గోపీనాథ రామాయణము/గోపీనాథ రామాయణము - పీఠిక

శ్రీరస్తు

శ్రీరామచంద్రపరబ్రహ్మణేనమః

గోపీనాథ రామాయణము

పీఠిక

మీఱ న్వనజాసనాదికులు ప్రార్థింపన్ ఖలశ్రేణి సం
గ్రామక్షోణి జయించి సాధుజనులన్ రక్షించి భూభార ము
ద్దామప్రీతి హరించి ధర్మమును సంస్థాపింపఁ గృష్ణాకృతిన్
భూమానందముతో జనించినకృపాపూర్ణున్ హరిం గొల్చెదన్.

1


చ.

కలశపయోధిపుత్రి యలకాంచనగర్భునిఁగన్నతల్లి క
ల్వలదొరతోడఁబుట్టు హరివల్లభ లేములఁబాపులేమ సొం
పలరఁగఁ బద్మషండములయందు వసించెడుతన్వి లచ్చి నా
కెలమి సమస్తసంపదల నిచ్చి కృతార్థునిఁ జేయుఁ గావుతన్.

2


సీ.

కరటిచర్మముఁ దాను గట్టి భక్తులకు సువర్ణచేలంబు లెవ్వాఁ డొసంగె
ఫణిహారములు దాను బైఁదాల్చి యెవ్వాఁడు మణిహారములు దాసగణమున కిడెఁ
గాలకూటముఁ దాను గబళించి సేవకతతుల కెవ్వాఁ డమృతం బొసంగెఁ
దాను గపాలంబు ధరియించి యెవ్వాఁడు మితిలేని భాగ్య మాశ్రితుల కిచ్చె


తే.

నట్టి పరమదయాశాలి నబ్జమాళి, నఖిలలోకేశు భూతేశు నభ్రకేశుఁ
బ్రమథగణనాథు వినతసుపర్వనాథుఁ, బార్వతీనాథు మదిలోనఁ బ్రస్తుతింతు.

3


మ.

పతిసామేన వసించి భారతియు లోపాముద్రయున్ లక్ష్మియున్
సతతంబున్ భజియింప భూరికరుణాచంచత్కటాక్షంబులన్
బతికన్న న్నతకోటి కెక్కుడుగ సంపద్బోగసౌభాగ్యముల్
చతురత్వంబున నిచ్చుగౌరి నను వాత్సల్యంబునన్ బ్రోవుతన్.

4

మ.

హరినాభీకమలంబునం బొడమి భాషాబ్జేక్షణం బత్నిఁగాఁ
గర మర్థిం గొని తత్సమేతముగ వేడ్కన్ బద్మపీఠస్థుఁడై
పరమప్రీతి సనందనాదులు భజింపన్ నేర్పు మీఱన్ ద్రయీ
సరణిన్ ముజ్జగముల్ సృజించిన జగత్ప్రష్ట న్విధిన్ గొల్చెదన్.

5


శా.

వీణాపుస్తకపాణి షట్పదలసద్వేణిన్ బృహత్సైకత
శ్రోణిన్ బద్మజురాణి సర్వసుగుణక్షోణిన్ బురాణి న్నతేం
ద్రాణి న్నేత్రజితైణిఁ బాదగతగీర్వాణిన్ బ్రవృద్ధాశ్రిత
శ్రేణి న్వాణి నభీష్టసిద్ధికి మదిన్ సేవింతు నశ్రాంతమున్.

6


పంచచామరము.

అజాదిదేవబృంద మేమహాత్ము భక్తినాత్మలో
నజస్రము న్భజించి వాంఛితార్థసిద్ధిఁ గాంచు నా
గజాస్యు సర్వదేవతాగ్రగణ్యుఁ గార్తికేయపూ
ర్వజుణ గణాధిపుం ద్రిలోకవందితున్ భజించెదన్.

7


సీ.

రామనామాంకితరత్నముద్రిక యిచ్చి జనకజప్రాణ మేఘనుఁడు నిలిపె
మైథిలీవరశిరోమాణిక్య మర్పించి కడిమి నెవ్వాఁడు రాఘవునిఁ బ్రోచె
బ్రతికించె నెవ్వాఁడు పరమదివ్యౌషధీదానంబుచే సుమిత్రాతనూజుఁ
బూని యెవ్వాఁడు రామునిరాక యెరిఁగించి భరతశత్రుఘ్నుల బ్రతుకఁజేసె


తే.

సమరమున మూర్ఛ నొందినసకలకపులఁ
బ్రాణము లొసంగి యేమహాబలుఁడు మనిచె
నట్టిపరమోపకారి జితాఖిలారి
నద్భుతవిహారి సామీరి నభినుతింతు.

8


చ.

సరసిజగర్భనిర్మితలసచ్ఛతకోటివిశాలరాఘవే
శ్వరచరితంబు లోకహితనంగతి నిర్వదినాల్గువేలుగా
వరుస రచించినట్టి మునివల్లభు నాదికవీంద్రు యోగవి
స్ఫురితు విరించనాంశభవుఁ బుణ్యుఁ బ్రచేతసుపుత్రుఁ గొల్చెదన్.

