శ్రీరామచంద్ర పరబ్రహ్మణేనమః
గోపీనాథ రామాయణము
ఆరణ్యకాండము
|
మానినీమనోహర
సోమాన్వయజలధిపూర్ణసోమ జితారి
స్తోమ సమిద్భీమ పరం
ధామ సుగుణజాల శ్రీమదనగోపాలా.
| 1
|
వ. |
దేవా యవధరింపుము రాజనందను లగుకుశలవు లవ్వలికథ యిట్లని చదువం
దొడంగిరి యివ్విధంబున ధృతిమంతుండును దుర్ధర్షుండు నగురాముండు
మహారణ్యం బగుదండకారణ్యంబుఁ బ్రవేశించి తాపసాశ్రమమండలంబు విలో
కించె నదియును.
| 2
|
శ్రీరాముఁడు ఋష్యాశ్రమములకుఁ బోవుట
క. |
వితతబ్రాహ్మశ్రీవృత, మతులితకుశచీరయుక్త మై నభమున ను
న్నతి వెలయుతపనమండల, గతి నతిదుర్దర్శ మగుచుఁ గ్రాలుచు నుండున్.
| 3
|
తే. |
సర్వభూతశరణ్యంబు సకలవన్య, మృగకదంబజుష్టంబును ఖగనిషేవి
తంబు సతతసమ్మృష్టాంగణంబు నగుచు, నతివిచిత్రక్రమంబున నలరుచుండు.
| 4
|
సీ. |
చెలువొప్ప నప్సరస్త్రీనటనంబులు పావకశాలలు వరసమిత్కు
శాజినస్రుక్స్రువాద్యనుపమయాగోపకరణంబులు సుగంధిఘనసుమములు
ఫలమూలములు పూర్ణజలకలశంబులు స్వాదుఫలోపేతపాదపములు
వన్యపుష్పంబులు పద్మోత్పలవినిర్మలాంబుయుక్తజలాశయములు గలిగి
|
|
తే. |
పుణ్య మై వేదఘోషసంపూర్ణ మై స, మగ్రబలిహోమపూజితం బై నితాంత
హోమమంత్రనినాదిత మై మనోజ్ఞ, జలజభవమందిరముభంగి నలరుచుండు.
| 5
|
మ. |
అనఘు ల్పుణ్యులు బ్రహ్మకల్పులు ఫలాహారు ల్తపోలబ్ధని
త్యనితాంతద్యుతు లర్కపావకనిభుల్దాంతు ల్పురాణు ల్జటా
జినధారుల్ ద్రుమచీరయుక్తులు తపస్సిద్ధు ల్పరబ్రహ్మత
త్త్వనిబద్ధాత్ములు తాపసుల్ గలిగి నిత్యశ్రీల నొప్పున్ రహిన్.
| 6
|
తాపసులు పరమానందంబున సీతారామలక్ష్మణుల నెదుర్కొనుట
వ. |
అట్టితాపసాశ్రమసమూహంబుఁ బ్రవేశించి శ్రీమంతుం డగురాముండు తపో
వనవర్తిమృగపక్షిత్రాసనివృత్తికొఱకుఁ జాపంబు నవరోపితగుణంబుఁ గావించి
నిజతేజంబున నమ్మహారణ్యంబు వెలుంగం జేయుచు మందాంచితగమనంబునం
జనుచుండ నప్పుడు ధర్మచారులును దివ్యజ్ఞానోపసంపన్నులు నైనయచ్చటి
మహర్షులు రామలక్ష్మణులను యశస్విని యగువైదేహి నవలోకించి ప్రీతిసం
హృష్టసర్వాంగు లై వారల కభిముఖంబుగా నరిగి సంపూర్ణచంద్రుండునుంబోలె
సకలజనానందకరుఁ డైనరామచంద్రునిఁ గన్నులారం గనుంగొని మంగళాశీర్వా
దంబులు గావించుచు స్వేష్టదేవతాత్వంబున స్వీకరించి తదీయరూపవిశేషం
బును సర్వావయవశ్లిష్టసంధిబంధంబును లావణ్యంబును సౌకుమార్యం
బును సముచితశృంగారసంపన్నత్వంబును విలోకించి విస్మితాకారు లైరి యచ్చ
టిపశుపక్షిమృగాదితిర్యగ్దంతువులు వైదేహీలక్ష్మణసహితుం డైనరాము నవ
లోకించి పద్మభవాదుల కగోచరుం డగుభగవంతుండు పంగూపరిగంగాప్రవా
హంబుకరణి మనముంగలఁ బ్రాదుర్భవించె నని జగన్మోహనదివ్యమంగళ
విగ్రహదర్శనానందవిచ్ఛేదభయంబున నిమేషరహితంబు లైననేత్రంబులచేతఁ
బరమాశ్చర్యవంతంబు లై విలోకించుచుండె నప్పు డమ్మహర్షులు సర్వభూతహిత
రతుం డైన రామునిఁ బ్రియాతిథినింబలెఁ బర్ణశాలకుం దోడ్కొని చని నివాస
స్థానంబు నివేదించి పరమపురుషుండ వైననీసందర్శనంబున నేము ధన్యుల
మైతి మని ప్రియవచనంబుల సత్కరించి సలిలాదిపూజాద్రవ్యంబుఁ గొని
తెచ్చి సలక్ష్మణుం డైనరాముని విధ్యుక్తప్రకారంబునం బూజించి వన్యంబు
లైనపుష్పంబు లర్పించి యీవస్తువు లన్ని భవదీయంబు లని పలికి రాముండు
పరమపురుషుం డైననారాయణుం డను నిశ్చయబుద్ధిచేత సముద్భూతభక్తి
రసంబున బద్ధాంజలు లై యి ట్లనిరి.
| 7
|
ఋషులు రాముని నానావిధంబుల స్తుతించుట
సీ. |
అనఘాత్మ నీవు మా కందఱకును శరణ్యుండవు భూరియశుండ వఖిల
వర్ణాశ్రమాచారనిర్ణయవిదుఁడవు ఖలజననిగ్రహకర్త వాది
నారాయణునియవతారరూపంబున గురుఁడవు సకలార్థకోవిదుఁడవు
పూజనీయుండవు రాజరూపంబున మాన్యుఁ డవార్యసమ్మతుఁడ వైతి
|
|
తే. |
పుడమి నింద్రచతుర్థాంశభూతుఁ డైన, రాజు మునుకొని ప్రజలధర్మంబు దప్ప
కుండ రక్షించుఁ గావున నొప్పు మీఱ, నఖిలలోకనమస్కృతుం డై వెలుంగు.
| 8
|
తే. |
విపులవిక్రమసామాన్యనృపున కిట్టి, మహిమ గలుగుచు నుండ సమస్తలోక
పాలనార్థంబు పుట్టినపరమపురుష, నామునకు నీకుఁ గల్గుట కేమి యరిది.
| 9
|
వ. |
దేవా నీవు వనంబున నున్న నగరంబున నున్న మా కధినాథుండవు గావున భవ
|
|
|
దీయమూర్తి ధ్యానానందానుభవాంతరాయరూప రాక్షసనివారణపూర్వకం
బుగా రక్షింపం దగుదు మితరరాజులు బుద్ధిబలంబున స్వరాజ్యమాత్ర రక్ష
ణంబునందు శక్తు లగుదురు సకలలోకరక్షణధురంధరాసహాయశూరుండ వైన
నీకు నగరవాసంబునం దేమి బలవృద్ధియు స్వాభావికనిత్యనిరతిశయజ్ఞానశక్తిసంప
న్నుండ వైననీకు వనవాసంబునం దేమి బలహానియుఁ గలుగు నేము నీయందు
విన్యస్తసకలరాక్షసశిక్షాభారుల మై పరిత్యక్తశాపాదిశాసనుల మై జితక్రోధుల
మై జితేంద్రియుల మై తపోధనుల మై యున్నవారము మమ్మఁ దల్లిగర్భం
బునంబోలె నతిప్రయత్నంబున రక్షింపు మని పలికి ఫలమూలపుష్పనీవార
దర్భాదులచేత సలక్ష్మణుం డైనరామునిం బూజించి మంగళస్తుతివచనంబుల
నభినందించి సకలజగత్స్వామి యగుటవలన యథావిధిఁ దృప్తి నొందించిరి
యి ట్లమ్మహాత్ముండు తాపసులచేతఁ గృతాతిథ్యుం డై యిష్టకథావినోదంబుల
నారాత్రి యచ్చట వసియించి మఱునాఁ డరుణోదయంబునఁ గాల్యకరణీ
యంబులు దీర్చి సాదరంబుగా నమ్మునిపుంగవులచేత నామంత్రణంబు వడసి
సీతాలక్ష్మణసహితుం డై.
| 10
|
రామునకు విరాధుండు గనఁబడుట
శా. |
నానాఘోరమృగప్రకాండయుతము న్నానాఖగవ్రాతము
న్నానాధ్వస్తలతాంతకుంజమును నానాజంతునిశ్శబ్దము
న్నానాగాధజలాశయావృతము నానాక్రూరఝిల్లీగణ
ధ్వానం బైనయరణ్యమధ్యమునఁ బోవం బోవఁ గా నొక్కెడన్.
| 11
|
శా. |
ఘోరాకారుఁడు దీర్ఘజిహ్వుఁడు మహాక్రూరుండు శూరుండు గం
భీరాక్షుండు మహోదరుండు వికటాభీలాస్యుఁ డుగ్రస్వన
స్పారుండు న్విషముండు రాక్షసుఁడు బీభత్సుండు మాంసాసృగా
హారుం డద్రినిభుండు మత్తుఁడు విరాధాఖ్యుండు దోఁచె న్రహిన్.
| 12
|
విరాధుఁడు సీత నెత్తికొనుట
వ. |
మఱియు నన్నిశాచరుండు సింహత్రయంబును వ్యాఘ్రచతుష్టయంబును వృక
ద్వయంబును బృషద్ధశకంబును వసాదిగ్ధం బై విషాణసహితం బైనదాని నొక్క
గజశిరంబును నిశాతశూలాగ్రంబునం గ్రుచ్చికొని వసార్ద్రం బైనవ్యాఘ్ర
చర్మంబు గప్పికొని రుధిరోక్షితశరీరుం డై సర్వభూతభయంకరుం డై బ్రహ్మాం
డంబు బ్రద్దలు వాఱ నార్చుచుఁ బాతాళసదృశం బైనవక్త్రంబు విచ్చికొని
ప్రళయకాలంబునందు సంక్రుద్ధుం డై యంతకుం డెట్లు ప్రజల నుద్దేశించి పరు
వెత్తు నట్లు మహీతలంబు కంపింప నతిశీఘ్రంబునం బఱతెంచి వైదేహి నాక్ర
మించి కటిప్రదేశంబున నిడికొని ప్రళయకాలమేఘస్వనంబున రామలక్ష్మణుల
నాక్షేపించుచు ని ట్లనియె.
| 13
|
శా. |
మీ రెవ్వారు జటాజినంబు లిటు నెమ్మిం దాల్చి యీ దుష్ప్రవే
శారణ్యంబున సంచరించెదరు చాపాస్యంబకంబు ల్మునుల్
ధీరత్వంబునఁ దాల్ప నేర్తురె భవద్వేషంబులం జూడఁగా
వేఱై యున్నది మౌనిదూషకులు మీవృత్తంబుఁ దెల్పం దగున్.
| 14
|
క. |
దారుణవన మిది దుర్గం, బారూఢి విరాధుఁ డనుమహాసురవరుఁడ
న్వారక తాపసమాంసా, హారుఁడ నై సంచరింతు ననిశం బిచటన్.
| 15
|
క. |
దురితాత్ము లైనమీయి, ద్దఱ శూలాగ్రమునఁ దునిమి తడయక రుధిరం
బఱ లేక క్రోలి వెస నీ, గఱితం గైకొందు భార్యగా నిపుడు తగన్.
| 16
|
వ. |
అని పలుకుచున్నదురాత్ముం డగువిరాధునిసగర్వితం బైనదుష్టవాక్యంబు విని
వైదేహి సంభ్రాంతచిత్త యై ప్రవాతంబునందుఁ గదళియుం బోలె భయశోక
వేగంబున నాకంపించె నప్పు డారఘువల్లభుండు విరాధాంకగత యై భయంబున
వడఁకుచున్నసీత నవలోకించి దీనవదనుం డై లక్ష్మణున కి ట్లనియె.
| 17
|
రాముఁడు కైకేయీకృత్యమును దలంచి దుఃఖించుట
ఉ. |
భూరిసుఖార్హపుణ్యముల ప్రోవు మనస్విని నిత్యమంగళా
చార విదేహరాజసుత సర్వసతీమణి మత్పురంధ్రి యీ
ధారుణిపుత్రి భీతిఁ గొని దైన్యము మీఱఁగఁ గంపితాంగి యై
ఘోరనిశాటునంకమునఁ గుందుచు నున్నది కంటె లక్ష్మణా.
| 18
|
తే. |
అకట కైకేయి మన కేదురంతదుఃఖ, మటవి నొనగూర్పుటకు నింత యాచరించె
నది రయంబున నిపుడె సంప్రాప్త మయ్యెఁ, గాలము దురత్యయం బెంతఘనునకైన.
| 19
|
సీ. |
కేవలజడత నేదేవి సుతార్థంబు రాజ్యాభిషేకమాత్రమునఁ దనివి
సనక సమస్తభూతనివహంబున కనారతమును మిక్కిలిహితుఁడ నైన
యనుపమచిత్తుని వినయవిధేయునిఁ దనయరాజ్యస్థిరత్వంబుకొఱకుఁ
దాపసుఁ జేసి బాంధవు లెల్ల దుఃఖంపఁ గట్టిఁడితనమునఁ గాన కనిచె
|
|
తే. |
నట్టి మధ్యమజనయిత్రి యైనకైక, సీత దనుజాధమునిచేతఁ జిక్కుచుండ
నేఁడు చాల సకామ యై నెగడుఁ గాదె, ముదిత సంకల్ప మెంత యమోఘ మయ్యె.
| 20
|
తే. |
అకట మనయయ్య దశరథుఁ డన్యలోక, గతికిఁ బోవుటకంటె నఖండరాజ్య
హరణమునకంటె సీత యీపరునిచేతఁ, జిక్కుటకుఁ జాల మనమునఁ జింత వొడమె.
| 21
|
లక్ష్మణుఁడు రాముని నూరార్చుట
వ. |
అని పలికి కన్నీరు నించిన నారఘుపుంగవునిం జూచి లక్ష్మణుండు కైకేయి నుద్దే
శించి సంక్రుద్ధుం డై మహానాగంబుకరణి నూర్పులు వుచ్చుచు ని ట్లనియె.
| 22
|
ఆ. |
సాధుచరిత నీవు సర్వభూతములకు, నాథుఁడవు సురేంద్రునకు సముఁడవు
వినుత బాహువీర్యమనుఁడ వనాథుని, పగిదిఁ బరితపింప నగునె యధిప.
| 23
|
ఉ. |
క్రచ్ఛఱఁ జాప మెక్కిడి యఖండశరంబుల వీనిగుండియల్
|
|
|
వ్రచ్చెద నుత్తమాంగ మటు వ్రయ్యలు చేసెదఁ గాలుప్రోలికి
న్బుచ్చెదఁ గైకపట్టిపయిఁ బుట్టినకిన్కకు నీదురాత్ముపై
నొచ్చెము లేక నేఁడు వినియోగ మొనర్చెద నీవు మెచ్చఁగన్.
| 24
|
ఆ. |
అధిప యీదురాత్ముఁ డస్మచ్చరాహతి, వజ్రివజ్రనిహతి వ్రాలునగము
భంగిఁ గూలుచుండఁ బదపడి వీనిర, క్తంబు నిపుడు పుడమి ద్రావుఁ గాక.
| 25
|
తే. |
అనుచు లక్ష్మణుఁ డన్నతో నాడుచుండ, నవ్విరాధుఁడు భయదాట్టహాస మెసఁగ
వారి నీక్షించి విూర లెవ్వార లెచటి, కేగెదరు చెప్పుఁ డన రాముఁ డిట్టు లనియె.
| 26
|
ఆ. |
క్షత్రియులము వృత్తసంపన్నులము మను, కులుల ముగ్రగహనగోచరులము
క్రూరు లైనదైత్యవీరుల దండింప, మీఱి తిరుగుచున్నవార మిపుడు.
| 27
|
క. |
నీ వెవ్వఁడ వొంటిగ నీ, దావంబున నేల దిరిగెదవు నీచరితం
బేవిధము నామ మెయ్యది, లా వెంత యెఱుంగఁ జెప్పు లలిఁ బాపాత్మా.
| 28
|
క. |
అన విని వాఁ డిట్లను మ, జ్జనకుఁడు జయుఁ డనెడువాఁడు సత్యరతుఁడు మ
జ్జనని శతహ్రద నా పే, రనుపమవైఖరి విరాధుఁ డంద్రు నిశాటుల్.
| 29
|
క. |
ఘనతపమున మును వనజా, సనునకుఁ బ్రమదం బొనర్చి శస్త్రహతిం జా
వనివరము వడసి విక్రమ, మునఁ ద్రిమ్మరుచున్నవాఁడ ముల్లోకములన్.
| 30
|
వ. |
మఱియు నవ్విరించివలనఁ బ్రాణవియోజనకారణఖండనవిధారణానర్హత్వంబు
నొందినవాఁడ నాబారిం బడి తొలంగిపోవుటకు నిలింపపతి యైన సమర్థుండు
గాఁడు మీకుఁ బ్రాణంబులదెస నాస గలదేని యివ్వెలంది నిచ్చటం బరిత్య
జించి యథేచ్ఛం జనుం డని పలికిన నారామభద్రుండు రౌద్రరసోల్లాసమూర్తి
యై నేత్రకోణంబులం దామ్రదీధితులు నిగుడ నవ్విరాధు నీక్షించి మేఘగంభీర
భాషణంబుల ని ట్లనియె.
| 31
|
రామలక్ష్మణులు విరాధునిపై నానావిధశరంబులు ప్రయోగించుట
తే. |
నీకు ధిక్కార మొనరింతు నీచచరిత, తవిలి మిత్తి నన్వేషించెదవు నిజంబు
తలఁప నాజికి డాసితి నిలువు మింక, జగతి నామ్రోల బ్రతికి పోఁజాల వీవు.
| 32
|
క. |
అలవి యెఱుంగక రజ్జులు, పలికిన నది నీకు బంటుపంతమె నాతోఁ
గలసి పెనంగెడునప్పుడు, దెలిసెదవు మదీయబాణతీవ్రస్ఫూర్తిన్.
| 33
|
క. |
అని పల్కి వైరిసంత్రా, సన మగుబాణాసనంబు చక్కఁగ సజ్యం
బొనరించి నిశితశరములు, దనుజునిపై గాఁడ నేసె దారుణభంగిన్.
| 34
|
ఉ. |
అంత రఘూద్వహుండు ప్రళయాంతకుకైవడిఁ బేర్చి వింట న
త్యంతగుణప్రణాద మొలయం బటుకాంచనపుంఖ ముగ్రస
ర్వాంతకవాతవేగ మగునంబకసప్తక మేసె వానిమే
నంతయుఁ జించి తీవ్రరుధిరాప్లుత మై వెస భూమి గాఁడఁగన్.
| 35
|
ఉ. |
అంతట వాఁడు భూమిసుత నక్కడ డించి మహోగ్రరూపక
|
|
|
ల్పాంతకుఁడో యనంగ భయదాకృతిఁ గైకొని ఘోరభంగి రో
దోంతర మెల్ల నిండ వడి నార్చుచు శూలముఁ గేలఁ దాల్చి య
త్యంతరయంబునం గవిసె నారఘువీరులమీఁది కుగ్రతన్.
| 36
|
రాముఁడు విరాధునిశూలమును ఖండించుట
శా. |
జంట న్రాముఁడు లక్ష్మణుండు మది నిశ్శంక న్రణారంభు లై
వింటన్ మంటలు మ్రోయ నిష్ఠురరయావిర్భూతవాతాహతి
న్మింటన్ న్మబ్బులు విచ్చి పాఱ విశిఖానీకంబుల న్వీఁకతో
వెంట న్వెంట నిగిడ్చి రా దివిజవిద్వేష్యంగము ల్దూలఁగన్.
| 38
|
వ. |
ఇ ట్లఖండకోదండపాండిత్యంబుఁ జూపుటయు నక్కాండంబులు తండోపతండం
బులై కాలవ్యాళంబులకరణి నవ్విరాధునిమర్మంబులం గలంచిన నతండు వర
దానబలంబున బలవృద్ధికొఱకు హృదయంబునం బ్రాణంబులు నిరోధించుకొని.
| 39
|
శా. |
విద్యుద్వల్లికభంగిఁ గ్రాలుచటులస్ఫీతోగ్రశూలంబు వాఁ
డుద్యత్క్రూరతఁ బూన్చి వ్రేయ నది ధూర్యోగంబున న్మింట సూ
ర్యద్యుత్యాకృతి రాఁగఁ జూచి కడిమి న్రాముండు సంక్రుద్ధుఁ డై
సద్యోనాశము నొందఁ జేసె దృఢచంచత్కండయుగ్మాహతిన్.
| 40
|
చ. |
ఇటు రఘువీరబాణహతి నెంతయుఁ జూర్ణిత మైనశూల మ
క్కుటిలనిశాటుచేవ యనఁ గూలె రయంబున భూతలంబునం
బటుతరదేవరాడ్భిదురపాతమున న్బొడి యై శిలాతలం
బటు కనకాద్రినుండి సరయాహతి వ్రాలినచంద మేర్పడన్.
| 41
|
విరాధుఁడు రామలక్ష్మణులఁ దనభుజంబుల నెత్తికొనిపోవుట
ఉ. |
క్రమ్మఱ నమ్మహాభుజులు కాలభుజంగములట్ల గ్రాలుఖ
డ్గమ్ములఁ బూని వాని నెసకంబున వ్రేయఁ గడంగునంతలో
నమ్మనుజాశి బాహువుల నారఘువీరులఁ జిక్కఁ బట్టి శి
ఘ్రమ్మునఁ గానలోని కలుకం జులుకం గొని పోవఁ జూచినన్.
| 42
|
ఉ. |
వానితలం పెఱింగి రఘువర్యుఁడు లక్ష్మణుఁ జూచి పల్కు నో
మానితబాహుశౌర్య వినుమా మనలం గొని పోవఁ జూచె నీ
దానవవీరుఁ డంతకు నుదగ్రతఁ జాలినవాఁడు వీనిచే
మానక చిక్కకుండ నసమానబలస్థితి నూఁది యుండుమీ.
| 43
|
వ. |
మఱియు నీదురాత్ముం డగురాక్షసుం డేతెరువునం బోవు నదియె మనకు మార్గంబు
గావున నితండు మనల నెత్తుకొని మన మరుగం దలంచినమార్గంబునం గాని
తా నరుగం దలంచినమార్గంబునం గాని యేమార్గంబునం జనినను మన కది
సమ్మతం బై యుండు.
| 44
|
చ. |
అనుసమయంబున న్భుజబలాఢ్యుల రాఘవవంశవర్యులం
బ్రణుతబలుండు వాఁడు పసిబాలుర నట్ల నిజాంసభాగమం
దనువుగఁ జిక్కఁ బట్టి భయదార్భటి దిక్కులఁ బిక్కటిల్ల ధా
వనమున దారుణాటవి కవార్యగతి న్వెసఁ బోవుచుండఁగన్.
| 45
|
ఉ. |
ఆవిధ మంత చూచి జనకాత్మజ తాల్మి వహింప లేక శో
కావిలచిత్త యై సముదితార్తరవంబున సర్వలోకసం
భావితుఁ డీరఘూత్తముఁ డమందపరాక్రమణశాలి శేముషీ
శేవధి దుష్టదైత్యునకుఁ జిక్కె సహోదరసంయుతంబుగన్.
| 46
|
క. |
నను శార్దూలవృకాదులు, తనియఁగ భక్షింప నేల దశరథనృపనం
దనులను విడిచి ననుం గొని, మునుకొని చను మసురనాథ మ్రొక్కెద నీకున్.
| 47
|
రామలక్ష్మణులు విరాధుని బాహువులు రెండును నఱకుట
క. |
అని యీగతి విలపించిన, విని రాముఁడు లక్ష్మణుండు వేగంబున న
ద్దనుజుని వధింపఁ దలకొని, యనుపమనిశితాసియుగ్మ మంకించి రహిన్.
| 48
|
తే. |
బలిమి సౌమిత్రి వానిడాపలికరంబు, నఱకె రాముఁడు వలపటికరము నఱకె
భగ్నకరుఁ డై విరాధుండు పవివిలూన, ధారుణీద్రంబుచందాన ధరణిఁ గూలె.
| 49
|
వ. |
ఇత్తెఱంగునం బడినయన్నిశాచరు నాక్రమించి యవక్రపరాక్రమంబున
జానుకూర్పరముష్టిఘాతంబుల మర్దించుచు సారెసారెకు మీఁది కెత్తి శిలా
తలంబుమీఁదం గూలవైచుచు ఖడ్గంబుల నఱకుచు ని ట్లనేకప్రకారంబులఁ జిత్ర
వధక్రమం బాపాదించిన నవ్విరాధుండు నానావిధప్రహారణవిద్ధుం డై పుడమిం
బడియును సజీవితుం డై యున్న వాని యవధ్యత్వంబు విలోకించి నిజశ్రవణకీర్త
నధ్యాననిష్ఠపురుషసకలభయాపహారి యగు రాముండు లక్ష్మణున కి ట్లనియె.
| 50
|
తే. |
వరతపంబున దైత్యుఁ డవధ్యుఁ డయ్యె, శస్త్రహతి సంగరంబునఁ జంపఁ గూడ
దనఘ వీని నిక్షేపింత మవనిలోన, ననుచుఁ బలికిన నవ్వాక్య మాలకించి.
| 51
|
విరాధుఁడు రామునితోఁ దనపూర్వవృత్తాంతంబుఁ జెప్పుట
వ. |
విరాధుం డి ట్లనియె దేవా శక్రతుల్యబలుండ వైననీచేత నేను నిహతుండ నైతి
భవదీయసచ్చిదానందఘటనజగన్మోహనశ్రీమూర్తిసంస్పర్శభాగధేయంబు కం
టె మున్ను నిరవధికకరుణచేత మదీయశాపవిమోచనార్థం బావిర్భూతుండ
వైనశ్రీరాముండవు నీ వని యజ్ఞానంబువలన నాచేత నజ్ఞాతుండ వైతి వట్టి
పరమేశ్వరుండ వైననీ విప్పుడు రామరూపంబున నవతీర్ణుండ వైతి వని నాచేత
విదితుండ వైతివి గావున.
| 52
|
క. |
జననుత నినుఁ గౌసల్యా, తనయునిఁ గా లక్ష్మణునిఁ బ్రతాపనిధిని నీ
యనుజన్మునిఁ గా సీతను, జనకజఁ గా నిపుడు తెలియఁ జాలితి బుద్ధిన్.
| 53
|
క. |
అనఘా ము న్నే తుంబురుఁ, డనుగంధర్వుండఁ గిన్నరాధిపుశాపం
బున నీయసహ్యరాక్షస, తనువుం గైకొనినవాఁడ దారుణభంగిన్.
| 54
|
వ. |
ఇట్లు రంభాసక్తుండ నైనయేను వైశ్రవణునిచేత నభిశప్తుండ నై పదంపడి యమ్మ
హాత్మునిం బ్రార్థించిన నతండు ప్రసన్నవదనుం డై.
| 55
|
ఉ. |
ఓరి దురాత్మ యెన్నఁడు రఘూత్తముఁ డుగ్రత నిన్నుఁ బట్టి బల్
దారుణసంగరంబున శితప్రదరాహతిఁ ద్రుంచునప్పు డీ
ఘోరనిశాటరూప మది గోల్పడి తొంటిమనోజ్ఞరూప మిం
పారఁగ నొందె దింకఁ జను మంచుఁ బ్రసాద మొసంగె నా కొగిన్.
| 56
|
రామలక్ష్మణులు విరాధుని గుంటఁ ద్రవ్వి పూడ్చి వేయుట
వ. |
మహాత్మా కుబేరుం డానతిచ్చినచందంబున నింతకాలంబునకు నీచేత నాకు
శాపమోక్షణంబు సిద్ధించెఁ గృతార్థుండ నైతి నింక స్వర్గంబునకుం జనియెద
నిచ్చటికి సార్ధయోజనమాత్రంబు దవ్వుల బ్రహ్మజ్ఞాననిబిడీకృతాంతరంగుం డగు
శరభంగుం డనుమునిపుంగవుండు వసియించియున్నవాఁ డమ్మహాత్మునిఁ గానం
జను మ ట్లైన నీకు స్వస్తి యయ్యెడు న న్నవటంబున నిక్షేపించి కుశలివై యరు
గుము గతసత్వు లైనరాక్షసుల కిది సనాతనధర్మంబు బిలనిక్షిప్తు లగురాక్షను
లకు సనాతనంబు లైనయుత్తమలోకంబులు సన్నిహితంబు లై యుండు నని
పలికి తత్క్షణంబ యవ్విరాధుండు బాణక్షతవేదన సహింపం జాలక సన్న్యస్త
దేహుం డై దివంబునకుం జనుట కుద్యుక్తుం డయ్యె నంత రాముండు
విరాధువచనంబు విని లక్ష్మణు నవలోకించి వత్సా రౌద్రకర్ముం డైనయీ
రాక్షసునకుఁ గుంజరంబునకుం బోలె యివ్వనంబున నొక్కమహాగర్తంబు
ద్రవ్వు మని పలికి గర్తంబు ద్రవ్వునందాఁక విరాధునికంఠంబుఁ బాదం
బునం ద్రొక్కి పట్టి యుండె నంత లక్ష్మణుండు ఖనిత్రంబుఁ గొని విరాధుని
పార్శ్వభాగంబున నొక్కప్రదరంబు ద్రవ్విన నారఘుపుంగవుండు విరాధుని
చరణపీడనంబున శిథిలీకృతకంఠుం గావించి బిలప్రక్షేపంబుకొఱకు శస్త్రవ
ధంబు నిషేధించి బిలప్రక్షేపవిధంబు వానిచేత నివేదితుం డై మిక్కిలి కార్య
విశారదుం డగుటను వానియవధ్యత్వంబుఁ జూచి బిలనిక్షేపవధంబుకంటె నిత
రోపాయంబున విరాధునకు మరణంబు లేదని నిశ్చయించి పరమేశ్వరుం డైన
రామునిచేత వధంబు సంప్రాప్తం బయ్యె నతిధన్యుండ నైతి నని హర్షంబున
నాదంబుఁ గావించువాని సంగరనిర్జితుం డగువాని శంకుకర్ణుం డగువాని
నవ్విరాధుని భుజబలంబునం బట్టి యెత్తి బిలంబులోఁ బడవైచి శిలలచేత
నమ్మహాబిలంబుఁ బూడ్చి మహాపరాక్రముం డగురాముండు లక్ష్మణసహి
తంబుగా వీతభయుం డై పరమానందభరితాంతఃకరణుం డై చంద్రుండునుం
|
|
|
బోలెఁ గళాసంపన్నుం డై సూర్యుండునుం బోలెఁ బ్రతాపవంతుం డై విరాధు
వలనిభయంబునఁ బరితపించుచున్నజానకిం గౌఁగిలించుకొని మృదుమధుర
భాషణంబుల నాశ్వాసించి దీప్తతేజుం డగులక్ష్మణున కి ట్లనియె.
| 57
|
క. |
అనఘా ఘోరవనం బిది, మన కిచ్చట నింక నొంటి మసలఁ దగదు గ్ర
క్కున శరభంగమునీంద్రునిఁ, గనఁ బోవలె ననుచుఁ బలికే గాఢప్రీతిన్.
| 58
|
తే. |
అతనియనుమతిఁ గొని రాముఁ డతిరయమున, భావితాత్ముఁడు దేవప్రభావయుతుఁడు
నైనశరభంగమునియాశ్రమాంతికంబుఁ, జేరఁ జని కాంచె నందు విచిత్ర మొకటి.
| 59
|
రాముండు దేవేంద్రునిరథంబుఁ జూచుట
సీ. |
తపనీయకేతనదండాగ్రపటవాతఘాతంబు మబ్బులఁ గడలి కొత్త
రణితఘంటాఘణంఘణితనినాదంబు లవ్యక్తమధురంబు లై చెలంగ
మణిరథాంగసహస్రఘృణిపరంపరలు నభంబున వరుణాతపంబు నింప
జంద్రమండలనిభస్వచ్ఛాతపత్రంబు పాండరాభ్రఖ్యాతిఁ బరిఢవిల్ల
|
|
తే. |
హరితసత్తమవాజిసహస్రకంబు, మహితముక్తావళిప్రభామండితంబు
నిరుపమానవిచిత్రమణీశతాంగ, మల్ల మొక్కటి గనె నభోమండలమున.
| 61
|
సీ. |
మౌళిఁ జుట్టినదివ్యమాలికాసౌరభం బళికులంబునకుఁ బేరాసఁ గొలుప
ఱెప్పవ్రేయక చూచు దృక్సహస్రవిభూతి సర్వతోముఖవిచక్షణతఁ దెలుప
నరుణకటాక్షవీక్షారూఢి గొండలఁ బిండిఁ జేసిననాఁటి బిఱుసుఁ జూప
వృత్రజంభకులఁ జంపిననాఁటిశౌర్యంబు చారణు లొకట జోహారు సేయఁ
|
|
తే. |
దనకు సము లైనదివిజులు తన్నుఁ గొల్వ, నమరనారీకరాందోళితాచ్ఛదండ
చామరవ్యజనానిలచలితచూర్ణ, కుంతలుం డైన యలశచీకాంతుఁ గనియె.
| 63
|
వ. |
అప్పు డయ్యింద్రుండు రథావతరణంబుఁ గావించి శరభంగునిపాలికిం జను
దెంచి మహీతలంబు సంస్పృశింపక కొండొకపొడువున నుండి యమ్మునిపుంగ
వునితోడ సంభాషణంబుఁ గావించి రామాగమనం బెఱింగి క్రమ్మఱ రథా
రూఢుం డయ్యె నప్పు డారఘువల్లభుండు శరభంగునితో సంభాషించి మరల
రథారూఢుం డైనయింద్రునిం జూచి తదీయదివ్యరథంబు నంగుళీనిర్దేశంబున
లక్ష్మణునకుం జూపి యి ట్లనియె.
| 64
|
క. |
సౌమిత్రి కంటె దవ్వులఁ, గామగ మైనట్టి దివ్యకాంచనరథము
న్వ్యోమంబునఁ గార్శానవ, ధామముక్రియ భూరికాంతిఁ దనరెడుదానిన్.
| 65
|
క. |
అనఘా యాదివ్యరథం, బునకుం బూన్చినతురంగములసొబగు సురేం
|
|
|
ద్రునిహయములకుం గల దని, మును వింటిమి గా తదీయములె గాఁబోలున్.
| 66
|
వ. |
మఱియు నిమ్మహనీయరథంబుచుట్టునుం బరివేష్టించి ఖడ్గపాణు లై విస్తీర్ణవిపు
లోరస్కు లై పరిఘాయతబాహు లై పద్మరాగసదృశవసను లై వ్యామంబులుం
బోలె దురాసదు లై పంచవింశతివార్షికవయస్కు లై జ్వలనార్కప్రతీకాశహార
శోభితవక్షు లై ప్రియదర్శను లై కుండలాలంకృతకపోలభాగు లై ప్రకాశించు
చున్నవారు సుపర్వు లిప్పుడు యాదృగ్వయస్కు లై చూపట్టుచున్నవా రిదియె
వారలకు నిత్యం బై యుండు నని పలికి వెండియు ని ట్లనియె.
| 67
|
ఉ. |
చందురువంటి నెమ్మొగము చల్లనిచూపులమేటి యెవ్వఁడో
యిందఱిలోన భాసిలెడు నీతనిచంద మెఱుంగఁబోయెదన్
బొందుగ నీవు మైథిలియు మూరుత మిచ్చటఁ దామసించి యుం
డం దగు నంచుఁ బల్కఁగ నొడంబడె లక్ష్మణుఁ డన్నమాటకున్.
| 68
|
తే. |
అంత శరభంగమునియాశ్రమాంతికమున, కేగుదెంచుచు నున్నసీతేశుఁ జూచి
శక్రుఁ డమ్మునిచే ననుఙ్ఞాతుఁ డగుచు, నింపు సొంపార మెల్లన నిట్టు లనియె.
| 69
|
ఉ. |
వేడుకతోడ రాముఁ డతివేగమున న్నినుఁ జూడ వచ్చుచు
న్నాఁ డిట కమ్మహాత్ముఁడు ఘనం బగుకార్య మొనర్పఁ బూని యు
న్నాం డిఁకమీఁద నప్పని యొనర్చినపిమ్మటఁ గంటి కింపుగాఁ
జూడఁగఁ బోలు నా కిపుడు చూచుట కార్యము గా దనిందితా.
| 70
|
వ. |
మదభిభాషణంబునకంటె ముందఱ నీరామునిచేత రావణవధరూపం బైన
కర్మంబు కర్తవ్యం బనంతరంబ నన్ను విలోకింపం గలండు రావణవధానంతరం
బున విజయలక్ష్మీవిరాజమానుం డై కృతదేవప్రయోజనుం డై యున్నయీమహా
త్ముని విలోకించి కృతార్థుండ నయ్యెద.
| 71
|
సీతారామలక్ష్మణులు శరభంగమహర్షిని సందర్శించుట
క. |
అని పలికి వజ్రధరుఁ డ, మ్ముని నామంత్రణముఁ జేసి మును లనిమేషు
ల్దను సేవింపఁగ శీఘ్రం, బున దివ్యవరూథి నెక్కి పోయెం దివికిన్.
| 72
|
తే. |
అంత రఘువంశనేత కృతాగ్నిహోత్రు, ననఘు శరభంగమౌని డాయంగ నేగి
యవనిజాలక్ష్మణోపేతుఁ డై తదీయ, పాదపద్మంబులకు భక్తిఁ బ్రణతిఁ జేసి.
| 73
|
తే. |
అతనియనుమతి నొక్కదర్భాసనమునఁ, బరఁగఁ గూర్చుండి తనకుఁ గన్పడినపురుషు
చంద మేర్పడ నడిగిన సర్వ మతని, కెఱుకవడఁ జెప్పి వెండియు నిట్టు లనియె.
| 74
|
వ. |
మహాత్మా యద్దివ్యపురుషుండు శక్రుండు వరదుం డై తపోబలసముపార్జితం బైన
బ్రహ్మలోకంబునకు బ్రహ్మచేత ననుజ్ఞాతుం డై నన్నుం దోడ్కొని పోవుటకు
వచ్చిన వాఁ డేను దపోబలవిశేషంబునం త్రైకాలికసకలజగద్వృత్తాంతాభి
జ్ఞుండఁ గావునఁ జిరకాలంబు మనోమార్గంబున వెదుకంబడి యిప్పుడు నాభాగ్య
వశంబున బాహ్యంబున సమీపంబునందు వర్తించుచున్నప్రియాతిథి వైన
|
|
|
నిన్ను సందర్శింపక నిత్యనిరతిశయనిర్మలానందస్వరూపుండవు భక్తమందా
రుండ వైన నీ సందర్శనానందంబు విడిచి బ్రహ్మలోకంబునకుం బోవుట
యుక్తంబుగా దని యున్నవాఁడ భక్తిసంరక్షణధర్మశీలుండవు మహాత్ముండవు
పరమపురుషుండవు పైన నీతోడ సమాగమంబుఁ జేసి బ్రహ్మలోకంబునకుం
జనియెద నాచేత జయింపంబడి యక్షయంబు లై బహ్మలోకస్వర్గలోకసంభవ
భోగప్రదేశవిశేషంబులు సమృద్ధంబు లై యున్నవి మామకంబు లైనవానిం
బ్రతిగ్రహింపు మని సర్వేశ్వరుం డైనశ్రీరామునియందు సమర్పణాభిప్రాయం
బునం బలికిన సర్వశాస్త్రవిశారదుం డగురాముండు మునీంద్రా యేనె సర్వ
లోకంబు లాహరించుచున్నా నని సమర్పితఫలస్వీకరణాభిప్రాయంబును క్షత్రి
యునకుఁ బ్రతిగ్రహానర్హత్వాభిప్రాయంబును దేటపడం బలికి యివ్వనంబున
నాకు నివాసయోగ్యం బైనప్రదేశం బానతిం డనిన నమ్మునిపుంగవుం డట్లేని
యిచ్చటికి సమీపంబున ధార్మికుం డైనసుతీక్ష్ణుం డనుమునీంద్రునియాశ్రమం
బు గల దమ్మహాత్మునిఁ గానం జను మతండు మీకు శ్రేయం బొనగూర్చు
నిమ్మందాకినీనది ననుసరించి పశ్చిమాభిముఖంబుగాఁ జను మీయాపగ వుష్ప
పల్లవోడుపంబుల వహించి యుండు నిది మార్గక్రమం బిక్కడ నొక్కముహూ
ర్తంబు నిల్చి యితండు కృతార్థుం డగుఁగాక యని కరుణాకటాక్షవీక్షణంబున
నన్ను విలోకింపు మురగంబు జీర్ణం బైనచర్మంబునుంబోలె సర్వావయవం
|
|
శరభంగుఁ డగ్నిప్రవేశముఁ జేసి బ్రహ్మలోకమున కరుగుట
|
బులు పరిత్యజించెద నని పల్కి. తత్క్షణంబ గార్హపత్యవహ్నిం బ్రణయించి
మంత్రపూర్వకంబుగా నాజ్యహోమంబుఁ గావించి మహాతేజుం డగుశరభంగుం
కప్పావకమధ్యంబునం బ్రవేశించిన నయ్యగ్నిదేవుం డామహర్షిముఖ్యునిరో
మంబులును జీర్ణం బైనచర్మంబురు సశోణితం బైనమాంసంబును శల్యంబు
లును దిగ్మశిఖాపరంపరల దగ్ధంబులు గావించె నంత నారఘుపుంగవుం డచ్చెరు
వడి సూచుచుండ నమ్మునిపుంగవుండు దివ్యదేహంబు ధరియించి పంచవింశతి
వత్సరవయస్కుం డై యయ్యనలునితేజంబుఁ దస్కరించెనో యనం బొలు
పొందుదివ్యతేజంబుఁ దాల్చి యక్కుండంబువలన నిర్గమించి దివ్యయానం
బెక్కి స్వర్గలోకాదిసర్వలోకంబు లతిక్రమించి శాశ్వతం బైనబ్రహ్మలోకంబున
కుం జని సానుచరుం డగుపితామహుని సముచితప్రకారంబున సందర్శించి పరి
తుష్టుం డైనయవ్విరించిచేత స్వాగతం బడుగంబడినవాఁ డై యమ్మహనీయ
మూర్తిం గొల్చి యుండె నిట్లు శరభంగుండు దివంబునకుం జనిన యనంతరంబ.
| 75
|
వాలఖిల్యాదిమహర్షులు శ్రీరామునిం జూడవచ్చుట
సీ. |
అనుదినంబును ఫలాహారు లై పెక్కేండ్లు తప మాచరించిన ధన్యమతులు
సలిలపాన మొనర్చి శాఖావలంబు లై పెక్కేండ్లు నిష్ఠ సల్పినమహాత్ము
|
|
|
లతిజీర్ణపర్ణాశు లై బహుకాలంబు వినుతసమాధిఁ గైకొనినతపసు
లొడలు పుట్టలు గట్ట నిడుదకాలము గాడ్పు మెసవి తపోనిష్ఠ నెసఁగుమౌని
|
|
ఆ. |
వరులు వాలఖిల్యవైఖానసాత్రేయ, భార్గవాదిసకలపరమమునులు
దేవనుతులు దండకావనవాసులు, వరుస రాముఁ జూడ వచ్చి రపుడు.
| 76
|
వ. |
మఱియు భగవత్పాదప్రక్షాళనజాతమహర్షులును బ్రతిదినంబును జీవసాధనం
బు సంపాదించి సర్వంబునకును వినియోగంబు సేయునట్టివారును జంద్రికాపా
యులును భక్షణార్థంబు ప్రియంగుప్రముఖంబులు కశ్మంబునందుఁ గుట్టనం
బుఁ గావించునట్టివారును జీర్ణపర్ణాశనులును వ్రీహ్యాదికంబు దంతంబులచేత
ఖండించి భక్షించునట్టిదంతోలూఖలులును గంఠదఘ్నజలంబునందు నిలువం
బడి తపంబుఁ గావించునట్టియున్మజ్జకులును నసంవృతమేదినియందు శయ
నించునట్టిగాత్రశయ్యులును నొకానొకప్పు డైన శయనం బెఱుంగనియశ
య్యులును వాతాతపవర్షంబులందు మిక్కిలి యనావరణదేశంబునందుఁ దపం
బుఁ గావించునట్టియభ్రావకాశులును సలిలాహారులును వాయుభక్షులును
వాయుధారణబలంబున గగనంబునందు విలీను లగునట్టియాకాశనిలయులును
గుశాద్యావృతభూతలంబునందు శయనించునట్టిస్థండిలశాయులును వ్రతో
పవాసనిష్ఠులును నార్ద్రపటవాసులును సంతతాధ్యయననిష్ఠులును నిరంతరజప
పరాయణులును బంచాగ్నిమధ్యసమాచరితతపశ్శాలులును మొదలుగాఁ గల
మహర్షు లందఱు బ్రహ్మతేజోనిష్ఠు లై స్వప్రకాశపరబ్రహ్మంబు రఘువంశంబునం
దవతీర్ణం బై యస్మద్భాగ్యవశంబున మనకు దృష్టిగోచరం బయ్యె నేఁ డస్మ
త్తపోదానాదికంబు ఫలితం బయ్యె నని దర్శనానందంబునఁ గృతార్థు లగుటకు
నిర్ధనుండు ధనలాభంబు నొందినచందంబునఁ బరమానందనిర్భరు లై నానా
దేశంబులనుండి చనుదెంచి రక్షఃపీడితు లైనతమ కనన్యగతికత్వంబును జగద్రక్ష
ణార్థం బవతీర్ణుం డైనరాముని సర్వలోకశరణ్యత్వంబును నిశ్చయించి స్వరక్ష
ణంబుకొఱకు దయోత్పాదకంబు లగువాక్యంబుల ని ట్లనిరి.
| 77
|
మునులందఱు రాముని నభయంబుఁ గోరుట
సీ. |
అనఘాత్మ వేల్పుల కలశచీపతివోలె యిక్ష్వాకుకులమున కీధరిత్రి
కధినాథుఁడవు మహారథుఁడవు యశమున విక్రమంబున జగద్విశ్రుతుఁడవు
పితృభక్తియును సత్యవితరణంబులు సత్వ మధికధర్మంబు నీయంద యుండు
ధర్మవత్సలుఁడవు ధర్మజ్ఞుఁడవు మహాత్ముఁడ వైననినుఁ జేరి మునుల మెల్లఁ
|
|
తే. |
జాల నర్థిత్వబుద్ధి విజ్ఞాపనంబుఁ, జేసెదము మాప్రయత్నంబు చిత్తగించి
సాధుసంరక్షణంబు ప్రశస్తధర్మ, మని తలంచి రక్షింపుము వినుతశీల.
| 78
|
వ. |
అని పరమార్థంబుగా విన్నవించి వెండియు లోకరీత్యానుసారంబున రాజధర్మం
బు తేటపడ ని ట్లనిరి.
| 79
|
శా. |
షష్టాంశంబు కరంబుఁ బుచ్చుకొని యేక్ష్మాభర్త దేశప్రజ
న్హృష్టస్వాంతముఁ జేయఁ డానృపతి యూహింప న్గతశ్రేయుఁ డై
కష్టాత్ముం డగుఁ దండ్రివోలెఁ బ్రజ సత్కారుణ్యుఁ డై ప్రోచువాఁ
డిష్టావాప్తి వహించి శాశ్వశయశం బేపార లోకంబునన్.
| 80
|
క. |
యతచిత్తుఁ డై సదావన, హితుఁ డై భూప్రజల నధిపుఁ డిష్టతనయజీ
వితములకైవడిఁ బ్రోచిన, నతనికిఁ జీరకాల మబ్బు నాయువు యశమున్.
| 81
|
మ. |
అనఘా యెవ్వఁడు రాజధర్మవిహితవ్యాపారగౌరేయుఁ డై
యనుమానించక ప్రోచు నాతఁడు తదీయం బైనపుణ్యంబులో
మనత న్నాలవపాలు గైకొని సమగ్రశ్రేయుఁ డై సంతతం
బును లోకేశ్వరలోకనిష్ఠసుఖతం బొల్పొందు నిత్యోన్నతిన్.
| 82
|
వ. |
బ్రాహ్మణభూయిష్ఠం బైనయీవానప్రస్ధగణంబు భవన్నాథం బయ్యు ననాథం
బైనచందంబున మిక్కిలి రాక్షసులచేత వధియింపంబడుచున్నది భవవధీన
చిత్తుల మై యున్నమచ్ఛరీరంబులు బహుప్రకారంబుల రాక్షసపీడితంబు లై
యున్నవి విలోకింపుము మహాత్మా పంపానదీతీరంబునఁ జిత్రకూటపర్వతంబున
మందాకినీనదీప్రాంతకాంతారంబులఁ జిరకాలంబుననుండి నివసించి యున్నపర
మర్షుల దురవస్థ కొలంది పెట్ట నలవి గాదు బహుప్రకారంబుల భీమకర్ము లగురా
క్షసులచేతఁ గ్రియమాణం బైనవిప్రకారంబు సహింపంజాలక సర్వలోకరక్షణ
సమర్థుండ వైననిన్ను శరణంబు నొందుటకుం జనుదెంచితిమి సర్వలోకంబుల
యందు నీకంటె నైహికాముష్మికసాధనదేవతాంతరం బన్యం బెద్దియు లేదు
గావున ననన్యశరణ్యుల మైనముమ్మ రాక్షసబాధవలన విముక్తులం జేసి కృపా
ళుండ వై రక్షింపుమని బహుప్రకారంబుల దీను లై ప్రార్థించుచున్నయత్త
పోధనులవాక్యంబు లాకర్ణించి ప్రసాదసుందరవదనారవిందుం డై కౌసల్యా
నందనుఁ డి ట్లనియె.
| 83
|
రాముఁడు మునుల కభయం బొసంగుట
ఉ. |
ఓజటివర్యులార వినుఁ డున్నతవైఖరిఁ గైకయీవర
వ్యాజమున న్నిశాచరుల నందఱఁ ద్రుంచి మిముం గృపాగుణ
భ్రాజితశక్తిఁ గాచుట కరణ్యపదంబున కేగుదెంచితి
న్రాజితకీర్తులార యిటు ప్రార్థన సేయుట యింత యేటికిన్.
| 84
|
ఉ. |
మంచిది మీరు నన్ను బహుమానపురస్సరదృష్టిఁ జూచి ప్రా
ర్థించితి రట్లు గాన నిఁక దేవవిరోధులబాహుశక్తి మ
ర్దించెద నీవనంబు కడుఁ బ్రీతి దలిర్స నరాక్షసంబు గా
వించెద మీకు హర్ష మొదవించెద నించెదఁ గీర్తి దిక్కులన్.
| 85
|
ఉ. |
చెచ్చెరఁ జాప మెక్కిడి ప్రసిద్ధశరంబుల రాక్షసావళిన్
|
|
|
వచ్చినవేళ నాదుశరబాధకు నోర్వక దైత్యు లాజిలోఁ
జచ్చినవేళ నాదుబలసంపద లక్ష్మణుబాహువిక్రమం
బచ్ఛువడంగఁ జూచి మది నచ్చెరు వందెవ రింత యేటికిన్.
| 86
|
వ. |
అని పలికి సాదరంబుగాఁ దపోధనుల కభయదానం బొసంగి వారు తనవెంటం
జనుదేర సీతాలక్ష్మణసహితుం డై సుతీక్ష్ణమునీంద్రునాశ్రమంబునకుం బోవ
సమకట్టి యచ్చోటు వాసి కొండొకదూరం బరిగి యంత నంత బహూదకంబు
లైననదులు పెక్కులు గడిచి యొక్కచోట గగనోల్లిఖితశిఖరం బైనయొక్కశై
లంబు పొడగని తత్ప్రాంతంబున బహుఫలపుష్పద్రుమశోభితం బైనయొకకాం
తారంబుఁ బ్రవేశించి తన్మధ్యభాగంబునఁ జీరమాలాపరిష్కృతం బైనయొక్క
మహనీయాశ్రమంబు నిరీక్షించి యందు శాశ్వతుం డైనబ్రహ్మచందంబున సు
ఖాసీనుం డై మలయపంకజటాధరుం డై యున్నసుతీక్ష్ణుని సముచితంబుగా సంద
ర్శించి తచ్చరణంబులకు వందనం బాచరించి వినయపూర్వకంబుగా ని ట్లనియె.
| 87
|
శ్రీరాముఁడు సుతీక్ష్ణమహామునిని సందర్శించుట
క. |
అనఘాత్మ యేను దశరథ, తనయుఁడ రామాహ్వయుండఁ దగ మిముఁ జూడం
జనుదెంచితి మొక్కన నె, మ్మనమున నాశీర్వదించి మన్నింపఁదగున్.
| 88
|
క. |
నా విని మునినాథుఁడు సీ, తావల్లభుఁ జూచి కరుణ దళుకొత్తఁగ సం
భావించి యిట్టు లనియెను, బ్రావీణ్య మెలర్ప మధురభాషాప్రౌఢిన్.
| 89
|
క. |
సురపతి కెన యగునీ విపు, డరుదెంచుకతన నిమ్మహావని సుశుభో
త్కర మై పావన మై యఱ, మఱ లే కిట నాథసత్తమం బయ్యెఁ గదా.
| 90
|
ఉ. |
రట్టడి కైకచెయ్దముల రాజ్యము గోల్పడి భూమిపుత్త్రితోఁ
బుట్టువు వెంట రాఁ దపసిపూనికఁ గైకొని చిత్రకూట మ
న్గట్టున నున్నవాఁడ వనఁగా విని యెన్నఁడు చూతు నంచు ని
ప్పట్టున నున్నవాఁడ ననపాయకుతూహల ముల్లసిల్లఁగన్.
| 91
|
వ. |
మహాత్మా యింతకు ము న్నిచటికి సురేంద్రుండు చనుదెంచి మీరాక యెఱిం
గించి చనియె నేను భవద్దర్శనాకాంక్షి నై దేహంబుఁ బరిత్యజించి దేవలోకం
బునకుం బోవకున్నవాఁడఁ దపోబలవిశేషంబునఁ బుణ్యలోకంబుల నన్నింటిని
జయించితి దేవర్షిజుష్టంబు లైనతత్తల్లోకంబులందు జానకీలక్ష్మణసహితుండ వై
మత్ప్రసాదంబున విహరింపు మనిన నారఘువల్లభుండు మునీంద్రా యేనును
సమస్తలోకంబు లాహరించెద నిక్కాననంబున నాకు వసియించుటకుం దగిన
యాశ్రమం బానతిమ్ము సర్వభూతహితుండవు మహాత్ముండ వైననీకుశలంబు గౌత
ముం డైనశరభంగునిచేత నాఖ్యాతం బయ్యె ననిన విని లోకవిశ్రుతుం డైన
యమ్మునిపుంగవుడు పరమానందభరితాంతఃకరణుం డై మంజుభాషణంబుల
ని ట్లనియె.
| 92
|
చ. |
అనుపమరమ్యమూలఫల మై సుకృతంబులకు న్నివాస మై
మునులకు నాటప ట్టయి సమున్నతి నొప్పెడు నీవనంబు నీ
కనఘ నివాసయోగ్య మగు నైనను వన్యమృగంబు లెల్లెడన్
బనివడి నీతపంబునకు భంగము సేయుచు నుండు నిచ్చటన్.
| 93
|
వ. |
మహాత్మా యివ్వనంబునకు మృగసంఘంబులు చనుదెంచి యకుతోభయం
బు లై యథేష్టంబుగా సంచరించి నానావిచిత్రవేషంబులఁ దపోభంగంబుఁ
గావించి గ్రమ్మఱం జనుచుండు నిచ్చట మృగప్రలోభనరూపదోషంబుకంటె
నన్యదోషం బేమియు లే దని పలికిన విని రామభద్రుం డమ్ముని కి ట్లనియె.
| 94
|
చ. |
ఇనసమతేజ యేను ధను వెక్కిడి ఘోరమృగావళి న్మహా
శనినిభశాతబాణములఁ జంపితి నేని తదర్థమందు నీ
మనమునకు న్విషాద మగు మా కది మిక్కిలి పీడ సేయు ని
వ్వనమున దీర్ఘకాలము నివాస మొనర్పఁగ జాల నెంతయున్.
| 95
|
వ. |
అని పలికి రాముండు సీతాలక్ష్మణసహితుం డై యమ్మునీంద్రునాశ్రమంబున
నివాసంబుఁ గల్పించుకొని పశ్చిమసంధ్య నుపాసించి మునిపతి యొసంగిన తాప
సభోజ్యం బైనయన్నంబు భుజించి యతనిచేత సత్కారంబు వడసి మునులతోడ
నిష్టకథావినోదంబుల నారాత్రి పుచ్చి మఱునాఁ డరుణోదయంబున సీతా
సహితంబుగాఁ బద్మకైరవసౌరభోల్లసితం బైనశీతసలిలంబున మజ్జనంబుఁ గా
వించి యగ్నిదేవు నారాధించి సురలం బూజించి మహర్షుల సత్కరించి సుతీక్ష్ణ
మునీంద్రునకు వందనంబుఁ గావించి సవినయవాక్యంబుల ని ట్లనియె.
| 96
|
రాముఁడు సుతీక్ష్ణమహర్షిని మునులయాశ్రమంబుఁ జూడ ననుజ్ఞ నడుగుట
ఉ. |
ఓమునివర్య నేఁడు సుఖ ముంటిమి నీకడ నీతపోధన
గ్రామణు లొక్కరీతి నను రమ్మని పిల్చుచు నున్నవార లెం
తో ముద మొప్ప వారిఁ బరితుష్టులఁ జేయుట మేలు గాన నా
నామహనీయతాపసవనంబులు గన్గొనఁ బోయి వచ్చెదన్.
| 97
|
చ. |
అనఘచరిత్ర దుర్నయసమాగతసంపద నొందినట్టిదు
ర్జనుఁ డగురాజుభంగి నవిషహ్యఘనాతపుఁ డైనయాత్రయీ
తనుఁడు నభంబునం గడుఁబ్రతాపము నొందకమున్నె లక్ష్మణు
న్జనకజఁ గూడి తాపసవనంబులకుం జనువాఁడ నెంతయున్.
| 98
|
క. |
అని పలికి సుమిత్రానం, దనసీతాసహితుఁ డగుచుఁ దత్పదములకున్
వినతి యొనరింప నతఁడ, క్కునఁ జేర్చి ముదం బెలర్ప గురుమతి ననియెన్.
| 99
|
ఉ. |
తమ్మునిఁ గూడి నీవు సుపథంబున నేగుము భూమిపుత్రి యం
దమ్మున వెంట రాఁగ విపినంబున నున్కి యొనర్చి యున్నపు
ణ్యమ్ములప్రోవు లైనమునినాథుల రమ్యతరాశ్రమప్రదే
|
|
|
శమ్ములు వేడ్కతోడ వరుసం దగఁ గన్గొని రమ్ము రాఘవా.
| 100
|
వ. |
మఱియు ఫుల్లపంకజమండితప్రసన్నసలిలయుతహంసకారండవాకీర్ణంబు లగు
సరోవరతటాకంబులు గలిగి దృష్టిరమ్యంబు లగుగిరిప్రస్రవణంబులచేత నావృ
తంబు లై పరస్పరవైరవిహితప్రశాంతమృగపక్షిగణంబు లై మయూరాభిరుతం
బు లై యొప్పురమణీయారణ్యంబులు విలోకించుచు దండకారణ్యనివాసు లగు
మహర్షులచేత సత్కృతుండ వై క్రమ్మఱ మదీయాశ్రమంబునకుం జనుదెమ్మని
పలికిన నట్ల కాక యని రాముండు లక్ష్మణసహితంబుగా నమ్మహర్షి చరణంబులకుఁ
బ్రణామంబుఁ గావించి యపాంసులాశిరోమణి యగువైదేహి యొసంగిన
శుభతరతూణీరంబులును దీర్ఘంబు లగుచాపంబులును గనకత్సరుఖడ్గంబులును
దమ్ముండునుఁ దానును సముచితంబుగా ధరించి నిజదేహప్రభాపటలం బక్కాం
తారంబునకుం గారుత్మతచ్ఛాయ సంపాదింప శీఘ్రంబునఁ బ్రయాణంబున కభి
ముఖుం డయ్యె నాసమయంబునఁ దదీయసహధర్మచారిణియు నిత్యానపాయిని
యు దివ్యమంగళస్వరూపిణియు నగుసీతాదేవి నిజభర్త నవలోకించి హృద్యం
బగుస్నిగ్ధవాక్యంబున ని ట్లనియె.
| 101
|
సీత రాముని సత్యసంధత్వపరదారపరాఙ్ముఖత్వాదుల నభినుతించుట
సీ. |
ప్రాణేశ శాస్త్రోక్తభంగి నేయుత్కృష్టధర్మ మీమునికులోత్తమునిచేతఁ
దప్పక ప్రాప్తించెఁ దద్ధర్మ మీలోకమందుఁ గామోద్భవం బైనయట్టి
వ్యసనంబువలనఁ జయ్యన నివృత్తుఁడ వైననీచేత నిత్యంబు నేర్పువలన
నాచరింపఁగ శక్య మై యుండు మిథ్యాభివాదంబు పరసతీవర్తనంబు
|
|
తే. |
ధాత్రివైరంబు లేనిరౌద్రత్వ మనఁగఁ, బొసఁగ నిమ్మూఁడుకామజవ్యసనము లగు
నరయ మొదలిమిథ్యాభివాక్యంబుకంటెఁ, దక్కినవి రెండు నతిగురుత్వము వహించు.
| 102
|
చ. |
పరవనితాభిలాషయును బల్కులబొంకును ధర్మనాశ మం
డ్రరయఁగ నీకు లేవు పురుషాధిప ము న్నవి రెండు మీఁదటన్
దొరకొనఁ బోవు నేఁ డిచటఁ దోడ్పడె నంచు వచింప నె ట్లగుం
గర మురుధర్మశీలికిఁ ద్రికాలమునందును గల్గ నేర్చునే.
| 103
|
వ. |
అని పలికి యీరెంటిలోనఁ బరదారాభిగమనాభావంబునం దతిశయం బెఱిం
గించుతలంపున వెండియు ని ట్లనియె.
| 104
|
తే. |
భావమున నైనఁ గల నైన బ్రమసి యైన, నన్యకాంతాభిగమన మావంత యైన
నధిప కాలత్రయంబునం దరియ నీకు, లే దనుట కించుకయు శంక లేదు నాకు.
| 105
|
వ. |
అని పలికి పరదారాభిగమనమిథ్యావచనాభావంబులందుఁ గ్రమంబున హేతు
ద్వయం బుపన్యసించుతాత్పర్యంబున ని ట్లనియె.
