గోపీనాథ రామాయణము/అయోధ్యాకాండము (కొనసాగింపు)

సీతారామలక్ష్మణులు భరద్వాజాశ్రమముఁ జేరుట

క.

గంగాయమునాతటినీ, సంగమదేశంబుఁ గంటె శైలతనూజా
ర్ధాంగుఁ డగువృషభరాజతు, రంగునిగాత్రంబుపగిదిఁ గ్రాలెడి వత్సా.

1137


క.

సుశ్రీయుత మై బహుతరు, మిశ్రిత మై ప్రశ్రితు లగుమేటిమునులకు
న్విశ్రమ మగుభారద్వా, జాశ్రమ మిది దీనిఁ జూడు మనఘవిచారా.

1138


వ.

అని భరద్వాజాశ్రమంబుఁ జూపి యమ్మహానుభావుండు మహాధనుర్ధరుం డై
మృగపక్షిసంఘంబుల వెఱపించుచు సీతాలక్ష్మణసహితంబుగా ముహూర్త
మాత్రంబున కయ్యాశ్రమంబు సేరం బోయి గంగాయమునాసంధిదేశంబున
బ్రహ్మస్థానంబుపగిది నొప్పుచున్నయమ్మునియాశ్రమంబుఁ బ్రవేశించి యందు
శిష్యగణోపాసితుండును దపోలబ్ధనేత్రుండును సంశితవ్రతుండును నేకాగ్ర
చిత్తుండును గృతాగ్నిహోత్రుండును మహాత్ముండు నగునమ్మహాముని సముచిత
ప్రకారంబున సందర్శించి సీతాలక్ష్మణసహితంబుగాఁ దదీయచరణంబులకుం
బ్రణమిల్లి కేలుదోయి ఫాలంబునం జేర్చి త్రైకాలికాసకలజగద్వృత్తాంతాభి
జ్ఞుం డగునమ్మునిగ్రామణి కి ట్లనియె.

1139


తే.

సూరినుత యేను దశరథసుతుఁడ రాముఁ డండ్రు నాపేరు వీఁడు నాయనుజుఁ డితని
లక్ష్మణుం డందు రీగోల రమణి నాకు, జనకపుత్రిక జానకి యనఁగ నొప్పు.

1140


సీ.

మునినాథ తండ్రిశాసన మౌదల ధరించి వనమున విహరింపఁజనెడు నన్ను
విడువక యీలక్ష్మణుఁడు మహీపుత్రియు నాతోడఁ జనుదెంచినారు వీరిఁ
గూడి వ్రతంబుఁ గైకొని తపోవనముఁ బ్రవేశించి మూలఫలాశనులము
ధర్మమార్గప్రవర్తనులము నై విహరించెద మని విన్నవించురాజ


తే.

వంశవరుమాట విని భరద్వాజుఁ డర్ఘ్య, పాద్యముల గోవు బహువిధపక్వమూల
ఫలముల నొసంగి మృగపక్షికలితుఁ డగుచు, వివిధభంగులఁ బూజఁ గావించి పలికె.

1141


క.

వినుము చిరకాలమున కిట, నినుఁ జూడఁగఁ గల్గె నాకు నిష్కారణ మి
ట్లనఘాత్మ నీకు గహనో, ర్వినివాసము గలుగు టెల్ల వింటిమి గాదే.

1142


క.

ఇది పుణ్యదేశము మహా, నదులు గలయుచోటు పావనము భూరిసుఖా
స్పద మటు గావున నిచ్చట, ముదితుఁడ వై యునికి సేయుము రఘుప్రవరా.

1143


చ.

అన విని రాముఁ డి ట్లనియె నాయన కిచ్చట నుంటి నేని యో
మునివర పౌరజానపదముఖ్యులు చాల సుదర్శుఁ డంచు న
న్ననవరతంబుఁ జూచుటకు నర్మిలి వచ్చుచుఁ బోవుచుందు రీ
యనువున నుండఁ బోలదు రహఃపద మొండొక టాన తీఁ గదే.

1144


వ.

అని యిట్లు రావణవధార్థంబు గూఢంబుగా నవతరించిన నన్నుఁ బ్రకటంబుగాఁ
జేసితి రేని సర్వజనంబు నన్ను నారాయణుం డనియును వైదేహి నిందిర యని
యుఁ దలంచి మమ్ము సందర్శించుటకు సులభంబుగా వచ్చుచుందురు గావున

నిట్టిప్రకటావస్థానంబు నొల్ల నెచ్చట మత్స్వరూపంబు ప్రకటంబు గా కుండు
నెచ్చట వైదేహి హృద్యంబుగా విహరించు నట్టియేకాంతస్థానంబు నాలో
చించి చెప్పుం డనియెడుతాత్పర్యంబునం బలికిన నర్థగ్రాహకం బైనరాముని
వచనంబు విని కాలత్రయాభిజ్ఞుండగుభరద్వాజుండు మహాత్మా యిచ్చటికి దశ
క్రోశమాత్రంబు దవ్వులఁ జిత్రకూటం బన నొక్కపర్వతంబు గల దది
మహర్షిగణసేవితంబును సమంతతస్సుఖదర్శనంబును ఋక్షవానరగోలాంగూల
ప్రముఖనిఖిలమృగవ్రాతోపేతంబును బుణ్యంబును గంధమాదనసన్నిభంబు
నై యొప్పుచుండు నందుఁ బెక్కువర్షంబులు నిరాహారు లై తపంబుఁ జేసి
తన్మహిమవిశేషంబునఁ గపాలావశిష్టశిరంబులతో గూడి దివంబునకుం జనిన
మహాసిద్ధులు పెక్కండ్రు గలరు మఱియు నగ్గిరికూటంబులు విలోకించు
వారికిఁ గల్యాణంబు లొదవు వారలచిత్తంబులు వికారంబులం బొరయక
నిర్మలంబు లై యుండు నది వివిక్తంబు గావున నీకు నివాసయోగ్యస్థానం బై
యుండు నచ్చట నివసింపు మట్లు గాదేని యిచ్చట మత్సహితంబుగా నివసింపు
మని పలికి యమ్మనీంద్రుండు ప్రియాతిథి యైనరాముని సర్వకామంబుల సంతుష్టు
నిం జేసిన నారఘుపుంగవుండు సీతాలక్ష్మణసహితంబుగా మునికృతసపర్యలఁ
బ్రతిగ్రహించి మహర్షికథితంబు లైనపుణ్యకథేతిహాసంబులు వినుచు నారాత్రి
యచ్చట వసియించె నుభయమహానదీకల్లోలమాలాసంఘటనసంభూతజల
కణసిక్తుం డై యాశ్రమస్థవివిధపక్వఫలకునుమసౌరభంబు సంగ్రహించి మంద
మారుతంబు మనోహరంబుగా విసరె నంతఁ బ్రభాతకాలంబున రాముండు
మేల్కాంచి కాలోచితకృత్యంబులు నిర్వర్తించి సముచితంబుగా భరద్వాజుని
సందర్శించి వినయంబున ని ట్లనియె.

1145


తే.

అర్కనిభ నేఁటిరాత్రి మీయాశ్రమంబు, నందు సద్గోష్ఠి సుఖ ముంటి మతిహితముగ
నింక భవదుపదిష్టమహీధరేంద్ర, గమనవాసంబుల కనుజ్ఞఁ గరుణ నిమ్మ.

1146


వ.

అనిన మునీంద్రుం డి ట్లనియె.

1147


తే.

అనఘచారిత్ర చిత్రకూటాచలమున, కరుగు మది మధుమూలఫలాన్వితంబు
కిన్నరవిహగగంధర్వపన్నగేంద్ర, భాసురము నీకు యుక్తనివాస మధిప.

1148


క.

పుణ్యము తపస్విలోకశ, రణ్యము బహుతరుమృగాభిరాజితరమ్యా
రణ్యము ధృతఫలజలరా, మణ్యక మాభూధరంబు మనుకులవర్యా.

1149


క.

అన్నగవనాంతభూములఁ, గ్రన్నన మృగయూథములును గరియూథంబు
ల్ఫన్నుగఁ జరించుచుండు జ, గన్నుతగుణ వానిఁ జూడఁ గల వీ వచటన్.

1150

భరద్వాజుఁడు రామునకుఁ జిత్రకూటమునకుఁ బోవుదారి యెఱింగించుట

ఉ.

అచ్చటిసానుదేశముల నచ్చటిప్రస్రవణంబులం గరం
బచ్చటిపుణ్యతీర్థముల నచ్చటినిర్ఝరకందరంబుల
న్మైచ్చుగ సీతఁ గూడి తమినిండ రహి న్విహరించువేళ నీ
యిచ్చకు సమ్మదం బొదవు నింత యథార్థము రాజనందనా.

1151


క.

పికబర్హిణకోయష్టిక, శుకనాదనినాదితంబు సురుచిరమృగయూ
థకలిత మగునగ్గిరిపై, నకలంకస్థితి వసింపు మతిరమ్యముగన్.

1152

భరద్వాజవచనప్రకారమున రాముఁడు చిత్రకూటమున కరుగుట

వ.

అని పలికి ప్రాస్థానికం బగుస్యస్త్వయనంబుఁ బ్రయోగించిన నారాముండు
సీతాలక్ష్మణసహితంబుగా నమ్మహర్షి కభివందనంబుఁ గావించి యనుజ్ఞఁ గొని
చిత్రకూటశైలనిరీక్షాపేక్షుం డై యరిగె నప్పు డమ్మునీంద్రుండు జనకుండు
సుతులవెంట నరిగినభంగి రామలక్ష్మణులవెంట నొక్కింతదూరం బరిగి
యారాజనందనులం జూచి మీరు గంగాయమునాసంగమంబు డాసి యచ్చటి
నుండి యొక్కింత పశ్చాన్ముఖాశ్రిత యగుకాళిందియుత్తరతీరంబునం జని య
మ్మహానదిరేవు చేరి గమనాగమనంబులచేత నతిక్షుణ్ణంబును బురాణంబు నగు
నయ్యవతరణప్రదేశంబునఁ గాష్ఠసంఘాతవిరచితప్లవంబున నాసూర్యనందని
నుత్తరించి యవ్వల బహువృక్షనిషేవితంబును హరితచ్ఛందంబును దీర్ఘ
శాఖాశిఖోల్లసితంబును సిద్ధోపసేవితంబును శ్యామనామకంబు నగునొక్క
న్యగ్రోధవృక్షంబు గల దావృక్షంబు డాయం జని యమ్మహాపాదపంబునకు సీతా
దేవిని మ్రొక్కించి మాకు శీఘ్రంబునఁ బునరాగమనంబు గలుగుం గాక యని
సీతాపురస్సరంబుగాఁ బ్రార్థించి తదాశీర్వాదంబులు గైకొని యచ్చట నివ
సించి యైన నతిక్రమించి యైన నవ్వలఁ గ్రోశమాత్రంబు దూరంబున యమునా
తీరసంభూతవంశవిరాజితంబును బలాశబదరీమిశ్రంబు నగునీలకాననం బవ
లోకించి యవ్వల రమ్యంబును గంటకపాషాణవర్జితంబును దావపాకరహితంబు
నగుమార్గంబుఁ బట్టి చిత్రకూటపర్వతంబుఁ బ్రవేశింపుఁ డే నీమార్గంబున
బహువారంబులు చిత్రకూటంబునకుం బోయి వచ్చినవాఁడ నని మార్గక్రమం
బెఱింగించి వారిచేత నమస్కృతుండై దీవించి యనుజ్ఞఁ గొని మరలి యాశ్ర
మంబునకుం జనుదెంచె నిట్లు భరద్వాజుం డుపావృత్తుం డైనయనంతరంబ
రాముండు తదుపదిష్టమార్గంబునం బోవుచు సౌమిత్రి కి ట్లనియె.

1153


తే.

అనఘ మునినాథకరుణారసానుభూతి, నతికృతార్థుల మైతి మయ్యనఘమూర్తి
చెప్పినవితాన నమ్మహాచిత్రకూట, శిఖరిశిఖరాగ్రమున నున్కి సేయవలదె.

1154


చ.

అని యిటు రాజపుత్రు లగునయ్యనఘు ల్దమలోఁ దలంచుచున్

జనకజ మ్రోల నుంచికొని సత్వరలీలఁ బవిత్రతోయ న
య్యినసుత డాయ నేగి మన మేక్రియ దాఁటుద మత్యగాధమై
తనరెడు నీలతోయములఁ దద్దయు శోభిలుచున్న దెంతయున్.

1155


మ.

అని చింతించుచుఁ దీర్థదేశ మటు డాయంబోయి సౌమిత్రి గ్ర
ద్దన నత్యున్నతశుష్కవంశములచేతం దెప్పఁ గావించి లే
ననలం బీట యొనర్ప దానిపయి విన్నాణంబుగా రాముఁ డొ
య్యనఁ గూర్చుండఁగఁబెట్టె జానకిని లజ్జాలోలదృక్పంకజన్.

1156


తే.

సీత నిటు రాఘవుఁడు సుఖాసీనఁ జేసి, యిరుదెసల భూషణంబు లంబరము లునిచి
కఠినకాజంబులును జాపఖడ్గబాణ, ములుకుదురు కొల్పి తానుఁ దమ్ముఁడును బ్రీతి.

1157

సీతారామలక్ష్మణులు యమునానది నుత్తరించుట

వ.

అమ్మహాప్లవంబుఁ బరిగ్రహించి యభంగతరంగమాలికాడోలికాచకితచక్రమరా
ళబాలికామధుకరమధురశబ్దాయమానం బైనయమునానదీమధ్యంబునం బోవు
నప్పు డాసీతాదేవి ఘటితాంజలిపుటయై యమ్మహానది నుద్దేశించి యి ట్లనియె.

1158


క.

దేవీ రాముఁడు దశరథ, భూవల్లభసుతుఁడు విపినభూమి కరిగెడిన్
నీ వధికకరుణ నచ్చట, వావిరి రక్షించుచుండవలయుం జుమ్మా.

1159


క.

ఈరే డబ్దంబులు వన, ధారుణిఁ జరియించి పిదపఁ దమ్ముఁడు నేనుం
గోరిక సేవింపఁగఁ జను, దేరఁగలఁడు నిన్నుఁ జూడ దేవీ మరలన్.

1160


క.

ఓయమ్మ నీకు మ్రొక్కెద, నీయనఘుఁడు మరలఁ బుడమి కేలిక యైనన్
నీయాన నీకుఁ బ్రియముగ, వేయుమొదవు లిత్తు వేదవిప్రుల కెలమిన్.

1161


వ.

అని సవినయంబుగా నక్కాళిందిం బ్రార్థించుచుం బోవుచుండ నయ్యేటిదక్షిణ
తీరం బాసన్నం బగుటయు రాముండు లక్ష్మణుండును సీతాసహితంబుగాఁ
బ్లవంబు డిగ్గి యమునాతీరప్రాంతకాంతారసంతానంబులు విలోకించుచుం జని
చని యవ్వల శ్యామనామకం బైనన్యగ్రోధవృక్షంబు డాయం జని రప్పు డ
వ్వైదేహి రామునియనుజ్ఞ వడసి యవ్వనస్పతికి ననుస్కరించి యి ట్లనియె.

1162

సీత శ్యామనామకం బైనన్యగ్రోధవృక్షంబునకు నమస్కరించుట

తే.

పాదపోత్తమ నాపతివ్రతము పార, మొందఁజేయుము కౌసల్య నొగి సుమిత్ర
నర్థిఁ గ్రమ్మఱ వీక్షించున ట్లొనర్పు, మతిదయాళుఁడవై నమస్కృతి గ్రహించి.

1163


క.

అని యీగతిఁ బ్రార్థించుచు, జనకసుత ప్రదక్షిణంబు సలిపె నపుడు రా
మనరేంద్రుఁడు సౌమిత్రిం, గనుఁగొని యి ట్లనియెఁ బ్రీతి గడలుకొనంగన్.

1164


క.

నీ విఁక ముంగలియై చను, మావెంబడి జనకపుత్రి యరుదెంచెడు నే
వావిరి మీయిద్దఱకుం, గావలియై వెనుకఁ బ్రాపుగాఁ జనుదెంతున్.

1165


తే.

త్రోవ నెద్దానియందు నీదేవిమనసు, దగ రమించుచునుండు నెద్దానిఁ గోరు
నది కుసుమమైన ఫలమైన ననఘచరిత, చెచ్చెర మహీకుమారికిఁ దెచ్చి యిమ్ము.

1166

తే.

అనిన నతఁ డగ్రభాగమం దరుగుచుండె, వెనుక రాముఁడు చనుచుండె విల్లుఁ బూని
పుడమికన్నె యయ్యిద్దఱినడుమ నొప్పె, దంతియుగమధ్యగతనాగకాంతఁ బోలి.

1167


వ.

ఇత్తెఱంగునం బోవుచు నమ్మహీపుత్రి కుసుమకిసలయఫలోపేతంబులై యదృష్ట
పూర్వంబు లైనతరులతాగుల్మంబులు విలోకించి తదీయసుషమావిశేషం
బులు నిజనాథునకుం జూపి చెప్పిన నద్దేవి యభిప్రాయం బెఱింగి తత్తత్తరు
లతాగుల్యాధిష్ఠితంబు లైనఫలకుసుమంబులు గోసి తెచ్చి లక్ష్మణుండు సీతా
వచనసంరబ్ధుండై యొసంగినం గైకొని యాహ్లాదించుచుఁ గుముదకైరవనీలో
త్పలపుండరీకషండమండలాంతర్గతమకరందబిందురసాస్వాదనతుందిలేందిందిర
బృందఝంకారసంకులంబు లైనయమునాసరోవరతీరంబులం గ్రీడించుచు
నవ్వలఁ గ్రోశమాత్రంబు దూరం బరిగి యందు.

1168


ఉ.

గ్రద్దన విండ్లు నమ్ములును గైకొని బల్లిదు లన్నదమ్ము లా
యిద్దఱు శౌర్యవిస్ఫురణ మేర్పడఁ గ్రూరమృగాళిఁ ద్రుంచుచుం
బ్రొ ద్దటు గ్రుంకునంతకును బొందికతో విహరించి యొక్కచో
నొద్దిక మీఱ నుండి రల యుర్విజకుం గుశలంబుఁ దెల్పుచున్.

1169


వ.

అంత మేధ్యంబు లగుపెక్కుమృగంబుల వధించి యాహారంబు గావించి రిట్లు విచి
త్రవాలుకజలవిహరమాణహంససారసనినాదంబు లాకర్ణించుచు నిర్మలసరో
వరసలిలకణసంవర్ధితపుష్పితెలాలతావాసనావాసితశీతలానిలంబు పై వీవ
వానరవారణయుతం బైనయమునాతీరవనంబున నారాత్రి వసియించి.

1170


ఆ.

అంత రాత్రి చనిన ననఘుండు రాఘవుఁ, డనుజు మేలుకొల్పి యనియె వింటె
శుకపికాదిపక్షినికరనినాదంబు, ప్రొద్దు పొడిచె నింకఁ బోవవలదె.

1171


తే.

అనుచు లక్ష్మణు బోధించి యతఁడు తాను, సవితృజావారిలోఁ గ్రుంకి సంధ్య వార్చి
చిత్రకూటాద్రి కరుగుచు సీతఁ జూచి, రాముఁ డిట్లని పల్కె గారవముతోడ.

1172

రాముఁడు సీతకు వనంబులయందలి విచిత్రంబులను దెల్పుట

క.

కాంతా పలాశవృక్షము, లంతటఁ జాలుఁ గొని నిజసుమావళిచేతన్
దంతురితము లై యొప్పై వ, సంతసమయ మగుటఁ గంటె సంతస మలరన్.

1173


ఉ.

కాతరనేత్ర చూచితివె కమ్మనివాసన లుల్లసిల్లు భ
ల్లాతకవృక్షపంక్తులు పలాశఫలప్రసవప్రకాండవి
ద్యోతితమూర్తు లై కడుభరోద్ధతి నేలకు వీఁగి చిత్రవి
ఖ్యాతిఁ జెలంగుచున్నవి మృగద్విజకోటి కనాశ్రయంబు లై.

1174


ఆ.

మధురవాణి కంటె మధుమక్షికాభిసం, భృతము లగుచు భరముకతన వ్రేలి
తూలుచున్న వివిగొ ద్రోణప్రమాణంబు, లైనతేనెపెరలు మ్రానులందు.

1175


తే.

ప్రసవసంస్తరసంకటరమ్యనిపిన, దేశములయందుఁ దనుఁ గాంచి ధీరఫణితి

మ్రోయు దాత్యూహమున కాభిముఖ్య మొంది, నెమిలి గూసెడిఁ గంటివె నీరజాక్షి.

1176


వ.

అని బహుప్రకారంబుల నవ్వనవిలాసంబు లవ్వైదేహికిం జూపుచుం జని
చని దవ్వులఁ జిత్రకూటంబుఁ జూచి రాముండు లక్ష్మణున కి ట్లనియె.

1177


క.

కరియూథానుసృతంబై, గురుతరవిహగప్రణాదఘోషితమై సుం
దరశిఖరంబై యొప్పెడు, నరవరసుత చిత్రకూటనగముం గంటే.

1178


క.

అతిరమ్యము బహుతరమి, శ్రితము సమతలంబు పుణ్యశేవధి యగు నీ
క్షితిధరకాంతారంబున, జితవైరీ మనము వసతి సేయుదము రహిన్.

1179


మ.

వనదంతావళకర్ణచామరలసద్వాతంబులన్ మార్గసం
జనితాయాసముఁ దీర్చుచు న్భుజగభుక్శబ్దంబుల న్సంస్తుతి
ధ్వనిఁ గావింపుచు నిర్ఝరాంబువుల పాద్యం బిచ్చుచున్ లక్ష్మణా
కనుఁగొంటే గిరిరాజు తా మనకు సత్కారంబుఁ గావించెడిన్.

1180


మ.

రుచిరామూల్యఫలోపభోగకుతుకప్రోద్యచ్ఛుకశ్యామమై
యచలధ్భూరితమాలమేచకఘనంబై ధాతుసంరక్తమై
ప్రచురాబ్జాకరతీరశోభిసితపత్రస్వచ్ఛమై చూడు మీ
యచలోత్తంసము చిత్రకూట మనుట న్సార్థక్య మొందించెడిన్.

1181


శా.

నానాపక్షిరుతాన్వితంబు మృగసన్నాదాన్వితం బున్నతా
హీనానోకహపుష్పశోభితలతాహేలాయుతం బుజ్జ్వలా
స్థానాలంకృత మాత్తమూలఫలము న్స్వాదూదకంబు న్ఘనో
ద్యానప్రావృత మైనయీశిఖరిమీఁద న్నిల్వఁగాఁ బోలదే.

1182


క.

ఇది మనకు యోగ్యవాసం, బిది రమ్యం బిది మనోజ్ఞ మిచ్చటఁ బుణ్యా
స్పదు లగుమునులు వసింతురు, సిదిరము లే దిచ్చట సుఖజీవన మబ్బున్.

1183


మ.

అని చింతించుచు నమ్మహాశిఖరి డాయం బోయి యప్పట్టునన్
మునినాథేరితవేదమంత్రనినదంబు ల్నింగిపైఁ బర్వఁగా
ఘనహోమానలధూమసంకలితమై గన్పట్టు వల్మీకజ
న్మునిపుణ్యాశ్రమముం గనుంగొనిరి తద్భూపాలవంశోత్తముల్.

1184

రాముఁడు వాల్మీకిమహామునియాశ్రమముఁ జేరుట

వ.

ఇట్లు వాల్మీకిపుణ్యాశ్రమంబుఁ జూచి సీతాసహితంబుగా నమ్మహామునికడకుం
జని తదీయచరణంబుల కభివందనంబుఁ గావించిన నమ్మహర్షిశ్రేష్ఠుండు సమా
దరసంభృతాతుండై యమ్మువ్వుర నతిథిసత్కారంబుల సంప్రీతులం జేసి స్వా
గతం బడిగిన నమ్మునికి రాముండు నిజవృత్తాంతం బంతయుఁ దెల్లంబుగా విన్న
వించి సౌమిత్రి నవలోకించి యి ట్లనియె.

1185


క.

భూరిశ్రేష్ఠములగు దృఢ, దారువులం దెచ్చి తగువిధంబున మనకున్

వారక నిలువఁగఁ జిత్రా, కారంబుగఁ బర్ణశాలఁ గావింపు మిటన్.

1186


క.

అనవుడు లక్ష్మణుఁ డగుఁ గా, కనుచుఁ గవాటాభిరామ మగునట్లుగఁ జ
య్యన నాకుటిల్లుఁ గట్టిన, ననుజునినేర్పునకు మెచ్చి యధిపతి పల్కెన్.

1187

సీతారామలక్ష్మణులు పర్ణశాలాప్రవేశము చేయుట

వ.

వత్సా గృహాధిష్ఠితశిఖిపర్జన్యప్రముఖపంచచత్వారింశత్సంఖ్యాకవాస్తుదేవత
లకు శాస్త్రచోదకవిధిప్రకారంబున బలిహోమనైవేద్యాదిపూజనంబుఁ గా
వింపవలయుఁ జిరంజీవు లగువారిచేత నీవాస్తుశమనం బవశ్యకర్తవ్యంబు గావున
నీవు విధిధర్మంబు సంస్మరించుచుఁ దదర్థంబు కృష్ణమృగంబును వధించి తె
మ్మీదివసంబు శుభదివసం బిమ్ముహూర్తంబు శుభముహూర్తంబు మన మిప్పు
డె పర్ణశాలకు శాంతిఁ గావింత మనిన నాలక్ష్మణుండు మేధ్యంబైన కృష్ణమృ
గంబును వధించి యువరతశోణితనిష్యందం బగుదాని వహ్నియందుఁ బక్వంబు
గాఁ దప్తంబుఁ గావించి తెచ్చి రామునకుం జూపి కృష్ణమృగం బన్యూ
నాంగంబై యవైకల్యదగ్ధత్వంబువలనఁ గృష్ణవర్ణంబైన మృగంబుచందంబు
నం జూపట్టుచున్నది యీయైణేయం బగుమాంసంబుచేత వాస్తుదేవతాసంత
ర్పణంబుఁ గావింపుం డనిన నమ్మహాత్ముండు నిర్మలోదకంబులం గ్రుంకి నియతుం
డై గృహదేవవినియుక్తంబు లైనమంత్రంబులు సంగ్రహించి సంగ్రహంబుగా
వాస్తుశాంత్యాదికంబుఁ గావించి పూర్వోక్తగృహాధిష్ఠితపంచచత్వారింశద్దే
వతాగణంబులఁ దృప్తులం గావించి శుచియై సంతుష్టాంతరంగుండై పర్ణశాలఁ
బ్రవేశించి వాస్తుదోషశమనీయంబు లైనపుణ్యాహవాచనాదిమంగళకృత్యం
బులు నిర్వర్తించి క్రమ్మఱ స్నానపూర్వకంబుగా రౌద్రంబును వైష్ణవంబు
నైన వైశ్వదేవబలిఁ గావించి నద్యంబువులఁ గ్రుంకి వీర్యవంతంబు లైనమం
త్రంబులు జపించి పాపసంశమనీయం బైనయుత్తమబలిఁ గావించి యష్టదిగ్వ
ర్తిబలిహరణవేదిస్థలంబులును గణపతివిష్ణుప్రముఖదేవతాయతనంబులును
నిర్మించి తత్తద్దేవతల కందంద సూక్ష్మమార్గంబున నవస్థానంబులు కల్పించి
వన్యంబు లైనఫలమూలమాల్యపక్వమాంససలిలదర్భసమిద్గణంబులచేత వేదో
క్తప్రకారంబున సర్వభూతంబులఁ దృప్తి నొందించి రాముండు సీతాలక్ష్మణ
సహితంబుగా సుముహూర్తంబున నంతర్బహిఃప్రాకారభిత్తిప్రతిష్ఠిత యగుదా
ని విశాల యగుపర్ణశాలఁ బ్రవేశించి సుధర్మాభ్యంతరస్థుం డైనదేవేంద్రుని
చందంబునం దేజరిల్లుచు.

1188


సీ.

కమనీయఫలభరోేన్నమితమాకందనంబానోకహవ్యాప్తసానువులను
నేడాకులనఁటుల నెలమావికానలఁ బుష్పితద్రుమకుంజపుంజములను
సముదదంతావళశార్దూలముఖసత్త్వనినదఘూర్ణితమహావనములందు
రమణీయపుళినాభిరామమాల్యవతీనదీతీరపుణ్యప్రదేశములను

తే.

వేడ్క విహరింపుచును దాను వీరుఁ డయ్యు, లక్ష్మణబలాభిగుప్తుఁ డై రమణ మెఱసి
సీతతోఁ గూడి సుఖలీల జెలఁగుచుండెఁ, గరము పురవిప్రవాసదుఃఖంబు విడిచి.

1189

సుమంత్రుం డయోధ్య కరుగుట

వ.

ఇచ్చట గుహుండు జాహ్నవీతీరంబున రాముండు దృష్టిపథం బతిక్రమించునం
దాఁక నచ్చటనుండి తదీయకల్యాణగుణగణవిశేషంబులు సుమంత్రునితో వక్కా
ణించుచు నతనిచేత నామంత్రణంబు వడసి నిజనివాసంబునకుం జనియె నంత
సుమంత్రుండు గుహునిచారులవలన రాముని భరద్వాజాభిగమనంబును
యమునాతీరప్రాంతకాంతారప్రవర్తనంబును జిత్రకూటప్రవేశనంబును సవిస్త
రంబుగా నెఱింగినవాఁడై యరదంబుఁ దోలుకొని గాఢదుర్మనస్కుండై సు
గంధబంధురంబు లైనవనంబులను సరిత్సరోవరంబులను నగరగ్రామంబులును '
విలోకించుచుం జని మూఁడవనాటిసాయహ్నసమయంబునకు శీఘ్రవేగం
బున నయోధ్యాపట్టణంబు నేరం జని నిరానందంబై నిశ్శబ్దంబై శూన్యాకా
రంబై యున్నయప్పురంబుఁ గలయం గనుంగొని శోకవేగసమాహతుండై
నిజాంతర్గతంబున.

1190


మ.

కరులుం దేరులు గుఱ్ఱము ల్సుభటసంఘంబు ల్పురీసుందరుల్
పురసంవాసులు దేశవాసు లెపు డామోదంబుతో నిండియుం
డ రహిం గ్రాలెడుపట్టణం బిపుడు సీతానాథుఁడు న్లేమిఁ బొం
పిరి శోకానలహేతిఁ గాలినక్రియ న్వీక్షింపఁగా నయ్యెడిన్.

1191


క.

అని చింతించుచు మెల్లన, జనుచుండఁగఁ బౌరజను లసంఖ్యులు రథమున్
వెనుకొని రాఘవు నెచ్చట, ననఘాత్మక విడిచి వచ్చి తని యడుగుటయున్.

1192


క.

వారికిఁ గ్రమ్మఱ నిట్లను, శ్రీరాముని జాహ్నవీసరిత్తీరమునన్
దూరమున నిడిచి యారఘు, వీరునిచే సెలవుఁ గొని నివృత్తుఁడ నైతిన్.

1193


తే.

అనుచు వినిపింప విని పౌరు లధికశోక, వేగమున వ్రాలి కన్నీరువెడల నూర్పు
సెగలఁ గందుచు నందంద చిత్త మెరియ, హారఘూత్తమ యని పొక్కి రార్తు లగుచు.

1194


క.

పున్నమనాఁటికళానిధి, కెన్నిక యగురామచంద్రు నీయరదముపై
గన్నారఁ జూడ దొరకమిఁ, బన్నుగ నేఁ డిట్లు చంపఁబడితిమి గాదే.

1195


తే.

దానయజ్ఞవివాహాదిధర్మకర్మ, ములను మహనీయసుసమాజములను రామ
చంద్రు గుణసాంద్రు ధార్మికు సత్యనిరతుఁ, డనెడిభాగ్యంబు మన కింకఁ గలుగు నెట్లు.

1196


చ.

తపములు సల్పి యైన బహుదానము లర్థుల కిచ్చియైన ని
శ్చపలతఁ బెక్కుజన్నములు సమ్మతితో నొనరించియైన నీ
యపరిమితప్రభావుని ననంతగుణాఢ్యునిఁ బోలు నాథునిన్
నిపుణత నన్యునిం బడయ నేర్తుమె యింక జగత్రయంబునన్.

1197

తే.

రమణ జనకునిచే బోలె రాముచేత, నూరు పరిపాలితం బగుచుండె నేని
యీపురంబునఁ గలవారి కింతకంటెఁ, బ్రియము సుఖము సామర్థ్యంబు పెంపు గలదె.

1198


తే.

అనుచుఁ బౌరులు దుఃఖార్తి నాడుమాట, లాలకించుచు సౌధవాతాయనస్థ
పుణ్యపుణ్యాంగనాశోకమున కడలుచు, రాజవరుఁ డున్ననగరు సేరంగఁ జనియె.

1199

సుమంత్రుఁడు దశరథుని సందర్శించుట

వ.

ఇట్లు సుమంత్రుండు పిహితాననుండై రాజమార్గంబునం జని చని రాజమందిర
ద్వారసమీపంబునం దేరు డిగ్గి మహాజనసమాకులంబు లైనసప్తకక్ష్యాతరం
బు లతిక్రమించి చనునప్పుడు రామరహితుండై హర్మ్యప్రాసాదవిమానమాలిని
యగు నయోధ్యఁ బ్రవేశించి వచ్చుచున్నసుమంత్రు నవలోకించి యంతఃపుర
కాంతలు రామాదర్శనకర్శితులై బాష్పవేగపరిప్లుతంబులై నవిమలాయతనేత్రం
బులచేత నొండొరుల నిరీక్షించుచు హాహాకారంబులఁ గావించుచు రాజసాన్నిధ్యం
బువలన మందంబుగా రోదనంబు సేయుచు రామశోకాభితప్తలై గుసగుసలు వో
వుచు నీసుమంత్రుండు తొలుత రామసహితం బైనరథంబుఁ గొని చని యిప్పుడు
రామరహితం బైనరథంబుఁ గొని యొంటిమెయిం జనుదెంచుచున్నవాఁడు
పుత్రశోకాభిపీడిత యైనకౌసల్య కేమి చెప్పఁ గలవాఁ డీదేవిపుత్రుండు నిర్యాతుం
డగుచుండ సహించి జీవించు ననియెడునది మిక్కిలి దుష్కరజీవనం
బిట్టిజీవనంబు సుకరంబు గాదని సత్యంబుగాఁ దలంచెద మని విలపించుచుండఁ
బరమార్థభూతం బైనవారలవాక్యం బాలకించుచుం జని యష్టమకక్ష్యం బ్రవే
శించి శోకంబుచేతఁ బ్రదీప్తం బైనదానిపగిదిం జూపట్టునట్టి యొక్కపాండర
గృహంబునఁ గుమారునిం దలంచికొని కొండొకసేపు కన్నీరు మున్నీరుగా
రోదనంబుఁ జేసి యలసి దీనుండై శోకనిద్రాపరవశుండై నేలం బడియున్న దశ
రథు నుచితభంగి సందర్శించి మేల్కొల్పి నమస్కరించి రామవృత్తాంతం బం
తయు నెఱింగించిన నతం డూరక యవ్వాక్యంబు విని యేమియుం దోఁపక
విభ్రాంతచేతనుండై శోకమూర్ఛాపారవశ్యంబునఁ గ్రమ్మఱ ధరణిపయిం బడియె
నప్పు డంతఃపురజనంబు లెల్ల మహీపతిపా టంతయుం జూచి భుజం బెత్తి
యుచ్చైర్నాదంబున రోదనంబు సేయుచుండి రప్పుడు కౌసల్య సుమిత్రయుం
దానును మూర్ఛితుండై పడియున్నమగనిం గ్రుచ్చి యెత్తి యాసీనుం గావించి
శోకగద్గదస్వరంబున ని ట్లనియె.

1200


సీ.

లోకేశ నీయాజ్ఞఁ గైకొని రాముని దారుణారణ్యమధ్యమున విడిచి
వచ్చిన సూతునివంకఁ గన్గొని మన సిచ్చి సంభాషింప వేటి కింత
యనయంబుఁ జేసితి నని సిగ్గు నొందితో యట్లేల వినుము నీ కధికసుకృత
మగుఁ గాక యిటు రిత్త వగచినఁ బని యేమి యధిప యెద్దానిభయంబువలన


తే.

సుతునివార్త విచారింపఁజూడ వైతి, వట్టికైకేయి యిచట లే దడలు మాని

కూర్మిభాషింపు మని పల్కి కొండవంటి, శోకభరమున నవశయై సొలసి వ్రాలె.

1201


తే.

ఇట్లు మూర్ఛిల్లి పరితాప మెదఁ జెలంగ, నవని వ్రాలిన కౌసల్య నట్టె చూచి
యంతిపురమున విలపించుకాంత లెల్ల, సుస్వరంబుల నేడ్చిరి చూడలేక.

1202


తే.

అంత నంతఃపురసముస్థితార్తనాద, మాలకించి పురింగల బాలవృద్ధ
జనము తరుణీజనంబు రోదనముఁ జేసె, నారవంబునఁ బురమెల్ల బోరు కలఁగె.

1203


తే.

అప్పు డుపచారముల బోధితాత్ముఁ డగుచుఁ, బుడమిఱేఁ డాత్మజునివార్త నడుగఁ దలఁచి
సూతుదిక్కు మొగం బైనఁ జూచి యతఁడు, ఫాలమున హస్తయుగ్మంబు గీలుకొలిపి.

1204


తే.

భూరిశోకాభితప్తుఁ డై పొగులువాని, భుజగపతిభంగి నూర్పులు వుచ్చువాని
ధ్యానశోకపరీతాత్ముఁ డైనవాని, నధికవృద్ధుని నృపుని డాయంగఁ జనియె.

1205


వ.

మఱియు నవసూత్రబద్ధం బైనకుంజరంబు భంగి నస్వస్థుం డైనదశరథునిసమీ
పంబున కరిగి యప్పుడు.

1206

దశరథుఁడు సుమంత్రుని రామవృత్తాంతం బడుగుట

తే.

వేఁడియూర్పులు సెలఁగంగ విన్నవాటు, వదనమునఁ దోఁప ఘనరజోధ్వస్తగాత్రుఁ
డగుచు శోకసంతప్తుఁ డై పొగులుచున్న, వాని సూతునిఁ జూచి భూవరుఁడు పల్కె.

1207


క.

సూతా తరుమూలాశ్రితుఁ, డై తాపసవృత్తిఁ దాల్చి యాపదలకు వి
ఖ్యాతిగ సహించి యెచ్చట, సీతాపతి యున్నవాఁడు చెప్పుము నాకున్.

1208


మ.

అనఘా భూరిసుఖోచితుం డతఁడు కల్యాణాభిజాతుండు నా
తనితమ్ముండును మేటిసౌఖ్యముల నొందం జాలువాఁ డాయశో
ధను లామంజులతూలతల్పములమీఁదం గూర్కువా రావనా
వనిలో నెట్లు వసింప నేర్తు రిపు డీవైక్లబ్య మె ట్లీఁగుదున్.

1209


చ.

అనుదిన మేఘనుండు తమినాటకు సంగడికాండ్రఁ గూడి గ్ర
క్కునఁ జనువేళ నేనుఁగులు ఘోటకముల్ రథముల్ పదాతులున్
వెనుకొని వోవు నట్టిరఘువీరుఁడు నిర్జన మైన ఘోరకా
సనమున నొంటి నేవిధమునం జరియించు సుమంత్ర చెప్పుమా.

1210


ఉ.

క్రూరమృగప్రకాండ మగు ఘోరవనంబున నేఁడు పాదసం
చారమునం బవిత్రకులజాత మహాసుకుమారి యైనయా
ధారుణిపుత్రిఁ గూడి బలుతావుల నాఁకటిబాధ కోర్చి నా
కూరిమిపుత్రు లెట్లు నయకోవిద గ్రుమ్మరువారు చెప్పుమా.

1211


ఉ.

ప్రేమ దొఱంగి యాలి కటుప్రీతిగఁ గావలె నంచుఁ బుత్రునిం

దా మును కానకుం బనిచి తద్వ్యధ నిప్పుడు కుందిన న్ఫలం
బేమి సుమంత్ర యైన విను మీ విటు క్రమ్మఱ వచ్చువేళఁ దా
నేమనె రాఘవుం డనుజుఁ డేమనె నేమనె సీత చెప్పుమా.

1212


తే.

ఆశ్వినులభంగి సుందరు లమితతేజు, లైన మన్నందనులు ఘోరకాననమున
కరుగునప్పుడు వీక్షించి నందువలన, సూత నీవు సిద్ధార్థుండ వైతివి కద.

1213


తే.

అమరపదతుల్య మైనరాజ్యంబు విడిచి, సాధుగతిఁ బూని యడవికిఁ జనిన సుతుని
విధము వినుపింపు నట్లైన నిలుతుఁ గొంత, దడవు మేనఁ బ్రాణంబులు దాల్తు నిపుడు.

1214


వ.

మఱియు స్వర్గపదంబున నుండి సాధుమధ్యంబునం బడినయయాతిరాజర్షి
చందంబున స్వర్గతుల్యరామసాన్నిధ్యవిహీనుండనై నిర్గమించి తదీయాసనాది
వ్యాపారశ్రవణంబున జీవించి యుండెద నని రామనచనాకర్ణనోత్కంఠుండై
యడిగిన సుమంత్రుం డమ్మహీపతిం జూచి యెలుంగు సవరించికొని కంఠగత
బాష్పనిరుద్ధం బగువాక్యంబున ని ట్లనియె.

1215

సుమంత్రుఁడు దశరథునికి రామవాక్యములఁ జెప్పుట

సీ.

వసుధేశ నే నిట వచ్చునప్పుడు రామచంద్రుండు నయధర్మసంహితముగ
మీతోడ నను మని ప్రీతితో నాతోడఁ జెప్పినవాక్యంబు చిత్తగింపు
మందంద శిరముచే వందనీయుం డగుమాయయ్య కిపుడు నామాఱు గాఁగ
నంజలిఁ గావించి యభివాదన మొనర్చి యడుగులఁ బడి యొత్తుమనియె మఱియు


తే.

నంతిపురమునఁ గలవారి కధికభక్తి, వందన మొనర్చి వేర్వేఱ వరుసతోడ
సేమ మభివాదనంబును జెప్పు మనుచుఁ, బ్రియముతోఁ జెప్పె నాతోడ నృపవరేణ్య.

1216


వ.

మఱియు మజ్జనని యగుకౌసల్యకుఁ బ్రణామంబుఁ జేసి నావచనంబులుగా
నద్దేవితోడం జెప్పు మని నాతోఁ జెప్పిన తెఱంగు వినుము.

1217


క.

ధర్మము వదలక నిత్యము, నిర్మలమతి నగుచు వహ్నినిలయము తఱియం
దర్మిలి సేవించుచు స, త్కర్మునిఁ బతిఁ గొలుచు చునికి దగు నీ కెపుడున్.

1218


క.

మానాభిమానముల గతి, మాని సవతులందు సూడు మాని నృపునికై
మానుగఁ గైకేయిని స, న్మానించుచు నుండు మతిసమంచితబుద్ధిన్.

1219


వ.

తల్లీ భరతునియందు రాజ్యత్వప్రయుక్తగౌరవంబుఁ జేర్పుము రాజు లర్థజ్యేష్ఠు
లగుటం జేసి రాజధర్మంబు సంస్మరించి భరతునియెడ వైముఖ్యంబు విడువుమని
పలికి పదంపడి భరతునితోఁ జెప్పు మనిన తెఱంగు వినుము.

1220

ఉ.

ఏ నిట వచ్చునప్పుడు మహీవరనందన నీవు వీటిలో
లేనికతంబున న్మతులఁ బ్రీతిగఁ జెప్పుట లేక పోయె న
మ్మానవనాథునానతి సమంచితరాజ్యముఁ బూని ధర్మము
న్మానక తల్లు లందు సమస్థితిఁ జూచుచు నుండు మెప్పుడున్.

1221


వ.

మఱియు మహీనాథుండు వయోవృద్ధుండు గావున నమ్మహాత్ముని రాజ్యస్థునిం
గా భావించి పాలించుచు యౌవరాజ్యపదస్థుండ వై రాజశాసనంబున జీవిం
పుము మఱియుఁ బుత్రాభికాంక్షిణి యైనకౌసల్యను గైకేయినట్ల సన్మానించు
చుండుము.

1222

సుమంత్రుఁడు దశరథునికి లక్ష్మణువాక్యంబులఁ జెప్పుట

క.

అని చెప్పు మనుచు నాతో, మనుజేశ్వర రాఘవుండు మాటికి వినయం
బునఁ బల్కి దుఃఖవశమున, కనుఁగవ సాంద్రముగ బాష్పకణముల నించెన్.

1223


ఉ.

రాముఁడు పల్కుమాట విని లక్ష్మణుఁ డూర్పులు వుచ్చి క్రుద్ధుఁ డై
నామొగ మట్టె చూచి ఘననాదనిభార్భటితోడ ని ట్లనున్
ఈమహనీయమూర్తి యిపు డేయపరాధముచే నిరంతరో
ద్దామపురీసుఖస్థితులు దక్కి వివాసితుఁ డయ్యెఁ జెప్పుమా.

1224


తే.

దోస మెంచక కైక యీతుచ్ఛశాస, నంబు శిరమున నిడికొని నరవరుం డ
కార్య మైనను మది నొక్కకార్యబుద్ధిఁ, జేసి పంచిన నప్పని సేయఁ దగవె.

1225


చ.

కపటపుధర్మముం దవిలి గ్రక్కున రాముని లచ్చి నెంతయున్
నిపుణత సంగ్రహించుటకు నేఁడు వరద్వయ మంచు నొక్కబ
ల్నెప మిడి కామదారుణశిలీముఖవిద్ధుఁడు గాన నాలికై
నృపుఁ డిటు కాన కీయనఘునిం బనిచె న్సువిచారహీనుఁ డై.

1226


వ.

సుమంత్రా దశరథుండు దైవప్రేరితబుద్ధిం జేసి మిమ్మఁ బరిత్యజించె నని యంటి
వేని దైవప్రేరితుం డైన నొకానొకయపరాధంబు నిరూపించి కదా పరిత్యజిం
పవలయు నీరామునియం దొక్కింత యైన నపరాధంబు లే దిట్టినిరపరాధుఁ డై
నరాముని నెట్లు పరిత్యజించె నిది యుక్తంబు గాదు వినుము.

1227


క.

అనుచిత మిది యుచితం బిది, యనుచు విచారింప కానృపాగ్రణి రఘువ
ర్యుని లోకవిరుద్ధంబుగ, వనమున కనుచుటఁ దలంచి వగచెద బుద్ధిన్.

1228


చ.

సకలజగద్ధితాచరణు సర్వజగత్ప్రయునిం గుమారునిం
గ్రకచమువంటిచిత్తమునఁ గానకుఁ బంచినయట్టిరాజునం
చీఁక గురుబుద్ధిఁ గూర్పఁ దగ దేటికి వే యన నీమహాత్ముఁడే
సకుఁడు గురుండు దైవమును సర్వము నాకుఁ దలంప సారథీ.

1229


తే.

పూర్ణిమాచంద్రవదనునిఁ బుణ్యమూర్తి, ననఘు రాముని నిష్కారణముగ విడిచె
నిట్టిదుష్కర్మకారి యైనట్టిమనుజ, విభుని నెబ్భంగి లోకంబు విశ్వసించు.

1230

తే.

సకలలోకాభిరాముని సత్యరతుని, రామునిఁ బరిత్యజించి భూరమణ లోక
గర్హితుండ వై యింక నేకరణి జగతి, నేలెద వటంచుఁ జెప్పుము నృపునితోడ.

1231


తే.

అనుచు మీతోడ భాషింపుమని సుమిత్ర, కొడుకు గనలుచుఁ బలికెఁ దత్కోపవేగ
మేమని వచింపవచ్చు శ్రీరామునందుఁ, గూర్మి పెంపున నతఁ డంతకుపితుఁ డయ్యె.

1232


ఉ.

రాముఁడు పల్కుచందమును లక్ష్మణుఁ డన్నవిధంబుఁ జూచి యా
భూమితనూజ యూరుపులు వుచ్చుచుఁ జిత్రసమర్పితాకృతిన్
మో మఱ వాంచి శోకమున మోమున నశ్రులు గ్రమ్ముదేఱఁ దా
నేమియుఁ బల్క కుండె మనుజేశ్వర రామునిమోముఁ జూచుచున్.

1233


తే.

సీతయట్టుల రాముఁడు చిన్నబోయి, కనుల నశ్రులు చనుదేఱ ననుజబాహు
పాలితుం డయి నన్ను మీపాలి కరుగు, మనుచుఁ దా నెట్టకేలకుఁ బనిచె నధిప.

1234


వ.

ఏను గృతాభ్యనుజ్ఞుండ నయ్యు నమ్మహాత్ముని విడువంజాలక హృదయంబునం
బరితపించుచుఁ గొంతసేపు పురోభాగంబునఁ గృతాంజలిపుటుండ నై కొలిచి
యుండి యెట్టకేలకుఁ జిత్తంబు గట్టిపఱచుకొని రథంబు దోలుకొని గుహసహి
తంబుగా శృంగిబేరపురంబునకుం బోయితి నప్పుడు వైదేహి భూతోపహతచిత్త
యైనదానితెఱంగున విస్మృతసర్వప్రయోజన యై ఱిచ్చవడి యభూతపూర్వ
వ్యసన యై కన్నీరు నించుచు దీనవదన యై సారెసారెకు రామునివదనంబు విలో
కించుచు మరలి చనుదెంచుచున్ననన్ను విలోకించుచుండె నంత రామలక్ష్మ
ణులు జటామండలమండితు లై సీతాసహితంబుగా గంగానది నుత్తరించి యే
ను విలోకించుచుండఁ బ్రయాగాభిముఖులై చనిరి లక్ష్మణుండు రఘునందనుం
బాలిఁచుచు నగ్రంబునం జనియె నట్లు ప్రస్థితు లైనవారలం జూచి యే నవశుం
డ నై నివృత్తుఁడ నైతి నప్పుడు శతమఖముఖవిబుధదుర్లభం బైనశ్రీరామసేవా
భాగ్యంబు మాచేతఁ బురాకృతసుకృతపరిపాకంబున లబ్ధం బయ్యె నది యిప్పు
డు దైవంబుచేతఁ గ్రమ్మఱ విఘటితం బయ్యె నింక నేమి సేయుదము మనకు
వ్యర్థజీవనం బేల యని తద్దుఃఖంబున నశ్రువులు నించుచు రాముం డతికఠినహృ
దయుండై యరుగుచుండ రథ్యంబులు మరలకున్న నే నతిప్రయత్నంబునఁ
గ్రమ్మఱించికొని రామలక్ష్మణుల కంజలి గావించి దుఃఖము నడంచుకొని శృంగి
బేరపురంబుఁ జేరి రాముండు నన్ను మరలఁ బిలుచునో యనునాశచేత నచ్చట
గుహునితోఁగూడఁ గొన్నివాసరంబు లుండి క్రమ్మఱఁ బురంబునకుం జను
దెంచునప్పుడు మార్గంబునందు.

1235

సుమంత్రుఁడు దశరథునికిఁ దాను దారిలోఁ గన్నతెఱఁగుఁ దెల్పుట

సీ.

రమణీయపుష్పకోరకశోభితము లైన మ్రాఁకులు మలమల మఱిఁగిపోయె
నదులు వల్వలములు సదమలజలతటాకంబులు తప్తోదకంబు లయ్యె
నుద్యానవనములు నుపవనంబులు పరిశుష్కవర్ణంబు లై సొబగు దప్పె

సత్వసంఘంబులు సంచారములు మానెఁ గమలాకరంబులు కలుషజలము


తే.

లగుచుఁ దప్తాంబుజంబు లై హంసముఖర, ఖగవిరావంబులును లేక క్రాఁగుచుండె
రమ్యగుణమండనుం డైనరాఘవుండు, కాననంబున కరిగిన కారణమున.

1236


తే.

మఱియు నావచ్చునప్పుడు నిరుపమాన, విపినములయందుఁ గీరాదివివిధవిహగ
రవము లించుకయైనను జెవికి సోఁక, వేమి చెప్పుదు నాచిత్ర మినకులేశ.

1237


వ.

ఇట్టివిపర్యాసంబులఁ జూచుచుం జనుదెంచి యయోధ్యాపురంబుఁ బ్రవేశించి
రాజమార్గంబునం జనుదెంచునప్పుడు రామరహితం బైనరథంబుఁ జూచి నిట్టూ
ర్పు నిగుడించుచుఁ గన్నీరు నించుచు నూరం గలవారిలోన నొక్కం డైన
న న్నాశ్వాసింపం డయ్యె మఱియుఁ బురంబునం గలపుణ్యాంగనలు ప్రాసాద
హర్మ్యవిమానాగ్రంబులనుండి హాహాకారంబులు సేయుచు బాష్పధారా
పూరితముఖు లై యన్యోన్యవదనావలోకనంబు సేయుచు దీర్ఘస్వరంబున విల
పించుచుండిరి యేను రామప్రవాసజనితార్తిత్వంబున మిత్రామిత్రోదాసీనజనుల
విశేషం బించుక యైన విలోకింపనైతి నియయోధ్య యప్రహృష్టమనుష్యయు
దీననాగతురంగమయు నార్తస్వరపరిమ్లానయు వినిశ్వసితనిస్వనయు నిరానం
దయు రామప్రవ్రాజనాతురయు నై పుత్రహీన మైన కౌసల్యకరణిం దోఁచు
చున్న దని పలికిన నాసుమంత్రునివాక్యంబు విని యద్దశరథుండు పరమదీనుండై
బాష్పోపహతవాక్యంబున సుమంత్రున కి ట్లనియె.

1238

దశరథుఁడు తన్ను దూఱుకొనుచు నానాప్రకారంబుల దుఃఖించుట

ఉ.

మక్కువతో నయజ్ఞు లగుమంత్రు లనేకులు గల్గి యుండఁగా
నొక్కనితోడ నైన నయ మొప్పఁగ యోచన సేయ కాలికై
గ్రక్కున రామునిం గటికికానకుఁ బొమ్మని యంటి నక్కటా
యక్కడి కేల పోయితి మహాగుణభూషణు నేల వాసితిన్.

1239


తే.

మోహవశమున నాలికై మోసపోయి, కులమునకుఁ గీడు చేసితిఁ దలఁప నేల
మొదలఁ గావలె నని చేసి పిదప నిట్లు, పరితపించిన నిఁక నెట్లు పాసిపోవు.

1240


తే.

ఏమి చెప్పుదు సూత నా కించు కైనఁ, బుణ్యశేషంబు గలదేని భూరికరుణఁ
గూర్పు మల రాఘవుని నన్నుఁ గూర్పకున్న, నొడలఁ బ్రాణంబు లుండవు తడవు వలదు.

1241


చ.

అనఘచరిత్ర యిప్పటికి నైన మదాజ్ఞఁ జరించెదేని పు
త్రుని మరలింపు మత్తెఱఁగు దుర్ఘట మేని రథస్థుఁ జేసి గొ
బ్బున రఘువర్యుఁ డున్నవనభూమికి న న్గొని పొమ్ము సూత యా
ఘను నెడఁబాసి యొక్కతృటికాల మిల న్మనఁజాల నెంతయున్.

1242


ఉ.

చందురువంటి నెమ్మొగము చాఁగెడుకన్నులు వృత్తదంష్ట్రముల్
సుందరపల్లవాధరము సోఁగకురు ల్మణికుండలప్రభా

బంధురకర్ణయుగ్మమును బారెఁడుచేతులు గల్గురాము నిం
పొందఁగఁ జూడ కున్న నిలుపోపఁ దరంబె సుమంత్ర యిత్తఱిన్.

1243


చ.

గుఱుతుగ రాముఁ డున్నయెడకుం గొనిపోవుట యొండెఁ గానిచో
సురుచిరలీల నయ్యనఘుసుందరరూపము నాత్మలోపలం
దిరముగ నిల్పి చూచుచు నతిత్వరితంబుగ ధర్మరాజమం
దిరమున కేగు టొండె నిఁక నిల్వఁగ నేర్తునె యీజగంబునన్.

1244


తే.

ఇట్టిదురవస్థ నొంది యే నిపుడు రాము, చంద్రు సద్గుణసాంద్రు విశాలయశుని
సూర్యవంశప్రదీపకుఁ జూడ నేని, యింతకంటెను ఘనదుఃఖ మెద్ది నాకు.

1245


వ.

అని నిర్వేదించి యంత కంత కగ్గలం బగుశోకవేగంబున.

1246


శా.

ఆభూనాయకుఁ డొంటి న న్నిచట దుఃఖాంభోధిలోఁ ద్రోచి మీ
రీభంగి న్వనసీను కేగఁ దగ వౌనే కావరే రారె శో
కాభీలాంబుధి నుద్ధరింపఁగదరే హారామ హాలక్ష్మణా
హాభూపుత్రిక యంచు నించుఁ గనుల న్వ్యాలోలబాష్పాంబువుల్.

1247


వ.

అని యివ్విధంబునఁ గొండొకసేపు రామునిం బేర్కొని విలపించుచు నద్దశ
రథుండు కౌసల్యదిక్కు మొగంబై దేవి రామశోకమహావేగంబును సీతావిరహ
పారగంబును శ్వసితోర్మిమహావర్తంబును బాష్పఫేనజలావిలంబును బాహు
విక్షేషమీనౌఘంబును విక్రందితమహాస్వనంబును బ్రకీర్ణకేశశైవాలంబును
గైకేయీబడబానలంబును మదశ్రువేగప్రభూతంబును గుబ్జావాక్యమహా
గ్రహంబును నృశంసావరవేలంబును రామప్రవ్రాజనాయతంబు నగునపార
శోకసాగరంబున నిమగ్నుండ నైతి నింకఁ దరణిభూతుఁ డగురాముండు లేకు
న్న నిమ్మహాసముద్రంబు దాఁటి దరి చేరుట కేయుపాయంబు లే దని పల్కి
శోకాయానవిశేషంబున దుఃఖసమర్చితచేతనుం డై వివశత్వంబు నొంది శయ
నంబునం బడియె నప్పు డక్కౌసల్య మహీపతిపాటంతయుం జూచి భయంబుఁ
గొని ద్విగుణీకృతశోకతాప యై భూతావిష్ట యైనదానితెఱంగున వేపమాన
యై గతప్రాణ యైనదానిపగిదిఁ బుడమిం బడి సుమంత్రు నాలోకించి యి
ట్లనియె.

1248


ఉ.

నాకొడు కున్నచోటి కటు నన్ను రహిం గొని పొమ్ము తన్ముఖా
లోకన మబ్బదేని మహిలోఁ దృటి యైనను నిల్వఁ జాల నం
దాఁక సుమంత్ర వేగ యరదంబు మరల్పుము రాఘవుండు నన్
గైకొనఁ డేని తత్క్షణమై గ్రక్కున నేగెదఁ గాలుప్రోలికిన్.

1249

సుమంత్రుఁడు కౌసల్య నూఱడించుట

యి

క.

నా విని సుమంత్రుఁ డెంతయు, భావంబునఁ జాల వగచి ప్రాంజలి యగుచుం
దా వెండి వాకు తడఁబడ, దేవికి ని ట్లనియె వగపు దీఱఁగ నంతన్.

1250

మ.

తుములంబై కుల మెల్ల మ్రానుపడఁగా దుఃఖించె ది ట్లేల సం
భ్రమము న్శోకము దైన్యము న్విడువుమా రాముం డరణ్యంబులో
నమితస్నేహము భక్తియు న్వినయ మొప్పారంగ సౌమిత్రి యు
ల్లము రంజిల్లఁగఁ గొల్చుచుండ సుఖలీలం బొల్చి యుండుం జుమీ.

1251


క.

ధర్మజ్ఞుఁ డైనలక్ష్మణుఁ, డర్మిలి రాఘవునిపదము లర్చించుచుఁ దా
నిర్మలమతి యై వనమున, శర్మకరాముష్మికంబు సాధించు రహిన్.

1252


క.

జనకసుత విజన మగు కా, ననమున కేగియును దనమనంబున భయముం
గొన కెప్పటివలె శ్రీరా, మునిపయి రమియించుచుండు ముదితహృదయ యై.

1253


క.

ఆనెలఁత నెమ్మొగంబున, దీనత్వం బించు కైనఁ దెలియనికతనం
బూని ప్రవాసము సేయఁగ, మానుగఁ దగు ననుచు నాదుమదికిం దోఁచెన్.

1254


క.

జానకి ము న్నారామో, ద్యానంబులఁ గ్రీడ సల్పినట్లుగ విజనం
బైనగహనంబునందును, జానుగఁ గ్రీడించు రామసమ్మానిత యై.

1255


తే.

పూర్ణచంద్రనిభాస్య యాభూమిపుత్రి, విజన మగుకాననంబున విభునిమనముఁ
బాయ కెప్పుడు రంజిల్లఁజేయుచుండు, సాధ్వి వారి నుద్దేశించి శంక వలదు.

1256


క.

చిత్తము జీవితము తదా, యత్తంబుగఁ జేసి గృహమునందుంబలె న
య్యుత్తమసతి వనమునఁ బతి, చిత్తము రంజిల్లఁజేయు సేవాక్రియలన్.

1257


ఆ.

విపిన మైన వీడు వీ డైన విపిన మా, యుర్విసుతకు రాముఁ డొద్ద యున్న
నెలవు నొద్దలేని నెలవు క్రమంబున, సాధ్వి యిత్తెఱంగు సత్య మరయ.

1256


వ.

మఱియు నద్దేవి మార్గంబునం బోవుచు నెడ నెడ గ్రామంబులు నగరంబులు
నదీనదంబులు పాదపంబులు విలోకించి తత్తద్విశేషంబు లన్నియు రామలక్ష్మ
ణుల నడిగి వారివలన నెఱుంగుచు నగరోపవనంబునం గ్రీడింపం బోవు
చందంబున నుత్సాహోపేత యై సుఖలీలం జనియె నీవైదేహిసంబంధి యైన
యీప్రస్తుతవృత్తాంతజాతంబు సంస్మరించెదఁ గైకేయి నుద్దేశించి సీతచేతఁ
బలుకం బడినవాక్యంబు సంస్మరించుటకుం జాల నని యి ట్లయోధ్యానిర్గమన
కాలికం బైనసీతోక్తకైకేయీవిషయకపరుషవచనంబు కౌసల్యకుఁ బ్రియం
బని చెప్పుట కుపక్రమించి వృద్ధు లగువారలకు జీవనైరాశ్యహేతుత్వంబు
వీక్షించి ప్రమాదంబునం బలికితి నిది గోపనీయంబు దీని నెఱింగింప నర్హంబు
గా దాని తలంచి పర్యుపస్థితం బైనతద్వాక్యంబునుం బ్రచ్ఛాదించి యద్దేవికి
సంతోషహేతుభూతం బైనవాక్యంబున వెండియు ని ట్లనియె.

1259


తే.

దేవి యే మని చెప్పుదుఁ ద్రోవ నేగు, నపుడు వాతాతపోద్ధతి నమ్మహీజ
మిుంచువంటితనుచ్ఛాయ యించుకైన, దఱుగ దది యేమిచిత్రమో యెఱుఁగరాదు.

1260


క.

తమ్మికి నెన యై పున్నమ, తమ్మిపగతుఁ బోలు చాయఁ దనరెడు సతియా
స్య మ్మించుక యైనను మా, యమ్మా వసి వాడ దెంత యాశ్చర్యంబో.

1061

క.

ఆరామచరణములు లా, క్షారసవర్జితము లయ్యు సలలితరక్తాం
భోరుహకోశసమప్రభ, నారూఢిం బొల్చుచున్న వమ్మా చూడన్.

1262


వ.

మఱియు నద్దేవి వనగమనసమయంబునందు భూషణవిషయస్నేహంబునఁ జర
ణాద్యవయవసమర్పితసర్వభూషణ యై నూపురాదిశింజితస్వనానుకారిలీలా
యుక్త యైనపగిది సఖేలంబుగాఁ బోవుచున్న దదియునుం గాక.

1263


ఆ.

వారణాదిఘోరవన్యమృగంబులఁ గాంచి యించు కైన గాసిపడదు
రామబాహుసాలరక్షిత యగుచు క్ష, మాకుమారి విపినమార్గమందు.

1264


వ.

దేవి సీతారామలక్ష్మణులు శోచింపం దగినవారు కారు మనమును శోచింపం
దగినవారము గాము దశరథుండును శోచింపం దగినవాఁడు గాఁ డీపితృవచన
పరిపాలనరూపచరిత్రంబు లోకంబునం దాచంద్రార్కంబుగాఁ బ్రతిష్ఠితం బై
యుండు నీవు శోకంబు విడిచి స్వస్థచిత్తవు గమ్ము మహర్షిజుష్టం బైనమార్గం
బునందు సువ్యవస్థితులై కందమూలాశను లై శుభం బైనపితృవాక్యంబు పరి
పాలించుచు వనంబున నివసించెద రని యిట్లు సుమంత్రుండు పలికిన యుక్తవాది
యగునతనిచేత నివార్యమాణ యయ్యు సుతశోకకర్శిత గావున నెంత
చెప్పిన నుడుగక ప్రియపుత్ర రాఘవా యని పేర్కొని బహుప్రకారంబుల
విలపించుచు నిజభర్త నవలోకించి యక్కౌసల్య యి ట్లనియె.

1265

కౌసల్య దశరథుని నిందించుట

శా.

సానుక్రోశుఁడు సత్యవాదియు వదాన్యశ్రేష్ఠుఁ డింద్రాభుఁ డీ
క్ష్మానాథుం డని నీయశం బఖిలలోకస్తుత్య మై యుండు మ
త్సూనుం గానకుఁ బంచి కామపరతన్ దోషంబు నార్జించి ధా
త్రీనాథోత్తమ కాముకుం డనఁగఁ గీర్తిం గాంచి తీ వెంతయున్.

1266


ఉ.

పిన్నటనాఁటనుండియును బెక్కుసుఖంబులచేఁ బ్రవృద్ధు లై
వన్నియఁ గన్నపుత్రు లిటువంటియవస్థల కెట్టు లోర్చువా
రన్ని యటుండని మ్మతిసుఖార్హ మహాసుకుమార సద్గుణా
భ్యున్నత యైనసీతఁ దలపోసిన గుండియ చాలఁ ద్రుళ్లెడిన్.

1267


క.

చిన్నది పెక్కుసుఖంబులు, గన్నది ము న్నెన్నఁ డిట్టికష్టంబులు దాఁ
గన్నయది గాదు కానం, బన్నుగ నెట్లోర్చు నాతపమునకుఁ జలికిన్.

1268


శా.

సారాన్నంబు భుజించి గీతకలనిస్స్వానంబుఁ దా వించు వి
స్తారామంజులతూలతల్పములమీఁదం గూర్కువైదేహి నై
వారాహారము మెక్కి కేసరిఘనధ్వానంబుల న్వించుఁ జె
న్నారం గర్కశపర్ణతల్పములపై నాసీన యౌ టెట్లొకో.

1269


క.

తమ్మికి నెన యై పున్నమ, తమ్మిపగతుఁ బోలి కమ్మతావిపలుకులం
గ్రమ్ముకొనురాఘవుని వ, క్త్ర మ్మెన్నఁడు గాంతుఁ గనులతమి దీఱంగన్.

1270

తే.

కరికరోపమపరిఘసంకాశ మైన, కరము తలగడ నిడుకొని కఠినభూమి
శయ్యపై నాకుమారుఁ డెచ్చట వసించి, యున్నవాఁడొ యరణ్యమధ్యోర్వియందు.

1271


తే.

అధిప యే మందు నాగుండె యశనిపాత, కల్ప మగుభూరిశోకంబు గాడి యైన
వేయిపఱియ లై పోవదు వితతవజ్ర, సారమయము గాఁబోలు నిస్సంశయముగ.

1272


వ.

దేవా సుఖార్హు లైనరామలక్ష్మణులు సీతాసహితంబుగా ననాదరింపంబడి
నీచేత నిరస్తు లై దారుణారణ్యంబునం జరించుచున్నవా రనియెడునక్కర్మంబు
శోచనీయంబు గాదె కరుణారాహిత్యంబున నీచేత నిది కృతం బయ్యె నని
వగచి వెండియు ని ట్లనియె.

1273


క.

హృదయేశ్వర రాముఁడు పంచ, దశాబ్దమునందు మరలఁ జనుదెంచిన ను
న్మదుఁ డై రాజ్యము కోశము, పదపడి రాఘవుని కేల భరతుం డిచ్చున్.

1274


క.

చెచ్చెర రాముఁడు సమయం, బచ్చుపడం దీర్చి మరల నరుదెంచినఁ జా
నిచ్చునె భరతుఁడు రాజ్యం, బిచ్చినఁ గైకొనునె యతఁ డహీనగుణాఢ్యా.

1275


వ.

అది యె ట్లనిన వినుము.

1276


చ.

గుఱుతుగ శ్రాద్ధకర్త లగు కొందఱు విప్రులు బంధుకోటికిన్
స్థిరమతిచే నియంత్రణముఁ జెప్పినపాఱులకంటె మున్నె య
క్కఱపడి భోజనం బిడినఁ గ్రమ్మఱ వారలయిండ్ల నమ్మహీ
సురవరు లర్థిమైఁ గుడువఁ జూతురొకో సుధనైన వల్లభా.

1277


వ.

మఱియు ననిమంత్రితబ్రాహ్మణులు తృప్తు లగుచుండ గుణవంతులును సురసమా
నులును బ్రాజ్ఞులును వృద్ధులు నగునిమంత్రితబ్రాహ్మణో త్తములు వృషభంబులు
శృంగచ్ఛేదంబునుం బోలె నిజావమానహేతుకం బైనభోజనంబు గ్రహింప
నొల్ల రత్తెఱంగున.

1278


క.

జగతీశ వృకము భక్షిం, పఁగఁ దక్కినవన్యసత్వమాంసము పిదప
న్వగ చెడి యుపయోగింపఁగ, మృగపతి చిత్తమునఁ దలఁచునే హీనమతిన్.

1279


తే.

మనుజనాయక యాతయామంబులు హవి, రాజ్యకుశపురోడాశయూపాదికంబు
లన్యమఖమున వినియోగ మాచరింప, నర్హములు గా వటనరె మహర్షివరులు.

1280


క.

హృతసార యైనసురక్రియ, గతసోమం బైనమఖము గతిఁ గైకేయీ
సుతభుక్తవర్జితం బగు, క్షితిరాజ్యము రాముఁ డేల చేకొను నధిపా.

1281


క.

నిరుపమబలవద్వ్యాఘ్రము, నరవర వాలాభిమర్శనంబును బోలె
న్గురుమతి యిట్టియసత్కృతి, నరుదార సహింపఁజాలఁ డతిబలుఁ డగుటన్.

1282


చ.

మనుజవరేణ్య రాముఁడు సమంచితధర్మవిదుండు గాన దు
ర్జనులను బ్రీతితో నయవిచారులఁ జేయఁగఁ బూని నీదుశా

సనమున దండకాటవికి సమ్మతి మీఱఁగ నేగెఁ గాక యా
యనకు సురాసురప్రముఖు లైనను గీ డొనరింప శక్తులే.