9


చ.

తొలుత జగద్ధితంబుగ శ్రుతుల్ విభజించి తదర్థయుక్తిచే
నెలమిఁ బురాణము ల్పదియు నెన్మిదియున్ రచియించి సన్మతిన్
బలువుగ భారతం బనెడుపంచమవేదముఁ జేసినట్టిని
ర్మలునిఁ ద్రివిక్రమాంశజుఁ బరాశరపుత్రుని సన్నుతించెదన్.

10


సీ.

వేడ్కతో నెద్దాని వినినఁ బఠించినఁ గర మర్థి భోగమోక్షము లొసంగు
నరుదార నెద్ది గాయత్ర్యాఖ్యసత్పరబ్రహ్మనివాసమై పరఁగుచుండు
రత్నాఢ్య మగుసముద్రముభంగి సత్కథావిస్తీర్ణమై యెద్ది వినుతి కెక్కు
నొక్కపాదం బైన నొక్కపదం బైన నెద్దానిఁ బఠియింప నిచ్చుఁ బరము


తే.

శ్రుతిమనోహర మెద్ది విశ్రుతపురాణ, మునిరచిత మెద్ది సత్కావ్యముఖ్య మెద్ది

యట్టిబుధసేవ్య మైనరామాయణమున, కాదికావ్యంబునకు నతులాచరింతు.

11


ఉ.

శంకర పంకజాక్ష గిరిజా హనుమన్ముఖ దేవతానుకం
పాంకకటాక్షలబ్ధ కవితాకరులై బహుకావ్యనాటకా
లంకృతు లాచరించి విపులం బగువిశ్రుతిఁ గన్నయట్టిని
ష్పంకులఁ గాళిదాసముఖసత్కవుల న్మది సన్నుతించెదన్.

12


ఉ.

భారతరామసచ్చరిత భాగవతాది మహాపురాణము
ల్గోరి తెనుంగున న్నిఖిలలోకహితంబుగఁ జేసినట్టియా
ధీరుల నన్నపార్య కవితిక్కన భాస్కర పోతనాదులన్
సూరివరేణ్యులం బరమశుద్ధులఁ జిత్తమునం దలంచెదన్.

13


చ.

సరసపదార్థసంగతులఁ జారుతరంబుగ సత్ప్రబంధము
ల్వరుస రచించి ప్రీతి మధువైరి కొసంగి కృతార్థులై రహిం
బరరచిత ప్రబంధములు బాగుగఁ గన్గొని యాదరించుచున్
బరఁగెడు వర్తమానకవివర్యుల నార్యులఁ బ్రస్తుతించెదన్.

14


మ.

ఇల సర్వజ్ఞుఁడు దేవదేవుఁడు రమాధీశుండు లేఁ డన్యుఁ డే
నెలమిన్ నేర్చినభంగిఁ జెప్పితి శుభం బీరామచారిత్రమున్
బలుమా ఱిందులఁ దప్పు లుండిన గణింపన్ బోక సద్భక్తితోఁ
దిలకింపం దగు భావిసత్కవు లమందీభూతచేతస్కులై.

15


ఉ.

కొంచెపువిద్యల న్గడుపుకూటికి నన్యులయొద్దఁ జేరి తా
రించుక పారమార్థికము నెంచక యన్నియు నేర్చినట్టు గ
ర్వించి కృతుల్ రచించుటకుఁ బెల్కుఱి సత్కవులన్ గుయుక్తులన్
వంచన సేయు దుష్కవుల వారక బుద్ధి నిరాకరించెదన్.

16


చ.

నృపతుల వేఁడినన్ గరుణ నిచ్చిన నిత్తురు దంతివాజిర
త్నపటధనాగ్రహారములు దప్పక యన్నియు నస్థిరంబు లా
విపులకృపాపయోధి యదువీరుని వేఁడినఁ బ్రీతినిచ్చు ని
త్యపదము నట్టివానిఁ గొనియాడక యన్యుల వేఁడ నేటికిన్.

17


చ.

స్థిరమతి మాధవాంకితముఁ జేసి రచింపఁగఁ బోలు సత్కృతు
ల్సరసత నందుఁ జెప్పఁబడు లక్షణదోషము లెన్ని యున్న నా
హరికరుణావిశేషమున నన్నియుఁ జాల గుణంబులై చనున్
బరుసువు సోఁక లోహము ధ్రువంబుగఁ గాంచన మైనకైవడిన్.

18


చ.

చతురత మీఱఁ బాకములు శయ్యలు రీతు లలంకృతుల్ ధ్వనుల్
వితతరసంబులున్ మఱియు వృత్తులు దోషములున్ గుణంబు లు
న్నతిఁ బరికించి సత్కృతి యొనర్చినఁ దత్కృతి లోకపూజ్యమై
యతులితభంగి వృద్ధిఁ గను నావిధుభాస్కరతారమై భువిన్.