| 106
|
తే. |
అనఘచరిత ధర్మిష్ఠుండ వగుచుఁ బ్రీతి, ననిశము స్వదారనిరతుండ వైతి నీవు
సత్యసంధుండ వగుచు నాజనకవాక్య, కారకుఁడ వైతి వింత నిక్కంబు సువ్వె.
| 107
|
క. |
సత్యము ధర్మము సర్వము, నిత్యము నీయందు నిలిచి నెగడుచు నుండున్
సత్య మజితేంద్రియుల కివి, యత్యంతభారంబు లగు గుహాగుణశాలీ.
| 108
|
సీత రామునితో జీవహింస చేయఁ దగ దని చెప్పుట
వ. |
మహాత్మా నీకు మిథ్యావాక్యపరదారాభిగమనరూపవ్యసనద్వయప్రసక్తి లేదు
భవదీయవశ్యేంద్రియత్వం బెఱుంగుదు నెయ్యది మూఁడవది యగునిర్వైరపర
ప్రాణాభిహింసనరూపవ్యసనంబు గల దది మోహంబువలన రౌద్రత్వరూపాధ
ర్మాంతరంబు సంపాదించు నది యిప్పుడు నీకు సముపస్థితం బయ్యె దండకారణ్య
నివాసిమహర్షిరక్షణార్థం బిప్పుడు రాక్షసవధంబు నీచేతఁ బ్రతిజ్ఞాతం బయ్యెఁ
గైకేయీవరవ్యాజంబున రక్షోవధార్థంబు శరచాపంబులు గైకొని భ్రాతృ
సహితంబుగా దండకావనంబునకుం జనుదెంచితి వని యూహించెద రాక్షస
వధార్థంబు ప్రస్థితుండ వైననిన్ను విలోకించి భవదీయసత్యప్రతిజ్ఞత్వస్వదారైక
సనిరతత్వాదిసద్వృత్తంబు విచారించి యుభయలోకసుఖకాంక్షిణి నైననాకు
మనఃఖేదం బగు చున్న దని పలికి వెండియు ని ట్లనియె.
| 109
|
తే. |
రఘుకులోత్తమ దండకారణ్యగమన, మరయ నీకు హితంబు గా దని తలఁచెదఁ
గరము నీయర్థమం దొక్కకారణంబు, గలదు వినిపింతు వినుము నిశ్చలత మించి.
| 110
|
క. |
ధనువును శరములుఁ గైకొని, జననాయక నీవు భ్రాతృసహితుఁడ వై య
వ్వనమునకుఁ జనితి వేనియు, దనుజులఁ గని శరము విడువఁ దలఁపు వొడమదే.
| 111
|
సీత రామునకు ధనుర్ధారణము వికారహేతు వని నిరూపించుట
తే. |
అధిప ముంగల నున్న శరాసనంబు, వినుము నృపులకుఁ దేజోభివృద్ధి నొసఁగు
నెంతయు సమీపమున నున్నయింధనములు, శ్వసనసఖునకుఁ దేజం బొసంగినట్లు.
| 112
|
వ. |
ఇందులకు నొక్కయితిహాసంబు గల దెఱింగించెద వినుము.
| 113
|
శా. |
దేవా ము న్నొకపుణ్యకాననమున ధీరోత్తముం డాత్మవి
ద్యావర్ధిష్ణుఁడు విప్రుఁ డొక్కఁడు తపం బారూఢిఁ గావింపఁగా
దేవాధీశుఁడు తత్తపంబుఁ జెఱపన్ దీపించు ఖడ్గంబుఁ గొం
చావిప్రోత్తముఁ డున్నచోటికి భటుం డై వచ్చె దంభాకృతిన్.
| 114
|
తే. |
శక్రుఁ డిబ్భంగి నతనియాశ్రమపదంబుఁ, జేరి తనచేతిఖడ్గ మప్పాఱుచేతి
కిచ్చి మునివర్య దీని నా వచ్చునంత, దాఁక రక్షింపు మని చెప్పి తడయ కరిగె.
| 115
|
వ. |
అంత నవ్విప్రుండు శక్రదత్తశస్త్రంబు పరిగ్రహించి న్యాసరక్షణతత్పరుం డై
స్థాపితవస్తువిషయవిశ్వాసంబువలన నేమఱక ఫలమూలహరణార్థం బరుగు
నప్పుడును ఖడ్గంబుఁ గొనిపోవుచు నతిప్రయత్నంబున దాని రక్షించుచు వనం
బునం జరించుచు నంతకంతకుఁ గ్రామంబున నత్తపోధనుండు శస్త్రసంవాసంబు
|
|
|
వలనఁ దపంబు విడిచి క్రూరబుద్ధి నధిగమించి ప్రమత్తుం డై యధర్మకర్శితుం డై
రౌద్రాభిరతుం డై నిరయగతికిం జనియె నిది శస్త్రసంయోగకారణం బైనపురా
వృత్తాంతంబు వహ్నిసంయోగం బెట్లు వస్తువునకు వికారహేతు వగు నట్లు శస్త్ర
సంయోగంబును శస్త్రధారికి వికారహేతు వగు నని పలికి వెండియు ని ట్లనియె.
| 116
|
చ. |
ఘనుఁడవు నీవు నీమతము గా దని పల్కఁగఁ జాల నైన బ
ల్చనవున స్నేహదర్శితబలంబున నాడితి దీనిఁ దప్పు గాఁ
గొన కిది యెంత యంచు మదిఁ గ్రుక్కక నావచనంబుఁ బట్టి నే
ర్పునఁ బలలాశికోటిపయిఁ బుట్టినరౌద్రత నుజ్జగింపుమీ.
| 117
|
క. |
పగఁ గొనినవారిఁ జంపం, దగుఁ గాక నృపాలచంద్ర తడయక నీకున్
బగఁ గొననివారి దైత్యులఁ, దెగజూడం దగదు గలవె దీన శుభంబుల్.
| 118
|
తే. |
అధిప దైత్యవధారంభ మంతకంత, కఖిలలోకహింసాబుద్ధి నవలఁ గలుగఁ
జేయు నేయపరాధంబుఁ జేయనట్టి, సర్వజనుల హింసించుట కోర్వఁ జాల.
| 119
|
సీత రామునికి వనవాసులకుఁ బరహింస దగ దని చెప్పుట
సీ. |
క్షత్రధర్మోచితసాధురక్షణవృత్తు లైనవీరుల కరణ్యప్రవాసి
మౌనిసంరక్షణమాత్రంబు ధనువుచేఁ కార్యంబు సర్వరాక్షసులఁ జంపి
మునుల రక్షించుట మనకుఁ గార్యము గాదు రాజ్యపాలనశీల రాజధార్య
మైన శస్త్రం బేడ మానితరాజ్యంబు విడిచి యిప్పుడు మునివృత్తిఁ బూని
|
|
తే. |
వచ్చి సొచ్చినవన మేడ వసుమతీశ, కార్యహింసాభిలక్షణకర్మ మేడ
మఱియు హింసారహితతపశ్చరణ మేడ, బుద్ధి నరయ నన్యోన్యవిరుద్ధ మయ్యె.
| 120
|
తే. |
దేవ మనచేత నిప్పుడు దేశధర్మ, మాచరింపంగఁ దగుఁ గాక యన్య మేల
శస్త్రసేవనమునఁ గలుషంబు గలుగు, క్షత్రధర్మం బయోధ్యలోఁ జలుపవచ్చు.
| 121
|
తే. |
రాజ్యముఁ బరిత్యజించి యరణ్యమునకు, వచ్చినందుకుఁ బరహింస వదలి మౌని
వృత్తిఁ బూని వర్తించెద మేని దేవ, తల్లిదండ్రుల కధికముదంబు గలుగు.
| 122
|
క. |
ధర్మమున ధనము దొరకొను, ధర్మంబునఁ బరమసుఖము దనరుచు నుండున్
ధర్మమునఁ గలుగు సర్వము, శర్మద యీజగము ధర్మసారము సుమ్మీ.
| 123
|
వ. |
మహాత్మా కృచ్ఛ్రచాంద్రాయణాదికంబు లైననియమంబులచేత శరీరంబు కృశిం
పం జేసి నిపుణు లగువారిచేత ధర్మంబు ప్రాపింపంబడు సుఖాధిష్ఠానానువర్త
నంబున సుఖంబు గలుగదు గావున రాక్షససంహారోద్యోగంబు కర్తవ్యంబు
గాదు నీవును నిత్యంబును శుచిమతి వై తపోవనంబున నేతత్కాలసదృశం బైన
ధర్మంబు ననుసరించి వర్తింపుము త్రిలోకాంతర్వర్తిజనధర్మాధర్మాత్మకం బైన
సర్వంబును మీకు విదితం బై యుండు మీకు ధర్మం బుపదేశించుట కెవ్వండు
సమర్థుండు స్త్రీచాపలంబున నిది నాచేత సముదాహృతం బయ్యె భ్రాతృసహి
|
|
|
తుండ వై బుద్ధిచేత విచారించి చిత్తంబునకుం దోఁచినభంగి నవధరింతువు
గాక యని పలికిన భర్తృభక్త యగువైదేహివాక్యంబు విని రాముండు ముని
పరిపాలనాత్మకధర్మసంస్థితుం డై యద్దేవి కి ట్లనియె.
| 124
|
రాముఁడు సీతతో రాజులకు సాధురక్షణం బావశ్యకం బని చెప్పుట
చ. |
చకితమృగాక్షి నీపలుకు సత్యము క్షత్త్రియవీరధర్మదీ
పకము హితంబు పథ్యము శుభంబు వరంబు మనోహరంబు వై
ప్రకటిత మయ్యెఁ గార్ముకముఁ బట్టినభూపతి కార్తరక్ష త
ప్పక దగు నంచు నీవె యిటు పల్కితివే యిఁకఁ జెప్ప నేటికిన్.
| 125
|
ఉ. |
వారిజగర్భతుల్యు లగువారు మహర్షులు సంతతంబు దు
ర్వారపటుప్రతాపబలవద్రజనీచరబాధితాంగు లై
వారక యేగుదెంచి జితవైరిని న న్శరణంబు నొంది రం
భోరుహగంధి యమ్మునులఁ బ్రోవనినాకు యశంబు గల్గునే.
| 126
|
చ. |
నరపిశితోపజీవులు ఘనాఘనదేహులు క్షుద్రయామినీ
చరు లతిఘోరభంగిఁ దము సారెకుఁ గాఱియ పెట్టి సంతతాం
తరితమఖాదికార్యకలన న్గనుదోయికిఁ గూర్కు లేక ది
క్కఱి మునిపుంగవు ల్గడుసుఖస్థితిఁ గానక యున్నవా రొగిన్.
| 127
|
తే. |
నిత్య మీదండకారణ్యనిలయు లైన, మునులు రాక్షసపీడితమూర్తు లగుచుఁ
దపము లన్నియుఁ జాలించి తమదురంత, చింత లన్నియు నాతోడఁ జెప్పుకొనిరి.
| 128
|
తే. |
ఏను నత్తాపసేంద్రముఖరితోక్తి, విని తదంఘ్రుల కెఱఁగి యోవిప్రులార
యింత వగ పేల నాకు మీచింత లెల్లఁ, జెప్పుఁ డెంతటిపనియైనఁ జేయువాఁడ.
| 129
|
క. |
అని యేను బలుక విని యి, ట్లనిరి రఘూత్తంస దండకారణ్యమునన్
దనుజులు మము బాధించుచుఁ, గనారిలుచు నున్నవారు గావుము కరుణన్.
| 130
|
క. |
ఎచ్చోట నుండి వత్తురొ, విచ్చలవిడి సర్వహోమవేళల శాలల్
చొచ్చి శుచికుండముల బలు, మచ్చరమున నింతు రస్థిమాంసంబు లొగిన్.
| 131
|
క. |
దనుజులరాయిడి కోర్వక, దినకరకులవర్య నీవె ది క్కని దైన్యం
బున శరణ మొందినారము, ఘనకృప రాక్షసులఁ ద్రుంచి కావుము మమ్మున్.
| 132
|
సీ. |
భూరితపోబలంబున దైత్యుల వధింప శక్తుల మైనను జనవరేణ్య
బహుకాలమున నుండి పడసినఘనతపంబునకు హాని జనించు ననుచు ఘోర
దనుజబాధితుల మయ్యును వారి శపియింప నోడి యున్నాము తదుగ్రబాధ
నడఁచి ప్రోవుము కరుణాంభోనిధి యటంచు గురుదైన్యమున వేఁడుకొనిరి గాన
|
|
ఆ. |
దీను లైనమునులదీనత్వ ముడుపుట, కంటె వేఱెఫలము గలదె నాకుఁ
గ్రూరు లైనదైత్యవీరులఁ జంపినఁ, బాప మేల గలుగు పంకజాక్షి.
| 133
|
వ. |
దేవి రాజత్వం బంగీకరించుటకు సాధుసంరక్షణంబు ఫలంబు గదా మునిరక్షణా
|
|
|
ర్థంబు ప్రాణంబు లొసంగినం గొఱంత లే దేను గైకేయీవరవ్యాజంబున వనం
బునకుం జనుదెంచుటయు దండకారణ్యనివాసమునిరక్షణార్థం బని యెఱుం
గుము నాయందు సౌహార్దస్నేహవిశేషంబున హితంబుఁ జెప్పితివి దానం దప్పు
లేదు ప్రాణంబులకంటె గరీయసివి గావున నీపలుకులకు సంతోషించితి నిది
మొదలు సాధుసంరక్షణార్థంబు రాక్షసవధంబున కుపక్రమించెదనని నానావిధ
ప్రియాలాసంబుల నమ్మైథిలరాజనందని గారవించి యద్దేవి నడుమ నిడుకొని
లక్ష్మణుండు పిఱుందదెసం జనుదేరఁ దాను ముంగలి యై యచ్చోటు వాసి
మహారణ్యమార్గంబుఁ బట్టి పోవుచు.
| 134
|
చ. |
అటఁ జని కాంచె రామవిభుఁ డంబరచుంచిరసాలభూర్జరీ
కుటజతమాలతాలవటకుందకురంటకకోవిదారవి
స్ఫుటకరవీరలోధ్రతరుచూతమధూకవిశాలశింశుపా
పటలవిరాజతం బయిన భాసురదావము భూరిరావమున్.
| 135
|
సీ. |
పల్వలోత్తీర్ణశుంభద్వరాహంబులు గుంపు లై సెలయేళ్లు రొంపి సేయ
సెలయేటియిసుకతిన్నెల సింహపోతంబు లురుసామజములపై నురువడింప
సెలవుల రురుడింభపలలసారము గాఱఁ గ్రోల్పులు ల్పొదరిండ్ల గుఱక లిడఁగ
సలలితఘానశాడ్వలచరన్మృగపంక్తి భిల్లాగమనభీతిఁ గ్రేళ్లు దాఁటఁ
|
|
తే. |
జండగండకవేదండశరభభల్ల, శల్యసారంగచమరికాశశకఖడ్గ
భూరికాసరమహిషదుర్వార మైన, యమ్మహారణ్యమధ్యమం దరిగి యరిగి.
| 137
|
శ్రీరాముఁ డొకానొకతటాకంబునందు వాద్యధ్వనులు వినుట
మ. |
ఒకచో రాముఁడు కాంచె నభ్రపదసంయుక్తోర్మిసంచారము
న్వికసత్సారసచక్రవాకబిసభుగ్వేదండరాడ్వారముం
బ్రకటామోదమరాళసేవితలసత్సంకేరుహోదారమున్
వకుళాబ్జాకరతీరమున్ సువిలసద్ద్వారంబుఁ గాసారమున్.
| 138
|
వ. |
మఱియు నాసరోవరంబు యోజనాయతంబును వవవారణాలంకృతంబును
గమఠమీనగ్రాహపాఠీనాభియుతంబును నై యొప్పై నందు.
| 139
|
క. |
హృద్యం బై శ్రోత్రములకు, వేద్యం బై నీటిలోనఁ బృథుసుందర మై
సద్యస్సుఖసూచక మై, వాద్యధ్వని దోఁచె దుర్నివారస్ఫూర్తిన్.
| 140
|
క. |
విని రామభద్రుఁ డిచ్చట, జను లెవ్వరు లేరు వాద్యశబ్దము నీటన్
వినఁబడుట కేమి హేతువొ, యని యచ్చెరు వడరఁ గౌతుకాన్వితమతి యై.
| 141
|
క. |
అచ్చెరువడ గాఢతపం, బచ్చుపడం జేయుచున్నయనఘుఁ దపస్వి
న్సచ్చరితు ధర్మభృతుని, న్హెచ్చిన కుతుకమునఁ జూచి యి ట్లని పలికెన్.
| 142
|
శా. |
ధ్వానం బొక్కటి పుట్టె నిమ్మడువులో వర్ణింపఁ జేతస్సమా
|
|
|
ధానం బై విన నయ్యెడిం జెవులు కద్దా నిర్జనం బైనచో
స్వానం బేల జనించెఁ గౌతుకము దైవాఱంగ నీచందము
న్మౌనిగ్రామణి తెల్పు నా నతఁడు సమ్మానించి తా ని ట్లనున్.
| 143
|
ధర్మభృతుండు రామునకుఁ దటాకమందలివాద్యధ్వనులకుఁ గారణం బెఱింగించుట
సీ. |
అనఘాత్మ వినుము పంచాప్సరం బనుతటాకం బిది మును మాండకర్ణి యనెడు
మునిపతి తపముపెంపున దీని నిర్మించెఁ బదివేలవర్షము ల్పరమనిష్ఠఁ
గరువలి భుజియించి ఘనతపం బొనరింపఁ దత్తపోవహ్నిసంతప్తు లగుచు
వేల్పులు దలపోసి విఘ్నంబుఁ గావింప వంచించి యప్సరఃపంచకంబు
|
|
తే. |
ననుప వారలు వలపుల నతనిధైర్య, మహిమ లోఁగొన నమ్ముని మదనవశత
దేవకాంతలఁ బత్నులఁ గా వరించి, యింపు దళుకొత్తఁ జాలఁ గ్రీడింపఁదలఁచి.
| 144
|
వ. |
ఈతటాకంబునం దంతర్హితగృహంబు నిర్మించి యిందు నిత్యంబు నవ్వెలఁదులం
గూడి యథేచ్ఛావిహారంబునం గ్రీడించుచుండు నీనిస్వనంబు సంక్రీడమాన లై
నయత్తలోదరుల భూషణస్వనోన్మిశ్రం బైనగీతవాదిత్రశబ్దం బిచ్చట వర్తించు
వారికి మనోహరంబుగా వీతెంచుచుండు నని పలికిన రాముండు పరమాద్భుతంబు
నొంది యమ్మనిమహత్త్వంబు కొండొకసేపు వక్కాణించి సీతాలక్ష్మణసహితం
బుగా నచ్చోటు వాసి కుశచీరపరిక్షిప్తంబును నానావృక్షసమావృతంబు నై య
మ్మహారణ్యంబునం జెలువొందు తాపసాశ్రమమండలంబుఁ బ్రవేశించి.
| 145
|
చ. |
దిన మొకయాశ్రమంబున నతిప్రమదంబున నున్కి సేయుచున్
మునికృతహోమమంత్రరవము ల్వినుచుం బ్రతిపూజనంబుఁ గై
కొనుచుఁ గుశాస్తరంబుపయిఁ గూర్కుచు మూలము లారగించుచున్
మునులకు వింద యై రఘువిభుండు చరించెను దండకాటవిన్.
| 146
|
చ. |
ప్రమదముతో నెదుర్కొని తపఃఫలముం బలె రాముని న్మునుల్
దమతమయాశ్రమంబులకుఁ దప్పక దోడ్కొని పోయి వేడ్క స
క్లమముగఁ బాద్య మర్ఘ్యము ఫలంబు కుశాస్తరణం బొసంగి ని
త్యము మముఁ గావు మోరఘువతంస యటంచు నుతించి రెంతయున్.
| 147
|
క. |
చెలువుగ నీగతి రాఘవుఁ, డలయక దినదినము దండకారణ్యమునం
గలతాపసాశ్రమంబులు, గలయఁగఁ జరియించె ననుజకాంతాయుతుఁ డై.
| 148
|
క. |
ఈరీతి ఘోర మగుకాం, తారంబునఁ దిరుగుచుండ దాశరథికి సొం
పార సమయాబ్దములలో, నారూఢిగ వర్షదశక మయ్యెం బెలుచన్.
| 149
|
వ. |
ఇట్లు రాముండు వనంబున నొక్కచోట నిరువదిరెండునెలలును నొక్క
చోటఁ బదునాల్గునెలలును నొక్కచోటఁ బదియేనునెలలును నొక్కచోటఁ
బదియాఱుమాసంబులును నొక్కయెడ నర్ధాధికదశమాసంబులును నొక్క
యెడ నర్ధాధికైకాదశమాసంబులును నొక్కయెడఁ బదుమూఁడుమాసంబు
|
|
|
లును నొక్కయెడఁ బదునెనిమిదిమాసంబులును గా నిట్లు దశవర్షంబులు
గడపె నంత రఘువల్లభుండు సీతాలక్ష్మణసహితుం డై వెండియు నెప్పటి
సుతీక్ష్ణమునియాశ్రమంబునకుం జనుదెంచి యతనిచేతం బ్రతిపూజితుం డై
యచ్చటం గొన్నిదినంబు లుండి యొక్కనాఁ డమ్మునిం జేరి యి ట్లనియె.
| 150
|
సుతీక్ష్ణమహర్షి రామున కగస్త్యాశ్రమమునకు దారిఁ దెల్పుట
సీ. |
మునినాథ యీవనంబున భగవంతుండు కనకగర్భాభుం డగస్త్యమాని
యున్నవాఁ డని వింటి ము న్నామునిశ్రేష్ఠుఁ డెచ్చట నున్నవాఁ డెఱుఁగఁ జెప్పు
మమ్మహాత్మునిప్రసాదమ్ముఁ గైకొనునట్టితలఁపు జనించెఁ దత్పాదములకు
నెప్పుడు మ్రొక్కుదు నెపుడు భాషింపుదునో యని తమిఁబూనియున్నవాఁడ
|
|
తే. |
ననిన నమ్మౌనినాయకుఁ డనఘ యేను, గఱపఁ బూనినదాని నాకంటె మున్ను
నీవె నొడివితి వామునినెలవుతెఱఁగుఁ, దెలియఁ జెప్పెద వినుము సందేహ ముడిగి.
| 151
|
వ. |
మహాత్మా యిచ్చటికి యోజనచతుష్టయమాత్రదూరంబున నగస్త్యభ్రాత యగు
సుదర్శనముని తపోవనంబు గల దయ్యాశ్రమంబు పిప్పలీవనశోభితంబును
బహుపుష్పఫలోపేతంబును రమ్యంబును నానాశకునినాదితంబును స్థలప్రాయం
బును హంసకారండవచక్రవాకోపశోభితప్రసన్నసలిలభాసురసరోవరతీరవిక
సత్పద్మకైరవకుముదషండమండలాంతర్గతమకరందపానమత్తమధుకరఝంకార
సంకులంబు నై యొప్పుచుండు దక్షిణాపథంబున నయ్యాశ్రమంబునకుం జని
యందు నారేయి గడపి మఱునాఁ డరుణోదయంబునఁ గదలి దక్షిణదిశాభి
ముఖుండ వై యొక్కయోజనం బరిగిన నచ్చటఁ గుంభసంభవాశ్రమంబు
బహుపాదపసంవృతం బై రమణీయం బై యుండు నందు వైదేహి హృద్యం
బగునట్లుగా భవత్సహిత యై విహరించు నట్లు గావున.
| 152
|
క. |
ఇనవంశశేఖర యగ, స్త్యునిఁ జూడఁ దలంచితేని సుముహూర్తమునం
జను మిప్పు డనుచుఁ బలికిన, విని రాముఁడు మ్రొక్కి యతని వీడ్కొని పెలుచన్.
| 153
|
వ. |
సీతాలక్ష్మణసహితంబుగా నచ్చోటు గదలి రమ్యంబు లగువనంబులును మేఘ
సంకాశంబు లగుపర్వతంబులును నిమ్నంబు లగుసరోవరంబులును దీర్ఘప్రవా
హంబు లగునదీనదంబులు నెడనెడ నవలోకించుచు సుతీక్ష్ణోపదిష్టమార్గంబున
దూరంబు చని సంహృష్టహృదయుం డై లక్ష్మణున కి ట్లనియె.
| 154
|
రాముఁ డగస్త్యుతమ్ముఁ డగుసుదర్శనునాశ్రమముఁ జేర నరుగుట
ఉ. |
తమ్ముఁడ కుంభసంభవునితమ్మునియాశ్రమభూమికంటె యం
ద మ్మగుచున్న దెంతయు నుదగ్రఫలప్రసవప్రకాండభా
రమ్మున సన్నతంబు లగుమ్రాఁకులు వ్యోమము నంటి చాల మా
ర్గమ్మున నెల్లెడ న్దఱచుగా బహుభంగుల నిండి యుండఁగన్.
| 155
|
చ. |
విరిసిన పిప్పలీఫలనివిష్టమనోహరభూరిసౌరభం
|
|
|
బురుగతి గాడ్పు రేఁపఁ గటుకోదయ మై వనభూమి నిండ బ
ల్తిరముగ నెల్లెడం బరిమళించును నున్నది కంటె యమ్మునీ
శ్వరుగుణసౌరభోత్కరము చారుతరంబుగ వీచెనో యనన్.
| 156
|
తే. |
నరవరాత్మజ కంటె లూనంబు లైన, లలితవైడూర్యవర్ణదర్భలు నవాంబు
జములు సంక్షిప్తకాష్ఠసంచయము లంత, నంతఁ జూపట్టుచున్నవి యాశ్రమమున.
| 157
|
క. |
శ్యామాభ్రశిఖరనిభ మై, ధూమాగ్రం బివ్వనమునఁ దోఁచెడిఁ గంటే
యీమునితపోగ్నసంభవ, ధూమం బీపగిది నున్నదో యన దళమై.
| 158
|
క. |
రమణీయము లగుఘనతీ, ర్థములఁ గృతస్నాను లగుచు ధరణీదివిజో
త్తములు సమార్జితసుమముల, సుమోపహారం బొనర్పఁ జొచ్చిరి కంటే.
| 159
|
తే. |
నిత్యతపమున మిత్తిని నిగ్రహించి, భువనహితకాంక్ష నేమహాపుణ్యుభ్రాత
చేత నీదిక్కు లోకప్రసిద్ధి కెక్కె, నట్టి మునియాశ్రమం బిది యనఘచరిత.
| 160
|
రాముఁడు లక్ష్మణున కగస్త్యకృతవాతాపీల్వలసంహారప్రకారంబుఁ దెల్పుట
క. |
అనఘా ము న్నీవనమున, ననిశము వసియించి యుందు రతిపాపమతుల్
దనుజులు వాతాపీల్వలు, లనువారలు దేవభూసురాంతకు లగుచున్.
| 161
|
తే. |
వారిలో నిల్వలుం డనువాఁడు మిగులఁ, గృత్రిమమహీసురత్వ మంగీకరించి
వేదభాష భాషించుచు సాదరముగఁ, దాపసుల శ్రాద్ధ మని నిమంత్రణము చేసి.
| 162
|
ఆ. |
పూని మేషరూపుఁ డైనవాతాపిని, నడిచి చంపి వండి కుడువఁబెట్టి
వారు దిన్నపిదప వాతాపి రమ్మని, ప్రీతి నిల్వలుండు పిలుచు నంత.
| 163
|
క. |
భీషణరవమున బెట్టుగ, ఘోషించుచుఁ గడుపు సించికొని శీఘ్రమునన్
మేషాకృతితో నప్పుడు, దోషాటుఁడు వెడలి వచ్చుఁ దోరపుబలిమిన్.
| 164
|
క. |
అంత మృతు లైనవిప్రుల, నెంతయు గృధ్రములపగిది నిద్దఱు దనుజుల్
వంతుల బడి భక్షించుచు, సంతోషింపుదురు దుర్విచారస్ఫూర్తిన్.
| 165
|
ఉ. |
ఇంపుగఁ దారకానికర మెన్నఁగ వచ్చు మహీరజంబు లె
క్కింపఁగ వచ్చు నీరనిధికిం గలయూర్ముల నెంచ వచ్చు నా
కంపము లేక నిల్వలుఁడు గాఱియపెట్టి నికృష్టవృత్తిచేఁ
జంపిన తాపసోత్తములసంఖ్య యొనర్పఁగ రాదు యేరికిన్.
| 166
|
రాముఁడు సుదర్శనమహర్షిని సందర్శించుట
వ. |
ఇట్లు దుర్వారగర్వాతిరేకంబున నప్పూర్వగీర్వాణులు ధరణీసుపర్వుల వధించు
చుండు నంతఁ గొంతకాలంబునకు దేవమునిప్రార్థితుం డై యగస్త్యమునీం
ద్రుం డిచ్చోటికిం జనుదెంచుటయు నెప్పటియట్ల నయ్యిల్వలుం డమ్మహాత్ముని
బ్రాహ్మణార్థంబు నియమించి మేషరూపుం డైనవాతాపిం జంపి తన్మాంసంబుఁ
బక్వంబుఁ జేసి పెట్టి యతండు గుడుచు నంతఁ దొల్లింటిచందంబున వాతాపిం
జీరిన నమ్మునీంద్రుండు ప్రహసించుచు నిల్వలుం జూచి యెక్కడ వాతాపి మదీయ
|
|
|
జాఠరానిలశిఖాపరంపరల భస్మీభూతుం డై బహుకాలసంచితదురితవిశేషం
బున యమక్షయంబునకుం జనియె నని పలికిన నన్నిశాచరుండు క్రుద్ధుం డై యగ
స్త్యునిం బ్రధర్షించిన నమ్మహానుభావుండు రూక్షప్రేక్షణంబుల నిరీక్షించుటయుఁ
దత్క్షణం బారాక్షనుండు శుష్కతృణంబుపగిది దందహ్యమానదేహుం డై
నిధనంబు నొందె నివ్విధంబున లోకహితార్థంబు దుష్కరం బైనకర్మంబుఁ జేసి
నట్టిమహానుభావుం డగస్త్యుం డమ్మహామునిభ్రాతపుణ్యాశ్రమం బిది యని
పెక్కువిధంబుల నమ్మహర్షిప్రభావంబు వక్కాణించుచు సూర్యుండు గ్రుంకిన
పశ్చిమసంధ్య నుపాసించి సీతాలక్ష్మణసహితుం డై రాముండు రమ్యం
బగుతదీయాశ్రమంబుఁ బ్రవేశించి సముచితంబుగా నమ్మహర్షి సందర్శించి
తచ్చరణంబులకు నమస్కరించి యతనిచేతం బ్రతిపూజితుం డై ఫలమూ
లంబు లుపయోగించి యారాత్రి యచ్చట వసియించి మఱునాఁడు సూ
ర్యోదయసమయంబునఁ గాల్యకరణీయంబులు దీర్చి తగినతెఱంగున నమ్మునీం
ద్రునిచేత నామంత్రణంబు వడసి సుతీక్ష్ణోపదిష్టమార్గంబుఁ బట్టి జానకీలక్ష్మణో
పేతంబుగాఁ బరమానందంబునం జని చని.
| 167
|
రాముం డగస్త్యాశ్రమముఁ జేరుట
చ. |
ఇనకిరణాలికిం జొరవ యీని మహాగహనంబున న్రయం
బునఁ జనుచు న్రఘూత్తముఁడు పొల్పుగఁ గాంచె మదద్విపేంద్రహ
స్తనిహతసాలసంగతపతంగవిరావవిరాజితంబుఁ బా
వనకపిశోభితంబు ఫలవంతము నైన తరుప్రతానమున్.
| 168
|
చ. |
మిహిరసమానతేజుఁడు సమీపగతుండును బూజనీయుఁ డౌ
మిహిరకులావతంసుపయి మేడలనుండి పురాంగన ల్ప్రహృ
ష్టహృదయ లై ప్రసూనములఁ జల్లినభంగి మరుత్ప్రయుక్తభూ
రుహగతనూత్నవల్లికలు రూఢిని జల్లె లసత్సుమంబులన్.
| 170
|
చ. |
అనుపమదీర్ఘచాపధరుఁ డైనను దత్కరుణార్ద్రభావసూ
చన మగుస్నిగ్ధగాత్రము నశంక మనంబునఁ జూచుచు న్ముదం
బనుపమరాగముం జెలఁగ నవ్వలఁ బోవక నిల్చి శంబరాం
గనలు విశాలనేత్రములు గల్గుటకు న్ఫల మొందె నెంతయున్.
| 171
|
క. |
ఈవిధమున రఘుపుంగవుఁ, డావనసౌభాగ్యగరిమ లటు బహుగతుల
న్భావమునకు సమ్మోదముఁ, గావింప సుమిత్రపట్టిఁ గని యి ట్లనియెన్.
| 172
|
రాముఁడు లక్ష్మణున కగస్త్యాశ్రమవిశేషముల నభివర్ణించి చెప్పుట
క. |
కనుఁగొంటే కుంభభవపా, వనపుణ్యాశ్రమముఁ జేర వచ్చితి మిచట
న్ఘనమృగఖగములు దిరిగెడి, వనవీథుల విగతజాతివైరము లగుచున్.
| 178
|
క. |
తరుణులతోడఁ బెనంగెడు, పురుషులచందాన నిచట భూరుహచయము
ల్తరుణలతలతోఁ బెనఁగొని, కర మొప్పుచు నున్న వీవు కంటె కుమారా.
| 174
|
తే. |
చారుపత్రంబు లైనవృక్షములు శాంత, ఖగమృగంబులు గలిగి శృంగారఫణితిఁ
దనరుచున్నవి గాన నివ్వన మగస్త్య, మునివరాశ్రమ మగు నిక్క మనఘచరిత.
| 175
|
తే. |
అనఘ యెవ్వాఁడు లోకంబులందు నైజ, కర్మముల ఖ్యాతి వడసె నగస్త్యుఁ డనఁగ
నట్టిపుణ్యులయాశ్రను మదిగొఁ గంటె, కన్నులకు విందువేయుచు నున్న దిపుడు.
| 176
|
చ. |
కమలభవప్రభుం డగునగస్త్యమహామునినాథుపావనా
శ్రమ మిదె ర మ్మటంచు విలసత్కిసలాంగుళిసాలహస్తముల్
క్రమమున నెత్తి యున్మదఖగధ్వనుల న్ననుఁ బిల్చుచున్నచం
దమునఁ జెలంగుచున్నయవి తమ్ముఁడ కంటివె యివ్వనావళుల్.
| 177
|
వ. |
మఱియు నిమ్మహనీయాశ్రమంబు ప్రాజ్యధూమాకులవనంబును జీరమాలాపరి
ష్కృతంబును బ్రశాంతమృగయూథంబును నానాశకునినాదితంబు నై యొప్పు
చున్నది విలోకింపుము.
| 178
|
తే. |
నిత్యతపమున మిత్తిని నిగ్రహించి, యఖిలహితకాంక్ష నెవ్వఁ డీయామ్యదేశ
మనుదినంబును మునిశరణ్యముగఁ జేసె, నయ్యగస్త్యునియాశ్రమ మదిగొఁ గంటె.
| 179
|
క. |
మేరుముఖభూమిధరభూ, దారకమఠశేషదిగిభతతులకు నెన యై
యీరమ్యాశ్రమ మతితే, జోరాజిత మగుచుఁ బొల్చుఁ జూచితె యనఘా.
| 180
|
తే. |
అనఘ యిమ్మౌనివర్యుఁ డీయామ్యదిక్కు, నాటపట్టుగఁ గైకొన్ననాఁటనుండి
యిచట దనుజులు వర్తింతు రెల్లప్రొద్దు, వరమునీంద్రులభంగి నిర్వైరు లగుచు.
| 181
|
సీ. |
స్వారాజ్యగర్వధూర్వహనహుషైశ్వర్యశోషణం బెవ్వానిభాషణంబు
భృతమహోర్మివ్యాప్తవితతపాథోరాశివరజలం బెవ్వానికరతలంబు
చటులమేషాకారకుటిలవాతాపిభక్షణశాలి యెవ్వానిజఠరశీలి
భూరివింధ్యాద్రిదుర్వారమహోత్సేధనాశనం బెవ్వానిశాసనంబు
|
|
తే. |
అట్టిపరమేష్ఠిసన్నిభుఁ డైనకుంభ, సంభవునియాశ్రమం బిదె స్వర్గతుల్య
మగుచు రాజిల్లుచున్నది విగతజాతి, వైరమృగపక్షిరాక్షసోదార మగుచు.
| 182
|
వ. |
మఱియు భగవంతుం డైనయగస్త్యమహామునినామగ్రహణంబున నీదక్షిణ
దిశ క్రూరకర్ము లగురాక్షసులచేత ధర్షించుట కశక్యం బనియు సజ్జనాభిగమ్యం
బనియు ముల్లోకంబులం బ్రసిద్ధి వహించెఁ జిరజీవి యైనయీయగస్త్యునియాశ్ర
మంబు శ్రీమంతం బై వినీతజనసేవితం బై యొప్పు నీలోపాముద్రాకాంతుండు
విశ్రుతకర్ముండును లోకార్చితుండును సాధుజనహీతరతుండును గావున సమా
గతుల మైనమనకు శ్రేయం బొసంగు న ట్లగుటం జేసి.
| 183
|
ఉ. |
ఇల్వలభంజనుం డయిన యీమునియంఘ్రుల కుత్సుకాత్ము లై
చెల్వుగ నిత్య మర్చనము సేయుచుఁ బుణ్యకథేతిహాసము
|
|
|
ల్బల్విడిఁ బ్రీతితో వినుచుఁ బాయక తత్కృప నొంది యిందు ని
చ్చ ల్వనవాసశేషదివసంబులు పుచ్చఁగ రాదె లక్ష్మణా.
| 184
|
ఉ. |
నిచ్చలు దేవదానవమునిప్రభుచారణసాధ్యు లాదిగా
నిచ్చట నెవ్వనిం గుతుక మేర్పడ వేడ్క భజించుచుందు రా
సచ్చరితు న్సమస్తమునిసత్తమునిన్ సుగుణాలవాలుని
న్ముచ్చట దీరఁగా మనము మోదమునం గొనియాడు టొప్పదే.
| 185
|
చ. |
నరమరయక్షకింపురుషనాగనభశ్చరసిద్ధసాధ్యకి
న్నరగరుడాదు లెంతయు ననారత మిమ్మునినాథుఁ గొల్చుచుం
బరమమునీంద్రుల న్వరవిమానరథస్థులఁ జేసి సమ్మదో
త్కరమున వెంటఁ దోడుకొని గ్రక్కునఁ బోదురు శక్రువీటికిన్.
| 186
|
తే. |
కామవృత్తుండు క్రూరుండు ఘాతుకుండు, పండితుఁడు గానివాఁడు శఠుండు ఖలుఁడు
గూఢవిప్రియకారియు క్షుద్రుఁ డిచట, నిలిచి జీవింపఁగాఁ జాలఁ డలఘుచరిత.
| 187
|
తే. |
మును లనేకు లివ్వనమున ఘనతపోవి, శేషనిష్ఠలు సల్ఫి సంసిద్ధు లగుచు
దివ్యదేహు లై రవినిభదేవయాన, మెక్కి చనుదురు హరిపురి కక్కజముగ.
| 188
|
తే. |
దశరథాత్మజ యిచట భూతముల చేత, సురలు ప్రార్థితు లయి మెచ్చి పరమకరుణ
వెలయ యక్షత్వ మమరత్వ మలఘురాజ్య, మిత్తు రీయాశ్రమమహత్త్వ మిట్టి దరయ.
| 189
|
లక్ష్మణుఁ డగస్త్యమహర్షికి రామునిరాక యెఱింగించుట
తే. |
అనఘ లక్ష్మణ నీవు ము న్నరిగి నాదు, రాక యెఱిఁగించి పుచ్చుము రవిసమాన
తేజుఁ డగుకుంభసంభవదివ్యమౌని, కనవుడు నతండు తత్తపోవనముఁ జేరి.
| 190
|
క. |
అచ్చట నొకమునిశిష్యుని, నచ్చుపడం జూచి దశరథాగ్రతనయుఁడున్
సచ్చరితుం డగురాముఁడు, వచ్చినవాఁ డిత్తపస్వివర్యునిఁ జూడన్.
| 191
|
వ. |
ఏ నమ్మహాత్ముని యనుజన్ముండ లక్ష్మణుం డనువాఁడ నిత్యంబును భృత్యమాత్రుం
డ నై పరిచర్యాభక్తియోగంబులం గొల్చి యుండుదు నట్టియేనును సీతయుఁ
దనపిఱుంద జనుజేరఁ బితృశాసనంబున దండకారణ్యంబునం జరియింపఁ జను
దెంచినవాఁ డనవుడు నమ్మునిశిష్యుండు శీఘ్రంబున నగ్నిశాలకుం జని య
గస్త్యుని సందర్శించి కృతాంజలి యై దేవా దశరథనందనుం డగురాముండు
సీతాలక్ష్మణసహితుం డై మిమ్మ సందర్శించి మీకు శుశ్రూషఁ గావింపం
జనుదెంచి యున్నవాఁ డని విన్నవించిన నమ్మహర్షిశ్రమం డస్మత్కులదైవతం
బైనశ్రీరాముండు సీతాలక్ష్మణోపేతుం డై వచ్చి యున్నవాఁ డని శిష్యుని
వలన విని శ్రవణానందం బనుభవించి శిష్యు నవలోకించి మద్భాగ్యవశంబున
|
|
|
రాముండు చిరకాలంబున కిప్పుడు నన్ను విలోకించుటకుం జనుదెంచె నమ్మహా
త్మునిసమాగమంబు నాచేతఁ బెద్దకాలంబున నుండి కాంక్షితం బైనయదియె
కదా కల్యాణగుణసాంద్రుఁ డైనయారామచంద్రునిం గన్నులారం గనుంగొని
యమ్మహానుభావున కతిథిసత్కారంబుఁ గావించి కృతార్థుండ నయ్యెద సీతా
లక్ష్మణసహితంబుగాఁ దోడ్కొని రమ్మనిన నతండు రయంబునం జనుదెంచి
లక్ష్మణుం గాంచి రాముం డెచ్చట నున్నవాఁడు మునీంద్రునిం జూడ నవశ్యంబు
చనుదెంచుంగాక యని పలికిన నాలక్ష్మణుం డమ్మునిశిష్యునిం దోడ్కొని చని
సీతారాములం జూపిన నతండు మునివచనం బారామునకుం జెప్పి వారలం
దోడ్కొని యాశ్రమంబుఁ బ్రవేశించె నట్లు రఘువల్లభుండు సీతాలక్ష్మణ
సమేతంబుగాఁ బ్రశాంతహరిణాకీర్ణం బైనతపోవనంబుఁ బ్రవేశించి యందు
బ్రహ్మస్థానంబును వహ్నిస్థానంబును విష్ణుస్థానంబును మహేంద్రస్థానంబును
సూర్యస్థానంబును సోమస్థానంబును భగస్థానంబును గుబేరస్థానంబును ధాతృ
విధాతృస్థానంబులును వాయుస్థానంబును శేషస్థానంబును గాయత్రీస్థానం
బును వసుస్థానంబును వరుణస్థానంబును గార్తికేయస్థానంబును ధర్మస్థానంబును
మొదలుగాఁ గల దేవస్థానంబు లన్నియు విలోకించుచుఁ బరమాద్భుతంబు
నొందుచుం జని చని యొక్కచోట శిష్యగణపరివృతుం డై దీప్తతేజు లైన
మహర్షులనడుమ శాశ్వతుం డైనపరమేష్ఠిచందంబున సుఖాసీనుం డై తేజ
రిల్లుచున్నయక్కుంభసంభవమహర్షిశ్రేష్ఠుని దవ్వులం జూచి వినయవినమిత
గాత్రుం డై యరుగుచుండె నమ్మహర్షిముఖ్యుండును సీతాలక్ష్మణసహితుం డై
వచ్చుచున్నరామచంద్రు నల్లంతనే విలోకించి దిగ్గునఁ బరమాసనంబు డిగ్గి
రయంబున నెదురుగాఁ జనుదెంచుచుండె నప్పు డారఘువల్లభుండు లక్ష్మణున
కి ట్లనియె.
| 192
|
క. |
ఇమ్ముని మన కెదురుగ క్షి, ప్రమ్మునఁ జనుదెంచెడు న్దపమ్ములకు నిధా
న మ్మగునీయన నౌదా, ర్యమ్మునఁ గుంభజుఁ డటంచు నాత్మ నెఱిఁగితిన్.
| 193
|
రాముఁ డగస్త్యమహర్షిని సందర్శించుట
క. |
అని లక్ష్మణుతో నాడుచు, జననాయకుఁ డతఁడు తాను సంభ్రమమున భూ
తనయాయుతముగఁ జని య, మ్మునిపదపద్మముల కెఱఁగె మోదం బెసఁగన్.
| 194
|
క. |
పదపడి లక్ష్మణుఁ డమ్ముని, పదములకుం బ్రణతిఁ జేసె భక్తియుతుం డై
సుదతీరత్నము జానకి, ముద మలరఁగ మ్రొక్కిఁ బిదప మునిపదములకున్.
| 195
|
తే. |
అంత నమ్మునిశేఖరుం డమ్మహాను, భావు నాలింగనము చేసి బహువిధములఁ
ప్రేమ నభినుతిఁ గావించి సేమ మరసి, హర్ష మిగురొత్తఁ గూర్చుండు మనుచుఁ బలికి.
| 196
|
వ. |
శీఘ్రంబున వైశ్వదేవంబుఁ గావించి మొదల బ్రాహ్మణాతిథుల నర్ఘ్యదానం
బున నర్చించి వానప్రస్థధర్మంబున వారికి భోజనం బొసంగి తానును సుఖా
|
|
|
సీనుండై తన కభిముఖంబుగా రాముని సుఖాసీనుం గావించి రఘువరా తపస్వి
యగువాఁడు పూజ్యపూజాతిక్రమణంబుఁ గావించెనేని కూటసాక్షియుంబోలెఁ
బరలోకంబునందు స్వమాంసభక్షకుం డగుఁ గావునఁ బ్రత్యవాయపరిహారా
ర్థంబు నిన్నుం బూజించెద నని పలికి వెండియు ని ట్లనియె.
| 197
|
సీ. |
కనకాసనాగ్రభాగమున నుండెడునీకు నీకుశవిష్టర మిచ్చు టెంత
రమణీయదానధారాశాలి వగునీకు నాయిచ్చు విమలార్హ్యతోయ మెంత
యనుదినశాల్యోదనాహారునకు నీకు నీమూలఫలము లే నిచ్చు టెంత
నిరుపమకాంచనాంబరధారి వగునీకు నీవల్కలాజిన మిచ్చు టెంత
|
|
తే. |
భక్తి నే నిచ్చుపుష్కరపత్రపుష్ప, మాత్రమును గైకొనుట కాక మనుజవర్య
తర మెఱిఁగి నిన్నుఁ బూజింపఁ దరమె నాకు, మిమ్ముఁ గనుఁగొను టంతియె మేలుగాక.
| 198
|
వ. |
మహాత్మా నీవు సర్వలోకాధిపుండవు ధర్మచారివి మాన్యుండవు పూజనీయుం
డవు ప్రియాతిథి వై చనుదెంచుటవలనఁ గృతకృత్యుండ నైతి నని పలికి ఫల
మూలపుష్పంబుల యథేష్టంబుగాఁ బూజించి క్రమ్మఱ ని ట్లనియె.
| 199
|
అగస్త్యమహర్షి రామునకు దివ్యంబు లగుఖడ్గబాణతూణీరకోదండంబు లొసంగుట
సీ. |
తతహేమకనకభూషితవిశ్వకర్మనిర్మితదివ్యవైష్ణవవితతధనువు
పద్మసంభవదత్తపరమభాస్కరకిరణోపమామోఘశరోత్తమంబు
శక్రవిశ్రాణితాక్షయసాయకాంబకసంపూర్ణదీర్ఘనిషంగములును
రమణీయతరమహారజతకోశప్రశస్తసువర్ణభూషితశాతఖడ్గ
|
|
తే. |
మర్థి నొసఁగెద విజయార్థ మమరవిభుఁడు, కులిశమును బోలెఁ గైకొను మలరథాంగ
పాణి యీసాధనంబుచేఁ బగఱ గెలిచి, శతమఖునకుఁ త్రైలోక్యరాజ్యం బొసంగె.
| 200
|
క. |
అని పలికి మహాతేజుఁడు, మునిపతి సత్కరుణ మీఱ మోదం బలరన్
ధనురాదిసాధనంబులు, ఘనమతి రాఘవున కొసఁగి క్రమ్మఱఁ బలికెన్.
| 201
|
క. |
నరనాథ నీకు శుభ మగు, ధరణిసుతాలక్ష్మణాన్వితంబుగ నన్నుం
బరికింప వచ్చినందునఁ, బరితుష్టుఁడ నైతిఁ దపము ఫలియించె రహిన్.
| 202
|
ఉ. |
పిన్నటనాఁట యుండియును బెక్కుసుఖంబుల వర్తమాన యై
వన్నియఁ గన్న దౌట నిటువంటియవస్థల కోర్వ లేక యా
పన్నత నొంది యున్నది నృపాలక జానకి కంటె భక్తిసం
పన్నతయు న్శుచిత్వ మసమానసతీత్వము మాకుఁ దెల్పుచున్.
| 203
|
చ. |
నరవర సద్మసౌఖ్యము మనంబున నెంచక యీవధూటి దు
ర్భరవనవాససంజనితబాధఁ దలంపక భర్తృభక్తిచే
వరుస నరణ్యసీమ కిటు వచ్చుటఁ జేసి యపాంసులాశిరో
|
|
|
వరమణి యయ్యెఁ గాదె తనవారికి నిత్యయశంబు గల్గఁగన్.
| 204
|
క. |
వైదేహపుత్రి బాల్యం, బాదిగ సుఖలీలఁ బెరిఁగె నటు గాన మనః
ఖేదంబు గలుగకుండఁగ, నాదరమున నరసి ప్రోవు మనఘవిచారా.
| 205
|
క. |
ఈలోకంబునఁ బ్రకృతిన్, స్త్రీలు పతి సమర్థుఁ డైన సేవింతు రతం
డోలి విషమస్థుఁ డగునపు, డాలస్యముఁ జేసి విడుతు రవహితబుద్ధిన్.
| 206
|
క. |
విద్యుచ్ఛపలత్వము శ, స్త్రోద్యత్తీక్ష్ణతయు మారుతోరగరిపువే
గోద్యోగతయుం గైకొని, విద్యుద్గాత్రలు యథేచ్ఛ విహరింతు రిలన్.
| 207
|
క. |
ఏతాదృశదుర్ధోష, వ్రాతపరిత్యక్త యైన వసుధాసుత వి
ఖ్యాతిఁ బొలుపొందు ననసూ, యాతరుణీపార్వతీరమాదుల కెన యై.
| 208
|
క. |
జనవర యెచ్చట లక్ష్మణ, జనకసుతలు గొలువ నీవు చరియించితి వా
ఘనదేశ మలంకృత మై, యనవరతం బతిపవిత్ర మై యొప్పుఁ గదా.
| 209
|
వ. |
మహాత్మా సూర్యుం డస్తమించుచున్నవాఁ డీరాత్రి యిచ్చట సుఖం బుండు మని
పలికిన నారఘూత్తముండు మునివచనప్రకారంబునఁ బశ్చిమసంధ్య నుపాసించి
యమ్మునిగ్రామణిచేతఁ బూజితుం డై పుణ్యకథేతిహాసంబు లాకర్ణించుచు సీతా
లక్ష్మణసహితంబుగా నచ్చోట వసియించి మఱునాఁడు సూర్యోదయంబున
సానుజుం డై కాలోచితకృత్యంబులు నిర్వర్తించి సముచితంబుగా నమ్మునివల్లభు
సందర్శించి నమస్కరించి యతనిచేతం బ్రతిపూజితుండై యంజలిఁ గీలించి యి
ట్లనియె.
| 210
|
చ. |
అనఘ భవతపోవనమునందు సుఖంచితి నేఁటిరాత్రి భూ
తనయయుఁ దమ్ముఁడుం గొలువఁ దద్దయుఁ బుణ్యఘనుండ వైన నిన్
గనుఁగొని ప్రీతిఁ బూజనముఁ గైకొనినందున రాజకోటిలో
వినుతికి నెక్కితిన్ భువనవిశ్రుతభూరియశంబుఁ గాంచితిన్.
| 211
|
అగస్త్యుని శ్రీరాముఁడు తాము వసియింపఁదగినప్రదేశంబు తెలియఁజెప్పఁగోరుట
వ. |
మునీంద్రా సీతాలక్ష్మణసహితంబుగా నాకు వసియింపందగినరమ్యప్రదేశం
బొక్కటి యాన తిమ్ము నీవు త్రైకాలికసకలజగద్వృత్తాంతాభిజ్ఞుండవు నీకు గో
చరింపనియర్థంబు లే దని పలికిన నమ్మునిశ్రేష్ఠుం డొక్కముహూర్తంబు చిం
తించి విజ్ఞానవిలోచనంబున భావికాలవృత్తాంతం బెఱింగి ధీరుం డై రాజేంద్రా
యిచ్చటికి యోజనద్వయమాత్రంబుదవ్వుల గోదావరీతీరంబున బహుమూల
ఫలోదకం బైనపంచవటి యనం బరఁగు నొక్కపుణ్యదేశంబు గల దచ్చోట రమ్యం
బుగా నాశ్రమంబు నిర్మించుకొని యందు సీతాలక్ష్మణసహితుండ వై విహరిం
చుచు వనవాసశేషదివసంబులు పుచ్చుము తండ్రిచేత దత్తం బైనసమయకా
లంబు డగ్గఱియెఁ గావునఁ దీర్ణప్రతిజ్ఞుండ వై సుఖంబుగా రాజ్యంబు నధిగమిం
చెద వెవ్వండు జ్యేష్ఠపుత్రుండ వైననీచేత యయాతియుం బోలెఁ దారితుం
|
|
|
డయ్యె నట్టిదశరథుండు ధన్యుం డయ్యె నేను గైకేయిదుర్మంత్రంబును దశ
రథునిప్రవిలాపంబును భవదాగమనంబును భావికాలవృత్తాంతంబును సర్వం
బును దపఃప్రభావవిశేషంబున నెఱింగి యున్నవాఁడఁ గావున మత్సమేతం
బుగా మదీయాశ్రమనివాసంబునం దభీష్టంబు గలవాఁడ నయ్యును బంచ
వటికిం బొ మ్మని ధీరతరంబు గాఁ బలికితి నప్పంచవటీదేశంబు ప్రాజ్యమూలఫలం
బై నానాద్విజగణయుతం బై వివిక్తం బై పుణ్యం బై రమ్యం బై శ్లాఘ్యం బై
యుండు నచ్చట వైదేహి మనోహరంబుగా విహరింపం గలదు నీ వచ్చట
యథాసుఖంబుగా వసియించి తాపసుల రక్షించుచుండు మ ట్లైన నీకుఁ గార్య
సిద్ధి యగు నని పలికి వెండియు ని ట్లనియె.
| 212
|
అగస్త్యమహాముని రామునికిఁ బంచవటి వాసయోగ్య మని యాన తిచ్చుట
సీ. |
జననాథ యిచ్చటి కనతిదూరంబునఁ గలదు సాంద్రమధూకకాననంబు
పరఁగ నవ్వనికి నుత్తరభాగమున నేగఁ గనుపట్టు నొకవటక్ష్మారుహంబు
దాని కవ్వల నొక్కధరణీధరం బొప్పుఁ దత్సమీపంబునఁ దనరు నొక్క
సమతలం బైనదేశం బదె యల పంచవటి యనువిఖ్యాతి వఱలుదేశ
|
|
తే. |
ఘనవరతపుష్పితద్రుమ మై చెలంగు, నచటి కేగు మ టన్న నయ్యర్కకులుఁడు
మౌనిపతి సత్కరించి నమస్కరించి, నమ్రుఁ డై ప్రీతి నామంత్రణంబు వడసి.
| 213
|
ఉ. |
తానును లక్ష్మణుండు వితతస్ఫుటచాపశరాసితూణముల్
మానుగఁ దాల్చి మిక్కిలి సమాహితు లై రణరంగధీరు లై
మానుగ సీతఁ దోడ్కొని సమంచితతేజము పిక్కటిల్ల న
మ్మౌనివరోపదిష్ట మగుమార్గమునం జని రవ్వనంబునన్.
| 214
|
రామలక్ష్మణులు జటాయువుం గాంచుట
క. |
ఇత్తెఱఁగున నేగుచు రఘు, సత్తము లొకచోటఁ గనిరి శైలనిభున్ గృ
ధ్రోత్తముని భీమకాయు ను, దాత్తబలు వటస్థుఁ బుణ్యతము నతివృద్ధున్.
| 215
|
తే. |
కాంచి వాని నిశాటునిఁ గాఁ దలంచి, ధీరు లై యెవ్వఁడవు నీవు దెల్పు మనిన
నావిహంగమనాథుఁ డత్యాదరమున, నినకులులఁ జూచి మధురోక్తి నిట్టు లనియె.
| 216
|
క. |
అనఘాత్ములార నను మీ, జనకుం డగుదశరథునకు సచివునిఁగ మనం
బున నెఱుఁగుఁ డనినఁ బితృసఖుఁ డని యతనికిఁ బూజ చేసి రధికప్రీతిన్.
| 217
|
క. |
వానికులం బాతనియభి, ధానముఁ దెలియంగ నడుగఁ దడయక యతఁడున్
మానుగఁ దనవృత్తాంతము, ధీనిధి రాఘవునితోడఁ దెలియఁగ ననియెన్.
| 218
|
జటాయువు తనవృత్తాంతంబు శ్రీరామున కెఱింగించుట
వ. |
మహాత్మా తొల్లి విరించికిఁ బుత్రు లై కర్దముండును విక్రీతుండును శేషుండును
సంశ్రయుండును స్థాణుండును మరీచియు నత్రియుఁ గ్రతుండును బులస్త్యుండు
ను నంగిరసుండును బ్రచేతసుండును బులహుండు ననువారలు సృష్టికారణు లై
|
|
|
జన్మించి రందు మరీచికిఁ గశ్యపాహ్వయుండు పుట్టె మఱియు బ్రహ్మదక్షిణాంగు
ష్ఠసంభవుం డైనదక్షునకు నఱువదిమంది కూఁతులు జన్మించి రందు నదితియు
దితియు దనువుఁ గాళికయుఁ దామ్రయుఁ గ్రోధవశయు మనువు ననలయు నను
వారి నెనమండ్రఁ గన్యకలఁ గశ్యపుండు వివాహం బై మీకు ముల్లోకంబులం
బాలింపం గలవారి మత్సమానులఁ బుత్రులఁ బడయుం డనిన నం దదితియు
దితియుఁ గాళియు నీమువ్వురు పతివాక్యంబున కీయకొనిరి తక్కినభార్యలు పతివా
క్యం బంగీకరింపకుండి రామువ్వురిలోనఁ బతివిశ్వాసతారతమ్యంబువలన నదితి
త్రయత్రింశత్కోటిదేవతలను ద్వాదశాదిత్యులను వసువుల నేకాదశరుద్రుల
నశ్విదేవతలం బడసె దితికి బలవంతు లైనరాక్షసులు పుట్టిరి తొల్లి యీవ
సుంధర వారలయధీనం బని వినం బడు దను వనుదానికి హయగ్రీవుం డను
దానవుండు పుట్టెఁ గాళిక యనుదానికి నరకుండును గాళకుండు ననువా
రిరువురు గలిగిరి తామ్ర యనునది క్రౌంచియు భాసియు ధృతరాష్ట్రియు శుకియు
నను నేవురఁ గూఁతులం గనియె నందుఁ గ్రౌంచి యనుదానికి నులూకంబులు
పుట్టె భాసి యనుదానికి భాసంబులు పుట్టె శ్యేని యనుదానికి శ్యేనగృ
ధ్రంబులు పుట్టె ధృతరాష్ట్రి యనుదానికి హంసకలహంసచక్రవాకంబులు
పుట్టె మఱియును దానికి నత పుట్టె నతకు వినత జన్మించెఁ గ్రోధవశ యనుదానికి
మృగియు మృగమందయు హరియు భద్రమదయు మాతంగియు శార్దూలియు
శ్వేతయు సురభియు సర్వలక్షణసంపన్న యగుసురసయుఁ గద్రువు ననుపదు
గురుకూఁతు లుద్భవించి రందు మృగి యనుదానికి మృగంబులును మృగమంద
యను దానికి భల్లూకంబును నీలవాలంబు లైనసృమరంబులును శ్వేతవాలంబు
లైనచమరంబులును హరి యనుదానికి సింహంబులును వానరంబులును బుట్టె
భద్రమద యనుదాని కిరావతి యనుకూఁతురు గలిగె నయ్యిరావతి కైరావతం
బనుమహాగజంబు పుట్టె మాతంగి యనుదానికి మాతంగంబులు పుట్టె శార్దూలి
యనుదానికి వ్యాఘ్రంబులును గోలాంగూలంబులును బుట్టె శ్వేత యనుదా
నికి దిగ్గజంబులు పుట్టె సురభి యనుదానికి రోహిణియు గంధర్వియు ననుకూఁతు
లిద్దఱు జన్మించి రందు రోహిణి యనుదానికి గోవులును గంధర్వి యనుదానికి
హయంబులునుం గలిగె సురస యనుదానికి బహుఫణంబు లైనసర్పంబులు పుట్టెఁ
గద్రువ యనుదానికి బన్నగంబులు పుట్టె మను వనుదానికి బ్రహ్మక్షత్రియవైశ్య
శూద్రప్రముఖు లైనమనుష్యులు జన్మించిరి యనల యనుదానికిఁ బిండకార
ఫలంబు లైనవృక్షంబులు పుట్టె మఱియు సురసచెలియ లగుకద్రువకు శేషవాసు
కిపురోగమము లైననాగసహస్రంబులు పుట్టె నందు సహస్రశిరుం డైనశేషుండు
ధరణీధరుం డయ్యె శుకిపౌత్రి యైనవినత కరుణుండును గరుడుం డన నిద్దఱు
కొడుకులు గలిగి రం దరుణునకు మహాబలుం డగుసంపాతియు నేనును జన్మించి
|
|
|
తిమి మదుత్పత్తికథనార్థంబు సృష్టిక్రమం బంతయు నెఱింగించితి వరుణునిభార్య
వేఱొక్కశ్యేని యని యెఱుంగుము శ్యేనిపుత్రుండ నైననన్ను జటాయువునుగా
నెఱుంగు మేను మహాబలుండ దశరథునకు సచివుండ నీ విచ్చట వసించితివేని
భవత్కామితంబులు దీర్చుచు ఫలార్థులై యొండుచోటికిం బోయినప్పుడు జానకిం
బరివేష్టించి రక్షించుచుండెద నిది దుర్గమం బగుకాంతారంబు మృగరాక్షస
సేవితం బై యుండు నిమ్మహాగహనంబున మదీయసాహాయ్యం బంగీకరించుట
నీ కవశ్యకర్తవ్యం బని పలికిన నతనిపలుకుల కలరి రాముండు వానిఁ బితృసఖు
నిఁగా నెఱింగి పూజించి సంతోషించి యతనిఁ గౌఁగిటఁ జేర్చి యతనితోడ సఖ్యంబుఁ
జేసి సారెసారెకు నతనివలనఁ బితృసఖత్వవృత్తాంతంబు ముదంబున నాకర్ణించు
చు నతనిం దోడ్కొని సీతాలక్ష్మణసహితుం డై యనలుండు శలభంబులంబోలె
శాత్రవుల దహించుచుఁ గొండొకదూరం బరిగి నానావ్యాళసమాకీర్ణం బైనపం
చవటీదేశంబుఁ బ్రవేశించి దీప్తతేజుం డైనసౌమిత్రి నవలోకించి యి ట్లనియె.