1283


చ.

అనఘ యముండు భూతముల నట్ల శరార్చులచే సమస్తతో
యనిధుల నైనఁ గాల్పఁ దగు నంతపరాక్రమశాలి యయ్యు మ
త్తనయుఁడు తండ్రిచేఁ దనకుఁ దానె సమాహతుఁ డయ్యె నక్కటా
మనమునఁ జూడఁ ద న్గనిన మత్స్యముచేఁ జిఱుమీనుకైవడిన్.

1284


క.

తనయుండు సత్యరతుఁ డి, మ్మనుజవిభుం డనుచుఁ బొగడు పడయఁ దలఁచి ధ
ర్మనిరతుని నయవినీతా, త్ముని రాముని వెడల ననిచితో నృపతిలకా.

1285


తే.

అనఘుఁడు సుతుండు వనమున కరుగ నీకు, శాస్త్రదృష్టంబు రాజర్షిచరితమును బ్ర
ధానము సనాతనం బగు ధర్మ మయ్యె, నేని యుక్త మాధర్మంబు గాన మట్లు.

1286


సీ.

రాజేంద్ర విను పతివ్రత యగుసాధ్వికి గణుతింపఁ బ్రథమరక్షకుఁడు భర్త
రెండవగతి నందనుండు మూఁడవగతి దాయ లీమువ్వురు దక్క నొండు
శరణంబు లేదని శాస్త్రంబు లెఱిఁగింప నదియు నాపుట్టువ కొదవ దయ్యెఁ
గలకాలమును నీవు కైకకు వశుఁడ వై యించుకయును మది నెంచ వైతి


తే.

విపుడు ఫలకాలమున మహావిపులయశుని, సుతునిఁ గానకుఁ బనిచితి వితరు లైన
చుట్ట లెల్లను జుల్కగాఁ జూచు నట్లు, చేసితివి వేఱె యిఁక నూఱు చెప్ప నేల.

1287


చ.

జనవర క్రూరమన్మథవశంబున నెయ్యము దక్కి పుత్రుని
న్ఘనవని కంపి యిట్లు వెనుకం బరితాపము నొందె దేల యీ
నినపులి యాఁకటం దెలియ నేరక పుట్టిన చిన్నికూనలం
దనియఁగ మెక్కి యావెనుకఁ దద్వ్యథచేతఁ గృశించుచాడ్పునన్.

1288


క.

జననాయక నీచేఁ బుర, జనులు సఖులు మంత్రివరులు సతులును భృత్యు
ల్తనయులు బాంధవు లాదిగ, జనులు నిహతు లైరి కులము సంక్షోభించెన్.

1289

దశరథుఁడు తాను మున్ను చేసిన మునికుమారవధముఁ దలంచుకొనుట

వ.

అని యిట్లు శోకాతిశయంబునఁ బరమసంక్రుద్ధయై పరుషంబుగాఁ బలికిన దారు
ణశబ్దసంశ్రితం బైనతద్వాక్యం బాలకించి యద్దశరథుండు పరమదుఃఖితుం డై
దురంతచింతాభరంబున నొల్లం బోయి కొండొకసేవునకుం దెలిసి యేతా
దృశదుఃఖంబునకు నిదానభూతం బైనదుఃఖం బెయ్యది పూర్వకృతం బయ్యె
నో యని సంస్మరించి యీదేవిచేతఁ గథితం బైనసర్వంబు సత్యం బిట్టి దురవస్థ
దొరకొనుటకుఁ బూర్వభవంబునం దేమి యకృత్యంబు గావించితినో యని
క్రమ్మఱ విచారించి వెండియు శోకవ్యాకులేంద్రియుం డై మూర్ఛ నొంది దీర్ఘ
కాలంబువ కతిప్రయత్నంబునం దేఱి వేఁడినిట్టూర్పు నిగుడించి తనపార్శ్వ

భాగంబునఁ దనయట్ల దుఃఖించుచున్నకౌసల్య నవలోకించి యత్యుత్కటం
బు లైనపుణ్యపాపంబులచేత నిప్పుడే ఫలం బనుభవింపంబడు ననియెడిన్యా
యంబునఁ బ్రియపుత్రవిశ్లేషదుఃఖం బే ననుభవించుచున్నవాఁడ దీనికి హే
తుభూతం బైనకర్మం బెద్ది యని పదంపడి విచారించి తొల్లి శబ్దవేధి యైనతన
చేత నజ్ఞానంబువలనఁ గృతం బైనమునికుమారవధరూపదుష్కృతకర్మంబు ప్ర
తీతం బైన నమ్మహీపతి నిజకుమారవియోగజనితశోకానలంబు మునికుమార
వధజనితదోషస్మరణవాతంబునం బ్రజ్వలితం బై శరీరంబు దహింపం దొడం
గిన సహింపం జాలక మొగంబు వాంచి యంజలిఁ గీలించి ప్రసాదంబు వేఁడు
కొనుతలంపున నక్కౌసల్య కి ట్లనియె.

1290


ఆ.

దేవి నీగుణంబు దేవాదులకు నైనఁ, బ్రస్తుతింప వచ్చు భర్తృభక్తిఁ
జేసి ఘోరపాపచిత్తుఁడ నగునామొ, గంబు రోయ కిపుడు కాంచుకతన.

1291

దశరథుఁడు నమ్రుఁడై కౌసల్య ననూనయించుట

తే.

రిపులయం దైనఁ గినియక కృప యొనర్చు, నంత శాంతియుఁ గలదాన వింత యేల
నన్ను విడనాడెదవు నాదువిన్నపంబుఁ, గైకొని యనుగ్రహింపుము కమలనేత్ర.

1292


తే.

జలజలోచన ధర్మవిచార యైన, సాధ్వి కెంతయు జగతిలో సగుణుఁ డైన
నిర్గుణుం డైన శాస్త్రోక్తనియతిఁ జూడ, దయితుఁ డొక్కఁడె ప్రత్యక్షదైవతంబు.

1293


ఆ.

సాధ్వి నీవు దృష్టజనపరాపరవు న, యజ్ఞవాత్తధర్మవార్తి నొంది
తూలుచున్ననన్ను దుగఖిత వయ్యును, దారుణోక్తి నింత దూఱఁ దగదు.

1294


వ.

అని యివ్విధంబున దీనుం డై ప్రార్థించుచున్నయమ్మహీపతివాక్యంబు విని
యద్దేవి జలనిర్గమనమార్గంబు నవోదకంబునుం బోలె శోకబాష్పజలంబులు
నించుచు నతనియంజలిపుటంబు పద్మంబునుం బోలె శిరంబునం గదియించి
రోదనంబు సేయుచు శోకసంభ్రమభయంబులు మనంబున ముప్పిరి గొన
ని ట్లనియె.

1295


క.

ధరణీశ భూరిశోకము, దరికొన సైరింప లేక తాపము పేర్మిం
బరుషోక్తు లంటిఁ గా కిటు, తర మెఱుఁగక దూఱ నంత ధర్మేతరనే.

1296


క.

జనవర నిను యాచించెద, ననుగ్రహింపు మని పలికి తమ్మాటకు నె
మ్మనమున దుఃఖించి రయం, బునఁ బుడమిం బడినదాన మోహవశమునన్.

1297

కౌసల్య దశరథు ననూనయించుట

వ.

దేవా నీచేత యాచిత నగుటవలన హత నైతి నేను హంతవ్యను గానే యుభ
యలోకంబులయందు శ్లాఘనీయుం డైనపతిచేత నేయువతి ప్రసాదింపంబడు
నది యుత్తమయువతి గానేరదు దాని కైహికాముష్మికసుఖంబులు గలుగ
వదియునుంగాక.

1298


సీ.

అవనీశ పతిబుద్ధి ననుసరించెడుసాధ్వి కుభయలోకసుఖంబు లొందవచ్చు

నను ధర్మ మెఱుఁగుదు నిను సత్యవాదిఁగాఁ దలఁపుదుఁ దెలియనిదానఁ గాను
పుత్రశోకార్త నై పొగిలి మై మఱిచి పల్కినమాట తప్పుగాఁ గొనకుఁ డిపుడు
శోకంబు ధైర్యవివేకాదుల నడంచుఁ బూని శోకసమానుఁ డైనరిపుఁడు


తే.

మఱి యొకఁడు లేఁడు ధాత్రి నిష్ఠురరిపుప్ర, హార మైన సహింప శక్యంబు గాని
కటికికార్చిచ్చు వంటిశోకంబు చాలఁ, గొంచె మైనను సైరింపఁగూడ దధిప.

1299


వ.

జితేంద్రియు లైనయతులును శోకంబున మూఢచేతస్కు లై మోహితు
లగుదురు.

1300


క.

తనయుఁ డగురామభద్రుఁడు, వనమునకుం జనినపంచవాసర మిది నా
మనమునకుఁ దోఁచె నెంతయు, జననాయక పంచవర్షసదృశం బగుచున్.

1301


క.

నరవర పుత్రవియోగజ, నిరుపమశోకంబు నాడు నెమ్మనమున దు
ర్భర మై పెం పగుచున్నది, సరిదురువేగమున జలధిసలిలముమాడ్కిన్.

1302


వ.

అని యిట్లు కౌసల్య పతితోడఁ దగినతెఱంగున మాట లాడుచుండ సూర్యుం
డు పశ్చిమమహీధరకందరాంతర్గతుం డయ్యెఁ బదంపడి గాఢసంతమసపరిపూ
ర్ణం బై రాత్రికాలంబు ప్రవర్తించె నంత దశరథుం డొక్కింత శోకనిద్రాపర
వశుం డై తల్పంబునం బడి యుండి వెండియు ముహూర్తమాత్రంబునకుం
దెలి వొందె నప్పుడు శోకోపహతచేతనుం డైనయమ్మహీపతిని రామలక్ష్మణ
వివాసనసంజాతశోకమోహోపద్రవంబు స్వర్భానుండు సూర్యునిం బోలె
ననివార్యం బై యధిగమించె నిట్లు దురంతదుఃఖతాపంబున బడలుపడుచు నిస్తే
జుం డై యద్దశరథుండు పూర్వకృతం బైనమునికుమారవధరూపదుష్కృతం
బంతయుఁ దెల్లంబుగా నెఱింగించువాఁడై యాఱవనాఁటినిశాసమయంబున
శోకపీడిత యైనకౌసల్య కి ట్లనియె.

1303


తే.

ధరణిలోపలఁ బురుషుఁ డెద్దానిఁ జేయు, నది యశుభమైన మఱి శుభ మైనఁ గాని
సందియము లేదు తత్కర్మజాతఫలము, నిక్కువంబుగఁ బ్రాపించు నీరజాక్షి.

1304


తే.

కర్మములు సేయఁ దలకొనుకాలమందె, కొసరి గురులాఘవంబులు గుణము దోష
మరయ కుర్వి నెవ్వాఁడు కార్యంబు నడుపు, నట్టిమనుజుఁడు బాలిశుం డనఁగఁ బరఁగు.

1305


వ.

అది యె ట్లనిన వినుము సూక్ష్మతరపుష్పం బైనయామ్రవణంబు సూక్ష్మతరఫలం
బుం బుట్టించు ననుమోహంబున దాని ఛేదించి వర్ణంబుచేత నా పాతరమ
ణీయంబు లగుపృథుపుష్పంబుల నొప్పుపలాశవనంబు విలోకించి పుష్పం
బున కనురూపం బైనపృథుఫలంబు గలుగు నని ఫలంబునం దాసక్తుం డై తత్ప
లాశారోపణంబుఁ జేసి జలసేచనంబుఁ గావించునతం డనుభోగప్రాప్తిసమయం
బున స్వోత్ప్రేక్షితఫలాభావంబువలనఁ బరితపించు నెవ్వండు భావిఫలంబు

విచారింపక కర్మంబు సేయునతండు ఫలకాలంబునందుఁ గింశుకసేచకుని
పగిది దుఃఖించుచుండు నత్తెఱంగున నేనును రామాభిషేకరూపం బైనశుభ
కర్మంబుఁ బరిత్యజించి దుఃఖరూపం బైనయాగామిఫలం బపేక్షించి కైకేయీ
ప్రియరూపం బైనయశుభకర్మం బాచరించి కర్మఫలానుభవకాలంబున నశుభ
కర్మఫలం బగురామవియోగంబు నొంది రామత్యాగరూపఫల మనుభవిం
చుచు దుఃఖించుచున్నవాఁడఁ గుమారుండును ధనుష్మంతుండును శబ్దవేధి
శబ్దప్రాప్తవిఖ్యాతి నైననాచేత నీవక్ష్యమాణమునికుమారవధరూపపాపకర్మంబు
కృతం బయ్యె స్వయంకృతతన్మహాపాపకర్మఫలం బేతాదృశదుఖరూపం బై
యజ్ఞానంబుచేత భక్షితం బైనగరళంబుభంగి సంప్రాప్తం బయ్యె నొకానొక
పురుషుండు కింశుకపుష్పంబులు విలోకించి పుష్పం బెట్టి దట్టిఫలం బగు నని
యెట్లు మోహితుఁ డయ్యె న ట్లేనును శబ్దవేధ్యహేతుకం బైనఫలంబు
నెఱుంగ నైతి నిట్లు శబ్దవేధనం బెట్లు ప్రాప్తించె నంటి వేని యే నకృతవివా
హుండ నై యౌవరాజ్యంబు సేయుచున్నసమయంబున.

1306


శా.

హర్షం బొప్పఁగ యౌవరాజ్యకటకాధ్యక్షుండ నై వైభవో
త్కర్షం బేర్పడ నేను భూప్రజల నందం బొప్పఁ బాలింప ను
ద్వర్షన్నీలమహాపయోధరలసద్గర్జాసముజ్జృంభ మై
వర్షాకాలము దోఁచె సస్యములకు న్వైదగ్ధ్య మేపారఁగన్.

1307

దశరథుండు కౌసల్యకు మున్ను తాను జేసినమునికుమారవధముఁ దెల్పుట

క.

ఖగుఁడు నిజతిగ్మకరముల, జగతిం దపియింపఁ జేసి సర్వరసములం
దిగీచికొని మందకరుఁ డై, యగస్త్యచరిత యగుదక్షిణాశఁ జరించెన్.

1308


క.

ఘనములు స్నిగ్ధము లయ్యెను, వనముల దవశిఖి శమించె వలిగా డ్పెసఁగెన్
వనముల మండూకంబులు, వనముల సారంగశిఖులు వారక మ్రోసెన్.

1309


తే.

సిక్తపక్షోత్తరము లౌటఁ జేసి ఖగచ, యములు సలిలసుస్నాతంబు లైనమాడ్కి
వృష్టివాతావధూతాగ్రవృక్షసమితి,యం దధివసించెఁ గవగూడి యత్న మలర.

1310


తే.

పతితపతదంబుసంఛన్నభద్రదంతి, యచల మగుతోయరాశియ ట్లలరెఁ బాండు
రారుణచ్ఛాయములు సెలయేఱు లహుల, భంగి గిరిధాతువులఁ జేసి పాఱఁ దొడఁగె.

1311


వ.

మఱియు నవరసాభిరామం బై యలంకారశాస్త్రంబుపగిది సమున్నతపయోధర
మండలం బై యౌవనవద్వనితారూపంబుకైవడి సుప్రసారితవాహినీసందో
హం బై జయశీలునిదండప్రయాణంబువైఖరి సమంతతోవ్యాప్తచపలం బై
కాముకునిచిత్తంబుభంగి సహస్రాక్షశరాసనవిభాసితం బై దేవాసురసంగ్రా

మంబుచాడ్పున నిరంతరామృతధారాపూర్ణం బై నాకలోకంబుకరణి నొప్పు
నక్కాలంబునందు.

1312


ఉ.

ఏ నొకనాఁటిరేయి రథ మెక్కి, శరాసన ముగ్రకాండముల్
మానుగఁ దాల్చి మైనఱువు మక్కువతో ధరియించి యాత్మలో
నూనినవేడ్కతోడ సరయూతటపుష్పితకాననంబులోఁ
బూని మెకంబులం దునుమఁ బోయితి సాహసరేఖ దోఁపఁగన్.

1313


ఉ.

ఈకరణి న్వనావనికి నేగి యనేకమృగవ్రజంబులన్
వీఁక నమోఘబాణముల వేమఱు సోమరునట్లు చేసి యా
చీఁకటిప్రొద్దునం దటినిచేరువ నొక్కెడఁ బొంచి యుంటి న
వ్యాకులమానసుండ నయి వాఁడిమెకంబులఁ ద్రుంచువేడుకన్.

1314


ఉ.

అప్పుడు తన్మహాతటిని యం దొకభూరిగభీరనిస్వనం
బప్పులలో వినంబడిన నప్పుడు దంతి జలంబుఁ గ్రోలంగా
నొప్పినచప్పు డంచు మది నూహ యొనర్చి శరంబు మౌర్వితోఁ
దప్పక గూర్చి యేసితిని దద్ధ్వని లక్ష్యము గాఁగ నుద్ధతిన్.

1315


సీ.

ఆసమయంబున నక్కటా నడురేయి సలిలముఁ గొని పోవ సత్వరముగ
నేగుదెంచితిని న న్నెవ్వాఁడు కరుణ లే కమ్మునఁ గ్రుమ్మెఁ జీరాజినములఁ
దాల్చి వన్యంబులఁ దక్కక మెసవుచు దండనబాధకుఁ దప్పి యున్న
నాయట్టితపసి కన్యాయంబుగా నిట్టిపాటు వాటిల్లె నేపాటి గలదు


తే.

తల్లిదండ్రులు వృద్ధులు తపసు లట్టి, వారి కింక ది క్కెవ్వఁడు బాల్య మాది
గాఁగఁ బెక్కువిధంబుల గాఢభక్తిఁ, గొలిచి నేఁ డిట్లు వాసి పోవలసె నాకు.

1316


వ.

ఏ నెవ్వని కేమి పాపంబుఁ జేసితి నాయట్టియజాతశత్రునియందు శస్త్రం బెట్టు
ప్రయుక్తం బయ్యె న్యస్తపరపీడనుండ నైననాయట్టిఋషికి శస్త్రంబుచే వధం
బెట్లు విధింపఁబడియెఁ గేవలానర్థసంహితం బంతియె కాని మద్వధంబువలన
దాని కయ్యెడుఫలం బేమి గురుతల్పగమనునకుం బోలె నా కిట్టిదుర్మరణం
బేల కలిగె మద్వధంబునకు దుఃఖింప నింక నాతల్లిదండ్రు లెట్లు జీవించెదరో
యని వగచెద వృద్ధు లగునాజననీజనకులు చిరకాలమునుండి నాచేఁ బోషింపఁ
బడుచుండి నేను బంచత్వము నొందిన నిఁక వారల కేమిగతి నన్నును వృద్ధులగు
మజ్జననీజనకులను మువ్వుర నొక్కబాణంబుచే బుద్ధిహీనుఁడు వధియించె.

1317


క.

అని పలుకుదీనవచనము, విన వచ్చిన నదరిపడి వివేకిత నయ్యో
మునిసుతుఁ డొక్కఁడు నాచే, వినిహతుఁ డయ్యె నని యేను వెఱఁగు జనింపన్.

1318


తే.

శరముతోఁ గూర్చినట్టి ప్రచండచాప, మవనిఁ బడ వైచి పావభయంబువలన
మేను కంపింప నయ్యేటిపాసయోగ్య, దేశ మటు చేరఁబోయితి దీనమతిని.

1319


వ.

ఇ ట్లరిగి.

1320

క.

అవకీర్ణజటాభారునిఁ, బ్రవిద్ధకలశోదకునిఁ బరాగక్షతజ
ప్రవిలిప్తగాత్రు మద్విశి, ఖవిభిన్నాంగు మునిపుత్రుఁ గనుఁగొని భీతిన్.

1321


తే.

ఏను మెల్లన డాయంగ నేగ నపుడు, పుడమిఁ బడియున్నయమ్మహామునిసుతుండు
గాఢకోపాగ్నిహేతులఁ గాల్చుచున్న, వాఁడు పోలె నన్గాంచి కంపమునఁ బలికె.

1322


సీ.

అవనీశ వన్య మాహారంబుగాఁ గొని ఘనతపోవృత్తిచేఁ గాన నున్న
యేను నీ కపకార మేమి గావించితిఁ దల్లిదండ్రులకును దప్పిఁ దీర్ప
నంబువు ల్గొనిపోవ నరుగుదెంచిననన్ను నిష్కారణంబుగ నిశితబాణ
విద్ధుఁ జేసితి వేల వృద్ధు లంధకులు దుర్బలులు నాతల్లిదండ్రులు పిపాసఁ


తే.

గొని మదాగమనంబును గోరుచుందు, రట్టివా రేను బోకున్న నధికతృష్ణ
నలసి యసువులు విడువంగఁగలరు తెలియ, కెంత పాపంబు చేసితి వేమి గలదు.

1323


తే.

ఇనకులేంద్ర మాతండ్రి యే నిచట నిపుడు, దారుణశరాభిహతుఁడ నై ధాత్రిఁ గూలి
యున్నచందం బెఱుంగక యున్నకతన, శ్రుతతపఃఫలయోగ మీక్షోణి లేదు.

1324


క.

ఎఱుఁగఁ డని వగవ నేటికి, నెఱిఁగిన మజ్జనకుఁ డిచట నేమి యొనర్చుం
బరిసంచారాక్షము లి, ద్దరలో గిరికి గిరిఁ బ్రోవ దక్షత గలదే.

1325


చ.

జనవర నీవు వేగ చని సర్వము మన్నిధనప్రవృత్తి మ
జ్జనకునితోడఁ జెప్పుము ప్రశాంతి వహించి యతండు నిన్ను గొ
బ్బున శపియింపకుండు నటు పోక యుపేక్ష యొనర్చితేని చ
య్యన ననలుండు గాఱడవి నట్ల వడి న్నిను నీఱు చేసెడిన్.

1326


క.

లోకేశ తదాశ్రమమున, కేకపదిన్ దీన నేగు మి ట్లరిగి కృపా
లోకనుఁ డగుమజ్జనకునిఁ, గైకొని ప్రార్థింపు మీవు కడుదీనుఁడ వై.

1327


తే.

సలిలవేగ మత్యున్నతి సహితమృదున, దీతటంబును బోలె నిశాతశరము
కరము నాదుమర్మంబును గలఁచుచున్న, యది విశల్యునిఁ గావింపు మవనినాథ.

1328


వ.

అనిన విని యే నిమ్మునిసుతుండు సశల్యుండై బాణక్షతవేదన సహింపంజాలక
కంపించుచున్నవాఁడు విశల్యునిం జేసితినేని ప్రాణంబు విడువం గలవాఁ డేమి
నేయుదు నని దుఃఖితుండ నై దైన్యంబు నొంది శోకాతురత్వంబున నేమి
యుం జేయఁ జేతు లాడక యున్న మచ్చింతాప్రకారం బెఱింగి యమ్మునినంద
నుండు పరమార్తియుక్తుం డై యతిప్రయత్నంబున నా కి ట్లనియె.

1329


సీ.

మానవనాయక కానక చేసినపనికి దుఃఖించిన ఫలము గలదె
ధైర్యంబుచే శోకతాపంబు నణఁగించి స్థిరచిత్తుఁడవు గమ్ము చిత్తమోహ
మింతయు నాకు లే దేను శూద్రకు వైశ్యువలన జనించినవాఁడఁ గాన
బ్రహ్మహత్యాప్రాప్తపాపంబు నీకు లేదని పల్కి బాణవేదన సహింపఁ


తే.

జాలక విఘూర్ణితాక్షుఁ డై జగతివేష్టి, తాంగుఁ డై మాట లుడిగి బిట్టలసియున్న
యమ్మునికుమారుఁ గాంచి యే నుమ్మలించి, కడుభయంబున నడలుచుఁ గదియ నేగి.

1330

వ.

మహావ్యథచేత సంకుచితాంగుం డై పుడమిం బడి యున్నమునికుమారునిశరీ
రంబున నాటి యున్నశరంబుఁ బెఱికిన నతండు తత్క్షణంబ సంప్రాప్తమరణుం
డయ్యె నని పలికి యద్దశరథుండు శోకవేగంబునఁ గన్నీరు నించి వెండియుఁ
గౌసల్య కి ట్లనియె.

1331


తే.

బుద్ధి నరయక చేసిన పుణ్యపాప, ఫలము గుడువక తీఱ దత్యలఘుతరము
చిన్ననాఁ డేను గానక చేసినట్టి, పాపఫలము నేఁ డనుభవింపంగ వలసె.

1332


వ.

అంత దీని సమీకరింప నెద్ది యుపాయం బని చింతించి యేను.

1333


క.

మునిసుతుఁడు సనినపిమ్మట, వనితా జలఘటముఁ గొనుచు వారనివేగం
బునఁ దదుపదిష్టమార్గం, బున నయ్యాశ్రమము సేరఁబోయితి నంతన్.

1334


క.

పెనుముదుసళ్లై కన్నులు, గన రాక విలూనపక్షఖగములమాడ్కిం
దనరెడునాదంపతులను, గని యేను గడింది నివ్వెగ న్మునిఁగి వెసన్.

1335


వ.

మఱియు సంచారాక్షములును సంచారసహాయభూతుం డగుపుత్త్రుం డొద్ద
లేమింజేసి వానికథలనే చెప్పుకొనుచుఁ బ్రయత్నశూన్యు లై పుత్రునిరాక కె
దురుచూచుచు మరల మన్నిమిత్తంబునఁ బుత్త్రాశారహితులైనవారు నగుముని
దంతుల నవలోకించి శోకోపహతచిత్తుండను భయసంత్రస్తచేతనుండను నై.

1336


ఆ.

వారిఁ గొనుచు నేను వారి డాయఁగఁ బోవు, నంతఁ జరణశబ్ద మాలకించి
యధికతృష్ణఁ బుత్రుఁ డనుతలంపున నమ్మ, హామునీంద్రుఁ డిట్టు లనియె నపుడు.

1337


తే.

పుత్ర తడ వేల చేసి తంబువులు దెమ్ము, సరవి నిందాఁక జలకేళి సలిపితొక్కొ
దప్పికొని యున్న దిదిగొ మీతల్లి వేగ, యాశ్రమంబుఁ బ్రవేశింపు మనఘచరిత.

1338


క.

ఏనును మీతల్లియు మదిఁ, గానక యపరాధ మేమి గావించిన నీ
మానసమున నది యంతయు, మానుగ క్షమియింపవలదె మాన్యచరిత్రా.

1339


తే.

హీననేత్రుల మై గతి యింత లేక, యున్నమే మీవె గతి యని కన్ను లనుచు
నమ్మి నీమీఁద మనసు ప్రాణములఁ జేర్చి, యుంటి మీలా గుపేక్షింప నుచిత మగునె.

1340


వ.

అని పుత్రుండు మసలుటకు వేగిరపడి కరుణంబుగాఁ బలుకుచున్నయమ్మునివా
క్యంబు విని యేను శోకవ్యాకులచిత్తుండ నై పుత్రమరణం బెఱింగించుటకు
భయంబుఁ గొని యాకంపించుచు మానసవ్యాపారంబును శరీరవ్యాపారంబు
లను వాగ్బలంబును సంస్తంభించి, యిట్లు నియమితకరణత్రయుండ నై పుత్ర
వ్యసనజం బైనభయంబు నెఱింగింప నెట్టకేలకు సాహసించి సజ్జమానంబును
నస్పష్టాక్షరయుక్తంబు నవ్యక్తంబును నగువాక్యంబున మెల్లన ని ట్లంటి.

1341


సీ.

అనఘాత్మ యేను నీతనయుఁడఁ గాను మిత్రకులసంజాతుండ దశరథాభి
ధానుండ విను ధనుర్ధరుడఁ నై నడురేయి సరయూతటంబున సలిలపాన
యోగ్యస్థలంబున నురుమృగంబులఁ జంప నేఁ గాచి యుండ నన్నీటిమధ్య
మునఁ గుంభమున కంబుఁ బూరించుచప్పుడు విన నైన నిది మదద్విరదమొకటి

తే.

నీరుఁ గ్రోలెడునప్పటినినద మనుచు, నదియె లక్ష్యముగా విషప్రదర మొకటి
దాఁక నేసిన దానిచే నీకుమారుఁ, డార్తరవమున నిహతుఁ డై యవనిఁ బడియె.

1342


క.

ఏ నారవంబు విని యను, మానించుచు నచటి కరిగి మద్బాణహతుం
డై నేలం గూలిన నీ, సూనునిఁ గని తీవ్రశోకశోషితమతి నై.

1343


క.

ఒక్కింతసేపు చింతిలి, గ్రక్కునఁ దద్వచనసరణిఁ గాండముఁ బెఱుకన్
మిక్కిలికృపచే నను మీ, చక్కటి కేగు మని చెప్పి చనియె మహాత్మా.

1344


తే.

అధికవృద్ధు లంధు లతిదీను లమితత, పోనుషక్తచిత్తు లైనమీకు
వేచి యింతపాప మాచరించిన నన్నుఁ, దాల్మిఁ జేసి ప్రోవఁ దగు మహాత్మ.

1345


వ.

ఇంకఁ జిత్తంబుకొలంది నవధరింతురు గాక యని విన్నవించిన యశనిపాతకల్పం
బెైననావచనంబు విని భగవంతుం డైనయత్తాపసోత్తముండు శోకానల
జ్వాలాజలదందహ్యమానమానసుం డై బాష్పంబులు నించుచుఁ దీవ్రాయాసం
బు నడంప నశక్తుం డై బహువిధంబుల సంతపించుచుఁ గృతాంజలిపుటుండ
నై యున్ననా కి ట్లనియె.

1346


సీ.

మనుజేంద్ర నీ వొనర్చిన యీమహాఘంబు నేర్పున నీయంత నీవె వచ్చి
చెప్పుటవలన నీశీర్షంబు పదివేలవ్రక్క లై పోవక తక్కె నేఁడు
నరపతిచేత వానప్రస్థసంయమివధ మనజ్ఞానపూర్వముగఁ జేయఁ
బడె నేని హరి నైనఁ బరఁగ బదభ్రముఁ గావించు బ్రహ్మనిష్ఠావిధిజ్ఞుఁ


తే.

డై తపము సల్పుమునివరునందు శస్త్ర, మెఱిఁగి విడిచినఁ దన్మూర్ధ మేడువ్రక్క
లై చనదే కనిసేయనిదగుట మంటి, వెఱిఁగి చేసినఁ గుల మెల్ల మఱిఁగిపోదె.

1347


చ.

జనవర మత్సుతుండు శరసంహతుఁ డై పడియున్నచోటికిన్
ననుఁ గొని పొమ్ము వేగ పితృనాథవశంగతుఁ డై విసంజ్ఞుఁ డై
పనుపడ నెత్తుటం దడిసి పశ్చిమదర్శనుఁ డై ధరిత్రిమీఁ
ద నొరగి యున్నవాని గుణధన్యునిఁ బుత్రునిఁ జూడఁ గోరెదన్.

1348


తే.

అనుచు మునిపతి పల్క, నే నాత్మ నడలు, గూర నచటికి వారిఁ దోడ్కొని రయమునఁ
జని కుమారునిఁ జూపినఁ దనువుమీఁద, వ్రాలి శోకంబుచే మౌనివరుఁడు పలికె.

1349


ఉ.

ఓయి కుమారవర్య మము నొంటిగ నిచ్చట డించి పోవఁగా
న్యాయమె నీకుఁ దల్లివగ పాఱఁ బ్రియోక్తులు పల్క వేల తం
డ్రీ యని మ్రొక్క వేల నయ మేర్పడఁ గౌఁగిటఁ జేర్ప వేల యే
లా యిలపై వసింపఁ గుపితాత్ముఁడ వైతి వదేల చెప్పుమా.

1350


క.

ఇఁక నపరరాత్రమందును, సకలామ్నాయములు సకలసద్వృత్తంబుల్
సకలాధ్యాత్మకథలనుం, బ్రకటంబుగఁ జదువుచుండువాఁ డెవ్వఁ డిఁకన్.

1351


క.

శీలంబు భక్తి నియమము, గ్రాలఁ బవిత్రాగ్ని వేల్చి గారవ మెసఁగన్

గాలంబు దప్పక ననున్, వాలాయము గొలుచుచుండువాఁ డెవ్వఁ డిఁకన్.

1352


వ.

పుత్రా సంచారాక్షముండ ననుష్ఠానాశక్తుండ నీవారాదిసంగ్రహరహితుండ
ననాయకుండ నైననన్నుఁ బ్రియాతిథినట్ల నిత్యంబును గందమూలాదికంబు
లచేత నెవ్వాఁడు సంతుష్టునిం జేయు లోచనహీన యై జరాభారంబున డస్సి
పుత్రశోకంబురం బొగిలెడిభవజ్జనని నెవ్విధంబున భరింతు మహాగుణమండ
నుండ వైననిన్నుం బాసి యనాథుల మై కన్నులు గానక యివ్వనంబున నెట్లు
జీవింపంగలవార మెల్లి తెల్లవాఱిన నేము నీతోడ యమక్షయంబునకుం జను
దెంచెద మందాఁక నీకుం బోక యొప్పదు నీమసలుటకు యముండు గినిసె నేని
తల్లిదండ్రుల మైనమముం దోడ్కొని వచ్చుటకు మసలె ననుగ్రహింపవల
యు నని యతనితోడం జెప్పెదము ధర్మాత్ముం డగుయముండు మాయట్టి
యనాథుల కభయదానం బొసంగఁడే యని యిత్తెఱంగున విలపించుచుఁ బాప
కరుం డగునృపునిచేత నిహతుండ వైతివి గావున నప్పాపంబున నిరయగతికిం
బోక యపాపుండ వై సగరశైబ్యదిలీపజనమేజయదుందుమారాదులు చనినలో
కంబులకుం జనుము మఱియు శస్త్రయోధులును శూరులును సాధులును
స్వాధ్యాయసంపన్నులును దపోనిష్ఠులును భూదానపరులును నాహితాగ్నులు
ను నేకపత్నీవ్రతులును గోసహస్రప్రదాతలును గురుసేవారతులును బరలోక
ప్రాప్తిసాధనార్థంబు గంగాయమునాసంగమాదియందుం గాని జలంబులందుం
గాని వహ్నియందుం గాని తనుత్యాగంబుఁ గావించినవారు నగుపుణ్యాత్ముల
లోకంబులు నీకుం గలుగుఁ దపోనిష్ఠుల మైనమాకులంబునం బుట్టినవారికి
నిరయగతి లే దెవ్వనిచేత నీవు నిహతుండ వైతి వట్టినృపుండే దుర్గతికిం జనుఁగాక
యని పలికి యక్కుమారు కుదకప్రదానంబుఁ గావించిన నప్పు డమ్మునిపు
త్రుండు దివ్యదేహధారి యై శక్రసహితంబుగాఁ దల్లితండ్రుల నాశ్వాసించి మీ
కటాక్షంబున నేను బరమస్థానంబు నొందితి మీరును శీఘ్రంబున నాయొద్దకుం
జనుదెంచెద రని పలికి దివ్యతేజోజాలంబు దిక్కులం బిక్కటిల్ల దివ్యవిమానా
ధిరూఢుం డై యింద్రసహితంబుగా సురలోకంబునకుం జనియెఁ దదనంతరంబ
యమ్మునివరుండు కృతాంజలిపుటుండ నై కొలిచి యున్ననన్నుం జూచి
యి ట్లనియె.

1353


సీ.

క్రూరాత్మ యేకవుత్రుఁడ నైనననుఁ బుత్రహీనునిఁ జేసితి వింక నిధన
మందు నా కించుకయైన దుఃఖము లేదు హింసింపు మదయత నిపుడె నన్ను
మునుకొని యజ్ఞానమున మత్కుమారునిఁ జంపితి గాన నాచందమునను
బోడిమి సెడి నీవు పుత్రశోకంబునఁ జచ్చెద వజ్ఞానజనిత మగుట


ఆ.

వలన బ్రహ్మహత్య వావిరి నినుఁ జెంద, దని యనుగ్రహించి యపుడె తపసి
పత్నితోడఁ గూడి పావకశిఖలందు, నవగతాసుఁ డగుచు నరిగె దివికి.

1354

వ.

దేవి యిత్తెఱంగునం దొల్లి శబ్దవేధ్యాభ్యాసి నైననాచేత మౌఢ్యంబువలనఁ
గృతం బైనయిమ్మహాపాతకం బిప్పుడు స్మృతివిషయం బయ్యె నమ్మహాపాప
కర్మఫలం బిప్పు డపథ్యవ్యంజనంబులతో నన్నరసంబు భుక్తం బగుచుండ రోగం
బుపస్థితం బైనమాడ్కి సముపస్థితం బయ్యె నమ్మహాత్మునివచనప్రకారంబున
మరణపర్యవసాయిపుత్రశోకంబు సంప్రాప్తం బయ్యె నని రోదనంబు సేయుచు
వెండియు నమ్మహీరమణుండు కౌసల్య నవలోకించి దేవి పుత్రుండు దుర్వృత్తుం
డైనను వాని విచక్షణుం డగువాఁ డెవ్వాఁడు పరిత్యజించుఁ బ్రవ్రాజ్యమానుం
డయ్యును సుతుం డెవ్వాఁ డట్టితండ్రియం దసూయ సేయకుండు రాముని
యందు నాచేత నెయ్యది కృతం బయ్యె నది నాకు సదృశం బై యున్నది
నాయందు రామునిచేత నెయ్యది కృతం బయ్యె నది రామునకు సదృశం బై
యున్నది రాముం డిప్పు డొక్కసారి యైన మదీయనేత్రంబులకుం జూపట్టిన
మదీయగాత్రంబు సంస్పృశించిన సప్రాణుండ నై యుండుట శక్యం బై
యుండు నది పరమదుర్ఘటంబు గావున నింక జీవింపం జాల యమక్షయంబు
నకుం జనియెద జీవితంబు మేనిలోఁ జలించుచున్నయది నేత్రంబులు గాన
రా వయ్యె శమనకింకరులు వేగిరపడుచున్నవారు కల్యాణగుణాభిరాముఁ డగు
రాముఁ డరణ్యంబునకుం జనిననాఁటనుండి తద్విరహసంజాతశోకంబు ఘనా
తపం బల్పజలంబులం బోలె మత్ప్రాణంబుల శోషింపజేయుచున్న దింద్రి
యంబులు విషయంబులకుం దప్పెఁ జిత్తమోహంబు పైకొనియె నింక నీతోడ
సంభాషించుటకుం జాల క్షీణస్నేహదీపసంసక్తరశ్ములుం బోలెఁ జిత్తనా
శంబువలన సర్వేంద్రియంబులు శోషించుచున్నయవి జీవితక్షయకాలంబు
నందు సత్యపరాక్రముండును ధర్మజుండు నగురామునిం జూడకున్నవాఁడ
నింతకంటె నాకు దుఃఖకరం బెద్ది కనకకుండలవిరాజితంబును బద్మపత్రనిభే
క్షణంబును శరాసనసౌందర్యగర్వనిర్వాహణచాతురీవిశిష్టభ్రూయుగసంశోభితం
బును సుదంష్ట్రంబును జారునాసికంబును శరత్కాలరాకానిశాకరమండల
ప్రియదర్శనంబును సుగంధినిశ్వాససంయుక్తంబు నైనరాముని వదనంబు
నెవ్వారు విలోకింతు రట్టివా రెల్ల ధన్యు లయ్యెదరు మఱియు నివృత్తవన
వాసుం డై పంచదశవర్షంబునఁ గ్రమ్మఱ నయోధ్యాపురంబునకుం జను
దెంచినరామచంద్రుని మౌఢ్యంబు విడిచి స్వోచ్చమార్గగతుం డైనశుక్రునిం
బలె వీక్షించి సకలజనంబులు సుఖు లయ్యెద రిప్పు డాత్మభవం బైనశోకంబు
నదీరయంబు కూలంబుం బోలె నచేతనుండ నైననన్ను శోషిల్లం జేయుచున్న
దని పలికి వెండియు నద్దశరథుండు.

1355

దశరథుఁడు పుత్రశోకమున మృతుఁ డగుట

శా.

హా కాకుత్స్థకులాగ్రణీ గుణమణీ హా రామచంద్రా నినుం

గైకేయీకృతపాపబోధనకథాక్రాంతుండ నై పాసితిన్
శోకం బేర్వఁ దొడంగె నింకఁ బితృరాజుం గొల్వఁగా నేగెదన్
హా కౌసల్య సుమిత్ర హా జనకకన్యా హా సుమిత్రాసుతా.

1356


క.

అని విలపించుచు దశరథ, జననాథుఁడు రామజననిసన్నిధియందుం
దనయునిఁ జింతించుచుఁ జ, య్యన నడురేయిఁ బరమార్తి నసువులు విడిచెన్.

1357


వ.

అంతఁ బ్రభాతకాలం బగుటయుఁ బరమసంస్కారు లగుసూతులును నుత్తమ
శ్రుతు లగుమంగళపాఠకులును స్తుతిశీలు రగుగాయకులును వేర్వేఱ రాజ
వేశ్మంబునకుం జనుదెంచి స్తుతినాదంబులు గావించిన నుదాత్తాభిహితాశీర్వా
దు లగువారల స్తుతిశబ్దంబు ప్రాసాదాభోగవిస్తీర్ణం బై మ్రోసెఁ బదంపడి పాణి
వాదకులు వృత్తాద్భుతకర్మంబు లుదాహరించి పాణివాదంబులు గావించి రమ్మ
హాశబ్దంబు విని గృహారామవృక్షశాఖాపంజరస్థితపారావతాదిపతత్రిప్రకరంబు
మేల్కని సుకలంబుగాఁ గలకలధ్వని గావించె నంత వ్యాహృతంబు లైనహరి
నారాయణాదిపుణ్యశబ్దంబులును బుణ్యశ్లోకపురుషకీర్తనంబును వీణానిస్వనం
బును నాశీర్వాదరూపగానంబును రాజచరిత్రపాఠకశ్లోకశబ్దంబులును మృదంగ
భేరీశంఖకాహళాదివాద్యరవంబులును సాంద్రం బై రాజమందిరాభ్యంతరంబు
నిండి చెలంగె నప్పుడు కాలోచితపరిచర్యావిచక్షుణులును శుచిసమాచారులు
నగుపరిచారకు లంతఃపురసంచారార్హస్త్రీజనవర్షధరసహితు లై హరిచందన
సంపృక్తపరిమళోదకంబు కాంచనఘటంబుల సంగ్రహించుకొని స్నానార్థం
బవసరం బెఱింగి కాచికొనియుండఁ గొందఱు యువతులు మంగళరూపాను
లేపనత్రైలోవ్వర్తనంబులును బ్రాశనీయంబు లైనసంపిష్టతిలనారికేళజీరకాది
ద్రవ్యవిశేషంబులును దర్పణవస్త్రాభరణాద్యుపస్కరంబులునుం జేకొని వచ్చి
యనేకకన్యాయుత లై కాచికొనియుండిరి యిట్లు సర్వపరిజనజాతంబును సర్వ
లక్షణసంపన్నం బై యథాయోగ్యంబుగా బహూకృతం బై రాజస్వీకారయో
గ్యం బై సుగుణవంతం బై లక్ష్మీవంతం బై సముత్సుకం బై నిండి సూర్యోదయ
సమయం బయ్యె మహీరమణుం డేలకో మేల్కొనకున్నవాఁ డని శంకించు
చుండె నానమయంబున.

1358


సీ.

మానవనాథునిమరణం బెఱుంగక యవరోధ మచ్చటి కరుగుదెంచి
క్షితినాథబోధనోచితమృదువినయవాక్యంబుల బోధించి యతనిమేను
పరికించి ముకుఁగ్రోళ్లఁ బ్రాణసమీరసంచారంబు లేకున్న శంక నొంది
గాత్రంబు నిట్టట్టు గదిలించి ఱొమ్మునఁ జేయిడి ధాతువిశేష మరసి


తే.

ప్రాణలక్షణ మేమి చూపట్టకున్న, నృపుఁడు మృతుఁ డయ్యెనని మది నిశ్చయించి
యేటివెల్లువ కెదురైనతృణముఖముల, కరణిఁ గంపించి రారాజు కాంత లపుడు

1359

మృతుండగు దశరథునిఁ జూచి యంతఃపురస్త్రీ లందఱు విలపించుట

సీ.

జనపతిచెంతఁ గౌసల్యయుఁ దత్సమీపమున సుమిత్రయు బాఢపుత్ర
శోకపరాజిత లై కాలయుత లైనచందాన ఘననిద్రఁ జెంది మేని
కాంతియంతయు మాయఁ గడువివర్ణత నొంది తిమిరసమావృతర్క్షములమాడ్కిఁ
గనుపట్టుచు దృగశ్రుకణలుళితాస్య లై పడియుండుటయు వారిపాటుఁ జూచి


తే.

విగతజీవితుఁ డైనభూవిభునిఁ గాంచి, యంతిపుర మెల్లఁ గెడసినయట్ల తోఁచె
నడవి విభ్రష్టయూథపలైన దంతి, సతులగతి విలపించి రాచారుముఖులు.

1360


తే.

వారియార్తనినాదంబు ఘోరభంగి, వీనులకు సోఁక విని లేచి వెఱఁగు గదురఁ
నలరి కౌసల్యయును సుమిత్రయు గతాసుఁ, డైనపతిఁ గాంచి విలపించి రార్త లగుచు.

1361


వ.

అప్పు డక్కౌసల్య మగనిమరణం బెఱింగి శోకావేశంబున.

1362


చ.

మును తనమానసంబున సముత్థిత మై పొగ లెత్తి యున్ననం
దనవిపినప్రయాణజనితం బగుదారుణశోకవహ్ని య
మ్మనుజవరేణ్యుపాటుఁ గనినంతనె మండినయట్ల యై దహిం
చినఁ గడు సైఁప లేక ధృతి చేడ్పడ నేడ్చుచు వ్రాలె నేలకున్.

1363


మ.

గగనప్రచ్యుత యైనతారపగిదిం గ్రవ్యాదవిద్వేషిలో
కగళత్కిన్నరకాంతరీతి విషదిగ్ధక్రూరఖడ్గప్రహా
రగతైరావణియట్ల నిష్ఠురకుఠారచ్ఛిన్నమూలక్షమా
జగతి న్వ్రాలి కలంగె వాతహతచంచద్వల్లిచందంబునన్.

1364


శా.

ఈరీతి న్మహి వ్రాలి శోకదహనుం డేఁచ న్సరు ల్పెన్నరుల్
జారన్ బోరున నేడ్చుచున్నయలకౌసల్య న్విలోకించి శో
కారావంబునఁ గైకయీప్రముఖసర్వాంతఃపురస్త్రీజనం
బారూఢి న్విలపించెఁ దత్సదనకుడ్యంబు ల్బదు ల్మ్రోయఁగన్.

1365


వ.

ఇట్లు రాజాంతఃపురం బేనాదంబున మొదలఁ బూరితం బయ్యె నమ్మహానాదం
బనంతరప్రవిష్టకైకేయ్యాదులచేత నభివర్ధితం బై వెండియు మిక్కిలినాద
వంతంబుం గావించె మఱియుఁ బర్యుత్సుకజనాకులం బగుతన్మందిరంబు దశర
థమరణంబున సంత్రస్తసంభ్రాంతం బై తుములాక్రందం బై పరితాపార్తబాం
ధనం బై సద్యోనిపతితానందం బై దీనవిక్లబదర్శనంబై సొబగు దక్కి యుం
డె మృతుం డైనదశరథుం గౌఁగిలించికొని తత్పత్ను లంద ఱొండొరులకరంబు
లు పట్టుకొని యుచ్చైస్స్వనంబున రోదనంబు సేయుచు దీనస్వరంబున విలపిం
చుచుండి రాసమయంబున.

1366

కౌసల్య కైకేయిని దూఱుట

మ.

హతభానుం డగుభానురీతి గతతోయాంభోధిభంగి న్విని
ర్గతతేజుం డగువహ్నికైవడి గతప్రాణానిలుం డైనభూ

పతి నీక్షించి కడిందిశోకమునఁ గంపం బొంది కౌసల్య యు
ద్దతశోకంబునఁ దచ్ఛిరంబు గొనుచుం గైకేయితో ని ట్లనున్.

1367


క.

నీకోర్కికిఁ దగునట్లు మ, హీకాంతుఁడు దివికిఁ జనియె నింక విధవ వై
లోకం బకంటకముగాఁ, జేకొని పాలింపు మొంటిఁ జిక్కి నృశంసా.

1368


చ.

నను విడనాడి ఘోరవిపినంబునకుం జనియెం గుమారుఁ డా
తని నెడఁబాసి శోకమున ధారుణినాథుఁడు దీఱెఁ గానలోన్
జనియెడుసార్థహీన యగునాతిక్రియం బతిహీన నై మహిన్
మనుటకుఁ జాల నమ్మనుజనాథుగతిం జనుదాన నెంతయున్.

1369


క.

తన కేడుగడయు నై తగు, మనోవిభుఁడు చనినపిదప మన నేసతి నె
మ్మనమునఁ దలంచు సంత్య, క్తనిజాచార వగునీ వొకర్తెవు దక్కన్.

1370


తే.

పరఁగ లుబ్ధుండు విషమిశ్రపాక మాహ, రించి దోషం బెఱుంగనిరీతిఁ గైక
చేరి కుబ్జానిమిత్తంబు శీలయుక్త, మైనరఘువంశ మది నేఁడు హత మొనర్చె.

1371


మ.

అనియోగంబున ధారుణీవిభుఁడు భార్యాప్రేరితుం డై సుపు
త్రుని నిష్కారణ మంగనాయుతముగా దూరస్థునిం జేసినాఁ
డని విన్నంతనె పుత్రహీన నగునాయ ట్లమ్మహోదారుఁ డా
జనకక్ష్మాపతి నెవ్వగ న్మునుఁగఁడే సంతాపసంతప్తుఁ డై.

1372


మ.

ధరణీనాథునిజీవనాశనము మద్వైధవ్యము న్విన్న వి
స్ఫురదంభోరుహతామ్రనేత్రుఁ డగునాపుత్రుండు రాముండు దు
స్తరశోకంబునఁ గుంద కున్నె పతిచందాన న్మహీపుత్రి దు
ర్భరసంతాపమున న్మలంగుచు విపత్త్రస్తాత్మ గాకుండునే.

1373


క.

రే లధికభీమఘోష, వ్యాలోలమృగద్విజారవాకర్ణనసం
కీలితసాధ్వస యై సతి, జాలిం గొని మగనిచెంత సంకటపడదే.

1374


క.

తనకూఁతుపాటు నెమ్మన, మునఁ బలుమఱుఁ దలఁచి యల్పపుత్రుఁడు వృద్ధుం
డనఘుఁడు వత్సలుఁ డగున, జ్జనకుఁడు పెనువగలఁ దగిలి చావక యున్నే.

1375


ఉ.

ఈనరనాథమౌళి తనువెంతయుఁ గౌఁగిటఁ జేర్చి చిచ్చులో
మానక సొచ్చి ప్రాణ మనుమానము లేక త్యజించుదాన నం
చానృపపత్ని బోరునఁ గరాంబుజము ల్వెస నెత్తి రోదన
ధ్వాన మొనర్చె యంతిపురివారు మృదూక్తి ననూనయింపఁగన్.

1376


వ.

అంత నమాత్యులు వసిష్ఠాదులచేత నాజ్ఞప్తులై పుత్రుం డొక్కరుం డైన సమీ
పంబున లేకుండుటవలన దహనాదిక్రియలు గావింపక యమ్మహారాజకళేబరం
బు తైలద్రోణియందు నిక్షేపించి సర్వప్రయత్నంబులం గాచికొని యుండం
దగువారల నియమించి దుఃఖాపనోదకంబులు గావించి రనంతరంబ యంతః

పురకాంతలు పరమదుఃఖాక్రాంత లై కన్నీరు నించుచు బాహువు లెత్తి దీనస్వ
రంబున నిట్లని విలపించిరి.

1377


ఉ.

హా మనువంశతోయధిశశాంక సదాప్రియవాది యైన శ్రీ
రామునిఁ బాసి చాలవగల న్మిగులం బొగ లొంది యున్నమ
మ్మీమహి నొంటి డించి చననేగతిఁ జిత్తము వచ్చె మీకు న
య్యో మము నింక నెవ్వరు నృపోత్తమ దేర్చెడువారు సెప్పుమా.

1378


క.

అస్తోకశోకభరమున, దుస్తామసి యైనకైకతోఁ గూడి యిటన్
స్వస్తి గలిగి మనియుండుట, దుస్తర మగుఁ గాదె మాకు దుర్జనదూరా.

1379


మ.

మముఁ గావం దగునంతధీశరధి రామస్వామి రాజ్యేందిరన్
సమతం బాసి యరణ్యసీమ కలయోషాయుక్తుఁ డై యేగె నీ
వమరస్థానగతుండ వైతి విఁక దుష్టాచారపాపాతిరే
కమునం గ్రాలెడుకైకచెంగట మనంగా నేర్తుమే వల్లభా.

1380


తే.

ప్రాణవల్లభ నీవును రాఘవుండు, జానకియు లక్ష్మణుండు నెద్దానిచేతఁ
గరము విడువంగఁబడితి రాకైక యింకఁ, బుడమిలో నన్యు నెవ్వాని విడువకుండు.

1381


క.

అని పెక్కుచందముల న, జ్జనపాలపురంధ్రు లధికసంతాపమునం
గనుఁగొనల బాష్పకణములు, చినుకఁగ విలపించి రతనిచెంగట గుము లై.

1382


క.

ఉడుహీన యైనయామిని, వడువునఁ బతిహీన యైనవనితపగిది న
ప్పుడు రాజహీన యై దెస, చెడి యప్పురి కంటి కింపు సేయక యుండెన్.

1383


వ.

మఱియు నప్పురవరంబు బాష్పపర్యాకులజనం బై హాహాభూతకులాంగనాసందో
హం బై శూన్యచత్వరవేశ్మాంతం బై నవాస్రకంఠాకులమార్గచత్వరం బై యాక్రం
దితనిరానందం బై పాడఱిన ట్లుండె నప్పుడు మిహిరకులనాథుండు పుత్రశోకం
బున మృతుం డగుటయు నృపాంగనలు మహీతలగత లగుటయు నివృత్తకిరణ
సంచారుం డై సూర్యుం డపరశిఖరిశిఖరాంతర్గతుఁ డయ్యెఁ దోడనె కైకే
యీకృతం బగుపాపంబు వెల్లి విరిసినచందంబున గాఢసంతమసంబు రోదసీ
కుహరంబు నిండి యుండె నప్పురంబునం గలనరనారీజనంబులు గుంపులు
గట్టి యార్తనాదంబులు సేయుచుఁ గైకేయి నిందించుచు గాఢదుర్మనస్కు లై
యుండి రారాత్రి దుఃఖవశంబున దీర్ఘభూత యై తోఁచె నంతఁ బ్రభాతకాలం
బగుటయుఁ బూర్వమహీధరమండలంబునకు మండనం బై పుండరీకవనబంధుం
డుదయించిన యనంతరంబ.

1384

గౌతమాదిమునులు వసిష్ఠునితో రాజ్యమునకు రాజు నేర్పఱుపపలయు ననుట

చ.

విదితవివేకశీలు రగువిప్రులు గౌతమకణ్వకాశ్యపు
ల్మొదలుగ రాజకర్త లగుముఖ్యు లమాత్యులతోడఁ దత్సభా
సదనముఁ జేరి చక్కఁగ విచారము సేయుచు నక్త లై సభా

సదులు వినంగ ని ట్లనిరి సమ్మతి మీఱ వసిష్ఠమౌనికిన్.

1385


క.

ఈరాజు పుత్రశోకము, చే రాయిడి నొంది విగతజీవితుఁ డగుచో
నూఱేడు లయ్యెఁ గద మన, కీరాతిరి తెల్లవాఱు టెంతయు ననఘా.

1386


చ.

జనపతి పుత్రశోకమున స్వర్గతుఁ డయ్యును రామలక్ష్మణు
ల్వనమున కేగి రాభరతలక్ష్మణసోదరు లశ్వరాణ్ణికే
తనమున నున్నవారు వసుధాభర మొక్కటఁ దాల్చి రాజ్యపా
లన మొనరింపఁగాఁ దగినరా జొకని న్నియమింపవల్వదే.

1387


ఆ.

రాజు లేనిపురము రాజు లేనినభంబు, పగిదిఁ గాంతిహీన మగుచు నుండు
రాజహీన మైనరాష్ట్రంబునకుఁ గీడు, పొరయు జనులు మేలు పొంద రకట.

1388


క.

గర్జితము లెసఁగ జపలా, స్ఫూర్జితుఁ డై విమలవారి భువి నెల్లెడలం
బర్జన్యుఁడు గురియఁడు సుగు, ణార్జనుఁ డగురాజు లేని యాదేశమునన్.

1389


క.

మునివర యరాజకం బగు, జనపదమున బీజముష్టి చల్లరు తగ నం
దనులు గురుని మన్నింపరు, వనితలు పతివశత నొంది వర్తింప రిలన్.

1390


క.

పెరుఁగవు శుభములు వ్యాధులు,
దొఱఁగవు జనములకు వృద్ధి దొరకొనదు నిరం
తరము నరాజక మగున, ప్పురమున ధనధాన్యవస్తుపుంజము లధిపా.

1391


క.

అత్యాహితంబు గలుగును, నిత్యానందంబు యశము నిరతిశయసుఖం
బత్యంతహితము గలుగదు, ప్రత్యహమును రాజు లేనిరాష్ట్రమునందున్.

1392


క.

మానిగ్రామణి రాజవి, హీనం బగురాష్ట్రమందు హృద్యము లగును
ద్యానంబులు ఫలపల్లవ, నూనసమృద్ధంబు లగుచుఁ జూపట్ట విలన్.

1393


వ.

మఱియు నరాజకం బగుదేశంబున నరులు మనస్స్వాస్థ్యాభావంబున సభ గావిం
పరు యజ్ఞశీలు రగువివ్రులు సంశ్రితవ్రతు లై దీర్ఘసత్రంబులు గావింపక యథోక్త
దక్షిణ లొసంగక పరిత్యక్తనిధికలాపు లై యుందురు మహోద్యానంబులు పుణ్య
సంపాదకగృహంబులు రమ్యంబులు గా కుండుఁ బ్రభూతనటనర్తకు లుల్లాసంబు
నొందరు రాష్ట్రవర్ధనంబు లగునుత్సవంబులు సమాజంబులు వృద్ధి నొందవు వ్యవహా
రులు పరస్పరంబు కుతర్కవాదంబు సేయుచు నిర్ణీతార్థులు గాకుందురు వణిగ్జనం
బులు క్రయవిక్రయాదివ్యాపారంబులం దనిష్పన్నప్రయోజను లగుదు రితిహాస
పురాణాదికథాకథనశీలురు కథాప్రియజనంబులచేత ననురంజితులు గా కుందురు
మఱియు హేమభూషిత లై కుమారికలు సాయాహ్నకాలంబున సఖీజనంబులం
గూడి క్రీడార్థం బుద్యానంబునకుం బోవరు సకాము లగుయువపురుషులు విలాస
వతులం గూడి జనయుక్తంబు లైనవాహనంబు లెక్కి విహారార్థం బుపవనంబులకుం
బోవకుందురు కృషిగోరక్షజీవు లగుధనవంతులు వివృతద్వారు లై సురక్షితులు
గాక బద్ధకవాటు లై యుందురు విషాణవంతంబు లై షష్టిహాయనకుంజరంబులు
బద్ధఘంటాకలాపంబు లై రాజమార్గంబులందుఁ జరింపకుండు నివ్వస్త్రాభ్యాసం

బునందు జనించుశింజినీరవంబు వినంబడకుండు దూరగాము లగువణిజులు
బహుప్రియార్ద్రవస్తుసహితు లై క్షేమమార్గంబునం జనరు జితేంద్రియుం డగు
యతీంద్రుండు శుచియై యెచ్చట సాయంకాలం బగు నట్టిచోట నివసించి స్వస్వ
రూపావలోకనంబు సేయుచుం జరింపకుండుఁ జతురంగసమృద్ధం బగుసైన్యంబు
పగతులం బరిమార్చి విజయంబు నొందకుండు జనంబులకు యోగక్షేమంబు
గలుగనేరదు రథవాజివారణంబు లారోహించి పురుషులు మృగయార్థంబు
వనంబునకుం జనరు శాస్త్రవిశారదు లగునరులు వనోపవనంబులందు హేతు
వాదంబు గావింపరు నియతియుక్తు లగుజనంబులచేత దేవతాభ్యర్చనార్థంబు
మాల్యమోదకాదిపదార్థంబులు కల్పితంబులు గా కుండు రాజకుమారులు
చందనాగరురూషితు లై వసంతసమయవృక్షంబులమాడ్కిఁ జూడ్కికి వేడ్క
సేయకుందు రదియునుం గాక.

1394


ఆ.

కసవు లేని వనముకైవడి సదమల, జలము లేని నదులచందమునను
గోపహీన లైన గోవులకైవవడి, రాజహీన మైన రాష్ట్ర మొప్పు.

1395


తే.

అనలునకు ధూమమలరథంబునకు ధ్వజము, జ్ఞాపకం బైనభంగి నేఘనుఁడు మనకు
నిత్యమును కేతుభూతుఁ డై నెగడె నట్టి, వనజసఖవంశవరుఁడు దేవత్వ మొందె.

1396


తే.

విను మనాయక మైనట్టివిషయమందు, మనుజు లన్యోన్యపశుదారధనగృహాప
హారులై యొండొరులఁ బట్టి దారుణముగ, మ్రింగుదురు జలచరములభంగి ననఘ.

1397


తే.

వసుధ నాస్తికు లెవ్వలెవ్వరు వివేక, రహితు లెవ్వారు భిన్నమర్యాదు లట్టి
వారు నృపతిదండప్రభావమున సాధు, భావము వహింత్రు గాదె యో బ్రహ్మపుత్ర.

1398


తే.

మేని కక్షి ప్రవర్తక మైనభంగి, రాజు రాష్ట్రంబునకుఁ బ్రవర్తకుఁడు గాన
నట్టి నరపతి లేనిరాజ్యంబునందు, నురుభయోపద్రవము బ్రవర్తకుఁడు గాన.

1399


తే.

నృపుఁడె సత్యధర్మములకు నిలయ మతఁడె, జగతిఁ గులవంతులకుఁ గులాచారసరణి
యతఁడె తల్లియుఁ దండ్రియు నతఁడె ప్రజకు, హితకరుఁడు సంతతంబు మునీంద్రతిలక.

1400


క.

వరుణయమపాకరివుకి, న్నరనాథప్రభృతిదిగధినాథులు సద్వృ
త్తిరతుం డగునరపతిచేఁ, గరము నధఃకృతులు గారె ఘనగుణశాలీ.

1401


క.

తగవును దగమియుఁ దలిపెడు, జగతీపతి లేకయున్న సంయమివర యీ
జగ మినుఁడు లేనిదివసము, పగిదిఁ దమోభూత మగుచుఁ బస చెడి యుండున్.

1402


వ.

మునీంద్రా మహీపతి మని యున్నయపుడె సముద్రంబు చెలియలికట్ట నతిక్రమిం
పంజాలనికైవడి నే మందఱము భవద్వచనంబు నతిక్రమింపంజాలక యుందు
మిప్పు డెత్తెఱంగున నతిక్రమింపం గలవార మీవు మాస్థితియును మహీపతి లే
మిం జేసి యరణ్యభూతం బైనరాష్ట్రంబుం బరికించి వదాన్యుం డైన యిక్ష్వాకు
పుత్రునిఁ గుమారు నొక్కనిఁ బూజ్యం బైనసామ్రాజ్యంబున కభిషిక్తునిఁ గావిం
వు మనిన నట్ల కాక యని యమ్మునివరుండు జయంతాదిమంత్రుల నవలోకించి.

1403

ఉ.

ఆమునిరాజు వల్కె వినయాన్వితుఁ డాభరతుండు నేఁడు మా
తామహునింటఁ దమ్ముఁడును దాను సుఖస్థితి నున్నవాఁడు శ్రీ
రామునితమ్ముఁ డాతనిఁ దిరంబుగఁ దోడ్కొనిరండు విస్ఫుర
త్కామగమంబు లైనతురగంబుల నెక్కి చనుండు గ్రక్కునన్.

1404

వసిష్ఠుఁడు భరతశత్రుఘ్నులఁ దోడ్కొని రమ్మని మంత్రుల నియోగించుట

క.

రామునివివాసనంబును, భూమీశ్వరుమృతియుఁ గైకబూమె లతనితో
నేమియుఁ జెప్పక యూరక, నామాటగఁ దోడి తెండు నయ మలరారన్.

1405


ఆ.

ఎల్లవారు కుశల మిచ్చట నని పల్కి, పటవిభూషణము లుపాయనములు
వారివారి కెల్ల వేఱు వేఱు నొసంగి, భరతుఁ దోడి తెండు ప్రాభవమున.

1406


క.

అని పయనముఁ జేసిన న, మ్మునినాథునియాజ్ఞ మాళిఁ బూని మనమునం
బెనువగలు పొగలుకొనఁ జ, య్యనఁ జనిరి హయాధిరూఢు లై శీఘ్రగతిన్.

1407

వసిష్ఠనియుక్తు లగుచారులు గిరివ్రజపురంబుఁ జేరుట

వ.

ఇత్తెఱంగున నచ్చారులు పుష్కలంబుగాఁ బాథేయంబుఁ గొని చని మొదలఁ
బశ్చిమాభిముఖంబుగా నిర్గమించి దక్షిణోత్తరభాగాయతంబు లైన యపరతా
లప్రలంబనామగిరిద్వయమధ్యంబుఁ బ్రవేశించి మాలినీనదీతీరమార్గంబున నుత్త
రాభిముఖు లై యొక్కింతదూరం బరిగి యవ్వలఁ బ్రలంబపర్వతోత్తరభాగంబు
నధిగమించి హస్తినపురసమీపంబునందు గంగానది నుత్తరించి యంతట
నుండి ప్రత్యఙ్ముఖు లు లై కురుజాంగలదేశమధ్యమార్గంబునం జని పాంచాలదే
శంబుఁ బ్రవేశించి సంఫుల్లకమలసుగంధబంధురంబు లైనసరోవరంబులును
విమలోదకంబు లైననదీసంఘంబులును విలోకించుచుఁ బ్రసన్నసలిలోపరి
విహారిహంససారసాదినానావిహంగరుతాభిరామ యై జనాకుల యగుశరదండ
యనుదివ్యనది నుత్తరించి యమ్మహానదిపశ్చిమతీరంబున నున్న సత్యోపయా
చనం బైనపుణ్యవృక్షంబుకడకుం జని దానికిఁ బ్రదక్షిణంబును బ్రణామం
బునుం గావించి యవ్వలఁ గుళింగాఖ్యపురంబు దాఁటి యభికాలాఖ్య
గ్రామంబు గడచి బోధిభవనాఖ్యపర్వతంబు డాసి దశరథవంశానుభూత
యైనయిక్షుమతి యనుపుణ్యనది నుత్తరించి యంజలిప్రమాణజలమాత్రా
హారులు బ్రాహ్మణుల వేదపారగుల నిక్షుమతీతీరవాసుల విలోకించుచు బా
హ్లికదేశమధ్యంబునం జని సుదామాఖ్యపర్వతం బతిక్రమించి యచట విష్ణు
చరణాంకితస్థానంబు విలోకించుచు విపాశానామనది నుత్తరించి తత్తీరవర్తి
శాల్మలీవృక్షంబు విలోకించి యవ్వల సరిత్సరోవరతటాకవాపీకూపానూపం
బులు నిరీక్షించుచు సింహవ్యాళమృగద్వీపిసంపూర్ణంబు లైనమహారణ్యంబు
లు తరించి మహామార్గంబు బట్టి చని శ్రాంతవాహను లై కులరక్షణంబుకొఱ
కును నృపతిప్రియంబుకొఱకును భర్తృవంశపరిగ్రహంబుకొఱకును బహు

ప్రయత్నంబున రాత్రిసమయంబున గిరివ్రజపురంబుఁ బ్రవేశించి యొక్కచోట
విశ్రమించి యున్నంత.

1408

భరతునికి దుస్స్వప్న మగుట

చ.

భరతుఁడు నాటిరేయి యొకభంగిని నిద్దుర వోవుచుండి దు
ష్కరమగు నొక్కకీడుకలఁ గాంచి దిగు ల్గొని నిద్ర లేచి ని
వ్వెఱపడి వేగునంతకును వేగుచు వేగిరపాటుతో నినుం
డఱిముఱిఁ దోఁచినంతనె సభాంతరసీమకు వచ్చి యచ్చటన్.

1409


క.

అక్కఱపడి చనుదెంచిన, మక్కువ చెలికాండ్రతోడ మాటాడక యే
దిక్కును జూడక గ్రక్కున, చెక్కిటఁ జెయిఁ జేర్చి చింత సేయుచు నుండెన్.

1410


తే.

అప్పుడు విషణ్ణవదనుఁ డైనట్టిభరతుఁ, జూచి ప్రియవాదు లగువయస్యులు తదీయ
చిత్తఖేదంబుఁ బాయ విచిత్రపుణ్య, కథలఁ జెప్పిరి కొందఱు కౌతుకమున.

1411


క.

మఱియుం గొందఱు మురళీ, కరతాళమృదంగములును ఘనముగ వాయిం
చిరి వారయువతు లెంతయు, సరసత నాట్యములు మ్రోల సల్పిరి వరుసన్.

1412


తే.

మఱియు సంస్కృతప్రాకృతమాగధాది, గద్యపద్యాత్మకము లైనకావ్యనాట
కములు చదివిరి కొందఱు కరము హాస్య, ములు వచించిరి పరిహాసకులు చెలంగి.

1413


తే.

ఇవ్విధంబున హితమతి నెవ్వ రెన్ని, ప్రమదజనకంబు లగువినోదము లనేక
గతుల సలిపిన నమ్మహీపతిసుతుండు, చిత్తమున నించుకయు సంతసింపకుండె.

1414

భరతుఁడు తనప్రియసఖునికి స్వప్నప్రకారముఁ దెల్పుట

వ.

అప్పు డొక్కప్రియసఖుండు దీనుం డై మొగంబు వాంచి యున్నభరతు
నుపలక్షించి యేమి కారణంబున ని ట్లున్నవాఁడ వని యడిగిన నతం డతని
కి ట్లనియె.

1415


క.

ఇష్టసఖా యే మందు న, రిష్టం బగుస్వప్న మొకటి రే యాత్మకు సం
దృష్టం బైనకతంబున, నష్టమహుఁడ నైతి నెమ్మనంబు గలంగెన్.

1416


వ.

అత్తెఱం బెఱింగించెద వినుము.

1417


సీ.

అచలాగ్ర మెక్కి మాయయ్య క్రొమ్ముడి వీడ గోమయహ్రదములోఁ గూలినట్లు
గోమయహ్రదములోఁ గూలి తైలముఁ గ్రోలి ఘనతైలవాపిలో మునిఁగినట్లు
తైలంబు తల నంటి తైలాన్నము భుజించి నగము బ్రద్దలు వాఱ నవ్వినట్లు
రక్తగంధముఁ బూసి రాసభస్యందన మెక్కి దక్షిణదిశ కేగినట్లు


ఆ.