19

చ.

అరుదుగ నాణిముత్తెముల హారము గూర్చినమాడ్కి లో వెలిన్
సరి మెఱుఁగుల్ సెలంగుపదజాలము గూర్చి రసార్థగౌరవ
స్ఫురణ దలిర్ప సత్కృతులు పూని రచించిన సత్కవిత్వమున్
సరసకవిత్వ మండ్రు కవిసత్తము లన్య కృతు ల్గణింతురే.

20


వ.

అని యివ్విధంబున నభీష్టదేవతాప్రార్థనంబును సుకవిజనబహూకరణంబును
గుకవిజననిరాకరణంబును సత్కృతిప్రస్తుతియుం గావించి మద్వృత్తాంతంబు
వివరించెద నేను బదియాఱువత్సరంబులవాడనై యుండుతఱి నొక్కనాఁడు సిం
హపురంబునుండి నృసింహదేవ కల్యాణోత్సవసమాలోకనకుతూహలాతిరేకం
బున వేదశైలంబునకుం జని యం దొక్కమహాయోగివలన నొక్కవిద్య వడసి
తత్ప్రసాదలబ్ధకవిత్వవిద్యావిశేషుండనై యుదంచితమందార కుసుమబృందని
ష్యంద మకరందబిందుసందోహ పేశల సుధామయ మంజులశబ్దప్రపంచంబును
నవరసోచితచాతుర్య సౌకర్య నిగూఢార్థ సంగ్రహ సాహిత్య సాధ్య నానాలం
కారసంగ్రహంబును ధరార్థకామమోక్షప్రదంబును బురాణమునికథితంబును
సకలవిద్వజ్జనసేవ్యంబును నగునొక్కమహాకావ్యంబు భగవత్ప్రీతికొఱకుఁ గవి
జనానుమతంబున రచియింపం దలంచి యట్టిమహాకావ్యం బెయ్యది యామహా
ప్రబంధరాజంబునకు నాయకరత్నం బెవ్వండొకో యని విచారించు చున్న
సమయంబున.

21


సీ.

రమ్యహాసమువాఁడు రతిరాజు ఋతురాజు వలపించు రహిమించు చెలువువాఁడు
మొగులువన్నియవాఁడు మురిపెంపు మురిపెంపు దొలగించుచక్కనిగలమువాఁడు
కొమరుప్రాయమువాఁడు కమలారి కొమరోలిఁ బురుణించుసొబగైన మోమువాఁడు
వలుఁదచెక్కులవాఁడు బంగారుపొంగారు వలిపెంపుజిగిమించువలువవాఁడు


తే.

 చారుకోటీరకేయూరసారహీర, హారకుండలధాళధళ్యములవాఁడు
బర్హిబర్హావతంసుండు పరమపురుషుఁ, డొకఁడు కలలోనఁ జూపట్టె నుత్సుకమున.

22


ఉ.

మీఱినవేడ్క నవ్వనదమేచకదేహమువానిఁ గాంతి పె
ల్లూరెడుతమ్మిఱేకు లన నొప్పెడుకన్నులవానిఁ బూర్ణిమాం
భోరుహవైరిమండలవిభూతిఁ గనం దగుమోమువాని సొం
పారెడువానిఁ గాంచి మది నద్భుతము న్ముద మంకురింపఁగన్.

23


తే.

కువలయానందరస మొనగూర్చువిధున
కలరుపద్మానుమోదియై వెలయుహరికి
మహితసుమనఃప్రబోధియై మలయుమాధ
వునకు నిట్లంటి వినయోక్తి ననుపమముగ.

24


తే.

అనఘపూర్ణకళానిధి యనఁగ లోక
బాంధవుఁ డనంగఁ జతురాస్యభవ్యుఁ డనఁగ

మాధవుఁ డనంగ సర్వజ్ఞ మహిముఁ డనఁగ
వఱలు నీ వెవ్వరయ్య యో పరమపురుష.

25


క.

హరుఁడవొ మధుకైటభసం,హరుఁడవొ పల్కులవెలంది యగు వాణిమనో
హరుఁడవొ ఘనశంబరసం,హరుఁడవొ శితకరుఁడవో మహాత్మ తెలుపవే.

26


ఆ.

దివ్యపురుష నీదు తేజంబు పొడగన, విమలవృత్తి నాదు తమము విరిసెఁ
బొసఁగఁ దెలివిఁ దాల్చె బుద్ధిప్రపంచంబు, చిత్తపంకజంబు చెలువు మీఱె.

27


క.

అనవుడు నద్దేవుఁడు మె, ల్లన వదనసరోజగంధలహరీలుబ్ధా
ళినిచయముకరణి మోమున, ఘనాలకము లలరఁ బలికె ఘననాదమునన్.

28


తే.

ఏను గృష్ణుండ యుష్మదహీనభక్తి, కలరి యీ పుట్టువునకు నత్యంతకీర్తి
సౌఖ్యము లనంతరంబ మోక్షం బొసంగఁ, దలఁచి సాక్షాత్కరించితిఁ దపముక లిమి.

