంగి రంత నధ్వర్యుండు తురంగనువప నాకర్షించి నియతేంద్రి
యుం డై వహ్నియందు శ్రపణంబుఁ గావించి శాస్త్రోక్తప్రకారంబున హోమం
బుఁ జేసె నప్పుడు.

338


తే.

ధన్యచారిత్రుఁ డైనయద్దశరథేంద్రుఁ, డొప్పు మీఱంగ నవ్వపాహోమధూమ
గంధ మాస్వాదనము సేసి కలుషనిచయ, మంతయును బాసి మిగులఁ గృతార్థుఁ డయ్యె.

339


క.

పదియార్వురు ఋత్విజు లిం, పొదవ హయాంగములు పచన మొనరించి ముదం
బెదుగ శిఖియందు వేలిచి, పదపడి తచ్ఛేష మర్థిఁ బ్రౌశించి రొగిన్.

340


తే.

వసుధలో నన్యపశువుల వపను బ్లక్ష, శాఖయం దిడి వేల్తురు శాస్త్రఫణితిఁ
బరఁగ హయమేధమఖమందు వైతసంబు, మీఁద నిడి హోమ మొనరింతు రాదరమున.

341


వ.

మఱియు నయ్యశ్వమేధంబునకుఁ జతుష్టోమాత్మకం బైనజ్యోతిష్టోమంబు ప్రథ
మాహం బనియు నుక్థ్యంబు ద్వితీయాహం బనియు నతిరాత్రంబు తృతీయా
హం బనియు నిట్లు కల్పసూత్రంబుచేతను దన్మూలభూతము లైనబ్రాహ్మణముల
చేతను బలుకంబడుటవలనఁ దన్మహాయజ్ఞంబు త్ర్యహం బనంబడు ని ట్లుక్త
ప్రకారంబున నశ్వమేధంబుఁ గావించి తదంగభూతంబు లైనజ్యోతిష్టోమాయు
రతిరాత్రద్వయాప్తోర్యామాభిజిద్విశ్వజిత్ప్రభృతిబహుయజ్ఞంబులఁ గావించె
నిత్తెఱంగునఁ దొల్లి బ్రహ్మనిర్మితం బైననమ్మహాయజ్ఞంబు సాంగంబుగాఁ బరి
సమాప్తి నొందించి.

342


సీ.

హోతకుఁ బ్రాగ్దేశ ముద్గాత కుత్తరం బగుదార బ్రహ్మకు యామ్యదేశ
మధ్వర్యునకు వేడ్క నపరదేశంబును యాగదక్షిణ గాఁగ నర్థి నొసఁగె
నొసఁగిన వారు తాపసుల మై వనమున వర్తించుమాకు నీవసుధ యేల
మనుజేంద్ర నీకుఁ గ్రమ్మఱ విక్రయించెద మావుల స్వర్ణరత్నాదికముల


తే.

నిచ్చి కైకొని సంప్రీతి నేలు మనినఁ, గోటిగోవుల మఱి దశకోటిమణులఁ

గాంచనం బొకశతకోటి గరిమ నొసఁగి, ధాత్రిఁ గ్రమ్మఱఁ గొనియె నద్దశరథుండు.

343


వ.

అంత నాఋత్విజు లందఱు యాగదక్షిణార్థంబు లబ్ధం బైనధనం బంతయు
వసిష్ఠఋశ్యశృంగులకు సమర్పించిన నమ్మహాత్ములు యథాశాస్త్రంబుగా విభా
గించి ఋత్విజుల కందఱికి వేర్వేఱ యొసంగినఁ బ్రతిగ్రహించి యేమందఱము
సంతుష్టాంతరంగుల మైతి మని పలికి యమ్మునిపుంగవులం గొనియాడి రంత నమ్మ
హీరమణుండు యజ్ఞదర్శనార్థంబు సమాగతు లైనబ్రాహ్మణులకు జంబూనదీ
ప్రభవం బైనహిరణ్యం బొక్కకోటి యొసంగి హస్తాభరణంబులఁ గోరినదరి
ద్రు లైనయాచకులకు హస్తాభరణంబు లొసంగి వార లందఱు సంప్రీతు లగు
చుండఁ దానును హర్షపర్యాకులేక్షణుండై భక్తిపూర్వకంబుగా నందఱికి దండ
ప్రణామంబుఁ జేసిన.

344


అ.

అభిమతార్థసిద్ధి రస్తు తే భూపతే, రాజశేఖరాయ రాఘవాయ
యనుచుఁ బెక్కుగతుల నాశీర్వదించి రా, ధరణిదివిజు లెల్లఁ గరుణ నృపుని.

345


ఆ.

దురితహరము కీర్తికర మన్యరాజదు, ష్కరము స్వర్గసౌఖ్యకరము నై న
మఖముఁ జేసి రాజు మహనీయచరితుఁ డా, ఋశ్యశృంగమాని కిట్టు లనియె.

346


క.

అనఘాత్మ మీప్రసాదం, బున యజ్ఞము పరిసమాప్తిఁ బొందె నిఁక ముదం
బున వంశవర్ధనుం డై, తనరారెడునట్టిసుతుని దయ సేయు మొగిన్.

347

ఋశ్యశృంగముని పుత్రకామేష్టిఁ జేయ నారంభించుట

ఉ.

నా విని యత్తపస్వికులనాథుఁ డొకించుకసేపు ధ్యానని
ష్ఠావశుఁ డై పదంపడి రసాపతి కి ట్లను నీమనంబునం
భూవర చింత సేయకుము పుత్రచతుష్టయ ముద్భవించు నీ
కావిధ మంతఁ గాంచితిఁ దదర్థముగా నొకయిష్టిఁ జేసెదన్.

348


వ.

అని పలికి సమాహితచిత్తుండై యతీంద్రియార్థదర్శి యగునమ్మునిపుంగవుండు
వహ్నిప్రతిష్ఠాపనంబుఁ జేసి యధర్వణోక్తప్రకారంబున మంత్రప్రకాశితకర్మం
బగుహోమంబుఁ గావింపఁ దొడంగిన నప్పుడు భాగప్రతిగ్రహార్థంబు దేవర్షి
గంధర్వసిద్ధవిద్యాధరాదు లచ్చటికిం జనుదెంచి యంతకు మున్న మౌనిమంత్ర
బలాహూయమానుం డై చనుదెంచి యున్నలోకకర్త యగువిరించి నవలో
కించి యి ట్లనిరి.

349

పుత్రకామేష్టియం దాహూతు లగుదేవతలు బ్రహ్మతో మొఱ లిడుట

సీ.

వాణీమనోనాథ వాసవవందిత లోకనాయకభక్త లోకవరద
మును మీరొసంగిన ఘనవరంబునఁ జేసి రావణుం డనియెడు రాక్షసుండు
మత్తుఁ డై ఘనబలోద్వృత్తుఁ డై నిత్యంబు లోకత్రయంబుఁ జీకాకుఁ జేసి
శక్రాదిసకలదిశాపాలకులఁ దోలి గంధర్వయక్షుల గాసి పఱచి


తే.

ద్విజుల హింసించి తపసుల వెదకి చంపి, సురల బాధించి జన్నము ల్జెఱచి సిద్ధ

సాధ్యవిద్యాధరాదుల సమయఁ జేసి, కన్ను గానక వర్తించుచున్నవాఁడు.

350


చ.

పవనుఁడు వీవ నోడె సితభానుఁడు వెన్నెల గాయ నోడె నా
రవి తపియింప నోడె జలవాసులు పొంగి చెలంగ నోడె మృ
త్యువు దలఁ జూప నోడె విభవోన్నతిఁ జూపఁగ నోడె శక్రుఁడున్
భువనభయంకరస్ఫురణఁ బొల్చుదు రంత దశాస్యధాటికిన్.

351


చ.

అసురులచేత బాధితుల మై పను లన్నియు మాని రేఁబవ
ల్దెస చెడి భీతిఁ జేయునది లేక తపించుచు నున్నవార మో
యసురవిరోధినందన దయాహృదయా మము నాదరించి వాఁ
డసువులకుం దొలంగి చనునట్టియుపాయముఁ జింత సేయవే.

352


మ.

అని యి ట్లాసురకోటి పల్క ననుకంపాయత్తచేతస్కుఁ డై
వనజాతాసనుఁ డంతఁ గొంతవడి భావంబందుఁ జింతించి య
మ్మనుజాంధఃప్రభుఁ డీల్గునట్టివిధముం బాటించి యూహించి ప
ర్వినమోదంబున వారి కి ట్లనియెఁ బ్రావృట్కాలమేఘార్భటిన్.

353


మ.

వినుఁ డోనిర్జరులార ము న్నతఁ డొగిం బెక్కేండ్లు న న్గూర్చి కా
ననభూమిం గడుఘోరనిష్ఠఁ దపముం గావించి మెప్పించి చ
య్యన గంధర్వవిహంగచారణమరుద్యక్షోరగశ్రేణిచే
ననిలో నాశము నొందకుండ వర మొయ్యం గొన్నవాఁ డెంతయున్.

354


ఉ.

కావున రావణుం గెలువఁగా సమకూడదు మీ కతండు నా
చే వర మందినాఁడు మఱచె న్నరవానరజాతిచే ననిం
జావనియవ్వరం బడుగ సభ్రముఁడై యటు గాన వాఁ డిఁకం
జేవ దలిర్చుమానవునిచేతను గాని యడంగఁ డెంతయున్.

355


క.

ఇంతటి పని సాధింప న, లంతులచే నగునె శరధిరాజకుమారీ
కాంతునకుఁ గాక మన కిఁక, నింత విచారం బి దేల హితమతులారా.

356


క.

కరుణారతు శరణాగత, భరణోచితు నఖిలభువనపాలనదీక్షా
చరణోద్ధతు దనుజాహితు, శరణముఁ గొని మనుట యొప్పు జాలఁ దలంపన్.

357

బ్రహ్మాదిదేవతలకు శ్రీనారాయణుండు పొడసూపుట

వ.

అని పలుకుచున్నసమయంబున.

358


సీ.

బుధజనకులవనంబులు పల్లవింపఁ జేయుటఁ జేసి మాధవసూక్తి గాంచి
కొమరొప్ప నతలోకతమముఁ బాయఁగఁ జేయుకతన విధుం డన ఖ్యాతి వడసి
సాధుమానససరోజము వికసింపఁ జేయుటఁ జేసి హరి యన నొప్పు మీఱి
భూరివిశ్వంభరాభారంబు దాల్చుట వలన ననంతాఖ్యవాసి కెక్కి


తే.

గదయు శంఖంబు చక్రంబు గౌస్తుభంబు, లక్ష్మి నందక శ్రీవత్సలాంఛనములు
శార్ఙవనమాలికలు హైమచారుపటము, మేన దీపింప భార్గవీజాని దోఁచె.

359

దేవతలు శ్రీనారాయణునికి తమబాధల నెఱింగించుట

క.

ఈవిధమునఁ బొడసూపిన, శ్రీవల్లభుఁ గాంచి వినతిఁ జేసి ప్రమోదం
బావహిల శక్రవిధిముఖ, దేవత లిట్లనిరి ఫాలదీప్తాంజలు లై.

360


శా.

దుష్టాత్ముం డగురావణుం డనెడునా దోషాచరాధీశ్వరుం
డష్టాశేంద్రులఁ బాఱఁ దోలి దివిషద్యక్షోరగాదుల్ కటా
కష్టం బందుఁ దపించుచుం బఱవ నుగ్రస్ఫారదోస్సారుఁ డై
శిష్టాచారవిహీనుఁ డై జగములం జీకాకుఁ జేసె న్రహిన్.

361


సీ.

రమణీయనందనారామదేశంబుల విహరింప మఱచిరి వేల్పుచెలులు
పస మీఱ మిన్నేటియిసుకతిన్నెల వేడ్కఁ గ్రీడింప వెఱచిరి కింపురుషులు
నధ్వరంబులయందు నర్హభాగంబులఁ గైకొన వెఱచిరి నాకివరులు
చటులమణిప్రభోజ్జ్వలవిమానము లెక్కి తిరుగంగ వెఱచిరి పరమసిద్ధు


తే.

లఖిలదిగధీశ్వరులు భీతి యావహిల్లఁ, దివిరి పురములవాకిళ్లఁ దెఱవ వెఱచి
రేమిఁ జెప్పుదు మయ్య రమేశ మీకు, దానవేంద్రునిరాఘాటధాటిఁ జూచి.

362


మ.

వనజాక్షా మును మీరు సత్కరుణ సస్వప్నత్వమున్ సంతతం
బనిమేషత్వ మొసంగినందున మహాత్మా రేఁబవ ల్వానిరా
క నిరీక్షించి మొఱంగి పాఱి చని వీఁక న్మంటి మబ్భంగి మా
కను వై తోడ్పడ కుండినం గలదె దేవా ప్రాణ మిన్నా ళ్లొగిన్.

363


శా.

సామాన్యేతరభంగిఁ బేర్చి యనిలోఁ జంపంగ నీ వోపితే
నేమో కాని దురంతదుస్సహఘనాహీనస్ఫురద్ఘోరసం
గ్రామప్రస్ఫుటబాహుశౌర్యమున లీలం గ్రాలు వాని న్సమి
ద్భూమి న్మేము వధింపఁ జాల మసురేంద్రున్ మాట లింకేటికిన్.

364


క.

అనిశంబు మేలు మే లని, సనకాదులు వొగడ రాత్రిచరవిభుని దశా
స్యునిఁ దునిమి ముజ్జగంబులఁ, బ్రణుతగుణా కరుణ వెలయ రక్షింపఁ గదే.

365

దేవతలు శ్రీనారాయణునికి రావణవధోపాయంబుఁ దెల్పుట

చ.

అని సుర లాడిన న్విని రమాధిపుఁ డి ట్లను సాధురక్షణం
బును మఱి దుష్టశిక్షణముఁ బొల్పుగ మాకు నిసర్గధర్మ మిం
తనఁ బని లేదు మీరు సుగుణాకరులార రణంబునన్ దశా
ననుని వధించి మీకు భువనంబులకుం గడు మేలు సేసెదన్.

366


క.

సందియము విడిచి రణమున, నందముగా వానిఁ జంపునట్టి యుపాయం
బందఱు చింతించి రహిన్, డెందము రంజిల్ల మాకుఁ దెలియం జెపుఁడీ.

367


చ.

అన విని నిర్జరప్రవరు లామధువైరికి విన్నవించి రో
ప్రణుతగుణా సుదర్శనధరా సకలజ్ఞుఁడ వీవు మమ్ముఁ జ
య్యన సదుపాయముం దెలుపుఁ డంచు వచించుట చాలఁ జిత్రమై

నను మదిఁ దోఁచినంతయు ఘనంబుగఁ దెల్పెద మాలకింపవే.

368


శా.

దేవా తొల్లి విరించిఁ గూర్చి హఠ ముద్దీపింపఁ బెక్కేండ్లు నా
దేవారాతి దపంబు సల్పుటయు నద్దేవుండు తా వచ్చి త
త్ప్రావీణ్యంబున కిచ్చ మెచ్చి కృప సొంపార న్వరం బిచ్చెద
న్నావాక్యం బెద నమ్మి ఘోరతపమున్ దైత్యేంద్ర చాలింపుమా.

369


వ.

అని పలికిన నద్దశముఖుండు సుధారసోపమం బైనయరవిందగర్భునివచనం
బుల కలరి తపంబు సాలించి నమస్కారంబుఁ గావించి యంజలిఁ గీలించి యా
గమసూక్తులం బ్రస్తుతించి మహాత్మా నాయందుఁ గృప గల దేని మనుష్యుల
వలనం దక్కఁ దక్కినసమస్తభూతంబులవలనం జావు లేకుండ వరంబుఁ గృప
సేయుమని యడిగిన నప్పరమేష్ఠి యట్ల యగుంగాక యని పలికి యంతర్ధానంబుఁ
జేసె నిత్తెఱంగున నద్దైతేయవల్లభుండు మనుజులు హీనబలు లని తలంచి సరకు
గొనక వారి నిరాకరించి తక్కినవారివలన మృత్యువు లేకుండ వరంబు వడసి
వీర్యదర్పితుం డై యవక్రపరాక్రమంబున ముల్లోకంబుల నాక్రమించి సమస్త
భూతంబుల బాధించుచు విశేషించి కామవ్యసనంబునఁ బాపం బని తలంపక
పుణ్యాంగనలం జెఱపట్టుచున్నవాఁ డప్పాపాత్తుని మనుష్యావతారంబునం గాని
తక్కినయవతారంబులచేత వధింపఁగూడదు కావున మీరు మనుష్యరూపంబున
నవతరించి రావణుని వధించి లోకంబులకుఁ బరమకల్యాణంబు సంపాదింపవల
యు నీవే గతి యని శరణాగతులమై మొఱ లిడుచున్నమమ్ము రక్షింపవే యని
యభ్యర్థించిన నవ్విరించిగురుం డుదంచితకరుణాకటాక్షవీక్షణంబుల నిరీక్షించి
వారి కి ట్లనియె.

370

శ్రీ నారాయణుఁడు దేవతల కభయదానం బొసంగుట

చ.

అనిమిషులార మీర లిపు డాడినకైవడి మానుషాకృతిన్
దనుజునిఁ జంపి మీకుఁ బ్రమదం బొనగూర్చెద నెందుఁ బుట్టుదుం
జనకునిఁ గాఁగ నెవ్వనిఁ బ్రసన్నమతి న్వరియింతు నేక్రియం
దనరుదు నెన్నిరూపములు దాల్పుదు నింత యెఱుంగఁ బల్కుఁడీ.

371


ఉ.

నా విని నిర్జరుల్ కమలనాభుని కి ట్లని రయ్య సర్వగో
త్రావరమాళిరత్నరుచిరంజితపాదసరోరుహుం డయో
ధ్యావిభుఁ డాఢ్యుఁ డాదశరథావనినాథుఁడు పుత్రకాముఁ డై
వావిరి దీక్షఁ గైకొని హవం బొనరించుచు నున్నవాఁ డిలన్.

372


శా.

సుశ్రావ్యస్ఫుటవీరశబ్దధరుఁ డై శోభిల్లునాఱేనికిన్
హ్రీశ్రీకీర్త్యుపమాన లై కలరు నారీరత్నముల్ మువ్వు ర
గ్రశ్రోతవ్యలు వారియందుఁ జతురాకారంబులం బుట్టి దై
త్యశ్రేష్ఠు న్వధియించి సత్కరుణ దేవా మమ్ము రక్షింపవే.

373

వ.

అని విన్నవించిన విని సర్వలోకనమస్కృతుం డగునాసుదర్శనధరుండు సంపూర్ణ
మనోరథుండై కరుణాతరంగితాపాంగవీక్షణంబు లొలయఁ బురందరాదిబృందా
రకులం జూచి విూరు వెఱవవలదు మీచెప్పినక్రమంబున నిద్దశరథునకు నాల్గు
రూపంబుల నవతరించి యొక్కరూపంబున సబాంధవుం డైనరావణుని నొక్క
రూపంబున నింద్రజిత్తు నొక్కరూపంబున గంధర్వుని నొక్కరూపంబున లవణుని
సంగ్రామరంగంబునం బరిమార్చి లోకంబున కత్యంతసంతోషంబు సంపాదించి
బదనొకండువేలసంవత్సరంబులు రాజ్యంబుఁ జేసి కృతార్థుండ నై క్రమ్మఱ మ
దీయదివ్యస్థానంబునకుం జనియెద ననియభయదానం బొసంగి బృందారకసం
దోహవంద్యమానుండును గంధర్వగీయమానుండును సనందనాదిమహాయోగి
సేవ్యమానుండును నై యప్పరమపురుషుం డంతర్ధానంబుఁ జేసె నంత మహేం
ద్రప్రభృతిబృందారకులు యాగభాగంబులం బరితుష్టు లై రావణునివలని
భయంబు వదలి పితామహుం గొల్చి నిజనివాసంబునకుం జని రంత.

374

ప్రాజాపత్యపురుషుండు దివ్యపాయసంబు దశరధున కొసంగుట

తే.

పుత్రకాముఁడై దశరథభూవిభుండు, ఋశ్యశృంగుండు చెప్పినరీతి నియతి
క్రాలఁదగుభంగి వేదమంత్రములచేతఁ, దవిలి హోమంబుఁ గావించునవసరమున.

375


సీ.

కంజాతసఖసమాకారంబు గలవాఁడు జ్వలితాగ్నిశిఖభంగిఁ జెలఁగువాఁడు
రమణీయతరకృష్ణరక్తాంబరమువాఁడు తామ్రమయూఖవక్త్రంబువాఁడు
సముదగ్రదివ్యభూషావిశేషమువాఁడు కమనీయశుభలక్షణములవాఁడు
శైలశృంగముమాడ్కిఁ జాలనొప్పగువాఁడు ప్రబలశార్దూలవిక్రమమువాఁడు


తే.

బలము వీర్యంబు తేజంబు గలుగువాఁడు, దివ్యరూపంబువాఁడు ప్రదీప్తకనక
వర్ణములవాఁడు దుందుభిస్వనమువాఁడు, చారుసుస్నిగ్ధఘనశిరోజములవాఁడు.


తే.

నిరుపమానప్రభావుఁడు పురుషుఁ డొకఁడు, దివ్య పాయససంపూర్ణదీప్తకనక
రాజితాంతఃపరిచ్ఛదరమ్యపాత్రఁ, గాంతనుంబలె బాహులఁ గదియఁ బట్టి.

376


క.

ఘనయాగదీక్షఁ గైకొని, తనయులఁ బడయంగఁ గోరి తప్పక హోమం
బొనరించు చున్ననరపతిఁ, గని ప్రాజాపత్యపురుషుఁ గా ననుఁ గనుమా.

378


క.

అన విని యద్భుతరూపం, బునఁ గ్రాలెడుయజ్ఞపురుషుఁ బొడగని నృవుఁ డి
ట్లనుఁ గేలు మొగిచి దేవా, పని యెయ్యది నాకు ఘనకృపం దెలుపఁ గదే.

379


వ.

అనిన ప్రాజాపత్యవరుండు గ్రమ్మఱ నమ్మహీపతి కి ట్లనియె.

380


ఉ.

భూవర నీ వొనర్చుఘనపూజలు గూర్మి బ్రతిగ్రహించి యా
దేవత లెల్ల మెచ్చి తమి దీరఁగ నీకు నొసంగు మంచు నా
చే వరదివ్యపాయసముఁ జెచ్చెరఁ బంపఁగఁ దెచ్చినాఁడ సొం
పావహిలం బ్రజాకరము నయ్యెడు దీనిఁ బ్రతిగ్రహింపుమా.

381


తే.

ధన్య మారోగ్యవర్ధన మన్యదుర్ల, భంబు నగు దీని నీకూర్మిపత్నులకు నొ

సంగు మట్లైన వారు కాంక్షఁ గొని మెసవి, కడుముదంబునఁ గొడుకులఁ గాంతు రనఘ.

382


వ.

అని పలికి యద్దివ్యపురుషుండు దేవాన్నసంపూర్ణం బైనహిరణ్మయకలశం
బొసంగినం గైకొని యద్దశరథుండు నిర్ధనుండు ధనంబు నొందినచందంబున
పరమానందభరితచేతస్కుం డై ప్రియదర్శనం బైనయయ్యద్భుతంబునకు
భక్తిపూర్వకంబుగాఁ బ్రదక్షిణంబును బ్రణామంబునుం గావించి తన్నుఁ గృతా
ర్థునింగాఁ దలంచుకొనుచుఁ దనయనుమతంబున నమ్మహాభూతం బంతర్ధానంబుఁ
జేసినయనంతరంబ యజ్ఞకర్మంబు సాంగంబుగా నిర్వర్తించి నావరంబుగ
నప్పాయసకలశంబు శిరంబున నిడికొని పత్నీసమేతంబుగా నంతఃపురంబుఁ
బ్రవేశించి శారదాభిరాముం డగుచంద్రుండు నిజకరంబులచేత నభంబునుం
బోలె నిజానందరశ్ములచేత నయ్యంతఃపురంబును బ్రకాశింపఁజేయుచు దేవ
దత్తం బై యమృతోపమానం బైనయమ్మహనీయపాయసాన్నంబు దైవ
చోదితబుద్ధిం జేసి ప్రత్యేకంబుగా విభాగించి.

383

దశరథుం డాదివ్యపాయసంబు విభజించి భార్యల కొసంగుట

తే.

సగముఁ గౌసల్య కొసఁగి యాసగములోన, సగ మల సుమిత్ర కొసఁగి యాసగములోన
సగముఁ గైకేయి కొసఁగి ప్రసన్నదృష్టి, మిగిలిన సగంబు మరల సుమిత్ర కొసఁగె.

384


క.

ఒసఁగిన నయ్యమృతాన్నము, మెసవి మిసిమి పసలు పొసఁగ మెల్లనఁ దగనా
కిసలయపాణులు మువ్వురు, వెసఁ దాల్చిరి గర్భములఁ బ్రవీణత మెఱయన్.

385


ఉ.

ఆరఘువంశవర్యుఁ డపు డయ్యెలనాగలగర్భచిహ్నముల్
వారక చూచి చిత్తమున వారనికౌతుకహర్షరాగముల్
గూరఁగ నన్యకార్యములఁ గూడక రేఁబవ లొక్కరీతి నా
దారలఁ గూడి చె న్నలరెఁ దారలఁ గూడినరాజుకైవడిన్.

386


వ.

మఱియు నారూఢగర్భ లై యారాజపత్నులు హుతాశనాదిత్యసమానతేజు
లై యభూతపూర్వశోభావిశేషంబున నలరి రాదశరథుండు సురేంద్రసిద్ధర్షిగణా
భిపూజితుం డైనహరిచందంబునం దేజరిల్లుచుండె.

387


తే.

ఇట్లు నారాయణుఁడు దేవహితముకొఱకు, నుర్వివిభున కపత్యత్వ మొందుచుండె
సకలలోకేశ్వరం డైనజలజగర్భుఁ, డఖలదివిజులఁ గూర్చి యి ట్లనుచుఁ బలికె.

388

బ్రహ్మ దేవతలను వనచరయోనులఁ బుట్ట నియోగించుట

చ.

మనకు హితంబు సేయుటకు మాధవుఁ డుర్వి జనించుచున్నవాఁ
డనిమిషులార యవ్విభున కాజిని సాయ మొనర్పఁగా రహిన్
మనమును ధాత్రిఁ బుట్ట నగు మానకఋక్షవనాటయోనులం
దనువుగ వీర్యవంతులగు నట్టివలీముఖులన్ సృజింపుఁడీ.

389


వ.

మఱియు బలవంతులును గామరూపులును మాయావిదులును గరుడానిలతుల్య
వేగులును శూరులును నయజ్ఞులును బుద్ధిసంపన్నులును విష్ణుతుల్యపరాక్రము
లును నుపాయజ్ఞులును దివ్యదేహయుక్తులును దుర్జయులును సర్వాస్త్రసం
యోగసంహారాదిగుణయుక్తులును నమృతప్రాశనులు నగుభల్లూకగోలాంగూల
వానరుల యక్షగంధర్వపన్నగసిద్ధవిద్యాధరకిన్నరాప్సరఃకాంతలయందు మీ
మీయంశంబుల వేఱ్వేఱ సృజింపుండు.

390


తే.

సృష్టి నింతకు మున్నె నాచేత సృష్టుఁ, డయ్యె జాంబవంతుండు ఋక్షాధినాథుఁ
డతఁడు కడుజృంభమాణుండ నైననాదు, ముఖమువలన జనించె సముత్సుకతను.

391

దేవతలు వనచరయోనులఁ దత్తన్నామంబుల నవతరించుట

చ.

అని నయ మారఁ బద్మభవుఁ డాడిన న ట్లొనరింతు మంచు న
య్యనిమిషవర్యు లందఱు నిజాంశములన్ సృజియించి రాఢ్యులన్
ఘనతరసింహవిక్రముల గ్రావసమానుల నాత్మతుల్యులన్
వనచరవీరులన్ బలవివర్ధనులన్ భువనప్రసిద్ధులన్.

392


చ.

పొలుపుగ శక్రునంశమునఁ బుట్టెఁ బ్రతాపజితాంశుమాలి దో
ర్బలపరిపాలితాగచరపాళి దురంతనితాంతవిద్విష
త్కులవనకీలి హైమశతతోయజమాలి యనారతాజిని
శ్చలజయశీలి వాలి దివిషద్గుణసన్నుతశౌర్యశాలి యై.

393


క.

ఉగ్రకరువంశమున విపు, లగ్రీవుఁడు లోకభీకరస్ఫుటరిపువం
శగ్రావఘనశతారుఁడు, సుగ్రీవుఁడు పుట్టెఁ బూర్ణసోమునిభంగిన్.

394


క.

ధీరుఁడు శూరుఁడు వీరుఁడు, తారుఁడు కీర్తిజితవిమలతారుఁడు సుగుణో
దారుఁడు నరాతిలోచన, ఘోరుఁడు జన్మించె దేవగురునంశమునన్.

395


ఆ.

అవనిఁ గిన్నరేశువంశంబున జనించె, జగము లొక్కభంగి సన్నుతింప
దైత్యసూదనుండు ధైర్యనిర్జితగంధ, మాదనుండు గంధమాదనుండు.

396


తే.

విశ్వకర్మాంశమునఁ బుట్టె వీరలోక, నుతబలుఁడు భూరిశౌర్యనిర్జితబలుండు

సంతతౌదార్యముఖగుణోజ్జ్వలుఁడు కీశ, కులుఁడు రిపువంశవనదవానలుఁడు నలుఁడు.

397


క.

వాలాయము వినుతమహా, కాలుఁడు దుర్మదవిపక్షకాలుఁడు ఘనవా
గ్జాలుఁడు జగదభినుతరణ, శీలుఁడు నీలుఁడు జనించె శిఖియంశమునన్.

398


క.

బృందారకకులవైద్యులు, పొందుగఁ దమయంశములను బుట్టించిరి య
స్పందపరాక్రమవంతులు, మైందద్వివిదు లనువారి మర్కటవరులన్.

399


తే.

ఘనబలుఁడు సింధుపతియంశమున జనించె, నల సుషేణుఁడు వనచరకులవరుండు
జవవినిర్జితశరభుండు శరభుఁ డనెడు, వనచరవరుండు పర్జన్యువలనఁ గలిగె.

400


ఉ.

అంతఁ బ్రభంజనాంశమున నద్భుతభంగి సమిన్నయాకర
స్వాంతుఁడు నీతిమంతుఁ డతిశాంతుఁడు వైరికృతాంతుఁడున్ సుధీ
మంతుఁడు వీర్యవంతుఁడు సమంచితవిక్రమవంతుఁ డాహనూ
మంతుఁడు గల్గె సర్వసురమానితచర్యల నార్యధుర్యుఁ డై.

401


క.

సురగంధర్వభుజగఖే, చరకిన్నరసిద్ధసాధ్యచారణవిద్యా
ధరమరుదంశంబులఁ గ, ల్లిరి పెక్కండ్రు ఘనబలులు కీశశ్రేష్ఠుల్.

402


తే.

ఋక్షగోపుచ్ఛవానరస్త్రీత్వ మొంది, నట్టి గంధర్వచారణయక్షసిద్ధ
పుణ్యసతులందుఁ గీశగోపుచ్ఛభల్ల, వరులఁ బుట్టించి రఖిలదేవతలు ప్రీతి.

403


క.

ఏవేల్పున కేరూపం, బేవేషం బెట్టిశౌర్య మెసఁగఁ బొసఁగు నా
దేవునితనయుల కలవడి, నావేషం బట్టిరూప మాశౌర్యంబుల్.

404


తే.

సమదగజశైలసంకాశు లమితబలులు, వీర్యధనులు విశ్రాంతులు వేగవంతు
లనఘులు ప్రతాపవంతులు ఘనులు వలయు, నట్టిరూపంబుఁ గొన నేర్చునట్టివారు.

405


క.

ఇతరేతరానురక్తులు, చతురులు సకలజ్ఞు లాజి సంసక్తులు ను
ద్ధతి రిపుల నొడువ శక్తులు, మతియుక్తులు మంజుమధురమానితసూక్తుల్.

406


సీ.

శరధినాథుని దాఁటఁ జాలుదు రతిజవగరిమచే గాంభీర్యగరిమచేత
బిఱుసుకొండల నైనఁ బెకలింప నేర్తురు బలముచే ధీరత్వబలముచేత
మిహికాంశుధరు నైన మెప్పింపఁగలరు దోశ్శక్తిచే ఘనతపశ్శక్తిచేత
హరి నైన మీఱనేర్తురు భూరిలాఘవమహిమచే ఘనదీప్తిమహిమచేత


తే.

రూపవంతులు చటులప్రతాపనిధులు, వృక్షపాషాణనఖదంతహేతు లుగ్రు
లభిలదివ్యాస్త్రకోవిదు లమితయశులు, మేఘగంభీరహోషు లమోఘబలులు.

408


వ.

మఱియు నప్రమేయపరాక్రములును బహువిధసంస్థానవ్యంజనలక్షణోపేతులును
మేఘబృందాచలకూటకల్పులును యుద్ధకర్మవిశారదులును దుర్గకాంతారద్వీప
సంభవులును శతసహస్రాయుతనియుతప్రయుతార్బుదసంఖ్యాతులును నై పుడమి

యీనిన తెఱంగున నిజలజలధివలయితమహీమండలం బెల్ల నిండి మెండుకొని
ప్రచండపరాక్రమంబునం గ్రాలుచు.

408


ఉ.

కొందఱు శస్త్రనందనునిఁ గొందఱు పంకజమిత్రపుత్రునిం
గొందఱు మారుతాత్మజునిఁ గొందఱు నీలునిఁ గొంద ఱానలుం
గొందఱు తారముఖ్యులను గొల్చి హిమాచలమందుఁ గొందఱుం
గొందఱు మేరుముఖ్యగిరికూటముల న్వసియించి రెంతయున్.

409


తే.

ఋక్షగోపుచ్ఛవానరశ్రేణి కెల్ల, నాథుఁడై నిర్జరకులేంద్రనందనుండు
వాలి తనతండ్రి గీర్వాణపాళిఁ బోలె, మించి భుజగర్వగరిమఁ బాలించుచుండె.

410


వ.

అంత నిక్కడ నయోధ్యాపురంబునందుఁ బూర్వోక్తప్రకారంబున హయమే
ధంబు పరిసమాప్తి నొందుచుండ దేవత లందు హవిర్భాగంబుఁ గొని నిజ
నివాసంబులకుం జనినయనంతరంబ యద్ధశరథుండు సమాప్తదీక్షానియ
ముండై సుహృదమాత్యబాంధవబలవాహనంబులఁ గూడి పత్నీగణసమేతంబు
గాఁ బురంబుఁ బ్రవేశించి యజ్ఞదర్శనార్థం బానీతు లైననానాదేశాధి
రాజుల నెల్ల యథార్హసత్కారంబులం బూజించిన వారు సంతుష్టు లై వసిష్ఠు
నకు నమస్కరించి తమయట్ల వస్త్రాదిదానంబులచేత సంతుష్టు లయినబలం
బులం గూడి నిజదేశంబులకుఁ జనిరి యనంతరంబ యమ్మహీరమణుండు శాంతా
సహితుం డైనఋశ్యశృంగుని బహువిధపూజలం దనిపిన నమ్మహర్షిపుంగవుండు
సంతుష్టాంతరంగుం డై యంగపతి యైనరోమపాదునిచేత నాహూయమానం
డై పత్నీసమేతంబుగా నతనివెంటం జనియె నిత్తెఱంగున సర్వజనంబుల
యథార్హసత్కారంబులఁ బ్రీతచేతస్కులం జేసి స్వదేశంబులకుం బనిచి
దశరథుండు పుత్రోదయంబుఁ గాంక్షించుచు సుఖం బుండె నంత.

411


క.

పంతంబున దశరథభూ, కాంతుని కాంతామణులకు గర్భంబులు నం
తంతకుఁ గర మెదుగఁగ నా, వంతనడుము లెంత బటువు లై తనరారెన్.

412


సీ.

నాగేంద్రయానలనడలు మందము లయ్యెఁ బదపడి రుచికోర్కి బహుళ మయ్యె
గండరేఖలు పాండుడిండీరరుచిఁ బొల్చెఁ గమ్మనిట్టూర్పులు గ్రమ్మ సాగె
లలిముద్దుమోములఁ గీతలయింపులు దేఱెఁ దెలివాలుకనుడాలు తేఁట యెసఁగె
ముద మారఁ జూచుకంబుల నల్పు రెట్టించె వళులు నానాఁటికి వన్నె కెక్కె


తే.

రుచిరమేచకరుచిఁ బొల్చె రోమరాజి, నాద మంతంత కెలమి మందత వహించెఁ
బేదకౌనుల మొలనూలు బిగువుఁ జెందెఁ, బలుచమేనుల కొకవింత పసలు గలిగె.

413


తే.

పూర్ణగర్భిణు లగుచు నాపుష్పగంధు, లతివిశదకాంతి నలరారి రద్భుతముగఁ
గలువపూఱేనిగర్భంబు నలరఁ దాల్చి, వఱలుప్రాచీదిశాంగన యొఱవుఁ దెగడి.

414

శ్రీరామావతారఘట్టము

క.

నెల లంతంతకు డగ్గఱ, నలసటలుం దఱుచు నిగుడ నభినవగతి నా

పొలఁతుకలకు నానాఁటికి, నలవడ నీళ్లాడఁ బ్రొద్దు లయ్యె న్మిగులన్.

415


ఉ.

మేటిగఁ జైత్రశుద్ధనవమీబుధవారపునర్వసూడుక
ర్కాటకలగ్నమందు గురురాజులు నొక్కటఁ గూడి పర్వ స
య్యాటముతో శుభగ్రహము లైదు సముచ్ఛగతిం జరింప నా
ఖేటవిభుండు మింటినడుక్రేవ సముజ్జ్వలుఁ డై వెలుంగఁగన్.

416


వ.

ఇట్టిశుభసమయంబున.

417


సీ.

మొలకనవ్వులవాని వలరాజు నలరాజు వలపింపునవకంపుఁజెలువువాని
నరచందురునియంద మిర వొంద నను వొందు పస మీఱుమిసిమినెన్నొసలవాని
నలతమ్మివిరియిమ్మ లవి సొమ్ముగాఁ గొన్న గరువంపుఁదెలిసోఁగకనులవాని
నెలమావిననకావిచెలువులోఁ గొని చాల మురువుఁ గాంచిన ముద్దుమోవివానిఁ


తే.

జారులక్షణశుభవిలాసములవాని, నచ్యుతార్ధాంశ మగువాని నరివిరాము
సకలగుణధాము రాముఁ గౌసల్య గనియెఁ, గలువదొరఁ బూర్వదికృతి గన్నయట్లు.

418


క.

ఘనతేజుఁ డైనయానం, దనుచేఁ గౌసల్య పుడమిఁ దద్దయు నొప్పెన్
అనిమిషలోకవిభుం డై, యనువందెడువజ్రి చేత నదితియుఁ బోలెన్.

419

భరతలక్ష్మణశత్రుఘ్నులు కైకేయీసుమిత్రలయం దుదయించుట

చ.

అలికులవేణి గైక గనె నాదశమీగురుతారయందు సొం
పలరఁగ మీనలగ్నమున నబ్జముఖున్ సుముఖున్ జగత్సఖు
న్గులగిరిధైర్యు సజ్జనమనోహరుఁ బద్మవిశాలనేత్రునిన్
లలితగుణాఢ్యునిన్ సుజనలాభరతు న్భరతు న్ముదంబునన్.

420


మ.

ఘనకర్కాటకలగ్నమందు ఫణినక్షత్రంబున న్భూరిశో
భనవిస్ఫూర్తి సుమిత్ర గాంచె సుతులం బంచాంబకాకారుల
న్మనువంశాఢ్యుల దీర్ఘబాహుల మహానందాత్ముల న్వంశవ
ర్ధనుల న్లక్ష్మణునిన్ జగన్నుతకళాధౌరేయు శత్రుఘ్నునిన్.

421


తే.

వరకుమారునిఁ గన్నపార్వతివిధమునఁ, జంద్రుఁ గాంచిన పూర్వదిక్సతిసొబగున
హరిహయుని వామనునిఁ గన్నయదితికరణి, మెఱసెఁ గౌనల్య గైక సుమిత్ర మిగుల.

422


వ.

ఇట్లు కౌసల్యాదేవియందు నారాయణార్ధాంశంబున రాముండును సుమిత్రయం
దుఁ దచ్చతుర్థాంశంబున లక్ష్మణుండును దదష్టాంశంబున శత్రఘ్నుండును గైకే
యియందుఁ దదష్టాంశంబున భరతుండును నవతరించి దశరథుని కనురూ
పు లై గుణవంతు లై నిజద్యుతులచేతఁ బ్రోష్ఠపదోపమాను లై యొప్పి రపుడు.

423


క.

మొఱసెను సురదుందుభు లటు, కురిసె న్మందారకల్పకోమలసుమము
ల్మొఱసెం గిన్నరగీతో, త్కరము లెసఁగె నిర్జరవనితానటనంబుల్.

424

సీ.

సకలామరశ్రేణి చటులాపదలు దీఱె దివిజారిగుండెల దిగులు సేరెఁ
బాపసంతతులు పటాపంచ లై పాఱె విమలచిత్తులమనస్తమము జాఱె
లతితాంబుధులఁ బుష్కరములు దేటలఁ దేఱె దిఙ్ముఖంబుల వింతతెలుపు లూరె
రవిశశధరమండలములఁ గాంతులు మీఱె వసుధాచకోరాక్షి నగపు దీఱె


తే.

మహితతాపససందోహమానసాంబు, జములు వికసించి తనరారె సకలలోక
ములకుఁ గళ్యాణసుఖములు మొలకలెత్తె, నచ్యుతుఁడు రాముఁడై పుట్టినట్టివేళ.

425


వ.

అప్పు డప్పురవరంబు నటనర్తకగాయకవాదకజనసంకులరాజమార్గం బై యు
త్సవనృత్యంబు సేయుచుండె నంత నద్దశరథుండు పుత్రు లుదయించుట విని
పరమానందభరితహృదయారవిందుం డై తత్ప్రియాఖ్యాయులకు రత్నాంబర
భూషణాదు లొసంగి బ్రాహ్మణులకు ధనంబును ధేనువులు నొసంగె నంతఁ బద
నొకొండవదినంబున మహర్షిశ్రేష్ఠుం డగువసిష్ఠుండు.

426

వసిష్ఠమహర్షి రామాదులకు నామకరణంబుఁ జేయుట

తే.

క్రమముగా నగ్రసుతునకు రాముఁ డనఁగఁ, బరఁగఁ గైకేయిసుతునకు భరతుఁ డనఁగ
మఱి సుమిత్రాత్మజునకు లక్ష్మణుఁ డనంగ, రమణ శత్రుఘ్నుఁ డనఁగఁ బే ళ్లమర నిడియె.

427


వ.

ఇట్లు నామకరణంబుఁ జేసి జాతకర్మాదిశుభకర్మంబు లన్నియు నిర్వర్తించి బ్రాహ్మ
ణులకుఁ బుష్కలంబుగా నన్నంబుఁ బెట్టించి యథేష్టంబుగా మణిసువర్ణవస్త్రా
దికంబు లొసంగి యమందానందంబునం బొదలుచుండె నంత నారాజనంద
నులు పూర్వపక్షశశాంకునిపోలికి దినదినప్రవర్ధమాను లై జననీజనకులకు
ముదంబు రెట్టింప బాల్యంబు వీడి సకలజగన్మోహనం బైనయౌవనంబు నొంది
శాస్త్రంబులయందుఁ బరిచయంబు గలిగి నీతులయం దభిరతులై ధర్మశాస్త్రం
బులయందుఁ బరిజ్ఞాతలై కోదండపాండిత్యంబులం దారితేఱి గజహయాధిరో
హంబులయందు జితశ్రము లై పరిపంథిమర్మభేదనవ్యూహద్వంద్వయుద్ధచిత్ర
శస్త్రాస్త్రనైపుణ్యంబులం బ్రవీణత గలిగి చతుర్విధోపాయంబులం బ్రసిద్ధులై
గర్భైకాదశవర్షంబుల నుపనీతు లై వేదాధ్యయనంబు సేసి కళంకరహిత
శశాంకుపొంకంబున నతనుత్వరహితకుసుమశరుపోలికి సకలజగన్మోహనాకార
లీలావిహారచాతుర్యంబుల నిఖిలజనమనోహరు లగుచు వినోదించుచుండి రందు.

428


క.

జ్యేష్ఠుం డగురాముఁడు లో, కేష్టుం డై దశరథునకు హితుఁ డై పురుష
శ్రేష్ఠుం డై విధికై డి, శిష్టుం డై చంద్రుభంగిఁ జెలువు వహించెన్.

429


క.

ధీరుం డై ఘనసుగుణో, దారుం డై కీర్తివిజితతారుం డై గం
భీరుం డై ధీరుం డై, శూరుం డై యొప్పె నతఁడు సురుచిరభంగిన్.

430


క.

పితృశుశ్రూషణరతుఁ డై, శ్రుతివిదుఁ డై చాపవేదశోధకుఁ డై సు

వ్రతుఁ డై యతిరథుఁ డై బుధ, హితుఁ డై తనరారె నాతఁ డెంతయుఁ బ్రీతిన్.

431


మ.

ఘనుఁడున్ స్నిగ్ధుఁడు లక్ష్మివర్ధనుఁ డమోఘప్రేముఁ డాలక్ష్మణుం
డనఘుం డన్నయు లోకరాముఁడు హితవ్యాపారుఁ డారామభ
ద్రునకున్ దక్షిణబాహు వై ప్రియుఁడు నై తోడై సదాభూరిశో
భనసందాయకుఁ డై రహిం దగె బహిఃప్రాణంబుచందంబునన్.

432


క.

సొంపార రామభద్రుఁడు, నింపుగ లక్ష్మణుని విడిచి యించుకయు న్ని
ద్రింపఁడు సరసాన్నము భుజి, యింపఁడు క్రీడారతిఁ జరియింపఁడు నెపుడున్.

433


క.

ఆరామవిభుఁడు చటులా, శ్వారూఢం డగుచు వేఁట కరిగెడుతఱిఁ ద
ద్భూరిశరాసనధరుఁ డై, వీరుఁడు లక్ష్మణుఁడు పోవు వెనుకొని ప్రీతిన్.

434


తే.

ఇంపు సొం పార లక్ష్మణుం డెల్లప్రొద్దుఁ, బూని రాముని కతిహితుం డైనభంగిఁ
బరఁగ శత్రుఘ్నుఁడును జాల భరతునకును, బ్రీతి నెప్పుడు కడుహితుండై తనర్చె.

435


తే.

మఱియు దశరథధారుణీమండలేంద్రుఁ, డక్కుమారోత్తములచేత ననవరతము
సేవ్యమానుఁ డై మిక్కిలి చెలఁగుచుండె, ననిమిషులచేతఁ బంకజాసనుఁడు వోలె.

436


వ.

ఇట్లు దశరథుండు నందనులచేత నుపాస్యమానుం డై యక్కుమారు లారూఢ
యౌవను లగుటఁ దలపోసి తగినకన్యలం దెచ్చి వివాహంబులు సేయుటకు
నుపాధ్యాయబాంధవసహితంబుగా విచారించుచున్నసమయంబున.

437

విశ్వామిత్రమహర్షి దశరథమహారాజుకడ కేతెంచుట

సీ.

అల వసిష్ఠునితోడఁ గలహించి యెవ్వాఁడు సదమల బ్రహ్మర్షిపదము వడసె
సురలపై నలిగి భూవరునకై యెవ్వాఁడు ప్రతినాక మొనరించె వితతమహిమ
ఘనతపంబునకు విఘ్నము సేయ వచ్చిన రంభ నెవ్వఁడు దిట్టె రాయి గాఁగఁ
బరఁగ నెవ్వఁడు యాగపశువుగాఁ గొనిపోవుద్విజపుత్రు బ్రతికించె విపులకరుణ


తే.

నట్టితాపసకులవర్యుఁ డమితతేజుఁ, డంబురుహగర్భసముఁడు మహామహుండు
గాధినందనుఁ డమ్మహీకాంతుఁ జూడ, నక్కజంబుగఁ జనుదెంచె నొక్కనాఁడు.

438


తే.

వచ్చి వాకిట నిలిచి దౌవారికులను, గాంచి మారాక యానృపాగ్రణికిఁ దెలుపు
మనుడు రయమున నొకఫణిహారుఁ డరిగి, నరవరాగ్రణి కొలువున్ననగరు సొచ్చి.

439


ఉ.

ఏలికఁ గాంచి కేలు ఘటియించి నృపాలమణీ పరాకు నా
యేలినసామి కౌశికమునీంద్రుఁ డుపాత్తలసన్మహాతప
శ్శీలుఁడు వచ్చి సంభ్రమముచేఁ దలవాకిట నున్నవాఁడు తే
జోలసితుండు నావు డల సూర్యకులేంద్రుఁడు హృష్టచిత్తుఁ డై.

440


క.

గురుసహితుఁ డై మహేంద్రుఁడు, వరచతురాననున కెదురు వచ్చినభంగిన్
గురుసహితుఁ డై మహీంద్రుఁడు, కర మద్భుతభక్తి నెదురుగాఁ జనుదెంచెన్.

441


తే.

అట్లు చనుదెంచి ప్రజ్వలితాగ్నిమాడ్కిఁ, గ్రాలు మునినాథు సంశ్రితవ్రతునిఁ గాంచి

భక్తిఁ దత్పదాబ్జములకుఁ బ్రణతిఁ జేసి, యర్ఘ్యపాద్యప్రముఖపూజ లాచరించి.

442


వ.

వినయంబున గృహంబులోనికిం దోడ్కొని చని కాంచనాసనంబున నాసీనుం
జేసి శాస్త్రదృష్టవిధానంబున నర్చించిన నప్పరమతపస్వి తత్పూజనంబుఁ బ్రతి
గ్రహించి పురరాష్ట్రకోశజనపదబాంధవసుహృజ్జనంబులయందుఁ గుశలంబడిగి.

443


తే.

అనఘ పగతులు నిర్జితు లైరె మంత్రి, వరులు వశవర్తు లై చరింతురె సమస్త
నృపులు సన్నుతు లగుదురె నీకుఁ జేయఁ, గంటివే దైవమానుషకర్మచయము.

444


వ.

అని పలికి పదంపడి వసిష్ఠమునిశ్రేష్ఠునిం జూచి సగౌరవంబును సస్నేహంబును
సవినయంబునుం గా సేమం బరసి తక్కినమహర్షుల నందఱ నయ్యైతెఱంగుల
సంభావించి వారిచేత నుపాస్యమానుండై నిజతేజోజాలంబులఁ దత్సభాంతరం
బెల్ల వెలుంగం జేయుచు సుఖాసీనుండై యుండె నప్పు డద్దశరథుండు విశ్వా
మిత్రు నవలోకించి వినయంబున ని ట్లనియె.

445


ఆ.

అమృతకలశ మబ్బిన ట్లనూదక మందు, నీరు సెందినట్లు నిర్ధనునకు
నమితధనము దొరికి నటుగాదె మీరాక, నేఁడు మాకు గాధినృపకుమార.

446


ఆ.

ధర్మపత్నులందుఁ దనయులఁ బడసిన, నాఁటికంటె మౌనినాథ నేఁడు
యినుమడించె నాదుహృదయమందుఁ బ్రమోద, లాభ మనఘ నీదురాకవలన.

447


క.

మునినాథ దైవికంబునఁ, జనుదెంచితి నీవు నాదుసదసంబునకుం
బను లన్నియు సమకూడెను, పనివడి మీకృపకుఁ జాలఁ బాత్రుఁడ నైతిన్.

448


తే.

సంయమీశ్వర ఘోరసంసారజలధి, మగ్నమాదృశనరపాలమండలంబు
నుద్ధరింపంగ సదుపాయ మెందుఁ గలదె, యుష్మదీయకృపాపోత మొకటిదక్క.

449


మ.

అనఘం బై సుపవిత్ర మై శుభకరం బై యొప్పుమీదర్శనం
బున నాజన్మము సార్ధ మయ్యె యశము న్బొల్పొందె బల్నిష్ఠఁ జే
సినపుణ్యంబు ఫలించె నిత్యశుభము ల్సేకూడె నోగాధీనం
దన వెయ్యేటికి సాధుభూపతులలో ధన్యుండ నై మించితిన్.

450


తే.

మొదల రాజర్షివై చాలఁబొగడు వడసి, పిదపఁ దపమున బ్రహ్మర్షిపదము గాంచి
మున్ను భువనప్రసిద్ధిఁ గైకొన్న నీదు, మహిమ లెఱిఁగి నుతింపంగ మాకు వశమె.

451


క.

గురుఁడవు దైవతమవు శుభ, కరుఁడవు బలదాయకుఁడవు కర్తవు సంప
త్కరుఁడవు దైవతమవు సుఖ, కరుఁడవు మా కెపుడు నీవ కావె మహాత్మా.

452


వ.

మునీంద్రా మిముబోఁటి పరమసిద్ధులకు మ మ్మడుగవలసినకార్యం బొక్కింతైనఁ
గలుగమి నిక్కువం బైనను నడుగ వలసి యడిగెద నేమి దలంచి విజయంబు
సేసితిరి నా కెయ్యది కర్తవ్యం బానతిండు పాత్రభూతుండ వగుటం జేసి భవత్కా
మితంబుఁ దీర్చెద మహానుభావుం డైననీవు మద్దృహంబున కరుదెంచుట నా
యందుం గలవాత్సల్యాతిశయంబునం గదా యని శ్రవణసుఖంబుగాఁ బల్కిన

నప్పలుకుల కలరి నిజతేజోధరీకృతశతపత్రమిత్రుం డగువిశ్వామిత్రుండు హర్ష
పులకితగాత్రుం డై యజరాజపుత్రున కిట్లనియె.

453


చ.

మనుకులసంభవుండ వసమానవసిష్ఠకృతోపదేశసం
జనితలసద్వివేకుఁడవు సాధువిధేయుఁడ వన్వయోచిత
ప్రణయవిదుండ వీపగిదిఁ బల్కుట నీ కనురూపమే కదా
మనుజవరేణ్య నీ వనినమాట కసత్యము గల్గ దెన్నఁడున్.

454


క.

హితమతి నస్మన్మానస, గతకార్యం బెఱుకపఱతు గ్రక్కున దానిం
జతురత నొనర్చి సత్య, ప్రతిశ్రవుఁడ నగుము నీవు పార్థివముఖ్యా.

455


వ.

అని బహూకరించి వెండియు.

456


చ.

అనఘచరిత్ర యే నొకమహాధ్వరకర్మ మొనర్పఁ బూని మ
ద్వనమున దీక్షఁ గైకొని యథావిధి హోమము సేయుచుండఁగా
దనుజవరేణ్యు లిద్ద ఱతిదర్పితు లుగ్రులు కామరూపు లై
వెనుకొని వచ్చి యెంతయును విఘ్న మొనర్తురు సారెసారెకున్.

457


క.

ఏ నెన్నిమార్లు సేయం, బూనిన వా రన్నిమార్లు పూని చలమునన్
నానావిధవిఘ్నంబుల, దానిం గొనసాగనీరు దశరథనృపతీ.

458


ఉ.

నెత్తురు వహ్నికుండములు నించుచుఁ బావనయజ్ఞవేదిపైఁ
గుత్తుకబంటిమాంసమును ఘోరముగా దివినుండి వైచుచుం
దత్తఱపాటుతో మునులఁ దద్దయుఁ గాఱియపెట్టుచుం గడుం
జిత్తము గంద నత్తపముఁ జెల్లఁగనీ రిఁక నేమి జెప్పుదున్.

459


చ.

పెనుకినుక న్నిశాటుల శపింపఁ గడంగియు దీక్షితుండ నై
మనమున నల్కఁ బూనిన సమంచితయాగఫలంబు వ్యర్థ మై
చను ననియుం జిరార్జితవిశాలతపంబున కర్థి హాని గ
ల్గు ననియుఁ దాల్మిచేత మదిఁ గూరినకిన్క నడంతు సారెకున్.

460

విశ్వామిత్రుఁడు యాగరక్షణార్థమై రామునిఁ దన కొసఁగఁ గోరుట

తే.

వారు సుందోపసుందకుమారు లమిత, విక్రములు కామరూలు వీరకర్మ
విదులు మాయావులు దశాస్యవీరభటులు, జనవర సుబాహుమారీచు లనెడివారు.

461


చ.

జవయుతుల న్నిశాటుల వెసం దునుమ న్భవదగ్రనందనున్
భువనమనోహరు న్బలరిపుప్రతిమున్ సుగుణాభిరామునిన్
రవికులవార్ధిసోముని నరాతివిరాముని రాము నెంతయు
న్సవరణ మీఱఁ దోడ్కొని చనం జనుదెంచినవాఁడ వేడుకన్.

462


క.

భూమీశతిలక సుగుణో, ద్గాముని ఘనకాకపక్షధరుని న్శూరున్

భీమసమానపరాక్రము, రాముని నా కొసఁగు మిపు డరాతుల నొడువన్.

463


క.

ఇతఁ డెంతయు నాచేఁ బాలితుఁడై యాత్ర్మీయదివ్యపృథుతేజమునన్
దితిజులవినాశనమునం, దతులితగుణధుర్యశక్తుఁ డై తనరారున్.

464


క.

ఎద్దానివలన నీతఁడు, దద్దయు ముజ్జగములందు ధన్యుం డనఁగాఁ
బెద్దయు విఖ్యాతి పడయు, సద్దివ్యానేకరూపయశము నొసఁగెదన్.

465

దశరథుఁడు రామునివెంటఁ దన్నును దోడ్కొని పొమ్మనుట

క.

రామునిముంగల నిలువఁగ, నామనుజాశనులు చాల రనిలో వారిన్
రాముండు దక్క నన్యుం, డీమహిలోఁ దునుమఁ జాలఁ డినకులతిలకా.

466


తే.

అధీప బలవీర్యదర్పితు లగుటఁ జేసి, ప్రాప్తు లై కాలపాశనిబద్ధు లగుచు
నున్నవా రన్నిశాటులు యుద్ధమందు, ఘనబలుం డైనరామునిఁ గడువలేరు.

467


క.

విమలాత్మక పుత్రస్నే, హము విడువుము నీదుభావ మంత యెఱుఁగుదున్
సమరమున దానవుల ని, క్కము రామశరాభిహతులఁ గా నెఱుఁగు మొగిన్.

468


తే.

రామభద్రుఁడు సత్యవిక్రముఁడు లోక, హితుఁడును మహాత్ముఁ డని మది నే నెఱుఁగుదు
నీవసిష్ఠమహాముని యెఱుఁగు మఱియు, నితరతాపసు లెఱుఁగుదు రితనిమహిమ.

469


తే.

శాశ్వతం బైనయశమును సర్వధర్మ, లాభము నఖండభూరికల్యాణలాభ
మును పడయఁగోరితేని యోభూతలేంద్ర, చంద్ర రాముని నాకు నొసంగు మిపుడు.

470


తే.