వికృతవేష యైనయొకరాక్షసాంగన, రక్తపటముఁ దాల్చి రాజవరుని
నెలమిఁ ద్రాటఁ గట్టి యీడ్చినట్లుగ స్వప్న, మందుఁ గానఁబడియె నాప్తవర్య.

1418


క.

అసితాంబరధరుఁ డై యా, యసపీఠంబున విషణ్ణుఁ డగుదశరథు న
త్యసితపిశంగప్రమదలు, వెసఁ జూచుచు నవ్వినట్లు వీక్షింపఁబడెన్.

1419


ఉ.

వారిధు లింకినట్లు శశివార కిలం బడినట్లు చిచ్చు చ

ల్లాఱినయట్లు భూమి నిబిడాంధతమోవృత యైనయట్లు రా
డ్వారణశృంగము ల్విఱిగి వ్రాలినయట్లు కుజంబు లెండిన
ట్లూరక కొండలందుఁ బొగలూరిన యట్లుగఁ దోఁచె నెంతయున్.

1420


తే.

ఇట్టిదుస్స్వప్న మొకటి చూపట్టె నాకు, నదియమొద లేమియును దోపదయ్యె నెట్టి
మాట వినఁబడునో యని మనుజనాథుఁ, డన్నదమ్ములు వీట నె ట్లున్నవారొ.

1421


తే.

రాసభంబులుఁ బూన్చినరథము నెక్కి, యేనరుం డేని స్వప్నమం దేగినట్లు
దోఁచునట్టిమనుష్యునిధూమము చిత, యం దచిరకాలమునఁ దోఁచు నది నిజంబు.

1422


క.

కావున నది కారణముగ, భావంబు గలంగి యొక్కభంగిగ నుండె
న్వావిరి విషణ్ణవదనుఁడ, నై వగచెద నృపతి కేమి యగునో యనుచున్.

1423


క.

ఏమిట భయ మెఱుఁగని నా, కేమో దిగు లగుచుఁ జిత్త మెరియఁగఁ జొచ్చెన్
రామునకు లక్ష్మణునకును, భూమివిభున కేమి కీడు పుట్టునొ యనుచున్.

1424


తే.

ఏమి హేతువొ తెలియదు హృదయమునకు, మందత ఘటిల్లెఁ దనుకాంతి మాసె నాస్య
మునకు దైన్యంబు వాటిల్లెఁ బుట్టి యెన్నఁ, డిట్టివైక్లబ్య మెఱుఁగ నే నించు కైన.

1425


క.

మున్నెన్నఁ డిట్టికల నేఁ, గన్నది లే దేమి చెప్పఁగల నిఁక ధాత్రీ
భృన్నుతుఁ డగుమజ్జనకు గు, ణోన్నతుఁ జింతింప భీతి నొందితి ననఘా.

1426


క.

అని సచివునితో రాతిరి, గనుపట్టినయట్టికీడుకల యంతయుఁ దా
వినిపించి వెఱఁగుపడి నె, మ్మనమునఁ దలపోసి వెగడుపడుచున్నంతన్.

1427

అయోధ్యనుండి వచ్చినదూతలు భరతుని సందర్శించుట

క.

పురినుండి యరుగుదెంచిన, పరమహితులు దూత లతనిపాలికిఁ జని త
చ్చరణములకు నతు లిడి య,క్కఱపడి యి ట్లనిరి వగపు గన్పడకుండన్.

1428


క.

అనఘ పురోహితుఁడు నమా, త్యనికరము శుభంబు దెలిపి తడయక మిముఁ దో
డ్కొని రమ్మని మముఁ బనిచినఁ, జనుదెంచితి మచటిపనులు సమకూర్చుటకున్.

1429


క.

మా తెచ్చిన మణిభూషణ, ధౌతాంబరములు గ్రహించి తడయక యుష్మ
న్మాతామహునకు సఖులకు, మాతులున కొసంగు మతిసమంచితబుద్ధిన్.

1430


వ.

మఱియు మాతామహునకు వింశతికోటిమూల్యంబులును మాతులునకు దశ
కోటిమూల్యంబులును వేర్వేఱ నొసంగు మని సమర్పించినం గైకొని వారి
నభిమతకామంబుల సంతుష్టులం జేసి యి ట్లనియె.

1431

భరతుఁడు తనమాతామహుని నయోధ్య కరుగుటకు సెల వడుగుట

సీ.

మాతండ్రి దశరథోర్వీతలనాథుండు సేమమె మాయన్న రామభద్రుఁ
డానందభరితాత్ముఁ డై యున్నవాఁడె లక్ష్మణునకు మేలె ధర్మజ్ఞ ధర్మ
దర్శిని ధర్మాఢ్య ధర్మవిచారిణి లక్షణలక్షిత రామజనని

కౌసల్య కుశలమె కమనీయగుణశీల యగుసుమిత్రకు భద్ర మగునె క్రూర


తే.

చిత్త నిజకార్యతత్పరోద్వృత్తశీల, యైనమాతల్లి సుఖయుక్త యగునె మఱియు
దక్కిననృపాంగనలకు భద్రంబె యూర, నున్నవారెల్లఁ గుశలు లై యున్నవారె.

1432


క.

అని యడిగిన నచ్చారులు, విని భరతునితోడ ననిరి వెండియు దేవా
విను మీ రిపు డడిగినవా, రనువుగ నున్నారు సమ్మదాత్మకు లగుచున్.

1433


క.

ఆవంత లేదు భయము సు, ధీవర పద్మకర లక్ష్మి దేవరవారిం
గావలె నని వరియించుం, గావున విచ్చేయవలయు గ్రక్కునఁ బురికిన్.

1434


వ.

అని వేగిరపడి పలుకుచున్నచారులవాక్యంబు విని భరతుండు శంకాకళంకిత
స్వాంతుం డై మాతామహున కి ట్లనియె.

1435


క.

అనఘా సాకేతపురం, బున కరిగెదఁ దండ్రిఁ జూడ మునుకొని మీర
ల్మనమునఁ దలంచినప్పుడె, చనుదెంచెద నాకు సెల వొసంగఁగ వలయున్.

1436

మాతామహమాతులులు భరతునకుఁ గానుక లొసఁగుట

చ.

అనుటయుఁ గేకయక్షితితలాధిపుఁ డెంతయుఁ జిత్రకంబళా
జినములు వారణాశ్వములు చీర లనేకధనంబుఁ బ్రీతితో
మనుమని కిచ్చి తచ్ఛిరము మక్కువ మూర్కొని సత్కరించి మిం
చినయనురక్తి నంపకము చేసి ముదం బిగురొత్త వెండియున్.

1437


మ.

అనఘా వీటికిఁ బోయి ర మ్మచటివృత్తాంతంబు సర్వంబు మా
కనుమానింపక చెప్పి పంపు మని సయ్యాటంబుగాఁ బల్కి నూ
తనహారంబులు ధౌతచేలము లమాత్యశ్రేణి కర్పించి సం
జనితానందముతోడ వీడ్కొనియె వాత్సల్యంబు దీపింపఁగన్.

1438

భరతుం డయోధ్య కరుగుట

వ.

ఇట్లు మాతామహుండు ద్విసహస్రవక్షోభూషణంబులును షోడశాశ్వశతం
బులును నపరిమితధనంబును భరతున కొసంగి గుణవంతు లగువారిఁ గొందఱ
మంత్రుల నిచ్చి సముచితంబుగా వీడు కొల్పిన నతనిమాతులుండును రూపసం
పన్నంబులు నిరావదింద్రశిరాఖ్యపర్వతోత్పన్నంబులు నైనగజంబులను వాయు
వేగంబు లైనసైంధవంబులను సుసంయుక్తంబు లైనఖరంబులను నంతఃపుర
సంవృద్ధంబులును వ్యాఘ్రవీర్యబలాన్వితంబులును దంష్ట్రాయుధంబులును
మహాకాయంబులు నగుశునకంబుల నొసంగి యనంతధనం బిచ్చి యనిచె
నిట్లు కృతప్రయాణుం డై భరతుండు మాతామహమాతులదత్తధనాదుల నభి
నందింపక స్వప్నదర్శనభయంబువలనను దూతప్రేరణంబువలనను ద్వరమా
ణుం డై మాతామహునకు మాతులునకుం జెప్పి గమనసంవిధానంబుఁ గావించి
శత్రుఘ్నసహితంబుగా రథారోహణంబుఁ జేసి రాజగృహంబు వెలువడి
యింద్రలోకంబు వెలువడినపరమసిద్ధుండుంబోలెఁ దేజరిల్లుచు రాజమార్గం

బునం జనియె నప్పుడు భృత్యులు మండలాకారచక్రంబు లగు పరశ్శత
రథంబులను గోహయఖరోష్ట్రంబులనుం గొని వెంటం జనిరి యిట్లు భర
తుండు మాతామహబలాభిగుప్తుం డై ప్రాణసఖు లైనయమాత్యులం గూడి
ప్రాఙ్ముఖంబుగాఁ బోవుచు మార్గంబున సుదామాఖ్యనది నుత్తరించి దూర
పార యగుహ్లాదినీనది దాఁటి యేలాధాననగరసమీపంబునఁ బశ్చిమాభిముఖ
ప్రవాహతరంగయుక్త యైనశతద్రూతరంగిణిం దాఁటి యపరపర్పటాఖ్యదేశ
విశేషంబు లతిక్రమించి శిలాపకర్షణస్వభావ యగుకల్లోలిని దాఁటి యాగ్నే
యశల్యకర్తనసంయజ్ఞకం బైనగ్రామద్వయం బతిక్రమించి శిలావహానది నవ
లోకించుచుఁ జైత్రరథం బనువనంబును లక్ష్యంబుఁ జేసి మహాశైలంబుల నతి
క్రమించి పార్శ్వద్వయంబునఁ బ్రవహించు గంగాసరస్వతీనదుల విలోకిం
చుచు వీరమత్స్యోత్తరదేశంబు లతిక్రమించి తదుత్తరంబున భారుండాఖ్య
వనంబుఁ బ్రవేశించి పర్వతాభిసంవృత యైనకుళింగాఖ్యనదిని యమునాసమీ
పంబున దాఁటి యమునానది డాయం జని యమ్మహానదియందు సుస్నాతుం
డై తజ్జలపానంబుఁ జేసి జలావగాహనాదికంబునఁ గ్లాంతంబు లైనహయంబుల
గాత్రంబులు శీతీకరించి యాశ్వాసించి నిర్మలజలంబులు సంగ్రహించికొని
యన్నది నుత్తరించి భద్రజాతీయగజంబు నారోహించి గంధవాహుం డాకా
శంబుం బోలె రయంబున నిర్జనం బైనమహారణ్యం బతిక్రమించి యంశుధా
నాఖ్యపురంబు దాఁటి ప్రాగ్వటాఖ్యపుణ్యపురతీర్థంబున భాగీరథి నుత్తరించి
యవ్వలఁ గుటికోష్ఠికాఖ్యనిమ్నగ దాఁటి ధర్మవర్ధనగ్రామంబు గడచి యవ్వలఁ
దోరణగ్రామంబునకు దక్షిణభాగంబునం బొల్చుజంబూప్రస్థాఖ్యం బగుగ్రామం
బుఁ బ్రవేశించి యచ్చటం గదలి రమ్యం బైనవరూధగ్రామంబునకుం జని తత్స
మీపవనంబున నారాత్రి నివసించి యవ్వలఁ బ్రాఙ్ముఖుం డై యరిగి యవ్వల
నుజ్జిహానాఖ్యపురసమీపంబునఁ గదంబవృక్షశోభితం బైనమహోద్యానంబుఁ
బ్రవేశించి యచ్చటి మహోన్నతప్రియకంబులు విలోకించుచు రయంబున
నవ్వనంబు దాఁటి సర్వతీర్థగ్రామంబున నొక్కరాత్రి నివసించి యవ్వల వెనుకొని
రమ్మని సేనల కనుజ్ఞ యొసంగి తాను రథారూఢుండై చని యుత్తానికాప్రభృ
తి పుణ్యనదు లన్నియు నుత్తరించి హస్తిపృష్ఠకగ్రామసమీపంబునఁ గుటికా
ఖ్యనదిం గడచి యవ్వల లౌహిత్యాఖ్యనగరసవిూపంబునఁ గపీవతీతటిని
దాఁటి యేకసాలగ్రామంబున స్థాణుమతి నుత్తరించి వినతాఖ్యనగరంబున
గోమతీనది దాఁటి కళింగనగరప్రాంతసాలవనంబుఁ బవేశించి యచ్చట
నొక్కింతసేపు విశ్రమించి యవ్వనంబు దాఁటి యవ్వలం జని చని యెనిమిద
వనాఁటిసూర్యోదయంబున మనునిర్మితం బైనయయోధ్యాపురంబుఁ గనుం
గొని భరతుండు సారథి నవలోకించి యి ట్లనియె.

1439

ఉ.

సారథికంటె దవ్వుల విశాలరసాలమహీరుహాళిచే
భూరిగభీరమై పొలుచు పుణ్యవనోపవనంబుల న్శర
న్నీరదపఙ్క్తిఁ బోలు మణినిర్మతశర్మదహర్మ్యపాళిఁ జె
న్నారెడురాజమార్గముల నద్భుతభంగి వెలుంగు మత్పురిన్.

1440


చ.

మఱియు సమాహితాగ్నుల సమానగుణాకరు లైనభూసురు
ల్గర మనురక్తి సేయు సకలశ్రుతిమంత్రరవంబు లొక్కటం
దఱుచుగ నిండి మ్రోయ వితతద్యుతి నొప్పెడుదాని రాజశే
ఖరపరిపాలితం బగుచుఁ గ్రాలెడుదాని నయోధ్యఁ గంటివే.

1441


శా.

ము న్నీపట్టణరాజమందు సతతంబుం బౌరనారీనరో
త్పన్నం బెనరవంబు మానసకుజ ల్పాయంగ వీతెంచుచుం
డు న్నేఁడేల వినంగరాదు పురిచుట్టుం బొల్చునుద్యానపా
ళి న్నారీయుతు లై విలాసపురుషు ల్క్రీడింప రా రేలకో.

1442

భరతుం డయోధ్యను జూచి యందలిదుఃఖనిమిత్తముల సారథికిఁ జూపుట

తే.

అనుదినంబును సాయాహ్నమందుఁ గ్రీడ, సలిపి యుపరతి నొందినజనులచేత
నలరునట్టియుద్యానంబు లరయఁ జాల, నిష్ప్రభత నొంది యున్నవి నేఁ డిదేల.

1443


క.

వారణతురంగశకటర, థారోహకు లర్థి నీవ లావలి కిపు డే
లా రారు పోరు సారథి, యూ రడవిం బోలెఁ దోఁచుచున్నది మదికిన్.

1444


వ.

మఱియు ఫలపల్లవకుసుమమకరందరసాస్వాదమత్తశుకపికశారికాభ్రమరమరాళ
విహంగమకూజితస్వనసంకులంబులును నాలవాలకరణదోహనసేచనకందళితం
బులును వివిధకుసుమలతాగృహదీర్ఘికాక్రీడాపర్వతాదిశోభితంబులును రమ్యం
బులు నగుమహోద్యానంబులు స్రస్తపర్ణద్రుమసంయుతంబు లగుటంజేసి నిరా
నందంబు లై సొబగు దప్పి యున్న వదియునుం గాక.

1445


ఉ.

కోకిలశారికామధురకూజితము ల్వినరావు వేణువీ
ణాకలనిస్వనంబులు వినంబడ వేలకొ కుందచందనా
నోకహసౌరభాంచితమనోహరసుందరగంధవాహుఁ డే
లా కలయంగ వీవఁడు సభా వినఁ గానము వాద్యఘోషముల్.

1446


క.

ఈకష్టనిమిత్తంబు లనేకంబులు దోఁచుకతన హృదయంబున క
స్తోకపరితాప మొదవెను, దేఁకువ సెడి బుద్ధి చాల ద్రిమ్మట గొనియెన్.

1447


తే.

ఎల్లభంగుల మావారి కెల్ల మేలు, దుర్లభం బని యాత్మకుఁ దోఁచుచున్న
దనుచు వెలవెలఁ బోవుచు మనసు గలఁగ, భరతుఁ డల్లన నప్పురీవరము సొచ్చె.

1448


క.

ఈరీతి వైజయంత, ద్వారంబునఁ బురము సొచ్చి త్వరితంబునఁ ద
ద్ద్వారపరిపాలకులు త, న్నోర మొగముఁ బెట్టి సూచుచుండఁగ నరిగెన్.

1449


వ.

ఇవ్విధంబున భరతుండు విషణ్ణశ్రాంతానేకాగ్రహృదయుండును లుళితేంద్రి

యుండును శ్రాంతవాహనుండు నై రయంబునఁ బురంబు సొచ్చి రాజమార్గంబు
నం బోవుచుఁ బథిశ్రమక్లాంతుం డైనసూతు నవలోకించి వెండియు ని ట్లనియె.

1550


క.

సూతా నిష్కారణముగ, మాతామహు విడిచి మౌని మాటకు దూతా
నీతుఁడ నై యే నేలా, యేతెంచిలి నిట్టియశుభ మేఁటికిఁ దోఁచెన్.

1451


క.

నృపనాశమ్మున నేయే, నెపములు మును చెప్పఁబడియె నేఁ డవి యెల్ల
న్విపులతరంబుగఁ గనుఁగవ, కిపు డెల్లెడఁ దోఁచుచున్న వెంతయు వీటన్.

1452


వ.

మఱియుఁ గుటుంభిభవనంబులు సమ్మార్జనవిహీనంబు లై యసంయతకవాటం
బులై ప్రభాహీనంబు లై బలికర్మరహితంబు లై ధూపసమ్మోదనశూన్యంబు
లై యభోజితకుటుంబంబు లై శోభాహీనజనాకులంబు లై యలక్ష్మీకంబు లై
సొబగు దక్కి యున్నవి మఱియు దేవాగారంబులు వ్యపేతమాల్యశోభంబు లై
యసమ్మష్టాంగణంబు లై ప్రవిద్ధంబు లై శూన్యంబు లై యున్నవి యజ్ఞగోష్ఠు
లు పాడఱియున్నయవి మాల్యావణంబులందుఁ బణ్యంబులు ప్రకాశితంబులు
గా కున్న వదియునుం గాక.

1453


ఆ.

ఎవ్వ రేమి చెప్ప రేలకొ పాడఱి, నట్లు దోఁచుచున్న దకట పురము
వణిజు లెల్ల సర్వవస్తువిక్రయవృత్తి, యుతులు గానిపగిది నున్నవారు.

1454


క.

సౌరాలయచైత్యంబులఁ, బారావతశుకపికాదిపక్షిగణము సం
చారంబు దక్కి యేలకొ, యూరక కన్నీరు నించుచున్నది కంటే.

1455


తే.

ఆననమునందు వైవర్ణ్య మడర నశ్రు, కణము లురలఁగ ధ్యానమూకత వహించి
విక్లబత నొంది యున్న దీవీట నున్న, నరసమూహంబు కంటివె నర్మసచివ.

1456


క.

అని భరతుఁడు సారథితో, ననిష్టశకునంబు లన్ని యటు పేర్కొనుచు
న్మనమున దైన్యం బడరఁగఁ, జనియెం దొలుతొల్త రాజసదనంబునకున్.

1457

భరతుఁడు కైకేయిని సందర్శించుట

వ.

ఇట్లు శూన్యశృంగాటకమందిరరథ్యంబును రజోరుణద్వారకవాటయంత్రంబును
నగుపితృమందిరంబు విలోకించి యందు దశరథుం గానక యప్రియంబు లైన
దుర్నిమిత్తంబు లనేకంబులు గనుంగొనుచు దీనమానసుం డై భయకంపితశరీ
రుం డై మాతృమందిరంబునకుం జని సముచితంబుగా నిజజనని సందర్శించి తచ్చ
రణంబుల కభివందనంబుఁ గావించె నప్పు డక్కైకేయి సంప్రాప్తుం డైనకుమా
రు నవలోకించి రయంబునఁ గనకాసకంబు డిగ్గి యొక్కింతసేవు పుత్రవాత్సల్యం
బున గాఢంబుగాఁ బరిష్వజించి నిజోత్సంగంబున సుఖాసీనుం గావించి చుబుకం
బు పుణికి శిరంబు మూర్కొని చెక్కిలి ముద్దుగొని చిరకాలంబునకు సమాగ
తుం డగుటవలన నానందపరిపూరితాంతఃకరణ యై ప్రేమగద్గదస్వరంబున ని ట్లనియె.

1458


ఆ.

అనఘ యెన్నిదినము లయ్యె మాతామహు, మందిరంబు విడిచి మమత మాని
నిన్ను విడువఁజాలెనే యతండు పథిశ్ర, మంబు దీర్చికొనుము మాన్యచరిత.

1459

మ.

తనయా వచ్చితె మామయి ల్విడిచి యెన్నాళ్లయ్యె మాయయ్య తా
ననునిత్యంబు మనంబునం దలంచునే నాయన్న సంతోషియే
నినుఁ దా నంపెడువేళ నేమనియె రాజ్ఞీశ్రేష్ఠ మాతల్లి నా
యన ని న్బాసిననాఁటనుండి కను చెడ్డ ట్లయ్యె నా కెంతయున్.

1460


చ.

అని ప్రియమారఁ బల్కు తనయమ్మను గన్గొని యాతఁ డిట్లనున్
జననిరొ తాత నిత్యము మనంబున నిన్నుఁ దలంచుచుండు న
య్యనఘుఁడు మాతులుండు సుఖ యై సదనంబున నున్నవాఁడు న
న్ననుపనులీల నేగు మని యంపె బహూకృతి జేసి వేడుకన్.

1461


తే.

మామ యొసఁగిన గజవాజి మణిధనంబు, లధ్వమునఁ జిక్కె నేను రయమున నేగు
దెంచితి నృపాలదూతచోదితుఁడ నగుచుఁ, దద్గృహముఁ బాసి సప్తరాత్రంబు కడచె.

1462


సీ.

పగడంపుఁగోళ్ల సొంపగునీదుశయనీయపర్యంత మేలకో పాడుదోఁచె
మాయయ్య దశరథక్ష్మాభ ర్త కుశలి యై యున్నచందము దోఁపకున్న దేమి
యెప్పుడు నీయిల్లు నెడఁబాయఁజాలని తండ్రి నేఁ డెచటికిఁ దలఁగిపోయెఁ
గృతకాముఁ డై యగ్రసతి యగుకౌసల్య యున్నతాలయమున నున్నవాఁడొ


తే.

యమ్మహాత్మునిపాదపద్మమ్ముఁ గొలువ, వలయు నెచ్చట యున్నాఁడొ తెలియఁ జెప్పు
మనిన నక్కైక భరతునాననముఁ జూచి, యి ట్లనుచుఁ బల్కె సందియ మింత లేక.

14463

భరతుఁడు పితృమరణం బెఱింగి దుఃఖించుట

క.

చతురుండు యాయజూకుఁడు, జితేంద్రియుఁడు సత్యరతుఁడు క్షితివల్లభుఁడో
సుత భూతంబుల కెయ్యది, గతి యై తగు నట్టిచరమగతికిం జనియెన్.

1464


క.

నావుడు భరతుఁడు జనయి, త్రీవాక్యం బాలకించి పృథుపరశుహతం
బై వసుధఁ బడినవిటపము, కైవడి మహి వ్రాలె శోకకంపితుఁ డగుచున్.

1465


శా.

ఈరీతి న్మహి వ్రాలి శోకదహనుం డేఁచ న్భుజం బెత్తి దీ
నారావంబున నేడ్చెఁ గన్నుఁగవ బాష్పాంబుల్ జడిం గాఱఁగా
హా రాజోత్తమ హా మహాగుణమణీ హా తండ్రి మ మ్మొంటి ని
ష్కారుణ్యంబునఁ బాసి పోవఁ దగవే క్ష్మానాథ యంచున్ రహిన్.

1466


క.

అని యీగతి భరతుం డా, ననమునఁ బట మొత్తి ఘోరనాదమునఁ బ్రతి
ధ్వను లీనఁగ నేడ్చుచు మే, దినిఁ బడి విలపించెఁ జాల ధృతి వాయంగన్.

1467


ఉ.

శారదపూర్ణిమారజనిచంద్రవిరాజిత మైనవారిద
ద్వారముభంగిఁ బొల్చు నృపతల్పము భూపతి లేమిఁ జేసి నేఁ
డారయఁ జంద్రహీన మగు నాకసముం బలె శుష్కతోయ మౌ
వారినిధానముంబలెను బాడఱి యున్నది కాంతిహీన మై.

1468

చ.

అని బహుభంగుల న్సముదితార్తరవం బడరంగ నిష్ఠురా
వనిఁ బడి యేడ్చుచున్నహరివారణసన్నిభు నిందుతుల్యుని
న్వనరుహబాంధవప్రతిము వారణవైరినిభుం గుమారునిం
గనుఁగొని లెమ్ము లె మ్మనుచుఁ గైకయి కౌఁగిటఁ బట్టి యి ట్లనున్.

1469


మ.

అమలాత్మా నినుబోఁటిప్రాజ్ఞు లిటు శోకాక్రాంతు లై విక్లబ
త్వమునం బ్రాకృతులట్ల దైన్యమున సంతాపింతురే యిట్లు దుః
ఖమునం దూలినఁ జన్నవారు మరలం గాంక్షించి యేతెంతురే
క్షమలోఁ దొల్లిఁటిరాజు లందఱును బంచత్వంబుఁ బ్రాపింపరే.

1470


తే.

అనఘచారిత్ర నీబుద్ధి యనవరతము, సవనదానతపశ్శ్రుతిసత్యశౌచ
శీలములయందు మిక్కిలి చేరి యుండు, నర్కరుచి మందరనగంబునందుఁబోలె.

1471


క.

అనవుడుఁ గొండొకసే ప, య్యనఘుఁడు కఠినోర్వి నొరిగి యారాటమునం
బెనువగలఁ బొగిలి క్రమ్మఱ, జననిం గని యిట్టు లనియె సంతాపమునన్.

1472


ఉ.

ఉల్లమునందుఁ బ్రేమ దళుకొత్తఁగ రాముని రాజ్యలక్ష్మికి
న్వల్లభుఁ జేయుఁ దా నొకహవం బొనరింపఁ గలండు తండ్రి యం
చుల్లమునందు నమ్మి రయ మొప్పఁగ వచ్చితిఁ గాని యిట్లు మా
కెల్ల దురంతదుఃఖ మిడి యీగతిఁ బోవు టెఱుంగ నక్కటా.

1473


ఉ.

సాధుచరిత్రుఁ డార్జవవిచారుఁడు సూనృతవాది యైనభూ
నాథుఁ డమేయధైర్యగిరినాథుఁడు నాచనుదెంచునంతలో
వ్యాధి నశించెనో తెలియ నాడుము నాయన సంస్కరించి రా
మాదికుమారు లెంతయుఁ గృతార్థకు లైరికదా తలంపఁగన్.

1474


ఉ.

మాతులునింట నుండి గరిమం జనుదెంచిన నన్ను మున్ను వి
ఖ్యాతకృపానురాగములఁ గౌఁగిటఁ జేర్చి రజంబు నూడ్చి సం
భూతముదంబున న్శిరము మూర్కొని వేడ్కలు సేయుచుండు నేఁ
డాతనియంగసంగమమహాసుఖముం గన నైతి నక్కటా.

1475


ఉ.

ఎవ్వఁడు భ్రాత తండ్రిసముఁ డెవ్వఁడు రక్షకుఁ డెవ్వఁ డింక నా
కెవ్వని కేను దాసుఁడ మహీస్థలి నారఘురాముతోడ నా
నెవ్వగ లెల్లఁ దెల్పి జననీ రయ మారఁగఁ బిల్వ నంపు దౌ
దవ్వులఁ జూచి తచ్చరణతామరసంబులమీఁద వ్రాలెదన్.

1476


క.

ధర్మవిదుఁడు ధర్మాత్ముఁడు, ధర్మపథగరిష్ఠుఁ డైనధరణీనాథుం
డర్మిలిఁ గడచనుచో నయ, ధర్మా సందేశ మేమి దడవెం జెపుమా.

1477


వ.

అనిన నక్కైకేయి యి ట్లనియె.

1478


శా.

ఆభూనాథకులోత్తముం డలసతన్ హా రామ హా లక్ష్మణా
హా భూపుత్రిక యంచుఁ బేర్కొని తదీయానూనరమ్యాకృతు

ల్దా భావంబున నిల్పి తద్గుణగణధ్యానంబుఁ గావించుచు
న్శోభాహీనత నొంది మేను విడిచెన్ క్షోభంబు వాటిల్లఁగన్.

1479


తే.

జానకీలక్ష్మణులఁ గూడి సంభ్రమమున, విపినమున నుండి క్రమ్మఱ వీటి కరుగు
దెంచిన రఘూత్తముని విలోకించి యెల్ల, జనులు సిద్ధార్థు లయ్యెద రనుచుఁ బలికె.

1480


వ.

అని పలికిన నద్దేవివచనంబు విని ద్వితీయాప్రియశంసనంబువలన మిక్కిలి విష
ణ్ణవదనుం డై వెండియు నద్దేవి కి ట్లనియె.

1481

భరతుఁడు కైకేయిని రామవివాసనంబునకుఁ గారణం బడుగుట

క.

జననీ కౌసల్యానం, దనుఁ డవనీపుత్రిఁ గూడి తమ్ముఁడు గొలువ
న్దనపురము విడిచి యెచ్చట, నునికిం గావించె దాని నొయ్యనఁ జెపుమా.

1482


చ.

అన విని వేడ్కఁ గ్రాలుహృదయంబున నజ్జగఱాఁగ కూర్మి ని
ట్లను నిసుమంత గొంకక జటాజినము ల్ధరియించి భూమినం
దనియు సుమిత్రపట్టియు ముదంబునఁ దోఁ జనుదేర దండకా
వనమున కేగె రాముఁడు ధ్రువంబుగ రాజ్యముఁ బాసి పుత్రకా.

1483


ఉ.

నా విని విన్నవాటు వదనంబునఁ దోఁప నతండు బాష్పము
ల్వావిరిఁ గ్రమ్మదేర బలువంతలఁ గుందుచుఁ ద్రస్తచిత్తుఁ డై
భూవియదంతరాళపరిపూరితకీర్తిని రామమూర్తినిన్
భావమునందు నిల్పి నిజవంశసమంచితసూక్తి ని ట్లనున్.

1484


ఉ.

ఎన్నఁడు విప్రుసొమ్ము భుజియింపఁ డధర్మము త్రోవఁ బోఁడు తా
నెన్నఁడు నన్యకాంతపయి నించుకయైన మనంబు సేర్పఁ డా
పన్నశరణ్యుఁ డంచితకృపాలుఁడు ధర్మవిధిజ్ఞుఁ డైనమా
యన్న యదేల భ్రూణహునియట్ల వనంబున కేగెఁ జెప్పుమా.

1485


చ.

అన విని యానృశంసిని నిజాత్మజునిం బరికించి తా నొన
ర్చినకొఱగానికార్యములఁ జెప్పినఁ జాలఁ గృశించునే కదా
యని జగఱాఁగ యౌట హృదయంబున నించుక శంక నొంద కా
యనువున స్త్రీస్వభావమున నాతనితో ముద మంది యి ట్లనున్.

1486

కైకేయి భరతునకు రామవివాసంబునకుఁ గారణంబుఁ దెల్పుట

ఉ.

ధర్మము దప్పి కాదు పరదారధనాదులఁ గోరి కాదు దు
ష్కర్మ మొనర్చి కాదు ద్విజసత్తముని న్వధియించి కాదు స
ద్ధర్మవిశారదుండు నృపధర్మవిధిజ్ఞుఁడు నైనరాఘవుం
డర్మిలి గానకుం జనుట కైనతెఱం గెఱిఁగింతుఁ బుత్రకా.

1487


చ.

అఱమఱ యింత లేక వినుమా మును మీజనకుండు నాకుఁ దా
వరములు రెం డొసంగె నవి వాకొని నీకు నరాధిపత్యముం

బరువడి రామభర్తకుఁ బ్రవాసముఁ గోరితిఁ గోరిన న్మహీ
వరుఁ డగుఁ గాకయం చతని వారక పొమ్మని పంచెఁ గానకున్.

1488


ఉ.

పంచిన మంచి దంచు నరపాలశిఖామణి యైనరాముఁ డ
భ్యంచితలీల వల్కలజటాజినము ల్ధరియించి యాత్మలో
నించుక యైన స్రుక్కక మహీజయు లక్ష్మణుఁ డంటి వెంట రా
వంచన యింత లేక వనవాటికిఁ బోయెఁ బితౄణ మీఁగఁగన్.

1489


ఉ.

ఈగతి రాఘవుం డడవి కేగిన పిమ్మటఁ దాల్మి వీడి లో
రాగము గూర నివ్వటిలు రామువియోగజతాపవహ్నిచేఁ
గ్రాఁగుచు రేపవ ల్వగలఁ గంటికిఁ గూరుకు రాక వంతల
న్వేఁగుచు మేదినీవిభుఁడు వే చనియె న్సురరాజువీటికిన్.

1490


ఉ.

రాముఁడు దాల్పఁగాఁ దగినరాజ్యము నేర్పునఁ జేసి నీకుఁ గా
భూమివరేణ్యుచేతఁ బలుపోకల వంచనఁ జేసి తెచ్చితి
న్నామది చల్లసేయుచు జనంబులు సన్నుతి సేయఁ జుట్టము
ల్బాములు వీడ నింక నరపాలనశీలివి గమ్ము పుత్రకా.

1491


ఉ.

ఈపుర మీయనామయమహీతల మీమణిరత్నకాంచనం
బీపలుమూఁక లీధనము లెంతయు నీయది గాన నాత్మలో
భూపతిపోకకు న్వగలఁ బొందక ధైర్యము నూఁదు మింక ని
న్నేఁపున సర్వరాజ్యమున కేలికఁ జేసెద రెల్లి సద్విజుల్.

1492


క.

అని పితృమరణము భ్రాతల, వనగమనముఁ జెన్ప విని యవార్యచరితుఁ డా
యన పిడుగు పడినవానిం, బెనుగొఱవిం గాల్చి నట్లు బిమ్మిటి గొనుచున్.

1493


వ.

కొండొకసే పొల్లం బోయి మెల్లనఁ దెలిసి నిజజనని నవలోకించి యి ట్లనియె.

1494

భరతుండు కైకేయిని దూఱుట

ఆ.

అకట తండ్రిచేత నల తండ్రికెన యైన, భ్రాతచేత విడువఁబడి స్వధర్మ
హతుఁడ నై కృశించునట్టినా కీరాజ్య, మీధనంబు నగర మేల చెపుమ.

1495


క.

భూరమణుఁ జంపి రాముని, వారక తాపసునిఁ జేసి వ్రణమందు ఘన
క్షారము బలె దుఃఖము నం, దారయ దుఃఖం బొనర్చి తతికఠినమతిన్.

1496


క.

మావంశము నిర్మూలముఁ గావింపఁగఁ గాళరాత్రిగతి వచ్చితి వా
భూవిభుఁడు నిన్ను భస్మ, వ్యావృతశిఖికణమ వనుచు నరయక చెడియెన్.

1497


క.

జనపతి నీచే గతచే, తనుఁ డై దివి కనుపఁబడియె దాన రఘుకులం
బునఁ గలధర్మంబు నయం, బును వృత్తము సుఖము యశముఁ బొలిసెఁ గులఘ్నీ.

1498


తే.

నీకరగ్రహ మొనరించి నిత్యసత్య, ధర్మరతుఁ డైనమాయయ్య దశరథుండు
తీవ్రదుఃఖాభితప్తుఁ డై తీఱి పోయె, ఫణినిఁ జేనంటి యజ్ఞుఁడు పడినపగిది.

1499


చ.

అనుపమసత్యధర్మరతుఁ డైనరఘూత్తము నుగ్రకాననం

బున కనుపంగ నేల తనపుత్రునివైభవ మక్షి కింపుగాఁ
గనుఁగొనువేడ్క నున్నమహికాంతునిఁ జంపఁగ నేల యక్కటా
కని కని దీన నేమి యొడిగట్టఁ దలంచివే నరాదినీ.

1500


మ.

చిరకాలం బనపత్యతాఘమున గాసిం జెంది నేఁ డింతక
క్కఱతో నమ్మహనీయులం గని యభంగప్రీతితో నున్న ని
త్తఱిఁ గౌసల్యకు నాసుమిత్రకు ననంతక్షోభ మి ట్లీవు మ
త్సరితం జేసితి వింకఁ దన్ముఖము లేచందంబునం జూచెదన్.

1501


క.

గురువృత్తివిదుఁడు ధర్మో, త్తరుఁ డగురఘునాయకుండు తనతల్లిపయిం
గుఱిఁ జేయుభక్తి నిన్నుం, బరికించుం గాదె యతనిఁ బాపుట తగవే.

1502


మ.

కరుణం జెల్లెలఁ జూచుకైవడి నినుం గౌసల్య దా సంతతం
బరుదారం బరికించు నాయమసుతుం డైశ్వర్యభోగార్హుఁ డి
త్తఱిఁ జీరాజనము ల్ధరించి మునిచందాన న్వనక్షోణి క
ట్లరుగం జూడఁగ నెట్లు సైఁచితివి వంశాచారవిద్వేషిణీ.

1503


ఉ.

శూరుఁ డపాపచిత్తుఁడు విశుద్ధచరిత్రుఁడు కీర్తిమంతుఁ డం
భోరుహతామ్రలోచనుఁడు పుణ్యుఁడు సర్వశరణ్యుఁ డంచితా
కారుఁడు నైనరాముని జగన్నుతశీలు నకారణంబుఁగా
దారుణకాననంబునకుఁ దప్పక పంచితి వేల చెప్పుమా.

1504


తే.

కరము రాజ్యార్థ మన్యాయగతి ననర్థ, మరయ నీచేతనానీత మగుటవలన
నన్న కేఁ జేయుభక్తిలౌభ్యమునఁ జేసి, నీకు విదితంబుగా దని నేఁ దలంతు.

1505


క.

లలితయశోధను లినకుల, లలాము లుత్తములు రామలక్ష్మణు లటవీ
స్థలి కేగి రింక నే నే, బలమున సామ్రాజ్య మెల్లఁ బరిపాలింతున్.

1506


తే.

మేరుధాత్రీధరంబు సమీపవనము, నట్ల బలవంతుఁ డైనసీతాధినాథు
నాశ్రయించి బలోన్నతుం డయ్యు దశర, థాధిపుఁడు సేమమున రాజ్య మర్థి నేలె.

1507


వ.

అట్టిమహాత్ముం డగుదశరథునిచేతఁ దాల్పంబడిన మహీసామ్రాజ్యభారం బే
బలంబునం దాల్చువాఁడ మహాబలీవర్ధంబుచేత సముద్ధృతం బైనభారంబు
వత్సతరంబు మోవం జాలునే యది యట్లుండని మ్ముపాయబలంబునఁ గాని
బుద్ధిబలంబునఁ గాని యొక్కింత రాజ్యభారధారణంబునందు సామర్థ్యంబు
నాకుఁ గలిగి యున్నను బుత్రగర్ధిని వగునిన్నుఁ గామితసిద్ధిచేత వెలయింపం
జాల రామునకుఁ గౌసల్యయందుం బోలె నీయందు సంతతంబు మాతృత్వ
ప్రయుక్తగౌరవంబు గలుగకుండెనేని నిన్నుం బరిత్యజింపవచ్చు నతం డంత
కంటె నీయెడ వినయగౌరవంబులఁ బాటించుం గావున నత్తెఱం గవలంబించుట
కయుక్తం బై యున్న దని పలికి భరతుండు వెండియు ని ట్లనియె.

1508


తే.

సాధుచారిత్రవిభ్రష్ట సత్యరహిత, కులవినాశని పాపసంకలితచిత్త

మూఢ పండితమానినిపూర్వరాజ, గర్హితం బైనమత మెట్లు గలిగె నీకు.

1509


తే.

వంశపాంసని యీరఘువంశమందుఁ, బూర్వకులలోన జ్యేష్ఠుండు భూమి కధిపుఁ
డగుచు నుండఁ గనిష్ఠు లయ్యనఘు ననుస, రించి వర్తించు టది ధర్మవృత్తిసరణి.

1510


తే.

స్వప్రయోజనపరవు నృశంస వగుట, నీవు శాశ్వతమైనట్టి నృపతిధర్మ
మును నృపాచారపద్ధతి యనుపమాన, సాధువృత్త మెఱుంగవు సత్య మింత.

1511


తే.

వంశపాంసని జ్యేష్టానువర్తనంబు, వివిధపార్థివవంశసంభవుల కెల్ల
ధరణి సాధారణం బైనధర్మ మందు, రాఘవులకు విశేషధర్మంబు దలఁప.

1512


తే.

అట్టికులశీలయుతులు ధర్మైకరక్షు, లైనయిక్ష్వాకుకులజధరాధిపతుల
ధర్మచారిత్రగర్వితత్వంబు నిన్నుఁ, బొంది సర్వంబు శిథిల మై పోయె నేడు.

1513


క.

మునుకొని మీమాతృకులం, బునఁ బుట్టి వారు రాజముఖ్యులు జ్యేష్ఠున్
జనపతిఁ జేయరె నీ కీ, యనర్థమతి యెట్లు గలిగె నన్వయహరణీ.

1514


తే.

యశము కులమును జెఱిచితి వట్టినీకుఁ, గామమునఁ దృప్తి సేయక రామభద్రు
నిపుడె దోడ్తెచ్చి పుడమి కధిపునిఁ జేసి, యతని కతిభక్తి దాసుండ నై చరింతు.

1515


క.

అని యిట్లు విప్రియము లగు, సునిశితవాక్యములు పల్కి శోకంబున రో
దన మొనరించుచుఁ గ్రమ్మఱ, జననిం గని యిట్టు లనియె సక్రోధుం డై.

1516


తే.

పాపచారిణి రాజ్యలోభమునఁ జేసి, ధర్మ మంతయు విడిచినదాన వైతి
వింక ని న్నన నేల నిశ్శంక నన్ను, మృతునిఁగా నెంచి రోదనయుతవు గమ్ము.

1517


క.

పతి దివమున కలసీతా, పతి కాననమునకు నీదుపంపునఁ జనుచు
న్మతిలోన నిను సతీగుణ, యుత వని నిక్కము దలంచి యుందురె చెపుమా.

1518


క.

కులమును నశింపఁజేయుట, వలనం దగ భ్రూణహత్యఁ బ్రాపించితి వా
కలుషమునఁ బతిసలోకత, నలరారక నిరయగతికి నరిగెద వింకన్.

1519


తే.

సకలలోకప్రియుని రామచంద్రు నడవి, కనిచి విభుని నాకమునకుఁ బనిచి నాకు
నెల్లవారికి భయ మావహిల్లఁజేసి, పాపభాగిని వై నిల్వఁబడితి వీవు.

1520


క.

నీచేత ఘోరకర్మ, ప్రాచుర్యముచేత నెద్దిపాప మిటులు నేఁ
డాచరిత మయ్యె నది న, న్నేఁచుటయే కాదు జగము నేఁచఁ దొడంగెన్.

1521


వ.

మఱియు దుష్టచారిణి వైననీకతంబున మహీరమణుండు లోకాంతరగతుం
డయ్యె రామభద్రుండు వనంబునకుం జనియె నేను వంశపాంసని వగునీకుం
బుట్టినకతంబున లోకంబునం దుపక్రోశమలీమసుండ నైతి మాతృరూపం
బునం జూపట్టుమృత్యువ కా నిన్నుఁ దలంచెద దురాచారసంపన్న వగుని న్నవ
లోకించుటయు నీతోడ సంభాషించుటయు మహాపాతకం బని తోఁచుచున్నది.
పతిఘాతిని వైన నీవలన సుశీల లగుకౌసల్యయు సుమిత్రయుఁ దక్కిన యంతః
పురకాంతలు దుస్సహం బైనదుఃఖంబు నొందవలసె నిరయగామిని వగునీవు
ధర్మాత్ముం డగునశ్వపతివంశవినాశనార్థంబు పుట్టినరాక్షసివి గాని యమ్మహా

త్మునకుం బుత్రికవు గావు పరమధార్మికుండును నిత్యసత్యపరాయణుండు నగు
రాముని వనంబునకుం బనిచి పుత్రవత్సలుం డగుమజ్జనకుని దివంబునకుం
బంచి యేపాపకర్మం బాచరించితి వాపాపకర్మంబు పితృభ్రాతృపరిత్యక్తుం డగు
టవలన లోకవిద్వేష్యుండ నైననాయందు సమారోపితం బయ్యెఁ గట్టిడితనం
బున రట్టున కొడిగట్టితివి ధర్మసంయుక్త యైనకౌసల్యాదేవినిఁ బుత్రహీనం
జేసి యేలోకంబుఁ బడయం గోరితివి బంధుసంశ్రయుండును నియతుండును
జ్యేష్ఠుండును బితృసముండు నగుకౌసల్యానందనునియందు నాకుం గలభక్తి
స్నేహంబులు మూఢచిత్త వగుటం జేసి పరామర్శింపవైతి వని పలికి పుత్ర
విశ్లేషంబు దల్లి కసహ్యతరం బని యెఱింగించువాఁ డై యంగాదంగా దీని
యెడు శ్రుతియర్థంబు మనంబున నిడికొని వెండియు ని ట్లనియె.

1522

భరతుఁడు కైకేయికిం బుత్రశోకము దుస్సహమని యెఱిఁగించుట

క.

విను మంగప్రత్యంగజుఁ, డనురాగస్థానభూత మగుహృదయమునన్
జనియించెఁ గాన నౌరసుఁ డనఁ దగె నతఁ డమ్మ కెక్కు డార్వురిలోనన్.

1523


వ.

అని పలికి పుత్రశోకంబు దుస్సహదుఃఖకారణం బని సూచింపం జేయువాఁడై
యొక్కయితిహాసంబు ని ట్లనియె.

1524


సీ.

వినుము నృశంస త్రివిష్టపంబున వన్నె కెక్కిన సురభి దా నొక్కనాఁడు
పుడమిపై నాఁగలిఁ బూని యామద్వయపర్యంతమును దున్ని బడలి దారు
ణాతపంబున డస్సి యడుగులు తడఁబడఁ దూఁగాడుచున్నయుత్తుంగవృషభ
ముల రెంటిఁ గని తనకులమునఁ బుట్టిన వౌట నందనుల కానాత్మఁ దలఁచి


తే.

పుత్రశోకంబుచేఁ జాలఁ బొక్కి యేడ్వ, దానికన్నీటిచినుకు లధఃప్రచారి
యగుసురేంద్రునిపైఁ బడ్డ నతఁడు చూచి, మోడ్పుఁ గే లొప్పఁ బలికె నమ్మొదవుతోడ.

1525


క.

దేవతతికి భయ మయ్యెనె, భావంబునఁ గలఁగి యేల పరితాపింప
న్నావుడు నిర్జరధేనువు, దేవపతిం జూచి పలికె దీనత వెలయన్.

1526


వ.

సురేంద్రా యుష్మద్భయాగమనశంకాహేతుభూతం బైనపాపంబు లేదు కర్షకు
నిచేత దండితు లై యెండం బడి కృశించుచు మొగంబుల దైన్యంబు దోఁప
భూరిభారపీడితు లౌటకతంబున దుఃఖించుచు మహీతలంబున విషమస్థలంబు
నం జరించు చున్నమత్పుత్రులం జూచి పుత్రునిం బోలిన ప్రియవస్తు వన్యం
బెద్దియు లేమింజేసి శోకించుచున్నదాన నని పలికిన నయ్యమరవిభుం డెద్దాని
పుత్రసహస్రంబులచేత లోకంబు వ్యాప్తం బయ్యె నట్టిదాని రోదనంబుఁ
గావించుదానిఁ గామధేనువు నవలోకించి పుత్రునకంటెఁ బ్రియుం డన్యుండు లేఁ
డని తలంచి పరిమళోపేతంబు లైనతదీయాశ్రుకణంబులు గొనగోట మీటుచు

మృదుమధురవాక్యంబుల ననునయించె నిత్యం బప్రతిమవృత్తయు లోక
సంరక్షణేచ్ఛయు గుణనిత్యయు సంపత్ప్రదయు శీలపరిపూర్ణయు బహుపు
త్రయు నైనకామధేను వొక్కనికిఁ గా శోకించె నని శాస్త్రంబు లెఱింగించు
చుండ నేకపుత్ర యగుకౌసల్య యతం డొక్కరుండును వనంబునకుం బోవు
చుండ దుఃఖంబునం బరితపించుచున్న దనుట కేమి సందియం బని పలికి వెండి
యు ని ట్లనియె.

1527


మ.

చిరకాలం బనపత్యతాఘమున గాసిం జెంది నేఁ డింత
కరుణోదారునిఁ గాంచి కాంచితిఁ గదా కల్యాణమం చుండ ని
త్తఱిఁ గౌసల్యకు దుస్సహం బయినసంతాపంబుఁ గావించి తీ
దురితం బుద్ధతిఁ గాల్ప కున్నె నిను నెందు న్జన్మజన్మంబునన్.

1528


తే.

పాపదర్శిని సుగుణసంపన్న యైన, పుణ్యసాధ్వి కౌసల్యకు భూరిశోక
మాత్మ నరయక కావించినందువలన, నిరయగతి కేగఁ గల వీవు నిక్కువముగ.

1529


తే.

అఖిలరాజవిగర్హిత యైననీదు, బుద్ధిఁ గైకొన కేను సంపూర్ణకీర్తి
వర్ధనం బైనజానకీవల్లభాంఘ్రి, పూజనం బర్థి సలిపెద బొంకు గాదు.

1530


మ.

నిను వేభంగుల దూఱ నేటికిఁ గులఘ్నీ యిప్పుడే పోయి రా
మునిఁ గల్యాణగుణాభిరాము నిటకుం బొల్పొందఁ దోడ్తెచ్చి గ్ర
క్కున సామ్రాజ్యమునందు వేడ్క నభిషిక్తుం జేసి యప్పూన్కిఁ గై
కొని యే నేగెద దండకాఖ్యగహనక్షోణీస్థలిం ద్రిమ్మరన్.

1531


ఆ.

బాష్పకంఠు లైనపౌరులచే నిరీ, క్షితుఁడ నగుచు నీవు చేసినట్టి
యీదురంతపాప మించుక యైన స, హించి యుండఁ జాల నిచట నిపుడు.

1532

భరతుం డమాత్యమధ్యమునఁ బ్రమాణము సేయుట

వ.

మహాత్ముం డగురామునకును బుణ్యసాధ్వి యైనకౌసల్యకు బుద్ధిపూర్వకంబుగా
మహాపకారంబుఁ గావించితి వీపాపంబునకు మరణంబు దక్క నొండు ప్రాయశ్చి
త్తంబు లేదు చిచ్చులో నుఱికి యైన గరళంబుఁ గ్రోలి యైన దండకారణ్యం
బున కరిగి యైనఁ బాశంబున నురిగొని యైన నెట్లయినఁ గళేబరత్యాగంబుఁ జేసి
యీదుష్కృతంబుఁ బాపికొను మేను సత్యపరాక్రముం డగురామునిఁ గోసల
రాజ్య పట్టాభిషిక్తునిం జేసి యపనీతకల్మషుండ నై కృతకృత్యుండ నయ్యెద నని
పలికి భరతుండు సంక్రుద్ధం బైనపన్నగంబుభంగి రోజుచుఁ గాంతారమధ్యస్థిత
గర్తంబునందుఁ దోమరాంకుశవిద్ధం బైనమహాగజంబుపగిది నాకంపించుచు రోష
రోదనతామ్రాక్షుండును శిథిలాంబరుండును విధూతసర్వాభరణుండు నై యుత్స
వాంతంబునందుఁ బుడమిం బడినశక్రధ్వజంబుపోలిక ధరణిపయిం బడి కొం
డొకసేపునకు లబ్ధసంజ్ఞుం డై లేచి నేత్రంబుల నశ్రుకణంబులు దొరుఁగ రక్తాంత

వీక్షణంబులఁ గైకేయి నిరీక్షించి గర్హించుచుఁ దత్కాలసమాగతు లైనయ
మాత్యులమధ్యంబున నిలువంబడి భుజం బెత్తి రామోపభోజ్యం బైనసామ్రా
జ్యం బేను గాంక్షింపలేదు కపటంబున రాజ్యగ్రహణార్థంబు కైకేయిం బ్రేరే
పించి యెఱుంగ రాజుచేత మదర్థం బేయభిషేకంబు సమీక్షితం బయ్యె నయ్య
భిషేకంబు నెఱుంగ శత్రుఘ్నసహితుండ నై దూరదేశంబున నుండుటవలన రా
మలక్ష్మణులవివాసనం బెఱుంగ నని ప్రామాణ్యంబుగాఁ బల్కి దీర్ఘస్వరంబున
రోదనంబుఁ గావించిన నతని కంఠశబ్దం బాకర్ణించి కౌసల్య సుమిత్ర నవ
లోకించి యి ట్లనియె.

1533


ఆ.

కలుషచిత్త యైనకైకేయితనయుండు, వచ్చి యుండఁ బోలు వాఁడు దీర్ఘ
దర్శి గాన వానిఁ దడయక వీక్షింపఁ, బోద మనుచు వేగ పోయె నటకు.

1534


క.

ఆభరతుఁడు మనమున సం, క్షోభించుచు సుతవియోగశోకముచే సం
క్షోభించుచున్నకోసల, భూభృత్సుత యున్నయెడకుఁ బోయె రయమునన్.

1535

కౌసల్య శోకావేశంబున భరతుని దూఱుట

క.

ఈగతి నేగి కుమార వి, యోగజశోకశిఖిఁ గ్రాఁగి యుడికెడుతల్లి
న్వేగంబె కాంచి యాప, త్సాగరమున మునిఁగి భరతశత్రుఘ్ను లొగిన్.

1536


క.

పరశునికృత్తం బగుసుర, తరువుంబలె నేలఁ బడిన తల్లిని వంతం
బరిరంభించుచు నడలిరి, మరుచ్చలితకచ్ఛరుహలమాడ్కిం బెలుచన్.

1537


వ.

ఇత్తెఱంగున నాకంపించుచుండ నప్పు డక్కౌసల్య శోకావేశంబున.

1538


ఉ.

కన్నుల నశ్రువు ల్దొరుఁగ గన్నుల నశ్రులు నించువాని నా
పన్నత నొందుచుం గడువిపన్నత నొందెడువాని మోమున
న్విన్నఁదనంబు దోఁపఁ గడువిన్నఁదనంబున నొప్పువాని నా
చిన్నికుమారుని న్భరతుఁ జి చ్చురలం బరికించి యి ట్లనున్.

1539


క.

దుర్మతి కైకేయీదు, ష్కర్మంబున రామరాజ్యకాముఁడ వగునీ
కర్మిలి నకంటకం బతి, శర్మద మగురాజ్యపదము సమకూడెఁ గదా.

1540


ఆ.

నారచీర లిచ్చి నాపుత్రు మీయమ్మ, ఘోరకాననంబుఁ జేరఁ బనిచెఁ
దనకు దీన నేమి ఘనత వాటిల్లునో, తెలియ దింతపనికిఁ దెగియె నపుడు.

1541


తే.

దారుణప్రజ్ఞ యైన మీతల్లి కైక, భూవిభునిఁ జంపుటయును మత్పుత్రుఁ డైన
రామభద్రుని దారుణారణ్యసీమ, కనుచుటయు నిన్ని నీకొఱ కాచరించె.

1542


క.

ఆలస్య మేల చేకొని, పాలింపుము రామరాజ్యపదము సభల నీ
శీలము విూయమశీలము, వాలాయముఁ బెద్ద లైనవారు నుతింపన్.

1543


ఉ.

చారుహిరణ్యనాభుఁడు విశాలయశుండు ప్రశాంతచిత్తుఁ డ
బ్జారిసమానతేజుఁడు గుణాఢ్యుఁడు మత్ప్రియపుత్రుఁ డెచ్చటం
గోరి వసించె నచ్చటికి గొబ్బునఁ గైకకుఁ జెప్పి నన్ను పొ

ల్పారఁగఁ బంపు మయ్యనఘు నాస్యముఁ జూడక యుండ నేర్తునే.

1544


ఆ.

అట్లు సేయ వేని యగ్నిహోత్రంబు పు, రస్కరించుకొని కరంబు భయము
దొలఁగ నిడి సుమిత్రతోఁ గూడి యిప్పుడే, పుత్రుఁ డున్నయెడకుఁ బోవుదాన.

1545


ఉ.

నాయెడ నీకు భక్తియు వినమ్రతయుం గృప గల్గె నేని ను
శ్రీయుతుఁ డైన రాఘవునిచేరువకు న్నను నీవ పంచి భ
ద్రాయతమూర్తి వై సఖుల కమ్మకు సంతస మంకురింప న
న్యాయవిధార్జితం బగుననామయరాజ్యము నేలు మిత్తఱిన్.

1546

భరతుఁడు కౌసల్యముందర తాను రాజ్యరామవివాసనములఁ గోరలేదని శపథము సేయుట

వ.

అని యివ్విధంబున దారుణంబు లైనబహువిధవాక్యంబుల గర్హించుటయు
నవ్వాక్యంబులు తీవ్రవ్రణంబునందు వాఁడిసూదులఁ జొనిపిన ట్లయిన నతండు
తీక్ష్ణవ్యధాబాధితుం డై శోకమూర్ఛాపారవశ్యంబునఁ దదీయచరణంబుల
పయిం బడి కొండొకసేపునకు లబ్ధసంజ్ఞుం డై బహుప్రకారంబుల విలపించుచుఁ
గేలుదోయి ఫాలంబునం గీలించి దుస్సహపుత్రశోకబలార్దిత యై విలపించుచున్న
కౌసల్యచేతఁ దనయందు సమారోపితం బైనదోషంబు పరిహరించుటకు శపథ
వాక్యంబుల ని ట్లనియె.

1547


క.

జననీ యకల్మషుఁడ నగు, నను గర్హించెద వి దేల నా కారఘునా
థునిమీఁదం గలభక్తియు, వినమ్రతయు మున్ను నీకు విదితము గాదే.

1548


క.

ఏపాప మెఱుంగనిన, న్నీపగిదిం దూఱ నేటి కింతకు మును సీ
తాపతిపదారవిందా, రోపిత యగుభక్తి నీ వెఱుంగవె తల్లీ.

1549


క.

జననీ రాఘవుఁ డెవ్వని, యనుమతమున నడవి కరిగె నాతని కాచా
ర్యనిగదితశాస్త్రశిక్షిత, ఘనబుద్ధియుఁ గలుగకుండుఁ గాక గుణాఢ్యా.

1550


సీ.

వృజినాత్మునకుఁ బ్రేష్యవృత్తిఁ బూనిన వానియఘము మార్తాండున కభిముఖముగ
మూత్రంబు విడిచినమూఢునిదురితంబు పడియున్నమొదవును బాదనిహతిఁ
దన్నినవానిపాతకము భృత్యునిచేతఁ బని గొని కుడుప నియ్యని నృపాలు
పాపంబు పుత్రులపగిది భూతంబుల నరయుభూపతికి ద్రోహంబు సేయు


తే.

వానికలుషంబు రాముఁ డెవ్వానియనుమ, తమున రాజ్యంబు విడిచి సీతాయుతముగ
దారుణారణ్యదేశమధ్యమున కరిగె, నతని కగుఁ గాక భూతసంతతులు గుఱిగ.

1551


క.

కరషడ్భాగముఁ గైకొని, కర మనురాగమునఁ బ్రజలఁ గావనిధాత్రీ
వరుని మహాకలుషము నీ, వరసుతునకుఁ గీడుఁ దలఁచువానిది గాదే.

1552


సీ.

విను మిత్తు ననియు ఋత్విజుల కధ్వరమందు యజ్ఞదక్షిణ యీనియతనిదురిత
మశ్వగజస్యందనాకులం బగుయుద్ధమందుఁ బాఱినవానియఘఫలంబు

నుగురూపదిష్టమౌ సూక్ష్మార్థశాస్త్రంబు విస్మరించినదుష్టువృజినఫలము
గురువుల కీడక కృసరము ఛాగము పాయసము దిన్న నిర్ఘృణస్వాంతుగతియు


ఆ.

గురుజనావమాన మరయక కావించి, నట్టిపాపచిత్తు నతులపాప
మొందుఁగాక రఘుకులేందు కాననవాస, మాత్మఁ గోరినట్టియతని కంబ.

1553


తే.

వ్యూఢబాహ్వంసుఁ బుష్పవద్గాఢతేజు, రాజ్యసింహాసనాసీను రామవిభునిఁ
గాంచుభాగ్యము మేదినిఁ గలుగకుండుఁ, గాక రామవివాసనకాంక్షి కింక.

1554


క.

గురువులఁ దిట్టుట గోవులఁ, జరణహతిం దన్నుటయును సఖునకు ద్రోహం
బరయక సేయుట రామున, కురుదుర్మతిఁ గీ డొనర్చు టొక్కటి గాదే.

1555


క.

అకటా రహస్యమును దాఁ, పక మైత్రిం జెప్పినట్టి పరివాదముఁ దాఁ
బ్రకటముఁ జేసిననరుపా, తక మార్యద్వేషి కవితథంబుగ రాదే.

1556


క.

శ్రీరామున కపకృతి ని, ష్కారణముగఁ జేసినట్టికష్టుఁడు శిష్టా
చారద్వేష్యుఁడు జగదప, కారి యగుచు నాత్మహంతగతికిఁ జనియెడిన్.

1557


తే.

ఆర్యునకుఁ జాలఁ గీడెవ్వఁ డాచరించె, నతఁడు పుత్రకళత్రభృత్యాదికపరి
వారితుం డయ్యు నొక్కండె స్వగృహమందు, మృష్టము భుజించునట్టినికృష్టుఁ డగును.

1558


క.

అకృతోపకారుఁ డగుణుం, డకృతజ్ఞుం డాత్మహంత యపగతలజ్జుం
డకృతార్థుం డగుభ్రాత క, పకృతిం గావించునట్టిపాపాత్ముఁ డిలన్.

1559


తే.

సత్యసంధుండు శ్రీరామచంద్రుఁ డతని, కెగ్గుఁ జేసిననీచాత్ముఁ డిజ్జగమునఁ
బుత్రదారగృహక్షేత్రభూరిధర్మ, హీనుఁ డై దుఃఖమరణంబుఁ బూనుఁగాదె.

1560


వ.

మఱియు రాజస్త్రీవృద్ధబాలకులం జంపినదురితంబును భృత్యత్యాగదోషంబును
లాక్షామధుమాంసలోహవిషవిక్రయంబులచేత నిత్యంబును గుటుంబముం బెం
చినపాపంబును శత్రుపక్షభయంకరం బైనసంగ్రామంబున నిరాయుధుం డై
బెదరి పాఱువాని వధించినవృజినంబు నుభయసంధ్యాకాలంబులందు నిద్రవో
యినవానికల్మషంబును వహ్నిదాయకుకిల్బిషంబును గురుతల్పగమనునిపంకం
బును మిత్రద్రోహం బాచరించినవానిపాతకంబును బితృమాతృశుశ్రూషం
గావింపనివానిదుష్కృతియును దేవతాపితృపూజనంబు సేయనివానికలుషం
బును నాశంసమానులును దీనులును నూర్ధ్వలోచనులు నగుయాచకుల కామి
తంబు విఫలంబుఁ జేసినవానియఘంబును సకలలోకపవిత్రచరిత్రుం డగుభవ
త్పుత్రున కెగ్గుఁ జేసిన దుష్టాతున కగుం గాక యెవ్వానియనుమతంబున
రాముండు వనంబునకుం జనియె నట్టిపాపాత్ముండు బహుపుత్రుండును దరిద్రుం
డును జ్వరరోగసమన్వితుండును సురాపానరతుండును నపాత్రవర్షియుఁ గామ
క్రోధాభిభూతుండును నున్మత్తుండును సంత్యక్తకులధర్ముండును మూఢుండును

ధర్మదారపరిత్యాగియును బరదారాపహరణుండును మాయావాదియుఁ గప
టాత్ముండు నై సత్పురుషులలోకంబువలనను సజ్జనులకీర్తివలనను సదాచారు
లకర్మంబువలనను విడువఁబడి కపాలపాణి యై యమంగళుం డై భిక్షాచర
ణంబు సేయుచు మహీచక్రంబునఁ బరిభ్రమించుచుండుఁగాక మఱియు నత
నినానావిధసంపాదితవిత్తం బంతయు దస్యులచేత నపహరింపంబడుఁ గాక
మఱియు నతనికి స్వపత్నులయందుఁ బుత్రోదయంబు లేకుండుం గాక మాతృ
శుశ్రూషాపరుండు గాక స్వల్పాయు వై దుర్గతికిం జనుఁ గాక యని పలికి వెండియు
భరతుండు.

1561


తే.

విప్రలుప్తసంతతి యగువిప్రుపాత, కంబు పానీయదూషకుకల్మషంబు
గరగునియఘంబు రాముఁ డేకఠినచిత్తు, ననుమతంబునఁ జనియె నాతనిది గాదె.

1562


క.

పాఱున కొసఁగుసపర్యను, వారించినయఘము బాలవత్స యగుగవిం
గోరికఁ బిదికినదురితము, శ్రీరామున కెగ్గు సేయుచెనఁటిది గాదే.

1563


క.

దప్పిం బడి గ్రోలుటకై, యప్పు లడుగ నతని కిడక యతిలోభమునం
దప్పించినక్రూరునిగతి, కిప్పుడె చనువాఁడ నన్న కెగ్గుఁ దలఁచినన్.

1564


వ.

వాదిప్రతివాదులు వివాదంబుఁ గావించుచుండ నొక్కనియందు స్నేహంబు
చేతఁ బక్షపాతంబున జయోపాయంబు నుడువు కలుషాత్మునకుం గలదురితంబు
రామవిద్వేషి కగుం గాక యని యేతాదృశంబు లగుదారుణశపథంబులఁ బలికి
నిట్టూర్పులు పుచ్చుచుఁ బతిపుత్రవిహీన యై దుఃఖించుచున్నకౌసల్యచరణం
బులపయిం బడి యుచ్చైర్నాదంబున రోదనంబు సేయుచున్నభరతు నవలో
కించి యద్దేవి యి ట్లనియె.

1565

కౌసల్య దుఃఖసంతప్తుం డగుభరతు నాశ్వాసించుట

మ.

భరతా నీశపథోక్తిసంజనితశుంభద్దుఃఖతాపాగ్ని న
న్మరలం గాల్పఁ దొడంగె నీమదికి సమ్యగ్భ్రాతృధర్మంబు సు
స్థిర మై యున్నది నీయెడ న్దురితసందేహంబు లే దింతయుం
గరణం బేటికి లెమ్ము సజ్జనుల లోకం బింక నీ కయ్యెడిన్.

1566


క.

అని యూఱడించి వెస నా, తని భుజములఁ గ్రుచ్చి యెత్తి తనయుత్సంగం
బునఁ జేర్చి తనువు నివురుచు, జనపతిమృతి నొడివి చాల సంతాపించెన్.

1567


తే.

మాతృరోదనరూపకమారుతమున, నిజమనోగతశోకాగ్ని నివ్వటిల్లి
యేర్చఁ జొచ్చిన నతఁడు సహింపలేక, లుళితచేతస్కుఁ డై చాలమలఁగుచుండె.

1568


వ.

ఇట్లు లాలప్యమానుండును విచేతనుండును బ్రణష్టబుద్ధియు దీర్ఘనిశ్వాసమారుత
మ్లానవదనుండును మేదినీపరిపతితగాత్రుండు నై బహుప్రకారంబుల దుఃఖించు
చున్నయమ్మహారాజునందనున కవ్విభావరి యొక్కచందంబున నతిక్రమించె

నంత సూర్యోదయానంతరంబున మునిశ్రేష్ఠుం డగువసిష్ఠుండు శోకతప్తుం డైన
భరతున కి ట్లనియె.

1569


క.

ఆలింపుము నామాటలు, చాలింపుము వేఱె యొకవిచారము ధరణీ
పాలకునకు సంయానము, కాలం బది దప్పకుండఁ గావింపు మిఁకన్.

1570


తే.

అనవుడు వసిష్ఠవాక్యంబు లాలకించి, భరతుఁ డెంతయు స్వస్థస్వభావుఁ డగుచు
ధర్మపద్ధతిఁ బ్రేతకృత్యంబు లన్ని, శిష్టసమ్మతి నృపునకుఁ జేయఁ గడఁగి.

1571


ఆ.

నూనెచేతఁ బక్వ మైనది గాన నా, పీతవర్ణవదన మై తనర్చు
నృపునిమేను రత్ననిర్మిత మగుశయ్య, యందుఁ జేర్చి యిట్టు లనుచు వగచె.

1572


మ.

అనఘా రాముని లక్ష్మణు న్విపినదేశావాసులం జేసి చ
య్యన నీ వీటికి రాకమున్నె ఘను నత్యక్లిష్టకర్ము న్యశో
ధనుని న్రామునిఁ బాసి ఘోరతరసంతాపంబునం బొక్కునీ
జనముం బాసి సుపర్వలోకమునకున్ క్ష్మానాథ యి ట్లేగితే.

1573

భరతుండు దశరథునికి దహనసంస్కారముఁ గావించుట

క.

రాముఁడు కాననసీమకు, భూమీశ్వర నీవు దివికిఁ బోయిన నిఁక నీ
భూమికి నెవ్వఁడు యోగ, క్షేమముఁ గావించువాఁడు చెప్పు మధీశా.

1574


ఆ.

తండ్రి నీవు లేనిధర విధవాంగన, భంగి నున్నయది భవద్విహీన
యైననగరి చంద్రహీన యై చూపట్టు, రాత్రిభంగిఁ గాంతిరహిత మయ్యె.

1575


క.

అని బహుభంగుల శోకం, బున సంక్లేశించురాజపుత్రుం గని య
మ్ముని యింత వగవ నగునే, జనకున కొనరింపు ముచితసంస్కారవిధుల్.

1576


వ.