29


ఆ.

నన్ను మున్ను నెన్నుచున్నకతంబున, నతజనావనము గుణమ్ము గాన
నిన్ను మెచ్చి కడుఁ బ్రసన్నుఁడ నైతి లే, కున్నఁ గానవశమె నన్నుఁ గుఱ్ఱ.

30


క.

వచ్చితి వర మిచ్చితి ని, న్మెచ్చితి నీభాగ్య మెన్న నేర్తురె యొరు లో
సచ్చరిత సకలదోషస, ముచ్చయములఁ బాసితివి సమున్నతిఁ బుత్రా.

31


వ.

వత్సా నీవు పవిత్రంబు లైనమదీయ దివ్యావతారచరిత్రంబులలో నీ కభీష్ట
మెయ్యది దాని మదంకితంబుగా నాంధ్రభాష వచింపు మక్కావ్యంబు నిర్వి
ఘ్నంబుగాఁ బరిసమాప్తి నొందించునట్టి భారం బేను బూనెద నీకును నీవు
రచించినకావ్యంబునకు నభ్యుదయపరంపరాభివృద్ధి యగునట్లుగా ననుగ్రహిం
చెద నీ కీజన్మంబు దక్క నొండు జన్మంబులే దేతద్జన్మాంతంబునఁ బునరావృత్తి
రహితం బైన పరమపదంబుఁ బ్రాపించెదవు.

32


క.

అని యాకమలాక్షుఁడు న, న్గని యుపదేశం బొసంగి ఘనకరుణాసం
జనితానందమున వెసం, జనెఁ దా నందమున నందసంభవుఁ డంతన్.

33


వ.

ఏను మేలుకాంచి మేలుకాంచితినని యనంతసంతోషకలితస్వాంతుండ నగుచుఁ
దదుదంతం బంతయు నార్యుల కెఱింగించితిఁ దదనుమతంబునఁ బురాతన పుణ్య
శ్లోకబ్రహ్మర్షివిరచితంబును ననేకార్థప్రతిపాదకంబును నానావిధవిచిత్రమధుర
శబ్ధప్రపంచంబును వివిధాలంకారభూషితంబును గాయత్త్రీబీజసమ్మితంబు నగుటం
జేసి వేదతుల్యంబుసు సకలరత్నంబులకు సముద్రంబునుంబోలె బహువిధేతి
హాసంబులకుఁ దానకంబును నాదికావ్యంబును సమస్తసురమునిగణసేవ్యం
బును వక్తృశ్రోతలకు భవ్యంబును బురుషార్థంబులకు నివాసస్థానంబు నగు
రామావతారచరిత్రంబు భగవంతుం డగువాల్మీకి సెప్పిన క్రమంబునఁ జతు
ర్వింశతి సహస్రపరిమితగ్రంథములోనం ద్రయోవింశత్యుత్తర సప్తశతవింశతి
సహస్రపరిమితం బైన బాలకాండప్రభృతిషట్కాండకథాప్రపంచం బంతయు
సమగ్రంబుగా నంధ్రభాష రచియింప నిశ్చయించి.

34

శా.

వ్యాప్తి న్రామకథాసుధార్ణవము నిత్యంబు న్దమిం గ్రోలియుం
దృప్తిం జెందనిపుణ్యు నాదిమకవిన్ దివ్యప్రభావాఢ్యునిన్
సప్తార్చిఃప్రతిమానపింగళజటాసందోహు నుద్యత్తప
స్తప్తుం గొల్చెద నిష్టసిద్ధికి మరుత్సంపూజ్యుఁ బ్రాచేతసున్.

35


క.

అని యమ్మునిఁ బ్రార్థించినఁ, బనిగొని ముద మలర నాకుఁ బ్రత్యక్షంబై
తన కజుఁ డొసఁగిన తెల్విని, ఘనముగ నాకొసఁగి చనియెఁ గారుణ్యమునన్.

36


వ.

ఇ ట్లమ్మహాముని యంతర్ధానంబు సేసిన నేను బహుజన్మకృతసుకృతపరిపాకం
బున నిమ్మహాకావ్యరాజంబు దొరకొనియెఁ గదా యని సంతసిల్లి రామాయణ
కథాప్రపంచవిరచనాదక్షుండనై యాభిముఖ్యంబు నొందితి.

37


ఉ.

ము న్నలభాస్కరాదికవిముఖ్యులు ప్రీతి రచించి రీకథం
జెన్నుగ నీవు గ్రమ్మఱ రచించుట కెయ్యది హేతు వంచు మీ
రన్న బుధేంద్రులార వినుఁ డారఘునాథచరిత్ర మెంద ఱె
ట్లెన్నిన నన్నిరూపుల కహీనగతిన్ దగి యుండు నుర్వరన్.

38


వ.