అధిప నావెంట బంపుట కఖిలమంత్రి, వరులును వశిష్ఠముఖమునివరులు సమ్మ
తించి యున్నారు నీవు సందియము దక్కి, నా కొసంగుము రాముని లోకనుతుని.

471


వ.

మహాత్మా యే నొనర్పం బూనినదశరాత్రయాగకాలం బతీతంబు గాకుండ
శీఘ్రంబున భవత్కుమారకుం డైనరాముని నాపిఱుందం బంపి సత్యప్రతిశ్ర
వుండవు గ మ్మట్లైన నీకు శుభంబు గలుగు నని ధర్మార్థసహితంబు లగుపలుకులఁ
బలికి క్రమ్మఱ నతం డిచ్చుసదుత్తరంబు వినువాఁడై యూరకున్న నావిశ్వామి
త్రునివచనంబులు విని యద్దశరథుండు వ్యధితమనస్కుం డై తీవ్రశోకంబున
నొక్కింతసేపు మైమఱచి యుండి క్రమ్మఱ లబ్ధసంజ్ఞుం డై మొగంబున దైన్యంబు
దోఁప నిరుద్ధబాష్పోదయసన్నకంఠుం డై యిట్లనియె.

472


తే.

అనఘ రాజీవలోచనుం డైనరాముఁ, డూసషోడశవర్షుండు వీని కాజి
నసురులు నెదిర్చి పోరాడునట్టి భూరి, కర్కశం బైనభుజశక్తిఁ గాన మిపుడు.

473


ఉ.

బాలుఁడు ధీరుఁ డై రిపులపాళి నెదిర్చి రణం బొనర్పఁగాఁ
జాలఁడు యస్త్రశస్త్రములచంద మొకింత యెఱుంగఁ డాజివి
ద్యాలసితుండు గాఁ డరిబలాబలయుక్తు లెఱుంగఁ డుగ్రదై
త్యారి నెదిర్చి పోర నకృతాస్త్రుని రామునిఁ బంపఁ జెల్లునే.

474

తే.

నిన్నమొన్నటివాఁడె యీచిన్నకుఱ్ఱఁ, డకట రాఘవుఁ డెక్కడ యసురు లేడ
సమరమున వారి నీతఁడు సంపు టేడ, యింత చింతింపవలదె మీ రేమి చెప్ప.

475


మ.

సుతులం గానక పెద్దకాలము మదిన్ శోకించి పెక్కేండ్ల కీ
సుతులం గంటిఁ గృపన్ భవాదృశజటీశుల్ సేయునాశీర్వరో
న్నతి మద్భాగ్యవిశేషమున్ భవదధీనంబే కదా యీజగ
ద్ధితునిం దైత్యులతోడఁ బోరుటకు నే నేలాగు పుత్తెంచెదన్.

476


చ.

ఘనగుణశాలి ప్రాణములకంటెఁ బ్రియుం డగురామచంద్రునిన్
జననుతు నొంటిఁ బంపి నిమిషం బయినన్ మనఁ జాల వంశవ
ర్ధనుఁ డగునట్టియీతలిరుప్రాయపుముద్దులకుఱ్ఱఁ డేల నీ
యనుమతి నేనె వచ్చెద సురారులఁ జంపి మఖంబుఁ గావఁగన్.

477

దశరథుఁడు విశ్వామిత్రుని సుబాహుమారీచాదులసమాచారం బడుగుట

వ.

మహాత్మా మిముబోఁటిమహాత్ములయనుగ్రహవిశేషంబున నా కక్షౌహిణీపరి
పూర్ణం బైనసైన్యంబు గొఱంతపడకుండఁ గలిగి యున్నది మఱియు సర్వాస్త్ర
కుశలు లగువీరులు దండనాథు లనేకు లున్నవారు వీ రందఱు భవత్ప్రసాదం
బున రక్షోగణనిగ్రహంబునందు దక్షు లై యుండుదు రట్టి వీరభటకోలాహల
సంకులం బైనబలంబునుం గూడి ధనుర్ధరుఁ డైనయేను జనుదెంచి రణంబున
నసురుల నెదిర్చి ప్రాణంబులు దాఁపక నాయకపరంపరల నిశ్శేషంబుగా రూపు
మాపి భవద్వ్రతచర్య నిర్విఘ్నంబుగా సమాప్తి నొందించి వచ్చెద రామునిఁ
దోడ్కొనిపోవ నిశ్చయించితిరేని చతురంగబలోపేతుం జేసి మత్సహితంబుగాఁ
దోడ్కొని చనుము నాకు నల్వురుపుత్రులు గల రైనను వారిలో రాముండు
జ్యేష్ఠుండును ధర్మప్రధానుండు గావున నితనియందు మిక్కిలిఁ బ్రీతి గలిగి
యు౦డు నద్దనుజు లెట్టివా రెవ్వనికొడుకు లెవ్వనిచేత రక్షితు లగుదు రెట్టిపరి
మాణంబు గలవారు నాకును రామునకు నాబలంబునకు నెత్తెఱంగునఁ బ్రవ
ర్తింపవలయు నేయుపాయంబునఁ బరిమార్పవచ్చు నెచ్చటనుండి చనుదెంతు
రేచందంబునం జరింతు రింతయు నెఱింగింపుం డనిన మునిగ్రామణి నృపగ్రామ
ణికి నిట్లనియె.

478


సీ.

జననాథ యల పులస్త్యబ్రహ్మ మనుమఁడు రావణుం డనియెడు రాక్షసుండు
విధిదత్తవరజాతవీర్యగర్వంబున మత్తుఁ డై తనయట్ల మత్తు లైన
దుష్టనిశాటులతోఁ గూడి యనిశంబు ఘనబలప్రౌఢి లోకముల నెల్లఁ
బ్రతిహతద్యుతులుగా బాధించు చున్నవాఁ డనుమాట మన మెల్ల నాలకించి


తే.

నదియె కద యద్దశాస్యుఁడు యక్షనాథు, ననుజుఁ డల విశ్రవునిపుత్రుఁ డధికసత్వుఁ
డయ్యు జగతి నాసురభావుఁ డగుటవలన, గహ్వరీనాథ మఖవిఘ్నకర్త యయ్యె.

479


శా.

ఆరక్షఃపతిపంపున ఘనమహోగ్రాకారు లుద్యద్బలుల్

శూరుల్ దుష్టులు గామరూపధరులున్ సుందోపసుందాత్మజు
ల్మారీచుండు సుబాహుఁ డన్ సురరిపు ల్ధైర్యోద్ధతుల్ క్రవ్యభు
గ్వీరుల్ సారెకు వత్తు రాసవనమున్ విఘ్నంబు గావింపఁగన్.

480

దశరథుఁడు రాక్షసులబలంబు విని వెఱచి రామునిఁ బంప నొల్లననుట

క.

అని పలికినమునినాథువ, చనమున్ విని యొల్లఁ బోయి జననాథుఁడు నె
మ్మనమున భీతి గదుర నా, ననమున దైన్యంబు దోఁప నమ్రుం డగుచున్.

481


వ.

అంజలిఁ గీలించి యి ట్లనియె.

482


చ.

మునివర రావణుం డనఁగ ము న్నసహాయతఁ బెక్కుమాఱు ల
య్యనిమిషదైత్యసంగరములందు దిగీశులతోడఁ బోరువాఁ
డనుపమవిక్రమాప్తి బిరు దందిన మేటిమగండు వానితో
నని నెదిరించి పోర దివిజాధిపముఖ్యుల కైనఁ జెల్లునే.

483


తే.

అంతలంతటివేల్పు ల ట్లగుచు నుండ, దానవునిదేజము సహింప మౌనినాథ
మనుజులన నెంతవారలు మనుజులఁ దిను, వారి మనుజులు వధియింపఁ గోరు టెట్లు.

484


క.

ఆరావణుండు సమరజి, తైరావణుఁ డనఁగ వినమె యాతనితోడన్
మా ఱొడ్డి సంగరంబునఁ, బోరఁగ నాతరమె మౌనిపుంగవ తలఁపన్.

485


వ.

మఱియు సుందోపసుందనందను లగుమారీచసుబాహులు వీర్యగర్వంబున
నెవ్వరి మెచ్చక మాయాబలవిశేషంబునఁ బురందరాదిబృందారకుల లెక్క
సేయక యుక్కునం గ్రాలుచు యజ్ఞవిఘ్నకరు లై ప్రవర్తింతు రనునది జగత్ప్ర
సిద్ధంబై మ్రోయుచుండు నే నెట్టిజెట్టిజోదుల నైన బిట్టెదిరించి కట్టల్క గట్టి
తనంబుఁ జూపి యిట్లట్ల సుడి పెట్ట నోపుదుంగాని కాలాంతకయమోపము లగు
నమ్మారీచసుబాహుల నోర్వం జాల ననేకసంగ్రామంబుల నారితేఱి పేరుకొన్న
నాయట్టిశూరులకుం దీర్పరానికార్యంబు బాలుండును నకృతాస్త్రుండు నగు
రాముఁ డెత్తెఱంగునం దీర్చువాఁడు నీవు సర్వజ్ఞుండవు గురుండవు నాకు దైవ
మవు కావున మందభాగ్యుండ నైననన్నుం గరుణించి రామునియందుఁ బ్రసా
దంబు సేయుము.

486

విశ్వామిత్రుఁడు దశరథవచనంబు విని క్రుద్ధుఁ డగుట

మ.

అని ధాత్రీవరమౌళి పల్క ముని విశ్వామిత్రుఁ డత్యాగ్రహం
బున యజ్ఞాయతనంబునందు విలసత్సూతాజ్యసిక్తాగ్నిభం
గి నితాంతద్యుతితో నుదీర్ణ మగుచున్ గెంజాయ రంజిల్లులో
చనకోణంబుల రాజుఁ జూచి పలికెన్ శస్త్రోపమానోక్తులన్.

487


ఉ.

అచ్చుపడంగ మే మడిగి నప్పుడే లే దని పల్కు టొప్పు గా
కిచ్చెద నందుఁ బల్కి తుది నీగతి బొంకుట రాజనీతియే
రచ్చల నీవలెన్ రఘుకులంబునఁ బుట్టినరాజు లెన్నఁడుం

బొచ్చెము లాడ రన్వయ మపుణ్యముఁ జేసితి వేమి చెప్పుదున్.

488


శా.

ఎంతో గౌరవ మింత యయ్యె నయితే నేమాయెఁ గానిమ్ము మా
కింతే చాలుఁ గొఱంత యేమి పను లిం కేరీతిచే నైన నొ
క్కిం తైనం దుది ముట్టవే పలుకు లిం కేలా మృషావాది వై
సంతోషంబున నుండు మీవు సుఖి యై క్ష్మానాథ యేఁ బోయెదన్.

489


వ.

అని పలికిన నవ్విశ్వామిత్రుని దుర్నివారక్రోధరసోదీర్ణం బైనరూపలక్షణం
బుపలక్షించి.

490


క.

ధర దిరిగెం గులశైలము, లొరగెన్ దిగ్భిత్తు లడరె నుడుపతి రాలెన్
శరనిధు లింకెన్ భూతము, లఱిముఱి వడవడ వడంకె హరివరుఁ డడరెన్.

491

వషిష్ఠుఁడు రాముని విశ్వామిత్రున కొసంగు మని దశరథునకు బోధించుట

శా

అంతం గొంత వసిష్ఠుఁ డాజటిలుకోపాటోపముం జూచి లో
వంతం జింతిలి కోర్కిఁ దీర్తు నని మున్ వా క్రుచ్చి యిమ్మేదినీ
కాంతుం డీనికతంబునం దపసి శంకం జాలఁ గోపించినాఁ
డెంతో మోసము వచ్చె నంచు వెసఁ బృథ్వీశేంద్రుతో ని ట్లనున్.

492


మ.

జననాథా సుపవిత్ర మైనమనువంశంబందు జన్మించి స
జ్జనమాన్యుం డన సువ్రతుం డనఁగ సాక్షాద్ధర్మతుల్యుం డనా
వినుతప్రజ్ఞుఁ డనా మహాద్యుతి యనా విఖ్యాతి వాటించి నేఁ
డనుమానింపక వంశధర్మ మెడ సేయం బూనఁగాఁ జెల్లునే.

493


చ.

ఇనకులవర్య తాఁ దొలుత నిచ్చెద నంచు వచించి వేఁడఁ బో
యినఁ గడులోభబుద్ధిఁ దుది నీక పెనంగిన యాగపూర్తముల్
పనిచెడి పోవు నంచు మును పల్కిరి కాన నధర్మవృత్తిఁ గై
కొనక స్వధర్మ మూఁది రఘుకుంజర రామునిఁ బంపు మిత్తఱిన్.

494


తే.

అధిప యకృతాస్త్రుఁ డైనఁ గృతాస్త్రుఁ డైన, నేమి కౌశికగుప్తుఁ డై యెసఁగునట్టి
రాము వీక్షింపఁగా లేరు రాత్రిచరులు, దారుణానలగుప్తామృతమునుబోలె.

495


ఉ.

ఈమునివంశశేఖరు నహీనమహత్వము లెన్నఁ జిత్రముల్
భూమివరాగ్రగణ్యకులభూషణ పూర్వ మఖండచండవి
ష్ఠామహిమంబుచేఁ దపము సల్పి తదద్భుతశక్తియోగవి
ద్యామహిమాధికుం డనఁగ నద్భుతశీలముఁ గన్నవాఁ డిలన్.

496


మ.

ఘనుఁ డీసంయమినేత దివ్యశరశిక్షాశాలి మార్తాండవ
హ్నినిభుం డుగ్రతపంబునన్ మును భవానీనాథు మెప్పించి యా
యనచేఁ బెక్కునిశాతసాయకము లుద్యత్ప్రీతిఁ జేకొన్నవాఁ
డెనయే యీయన కెవ్వ రైన విపులాహిస్వర్గలోకంబులన్.

497


చ.

వెలయఁగ నిమ్మునిప్రభుఁడు విగ్రహవంతుఁడు ధర్మశీలుఁడున్

బలరిపుతుల్యవిక్రముఁడు పావనమూర్తి తపఃపరాయణుం
డలఘయశుండు నద్భుతవిహారుఁడు బుద్ధ్యధికుండు ముజ్జగం
బులఁ గలదారుణాస్త్రచయమున్ సకలంబు నెఱుంగు భూవరా.

498


వ.

మహీంద్రా నీకుమారుం డైనరాముండు సువిగ్రహవంతుఁడును సహజవీర్యుం
డును సహజజ్ఞానశక్తియుక్తుండును దపంబునకుఁ బరమప్రాప్యంబును నై యుం
డు మఱియు నతండు చరాచరాత్మకత్రిలోకస్థసమస్తాస్త్రశస్త్రంబులు నెఱుంగు
నతనిప్రభావం బెవ్వ రెఱుంగరు శక్రాదిదిగీశు లైన నతనికి సములు గా రది
య ట్లుండనిమ్ము తొల్లి భృశాశ్వుండు తనుమధ్య లగుదక్షకన్యల జయసుప్రభ
లనువారి నిర్వురఁ బరిణయం బై యక్కాంతలయందు రాక్షసవధార్థంబు
క్రమంబున నస్త్రశస్త్రస్వరూపులఁ బరమభాస్వరుల నతిధార్మికుల నానావర్ణ
రూపుల మహావీర్యుల దీప్తిమంతుల జయశీలుర నప్రమేయప్రభావుల నప్రతి
హతతేజులఁ గామరూపుల దురాధర్షుల బలవంతుల వేవురఁ బుత్రులం బడసె
శంకరుం డితనితపంబునకు మెచ్చి యయ్యస్త్రశస్త్రంబుల నన్నింటి నిమ్మునీం
ద్రున కొసంగె దానంజేసి యితండు సర్వాస్త్రశస్త్రకుశలుం డై యస్త్రవిదు
లలో నుత్తముం డై త్రిలోకప్రసిద్ధుం డై యుండుఁ జరాచరాత్మకంబు లైన
జగంబులం దిమ్మునీంద్రుం డెఱుంగనియర్థం బొకిం తైన లేమి నిక్కువంబు
మహావీర్యుండును మహాతేజుండును మహానుభావుండు నగునితండు రాక్షన
వినాశంబునందుఁ దాను శక్తుం డయ్యును భవన్నందనుండైన రామున కమేయ
కల్యాణం బొసంగం దలంచి కృపావిశేషంబునఁ జనుదెంచినాఁడు కావున
నీవు సందియంబు వదలి పరమానందంబున రాము నిమ్మునిరాజున కొసంగు
మని బోధించిన నగ్గురువచనంబు విని యన్నరశార్దూలుండు ప్రసన్నచిత్తుం డై
యానందించి మహాత్ముం డగువిశ్వామిత్రునకు రాము నొసంగెద నని
నిశ్చయించి.

499

దశరథుఁడు రామలక్ష్మణుల విశ్వామిత్రుని వెంటఁ బంపుట

ఉ.

ఆమనుజాధిపుండు ముద మారఁగ సూతునిఁ జూచి రాజుసు
త్రాముని రాఘవాన్వయలలామునిఁ గోమలనీలనీరద
శ్యామునిఁ బూర్ణకాముని సమంచితచారుగుణైకధామునిన్
రాముని వేడ్కఁ దోడుకొని ర మ్మిటు లక్ష్మణసంయుతంబుగన్.

500


చ.

అనిన మహాప్రసాద మని యాతడు గ్రక్కున నేగి మౌనినా
థునిమది కింపుగా నటకుఁ దోడ్కొని వచ్చెఁ బ్రతాపసాంద్రునిన్
జననుతరూపనిర్జితవసంతజయంతరతీంద్రచంద్రు న
త్యనుపమభోగభాగ్యవిజితానిమిషేంద్రుని రామచంద్రునిన్.

501


ఉ.

వచ్చినపుత్రుఁ గాంచి జనవర్యుఁడు చాల ముదంబుఁ బొంది తా

గ్రుచ్చి కవుంగిలించి వెసఁ గూఁకటి దువ్వి నిజాంకపీఠిపై
ముచ్చట నుంచి తచ్ఛిరము మూర్కొని చెక్కిలి ముద్దుఁ గాంచి లో
హెచ్చినకూర్మి నివ్వటిల నిట్లని పల్కె సుధామయోక్తులన్.

502


ఆ.

నన్నుఁ గన్నతండ్రి నాముద్దులయ్య నా, చిన్నియన్న నిన్నుఁ జెన్ను మీఱఁ
గుశికసుతుఁడు దోడుకొని పోవ వచ్చినాఁ, డరుగు మితనివెంట ననుజుఁ గూడి.

503


వ.

అని పలికి యద్దశరథుండు ప్రీతచేతస్కుండై ప్రాస్థానికం బగుస్వస్త్యయనంబుఁ
బ్రయోగించి ప్రియనందనుం డైనరాముని విశ్వామిత్రుని కొసంగిన.

504


తే.

తల్లులకు మ్రొక్కి పతికి వందనముఁ జేసి, మౌనివరునకుఁ బ్రణమిల్లి మంగళాభి
మంత్రితుం డయి గాధేయమౌనివెంట, హర్ష మిగు రొత్త నరుగు నయ్యవసరమున.

505


క.

మందారవృష్టి గురిసెను, బృందారకబృందదుందుభిస్వను లెసఁగెన్
మందానిలంబు వీచెను, గ్రందుగ వడి మొఱసె శంఖకాహళరవముల్.

506


చ.

నిరుపమదివ్యమౌక్తికమణీముకుళీకృతకాకపక్షుఁ డై
సురుచిరదివ్యహారపరిశోభితరమ్యవిశాలవక్షుఁ డై
శరములు గార్ముకం బసినిషంగములుం గొని మౌనివెంటఁ దా
నరిగెఁ బినాకివెంట ముద మారఁగ నేగుకుమారుఁడో యనన్.

507


క.

రాము నెడఁబాయ కప్పుడు, భీమశరాసనశరాసపృథుతూణము లు
ద్దామగతిఁ దాల్చి వెంటనె, సౌమిత్రి కుతూహలం బెసంగం జనియెన్.

508


శా.

రాణింప న్రఘువర్యు లీక్రియఁ దనుత్రాణుల్ గృపాణుల్ ధను
ర్భాణుల్ శౌర్యధురీణు లద్భుతులు భాస్వద్బద్ధగోధాంగుళీ
త్రాణుల్ తాపసరాజువెంటఁ జని రందం బొప్ప లీలారతిన్
వాణీనాథునివెంట నశ్వులు విభాస్వల్లీలఁ బోవున్ గతిన్.

509


వ.

ఇత్తెఱంగున నత్తరణీకులగ్రామణులు నిజతేజోజాలంబుల దశదిశల వెలుంగం
జేయుచు ద్రిశీర్షంబు లగుపన్నగంబులకరణి నలరుచు విశ్వామిత్రుని వెనుకొని
యెడనెడఁ జనవుఁ గఱపుచు మందాంచితగమనంబునం బోవునప్పు డమ్మునీం
ద్రుండు లబ్ధమనోరథుం డై యక్కుమారులతో లీలావినోదంబులం దగిలి
దయార్ద్రస్నేహభూయిష్ఠం బైనచిత్తంబునందు హర్షంబు పల్లవింపఁ జనిచని
సార్ధయోజనమాత్రంబుదవ్వులం గలసరయూనదిదక్షిణతీరంబుఁ జేరంబోయి
రామా యని మధురంబుగాఁ బేర్కొని యి ట్లనియె.

510

విశ్వామిత్రమహర్షి రామునకు బలాతిబల లనెడుమంత్రంబుల నుపదేశించుట

చ.

అనఘ మహానుభావ సుకృతాత్ములచిత్తముభంగి రమ్య మై
తనరుచు నున్న దీతటిని దప్పక నీ విపు డీజలంబు గ్ర

క్కునఁ దగ సంస్పృశించి బలుకోరికతోఁ జను దెమ్ము సజ్జనా
వనగుణధుర్య నీ కిట ధ్రువంబుగ విద్యలు రెం డొసంగెదన్.

511


సీ.

చతురత నెద్దాని జపియింప రుజయును జరయు నాఁకలి దప్పి పొరయ కుండు
నెద్ధానిఁ బేర్కొన్న నెట్టియవస్థలందైన దైత్యులబాధ లన్ని దొలఁగు
నెద్ధానిఁ దలఁచిన నీరేడుజగములం దసమానతేజుఁ డై యలరుచుండు
భక్తితో నెద్దానిఁ బఠియింపు రణములం దనుపమజయశాలి యై తనర్చు


తే.

నవని నెద్దానిఁ గొనియాడ నమితసత్త్వ, మాయురారోగ్యములును సర్వార్థసిద్ధి
గలుగు నట్టిబలయు నతిబలయు ననెడు, విద్య లత్యంతకృప నిత్తు వేడ్కఁ గొనుము.

512


వ.

మఱియు నమ్మహావిద్యలు లోకకర్త యగు పరమేష్టివలన సృజింపంబడినయవి
యేను దపఃప్రభావంబునం బడసితి నమ్మంత్రంబులు వీర్యతేజసమన్వితంబు లై
సర్వజ్ఞానప్రదీపనంబు లై యుండు వాని నభ్యసింప నీవ యర్హుండవు తత్ప్రభావం
బునం జేసి సౌభాగ్యదాక్షిణ్యజ్ఞానబుద్ధినిశ్చయోత్తరప్రతివక్తవ్యంబులందు
నీకు సమానుండు లేక యుండు దానం జేసి యతులం బైనయశోలాభంబు
గలుగు నానావిధంబు లగుగుణంబు లన్నియు నీయందు సన్నివిష్టంబు లై
యుండు బహురూపంబు లంగీకరించి వలసినకార్యంబు లన్నియు సాధించుచుం
డు సమాహీతమనస్కుండవై ప్రతిగ్రహింపు మని పలికిన నారఘూత్తముండు
ప్రహృష్టవదనుం డై జలంబు లుపస్పృశించి శుచి యై వినయపూర్వకంబుగా
నుపసర్పించిన నవ్విశ్వామిత్రుండు గరుణావిధేయుం డై యమ్మహావిద్య నుపదే
శించిన నది బాలసూర్యమండలంబువలన నిర్గమించినపరమద్యుతి స్ఫురత్ప
ద్మంబుఁ బ్రవేశించినపగిది నమ్మహర్షివదనంబువలన నిర్గమించి రామునిముఖంబు
బ్రవేశించె నంత నారాముండు విద్యాసముదితుండై శరత్కాలంబునందలి
సహస్రరశ్మి యగుదివాకరుండునుం బోలె నభిరాముం డై పాదోపసంగ్రహ
ణాదిగురుకార్యంబు లన్నియు నిర్వర్తించి.

513


చ.

అనఘపవిత్రుఁ డారఘుకులాగ్రణి రాముఁడు పర్ణశయ్యపై
మునిపతిచే నమేయగతిఁ బుణ్యకథాశ్రవణంబుఁ జేయుచు
న్ఘనముగ నన్నదీతటమునన్ సుఖలీల వసించే నాఁటిరే
యనుజునితోడఁ గూడి శిశిరానిలముం బయి వీఁచుచుండఁగన్.

514


క.

మఱునాఁ డరుణోదయమున, గురుమతి గౌశికుఁడు మేలుకొని మృదుతృణసం
స్తరమందుఁ బవ్వళించిన, తరణికులోత్తమునిఁ జూచి తగ ని ట్లనియెన్.

515


క.

కౌసల్యాసుత రాఘవ, భాసురముగఁ బూర్వసంధ్య పరఁగెడు నిఁక ను
ల్లాసమున నిద్ర లెమ్ము సు, ధీసన్నుత యాహ్నికంబుఁ దీర్పుము ప్రీతిన్.

516


చ.

అని మునిరాజు పల్క విని యారఘువీరులు మేలుకాంచి చ
య్యన సరయూనదీప్రవిమలాంబువుల న్వడిఁ జల్లు లాడి నె

మ్మనమున భక్తి మీఱఁ బరమం బగుమంత్ర మొగిం జపించి య
మ్మునికి నమస్కరించి కడుమోదమునం గృతకార్యసిద్ధు లై.

517


తే.

తపసియనుమతి వడసి తత్సహితు లగుచు, నచటు వాసి రయంబున నవలనగిది
మహితసరయూనదీసంగమంబునందు, భువనపావని యైనజాహ్నవిని గాంచి.

518


చ.

అనుపమవృక్షశోభితతదంతికకాననసీమయందు మిం
చిననియమంబునం దపముఁ జేసెడువారి నమేయదీప్తిచేఁ
దనరెడువారి మౌనుల నుదారతఁ గాంచి మునీంద్రుతోడ మె
ల్లన వినయంబుతోఁ బలికె రాఘవరాముఁ డమోఘుధాముఁ డై.

519


క.

ఈపుణ్యాశ్రమ మెవ్వరి, దేపుణ్యచరిత్రుఁ డిప్పు డిచ్చట నుండున్
గోపాలవనముఁ బోలెడుఁ, దాపసకులవర్య మాకు దయఁ దెల్పఁ గదే.

520


క.

నా విని కౌశికుఁ డిట్లను, భూవరనందనునితోడఁ బొలుపుగ విను మీ
పావనతపోవనోత్తమ, మేవిధమునఁ గలిగె దాని నెఱిఁగింతుఁ దగన్.

521


వ.

తొల్లి భగవంతుం డగుశశాంకశేఖరుం డుద్వాహానంతరంబునఁ బార్వతీసహి
తంబుగా సమాహితమనస్కుండై యిచ్చట నఖండచండనిష్ఠాసౌష్ఠవం బేర్పడఁ
దపంబుఁ జేయుచుండ నప్పుడు సురప్రార్థితుండై కందర్పుండు దర్పం బేర్పడ
నహంకరించి దర్పించిన నద్దేవదేవుండు కినుక పొడమినచిత్తంబున మూఁడవ
కన్ను విచ్చి చి చ్చురలం జూచి హుంకరించినఁ దదీయనేత్రానలజ్వాలాజాలదం
దహ్యమానశరీరుం డై యక్కాముఁడు నాటంగోలె యనంగుఁ డనం బరఁగె
నిచ్చట మదనుం డంగవిమోచనంబుఁ జేసెం గావున నీవిషయం బంగవిష
యం బన విశ్రుతి వహించె నీయాశ్రమం బాదికాలంబున శంకరస్థానం బనం
బరఁగు నిప్పు డయ్యాదిదేవునిశిష్యులు పరమఋషులు ధర్మపరు లిచ్చట
నున్నవా రిచ్చట వసించువారికిఁ బాపంబు లే దని శివునివచనంబు గలదు
కావున.

522


తే.

నరవరకుమార యీరెండునదులనడుమఁ, బొల్బుపావన మైనతపోవనమున
నేఁటిరాత్రి ముదంబున నిలిచి యెల్లి, మిహిరుఁ డుదయించునంతకు మేలుకాంచి.

523


తే.

స్నాన మొనరించి జపియించి సముచితముగ, వహ్నికార్యంబు సలిపి యవ్వల స్రవంతి
దాఁటి తాపసాశ్రమము లందంద చూచి, కొనుచు మాయాశ్రమమునకుఁ జనుద మనఘ.

524


వ.

అని పలికి యవ్విశ్వామిత్రుండు తదనుమతంబున మనోజ్ఞం బైనగంగాసరయూ
మధ్యప్రదేశంబున నివసించి యుండ నప్పుడు.

525


ఉ.

అచ్చటఁ దాపసప్రవరు లద్భుతశీలుని గాధినందనున్
వచ్చినవానిఁగా నెఱిఁగి వన్యఫలంబులు సంగ్రహించి తా

రచ్చుపడంగ సమ్మదరనాతినవికృతమానసాబ్జు లై
చెచ్చెర వచ్చి యుక్తనిధిచే నిడి రాసన మర్ఘ్యపాద్యముల్.

526


తే.

అంచితంబుగ నిట్లు పూజించి భక్తి, ఫలము లర్పించి పదపడి భానువంశ
శేఖరులకు యథావిధిఁ జేసి రపుడు, తాపసోత్తము లతిథిసత్కారములను.

527


వ.

ఇ ట్లుచితసత్కా రంబులఁ గావించి.

528


ఆ.

మరల వారు సేయు మహితసత్కారంబు, లందికొని సమాహితాత్ము లగుచు
సముచితముగ మునులు సంధ్య నుపాసించి, పుణ్యకథలఁ గొంత ప్రొద్దుఁ బుచ్చి.

529


క.

ప్రియమున వారలఁ దోడ్కొని, రయమున నుటజముల కేగ రమణీయకథా
ధ్యయనముఁ జేయుచు నాపు, ణ్యయుతులు నాఁ డచట నుండి రతిసుఖలీలన్.

530


క.

మునిపతి విశ్వామిత్రుఁడు, ఘనకృప నెఱిఁగించుఁ బుణ్యకథలు వినుచు నా
జననాథతనయు లానిశ, ననుపమపుణ్యనిశఁ జేసి రద్భుతభంగిన్.

531


వ.

ఇ ట్లారఘుపుంగవులు శీతవాతనీతవన్యపరిమళాఘ్రాణంబుఁ జేయుచు నుచిత
కథావినోదంబుల నారాత్రిఁ గడపి మఱునాఁడు ప్రభాతకాలంబున లేచి యా
హ్నికక్రియలు నిర్వర్తించి విశ్వామిత్రసహితు లై యచ్చటిమునులు గఱపిన
తెఱంగున యోడ నెక్కి వారలు సంప్రీతితో నొసంగుబహువిధాశీర్వాదం
బులఁ గైకొని యమ్మహాత్ముల నానావిధపూజనంబులఁ బరితుష్టులం జేసి య
నుజ్ఞఁ గొని యమ్మహానదీమధ్యంబునం బోవుచుఁ బ్రావృట్కాలధారాధరగర్జా
సముజ్జృంభితం బైనయొక్కనిర్ఘోషంబు వినవచ్చిన నాలించి రాముండు విశ్వా
మిత్రు నవలోకించి మహాత్మా యొక్కగంభీరశబ్దంబు దుములం బై వినంబడియె
నిది యేమికారణంబున నుత్పన్నం బయ్యె నెఱింగింపవే యని యడిగిన సకలగు
ణాభిరాముం డగురామునకు జగత్పవిత్రచరిత్రుం డగువిశ్వామిత్రుం డిట్లనియె.

532


చ.

మనువంశాంబుధిపూర్ణసోమ రఘురామా రాజసుత్రామ పా
వనకైలాసనగంబున న్మును జగద్వంద్యుండు లోకేశ్వరుం
డనఘం బైనమనంబుచే నౌకసరం బారూఢి నిర్మించె నొ
య్యనఁ గీర్తింతురు దాని మానససరం బంచున్ సురగ్రామణుల్.

533


క.

ఆసరసియందు సముదిత, యై సరయు వనంగ నొకమహానది పుణ్య
శ్రీసంతతులకు నెలవై, భాసురముగ నలరు భువనపావని యగుచున్.

534


తే.

పరఁగ నన్నది సాకేతపురముఁ దిరిగి, వచ్చి జాహ్నవీనదిలో నవార్యభంగిఁ
గలసె నచ్చటఁ బొడమినఘనతరంగ, ఘట్టనోద్భూతరవ మిది కంటె వత్స.

535


క.

వసుధేశతనయ నీ వ, ద్దెసకుం బ్రణమిల్లు మనిన ధీరుఁడు రాముం
డసమానతేజుఁ డాదెస, కసదృశగతి వినతిఁ జేసె ననుజయుతముగాన్.

536


వ.

ఇట్లు కృతప్రణాముండై యమ్మహానది నుత్తరించి యవ్వలం బోవుచు రవికిరణం
బులకుం జొరవ యీక సాంద్రతరువిటపపలాశపటలపరిచ్ఛన్నం బైనయొక్క

వనంబు విలోకించి విశ్వామిత్రునిం జూచి మహాత్మా యిమ్మహాగహనంబు మత్త
వేదండశుండాదండకాండాభిహతమహానోకహమండలం బై సింహవ్యాఘ్రవరా
హభైరవనిర్ఘోష భీషణం బై మృగేంద్రనఖవిదళితమత్తమాతంగకుంభపరిపతిత
నూతనముక్తాఫలవిరాజితవనాంతం బై దారుణారావనానాపతత్రికంఠకుహూ
కారం బై ఝిల్లికాగణనాదితం బై గంభీరస్వనశ్వాపదసంపూర్ణం బై దవాశ్వక
ర్ణకకుభబిల్వతిందుకపాటలబదరీసంకీర్ణం బై దుష్ప్రవేశం బై యున్నయది దీని
తెఱం గెఱింగింపవే యని యభ్యర్థించిన నమ్మునిమండలాఖండలుండు రఘు
వంశపద్మినీమార్తాండున కి ట్లనియె.

537


శా.

కాలాంభోధరతుల్యమూర్తి గిరిసంకాశుండు వృత్రుండు శౌ
ర్యాలంకారుఁడు దొల్లి ఘోరతప ముద్యత్ప్రీతిఁ గావింపఁగా
నాలోకించి బలాంతకుం డలుకతో నాభీలవజ్రాహతిన్
వేలోపాంతనితాంతకాననమున న్వే ద్రుంచెఁ దన్మూర్ధమున్.

538


ఉ.

త్రుంచినయంతలో హరికిఁ దోడనె గ్రక్కున బ్రహ్మహత్య ప్రా
ప్తించినఁ జూచి తాపసులు దేవతలు వగ గూర నాత్మఁ జిం
తించి యఘాపనోచనవిధిం దగుభంగిఁ బ్రబుద్ధు లై విచా
రించి బలారి నీడకు నిలింపులు దోడ్కొని వచ్చి సమ్మతిన్.

539


తే.

కలశతటినీజలంబు లంగమునఁ జిలికి, బాధకం బైననిర్జరనాథగాత్ర
కలితమలముఁ గరూశంబు నలఘుభంగి, నిచట విడిపించి ప్రీతులై రెల్లవారు.

540


ఆ.

అటుల నిర్మలాత్ముఁ డై నిష్కరూశుఁ డై, పాకశాసనుండు భవ్యుఁ డగుచు
మునులు దేవతలును మోదింప భాసిల్లె, హిమము విరియ వెలుఁగునినునికరణి.

541


వ.

ఇట్లు కృతార్థుం డై మహేంద్రుండు మదీయాంగమలకరూశంబులు ధరించిన
వౌట నీజనపదంబులు మలదకరూశనామంబులం బ్రసిద్ధికి నెక్కుం గాక యని
యిద్దేశంబునకు వరం బొసంగిన.

542


చ.

అనిమిషు లవ్విధంబు విని హర్షము మీఱఁగ నాబలాంతకుం
బనిగొని సాధువాక్యములఁ బ్రస్తుతిఁ జేసి సురాధినాథ నీ
వనిన తెఱంగునన్ శుభము లై ధనధాన్యసమృద్ధి నిమ్మహా
జనపదముల్ సమస్తగుణసంపదలం జెలువారు నిత్యమున్.

543

విశ్వామిత్రుఁడు రామునికిఁ దాటకావృత్తాంతంబుఁ దెల్పి దానిఁ జంప నియోగించుట

వ.

అని పలికి బృందారకబృందంబు పురందరసహితం బై దివంబునకుం జనియె
నంతఁ గొంతకాలంబునకు సుందుం డనువానిభార్య తాటక యనునొక్క
యక్షి కామరూపిణి యై వేయుమదపుటేనుగులకుం గలబలంబు గలిగి తన
పుత్రుండగు మారీచుం డను రాక్షసుని శక్రతుల్యపరాక్రముని మహా
బాహుని గిరిసంకాశదేహుని విపులాంసుని మహాశీర్షునిం గూడి మలదకరూశ

సంజ్ఞలం గల యీజనపదంబుల రెంటి నాక్రమించి నిత్యంబు వినాశంబు నొం
దించుచుఁ దపోధనుల హింసించుచు దుష్టచారిణియై సార్ధయోజనమాత్రంబు
దవ్వుల కాంతారమార్గంబు నిరోధించి యున్న దీయక్షిచేత విజనీకృతం బైన
యీగహనంబు విడిచి దేశోపప్లవంబుకంటె మున్ను నివసించి యున్నజనం
బిప్పటికిని మరలం బ్రవేశింప కున్నది గావున.

544


సీ.

మనుజేంద్రనందన మన్నియోగంబున నాత్మీయభుజబలం బాశ్రయించి
యీదుష్టచారిణి నీయక్షి వధియించి నేఁడె యీదేశంబు నిర్భయంబుఁ
గాఁ జేయు మిమ్మహాకాంతారమును జొరవెఱతు రింద్రాదిదిగ్వరులు దీని
వలనిభయంబున వాఁడి దీపింపంగ దీని నోర్చెడునట్టి ధీరు నెందుఁ


తే.

గాన మంబకహతి దీనిఁ గడపి పుచ్చి, పుడమి నత్యంతవిఖ్యాతి వడయు మయ్య
తెలియఁ జెప్పితి నీకు నీదేశవిధము, రమ్యగుణసాంద్ర రాజేంద్ర రామచంద్ర.

545


క.

అని యప్రమేయుఁ డగున, మ్మునిపతి పల్క విని రాజపుత్రుఁడు రాముం
డనియెం గ్రమ్మఱ మౌనికి, ఘనవిస్మయ మాత్మలోన గడలుకొనంగన్.

546


తే.

అనఘ యక్షులు ధాత్రిలో నల్పసత్త్వు, లనఁగ విని యుందు మబల క ట్లనుపమాన
మదకరిసహస్రసత్త్వ మేమాడ్కిఁ గలిగెఁ, గరుణ దళుకొత్తఁ దెల్పుము గాధితనయ.

547


వ.

అని యడిగిన విదితాత్మం డగు రాముని వచనంబు విని విశ్వామిత్రుం డిది
యొక్కవరప్రభావంబునం గలిగినసత్త్వం బత్తెఱం గెఱింగించెద విను మని
యి ట్లనియె.

548


చ.

అలఘుయశుండు ధార్మికుఁడు యక్షవరుండు సుకేతునామకుం
డలరు నొకం డతండు తనయార్థముగా నతిఘోరనిష్ఠతో
జలజభవుం గుఱించి మును సంయమి యై బహువర్షముల్ దమం
బలవడ సాంద్రదుర్గగహనాంతరసీమఁ దపంబుఁ జేయఁగన్.

549


ఉ.

మెచ్చి పయోజసంభవుఁ డమేయకృపాకలితాంతరంగుఁ డై
వచ్చి కుమారు నీక వెస వానికిఁ బుత్రిక నిచ్చి సమ్మడం
బచ్చుపడంగ దానికి సహస్రమదావళసత్త్వ మిచ్చి తా
మెచ్చుగఁ దాటకాఖ్య నిడి మెల్లన నేఁగె సుపర్వయుక్తుఁ డై.

550


వ.

అంత సుకేతుండు రూపయౌవనశాలి యగుతనపుత్రికను దాటకను ఝర్ఘ
పుత్రుం డగుసుందునకుఁ బత్నిగా నొసంగినంతఁ గొండొకకాలంబునకు నయ్యక్షి
మారీచుం డనువాని నొక్కకొడుకుం బడసి సుందుండు నిహతుం డైనయనం
తరంబ పుత్రసహిత యై వనంబునం జరించుచు నొక్కనాఁడు జాతసంరంభ
యై గర్జించుచు భిక్షార్థం బగస్త్యమునీంద్రునిపైఁ గవిసిన నమ్మహానుభావుండు.

551

మ.

కడక న్నెఱ్ఱగఁ జేసి రాక్షసుఁడవుం గమ్మంచు మారీచునిం
గడునల్కన్ శపియించి తోడనె జగత్కళ్యాణుఁ డత్తాటకం
గడిమిన్ దారుణవక్త్రవై వికటరాక్షస్యాకృతిం దాల్చి కా
ఱడవిన్ మర్త్యులఁ దించు నుండు మని కోపాటోపుఁ డై తిట్టినన్.

552


క.

ఆపాపయక్షి యీగతి, శాపకృతామర్ష యగుచు జల మడరఁగఁ ద
త్తాపసవరచరితం బగు, నీపావనవనమునన్ రహిం జరియించున్.

553


క.

క్షితివరసుత నీ వీదు, ర్మతిని దురాధర్షదుష్టరాక్షసిని మహో
ద్ధతసత్త్వను గోబ్రాహ్మణ, హితార్థము వధింపు మయ్య యినకులతిలకా.

554


తే.

అనఘ శాపసంస్పృష్టయైనట్టి దీనిఁ, జంప ముల్లోకములయందుఁ జాలినట్టి
ఘనుఁడు పురుషుఁ డొక్కరుఁడైనఁ గానబడఁడు, లోకసన్నుత నీ వొక్కరుఁడవుదక్క.

555


మ.

వనితం జంపుట నీతి గా దనుచు భావంబందు రాజేంద్ర నీ
వనుమానించెద వేమొ ధాత్రిజనరక్షాదక్షుఁ డౌ ఱేనికి
న్బనిగా దౌష్ట్యము గల్గుచోఁ బురుషు నైనం గాంత నైనం దగన్
ఘనవర్ణాశ్రమరక్షణార్థము వడిన్ ఖండింప ధర్మం బగున్.

556


చ.

వెదకి దురాత్ములం దునిమి వీరత సాధులఁ బ్రోచు టెంతయు
న్మదనసమానసుందర సనాతనధర్మము రాజమౌళికి
న్సదమలకీర్తి గల్గు వృజినంబు ఘటిల్లడు కావునం బటు
ప్రదరహతిన్ జగంబు లలరన్ వడిఁ ద్రుంపుము దీని నుద్ధతిన్.

557


చ.

మును పృథివిన్ వడిం జెఱుపఁబూనినదాని విరోచ నాఖ్యనం
దని నలమందరం దునుమఁడా మఘవుండు జగం బపాకసూ
దనముగఁ జేయఁ బూనినయధర్మవిచారిణి గావ్యమాత ప
ద్మనయనుచే రహిం దెగదె దాశరథీ వినమే తదర్థముల్.

558


వ.

మఱియు ధర్మపరిపాలనతత్పరు లగుమహాత్ములు మహీపతులు పెక్కం డ్రధర్మ
నిరతు లగుయువతులఁ బెక్కండ్ర వధించిరి కావున నీవును సంశయంబు వదలి
దుష్టచారిణి యగుదీనిం జంపి లోకంబులకుఁ బరమకల్యాణంబు సంపాదించి
కీర్తి వడయు మని పలికిన నక్లీబం బగుమునివచనంబు విని దృఢవ్రతుఁ డగు
రాఘవుండు ప్రాంజలి యై వెండియు ని ట్లనియె.

559


ఉ.

తాపసరాజుమాట జవదాఁటక చేయుము రామ యం చయో
ధ్యాపురమందు సద్గురుసభాంతరమందు మహాత్ముఁ డైనధా
త్రీపతి చేత నేను నుపదిష్టుఁడ నైతిని వచ్చువేళ భా
షాపతితుల్య యప్పలుకు సత్యము మీఱఁగ రాదు నా కిఁకన్.

580


ఉ.

కావున మద్గురుం డనినకైవడి నీదగుశాసనంబునం
గావర మెత్తి లోకములఁ గాఱియపెట్టుచు నున్నతాటకన్

వే వధియించి గోవులకు విష్టపపఙ్క్తికి విప్రకోటికిన్
ధీవర మేలుఁ జేసి జగతిన్ మహనీయయశంబుఁ గాంచెదన్.

561

శ్రీరాముఁడు తాటకను సంహరించుట

వ.

అని పలికి యరిందముం దగురాముండు మహనీయశరాసనంబు లీలం గేల
నందుకొని ముష్టి నలవరించి తీవ్రంబుగా గుణప్రణాదంబుఁ జేసిన.

562


శా.

ఘోరం బైనతదీయనాదము కులక్షోణీధ్రభాస్వద్గుహా
ద్వారోద్యత్ప్రతిశబ్దమున్ దళితదిగ్దంతావళాఘోషమున్
దోరంబై కుహరంబు నిండఁ బరవం దోడ్తో నభోభూదిశా
పారావారవిహారజంతువులు విభ్రాంతాత్ము లై రందఱున్.

563


క.

ఆరావము వీనులకుఁ గ, ఠోరం బై యురమునకుఁ బటుహ్రాదిని యై
కారింప మదవిఘూర్ణిత, ఘోరానన యగుచు యక్షి క్రోధవివశ యై.

564


మ.

ఎలమిం బాదయుగాహతిన్ క్షితితలం బిట్టట్టు నఱ్ఱాడఁగాఁ
బ్రళయాబ్దంబువిధంబునన్ భయదశుంభద్భూరిగర్జాధ్వనుల్
సెలఁగన్ మౌర్వినినాద మెందుఁ బొడమెన్ శీఘ్రంబ యచ్చోటికిన్
గులశైలాకృతి నేగుదెంచెఁ గనులన్ ఘోరాగ్నికీలల్ పడన్.

565


ఉ.

భూరినిశాతఖడ్గములపోలిక నొప్పుమహోగ్రదంష్ట్రలున్
దారుణభంగి నూతులవిధంబునఁ గ్రాలెడువృత్తనేత్రముల్
ఘోరనినాదముల్ సెలఁగఁ గోపమునన్ దనపైకి వచ్చుదు
శ్చారిణి యక్షిఁ జూచి రఘుచంద్రుఁడు లక్ష్మణుతోడ ని ట్లనున్.

566


క.

కనుఁగొంటె లక్ష్మణా యీ, దనుజిని ఘోరమగుమేనుఁ దప్పక దీనిన్
ఘనభీషణవక్త్రను గనుఁ, గొనినంతనె యలఁతివారిగుండె లవియవే.

567


గఱితం జంపుట పాడిగాదు జగముల్ గైవారముల్ సేయ భీ
కరఖడ్గంబున దీనిముక్కు సెవులన్ ఖండించి తోడ్తోడ దు
ర్భరసత్త్వంబును దేజమున్ గతియు శౌర్యంబున్ హరింతున్ దివా
కరవంశోత్తమ చూడు మిప్పుడు సమగ్రం బైనమద్వీర్యమున్.

568


వ.

అని రాముండు పల్కుచుండ నప్పుడు నిశాటి యగుతాటక గ్రోధమూర్ఛిత
యై యాటోపంబున భుజంబు లెత్తి గర్జించుచు నారఘుపుంగవుని డాయ వచ్చె
నత్తెఱంగు విలోకించి బ్రహ్మర్షిపుంగవుం డగువిశ్వామిత్రుండు దానిహుంకారం
బున నదల్చి రాఘవులకు స్వస్తియగుఁ గాక విజయంబు గల్గుంగాక యని పల్కె
నంత నయ్యక్షి యక్షీణబలంబున సాంద్రరజోవృష్టి ఘోరంబుగా నారాఘ
వులం బొదివి యొక్కముహూర్తంబు నిరంతరరజోమేఘంబున దెగడుపఱచి
పదంపడి మాయఁ బన్ని నీరంధ్రంబు నాశిలావర్షంబుఁ గురిసినం గోపించి.

569


క.

రాముఁడు శరవర్షంబున, భీమశిలావృష్టి మాన్చి పృథుకాండములన్

యామవతీచరిభుజములు, భూమిఁ దునిసి పడఁగ నేసె మునిపతి మెచ్చన్.

570


ఉ.

తోడనె లక్ష్మణుండు ముదితుం డయి రాక్షసికర్ణనాసమున్
వాడిఁ జెలంగుఖడ్గమున వారక గాధిసుతుండు మెచ్చ తా
నోడక నంటఁ గోసి రయ మొప్ప విరూపిణిఁ జేసె మింటిపై
వేడుక మీఱ నిర్జరులు వేయుముఖంబుల సన్నుతింపఁగన్.

571


సీ.

అంతఁ దాటక కోప మగ్గల మై పర్వఁ గామరూపము లనేకములఁ దాల్చి
మింటిపై కెగసి భ్రమించుచుఁ దనమేను గన్పడకుండంగ గాఢభంగి
జీఁకట్లు సేయుచు శిలలు పై ఱువ్వుచు రజము రేపుచు సాంద్రరక్తవృష్టి
గురియుచు మేఘంబుకరణి గర్జించుచు నట్టహాసముఁ జేయ నపుడు తెలిసి


తే.

యశ్మపృష్టివికీర్యమాణాంగు లైన, మనుజపతినందనులఁ జూచి మునికులాబ్ధి
హరిణధరుఁడు విశ్వామిత్రుఁ డమితయశుఁడు, హితము దీపింప మెల్లన నిట్టు లనియె.

572


చ.

ఇనకులసార్వభౌమ తడ వేల దినేంద్రుఁడు గ్రుంకుచున్నవాఁ
డనుపమసంధ్య వచ్చె నసురాలికి రాత్రులయందు సత్వమున్
ఘనతరతేజ మెక్కు డగుఁ గావున వే దెగఁ జూడు దీని స
జ్జనులకు బాధఁ జేసెడు నిశాచరిపైఁ గృపఁ గూర్ప నేటికిన్.

573


క.

ఈయక్షి మునివరేణ్యులు, సేయుమఖంబులకుఁ గీడు సేయుచు నుండున్
వే యేల లోకహిత మిది, పాయక తెగఁ జూడు దీని భద్రము గలుగున్.

574


వ.

అని పలికిన నవ్విశ్వామిత్రుని వచనంబు విని సంశయంబు వదలి తీవ్రం బగు
వీర్యం బంగీకరించి శబ్దవేధిత్వంబుఁ జూపుచు సాంధ్రంబుగా శిలావర్షంబు గురి
పెడుతాటకవిూఁద సాయకపరంపరలఁ బరఁగించి యవరోధించిన నది శర
జాలపరీత యై నూయాబలవిశేషంబునం దెరల్చుకొని గర్జించుచు నశనికరణి
శీఘ్రజవంబున రామలక్ష్మణులం బట్టుకొనం గమకించిన దానిం జూచి రా
ముండు రయంబున నొక్కశిలీముఖంబు దానియురంబు గాడ నేసిన నయ్య
మ్ముతాఁకున కోర్వక యక్షి తక్షణంబ రోఁజుచుఁ బుడమిం ద్రెళ్లి విగతప్రాణ
యయ్యె నయ్యద్భుతకర్మంబు విలోకించి పురందరుండు బృందారకసందోహ
సహితుండై సాధువాక్యంబుల నభినందించుచు నచ్చటికిం జనుదెంచి రామల
క్ష్మణుల నుచితభంగిం బూజించి పదంపడి విశ్వామిత్రు నర్హవిధంబునం బూజించి
మందమధురాలాపంబులం బ్రస్తుతించి పరమప్రీతుం డై యి ట్లనియె.

575

దేవేంద్రుఁడు ప్రీతుఁడై కాశికునితో భృశాశ్వపుత్రుల రామున కొసంగు మనుట

సీ.

మునినాథ నీమహాద్భుతదివ్యచారిత్రమహిమ నుతింపంగ మాతరంబె
యీరాఘవునిచేత నేపారుతాటకఁ జంపించి కరుణ ముజ్జగములకును
మేలుఁ గావించితి మే మందఱము నిర్భయానందపరుల మై యలరఁ గంటి
మితఁడు నిర్జరులకు హితముఁ జేయఁగఁ బుట్టినట్టిమహామహుం డట్లు గాన

తే.

మున్ను నీవు తపోబలంబునఁ బడసిన, ధన్యుల భృశాశ్వుకూర్మినందనుల నస్త్ర
శస్త్రగాత్రుల సముదగ్రశౌర్యనిధుల, నితని కొనఁగుము వేర్వేఱ యింపు మెఱయ.

576


క.

అని పలికి గాధితనయుని, వినుతించి తగన్ రఘుప్రవీరుం డగురా
ముని వినుతించుచు సురపతి, చనియె న్సురకలితుఁ డగుచు సమ్మోదమునన్.

577


తే.

అంతఁ దాటకావనవాసు లైనమునులు, భక్తిఁ జనుదెంచి కౌశికుఁ బ్రస్తుతించి
రాము నాశీర్వదించి యశ్రాంత మింకఁ, దపములు ఫలించె నని పల్కి తలఁగి చనిరి.

578


వ.

అంత విశ్వామిత్త్రుండు తాటకావధతోషితుం డై జగత్పవిత్రుం డగు కౌసల్యా
పుత్రుని బాహువులం బరిరంభించి శిరంబు మూర్కొని మందమధురాలాపం
బుల ని ట్లనియె.

579


తే.

అమరదూషిణి యైనయీయక్షిఁ జంపి, రవికులోత్తమ నీవు త్రిభువనమునకు
నేఁడు మితి లేని ప్రమదంబు నించినాఁడ, వింక నీ కుర్వర నసాధ్య మెద్ది లేదు.

580


ఆ.

ఇనుఁడు గ్రుంకె సంధ్య యేతెంచె నీరాత్రి, నిచట నధివసించి యెల్లి గదలి
పోక మస్మదీయపుణ్యాశ్రమమునకు, నచటిమౌను లెల్ల హర్ష మొంద.

581


క.

నా విని సంతోషము మది, నావిర్భవ మంద రాముఁ డయ్యామినియం
దావిలీనమున వసించెను, ధీరుం డగులక్ష్మణుండు ధృతి సేవింపన్.

582


తే.

దేవతల కైనఁ జొరరాని యీవనంబు, ముక్తశాప మై నరమృగమునివరులకు
సులభమై చాల నవ్వేళఁ జూడ నొప్పె, రమ్యతరమైన యలచైత్రరథముకరణి.

583


వ.

ఇత్తెఱంగున నారఘుసత్తముండు తాటకం బరిమార్చి సురసిద్ధసంఘంబులచేతఁ
బ్రశస్యమానుం డై విశ్వామిత్రలక్ష్మణసహితంబుగా నారాత్రి యచ్చట సుఖ
లీల నిద్రించి మఱునాఁడు ప్రభాతకాలంబున మేలు కాంచె నంతకు మున్ను
మేల్కొని గాధేయుండు కరుణావిధేయుండై రామభద్రు నవలోకించి మధురా
క్షరవ్యక్తంబుగా ని ట్లనియె.

584

విశ్వామిత్రుఁడు శ్రీరామునకు భృశాశ్వాపత్యంబు లగుసమస్తాస్త్రంబుల నొసంగుట

ఉ.

తామరసారితుల్యశుభదర్శన దారుణశత్రుకర్శనా
రామ దినేశ్వరాన్వయలలామ భవన్మహనీయవిక్రమం
బే మని చెప్పవచ్చు మది కిం పొనరించెఁ గృపాప్తి నీ కిఁకం
బ్రేమ నొసంగెదం గనుము పెం పలరంగ భృశాశ్వపుత్రులన్.

585

చ.

నరసురయక్షకింపురుషనాగనభశ్చరసిద్ధసాధ్యఖే
చరగరుడాసురాద్యరుల సంగరరంగమునం జయించి సు
స్థిరజయలక్ష్మిఁ జేకొనఁగఁ జేయుప్రభావము గల్గునట్టిభీ
కరనిఖలాస్త్రశస్త్రములఁ గైకొను మిచ్చెద నిష్టసిద్ధికిన్.

586


వ.

అని పలికి జలంబు లుపస్పృశించి ప్రసన్నవదనుం డై నియమంబున సర్వాస్త్ర
మంత్రంబులు సంస్మరించుచుఁ దనయట్ల ప్రక్షాళితపాణిపాదుం డై శుచి యై
చనుదెంచిన రామభద్రునిఁ బ్రాఙ్ముఖంబుగా నాసీనుం జేసి క్రమక్రమంబున దం
డచక్రంబును ధర్మచక్రంబును గాలచక్రంబును విష్ణుచక్రంబును నైంద్రాస్త్రం
బును వజ్రంబును శైవం బగుశూలంబును బ్రహ్మశిరంబును నిషీకంబును బ్రహ్మా
స్త్రంబును మోదకీశిఖరీనామకం బైనగదాయుగ్మంబును ధర్మపాశంబును గాల
పాశంబును వరుణపాశంబును శుష్కార్ద్రానామకం బైనయశనిద్వయంబును
బైనాకం బైనయస్త్రంబును నారాయణాస్త్రంబును నాగ్నేయాస్త్రంబును
శిఖరంబును వాయవ్యాస్త్రంబును బ్రథనంబును హయశిరంబును గ్రౌంచా
స్త్రంబును విష్ణుశక్తి రుద్రశక్తి నామకశక్తిద్వయంబును మఱియు నసురులు
ధరించునట్టికంకాళముసలకాపాలకంకణంబులును వైద్యాధరాస్త్రంబును నంద
నాస్త్రంబును నసిరత్నంబును గంధర్వాస్త్రంబును మానవంబును బ్రస్వాపన
ప్రశమనంబులును సౌర్యాస్త్రంబును దర్పణంబును శోషణంబును సంతాపన
విలాపనంబులును మదనంబును బైశాచాస్త్రంబును మోహనంబును సౌమ
నంబుకు తామసంబును సంవర్ధనంబును మౌసలంబును సత్యాస్త్రంబును మా
యాధరంబును దేజఃప్రభంబును బరతేజోపకర్షణం బగుసోమాస్త్రంబును
శిశిరా స్త్రంబును ద్వష్టృదేవతాకం బైనయస్త్రంబును సుదామనంబును దా
రుణం బగుభగాస్త్రంబును శితేషువును మానవాస్త్రంబును మొదలుగాఁ గల
యనేకదివ్యాస్త్రశస్త్రంబు లుపదేశించి యమ్మునిపుంగవుం డమ్మహాస్త్రంబు
లన్నియు రామాధీనంబులు గావించుటకుఁ గ్రమ్మఱ సంస్మరించి మంత్రగ్రామం
బంతయు జపియించిన నవి యన్నియు నవ్విశ్వామిత్రునిచేత ననుమతి వడసి
భీమముఖంబులును విజయసంపాదనంబులును దంష్ట్రాకరాళవక్త్రంబులును
జ్వలనజ్వాలాభీలంబులును విస్ఫులింగపటలిసంచారఘోరంబులును జైత్రంబు
లును భీషణప్రతాపదుర్నిరీక్షంబులును బ్రచండతేజోకలితంబులును భయంక
రాకారంబులును నానావర్ణరూపంబులును నై రాముని ముంగలం బొడసూపి
కేలు మోడ్చి ఫాలంబునం జేర్చి యి ట్లనియె.