అని యుపదేశించిన నవ్వసిష్ఠువచనంబులం దేఱి భరతుండు ఋత్విక్పురో
హితాచార్యులును దక్కినపరిచారకుల నయ్యైకృత్యంబులయందు యథార్హం
బుగా నియోగించినఁ దత్క్షణంబ యాజనకులు నుపద్రష్టులును హవిరాజ్యహో
మపవిత్రం బైనగార్హపత్యాద్యగ్నిహోత్రంబులు సంగ్రహించుకొని పురో
భాగంబునం బోవుచుండఁ గొందఱు పరిచారకులు విగతచేతనుం డయినమహీ
పతికళేబరంబు శిబికయం దిడి తదీయదీర్ఘదండంబులు భుజంబులపై నిడికొని
విమనస్కులై కన్నీరు నించుచుం జనుచుండిరి. సువర్ణంబును రజతంబును
రత్నంబులును నానావిధవస్త్రంబులును రాజమార్గంబున వెదచల్లుచుఁ
గొందఱు ముంగలి యై నడువ నివ్విధంబునఁ బురంబు వెలువడి యుత్తర
దిగ్భాగంబునఁ జందనాగరునిర్యాససరళపద్మకదేవదారుదారువినిర్మితం బైనచి
తామధ్యంబున విగతప్రాణుం డైనమహీపతి నునిచి యుచ్చావచంబు లైన
గంధంబు లొసంగి ఋత్విజులు వహ్నియందు హోమంబుఁ గావించి
ఋగ్యజుస్సామమంత్రంబులు జపియించి యనలు దరికొల్పి నవ్యాపసవ్యప్రద
క్షిణంబుఁ గావించి రాసమయంబున దురంతచింతాభరంబునఁ గౌసల్యాది

సర్వాంతఃపురకాంతలు వృద్ధకాంతాసమేతంబుగా యథార్హంబు లగుశిబికా
యానంబు లారోహించి పురంబు వెలువడి చితామధ్యంబున వహ్నిశిఖాపరం
పరాదందహ్యమానదేహుం డైననిజవల్లభు నశ్వమేధాదియజ్ఞకర్త నాలో
కించి శోకసంతప్తచిత్త లై గుంపులు గూడి యొండొరులం బట్టుకొని క్రౌంచాం
గనలచందంబున నుచ్చైర్నాదంబులఁ గొండొకసేపు దుఃఖాయాసభరంబునఁ
గన్నీరు మున్నీరుగా రోదనంబుఁ జేసి యనంతరంబ భరతునితోఁ గూడి సరయూ
జలంబుల నమ్మహీపతి కుదకక్రియలు నిర్వర్తించి భరతశత్రుఘ్నమంత్రిపురోహి
తసహితంబుగాఁ గ్రమ్మఱఁ బురంబుఁ బ్రవేశించి బాష్పపరీతనేత్ర లై దశరాత్రం
బు విశేషశాస్త్రానుసారంబున నాశౌచం బంగీకరించి రంత దశరాత్రంబు లతి
క్రమించినయనంతరంబు భరతుండు కృతశౌచుండై ద్వాదశదివసంబున నేకా
దశదివసకర్తవ్యశ్రాద్ధకరణపూర్వకంబుగా శ్రాద్ధకర్మంబు లన్నియు నిర్వర్తించి
పరలోకక్రియ నుద్దేశించి రత్నంబులును ధనంబును బుష్కలం బైనయన్నం
బును దానార్హం బైనఛాగసమూహంబును వస్త్రంబులును గోసహస్రంబు
లును గృహంబులును దాసదాసీజనంబులును శయ్యాశకటాద్యుపకరణంబులును
బ్రాహ్మణుల కొసంగి పదుమూఁడవనాఁడు భరతుండు శోకవిశేషంబున రోదన
శబ్దావిహితకంఠుం డై విలపించుచు నస్థిసంచయనార్థంబు చితామూలంబున
కుం జని యందు బితృమరణసంజాతమహాక్షోభక్షుభితాంతఃకరణుం డై యి ట్ల
ని విలపించె.

1577

దగ్ధం బగుదశరథునిశరీరంబుఁ జూచి భరతశత్రుఘ్నులు విలపించుట

తే.

దేవ యెవనికి నన్ను నధీను గాఁగ, నొసఁగి తాజ్యేష్ఠు రాఘవు వెస నడవికిఁ
బంపి యిచ్చట దిక్కఱి వనరుచుండు, నన్ను విడిచితి వకట శూన్యంబునందు.

1578


క.

తనకూర్మిపట్టి రాముని, వనగమనముఁ దలఁచి వగపు వదలక తాపం
బునఁ గ్రాఁగుచున్నకౌస, ల్యను విడిచి త్రివిష్టపమున కరిగితె తండ్రీ.

1579


వ.

అని యిట్లు బహుప్రకారంబుల దుఃఖించుచు భస్మారుణంబును బితృశరీర
నిర్వాణంబును దగ్ధస్థియు నైనచితాస్థానమండలం బవలోకించి రోదనంబు
సేయుచు రజ్జువులచేత నుత్థాప్యమానం బై పరిచ్యుతం బైనమహేంద్రుని
యంత్రబద్ధధ్వజంబుచందంబున ధరణిపయిం బడియె నప్పుడు మహర్షులు పుణ్య
క్షయకాలంబునందు స్వర్గచ్యుతుం డైనయయాతినిం బలె నమాత్యులు
శుచివ్రతుం డైన భరతునిం గ్రుచ్చి యెత్తి తత్కాలోచితవాక్యంబుల ననూన
యించు చుండి రాసమయంబున.

1580


శా.

కైకేయీసుతుపాటుఁ జూచి యొడ లాకంపింప శత్రుఘ్నుఁ డ
స్తోకవ్యాకులచిత్తుఁ డై వివశుఁ డై క్షోణీస్థలి న్వ్రాలి గో
త్రాకాంతుం దలపోసి తద్గుణగణధ్యానంబుఁ గావించుచు

న్శోకం బెంతయు నంతకంతకు మనఃక్షోభంబుఁ గావింపఁగన్.

1581


వ.

ఇ ట్లని విలపించె.

1582


సీ.

రాజేంద్ర మంథరాప్రభవంబు కైకయీగ్రాహసంకులము దుర్వారఘోర
వరదానమయ మైననిరుపమశోకసాగర మిట్లు మము దీవికరణి ముంచెఁ
జాల నీచే నుపలాలితుం డగుసుకుమారుండు బాలుండు మానధనుఁడు
గురుభక్తియుతుఁ డగుభరతుని విడనాడి యెక్కడఁ జనితి నరేంద్ర శయన


తే.

పానభోజనమజ్ఞనాభరణవస్త్ర, ధారణంబులయెడ మమ్ముఁ దగినభంగి
నరయుచుండుదు వింక సత్కరుణఁ బూర్వ, భంగి నెవ్వాఁడు రక్షించువాఁడు తండ్రి.

1583


తే.

సకలధర్మవిదుండవు సౌఖ్యకారి, వైననినుఁ బాసినప్పుడే యవని వేయి
పఱియలై పోవకున్నది ప్రళయవేళ, వచ్చినపుడైనఁ గ్రుంగిపోవదు నిజంబు.

1584


క.

క్షితినాథుఁడు లోకాంతర, గతుఁ డయ్యె రఘూత్తముండు కాననమునకు
న్వ్రతి యై చనె నిఁక నాకున్, బ్రతు కేటికి నగర మేల పడియెద నగ్నిన్.

1585


వ.

ఏను బితృభ్రాతృవిహీనుండ నై శూన్యం బైనపురంబు సొర నొల్ల నిచ్చట
నుండి వనంబున కరిగెద నని యిట్లు భరతశత్రుఘ్ను లేకప్రకారంబునఁ గవ
గూడి దుఃఖించుచుండఁ దదీయరోదనశ్రవణసంజాతశోకవిశేషంబున నచ్చటి
జనంబు లెల్ల హాహాకారంబులు సేయుచుండి రప్పుడు భగ్నశృంగంబు లైనమ
హోక్షంబులకైవడి నేలం బడి పరితపించు చున్నయక్కుమారులం జూచి
వంశగురుండును సర్వజ్ఞుండును బ్రశస్తస్వభావుండును దీర్ఘదర్శియు నగువసి
ష్ఠుండు భరతునిఁ గ్రుచ్చి యెత్తి యాసీనుం గావించి తత్కాలసదృశంబు లగు
వాక్యంబుల ననునయించుచు ని ట్లనియె.

1586


తే.

అనఘ మీయయ్య దశరథుం డమరపదవి, కరిగి దినములు పదియు మూఁ డయ్యె నిపుడు
సావశేషాస్థినంచయమందు నీవు, కడఁగి యాలస్య మిటు సేయఁ గార్య మగునె.

1587


క.

జనులకు జన్మము మరణం, బును లాభాలాభములును మోదము ఖేదం
బనుభావ్యము లని యెఱిఁగియు, ననఘా నేఁ డిట్లు వగవ నగునే నీకున్.

1588


క.

అని మునిపతి యీగతి న, మ్మనుకులునిం దేర్చునెడ సుమంత్రుఁడు శత్రు
ఘ్నుని గ్రుచ్చియెత్తి యట్లనె, జనులభవాభవముఁ దెల్పి సమ్మతిఁ జేర్చెన్.

1589


వ.

ఇట్లు వసిష్ఠసుమంత్రబాహుసముర్థితు లైయన్నరకంఠీరవులు వర్షాతపపరి
మ్లానంబు లగుశక్రధ్వజంబులపోలిక వేర్వేఱఁ బ్రకాశించి రప్పు డమాత్యు
లు పరమార్తులును బరిమార్జితబాష్పులును రక్తాక్షులును నైనయమ్మహా
రాజనందనులం జూచి యపరక్రియ నుద్దేశించి వేగిరపడి పలికినఁ దద్వచ
నానురూపంబుగాఁ గ్రియాశేషం బంతయు నిర్వర్తించి గృహంబుఁ బ్రవేశించి

రంత లక్ష్మణానుజుం డగుశత్రుఘ్నుండు రామానయనవిచారడోలాందోళిత
చిత్తుం డైనభరతున కి ట్లనియె.

1590

శత్రుఘ్నుఁడు మంథరాకైకేయులఁ బట్టుకొని బెదరించుట

సీ.

సకలభూతములకు సంకటం బరుదెంచి నపు డేమహామహుం డరసి ప్రోచు
నట్టిరాఘవుఁ డొక్కకట్టిడిమగువచే వనవివాసితుఁ డయ్యెఁ దనకు నింత
చెల్లునే జనకవాక్యోల్లంఘనముఁ జేసెఁ గౌసలేయుఁడు రాజ్యకాంక్షఁ జేసి
యని దుష్టజను లాడుకొనుసన్నసడి కోడి యతఁ డీయకొనియెఁ బో వితతవీర్య


తే.

నిరతుఁ డగులక్ష్మణుఁడు తండ్రిని గ్రహించి, యన్న నేటికి వారింపఁడయ్యె భరత
యాలిమాటలు విని నీతి మాలి తిరుగు, నవనిపతి నిగ్రహించుట యంతతప్పె.

1691


మ.

అని యిబ్భంగి సుమిత్రపట్టి ఘనవీరాలాపముల్ గైకయీ
తనయాదు ల్విన నాడుచుండ మయిపూఁతన్ బుష్పహారంబులన్
ఘనవస్త్రంబుల నవ్యభూషణముల గై ససి యాళీజను
ల్దను సేవింపఁగఁ గుబ్జ యన్నగరిప్రాద్ద్వారంబునం దోఁచినన్.

1592


క.

అచ్చటికావలివారలు, గ్రచ్చఱ నప్పాపురాలిఁ గట్టికొని వెసం
దెచ్చి సుమిత్రాసుతుతో, హెచ్చినకోపమునఁ బల్కి రి ట్లనుచుఁ దగన్.

1593


క.

రామునివనవాసమునకు, భూమీశ్వరుమరణమునకుఁ బుట్టినమూలం
బీమంథర దీనిం దగ, నీమదికిం దోఁచినట్లు నెఱుపుము శిక్షన్.

1594


ఉ.

నా విని కెంపుడాలు నయనంబులఁ గన్పడఁ గ్రుద్ధుఁ డై సుమి
త్రావరపుత్రుఁ డెల్లరను దాఁ బరికించి సుఖార్హుఁ డైనసీ
తావిభుఁ డేదురాత్మికకతంబునఁ గానకు నేగె దాని నేఁ
దీవిధిఁ దత్ఫలంబు భుజియింపఁగఁ జేసెదఁ జూడుఁ డిందఱున్.

1595


మ.

అని యి ట్లుద్ధతి లక్ష్మణానుజుఁడు క్రూరాలాపము ల్పల్కి గ్ర
క్కున నమ్మంథరఁ బట్టెఁ బట్టుటయు నాక్రోశించుచుం దత్సఖీ
జన మత్యంతభయంబునం బఱచి కౌసల్యామహాదేవి నొ
య్యన భక్తి న్శరణంబు నొందె ననుకంపాయత్త యౌఁ గావునన్.

1596


సీ.

అప్పుడు శత్రుఘ్నుఁ డధికరోషంబున నారక్తనేత్రుఁ డై ఘోరభంగిఁ
గుబ్జ నాకర్షించి కుంభిని వ్రేసి కేల్మోడ్చి కావవె యని యేడ్చుచుండ
నీడ్చుటయును దానిఁబృథుచిత్రభూషణమణు లుర్విఁ బడిన నమ్మందిరంబు
శారదగగనంబుచందాన నొప్పె నిక్కరణిఁ గుబ్జను బట్టి మరలఁ గ్రోధ


తే.

బలము పెంవునఁ గైకేయిఁ బట్టుకొనఁగ, దారుణోక్తుల బదరినఁ దనువు వడకఁ
బ్రాణభయమున నేడ్చుచుఁ బరువు వీడి, సత్వరంబుగ భరతునిశరణ మొందె.

1597


క.

భరతుం డీగతి భయమున, శరణాగత యైనయాత్మజననిం గని యి
ద్ధర సర్వభూతములలోఁ, వెఱవ యవధ్య మది దీనిఁ దెగఁ జూడకుమీ.

1598

క.

అని క్రుద్ధుఁ డైనతమ్మునిఁ, దనధర్మసమగ్రవాక్సుధాధారాసే
చనమునఁ బ్రశాంతుఁ జేయుచు, నినసంతతిసముచితోక్తి ని ట్లని పలికెన్.

1599


క.

మన మీకైకను గుబ్జను, జనదూషితవృత్త లనుచుఁ జంపితి మేని
న్ఘనధార్మికుఁ డగురాముఁడు, గని విడువఁడె మనల మాతృఘాతుకు లనుచున్.

1600


క.

అనవుడు భరతునివాక్యము, విని శత్రుఘ్నుండు ఘనవివేకముతో గ్ర
క్కునఁ గైకేయిని గుబ్జను, దనవంశోచితనయంబుఁ దలఁచుచు విడిచెన్.

1601


క.

విడిచిన నప్పడఁతుక వగ, పడరఁగ నశ్వపతిపుత్రి యంఘ్రిద్వయిపైఁ
బడి నిట్టూర్పులు వుచ్చుచుఁ, గడువడి విలపించె శోకకంపితమతి యై.

1602

భరతుఁడు రాజాభిషేకకర్తలతో రామునకే యభిషేకముఁ గావించెద ననుట

వ.

ఇట్లు శత్రుఘ్నవిశేషపమూఢసంజ్ఞ యై భయత్రస్త మైనక్రౌంచాంగనభంగి
నార్తరూప యై దీనస్వరంబున దుఃఖించు చున్నమంథరం జూచి కైకేయి
బహుప్రకారంబుల నాశ్వాసించె నంత బదునాలవనాఁడు సూర్యోదయసమ
యంబున రాజభిషేకకర్తలు భరతునొద్దకుం జనుదెంచి యి ట్లనిరి.

1603


ఉ.

భూపతి రాముని న్విపినభూమికిఁ బంచి తదీయశోకసం
తాపమహావ్యథం బిదపఁ దాఁ ద్రిదివంబున కేగె నింక గో
త్రాపరిపాలనవ్రతముఁ దాల్పు మనాయక మయ్యు రాజ్య మి
ట్లేపున నింతదాఁక నశియింపకయున్నది దైవికంబునన్.

1604


ఉ.

ఎప్పుడు వచ్చుఁ గైకకొడు కెప్పుడు మాకు విభుండు గల్గు నం
చెప్పుడు నీదురాక పురి నెల్ల జనంబులు గోరుచున్నవా
రిప్పుడె సర్వరాజ్యపద మింపుగఁ గైకొని పూర్వవృత్తముం
దప్పక యుండ నింక మము దాశరథీ కృప నేలు మి త్తఱిన్.

1605


వ.

అనిన దృఢవ్రతుం డగుభరతుండు పట్టాభిషేకోపయుక్తమంగళద్రవ్యజాతంబు
వలగొని వారల కి ట్లనియె.

1606


క.

రాజకులమునకు జ్యేష్ఠుని, రాజత్వం బుచిత మని తిరంబుగ నిూర
ల్రాజచరిత్రం బెఱిఁగియు, రా జితఁ డని నన్ను మదిఁ దలంచుట తగవే.

1607


ఆ.

రాజసమ్మతుండు రఘుకులతిలకుండు, రాముఁ డన్న యగుట రాజు ధరణి
కతనిపూన్కిఁ బూని యడవిలో నొక్కెడ, నధివసించువాఁడ నన్నియేండ్లు.

1608

భరతుఁడు సనమార్గాదికంబులఁ బరిష్కరింపఁ బ్రజల కాజ్ఞాపించుట

చ.

అఱమఱ యింత లేక చతురంగబలంబులఁ గూర్పుఁ డెల్లి త
త్పరత ఘనాభిషేచనికభాండముఁ గైకొని కాన కేగి సు
స్థిరమతి నందె రాము నభిషిక్తునిఁ జేసి కడంగి వీటి క
ధ్వరముననుండి పావకు ధ్రువంబుగఁ దెచ్చినభంగిఁ దెచ్చెదన్.

1609


తే.

రాము నీరీతిఁ బుడమికి రాజుఁ జేసి, యేను వనదుర్గమున వసియింతు నింక

మీఁదఁ గైకను గామనమేతఁ గాఁగఁ, బూని కావించుకోరిక లేనికతన.

1610


క.

తెరువులు సుకరంబులు గాఁ, దరంగిణీగణము సుప్రతరముగ వనము
ల్గరము ప్రకాశములుగ స, త్వరముగఁ గావింపుఁ డిపుడు తడ వేమిటికిన్.

1611


క.

అని శ్రీమంతము హృద్యం, బనుత్తమము సుప్రసన్న మగుభాషిత మీ
యనువునఁ బలికిన భరతున, కనియె నచటిజనము సంభృతానందమునన్.

1612


క.

అనఘా జ్యేష్ఠం డగునృప, తనయునకు ధరిత్రి నొసఁగఁ దలఁచినకతనన్
నినుఁ బొందు నిక్కువంబుగ, వనరుహపాణి యగులక్ష్మి వారనికరుణన్.

1613


క.

అని యిట్లు పూర్ణసమ్మద, జనితము లగు బాష్పబిందుసందోహము లా
తనిపైఁ గురియఁగఁ గౌతుక, మున నగ్గించెం దదీయముఖ్యగుణంబుల్.

1614

భరతనియుక్తు లగుకర్మకారులు వనంబున రాజమార్గంబుఁ గావించుట

వ.

అంత భరతునిశాసనంబున నమాత్యప్రచోదితు లై సర్వంబును సమకట్టి
భూమిప్రదేశజ్ఞులును శిబికాదినిర్మాణంబునందు సూత్రగ్రహణకుశలురును
దంతువాయులును స్వకర్యాభిరతు లగుఖననోపజీవులును మృగపక్షిసాధన
యంత్రకర్తలును భృతిజీవులును స్థపతులును రాజపురుషులును క్షేపణీయాది
యంత్రకరణాభిజ్ఞులును జలయంత్రాదినిర్మాణచతురులును వర్ధకులును మార్గ
సమీకరణసమర్థులును మార్గనిరోధకవృక్షచ్ఛేదకులును గూపకారులును
సుధాకారులును వంశకర్మకారులును మార్గప్రదర్శకులును మొదలుగాఁగల
సకలజనంబులు రామసందర్శనకుతూహలత్వంబువలనఁ బర్వకాలంబునందలి
సముద్రునిమహావేగంబుకరణి శోభిల్లుచుఁ దమవారిం గూడికొని వివిధపిటక
ఖనిత్రకుఠారాదిసాధనంబులు పరిగ్రహించుకొని రామాధిష్ఠితప్రదేశంబు
నుద్దేశించి ముంగలం జని రందుఁ గొందఱు మార్గనిరోధకంబు లగుశాఖాల
తాగుల్మస్థాణువృక్షంబులు కుఠారటంకదాత్రంబుల నఱకుచు వృక్షరహిత
ప్రదేశంబుల వృక్షంబులఁ బ్రతిష్ఠించుచుఁ గొందఱు బలవంతులు విషమ
భూప్రదేశంబులకుం జని తత్రత్యరూఢమూలవీరణస్తంబంబుల ఛేదించుచుఁ
గొందఱు మిఱ్ఱుపల్లంబు సమతలంబు సేయుచుఁ గొందఱు వావీకూపంబులు
పూడ్చుచుఁ గొందఱు బంధనీయంబు లైనక్షుద్రనదీదుర్గమప్రదేశంబుల
సేతువుల బంధించుచు క్షోద్యంబు లైనక్షుద్రశిలాభూయిష్టప్రదేశంబులు
చూర్ణంబులు సేయుచు భేదనీయంబు లైననదీతటాకాదిజలప్రదేశంబుల
జలదుర్గమార్గంబు భేదించుచుఁ గొందఱు స్వల్పప్రవాహంబుల బంధనంబుల
చేత బహుసలిలంబులం గావించుచుఁ గొండఱు నిర్జలప్రదేశంబులయందు
బహువిధవేదికాపరిమండితకూపంబులు ద్రవ్వుచు ని ట్లనేకప్రకారంబుల నయ్యై
ప్రదేశంబులు రమ్యంబులు గావించిన నాసేనామార్గంబు సుధాలిప్తనిబద్ధ
భూప్రదేశంబును బుష్పితమహీరుహంబును మతోద్ఘుష్టద్విజగణంబును ధ్వజ

పతాకాలంకృతంబును జందనోదకసంసిక్తంబును నానాకుసుమభూషితంబు
నై స్వర్ణపథంబుచందంబున నొప్పి నంత భరతునిశాసనంబున శిబిరాది
కరణనియుక్తులు పరస్పరసంగతు లై బహుస్వాదుఫలోపేతంబు లైనరమ
ణీయప్రదేశంబులయందు మహాత్ముం డగుభరతుండు నివసించుటకు శుభన
క్షత్రముహూర్తంబులయందు శిబిరంబులు నిర్మించిన నవి భూషణసదృశంబు
లయ్యును వితానకలశధ్వజాదులచేత మిక్కిలి భూషితంబులై దృష్టిచిత్తహరం
బు లై పాంసుసదృశసికతామయపరికాలంకృతంబు లై యింద్రకీలాద్రిప్రతిమం
బు లై ప్రతోళీపరిశోభితంబు లై ప్రాసాదమాలాసంసక్తంబు లై సౌధప్రాకార
సంవృతంబు లై పతాకాధ్వజశోభితంబు లై సునిర్మితమహాపథంబు లై గృహక
పోతపాలికోపరివినిర్మితమహోన్నతశిరోగృహాలంకృతంబు లై యొప్పె నివ్వి
ధంబున వివిధద్రుమకాననశీతనిర్మలపానీయమహామీనసమాకుల యైనజాహ్న
వీనదిపర్యంతంబు శుభశిల్పినిర్మితం బైనరాజమార్గంబు చంద్రతారాగణ
మండితం బైనరజనీనభంబుభంగి నతిరమ్యం బై ప్రకాశించె నంత.

1615


క.

నాందీముఖి యగుయామని, యందు రహి న్సూతమాగధాదులు పరమా
నందమున భరతునిఁ బొగడి, రందంద శుభస్తవముల నతివైచిత్రిన్.

1616


తే.

స్వర్ణదండాభిహతము లై చటులయామ, దుందుభులు మ్రోసె మురి రొద ల్గ్రందుకొనియె
మఱియు నుచ్చావచస్వనోత్కరము లైన, వాద్యములబోరు కలఁగె నవ్యక్తఫణితి.

1617


క.

ఆతూర్యరవము సకలా, శాతలముల నిండి శోకసంతాపముచే
వీతధృతి యైనభరతుని, నాతతదుఃఖమున మరల నారట పెట్టెన్.

1618


తే.

అంత భరతుండు నేను మీ కధివిభుండఁ, గాను మీ రేల న న్నింత గలఁచెద రని
వారి వారించి శ్రుతకీర్తివరునిఁ గాంచి, కనుల నశ్రులు గాఱ ని ట్లనుచుఁ బలికె.

1619


క.

పాపపుఁగైకయి చేసిన, పాపంబున వ్యథయు మహదుపక్రోశంబు
న్నాపై నిడి తా నక్కట, భూపాలుఁడు నాకమునకుఁ బోయెం గంటే.

1620


క.

సుగుణుండు ధర్మరతుఁ డగు, జగతీపతి రాజ్యలక్ష్మి జలమధ్యమునం
దగఁ గర్ణధారహీనం, బగుపోతముకరణి ని ట్లహా సుడి వడియెన్.

1621


క.

మన కెవ్వాఁడు విభుం డ, య్యనఘుం డగురామభద్రుఁ డాకైకయిచేఁ
దనకుం దానె వనంబున, కనుపం బడియెఁ గద యపగతైశ్వర్యుం డై.

1622

వసిష్ఠుఁడు భరతునితో రాజ్యం బంగీకరింపుమని చెప్పుట

వ.

అని బహుప్రకారంబుల విలపించుచు మూర్ఛితుం డైనభరతునిం గని యంతః
పురకాంతలు సుస్వరంబుగా రోదనంబు చేసి రంత రాజధర్మవిశారదుం డగు
వసిష్ఠుండు శాతకుంభమయంబును రమ్యంబును మణిరత్నసమాకులంబు నగు

నిక్ష్వాకునాథునిసభామండపంబునకు శిష్యసహితంబుగాఁ జనుదెంచి యందుఁ
బరార్ధ్యాస్తరణసంవృతం బైనకాంచనపీఠంబున నధివసించి బ్రాహ్మణక్షత్రియ
వైశ్యులను మంత్రిసేనానాయకులను భరతశత్రుఘ్నసుమంత్రులను దోడ్కొని
రమ్మని దూతలం బంచిన వా రట్ల కావింప గజాశ్వరథసంఘటనసంజాతమహా
ఘోషంబు భూనభోంతరాళంబు నిండి చెలంగె నప్పుడు ప్రకృతిజనంబులు
సభామండపంబునకుం జనుదెంచుచున్నభరతునిం జూచి దేవతలు శతమ
ఖునిం బోలె నభినందించి రాసమయంబునఁ దిమినాగసంవృతంబును స్తిమిత
జలంబును మణిశంఖశర్కరంబును నగుహ్రదంబుచందంబున నందం బై తత్స
భాసదనంబు దశరథసుతశోభితం బై తొల్లి దశరథశోభితం బైనయట్ల ప్రకా
శించుచుండె నంత భరతుం డార్యగుణసంపూర్ణ యగుసభను బూర్ణచంద్రుం
డు శుక్రబృహస్పతిప్రముఖప్రకృష్టగ్రహయుక్త యైనశర్వరిం బోలె వెలింగిం
చె నిట్లు రుచిరాసనాసీనులగు నార్యులవస్త్రాంగరాగప్రభాజాలంబులం బ్రద్యోతి
త యై యీసభ ఘనాపాయంబునందుఁ బూర్ణచంద్రప్రద్యోతిత యైనరాత్రి
చందంబునం దేజరిల్లె నప్పుడు మునిశ్రేష్ఠుం డగువసిష్ఠుండు సభాసదు లందఱు
వినుచుండ భరతున కి ట్లనియె.

1623


సీ.

ధరణీశనందన ధనధాన్యవతి యైనధారుణి నీ కిచ్చి దశరథుండు
విఖ్యాత మగుశక్రవిష్టపంబున కేగె రాముండు రాజధర్మజ్ఞుఁ డతని
యానతి వనమున కరిగె నీ విఁకఁ బితృభ్రాతృదత్తం బైనరాజ్య మిప్డు
గైకొని వినిహతకంటకంబుగ నేలు మనఘ ప్రత్యేకసింహాసనాధి


తే.

నాథు లగుప్రాచ్యులును దాక్షిణాత్యులును బ్ర, దీచ్యులు నుదీచ్యులు సముద్రదేశవాసు
లమితధనరత్నరాసుల నధికభక్తి, గరము లర్పించి గొల్చుచుందురు మహాత్మ.

1624


ఉ.

నావుడు ధర్మవిత్తముఁ డనం బొగడం దగుకైకయీసుతుం
డావచనంబు కర్ణపుట మంటిన యంతనె శోకమూర్ఛితుం
డై వెసఁ దెల్విఁ దాల్చి గురు నర్మిలి దూఱుచు ధర్మకాంక్ష సీ
తావిభునిం దలంచుచుఁ బదంపడి కన్నుల నీరు నించుచున్.

1625


వ.

శోకగద్గదకంఠుం డై కలహంసస్వరంబునఁ గొండొకసేపు విలపించి పురోహితు
నుద్దేశించి.

1626


సీ.

అనఘ విద్యాస్నాతుఁ డాచరితబ్రహ్మచర్యుండు ధీమంతుఁ డార్యవినుతుఁ
డర్హధర్మవిచారుఁ డగురామవిభునిరాజ్యంబు మాదృశుఁ డెవ్వఁ డపహరించు
దశరథునకుఁ బుట్టి ధర్మంబునకుఁ దప్పి భ్రాతృరాజ్యంబు నేభంగిఁ గొందు
రాజ్య మేనును లచ్చి రామునిసొమ్ముగా భావించి ధర్మంబుఁ బలుక వైతి

తే.

జ్యేష్ఠుఁడును ధర్మసంవేదిశ్రేష్ఠుఁ డాది, రాజనహుషోపముం డగురాఘవుండు
దశరథునియట్ల యాధిపత్యంబు సేయ, వలవదే శాశ్వతంబుగ వసుధ కెల్ల.

1627


ఆ.

విను మనార్యజుష్ట మనుచితం బగుపాప, మేను జేయ నోప నీయకొనిన
రఘుకులప్రభూతరాజులలో వంశ, పాంసనుండఁ గానె పలుకు లేల.

1628


తే.

కైక చేసిన యపరాధకార్యమునకు, నీయకొనఁజాల నిప్పుడె యిచటనుండి
దారుణారణ్యగతుఁ డగుదాశరథికిఁ, జాఁగిలి నమస్కరింతు హస్తములు మోడ్చి.

1629


క.

రాముని దోడ్కొని వచ్చుట, కీమెయిఁ జనువాఁడ నతఁ డహీనగుణాఢ్యుం
డీముల్లోకము లైన న, సామాన్యప్రౌఢి నేలఁజాలు మహాత్మా.

1630

భరతుఁడు వసిష్ఠునితో శ్రీరాముఁడే రాజ్యాధిపతి కావలయు ననుట

క.

అని ధర్మ మూఁది పలుకుచుఁ, దనవాక్యము లాలకించి తద్దయుఁ బరిష
జ్జనము పులకించుచుండఁగ, మునిపతి కనియెం బ్రసన్నముఖుఁ డై మరలన్.

1631


ఉ.

వర్ధితధర్మకీర్తి రఘువర్యుని రాముని సాధుసన్నిధిం
బ్రార్థన సేసి క్రమ్మఱఁ బురంబునకు న్వెసఁ దోడి తెత్తు న
య్యర్థము గాక తక్కిన జటాజినము ల్ధరియించి కానలో
సార్థకవృత్తి లక్ష్మణునిచాడ్పున రామునిఁ గొల్చి యుండెదన్.

1632


వ.

పురోహితామాత్యబాంధవు లందఱు వినుచుండ నానేర్చువిధంబున సర్వో
పాయంబుల బలాత్కరించి రామునిఁ బురంబునకుం దోడ్కొని వచ్చెద.

1633


క.

ఇంతకు మును ఖనికులు క, ర్మాంతికులును మార్గశోధకాదులు నాచే
నెంతయుఁ బ్రయుక్తులై చను, టంతయు మీ రెఱుఁగరయ్య యాత్రాభిరతిన్.

1634


వ.

అని యిట్లు వసిష్ఠునితోఁ దగినతెఱంగునఁ బ్రత్యుత్తరం బిచ్చి సమీపం
బున నున్నమంత్రకోవిదుం డగుసుమంత్రు నవలోకించి నీవు మదీయశాస
నంబునఁ బురంబులోన యాత్ర సాటించి బలంబుల నాయితంబు గావింపు
మనిన నతం డట్ల కావించినఁ దత్క్షణంబ బలాధ్యక్షులును బౌరులును సమా
జ్ఞప్త యైనబలయాత్ర నాకర్ణించి సంప్రహృష్టచిత్తు లై రప్పుడు యోధాంగన
లందఱు యాత్రాగమనంబు విని పరమానందభరితాంతఃకరణ లై సత్వరం
బుగఁ దమతమవల్లభులం బ్రయాణంబున కుద్యుక్తులం జేసిరి బలాధ్యక్షులు
హయగోరథస్యందనశకటమాతంగంబులచేత సజ్జం బైనచమూసమూహంబు
నుం బ్రచోదించి రంత భరతుండు గురుసన్నిధియందు సుమంత్రుం జూచి రథం
బాయిత్తంబుఁ జేసి తెమ్మనిన నతండు తద్వచనానురూపంబుగా జవసత్వసంప
న్నంబు లైనహయంబులం బూన్చి సజ్జంబుఁ జేసి తెచ్చిన దానిం బ్రదక్షిణ
పూర్వకంబుగా నారోహించి రామదర్శనలాలసుం డై సైన్యసమేతంబుగా
వెడలె నప్పుడు సుమంత్రచోదితు లై పురంబునం గల బ్రాహ్మణక్షత్రియవైశ్య
శూద్రులును బుత్రమిత్రకళత్రభ్రాతృసమేతంబుగా యథార్హయానంబు లెక్కి

యతనిపిఱుందం జనిరి మంత్రిపురోహితసామంతబంధుసుహృజ్జనంబు లనేక
శతాంగమాతంగతురంగంబు లెక్కి భరతునియగ్రభాగంబునం బోవుచుండిరి
కౌసల్యయు సుమిత్రయుఁ గైకయుఁ దక్కినయంతఃపురకాంతలు రామా
నయనసంహృష్ట లై భరతనియోగంబునం జనుచుండి రివ్విధంబున.

1635

భరతుఁడు సైన్యసమేతంబుగఁ బయనంబై వెడలుట

తే.

భరతశాసనమున రామభద్రుఁ జూడఁ, గలిగె నని మేనఁ బులకలు గ్రమ్ము దేర
వేయిభంగుల భరతునివెంటఁ జనిరి, వీరు వా రన కమ్మేటివీటివారు.

1636


సీ.

సకలనీలాంబుదశ్యామలకోమలగాత్రు రాకాసుధాకరోల్లాసివదను
రవికరోద్దీపితరాజీవతామ్రాక్షు నాజానుబాహు మహానుభావు
రమణీయగళు మహోరస్కు మహేష్వాసు సుకపోలు సులలాటు సుగుణజాలు
స్థిరసత్వుఁ జారునాసికు దృఢవ్రతు గూఢజత్రు సుదంష్ట్రుఁ బ్రసన్నతేజుఁ


తే.

గౌసలేయుని నెప్పుడు గాంచఁగలుగు, నెపుడు భావింపఁగలుగు నవ్విపులయశునిఁ
జూచినంతనె చనుఁ గాదె శోక మినునిఁ, గాంచినంతనే విరియు చీఁకటులకరణి.

1637

భరతుఁడు గంగానదిఁ జేరుట

వ.

అని బహుప్రకారంబుల రామునిమహిమంబులు వక్కాణించుచుఁ దద్దర్శ
నలాలసు లై హర్షవిశేషంబున నన్యోన్యాలింగనంబుఁ గావించుచుఁ బెన్నిధి
కడకుం జనుపేదలచందంబునం జని రప్పుడు పురంబునం గలగజంబులలోనఁ
దొమ్మిదివేలగజంబులు నఱువదివేలరథంబులును లక్షగుఱ్ఱంబులును భరతుని
పిఱుందం జనియె ముక్తాపద్మరాగాదిమణిసంస్కారకులును గుంభకారులును
సూత్రకర్మకారులును శస్త్రనిర్మాణోపజీవులును మయూరపించచ్ఛత్రవ్యజనాది
కారులును గరపత్రోపజీవులును దంతికుడ్యవేదికాదికాంత్యుత్పాదకులును
దారురత్నాదిరంధ్రకారులును దంతమయపుత్రికాపీఠశిబికాదికారులును సుధా
లేపనకర్మకారులును జందనకస్తూరికాదిసుగంధిద్రవ్యోపజీవులును దైలాభ్యం
గాదిస్నానకారులును గంబళధావకులును నుద్వర్తనకారులును వైద్యులును
ధూపాదివాసకులును మద్యకారులును రజకులును గ్రామప్రధానులును
ఘోషప్రధానులును శైలూషులును గైవర్తకులును వేదవిదు లైనబ్రాహ్మణు
లును మొదలుగాఁ గలనాగరు లందఱుఁ దామ్రమృష్టానులేపనులును శుద్ధ
వస్త్రధారులును సువేషాఢ్యులు నై పుత్రదారాదులం గూడికొని గోరథాది
యథార్హయానంబు లెక్కి సుందరగమనంబున భరతునివెనుకం బోవుచుండిరి
యిత్తెఱంగునం జని చని యెచ్చట రామసఖుం డగుగుహుండు బంధుసహి
తంబుగా నివసించి యుండు నట్టిశృంగిబేరపురసమీపంబునకుం జని యందుఁ
జక్రవాకోపశోభితం బగుగంగానదీసమీపంబున సైన్యంబు విడిసె నప్పుడు
గంగానది విలోకించి భరతుండు సచివుల కి ట్లనియె.

1638

చ.

బలముల నిచ్చటన్ విడియఁ బంపుఁడు నేఁ డిట విశ్రమించి స
ల్లలితజలంబులం దగ నిలాపతి కౌర్ధ్విక మాచరించి ని
శ్చలమతి నెల్లి వేకువనె చయ్యన నీనది దాఁటి పోద మ
త్యలఘుపరాక్రమక్రము ననర్ఘశిలీముఖు రాముఁ జూడఁగన్.

1639


చ.

అన విని యట్ల కాక యని యందఱుఁ బావనజాహ్నవీతటం
బునఁ జతురంగసైన్యముల మోదముతో విడియించి మించి భా
రనిరతు లై యథార్హశిబిరంబుల నుండిరి కార్యచింత న
మ్మనుకులవర్ధనుం డుచితమందిరమందు వసించె నెంతయున్.

1640


వ.

అంత భరతునిరాక యెఱింగి నిషాదనాథుం డగుగుహుండు తనవారి నందఱ
రావించి గంగాతీరంబున సైన్యంబు సాగరసంకాశం బై యనంతం బై మనం
బున కైన నచింత్యం బైయున్నది రథంబునందుఁ గోవిదారధ్వజంబు గనుపట్టు
చున్నది గావున.

1641

గుహుఁడు భరతునిఁగూర్చి శంకించి తనవారితో నాలోచించుట

మ.

ధనకోశంబును దుర్గము ల్బలము హృద్యం బైనసామ్రాజ్యముం
దనపా ల్చేసి పితౄణ మీఁగుటకుఁ గాంతారోర్వి వర్తింపఁ బో
యిననామిత్రుని రామభద్రు మరల న్హింసింప సాటోపుఁ డై
పనిగా నేగెడు సేనతో భరతుఁ డీపాపాత్మునిం గంటిరే.

1642


చ.

ఇతఁడు దురంతవిక్రముఁ డహీనభుజబలశాలి వీని ను
ద్ధతభుజసత్వయుక్తి నరికట్టఁ దలంచితి మేని క్రుద్ధుఁ డై
యతులశరోద్ధతి న్మనల నందఱఁ గాఱియ పెట్టుఁ గాన మీ
రతిశయయుక్తి నొక్కమొగి నడ్డము కట్టుఁడు గంగరేవులన్.

1643


చ.

అనఘుఁడు సత్యవాది చరితార్థుఁడు రాఘవుఁ డెల్లభంగుల
న్మనకు విభుండు మిత్రుఁ డతిమాన్యుఁడు గావున నాత్రిలోకపూ
జ్యున కొకహానియుం బొరయకుండువిధంబునఁ గావఁ బోలు మీ
రనుపమబుద్ధి నాకఱపినట్ల యొనర్పుఁడు కర్ణధారకుల్.

1644


వ.

మఱియు మాంసమూలఫలాశను లగునదీరక్షకులు బలవంతులు గూడికొని
యేనూఱోడలయం దొక్కొక్కయోడకుఁ బ్రత్యేకంబుగాఁ గైవర్తకశతంబు
నిలుచునట్లుగా సంఘటించి స్వబలంబులం గూడి పోతారోపితమధుమూల
ఫలాదికు లై తీర్థప్రదేశంబుల రక్షించుచుండుఁడు భరతుండు రామునియెడ
నదుష్టుం డగునేని యిప్పుడు యీసేన క్షేమంబున గంగానదిం దరింపనిత్తును.

1645

గుహుండు భరతునిఁ జూడ నరుగుట

క.

అని వారి వారి నయ్యై, పనులకు నియమించి రుచ్యఫలములు మధువున్
ఘనమాంసముఁ గానుకఁ గొని, పనివడి తా నరిగె గుహుఁడు భరతునిఁ జూడన్.

1646

తే.

ఇత్తెఱంగునఁ దమకడ కేగుదెంచు, గుహుని నల్లంతటనె చూచి గురుమనీష
నంజలి ఘటించి నయవినయజ్ఞుఁ డైన, సూతపుత్రుండు భరతునిఁ జూచి పలికె.

1647


క.

అనఘా యీవచ్చునిషా, దనాయకుఁడు రామసఖుఁడు తడయక మిముఁ గ
న్గొన వచ్చుచున్నవాఁ డీ, యనచేఁ బతి యున్నకందు వది దెలియ నగున్.

1648


క.

నా విని భరతుఁడు సంతో, షావిష్కృతచిత్తుఁ డగుచు నతని రయమునన్
రావింపు మనవుడుఁ దదా, జ్ఞావిధి సూతుండు సమ్ముఖంబు ఘటించెన్.

1649


వ.

ఇవ్విధంబున ననుజ్ఞాతుం డై గుహుండు జ్ఞాతిసమేతంబుగా భరతునొద్దకుం
జనుదెంచి నమస్కరించి దేవా యీదేశంబు మీకు గృహారామభూతంబు
భవద్గమనానివేదనంబున వంచితుల మైతి మే మందఱము భవదధీనులము
గావున స్వకీయం బైన దాసకులంబునందు నివసింపు మని విన్నవించెద మని పలికి
వెండియు ని ట్లనియె.

1650


తే.

ఆర్ద్రశుష్క ముచ్చావచం బగుపలలము, మృష్టఫలముల మధువుఁ బరిగ్రహించి
యిచట నేఁ డెల్ల వసియించి యెల్లి తెల్ల, వాఱినంతనె యరుగుము బలయుతముగ.

1651


క.

అని సౌహార్ధవిశేషం, బునఁ బలికెడుగుహునివచనములు విని వదనం
బున దైన్యము దోఁపఁగ నా, తనితో హేత్వర్థసంహితంబుగఁ బలికెన్.

1652


వ.

పరమసఖా నీ వొక్కండవె యీదృశం బగుసైన్యంబు నభ్యర్చింప నిశ్చ
యించితివి గావున రామునియందు నీకుం గల భక్తిస్నేహంబు లెల్లవారికిఁ
దెల్లం బయ్యె నీయాదరణంబుచేతనే యే మందఱము నీచేత నర్చితు లైన
వార మైతి మిది దురత్యయం బగుగంగానూపం బీదేశంబు దుష్ప్రవేశం బే
మార్గంబున భరద్వాజాశ్రమంబునకుం జనియెద మనిన విని గహనగోచరుం
డగుగుహుండు కృతాంజలిపుటుం డై నరేంద్రా యేను ధనుష్మంతు లైనమదీ
యజ్ఞాతులం గూడి నీపిఱుంద నరుగుదెంచెద నీవు సేనాసమేతుండ వై చను
టకుఁ గారణం బేమి మహాత్ముం డైనరాముని కపకృతి సేయుటకుం బోవు
చున్నవాఁడ వని సందియంబు వొడముచున్నయది యనవుడు గగనంబు
మాడ్కి నిర్మలుం డగుభరతుండు వెండియు గుహునిం జూచి శ్లక్ష్ణవాక్యంబుల
ని ట్లనియె.

1653

భరతుఁడు గుహునకు నిజాగమనకారణముఁ దెల్పుట

సీ.

అనఘ రాఘవుఁడు నా కన్నయుఁ బితృతుల్యుఁ డాచార్యవరుఁడు నియామకుండు
వందనీయుఁడు సదావర్ణనీయుఁడు గురుం డమ్మహాత్మునిచరణాబ్జములకు
భక్తితోఁ బ్రణమిల్లి ప్రార్థనఁ గావించి దండకారణ్యమధ్యముననుండి
మరలఁ దోడ్కొని వచ్చి మహితరాజ్యపదస్థుఁ జేయంగఁ గోరి యీసేనఁ గూడి


ఆ.

పోవుచున్నవాఁడ బొంకు గా దీమాట, నమ్ము మదికి సందియమ్మ వలదు
కలియుగంబు గాదు కల్లలాడుటకు నీ, డెందమందు శంక నొంద వలదు.

1654

వ.

అని పలికిన సంహృష్టచిత్తుం డై భరతున కి ట్లనియె.

1655


ఆ.

అప్రయత్నలబ్ధ మైనసామ్రాజ్యంబు, నవల ద్రోచిపుచ్చినందువలన
దశరథేంద్రతనయ ధన్యుండ వైతివి, త్వత్సమానుఁ డొరుఁడు ధరణి లేఁడు.

1656


తే.

గహనమునఁ గృఛ్రగతుఁ డైనకౌసలేయు, మరలఁ దోడ్కొని వచ్చుట కరుగుచున్న
వాఁడ నని పల్కితివి గాన వసుధలోన, నీయశము శాశ్వతం బయి నెగడు నధిప.

1657


ఆ.

అని బహూకరించె నంత సూర్యుఁడు గ్రుంకె, రాత్రి దోఁచెఁ దమ ముగ్ర మై భరతుఁ
డచట సంధ్య వార్చి యనుజయుతంబుగాఁ, బర్ణతల్పమందుఁ బవ్వళించె.

1658


వ.

అప్పుడు శోకానర్హుండును శోకమూలపాపశూన్యుండును మహాత్ముండు నగు
భరతునకు వాగగోచరం బైనరామచింతామయశోకంబు సముపస్థితం బయ్యె
బదంపడి కోటరసంసక్తవహ్నివనదాహాభితప్తం బైనపాదపంబుంబోలె శోకాగ్ని
యంతర్దాహంబున భరతునిఁ దపింపఁజేయుచుండె నిట్లు భరతుండు సూ
ర్యాంశుసంతప్తుం డైనహిమవంతుండు హిమంబుం బోలె శోకాగ్నిసంభవం
బైన స్వేదోదకంబును సర్వగాత్రంబులవలన నించుచు ధ్యాననిర్దరశిలాసమూ
హంబును వినిశ్శ్వసితధాతుసంకులంబును దైవ్యపాదపసంఘంబును శోకాయా
సాధిశృంగంబును బ్రమోహానంతసత్త్వంబును సంతాపౌషధివేణువు నగులోక
శైలంబుచేత నాక్రాంతుం డై నిట్టూర్పులు వుచ్చుచు లోకాపవాదంబునకుఁ
దలంకుచుఁ గైకేయి చేసినదుర్మంత్రంబునకు నిందించుచు దశరథునిం దలంచి
కన్నీరు నించుచు రామభద్రు నెవ్విధంబునం జూతు నని తనలోనఁ దాను లజ్జిం
చుచు నతనిచిత్తంబు పడయుటకుఁ దగినయుపాయం బూహించుచు హత
యూథం బైనవృషభంబుభంగి నాకంపించుచు హృదయజ్వరార్దితుం డై సుఖం
బెఱుంగక యేకాగ్రచిత్తుం డై గృహపరివారసహితంబుగా దుఃఖించుచు
ని ట్లనేకప్రకారంబుల విలపించుచున్నసమయంబున గహనగోచరుం డగు
గుహుండు భరతునిఁ దగినతెఱంగున నాశ్వాసించుచు రామునిమహానుభావ
త్వంబుఁ బ్రశంసించుచు నంతకంతకుఁ బ్రసంగవశంబున లక్ష్మణుని సుహృద్భా
వంబు వక్కాణించుతలంపున ని ట్లనియె.

1659

గుహుఁడు భరతునికి లక్ష్మణుని సౌహార్ధం బభివర్ణించి చెప్పుట

మ.

అనఘా రాముఁడు పర్ణతల్పమున భార్యాయుక్తుఁ డై పవ్వళిం
చినఁ దద్రక్షణ మాచరించుటకుఁ బ్రస్ఫీతాంబకాసు ల్శరా
సనముం గైకొని కన్ను మూయక మహాసంరంభి యై యున్నస
జ్జనసన్మాన్యు సుమిత్రపట్టిఁ గని నే సంతాపతప్తుండ నై.

1660


వ.

ఇ ట్లంటి.

1661

తే.

భానుకులవర్య చూడు మీపర్ణతల్ప, మింపు మెఱయ నీకొఱకుఁ గల్పింపఁబడియె
నిందు సుఖనిద్ర సేయుము సందియంబు, వలదు సుకుమారుఁడవు పిన్నవాఁడ వీవు.

1662


చ.

అనఘచరిత్ర నీదుకృప నందినవాఁడను గాని సజ్జనా
వనగుణధుర్య యేను గడవాఁడను గాను సుమయ్య యీనిశం
బనివడి బంధువు ల్సకులు భ్రాతలు సైన్యము గొల్వ నిద్ర మే
ల్కనియెడునంతదాఁక మిముఁ గాచెదఁ గంటికి ఱెప్పకైవడిన్.

1663


తే.

నాకు రామునకంటె మనఃప్రియుండు, వసుధలోపల నన్యుఁ డెవ్వాఁడు లేఁడు
దేవ యీయర్థమందు సందియము వలదు, పరఁగ నీమ్రోల బొంకులు పలుకఁగలనె.

1664


క.

రామునియనుగ్రహంబున, నీమహిలో యశము సౌఖ్య మీసంపదయు
న్సేమంబు గలిగెఁ బ్రియసఖు, భామాయుతు నిమ్మహాత్ముఁ బరిపాలింతున్.

1665


తే.

గహనసంచారకుశలుండు గాన నాకుఁ, దెలియని దొకింత లే దిందు ధీరవర్య
భండనంబునఁ జతురంగబలము నైన, సరకుగొనక వారించెద సత్య మింత.

1666


ఉ.

నా విని యాకకుత్స్థకులనాథుఁడు న న్బరికించి పల్కె నో
భూవినుతప్రతాప విను ముజ్జగ మేలఁగఁ జాలునట్టియీ
భావజసన్నిభుం డిచటఁ బర్ణతలంబునఁ గూర్కుచుండ నా
కేవిధి నిద్ర వచ్చు సుఖ మేటికి జీవిత మేల చెప్పుమా.

1667


తే.

సంగరంబుల నెవ్వాఁడు సకలనిర్జ, రాసురుల కైన రక్షింప నలవి గాక
యలకు నారామవిభుఁడు సీతాన్వితముగ, నేఁడు తృణతల్పములఁ గూర్కినాఁడు కంటె.

1668


తే.

ఘనతపముచేత వివిధయాగములచేత, దానములచేత సకలమంత్రములచేతఁ
బ్రాప్తుఁ డై తుల్యగుణుఁ డయి పరఁగెఁ గాన, జనకున కతిప్రియాత్మజుం డనఘ యితఁడు.

1669


ఆ.

అట్టి రామవాన్వయప్రదీపకుఁ డైన, యితఁడు ఘోరవనికి నేగుచుండఁ
గాంచి తండ్రి యైన గహ్వరీపతి మను, ననెడుమాట సందియంబు గాదె.

1670


వ.

పితృమరణానంతరంబున మేదిని యనాథ యై యుండఁగలదు.

1671


తే.

సాంద్రభంగి నంతఃపురసతులు ఘోర, శోకరోదన మొనరించి సొలసి యూర
కున్న నుపరతనాద మై యుండు రాజ, సదన మిపు డని తలంచెద సచివవర్య.

1672


క.

మాయయ్యయుఁ గౌసల్యయు, మాయమ్మయు నేఁటిరాత్రి మహనీయగుణ
శ్రీయుతుల మమ్ముఁ గానక, పాయక యేపగిది వీట బ్రదుకుదు రకటా.

1673

తే.

వీరవరుఁ డైనతనయుని విపినయాత్రఁ, దలఁచి శోకాగ్నిచే గ్రాఁగి తనువు విడుచుఁ
గాని కౌసల్య మని యుండఁ గలదె యింక, నాయమవితాన మాయమ్మ యడలుఁ గాదె.

1674


క.

గ్రద్దన భూమిశ్వరుఁ డా, యిద్దఱముద్దియలపాటు హృదయంబునఁ దాఁ
బెద్దయుఁ జింతించి ఘనవి, పద్దశఁ బ్రాపించి మేనుఁ బాయు నిజముగాన్.

1675


ఆ.

ఇట్టిమాట దలఁప నెంతయు నాగుండె, యవియుచున్న దట్టియడలు మాని
సమ్మదమున నేఁడు ఱొమ్మునఁ జె య్యిడి, నిద్రవోవ నెట్లు నేర్తు నయ్య.

1676


తే.

ఏను లే కున్న మజ్జనయిత్రి పిన్న, కొడుకు నీక్షించి జీవించు నడలు దక్కి
యీమహాత్ముఁడు లేకున్న హితవరేణ్య, యేకసుత యైనకౌసల్య యెట్లు బ్రతుకు.

1677


తే.

రామభద్రునిఁ గోసలరాజ్యపట్ట, భద్రుఁ జేసి మనోరథప్రాప్తి గాక
మున్నె భూపతి పరలోకమునకుఁ బోవుఁ, గార్యమంతయు వ్యర్థమై కడచె నకట.

1678


వ.

అమ్మహాత్ముండు మావచ్చునందాఁక మని యుండఁ డేని యతని సంస్కరించి
భరతాదులు సిద్ధార్థు లై రమ్యచత్వరసంస్థానంబును సువిభక్తమహాపథంబును
రమ్యప్రాసాదసంపన్నంబును సర్వరత్నవిభూషితంబును గజాశ్వరథసంబాధం
బును దూర్యనాదవినాదితంబును సర్వకళ్యాణసంపూర్ణంబును హృష్టపుష్ట
జనాన్వితంబును నారామోద్యానసంపన్నంబును సమాజోత్సవసంకులంబు
నగుసాకేతనగరంబున సుఖంబు లనుభవించుచుండుదు రేను సమయకాలం
బతీతం బగుచుండఁ గృతప్రతిజ్ఞుం డై సేమంబున నున్నరామునిం గూడి మర
లఁ బురంబుఁ బ్రవేశించుభాగ్యంబుఁ గాంతునా యని యేతాదృశంబు లగు
దుఃఖాలాపంబులు నాతో నాడుచుండ నంతలోనఁ బ్రభాతకాలంబయ్యె నంత
రాముండు మేల్కాంచి తానును లక్ష్మణుండును నిమ్మహానదీతీరంబున జటా
వల్కలంబులు ధరించి బాణబాణాసనకృపాణంబులు ధరించి వ్యపేక్షమాణు లై
సీతాసహితంబుగా నిమ్మహానది నుత్తరించి గజయూథపులచందంబున సుఖ
లీలం జని రని యిట్లు గుహుండు రామవృత్తాంతంబును లక్ష్మణుని పరిదేవనం
బును సవిస్తరంబుగా నెఱింగించిన విని సుకుమారుండును మహాసత్త్వుండును
సింహస్కంధుండును మహాభుజుండును బుండరీకవిశాలాక్షుండును దరుణుం
డును బ్రియదర్శనుండు నగుభరతుండు స్వాభిలషితకార్యసంకటంబు సంజాతం
బయ్యె నని చింత నొంది ముహూర్తమాత్రంబు పరమదుర్మనస్కుం డై పదం
పడి తోత్రవిద్ధం బైనమహాద్వీపంబు కైవడిఁ బుడమిపయిం బడియె నతని
దురవస్థఁ జూచి యాసన్నస్థితుం డైనశత్రుఘ్నుండు శోకకర్శితుం డై యతనిం
గౌఁగిలించికొని యుచ్చైన్నాదంబున రోదనంబుఁ జేయుచుండె నయ్యిద్దఱం
బరికించి భర్తృవ్యసనకర్శిత లగురాజకాంతలు హాహాకారంబులు సేయుచు

ధరణిపయిం బడి దీర్ఘస్వరంబున విలపించుచుండి రప్పుడు తపస్విని యగుకౌస
ల్య శోకలాలసుం డైనభరతు ననుసరించి యుపగూహనంబుఁ జేసి శోకా
యాసవిశేషంబున విలపించుచు ని ట్లనియె.

1679

కౌసల్య భరతు నూఱడించుట

చ.

అనఘచరిత్ర, నీతనువు నంటవు రోగము లిప్పు డీకులం
బునకు విభుండు నీవు తలపోయఁగఁ బ్రాణము నీయధీన మా
మనుజవిభుండు పోయినఁ గుమారుఁడు కానకు నేగిన న్రహి
న్నినుఁ గని యింక మాకు గతి నీవె యటంచుఁ దలంచి నెమ్మదిన్.

1690


తే.

ఒడలఁ బ్రాణంబులు ధరించియున్నదాన, నట్టిధీరుండ వీవె ధైర్యంబు విడిచి
యివ్విధంబున దుఃఖింప నేమి గలుగు, నిచట మ మ్మాదరించువా రెవ్వ రింక.

1681


ఆ.

అనఘచరిత లక్ష్మణునకుఁ గీ డేమేని, వినఁగఁ బడెనే యేకతనుజ నైన
నాదుపుత్రకునకు నాతి సీతకుఁ గాని, కష్ట మేమి వింటి కాననమున.

1682


క.

అని యిట్లు పెక్కువిధముల, జననులు వలవింప నాశ్వసన మించుక పొం
ది నితాంతశోకుఁ డై గుహుఁ, గనుఁగొని యి ట్లనియె నతఁడు గద్గదఫణితిన్.

1683


ఉ.

ఓయి నిషాదనాయక సమున్నతవిక్రమ నాఁటి రేయి తా
నేయెడ నుండె రామవిభుఁ డెచ్చట నుండె మహీజ లక్ష్మణుం
డేయెడ నుండె నేమి భుజియించిరి యెట్లు వసించి రెంతయు
న్నాయెడఁ గూర్మిఁ జేసి కరుణ న్వినిపింపఁ గదయ్య నావుడున్.

1684


ఆ.

గుహుఁడు హృష్టుఁ డగుచు క్షోణీశసుతుఁ జూచి, యోమహానుభావ రాముఁ డిచట
కరుగుదేర నతని కాహార మిడుటకు, నన్నమును ఫలంబు లర్థిఁ గొనుచు.

1685


తే.

సఖులతోఁ గూడి యే నట్లు చని ముదంబు, వెలయ నా తెచ్చినపదార్థవిసరమెల్ల
భక్తి నర్పించుటయు ధర్మయుక్తి నన్ను, గరిమ మన్నించి యవి యన్ని పరిహరించి.

1686


వ.

మేము దానంబు సేయవలయుంగాని ప్రతిగ్రహింపరాదని న న్ననునయించి.

1687

గుహుండు భరతున కింగుదీతరుమూలంబున నుండు రామశయ్యఁ జూపుట

తే.

లక్ష్మణుఁడు తెచ్చి యిచ్చినరమ్యగాంగ, తోయ మింపారఁ గ్రోలి సీతాయుతముగ
నౌపవాస్యంబు సలిపి తమోరి గ్రుంకు, నపుడు సంధ్య నుపాసించి యంతమీఁద.

1688


వ.

సౌమిత్రివిరచితకుశతల్పంబుమీఁద సీతాసమేతంబుగా నధివసించె నంత
లక్ష్మణుండు విమలజలంబులఁ దదీయచరణంబులు గడిగి తడి యొత్తి కొండొక
సేవు నానావిధశుశ్రూషలు గావించి పదంపడి జ్యాఘాతవారణాంగుళిత్రాణ
వంతుండై శరసంపూర్ణంబు లైనతూణీరంబులు ధరించి సజ్యం బైనకార్ముకంబు
కేలం దాల్చి శయననిద్రాహారంబులు వర్జించి రాముని సవిూపంబునం గొలిచి
యుండె నేనును జాపబాణధరుండ నై యతంద్రితుండ నై యాత్తకార్ముకు లైన
జ్ఞాతులం గూడి మహేంద్రకల్పుం డగురామునిఁ బరిపాలించుచుఁ దదంతికఁ

బునం గొలిచి యుండితి రాముండు పవ్వళించుటకు రచించినతృణతల్పం బిదె
యింగుదీతరుమూలంబున నొప్పుచున్నది విలోకింపు మని భరతునకుం జూపిన
నతండు మంత్రిసహితంబుగా నమ్మహీరుహమూలంబునకుం జని యచ్చట నున్న
తృణశయ్య నవలోకించి కన్నీరు నించుచు జనయిత్రుల కి ట్లనియె.

1689


చ.

గుఱుతుగఁ దల్లులార కనుఁగొంటిరె రాముఁడు నాఁటిరేయి తా
నిరుపమధర్మయుక్తి శయనించిన కర్కశపర్ణతల్ప మ
ప్పరమసుఖార్హుఁ డంచితకృపాలుఁడు పఙ్క్తిరథాత్మజుండు సుం
దరసుకుమారుఁ డిట్టికఠినక్షితిపైఁ బవళింప నర్హుఁడే.

1690

భరతుఁడు శ్రీరాముఁడు శయనించినపర్ణతల్పంబుఁ జూచి దుఃఖించుట

చ.

సరసపదార్థము ల్గుడిచి సన్నపుటొల్లియఁ గట్టి దీప్తహే
మరచితసౌధభాగముల మంజులశయ్యలఁ బవ్వళించు న
ప్పరమసుఖోచితుండు జలపానముఁ జేసి మహీజమూలమం
దిర వగుపర్ణతల్పమున నేకరణి న్వసియించె నక్కటా.

1691


సీ.

పుష్పసంచయచిత్రములు చందనాగరుపరిమళయుతములు పాండరాభ్ర
సందీప్తములు శుకసంఘరుతంబులు మంజులాస్తరణసమంచితములు
కృతహేమకుడ్యంబు లతిగీతవంతము ల్హేమరాజతరమ్యభూము లద్రి
కల్పంబు లగునవ్యకాంచనప్రాసాదసౌధవిమానరాజములయందుఁ


తే.

గాహళవిచిత్రరవమృదంగస్వనముల, సూతమాగధగాయకస్తుతిరవముల
సంప్రబోధితుఁ డగురామచంద్రుఁ డిట్టి, కఠినధారుణిపై నెట్లుగా వసించె.

1692


తే.

లలితసుకుమారతనుఁ డైనరాముఁ డేడ, రేయిఁ గఠినోర్విపైఁ బవ్వళించు టేడ
నుదకములఁ గ్రోలి యుపవాస ముండు టేడ, నకట స్వప్నంబు గాక యథార్థ మగునె.

1693


తే.

మూఁడులోకంబులు భుజాగ్రమున ధరింపఁ, జాలినట్టియినాన్వయస్వామి కిట్లు
కఠినమేదిని వసియింపఁ గలిగె నకట, కాలము దురత్యయం బెంతఘనున కైన.

1694


వ.

ఇది మహాత్ముం డగురాముండు పవ్వళించినతృణతల్పంబు కఠినస్థండిలంబుమీఁ
ద రచింపంబడియున్న దిచ్ఛటితృణం బంతయుఁ దదీయగాత్రంబులచేత విమర్ది
తం బై యున్న దని పలికి వెండియు ని ట్లనియె.

1695


ఉ.

పోఁడిమితో విదేహపతిపుత్రిక నై యజరాజసూతికి
న్గోడలి నై జగజ్జనమనోహరు రామునిఁ జెట్టఁ బట్టియున్
నేఁ డిటు కష్టముల్ పడితి నే నని జానకి యేడ్వఁ బోలు నీ
జాడనె యంత నంతఁ గనుపట్టెఁ దదంజనమిశ్రితాశ్రువుల్.

1696


క.

ఆభూసుత యిచ్చట ది, వ్యాభరణోపేత యగుచు నటు నిద్రింపం
గాఁ బోలు నంత నంతన, శోభిల్లెడుఁ దత్సువర్ణసుందరబిందుల్.

1697


తే.

మఱియు నిచ్చోట భూపుత్రి మగనిఁ గూడి, ధౌతకౌశేయపరిధానధారుణిపయిఁ

బవ్వళింపఁగఁ బోలు తత్పటనివిష్ట, తంతుసంతాన మంతంతఁ దఱచు దోఁచె.

1698


ఆ.

చాల గోల ముద్దరాలు మహాసుకు, మారి మేదినీకుమారి యిట్టి
కఠినభూమియందు గాత్రంబు వైచిన, గండుశిలలు దాఁకి గందకున్నె.

1699


క.

పుట్టినది మొదలు బంగరు, తొట్టియలో నూఁగుసతికి దుస్తరముగ నేఁ
డిట్టి దురవస్థ దొరకొనెఁ, గట్టా దుశ్చిత్త యైనకైకకతమునన్.

1700


తే.

సతియు సుకుమారియును సుఖోచితయు నైన, జనకనందని నిజనాథసహిత యగుచు
బరఁగ నీతృణశయ్యపైఁ బవ్వళించెఁ, గాంతలకు భర్తృశయ్య సుఖంబు గాదె.

1701


క.

ఆరాముఁడు మత్కృతమున, దారయుతుం డగుచు నిట్టితల్పముమీఁదం
గూరికెఁ గావున హాయీ, కారణమునఁ గడునృశంసకర్ముఁడ నైతిన్.

1702


చ.

సరసుఁడు సార్వభౌమకులజాతుఁడు సర్వజగత్ప్రియుండు పు
ణ్యరతుఁడు పద్మనేత్రుఁడు సుఖాక్షుఁడు సత్ప్రియదర్శనుండు సుం
దరతనుఁ డైనరాఘవుఁ డనామయరాజ్యసుఖంబు మాని తా
నఱమఱ యింత లేక కఠినావని నెట్లు వసించె నక్కటా.

1703


వ.

మఱియు విషమకాలంబున నన్న యగురామభద్రు ననువర్తించి ప్రియదర్శనుఁ
డును మహాభాగుండు నగులక్ష్మణుండు ధన్యుం డయ్యెఁ బత్యనుసరణంబున
వైదేహి కృతార్థ యయ్యె మనము రామవిహీనులమై లోకవిద్వేష్యుల మైతిమి
రాఘవుం డరణ్యగతుం డగుచుండ విశ్వంభర కర్ణధారహీన యైననావచందంబు
న నాయకరహిత యై తోఁచుచున్నది దశరథుండు స్వర్గగతుం డగుచుండ రాముఁ
డు కానకుం బోవుచుండ నివ్వసుంధరాధిపత్యంబు సేయుట కేపాపాత్ముండు సమ్మతిం
చు రాముండు వనవాసగతుం డయ్యును విశ్వంభర తదీయభుజవీర్యాభిరక్షిత
గాఁ దలంచెద విహీనప్రాకారరతియు నసన్నద్ధాశ్వమాతంగయు నపావృతపుర
ద్వారయు నరక్షితయు నప్రహృష్టబలోపేతయు సాధనవిహీనయు దుర్దశాపనయు
ననావృత్తయు నైనరాజధాని శత్రువు లైన విషకృతం బైనభక్ష్యంబుంబోలె
బరిహరింతురు గాక గైకొనం దలంతురే యని యన్నియు న ట్లుండనిండు నేఁడు
మొదలుగ నేను జటావల్కలధరుండ నై నిత్యంబును ఫలమూలంబు లుప
యోగించుచుఁ దృణశయ్యమీఁదం బవ్వళించుచు రామకృతవనవాసప్రతిజ్ఞను
నాయం దారోపించుకొని రామార్థంబుగాఁ జతుర్దశవర్షాత్మకకాలంబున రా
మానుష్ఠితవ్యతిరిక్తోత్తరకాలంబు వనంబున వసించెద నందువలన నారఘుపుంగ
వునిప్రతిశ్రవంబు మిథ్యాభూతంబు గా కుండు శత్రుఘ్నుండు నాయట్ల వ్రతం
బంగీకరించి యనువర్తించి యుండు రాముండు లక్ష్మణసహితంబుగా ద్విజశ్రేష్ఠుల
చేత సామ్రాజ్యంబునం దభిషిక్తుం డై యయోధ్యాపురంబుఁ బరిపాలింపంగలం

డేతాదృశం బైనమన్మనోరథంబు దేవత లందఱు సఫలంబుఁ గావింతురుగాక
రాముండు నాచేత బహుప్రకారంబులఁ బ్రసాద్యమానుం డయ్యును మత్ప్రా
ర్థన నంగీకరింపఁడేని యమ్మహాత్మునితోఁ గూడ వనంబునఁ జిరకాలంబు వసించి
యుండెద నద్దయాళుండు న న్నేల యుపేక్షించునని యీదృశంబు లగుశపథం
బులఁ బల్కుచు నంతలోనఁ బ్రభాతకాలం బగుటయుఁ గాల్యకరణీయంబులు
దీర్చి శత్రుఘ్ను నవలోకించి యి ట్లనియె.

1704


చ.

కమలాప్తుం డుదయించె నింక మసలంగా నేటి కిచ్చోట వే
గమె యివ్వాహిని దాఁటి పుణ్యరతునిం గాకుత్స్థునిం గానఁబో
దము ప్రాణోపమమిత్రుఁ డైనగుహు నందం బొప్పఁ దో డ్తెమ్ము ని
క్కము నా కీనిశ నిద్ర లేదు మిగులం గార్యాతురత్వంబునన్.

1705


వ.

అని యిట్లు భరతునిచేతఁ బ్రచోదితుం డై శత్రుఘ్నుండు నదీసంతరణార్థంబు
వేగిరపడుచుండె నట్టిసమయంబున.

1706


క.

ప్రాంజలి యై గుహుఁ డారఘు, కుంజరుకడ కరుగుదెంచి గుణరత్ననిధీ
కొంజక నీచే నిచ్చట, రంజిత యై యొప్పెఁ గాదె రాత్రి సుఖద యై.

1707


క.

నా విని భరతుఁ డతనితో, నీవాడినయట్ల యయ్యె నిఁక నన్నఁ గనం
బోవఁగవలె సత్వరముగ, నావికులం బిలువ నంపు నది దాఁటుటకున్.

1708


క.

అన విని గుహుఁ డాతనిశా, సనమునఁ బురమునకుఁ బోయి జ్ఞాతుల వెస న
ప్పనికి నియమించుటయు వా, రనుపముచాతుర్యమహిమ నందఱుఁ బెలుచన్.

1709

భరతుఁడు సేనాసమేతంబుగ నోడ లెక్కి గంగానది దాఁటుట

వ.