అదియునుంగాక తిక్కనసోమయాజి హరిహరనాథునిం గృతినాథునిం జేసి
భారతంబు సాంగోపాంగంబుగా రచించెఁ బోతనామాత్యుండు సీతాపతిం గృతి
పతింజేసి భాగవతంబు రచించెఁ గంకంటిపాపరాజప్రధానుండు రుక్మిణీశ్వరుం
గృతీశ్వరుం జేసి యుత్తరరామాయణంబు రచించె నాదికావ్యంబును మహా
మునిప్రణీతంబును షట్కాండకథాప్రపంచసంచితం బైన యీపూర్వరామా
యణంబు భాస్కరాదు లొక్కమర్త్యునిం గృతినాథునిం జేసి రచించి రిది
సమాచీనంబు గా దిమ్మహాకావ్యంబునకు రమానాథుండె కృతినాథుం డైనఁ
బదియాఱువన్నెబంగారునకు మాణిక్యంబుతోడి సంపర్కంబు గలిగిన చందం
బున నధికోదయంబై యుండుఁ గదా యని తలంచి యీరామాయణకావ్యం
బు తొలుతం గుశలవులవలన రామరూపధరుండైననారాయణుండె వినియెఁ
గావున నేనును దత్క్రమంబున శ్రీకృష్ణరూపధరుం డైన రమావల్లభునిం
గృతినాథునిం జేసి యీపుణ్యకావ్యంబు రచింప నిశ్చయించితి నీరామాయణ
రహస్యార్థతత్త్వంబు దెలియుటకు వామలూరుతనయుం డొక్కండు దక్క
నన్యు లెవ్వరును సమర్థులు గారైనను నాయెఱింగినంతఁ దేటపఱచెద నత్యా
దరంబున నంగీకరింపవలయు నింక మదీయవంశావతారం బభివర్ణించెద.

39

గ్రంథకర్తృ వంశావతార వర్ణనము

చ.

జలజభవాన్వయాటవివసంతుఁడు పావనగోపినాథస
త్కులకలశాభికైరవహితుండు కళాఢ్యుఁడు లోకబాంధవుం
డలఘుపదార్థకర్త చతురాస్యుఁడు కామహరుండు నిమ్మహీ
స్థలి సుమనోవిభూతిఁ దగు సాధుఁడు వేంకటశాస్త్రి ధీరుఁడై.

40

తే.

అట్టిసర్వజ్ఞునకు గౌరియనఁగ నార్య, యనఁగ శ్యామయనఁగ శివయనఁగ సర్వ
మంగళయనంగ సతియనమహితభద్ర, యగుచుఁ గామాక్షిదేవి యర్ధాంగి యయ్యె.

41


క.

ఆయిరువుర కుదయించిరి, పాయక భగవంతుఁడైన భగవంతుఁడు సు
శ్రీయుతుఁడు బుచ్చనార్యుం, డాయతసత్పథగు లగుచు నర్యమసములై.

42


తే.

అంత భగవంతుపరిణయానంతరమున, నతనికూరిమితమ్ముఁ డద్భుతుఁడు బుచ్చ
నార్యుఁ డారీతి ననసూయ నత్రివోలెఁ, బ్రేమతోఁ గోనమాంబను బెండ్లియయ్యె.

43


క.

ఆమిథునమునకుఁ గల్గిరి, ధీమహితులు నారసింహధృతిశాలి యశో
ధాముఁడు రామాగ్రజసు, త్రాముఁడు విభవాభిరామ రామానుతు లై.

44


క.

అందగ్రజుండు విప్రపు, రందరుఁ డనఁ బొగడు గనెఁ బురందరకరిస
త్కుందేందుశారదాంబుద, చందనయశుఁ డగుచు నరసశాస్త్రి వసుధలోన్.

45


తే.

ఆనరసశాస్త్రిసతి వెంకమాంబ పతికి, భోగసౌభాగ్యనిత్యవిభూతు లొసఁగుఁ
దనువు సగముగ నొనరించి ధవుని బికిర, మెత్తఁ జేసిన గిరిపుత్రి నీసడించి.

46


ఉ.

ఆమహనీయమూర్తికి సమంచితకీర్తికి వెంకమాంబయం
దీమహిఁ బద్మనాభుఁ డన నెంతయు నొప్పెడుపద్మనాభుఁడున్
సోమనిభుండు బుచ్చనయు సొం పలరన్ వరదుండు భూరివి
ద్యా మహిమాఢ్యుఁ డీతఁ డన నాభగవంతుఁడు గల్గి రిమ్ముగన్.

47


క.

వారలలో నగ్రజుఁ డగు, నారాయణసముఁడు పద్మనాభుఁడు వెలసెన్
హారాంబుజహీరాంబుజ, వైరిపటీరహరహారవర్ధితయశుఁడై.

48


తే.

నయవిశారదుఁ డగు పద్మనాభునకుఁ బు
రంధ్రి వేంకటలక్ష్మ్యంబ రహి వహించెఁ
గలిమిజవ్వని యన నెల్లకడల సిరులు
పరఁగ వెదచల్లు జలజాతపాణి యగుచు.

49


క.