| 219
|
శ్రీరాముఁడు సీతాలక్ష్మణసహితుం డై పంచవటిం జేరుట
క. |
అగణితమహిమాస్పదుఁ డా, యగస్త్యముని చెప్పినట్టి యల పంచవటిన్
సుగుణాఢ్య చేరితిమి గద, తగి యున్నది కంటె పుష్పితద్రుమ మగుచున్.
| 220
|
ఉ. |
ఈవనమధ్యదేశము సమృద్ధనవాంబుజలాశయాన్వితం
బై వివిధప్రసూనసముదంచితరమ్యవిశాలవృక్ష మై
పావనసంయమీంద్రపరిపాల్యతపోవనరాజిరంజితం
బై విలసిల్లుచున్న దనఘా మన కిచ్చట నిల్వఁగాఁ దగున్.
| 221
|
క. |
పొందుగ నీకాననమునఁ, గందువ లరయంగ నీవు కడునేర్పరి వీ
సందున వేడ్క మనకు ని, ల్వం దగుచో టెద్ది దానిఁ బరికింపు మిఁకన్.
| 222
|
ఉ. |
నాకును నీకు జానకికి నల్వుగ నెద్ది మనోజ్ఞ మెద్ది ప
ద్మాకరయుక్త మెద్ది విమలాంబుసమిత్కుశమూల మెద్ది య
స్తోకఫలప్రసూన మయి సొంపుగ శోభిలు నట్టిచోటఁ బు
ణ్యాకర పర్ణశాల చెలువార రచింపుము నేర్పుపెంపునన్.
| 223
|
చ. |
అన విని లక్ష్మణుండు వినయంబున నంజలిఁ జేసి యిట్లనున్
మనుకులవర్య మీకు గరిమం దగ వర్షశతంబు ప్రీతి ని
వ్వనిఁ బురమందు నొండెఁ బరవంతుఁడ నైతిని మీరె చూచి తోఁ
చిన రుచిరస్థలంబున రచింపు మటంచు వచింపుఁ డెంతయున్.
| 224
|
తే. |
అనినఁ దమ్మునిమాటల కలరి రాజ, వర్యుఁ డచ్చట రుచిరనివాస మొకటి
గాంచి కరమున నాతనికరము పట్టి, యెలుఁగు మధుయుక్త మగుచుండ నిట్టు లనియె.
| 225
|
క. |
తమ్ముఁడ యీదేశము ర, మ్య మ్మై కుసుమితమహీరుహశ్రేణీయు
క్త మ్మై యున్నది యిట రుచి, రమ్ముగ నొకయాశ్రమంబు రచియింపు మిఁకన్.
| 226
|
క. |
ఘనసురభిగంధిరవినిభ, వనరుహములచేత మిగుల వ్యావృత యై యీ
యనువున నెల్లెడ నొప్పెడిఁ, గనుఁగొంటివె పద్మినీనికాయం బనఘా.
| 227
|
చ. |
మునిపతి చెప్పినట్లు బహుపుష్పితభూమిరుహప్రకాండ యై
యనుపమచక్రవాకబకహంసమరాళవిరాజమాన యై
ప్రణుతనవాంబుసంభవతరంగకణద్రవగంధవాహ యై
గన నగు చున్న దల్లదిగొ గౌతమి కంటివె యమ్మహానదిన్.
| 228
|
ఉ. |
ప్రాంశువినీలకందరవిభాసిత మై సితరక్తనీలపీ
తాంశుపరీతధాతునిచయావృత మై బహుగండశైల మై
కింశుకపాటలీవకుళకేతకసాలతమాలశింశుపా
వంశకరీరచిత్ర మయి వారక పర్వతసంఘ మొప్పెడున్.
| 229
|
సీ. |
సాలరసాలహింతాలతాలతమాలచందనస్పందనచంపకామ్ర
లుంగమాధవమాతులుంగనారంగలసంగపున్నాగనీవారలికుచ
ఖర్జూరపనసాశ్వకర్ణధవాంకోలతిలకకురంటకతినిశఖదిర
కింశుకశింశుపావంశపాటలనీపకేతకీబిల్వభల్లాతకాది
|
|
తే. |
వివిధతరువల్లికాగుల్మపిహిత మగుచు, నీవనం బొప్పుచున్నది యిచట నిలిచి
యీఖగేంద్రునితోఁ గూడి యెలమిసమయ, వాసరంబులు గడపంగవలయు మనకు.
| 230
|
క. |
అని రామవిభుఁడు పలికిన, విని ముదమున లక్ష్మణుండు విశ్రుతభంగిం
దనరారునట్లు గ్రక్కున, ఘనముగ నొకపర్ణశాలఁ గావించె రహిన్.
| 231
|
శ్రీరామునియనుజ్ఞ పడసి లక్ష్మణుండు పర్ణశాల నిర్మించుట
వ. |
అది మఱియు రమ్యయు విపులయు భిత్త్యాకారకృతమృత్తికయు శమీశాఖా
సమాస్తీర్ణయు సుస్తంభయు సుశోభనయు దీర్ఘవంశకృతగృహోర్ధ్వకాష్ఠయు
దృఢపాశావపాశితయుఁ గుశకాశశరపర్ణపరిచ్ఛాదితయు సమీకృతతలయుఁ
బ్రేక్షణీయయు నై యొప్పె నంత లక్ష్మణుండు గోదావరీనదికిం జని యందుఁ
గృతస్నానుం డై నూతనపద్మంబులు సంగ్రహించుకొని సఫలుం డై రయం
బునం జనుదెంచి వాస్తుపూజఁ గావించి విధ్యుక్తప్రకారంబున శాంతికర్మం
బాచరించి స్వకృతం బైనతదాశ్రమపదంబు రామునకుం జూపిన నమ్మహాను
భావుండు సీతాసహితుం డై పర్ణశాలారచనావిశేషవిలోకనసంజాతసాంద్రా
నందపారవశ్యంబునఁ దమ్ముని గాఢంబుగాఁ బరిరంభించి దుందుభిస్వనకల్పం
బగుస్వరంబున నతిస్నిగ్ధంబుగా ని ట్లనియె.
| 232
|
తే. |
అనఘ యద్భుతకర్మ, మి ట్లాచరించి, తీవు సమ్మోద మొదవె సంభావనార్థ
|
|
|
మొసఁగఁ దగినపరిష్వంగ మొసఁగినాఁడఁ, జేకొని మనంబున ముదంబుఁ జేర్పు మిపుడు.
| 233
|
తే. |
భావవిదుఁడవు కులధర్మకోవిదుఁడవు, ఘనుఁడవు కృతజ్ఞుఁడవు వీతకల్మషుఁడవు
పాలకుఁడ వైననీచేతఁ బంక్తిరథుఁడు, నాదుతండ్రి జీవించి యున్నాఁడు వత్స.
| 234
|
క. |
అని తా లక్ష్మీవర్ధనుఁ, డనఘుఁడు రాముఁడు ప్రియానుజాన్వితుఁ డై చ
య్యన గృధ్రపతియుతంబుగ, వినుతగతిం బర్ణకుటిఁ బ్రవేశించెఁ దగన్.
| 235
|
చ. |
అనిశము మౌనిపూజనము లందుచు నాకమునందు బాకశా
సనుఁడును బోలె రుచ్యఫలసంభృత మై తనరారుతత్పదం
బున సుఖలీలఁ గొన్నిదినము ల్వశి యై వసియించె నంత నా
జనపతి కిష్ట మై పొడమె సాంద్రగతి న్హిమకాల ముధ్ధతిన్.
| 236
|
ఉ. |
ఆరఘువంశవార్ధివిధుఁ డం దొకనాఁటిప్రభాతవేళ సొం
పారఁగ జానకీసహితుఁ డై యభిషేకనిమిత్త మర్థి మై
వారక గౌతమీనది కవార్యగతిం జనుచుండ వెంట నిం
పారఁగఁ బోవుచుండి వినయజ్ఞుఁడు లక్ష్మణుఁ డన్న కి ట్లనున్.
| 237
|
లక్ష్మణుండు రామునికి హిమకాలంబు నభివర్ణించి చెప్పుట
తే. |
ప్రియవచనశీల యెయ్యది ప్రియము నీకు, వర్ష మెద్దానిచేత దుర్వారభంగిఁ
దగ నలంకృత యైనచందాన నలరు, నట్టివలితఱి సంప్రాప్త మయ్యెఁ గంటె.
| 238
|
తే. |
పరఁగ లోకంబు నీహారపరుష మయ్యె, సస్యశాలిని యై యొప్పె జగతి యెల్ల
యాపగాంబువు లనుపభోగ్యంబు లయ్యె, వీతిహోత్రుఁ డభీష్టుఁ డై వెలసె నిపుడు.
| 239
|
తే. |
అనఘచరిత నవాగ్రయణార్చనముల, సురలఁ బితరుల సంతుష్టిపరులఁ జేసి
యజ్వలు కృతాగ్రయణకు లై యపగతాఘు, లై మిగులఁ బరిశుద్ధాత్ము లగుదు రిపుడు.
| 240
|
క. |
సంపన్నగోరనము లై, సొం పారఁగ జనపదములు శోభిలుచుండన్
పెం పెసఁగ దండయాత్రా, లంపటు లై యుందు రిపు డిలాపతులు భువిన్.
| 241
|
క. |
ఇనుఁ డంతకదిగ్భాగము, ననురక్తి భజించుచుండ నపరిష్కృత యై
ధనదాశ చెలువుఁ గోల్పడె, ననుదినము విహీనతిలక యగుసతి మాడ్కిన్.
| 242
|
క. |
హీనకోశాఢ్యుం డగు నా, హిమవంతుఁడు దూరగతదినేశ్వరుఁ డగుచున్
హిమసిక్తుం డై యిప్పుడు, సమజ్జనశరణ్య సత్యనామకుఁ డయ్యెన్.
| 243
|
వ. |
మఱియు నిప్పుడు దివసంబులు కించిదుష్ణసూర్యంబు లై సావశ్యాయంబు లై
సమారుతంబు లై పటుశీతంబు లై హిమోపహతంబు లై శూన్యారణ్యంబు లై
|
|
|
మధ్యాహ్నకాలంబున సుఖస్పర్శంబు లై యత్యంతసుఖసంచారంబు లై సుభగా
దిత్యంబు లై దుర్భగచ్ఛాయాసలిలంబు లై యొప్పుచున్నయవి రాత్రులు నివృ
త్తానావృతదేశభోగిపర్యంకంబు లై తుషారధూసరంబు లై శీతస్పర్శమారుత
సమేతంబు లై పుష్యనీతంబు లై యతిదీర్ఘంబు లై చనుచున్న వదియునుం గాక.
| 244
|
క. |
హిమధూసరమండలుఁ డై, సముదితరవికరగృహీతసౌభాగ్యుం డై
కమలారి యొప్పె గగనప, థమున వినిశ్శ్వాసమలినదర్పణముక్రియన్.
| 245
|
తే. |
నరవరోత్తమ పున్నమనాఁటిపండు, వెన్నెల తుషారమలిన మై విపినవీథి
నాతపశ్యామ యైనధరాత్మజాత, పగిది శోభింపకున్నది భానుతేజ.
| 246
|
క. |
తడయక నతిశీతలుఁ డగు, పడమటిగా డ్పడరి యిపుడు ప్రాలేయముచేఁ
దడుపంబడి వనమున సుడి, సెడుఁ గంటివె దేవ ద్విగుణశీతలుఁ డగుచున్.
| 247
|
క. |
నవబాష్పఛ్ఛన్నంబులు, యవగోధూమాన్వితంబు లగువిపినంబుల్
రవి వొడమువేళ సారస, రవములు రంజితము లయ్యె రాఘవ కంటే.
| 248
|
క. |
పరిపూర్ణతండులము లై, నిరుపముఖర్జూరపుష్పనిభకణిశము లై
వరకనకచ్ఛవిశాలులు, కరము వినమ్రంబు లగుచుఁ గ్రాలెడుఁ గంటే.
| 249
|
క. |
రమణీయశీల చూచితె, సముదితుఁ డగుహేళిసొబగు చన దూరమునన్
హిమజాలపరీతమయూ, ఖములం జందురునిపగిదిఁ గానఁగ నయ్యెన్.
| 250
|
తే. |
విను ముదయవేళ నగ్రాహ్యవీర్య మగుచుఁ, బరఁగ మధ్యాహ్నమున సుఖస్పర్శ మగుచుఁ
గించిదర్జున మై సముదంచితముగ, నవనిపై వ్రాలెఁ గంటివె యాతపంబు.
| 251
|
తే. |
మహితముక్తాఫలసమానతుహినబిందు, జాలపరిషిక్తశాడ్వలసహిత యై
గహనభూమి బాలాతపకలిత యగుచుఁ, జిత్రగతి నున్న దిపుడు వీక్షింపు మధిప.
| 252
|
తే. |
దేవ వనగజ మత్యంతతృషిత మగుచు, సాంద్రతరశీతసలిలంబు సంస్పృశించి
చాలదుస్స్పర్శశైత్యవశంబువలనఁ, గ్రమ్మఱించుచు నున్నది కరము కంటె.
| 253
|
తే. |
హంసచక్రాదివిహగంబు లంబుచరము, లయ్యు సరసీజలసమీపమందుఁ జేరి
యని నశూరులవలె జలంబునఁ దగ నవ, గాహనంబు గావింపవు క్ష్మాప కంటె.
| 254
|
వ. |
మఱియు నీవనపంక్తు లవశ్యాయతమస్సంకుచితపల్లవపుటంబు లై యుపరిపతిత
నీహారతమశ్ఛన్నంబు లై విగతపుష్పంబు లై యాంతరం బైననిద్రాతమంబుచేత
బాహ్యం బైననిశాతమంబుచేత ముకుళితనేత్రంబు లై ప్రసుప్తంబు లైనవాని
మాడ్కిం జూపట్టుచున్న వదియునుంగాక.
| 255
|
తే. |
జనవరోత్తమ బాష్పసంఛన్నజలము, లై రుతజ్ఞేయవిహగంబు లై హిమార్ధ్ర
వాలుకోదగ్రతటము లై గ్రాలుచున్న, వలఘుచరిత విలోకింపు మద్రినదుల.
| 256
|
క. |
అనఘా హిమపాతమ్మున, ఘనశీతత్వమున నుష్ణకరునిమృదుత్వం
|
|
|
బున నగముమీఁద నున్నను, వనములు రుచికరము లయ్యె వరుస నిపు డిలన్.
| 257
|
తే. |
పటుజరాజర్జరీభూతపర్ణశీర్ణ, కర్ణికాకేసరతుషారకణపరీత
నాళశేషంబు లగునలినములచేత, నుర్వి సరసులు శోభింప కున్న విపుడు.
| 258
|
లక్ష్మణుఁడు రామునకు భరతుగుణముల నభివర్ణించి చెప్పుట
ఉ. |
మానము రాజ్యభోగములు మాని మహాత్ముఁడు కైకపట్టి సం
తానితవంశధర్ముఁ డయి తాపసవేషముఁ దాల్చి యిత్తఱిన్
మానక నిన్నె నిత్యమును మానసవీథిఁ దలంచి దుఃఖితుం
డై నెఱి దక్కి శీతమహియందు వసించి తపంబు సల్పెడిన్.
| 259
|
తే. |
అనఘచారిత్ర మనయట్ల యాభరతుఁడు, నిత్య మిక్కాలమందున నిద్ర లేచి
ప్రకృతిపరివృతుఁ డై కడుభక్తితోడ, నరుగుచుండు స్నానార్థంబు సరయుకడకు.
| 260
|
క. |
అతిసుఖసంవృద్ధుఁడు ఘనుఁ, డతిసుకుమారుండు భరతుఁ డత్యంతహిమా
ర్దితుఁ డయి వేఁకువ నేక్రియఁ, గుతుకంబున సరయువందుఁ గ్రుంకు మహాత్మా.
| 261
|
సీ. |
కంజాతనేత్రుండు కమనీయగాత్రుండు నీరదశ్యాముండు నిరుదరుండు
శ్రీమంతుఁడును ధర్మశేవధి మధురుండు హ్రీనిషేధుండు జితేంద్రియుండు
సత్యప్రతిజ్ఞుండు సత్ప్రియభాషియు ననుపమభోగార్హుఁ డార్యసేవి
సకలశాస్త్రార్థవిశారదుండు మృదుండు వర్ణనీయుఁడు గురువత్సలుండు
|
|
తే. |
కైకయీనందనుం డట్టిఘనుఁడు దీర్ఘ, కాలము సమస్తరాజభోగములు విడిచి
నిశ్చలప్రీతి నార్యుని నిను భజించి, నందున మహాత్మ కృతకృత్యుఁ డయ్యెఁ గాదె.
| 262
|
వ. |
దేవా మహాత్ముం డగుభరతుండు తాపసకృత్యంబుఁ గైకొని నీవు వనస్థుండవై
నను ని న్ననుసరించి వివిధభక్తుల సేవించుచున్నకారణంబున నతనిచేత నాకం
బు జయింపంబడియె నదియునుంగాక మనుష్యులు పితృస్వభావం బనువర్తింపక
మాతృస్వభావం బనువర్తింతు రనియెడు ప్రసిద్ధం బైనలోకప్రవాదంబు మాతృ
కృతానయపరిహారంబువలన నాతనిచేత నన్యథాకృతం బయ్యె నని పలికి వెండియు.
| 263
|
తే. |
అనఘచారిత్ర దశరథునంతవాని, కరయఁ బత్ని యై భరతునియంతవాని
కంబ యై ఖ్యాతి వడసినయట్టికైక, కెలమి నీక్రూరబుద్ధి నేఁ డేల గలిగె.
| 264
|
క. |
అని లక్ష్మణుండు స్నేహం, బునఁ బలికిన నావిదేహపుత్రీవిభుఁ డా
జననీపరివాదము విని, తనమదిని సహింపలేక తమ్ముని కనియెన్.
| 265
|
శా. |
కారుణ్యాదిసమస్తసద్గుణములం గన్పట్టు కైకేయిపై
నేరం బేల వచించె దీవు మృదునిన్ నిర్మత్సరుం దత్సుతున్
శ్రీరమ్యుం బ్రణుతింపు మన్విభుని సౌశీల్యంబె ముఖ్యంబు గా
కారామామణిదౌష్ట్య మెన్నఁ దగ దోయబ్జాప్తవంశోత్తమా.
| 266
|
తే. |
అనఘచరిత దృఢవ్రత మయ్యు వనవి, హారమందు సునిశ్చిత మయ్యు నాదు
మానసము భరతస్నేహమగ్న మగుచుఁ, దరలత వహించుచున్నది మరల నిపుడు.
| 267
|
తే. |
అమృతకల్పంబులు ప్రియంబు లతిమృదులము, లమితసుఖకరములు మధురార్థయుక్త
ములు మనోజ్ఞంబు లద్భుతోజ్జ్వలము లైన, భరతువచనంబు లెంతయు మఱవఁబడవు.
| 268
|
క. |
పరమార్థవిదుఁడు భరతుఁడు, సరసాత్ముఁడ వైననీవు శత్రుఘ్నుండున్
గురుమతి భజింప సంపద, యిరవందెడునట్టికాల మెన్నఁడు వచ్చున్.
| 269
|
వ. |
అని బహుప్రకారంబుల విలపించుచు రాముండు ప్రియానుజసహితంబుగా
గోదావరీనదికిం జని యందుఁ గృతాభిషేకుం డై తదీయపావనజీవనంబుల దేవ
పితృతర్పణంబులు గావించి పార్వతీవిష్ణుసహితంబుగాఁ గృతాభిషేకుం డైన
భగవంతుం డగురుద్రునిచందంబున నందం బగుచు నుదితాదిత్యు నుపాసించి
దేవతోపాస్తిఁ గావించి గ్రమ్మఱ నిజాశ్రమంబునకుం జనుదెంచి ప్రాతర్హో
మాదికంబుఁ గావించి పర్ణశాలఁ బ్రవేశించి తన్మధ్యదేశంబుస సీతాసమేతం
బుగా సుఖాసీనుఁ డై చిత్రాసమన్వితుం డైనచంద్రునిభంగి వెలుంగుచు మహర్షి
పూజ్యమానుఁ డై లక్ష్మణునితోడఁ బుణ్యకథేతిహాసంబులు వక్కాణించు
చున్నసమయంబున.
| 270
|
శూర్పణఖ రామునిఁ జూచి మోహించుట
చ. |
దశముఖదైత్యరాడ్భగిని దారుణలోచన లంబజిహ్వ దు
ర్దశన దురాగ్రహప్రబలతావికటీకృతచిత్త నీలవ
ర్ణ శిఖరితుల్యగాత్రి యొకరాక్షసి శూర్పణఖాభిధాన యా
దశరథపుత్రునాశ్రమపదంబునకుం జనుదెంచె లీలతోన్.
| 271
|
సీ. |
ఇందీవరశ్యాముఁ గందర్పసమధాము నాజానుబాహు నీలాభ్రదేహుఁ
గమలపత్రనిభాక్షు విమలశోభనవక్షు నతిసుకుమారు విశ్రుతవిహారు
రాజచిహ్నసమేతు రాఘవాన్వయజాతు దరహాసవదను సౌందర్యసదను
రమణీయగుణజాలు విమలవిద్యాశీలుఁ గరుణాలవాలు భాసురకపోలుఁ
|
|
తే. |
దరుణయౌవనకలితు సీతాసమేతు, ఘనజటాధారి వల్కలాజినవిహారి
రాము నందంద చూచి శూర్పణఖ బహుళ, కామభారావసన్న యై కదియవచ్చి.
| 273
|
సీ. |
తనదుర్ముఖత్వ మాయనసుముఖత్వంబుఁ గాంచి రెంటికి నీడు గాఁ దలంచి
తనమహోదరము నాయనవృత్తమధ్యంబుఁ గాంచి రెం డొకటిగా నెంచికొనుచుఁ
దనవిరూపాక్షు లాయనవిశాలాక్షులుఁ బరికించి సరియ కాఁ బ్రస్తుతించి
తనతామ్రకేశ మాయనసుకేశముఁ జూచి తగు నని డెందానఁ దమక మూని
|
|
తే. |
తనదువార్ధక మాయనతరుణతయును, దనవికృతమూర్తి యాయనవినుతమూర్తి
|
|
|
తనదుభైరవనాద మాయనసునాద, మరసి యజ్ఞానబుద్ధి జో డనుచుఁ దలఁచి.
| 274
|
శూర్పణఖ రామునికిఁ దనభావంబు దెల్పుట
ఉ. |
ఆరఘుభర్త కి ట్లనియె నద్భుతచాపశరాసు లింపు సొం
పార ధరించి తాపసవరాకృతిఁ గైకొని పత్నిఁ గూడి యీ
ఘోర వనప్రదేశమునకుం జనుదెంచితి వేల నీవు నీ
పేరును నీదుచందమును బేర్కొను మింతయు నాకు నావుడున్.
| 275
|
శా. |
ఆరక్షోంగనఁ జూచి యి ట్లనియె రామాధీశుఁ డెన్నండు మి
థ్యారూపంబులఁ బల్కఁ డ ట్లగుట నయ్యారే విశేషించి నేఁ
డారణ్యస్థలి నాశ్రమార్హనియమవ్యాసక్తితో నుండి మి
థ్యారూపంబులఁ బల్కునే తగ స్వకీయం బైనవృత్తాంతమున్.
| 276
|
చ. |
కలఁ డొకమేదినీశ్వరశిఖామణి పంక్తిరథుండు నాఁగ న
య్యలఘుచరిత్రుపుత్రుఁడ మదాఖ్య మనీషులు రాముఁ డందు రీ
జలరుహమిత్రతేజుఁ డనుజన్ముఁడు లక్ష్మణుఁ డండ్రు వీని నీ
యలికచ నాదుపత్ని జనకాత్మజ జానకి యందు రీబిడన్.
| 277
|
క. |
జననీజనకులచే ని, ట్లనుపంబడి ధర్మకాంక్షి నై వీరలఁ దో
డ్కొని మునివేషముఁ గైకొని, చనుదెంచితి నివ్వనమునఁ జరియించుటకున్.
| 278
|
క. |
నినుఁ జూడ రాక్షసాంగన, యని తోఁచుచు నున్న దిచటి కరుదెంచుట కే
పని గలదు నీదుకులవ, ర్తనములు నీపేరు మాకుఁ దడయక చెపుమా.
| 279
|
క. |
నా విని యారాక్షసి సీ, తావల్లభుఁ జూచి మదనతామరసశర
వ్యావిద్ధ యగుచు వెసఁ దన, భావం బవ్విభున కెఱుకవడ ని ట్లనియెన్.
| 280
|
చ. |
అనఘచరిత్ర నాదువిధ మంతయుఁ దెల్పెదఁ జిత్తగింపు మి
వ్వనమున నొంటి మై సకలవన్యభయంకరి నై చరింతు న
న్ననుపమశీల శూర్పణఖ యండ్రు, సమస్తనిశాటకోటిలో
వినుతికి నెక్కితి న్భువనవిశ్రుతకామగతిత్వసంపదన్.
| 281
|
చ. |
అనిమిషగర్వపర్వతమహాశనికల్పకుఁ డైనరావణుం
డనుపమభూరినిద్రుఁ డగునాదిమశూరుఁడు కుంభకర్ణుఁడున్
వినుతపరాక్రముండు సువివేకి విభీషణుఁడున్ జగన్నుతుల్
ప్రణుతపరాక్రముల్ గలరు భ్రాతలు మువ్వురు నాకు భూవరా.
| 282
|
చ. |
ఖరుఁ డన దూషణుం డనఁ బొగడ్తకు నెక్కినరాక్షసేంద్రు లి
ద్దఱు గల రింక రావణునితమ్ములు వారిఁ బరిత్యజించి యే
నిరుపమదివ్యమంగళవినీలశరీరుని నిన్నుఁ జూచి య
చ్చెరువడి భర్తృవాంఛ నిటు చేరఁగ వచ్చితి మన్మథార్త నై.
| 283
|
చ. |
మనుజవరేణ్య యేను బహుమాయలు నేర్చినదానఁ గామరూ
పను బలవంతురాల నరిభంజనశీలను గాన నన్నుఁ గై
కొని సకలేష్టభోగము లకుంఠితవైఖరి నొందు మక్కటా
కనికని దీనియంతటి వికారపుఁబొత్తు మనంగ నేటికిన్.
| 284
|
ఉ. |
చక్కనివారిలో మిగులఁ జక్కనివాఁడవు నీవు నన్నుఁ బోల్
చక్కనికాంతఁ గూడి జలుచందములన్ సుఖయించు టంతె కా
కిక్కుటిలాంగితోడి చన వేటికి దీనిఁ బరిత్యజింపు మో
చక్కెరవింటిసామి నెకసక్కెము లాడెడురాజమన్మథా.
| 285
|
చ. |
ఇది వికృతాస్య నీకుఁ దగ దీసతిపై ననురక్తిఁ గూర్ప రా
దదయత నిగ్రహింపు మటు లైనను దోషము లేదు గాన నీ
హృదయమునందుఁ గూర్మి మెయి నింత కొడంబడ వేని లక్ష్మణుం
బదపడి దీని నే నివుడు పట్టి గ్రసించెద వంతఁ దీఱెడిన్.
| 286
|
శూర్పణఖను రామలక్ష్మణులు పరిహసించుట
క. |
అని చుప్పనాతి పలికిన, విని రాముఁడు చతురవాక్యవిదుఁ డగుట మనం
బున గర్హించుచు దానిం, గని చిఱునగ వంకురింపఁగా ని ట్లనియెన్.
| 287
|
క. |
నిను వంటిరూపపతి నెందును గానక తొలుత తగినదో తగనిదొ కై
కొనినాఁడ దీని వేఱొక, వనితను మది నింకఁ గోర వచ్చునె నాకున్.
| 288
|
ఉ. |
కన్నుల కింపు సేయు నినుఁ గైకొనఁ జూచితి నేని సంతతం
బన్నిట నీకు నీమగువ కాఱనితీఱనిపోరు గల్గు సౌ
ఖ్యోన్నతి లేదు మేల్పడినయోష నలంచిన దోస మంటివే
నిన్నును గైకొనం దగిననేర్పరి నాయనుజు న్వరింపుమా.
| 289
|
చ. |
ఇతఁడు సుశీలవంతుఁడు నహీనబలుండు సుదర్శనుండు నా
తతభుజవిక్రముం డకృతదారుఁడు నీ కనురూపుఁ డైనభ
ర్త తనకు భార్యగాఁ దగినదాని నొకర్తెను గోరుచున్నవాఁ
డితని వరించితేని భజియింపుదు వాఱడి లేనిసౌఖ్యమున్.
| 290
|
వ. |
కావున సూర్యప్రభ మేరువుంబోలె నీలక్ష్మణుని భర్తగా భజింపు మని యిట్లు
రాముండు పరమదయాళుత్వంబునఁ దనయందుఁ గామమోహంబులచేత సమా
గత యైనయువతిని శీఘ్రంబున ధిక్కరించిన దుఃఖించు నని తలంచి క్రమంబు
నఁ దిరస్కరించువాఁ డై పరిహాసవచనంబుఁ బల్కి లక్ష్మణుం జూపిన.
| 291
|
క. |
మనమున హర్షం బడరఁగ, దనుజాంగన కామబాణదళితహృదయ గా
వున నది యొకనిజ మని గ్ర, క్కున లక్ష్మణుఁ జూచి పల్కెఁ గోర్కులు నిగుడన్.
| 292
|
ఉ. |
చక్కనివాఁడ వీవు నృపసత్తమ చక్కనిదాన నేను బెం
పెక్కఁగ నన్నుఁ గూడి చరియింపుము కాననభూమియందు నే
|
|
|
నిక్కము నిన్నుఁ గూడి గిరినిర్ఝరకాననకందరంబులం
బెక్కువిధంబులన్ సుఖసమృద్ధి వహించెద సొంపు మీఱఁగన్.
| 293
|
వ. |
అనిన విని వాక్యకోవిదుం డగులక్ష్మణుండు చిఱునగవు నగి యుక్తంబుగా
దాని కి ట్లనియె.
| 294
|
క. |
దాసుఁడ నగుననుఁ గైకొని, దాసివి గా నెట్లు నీవు దలఁచితి వోహో
నీసరస మేమి చెప్పుదు, దాశరథికి నేను గూర్చుదాసుఁడఁ గానే.
| 295
|
క. |
ఏపగిది నైన నధికునిఁ, జేపట్టిన వలయుసుఖము చేకూరుం గా
కీపట్ల సేవకుని ననుఁ, జేపట్టిన నేమి సుఖముఁ జెందెదవు బలే.
| 296
|
క. |
కావున రామునిఁ గైకొను, మీవృద్ధిఁ గరాళ నసతి నీవికృతాంగిం
గేవలత విడిచి మోదం, బావహిల న్నిన్నె వేగ యవలంబించున్.
| 297
|
క. |
నీచక్కఁదనము పోలం, జూచిన నెవ్వార లైనఁ జొక్కరె యిపు డే
లా చింతించెదు విభుఁ డే, లా చేకొనఁ డమ్మహాత్ముఁ బ్రార్థింపు మిఁకన్.
| 298
|
క. |
నీరూప మిది గనుంగొని, వారక నీతోడిపొందు వర్జించి రయం
బార మనుజాంగనల నె, వ్వారు విచక్షణులు గోర వత్తురు చెపుమా.
| 299
|
శూర్పణఖ సీతను మ్రింగెద ననుట
తే. |
అనుచు లక్ష్మణుఁ డాడిన యతనిపలుకు, విని దనుజ పరిహాసానభిజ్ఞ యగుటఁ
దథ్య మని నమ్మి నిర్నతోదరి కరాల, కామమోహిత యై పల్కె రాముఁ జూచి.
| 300
|
తే. |
ఈవిరూప నీయబల నీవృద్ధ నసతి, నిర్నతోదరి విడువంగ నేర కిట్టు
లమితసత్త్వను స్వచ్ఛంద నైననన్ను, మించినకృపారసమునఁ గామింపవైతి.
| 301
|
ఉ. |
ఇప్పుడు నీవు గన్గొనఁగ నీమనుజాంగన మ్రింగి పుచ్చి నే
ర్పొప్పఁగ నిన్నుఁ గూడి ముద మొప్పఁగ నిందుఁ జరింతు జూడు మం
చప్పుడు చుప్పనాతి రయ మారఁగ రోహిణి నుల్కయట్ల యా
కప్పురగంధినిం బొదువఁగా గమకించినఁ జూచి యుద్ధతిన్.
| 302
|
ఉ. |
ఆరఘునాయకుండు జనకాత్మజ క ట్లభయంబుఁ దెల్పి యా
దారుణరాక్షసిం బదరి తమ్మునిఁ గన్గొని యీనృశంస ని
ట్లూరక చూచుచుండఁ దగ దుర్విసుత నెదరించుచున్న ద
య్యారె శితాసిధార రయ మారఁగ దీని విరూపఁ జేయుమా.
| 303
|
లక్ష్మణుఁడు శూర్పణఖయొక్క కర్ణనాసమును ఛేదించుట
చ. |
అన విని లక్ష్మణుండు భయదాకృతి ఖడ్గము కేలఁ బూని యా
దనుసుతకర్ణనాసిక ముదగ్రతఁ గోసినఁ బ్రావృడంబుద
ధ్వనిగతి నేడ్చుచు న్రుధిరధారలు గాఱఁగ ఘోరరూప యై
తనదువిరూపతాగతికిఁ దద్దయుఁ గుందుచు లజ్జ పుట్టఁగన్.
| 304
|
ఉ. |
అక్కడఁ బాసి శీఘ్రగతి నంఘ్రియుగాహతి భూతధాత్రియున్
|
|
|
గ్రక్కదలంగఁ బాఱి ఘనకాయు దురాత్ము మహోగ్రదర్శను
న్రక్కసిఱేనిఁ గ్రూరతరరాక్షససంఘసమావృతు న్ఖరు
న్గ్రక్కున డాసి తత్పరిసరంబున వ్రాలె మహోల్కకైవడిన్.
| 305
|
తే. |
ఈకరణిఁ గర్ణనాసవిహీన యగుచు, రక్తధారోక్షితాంగి యై వ్రాలి యున్న
భగినిఁ గన్గొని యి ట్లని పలికె రాత్రి, చరకులసరోజనిసహస్రకరుఁడు ఖరుఁడు.
| 306
|
ఉ. |
లె మ్మిటు లార్త వై కళవళించెద వేటికి సంభ్రమంబు శో
కమ్మును మోహము న్విడిచి గ్రక్కున నీదురవస్థఁ జెప్పు నా
కిమ్మెయి నీదుముక్కుసెవు లెవ్వఁడు గోసి విరూపఁ జేసె వ్య
క్తమ్ముగ సర్వము న్దెలియఁగా వినిపింపుము చింత యేటికిన్.
| 307
|
చ. |
ఎఱుఁగక దుర్విషంబు మది నెవ్వఁడు గ్రోలఁగఁ జూచె గుండలి
న్గరమునఁ గొట్టె నెవ్వఁ డలకాలుని నెవ్వఁ డెదిర్చె జిచ్చులో
నుఱుకఁ దలంచె నెవ్వఁ డెవఁ డొప్పె గళంబునఁ గాలపాశ మి
ట్లురిగొన నెవ్వఁ డాసగొనె నుద్ధతి మృత్యువుతోడి వైరమున్.
| 308
|
చ. |
స్థిరమతి నాకు విప్రియము సేయఁగఁ జాలినవీరు నుర్విలో
నరసినఁ గాన మిప్పుడు నరాసురదైవతపన్నగాలిలో
నిరుపమబాహువీర్యమున ని న్నిటు పట్టి విరూపఁ జేయఁగా
వరుస సమర్థుఁ డైనబలవత్తరుఁ డెవ్వఁడు వానిఁ జెప్పుమా.
| 309
|
ఉ. |
హెచ్చినకోపవేగమున నిప్పుడె దారుణబాణసంహతిం
జెచ్చెర వానిగుండియలు సించెద నెమ్ములు సర్వమర్మముల్
వ్రచ్చెదఁ దచ్ఛరీరరుధిరంబులు కాల్వలు గట్టఁ జేసెద
న్మచ్చర మంకురింపఁ బ్రసభంబునఁ బుచ్చెదఁ గాలుప్రోలికిన్.
| 310
|
క. |
భీకరశరమున నరి నొక, తాఁకువఁ గూలంగ నేసి తత్పిశితముచే
నాఁకలిఁ దీర్చెద గ్రక్కున, గాకోలూకోగ్రజంబుకంబుల కాజిన్.
| 311
|
తే. |
రాజహంసంబు వేగ నీరంబులోనఁ, గలసి యున్నక్షీరంబు నాకర్షణంబు
సేయుగతి వానిప్రాణముల్ శితశిలీము, ఖముల నాకర్షణ మొసర్తుఁ గాదె నేఁడు.
| 312
|
క. |
కదనంబున నాచే నటు, పొదువఁబడినరిపునిఁ బ్రోవఁ బురుహూతాది
త్రిదశవరు లైన శక్తులె, విదితంబుగ వానితెఱుఁగు వివరింపు తగన్.
| 313
|
శూర్పణఖ తనదుఃఖంబును ఖరాసురునితోఁ జెప్పికొనుట
వ. |
అని రణాగ్రహోదగ్రవ్యగ్రాయమానమానసుం డై పలికినఖరాసురునివాక్యం
బులు విని శోకబాష్పధారాపూరితముఖి యై శూర్పణఖ యి ట్లనియె.
| 314
|
చ. |
తరుణులు రూపవంతు లతిదాంతులు మూలఫలాశను ల్మును
ల్సరసిజపత్రలోచనులు సౌమ్యులు దాశరథు ల్స్వధర్మశీ
లురు సుకుమారు లద్భుతబలు ల్ఘనవల్కలు లన్నదమ్ములు
|
|
|
న్సరసులు రామలక్ష్మణులు నాఁ గల రిద్దఱు దండకాటవిన్.
| 315
|
క. |
ఘనరాజచిహ్నకలితులు, సనయులు గంధర్వరాజసము లగువారి
న్గనుఁగొని వేల్పులొ మనుజులొ, యని యే నరయంగఁ జాలనైతి సురారీ.
| 316
|
ఉ. |
వారిలసద్విహారములు వారివచోరచనాచమత్కృతుల్
వారిమనోజ్ఞవేషములు వారిసమగ్రపటుప్రతాపముల్
వారిపరాక్రమక్రమము వారిశరాసననైపుణంబు నె
వ్వారికి లేవు ముజ్జగమువారలలోపల నేమి చెప్పుదున్.
| 317
|
తే. |
దంతియుగమధ్యగతనాగకాంతఁ బోలి, దిననిశాంతరగతసంధ్య యనఁగ వారి
నడుమఁ గాంచనమణిభూషణప్రభూషి, తాంగి యై యున్న యొకచకోరాక్షిఁ గంటి.
| 318
|
క. |
విను మాకాంతనిమి త్తం, బున నోర్వక భయదరూపమున నను వెసలోఁ
గొని వారు శాతఖడ్గం, బునఁ గోసిరి గినిసి నాదుముక్కుం జెవులున్.
| 319
|
క. |
మాయన్న ఖరుఁడు విన్నను, మీయుసుఱున కేరు వచ్చు మీఁ దెఱిఁగి మనుం
డీ యన్న వినక హాసము, సేయుచు నన్నంగవికలఁ జేసిరి కడిమిన్.
| 320
|
ఉ. |
ఇమ్మెయి నాదుముక్కుసెవు లెవ్వఁడు గోసి విరూపఁ జేసె వాఁ
డిమ్మహి నీదుబాణముల నెన్నఁడు గూలుఁ దదీయరక్తపూ
రమ్మును దానిశోణితముఁ ద్రావఁగ నెన్నఁడు గల్గు నాకు నీ
యుమ్మలికంబు దీర్పు మసురోత్తమ తోడ జనించినందుకున్.
| 321
|
చ. |
అన విని దుర్మదుండు ఖరుఁ డంతకుకైవడిఁ బేర్చి క్రుద్ధుఁ డై
విన విన నెట్టి వింత పృథివీస్థలిఁ బుట్టె ఖరాసురానుజ
న్మనుజుఁ డొకండు పట్టుకొని మానము గోల్పడఁ గర్ణనాసముం
దునిమి విరూపఁ జేసె నహ దోర్బల మెంత ఘనంబు వానికిన్.
| 322
|
వ. |
అని పలికి క్రోధమూర్ఛావిశేషంబున మైమఱచి రణలంపటుం డై యన్నిలింప
విమతుండు.
| 323
|
క. |
పదివేలమదగజంబుల, కదుపునకుం గలబలంబు గలరాక్షసులం
బదునలుగురఁ గనుఁగొని కన, లొదవఁగ ని ట్లనియె ఘనరవోగ్రరవమునన్.
| 324
|
ఖరుఁడు శ్రీరామలక్ష్మణులం జంపఁ జతుర్దశరాక్షసులఁ బంపుట
ఉ. |
ఎవ్వరొ మర్త్యు లిద్ద ఱొకయింతియుఁ క్రొవ్వున దండకాటవిన్
దవ్వుల నున్నవారఁట యుదగ్రబలంబునఁ గిట్టి మీర లా
మువ్వురప్రాణము ల్గొనుఁ డమోఘశరంబులఁ జుప్పనాతి తా
నవ్వలఁ దత్తనూరుధిర మంతయు దాహము దీఱఁ గ్రోలెడిన్.
| 325
|
వ. |
మదీయభగిని యగుశూర్పణఖయభిప్రాయం బి ట్లున్నది గావున నమ్మర్త్యుల వ
ధించి మీరు దీని సఫలంబు గావింపుఁ డని దండధరుండునుఁ బోలె నాజ్ఞాపిం
చిన నన్నిశాచరులు వాతప్రేరితవలాహకంబులుంబోలె శూర్పణఖాదర్శిత
|
|
|
మార్గంబున రయంబునం జని పర్ణశాలమధ్యంబున సీతాలక్ష్మణసహితంబుగా
సుఖాసీనుం డై యున్నరామునిం జూచి సముదగ్రతేజుం డగుటవలన వనద్వీ
పంబులు దీప్తవహ్నిం బోలె నమ్మహానుభావునిఁ దేఱి చూడం జాలక నివ్వె
ఱపడి రివ్విధంబున శూర్పణఖాసహితంబుగాఁ జనుదెంచిన క్షుద్రరాక్షసులం
జూచి రాముండు దీప్తతేజుం డైనలక్ష్మణున కి ట్లనియె.
| 326
|
క. |
మనచేత భంగపడి యీ, దనుజాంగన యీరసమునఁ దనవారిని దో
డ్కొని వచ్చె వీరె మనతో, నని సేయఁగ వచ్చి నార లసురులు కంటే.
| 327
|
క. |
ఒక్కముహూర్తము జానకి, నిక్కడఁ గాచికొని యుండు మే నిపుడు సుధా
భుక్కులు మెచ్చఁగ వ్రేల్మిడి, రక్కసులం ద్రుంచివైతుఁ బ్రదరప్రహతిన్.
| 328
|
ఆ. |
అనిన నట్ల కాక యని లక్ష్మణుఁడు నీయ, కొనియె రాముఁ డంతఁ గనకవలయ
చాప మెక్కువెట్టి చటులమౌర్వీనాద, మెరఁగ వారిఁ జూచి యిట్టు లనియె.
| 329
|
ఉ. |
మూలఫలోపజీవులము పుణ్యచరిత్రుల మాజి నంతకుం
బోలుదు మన్నదమ్ములము పుత్రుల మాజికి శస్త్రసంపదల్
గ్రాలుచునుండు మాకు మము రాముఁడు లక్ష్మణుఁ డందు రీ వినీ
లాలకతోడఁ గూడి ముద మారఁ జరింతుము దండకాటవిన్.
| 330
|
క. |
మునులనియోగంబునఁ ద, న్మునికంటకు లైనమి మ్మమోఘాస్త్రముల
న్దునుమాడుటకై యీకాం, చనభూషితకారుకంబు జతనం బయ్యెన్.
| 331
|
ఖరప్రేషితు లగురాక్షసులు రామునితో యుద్ధముఁ జేయుట
ఉ. |
ఇమ్మెయి మాపయిం దొడర నేటికి వచ్చితి రుగ్రభంగి మీ
కిమ్మహి జీవితేచ్ఛ గలదేని తొలంగి చనుండు గానిచోఁ
గ్రమ్మి మదీయహస్తగతకార్ముకముక్తనిశాతబాణపా
తమ్మున నాజిలోఁ దునిమి తప్పక యిప్పుడె తీర్చి పుచ్చెదన్.
| 332
|
చ. |
అన విని యాచతుర్దశనిశాటులు దారుణశూలపాణు లై
ఘనతరకోపవేగమునఁ గన్నుల నిప్పులు రాల రక్తలో
చనుఁ డయి యున్నరాముని విశాలపరాక్రమసోమునిం గనుం
గొని కఠినోక్తి ని ట్లనిరి కోపహుతాశుఁడు ప్రజ్వలింపఁగన్.
| 333
|
చ. |
దనుజకులోత్తముండు రిపుదర్పహరుండు ఖరుండు పంప ని
న్ఘనసమరంబునం దునుమఁ గాఁ జనుదెంచినవార మిందఱిం
జెనకఁగ నీకు నొక్కనికిఁ జెల్లునె యించుకసేపు నీవు మా
మునుమున నిల్చి పోరుము సమున్నతసత్త్వము తెల్ల మయ్యెడిన్.
| 334
|
శా. |
అస్మద్ఘోరకరస్రముక్తపటుశస్త్రాస్త్రమ్ము లొక్కుమ్మడి
న్విస్మేరోద్ధతభంగిఁ దాఁకి తనువు న్భేదింపఁగా దారుణా
పస్మారంబున బీరము న్విడిచి తద్బాణానలజ్వాలలన్
|
|
|
భస్మీభూతుఁడ వయ్యె దీవు విను మీ ప్రాగల్భ్య మిం కేటికిన్.
| 335
|
చ. |
అనుచు మిడుంగుఱుల్ సెదర నందఱు శూలము లొక్కపెట్ట రా
మునిపయి వైవ నమ్మనుజపుంగవుఁ డుగ్రతఁ జాపశింజినీ
ధ్వనులు సెలంగ నన్నిటిని భర్మవిభూషితసాయకంబులన్
దునియలు గాఁగ శూలములఁ ద్రుంచి ధరం బడ నేసె నుగ్రతన్.
| 336
|
ఉ. |
అంతటఁ బోక యద్దనుజు లంతకులుం బలెఁ బేర్చి జానకీ
కాంతునిమీఁద నుగ్రగతి గ్రావము లొక్కట వీచి వైవ న
త్యంతరయంబున న్ఘనశరాహతి నాయుపలప్రకాండ మిం
తింతలు తున్క లై వెస మహీస్థలి రాలఁగ నేసి వ్రేల్మిడిన్.
| 337
|
శ్రీరాముఁడు ఖరప్రేషితు లైనచతుర్దశరాక్షసులనుం జంపుట
శా. |
జ్యావల్లి న్సవరించి దారుణభుజంగాకారనారాచముల్
ప్రావీణ్యంబునఁ గూర్చి శీఘ్రగతి శుంభద్విక్రమారంభుఁ డై
దేవేంద్రుండు నిశాతవజ్రములరీతి న్శుద్ధలక్ష్యత్వవి
ద్యావైదుష్యము మీఱ నేసె వెస నాదైత్యప్రతానంబుపై.
| 338
|
ఉ. |
ఆరఘునాథుఁ డీపగిది నద్భుతదోర్బల మంత కంతకున్
మీఱఁ జతుర్దశాసురులమీఁదఁ జతుర్దశసాయకంబులన్
దారుణభంగి నేయ నవి తద్ఘనవక్షము లుచ్చి వీఁపులన్
ఘోరరవంబుగా వెడలి క్షోణితలంబున వ్రాలె నెంతయున్.
| 339
|
క. |
ఇమ్మెయి రఘుపతిశరపా, తమ్మున నయ్యసురవరులు దారుణగతి మూ
లమ్ములు వోయినఘనవృ, క్షమ్ములక్రియ ధరణిఁ గూలి చచ్చిరి వరుసన్.
| 340
|
శూర్పణఖ మరల ఖరునికడ కేగుట
ఉ. |
అప్పుడు చుప్పనాతి వెస నంతకగోచరు లైనదైత్యులం
దప్పక చూచి భీతి మదిఁ దట్టుకొనంగ విఘూర్ణమాన యై
యుప్పరవీది నార్చుచు రయోద్ధతి నేగి ఖరాంతికంబునన్
దెప్పర మైనశోకమున దీనత వ్రాలె విషణ్ణరూప యై.
| 341
|
వ. |
ఇట్లు కించిత్సంతుష్కశోణిత యై నిర్యాససహిత యైనసల్లకియునుంబోలెఁ దన
మ్రోలం బడినదాని సర్వరాక్షసవినాశంబుకొఱకు సమాగత యైనదాని శూ
ర్పణఖ నవలోకించి ఖరుండు క్రోధంబున ని ట్లనియె.
| 342
|
క. |
నీకుఁ బ్రియంబుగ నిపు డ, స్తోకభుజావిక్రమోద్ధతుల దనుజుల నే
భీకరులఁ బంపితిని నీ, వీకైవడిఁ బరితపించె దేటికి మరలన్.
| 343
|
క. |
భక్తులు నా కనిశం బను, రక్తులు సంగరమునం దరాతులఁ గడవ
న్శక్తులు మనపదునలుగురు, నక్తంచరు లేల చుప్పనాతిరొ వగవన్.
| 344
|
ఉ. |
నాకకులద్విపేంద్రమృగనాథుఁ డనం దగు నేను గల్గఁగా
|
|
|
నీ కిటు దుఃఖ మొందఁ దగునే యహికైవడి వేష్టితాంగి వై
శోకము మోహము న్విడిచి సుస్థితినిం దగ వైన కార్యము
న్నాకు వినంగఁ జెప్పుము ఘనంబుగ నిప్పుడె దీర్చి పుచ్చెదన్.
| 345
|
ఉ. |
నా విని చుప్పనాతి నయనంబుల నశ్రులు గ్రమ్ముదేర ర
క్షోవిభుఁ జూచి యేమి పురికొల్పెద సంహృతకర్ణనాస నై
యీవిధి సిగ్గుమాలి యొకహీనమనుష్యునిచేత నీకడ
న్లావని చెప్పఁ బా లయితి నాకరిపూత్తమ సారెసారెకున్.
| 346
|
చ. |
తొలుత నమోఘవీర్యులఁ జతుర్దశరాక్షసవీరుల న్సము
జ్జ్వలగతి నీవు పంపఁ జని వారలు రాముని రౌద్రమూర్తు లై
చలమునఁ గిట్టి వాఁడి గలశస్త్రపరంపర లొక్కరీతిగాఁ
గులగిరిమీఁద మేఘములు క్రూరతరాశనులట్ల గప్పినన్.
| 347
|
చ. |
అలిగి మహోగ్రకోపమున నక్షియుగంబునఁ దామ్రదీధితు
ల్సెలఁగఁగ నారఘూత్తముఁ డశేషచతుర్దశదైత్యవర్గమున్
జ్వలితచతుర్దశాస్త్రములఁ జావఁగ నేసిన వారు పెద్దకొం
డలక్రియ ధాత్రిఁ గూలిరి కడ ల్వడి మ్రోయఁగ నేమి చెప్పుదున్.
| 348
|
శూర్పణఖ ఖరునితో రాముని ప్రభావంబుఁ జెప్పి దుఃఖించుట
క. |
ఈకరణి నొక్కవ్రేల్మిడి, నాకారులఁ జంపినట్టి నరనాథునియ
స్తోకబలోద్ధతిఁ జూచి వి, తాకున భయ మొంది యున్నదాన జితారీ.
| 349
|
క. |
దానవులనిధనముం గని, యే నాతనిమ్రోల నిలువ కెంతయు భీతి
న్మానక నిను శరణము గొన దీనావన, మరల నేగుదెంచితి నిటకున్.
| 350
|
మ. |
శరసంధానము సేయుచోఁ దివియుచోఁ జాపంబు సారించుచో
సరిమేనం గుఱి వెట్టుచోఁ గడఁగి ప్రత్యాలీఢపాదస్థుఁ డై
పరుషోగ్రాస్త్రము లేయుచోఁ బరులదోఃప్రాబల్యము ల్మాన్చుచో
ఖరుఁడా యాతనినేర్పు నెవ్వరియెడం గానం ద్రిలోకంబులన్.
| 351
|
క. |
ఇక్కైవడిఁ బదునలువుర, రక్కసులం జంపి పిదప రాముఁడు నాతో
ముక్కిఁడిరక్కసి తక్కిన, రక్కసులం గొనుచు వేగ రమ్మని పలికెన్.
| 352
|
క. |
ఆమాట చెవికి సోఁకిన, హామిక వోనాడి నేఁటి కసురులసత్త్వం
బీమాడ్కి నవ్వు లాయెఁ గ, దా మనుజున కనుచుఁ జిత్త మలమట నొందెన్.
| 353
|
క. |
నీ కొకని కేల లోకా,నీకంబుల కైన వానినిరుపమశౌర్యో
ద్రేకం బొకించు కైనను, బ్రాకటధృతియుక్తి సైపరా దసురేంద్రా.
| 354
|
చ. |
పలుకులు వేయు నేల రిపుభంజన యిప్పుడె వానిమీఁదికిం
జలమున నెత్తి పోయి పటుసాహసవిక్రమరేఖ దోఁపఁగా
బలువిశిఖంబులం బొదివి ప్రాణముఁ బాపినఁ గాని నీకు ని
|
|
|
శ్చల మగుసత్త్వము న్యశ మసహ్యపరాక్రమ ముర్వి నిల్చునే.
| 355
|
చ. |
దనుజవరేణ్య నాకుఁ బ్రమదం బొనగూర్పఁ దలంచి నేఁడు నీ
పనుపున నేగి రాక్షసు లపారబలుం డగువానిశక్తిచే
ననిమొనఁ జచ్చి రట్టిరిపు నంతము నొందఁగఁ జేయ వేని వీఁ
డనిశము భృత్యఘాతుకుఁ డటంచు నిశాటులు నిన్ను దూఱరే.
| 356
|
చ. |
చెలియలిముక్కునుం జెవు లసిప్రహతి న్దెగఁ గోసి భృత్యుల
న్బలియురఁ గొందఱం దునిమి బాహుబలోద్ధతిఁ గ్రాలుచున్నయా
తులువను బట్టి బల్గతుల దోర్బలశక్తి వధించు టుండనీ
పిలిచినఁ బోవకున్న కడుఁబెం పొడఁగూడునె శౌర్యశాలికిన్.
| 357
|
ఉ. |
రాక్షసకంటకుం డయినరాముని నాతనితమ్మునిం జకో
రాక్షిని జానకిం దునిమి యన్నరొ నాపగఁ దీర్పు మింతకు
న్దక్షతఁ జాలవేని ఖరదానవశేఖర నీవు చూడఁగా
నీక్షణమందె చత్తు మన నేటి కిఁక న్సరివారు నవ్వఁగన్.
| 358
|
చ. |
అమరవిరోధి యేపగిది నైన రణంబునఁ గిట్టి యన్నరా
ధముని సతీసహోదరయుతంబుగఁ జంపక యుంటివేని ని
క్కముగ ధరిత్రిలోన మనకర్బురవంశము నెల్ల నేకకా
లమున వధించు నింతకుఁ దలంచినవాఁ డిఁక నంతఁ జేయఁడే.
| 359
|
వ. |
మఱియు రణశిరంబున రాముని నెదిరించి పోరాడునట్టివీరుండు ముల్లోకం
బులం దెవ్వండును లేఁడు నీ వల్పవీర్యుండవు నిస్సత్వుండవు మిథ్యారోపితవిక్ర
ముండవు శూరమాని వని యూహించెద రామునకుం గలతేజంబును శక్తి
యు నీకుం గలిగెనేని దండకారణ్యవాసి యైనయతని జయింపు మంతకుం
జాలవేని బంధుసహితంబుగా జనస్థానంబు విడిచి యొండుకడకుం జను
మిచ్చట నుంటివేని రామతేజోభిభూతుండ వై రయంబున నశింపంగలవాఁడ
వారాముండు తేజస్సమాయుక్తుండు వానితమ్ముండు మహావీర్యుండు వారిరు
వురు వహ్నిమారుతకల్పు లై వెలుంగుచున్నవారు.
| 360
|
క. |
అని ఖరునకు మది రోసము, జనియింపఁగ నిట్లు పెక్కుచందంబుల శూ
ర్పణఖ పురికొల్పి హ స్తం, బున నుదరము మోఁదికొనుచు బోరన నేడ్చెన్.
| 361
|
క. |
ఈరీతి శూర్పణఖచేఁ, బ్రేరితుఁ డై ఖరుఁడు భయదవేషంబున నా
కారులమధ్యంబున దు, ర్వారోద్ధతి దానిఁ జూచి గ్రమ్మఱఁ బలికెన్.
| 362
|
ఖరుఁడు తాను రామాదులఁ జంపెద నని శూర్పణఖ నూరార్చుట
చ. |
భవదవమానసంజనితబంధురరోషము నెమ్మనంబునం
దవిలి బహుప్రకారములఁ దాల్పఁగ నాకు నశక్య మయ్యె నా
సవిధరుఁ డైన నాయెదుటఁ బ్రస్తుతి కెక్కఁడు హీనమానవ
|
|
|
స్తవము సహింప నోపుదునె నారెకుఁ గర్ణగఠోరభంగిగన్.
| 363
|
ఉ. |
ఇంత దురంత చింత పడ నేటికి రాముని నానుజంబుగా
నంతకసాదనంబునకు నంపెద నొక్కముహూర్తమాత్ర మీ
చింత దొఱంగి యుండు మటు చేసినపిమ్మట నాజిభూమిలోఁ
బంతము మీఱఁ దద్రుధిరపానము జేసెదు గాక రాక్షసీ.
| 364
|
ఖరుఁడు యుద్ధమున కంతయు సన్నద్ధము చేయు మని యాజ్ఞాపించుట
వ. |
మఱియు నారాముండు స్వకీయంబు లైనవికరణాదిదుష్కృతంబులచేత
హతుం డై యున్నవాఁ డిప్పుడు మద్విశిఖతాడితుం డై ప్రాణంబులు విడువం
గలఁడు శక్రాదిదిగీశులకు హృదయభల్లం బైనయేను మర్త్యమాత్రుం డైనరా
ముని సరకు గొందునె మత్ప్రబలపరాక్రమప్రకారంబు నీవె విలోకించెద వని
పలికి రణోత్సాహదుర్ధరుం డగుఖరుండు వైరిభీషణుం డైనదూషణుం డనుసే
నాపతిం జూచి మచ్చిత్తానువర్తులును భీమవేగులును సమరానివర్తులును నీలజీ
మూతవర్ణులును ఘోరదర్శనులును గ్రూరకర్ములును లోకహింసావిహారులును
సముదగ్రతేజులును శార్దూలదర్పులును గంభీరాట్టహాసులును భీషణఘోషులు
ను తేజోబలసముదీర్ణులును మహాసత్యవంతులును దుర్నివారులు నగుచతు
ర్దశసహస్రరక్షోవీరుల యుద్ధంబునకు సన్నద్ధులం గావింపుము మఱియు సర్వా
యుధపరిష్కృతంబును మేరుశిఖరాకారంబును మణికాంచనభూషితంబు నగు
రథంబు జవనాశ్వంబులం బూన్చి కట్టాయితంబు సేయింపుము దీర్ఘంబు లైన
చాపంబులును దిగ్మంబు లైసశరంబులును దృఢంబు లైనతూణీరంబులును
నచ్ఛిద్రంబు లైనతనుత్రాణంబులును జిత్రంబు లైనఖడ్గంబులును నానావిధశక్తు
లును సుందరస్యందనోపరిభాగంబునం బెట్టింపుము రాక్షసకంటకుం డైనరా
ముని వధించుటకు మహాత్ము లగుపౌలస్త్యులలోన నేను బ్రథమశూరుండ నై
తల మిగిలి సంగ్రామంబునకుం జనియెద నని పలికిన నతండు తద్వచనప్రకారం
బున సర్వంబును సమకట్టి తానును సమరసముత్సాహవిశేషంబునఁ గట్టాయి
తం బై పొడసూపిన.
| 365
|
సీ. |
శబళాశ్వయుక్తంబు చారువైడూర్యకూబర మసంబాధంబు భర్మశిఖరి
శిఖరసంకాశంబు చిత్రభానునిభంబు చటులహేమరథాంగసంయుతంబు
సంతతచారుకాంచనభూషణయుతంబు సౌవర్ణకింకిణీసంకులంబు
రణితఘంటాసుందరము ధ్వజనిస్త్రింశసంపన్న మగుఘనస్యందనంబు
|
|
తే. |
నెక్కి శౌర్యంబు దిక్కులఁ బిక్కటిల్లఁ, గదనసముచితభేరిభాంకార మడర
సమరదోహలి యై జనస్థానసీమ, గదలెఁ దేజోజితప్రభాకరుఁడు ఖరుఁడు.
| 366
|
ఖరుఁడు సైన్యముతో జనస్థానమునుండి వెడలుట
సీ. |
సంగరరంగానుషంగశాత్రవనేత్రభీషణుం డన నొప్పుదూషణుండు
|
|
|
ప్రళయజీమూతగర్జాసముజ్జృంభణభాషణుం డన నొప్పుదూషణుండు
సంగ్రామములయందు శక్రాదిభీకరఘోషణుం డన నొప్పుదూషణుండు
సకలనిశాటవంశప్రదీపకశిరోభూషణుం డన నొప్పుదూషణుండు
|
|
ఆ. |
ఖరునివెంటఁ జనియె ఖరములఁ బూన్చిన, యరద మెక్కి దిక్కు లదరఁ బ్రళయ
కాలవారిధరముకైవడి నార్చుచు, దితిజసైన్యవదనతిలక మగుచు.