గుహువచనప్రకారంబునఁ దొల్లింటియేనూఱు క్షుద్రనావలను మఱియు వి
చిత్రపటసందీపితధ్వజాలంకృతదృఢసంధిబంధపర్యాప్తకర్ణధారయుక్తచారుఫ
లకభిత్తిసమావరణపరిమితవాతమహాఘంటాధరవరాస్తరణోపేతస్వస్తికాఖ్య
నౌశతంబును సన్నద్ధంబుఁ జేసి తెచ్చి రంత గుహుం డయ్యోడలలోనఁ
బాండుకంబళసంవృతయు హర్షజనకకింకిణీఘోషయుక్తయుఁ గల్యాణియు
నైన స్వస్తికవిజ్ఞేయనావ నాకర్షించి తెచ్చిన భరతుండు శత్రుఘ్నసహితంబుగా
దాని నారోహించె నంతకు మున్ను సమాగతు లైనపురోహితులును గురువు
లును బ్రాహ్మణులు నారోహించిరి పదంపడి కౌసల్యాప్రముఖరాజకాంత లారో
హించి రనంతరంబ శకటంబులు నాపణస్థపదార్థంబులునుం దగినయోడలయం
దునిచి రప్పుడు సేనాసన్నివేశంబు గావించువారికలకలంబులును నవతరణప్రదే
శంబున డిగ్గువారిఘనారావంబులును నుపకరణంబు లందుకొనువారిమహానా
దంబులును నింగి ముట్టి చెలంగె నిట్లయ్యోడలు కొన్ని నారీజనంబును గొన్ని
హయంబులను గొన్ని మహామూల్యంబు లగురథశకటాదియానంబులను గొ
న్ని యుష్ట్రాశ్వతరాదియుగ్యంబులను గొన్ని నానావిధజవంబులను గొన్ని

రాజనందనపురోహితాంతఃపురకాంతలను వహించి పతాకావంతంబు లై స్వ
స్వదాశాధిష్ఠితంబు లై మహావేగంబున నమ్మహానది నుత్తరించి యవ్వలితీరం
బుస సందఱ డించి నివృత్తంబు లయ్యె నప్పుడు దాశశ్రేష్ఠులు నివృత్తిసమయ
భారావరోపణలఘుత్వజనితసౌకర్యంబున జలంబులందు నౌకలఁ జిత్రగమనం
బుల నడపించుచు మరలించిరి సపతాకంబు లైనగజంబులు గజారోహకులచే
తఁ బ్రచోదితంబు లై సధ్వజంబు లైనజంగమపర్వతంబులచందంబున నందం
బగుచు నమ్మహానది నుత్తరించి చనియె నప్పుడు కొంద ఱోడలచేతను గొం
దఱు ప్లవంబులచేతను గొందఱు కుంభఘటంబులచేతను గొందఱు బాహు

భరతుఁడు వసిష్ఠఋత్విగ్జనమాత్రసహితుం డై భరద్వాజమహర్షిని సందర్శించుట

వులచేతను గంగానదిని దాఁటి రి ట్లందఱు సుఖంబుగా నమ్మహానది నుత్తరించి
మైత్రముహూర్తంబున కనుత్తమం బైనప్రయాగవనంబునకుం జని రంత మహా
త్ముం డగుభరతుండు బలంబుల నాశ్వాసించి యథాసుఖంబుగా నొక్కచోట
నిలువ నియమించి రమ్యోటజవృక్షషండం బైనభరద్వాజాశ్రమంబు దవ్వు
లం జూచి ధర్మజ్ఞుండు గావునఁ గ్రోశమాత్రదూరంబున రథంబు డిగ్గి న్యస్తశస్త్ర
పరిచ్ఛదుం డై క్షౌమపరిధానసంవీతుం డై పురోహితు ము న్నిడికొని ఋత్వి
గ్జనపరివృతుం డై పాదసంచారంబున నమ్మహామునిసమీపంబునకుం జనియె
నప్పుడు బృహస్పతినందనుం డగుటవలన దేవపురోహితుం డగుభరద్వాజుండు
వసిష్ఠుని దవ్వులంజూచి శీఘ్రంబున దర్భాసనంబు డిగ్గి శిష్యు లర్ఘ్యంబుఁ గొ
ని వెంట నరుగుదేర సంభ్రమంబున నెదురుగాఁ జని వసిష్ఠునితోడ సుహృత్స
ల్లాపంబుఁ గావించి భరతునిచేత నభివాదితుం డై యతని దశరథపుత్రునిఁగా
నెఱింగి యయ్యిద్దఱ కర్ఘ్యపాద్యంబు లొసంగి ఫలంబు లిచ్చి దశరథునివృత్తం
బెఱింగినవాఁ డగుటవలన నతనికుశలం బడుగక కులబలపురకోశమంత్రిమిత్ర
బాంధవులయందుఁ గుశలం బడిగిన నవ్వసిష్ఠుండును భరతుండు నందఱుఁ
గుశలం బని పలికి వెండియు శరీరాగ్నిశిష్యవృక్షపక్షిమృగంబులయందుఁ
గుశలం బడిగిన నమ్మహాత్ముండు సర్వంబును గుశలం బని పలికి రామవిషయస్నే
హబంధంబున భరతున కి ట్లనియె.

1710

భరద్వాజమహర్షి భరతుని దూఱుట

ఉ.

అగ్రజుఁ డైనరాముని యనామయరాజ్య మధర్మయుక్తిచే
వ్యగ్రతఁ జేసి పుచ్చుకొని యంతటఁ బోవఁగ నీక ఘోరస
త్యోగ్రవనంబులోఁ దిరుగుచుండెడియమ్మహనీయమూర్తిపై
నాగ్రహవృత్తిఁ బోవఁ దగునా నినుఁ జూచిన శంక దోఁచెడిన్.

1711


క.

పుడమియు రాష్ట్రము నగరముఁ, గడువడి మీయమ్మ మున్నె కైకొనియెఁ బదం
పడి యాతనిజీవితమును, గడిమి న్నీ వపహరింపఁగా వచ్చితివో.

1712

క.

కాంతానియుక్తుఁ డై భూ, కాంతుఁడు కాంతారమునకుఁ గఠినతఁ జను మ
న్నంతనె వచ్చినసీతా, కాంతునిదే కాక తప్పు కైకదె చెపుమా.

1713


క.

అని పెనుగొఱవిం గాల్చిన, యనువున నిట్లాడ భరతుఁ డారాటమునం
గనుఁగొనల నశ్రుకణములు, చినుకఁగ ని ట్లనియెఁ దల్లిసేఁత కడలుచున్.

1714


చ.

అనఘ కృతఘ్నునట్ల యకటా నను దూఱఁగ నేల నాతెఱం
గనిశము మీ రెఱుంగరె మహాత్ముఁడు పుణ్యచరిత్రుఁ డైనరా
మునివనయాత్ర నించుకయు భూతతతు ల్గుఱిగా నెఱుంగఁ గా
దని మది నమ్మవేని భవదంఘ్రిసరోజము ముట్టి చెప్పెదన్.

1715


చ.

అనిశము సత్యధర్మములయం దనురక్తుఁడ నయ్యు నాజికిం
దనయుఁడ నయ్యు రామునకుఁ దమ్ముఁడ నయ్యు వసిష్ఠమౌనిచే
ననవరతంబు శిక్షితుఁడ నయ్యునుఁ గైకకుఁ బుట్టినందునం
బనివడి యిట్టినిందలకుఁ బాత్రమ నైతి ని కేమి సేయుదున్.

1716

భరతుఁడు భరద్వాజమహర్షికిఁ దనయనపరాధత్వముఁ దెల్పుట

క.

వగ వేల లోకనిందకు, జగతీపతిమౌళిరత్నచారుపదాబ్జుం
డగునన్న కెగ్గుఁ జేసిన, భగవంతుఁడె యెఱిఁగి యుండు భవ్యగుణాఢ్యా.

1717


వ.

మహాత్మా నీవు త్రికాలజ్ఞుండ వయ్యును న న్నిట్టివానిఁగాఁ దలంచుటవలన
నేను వ్యర్థజీవితుండ నైతి నాయందు దోషగంధం బించుక యైన లేదు మీ
రిట్లు కర్ణకఠోరంబుగాఁ బలికితిరి దీని కే నేమి మాఱు పల్కువాఁడ మద
సాన్నిధ్యంబునందు మదంబ యగుకైకేయిచేతఁ బలుకంబడినవాక్యంబు
నా కిష్టం బైనయది గాదు దాని నంగీకరించినయదియు లే దే నిక్కార్యంబు
చేత సంతుష్టుండ నైనవాఁడఁ గా నిని యీదృశంబు లైనశపథవాక్యంబుల
చేత స్వారోపితదోషం బపనయించికొని స్వాగమనకారణం బెఱింగించు
తలంపున వెండియు భరతుండు భరద్వాజున కి ట్లనియె.

1718


చ.

అఱమఱ యింత లేదు విను మయ్య మునీంద్ర వనస్థుఁ డైనభా
స్కరనిభతేజు రామునిఁ బ్రసన్నునిఁ జేసి యయోధ్య కమ్మహా
పురుషుని వెండి దోడుకొని పోవుతలంపున వచ్చినాఁడ న
త్తెఱఁగు సమస్తముం గరుణఁ దెల్పి ప్రసాద మొసంగు మి త్తఱిన్.

1719

భరద్వాజమహర్షి భరతునిం గొనియాడుట

వ.

అని యిట్లు భరతుండు వసిష్ఠాదిమహామునిసహితంబుగా రామవృత్తాంతం
బడిగిన.

1720


చ.

మునిపతి సంతసిల్లి కృప మోమున నిం పెసలారఁ గైకయీ
తనయునిఁ జూచి పల్కె నృపధర్మవిశారద రాఘవాన్వయం
బున నవనప్రసాదమునఁ బుట్టిననీ కిది యుక్త మివ్విధం

బున గురువృత్తియున్ దమము పుణ్యున కాచరణీయమే కదా.

1721


చ.

రవికులవర్య నీ విపుడు రామునిపైఁ గలభక్తిపెంపున
న్సవినయబుద్ధి వచ్చు టది సర్వ మెఱింగియు నీదుకీర్తి యీ
భువనములందు నిత్యపరిపూర్ణము సేయఁ దలంచి యీగతిం
బవినిభతీక్ష్ణవాక్యములు పల్కితి నింతియె గాక వెఱ్ఱి నే.

1722


చ.

ఎఱుఁగుదు రాఘవుం డడవి కేగినచందము సర్వ మమ్మహా
పురుషుఁడు చిత్రకూట మను భూధరమం దనుజన్మయుక్తుఁ డై
యిరవుగ నున్నవాఁ డతని నెల్లి గనం జనఁ బోలు నేఁ డిట
న్నిరుపమలీల నుండుము గుణిప్రవరా సపురోహితుండ వై.

1723

భరతుఁడు భరద్వాజానుమతంబునఁ దదాశ్రమమునకు సైన్యములను రావించుట

వ.

రాజనందనా నీవు వాంఛితార్థప్రదానదక్షుండవు మదీయాభిమతంబు సిద్ధింపఁ
జేయు మని యిట్లు ప్రార్థించిన నుదారదర్శనుండును బ్రశస్తకీర్తియు నగు
భరతుం డారాత్రి యచ్చట నివసించుట కీయకొనియె నిట్లు భరద్వాజుడు
భరతుని నిలువ నియమించి పదంపడి భోజనపర్యంతాతిథిసత్కారంబుకొఱకుఁ
బ్రార్థించిన నాభరతుండు వెండియు నమ్మునిశేఖరుం జూచి తాపసేంద్ర
యర్ఘ్యపాద్యంబులును వనంబునం గలకందమూలాదికంబులు మీ రొసంగి
తిరి మాకు సంతోషంబుఁ గావించుట కవియె చాలు నని పలికిన నమ్మ
హర్షివల్లభుం డింతకంటె విశేషం బేమి యొసంగెద రనియెడుభరతాశ
యం బెఱింగి ప్రహాసావేదకానుభావయుక్తుం డై మద్విషయంబునందుఁ
బ్రీతిసంయుక్తుం డైనవానిఁగా ని న్నెఱుంగుదు నీ కొక్కనికే కాదు భవదీయ
సైన్యంబున కెల్ల భోజనం బొసంగఁ దలంచితి మదాశయం బంగీకరింప
వలయు నీవు నబలుండ వై రాక బలంబుల దూరంబున విడియించి యొక్క
రుండ వై యేల వచ్చితి వనిన నక్కైకేయీనందనుండు కృతాంజలి యై
తపోధనా చతురంగసహితం బైనమదీయసైన్యంబు ధరిత్రి నాచ్ఛాదించి
వచ్చుచున్నది యందలిగజవాజిరథపదాతు లిచ్చటికిం జనుదెంచె నేని
పావనం బైనభవదీయతపోవనంబునకు సంకటంబు వాటిల్లు ననియును రాజు
గాని రాజపుత్రుఁడుగాని విషయంబులందలి తపోధనులకడకు సేనాసహితంబు
గా బోరా దనియును వనభంగంబువలన భవదీయచిత్తంబున కేమికినుక వొడ
యునో యనియును శంకించి దూరంబున విడియించి యే నొక్కరుండ చను
దెంచితి నిప్పుడు భవదీయశాసనంబున నిచ్చటికి రావించెద ననిన నట్ల కావింపు
మని పలికిన నతం డట్ల కావించె నంత నమ్మునివరుండు ప్రక్షాళితపాణిపాదుం
డై యగ్నిశాలఁ బ్రవేశించి ముమ్మా ఱాచమనంబు రెండుమార్లు
ముఖంబు పరిమార్జించి యొక్కసారి శిరశ్చక్షుశ్శోత్రనాసికాహృదయంబులు

సంస్పృశించి యాతిథ్యక్రియార్థంబు స్థిరసమాధినియుక్తుం డై భరతున కా
తిథ్యం బొసంగఁ దలంచితిఁ గావున మచ్ఛాmనంబున విశ్వకర్మయుఁ ద్వష్టయు

భరద్వాజమహర్షి సైన్యసమేతుం డగుభరతునికి విందు సేయుట

గృహాదిసంవిధానంబుఁ గావింతురు గాక యింద్రాదిదిక్పాలకులును వహ్ని
పురోగము లైనదేవతలును సన్నిహితు లై యన్నపానాదికంబును రక్షిం
తురు గాక భూమ్యంతరిక్షదివంబులం బూర్వపశ్చిమవాహిను లగునదు
లన్నియు నిక్షుకాండరసోపమంబు లైనశీతసలిలంబులును ఖర్జూరతాళాది
హేతుకం బైనమద్యవిశేషంబును గౌడీప్రముఖత్రివిధసురలను స్రవించుచు సన్ని
హితంబు లగుంగాక మఱియు హాహాహూహూవిశ్వావసుప్రముఖదేవగంధర్వు
లును ఘృతాచియు విశ్వాచియు నాగదంతయు మిశ్రకేశియు నలంబుసయు
హేమయు మహేంద్రపర్వతకృతస్వయంప్రభాబిలస్థహేమయు మొదలుగాఁ
గల దేవజాతిగంధర్వజాత్యప్సరసలును నింద్రలోకంబునం గలరంభోర్వశీ
మేనకాదులును బ్రహ్మలోకంబునం గలదివ్యాప్సరసలును స్వలంకృత లై నృత్త
గీతాద్యుపకరణసహిత లై గానశిక్షకుం డగుతుంబురునిం గూడి చనుదెంచి
నృత్తగీతాదికంబులు గావింతురు గాక వాసోభూషణపత్రవంతం బై దివ్యనారీ
ఫలం బై దేవభోగస్థానం బై యుత్తరకురుదేశంబునం గలకౌబేరం బైనచైత్రర
థవనం బిచ్చట సన్నిహితం బగుం గాక మఱియు భగవంతుం డైనసోముండు
శాల్యోదనంబును భక్ష్యభోజ్యచోష్యలేహ్యంబులును సురాప్రముఖపానీయం
బులును నానావిధమాంసంబులును బాదపప్రచ్యుతంబు లైనవిచిత్రమాల్యంబు
లును సృజించుం గాక యని యివ్విధంబున నప్రతిమతపోలబ్ధమహిమవిశేషం
బునఁ బ్రాఙ్ముఖుం డై యాహ్వానార్థంబు శిక్షాస్వరసంహితం బైనమంత్రంబు
జపించినఁ దత్క్షణం బామునివచనప్రకారంబున దేవత లందఱు వేర్వేఱ నచ్చ
టం బొడసూపి రప్పుడు.

1724


సీ.

హారి యై ఘనతాపహారి యై సంతోషకారి యై పవనుండు గలయ విసరె
హృష్ట యై యపగతారిష్ట యై పరిశుభోత్కృష్ట యై సురపుష్పవృష్టి గురిసె
నంద మై శ్రుతిపుటానంద మై సంతతాస్పంద మై వాద్యము ల్గ్రందుకొనియె
నిత్య మై యభినయౌద్ధత్య మై సజ్జనస్తుత్య మై యప్సరోనృత్య మొప్పె


తే.

వల్లకీదండములఁ బూని స్వరయుతముగ, నేర్పు మీఱంగ రాగంబు లేర్పఱించి
లయగుణాన్విత మగునట్లు రాలు గరఁగఁ, బాడి రవ్వేళ గంధర్వభామ లచట.

1725


క.

ఆనినదము మధురం బై, మానసహర మై లయప్రమాణయుతం బై
వీనులవిందై యకృతపు, సోనలపొం దై నభంబు క్షోణియు నిండెన్.

1726


తే.

సారచందనోత్పత్తిబీజంబు లైన, మలయదుర్దురపర్వతంబులు స్పృశించి
వివిధగతుల యథోచితవృత్తిచేత, సుఖకరంబుగఁ బవనుండు సుడిసె నపుడు.

1727

ఉ.

అప్పుడు రాజసైన్యములు హర్షము నద్భుతముం బెనంగఁగాఁ
దప్పక విశ్వకర్మునివిధానము నంతయుఁ జూచె నంతలో
నొప్పుగఁ బంచయోజనము లుర్వి సమత్వము నొందె దానిపైఁ
జొప్పులు దోఁచె నీలతృణశోభితశాడ్వలసంయుతంబుగన్.

1728


ఆ.

అంతలోనఁ దోఁచె నట ఫలభూషణ, పనసతిల్వచూతబదరినారి
కేళపూగవరరసాలకపిత్థజం, బీరముఖ్యవివిధభూరుహములు.

1729


క.

కమనీయోత్తరకురుదే, శములం గలదివ్యభోగసంయుతకాంతా
ర మొకింతలోన నచ్చట, సముచితగతిఁ దోఁచె నతివిశాలం బగుచున్.

1730


ఆ.

మఱియు నంతలోనఁ బరికింపఁ గా నయ్యె, నచటఁ దటజబహువిధావనీజ
సురుచిరప్రసూనశోభితపులినసం, యోగ మైననిమ్నగాగణంబు.

1731


చ.

ఒకనిమిషంబులో నచట నున్నతవైఖరిఁ దోఁచె సౌధము
ల్ప్రకటితహర్మ్యము ల్మణివిరాజితసద్మములు న్విమానము
ల్వికసితపద్మశోభితనవీనసరోవరము ల్సువర్ణవే
దికలును మంటపంబులును దివ్యసభాసదనంబు లొక్కటన్.

1732


క.

ఆలోఁ గనుపట్టెఁ జతు, శ్శాలములు రథహయహస్తిశాలలును ధను
శ్శాలలును జంద్రశాలలు, సాలంబులు తోరణములు సముచితభంగిన్.

1733


సీ.

వెండియుఁ గనుఱెప్ప వేయునంతటిలోన నద్భుతభంగిఁ దదంతరమున
సితమేఘతుల్య మై వితత మై సుందరం బై సుతోరణయుక్త మై మనోజ్ఞ
దివ్యగంధాఢ్య మై దివ్యరసోపేత మై దివ్యభోజనాచ్ఛాదనాన్న
శయనయానాసనచ్ఛత్రచామరవంత మై చతురశ్ర మై యతివిశాల


తే.

మై వినిర్మలభాజన మై సమస్త, వస్తువిస్తారపూర్ణ మై వైజయంత
సన్నిభం బగునొకరాజసదన మచటఁ, గన్నులకు విం దొనర్చుచుఁ గాననయ్యె.

1734


వ.

అంత మహానుభావుం డగుభరతుండు భరద్వాజునిచేత ననుజ్ఞాతుం డై రత్న
సంపూర్ణం బైనయమ్మహనీయమందిరంబుఁ బ్రవేశించి తదీయసంవిధానం
బున కిచ్చమెచ్చుచు నందొక్క దివ్యం బైనరాజాససంబును వాలవ్యజనంబును
ఛత్రంబును విలోకించి యమ్మూఁటికిం బ్రదక్షిణంబుఁ గావించి పూజించి
మనంబున రామునిం దలంచి నమస్కరించి వాలవ్యజనంబుఁ గైకొని యొ
క్కసచివాసనంబుమీఁదం గూర్చుండె నంత మంత్రులును బురోహితులును గూ
ర్చుండి రటమీఁద సేనానాయకుండు నావెనుక శిబిరాధికృతుండును గూర్చుండి
రి ట్లందఱు నానుపూర్విని భరతునిం బరివేష్టించి యుచితపీఠంబుల నాసీనులై
యున్నంత ముహూర్తమాత్రంబునకుఁ బాయనకర్దమంబు లగునదులు భర
ద్వాజునిశాసనంబున భరతునిసమీపంబునం బ్రవహించెఁ దదుభయతీరంబు

లందు మునిప్రసాదంబువలనఁ బాండుమృత్తికాలేపనంబు లైనరమ్యావసథం
బులు దోఁచె నప్పుడు.

1735


తే.

వాసవుని నందనోద్యానవాటినుండి, పరఁగ నిరువదివేలయచ్చరలు దివ్య
గంధమాల్యవిభూషణకలిత లగుచు, నచటి కొయ్యనఁ జనుదెంచి రద్భుతముగ.

1736


క.

కనకమణివిద్రుమంబుల, ఘనతరనవమౌక్తికములఁ గైసేసి వెసం
జనుదెంచి రజునిశాసన, మున నిరువదివేలదివిజమోహనగాత్రుల్.

1737


తే.

చెలువుమీఱంగ నెవ్వారిచే గృహీతుఁ, డైనపురుషుఁడు సోన్మాదుఁ డనఁగఁ బరఁగు
నట్టివారు యక్షేశ్వరుననుమతమున, వచ్చి రటు వింశతిసహస్రవనజముఖులు.

1738


తే.

ప్రమద మెసఁగ విశ్వావసుప్రముఖనిఖిల, విబుధగంధర్వపతులు వేర్వేఱ నార
దుండు తుంబురుఁడును భరతునిసమీప, మున మధురభంగిఁ బాడిరి ఘనత మెఱసి.

1739


తే.

పుండరీకయు నయ్యలంబుసయు మఱియు, వామనయు మిశ్రకేశియు వసుమతీశ
నందనునిమ్రోల సంభృతానంద లగుచు, సరసగతి నాడి రమ్మునిశాసనమున.

1740


క.

మునిపతిశాసనమున నం, దనవనమునఁ జైత్రరథవనంబునఁ గలశో
భనకరమాల్యంబులు నూ, తనరుచిఁ గనుపట్టె నపుడు తద్విపినమునన్.

1741


తే.

బిల్వకలివృక్షకాశ్వత్థవృక్షచయము, లపుడు మార్దంగికులును శమ్యాఖ్యతాళ
ధరులు నర్తకశ్రేష్ఠు లై వరుసఁ దోఁచి, రమ్మునీంద్రుశాసనమున నద్భుతముగ.

1742


క.

తిలకములు సరళతరువులు, కలగొట్టులు నక్తమాలకంబులు వరుసం
దిలకింపఁగ వామన లై, కలయం గుబ్జ లయి యకట కనుపట్టె రహిన్.

1743


తే.

శింశుపామలకీవంశకింశుకములు, మఱియుఁ దక్కినవనజాతమల్లికాది
లతలు స్త్రీరూపములఁ దాల్చి లలితఫణితి, నపుడు కనుపట్టె భరతునియంతికమున.

1744


వ.

ఇట్లు కనుపట్టి.

1745


క.

తమి దీఱ మధువుఁ గ్రోలుఁడు, ప్రమదంబునఁ బాయసంబు భక్షింపుఁడు మే
ధ్యము లైనమాంసములు వెస, నమలుఁ డనెడుపలుకు లతిఘనంబుగఁ బలికెన్.

1746


వ.

అంత సౌందర్యవ్రతు లగునయ్యువతులు పెక్కం డ్రొక్కొకపురుషుం బరిగ్ర
హించి వల్గునదీతీరంబుల నుద్వర్తనంబుఁ గావించి విమలనదీజలంబుల మజ్జనం
బాడించి చతుర్విధాలంకారంబులఁ గై ససి పాదసంవాహనంబు సేయుచు జలా
ర్ద్రాంగంబును వస్త్రాదికంబులచేతఁ దుడిచి యలంకరించి మధ్వాదికపానంబు
సేయించుచు యథాసుఖంబుగా సేవించుచుండిరి మహాబలు లగుమునిప్రభావ
సిద్ధవాహనపాలకులు భరతవాహనపాలకులకు గజోష్ట్రహయఖరంబులకు యథే
ష్టంబుగా నిక్షుమధులాజప్రముఖభోజ్యపదార్థంబులు గుడుపం బెట్టి రాభరతసై
నికులు సర్వకామంబులచేతఁ దర్పితులై మదకరద్రవ్యసేవచేత మత్తులును మధు
పానంబునఁ బ్రమత్తులును స్రక్చందనాదిభోగాతిశయంబునఁ బ్రముదితులు నై
తమతమవాహనంబు లెఱుంగక యప్సరోగణంబులం గూడి సరససల్లాపంబులు

సేయుచు యమునాతీరప్రాంతకాంతారంబులం ద్రిమ్మరుచుఁ బద్మోత్పలగంధియై
మందానిలంబుపై వీన శీతలసికతాతలంబులం గ్రీడించుచు భరద్వాజుం డెంత
మహానుభావుం డనువారును నింక సాకేతపురంబునకును దండకారణ్యంబున
కును బోవ వల దిచ్చట సుఖంబుగాఁ కాపురంబు సేయుడు మనువారును భరతు
నకు శుభంబు గలుగుఁ గాక రాముండు సుఖి యై యుండుఁ గాక యని దీవించు
వారును నీతపోవనంబు స్వర్గతుల్యం బై యున్న దనువారు నై విహరించు
చుండిరి తక్కినసమస్తజనంబులు నేతాదృశసత్కారవిధి నధిగమించి సంప్ర
హృష్టచిత్తు లై స్వతంత్రు లై శుభసల్లాపంబులు సేయుచు హర్షనాదంబులు
గావించుచు మాల్యోపేతు లై కార్యాకార్యవిచారశూన్యు లై నృత్యంబు
సేయుచు గానంబుఁ గావించుచు హాసం బొనరించుచుఁ బరుగులెత్తుచుఁ బర
స్పరాలింగనంబు సేయుచు లతాగృహంబులు దూఱుచుఁ బన్నీటియేటికా
ల్వ నీఁదుచు బహుప్రకారంబుల విహరించుచు నమృతోపమానం బైన
తదన్నంబు యథేష్టంబుగా భుజించినవారయ్యును దివ్యంబు లైనపక్వపదార్థం
బులు విలోకించి భక్షించుటకు సామర్థ్యంబు లేమింజేసి నోరూరం జూచుచుండి
కొండొకసేపునకు నాసపెంపున వెండియుం గుడువ నుద్యోగించి యోపినంత
గుడిచి వెక్కసం బైనఁ బరిహరించుటకుం జాలక గుడువ నోపక ఱిచ్చపడి
చూచుచుండి రిట్లు సర్వజనంబులు సంతుష్టమానసు లై యఖండకౌశేయచేలం
బులు ధరించి యీదృశం బైనసుఖం బెన్నం డేనియుఁ గంటిమే యని మనం
బున మెచ్చుచుండిరి పరిచారికలును దాసీజనంబులును యోధాంగనలును
మఱియు సైన్యంబునం గలవారందఱును దృప్తు లగుటవలన దృప్తు లై నూతనచేల
ధరు లై యథాసుఖంబుగా విహరించుచుండిరి పంజరోష్ట్రహయఖరగోవృషభ
మృగపక్షిగణంబు యథార్థపదార్థంబులు భుజించి మదవిశేషంబున మాఱు
మసలుచుండె నప్పు డాభరతసైనికులలోన సశుక్లచేలుండును క్షుధితుండును
మలినుండును రజోధ్యస్తకేశుండు నైననరుం డొక్కరుండును లేఁ డయ్యె మఱియు
భరద్వాజునిమహిమాతిశయంబున నజవరాహమాంసంబులచేతను సమ్యఙ్నిష్ప
న్నఫలయుక్తశర్కరాదిక్వాథరసంబులచేతను సుగంధిరసాన్వితంబు లైనసూపం
బులచేతను శాల్యోదనంబుచేతను బరిపూర్ణంబు లై యలంకారార్థపరికల్పిత
పుష్పధ్వజయుక్తంబు లైనసువర్ణపాత్రసహస్రంబు లద్భుతప్రకారంబునం గను
పట్టె నత్తపోవనపార్శ్వంబులఁ బాయసకర్దమంబు లైనకూపంబులును సర్వకా
మంబులఁ బితుకుధేనువులుసు మధువులం గురియువృక్షంబులును బ్రతప్తపిఠరమృ
గమయూరకుక్కుటసంబంధిమృష్టమాంససంచయంబులచేతఁ బరివృతంబు లై
మైరేయపూర్ణంబు లైనవాపీశతంబులును మఱియు శాతకుంభమయంబు లైన
పాత్రసహస్రంబులును స్థాలీనియుతంబులును భోజనభాజనన్యర్బుదంబులును

దధిపూర్ణంబు లైనస్థాలీసహస్రంబులును గుంభీకరంభీసహస్రంబులును రసాల
ఫలరసోపేతంబు లైనయనతినూతనానతిపురాణగౌరకపిత్థపరిమళయుక్తశుంఠీ
మరిచలవంగైలానాగపుష్పఖండశర్కరాశృంగిబేరజీరకమిశ్రితతక్రపూర్ణంబు
లైనహ్రదంబులును శ్వేతదధిపూర్ణంబు లైనతటాకకూపంబులును బాయస
నదులును శర్కరాయావసంచయంబులును సరిత్తీర్థంబులందు భాజనంబులం
దిడిన నామలకీప్రభృతికల్కంబులును జూర్ణకషాయంబులును నానావిధస్నానీ
యద్రవ్యంబులును స్నిగ్ధదంతధావనసంచయంబులును సంపుటంబులం దుంచిన
శుక్లచందనపంకంబులును బరిమృష్టంబు లైనదర్పణంబులును వాసస్సంచ
యంబులును బాదుకోపానద్యుగ్మసహస్రంబులును నంజనయుక్తకరండికలు
ను గేశమార్జనంబులును శ్మశ్రుప్రసాదకంబులును శస్త్రంబులును ధనువు
లును విచిత్రతనుత్రాణంబులును శయనాసనంబులును ఖరోష్ట్రగజహయం
బులచేత భుక్తం బైనపదార్థంబు జీర్ణించుటకు నెయ్యది త్రావంబడు నట్టి
ప్రతిపానంబుచేత సంపూర్ణంబు లైనహ్రదంబులును నవగాహనయోగ్యశో
భనజలావతరణప్రదేశంబు లై కమలకుముదకైరవమండితంబు లై యాకాశ
వర్ణప్రతిమంబు లై స్వచ్ఛతోయంబు లై సుఖప్లవంబు లై యలరుజలాశ
యంబులును నీలవైడూర్యవర్ణంబు లైనమృదుతృణసంచయంబులును విచిత్ర
ప్రకారంబునం జూడ నయ్యె నప్పు డచ్చటిజనంబు లందఱు మహర్షిచేత
భరతునకుఁ గావింపంబడిన తాదృశాతిథ్యకర్మంబు విలోకించి యదృష్టపూర్వ
త్వంబువలన నయత్నసిద్ధత్వంబువలన నాశ్చర్యస్థానత్వంబువలన స్వప్నకల్పం
బని తలంచుచు మహాద్భుతంబు నొందుచుండి రిత్తెఱంగున నందనో
ద్యానంబున విహరించుదేవతలమాడ్కి రమ్యం బైనభరద్వాజాశ్రమంబున
విహరించుభరతసైనికుల కారాత్రి సుఖతరంబుగా నతిక్రమించె నంతఁ
బ్రభాతకాలం బగుటయు నమ్మహర్షిచేత ననుజ్ఞ వడసి గంధర్వులును దిక్పాల
కులును సర్వదేవతలును నప్సరసలును నదులును దివ్యచందనంబులును దివ్య
మాల్యంబులును మఱియుఁ దక్కిన తపస్సంప్రాప్తపదార్థంబు లన్నియు యథా
స్థానంబులకుం జనియెఁ బదంబడి సూర్యోదయం బయ్యె సర్వజనంబులు పూ
ర్వప్రకారంబున భోగంబులచేతఁ దృప్తులై మదిరాపానమత్తు లై దివ్యాగరు
చందనోక్షితు లై రాత్రికాలవ్యాపారం బంతయు సత్యం బని సూచింపంజేయు
చుండిరి నానావిధదివ్యపుష్పమాల్యంబులు మనుజప్రమర్దితంబు లై పృథక్ప్రకీ
ర్ణంబులై యుండె నంత భరతుండు సపరివారుం డై రామదర్శనకామంబున
భరద్వాజునిఁ గానంబోయిన నతండు తనకడకుం జనుదెంచి ప్రాంజలి యై
యున్నయారాజకుమారు నవలోకించి హుతాగ్నిహోత్రుం డై సాదరంబుగా
ని ట్లనియె.

1747

ఆతిథ్యాంతమున భరతుఁడు భరద్వాజుని సందర్శించుట

క.

భూమీశతనయ నీ కీ, యామిని మాయొద్ద సుఖదయై యొప్పెనె భృ
త్యామాత్యులు సైనికులును, సేమమున మెలంగిరే విసృష్టశ్రము లై.

1748


క.

అన విని భరతుఁడు వినయం, బున నమ్మునిపాదములకు మ్రొక్కి కరపుటం
బనువుగ శిరమున నిడికొని, తన వాఙ్నైపథ్య మలరఁ దగ ని ట్లనియెన్.

1749


తే.

తాపసోత్తమ మీప్రసాదమునఁ జేసి, విమలభంగి సమస్తకామములచేతఁ
దర్పితుండనై మంత్రిబాంధవచమూస, హితముగా నేఁడు కడుసుఖోషితుఁడ నైతి.

1750


తే.

అప్రతిమశోభనస్థాను లై సుభక్ష్యు, లై యపేతపరిశ్రము లై యనంత
భోగు లై ప్రేష్యయుతముగఁ బొలుపు మీఱ, నఖిలజనులు సుఖోషితు లైరి నేఁడు.

1751


చ.

పరమతపోధనా సుజనబంధుని రామునిఁ గానఁ బో వలెన్
స్థిరమతి నిచ్చటం దడవు సేయఁగఁ బోల దపాపుఁ డామహా
పురుషుఁడు సంవసించినతపోవన మిచ్చటి కెంత దూర మె
త్తెఱఁగునఁ బోవు టొప్పగు సుధీవర నా కెఱిఁగింపు మింతయున్.

1752


వ.

అనిన విని.

1753


సీ.

మునినాథుఁ డతని కి ట్లనియె నిచ్చోటికి రాజనందన సార్ధయోజనద్వ
యంబుదవ్వుల రమ్యమై పుణ్యవిపిన మై చిత్రకూటం బనుక్షితిధరంబు
తనరు నగ్గిరికి నుత్తరభాగనుందు మందాకినీనామనిమ్నగ చెలంగు
నారెంటినడుమఁ జెల్వగుపర్ణకుటియందు రాముఁ డున్నాఁడు శీఘ్రమున నీవు


తే.

సవ్యదక్షిణపథమునఁ జని బలములు, భూధరప్రాంతకాంతారభూమి నిలిపి
యవలఁ దగువారిఁ దోడ్కొని యరిగి తేని, కౌసలేయుని నచ్చటఁ గాంచవచ్చు.

1754


క.

అని మునిపతి పలికిన విని, జననాథపురంధ్రు లెల్ల సవినయమున న
య్యనఘాత్మునికడకుం జని, మునుకొని తచ్చరణములకు మ్రొక్కిరి వరుసన్.

1755


తే.

అంతఁ బుత్రవియోగశోకానలార్చిఁ, జాల సంతప్త యైనకౌసల్య యలసు
మిత్రతోఁ గూడి పరమపవిత్రుఁ డైన, జటిపదంబులు కరములు సంస్పృశించె.

1756


క.

పదపడి మోమున నూతన, విధవాత్వము గానుపింప వృజినంబుల కా
స్పద మగుకైకయి యమ్ముని, పదములు తగ సంస్పృశించెఁ బాణీద్వయిచేన్.

1757


వ.

అట్లు కైకేయి యమ్మహామునికి నమస్కరించి యతనిమ్రోలఁ గౌసల్యా
సహితంబుగా నిలుచుటకు సిగ్గు పడి ప్రదక్షిణవ్యాజంబున నవ్వలికిం జని
భరతునిసమీపంబున దీనవదన యై యుండిఁ గౌసల్యాద్యంతఃపురకాంతల
నందఱ విలోకించుటకుఁ దపోవనబహిఃప్రదేశంబునకుం జనుదెంచి యున్న
వాఁ డగుటం జేసి యమ్మునిశ్రేష్ఠుఁ డప్పుడు వారల నందఱఁ గలయ విలోకించి

భరతునిం జీరి రాజనందనా భవజ్ఞనయిత్రులలోన విశేషం బెఱింగింపుము.

1758

భరతుఁడు భరద్వాజునికిఁ దల్లుల నందఱ నిరూపించి చెప్పుట

మ.

అనినం బ్రాంజలి యై యతండు మునివంశాగ్రేసరుం జూచి యి
ట్లనుఁ బూతాత్మక పుణ్యశీల నిజవంశాచారసంసక్తచి
త్త నృపాలాగ్రణి కగ్రపత్ని యలసంధ్యాదేవికి న్సాటి యౌ
ఘనదాక్షిణ్యగుణాఢ్య ధర్మరత యీకౌసల్య వీక్షించితే.

1759


మ.

అనఘా యీయమ పుణ్యశీలు మనువంశాగ్రేసరు న్సజ్జనా
వనధుర్యు న్సుగుణాలవాలు విగతవ్యాపాదుని న్సింహసం
హనను న్రాజకులైకభూషణు మనోజ్ఞాకారు ధీరు న్యశో
ధనుని న్రామునిఁ గాంచె నయ్యదితి ధాత న్గన్నచందంబునన్.

1760


తే.

గహనమున శీర్ణనవకర్ణికారశాఖ, కరణిఁ గౌసల్య వామభాగంబు నఱిమి
యతులశోకరసాధిదేవతయుఁ బోలె, మెలఁగుచున్నయీదేవి సుమిత్ర సుమ్మి.

1761


తే.

ఇమ్మహాసాధ్వితనయు లహీననయులు, సత్యవిక్రమరతులు ప్రసన్నమతులు
వ్యాఘ్రవిక్రాంతగమనులు నరిదమనులు, ఘనులు లక్ష్మణశత్రుఘ్ను లనఘచరిత.

1762


సీ.

తాపసవర్య యెద్ధానికృతంబునఁ గౌసలేయుఁడు వనవాసి యయ్యెఁ
బుత్రవిహీనుఁ డై భూవిభుఁ డెద్దానికలుషంబుకతన స్వర్గస్థుఁ డయ్యె
నట్టిదుశ్చిత్త ననార్యరూపిణి దృప్త నైశ్వర్యకామ నన్యాయ్యమతిని
గ్రోధన నతిసతీలోకవినిందితఁ గైకను మాయమ్మగా నెఱుంగు


తే.

మెల్లపాపంబులకు మూల మిదియె దేవ, యనుచు నీరీతి గాద్గద్య మడరఁ బలికి
క్రోధమున ఫణిభంగి నూర్పులు నిగిడ్చి, దీప్తముఖుఁ డయ్యెఁ గనుల రక్తిమ చెలంగ.

1763

కైకయీస్మరణకుపితుం డగుభరతుని భరద్వాజుఁ డూఱడించుట

వ.

ఇట్లు మాతృనామస్మరణసంజాతక్రోధవిశేషంబున దుర్నిరీక్షుం డైనభరతుం
జూచి భరద్వాజుం డర్థవంతం బైనవాక్యంబున ని ట్లనియె.

1764


క.

ఊరక కైకయిపై దో, షారోపణ మాచరించి యలుగఁ దగదు నీ
కారామనివాసనమున, నారయ జనములకు సౌఖ్య మయ్యెడిఁ జుమ్మీ.

1765

భరతుఁడు సైన్యసమేతుఁడై చిత్రకూటపర్వతంబున కేగుట

వ.

వత్సా యీరామప్రవ్రాజనంబువలన దేవదానవమహర్షులకు మిక్కిలిహితంబు
గాఁగల దని పలికిన నాభరతుండు మునివచనశమితక్రోధుం డై యత్తాపసశ్రేష్ఠు
నకుఁ బ్రదక్షిణపూర్వకంబుగా నమస్కారంబుఁ గావించి తదాశీర్వాదంబులు
గైకొని యామంత్రణంబు వడసి మంత్రులం జూచి ప్రయాణం బాజ్ఞాపించిన
వారు తద్వచనప్రకారంబున నెల్లవారికిఁ బ్రయాణంబు సాటించిన యనంతరం
బ నానావిధజనంబు ప్రయాణార్థియై హేమపరిష్కృతాయుక్తవాజిరథంబు లారో

హించి చనియె హేమకక్ష్యంబులును బతాకావంతంబులు నై కరిణీగజంబులు
ఘర్మాంతంబునందలి ఘోషవంతంబు లైనజీమూతంబులభంగి నలరుచుం జనియె
మహార్హంబు లైననానావిధగురులఘుయానంబు లెక్కి తక్కినజనంబు చని
యెఁ బదాతులు పాదగమనంబునం జనిరి యానప్రవేకంబు లారోహించి రామ
దర్శనలాలస లై కౌసల్యాప్రభృతిరాజకాంత లరిగిరి తరుణచంద్రార్కసదృశ
శిబిక నారోహించి సపరిచ్ఛదుం డై భరతుండు చనియె నిట్లు గజవాజిరథా
కులం బైనయమ్మహాసైన్యంబు మహామేఘంబుచందంబున నాగస్త్యం బగు
దిగ్భాగంబు నావరించి మృగపక్షిజుష్టంబు లైనగిరినదీతీరంబులం గలవిపినంబు
లతిక్రమించి రయంబునం బోవుచుండె నప్పుడు.

1766


చ.

లలితవినీలశాడ్వలచరన్మృగపఙ్క్తిదవాగ్నిధూమ మం
చలఘుభయంబునం బరువ నంచలు వార్షికమేఘ మంచు భీ
తిలఁగ వనాటకోటి పటుతీవ్రతమం బని యిక్కువ ల్సొరం
బలుగతులం జెలంగె నల భారతసైనికపాంసుజాలముల్.

1767


క.

ఆలో సైన్యము కుతుక, వ్యాలోలం బై ధరిత్రి నాచ్ఛాదించెన్
వాలాయము ఘనవర్షా, కాలాంబుద మాకసంబు గప్పినమాడ్కిన్.

1768


క.

హరిసామజోష్ట్రగోరథ, ఖరములచే సాంద్రభంగిఁ గప్పఁబడి వసుం
ధర చిరకాలము జనులకుఁ, గర మద్భుతభంగి నపుడు కనఁబడ కుండెన్.

1769


క.

ఏతాదృశఘనసైన్యో, పేతుం డై భరతుఁ డిట్లు పృథుసంరంభ
స్ఫీతుఁ డగుచు దూరము చని, పేతఃఖేదమున నవ్వసిష్ఠున కనియెన్.

1770


క.

సదయుం డగుముని చెప్పిన, ప్రదేశ మిదె చిత్రకూటపర్వతరాజం
బదె మందాకిని యది య, ల్లదె యదె యసితాభ్రతుల్య మగువన మనఘా.

1771


క.

గిరితుల్యమత్తమామక, కరటిఘటాదంతకాండఘట్టనమున నీ
వరచిత్రకూటసానువు, లఱిముఱిఁ ద్రుటితాశ్మపఙ్క్తు లయ్యెడిఁ గంటే.

1772


క.

జలధరము లగుఘనంబులు, జలములఁ దొనలందుఁ గురియుచందంబున ని
ట్టలముగ నగములు చదులం, దలరులు వడిఁ గురియుచున్న వల్లదె కంటే.

1773


క.

అంబుధి మకరవితతిచే, తం బోలె నితాంతమృగవితతిచే వ్యాకీ
ర్ణం బగుచుఁ జిత్రకూటన, గం బొప్పెడుఁ గంటె దేవకాంతాలయ మై.

1774

భరతుఁడు శత్రుఘ్నునితోఁ జిత్రకూటపర్వతము నభివర్ణించి చెప్పుట

వ.

అని పలికి శత్రుఘ్ను నవలోకించి.

1775


క.

వాతప్రవృద్ధఘనసం, ఘాతంబు ఘనాత్యయమున గగనమునందు
బోతిరుగుకైవడి మృగ, వ్రాతము చెలువారె వేగవంతం బగుచున్.

1776


క.

జలదప్రకాశఫలకం, బులచేతన్ దాక్షిణాత్యపురుషులక్రియ నౌ
దలలందు భటులు తమి భా, సిలఁ గుసుమాపీడములను జేసెడుఁ గంటే.

1777

వ.

మఱియు నమ్మహాఘోరకాంతారంబు తొల్లి విజనం బైన నిప్పుడు జనాకీర్ణం
బైనసాకేతపురంబుభంగి సౌమ్యదర్శనం బై యున్నది విలోకింపుము.

1778


తే.

హరిఖురోద్ధూతపటుసాంద్రధరణిరజము, దావమును వ్యోమభాగంబు నావరింప
గాడ్పు మనకుఁ బ్రియము సేయుకరణి దాని, విరియఁదట్టెడుఁ గంటివే వినుతచర్య.

1779


క.

తురగోపేతము లగుసుం, దరరథములు సూతచోదితము లయ్యును స
త్వరగతిఁ జన నేరక కడు, భరమున విపినమునఁ జిక్కువడియెడుఁ గంటే.

1780


చ.

హరిపదవీథిపైఁ బొలుచు నస్మదనీకపరాగజాల మి
త్తఱిఁ బరికించి వారిదకడంబ మటం చలచిత్రకూటభూ
ధరశిఖరాగ్రభాగమునఁ దద్దయుఁ జిత్రకలాపజాలము
ల్విరివిగఁ బాయ విచ్చి సరవి న్శిఖు లాడెడుఁ గంటె ముంగలన్.

1781


తే.

పద్మగర్భున కెన యైనపరమమునుల, కాశ్రయం బిది గావున ననఘ యీప్ర
దేశము త్రివిష్టపముఁ బోలె దివ్య మై య, నామయం బయి తోఁచెడి ననఘ కంటె.

1782


తే.

భానుతేజ మంజులబిందుభాస్వరములు, మృగములు మృగీయుతంబు లై యవ్వనమున
ధవళసుమములచేఁ జిత్రితంబు లైన, చందమున నొప్పుచున్నవి చాలఁ గంటె.

1783


తే.

అతులితపరాక్రములు ధీరు లతిగభీరు, లసదృశులు రామలక్ష్మణు లధికబలులు
మనకుఁ జూపట్టునందాఁక వనములోన, వీరభటపుంగవులు చొచ్చి వెదకవలయు.

1784


వ.

అని భరతుం డాజ్ఞాపించినఁ దత్క్షణంబ కొందఱు యోధులు శస్త్రాస్త్రపాణు
లై యవ్వనంబుఁ బ్రవేశించి పురోభాగంబున వర్షాకాలమేఘంబుకరణి
శ్యామం బై యొప్పుచున్నధూమాగ్రంబు దవ్వులం గాంచి క్రమ్మఱ భరతు
నొద్దకుం జనుదెంచి దేవా యగ్రభాగంబున దవ్వుల ధూమాగ్రం బొప్పుచు
న్నది కృశానుండు లేనిచోట ధూమం బుండదు నిర్జనం బైనస్థానంబునఁ
గృశానుం డుండఁడు నిక్కంబుగా నచ్చట రామలక్ష్మణులు వసించి యుండఁ
బోలు నట్లు గాదేని రామసమాను లయినమునులు నివసించి యుండఁ బోలు
నని యూహించెద మని పలికిన సాధుసమ్మతంబు లైనవారలపలుకులు విని
యమిత్రబలమర్దనుం డైనభరతుండు సర్వసైనికుల విలోకించి మీ రిచ్చటనె
నిశ్శబ్దులై యుండుఁడు వసిష్ఠుండును సుమంత్రుండును నేనునుం జనియెదమని పలి
కిన వారు తద్వచనప్రకారంబునఁ జిరకాలంబునకు రామసమాగమంబు దొర
కొనియెఁ గదా యని సంతసించుచు ధూమాగ్రగతవీక్షణు లై నిలిచియుండిరి
భరతుండును ధూమాగ్రంబు విలోకించుచుం బోవుచుండె నంతకు మున్ను గిరి
వనప్రియుం డగురామభద్రుండు తచ్ఛైలంబునందు దీర్ఘకాలోషితుం డై పురం
దరుండు పులోమజం బోలె వైదేహి నవలోకించి యద్దేవికిఁ బ్రియంబు సంపా

దించువాఁ డై వనవాసపరిశ్రాంతం బైనతనమనంబున కభిమతవిషయాంతరవ్యా
సంగంబున నానందంబు సంపాదించుచు నమ్మైథిలి కి ట్లనియె.

1785

రాముఁడు సీతకుఁ జిత్రకూటమునందలి విశేషములను జెప్పుట

క.

గతసామ్రాజ్యుఁడ నయ్యును, హితజనరహితుండ నయ్యు నీరమణీయ
క్షితిధరముఁ గాంచి మది న, ప్రతిమామోదమున నున్నవాఁడ నతాంగీ.

1796


క.

నానాకూటవిరాజిత, 'మై నానాధాతుకలిత మై సాంద్రగతిన్
నానాఖగమృగయుత మై, యీనగ మలరారెడి న్మృగేక్షణ కంటే.

1787


వ.

మఱియు ధాతుభూషితంబు లైనయీశైలదేశంబులు గొన్ని రజతసంకాశం
బులు గొన్ని క్షతజసన్నిభంబులు గొన్ని పీతమాంజిష్ఠవర్ణంబులు గొన్ని మణి
వరప్రభంబులు గొన్ని పుష్యరాగస్ఫటికకేతకీపుష్పవర్ణంబులు గొన్ని నక్షత్ర
పాదరసప్రభంబు లీశైలం బదుష్ట నానామృగగణసింహవ్యాఘ్రభల్లూకసమూ
హంబులు గలిగి విచిత్రపక్షిసమాకులం బై ప్రకాశించుచున్నది మఱి
యు నామ్రాసనలోధ్రప్రియాళుపనసధవతిమిశాంకోలబిల్వతిందుకారిష్టవరుణ
మధూకతిలకబదర్యామలకీనీపవేత్రధన్వనబీజకాదినిఖిలతరువ్రాతంబులు పుష్ప
వంతంబు లై ఫలోపేతంబు లై ఛాయాయుక్తంబు లై మనోరమంబు లై
యొప్పుచున్నవి విలోకింపుము.

1788


క.

రమణీయపర్వతప్ర, స్థములందు విరాళిఁ గామసమ్మోహితు లై
రమియించుచున్నకిన్నర, రమణీరమణులను గంటె రాజీవాక్షీ.

1789


క.

అంబుజముఖి కనుఁగొనుము ఘ, నంబుగ విద్యాధరాంగనాక్రీడోద్దే
శంబులు మిక్కిలి నాహృద, యంబున కానందకరములై యున్న విటన్.

1790


క.

తరువిటపంబుల వ్రేలెడు, వరమణిమయభూషణములు వస్త్రంబులు సుం
దరమాల్యంబులు ధనువులు, సురుచిరఖడ్గములు మ్రోలఁ జూడుము తన్వీ.

1791


తే.

జలజముఖి యున్నతప్రదేశమున నుండి, దుమికెడువిశాలగిరినిర్ఝరములచేత
నల్పనిర్ఝరములచేత నద్రి చాలఁ, గ్రాలెడు స్రవన్మదం బైనగజముకరణి.

1792


క.

ఫలకుసుమసంభృతం బగు, విలసద్గంధము గ్రహించి విసువక గుహలం
బలుగతుల విసరు కరువలి, చెలియా యెవ్వరికి సుఖము సేయక యుండున్.

1793


క.

నీవును రాజాన్వయనయ, కోవిదుఁ డగులక్ష్మణుం డకుంఠితభక్తిన్
సేవించుచుండ నిచ్చట, వావిరి నిలువంగరాదె వర్షశతంబున్.

1794


క.

అతులితఫలకిసలయసం, గతము సురమ్యంబు పక్షిగణయుత మగునీ
క్షితిధరశిఖరాగ్రమునన్, రతిమంతుఁడ నైతిఁ జుమ్మి రాజీవాక్షీ.

1795


క.

జనకునిఋణ మీఁగుటయును, గొనకొని భరతునకుఁ బ్రియముఁ గూర్చుటయును గా
ననవాసముచే నా కిటు, వనజాక్షి ఫలద్వయంబు వచ్చెం జుమ్మీ.

1796


తే.

నెలఁత మానసవాక్కాయనియత వగుచు, వివిధభావముల్ చూచుచు వేయిగతుల

నన్నుఁ గూడి యీరమ్యకాననములందు, నీనగంబున గ్రీడింతె యింపు మెఱయ.

1797


తే.

రమణీ యన్యరాజర్షు లరణ్యవాస, మమృత మని పల్కి రస్మదీయాన్వవాయ
రాజు లెల్ల దేవత్వసంప్రాప్తికొఱకుఁ, గానననివాస మని రర్థి ఘనత మెఱసి.

1798


క.

శైలోపరిభాగంబున నీలారుణపీతధవళనిర్మలరుచుల
న్వాలాయముఁ జూపట్టు వి, శాలశిలాపటలిఁ గంటె చంచలనయనా.

1799


తే.

చారువదన యెద్ధానికేసరము విరుల, వృద్ధి నొందినకైవడి వెలసె నట్టి
యీశిలాపట్ట మీక్షింపు మిదిగొ యుష్మ, దర్థ మిడినట్లు పరికింపనయ్యె నహహ.

1800


వ.

మఱియు నిమ్మహీధరంబునం గలదివ్యౌషధులు సహస్రప్రకారంబుల స్వకాంతి
సంపదలచేత భ్రాజమానంబు లై రాత్రియందు హుతాశనజ్వాలలభంగి వెలుం
గుచున్నవి కొన్నిదేశంబులు సదనసదృశంబు లై కొన్నియెడ లుద్యానసన్నిభం
బు లై కొన్నినెలవు లేకశిలారూపంబు లయి యద్భుతప్రకారంబునం జూపట్టు
చున్నవి మఱియు నీచిత్రకూటపర్వతంబు ధరిత్రిని భేదించి సముద్ధితం బయినమా
డ్కి నలరుచున్నది యేతత్పర్వతశిఖరంబు శుభదర్శనం బై యున్నది మఱియుఁ
గుష్ఠపున్నాగసరళభూర్జపత్రోత్తరచ్ఛదంబు లయి కుశేశయదళయుతంబు లై
కాముకులయాస్తరణంబులు శోభిల్లుచున్నవి తత్పరివారంబునఁ బరిమ్లానంబు లై
మృదితంబు లై పుష్పమాలికాసందోహంబులు వ్రాలి యున్నయని చిత్రకూ
టనగంబు బహుమాల్యఫలోదకం బై యమరావత్యల కపురంబులను మానస
సరోవరసౌగంధికాఖ్యసరోవరంబుల నుత్తరకురుదేశంబుల నతిరమణీయత్వంబు
న నతిక్రమించిన ట్లొప్పుచున్న దిచ్చటఁ జతుర్దశవర్షవ్యతిరిక్తపురుషాయుఃకా
లంబంతయు రాజర్షిసమాచరితంబు లైనస్వనియమంబుల ననుసరించి లక్ష్మణు
నితోడ నీతోడం గూడి విహరించినం గొఱంత యేమి వనవాసవత్సరంబు లిచ్చటఁ
గడపి యవ్వల రాజ్యసుఖం బనుభవించెద నని యీదృశంబు లైనశుభవాక్యం
బులు సీతకుం జెప్పుచు నప్పర్వతంబు డిగ్గి తత్కటకంబున రమ్యజలాకీర్ణ యగు
మందాకినీనది నవలోకించి రాజీవలోచనుం డగురాముండు చారుచంద్రనిభాన
న యగుజానకి నవలోకించి వెండియు ని ట్లనియె.

1801


శా.

రాజీవేక్షణ రమ్యచిత్రపులిన న్రమ్యన్ జగత్పావని
న్రాజత్కైరవషండమండలయుత న్నానాతటోద్భూతధా
త్రీజాతావృతఁజక్రహంసముఖపత్రివ్యాకుల న్యక్షరా
డ్రాజీవాకరతుల్య నచ్ఛజలపూర్ణ న్నిమ్నగం జూచితే.

1802


సీ.

ఒకవంక నవకైరవోత్పలాంబుజవనాలంకృతంబు మదాళిఝంకృతంబు
ఒకచోట దివ్యగంధోపేతపవనవిరాజితంబు మరాళకూజితంబు
ఒకదెస గగనచుంబ్యుత్తుంగకల్లోలభావితంబు కుళింగసేవితంబు
ఒకయోర వనదేవయువతిసంగీతసన్నాదితం బలసారసోదితంబు

తే.

ఒక్కయెడ నిమ్నగావర్త మొక్కక్రేవ, స్తనితగంభీర మొకచాయఁ జక్రవాక
శోభితం బయి యెల్లెడఁ జూడ నొప్పె, నబ్జలోచన యిచటిశోభాతిశయము.

1803


సీ.

అలివేణి కంటె దివ్యారణ్యఫలపల్లవోద్దీపితారణ్య మొక్కచోటు
కలకంఠి కంటె మాకందపల్లవభావనోన్మత్తపికనాద మొక్కచోటు
పూఁబోఁడి కంటె సంఫుల్లకలాపమయూరనాట్యవిశాల మొక్కచోటు
రాజీవముఖి కంటె రమణీయతరమృగయూథకోలాహలం బొక్కచోటు


తే.

చెలువ యొకచోటు సిద్ధనిషేవ్యమాన, మతివ యొకచోటు దేవవిహారయోగ్య
మింతి యొకచోటు వనదంతిదంతయుతము, దేవి చూచితే యీనదీతీరమందు.

1804


తే.

తామరసనేత్రి మృగనిపీతంబు లగుట, వలనఁ గలుషోదకంబు లై యలరునట్టి
యీమనోజ్ఞతీర్థంబు లిం పెసఁగ నాకు, వేడ్కఁ బుట్టించుచున్న వీవేళఁ గంటె.

1805


క.

ఘనవల్కలంబులు జటా, జినములు ధరియించి మౌనిశేఖరులు ముదం
బువ నీనదిలో మజ్జన, మొనరించుచు నున్నవారు యువతీ కంటే.

1806


క.

రమణీ మఱికొందఱు సం, యము లిచ్చట నూర్ధ్వబాహు లై నియమమునం
గ్రమమున నాదిత్యుని స, ర్వమయు నుపాసించుచున్నవారలు కంటే.

1807


తే.

పత్రపుష్పంబు లిన్నదిపై సృజించు, మారుతోద్ధూతశిఖరద్రుమములచేతఁ
బరఁగ నృత్యం బొనర్ప నుపక్రమించు, పగిదిఁ జూపట్టుచున్నది పర్వతంబు.

1808


తే.

వారిజేక్షణ నీరమ్యవదనజనిత, కాంతి నీక్షించి తమ కట్టికాంతి లేమి
వనరుహంబులు సిగ్గుచే మునిఁగె ననఁగ, జలముల మునుంగుచున్నవి చెలువ కంటె.

1809


క.

ఒకచోట మణినికాశో,దక మొకయెడ విమలసైకతం బొకచో న
త్యకలంకసలిల మొకయెడ, వికచసరోజములు గలిగి వెలసెడుఁ గంటే.

1810


క.

శ్వసనాహతనవవికచ, ప్రసూనములు పాదపములపై నుండి రహి
న్వెస వ్రాలి పఱచినట్లుగఁ, బొసఁగఁ బ్రవాహంబువెంటఁ బోయెడుఁ గంటే.

1811


క.

వనజాతపత్ర చూచితె, పనివడి జక్కువలు మధురఫణితి నినాదం
బొనరించుచుఁ గమలోత్పల, వనషండములందు వ్రాలి వరలెడు మ్రోలన్.

1812


తే.

ఇన్నదీసైకతములందు నిన్నుఁ గూడి, వలసినట్లు క్రీడించుచు లలితఫణితి
నిమ్మహాగిరిపై వసియించుకంటె, నతిన పురవాస మధికోదయంబె నాకు.

1813


క.

అతులితతపోదమశమా, న్వితు లగుతాపసులచేత నిత్యము విక్షో
భితజల యగునీనది నం, చితభక్తి న్నన్నుఁ గూడి సేవింపు మిఁకన్.

1814


వ.

కల్యాణి నీ విమ్మహానదియందు మత్సమేతంబుగా నవగాహనంబు సేయుము
భవజ్జఘనకుచాఘాతజనితతరంగంబులచేతఁ గమలోత్పలంబులు నటనంబుఁ
గావింపం గలవు.

1815


క.

ఆమందాకిని శక్రుని, కోమలి కనిశంబుఁ బ్రియముఁ గూర్చినక్రియ నేఁ
డీమందాకిని నీకును, లేమా యొడఁగూర్చు హితము బ్రియమును సుఖమున్.

1816

క.

ఈపర్వతరాజ మయో, ధ్యాపట్టణమట్ల యిమ్మహానది సరయూ
ద్వీపవతియట్ల యరయుచు, భూపుత్రీ నన్నుఁ గూడి పొందుము సుఖముల్.

1817


తే.

బాలశశిఫాల నీ వనుకూల వగుచు, హితముఁ గావింప లక్ష్మణుఁ డధికభక్తి
నస్మదాజ్ఞావ్యవస్థితుండగుచునుండ,ముదము నా కబ్బుటకు నింకఁ గొదవ యేమి.

1818


క.

క్రమయుక్తిఁ ద్రిషవణస్నా, న మొనర్చుచు వన్య మనుదినంబు మెసవుచు
న్నిముఁ గూడి నామనంబున, రమణీ కాంక్షింప నింక రాజ్యమును బురిన్.

1819


చ.

తతమృగయూథశాలినియుఁ దామరసావృతయు న్మహామృగ
ప్రతతినిపీతతోయయును బాదపసేవితయు న్మహోర్మికో
న్నత యగునిమ్మహాతటిని స్నాన మొనర్చి గతక్లముం డనా
హతకుశలుండు గానినరుఁ డంగన యెవ్వఁడు లేఁడు చూడఁగన్.

1820


వ.

అని యివ్విధంబున రాముండు ప్రియాసహాయుండై బహుసంగతు లగువచ
నంబులు పలుకుచుఁ గొండొకసేపు నయనాంజనప్రభం బైన చిత్రకూటపర్వతం
బున విహరించి యనంతరంబ నిజాశ్రమసమీపంబున నొక్కరమణీయగిరిప్రస్థం
బునందు సీతాసమేతంబుగా సుఖాసీనుండై యిది మేధ్యం బిది స్వాదు విది వహ్ని
నిష్టప్తం బని వచించుచు మృగమాంసప్రదానంబున నద్దేవిని రంజిల్లంజేయు
చుండె నప్పుడు సమీపంబునం జనుదెంచుచున్నభరతునిసైన్యశబ్దంబును
జమూచరణోత్థతపరాగంబును నింగి ముట్టి చెలంగె నమ్మహాధ్వని విని వార
ణాదిమృగంబులు సయూథంబు లై భయంబుఁ గొని పెక్కుతెఱంగులం బరు
వెత్తుచుండె నంత రాముండు సైన్యసముద్ధూతశబ్దంబు విని శబ్దసంశ్రవణసం
జాతసాధ్వసంబునం బఱచునుృగంబుల నవలోకించి దీప్తతేజుం డైనసౌమిత్రి
కి ట్లనియె.

1821


చ.

జలనిధిఘోష మట్ల ఘనశబ్దముకైవడి నొక్కనాద మ
త్యలఘుగతి న్వినంబడియె నద్భుతపాంసువు లెల్లదిక్కులం
గలయఁగ నాక్రమించె గజఖడ్గమృగేంద్రవరాహయూథము
ల్పలుగతుల న్భయంబుఁ గొని పాఱఁ దొడంగెఁ గుమార చూచితే.

1822


తే.

జనవిభుఁడొ తత్సముండో యీవనమునందు, వేఁట సలుపంగ వచ్చె నవ్విధము గాక
శ్వాపదం బరుదెంచెనో సత్వరముగఁ, గలతెఱం గంతయును నీవు తెలిసికొమ్మ.

1823


క.

ఈనగము పక్షిగణముల, కైన సుదుశ్చరము లక్ష్మణా యీపగిదిం
బూనికిఁ జనుదెంచెడువాఁ, డేనరుఁడో వేగ తెలియు మెంతటిఘనుఁడో.

1824


చ.

అన విని లక్ష్మణుండు రయ మారఁగఁ బుష్పితసాల మెక్కి యా
యనువున దిక్కు లన్ని గలయం బరికించి యుదఙ్ముఖంబుగాఁ

గనుఁగొనియె న్శతాంగతురద్విపసంకులము న్మృగాధిరా
జనిభపదాతిసంయుతము సాగరతుల్యము భూరిసైన్యమున్.

1825


క.

ఈరీతిఁ గాంచి యారఘు, వీరుఁడు సాలమున నుండి వెసఁ బ్రాంజలి యై
యారామునితో సైన్య, ప్రారంభం బెఱుకపఱచి పలికె న్మరలన్.

1826


క.

వీరోత్తమ వహ్ని నర, ణ్యారోపితుఁ జేసి సీత నద్రిబిలమునం
జేరిచి గ్రక్కునఁ జేయుము, దారుణశరచాపకవచధారణ మనఘా.

1827


క.

అని వేగిరపడి పలికెడు, ననుజన్మునిఁ జూచి పలికె నారామవిభుం
డనఘా యెవ్వనిబలమో, గనుఁగొనుము సవిస్తరంబుగా సర్వంబున్.

1828

లక్ష్మణుండు శ్రీరామచంద్రునకు భరతాగమనం బెఱిఁగించుట

ఉ.

నా విని లక్ష్మణుండు వదనంబునఁ గోపము చెంగలింపఁ గాఁ
బావకుకైవడిం గెరలి ప్రాంజలి యై తనయన్న కి ట్లనున్
దేవ కృతాభిషేకుఁ డయి ధీరత నిన్ను జయింపఁ గోరి యీ
త్రోవ బలంబు గొల్వ భరతుం డరుదెంచుచు నున్నవాఁ డొగిన్.

1829


ఆ.

మింటిపొడువు గలిగి ఘంటాఘణంఘణ, నినద మెల్లదెసల నిండఁ దద్ర
థంబుమీఁద నుద్గతస్కంధ మగుకోవి, దారకేతు వలరు ధర్మనిరత.

1830


తే.

చటులగతి గల్గునారట్టజంబు లెక్కి, విచ్చుకత్తులతళతళ ల్గ్రచ్చుకొనఁగ
సాదు లరుదెంచుచున్నారు సాహసమున, వారణారోహకులుఁ గంటె వాఁడి గలిగి.

1831


క.

మన మాయుధములు గొని గ్ర, ద్దన గిరిశిఖరంబుపైకి దాఁటుదమో లే
కనఘా సన్నద్ధుల మై, మునుకొని యిచ్చటనె యుందమో తెల్పు మొగిన్.

1832


క.

క్రొవ్వున మనలం దాఁకిన, నెవ్వనికృతమందు మనకు నీగతి నిడుమ
ల్నివ్వటిలె నట్టిభరతునిఁ, జివ్వకు రాఁ దిగిచి కృపణుఁ జేసెదఁ గడిమిన్.

1833


తే.

మిహిరకులవర్య యెవనినిమిత్త మీవు, నేను సీతయు దారుణ మైనవ్యసన
మొందినార మాకైకయినందనుండు, నాదుకంటను బడు నికఁ గాదు విడువ.

1834


తే.

శాశ్వతం బైననీదురాజ్యం బధర్మ, వృత్తి గైకొన్న దుష్టాత్ముఁ డీభరతుఁడు
భాగ్యవశమున నేఁడు సంప్రాప్తుఁ డయ్యె, వీని వధియించి పుచ్చెద విమలచరిత.

1835


క.

వీరోత్తమ యీభరతుఁడు, వారనిపరిపంథి గాన వధ్యుఁడు నా కీ
దారుణచిత్తునివధమం, దారయఁ గా దోస మించుకైనం గలదే.

1836


తే.

అధిప యపగతనిజధర్ముఁ డైనభరతుఁ, డార్యగణగర్హితుండు పూర్వాపకారి
సహజశత్రుండు స్వప్రయోజనరతుండు, తత్పరిత్యాగమున నీకుఁ దప్పు లేదు.

1837


వ.

మహాత్మా యేను నీచేతఁ గృతాభ్యనుజ్ఞుండనై యీక్షణంబు భవద్రాజ్యాపహారి
యైనభరతుని వధించెద నాచేత నిహతుం డైనపుత్రుని హస్తిభగ్నద్రుమంబునుం
బోలె నిరీక్షించి రాజ్యకాముక యైనకైకేయి దుఃఖార్తయై విలపించుచుండఁ
బదంపడి దానిం బట్టి బంధుసహితంబుగా వధించి శుష్కారణ్యంబునందు హుతా

శనుంబోలె సైన్యంబునందు మత్క్రోధంబు నసత్కారంబును బ్రయోగించి
కరితురంగరథికపదాతుల నిశితశరంబులం గీ టడంచి చిత్రకూటకాననంబు నెల్ల
రుధిరోక్షితంబుఁ గావించెద మఱియు నాచేత నిహతంబు లైనగజహయపదాతి
కళేబరంబుల శ్వాపదంబులు భక్షించుం గాక యే నిట్లు పగతురం బరిమార్చి శర
చాపంబుల ఋణంబుఁ దీర్చికొని కైకేయీకరగతం బైనసామ్రాజ్యంబునుం
దెచ్చి నీ కొసంగి కృతార్థుండ నయ్యెద నీవు పట్టాభిషిక్తుండ వై వసుంధరఁ బరి
పాలింపుమని యివ్విధంబున నాగ్రహోదగ్రవ్యగ్రాయమానమానసుండై సమగ్ర
బాహుబలంబున భరతునితో విగ్రహించి నిగ్రహించుటకుం దివురుచున్నలక్ష్మ
ణుం జూచి రాముండు సాంత్వవాక్యంబుల ననునయించుచు నిట్లనియె.

1838


క.

గురువృత్తివిదుఁడు ధర్మో, త్తరుఁడు మహాప్రాజ్ఞుఁ డధికధైర్యుఁడు భరతుం
డరుదెంచుచుండ ససిభీ, కరశరచాపముల నేమి కార్యము చెపుమా.

1839


క.

నరపతికి సత్య మాడియు, పరమతిఁ జనుదెంచినట్టిభరతు న్సుగుణా
భిరతు న్వధించి యీతు, చ్ఛరాజ్యమున నేమి యశము సంపాదింతున్.

1840


తే.

తలఁప నెయ్యది బంధుమిత్రక్షయంబు, నందుఁ బ్రాప్తించునది సుధయైన నేమి
గరళమిశ్రితభక్ష్యంబుగతిఁ బరిత్య, జింతుఁ గా కాత్మలోనఁ గాంక్షింప నయ్య.

1841


తే.