హరునకు సుమకైటభసం, హరునకు రమ పద్మయోని కలవాణి నిశా
కరునకు రోహిణిక్రియ నా, సరసున కద్దేవి ధర్మచారిణి యయ్యెన్.

50


ఆ.

చంద్రశేఖరునకు శైలజ కెనయగు, పద్మనాభునకును బరఁగ లక్ష్మి
కొనర వేంకటాఖ్య నుదయించితిఁ గుమార, మదనుఁ డనఁగ నేను మహిమ వెలసి.

51


సీ.

చిత్తంబు హరిగుణచింతనంబులయందు శయములు విష్ణుపూజనములందుఁ
బాదంబులు రమాధిపతిభజనమునందు వీనులు విభుకథ ల్వినుటయందు
శిరము కైటభదైత్యహరనమస్కృతులందు రసన గోవిందకీర్తనమునందుఁ
జక్షువు ల్హరిరూపసందర్శనమునందుఁ గాయంబు శౌరికైంకర్యమందు


తే.

సంతతము గీలుకొల్పి ప్రసన్నబుద్ధి, నన్యమేమియు నెఱుఁగక యవ్విభుండె
శరణమని నమ్మి కొలుచుచు ధర శరీర, యాత్ర నలుపుదు సన్మార్గ మధిగమించి.

52

మ.

జననం బాదిగ రామపాదయుగళీసంసక్తచిత్తుండనై
జనితోత్సాహమునం దదీయకరుణాసంలబ్ధనానాకళా
ఖనినై తద్గుణవైభవప్రచురమై కన్పట్టురామాయణం
బనువొంద న్విరచింతుఁ బ్రౌఢకవితావ్యాపార మేపారఁగన్.

53


గ్రంధకర్త తనగ్రంథము ప్రసిద్ధి కెక్కినచందం బెఱింగించుట

వ.

మఱియు నిమ్మహాకావ్యంబు ధర్మార్థకామమోక్షప్రదంబై పుత్రపౌత్రప్రవర్ధ
నంబై యాయుఃకీర్తికరంబై కల్పద్రుమంబుచందంబున నందంబై యుండు నని
యిట్లు మద్వృత్తాంతంబును రామాయణకావ్యకరణసామర్థ్యంబు గలుగుటకుం
దగినయుపపత్తియు శ్రీకృష్ణదేవునిం గృతినాధునిం జేసి రచించుటకుం దగినకార
ణంబును మద్వంశక్రమంబును వివరించి నాచేత రచియింపంబడిన యీరామా
యణంబు లోకంబునం బ్రసిద్ధి కెక్కినచందంబుఁ దేటపఱచెద నేను శ్రీకృష్ణ
దేవాంకితంబుఁ జేసి తదనుగ్రహబలవిశేషంబున నిరంతరాయంబుగా నిమ్మహా
పుణ్యకావ్యంబు పఠ్యమాణక్రమంబున సాంగోపాంగంబుగా రచియించి దీని
లోకంబునం గలపండితసభలయందు విస్తరిల్లం జేయుటకుం దగినశ్రద్ధాభక్తులు
గలమహీపతు లెవ్వరొకో యని వితర్కించునట్టికాలంబున.

54


శ్రీవేంకటగిరిపురవర్ణనము

సీ.

కమలాప్తబింబంబుఁ గలశంబుగాఁ జేసి కొనఁజాలుపడగలఁ దనరురథము
లటు కరంబులు సాఁచి యమరధునీనరోజములఁ ద్రుంపఁగఁ జాలుసామజములు
హరితేరిబాబాల కర్ధపులాయితక్రమమ్ముఁ జెప్పఁగఁ జాలుఘనహయములు
పిడికిటిపోటుల బిరుదుకొండల నైనఁ బిండి సేయఁగ నోపు వీరభటులు


తే.

కనకరౌప్యవినిర్మితగగనచుంబి, మేరుకైలాససన్నిభాగారములును
నందనోపమోద్యానవనములు గలిగి, పొలుచు వేంకటగిరినామవురవరంబు.

55


క.

సిరి కిరవై కవిశేఖర, పరిశోభితమై యనంతవైభవయుతమై
నిరుపాధికసుఖమై య, ప్పుర మలవైకుంఠపురము పోలికి నమరున్.

56


శ్రీ వేంకటగిరిపురాధిరాజవంశావతారవర్ణనము

సీ.