587


క.

ఏపగిదిఁ జరింతుము మే, మేపగతునిమీఁదఁ జనుదు మెయ్యది పని మా
కీపట్ల నతనమస్తో,ర్వీపా నీకింకరులము కృప నేలు మిఁకన్.

588

క.

అన విని రాముఁడు వానిని, దనకరమున సంస్పృశించి తప్పక మిమ్ముం
బని గలయప్పుడు చిత్తం, బునఁ దలఁచెద నపుడు రం డిపుడు పొండు రహిన్.

589


క.

నా విని యయ్యస్త్రంబులు, భావంబునఁ బొంగి రాముపాదంబులకుం
గేవలభక్తి నమస్కృతిఁ, గావించి యథేచ్ఛఁ జనియెఁ గౌతుక మలరన్.

590


తే.

అంత రఘుపతిముఖమున హర్షరేఖ, గనుపడ మునీశ్వరునిపాదకమలములకు
వందనముఁ జేసి పేశలవాగ్విభూతి, వెలయు మధురోక్తి ని ట్లని విన్నవించె.

591


తే.

అనఘసర్వాస్త్రకుశలుండ నైతి నీదు, కరుణ ముల్లోకములయందు నిరుపమాన
మహిమ పడసితి నింక సముంచితముగ, నస్త్రముల కుపసంహార మానతీవె.

592


మ.

అపు డి ట్లారఘునేత పల్క విని బ్రహ్మాభుండు గాధేయుఁ డో
నృపవంశోత్తమ యస్త్రకోటికి నయం బేపార జన్మంబులం
దుపసంహార మెఱింగికొంటె యను వై యొప్పారుసంప్రీతితో
నపురూపంబుగ నిచ్చెదం గొనుము సంహారాస్త్రముల్ చెచ్చెరన్.

593


వ.

అని పలికి ధారణశక్తియుక్తుండును సువ్రతుండును శుచియు నగువిశ్వామిత్రుండు
సత్యవంతంబును సత్యకీర్తియు ధృష్టంబును రభసంబును బ్రతిహారతరంబును
బరాఙ్ముఖంబును నవాఙ్ముఖంబును లక్షాక్షవిషమంబులును దృఢనాభసునాభ
పద్మనాభమహానాభదుందునాభంబులును దశాక్షతవక్రదశశీర్షశతోదరంబు
లును జ్యోతిషంబును గృశనంబును నైరాశ్యంబును విమలంబును యోగంధ
రంబును హరిద్రంబును దైత్యప్రశమనంబులును సార్చిర్మాలియు ధృతిర్మాలియు
వృత్తిమంతంబును రుచిరంబును బితృసౌమనసంబును విధూతమకరంబులును
గరవీరకరంబును ధనధాన్యంబులును గ్రామరూపంబును గ్రామరుచియు మో
హంబును నావరణంబును జృంభకంబును సర్వనాభంబును సంతానవరణంబులు
మొదలుగాఁ గలపరమభాస్వరులఁ గామరూపుల భృశాశ్వతనయుల దివ్య
దేహుల నొసంగి యి ట్లనియె.

594


తే.

అమలగుణపాత్రభూతుండ వగుటఁ జేసి, నీకు నొసఁగితి నీయస్త్రనిచయ మెల్ల
సమ్మతిఁ బ్రతిగ్రహింపుము సంతతంబు, శుభము వీర్యంబు తేజంబు సుఖము గలుగు.

595


క.

అని పలుక నపుడు రాముఁడు, మునిదత్తభృశాశ్వసుతుల మునుకొని మోదం
బునఁ గైకొని ఘనతేజం, బున జూడఁగ నొప్పె నుదితపూషునిభంగిన్.

596


సీ.

ప్రళయకాలాభీలపావకార్చులభంగిఁ గమలమిత్రునిమయూఖములమాడ్కిఁ
గమనీయరాకేందుకరములకైవడి దీప్తఖద్యోతదీధితులరీతి
లలితక్షణప్రభాలతికలసొబగున గాఢాంధకారసంఘములకరణి
భీషణాంగారకాభీలరోచులయట్లు సముదగ్రధూమజాలములపగిదిఁ


తే.

జతురమునిదత్తదివ్యాస్త్రశస్త్రము లటు, మూర్తిమంతంబు లై రామమూర్తిమ్రోల

నిలచె సేవాంజలులఁ జేసి నిరుపమాన, లలితసుమమంజులోక్తులఁ బలికె నపుడు.

597


వ.

దేవా యేము భవదీయశాసనంబు శిరంబున నిడికొని యెద్ది పంచినఁ జేయం
గలవార మానతిండనిన నారఘునందనుండు మునిపతిమంత్రప్రభావంబున కచ్చె
రు వొందుచుఁ బని గలయప్పుడు మిమ్ముం దలంచెద నప్పుడ వచ్చి యభిమతార్థ
సిద్ధిఁ జేయుం డని పలికి బహుమానపురస్సరంబుగా ననిచిన నయ్యస్త్రంబులు
రామున కభివాదనంబుఁ జేసి యతనిచేత ననుజ్ఞఁ గొని యట్ల చేసెద మని
పల్కి యథేచ్ఛం జనియె నంత నారాముండు తనకు విశ్వామిత్రుండు గృప నొసం
గిన శస్త్రాస్త్రంబు లన్నియు లక్ష్మణున కుపదేశించి లక్ష్మణోపేతుం డై విశ్వా
మిత్రసహితంబుగా నచ్చోటుఁ బాసి యవ్వల రమ్యంబు లైనతాపసాశ్రమం
బులు విలోకించుచుం జని చని యొక్కచోట సుమనోవిరాజితం బై పుణ్యజన
సమాకీర్ణం బై ఖగసంచారక్షమం బై యనంతలక్ష్మీవిరాజమానం బై మునీంద్ర
వాణీవిలాసం బై స్వర్గలోకంబుభంగిఁ జైత్రరథంబుమాడ్కి వియన్మార్గంబుకరణి
వైకుంఠంబుకైవడి సత్యలోకంబుచందంబున మనోరమం బై దివ్యం బై భవ్యం
బై సేవ్యం బై దర్శనీయం బై దూరవాసితాపసప్రవేశసంకులం బై యొక్క
పర్వతసమీపంబున నొప్పునొక్కమహనీయతపోవనంబు విలోకించి విశ్వా
మిత్రున కి ట్లనియె.

598


చ.

అనఘ మహానుభావ కరుణాభరణా మునివంశవర్య యీ
వనమునఁ గల్గుపక్షిమృగవర్గ మనర్గళభంగి నొప్పెడున్
ఘనతరవేదమంత్రముల గానముఁ జేయుచు నున్న వేతపో
ధనుఁడు వసించుయాశ్రమపదం బిది దీనితెఱంగుఁ జెప్పవే.

599


సీ.

అనఘాత్మ నీదు దివ్యాశ్రమం బెయ్యది యలరారు నెచ్చోట యజ్ఞవాటి
యజ్ఞవిఘ్న మొనర్చు నట్టిపాపాత్ములు దితిపుత్రులు వసించు దేశ మెద్ది
యెచ్చోటనుండి వా రేతెంతు రిచటికి నెవ్విధంబునఁ జరియించువారు
సవనంబుఁ జేయించు సంయము లెవ్వార లిచ్చటి కాదేశ మెంత దవ్వు


తే.

నిర్జరారుల వధియించి నీమఖంబు, కడమ పడకుండఁ గాచు టో గాధితనయ
నాకు వలసినకార్యంబు నయ మెలర్ప, నన్నియును మాకుఁ గృప మీఱ నెన్ని చెపుమ.

600

విశ్వామిత్రుఁడు రామునకుఁ దనదగు సిద్ధాశ్రమముయొక్క ప్రభావం బెఱింగించుట

క.

అని యడిగిన నద్దశరథ, జననాథకుమారుఁ జూచి సమ్మోదమున
న్మునికులశేఖరుఁ డి ట్లని, వినిపింపఁ దొడంగె నపుడు విపినక్రమమున్.

601


చ.

అనఘ రమాధినాథుఁ డగు నచ్యుతుఁ డీవిపినంబునందు న

త్యనుపమఘోరనిష్ఠ చెలువార సమస్తజగద్ధితంబుగా
మును బహుదివ్యవర్షము లమోఘతపం బొనరించె రాజనం
దన యిది వామనాశ్రమ మనంగ రహిం దనరారు నుర్వరన్.

602


ఆ.

రామ యిచటఁ దొల్లి రాజీవనేత్రుండు, విపులనిష్ఠ ఘోరతపముఁ జేసి
సిద్ధుఁ డయ్యెఁ గాన సిద్ధాశ్రమ మనంగఁ, బిదపఁ బేరు వడసెఁ బృథివియందు.

603


చ.

చెలువుగ నీగతిన్ జపము సేయుచు మాధవుఁ డున్నవేళ దో
ర్బలమహిమాధికుండు బలిరాక్షసభర్త విరోచనాత్మజుం
డలఘుయశుండు శక్రుని సురాలి రణంబునఁ దోలి ముజ్జగం
బులఁ గడుమేటి యై త్రిదివము న్బహుళద్యుతి నేలుచున్నెడన్.

604


వ.

దేవత లందఱు వహ్నిపురోగము లై యిచ్చటఁ దపంబుఁ జేయుచున్న విష్ణు
కడకుం జనుదెంచి దేవావిరోచననందనుం డైనబలి యజ్ఞంబుఁ జేయుచు ననీప
కు లెద్ది గోరిన దాని నెల్ల నొసంగుచున్నవాఁ డయ్యజ్ఞంబు సమాప్తి నొందిం
పకమున్నె నీవు దేవహితార్థంబుకొఱకు మాయాయోగబలంబున వామ
నత్వం బంగీకరించి దేవతాకార్యంబుఁ దీర్చి యుత్తమం బైనకల్యాణంబుఁ
జేయుము.

605


ఆ.

అనుచు సురలు వేఁడ నపుడు జితారియై, కాంత నదితిఁ గూడి కశ్యపుండు
వ్రతముఁ బూని దివ్యవర్షసహస్రంబు, దపము సల్పుటయును దయ దలిర్ప.

606


తే.

కమలలోచనుఁ డపుడు సాక్షాత్కరింప, నలరి కశ్యపుఁ డతిభక్తి సెలఁగ మ్రొక్కి
నిగమసూక్తుల వినుతించి నిరుపమాన, పేశలసుధామయోక్తులఁ బిదప ననియె.

607


వ.

దేవా నీవు తపోమయుండవు తపోరాశివి తపోమూర్తివి తపస్స్వభావుండ వట్టి
నిన్ను దుస్తరం బైనతపంబుచేతం గంటిఁ బురుషోత్తముండ వైననీశరీరంబునం
దుఁ జరాచరాత్మకం బైనజగంబంతయుఁ గానంబడుచున్నది కుక్షినిక్షిప్తా
ఖిలలోకుండ వైననీ వాదిమధ్యాంతరహితుండ వనియు ననిర్దేశ్యుండ వనియును
శ్రుతులు నొడువు నట్టి నిన్ను శరణంబు నొందెద.

608


క.

అని నానానూనోక్తుల, వినుతించిన నాత్మ మెచ్చి విష్ణుం డను నో
యనఘ వరార్హుఁడ వైతివి, కొను మిచ్చెద వరము నీకుఁ గుతుకం బెసఁగన్.

609


చ.

అన విని కశ్యపుం డనియె నంజలిఁ జేసి మహాత్మ నాకు నీ
యనిమిషకోటి కీయదితి కంచితభంగి వరం బొసంగు నా
కనుపమబుద్ధి నీయదితి యందుఁ గుమారుఁడ వై బలారి క
ట్లనుజుఁడ వై జనించి పరమార్తుల వేల్పుల నుద్ధరింపుమీ.

610


వ.

మహాత్మా యిచ్చటఁ దపంబు సిద్దించుటం జేసి యీదేశంబు సిద్ధాశ్రమం బనం

బడు నని కశ్యపుండు బ్రార్థించిన మహాతేజుం డగువిష్ణుండు భక్తసులభుండు
గావునఁ గశ్యపుండు గోరినతెఱంగునఁ దత్తేజంబున నదితిగర్భంబునందు వామన
రూపంబున నవతరించి యాగదీక్షుం డైన వైరోచనికడకు భిక్షురూపంబునం
జని యతని నడిగి పదత్రయమాత్రంబు ధాత్రిఁ గొని త్రివిక్రమరూపంబున
జగత్త్రయంబు నాక్రమించి బలిని రసాతలంబున నుండ నియమించి క్రమ్మఱ
ముల్లోకంబు లింద్రున కొసంగిన నతండు పూర్వప్రకారంబునఁ ద్రివిష్టపరా
జ్యంబుఁ బరిపాలించుచుండె.

611


తే.

మొదల వామనాశ్రమ మనఁ బొగడుఁ గాంచి, పిదప సిద్ధాశ్రమం బనఁ బేరు వడసె
ననఘచారిత్ర నాఁడు నీయాశ్రమంబె, నేఁడు నీయాశ్రమంబె యీనెలవు దలఁప.

612


మ.

దితిజారాతి దపంబు సల్పి తగ సిద్ధిం గాంచి జంభారికి
న్హితముం జేయఁగఁ జన్నపిమ్మట ముదం బేపారఁ గొన్నాళ్ల కే
నతినిష్ఠం దప మిచ్చట న్సలిపి పద్మాధీశుచందాన సు
స్థితి సిద్ధిం గని క్రొత్తఁ జేసితి సుమీ సిద్ధాశ్రమత్వం బొగిన్.

613


మ.

రవివంశోత్తమ యేను దీక్షితుఁడ నై ప్రారంభ మేపారఁగా
సవనం బుద్ధతిఁ జేయఁ బూనిన దురాచారాఢ్యు లై సారెకు
న్దివిషత్కంటకు లేగుదెంచి నడుమ న్విఘ్నంబుఁ గావింతు రా
ర్జవ మొప్పారఁగ వారిఁ ద్రుంచి మఖము న్సాఫల్య మొందింపవే.

614

విశ్వామిత్రుండు రామలక్ష్మణులతోడ స్వకీయాశ్రమంబుఁ బ్రవేశించుట

చ.

ఇదియె మదాశ్రమంబు మనుజేశ్వరనందన రమ్ము పోద మ
భ్యుదయము గల్గు నంచు మునిపూజ్యుఁడు గాధిసుతుండు రామునిన్
సదమలచిత్తు లక్ష్మణుని సమ్మతిఁ దోడ్కొని యాశ్రమోర్వి కిం
పొదవఁ జనె న్బునర్వసుయుతోజ్జ్వలచంద్రునిభంగి నొప్పుచున్.

615


వ.

ఇట్లు నిజాశ్రమపదంబుఁ బ్రవేశించినయనంతరంబ.

616


చ.

పొరుగిరుగాశ్రమంబుల తపోధను లారఘువర్యుల న్మునీ
శ్వరుఁ గనువేడ్క డెందముల సందడి పెట్టఁగ నేగుదెంచి శం
కరనిభు దివ్యబోధఘను గాధిసుతుం దగ సత్కరించి సుం
దరు లగురామలక్ష్మణులఁ దద్దయుఁ బ్రీతి భజించి రెంతయున్.

617


ఆ.

అంత నొకముహూర్త మచ్చోట వసియించి, రాజమౌళిసుతు లరాతిదమను
లారఘుప్రవీరు లమ్మునిశార్దూలు, తోడ ననిరి కేలుదోయి మొగిచి.

618


క.

ఇప్పుడె దీక్ష వహింపుఁడు, చెప్పెడి దే మింక మీరు సెప్పినకరణిం
దప్పక యీసిద్ధాశ్రమ, మిప్పుడు సిద్ధ మగుఁ గా కహీనగుణాఢ్యా.

619

విశ్వామిత్రుఁడు యాగారంభముఁ జేయుట

మ.

అన నౌఁగా కని మౌనిరాజు కుతుకవ్యాకోచచిత్తాబ్జుఁ డై

మునుల న్రమ్మని చీరఁ బంచి నియమంబుం గ్రాలఁగా యాగదీ
క్ష నితాంతస్పృహఁ దాల్చి మౌనియుతుఁ డై సంపూర్ణయజ్ఞాంగపా
వన మై యొప్పెడుయజ్ఞవేదిపయి భాస్వన్మూర్తి యై యుండఁగన్.

620


వ.

రఘునందనులు సమాహితమనస్కులై యారాత్రిఁ గడిపి మఱునాఁడు ప్రభాత
కాలంబున లేచి జలంబు లుపస్పృశించి పూర్వసంధ్య నుపాసించి శుచు లై
నియమంబునం గ్రాలుచు హుతాగ్నిహోత్రుం డై రెండవవైశ్వానరుండునుం
బోలె వెలుంగుచు వేదిమధ్యంబున నాసీనుం డై యున్నవిశ్వామిత్రునకు నమ
స్కరించి దేశకాలతత్త్వజ్ఞులును వచనకోవిదులును దివ్యాయుధపరిష్కృతు
లును బరిపంథిశిక్షాచతురు లగురామలక్ష్మణులు నమ్మహాత్మున కి ట్లనిరి.

621


క.

దానవు లెక్కాలంబున, మానక చనుదెంతు రిటకు మా కేకరణిం
బూని చరియింపఁగాఁ దగు, మౌనికులాధీశ యింత మాకుం జెపుమా.

622


క.

అని రాజతనయు లడిగిన, విని యచ్చట మౌను లెల్ల వేమఱు వారిం
గొనియాడి మౌనిచందము, వినుఁ డని యి ట్లనిరి వాక్ప్రవీణత మెఱయన్.

623


క.

అక్షీణమహిముఁ డీముని, దక్షత నేఁ డాదిగాఁగఁ దగ నాఱునిశ
ల్దీక్షఁ గొని పలుకకుండును, రక్షింపఁగ వలయు నన్నిరాత్రులు మీరల్.

624


ఉ.

నా విని రాజపుత్రులు మనంబున నుత్సుక మంకురింప సు
శ్రీ విలసిల్లుభీకరశిలీముఖకార్ముకము ల్ధరించి ర
క్షావిధిఁ గంటికి న్నిదురఁ గానక రేపవ లొక్కరీతిగాఁ
గేవలనిష్ఠఁ గాచిరి జిగీషులు వర్మనిషంగధారు లై.

625


ఉ.

ఆరయ యాగ మీకరణి నైదుదినంబులు సెల్లె నంత న
య్యాఱవనాఁడు రాముఁడు మహామతి లక్ష్మణుఁ జూచి రాక్షసు
ల్వారక జన్నముం జెఱుప వత్తురు నేఁ డటు గాన నీవు సొం
పారఁగఁ గాచి యుండవలె నంచు వచించి సమాహితాత్ముఁ డై.

626


క.

దానవులఁ దునిమి సవనము, మానక రక్షించి భువి సమంచితకీర్తి
న్మానుగఁ బడసెదఁ గా కని, యానృపమణి గాచి యుండె ననుజయుతుం డై.

627


క.

సోపాధ్యాయపురోహిత, మై పావనకుశసమిల్లతాంతోచ్చయ మై
యేపారు మౌనియుత మై, చూపఱులకు యాగవేది సొంపై యలరెన్.

628


వ.

ఇట్లు కల్పసూక్తప్రకారంబున మంత్రవంతం బై యాగంబు చెల్లుచున్న సమ
యంబున.

629


సీ.

తొలుదొల్తఁ గల్పాంతతోయదధ్వనిభంగి వినువీథి దారుణస్వనము లెసఁగె
నటుమీఁదఁ బద్మినీవిటుఁడు గన్పడకుండ సాంద్రరజోమేఘజాల మడరెఁ
దరువాతఁ జూపఱు ల్దల యెత్త రాకుండ వితతంబుగా శిలావృష్టి గురిసెఁ
బదపడి మఖశాలపై గహనంబుపై వేదిపై శోణితవృష్టి గురిసె

తే.

నసురసేనాసమేతులై యంబరమునఁ, బన్ని దుష్టాత్ముఁ డైనసుబాహుఁడును దు
రంతసత్త్వుఁడు మారీచుఁ డనెడువాఁడు, పాయ కురుశక్తిఁ గావించు మాయవలన.

630


ఉ.

అంత దినేశవంశవరుఁ డత్తెఱఁ గంతయుఁ జూచి యాత్మలో
నెంతయు గిన్క పర్వఁగ నహీనబలంబున మింటనుండి య
త్యంతరయంబునం బఱచు నట్టినిశాటులఁ బోలఁ జూచి కా
లాంతకుమాడ్కిఁ గ్రాలుచు మహాద్యుతి లక్ష్మణుతోడ ని ట్లనున్.

631

శ్రీరాముఁడు మానవాస్త్రంబున మారీచుని సముద్రంబునం బడవైచుట

వ.

వత్సా దుష్టాత్ము లగుపిశితాశను లంబరంబునం బన్ని మాయాబలవిశేషం
బున యజ్ఞవిఘ్నంబుఁ గావించుచున్నవారు సమీరణంబు చేత ఘనంబులం
బోలె వీరి నందఱ మానవాస్త్రసముద్ధూతులం జేసెదఁ జూడు మని పల్కి
సమాహితుండై చాపంబు సారించి మౌర్వి మ్రోయించి పరమసంక్రుద్ధుండై
పరమభాస్వరంబును బరమోదారంబును మహావేగంబు నగుమానవాస్త్రంబు
సంధించి మారీచునియురంబుఁ దాఁక నేసిన నారాక్షసుండు శితేషుబలతాడి
తుండై మైమఱచి యాక్రందనంబుఁ జేయుచు వజ్రప్రహారంబున ఱెక్కలు
విఱిగి మహామహీధరంబు సాగరంబునఁ బడినతెఱంగున శతయోజనమాత్రం
బు దవ్వుల సముద్రజలంబులం గూలిన నవ్విధంబు విలోకించి రాముండు
లక్ష్మణున కి ట్లనియె.

632


మ.

అవలోకించితె లక్ష్మణా చటులదీవ్యన్మానవాస్త్రప్రభా
వవిశేషంబు దురాత్ముఁ డైనదనుజు న్వంచించి కొంపోయి య
ర్ణవతోయంబుల వైచెఁ గాని వెసఁ బ్రాణంబుం గొనం జూడ దెం
తవిచిత్రంబు మహాత్ముఁ డైనమునిమంత్రం బిట్టి దై యొప్పఁగన్.

633

శ్రీరాముఁ డాగ్నేయవాయవ్యాస్త్రంబులచే సుబాహుని దత్సైన్యంబులఁ గూల్చుట

క.

ఘోరాకారుల దుష్టవి, హారుల నిర్ఘృణుల ఖలుల యజ్ఞఘ్నుల దే
వారుల రుధిరాహారుల, దారుణకర్ముల వధింతుఁ దడయక యింకన్.

634


వ.

అని పలికి.

635


శా.

శోణభ్రాజితనేత్రుఁ డై రఘుకులేశుం డుద్ధతి న్సర్వగీ
ర్వాణవ్రాతము మెచ్చి చూడ ననలాస్త్రప్రోద్ధతిం బూర్వగీ
ర్వాణశ్రేష్ఠు సుబాహుఁ ద్రుంచి పటురౌద్రస్ఫూర్తి వెంట న్మరు
ద్బాణంబు న్నిగుడించి కూల్చె నిఖలేంద్రద్వేషుల న్వ్రేల్మిడిన్.

636


వ.

ఇత్తెఱంగున నారఘుసత్తముండు యజ్ఞవిఘ్నకరు లగురాక్షసుల నందఱ నిశ్శే
షంబుగా రూపు మాపి తొల్లిరాక్షసజయంబునందు శక్రుండునుంబోలె సమస్త
మునిగణపూజితుం డై యొప్పె నప్పుడు.

637

ఉ.

అంత శ్రుతీరితస్థితిని నమ్ముని యమ్మఖ మొక్కఁడైన గో
రంత గొఱంత లేక తుది నంతఁగ జేసి కృతార్థుఁ డై సుధీ
మంతుఁడు యాగనిష్ఠ మగుమౌనము వీడి నిరీతిక ల్దిశల్
సంతస మంకురించఁ గని చయ్యన రామునితోడ ని ట్లనున్.

638


క.

గురుకార్యముఁ జెల్లించితిఁ, బరఁగఁ గృతార్థుండ నైతిఁ బార్థివతనయా
గుఱుతుగ నీయాశ్రమమున, కరుదుగ సిద్ధాశ్రమత్వ మది నిజ మయ్యెన్.

639


వ.

అని పలికె నంత నారామలక్ష్మణులు గృతకృత్యు లై యారాత్రి సుఖలీల వసి
యించి మఱునాఁడు ప్రభాతకాలంబున మేల్కని కాల్యకరణీయంబులఁ దీర్చి
బరమానందరసపూరితహృదయు లై పావకునిచందంబునం దేజరిల్లుచున్న
విశ్వామిత్రునిచరణంబుల కభివాదనంబుఁ జేసి తక్కినమునులకు నమస్కరించి
విశ్వామిత్రు నవలోకించి మధురోదారం బగువాక్యంబున ని ట్లనిరి.

640


తే.

అనఘ నీ కింకరులము దయార్ద్రవీక్ష, ణముల వీక్షింపు మిఁక మా కొనర్పవలసి
నట్టిపని యెద్ది తెలియంగ నానతిమ్ము, కడిమిఁ దీర్చెద మెంతటికార్య మైన.

641

విశ్వామిత్రుఁడు రామలక్ష్మణుల జనకయాగముఁ జూడరా నియోగించుట

క.

అని పలికిన నద్ధశరథతనయుల వాక్యముల కలరి తాపసవర్యు
ల్మునిపతి యగువిశ్వామిత్రుని ము న్నిడుకొని రఘుపతితో ననిరి తగన్.

642


చ.

అలమిథిలేంద్రుఁ డైనజనకాధిపుఁ డుత్తమధర్మశీలుఁ డిం
పలరఁగ నద్భుతంబుగ మహాధ్వర మొక్కటి సేయుచున్నవాఁ
డలయక యమ్మఖంబుఁ గన నచ్చటి కేగెద మేము విక్రమో
జ్జ్వల మముఁ గూడి నీవును బ్రసన్నమతిం జనుదెమ్ము చెచ్చెరన్.

643


వ.

అదియునుం గాక.

644


ఉ.

ఆనృపమాళిమందిరమునం దొకవిల్లు సుమేరుసార మై
మానుగ నొప్పి యుండుఁ బురమర్దనువి ల్లది తొల్లి ప్రీతు లై
దానవవైరు లిచ్చిరి ముదంబునఁ దన్మహనీయమౌర్విసం
ఛాన మొనర్ప నీవు వసుధావర యోగ్యుఁడ వెన్ని చూడఁగన్.

645


క.

నురగరుడోరగనరఖే, చరకిన్నరసిద్ధసాధ్యచారణయక్షా
సురు లాదివ్యశరాసన,వర మెక్కిడఁజాల రమరవరసమతేజా.

646


క.

జననాథు లనేకులు ద, ద్ఘనకార్ముకశక్తి దెలియఁగా వచ్చి బలం
బున దానిసమారోపణ, మొనరింపఁగ లేక చనిరి యొదవినలజ్జన్.

647


క.

జనవరసుర మౌతోడను, జనుదె మ్మచ్చటికి జనకజనపతిచాపం
బును సముదితయజ్ఞంబును, గనవచ్చును దాన నీకుఁ గలుగు శుభంబుల్.

648

విశ్వామిత్రుఁడు రామలక్ష్మణులఁ దోడ్కొని మిథిలాపురంబున కరుగుట

వ.

మఱియు నయ్యుత్తమశరాసనంబు దేవతలవలనం బడసి వైదేహుండు దాని

యజ్ఞఫలంబునుఁగా సంభావించుచుఁ దనగృహంబున నిడికొని నిత్యంబును
గంధపుష్పధూపదీపంబులచేత నర్పించుచు ధనురుత్సవంబునందుఁ బ్రాధా
న్యంబునఁ బూజించుచున్నవాఁ డని పలికిన నవ్విశ్వామిత్రుండు రామలక్ష్మ
ణులం దోడ్కొని మునిసహితుం డై యాసిద్ధాశ్రమంబు విడిచి జాహ్న
వీనదియుత్తరతీరంబున నున్నహిమవంతంబునకుం జనియెద మీకు స్వస్తి
యగుం గాక యని యచ్చటి వనదేవతలకుం జెప్పి యప్పుడు కదలి యయ్యా
శ్రమంబునకుఁ బ్రదక్షిణంబుగాఁ దిరిగి యుత్తరాభిముఖుం డై మిథిలానగర
మార్గంబుఁ బట్టి చనియె నప్పు డమ్మహనీయాశ్రమంబున నున్న బ్రహ్మవాదులైన
మహర్షులయగ్నహోత్రసంభారంబులచేతఁ బరిపూర్ణం బైనశకటీశతమాత్రం
బమ్మహాత్ముని వెనుకొని యరిగె మఱియు నయ్యాశ్రమంబునంగల మృగపక్షిగణం
బులు భక్త్యతిశయంబున నవ్విశ్వామిత్రునివెంటం గొండొకదూరం బరిగి యతని
చేత ననుజ్ఞ వడసి మరలి నిజనివాసంబులకుం జనియె నంత గాధీనందనుండు
గొంతదూరంబు సని సూర్యుండు గ్రుంకువేళకు మునిసహితంబుగా శోణనదీ
సమీపంబుఁ జేరి యన్నదీపుణ్యతీర్థంబులం గ్రుంకి యగ్నిసమారాధనంబుఁ జేసి
విశ్వామిత్రుండు దత్తీరవనంబున నివసించె నంత రాముండు లక్ష్మణసమేతుం
బుగా సంధ్య నుపాసించి మునుల నభివాదనంబుఁ జేసి మునిసభామధ్యంబున
విశ్వామిత్రున కభిముఖంబుగా సుఖోపవిష్టుం డై మృదుమధురవాక్యంబున నమ్మ
హాత్మున కి ట్లనియె.

649

విశ్వామిత్రుఁడు రామలక్ష్మణులకుఁ దనదువంశక్రమంబుఁ దెల్పుట

తే.

అనఘ యీదేశ మతిరమ్య మై తనర్చె, మంజులవనాంతజాతసంపదలచేత
ననిక మేపుణ్యుఁడు వసించునట్టి నెలవు, దీనివిధ మెల్లఁ గృపతోడఁ దెలియఁ జెపుమ.

650


క.

అని యడిగిన గాధేయుఁడు, దనమనమునఁ బొంగి రాజతనయునితోఁ ద
ద్ఘనదేశక్రమ మెల్లను, వినిపింపఁ దొడంగె వాక్ప్రవీణత మెఱయన్.

651


తే.

దశరథకుమార బ్రహ్మకుఁ గుశుఁ డనంగ, నొక్కతనయుండు గలఁడు గుణోత్తరుండు
నిత్యధర్మజ్ఞతావ్రతనియతిమహిమ, నలరె నాతండు రెండవనలువకరణి.

652


శా.

ఆపుణ్యుండు విదర్భరాజనుత నుద్యత్ప్రతితోఁ బెండ్లి యై
యాపద్మాననయందు నందనుల సారాచారులం ధీరుల
న్భూపాలోత్తములన్ గుణోత్తరుల సంపూర్ణప్రభావాఢ్యులన్
శ్రీపుత్రాకృతుల న్సుధీరతులఁ గాంచె న్నల్వుర న్వేడుకన్.

653


తే.

నరవర కుశాంబుఁ డనఁ గుశనాభుఁ డనఁగ, వసు వన నధూర్తరజుఁ డన వఱలువారు
వారిజవనప్రియాభులై వాలువారు, వాసవసమానులై క్రాలువారు వారు.

654

క.

వారి విలోకించి గుణో, దారుఁడు గుశుఁ డిట్టు లనియె ధర్మచికీర్ష
న్మీ రందఱు ధారుణి నయ, మారఁగఁ బంచికొని కుడువుఁ డనురాగమునన్.

655


వ.

అని నియమించి కుశుండు మహీమండలం బంతయుఁ జతురఖండంబుగా
విభాగించి యిచ్చినం గైకొని యన్నలువురు ధర్మపరు లై లోకసమ్మతంబుగా
రాజ్యంబుఁ జేయుచు.

656


తే.

అంబురుహమిత్రతేజ కుశాంబుఁ డనెడు, ఘనుఁడు దనపేరఁ గౌశాంబి యనెడుపురము
మహిమ నిర్మించి యందు ధర్మంబుకలిమి, శిష్టసమ్మతి రాజ్యంబుఁ జేయుచుండె.

657


తే.

శక్రతుల్యుండు గుశనాభజనవిభుండు, పొలుపుగ మహోదయం బనుపురవరంబు
వేడ్కఁ గావించి యందుఁ బ్రావీణ్య మొదవ, నింపు సొంపారఁ బ్రజలఁ బాలించుచుండె.

658


క.

అనఘుఁ డధూర్తరజుం డను, ధననాథనిభుండు ప్రీతి ధర్మారణ్యం
బనుపురముఁ జేరి యచ్చట, నినవంశోత్తమ ధరిత్రి నేలుచు నుండెన్.

659


క.

వసు వనువాఁడు పయోజా, క్షసముద్యుతి యై గిరివ్రజం బనుపురమున్
వెస నిర్మించి ముదంబున, వసుమతిఁ బాలించె నం దవార్యప్రౌఢిన్.

660


చ.

మనుజవరేణ్య యీధరణి మానుగ నవ్వసురాజమౌళి యే
లినయది గ్రాలుచున్నయది క్రీవ మహీధ్రము లైదు గంటె నూ
తనసితపుష్పమాలికవిధంబున మాగధి యీనగాంతరం
బున విలసిల్లుచున్నయది పొ ల్పలర న్మగధాత్మజాత యై.

661


వ.

మఱియు నిమ్మహానది ప్రత్యగ్వాహిని యై యుండు నిచ్చటి వసుంధర వసురాజు
ధర్మమహిమం జేసి మాగధీనదీసలిలస్పర్శంబున సంపూర్ణసస్యశాలిని యై
సుక్షేత్ర యై యుండు.

662


తే.

తవిలికుశనాభనృపతి ఘృతాచి యనెడు, నచ్చరను బెండ్లియై దానియందుఁ గాంచె
రూపసౌందర్యమహిమచే రూఢిఁ గన్న, యట్టితనయల నూర్వుర నతిముదమున.

663


ఉ.

ఆనరనాథమాళిసుత లంచితరూపవిలాసయౌవన
శ్రీ నిర వంద హారమృదుచేలములం గయిసేసి మంజులో
ద్యానముఁ జేరి యందు ముదమారఁగ వాద మొనర్చుచు న్రహిం
గానముఁ జేయుచున్ శిఖులకైవడి నృత్యము లాచరించుచున్.

664


క.

ఘనమధ్యస్థితశంపల, యనువున గగనగతతార లట్ల వెలుఁగుచు
న్వనమధ్యస్థిత లై నృప, తనయలు విహరించి రద్భుతక్రమ మొసఁగన్.

665


ఉ.

వారిమనోజ్ఞవేషములు వారివచోరచనాచమత్కృతుల్

వారివిలాసవైఖరులు వారిసమంచితరూపసంపద
ల్వారివిహారచాతురియు వారియపాంగదృగంచలంబు లిం
పారఁగఁ జూచి మన్మథశరాతురుఁ డై పవనుండు చెచ్చెరన్.

666


తే.

కన్ను లారంగ నయ్యళికచలచెలువుఁ, బొలు పలరఁ గాంచి తమి మించి వలపు నించి
ధృతిఁ దొలంగించి విచలితహృదయుఁ డగుచుఁ, జేర నేతెంచి పలికె సమీరణుండు.

667


చ.

జలజదళాక్షులార నవచంపకనాసికలార యేను మీ
చెలువముఁ జూచి మేలుపడి చేకొన వచ్చితి నాకు భార్య లై
కలసి రమింపుఁ డుత్తమసుఖంబులు సేకురు మానుషత్వముం
దలఁగు శుభోదయం బెసఁగుఁ దప్పక కల్గుఁ జిరాయురున్నతుల్.

668


క.

మనుజాంగనలకు జవ్వన, మనిత్య మమరులకు నిత్య మటుగావున నీ
మనుజత్వ ముడిగి మీ రిఁక, ననిమేషత్వమున సుఖము నందఁగ రాదే.

669


వ.

అని పలికిన నక్లిష్టకర్ముం డగుసదాగతివచనంబు విని యపహసించుచుఁ గన్యా
శతం బతని కి ట్లనియె.

670


తే.

అమరవర్య సమస్తభూతముల కీవు, పరఁగ నంతశ్చరం బైన ప్రాణ మగుట
నలువ నీకు జగత్ప్రాణనామ మిడియె, నరయ నీయట్టిపూజ్యుఁ డి ట్లాడనగునె.

671


క.

అనిలా మముఁ గుశనాభుని, తనయల మని యెఱుఁగవే పదభ్రష్టునిఁగా
నినుఁ దిట్టఁగ జాలుదు మై, నను సైఁచితి మిటు తపోవినాశ నశంకన్.

672


ఆ.

సత్యవాది యైన జనకున కవమతిఁ, గూర్చి తుచ్ఛసుఖముఁ గోరుకంటె
మానవతులు కుర్వి మరణ మభ్యుదయంబు, గాదె పల్కె దేల గాన కిట్లు.

673


క.

సురవర్య మాకు దండ్రియె, పరమం బగుదైవతంబు ప్రభు వటు గానన్
గురుఁ డెవ్వని కొసఁగిన న, ప్పరమోదారుండె మాకు భర్త దలంపన్.

674


తే.

అనఘ మజ్జనకుండు నీ కరయ నంత, కుండు గాకుండుఁ గాక యాకోవిదునకు
నవమతి యొనర్పకుము ధర్మ మాశ్రయించి, ధవుని వరియింపఁగోరియున్నార మేము.

675


క.

అని కుశనాభమహీపతి, తనయలు పల్క విని గాడ్పు దవశిఖిమాడ్కి
న్గనలుచుఁ బ్రభంజనత్వము, దనరఁగ భంజించె వేగ తద్గాత్రంబుల్.

676


క.

జననాథతనయ లీగతి, ననిలునిచే భగ్నగాత్ర లై ఘనలజ్జా
వనతానన లై గ్రక్కునఁ, జని రింటికిఁ గనుల బాష్పజలములు చినుకన్.

677


వ.

ఇట్లు చనుదెంచినకన్యలం జూచి సంభ్రాంతచేతస్కుం డై కుశనాభుం
డి ట్లనియె.

678


ఉ.

కన్నియలార మీకుఁ గను గానక యెవ్వఁడు గీడుఁ జేసె నా
పన్నత నొంటి తొల్లిటి జపాకుసుమద్యుతి వీడి కుబ్జ లై

కన్నుల నశ్రుబిందువులు గాఱఁగ నేడ్చెద రేల మీరు మా
కున్నది యున్నయట్లు రయ మొప్పఁగఁ జెప్పుఁడు దాఁచ నేటికిన్.

679


తే.

అని యడిగి దీర్ఘనిశ్వాస మడర నూర, కున్నజనకునిఁ గాంచి యయ్యువతు లెల్ల
చరణములు ముందలలు సోఁక సాగి మ్రొక్కి, హస్తములు మోడ్చి యి ట్లని రడలు గదుర.

680


మ.

మనయుద్యానవనంబునందు విహరింపన్ దుర్మదుం డై ప్రభం
జనుఁ డచ్చోటికి నేగుదెంచి యశుభాచారస్థుఁ డై ధర్మమా
ర్గనిరూఢస్థితి వీడి రాగవశుఁ డై కామాస్త్రసంవిద్ధుఁ డై
తనకుం బత్నులు గం డటంచు మము వీతన్యాయుఁ డై వేడినన్.

681


తే.

వెలఁదులు స్వతంత్రులే ధర్మవిధి యెఱుఁగవె, కోర్కె గలదేని నీవు మద్గురుని నడుగు
మానవేంద్రుఁడు నీ కిచ్చెనేని ప్రీతి, నిను వరించెద మిందఱ మనఘచరిత.

682


క.

అని యేము పలుక విన క, య్యనిలుఁడు గోపించి చిత్త మలమటఁ జెందం
బనిగొని మదంగములు గ్ర, క్కునఁ గుదియం బట్టి మమ్మఁ గుబ్జలఁ జేసెన్.

683


వ.

అని విన్నవించిన విని పరమధార్మికుం డైనకుశనాభుండు గన్యాశతంబున కి ట్ల
నియె.

684


సీ.

ఆత్మజలార మీ రైకమత్యము నొంది వంశధర్మస్థితి వదలకుండ
సైరణఁ గావించి చనుదెంచితిరి క్షమావంతుల కేమి గొఱంత లేదు
లోకత్రయమునందు మీకుఁ బోలిన తాల్మి పరికింప మఱియు నెవ్వరికి లేదు
సురలయందైన దుష్కర మిట్టిశాంతంబు పురుషుల కైనఁ బూఁబోండ్ల కైన


ఆ.

క్షమయె భూషణంబు క్షమయె దానంబు య, జ్ఞంబు సత్య మార్జవంబు యశము
తపము శీల మధికధర్మంబు క్షమయందె, నిలిచి యుండుఁ జూడ నిఖిలజగము.

685


క.

అని పలికి సుతలఁ బోవం, బనిచి మహీవిభుఁడు మంత్రిబాంధవయుతుఁ డై
తనయల నెవ్వరి కిచ్చెద, ననుచు విచారించుచుండ నాసమయమునన్.

686


చ.

ఘనుఁడు జితేంద్రియుండు విధికల్పుఁ డనల్పతపుండు చూళి నాఁ
దనరుతపస్వి బ్రాహ్మసముదగ్రతపం బొనరించుచుండఁగా
ననిమిషలోకకాంత యగునట్టిది యూర్మిళముద్దుకూఁతు రా
ననజితసోమ సోమద యనం దగుయచ్చరమిన్న చెచ్చెరన్.

687


క.

మునివంశవార్ధిచంద్రునిఁ, గనఁ జని తచ్చరణములకు ఘనతరభక్తి
న్వినతి యొసరించి నిత్యం, బును సేవ యొనర్చుచుండెఁ బుత్రార్థిని యై.

688


తే.

అంతఁ గొంతకాలంబున కమ్మునీంద్రుఁ, డాత్మసంతుష్టుఁ డై మెచ్చి యన్నెలంతఁ
జూచి నీ కిష్ట మెద్దియో సుదతి దాని, నడుగు మిచ్చెద ననిన నప్పడఁతి యలరి.

689


క.

పలుకుల నమృతపుసోనలు, చిలుకఁగ మధురస్వరంబుచే ని ట్లనియెన్

జలరుహగర్భసమానున, కలచూళికి ఫాలకీలితాంజలి యగుచున్.

690


వ.

మహాత్మా యేను బుత్రార్థినియై మిము భజించితి నే నింతకు ము న్నపతినై యి
ప్పు డన్యునిం గోరక నైష్టికబ్రహ్మచారిణి నై యున్నదాన నీవు బ్రహ్మతేజోసము
దితుండవు బ్రహ్మభూతుండవు తపస్సంపన్నుండవు నాయందుఁ గృప గల దేని
శరణాగత నైననాకుఁ దపోమహిమచే బ్రాహ్మణశక్తియోగయుక్తుం డైనపు
త్రుం బ్రసాదింపు మని యభ్యర్థించిన నప్పరమతపస్వి దయాళుం డై యాగంధర్వి
కోరినయట్ల పరమధార్మికుం డైనపుత్రు నొసంగిన నతండు బ్రహ్మదత్తుం డనాఁ
బరఁగె నట్టి చూళిమానసపుత్రుం డైనబ్రహ్మదత్తుండు శక్త్రుం డమరావతీపురంబు
నుంబోలె కాంపిల్యానామనగరంబుఁ బరిపాలించుచు మహాసంపద్యుక్తుం డై
యుండె నట్టి బ్రహ్మదత్తుని రావించి కుశనాభుఁడు ప్రీతచేతస్కుం డై సమస్తలో
కసమ్మతంబుగాఁ గన్యాశతంబు నొసంగిన నాబ్రహ్మదత్తుం డక్కన్యల యథా
క్రమంబుగాఁ బాణిగ్రహణంబుఁ జేసిన.

691


క.

వరుని ప్రసాదంబున న, త్తరుణులు కుబ్జత్వ ముడిగి తత్క్షణమె మనో
హరగాత్ర లై తనర్చిరి, యరు దారఁగ మరుని మోహనాస్త్రములక్రియన్.

692


ఆ.

వీతకుబ్జభావ లై తారకలమాడ్కి, వెలుఁగుచున్నసుతలఁ గలయఁ జూచి
యద్భుతంబు నొంది యాకుశనాభుండు, గాఢహర్ష మాత్మఁ గడలుకొనఁగ.

693


చ.

తనయల నల్లుని న్బహువిధంబులఁ గామితముల్ ఘటించి మిం
చినయనురక్తి దివ్యమణిచేలసువర్ణము లిచ్చి యాదరం
బునఁ దగ వీడుకొల్పినఁ బ్రమోదమునం జని రగ్రభాగమం
దనుపమహృద్యవాద్యనినదార్భటు లంబరవీథి నిండఁగన్.

694


క.

తనయునిఁ గోడండ్రను గనుఁ, గొని సోమద హర్ష మొంది కుశనాభమహీం
ద్రునిఁ గొనియాడుచు వారల, ననుపమగతి గారవించె నధికప్రీతిన్.

695


వ.

ఇట్లు బ్రహ్మదత్తుండు గాంపిల్యానగరంబుఁ బ్రవేశించి పత్నీసహితుండై శక్రుండు
త్రిదివంబునందుఁ బోలె సుఖించుచుండె.

696


తే.

అంతఁ గుశనాభరాజు పుత్రార్థ మొక్క, యిష్టిఁ గావింప నాపృథివీశుకడకుఁ
గోర్కెతో బ్రహ్మపుత్రుండు గుశుఁడు వచ్చి, యింపుసొంపార మధురోక్తి నిట్టు లనియె.

697


క.

తనయా నీకు సమానుఁడు, తనయుఁడు గాధి యనువాఁడు ధార్మికుఁడు యశో
ధనుఁడు జనియించు ధర న, య్యనఘునిచే నీ కనంతయశముం గలుగున్.

698


క.

అని పలికి కుశుఁడు ముదమునఁ, దనయుని నాశీర్వదించి తపనునిచందం
బున నుజ్జ్వలుఁ డగుచు సనా, తన మగువిధిలోకమునకుఁ దడయక చనియెన్.

699


ఉ.

అంతటఁ గొంతకాలమున కద్భుతతేజుఁడు పుత్రుఁ డామహీ
కాంతుని గర్భవార్ధిమిహికాద్యుతి యై జనియించె మంజుల
స్వాంతుఁడు గాధిరా జనుప్రసన్నకళాకలితాత్ముఁ డమ్మహా

స్వాంతున కే జనించితి రసాపురుహూతునకున్ రఘూత్తమా.

700


సీ.

అవనీశ కుశవంశమందుఁ బుట్టుటఁ జేసి కౌశికనామంబు గలిగె నాకు
సరసాత్మ మాయక్క సత్యవతీదేవి దివ్యగుణాఢ్య సతీలలామ
వెనుకొని తనప్రాణవిభుఁ డైనఋచికుతోఁ గూడి శరీరంబుతోడ నాక
లోకంబునకుఁ బోయి లోకహితంబుగా నీలోకమునఁ బర్వతేంద్రుఁ డనఁగఁ


తే.

బరఁగు ప్రాలేయపర్వతప్రాంతమందుఁ, జెలఁగి కాళికి యనుపేర నలరుదివ్య
నిర్ఝరిణి యయ్యె నయ్యమ నిత్యమమ్మ, హాతటినిచెంత వసియింతు నయ్య నేను.

701


వ.

పదంపడి నేను యాగనియమంబున హిమవంతంబు విడిచి సిద్ధాశ్రమంబుఁ జేరి
భవత్తేజంబునఁ దపస్సిద్ధుండ నైతి మద్భగిని యగుసత్యవతి మహానదీస్వరూ
పంబున లోకపావని యై సజ్జనులదురితంబుఁ దొలంగం ద్రోయుచుండు రఘువరా
మదీయవంశక్రమంబును దచ్చరిత్రంబును నీదేశవిశేషవిధంబును బ్రస్ఫుటం
బుగా నెఱింగించితిఁ గదా యని పలికి హర్షపులకితగాత్రుం డై విశ్వామిత్రుండు
వెండియు నిట్లనియె.

702


మ.

అవనీశాత్మజ పూర్వరాత్రిసమయం బయ్యెం దమోజాలము
ల్భువి నీరంధ్రము గాఁగఁ బర్వెఁ దఱుచై భూరిద్యుతిం దారక
ల్దివిపై నుజ్జ్వలభంగిఁ బొల్చె సురవిద్వేషు ల్బలోద్రేకు లై
దవధూమాకృతి సంచరించెదరు నందం బొప్ప వీక్షించితే.

703


క.

గిరిగుహలయందుఁ దరుకో, టరములయం దాపగాతటంబులయందుం
దరులందు ఖగమృగంబులు, నెఱి సెడి లీనంబు లయ్యె నిద్రాసక్తిన్.

704


చ.

తొవలకుఁ బ్రేమఁ జూపి యల తోయరుహాంబకు నిద్ర లేపి ప
ద్మవనముకాంతి మాపి సురమండలికి న్సుధఁ జేఁపి చాల న
ర్ణవమున కుబ్బు దాపి రఘునాయక తావకకీర్తిమూర్తి నొం
ది వెడలె నాఁగ నిప్డు హిమదీధితి యొప్పెడిఁ గంటె ప్రాగ్గిరిన్.

705


వ.

రాజనందనా రాత్రివిశేషకాలం బయ్యె మేల్కొని యుండుటవలన నెల్లి జాగర
జనితపరిశ్రాంతివలన మార్గవిఘ్నంబు సంభవించుం గావున నింక సుఖనిద్ర
సల్పుము.

706


చ.

అన విని తోడిమౌనివరు లాముని కి ట్లని రోమహాతపో
ధనవర తావకాన్వయవిధంబు యథావిధి గా వినంబడె
న్ననఘులు బ్రహ్మతుల్యులు మహాత్ములు తావకవంశజాతుల
ట్ల నియుతభూరిదివ్యపృథులద్యుతి వై తనరారి తీ విలన్.

707


తే.

నృపుఁడ వై పుట్టి పదపడి విపులతపము, కలిమి బ్రహ్మర్షిపదమును గన్నవాఁడ
వీవు నీయంతవాఁడవు నీవె కాక, జగతి వేఱొక్కఁడును నీకు సాటి గలఁడె.

708


వ.

మహాత్మా భవత్సహోదరి యైనసత్యవతి గౌశికి యనుపేరం దనరుదివ్యనది యై

భువనపావని యై కులోద్యోతకరి యై ప్రకాశించుచున్నయది యని బహుప్రకా
రంబుల నత్తాపసులు విశ్వామిత్రునిం బ్రశంసించిన నమ్మునిశ్రేష్ఠుం డుల్లంబు
పల్లవింప సస్మితవదనారవిందుం డై వారి నందఱఁ దగినతెఱంగున నభినం
దించి వారలుం దానును మంజుకిసలయకుసుమవిరచితశయ్యాతలంబుల నధివ
సించి యొక్కింతసేపు పుణ్యకథావినోదంబులం బ్రొద్దుఁ బుచ్చి పదంపడి సుఖ
నిద్రఁ జేసి రారఘుప్రవరులును విశ్వామిత్రుని సేవించి యమ్మహాత్మునివలన
నిష్టకథాశ్రవణంబుఁ జేయుచు మృదుతల్పంబులం బవ్వళించి సుఖనిద్రం గావిం
చిరి తదనంతరంబ.

709


క.

శతపత్రకుట్మలబహి, ర్గతముదమధుపాంగనానికాయరవంబు
ల్జత గూడి కేవలాదం, భత మీఱఁ బ్రభాతకాలమహిమం దెలిపెన్.

710


తే.

అంతఁ గౌశికముని యంతికావనీరు, హాగ్రసంగతపారావతారవములు
మేలుకొలుపులు పాడంగ మేలుకాంచి, సరసమతిఁ దోడిమునుల కెచ్చరికఁ జేసి.

711


చ.

చెలువుగ రామలక్ష్మణులఁ జీఱి రఘూత్తములార మేలుకొం
డలతపనోదయావసర మయ్యె నటంచు సుధానుయోక్తి మే
ల్కొలిపిన నిద్ర లేచి రఘుకుంజరు లాహ్నికకృత్యము ల్నయం
బలరఁగఁ దీర్చి రత్తఱి నృపాగ్రణి గౌశికుతోడ ని ట్లనున్.

712


తే.

కంటె యీశోణనది మహాగాధ మగుచుఁ, బులినమండితమై శుభసలిలపూర్ణ
మగుచు నొప్పెడు మనము సొంపార నెద్ది, మార్గమున దాఁటిపోదము మౌనివర్య.

713


క.

అన విని గాధేయుఁడు రా, మున కి ట్లనుఁ దాపసోత్తములు దాఁటెడు రే
వున దాఁటి పోద మని గ్ర, ద్దన నన్నది దాఁటె మౌనితతియుతుఁ డగుచున్.

714

విశ్వామిత్రుఁడు రామలక్ష్మణసహితుం డై గంగానదిఁ జేర నరుగుట

వ.

ఇత్తెఱంగున నత్తపోధనగ్రామణి రామలక్ష్మణనహితుం డై తాపసులం గూడి
శోణనది నుత్తరించి తత్తీరవనంబులు విలోకింపుచు దూరం బరిగి యినుండు
నభోమధ్యగతుం డగునంతకు సమస్తమునినిషేవితం బగుదాని హంససారస
నాదితం బగుదానిఁ బుణ్యోదకం బైనదాని గంగానది డాసి యమ్మహానదియందు
సుస్నాతులై పితృతర్పణంబుఁ గావించి కృతాగ్నిహోత్రులై యమృతతుల్యం
బైనహవిశ్శేషంబు భక్షించి యమ్మహానదితీరంబున నొక్కరమ్యప్రదేశంబున
నావాసపరిగ్రహణంబుఁ జేసి పరమానందభరితాంతఃకరణు లై రచ్చట సమ
స్తమునిపరివృతుం డై విశ్వామిత్రుండు నివసించె నంత నారాముండు విశ్వా
మిత్రుని కభిముఖంబుగా నాసీనుం డై యమ్మహాత్మున కి ట్లనియె.

715

విశ్వామిత్రుఁడు శ్రీరామునికి గంగాపర్ణలసంభవప్రకారంబుఁ దెల్పుట

క.

తాపస యీదివ్యాపగ, యేపగిది జనించె జగము లేక్రియ నిండెన్
యేపగిది జలధిఁ గలసెను, నాపై గృపఁ జేసి యంత నయముగఁ జెపుమా.

716

క.

అనవుడు రఘువరముఖసం, జనితవచోమృతముఁ జెవులఁ జవిగొని స్మేరా
ననుఁ డై సుమనోగతి న, మ్మునిరా జి ట్లనియెఁ గుతుకముం దళుకొత్తన్.

717


క.

కల దొకయళిచికుర సురా, చలపుత్రి మెఱుంగుదీఁగె శశికళ మరుగ
జ్జెలగుఱ్ఱ మఖిలసురరమ, ణుల చూడాభూషణము మనోరమ యనఁగన్.

718


చ.

హిమవదహార్యరాజు మది హెచ్చినకోరిక నివ్వటిల్లఁగాఁ
బ్రమద మెలర్ప నక్కలువరాయనిరేకఁ దృణీకరించున
య్యమను యథావిధిం బరిణయం బయి తత్సతియందుఁ గాంచె నా
సుమహితరూపయౌవనసుశోభితగాత్రులఁ గూఁతు లిద్దఱన్.

719


తే.

సురలు దేవహితార్థ మాసుతలలోనఁ బెద్దకూఁతురు గంగ యన్పేర నలరు
దాని నిమ్మని హిమధరాధరుని నెయ్య, మెసఁగ నడిగిరి త్రైలోక్యహితముపొంటె.

720


క.

అడిగిన నక్కుధరేంద్రుఁడు, పడఁతుకఁ దనపుత్రి భువనపావని గంగ
న్గడువేడ్క లోకహితముగఁ, దడయక దేవతల కిచ్చెఁ దద్దయుఁ బ్రీతిన్.

721


క.

ఇచ్చినఁ గైకొని నిర్జరు, లిచ్చ నలరి లోకములకు హిత మొనరింపం
జెచ్చెర గంగను దోడ్కొని, యచ్చుపడఁగ నాకమునకు నరిగిరి పెలుచన్.

722


వ.

ఇట్లు స్వచ్ఛందపథగామిని యైనగంగ సురలచేత నాహూయమాన యై దివంబు
నకుం జని మహానదీరూపంబున సురగరుడోరగమునిసేవిత యై యెల్లవారలఁ బ
విత్రులం జేయుచుండె నంత రెండవకూఁతు రుమాదేవి యుగ్రం బైనవ్రతం
బంగీకరించి శైలసానుకందరంబులఁ దపంబుఁ జేయుచుండ నాహిమవంతుం
డక్కన్యకుం దగినవరుని విచారించి సకలలోకనమస్కృతుం డైనరుద్రున కొసంగె
నిది త్రిభువనాభివంద్య లైనగంగాపర్ణలసంభవప్రకారం బందుఁ ద్రిపథగ యైన
గంగానది మొదలఁ ద్రివిష్టపంబు నధిగమించి యందు మహానదీస్వరూపిణీ యై
స్వర్లోకంబునం బ్రవహించిన చందంబు నెఱింగించితి నని పలికిన నారామ
లక్ష్మణు లిరువురు ప్రీతిసంహృష్టసర్వాంగులై విశ్వామిత్రు నవలోకించి మహా
త్మా ధర్మయుక్తం బైన యీగంగాఖ్యానంబు సంక్షేపంబుగా మీచేతఁ గథితం
బయ్యె నీవు దివ్యమానుషసంభవప్రకారం బంతయు సవిస్తరంబుగా నెఱిఁగిన
మహానుభావుండవు శైలపుత్రి యైనగంగాదేవి మహానదీస్వరూపిణియై ముల్లో
కంబులం బ్రవర్తించుటకుఁ గారణం బెయ్యది యేకర్మంబులం గూడి ముల్లో
కంబులయందు విశ్రుతి వహించె నేకారణంబున మార్గత్రయగామిని యయ్యెఁ
దత్ప్రకారం బంతయు సవిస్తరంబుగా నెఱింగింప నీవే యర్హుండ వనిన ఋషిస
భామధ్యగతుం డైనవిశ్వామిత్రుండు హర్షపులకితగాత్రుం డై యి ట్లనియె.