ధర్మ మర్థంబు కామంబు ధరణి సిరియుఁ, గోరటంతయు మీమేలుకొఱకుఁ గాదె
బాల్య మాదిగ నాబుద్ధి భ్రాతృవత్స, లతఁ బరిణమించు టెఱుఁగవే రాట్కుమార.

1842


చ.

ఘనమతి నాకు దుర్లభము గాదు ధరిత్రి యధర్మమందు నా
కనిమిషలోకరాజ్యపద మబ్బిన నైనఁ దృణీకరింతు నే
ర్పున నసిచాపబాణములఁ బూనుట రాజ్యముఁ గోరు టెంతయు
న్మునుకొని మీకు నిచ్చలు ప్రమోద మొనర్చుట కంచుఁ జూడుమీ.

1843


క.

ఈమాట నిజముఁ బల్కితి, సౌమిత్రీ నమ్ము మీవు నమ్మవేయేని
న్దీమసమున నాయుధములు, చే ముట్టి నిజంబు బాసఁ జేసెద ననఘా.

1844


క.

అసదృశచరితుని భరతునిఁ, బస చెడి దునుమాడి బృహదుపక్రోశమలీ
మసుఁడ నయి తుచ్ఛమహి మా, నసమున గణియింతునే వినయగుణశాలీ.

1845


తే.

నీవు శత్రుఘ్నుఁడును బుణ్యనిరతుఁ డైన, భరతుఁడును లేనియెడ నాకుఁ బరఁగ నెద్ది
యేనియు నొకింతసుఖ మబ్బెనేని దాని, వీతిహోత్రుండు నీఱు గావించుఁ గాక.

1846


క.

కారణము లేక నా కప, కారముఁ జేయుటను జేసి కైకను సుజను
ల్దూఱిరి నృశంస యని నను, దూఱరె యిఁక నామె నొడిసి ద్రుంచిన యంతన్.

1847


తే.

కైక చేసినయపరాధకార్యమునకు, సత్యసంధుని భ్రాతృవత్సలుని ఋజునిఁ
బ్రాణములకంటెఁ బ్రియుఁ డగుభరతు నెట్లు, నిష్ఠురాత్ముఁడ నై త్రుంప నేర్తునయ్య.

1848

సీ.

పుడమియు సిరిఁ బాసి జడలు చీరలు దాల్చి జానకీలక్ష్మణసంయుతముగ
వనికి నేతెంచిన నను విని శోకసంక్షోభితకరణుఁ డై క్రూరచిత్త
యగుతనయమ్మకు నవమతిఁ గావింపఁ దలఁచి భూపతిప్రసాదంబు వడసి
భ్రాతృవత్సలత సామ్రాజ్యంబు నాకు సమర్పించుటకు భక్తి నరుగుదెంచు


తే.

చున్నవాఁ డిమ్మహామహుఁ డొండువిధము, పూనిగా దెన్నఁడేనియు మున్ను భరతుఁ
డెగ్గుఁ గావించెనే మన కించు కైన, నట్టిపుణ్యునిపై నేల వట్టిశంక.

1849


క.

భరతుఁడు మనలం జూచుట, కరుదెంచుట కాలయోగ్య మనఘుఁడు మనయం
దరయంగ నించు కైనను, దురితము గావింపఁ డితఁడు దుర్జనదూరా.

1850


తే.

అనఘ భరతుఁడు కల నైన నప్రియంబుఁ, దలఁపఁ డెన్నఁడుఁ బరుషోక్తిఁ బలుకఁ డెపుడు
సకలనృపధర్మసంవేది శ్లక్ష్ణవాది, మన మెఱుంగనిదే వానిమానసంబు.

1851


తే.

కెరలి భరతునిఁ గూర్చి శంకించె దేటి, కమ్మహాత్మునిచే ము న్నొకప్పు డైన
నిట్టిసాధ్వసజనకోక్తి యించు కై నఁ, బలుకఁబడియెనె యేల యీతలఁపు నీకు.

1852


తే.

అనఘచరిత క్రౌర్యంబున నప్రియోక్తు లాకుమారు నుద్దేశించి యాడఁదగదు
వానియం దొకదుష్టభావత్వశంక, గలిగి యుండిన నే నైనఁ గనల వచ్చు.

1853


వ.

వత్సా భరతుండు నీచేత నప్రియంబును నిష్ఠురంబు నగువాక్యంబు పలుకం
దగినవాఁడు గాఁ డతని నుద్దేశించి నీచేతఁ బలుకంబడియెడునప్రియోక్తులు
నన్ను నుద్దేశించి పలుకంబడినయవిగాఁ దలంచెదఁ దన కొకానొకయాపద
వచ్చినప్పుడైనను వందనీయుం డగుతండ్రిని బ్రాణభూతుం డైనభ్రాత నెవ్వి
ధంబున వధియింపవచ్చు నని పలికి వెండియు ని ట్లనియె.

1854


తే.

అనఘ దైవకృతంబున నైనపనికి, ధర్మమార్గంబు విడిచి సత్కర్ము లైన
తల్లితండ్రుల భ్రాతల దారుణముగఁ, దునిమి జననిందలను బొంది మనుట మేలె.

1855


తే.

కడఁగి రాజ్యంబుఁ గోరి యీగతి ననర్థ, వివ్విధంబున బోధింతువేని నీకు
సుగుణవంతుని భరతునిఁ జూచినంత, నంతయును రాజ్య మితని కిమ్మనెదనయ్య.

1856


చ.

అనుపమలీల నేలు మిలయంతయుఁ దమ్ముఁడ యంచుఁ బ్రీతి న
య్యనఘుఁడు గ్రమ్మఱ న్భరతుఁ డంఘ్రులపైఁ బడి రామభద్ర మా
కనిశము రాజు వీఁడె సిరి యంతయుఁ గైకొనుఁగాక యంచుఁ దాఁ
బనివడి పెక్కుచందములఁ బల్కునొ పల్కఁడొ చూచుచుండుమీ.

1857


వ.

అని యిట్లు ధర్మశీలుం డగురాముండు పలికిన విని లక్ష్మణుండు లజ్ఞాతిశయం
బువలన నత్యంతసంకుచితగాత్రుం డై భ్రాతృవత్సలుండు గావునఁ గేలుదోయి
ఫాలంబునం గీలించి దేవా భవదీయచిత్తంబుకొలంది నవధరింతువు గాక
భరతుం డొక్కరుండె గాఁడు మజ్జనకుండైన దశరథుండును జనుదెంచుచున్న

వాఁ డని తోఁచుచున్న దనినఁ గౌసల్యానందనుండు వెండియు సౌమిత్రిం
జూచి వరభావజ్ఞుండు గావున నీతండు వ్రీళితుం డై ప్రసంగాంతరంబుఁ బ్రస్తా
వించుచున్నవాఁ డని నిశ్చయించి యౌచిత్యంబున లక్ష్మణకృతప్రస్తావంబునె
విస్తరించుచు ని ట్లనియె.

1858


సీ.

అనఘాత్మ జనకసమాగమం బది మన కరయ సత్యానందకరము గాదె
మనల వీక్షింపనో మనకష్టముఁ దలంచి మరల నయోధ్యకు మనలఁ దోడు
కొని పోవుటకొ లేక కోడలిదురవస్థ చింతించి కడు సుఖసేవిని యని
ప్రోలికిఁ దోడ్కొని పోవుటకో వచ్చుచున్నవాఁ డవిగో మహోన్నతములు


తే.

పవనతుల్యవేగంబులు జవయుతములు, గోత్రవంతంబు లైనట్టిఘోటకములు
రెండు శత్రుంజయాఖ్యవేదండ మొకటి, మ్రోలఁ జూపట్టుచున్నది పోలఁ గంటె.

1859


తే.

మూఁగి చనుదెంచుచున్నయామూఁకనడుమ, భూతసత్కృత మగుపాండురాతపత్ర
మిపుడు తోఁపనికతమున నృపునిరాక, యందు సందియ మయ్యెడి ననఘచరిత.

1860


వ.

అని పలికి రాముండు శంకాకళంకితస్వాంతుం డై నిరీక్షించుచుండ భ్రాతృ
సేవాయత్తచిత్తుం డైనలక్ష్మణుండు రామునిచేత నాజ్ఞప్తుండై సాలంబు డిగ్గి
కృతాంజలిపుటుం డై పార్శ్వభాగంబునం గొలిచి యుండె నంత భరతుండు
సైన్యంబుల నమ్మహీధరపార్శ్వంబుల విడియ నియమించిన గజవాజిరథా
కులం బైనతత్సైన్యం బప్పర్వతప్రాంతంబున సార్ధయోజనమాత్రప్రదేశం బా
క్రమించి నివాసంబుఁ గావించె నిట్లు నీతిమంతుం డైనభరతుండు రఘునందన
ప్రసాదనార్థం బరుగుదెంచి ధర్మంబు పురస్కరించి సేనాసన్నివేశంబుఁ గావించి
దర్పంబు పరిహరించి పాదచారి యై యరిగి గురువచనానుష్ఠానపరుం డైన
రాముని సందర్శింతుం గాక యని నిశ్చయించి శత్రుఘ్ను నవలోకించి యి
ట్లనియె.

1861


శా.

నీ వాలుబ్ధులఁ గూడి రామవిభు నన్వేషింపఁగా నేగు మీ
త్రోవ న్వెంట గుహుండు జ్ఞాతియుతుఁ డై తోడ్తోడ నేతెంచెడుం
బ్రావీణ్యంబున మంత్రిభృత్యగురుపౌరవ్రాతముం గూడి యే
నీవంక న్జనుదెంతు రామచరణప్రేక్షాసమాపేక్షతన్.

1862


ఆ.

ఎంతలోన రాము నెంతలో లక్ష్మణు, నెంతలోన సీత నిపుడు కనుల
కఱవు దీఱఁ జూడఁగాఁ జాల నంతలోఁ, జిత్తమునకు శాంతి చెల్ల దనఘ.

1863


తే.

ఇందుసంకాశ మరుణారవిందనేత్ర, ముగురఘూత్తముఘనసుందరాస్య మెంత
లో విలోకింపలే నంతలోన నామ, నంబునకు శాంతి గలుగ దనర్ఘశీల.

1864


తే.

అనఘ రామునిపార్థివవ్యంజనాన్వి, తము లగుపదంబు లెంతలో విమలభక్తి

నౌదల ఘటింపఁగాఁజాల నంతలోనఁ, గలుషచిత్తంబునకు శాంతి గలుగ దిపుడు.

1865


తే.

ఇష్టరాజ్యార్హుఁ డగురాముఁ డెంతలోన, రుచిరసింహాసనమునఁ గూర్చుండి సదభి
షేకపుష్కరక్లిన్నుండు గాకయుండు, నంతలో శాంతి గలుగునే యనఘ నాకు.

1866


ఉ.

తామరసేక్షణంబు శుభదంష్ట్రము సుందరనాసము న్సుధా
ధామనిభంబు హాసకలితంబు కృపారసయుక్త మైన శ్రీ
రాముని నెమ్మొగంబు మది రంజిల నిచ్చలు చూచుచు న్యశో
ధాముఁడు లక్ష్మణుండు సుకృతవ్రతుఁ డయ్యెఁ గ దయ్య తమ్ముఁడా.

1867


క.

జలనిధిముద్రితధాత్రీ, తలమున కధినాథుఁ డనఁగఁ దగునిజభర్తం
బలుదెఱఁగుల సేవించుచు, నల జనకకుమారి ధన్య యయ్యెం గాదే.

1868


క.

నందనమునందు ధనదుని, చందంబున నెందు రామచంద్రుఁ డమందా
నందమున నుండు నగ్గిరి, మందరగిరికంటె నుత్తమం బగుఁ గాదే.

1869


ఆ.

శస్త్రభృద్వరుండు సవితృప్రతావుండు, రాముఁ డేవనమున రమణిఁ గూడి
సంతతంబుఁ క్రీడ సల్పుచు నివసించె, నదియు నతిపవిత్ర మయ్యెఁ గాదె.

1870

భరతుండు పాదచారి యై శ్రీరామాశ్రమంబుఁ గనుంగొనఁ బోవుట

వ.

అని యివ్విధంబున బహువిధాలాపంబులు పలుకుచు మహాతేజుం డగుభర
తుండు మహారణ్యంబుఁ బ్రవేశించి పుష్పితాగ్రంబు లైనగిరిసానుసంజాత
ద్రుమషండంబు లవలోకించుచుఁ దన్మధ్యంబునం జని చని పుష్పితం బైనచిత్ర
కూటసాలంబు డగ్గఱి తత్సవిూపంబునం బొల్చు రామాశ్రమగతం బైన
వహ్నిధ్వజంబు విలోకించి యచ్చట రాముండు వసియించి యున్నవాఁ డని
యెఱింగి జలపారంబు నొందినవానితెఱంగున సంతోషవిశేషంబునం బొద
లుచు శత్రుఘ్నునిం జూచి పుణ్యజనోపపన్నం బైనరామాశ్రమం బల్లదే
యని శత్రుఘ్నునకుం జూపుచు మాతృవర్గంబునుం దోడ్కొని రమ్మని వసిష్టు
నకుం జెప్పి తాను గుహసహితంబుగాఁ బురోభాగంబున శీఘ్రంబునం బోవు
చుండె సుమంత్రుండు రామదర్శనకృతాభిలాషుం డై శత్రుఘ్నసహితంబుగా
నరుగుచుండె నిట్లు ద్యుతిమంతుఁ డగుభరతుండు సత్వరంబుగాఁ బోవుచుఁ
బురోభాగంబున నాశ్రమసమీపవర్తిచిహ్నంబులు విలోకించి శత్రుఘ్నున
కి ట్లనియె.

1871


క.

ముదితుఁ డయి భరద్వాజుఁడు, సదయత నెఱిఁగించినట్టి శైలోత్తంసం
బిదె దీని డాసితిమి కద, యదె సుమి మందాకినీమహానది వత్సా.

1872


వ.

అని శత్రుఘ్నున కచ్చటివిశేషంబు లెఱింగించుచుం జని చని యవ్వల
నొక్కింతదూరంబునఁ దాపసాలయసదృశం బైనవహ్న్యగారభూతపర్ణ
శాలయు బహిస్సుఖావస్థానార్థం బుపకల్పితం బైనయాశ్రమంబును విలో

కించి తత్పరిసరంబున నవభగ్నంబు లైనకాష్ఠంబును సంపాదితంబు లైన
పుష్పంబులు నందంద మార్గపరిజ్ఞానార్థంబు కుశవల్కంబులచేత రచింపం
బడినయజ్ఞానంబును సీతకారణంబువలన మృగమహిషకరీషంబులచేత నిర్మిం
పంబడిన బహుసంచయంబులును సర్వంబునుం జూచి వెండియు శత్రుఘ్నున
కి ట్లనియె.

1873


చ.

ముదమున లక్ష్మణుండు ఫలము ల్గొని కాననసీమనుండి తాఁ
బదవడి యాశ్రమంబునకుఁ బాయక వచ్చుటకై పథంబునన్
సిదిలముగాక యుండ విరచించిన గుర్తుఁల గంటె నీతికో
విద జగతీరుహాగ్రముల వ్రేలఁగఁ గట్టిననారచీరలన్.

1874


చ.

మొనసి నగంబుక్రేవఁ జలము న్బలముం జెలువార ఘోరకా
ననగజము ల్మదంబున ఘనంబులకైవడి నింగి బృంహిత
ధ్వనులు సెలంగ నొండొకటిఁ దాఁకి సముద్ధతిఁ బోరిపోరి న
ల్లనిమలలట్ల బి ట్టలసి క్రాలుచు నున్నవి కంటె ముంగలన్.

1875


ఉ.

కాననమందుఁ దాపసు లకల్మషభక్తి ననారతంబు నె
ద్దాని భజించి బ్రహ్మగతిఁ దారు దగం జరియింతు రాబృహ
ద్భానుని ధూమరాజి యదె భాసిలుచున్నది యందు జానకీ
జానిని బుణ్యమూర్తి నలసంయమినిం బలె నేఁడు చూచెదన్.

1876


వ.

అని పలికి ముహూర్తమాత్రంబునకు మందాకినీనదిం గడచి యనుచరులం
జూచి యి ట్లనియె.

1877


మ.

క్షితి నెవ్వాఁడు సమస్తరాజ్యపదవీసింహాసనాధ్యక్షుఁ డై
సతతం బేలఁగఁ జాలు నట్టివిభుఁ డీసౌమ్యుండు రాముండు మ
త్కృతమం దీదురవస్థ నొంది సుఖముం గ్రేడించి ఘోరాటవీ
క్షితిలో నొంటిగ నున్నవాఁ డకట ఛీ జీవంబు నా కేటికిన్.

1878


క.

పలుగతుల నిపుడు తత్పద, ములకు న్సీతాంఘ్రియుగ్మమునకుం బడి త
ద్విలసత్కృప నొందెదఁ గొం, చలపడక పునఃపునఃప్రణామంబులచేన్.

1879

భరతుండు రామాశ్రమంబుఁ గనుంగొనుట

వ.

అని యిట్లు విలపించుచుఁ గైకేయీనందనుండు నిజాగ్రభాగంబున సాలతా
లాశ్వకర్ణపర్ణసమాచ్ఛాది యగుదాని శక్రాయుధనీకాశభారసాధనమహాకార్ము
కంబులచేత సమాకీర్ణ యగుదాని శత్రుబాధకమహాసారరుక్మపృష్ఠదీప్తవదన
భానురశ్మిప్రతీకాశతూణీరగతఘోరసాయకాలంకృత యగుదాని సుపర్ణనిర్మి
తకోశశోభిత యగుదాని రుక్మబిందువిచిత్రఫలకరాజిత యగుదానిఁ గాంచన
భూషణవిచిత్రగోధాంగుళిత్రమండిత యగుదాని సింహాధిష్ఠిత యైన పర్వత
గుహమృగంబులచేతం బోలె నరాతులచేత నప్రధృష్య యగుదానిఁ గాకోద

రంబులచేత భోగవతియుం బోలె నిశితనారాచంబులచేత నభిరామ యగుదాని
మృదుకుశంబులచేత యజ్ఞాయతనంబునం బోలె నావృత యగుదాని విశాల
యగుదాని మనోరమ యగుదానిఁ బర్ణశాలం జూచి యందు నీశాన్యభాగ
క్రమనిమ్న యై దీప్తపాపక యగువేదిక నవలోకించి తన్మధ్యదేశంబున.

1880

భరతుండు దూరమున రామునిం గనుంగొనుట

క.

నిరుపమగుణనిధి భరతుం, డురువిక్రమధనుని ఘనుని నుటజాసీనున్
గురుని జటాధరుని జితా, సురుని రఘూత్తమునిఁ గాంచె సుముహూర్తమునన్.

1881


సీ.

ఇందీవరశ్యాము నందితసుత్రాము ధవళాంశువదను సౌందర్యసదను
దీప్తతేజోలాభు దేవాధిరాజాభు సరసీరుహాక్షు విశాలవక్షు
వల్కలాజినవాసు వరసుగుణోల్లాసుఁ గాంచనాచలధీరు ఘనగభీరుఁ
జటులసింహస్కంధు శౌర్యజితస్కందు మానినదేహు నాజానుబాహు


తే.

లక్ష్మణోపేతు సీతాభిరాముఁ బద్మ, యోనిచందాన నాసీనుఁ డైనవాని
రాము నీక్షించి భరతుఁ డలంఘనీయ, శోకవార్ధి మునింగి సంక్షుభితుఁ డగుచు.

1882


క.

పలుగతుల నార్తరవమున, విలపించుచు భ్రాతృమోహవివశుం డై క
న్నుల నశ్రు లొలుక మనమునఁ, దలఁకుచు ని ట్లనియెఁ జాలధైర్యము వాయన్.

1883


తే.

అనుదినము ప్రజచే నెవ్వఁ డభినుతింపఁ, బడియె నట్టి శ్రీరాముఁడు భయదవన్య
దుష్టమృగములచేఁ జాలదుష్ప్రవేశ, వని నుపాసితుఁ డై యున్నవాఁడు నేఁడు.

1884


సీ.

రమణీయచీనాంబరములు ధరించువాఁ డీచీరవల్కల మెట్లు దాల్చె
విమలవిచిత్రమాల్యములు వహించువాఁ డీజటామండల మెట్లు దాల్చె
మహితచందనకర్దమంబు మై మెత్తువాఁ డీధరిత్రీరజ మెట్లు మెత్తె
నెండ క న్నెఱుఁగక యింట వసించువాఁ డీఘోరవనవాస మె ట్లొనర్చె


తే.

నతిసుఖోచితుఁ డగురాముఁ డకట మన్ని, మిత్తమున నిట్లు దురవస్థ మెలఁగవలసె
నీచమతి నైననాకు నిందితము లైన, జీవితము లేల ఛీ యెంత చెట్ట నైతి.

1885


తే.

జగతి నెవనికి ధర్మసంచయము సముచి, తాధ్వరంబులచే యుక్త మయ్యె నట్టి
పుణ్యుఁడు శరీరదుఃఖసంభూతమైన, ధర్మ మొనరించుచున్నాఁడు ధైర్య మూఁది.

1886

భరతశత్రుఘ్నులు రామునిపాదములపైఁ బడుట

క.

అని యీగతి విలపించుచుఁ, గనుఁగవలను దుఃఖబాష్పకణము లొలుక రో
దన మొనరించుచుఁ దగ రా, మునిదివ్యాంఘ్రులసమీపమున వ్రాలె వెసన్.

1887


క.

ఈరీతి వ్రాలి భరతుం, డారామునిఁ జూచి యార్య యని యొకమా టు
చ్ఛారణముఁ జేసి శోకవి, చారంబున మరలఁ బలుకఁజాలక యుండెన్.

1888

క.

పదపడి శత్రుఘ్నుఁడు ద, త్పదముల కెఱఁగుటయుఁ జూచి దారుణశోకం
బెద నెదుగ రాఘవుఁడు వా, రి దయామతి నాదరించి ప్రియ మలరారన్.

1889


వ.

శీఘ్రంబునం గ్రుచ్చి యెత్తి గాఢాలింగనంబు గావించి కన్నీరు నించె నంత
సుమంత్రుండును గుహుండును పొడసూపిన నారామలక్ష్మణులు వారలం గూ
డి గగనంబునందు శుక్రబృహస్పతులతోడం గూడినదివాకరనిశాకరులచందం
బునం దేజరిల్లె నిత్తెఱంగునం గూడుకొనిన వారణయూథపసన్నిభు లయిన
యారాజనందనుల నల్వురం జూచి యచ్చటివనచరు లందఱు హర్షంబు విడిచి
కన్నీరు నించుచుండి రనంతరంబ యుగాంతకాలంబున ధరణిపయిం బడిన
భాస్కరునిచందంబునఁ దనచరణంబులపయిం బడి బద్ధాంజలి యై బహువిధ
శోకాలాపంబుల విలపించుచున్నవాని జటాజినవల్కలధరుం డగువాని నుప
వాసకృశుం డగువాని వివర్ణవదనుం డగువాని భరతునిం జూచి యతని నతిప్ర
యత్నంబున భరతునిఁ గా నెఱింగి రామభద్రుండు నిజకరంబుల నతనిం గ్రు
చ్చి యెత్తి శిరంబు మూర్కొని కొండొకసేపు గాఢంబుగాఁ బరిష్వజించి పదం
పడి నిజోత్సంగంబున నునిచికొని యతిదుఃఖితుం డైనయతనిదుఃఖం బపన
యించుటకుఁ బ్రశ్నవ్యాజంబున ధర్మంబు లుపదేశించుచు ని ట్లనియె.

1890

రాముఁడు భరతునిఁ గూర్చి ధర్మప్రశ్నములు సేయుట

ఉ.

ఎచ్చట నున్నవాఁడు కడువృద్ధుఁడు మజ్జనకుండు నేఁడు నీ
విచ్చటి కేల వచ్చితి వహీనగుణాఢ్య నృపాలు నొంటిగా
నచ్చట డించి మీ రిరువు రక్కట యీగతి రాఁ బొసంగునే
యచ్చట నెవ్వ రింకఁ గల రవ్విభుఁ బ్రోచెడువారు చెప్పుమా.

1891


తే.

దూరమున నుండి వచ్చినవారి మిమ్ముఁ, గార్శ్యమాలిన్యవైవర్ణ్యకములచేతఁ
బరమదుర్జేయగాత్రులఁ బరఁగఁ బెద్ద, కాలమున కిందుఁ బొడగంటిఁ జాల నరిది.

1892


క.

విను మీ విచటికి వచ్చినఁ, దనువునఁ బ్రాణంబు లెట్లు తాల్పఁగలం డా
జనపతి కడుదీనుం డై, మునుకొని తత్క్షణమె నాకమునకుం జనఁడే.

1893


క.

సరసాత్మక మజ్జనకుఁ డ, మరపతిసదృశుండు వీట మని యున్నాఁడో
పరువడి లోకాంతరమున, కరిగెనొ నీ వేల వచ్చి తడవికిఁ జెపుమా.

1894


తే.

అనఘచారిత్ర బాలుండ వౌట నీదు, శాశ్వతం బైనరాజ్యంబు జనపదంబు
సర్వము నశింపకున్నదె సత్యరతునిఁ, దండ్రి సేవింతువే నీవు ధర్మయుక్తి.

1895


ఆ.

రాజధర్మవిదుఁడు రాజసూయాశ్వమే, ధాదియాగకర్త యనఘమూర్తి

సత్యసంగరుండు జనకుండు కుశలి యై, యున్నవాఁడె సుఖముఁ గన్నవాఁడె.

1896


క.

జనకుని సేవింతువొ నీ, వనిశముఁ గులగురునిఁ బుణ్యు హరినిభతేజు
న్ఘనకీర్తిని విద్వాంసుని, మునినాథు వసిష్ఠు నెపుడుఁ బూజింపుదువే.

1897


తే.

అనఘ కౌసల్య సుఖినియె యలసుమిత్ర, సేమమున నున్నదే పుణ్యశీల సాధ్వి
కైక యానందభరితయే కడమతల్లు, లొప్పు మీఱఁ గుశలిను లై యున్నవారె.

1898


క.

అనసూయుఁ డనుద్రష్టయు, సనయుఁడు గులమతుఁడు వినయసంపన్నుండున్
ఘనుఁడు బహుశ్రుతుఁడు ఋజుం, డనఘ సుయజ్ఞుండు సత్కృతాత్ముం డగునే.

1899


క.

అతఁడు మతిమంతుఁ డయి సం, తతమును వేదోక్తఫణితిఁ దప్పక వహ్ని
త్రితయమున హోష్యమాణము, హుతమును గాలమున నీకు నురుమతిఁ జెపునే.

1900


క.

దేవబ్రాహ్మణవృద్ధుల, వావిరిఁ బితృభృత్యమంత్రివైద్యుల గురుల
న్భావించుచు భయభక్తుల, సేవింతువె సంతతంబుఁ జిరశుభలీలన్.

1901


తే.

అనఘ యిష్వస్త్రసంపన్ను నర్థశాస్త్ర, కోవిదుని హితకరుఁ గృతజ్ఞుని సుధన్వుఁ
గార్ముకాచార్యు సవినయగౌరవమున, నమితభయభక్తిఁ బూజింతె యనుదినంబు.

1902


క.

శ్రుతవంతు లాత్మసము లిం, గితజ్ఞులును శూరులును సుశ్రుతులు కులీనుల్
జితకరణులు నగుమంత్రుల, సతతము మన్నింతె నీవు సజ్జనతిలకా.

1903


వ.

మఱియు నీతిశాస్త్రనిపుణులును మంత్రధరులు నగుమంత్రులచేత సుసం
వృతం బైనమంత్రంబు రాజులకు విజయమూలంబు గదా యని పలికి వెండియు
ని ట్లనియె.

1904


క.

కాలంబున నిద్రించుచుఁ, గాలంబున మేలుకొనుచు ఘనబుద్ధి నిశా
కాలంబునందు నిత్యం, బాలోచింపుదువె నిశ్చలార్థనిపుణతన్.

1905


క.

నిక్కము మంత్రితమంత్రం, బక్కజముగ గుప్త మగునె యమ్మంత్రంబున్
బెక్కండ్రతోడ మఱి నీ, వొక్కండవు సేయఁ దగ దయుక్తం బనఘా.

1906


క.

హితమతు లగుమితజనసం, యుతముగ లఘుమూలమును మహోదయమునుగా
మతి నిశ్చయించి కార్యం, బతిరయమునఁ జేయుదే మహాగుణశాలీ.

1907


వ.

మఱియుసామంతమహీపతులు శీఘ్రంబున ఫలోన్ముఖంబు లయినకార్యంబులును
జేయందలంచినకార్యంబులు నెఱుంగక నిష్పన్నంబు లైనకార్యంబులె యె
ఱుంగునట్లుగా మంత్రగోపనంబు గావించి సర్వకార్యంబులు నడుపుదువే మంత్రు
లచేతం గాని నీచేతం గాని సుమంత్రితం బైనమంత్రంబులను బరులు తర్కయుక్తుల
చేత నింగితాదులచేత నెఱుంగకుండుదురు గదా మూర్ఖజనసహస్రంబుకంటెఁ

బండితుం డైనవాని నొక్కనిం బరిగ్రహించిన నతండు మహీపతి కర్ధసంకటం
బులయందు మహైశ్వర్యంబు గావించు మూర్ఖు లగువారిం బదివేలజనంబుల
నుపాసించిన నించుక యైన సాహాయ్యంబు లేదు మేధావియు శూరుండును
దక్షుండును నీతిశాస్త్రవిచక్షణుం డగునమాత్యుం డొక్కరుం డైన మహీపతిని
గాని దత్సమానుని గాని లక్ష్మీసంపన్నుం జేయు నన్నికార్యంబులందు నట్టియుత్త
మగుణసంపన్నునిం జేర్పఁదగ దుత్తమకర్మంబులం దుత్తముని మధ్యమకర్మం
బులయందు మధ్యముని జఘన్యకర్మంబునందు జఘన్యుని నియోగింపవలయు
మఱియు సుపరీక్షాతీతు లగువారి నమాత్యులఁ గులక్రమాగతులఁ గరణత్రయ
శుద్ధియుక్తుల గుణశ్రేష్ఠుల శ్రేష్ఠకర్మంబులందు నియోగింపవలయు ని ట్లుక్త
ప్రకారంబునం గావింపుదువె యని పలికి వెండియు ని ట్లనియె.

1908


తే.

అనఘ మంత్రులు ప్రీతి ని న్ననుదినంబు, తీవ్రదండంబుచే సముద్వేజితప్ర
జంబు గాకుండఁ బూజ్యరాజ్యంబుఁ బ్రోచు, వానిఁ గాఁ జేయుదురె నీతివరుసఁ దెలిపి.

1909


వ.

మఱియు దుర్దానంబున ధనం బుపార్జించి యాగంబు సేయ నుపక్రమించిన
పతితుని యాజకులు వర్జించినచందంబున బలాత్కారంబునం బరిగ్రహింపం
దలంచిన కాముకునిఁ గాంతలు పరిత్యజించినకైవడి నుగ్రదండోపాయంబున
నదండ్యు లగువారివలన ధనగ్రహణంబు సేయునిన్ను విలోకించి ప్రజలు
పరిత్యజింపక యనురక్తు లై యుందురు గదా యని పలికి క్రమ్మఱ ని ట్లనియె.

1910


తే.

పార్థివనయజ్ఞు సామాద్యుపాయకుశలు, వైద్యుని గృతఘ్ను శూరు నైశ్వర్యకాము
నాప్తవిఘటనరతు నేధరాధిపతి వ, ధింపఁ డాతని కాపదఁ దెచ్చు నతఁడు.

1911


క.

యుక్తుని భృశానురక్తుని, శక్తుని శూరునిఁ గులీను సదుపాయసమా
యుక్తుని మతిమంతుని వర, భక్తునిఁ గావింతె నీవు బలపతి గాఁగన్.

1912


క.

బలవంతులు ముఖ్యులు పర, బలార్దనులు జన్యవిదులు భక్తులు విక్రాం
తులు నైనదండనాథుల, నలఘుగుణా సత్కరించి యలరుదె ప్రీతిన్.

1913


సీ.

తఱి వచ్చినపుడు భూవరుఁడు బలంబున కన్నంబు వేతన మర్హభంగిఁ
బుష్కలంబుగ నిడఁబోలు లోభంబున నొసఁగక మత్తుఁ డై యుండెనేని
వానిపైఁ గోపించి వారు దూషింతురు దాన భూపతి కనర్థంబు గలుగుఁ
గాలయాపన మీవు గావింప కిడుదువే వీరుల కన్నంబు వేతనంబు


తే.

జ్ఞాతులు ప్రధానులును భృత్యజనులు దండ, నాథు లనురక్తు లై ప్రథనంబులందు
వీఁక భవదర్థమందు జీవితము నైన, విడువఁ దలకొని యుందురే వీరవర్య.

1914

తే.

శక్తుఁడు విచక్షణుండు యథోక్తకారి, పండితుఁడు బుద్ధినిధి జనపదభవుండు
ఘనుఁడు ప్రతిభానవంతుం డకల్మషుండు, నైనచారుండు సత్కృతుం డగునె యయ్య.

1915


వ.

మఱియుఁ బరపక్షంబులందు మంత్రియువరాజపురోహితసేనాపతిదౌవారికాం
తర్వంశికకారాగారాధికృతార్థసంచయకృత్కార్యాకార్యనియోజకప్రాడ్వివా
కసేనానాయకనగరాధ్యక్షకర్మాంతికసభ్యధర్మాధ్యక్షదండపాలదుర్గపాలరాష్ట్రాం
తపాలకాఖ్యలం గలయష్టాదశతీర్థంబులను స్వపక్షంబునందు మంత్రిపురోహిత
యువరాజులుం దక్కఁ దక్కినపంచదశతీర్థంబులను బరస్పరావిజ్ఞాతు లైనము
వ్వురు మువ్వురు చారకులచేత వేర్వేఱ నెఱుంగవలయు మఱియు వ్యపాస్త
పునరాగతు లయినశత్రువులు దుర్బలులఁ గా నెంచక వర్తింపవలయుఁ జార్వాకు
లగుబ్రాహ్మణుల సేవింపందగదు వారు బాలిశు లై పండితాభిమాను లై య
నర్థసంపాదనచతురు లై వేదమార్గవిపరీతబుద్ధు లై శుష్కతర్కవిషయబుద్ధి
నధిగమించి నిరర్థకంబు లైనపూర్వపక్షయుక్తులను సిద్ధాంతోక్తులఁ గా నుప
న్యసించుచుందు రట్టివారి నేర్పఱించి పరిత్యజింపవలయు నని పలికి వెండియు
ని ట్లనియె.

1916


సీ.

రవితేజ మత్కులోద్భవపూర్వనృపులచే ననిశంబు రక్షితం బైనదాని
ఘనవీరభటశతాంగకదంబగంధేభహయసంకులద్వార మైనదాని
నిజకర్మనిరతావనీసురక్షత్రియవైశ్యశూద్రులచేత వఱలుదాని
బహువిధకాంచనప్రాకారహర్మ్యవిమానవిరాజితం బైనదాని


తే.

ననవరత మార్యసేవితం బైనదాని, ధన్య మగుదాని మనయయోధ్యాపురమును
సత్యనామంబుగాఁ జేసి సంతతంబుఁ, బ్రీతిఁ బాలింపుదువె నీవు నీతిశీల.

1917


వ.

మఱియుఁ జైత్యశతజుష్టంబును సుఖోపనివిష్టజనకులంబును దేవస్థానపా
నీయశాలాతటాకోపశోభితంబును బ్రహృష్టనరనారీసంయుతంబును సమా
జోత్సవశోభితంబును సుకృష్టసీమాంతంబును బశుమంతంబును హింసాభి
వర్జితంబును నదీమాతృకంబును రమ్యంబును శ్వాపదపరివర్జితంబును సర్వభయ
పరిత్యక్తంబును రత్నసువర్ణరజతాద్యాకరసంపన్నంబును బాపనరవిహీనం
బును బూర్వరాజాభిరక్షితంబును నగుజనపదంబు సుఖం బున్నదె కృషి
వాణిజ్యగోరక్షజీవు లగువైశ్యాదులు సకలార్థసంపాదనంబున నభిమతు లై క్రయ
విక్రయాత్మకవాణిజ్యరతు లగుచు నుండ నాశ్రితలోకం బంతయు సుఖంబు

నొందుచున్నదె మఱియు నావణిజుల కిష్టప్రాపణానిష్టనివారణంబులచేత భర
ణంబుఁ గావింపుదువే యని పలికి వెండియు ని ట్లనియె.

1918


క.

రక్షకులు లేనివారల, రక్షింతువె నృపతి కాత్మరాష్ట్రనిలయులన్
రక్షింపవలయు నెప్పుడు, దక్షత నిజవంశయోగ్యధర్మముకలిమిన్.

1919


వ.

వత్సా నీవు స్వస్త్రీలయం దనుకూలుండ వై వారల కన్యపురుషసంభాషణాది
దోషంబులు లేకుండ రక్షించుచు వారలవచనంబు యథార్థబుద్ధి నాకర్ణింపక
వారితోడ రహస్యంబు లాడక వర్తింపుదువే యని పలికి వెండియు ని ట్లనియె.

1920


క.

అనఘా గజములు వొడమెడు, వనములఁ బ్రోతువె కరేణు వాజిగజములన్
మునుకొని రక్షింపుదువే, యనవరత ముపార్జనంబునందుఁ దనియకన్.

1921


ఉ.

ప్రొద్దున లేచి దివ్యమణిభూషణము ల్మెయినిండఁ దాల్చి బ
ల్గద్దియమీఁద నుండుచు జగజ్జనలోచనపూర్ణపర్వ మై
తద్దయు నీప్రజాతతికి దర్శన మిత్తువె వారు భక్తితో
బెద్దయుఁ బ్రొద్దు ని న్గొలిచి పిమ్మటఁ బోదురె నిత్య మిండ్లకున్.

1922


వ.

మఱియు విష్టిప్రభృతినీచకర్మకరులు నిర్విశంకు లై మహీపతియొద్దకుఁ బ్రత్య
క్షంబుగాఁ జనుదెంచిరేని యవజ్ఞాధిక్యంబు సంభవించు దర్శనాభావంబువలనఁ
గార్యహాని యగు నీయర్థంబునందు యథోచితసమయనిరీక్షణప్రదానంబు
ప్రయోజకం బై యుండు నట్లు గావించెదవే యని పలికి వెండియు.

1923


తే.

రాజనందన సర్వదుర్గములు రత్న, ధాన్యధనయంత్రసలిలాయుధములచేత
శిల్పికార్ముకపాణులచేత సంత, తంబును బరిపూర్ణంబు లై తనరు నయ్య.

1924


తే.

అనఘ విస్తార మగునె ధనాగమంబు, వ్యయము కడుఁ గొంచె మగునె యపాత్రభూత
జనుల కెంతయు నీదుకోశంబు చేర, కుండునే భృత్యులు సుఖు లై యున్నవారె.

1925


తే.

వీరవర్య యభ్యాగతవిప్రులందు, దేవతాపితృదేవతాతిథులయందు
సాధుజనులందు సఖులందు యోధులందు, ద్రవిణవినియోగ మొనరింతె ధర్మఫణితి.

1926


వ.

మఱియు విశుద్ధస్వభావుండును గరణత్రయశుద్ధియుక్తుండును సజ్జనుండు యదృ
చ్ఛచేతఁ జోరుం డని పట్టువడి శాస్త్రజ్ఞులచే నశోధితుం డై ధనలౌల్యంబున
వధింపంబడకుండునె మఱియుఁ గాలంబున సందృష్టుఁ డై గృహీతుం డై పృ
ష్టుం డై చౌర్యలబ్ధద్రవ్యసహితుం డైనచోరుండు ధనలోభంబున విముక్తుం
డు గాకుండుఁ గదా యని పలికి వెండియు.

1927


తే.

అనఘ ధనవంతునకు దరిద్రునకు నొకవి, వాదరూపసంకట మది వచ్చినపుడు

వీతధనలోభు లై పక్షపాత ముడిగి, సత్య మాడుదురే నీదుసచివు లనఘ.

1928


తే.

అనఘ మిథ్యాభిశస్తులయశ్రుకణము, లవని రాలిన నవియు భోగార్ధ ముర్వి
పాలనము సేయునరపతిపశుకళత్ర, మిత్రపుత్రుల హింసించు మిథ్య గాదు.

1929


సీ.

అల బాలవృద్ధవైద్యులను బూజింతువే తడయక వాఙ్మనోదానములను
గురువుల వృద్ధుల సురలఁ జైత్యంబుల నతిథుల సిద్ధార్థు లైనవిప్ర
వరులను మౌనులఁ బరికించి నిత్యంబు గురుతరభక్తి మ్రొక్కుదువె నీవు
ధర్మ మర్థంబుచే ధర్మంబుచే నర్థ మవి రెండు నిఖిలభోగాభికాంక్షఁ


తే.

గామమునఁ జాలఁ జేడ్పాటు గాక యుండఁ, గాతువే మఱి ధర్మార్థకామములను
వేఱు వేఱ విభాగించి వీరవర్య, కడమ పడకుండ సేవింతె కాలమందు.

1930


తే.

అఖిలశాస్త్రార్థకోవిదు లైనద్విజులు, పాడి దప్పక నిత్యంబుఁ బౌరజాన
పదులతోఁ గూడి నీకు శుభంబు గలుగు, నట్లు ప్రార్థింతురే నిత్య మనఘచరిత.

1931


వ.

మఱియు నాస్తిక్యంబును ననృతంబును గ్రోధంబును ననవధానత్వంబును దీర్ఘ
సూత్రత్వంబును సాధుజనాదర్శనంబును నాలస్యంబును బంచేంద్రియపరవశత్వం
బును బ్రయోజనంబుల నేకచింతనంబును విపరీతార్థబోధకులతోడ మంత్ర
ణంబును నిశ్చితార్థంబులం దనారంభంబును మంత్రంబు రక్షింపకుండు
టయు మంగళంబు లనుష్టింపకుండుటయు సర్వదిగవస్థితశత్రురాజుల నుద్దే
శించి యేకకాలంబున దండయాత్ర సలుపుటయు నివి పదునాల్గు రాజ
దోషంబులు మహీపతి వీని నన్నిటిని వర్జింపవలయు మఱియు లోభక్రోధా
లస్యాసత్యప్రమాదభీరుత్వాస్థిరత్వమూఢత్వానయావమంతృత్వరూపర
శవర్గంబును మృగయాద్యూతదివాస్వప్నపరివాదస్త్రీమదనృత్తగీతవాద్య
వృథాపర్యటనంబు లనియెడుదశకామజగుణంబులును సాపత్నవస్తుజస్త్రీజవా
గ్జాతాపరాధజంబు లనియెడుపంచవిధవైరంబులును నౌదకపార్వతవార్క్షైరిణ
ధాన్వనంబు లనియెడుపంచవిధదుర్గంబులును సామదానభేదదండంబు లని
యెడుచతురుపాయంబులును నౌరసతంతుసంబంధవంశక్రమాగతవ్యసనరక్షి
తు లనియెడుచతుర్విధమిత్రంబులును న్యాయధనార్జనరక్షణవర్ధనసత్పాత్ర
ప్రతిపత్తు లనెడుచతుర్విధరాజవృత్తంబులును స్వామ్యమాత్యరాష్ట్రదుర్గకోశ
బలసుహృత్సంజ్ఞలం గలపరస్పరోపకారిసప్తాంగంబులును నిజమైత్రసమా
శ్రితసుబంధుజకార్యసముద్భవభృత్యగృహీతనామకంబు లగుసప్త
విధపక్షంబులును శ్యేనసూచిగరుడశకటమకరక్రౌంచపద్మంబు లని
యెడుసప్తవిధప్రధానవ్యూహంబులును గృషివాణిజ్యదుర్గసేతుకుంజర
బంధనఖన్యాకరకరాదానశూన్యనివేశనంబు లనియెడునష్టవర్గంబులును
బైశున్యసాహసద్రోహేర్ష్యాసూయార్థదూషణవాక్పారుష్యదండపారుష్యం

బు లనియెడిక్రోధజనితాష్టగుణంబులును నసాధ్యవస్తువులయందు సముద్యమం
బును సాధ్యవస్తువులయం దసముద్యమంబును శక్యవస్తువిషయంబునం దకాల
సముద్యమంబు ననియెడివ్యసనత్రయంబును ధర్మార్థకామంబు లనియెడిత్రివ
ర్గంబును బ్రభుత్వమంత్రోత్సాహనామకశక్తిత్రయంబును శత్రుక్షయస్థానవృద్ధు
లనియెడిత్రివర్గంబును ద్రయీవార్తాదండనీతిసంజ్ఞకవిద్యాత్రయంబును బ్రజా
పాలనమూలం బైనయింద్రియజయంబును సంధివిగ్రహయానాసనద్వైధీ
భావసమాశ్రయసంజ్ఞకం బైనషాడ్గుణ్యంబును హుతాశనజలవ్యాధి
దుర్భిక్షమరణంబు లనియెడిపంచవిధదైవవ్యసనంబులును నాయుక్తకచోర
పరరాజవల్లభపృథివీపతిలోభంబులవలన నయ్యెడుపంచవిధమానుషవ్యసనం
బులును నలబ్ధవేతనావమానితకోపితభీషితంబు లగుశత్రుసంబంధివర్గంబుల
నభిమతవస్తుప్రదానంబున భేదించుటయును బాలవృద్ధదీర్ఘరోగిజ్ఞాతిబహిష్కృ
తభీరుకభీరుజనకలుబ్ధలుబ్ధజనకవిరక్తప్రకృతికవిషయాసక్తానేకచిత్తమంత్ర
దేవబ్రాహ్మణనిందకదైవోపహతకదైవచింతకదుర్భిక్షవ్యసనోపేతబలవ్యసన
సంకులాదేశస్థాకాలయుక్తబహురిపుసత్యధర్మవ్యపేతసంజ్ఞకు లనుసంధి కయో
గ్యులై కేవలనిగ్రహార్హు లగుపురుషులను రాజ్యాపహరణంబును భార్యావహర
ణంబును స్థానాపహరణంబును దేశాపహరణంబును జ్ఞాతిజనాపహరణంబును ధ
నాపహరణంబును మదంబును మానంబును విషయపారవశ్యంబును జ్ఞానవిఘా
తంబును నర్థవిఘాతంబును శక్తివిఘాతంబును ధర్మవిఘాతంబును దేవతాతిరస్క
రణంబును మిత్రతద్ధనావమానంబులును బంధువినాశనంబును లోకానుగ్రహరా
హిత్యంబును స్వామ్యమాత్యాదిమండలదూషణంబును స్వాభిమతవిషయాభిలా
షిత్వంబు ననియెడువింశతివిగ్రహకారణంబులను నమాత్యరాష్ట్రదుర్గకోశ
దండంబు లనియెడుపంచవిధప్రకృతులను బురోవర్తు లైనశత్రుమిత్రశత్రుమిత్ర
మిత్రమిత్రశత్రుమిత్రమిత్రు లనియెడువారేవురును బృష్టభాగస్థు లైనపార్ష్ణిగ్రా
హాక్రందపార్ష్ణిగ్రాహాసారాక్రందాసారు లనియెడువారు నలువురును మధ్యవర్తి
యగువిజిగీషుండును పార్శ్వభాగవర్తి యగుమధ్యముండును వీరల కందఱకు
బహిస్స్థానావస్థితుం డైనవాఁ డుదాసీనుండు ననునీద్వాదశరాజాత్మకమండలం
బును విగృహ్యయానసంధాయయానసంభూయయానప్రసంగతోయానో
పేక్ష్యయానంబు లనియెడుపంచవిధయానంబులను యానాసనాత్మకం బైన
సంధిని ద్వైధీభావసమాశ్రయాత్మకం బైనవిగ్రహంబును వీని నన్నింటిని నీతి
శాస్త్రోక్తప్రకారంబున నెఱింగి హేయంబులఁ బరిత్యజించి యుపాయంబులఁ
బరిగ్రహింతువే మఱియుఁ బెక్కండ్రు మంత్రులం గూడి కావించినమంత్రం
బునకు భిన్నత్వసంభవంబువలన నైకమత్యాభావంబువలనను సార్థక్యంబు గలు

గదు గావున శాస్త్రోక్తమంత్రిలక్షణలక్షితు లగుమంత్రుల నల్వురం గాని
మువ్వురం గాని గూడి వారియందఱలోను నొక్కొకరితోను రహస్యంబుగా
మంత్రంబు గావింపుదువే యని పలికి వెండియు ని ట్లనియె.

1932


సీ.

సవనతంత్రాద్యనుష్ఠానంబుచేత వేదంబులు సఫలీకృతంబు లగునె
దానభోగంబుల ధనధాన్యరత్నాదికంబులు సఫలీకృతంబు లగునె
శాస్త్రసంశ్రవణంబు సఫలీకృతం బగునే శీలసద్వృత్తనియతివలన
దాక్షిణ్యరతి సుతోత్పాదనంబునఁ గళత్రంబులు సఫలీకృతంబు లగునె


తే.

రవికులోత్తమ నీ వొక్కఁడవె భుజింప, కిష్టమృష్టాన్నమును బరితుష్టి గాఁగ
మానితాచారు లాశంసమాను లైన, మిత్రులకుఁ బెట్టుదువె నీవు పాత్ర మెఱిఁగి.

1933


క.

ధర్మార్థకామయుక్తము, నిర్మలసువివేకదంబు నిత్యము శుభమున్
శర్మద మగునాచెప్పిన, ధర్మము మది నిలుపుదయ్య దశరథతనయా.

1934


తే.

ఎయ్యది శుభంబు సుజనుల కిష్ట మెద్ది, తవిలి మనతండ్రి తాత ముత్తాత లెల్ల
నర్థి నెద్దాని సేవించి రనుదినంబు, నట్టివృత్తిని సేవింతె యనఘ నీవు.

1935


తే.

యుక్తదండుఁ డై ధర్మసంయుక్తబుద్ధి, నెవ్వఁ డిల యేలు నట్టిమహీవరుండు
పుణ్యజనవుంగవులచేతఁ బొగడు వడసి, యైహికాముష్మికసుఖంబు లనుభవించు.

1936


వ.

అని యివ్విధంబున రాజధర్మంబు లుపదేశించు చున్నయన్నం జూచి భరతుం
డి ట్లనియె.

1937


క.

కూర్మి మెఱయ మీ రిప్పుడు, నిర్మలమతిఁ జెప్పినట్టి నృపధర్మంబుల్
ధార్మికులకుఁ గాక రహిన్, ధర్మవిహీనుండ నైన నా కేమిటికిన్.

1938

భరతుఁడు రామునికి దశరథమరణం బెఱింగించుట

సీ.

అనఘాత్మ మనవంశమున జ్యేష్ఠునకు రాజ్య మవలికనిష్ఠుల కతనిసేవ
యుచితధర్మం బగుచుండ నీవు భరింపఁదగినసామ్రాజ్య మధర్మయుక్తి
నా కిచ్చినందుకు నన్నుఁ బాత్రముఁ జేసి యీఘోరవనమున కిట్లు నీకు
రాఁ జెల్లునే దేవరాజ్యపదం బైన నీకుఁ గానిది దాల్ప నాకు వశమె


తే.

దేవ మా కెల్ల నధిపతి నీవు నన్నుఁ, గరుణఁ జూచి యయోధ్యానగరికి రమ్ము
రాజసన్నిధిఁ బూజ్యసామ్రాజ్యపట్ట, భద్రుఁడవు గమ్ము నృపసభాభవనమందు.

1939


తే.

అధిప ధర్మార్థసహిత మైనట్టిదేవ, లోకసంపాదనీయకాస్తోకవృత్త
మెవ్వనికిఁ గల్గు నట్టిమహీశుఁ దుర్వి, మానుషుండైన దేవత్వమహిమఁ గాంచు.

1940


క.

లక్ష్మణుఁడు సీతయును వెంటరాఁగ నీవు, ప్రోలు వెడలినమాత్రాన భూవరుండు
పురికి నావచ్చుకంటెము న్నరిగె దివికిఁ, ద్వద్వియోగాగ్నిహేతిసంతప్తుఁ డగుచు.

1941


మ.

నినుఁ జింతించుచు నిన్నె పేరుకొనుచు న్నయందుఁ జిత్తంబుఁ జే
ర్చి నినుం గూర్చి బహుప్రకారముల విక్షేపించుచు న్నీముఖా
బ్జనిరీక్షాస్పృహుఁ డై భవద్విరహసంజాతాగ్నిచేఁ గ్రాఁగి నీ

జనకుం డెంతయు నస్తమించె జననీసంఘంబు శోకింపఁగన్.

1942


చ.

ప్రియతనయుండు ప్రీతి నిడుపిండము దత్పితృలోకమందు న
క్షయ మగు నంచు శాస్త్రములు చాటి వచించెను నీవు తండ్రికిం
బ్రియుఁడవు గాన నాయనకుఁ బ్రీతిగఁ బిండ మొసంగు మిప్పుడే
రయమున మున్నె చేసితిని లక్ష్మణసోదరసంయుతంబుగన్.

1943

రాముఁడు పితృమరణమును విని దుఃఖించుట

క.

అని యీగతిఁ బితృమరణము, వినిపించిన నతనిమాట వీనుల కనిలో
దనుజరిపూత్సృష్టం బగు, ఘనదారుణవజ్రహేతిగతి సోఁకుటయున్.

1944


క.

పరశునికృత్తం బగుసుర, తరువుకరణి రాఘవుండు దద్దయు శోకం
బెరియఁగఁ బరవశుఁ డై య, త్తఱి ధరణిం బడియెఁ జాల ధైర్యము వాయన్.

1945


మ.

విపులాధీశునిఁ గూర్చి యీపగిది నిర్వేదించుచుం గూలఘా
తపరిశ్రాంతసుషుప్తదంతికరణి న్ధాత్రిస్థలి న్వ్రాలి యు
న్నపృథూరస్కుని రాముఁ గాంచి వెస నంతన్ భ్రాత లుద్విగ్ను లై
యుపచారంబుల సేద దేర్చి రపు డయ్యుర్వీసుతాయుక్తు లై.

1946


ఆ.

అంతఁ గొంతవడికి నమ్మహాపురుషుండు, తెలివి నొంది కనులజలము లొలుకఁ
దండ్రిమరణమునకుఁ దలఁకి దుఃఖించుచు, నిట్టు లనియెఁ గైకపట్టితోడ.

1947


ఉ.

భూమివరుండు సద్గతికిఁ బోయినవెన్క నయోధ్యయందు నే
నేమి యొనర్చువాఁడ జగతీశ్వరపాలిత మైనయప్పురం
బీమహి నింక నేపురుషుఁ డేలఁగఁ జాలు దురంత మీయగా
ధామితశోకరూపమకరాలయ మెట్లు తరింతుఁ దమ్ముఁడా.

1948


ఉ.

ఆతతమద్వియోగజనితార్తిఁ దపించుచు మృత్యు వొంది నా
చేత నసంస్కృతుం డగుచు శీఘ్రమున న్దివి కేగెఁ గాన వి
ఖ్యాతగుణాబ్ధికి న్దశరథావనిభర్తకుఁ బట్టి నై సుదు
ర్జాతుఁడ నైననేను వరుస న్జనియించుట వ్యర్థమే కదా.

1949


క.

శ్రుతిచోదితగతి నీచే, క్షితినాథుఁడు మున్నె ప్రేతకృత్యంబుల స
త్కృతుఁ డయ్యెఁ గాన నీ విపు, డతులితచరితార్థకుండ వైతివి గాదే.

1950


చ.

ఇనకులనాయకుండు దివి కేగినవెన్కఁ గృతవ్రతుండ నై
నననుఁ బురంబునం దిఁక ఘనంబుగ నెవ్వఁడు ప్రోచువాఁడు పా
వనగతి సన్నివృత్తవనవాసుఁడ నయ్యును గ్రమ్మఱం బురం
బునకుఁ జనంగ నోపఁ గృతపుణ్య యనాయక మట్లు గావునన్.

1951


క.

ననుఁ జూచి సువృత్తుం డం, చు నృపతి యేయేనుడుగులు శ్రుతిసుఖములు గా
మును పలుకు నట్టిమాటలు, వినుతగుణా యింక నెట్లు విన నగు నాకున్.

1952


చ.

అని యిటు రామభద్రుఁడు మహావ్యసనంబునఁ గైకపట్టితో

నని మగువా భవచ్ఛ్వశురుఁ డంతము నొందెఁ గదా యటంచుఁ ద
జ్జనకజతోడ నాడి యనుజా పితృహీనుఁడ వైతె యంచుఁ ద
మ్మునిఁ గని పల్కి నెవ్వగలు ముంపఁగ నశ్రులు నించెఁ గ్రమ్మఱన్.

1953


ఉ.

అన్నతెఱంగుఁ జూచి భరతాదులు శోకపరీతచిత్తు లై
కన్నుల బాష్పము ల్గురియఁగా విలపించుచు సాంత్వవాక్యసం
పన్నత నాదరించి నరపాలున కౌర్ధ్విక మాచరింప కా
పన్నత నొంది కుంద నిటు పాడియె రాఘవ యంచుఁ బల్కినన్.

1954


తే.

జానకియు స్వర్గగతుఁ డైనశ్వశురుని విని, కనుల నశ్రులు గార రోదనముఁ జేసె
నామహాదేవి నూరార్చి రాముఁ డపుడు, శోకమునఁ గుందుసౌమిత్రిఁ జూచి పలికె.

1955


క.

విదితాత్ముం డగుతండ్రికి, నుదకక్రియ సలుపవలయు నుచితంబుగ నిం
గుదిపిణ్యాకము చీరయు, కొదువపడక యుండ వేగ గొని తె మ్మనఘా.

1956

రాముఁడు దశరథునకు బిండప్రదానంబు సేయుట

క.

జనకకుమారిం దోడ్కొని, యనఘా మందాకినీమహానదికడకుం
జను మీవు వెంట నేనును, జనుదెంచెదఁ దండ్రి కర్థిజల మొసఁగుటకున్.

1957


వ.

అని పలుకునాసమయంబున విదితాత్ముండును మహామతియు మృదుండును
శాంతుండును దాంతుండును భృశానురక్తుండును దృఢభక్తిమంతుండును
నిత్యానుగుండు నగుసుమంత్రుండు రాజకుమారులం గూడి రామభద్రు నాశ్వా
సించి తదీయకరం బవలంబించి మందాకినీనదికడకుం దోడ్కొని చనియె నప్పు
డక్కుమారచతుష్టయంబు సదాపుష్పితకాననం బైనమందాకినీనదీతీరంబునకుం
జని యకర్దమం బైనయవతరణ, ప్రదేశంబున కతిప్రయత్నంబున డిగ్గి తదీయ
పుణ్యసలిలంబులం గ్రుంకె నంత రాముండు జలంబులు దోయిట సంగ్ర
హించి యామ్యదిశాభిముఖుం డై రోదనంబు సేయుచు దశరథు నుద్దేశించి.

1958


తే.

క్షితివరోత్తమ పితృలోకగతుఁడ వైన, నీకు మద్దత్త మైనయీలోకపావ
నోదకం బక్షయం బయి యొప్పుఁగాక, యనుచు నంజలి జలవిసర్జన మొనర్చె.

1959


వ.

ఇట్లు సలిలక్రియఁ గావించి దర్భసంస్తరంబునందు బదరీమిశ్రితం బైనయింగుదీ
పిణ్యాకం బిడి వెండియు దశరథు నుద్దేశించి దుఃఖపూర్వకంబుగా ని ట్లనియె.

1960


ఆ.

పృథివిలోనఁ బురుషుఁ డేయన్నము భుజించు, నతనిదేవతలు తదన్ను లగుదు
రధిప నాయొసంగినట్టియీ పిణ్యాక, మింపుతో భుజింపు మిపుడు నీవు.

1961

భరతసైనికు లందఱు రామునిం జూడ వచ్చుట

వ.

అని పలికి విధిప్ర, కారంబునఁ బిండదానంబుఁ గావించి యారఘువల్లభుండు తమ్ము
లుం దానును సీతాసమేతంబుగా వెండియుఁ బూర్వమార్గంబున నప్పర్వతం
బారోహించి పర్ణకుటీరద్వారంబు డగ్గఱి నిజబాహుదండంబులు సాఁచి భరత
లక్ష్మణులం గౌఁగిలించికొని దీర్ఘస్వరంబున రోదనంబుఁ జేసిన వారును సీతా

సమేతంబుగాఁ, బితృమరణ, భ్రాతృప్రవ్రాజనసంజాతశోకవిశేషంబున దుఃఖించి
రంత నయ్యాక్రందనశబ్దంబు గిరిగుహాముఖంబులం బ్రతిధ్వనులు సెలంగఁ దు
ములం బై యొప్పె నప్పు డమ్మహాశబ్దంబు విని భరతసైనికులు భయోద్విగ్నులై
భరతుండు రామునిం జేరె వారిద యీరోదనధ్వని యని నివాసంబులు
విడిచి వారి కభిముఖంబుగా నచిరప్రోషితుం డైనరామునిఁ జిరప్రోషితునిం గాఁ
దలంచుచు ద్రష్టుకాము లై రథహయగజశకటంబు లెక్కి సత్వరంబుగం జనిరి
కొందఱు తేవనంబునఁ దదీయాశ్రమంబున కరిగి రాసమయంబున ఖురనేమి
సమాహతం బైనయయ్యరణ్యభూమి యభ్రసమాగమంబున నాకాశముం
బోలెఁ దుములంబుగా మ్రోసె నాదారుణధ్వని విని విత్రస్తంబు లై వనగజం
బులు గరేణుపరివారితంబు లై మదగంధంబున దెసల వాసించుచు నొండువనంబు
నకుం జనియె సింహవ్యాఘ్రవరాహభల్లూకమహిషసర్పవానరగోకర్ణ
గవయపృషతాదిమృగంబులును విత్రాసితంబు లయ్యె రథాంగహంసకారండవ
బకక్రౌంచశుకపికశారికాదిపతత్రిగణంబులు దీనారావంబులు సేయుచుఁ బఱ
వందొడంగె నప్పుడు విత్రస్తపక్షిసంకులం బైననభంబును విత్రస్తజనసంకులం
బైనభూతలంబు నుభయంబు నేకప్రకారంబునం బొల్చి యుండె నంత సర్వ
జనంబులు పురుషవ్యాఘ్రుండు నకల్మషుండును స్థండిలాసీనుండును యశస్వియు
నగురామునిం జూచి కైకేయిని మంథరను నిందించుచు బాష్పపూర్ణముఖు లై
శోకించుచుండ వారిం జూచి ధర్మజ్ఞుం డైనరాముండు తల్లిదండ్రులంబోలె సంభా
వించి యథార్హంబుగాఁ బ్రణామాలింగనవచోగౌరవాదుల సంప్రీతులం జేసిన
వారు యథార్హస్థానంబుల నధివసించి పెక్కుచందంబుల నతనిదురవస్థం జూచి
యాక్రందించుచుండఁ దదీయశబ్దంబు భూనభోంతరంబు నిండి మహీధరగుహా
వివరంబులు మాఱు మ్రోయ మృదంగస్వనంబుభంగి జెలంగెఁ దదనంతరంబ.

1962


క.

జనపతిభార్యల నందఱ, మునివిభుఁడు వసిష్ఠుఁ డపుడు ము న్నిడుకొని గ్ర
క్కున నద్దేశంబునకుం, జనియె న్రాఘవునిఁ జూచు సంభ్రమ మెసఁగన్.

1963


తే.

అమ్మహారాజపత్ను లి ట్లరిగి జనక, కన్యకాస్నానపుణ్యోదకయును రామ
లక్ష్మణనిషేవితయు నై సులక్ష్య మగుచుఁ, గ్రాలుమందాకినీనదిఁ గాంచి రచట.

1964


క.

అప్పుడు కౌసల్యయుఁ గను, ఱెప్పల బాష్పంబు లాని ప్రియతనయునిపై
నొప్పినయనురాగము తనుఁ, గప్పికొనఁగ నలసుమిత్రఁ గని యి ట్లనియెన్.

1965


తే.

అకట నిర్విషయీకృతు లైనరామ, లక్ష్మణు లనాథు లై త్రికాలంబులందు
స్నాన మొనరించుటకు నజస్రంబు డిగ్గు, నట్టితీర్థదేశం బిది యబల కంటె.

1966


క.

అతివ యతంద్రితుఁ డై నీ, సుతుఁ డీతీర్థమున నుండి సురుచిరముగ మ
త్సుతునకు నర్పించుటకై, సతతము సలిలము గ్రహించి చనుచుండుఁ గదా.

1967


సీ.

అతివ నీసుతుఁడు జలాహరణాదిజఘన్యకర్మం బిట్లు కడఁకతోడఁ

జేసినవాఁ డయ్యు శిష్టజనంబుచే నిల గర్హితుఁడు గాఁ డ దెట్టు లన్న
నన్నకుఁ గైంకర్య మర్థిఁ జేసిన నది యంతయు గుణయుక్త మనిరి గాదె
భగతుఁ డంజలిఁ జేసి ప్రార్థనఁ గావింప రాముండు ప్రీతిసామ్రాజ్యపదవిఁ


తే.

జేకొనియెనేని ఘనసుఖోచితుఁడు నీకు, మారుఁ డతిదుఃఖశోకవిస్తార మయిన
యీనికృష్టకర్మంబు తా నిందె విడిచి, యిపుడె సుఖియించు గృహమున నింపు మెఱయ.

1968

కౌసల్య యింగుదీపిణ్యాకపిండములను జూచి దుఃఖించుట

వ.

అని యిట్లు లక్ష్మణునిసుహృద్భావంబు బహుప్రకారంబుల వక్కాణించుచుఁ
దత్సమీపంబున దక్షిణాగ్రదర్భసంస్తరంబునందుఁ బితృప్రీత్యర్థంబుగా రాము
నిచేత విన్యస్తం బైనయింగుదీపిణ్యాకంబుఁ జూచి యద్దేవి వెండియు నంతః
పురకాంతల నవలోకించి యి ట్లనియె.

1969


సీ.

ఇనకులదీపకుం డిక్ష్వాకునాయకుం డతిసుఖోచితుఁడు మహాత్ముఁ డమర
సముఁ డైనదశరథక్ష్మాభర్త కిచట మత్సూనునిచే దత్త మైనదాని
నింగుదీపిణ్యాక మిది గనుఁగొంటిరే భుక్తభోగుం డైన భూవరుండు
చతురంతమేదినీచక్రంబు గుడుచువాఁ డిటువంటిభోజనం బెటు భుజించె


తే.

దాశరథిచేతఁ దండ్రికి దత్త మైన, దీని వీక్షించినంత నామానసంబు
వేయివ్రయ్య లైపోవదు వితతవజ్ర, సారమయము గాఁబోలు నిస్సంశయముగ.

1970


వ.

అని యివ్విధంబున నార్త యై విలపించుచున్నకౌసల్య నూరార్చి సపత్ను
లద్దేవిం దోడ్కొని శీఘ్రంబునం జని స్వర్గచ్యుతుం డైనదేవేంద్రునిచందంబున
సర్వభోగపరిత్యక్తుం డై స్థండిలంబుసం గూర్చున్నరామునిం జూచి శోకకర్శితు
లయి కన్నీరు నించుచు సుస్వరంబుగా రోదనంబు చేసి రప్పుడు రాముండు
తల్లులం జూచి శీఘ్రంబున దర్భాసనంబున నుండి లేచి తదీయచరణంబులకుఁ
బ్రణామంబుఁ గావించిన వారు సుఖస్పర్శంబులును మృద్వంగుళీతలంబులు
నైనకరంబుల నమ్మహాత్మునినమ్మేనిరజంబు పరిమార్జించి రంత లక్ష్మణుం
డునుం బ్రణమిల్లిన నక్కుమారుని రామునిం బోలె నాదరించిరి పదంపడి
వైదేహి భక్తిపూర్వకంబుగా నమస్కరించి బాష్పపూర్ణముఖి యయి దుఃఖిం
చుచు మరుచ్చలితవల్లియుం బోలె నడలుచు నుపవాసకృశాంగి యై తూలుచు
దైన్యంబుతోఁ బురోభాగంబున నుండె నప్పు డద్దేవిం జూచి కౌసల్య బద్ధ
స్నేహ యై తల్లి కూఁతునిం బలె గవుంగిలించి వాత్సల్యంబు నెఱపుచు
ని ట్లనియె.

1971

కౌసల్య సీతాదేవినిం జూచి దుఃఖించుట

క.

జనకునికూఁతురు దశరథ, జనపతికోడలును రామచంద్రునిసతి భూ

తనయ యగుసీత కిటు విధి, వని నిడుమలు గుడువు మనుచు వ్రాసె నదయుఁ డై.

1972


మ.

దిననాథాతపతప్తపంకజమురీతి న్వారిదచ్ఛన్నచం
ద్రునిభంగి న్విరసోత్ఫలంబుగతి రేణుధ్వస్తభర్మంబుచా
డ్పున వీతద్యుతి నున్నసీతవదనంబుం జూచుచో నన్నుఁ ద
ద్ఘనశోకానల మాశ్రయంబుకరణిం గాల్పం దొడంగె న్రహిన్.

1973


వ.

అని బహుప్రకారంబుల దుఃఖించుచున్నతల్లి ననునయించి రాముండు సురా
ధిపుం డగుశక్రుండు బృహస్పతికిం బోలె హుతాశనసమప్రభుం డైనవసిష్ఠు
నకుఁ బ్రణామం బాచరించి యమ్మునిపుంగవునితోఁ గూడ దర్భాసనంబున
నాసీనుం డయ్యెఁ దదనంతరంబ భరతుండు కృతాంజలిపుటుం డై సామంత
పురోహితసేనానాథసహితంబుగా నిజతనుచ్చాయావిశేషంబున నక్కాననంబు
నకు గారుత్మతచ్చాయ నొసంగుచుఁ బ్రజాపతి కభిముఖుం డై కూర్చున్న
పురుహూతుండుం బోలె మునివేషధరుం డైనరామున కభిముఖుం డై కూ
ర్చుండె నప్పు డచ్చటివా రందఱు రామునకుఁ బ్రణమిల్లి సత్కారపూర్వ
కంబుగా భరతుం డతనితో నేమి సంభాషించునో యని తద్వాక్యశ్రవణకుతూ
హలంబున యథార్హస్థానంబుల నాసీను లై యుండి రిట్లు గూడుకొనిన సత్య
ధృతి యగురాముండును మహాత్ముం డగులక్ష్మణుండును ధార్మికుం డైనభర
తుండును సుహృత్సమేతు లై యధ్వరవేదియందు సదస్యులతోడం గూడిన
త్రేతాగ్నులచందంబునం దేజరిల్లుచుండి రంతఁ గొంతసేపునకు రాముండు
గురువత్సలుం డగుభరతునింజూచి ప్రియవచనంబుల నాశ్వాసించి లక్ష్మణసహి
తంబుగా ని ట్లనియె.

1974

రాముండు భరతునిజటాధారణవనాగమనకారణం బడుగుట

చ.

నిరుపమరాజ్యము న్విడిచి నిత్యముఁ బార్థివరక్ష్య మైనమ
త్పురమును బాడు చేసి నరపుంగవ తాపసవేషధారి వై
యఱమర లేక పక్షులకు నైన గమింపఁగ రానియట్టియీ
గురుతరచిత్రకూటమునకుం జనుదెంచితి వేల చెప్పుమా.