| 367
|
వ. |
మఱియు గదాముసలముద్గరభిండివాలకరవాలతోమరపరశుపట్టిసప్రాససరశ్వథ
చక్రశూలకుంతక్షురికాదినానాసాధనంబులం గైసేసి వెల్లి విరిసిన మహాస
ముద్రంబుచందంబున నుప్పొంగుచుఁ బరస్పరవీరాలాపంబుల నుత్సహిం
చుచు రోదోంతరాళంబు నిండ నార్చుచుఁ జతుర్దశసహస్రసంఖ్యాతం బగు
ఘోరవర్మాయుధధ్వజం బైనరాక్షససైన్యంబు సమరోత్సాహంబున దూష
ణునివెనువెంటం గదలె నప్పుడు తదీయచరణక్షుణ్ణసముద్ధూతమహీపరాగంబు
నానావిధనాదంబులతోఁ గూడ గగనంబున కెగసె నివ్విధంబున ఖరుండు సేనా
మంత్రిదండనాథపురస్సరంబుగా రణంబునకు వెడలి చిత్రితమత్స్యపుష్పద్రుమ
శైలచంద్రసూర్యకాంచనపక్షిసంఘతారాగణాభిసంవృతం బైనరథం బారో
హించి సూతు నాలోకించి రథంబు రయంబునం దోలు మని యాజ్ఞాపిం
చిన నతం డతనిచిత్తంబుకొలఁదిఁ బగ్గంబులు వదిలి వాయుజవంబు గలఘోట
కంబుల దాఁటించి తనసారథ్యనైపుణ్యంబున రథంబుఁ దోలిన.
| 368
|
సీ. |
కాంచననేమిసంఘట్టనంబునఁ ద్రోవఁ బెనుగట్టుశిల లెల్లఁ బిండి గాఁగఁ
గనకధ్వజాగ్రసంఘటితపటప్రభంజనఘాతమున మేఘసమితి పాఱఁ
జటులఘోటకఖురపుటఘట్టనోద్ధూతధరణీపరాగ మంబరము నిండఁ
గనకఘంటాఘణఘణనినాదంబులు దిక్కరికర్ణము ల్వ్రక్కలింప
|
|
తే. |
గగనమునఁ జనురవిశతాంగంబుపగిది, లోచనంబుల కతిదుర్విలోక మగుచు
శీఘ్రభరమున శేషుండు శిరము వంప, గాఢరయమునఁ జనుచుండె ఖరునిరథము.
| 369
|
ఖరుని సైన్యములో దుర్నిమిత్తము లగపడుట
వ. |
ఇవ్విధంబునం జనుసమయంబున ఖరాసురున కరిష్టసూచకంబుగా గర్దభధూ
సరంబు లైనమేఘంబులు రక్తవర్షంబు గురిసె దివాకరమండలంబుచుట్టు రుధిర
పర్యంతం బై యలాతచక్రప్రతిమం బై నీలపరివేషంబు దోఁచె రథంబునం
బూన్చినహయంబులు మహావేగంబునం బోవుచు నాకస్మికంబుగా ముందఱికి
మ్రొగ్గతిలం బడియె సముచితహేమదండం బైనధ్వజంబు నాక్రమించి
మహాకాయం బగుగృధ్రంబు దారుణప్రకారంబునం గనుపట్టె జనస్థానసమీ
పంబున మాంసాదంబు లగుఖగమృగంబులు విస్వరంబుగా ఖరస్వనంబులు
|
|
|
సేయుచుండెఁ బ్రభిన్నగిరిసంకాశంబు లై శోణితతోయధరంబు లై భీమంబులై
వలాహకంబు లాకాశంబు నిరవకాశంబు గావించె నుత్పాతవశంబువలన జాజ్వ
ల్యమానంబు లైనదిశలయందు ఘోరంబుగాఁ దిమిరంబు గవిసెఁ బ్రాతఃకా
లంబునందు గగనంబు సంధ్యాకాలంబునందుం బోలె క్షతజార్ద్రవర్ణాభం బై
యుండిఁ గంకగోమాయుగృధ్రంబులు ఖరున కభిముఖంబుగా నఱచుచుండె
శివాగణంబులు రణంబునం దపజయంబుఁ దెల్పుచు దుర్నిమిత్తదృష్టాంత
భూతంబు లై జ్వాలోద్గారిముఖంబులచేత బలంబున కభిముఖంబుగా రోద
నంబు సేయుచుండె సూర్యునిసమీపంబునఁ బరిఘసన్నికాశంబు లైన
కబంధంబులు దోఁచె నపర్వకాలంబునందు స్వర్భానుండు భానునిం బరిగ్ర
హించెఁ బ్రతికూలంబు లై వాతంబులు సుడిసె దివాకరుండు నిష్ప్రభుం
డయ్యెఁ బట్టపవలు ఖద్యోతసన్నిభంబు లై చుక్కలు పొడిచె లీనమీన
విహంగమంబు లై కమలాకరంబులు చూపట్టె విగతపుష్పపత్రఫలంబు లై పాద
పంబులు మ్రోడుపడి యుండె వాయువులు లేక జలధరధూసరం బైనరజంబు
సుడిసె మేఘంబులు లేక పిడుగులు పడియె శారికలు వీచి కూచి యని యసుఖ
కరశబ్దంబులు పలికె సాగరపర్వతకాననసహితంబుగా మహీచక్రంబు చలించి
న ట్లయ్యె రథస్థుం డైనఖరునిసవ్యభుజంబు చలించెఁ గంఠనాదంబు హీనం
బయ్యె నేత్రంబుల నశ్రువులు గ్రమ్మె లలాటంబునందు వేదన వొడమె నిట్టి
మహోత్పాతంబు లనేకంబులు వొడమినం జూచి ఖరుండు ప్రహసించుచు
రాక్షసుల నవలోకించి యి ట్లనియె.
| 370
|
ఖరుఁడు దుర్నిమిత్తంబులఁ జూచి ప్రహసించుట
క. |
చూచితిరె మన కమంగళ, సూచకములు పెక్కుగతులఁ జూడ్కికి వ్రేఁ గై
తోఁచుచు నున్నవి సర్వత, మీచరవరులార దుర్నిమిత్తము లైనన్.
| 371
|
క. |
కడిమి గలశూరవరునకు, మిడుతశకునము లివి యడ్డ మే పగతునిపైఁ
బడి తునుము టంతె కా కిటు, పిడుగున కొకవారశూల పృథివిం గలదే.
| 372
|
క. |
నిక్కముగ నేను గినిసిన, నొక్కముహూర్తంబులోన నురుబాణములం
జుక్కల నిలఁ బడ నేసెదఁ, దక్కక మృత్యువును బట్టి తల ఖండింతున్.
| 373
|
క. |
వీర్యోత్సిక్తుం డగురఘు, వర్యునిఁ దదనుజునిఁ బట్టి వరబాణములన్
వీర్యమునఁ ద్రుంప కిటకు న, వార్యగతి రిత్త మగిడి వత్తునా పెలుచన్.
| 374
|
తే. |
పార్థివోత్తమసుతులవిపర్యయంబు, కడిమి నెద్దానికొఱకు సంఘటిత మయ్యె
నట్టిభగిని సమాహతు లైనవారి, రుధిరపూరంబు తమి దీఱఁ గ్రోలుఁ గాక.
| 375
|
క. |
దురమున ము న్నెన్నఁడు నొక, పరాజయ మెఱుంగనట్టి ప్రబలుఁడ నెందుం
గర మేను బలికి నంతయుఁ, దిర మగు నిత్తెఱఁగు మీకుఁ దెల్లము గాదే.
| 376
|
క. |
దారుణకులిశముఁ గైకొని, యైరావణ మెక్కి సురబలాన్వితుఁ డై జం
|
|
|
భారి యనికిఁ బఱతెంచిన, వారక వధియింతు నెంతవారలు మర్త్యుల్.
| 377
|
వ. |
అని యిట్లు దురాగ్రహంబునం బలికిన నాఖరాసురునివాక్యంబులు విని మృత్యు
పాశావపాశితు లై రాక్షససైన్యయోధులు సంతోషవిశేషంబున నతనిం
బ్రశంసించి రాసమయంబున శ్యేనగామియుఁ బృథుగ్రీవుండును విహంగముం
డును దుర్జయుండును గరవీరాక్షుండును బరుషుండును గాలకార్ముకుండును
మేఘమాలియు మహామాలియు సర్పాస్యుండును రుధిరాశనుండు ననుపన్ని
ద్దఱు మహామాత్యులు ఖరునిం జుట్టుముట్టి యగ్రభాగంబునం జనుచుండిరి
మహాకపాలుండును స్థూలాక్షుండును బ్రమాథియుఁ ద్రిశిరుండు ననునలువురు
సేనానాయకులు దూషణునిపిఱుందదెసం జనుచుండి రిత్తెఱంగునం గూడుకొని
రాక్షసవీర్యసైన్యంబు భీమవేగంబున గ్రహమండలంబు చంద్రసూర్యులంబోలె
రామలక్ష్మణులం గదియ నడిచె నిట్లు దానవశేఖరుం డగుఖరుండు రథారూఢుం
డై మహోగ్రసైన్యసమేతుం డై కోలాహలబహులంబుగా రణార్థంబు చను
దెంచుచుండ నప్పుడు రాక్షసవినాశనార్థంబు సముత్పన్నంబు లైనదారుణమహొ
త్పాతంబు లన్నియు విలోకించి రాముండు లక్ష్మణున కి ట్లనియె.
| 378
|
రాముఁడు రాక్షసనాశకరంబు లగునిమిత్తంబుల లక్ష్మణునకుఁ జూపుట
చ. |
అసదృశ మై మహాభ్రము మహాధ్వని సేయుచు ఘోరభంగి నా
కసమున నెత్తురు ల్గురియఁగాఁ దొడఁగె మఱి భూనభంబులం
దు సకలదుర్నిమిత్తములు దోఁచుచు నున్నవి యిన్నియుం గరం
బసురవినాశసూచకము లై కనుపట్టెడిఁ గంటె లక్ష్మణా.
| 379
|
మ. |
కనకాంశుచ్ఛట లీను మచ్చితశరౌఘంబుల్ సధూమంబు లై
ఘనకోదండములుం జలించుచును సంగ్రామప్రహర్షంబుతో
ననువై యున్నవి నాదుదక్షిణకరం బాసక్తితో సారెకున్
ఘనభంగిన్ స్ఫురణంబుచే మన కసంఖ్యక్షేమముం దెల్పెడిన్.
| 380
|
క. |
వనచరసౌమ్యఖగంబులు, మనమ్రోల ననేకగతులు మన కభయంబున్
దనుజులకు వినాశంబును, మునుకొని దెల్పుచుఁ గరంబు మ్రోసెడు వింటే.
| 381
|
చ. |
అని యొనరింపఁబోవుజనులందు గతాయువు లైనవారి యా
ననముల నిష్ప్రభత్వము గనంబడు నిక్కువ మెన్ని చూచినన్
మన కది లేదు నీముఖము మానుగ సుప్రభ మై ప్రసన్న మై
గన నగుచున్న ద ట్లగుటఁ గయ్యమున న్విజయంబు గల్గెడిన్.
| 382
|
క. |
మఱియు ననేకవిధంబులఁ, దఱచుగ నెచ్చోటఁ గన్న దారుణతరసం
గరపదములు గనుపట్టెడు, వరగుణ మన కిపుడు పో రవశ్యము గలుగున్.
| 383
|
క. |
మనకు శుభనిమిత్తము లిపు, డనేకములు దోఁచుచున్న వటు గాన రణం
బునఁ బగతులకుఁ బరాజయ, మనఘాత్మక మనకు విజయ మగు నిక్కముగన్.
| 384
|
క. |
దానవవీరుల సింహ, ధ్వానంబులు భూరిదండతాడితభేరీ
ధ్వానంబులు శ్రుతిభయసం, ధానములై మ్రోయఁ దొడఁగెఁ దమ్ముఁడ వింటే.
| 385
|
వ. |
సంగ్రామంబునం దాపద దొలంగం ద్రోచి జయంబుఁ గోరునట్టిపండితునిచేత
భావికాలసంభవ్యనిష్టంబునకుఁ బరిహారంబు కర్తవ్యంబు కావున.
| 386
|
రాముఁడు సీతతో గిరిగుహలో నుండు మని లక్ష్మణున కాజ్ఞాపించుట
ఆ. |
ఎంత శూరుఁ డైన నింతితోఁ గూడి సం, గరము సేయరాదు కడఁగి నీవు
సీతతోడఁ గూడి శిఖరిగహ్వర మాశ్ర, యించి కాని యుండు మింపుతోడ.
| 387
|
క. |
కాదని మాఱాడిన మ, త్పాదంబుల యాన యచటఁ దడయక త్వరలో
వైదేహితోడ నుండుము, పాదపసంఘాతయుక్తపర్వతగుహలోన్.
| 388
|
క. |
అనఘా నీవును శూరుఁడ, వనుపమబలయుతుఁడ వాజి నరులఁ గడిమిమైఁ
దునుమఁగ దక్షుఁడ వైనను, దనుజుల నే నొకఁడ చంపఁ దలఁచితి బుద్ధిన్.
| 389
|
వ. |
అని నీయకొల్పిన నాలక్ష్మణుండు తత్క్షణంబ శరచాపంబులు గైకొని వైదేహీ
సహితంబుగా దుర్గమం బైరగిరికందరంబు నాశ్రయించె నంత రాముండు
లక్ష్మణునిచేత మిక్కిలి యుక్తకార్యంబు కృతం బయ్యె నని పలికి వహ్నిసంకా
శం బైనదివ్యకవచంబు దొడిగి తిమిరంబునందు విగతధూముం డైనవైశ్వా
నరునిచందంబునం దేజరిల్లుచు మహనీయశరశరాసనంబులు గైకొని దిగంత
రాళంబు నిండ గుణప్రణాదంబు సేయుచు యుద్ధసన్నద్ధుం డై రాక్షసుల
రాక కెదురు సూచుచుండె నప్పుడు మహర్షిదేవగంధర్వసిద్ధసాధ్యులు దివ్యవి
మానాధిరూఢు లై సంగ్రామదర్శనకుతూహలంబునం జనుదెంచి యంబరంబున
నుండి పరస్పరంబు శుభాలాపంబులు పల్కుచు గోబ్రాహ్మణులకు శుభం బగుం
గాక సర్వలోకంబులు భద్రవంతంబు లై యుండుఁ గాక రాముండు విష్ణువు
సర్వాసురులంబోలె సర్వరాక్షసుల జయించి విజయలక్ష్మి నధిగమించుంగాక యని
యీదృశంబు లైనభద్రవాక్యంబుల నమోఘంబుగా నాశీర్వదించుచుఁ
బెక్కండ్రరాక్షసులతోడ నొక్కరాముం డెవ్విధంబున సంగ్రామంబుఁ గావిం
చునో యని జాతకౌతూహలు లై చూచుచుండిరి మఱియు సంగ్రామంబునకు
సన్నద్ధుం డైనరాముని రౌద్రాకారంబు విలోకించి సర్వభూతంబులు భయ
భ్రాంతచిత్తంబు లై యుండె నప్పు డమ్మహానుభావుని యమానుషం బైన
రూపంబు క్రుద్ధుం డగువిలయకాలరుద్రునిరూపంబుకైవడి నతిభయంకరం బై
యుండె నంత ఘోరవర్మాయుధధ్వజంబును గంభీరనిర్హ్రాదంబు నగు రాక్ష
సానీకంబు కదియ వచ్చె నపుడు.
| 390
|
రాక్షససైన్యంబు రామునిఁ జేర వచ్చుట
చ. |
దనుజులసింహనాదము లుదగ్రచలద్రథనేమిఘట్టన
స్వనములు వీరహుంకృతులు చాపరణద్గుణటంకృతు ల్పట
|
|
|
ధ్వనులును భేరిభాంకృతు లవార్యము లై యొకరీతి నమ్మహా
వనమున నుండి పె ల్లెసఁగె వన్యమృగంబులు భీతిఁ బాఱఁగన్.
| 391
|
వ. |
మఱియు నమ్మహాసైన్యంబునందు.
| 392
|
చ. |
పలుమఱు బంటుపంతములఁ బల్కెడువారు నిజప్రతిజ్ఞలం
దెలిపెడువారు శూర్పణఖ దెల్పినకైవడి రాముచందము
ల్గలయఁగఁ జూచువా రసురకంటకు నేనె వధింతు మీరు ని
శ్చలముగఁ జూచుచుండుఁ డని చాటెడువారలు నైరి యందఱున్.
| 393
|
వ. |
ఇట్లు బహుప్రకారంబుల వీరాలాపంబు లాడుచు వెల్లి విరిసినమహాసముద్రం
బుపోలిక ననివార్యం బై ఘూర్ణిల్లుచు సంరంభంబునం గదియ నేతెంచి.
| 394
|
క. |
ఆరక్షస్సైన్యము గం, భీరుని ధృతచాపముఖ్యపృథుసాధనునిన్
ధీరుని నతిశూరుని రఘు, వీరునిఁ గనుఁగొనియె విమతవీక్షణభయదున్.
| 395
|
క. |
ఆరామవిభుండును దు, ర్వారంబై వనధిమాడ్కి వచ్చెడువిలస
ద్దారుణరక్షస్సైన్యము, నారక్తప్రేక్షణముల నటు చూచి వెసన్.
| 396
|
క. |
ఘోరం బగుకార్ముకమున, సారం బగునారిఁ గూర్చి చటులనిషంగ
ద్వారంబువలన శరము ల, పారంబుగఁ దీసి కూర్చి బంధురభంగిన్.
| 397
|
క. |
దనుజవధార్థము క్రోధం, బనువుగ నంగీకరించి యల కాలహుతా
శనుక్రియ దుష్ప్రేక్షుం డై, పెనుపుగ వనదేవతలకు భీతి నొసఁగుచున్.
| 398
|
క. |
దక్షమఖహరణసమయ, ప్రేక్షితుఁ డగుశూలపాణిపెంపున రఘుహ
ర్యక్షుఁడు రాక్షసగణవధ, దీక్షితుఁ డై యొప్పెఁ దీవ్రతేజస్ఫూర్తిన్.
| 399
|
చ. |
దశరథనందనుం డటు లుదగ్రతరస్ఫుటభీషణాకృతి
న్దశదిశలందుఁ దీవ్ర మగుదారుణతేజము పిక్కటిల్లఁ గ్రూ
రశమనుకైవడి న్రణశిరంబున నుండఁగఁ జూచి సర్వభూ
తసముదయం బపూర్వజనితం బగుసాధ్వస మొందె నత్తఱిన్.
| 400
|
తే. |
కారుకధ్వజభూషణకాండచిత్ర, వర్మములచేత నపుడు దుర్వారనిర్ణ
రారిసైన్యము సూర్యోదయంబునందు, నీలఘనమండలముభంగిఁ గ్రాలుచుండె.
| 401
|
రాక్షసవీరులు రామునిమీఁద శస్త్రంబులం బ్రయోగించుట
వ. |
ఇట్లు మండలీకృతకోదండుం డై నిజతేజోజాలంబుల శాత్రవనేత్రంబులకు మిఱు
మిట్లు గొలుపుచున్నరామునిఁ బరివారసహితుం డై దవ్వులం జూచి ఖరుండు
సమధిజ్యధన్వుం డై గుణప్రణాదంబు సేయుచు రామున కభిముఖంబుగా రథంబుఁ
దోలు మని సూతు నాజ్ఞాపించిన నతండు తద్వచనానురూపంబుగా రయంబునం
దేరు దోలిన నతనిం బరివేష్టించి కాలజీమూతంబులకరణి గర్జించుచు రాక్షసు
లందఱు నేన నేన రాముని జయించెద నని బిరుదులు పలుకుచుండి రిట్లు ఖరుం
డు యాతుధానమధ్యంబున రథస్థుం డై తారాగణమధ్యంబునం బొల్చులోహి
|
|
|
తాంగునిచందంబున నొప్పుచుఁ దీవ్రం బగుబాణసహస్రంబున రణదుర్జయుం
డగురామునిం బ్రహరించి నింగి ఘూర్ణిల్ల సింహనాదంబుఁ జేసె నంత భీమకర్ము
లగురక్షోవీరులు నిరుపమానతేజుం డగురామునిం జుట్టుముట్టి నిశితంబు లైన
గదాశూలపరిఘపట్టిసముసలముద్గరప్రాసకరవాలభిండికాలకుంతాదినానావిధ
సాధనంబులం బ్రహరించుచు నీలవలాహకంబులభంగి మహానాదంబులు గావిం
చిరి మఱియు గజారోహకులు మదపుటేనుంగుల ఢీకొలిపి నిశాతతోమరంబుల
నంకుశంబులం బొడిచిరి రథికులు నానావిధసాయకంబులఁ బ్రయోగించిరి సాదులు
హయంబుల దుమికించి నిస్త్రింశంబు లడరించి రిట్లు పెక్కండ్రురక్కసు లుక్కు
మిగిలి పెక్కువిధంబుల నక్కజంబుగా శస్త్రాస్త్రపరంపరలం గప్పిన నీలజీమూ
తంబులు గురియుకరకాశనివర్షధారలకుం జలింపనిపర్వతంబుకైవడి రాముండు
సుస్థిరుం డై యాదారుణప్రహరణంబులచేత భిన్నగాత్రుం డయ్యును బ్రదీప్తాశని
నిపాతంబులచేత వ్యధికంబు గానిమహాచలంబుకరణి వ్యధితుండు గాక సాగరంబు
నదీసంఘంబులంబోలె రాక్షసప్రయుక్తనానావిధశస్త్రాస్త్రనిచయంబుల నిజవిశి
ఖంబులచేతం బ్రతిగ్రహించి తదీయబాణక్షతసంజాతరక్తధారాస్నపితదేహుం
డై సంధ్యాభ్రపరివృతుం డైనసహస్రకరునిచందంబునం దేజరిల్లుచుండె నప్పు
డనేకరాక్షసులచేతఁ బొదువంబడినరామభద్రు నొక్కని విలోకించి దేవగంధర్వ
సిద్ధసాధ్యపరమర్షులు విషాదంబు నొంది రంత.
| 402
|
రాముఁడు రాక్షసులమీఁద నానావిధబాణంబులఁ బ్రయోగించుట
శా. |
ఆరాజాన్వయకుంజరుం డపుడు ప్రత్యాలీఢపాదస్థుఁ డై
ఘోరప్రక్రియ మండలీకృతచలత్కోదండుఁ డై చాపవి
ద్యారూఢత్వము గానుపింపఁగ రణన్యాయైకదక్షత్వ మే
పారం గాంచనపుంఖకాండములఁ బొల్పారంగ నేసె న్వడిన్.
| 403
|
ఉ. |
చాపము శక్రచాపముగఁ జండగుణధ్వని గర్జితంబుగా
దీపితసన్మణీవలయదీధితి చంచల గాఁగఁ గ్రవ్యభు
గ్రూపదవాగ్ను లాఱఁగ రఘుప్రవరాహ్వయకాలమేఘ మా
శాపరిపూర్తిగాఁ గురియ సాగె నిరంతరబాణవర్షమున్.
| 404
|
ఉ. |
దండిమెయి న్రఘూత్తముఁడు దారుణదైత్యుల భండనంబునం
జండభుజావలేపమునఁ జంపఁగలం డిఁక హర్షసంయుతు
ల్గం డనుచు న్దిగీశులకు గ్రక్కునఁ దెల్పఁగఁ బోయినట్లు కో
దండవిముక్తసాయకవితానము లొక్కటఁ బర్వె దిక్కులన్.
| 405
|
ఉ. |
రాముఁడు జన్యరంగమున రాక్షసుల న్వధియించుచున్నవాఁ
డోమునులార యింక భయ మొందకుఁ డంచు నిరంతరంబుగాఁ
ప్రేమ సమస్తభూతములు పెద్దయు మ్రోయుచు నున్నవో యనం
|
|
|
గా మణిఘంటికాధ్వనుల గాఢగుణస్వన మొప్పె నవ్వనిన్.
| 406
|
చ. |
త్రిదశులతోడ మున్ను పటుతీవ్రభుజాబలవైభవంబునం
గదన మొనర్చి చూచితిమి గాదొకొ వారలచేతు లంత బె
ట్టిదములు గావు తచ్ఛరపటిష్ఠత యే మన వచ్చు నంచు వీ
రదనుజు లప్డు మెత్తు రల రామశరంబులు సోఁకువేళలన్.
| 407
|
సీ. |
ప్రలయకాలోదగ్రజలధరంబులనుండి పుడమిపైఁ బడెడు బల్పిడుగులట్ల
సద్యస్తమోనాళచటులఖద్యోతమండలనిర్గతాంశుకాండములరీతి
క్షయకాలరుద్రలోచనజాతసుమహోగ్రసముదగ్రపావకజ్వాలలగతి
జంతుసారణకళాచతురకాలాంతకసముదితకాలదండములపగిది
|
|
తే. |
నతిదురావారదుర్విషహప్రచండ, కంకపత్రకరాళవక్త్రంబు లైన
రామశరములు రాక్షసవ్రజముమీఁద, నిగిడెఁ దండోపతండంబు లగుచు నపుడు.
| 408
|
చ. |
హరనయనాగ్నివేఁడిమి మహాశనివాఁడిమి కాలదండని
ష్ఠురతయు హ్రాదినీఘనపటుత్వము స్కందునిభూరిశక్తిభీ
కరత ప్రతాపవేగమును గల్గి రఘూద్వహుబాణజాలము
ల్పరువడి వీరరాక్షసబలంబులపైఁ బడియె న్మహోగ్రతన్.
| 409
|
చ. |
ఇనకిరణాలికిం జొరవ యీక సదాగతిరాక కైనఁ బ
ల్చన వడ కర్థి సైకతముఁ జల్లిన రాలఁగ నీక దట్టమై
దనుజవిముక్తకాండములఁ కట్టుచు దిక్కుల రామకాండము
ల్సునిశితభంగి నిండుటయుఁ జూచి సుర ల్వెఱఁగంది రయ్యెడన్.
| 410
|
ఉ. |
రామునిదివ్యసాయకపరంపర దాఁకునొ యంచు ఘోరసం
గ్రామమునందు దైత్యులు ధరాగతవీక్షణు లై భయంబున
న్మోములు వాంచి చాల హరిముంగలిదంతులభంగి నైరి గా
కేమియు సేయ లే రయిరి యెంతయు నివ్వెఱపాటు గూరఁగన్.
| 411
|
చ. |
నలుదెస లాక్రమించి రఘునాథునిచాపగుణచ్యుతాంబకా
వలులు నిశాటవర్యుల నవార్యగతి న్దునుమాడఁ జొచ్చె ని
ట్టలముగఁ బర్వి వహ్ని ప్రకటంబుగ నాత్మశిఖాపరంపర
న్విలసితతేజుఁ డై కడిమి వే శలభంబుల నేర్చుచాడ్పునన్.
| 412
|
ఉ. |
మించి కకుత్స్థనాయకసమిద్ధధనుర్గుణవిచ్యుతంబు లౌ
కాంచనపుంఖకాండము లఖండరయంబునఁ బోయి ఘోరన
క్తంచరకాయము ల్వెస నగల్చి గళద్రుధిరాప్లుతంబు లై
యంచితభంగి మింట దహనార్చులకైవడి నొప్పె నయ్యెడన్.
| 413
|
సీ. |
రథికసారథికేతురథ్యయుతంబు లౌ మందరాచలనిభస్యందనములు
కాలజీమూతసంఘాతసంకాశంబు లై యొప్పుమత్తమహాగజములు
|
|
|
జవసత్వజితమనఃపవమానమాధవవాహనంబులు సమిద్వాహనములు
కాటుకకొండలకరణి మేనుల గ్రాల విఱ్ఱవీఁగుచు చున్నవీరభటులు
|
|
తే. |
మడిసి రొక్కొక్కయెడఁ బెక్కుమలలమాడ్కి, దారుణాకారరామహస్తప్రశస్త
చండకోదండనిస్సృతచటులకాల, దండమండితకాండప్రకాండమతిని.
| 414
|
ఖరసైన్యంబు రామునిపరాక్రమంబునకు వెఱఁగుపడి మరలిపోవుట
వ. |
ఇవ్విధంబునఁ బ్రళయసమయజంతుపారణకళాధురీణుం డగుస్థాణునిపోలిక నిజ
హేతివ్రాతభస్మీభూతసకలలోకనివహుం డైనసంకర్షణాగ్నికైవడిఁ దారకాసుర
సంహారనమయసముదీర్ణుం డగుకుమారునిపగిది సంక్రుద్ధుం డైనకాలాంతకుని
మాడ్కి రామభద్రుండు రౌద్రరసోల్లాసభాసురమూర్తి యై యఖండకోదండ
పాండిత్యంబుఁ జూపినఁ దదీయసాయకపరంపర యన్నిశాచరసైన్యంబునందుఁ
బరహేతిప్రఘట్టనంబున మండుచుఁ గరులం బడవైచుచు హయంబుల నఱు
కుచు రథంబుల నుగ్గునూచంబులు సేయుచుఁ బదాతులం ద్రుంచుచు శిరం
బులం బగల్చుచుఁ గంఠంబులఁ ద్రెంచుచు బాహువులఁ దెగవేయుచు వక్షం
బుల వ్రక్కలించుచుఁ బ్రక్కలఁ జెక్కుచు నడుములఁ దుండెంబులు సేయుచు
నూరువుల విఱుచుచు జానువులు ఖండించుచుఁ బిక్కలు చెక్కలు వాపుచుఁ
బాదంబులు విలూనంబులు సేయుచు నెత్తురు లురిలించుచుఁ గండలు రాల్చు
చు నెమ్ములు విఱచుచు భూషణంబులు రాల్చుచుఁ దనుత్రాణంబులు సించు
చుఁ జాపంబులఁ ద్రుంచుచు గదలు పొడి సేయుచుఁ గరవాలంబులు పఱియలు
వాపుచు ముసలంబులు గూల్చుచు ముద్గరంబులు తుముళ్లు సేయుచుఁ గుంతం
బులు రూపుమాపుచుఁ గుఠారంబులు చూర్ణంబులు సేయుచు భిండివాలం
బులు నఱకుచుఁ దోమరంబులు పుడమి రాల్చుచు నంకుశంబులు పొడి
సేయుచు ధ్వజంబుల నడిమికి నఱకుచు ని ట్లనేకప్రకారంబులఁ గీలాభీలంబుఁ
జేసిన నమ్మొగ్గరంబు చచ్చియు నొచ్చియు విచ్చియు సుడిఁబడియుఁ గలం
గియుఁ దొలంగియుఁ జిక్కు వడియును జీకాకు వడియును సైన్యంబు దైన్యదశకు
వచ్చినం గనుంగొని మహాబలశాలు లగుకొందఱు రక్షోవీరులు సాహసం
బునం దలకడిచి వీరావేశంబున రామున కభిముఖు లై శూలనిస్త్రింశపరశ్వ
థంబులం బ్రహరించిన నయ్యతిరథవర్యుండు తీక్ష్ణాగ్రంబు లైననాళీకనారాచం
బులఁ బ్రబలహాలికుండు మహారణ్యవృక్షంబులంబోలె వారల నందఱఁ బెక్కు
తుండెంబులు గావించినం జూచి తక్కినరక్కసులు సింగంబుఁ గన్నలేళ్లచం
దంబునఁ బ్రాణభయంబునఁ గనుకనిం బఱచి ఖరునిశరణంబుఁ జొచ్చినం జూచి
శత్రుభీషణుం డగుదూషణుం డెలుంగెత్తి గంభీరఘోషణంబునం జేయి వీచి
|
|
|
పురికొల్పిన నందఱు నొక్కింతధైర్యం బవలంబించి యంతపట్టువనుం గూడుకొని.
| 415
|
సీ. |
అనిలునితోడ మార్కొనఁ బోవుభూరినీరదములఁ బోలెడురథచయములు
నర్యముతోడఁ బోరాడఁబోయెడు పెనుచీఁకట్లకైవడి సింధురములు
పోరు చాలక పెద్దపులిమీఁది కుఱికెడుకొదమలేళ్లం బోలు ఘోటకములు
నగణితబలుఁ డైనమృగరాజుపై కేగుశుండాలములభంగి సుభటచయము
|
|
తే. |
వెల్లి విరిసినజలనిధివిధము దోఁప, నొక్కమొగి ఘోరసంగరోద్యోగకాంక్ష
తనరఁ జెలియలికట్టచందమున నున్న, రామభద్రునిపై కేగె రౌద్రభంగి.
| 416
|
ఉ. |
కొందఱు సాలతాలములు కొందఱు భూరిశిలాప్రకాండము
ల్కొందఱు శూలకుంతములు కొందఱు ముద్గరభిండివాలము
ల్పొందుగఁ బూని యంద ఱొకపోరికిఁ గ్రమ్మి కడంగి వ్రేయఁ గా
సందడికయ్య మయ్యె నృపచంద్రున కాఖరదైత్యసేనకున్.
| 417
|
రాముఁడు రాక్షససైన్యముపై గాంధర్వాస్త్రంబుఁ బ్రయోగించుట
ఉ. |
ఆరఘువీరుఁ డప్పుడు భయానకభంగిఁ గడంగి చుట్టును
న్భూరిశిలాంబకప్రహతిఁ బోరుచు నున్ననిశాటసైన్యము
న్బాఱఁగఁ జూచి దీర్ఘనయనంబుల నెఱ్ఱఁదనంబు దోఁపఁ గా
వారణయూథముం గనినవారణవైరిక్రియం జెలంగుచున్.
| 418
|
క. |
మిడుతపరి గవిసినట్లుగ, నెడతెగక గడంగి యున్న దీసేన బలే
సుడివడి యున్నది యిప్పుడె, మడియింపఁగ వలయు రిత్త మసలఁగ నేలా.
| 419
|
మ. |
అని చింతించి జగద్భయానకరవం బౌ నట్లుగా శింజినీ
ధ్వనిఁ గావించుచు లోకపూజ్య మగుగాంధర్వాంబకం బేయఁ జ
య్యన నయ్యస్త్రమహత్త్వ మెట్టిదొ యసంఖ్యాతంబు లై యస్త్రశ
స్త్రనికాయంబులు పుట్టి దిక్తటము లంతన్ నిండె గాఢోద్ధతిన్.
| 420
|
క. |
పడుచున్నరాక్షసులచేఁ, బడినమహాదారుణు లగుపలలాదులచేఁ
బడనున్నవారిచేతను, బుడమి పరిస్తీర్ణ యయ్యెఁ బొలుపుగ నంతన్.
| 421
|
వ. |
ఇట్లు తండోపతండంబు లై రాముని ప్రచండకాండంబులు లెక్కకు వెక్కసం
బు లై పుడమి యీనినతెఱంగున నెల్లదిక్కుల నాక్రమించి యాకాశంబు
నిరవకాశంబు చేసిన సూర్యకిరణప్రసరణంబు లేమిం జేసి గాఢాంధకారంబు
గప్పుకొనియె నందు వెడందవాతియమ్ములతాఁకున శిరంబులు పగిలి గిఱ్ఱునం
దిరుగుచు భీషణంబుగా ఘీంకారంబు సేయుచు వజ్రప్రహారంబుల రెక్కలు
దెగి ధరణిం బడినకులాచలంబులచాడ్పున దంతంబు లూఁతగా ముంద
ఱికి మ్రొగ్గతిలం బడి బాణక్షతవేదన సహింపంజాలక ప్రాణంబులు విడుచు
మత్తశుండాలంబులును శుండాలోపరిభాగంబులనుండి తోమరాంకుశంబులఁ
బ్రహరింప గమకించునంతలోనఁ గత్తివాతియమ్ములు కంఠనాళంబులఁ ద్రెంచిన
|
|
|
నదియే చందంబున ధరణిపయిం బడి కామితంబు సఫలంబు గామికి జీవితం
బులు విడువంజాలక కొఱప్రాణంబులం దన్నుకొనుగజారోహకులును భల్ల
బాణంబుల శిరంబులు దునిసిపడ రయంబుపెంపున నవియె పోఁగాక యని యొ
క్కింతదూరం బరిగి యవ్వలం జన నలవి గాక ముచ్చటం బడి పొరలుచు నసు
వులు విడుచుహయంబులును వాఁడి గలమండలాగ్రంబులు జళిపించుచు వీరా
వేశంబునం దెగవ్రేయ గమకించునెడ సింహనఖశిలీముఖంబుల నుత్తమాం
గంబులు దెగి క్రిందం బడియున్నహయకళేబరంబులమీఁదం బడి తోకన
వేల్పులు గురియించుమందారకుమవర్షంబులఁ బ్రాణంబులు వచ్చి వెంటనే
మింటి కెగసి కిన్నరరూపంబులం బ్రశంసించువీరు లగురాహుత్తులును రథిక
సారథులు మడిసిన వాహనంబు లవికలంబు లై తమయిచ్చకొలంది నీడ్చు
కొని పోవ మేదోమాంసమస్తిష్కపంకంబునం జిక్కువడి విశీర్ణంబు లైనరథాం
గంబులతో నఱవఱ లైసయరదంబులును వాలుఁ బెఱికికొన సామర్థ్యంబు
లేక యొక్కింతసాహసంబున నానావిధప్రహరణంబులం బొడువ నుంకించు
నంతలోన నెడనెడ వాలికనారసంబులఁ జరణజానుజంఘాజఘనమధ్యోదరఖం
డంబులు తిలప్రమాణశకలంబు లై రాలిన రూపుసెడి పోవుపదాతులుం గలిగి
సంగరాంగణంబు దారుణదర్శనం బయ్యె నందు శిరంబులు కమఠంబులును
గజంబులు మకరంబులును గేశంబులు శైవాలంబులును భూషణరజం బిసుకయు
బాహువులు మీనంబులును గొడుగులు శతపత్రంబులును మేదోమాంస
మస్తిష్కంబులు పంకంబును శోణితంబు జలంబునుగా ననేకరుధిరనదులు ప్రవ
హించె నందుఁ గడుపులకు వెక్కసంబుగా మాంసంబు మెక్కి రక్తంబుఁ గ్రోలి
రుధిరప్రవాహమధ్యంబున నీఁదులాడుచు రామునివిక్రమంబుఁ బ్రస్తుతించుచు
ననేకభంగులం గ్రీడించుభూతప్రేతపిశాచశాకినీగణంబులకోలాహలంబు బహు
లంబై యుండె నివ్విధంబున నొక్కముహూర్తంబులోనఁ గించిదవశిష్టంబుగా
రాక్షససై న్యంబు రూపు మాపి తమంబు విరియందట్టి తేజరిల్లు మధ్యందినమార్తాం
డునకు రెండవమూర్తి యై రామభద్రుం డంతకంతకుఁ బ్రవర్ధమానంబు
లగునుత్సాహబలశౌర్యంబులు గలిగి తక్కినరాక్షసులు నిశ్శేషంబుగా వధి
యింపం గోరుచుండె నప్పుడు హతశేషు లగురాక్షసులు బెబ్బులిం గన్నలేళ్ల
చందంబున నమ్మహావీరుని కట్టెదుట నిలువ నోపక భీతచిత్తు లై కనుకనిం బఱ
చినం జూచి రోషభీషణుం డై దూషణుండు.
| 422
|
దూషణుండు మఱలినరాక్షససైన్యమును బురికొల్పుట
ఉ. |
ఈగతి మీకు నేఁ గలుగ నేటికి మర్త్యున కోడి పాఱి దో
ర్వేగము మీఱ నందఱము వీని వధింతము రం డటంచు ర
క్షోగణనాయకుండు పురికొల్పినఁ బంచసహస్రయోధు లం
|
|
|
తాగతకాలకింకరుల యట్ల చెలంగెడువార లుగ్రతన్.
| 423
|
చ. |
అతనిఁ బురస్కరించుకొని యందఱు రామునిఁ జుట్టుముట్టి య
ద్భుతముసలోపలప్రదరభూరుహపట్టిసశూలవర్షము
న్వితతబలాఢ్యుఁ డైనరఘువీరునిపైఁ గురియింప నమ్మహో
ద్ధతికిఁ గలంగ కవ్విభుఁడు దారుణబాణహతిం దెరల్చుచున్.
| 424
|
క. |
వడగండ్లు గురియుదట్టపు, జడికిఁ జలింపనినగంబుచందంబున రా
ముఁడు సుస్థిరుఁ డై దైత్యుల, మడియింపఁగఁ బూని రోషమానసుఁ డగుచున్.
| 425
|
క. |
కులిశంబుకంటె బెడిదము, గల వాలికనారసములఁ గడువడి దోషా
టులమీఁదఁ బఱపి బలుదూ, పులు దూషణుమేనఁ జొనిపె భుజబల మలరన్.
| 426
|
ఉ. |
తోడనె శత్రుదూషణుఁడు దూషణుఁ డంతకుభంగిఁ గ్రుద్ధుఁ డై
వేఁడిమి నివ్వటిల్ల రఘువీరునిఁ దాఁకఁగఁ దేరుఁ దోలి క్రొ
వ్వాఁడిశిలీముఖంబు లనివార్యగతి న్నిగిడించి రాక్షసు
ల్వేడుకతోడఁ జూడఁ దనవిక్రమ మంతయుఁ జూపె నుద్ధతిన్.
| 427
|
రాముఁడు దూషణుని వధియించుట
చ. |
అతనిపరాక్రమంబునకు నల్క వహించి రఘుప్రవీరుఁ డ
ప్రతిహతశౌర్యుఁ డై యొకశరంబునఁ జాపముఁ ద్రుంచి నాల్గిటం
జతురత నశ్వము న్దునిమి సారథి నొక్కట నర్ధచంద్రసం
హతిఁ దునుమాడి వానియుర మంటఁగ వ్రేసె నిషుత్రయంబునన్.
| 428
|
వ. |
ఇట్లు విరథుండును వికలసాధనుండును వినిహతాశ్వుండును వినిపాతితసారథి
యు నై యన్నిశాచరుండు గినిసి గిరిశిఖరసంకాశంబును రోమహర్షణంబును
గాంచనపట్టవేష్టితంబును దేవసైన్యాభిమర్దనంబును దీక్ష్ణశంకుసమాకీర్ణంబును
గాలాయసమయంబును బరవసోక్షితంబును వజ్రాశనిసమస్పర్శంబును బరగో
పురవిదారణంబును మహోరగసంకాశంబు నగుపరిఘంబుఁ గొని పరమసంక్రు
ద్ధుం డై రామున కభిముఖంబుగా రయంబునం బఱతెంచుసమయంబున నా
రఘువీరుండు రెండుకత్తివాతియమ్ముల సహస్తాభరణంబు లైనవానిభుజంబులు
రెండును ఖండించిన ఛిన్నహస్తుం డైనవానికరంబున నుండి యమ్మహాపరిఘంబు
శక్రధ్వజంబుపోలిక ధరణిపయిం బడియె నిట్లు శరనికృత్తబాహుం డై దూష
ణుండు విషాణంబులు వెఱికినమహాగజంబుపోలికఁ బుడమిం గూలి తక్షణ
బున సంప్రాప్తమరణుం డయ్యె నతనిపాటుఁ జూచి సర్వభూతంబులు సాధు
వాక్యంబుల రామునిం బ్రశంసించి రంత.
| 429
|
ఉ. |
దూషణుపాటుఁ జూచి మదిఁ దొట్టినకోపము నెత్తి కెక్కఁగా
రోషకసాయితాక్షు లయి రోఁజుచు దానవదండనాయకు
ల్భీషణభంగి మువ్వు రతిభీకరు లొక్కట వీర్యవచ్ఛిరో
|
|
|
భూషణుఁ డైనరాఘవునిఁ బోర నెదిర్చిరి సాహసంబునన్.
| 430
|
వ. |
ఇట్లు మహాకపాలుండును స్థూలాక్షుండును బ్రమాథియు ననువారలు మృత్యు
పాశావపాశితు లై తీవ్రవేగంబునం దాఁకి.
| 431
|
చ. |
అలుక మహాకపాలుఁ డొకయాయసశూలము స్థూలనేత్రుఁ డు
జ్జ్వలదురుపట్టిసంబు నొకశాతపరశ్వథముం బ్రమాథి ని
ట్టలముగఁ బూని వ్రేసి వికటంబుగ నార్చిన నారఘూత్తముం
డలయక సాధనత్రయము నస్త్రముల న్వడిఁ ద్రుంచి వెండియున్.
| 432
|
రాముఁడు మహాకపాలస్థూలాక్షప్రమాథు లనుమువ్వురరాక్షసులఁ జంపుట
చ. |
అనుపమహేమభూషితశరాహతి వేగ మహాకపాలునిం
దునిమి ప్రమాథిని న్వెడఁదతూపున గీ టణఁగించి స్థూలనే
త్రుని విషదిగ్ధబాణమునఁ ద్రుంచిన నయ్యసురత్రయంబు వ
జ్రనిహతపర్వతత్రయముచాడ్పునఁ గూలె ధరాతలంబునన్.
| 433
|
ఉ. |
అంచితవిక్రముం డగుమహారథవర్యుఁడు రాముఁ డంతటం
బంచసహస్రరాక్షసులఁ బంచసహస్రశిలీముఖంబులం
బంచత నొందఁజేసి కలభంబులఁ జంపినసింగమట్ల నే
త్రాంచలదీధితు ల్నిగుడ నద్భుతవైఖరిఁ బొల్చి యుండఁగన్.
| 434
|
వ. |
అమ్మహావీరునిపరాక్రమప్రకారంబుఁ జూచి సహింపక మృతుం డైనదూష
ణుం దలంచుకొని దుఃఖతుం డై ఖరుండు వీరావేశంబున.
| 435
|
ఉ. |
గ్రద్దనఁ గోపవేగమునఁ గన్నుల నగ్నికణంబు లొల్కఁ బ
న్నిద్ధఱ దండనాథుల నహీనబలాఢ్యులఁ జూచి మీర లీ
ప్రొద్దున నేగి మానవునిపొంక మడంచి వధించి రండు వే
సుద్దులఁ జెప్ప నేల మనశూరత లెన్నటి కింకఁ గాల్పనే.
| 436
|
వ. |
అని బరవసంబుఁ జేసి పురికొల్పి తానును రభసాతిశయంబున రామున కభిము
ఖంబుగా రథంబుఁ దోలించె వంత ఖరాసురప్రేరితు లై శ్యేనగామియుఁ బృథు
గ్రీవుండును యజ్ఞశత్రుండును విహంగముండును దుర్జయుండును గరవీరాక్షుం
డును బరుషుండును గాలకార్ముకుండును మేఘమాలియు మహామాలియు సర్పా
స్యుండును రుధిరాశనుండు ననుద్వాదశమహావీరులు హతశేషు లైనసైనికులం
గూడుకొని శీఘ్రవేగంబున ఖరునిం దలకడచి శరాసారఘోరంబుగాఁ గవిసి
నానావిధహేతివ్రాతంబులఁ బరఁగించుచు రౌద్రప్రకారంబునం జుట్టుముట్టి
యట్టహాసంబుఁ జేసిన.
| 437
|
రాముఁడు పన్నిద్ధఱ రక్షోవీరులఁ జంపుట
శా. |
ఆపద్మాప్తకులుండు రెండవనిదాఘాదిత్యుఁ డై చాపవి
ద్యాపాండిత్యము దోఁప సాధుముఖపద్మంబు ల్వికాసస్థితి
|
|
|
న్దీవింప న్ఘనచండకాండకిరణోద్రేకంబునం గ్రవ్యభు
గ్రూపధ్వాంతముల న్హరించె దిశల న్రూఢప్రభ ల్గ్రమ్మఁగన్.
| 438
|
ఉ. |
వెండియుఁ జండకాండములు వే పదివేలు నిగిడ్చి యొక్కటన్
గొండలఁ బోలు రాక్షసుల నూర్వుర నూఱుశిలీముఖంబుల
న్మెండుగ నొక్కదైత్యవరుని న్వధియించుచుఁ జిత్రభంగి నా
ఖండలుఁ డద్రిశృంగములకైవడి నందఱఁ గూల్చె వ్రేల్మిడిన్.
| 439
|
క. |
పదిరెండునారసంబులఁ, బదపడి రాఘవుఁడు వేగ పన్నిద్దఱ బె
ట్టిదు లగుసేనాధ్యక్షులఁ, గదనంబునఁ దునిమి పనిచెఁ గాలునిపురికిన్.
| 440
|
చ. |
అనిమొన రామచండవిశిఖాహతిఁ గూలినముక్తకేశభృ
ద్దనుజులచేఁ బినద్ధ యయి ధాత్రి కుశావృత యైనవేదిచొ
ప్పునఁ దనరారె నవ్విపినభూస్థలి శోణితమాంసపంక యై
ఘనతరనారకస్థలముకైవడి నొప్పుచు నుండె నత్తఱిన్.
| 441
|
చ. |
కదనమునందు రాఘవుఁ డఖండపరాక్రమదుర్నివారుఁ డై
మదమున నొక్కఁ డయ్యు నరమాత్రకుఁ డయ్యుఁ బజాతి యయ్యు ని
ట్లదయతఁ దచ్చతుర్దశసహస్రనిశాటుల నశ్రమంబునం
జిదురుపలై ధరం దొరఁగఁ జేసె సుర ల్ముద మంది చూడఁగన్.
| 442
|
క. |
ఖరుఁడును ద్రిశిరుం డనువా, రిరువురు రాక్షసులు దక్క నెల్లసురారుల్
ధరణీధరములక్రియ ను, ర్వరఁ గూలిరి కదనమందు రామునిచేతన్.
| 443
|
వ. |
ఇట్లు మహావాతవేగంబునం గూలుమహీరుహంబులచాడ్పున నిశాచరు లం
దఱు రఘువీరునికాండప్రకాండంబులం దెగి నిశ్శేషంబుగా మడిసినం జూచి
ఖరుండు కోపాటోపంబున రామునియాటోపంబుఁ జూచి సహింపక రథంబుఁ దో
లించుకొని యమ్మహారథున కభిముఖంబుగా నడరిన నతని నివారించి వాహినీ
నాయకుం డగు త్రిశిరుం డి ట్లనియె.
| 444
|
సీ. |
అసురేంద్ర యింత సాహస మేలు మరలుము రాక్షసాంతకుఁ డైనరాముఁ గదిసి
వాఁడిమి గలనాదువేఁడిమిఁ జూపి దివ్యాస్త్రసంహతి వాని నని వధించి
యనిలోన నింతకు మును వానిచేఁ జచ్చినట్టివారికిఁ బ్రీతి పుట్టఁ జేసి
వచ్చెద నది గాక వాఁడు నాచేఁ జచ్చెనేని క్రమ్మఱ నిజస్థానమునకు
|
|
తే. |
నరుగు మటు గాక యే నమ్మహాత్ముచేత, నిపుడు రణమునఁ జచ్చితినేని మరల
యుద్ధమున కీవు దొడరి నాయుమ్మలికము, తీర్చి పుచ్చుము పె క్కేల ధీరవర్య.
| 445
|
రాముఁడు త్రిశిరునిఁ జంపుట
వ. |
రాక్షసేంద్రా యే నాయుధంబు ముట్టి ప్రతిజ్ఞఁ జేసెద సర్వప్రకారంబుల రాక్ష
నులకు వధ్యుం డైనరాముని వధించెద రామునిచేత నే నై నను నాచేత రాముం
డై నను బంచత్వంబు నొందుట సిద్ధంబు నీవు వెనుకకుం జని రణోత్సాహంబున
|
|
|
నిలువంబడి యొక్కముహూర్తంబు జయాపజయనిర్ణాయకుండ వగు మని బర
వసంబుగాఁ బలికిన ఖరుండు వానికి రణంబున కనుజ్ఞ యొసంగి రయంబున రా
మున కనభిముఖంబుగా నడిచె నంతఁ ద్రిశిరుండు కృతాభ్యనుజ్ఞుం డై జవనాశ్వ
సంయుతం బగు కనకరథం బెక్కి త్రిశృంగం బగుపర్వతంబుచందంబున శరీ
రంబు గ్రాల సలిలధారలు గురియుమేఘంబుకైవడి శరవర్షంబు గురియుచు
మూఁడునోళ్ల ముల్లోకంబు లప్పళించుటకుం జాలి జలార్ద్రదుందుభినాదసదృశ
నాదంబున గర్జించుచు రభసాతిరేకంబుగాఁ గవిసిన నతని యట్టహాసంబుఁ
జూచి రఘువీరుండు బహుప్రకారంబు లగుశరపరంపరల వానిబాణంబులనన్నిం
టినిం జదియ నడంచుచుఁ బ్రచండభంగి మార్కొనిన నయ్యిద్దఱకు భీషణం
బగుసంగ్రామం బయ్యె నివ్విధంబునం దలపడి రాముండును ద్రిశిరుండును
సింహమదేభంబులచందంబున వాయువలాహకంబులపగిది వాసవవృత్రుల
విధంబున గరుడపన్నగంబులమాడ్కిఁ బరస్పరహుంకారంబులు నితరేతర
ధిక్కారంబులు నన్యోన్యతిరస్కారంబులఁ గొండొకసేపు కన్నులపండువుగా
భండనంబుఁ జేసి రాసమయంబున.
| 446
|
తే. |
కనలి త్రిశిరుండు తీవ్రాంబకత్రయంబు, కౌసలేయునినొసలు దాఁకంగ నేయ
నించుకైనను దలఁకక హీనబలునిఁ, గా నెఱిఁగి వానితోడ ని ట్లనుచుఁ బల్కె.
| 447
|
ఉ. |
ఓరి నిశాట యెవ్వనిమహోగ్రశరంబులు మన్నిటాలమం
దారయఁ బుష్పసన్నిభము లై మృదువైఖరిఁ బొల్చె నట్టినీ
శూరత తెల్ల మయ్యె నిఁకఁ జూపఁగ నేటికి మచ్ఛిలీముఖా
సారము గ్రమ్మఱం గొనుము చయ్యన నీపని చక్క నయ్యెడిన్.
| 448
|
క. |
అని యుల్లసమాడుచు న, ద్దనుజునివక్షమున ఘోరతరకాలవ్యా
ళనిభశరచతుర్దశకము, సునిశితగతిఁ జొనిపి యంత సొలయక మరలన్.
| 449
|
మ. |
ఒకబాణంబున వానిచేతిధను వత్యుగ్రంబుగాఁ ద్రుంచి వే
ఱొకనారాచచతుష్టయంబునఁ దురంగోత్సేకము న్మాన్చి త
క్కక సూతు న్దృఢసాయకాష్టకమున న్ఖండించి తత్కేతనం
బొకకాండంబున రెండుగాఁ దునియ లై యుర్విం బడం గూల్చినన్.
| 450
|
వ. |
ఇట్లు విరథుం డై రథంబువలన రయంబునఁ బుడమికి దాఁటి పాదవిన్యాసంబున
భూమి గ్రక్కదలఁ బఱతెంచుచున్నత్రిశిరునిశిరత్రయంబు బాణత్రయం
బున ఖండించిన నవి మహావాతపతితంబు లగుతాళఫలంబులచందంబున ధర
ణిం బడియె వానికళేబరంబు శిఖరరహితం బైనపర్వతంబుపగిది నుర్విం గూలె
నిట్లు త్రిశిరునిం దెగటార్చి రఘువీరుండు వృత్రాసురునిం దునిమినపురందరుని
కైవడి నొప్పుచుండె నంత హతశేషు లగురాక్షసులు బెబ్బులిం గన్నహరి
ణంబులకైవడిఁ ద్రస్తచిత్తు లై కనుకనిం బఱచి ఖరునిమఱువు సొచ్చి రతండు
|
|
|
హతు లైనదూషణత్రిశిరులను దక్కినచతుర్దశసహస్రరక్షోవీరులం దలంచుకొని
శోకరోషంబులు మనంబున ముప్పిరిగొన రాక్షసులపాలిటియంతకుం డై
కన్నులకుం దేఱిచూడ రాక వెలుంగుచున్నరాముని విలోకించి మనంబునఁ
దలంకుచు విమానాగ్రభాగంబులనుండి పెక్కువిధంబుల రామునిఁ బ్రశం
సించు దేవర్షిమహర్షులయుత్సాహంబుఁ గనుంగొని క్రమ్మఱ రోషంబుఁ గల్పించు
కొని వాసవుం జేరునముచిచందంబున స్కందునిం జేరుతారకునిపోలిక సంరంభ
విజృంభితుం డై రామునిం గదియ వచ్చి.
| 451
|
మ. |
బలవచ్చాపము నెక్కుపెట్టి గుణశబ్దంబు ల్ప్రచండంబుగాఁ
జెలఁగ న్శిక్షితభంగి ఘోరతరసంస్ఫీతోగ్రనారాచము
ల్చల మొప్ప న్నిగిడించి సర్వదిశలు న్సర్వంసహాకాశము
ల్గలయం జేసి నిమేషమాత్రమున దుర్లక్షంబుగాఁ గప్పినన్.
| 452
|
రామఖరాసురద్వంద్వయుద్ధము
చ. |
కని రఘువల్లభుండు ఘనకార్ముకము న్సవరించి శింజినీ
ధ్వనులు సెలంగ దుర్విషహదారుణకాండము లొక్కరీతిగా
మునుకొని దీప్తవహ్నికణము ల్చెదర న్నిగిడించి యాకసం
బనుపమలీల నుగ్రగతి నస్త్రమయంబుగఁ జేసె గ్రక్కునన్.
| 453
|
క. |
ఖరరామవిసర్జితభీ, కరతరబాణములచేత గగనంబు నిరం
తర మయ్యె సర్వదిశలును, బరిపూర్ణము లయ్యె ఱెల్లు పఱిచినభంగిన్.
| 454
|
క. |
నిరుసమనాయకధారా, పరివృతుఁ డై యినుఁడు గానఁబడ కున్కిఁ బ్రజ
ల్వెరవేది రేయుఁ బవ లే, ర్పఱుపఁ దరముగాక ఱిచ్చవడి యుండి రిలన్.
| 455
|
వ. |
మఱియు నిట్లు తలపడి యితరేతరజయకాంక్షలం బోరునప్పుడు.
| 456
|
క. |
ఆలమున ఖరుఁడు రాముని, నాళీకవికర్ణనిశితనారాచముల
న్వాలికతోత్రంబుల శుం, డాలంబును బోలె నలమటం బ్రహరించెన్.
| 457
|
క. |
ఖరుని రథస్థుని రాక్షస, వరుని ధనుర్ధరునిఁ బర్యవస్థితు భూతో
త్కర మపుడు పాశధరుఁ డగు, పరేతపతినట్ల చూచి భయ మందె రహిన్.
| 458
|
వ. |
ఇట్లు దుష్ప్రధర్షుం డై ఖరుండు.
| 459
|
శా. |
ధీరుం బౌరుషపర్యవస్థితు సముద్దీప్తప్రతాపు న్మహా
శూరు న్సింహపరాక్రము న్సకలరక్షోభీము రాము న్బలో
దారుం గాంచి హుతాశను న్మిడుతచందాన న్వెస న్డాసి దు
ర్వారాజిశ్రమహీనసత్త్వుఁ డనుచు న్భావించి సంరంభి యై.
| 460
|
క. |
తనచేతిబలువు గన్పడ, ఘనశరమున రాముచేతికార్ముకగుణముం
దునిమి వెస సప్తశరములు, సునిశితగతి నతనిమేనఁ జొనిపెం బెలుచన్.
| 461
|
క. |
అట ఖరకార్ముకముక్త, స్ఫుటనారాచములచేత భూమీశునికం
|
|
|
కట మప్పుడు కుబుసముక్రియఁ, బటుకయమున సడలి పుడమిఁ బడియెం గడిమిన్.
| 462
|
ఉ. |
అంతట రాక్షసుండు ప్రళయాంతకుకైవడిఁ బేర్చి జానకీ
కాంతునిమీఁద సాయకసహస్రము లొక్కట నేసి వేగ రో
దోంతర మెల్ల నింద వడి నార్చుచు సర్వసుపర్వు లాత్మలో
నెంతయు నుమ్మలింప ఖరుఁ డేపునఁ దోఁచె మహోగ్రమూర్తి యై.
| 463
|
వ. |
ఇట్లు ఖరబాణపీడితుం డై శత్రునిబర్హణుం డగురాముండు విగతధూముం డగు
నైశ్వానరునిచందంబునం దేజరిల్లుచు నంతకంత కుత్సాహంబు రెట్టింపఁ దొ
ల్లి తనకుఁ గుంభసంభవుం డిచ్చిన గంభీరనిర్హ్రాదం బగువైష్ణవచాపంబు లీలం
గేల నందుకొని వైరివినాశనార్థంబు సముచితంబుగా సజ్యంబుఁ జేసి గుణప్రణా
దంబు సేయుచు.
| 464
|
ఉ. |
కాంచనపుంఖకాండము లఖండగతి న్నిగిడించి వేగ న
క్తంచరుకాంచనధ్వజము దప్పక ద్రుంచిన సర్వదేవత
ల్పంచినఁ బద్మబాంధవుఁడు వ్రాలినకైవడిఁ గూలె నేలెఁ ద
త్కాంచనదీధితు ల్నిఖిలకాష్ఠలయందు వెలుంగుచుండఁగన్.
| 465
|
ఉ. |
వెండియుఁ గ్రుద్ధుఁ డై ఖరుఁడు వేగమె మర్మవిదుండు గావునం
గాండచతుష్టయప్రహతి గాత్రము నొవ్వఁగ జేసి యార్చె ను
ద్దండరయంబున న్సమదదంతిని దారుణతోమరంబుల
న్దండిగ వ్రేటు పెట్టినవిధంబునఁ గోపరసోగ్రమూర్తి యై.
| 466
|
క. |
ఖరకార్ముకనిస్సృతభీ, కరమార్గణవిద్ధుఁ డగుచుఁ గాకుత్స్థకులా
భరణుఁడు రుధిరాప్లుతుఁ డై, కర మరుదుగ రోహణాద్రికైవడి నలరెన్.
| 467
|
వ. |
ఇ ట్లఖండసంధ్యారాగమండలపరివృతమార్తాండుండుంబోలె దివ్యప్రభాభాస
మానుం డై రామభద్రుం డవష్టంభంబున.
| 468
|
శా. |
లోకాలోకగుహ ల్ప్రతిధ్వను లిడన్ లోకాధికుం డంత న
స్తోకజ్యానినదంబుఁ జేసి శరము ల్దోడ్తోడ సంధించి వి
ల్లాకర్ణాంతముగా వడిం దిగిచి ప్రత్యాలీఢపాదస్థుఁ డై
వీఁక న్వీఁక నిగిడ్చె బాహువిలసద్వేగంబు దీపింపఁగన్.
| 469
|
రాముఁడు ఖరుని విరధునిఁ జేయుట
వ. |
ఇ ట్లమోఘశరపాతనంబున ఖరునియాటోపం బడఁగించి వెగడు పఱచి క్రమ్మఱ
నాఱుసాయకంబులు నిగిడించి యొక్కవెడందవాతియమ్మున వానిశిరంబును
రెండుక్షురప్రంబుల వానిభుజశిఖరంబులును మూఁ డర్ధచంద్రబాణంబుల
వానివక్షంబు నొప్పించి వెండియు సూర్యమరీచికల్పంబు లైనపదుమూఁడు
నారసంబులు ప్రయోగించి యొక్కవిశిఖంబున యుగంబు నఱికి నాలుగుశిలీ
ముఖంబుల ఘోటకంబుల గీ టణఁగించి యాఱవశరంబున సారథిశిరంబు ఖం
|
|
|
డించి మూఁడంబకంబులఁ గూబరంబును రెండమ్ముల నొగలును బండ్రెండవ
మార్గణంబున ఖరునిచేతికార్ముకంబును బఱియలు వాపి వజ్రసంకాశం బైనపదు
మూఁడవపృషత్కంబున ఖరునిశిరంబు దూల నేసిన నాఖరుండు భగ్నచా
వుండును విరథుండును హుతాశ్వుండును హతసారథియు నై కాలదండంబుఁ
బోనిగదాదండంబుఁ బుచ్చుకొని ధరణిగతుం డై నిలువంబడి యుండె నప్పుడు
రామునిపరాక్రమప్రకారం బాలోకించి యంబరంబునం బన్నినమహర్షిదేవ
తాముఖ్యులు విమానాగ్రభాగంబుల నుండి ప్రాంజలు లై పరమానందంబునఁ
బ్రశంసించుచుండిరి యిత్తెఱంగున విరథుం డై గదాపాణి యై యున్న ఖరునిం
జూచి రాముండు మృదుపూర్వకంబుగాఁ బరుషవాక్యంబున ని ట్లనియె.