723

విశ్వామిత్రుఁడు శ్రీరామునికిఁ బార్వతీవృత్తాంతంబుఁ దెలుపుట

చ.

ఎలమి శశాంకమౌళి కుధరేశ్వరనందన నిట్లు పెండ్లి యై
చెలువుగఁ బువ్వుతావిగతిఁ జిత్తము లొక్కటిగాఁ బరస్పరం

బలఘుముదంబుతో నహరహం బెడఁబాయక సౌఖ్యసంపదం
దలకొని పోల్చి రెంతయు సనాతనదంపతు లై జగంబులన్.

724


వ.

అంత.

725


చ.

మృడుఁ డొకనాఁడు వేడుక నమేయభుజాబలశాలిపుత్రునిం
బడయఁగఁ గోరి యత్తుహినపర్వతరాజకుమారిఁ గూడ సొం
పడరఁగ నూఱువర్షము లహర్నిశము ల్పరమానురక్తిచే
నెడఁబడకుండ నిత్యము రహి న్సురతం బొనరించుచుండఁగన్.

726


చ.

జలజభవాద్యశేషసురసత్తము లొక్కట గుంపుఁ గూడి యా
యళికవిలోచనుండు తుహినాచలనందనితోడఁ గూడి మి
క్కిలి సురతం బొనర్పఁ దొడఁగెం దగ వారలతేజ మేఘనుం
డిల సహియింప నోపు మన మి త్తఱి నవ్విధి మాన్పఁగాఁ దగున్.

727


మ.

అని చింతించి సుర ల్కుతూహలముతో నచ్చోటి కేతెంచి యం
దు నిరూఢేచ్ఛ నఖండత న్సురత మెంతో వేడ్కఁ గావించులో
కనిదానం బగుశంకరుం గని నమస్కారంబుఁ గావించి ఫా
లనిబద్ధాంజలు లై నుతించిరి శుభాలాపంబుల న్భక్తితోన్.

728


తే.

దేవదేవ మహాదేవ దేవవినుత, లోకనాయక నతభక్త లోకవరద
శర్వ శంకర యీశాన చంద్రమౌళి, నీకు మ్రొక్కెద మాలింపు నిర్మలాత్మ.

729


తే.

ఈశ యేపారు నీతేజ మెవరు దాల్ప, నోవువా రిట్టిరతికృత్య ముడుగవలయు
బ్రహ్మచర్యవ్రతంబునఁ బరఁగవలయు, నివ్వరము మా కిఁక ననుగ్రహింపవలయు.

730


వ.

దేవా యమోఘం బైనభవత్తేజంబు సహింప జగంబు లోపవు కావునఁ
దేజంబు నీయందు ధరింపుము లోకహితార్థంబు దేవీసహితుండ వై తపంబుఁ
గావింపు మని ప్రార్థించిన దేవతలవచనంబు విని దయాళుం డై సర్వలోక
మహేశ్వరుం డగు పార్వతీశ్వరుండు వేల్పులం జూచి మీ చెప్పినట్ల మదీయం
బైనతేజంబు నాయందె నిలిపెద స్వస్థచిత్తులరు గం డిప్పు డనుత్తమం బైన
మద్వీర్యంబు రేతస్థానహృదయసంపుటసంక్షుభితం బయ్యె దీని నెవ్వాఁడు
ధరించువాఁ డెఱింగింపుం డనిన నయ్యాదిత్యులు వృషభధ్వజున కి ట్లనిరి.

731


క.

విడువుము తావకతేజముఁ, దడయక తాల్పంగ నోపు ధాత్రి యటన్నన్
మృడుఁ డౌఁగా కని గ్రక్కునఁ, బుడమిం గావించెఁ దద్విమోచన మనఘా.

732


వ.

ఇట్లు విసర్జించిన నమ్మహాతేజంబు శైలకాననసహిత యైనమహి యెల్ల నిండె
నప్పుడు.

733

తే.

అమరు లనలునిఁ గనుఁగొని యనిలుఁ గూడి, చెలఁగి నీవిందుఁ దగఁ బ్రవేశింపు మనిన
విని యతం డట్ల కావించె జనవరేణ్య, యవని శ్వేతాద్రి యన నొప్పె నచటి నెలవు.

734


వ.

మఱియు రౌద్రం బైనతేజం బెచ్చోట విసృష్టం బయ్యె నది కార్తికేయజన్మ
స్థానం బైనదివ్యశరవణం బై పావకాదిత్యసన్నిభం బై విలసిల్లె నంత దేవతలు
సమస్తమునిగణసమేతంబుగా నయ్యుమామహేశ్వరులం బూజించి రప్పుడు.

735


క.

కట్టడితనమున వేల్పులు, గట్టిగఁ దన కప్రియంబుఁ గావించుటకుం
గట్టలుకఁ దత్ఫలంబును, గట్టి కుడుచున ట్లొనర్తుఁ గా కని యుమయున్.

736


క.

కనుఁగొనలఁ దామ్రదీధితి, దనరారఁగ మేను దీప్తదవశిఖిచందం
బున నలరఁ గ్రోధ మది పై, కొనఁగా దోయిట జలంబుఁ గొని యి ట్లనియెన్.

737


చ.

కొడుకును గోరి ప్రాణవిభుఁ గూడి సుఖించెడు నాకు నిమ్మెయిన్
విడువక దుష్టు లై నడుమ విఘ్న మొనర్చితి రిట్లు గాన నిం
పడరఁగ వేల్పులార యిది యాదిగఁ బత్నులయందు మీ కిఁకం
గొడుకులు పుట్ట కుండెదరు కోరి శపించితి నిక్క మింతయున్.

738


వ.

అని పలికి వెండియు.

739


తే.

ఇలను వీక్షించి క్రుద్ధ యై యేను దాల్పఁ, దగినయీతేజ మీ వెట్లు దాల్చితి విది
మొదలు బహునాయకత్వంబుఁ బొందు మనుచు, శాప మిచ్చెఁ బదంపడి శైలతనయ.

740


వ.

మఱియు వసుంధర నుద్దేశించి యూషరత్వాదినానావిధరూపిణి వై మచ్ఛాప
క్రోధవిపర్యస్తప్రకృతి వై పుత్రకృతప్రీతి నొందకుండు మని యిట్లు కఠోరంబుగా
శపించె నంత దేవతలు పార్వతిచేత శప్తులై మొగంబుల లజ్జావిషాదంబులు
వొడను నిజనివాసంబులకుం జనిరి శంభుఁడు దేవీసహితుండై యచ్చోటు
విడిచి తుషారగిరియుత్తరభాగంబునకుం జని తదీయం బైనయొక్కమహోన్నత
శృంగంబుమీఁదఁ దపంబుఁ జేయుచుండె నిది పార్వతీవృత్తాంతం బింక
గంగావృత్తాంతం బెఱింగించెద వినుము.

741

విశ్వామిత్రుఁడు శ్రీరామునికి గంగావృత్తాంతంబుఁ దెల్పుట

సీ.

అమరు లందఱును మహర్షిసమేతు లై కడువేడ్క బ్రహ్మను గానఁ బోయి
వినయంబు భక్తివివేకంబు లేర్పడఁ దత్పాదములకు వందనముఁ జేసి
నలువ మా కొకఁడు సేనానాయకుఁడు లేమిఁ జేసి దైత్యులచేతఁ జిక్కు పడితి
మష్టమూర్తికిఁ బుట్టి నట్టివాని గ్రహింతు మని యున్న నదియు నాఁ డట్ల యయ్యె


తే.

దామరసగర్భ మా కింకఁ దగినకార్య, మెద్ది యోచించి త్రైలోక్యహితము పొంటె

నానతిమ్ము సమస్తవిధానవిదుఁడ, వీవు మాకందఱకు దిక్కు నీవ కావె.

742


వ.

దేవా తొల్లి మాకు భగవంతునిచేత నెవ్వఁడు సేనాధిపతిగా దత్తం బయ్యె
నమ్మహాత్ముఁ డిప్పు డుమాసహితంబుగాఁ దపంబుఁ జేయుచున్నవాఁ డింక
వేఱొక్కని నిర్దేశింపుము.

743


క.

అని సురలు విన్నవించిన, విని వేలుపుపెద్ద వారి వీక్షించి కృపా
జనితానురాగమున ని, ట్లనియెం బలుకులు సుధామయము లై యుండన్.

744


చ.

పరమసతీలలామ యగు పార్వతి పల్కినభంగి నింక మీ
గఱితలయందు నందనులు గల్గుట చొప్పడ దింత నిక్కువం
బఱమర లేదు పావకునియందు సమున్నత మైనశూలభృ
త్పరమపవిత్రతేజ మది భాసిలుచున్నది హేమరూప మై.

745


తే.

శాంభవం బైనదివ్యతేజంబుచేతఁ, జిత్రభానుండు కడువేడ్క శీతశైల
పుత్రి యగుగంగయందు సత్పుత్రు నొకనిఁ, బూని కలిగించు మీకు సేనాని గాఁగ.

746


వ.

మఱియు నాగంగాదేవి హిమవంతంబునకుం బెద్దకూఁతురు గావున నుమా
దేవి ధరింపం దగిన శైవం బగుతేజంబు దా నశ్రమంబునం దాల్పనోపు నవ్వి
ధం బయ్యుమకును బహుమతం బై యుండు నని పితామహుం డానతిచ్చిన
నిలింపులు కృతార్థుల మైతి మని సంతసిల్లి యమ్మహాత్మునిం బూజించి యనుజ్ఞ
వడసి బహుధాతుమండితం బైనకైలాసనగంబునకుం జని సర్వదేవపురోహి
తుఁ డైనపావకునిం జూచి మహాత్మా నీయందు నిక్షేపించి యున్నమాహేశ్వరం
బగుతేజంబు పుత్రార్థంబుగా శైలపుత్రి యగుగంగయందుఁ జేర్చి దేవతలకు
హితంబుఁ జేయు మని నియోగించిన నప్పావకుండు గంగకడకుం జని సర్వదేవ
తాహితార్థంబు గర్భంబు ధరింపు మని పలికిన నద్దేవి దివ్యస్త్రీరూపధారిణియై
పొడసూపినఁ దదేయసౌందర్యాతిశయంబు విలోకించి మోహితుం డై పావ
కుండు దనయందు వ్యాప్తం బైనతేజంబు సర్వావయవంబులవలన విసర్జించి
గంగాదేవి సర్వావయవంబులయందుఁ బ్రసరింపంజేసిన నద్దివ్యతేజంబు ముఖనా
సాదిసర్వావయవంబులయందు నిండిన నద్దేవి ప్రవ్యధితచేతన యై పావకుం
జూచి యి ట్లనియె.

747


క.

అమరపురోహిత నీతే, జముఁ దాల్పఁగ నోప నైతి జాంబూనదశై
లముభంగిఁ జాల వ్రేఁ గై, విమలలయాగ్నిశిఖమాడ్కి వెలిఁగెడుఁ గంటే.

748


క.

అని పలికిన నద్దేవికి, ననలుం డి ట్లనియె నపుడు హైమవతీశం
భునితేజ మిది సుతార్థము, పనిగొని నీయందు నుంపఁబడె నాచేతన్.

749


ఆ.

మోయఁజాలవేని మునుకొని నీ వతి, గౌరవంబు గలుగు గర్భము హిమ
శిఖరిపాదమందుఁ జేర్పుము గ్రక్కున, ననిన నట్ల చేసె నమరతటిని.

750


వ.

ఇట్లు గంగాదేవి తనయందుఁ జేర్చిన యద్దివ్యతేజంబు వహ్నివ్యాప్తశ్వేత

శైలీకృతశివతేజోరాశియందు విసర్జించినఁ దద్గర్భనిక్షేపమాత్రంబునఁ దత్తే
జంబుచేత నభిరంజితం బై పూర్వోక్తశ్వేతపర్వతసహితం బైనశరవణంబు
సర్వంబును గాంచనమయం బయ్యె నందు భాస్వరతరదివ్యదేహుండును జిత్ర
భానుసమప్రభుండును నగుకుమారుండు జన్మించెఁ దచ్ఛోణితాధిక్యంబువల
నఁ దప్తజాంబూనదప్రభం బైనకాంచనంబును నిర్మలం బైనరజతంబును బొడమి
యచ్చట మేదినియందు వ్యాపించెఁ దత్క్షారగుణంబువలనఁ దామ్రకృష్ణాయ
నంబులు దన్మలంబువలనఁ ద్రపుసీసకంబులునుం బుట్టెఁ దద్దివ్యతేజప్రభావం
బున నచ్చటి తరుగుల్మలతాప్రతానంబు లన్నియు సువర్ణమయంబు లై తేజ
రిల్లె నచ్చటినెలవు నానాధాతుమండితం బై యొప్పె నాఁటంగోలె సువర్ణం
బునకు జాతరూపవిఖ్యాతియు వైశ్వానరసమప్రభయునుం గలిగె.

751


చ.

రయమున నక్కుమారునకుఁ గ్రమ్మర క్షీరము లిచ్చి పెంపఁ గాఁ
బ్రియమున వేల్పు లందఱును గృత్తికల న్నియమింప వార లెం
తయుఁ గృప మీఱఁగాఁ దమకు నందనుఁ డంచుఁ దలంచి యాతని
న్బ్రియమున జన్నుపా లొసఁగి పెంచిరి లోకహితార్థ మత్తఱిన్.

752


తే.

కృత్తికాస్తన్యపానప్రవృద్ధుఁ డగుట, వలన నిక్కుమారుండు సొం పలరఁ గార్తి
కేయుఁ డన ముజ్జగంబులఁ గీర్తితుఁ డగు, ననుచు సంప్రీతితో వేల్పు లాడి రపుడు.

753


క.

ఇందుధరునిఘనరేత, స్స్కందంబున జనన మౌట కతమున నతనిన్
బృందారకసందోహము, స్కందుం డని పొగడె నపుడు కౌతుక మరలన్.

754


తే.

గరిమ గర్భోదకంబందు స్కన్న మగుచు, నధికకాంతిచే దీప్యమానాగ్ని భంగి
వెలుఁగుపుత్రునిఁ గని కృత్తికలు చెలంగి, స్నపన మొనరించి రప్పుడు సంతసమున.

755


తే.

అరయఁ గృత్తిక ల ట్లార్వు రగుటవలన, నాఱుమోములఁ దాల్చి సొంపార నొక్క
దివసమున వారిచనుపాలు దవిలి త్రావి, మిగుల సుకుమారదేహుఁ డై పొగడుఁ గాంచె.

756


తే.

సముదితం బైనదివ్యతేజంబుచేత, సురబలాధీశుఁ డై రాక్షసుల వధించె
నందువలన నతండు షడాస్యుఁ డనఁగ, గరిమ సేనాని యనఁగ విఖ్యాతిఁ గనియె.

757


చ.

అమరసమాన గంగవిధ మద్భుత మైనకుమారసంభవ
క్రమమును సర్వముం దెలియఁగా వినిపించితిఁ గార్తికేయునం
దమలినభక్తిఁ జేయు నరుఁ డాయువు గల్గి సపుత్రపౌత్రుఁ డై
క్షమ సుఖి యై చరించి తుదిఁ గాంచు సమంచితతత్సలోకతన్.

758


వ.

అని పలికి విశ్వామిత్రుండు వెండియు రామభద్రు నవలోకించి యిట్లనియె.

759

విశ్వామిత్రుఁడు శ్రీరామునకు సగరచక్రవర్తికథఁ దెల్పుట

చ.

అలరు భవత్కులాంబుధిహిమాంశుఁ డనా సగరావనీశ్వరుం

డలఘుతరప్రతాపమున నాతఁడు సాగరవేష్టితావనీ
తల మనిశంబు ధర్మగతిఁ దప్పక యేలుచుఁ జక్రవర్తి యై
బలరిపువైభవస్ఫురణ భాసిలుచుండు నమానుషప్రభన్.

760


తే.

దశరథకుమార వినుము విదర్భరాజ, తనయ ధర్మిష్ఠ సత్యవాదిని పతివ్ర
తాగ్రగణనీయ కేశిని యనెడుసాధ్వి, యగ్రగేహిని యయ్యె నయ్యవనిపతికి.

761


తే.

మఱియు నారాజమౌళికి గరుడభగిని, కామునిజయాస్త్రమ యరిష్టనేమిదుహిత
సుమతి యనుపేర నొప్పారు సుందరాంగి, నేయ మెసఁగ ద్వితీయ ద్వితీయ యయ్యె.

762


క.

ఆయిరువురుపత్నులు తన, కాయతసౌఖ్యం బొసంగ నభినవవిభవ
శ్రీయుతుఁ డై బహుకాలము, పాయక యిల యేలె నానృపాలుఁడు ప్రీతిన్.

763


వ.

ఇట్లు రాజ్యంబుఁ జేయుచు.

764


క.

తనయులు లేమికి వగ నె, క్కొనఁ బత్నీయుతముగా భృగుప్రస్రవణం
బనుశైలమందు నేమము, దనరారఁగ నుగ్రభంగిఁ దప మొనరించెన్.

765


వ.

అంత.

766


క.

నూఱేండ్లు సనినవెన్కన సు, రారాధ్యుం డైనభృగుమహాముని కరుణో
దారుఁడు ప్రత్యక్షం బై, కూరిమితో నిట్టు లనియెఁ గువలయపతికిన్.

767


చ.

అలఘుచరిత్ర నీకు సముదంచిత మై తగుపుత్రలాభముం
గలుగు ననంతవైభవ మఖండయశంబును వృద్ధిఁ బొందు నీ
యలికచలందు నొక్కతెకు నఱ్వదివేలసుతుల్ జనింతు రిం
పలర నొకర్తె కొక్కఁ డగుణాఢ్యుఁడు వంశకరుండు గల్గెడున్.

768


క.

అని మునిపతి వర మిచ్చిన, విని నరపతిసుత లతనికి వినత లయి ముదం
బున వినయవాక్యముల ని, ట్లని రప్పుడు ఫాలకీలితాంజలిపుట లై.

769


తే.

నీపలుకు నిక్క మగుఁ గాక తాపసేంద్ర, పరఁగఁ బెక్కండ్ర సుతుల నేతరుణి గాంచు
నొక్కనుతుఁ డేమృగాక్షికి నుద్భవించుఁ, గరుణ దళుకొత్త నింతయు నెఱుఁగఁ జెపుమ.

770


క.

ఆరామలవచనము విని, సారసగర్భాత్మజుండు సంయమి పలికెన్
మీ రెవ్వ రెట్లు గోరిన, నారీతి జనింతు రిది యథార్థము చుండీ.

771


క.

ఒక్కఁడు వంశకరుం డగుఁ, బెక్కండ్రుసుతుల్ ధరిత్రిఁ బృథుబలయుక్తిన్
మిక్కిలి గీర్తి వహింతురు, నిక్కము నావచన మింక నృపసుతలారా.

772


ఆ.

అనిన నగ్రపత్ని యగుకేశిని కుమార, వరునిఁ గోరె నొకని వంశకరునిఁ
దక్కినట్టిసుదతి తనయులఁ బెక్కండ్ర, నధికబలులఁ గోరె నద్భుతముగ.

773

వ.

అమ్మునీంద్రుం డక్కాంతలు గోరినవరంబు లొసంగె నారాజశేఖరుండు లబ్ధ
మనోరథుం డై భృగువునకుఁ బ్రదక్షిణంబును బ్రణామంబునుం గావించి యతని
చేత ననుజ్ఞ వడసి పత్నీసమేతుం డై నిజపురంబునకుఁ జనుదెంచి పుత్రోదయంబుఁ
గోరుచున్నంతఁ గొంతకాలంబు సనినయనంతరంబ.

774


క.

జనవిభుని యగ్రసతి కే, శిని గాంచె సమస్తసాధుశిక్షారతునిన్
జనకంటకు నసమంజుం, డనుపుత్రుని వంశకరు మహాబలు నొకనిన్.

775


అ.

అంత సుమతి యనెడుకాంతగర్భంబునఁ, దుంబ మొకటి పుట్టెఁ దొలుత నదియు
విరియఁ దోడుతోడ నఱువదివేవురు, సుతులు పుట్టి రందు సురుచిరముగ.

776


ఆ.

వారి నెల్ల దాదు లారూఢిగా నాజ్య, పూర్ణఘటములందుఁ బొసఁగ నునిచి
సంతతంబుఁ బెనుపఁ గొంతకాలమునకు, శైశవంబు వీడి సంభ్రమమున.

777


చ.

భువనమనోహరస్ఫురణఁ బొల్చు సమంచితయౌవనప్రభా
సువిహితరూపు లై మిగుల సొంపును బెంపును గల్గి తేజమున్
జవమును విక్రమంబు భుజసత్త్వముఁ గ్రాల జగత్త్రయైకసం
స్తవమున నొప్పి రెంతయును దండ్రికిఁ జాల ముదం బెలర్పఁగన్.

778


ఉ.

ఆయసమంజుఁ డెంతయు దురాత్మకుఁ డై బహుళావలేపతం
బాయక సంతతంబు బుధపాళికి బాధ యొనర్చుచున్ రహిన్
డాయుచు బాలురన్ బహువిధంబుల నొక్కటఁ జిక్కఁ బట్ట కు
య్యో యని తల్లడిల్ల సరయూనదిలోఁ బడవైచు నుగ్రతన్.

779


వ.

ఇట్లు పాపసమాచారుండును సజ్జనప్రతిబాధకుండు నై వర్తించుచుండ నంతఁ
గొంతకాలంబున కయ్యసమంజునకుఁ దేజోజితాంశుమంతుం డై యంశు
మంతుం డనుకుమారుం డుదయించి సర్వజనులకును బ్రియంవదుం డై సర్వ
లోకసమ్మతుం డై యొప్పుచుండఁ దద్గుణంబులకు సంతసిల్లుచు సగరుండు గొడుకు
వలని మోహంబు విడిచి యతనిదుశ్చారిత్రంబులు వినరామికి రోయుచు సకలజ
నానురాగంబుగా నసమంజుఁ బురంబు వెడల ననిచి కొంతకాలమునకు ఋత్వి
క్పురోహితుల విచారించి నిశ్చయించి సకలమహీనాయకత్వంబు సార్థకము
గా నొక్కయశ్వమేధయాగంబుఁ గావించె నని పలికిన విశ్వామిత్రునిపలు
కుల కలరి రాముం డమ్మహాత్ము నవలోకించి మునీంద్రా మదన్వయంబునం
బుట్టిన పూర్వికులచరిత్రంబు వినవలఁతు సగరునియజ్ఞం బెత్తెఱంగునం
బ్రవర్తిల్లె సవిస్తరంబుగా నెఱింగింపవే యని యభ్యర్థించిన నమ్మునిస్వామి
రఘుస్వామి కి ట్లనియె.

780


మ.

హిమవింధ్యాచలమధ్యదేశమున ధాత్రీశుండు చిత్తంబునం
బ్రమదం బొప్పఁ దురంగమేధ మొనరింపం బూని కావించుచో
రమణీయుం డగునంశుమంతుఁడు దదర్థం బైనయశ్వంబు న

య్యమరారుల్ గొనిపోవకుండఁగ సముద్యచ్ఛక్తి రక్షింపఁగన్.

781

ఇంద్రుఁడు వంచనచే సగరునియాగీయాశ్వమును గొనిపోవుట

చ.

అనిమిషనాథుఁ డొక్కకుహనాసురవేషముఁ దాల్చి యంశుమం
తుని వెస డాఁగుఱించి కుపితుం డయి పర్వమునందు నశ్వముం
గొని ఫణిరాజలోకమునకుం జని యం దతిగుహ్య మైనయా
ఘనకపిలాశ్రమంబు వెనుకన్ వడి దాఁచి చనెన్ రయంబునన్.

782


సీ.

అంత ఋత్విగ్వరు లధ్వరాశ్వము పోవు టెఱిఁగి మహీపతి కిట్టు లనిరి
పార్థివోత్తమ యాగపశువు హృతం బయ్యె వెస నశ్వచోరుని వెదకి చంపి
హయమును దెప్పింపు మధ్యరంబునకు ఛిద్రము గల్గె నేనియుఁ దప్ప కిపుడు
మన కందఱకును నమంగళం బొనఁగూడు నట్లు గాకుండ నీయధ్వరంబు


తే.

సాంగముగఁ జేయు మనవుడు జనవిభుండు, చాల మనమునఁ జింతించి సభకు వేగ
యమితసత్వుల షష్టిసహస్రసుతుల, నపుడె రావించి వారి కి ట్లనుచుఁ బలికె.

783


ఉ.

పుత్రకులార యేవలనఁ బూర్వసుపర్వులు చూడఁ గాన మీ
సత్రము శాస్త్రదృష్టవిధి సాగుచు నున్నది యధ్వరక్రియా
సూత్రవిదుల్ మహామునులు సూచు సదస్యులు నేలకో మహా
చిత్రముగా మహాశ్వ మది చెచ్చెర సంహృత మయ్యె నీయెడన్.

784


ఉ.

మీరు మదాఙ్ఞచే రయము మీఱఁగ నేగి పయోధిచేత నొ
ప్పారెడుమేదినీజగము నారసి యశ్వము లేక యున్న న
ట్లూరక ధారుణీతలము నొక్కొకఁ డొక్కొకయోజనంబు సొం
పారఁగఁ ద్రవ్వుఁ డధ్వరహయం బది గన్పఁడుదాఁక నుద్ధతిన్.

785


తే.

భుజబలంబును నిబ్భంగి భుజగజగము, దాఁక వడి నంటఁ ద్రవ్వి యస్తోకమహిమ
నందు శోధించి హయచోరు నరసి చంపి, సవనహయమును గొని తెండు సత్వరముగ.

786


వ.

ఏను దురంగదర్శనం బగునందాఁకఁ బౌత్రకుం డైన యంశుమంతునిం గూడి
యుపాధ్యాయగణసహితుండ నై దీక్ష వహించి యిచ్చట నుండువాఁడ.

787

సగరపుత్రులు భూమియంతయుఁ ద్రవ్వ నారంభించుట

చ.

అనిన మహాప్రసాద మని యాసగరుల్ ప్రళయావసానసం
జనితపయోధరారవము చాడ్పున నింగి చెలంగ నార్చి యే
ర్చినబడబాగ్నికీలలవిశేషము దోఁపఁ బ్రదీప్తమూర్తు లై
చనిరి మఖాశ్వము న్వెదక శక్తిగదాప్రముఖాయుధాఢ్యు లై.

788

వ.

ఇత్తెఱంగునఁ జని గురూపదేశక్రమంబునఁ దూర్పుదెస మొదలుగా
జంబూద్వీపంబు చుట్టురాఁ దిఱుగ నొక్కొక్కఁ డొక్కొక్కయోజనంబుఁ
ద్రవ్వుద మని వజ్రస్పర్శసమంబు లైననఖంబుల నశనికల్పంబు లైనశూలం
బుల దారుణంబు లైనహలంబుల మహీతలంబు భేదింపం దొడంగిన నప్పుడు
భిద్యమానమహీనినాదంబును వధ్యమాననాగాసురనానాసత్వనిర్ఘోషంబును
సగరులకోలాహలంబును సౌంద్రంబుగా నొక్కటి యై భూనభోంతరాళంబు
నిండి చెలంగె.

789


చ.

నిరుపమభంగి నిట్లు ధరణీతలమున్ భుజశక్తియుక్తిచే
నఱువదివేలయోజనము లద్భుతవైఖరిఁ ద్రవ్వి రానరే
శ్వరసుతు లంత సిద్ధమునిసాధ్యసురుల్ భయ మంది భారతీ
శ్వరు కడ కేగి తచ్ఛరణవారిరుహద్వయికిన్ వినమ్రు లై.

790

దేవతలు సగరపుత్రభీతులై బ్రహ్మతో మొఱలిడుట

క.

పటుతరభంగి సపర్యలు, ఘటియించి హృదంతరమునఁ గౌతుక మలరన్
నిటలతటన్యస్తాంజలి, పుటు లై యి ట్లనిరి కడుఁ బ్రబుద్ధత వెలయన్.

791


చ.

వెలయఁగ మీకుఁ దెల్ప నొకవిన్నప మున్నది చిత్తగింపు మో
జలరుహగర్భ యాసగరసంభవు లుర్విఁ బ్రదక్షిణంబుగాఁ
జలమున ముష్టిముద్గరకశానఖసీరముఖంబులన్ రసా
తలభువనంబుదాఁకఁ జనఁ ద్రవ్విరి భూరిభుజాబలంబునన్.

792


ఉ.

వీఁడె మఖాశ్వచోరకుఁడు వీఁడె దురాత్ముఁడు వీఁడె వైరి పో
వీఁడె సుమీ తలంప మఖవిఘ్నకరుండు వధింపుఁ డంచు నె
గ్గాడుచు వీఁడు వాఁ డనక నక్షులకుం గనఁబడ్డవారి మో
మోడక త్రుంచి రింకఁ గమలోద్భవ తద్విధి వేగ మాన్పవే.

793


మ.

అని యావేల్పులు విన్నవించుటయు భాషాధీశుఁ డవ్వేల్పులం
గని యోనిర్జరులార శౌరి కపిలాఖ్యన్మౌని యై యున్నవాఁ
డనిశం బామహనీయమూర్తి ఘనకోపాగ్న్యర్చులం గాలి చ
య్యనఁ బంచత్వము నొందఁగాఁ గలరు మీ కత్యంతహర్షంబుగన్.

794


(తే.

క్షితివిభేదనంబున దీర్ఘజీవు లైన, సగరపుత్రుల నాశంబు స్వర్గులార
నిశ్చిత మవశ్యభావులు నియతివలన, వగవవలవదు దీనికి స్వస్థుల రయి.)


క.

మీమీనెలవులకుం జనుఁ, డీ మనమున నమ్మి మీరు ధృతి వదలక మా
కీమీఁద శుభము గలిగెడు, నామాధవుకరుణఁ జేసి యనిమిషులారా.

795


క.

అని ద్రుహిణుఁ డాన తిచ్చినఁ, జని రయ్యాదిత్యు లాత్మసదనంబులకున్
వినయమున మ్రొక్కి వీడ్కొని, ఘనతరసంతోషకుతుకకలితహృదయు లై.

796


వ.

అంత నిక్కడ.

797

ఉ.

ఆసగరావనీంద్రసుతు లయ్యహిలోకముదాఁకఁ ద్రవ్వి య
చ్చో సవనాశ్వముం జనినచొప్పు గనుంగొనలేక మిక్కిలి
న్వేసరి తండ్రి చక్కటికి వెండియు వచ్చి నమస్కరించి యు
ల్లానము లేనిమానసముల న్వచియించిరి దీనవక్త్రు లై.

798


ఉ.

అయ్య ధరిత్రి యంతయు రయంబునఁ ద్రవ్వితి మెందు నశ్వముం
జయ్యన నశ్వచోరుఁ బెలుచం గన నైతిమి దోర్బలంబుచే
నయ్యెడ యక్షదైత్యపతగాదులఁ జంపితి మింకమీఁద మా
కెయ్యది కార్య మన్న వసుధేశ్వరుఁ డిట్లనుఁ జండకోపుఁ డై.

799


ఉ.

క్రమ్మఱ నేగి మీరలు ధరాతలము న్వడిఁ ద్రవ్వి లోకముల్
ద్రిమ్మరి యశ్వచోరకునిఁ దేకువఁ గన్గొని వే కృతార్థులై
సమ్మతి రెండు పొం డనినఁ జయ్యన వారు రసాతలప్రదే
శమ్మున కేగి రొక్కమొగి సత్వరతన్ జనయుక్తి వెండియున్.

800


క.

ఈగతి భుజావలేప, శ్రీగరిమ దలిర్ప భుజగసీమకుఁ జని యెం
తో గాఢకుతూహలమునఁ, బ్రాగాశకుఁ జనిరి మొదలఁ బ్రాభవ మొప్పన్.

801


వ.

ఇవ్విధంబునఁ జని యందు సర్వకాలంబునం దెయ్యది భూభారవాహనజనిత
భేదంబున నొక్కింతవిశ్రమార్థంబు శిరంబుఁ జలింపంజేసి దాన భూకంపంబుఁ
గలుగం జేయునట్టిదానిఁ బర్వతారణ్యసహితం బైనమహీతలం బంతయు శిరం
బున మోచికొని యున్నదాని మహాపర్వతసన్నికాశం బైనదాని విరూపాక్ష
నామకం బైనదిగ్గజంబు విలోకించి సమ్మానించి దానికిం బ్రదక్షిణంబుఁ జేసి
యచ్చోటుఁ బాసి యామ్యదిశకుం జని యందు.

802


ఆ.

అఖిలభువనభారమంతయు శిరమునఁ, దాల్చి హేమపర్వతంబుకరణి
నలరుదాని యలమహాపద్మ మనుదిశా, గజముఁ గాంచి యరుదు గడలు కొనఁగ.

803


తే.

దాని వలగొని యవ్వల మానితముగఁ, బశ్చిమాశకుఁ జని యందు పర్వతంబు
మాడ్కి నొప్పెడుదాని సౌమనస మనెడు, సామజంబును గని దానిసేమ మరసి.

804


తే.

దానికిఁ బ్రదక్షిణముఁ జేసి ధరణి యెల్లఁ, ద్రవ్వుకొనుచు బలప్రౌఢి నివ్వటిల్ల
నరిగి తుహినాద్రిభూషితం బైనయుత్త, రాశఁ జేరి నృపాత్మజులంద ఱచట.

805


క.

హిమశైలపాండురం బై, క్షమాభరము నెల్ల భద్రగాత్రముచే న
శ్రమమునఁ దాల్చి యలరునా, గముఁ గాంచిరి భద్రనామకం బగుదానిన్.

806


వ.

ఇత్తెఱంగున విలోకించి దాని నభినందించి ప్రదక్షిణంబుఁ గావించి యచ్చోటుఁ
భాసి మహీతలంబు భేదించుకొనుచు నీశాన్యదిక్కునకుం జని యం దొక్క
చోటఁ దపంబుఁ గావించుచున్న కాపిలరూపధరుం డగువాసుదేవునిం జూచి
తత్పరిసరంబునం జరించుచున్నహయంబు నవలోకించి సంప్రహృష్టచిత్తు లై
యమ్మహాత్ముని హయచోరకుంగాఁ దలంచి ఖనిత్రలాంగలశిలాపాదపంబులు

ధరించి క్రోధపర్యాకులేక్షణు లై యమ్మహాత్ముని డాయం జని.

807

కపిలమహర్షి క్రోధానలంబున సగరపుత్రులు దగ్ధులగుట

తే.

ఔర దుష్టాత్మ నిలు నిలు మస్మదీయ, తురగమును గొని తెచ్చినదొంగ వీవు
మమ్ము సగరపుత్రులనుఁగా మది నెఱుంగు, మనుచుఁ బలికిన నమ్ముని కినుకఁ బూని.

808


తే.

ఘోరహుంకార మొనరింప వార లమ్మ, హాత్ముకోపాగ్ని దగ్ధులై యద్భుతగతి
క్షోణిపై భస్మరాసులై కూలి రపుడు, దైవకృత మెవ్వరికినైన దాఁటవశమె.

809


వ.

అంతఁ జిరవిప్రోషితు లైనపుత్రులం దలంచుకొని సగరుండు.

810


ఉ.

అచ్చుపడంగఁ బుత్రులు మహాధ్వరసైంధవరాజమున్ వెసం
దెచ్చెద మంచుఁ బోయి రతితీవ్రగతిన్ బహుకాల మయ్యె రా
రెచ్చటి కేగిరో మదికి నెంతయు నెవ్వగ నివ్వటిల్లెడుం
జెచ్చెర వారల న్ముదముఁ జెందఁగ నెన్నఁడు చూడఁ గల్గునో.

811

సగరుఁడు దనపుత్రులజాడఁ గనుంగొనుట కంశుమంతుఁ బుత్తెంచుట

చ.

అని తలపోసి యమ్మనుకులాఢ్యుఁడు పౌత్రకు నంశుమంతుఁ గ
న్గొని యను వత్స నీదుజనకుల్ సవనాశ్వముఁ దెత్తు మంచుఁ జ
య్యనఁ జని రారు పె క్కహము లయ్యె నహంకృతి నెందుఁ బోయిరో
జనకులజాడఁ గాంచి మఖసైంధవముం గొని తెమ్మ నీ విఁకన్.

812


వ.

మఱియు నీవు శూరుండవు కృతవీర్యుండవు కృతవిద్యుండవు పూర్వరాజసంకా
శుండవు గావున నీకుం జెప్పవలసినవిశేషం బెద్దియు లే దాంతర్భౌమంబు లగు
మహాసత్వంబులు వీర్యవంతంబులై యుండు నీవు నిరాయుధుండవై పోవం జన
దు కార్ముకఖడ్గంబులు ధరియించి యిపుడ కదలి పెద్ద లగువారి సమ్మానించుచు
విఘ్నకరు లగువారి వధియించుచు నప్రమాదుండ వై యరిగి సిద్ధార్థుండ వై
క్రమ్మఱం జనుదెమ్ము యజ్ఞపారగుండవు గమ్మని పల్కి యనిచిన నయ్యంశుమంతుం
డు పితామహునిశాసనంబునఁ జాపఖడ్గంబులు ధరియించి పితృఖాతం బైనయంత
ర్భౌమమార్గంబునం జని దైత్యదానవరక్షఃపిశాచపతంగోరగంబులచేతఁ బూ
జ్యమానుం డగుచు దిగ్గజంబుకడకుం జని ప్రదక్షిణంబుఁ జేసి పితృహయవార్త
నెఱింగింపు మని యడిగిన నద్దంతావళరాజంబు పరమానందంబున ని ట్లనియె.

813


తే.

రాజనందన నీవు శీఘ్రంబె సవన, తురగమును వెంటఁగొని కృతార్థుండ వగుచు
నరుగుదెంచెద విది నిక్క మరుగు మనిన, నతఁడు మనమున హర్షించి యవలఁ బోయి.

814


ఆ.

దాని నడిగినట్లు తక్కినదిక్పాల, సామజముల నడుగఁ బ్రేమ నవియు
నభ్రగజము సెప్పినట్లు చెప్పినఁ బ్రీతి, నంశుమంతుఁ డవల నరిగి యరిగి.

815

అంశుమంతుఁడు కపిలాశ్రమంబున నశ్వమును భస్మీకృతజనకులనుం గాంచుట

వ.

మహోన్నతం బైనకపిలునిదివ్యాశ్రమంబునకుం జని యందు.

816


చ.

తురగముఁ గాంచి సంతసిలి తోడనె యమ్మనినాథుచెంగటన్

గుఱుతుగ భస్మరాసు లయి కూలినతండ్రులఁ గాంచి భూరిశో
కరసనిమగ్నచిత్తుఁ డయి గాసిలి పెక్కువిధంబులం గడుం
దఱలుచుఁ గొంతసేపునకుఁ దద్దయు ధైర్యబలావలంబి యై.

817


క.

జనకులకు నుదకతర్పణ, మొనరింపఁ దలంచి యచట నుదక మరిసి యెం
దును గానక నద్దెస ల, త్య నుపమగతిఁ జూచుచుండ నాసమయమునన్.

818

గరుడుఁ డంశుమంతునికిఁ బొడసూపి తజ్జనకులకు సద్గతి గలుగునుపాయం బెఱిఁగించుట

ఉ.

ఆయతపక్షవాతచలితాచలుఁ డై ఖగవంశనాయకుం
డాయెడ కేగుదెంచిన మహాత్ముని తండ్రులమేనమామనుం
బాయక కాంచి యంఘ్రులకు భక్తి నమస్కృతి యాచరించి కే
ల్దోయి ఘటించి చాల వినుతుల్ పచరించి భజించి యుండఁగన్.

819


వ.

మనుమనిం గని సాంత్వవచనంబుల ననునయించి యి ట్లనియె.

820


మ.

అనఘా నీజనకుల్ వడిం గపిలుకోపాగ్న్యర్చులన్ భస్మమై
చని రీ విం కిట వారికై వగచు టే సాధించుకార్యంబు గ్ర
న్నన నెవ్వారికి నైన దైవకృతముం దప్పించఁగా వచ్చునే
విను కర్మంబులు గాలచోదితము లై వెన్నాడి వర్తింపవే.

821


తే.

జనవరకుమార వీరలచావు లోక, సమ్మతము దీని కింత శోకమ్ము వలదు
కపిలుకోపానలంబునఁ గాలి నిరయ, గతికి జని యున్నవారు సాగరులు వీరు.

822


క.

కావున నీజలదానముఁ, గావించిన ఫలము లేదు ఘనముగ వీరల్
ధీవర్య వినుము శుచు లై, దేవత్వము నొందునట్టి తెరు వెఱిఁగింతున్.

823


క.

జగతీశతనయ హిమవ, న్నగపతియగ్రసుత గంగ నాఁ గల దయ్యా
పగయందుఁ దండ్రులకుఁ జ, క్కఁగ నుదకక్రియ యొనర్పఁ గలుగు శుభగతుల్.

824


వ.

మఱియు నమ్మహానది లోకపావని గావునఁ దద్విమలజలంబుల నీభస్మరాసులఁ
దడిపితి వేని పరిశుద్ధులై యూర్ధ్వలోకంబునకుం జనియెద రిప్పు డిచ్చట మసలక
శీఘ్రంబున హయంబునుం గొని చని పితామహునిచేత యజ్ఞంబు సాంగం
బుగాఁ జేయింపు మనిన నాసుపర్ణునివచనంబు విని వీర్యవంతుం డగునంశుమం
తుండు హయంబును రయంబునం గొని దీక్షితుం డైనసగరునియొద్దకుఁ గ్రమ్మ
ఱం జని యశ్వోత్తమంబు సమర్పించి తండ్రులపోక యెఱింగించి సుపర్ణునివచ
నంబు విన్నవించిన విని యమ్మహీరమణుండు దుఃఖితుం డై కొండొకధైర్యం
బున నమ్మహాయజ్ఞంబు సమాప్తి నొందించి నిజపురంబునకుం జనుదెంచి స్వర్గం
గను బుడమికిం దెచ్చుటకుఁ దగినయుపాయంబుఁ జింతించి నిశ్చయింపంజాల
క ముప్పదివేలవత్సరంబులు రాజ్యంబుఁ జేసి కాలధర్మంబు నొందె నంత.

825


తే.

మంత్రు లయ్యంశుమంతుని మహితరాజ్య, మందు నభిషిక్తుఁ గావించి రన్నరేంద్ర
వరుఁ డల దిలీపుఁ బుత్రుఁగా బడసి యతనిఁ, జెలఁగి సామ్రాజ్యమం దభిషిక్తుఁ జేసి.

826

తే.

గరిమతోఁ దుహీనాద్రిశృంగంబుమీఁదఁ, బ్రీతి మెఱయంగ ముప్పదిరెండువేల
యేండ్లు దపముఁ గావించి యభీష్టసిద్ధిఁ, గాంచఁ జాలక యతఁడు నాకమున కరిగె.

827


సీ.

అంత దిలీపభూపాగ్రణి తాతలమరణంబు విని చాల మనములోన
దుఃఖించి హిమశైలదుహిత యౌగంగ యెబ్భంగి ధాత్రికి వచ్చుఁ బరఁగ సలిల
తర్పణం బెట్టు లొనర్పంగఁ జేకురు నొనర వారల నెట్లు నుద్ధరింతు
ననుచుఁ జింతాపరుం డై నిశ్చయింపంగఁ జాలక ముప్పదివేలయేండ్లు


తే.

రాజ్యమొనరించి బహుళాధ్వరములఁ జేసి, రమణధార్మికుఁ డగు భగీరథుని ఘనుని
సుతునిఁ గాఁ గని యతని భూపతినిఁ జేసి, వ్యాధిపీడితుఁ డై దివి కరిగె నతఁడు.

828

భగీరథుఁడు గంగావతరణమునకుఁగాఁ దప మొనర్చుట

ఉ.

ఆనరరాజసూనుఁడు మహాద్భుతవీర్యుఁడు వంశపావనుం
డైనభగీరథుండు నిఖిలావని నేలుచు నుండి ధాత్రికిన్
మానుగ గంగఁ దెత్తు నని మంత్రుల రాజ్యమునందు నిల్పి లో
నానినకౌతుకంబు సెలువారఁ దపంబున కేగెఁ బ్రీతితోన్.

829


వ.

ఇవ్విధంబున నమ్మహీమిహికాంశుండు గోకర్ణాశ్రమంబునకుం జని యందు.

830


సీ.

కుడికాలు పెనువ్రేలు పుడమిపై మోపి డాపలికాలు గుడికాలుపై ఘటించి
చేదోయిఁ బెనువ్రేల నూఁదిమీఁదికిఁ జాఁపి జగతిఁ జూడక యేగుమొగముఁ జేసి
కటికివేసవియందు ఘనచతుర్వహ్నిమధ్యమున నిల్చి మహోగ్రహంసమండ
లంబుఁ గన్గొనుచు వర్షాకాలమున వారినడుమ నిల్చుచు నిట్లు కడు సమాధి


తే.

నచలనిష్ఠ మాసాహారుఁ డై యమోఘ, ఘనతపోవహ్నిశిఖలు లోకములఁ బర్వి
ప్రళయకాలాగ్నిహేతులపగిది నేర్చఁ, దవిలి యబ్దసహస్రముల్ దప మొనర్చె.

831

భగీరథునకు బ్రహ్మ ప్రత్యక్షమై గంగాపాతము సహించుటకై యీశ్వరుని బ్రార్థింపుమనుట

ఉ.

అంత సమస్తలోక గురుఁ డంబుజగర్భుఁడు వేల్పుపెద్ద వా
క్కాంతుఁడు మెచ్చి నిర్జరనికాయసమన్వితుఁ డై రయంబునం
బంతముతో నమేయగతి భవ్యతపం బొనరించుచున్నభూ
కాంతునిఁ జేర వచ్చి కుతుకం బలర న్మధురోక్తి ని ట్లనున్.

832


ఉ.

మెచ్చితి ధారుణీరమణ మించినవేడ్క వరం బొసంగఁగా
వచ్చితి నీతపం బుడిగి వాకొని యిష్టము దెల్పు మన్న నా
సచ్చరితుండు దచ్చరణసారసముల్ దల సోఁక మ్రొక్కి లో
హెచ్చినభక్తి దేటపడ నింపుగ నంజలిఁ జేసి యి ట్లనున్.

833

క.

నిక్కముగ నీకు నాపై, మక్కువ గలదేని దేవ మాతాతలు పెం
పెక్కఁగ నాచే సలిలము, గ్రక్కునఁ గొనువారు గాఁగ ఘటియింపఁగదే.

834


వ.

మఱియు నాతపం బమోఘం బేని భస్మరాసులు గంగాసలిలక్లిన్నంబు లగు
చుండ సాగరు లూర్ధ్వగతికిం జనువారుగాఁ బ్రసాదింపవలయు నదియునుం
గాక ఘోరం బైనయనపత్యతాదోషంబున సౌమనస్యంబుఁ గానక శోకించు
చున్ననాకు వంశకర్త లగుపుత్రుల ననుగ్రహింపవలయు నని యడిగిన సర్వ
లోకపితామహుం డగువిరించి యుదంచితకరుణాకటాక్షవీక్షణంబుల భగీరథు
నిరీక్షించి మంజుమధురాక్షరవ్యక్తంబుగా ని ట్లనియె.

835


తే.

అనఘచారిత్ర నీకోరినట్ల యగును, డెందమున నింక సందియ మందవలదు
వితతమతి నీకు నింకొకహితముఁ జెప్పె, దను సమాహితబుద్ధివై వినఁగవలయు.

836


చ.

హిమగిరిపుత్రి గంగ నొగి ని మ్మని పల్కితి వట్ల యిచ్చితిన్
విమలగుణాఢ్య తత్పతనవేగము ధాత్రి సహింపఁజాల దా
ప్రమథగణాధినాథుఁ డగురాజకిరీటుఁడు దాల్పఁగావలెం
బ్రవిమలతేజు నవ్విభునిఁ బ్రార్థన సేయు మమోఘనిష్టతోన్.

837


వ.

మఱియు నాగంగానది హిమవంతునకు జ్యేష్ఠపుత్రిక గావున దాని ధరింప నీశ్వ
రుండె యర్హుం డగు నమ్మహాత్ముండు దక్క నన్యుండు గంగాపతనవేగంబు సహిం
చుటకు శక్తుండు గాఁ డద్దేవదేవు నారాధింపుము.

838


చ.

అని యిటు లానతిచ్చి యజుఁ డానృపమౌళికి వంశకర్తలం
దనయుల నిచ్చి క్రమ్మఱ ముదంబున గంగను బిల్చి యీమహా
త్ముని వెనువెంట నేగుము సముద్ధతిఁ గోరినయప్పు డంచుఁ జ
య్యన నియమించి యాత్మనిలయంబునకుం జనియెన్ సలేఖుఁ డై.

839

భగీరథునికిఁ బరమేశ్వరుండు పొడసూపి గంగను శిరంబున వహింతు నని కరుణించుట

ఉ.

అంత సరస్వతీరమణు నానతి నమ్మహికాంతుఁ డద్రిజా
కాంతునిఁ గూర్చి వత్సరము గ్రక్కునఁ బాదతలాగ్ర ముర్విపై
నెంతయు మోపి బాహుయుగ మెత్తి నిరాశ్రయుఁ డై చలింప క
భ్యంతరసిద్ధి నొంది పవనాశనుఁడై తప మాచరించినన్.

840


వ.

అంత సంవత్సరంబు పరిపూర్ణం బగుటయుఁ దత్ప్రయాసంబుఁ జూచి కరుణించి
సర్వలోకనమస్కృతుం డైనయుమావల్లభుండు క్షమావల్లభునకుం బొడసూపి
యి ట్లనియె.

841


క.

నరనాయక నీనిష్ఠకు, నిరుపమసంతోష మొదవె నీకుఁ బ్రియముగా
గిరిరాజపుత్రి గంగను, శిరమున ధరియింతుఁ దెమ్ము చెచ్చెర దానిన్.

842


క.

అని రాజమౌళి పల్కిన, జననాయకుఁ డుల్లసిల్లి చతురతచే న
య్యనిమేషధునిని వేఁడుట, యును దయ నప్పావనాపగోత్తమ యంతన్.

843

తే.

సంగతాభంగరంగతరంగసంగ, ఘట్టనోద్భూతరవము లోకత్రయంబుఁ
బగులఁ జేయంగ సకలదిగ్భాసమాన, యగుచు మిన్నేఱు గగనంబు దిగియె నపుడు.

844

గంగావలేపంబునకుఁ క్రుద్ధుఁడై పరమేశ్వరుఁడు దనజటాజూటంబుఁ బెంచుట

వ.

ఇట్లు దుర్వారవేగంబునం బఱతెంచి శివం బగుశివశిరంబునం బడి యంత
నిలువక మదీయస్రోతోవేగంబున శంకరుం బరిగ్రహించి పాతాళలోకంబుఁ
బ్రవేశించెదఁ గాక యని సరభసంబుగాఁ బఱవం దొడంగిన నయ్యాదిదేవుండు
దానియవలేపనం బెఱింగి క్రుద్ధుండై యొక్కింత గర్వవిమోచనంబుఁ జేయుదుఁ
గాక యని తలంచి వాటంబుగా జటాజూటంబుఁ బెంచిన నయ్యే ఱయ్యుమా
వల్లభునిజటామండలగహ్వరమధ్యంబునఁ దుషారకణమాత్రం బై చిక్కువడి
తనశక్తికొలంది మహీతలంబున కవతరింప నతిప్రయత్నంబుఁ జేసి మరల వెడలు
తెఱం గెఱుంగక యనేకవత్సరంబులు దిరుగుడు పడుచుండె నంత.

845

భగీరథుఁడు శివశిరంబునఁ బడినగంగం గానక తపం బొనరింప శివుండు కరుణించుట

ఉ.

ఆమనుజేంద్రచంద్రుఁడు వియన్నదిఁ గానక యెందుఁ బోయెనో
నామదిఁ జూడఁ గోరి గణనాథుశిరంబున నెందు డాగెనే
యేమి యొనర్చువాఁడ నిఁక నెయ్యది కర్జ మటంచుఁ గ్రమ్మఱం
గామహరుం గుఱించి కుతుకంబున ఘోరతపం బొనర్చినన్.

846


క.

మేటిగ నతఁ డొనరించెడు, గాటపుఁదపమునకు గరుణ గదుర నిజజటా
జూటంబువలన శంభుఁడు, వాటముగా విడిచె దేవవాహిని నంతన్.

847


వ.

ఇటు హిమవన్నందని యైనగంగ సర్వలోకనమస్కృతుం డైనపినాకధరుని
జటాజూటంబువలన నిర్గమించి బిందుసరోవరంబునం బడి సప్తప్రవాహ
యయ్యె నందు హ్లాదినీ పావనీ నలినీ సంజ్ఞంబు లగుమూఁడుప్రవాహంబులు
దూర్పుదెసకుం జనియె సితా సింధు సుచక్షు సంజ్ఞలు గల మూఁడుప్రవా
హంబులు పశ్చిమదిక్కునకుం జనియె మఱియును.

848


సీ.

దివి కేగ మదిలోనఁ దివురుభూజనులకు నిశ్రేణు లన నూర్మినికరములును
జెలిమిఁ దారలతోడఁ జేయంగఁ జనుమాడ్కి వినువీథి కెగయుజీవనకణములు
ధర్మాత్ము లగువారి నిర్మలకీర్తులకరణి నొప్పిడు ఫేనఖండతతులు
నీరీతిఁ ద్రిప్పుదు నెల్లదోసము లంచు దెల్పుచందంబునఁ దిరుగు సుళ్లు


తే.

వెలయ వినువీథి శరడభ్రవిభ్రమంబు, గలిగి యొకదివ్యవాహిని యలభగీర
థావనీనాథువెనువెంట నంటి యఘస,మూహములఁ బాప భూలోకమునకు వచ్చె.

849


వ.

అది మఱియు శంకరజటాజూటతటాధివాసుం డగుహిమకరునికిరణము
లన్నియు సర్వతోముఖత్వంబు మాని యేకీభవించి యక్కురంగలాంఛనుని

శరీరంబుననుండి దీఁగె సాగి పఱతెంచుచున్నచందంబున నందంబై, యుల్లోల
కల్లోలమాలికాడోలికాకలితరథాంగబాలికాతనుచ్ఛాయావిలాసంబులు
దదీయస్రోతోవేగబాహుళ్యంబున గగనంబున నుండఁజాలక పుడమిం బడ
నశరుధారాధరమండలంబువలన నెడతెగక పడునీరమ్మదలసంపదసొంపు సంపా
దింప, నిలింపులు దమకు నిరంతరజీవనం బైనమిన్నేఱు పుడమికి దిగుటకుఁ
జిరకాలసంస్తవంబున నోర్వక బాష్పధారాపూరవ్యాజంబున వగవఁ గరకిసల
యంబులు సాఁచి మంజువాక్యంబుల వారి ననునయించుచున్నదో యన నంబ
రచుంబిసముత్తుంగరంగత్తరంగంబులు ఘుమఘుమారావంబులతో నొండొంటిం
దాఁక, భవద్విషయకృతాపచారదోషవిశేషంబుగా నిరయగతికిం జనిన సగర
ధరణీతరుణీపురందరనందనసందోహంబు సద్గతి నొందింపంబూని యనుజ్ఞ
పడయుటకు మదుత్పత్తిస్థానం బైనభవదీయకరణమూలంబులు సేవింప వచ్చు
చున్నదాన మద్వాంఛితంబు ఫలింపం జేయవే యని కపిలమహామునిం బ్రార్థిం
చుటకుఁ గరంబులు తిరంబుగా మొగిచెనో యని యుపమింప సొం పైనతదీయ
విమలసంవర్ధితజాంబూనదారవిందకుట్మలంబులు నయనానందకరంబు లై
యలర, నమృతరసాధిదేవత సమస్తభువనజీవనం బైనతనజీవనంబునకు ననవరత
సర్వతోముఖతావిచ్ఛేదకత్వంబు సంపాదింపందలంచి జగన్మాత నావహింపంజేసి
పూర్ణపరికీర్ణపరాగపటలపరిలేనంబు సంఘటించి వినూతనకేసరవిరహరిద్రా
క్షతంబులు సమర్పించి రంజన్మకరందబిందుబృందపాద్యం బొసంగి సమంచితరం
జత్కింజల్కపుంజచ్ఛాయ దీపాంకురంబు లిడి మకరందపానమత్తమధుకరమధుర
గానమంత్రంబు లుచ్చరించుచు ముహుర్ముహుర్లుఠదభంగతరంగమృదంగనిస్వ
నంబు సెలంగ నర్చించిన సంపూర్ణసుధాపూర్ణకనత్కనకకలశంబులచెలువున
నలరువినూతనచారుచామీకరసారసకోరకంబులఁ గలంచి బిసఖండకాండం
బులు మెసవి తదీయమధురమధుపానవశంబున మదించినయంచతండంబుల
పక్షవిక్షేపణసంజాతసముద్ధూతశీతలజలబిందుబృందంబులు వాయువశంబున
మింటి కెగసి తత్పతనచాతురీసమాలోకనకౌతుకాతిరేకంబున విమానారూఢు
లై చనుదెంచి తదుపరిప్రదేశంబునఁ జాలుగొని యున్నసిద్ధవిద్యాధరాంగనల
గొప్పుకప్పుకొప్పులకుం జుట్టినదట్టంపుఁగ్రొత్తముత్తియంపుసరులమొత్తంబుల
గతి నతిరమణీయంబు లై చూపఱులచూడ్కులకు వేడ్కఁ జేయఁ బెక్కుకాలం
బుననుండి హిరణ్యగర్భుండు కమలంబున నివసించినకారణంబున నతనిమేని
జిగి సోఁకి కుందనపుఁజాయల నలరు కేసరవిసరంబులనడుమ వాసంబుఁ జేయు
టం జేసి నిజమాలిన్యంబు దొఱంగి పుటపాకశోభితకార్తస్వరకలికాసుష
మాభిరామంబు లైనచందంబున నందంబు లగుకమలపరాగపటలపిశంగీకృత
పుష్పంధయసముదయంబులు సరోజపరిమళరసాస్వాదనంబునం దనివి సనక

మిన్నునం జాలుగొని యున్నకిన్నరాంగనలచికురబంధంబులం జుట్టినసంతాన
కుసుమవాసన లాఘ్రాణింప మింటి కెగసి జంట గూడి ఝాంకరణంబులు
సేయుచుఁ దదీయమధురగానంబున కనురూపం బైనశ్రుతినాదవిలసనంబు
హత్తింప, నాచార్యదారపరిగ్రహదోషవిశేషంబున దోషాకరుండు పవిత్రం
బైనసర్వజ్ఞునిశిరంబున నుండ నర్హుండు గాక యద్దేవదేవునిచేత వెలువరింపం
బడి ప్రవాహంబు వెంటం బఱతేరఁ దుమురై పతచ్ఛకలంబులభంగి నిండు
కొని యున్నజలబుద్బుదంబులు గలిగి సగరమహీమండలాఖండలతనుజాతసమా
జాతాఘవ్రాతంబుల నత్తెఱంగున సుడిఁ బెట్టెద నింక సందియంబు నొందకు మని
యమ్మహానది భగీరథనరేంద్రచంద్రునకు సాంద్రానందంబుగాఁ దెల్పిన ట్లుల్లసి
ల్లు సుళ్లపెల్లునకుఁ దల్లడిల్లుచు నుత్ఫుల్లసల్లలితహల్లకాంతర్బహిర్గతమత్తమధు
వ్రతవ్రాతంబులు సుడివడి మునుంగ నిత్తెఱంగున మదీయపావనజీవనంబులఁ
గనుంగొనినవారి మునింగినవారి కలుషవ్రాతంబుల వారింతు నని యత్తరంగి
ణీమణి యెల్లవారి కెఱింగించే నని యుపమింపం దగి యలర, నద్దివ్యవాహినీ
రత్నంబు దనకుం గలమహిమాతిరేకం బితరతరంగిణులకు లేదని యుభయ
తటనటత్కారండవపటలస్వనమిషంబున నాడుచు నవ్వినచిఱునవ్వుచందం
బున నందం బగుపాండురడిండీరఖండకాండంబులు గాండంబులపై మెండుగ
నిండుకొని నిండువేడుక నెఱప, భగీరథమహీపాలునిపైఁ బొడమినరుద్రదే
వునికరుణారసంబు వాహినీరూపంబు నొంది సితశతపత్రాతపత్రంబులతోఁ
గాశచామరంబులతో రంగద్భృంగసంగీతనాదంబులతో రథాంగదంపతినిర్ఘోష
సాహోనినాదంబులతో దరంగపాళీకేళీకలితమరాళీగణంబులు మంజులశబ్దంబుల
జోహారు సేయఁ గల్లోలమాలికాపరస్పరసంఘటనసంజాతబహుళస్వనంబులు
మంగళతూర్యనిస్వనంబులఁ దెలుపఁ జలిమలనుండి భగీరథమహీమండలాఖం
డలునివెంట భూలోకంబుఁ బావనంబు సేయుటకు మీఱినకోరికతో నూరే
గుచుఁ జనుదెంచుచున్నదో యని యుత్ప్రేక్షింపం దిగి పట్టరానివేగంబున
మట్టు మీఱి యిట్టట్టు గదల్ప రాక యెదురు దట్టించిన బెట్టిదంబు లగుపెనుగ
ట్టుల నెల్ల బట్టబయలు సేయుడు భగీరథునిమనోరథంబు సఫలంబుఁ జేయు
టకు దుర్వారవేగంబున నరుగుదెంచుచుండె నప్పుడు.