యద్వంశకర్తయై యలరెఁ బరాక్రమఘనుఁడు రుద్రాదిత్యజనవిభుండు
ఆచంద్రతారార్క మైయుండ సప్తసప్తతిగోత్రముల నుర్విఁ బాదుకొల్పి
కోరి యేకాదశగోత్రంబు లొక్కొక్కగణముగా విభజించి క్రమముతోడ
నాగతాళంబులు నయముతో వృషభంబు పంచవర్ణంబు సమంచితముగ
రమ్యభేరుండవరాహఖడ్గంబులు వానికిఁ బడగలుగా నొనర్చి
ఖడ్గనారాయణఖ్యాతి సంపాదించి వారలచేతఁ గప్పములు వడసి
పరఁగునయ్యనపోతనరనాథతిలకుఁ డే పుణ్యవంశంబునఁ బుట్టి యెసఁగె
జగతిలో శ్రీరంగ జంబుకేశ్వరపురసీమాపరిచ్ఛేదశీలి యగుచుఁ

బాండ్యకిరీటంబు బలిమిచేఁ గొన్నమాధవభూధవుం డెందు నవతరించెఁ
బటుశక్తి శింగభూపాలీయ మనెడి యలంకారశాస్త్రంబు లలి రచించి
యరుదారరాయవేశ్యాభుజంగుండన బిరుదుఁగాంచి యుదారచరితుఁ డగుచుఁ
జెలువొందుసర్వజ్ఞశింగభూపాలుఁ డే యమలాన్వయంబున నవతరించె


తే.

నట్టివెలుగోటివంశమం దవతరించి, వెలయ రేచర్లగోత్రపవిత్రుఁ డగుచు
వీరవర్యుండు విద్వత్కుమారయాచ, జనవిభుం డప్పురం బేలెఁ జతురుఁ డగుచు.

57


తే.

విశ్వనాథప్రతిష్ఠఁ గావించి వెలసి
నట్టిపుణ్యుండు బంగారుయాచవిభుఁడు
తనయుఁడై పుట్టె నతని కాధరణివిభుఁడు
విమలునిఁ గుమారయాచభూవిభునిఁ గాంచె.

58


తే.

ధన్యుఁడగు రాజమౌళికిఁ దనయుఁ డగుట
విబుధగణములఁ బ్రోచువివేకి యగుట
పొసఁగఁ దారకహరయశఃస్ఫూర్తి గనుట
యామహీనేతకుఁ గుమారనామ మమరె.

59


చ.

వెలయఁగ నన్నరేశ్వరుఁడు విష్ణుపురాణము నాంధ్రభాష నిం
పలర రచింపఁ జేసి దనుజారికృపాప్తికిఁ బాత్రభూతుఁడై
చెలఁగి జగంబులం గడుప్రసిద్ధికి నిక్కఁగ విశ్వనాథు ని
శ్చలవిభవంబులం దనిపి చక్కఁగఁ దత్కృపఁ గాంచె నుర్వరన్.

60


తే.

ఆమహారాజునకుఁ బుత్రుఁ డతిపవిత్రుఁ, డాదిరాజనిభుండు దివ్యప్రభుండు
దానమానధనుండు విద్యాఘనుండు, వఱలు బంగారుయాచభూపాలమౌళి.

61


చ.

అరులకుఁ గాలదండ మఖిలార్థులకు న్సురశాఖిశాఖ భూ
భరము ధరింప భోగి జయపద్మకుఁ జక్కని జీవగఱ్ఱయై
పరఁగు జయాభిరాముఁ డగుబంగరుయాచమహీవరేణ్యుసు
స్థిరతరబాహుదండ మని ధీవరు లెన్నఁ జెలంగు చిమ్మహిన్.

62


శ్రీవెలుగోటిసర్వజ్ఞకుమారయాచేంద్ర భూపాలప్రశంస

ఉ.

ఆజ్ఞకు బద్ధులై నృపతు లందఱు గొల్వఁగఁ బెక్కువర్షముల్
విజ్ఞులు మెచ్చ ధాత్రి నతివిశ్రుతవైఖరి నేలె నమ్మహా
ప్రాజ్ఞున కుద్భవించె నిరపాయమహావిభవోన్నతుండు స
ర్వజ్ఞకుమారయాచనరపాలుఁ డమేయగుణాభిరాముఁడై.

63


మ.

గణనాతీతగుణోన్నతుండును ద్రిలోకఖ్యాతచారిత్రుడుం
బ్రణుతప్రాభవుఁ డివ్విభుండు ధ్రువుఁడో ప్రహ్లాదుఁడో యావిభీ
షణుఁడో యంచు బుధు ల్నుతింప భగవత్సంసేవనాస క్తవీ
క్షణచిత్తంబులకుం బ్రియుం డగుచు నాక్ష్మాభర్త ప్రోచు న్మహిన్.

64

మ.

అనిశంబున్ ద్విజకోటిచే మఖము లుద్యత్ప్రీతిఁ జేయించి యో
దనదానంబున మర్త్యులన్ బహుహవిర్దానంబులన్ వేల్పులం
దనియం జేసి మహీసుపర్వులకు నందం బొప్ప భూవస్త్రగో
ధనదానంబు లొసంగి మించి శుచియై ధన్యాత్ముఁడై యుర్వరన్.

65


సీ.

అలతర్కశాస్త్రయుక్తు లుపన్యసించుచో, గణుతింప రెండవగౌతముండు
బహువిధశబ్దనిష్పత్తిఁ గావించుచోఁ, దలపోయ నపరపతంజలి యగు
నఖలవేదాంతశాస్త్రార్థతత్త్వవిచారమందు సాక్షాజ్జనకాధిపుఁ డగు
లలిఁ గావ్యనాటకాలంకారకవితాప్రముఖవిద్యలం దన్యభోజనృపతి


తే.