1975


క.

నా విని భరతుం డాసీ, తావల్లభుచరణములకు దండప్రణతు
ల్గావించి మధురభాషా, ప్రావీణ్యము దోఁపఁ బలికెఁ బ్రాంజలి యగుచున్.

1976


క.

నరపతి నినుఁ బాసి సుదు, ష్కర మగుకర్మం బొనర్చి కడపట సుతశో
కరసాబ్ధిమగ్నుఁ డై య, ప్పురుష రుఁడు మేను విడిచి పోయెన్ దివికిన్.

1977


క.

రయమున మాయమ యగుకై, కయిచే వినియుక్తుఁ డగుచు క్ష్మానాయకుఁ డ
ట్లు యశోహర మగునీదు, ర్నయకార్యం బాచరించె రాజకులేశా.

1978


క.

లోకనుత విధవ యగు చ, క్కైకయి బహుదుఃఖశోకకర్శిత యై య
స్తోకతరరాజ్యపదమును, గైకొనక దురంతనిరయగతికిఁ జనియెడిన్.

1979

భరతుఁడు రాముని రాజ్యం బంగీకరింపు మని ప్రార్థించుట

క.

తడయక యిప్పుడె శక్రుని, వడువున సామ్రాజ్యమందు వారక యభిషి
క్తుఁడ వై దాసుఁడ నగునా, కిడుము మహానుగ్రహం బహీనగుణాఢ్యా.

1980


క.

అనఘా పురజనులు మహీ, జనులు సఖులు హితులు మాతృసంఘ మిచటికిం
జనుదెంచియున్నవారలు, జనవర్య యనుగ్రహం బొసంగుము కరుణన్.

1981


క.

వ్యక్తంబు నానుపూర్వీ, యుక్తము నీ వనుభవింప నుచితము నీకే
యుక్తం బగురాజ్యం బను, రక్తిం జేకొని హితాప్తులం బ్రోవు మిఁకన్.

1982


క.

భూరికళానిధి యగుశశి, చే రాకారజనిభంగి శిష్టాచారో
దారవిచారుఁడ వగునీ, చే రసనాథవతి యగుచుఁ జెలఁగెడుఁగాతన్.

1983


తే.

అధిప యీయిష్టసచివసమన్వితముగ, నర్థి నాచేత శిరముచే యాచితుండ
వగుచు శిష్యుఁడ దాసుఁడ ననుజుఁడ నగు, నాకు సమ్యక్ప్రసాదం బొనర్పు మిపుడు.

1984


క.

విమలాత్మ పూజితము పి, త్ర్యము శాశ్వతము న్సమాహితము నిత్యంబున్
సుమహితచరితం బీప్రకృ, తిమండలము గడవఁ దగదు దీనిని నీకున్.

1985


క.

అని యిట్లు పలికి యశ్రులు, కనుఁగొనలం గ్రమ్ముదేఱఁగాఁ గైకేయీ
తనయుఁడు గ్రమ్మఱుఁ దత్పద, వనజంబులమీఁద భక్తి వ్రాలెం బెలుచన్.

1986


తే.

అంత రఘుపుంగవుఁడు దుఃఖితాత్ముఁ డగుచుస సమదదంతావళముభంగి సారె సారె
కూరుపులు వుచ్చుచుఁ గలంగియున్నభరతు, నట్టె కౌఁగిటఁ గదియించి యిట్టు లనియె.

1987


మ.

అనఘాత్మా చరితవ్రతుండు నిజవంశాచారసంరక్షణుం
డును దేజస్వి కులీనుఁ డంచితగుణుండు న్సత్వసంపన్నుఁడు
న్వినయోదారుఁడు రాజధర్మవిదుఁ డౌ నీయట్టివాఁ డివ్విధం
బున పాపంబును రాజ్యకారణమునం బోధింపఁగాఁ జెల్లునే.

1988


క.

మానుగ నీయం దించుక, యైనను దోషంబుఁ గాన మన్వయనయము
న్మాని భవదంబ ని ట్ల,జ్ఞానంబున దూఱ నగునె సౌజన్యనిధీ.

1989

రాముఁడు భరతునితో దశరథాజ్ఞకు లోబడవలయు ననుట

వ.

వత్సా గురువు లగువారికి పుత్రకళత్రశిష్యదాసాదులయందు స్వచ్ఛందకర
ణంబు విధింపబడియున్నది లోకంబులయందు సాధువులచేత గురువులకు
నియామ్యులుగాఁ బుత్రకళత్రశిష్యాదులు పరిగణితు లైరి కావున మనము దశర
థునకు నియామ్యుల మని నీ వెఱింగికొనుము చీరకృష్ణాజినాంబరుండ నై వనం
బున నుండను బట్టాభిషిక్తుండ నై పురంబున నుండను నా కమ్మహానుభావుండే

నియామకుం డతనివాక్యం బలంఘనీయంబు.

1990


తే.

ధర్మభృచ్ఛ్రేష్ఠ విను మెంత దండ్రియందు, లోకసత్కృత మయినయస్తోకగౌర
వం బనుష్ఠించు నంతయు వరుసతోడ, నంబయందు ననుష్టించు టది హితంబు.

1991


ఆ.

అట్టిధర్మశీలు రగుతలిదండ్రుల, చేత రామ వని వసింపు మనుచుఁ
బలుకఁబడిన నేను బదపడి వేఱొక్క, చంద మెవ్విధమున సలుపువాఁడ.

1992


సీ.

అనఘాత్మ విను మయోధ్యాపట్టణమున నేకచ్ఛత్ర మైనజగత్ప్రభుత్వ
మింపారఁగాఁ గైకయీకుమారుం డుండుఁ గాక రాముండు వల్కలజటాజి
నంబులు దాల్చి ఘోరం బగుదండకాకాననంబున నుండుఁ గాక యనుచు
భూమీశుఁ డిట్లు సభామధ్య మందు విభాగించి పలికి సుపర్వగతికి


తే.

నరిగె నాయన గురుఁడు సత్యప్రతిజ్ఞుఁ, డధివిభుఁడు తండ్రి ధర్మాత్ముఁ డట్లు గాన
నతనిచే దత్త మయిన మహార్హభాగ, మనుభవింపుము తగ సందియంబు వదలి.

1993


ఉ.

ఏనును వల్కలాజినము లెంతయుఁ దాల్చి చతుర్దశాబ్దము
ల్పూనికి మౌని నై గహనభూమి నివాస మొనర్చి తండ్రిచే
మానుగ దత్త మైనయసమానయశస్కరభాగ మాత్మలో
నూనినవేడ్కతోఁ గుడుచుచుండెద మూలఫలాశనుండ నై.

1994


వ.

మఱియు దశరథుండు ధర్మాత్ముఁడును సత్యసంధుండును మహేంద్రసముండును
లోకసత్కృతుండును గావున నతనిచేత నేభాగంబు దత్తం బయ్యె నదియె
యమృతం బని తలంచెదం గాని తద్వ్యతిరిక్తంబుగా సంప్రాప్తం బైనసర్వలోకే
శ్వరత్వం బైనఁ దుచ్ఛంబుగాఁ దలంచెద నని యివ్విధంబున రాముండు పలుకు
చుండ సుహృద్గణపరివృతు లయి శోకించుచున్నయప్పురుషసింహుల కవ్విభా
వరి యొక్కచందంబున నతిక్రమించె నంతఁ బ్రభాతకాలంబున నారాజకుమా
రులు సుహృత్సమేతంబుగా మందాకినీనదికిం జని యందు సుస్నాతు లై కాల్య
కరణీయంబులు దీర్చి క్రమ్మఱ పర్ణశాలకుం జని రామునిం బరివేష్టించి
యందఱు సుఖాసీను లయి యూరకుండి రంతఁ గొంతసేపునకు సుహృన్మధ్యం
బున భరతుండు రామభద్రు నవలోకించి యెల్లవారును విన ని ట్లనియె.

1995

భరతుఁడు నానావిధంబుల రాముని రాజ్యం బంగీకరింపు మని వేఁడుట

చ.

అనఘచరిత్ర మజ్జనని యానరనాథు బలాత్కరించి గై
కొని వెస నా కొసంగినయకుంఠితరాజ్యము ధర్మయుక్తి నా
యనువున నీ కొసంగెద మహాత్మ పరిగ్రహణం బొనర్చి నా

మనము వికాస మొందఁగ నమాత్యుల భృత్యుల నేలు మిత్తఱిన్.

1996


తే.

ఘనసమయనూతనాంబువేగంబుచేత, సేతువును బోలె నీసుప్రసిద్ధ మైన
భరతఖండంబు నీకంటెఁ బరునిచేత, శీర్ణ మగుఁ గాక రక్షణోదీర్ణ మగునె.

1997


ఆ.

హరిగతిని ఖరంబు గరుడగతిని గాక, మనుసరింప లేనియట్లు పరమ
ధర్మమూర్తి వగుచుఁ దనరెడునీగతి, ననుసరింపఁజాల నధిప యేను.

1998


తే.

చెలఁగి యన్యులచేతఁ బోషింపఁబడెడు, వానిజీవంబు కడు సుజీవంబు కాదు
చెలువు మీఱంగఁ బరుల రక్షించునట్టి, వానిజీవంబె కడు సుజీవం బధీశ.

1999


వ.

మహాత్మా పురుషునిచేత రోపితం బైనవృక్షంబు పరివర్థితం బై యంతకంతకు
వామనునిచేత దురారోహం బగునట్లు రూఢస్కంధం బై మహాద్రుమం బై పుష్పిం
చిన దై ఫలంబులం జూపకుండెనేని యప్పురుషం డెట్లు ఫలాభావహేతువు
వలనఁ దత్ఫలవిషయప్రీతి ననుభవింపకుండు నట్లు నీవు భర్త వై భృత్యుల మైన
మమ్ముఁ బాలింపవేని యీయుపమానార్థంబున కనుగుణం బగుం గావున నస్మత్ప
రిపాలనరూపార్థం బెఱుంగ నర్హుండ విప్పుడు సామ్రాజ్యదీక్షితుండ వైననిన్నుఁ
బ్రతాపవంతుం డైనసూర్యునిం బోలెఁ గన్నులారం గనుంగొన నీపౌరశ్రేణు
లమాత్యులందఱుఁ బరమాసక్తు లై యున్నవారు తురంగమాతంగంబులు
రాజ్యాభిషిక్తుం డైననిన్ను వెనుకొని హేషాబృంహితధ్వనులు సెలంగ నరుదేరం
గల వంతఃపురకాంతలెల్ల సమాహిత లై సంతోషంబునం బొదలుచు నీపిఱుం
దం జనుదెంచెదరు నాయంజలిం గైకొని పురంబునకు విచ్చేయు మని పలికిన
నతనివచనంబుల కలరి యచ్చటివార లందఱు సాధువాక్యంబుల నభినందిం
చిరి యిత్తెఱంగునఁ గృతాంజలిమస్తకుం డై దైన్యంబునం బ్రార్థించుచున్న
భరతునిం జూచి సుశిక్షితమనస్కుండును ధైర్యవంతుండు నగురాముండు మంద
మధురాలాపంబుల నాశ్వాసించుచు ని ట్లనియె.

2000


ఆ.

అనఘచరిత యాత్మ కైచ్ఛికవ్యాపార, మరియు లేదు పురుషుఁ డస్వతంత్రుఁ
డతనిఁ బట్టి దైవ మట్టిట్టు సుడి పెట్టుఁ, గడఁగి పూర్వకర్మకారణమున.

2001

రాముఁడు భరతునికి ధర్మోపదేశము సేయుట

తే.

జగతి జీవితమునకు సంచయములకు స, ముచ్ఛయములకు మఱియు సంయోగములకు
మరణము క్షయంబు పతనంబు మఱి వియోగ, మంత మని పల్కి రార్యు లనర్ఘశీల.

2002


క.

ఇలపైఁ బక్వఫలంబులు, కలయక పతనమునకంటె నన్యభయంబు
ల్గలుగనిక్రియఁ గలుగదు మ, ర్త్యులకు న్మరణమునకంటె నొండు భయంబున్.

2003


తే.

అనఘచరిత దృఢస్థూణ మైనగృహము, సిదిర మై చూడఁ జూడ నశించునట్లు
ముదిమి నొంది నానాఁటికిఁ బుడమిజనులు, మృత్యువశగతు లై నశియింతు రెపుడు.

2004

క.

ఇననందనీప్రవాహము, వనధిఁ గలసి మరల రాని వైఖరి ధరలోఁ
జనినదినంబులు రాత్రులు, చనుదేరవు మరలఁ గాలసంగతి ననఘా.

2005


వ.

చనుచున్నయహోరాత్రంబులు నిదాఘంబునందు సూర్యునికిరణంబులు
జలంబుం బోలె నీజగంబునందు సర్వప్రాణులయాయువును హరించుచుండు
నశ్వర ఫలసాధనంబులయందు వ్యాపృతుండ వైననీవు నిన్నే యుద్దేశించి శోకిం
వుము పరుల నుద్దేశించి యేల వగచెద వేకారణంబున భవదీయం బైనజీవితకా
లంబు క్షయించుచుండు నక్కారణంబునఁ బరలోకచింత గావింపుము మృ
త్యువు శరీరితోఁ గూడం జను శరీరితోడం గూడి యుండు సుదూరమార్గం
బరిగినను శరీరితోఁ గూడ మరల వచ్చుఁ బురుషునిదేహంబునందు నానాఁటికి
వళులును శ్వేతశిరోరుహంబులును సంప్రాప్తంబు లగు జరచేత జీర్ణుం డైనపురు
షుం డేయుపాయంబు గావింప సమర్థుం డగు సూర్యుం డుదయించుచుండ న
ర్థార్జనకాలంబు సమాగతం బయ్యె సూర్యుం డస్తమించుచుండఁ గామోప
భోగకాలంబు సమాగతం బయ్యె నని యిట్లు మనుష్యు లానందింపుదురుగాని
ఛిద్రఘటంబునందు గ్రహింపంబడినజలంబుకరణిఁ బ్రతిక్షణంబు తమజీవిత
కాలంబు క్షయించుచున్న దని యెఱుంగరు మఱియు వసంతాదిఋతుసమా
గమంబు విలోకించి తత్తద్భోగకాలంబు సంప్రాప్తం బయ్యె నని హర్షింతురు
గాని ఋతుపరివర్తనంబున జీవితక్షయం బగుచున్నదని యించుక యైన
నెఱుంగఁజాల రదియునుం గాక.

2006


చ.

కడువడి వార్ధిమధ్యమునఁ గోష్ఠము కాష్ఠముఁ గూడి మారుతం
బడర వియోగ మొంది చనినట్లు కళత్రసుతాదు లొక్కచో
నుడుగక కూడి పెక్కహము లుండి పదంపడి పూర్వసంస్కృతిం
గడచి వియోగ మొందుదురు కాలవశంబునఁ జేసి మానదా.

2007


తే.

అవని నొకఁ డైన వలసిన ట్లాప్తజనులఁ, గలసి యుండఁగఁజాలఁ డక్కారణమునఁ
బరఁగ మృతుని నుద్దేశించి వగచువాని, కరయ లేదు తన్నిరసనమందు శక్తి.

2008


సీ.

రాజనందన శరీరప్రవర్తన మది యంతలోఁ గలుగు తా నంతలోన
గుణదోషము లెఱింగి కుత్సితకర్మంబు వర్జించి దేహి కేవలత ధర్మ
మాచరింపఁగఁ బోలు నంగనాపుత్రగేహారామవిత్తాదు లతనివెంటఁ
బోవు తాఁ జేసిన పుణ్యపాపంబులు దప్పక తనవెంటఁ దగిలి వచ్చు


ఆ.

ఎఱుక గలమహాత్ము లీయర్ధము గ్రహించి, పోవరానిత్రోవఁ బోవ నీక
మనసు నాఁగి పట్టి మహితధర్మమునందె, సంచరింతు రెపుడు సత్య మింత.

2009


వ.

మఱియు మార్గగతుం డైనపురుషుండు సహచరు లైనపథికులం జూచి యేనును
మీవెంట నరుదెంచెద నని పలికి యనుసరించి చనిన ట్లిది తొల్లింటిపూర్వ
పితృపితామహాదులు చనినమహామార్గంబు దీని ననుసరింపక తప్ప దెద్దానికి

వ్యతిక్రమంబు లే దట్టిదాని నుద్దేశించి యాపన్నుండై శోకింప నేమి యగు నని
వర్తి యైనప్రవాహంబుకరణి నాయుఃకాలం బరుగుచుండఁ బ్రజలు ధర్మసాధ్య
సుఖాసక్తులు గావునఁ బరలోకహితచింతచేత సుఖహేతు వగుధర్మంబునం
దాత్మ నియోగింపఁదగినయది తండ్రి యగుదశరథుండు పుష్కలంబు లైన
భోగంబు లనుభవించి ధర్మంబు తప్పకుండ నర్థాదానంబు వలన భృత్యరక్షణ
పూర్వకంబుగాఁ బ్రజలఁ బాలించి దక్షిణాపూర్ణంబు లైనక్రతుశతంబులచేత
దేవతలఁ దృప్తి నొందించి విధూతకల్మషుం డై చిరకాలంబు పాపప్రసంగరహి
తంబుగా జీవించి జీర్ణం బైనమానుషదేహంబు విడిచి బ్రహ్మలోకవిహారిణి
యైనతనువు ధరించి దేవసంబంధిసంపద ననుభవింపం జనియె నమ్మహాత్ము
నుద్దేశించి శ్రుతవంతుండవు బుద్ధిమత్తరుండ వైననీవు ప్రాకృతునియట్ల శోకింపం
దగదు దశరథమరణమద్వివాసనాదివిషయభేదంబున బహుప్రకారంబు లైన
యీశోకంబులు వ్యర్థంబులు ప్రలాపాశ్రువిమోచనంబునందుఁ గార్యంబు
లేదు ధీరుం డగువానిచేత సర్వావస్థలయందు నేతాదృశవ్యసనంబులు వర్జనీ
యంబు లై యుండు నదియునుం గాక.

2010


సీ.

అనఘాత్మ మనతండ్రి యగు దశరథుఁడు ని న్నవని సంరక్షింపు మనుచుఁ బలికె
నను ఘోరకాననంబున కేగు మని పంచె నమ్మహాత్ముఁడు చెప్పినట్ల నీవు
స్వస్థచిత్తుండ వై సాకేతపురి కేగు మేను గాననమున కేగువాఁడ
నీకు నాకును బోలె నృపశాసన మలంఘ్య మట్లు గావునఁ జేయు టది హితంబు


తే.

మనకుఁ దండ్రియు దైవంబు మాన్యుఁ డఖిల, ధర్మసంవేది యమ్మహోదారుపలుకు
ధర్మగతి నేను వనవాసకర్మమున స, మంచితంబుగ నింకఁ బాలించువాఁడ.

2011


చ.

వరమతి ధార్మికుండు గురువర్తి మృదుం డనృశంసుఁ డైనవాఁ
డరయఁగ ధర్మమార్గరతుఁ డై పరలోకజిగీషచే నతి
స్థిరముగఁ దండ్రిమాట విని చేయఁగఁ బోలుఁ గుమార నీవు న
గ్గురువచనంబు సార్థముగఁ గోరి యొనర్పుము రాజనందనా.

2012


క.

మనతండ్రి యైనదశరథ, జనపతిశుభవృత్త మెఱిఁగి సజ్జనవర నీ
వనిశంబు తత్స్వభావము, సనుపమమతిఁ బొందు మయ్య యవితథభంగిన్.

2013


వ.

అని యిత్తెఱంగున రాముండు పితృనిదేశపరిపాలనంబుకొఱకు నర్థవంతం బైన
వాక్యంబునఁ దమ్మునికి ధర్మరహస్యం బుపదేశించి యూరకున్న నారఘునంద
నుం డగుభరతుండు ప్రకృతివత్సలుం డగురాముని వీక్షించి ధార్మికంబును
జిత్రంబు నగువాక్యంబున ని ట్లనియె.

2014

భరతుఁడు యుక్తియుక్తంబుగా రామునిఁ బ్రార్థించుట

ఆ.

అధిప నిన్ను దుఃఖ మది బాధితునిఁ జేయఁ, జాల దలముదంబు సంప్రమోద

సహితుఁ గాఁగఁ జేయఁజాలదు నీయంత, ఘనుఁడు లోకమందుఁ గలఁడె యొరుఁడు.

2015


తే.

విమలచారిత్ర త్రైవిద్యవృద్ధు లయిన, వారి కీవు సర్వజ్ఞతావైభవమున
సమ్మతుఁడ వయ్యు ధర్మసంశయము కలుగు, చోట వారల నడిగెదు సురుచిరముగ.

2016


సీ.

మృతుఁ డైనపురుషుఁ డేగతి ద్వేషవిషయుండు గాఁ డట్లు మనియున్నవాఁడు ద్వేష
విషయుఁడు గాఁడు బల్విడి లేనిదానిపై నెట్లు రాగము పుట్ట దట్ల యున్న
దానిపై రాగ మింతయుఁ బుట్ట దిటువంటిబుద్ధిలాభము గలపురుషుఁ డేల
పరితాప మొందు నెవ్వఁడు పరావరవిదుఁ డతఁ డిట్టివ్యవనంబు నధిగమించి


తే.

యును బరితపింపఁ డ ట్లీవు జనవరేణ్య, యట్టివాఁడవు నినుఁ గొనియాడఁదరమె
సకలలోకైకకర్తవు సాధువినుత, సద్గుణుండవు శాస్త్రవిశారదుఁడవు.

2017


వ.

మహాత్మా నీవు సత్వగుణప్రధానుండ వమరతుల్యుఁడవు మహానుభావుండవు
సత్యసంగరుండవు సర్వజ్ఞుండవు సర్వదర్శివి బుద్ధిమంతుండవు భూతప్రభవవినాశ
కోవిదుండ విట్టిసద్గుణయుక్తుండ వైననీవు మాదృశుల కవిషహ్యతమం బైన
వ్యసనంబు నొందియు విషణ్ణుండవు కా వని పలికి వెండియు ని ట్లనియె.

2018


క.

సరసుఁడవు సత్యసంధుఁడ, వరయఁగఁ బుణ్యాత్ముఁడవు మహాత్ముఁడ వీ వి
ప్పరుసునఁ బలికిన మముబోం, ట్లరిమథనా యేమి సేయ నర్హులు ధాత్రిన్.

2019


ఆ.

ఏను బ్రోషితుండ నైనచో మాతల్లి, క్షుద్రశీల యగుట సొరిది నాకుఁ
బ్రీతి సేయ నిట్టిపాతకం బొనరించె, నేను నొల్ల నది సహింపు మధిప.

2020


ఉ.

ఇట్టియఘం బొనర్చిననయేతర యుద్ధతశీలఁ గైకయిం
బట్టి వధించు టర్హ మిటు పాపవిచారిణిఁ జంపఁ బాతకం
బెట్టును గల్గ దైనను నరేంద్రకులీనుఁడ నై యకార్య మే
ని ట్టొనరింతునా యని సహించి వధింపఁగ నైతి నత్తఱిన్.

2021


ఉ.

కాదని తెంపు సేసి యలకైకను జంపితి నేని దేవ నీ
వే దయమాలి యాజి కతివృద్ధునకు న్ఘనరాజధర్మసం
వేదికిఁ బుట్టి పుణ్యుఁ డన విశ్రుతిఁ గాంచి కుమార తల్లి నే
లా దునుమాడి తెంత కలుషాత్ముఁడ వైతి వటంచు దూఱవే.

2022


తే.

అధిప శుద్ధాభిజనకర్ముఁ డైనదశర. థునకుఁ బుత్రుఁడ నై పుట్టి దురిత మనక
కడు నధర్మిష్ఠ మైనయీధర్మ మెట్లు, సేయువాఁడ సాధుల కిది చెల్ల దయ్య.

2023


మ.

గురుఁడు న్వృద్ధుఁడు తండ్రి దైవత మరాగుండుం గ్రియావంతుఁడు
న్ధరణీభర్తయుఁ బుణ్యమూర్తి యగుటం నండ్రి న్విగర్హింప నా
కరయం జెల్లదు గాని యెవ్వఁడు ప్రియాహరార్థి యై యిట్టిని
ష్ఠురకర్మం బొనరించుఁ బుణ్యు లగురాజు ల్మెత్తురే యిప్పనిన్.

2024


తే.

రాజవర్య వినాశకాలంబునందు, భూతకోటికి విపరీతబుద్ధి యనెడు
విశ్రుతం బైనమాట పృథ్వీతలేంద్రు, చేతఁ బ్రత్యక్షముగ నేఁడు చేయఁబడియె.

2025

వ.

మహాత్మా క్రోధమోహసాహసంబులవలన దశరథునిచేత నాచరింపఁబడిన
ధర్మాతిక్రమణంబును సమీచీనార్థం బనుసంధించి నీవు గ్రమ్మఱింపుము తండ్రి
వలనం బొడమిన ధర్మాతిక్రమణం బేపుత్రుండు గ్రమ్మఱించు నతం డపత్యం బనఁ
బ్రసిద్ధి వహించు నట్లు గావింపఁ డేని విపరీతుం డగు నీ వట్టియపత్యంబవు గమ్ము
ధీరవిగర్హితం బైనజనకునిదుష్కృతకర్మంబు నవలంబింపందగదు కైకేయి
రాజ్యలోభంబున ధర్మవిరోధంబుగా మహీనాథుని నిర్బంధించి మదర్థంబుగా
రాజ్యంబుఁ గైకొని దురంతం బైనపాపం బాచరించె నద్దశరథుండును
మోహంబునఁ గైకేయీవాక్యం బెంతని నిగ్రహింపంజాలక సాహసంబున
సుగుణసంపన్నుండ వైననిన్ను వనంబునకుం బనిచి పాపకారి యయ్యె నిట్లు
తల్లిదండ్రులు దురితాత్ము లై నిరయగతికిం బోవుచుండ మహానుభావుం డైన
నీయట్టిసత్పుత్రుం డుపేక్షించుట యుక్తంబు గాదు లోభమోహంబుల మై
మఱచి పలికినజననీజనకులశాసనంబు నిగ్రహించి రాజధర్మం బెఱింగి పితృపై
తామహం బైనరాజ్యంబుఁ గైకొని తల్లిదండ్రులను నన్నును సుహృజ్జనంబులను
బాంధవులను బౌరజానపదులను ధర్మంబున సుద్ధరింపు మని పలికి శోకావేశం
బున వెండియు ని ట్లనియె.

2026


ఆ.

గహనవాస మేడ క్షత్రధర్మం బేడ, జడలు దాల్చు టేడ జగతిఁ బ్రోచు
టేడ రఘువరేణ్య యిట్టివిరుద్ధధ, ర్మంబు నాచరింపరాదు నీకు.

2027


ఉ.

ఉక్కున రాజ్య మేలుటకు నోపినఱేనికిఁ బట్టబంధనం
బొక్కట రాజధర్మ మగుచుండఁగ నీ కిటు చేయఁ జెల్లునే
యెక్కడ క్షత్రధర్మ మది యెక్కడ భూపరిపాలనంబు నేఁ
డెక్కడఁ గాననంబు మఱి యెక్కడఁ దాపసవేష మారయన్.

2028


సీ.

మనుజేంద్ర పరిదృశ్యమాన మైనట్టియీత్యాగభోగాభియుక్తప్రజాది
పాలనధర్మంబు పరఁగ నవ్వలఁ ద్రోచి సంశయస్థంబు లక్షణవిహీన
మాయతిఫలము ధరాధీశుచే నిది యాదిభాగంబున నాచరింప
నెంతయు హిత మని యేప్రమాణంబునఁ దగ ననిశ్చిత మైనధర్మ మెవ్వఁ


ఆ.

డవని క్షత్రబంధుఁ డాచరింపఁ దలంచు, నకట విధినిషిద్ధ మైనవృత్త
మూఁద నేల ధర్మ మొప్పార నాల్గువ, ర్ణములవారిఁ బ్రోవు మమలచరిత.

2029


తే.

మనుకులోత్తమ చతురాశ్రమములలోన, నవని గార్హస్థ్య ముత్తమం బనిరి ధర్మ
విదు లకారణముగ దాని వృథ యొనర్ప, నేల పూనితి వీధర్మ మెవ్వఁ డనియె.

2030


ఉ.

బాలుఁడ జ్ఞానహీనుఁడ నపండితుఁడం గడుదుర్బలుండ భూ
పాలకిరీటరత్నరుచిభాసితపాదయుగుండ వైననీ
వేలఁగ నర్హ యైనధర నేలఁగ నే నెటు లోపువాఁడ నీ
శీలము నచ్చి భద్రములఁ జెందెద రిందఱు రమ్ము వీటికిన్.

2031

సీ.

మంత్రకోవిదు లైనమంత్రులు ఋత్విజు ల్ఘనులు వసిష్ఠాదిమునులు ప్రకృతి
మండలం బాప్తసామంతులు ననుఁ గూడి కోర్కితో నీచిత్రకూటమందె
సంప్రీతితో నిన్ను సామ్రాజ్యపట్టాభిషిక్తునిఁ జేసెద రుక్తభంగి
వీటికిఁ జనుదెంచి వేడ్కతో బాంధవు లలర నిష్కంటకం బైనపూజ్య


తే.

రాజ్యమును ధర్మపద్ధతి రమణతోడ, నేలుచు విశేషయుక్తిచే నెల్లవారిఁ
దవిలి వర్ణాశ్రమస్థితు ల్దప్పకుండ, నరసి పాలింపు ముయ్య మహాత్మ నీవు.

2032


వ.

దేవా యేను సద్గుణబుద్ధిరహితుండ బాలుండ స్థానహీనుండ నీమఱుంగున
దాసభూతుండ నై జీవింప నర్హుండ నిన్నుం బాసి యొక్కముహూర్తంబైన జీవింప
నర్హుండు కానివాఁడ నట్టియేను భవద్విహీనుండ నై రాజ్యం బెత్తెఱంగునం
బాలింప నేర్తు నీ వయోధ్యాపట్టణసింహాసనాధ్యక్షుండ వై విబుధులచేత వాస
వుండుం బోలెఁ బ్రకృతులచేత నుపాస్యమానుండ వై భుజబలంబున లోకం
బుల జయించి ఋణత్రయంబువలన విముక్తుండ వై వైరుల నందఱ నిర్జించి
సుహృజ్జనంబుల సర్వకామంబులచేత సంతుష్టులం జేయుచు సాధుల కెల్ల సంతో
షంబుఁ గావించుచుఁ గోసలరాజ్యంబుఁ బరిపాలింపు మని పలికి వెండియు
ని ట్లనియె.

2033


ఉ.

అందముగా శిరంబు భవదంఘ్రులు సోఁకఁగ మ్రొక్కి వేఁడెదం
బొందుగ వేల్పులం దజుఁడుఁ బోలె సుహృజ్జనకోటియందు నా
యందును బ్రీతి సేర్చి నయ మార మదంబవివేకహీనవృ
త్తిం దగ నోర్చి యిప్డు కుగతిం బడకుండఁగఁ దండ్రిఁ గావుమీ.

2034


క.

నామాటఁ గైకొనక వన, సీమకుఁ జని తేని రాజశేఖర యేను
న్నీమాడ్కి దాపనుఁడ నై, సౌమిత్రియుఁ బోలె వెంటఁ జనుదెంతు రహిన్.

2035


చ.

అని యిటు కైకయీతనయుఁ డంజలిఁ జేసి యనేకభంగుల
న్వినయ మెలర్పఁ దన్నుఁ దగ వేఁడిన రాముఁడు తండ్రిమాట నె
మ్మనమున గట్టి చేసి దయ మాలి పురంబు సొరంగ రాదు నా
కనఘ చతుర్దశాబ్దముల కవ్వల వచ్చెద నంచుఁ బల్కినన్.

2036


తే.

అద్భుతం బైనయతనిస్థైర్యంబుఁ జూచి, దుఃఖితం బైనజనము సంతోష మొందె
వీటి కిప్పుడె రా నను మాట విని ప్ర, హర్షితం బైనజనము శోకార్తి నొందె.

2037


ఉ.

ఆతెఱఁ గంతఁ జూచి సఖు లమ్మలు మంత్రులు చుట్ల నున్నవా
రాతతదుఃఖశోకమున నశ్రులు నించుచుఁ గైకపట్టి వి
ఖ్యాతచరిత్రుఁ జాలఁ గొనియాడుచు నాతనిఁ గూడి నమ్రు లై
భూతనయామనోహరునిఁ బుణ్యచరిత్రుని వేఁడి రత్తఱిన్.

2038


తే.

అద్భుతం బైనయతనిస్థైర్యంబుఁ జూచి, ఎక్కటా యింత కఠినాత్ముఁ డగునే రాముఁ

డనుచుఁ గ్రమ్మఱఁ దత్పదంబునకు వ్రాలి
భరతుఁ డెంతయు శోకంబు ప్రబ్బికొనఁగ.

2039


క.

సమ్మతితోడ నయోధ్యకు, రమ్ము ననుం గరుణఁ జూచి రాజ్యం బిదె గై
కొమ్ము నృపాలనశీలివి, కమ్మని ప్రార్థించుచుండెఁ గడుభక్తిమెయిన్.

2040


క.

క్రమ్మఱ నీక్రియఁ బలికెడు, తమ్ముని వీక్షించి సుగుణధాముఁడు రాముం
డమ్మెయి ననూనమృదువా, క్యమ్మున ని ట్లనుచుఁ బలికె నందఱు వినఁగన్.

2041


చ.

అనఘచరిత్ర యాదశరథావనిభర్తకుఁ గైకయందు స
త్తనయుఁడ వై జనించి యిటు ధర్మవిరోధము లాడఁ జెల్లునే
పనివడి భ్రాతృవత్సలతఁ బల్కితి దీనఁ గొఱంతలేదు నీ
వినయవివేకశీలములు వేయివిధంబుల నే నెఱుంగనే.

2042


వ.

వత్సా మనతండ్రి యగుదశరథుండు తొల్లి భవజ్జననిం బెండ్లియాడు నప్పు డీ
కైకేయికిం బుట్టినకుమారునకు రాజ్యం బొసంగెద నని కేకయునితోఁ బ్రతిజ్ఞ
గావించి వివాహం బయ్యె నాఁటంగోలె దేవి రాజ్యశుల్క యనంబడియె
నదియునుం గాక దేవాసురసంగ్రామంబునందు దశరథుం డద్దేవిచేత నారా
ధితుం డై సమర్థుం డగుటను సంతోషవిశేషంబున వరద్వయం బొసంగె నయ్యమ
ప్రతిజ్ఞఁ జేసి నీకు రాజ్యాభిషేకంబును నాకు వనవాసంబునుం గా వరంబులు
రెండును యాచించె నమ్మహీరమణుండు సత్యవాది గావున ధర్మంబునకు హాని
లేకుండ నన్ను వనంబునకుం బొ మ్మనియె నిట్లు తండ్రిచేత నియుక్తుండనై పదు
నాల్గువత్సరంబులు దండకారణ్యంబున నివసింపం బూని సీతాలక్ష్మణసహితుండ
నై నిర్జనం బైనవనంబునకుం జనుదెంచితి మదీయాభిమతం బనివార్యంబు
నీవును బితృనిదేశవ్యవస్థితుండ వై రాజ్యంబుఁ గైకొని భవజ్ఞననికి సంతోషం
బొసంగి జనకుని సత్యవాదినిం జేసి కైకేయీఋణంబువలన విముక్తునిం
గావించి రక్షింపుము తొల్లి యశస్వి యగుగయునిచే గయాఖ్యప్రదేశంబుల
యందుఁ బితరుల నుద్దేశించి కొన్నిశ్లోకంబులు గీతంబు లయ్యె వాని తెఱం
గెఱింగించెద వినుము.

2043


తే.

తలఁపఁ బున్నామనరకంబువలన జనకుఁ, బ్రోచుఁ గావునఁ దనయుండు పుత్రుఁ డొండె
గరిమఁ దండ్రిని నాకలోకస్థుఁ జేసి, మనుచుఁ గావునఁ బుత్రుఁడు ఘనగుణాఢ్య.

2044


తే.

మఱియుఁ బెక్కురఁ బుత్రుల మాన్యగుణుల, ననఘులను బహుశ్రుతులను గనఁగవలయు
నింద ఱుండిన వారిలో నెవ్వఁ డేని, గయకుఁ బోవఁడె జనకునిఁ గాచుపొంటె.

2045

చ.

అని యిటు ధర్మయుక్తి గయుఁ డాడిన నాతనిమాటఁ బట్టి ము
న్ననఘవిచారు లైననృపు లందఱు నవ్విధ మాచరించి రీ
వనుపమధర్మశీలుఁడవు నర్హగుణుండవు పుణ్యుఁ డైనమ
జ్జనకునిఁ బ్రోవు మాయన కసత్యజదోషము గల్గకుండఁగన్.

2046


వ.

వత్సా నీవు శత్రుఘ్నసహితంబుగా నయోధ్యకుం జని ద్విజాతిసహితుండ వై
ప్రజలఁ బాలించుచు శ్వేతాతపత్రచ్ఛాయలం జరించుచు సౌధప్రసాదహర్మ్య
విమానాగ్రభాగంబుల వసియించి శత్రుఘ్నుండు హితం బాచరించుచుండ
సుఖం బుండు మేను సీతాలక్ష్మణసహితంబుగా దండకారణ్యంబుఁ బ్రవేశించి
మునివేషంబున మునిసహితుండ నై మృగంబులం బాలించుచు సాంద్రశీతల
తరుచ్ఛాయలం జరించుచుఁ బర్ణశాలలయం దధివసించి లక్ష్మణుండు హితం
బాచరించుచుండ సుఖం బుండెదఁ బుత్రుల మైనమనము నల్వురము నరేం
ద్రుని సత్యస్థునిం జేసి విషాదంబు దక్కి వర్తింపుద మని పలికిన నప్పుడు రామ
భరతులసంవాదంబు విని జాబాలి యనుబ్రాహ్మణోత్తముండు ధర్మజ్ఞుం డైన
రామభద్రునిం జూచి వైదికధర్మరహితం బైనవాక్యంబున ని ట్లనియె.

2047

జాబాలి యను బ్రాహ్మణుఁడు రామున కధర్మ ముపదేశించుట

ఉ.

భూవర జ్ఞానహీనునకుఁ బోలె నిరర్థకబుద్ధి నేఁడు నీ
కేవిధిఁ గల్గె సాధుజను లీగతిఁ జూచిన యుక్త మందురే
నీవు సమస్తముం దెలియ నేర్తువు నీ కొకఁ డర్థధర్మము
ల్వావిరిఁ జెప్పఁగా వలెనె వాసవసన్నిభ పొమ్ము వీటికిన్.

2048


ఉ.

ఎక్కడితండ్రి యెవ్వనికి నెవ్వఁడు బాంధవుఁ డేటిధర్మ మిం
దొక్కఁడు పుట్టుచుండ మఱియొక్కఁడె చచ్చుచు నుండుఁ గావునం
దక్కక తల్లి దండ్రి యని ధర్మముఁ బల్కెడువాఁడు బాలిశుం
డెక్కడిమాట నిక్కముగ నెవ్వని కెవ్వఁడు లేఁడు చూడఁగన్.

2049


మ.

అరయంగా నొకవీటి కేగి పురుషుం డారేయి వర్తించి తా
మఱునాఁ డొండొకవీటి కేగినక్రియ న్మర్త్యాలికి న్సంతతం
బరుదారం దలిదండ్రు లిల్లును ధనం బావాసమాత్రంబు భూ
వర సుజ్ఞానులు దీనిఁ గైకొనరు సర్వ మ్మిథ్య యంచు న్రహిన్.

2050


వ.

మహాత్మా పిత్ర్యం బగురాజ్యంబు పరిత్యజించి కుత్సితమార్గంబును దుఃఖప్రదం
బును విషమంబును బహుకంటకంబు నగుకాపథంబు నంగీకరించుట కర్త
వ్యంబు కాదు పుణ్యసమృద్ధ యగునయోధ్యయందు సామ్రాజ్యదీక్షితుండ వై
కోసలరాజ్యంబు పరిపాలించుచు మహార్హంబు లైనరాజభోగంబు లనుభవిం
చుచు శక్రుండు త్రివిష్టపంబునందుంబోలె హర్మ్యవిమానప్రాసాదాగ్రమహో

ద్యానంబులందు సుఖలీల విహరించుచుండు మని పలికి వెండియు ని ట్లనియె.

2051


తే.

దేవ దశరథజనపతి కీవు లేవు, నిర్మలాత్ముఁ డాజనపతి నీకు లేఁడు
ఒక్కరా జతఁ డీవు వే ఱొక్కరాజ, వాతనికి నీకు సంబంధ మరయ లేదు.

2052


తే.

జనకుఁ డన బీజమాత్రంబు జంతువులకుఁ, బరఁగ శుక్లశోణితములు కరుడుగట్టి
తల్లియుదరంబునందు వర్ధిల్లి పిదప, నిర్మలాత్మకరూప మై నిర్గమించు.

2053


క.

జనకుం డెచ్చట నున్నాఁ, డనఘా నీ వెచట నుంటి వతనికి నీకుం
దనుసంబంధం బెయ్యది, జనకుఁ డనుచు వానితోడఁ జనిరే తనయుల్.

2054


తే.

అనఘచరిత యేభూతంబులందుఁ గలియ, నర్హ మగు నట్టిభూతంబులందుఁ గలసె
దశరథునకు నీమర్త్యసంతతుల కెల్ల, వసుధలోపల నిధి స్వభావంబు చువ్వె.

2055


క.

జనకుం డనఁ దనయుం డన, విను మంతయు భ్రాంతి గాక విశ్రుత మగునే
తనవార లనుచు వగవరు, చనినపరులఁ గూర్చి తత్త్వసంగతు లుర్విన్.

2056


వ.

మహాత్మా ప్రత్యక్షం బయిన సౌఖ్యంబు విడిచి కేవలార్థధర్మసంపాదనపరు
లెవ్వరు గల రట్టివారలంగూర్చి వగచెద వా రీజగంబునఁ గలకాలంబు దుఃఖం
బనుభవించి తుది వినాశంబు నొందుదురు కేవలప్రత్యక్షసుఖానుభవపరాయణు
లగువారి నవలోకించి సంతసించెద నదియునుం గాక.

2057


తే.

జనకులకు నందనులు పెట్టుశ్రాద్ధ మదియు, వ్యర్థ మగుఁ గాక కుడిచిరె వారు వచ్చి
తనకుఁ దానె స్వతంత్రుండు తత్త్వవిదుఁడు, చెలఁగి మిథ్యాభివాదంబుఁ జేసె దేల.

2058


వ.

మహాత్మా యొకనిచేత భుక్తం బైనయన్నంబు వేఱొకనిదేహంబుఁ బ్రవేశిం
చెనేని మార్గంబునం జనువాని నుద్దేశించి యన్నం బొసంగ వచ్చుఁ దద్భుక్తా
న్నంబు పథికునకుఁ బాథేయం బగు నిట్లు గానంబడలేదు గావున మృతుఁడైన
జనకు నుద్దేశించి చేసినశ్రాద్ధం బతనికిఁ జరితార్థంబు గానేరదు జనం బష్టక
శ్రాద్ధం బనియుఁ బ్రతిసాంవత్సరికం బనియు నెయ్యది పితరుల నుద్దేశించి చేయు
నది యంతయు నన్నంబున కుపద్రవం బంతియె కాని ప్రయోజనం బేమియు
లేదు ద్రవ్యగ్రహణకుశలబుద్ధు లగువారిచేత దేవతారాధనంబు గావిం
పుము యాగదీక్షితుఁడవు గమ్ము తపంబుఁ గావింపు మర్థాదికంబుఁ బరిత్య
జింపు మని దానవశీకరణోపాయంబు లయినగ్రంథంబులు విరచితంబు లయ్యె
నవి వర్జనీయంబులు తత్త్వదృష్టి విలోకించిన భవం బనాదిసిద్ధంబు తనంతం
దాన పొడమి తనంతం దాన నశించు దానియుత్పత్తిలయంబులకుఁ బ్రభుం
డొకఁడు లేఁడు బ్రహ్మవిష్ణురుద్రాదులబతుకులు మనబ్రతుకులట్ల వారిదేహం
బులు మనదేహంబులుం బోలెఁ గాలవశగతం జెందుచుండు దేహికి సుఖదుఃఖ
శరీరత్యాగంబులె స్వర్గనరకమోక్షంబు లై యుండుఁ బరమధర్మనిరూపణంబు
లగు నానాశాస్త్రసిద్ధాంతంబు లాలోకించి నిశ్చయార్థం బెఱుంగక జనంబులు
వలసినచందంబున వాదించుచుండుదు రివియన్నియు ననుమానోపమానార్థా

పత్తిజ్ఞానంబు లై యుండు వ్యవసాయాత్మకం బైనజ్ఞానంబు ప్రత్యక్షంబు ప్రత్యక్ష
జ్ఞానం బెల్లవారికిఁ దెల్లం బై యుండుఁ గావున నీవు పరంబు లే దని నిశ్చయించి
ప్రత్యక్షసిద్ధం బైనరాజ్యభోగాదికంబు ప్రతిగ్రహించి పరోక్షంబు పిఱిందికిం
ద్రోచి స్వజనసమ్మతం బైనమద్బుద్ధిఁ బురస్కరించుకొని భరతునిచేతఁ బ్రసా
దితుండ వై రాజ్యంబుఁ బ్రతిగ్రహించి సుఖంబు లనుభవింపు మని పలికిన
విని సత్యప్రవణస్వభావులలో శ్రేష్ఠుం డైనరాముండు ధర్మాచలితబుద్ధి యై యుక్తి
యుక్తం బగువాక్యంబున జాబాలి కి ట్లనియె.

2059

రాముఁడు జాబాలిమాటలు నిరసించుట

తే.

అనఘ మత్ప్రియకామార్థ మరయు నెద్ది, పరమయుక్తియుక్తంబుగాఁ బలికితి వది
కార్యసంకాశ మైనయకార్య మయ్యె, పథ్యసమ్మిత మైనయపథ్య మయ్యె.

2060


తే.

అనఘచరిత నిర్మర్యాదుఁ డైనపురుషుఁ, డవని నెవ్వాఁడు వాఁ డనుదినంబు
వృజినయుక్తుండు భిన్నచారిత్ర దర్శ, నుం డగుచు నపచితి నొందకుండు సభల.

2061


క.

ధీరునిఁ బండితమానిని, సూరిని బాలిశునిఁ బరమశుద్ధుని మలిను
న్సారగ్రాహినిఁ గుత్సితుఁ, జారిత్రమె చెప్పుచుండు సంయమివర్యా.

2062


సీ.

శిష్టసమ్మతుఁ డనుశీలవంతుఁడ లక్షణాధ్యుఁడ నతిశుచి నైనయేను
శిష్టగర్హితుఁడు దుశ్శీలుఁడు లక్షణహీనుఁడు మలినాత్ముఁ డైనవాని
వైఖరి శుభహేతువైదికకర్మంబు విడిచి క్రియావిధివిరహితంబు
భువనసంకర మగుభవదీరితాధర్మ మనిశము ధర్మత్వమునఁ గడంగి


తే.

మాస కంగీకరించితినేని ధాత్రి, శఠుని దుర్వృత్తు లోకదూషణుని నన్నుఁ
గాంచి తత్త్వవిదుండు సుకర్మరతుఁడు, యుక్తకార్యుఁ డెవ్వాఁడు బహూకరించు.

2063


తే.

అనఘ హీనప్రతిజ్ఞ మైనట్టివృత్తి, నలమి తిరుగుచు భవదీరితాచరణము
నెవ్వనికి నుపదేశింతు నిట్టిసాధ, నమున నెబ్బంగిఁ బడయుదు నాకసుఖము.

2064


తే.

తాపసోత్తమ లోక మంతయును గామ, వృత్తమై సంతతంబు వర్తించుచుండు
నృపతు లేవృత్తిఁ దాల్చి వర్తింతు రతని, జనము లావృత్తి వర్తింతు రనుదినంబు.

2065


తే.

అనిశ మనృశంసమును సనాతనము నైన, రాజవృత్తంబు సత్యమై రహి వహించు
నట్లు గాన సత్యాత్మకం బయ్యె రాజ్య, మఖిలలోకంబు సత్యంబునందు నిలుచు.

2066


సీ.

ఈశ్వరుండును సత్య మేపారఁగాఁ బద్మ యెపుడు సత్యము నాశ్రయించి యుండు
సత్యధర్మంబులు స్వర్గమూలంబులు సత్యమూలంబులు సర్వములును
వేదంబులును శాస్త్రవితతులు హుతమును దపములు సత్య మై తనరుచుండు
నమరులు ఋషులు సత్యము సత్యమునకంటెఁ దలపోయఁ బరమపదంబు లేదు


తే.

సత్యవాది లోకంబునఁ జతురుఁ డగుచు,నాస్తి యనుచు వాదించెడునరుల నెల్లఁ
గ్రూరసర్పంబులను బోలె నేఱివైచి, ధన్యుఁడై తుది పరమపదంబుఁ గాంచు.

2067


తే.

ఒకఁడు లోకంబుఁ బాలించు నొకఁడు కులముఁ, బ్రోచు నొకఁడు దుర్గతికిని బోవు నొకఁడు

స్వర్గమున నుండు నిందఱు వరుసతోడ, నేకభంగిఁ బ్రవర్తించిరే మునీంద్ర.

2068


చ.

మునివర సత్యసంధుఁ డగుభూపతి స న్నిటు కాననోర్వికిం
జను మని పల్కె నేనును బ్రసన్నమతి న్సభ యాలకింపఁగాఁ
జనియెద నంచు నీయకొని సమ్మతి వచ్చితి సత్య మూఁది య
జ్జనకునిశాసనంబు కడుసత్య మొనర్పక రిత్త వుత్తునే.

2069


ఆ.

వేయి పలుకు లేల వినుము తాపసవర్య, చెలఁగి తండ్రిపంపు సేయువాఁడ
మోహలోభకామముల నైనఁ దగ సత్య, సేతువునకు హాని సేయ నయ్య.

2070


ఆ.

విను మసత్యసంధు ననభిజ్ఞు నస్థిర, చిత్తు మలిను సాధువృత్తిశూన్యుఁ
జూచి పితరు లఖిలసురులును హర్షింప, రనుచుఁ బలికి రార్యు లదియు వినమె.

2071


వ.

మునీంద్రా యేను సత్యరూపం బైనయీధర్మంబు నాత్మయం దవినాభూ
తంబుగా నవలోకించెద సత్పురుషాచరితం బైనజటావలయాదిభారంబు సత్య
రూపధర్యార్థం బభినందించుచుందు భవదుక్తధర్మంబు క్షుద్రనృశంసలుబ్ధపాప
కర్ములచేత సేవింపందగినయది గాని యస్మదాదుల కంగీకార్యంబు గా దధర్మ
ప్రచురధర్మలేశయుక్తక్షత్రియధర్మంబుఁ జరిత్యజించెద మనోవాక్యాయజం బైన
త్రివిధపాతకకర్మంబు నవ్వలం ద్రోచి పుచ్చి త్రివిధసుకృతకర్మంబు నంగీకరించి
సత్యంబునం బ్రవర్తింపవలయు భూకీర్తియశోలక్ష్ములు సత్యవాది యగుపురు
షునిం బ్రార్థించుచు నతని స్వర్గగతునిఁ గాఁ దలంచుచుండ్రు నీవు నిశ్చయించి
యిది భద్రంబు దీనిం గావింపు మని యుక్తికరంబు లైనవాక్యంబులచేత నన్ను
నియోగించితి వది యనార్యంబు దాని నంగీకరింపం దగ దేను గురుసన్నిధి
యందుఁ బదునాల్గువత్సరంబులు వనవాసంబు సలిపెద నని ప్రతిజ్ఞఁ జేసి వచ్చితి
నప్పుడు మద్వాక్యంబు విని కైకేయి సంప్రహృష్టచిత్త యయ్యె నిప్పుడు గురు
వచనోల్లంఘనంబుఁ జేసి భరతునివచనం బెట్లు గావింతు గురువాక్యప్రకా
రంబున వనవాసంబు సేయుచు నియతవన్యాహారుండ నై శుచి నై పుణ్యంబు
లైనమూలపుష్పఫలంబులచేత దేవతలఁ బితృదేవతలఁ దృప్తి నొందించుచు
సంతుష్టేంద్రియవర్గుండ నై శ్రద్దధానుండ నై కార్యాకార్యవిచక్షణుండ నై
యకృత్రిముఁడ నై పితృవచనపరిపాలనరూపం బైనలోకవర్తనంబు ననుసరించి
ప్రవర్తించెద నని పలికి వెండియు ని ట్లనియె.

2072


క.

కర్మమునఁ గలుగు భద్రము, శర్మదహితకర్మభూమిసంజాతనరు
ల్కర్మములు సేయఁగాఁ దగుఁ, గర్మంబునఁ గాని లేవు జ్ఞానసుఖంబుల్.

2073


చ.

అనఘ ధనంజయానిలశశాంకులు కర్మముచేఁ బ్రదీప్తు లై
తనరిరి గాదె శక్రుఁడు శతక్రతువు ల్దగఁ జేసి తా దివం

బున కధినాథుఁ డయ్యె మునిపుంగవు లుగ్రతపంబుఁ జేసి బ్ర
హ్మనిరతు లైరి కర్మమున నందఁగ రానిది యేది చెప్పుమా.

2074


వ.

అని పలికి వెండియు నుగ్రతేజుం డగురాముండు తన్నాస్తికతర్కరూపవాక్యంబు
విని యమృష్యమాణుం డై యతని వాక్యంబులు గర్హించుచు ని ట్లనియె.

2075


క.

సురవిప్రాతిథిసేవయుఁ, బరాక్రమము భూతదయయుఁ బరహితశీలం
బరుదార సత్యధర్మము, లరయఁగ సురలోకమార్గ మనిరి మునీంద్రుల్.

2076


చ.

పరహితబుద్ధి సత్యమును బాడియుఁ దప్పక యుండునట్టి సు
స్థిరతరధర్మబోధనము సేయంచు రాజుల నుద్ధరింప నే
ర్పరి వగునీవె ప్రాకృతునిభంగి ననర్థకనాస్తివాద మి
ప్ఫరుసునఁ జేసె దింక నల బాలిశు లాడి రనంగఁ జోద్యమే.

2077


చ.

అనిమిషలోకమార్గ మని యార్యులు పల్మఱుఁ బల్కినందునం
దనుమతి విప్రు లట్లు వరతత్త్వముఁ గన్గొని యేకచిత్తు లై
మునుకొని ధర్మము న్సకలము న్బచరించుచు జాగరూకు లై
యనిశము నాకవాససుఖ మందఁగఁ గోరుచు నుందు రెంతయున్.

2078


ఆ.

తా నెఱింగినంత ధర్మంబుఁ దప్పక, నడవ వలయు నొరుల నడప వలయు
నార్యజనులయొద్ద నాడెడుమాటలే, చాలుఁ జాలు ధర్మసంగతంబు.

2079


తే.

చూడఁబడనియర్థంబును జూపుకొఱకుఁ, గాదె సకలశాస్త్రంబులు గలుగు టెల్ల
ధాత్రిఁ బ్రత్యక్ష మగునట్టిధర్మమునకు, సంయమీశ్వర వేఱె శాస్త్రంబు లేల.

2080


వ.

మఱియుఁ బరోక్షధర్మంబు మిథ్య యని పరిహరించి ప్రత్యక్షధర్మం బంగీకరిం
చిన శాస్త్రంబు లప్రమాణంబు లగుఁ బ్రత్యక్షధర్మం బెల్లవారికిఁ దెల్లంబై
యుండుఁ గావున నదియె పరమార్థం బయ్యె నేని సర్వజనంబులకు సామా
న్యంబు గలుగు దానం జేసి జ్ఞానాజ్ఞానంబులు లేక వర్ణాశ్రమాచారంబులు
విడిచి జనంబు లిచ్ఛాప్రకారంబున వర్తింతు రక్కారణంబున లోకం బంతయు
సంకరం బై చెడు వైదికమార్గనిష్ణారహితుండవు చార్వాకమతానుసారిబుద్ధి
ప్రవర్తకుండవు వీతధర్మమారుండవు నాస్తికుండ వైననిన్ను సమ్మానించిన
యస్మజ్ఞనకుండును నిందనీయుం డగుఁ జోరుం డెట్లు నిరాకరణీయుం డగు
నట్లు వేదబాహ్యత్వంబునం బ్రసిద్ధుం డైనబుద్ధుండును నిరాకరణీయుం డై
యుండు నీలోకంబునఁ జార్వాకుని సుగతతుల్యునింగా నెఱుంగందగుఁ గావున
నతండు బహిష్కరించుటకు యోగ్యుండు బుధుం డగువాఁడు నాస్తికవాద
శీలున కాభిముఖ్యం బొసంగం దగదు నీకంటెఁ బురాతను లగునట్టిజ్ఞానాధికు
లగుజనంబులు శుభకర్మంబు లనేకంబులు గావించి యిహపరలోకంబులు
జయించి సంతతంబును గ్రహనక్షత్రాదిరూపంబులం బరిదృశ్యమాను లై
వర్తించుచున్నవారు గావున నది ప్రమాణంబుగాఁ గొని విప్రులు మంగళా

త్మకం బైనకర్మంబును యజ్ఞదానాదికంబునుం గావించుచున్నవారు దానగుణ
ప్రధాను లైనవారును ధర్మరతు లైనవారును నహింసకు లైనవారును వీతమ
లు లై తేజోమయు లై మును లై సత్పురుషసమేతు లై లోకపూజ్యు లై ప్రకా
శించుచున్నవా రని పలికినఁ గ్రుద్ధుం డైనరామునిం జూచి యవ్విప్రుండు వ్రీళి
తుండై యనాస్తికంబును దథ్యంబును సత్యంబు నగువచనంబునఁ గోపోపశమ
నంబు సేయుచు ని ట్లనియె.

2081


చ.

కనలకు మేను నాస్తికుఁడఁ గా నిటు నాస్తికవాక్య మేను బ
ల్కినయది గాదు ధర్మ మన లేనిది గా దిది రామ నిక్క మో
దినకరతేజ యీభరతుదీనతఁ జూచి భవన్నివర్తనం
బున కిటు లంటిఁ ద ప్పనక పుణ్యచరిత్ర సహింపు మిత్తఱిన్.

2082


వ.

మహాత్మా యేను నాస్తికమతం బవలంబించి నీచేతఁ దిరస్కృతుండ నై వెండియుఁ
దన్నాస్తికవాదంబుఁ బరిహరించి ప్రకృతిగతుండ నైతి మదీరితం బైనయీనా
స్తికవాదంబు ధర్మసంకటకాలప్రయుక్తం బని యెఱుంగుము నాచేత నాస్తిక
వాదం బెట్లు సముదీరితం బయ్యె నట్టిధర్మసంకటకాలం బిప్పుడు సమాగతం
బయ్యె భవన్నివర్తనంబుకొఱకు భరతముఖోల్లాసనంబుకొఱకుఁ గాలాను
సరణంబుగా నిట్టివాదంబు వాదించితి నిది తప్పుగాఁ గొనకు మని యిట్లు
సాంత్వవాక్యంబుల ననూనయించుచున్న జాబాలిని వారించి క్రుద్ధుండై యున్న
రామునిం జూచి మునిశ్రేష్ఠుం డైనవసిష్ఠుం డి ట్లనియె.

2083


చ.

అనఘచరిత్ర యేపగిది నైన సుఖార్హుఁడ వైనని న్నవా
రణవనసీమనుండి నగరంబునకు న్మరలింపఁ గోరి యీ
యనువునఁ బల్కెఁ గాక వినయజ్ఞుఁడు లోకగతాగతజ్ఞుఁడు
న్జననుతుఁ డైనయీతపసి సత్య మెఱుంగనివాఁడె చెప్పుమా.

2084


క.

లోకేశపుత్ర విను మీ, లోకసముత్పత్తివిధ మలుప్తంబుగ న
స్తోకమనీషాప్రౌఢిమఁ, జేకొని బోధింతు నఖిలశిష్టులు వినఁగన్.

2085

వసిష్ఠమహర్షి రామునికి రఘువంశక్రమం బెఱింగించుట

మ.

విను మేకార్ణవ మైనకాలమునఁ బృథ్వీభాగ మెచ్చోట వి
ష్ణునిచే నిర్మిత మయ్యె నచ్చట సురస్తోమంబుతోఁ గూడఁ జ
య్యనఁ బ్దమాసనుఁ డుద్భవించె ఘనుఁ డై యయ్యుర్వి మున్నీటిలో
మునుఁగం గేశవుఁ డుద్ధరించెఁ గడిమి న్భూదారవేషంబునన్.

2086


తే.

అంత నాకాశసంభవుం డవ్యయాత్ముఁ, డజితుఁ డమీరుఁ డనఘుఁ డనామయుం డ
నంతుఁ డాబ్రహ్మ పుత్రసహాయుఁ డగుచు, ఘనత నిర్మించె సకలలోకంబు లనఘ.

2087

తే.

అట్టిపరమేష్టికిఁ గుమారుఁ డై మరీచి, పుట్టె నాతని కలకశ్యపుఁడు జనించె
నమ్మహాత్మున కుదయించె నంశుమంతుఁ, కతనికి జనించె వైవస్వతాఖ్యమనువు.

2088


క.

అతనికిఁ బుత్రుఁడు త్రిజగ, ద్ధితుఁడు ఋజుఁడు కీర్తిమంతుఁ డిక్ష్వాకు వనా
జితవైరి గలిగె లక్ష్మీ, పతికి విరించనుఁడు బోలె భవ్య గుణాఢ్యా.

2089


తే.

మొదల నెవ్వాని కమ్మనుముఖ్యుఁ డివ్వ, సుంధర నొసంగె నట్టివిశుద్ధచరితు
ననఘు నిక్ష్వాకునృపు నయోధ్యాపురమున, కాదిరాజును గాఁ జూడు మనఘచరిత.

2090


క.

ఆయతతేజోనిధి యగు, నాయిక్ష్వాకునకుఁ గుక్షి యనువాఁడు సుతుం
డాయనకుఁ గుమారుఁడు భద్రాయతశౌర్యుఁడు వికుక్షి యనువాఁ డనఘా.

2091


తే.

ఆవికుక్షికి నందనుం డయ్యె బాణుఁ, డాతఁ డనరణ్యుఁ గనియె విఖ్యాతకీర్తి
నతఁ డనావృష్టిచోరరోగాద్యుపద్ర, వంబు లేవియు లేకుండ వసుధ నేలె.

2092


క.

ఆయనరణ్యునకు సుతుం డై యనఘుఁడు పృథుఁడు పుట్టె నతఁడు త్రిశంకు
న్ధీయుతునిఁ గనియె నాతఁడు, కాయముతోఁ గూడ నాకగతికిం జనియెన్.

2093


క.

అట్టి త్రిశంకుజనపతికిఁ, బుట్టె ఘనుఁడు దుందుమారభూపుఁ డతనికిం
బుట్టె యువనాశ్వుఁ డతనికిఁ, బుట్టె న్మాంధాతృనృపతి పూర్ణేందుఁ డనన్.

2094


శా.

ఆరాజేంద్రునకుం గుమారుఁడు సుసంధ్యాఖ్యుండు జన్మించె నా
ధీరుం డంతఁ బ్రసేనజిత్తు ధ్రువసంధిం గాంచె నాపుణ్యుఁ డా
శూరోత్తంసు మహానుభావు భరతున్ శుద్ధాత్మునిం గాంచె న
వ్వీరశ్రేష్ఠునకు న్జనించె నసితోర్వీభర్త రమ్యాకృతిన్.

2095


సీ.

ఆయసితుండు రాజ్యం బేలుచుండ హైహయతాలజంఘాదు లధికశక్తిఁ
బయి నెత్తి వచ్చిన భండనంబున నోడి పాఱి పర్వతగుహపజ్జ డాఁగె
నతనికి గర్భిణు లగుపత్ను లిరువురు గల రం దొకర్తె యొకర్తెచూలు
చెఱుపంగఁ దలకొని గరముఁ బెట్టిన నది ప్రాలేయగిరి కేగి పరఁగ చ్యవనుఁ


తే.

గాంచి మ్రొక్కిన నమ్ముని గరళవహ్ని, నతిదయామృతధారఁ జల్లార్చి దేవి
లోకవిశ్రుతుఁ డైనపుత్రుండు నీకుఁ, గలుగు నిది నిక్క మని యనుగ్రహముఁ జేసె.

2096


తే.

అంత నక్కాంత సంమదస్వాంత యగుచు, మునికిఁ బ్రణమిల్లి తనగృహంబునకు వచ్చి
యొక్కసుముహూర్తమునఁ బుత్రు నుగ్రతేజు, సరసిజదళాక్షుఁ బరమేష్ఠిసమునిఁ గనియె.

2097


తే.

గరముతోఁ గూడఁ బుట్టినకారణమున, సగరుఁ డనుపేర నొప్పి యాచక్రవర్తి

పెక్కుహయమేధములఁ జేసి పెంపు వడసి, ప్రజల నందఱఁ బుత్రుల పగిదిఁ బ్రోచె.

2098


వ.

మఱియు నమ్మహీరమణుండు యోగదీక్షితుం డై సర్వకాలంబునందు సలిలవేగం
బున నీప్రజల నందఱ భయంబు నొందించు నట్టిసముద్రంబుఁ దనపుత్రులచేత
నద్భుతంబుగాఁ ద్రవ్వించె.

2099


క.

అతనికి నసమంజుం డను, సుతుఁ డొక్కఁడు పుట్టి ప్రజల సుడి పెట్టుచు దు
ర్మతి యై కడపట జనహిత, రతుఁ డగుతనతండ్రిచే నిరస్తుం డయ్యెన్.

2100


క.

ఆయసమంజునకుఁ గుమా, రాయతబలశాలి పుట్టె నంశుమదాఖ్యుం
డాయనఘునకు దిలీపుం, డాయనకు భగీరదాఖ్యుఁ డాత్మజుఁ డయ్యెన్.

2101


తే.

ఆభగీరథునకుఁ బుట్టె నల కకుత్స్థుఁ, డతని కుదయించె రఘువు తదన్వయమునఁ
గొమరుఁ గాంచినవారు కాకుత్స్థు లనఁగ, రాఘవు లనంగ వెలసిరి రామచంద్ర.

2102


క.

ఆరఘుపుత్రుఁడు సత్యవి, చారుండు ప్రవృద్ధుఁ డతఁడె సౌదాసుఁ డన
న్ధీరుఁడు పురుషాదకుఁ డన, నారయఁ గల్మాషపాదుఁ డనఁ దగె నుర్విన్.

2103


వ.

ఆకల్మాషపాదునకు శంఖణుండు పుట్టె నతండు వసిష్ఠశాపంబువలన రాక్షసత్వంబు
నొందినకల్మాషపాదునిచేత సైన్యసమేతంబుగా భక్షితుం డయ్యె నాశంఖ
ణునిపుత్రుం డైనసుదర్శనునకు నగ్నివర్ణుండు పుట్టె నతనికి శీఘ్రగుండు పుట్టె నత
నికి మరువు పుట్టె మరునకుఁ బ్రశుశ్రుకుండు పుట్టె నతని కంబరీషుండు పుట్టె సత
నికి నహుషుండు పుట్టె నహుషునకు నాభాగుండు పుట్టె నాభాగున కజుండును
సువ్రతుండు నన నిద్దఱు కొడుకులు గలిగి రయ్యజునకు దశరథుండు జన్మించె
నాదశరథునకు నీవు జ్యేష్ఠపుత్రుండ వై జన్మించితివి పరమపవిత్రం బైనయిక్ష్వాకు
వంశంబునం బుట్టినరాజులలోనఁ బూర్వజునకు రాజ్యాభిషేకంబును గనిష్ఠున
కతనిసేవయు నుచితం బై యుండు నట్టిసనాతనం బైనవంశక్రమాగతధర్మంబు
నిరాకరింపక స్వకీయం బైనరాజ్యం బంగీకరించి ప్రభూతరత్న యగునిమ్మహి
నెల్లఁ దండ్రియుం బోలెఁ బరిపాలింపు మని యివ్విధంబునం బలికి రాజుపురో
హితుం డగు వసిష్ఠుండు వెండియు ధర్మయుక్తం బగువాక్యంబున ని ట్లనియె.

2104

వసిష్ఠమహర్షి రామునితో రాజ్యం బంగీకరింపు మని చెప్పుట

క.

నరనాథశిరోమణి విధి, సరణిన్ జనకుం డనంగ జనయిత్రి యనం
గర మాచార్యుం డనఁగాఁ, బురుషున కీలోకమందు మువ్వురు గురువుల్.

2105


క.

కని పెంచుఁ దల్లి జన్మం, బునకుం గారణము తండ్రి బుద్ధిప్రదుఁ డౌ
ఘనుఁ డాచార్యుఁడు గావున, ననఘా యాచార్యుఁ డెక్కు డామువ్వురిలోన్.

2106


తే.

అట్టియేను గకుత్స్థవంశాబ్దిచంద్ర, చెలఁగి యిక్ష్వాకులకు శేముషీప్రదుండ
నైనయాచార్యకుఁడ నైతి నట్లుగాన, నాదువాక్యంబు మీఱంగరాదు నీకు.

2107


తే.

ఈసభాసదు లైనమహీదివిజులు, పౌరులును జానపదులును బంధుజనము
లర్థి యాచించుచున్నవా రనఘచరిత, వీరికోరిక వృథ సేయ మేర గాదు.

2108

తే.

ధర్మశీలయు వృద్ధయు నిర్మలమతి, యును గులాచారసంసక్తయును జననియు
నైనకౌసల్యనెమ్మన మలరఁ జేసి, పూర్వరాజులసత్కీర్తిఁ బొందు మనఘ.

2109


చ.

అరయ గుణాకరుండు నిఖిలార్థవిదుండు మహానుభావుఁ డీ
భరతుఁడు భ్రాతృవత్సలుఁడు భవ్యచరిత్రుఁడు రాజధర్మమా
ర్గగతుఁడు దాసభూతుఁ డటు గావున రాఘవ వీనియంజలిం
గర మనురక్తిఁ గైకొని యఖర్వదయారతిఁ బ్రోవు మిత్తఱిన్.

2110


వ.

అని యివ్విధంబున మధురంబుగాఁ బలికిన వసిష్ఠునివాక్యంబు విని పురుష
శ్రేష్ఠుం డగురాముం డి ట్లనియె.

2111

రాముఁడు వసిష్ఠుని సమ్మతింపఁజేయుట

సీ.

తాపసోత్తమ తల్లిదండ్రులు తపములు వ్రతములు దేవతారాధనంబు
లుపవాసములు సల్పి యపురూపముగఁ బుత్రుఁ గాంచి పుట్టినవెన్కఁ గరము ప్రీతి
నన్నవస్త్రాభరణాదిదానమున సంవర్ధనంబునఁ బ్రియవాదనమున
గారవంబునఁ బెంచి కడుఁబెద్దవానిఁగాఁ జేసిరి వారల సేఁత కేమి


తే.