851


క.

ఎడతెగక మింటివలనం, బడియెడు ఘనమత్స్యకచ్ఛపంబులచేతన్
వడిఁ బాఱుజలముచేతను, బండమి కడువిచిత్రభంగిఁ బొలు పై యొప్పెన్.

852


క.

దితిజారులచే విలస, ద్వితతతదీయావతంసదీధితిచేతన్
గతతోయద మగుగగనము, శతార్కమయిన క్రియ నలరె సాంద్రద్యుతియై.

853


తే.

చంచలము లైనమత్స్యకఛ్ఛపవిహంగ, శింశుమారగణంబులచేత నపుడు
గగన మొప్పారె మఱియు భాస్కరకులాబ్ధి, శీతకరదీప్తశంపలచేతఁ బోలె.

854

తే.

మఱియు గగనంబు సంకీర్యమాణవిమల, ఘనవనోత్పీడహంససంఘములచేతఁ
బరివృతం బయి శారదాభ్రములచేతఁ, బరివృతం బైనకరణి నచ్చెరు వొనర్చె.

855


క.

రొద సేయుచు సుడి దిరుగుచు, నెదురేగుచు గగనమునకు నెగయుచు వడితో
బదపడి ధరపై వ్రాలుచు, ముదమునఁ జనుదెంచె గంగ భూపతివెంటన్.

856


క.

ఏమార్గమున భగీరథ, భూమిశలలామ మరిగెఁ బొలుపుగ నదియుం
బ్రేమ దళుకొత్త రయమున, నామార్గముఁ బట్టి చనియె నాతనివెంటన్.

857


వ.

అప్పుడు.

858


చ.

సరసిజగర్భుఁ డాది యగుసర్వదివౌకసు లమ్మహాపగన్
సరసతఁ జూచువేడుకఁ బ్రసన్నమణిమయహారచేలనూ
పురమకుటాంగదాదివరభూషణముల్ ధరియించి మించి యు
ప్పరమున నిల్చి మ్రొక్కి బహుభంగుల నంజలిఁ జేసి యింపునన్.

859


చ.

అతులితభక్తియుక్తు లయి యన్నది నందఱు వేయునోళ్లఁ బ్ర
స్తుతు లొనరించి నేర్పుమెయిఁ దోరపువేడుక గట్లఁ జూడ నం
చితగతి డిగ్గి తద్విమలశీకరపఙ్క్తులు మీఁద వ్రాలఁగాఁ
జతురతఁ బుణ్యతీర్థముల స్నానముఁ జేసి జపించి రెంతయున్.

860


శా.

ఆనందంబునఁ గూడి యాడిరి పదవ్యక్తంబుగా నచ్చరల్
నానాసూనవితానమాలికల నందం బొప్ప నర్పించి రా
మౌనిశ్రేష్ఠులు మ్రోసె నౌర పటుశుంభత్తూర్యనిర్ఘోషముల్
గానం బున్నతి సల్పి రశ్వవదనుల్ గల్యాణభావంబునన్.

861


క.

సురసిద్ధసాధ్యకిన్నర, గరుడోరగయక్షదైత్యగంధర్వాదుల్
బఱతెంచుచుండి రప్పుడు, ధరణీపతిరథమువెంట దద్దయుఁ బ్రీతిన్.

862

జహ్నుమహాముని గంగానది యంతయు మ్రింగుట

క.

తనపావనజీవనములఁ, గనువారి మునుంగువారికలుషౌఘంబుల్
మునుముట్టఁ గొట్టిపెట్టుచు, ననిమిషనది నృపునివెంట నరుదెంచె రహిన్.

863


మ.

అను వందం దగ జహ్ను వయ్యెడ మఖం బారూఢిఁ గావింపఁ ద
ద్ఘనయజ్ఞాయతనంబు వారిమయముం గావించినన్ దానిఁ జ
య్యన నీక్షించి బళా యటంచుఁ గుపితుం డై యమ్మహాపుణ్యుఁ డా
ననగోళంబుఁ దెరల్చి మౌను లరుదంద న్మ్రింగె నవ్వాహినిన్.

864


ఈ.

ఆమహిమంబు గన్గొని మహర్షులు లేఖవరుల్ భగీరథ
క్ష్మావరనేతయున్ వివిధమార్గములం దను సన్నుతింపఁగా
నాముని వెండి తా నుమిసి యన్నది నెంగిలి సేయ నొల్ల కెం

తో ముద మొప్పఁగా విడిచెఁ దోడన కర్ణబిలంబులన్ రహిన్.

865


వ.

అప్పు డమ్మహానదిం జూచి దేవతలు జాహ్నవి యని పొగడి రిట్లు జహ్నుకర్ణ
బిలంబువలన నిర్గమించి మరల నెప్పటియట్ల నప్పుడమిఱేనిరథంబు వెనుకొని
మహామహిమాతిశయంబునం జని సాగరంబునం గలసి కడ లెత్తి నిండి వెల్లిగొ
ని రసాతలంబునకు డిగ్గి భగీరథునిమహాప్రయత్నంబు సార్థకంబుగా నమ్మ
హానది భస్మరాశీకృతు లై యున్నసాగరులమీఁదం బ్రవహించినఁ దత్క్షణం
బాసాగరులు వీతకల్మషులై త్రిదివంబునకుం జని రప్పు డచ్చటికిం జనుదెంచి.

866

బ్రహ్మ భగీరథునిఁ బ్రశంసించి వరంబు లొసంగుట

ఉ.

అంబుజసంభవుండు ముద మంది భగీరథుఁ గాంచి పల్కు నో
యంబుజమిత్త్రవంశకలశాంబుధిచంద్ర మహీనరేంద్ర యీ
యంబుధియందు నెందనుక నప్పులు భాసిలు నంతదాఁక ని
క్కంబుగ నీదుతాతలు సుఖంబులఁ గాంతురు నాకమం దొగిన్.

867


వ.

మఱియును.

868


సీ.

దివ్యభూషణములు దివ్యాంబరంబులు దివ్యమాల్యంబులు దివ్యగంధ
ములఁ దాల్చి ఘనదివ్యమూర్తులఁ గైకొని దివ్యభోగముల వర్తింతు రింక
నినవంశ యిది మొద లీనది నీపేర భాగీరథి యనంగఁ బ్రణుతి కెక్కు
నదిగాక త్రిపథగ యనఁగ సరిద్వర యనఁగ జాహ్నవి యన నలరు ధాత్రి


తే.

దవిలి యీధునిలోన నీతాతలకు స, మంచితంబుగఁ దర్పణ మాచరించి
కోర్కితోడఁ బితౄణముక్తుఁడవు గమ్ము, జననరేంద్ర సత్యప్రతిశ్రవుఁడ వగుచు.

869


తే.

ధర్మవంతులలోన నుత్తముఁ డనంగ, భూరియశుఁ డన నత్యంతశూరుఁ డనఁగ
ఖ్యాతి వడసిననీదుముత్తాత యైన, సగరుఁ డిప్పని సాధింపజాలఁ డయ్యె.

870


తే.

అంశుమంతునిచందాన నధిక తేజుఁ, డంశుమంతుఁడు మీతాత యమరతటిని
దెత్తు నని యత్న మొనరించి తెచ్చుటకు ను, పాయ మెంతయు నెఱుఁగక పోయె నతఁడు.

871


తే.

అనఘ రాజర్షిఘనుఁడు మహర్షి తేజుఁ, డమితతపమున మత్సముం డగుదిలీప
నృపుఁడు మీతండ్రి గంగ నర్థించి వడయఁ, జాలక దివంబునకు నేగె జనవరేణ్య.

872


మ.

మును మీపెద్దలు గాఢనిష్ఠురతపంబుల్ సేసి సాధింపఁజా
లనియిక్కార్యము నేఁడు నీవలన సార్థం బయ్యె నీయంతధ
న్యుని నెవ్వాని నెఱుంగ ముజ్జగమునన్ భూమీశ గంగానదీ
కనదుత్తుంగతరంగమంగళసమాఖ్యం బొందు మిం పారఁగన్.

873

చ.

అరయ సమస్తసద్గుణగణాకరు లై నిజవంశకర్త లై
పరమపవిత్రులై జగతి భాసిలుపుత్రులఁ గాంచు మింక ని
ద్దఱ నొగి సర్వధర్మసుకృతంబులకుం దగ నాలవాల మై
వఱలితి విందుఁ గ్రుంకి నరవర్య కృతార్థత నొందు మెంతయున్.

874


మ.

అని దీవించి విరించి సమ్మదరసవ్యాకోచచిత్తాబ్జుఁ డై
చనియెం బిమ్మట నాతఁ డాతటినిలో స్నానంబుఁ గావించి గొ
బ్బున సిద్ధాత్మకుఁ డై పితామహులకు బుణ్యోదకం బిచ్చి మిం
చినప్రీతిం గృతకృత్యుఁ డై మరల వచ్చె న్వీటి కింపారఁగన్.

875


క.

వచ్చిన నరపతిఁ గనుఁగొని, చెచ్చెరఁ బురజనులు మునముఁ జెందిరి మేనం
జొచ్చిన ప్రాణముఁ గనుఁగొని, క్రచ్చఱ నలరారుసర్వకరణములక్రియన్.

876


వ.

ఇట్లు పురంబుఁ బ్రవేశించి సకలప్రజానురాగంబుగా రాజ్యంబుఁ బరిపాలించు
చుండె నని చెప్పి వెండియు విశ్వామిత్రుం డి ట్లనియె రాజనందనా పరమశుభం
బై నయీగంగావతరణోపాఖ్యానం బవ్యగ్రుం డె యెవ్వండు విను నతండు
సర్వపాపవిముక్తుం డై సర్వకామంబులం బొంది యాయుఃకీర్తిలాభంబు పడయు
దేవతాపితృగణంబు లతనికొఱకు సంతోషింతురు మఱియు నిది ధన్యంబును
యశస్యంబును స్వర్గ్యంబును నాయుష్యంబు నై యొప్పు.

877


క.

అని మునిపతి గంగాకథ, వినిపించినఁ జిత్త మలర విని క్రమ్మఱ న
మ్మునిపరిబృఢునిఁ గనుంగొని, యినకులవర్ధనుఁడు రాముఁ డి ట్లని పలికెన్.

878


మ.

ఘనకీర్త్యన్విత నేఁడు మీవలన నీగంగాప్రభావంబుఁ బ
ర్వినమోదంబున నానుపూర్విని దగన్ వింటిం గృతార్థుండ నై
తిని మీ కీయఖలప్రపంచకథ లెంతేఁ బాణినీరంబుగా
యని యగ్గించుచు రాజపుత్రులు ప్రభూతాశ్చర్యు లై రత్తఱిన్.

879


వ.

ఇట్లు పరమానందంబు నొంది.

880


మ.

అను వందం దగ మందసుందరసమీరాందోళితైలాసుగం
ధనికుంజాంతమునం దమందముద మందం గూర్కి యారాత్రి వే
గిన మర్నాఁడు ప్రభాతకాలమునఁ దత్క్షీరంబులం గ్రుంకి గొ
బ్బునఁ బూర్వాహ్నికకృత్యముల్ సలిపి సంపూర్ణప్రభావంబునన్.

881


చ.

మునిపతిఁ గాంచి మ్రొక్కి రఘువుంగవుఁ డంజలిఁ జేసి పల్కె నో
యనఘ భవన్ముఖేరితసమగ్రవియత్తటినీప్రభావమున్
వినుటకతంబునం గరము వేడుక నీనిశ స్వల్పకాల యై
చనియె జగత్ప్రశస్తగుణచాతురి ధన్యుఁడ నైతి నీకృపన్.

882


వ.

మునీంద్రా హిరణ్యగర్భసమానుండ వైనమీరాక యెఱింగి మహర్షు లారో
హింపం దగినరమణీయపోతం బాసన్నం బై యున్నది దీని నారోహించి భాగీరథి

నుత్తరించి యవ్వలం బోద మనిన నమ్మహర్షిశ్రేష్ఠుం డట్ల కాక యని యీయ
కొని మునిసమేతుం డై రామలక్ష్మణసహితంబుగా నావ యెక్కి యమ్మహానది
నుత్తరించి తదుత్తరతీరంబుఁ జేరి యచ్చటిమునిగణంబులం బూజించి యచ్చట
నొక్కింతసేపు విశ్రమించి కొండొకదూరం బరిగి.

883


శా.

భూకాంతామణిఫాలభూషణ మనాఁ బొల్పొంది నానావిధా
స్తోకశ్రీకర మై కనుంగవకు నెంతో వేడ్కఁ బుట్టించుచుం
బ్రాకారావృత మైనయొక్కపురమున్ భాన్వన్వయాంభోధిరా
డ్రాకాబ్జుండు రఘూత్తముండు గని యుల్లంబందు నుల్లాసి యై.

884


చ.

కరములు మోడ్చి మంజుగతి గాధికుమారునిఁ జూచి పల్కు నో
పరమమునీంద్ర మ్రోల నొకపట్టణ మాసురలోకతుల్య మై
గురుతరపుణ్యసంపదలకుం గని యై తనరారుచున్న దె
వ్వరిపుర మెద్ది నామము ధ్రువంబుగ నా కెఱిఁగింపు మింతయున్.

885

విశ్వామిత్రుఁడు శ్రీరామునికి సముద్రమథనవృత్తాంతం బెఱింగించుట

వ.

అని యడిగిన గాధేయుండు కృపావిధేయుం డై యప్పురివృత్తాంతంబు శక్ర
కథాపూర్వకంబుగా ని ట్లని చెప్పం దొడంగె.

886


చ.

విడువక యాదికాలమున వేల్పులు దైత్యులు మైత్త్రితో సుధం
బడయుద మంచు మాధవుని పంపున వాసుకిఁ ద్రాడుఁ జేసి యె
క్కుడుతమి మందరాచలము గొబ్బునఁ గవ్వముఁ జేసి యుగ్రు లై
కడువడి దోర్బలంబు లెసఁగం గలశాంబుధిఁ ద్రచ్చి రుద్ధతిన్.

887


వ.

ఇ ట్లపారబలసంపన్ను లై రాక్షసులు ఫణంబులును దేవతలు పుచ్ఛంబును
బట్టి సవ్యాపనవ్యపరిగ్రహణవిశేషంబు లేర్పడఁ బెక్కుసంవత్సరంబులు దరువఁ
దరిత్రా డైనవాసుకిశిరంబులు మహోన్నతంబు లైనగండశైలంబులఁ గఱ
చుచు హాలాహలవిషంబునుం గ్రక్కిన నది కాలాగ్నిసదృశం బై దేవాసుర
మనుష్యసహితం బైనజగం బంతయు దహింపం దొణంగిన దాని సహింపం
జాలక.

888

శివుండు దేవతలచేఁ బ్రార్థితుఁ డై విష్ణునానతి హాలాహలంబును మ్రింగుట

క.

శరణార్థు లై దివౌకసు, లరుదారఁగ రక్ష రక్ష యనుచు నుమాధీ
శ్వరుకడకుం జని భక్తిం, గరములు ముకుళించి వినుతిఁ గావించి రొగిన్.

889


ఉ.

ఆతఱి శంఖచక్రధరుఁ డైనరమాపతి సర్వదేవతా
సత్తముఁ డీశ్వరుం డటకుఁ జయ్యన వచ్చి యుమాధినాథు న
త్యుత్తమశూలధారి దివిజోత్తముఁ గన్గొని భూరిసమ్మదా
యత్తమనస్కుఁ డై పలికె నాస్యమునం జిఱునవ్వు దోఁపఁగన్.

890


చ.

వినుము సురేశ నీ వఖిలవేల్పులలోఁ గడుఁబెద్ద గావునం

బనివడి నిర్జరాసురులు పట్టి మథించెడువార్ధిలోపలన్
మునుకొని బల్వడిన్ మొదలఁ బుట్టిన యావిష మగ్రపూజగా
మనమున నెంచి కైకొని సమస్తజగంబుల నుద్ధరింపవే.

891


వ.

అని పలికి వాసుదేవుం డంతర్ధానంబుఁ జేసిన.

892


తే.

సురల కొదవినభయమును జూచి శౌరి, వాక్య మాలించి యలభగవంతుఁడైన
హరుఁడు హాలాహలవిషంబు లమృతకబళ, మట్ల మ్రింగి యంతర్హితుం డయ్యె నపుడు.

893

మందరగిరిని విష్ణువు కూర్మరూపంబున వీఁపుమీఁద ధరించుట

వ.

అంత దేవాసురులు వెండియు సముద్రంబు మథింపం దొడంగిన.

894


ఆ.

మొనసి మందరాద్రి వనరాశినిర్మగ్న, యై రసాతలంబుఁ జేర నపుడు
దానిఁ జూచి సురలు దైత్యాంతకుం డైన, విధుని శరణ మొంది వినుతిఁ జేసి.

895


వ.

దేవా నీవు సమస్తభూతంబులకుఁ బరమగతి వందు విశేషించి మాకు శరణ్యుం
డవు గావున జలరాశిలోన మునింగిన మంథానశైలంబుఁ గ్రమ్మఱ నుద్ధరించి
మమ్ము రక్షింపు మని ప్రార్థించిన.

896


తే.

వారిమొఱ విని భార్గవీవల్లభుండు, కమఠరూపంబుఁ గైకొని కంధిలోన
మునిఁగి శైలంబుఁ బైకెత్తి మూఁపుమీఁదఁ, బరఁగ నిడికొని జలధిపైఁ బవ్వళించె.

897


వ.

ఇట్లు రమావల్లభుండు మందరశైలంబుఁ గమఠాకారుం డై తనవీఁపునందు
ధరించి దానియగ్రంబు కరంబులం బట్టికొని దేవతామధ్యంబున నుండి య
పారబలంబునఁ బెక్కువర్షంబులు మథించిన నందు మొదల దండకమండలు
హస్తుం డై ధన్వంతరి పుట్టెఁ బదంపడి రూపయౌవనసంపన్ను లయినయువ
తులు పెక్కండ్రు పొడమిరి నిర్మథనంబువలన నప్పులం బొడమినకారణంబుల
నయ్యంగన లప్సరస లనం బరఁగిరి వారలలోన నలువదికోట్లయప్సరసలు ప్రధా
నభూత లైరి వారిపరిచారికాజనం బసంఖ్యం బై యుండు వారి దేవదానవులు
ప్రతిగ్రహింపమింజేసి వారు సాధారణ లైరి వెండియుం దరువ నందు వరుణ
కన్య యైనవారుణి యనుసురాధిదేవత పొడమి పరిగ్రహవిచారంబుఁ జేయు
చున్న దాని రాక్షసులు గైకొన రోసి విడిచిన దేవతలు పరిగ్రహించిరి
నాఁటంగోలె సురాపరిగ్రహణంబున దేవతలు సుర లైరి మఱియుం దరువ ను
చ్చైశ్శ్రవం బనుహయశ్రేష్ఠంబును మణిరత్నం బగుకౌస్తుభంబును నుత్త
మం బగునమృతంబునుం బుట్టిన నయ్యశ్వంబును శక్రుండు గైకొనియెఁ గౌస్తు
భంబు విష్ణువక్షంబున వెలింగె నయ్యమృతంబు నసురులు చేకొనిన సహింపక.

898


మ.

అనిమేషు ల్కడు నుగ్రు లై చటులనానామోఘహేతిద్యుతు
ల్వినువీథిం గడుఁ జిత్రభంగి మెఱయ న్వీరాంకు లై వాసవా
రినికాయంబులఁ దాఁక వారు నటువారిం దాఁకఁ ద్రైలోక్యమో
హనసంగ్రామము సెల్లె నయ్యుభయసైన్యశ్రేణికి న్రాఘవా.

899

విష్ణువు మోహినీవేషంబున నమృతంబు సురలకుఁ బంచిపెట్టుట

మ.

అపు డానందకపాణి రమ్య మగుమాయామోహినీరూపముం
గపటత్వంబునఁ దాల్చి దైత్యవరుల న్వంచించి పీయూషము
న్నిపుణత్వంబునఁ గ్రమ్మఱం గొని వెసన్ దేవాళి కందీయ వా
రపురూపంబుగఁ గ్రోలఁ జూచి ఘనకోపాటోపు లై రాక్షసుల్.

900


చ.

అమరులఁ దాఁకి దారుణవరాయుధదీప్తులు నింగి ముట్టఁగా
సమర మొనర్ప వేల్పులు ప్రసన్నసుధారసపానజోగ్రతే
జమున నసాధ్యు లై హరి లసత్కృపఁ దోడ్పడి విక్రమింపఁగా
నమరవిరోధులం దునిమి రాజి నఖండపరాక్రమంబునన్.

901


వ.

ఇట్లు నిలింపులు రణంబున నసురుల నందఱ నిశ్శేషంబుగాఁ బరిమార్చిన నిలింప
వల్లభుండు విజయలక్ష్మీవిరాజమానుం డై దేవర్షిగంధర్వచారణసహితంబుగా
నమరావతికిం జని జగత్త్రయంబుఁ బరిపాలించుచు నుండె నంత.

902


మ.

తనపుత్రు ల్సమరంబులో సవతిసంతానంబుచేఁ జచ్చినా
రని విన్నంతనె పుత్రమోహమున శోకాక్రాంత యై వ్రాలి దూ
లినధైర్యంబున నొక్కనాఁడు దితి యుద్రేకంబునం బ్రాణనా
థునితో నిట్లనె శోకపావకశిఖాదోధూయమానాంగి యై.

903

దితికిఁ గశ్యపుం డింద్రుని జయించుఁ బుత్రునిఁ బడయ వరం బొసంగుట

శా.

దేవా వేల్పులు మించి ఘోరరణవీథి న్మత్కుమారావళిం
బ్రావీణ్యంబున విష్ణుదేవుకరుణ న్మర్దించి రిం కేమి నీ
సేవ ల్సేయుచుఁ బుత్రహీన నగుచున్ జీవించు దోశ్శక్తిచే
దేవేంద్రుం బరిమార్చుపుత్రునిఁ గృపాదృష్టి న్బ్రసాదింపవే.

904


తే.

అనవు డనుకంప గదురఁ గశ్యపుఁడు పలికె, నబల వ్రతనిష్ఠ శుచి వై సహస్రవర్ష
ములు గడుప నట్టితనయుండు గలుగు ననుచు, వర మొసఁగి యమ్మహామునివరుఁడు ప్రీతి.

905


వ.

తనహస్తంబుస నమ్మహాదేవియుదరంబు సంస్పృశించి పుత్రోత్పత్తిరూపం బైన
శుభంబు గలుగుఁగాక యని యనుగ్రహించి తపంబునకుం జనియె నిట్లు కశ్య
పుండు ననిన యనంతరంబ యద్దేవి బలవంతుండును మహేష్వాసుండును
స్థితిజ్ఞుండును సమదర్శనుండు నైనకొడుకుం బడయుదు నని కశ్యపోక్తప్రకారం
బున వ్రతం బంగీకరించి కుశవవనంబునందు దారుణక్రమంబునఁ దపంబుఁ
జేయుచుండె.

906

ఇంద్రుఁడు కపటంబునఁ బరిచరించుచు దితిగర్భంబును ఖండించుట

ఉ.

అంత నెఱింగి దంభవినయం బెసఁగన్ దితిపాలి కేగి జం

భాంతకుఁ డించు కైనఁ దనన్యాజము గన్పడకుండ మాటి య
క్కాంతమనం బెఱింగి యతిగౌరవ మొప్పఁగ భక్తియుక్తుఁ డై
సంతస మంకురింపఁ బరిచర్య లొనర్చుచు నుండె నిష్ఠ మై.

907


వ.

ఇట్లు శ్రమాపనయనంబు లగుగాత్రసంవాహనంబుల జలాగ్నికుశకాష్ఠఫల
మూలప్రదానంబుల నిత్యంబును దితికిఁ బరిచర్యఁ జేయుచుండె నంతఁ దొమ్మ
న్నూటతొంబదియబ్దంబులు సనినయనంతరంబ.

908


చ.

అపు డొకనాఁడు మానిని రహస్యము దాఁచఁగ లేక భూమిభృ
ద్రిపుఁ డొనరించుసేవకు మదిం గడు సంతస మొంది మోమునం
గృప దళుకొత్త నయ్యనిమిషేంద్రునిఁ గన్గొని పల్కె నక్కటా
కృపణమనస్కులం దెలియలేదుగదా యువతుల్ రఘూత్తమా.

909


సీ.

వాసవ వినుము భవత్సమానుని నొక్కకొడుకును బడయంగఁ గోరి యేను
గశ్యపుఁ బ్రార్థింపఁ గరుణతో వెయ్యేండ్లు వితతంబుగా దృఢవ్రతము సల్పి
తేనియుఁ గల్గునం చానతి యొనఁగెఁ గావున నింకఁ బదియేండ్ల కనఘమూర్తి
యనుఁగుఁదమ్ముండు నీకవతార మందెడుఁ గడఁగి మీరిరువు రేకత్వ మొంది


తే.

మొనసి క్షీరోదకన్యాయమునఁ దనర్చి, మూఁడులోకంబు లొక్కట భూరిసత్వ
మహిమ రక్షింపుఁ డన్యోన్యమైత్రి గలిగి, యనుచు నిర్వ్యాజముగఁ బల్క నాలకించి.

910


క.

తరుణియుదరస్థుఁ డగువాఁ, డరయఁగఁ దన కరి యటంచు నతని వధింప
న్వెర వెఱుఁగక తఱి నరయుచు, స్థిరమతి నింద్రుండు సేవఁ జేయుచు నుండెన్.

911


వ.

అంత నొక్కనాఁ డత్తలోదరి పులోమజాకాంతుం డొనరించుబహువిధోపచా
రంబులు దనహృదయంబునకు ముదావహంబు లై తనర శారీరనుఖంబులు మరిగి
వ్రతదీక్షాసమయభంగం బెఱుంగక కాలచోదిత యై మధ్యాహ్నసమయమున
మఱచి కాల్గడ తలయంపిగా సుఖసుప్తి వహించిన.

912


చ.

ఇది సమయం బటంచు దివిజేశ్వరుఁ డుల్లము పల్లవింపఁగా
భిదురముఁ గేలఁ బూని జళిపించుచు ధీరత యోగశక్తిచే
నుదరములోనఁ జొచ్చి రయ మొప్పఁగ దిత్యుదరస్థబాలకున్
గదురుచు సప్తఖండములుగా నరికెం దనకోర్కి దీరఁగన్.

913


ఆ.

రాజ్యకాంక్షఁ జేసి రాజులు సతి నైన, బాలు నైనఁ జంపఁ బాలుపడుదు
రఘభయంబు వారి కనిశంబు నది దోష, మనఁగ వినమె రఘుకులాబ్ధిచంద్ర.

914


వ.

ఇట్లు బలారాతిచేత వ్రేటు వడి దితి ర్భంబు యెలుం గెత్తి బి ట్టేడ్చిన నదరిపడి
దితి మేల్కాంచె నప్పు డమ్మఘవుండు మారుద మారుద యనుచు లఘురీతిం
బలికి వృధాగర్భం బేల వధించెదవు చాలుఁజా లుడుగు మని పలుకుదితివాక్యం

బాకర్ణించి రయంబునఁ దద్గర్భంబు నిర్గమించి వచ్చి తనచేసినయపకారంబునకుఁ
గినుకఁ బూని శపించునో యని శంకించి యొడలు వడంకఁ బ్రదక్షిణపూర్వ
కంబుగాఁ బ్రణామంబుఁ గావించి నిటలతటఘటితకరపుటుం డై గుణవతీ
మతల్లి యగుతల్లిమ్రోల నిలిచి యి ట్లనియె.

915


క.

వ్రతనిష్టాభంగం బది, మతిఁ దలఁపక నుక్తభంగి మానక నిద్రిం
చితి వాదోషంబున నీ, గతి నాచే లూన మయ్యె గర్భము తల్లీ.

916


వ.

అదియునుం గాక.

917


క.

తఱి యెఱిఁగి రిపు వధించుట, నిరుపమధర్మంబు గాన నీయుదరమునం
బెరిఁగెడుబాలుఁడు మది నా, కరి యని ఖండించినాఁడ నలుగకు మింకన్.

918


క.

నా విని గర్భము వృథ యై, పోవుటకు దురంతదుఃఖపూరితమతి యై
దేవేంద్రునిఁ గని యపు డ, ద్దేవి మది న్గినుక విడిచి ధీరతఁ బలికెన్.

919


క.

సురలోకనాథ నీయం, దరయఁగ దోషంబుఁ గాన మరు దారఁగ మ
ద్దురితమున నయ్యె నింతయు, దురితహరుని నిన్ను దూఱ దోసము వచ్చున్.

920


వ.

స్వయంకృతాపరాధంబున నైనకార్యంబునకు వగవం బని లేదు నిరపరాధి
వైననీ కపరాధంబు సేయం బూనిన దైవంబు సమకూర నిచ్చునే యింక
నీసప్తఖండంబులు నీచేత మారుద యని పలుకంబడినవి గావున మారుత
సంజ్ఞకంబు లై యుండు నదియునుం గాక యావహప్రవహసంవహోద్వహవి
వహపరివహపరావహాఖ్యలం గలసప్తవాతాభిమానదేవతలం దొక్కటి బ్రహ్మ
లోకంబునందును నొక్కటి యింద్రలోకంబునందును నొక్కటి యంతరిక్షం
బునందును దక్కిననాలుగు నాలుగుదిక్కులయందును బ్రవర్తిల్లుచుండు నట్టి
సప్తవాతస్కంధంబులకు నాయకులం జేసి సప్తఖండంబు లైనమత్పుత్రుల
రక్షింపు మనిన నతం డట్ల కావించి యద్దేవిచేత ననుజ్ఞాతుం డై నాకంబునకుం
జనియె నీదేశమందున నాఖండలుండు దితికి శుశ్రూషఁ గావించె నని పల్కి
విశ్వామిత్రుండు వెండియు రామచంద్రున కి ట్లనియె.

921


తే.

పొసఁగ నిక్ష్వాకునకు నలంబుసకు మున్ను, పుట్టినట్టివిశాలుఁ డన్భూపమాళి
పుడమి యేలి విశాల యన్పుర మొనర్చె, నిచట రాజేంద్ర తనపేర నింపు మీఱ.

922


తే.

ఆవిశాలునిపుత్రకుం డైనహేమ, చంద్రునకుఁ బుట్టె ఘనుఁడు సుచంద్రుఁ డతఁడు
పరఁగ ధూమ్రాశ్వు నతఁడు సృంజయునిఁ గాంచె, నతఁడు సహదేవు నతఁడు కుశాశ్వుఁ గాంచె.

923

తే.

ఆకుశాశ్వుఁడు సోమదత్తాఖ్యుఁ గనియె, నతఁడు కాకుత్స్థుఁ గాంచె నయ్యవనివిభుఁడు
సుమతి యనువానిఁ గనియె నాసుమతి యిప్పు, డీవిశాలపురం బేలు నిద్ధయశుఁడు.

924


వ.

మఱియు నిక్ష్వాకుప్రసాదంబున వీ రందఱు వైశాలికు లనం బ్రసిద్ధి కెక్కి దీర్ఘా
యువులును మహాత్ములును వీర్యవంతులును బరమధార్మికులును నై యుందు
రీరాత్రి యిచ్చట వసియించి యెల్లి మిథిలకుం బోద మని పలుకుచున్నసమ
యంబున.

925

సుమతి యనురాజు విశ్వామిత్రుని బూజించుట

చ.

ఘనతరసుప్రభావుఁ డగుకౌశికసంయమినాథురాకయు
న్విని సుమతిక్షమాపతి నవీనముదంబుధిపూరమగ్నుఁ డై
తనదుపురోహితు ల్హితులు దాసులుఁ జుట్టలు వెంట రా రయం
బునఁ జని కాంచి యమ్మునికి మ్రొక్కి సపర్య లొనర్చి యి ట్లనున్.

926


మ.

అనిశంబు న్హృదయప్రపంచము సముద్యద్భూరితేజంబుచే
నను వై మించెను లోచనాంబురుహముల్ వ్యాకోచతం జెందెఁ జ
య్యన దట్టంపుఁ దమచ్ఛట ల్విరిసె వస్వావాప్తి చేకూరె నేఁ
డను వయ్యెం గద యిన్ని మా కిచట విశ్వామిత్ర మీరాకచేన్.

927


క.

మాన్యుఁడ వగుమీకృపచే, ధన్యుం డనుబేరు గలవదాన్యుండను రా
జన్యులలో మాన్యుఁడ సౌ, జన్యయుతుఁడ నైతి నేఁడు సంయమివర్యా.

928


వ.

అని బహుప్రకారంబుల సన్నుతించి యొండొరులకుశలప్రసంగంబులు గడ
పినయనంతరంబ విశ్వామిత్రునియిరుగెలంకుల నలంకృతు లై సూర్యసోముల
చందంబున నింద్రోపేంద్రులకైవడి యశ్వినీదేవతలపొందున మనోహరాకా
రంబులం దేజరిల్లుచున్నరామలక్ష్మణులం జూచి కౌశికున కి ట్లనియె.

929


సీ.

గజసింహగమనులు ఖడ్గతూణీధనుర్ధరులు శార్దూలవిక్రములు రాజ
సింహులు గుణరూపచేష్టితంబులఁ బరస్పరసమానులు చారుచంద్రముఖులు
రమణీయమూర్తులు కమలపత్రవిశాలనయనులు సురభువనంబు విడిచి
ధరణికి వచ్చినసురలకైవడిఁ గ్రాలువారు దస్రులభంగి వఱలువారు


తే.

రాజభానులగతి దివ్యతేజమున హ, రిన్నికాయము వెలిఁగించుచున్నవారు
ధీవరేణ్య వీ రెవ్వరు తేవనమున, నేల చనుదెంచి రిచటికి నింత చెవుమ.

930


క.

మునినాథ నీతపంబును, ఘనకీర్తియుఁ దనువు లిట్లు గైకొని వెంటం
జనుదెంచె నొక్కొ హరిహరు, లన నొప్పెడు వీరిచంద మానతి యీవే.

931


క.

అన విని మునిపతి సుమతిం, గనుఁగొని యిట్లనియె వీరు కాకుత్స్థవరు
ల్ఘనమతులు రామలక్ష్మణు, లనువారలు దశరథాధిపాత్మజు లనఘా.

932

సీ.

రాజేంద్ర నాచేతఁ బ్రార్థితు లై వేడ్క జంటగా నావెనువెంట వచ్చి
తాటక యనుఘోరదానవి ఖండించి పరఁగ మారీచసుబాహు లనెడు
దైత్యుల సంగ్రామశీలమున భంజించి కరుణతో నాదుయాగంబుఁ గాచి
జనకుజన్నముఁ జూడఁ జనుచున్నవారలు ఘనులు పాపౌఘలంఘనులు శౌర్య


ఆ.

ధనులు పుణ్యఘనులు నన విని సుమతి య, చ్చెరువు గదురఁ బూజఁ జేసియుఁ దన
యింట నాఁటిరాత్రి యెలమితో నిడుకొని, వేఁగుటయును భక్తివినయ మెసఁగ.

933


తే.

అతిథినత్కారము లొనర్చి యనుప నతని, వీడ్కొని రఘూత్తములు మునివితతి వెంట
రా విదేహక్షమాపతి రాజధాని, కరుగు తెరువునఁ గౌశికుఁ డరిగె నపుడు.

934


వ.

ఇట్లు చని దవ్వుల నతిరమణీయకాంచనప్రాకారశోభితం బైనదాని నంబర
చుంబిశిఖరరేఖామయూఖవుంజరంజితశర్మదభర్మహర్మ్యం బైనదాని కుసుమ
కిసలయఫలభరితవిటపివాటికావిహరమాణమత్తమధుకరకీరశారికాకలకంఠమ
ధురశబ్దాయమానమంజులోద్యానపరివృతం బైనదాని మిథిలాపురంబుఁ గనుం
గొని తదీయసుషమావిశేషంబున కిచ్చ మెచ్చుచుఁ దదుపవనంబునందుఁ
బురాణం బై రమ్యం బై నిర్జనం బై యున్న యొక్కమహనీయాశ్రమంబు
విలోకించి.

935


మ.

జలజాతాకరతీరరాజిదవనీజాతావళీయుక్తశీ
తలమార్గం బటు పట్టి పోవునెడ నందం బొప్పఁగా భానువం
శలలాముం డగురామచంద్రుఁడు మునిస్వామి న్విలోకించి సొం
పలరం బల్కె గిరీశమౌళిగళదుద్యద్వ్యోమగంగార్భటిన్.

936

విశ్వామిత్రుఁడు రాముని కహల్యావృత్తాంతంబుఁ దెల్పుట

మ.

అనఘాత్మా రమణీయ మై సురుచిరం బై శ్లాఘ్య మై యొప్పునీ
వన మి ట్లేలకొ నిర్జనం బయి యసేవ్యం బయ్యె ము న్నీడ నే
ముని యుండెం గృప నింత నాకుఁ దెలియ న్మోదంబుతోఁ దెల్పవే
యని ప్రార్థించినఁ జెప్పఁగాఁ దొడఁగె విశ్వామిత్రుఁ డుద్యన్మతిన్.

937


తే.

అనఘ ము న్నీవనంబు మహాత్ముఁ డైన, గౌతమునియాశ్రమం బన ఘనత కెక్కు
నిది సకలదేవపూజితం బిది సురేంద్ర, నందనోపమ మై యొప్పు నయచరిత్ర.

938


చ.

లలనలలోఁ ద్రిలోకనుతలక్షణ యైనయహల్యతోడుతం
గలసి సుఖాత్ముఁడై యిచట గౌతమమౌని దపంబు సేయఁగా
నలరి బలాంతకుం డలయహల్యవయోవిభవాతిరేకముం
దొలఁగక చూచి యవ్వెలఁదితో సుఖియింపఁగఁ గోర్కి పుట్టినన్.

939


వ.

ఒక్కనాఁ డమ్మునివల్లభుండు స్నానార్థి యై యరిగిన నప్పు డెడఁ గని పురంద

రుండు మునివేషధరుం డై యహల్యకడ కరుగుదెంచి యి ట్లనియె.

940


తే.

అంబుజేక్షణ కామభోగార్తు లైన, పురుషు లెప్పుడు ఋతుకాల మరయుచుందు
రట్లు గావున నీతోడ నతనుసౌఖ్య, మనుభవింపంగఁ గోరితి నబ్జవదన.

941


తే.

అనిన నమ్మాయతపసివాక్యములపటిమ, మొగముఁ జాయయుఁ గాంచి నామగని కింత
సరస మేడది శక్రుఁ డిక్కరణి నాదు, వలని మోహంబుచే నిట వచ్చె ననుచు.

942


వ.

తలంచి యతనిం గూడి కందర్పక్రీడానందరసం బనుభవించి వెండియు నహల్య
శక్రునిం జూచి యేను నీవలనఁ గృతార్థ నైతి నింక నిచట మసలవలవదు
నన్నును నిన్నును రక్షించుకొనుచు శీఘ్రంబునం జను మనిన నయ్యింద్రుండు
నీవలనఁ బరితుష్టుండ నైతి నింక రయంబునం జనియెద నని యద్దేవిచే ననుజ్ఞా
తుండై యప్పర్ణశాల నిర్గమించి గౌతమాగమనంబు శంకించుచు ససంభ్రముం
డై రయంబునం బోవుచు.

943


చ.

అనిమిషలోకనాథుఁడు నిజాశ్రమవాటికి నేఁగుదెంచున
మ్మునిపతి దీప్తపావకనిభుం బరమేష్ఠిసముం దపోధను
న్మినుశిఖివేల్పునెచ్చెలి సమిత్కుశహస్తుఁ గృతాభిషేకునిం
గనుఁగొని సాంద్రభీతిపరికంపితుఁ డై చనుదెంచుచుండఁగన్.

944

గౌతముఁడు దేవేంద్రుని శపించుట

చ.

తనుఁ గని భీతుఁ డై మొగము దద్దయు వెల్వలఁ బాఱఁ గ్రమ్మఱం
జనియెడువజ్రిఁ గన్గొని నిశాసమయంబున ని ట్లదేలకో
యనిమిషనేత వచ్చె నని యంతయు గ్రక్కున యోగదృష్టిచే
గనుఁగొని రోషశోణితవికంపితలోచనుఁ డై రయంబునన్.

945


వ.

పరుషవాక్యంబున ని ట్లనియె.

946


ఉ.

ఓరి దురాత్మ యోరి శఠ యోరి మదాంధుఁడ శక్ర మౌనికాం
తారతి దూషితం బని మనంబున నించుక గొంక కిట్లు మ
న్నారిని వంచనం గపటతాపసతన్ రమియించి తీ విదే
కారణమై యముష్కుఁడవు గ మ్మని శాప మొసంగె నుద్ధతిన్.

947


వ.

ఇట్లు నిష్ఠురంబుగా శపియించినఁ దత్క్షణంబు వజ్రప్రహారంబునఁ దునిసిపడిన చం
దంబున నింద్రునివృషణంబులు దెగి ధరణిం బడియె నంత నమ్మునివరుండు.

948


తే.

పర్ణశాలకుఁ బోయి విశీర్ణకేశ, పాశయై డస్సి సురతవిభ్రమముఁ దెలుపు
చున్నయన్నారిఁ గనుఁగొని కన్నుఁగవకుఁ, గెంపు సొంపార నిట్లని కెరలి పలికె.

949

గౌతముఁ డహల్యను శపించుట

తే.

నీవు నిజవంశధర్మంబు నీఱుఁ జేసి, పుష్పవిశిఖార్థవై పరపురుషరక్తి

బయిసి మాలి నీ విటువంటిపను లొనర్చి, మాకుఁ దలవంపుఁ జేసితి మగువ నేఁడు.

950


ఉ.

ఈయటవీప్రదేశమున నెవ్వరుఁ జూడక యుండ నిత్యమున్
వాయువు నారగించుచుఁ బ్రభాతజభూరిరజఃపరీత వై
పాయక పెక్కువర్షములు పాపవశంబున నుండు మంచు వా
ఙ్నాయకతుల్యదర్శనుఁడు గౌతముఁ డాలి శపించె నుద్ధతిన్.

951


వ.

ఇట్లు శప్తయై యహల్య భయంబున వడంకుచు గౌతమునియంఘ్రులం బడి
లేచి మహాత్మా కృతాపరాధ నైననన్ను శపించుట నాయందులం గలదయాతి
శయంబున నిష్కళంకఁ గాఁ జేయుటకే కదా యీనిష్ఠురశాపంబునకుఁ దుది
యెయ్యది తన్మోక్షప్రకారం బానతి మ్మని ప్రార్థించినఁ బ్రియురాలికడంకకు
మెచ్చి యతీతానాగతవర్తమానవిశారదుం డగుగౌతముం డి ట్లనియె.

952


తే.

అతివ దశరథనందనుం డైనరాముఁ, డెప్పు డీఘోరవనమున కేగుదెంచి
యంఘ్రివిన్యాస మొనరించు నపుడు తత్ప, దాబ్జరేణువుచేఁ బూత వయ్యె దీవు.

953


తే.

అమ్మహాతున కాతిథ్య మాచరించి, యపగతాఘ వై లోభమోహములు విడిచి
మత్సకాశంబునందు సమంచితముగ, ధన్యవై పూర్వరూపంబుఁ దాల్చె దీవు.

954


వ.

అని యిట్లు గౌతముం డహల్యకు శాపం బిచ్చి పదంబడి తన్మోక్షణప్రకారం బెఱిం
గించి యచ్చోటుఁ బాసి సిధ్ధచారణసేవితం బయినహిమవంతంబునకుం జని
యందుఁ దపంబుఁ జేయుచుండు.

955


చ.

అట బలవైరి శప్తుఁ డయి యారని నెవ్వగ వేల్పువీటికిం
దటుకున నేగి శోకపరితాపమునం గడు డస్సి లజ్జ న
క్కట పరకాంత నిట్లు కనుఁ గానక పొందఁగ నేల దానిచే
నిటు సమకూరనేల విధి యెంతటిపా టొనరించె నియ్యెడన్.

956


వ.

అని విచారగ్రస్తమానసుండై దేవతల నందఱ రావించి గౌతముండు సర్వ
దేవతాపదచ్యవనకారణం బైనతపంబుఁ గావించుచుండ నే నాతపంబు విఘ్నంబు
సేయుటకు సమకట్టి క్రోధంబుఁ బుట్టించినం గాని తపోభంగంబు గా దని నిశ్చ
యించి క్రోధోత్పాదనంబుకొఱ కమ్మహామునిపత్ని యగుయహల్యతోడం గ్రీ
డించిన నమ్మునిపుంగవుం డలిగి మదీయవృషణంబులు దునిసిపడ నన్ను శపించి
పదంపడి తనపత్నికి శాపం బొసంగె నే నాకారణంబున విఫలుండ నైతి.

957

దేవేంద్రుఁడు మేషవృషణుఁ డగుట

ఆ.

వేల్పులార యిట్లు విఫలుండ నై యేను, భువనజాల మెట్లు ప్రోచువాఁడ
హీతముఁ గోరి విూర లిందఱు యోచించి, దేవకార్య మిపుడు తీర్పవలయు.

958


వ.

అని పురందరుండు పలికిన బృందారకు లందఱు పితృదేవతలకడకుం జని శక్రు
నకుం బాటిల్లినవైఫల్యం బెఱింగించి యిప్పుడు యజ్ఞంబునందు మీకొఱకు
నిజ్యమానం బైనయీమేషవృషణంబు లింద్రున కొసంగుఁ డిమ్మేషంబు వృషణ

రహితం బయినను మీకుఁ బరమతుష్టి నొసంగుం గాక యనియు నేమాన
వులు భవత్ప్రియంబుకొఱకు నముష్కం బైనమేషంబు నొసంగుదు రట్టి
దాతలకు ఫలలోపంబు గాకుండ సంపూర్ణఫలం బొసంగుఁ గాక యనియు
ననుగ్రహింతు మని పలికిన నగ్నిపురోగము లైనదేవతలవచనంబు విని పితృ
దేవతలు యూపనిబద్ధం బైనమేషవృషణంబు లుత్పాటించి తెచ్చి సహస్రా
క్షునకు సంఘటించిరి నాఁటంగోలె పితృదేవతలు తత్సజాతీయంబు లగుటం
జేసి యవృషణంబు లైనమేషంబుల భుజించుచు దాతలకు సవృషణమేషదాన
ఫలంబు లొసంగుచుందురు.

959


తే.

అనఘచారిత్ర వినుము నాఁ డాది గాఁగ, సరసిజాసనతుల్యుండు సకలమౌని
వర్యుఁ డగుగౌతమునిప్రభావంబువలన, వృత్రదైత్యాంతకుఁడు మేషవృషణుఁ డయ్యె.

960


చ.

అనిశము తావకాగమన మాత్మఁ దలంచుచు నాఁటఁ గోలె యీ
ఘనవని ఘోరశాపమున గౌతమపత్ని యహల్య యేరికిం
గనుపడకుండ నున్నయది గ్రక్కున నాశ్రమభూమి సొచ్చి నీ
వనుపమసత్కృపాగరిమ నమ్మునిగేహిని నుద్ధరింపుమా.

961


క.

అని యిటు కౌశికుఁ డాడిన, ఘనుఁ డారాముండు కౌశికపురస్కృతుఁ డై
యనుజన్మయుతంబుగ న, వ్వనముఁ బ్రవేశించె దీప్తవరతేజుండై.

962

రామపాదరజస్స్పర్శంబున నహల్య శాపవిముక్త యగుట

వ.

ఇట్లు గౌతమాశ్రమంబుఁ బ్రవేశించి యందు వాయుభక్షణాదితపంబుచేతఁ
బ్రద్యోతితప్రభ యగుటం జేసి సురాసురమనుష్యులకు దుర్నిరీక్ష యగు
దాని విరించిచేత నతిప్రయత్నంబున నిర్మింపంబడినయతిమానుషరూప
యగుమాయపగిది నలరుదాని వృక్షలతాపుష్పపటలపరిచ్ఛన్న యగుటం
జేసి తుషారాభ్రపటలపరిచ్ఛన్న యైనపూర్ణచంద్రప్రభసొబగున నొప్పుదాని
యక్రూరత్వదుర్నిరీక్షత్వాదులచేత నుదకమధ్యంబునం బ్రతిబింబించినప్రదీప్త
భాస్కరప్రభచందంబున నందం బగుదాని యహల్య నవలోకించె నప్పు
డద్దేవి గౌతమశాపంబున రామసమాగమపర్యంతంబు త్రైలోక్యంబున
కదృశ్య యై యుండి యప్పుడు శాపాంతంబు నొంది యెప్పటిశరీరంబు
తోడఁ జూపట్టె నిట్లు సందృష్ట యైనయహల్యచరణంబులకు లక్ష్మణసహితం
బుగా రాముండు నమస్కారంబుఁ గావించె నప్పు డద్దేవి గౌతమవాక్యంబుఁ
దలంచి వారి నిరువుర నాదరించి యర్ఘ్యపాద్యాదికంబు లర్పించి యాతిథ్యం
బొసంగినఁ బ్రతిగ్రహించి రంత.

963


క.

మొఱసెన్ సురదుందుభు లటు, గురిసెన్ మందారవృష్టి గోమలఫణితిన్

వరగంధర్వులు పాడిరి, యరుదారఁగ మేనకాదు లాడిరి వరుసన్.

964


తే.

అప్పు డచటికి సురసిద్ధు లమరమునులు, గరుడగంధర్వకిన్నరు లరుగుదెంచి
రాఘవు ననేకభంగులఁ బ్రస్తుతించి, యలయహల్యను బూజించి రతిముదమున.

965


తే.

అంతలో గౌతముం డట కరుగుదెంచి, పొలుపు మీఱంగ రాముని బూజ చేసి
ఘనతపోబలపరిశుద్ధగాత్రి యైన, వెలఁదితోఁ గూడి తపముఁ గావించుచుండె.

966

విశ్వామిత్రుఁడు రామలక్ష్మణసహితుఁడై జనకుని యజ్ఞవాటంబుఁ జేరుట

వ.

అంత నారాముండు లక్ష్మణసహాయుం డై విశ్వామిత్రునిం గూడి యప్పుణ్యాశ్ర
మంబుఁ బాసి యీశాన్యదిగ్భాగంబుఁ బట్టి యొక్కింతదూరం బరిగి పావనం
బైనజనకునియజ్ఞవాటంబుఁ జేరి మునిశార్దూలుం డైనవిశ్వామిత్రు నవలోకించి
యి ట్లనియె.

967


చ.

అనఘ మహాత్ముఁ డైనజనకాధిపుయజ్ఞసమృద్ధి సాధ్వి యై
తనరెడు పుణ్యమూర్తు లతిధన్యులు వేదషడంగపారగుల్
దినకరతేజులున్ సకలదేశనివాసులు సత్తపఃపరా
యణు లగుబ్రాహ్మణుల్ బహుసహస్రము లిచ్చట నున్నవా రొగిన్.

968


క.

శకటీశతసంకుల మై, ప్రకటితమునినిలయరాజి రాజిల్లెడు నిం
దొకచోట మనకు వాసం, బకలుషధిషణా విధింపుఁ డనుపమభంగిన్.

969


క.

అన విని విశ్వామిత్రుఁడు, ఘనతరసలిలాయుతంబు గమనీయతరం
బనుపమము వివిక్తం బగు, ఘనదేశమునందు వసతిఁ గావించె రహిన్.

970


సీ.

జనకుండు గాధిపుత్రునిరాక విని శీఘ్రమున శతానందుని ము న్నిడుకొని
ఋత్విజుల్ గొందఱు ప్రీతితో నర్ఘ్యంబుఁ బాద్యంబుఁ గొని వెంటఁ బరఁగుదేర
వినయముతో నెదుర్కొని సమంత్రకముగా నర్ఘ్యంబు విమలపాద్యం బొసంగె
జనకుం డొసంగుపూజన మంతయు గ్రహించి హవనిరామయముఁ దచ్ఛివము నరసి


తే.

కూర్మి మెఱయ శతానందుఁ గుశల మడిగి, ప్రీతిఁ బూజించినట్టి ఋత్విజులసేమ
మది విచారించి పిదప వా రడుగఁ దనదు, కుశల మంతయు నెఱిఁగించెఁ గుశికసుతుఁడు.

971


వ.

ఇట్లు పరస్పరనివేదితకుశలవృత్తాంతు లయినయనంతరంబ జనకమహీనాథుండు
గాధేయు నవలోకించి మహాత్మా యీయాసనంబులయందు మునిసమేతంబుగా
నాసీనుండవు గమ్మని ప్రార్థించిన నమ్మనిపుంగవుండు జనకోక్తప్రకారంబున నుచి
తాసనంబున నాసీనుం డయ్యెఁ దక్కినమునులు యథార్హపీఠంబులయందాసీ
ను లై రంత జనకుండు విశ్వామిత్రునియనుమతంబున సకలమంత్రిబాంధవసహి
తంబుగా నర్హపీఠమున నాసీనుండై యమ్మహాత్మున కి ట్లనియె.

972


సీ.

నేఁడుగా నా కనిందితయజ్ఞఫలవృద్ధి సఫలించె మీరాక సంయమీంద్ర

నేఁడుగా నాకు మానితజన్మసంసిద్ధి గలిగె మీకరుణచే గాధితనయ
నేఁడుగా నేను భూనేతలలోఁ జాల మాన్యుండ నైతి నోమౌనివర్య
నేఁడుగా నాకు నిన్నియు సమకూరె నీయాలోకనమునఁ బద్మాప్తతేజ


తే.

బ్రహ్మతుల్యుండ వైన నీపాదరజము, సోఁక నాయజ్ఞసదన మస్తోకభంగిఁ
గడుఁ బవిత్ర మై తనరారె కల్మషంబు, లడఁగె మిక్కిలి ధన్యుండ నైతి నేఁడు.

973


తే.

వినుము యజ్ఞంబు పండ్రెండుదినము లింకఁ, గొదవ యున్న దటంచుఁ గోవిదులు వలికి
రంత భాగార్థు లై వేల్పు లరుగుదేరఁ, గలరు వారలఁ జూచి పోవలయు మీరు.

974


వ.

అని పలికి తత్పరిసరంబున.

975


సీ.

గజసింహగమనుల ఖడ్గతూణీధనుర్ధరుల శార్దూలవిక్రముల రాజ
సింహుల గుణరూపచేష్టితంబులఁ బరస్పరసమానులఁ జారుచంద్రముఖుల
రమణీయమూర్తులఁ గమలపత్రవిశాలనయనుల సురభవనంబు విడిచి
ధరణికి వచ్చిన సురలకైవడిఁ గ్రాలువారి దస్రులభంగి వఱలువారి


తే.

రాజభానులక్రియ దివ్యతేజమున హ,రిన్నికాయము వెలిఁగించుచున్నవారిఁ
గమ్రతరకాకపక్షముల్ గలుగువారి, మహితకీర్తుల రామలక్ష్మణులఁ జూచి.

976


ఉ.

వారిమనోజ్ఞవేషములు వారివచోరచనాచమత్కృతుల్
వారివిలాసవైఖరులు వారిపరస్పరబద్ధభావముల్
వారక చూచి మెచ్చుచు నవారితసమ్మద మంకురింప నా
భూరమణీపురందరుఁడు పొల్పుగఁ గౌశికుతోడ ని ట్లనున్.

977

విశ్వామిత్రుఁడు జనకునికి రామలక్ష్మణులవృత్తాంతంబుఁ దెల్పుట

ఉ.

ఈశరచాపఖడ్గధరు లీసుకుమారకు లీకుమారకుల్
ఈశుభమూర్తు లీచతురు లెవ్వరివా రిట కేల వచ్చినా
రీసుమబాణకోటిసము లింతయు నా కెఱిఁగింపు మన్న న
క్కౌశికుఁ డిట్లు పల్కు జనకక్షితినాథునితో ముదంబునన్.

978


సీ.

అనఘాత్మ దశరథజననాథతనయులు రామలక్ష్మణు లని నామధేయ
మమితవిక్రములు ధర్మాత్ము లుదారులు ళూరులు ధీరులు వీరు బాహు
శక్తిచే మద్యాగసంరక్షణముఁ జేసి పరఁగ నహల్యశాపంబు మాన్చి
నిరుపమలీలతో నీయింటఁ బొలు పందుపంచాస్త్రవైరిచాపంబుఁ జూడ


తే.

నరుగుదెంచినవా రన నపుడు గౌత, మాత్మజుండు శతానందుఁ డధికహర్ష
మలర రోమాంచకంచుకితాంగుఁ డగుచుఁ, గనుల నానందబాష్పముల్ గ్రమ్ముదేర.