యుత్తరోత్తరయుక్తి నొండొకసురేజ్యుఁ, డతులగాంధర్వవిద్యయం దనుపమాను
డనుచు జనములు దనుఁ గొనియాడ వాసి, కెక్కె సర్వజ్ఞయాచమహీవరుండు.

66


తే.

ధరణి నెవ్వానికీర్తిప్రతాపరుచులు, వరుస నిఖలదిశాంగనావక్షములకు
సరసచందనకాశ్మీరచర్చ లయ్యె, నన్నరేంద్రుని గీర్తింప నలవి యగునె.

67


వ.

ఇట్లనన్యసామాన్యప్రభావుండై రాజ్యంబుఁ జేయుచు నారాజన్యశేఖరుండు
భారత భాగవత రామాయణ ప్రముఖ నిఖిలపురాణంబులఁ బరిశోధించి భాస్క
రాదులు రచించిన యాంధ్రరామాయణంబులందు వాల్మీకివిరచిత శ్రీమద్రా
మాయణంబునం గలయర్థం బంతయు సమగ్రంబుగాఁ గథితం బైనయది గా
దనియు భగవదంకితంబు గా కున్న వనియుఁ దలంచి యిమ్మహాకావ్యంబు గీర్వా
ణంబున కన్యూనానతిరిక్తంబుగా భగవదంకితంబుఁ జేసి యాంధ్రభాష రచి
యింప సమర్థుం డగుపండితుం డెవ్వండో యని విచారించుచు నే నిక్కావ్యంబు
గీర్వాణంబున కనురూపంబుగాఁ బద్యప్రబంధంబుఁ గావించుట యంతయు
విని ప్రీతిపూర్వకంబుగా నన్ను రావించి యొక్కనాఁడు సువర్ణమణిగణస్థగి
తంబై సుధర్మకు సాటి సేయం దగినసభామండపంబున నగణితమణిగణప్రభా
పటలజటిలంబైన భద్రపీఠంబున సుఖాసీనుండై యుదయమహీధరశిఖరో
పరిస్థితుండైన లోకభాంధవునిభంగి వెలుంగుచు సకలవిద్వజ్జనంబులు పరివే
ష్టింప బృందారకపరివృతుం డగు సహస్రాక్షునిచందంబున నందం బగుచు
మద్విరచితం బైన యాంధ్రరామాయణకావ్యం బంతయు సమగ్రంబుగా
నత్యాదరంబున నాకర్ణించి యిది మదీయాభిప్రాయప్రకారంబున గీర్వాణంబున
కనురూపంబై శ్రీకృష్ణాంకితంబై యున్న దని బహూకరించి పరమానందభరి
తాంతఃకరణుండై చారుచామీకరకటకాంగుళీయకహారాగ్రహారాధిప్రదా
నంబుల నన్ను సత్కరించి పరమభాగవతోత్తముండును శ్రీ రామచంద్రచరణ
సేవాసంసక్తచిత్తుండును గావున లోకహితార్థంబుగా నిమ్మహాపుణ్యకావ్యం
బు జగంబునందు విస్తరిల్లం జేసి శ్రీరామభద్రుని యపారంబైన కృపారసంబు
నకుఁ బాత్రభూతుం డయ్యె.

68

చ.

వెలయఁగ నీకథన్ జగతి విశ్రుతి కెక్కఁగఁ జేసి పుణ్యుఁడై
వెలసిన యిమ్మహీపతికి వేడ్క ననంతయశంబు నాయువుం
బొలుపుగ వంశవృద్ధియును భోగసమృద్ధియు రాజ్యవృద్ధియుం
దొలఁగక యిచ్చి సత్కరుణతోఁ గృతినాథుఁడు ప్రోచు నిత్యమున్.

69


షష్ఠ్యంతములు

క.

శ్రీవల్లభునకు బుధసం, భావితునకు భావుకప్రభావునకు విభా
ప్రావీణ్యహసితకోటివి, భావసునకు భక్తలోకపరతంత్రునకున్.

70


క.

హీరామృత చందన శశి, హారాయిత కీర్తిఘృణికి నదితిజమణికిన్
వీరాగ్రణికి జగన్నుత, సూరిమరున్మణికి యోగిచూడామణికిన్.

71


క.

వ్రజయువతినయనకుముద, ద్విజరాజున కఖిలలోకవిశ్రుతునకు నం
డజరాజగమనునకు బుధ, భజనానందునకు హరికి భద్రాత్మునకున్.

72


క.

సనకాదియోగినుతునకు, వనమాలాకనకచేలవరకౌస్తుభభా
సురపాంచజన్యధరునకు, నిరుపమవిభవునకు రుక్మిణీనాథునకున్.

73


క.

గోపాలనందనునకు ధ, రాపాలకిరీటరత్నరంజితదివ్య
శ్రీపాదపద్మునకు నత, గోపాలావళికి మదనగోపాలునకున్.

74