| 470
|
రాముఁడు ఖరుని నానావిధంబుల దూఱుట
ఉ. |
స్యందనవారణాశ్వభటసంకుల మైనబలంబుతోడ నీ
కందునఁ జేరి నీవు చిరకాలమునుండి సమస్తసాధులం
గొందల మందఁ జేసితివి క్రూరుఁడు పాపవిచారకుండు గ
ర్వాంధుఁడు సర్వలోకవిభుఁ డైనను ధాత్రి మనంగ నేర్చునే.
| 471
|
క. |
లోకవిరుద్ధం బగుపనిఁ, గైకొని గావించునట్టికఠినుని విషద
ర్వీకరమునట్ల బలియుఁడు, ప్రాకటముగఁ జంపు ఘనకృపారహితుం డై.
| 472
|
తే. |
మఱియు నెవ్వాఁడు లోభకామములచేత, దురిత మొనరించు నతఁడు తద్దురితఫలము
వెస ననుభవించు బ్రాహ్మణి వృష్టిశిలను, మ్రింగి పంచత్వ మొందినభంగి నసుర.
| 473
|
క. |
ఘనదండకావనంబున, మునుకొని వసియించి యున్నపుణ్యచరితుల
న్మునుల వధియించి యేఫల, మనుపముగతి ననుభవింప నాసించితివో.
| 474
|
క. |
జనదూష్యులు క్రూరులు భూ, తనింద్యులు సమర్థు లయ్యుఁ దడవుగ నిలపై
మన నేరరు చర్చింపఁగ, దనుజాధమ శీర్ణమూలతరువులమాడ్కిన్.
| 475
|
తే. |
కర్త యగువాఁడు నిజఘోరకలుషకర్మ, ఫల మవశ్యంబు నొందు సుపర్వవైరి
యరయఁ గాలంబు సంప్రాప్త మగుచు నుండ, నగము లార్తవ మగుప్రసూనమును బోలె.
| 476
|
ఆ. |
ఖలుఁడు తనదుఘోరకలుషకర్మఫలంబు, నపుడె తోడుతోడ ననుభవించు
వెలయ భుక్తఘోరవిషమిశ్రితోదన, ఫలమునట్ల దివిజకులవిరోధి.
| 477
|
తే. |
ఘోరపాపంబు సేయుచు మీఱి లోక, మునకు హింసఁ గావించెడుదనుజవరులఁ
బట్టి వధియించుటకు నేను భరతునాజ్ఞ, దుష్టదైత్యసమాసాదితుండ నైతి.
| 478
|
తే. |
దానవాధమ వేయేల తడయ కెపుడు, శిష్టులకు విప్రకారంబు సేయునట్టి
నిన్ను రణరంగమునఁ జంపి నేఁడు మొదలు, సకలభువనంబులకు మేలు సంఘటింతు.
| 479
|
తే. |
కడిమి దీపింప నాచేత విడువఁబడిన, హేమభూషితవిశిఖంబు లిపుడె నిన్నుఁ
|
|
|
గలఁచి వల్మీకమును బన్నగములుఁబోలెఁ, జయ్యన ధరిత్రి భేదించి చనఁగఁగలవు.
| 480
|
తే. |
పుణ్యతర మగుదండకారణ్యమందు, శిష్టవిద్వేషి వైన నీచేత మున్ను
పరఁగ భక్షింపఁబడినట్టిపరమమునుల, నిపుడె గలసెదు సైన్యసహితుఁడ వగుచు.
| 481
|
క. |
దనుజాధమ మచ్ఛరముల, ననిలోఁ దెగి నిరయగతికి నరిగెడునిన్ను
న్మును నీచే బాధితు లగు, మును లిప్పుడు చూడఁగలరు ముదితాత్మకు లై.
| 482
|
ఉ. |
ఓరి దురాత్మ యేటి కిపు డూరక యుండఁగ నీదు శౌర్య మిం
పారఁగఁ జూపు నీశిరము నద్భుతతాలఫలంబుకైవడి
న్ధారుణిఁ గూల్తు నంచు సముదగ్రత రాఘవుఁ డిట్లు పల్క నా
ఘోరనిశాటుఁ డి ట్లనియెఁ గ్రోధము దోఁపఁగ రక్తనేత్రుఁ డై.
| 483
|
ఖరుండు రాముని నధిక్షేపించుట
ఉ. |
కొందఱఁ బ్రాకృతాసురులఁ గూల్చితి నం చొకపోటుబంట వై
డెందమునందుఁ బొంగుచు వడి న్నుతియించుకొనంగ నేల గో
త్రం దగ వీర్యవంతులు నరర్షభు లద్భుతసత్వయుక్తు లీ
చందమున న్స్వతేజమును సంస్తుతి సేయుదురే నినుంబలెన్.
| 484
|
క. |
లోకంబున నకృతాత్ములు, ప్రాకృతులును రాజవంశపాంసను లగువా
రేకరణి రజ్జు లాడుదు, రాకరణి నిరర్థకోక్తు లాడఁగఁ దగునే.
| 485
|
క. |
అనిమొన శూరుఁడు తనుఁ దా, వినుతించుకొనంగఁ దగునె వెఱ్ఱితనమున
న్విను మాత్మస్తుతి నాశ, మ్మొనరించుం గాదె విక్రమోద్ధతి కెల్లన్.
| 486
|
వ. |
మఱియు మృత్యుకాలసంకాశం బైనసమరంబు సంప్రాప్తం బగుచుండ నప్ర
స్తవంబునందుఁ గులీనత్వంబుఁ బ్రకటించుచు నెవ్వం డాత్మప్రశంసం గావించు
కొను వహ్నిబుద్ధిచేత నగ్నివర్ణం బైనయుపలంబును సంస్పృశించువురుషుని
కొఱ కనుపలభ్యమానోష్ణస్పర్శం బైననయ్యుపలంబుచేతఁ దనయనగ్నిత్వం
బెట్లు నిదర్శితం బయ్యె నట్లు నీచేత నిన్ను వీరుం డని తలంచెడునాకొఱ
కీయాత్రప్రశంసచేత నీయవీరత్వనామకలఘుత్వంబు నిదర్శితం బయ్యె నది
యునుం గాక సువర్ణశోధకాగ్నిచేత సంతప్తం బైనసువర్ణప్రతిరూపారకూ
టంబుచేఁ గార్ష్యరూపం బైనలఘుత్వంబు నిదర్శితం బైనచందంబున నీచేత
నీవికత్థనంబున నశూరత్వరూపకం బైనలఘుత్వంబు సర్వప్రకారంబుల నిద
ర్శితం బయ్యె నని పలికి వెండియు ని ట్లనియె.
| 487
|
క. |
బహుధాతువిచిత్రిత మగు, మహీధ్రమును బోలె నన్ను మది నచలునిఁగా
రహిఁ బరికింపుము దోర్బల, రహితునిఁ గాఁ జూడవల దరాతిప్రవరా.
| 488
|
తే. |
తివిరి ముల్లోకములను వధింపఁ బూని, దండము పరిగ్రహించినదండధరుని
పోల్కి నని నిన్ను వధియింపఁబూని గదను, జేకొని గడంగినాఁడ వీక్షింపు నన్ను.
| 489
|
ఆ. |
ప్రొద్దు గ్రుంక వచ్చె సుద్దులు వే యేల, కదనమునకు హాని గలుగకుండ
నేఁడు నిన్నుఁ జంపి నీచేతఁ జచ్చిన, దితిజవరులవగపు దీర్చి పుత్తు.
| 490
|
రాముఁడు ఖరప్రయుక్తగదను ఖండించుట
వ. |
అనియివ్విధంబునఁ బిఱు సనక మఱుమాటలాడి ఖరుండు సంరంభవిజృంభితుం
డై కాలదండసదృశం బైనగదాదండంబు జరజరం ద్రిప్పి కనకవలయరోచులు
దిశలం జెదర దీప్తాశనింబోలె రామునిపై వైచిన నది మహావేగంబున వృక్షగు
ల్మంబులు భస్మంబు గావించుచు నంతరిక్షంబునఁ బఱతెంచుచున్నం గనుం
గొని యారఘువీరుండు నిశితాగ్రంబు లైనబహువిధశరంబు లడరించి దాని ఖం
డించిన మృత్యుపాశసంకాశ యగునమ్మహాగద రామకార్ముకముక్తకాండంబుల
చేత విభిన్న యై మంత్రౌషధబలంబులచేతఁ బుడమిం బడినవ్యాళికరణి ధరణి
తలంబునం బడియె నిట్లు ఖరాసురప్రయుక్తం బైనగదాదండంబు చూర్ణంబు
చేసి ధర్మవత్సలుం డగు రాముండు స్మయమానుం డై వెండియు నసంరంభంబు
గా వాని కి ట్లనియె.
| 491
|
ఉ. |
ఓరి నిశాట నీ దగుబలోద్ధతి సర్వముఁ జూపి తిట్లు నీ
శూరతయు నభీరతయు సొంపును బెంపును దెల్ల మయ్యె బ
ల్గారుణభంగి నొప్పుగద తప్పక మచ్చితసాయకాహతి
న్ధారుణిఁ గూలె నీకు ఖరనామము గల్గుట వ్యర్థమే కదా.
| 492
|
ఆ. |
నేఁడు నిన్నుఁ జంపి నీచేతఁ జచ్చిన, దితిజవరు వగపుఁ దీర్చి పుత్తు
ననుచు నీవు కడఁక నాడినవాక్యంబు, వ్యర్థ మయ్యెఁ గద నిశాటవర్య.
| 493
|
క. |
వధ్యుఁడవు నీచుఁడ వస, న్మిథ్యావృత్తుండ వైన నీజీవితముం
దథ్యము హరియింతు సుధ న, సాధ్యుం డగుగూఢచరణశత్రుఁడుఁ బోలెన్.
| 494
|
తే. |
దానవాధమ యిపుడు మద్బాణనిహతి, భిన్నకంఠుండ వై కూలియున్ననీదు
ఫేనబుద్బుదశోభితం బైన రుధిర, మిమ్మహీదేవి గ్రోలు నందమ్ము గాఁగ.
| 495
|
తే. |
స్రస్తవిన్యస్తభుజుఁడవు సాంద్రపాంసు, దూషితుండ వై దుర్లభయోష నట్ల
పృథ్విఁ గౌఁగిటఁ జేర్చి నిద్రింపఁగలవు, యడిచి పడనేటి కింతలో నమరవైరి.
| 496
|
తే. |
దానవాధమ నీవు మద్బాణహతిని, దారితావయవుండ వై ధాత్రిఁ గూలు
చుండ నేఁ డాదిగా నొప్పుచుండు నీయ, రణ్య మశరణ్యకులకు శరణ్య మగుచు.
| 497
|
క. |
ఇమ్మున నేఁడు జనస్థా, న మ్మస్మద్బాణపాతనమున హతస్థా
న మ్మగుచుండఁగ మునులు వ, నమ్మునఁ జరియించెదరు ఘనమ్మగసుఖు లై.
| 498
|
క. |
హతబాంధవ లై బాష్పా, ప్లుతలోచన లై విషణ్ణముఖు లై రక్ష
స్సతు లన్యభయావహముగ, గతి లేక భయార్తి నేడ్వఁ గల రిఁక విూఁదన్.
| 499
|
తే. |
వసతుల కిట్టినీవు ప్రాణేశ్వరుండ, వట్టియనురూపకులభార్య లంద ఱాత్మ
హర్షములు దక్కి విధవ లై యనుదినంబు, నుచితశోకరసజ్ఞ లై యుందు రింక.
| 500
|
తే. |
ఓరి క్రూరాత్మ క్షుద్రాత్మ యోరి నీచ, యోరి బ్రాహ్మణకంటక యోరి ఖలుఁడ
పలుకులిం కేల యిపుడు మద్బాణనిహతిఁ, గూల్చి పుచ్చెద శమనునికూటమునకు.
| 501
|
రాముఁడు ఖరాసురునిఁ జంపుట
వ. |
అని బహుప్రకారంబుల ధిక్కరించి పలుకుచున్న రామునివచనంబులు విని
రోషావేశంబున వికటభ్రుకుటిదుర్నిరీక్షుం డై ఖరుండు ఖరతరస్వనంబున నట్ట
హాసంబు సేయుచు మహాగజంబునకు మదం బెక్కించినచందంబునఁ గ్రూరవా
క్యంబుల నాకు రోషోత్పాదనంబుఁ గావించితివి ప్రాణసంశయకరం బగుసమ
రంబునందును నిర్భయంబున ననలిప్తుండ వై మృత్యువశ్యుండ నైతినని యెఱుం
గక పలుకందగనిమాట లాడెదవు కాలపాశపరిక్షిప్తు లగుపురుషులు నిర్గతజ్ఞానేం
ద్రియాంతఃకరణవ్యాపారు లై కార్యాకార్యంబు లెఱుంగక వర్తింతు రిప్పుడు
నిన్నుఁ బరిమార్చెదఁ జూడు మని పలికి యచ్చేరువ నున్నయొక్కవిశాలసాలంబు
నిరీక్షించి ప్రహారార్థంబు కరంబుల దాని నుత్పాటించి తెచ్చి రోదోంతరంబు
నిండ వికటధ్వనిఁ గావించుచు సందష్టదశనచ్చదుం డై దీనం జావు సిద్ధించు
నని సంరంభంబున వీచి వైచిన నారాముండు నిశాతసాయకంబు లడరించి
యమ్మహీరుహంబు నింతింతలు తునుక లై ధరణిం బడ ఖండించి యరివధార్థంబు
తీవ్రం బగురోషం బంగీకరించి చిఱుచెమట మొగంబునం గ్రమ్ముదేఱ రక్తాంత
లోచనుం డై ప్రచండకాండసహస్రంబున వానిసర్వమర్మంబులు గలంచె
నప్పుడు ప్రస్రవణాఖ్యపర్వతంబువలనం దొరఁగుసెలయేళ్లపోలిక వానిశరీరం
బుననుండి బహుప్రకారంబుల రక్తధారలు స్రవించుచుండె నిట్లు జర్జరితాంగుం
డై విహ్వలుం డై రుధిరగంధోపలక్షితుం డై మత్తుం డై ఖరుండు నానావిధాట్ట
హాసంబుల గర్జించుచుఁ గదిసినం జూచి రఘువల్లభుండు శస్త్రసంధానావకా
శార్థంబు త్వరితపాదవిక్షేపుం డై తిర్యగ్గమనంబున నొక్కింత వెనుకకుం జని
త్వరితవిక్రమాటోపుం డై.
| 502
|
క. |
తడ వేల యీదురాత్మునిఁ, గడురయమునఁ ద్రుంచి దండకనివాసులకుం
బడయంగ రానిసౌఖ్యము, లొడఁగూర్చెద మునులఁ బ్రోచు టొప్పుగుఁ గాదే.
| 503
|
మ. |
అని చింతించి ఖరు న్వధించుటకు నన్యబ్రహ్మదండం బొకో
యనఁ జె ల్వొందుచుఁ దీక్ష్ణ మై శుచినిభం బై గోత్రభిద్దత్త మై
ఘన మై యొప్పుప్రచండకాండము సమగ్రక్రోధుఁ డై కూర్చి జ్యా
ధ్వనిఁ గావించుచు వేగ దీసి విడిచెన్ దర్పంబు శోభిల్లఁగన్.
| 504
|
వ. |
ఇ ట్లాకర్ణపూర్ణంబుగాఁ దిగిచి విడిచిన.
| 505
|
క. |
రామధనుర్ముక్తం బగు, భీమాస్త్రం బపుడు వేయిపిడుగులమ్రోఁత
న్వ్యోమమున నేగి గ్రక్కున, తామసుఁ డగుఖరునియురముఁ దప్పక సొచ్చెన్.
| 506
|
తే. |
అంబకము వక్షమునఁ దూఱునంతలోనఁ, దత్కృశానునిచే వినిర్దగ్ధుఁ డగుచు
|
|
|
ఖరుఁడు ధరఁ గూలె మును శ్వేతగహనమందు, హరదృగగ్నిదగ్ధాంధకాసురునికరణి.
| 507
|
వనమున నుండుఋషులు రామునిఁ బ్రస్తుతించుట
క. |
కులిశముచే వృత్రునిక్రియ, జలఫేనముచేత నముచిసరణి నశనిచే
బలునిగతి రామశరమున, బలవంతుఁడు ఖరుఁడు ధరణిఁ బడియె నిహతుఁ డై.
| 508
|
వ. |
ఇట్లు పాపాత్ముం డగుఖరుండు గూలినయనంతరంబ మహర్షి బ్రహ్మర్షి దేవర్షి
రాజర్షి గణంబులు పరమానందంబున నచ్చటికిం జనుదెంచి విజయలక్ష్మీవిరాజ
మానుం డై యున్నరఘువీరుని సముచితంబుగా సందర్శించి మృదుమధుర
వాక్యంబున ని ట్లనిరి.
| 509
|
క. |
అనఘాత్మ యేతదర్థము, పనివడి సురనాథుఁ డైనపాకారి రహిన్
ఘన మగుశరభంగాశ్రమ, మునకుం జనుదెంచె మున్ను మునులకుఁ జెప్పన్.
| 510
|
క. |
అనివార్యశౌర్యు లగునీ, దనుజులఁ జంపుటకు నీవు తపసులచేత
న్వినయోపాయంబునఁ జ, య్యన నానీతుండ వైతి వధిప యిచటికిన్.
| 511
|
క. |
జనవర నీచే నిప్పని, మునుకొని మద్రక్షణార్థము కృతం బయ్యెన్
ఘనదండకములఁ దాపస, జనములు సుఖధర్మయుక్తిఁ జరియింతు రిఁకన్.
| 512
|
చ. |
అని కొనియాడుచున్నసమయంబునఁ జారణసంయుతంబుగా
ననిమిషసిద్ధసాధ్యవరు లచ్చటికిం జనుదెంచి చిత్రము
న్ఘనకుతుకంబు హర్షముఁ బెనంగొన దుందుభినాద మొప్ప న
య్యినకులవర్యుమీఁదఁ గురియించిరి కల్పకపుష్పవర్షముల్.
| 513
|
క. |
ఆడిరి రంభాదులు దగఁ, బాడిరి గంధర్వవరులు పరమమునీంద్రు
ల్వీడిరి భయములు గ్రహములు, గూడిరి శుభరాసులందుఁ గ్రూరత దొలఁగన్.
| 514
|
వ. |
ఇట్లు పరమోత్సవంబుఁ గావించి.
| 515
|
సీ. |
దోషాచరుల ఖరదూషణముఖ్యులఁ గామరూపుల మహాకలుషమతులఁ
గ్రూరుల దారుణాకారుల ఖలజనస్థానవాసులఁ జతుర్ధశసహస్ర
గణితుల నర్ధాధికముహూర్తమున రామచంద్రుఁ డొక్కఁడు శాతసాయకముల
ననిలోనఁ దునుమాడె నహహ యే మన వచ్చు నిమ్మహాత్మునివీర్య మితని దాక్ష్య
|
|
తే. |
మితనిచాతుర్య మితనియహీనసత్వ, మచ్యుతున కట్ల గన నయ్యె ననుచు నిట్లు
వేయినోళ్లఁ గీర్తించుచు విబుధవరులు, చనిరి గ్రమ్మఱఁ దమతమసదనములకు.
| 516
|
ఆ. |
అంతలోనఁ వీరుఁ డగులక్ష్మణుఁడు సీత, తోడఁ గూడ శైలదుర్గపథము
వలన నిర్గమించి వరుస సుఖంబుతోఁ, బర్ణశాలఁ జేరె భద్రయశుఁడు.
| 517
|
తే. |
అంత జయశీలుఁ డగు రాముఁ డచటిమునుల, చేతఁ బూజితుఁ డై సుమిత్రాతనూజు
చేత సంపూజ్యమానుఁ డై సీతఁ గూడి, పర్ణశాలఁ బ్రవేశించె భాసురముగ.
| 518
|
ఉ. |
ఇంచుక యైన స్రుక్కక యహీననిశాటుల నశ్రమంబునం
|
|
|
ద్రుంచి మహర్షిముఖ్యపరితోషణుఁ డైనరఘుప్రవీరు న
భ్యంచితమూర్తి గన్గొని మహాప్రమదం బిగిరింప సీత నే
త్రాంచలదీధితు ల్నిగుడ నట్టె కవుంగిటఁ జేర్చె నెంతయున్.
| 519
|
వ. |
మఱియు ఖరాసురునిసైన్యంబునందు జితకాశు లగువా రెవ్వ రెవ్వరు గల
రట్టిరాక్షనులతోఁ గూడఁ దాత్కాలికస్వేచ్ఛాగృహీతచతుర్దశసహస్రదివ్య
మంగళవిగ్రహంబు గలవాఁ డగుటవలన నొక్కొక్కరాక్షసున కొక్కొ
క్కరాముం డై కనుపట్టి శక్రాదుల కైన నసాధ్యు లగువారి బలవంతులఁ
జతుర్దశసహస్రరక్షోవీరుల నొక్కండె ఘటికాత్రయంబులోన సంహరించి
మహాత్ము లగుపరమర్షులకు జగన్మోహనదివ్యమంగళస్వమూర్తిసాక్షాత్కారం
బునఁ బరమానందంబు సంపాదించుచు విజయలక్ష్మీవిరాజమానుం డై లతా
ప్రతానోద్గ్రథితజటామండలుం డై దృఢబద్ధకక్ష్యత్వంబున స్కంధావలంబిత
తూణీరుం డై రణావసాననిర్వాపితకోపాగ్ని యగుటవలనఁ బ్రసన్నముఖుం డై
సీతాలక్ష్మణమార్గావలోకనుం డై నిర్వర్తితవీరకృత్యుం డై వీరవ్రతుం డై విగళ
ద్రుధిరాప్లుతశరీరుం డై ఘర్మపయఃకణౌఘకలితలలాటుం డై కోదండదండంబు
నవలంబించి తనముంగల నున్నరామభద్రునిం గనుంగొని సీత "ఆత్మావై
పురుషస్య దారా” యనెడు నియమంబున శ్రీరామసత్తచేత తానును సత్తావతి
నైతి నని తలంచి "రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుషవిగ్రహ" మ్మని
యజ్ఞానంబున మున్ను తా నాడినవాక్యావరాధం బపనయించుకొనుటకును
నాయుధవ్రణంబులకుఁ గుచోష్మముచేతఁ బరిహారంబు గావించుటకును గ్రమ్మఱ
గాఢంబుగాఁ బరిరంభించి ప్రీతిసంహృష్టసర్వాంగి యై వదనంబు రాకాశశాం
కునిచందంబున నందం బై యొప్ప శశాంకునిం గూడినరోహిణికైవడి నలరు
చుండె.
| 520
|
అకంపనుఁడు జనస్థానమందలి రాక్షసవినాశమును రావణునకుఁ దెల్పుట
క. |
అంత నకంపనుఁ డనువాఁ, డెంతయు శీఘ్రమున లంక కేగి నిశాంతా
భ్యంతరమున రావణుఁ గని, స్వాంతంబున నెగులు దోఁపఁ జయ్యనఁ బలికెన్.
| 521
|
క. |
దనుజేంద్ర జనస్థానం, బున నున్ననిశాటు లెల్లఁ బొలిసిరి త్రిశిరుం
డును ఖరుఁడును దూషణుఁడును, ఘనరణమునఁ జచ్చి రేమి గణుతింతు నిఁకన్.
| 523
|
వ. |
ఏ నొక్కరుండ నతిప్రయత్నంబునం దప్పించుకొని నీకడకుం జనుదెంచితి.
| 524
|
క. |
నా విని సంక్రుద్ధుం డై, రావణుఁ డటు కన్నుఁగొనల రక్తిమ నిగుడన్
దావాగ్నికరణి మండుచు, మోవి యదర వానితో సముద్ధతి ననియెన్.
| 525
|
సీ. |
దారుణం బగుజనస్థాన మెవ్వానిచే హత మయ్యె నవ్వాఁడు హాలహలము
కానక ద్రావె లోకంబులలో నాకు విప్రియ మొనరించి వితతసుఖముఁ
బడయ శక్రుని కైనఁ బౌలస్త్యునకు నైన శమనుని కైనను శౌరి కైన
|
|
|
నలవిగా దే నలయమునకు యముఁడ హుతాశనుఁ గాల్చుహుతాశనుండ
|
|
తే. |
మృత్యువును జంపుమృత్యువ నత్యమోఘ, తేజమున వహ్నిభానులఁ దెగడువాఁడ
బలముపెంపున వెస మహాబలుని వేగ, మడఁచి భృత్యునిఁగాఁ గొని యలరువాఁడ.
| 526
|
క. |
అని యిటు మోమునఁ జిడిముడి, గనుపడ సంక్రుద్ధుఁ డైనకైకసిపట్టిం
గని భీతి నకంపనుఁ డొ,య్యన యభయము వేఁడె దర్శితాంజలి యగుచున్.
| 527
|
క. |
దానవవిభుఁ డగు రావణుఁ, డానరభోజనున కప్పు డభయ మొసఁగిన
న్మానక విస్త్రబ్ధుం డై, వానికి ని ట్లనియె మరల వాఁ డభయోక్తిన్.
| 528
|
ఉ. |
మానితబాహుశౌర్యుఁ డసమానుఁడు వైరికులాంబుముగ్జగ
త్రాణుఁడు సింహసంహననుఁ డాయతబాహుఁడు వీరుఁ డాజికిన్
సూనుఁడు రామనాముఁ డొకశూరుఁడు శోభిలు వానిచే జన
స్థానము నాశ మొందె ఖరదానవదూషణసంయుతంబుగన్.
| 529
|
క. |
అన విని దశకంఠుఁడు నెమ్మనమునఁ గ్రోధంబు పెరుఁగ మదమున నాగేం
ద్రునిగతి రోఁజుచు వానిం, గనుఁగొని గంభీరభంగిఁ గ్రమ్మఱఁ బలికెన్.
| 530
|
క. |
సురపతి నిర్జరయుతుఁ డై, యురుగతిఁ దోడుపడ వచ్చెనో గా కున్న
న్నరుఁ డొక్కఁ డింతఁ జేసెనె, కర మరుదుగ వానితెఱఁగు గణుతింపు మిఁకన్.
| 531
|
అకంపనుఁడు రావణునికి రాముని పరాక్రమప్రకారము దెల్పుట
క. |
నా విని యకంపనుం డా, రావణునితలం పెఱింగి రామునిబలముం
బ్రావీణ్యము శౌర్యము సు, శ్రీవిభవము దెలియ నిట్లు చెప్పఁ దొడంగెన్.
| 532
|
సీ. |
దశకంధర వినుము దశరథరాముండు విలుకాండ్రలో నతివిశ్రుతుండు
నమితతేజుండు దివ్యాస్త్రసంపన్నుండు నాలంబులో జిష్ణుఁ బోలువీరుఁ
డమ్మేటియనుజన్ముఁ డతిబలవంతుండు రక్తాంతనేత్రుండు రాజముఖుఁడు
దుందుభినాదుఁ డమందవిక్రమశాలి యనురూపకుఁడు లక్ష్మణాఖ్యుఁ డతని
|
|
ఆ. |
తోడఁ గూడి గాడ్పుతోడఁ గూడిన చిచ్చు, కరణి రిపులమీఁదఁ గనలుచుండు
మేటిరాముచేత గీ టణంగిరి జన, స్థానవాసు లైనదైత్యు లెల్ల.
| 533
|
క. |
అనిమిషుల కంతసత్త్వము, వినుతపరాక్రమము శౌర్యవిస్ఫురణము గ
ల్గునె దనుజులతో వైరము, గొనుటకు మది సందియంబు గొనఁ డసురేంద్రా.
| 534
|
క. |
రామధనుర్ముక్తము లగు, హేమమయమహోగ్రశరము లెంతయు హేతి
స్తోమములకరణి నసురుల, భీమపరాక్రములఁ గాల్చె భీషణభంగిన్.
| 535
|
క. |
అనిలోనఁ బ్రాణభయమునఁ, గనికని వడిఁ బఱచునట్టి క్రవ్యాదులకున్
విను మేదిక్కునఁ జూచినఁ, బ్రణుతగుణా దోఁచు రామభద్రుఁడు గడిమిన్.
| 536
|
వ. |
మఱియు భయకర్శితు లై రాక్షసులు రాక్ష, సత్వగోపనార్థం బేయేరూపాం
తరంబునఁ జరింతు రాయాపరిగృహీతరూపాంతరంబున మ్రోల నున్న దాశ
రథినే విలోకింతు రదియునుం గాక రణసాధనత్వబుద్ధిచేత నేయేవస్తువు గొనం
|
|
|
జూతు రాయావస్తువు నెల్ల రామాకారంబుగా విలోకింతు రివ్విధంబున.
| 537
|
తే. |
రాక్షసేశ్వర రణమున రాముచేత, నలజనస్థాన మభిహతం బయ్యె ననిన
మానసంబునఁ గోపించి వానితో ద, శాస్యుఁ డి ట్లనె నుద్వృత్తి నట్టె లేచి.
| 538
|
క. |
ఏమి యకంపన యిప్పుడె, రాముని లక్ష్మణయుతముగ రణమునఁ దునుమం
గామించి పంచవటి కే, నీమెయిఁ జనువాఁడ శౌర్య మింపారంగన్.
| 539
|
క. |
నా విని యకంపనుం డా, రావణు వాక్యమున కులికి రక్షోవర యా
భూవరుపౌరుషసత్త్వ, ప్రావీణ్యము విను మటంచుఁ బలికెఁ గృపణుఁ డై.
| 540
|
సీ. |
అధిప రాముఁడు మహాయశుఁ డురువిక్రమంబున నసాధ్యుఁడు శౌర్యధనుఁడు కుపితుఁ
డంబుసంపూర్ణమహాపగావేగంబు నైన మహోధ్ధతి నడ్డగించు
సగ్రహతారనక్షత్ర మైననభంబు నిరవకాశము సేయు నేర్పుకలిమి
నుదకమగ్నావని నుద్ధరింపఁగఁ జాలుఁ గడువడి గాడ్పువేగము నడంచుఁ
|
|
తే. |
దివిరి జలనిధివేల భేదించి మించి, ముజ్జగంబుల నీటిలో ముంపఁగలఁడు
కడిమిమై వారినిధి నరికట్ట నేర్చు, ధరణిధరముల మోవంగ దక్షుఁ డతఁడు.
| 541
|
ఆ. |
సంహరించి మరల సర్వలోకంబులఁ, గడఁగి విక్రమమునఁ గలుగఁజేయు
సృష్టము లయినట్టి విష్టపంబుల నెల్ల, నడఁప శక్తుఁ డమ్మహాయశుండు.
| 542
|
సీ. |
దశకంఠ నాకపదం బపుణ్యులచేతఁ గడిమి మీఱ జయింపఁబడనిమాడ్కి
విష్టపత్రయనుతవిక్రమాధికుఁ డైనరాముండు నముచిహిరణ్యకశిపు
శంబరబలివృత్రజంభాదివిఖ్యాతదనుజులచే నైన నని జయింపఁ
బడఁ డట్టిఘనుఁ డెట్లు పరఁగ నీచే జయించుటకు శక్యుం డగు సొరిది నతఁడు
|
|
తే. |
వాసవాదులకైన నవధ్యుఁ డనుచు, మదిఁ దలంచెద నమ్మహామతిని గెలుచు
నట్టిసదుపాయ మెఱిఁగింతు నసురనాథ, మానసం బెందుఁ బోనీక దాని వినుము.
| 543
|
అకంపనుఁడు రామునిం జంపుట కుపాయము రావణునికిఁ దెల్పుట
వ. |
అని యి ట్లకంపనుండు రాక్షసుం డయ్యు ననేకజన్మాంతరకృతసుకృతపరిపాకం
బునఁ దత్కాలసముత్పన్నశ్రీరామస్వరూపవిషయజ్ఞానంబు గలవాఁ డై రా
ముం డని పలుకుటవలన రామునికోపంబున కసంహార్యత్వంబును విక్రమంబున
నసాధ్యుఁ డని పలుకుటవలన విక్రమంబు ప్రవృత్తం బగుచుండ నివారించు
ట కశక్యుం డనుతాత్పర్యంబును నుపపదరహితం బైనయసాధ్యశబ్దంబున బ్ర
హేంద్రాద్యసాధ్యత్వంబును గుపితుం డనుశబ్దంబున మర్యాదోల్లంఘనవిష
యనిగ్రహనిష్ఠుం డనునర్థంబును మహాయశుం డనుశబ్దంబున లోకంబునందు
సుప్రసిద్ధవిభవుం డనుభావంబును మహాపగావేగంబు నైన నడ్డగించు నని ప
లుకుటవలన భవిష్యత్కృష్ణావతారవృత్తాంతంబును నభంబు నిరవకాశంబు
సేయునని పలుకుటవలనఁ ద్రివిక్రమావతారవృత్తాంతంబును నుదకమగ్నావని
నుద్ధరింపఁగ జాలు నని పలుకుటవలన వరాహావతారవృత్తాంతంబును సంసార
|
|
|
సముద్రంబున మునింగినజనంబునకుఁ బరమపురుషార్థరూపమోక్షప్రదుం డని
యెడునభిప్రాయంబును ముజ్జగంబుల నీటిలో ముంపఁగలం డని పలుకుటవలన
సంహారకారణత్వంబును వారినిధి నరికట్ట నేర్చు నని పలుకుటవలనఁ గరిష్య
మాణసేతుబంధనకార్యంబును గాడ్పువేగము నడంచు నని పలుకుటవలనఁ బం
చభూతవిలయపూర్వకప్రళయకర్తృత్వంబును ధరణీధరముల మోవంగ దక్షుఁ
డని పలుకుటవలనఁ గూర్మావతారవృత్తాంతంబును సంహరించి మరల సర్వలో
కంబుల విక్రమంబునఁ గలుగఁజేయు నని పలుకుటవలనఁ బూర్వకల్పసంహా
రపునస్సృష్టికర్తృత్వంబును వెండియు మహాయశుం డని పలుకుటవలన షడ్గు
ణైశ్వర్యసంపన్నత్వంబును శక్తుం డని పలుకుటవలన ననంతశక్తిత్వంబును సృ
ష్టము లయినట్టివిష్టపంబుల నణంచు నని పలుకుటవలన వర్తమానసృష్టిసంహా
రకర్తృత్వంబును దశకంఠయని సంబోధనంబు సేయుటవలన రావణునిదశవద
నత్వంబును నల్పశక్తిత్వంబును రాముని సహస్రశీర్షత్వంబును నపరిమితానం
తశక్తివిశిష్టత్వంబును సూచింపం జేసి వెండియు ని ట్లనియె.
| 544
|
ఉ. |
ఆతనిపత్ని నూత్నకమలాయతలోచన మేఘవేణి జై
వాతృకమండలాస్య వరవర్ణిని పల్లవకోమలాంఘ్రి య
బ్జాతసుపాణి యర్ధశశిఫాల మనోహరసుందరాంగియున్
సీత యనంగఁ జె ల్వెసఁగుఁ జేసినపుత్తడిబొమ్మకైవడిన్.
| 545
|
ఉ. |
ఆయెలనాగచక్కఁదన మాలికుచస్తనిరూపవైభవం
బాయహిరోమరాజిపలు కామదవారణయానమోవితీ
రాయలివేణిమోముసొబ గామృదుకోకిలవాణి మేనిబా
గేయుగమందు నెవ్వరికి నెందును గానము రాక్షసేశ్వరా.
| 546
|
తే. |
సురసతులయందు గంధర్వసుదతులందు, నురగసతులందు దానవయోషలందు
నవ్వెలందికి సరి యైన యతివ లే ద, నంగ నరసతులందు జెప్పంగ నేల.
| 547
|
తే. |
ఆ నెలఁత రామునకుఁ బ్రాణ మట్లు గాన, దాని వంచనఁ గైకొంటివేని యతఁడు
తద్వియోగాగ్నిచేఁ గ్రాఁగి తత్క్షణంబ, చచ్చు నిది దక్క వేఱొక్కజాడ లేదు.
| 548
|
క. |
అనిన నకంపనువాక్యము, విని దశకంఠుండు చాల వెఱఁగుపడి మనం
బునఁ జింతించి రయంబున, ఘనరవమున వానితోడఁ గ్రమ్మఱఁ బలికెన్.
| 549
|
క. |
అటు లైన నేమి యఘటన, ఘటనాచతురుండ నేను గాల్యంబున న
చ్చటి కేగి సీతఁ జేకొని, యిటు దోడ్కొని వత్తుఁ బలుకు లిం కేటి కిటన్.
| 550
|
రావణుఁడు మారీచునికడ కేగుట
క. |
అని ఖరములఁ బూన్చిన కాం, చనమయ మగునరద మెక్కి సర్వదిశలు గ్ర
క్కున వెలిఁగించుచుఁ జనియెను, దనదుర్మంత్రమున కలరి దైత్యులు మెచ్చన్.
| 551
|
క. |
ఆరాక్షసనాథునిరథ, మారయ సంచార్యమాణ మై యుడువీథిన్
భూరిద్యుతి నేగుచు నొ, ప్పారె వలాహకములోని హరిణాంకుక్రియన్.
| 553
|
వ. |
ఇట్లు గదలి దశగ్రీవుండు రయంబునఁ దాటకేయుం డగుమారీచునియాశ్ర
మంబునకుం జని యతనిచేత నమానుషంబు లగుభక్ష్యభోజ్యంబులచేత నర్చి
తుం డై సముచితాసనంబున నాసీనుం డయ్యె నప్పుడు మారీచుం డర్థగంభీరం
బైనవాక్యంబున ని ట్లనియె.
| 554
|
క. |
దనుజోత్తమ నీకును నీ, తనయులకును రాజ్యమునకుఁ దరుణులకు సుహృ
జ్జనులకు సేమమె నీవ, చ్చినకార్యం బెద్ది దానిఁ జెప్పుము నాకున్.
| 555
|
మారీచుఁడు రావణునకు హితోపదేశముఁ జేయుట
వ. |
రాక్షసేంద్రా లోకంబులకు సేమంబు లే దని శంకించెద ఘనప్రయోజనంబు
లేక భవదాగమనంబు దొరకొనదు గదా యని పలికిన నారావణుం డమ్మా
రీచున కి ట్లనియె.
| 556
|
క. |
అనఘా యే మని చెప్పుదు, ననుపమభుజవీర్యయుక్తుఁ డగురామునిచే
వినిహతు లైరి జనస్థా, ననిలయు లగురాక్షసులు ఘనం బగునాజిన్.
| 557
|
ఆ. |
రాక్షసారి యైనరామునిప్రియభార్య, నపహరింప మైత్త్రి నిపుడు నెఱపు
నా నతండు దైత్యనాథునితోడ ని, ట్లనియె హితము నయము వినుతి కెక్క.
| 558
|
ఆ. |
మిత్రరూపుఁ డైన శత్రుఁ డెవ్వాఁడు నీ కీయనర్థకార్యం మిట్లు గఱపె
సామదానకలనసత్కృతుం డైనవాఁ, డిట్టియశుభవాక్య మేల చెప్పు.
| 559
|
ఉ. |
సీతను ముచ్చిలింపు మని చెప్పిన దుష్టునిఁ బట్టి కత్తిచే
వే తలఁ గొట్టరాదె యవివేకతఁ గ్రూరతరాహినోటిలోఁ
జేతులు పెట్టఁ జూచెదవు శిష్టుల కీతెఱఁ గొప్ప దయ్యయో
పాతకరూపకర్మమున భవ్యయశంబును లచ్చి వోవదే.
| 560
|
క. |
కడువడి నెవ్వఁడు సుఖసు, ప్తుఁడ వగునీయుత్తమాంగము కరంబునఁ జే
డ్పడఁ బ్రహరించెను రావణ, తడయక యెవ్వాఁడు చెఱుపఁదలకొనెఁ గులమున్.
| 561
|
చ. |
సురవినుతప్రతాపమదశుద్ధకులాభిజనాగ్రహస్తసుం
దరతరదివ్యలక్షణవితానవిభాసితదోర్విషాణ మై
వఱలెడు రాఘవాఖ్యబలవర్ధనగంధగజంబు పోరిలో
నరుదుగఁ దేఱిచూచుటకు నర్హము గాదు నిశాచరేశ్వరా.
| 562
|
మ. |
సమరాంతస్థితిసంధివాలము సమసక్రూరరాత్రించరో
గ్రమృగధ్వంసనశీలము న్నిశితఖడ్లస్ఫారదంష్ట్రంబు సు
ప్తము బాణావయవప్రపూర్ణ మగుశుంభద్రామహర్యక్షమున్
గ్రమము న్గానక మేలుకొల్పఁ దగునే క్రవ్యాదవంశోత్తమా.
| 563
|
చ. |
ఘనభుజవేగపంక మయి గాఢతరప్రదరోర్మిజాల మై
ధనురవహార మై విమతదారుణ మై సుమహాహవౌఘ మై
యనుపమ మై యగాధ మయి యద్భుత మై యనిశం బపార మై
తనరెడురాఘవాబ్ధిఁ బడ దానవనాథ తలంపఁ జెల్లునే.
| 564
|
రావణుఁడు మారీచువచనప్రకారంబున మరలి లంక కేగుట
వ. |
రాక్షసేంద్రా నీవు మహాత్మం డగుపులస్త్యబ్రహ్మవంశంబున బుట్టినవాఁడవు
భుజవీర్యంబునం బ్రసిద్ధికి నెక్కినవాఁడవు నీకుఁ బరదారాభిమర్శనంబు
యుక్తంబు గాదు దానివలనఁ బౌరుషంబునకు హాని సిద్ధించు నావచనంబుఁ
బట్టి ప్రసన్నుండ వై లంకాపురంబుఁ బ్రవేశించి సర్వాంతఃపురకాంతలం గూడి
సుఖింపుము రాముండు దండకారణ్యంబునందు సీతాసహితుం డై యిష్టోపభో
గంబు లనుభవించుచు విహరించుచుండుఁ గాక యని పలికిన నద్దశాననుండు
మారీచునిచేత నివారితుం డై క్రమ్మఱ లంకాపురంబునకుం జనియె నంత నిక్కడ
శూర్పణఖ రామునిచేత నివాతు లైనచతుర్దశసహస్రరక్షోవీరులం జూచి ఖర
దూషణత్రిశిరులనిధనంబునకు దుఃఖించుచుఁ దనయంగవికలత్వంబునకు
లజ్జించుచు ననన్యసాధారణం బైనరామునిపరాక్రమప్రకారంబునకు భయంబు
నొందుచు శోకవిషాదరోమంబులు మనంబున ముప్పిరిగొన నచ్చోట నిలు
వక మేఘంబుకరణి మహారావంబు సేయుచు శీఘ్రంబున రావణపాలితం
బైనలంకాపురంబుఁ బ్రవేశించి యందుఁ గైలాసశిఖరసంకాశం బైనపుష్పక
విమానాగ్రభాగంబున.
| 565
|
క. |
తరణినిభం బగుచామీ, కరవరసింహాసనమునఁ గర్భురవృతుఁ డై
సురపరివృతుఁ డగుశక్రుని, కరణిం గొలు వున్నపంక్తికంఠునిఁ గనియెన్.
| 566
|
తే. |
కాంచనమయేష్టకాపరికలితయాగ, వేదిమధ్యంబుఁ బ్రాపించి వివిధమంత్ర
వివిధపృషదాజ్యమునఁ జాల వృద్ధిఁ బొంది, నట్టిపావకు చందాననలరువాని.
| 567
|
క. |
నరగంధర్వామరకి, న్నరచారణసిద్ధసాధ్యనాగనభస్వ
ద్వరుల కజయ్యుని శూరునిఁ, బరేతపతిభంగిఁ గ్రాలు భయదాకారున్.
| 568
|
శూర్పణఖ రావణునికడ కేతెంచుట
క. |
బలభిత్సంగ్రామంబునఁ, గులిశకృతవ్రణుని నభ్రకుంజరదంతా
వలిసంఘృష్టకిణాంకో, జ్జ్వలనూతనరత్నహారసంభృతవక్షున్.
| 569
|
క. |
పదితలలజోదుఁ దగ ని, ర్వదిచేతులమేటి రాజవరలక్ష్మాఢ్యుం
ద్రిదశభయంకరరూపునిఁ, బ్రదీప్తతేజుని సమస్తరాక్షసరాజున్.
| 570
|
క. |
గిరినిభుని మహాస్యునిఁ బాం, డరదశనుని దీర్ఘభుజుని నద్ధకనకభా
సురకుండలు స్నిగ్ధవిడూ, రరత్నసంకాశు దేవరాజప్రతిమున్.
| 571
|
క. |
నరసురసంగ్రామంబుల, హరిచక్రనిపాతనమున నన్యాస్త్రసము
|
|
|
త్కరమునఁ దాడితదేహునిఁ, బరమభుజావిక్రమమునఁ బరఁగెడువానిన్.
| 572
|
క. |
అక్షోభ్యసమస్తసము, ద్రక్షోభుని శైలదళనదక్షుని నుగ్ర
ప్రేక్షణుని సురవిదారిని, రక్షోగణవిభుని ధర్మరహితాత్మకునిన్.
| 573
|
ఆ. |
యజ్ఞవిఘ్నకరుని నన్యదారాభిమ, ర్శనుని సర్వదివ్యశస్త్రబాణ
యోక్త నమితసత్త్వయుతుని స్వహస్తార్జి, తప్రవీరశబ్దు దైత్యవిభుని.
| 574
|
క. |
కడువడి భోగవతీపురి, కడకుం జని సర్పవిభునిఁ గడచి ప్రతాపం
బడరఁగఁ దక్షకుభార్యను, గడిమిం గొని తెచ్చినట్టి ఘనశౌర్యనిధిన్.
| 575
|
క. |
మునువడిఁ గైలాసాచల, మునకుం జని యందు ధనదుఁ బోరి గెలిచి త
ద్ఘనకామగపుష్పకముం, గొని తెచ్చినవీరు నసురకులదీపకునిన్.
| 576
|
క. |
అనిమిషపతినందనమును, ధననాథునిచైత్రరథము తక్కినదేవ
ప్రణుతోద్యానవనంబులు, వినశింప నొనర్చినట్టి విక్రమశాలిన్.
| 577
|
క. |
తపనునితేజముఁ దారా, ధిపుశైత్యము వహ్నిదేవుతీక్ష్ణత భుజస
త్వపటిష్ఠత్వంబున నే, యపరాజితుఁ డడఁచె నట్టియచలాకారున్.
| 578
|
క. |
పదివేలవర్షములు వన, పదమునఁ దప మాచరించి పదపడి విధికి
న్ముదము జనింపఁగఁ దనతల, లదరక యుపహార మిచ్చినట్టి మహోగ్రున్.
| 579
|
క. |
నరుఁ డొకఁడు తక్కఁ దక్కిన, గరుడామరసిద్ధసాధ్యగణములచే సం
గరమునఁ జావక యుండఁగ, వర మెవ్వఁడు వడసె నట్టి వ్రతసంసిద్ధున్.
| 580
|
క. |
నిరనుక్రోశునిఁ గర్కశు, నరిభంజను లోకములకు నహితకరుని దు
శ్చరితుని భయదాకృతి లో, కరావణుని వికృతముఖునిఁ గాపథవర్తిన్.
| 581
|
సీ. |
గరుడగంధర్వకిన్నరసిద్ధసాధ్యసుందరుల నేవీరుండు చెఱలఁ బట్టెఁ
దన కడ్డ మైనశంభుని కాటప ట్టగుకైలాస మెవ్వాఁడు గాసి చేసె
నలకూబరునితోడఁ గలయంగఁజనెడురంభను బట్టి యెవ్వాఁడు బలిమిఁ జెఱిచెఁ
గాంచనమయవిశ్వకర్మనిర్మితలంక కమర నేశూరుండు రమణుఁ డయ్యె
|
|
తే. |
నట్టిశూరుని దానవపట్టభద్రుఁ, దతమణీభూషణప్రభూషితశరీరు
దివ్యమాల్యోపశోభితు దీప్తవదను, మణివిమానాధిరూడు రావణునిఁ గనియె.
| 582
|
వ. |
మఱియు నధ్వరంబులందును హవిర్దానంబులందును బ్రాహ్మణులచేతఁ బ్రాతర
నువాకగ్రావస్తోత్రాదిమంత్రంబులచేత నభిష్టుతం బైనసోమంబు నెవ్వఁ డపహ
రించె నట్టిదశగ్రీవునిఁ బావకసంకాశలోచనుని మంత్రిమధ్యంబున విలోకించి
యభీతచారిణి యగుశూర్పణఖ భయమోహమూర్ఛిత యై తనవైరూప్యంబు
దర్శింపఁ జేసి క్రోధోద్రేకంబున బొమలు ముడిపెట్టుచు దారుణవాక్యంబున
ని ట్లనియె.
| 583
|
శూర్పణఖ రావణుని నానావిధంబుల దూఱుట
చ. |
అలయక కామభోగములయందుఁ బ్రమత్తుఁడ వై నిరంకుశో
|
|
|
జ్జ్వలుఁడవు మందశేముషివి స్వైరవిహారుఁడ వట్లు గావునన్
దెలియఁగఁ జాల వీవు తల ద్రెంపఁగ వచ్చినవైరి నైన నీ
కిల నొకరుండు నాటి గలఁడే దనుజాధిప బుద్ధిహీనతన్.
| 584
|
చ. |
సతతము గ్రామ్యభోగపరిషక్తుఁడు లుబ్ధుఁడు కామవృత్తుఁ డౌ
క్షితిధవునిం బ్రజ ల్విరతిఁ జెంది శ్మశానహుతాశనుం బలెన్
మతిఁ బరికింతు రెవ్వఁ డభిమానము దక్కి మెలంగు నట్టికు
త్సితుఁడు సజీవుఁ డయ్యు గతజీవుఁడు గాఁడె దలంచి చూడఁగన్.
| 585
|
క. |
కాలమునం దెవ్వఁడు తా, నాలస్యముఁ జేసి కార్య మరయం డాభూ
పాలుం డక్కార్యముతో, వాలాయము చెడు నపేతవైభవుఁ డగుచున్.
| 586
|
క. |
జను లస్వాధీనుని దు, ర్జను దుర్దర్శుని నయుక్తచారుని ధాత్రీ
శుని దవ్వుల విడుతు రధీ, శ నిమ్నగాపంకమును గజంబులు వోలెన్.
| 587
|
మ. |
అరయ న్మేదినిలోన నేనృపతు లస్వాధీనులై దేశమున్
బరిపాలింపఁగఁ జాల రట్టినృపతు ల్నానాప్రకారంబులన్
స్థిరసంపన్మహిమ ప్రభుత్వములచే దీపింపఁగాఁ జాల రా
సురవంశోత్తమ వార్ధిమగ్నపృథులక్షోణీధరప్రాయు లై.
| 588
|
ఆ. |
చపలమతి వయుక్తసంచారుఁడవు జడా, త్మకుఁడ వైననీవు ధైర్యవంతు
లైనదేవదానవాదులతో విగ్ర, హించి రాజు వైతి వెట్టు లకట.
| 589
|
క. |
మతిహీనునిఁ గాముకసం, గతునిఁ దెలియఁదగినయట్టికార్యము దెలియ
న్ధృతి లేనినిన్ను రాక్షస, పతిఁ జేసిననలువ యెంతఁ బాలిశుఁ డొక్కో.
| 590
|
వ. |
మఱియుఁ జారుండును గోశంబును సయంబు నెవ్వారికి స్వాధీనులు గా రట్టినరేం
ద్రులు మూర్ఖజనులతోడ సమాను లగుదు రదియునుంగాక.
| 591
|
క. |
చారులచే విషయసమా, చారంబుల నెఱిఁగి యుచితసరణి మెలఁగుధా
త్రీరమణుఁడు దైత్యేశ్వర, యారయఁగా దీర్ఘదర్శి యనఁ దగు నుర్విన్.
| 592
|
తే. |
ధరణి నెవ్వాఁడు ఘనజనస్థానమందుఁ, జచ్చిన ఖరాదుల నెఱుంగఁజాలఁ డట్టి
నిన్నుఁ బ్రాకృతసచివసంపన్ను నధిక, కామభారావసన్నునిఁగాఁ దలంతు.
| 593
|
ఆ. |
భీమకర్మము లగు యామినీచరచతు, ర్దశసహస్రములును ద్రిశిరుఁడును ఖ
రుండు దూషణుండు దండిరాక్షను లొక్క, రాముచేత మడిసి రేమి గలదు.
| 594
|
తే. |
రాక్షసోత్తమ నృపుఁ డైనరాముచేతఁ, దాపసుల కెల్ల నభయంబు దత్త మయ్యె
ధర్షితం బయ్యె నలజనస్థానపదము, దండకంబులు సుకృతభద్రంబు లయ్యె.
| 595
|
క. |
విను మీవు స్వదేశంబున, జనియించిన భయ మెఱుంగఁ జాల వయితి గా
వున మత్తుండవు లుబ్ధుఁడ, వనవరతము బాలబుద్ధి వనుచుఁ దలఁచెదన్.
| 596
|
క. |
ధర శఠునిఁ బ్రమత్తుని దు, ష్కరు నల్పునిఁ దీక్ష్ణకరుని గర్వితుని మహీ
వరుని సమస్తజనంబులు, నిరసింతురు వ్యసనమందు నిందితచరితా.
| 597
|
క. |
అతిమానియు నగ్రాహ్యుఁడు, సతతముఁ గ్రోధనుఁడు నాత్మసంభావితుఁ డౌ
క్షితిపతిని స్వజన మైనను, బ్రతతమతి న్వ్యసనమందు వధియించు నిలన్.
| 598
|
క. |
తనవారిసేమ మరయక, తనయిచ్చకొలందిఁ దిరుగుధాత్రీశుఁడు గ్ర
క్కున వారలచేఁ దృణముక్రి, య నెన్నఁబడు వ్యసనసమయమం దసురేంద్రా.
| 599
|
ఆ. |
పరఁగ శుష్కకాష్ఠపాంసులోష్టంబుల, వలనఁ గార్య మొకటి గలుగుఁ గాని
దానవేంద్ర వినుము స్థానపరిభ్రష్టు, లైననృపులచేత నదియు లేదు.
| 600
|
తే. |
రాజ్యపదహీనుఁ డైనట్టి రాజు చతురుఁ, డైన నేమి నిరర్థకుఁ డై నశించు
దానవేశ్వర యుపభుక్తమైనపటము, మాడ్కి నామ్లాన కుసుమదామంబుకరణి.
| 601
|
తే. |
నయనముల నిద్రితుం డయ్యు నయవిలోచ, నముల సర్వంబుఁ బరికించునరవిభుండు
వ్యక్తకోపప్రసాదుఁ డై వఱలువాఁడు, సంతతముఁ బూజ్యుఁ డగు సర్వజనులచేత.
| 602
|
వ. |
మఱియు నెవ్వండు విజితేంద్రియుం డై యప్రమత్తుం డై కృతజ్ఞుం డై ధర్మశీ
లుం డై స్వరాష్ట్రపరరాష్ట్రవృత్తాంతాభిజ్ఞుం డై ప్రవర్తించుచు నట్టిమహీపతి
చిరకాలంబు రాజ్యంబు పరిపాలించు నీవు జనస్థాననివాసు లగురక్షోవరుల
వధప్రకారం బెఱుంగనికతంబునఁ బూర్వోక్తసుగుణవర్జితుండ వనియును
విషయాసక్తుండ వనియును దేశకాలవిభాగనిర్ణయంబులయం దసమర్థుండ వని
యును గుణదోషనిశ్చయంబునం దయుక్తబుద్ధి వనియును జనంబులచేత నెన్నం
బడుదువు లోకాపవాదంబువలన నాయుర్భాగ్యంబులు నశించు నని యివ్విధం
బున స్వదోషంబు లుగ్గడించి దూఱుచున్నశూర్పణఖవాక్యంబులు విని నిశాచర
వల్లభుండును ధనదర్పబలాన్వితుండు నగు రావణుండు క్రోధమూర్ఛితుం డై
మారీచుండు సమరంబు యుక్తంబు గా దని నిషేధించె నీశూర్పణఖ సమరంబు
నం దుత్సాహకల్పనంబు సేయుచున్నది యెయ్యది కర్తవ్యం బని కొండొక
సేపు విచారించి యమాత్యమధ్యంబునఁ గోపోద్దీపితముఖి యై పరుషంబులు పలు
కుచున్నశూర్పణఖ కి ట్లనియె.
| 603
|
సీ. |
రాముఁ డెవ్వఁడు తత్పరాక్రమం బేచంద మెంతశౌర్యము గల దెట్టిరూప
మేటికి ఘనదండకాటవి కరుదెంచె లా వెంత చల మెంత యావిభునకు
నాయుధం బెద్ది ఘోరాజిలో ఖరదూషణాదినిశాచరు లతిసమర్థు
లెట్లు రామునిచేత నిందఱు హతు లైరి శౌర్యంబు ప్రకటింపఁజాల రైరి
|
|
తే. |
యనుచు రాక్షసవిభుఁడు దశాననుండు, తెలియ నడిగిన విని క్రోధదీప్తవదన
యగుచు ముక్కిఁడిరక్కసి యన్నతోడ, నమ్మహాత్మునివృత్తాంత మంతఁ జెప్పె.
| 604
|
శూర్పణఖ రావణునికి రామునివృత్తాంత మంతయుఁ దెల్పుట
ఉ. |
రాముఁడు బాహువిక్రమపరాజితభార్గవరాముఁ డంబుద
|
|
|
శ్యాముఁడు దీర్ఘబాహుఁడు జటాజినచీరధగుండు ధీరుఁడుం
గామసమానరూపుఁడు జగజ్జనలోచనరంజనుండు సు
త్రామనిభుండు పంక్తిరథరాజకుమారుఁడు రాక్షసేశ్వరా.
| 605
|
క. |
ఘనశక్రచాపనిభ మగు, కనకాంచితదివ్యకార్ముకం బెక్కిడి గ్ర
క్కున నారాచవితానము, పనివడి దొరఁగించు ఘోరఫణితతిని బలెన్.
| 606
|
క. |
విలు సవరించుటయును శర, ములు గుణమునఁ గూర్చుటయును మునుకొని సైన్యం
బులపై నేయుటయును ననిఁ, దెలియఁగ రా దయ్యె నాదితేయవిరోధీ.
| 607
|
క. |
శరవృష్టిచేతఁ గూలిన, సురారిసైన్యమును బోలఁ జూచితి ననిలో
సురవిభునియశ్మవృష్టిని, సరయాహతి మర్విఁ బడినసస్యమునుబలెన్.
| 608
|
క. |
పదునాల్గువేలదనుజులు, పదాతి యగునొక్కరామభద్రునిచే దు
ర్మదఖరదూషణయుతముగఁ, గదనావనిఁ బడిరి మూఁడుగడియలలోనన్.
| 609
|
ఆ. |
మునుల కభయ మొసఁగి మునుకొని ఖరదూష, ణాదిదనుజవరుల నాజిఁ జంపి
విపినపథము నెల్ల సుపథంబుఁ గావించె, నతనిబాహుశౌర్య మరిది పొగడ.
| 610
|
తే. |
వితరణరంగధీరుఁ డై వెలయునట్టి, రామభద్రునిఘోరశరములచేతఁ
దెగక యే నొక్కదాన నతిప్రయత్న, మున విముక్త నై వచ్చితి దనుజవర్య.
| 611
|
చ. |
అతనికిఁ దమ్ముఁ డుజ్జ్వలుఁ డహస్కరతేజుఁడు బుద్ధిమంతుఁ డ
ప్రతిముఁడు వీర్యవంతుఁ డనురక్తుఁడు భక్తుఁడు తుల్యవీర్యుఁ డా
శ్రితపరిపోషణుండు భయశీలుఁ డమర్షియు దుర్జయుండు న
ద్భుతబలుఁ డొప్పు రాత్రిచరపుంగవ లక్ష్మణనామధేయుఁ డై.
| 612
|
వ. |
అమ్మహాత్ముండు రామునకు దక్షిణభుజమాత్రుం డై బహిశ్చరం బగుప్రాణంబు
చందంబున నొప్పుచుండు నదియునుంగాక.
| 613
|
శూర్పణఖ రావణునికి సీతారూపవైభవంబుఁ బ్రస్తుతించి చెప్పుట
ఉ. |
ఆతనిపత్ని భీతహరిణాక్షి మనోహరచారుగాత్రి య
బ్జాతనుపాణి యర్ధశశిపాల సుకేశి సునాస రూపవి
ఖ్యాత యశస్వినీమణి జగజ్జనసన్నుతశీల పూర్ణిమా
శీతకరోపమానముఖి చెల్వగు సీత యనాఁ బ్రసిద్ధ యై.
| 614
|
తే. |
కమలవైరిని బాయనికౌముదిగతిఁ, గాయ మెడఁబాసి యుండనిఛాయపగిది
దనుజవర పువ్వుఁ బాయనితావికరణి, భర్త నెడఁబాయకుండు నప్పద్మనేత్ర.
| 615
|
ఉ. |
ఆజనకావనీశసుత కాశతపత్రవిశాల నత్ర కా
రాజనిభాస్య కాభుజగరాజమనోహరరోమరాజి కా
రాజితరూపవైభవతిరస్కృతనూతనరత్నపుత్రి కం
భోజనివాసినీకుధరపుత్రిక లైనను సాటి వత్తురే.
| 616
|
చ. |
మును ఫణిలోకసుందరులమోహనరూపవిలాసవిభ్రమం
|
|
|
బనిమిషలోకవాసిహరిణాక్షులశోభనదేహసౌష్ఠవం
బనుపమమర్త్యకామినులయందముచందముఁ బోలఁ జూడమే
దనుజవరేణ్య కాన మల దానికి నీ డగుదాని నెందునన్.
| 617
|
ఉ. |
ఆమదిరాక్షిచక్కఁదన మాయలికుంతలయాటపొంక మా
శ్యామవచోవిలాసవిధ మాలికుచస్తనిచూడ్కిచంద మా
రామవిలాస మాయువతిరాజితలక్షణ మాలతాంగిసొం
పే మని చెప్పుదాన నసురేశ్వర చూచినఁ గాని దీరునే.
| 618
|
క. |
ధరలో నెవ్వని కాసతి, యిరు వందఁగ భార్య యయ్యె నెవ్వానిఁ దమిం
బరిరంభించె నతం డా, పురుహూతునకంటె నధికపూజ్యుఁడు గాఁడే.
| 619
|
శా. |
ఆనీలాలక యాగజేంద్రగతి యాయంభోజపత్రాక్ష యా
పీనశ్రోణి సురారి నీకుఁ దగు నాపృథ్వీజకు న్నీవు ని
త్యానందంబు నొసంగ నర్హుఁడవు మీ కన్యోన్యముం జిత్తసం
ధానం బైన నభూతపూర్వవిభవౌన్నత్యంబు చేకూడదే.