979

తే.

విమలపీఠంబుల సుఖోపవిష్టు లయిన, దాశరథులముఖారవిందములఁ గనుల
కఱవుదీరంగఁ గనుఁగొని కౌశికునకు, నింపుసొంపార మధురోక్తి నిట్టు లనియె.

980

శతానందుఁడు విశ్వామిత్రుని రామునిం బ్రశంసించుట

సీ.

మునినాథ మాతల్లి మునుకొని మీచేత దర్శింపఁబడియెనే దాశరథిని
నతిభక్తి నర్ఘ్యపాద్యములచే నద్దేవి పూజించెనే మహాపురుషమణిని
దేవేంద్రకృత్యమాదిగఁ బూర్వవృత్తంబు నెఱిఁగించితివె సర్వ మినకులునకు
మనువంశ్యు గన్నపిమ్మట నహల్యాదేవి రహిఁ గూడుకొనియెనే ప్రాణవిభుని


తే.

ఘనుని రామునిఁ జూచెనే గౌతముండు, పూజ లొనరించెనే భక్తిపూర్వకముగఁ
బత్నితోఁ గూడి చేసెనే పటుతపంబు, ధన్య యయ్యనె మాతల్లి తాపసేంద్ర.

981


క.

నా విని కౌశికుఁ డి ట్లనుఁ, గావింపఁగఁబడియె నిన్ని గౌతముఁ గూడెన్
వావిరి నహల్య రేణుక, కోవిద జమదగ్నితోడఁ గూడిన మాడ్కిన్.

982


వ.

అని పలికిన నిజప్రభావతిరస్కృతశతానందుం డగుశతానందుండు పరమా
నందరసపూరితహృదయారవిందుం డై కౌసల్యానందనునివదనారవిందం బుప
లక్షించి మందమధురవాక్యంబున ని ట్లనియె.

983


సీ.

దశరథసుత నీవు దైవయోగంబున వచ్చితి విటకు నేఁ డచ్చుపడఁగ
ననఘ మజ్జనని యహల్యపాపము నేఁడు కడిగె యుష్మత్పాదకమలరజము
గౌతనుశాపదుర్గము నిస్తరించె వెండియు భర్తతోఁ గూడ నేఁటి కధిప
రాఘవ నీపాదరాజీవమహిమంబు నెఱిఁగి నుతింపంగ నెవ్వఁ డోపుఁ


తే.

గనకగర్భసమానుఁ డీకౌశికుండు, రక్షకుం డఁట నీకుఁ గొఱంత యేమి
విమలచారిత్ర నీకంటే వేరొకండు, ఘనుఁడు ధన్యుండు లేఁడు జగత్త్రయమున.

984


వ.

మహాత్ముం డైనయీవిశ్వామిత్రుండు జగత్పవిత్రచరిత్రుండ వైననిన్ను దో
డ్కొని వచ్చి మ మ్మందఱఁ కృతార్థులం జేసె నిట్టిమహోపకారి జగత్త్రయంబు
నం దెవ్వం డైనఁ గలఁడే యని పలికి యంత కంతకుఁ బ్రసంగవశంబున విశ్వా
మిత్రునిప్రభావంబు లన్నియు విస్పష్టంబుగా నెఱింగించువాఁ డై శతానందుండు
రామచంద్రున కి ట్లనియె.

985

శతానందుఁడు రామునికి విశ్వామిత్రవృత్తాంతంబుఁ దెల్పుట

క.

అతులప్రభుఁ డపరాజితుఁ డతర్క్యకర్ముం డమర్షి యగుకౌశికు ది
వ్యతరప్రభావములఁ బ్ర, స్తుతి సేయఁగ మాకు వశమె సుగుణోదారా.

986


క.

దశరథకుమార బ్రహ్మకుఁ, గుశుఁ డన నొకరాజు పుట్టెఁ గుశునకు సుతుఁ డై
కుశనాభుఁ డమరె నాతఁడు, వెస గాధిని గాధి యితని వేడుకఁ గాంచెన్.

987


చ.

ఇతఁ డతిధర్మనిష్ఠ నిల నేలె ననేకసహస్రవర్షముల్
చతురత నెల్లలోకములు సంతతముం దను సన్నుతింపఁగా
నతులితవైభవం బెసఁగ నం దొకనాఁడు చమూనమేతుఁ డై

క్షితిఁ గలశైలదుర్గవనసిద్ధతపోవనముల్ చరించుచున్.

988


వ.

చనిచని యొక్కచోట.

989


సీ.

కలితనానావిహంగమసంఘములు లసత్స్మృతిపురాణార్థసంతతులు దెలుప
నెలమావిమ్రానికొమ్మల శుకసంతతుల్ జత గూడి శ్రుతులలో జటలు చదువ
సరసకాసారరంజద్రాజహంసలు చటుల వేదాంతముల్ చర్చ జేయఁ
బరపుష్టములు మనోహరమాధురీనిస్వనముల శాస్త్రప్రసంగములు సలుప


తే.

జాతివైరంబు లుడిగి మార్జాలమూషి, కోరగశిఖండిగణము లన్యోన్యమైత్రి
నెఱప నిరుపమతరులతోత్కరము గలిగి, రాజిలు వసిష్ఠమునివరాశ్రమముఁ గనియె.

990


వ.

మఱియు బాహ్యేంద్రియవ్యాపారంబులు వర్జించి రాగద్వేషంబు లుడిగి ఫల
మూలంబు లుపయోగించి జపహోమార్చనపరాయణు లై పెద్దకాలంబు
ఘోరతపంబుఁ జేసి సిద్ధి వడసి వహ్నులుం బోలె వెలుంగుచు సాక్షాత్పితా
మహునకు సాటి సేయం దగిన దేవర్షి బ్రహ్మర్షి మహర్షి వాలఖిల్య వైఖానసులుం
గలిగి దేవదానవగరుడగంధర్వకిన్నరకింపురుషసిద్ధచారణుల కాశ్రయం బై ప్ర
శాంతసింహవ్యాఘ్రవరాహభల్లూకప్రముఖనిఖిలమృగంబుల కాటపటైటె రెండవ
బ్రహ్మలోకంబుకరణి నందం బగుచున్న వసిష్ఠునిదివ్యాశ్రమంబుఁ జూచి యచ్చె
రు వందుచుఁ దన్మధ్యదేశంబునం జని యొక్కచోట.

991

విశ్వామిత్రుఁడు వసిష్ఠాశ్రమముఁ జేరుట

సీ.

ఒకనాఁడు జలపాన మొనరించి వెయ్యేండ్లు తపముఁ గావించినధన్యమతులు
నొకనాఁడు గాడ్పుఁ గ్రోలి కలంతకాలంబు నిష్ఠ సల్పినమహనీయమూర్తు
లొకనాఁడు జీర్ణపర్ణోపయోగ మొనర్చి పెక్కేండ్లు తపము సల్పినమహాత్ము
లాహారవర్జితు లై కల్పకాలంబు నచలయోగ మొనర్చినట్టిఘనులు


తే.

సమరసాధ్యాత్మవిద్యాప్రసంగవశత, బలసి తనుఁ గొల్వ వారికిఁ బ్రకటితార్థ
బోధ సేయుచు దీప్తాగ్నిఁబోలెఁ దేజ, రిల్లుచున్నవసిష్ఠు నుత్ఫుల్లయశుని.

992


ఉ.

కాంచి తదంఘ్రిమూలములు గ్రక్కున ఫాలము సోఁక మ్రొక్క దీ
వించి మునీశ్వరుం డుచితవిష్టరమందు వసింపఁ బంచి పూ
జించి ఫలంబు లిచ్చిన విశేషమతిం దగ సంగ్రహించి య
భ్యంచితభక్తిఁ గే ల్మొగిచి యానృపుఁ డమ్మునినేత కి ట్లనున్.

993


మ.

అనఘా సేమమె మీకు మీఘనతపం బవ్యాహతంబే తపో
ధను లై శిష్యులు గొల్తురే దనుజబాధల్ లేవుగా సంతతం
బనలోపాసన సెల్లునే ద్రుహిణపుత్రాగ్రేసరా యన్న నా
యన సేమంబున నున్నవార మని విశ్వామిత్రుతో ని ట్లనున్.

994


సీ.

పార్థివోత్తమ నీవు ప్రజలఁ బాలింతువే తండ్రికైవడిఁ బాడి దప్పకుండ

నవనీశ సంభృతు లై భృత్యగణములు చరియింతురే నీదుశాసనమున
బలకోశమిత్ర సంపత్పుత్రపౌత్రులం దరయుదే కుశల మహర్నిశంబు
మనుజేంద్ర రాజధనప్రకారంబునఁ బగతుల గెలుతువే ప్రాభవమున


తే.

సాధుజనుల రక్షింతునే సవనకలన, వేలుపులఁ దృప్తినొందింతువే యటన్న
కుశకులుఁడు పల్కె సర్వత్ర కుశల మనుచు, వినయ మిగురొత్త నమ్మునివిభునితోడ.

995


వ.

ఇట్లు ధర్మిష్ఠు లగువసిష్ఠవిశ్వామిత్రులు పరమసంతుష్టు లై పరస్పరప్రియాలాపం
బులు నొక్కింతసేపు కుశలకథాప్రసంగంబులు సలిపి బద్ధానురాగు లై యు
న్నంతఁ గథాంతంబున భగవంతుం డగువసిష్ఠుండు విశ్వామిత్రుతో నిట్లనియె.

996

వసిష్ఠుఁడు విశ్వామిత్రుని చమూయుతముగఁ బూజఁ గైకొనఁ గోరుట

మత్తకోకిల.

రాజశేఖర నీవు ధాత్రికి రాజవౌటకతంబునం
బూజనీయుఁడ వెల్లభంగులఁ బుణ్యమూర్తివి నీకు నేఁ
బూజఁ జేసెన నర్హభంగిఁ జమూయుతంబుగ నేఁడు మ
త్పూజనంబుఁ బ్రతిగ్రహింపు మభూతపూర్వసుఖంబుగాన్.

997


తే.

మనుజనాయక యీవేళ మాగృహమున, నంచితంబుగ విం దారగించి యెల్లి
చనవలె నటంచుఁ బలికె నాజనవిభుండు, నింపు సొంపార నమ్మౌని కిట్టు లనియె.

998


చ.

అనఘచరిత్ర మీరు దయ నానతియిచ్చినమాటకంటె భో
జన మది యెక్కుడే సెల నొసంగినఁ బోయెద నంచుఁ బల్క న
ట్లనవల దంచు సారెకును బ్రార్థనఁ జేసిన మీరు వల్కిన
ట్ల నడచు గాక యంచు మనుజాధిపుఁ డెంతయు సమ్మతించినన్.

999


సీ.

మునినాథుఁ డప్పుడు తనహోమధేనువు మానుగా రప్పించి దాని కనియె
నందిని వినుమ యీనరనాథునకు బలంబునకు విం దొనరింపఁ బూనినాఁడ
మచ్ఛాసనమున నీమహిమ తేఁటపడంగ వలయు వస్తువులు నవ్వారి గాఁగఁ
దృటిలోన నిచ్చట సృజియింపు మని పల్క మీఱినభక్తి నాసౌరభేయి


తే.

షడ్రససమన్వితములుగా స్వాదుసంగ, తములుగాఁ బరిపాకభేదములు గాఁగ
రుచ్యములు గాఁగ నమ్మునిలోకవిభుఁడు, హర్ష మొందఁ బదార్థంబు లపుడు కురిసె.

1000

నందినీధేనువు విందుకు వలయువస్తువులు వర్షించుట

వ.

మఱియుఁ బర్వతోపమంబు లగునిష్టకించిదుష్ణాన్నరాసులును సూపంబులును
సద్యోఘృతకూపంబులును దధికుల్యంబులును నిక్షురసమధుమైరేయవరాసవం
బులును మహార్హంబు లగుపానంబులును నుచ్చావచంబు లగుభక్ష్యంబులును

సహ్యంబు లైనలేహ్యంబులును దూష్యంబులు గానిచోష్యంబులును షా
డబంబు లగునానాస్వాదురసంబులును గుడపూర్ణంబులును బరమాద్భుత
ప్రకారంబుగ ననంతంబుగా సృజియించిన నత్తెఱఁగు విలోకించి యద్భుతంబు
నొంది బ్రాహ్మణపురోహితామాత్యమంత్రిసుభృత్యసహితుం డై.

1001


చ.

కడు ముద మంది రాజు మునికాంతుని భూరితపోవిభూతి కిం
పడరఁగ హోమధేనువు మహామహిమంబున కిచ్చ మెచ్చుచున్
దృఢమతి వేయుభంగుల నుతించుచుఁ గాంచనభాజనంబునన్
గడి యొకమాడగాఁ గుడిచెఁ గాంక్షలు దీర యథాక్రమంబునన్.

1002


క.

మఱియుం దక్కినవారలు, వరుసన్ దమ కిచ్చ వలయు వస్తువు లెల్లం
గర మరుదుగ భుజియించిరి, పరమానందాత్ము లగుచు భానుకులేశా.

1003

విశ్వామిత్రుఁడు నందినిధేనువును గ్రహింప నిచ్ఛయించుట

చ.

జనపతి దృప్తి నొంది మునిచంద్రుని హోమగవిన్ గ్రహింప నె
మ్మనమునఁ గోరి యమ్మునికి మానుగ నిట్లనె లక్షగుఱ్ఱము
ల్ఘముగ లక్షధేనువులు లక్షమణుల్ మఱి లక్షకాంచనం
బెనయఁగ నిత్తు నోయనఘ యీమొదవుఁ గృప నిమ్ము నా కొగిన్.

1004


క.

మునివర గోరత్నం బిది, యనిశము పార్థివుఁడు రత్నహారియుఁ గానన్
వినుము పరికింప నిది నా, ధన మొసఁగుము దీని నాకు ధర్మముపేర్మిన్.

1005


సీ.

అనుచు విశ్వామిత్రుఁ డాడిన నమ్మాట విని వసిష్ఠుఁడు చాల విహ్వలించి
ధరణీశ మా కేల కరులు హయంబులు మణిరత్నములు ధేనుమండలములు
హవ్యకవ్యములకు నాధార యగుదానిఁ బ్రాణయాత్రకు మూల మయినదాని
స్వాహావషట్కారసర్వమంత్రక్రియావిద్యలనిలయ మై వెలయుదాని


తే.

నగ్నిబలిహోమసాధనం బైనదాని, నాత్మవంతునికీర్తియ ట్లనవరతము
నాశనము లేనిదాని సంతస మొసంగు, దాని నీదివ్యశబళ నీఁ దగదు నీకు.

1006


ఆ.

విడువఁదగనిదాని విడువుమ యని నీకుఁ, బలుక ధర్మ మగునె పార్థివేంద్ర
గోసువర్ణవాజికోటులు వే యైన, సురభి కెనయె గాధివరకుమార.

1007


వ.

అని పలికిన విశ్వామిత్రుండు సంరంభవిజృంభితుండై వసిష్ఠు నవలోకించి మహా
త్మా హైరణ్యకక్ష్యగ్రైవేయతోమరాంకుశభూషితంబు లగుపదునాల్గువేల
మత్తకుంజరంబులును గింకిణీజాలవిభూషితంబులును వేగవంతంబులును గాం
భోజసింధుదేశసంభవంబు లగుపదివేలహయంబులును శ్వేతాశ్వకలితంబులు
చతురశ్వయుతంబు లగునెనమన్నూఱుకాంచనరథంబులును నానావర్ణవిభ
క్తంబు లగుకోటిపాడిమొదవులును మఱియు యథేష్టంబుగా మణిసువర్ణం
బు లిచ్చెదఁ బ్రతిగ్రహించి యీకల్మాషి నొసంగుమనిన నవ్వసిష్ఠుం డి ట్లనియె.

1008


ఉ.

రాజవరేణ్య మా కిదియె రత్నసువర్ణధనాదికంబులున్

వాజులు ధేనుసంతతులు వారణముల్ రథముల్ మఖక్రియల్
జేజెలు మెచ్చుజన్నములు జీవిత మాత్మతపఃఫలంబు వి
ద్యాజయశీలవృత్తగుణధర్మములున్ గృతకార్యసిద్ధియున్.

1009


వ.

కావున.

1010


ఉ.

ఎంత బహూకరించిన నహీనజవాశ్వము లెన్ని యిచ్చినం
బంతముతోడ ధేనువులు భద్రకరుల్ పదివేలకోట్లు కొం
డంతధనం బొసంగిన జనాధిప ధేనువు నీను నీకు నేఁ
డింత దురాశ యేల జనియించె వచింపక పొమ్ము నెమ్మదిన్.

1011

విశ్వామిత్రుఁడు నందినీధేనువును బలాత్కారముగాఁ గొనిపోవుట

చ.

అనవుడు గాధినందనుఁ డహంకృతి నీతని నింత వేఁడఁగా
మన కిఁక నేల మౌని బలుమానిసిచంద మెఱుంగ నేర్చునే
వనముల నాకలంబు దిని వాడుట యొక్కటిగాక యంచుఁ జ
య్యన శబళన్ గ్రహించి చతురంగయుతంబుగఁ బోవు చున్నెడన్.

1012


తే.

మనుజనాథునిచే హ్రియమాణ యగుచుఁ, జాలదుఃఖిత యై మౌని శబళ యపుడు
దారుణధ్వని నేడ్చుచుఁ దనమనమున, నిట్లని కడంకఁ జింతించె నినకులేశ.

1013


చ.

తనహృదయం బెఱింగి సతతంబు మెలంగుచు వాఙ్మనోగతుల్
దనపయిఁ జేర్చి భక్తినయి తద్దయుఁ గొల్చెడునన్నుఁ గావరం
బున నిపు డిట్లు బల్మిఁ గొనిపోవఁగఁ జూచి వసిష్ఠుఁ డేలకో
కనల కుపేక్షఁ జేసె నపకార మొకింత యెఱుంగ నక్కటా.

1014

విశ్వామిత్రగృహీత యై నందిని వసిష్ఠునియొద్దకు వచ్చి మొఱ లిడుట

వ.

అని బహుప్రకారంబులం దలపోసి నిట్టూర్పు నిగుడించి.

1015


ఉ.

వారిని జీఱికిం గొనక వందర చిందర లాడి కొమ్ములం
జీరి నఖమ్ములం జదిపి చిక్కక చిక్కులఁ బెట్టి బెట్టుహుం
కారముతో నదల్చుచు రయంబున దాఁటి మునీంద్రచంద్రునిం
జేరఁగఁ బోయి యి ట్లనె వసిష్ఠుపదంబుల వ్రాలి దీనయై.

1016


మ.

నను బల్మిన్ గొని భూవరుం డరుగుచున్నాఁ డీవు వారింప కి
ట్లునికిం బాడియె నీకు న న్నతని కి ట్లొప్పింపఁగాఁ జెల్లునే
యనఘా నే నపరాధి గా నకట యి ట్లన్యాయపుంగృత్యముల్
గని మీ రూరకె యుండుట ల్కృప దొలంగం ద్రోచు టింతే కదా.

1017


వ.

అని పెక్కువిధంబుల భగినియుం బోలె విలపించుచుఁ గన్నీరు మున్నీరుగా
రోజనంబుఁ జేసిన నమ్మొదవుదృఢభ క్తివినయములకు మెచ్చి సస్నేహంబును
సగౌరవంబునుం గా ని ట్లనియె.

1018


ఉ.

ఏటికి నిన్ను నే విడుతు నెంతయు నీతఁడు దోర్బలంబునం

బోటరి యౌచు నిన్నుఁ గొని పోయెడుఁగాని పయోధిసంఘముల్
ధాటికి మేర మీఱినవిధంబున రాజులు న్యాయహీను లై
పాటి దొఱంగి వచ్చినను బ్రాహ్మణు లెంతటివారు చెప్పుమా.

1019


క.

ఈక్షోణికి విభుఁ డీతం, డక్షౌహిణ్యన్వితుండు నది గాక యితం
డక్షీణసమరదోహలుఁ, డీక్షితిపతి నెట్లు గడతు నింతయుఁ జెపుమా.

1020


ఉ.

నా విని వేల్పుటావు మునినాథుని కి ట్లను బ్రహ్మతేజమున్
క్ష్మావరభూరితేజమునకంటెను మిక్కిలిగా నెఱుంగుదుం
గావున నీప్రతాపమునకంటె నృపాలునితేజ మెక్కు డౌ
నావసుధేశుసైన్యముల నామ మణంచెదఁ బంపు న న్ననన్.

1021


వ.

అని పలికిన యానందినివచనంబు విని వసిష్ఠుండు దాని నవలోకించి శత్రు
బలంబుల నాశంబు నొందించునట్టిసైన్యంబు సృజింపు మని యాజ్ఞాపించిన నా
సురభి బ్రహ్మతేజోసంభృత యై హుంకారంబుఁ గావించిన నమ్మహారవంబువల
నఁ బప్లవు లనేకులు జనించి విశ్వామిత్రుని సర్వసైన్యంబు నాశనంబు నొందిం
చిన నతండు కోపించి రథంబుఁ దోలించి యాక్రమించి.

1022


క.

కడువడి లోచనములఁ గెం, పడరఁగ నుచ్చావచంబు లగుశస్త్రములన్
విడక యరాతుల నందఱఁ, బొడిపొడి గావించె భూరిభుజబల మలరన్.

1023


తే.

మానవేంద్రశస్త్రార్దితు లైనవారిఁ, బప్లవులఁ జూచి శబళ కోపంబు గదుర
యవనపప్లవమిశ్రితు లైనశకుల, నపుడు పుట్టించెఁ గ్రమ్మఱ నద్భుతముగ.

1024


వ.

ఇట్లు సృజించిన వారు దీర్ఘాసిపట్టిసప్రాసపాణులును హేమకింజల్కసన్నిభు
లును గాంచనవర్ణాంబరావృతులును మహాప్రభావసంపన్నులును నై పుడమి
నాచ్ఛాదించి పావకశిఖలు శుష్కారణ్యంబు నేర్చువిధంబున విశ్వామిత్రుని
బలంబు నెల్ల నిర్దగ్ధంబుఁ గావించినం గినిసి.

1025


క.

మానవపతి శరజాలము, జానుగఁ బరఁగింప యవనశకబల మెల్లన్
మీనక్షోభప్రచలిత, మైనమహాహ్రదముభంగి నాకుల మయ్యెన్.

1026


క.

నరపతిచేతను సైన్యము, గరువలిచేఁ బండుటాకుగతి సుడివడినన్
బరికించి తపసి ధేనువు, నరుదుగ బలముల సృజింపు మని పురికొల్పెన్.

1027


వ.

ఇట్లు వసిష్ఠచోదిత యై యక్కామదోహిని దత్క్షణంబ హుంకారరవంబుల
వలన రవిసన్నిభు లగుకాంభోజులను బొదుఁగువలన నానాస్త్రశస్త్రపాణు
లగుపప్లవులను యోనిదేశంబువలన భీషణాకారు లగుయవనులను శకృద్దేశం
బువలన నంతకరూపు లగుశకులను రోమకూపంబులవలన దంష్ట్రాకరాళవక్త్రు
లగుకిరాతులం బుట్టించిన నబ్బలంబులు విశ్వామిత్రబలంబులపయిం గవిసి
శతాంగమాతంగతురంగభటాంగంబుల నాజిరంగంబునఁ గసిమసంగి పొడ
వడంగించిన.

1028

చ.

తనబల మంతయున్ ముని యుదారతపోబలసంపదన్ జెడ
న్గనుఁగొని మానవేంద్రుడు మనంబున నచ్చెరు వొంది చూడఁ ద
త్తనయులు నూర్గు రుద్ధతు లుదగ్రులు రోషవిభీషణాంగు లై
మునిపతి డాసి బి ట్టవియ మొత్తుద మంచుఁ గడంగి శూరతన్.

1029

వసిష్ఠునికోపంబున విశ్వామిత్రునిసైన్యంబులు హతము లగుట

తే.

గిట్టి బెట్టుగ నమ్మౌనిఁ జుట్టు ముట్టి, యట్టహాసంబు సేసిన నట్టె గినిసి
యట్టె కన్నుల మిడుఁగుఱు లుట్టిపడఁగ, గట్టితనమునఁ జెడుఁడంచుఁ దిట్టుటయును.

1030


క.

వా రామునికోపంబున, వీరత్వము శూరతయు వివేకము నెడగా
నీఱై చనిరి మునుల కప, చారంబు లొనర్చునట్టిశఠులు మడియరే.

1031


వ.

ఇట్లు బలంబును గుమారులును నిశ్శేషంబుగా వసిష్ఠునిదివ్యప్రభావంబున
హతు లైనం జూచి విశ్వామిత్రుండు వ్రీడితుం డై నిర్వేగం బగుసముద్రంబు
చందంబున భగ్నదంష్ట్రం బగుభుజంగంబుకైవడి నుపరక్తుం డగుభాస్కరుని
భంగి లూనపక్షం బగువిహంగమంబుచాడ్పున హతపుత్రుండును హతబలుం
డును హతదర్పుండును హతోత్సాహుండును బరమనిర్వేదనపరుండు పై
నిష్ప్రభత్వంబు నొంది.

1032


ఉ.

కొడుకులపాటుఁ జూచి నృపకుంజరుఁ డెంతయు దుఃఖరోషముల్
వొడమఁగఁ బట్టణంబునకుఁ బోయి యుదారుఁ గుమారు నొక్కనిన్
బుడమికి రాజుఁ జేసి చలమున్ మెఱయన్ హిమశైలమందు లో
నడరినభక్తి మీఱ నలికాక్షునిఁ గూర్చి తపం బొనర్పఁగన్.

1033

విశ్వామిత్రుఁడు శివునివలన సమస్తాస్త్రంబులు పడయుట

క.

జనవరుఁ డొనరించుతపం, బున కెంతయు మెచ్చి భుజగభూషణుఁడు రయం
బునఁ బ్రత్యక్షం బై నె, మ్మనమునఁ గృప గదురఁ బలికె మధుమధురోక్తిన్.

1034


క.

నరవర ఘోరతపం బిటు, కర మరుదుగ నేమి గోరి కావించెదవో
వర మొసఁగ వచ్చినాఁడను, గురుమతి నిష్ట మగుదానిఁ గోరు మొసఁగెదన్.

1035


క.

నా విని విశ్వామిత్రుఁడు, భావంబునఁ బొంగి శివునిపాదంబులకుం
గేవలభక్తి నమస్కృతిఁ, గావించి వచించె ఫాలకలితాంజలి యై.

1036


మ.

కృప నాపైఁ గలదేని శంకర ధనుర్విద్యారహస్యంబు య
క్షపతంగోరగసిద్ధచారణనుమరుత్క్రవ్యాదశస్త్రాస్త్రముల్
విపులప్రక్రియ సర్వమున్ దెలియఁగా వేర్వేఱ సాంగంబుగా
నుపదేశింపు మటంచు శత్రుమదనప్రోత్సాహి యై వేఁడినన్.

1037


క.

మెచ్చి వచించిన వన్నియ, నిచ్చితి నరపాల యని మహేశ్వరుఁడు ముదం
బచ్చుపడ వెండికొండకు, విచ్చలవిడి నరిగె దేవవితతులు గొల్వన్.

1038


వ.

అంత.

1039

క.

అన్నరవిభుఁ డివ్విధమున, నన్నగకార్ముకునిచేత నఖిలజగములం
దెన్ని గల వన్ని బాణము, లున్నతగతిఁ బడసి సంగరోత్సాహమునన్.

1040


శా.

శుంభల్లీల మహోగ్రుఁడై కుపితుఁడై పొం పొందుకల్పాంతకృ
చ్ఛంభుండో యన దుస్సహప్రకటదోస్సారంబు దీపింపఁగా
నంభోధిక్రియ నింగిఁ బొంగి సమరవ్యాపారలీలాకళా
రంభం బొప్ప వసిష్ఠునాశ్రమము సేరం బోయి యత్యుద్ధతిన్.

1041

విశ్వామిత్రుఁడు మహాస్త్రంబుల వసిష్టునాశ్రమముమీఁదఁ బ్రయోగించుట

మ.

నియతిన్ ఘోరశరంబు లేసిన మహాగ్నిజ్వాలికామాలికల్
వియదాగారము భూతధాత్రియు దిశల్ భీమాకృతి న్నిండఁగన్
భయదప్రక్రియ విస్ఫులింగచయశబ్దంబుల్ రహి న్మ్రోయఁగ
న్రయ మొప్పారఁ బొగల్ మహీస్థలము నంధత్వంబు నొందింపగన్.

1042


వ.

అమ్మహనీయదివ్యాస్త్రంబులు రభసాతిశయంబునం బఱతెంచి వసిష్ఠముని
యాశ్రమవనంబుఁ జుట్టుముట్టి దహింపం దొడంగినఁ దదీయభీషణజ్వాలా
సంతప్తంబు లై ఖగమృగంబులును వసిష్ఠశిష్యులునుం దక్కినమునులును భయ
భీతు లై విరావంబులు సేయుచు దశదిక్కులకుం బఱచిరి తదీయాశ్రమం
బొక్కముహూర్తం బిరిణసన్నిభం బై యుండె నప్పు డక్కలకలం బాలించి
యది విశ్వామిత్రునికృత్యం బని యెఱింగి భాస్కరుండు నీహారంబునుం బోలె
గాధేయు నిప్పుడు నాశంబు నొందించెద నోడకుండుం డని వారి కందఱ కభ
యంబుఁ దెల్పి పాదవిన్యాసంబునఁ బుడమి గ్రక్కదల బ్రహ్మదండంబు మహో
ద్దండదండధరకాలదండంబుకరణిఁ బ్రచండలీలం గేలం గ్రాల విధూమకాలాగ్ని
యుం బోలె మండుచు రౌద్రరసోల్లాసమూర్తి యై శీఘ్రంబునం బఱతెంచి నిజ
కోపాగ్నిజ్వాలాజాలదహ్యమానవిశ్వామిత్రప్రయుక్తవిశిఖశిఖాపరంపరుం
డగుచు విశ్వామిత్రు నాలోకించి ప్రళయజీమూతసంఘాతసంజాతగర్జాసముజ్జృం
భణగంభీరభాషణంబుల ని ట్లనియె.

1043


తే.

వినుము మూఢాత్మ చిరపరివృధ్ధ మైన, యాశ్రమము దగ్ధ మొనరించి తందువలనఁ
గడు దురాచారపరుఁడవు కలుషబుద్ధి, వైతి వింక నశించెదు నీతిదూర.

1044


వ.

అని పలికిన నవ్విశ్వామిత్రుండు గోపించి చాపంబునం దాగ్నేయాస్త్రంబును
సంధించి నిలు నిలు మని యదల్చిన నవ్వసిష్ఠుండు కాలదండంబుఁ బోనిబ్రహ్మ
దండం బెత్తి పరమసంక్రుద్ధుండై విశ్వామిత్రున కి ట్లనియె.

1045


తే.

ఓరి రాజ్యమదాంధుఁడ యోరి శఠుఁడ, కడఁగి పుణ్యాశ్రమము లిట్లు కాల్పఁదగునె
యింత కే నేడ నీ వేడ నిట్టిపాప, కార్యము లొనర్పఁ బాడియె కలుషబుద్ధి.

1046

ఉ.

బ్రహ్మబలం బెఱుంగక నృపాలుఁడ నంచు మదాభిమాని వై
బ్రహ్మసమాను నన్ను వడి బాములఁ బెట్టఁగ వచ్చి తీవు మ
ద్బ్రహ్మబలంబున న్నిను శరంబులవ్రేల్మిడి గీ టణంచెదన్
బ్రహ్మవిరోధి నీదగుబలం బది సర్వముఁ జూపు మిత్తఱిన్.

1047

వసిష్ఠుఁడు బ్రహ్మదండమున విశ్వామిత్రునియస్త్రముల నన్నియు మడియఁ జేయుట

వ.

అని పలికి కాలదండంబుం బోనిబ్రహ్మదండంబుచే విశ్వామిత్రునియాగ్నే
యాస్త్రంబులు సలిలంబున వహ్నివేగంబుంబోలె శాంతి నొందించినఁ గనలి
విశ్వామిత్రుండు గ్రమంబున రౌద్రంబును నైంద్రంబును బాశుపతంబును
నైషీకంబును మానసంబును మోహనంబును గాంధర్వంబును స్వాపనంబును
జృంభణంబును సంతాపంబును విలాసంబును శోషణంబును మార్గణంబును
సుదుర్జయం బగువజ్రంబును బ్రహ్మపాశంబును గాలపాశంబును వరుణపాశం
బును బినాకాస్త్రంబును శుష్కార్ద్రనామకం బైనయశనిద్వయంబును
దండాస్త్రంబును బైశాచంబును గ్రౌంచంబును ధర్మచక్రంబును గాలచక్రం
బును విష్ణుచక్రంబును వాయవ్యాస్త్రంబును మథనంబును హయశిరంబును
శక్తిద్వయంబును గంకాళంబును గాపాలంబును గంకణంబును ముసలంబును
వైద్యాధరాస్త్రంబును గాలాస్త్రంబును దారుణం బగు త్రిశూలంబును మొద
లుగా ననేకాస్త్రశస్త్రపరంపరలు పరఁగించిన.

1048


చ.

ఇటు కుశవంశజుం డడరి యేయు మహోగ్రశితాస్త్రశస్త్రముల్
చటులరవంబులన్ భువనజాలములన్ సుడిఁ బెట్టెఁ గాని యా
జటి నొక టేని నొంచుటకుఁ జాలదు తత్పృథుశక్తి యెట్టిదో
కుటిలులు సేయుకృత్యములు కోరి మహత్ములచెంతఁ జేరునే.

1049


ఉ.

అప్పుడు బ్రహ్మదండమున నమ్మునిశేఖరుఁ డుప్పరంబునం
దెప్పర మై తనర్చి పఱతెంచునరేంద్రునియస్త్రపఙ్క్తి నే
ర్పొప్పగఁ ద్రుంచి యొ ప్పెసఁగె యోగివరేణ్యుఁడు దత్త్వబోధచేఁ
గప్పినయింద్రియస్ఫురణ గ్రక్కున మాన్చి చెలంగుకైవడిన్.

1050


శా.

బ్రహ్మణ్యుం డగుమౌనిచేఁ దనశరవ్రాతంబు లి ట్లౌటకున్
బ్రహ్మణ్యుం డితఁ డన్యసాధనములన్ బంచత్వ మొందం డిఁకన్
బ్రహ్మాండం బటు తల్లడిల్లఁగఁ జతుర్వారాసు లింకన్ దగన్
బ్రహ్మాస్త్రం బడరింతు నంచుఁ జల మొప్పం గౌశికుం డుద్ధతిన్.

1051


మ.

తగ నయ్యస్త్రము మౌర్వితో నియమమంత్రస్ఫూర్తి సంధించినన్
బగిలెన్ మిన్ను కులాద్రు లొడ్డగిలెఁ గంపం బొంది మ్రోసెన్ దిశ
ల్ఖగరాజుల్ గతి దప్పి రంబునిధికీలాలంబు లింకెన్ గజో
రగముల్ మ్రొగ్గె జగంబు ఘూర్ణిలెఁ బరిత్రస్తాత్ము లై రందఱున్.

1052

వ.

ఇట్లు సముచితంబుగా సంధించి విశ్వామిత్రుఁ డమ్మహనీయాస్త్రంబు లోక
క్షోభంబుగాఁ దిగిచి విడిచిన.

1053


మ.

చటులస్ఫూర్తి మిడుంగుఱుల్ సెదర దిక్చక్రంబునందున్ జట
చ్ఛటశబ్దంబులు పెల్లు రేఁగి దివియున్ క్ష్మాభాగమున్ నిండ ను
త్కటవేగంబున లోకజాలములు మ్రింగన్ వచ్చుమాడ్కిన్ మహో
త్కట మై మండుచు బహ్మదండమును గిన్కన్ దాఁటి యేతేరఁగన్.

1054


చ.

కనుఁగొని మౌని ము న్నలయగస్త్యమునీశ్వరుఁ డబ్ధిపూరమున్
ఘనముగ నొక్కగ్రుక్కఁ గొనుకైవడి గ్రక్కున వక్త్రగహ్వరం
బనువుగ విచ్చి మ్రింగె నపు డస్త్రము తాపసుగర్భమందుఁ జ
య్యన వెలిఁగెన్ మహార్ణవమునందు వెలింగెడుబాడబం బనన్.

1055


వ.

అప్పు డత్తేజోమూర్తి దివ్యరూపంబు త్రైలోక్యమోహనం బై రౌద్రం బై
దారుణప్రకారంబునం బొలిసె మఱియు.

1056


ఉ.

ఆరయ నిట్టు లమ్మునికులాగ్రణి తత్ప్రథితాస్త్రరాజము
న్వారక మ్రింగి భాస్కరునివైఖరి శోభిలె నంత నమ్మహో
దారుని యంగరోమసముదాయములన్ శిఖ లుప్పతిల్లి బల్
దారుణభంగి లోకములఁ దద్దయు నేర్వఁ దొడంగె నయ్యెడన్.

1057


వ.

ఇట్లు భువనభయంకరుం డై ప్రళయకాలమార్తాండుండువోలె దుర్నిరీక్షుం డై
వెలుంగుచున్న వసిష్ఠునిం జూచి భయంబుఁ గొని దేవర్షి గణంబు లచ్చటికిం
జనుదెంచి ప్రస్తుతించుచు ని ట్లనిరి.

1058


ఉ.

మానవభర్త బల్ దురభిమానమునం జెనకంగ వచ్చి నీ
చే నిగృహీతుఁ డయ్యె మునిశేఖర ని న్గని లోకముల్ భయ
స్థానము లయ్యె నింకిటఁ బ్రసన్నుఁడ వై కృపఁ బూని భూతముల్
దీనత వీడ నీదు ఘనతేజము తేజమునన్ ధరింపుమా.

1059


క.

అని ప్రార్థించిన మునిపతి, తన రౌద్రత విడిచి సౌమ్యదర్శనుఁ డయ్యెన్
మునులు తెలివొంది రనిమిషు, లనుపమహర్షాబ్ధి నోలలాడిరి వరుసన్.

1060

విశ్వామిత్రుఁడు వసిష్ఠుచే నవమానితుండై తపంబుఁ జేయఁ బోవుట

వ.

అంత నవ్విశ్వామిత్రుండు పరాభవంబు నొంది సారెసారెకు నిట్టూర్పులు
వుచ్చుచు నమ్మునీంద్రుం డొక్కబ్రహ్మదండంబున మదీయదివ్యబాణంబు లన్ని
యు నాశంబు నొందించె బ్రహ్మతేజోబలంబే బలంబు గాక క్షత్రియబలం బేటి
బలం బని నిందించి బ్రసన్నేంద్రియమానసుండనై తపంబు చేసి బ్రహ్మత్వంబు
పడసెదఁ గా కని నిశ్చయించి వసిష్ఠుతోడఁ గృతవైరుండై భార్యాసమన్వి
తంబుగా దక్షిణదిక్కునకుం బోయి యం దొక్కతపోవనంబున ఫలమూలాశ
నుండై మానసేంద్రియంబులు జయించి ఘోరతపంబు సేయుచు హవిష్యంద

మధుష్యందదృఢనేత్రమహారథు లనుసత్యధర్మపరాయణుల నల్వురఁ బుత్రులఁ
బడసి.

1061

బ్రహ్మ విశ్వామిత్రునకుఁ బ్రత్యక్షమై రాజర్షిత్వం బొసంగుట

మ.

చలమున్ డింపక గాధినందనుఁడు నిష్ఠాభక్తియుక్తంబుగా
జలజాతప్రభవుంగుఱించి బహువర్షంబుల్ తపం బుద్ధతిన్
జలుపన్ మెచ్చి విరించి వచ్చి వసుధేశా నీతపఃప్రౌఢి కిం
పలరన్ మెచ్చితి సంస్తుతిన్ బడయు మయ్యా యింక రాజర్షి వై.

1062


మ.

అని రాజర్షి పదం బొసంగి ద్రుహిణుం డంతర్హితుం డైన న
య్యనఘుం డింతతపంబుఁ జేసియును బ్రహ్మర్షిత్వముం గాంచ నై
తిని రాజర్షిపదం బిదేల యనుచున్ దీవ్రవ్రతప్రక్రియన్
ఘనకౌతూహలుఁడై యఖండతనముం గావించుచుండెన్ రహిన్.

1063

త్రిశంకుమహారాజు సదేహముగా స్వర్గముఁ బొందఁ గోరుట

సీ.

అప్పు డిక్ష్వాకువంశాంభోధిచంద్రుండు వినుతకీర్తి త్రిశంకు జనవిభుండు
తనువుతోడనె గూడి తా నాకలోకంబునకుఁ బోవఁ దగుజన్న మొకటి సేయఁ
బూని భక్తి వసిష్ఠమునిపాలి కేతెంచి యుచితసపర్యల నుపచరించి
యనఘ యిక్ష్వాకువంశాధీశులకు నెల్ల నిఖలకామదుఁడవు నీవె కావె


తే.

మిగుల కృప గలవారి కగునె కొఱఁత, లమరలోకంబునకు స్వదేహంబుతోడ
నరుగఁదగినట్టి యొకయాగ మర్థితోడ, నమర నాచేతఁ జేయింపు మయ్య యనిన.

1064


చ.

ఘనుఁడు వసిష్ఠుఁ డిట్లనియె గాత్రముతో సురరాజువీటికిన్
జనఁగ నసాధ్య మెవ్వరికి క్ష్మావర ము న్నిటువంటియాగ మే
జనపతులైనఁ జేసిరె విచారము చేయక యిట్టియధ్వరం
బొనరుపఁ బూను టెట్టు లిటు లొప్పనికార్యము కాదు పొ మ్మిఁకన్.

1065

త్రిశంకుఁడు వసిష్ఠుచేతఁ దిరస్కృతుం డై వపిష్ఠపుత్త్రులపాలి కరుగుట

వ.

అని పలికిన నమ్మహీరమణుండు వసిష్ఠునిచేతఁ బ్రత్యాఖ్యాతుండై లజ్జావనత
వదనుం డగుచు దక్షిణంబునకుం జని యందు సంశితవ్రతులై తపంబు సేయు
చున్నవారి సూర్యసంకాశుల వసిష్ఠపుత్రుల నూర్వురం గని యానుపూర్విగా
నగ్గురుకుమారులకు నమస్కరించి కృతాంజలిపుటుం డై యిట్లనియె.

1066


సీ.

అనఘాత్ములార యే నంగంబుతోఁ గూడ దివి కేగఁ దగునట్టిసవన మొకటి
సేయంగఁ బూని వసిష్ఠునికడ కేగి ప్రార్థింపఁ గాదు పొమ్మనియె నింక
మీకన్న నెవ్వారు నాకు శరణ్యులు గురుసుతులగు మీకు శిరముతోడ పు
నభివాదనముఁ జేసి యాచించెదఁ గృపాప్తి యాజకులై విూర లట్టిక్రతు

తే.

తవిలి నాచేతఁ జేయింపుఁ డవనిపతులు, గురువుల ప్రసాదమునఁ గాదె కోర్కె వడయు
టెల్ల మీకృప నయ్యాగ మెలమిఁ జేసి, నేను జరితవ్రతుండనై నెగడవలదె.

1067


వ.

అని పలికినఁ ద్రిశంకునివచనంబులు విని క్రుద్ధులై వసిస్థి పుత్రు లతని కి ట్లనిరి.

1068


మ.

భువి నిక్ష్వాకుల కెల్ల నొజ్జ త్రిజగత్పూజ్యుండు సత్యప్రతి
శ్రవుఁ డస్మద్గురుఁ డత్తపస్విపలుకుల్ దాఁటంగ లే రెవ్వ రా
రవితుల్యుండు గురుండు కాదనినఁ కార్యం బట్టె వోనీక భూ
ధవ శాఖాంతర మొంది తీవు తగునే ధర్మంబుఁ దప్పింపఁగన్.

1069


వ.

భగవంతుం డగువసిష్ఠుం డశక్యం బన్నదాని నే మెట్లు సాధింపనేర్తు మతం డాడిన
మాట సత్యం బగుంగాని రిత్త యగునే నీవు బాలిశుండ వగుటం జేసి మ మ్మ
డుగ వచ్చితి వమ్మహానుభావున కవమానంబు సేయుటకు సహింపంజాలము నీ వీ
దుర్విచారంబు విడిచి పురంబునకుం బొమ్మని పలికినఁ గ్రోధపర్యాకులాక్షరం
బగువాసిష్ఠుల వచనంబు విని వెండియుఁ ద్రిశంకుం డి ట్లనియె.

1070


తే.

తొలుత మీతండ్రిచే నట్లు త్రోయఁబడితిఁ, బిదప మీచేత నిటు లైతిఁ బెద్ద సేయఁ
జనునె మి మ్మింక నే నన్యు శరణ మొంద, నరిగిన శుభంబు గలుగుఁగా కరయ మీకు.

1071

వసిష్ఠపుత్రులు త్రిశంకునిఁ జండాలుఁడవు గమ్మని శపించుట

వ.

అనిన ఘోరాభిసంహితం బగునమ్మహీపతివచనంబు విని.

1072


క.

మండిపడి మునికుమారు ల, ఖండతపోమహిమ వెలయ క్ష్మాతలవిభునిం
జండాలుండవు గమ్మని, చండతరక్రోధ మరల శపియించి రొగిన్.

1073


వ.

ఇట్లు శపించి మునిపుత్రులు నిజాశ్రమంబుఁ బ్రవేశించి రంత నారాత్రి చనిన
మఱునాఁడు.

1074


క.

దండి సెడి మునికుమారక, చండతరక్రోధజనితశాపంబున భూ
మండలపతి కష్టం బగు, చండాలత్వము వహించె జనవరతనయా.

1075


సీ.

అపుడు వాసిష్ఠకోపాగ్నితేజంబున నలిఁ గాలెనన మేను నల్లనయ్యె
నెఱిమించుపైఁడివన్నియ సన్న మగుపట్టుకమ్మిచీరయు మేచకత్వ మొందెఁ
బ్రణుతకాంతిస్ఫూర్తిఁ బరఁగెడుసౌవర్ణమణిహారములు లోహమయము లయ్యె
వీడినశిఖతోడఁ బోడిమి సెడి నీచనామోక్తిభేదంబు లాముకొనియె


తే.

నరయఁ దజ్జాతి కనురూప మైనవేష, మంతయును దాల్చి కన్నవా రంత నంతఁ
బరవఁ గేవలచండాలభావుఁ డగుచుఁ, బురమునకు వచ్చి నంత నాభూవిభుండు.

1076


తే.

అతనిచండాలరూపంబు నరసిచూచి, పౌరులు సమాత్యభృత్యులు బంధుజనులు

నతని వర్జించి రంత నయ్యవనినాథుఁ, డార్తిఁ గుందుచు నేకాకియై రయమున.

1077

త్రిశంకుఁడు విశ్వామిత్రుకడ కేగుట

క.

జనములఁ జూచిన నొదుఁగుచుఁ, దనదురవస్థకును జాలఁ దలఁకుచు మదిలో
మునిసుతులచేఁత కులుకుచు, ఘనుఁ డగు నగ్గాధిసుతునికడకుం జనియెన్.

1078


క.

తనపాలికిఁ జనుదెంచిన, జననాథవరేణ్యుమేనిచండాలతయుం
గని కరము విస్మయంబునఁ, గనికర మెదఁ బొదవ ననియెఁ గౌశికుఁ డంతన్.

1079


చ.

నరవర సర్వధారుణికి నాథుఁడవై నయధర్మశాలివై
నఱలెడునీకు నిట్టిదురవస్థపురూప మి దేల వచ్చె నా
కెఱుకపడంగఁ జెప్పఁ మన నెంతయు నానృపమాళి దీనుఁడై
కరములు మోడ్చి సిగ్గుకొని గగ్గదికం దలవాంచి యిట్లనున్.

1080


చ.

ఎలమిగ మేనితోడ దివి కేగఁగఁజాలిన యొక్కయాగముం
బొలుపుగ నే నొనర్పు మదిఁ బూని వసిష్ఠునితోడఁ జెప్ప ని
వ్వలపనిజోలి యేటి కిటువంటిమఖం బొనరింపఁబోల దం
చలవడఁ జెప్పెఁ జెప్పుటయు నమ్మునిసూనులఁ జీరి వారితోన్.

1081


వ.

యే నిట్లంటి.

1082


తే.

దేహయుక్తుఁడనై యేను దివిజలోక, మునకుఁ బోవుట కర్హసవనము సేయఁ
బూనితిని దాని నాచేత మానితముగ, నర్థిఁ జేయింపుఁ డనినఁ గా దనిరి వారు.

1083


ఉ.

అంతటఁ గొన్నినిష్టురము లాడిన నమ్మనినాథపుత్రు ల
త్యంతదురంతరోషమతు లై నను మాలవు గ మ్మటంచు న
క్షాంతి శపించి రప్పు డది కారణ మే నిటు లౌట కో మహీ
కాంతశిఖావతంస తనకర్మఫలంబులు రిత్తవోవునే.

1084


ఆ.

పెక్కుధర్మములును బెక్కుదానంబులుఁ, బెక్కుజన్నములును బెంపుతోడఁ
జేసి గురుల కర్చఁ జేసితి గురువుల, కరుణలేమి నిట్టికార్య మయ్యె.

1085


తే.

అనఘ నావచనము కలనైన బొంకు, గాదు నేఁ డిట్టిమునిశాపకారణమున
నధ్వర మొనర్తు ననుమాట యనృతమయ్యె, ననుచు నామది వొక్కెడు నహరహంబు.

1086


తే.

ఇట్టియాపదలం దైన నింకమీఁదఁ, బట్టి సత్యంబు పాలింతుఁ బరమనిష్ఠ
నీదుగాఢానుకంపచే నోదయాబ్ధి, దైవ మై ననుఁ జేపట్టి ప్రోవుమయ్య.

1087


క.

దైవం బెక్కుడు పౌరుష, మేవంక నిరర్థకం బహీనగుణాఢ్యా
దైవాధీనము సర్వము, దైవమె పరమగతి యనుచుఁ దలఁచెద బుధ్ధిన్.

1088


తే.

అట్టిదైవింబుచే నుపహతుఁడ నైన, నాకు నీకంటె శరణ మన్యంబు లేదు
పురుషకారంబుచే దైవమును గడంగి, క్రమ్మఱింపంగఁ దగు దీవు గాధితనయ.

1089

విశ్వామిత్రుఁడు త్రిశంకుయాగమునకై ఋషుల నందఱఁ బిల్వపంపుట

చ.

అనిన దయాళుఁడై కుశకులాగ్రణి యి ట్లను నోడకుండు మో
జనవర దీనుని న్నినుఁ బ్రసన్నతఁ బ్రోచితి నింక మౌనుల
న్ఘనముగఁ బిల్వ నంపి సవనం బొనరించి వపుర్యుతంబుగా
ననిమిషనాథులోకమున కంపెద నీవచనంబు చెల్లఁగన్.

1090


క.

అనఘాత్మ శరణ్యుఁడ నగు, నను శరణము నొందినకతనం దగ నీకున్
మునుకొని నిర్జరలోకం, బనిశముఁ గరకలితమైన దనుచుఁ దలఁచెదన్.

1091


వ.

అని యూఱడిలం బలికి విశ్వామిత్రుండు తనపుత్రుల మహాప్రాజ్ఞుల హవిష్యం
దాదుల నవలోకించి మీరు యజ్ఞసంభారంబు లన్నియు నొనగూర్పుం డని
నియమించి శిష్యులం బిలిచి మీ రతిత్వరితగమనంబునం జని మదీయశాస
నంబుఁ దెలిపి బ్రహ్మవాదులును బహుశ్రుతులు నగు మహర్షుల నందఱ శిష్య
సుహృత్సహితంబుగా మత్సకాశంబునకుఁ దోడ్కొని రండు మద్వాక్యబలచో
దితుండై యెవ్వండు రాక నిరాకరించి నిందావాక్యంబుఁ బలుకు నతనిచేత
నుక్తం బైనదాని నంతయు నా కెఱింగింపుఁ డని పలికిన వారలు శీఘ్రంబున
దశదిక్కులకుం జని విశ్వామిత్రునివచనంబుఁ దెలిపి సమస్తసంయములం దో
డ్కొని వచ్చి విశ్వామిత్రు నుచితభంగి సందర్శించి కేల్మొగిచి యి ట్లనిరి.

1092


ఉ.

వీరె సమస్తసంయములు వేగమె వచ్చినవార లెంతయు
న్రారు వసిష్ఠునాశ్రమమునం గలమౌనులు వారు దక్క నీ
ధారుణిలోపలం గలుగుతాపసు లందఱు నేగుదెంచి రిం
కారయ నవ్వసిష్ఠనుతు లాడినపల్కులు చిత్తగింపుఁడీ.

1093


సీ.

చతురత వాటించి జన్నంబు సేయించువాఁడు రా జఁట మాలవాఁడు సేయు
నఁట వానిమఖమున నఖిలసంయమివర్యు లుండి భుజింతురే యుక్తిఁ జేసి
యచటి కెవ్విధమున నరుదెంచెదరు హవిర్భాగంబుఁ గొన సర్వయాగభుజులు
చెలఁగి గాధేయరక్షితుఁ డైనవాఁ డెట్లు సురవిష్టపమునకు నరుగఁగలఁడు


తే.

వినవిన విచిత్ర మిమ్మాట యనుచు వార, లమ్మహోదయసంయుతు లగుచుఁ జాల
నేత్రముల రక్తిమ చెలంగ నిష్ఠురముగఁ, గనలి దూషించి రనవుడు గాధిసుతుఁడు.

1094

విశ్వామిత్రుఁడు వాసిష్ఠమహోదయుల శపించుట

క.

కటము లదర లోచనములఁ, జిటచిటఁ బావకకణములు సెదరఁగ రోషో
త్కటమున మేను వడఁక మి, క్కుటముగఁ గలుషించి పండ్లు గొఱుకుచుఁ బలికెన్.

1095


వ.

అదూష్యుండ నైననన్ను దూషించినదురాత్ము లగువాసిష్ఠులు భస్మీభూతులై
కాలపాశంబునం గట్టువడి నిస్సంశయంబుగా నిప్పుడు యమసదనంబునకుం జని

యందు నానావిధనరకంబు లనుభవించి పదంపడి సప్తశతజన్మంబులు నీచజాతు
లం బుట్టి నిర్ఘృణులై వికృతులై విరూపులై మృతశునకమాంసభక్షకులై
భూలోకంబున వర్తింతురుగాక మఱియు నన్ను దూషించినదుర్బుద్ధి యగు
మహోదయుండు సర్వలోకదూషితుండై నిషాదత్వంబు నొంది ప్రాణాతిపాత
నిరతుండై నిరనుక్రోశత్వమత్క్రోధంబువలన దీర్ఘకాలంబు దుర్గతినొందుంగాక
యని యిట్లు మహాతేజుం డగువిశ్వామిత్రుండు మహోదయసహితు లైనవసిష్ఠ
పుత్రులఁ దపోబలనిహతులం గావించి ఋషిమధ్యంబున నొక్కింతసే పూర
కుండి తనచుట్ల నున్నమహర్షుల నందఱ విలోకించి యి ట్లనియె.

1096


మ.

మునులారా వినుఁ డింక నీమనుజరాణ్ముఖ్యుం ద్రిశంకున్ సుశీ
లుని ధర్మజ్ఞుని సత్యసంధునిఁ గృపాలోలున్ మహావైభవున్
ఘనపుణ్యుం గుణార్ద్రదృష్టిఁ గని యీగాత్రంబుతో జంభసూ
దనులోకంబున కేగునట్టిమఖ ముద్యత్ప్రీతిఁ గావింపరే.

1097


వ.

అని విశ్వామిత్రుం డాజ్ఞాపించిన నమ్మును లొక్కింత తమలో విచారించి యీ
విశ్వామిత్రండు పరమకోపనుం డితండు చెప్పినకార్యంబు ధర్మసహితంబు గా
దంటిమేని రోషితుండై దంభోళికఠోరఘోరవాక్యంబున శపించుం గావున
నితండు గఱపినమార్గంబున నిమ్మహీరమణుండు సశరీరుండై విశ్వామిత్రునితే
జంబున దివంబునకుం జనునట్టిమహాధ్వరంబు సేయించుట కర్తవ్యం బని నిశ్చ
యించి మంత్రకోవిదు లగుమహర్షులు యాగకర్మకౌశలంబు మెఱయఁ గల్పోక్త
ప్రకారంబున సర్వకర్మంబులు నిర్వర్తించుచుండి రప్పుడు.

1098

విశ్వామిత్రుఁడు తనతపోమహిమచేఁ ద్రిశంకుని స్వర్గమునకుఁ బంపుట

క.

ఆగాధిసుతుఁడు యాజకుఁ, డై గీర్వాణాధిపతుల హవదత్తహవి
ర్భాగముఁ గొనఁ బిల్చిన వా, రాగతి రా మనుచుఁ బలికి రంబరవీథిన్.

1099


క.

అన విని రోషము మదిలోఁ, బెనఁగొనఁ గౌశికుఁడు కుశపవిత్రము కేలన్
దనర స్రువ మెత్తికొని య, జ్జననాథునితోడ ననియె సమ్మతితోడన్.

1100


మ.

జగతీనాయక చింత సేయవల దశ్రాంతంబు నే సత్యవా
క్యగరిష్ఠుండన యేని ఘోరతప ముద్యన్నిష్ఠఁ గైశోర మా
దిగఁ గావింపుదునేని నాకమున కీదేహంబుతోఁ గూడఁ బో
యి గరీయస్థితి నుండు పొ మ్మనిన ధాత్రీశుండు సోల్లాసుఁడై.

1101


క.

అచ్చటిమును లందఱు కర, మచ్చెరువడి సూచుచుండ నపు డంగముతోఁ
జెచ్చెర దుర్లభ మయినవి, యచ్చరలోకమున కరిగె నద్భుతభంగిన్.

1102


వ.

ఇట్లు త్రిశంకుండు దివంబునకుం జనినఁ బురందరుండు బృందారకులతోడ
నాలోకించి.

1103


క.

చండాలుండవు నీ విం, దుండఁగఁ దగ దనుచు శక్రుఁ డొగిఁ ద్రోయింపన్

బెండు సెడి శీర్షము క్రిందై, మండలపతి వచ్చుచుండె మానము దూలన్.

1104


వ.

ఇ ట్లంతరిక్షంబుననుండి తలక్రిందుగా మహావాతపతితం బైనకల్పద్రుమంబుచం
దంబున విశ్వామిత్రా రక్షరక్ష యనుదు విలాపంబునం బ్రలాపించుచు వచ్చు
చున్న త్రిశంకుం జూచి కరుణావిధేయుం డగుగాధేయుండు నిలునిలు మని పలికి
తీవ్రరోషపరీతుండై సాక్షాత్ప్రజాపతియుం బోలె ఋషిమధ్యంబున వెలుం
గుచుఁ దనతపఃప్రభావంబున.

1105

విశ్వామిత్రుఁడు త్రిశంకునకై యన్యస్వర్గంబు సృజియించుట

క.