ప్రతికృతి యొనర్పఁగా నగుఁ బరమగురుఁడు, జనకుఁ డగుదశరథుఁ డెద్ది సంతతంబు
సలుపు మని పంచె దాని నౌదల ధరించి, సేయుదునుగాక యది రిత్త సేయనయ్య.

2112


సీ.

మునివంశశేఖర మున్ను యావజ్జీవపర్యంతమును వాక్యపాలనమునఁ
బొసఁగఁ బ్రత్యబ్దంబు భూరిభోజనమునఁ బ్రీతితో గయయందుఁ బిండదాన
మున మూఁటిచేతఁ బుత్రునకుఁ బుత్రత్వంబు ప్రాప్తించునని మీరె పలికి యిప్పు
డన్యధర్మం బిటు లాన తీఁదగునె మహాత్ముఁడు దశరథుం డధివిభుండు


తే.

తండ్రి గావున నానృపోత్తమునిమాట, యనృత మేరీతి నగును సత్యంబె కాక
తల్లిదండ్రులు పంచినదానిఁ జేయ,కొండుతెఱఁ గూని యపకీర్తి నొందఁజాల.

2113


వ.

అని యివ్విధంబునం బలికిన రామునినిశ్చయం బెఱింగి యతనిచిత్తంబు
ప్రసాదాయత్తంబు గాకుండుటకు దుఃఖించుచుఁ బరమోదారుం డగుభర
తుండు పరమదుర్మనస్కుం డై సమోపవర్తి యైనసూతుం జూచి కరుణోదారుం
డగురాముండు ప్రనన్నుం డగునందాఁక నిరాహారుం డనై యవగుంఠితాన
నుండ నై ధనహీనుం డైనద్విజునిచందంబున నిప్పర్ణశాలాగ్రభాగంబునఁ
బ్రత్యుపవేశంబుఁ జేసెద నీస్థండిలంబునందుఁ గుశాస్తరణంబు సంఘటింపు
మని పలికిన నాసుమంత్రుండు నివ్వెఱపడి యేమియుం దోఁపక రాముని
వదనంబు విలోకించుచు నూర కున్న నతనిం జూచి భరతుండు తనకుఁ దానె
ధరణీపయిం గుశాస్తరణంబుఁ బఱచికొని దాని నధివసించిన నతనిం జూచి
రాజర్షిసత్తముం డగురాముండు కరుణారసపూరితాంతఃకరణుం డై యి ట్లనియె.

2114


మ.

అనఘా యీదురవస్థ పాఱునకుఁ గా కయ్యారె మూర్థాభిషి
క్తునకుం జెల్లునె లెమ్ము నావచన మెంతో ప్రీతిఁ గైకొమ్మిఁకన్

జననీవర్గముతోడఁ గూడి మరలన్ స్థానీయముం జేరి నా
యనవాక్యంబు తొలంగకుండ ఘనరాజ్యశ్రీలఁ బాలింపుమా.

2115


క.

అన విని భరతుం డచ్చటి, జనములఁ బరికించి సత్యసంధుం డగురా
మునిమాటచొప్పు వింటిరె, నను దూష్యునిఁ జేయఁ దలఁచినాఁడు మనీషన్.

2116


క.

నా విని వారలు కైకే, యీవరనందనునిఁ జూచి యిట్లని రనఘా
దేవరవారికి దయ రా, దేవిధి బోధించువార మింకఁ గృపణతన్.

2117


క.

ఈరఘువీరుఁడు సత్యవి, చారుఁడు పితృవాక్యమందు సంస్థితుఁ డై యొ
ప్పారెడుఁ గావున ధర్మవి, చారా మరలింప మా కశక్యం బయ్యెన్.

2118


క.

అని పలుక నపుడు వారివ, చనములు విని మరల రామచంద్రుఁడు భరతుం
గనుఁగొని వింటివె వీరివ, చన మలరెడి సత్యధర్మసంహిత మగుచున్

2119

.

క.

లెమ్మా యీవ్రత మేటికి, బొమ్మా నామతి గ్రహించి పురమున కటు గై
కొమ్మా కోసలరాజ్యము, గమ్మా ధన్యాత్మకుఁడ వకల్మషధిషణా.

2120


తే.

మానితాచార యీపౌరజానపదుల, వచనమును మత్సమీరితవచనము విని
శీఘ్రమున లేచి నన్నును జీవనమును, సంస్పృశింపుము నీ విట్లు సలుపవలదు.

2121


వ.

అని పలికి భుజంబులం గ్రుచ్చి యెత్తిన నాభరతుండు ప్రత్యుపవేశంబుఁ
జాలించి శీఘ్రంబున లేచి క్షత్రియానర్హప్రత్యుపవేశనప్రాయశ్చిత్తార్థంబు
జలంబు లుపస్పృశించి యెల్లవారును విన ని ట్లనియె.

2122


సీ.

ఈసభాసదులు మహీసుపర్వులు మంత్రు లంద ఱాకర్ణింప నాడువాఁడ
రాజ్య మి మ్మని దశరథుని వేఁడఁగ లేదు జనయిత్రి దుర్మంత్రమునకు నీయ
కొనుట లేదు జగద్ధితుని సత్యరతుని ని న్నడవికిఁ బుచ్చుట యది యెఱుంగ
జనకునివాక్యంబు సమకూర్పఁ గర్తవ్య మేని యీ రేడేండ్లు కాననమునఁ


తే.

ద్వత్ప్రతినిధిత్వమున నేనె తగ వసించు, వాఁడ నీవు మత్ప్రతినిధిత్వమున రాజ్య
మేలు మట్లైన నీరెంట నృపునిమాట, సార్థకత్వంబు నొందు మహానుభావ.

2123


వ.

అని పలికిన ధర్మాత్ముం డగు రాముండు తథ్యం బైనతమ్మునివచనంబు విని విస్మి
తుండై పౌరజానపదుల నందఱ విలోకించి యి ట్లనియె.

2124


క.

మని యుండి మాకు నెయ్యది, మనుజేంద్రుఁ డొసంగె దాని మాఱిచికొనఁగాఁ
జన దిపుడు నాకు భరతున, కనఘాత్మకులార సత్య మది యె ట్లయ్యెన్.

2125


వ.

మఱియు వనవాసకరణశక్తిమంతుఁడ నైననాచేత వనవాసవిషయంబునందు
జుగుప్సితం బైనప్రతినిధిత్వం బకార్యం బై యుండుఁ గైకేయి యుక్తవాక్యంబె
పలికె దశరథుండు యుక్తధర్మంబె యాచరించె దశరథోద్దిష్టం బైనకార్యం
బవశ్యం బేనును భరతుండును శిరంబునం బూని నడుపవలయు భరతుని
గురుసత్కారశీలునిఁగా జితేంద్రియునిఁగా నెఱుంగుదు మహాత్ముం డైనజన
కుండు సత్యసంధుం డగుచుండ భరతునివిషయంబునందు సర్వంబునుం గల్యాణం

బగు నేను బదునాల్గువత్సరంబులు వనవాసంబు సలిపి క్రమ్మఱ నయో
ధ్యకుం జనుదెంచి ధర్మశీలుం డైనయీభరతునితోఁ గూడ సామ్రాజ్యదీక్షి
తుండ నయ్యెద నని పలికి వెండియు భరతున కి ట్లనియె.

2126


తే.

అచలసమధీర జనకునివచన మేను, సార్థకంబుగఁ జేసితి సత్య మూఁది
నీవు నావచనంబున నృపవరేణ్యు, సత్యమున నుద్ధరింపుమీ జాలి విడిచి.

2127


వ.

అని పలికె నప్పు డప్రతిమతేజు లైనరామభరతుల పరస్పరాతిశయితసౌహా
ర్ధకృతం బైనసంగమంబుఁ జూచి విస్మితు లై యచ్చటిసిద్ధులును బ్రహ్మర్షి
దేవర్షులును గుంపులు గట్టి యెవ్వాని కిట్టి ధర్మజ్ఞులును ధర్మమార్గప్రవర్త
కులు నగువీ రిరువురు పుత్రు లయి రట్టిదశరథుండు ధన్యుం డయ్యె నని మహా
త్ము లగువారిం బ్రశంసించి రందు రావణవధార్థు లగుకొందఱు మహర్షులు
రఘుశార్దూలుం డగుభరతుని కి ట్లనిరి.

2128


క.

ప్రవిమలచిత్త కులీనుం, డవు సువ్రతుఁడవు మహాత్ముఁడవు భూరియశుం
డవు రామునివాక్యము జన, కవాక్యమును బోలె నీవు గైకొనవలయున్.

2129


వ.

మహాత్మా యీరఘూత్తమునిఁ బితౄణవిముక్తుం గాఁ దలంచెదము కైకేయి
ఋణంబువలన విముక్తుం డయి దశరథుండు నాకంబునకుం జనియె నని పలికి
యమ్మహర్షులును రాజర్షులును శుభదర్శనుం డగురామునిచేతఁ బూజితు లయి
యామంత్రణంబు వడసి గంధర్వసహితంబుగాఁ దమతమనివాసంబులకుం జని
రంత భ్రాతృవత్సలుం డైనభరతుండు త్రస్తగాత్రుం డై కేలుదోయి ఫాలంబునం
గీలించి వెండియు గాద్గదికోక్తి ని ట్లనియె.

2130


క.

అనఘాత్మ రాజధర్మం, బును గులధర్మక్రమంబు పొలుపుగ మతిఁ గై
కొని మద్వాంఛితము భవ, జ్జననీవాంఛితము కరుణ సమకూర్ప నగున్.

2131


క.

పనివడి యే నొక్కరుఁడను, ఘనమతి రాజ్యంబు నేలఁ గా లే ననిశం
బనురక్తు లైనజనముల, ననఘా రంజింపఁజాల ననుపమశక్తిన్.

2132


క.

మునుకొని హలికులు పర్జ, న్యునిఁ బోలె సుహృజ్జనములు యోధులు మంత్రు
ల్ఘనబుద్ధి నిన్నె కులపా, వన మదిఁ గాంక్షించుచున్నవా రనిశంబున్.

2133


క.

అలఘుతరధర్మకౌశల, బలమున ఘనబుద్ధియోగబలమునఁ గడుదో
ర్బలమున లోకజనంబుల, నలరింప సమర్థకుండ వైతి మహాత్మా.

2134


వ.

అని యిట్లు భరతుండు పరిమార్తుం డై రామునిచరణంబులపైఁ బడి ప్రాంజలి
యై బహుప్రకారంబులం బ్రార్థించిన నారఘుపుంగవుం డతనిసద్భావంబుఁ
జూచి కరుణాతరంగితాపాంగుం డై యతని నిజోత్సంగంబున నిడికొని యెల్లవా
రును విన మత్తహంసస్వరంబున ని ట్లనియె.

2135


ఉ.

ఎంత నయంబు దెల్పిన మహీవరనందన సారెసారె కి
ట్లింత కృశించె దేటికి నహీనమహీపరిపాలనంబునం

దెంతయు నుత్సహింపుము మహీసురభక్తియు దేవపూజయు
న్స్వాంతమునందు నేమఱక సల్పుము భూజనరంజనుండ వై.

2136


ఆ.

బుద్ధిమంతు లైన భూసురాచార్యుల, సుప్రసిద్ధభృత్యసుహృదమాత్య
మంత్రివరులఁ గూడి మంత్రంబుఁ గావించి, కార్యతంత్రములకుఁ గడఁగు మనఘ.

2137


తే.

పార్థివాత్మజ నీవు స్వభావముననె, గుణగరిష్ఠుఁడ వది గాక గురువినీత
బుద్ధి నినుఁ బొందెఁ గావునఁ బుడమిఁ బ్రోవఁ, గడుసమర్థుఁడ వైతివి కడఁక యేల.

2138


క.

కమలారి కాంతి వీడిన, హిమవంతుం డాత్మనిష్ఠ హిమము విడిచిన
న్గమలనిధి వేల దాఁటినఁ, గ్రామమునఁ బితృశాసనంబు గడతునె యనఘా.

2139


క.

అనఘవిచారక కామం, బున నైనను రాజ్యలోభమున నైన భవ
జ్జనయిత్రి నీకుఁ గా నిది, కనికని గావించె నింకఁ గడవఁగ నగునే.

2140


వ.

అది చింతింపక కేకయరాజపుత్త్రికయందు మాతృభక్తి విడువక వర్తింపవల
యు నని బహుప్రకారంబుల ననూనయించుచున్న విని భరతుం డెట్టకేలకు
నీయకొని పదంపడి తచ్చరణంబులు శిరంబు సోఁకం బ్రణమిల్లి యాదిత్యసమ
తేజుండును బ్రతిపచ్చంద్రదర్శనుండు నగురామున కి ట్లనియె.

2141

రాముఁడు తనపాదుకలను భరతున కొసంగుట

సీ.

తరణివంశోత్తమ ధర్మసంహిత మైనభవదీయచిత్త మెబ్భంగి నైన
మరలింప లే నైతి వెరవులు వేయేల హలకులిశాంకుశాద్యఖిలదివ్య
లక్షణభూషితలలితకాంచనపాదుకాద్వయంబు ధరించి కరుణ నొసఁగు
మక్షీణరాజ్యయోగక్షేమ మనిశముం దత్పాదుకలకు విన్నపముఁ జేయు


ఆ.

చుండువాఁడ ననినఁ బుండరీకదళాయ, తాక్షుఁ డైనరాముఁ డలరి యతని
కతిదయాసముద్రుఁ డై ధరించి యొసంగె, భర్మరచితరత్నపాదుకలను.

2142


క.

ఇచ్చినఁ గైకొని భరతుం, డిచ్చ నలరి కౌతుకంబు హెచ్చఁగ భక్తిం
జెచ్చెరఁ బ్రణతుం డై నయ, మచ్చుపడఁగ నిట్టు లనియె నన్నకు మరలన్.

2143


సీ.

అనఘాత్మ నీకు మాఱాడ రా దని దీని కిప్పుడు భయమున నీయకొంటిఁ
బదునాలుగబ్దము ల్పాదుకార్పితరాజ్యకార్యుండ నగుచు వల్కలము లజిన
ములు దాల్చి ఫలమూలములు వేడ్క మెసవుచు నిండినపురిఁ బాసి యొండుచోట
మనమున భవదాగమనముఁ గోరుచుఁ గాల మొకరీతిఁ గడపుచు నుండువాఁడ


తే.

వాసవోపమ సమయాంతవాసరమునఁ, గనులపండువుగా నిన్నుఁ గాంచ నేని
సొరిది మండెడిచిచ్చులో నుఱుకువాఁడఁ, జంద్రసూర్యాగ్ను లొక్కట సాక్షి గాఁగ.

2144


తే.

అనినఁ దమ్ముని దృఢభక్తి కలరి రాముఁ డతనిప్రతిన కొడంబడి సాదరముగ
నపుడు కౌఁగిటఁ జేర్చి మహానురాగ, భరితహృదయుఁ డై యి ట్లని పలికె మరల.

2145


తే.

అనఘచరిత కైకేయి నత్యంతభక్తి, బ్రోవు మనిశంబు నటుగాక రోష మూఁది
కనలి దూషించి తేని భూతనయచేత, నరయ నాచేత శప్తుఁడ వౌదు వింక.

2146

భరతుఁడు శత్రుఘ్నసహితుం డై చిత్రకూటంబునుండి వెడలుట

వ.

అని పలికి బాష్పపరీతలోచనుం డై యాలింగనంబుఁ జేసి భరతుని సముచితం
బుగా వీడ్కొనిన నతండు స్వలంకృతం బైనతదీయపాదుకాద్వయంబు ప్రతి
గ్రహించి ధర్మవిదుండు కావునఁ బ్రదక్షిణంబు గావించి శత్రుంజయనాగశీర్షం
బునం బెట్టి పదంపడి నిజశీర్షంబున నిడికొని రథారూఢుం డయ్యె నంత నారఘు
వంశవర్ధనుం డగురాముండు శత్రుఘ్నునిం గౌఁగిలించికొని సాదరంబుగా వీ
డ్కొని పదంపడి గురువృద్ధమంత్రిభృత్యప్రభృతుల నందఱ నానుపూర్విమెయి
సముచితప్రకారంబున సంభాషించి వీడ్కొనియె నప్పుడు బాష్పగృహీతకంఠు
లై తల్లు లందఱు దుఃఖంబున నతని విడిచి పోవం జాల కున్న నమ్మహాను
భావుండు వారి నందఱ నభినందించి ప్రయాణంబున కొడంబఱిచి రోదనంబు
సేయుచు సీతాలక్ష్మణసహితంబుగాఁ బర్ణశాలఁ బ్రవేశించె నంత.

2147


క.

భరతుఁడు తత్పాదుకలను, బరువడి తనశిరముఁ జేర్చి భక్తి యలరఁగా
నరదం బెక్కి సుమిత్రా, వరసుతసహితముగ నరిగె బలములు గొలువన్.

2148


వ.

పదంపడి వసిష్ఠుండును వామదేవుండును జాబాలియు నమోఘకార్యవిచార
నైపుణ్యంబునఁ బూజితు లైనమంత్రులును యథార్హయానంబు లెక్కి మందా
కినీనది నుద్దేశించి ప్రాఙ్ముఖు లై చిత్రకూటపర్వతంబునకుఁ బ్రదక్షిణంబుగాఁ
దిరిగి యగ్రభాగంబునం జనిరి యిత్తెఱంగున భరతుండు ససైన్యుం డై నానా
విధమనోహరధాతుసహగ్రంబు లవలోకించుచుఁ జిత్రకూటనగపార్శ్వంబునం
జని చని మహాత్ముండు భరద్వాజుం డెచ్చట నివసించి యుండు నట్టిపుణ్యాశ్ర
మంబు సేరం జని యందు రథంబు డిగ్గి పాదచారి యై యమ్మునికడకుం జని
నమస్కరించిన నతండు సంతుష్టాంతరంగుం డై భరతున కి ట్లనియె.

2149


క.

అనఘాత్మ పోయి వచ్చితె, ప్రణుతగుణుం డైనరామభద్రుసకాశం
బున కచ్చటివృత్తాంతము, వినిపింపఁ గదయ్య మాకు విన నగు నేనిన్.

2150

భరతుఁడు రామానుమతంబు భరద్వాజున కెఱింగించుట

ఉ.

నా విని యత్తపస్వికులనాథునితో భరతుండు పల్కు నో
పావనశీల యేనును నృపాలపురోహితుఁ డీవసిష్ఠుఁడు
న్వేవిధుల న్రఘూత్తముని వేఁడిన నానృపధర్మవేది సం
భావనఁ జేసి యి ట్లనియె మక్కువతోడ వసిష్ఠమౌనికిన్.

2151


క.

గురువర్య యొండుగాథలు, గఱపెద రిట్లేల తండ్రి గఱపినకరణి
న్దిరముగఁ బదునాల్గబ్దము, లరణ్యమున నుండువాఁడ నతిధీయుక్తిన్.

2152


వ.

అనిన వసిష్ఠుండు వాక్యజ్ఞుండు గావున యుక్తియుక్తం బగువాక్యంబున మహా
ప్రాజ్ఞుం డగురామున కి ట్లనియె.

2153

క.

అటు లైన సకలరాజమ, కుటఖచితమహార్హరత్నకోటిమయూఖో
ద్ఘటితమణిహేమపాదుక, లిటు దయసేయుము మహాత్మ కృప గలదేనిన్.

2154


ఆ.

అనిన నట్ల కాక యని ప్రాఙ్ముఖుం డై ధ, రించి రాఘవుఁడు సమంచితమణి
పాదుకల నొసంగె నాదురాజ్యార్థంబు, కన్నుఁగొనలఁ గరుణ గడలుకొనఁగ.

2155


వ.

ఇవ్విధంబున నద్దివ్యపాదుక లొసంగినం బ్రతిగ్రహించి యమ్మహాత్మునిచేత
ననుఙ్ఞాతుండ నై క్రమ్మఱ నయోధ్యకుం బోవుచున్నవాఁడ నని సర్వంబు నెఱిం
గించిన శుభం బైనభరతునివాక్యంబు విని యమ్మునిపుంగవుండు సంతుష్టాం
తరంగుం డై వెండియు ని ట్లనియె.

2156


తే.

పరఁగ సలిలంబు నిమ్నభూభాగమునకు, నోడిగిల్లినపగిది గుణోన్నతత్వ
మనఘ నీయందుఁ జేరు నీయట్టి శీల, ధర్మవంతుల కిది విచిత్రంబు గాదు.

2157


తే.

అనఘ యెవ్వాని కిట్టిధన్యాత్మకుఁడవు, ధర్మశీలుఁడ వీవు పుత్రకుఁడ వైతి
వట్టిమీయయ్య దశరథక్ష్మాధిపుండు, వసుధఁ జచ్చియు మనియున్నవాఁడు గాదె.

2158


వ.

అని బహుప్రకారంబుల సాదరంబుగా నభినందించి యుక్తవాక్యంబుల దీవించి
యనిచిన భరతుం డమ్మహామునికిఁ బ్రదక్షిణంబు సారెసారెకుఁ దదీయచర
ణంబులకుం బ్రణతుం డై సముచితంబుగా నామంత్రణంబు వడసి చతురంగ
బలంబును మంత్రులును దనవెంట నరుగుదేరం గదలి రయంబునం బోవుచుఁ
గల్లోలమాలిని యగుయమునానది నుత్తరించి యవ్వలఁ బావనజలసంపూర్ణ
యగుగంగానది దాఁటి శృంగిబేరపురంబు నతిక్రమించి యవ్వల బహుదూరం
బరిగి పురోభాగంబున.

2159


తే.

దశరథునిచేత జానకీధవుని చేత, విడువఁబడిన కారణమున విప్రణష్ట
నాద యై దీన యై నిరానంద యై వి, పన్న యై శూన్యగేహ యై యున్నదాని.

2160


తే.

శ్వానమార్జాలఘూకసంచలిత యైన, దాని నాలీననరగజ యైనదాని
సాంద్రతిమిరపటలపరిచ్ఛన్నకృష్ణ, పక్షయామినికరణిఁ జూపట్టుదాని.

2161


తే.

భీషణాంగారకగ్రహపీడిత యగు, రోహిణీదేవిభంగి నుత్సాహ ముడిగి
కంప మొంది నిష్కాంతి యై సొంపు దక్కి, యున్నదాని దైన్యంబుఁ గైకొన్నదాని.

2162


వ.

మఱియు రాహుగ్రస్త యైనచంద్రచంద్రికకైవడి యల్పోష్ణక్షుబ్ధసలిల యై
ఘర్మోత్తప్తవిహంగమ యై లీనమీనఝషగ్రాహ యై కృశించి యున్న గిరినది
పగిదిం గనుపట్టుచున్నదాని మఱియును.

2163


తే.

తొలుతఁ దప్తహేమముభంగి వెలుఁగుచుండి, వెనుక దధ్యాదికంబుచే వేల్వఁబడి ల
యంబు నొందినఘనసవనాగ్నిజనిత, కీలకైవడిఁ జెలువఱి క్రాలుదాని.

2164


తే.

వినిహతాయుధకవచకేతనపదాతి, యై వినాశితనాయక యై విరుగ్ణ
వాజివారణరథ యై ఘనాజిభూమి, నొప్పు సెడినవాహినిభంగి నున్నదాని.

2165


తే.

మొదల రవఫేనయుక్త యై పిదప శాంత, మారుతోద్ధూత యై సొంపు మాలి రయము

మాలి యపగతనిస్వన యైనసాగ, రోష్టితోర్మిచందంబున నున్నదాని.

2166

భరతుఁడు దవ్వులనుండి యయోధ్యం గనుంగొనుట

వ.

మఱియు సుత్యాకాలంబు నివృత్తం బగుచుండ నభిరూపకు లైనయాజకుల
చేత యజ్ఞాయుధంబులచేతఁ బరిత్యక్తం బగుటవలన నిశ్శబ్దం బై యున్న
యోగవేదిచందంబున గోవృషంబును బాసి తృణంబు మెసకక గోష్ఠమధ్యం
బునం బరిభ్రమించుచున్నగోపంక్తిచాడ్పున సుస్నిగ్ధంబు లయి పద్మరాగాది
శాతిరత్నంబులచేత వియుక్త యయిననూతనముక్తావళిలాగునఁ బుణ్యక్షయంబు
వలన స్థానచలిత యై దివంబున నుండి పుడమిం బడి సంహృతద్యుతివిస్తార
యైనతారపగిది వసంతకాలాంతంబునఁ బుష్పోపేత యై మత్తభ్రమరశాలిని
యై యుండి వేగవంతం బయినదావాగ్నిచేత నీషదగ్ధ యై వాడి యున్నవన
లతకైవడిఁ బ్రచ్ఛన్నశశినక్షత్ర యై మేఘంబులచేత నావరింపంబడి యున్న
దివంబుకరణిఁ బరిక్షీణమద్యోత్తమంబు లైనభిన్నశరావంబులచేత నభిసంవృత
యై సమూహతమత్తజన యై యసంస్కృత యై యనావృతప్రదేశంబునం దున్న
పానభూమిమాడ్కి భిన్నపాత్రసమావృత యై భిన్నభూమితల యయి యువయు
క్తోదక యై భగ్న యై పుడమిం గూలి యున్నపానీయశాలభంగిఁ జవంబునందు
సమారోపిత యై బద్ధకోటిద్వయపాశ యై యుండి రణమధ్యంబునఁ బ్రతివీరుల
బాణంబులచేతఁ బరిచ్ఛిన్న యై వింటనుండి జాఱి పుడమిం బడిన మౌర్విరీతి
యుద్ధశాౌండుం డగుహయారోహకుని వేగంబున వహించి యలసి యవరోపితా
శ్వభూషణ యై విడువంబడిన బాలబడబయట్లు శుష్కతోయయు భిన్నతటయు
హృతోత్పలయు నై బహుమత్స్యకూర్మసంవృత యగువారిభాతి నప్రహృష్టుం
డై శోకసంతప్తుం డై భూషణానులేపనవర్జితుం డైనపురుషునిగాత్రయష్టివిధం
బున నిబిడం బయినప్రావృట్కాలంబునందు నీలజీమూతంబులచేతం గప్పఁబడిన
భాస్కరరశ్మిపొలువున సౌంపు సెడియున్నదాని నయోధ్య నవలోకించి భర
తుండు పరమదుఃఖితుం డై యప్పురంబుఁ బ్రవేశించి రాజమార్గంబునం బోవుచు
సారథి కి ట్లనియె.

2167

భరతుఁ డయోధ్యం బ్రవేశించి యందలిదుఃఖనిమిత్తంబుల సారథికిం జెప్పుట

క.

అనఘా యీనగరంబున, మునుపటివలెఁ బణవపటహమురజాద్యసువా
ద్యనినాదంబులు గీత, స్వనములు వినరావు కర్ణశర్మకరము లై.

2168


తే.

వారుణీమదగంధంబు భూరిమాల్య, సౌరభము చందనాగరుచారుధూప
వాసనలు నవ్యకస్తూరివరపరిమళ, మింపు సొంపార నేఁడు వాసింప దకట.

2169


క.

అనఘా రథనేమిఘన, స్వనములు హయహేషితములు వరవారణస
న్నినదంబు లిప్పు డప్పురి, వినరావు సఖా రఘుప్రవీరుఁడు లేమిన్.

2170


తే.

చందన మలంది క్రొవ్విరిసరులు దుఱిమి, పురుషు లనురూప లైననుందరులఁ గూడి

యువవనంబులఁ క్రీడింప నుత్సహింప, రూర రఘుపుంగవుఁడు లేనికారణమున.

2171


తే.

అకట యీవీటిసొబగు మహానుభావుఁ, డైనరామునిచే హత మయ్యె నేఁడు
వృష్టిధారాసమన్వితవిశదపక్ష, రాత్రికైవడి నున్నది రమణ దక్కి.

2172


వ.

మఱియు నపురూపంబుగా సమాగతం బైనమహోత్సవంబుకరణి మద్భ్రాత
యగురాముండు నిదాఘకాలంబునందలిమేఘంబుకైవడి నీనగరంబునం
దెన్నఁడు హర్షంబుఁ బుట్టించు నీరాజమార్గంబులు చారువేషధరు లగుపురు
షులమందాంచితగమనంబులచేత శోభితంబులు గా కున్నవి యని యిత్తెఱం
గున బహువిధదుఃఖాలాపంబు లాడుచు సింహహీనం బైనపర్వతకందరంబు
చాడ్పున రాజహీనం బై పాడఱి యున్నపితృమందిరంబుఁ బ్రవేశించి తొల్లి
దేవాసురసంగ్రామంబునందు స్వర్భానునిచేత భానుండు పరాజితుం డగుచుండ
నభాస్కరం బైనదినంబుభంగి నుజ్ఝితప్రభం బై యున్న యంతఃపురంబు
విలోకించి కన్నీరు నించి తల్లుల నందఱ స్వగృహంబులకుం బంచి మనంబున
దుఃఖించి వసిష్ఠాదిగురువుల నవలోకించి యి ట్లనియె.

2173

భరతుఁడు వసిష్ఠాదులతో నయోధ్యలో వాసముఁ జేయఁజాల ననుట

చ.

నృపతి త్రివిష్టపంబునకు నేగుచు నుండఁగఁ గౌసలేయుఁడుం
దపసివిధంబున న్వనపదంబునకుం జనుచుండ నిత్యము
న్వ్యపగతకాంతి యై భయద మై గహనాకృతి నున్నవీటియం
దిపుడు వసింపఁజాలఁ బరిహీనవిశాలమనోరథుండ నై.

2174


క.

రామాగమనముఁ గోరుచుఁ, గామితములు మాని విహితగతి మునివృత్తి
న్నేమంబున నలనంది, గ్రామంబున నుండువాఁడఁ గౌతుక మలరన్.

2175


క.

అని పలికినఁ గైకేయీ, తనయునికుశలోక్తి విని ప్రధానులు సచివుల్
మునివిభుఁడు వసిష్ఠుండును, వినయంబున నిట్టు లనిరి వెండియుఁ బ్రీతిన్.

2176


తే.

భ్రాతృవాత్సల్యమున నీవు పలికి నట్టి, లపిత మది శ్లాఘనీయ మై విపులమోద
కారి యయి యున్న దంతయు ఘనవివేకి, వైననీ కిది యనురూప మగుట యరుదె.

2177


తే.

భ్రాతృసౌహృదస్థితుఁడవు పండితుఁడవు, బంధులుబ్ధుఁడ వధిక సత్సథగతుండ
వైననీవచనంబు ధరాధినాథ, పుత్ర యెవ్వాని కైనను బొగడఁ దగదె.

2178

భరతుండు సైన్యసమేతముగా నందిగ్రామముఁ జేరుట

వ.

అని పలికిన యథాభిలషితం బైనవారలప్రియవాక్యం బాకర్ణించి ప్రహృష్ట
వదనుం డై తల్లుల కందఱ కభివాదనంబుఁ జేసి శత్రుఘ్నసహితంబుగా
రథం బెక్కి మంత్రిపురోహితసహితుం డై రామపాదుకలు శిరంబున నిడికొని
ప్రాఙ్ముఖంబుగా నందిగ్రామంబునకుం జనియె నతనియగ్రభాగంబున వసి
ష్ఠాదిమహామునులును మంత్రులును యథార్హయానంబులం జనిరి గజాశ్వరథ
పదాతులును బురవాసులు నతనివెనుకం జని రిట్లు భరతుండు నందిగ్రామంబు

ప్రవేశించి రథంబు డిగ్గి వసిష్ఠాదిగురువుల నవలోకించి యీరాజ్యంబు సమ్య
ఙ్నిక్షిప్తద్రవ్యంబుకరణి రామునిచేత నాకు దత్తం బయ్యె హేమభూషితంబు
లయినయీపాదుకలు యోగక్షేమంబు వహింపఁగలయవి యని పలికి దుఃఖి
తుం డై వెండియుఁ బాదుకలు శిరంబున నిడికొని ప్రకృతిమండలంబు నవ
లోకించి యి ట్లనియె.

2179


సీ.

రమణీయతరచామరంబులు వీవుఁడు పట్టుఁడు ఛత్రంబు పాదుకలకు
ననిశంబు మద్గురుం డైనరామునిపాదకమలరజస్సిక్తకమ్రహేమ
పాదుకాయుగళిప్రభావంబుచే రాజ్యమందు ధర్మంబు నిరంతరముగ
వర్ధిల్లుచుండు నీవరపాదుకాప్రతినిధి రాఘవునిచేత నిరుపమకృప


తే.

వెలయ నిక్షిప్త మయ్యె నే నలఘుభక్తి, రాఘవునిరాకఁ గోరుచు రమణతోడ
దీనిఁ బాలించుచుండెద మానితముగ, భక్తి గొలువుఁడు మీర లీపాదుకలను.

2180


చ.

కడువడి రామపాదములఁ గ్రమ్మఱ నీకమనీయపాదుకల్
దొడిగి తదంఘ్రిమూలములు తోడనె యౌదల సోఁక మ్రొక్కి సొం
పడరఁగ రాజ్యభారము రయంబున నమ్మహనీయమూర్తిపై
నిడి శ్రమ మెల్ల వీడి గురువృత్తిత నున్నతిమై భజించెదన్.

2181


తే.

అడవినుండి యేతెంచిన యగ్రజునకు, నీయయోధ్య నీసామ్రాజ్య మీసువర్ణ
పాదుకాద్వయ మర్పించి పరమభక్తి, యలరఁ గొల్చెద ధూతపాపాలి నగుచు.

2182

భరతుఁడు రామపాదుకలకు రాజ్యాభిషేకముఁ గావించుట

తే.

ఆప్తులెల్ల ముదంబున నలరుచుండ, రామచంద్రుఁడు పూజ్యసామ్రాజ్యపదవి
చేకొని సమస్తజనుల రక్షించుచుండు, నాఁడుగా ఫలియించుట నాతపంబు.

2183


తే.

గరిమ నభిషిక్తుఁ డైనరాఘవునిఁ గాంచి, చెలఁగి ప్రజలెల్లఁ గడుసంతసించుచుందు
రపుడు నీ రాజ్యమున కంటె వివులయశము, హర్షము చతుర్గుణాధికం బగు నిజంబు.

2184

మునులు శ్రీరామునిఁ జూచి గుసగుస లాడుకొనుట

వ.

అని బహుప్రకారంబుల దీనుం డై విలపించుచు మహాయశుండును భ్రాతృ
వత్సలుండును బ్రతిజ్ఞాతత్పరుండు నగుభరతుండు వల్కలజటాధారి యై ముని
వేషధరుం డై సైన్యసమేతంబుగా నందిగ్రామంబున నివసించి రామపాదు
కలకు రాజ్యాభిషేకంబుఁ గావించి పాదుకాపరతంత్రుం డై సర్వకృత్యంబు
పాదుకలకు విన్నవించుచు నెద్ది యేని రాజ్యపరిపాలనరూపకృత్యంబును వస్త్ర
పుష్పఫలాదికోపాయనంబును మొదల పాదుకలకు నివేదించి పదంపడి
సమస్తకృత్యంబును యుక్తప్రకారంబునం గావించుచు రామాగమనకాంక్షి
యై రాజ్యంబు సేయుచుండె నిక్కడఁ జిత్రకూటంబున భరతుం డయో
ధ్యకుం జనిన యనంతరంబ రాముండు సీతాలక్ష్మణసహితంబుగా సుఖాసీ
నుం డై యుండె నప్పుడు తదాశ్రమనివాసు లగుతాపసులు రాముని నుద్దేశించి

నయనభ్రూకుటివిక్షేపణంబులును బరస్పరముఖావలోకనంబులును నితరేతర
రహస్యకథలుం గావించిన నారఘుపుంగవుం డింగితాకారాదులచేత వారల
సభయోత్సుకత్వంబు వీక్షించి చిత్తంబున సంజాతశంకుం డై యంజలిఁ గీలించి
కులపతి యగుమునిపతి కి ట్లనియె.

2185


సీ.

మునినాథ యిమ్మహామునుల మోములఁ జూడ నొక్కచందంబున నున్న వేల
పూని నావలన నేమైన నేరము గల్గెనే ప్రమాదంబున నీప్రబుద్ధుఁ
డైనసౌమిత్రి యన్యాయంబుఁ జేసెనే సేవఁ గావించెడు సీతయందు
దోష మొక్కింతైనఁ దోఁచెనే సందియ మగుచున్న దాన తి మ్మనుచుఁ బలుక


తే.

విని తపోవృద్ధుఁడును వయోవృద్ధుఁ డధిక, తేజుఁ డగునమ్మహామునితిలకుఁ డపుడు
వార్ధకంబున నెమ్మేను వడఁక రాముఁ, జూచి యి ట్లని పలికె నుత్సుకత మెఱయ.

2186


తే.

అసమకల్యాణసత్త్వయు ననుపమాన, ధర్మశీలయుఁ బుణ్యతత్పరయు వంశ
శీలపరిపాలినియు నైన సీతయందు, దుష్టమతి కైనఁ బొడమునె దోషశంక.

2187

కులపతి యగుమహర్షి రామునకు ఖరాసురబాధ నెఱింగించుట

క.

జడదారులకు వికారము, కడువడి భవదర్థమందుఁ గలిగె నిశాటుల్
విడువక యొనర్చుబాధల, కుడుకుచు గుసగుసలు వోవుచున్నా రనఘా.

2188


క.

ఈవనమున ఖరుఁ డనఁగా, రావణతమ్ముం డొకండు రాక్షసుఁ డతిరో
పావిష్టుఁ డై జనస్థా, నావాసుల మునుల ననిశ మారట పెట్టున్.

2189


క.

జితకాశియుఁ బురుషాదకుఁ, డతిదుష్టుఁడు క్రూరచిత్తుఁ డవలిప్తుఁడు దు
ర్మతి యైనయన్నిశాటుఁడు, చతురత నినుఁ గని సహింపఁ జాలఁ డధీశా.

2190

మును లందఱుఁ జిత్రకూటమును వదలి యొండుస్థలమునకుఁ బోవుట

వ.

మఱియు మహానుభావుండ వైననీ విచ్చటికిం జనుదెంచిననాఁటనుండి విశేషించి
విరూపు లగురాక్షసులు తాపసులకు విప్రకారంబు సేయుచు జుగుప్సితంబులును
దూషితంబులును నానారూపంబులును వికృతదర్శనంబులు నగురూపంబులచేత
భయంబులు పుట్టించుచు మ్రోల నిలిచి యప్రశస్తంబు లగునశుచిద్రవ్యంబులు
ప్రయోగించి మఱి కొందఱ మునుల వధించుచు నయ్యైయాశ్రమస్థానంబుల
యందు విదితంబు గాకుండ దాఁగియుండి యవసరం బెఱింగి తాపసులవినాశంబు
నొందించి విహరించుచు హోమంబు గావించునప్పుడు కలశంబులు వో నడుచుచు
వహ్నికుండంబులలోన సలిలంబు నించుచు స్రువాదిసాధనంబులు నిర్మూలంబులు
సేయుచు ని ట్లనేకప్రకారంబుల దురాత్ము లగురాక్షసులు బాధించుచున్నవా
రద్దానవులచేత నపవిత్రితంబు లైనయాశ్రమంబులు విడిచి యొండుదేశంబు
నకుం బోవ సమకట్టి మహర్షు లందఱు నన్నుఁ బ్రేరించుచున్నవా రద్దురాత్ము
లచేతఁ దాపసులశరీరంబు లన్నియు హింసితంబు లయ్యె నింక నిచ్చట నిలు
వం జాల మీయాశ్రమంబునకుఁ గొండొకదూరంబున బహుమూలఫలోద

కం బైనకణ్వమహామునిపుణ్యాశ్రమం బొప్పుచున్న దచ్చటికిం జని శిష్యగణ
సమేతంబుగా నివసించెదము ఖరుండు మీయందును విప్రకారంబుఁ గావించుఁ
గావున నీ విచ్చట నుండవలదు సమాధానం బగు నేని మాతోడం జను
దెమ్ము సమర్ధున కైనను గళత్రసహితులకు నిచ్చటినివాసంబు సందేహజనకం
బును దుఃఖకారణంబు నై యుండు ననిన నమ్మునిపతివచనంబు విని రాఘవుం
డే నుండ మీకు భయం బేమి యేను రక్షించెద నని యుత్తరవాక్యంబులచేత
నిరోధించిన సమ్మతింపక యత్తాపసోత్తముండు రాము నభినందించి యామంత్ర
ణంబు నడసి యయ్యాశ్రమంబు విడిచి ఋషిసంఘాతసమన్వితంబుగా నరిగె
నంత రాముండు ఋషిగణంబుల నొండుదేశంబున కనిచి కులపతి కభివాద
నంబుఁ జేసి యమ్మహాత్త్మునిచేత నుపదిష్టప్రయోజనుం డై క్రమ్మఱ నిజాశ్రమంబు
ప్రవేశించి యయ్యాశ్రమంబు మునిశూన్యత్వంబునఁ బరిత్యాజ్యం బైనను
మునివిషయప్రేమాతిశయంబున కొంతకాలంబు పరిత్యజింపకుండి పదంపడి
మునిసందిష్టభావిప్రయోజనం బాలోచించి బహుకారణంబులచేత మునిరహి
తం బైనతదాశ్రమంబున నుండుటకు సహింపక తనమనంబున.

2191


ఆ.

ఇచట నాకు భరతుఁ డిపుడు దృష్టుం డయ్యె, మంత్రిభృత్యసుహృదమాత్యమాతృ
నగరవాసు లెల్ల నాయున్నకందుప, దెలిసి రింక నిచట నిలువఁ దగదు.

2192


క.

భారతభూరిస్కంధా, వారనివేశంబుచేత వరహస్త్యశ్వో
దారకరీషంబులచే, నీరమ్యాచలము మిగుల మృదితం బయ్యెన్.

2193


క.

కావున వేరొకచోటికిఁ బోవలె నని నిశ్చయించి భూమిజయు సుమి
త్రావరపుత్రుఁడు తోడన, వావిరిఁ జనుదేర నచటు వాసి రయమునన్.

2194

రాముఁడు సీతాలక్ష్మణసహితముగా నత్రిమహర్షియాశ్రమమునకుఁ బోవుట

ఆ.

అమ్మహానుభావుఁ డత్రిమహాముని, యాశ్రమమున కరిగి యమ్మహాత్ము
చరణపంకజముల కెఱఁగిన నమ్మౌని, కన్నకొడుకునట్ల గారవించి.

2195


ఆ.

సాదరంబు గాఁగ నాతిథ్య మొసఁగి సౌ, మిత్రి నాదరించి మిత్రవంశ
రాజ్యలక్ష్మివోలె రాజిల్లుచున్నయు, ర్వీకుమారి గారవించి మఱియు.

2196


ఉ.

వృద్ధను బుణ్యశీలను బవిత్రచరిత్రను ధర్మచారిణిన్
శుద్ధవివేకయుక్త ననసూయను దాపసి నమ్మహాతప
స్సిద్ధను లోకసత్కృతను జీరి రఘూత్తముఁ జూచి మానసా
బద్దనవప్రమోదుఁ డయి భవ్యచరిత్రుఁడు మౌని యి ట్లనున్.

2197


సీ.

రఘువర్య దశవత్సరం బనావృష్టిచేఁ దగిలి లోకము దగ్ధ మగుచు నుండఁ
గడువడి నేసాధ్వి ఘనతపోమహిమచే ఫలమూలములు జలంబులు సృజించె
దశసహస్రాబ్దము ల్దారుణగతి నేతపస్విని యుగ్రతపంబు సలిపెఁ
దగ ననసూయావ్రతంబుల నేసతి యంతరాయంబుల నవలఁ ద్రోచె

తే.

దేవకార్యనిమిత్త మే దేవి మొనసి, తవిలి దశరాత్ర మేకరాత్రముగఁ జేసి
నట్టియీపుణ్యశీల నీ కనవరతము, జననిగతిఁ బూజనీయ మై తనరుచుండు.

2198


తే.

అఖిలభూతనమస్కార్య యైనయీత, పస్విని స్వకీయకర్మసంపదలచేత
వసుధ ననసూయ యనఁ బేరు వడసెఁ బ్రీతి, జనకపుత్రి మొక్కింపు మీసాధ్వి కిపుడు.

2199

సీతాదేవి యనసూయాదేవికి నమస్కరించుట

వ.

అని పలికిన నారఘువల్లభుం డమ్మహామునిపలుకుల కలరి సీత నవలోకించి దేవి
మునిముఖేరితం బైనవాక్యంబు వింటివే శ్రేయస్కరం బై యున్న దట్లు గావింపు
మనిన నమ్మహీపుత్రి రామవచనప్రకారంబున నమ్మనిపత్నికడకుం జని శ్లథసంధి
బంధావయవసన్నివేశయు సంజాతవలితాంగియు జరపాండురమూర్ధజయు
నక్రోధనయు ననిందితయు మహాభాగయుఁ బరమవృద్ధయు వేపమానకృశాంగి
యు నైనయమ్మహాసాధ్వికి నిజాభిధానంబు నొడివి నమస్కరించి బద్ధాంజలిపుట
యై యారోగ్యం బడిగిన నయ్యనసూయ ధర్మచారిణి యైనసీత నవలోకించి
మధురవాక్యంబున గారవించుచు ని ట్లనియె.

2200


చ.

తరుణీరొ దైవయోగమునఁ దద్దయు ధర్మగతాగతజ్ఞ వై
వరగుణశాలి యైనరఘువర్యునివెంబడి ఘోరకానన
స్థిర కిటు భర్తృభక్తి నరుదెంచుటఁ జేసి కృతార్థ వైతి వే
నఱమఱ లేక నిన్నుఁ గనినంతనె సువ్రత నైతి నెంతయున్.

2201


క.

బహుసుఖముల హితజనముల, నహంకృతియు విడిచి ధర్మ మరసికొని రహిన్
గహనావరుద్ధుఁ డగుపతి, నహహా సేవింప వచ్చి తతిధన్యవు గా.

2202


తే.

వనిత నగరస్థుఁ డైన దావస్థుఁ డైనఁ, బుణ్యుఁ డైనను గుజనాగ్రగణ్యుఁ డైన
ధాత్రి నెవ్వారికి విభుండు దైవ మట్టి, యువతులకు లోకయుగము మహోదయంబు.

2203

అనసూయాదేవి సీతయొక్క పాతివ్రత్యంబుఁ గొనియాడుట

క.

ధనవంతుం డైనను నిర్ధనుఁ డైనను శీలవృత్తరహితుం డైనన్
ఘనకామవృత్తుఁ డైనను, వనితకు గతి పతియె సుమ్మి వారిజనేత్రా.

2204


తే.

సతికిఁ బతికంటె వేఱొకగతియు లేదు, పతికి సతికంటె నొండొకఫలము లేదు
తరుణి యిరువురు పుష్పంబుతావికరణి, నింపు సొంపార నేకీభవింపవలయు.

2205


ఉ.

కొందఱు దుర్వివేకమునఁ గోరినవారల కెల్లఁ జిత్తముం
బొందుగ నిచ్చి భర్తయెడఁ బోడిమి చేయక నీతిబాహ్య లై
యుందురు చుట్ట లెల్లఁ దము నొక్కట ఛీ యని రోయుచుండ వా
రందఱు దుర్యశంబున మహానిరయస్థిత లౌదు రంగనా.

2206


ఆ.

లోకమందు దృష్టలోకపరాపర, లమితసుగుణవతులు విమలమతులు
నీతశీల లైననీయట్టిసాధ్వులు, సురపదంబు నొందుదురు మృగాక్షి.

2207


వ.

దేవి నీవు పతివ్రతాచరణీయం బైనధర్మంబు ననుసరించి రామునకు సహధర్మ

చారిణి వై శాశ్వతం బైనయశంబును ధర్మంబును సంపాదించితి వని బోధించిన
నమ్మునిపత్నిపల్కుల కలరి వైదేహి క్రమ్మఱ నద్దేవికి నమస్కరించి మృదు
మధురభాషణంబుల వినయంబుగా ని ట్లనియె.

2208


శా.

తల్లీ నీ విపు డన్నచంద మది తథ్యం బింతయు న్సాధ్వికిం
జెల్లుం జిత్రము గాదు నాకును సతీశీలంబు మాతల్లి మున్
దెల్లం బౌనటు లానతిచ్చెఁ గరుణోద్రేకంబు సంధిల్ల నా
యుల్లంబందును జిక్కి యున్నయది తద్యోగంబు రూఢంబుగన్.

2209


మ.

మును మాతల్లి సతీగుణంబులు మహామోదంబునం జెప్పె మ
జ్జనకుం డవ్వల నాన తిచ్చెఁ గృపతో సాధ్వీగుణం బంతయున్
వనవాసంబున కేగుదెంచునపుడున్ వర్ణించె మాయత్త దా
ననురూపంబుగఁ గ్రొత్తఁ జేసితివి నీ వాయర్థముం గ్రమ్మఱన్.

2210


క.

కావున విధిదృష్టవిధిన్, వేవిధములఁ జూడ సతికి విభుఁ డొక్కండే
దైవత మనియెడువచనము, దేవీ నాహృదయమందుఁ దిర మై యుండున్.

2211

సీతాదేవి శ్రీరామునిగుణంబులఁ బ్రస్తుతించుట

మ.

జగతి న్నీచచరిత్రుఁ డైనవిభుఁ డెంచ న్సాధ్వికిన్ దైవతం
బగుచుండ న్గరుణాపరుండు నిజవంశాచారధర్మజ్ఞుఁడున్
సుగుణోదారుఁడు మంజువాది ప్రియుఁడు న్శూరుండు శుద్ధాత్ముఁ డౌ
మగనిన్ దైవత మంచుఁ జిత్తమున సంభావించు టాశ్చర్యమే.

2212


శా.

అక్రూరుండు దయాసముద్రుఁ డతివిఖ్యాతుండు ధన్యాత్ముఁడున్
శక్రాభుండును గన్నపుత్రులగతి న్సర్వప్రజ న్భూరిని
ర్వక్రప్రౌఢిమ నేలువాఁడు ఘనుఁడు న్వంశోచితాచారధ
ర్మక్రీడారతుఁ డుత్తమోత్తముఁడు మత్ప్రాణేశ్వరుం డంబికా.

2213


మ.

ధర నెవ్వాఁడు జితేంద్రియుండు సుగుణోదారుండు శాంతుండు సిం
ధురయానుండు దృఢానురాగుఁడును సానుక్రోశుఁ డై యొప్పు న
క్కరుణోదారుఁడు రాముఁ డేగురుత నక్కౌసల్యపైఁ జేర్చు నా
గురుతం దక్కిన మాతృవర్గముపయిం గూర్చు న్సమగ్రంబుగన్.

2214


క.

క్షితిపతి యొకపరి యైనను, మతి నెంచినకాంతలందు మానము విడి తాఁ
బితృభక్తిరతుఁడు రాముఁడు, సతతంబును మాతృవృత్తిఁ జరియించు రహిన్.

2215


సీ.

పరకాంత నేత్రగోచర మైనచో దానిఁ దల్లినిబలె నాత్మఁ దలఁచువాఁడు
పరులసంతోషవిస్ఫురణంబునకుఁ దాను సంచితంబుగఁ బ్రమోదించువాఁడు
ప్రజలదుఃఖమునకుఁ బరమాప్తుఁడును బోలెఁ గొంచక తాను దుఃఖించువాఁడు
దీనులు రక్షార్ధు లైనచో జనకునిరీతి సత్కృప నాదరించువాఁడు


తే.

వరమునీంద్రులఁ గన్న సేవకునిభంగి, వరుసఁ బరిచర్యఁ గావించువాఁడు వినయ

శీలకారుణ్యగుణములఁ జెలఁగువాఁడు, రమ్యగుణమండనుం డైనరాఘవుండు.

2216


తే.

అట్టి రాజలలామున కెట్టిదుష్ట, కాంత యైనను వశవర్తి గాక యున్నె
జనకుఁ డనిశంబు సహధర్మచారిణిఁగను, గౌసలేయున కర్పించెఁ గాదె నన్ను.

2217

సీతాదేవి యనసూయాదేవిని బ్రస్తుతించుట

తే.

నిరుపమసంపత్కరమును, బరమసుఖాస్పదము భూరిభద్రప్రదము
న్గురుతరకీర్తివిశాలము, తరుణికిఁ బతిసేవకంటెఁ దపములు గలవే.

2218


తే.

సువ్రతంబునఁ బతికి శుశ్రూషఁ జేసి, మున్ను సావిత్రి దేవతాముఖ్య యయ్యె
నట్ల నీవును బతిసపర్యావిశేష, జాతమహిమను ధన్యాత్య వైతి గాదె.

2219


తే.

ధర్మచారిణి సర్వసుందరులలోన, నుత్తమయు దేవతాప్రమదోత్తమాంగ
మండనయు నైన రోహిణి మగసి విడిచి, నిమిష మైనను జీవింప నేర్చె నమ్మ.

2220


క.

జగతి న్భర్తృదృఢవ్రత, లగుయువతులు దేవలోకమందు స్వకీయం
బగుపుణ్యకర్మమున సౌ, భగభాజన లగుచు యశముఁ బడసెద రెపుడున్.

2221


క.

అని యిట్లు పలుక సీతా, వనితావాక్యముల కలరి వారనికృప న
య్యనసూయ శిరము మూర్కొని, యనురాగ మెలర్ప మరల నవనిజ కనియెన్.

2222


క.

నానావిధనియమంబుల, మానుగ సంభూత మైనమహనీయతపో
నూనబల మాశ్రయించి వ, రానన యాశీర్వదింతు నడుగుము వరమున్.

2223

అనసూయ సీతకు దివ్యవస్త్రమాల్యాభరణాంగరాగానులేపనంబుల నొసంగుట

వ.

దేవి మనోజ్ఞం బైనభవదీయవాక్యంబు విని యానందించితి నింకఁ బ్రీతిదా
నంబు గావించెదఁ గైకొను మనిన నవ్వైదేహి జాతవిస్మయ యై భవదీయ
చిత్తంబుకొలంది నవధరింపు మనిన నమ్మునిపత్ని సంతసిల్లి భవదీయ
హర్షంబు సఫలంబుఁ గావించెద నని పలికి దివ్యంబు లైనవస్త్రమాల్యాభరణం
బులును మహార్హం బైనయంగరాగంబును మహాపరిమళద్రవ్యసహితం బైన
యనులేపనంబు నొసంగి యి ట్లనియె.

2224


తే.

అతివ యీదివ్యవస్త్రమాల్యాభరణము, లింపు సొంపార మేన ధరింపు మిపుడు
మహితమణిమండలప్రభామండితంబు, లగుచు నిత్యంబు లై యుండు ననుదినంబు.

2225


తే.

దేవి మద్దత్త మైనయీదివ్యలేప, నాంగరాగంబుచే విలిప్తాంగి వగుచు
నబ్దవాసిని పుండరీకాశునట్ల, కౌసలేయుని రంజింపఁ గలవు నీవు.

2226


క.

అని సాదరంబుగా ని, చ్చినఁ గైకొని మేనఁ దాల్చి చెలువుగ వసుధా
తనయ ఫలకుసుమకిసలయ, ఘనశోభిత యైనవల్లికైవడి నలరెన్.

2227


వ.

ఇవ్విధంబున నభూతపూర్వశోభావిశేషంబున నలంకృత యై యవ్వైదేహి
మునిపత్ని నుపాసించుచు నభిముఖంబుగా నాసీన యయ్యె నంత నయ్యన
సూయ తత్పరిణయకథావృత్తాంతం బంతయుఁ దెల్లంబుగా నాకర్ణించుతలం
వునఁ గ్రమ్మఱ నమ్మహీసుత కి ట్లనియె.

2228

క.

వైదేహి నిన్ను రాఘవుఁ, డాదరమున మున్ను పెండ్లి యాడినవిధము
న్మోదముతో నెఱిఁగింపుము, నాదుమదికి సమ్మదము ఘనం బై యుండన్.

2229

సీత తనవివాహవృత్తాంతము ననసూయాదేవికిఁ తెల్పుట

ఉ.

నా విని సంతసంబు వదనంబునఁ గన్పడ నమ్మహీజ నా
దేవికి సాటి వచ్చుమునిదేవిని గన్గొని ప్రీతి నిట్లను
న్దేవి రఘూత్తముండు నను ధీరతఁ జేకొనినట్టిచొప్పు సొం
పావహిలంగఁ జెప్పెద ననన్యమతి న్విను మయ్యుదంతమున్.

2230


చ.

కలఁడు సమస్తభూవరనికాయకిరీటమణీమరీచికా
విలసితపాదసీకుఁడు వివేకవిశారదుఁ డప్రమాదుఁడు
న్సలలితకీర్తిసాంద్రుఁడు విశాలగుణాఢ్యుఁడు ధర్మపారగుం
డలఘుభుజాబలుండు జనకావనిపాలుఁ డుదారశీలుఁ డై.

2231


తే.

అతఁడు పుత్రార్థ మధ్వర మాచరింపఁ, దలఁచి క్షేత్రంబు దున్నింప హలముఖమునఁ
బుడమి భేదించి యేను సంభూత నైతిఁ, బొడుపుమలనుండి శశిరేఖ పుట్టినట్లు.

2232


తే.

రమణ నిట్లు జన్మించి పరాగరూషి, తాంగి నై యున్న నన్నుఁ బోలంగఁ జూచి
త్వరితముగ ముష్టివిక్షేపతత్పరుఁ డగు, జనకుఁ డతివిస్మితాత్ముఁ డై సంభ్రమమున.

2233


క.

నను నుత్సంగంబున నిడి, కొని నా కీకన్నె చిన్నికూఁతు రనుచు వా
కొనునెడ నిక్కము నీకుం, దనయ యనుచు గగనవాణి తప్పక మ్రోసెన్.

2234


ఉ.

అంతఁ బ్రమోది యై జనకుఁ డాదృతుఁ డై ననుఁ గొంచు మందిరా
భ్యంతరసీమ కేగి తనయగ్రపురంధ్రికి న న్నొసంగిన
న్సంతస మంకురింపఁ గొని చయ్యన నయ్యమ మాతృసౌహృదం
బెంతయు నివ్వటిల్ల సకలేప్సితము ల్ఘటియించి పెంపఁగన్.

2235


తే.

ఈకరణి నాఁటినాఁటికి వృద్ధిఁ బొంది, యున్ననా కిల జవ్వనం బొదవి యొప్పెఁ
గాంచనమునకు వాసన గలిగినట్ల, యిక్షుకాండంబునకు ఫల మెసఁగినట్ల.

2236


వ.

ఇట్లు పాణిగ్రహణమహోత్సవయోగ్య నై యున్న నన్ను విలోకించి మజ్జనకుం
డై నజనకుండు తనమనంబునఁ గన్యాజనకుండు శక్రతుల్యుం డైనను గన్యా
గ్రహీతృతత్సంబంధిజనంబు సదృశం బైన నీచం బైన వారివలనఁ దిరస్కారం
బు నొందు నట్ల నాకును గన్యానిమిత్తంబునఁ దిరస్కారంబు వాటిల్లు నని చిం
తించి న న్నయోనిజఁగా నెఱింగి నిర్ధనుండు విత్తనాశంబువలన దీనుం డైనపగిది
నతిదీనుం డై యభిజనవృత్తాదికంబున వయస్సౌందర్యాదికంబున నా కనురూపుం
డగుపతి యెవ్వం డొకో యని విచారించుచు నెందునుం గానక నానాప్రకా

రంబులఁ జింతించి మత్కుమారికి స్వయంవరంబు సేయుదుఁ గాక యని
నిశ్చయించి.

2237


సీ.

అఖిలజగంబుల కాధార మైనట్టి కనకాద్రిచందానఁ గ్రాలుదాని
యాగసంతుష్టుఁ డై యనుపమకరుణతో నబ్ధినాయకుఁ డిచ్చినట్టిదాని
మానవేంద్రులు కలలో నైన గుణ మెక్కు పెట్టఁ జింతింప లేనట్టిదాని
ననుదినంబును గుసుమాదికంబులచేత నతిభక్తిఁ బూజితం బైనదాని


తే.

మఱియు బహుకాలమున నుండి మందిరమున, నలరుదాని మాహేశ్వరం బైనదానిఁ
జాపము నొకటిఁ దెప్పించి సంభ్రమమున, నృపుల నందఱ రావించి యిట్టు లనియె.

2238


క.

ఈనగపతిధను వెవ్వం, డేనియు సజ్యంబుఁ జేసెనేని ముదముతో
మానక యవ్వీరునకు న, హీనమతి న్నాకుమారి నిత్తు నిజముగాన్.

2239


క.

అనిన విని వారు గౌరవ, మున గిరి కెన యైనచాపము న్గని సత్త్వం
బున సజ్యము గావింపం, జని సామర్థ్యంబు లేక చని రటు లజ్జన్.

2240


ఆ.

అంతఁ గొంతకాల మరిగిన పిమ్మట, నీమహామహుండు రాముఁ డనుజ
గాధిపుత్రయుతముగా మిథిలేశుయా, గంబుఁ జూడ వచ్చెఁ గౌతుకమున.

2241


క.

ఘనుఁ డావిశ్వామిత్రుఁడు, జనకమహీవిభునిచేత సత్కృతుఁడై య
య్యనఘుని నుతించి కుతుకం, బున నిట్లని పలికె వాక్సమున్నతి మెఱయన్.

2242


ఉ.

వీరలు రామలక్ష్మణులు వీరులు పంక్తిరథాత్మజు ల్మహా
శూరులు చంద్రమౌళివిలుఁ జూడఁగ వచ్చినవారు దాని సొం
పారఁగఁ జూవుమా యనిన నాజననాథుఁడు తత్క్షణంబ త
ద్భూరిశరాసనంబును సముద్ధతిఁ జేరఁగఁ బంచె వేడుకన్.

2243


వ.

ఇవ్విధంబున నమ్మహనీయకార్ముకంబుఁ దెప్పించి రామునకుం జూపిన నమ్మహా
నుభావుండు.

2244


క.

గుణ మెక్కు పెట్టి గ్రక్కునఁ, దృణముగతి బలంబుకొలఁదిఁ దెగఁ దీసిన భీ
షణరవము దిశలు నిండఁగ, క్షణమాత్రములోన శంభుచాపము విఱిగెన్.

2245


వ.

అంత సత్యాభినంధి యగుమజ్జనకుం డనుత్తమం బైనజలభాజనంబు గైకొని
రామునకు న న్నొసంగ నిశ్చయించిన నప్పురుషశార్దూలుండు తనతండ్రి యగు
దశరథునియభిప్రాయంబు దెలియక పెండ్లి యాడుట యుక్తంబు గా దని
నన్నుఁ బరిగ్రహింపకుండె.

2246


ఆ.

అంత సత్యవాది యైనమజ్జనకుండు, రాఘవునకు నన్ను రమణ నొసఁగఁ
దలఁచి సత్వరముగ దశరథు రావించి, మంచిలగ్న మేర్పరించి తమిని.

2247

క.

మంగళతూర్యరవంబులు, సంగతిగా మ్రోయుచుండ జనకమహీశుం
డంగము సమ్మదమున ను, ప్పొంగఁగ రామునకు నన్నుఁ బొలుపుగ నిచ్చెన్.

2248


క.

నాయనుజ నూర్మిళను బద్మాయతలోచన నొసంగె నజ్జనకుఁడు భ
ద్రాయతమూర్తికి సుజనవి, ధేయున కీలక్ష్మణునకుఁ దేజం బెసఁగన్.

2249


వ.

తల్లీ యిది మదీయపరిణయవృత్తాంతంబు తెల్లంబుగా వినిపించితి నని సీతా
దేవి విన్నవించిన నయ్యనసూయ వ్యక్తాక్షరపదంబును జత్రంబును మధు
రంబు నగుతదీయభాషితంబు విని పరమసంతోషస్వాంత యై సీతం గౌఁగిలిం
చుకొని శిరంబు మూర్కొని చెక్కిలి ముద్దుగొని మందమధురాలాపంబుల
ని ట్లనియె.

2250


క.

శాంతా నీపరిణయవృ, త్తాంతం బంతయును నాకుఁ దత్ఫరమతిచే
నెంతయుఁ దెల్పితిఁ గావున, స్వాంతమున కభూతపూర్వసమ్మద మొదవెన్.

2251


క.

సూరుండు గ్రుంకె దిన మా, హారార్థము దిరిగి తిరిగి యస్తమయమునన్
భూరుహములు నిద్రార్ధము, చేరి విహంగములు రుతముఁ జేసెడు వింటే.

2252


క.

సలిలాప్లుతవల్కలు లై, కలశోద్యతు లై పవిత్రగతి నభిషేకా
ర్ద్రలసచ్ఛరీరు లై మును, లలరుచు నున్నారు కంటె యంగన యిచటన్.

2253


తే.

సీత చూచితె తాపసు ల్సేయుహోమ, కార్యముల నుజ్జ్వలితములై గ్రాలువహ్ను
లందు వాతసముత్థిత మై కపోత, గాత్రరక్తధూమంబు వికాస మొందె.

2254


మ.

వికలాల్పఛ్ఛదవృక్షముల్ ఘనము లై స్ఫీతంబు లయ్యె న్వనిన్
వికసించెన్ గ్రహతారక ల్దెసల నుర్విం జీఁకటు ల్పర్వెఁ ద
ప్పక రాత్రించరసత్వము ల్దిరిగెడి న్భాస్వన్మృగశ్రేణి కొం
చక చేరెన్ వరవేదికాతలములం జంద్రుండు దోఁచెన్ దివిన్.

2255


ఆ.

గగనలక్ష్మిమేనఁ గపురంబు మెత్తిన, కరణిఁ బర్వె జంద్రికాచయంబు
రాత్రి యయ్యె నింక రాముని సేవింపఁ, జనుము ధర్మ మిదియ సతుల కబల.

2256


చ.

వదలక మంజులోక్తుల వివాహకథ న్వినిపించి నీవు నా
మదికి ముదం బొసంగితివి మానక యింక మదర్పితస్ఫుర
న్మృదువసనాంగరాగములు మేన ధరించి సతీవిశేషస
మ్మద మొనగూర్పు మీ వనిన మైథిలి తద్దయు సంతసంబునన్.

2257


క.

అనసూయాదత్తము లగు, ఘనపటభూషాదికములఁ గైసేసి నయం
బున మ్రొక్కి జనకనందిని, చనియెం గడుఁబ్రీతి రామచంద్రునికడకున్.

2258

శ్రీరాముఁడు మునులయనుమతంబున దండకారణ్యంబు ప్రవేశించుట

చ.

ఇ ట్లమానుషలసదలంకారాలంకృత యై శ్రీరామునియొద్దకుం జనుదెంచి తన
కమ్మునిపత్ని యొసంగిన వరాభరణవస్త్రమాల్యాంగరాగరూపకం బైన ప్రీతి

దానంబు సర్వంబును విన్నవించిన నారఘువల్లభుండు లక్ష్మణసహితంబుగా
సంతసించి యనసూయాప్రభావంబు బహువారంబులు కైవారంబులు సేయుచు
సిద్ధు లగుతావనులచేత నర్చితుం డై యారాత్రి తదాశ్రమంబున నివసించి
ప్రభాతకాలంబున మేల్కని పుణ్యతీర్థజలావగాహనంబుఁ జేసి యాహ్నికంబుఁ
దీర్చి కృతాగ్నిహోత్రు లగుమునులకుం జెప్పి గమనోన్ముఖుం డైన నవ్వీరోత్త
ముని విలోకించి ధర్మాత్ము లగుతాపసు లి ట్లనిరి.

2259


మ.

అనఘా యీవిపినంబునం దసురు లుగ్రాకారు లుద్యన్మదం
బున నానాకృతుల న్జరింతు రనిశంబు న్మౌనిమాంసాదు లై
యనుమానింపక వారి నెల్ల బల మేపారంగ వారించి యి
మ్మునిమార్గంబున నేగు మచ్చట ఫలంబు ల్మూలము ల్గల్గెడిన్.

2260


వ.

అని పలికి దీవించి సముచితంబుగా వీడ్కొల్పిన నారఘుశార్దూలుండు పూర్వో
క్తమార్గోపదేశప్రకారంబునఁ గృతాంజలు లగుమునులచేతఁ గృతమంగళాశీ
ర్వాదుం డై సూర్యుండు మహాభ్రపటలంబుంబోలె సీతాలక్ష్మణసహితంబుగా
మహారణ్యంబుఁ బ్రవేశించె నని వ్యక్తాక్షరపదంబుగా నయోధ్యాకాండకథ
యంతయు వినిపించిన నారాముండు భ్రాతృసహితుం డై యటమీఁదికథా
వృత్తాంతంబు వినిపింపుం డని యడుగుటయును.

2261

చక్రబంధము

చ.

ధరణిప శ్రీవరా కనకదామ యదుప్రవరా మనోజ్ఞకం
ధర హరి మాధవా సకలదా దవభక్షక వైనతేయసుం
దరరథ దేవముక్తిఫలదా నరమిత్రక హీరహార మం
దరధర నాథ మంజుశయ దానధురీణ విధాతృవందితా.

2262


క.

బృందారకనుత నతజన, మందార దురంతయోగమాయాశ్రయసం
క్రందనవందిత పరమా, నందాత్మక యోగిరాజ నందతనూజా.

2263


స్వాగతావృత్తము.

రాజరాజనుత రాజనిభాస్యాం, భోజ రాజకులపుణ్యచరిత్రా
రాజమండలవిరాజితకీర్తీ, భ్రాజమానశతభాస్కరతేజా.

2264


గద్యము.

ఇది శ్రీరామచంద్రచరణారవిందమకరందరసాస్వాదతుందిలేందిందిరా
యమాణమానస కులపవిత్ర కౌండిన్యసగోత్ర పద్మనాభసూరిపుత్ర విద్యా
సాంద్ర వేంకటకవీంద్రప్రణీతం బైనశ్రీమద్రామాయణం బనునాదికావ్యంబు
నందు రామగుణానుకీర్తనంబు నభిషేకసమారంభంబును మంథరాదుర్మం
త్రంబును గైకేయీదుష్టభావత్వంబు నభిషేకవిఘాతంబును గౌసల్యాపరిదేవ
నంబును రామవనవాసగమనంబును బ్రకృతిజనవిషాదంబును బ్రకృతిజనవిసర్జ

నంబును గుహసంవాదంబును సుమంత్రోపావర్తనంబును గంగానదీతరణంబును
భరద్వాజదర్శనంబును జిత్రకూటప్రవేశంబును బర్ణశాలావస్థానంబును దశరథు
శోకవిలాపంబును దశరథునిపరలోకగమనంబును భరతసమాగమనంబును రాజ
ధర్మోపదేశంబును రామప్రసాదనంబును దశరథునకు సలిలప్రదానంబును బాదు
కాప్రదానంబును భరతోపావర్తనంబును నందిగ్రామనివాసంబును బాదుకా
స్థాపనంబు ననసూయాత్రిసందర్శనంబును నంగరాగార్పణంబును నను
కథలుం గల యయోధ్యాకాండము సంపూర్ణము.


శా.

ఈకావ్యప్రతిపాదితుం డయినసీతేశుండు రామప్రభుం
డీకల్యాణకృతీశ్వరుం డయినశ్రీకృష్ణుండు సంప్రీతితో
సాకల్యంబుగ నిష్టసిద్ధికరు లై చంచత్కృపాపూర్ణతన్
లోకస్తుత్యకుమారయాచధరణీంద్రుం బ్రోతు రెల్లప్పుడున్.