| 620
|
ఉ. |
దానిమనోజ్ఞవేషమును దానివచోరచనాచమత్కృతుల్
మానుగఁ జూచి నీకుఁ దగుమానిని యంచుఁ దలంచి వేడ్కతో
నేను గడంగి బల్వడి గ్రహింపఁగఁ బోయి సుమిత్రపట్టిచే
దానవనాథ యిట్టు లసిధార విరూపిత నైతి నెంతయున్.
| 621
|
క. |
మదనునియాఱవశర మగు, సుదతీమణిచంద మీవు చూచితివేనిం
ద్రిదశారి యేమి చెప్పుదు, మదనజ్వరతాపవార్ధిమగ్నుఁడు గావే.
| 622
|
క. |
ఆగజయానను భార్యం, గాఁ గైకొనుతలఁపు నీకుఁ గల దేని సము
ద్యోగి వయి యిపుడె చెచ్చెర, నేగుము విజయార్థ మీ వహీనగుణాఢ్యా.
| 623
|
క. |
రాముని రణభీముని సు, స్థేముని వధియించి యతనిచే మున్ను సమి
ధ్భూమిని జచ్చిన దనుజ, స్తోమమునకుఁ బ్రియ మొనర్పు దోషాటవరా.
| 624
|
తే. |
దైత్యకంటకు లైనయీదాశరథుల, నిరువుర వధించి తేని యాధరణివుత్రి
యొంటి మైఁ జిక్కు నవ్వలఁ దుంటవిల్తు, మచ్చరించుచు భోగింపవచ్చు నీకు.
| 625
|
క. |
నావచనం బొనగూర్పఁగ, భావించితి వేసి దనుజపాలక యిపుడే
వేవేగ దండకాటవి, కీవెంటం జనుము రాము నెక్కటి గెలువన్.
| 626
|
రావణుఁడు సీతాపహరణమునకై బయలుదేఱుట
వ. |
అని యిట్లు బహుప్రకారంబులఁ బాపవ్యవసాయంబునందు బుద్ధి తగులుపడు
నట్లుగా బోధించిన నయ్యసురాంగనవాక్యంబు విని ఖరదూషణులమరణంబు
నకు దుఃఖించి సచివముఖంబునఁ గార్యంబు తెలిసికొని వారి నందఱ నిండ్లకుఁ
బోవం బంచి యద్దశగ్రీవుం డంతఃపురంబునకుం జని యనంతరంబ తన
మనంబునఁ దత్కార్యపర్యాలోచనంబుఁ జేసి సునిశ్చితార్థుం డై క్రమ్మఱ దా
|
|
|
ర్ఢ్యంబుకొఱకు నాలోచించి సీతాపహరణకార్యంబు పౌరుషంబునం జేసితినేని
గుణం బగుఁ శౌర్యంబునం జేసితి నేని దోషం బగు నైనను ఖరాదియుద్ధంబు
నందు రామునియచింత్యబలపౌరుషంబులు వినఁబడుటవలనఁ బౌరుషంబునఁ
గావించుటకు శక్యం బై యుండ దుపాయపరికల్పితచౌర్యాశ్రయణంబునందు
దాత్కాలికదోషంబులు పరిదృశ్యమానంబులు గావు గావున సీతాపహరణంబు
చౌర్యంబునం గావించెదఁ గాక యని నిశ్చయించి స్థిరబుద్ధి యై రయంబున
యానశాలకుం జని పెద్ద లెఱింగిన నివారింతు రని తలంచి రహస్యంబుగా రథంబు
సన్నద్ధంబు గావింపు మని సూతు నాజ్ఞాపించిన లఘువిక్రముం డగునతండు
తత్క్షణంబ పిశాచవదనంబు లైనఖరంబులం బూన్చి కాంచనమయంబును
రత్నభూషితంబును గామగమనంబు సగురథం బాయితంబు చేసి తెచ్చిన దాని
నారోహించి శ్వేతమాల్యవ్యజనుండును శ్వేతచ్ఛత్రుండును స్నిగ్ధవైడూర్యసం
కాశుండును దృప్తకాంచనకుండలుండును దర్శనీయపరిచ్ఛదుండును దశగ్రీవుం
డును వింశతిభుజుండును దేవశత్రుండును మునికంటకుండు నగురావణుండు శిఖర
దశకసమన్వితం బైనపర్వతంబుచందంబున నందం బై బలాకామాలాసహి
తంబును విద్యున్మండలవంతంబు నైనమేఘంబుపగిది నంబరంబునం
చని రమ్యం బగుసాగరానూపంబు విలోకించె నది మఱియును.
| 627
|
సీ. |
బహుపుష్పఫలమహీరుహకదంబయుతంబు పద్మశోభితసరోభాసితంబు
వేదిమదాశ్రమవిసరవిశాలంబు నానాపతత్రిసునాదితంబు
నజమాషవాలఖిల్యమరీచిపాత్రేయవైఖానసాదిసంవాసితంబు
నాగసుపర్ణగంధర్వకిన్నరసిద్ధసాధ్యవిద్యాధరసంవృతంబు
|
|
తే. |
సాలతాలతమాలహింతాలమాతు, లుంగనారంగలుంగలవంగబిల్వ
వశకింశుకశింశుపావకుళనీప, మంజరీకుంజపుంజోపరంజితంబు.
| 628
|
రావణుఁడు మారీచునికడ కేగుట
వ. |
మఱియు నారికేళకదళీవనోపశోభితంబును నత్యంతనియతాహారపరమర్షి
శతాకీర్ణంబును దివ్యాభరణభూషితదివ్యరూపక్రీడారతివిధిజ్ఞదివ్యాప్సరోజన
సహస్రసంచారితంబును దేవపత్నీసంసేవితంబును నమృతాశిదేవదానవసంఘ
విరాజితంబును హంసక్రౌంచసారసప్రణాదితంబును రమ్యవైడూర్యప్రస్తరంబును
బాండరదివ్యమాల్యసంయుతతూర్యగీతాభిజుష్టవిశాలవిమానవిభ్రాజితంబును
నగుసముద్రతీరప్రదేశంబు డాయంజని యందు ఘ్రాణతృప్తికరనిర్యాసరసమూల
చందనాగరువనోపవనంబులును దక్కోలజాతివృక్షంబులును సుగంధిఫలంబులును
దమాలపుష్పంబులును మరీచిగుల్మంబులును ముక్తాసమూహంబులును శంఖ
ప్రస్తరంబులును బ్రవాళనిచయంబులును గాంచనరాజితశైలంబులును మనోజ్ఞ
|
|
|
శిలాఫలకంబులును బ్రసన్నసలిలాశయంబులును ధనధాన్యోపపన్నస్త్రీరత్న
శతసంకులగజాశ్వరథసంబాధనగరంబులును విలోకించుచు సాగరతరంగ
సంభూతశీతవాతపోతంబులు పై సోఁక నలరుచు నీదేశంబు స్వర్గతుల్యం బై
యున్నదని కొనియాడుచుం జని యందొక్కచోటఁ దొల్లి గరుడుండు సుధాహర
ణార్థంబు స్వర్గలోకంబునకుం బోవుచు గజకచ్ఛపంబులఁ దన్నికొని భక్షణా
ర్థంబు శతయోజనాయకం బైనరోహిణిశాఖ నెక్కిన నది భారంబు మోపం
జాలక తత్క్షణంబు విఱుగుటయు దాని నవలంబించి తలక్రిందుగాఁ దపంబు
సేయుచున్నబ్రహ్మనఖజాతు లైనవైఖానసులను వాలసంభవు లైనవాలఖిల్యు
లను బూతిమాషగోత్రజాతులను నయోనిజులను మరీచిపు లనుమహర్షుల నవ
లోకించి వారికి బాధ యగు నని యమ్మహాశాఖను నగ్గజకచ్ఛపసహితం
బుగా నొక్కపాదంబునఁ దన్నికొని యంతరిక్షంబున కెగిసి యందు గజకచ్ఛ
పంబుల భక్షించి శాఖాసహితంబుగా నిషాదవిషయంబునకుం జని యచ్చటి
నిషాదుల నెల్ల మ్రింగి యవ్వనస్పతిశాఖ నచ్చట విడిచి యభిమతభక్షణనిషాద
నాశనమునిజనరక్షణజనితసంతోషవిశేషంబున ద్విగుణీకృతవిక్రముం డై యమ
రావతికిం జని యందుఁ బక్షిరాజప్రవేశపరిహారార్థంబు నిబద్ధంబు లైన
యయోమయశృంఖలానిర్మితజాలంబులు భేదించి రత్నగృహంబు విధ్వస్తంబుఁ
జేసి యందు నిక్షేపించి యున్నసురేంద్రగుప్తం బైనయమృతంబుఁ దెచ్చె
నట్టిమహర్షిగణజుష్టంబును సుపర్ణకృతశాఖాభంగరూపలక్షణంబును సుభద్ర
నామకంబు నైనన్యగ్రోధవృక్షంబు నిరీక్షించుచుం జని యవ్వల నదీపతి యగు
సముద్రతీరంబున నొక్కపుణ్యకాననంబున రహస్యంబుగా నున్నయొక్క
రమ్యాశ్రమంబుఁ జూచి యందుఁ గృష్ణాజినజటావల్కలధరుం డై నియతా
హారుం డై తపంబు సేయుచున్నమారీచుం డనురాక్షను నవలోకించి యతని
చేత నమానుషంబు లైన సర్వకామంబుల నర్చితుం డై సంపృష్టకుశలప్రశ్నుం
డై వెండియుఁ జనుదెంచుటకుఁ కార్యం బెద్ది యని యడిగిన రావణుం డతని
కి ట్లనియె.
| 629
|
క. |
దనుజోత్తమ దీనుఁడ నగు, ననుఁ గరుణం గాచుటకు ఘనంబున నీవే
యనుపమగతి వటు గావున, వినిపించెద వినుము నాదువృత్తాంతంబున్.
| 630
|
సీ. |
రాముండు దండకారణ్యదేశమునకుఁ జనుదెంచుటయును లక్ష్మణునిచేత
రూఢి శూర్పణఖ నిరూపిత యగుటయుఁ నన్నిమిత్తము జనస్థానవాసు
లగుచతుర్దశసహస్రాసురులను గూడి ఖరుఁడు సంగ్రామార్థ మరిగి యచట
రామునిచేత శరప్రపాతనమున సైన్యంబుతోఁ గూడఁ జచ్చుటయును
|
|
తే. |
బలులు దూషణత్రిశిరులు పొలియుటయును, రామువిక్రమ మాతనిదీమసంబు
సర్వమును దెలియంగ సుపర్వవైరి, కడఁగి నీతోడఁ జెప్పితిఁగాదె తొల్లి.
| 631
|
ఉ. |
ఇంతటివారితోడ నొకహీననరుం డతఁ డెంత శూరుఁడో
యెంతయు శంక లేక కలహించిన భీరునిమాడ్కి నేఁడు నా
కెంతయు నూరకుండఁ దగునే యసురోత్తమ యట్టు లైన జం
భాంతకముఖ్యుల న్సమరమందు జయించినవాఁడి వోవదే.
| 632
|
ఉ. |
నాదుభుజాబలోద్ధతి తృణంబునకు న్సరి గాఁగ నెంచి మ
త్సోదరికర్ణనాసికముఁ ద్రుంచి విరూపిణిఁ జేసి యంతఁ బో
కాదటఁ బ్రాణమిత్రుల ఖరాదులఁ జంపినరాముని న్మను
ష్యాదన చంప కున్న విను ప్రాణము మానముఁ బోవదే వెసన్.
| 633
|
ఉ. |
రాక్షసరక్షితం బగునరణ్యము సొచ్చి ఖరాదిరాక్షసా
ధ్యక్షులఁ జంపినట్టి మనుజాధిపు గీ టణఁగింపకున్నచో
రాక్షసవర్య యిప్పుడె తిరంబుగ లంకకు నేగుదెంచి శి
క్షాక్షముఁ డై సమస్తసురకంటకుల న్వధియింపకుండునే.
| 634
|
రావణుఁడు మారీచునిఁ దనకు సీతాహరణమునందు సహాయునిఁ గమ్మనుట
చ. |
అతఁడు పదాతి యయ్యు నొకఁ డయ్యును మానవుఁ డయ్యు విక్రమో
ద్ధతులు ఖరాదిరాక్షసుల దారుణరూపులఁ జంపె నట్టియ
ద్భుతబలశాలి డాసి పలుపోకల వంచన నైన శస్త్రసం
హతి నెదిరించి యైన మన మందఱ మొక్కటఁ గూల్ప వల్వదే.
| 635
|
వ. |
చిరకాలంబున నుండి పరమమునీంద్రుల బాధించుచు మన్నియోగంబున జన
స్థానంబున నివసించి యున్న చతుర్దశసహస్రరక్షోవీరుల నొక్కింత యైనఁ బరు
షం బాడక వాక్పారుష్యంబు శరంబులం దనుసంధించి యశ్రమంబునం బరి
మార్చి దండకారణ్యంబు సర్వజనశరణ్యంబుఁ గావించె నతండు క్రుద్ధుం డగు
తండ్రిచేత నిరస్తుం డై సభార్యుం డై వనంబునకుం జనుదెంచి యాకలంబు మెస
వుచు క్షీణజీవితుం డై యున్నవాఁడు విశేషించి దుశ్శీలుండును గర్కశుండును
దీక్ష్ణుండును మూర్ఖుండును లుబ్ధుండును నజితేంద్రియుండును క్షత్రియపాంస
నుండు నుద్యక్తధర్ముండును నధర్మాతుండును భూతంబుల కహితకరుండు నై
ధర్మశీలు రగుమనయట్టివీర్యవంతులచేత నిందితుండై యుండు నెవ్వని చేత వై
రంబు లేక మద్భగిని యగుశూర్పణఖ కర్ణనాసచ్ఛేదనంబున విరూపిత యయ్యె
నట్టిదురాగ్రహుం డగురామునిభార్యను సురసుతోపమ యగుసీతను విక్ర
మించి లంకకుం గొని తెచ్చెద నక్కార్యంబునకు నీవు సాహాయ్యంబుఁ గావిం
పుము సకలోపాయజ్ఞుండవు శూరుండవు సర్వమాయావిశారదుండవు గావున
వీర్యయుద్ధంబులందును నీకు సమానం డగువాఁడు ముల్లోకంబులందు నెవ్వం
డును లేఁడు భవత్సాహాయ్యంబునం బడయరానియర్థంబు గలదె నీవు పార్శ్వ
వర్ధి నగుచుండ నిక్కార్యంబు సఫలంబు గావించెద నది యెట్లనిన వినుము.
| 636
|
చ. |
అరయ సువర్ణచిత్రితమృగాకృతిఁ గైకొని రామునాశ్రమాం
తరమున సీతసమ్ముఖమునం జరియించుము నీవు నిన్నుఁ జె
చ్చెరఁ బరికించి యీకనకచిత్రమృగంబును బట్టి తె మ్మటం
చఱిముఱి రామలక్ష్మణుల నావరవర్ణిని పంపు నత్తఱిన్.
| 637
|
చ. |
పనివడి యంత వారలయపాయమునందు విధుంతుదుండు చం
ద్రునికళనట్ల యవ్వరవధూటిని బల్మి గ్రహించి రాముఁడుం
గనికని గేహినీహరణకర్శితుఁ డై పలవించుచుండ నె
మ్మనమున సంతసించుచు సమస్తసుఖంబులు వేడ్క నొందెదన్.
| 638
|
మారీచుఁడు రావణునకు హితోపదేశము సేయుట
క. |
అని పలికిన రామునికథ, వినినంతనె తత్ప్రతాపవిదుఁ డగుమారీ
చునిముఖము వెల్ల నయ్యెను, మనం బధికభయసముద్రమగ్నం బయ్యెన్.
| 639
|
వ. |
మఱియు శుష్కంబు లైనయోష్ఠంబులు నాలుకం దడుపుచు ననిమిషంబు లైన
నేత్రవ్యాపారంబులచేత మృతభూతుం డైనవానియట్ల పరమార్తుం డై
చేష్టలు దక్కి రావణునివదనంబు విలోకించుచుఁ గొండొకసే పూరకుండి
వెండియు నొకింత తెల్వి దాల్చి చేదోయి నిటలంబున సంఘటించి యతనికిం
దనకును హితం బగునట్లుగా వినయవాక్యంబున ని ట్లనియె.
| 640
|
తే. |
ఆపదలఁ దెచ్చునట్టిప్రియములఁ బలుకు, కపటచిత్తులు పెక్కండ్రు గలరు గాని
యాపదఁ దొలంగ నిడునట్టియప్రియములఁ, బలుకువారలు వినువారు గలుగు టరిది.
| 641
|
సీ. |
దనుజేంద్ర నీ వయుక్తచరుండవును జపలుండవు గావునఁ జండవీర్యు
వరగుణోన్నతు శక్రవరుణాభు రాముని నసమానబలునిఁగా నరయ వైతి
సకలరాత్రించరులకు స్వస్తి యగుఁ గాక రాముఁ డల్గి జగం బరాక్షసంబు
గావింపకుండుఁ గాక మహీజ నీపాలి కుర్విలో మిత్తి గా కుండుఁ గాక
|
|
తే. |
తన్నిమిత్తంబు వ్యసనంబు దలఁగుఁగాక, కామరతుఁడవు దుష్కార్యకారి వీశ్వ
రుండ వగునిన్నుఁ బొంది పేర్గొన్నలంక, నిండువేడుక నశియింపకుండుఁగాక.
| 642
|
తే. |
జగతి నెవ్వాఁడు తన్ను రాష్ట్రమును హితులఁ, జుట్టములఁ జంపికొనఁజూచె నట్టిదుష్ట
తముఁడు నీయట్టిదుర్జాతిదారుణుండు, ధర్మహీనుండు కలుషుండు దక్కఁ గలఁడె.
| 643
|
సీ. |
రాక్షసేశ్వర విను రాముండు లుబ్ధుఁడు గాఁడు దుశ్శీలుఁడు గాఁ డధర్మ
మార్గనిష్ఠుఁడు గాఁ డమర్యాదుఁ డగువాఁడు గాఁడు భూతద్రోహి గాఁడు పితృని
రస్తుఁడు గాఁడు దుర్మతి గాఁడు తీక్ష్ణుఁడు గాఁ డవిద్వాంసుఁడు గాఁడు కర్క
శుఁడు గాఁడు కులపాంసనుఁడు గాఁడు కైకచే వంచితుఁ డగుసత్యవాదిజనకు
|
|
తే. |
నెఱిఁగి తత్ప్రియకామార్థ మెల్లసిరులు, రాజ్యమును బాసి దండకారణ్యమునకు
వచ్చె నమ్మహాత్మునిప్రభావంబు దెలియ, కాగ్రహంబున ననృతంబు లాడఁదగునె.
| 644
|
తే. |
రామభద్రుండు సత్యపరాక్రముండు, ఘనుఁడు ధర్మమూర్తి సకలజననుతుండు
|
|
|
పండితుండును సురల కింద్రుండవోలె, నఖిలలోకంబులకు నాథుఁ డసురవర్య.
| 645
|
క. |
అక్షీణతేజమున నభి, రక్షిత యగురామసతిని బ్రసభంబున లో
కాక్షిరుచినట్ల నీ వే, దక్షతచే నపహరింపఁ దలఁచితి బుద్ధిన్.
| 646
|
తే. |
శరశిఖోదీర్ణ మప్రధృష్యంబు రుచిర, చాపఖడ్గేంధనంబు ప్రచండదీప
మగుచు రాజిల్లురామాగ్నియందు మిడుత, పగిది నుఱుకఁ దలంప నీ కగునె యధిప.
| 647
|
చ. |
ఘనతరజీవితంబును సుఖంబును రాజ్యము వీటిఁ బుచ్చి నీ
వనిశము ఖడ్గపాశధరుఁ డన్యచమూహరణుం డమర్షణుం
డనుపమబాణహేతియుతుఁ డద్భుతకార్ముకదీప్తవక్త్రుఁ డై
యను వగురాఘవాఖ్యవిలయాంతకునిం జెనకంగ నేటికిన్.
| 648
|
తే. |
అమ్మహాత్మునిఘనతేజ మప్రధృష్య, మట్లు గావునఁ దత్కార్ముకాశ్రయ యగు
భూమిపుత్రిని గాననభూమియందు, సాహసంబున హరియింపఁ జాల వీవు.
| 649
|
చ. |
అనఘుఁడు సత్యసంధుఁడు మహాత్ముఁడు విక్రమవంతుఁ డైనరా
మునకు మహీజ జీవితముఁ బోలినప్రేయసి వీర్యశుల్క య
య్యనలునిహేతితో నెనయునాహరిణేక్షణ నాకులాంగనం
బనివడి నీకు వేగతుల బల్మి గ్రహింపఁగ రాదు రావణా.
| 650
|
క. |
ఏటికిఁ దలఁచితి విప్పని, మాటికి లోకమున నింద్యమానుఁడ వై దో
షాటకులేశ్వర నిక్కము, చే టొందెద వంతె గాక చేకొన వశమే.
| }651
|
క. |
అక్షీణతేజమున నభి, రక్షిత యై భానురుచికరణిఁ గ్రాలెడు ప
ద్మాక్షిని సీతను నీ వే, దక్షతచే నపహరింపఁ దలఁచితి బుద్ధిన్.
| 652
|
క. |
అతులిత మగురాజ్యము జీ, వితంబును సుఖంబు ననుభవింపంగఁ దలం
చితి వేని రామునకు నప, కృతి సేయక యుండు టదియె హిత మసురేంద్రా.
| 653
|
మారీచుఁడు రామునిచేఁ దాను బడినపాటు రావణునకుఁ దెల్పుట
వ. |
మఱియు ధర్మిష్ఠు లగువిభీషణపురోగము లైనసచివుల నందఱం గూర్చి వారి
తోడ నాలోచించి గుణదోషబలాబలంబులు విచారించి స్వపరబలవిశేషం
బెఱింగి హితాహితంబు దలపోసి యవ్వల మే లగునట్టికార్యంబు నిశ్చయింప
వలయు నందాఁక హితుండ నైననాబుద్ధి విని రామునియందు విరోధింపక
క్షమింపుము భవజ్జీవితంబు రామదర్శనావసానం బని దలంచెదఁ దొల్లి యేను
బలవీర్యదర్పంబులచేత నసమానుండ నై మదనాగాయుతబలంబు గలిగి పర్వత
సన్నిభం బైనమచ్ఛరీరంబు నీలజీమూతంబుచందంబునం గ్రాలఁ దప్త
కాంచనకిరీటకుండలంబులు మేనం దీపింపఁ బరిఘాయుధంబు కేలం దాల్చి
లోకంబునకు భయంబుఁ బుట్టించుచు మహియెల్ల సంచరించుచు దండ
కారణ్యంబుఁ బ్రవేశించి మునిమాంసంబు భక్షించుచు స్వేచ్ఛాప్రకారం
బున విహరించుచుండ మన్నిమిత్తంబున విత్రస్తుం డై విశ్వామిత్రుం డను
|
|
|
బ్రహ్మర్షిశ్రేష్ఠుం డయోధ్యకుం జని దశరథుం గాంచి యన్నరేంద్రున కి ట్లనియె.
| 654
|
తే. |
నృపకులోత్తంస మాకు మారీచువలన, నధికభయము సముత్పన్న మయ్యెఁగాన
యాగకాలమునందు సమాహితుండ, నైన ననుఁ బ్రోచుఁ గాక నీ సూనుఁ డిపుడు.
| 655
|
వ. |
అని రామసాహాయ్యంబు వేఁడిన విని యద్ధశరథుండు విశ్వామిత్రుని కి ట్లనియె.
| 656
|
క. |
బాలుఁడు ద్వాదశవత్సరుఁ, డాలంబులతెఱఁ గెఱుంగఁ డకృతాస్త్రుం డీ
శీలము గలరాము ననికి, వాలాయము నాకుఁ బంప వచ్చునె యనఘా.
| 657
|
క. |
ఏ నిప్పుడు నానావిధ, సేనలతోఁ గూడి వచ్చి చెచ్చెర ననిలో
మానుగ నీశత్రువులను, బూనికి వధియింతు లెండు పోద మచటికిన్.
| 658
|
వ. |
అనిన నమ్మనీంద్రుం డమ్మనుజేంద్రున కి ట్లనియె.
| 659
|
క. |
ఆరాక్షసు వధియింపఁగ, శ్రీరామునకంటె నొరుఁడు త్రిజగమునందుం
బేరు గలవారిలోపల, నారయఁగా లేఁడు దశరథాధిప వింటే.
| 660
|
వ. |
రాజేంద్రా నీవు సమరంబులయం దాఱితేఱినశూరుండవు దేవతల రక్షించిన
మహానుభావుండవు భవత్కృతం బైనరణకర్మంబు త్రిలోకవిశ్రుతం బై యుండు
నీకుఁ జతురంగసైన్యంబు గొఱంత లేకుండ నధికం బై యున్న దైన నిక్కా
ర్యంబు రామునకుం దక్కఁ దక్కినవారి కసాధ్యంబు గావున నిమ్మహాత్ముండు
బాలుం డైనఁ గొఱంత లేదు సముదీర్ణం బైననిజతేజంబున రక్షోనిగ్రహంబు
నందు సమర్థుం డై యుండు నితనిం దోడ్కొని యరిగెద నిమ్మహాత్మునకును
నీకును భద్రంబు గలుగుఁ గాక యని పలికి దశరథు నొడంబఱిచి యమ్మునీం
ద్రుండు రామునిం దోడ్కొని పరమహర్షంబున నిజాశ్రమంబునకుం జనుదెంచి
పర్వకాలంబున మఖదీక్షితుం డై యుండె నంతఁ దన్నియోగంబున శ్రీమం
తుండును బద్మపత్రనిభేక్షణుండును మహావీర్యుండును నజాతవ్యంజనుండును నేక
వస్త్రధరుండును బ్రహ్మచర్యస్థితుండును గాకపక్షధరుండును గనకమాలోపలక్షి
తుండు నై రాముండు చిత్రం బగుచాపంబు సారించుచుఁ బ్రదీప్తం బగుస్వతే
జంబున నయ్యరణ్యంబు వెలింగించుచు నుదితుం డగుబాలచంద్రుండుంబోలెఁ
దేజరిల్లుచుండె నంత.
| 661
|
క. |
బలవంతుఁడ నగునే నపు, డలయక వరదానమహిమ నట కేగి చలం
బలరఁగఁ బరిఘము కరమునఁ, జెలువారఁగ బరవసంబుఁ జేసితిఁ గడిమిన్.
| 662
|
క. |
ననుఁ జూచి రామభద్రుఁడు, ధనువును సజ్యంబుఁ జేసి తలఁకక యచలం
బునుబోలె సుస్థిరుం డై, మునిపతి కభయంబుఁ దెల్పి మొనయుచు నుండెన్.
| 663
|
ఆ. |
ఇతఁడు బాలుఁ డాజి నెంతని బుద్ధిమో, హమున నేను గడిమి నట్టహాస
మాచరింప నంత నతితీక్ష్ణ మగుతూపు, వింటివలన నపుడు వెడిలి వచ్చె.
| 664
|
వ. |
ఇ ట్లమోఘరయంబునం బఱతెంచి యమ్మహాశరంబు నన్నుం దాఁకిన నేను
శత్రునిబర్హణబాణతాడితదేహుండ నై శతయోజనంబుదవ్వులం గలసము
|
|
|
ద్రంబునం బడి మూర్ఛ నొందితి నప్పు డారాముండు దయాళుం డై నన్ను
వధియింపక గాచి పుచ్చె నిట్లు రాముని శరవేగంబున నిరస్తుండ నై యచేత
నుండ నై గంభీరం జగుసాగరజలంబునం బడి చిరకాలంబునకుఁ గ్రమ్మఱ లబ్ధ
సంజ్ఞుండ నై బ్రతుకు మరలఁ గంటి నని తలంచి యత్తెరువునకుం జనక లంకా
పురంబుఁ బ్రవేశించితి మత్సహచరు లైనరాక్షసు లందఱు రామునిచేత నిహ
తు లై రప్పుడు రాముండు బాలుండును ననభ్యస్త్రాస్త్రుండు నై యంతఁ జేసె
నిప్పుడు యౌవనాధికుం డై యస్త్రవిద్యయం దాఱితేరియున్నవాఁ డమ్మహా
త్మునితోడ విగ్రహంబుఁ గావించితి వేని ఘోరం బైనయాపద సంభవించు
సంశయంబు లే దని పలికి మారీచుండు వెండియు ని ట్లనియె.
| 665
|
తే. |
అరయఁ గ్రీడారతివిధిజ్ఞు లమితబాహు, సత్వులును సమాజోత్సవశాలు లైన
దానవులకు ననర్థసంతాప మేల, పొసఁగఁ జేసెద విటు బుద్ధిపూర్వకముగ.
| 666
|
క. |
నిరుపమమణిచిత్రితసుం, దరహర్మ్యవిమానశోభితం బగులంకా
పుర మాసీతకతంబునఁ, గర మభిహత మగుచు నుండఁ గాంచెద వధిపా.
| 667
|
తే. |
పాపములు సేయకుండియుఁ బరమశుచులు, రాక్షసోత్తమ పాపసంశ్రయమువలన
నెపుడుఁ బరపాపముల నశియింతు రహిజ, లాశయమునందు మత్స్యంబు లణఁగినట్లు.
| 668
|
క. |
హరిచందనదిగ్ధాంగులు, వరాభరణభూషితు లగువాసవరిపులం
గరము భవద్దోషంబున, ధరణినిపాతితులఁ గాఁగఁ దలఁపుము బుద్ధిన్.
| 669
|
వ. |
మఱియు రామశరపాతనంబునఁ దమవా రెల్లఁ బొలిసిన హతశేషు లగురాక్ష
సులు తమకు రక్షకుండు లేక భయంబునఁ గనుకనిం బఱచుచుండ నిరీక్షింపఁ
గల వదియునుం గాక బహువిధశరశిఖాపరంపరల భస్మీబూతం బై కూలిన
లంకాపురంబు గనుంగొనియెదవు సంశయంబు వలదు పరదారాభిమర్శనంబున
కంటె నధికం బగుపాపంబు వే ఱొక్కటి లేదు నీకుఁ బ్రమదాసహస్రంబులు
భార్యలు గలరు నావచనంబుఁ బట్టి స్వదారనిరతుండ వై కులంబును మానం
బును రాష్ట్రంబును నిష్టం బగుజీవితంబును గళత్రంబులును బంధువర్గంబును
రక్షించుకొను మట్లు సేయ వైతి వేని రామశరవినాశితజీవితుండ వై శీఘ్రం
బున బంధుసహితంబుగా యమక్షయంబునకుం జనియెద వది యట్లుండ నిమ్ము
మత్పురావృత్తాంతంబు వినిపించితిఁ గదా యిప్పుడు వెండియు నాకుం బాటి
ల్లిన యాపదతెఱం గెఱింగించెద నిరుత్తరంబుగా వినుము.
| 670
|
సీ. |
అసురేశ యేను మృగాకృతిఁ గైకొని మృగరూప మగుదైత్యయుగముఁ గూడి
తీక్ష్ణశృంగంబులు దీప్తజిహ్వయు మహాకాయంబు సత్త్వంబు గ్రాలుచుండ
ఘన మగుదండకావనముఁ బ్రవేశించి చైత్యవృక్షములందు శాలలందుఁ
|
|
|
దీర్థదేశములందుఁ దిరుగుచుఁ దపసులఁ దునిమి తన్మాంసంబుఁ దినుచు వారి
|
|
తే. |
రుధిరములు గ్రోలి వనగోచరులకు భీతి, పుట్టఁ జేయుచు రౌద్రత మిట్టిపడఁగ
వలసినట్లుగ వనమెల్లఁ గలయ రయము, మిక్కుటంబుగఁ దిరుగుచు నొక్కనాఁడు.
| 671
|
సీ. |
ధర్మవిచారుఁ డై తాపసాకృతిఁ బూని సీతయు సౌమిత్రి చేరి కొల్వఁ
దాపసోచితవృత్తిఁ దపముఁ గావించుచు నున్నరామునిఁ గాంచి మున్ను నాకుఁ
జేసినయపకృతిఁ జింతించి క్రుద్ధుండ నై డాయ గమకించునంతలోనఁ
దచ్చాపనిర్ముక్తదారుణబాణత్రయంబు మామువ్వుర నతిరయమున
|
|
తే. |
నశనిసంకాశ మై తాఁకె నపుడు తత్ప, రాక్రమవిదుండఁ గావున రాక్షసేంద్ర
యేను బాఱితిఁ దక్కిన యిరువు రుగ్ర, భంగిఁ గూలిరి తద్బాణపాతనమున.
| 672
|
వ. |
ఏను గొండొకసేపునకు మూర్ఛ దేఱి బ్రతుకు మరలం గాంచి మాతృగర్భం
బుననుండి గ్రమ్మఱం బుట్టినవానిఁగాఁ దలంచుకొనుచు నాఁటఁగోలె నాసుర
కృత్యంబు విసర్జించి తాపసుండ నై యివ్వనంబునఁ దపంబు సేయుచున్నవాఁడ
నదియునుం గాక.
| 673
|
మారీచుఁడు తనకుం గలరామభయమును రావణునకుఁ దెల్పుట
చ. |
భ్రమఁ గొని నాఁటనుండి ప్రతిపాదపమందును రామభద్రునిన్
సముదితరౌద్రుఁ గాఁగ ధృతచాపునిఁ గాఁగ మహాత్ముఁ గాఁగ సం
యమివరుఁ గాఁగ వల్కలజటాజినధారిని గాఁగ రాక్షసో
త్తమ కనుచున్నవాఁడ నిటఁ దప్పక దారుణకాలునిం బలెన్.
| 674
|
క. |
కనులకు రామసహస్రము, లనవరతముఁ దోఁచుచున్న వటు గావున ని
వ్వన మెల్ల రామభూతం, బని తలఁచుచు నున్నవాఁడ నసురేశ మదిన్.
| 675
|
తే. |
అసురకులవర్య స్వప్నమందైన రామ, భద్రురూపంబు మదికిఁ జూపట్టె నేని
గురుభయంబున మూర్ఛిల్లి కొంతవడికిఁ, దెలిసి కల యని క్రమ్మఱఁ దెలివిఁ గాంతు.
| 676
|
వ. |
మఱియు రామవిత్రస్తుండ నైననాకు రత్నరథాదికంబు లైనరేఫాదినామం
బులు చెవికి సోకిన నధికభయంబునం గళవళించుచుండుదు వేయేల రేఖా
ద్యం బైనభవన్నామంబును వినుట కధికభయం బగుచున్నది కావున నమ్మహా
త్మునితోడఁ జివ్వకుం జొర నొల్ల నతండు బలినముచివృత్రాదుల నైన లెక్కిం
పక నొక్కమాత్ర నుక్కున నుక్కడంగించునట్టి జెట్టిజోదు నీకును రాముని
తోడి విరోధంబునకుఁ జొరకుండుట క్షేమం బట్లు గాదంటి వేని తగువారల
సాయంబు గూర్చుకొని నీవె యిప్పనికిఁ గడంగుము న న్నేల రామునియమో
ఘబాణంబులకు సమర్పించెదవు నాకు సేమంబుఁ గోరితివేని నామ్రోల రామ
వృత్తాంతంబుఁ జెప్పకుము లోకంబునందు సాధు లనేకులు నియతచిత్తు లై
ధర్మంబు లనుష్ఠించుచుండియుఁ బరులయపరాధంబున సపరిచ్ఛదంబుగా
నాశంబు నొందుదు రట్ల యేనును నీయపరాధంబున నశింపం గలవాఁడ నీతోడి
చుట్టఱికం బింతకుం దెచ్చె మహాతేజుండును మహాసత్వుండును మహాబలుం
|
|
|
డును మహానుభావుండు నగురాముండు రాజనుల పాలిటి కంతకుం డై జన్మిం
చినవాఁడు శూర్పణఖహేతువువలన మహాబలుం డగుఖరుండు నిమిషమాత్రం
బునఁ బొలిసె నతనిపాటుకు దలంపవైతివి నీయట్టిగట్టిమగలు పెక్కండ్రైన
నమ్మహాత్మున కొక్కనికి సాటి సేయం దగదు బంధుహితార్థి నైననావచనంబునం
దనాదరణంబుఁ జేసి రామునితోఁ గలహించితి వేని నిశితంబు లైనతదీ
యశరంబులచేతఁ బీడితుండ వై బంధుసహితంబుగా మడిసెద వని యిట్లు
బహుప్రకారంబులం బ్రబోధించిన మర్తుకాముండు దివ్యౌషధంబుం బోలె
క్షేమయుక్తం బైనమారీచునివాక్యంబుఁ గైకొనక కాలచోదితుం డై రావ
ణుండు పరుషవాక్యంబున నతని కి ట్లనియె.
| 677
|
రావణుఁడు మారీచుని దూఱుట
తే. |
నేరిచినవానిచందాన నీ వయుక్త, భంగి నామ్రోల నెయ్యది పలికి తిప్పు
డది విశేషించి నిష్ఫల మయ్యె నూష, రమున నించిననూత్నబీజములకరణి.
| 678
|
తే. |
పాపశీలుండు మనుజుండు బాలిశుండు, చపలుఁ డగురాఘవునిపౌరుషము ఘన మని
నీవు పలికినయంతనె నృపునితోడి, కలను విడుతునే యిఁకఁ దాటకాతనూజ.
| 679
|
చ. |
హితులను దల్లిదండ్రుల నహీనసుఖంబును లచ్చిఁ బాసి ప్రా
కృత మగుకాంతమాట విని యెవ్వఁ డరణ్యముఁ జొచ్చె నట్టి దు
ర్మతి యగురాజనందనుని ప్రాణసమప్రియ యైనజానకిన్
ధృతి చెలఁగంగ నే నపహరించెద నిక్కము నీదుసన్నిధిన్.
| 680
|
క. |
ధృతిపెంపున నీగతి ని, శ్చిత యై తగ నాదుబుద్ధి చెలఁగెడు దానిం
జతురత మరలింప దివ, స్పతిముఖదిక్పాలు రైనఁ జాలరు తలఁపన్.
| 681
|
వ. |
తాటకేయా కార్యాకార్యవినిశ్చయవిషయంబునందు గుణదోషంబులును
నుపాయాపాయంబులును విచారించి చెప్పు మని ని న్నడిగిన నిట్లు చెప్పవచ్చు.
మా కట్టిజిజ్ఞాస లేదు గావున లేనియధికారంబు నొంది యి ట్లపృష్టోత్తరంబులు
పలుకుట యుక్తంబు గా దెవ్వండు తనకు హితంబుఁ గోరు నట్టివిద్వాంసుం
డగుసచివుం డసంపృష్టుం డై రాజుమ్రోల ని ట్లనుచితప్రసంగంబు ప్రతికూలం
బుగాఁ గావింపండు కావున.
| 682
|
తే. |
కూర్తు వనుచు నీతోడ నాకోర్కి దెలియఁ, జెప్పినందుకు హితయుక్తిఁ జెప్ప కిట్లు
నేర్పు లేర్పడ గుణదోషనిర్ణయంబు, నెఱిఁగినట్లుగఁ బ్రతికూల మెన్నఁ దగునె.
| 683
|
క. |
తగువైఖరి ననుకూలం, బగువాక్యము విభునితోడ నతిమృదుపూర్వం
బగునట్లు చెప్పవలయును, జగతి న్బ్రతికూల మాడఁ జనదు హితులకున్.
| 684
|
వ. |
మఱియు మానార్హుం డగుమహీరమణుండు సమ్మానశూన్యంబును దిరస్కార
సహితం బగువాక్యం బెద్ది గల దది హితం బైనను బ్రతిగ్రహింపఁ డదియునుం గాక.
| 685
|
చ. |
అమితగుణాఢ్యు లైననృపు లగ్నిసురేశమృగాంకవార్ధిరా
ట్ఛమనులపంచరూపములు సమ్మతిఁ గైకొని తైక్ష్ణ్యము న్సువి
క్రమమును సౌమ్యముం దగుతెఱంగున దండము సుప్రసన్నతన్
సముచితభంగిఁ దాల్చి జనసమ్మతు లై చరియింతు రెల్లెడన్.
| 686
|
క. |
కావునఁ బృథివీతులు స, ర్వావస్థలయందుఁ బూజ్యు లధికులు మాన్యు
ల్నీ వది యెఱుఁగక యజ్ఞుని, కైవడిఁ బరుషోక్తు లాడఁగాఁ దగ వగునే.
| 687
|
వ. |
ఏ నిప్పుడు గుణదోషంబులును గార్యాకార్యంబులందు యుక్తాయుక్తభావం
బులును ని న్నడుగలే దే నొక్కకార్యంబు నుద్దేశించి వచ్చితి నక్కార్యవిషయం
బునందు నీవు సాహాయ్యంబుఁ గావింప వలయు నది యె ట్లనిన వినుము.
| 688
|
రావణుఁడు మారీచున కతఁడు చేయవలసినకార్యముఁ జెప్పుట
చ. |
అరయ సువర్ణచిత్రితమృగాకృతిఁ గైకొని రామునాశ్రమాం
తరమున సీతసమ్ముఖమునం జరియించుచు బెళ్కుచూపులన్
వరతనుకాంతులం జికిలివన్నెలఁ జిన్నెల నాత్రిలోకసుం
దరి కతివిస్మయంబును ముదంబును మోహముఁ బుట్టఁ జేయుమీ.
| 689
|
రావణుఁడు మారీచుని బెదరించుట
వ. |
ఇట్లు కాంచనమయమాయామృగస్వరూపుఁడ వైననిన్ను విలోకించి యమ్మ
హీపుత్రి జాతవిస్మయ యై శీఘ్రంబున దీనిం బట్టి తెచ్చి యిమ్మని రామునిం
బ్రార్థించు నతండు ప్రియురాలికిఁ బ్రియం బొనగూర్చువాఁ డై నిన్నుం బట్ట
వచ్చు నప్పుడు నీ వతినికిం జిక్కక నానాప్రకారంబులం జిక్కులు వెట్టుచు
నుపాయబలంబున దూరంబునకుం బాపి కొని చని రామవాక్యానురూప
కంబుగా సీతాలక్ష్మణులం బేర్కొని యెలుంగెత్తి దీనస్వరంబున విల
పింపు మవ్వాక్యంబు విని సీతాప్రచోదితుం డై లక్ష్మణుండు సౌహృదంబున
రామమార్గానుసారి యై యరుగు నంత నేను రామలక్ష్మణరహితం బైనయాశ్ర
మంబునకుం జనుదెంచి సహస్రాక్షుండు పులోమజంబోలె నొంటి మై వెలుంగు
చున్నవైదేహిం జేకొని లంకకుం జనియెద నిక్కార్యంబు సఫలంబుఁ గావిం
చితి వేని నారాజ్యంబులోన నర్ధరాజ్యంబు నీ కొసంగెద మద్వచనంబు నమ్మి
మనోహరం బైనమృగరూపం బంగీకరించి చను మేనును రథారూడుండ నై
నీపిఱుంద దండకారణ్యంబునకుం జనుదెంచెద యుద్ధంబు గాకుండ రాముని
వంచించి జానకి నపహరించి కృతకృత్యుండ నై భవత్సమేతంబుగా లంకాపు
|
|
|
రంబుఁ బ్రవేశించెద నిట్లు సేయ వైతి వేని నిశాతం బగుకృపాణంబున భవచ్ఛి
రంబు దెగవ్రేసెదఁ బ్రాణభయంబువలన బలాత్కారంబుగా నీవె యిక్కా
ర్యంబుఁ గావించెదవు రాజున కనుకూలుండు గానివాఁడు సుఖం బనుభవింపం
జాలం డనియెడులోకప్రవాదం బెఱుఁగుదువె కదా యిప్పుడు మృగరూపం
బున రాముని డాసితి వేని నీకు జీవితహానిలాభంబులు సందిగ్ధంబు లై యుండు
నాతోడ విరోధించితి వేని నిక్కంబుగా జీవితహాని యగు దీని నెఱింగి యెయ్యది
యుక్తంబు దానిఁ గావింపు మని పలికిన నమ్మారీచుండు రాజార్హవాక్యంబున
నాజ్ఞప్తుం డై పరుషం బైనప్రతికూలవాక్యంబున రావణున కి ట్లనియె.
| 690
|
మారీచుఁడు రావణునిఁ బరుషముగా దూఱుట
సీ. |
దశకంఠ పుత్రమిత్రకళత్రసహితుండ వైననీ కేకలుషాత్ముచేత
నుపదిష్ట మయ్యె నీవిపరీతదుష్కర్మ మెవ్వాఁడు నినుఁ జంప నిచ్చగించె
సుఖి వైననినుఁ జూచి సొరిది నేపాపాత్ముఁ డభినందితుండు గాఁ డయ్యె నకట
దొడరి యెవ్వాఁడు మృత్యుద్వారమున కేగుమని పంచెఁ గర ముపాయమునఁ జేసి
|
|
ఆ. |
యధిప హీనవీర్యు లైననీరిపులు నీకంటె నధికుఁ డైనకౌసలేయు
చేత నాఁగఁబడి నశించెడునినుఁ జూడఁ, దలఁచి రిది మహాద్భుతంబు సువ్వె.
| 691
|
తే. |
పాకశాసనవైరి యేపగతు లాత్మ, నిర్మితోపాయమున నీవు నిధన మొంది
చనుచు నుండ విలోకించి సమ్మదంబు, సెలఁగ నసహాస మొనరింపఁ దలఁచి రకట.
| 692
|
తే. |
అధిప శాస్త్రవిరుద్ధమార్గానుసారి, వైననిన్ను నివారింప నట్టిసఖులు
వసుధ నెవ్వారు గల రట్టివారినెల్లఁ, బట్టి నిశితాసిచేఁ దల గొట్టవలదె.
| 693
|
తే. |
కాపథరతుండు కలుషుండు కామకృత్తుఁ, డగుమహీపతి నయవినీతాత్ము లైన
మంత్రసిద్ధులచేత సమంచితముగ, నిగ్రహింపంగఁ బడు నిది నిక్కువంబు.
| 694
|
వ. |
నివర్తనీయుండ వైననీ వేల నివర్తింపం బడ వైతి వదియునుం గాక.
| 695
|
తే. |
విమలధర్మార్థకామయశములు సచివ, వరులు స్వామిప్రసాదంబువలన మిగుల
నొందుదురు తద్విపర్యయ మందునవియు, సర్వము నిరర్థకంబులై చను సురారి.
| 696
|
వ. |
మఱియు స్వామివైగుణ్యంబునఁ గేవలామాత్యులే వ్యసనంబు నొందుట గాదు
సర్వజనంబును వ్యసనంబు నొందు ధర్మంబును జయంబును రాజమూలంబు
గావున సర్వావస్థలయందును రాజులు రక్షితవ్యు లై యుందురు.
| 697
|
క. |
క్షితి నవినీతుఁడు తీక్ష్ణుఁడు, ప్రతికూలుం డైనభూమిపాలునిచేతం
జతురంతమహీరాజ్యం, బతులితముగఁ బ్రోవ శక్యమై యుండ దొగిన్.
| 698
|
ఆ. |
జగతిఁ గ్రూరమంత్రు లగుమంత్రు లెవ్వారు, పతి భజింతు రట్టివారు విషమ
మందు వానితోడ మందసూతము లైన, హయములట్ల చెడుదు రధిప వింటె.
| 699
|
క. |
ప్రతికూలుఁడు తీక్ష్ణుఁడు దు, ర్మతి యగుభూవిభునిచేత మనుజులు నిత్యో
న్నతి వృద్ధి నొంద నేరరు, క్షితి మేషము జంబుకంబుచేతం బోలెన్.
| 700
|
క. |
నిరనుగ్రహుఁడవు క్రూరుఁడ, వరయఁగ నజితేంద్రియుండ వగునీ విల నె
వ్వరికిఁ బతి వట్టిరజనీ, చరు లందఱు నీకతమున సమసెద రింకన్.
| 701
|
వ. |
రాక్షసేంద్రా యే నొకరుండ యాదృచ్ఛికం బైనపాపంబున నశించెదఁ గావున
శోచనీయుండఁ గాను నీవు బుద్ధిపూర్వకంబుగాఁ బాపంబుఁ జేసి బంధుసహి
తంబుగా నశింపనున్నవాఁడవు గావున నీవే శోచనీయండవు.
| 702
|
క. |
ననుఁ జంపి పిదప నిన్ను, న్ఘనరణమునఁ జంపు శీఘ్రకాలంబున రా
మునిచేతఁ జచ్చి యిప్పుడె, యనిమిషకులవైరి నేఁ గృతార్థుఁడ నగుదున్.
| 703
|
వ. |
మఱియు రామసందర్శనమాత్రంబున నేను గెడసెదఁ బవంపడి సీత నపహ
రించి బంధుసహితంగా నీవు పొలిసెదవు సందియంబు లేదు సీత నపహరించి
కొని తెచ్చితి వేని నీవును నేనును లంకయు రాక్షసులును నశింతు రింతయు
నిక్కంబు రాక్షసేంద్రా హితకాముండ నైననాచేత నివార్యమాణుండ
వయ్యును మద్వాక్యంబుఁ గైకొన వైతివి క్షీణాయువు లగునరు లాసన్నమర
ణు లై సుహృత్సమీరితం బైనహితంబు విన నొల్ల రని యిట్లు బహుప్రకారం
బులు రావణునిదౌరాత్మ్యంబునకు గర్హించి పదంపడి రావణభయంబున
దీనుం డై యి ట్లనియె.
| 704
|
ఉ. |
అంతకవిక్రముం డయిన యారఘువీరుని డాసి క్రమ్మఱం
బంత మెలర్ప నా కిచటఁ బ్రాణయుతంబుగ నుండరాదు కా
లాంతకదండతాడితుఁడ వైన నిను న్మరలింపఁజాల నిం
కెం తని చెప్పువాఁడ నిపు డేగెద రావణ నీకుఁ బ్రీతిగన్.
| 705
|
రావణుఁడు మారీచసహితుండై రామాశ్రమమునకుఁ బోవుట
వ. |
నీకు స్వస్తి యగుఁ గాక యని పలికిన నమ్మారీచునివాక్యంబున కలరి రావ
ణుండు వానిం గౌఁగిలించుకొని రాక్షసోత్తమా నీచేత మదభిప్రాయానుసా
రంబుగా నీదృశం బైనపౌరుషవాక్యంబు సముదీరితం బయ్యె నిప్పు డెప్పటి
మారీచుండ వైతి వింతకు ము న్నధైర్యావలంబనంబున వేఱొక్కరాక్షసుండ
వైతివని బహూకరించి వెండియు ని ట్లనియె.
| 706
|
చ. |
అఱమఱ లేక జీవితసఖా నిను నమ్మినవాని కెంతయు
న్గొఱఁతలు గల్గునే యతిమనోహరనూతనహేమభూషిత
స్ఫురదురురాసభంబులను బూన్చినచారుమణీశతాంగముం
బరువడి నెక్కు మిప్పుడు సమంచితవైఖరిఁ గార్యసిద్ధికిన్.
| 707
|
వ. |
అని ప్రియంబుఁ బలికి దశగ్రీవుండు మారీచసహితంబుగా విమానంబుంబోని
కాంచనరథం బెక్కి శీఘ్రంబున నయ్యాశ్రమంబు నిర్గమించి యింత నంతఁ
బురంబులు జనపదంబులు నానావిధవనంబులును బత్తనంబులును సరిద్గిరిసమూ
హంబులును విలోకించుచుం జనిచని దండకారణ్యంబుఁ బ్రవేశించి యందు
|
|
|
దవ్వుల రామాశ్రమంబుఁ జూచి యచ్చట నరదంబు డిగ్గి తనకరంబున నమ్మా
రీచునికరంబుఁ బట్టుకొని యి ట్లనియె.
| 708
|
మారీచుఁడు సువర్ణచిత్రమృగరూపమును గైకొనుట
క. |
కదళీవనశోభిత మై, యదిగో రాఘవునిపావనాశ్రమపద మొ
ప్పిద మై యున్నది నీ విఁక, మదిఁ దలఁచినపనికిఁ జొరు మమర్త్యవిరోధీ.
| 709
|
క. |
నావుడు మారీచుం డా, రావణువాక్యంబు విని తిరంబుగ నాశ్చ
ర్యావహముగఁ గైకొనియెను, సౌవర్ణమృగత్వ మపుడు చతురత మెఱయన్.
| 710
|
వ. |
ఇంద్రనీలరత్నాకారశృంగాగ్రంబును సితాసితముఖంబును రక్తపద్మోత్సలముఖ
పుటంబును నింద్రనీలోత్పలశ్రవణంబును మధూకపుష్పసదృశపార్శ్వద్వయం
బును గించిదభ్యున్నతగ్రీవంబును గుందేందువజ్రసంకాశపరమభాస్వరతలోదరం
బును బద్మకింజల్కసన్నిభంబును వైడూర్యసంకాశఖురంబు నుదనుజంఘంబును
క్లిష్టసంధిబంధంబును నింద్రాయుధసవర్ణపుచ్చంబును మనోహరస్నిగ్ధవర్ణం
బును నానారత్నసమావృతంబును మనోహరంబును దర్శనీయంబును నానాధా
తువిచిత్రంబును రౌప్యబిందుశతచిత్రంబును బ్రియదర్శనంబును రాజీవచిత
పృష్ఠంబును బరమశోభనంబు నగుమృగరూపం బంగీకరించి నిజదేహప్రభా
జాలంబుల నక్కాననంబు వెలింగించుచు వనం బెల్లఁ గలయం దిరుగుచు శాడ్వ
లంబులం గ్రీడించుచు విటపికిసలయంబులు మెసవుచు మనోజ్ఞగంధపుష్పంబులు
మూర్కొనుచు గుంజగృహంబులఁ దూఱుచు సీతాసందర్శనంబు కాంక్షించి
కదళీషండంబు సొచ్చి మందగమనంబునఁ గర్ణికారంబుల నాశ్రయించుచు
మెల్లన రామాశ్రమంబు డగ్గఱి.
| 711
|
సీ. |
ఒకమాటు వనమృగయూథంబుతోఁ గూడి క్రీడించు నొకమాటు క్రేళ్లు దాఁటు
నొకమాటు తృణఖాదనోద్యోగ మొనరించు వదలక యొకమాటు బెదరి చూచు
నొకమాటు మెఱయు విద్యుద్వల్లికైవడిఁ జరియించు నొకమాటు శాడ్వలముల
నొకమాటు లఘుగతి నుద్వేగి యై పాఱు బిరబిర నొకమాటు తిరిగి వచ్చు
|
|
ఆ. |
వింతచెవులు దాల్చి విహరించు నొకమాటు, గంతు లిడుచుఁ బెక్కుగతుల నిట్లు
కఠినరాక్షసుండు కపటమృగాకృతి, నలరె రాఘవాశ్రమాంతికమున.
| 712
|
ఉ. |
దానిమనోజ్ఞరూపము ముదంబునఁ గన్గొని వన్యసత్వముల్
మానుగ వెంట వంటి పలుమాఱు చరించుచు సారెసారెకుం
బూనిక నెయ్య మేర్పడఁగ మూఁ పటు మూర్కొని వింతజాతి యీ
కానమెకం బటంచు బలుకంపమునం బరుగెత్తు నత్తఱిన్.
| 713
|
ఉ. |
ఏడది యీమృగంబు మృగహింస యొనర్చెడు నంచుఁ గ్రుద్ధుఁ డై
వాఁడిశరంబునం దునిమివైచును రాఘవుఁ డంచు భీతిచే
తోడిమెకంబులం జనవు దోఁపఁగ మూర్కొని వీడుఁ గాని తా
|
|
|
రూఢి వధింపఁ డయ్యె మృగరూపధరుం డగుదైత్యుఁ డయ్యెడన్.
| 714
|
సీత మాయామృగమును జూచి యచ్చెరు వొందుట
వ. |
ఇ ట్లనేకప్రకారంబుల సీతాప్రలోభనార్థంబు విచిత్రమండలంబులు చేయుచు
రామాశ్రమపదాభ్యాశంబున నతిరమణీయంబుగా విహరించుచున్నసమయం
బున.
| 715
|
సీ. |
శుభనేత్ర యగుసీత సుమసంగ్రహవ్యగ్ర యై శాలముంగలి కరుగుదెంచి
కర్ణికారాశోకకాంచనచూతప్రసూనము ల్కోయుచు సొంపు మీఱ
ముక్తావిచిత్రాంగమును హైమరాజతవర్ణపార్శ్వంబులు స్వర్ణకాంతి
రుచిరవాలంబును రూప్యధాతుతనూరుహంబులు గలిగి నిజాగ్రభాగ
|
|
ఆ. |
మం దదృష్టపూర్వ మై యొప్పుచున్నమా, యామృగంబుఁ జూచి యధికవిస్మ
యంబు వొడమ దానియతిరమణీయాంగ, శోభ కలరి మఱియుఁ జూచునపుడు.
| 716
|
క. |
ఆకపటమృగము చిత్రతఁ, గైకొని వైదేహిఁ జూచి క్రమ్మఱ వన మ
స్తోకగతి న్వెలిఁగించుచుఁ, బ్రాకటముగ సంచరించె భ్రమ జనియింపన్.
| 717
|
ఉ. |
దానిమనోహరాకృతియు దానియపూర్వవిచిత్రకాంతియున్
దానిగతిప్రమాణమును దానిసమగ్రవిహారదాక్ష్యము
న్దానివిలోచనద్యుతి ఘనంబుగఁ జూచినయంత సీతకుం
బూనికఁ దత్పరిగ్రహణబుద్ధి జనించెను దైవికంబుగన్.
| 718
|
వ. |
ఇట్లు క్రీడార్థంబు మాయామృగగ్రహణకుతూహలిని యై మృష్టకాంచననకాంగి
యగుజానకి రామలక్ష్మణులం జీరిన వా రచ్చోటికిం జనుదెంచి పరమదర్శనీ
యం బై యున్న యప్పైఁడిమెకం బవలోకించి రప్పుడు లక్ష్మణుండు దాని
విచిత్రరూపంబునకు శంకించి రామున కి ట్లనియె.
| 719
|
లక్ష్మణుఁడు స్వర్ణమృగము రాక్షసమాయ యని రామునికిఁ జెప్పుట
ఉ. |
అచ్చుగఁ దాటకేయుఁడు మృగాకృతిఁ గైకొని కృత్రిమంబుగా
నిచ్చటఁ బూర్వవైరమున నె గ్గొనరింపఁగఁ బూని యొంటి మై
వచ్చినవాఁడు గావలయు వాసవసన్నిభ యట్లు గానిచో
నెచ్చట నైనఁ జూచితిమె యిట్టివిచిత్రమృగంబు నుర్వరన్.
| 720
|
క. |
ఆయధముఁ డిట్లు కపటో, పాయంబున వేఁటవెంట వచ్చిననృపులం
బాయక వధించి మెసవుచు, నాయిల్వలుఁ బోలి యుండు ననఘాత్మ యిటన్.
| 721
|
క. |
మది సందేహముఁ గొన వల, చిది మాయామృగము గాని యినకులకలశాం
బుధిసోమ రామ నిక్కము, సదమలవనమృగము గాదు చర్చింపంగన్.
| 722
|
వ. |
దేవా యిట్టిరత్నవిచిత్రం బైనమృగంబు జగంబుల నెందునుం గానము మా
యావి యగుమారీచునిచేతఁ గాంతిసంపన్నంబుగా గంధర్వనగరసన్నిభంబు
గాఁ గల్పింపంబడిన మాయామృగరూపం బిది యని పలికిన నప్పుడు శుచిస్మిత
|
|
|
యగుసీత లక్ష్మణుని వారించి చర్మహృతచేతన యై నిజభర్త కి ట్లనియె.
| 723
|
సీత మాయామృగమును బట్టి తన కిమ్మని రామునిఁ బ్రార్థించుట
ఉ. |
జీవితనాథ యీకనకచిత్రమృగంబు మనోజ్ఞకాంతి నిం
పావహిలంగ నాదుహృదయంబు హరించుచు నున్న దెంతయున్
ధీవర దీనిఁ బట్టి కొనితెమ్ము రయంబునఁ గేళికార్థ మి
చ్ఛావిధి దీనిఁ గూడి సరసంబుగ నిత్యముఁ బ్రొద్దుఁ బుచ్చెదన్.
| 724
|
వ. |
మఱియు నీయాశ్రమవనంబునందు రూపశ్రేష్ఠంబు లైనసృమరచమరభల్లూక
వృషతవానరకిన్నరప్రముఖనానావిధమృగంబులు మనోహరంబు లై పుణ్యదర్శ
నంబులై గుంపులు గట్టి నిత్యంబును విహరించుచుండు నింతకు ము న్నిట్టివిచిత్ర
మృగంబు నా చేత దృష్టపూర్వంబు గా దిది నానావర్ణవిచిత్రాంగం బై రత్నబిందు
సమాచితం బై చంద్రుండునుంబోలె నివ్వనంబును బ్రకాశింపంజేయుచున్నది
దీని రమణీయరూపంబును విచిత్రకాంతియు స్వరసంపన్నతయు విలోకించినంత
మచ్చిత్తంబు సమ్మదాయత్తం బై యున్నది గావున.
| 725
|
సీ. |
ప్రాణేశ యీసువర్ణమృగంబు నిప్పుడు ప్రాణంబుతోఁ గూడఁ బట్టి తెండు
గారవంబునఁ బెంచి గరువంపుమాటల మచ్చికఁ గావించి మరులు గొల్పి
సంతతంబును గ్రీడ సల్పెద నది గాక విపినవాసముఁ దీర్చి వీటి కరిగి
నప్పుడు మనకు నంతఃపురభూషార్థ మయ్యెడి భరతున కత్తలకును
|
|
తే. |
వింతఁ బుట్టించునట్లు గావింపు మీకు, నలవి గా దేని శరహతి నడఁచి దాని
చర్మ మైనను గొని తెండు సరస నాకు, వరమృగాజిన మయ్యెడిఁ బరమపురుష.
| 726
|
వ. |
మఱియు జాంబూనదమయం బైనదీనిరుచిరచర్మంబు బాలతృణకల్పిత
తాపసాసనంబునందుఁ బ్రసారితం బగుచుండఁ దత్సమీపంబున భవత్సహి
తంబుగాఁ గూర్చుండఁ గోరెద స్వప్రయోజనార్థంబు భర్తను బలాత్కారం
బున నియోగించు టది క్రూరంబు యువతుల కసదృశం బని యెఱింగి యున్న
దాన నైనను దీనిశరీరశోభాసౌష్ఠవంబుచేత మనంబునకు విస్మయంబు
సంజాతం బయ్యెఁ బ్రియురాల నగునన్ను దయార్ద్రదృష్టి నవలోకించి మీ
కును బ్రియంబు గలదేని యెల్లభంగుల దీనిం బట్టి తెం డని ప్రార్థించిన సీతా
వచనంబుల కలరి రాముండు కాంచనరోమంబులును మణిప్రవరశృంగంబులును
దరుణాదిత్యవర్ణంబును నక్షత్రసదృశకాంతియుం గలిగి యద్భుతదర్శనం
బై యొప్పుచున్నయప్పసిండిమెకంబు నవలోకించి దానియదృష్టపూర్వ
రామణీయకంబున కిచ్చ మెచ్చుచు జానకీప్రచోదితుం డై లక్ష్మణున కి ట్లనియె.