ఆక్షణమున నలుక సహ, స్రాక్షునితోఁ జలము మెఱసి యన్యస్వర్గం
బాక్షణమున సృజియించెను, దక్షుండై సకలభూతతతి వెఱఁ గందన్.

1106


తే.

ఇట్లు ప్రతినాక మొనరించి యెలమిఁ దార, కలను సప్తర్షులను వేఱె గలుగఁజేసి
వేఱె సురలను వజ్రికి వేఱె వజ్రి, నిపుడె కల్పింతు నని పల్కు నంతలోన.

1107


సీ.

పరమసంభ్రాంతులై సురసిద్ధచారణగరుడగంధర్వకిన్నరులు ముచులుఁ
గౌశికుపాలికిఁ గడురయంబున వచ్చి సానునయోక్తి ని ట్లనుచుఁ బలికి
రనఘాత్మ యీనృపుఁ డరయంగ గురుశాపహతుఁ డయ్యెఁ గావున నమరపదముఁ
బడయ నర్హుఁడు గాఁడు పరికింప కిట్లు కోపించి నీ కవునె శమింప వయ్య


ఆ.

యని గాధితనయుఁ డమరులఁ జూచి యీ, నృపుని మేనితోడఁ ద్రిదివమునకు
నర్థిఁ బంపువాఁడ నని ప్రతిజ్ఞ యొనర్చి, యింకఁ గాదు పలుకు బొంకు సేయ.

1108


సీ.

ఎందాఁక భూలోక మెందాఁక మీలోక మందాఁక నీలోకమందు నిలిచి
కడఁగి పాతకవీథికంటెఁ బై కుడుగక దివ్యతేజోజాలదీప్తుఁ డగుచు
నంబుజారిస్ఫూర్తి నలరుచు దేవత్వగతి నొప్పి తలక్రిందు గాఁగ నీతఁ
డీతారకలఁ గూడి యెలమి వాటించుచుఁ గృతపుణ్యుఁడై భూరికీర్తికలితుఁ


తే.

డగుచు వెలుఁగొందుఁగా కని యమ్మునీంద్రుఁ, డాన తిచ్చిన దేవత లట్ల గాక
యనుచుఁ బలికి విశ్వామిత్రు నభినుతించి, చనిరి యజ్ఞాంతమం దాత్మసదనములకు.

1109


వ.

అంత విశ్వామిత్రుండు త్రిశంకునకు శాశ్వతం బైనదివ్యస్థానం బొసంగి కృతకృ
త్యుండై యచ్చటిమహర్షుల నవలోకించి యిట్లనియె.

1110

విశ్వామిత్రుఁడు పశ్చిమదిక్కున కరుగుట

తే.

ఇమ్ము లే దిందు మనకుఁ దపమ్ము సేయ, మిక్కుటంబుగ విఘ్న మీప్రక్కఁ గలిగె
గాన మనమింక నొండొకకడకుఁ బోద, మనుచు వారలతోఁగూడ యచటు వాసి.

1111


వ.

విశాలతపోవనోపేతం బైనపశ్చిమదిక్కునకుం జని యందుఁ బుష్కరతీరంబు
లందు మూలఫలాశనుండై యత్యుగ్రతపంబుఁ గావించుచుండె నాసమయంబున.

1112


చ.

కలఁ డొకఁ డిందుకుందశితికంఠపురందరనాగవాహసం

కలితయశుండు సూర్యకులకంధిశశాంకుఁడు కోసలేంద్రుఁ డ
త్యలఘుఁడు నంబరీషుఁ డన నవ్విభుఁ, డొక్కమఖంబు సేయుచో
దలకొని పాకశాసనుఁడు తత్పశువుం గొనిపోయి డాఁచినన్.

1113


క.

అతనిపురోహితుఁ డి ట్లను, నతనికి నృప నీదు దుర్నయమునఁ బశు వొగిన్
హృత మయ్యె నరక్షిత యగు, క్షితివిభు హింసించు నాత్మకృతదోషంబుల్.

1114


క.

జనవర ప్రాయశ్చిత్తం, బొనరింపఁగ వలయు నిక్క మొగి నరపశువుం
గొని తెమ్ము యజ్ఞకర్మం, బనుపముగతిఁ జెల్లుచుండు నంతటిలోనన్.

1115


క.

నావిని మానవనాథుఁడు, గోవుల నొకలక్ష వెంటఁ గొని రయమున నా
నావనజనపదనగరత, పోవనవిషయములు నెమకి వోవుచు నొకచోన్.

1116


క.

భృగుతుంగమునకుఁ జని య, చ్చుగ నచ్చటఁ బేద యగుచు సువ్రతనియతిం
దగి యున్నఋచీకుం డను, జగతీసురవర్యుఁ గాంచి సమ్మద మొదవన్.

1117


తే.

తపముపెంపున రెండవతపనుమాడ్కిఁ, దనరు మునివర్యుపదములు తనశిరంబు
సోఁకఁ బ్రణమిల్లి పూజించి సువినయోక్తి, ని ట్లనియెఁ గేలు మోడ్చి మహీవరుండు.

1118


వ.

మహాత్మా యే నొక్కజన్నంబు సేయుచుఁ బ్రమాదంబున యాగపశువుం
గోల్పడి ప్రాయశ్చిత్తంబున కుపాధ్యాయుండు చెప్పినతెఱంగున నానాదేశంబుల
నరపశు వరయుచు నెందుం బడయఁ జాలక నీకడకుం జనుదెంచితి లక్షధేను
వుల నొసంగెదఁ బ్రతిగ్రహించి పశ్వర్థంబుగా నీకొడుకుల నొక్కని దయ
సేయు మని యడిగిన నతం డతని కి ట్లనియె.

1119


చ.

మనుజవరేణ్య నీపలుకు మంచిది నిత్యముఁ బెద్దవానిపై
ఘనముగ వేడ్క చేయుదును కావున వాని నొసంగ నన్న నా
తనిసతి పిన్నవానిపయిఁ దద్దయుఁ గూర్మి నొనర్తుఁ గానఁ ద
త్తనయు నొసంగ నన్నఁ దలిదండ్రుల మాటల కుమ్మలించుచున్.

1120


ఆ.

వారిలోన నడిమివాఁడు శునశ్శేఫుఁ, డవనివిభున కనియె నగ్రసుతునిఁ
దండ్రి ప్రోచుఁ బిన్నతనయు జనని ప్రోచు, వార లెట్లు నీకు వత్తురయ్య.

1121


క.

జనయిత్రీజనకులచే, తను విడువంబడితి నేను దగ నీవెంటం
జనుదెంచెద వారలకుం, గొనకొని వెస నిమ్ము లక్షగోధేనువులన్.

1122


చ.

అనిన ధరాధినాథుఁడు రయంబున న ట్లొనరించి తేరిపై
మునివరపుత్రు నుంచుకొని మోద మెలర్పఁగఁ బుష్కరాశ్రమం
బుస కటువోయి యప్పటికి మూఁడవకాలము డాయ వచ్చినం
బనివడి విశ్రమించె నరభర్త పథిశ్రమ వాయ నచ్చటన్.

1123


మ.

అపు డచ్చోటఁ దపంబు సేయుచు జితాహంకారుఁ డై యున్నలో

కపవిత్రుం దపనాభతేజు ననఘున్ గాధేయు నుద్యన్మతిన్
విపులశ్రేయుని బ్రహ్మతుల్యుని జగద్విఖ్యాతచారిత్రుఁ జూ
చి పరోద్వేజితుఁ డైన బాలుఁడు శునశ్శేఫుండు శోకార్తుఁ డై.

1124

శునశ్శేఫుఁడు విశ్వామిత్రుని శరణము నొందుట

క.

తన మేనమామ గావున, ఘనముగ నే మరల బ్రతుకఁ గంటి ననుచుఁ జ
య్యన మునిపదములపైఁ బడి, తనమోమున దైన్య మడరఁ దా ని ట్లనియెన్.

1125


క.

ఓతాపసవంశోత్తమ, మాతల్లియుఁ దండ్రియు నను మఖపశువుంగా
భూతలనాథున కిచ్చిరి, గోతతి నొకలక్ష నీడు గొని ముద మలరన్.

1126


ఉ.

తల్లియుఁ దండ్రియున్ గురువు దైవము దాతవు బాంధవవ్రజం
బుల్లమునం దలంప జటిలోత్తమ నా కిఁక నీవె సుమ్ము మే
నల్లుని దీనుని న్నను దయామతివై బ్రతికించి యీమహీ
వల్లభుజన్న మింక ననివార్యముగా ఫలియింపఁ జేయవే.

1127


సీ.

అనిన విశ్వామిత్రుఁ డతిదయాకలితుఁడై తనతనూభవుల నందఱకు ననియె
సుతులార పరలోకసుఖమునకే కదా సుతులఁ గోరుట యెల్లసుతులు మఱియు
జనకుని కోర్కులు సఫలంబు సేయుటకే కదా యిది సర్వలోకధర్మ
మదిగాన మాపాలి కిదె పరలోకంబు శరణంబు నొందె నీసత్యశాలి


తే.

మీరు పుణ్యులు ధర్మవిచారపరులు, ప్రాణమాత్రంబుచే నాకుఁ బరమనిష్ఠఁ
బ్రియ మొనర్పుఁడు తండ్రికిఁ బ్రియ మొనర్చు, కంటె సుతులకు వేఱొక్కఘనత లేదు.

1128


వ.

కావున మీయం దొక్కరుండు మహీపతియాగపశుత్వంబున కొడంబడి బా
లుం డగుశునశ్శేఫుని బ్రదికించి దేవతలఁ దృప్తి నొందించి యంబరీషునకు
యాగఫలం బొసంగి నావచనం బమోఘంబు సేయుండనిన మధుష్యందాదులు
సాభిమానంబుగా ని ట్లనిరి.

1129


క.

తనసుతుల విడిచి యన్యుని, తనయుని రక్షింప నీవు వలఁచితి వది భో
జనమందు నిందితం బగు, శునకపిశితమట్టు లిపుడు చూచెద మనఘా.

1130


క.

నావిని విశ్వామిత్రుఁడు, భావంబున నుమ్మలించి పటురోషమునన్
దావాగ్నమాడ్కి మండుచుఁ, గేవలకఠినోక్తి ననియెఁ గెరలి సుతులకున్.

1131


వ.

నావచనం బతిక్రమించి పితృవచనభయరహితంబును ధర్మవిగర్హితంబును
దారుణంబును రోమహర్షంబు నైన యీవాక్యంబు పలికితిరి గావున మీ రింక
వసిష్ఠపుత్రులభంగి ముష్టికజాతులం బుట్టి శునకమాంసభక్షకులై భూలోకంబున
వేయిసంవత్సరంబులు వర్తింపుఁ డని శపియించి యార్తుం డైనశునశ్శేఫునకు

నిరామయం బగు నట్లు మంత్రితభస్మధూళ్యాదిప్రక్షేపరూపం బైన రక్షల
గావించి యి ట్లనియె.

1132

శునశ్శేఫుఁడు విశ్వామిత్ర ప్రభావంబున నింద్రోపేంద్రులయనుగ్రహంబు వడయుట

ఉ.

ఇంపుగ నీ కొసంగెద మహీసురనందన రెండుమంత్రముల్
దెంపున నిన్ను యాజకు లతిస్ఫుటయూపమునందుఁ గట్టి హిం
సింపఁ గడంగు నప్పుడు విశేషమతిన్ జపియించు చగ్నిఁ గీ
ర్తింపుము శక్రముఖ్యు లరుదెంచి కృపన్ నినుఁ గాతు రత్తఱిన్.

1133


వ.

అని పలికి యింద్రోపేంద్రదేవతాకంబు లైనయద్దివ్యమంత్రంబు లుపదేశించినం
బ్రతిగ్రహించి శునశ్శేఫుండు ధీరుండై యతనిచేత ననుజ్ఞాతుండై యంబ
రీషుం గనుంగొని మహీంద్రా యింక నిచ్చటఁ దడవు సేయ నేల శీఘ్రంబుగం
జని యజ్ఞకర్మంబు లన్నియు నిర్వర్తింపు మనిన నతనిపలుకుల కలరి యంబరీ
షుండు రయంబున యజ్ఞవాటంబునకుం జని యాజకానుమతంబున రక్తమా
ల్యాంబరానులేపనంబుల శునశ్శేఫుని యాగపశువుఁగా నలంకరించి పవిత్రపాశం
బుల వైష్ణవం బగుయూపంబున బంధించె నిట్లు బద్ధుండై యతండు వహ్ని కభి
ముఖుండై విశ్వామిత్రుం డుపదేశించినదివ్యమంత్రద్వయంబు రహస్యంబుగా
నచలనిష్ఠ జపించి యింద్రోపేంద్రుల స్తుతించిన స్తుతితర్పితుండై తత్క్షణంబ సహ
స్రాక్షుండు పరమానందంబున నచ్చటికిం జనుదెంచి శునశ్శేఫుని బంధవిముక్తు
నిం జేసి దీర్ఘాయు వొసంగి యంబరీషునకు బహుగుణంబుగా యాగఫలం
బొసంగి నిజనివాసంబునకుం జనియె నమ్మహీవిభుండును గృతార్థుం డై నిజపురం
బునకుం జనియె.

1134

బ్రహ్మ విశ్వామిత్రునకు ఋషిత్వం బొసంగుట

తే.

అంతఁ గౌశికుఁ డచట సహస్రవత్స, రంబు లత్యుగ్రతపము సల్పఁగ విరించి
వచ్చి కుశికవంశజ నీవు వరఋషిత్వ, మొందితని చెప్పి చనియె నమందగతిని.

1135


క.

తనివి సనక గాధేయుం డనిశముఁ బరమేష్టిఁ గూర్చి యద్భుతభంగిన్
ఘననిష్ఠాతిశయంబున, సునిశితగతిఁ దపము సేయుచుం దనరునెడన్.

1136


క.

సురసంప్రేషితయై య, చ్చర మేనక యచటి కర్థిఁ జనుదెంచి మనో
హరవేష యగుచుఁ దగఁ బు, ష్కరజలముల మజ్జనంబు సలుపుచు నుండెన్.

1137

మేనక విశ్వామిత్రుతపంబునకు విఘ్నము జేయుట

క.

ఘనుఁడు మహాతేజుం డగు, మునిపతి కౌశికుఁ డతుల్యమోహనరూపన్
ఘనమధ్యస్థితసౌదా, మినిగతిఁ దనరారుదాని మేనకఁ గనియెన్.

1138


క.

కని దానితోడ నిట్లను, వనిత మదాశ్రమమునందు వసియింపుము మిం
చిన యనురాగంబున న, న్ననంగమోహితునిఁ బ్రోవు మనుపమబుద్ధిన్.

1139


వ.

అని నిజాభిప్రాయంబు తేటపడ నెఱింగించి యొప్పులకుప్ప యగు నప్పువ్వుఁ
బోఁడి నొడంబఱచి.

1140

ఆ.

కేళివనములందు గిరులందు నదులందుఁ, గొలఁకులందుఁ గుంజతలములందు
నన్నెలంతఁ గూడి యబ్దంబు లొకపది, యతనుకేళిఁ దేలె నమితగతుల.

1141


ఉ.

అంత వివేకియై కుశకులాగ్రణి యెంతటిమోస మయ్యె ని
క్కాంతకతంబునన్ సకలకల్మషముల్ వొదలెం దపోధనం
బంతయు వీటిఁబోయె దివిజాధిపుకృత్య మెఱుంగ నక్కటా
యెంతవివేకు లైన భువి నీశ్వరుమాయఁ దలంప నేర్తురే.

1142


చ.

అని యిటు చింత నొంది ముని యాదట మేనక నింద్రుపాలి క
ట్లనిచి గడంగి కామవిజయం బొనరించెద నం చుదీచికి
న్జని హిమపర్వతాంతికమునం దగఁ గౌశికిచెంతఁ జేరి ని
ష్ఠను దప మాచరించెఁ బ్రకటంబుగఁ దాను సహస్రవర్షముల్.

1143

బ్రహ్మ విశ్వామిత్రునకు మహర్షిత్వ మొసఁగుట

వ.

అమ్మహాతపంబునకు భయంబుఁ గొని వేల్పులు మహర్షిసమేతులై బ్రహ్మ
కడకుం జని విశ్వామిత్రునకు మహర్షిశబ్దం బొసంగుం డని ప్రార్థించిన నవ్విరించి
దేవతాసమన్వితంబుగాఁ గౌశికుకడకుం జనుదెంచి మునీంద్రా యేను భవత్త
పంబునకు సంతోషించితి నీకు మహర్షిశబ్దం బొసంగెదఁ జాలింపు మని పలి
కిన నవ్విశ్వామిత్రుండు విషణ్ణుండును సంతుష్టుండునుం గాక సర్వలోకేశ్వరుం
డైన యప్పితామహునకుఁ బ్రణతుండై యంజలిఁ గీలించి స్వార్జితంబు లైన
శుభకర్మంబులచేత నసమానం బైనమహర్షిశబ్దంబు నీచేత దత్తం బయ్యెనేని
యవ్వల నేను జితేంద్రియుండనే కదా యని యడిగిన నప్పరమేష్టి యతని
వాక్యంబు విని మునీంద్రా వికారకారణవస్తుసన్నిధానంబునందైన నెంతకా
లంబు వికారంబు గలుగుచుండు నంత కాలంబు నీకు జితేంద్రియత్వసిద్ధి గలుగ
నేరదు గావున నీవు తావత్కాలపర్యంతంబు తపంబుఁ గావింపు మని పలికి
యంతర్ధానంబు నొందె.

1144


క.

అట విశ్వామిత్రుఁడు ను, త్కటనిష్ఠామహిమఁ దపముఁ గావించుచు నా
దట బ్రహ్మర్షిస్థానముఁ, బటుతరముగఁ గాంతు ననుచుఁ బ్రజ్ఞాన్వితుఁడై.

1145


ఉ.

ఊరుపు పుచ్చ కట్లు తగ నూర్ధ్వకరుం డయి మారుతాశియై
వారక మండువేసవిని వహ్నులమధ్యమునందు నిల్చి సొం
పారఁగఁ బుండువంటివలియందు జలంబుల నిల్చి వృష్టియం
దూరక మింట నిల్చి కడు నుగ్రతపం బొనరించె ధీరతన్.

1146

ఇంద్రుఁడు విశ్వామిత్రునితపము మాన్ప రంభను నియోగించుట

ఉ.

అంత బలాంతకుం డదరి యాతనియుగ్రతపంబు మాన్ప న
త్యంతరయంబునం గువలయాక్షిని రంభను జీరి పల్కు నో
కాంత కుశాన్వయోత్తముని గాఢతపోగతి మాన్చి మా కిఁకన్

సంతతసౌఖ్యసంపద లొసంగుము వేగము పొమ్ము నావుడున్.

1147


ఉ.

అక్కలకంఠి యి ట్లనియె నకట వహ్నియుఁ బోలె నుగ్రుఁ డై
యుక్కున ఘోరనిష్ఠఁ దప ముద్ధతి సల్పెడువాఁడు కౌశికుం
డక్కడ నుండు నన్నుఁ గనినంతనె యల్లి శపించుఁ గాక న
న్నక్కడి కంప వల్వదు సురాధిప నీపద మాశ్రయించెదన్.

1148


చ.

అన విని శక్రుఁ డి ట్లనియె నరిగిన యింత భయం బిదేల నా
పనుపునఁ గీరశారికలు బాలసమీరుఁడుఁ దోడు వత్తు రే
ననుపమలీల మన్మథసహాయుఁడనై వెనువెంట వచ్చెదం
బ్రణుతవిలాసరూప మలరం జని తన్మనమున్ హరింపవే.

1149


వ.

అని నియోగించిన నెట్టకేలకు నీయకొని సకలజగన్మోహనం బైనరూపంబుఁ
దాల్చి.

1150


చ.

మలయసమీరపుష్పశరమాధవకోకిలకీరశారికల్
మలయుచు వెంట రాఁ గవలి మౌనివనంబున కేగి యచ్చటన్
సొలయక లాస్యముల్ సలుపుచున్ లలితంబుగఁ బాట పాడుచుం
గలయఁ జరించె రంభ యల కౌశికుమ్రోల ననేకభంగులన్.

1151


చ.

చిలుకలు రద్ది సేయుటయుఁ జెంగటఁ గోవెల గూయుటల్ తరుల్
దలముగఁ బల్లవించుటయుఁ దప్పక వెంటనె రంభ వచ్చుటల్
గలయఁగఁ జూచి చిత్తమున గాధికుమారుఁడు సంశయించి యా
బలరిపుకృత్య మింత యని భావమునం వలపోసి కోపియై.

1152

విశ్వామిత్రుండు రంభను శపించుట

చ.

మెలపున శక్రుఁ డంప మును మేనక వచ్చి కలంచినట్లకా
వెలయఁగ మత్తపంబునకు విఘ్నము సేయఁగ నేఁడు వచ్చి
పలుమఱు మోసపోవుటకు బాలుఁడనే యది చెల్ల దింక నో
యలికులవేణి యుండు మిట నశ్మమవై పదివేలవర్షముల్.

1153


వ.

అని యిట్లు పట్టరానికోపంబువ విశ్వామిత్రుండు వేల్పువెలయాలిని దిట్టి పదం
పడి దయాళుండై తపస్స్వాధ్యాయనంపన్నుం డైనవసిష్ఠువలన శాపమోక్షణం
బగు నని యనుగ్రహించిన నారంభ తక్షణంబ పాషాణం బయ్యె మీనకేత
నుండు భీతుండై పాఱె నంత విశ్వామిత్రుండు తనతపం బొక్కింత దఱుఁగుటకుఁ
బరమనిర్వేదనపరుండై స్వార్జితం బైనతపంబంతయు మొదలఁ గామంబునకుఁ
బదంపడి క్రోధంబునకును సమర్పించితి నింకఁ గామక్రోధంబులు జయించి
జితేంద్రియుండనై యాహారంబు వర్ణించి యూర్పు పుచ్చక శరీరంబు శోషింపం
జేసి తపస్సమాశ్రితం బైన బ్రాహ్మణ్యంబు లభించునందాఁకఁ బెక్కుసంవత్సరం
బు లచలనిష్ఠ ఘోరతపంబుఁ గావించెదఁ దపస్సంతప్తుండ నైనమచ్ఛరీరావయ

వంబులు క్షయంబు నొందకుండుఁ గాక యని యిట్లు నిష్ఠురంబుగాఁ బ్రతిజ్ఞఁ
జేసి దీక్షితుండై.

1154


ఉ.

అక్కడనుండి యక్కుశకులాంబుధిపూర్ణశశాంకుఁ డంతఁ బ్రా
గ్దిక్కున కేగి వాసవుఁడు కిన్క నొనర్చెడువిఘ్నకోట్లకుం
జిక్కక నక్కడక్కడఁ బ్రసిద్ధపదంబులఁ బెక్కువర్షము
ల్మిక్కిలి ఘోరనిష్ఠ నచలీకృతభక్తిఁ దపం బొనర్చుచున్.

1155

ఇంద్రుఁడు వృద్ధబ్రాహ్మణరూపుఁడై విశ్వామిత్రుకడ కరుగుట

తే.

అంత సిద్ధాశ్రమంబున కరుగుదెంచి, యందు బ్రహ్మర్షి ననిపించుకొందు ననుచుఁ
దలఁచి వర్షసహస్రంబు తపము సల్పి, తవిలి పారణ సేయంగఁ దలఁచునపుడు.

1156


వ.

ఆఖండలుం డొక్కముదిపాఱుండై చనుదెంచి సిద్ధాన్నం బొసంగుమని
యభ్యర్థించిన నక్కౌశికుం డయ్యన్నం బొసంగిన నమ్మాయావిప్రుండు దాని
నంతయు నిరవశేషంబుగా భుజించినం జూచి నిర్వికారుఁడై యేమి బలుకక
వెండియు విశ్వామిత్రుండు పూర్వప్రకారంబున మౌనంబుఁ బూని యూర్పు
పుచ్చక వేయిసంవత్సరంబు లత్యుగ్రతపంబు సేసిన.

1157


ఉ.

ఆముని యౌదలం బొడమి యద్భుతధూమము లష్టదిక్కులన్
భూమియు నాకముం బవనభోజనలోకము నెల్ల నిండినన్
భూమి వడంకె దిక్కరులు మ్రొగ్గె నగంబులు గ్రుంగెఁ దారకా
స్తోమము వ్రాలె దూలె రవి తోయధు లింకెను బర్వెఁ జీఁకటుల్.

1158


తే.

అపుడు నిస్తేజులై వేల్పు లమరమునులుఁ, గశ్మలోపహతాత్ములై కమలయోని
కడకుఁ జని భక్తిఁ దత్పాదకమలములకు, మ్రొక్కి యి ట్లని రటు కరంబులు మొగిడ్చి.

1159


ఉ.

వారిజగర్భ కౌశికుఁ డవార్యతపం బొనరించుచున్నవాఁ
డారయఁ దన్మనోరథము నర్థి నొసంగి తపంబు మాన్ప కి
ట్లూరకయున్న నీజగము లొక్కట దిక్కఱి తత్తపోగ్నివి
స్తారశిఖాపరంపరల దగ్ధములై చనుఁ గాక దక్కునే.

1160


వ.

మహాత్మా యితండు కామక్రోధంబులు వర్జించి గాఢనిష్ఠఁ దపంబు సేయుచున్న
వాఁ డతనియందు వృజినం బించుకేని లే దమ్మహాత్మునితపంబునకుఁ బ్రతి
విధానం బెద్దియుఁ గాన మైతి మఖిలజగత్సంక్షోభవశంబువలన జనం బంతయుఁ
గర్మానుష్ఠానశూన్యంబై యున్నది త్రైలోక్యంబు సంక్షుభితమానసం బయ్యె
మఱియు మహాద్యుతి యగునతండు సాక్షాద్వైశ్వానరుండుం బోలె వెలుంగు

చున్నవాఁడు నిజతపోవహ్నిశిఖాపరంపరల లోకంబుల నన్నింటి నొక్క
పెట్ట భస్మంబు సేయక మున్నె యనుగ్రహింపవలయు.

1161


చ.

తపము ఫలించు టొండె వితతంబుగ ఘోరతపోగ్నిహేతిచేఁ
గృపణత లోకజాలము దహించుట యొండె నటంచు నిష్ఠతోఁ
దప మొనరింపఁగాఁ దొడఁగె ధాత యతండు సురాధిపత్యమ
ట్లిపుడ యొసంగు మన్న మన కీయక తీరదు మాట లేటికిన్.

1162

బ్రహ్మ విశ్వామిత్రునికి బ్రహ్మర్షిత్వ మొసఁగుట

సీ.

అని విన్నవించుడు నమరులవాక్యంబు విని పద్మభవుఁడు మన్నన యెలర్ప
వా రెల్లఁ దనుఁ గొల్వ వరదుఁడై రాయంచ నెక్కి కౌశికుపాలి కేగుదెంచి
వినుము కౌశిక యింతవిపరీతతప మేల మానుము మాకు సమ్మద మొసంగెఁ
బ్రబలతపంబున బ్రహ్మర్షి వైతివి దీర్ఘాయువును బ్రహ్మతేజ మేను


తే.

దయ నొసంగితి నీకు భద్రంబు గలుగు, నింక సుఖలీల వలసిన ట్లెల్లలోక
ములఁ జరింపు మటన్న నమ్మునివరుండు, మ్రొక్క కడుభక్తిఁ గరములు మోడ్చి పలికె.

1163


వ.

దేవా నాకు భవత్ప్రసాదంబున బ్రాహ్మణ్యంబును దీర్ఘాయువును సంప్రాప్తం
బగుట నిక్కంబేని యోంకారంబును వషట్కారంబును వేదంబులును నన్ను
వరించుం గాక యని పలికి వెండియు ని ట్లనియె.

1164


తే.

బ్రాహ్మణక్షత్రవేదసంపన్నుఁ డైన, యల వసిష్ఠుండు బ్రహ్మర్షి వైతి వనుచుఁ
బలికె నేనియు నమ్మెదఁ బలుకకున్న, నమ్మఁగాఁ జాల నిదియును నాతలంపు.

1165


క.

అని పలికిన విని ద్రుహిణుం, డనిమిషులును బిల్వ వచ్చి యమ్ముని సత్యం
బనుపమతపోబలంబున, ననఘా బ్రహ్మర్షి వైతి వని పల్కుటయున్.

1166


వ.

విశ్వామిత్రుండును బరమానందకందళితహృదయారవిందుం డై వసిష్ఠుని నానా
విధపూజావిధానంబులఁ దృప్తి నొందించె నంత విరించనాదిబృందారకులు
విశ్వామిత్రుని దీవించి తత్ప్రభావంబుఁ గొనియాడుచు నిజనివాసంబులకుం జనిరి
వసిష్ఠుండును విశ్వామిత్రునితో సఖ్యంబుఁ జేసి నిజాశ్రమంబునకుం జనియె
విశ్వామిత్రుండు ప్రాప్తకాముండై బ్రహ్మతేజంబున దిశలు వెలింగించుచు యథా
సుఖంబుగా విహరించె నీవిశ్వామిత్రుండు దివ్యతపఃప్రభావవిశేషంబున బ్రహ్మ
ర్షులలో నధికుం డని విశ్రుతిం గన్నవాఁ డిమ్మహాత్ముండు విగ్రహవంతం బగుతపం
బును వీర్యంబునకుఁ బరాయణుండును ధర్మపరుండు నని పల్కి శతానందుం
డూరకున్న నతనిపలుకులు విని రాముండును దదనుజుండును జనకాదు లైన

సభాసదులును బరమానందరసపూరితహృదయులై సాధువాక్యంబుల నభినం
దించి విశ్వామిత్రునిం బూజించి రంత జనకుండు విశ్వామిత్రు నవలోకించి
యి ట్లనియె.

1167


క.

కాకుత్స్థసహితముగ మీ, రీకరణి మదీయమఖము నీక్షించుట క
స్తోకగతి వచ్చినందున, నే కడుధన్యుండ ననుగృహీతుఁడ నైతిన్.

1168


తే.

తాపసోత్తమ నీదుసందర్శనమున, బహువిధగుణంబు లిపుడు ప్రాప్తంబు లయ్యెఁ
బరఁగ మీచేత నెంతయుఁ బాలితుండ, నైతి నిష్టార్థసంసిద్ధి యయ్యె నేఁడు.

1169


తే.

మానితంబుగఁ బరికీర్త్యమానమైన, నీమహాతప మంతయు నిరుపమగతి
నేఁడు నాచేత నీరఘునేతచేత, నింపు సొంపార నిచట నాలింపబడియె.

1170


తే.

కుశికకులవర్య మీబహుగుణము లిప్పు, డీసదస్యులచేతను నింపుమీఱ
వినఁబడియె నీదుగుణములు వీర్యబలము, లప్రమేయంబులు నుతింప నలవి యగునె.

1171


చ.

అనఘచరిత్ర పుట్టినది యాదిగఁ బెక్కువిచిత్రసత్కథల్
వినఁబడె నెద్దియేని కడు వేడుక నీకథ యట్ల నెమ్మనం
బునకు నొసంగ దీశ్రుతులు పుట్టినయందుకు నీచరిత్రము
న్వినుట ఫలంబు గాదె పృథివిం గడుధన్యుఁడ నైతి నెంతయున్.

1172


క.

ఇనుఁ డస్తగిరిసమీపం, బునకుం జనె నుక్తకర్మముం దీర్పఁగ నా
కనఘాత్మ సెల వొసంగుము, ఘనముగ రేపకడఁ జూడఁగా రమ్ము కృపన్.

1173


వ.

అని పలికి పురోహితామాత్యబంధుసహితంబుగా విశ్వామిత్రునకుం బ్రదక్షి
ణంబుఁ జేసి యనుజ్ఞాతుండై యనిచిన నమ్మహర్షివరుం డచ్చటిమునులచేతఁ బూ
జితుండై జనకునిం బ్రశంసించి రామలక్ష్మణసహితంబుగా నిజనివాసంబునకుం
జనియె నంతఁ బ్రభాతకాలంబున జనకుండు కృతకర్ముండై రామలక్ష్మణసహితుం
డైనవిశ్వామిత్రుని రావించి శాస్త్రదృష్టం బైనకర్మంబుచేత నమ్మనిపతిం బూ
జించి పదంపడి రామలక్ష్మణుల నుచితసత్కారంబులఁ బ్రీతచేతస్కులం జేసి
విశ్వామిత్రు నవలోకించి మహాత్మా మీరాక మాకు శుభం బయ్యె నా కెయ్యది
కర్తవ్యంబు మీచేత నాజ్ఞాపింపం దగినవాఁడఁ గావునఁ గర్తవ్యకార్యం బాన
తి మ్మని యడిగిన నవ్విశ్వామిత్రుండు జనకున కి ట్లనియె.

1174

జనకుండు విశ్వామిత్రునకు శివధనుర్మాహాత్మ్యంబుఁ దెల్పుట

మ.

ఇనవంశోత్తము లిందుసన్నిభులు ధాత్రీశాత్మజుల్ సాధుస
జ్జనసంస్తుత్యులు మన్మథాకృతులు భాస్వద్వీర్యు లై యొప్పు వీ
రనఘా నీగృహమందుఁ బొల్చుహరువి ల్లాసక్తితోఁ జూడఁగా
నను వొందం జనుదెంచినారు నృపవర్యా దానిఁ జూపింపుమా.

1175

క.

అనిన జనకుఁ డప్పలుకులు, విని విస్మయ మొంది వింటివిధ మెల్లను గ్ర
క్కునఁ జెప్పఁ బూని యిట్లనె, మునినాథునితోడ నపుడు ముద మొదవంగన్.

1176


తే.

అనఘ మద్వంశకూటస్థుఁ డైననిమికి, నాఱవతరంబువాఁడు మహాభుజుండు
దేవరాతుండు గలఁ డాధరావిభునకు, నమరు లొసఁగికి చాపంబు న్యాసఫణితి.

1177


సీ.

అనఘాత్మ మును దక్షయాగవిధ్వంసనకాలంబునందు శంకరుఁడు గినిసి
విల్లు సజ్యముఁ జేసి వేల్పుల నందఱ నటు సూచి భాగార్థినైన నాకుఁ
గర మర్థి భాగంబుఁ గల్పింపరైతిరి గాన మీయుత్తమాంగములు దునిమి
వైచెద నని యిట్లు పటురోషమునఁ బల్క విని సురలందఱు భీతి నొంది


తే.

కరములు మొగిడ్చి ప్రార్థింప హరుఁడు కోప, మంతయును వీడి సంప్రీతుఁ డగుచుఁ గరుణ
మీఱ నీచాపరత్నంబు వారికిచ్చె, నిచ్చినఁ బ్రతిగ్రహించి సంహృష్టు లగుచు.

1178


క.

మెచ్చుగ దేవత లండఱు, నచ్చుపడఁగ న్యాసరూప మగునాధనువుం
జెచ్చెర మత్పూర్వకునకు, నిచ్చిరి వాత్సల్య మలర నినసమతేజా.

1179


క.

అదిమొదలుగ మాయింటం, గొదువ పడక యుండఁ బూజఁ గొనుచు శుభదమై
పొదలుచునున్నది యావిలు, త్రిదశాలయమందరక్షితిధరసదృశమై.

1180


సీ.

కౌశిక యేను యాగము సేయఁగాఁ బూని గురుబుద్ధి భూశుద్ధికొఱకుఁ బుడమి
గడఁగి దున్నింప నాఁగటిచాలులో నద్భుతంబుగా నొక్కమందసము వొడమె
దడయక దాని ముద్రాభంగ మొనరింప రాకానిశాకరురేకవోలె
జలదంబు నెడఁబాసి జగతికి వచ్చిన మెఱుఁగారుక్రొక్కారుమెఱుఁగువోలె


తే.

నొక్కకన్నియ దోఁచె నం దక్కజముగ, దానిఁ జేకొని యేను సంతస మెలర్ప
సీత యను పేరుపెట్టి యాచిన్నికూన, నబ్బురంబుగఁ బెంచితి ననుదినంబు.

1181


వ.

ఇట్లు దినదినప్రవర్ధమాన యైనయక్కన్య యయోనిజ గావున వీర్యశుల్క
యనం బరఁగె నాసమయంబునఁ జారులక్షణలక్షితయు ననన్యసామాన్యలావ
ణ్యయు దేవతారూపిణియు వీర్యశుల్కయు నైనమత్కుమారిం బెండ్లియాడ
సమందానందంబున ధరణీపురందరనందను లెందఱేనియుం జనుదెంచి తమ
తమబిరుదాంకంబులు వక్కాణించి కన్య ని మ్మని యడిగిన వారలకెల్లఁ బ్రత్యు
త్తరంబుగా నే నిట్లంటి.

1182


ఉ.

కన్నియ వీర్యశుల్క యటు గావున నీఁ దగ దిప్పు డూరకే

పన్నుగ మన్నిశాంతమునఁ బర్వతభంగిఁ జెలంగుచున్నయా
పన్నగరాజభూషణుని భవ్యశరాసన మెక్కుపెట్టినన్
సన్నుతగాత్రి నిత్తు నిది సత్యము పల్కినవాఁడ నెంతయున్.

1183


వ.

అనిన నమ్మహీవరు లందఱు ముందుముందుగాఁ దల మిగిలి తమతమభుజాబలం
బులకొలందు లెఱుంగక బహువిధంబులు బోరి యవ్విల్లు నిట్టట్టు గదల్పఁ
జాలక బెండుపడి సిగ్గునం దల యెత్తక నిరాశు లై తమతమదేశంబులకుం జని.

1184


తే.

తరుణి నిచ్చెద ననుచుఁ గోదండ మొకటి, ఘనత నెప మిడి గారించె మనల జనకుఁ
డతని నేచందమున నైన నాజి గెలిచి, యన్నెలంతను గొని వత్త మనుచుఁ గడఁగి.

1185


మ.

సకలక్ష్మావరకోటు లద్భుతభుజాసంరంభ మేపారఁగా
సకలానీకముతోడ వచ్చి విలసచ్ఛౌర్యాతిరేకంబునం
బ్రకటప్రక్రియ మత్పురీవరణము ల్సన్నాహు లై చుట్టి ప
ర్వి కఠోరంబుగ నాక్రమించుటయు నే వీక్షించి యత్యుద్ధతిన్.

1186


క.

చతురంగంబులు గొల్వఁగ, నతులితవిభవంబు మెఱయ నాహవనిపుణో
ద్ధతి వెడలి తీవ్రబాణ, ప్రతతులఁ బరఁగించి భుజబలం బలరారన్.

1187


వ.

నానాప్రకారంబుల నొక్కసంవత్సరంబు రణంబుఁ జేసి మదీయసాధనంబు
లన్నియు సంక్షయించిన భృశదుఃఖితుండ నై సమాహితచిత్తంబున వేల్పుల
నారాధించిన వారు ప్రత్యక్షం బై చతురంగబలంబుల నిచ్చి చనిన దేవదత్త
చమూసమేతుండ నై క్రమ్మఱ రణంబునకుం జని బహువిధశరపరంపరలు నిగు
డించిన.

1188


క.

కొందఱు దెస చెడి పాఱిరి, కొందఱు మద్బాణనిహతిఁ గూలిరి మఱియుం
గొందఱు శరణము నొందిరి, యందముగా నిట్లు విజయ మందితిఁ గడిమిన్.

1189


క.

అనఘాత్మ పరమభాస్వర, మనుషమసారోద్ధతంబు నగునాధనువున్
మునుకొని తెప్పించి యిఁకం, గనిపించెద రాఘవులకుఁ గడుమోదమునన్.

1190


క.

ఆవిల్లు నీరఘూత్తముఁ, డేవిధమున నైన బలిమి నెక్కిడె నేనిన్
నావరపుత్రిక నిచ్చెదఁ, బావకగగనాంబుభూమిపవనులు గుఱిగాన్.

1191


క.

నా విని విశ్వామిత్రుఁడు, భూవల్లభుఁ జూచి పలుకుఁ బొలుపుగ ధనువున్
వావిరి దెప్పించి ముదం, బావహిలం జూపు మీనృపాత్మజున కొగిన్.

1192


క.

అనిన విని జనకుఁ డమ్ముని, యనుమతమున గంధమాలికార్చిత మగుత
ద్ధనువును దెప్పింపుం డని, పనివడి మంత్రులకుఁ జెప్పె ప్రాభవ మలరన్.

1193

జనకుఁడు విశ్వామిత్రుకడకు శివధనువు దెప్పించుట

వ.

ఇ ట్లాజ్ఞాపించిన వారు రయంబునఁ బురంబులోనికిం జని.

1194

సీ.

కమనీయసుమనప్రకాండసంకీర్ణ మై కనకాచలముభంగిఁ దనరుదాని
నగరాజనందినీనాథాంకయుక్త మై యలరజతాద్రియ ట్లలరుదాని
జటులవేగోద్ధతచక్రసందీప్త మై యుదయాచలముమాడ్కి నొప్పుదాని
నసదృశశ్రీగంధరసఘుమంఘుమిత మై గంధమాదనమట్ల గ్రాలుదాని


తే.

ననుపమాయసనిర్మితం బైనదాని, మహితగతి నొప్పుదాని నామందసమును
గాంచి కడుదీర్ఘదేహు లై క్రాలునమిత, బలులఁ బంచసహస్రవీరులను బంచి.

1195


వ.

వారిచేత దాని నతిప్రయత్నంబున నెత్తించుకొని వచ్చి సురసదృశుం డైనజన
కునిముంగలఁ బెట్టించి రాజేంద్ర సర్వరాజులచేతఁ బూజితం బైనయిమ్మహా
కార్ముకరత్నం బానీతం బయ్యె నిదె విలోకింపుఁ డనిన నమ్మంత్రివాక్యంబులు
విని జనకుండు విశ్వామిత్రునిం జూచి బద్ధాంజలి యై రామలక్ష్మణుల నుద్దేశించి
యిట్లనియె.

1196


క.

మునివర మాపెద్దలచే, ననిశముఁ బూజింపఁబడియె నతిశయభక్తిన్
వినుఁ డీచాపము దీనిన్, మునుకొని పూరింపలేకపోయిరి నృపతుల్.

1197


చ.

నరసురయక్షకింపురుషనాగనభశ్చరసిద్ధసాధ్యకి
న్నరవసురుద్రభాస్కరవితానము లైనను జూడ నెక్కిడం
గరమున నంటఁగా నలవి గానిది యీమహనీయచాపముం
బనివడి దీని నెక్కిడఁగ మానవు లెంతటివారు చూడఁగన్.

1198

రాముఁడు శివధనువు భగ్నముఁ జేయుట

వ.

ఇమ్మహాధనుశ్రేష్ఠంబు నిట్టట్టు గదల్చుటకుఁ బూరించుటకు నారోపణంబు
సేయుటకు శరంబుఁ గూర్చుటకు నాకర్షించుటకు ముల్లోకంబులయందు నెవ్వం
డు సముర్ధుండు లేఁ డట్టిదాని భవద్వచనప్రకారంబున నతిప్రయత్నంబున నిచ్చ
టికిం దెప్పించితి దీనిని రాజపుత్రులకుం జూపు మని పలికిన ధర్మాత్ముం డగు
విశ్వామిత్రుండు జనకునివాక్యంబు విని రామునిం జూచి వత్సా ధనువు విలో
కింపు మనిన నమ్మహర్షివాక్యప్రకారంబున నమ్మనువంశతిలకుండు మంజూషా
ముద్రాదళనం బొనరించి తన్మధ్యనిక్షిప్తం బైనమహాకార్ముకం బవలోకించి
విశ్వామిత్రున కి ట్లనియె.

1199


తే.

మునికులోత్తమ యీధనుర్ముఖ్య మేను, గరముచే సంస్పృశించితిఁ గడఁగి దీని
నశ్రమంబున మో పిడి యనుపమగతి, వెస సమాకర్షణంబుఁ గావించువాఁడ.

1200


వ.

అని పలికి విశ్వామిత్రజనకులయనుమతంబు వడసి సభాసదు లయినమహ
ర్షులు మహీపతు లందఱుఁ జూచుచుండ రాముం డవలీల నమ్మహాకార్ముకంబు
పయి కెత్తి గొనయం బెక్కించి యాకర్ణపూర్ణంబుగాఁ దిగిచి విడిచిన.

1201

తే.

ఆరఘుస్వామిసత్త్వ మే మనఁగ వచ్చుఁ, బగిలి పేడెత్తి జగములు పల్లటిల్లఁ
గరికరాహతి విఱిగిన చెఱుకువోలె, ఘనరవంబునఁ దచ్ఛరాసనము విఱిగె.

1202


చ.

విఱిగెఁ గులాచలంబు లట బీఁటలు వాఱె దిగంతకుడ్యముల్
పఱియలు వాఱె భూతల మసాన్నిధులుం గలఁగెన్ వెసన్ దిశా
కరులు వడంకె భూతతతి గందెఁ గుణాన్వయుఁ డావిదేహదా
శరథులుఁ దక్క సర్వజనసంఘము మూర్ఛ మునింగె నత్తఱిన్.

1203


ఆ.

అంతఁ గొంతవడికి నమ్మహాశబ్దంబు, శాంతి నొందెఁ బిదప సభ్యు లెల్ల
మూర్ఛ దేఱి చాల మోదంబు నొందిరి, జనకవిభుఁడు సాధ్వసంబు విడిచె.

1204


క.

అత్తఱి జనకక్షితినా, థోత్తముఁ డత్యంతసమ్మదోత్కర్షమునం
జిత్త మిగు రొత్త నమ్ముని, సత్తమునిం జూచి పలికె సవినయుఁ డగుచున్.

1205


క.

జగతీసుర దశరథసుతుఁ, డగురాముఁడు దృష్టవీర్యుఁ డయ్యె నితనిదో
ర్యుగగతవీర్య మచింత్యం, బగణ్య మమితం బమోఘ మత్యద్భుతమున్.

1206


క.

జనవినుతుఁ డైనరామునిఁ, బెనిమిటిఁగాఁ బడసి సీత పృథుగుణయుక్తిన్
జనకకులంబున కొంతయు, ఘనతరయశ మాహరింపఁగలదు మహాత్మా.

1207


తే.

సుగుణమండన విను వీర్యశుల్క యనుచుఁ, బట్టిన ప్రతిజ్ఞ సత్య మై పరఁగె నేఁడు
ప్రాణబహుమత యగుసీత రాఘవునకు, నిచ్చితి భవాదృశులు సూచి మెచ్చి వొగడ.

1208

జనకుఁడు దశరథునియొద్దకు దూతలఁ బంపుట

చ.

అనఘచరిత్ర శీఘ్రగతు లైనయమాత్యుల నయ్యయోధ్యకుం
బనిచి కుమారభద్రమును భర్గధనుర్దళనంబు వీర్యశు
ల్కను ముద మార నిచ్చుటయుఁ గౌశికురాకయుఁ దెల్పి పెండ్లికై
యనుపమవైభవున్ దశరథాధిపునిం బిలిపింతు నీయెడన్.

1209


క.

నా విని సంతోషము మది, నావిర్భవ మందఁ గుశకులాధిపుఁ డను నో
భూవల్లభ నీ వట్టుల, గావింపుము తడవు సేయఁగా వల దింకన్.

1210


వ.

అనిన నమ్మహీవల్లభుండు వికసితముఖుండై శీఘ్రంబుగ మంత్రుల రావించి
యొక్క కాంచనపట్టికయందు యథాక్రమంబున శుభవాచకాక్షరంబుల
లిఖించి కుంకుమం బలఁది మంత్రులచేతి కొసంగి మీ రతిత్వరితగమనంబున
నయోధ్యకుం జని దశరథు నుచితభంగి సందర్శించి రామలక్ష్మణుల కుశ
లంబుఁ దెల్పి యిచ్చటిశుభప్రసంగం బంతయుఁ బ్రకటించి కుటుంబపరివార

సమేతంబుగా నమ్మహీపతిని సీతారాముల పరిణయంబునకుఁ దోడ్కొని రండు
పొండని పనిచిన.

1211


ఉ.

వారు మరుజ్జవంబు లగువాహనరాజము లెక్కి వేడుకల్
మీఱఁ బథంబునన్ శుభనిమిత్తములం గనుఁగొంచుఁ గౌతుకం
బాక దినత్రయంబునకు నద్భుతవేగముతో నయోధ్యకుం
జేరఁగఁ బోయి రాజగృహసీమ రయంబునఁ జొచ్చి యచ్చటన్.

1212


తే.

కనకమండపమునఁ బెద్దగద్దెయందు, నలసుధర్తాసనాసీనుఁ డగుబలారి
పగిదిఁ గొలు వుండి కొడుకులపై నొకింత, కూర్మిఁ దలపోయుచున్నకాకుత్స్థవరుని.

1213


వ.

సముచితంబుగా సందర్శించి బద్ధాంజలిపుటు లై మధురాక్షరవ్యక్తంబుగా
ని ట్లనిరి.

1214


చ.

అలమిథిలేంద్రుఁ డైనజనకాధిపుఁ డెంతయు సంతసంబునం
బలుమఱు మంజులోక్తుల భవత్కుశలంబు పురోహితప్రధా
నులకుశలంబు బాంధవమనోజ్ఞసతీకుశలంబు వహ్నికౌ
శలమును సర్వమున్ దెలియ సమ్మతితో నడిగెన్ నృపాగ్రణీ.

1215


ఆ.

మఱియుఁ గౌశికానుమతి చేత నమ్మహీ, విభుఁడు సెప్పు మన్నవృత్త మెల్ల
వేడ్కతోడ మీకు విన్నవించెద మిపు, డింపు మీఱఁ జిత్తగింపు మధిప.

1216


సీ.

పృథ్వీశ మత్పుత్రి వీర్యశుల్క యటంచుఁ జెలఁగి యేను బ్రతిజ్ఞ సేయుటయును
జనపతు లరుదెంచి శంభునిచాపంబు మో పిడలేక వైముఖ్య మంది
తెరలి నిర్వీర్యులై యరుగుటయును మీకు విధిత మై యున్నదిగద మహాత్మ
మానుగ నక్కన్య మద్భాగ్యవశమునఁ బరగఁ గౌశికువెంట వచ్చినట్టి


తే.

భూరివిక్రముఁ డగుభవత్పుత్రుచేతఁ, జాల నిర్జిత యయ్యె నాచంద్రమౌళి
కార్ముకంబు సభాసదుల్ గనుఁగొనంగఁ, గడిమి మెఱసి రాముండు భగ్నంబుఁ జేసె.

1217


తే.

అనఘచరిత మహాత్ముఁ డై నట్టిరామ, భద్రునకు వీర్యశుల్కయై పరఁగు సీత
నిచ్చెదనటంచుఁ బల్కితి నింపుతోడ, సమ్మతించి యనుజ్ఞ యొసంగవలయు.

1218


వ.

మహాత్మా నీవు పురోహితోపాధ్యాయబంధుమిత్రామాత్యసహితుండవై కుమా
రులపరిణయంబునకు శీఘ్రంబునఁ జనుదెంచి మదీయసమ్మదంబునకు సార్థ
కంబు సంపాదించి కుమారకల్యాణోత్సవసమాలోకనసంజాతపరమానందం
బనుభవింప నర్హుండ వని యిట్లు జనకుండు విశ్వామిత్రశతానందానుమతి
స్థితుండై పలికె నని విన్నవించిన నజ్జనకామాత్యులవచనంబు విని యద్దశరథుండు

పరమహర్షసహితుం డై వసిష్ఠవామదేవులను దక్కినమంత్రుల నవలోకించి
యి ట్లనియె.

1219

దశరథుఁడు కుమారకల్యాణంబును గూర్చి ప్రశంశించుట

క.

మనరామలక్ష్మణులు నె, మ్మనమున సంతోష మొదవ మౌనిసహితు లై
జనకమహీపతిసదనం, బున శోభిలుచున్నవారు పొలుపుగ వింటే.

1220


ఉ.

ఆనరనాథునింటఁ జెలువారుచు వేల్పుల కైన దుస్సహం
బైనపురారిచాపము రయంబున రాముఁడు ద్రుంప మెచ్చి సు
శ్రీనిధి నాత్మపుత్రికను సీతను రామున కీఁ దలంచి య
మ్మానవభర్త పెండ్లి కిటు మమ్మును రమ్మని పంచె మంత్రులన్.

1221


తే.

అనఘచారిత్రులార మహాత్ముఁ డైన, యవ్విదేహునిసంబంధ మరయ మీకు
నభిమతం బయ్యెనేని రయమున నచటి, కరుగుదము కాలయాపన మనుచితంబు.

1222


క.

అన విని మంత్రులు మునివరు, లనుపమహర్షమునఁ బోద మని పల్కిన స
జ్జనపతి సుప్రీతుం డై యనువుగ రేపకడఁ బయన మని పల్కి తగన్.

1223


క.

జనకునిమంత్రుల నందఱ, ననుపమగతి సత్కరించె నప్పుడు వార
ల్ఘనసర్వగుణాన్వితు లై, యనువుగ నారాత్రి యుండి రచ్చటఁ బ్రీతిన్.

1224

దశరథుండు ఋత్విగుపాధ్యాయసహితుఁడై మిథిల కరుగుట

వ.

అంతఁ బ్రభాతకాలం బగుటయు నద్దశరథుండు హర్షవికసితాననుం డై యు
పాధ్యాయబాంధవపరివృతుం డై సుమంత్రునిం జూచి యిప్పుడు ధనాధ్యక్షు
లందఱుఁ బుష్కలంబుఁగా ధనంబు గొని నానారత్నసమన్వితు లై సుసమాహి
తు లై యగ్రభాగంబునం జనువారుగా నియోగింపుము చతురంగబలంబును
ననుత్తమంబు లైనయానంబులును యుగ్యంబును సత్వరంబునం జనునట్లు
గావింపుము వసిష్ఠవామదేవజాబాలికశ్యపకాత్యాయనమార్కండేయప్రభృతి
మహర్షు లందఱు ముంగలం జనువారుగా విజ్ఞాపనంబు సేయుము జన
కామాత్యులు వేగిరపడి పలుకుచున్నవారు గావున నింకఁ దడవు సేయుట
యుక్తంబు గాదు మదీయరథం బాయితంబు సేయు మని పలికిన నతం డట్ల
గావింప రథారూఢుం డై ఋత్విగుపాధ్యాయసహితంబుగాఁ జనియె నమ్మహీ
పతి వెనుకొని చతురంగబలంబును దక్కినవారును బరమానందంబున నరిగిరి
యిత్తెఱంగునం గదలి దశరథుండు నాలుగుదినంబులకు మిథిలానగరంబుఁ జేరం
బో నంత.

1225


చ.

ముదమున నవ్విదేహపతి పుణ్యచరిత్రకుఁ డైనయాజి క
ట్లెదురుగ వచ్చి ప్రేమయు నహీనకుతూహల మాత్మలోపల
న్గదుర హితోపచారము లొనర్చి బహుకృతు లాచరించుచున్
సదమలచిత్తుఁ డై కుసుమసన్నిభమంజులసూక్తి ని ట్లనున్.

1226

జనవర మాభాగ్యంబునఁ జనుదెంచితి వీవు వీర్యసముపార్జితనం
దనసంప్రీతిని బొందితి, వనుపమపుణ్యమున నేఁ గృతార్థుఁడ నైతిన్‌.

1227


క.

సురపరివృతుఁ డగుశక్రుని, కరణి సమంచితమహర్షికలితుం డై మ
ద్గురుతరపుణ్యవశంబున, నరుదారఁగ నీవసిష్టుఁ డరుదెంచె గృపన్‌.

1228


తే.

ఈమునీంద్రులఁ గూడి మహీశవర్య, నీవు విచ్చేయుకతమున నెగడె శుభము
విఘ్నము లడంగె గోర్కులు విస్తరిల్లె, నన్వయం బది పావనం బయ్యె నేఁడు.

1229


ఉ.

తోయజమిత్రవంశజులతో దగ వియ్యము గల్గె సంతతం
బాయతకీర్తి నైతి మనూుజాధిప యెల్లి ముహూర్త మింక మీ
రేయెడ నెల్లకార్యముల కెంతయు జాలి ప్రసన్నచిత్తు లై
పాయక యుండు డంచు నిటు పల్కిన నయ్యజసూనుఁ డి ట్లనున్‌.

1230


క.

అనఘచరిత్ర ప్రతిగ్రహ, మనిశము దాతృవశ మనిరి యటు గావున నీ
వొనరింపు మనిన గార్యం, బొనరించెద నిఁక స్వతంత్ర మున్నదె మాకున్‌.

1231


క.

నిర్మలకీర్తికరంబును, ధర్మిష్టం బైనయట్టి దశరథువాక్యం
బర్మిలి విని జనకుఁడు నృప, ధర్మవిదుఁడు మిగుల నద్భుతము నొప్పు రహిన్‌.

1232


ఆ.

అచట నున్నమౌను లంద ఱన్యోన్యస, మాగమంబునందు హర్షయుక్తు
లగుచు నతిసుఖముగ నారాత్రి వసియించి, రుచితిపదములందు నొప్పు మీఱ.

1233


క.

మనుకులుఁ డగుదశరథనృపుఁ, డనఘుల నందనులఁ జూచి హర్షం బలరన్
జనకునిచేఁ బూజితుఁ డై ఘనమతి సుఖలీల నుండె గౌతూహలి యై.

1234


వ.

అంత మహాతేజుం డగుజనకుం డవశిష్టయాగకర్మంబు నిర్వర్తించి యారాత్రి
వివాహాంగభూతం బైనయంకురార్పణాదికంబుఁ గావించి యథాసుఖంబుగా
వసియించి ప్రభాతకాలంబున సమాప్తయజ్ఞక్రియుం డై పురోహితుం డైన
శతానందు నవలోకించి యి ట్లనియె.

1235

జనకుండు దనతమ్ముం డగుకుశధ్వజుని రావించుట

సీ.

అనఘాత్మ నాతమ్ముం డలకుశధ్వజుఁ డతిధార్మికుఁడు జగన్నుతప్రభుండు
గరిమ వార్యాఫలకప్రాంత మై మె యొప్పు నిక్షుమతీజల మింపుతోడఁ
గ్రోలుచు స్వర్గంబులీల విమానంబుకై డి నలరుసాంకాశ్యయందు
నలరారుచున్నవాఁ డతఁడు నాచందానఁ జెలఁగి యీప్రీతి భుఃజింప నర్హుఁ


ఆ.

డతఁడు యజ్ఞగోప్త యతని విలోకింపఁ, గౌతుకంబు చాలఁ గలదు నాకుఁ
గానం దగినవారిఁ గడువడిఁ బుత్తెంచ్చి, పిలువ నంపు మతనిఁ బెండ్లిఁ జూడ.

1236


ఆ.

అనుచు బలికి ప్రీతి నప్పుడే చారుల, నతనిపాలి కనుప హయము లెక్కి
సత్వరమున నేగి సముచితగతి గుశ, ధ్వజునిఁ గాంచి కుశలవార్తఁ దెలిపి.

1237


ఆ.

ఇంద్రునాజ్ఞచే నుపేంద్రునిఁ దోడ్కొని, వచ్చిన ట్లనంతవైభవమున
జనకునాజ్ఞచేఁ గుశధ్వజుఁ దోడ్కొని, వచ్చి రపుడు వేగవంతు లగుచు.

1238

క.

ఘనుడు గుశధ్వజుఁ డీగతిఁ, దనయాద్వయయుక్తుఁ డగుచుఁ దడయక వేగం
బున వచ్చి గౌతమజునకు, జనకునకును మ్రొక్కి వారిసమ్మతి నొకచోన్‌.

1239


తే.

శిశిరకరకాంతపీఠి నాసీనుఁ డయ్యె, నట సుదామనుఁ డనుమంత్రి కనియె జనకుఁ
డాజిని సుతాప్తగురుబాంధవాన్వితముగఁ, దోడుకొని రమ్ము పొమ్ము సంతోష మెసఁగ.

1240


వ.

అని పలికిన నతండు రయంబున.

1241


క.

చని దశరథునకు నతుఁ డై, జనవర మిము బిల్వ నంపె జనకుఁడు నన్ను౦
దనయగురుమంత్రియుతముగఁ, జనుదేరఁగ వలయు మీరు సమ్మద మలరన్‌.

1242


క.

అన నౌఁ గా కని దశరథుఁ, డనుపమసంతోష మలర నందఱితోడం
జని భర్మాసనగతుఁ డగు, చును ని ట్లనె జనకుతోడ సొం పలరారన్‌.

1243


చ.

నరవర యీవసిష్టమునినాథుఁడు మత్కులదైవతంబుఁగా
నెఱుఁగుము సర్వకృత్యముల కీయన వక్త గురుండు దేవతా
గురునిభుఁ డైనకౌశికునిఁ గూడి మహర్షులసమ్మతంబునన్
సరసత మత్కులక్రమము సర్వము మీ కెఱిఁగించు నింపుగన్‌.

1244

వసిష్టుఁడు జనకునికి దశరథాన్వయక్రమం బెఱింగించుట

ఉ.

నా విని యవ్వసిష్ఠమునినాయకుఁ డాజనకక్షితీశుతో
నావనజాప్తవంశవిధ మంతయుఁ జెప్పఁగఁ బూని యి ట్లను
న్భూవర సత్యవాక్యగుణభూషణ వేడుక సర్వలోకసం
భావిత మైనసూర్యకులపద్ధతిఁ జెప్పెద నాలకింపుమా.

1245


సీ.

అవ్యక్తసంభవుం డవ్యయుఁ డజుండు శాశ్వతుండు చతుర్ముఖబ్రహ్మ దనరు
నతని మానసపుత్రుఁ డై మరీచి జనించె నతనికిఁ గశ్యపాహ్వయుఁడు పుట్టె
నతఁడు సూర్యునిఁ గాంచె నతఁడు వైవస్వతుఁ డనుమనువును గాంచె నమితయశుని
నాతఁ డిక్ష్వాకుమఃహారాజుఁ గాంచె నాతఁడు కుక్షిఁ గనియె నాతఁడు వికుక్షి


తే.

నతఁడు బాణునిఁ గనియె నయ్యధిపతి యన, రణ్యుఁ డనువానిఁ గనియె నారాజు పృథునిఁ
గాంచె నతండు త్రిశంకునిఁ గనియె మఱియు, నాతనికి దుందుమారాఖ్యుఁ డవతరించె.

1246


క.

అతఁడు యువనాశ్వుం బడసెను, నతనికి మాంధాత పుట్టె నన్నరపతికిన్
సుతుఁ డై సుసంధి వొడమెను, నతనికి ధ్రువసంధి వొడమె నవనీనాథా.

1247


వ.

అతనితమ్ముండు ప్రసేనజిత్తుఁ డనంబడు.

1248


చ.

చతురత నొ ప్పునట్టి ధ్రువసంధి కిల న్భరతుండు పుట్టె నా
స్తుతచరితుండు గాంచె నసితుం డనువాని నతండు ధాత్రి న

త్యతులవిభూతి నేలఁ గని యాతని శత్రులు హైహయు ల్మహో
గ్రత శశిబిందు లాజికి నఖర్వగతిం జనుదెంచి యుద్ధతిన్‌.

1249


వ.

అయ్యసితుని రణంబునకుం జీరిన నతండు వారలతోడ నోపినకొలంది సంగ్రా
మంబు గావించి యల్పబలుం డగుట వారల నోర్వం జాలక పలాయితుం డై
మంత్రిసహితంబుగా హిమవంతంబు జేరి యందు భృగుప్రస్రవణంబున నివ
సించి కొంతకాలంబునకు మృతుండయ్యె నతనిపత్ను లిరువురు భర్తృమరణ
కాలంబునకు గర్భిణు లై యుండి యం దొక్కతె యొక్కదానిచూలు
జెఱుప గరంబుఁ బెట్టిన నక్కాళింది విషవేదన సహింపం జాలక యమ్మహాపర్వ
తంబుమీఁదఁ దపంబుఁ గావించుచున్నవాని భృగువంశశ్రేష్ఠుం డైనచ్యవనుం
జేరి పుత్రార్థిని యై యమ్మహాత్మునకు నమస్కరించి శరణంబు వేఁడిన.

1250


చ.

కరుణ దలిర్ప నమ్మునిశిఖామణి యత్తరలాక్షిఁ జూచి యో
తరుణి విపక్షశిక్షకుఁడు ధార్మికుఁ డుత్తముఁ డర్కతేజుఁ డ
త్యురుతరపుణ్యుఁ డొక్కసుతుఁ డొయ్యన నీ కుదయించు నంచుఁ జె
చ్చెరఁ గరుణింప నత్తరుణి శీతకరాళిక సంతసంబునన్‌.

1251


క.

మునినాథునిపాదంబులు, దనఫాలము సోఁక మ్రొక్కి తప్పక పురికిం
జని యొకశుభలగ్నంబున, గనియె న్నందనుని నమృతకరసమమూర్తిన్‌.

1252


తే.

గరముతోడనె జన్మించెఁ గాన నతఁడు, సగరుఁ డన నొప్పె సంతతైశ్వర్యుఁ డగుచు
నతని కసమంజుఁ డనఁ బుట్టె నతని కంశు, మంతుడు జనించె భుజవీర్యవంతుఁ డగుచు.

1253


క.

ఆవసుధేశునకు దిలీ, పావనినాథుండు పుట్టె, నానృపతికి గం
గావతరణకారణ మగు, జ్యావిభుడు భగీరథుండు జనియించె నృపా.

1254


క.

ఆక్ష్మానాథునకుఁ గకుత్‌ , స్థక్ష్మానాథుండు పుట్టె సతతప్రాలే
యక్ష్మాధరధైర్యుండై, యాక్ష్మాపతి కుదయ మయ్యె నట రఘువు నృపా.

1255


క.

అతనిసుతుఁడు పురుషాదకుఁ డతఁ, డే కల్మాషపాదుఁ డన దగె నిలలో
నతఁ డమరళంఖణునిఁ గనె, నతనికిఁ బుట్టె న్సుదర్శనాధిపతి నృపా.

1256


సీ.

అతనికి నగ్నివర్ణాభిధుఁ డుదయించె నతనికి శీఘ్రకుం డవతరించెె
నతనికి మరువు మహాత్ముఁడు జవియించె నతండు ప్రశుశ్రుకు నర్థిఁ గనియె
నంబరీషుని నాత డమితసమాఖ్యునిఁ గడువేడ్క_ నహుషుని గాంచె నతఁడు
ధన్యు యయాతి నాతండు నాభాగుని నాతంశండు నజుని నయ్యమలచరితుఁ


తే.

డీదశరథునిఁ దగఁ గాంచె నితనివంశ, జలధి హరిణాంకుఁ డై యల శంభుచాప

విదళనోచితభుజబలావిష్టుఁ డైన, రాము డుదయించె లోకాభిరాముఁ డగుచు.

1257

జనకుఁడు వసిష్ఠునితోఁ దనవంశక్రమంబుఁ జెప్పుట

వ.

ఈరాముండు త్రిలోకవిఖ్యాతపౌరుషుండును ననన్యసామాన్యప్రతాపదీపితుం
డును సురాసురుల కభేద్యం బైనచంద్రమౌళిశరాసనభంగంబే సాక్షిగా నితని
మహత్త్వంబు దెలియు నిట్టిమహాపురుషశిఖామణికి నీకుమారి నీగంటివి
కృతార్థుండ వైతివి భవదన్వయంబు శుభాంకితం బయ్యె నీద్వితీయపుత్రికను
లక్ష్మణున కొసంగు మిారామలక్ష్మణుల కిరువురకు వయోరూపలావణ్యగుణం
బులచేత సమాను లైననీకూఁతుల నిరువుర నొసంగు టది యతియుక్తంబై
యుండు నని పలికిన విని జనకుండు ప్రీతుండై కృతాంజలి యై యి ట్లనియెఁ
గన్యాప్రదానంబునందుఁ గులజుండు స్వకులంబు నిరవశేషంబుగా వక్కా
ణింపవలయు నస్మత్కులక్రమంబుఁ జెప్పెద వినుము పరమధార్మికుండై సత్త్వ
వంతులలో నుత్తముండై నిమి యనుమహారాజశిఖామణి యొప్పు దత్ప్రభా
వంబు మీ రెఱింగినదియె కదా యాభూపతికి వీర్యవంతుం డైనమిథి పుట్టె
నయ్యచలాధీశునకు సత్యసంధుం డైనప్రథమజనకుండు పుట్టె నయ్యవంతా
వల్లభునకుఁ దేజోవంతుం డైనయుదావసుండు పుట్టె నారసాధినాథునకు ధర్మ
జ్ఞుం డైననందివర్ధనుండు పుట్టె నావిశ్వంభరాభరునకు శూరుం డగుసుకే
తుండు పుట్టె నాధరారమణునకు రాజర్షి యైనదేవరాతుండు పుట్టె నాధరిత్రీ
విభునకు ధర్మాత్ముం డగుబృహద్రథుండు పుట్టె నాధరణీపురందరునకుఁ
బ్రతాపవంతుం డగుమహావీరుండు పుట్టె నాక్షోణీంద్రునకు సత్యవిక్రముం డగు
సుధృతి పుట్టె నాసర్వంసహావరమిహికాంశునకు ధృతిమంతుం డైనధృష్టకేతుం
డు పుట్టె నావసుమతీనాథునకు రాజోత్తముం డైనహర్యశ్వుండు పుట్టె నావసు
ఛాధీశ్వరునకు యశోధనుం డైనమరువు పుట్టె నావనుంధరాజంభారికి గుణవం
తుం డైనప్రతీంధకుండు పుట్టె నాప్పథివీధవునకు దీప్తిమంతుం డగుకీర్తి
రథుండు పుట్టె నామేదినీకాంతునకు జితారి యైనదేవమీఢుండు పుట్టె నా
మహీవరోత్తమునకుఁ దేజోజితోషర్బుధుం డగువిబుధుండు పుట్టె నా
గహ్వరీభర్తకు వంశకర్త యైనమహీధృకుండు పుట్టె నాధాత్రీశునకు జన్యదుర్థ
ర్షుం డైనకీర్తిరాతుండు పుట్టె నయ్యిలాబలారికి బలవంతుం డైనమహారో
ముండు పుట్టె నక్కుంభినీభృన్మణికి నీతిమంతుం డైనస్వర్ణరోముండు పుట్టె
నాజగతీపతికి సాధుపోషకుఁ డైనసహ్రస్వరోముండు పుట్టె.

1258


క.

ఆరాజమణికి ముక్తా, హీరామలకీర్తిఘృణికి నేనును సుగుణో
దారుఁడు కుశధ్వజుఁడు నిం, పారఁగ నిరువురము సుతుల మైతి మజసుతా.

1259


క.

అం దగ్రసుతుఁడ నగుననుఁ, బొందుగ భూవిభునిఁ జేసి పొలుపుగ జనకుం

డందమున ఘోరవనమున, కుం దప మొనరింపఁ జనియె గుణరత్ననిధీ.

1260


ఆ.

తండ్రి చనినవెనుకఁ దమ్మునితో గూడి, ప్రజలు సంతతంబుఁ బ్రస్తుతింపఁ
దాపసేంద్ర రాజధర్మంబు దప్పక, యేను బూజ్యరాజ్య మేలుచుండ.

1261


ఆ.

సైన్యయుక్తుఁ డగుచు నాంకాశ్యపురమున, నుండి వీర్యవంతుఁ డుగ్రతేజుఁ
డగుసుధన్వుఁ డాజి కరుదెంచి సంరంభ, మడర వేగ మిథిల నడ్డగించి.

1262


క.

వచ్చినవాఁడు సుధన్వుఁడు, చెచ్చెర శివకార్ముకమును సీతను వెస నా
కిచ్చిన నిమ్మను లేదని, వచ్చి రణ మొనర్పు మనుము వదలక నాతోన్.

1263


క.

అని చెప్పి యొక్కదూతను, ఘనముగ నాకడకుఁ బంప గ్రక్కున నేను
న్వెనుఁ బడక వానితో వెస, ననిఁ జేసి వధించితి న్మహాశరనిహతిన్.

1264


వ.

ఇట్లు సుధన్వుని వధించి సాంకాశ్యంబునందుఁ గుశధ్వజు నభిషిక్తుం జేసితి నిది
మద్వంశక్రమంబు సర్వంబు నెఱింగించితి నింక మునీంద్రా సత్యంబు దప్పక
యేను వీర్యశుల్క యగుసీతను రామునకును రెండవకూఁతు నూర్మిళను లక్ష్మ
ణునకునుఁ ద్రిశుద్ధిగా నిచ్చెద నిప్పుడు రామలక్ష్మణుల కభ్యుదయంబు గలుగు
టకు గోదానపూర్వకంబుగా నాందీముఖంబును సమావర్తనంబును జేయిం
వుఁ డెల్లుండి యుత్తరఫల్గునీనక్షత్రంబు శుభగ్రహయుతంబై యున్నది వైవా
హికంబు సేయుం డనిన నప్పుడు విశ్వామిత్రుండు వసిష్ఠసహితుం డై వైదే
హుని కి ట్లనియె.

1265

వసిష్ఠవిశ్వామిత్రులు భరతశత్రుఘ్నులకుఁ గుశధ్వజుకూఁతుల నడుగుట

క.

ఇల నిక్ష్వాకువిదేహుల, కులము లచింత్యములు ధర్మగుణనిష్ఠము ల
త్యలఘుయశోనిలయంబులు, తలపోయఁగ నెందు లేదు తత్సమ మనఘా.

1266


క.

సిరియును వీర్యము శౌర్యము, గురుతేజము యశము జలము గుణము ధనము మీ
యిరువురకు సరెయె కావున, నరవర సంబంధ మది ఘనంబై చెల్లున్.

1267


తే.

రామునకు సీతఁ దగ సుమిత్రాసుతునకు, నూర్మిళ నొసంగు టది చాలయుక్త మింక
నీకుశధ్వజుకూఁతుల నిరువురను మ, హీశ భరతశత్రుఘ్నుల కీయవలయు.

1268


ఉ.

ఆతతరూపయౌవనవిహారవచోరచనాదిసద్గుణ
వ్రాతగతిప్రమాణవిభవంబుల నల్వురు నొక్కభంగి వి
ఖ్యాతి వహింతు రీదశరథాత్మజులం గడువేడ్క మీరు జా
మాతలఁగా వరించుట సమంచితకీర్తియె గాదె చూడఁగన్.

1269


వ.

అని పలికిన నవ్వైదేహుండు కృతాంజలియై యమ్మునిపుంగవుల కి ట్లనియె.

1270


సీ.

మౌనిపుంగవులార మద్భాగ్యమున రాఘవులతోడ వియ్యంబు గలిగె నాకుఁ
జాల ధన్యుఁడనైతి సత్కీర్తి వర్ధిల్లె నన్వయంబు పవిత్ర మయ్యె నేఁడు

గోప్తలు శాస్తలు గురువులు గతులును నారభూతులు మాకు మీరె కావె
ప్రియముతో మీకు చెప్పినయట్ల మాకుశధ్వజునిపుత్రికల నిద్దఱను వేడ్క


తే.

భరతశత్రుఘ్నులకు నిత్తుఁ బ్రాభవమున, రాఘవులు నల్వు రొకశుభరమ్యలగ్న
మందె నల్వురపాణిగ్రహణములు దగఁ, జలుపునట్లు ఘటింపుఁడు శాస్త్రఫణితి.

1271


వ.

అని పలికి వెండియు ని ట్లనియె.

1272


ఉ.

తాపసులార యీదశరథక్షితిభర్తకు మత్పురం బయో
ధ్యాపురమట్ల యై వఱలు నాయనపైఁ దగఁ జేర్చు సత్కృపన్
నాపయిఁ జేర్చి మీరలు ఘనంబుగ సర్వము నిర్వహింపుఁ డే
యేపను లెట్లు సేయ నగు నింతయు భారము మీదె సుం డికన్.

1273


వ.

అని పలికిన నతనిపలుకుల కలరి దశరథుండు జనకున కి ట్లనియె.

1274


క.

మీరన్నదమ్ము లిరువురు, వీరు లసంఖ్యేయగుణులు విడుఁక మీచే
నీరాజసంఘ మంతయు, వారక నీఋషులు పూజ వడసిరి మిగులన్.

1275

దశరథుఁడు కుమారాభ్యుదయంబుకొఱకు గోదానంబు గావించుట
భరతునిమాతులుఁ డగుయుధాజిత్తు దశరథునికడకు వచ్చుట

వ.

ఏనింక విడిదలకుం బోయెద మీకు శుభంబు గలుగుఁ గాక యని పల్కి జన
కునిచేత నామంత్రణంబు వడసి వసిష్ఠవిశ్వామిత్రసహితంబుగా నిజనివాసంబు
నకుం జని మఱునాఁడు ప్రభాతకాలంబున విధ్యుక్తప్రకారంబునఁ బితృదేవ
తల నర్చించి గోదానాఖ్యకర్మంబుఁ గావించి కుమారుల యభ్యుదయంబు
కొఱకుఁ గలధౌతాంచితఖురవిషాణంబులును దామ్రపుచ్ఛంబులును గాంస్య
దోహనంబులునై సవత్సలైన పాఁడిమొదవుల నొక్కొక్కని కొక్కొకలక్ష
మహీసురుల కొసంగి దక్షిణార్థం బనంతధనం బొసంగి తక్కినబ్రాహ్మణులకు
రత్నసువర్ణవస్త్రాదు లొసంగి కృతగోదాను లైననందనులచేతఁ బరివృతుండై
సుప్రసన్నచిత్తుం డైనయద్దశరథుండు లోకపాలపరివృతుం డైనప్రజాపతియుం
బోలెఁ బ్రకాశించుచుండె నట్టియెడ యుధాజి త్తనుభరతునిమాతులుండు
తనతండ్రి యగుకేకయాధీశుండు దౌహిత్రుం డగుభరతునిం జూచువేడ్కఁ
దన్నుఁ బుత్తెంచిన నయోధ్యకుం జనుదెంచి యచ్చటఁ బుత్రసహితుండై
దశరథుండు వివాహార్థంబు మిథిలకుం బోవుట యెఱింగి యతిత్వరితగమనం
బున మిథిలకుం జనుదెంచి దశరథుని సందర్శించి కుశలం బరసి యాగమన
ప్రయోజనం బెఱింగించిన నద్ధశరథుండు పూజార్హుం డగునతనిఁ బరమసత్కా
రంబులఁ బ్రీతునిం జేసి యథోచితవ్యాపారంబులఁ బ్రవర్తించుచుండె నంత
నారాత్రి చనిన మఱునాఁ డరుణోదయంబున దశరథుండు పుత్రసహితంబుగా
యథోచితకర్మంబు లాచరించి వసిష్ఠాదిమునులం బురస్కరించుకొని యుత్సవ
శాలకుం జనియె నంత రాముండు భ్రాతృసహితంబుగా నానావిధమణిభూషణ

వస్త్రమాల్యానులేపనంబులచేత నలంకృతుం డై వసిష్ఠవిశ్వామిత్రాదిమహ
ర్షులచేతఁ గృతవివాహసూత్రబంధనమంగళాచారుం డై విజయావహం బైన
వివాహానురూపశుభముహూర్తంబునందు మహర్షిసమేతుం డై యుత్సవశాలకుం
జనుదెంచె నంత నద్దశరథమహీనాథుండు కృతకౌతుకమంగళు లైనకుమా
రులం గూడి వసిష్ఠవిశ్వామిత్రాదిమహర్షులం బురస్కరించుకొని నానావిధమం
గళవాద్యఘోషపురస్సరంబుగా జనకమహీనాథునినగరద్వారంబు సేరం జని
యె నప్పుడు వనిష్టుండు జనకునికడకుం జని యి ట్లనియె.

1276

వసిష్ఠుఁడు జనకునికి దశరథుఁడు నగరద్వారంబున నున్నవాఁ డని తెల్పుట

క.

చెలువుగఁ గృతకౌతుకమం, గళు లగుతనయులను గూడి కాకుత్స్థవరుం
డెలమిఁ జనుదెంచి వేడ్కం, దలవాకిట నున్నవాఁడు దాతను జూడన్‌.

1277


ఆ.

దాతచేఁ బ్రతిగ్రహీతచే దానప్ర, తిగ్రహాదికములు దీర్చవలయుఁ
గాన నీవు పెండ్లికార్యంబుఁ గావించి, నేర్పుతో బ్రతిజ్ఞ నెఱపు మధిప.

1278


క.

అని యిటు వసిష్ఠముని పా, వనచారిత్రకుఁడు పల్కఁ బరమోదారుం
డనుపమధర్మవిదుం డగు, జనకుం డి ట్లనియె మరల సంయమితోడన్‌.

1279


సీ.

ఎలమితోఁ దన కడ్డ మెవ్వాఁడు వాకిటఁ దన కాజ్ఞ యొసఁగ స్వతంత్రుఁ డెవ్వఁ
డనఘాత్మ తనయింటఁ దనకు సందియ మేమి యూహింప నిది తనయూరు గాదె
మానుగఁ గృతసర్వమంగళాచారు లై మత్పుత్రికలు వేదిమధ్యమందు
జెలువొప్ప దీపాగ్నిశిఖలకైవడిఁ బ్రకాశించుచు నున్నవా రంచితముగ


తే.

ననఘ విను మేను నీవేదియందె యుండి, కుతుక మలరార మీరాకఁ గోరుచున్న
వాఁడ నెందుకుఁ గాలయాపన మవిఘ్న, ముగ వివాహంబు సేయుఁడు ముదముతోడ.

1280


క.

అని పలుక నపుడు మునిపతి, యనుమతమున దశరథేంద్రుఁ డఖిలమునులతోఁ దనయులఁ దోడ్కొని గ్రక్కున, మనుకులుఁడు వివాహవేదిమధ్యముఁ జేరెన్‌.

1281

సీతారామవివాహఘట్టము

వ.

అప్పుడు.

1282


క.

జనకుఁడు వసిష్ఠుఁ గనుఁగొని, మునిపుంగవ మీరు సర్వమునియుతముగ రా
మునకు వివాహక్రియ గ్ర, క్కునఁ గావింపుఁ డిఁకఁ దడవు గూడ దనవుడున్‌.

1283


వ.

భగవంతుం డైనవసిష్టుండు విశ్వామిత్రశతానందులం బురస్కరించుకొని ప్రపా
మధ్యంబున శాస్త్రోక్తప్రకారంబున వేదిక నిర్మించి దాని గంధపుష్పంబుల నలంక
రించి సువర్ణపాలికలను సాంకురంబు లగుకరకంబులును నంకురాఢ్యంబు లగుశరా
వంబులును నధూపకంబు లగుధూపపాత్రంబులును శంఖరూపపాత్రంబులును
స్రుక్స్రు వంబులును నర్ఘ్యపాత్రంబులును లాజపాత్రంబులును నక్షతపాత్రం

బులును సమంబు లగుదర్భలును సంఘటించి విధిమంత్రపూర్వకంబుగా వివాహ
వేదికయందు వహ్నిప్రతిష్ఠాపనంబు చేసి మంగళహోమంబు లాచరించె
నంత జనకుండు సర్వాభరణభూషిత యైనసీతను రావించి వహ్నిసమక్షంబున
రామున కభిముఖంబుగాఁ గూర్చుండ నియోగించి కౌసల్యానందవర్ధనుం డగు
రామున కి ట్లనియె.

1284


తే.

నాతనూజాత సాధ్వి యీసీత నీకు, ధర్మసహచరియై సంతతంబు ఛాయ
గతి ననుగతయై యుండు నీకన్యకరముఁ, గరమునఁ బ్రతిగ్రహింపుము గలుగు శుభము.

1285


క.

అని పలికి సమ్మదంబున, జనకుడు శుభమంత్రపూతజలమును వెస రా
మునికరపంకజమున విడి, చెను సర్వజనములు సంతసించి నుతింపన్‌.

1286


క.

అప్పుడు సురవాద్యధ్వను, లుప్పరమున మొనసె వేల్పు లొగి విరివానల్‌
కుప్పలుగాఁ గురిసిరి ముద, మొప్పఁగ నాడిరి సుపర్వయోషిజ్జనముల్.

1287

జనకుఁడు లక్ష్మణభరతశత్రుఘ్నులకు నూర్మిళామాండవీశ్రుతకీర్తుల నిచ్చుట

వ.

ఇట్లు మంత్రోదకపురస్సరంబుగా దనపుత్రి సీతను రామున కొసంగి హర్షపరి
ప్లుతుండై జనకుండు వెండియు.

i288


సీ.

లక్ష్మణ గైకొమ్ము లక్షణవతి యైనదాని నూర్మిళను మత్తనయ నెలమిఁ
బరమహర్షంబునఁ భరత చేకొను నవ్యఘనకేశి మాండవీకన్య నిపుడు
శత్రుఘ్న మోదం బెసంగ నీశ్రుతకీర్తికరము గ్రహింపుము కరముచేత
నలువురు నయధర్మ మలర బత్నివంతులై సుఖింతురుగాక యనుచు బలుక


తే.

జనకువచనంబు విని రాజతనయు లపుడు, నెమ్మితో రాజసుతలపాణిగ్రహణము
లర్థిఁ గావించిరి వసిష్ఠుననుమతమునఁ, దల్లిదండ్రులకోర్కులు పల్లవింప.

1289


తే.

అంత సుముహూర్త మని సమ్మదాత్ము లగుచు, నడిమి తెర దీయ రఘుకులనాయకుండు
సీత నెమ్మోము గాంచి హర్షించె రాము, మోముఁ గనుఁగొని యలరె నామోహనాంగి.

1290


చ.

రమణుని ముద్దుమోము గని రాకసుధాంశుని నిండువెన్నెలం
గొమరు వహించు కల్వలనఁ గోమలి వాలికచూపు లారఘూ
త్తమురమణీయదివ్యపదతామరసంబులమీఁద నెంతయుం
బ్రమద మెలర్చ వ్రాలెఁ బతిపాదములం బ్రణమిల్లుకైవడిన్‌.

1291


చ.

జనకజమోము జూడ మఱి చన్గవఁ జూడఁగ గోరు జన్గవ
న్గనుఁగొన నవ్వల న్నడుముఁ గాంచఁగఁ గోరు సుమధ్యముం గనుం
గొన మఱి యూరువుల్‌ గనఁగఁ గోరు నరేంద్రుమనంబు భూవరుల్‌

దనియక యుత్తరోత్తరపాదస్పృహులే కద యెన్ని చూడఁగన్‌.

1292


తే.

సరసిజానన లావణ్య నరసి లోన, నలరువికసితాబ్జంబులో యనఁగ రాజ
వరునిచూపులు సతిమేన వ్రాలె శశిక, రములు కుముదినిపైఁ జాల వ్రాలినట్లు.

1293


తే.

దశరథకుమారవరుని సౌందర్యవార్థి, కడరి యెదు రెక్కు మీనులొ యనఁగ సీత
వాలుచూపులు పతిమీఁద వ్రాలె నపుడు, రాజుపై వ్రాలు ఘనచకోరములకరణి.

1294


వ.

అంత.

1295


క.

మంగళవాద్యరవంబులు, సంగతిగా మెండుకొనఁగ జనవరసుతు ల
య్యంగనల యఱుతఁ గట్టిరి, మంగళసూత్రములు చతురిమం గ్రమయుక్తిన్‌.

1296


వ.

మఱియుఁ గ్రమంబున నమూల్యముక్తాఫలంబులు తలఁబ్రాలుఁ బోసి దారాన్వితు
లై యగ్నికి వేదికి జనకునకు మహర్షులకు వృద్ధరాజులకుఁ బ్రదక్షిణంబుఁ గా
వించి రపుడు వసిష్టవిశ్వామిత్రవామదేవాదిపరమర్షులు దీవించిరి సభాసదులు
హర్షించిరి వందిమాగధులు జయశబ్దంబులం గీర్తించిరి వేల్పులు కుసుమవృష్టి
గురియించిరి దేవదుందుభులు మ్రోయించిరి రంభాదు లాడిరి గంధర్వులు పాడి
రప్పు డమ్మహోత్సవంబు పరమాద్భుతదర్శనంబై యొప్పె నంత నారాజనందనులు
తమతమయగ్నులకుం బ్రదక్షిణత్రయం బాచరించి సాంగంబుగా వివావాశుభ
కర్మంబులన్నియు నిర్వర్తించి భార్యాసమన్వితులై యుపకార్యలకుం జనిరి దశర
థుండును గృతోద్వాహు లైనపుత్రుల నవలోకించుచు వసిష్ఠవిశ్వామిత్రాదిమ
హర్షులం గూడి బంధుసహితుండై పిఱుందఁ జనియె నంత నమ్మఱునాఁడు.

1297


చ.

జనకుఁడు రాఘవుండు కడు సంతస మొప్పఁగ గాధినందనున్
ఘనతరపూజలం దనిపి కౌతుక మొప్ప నుతించి వేడ్కతో
ననిచిన నాతఁ డేగె మిహికాద్రికి నంత సమస్తరాజుల
స్జనకుఁడు సత్కరించి వరుసం బనిచె న్వెస వారివీళ్లకున్‌.

1298

దశరథుఁడు జనకునిచేతఁ బూజితుం డై యయోధ్యకుఁ బోవుట

వ.

మఱియు దశరథుని వసిష్ఠాదిమహర్షులను సముచితప్రకారంబునం బూజించి
తనపుత్రికల కనేకశతసహస్రగోవులును గంబళంబులును బెక్కుచతురంగ
బలంబులును నలంకారసహితంబులును దివ్యరూపంబులు నైన దాసదాసీజన
సహస్రంబులును సువర్ణమయం బయినహిరణ్యం బొక్కకోటియు మౌక్తికంబు
లొక్కకోటియుఁ గోటివిద్రుమంబులును గన్యాధనం బొసంగి కొండొకదూరంబు
తోడ నరిగి సముచితప్రకారంబుగా వీడుకొల్సి నిజనివాసంబునకుం జనియె
నాదశరథుండు వైదేహు నామంత్రణంబు వడసి కొడుకులఁ గోడండ్ర ననర్ఘ
రత్నాందోళికల నెక్కించుకొని పురోహితామాత్యసామంతభృత్యపరిచారక

వందిమాగధవాదకగాయకనటనర్తకాదులం గూడి సైన్యోపేతుండై హృద్యం
బు లగుమంగళవాద్యరవంబులు సెలంగ మరలి యయోధ్యకుం బోవునెడ.

1299

దశరథుఁడు మార్గమున దుశ్శకునములఁ గని వితర్కించుట

క.

మొదల ఖగప్రకరంబులు, భిదురకఠోరస్వరములఁ బెల్లుగ మ్రోసెం
బదపడి సౌమ్యం బగు మృగ, కదంబము ప్రదక్షిణంబు గాఁ దిరిగె రహిన్‌.

1300


క.

అత్తెఱఁగు సూచి రఘువం, శోత్తముఁ డగు నాదశరథుఁ డూహించి మనం
బుత్తలపడ వెస దాపస, సత్తముని వసిష్టుఁ గాంచి చయ్యనఁ బలికెన్‌.

1301


క.

ఇది యేమికారణంబో, మొదల ఖగము లుగ్రభంగి మ్రోసెడు మృగముల్‌
పదపడి వలపటఁ దిరిగెడు, మదిఁ దహతహ వొడమె నింత మాకుం జెపుమా.

1302


చ.

అన విని మౌనినాథుఁడు నృపాగ్రణి కి ట్లను వింటె ముంగల
న్ఘనముగ నొక్కయాపద దగ న్బొడము న్రహి నంతలోనఁ జ
య్యన మితివెట్ట రానివిజయంబు ఘటిల్లును నోడకుండు మం
చనునెడ దారుణాశుగధుతాతతధూళ జగంబు మ్రింగినన్‌.

1303


చ.

కరిహరిసైన్య మొండొకటి గానఁగ లేక గలంగి పాఱె న
త్తరి రథికుల్‌ రథంబుల నుదారత డిగ్గి పరిభ్రమంబునం
బరువడిఁ బాఱి రుగ్రగతి భానునికాంతులు మాసెఁ దారక
ల్ధరపయి వ్రాలె దిక్కులు గలంగెఁ బయోనిధు లింకె నెంతయున్‌.

1304


వ.

ఇట్టిమహోత్పాతంబులు పుట్టినం జూచి సపుత్రకుం డైనదశరథు౦డును వసిష్ఠాది
మునులునుం దక్కఁ దక్కినసర్వజనంబులను దలంకుచుండిరి మఱియు
నయ్యంధతమసంబున మునింగి యేమియుం దోఁచక సమస్తసైన్యంబు భస్మచ్ళ
న్నం బైనతెఱంగున నిశ్చేష్టితంబై యుండె నట్టియెడ.

1305

రఘురామునొద్దకుఁ బరశురాముఁడు వచ్చుట

సీ.

మనములోఁ బొడమినమహితకోపరసంబు వెలికుబ్బెనా స్వేదజలము లొలయ
జయలక్ష్మిచే నొప్పెసఁగుమృణాళికతోడిపద్మంబనా ఘోరపరశు వలరఁ
దతకోపళిఖిశిఖాతతి వెలి బర్వెనాఁ గన్నులఁ గెంజాయ గడలుకొనఁగ
వీరరసాంభోధి వేలావిధంబున వికటభయంకరభ్రుకుటి మెఱయ


తే.

నమితగతితో నొనర్చు తపోగ్ని మిడిసి, మౌళిపై సుడి గొన్న పెన్మంట లనఁగ
నెగడు కెంజూయ రంజిలు నిడుదజడలు, గ్రాల లోకభయంకరాకారుఁ డగుచు.

1306


చ.

ఇరువదియొక్కమాఱు పృథివీశుల నెల్లఁ గుఠారధారచే
దర మిడి త్రుంచినట్టిజమదగ్నిసుతుం డరుదేరఁ గాంచి యం

దఱు భయ మంది రాదశరథక్షితిభర్త వసిష్ఠముఖ్యధీ
వరులను భక్తితో భయనివారకమంత్రము లుచ్చరించుచున్‌.

1307

పరశురామునకు బుషు లందఱుఁ బూజఁ జేయుట

ఉ.

ఈతఁడు మున్ను తండ్రిపగ కెంతయు రోషకషాయితాక్షుఁడై
యాతతసత్కుఠారమున నారసి యిర్వదియొక్కమాఱు ధా
త్రీతలనాథులం దగ వధించి గతజ్వరమన్యుఁ డయ్యు నీ
రీతి నిదేలకో కనికరింపక గిన్క వహించె గ్రమ్మఱన్‌.

1308


తే.

అనుచుఁ దలపోసి బహ్మర్షు లర్ఘ్యముఁ గొని, భీమదర్శను భార్గవరాముఁ జేరి
దేవ మత్పూజనంబుఁ బ్రతిగ్రహింపు, భార్గవ యటంచు మధురోక్తిఁ బల్కుటయును.

1309


క.

మునిదత్తసపర్యను గై, కొని యట నిల్వక ప్రభూతకోపం బడరం
గనుల హుతాశనకణములు, చినుకఁగ రఘురాముఁ జేరెఁ జిడిముడి వడుచున్‌.

1310


వ.

మఱియుఁ గైలాసంబుకరణి దుర్ధర్షుండును గాలాగ్నియుంబోలె దుస్పహుం
డును విద్యుద్గణసదృశుండును మహాపరశ్వథాలంకృతవిశాలస్కంధుండును శర
చాపధరుండును నై త్రిపురఘ్నుం డైనసాక్షాచ్ఛంభుండునుంబోలె దుర్నిరీక్షుం
డై పావకునిభంగి వెలుంగుచు రామునిమ్రోల నిలిచి యి ట్లనియె.

1311

పరశురాముఁడు రఘురామునితో ఘోరంబుగాఁ బల్కుట

చ.

దశరథరామ నీవు బలదర్ప మెలర్ప విదేహువీటిలోఁ
బశుపతిఘోరకార్ముకము భగ్నము జేసినమేటి వంచు నే
విశదము గాఁగ నింత విని వేగమె చూడఁగ వచ్చినాఁడ న
న్బశుపతిశిష్యుఁ డైనయల భార్గవరామునిఁగా నెఱుంగుమా.

1312


చ.

జనవరపుత్ర జీర్ణ మగు శంభునిచాపము ద్రుంచు టేఘనం
బనుపమలీల నాదువిశిఖాసనముం బరికింపు దీనిఁ గై
కొని వడి నెక్కు వెట్టి శరకోటి ఘటించితివేని రామ నీ
ఘనభుజశక్తిఁ జూచి వెనుకం దగ నిచ్చెద ద్వంద్వయుద్ధమున్‌.

1313

దశరథుఁడు పరశురాముని సవినయంబుగ ననునయించుట

చ.

అన విని భీతుఁడై దశరథాధిపుఁ డంజలిఁ జేసి దైన్య మా
ననమునఁ దోప బల్కె మునినాథునితో ననఘాత్మ భూమిభృ
జ్జనములఁ ద్రుంచి త్రుంచి తుది శాంతుఁడవై కడు బ్రహ్మనిష్ఠచేఁ
బ్రణుతికి నెక్కి తీవు కృప బాలుని రామునిఁ బ్రోవగాఁ దగున్‌.

1314


ఉ.

భూసురవర్య భార్గవుల పుణ్యకులంబునఁ బుట్టి భక్తితో
వాసవవహ్నిముఖ్యసురవర్యులు ప్రార్థన సేయ నస్త్రస

న్న్యాస మొనర్చి కాశ్యపున కర్థి సమస్తధరిత్రి నిచ్చి యు
ల్లాసముతో మహేంద్రకుధరంబున కేగితి గాదె ము న్నొగిన్.

1315


చ.

ఇరువదియొక్కమాఱు ధరణీశుల నందఱఁ ద్రుంచి మేటి వై
పరఁగెడునీకు మౌనివర బాలుఁడు రాముఁ డనంగ నెంత యీ
సురుచిరవిగ్రహుం గనులఁ జూడక నే బ్రతుకంగఁ జాల ని
ష్ఠురగతి రామభద్రుఁ దెగఁ జూడకు నీపద మాశ్రయించెదన్.

1316


వ.

అని బహుప్ర కారంబుల నద్దశరథుండు ప్రార్థించిన నప్పరశురామదేవుం డతని
పలుకులయెడ ననాదరణంబుఁ జేసి రామున కి ట్లనియె.

1317

పరశురాముఁడు రఘురామునికి శైవవైష్ణవధనువులయుత్పత్తిప్రకారంబుఁ జెప్పుట

ఉ.

మున్ను సమస్తదేవమునిముఖ్యులు ప్రార్థన సేయ వేడ్కతోఁ
బన్నుగ విశ్వకర్మ నిరపాయముగాఁ దనశిల్పనైపుణం
బెన్నిక కెక్కఁ జేసెఁ బృథివీశ్వర చాపయుగంబు మేరుభూ
భృన్నవసారము న్గుధరభిత్కఠినత్వముఁ గల్గునట్లుగన్.

1318


ఉ.

ఏవున వేల్పు లందఱు నహీనబలాన్విత మై తనర్చు త
చ్చాపయుగంబులోన నొకచాపము శూలి కొసంగ నయ్యప
ర్ణాపతి దానిఁ జేకొని కరంబు బలంబుఁ దలిర్ప లోకసం
తాపము నిర్జరార్తియుఁ జనం ద్రిపురంబులఁ గూల్చె నొక్కటన్.

1319


క.

రెండవది యైనఘనకో, దండము నన్యున కొసంగఁ దగ దని వెస నా
ఖండలముఖనిర్జరవరు, లండజగమనున కొసంగి రద్భుతభంగిన్.

1320


ఉ.

అంత సుపర్వు లందఱు రమాధిప శంకరదోర్బలాంతరం
బంతయుఁ జూడఁగోరి ముద మారఁగ నందొకనాఁడు భారతీ
కాంతునితోడ నత్తెఱఁగు గ్రక్కునఁ దెల్పిన నప్పితామహుం
డెంతయుఁ గల్గఁ జేసెఁ బరమేశరమేశులకు న్విరోధమున్.

1321


వ.

ఇట్లు జాతరోషు లై యప్పురాణపురుషు లిరువురు కోదండంబులు గొని పర
స్పరజయకాంక్షలం దలపడిన నయ్యిద్దఱకు ఘోరం బైనసంగ్రామం బయ్యె
నప్పుడు.

1322


క.

హుంకారంబున వెస మఱి, శంకరుఁ డటు ధనువుతోడ స్తంభితుఁ డయ్యె
న్బంకజభవాదిసురు లా, వంకకుఁ జనుదెంచి వారి రావించి రొగిన్.

1323


తే.

అనిమిషులచేతఁ బ్రార్థితు లై పినాక, చక్రపాణులు జగములు సంతసింప
బోరు సాలించి తమలోనఁ బొందుఁ జేసి, చనిరి ముదమున నాత్మీయసదనములకు.

1324


తే.

అంతఁ బరమేష్ఠివాసవాద్యమరవరులు, శంభుసత్త్వంబుకంటే నీచక్రిసత్త్వ

మెక్కుడని తలపోయుచు నేగి రధిక, సమ్మదంబునఁ దమతమసదనములకు.

1325


వ.

అంత రుద్రుండు తనచాపంబు విదేహులలో నుత్తముం డైన దేవరాతుం డను
రాజర్షి కిచ్చె విష్ణుఁడు పరపురంజయం బగుతనచాపంబు భార్గవుం డైన
ఋచీకున కిచ్చె నమ్మహాత్ముఁడు మజ్జనకుం డైనజమదగ్ని కొసంగె నమ్ముని
శ్రేష్ఠుండు న్యస్తశస్త్రుం డయి తపోవనంబునకుం జని యందుఁ గార్తవీర్యుని
చేత హతుం డయ్యె నంత నేను బితృవధంబుఁ జూచి జాతరోషుండ నై
వైష్ణవం బగుచాపంబుఁ గొని యిరువదియొక్కమాఱు శోధించి యర్జునాది
రాజుల నందఱ నిశ్శేషంబుగాఁ బరిమార్చి జగం బంతయు నక్షత్రంబుఁ జేసి
వసుంధర నెల్ల యజ్ఞాంతంబునందు దక్షిణార్థంబుగాఁ గాశ్యపున కొసంగి
మహేంద్రకృతకేతనుండ నై తపంబు సేయుచుండి శివధనుర్విభేదనంబు విని
వచ్చినాఁడ నిది వైష్ణవం బగుచాపంబు మత్కరంబునం గ్రాలు చున్నయది
దీనిఁ బ్రతిగ్రహించి క్షత్త్రధర్మం బవలంబించి సజ్యంబుఁ జేసి శరసంధా
నంబుఁ గావించితివేని యవ్వల ద్వంద్వయుద్ధం బొసంగెద నని పలికిన నా
రామభద్రుండు పరిశురామునివచనంబు విని పితృసన్నిధిగౌరవంబువలన నియ
మితకథుండై నయంబున భార్గవరామున కి ట్లనియె.

1326

రఘురామునిచేతఁ బరశురాముఁడు భగ్నవీర్యుఁ డగుట

సీ.

అనఘాత్మ మీతండ్రి యగుజమదగ్నిని జలమున హైహయు ల్చంపుటయును
దానికి నీ వల్గి తప్పక యిరువదియొకమాఱు శోధించి యుర్విపతుల
వరపరశ్వథముచే నఱికి చంపుటయును వరుసతో నేను సర్వంబు వింటి
నెలమితోడఁ బితౄణ మీఁగుట కబ్భంగిఁ జేయంగ సుతునకుఁ జెల్లు ననుచు


తే.

మది సహించితి క్షత్త్రధర్మంబునం ద, శక్తునిఁగ నన్నుఁ దలఁచితి సైఁప నింక
నాదుతేజంబు భుజవీర్యనైపుణంబు, నంతయును నేఁడు చూడుము పంతమేల.

1327


చ.

వెఱవనినన్ను నింత వెఱపింపఁగ నేటికిఁ దెమ్ము నీధను
ర్వర మని జామదగ్న్యునికరంబున రాజిలు చాపబాణము
ల్బరువడిఁ గేల నందుకొని బాణము వింట ఘటించి కన్నులం
జుఱచుఱ కెంపు సొం పెసఁగ జూచి రయంబున రాముఁ డిట్లనున్.

1328


ఆ.

బ్రాహ్మణుండ వనియుఁ బరఁగ విశ్వామిత్ర, బాంధవుండ వనియు భక్తితోడ
మొనసి జీవితంబుఁ గొనఁ జాలు నట్టి యీ, విశిఖ ముగ్రభంగి విడువ నైతి.

1329


వ.

మహాత్మా యిది దివ్యం బైనవైష్ణవసాయకం బమోఘంబు గావున దీనిచేత
భవదీయపాదగమనశక్తిని ఖండించెద నట్లు గాదేని తపోబలసముపార్జితపుణ్య
లోకప్రాపణశక్తిని హరించెద నీరెంటిలోన నీయభిమతం బెయ్యది యెఱింగింపు
మని సంరంభవిజృంభితుండై పలికిన దశరథరాముని రూపలక్షణం బుపలక్షించి
పరశురాముండు దర్పబలోత్సాహంబులు వదిలి ధైర్యంబు విడిచి చేష్టలు

మౌని నిర్వీర్యుం డై చిత్రాకారంబున ఱిచ్చవడి రామునివదనంబు సూచు
చుండె నప్పు డయ్యద్భుకర్మంబు విలోకించి యచ్చెరు వొందుచు బ్రహ్మయు
నింద్రప్రముఖదిక్పాలకులును దక్కిన సురాసురాయక్షగరుడగంధర్వకిన్నర
కింపురుషసిద్ధసాధ్యచారణాదు లంబరంబునం బన్ని బహుప్రకారంబుల శర
చాపధరుం డైనరాముని మహామహిమంబులు వక్కాణించుచుండి రంతఁ
గొంతవడికిం దెలి వొంది భార్గవరాముండు మందవాక్యంబున రామున
కి ట్లనియె.

1330

రఘురాముఁడు పరశురామునిపుణ్యలోకములపై బాణప్రయోగంబుఁ జేయుట

సీ.

బ్రహ్మణ్యుఁ డగు కశ్యపబ్రహ్మ కిచ్చితి ము న్నుర్వి యెల్ల నమ్మునివరుండు
తనదేశమున నుండఁ దగదు పొ మ్మనిన నే నట్ల చేసెడువాఁడ నని ప్రతిజ్ఞ
నెఱపి నాఁటంగోలె వరమహేంద్రాద్రిపై వసియించి పగలెల్ల వసుధ యెల్లఁ
దిరిగి రేలు నివాసగిరికిఁ బోవుచు నిట్లు కాలంబు వెరువున గడపుచున్న


తే.

వాఁడఁ గాన మద్గతి సేయవలదు నాదు, పాలిపుణ్యలోకంబులు లీల నేయు
మనిన నారాముఁ డట్ల కాకని రయమునఁ, గడఁగి యాతనిపుణ్యలోకంబు లేసె.

1331

పరశురాముఁడు రఘురామునిఁ బ్రశంసించుట

వ.

అంత నప్పరశురామదేవుండు రామశరాభిహతంబు లైనస్వార్జితపుణ్యలోకం
బులు విలోకించి వెండియు రాముని వీక్షించి మహాత్మా నీవు జగద్గురుండ వైన
సుదర్శనధరుండవు భవదీయమాయామహత్త్వం బెఱుంగ నెవ్వం డోపు
రణంబున నీ కోడుట నాకుఁ గొఱంత కాదు భవదీయదివ్యపరాక్రమప్రకారంబు
సూచి దేవర్షిగణంబులు గగనంబున నుండి బహుప్రకారంబుల వక్కాణించు
చున్నవారు నీవు దీర్ఘాయుష్మంతుడవై శిష్టప్రతిపాలనంబును దుష్టశిక్షణం
బును గావించుచు ధర్మసంస్థాపనంబు సేయుచుఁ గీర్తిమంతుడవు గ మ్మని
దీవించి ప్రదక్షిణంబుఁ జేసి మహేంద్రపర్వతంబునకుం జనియె సురాసుర
గణంబులు రామునిఁ బ్రస్తుతించుచు దివంబునకుం జని రప్పుడు సుఖస్పర్శంబు
లై వాయువులు విసరె దిక్కులు కాంతియుక్తంబు లయ్యె నంత రాముండు
ప్రశాంతాత్ముం డై యమ్మహనీయబాణాసనంబును శరంబును వరుణున కొసంగి
వసిష్ఠప్రముఖపరమర్షులకు నమస్కరించి విహ్వలుం డైనదశరథు నవలోకించి
యి ట్లనియె.

1332

దశరథుఁడు పుత్రులతో గూడి యయోధ్యాపట్టణంబుఁ బ్రవేశించుట

క.

ఘనుఁ డగుభార్గవరాముఁడు, చనియెం దగఁ జాతకాళిజలదముఁ బోలెన్
మనసేన భవచ్ఛాసన, మును గోరెడు నానతిమ్ము పురమున కరుగన్.

1333


క.

అని విని సంతోషము మది, జనియించఁగ నృపుఁడు రామచంద్రుఁ బునర్జా
తునిఁగాఁ దలఁచుచు రాగం, బుననఁ గౌఁగిటఁ జేర్చి శిరము మూర్కొని యంతన్.

1334

వ.

బంధుమిత్రపుత్రామాత్యసామంతపురోహితసేనాసహితుం డై మంగళవాద్య
ఘోషపురస్సరంబుగాఁ గదలి యెడనెడ నెదుర్కొనుపౌరుల నవలోకించి
మన్నించుచు సుముహూర్తంబున నఖిలసామ్రాజ్యలక్ష్మీనివాసం బైనయయో
ధ్యాపట్టణంబుఁ బ్రవేశించి సిక్తసమ్మార్జితంబును బ్రకీర్ణకుసుమోత్కరంబును
బతాకాధ్వజశోభితంబును దూర్యోద్ఘుష్టనినాదితంబు నైనరాజమార్గంబునం
జని శ్రీమంతు లైనపుత్రులం గూడి స్వస్తివాచనపూర్వకంబుగా హిమవచ్ఛి
ఖరసంకాశం బైనస్వగృహంబుఁ బ్రవేశించి సర్వవిషయభోగపరికరసమన్వితుం
డై మందిరవాసు లైసస్వజనులం గూడి యానందించుచుండె నంతఁ గౌసల్యయు
సుమిత్రయుఁ గైకయుఁ దక్కినరాజకాంతలును గోడం డ్రైనసీతోర్మిళా
మాండవీశ్రుతకీర్తులను బరిగ్రహించి క్షౌమపటంబులు దాల్చి మంగళాలాప
శోభితలై మంగళాలంకారంబులచేత దేవతాయతనంబులం బూజించి రంత
సీతాప్రముఖరాజకన్యకలు గృహదేవతలకుఁ గౌసల్యాదిరాజపత్నులకు నమ
స్కరించి తమతమభర్తలం గూడి యేకాంతంబున యథాసుఖంబుగాఁ గ్రీడించు
చుండిరి మహాత్మ లగు రామాదికుమారులు వీర్యంబుచేత నప్రతిమానులై
కృతదారు లై కృతాస్త్రు లై ధనవంతు లై సుహృజ్జనసమన్వితు లై యనా
రతంబుఁ దండ్రి యగుదశరథునకు శుశ్రూషఁ గావించుచుఁ బరమానందం
బున నిష్టోపభోగంబు లనుభవించుచుండి రంత.

1335

భరతశత్రుఘ్నులు యుథాజిత్తువెంటఁ గేకయరాజువొద్దకుఁ బోవుట

సీ.

ఒకనాఁడు దశరథుఁ డుత్సాహమునఁ బుణ్యరతుని సువ్రతుని భరతునిఁ బిలిచి
యోతనూభవ నీదుమాతామహుఁడు నిన్నుఁ గనుఁగొనువేడుక గడలుకొనఁగ
నీమాతులునిఁ బంపె నినుఁ దోడి తెమ్మని కడుఁబ్రీతి నీవు కాన్కలను గొనుచు
శత్రుఘ్నయుతుఁడ వై చను మని పల్కి యుథాజిత్తుఁ బూజించి తాపనీయ


తే.

భూషణంబు లొసంగి విభూతి మెఱయ, ననుప నాతఁడు భరతుని నతనియనుజుఁ
దోడుకొని హేమరథ మెక్కి తొగలఱేఁడు, వోలె వెలుఁగుచు నిజపురంబునకుఁ జనియె.

1336


వ.

ఇట్లు భరతుండు తల్లితండ్రులకు రామునకు నమస్కరించి యనుజ్ఞఁ గొని శత్రు
ఘ్నసహితుం డై మాతులుని వెంటం జనినయనంతరంబ రామలక్ష్మణులు దేవ
సంకాశుం డైనదశరథునిం బూజించి రంత.

1337

శ్రీరాముసౌజన్యాభివర్ణనము

ఉ.

కాల మెఱింగి ధర్మమును గామము నర్థముఁ గూడఁ బెట్టుచున్
లీల మహి ప్రజన్ ద్రుహిణులీలఁ గృపావశుఁ డై నిజ ప్రజం
బోలె ననారతం బరసి ప్రోచుచు నొజ్జలఁ దల్లిదండ్రులం

జాల భజింపుచు న్బొలిచె శత్రువిరాముఁడు రాముఁ డత్తఱిన్.

1338


తే.

జిష్ణుతపనచంద్రులు జయశీలమునఁ బ్ర, తాపమున సంతతప్రియదర్శనమునఁ
బరఁగ నన్వర్థు లైనట్లు ప్రకృతిరంజ, నమువలన రాముఁ డన్వర్థనాముఁ డయ్యె.

1339


తే.

అంశువులచేత నుజ్జ్వలుం డగుసహస్ర, కరునిచందాన దివ్యమంగళగుణముల
నలరి తలిదండ్రులకు గురువులకుఁ బౌరు, లకు ముద మెలర్ప రాముండు లలి వెలింగె.

1340

సీతారామపరస్పరానురాగాతిశయాభివర్ణనము

ఉ.

వేడుకతోడ రాముఁడు వివృద్ధమనోహర మైనతావిచేఁ
గూడినపువ్వుమాడ్కి రఘుకుంజరుఁ డాజనకాత్మజాతతోఁ
గూడి యథేచ్ఛభంగి మదిఁ గోర్కులు మీఱ వినూతనాతను
క్రీడల సోలుచు న్వినుతరీతి సుఖాంబుధి నోలలాడుచున్.

1341


తే.

జానకీహృత్సమర్పితస్వాంతుఁ డగుచుఁ, దద్గతుం డయి నిత్యంబు దాశరథుఁడు
ఋతువులొకకొన్ని యమ్మహాసతినిగూడి, యనుపమేష్టోపభోగంబు లనుభవించె.

1342


తే.

శ్రీరఘుస్వామి నిత్యంబు సీతఁ గూడి, భావభవకేళికాసుఖసేవి యయ్యుఁ
బ్రతిదినంబును నూత్నసంగతుఁడువోలె, నిరుపమప్రేమభారసంభరితుఁ డయ్యె.

1343


తే.

ధరణిపుత్రియుఁ బితృకృతదార యగుట, దాశరథునకు నత్యంతదయిత యగుచు
గుణమువలన సౌందర్యాదిగుణమువలన, విభున కెంతయు సంప్రీతి వృద్ధిఁ జేసె.

1344


క.

రామునికంటె ద్విగుణమై, రామామణి ప్రేమ యొప్పు రామునిపై నా
రామవిభునియనురాగం, బామానినిమీఁద నొప్పు నట్లు ద్విగుణమై.

1345


క.

సీతాంతర్గతరాగము, ఖ్యాతిగ రాఘవుఁడు రాఘవాంతర్గతరా
గాతిశయము సంతతమును, సీతయు సూక్ష్మమతి నెఱిఁగి చెలగిరి మిగులన్.

1346


వ.

ఇత్తెఱంగున రాజర్షిపుత్రుం డగురాముండు దేవతాసంకాశరూపిణియు
రాజకన్యయు లక్ష్మీసదృశసౌందర్యాదిసమస్తసద్గుణసమన్వితయు నైనసీతం
గూడి లక్ష్మీసమేతుం డైననారాయణునిభంగిఁ బ్రకాశించె నని యిట్లు కుశ
లవులు బాలకాండకథాప్రపంచం బంతయు సవిస్తరంబుగా వినిపించిన విని
రాముండును లక్ష్మణుండును భరతశత్రుఘ్నులును దక్కినసభాసదులును బర
మానందభరితాంతఃకరణులై యట మీఁదికథాక్రమణిక యెట్లు వినిపింపుఁ
డని యడుగుటయు.

1347

పుష్పమాలికాబంధము

చ.

ధరధర వీర శాశ్వత ధృతవ్రత మాధవ దేవదేవ మం
దరధర ధీర మోక్షపదప్రద సుందరతారహార భా

స్వర సురవారపోష వరపల్లవశేఖర హారహార శం
కరధరసారకీర్తి కవికల్పక గోకులబాలఖేలనా.

1348


క.

విశ్వాధిప విశ్వోదర, విశ్వాత్మక విశ్వసాక్షి విశ్వాధారా
విశ్వమయ విశ్వరూపక, విశ్వస్థితివిలయకరణ విశ్వాతీతా.

1349


మాలిని.

సరసిజదళనేత్రా సజ్జనస్తోత్రపాత్రా
నిరుపమసుచరిత్రా నీలమేఘాభగాత్రా
పరమగుణపవిత్రా పాపవల్లీలవిత్రా
హరివరసుతమిత్రా యర్ధికన్యాకళత్రా.

1350


శా.

ఈకావ్యప్రతిపాదితుం డయినసీతేశుండు రామప్రభుం
డీకల్యాణకృతీశ్వరుం డయినశ్రీకృష్ణుండు సంప్రీతితో
సాకల్యంబుగ నిష్టసిద్ధికరు లై చంచత్కృపాపూర్ణతన్
లోకస్తుత్యకుమారయాచధరణీంద్రుం బ్రోతు రెల్లప్పుడున్.

1351


గద్య.

శ్రీరామచంద్రచరణారవిందమకరందరసాస్వాదనతుందిలేందిందిరాయమాన
మానస గోపీనాథకులపవిత్ర కౌండిన్యగోత్ర పద్మనాభసూరిపుత్ర విద్యాసాంద్ర
వేంకటకవీంద్రప్రణీతం బైనశ్రీమద్రామాయణం బనునాదికావ్యంబునందు
బాలకాండము.

శ్రీరామచంద్రార్పణ మస్తు.