| 727
|
రాముండు లక్ష్మణనకు మాయామృగము నభివర్ణించి చెప్పుట
ఉ. |
తమ్ముఁడ కంటె యీమృగము తద్దయుఁ దప్తసువర్ణకాంతి నం
ద మ్మగుచున్న దెంతయును నందనచైత్రరథంబులందు యు
|
|
|
క్తమ్ముగ సంచరించెడుమృగంబులలోపల నిట్టిచిత్రస
త్వ మ్మది లే దనంగ నిఁక ధారుణి నున్న దనంగ వచ్చునే.
| 728
|
వ. |
మఱియు నిది రూపశ్రేష్ఠత్వంబున సామాన్యమృగంబు గా దని తలంచెద.
| 729
|
ఆ. |
జాతరూపబిందుశతసమాకీర్ణ మై, చుట్టుఁ దిరిగి పరమసుందరముగఁ
దీర్చి కూర్చినట్లు దీపించుచున్నది, రాజపుత్ర రోమరాజి కంటె.
| 730
|
క. |
అనలునిశిఖితో నెన యై, ఘనమువలన నిర్గమించి క్రాలెడుసౌదా
మినిభంగి దీనినాలుక, గన నయ్యెడిఁ గంటివే ముఖవినిర్గత యై.
| 731
|
క. |
మఱియు మసారవినిర్మిత, సురుచిర గల్లర్కరూపసుందరముఖ మై
వరశంఖమౌక్తికనిభో, దర మై యొప్పెడు మృగంబు తమ్ముఁడ కంటే.
| 732
|
తే. |
పద్మకింజల్కవర్ణంబు పరమభాస్వ, రంబు శక్రాయుధాభపుచ్ఛంబు గలిగి
వఱలు నీమృగరాజ మెవ్వానిమనము, నుష్ణఖరవంశ హరియింపకుండుఁ జెపుమ.
| 733
|
క. |
నవరత్నమయము రమ్యము, సువర్ణసంకాశ మధికసుందర మగునీ
దవమృగముఁ గాంచి మనమున, భువి నెవ్వఁడు విస్మయంబుఁ బొందకయుండున్.
| 734
|
తే. |
కాంచనవిచిత్ర మైనయీఘనమృగంబు, విపులపురుషమానస మైన నపహరించు
నబల శాంతయు ముగ్ధయు నైనసీత, చిత్త మపహరించె ననుటఁ జెప్పనేల.
| 735
|
క. |
వేఁటలకుఁ బోయి నృపతులు, మాటికి సంక్రీడకొఱకు మాంసముకొఱకుం
బాటించి వనమృగంబుల, దాఁటించి వధించి రధికధర్మం బగుటన్.
| 736
|
వ. |
వత్సా యిట్టివిచిత్రవస్తులాభంబుకొఱకు వేఁట కరుగుట కేమి యరిది కేవల
మృగహననమాత్రంబె కాదు మఱియు వజ్రాదిమణిసువర్ణరజతాద్యాకార
ధాత్వాధారపర్వతప్రదేశంబులును హస్తిమస్తకముక్తాప్రభృతిధనంబులును
మహావనంబునందు మృగయోద్యోగంబున రాజులచేత నన్వేషింపఁబడుఁ
గావున శాస్త్రావిరోధోపాయంబున నుపార్జితం బైనధనంబు మనుష్యమన
స్సంకల్పితధనం బంతయు శుక్రునికోశగృహంబు పూరింపం జేసినకైవడి
మహీపతులకోశగృహంబు పూరింపఁ జేయు నపూర్వవస్తుకాముం డైనపురు
షుండు విచారింపక సౌందర్యగుణలోభంబున నేవస్తువు సంపాదింపం బ్రవ
ర్తించు నదియె యర్థం బని యర్థసాధనచతురు లగునీతిశాస్త్రజ్ఞులు పలుకుదు
రీమృగం బట్టిదే యని పలికి వెండియు ని ట్లనియె.
| 737
|
క. |
ఈమృగరత్నపరార్థ్య, శ్రీమహితసువర్ణమయవిచిత్రాజినమం
దీమగువ మత్సమేతము, గా ముదమున నధివసింపఁ గాంక్షించె మదిన్.
| 738
|
తే. |
పార్థివాత్మజ విను మృదుస్పర్శనమున, నావికియుఁ గాదళియును బ్రియకియు మఱి ప్ర
వేణియును నీమెకమునకు వేయిగతుల, నీడు సేయంగ రా దని యేఁ దలంతు.
| 739
|
తే. |
ఇనకులోత్తమ విను మీమహీమృగంబు, రమణ నభమున నొప్పుతారామృగంబు
మొనసి యీరెండుమృగములు భూరిశోభ, నరయ దేవతాయోగ్యంబు లని తలంతు.
| 740
|
ఉ. |
తమ్ముఁడ నీవు చెప్పినవిధంబున నీమెక ముగ్రదైత్యకృ
త్య మ్మగు నేని నాకు నటు లైనను మిక్కిలి లెస్స యట్ల కా
నిమ్ము మునీంద్రకోటికి మహిం బెనుబాధలు సేయుచోట వ
ధ్య మ్మగుఁ గాదె చూడ హృదయంబున నింతవిచార మేటికిన్.
| 741
|
శా. |
ప్రాచుర్యంబున నిమ్మహాటవి మహాపాపాత్యుఁ డై చేరి మా
రీచుం డుక్కునఁ బెక్కుసంయముల ధాత్రీనాథుల న్భూరిమా
యాచాతుర్యము మీఱఁ జంపె వడి నయ్యాదిత్యశత్రు న్శఠున్
నీచున్ గీ టడఁగించి యీవిపినము న్నిర్దోషముం జేసెదన్.
| 742
|
సీ. |
అనఘాత్మ యీవనంబున మున్ను వాతాపి యన దైత్యుఁ డొకఁడు మాయావిదుండు
తొడరి మేషాకృతితో నుదరస్థుఁ డై తగ స్వగర్భం బశ్వతరిని బోలె
మునుల వధించుచు మునుకొని పెద్దకాలంబున నొకనాఁడు లావు మెఱసి
చతురాస్యనిభు నగస్త్యమహామునీంద్రునిపాలికిఁ జని యత్తపస్వివరున
|
|
తే. |
కరయ భక్ష్య మై శ్రాద్ధాంతమందుఁ బూర్వ, రీతి నిజరూప మంగీకరింపఁదలఁచు
నతని వీక్షించి నగి యమ్మహానుభావుఁ, డినసముద్యుతి వానికి నిట్టు లనియె.
| 743
|
తే. |
భానుతేజులఁ బెక్కండ్రఁ బరమమునుల, సమవిదూరుల భక్షించినట్టిఖలుఁడ
వస్మదీయమహాజఠరాగ్ని దగ్ధ, తనుఁడ వై పోయి తేడ వాతాపి యింక.
| 744
|
రాముఁడు మాయామృగమును బట్టుటకుఁగా దాని వెంబడించుట
వ. |
అని పలికెఁ గావున నిద్దురాత్ముం డగుమారీచుండు వాతాపిపగిదిఁ బంచత్వంబు
నొందవలయు ధర్మనిత్యుండను జితేంద్రియుండ నైనన న్నతిక్రమింపఁ జూచు
నీరాక్షసుండు వాతాపివలె నశించుఁ గుంభసంభవుండు వాతాపిఁ జంపినచం
దంబున నే నిమ్మారీచుని వధించెద నిది నిక్కంబుగా మృగం బేని వైదేహికిం
బ్రియం బగునట్లుగాఁ బట్టి తెచ్చిద నట్లు గాక కపటమృగం బేని తపోధ
నులకుఁ బ్రియంబుగా వధించెద నిక్కార్యంబు రెంట నధికోదయంబై యుండు
మనయత్నం బంతయు నీవైదేహిసంరక్షణార్థంబె కావున నావచ్చునందాఁక
నీవు ధనుఃకవచాదిసన్నాహయుక్తుండ వై సమర్థుండును మహాబలుండును బుద్ధి
|
|
|
మంతుండు నగుజటాయువుతోడం గూడి ప్రతిక్షణంబు సర్వదిగ్వర్తిరాక్షసుల
వలన శంకితుండ వై యప్రమత్తుండ వై వైదేహి రక్షించుచుండుము పరార్థ్య
చర్మోపలక్షితం బైనయిది రాక్షసమాయాకల్పితమృగంబు గాని నిక్కంబుగా
వనమృగంబు గా దైనను మృగచర్మగతస్పృహ యైనసీత నవలోకించి తన్మనః
ప్రియార్థం బేను మహాధనుర్ధరుండ నై మృగంబు వెంట నరిగి యుపాయంబున
వంచించి పట్టి తెచ్చెదఁ గా దేని శీతవిశిఖంబున దీనిం దెగటార్చి విచిత్రం బైన
దీనిచర్మంబుఁ గొని రయంబునం బఱతెంచెద నని సౌమిత్రి నొడంబఱిచి
రాముండు తత్క్షణంబ జంబూనదమయత్సరుయుక్తం బైనఖడ్గంబును ద్ర్యవ
నతం బైనచాపంబును వజ్రమయం బైనకంకటంబును నక్షయబాణతూణీరం
బులును సముచితంబుగా ధరించి వైదేహికిఁ బ్రియంబు సంపాదించుటకు నమిత
విక్రమంబున నరిగె నిట్లు తన్నుఁ బట్ట వచ్చు రామునిం జూచి యప్పైఁడి
మెకంబు.
| 745
|
ఉ. |
గంతులు వేయుచుం జిఱుతకాల్వలు చెంగునఁ జౌకళించుచు
న్రంతులు సేయుచుం దరులఁ బ్రాఁకుచుఁ గుంజములందుఁ దూఱుచుం
బంతము మీఱఁ గన్మొఱఁగి పల్లముల న్వెస డాఁగుచు న్వనా
భ్యంతరసీమ ని ట్లినకులాగ్రణిఁ జిక్కులఁ బెట్టె నెంతయున్.
| 746
|
సీ. |
ఒకమాటు వనమృగయూథంబుతోఁ గూడి గుఱుతు గన్పడకుండుఁ గొంతసేపు
ఒకమాటు విడివడి యొక్కటఁ జూడ్కికి గోచరింపక యేగుఁ గొంతసేపు
ఒకమాటు లఘుగతి వ్యోమమార్గము నంటి వింతగాఁ జూపట్టు గొంతసేపు
ఒకమాటు మృదుశాడ్వలోపరిస్థలములఁ గ్రొత్తగడ్డియు మేయుఁ గొంతసేపు
|
|
తే. |
గొప్పతిప్పలపై కేగుఁ గొంతసేపు, కుఱుచవాఁకలలోఁ బాఱుఁ గొంతసేపు
గహనమున నిట్లు మాయామృగంబు నేర్పు, మీఱ దూరంబు గొని యేగె మిహిరకులుని.
| 747
|
సీ. |
కడుదూర మేగె నెక్కడఁ బట్ట రా దని మానినచో మ్రోలఁ గానవచ్చు
మిగుల డగ్గఱియెఁ బట్టఁగవచ్చు నని డాయ జవమున దూరదేశమునఁ దోఁచుఁ
బొదలమాటున బొంచిపొంచి పట్టఁగఁబోవ నటు చూపి యిటు చూపి యవలి కేగు
వలపలిదెసఁ దోఁచు నెలమిఁ బట్టఁగఁ బోవునంతలో డాపలిచెంత నుండు
|
|
తే. |
నిట్లు చిక్కక కృత్రిమమృగము పెక్కు, గతుల నలయింప విసివి రాఘవుఁడు కోప
మడర మాయామృగం బని యపుడు తెలిసి, తెంపుసొంపార దాని వధింపఁ దలఁచి.
| 748
|
చ. |
అనుపమశక్రచాపనిభ మైనమహోగ్రశరాసనంబునన్
సునిశిత మై రవిద్యుతికి జో డయి వహ్నిశిఖాసమాన మై
ఘనతరదీప్త మై నళినగర్భవినిర్మిత మైనబాణముం
|
|
|
బనివడి గూర్చి యమ్మెకముపై నిగిడించె నమోఘవైఖరిన్.
| 749
|
వ. |
ఇ ట్లనన్యసాధనం బైనయద్దివ్యసాధనంబు రామునివింటివలన నిర్గమించి భర్గనే
త్రాగ్నియుం బోలె మండుచుఁ దత్క్షణంబ పఱతెంచి మృగరూపధరుం డైన
మారీచునిశరీరంబు భేదించిన శరార్తుం డై యన్నీచుండు తాలప్రమాణంబు
మింటి కెగసి నిబిడంబుగా భైరవారావంబు సేయుచు నల్పజీవితుం డై ధరణిం
బడి యమ్మాయారూపంబు విడిచి నిజరూపం బంగీకరించి రావణునివాక్యంబుఁ
దలంచి వైదేహి లక్ష్మణు నేయుపాయంబున నిచ్చటికిం బంపు జానకి
నేయుపాయంబున రావణుం డపహరించు నని చింతించి రామస్వరానురూపం
బగునెలుంగున.
| 750
|
మారీచుఁడు రామస్వరానురూపముగా నఱచుట
శా. |
ప్రాంచద్వైఖరదైన్యనాద మడర న్హాసీత హాలక్ష్మణా
యంచుం బేర్కొని యంత శాతశరబాధాపీడితప్రాణుఁ డై
సంచారంబులు మాని మేన ననువు ల్సంధింపఁగా లేక వే
పంచత్వంబును బొందె నప్పుడె నిలింపద్వేషి వీతస్పృహన్.
| 751
|
వ. |
ఇట్లు మారీచుండు గూలిన యనంతరంబ.
| 752
|
మ. |
అనిమేషారి మదీయకస్వరముతో హాసీత హాలక్ష్మణా
యని వాపోవుచుఁ బ్రాణము ల్విడిచె నయ్యార్తధ్వని న్విన్నచో
జనకక్ష్మాపతిపుత్రి యెం తడలునో సౌమిత్రి తా నిప్పు డే
మని చింతించునొ యంచు రాఘవుఁడు త్రాసాయత్తచేతస్కుఁ డై.
| 753
|
వ. |
లక్ష్మణుం డాడినతెఱం గంతయు నిజం బయ్యె నని తలంచి యచ్చట నిలువ
నొల్లక తత్క్షణంబ వేరొక్కమృగంబును జంపి దాని మాంసంబు గొని శీఘ్రం
బున జనస్థానమధ్యవర్తినిజాశ్రమంబున కభిముఖుం డై వచ్చుచుండె నంత
నిక్కడ వైదేహి రామస్వరానురూపం బైనదీనస్వరంబు విని లక్ష్మణున కి ట్లనియె.
| 754
|
మ. |
నినదం బొక్కటి పిక్కటిల్లె దిశల న్దీనస్వరోపేత మై
వినఁగా నయ్యెడు వింటె కాన మెకమున్ విధ్వస్తముం జేయఁగాఁ
జనియె న్దూరము కాననాంతరమునన్ సౌమిత్రి మీయన్న య
య్యనఘుం గావఁగ నేగు మీ విపుడె సౌహార్ధంబు సంధిల్లఁగన్.
| 755
|
సీత లక్ష్మణునితో రాముని రక్షింపఁ బొమ్మని చెప్పుట
మ. |
హరిమధ్యంబున నున్న గోవృషముచాయ న్రాఘవుం డాత్మలో
నరయం గ్రూరనిశాచరాంతరగతుం డై చిక్కెఁ గాఁబోలు సొం
పఱి నాచిత్తము భూరిసాధ్వసయుతం బైయున్న దీ వేగి చె
చ్చెర నన్నుం గరుణించి రామవిభునిం జేపట్టి రక్షింపుమా.
| 756
|
చ. |
అన విని లక్ష్మణుండు హృదయంబున రామునియుగ్రశాసనం
|
|
|
బును దలపోసి యచ్చటికిఁ బోవక యుండినఁ జూచి నెమ్మనం
బున జనియించినట్టివగ మోమునఁ గన్పడ భూరిదారుణా
శనిసదృశోక్తి ని ట్లనియె జానకి దైవనియుక్తబుద్ధి యై.
| 757
|
క. |
మిత్రాకృతిచే నన్నకు, శత్రుఁడ వై తీవు దుఃఖసమయంబున సౌ
భ్రాత్రము నెఱపనికతన సు, మిత్రాసుత యిట్టిసేఁత మే లగు నయ్యా.
| 758
|
వ. |
మఱియు నీవు మత్కృతంబునందు లోభంబువలన భ్రాతృరక్షణాయత్తచిత్తుం
డవు గాకుండుటం జేసి తన్నాశంబుఁ గోరుచున్నవాఁడ వని యూహించెద నీకు
నిక్కంబుగా రామునియందు సౌహార్ధంబు లేదు తద్వ్యసనంబు నీకుఁ బ్రియం
బైయున్న దక్కారణంబున మహాద్యుతి యగునమ్మహాత్ముని విలోకింపక విస్ర
బ్ధుండ వై యున్నవాఁడ వెవ్వండు నీకుఁ బ్రధానం బయ్యె నట్టిరాముండు
ప్రాణసంశయంబు నొందుచుండ నిచ్చట మద్రక్తణంబునందుఁ బ్రయోజనంబు
లేదు రామరహిత నై యే నొక్కనిమిషమాత్రంబైన జీవింపఁజాల నని కన్నీరు
నించుచు మృగాంగనచందంబునఁ ద్రస్తచిత్త యై పలుకుచున్న వైదేహి
వాక్యంబులకుఁ గటకటంబడి లక్ష్మణుం డి ట్లనియె.
| 759
|
క. |
ఉల్లమున నేల వగచెదు, తల్లీ నీవిభుఁడు దేవదానవరక్షో
వల్లభులచేత నైనను, దెల్లముగాఁ జిక్కుపడఁడు ధీరుం డెందున్.
| 760
|
సీ. |
గరుడ గంధర్వకింపురుషకిన్నరసిద్ధచారణయక్షరాక్షసులయందు
రామునిఁ దొడరువిక్రమశాలి లేఁడు త్రిలోకపూజ్యుఁడు శూరలోకనుతుఁడు
నురురణంబుల నవధ్యుఁడు మహాబలవీర్యుఁ డమ్మహాత్మున కొకహాని గలదె
యడల నేటికిఁ జింత విడువుము మృగమును వధియించి యిప్పుడె వచ్చు రామ
|
|
ఆ. |
విభుఁడు లేనిచోట విపినమధ్యంబుస, నొంటి నిన్ను విడిచి యోజ లేక
పోవ నగునె నాకుఁ బుణ్యాంగనామణి, మనుజవిభుఁడు గన్న మాట రాదె.
| 761
|
సీత లక్ష్మణుని నానావిధంబుల దూఱుట
వ. |
మఱియు నిది గంధర్వనగరసదృశం బైన రాక్షసునిమాయ గాని రామునికంఠ
స్వరంబు గాదు మహాత్ముం డగు రాముండు భవద్రక్షణంబునందు నన్ను నియో
గించి చనియెఁ గావున నాకు ని న్నిచట నొంటి విడిచి పోవుట యుక్తంబు గా
దదియునుం గాక ఖరాసురు వధించిననాఁటనుండి జనస్థానపదంబు నుద్దేశించి
మాయావు లగురాక్షసులు మనయందు విరోధించి హింసావిహారు లై యిమ్మహా
వనంబునఁ బరవ్యామోహజనకంబు లైనవాక్యంబు లుచ్చరించుచున్నవారు
నీవు సందియంబు వదలి రామునియనివార్యశౌర్యం బెఱింగి నెమ్మది నుండు
మని యివ్విధంబున రాక్షసబాధలు తలంచి మహీపుత్రి నొంటి విడిచి పోవం
జాలక కృతాంజలిపుటుం డై సత్యవాక్యంబులం బ్రార్థించుచున్నలక్ష్మణునివచ
నంబులు విని యద్దేవి కోపసంరక్తలోచన యై పరుషవాక్యంబుల ని ట్లనియె.
| 762
|
క. |
కులపాంసన వినయరహిత, కలుషాత్మక శఠ యకార్యకరణోద్యుక్తా
యలరామునివ్యసనము నీ, కెలమిం గడుఁబ్రియ మటంచు నెంచెద బుద్ధిన్.
| 763
|
క. |
రామునివ్యసనము ప్రియ మగు, టేమియుఁ జిత్రంబు గాదు హితశత్రుత్వం
బీమాడ్కిఁ దగ సపత్నుల, కీమహిఁ గల్గుట విసర్గమే గద తలఁపన్.
| 764
|
తే. |
జగతి నీయట్టిప్రచ్ఛన్నచారు లతినృ, శంసు లెవ్వారు గల రట్టిశఠులయందుఁ
గూర్పఁ దగదు విశ్వాసంబు గూర్చెనేని, వాని కెంతయుఁ గీడు వేవచ్చు నిజము.
| 765
|
ఉ. |
దోస మటంచు నించుకయుఁ దోఁపక రాఘవుఁ డొంటి నేగి దు
ష్టాసురకోటిచేత విపినాంతరసీమను జిక్క దీనత
న్బాసట గాఁగ నిన్ను పలుమా ఱటు చీరినఁ బోవ వయ్యయో
నీసరి గూఢశత్రుఁ డవనిం గలఁడే నృపవంశపాంసనా.
| 766
|
చ. |
అనయముఁ బూని భ్రాత కెటు లైన నపాయముఁ గల్గఁ జేసి త
ద్ఘనతరరాజ్యము న్ధనముఁ గైకొని నన్నుఁ బరిగ్రహింపఁగా
మనమున నిశ్చయించితివి మానవిహీన దురంతపాతకం
బునఁ బడు టంతె గాక యిది పోలునె చేరుఱునే కులాధమా.
| 767
|
మ. |
ఇనవంశోత్తము నంబుజాక్షుని వినూత్నేందీవరశ్యాము న
త్యనఘు న్రామునిఁ బాసి కోరుదునె దుష్టాచారు వేఱొక్కని
న్ఘనుఁ డారాముఁడు లేనిచో నిమిష మైన న్ధాత్రి జీవింప నే
ర్తునె నీ విప్పుడు చూచుచుండఁగఁ ద్యజింతు న్వేగ ప్రాణంబులన్.
| 768
|
వ. |
అని యిట్లు కర్ణకఠోరంబుగాఁ బలికిన సీతం జూచి జితేంద్రియుం డగులక్ష్మ
ణుండు కృతాంజలిపుటుం డై యి ట్లనియె.
| 769
|
లక్ష్మణుఁడు సీత మాటలకుఁ గటకటఁ బడుట
ఉ. |
తల్లిరొ బిడ్డవంటినను దారుణభంగి దురుక్తు లాడఁగాఁ
జెల్లునె నీచునిం బలెఁ బ్రసిద్ధనయవ్రతబద్ధ మైననా
యుల్లము రాముఁడే యెఱుఁగు నుగ్రవనంబున నొంటి నుంచి పో
నొల్లక యుంటిఁ గాని మది నొండుతెఱంగుఁ దలంచువాఁడనే.
| 770
|
ఉ. |
ఈగతిఁ బాపము ల్పలుక నే మని యుత్తర మిచ్చువాఁడ నా
రీగుణము ల్ధరిత్రి విపరీతము లౌట యథార్థ మయ్యె నిం
తేగద నాదుచిత్తవిధ మెల్లను దైవ మెఱుంగు నిప్పు డే
నేగీతి నేని నిక్కము మహీసుత యాపద వచ్చు నీ కిటన్.
| 771
|
ఉ. |
సత్యము సర్వదేవతలు సాక్షిగఁ బాపము లేదు నాయెడన్
నిత్యయశు న్రఘూత్తముని నిక్కము తండ్రిని నిన్నుఁ దల్లిఁగాఁ
బ్రత్యహము న్దలంచుచుఁ దిరంబుగ భక్తి యొనర్చుచున్నచో
భృత్యుఁ డటంచుఁ జూడక మహీసుత పాపము లాడఁ జెల్లునే.
| 772
|
వ. |
దేవీ యనర్హవాక్యంబులు పలుకుటయు సతులకుఁ జిత్రంబు గాదు స్వభావంబై
యుండుఁ జాపల్యంబును క్రౌర్యంబును ధర్మహైన్యంబును బరస్పరస్నేహకా
ర్యవిచ్ఛేదకరణంబును వారలగుణంబు ల ట్లగుటంజేసి నీవలన నిట్టిక్రూరవా
క్యంబు పుట్టె నిది వినం జాల నివ్వాక్యంబులు శ్రవణంబునకు దీప్తనారాచసన్ని
భంబు లై యున్నవి సత్యవాది నైననన్ను నీవు పరుసంబు లాడినతెఱం
గంతయు నిచ్చటివనదేవత లందఱు సాక్షీభూత లై వినుచున్నవారు గురు
వాక్యవ్యవస్థితుండ నైననన్ను విచారింపక యిట్టి నిష్ఠురోక్తులు శంకించి
పలికితి గావున స్త్రీత్వంబు స్వభావంబున దృష్టం బయ్యె ని న్నేమని గర్హిం
చినం దీఱు నిప్పుడ నశింపు మని కోపంబుపెంపునం బలికి వెండియ రాముని
సంస్మరించి యద్దేవికి మంగళం బొసంగువాఁ డై యి ట్లనియె.
| 773
|
ఉ. |
పోవక యున్నచో శకునిఁ బోలె నను న్నిరసించె దార్త వై
పోవఁగఁ జూచిన న్రఘువిభుం డలుకం గృప దప్పు రెంట నా
కావహిలుం దిరస్కరణ మైనను నీవచనం బమోఘ మౌఁ
గావున నీకు స్వస్తి యగుఁ గాక రయంబునఁ బోయివచ్చెదన్.
| 774
|
వ. |
దేవీ నిన్ను వనదేవతలు బహుప్రయత్నంబుల నేమఱక రక్షింపుదురు గాక
ఘోరంబు లగునిమిత్తంబులు దోఁచుచున్నవి గావున నేను రామసహితం
బుగాఁ జనుదెంచి క్రమ్మఱ నిన్ను విలోకించునో విలోకింపనో యెఱుంగఁ బరి
శుద్ధం బగుమనంబున మారాక ప్రతీక్షించుచు నుండు మని పలికిన లక్ష్మణుని
వచనంబులు విని యమ్మహీపుత్రి శోకబాష్పపరిఫ్లుత యై తీవ్రం బగువాక్యం
బున ని ట్లనియె.
| 775
|
సీ. |
భావజసన్నిభుఁ బరమదయానిధిఁ గౌసలేయుని రాముఁ గాన కున్న
మానక గోదావరీనదిఁ బడి యైన క్షోణీధ్రముననుండి గూలి యైన '
నుడుగక పెనుఁద్రాట నురిగొని యైనను వాలాయము విషంబు గ్రోలి యైన
గర మర్థిఁ జిచ్చులో నుఱికి యైనను మేను విడుతుఁ గాక మహాత్ము విభునిఁ బాసి
|
|
తే. |
యన్యపురుషునిఁ బదమున నైన సంస్పృ, శింప నేర్తునే మహనీయశీలు నజితు
నమలుఁ ద్రిభువనసన్నుతుం డైనరఘుకు, లోత్తమునిఁ బాసి జీవించియుండనొల్ల.
| 776
|
లక్ష్మణుఁడు రామునివద్దకుఁ బోవుట
వ. |
అని బహుప్రకారంబుల నాక్రోశించుచు నంత కంత కగ్గలం బైనశోకంబున
నుదరతాడనంబుఁ గావించుకొనుచుఁ గన్నీరు మున్నీరుగా రోదనంబు సేయుచు
శోకరసాధిదేవతయుం బోలెఁ జూపట్టుచున్నజానకిం జూచి లక్ష్మణుండు
తత్కాలసదృశం బగువాక్యంబున ననూనయించిన నద్దేవి లక్ష్మణునితోడ
నేమియం బలుకక యూరకుండె నంత నాసౌమిత్రి ప్రదక్షిణంబును బ్రణామం
బును గావించి యనుజ్ఞఁ గొని కుపితచేతస్కుం డై జానకి నొంటి విడిచి
|
|
|
పోవం జాలక తిరిగి చూచుచు రామునిసమీపంబునకుం జనియె నంత
దశగ్రీవుండు నెడగని శ్లక్ష్ణకాషాయసంవీతుండును వామాంసన్యస్తయష్టికమం
డలుండును శిజయుధృతాతపత్రుండును సపాదుకుండును నై సీతావిశ్వాసార్థంబు
కపటపరివ్రాజకరూపం బంగీకరించి వేదఘోషంబు సేయుచుఁ బర్లశాల
కడకుం జనుదెంచుసమయంబున.
| 777
|
ఆ. |
భీమకర్ముఁ డైన యామినీచరుఁ జూచి, గాలి వీవకుండెఁ గడుభయమునఁ
గదలకుండెఁ దరులు గౌతమి వేగంబు, మాఱి మందసరణిఁ బాఱుచుండె.
| 778
|
రావణుఁడు యతిరూపధరుం డై సీతకడకు వచ్చుట
వ. |
ఇట్లు భయదర్శనుం డగురావణుం డభవ్యరూపుం డయ్యును భవ్యరూపుం డై
పర్ణశాల సేరం జని యందుఁ బద్మహీన యైనపద్మచందంబున నొప్పుదాని
సపాంసులాళిరోమణి యగుదాని ననన్యసామాన్యలావణ్య యగుదాని
మార్తస్వరశ్రవణసంజాతశోక యై కన్నీరు నించుచుఁ బర్ణశాలామధ్యంబున
నాసీన యై యున్నదాని శుభస్వరూపిణి యగుదాని రుచిరసంతోషి యగు
దానిఁ బూర్ణచంద్రనిభానన యగుదానిఁ బద్మపలాశలోచన యగుదానిఁ
బీతకౌశేయవాసిని యగుదాని సీత నవలోకించి శశిహీన యైనరోహిణి
డాయు దారుణగ్రహంబుపోలిక జిత్రానక్షత్రంబు నాక్రమించు శనైశ్చ
రునికరణిఁ జంద్రసూర్యవిహీన యైనసంధ్య నావరించు మహాతమంబుకైవడి
రామలక్ష్మణరహిత యై యొంటి నున్నయద్దేవి డాయం జని తదీయసుష
మావిశేషంబున కచ్చెరు వందుచు మన్మథశరావిష్టుం డై ప్రశ్రితం బగువా
క్యంబున ని ట్లనియె.
| 779
|
క. |
సలలిత మగునవపద్మిని, జలరుహమాలికను బోలె స్వర్ణద్యుతి శో
భిలువలువఁ దాల్చి యలరెడు, కలికీ యెవ్వతవు నీవు గహనమునందున్.
| 780
|
క. |
రతివో హరిణాంకునిమద, వతివో వైకుంఠవిభునివరసతివో భా
రతివో యచ్చరమిన్నవొ, యతివా నీచంద మతిదయానుతిఁ జెపుమా.
| 781
|
క. |
ఊరులు కరికరతుల్యము, లారయ జఘనము విశాల మక్షు లసితరు
క్తారకములు రక్తాంతము, లీరీతిం దనరుచున్న వెంతయు నీకున్.
| 782
|
చ. |
ధరశిఖరోపమం బుపచితంబు సువృత్తము సంప్రవల్గితం
బరయ మణిప్రవేకరుచిరాభరణంబును స్నిగ్ధమున్ మనో
హర మతిపీనవృత్తము సమంచితతాళఫలోపమాన మై
వఱలెడు నీకుచద్వయము వారిజపత్రవిశాలలోచనా.
| 783
|
సీ. |
కలకంఠి నీమోము కలువరాయనికాంతి లోఁగొన్నకైవడి బాగు మెఱసె
గోల నీవలుతీరు కుందకుట్మలములపసఁ జూచి నవ్వినపగిది నొప్పిఁ
గలికి నీకంఠంబు వలముఱి చెలువంబు చూఱకొన్నవితానఁ జూడ నయ్యెఁ
|
|
|
దరుణి నీనిడుదపెన్నెఱిగుంపు ఘనకాంతి రమణ గైకొన్నచందమున నలరె
|
|
తే. |
నళిచికుర నీదుసౌందర్య మంతఁ జూచి, వంత నాచిత్త మంతంత కద్భుతముగఁ
గరఁగుచున్నది నూత్నోదకంబుచేతఁ, గడఁగి నిమ్నగాతీరంబు గరిఁగినట్లు.
| 784
|
తే. |
చారునేత్రవిలాసిని చారువేణి, చారునాసిక చారువిశాలజఘన
యెట్టితపములు గావించి యిట్టిచెలువ, మిట్టితనుకాంతి వడసితి విందువదన.
| 785
|
క. |
పిడికిటఁ బట్టఁగ నగు నీ, నడుము తిలసుమంబుఁ దెగడు నాసిక బొమలు
న్వెడవింటివానివిలుకై, వడిఁ జూడఁగ నయ్యె నహహ వారిజనేత్రా.
| 786
|
ఉ. |
పన్నగకాంతల గరుడభామలఁ జారణచంచలాక్షులం
గిన్నరకామినీమణుల ఖేచరతన్వుల సాధ్యకన్యలం
బన్నుగ మర్త్యభామినులఁ బల్మఱుఁ జూచితిఁ గాని నీకు జో
డెన్నఁగ మూఁడులోకముల నెవ్వరిఁ గానము సుందరీమణీ.
| 787
|
క. |
వెలయఁగ ముల్లోకంబులఁ, గల కాంతలలోన రూపకౌశలసుషమో
జ్జ్వలసౌకుమార్యములచే, నళిచికురా యగ్రగణ్య వైతివి గాదే.
| 788
|
చ. |
అతులితపుష్పపల్లవఫలాసనగుచ్ఛసుగంధిభూజసం
యుత మయి యొప్పురమ్యనగరోపవనంబుల నున్కి మాని ఘో
రతరమృగాసురస్ఫురదరణ్యమునందుఁ జరించుచున్నని
న్నతిసుకుమారిఁ జూచి హృదయంబునఁ జాల విషాద మొందెదన్.
| 789
|
ఉ. |
మంచిపదార్థము ల్గుడిచి మంజులచేలముఁ గట్టి కాంచనా
భ్యంచితహారము ల్దొడిగి హాటకసౌధములందు సెజ్జపై
మంచివిలాసితోఁ గలిసి మచ్చికతోడ సుఖింప కొంటి రా
త్రించరజుష్టఘోరవనదేశమునం జరియింప నేటికిన్.
| 790
|
తే. |
నీవు గుడిచినయన్నంబు నీవు దాల్చి, నట్టిసొమ్ములు నీమొలఁ గట్టినట్టి
పుట్టమును నీవు వరియించినట్టి పురుషుఁ, డఖిలలోకోత్తరతఁ జాల నలరుఁ దన్వి.
| 791
|
క. |
తరుణీ విద్యాధరివో, సరసిజముఖ యక్షసతివొ చంద్రానన కి
స్నరివో సిద్ధాంగనవో, వరవర్ణిని లేక యిచటివనదేవతవో.
| 792
|
క. |
నరగంధర్వామరకి, న్నరచారణసిద్ధసాధ్యనాగనభస్వ
ద్వరు లివ్వనిఁ జొర వెఱతురు, వరవర్ణిని యెట్లు నీవు వచ్చితి చెపుమా.
| 793
|
క. |
వానరవాహనరిపుపం, చాననశార్దూలభల్లుకాదిమృగంబు
ల్పూని భయపెట్ట కున్నవె, కాననమున నొంటి నుండఁ గాతరనేత్రా.
| 794
|
క. |
ఘనతరమదాన్వితము లగు, వనశుండాలముల కాలవాలం బిది యి
వ్వనమునకు నొంటి నేక్రియఁ, జనుదెంచితి వబ్జనేత్ర సాహసబుద్ధిన్.
| 795
|
ఉ. |
ఎచ్చటనుండి యెచ్చటికి నేగుచు నిచ్చటి కద్భుతంబుగా
వచ్చితి వుగ్రదైత్యపరివారనిషేవిత మైనకానలో
|
|
|
నిచ్చకు వచ్చినట్ల యిపు డేల చరించెద వొంటిఁ జిక్కి నీ
సచ్చరితంబు నెల్ల వరుస న్వినిపింపఁ గదే తలోదరీ.
| 796
|
వ. |
అని యివ్విధంబున దురాత్ముం డగురావణుం డడిగిన వానిఁ గపటరూపునిం
గా నెఱుంగక నిక్కంబుగా బ్రాహ్మణుం డని నానావిధపూజల నతిథినత్కా
రంబు గావించినం బ్రతిగ్రహించి.
| 797
|
క. |
అసదృశ మగుతత్కోమల, విశాలలావణ్యగరిమ వీక్షించి తగ
న్దశముఖుఁ డాత్మపదార్థము, శశిముఖిహరణంబునందు స్వాంతము సేర్చెన్.
| 798
|
వ. |
ఇట్లు జనకపుత్రి ద్విజాతివేషంబునఁ బాత్రకుసుంభధారి యై తనకడకు వచ్చిన
వాని నపహరణబుద్ధి యైనరావణుం జూచి యతిథిత్వంబున ద్వేషంబు సేయుట
కనర్హుం డైన బ్రాహ్మణాతిథినింబలె నతని సత్కరించి.
| 799
|
సీత యతివేషధారి యైనరావణున కర్ఘ్యపాద్యాదు లొసంగుట
క. |
ఇది యాసన మిది యర్ఘ్యం, బిది పాద్యం బిది ప్రసూన మిది వన్యఫలం
బిది మధుపర్క మొసంగితి, సదయతఁ జేకొనుము నీవు సంయమివర్యా.
| 800
|
వ. |
అని పలికిన నారావణుండు ప్రతిపూర్ణభాషిణి యగుజానకిచేత నిమంత్ర్యమా
ణుం డై తత్ప్రతిగ్రహణంబునందుఁ జిత్తంబుఁ జేర్చి తద్రూపసౌందర్యరేఖా
విశేషంబు విలోకించుచుండె నంత నవ్వైదేహి వానిలక్షణం బంతయు నుప
లక్షించి మృగయార్థం బరిగినశోభనాకారుం డగురామునియాగమనంబుఁ
బ్రతీక్షించుచు సారెసారెకు సముద్గ్రీవ యై శ్యామం బైనయవ్వనంబు విలో
కించుచు రామలక్ష్మణులజాడఁ గానక పరివ్రాజకచిహ్నుండును నవహరణబుద్ధి
యుక్తుండును దురాత్ముండు నైనరావణునిచేత నిట్లు సంపృష్ట యై యితండు
బ్రాహ్మణుండును నతిథియుఁ గావున మద్వృత్తాంతం బెఱింగింపకున్న శపిం
చునో యని యొక్కముహూర్తంబు చింతించి తనవృత్తాంతం బెఱుకపడ ని
ట్లనియె.
| 801
|
సీతాదేవి తనవృత్తాంతమంతయు రావణునికిఁ జెప్పుట
క. |
అనుపమతేజోనిధి యగు, జనకునిపుత్రికను రామచంద్రునిభార్య
న్జను లెల్ల నన్ను జానకి, యని సీత యటంచుఁ బిలుతు రసమవిచారా.
| 802
|
క. |
పదిరెండువత్సరంబులు, ముద మలరఁగ నత్తయింట మునుకొని భోగా
స్పదము లగుదివ్యసుఖములు, విదితంబుగఁ జాల ననుభవించితి విప్రా.
| 803
|
ఉ. |
అంతఁ ద్రయోదశాబ్దమున నమ్మహికాంతుఁడు రాముని న్ధరా
కాంతునిఁ జేయఁ బూని కుతుకంబున మంత్రులఁ గూడి సమ్మద
స్వాంతముతోడఁ జక్కఁగ విచారముఁ జేసి సునిశ్చితార్థుఁ డై
చింత దొఱంగి యున్నయెడఁ జెచ్చెరఁ గైకయి దుష్టచిత్త యై.
| 804
|
సీ. |
తన ప్రాణవిభుఁ డైనదశరథనృపుని సుకృతముచేఁ దగ వశీకృతునిఁ జేసి
|
|
|
కఠినవరంబులు కరమర్థిఁ గాంక్షించి యొకటికి మన్నాథునకు వివాస
మొకటికి భరతున కుర్వీశ్వరత్వంబుఁ గోరి యిప్పని సమకూర్చునంత
కాహారనిద్రావిహారాదికము నొల్ల నట్లు సేయఁగ నోప నైతి వేని
|
|
తే. |
రాము నభిషేకకాలంబె గ్రాలు నాదు, జీవితాంతకాలం బని భావమందుఁ
దెలియు మని యిట్లు దారుణోక్తుల నలంచి, విభునిచిత్తంబు వేఱొక్కవిధముఁ జేసి.
| 805
|
వ. |
ఇట్లు ధర్మంబున నిర్బంధించి పలికిన సత్యప్రతిజ్ఞుం డగునద్దశరథుండు వరద్వయ
ప్రతినిధిత్వంబున నుపభోగక్షేమంబు లైన సువర్ణరత్నాదికంబులు గొను మని
ప్రార్థించిన నద్దేవి యంగీకరింప దయ్యె.
| 806
|
తే. |
రూపవంతుండు సుగుణుం డపాపసమ్మ, తుండు భూతహితుండు శాంతుండు లోక
కాంతుఁ డగునాదుభర్త యక్కాలమునకు, నిరువదేనేండ్లవయసువాఁ డెన్ని చూడ.
| 807
|
క. |
ధరణీసుర యేనాఁటికి, బరువడిఁ బ్రాయంబుచేతఁ బదునెనిమిదివ
త్సరములదానను విను మే, మీరువుర మివ్వయసుచేత నెనయుచు నుండన్.
| 808
|
క. |
కామార్తుం డగుదశరథ, భూమివిభుఁడు సతికిఁ బ్రీతిఁ బుట్టించుటకై
రామాభిషేచనవ్యా, యామంబునఁ జింత విడిచె నవహితమతి యై.
| 809
|
క. |
మునుకొని యభిషేకార్థము, జనకునియభ్యాశమునకుఁ జనుదెంచినరా
మునిఁ గన్గొని కైకయి యి, ట్లనియె న్సిరి కాసపడి నిజార్థస్పృహ యై.
| 810
|
సీ. |
అనఘ భవజ్జనకునిచే సమాజ్ఞప్త మైనయీనాదువాక్యంబు వినుము
పదునాల్గువర్షముల్ భరతుఁ డయోధ్యకు నాథుఁ డందాఁకఁ గాననమునందు
మునివృత్తిఁ బూని రాముఁడు వివాస మొనర్పఁగలఁ డంచు విభజించెఁ గాన నీవు
రయముస దండకారణ్యమునకుఁ బోయి తండ్రిని బ్రోవు సత్యమున ననిన
|
|
ఆ. |
నట్ల కాక యనుచు నంబకుఁ బ్రియముగా, వ్రతముఁ బూని యీయరణ్యమునకు
నరుగుదెంచె మత్సమన్వితముగ నమ్మ, హాత్ముచరిత మిది ద్విజాగ్రగణ్య.
| 811
|
తే. |
ఒరుల కిచ్చుటె గాని తా నొరులచేతఁ, గొనఁడు సత్య మాడుటె కాక మనమునందు
బ్రమసి యైన నసత్యంబుఁ బలుకఁ డెపుడుఁ, బృథివిలోపల మత్పతి కిది వ్రతంబు.
| 812
|
వ. |
మఱియు నమ్మహాత్మునియనుజుండు లక్ష్మణుండు భ్రాతృస్నేహంబున ధనుష్పా
ణియై రామసహాయార్థం బరుగుదెంచె నతండు శౌర్యాదిగుణంబుల సుప్రసిద్ధుం
డు సమరంబునందు సహాయుండు రాఘవుం డిత్తెఱంగునఁ దండ్రిచేత సమా
|
|
|
జ్ఞప్తుం డై యాచకులకు యథేష్టంబుగా ధనం బొసంగి రాజ్యాదికంబుఁ బరిత్య
జించి జటావల్కలంబులు ధరించి లక్ష్మణసహాయుండై మత్సమేతంబుగా దండ
కారణ్యంబుసకుం జనుదెంచెఁ గైకేయీనిమిత్తం బేము మువ్వురము రాజ్య
ప్రచ్యుతులమై గంభీరతేజంబున నివ్వనంబునం జరియించుచున్నవార మొక్క
ముహూర్తం బిచ్చట నివసించితి వేని రురుగోధావరాహంబుల వధించి తన్మాం
సంబును వన్యఫలంబులును బుష్కలంబుగా సంగ్రహించుకొని మద్విభుండు
చనుదెంచు నయ్యధిపునిచేత నాతిథ్యంబుఁ గొని యవ్వల యథేచ్ఛం జన
వచ్చు నని కపటవిప్రవేషధరుం డైనరావణునితోఁ దనవృత్తాంతం బంతయు
నుడివి వెండియు ని ట్లనియె.
| 813
|
క. |
ధరణీసుర యొంటిని దు, శ్చర మగునీగహనమందు సాహసభంగిం
జరియించె దేల యేర్పడఁ, దిరముగ నీచంద మెల్లఁ దెల్పుము నాకున్.
| 814
|
రావణుండు సీతాదేవికిఁ దననిజస్వరూపం బెఱింగించుట
ఉ. |
నా విని యానిశాటకులనాథుఁడు. రావణుఁ డిట్లు పల్కు నో
క్ష్మావరపుత్రికామణి జగత్రయ మెవ్వనిదుష్ప్రధర్షబా
హావిభవంబుచేఁ జకిత మై శరణంబును గాన దట్టి నే
రావణనామధేయుఁడ ధరాధరధీరుఁడ దైత్యనాథుఁడన్.
| 815
|
చ. |
జనకతనూజ కుందనపుఁజాయల నీనెడునీదురూపముం
గని నిజకాంతలందు రతికాంక్ష దొఱంగితిఁ దొల్లి బల్మిచే
ననుపమలీలఁ జేకొనినయచ్చరమిన్నలలోన నీవు నా
కనిశము నగ్రభార్య వగు మద్భుతసౌఖ్యము నీకుఁ గల్గెడిన్.
| 816
|
చ. |
లవణపయోధిమధ్యమున లంక యనాఁ జెలువొందు మత్సురం
బవిరళభోగభాగ్యముల కాస్పద మై గిరిమూర్ధ మందు నుం
డు వలసినట్లు సంతతమునుం గడువేడుక నన్నుఁ గూడి ర
మ్యవనములం జరింపు మబలా యిటు లూరక డయ్య నేటికిన్.
| 817
|
చ. |
అలికులవేణి నాకు ముద మారఁగ గేహిని వైతివేని యి
మ్ముల మణిహేమభూషణవిభూషితపంచసహస్రసుందరుల్
చెలువుగ నీకు దాస్యములఁ జేయుచు నుండఁగ రాజసంబునన్
విలసదమేయసౌఖ్యముల వీగుదు విట్లు కృశింప నేటికిన్.
| 818
|
సీతాదేవి రావణునిఁ దృణీకరించి పలుకుట
తే. |
అన విని నితీశిరోమణి యైనసీత, తీవ్రకోపంబుచే వానిఁ దృణము గాఁగ
నెంచి మది నాదరింపక యిట్టు లనియెఁ, జూపులనె వానియాయువు చూఱకొనుచు.
| 819
|
సీ. |
గిరివోలె నచలుఁ డుర్వరవోలెఁ దాలిమి గలవాఁడు హరివోలెఁ గమ్రతేజుఁ
డంబుధివోలెఁ దా నక్షోభ్యుఁ డాపూర్ణశశివదనుండు ప్రసన్నయశుఁడు
|
|
|
సింహసంహననుండు సింహవిశ్రాంతగామియు నృసింహుఁడు మహామేచకాంగుఁ
డాజానుబాహుఁ డనర్గళాయుధదీప్తుఁ డతిశూరుఁ డతిధీరుఁ డతిగభీరుఁ
|
|
తే. |
డధికసుకుమారుఁ డభిరాముఁ డరివిరాముఁ, డమితగుణధాముఁ డగురాముఁ డనవరతము
గతియు నా కమ్మహాత్ముని వితతబుద్ధిఁ, బాయ కెప్పుడు సేవింతు ఛాయపగిది.
| 820
|
తే. |
సర్వలక్షణయుక్తుండు సత్యసంగ, రుండు న్యగ్రోధపరిమండలుండు గుణని
ధానము జితేంద్రియుఁడు నైనప్రాణవిభుని, మాన కెప్పుడు సేవించుదాన నసుర.
| 821
|
చ. |
రభసముచేత జంబుకము రావణ సింహిని బోలె నీవు దు
ర్లభ నగునన్నుఁ గైకొనఁ దలంచితి వక్కట చండభానుస
త్ప్రభగతి నేను నీకును గరంబునఁ దాఁక నశక్య నింద్రస
న్నిభుఁ డగురాముపత్ని యొకనీచున కబ్బునె రాక్షసాధమా.
| 822
|
తే. |
అర్కకులునకుఁ బ్రియపత్ని నైననన్నుఁ, గర మపహరింపఁదలఁచినకారణమునఁ
గుటిలరాక్షస క్షీణభోగుండ వగుచుఁ, గనకతరువుల నిప్పుడ కాంచె దీవు.
| 823
|
సీ. |
ఆఁకలి గొన్నగజారికోఱలు దీయఁ దలకొన్నవాని మందరనగంబు
నరచేతఁ బ్రహరింప నాన చేసినవానిఁ గాలకూటవిషంబుఁ గ్రోలఁ జూచు
వాని మంగలకత్తిచే నాలుకను ద్రుంచుకొనఁ జూచువానిఁ బెన్గుండు మెడను
దవిలించుకొని వార్ధి దాఁటఁగోరెడువాని సూదిచేఁ గనుగ్రుమ్మఁ జూచువాని
|
|
తే. |
రాజకులభూషణుం డైనరాఘవునకుఁ, గూర్చుప్రియురాలి నగునన్ను ఘోరభంగి
నవహరింపఁ దలంచినయట్టినిన్ను, దానవాధమ సరిగాఁగఁ దలఁపవలదె.
| 824
|
సీ. |
రాక్షసాధమ నీవు రామునిప్రియభార్య నైననన్ను హరింప నాత్మఁ దలఁచి
తది యెంత యవివేక మాదిత్యసోములఁ గరములఁ బ్రహరింపఁ గాంక్ష యిడిన
యట్లు నిర్ముక్తఘోరాహిముఖంబున కోఱలఁ బెఱుకంగఁ గోరినట్లు
వారక మండెదువహ్నిని జెఱఁగున ముడువంగ మదిలోనఁ బూనినట్లు
|
|
తే. |
మొనసి ఘోరకాలాయసముఖము లైన, శాతశూలాగ్రములమీఁద సంచరింపఁ
గాండఁ జేసినయ ట్లగుఁ గాదె రాము, కూర్మిపత్నిని నను మదిఁ గోరు టెల్ల.
| 825
|
ఉ. |
అంబుధిపల్వలంబులకు హంసబకంబులకున్ ఖగేంద్రకా
కంబులకు మృగేంద్రశశకంబులకు న్మదహస్తిరాడ్బిడా
లంబుల కెంత యంతర మిలాస్థలిఁ గన్పడు నంత తారత
|
|
|
మ్యం బగునాదుభర్తకు నిశాటకులాధమ నీకుఁ జూడఁగన్.
| 826
|
వ. |
మఱియు నమృతారనాళంబులకు మద్గుమయూరంబులకుఁ గాంచనసీసంబు
లకుఁ జందనవారిపంకంబులకు సారసగృధ్రంబుల కెంత తారతమ్యంబు గల
దంత తారతమ్యంబు రామునకు నీకునుం గల దదియునుంగాక.
| 827
|
ఉ. |
వాసవసన్నిభుండు రఘువర్యుఁడు కార్ముకబాణపాణి యై
భాసురలీల ఘోరరణభాగమునం దగ నిల్చి యుండ నీ
చే సముదగ్రదోర్బలముచే హృత నయ్యును నన్ను లోకసం
త్రాసన మక్షికాన్వితఘృతంబుగతిన్ గొనలేవు దక్కఁగన్.
| 828
|
మ. |
అని యిబ్భంగి నదుష్టభావ యగునయ్యంభోజపత్రాక్ష దు
ష్టనిశాటుం డగుపంక్తికంధరునితో సక్రోధ యై పల్కి గ్ర
క్కున వాతోద్ధత యైనరంభగతి సంక్షోభించి కంపించెఁ ద
త్తనుసందర్శనజాతసాధ్వసమునన్ దైన్యంబు వాటిల్లఁగన్.
| 829
|
వ. |
ఇవ్విధంబున దలంకుచున్నవైదేహి నవలోకించి మృత్యుసమప్రభావుం డగు
రావణుండు వికటభ్రుకుటిదుర్నిరీక్షుం డై తనకులంబును బలంబును గర్మంబును
నామంబును సర్వంబునుం దేటపడ నెఱింగించి యద్దేవికి భయంబుఁ బుట్టింతుఁ
గాక యని తలంచి సంరబ్ధపరుషం బగువాక్యంబున ని ట్లనియె.
| 830
|
రావణుండు సీతాదేవికిఁ దనపరాక్రమాతిశయముఁ దెల్పుట
ఉ. |
మానిని మృత్యుదేవతకు మర్త్యులపోలె సురాసురాదు లె
వ్వానికి సంతతంబుఁ బెనువంతఁ దలంకుదు రట్టియేను దీ
ప్తానలతుల్యతేజుఁడ ధనాధిపుతమ్ముఁడఁ బంక్తికంఠుఁడ
న్మానితబాహుశౌర్యుఁడ సమస్తనిశాటకులాధినాథుఁడన్.
| 831
|
చ. |
రణమున గుహ్యకేశ్వరుఁ బరాజితుఁ జేసి యతండు భీతిఁ బ
ట్టణముఁ దొలంగి వెండిమల ఠావుగఁ జేసి వసించి యుండఁ దన్
మణిమయదేవనిర్మితసమంచితకామగపుష్పకంబుఁ గై
కొని భువనత్రయంబున నకుంఠితశక్తిఁ జరింతు నిచ్చలున్.
| 832
|
క. |
మృగనేత్ర జాతరోషుఁడ, నగునాదుమొగంబుఁ జూచినంతనె సురయ
క్షగరుడగంధర్వాదులు, మిగులఁ బరిత్రస్తు లగుచు మెలఁగుదు రెందున్.
| 833
|
చ. |
కువలయగంధి యే నెచటఁ గోరి వసింతుఁ జరింతు నచ్చటం
బవనుఁడు వీవ నోడు సితభానుఁడు వెన్నెల గాయ నోడు నా
రవియుఁ దపింప నోడును ధరాజములుం గదలంగ నోడు వ
హ్ని వెలుఁగ నోడు ధాత్రిఁ బ్రవహింపఁగ నోడు నదు ల్భయోద్ధతిన్.
| 834
|
చ. |
లవణపయోధిమధ్యమున లంక యనంగఁ జెలంగు మత్పురం
బవిరళభోగభాగ్యముల కాస్పద మై మణిసాలసౌధ మై
|
|
|
ప్రవిమలపద్మకైరవవిరాజితనవ్యవనోభిరామ మై
దివి బలభిత్పురంబుపగిదిన్ క్షితిభృచ్ఛిఖరాగ్రమండలిన్.
| 835
|
వ. |
అది మఱియు రమ్యప్రాసాదసంబాధంబును మణిచత్వరసభాభవనంబును వైడూ
ర్యద్వారతోరణంబును హస్త్యశ్వరథసంకులంబును విచిత్రశిల్పనిర్మితహేమ
కక్ష్యంబును సర్వకామఫలప్రదనానావిధసురతరుఫలకిసలయకుసుమరసాస్వాద
మత్తకీరశారికాకలకంఠమధుకరమధురశబ్దాయమానమహోద్యానశోభితంబు
ను నై యొప్పు నప్పురంబునందు.
| 836
|
క. |
ననుఁ గూడి సంతతంబును, మన మలర వసించి తేని మానిని మనుజాం
గనలస్థితి యపుడు తోఁచెడు, మనమునకుం జూడఁ దృణసమానం బగుచున్.
| 837
|
వ. |
మఱియు నాలంకాపురంబున మత్సమర్పితదివ్యభోగంబు లనుభవించునప్పుడు
మానుషుండును గతాయుష్యుండు నగురామునిఁ గల నైనఁ దలంచుకొన వది
యునుం గాక.
| 838
|
చ. |
అనుపమగాత్రి పంక్తిరథుఁ డగ్రసుతుం డనుకూర్మి మాని రా
ముని లఘువీర్యుఁ డంచు వనభూమికిఁ ద్రోచి ప్రియార్షుఁ డౌకని
ష్ఠుని నరనాథుఁ జేసె నది చూచియు నీ విపు డట్టిహీనవ
ర్తనుఁడు జడుండు మర్త్యుఁ డగురామునిపైఁ దమిఁ గూర్ప నేటికిన్.
| 839
|
తే. |
తాపసుండును విగతచేతనుఁడు మఱియు, భ్రష్టసామ్రాజ్యుఁ డైనయారాముచేత
నేమి కార్యంబు మానవుఁ డెంతవాఁడు, విడువు మాతనిపైఁ బ్రేమ వినుతగాత్రి.
| 840
|
ఉ. |
ఇంతిరొ నిన్నుఁ జూచి మరుఁ డేఁపఁగ నిచ్చటి కార్తిఁ దూలి నా
యంతనె వేఁడ వచ్చితి సురారికులాగ్రణి నైననన్ను బ
ల్వంతలఁ బెట్టి తేని యబలా పరితాపము నొందె దవ్వలం
బంతముతోఁ బుగూరవునిఁ బాసినయూర్వశిభంగి నంగనా.
| 841
|
వ. |
మఱియు మానుషుం డగురాముండు సంగ్రామంబున నాయంగుళితో
సాటి సేయం దగఁడు.
| 842
|
చ. |
తరుణిరొ నీదుభాగ్యమునఁ దప్పక నిచ్చట నొంటి నీకు నే
దొరకితిఁ ద్రోచి పుచ్చ కిఁకఁ దోరపువేడ్క భజింపు నన్ను దు
ర్భరతరబాహుశౌర్యమున వ్రాలినవాఁడిమగండ రాముఁడుం
గర మనిలోన నన్నుఁ జెనకంగ సమర్థుఁడు గాఁడు చూడఁగన్.
| 843
|
ఉ. |
నా విని భూమిపుత్రి నయనంబుల నెఱ్ఱఁదనంబు దోఁపఁ గో
పావిలచిత్త యై వికసితానన మొప్ప రఘుప్రవీరుని
న్భావమునం దలంచుకొని మాటికి దుర్వచనంబు లాడు నా
|
|
|
రావణుఁ జూచి దారుణశరప్రతిమోక్తులఁ బల్కె నుగ్రతన్.
| 844
|
తే. |
అఖిలభూతనమస్కృతు నమితతేజు, నగ్రజుని గుహ్యకేశ్వరు నాదిదేవ
సఖుని దురమునఁ గదిసి దుస్సహమహోగ్ర, కలుష మొనరింప నెబ్భంగిఁ దలఁచి తొక్కొ.
| 845
|
తే. |
పుడమి నెవ్వారి కిట్టిదుర్బుద్ధి విట్టి, కర్కశుఁడ విట్టిజడుఁడవు కలుషరతుఁడ
వైననీ వధినాథుఁడ వైతి వట్టి, ఖలులు దైత్యులు నశియింపఁగలరు నీచ.
| 846
|
క. |
సురపతిసతి యగుశచి నప, హరించి బ్రతుకంగ వచ్చు నాదిత్యకులే
శ్వరునిసతి నైనన న్నప, హరించి బ్రతుకంగఁ గూడ దమరవిరోధీ.
| 847
|
వ. |
మఱియు రామభుజప్రాకారరక్షిత నైనన న్నపహరించి నీ వమృతంబుఁ ద్రావి
యైన బ్రతుకం జాల వని యిట్లు నిరసించి పలికిన సీతవాక్యంబులు విని రావ
ణుండు హస్తతాడనంబుఁ జేసి ప్రావృట్కాలమేఘంబుకరణి మేనుఁ బెంచి
వైదేహిం జూచి వెండియు ని ట్లనియె.
| 848
|
ఉ. |
మానిని మత్త వౌట విను మామకవీర్యపరాక్రమంబు లిం
తైన నెఱుంగ వైతి నిఖలాబ్ధులు రొంపి యొనర్తు మృత్యువుం
బూని వధింతు బాణములు భూమిని బ్రద్దలు వాపుదుం గరం
బానలినాప్తచంద్రుల శయంబులఁ దాళగతి న్ధరించెదన్.
| 849
|
క. |
భూమీశతనయ రాముని, పై మమతఁ బరిత్యజించి భావమున ననుం
గామించి వల్లభునిఁ గాఁ, గామదుఁ గాఁ గామచరునిఁ గాఁ దలఁపు మిఁకన్.
| 850
|
తే. |
అని పలికె నప్డు సంక్రుద్ధుఁ డైనవాని, నేత్రములు భానుమండలనిభము లై కృ
శానుకల్పంబు లై క్షతజప్రభంబు, లగుచుఁ బింగలోపాంతంబు లై తనర్చె.
| 851
|
వ. |
అప్పుడు రావణుండు సౌమ్యం బైనభిక్షురూపంబుఁ బరిత్యజించి సకలభయంక
రం బైననిజరూపం బంగీకరించి మహాకాయుండును సంరక్తనయనుండును
దప్తకాంచనకుండలుండును నీలజీమూతసన్నిభుండును దశాస్యుండును వింశతి
భుజుండును గార్ముకబాణతూణీరధరుండును రక్తాంబరుండును గ్రోధావిష్ట
చిత్తుండు నై వసనాభరణోపేత యై సూర్యమరీచిభంగి నొప్పుచున్నస్త్రీరత్నం
బైనజానకి నవలోకించి యి ట్లనియె.
| 852
|
మ. |
వినుతాంగీ కులశీలవంతుఁ ద్రిజగద్విఖ్యాతచారిత్రు భ
ర్తను గాఁ గోరితి వేని సమ్మద మెలర్ప న్నన్నుఁ గైకొమ్ము నీ
కనురూపప్రియవల్లభుండ భువనాధ్యక్షుండ నబ్బంగిఁ గై
కొన వేనిం బెనుఁగిన్కఁ బూని హృదయక్షోభంబుఁ గావించెదన్.
| 853
|
క. |
మానుషభావము విడువుము, పూనిక నిఖలాసురోత్తముఁడ నగునాపై
మానిని భావము సేర్పుము, మానసమున నితరచింత మానుము తన్వీ.
| 854
|
తరల. |
పడఁతిమాటకు రాజ్యసంపదఁ బ్రాభవం బెడఁబాసి యె
వ్వఁడు భయంకరకాననోర్వికి వచ్చె నట్టిగతాయువున్
జడుఁడు రాజ్యవిహీనుఁడుం బరసంభృతుం డగురాముపై
విడువ కీ విపు డేగుణంబుల వేడ్కఁ గూర్చితి చెప్పుమా.
| 855
|
రావణుఁడు సీతాదేవి నెత్తికొని పోవుట
వ. |
మఱియు దుర్మతియు నసిద్ధార్థుండు నగురామునిమీఁద మోహంబు విడిచి
భర్తను గా నన్ను వరింపు మని యివ్విధంబున విప్రలాపంబులు పలుకుచు
దుష్టాత్ముం డగురావణుండు కామమోహితుం డై వైదేహి డగ్గఱి యంతరి
క్షంబునందు బుధుండు రోహిణింబోలె బలాత్కారంబున నొక్కకరంబున
శిరోజంబులును వేరొక్కకరంబున నూరువులునుఁ బట్టి యెత్తి యంతలోన
సన్నిహితం బైనమాయామయహేమాంగఖరయుక్తదివ్యరథం బారోహించి
యద్దేవి నంకభాగంబున నిడుకొని పరుషవాక్యంబులం గర్జించుచు రయం
బున రథంబుతోఁ గూడ గగనంబున కెగసె నప్పుడు తీక్ష్ణదంష్ట్రుండును మహా
భుజుండును మృత్యుసంకాశుండును గిరిసన్నిభకాయుండు నగు రావణుం
జూచి భయార్త లై వనదేవత లాక్రోశించుచుండిరి యివ్విధంబున నకామ
దగుదాని భయార్తయె దూరగతుం డగురామునిం జీరుదాని సురనాగాం
గనభంగి వివేష్టమాన యగుదాని యశస్విని యగుజానకి బలాత్కారంబునం
గైకొని దురాత్ముం డగుదశగ్రీవుం డంబరంబునం జనుసమయంబున.
| 856
|
సీతాదేవి రావణహృత యై రామలక్ష్మణులం దలంచి విలపించుట
తే. |
రావణునిచే గృహీత యై రామపత్ని, తనదుదురవస్థ కెంతయుఁ దలఁకి చాల
వగలఁ బొగులుచు నున్మత్తపగిది భ్రాంత, హృదయగతి విలపించుచు నిట్టు లనియె.
| 857
|
ఆ. |
కామరూపుఁ డైనఖలరాక్షసునిచే గృ, హీత నైననన్ను నెఱుఁగ వైతి
హాకృపావిధేయ హాసుమిత్రాసుత, హాగురుప్రసాద హామహాత్మ.
| 858
|
తే. |
ధర్మహేతువువలన నర్థమును జీవి, తమును సుఖమును దృణముగాఁ దలఁచితీవ
ధర్మమున హ్రియమాణ నై తలఁకునన్ను, నృపకులోత్తమ గనుఁగొననేరవుగద.
| 859
|
క. |
అనఘా నీ వవినీతుల, కనవరతము శిక్షకుండ వైతివి నేఁ డీ
యనువునఁ బాపముఁ జేసిన, దనుజుని శాసింప వేల దయ దప్పె నొకో.
| 860
|
తే. |
పరఁగ నవినీతజనకృతపాపమునకు, జగతి సద్యఃఫలప్రదర్శనము లేదు
కాల మందుకు సహకారికారణ మగు, సస్యపాకంబునకుఁ బోలె సంతతంబు.
| 861
|
వ. |
అని పలికి రావణు నుద్దేశించి నీవు కాలోపహతచేతనుండ వై యీకర్మంబుఁ
గావించితి వింక రామునివలన ఘోరంబును జీవితాంతకరం బైనవ్యసనంబు
నొందఁ గల వని పలికి వెండియు.
| 862
|
క. |
ఆకస్మికముగ దానవుఁ, డీకరణిం గొనుచు బలిమి నేగెడు నన్నుం
|
|
|
బ్రాకృతకర్మఫలంబులు, చేకూడెం గాక యేల చింతింపంగన్.
| 863
|
తే. |
కాలచోదితుఁ డై వీఁడు కాంక్షచేత, నన్ను ముచ్చిలి గొనిపోవుచున్నవాఁడు
వీరశేఖరుఁ డైననావిభునిచేత, సందియము లేదు పంచత్వ మొందఁగలఁడు.
| 864
|
క. |
ఈపాపాత్మునిచే నే, నీపట్టునఁ జిక్కుచుండ నిఁకఁ గైకయి దా
నేపార బంధుయుతముగ, దీపించుచు నుండుఁ గాదె తీఱనికోర్కిన్.
| 865
|
ఉ. |
కాననసీమయందు దశకంఠుఁడు ముచ్చిలి దుర్వినీతుఁ డై
పూనిక భూమిపుత్రిఁ గొనిపోయెడు వేగమె నీవు ప్రోవ రా
వే నృప ధర్మశీల రఘువీర యటంచుఁ గృపారతి న్జన
స్థాననగంబులార యలసౌరకులాగ్రణితోడఁ జెప్పరే.
| 866
|
క. |
రావణుఁడు జానకిం గొని, పోవుచు నున్నాఁడు వేగ ప్రోవు మటంచు
న్నావిభునితోడఁ జెప్పుము, వావిరిఁ గృపతోడ మాల్యవద్గిరినాథా.
| 867
|
క. |
నిరుపమతరంగమాలా, పరికలితమరాళచక్రబకసాదనవి
స్ఫురితఘనగౌతమీనది, నరనాథునితోడఁ జెప్పు నాతెఱఁ గెల్లన్.
| 868
|
చ. |
తిరముగ నింద యున్నవనదేవతలార మృగంబులార ఖే
చరవరులార సిధ్ధమునిసంతతులార దశాననుండు బం
ధురగతి సీత నెత్తికొని దొంగిలి పోయెను నంచు మీరు మ
ద్వరునకుఁ జెప్పుఁ డార్తి సతతంబు మిమున్ శరణంబు వేఁడెదన్.
| 869
|
చ. |
యమునకుఁ జిక్కినట్టిసతి వెసన్ విడిపింపఁజాలునం
తమహిమ గల్గువాఁడు రఘునాయకుఁ డీవని విన్నయంత వి
క్రమమున వీనిఁ దాఁకి పటుకాండహతి న్వధియించి మించి య
శ్రమమున నీక్షణంబె సుకరంబుగ న న్విడిపింపకుండునే.
| 870
|
వ. |
అని బహుప్రకారంబుల విలపించుచు నమ్మహీపుత్రి పురోభాగంబున వనస్పతి
గతుం డైనగృధ్రనాథుం డగు జటాయువునుం జూచి భయకంపితాంగి యై
డగ్గుత్తికతో ని ట్లనియె.
| 871
|
చ. |
రాముఁడు లేనిచో నను నరణ్యమునం గొనిపోవుచున్నవాఁ
డీమనుజాశనుండు పతగేశ్వర వీఁ డతిశూరుఁ డౌట సం
గ్రామతలంబునం దగ భరం బగునీకు జయింపఁ గాన సు
త్రామసమానుఁ డైనరఘురామున కింత యెఱుంగఁ జెప్పవే.
| 872
|
జటాయువు రావణునికి హితోపదేశముఁ జేయుట
ఉ. |
నా విని యజ్జటాయువు వనస్పతిపై నిదురం దలంగి యా
రావణు వానియంకమున రామునిఁ జీరుచు నేడ్చుజానకీ
దేవిని జూచి ఱెక్కలు విదిర్చి శితాయతతుండుఁ డై మహా
గ్రావముభంగి గాత్ర మలరం బరుషోక్తుల వాని కి ట్లనున్.
| 873
|
ఉ. |
ఓరి దశాస్య యేను విహగోత్తముఁడ న్భుజవీర్యవిక్రమో
ద్దారుఁడ సత్యసంశ్రయుఁడ ధర్మవిదుండ జటాయు వండ్రు నా
పే రటు పెక్కుకయ్యములఁ బెద్దయు విశ్రుతిఁ గన్నవాఁడ సొం
పార వసించి యుండుదుఁ గదా బహుకాలమునుండి యిచ్చటన్.
| 874
|
తే. |
సర్వలోకంబునకు రాజు సత్యసంధుఁ డింద్రవరుణోపముం డతిహితుఁడు లోక
ములకు శూరుండు దశరథవుత్రుఁ డలరు, రాముఁ డన సర్వసుగుణాభిరాముఁ డగుచు.
| 875
|
ఉ. |
ఏసతి బల్మి నెత్తికొని యేగఁగ నీవు దలంచి తాసతిన్
భూసుతఁ గా నమేయగుణపుణ్యచరిత్రను గాఁ బతివ్రతో
ల్లాసిని గాఁ గనద్గుణవిలాసిని గా నలరాముపత్నిఁ గా
శ్రీసమఁ గాఁ బవిత్రకులశీలను సీతను గా నెఱుంగుమీ.
| 876
|
ఉ. |
రాముఁడు సూర్యవంశ్యుఁ డభిరాముఁడు భూరిభుజాపరాక్రమో
ద్దాముఁడు కీర్తనీయగుణధాముఁడు ఘోరబలాధికాసుర
స్తోమవిరాముఁ డుగ్రరణసోముఁడు వీర్యజితైకపింగసు
త్రాముఁడు భూరిదోర్విజితరాముఁడు సుమ్ము నిశాచరాధమా.
| 877
|
ఉ. |
రావణ ధర్మశీలుఁ డగురాజు పరాంగన నెట్లు గోరు నా
హా విను మందు రాజసతి యంబయుఁ బోలె సురక్షణీయ యౌఁ
గావున నీతెఱంగు గొఱ గా దిఁక నీచమనీష మాను ము
ర్వీవరుఁ డైనరామున కరిష్టముఁ జేసి మనంగ వచ్చునే.
| 878
|
తే. |
ధీరుఁ డగువాఁడు పరులు నిందించునట్టి, పని యొనర్పఁడు తనపత్ని తనకు నెట్లు
రక్ష్య యౌ నట్లు పరవిమర్శనమువలనఁ, బరసతులు రక్షణీయలు పరుల కెందు.
| 879
|
వ. |
రాక్షసేంద్రా శాస్త్రపర్యాలోచనంబునం దతిసూక్ష్మదృష్టి గలవారి కైనఁ బరమ
దుర్బోధంబు లైనధర్మార్థకామంబులు రాజుకంటె నితరు లగువారు రాజు
ననుసరించి కావింతురు కావున ధర్మోపదేశపరుం డగురాజున కధర్మప్రవృత్తి
యనుచితం బై యుండు సర్వావస్థలయందును ధర్మంబె యాచరింపవలయు
సద్వృత్తు లగురాజులు శాస్త్రవిరుద్ధం బైనకామాదికంబు నిచ్చగింపరు.
| 880
|
తే. |
యామినీచరధర్మార్థకామములకు, రాజు స్థానంబు గావున రమణతోడఁ
బుణ్యపాపంబులును యశంబును శుభంబు, రాజమూలంబులై చెల్లు రాక్షసేంద్ర.
| 881
|
తే. |
ధరణిఁ బాపాత్ముఁ డగువాఁడు తన కయోగ్య, మైనదివ్యవిమానంబు నధిగమించి
నట్లు చపలుండ వగునీ వనర్హ మైన, విభుత నెబ్భంగి నొందితి విబుధవైరి.
| 882
|
తే. |
పరఁగ నెవ్వాని కెద్ది స్వభావ మదియుఁ, జాల దురతిక్రమం బగుఁ జపలచిత్తు
లైనవారిగృహంబుల నధివసింపఁ, జాల దిలఁ బెద్దకాల మైశ్వర్య మసుర.
| 883
|
ఉ. |
రాముఁడు నీకుఁ దొల్లి యపరాధముఁ జేసి యెఱుంగఁ డట్టిబా
హామహిమాభిరామున కహస్కరతేజున కెగ్గు సేయఁగా
|
|
|
నీమది నెట్లు చూచితివి నిక్కము దీనఁ బొసంగుఁ జేటు సం
గ్రామమునం దదీయపటుకాలకటాక్షనిభాస్త్రసంహతిన్.
| 884
|
ఉ. |
ఏమనుజేంద్రుపత్ని నిపు డేపున ముచ్చిలి పోయె దారఘు
స్వామిపరాక్రమంబు భుజశక్తియు నోర్వఁగ నోపు నేఘనుం
డీమహిఁ జుప్పనాతికయి యింతకు మున్ను ఖరాసురుండు త
ద్భీమకృతాంతదండనిభదీప్తశరాహతి నుర్విఁ గూలఁడే.
| 885
|
చ. |
కడువడిఁ గంఠలగ్న మగుకాలునిపాశముగాఁ జెఱంగున
న్ముడిచినవిస్ఫులింగముగ బుక్కిటఁ బట్టినదుర్విషంబుగాఁ
గడఁక నెఱింగి సీత నిట గ్రక్కున డించి తొలంగు మట్లు గా
నొడఁబడ వేనిఁ గూలెదు తదుగ్రశరార్చులఁ గాలి వ్రేల్మిడిన్.
| 886
|
క. |
హరివజ్రము నిజహేతులఁ, గర మరుదుగ వృత్రదైత్యుఁ గాల్చినభంగి
న్నరపతి నయనోస్థితభీ, శరదహనార్చులను నిన్నుఁ గాల్పక యున్నే.
| 887
|
వ. |
రావణా యేభారద్రవ్యంబు నరుఁ బీడింప దట్టిదాని మోవం దగు నేయ
న్నంబు రోగంబు నుత్పాదింపక జీర్ణించు నట్టియన్నంబు భుజింపం దగు నేక
ర్మంబుఁ జేసిన గీర్తియశోధర్మంబులు నశించు నట్టికర్మం బెవ్వం డాచరించుఁ
బ్రమాదంబునం గావించె నేని దాన శరీరఖేదంబు గలుగు నంతియె కాని ఫలం
బేమియు లేదు నా కఱువదివేలవత్సరంబు లతీతంబు లయ్యె నాఁటనుండి పితృ
పైతామహం బైనఖగరాజ్యంబుఁ బరిపాలించుచున్నవాఁడ.
| 888
|
చ. |
స్థిరచిరకాలము న్మనుటచేఁ గడువృద్ధుఁడ నైతి నేను నీ
వరయఁగఁ బ్రౌఢమూర్తివి శతాంగివి ధన్వివి ఖడ్గి వస్త్రి వై
వఱలుదు వైన నేమి యనివారణచాతురి నన్ను మీఱి యి
ప్పరుసున నీకు రాఘవునిపత్నిని జేకొని పోవ వచ్చునే.
| 889
|
వ. |
మఱియు ద్రవద్రవ్యం బగుటవలన క్షీరంబుమాడ్కి సుర పేయం బనియెడు
నది మొదలుగాఁ గలతర్కసంయుక్తయుక్తులచేత సుర పేయంబుగా దని నిషే
ధించునట్టి నిత్యం బైనదాని నిరపేక్షణం బైనవేదశ్రుతిని బురుషుం డెట్లు హ
రింపశక్తుండు గాఁ డట్లు నీవు సీత నామ్రోల బలాత్కారంబున నపహరించు
టకు శక్తుండవు గావు మహాత్ము లగు రామలక్ష్మణులు దూరగతు లగుచుండఁ
జౌర్యంబున వైదేహిం గొని భయంబునం బరువెత్తుచున్నవాఁడవు నీవు శూరుం
డ వేని నాతో ద్వంద్వయుద్ధంబు సేయుము కాదని యొక్కముహూర్తంబు
నిలువుము పెక్కుమాఱు లెవ్వానిచేత సంగ్రామంబున దైత్యదానవులు పె
క్కండ్రు నిహతు లై రట్టిజటావల్కలధరుం డైనరాముండు చనుదెంచి జన
స్థానగతుం డైనఖరునిం బోలె నిశాతసాయకంబుల నిన్నుం బడవైచి తన
పత్నిం గొనిపోవు నే నారామునకు సచివుండ నాయొడలఁ బ్రాణంబు లుండ
|
|
|
నీవు వైదేహి నెత్తికొని పోవం జాలవు ప్రాణంబు లర్పించి యైన రామునకు
దశరథునకు హితంబుఁ గావింపం దగినవాఁడ నోపినకొలంది నీకు యుద్ధాతిథ్యం
బొసంగెద నీకుఁ బ్రాణంబులదెస నాస గల దేని వైదేహిం బరిత్యజించి
తొలంగి చను మట్లు సేయ వేని వృంతంబువలన ఫలంబుంబోలె రథంబువలన
నిన్నుం ద్రెళ్ల వైచెద చూడు మని పలికి యజ్జటాయువు రోషావేశంబున
నిలు నిలు మని యదల్చి తాఁకిన నద్దశగ్రీవుండు సక్రోధుం డై వింశతిలోచనం
బుల నగ్నికణంబు లొలుకఁ గాంచనకుండలరోచులు గండభాగంబుల నిండు
కొన మండలీకృతకోదండుం డై ప్రచండంబుగా నయ్యండజమండలాఖండ
లుం దలపడియె నివ్విధంబున మార్కొని పక్షవంతంబు లైనమేఘంబులపగిది
నితరేతరసంఘర్షణంబుల నన్యోన్యప్రహరణంబులఁ బరస్పరధిక్కారంబుల
నక్కజంబుగాఁ బోరుసమయంబున.
| 890
|
జటాయువు రావణునితో యుద్ధము చేయుట
శా. |
ప్రాచుర్యంబుగ రావణుండు నిశితోగ్రక్రూరనాళీకనా
రాచంబు ల్నిగిడింప గృధ్రవిభుఁ డుగ్రక్రోధుఁ డై జన్యవి
ద్యాచాతుర్యము మీఱఁ దచ్చిరములన్ దాఁటించి పెన్గోళ్ల న
న్నీచాంగంబు వ్రణంబుఁ జేసె రుధిరోన్మేషంబు వాటిల్లఁగన్.
| 891
|
ఉ. |
అంత దురంతకోపమున నద్దశకంధరుఁ డుగ్రవృత్తిఁ గా
లాంతకకాలదండనదృశాంబకము ల్పది యొక్కపెట్ట య
త్యంతరయంబునం బఱపి యద్భుతభంగి గుణస్వనంబు రో
దోంతర మెల్ల నిండఁ బతగాధిపుగాత్రము నొవ్వఁ జేసినన్.
| 892
|
ఉ. |
దానికి నించు కైన మదిఁ దత్తఱ మందక పక్షినాథుఁ డా
దానవుతేరిపై బహువిధంబుల నార్తిఁ గృశించుచున్నయా
జానకిఁ జూచి రోష మతిసాహసికత్వము చెంగలింపఁ గా
లానలుభంగి మోము చెలువారఁ బరాక్రమదుర్నివారుఁ డై.
| 893
|
చ. |
అలయక వానివిల్లు చరణాహతిఁ ద్రుంచిన వెండి కోప మ
గ్గలముగ నొండువిల్లు గొని కాండము లొక్కట నూఱు వేయు ల
క్షలు నిగిడింపఁ దచ్ఛరనికాయముచేతఁ బరీతుఁ డై కుహా
బలుఁడు కులాయమధ్యగతపక్షివిధంబునఁ జూడ నొప్పుచున్.
| 894
|
తే. |
మేదురపతత్త్రజాతసమీరణమున, రావణశరంబు లన్నియుఁ బోవఁ దట్టి
కఠినవజ్రాభచరణనఖప్రహతుల, మరల దశకంధరునివిల్లు విఱిచివైచె.
| 895
|
జటాయువుచేత రావణుఁడు విరథుఁ డగుట
చ. |
అంతటఁ బోక పక్షివరుఁ డంఘ్రుల వానిధ్వజంబు ద్రుంచి యిం
తింతలు తున్కలై వెస మహీస్థలి వ్రాలఁ బతాకఁ దన్ని ప
|
|
|
క్షాంతముల న్హయంబుల రయంబునఁ జంపి తదీయకంకటం
బంతయుఁ జించి సూతుఁ దెగటార్చి నఖంబులఁ జించె ఛత్రమున్.
| 896
|
వ. |
మఱియుఁ ద్రివేణుసంపన్నంబును బావకసన్నికాశంబును గామసంచారక్షమం
బును మణిహేమవిచిత్రాంగంబు నగురథంబుఁ బఱియలు వాపి గ్రాహకసహి
తంబుగాఁ జామరంబులు భంజించి పక్షీంద్రుం డక్షీణభుజావిక్షేపంబుఁ
జూపిన నద్దశగ్రీవుండు విరథుండును హతాశ్వుండును హతసారథియు నై
నిజాంకభాగంబున వైదేహి నిడుకొని శీఘ్రజవంబున ధరణిపయిం బడు
టయు నతనిపరాభవంబుఁ జూచి సకలభూతంబులు సాధువాక్యంబులఁ
బక్షీంద్రునిం బ్రశంసించి రంత రావణుండు భూతలపతితుం డయ్యును
జరాభారంబునఁ బరిశ్రాంతుం డై యున్నజటాయువుం జూచి సంహృష్టచిత్తుం డై
క్రమ్మఱ నమ్మహీపుత్రితోడ గగనంబున కెగసి యతిత్వరితగమనంబునం బోవు
చుండ నయ్యండజశ్రేష్ఠుండు తోడనె యెగసి నిలునిలు మని యదల్చి పక్ష
విక్షేపణసంజాతవాతవేగంబున నతని సుడి పెట్టుచు నొడ్డారంబుగా నడ్డంబు
నిల్చి పరుషవాక్యంబున ని ట్లనియె.
| 897
|
చ. |
అశనిసమానబాణుఁడు మహాత్ముఁడు రామవిభుండు తత్సతిం
బశుమతిఁ జేసి బల్మిఁ గొని పాఱెద వాత్మవధార్థ మీ వయో
దళముఖ చే టెఱుంగక మదంబున మీనము మాంసబుద్ధి వె
క్కసముగ మాంసయుక్త మగుగాలము మ్రింగినచంద మేర్పడన్.
| 898
|
క. |
దితిజాధిప బాంధవబల, హితభృత్యామాత్యసుతసహితముగ సుపిపా
సితుఁ డుదకముఁ గ్రోలినక్రియ, హిత మెఱుఁగక విషముఁ ద్రావి తేటికిఁ జెపుమా.
| 899
|
క. |
అవిచక్షణు లగుపురుషులు, భువిలో నాత్మీయదోషమున నష్టప్రా
భవు లై నీవిధమున వా, సవవైరి నశింతు రింత సత్యం బరయన్.
| 900
|
ఉ. |
ఒంటిగ నున్నచో రఘుకులోత్తముదేవిని ముచ్చిలించు టే
బంటుతనంబు నీకుఁ గులపాంసన యమ్మహనీయకార్ముకుం
డంటినఁ గిన్కఁ దిగ్మవిశిఖాహతి నిన్ను వధించి సీత ని
ష్కంటకవృత్తి వెండి కొనుఁగా కిఁక నిన్ను మనంగ నిచ్చునే.
| 901
|
క. |
అచ్చుపడఁగ నీ వీగతి, వచ్చుటయును సీత నిట్లు వంచించి రహిం
దెచ్చుటయు విని సహింతురె, సచ్చరితులు రాజసుతులు సంగరధీరుల్.
| 902
|
చ. |
కడువడిఁ గాలపాశ మురి గాఁగ మెడం దవిలించికొంటి వె
క్కడఁ జనవచ్చు నీకు దశకంధర పుత్రబలాన్వితంబుగాఁ
దడయక రాఘవుండు నిశితప్రదరానలహేతుల న్రయం
బడరఁగ నిన్నుఁ గాల్చు భయదాజి మహి న్ఖరదైత్యునిం బలెన్.
| 903
|
క. |
ధర నెంతటివాఁ డైనను, దర మెఱుఁగక నీచబుద్ధిఁ దాఁ జేసినదు
|
|
|
ర్భరదుష్కర్మము ఫలమును, గుఱుతుగఁ దోడ్తోడఁ గట్టి కుడువక చనునే.
| 904
|
క. |
ధీరుఁడ వగునీచే నిటు, లారయఁ గడునింద్యకర్మ మది కృత మయ్యెం
జోరాచరితపథం బిది, వీరాచరికంబు గారు విబుధవిరోధీ.
| 905
|
క. |
లోకవిగర్హిత మగుపనిఁ, గైకొని కావించునట్టి కలుషాత్ముం డా
లోకేశుఁ డైన మేదినిఁ, బ్రాకటముగ సిరియుఁ దక్కి బ్రతుకంగలఁడే.
| 906
|
వ. |
దురాత్మా మృత్యుకాలంబునందుఁ బురుషుం డాత్మవినాశంబుకొఱకు నెట్టి
కర్మంబు నొందు నట్టిసీతాహరణరూపకర్మంబు నొందితివి దీన నీకు మృత్యువు
సిద్ధించు నేకర్మంబునకుఁ బాపానుబంధంబు గలుగు నట్టికర్మంబు భగవంతుం
డగు లోకేశ్వరుం డైనను గావింపం డని బహుప్రకారంబుల నుపక్రోశించుచు
నంతకంతకుఁ గోపం బగ్గలం బగుటయు నప్పతంగకులపుంగవుండు శీఘ్రంబు
నం బఱతెంచి రావణునివీఁపున వ్రాలి గజారోహకుండు మదవారణం బధి
రోహించి యాదృశవ్యాపారవంతుం డగు నత్తెఱంగున వాని నాక్రమించి
దీక్ష్ణనఖంబుల విదారించుచు నిశాతతుండంబున వ్రణంబు సేయుచుఁ గేశంబు
లుత్పాటించుచు నఖపక్షముఖాయుధుం డై వెండియు బహుప్రకారంబుల
నొప్పించిన నతండు బెండు సెడక రోషవిశేషంబున నమర్షస్ఫురితోష్టుం డై
కంపించుచు వైదేహిని వామాంకంబునం గ్రుచ్చి పట్టి కరతలంబున జటాయువు
వ్రేసిన నతండు కడు నలిగి యన్నిశాచరు నాక్రమించి నిశితం బైనతుండా
గ్రంబున వానివామబాహుదశకంబు ఖండించిన నవి క్రమ్మఱం బొడమి
రక్తధారాస్నపితంబు లై విషజ్వాలావళీయుక్తంబు లైనపన్నగంబులకరణి
నొప్పుచుండె నిత్తెఱంగున రావణుండు జటాయువుచేత వేటుపడి తాను బ్రౌఢుం
డయ్యును వృద్ధుం డగుజటాయువుఁ గడవంజాలక చిక్కువడి యౌడుఁ గఱచి
శీఘ్రంబున వైదేహి డించి యతనితోడ బాహుయుద్ధంబునకుం దలపడి ముష్టి
ప్రహారంబులఁ జరణతాడనంబుల బడలుపడం జేసిన నవ్విహంగమపుంగవుండు
వెనుదీయక రామార్థంబు శరీరాయాసజనకం బైనరణంబు సేయుచు మార్కొ
నిన నసమానపరాక్రము లైనయారాక్షసనాథపక్షినాథులకుఁ గొండొకసేవు
దారుణం బగుసంగ్రామంబు చెల్లె నంత నద్దశగ్రీవుండు.
| 907
|
రావణుఁడు జటాయువుయొక్క పక్షపాదంబులు ఖండించుట
క. |
కడిమి మెఱయ ఖడ్గము గొని, కడువడి సమరమున రామకార్యార్థము పో
రెడుఖగపతిపక్షంబులు, కడఁకం బాదములు రెండు ఖండించె వెసన్.
| 908
|
క. |
పక్షివిభుఁ డిట్లు ఖండితపక్షుం డై యసివిలూనపాదుం డై ర
క్తోక్షితతనుఁ డై పొలుపఱి, యాక్షణమ విసంజ్ఞుఁ డగుచు నచలం బడియెన్.
| 910
|
తే. |
ఇత్తెఱంగున దుష్టదైత్యేశఖడ్గ, ఖండితపతత్రపాదుఁ డై కడిమి దక్కి
|
|
|
పుడమిఁ బడియున్నఖగపతి పోలఁ జూచి, జనకసుత శోక మడరంగఁ జాల వగచె.
| 911
|
వ. |
మఱియు రావణభుజావేగమర్దితుం డై శాంతం బైనదావానలంబుపగిది నిస్తే
జుం డై పుడమిం బడియున్నవాని నీలజీమూతప్రకాశకల్పుం డగువానిఁ
బాండురపక్షుం డగువాని మహావీర్యుం డగువాని గృధ్రపతి నవలోకించి
దుఃఖార్త యై కరంబుల సంస్పృశించి శశినిభానన యగుజానకి భర్త నుద్దే
శించి యి ట్లని విలపించె.
| 912
|
సీతాదేవి జటాయువును జూచి విలపించుట
సీ. |
పరఁగఁ బింగళ్యాదిపక్షిస్వరజ్ఞాన మక్షిపరిస్పందనాదిజన్య
లక్షణజ్ఞాన మిలాస్థలి నరులకు గణుతింప సుఖదుఃఖకారణంబు
లండ్రు నేఁ డిట్లు న న్నసురుం డపహరించు టెంతయు నిచ్చటి మృగ ఖగములు
సూచింపఁ జేయుచు సొరిది గుంపులు గట్టి చరియించుచున్నవి సంభ్రమమునఁ
|
|
ఆ. |
బ్రాణనాథ నాకుఁ బాటిల్లినట్టియీ, వ్యసన మీ వెఱుంగ వైతి వేల
నరవరేణ్య నేఁడు నాయభాగ్యంబునఁ, జేసి నీదుబుద్ధి చిక్కె నొక్కొ.
| 913
|
క. |
ననుఁ గావ వచ్చి పాపపు, దనుజునిచే నిహతుఁ డగుచు ధరణిం బడె నీ
యనఘుఁడు పక్షీంద్రుం డీ, తనిఋణ మేపగిదిఁ దీర్పఁ దగు నీ కధిపా.
| 914
|
శా. |
హారాజోత్తమ హాకృపాజలనిధీ హారామ హాలక్ష్మణా
ఘోరారణ్యమునందు రాక్షసుఁడు నన్ గొంపోవుచున్నాఁడు దో
స్సారోదారుని వీనిఁ జంపి ననుఁ జంచత్ప్రీతి రక్షింపరే
రారే వేగమె వీని కడ్డపడరే రమ్యాకృతు ల్చూపరే.
| 915
|
మ. |
అని యిబ్భంగిఁ గృశించుచు న్విభుని సువ్యక్తంబుగాఁ జీరుచున్
ఘనవృక్షంబులఁ గౌఁగిలించుకొనుచుం గంపించుచు న్బాష్పము
ల్చినుక న్భోరున నేడ్చుజానకిని యోషిద్వర్గచూడామణి
న్గని దైత్యాధముఁ డుగ్రుఁ డై పరుషవాక్యప్రౌఢిఁ దర్జించుచున్.
| 916
|
మ. |
కడిమిం గ్రమ్మఱఁ గైకొనం దలఁచునక్కాలంబున న్సాధ్వసం
బకర న్దిక్కులఁ జీఁకటు ల్గవిసెఁ బద్మాప్తుండు నిస్తేజుఁ డై
జడతం జెందె సమీరణుండు వగ హెచ్చ న్వీవకుండె న్మును
ల్కడుశోకంబున సీతపాటుఁ గని కిన్కం దూఱి రెంతే విధిన్.
| 917
|
వ. |
మఱియు సచరాచరం బగుజగం బంతయు నతిక్రాంతనైసర్గికావస్థానం బయ్యెఁ
బితామహుండు దివ్యజ్ఞానదృష్టి నాలోచించి దేవతాకార్యంబు కృతం బయ్యె
నని పలికె దండకారణ్యనివాసు లగుమహర్షులు సీతానిమిత్తంబున రావణున
కు వినాశంబు వాటిల్లు నింక సకలలోకంబులకుఁ బరమకల్యాణంబు గలుగునని
గుసగుసవోవుచు నప్పటివైదేహి దురవస్థ విలోకించి దుఃఖించుచుండిరి యి
వ్విధంబున రావణుండు రామలక్ష్మణులం బేర్కొని విలపించుచున్నజానకిని
|
|
|
బలాత్కారమున నెత్తికొని శీఘ్రంబున నాకాశంబున కెగసె నప్పు డద్దేవి వస్త్రా
భరణసువర్ణాంగియుఁ బీతకౌశేయవాసినియు నై సుదామాఖ్యపర్వతంబునం
బుట్టినమెఱుంగుచందంబున నొప్పె మఱియును.
| 918
|
క. |
కమనీయం బగుసీతా, కమలేక్షణ మంజుపీతకౌశేయముచే
నమరారి యొప్పె నప్పుడు, సమీరసఖుచేత నీలశైలముమాడ్కిన్.
| 919
|
తే. |
మఱియు నయ్యింటిలోహితసురభిపద్మ, పత్రములు రావణునిమీఁదఁ బడియె నపుడు
భీతకౌశేయపట మొప్పె నాతపమున, నినమరీచులచేఁ దామ్రఘనముపగిది.
| 920
|
సీ. |
చారుతామ్రోష్ఠంబు చాంపేయకుసుమోపమానసునాసాసమన్వితంబు
పద్మగర్భాభంబు పాండరదశనాభిరంజితం బలకాభిరాజితంబు
శుభదర్శనంబు మంజులకపోలతలంబు దీర్ఘలోచనసముద్దీపితంబు
కనకప్రభంబు శృంగారలలాటంబు సలలితతారకావిలసితంబు
|
|
తే. |
నగుమహీపుత్రివదన మొప్పారునపుడు, శోకభరమున నొక్కింతసొబగు దప్పి
పవలు గనుపట్టు రోహిణీపతివిధమున, రాత్రిఁ గనుపట్టు నవతామరసముపగిది.
| 921
|
తే. |
మఱియు నీలాంగుఁ డగుదైత్యవరునియంక, మున సువర్ణాంగి యగుమహీపుత్రి యొప్పె
విమలకాంతి శోభిల్లు నీలమణి నాశ్ర, యించినవినూత్నకాంచనకాంచిపగిది.
| 922
|
తే. |
వెండియు వెడందకాటుకకొండపగిదిఁ, గ్రాలు దేవారియంకభాగమున దీప్త
హేమభూషణ యగునమ్మహీజ యొప్పె, మేచకాభ్రంబుచెంగట మించుఁబోలె.
| 923
|
సీతాదేవి ధరించి యున్నపుష్పాభరణాదులు పుడమిం బడుట
క. |
దోషాచరుఁ డాజానకి, భూషణఘోషమున నలరెఁ బుష్కరవీథి
న్భీషణముగ శంపాని, ర్ఘోషాయతమనముక్రియ నకుంఠితలీలన్.
| 924
|
చ. |
గుఱుతుగ నమ్మహీతనయకొప్పునఁ జుట్టిన మంజుపుష్పముల్
సురకుధరంబుపైఁ బడెడుచుక్కలకైవడిఁ గొన్ని యన్నిశా
చరుపయి వ్రాలె వ్రాలె వరుస న్మఱికొన్ని మహీతలంబుపైఁ
గర మనివేకి యైనదశకంఠుయశఃకుసుమంబులో యనన్.
| 925
|
తే. |
మఱియు నద్దేవి కాంచనమణివిచిత్ర, నూపురము మింటనుండి మనోజ్ఞఫణితి
మధురముగ మ్రోయుచును దటిన్మండలంబు, పగిది రయమున ధరణిపైఁ బడియె నపుడు.
| 926
|
క. |
తరుపల్లవశోభిత యగు, ధరణీనందని వినీలతనుఁ డగురాత్రిం
చరుని వెలయించె నప్పుడు, కర మరుదుగ హేమకక్ష్యగజమునుబోలెన్.
| 927
|
క. |
త్వరితగతి నేగుతఱి న, వ్వరపర్ణినిదీప్తవహ్నివర్ణవిచిత్రా
|
|
|
భరణము లిల వ్రాలె నభోం, తరమున సంక్షీణ లైనతారలమాడ్కిన్.
| 928
|
తే. |
చంద్రుచంద్రికగతి నొప్పుజనకపుత్రి, హారధార తదీయస్తనాంతరప్ర
గళిత యై యుర్విఁ బడియె నక్కజము గాఁగ, గగనముననుండి పడియెడుగంగఁ బోలి.
| 929
|
వ. |
మఱియు నానాద్విజగణయుతంబు లగుపాదపంబు లుత్పాతవాతాభిహతం
బులై విధూతాగ్రంబులచేత వైదేహి కభయంబుఁ దెల్పిన ట్లొప్పుచుండెఁ గమ
లాకరంబులు విధ్వస్తకమలంబు లై విత్రస్తమానవిహంగమంబు లై మూర్ఛిత
యైనసఖింబోలె వైదేహి నుద్దేశించి తదీయదుర్దశాదర్శనంబువలన సంప్రాప్త
నిశ్శ్వాసంబు లై దుఃఖించిన ట్లుండె సింహవ్యాఘ్రమృగద్విపంబులు రావణుని
దౌరాత్మ్యంబునకు నాక్రోశించుచు నిలిచినచోట నిలువక రావణవిషయ
రోషంబున ఛాయానుగతంబు లై పరువెత్తుచుండెఁ బర్వతంబులు జలప్రపా
తాశ్రుముఖంబు లై శృంగంబు లనుసముచితభుజంబులు గలిగి గుహాముఖం
బుల మొఱ పెట్టిన ట్లుండె దివాకరుండు దీనుం డై నిష్ప్రభుం డై పాండరమం
డలుం డయ్యె వపాంసులాశిరోమణి యగువైదేహిని రావణుండు ముచ్చిలి
కొనిపోవుచున్నవాఁడు లోకంబుల నింక నార్జవంబును నానృశంస్యంబును సత్యం
బును ధర్మంబును లే దని సకలభూతంబులు గుంపులు గట్టి పెక్కుచందంబుల
విలపించుచుండె మృగపోతంబులు దీనముఖంబు లై బాష్పపాతావిలేక్షణంబు
లైననయనంబుల సారెసారెకు సీత నవలోకించి రోదనంబు సేయుచుండె రామ
లక్ష్మణాగమనకాంక్షచేత ధరణీతలంబు నవలోకించుచు బహుప్రకారంబుల విల
పించుచు రావణాంకగత యై గగనంబునం జనుచున్నజానకి నవలోకించి వనదేవత
లాకంపితగాత్ర లైరి రావణుండు సీత నపహరించుచుండఁ జరాచరం బగులోకం
బంతయు మీనసంక్షోభచలితం బైనకమలాకరంబుచందంబునం జూపట్టె ని
త్తెఱంగున దురాత్మం డగురావణుండు సమాకులకేశాంతయు విప్రమృష్టతిలక
యు నగువైదేహి నపహరించి యాత్మవినాశంబుకొఱకుఁ దనపాలిమృత్యువుం
గొనిపోవుకైవడి నతిత్వరితగమనంబున నాకాశంబునం బోవ నప్పుడు శరీరంబు
వడంక మొగంబునం జిఱుచెమట గ్రమ్ముదేర దీవచందంబున నడలుచు
నుచ్చైర్నాదంబున రోదనంబు సేయుచు రామలక్ష్మణులం జీరుచు దిక్కు
లాలోకించుచు వనదేవతలం బేర్కొనుచుఁ దనదురవస్థకు దైవంబు దూఱుచు
రోషరోదనతామ్రాక్షి యై యలుక వొడమినచిత్తంబున నమ్మహీపుత్రి రావణు
నుద్దేశించి యశనిపాతకల్పం బైనదారుణవాక్యంబుల ని ట్లనియె.
| 930
|
సీతాదేవి తన్ను బలాత్కారముగా నెత్తికొనిపోవురావణుని దూఱుట
క. |
ఓరి దురాత్మక మత్పతి, దూరంబున కేగి యుండ దొంగిలి నను దు
|
|
|
ర్వారోద్ధతిఁ గొని యీగతిఁ, బాఱుట కయొ సిగ్గు గాదె పరికింపంగన్.
| 931
|
సీ. |
కాంచనచిత్రమృగంబు వచ్చుటయును రహి మీఱఁ దత్ప్రతిగ్రహణబుద్ధి
నాకుఁ బుట్టుటయును నరనాయకుఁడు దాని పొలుపారఁ బట్టి తేఁబోవుటయును
వికృతనినాదంబు వినవచ్చుటయును దోడనె లక్ష్మణుఁడు పోవుటయును దలఁప
నిపుడు నీమాయగా నెఱిఁగితిఁ గాకున్న భిక్షుఁడ వై వచ్చి పిదప నింత
|
|
తే. |
పనికిఁ జొత్తువె నీచాత్మ పక్షినాథు, నధికవృద్ధునిఁ జిరజీవి నాహవమునఁ
గడిమి నిటు మన్నిమిత్తంబుగా వధించి, తరయ నిది బంటుతనము గా దసుర నీకు.
| 932
|
చ. |
పతి కడలేనిచోటఁ బరభామను బల్మి గ్రహించి వోవుటే
చతురత నీపరాక్రమము సత్త్వము సర్వముఁ దెల్ల మయ్యె గ
ర్హిత మగునీచకృత్య మొనరించుట కెంతయు సిగ్గు గాదె కు
త్సితున కిహంబునుం బరము చేకుఱునే రజనీచరాధమా.
| 933
|
తే. |
కడిమి రామలక్ష్మణుల సంగ్రామమందు, మెచ్చుగ జయించి ననుఁ గొని తెచ్చి తేని
యపుడు నీశౌర్య మది గొనియాడవచ్చుఁ, జౌర్యమునఁ గొని తెచ్చుట శౌర్య మగునె.
| 934
|
ఉ. |
ఎక్కడిసత్త్వ మేటిచల మెక్కడిశౌర్యము బుద్ధిహీన నీ
వక్కట మేటిరక్కసుల కందఱ కేక్రియ రాజు వైతి ని
న్నెక్కుఁడు గాఁగ శూరవరు లేక్రియఁ జూచిరి యిన్నినాళ్లు నీ
వెక్కడ నన్ను బల్మిఁ గొని యేగుట యెక్కడ రాక్షసాధమా.
| 935
|
వ. |
దురాత్మా కులనిందాకరం బైనయీదుష్కృతకర్మం బాచరించి రామభయం
బునం బాఱెద నేను యువతి నగుటవలన నివారించుటకు శక్యంబు గా కున్నది
శూరుండ వేని యొక్కముహూర్తంబు నిలువు మట్లైన భవదీయవిక్రమం బెల్ల
వారికిఁ దెల్లం బగు నమ్మహాత్ములచక్షుష్పథంబునం బడి బ్రతికి పోవంజాలవు
విహంగమంబులు దీప్తవహ్నిస్పర్శనంబునుంబోలె నద్దివ్యపురుషులశరస్పర్శనం
బు సహించుటకు యమాదు లైన సమర్థులు గారు నీవు బుద్ధిమంతుండ వై జీవితం
బులకు హితం బపేక్షించి నన్ను విడువు మట్లు సేయ వేని మత్ప్రధర్షణరుష్టుం డై
రాముండు నిన్ను నాశంబు నొందించు దానం జేసి నీవ్యవసాయం బంతయు
నిరర్థకం బై చను విబుధసమ్మతుఁ డగురామునిఁ బాసి యొక్కనిమిషం బైన
జీవింపనేర్తునె నిర్ఘృణుండ వగునీకుఁ జిరకాలంబు లంకావాసంబును శుభంబు
ను గలుగనేరదు ముమూర్షు లగువారికిఁ బథ్యవాక్యం బసహ్యం బై యుండు
నాసన్నమరణు లగువారు మృత్యుగ్రస్తు లై వివరీతకర్మంబు లాచరింతురు మ
త్కారణంబున నీవు దుర్నివారం బైనకాలపాశంబునం గట్టుపడితి వింక నెక్క
|
|
|
డికిఁ బోయెదవు శీఘ్రంబున హిరణ్మయవృక్షంబులను రుధిరవాహిని యగువై
తరణీనదిని భీమం బైనయసిపత్రవనంబును దప్తకాంచనపుష్పం బై వైడూర్య
ప్రవరచ్ఛదం బై కాలాయనకంటకచితం బై యొప్పు శాల్మలీపాదపంబును విలో
కించెద నదియునుం గాక.
| 936
|
క. |
రోగార్తుఁడు మోహంబున, బాగుగ విష మానినట్లు భర్తకు నీ వీ
లాగున నహితముఁ జేసితి, వేగతి భువిలోఁ జరించె దింకఁ గుశలి వై.
| 937
|
చ. |
ఒకనిమిషంబులోఁ గలన నొక్కఁడె యెవ్వఁడు వజ్రకల్పసా
యకములచేఁ జతుర్దశసహస్రనిశాటులఁ ద్రుంచె నట్టియ
స్త్రకుశలుఁ డుగ్రవీర్యుఁ డగురాఘవుఁ డిష్టసతి న్హరించి త
క్కక చనినట్టినిన్నుఁ బటుకాండముల న్వధియింపకుండునే.
| 938
|
వ. |
అని యేతాదృశంబు లగుదారుణవాక్యంబుల గర్హించుచు నమ్మహీపుత్రి భయ
శోకరోషంబులు మనంబున ముప్పిరిగొన నానాప్రకారంబుల విలపించుచు
పణాంకగత యై వడంకుచు నంబరంబునం బోవుచు నొక్కయెడ.
| 939
|
సీతాదేవి యాభరణంబుల మూఁటఁగాఁ గట్టి వానరులయొద్ద వైచుట
చ. |
ఒకధరణీధరాగ్రమున నొప్పెడువానరపంచకంబు త
ప్పక పరికించి దివ్యమణిభర్మమయాభరణంబు లుత్తరీ
యకమునఁ గట్టి నాడువిధ మంతయు రామునితో వచింత్రు గా
క కరుణ నంచు నెంచి గుఱిగాఁ బడవైచెఁ దదంతరంబునన్.
| 940
|
ఉ. |
ఆవిధ మించు కైనను దశాస్యుఁ డెఱుంగక సంభ్రమంబునం
పోవుచు నుండె నంతఁ దమముంగలఁ బడ్డసువర్ణభూషణ
శ్రీవిలసన్నవీనమృదుచేలముఁ గన్గొని యఱ్ఱు లెత్తి యెం
తేవడి మింట నేగుధరణీసుతఁ గన్గొని రావలీముఖుల్.
| 941
|
సీ. |
రాక్షసేశ్వరుఁ డిత్తెఱంగునఁ దనపాలిమృత్యువునట్ల మహీకుమారి
వడి నెత్తికొని ముదం బడరఁ బంపను దాఁటి నదులు వనంబులు నగము లంత
నంతఁ జూచుచు విశిఖాసనచ్యుత మైనకాండంబుకైవడి గగనవీథి
లంకాభిముఖముగా లక్షించి చనిచని తిమినక్రకమఠవిస్తీర్ణ మైన
|
|
తే. |
వనధిఁ గన్గొని దశకంధరునకు దీనఁ, జేటు వాటిల్లు ననియెడుసిద్ధవరుల
పలుకు లతిఘోరభంగి వీనులకుఁ బొలయ, నురుజవంబున నయ్యబ్ధి నుత్తరించె.
| 942
|
రావణుఁడు సీత నెత్తికొని తనయంతఃపురమున కరుగుట
వ. |
అప్పు డవ్వరుణాలయంబు సంభ్రమంబునఁ బరివృత్తతరంగంబును రుద్దమీన
మహోరగంబు నై యుండె రావణుండు పయోదధి నుత్తరించి భుజంగిభంగి
వివేష్టమానాంగి యైనజానకిం గొని విభక్తమహాపథం బైనలంకాపురంబుఁ
బ్రవేశించి సంరూఢద్వారబహుళం బైనయంతఃపురంబులోనికిం జని మయుం
|
|
|
డాసురి యగుమాయనుం బోలె శోకమోహపరాయణ యగువైదేహి నచ్చట
డించి రాక్షసస్త్రీల ననలోకించి యి ట్లనియె.
| 943
|
శా. |
నాపుణ్యాతిశయంబున దొరకె నీనారీలలామంబు మీ
రేపార న్వినయోక్తి నేమఱక నెంతే ప్రీతి మన్నించుచు
న్రేపు న్మాపును దివ్యభూషణమణిశ్రీగంధమాల్యాంబర
వ్యాపారంబుల నాదరించుచు ముదం బారంగ రక్షింపుఁడీ.
| 944
|
వ. |
మఱియు నెవ్వరేని జ్ఞానంబునం గాని యజ్ఞానంబునం గాని యప్రియవచనంబున
నిద్దేవికి మనఃఖేదంబు సంపాదింపుదు రట్టివారు ప్రాణాంతం బైనమదీయదండంబు
నకుఁ బాత్రు లగుదు రిక్కాంతను బురుషుండు గాని యువతి గాని నాయాజ్ఞ
లేక విలోకింపం గూడ దట్లు జాగరూక లై రక్షింపుండు.
| 945
|
చ. |
అని నియమించి వెండియు సురారి హజారముఁ జేరి యింక నే
పని యొనరించువాఁడ నని భావమునం దలపోసి మాంసభో
జనులఁ బరాక్రమాధికుల శైలనిభాంగుల భూరిసత్త్వులన్
దనుజులఁ గొందఱం గని మదంబున నిట్లని పల్కె ధీరతన్.
| 946
|
ఉ. |
మానితబాహుశౌర్యు లసమానబలు ల్ఖరదూషణు ల్బల
శ్రీనిధు లొక్కమానవునిచే హతు లైరి బలాన్వితంబుగా
మానుగ వాసవాదిసురమండలికిం జొరరానియాజన
స్థానము సర్వరాక్షసవిశాల మరాక్షస మయ్యె వింటిరే.
| 947
|
రావణుం డెనమండ్ర రాక్షసుల జనస్థానంబునకుఁ బంపుట
చ. |
అనుజునిపాటు నేను వినినప్పటినుండి యహర్నిశంబు రా
మునిపయి నాత్మలోఁ గినుకఁ బూనితి నేక్రియ నైన వైరినా
శన మొనరింప కున్న నిఁక సమ్మతిఁ గంటికి నిద్రవచ్చునే
యనుషమసౌఖ్య మబ్బునె మహాసురరాజ్యపదంబు నిల్చునే.
| 948
|
చ. |
అరివిజయార్థ మే నిపుడు యత్నముఁ బూనితి భీతి దక్కి
స్థిర మగు పౌరుషంబును విశేషబలంబును సంశ్రయించి భీ
కరముగ నెల్లవారు బలుకైదువులు న్గయిసేసి మీరు సం
గరమున కింక నాయితము గండు పరాక్రమదుర్నివారతన్.
| 949
|
వ. |
సంగ్రామంబున రిపుం డగురాముని వధించి ధనంబు నధిగమించిననిర్ధనునిపగిది
నేను సుఖంబు నొందెద నిది మదీయనిశ్చయంబు మీరు సురసంగ్రామంబు
లందు బహుప్రకారంబుల నాఱితేఱి యున్నవారు ముల్లోకంబులందు మీ కసా
ధ్యం బెద్దియు లేదు మీతెఱం గంతయు నెఱింగి కాదె యిక్కార్యంబునకు ని
యోగించుచున్నవాఁడ నస్మదీయశాసనంబున మీరు కొందఱు తగుసాయం
బుఁ గూర్చికొని రాక్షసశూన్యం బైనజనస్థానంబునకుం జని యప్రమాదు లై
|
|
|
రామలక్ష్మణులవృత్తాంతం బరయుచు నజస్రంబును దద్వధంబునందుఁ గృత
ప్రయత్నులరు గండని పలికి బలవంతు లగువారి నెనమండ్ర రక్కసులం బంచిన
వారు దశగ్రీవునిశాసనంబునఁ బ్రచ్ఛన్నవేషు లై శీఘ్రంబున జనస్థానంబున
కుం జని రంత రావణుండు వైదేహిఁ దనకుఁ దక్కినదానిఁ గాఁ దలంచి రాము
వైరంబు సంపాదించి బుద్ధివైపరీత్యంబునఁ దన్నుం గృతకృత్యునిం గాఁ
దలంచుకొనుచుఁ గామబాణపరవశుం డై యచ్చట నిలువ నొల్లక రయంబున
రమ్యం బైనయభ్యంతరమందిరంబునకుం జని యందు.
| 950
|
చ. |
కనుఁగవ నశ్రుబిందువులు గాఱఁగ నేడ్చెడుదాని రాముఁ బే
ర్కొని విలపించుదాని వగ గూరినచిత్తముదాని దైన్య మా
ననమునఁ దోఁచుదాని హరిణంబులఁ బాసినలేడిపోలె భీ
తి నడలుదాని రాఘవునిదేవిని జానకిఁ గాంచెఁ జెచ్చెరన్.
| 951
|
చ. |
గురుతరవస్తుభారపరికుంఠిత మై ఘనమారుతాహతి
న్దిరిగి మహార్ణవంబున మునింగిననావయుఁ బోలె శోకసా
గరపరిమగ్న యై మిగుల గాసిలి యాస్యము వాంచి శ్వాపదాం
తరగతశంబరాంగనవిధంబున భీతిలుదాని నెంతయున్.
| 953
|
వ. |
సీత నవలోకించి పాపాత్ముం డగురావణుండు మదనబాణమోహితుం డై మెల్లన
నుపసర్పించి బలాత్కారంబున నద్దేవిం దోడ్కొని కాంచనవిచిత్రసోపానం
బారోహించి తచ్చిత్తంబు వడయుతలంపున ని ట్లనియె.
| 954
|
రావణుఁడు జానకికిఁ దనభాగ్యముఁ జూపుట
సీ. |
రమణీయహేమతోరణము విచిత్రసోపానంబు నవరత్నభాసితంబు
నానాపతత్త్రిసన్నాదితంబు నవేందుకాంతకుట్టిమదేశకల్పితంబు
నారీసహస్రసంచారంబును మనోజ్ఞసురదుందుభిధ్వానశోభితంబు
హాటకమణిసౌధహర్మ్యసంబాధంబు శక్రపాశినిశాంతసన్నిభంబు
|
|
తే. |
దాంతరాజితస్ఫాటికతాపనీయ, నీలపురుషోపలస్తంభనిర్మితంబు
నగుచు నవరత్నఖచిత మై యలరుచున్న, దంబుజాక్షి మదంతఃపురంబు కంటె.
| 955
|
తే. |
తరుణి యిచ్చటి దాంతికతాపనీయ, హారివిద్రుమరచితగవాక్షములును
హేమజాలకపరివృతహీరఖచిత, సురుచిరమనోజ్ఞభిత్తులు చూడు మబల.
| 956
|
తే. |
కాంచనవిచిత్రభూమిభాగములు రుచిర, మౌక్తికవితానములు రత్నమండపములు
దీర్ఘికలు పద్మినులు మణిదీప్తదివ్య, భవనములు శయ్యలును జూడు పద్మనేత్ర.
| 957
|
ఉ. |
ముప్పును బాల్యమున్ రుజయు మూఢత లేనిపరాక్రమోన్నతు
ల్ముప్పదిరెండుకోట్లబలముఖ్యులు దైత్యులు యౌవనాధికు
ల్దప్పక న న్భజింతురు ప్రతాప మెలర్పఁగ వారిలోన నే
|
|
|
నొప్పుగ నొక్కరొక్కరికి నొక్కొకవేవుర నిల్పి యుండుదున్.
| 958
|
ఉ. |
నాదుబలంబు రాజ్యము ధనంబును నీయదిగాఁ దలంచుచు
న్గాదన కీవు ప్రాణములకంటె గరీయసి వౌదు గాన నా
కాదర మొప్ప భార్య వగు మంబుజలోచన దేవదైత్యవి
ద్యాధరసుందరీమణుల కందఱ కీశ్వరి వయ్యె దెంతయున్.
| 959
|
క. |
నావచనము విని బుద్ధి, ప్రావీణ్యము మీఱ నన్ను భావజసుమబా
ణావిద్ధునిఁ గాకుండఁగఁ, గావు మనుగ్రహముఁ జేసి కాతరనేత్రా.
| 960
|
తే. |
ఉదధిముద్రిత మై శతయోజనంబు, లాయతము గల్గి వరుణశక్రాదులకు న
గమ్యమై లంక యనుపేరఁ గ్రాలు నిది మ, దీయపట్టణ మబ్జాక్షి దీనిఁ గంటె.
| 961
|
క. |
నరసురవిద్యాధరఖే, చరకిన్నరయక్షసిద్ధసాధ్యాదులలోఁ
బరికింప నాకు జో డొ, క్కరుఁ డైనను లేఁడు ముజ్జగంబులయందున్.
| 962
|
ఉ. |
మానవుఁ డల్పతేజుఁ డవమాని తపస్వియు రాజ్యహీనుఁడు
న్దీనుఁడు దుర్విభావుఁ డవినీతుఁడు నీమగఁ డట్టివానిపై
మానిని మోహ మేటికి సమానుఁడ నన్ను భజింపు మస్థిరం
బౌనె కదా పడంతులకు యౌవన మంతయు నాఁటినాఁటికిన్.
| 963
|
ఉ. |
రామునిఁ జూడఁ గోరకుము రాజముఖీ యిఁక నెట్లు రాఁగలం
డామనుజాధముం డిచటి కాశుగ మెట్టులు కట్టనోపు సు
ద్దామగతిం బ్రదీప్తశిఖిదారుణహేతిని బోలె నాకడ
న్సేమము నొందియున్ననినుఁ జేకొన నేక్రియ వచ్చు వానికిన్.
| 964
|
క. |
సుర లైన నిమ్మహాపురిఁ, జొర వెఱతురు రాముఁ డెట్లు చొరఁగలఁ డిఁక నీ
వెఱ పేల నాదురాజ్యము, గఱితా నీసొమ్ము గాఁగఁ గైకొనుము రహిన్.
| 965
|
తే. |
భువనములయందుఁ గల మముబోఁటి సత్త్వ, వంతు లగువారు దాసులై వలయు పనులు
సేయుచుండఁగ రాజ్యాభిషిక్త వగుచు, వనిత ననుఁ గూడి సుఖయింపు మనుదినంబు.
| 966
|
తే. |
వెలఁది నీవు చేసిన పూర్వవృజిన మెద్ది, గల దది యరణ్యవాసంబువలన సమసెఁ
బొలఁతిరో యింక నీపూర్వపుణ్యకర్మ, ఫల మనుభవింపు మిచ్చటఁ బంకజాక్షి.
| 967
|
క. |
ఇన్నాళ్లు కాననంబునఁ, బన్నుగఁ దప మాచరించి బడలుటకుఁ దుది
న్నన్ను వరియించి సుఖసం, పన్నత నొప్పుటయు నీకు ఫల మగుఁ గాదే.
| 968
|
తే. |
అంబుజేక్షణ తొల్లి మాయన్న యైన, ధనవిభుని ఘోరసంగరంబున జయించి
తెచ్చినట్టి పుష్పకనామదేవయాన, మిదియె చూడుము కామగం బిది లతాంగి.
| 969
|
తే. |
చందన మలంది తాంబూల మంది దివ్య, భూషణంబులఁ దాల్చి యీపుష్పకంబు
నందు ననుఁ గూడి వలసినయట్లు నీవు, సంతతంబును విహరింపు చంద్రవదన.
| 970
|
క. |
విమలాంబుజంబుకైవడి, రమణీయం బగుచుఁ జాల రాజిలు నీయా
స్యము మురువు దక్కి యున్నది, కమలేక్షణ వగపుచేతఁ గందినకతనన్.
| 971
|
క. |
అన విని జానకి దశకం, ఠునిదుర్వచనముల కడలి తోరపుశోకం
బున నేడ్చెఁ గనుల నశ్రులు, చినుకఁ బటాంతమున మోముఁ జేర్చి రయమునన్.
| 972
|
క. |
ఇమ్మెయి ఘనశోకావే, శమ్మున విలపించుచున్నజనకకుమారిం
గ్రమ్మఱఁ గనుఁగొని కామవ, శమ్మున ని ట్లనియె రాత్రిచరుఁ డాతురుఁ డై.
| 973
|
ఉ. |
సన్నతగాత్రి యింక గడుసంభ్రమ మేల విధాత యీగతి
న్నిన్ను సృజించె నాకొఱకు నేరుపు లేటికిఁ దప్ప దింక నీ
యున్నతపాదపద్మముల కుత్తమభక్తి నమస్కరించెదం
బన్నుగ నన్నుఁ బ్రోవు మిఁక వశ్యుఁడ దాసుఁడ నైతి నెంతయున్.
| 974
|
చ. |
స్మరశరపీడితుండ నయి సారెకు నే నిపు డన్నమాట లో
కరివరయాన నీచములుగా మది నెంచకుమా త్రిలోకసుం
దరి వగునీకు వందన మొనర్చెను గాని దశాననక్షపా
చరవిభుఁ డెన్నఁ డేని యొకచానపదంబులు వ్రేల ముట్టునే.
| 975
|
ఆ. |
పరఁగ ధర్మలోపభయమును సిగ్గును, విడిచి యింక గారవింపు నన్ను
నెలఁత మనకు దైవనిష్ష్యంద మీబంధ, మార్ష మగుటఁ దప్ప దడలవలదు.
| 976
|
చ. |
శతమఖముఖ్యు లెవ్వనిప్రసాదముఁ గోరి సమగ్రభక్తి సం
తతము భజింతు రట్టిఘనదైత్యశిఖామణి యైనావణుం
డతిశయభంగి వేఁడ విన దయ్యయొ యెంత వివేకహీన యీ
సతి యని విన్నవారు వెలిఁ జాటరె వేఱొకరీతిఁ బల్కినన్.
| 977
|
వ. |
అని బహుప్రకారంబులఁ గందర్పదర్పగోచరుండు గావున మైమఱచి కృతాంత
వశగతుం డై వైదేహిం దనసొమ్ముగాఁ దలంచుచు దురాలాపంబు లాడుచున్న
రావణుం జూచి యద్దేవి భయంబు విడిచి వానిఁ దృణంబునకు సరిగా భావిం
చినతెఱం గెఱింగించుకరణి నొక్కతృణఖండంబుఁ జేతం బట్టుకొని శోకావే
శంబున ని ట్లనియె.
| 978
|
సీతాదేవి రావణుని నిరసించుట
క. |
దారుణచాపచ్యుతవి, స్ఫారశరానలవిదగ్ధశాత్రవకులకాం
తారుఁడు దశరథుఁ డనఁగా, ధారుణివరుఁ డొప్పు సత్యధర్మోజ్జ్వలుఁ డై.
| 979
|
ఉ. |
ఆనరలోకపాలకున కగ్రసుతుండు మహాభుజుండు స
న్మానితబాహుశౌర్యుఁ డసమానబలుండు జగత్ప్రసిద్ధుఁ డ
బ్జాననుఁ డబ్జలోచనుఁ డహస్కరతేజుఁడు సత్యవాది పం
చాననవిక్రముండు గలఁ డార్యుఁడు రాముఁ డనాఁ బ్రసిద్ధుఁ డై.
| 980
|
క. |
హరునకు నుమ కైటభసం, హరునకు రమ పోలె నమ్మహారాజకులా
|
|
|
భరణ మగురాఘవున కే, నరయంగా ధర్మపత్ని నగుదు సురారీ.
| 981
|
ఉ. |
దోస మటంచుఁ జూడ కిటు దొంగిలి న న్గొని తెచ్చి తీవు దు
ష్టాసుర యింక మద్విభుఁ డహర్పతితేజుఁ డమోఘవీర్యుఁ డా
యాసము దోఁపకుండఁగ ఖరాసురునిం బలె నిన్ను లోకము
ల్బాసట యై కడంగినను బాణహతి న్ధరఁ గూల్పకుండునే.
| 982
|
ఉ. |
రామునిసాయకంబులు తరంగము లాపగగట్టునుం బలె
న్భీమము గాఁగ నీతనువుఁ బెద్దయు బ్రద్దలు వాపుచుండ సు
త్రామవిరోధి తీవ్రుఁ డగుతార్క్ష్యునిచే భుజగంబుఁ బోలె నా
రామునిచేతఁ గూలెదవు రావణ సత్త్వము వీటిఁ బోవఁగన్.
| 983
|
క. |
దనుజాధమ నీ చెప్పిన, యనిమిషరిపు లంద ఱాజనాధిపుమ్రోలం
బనిచెడి నిర్విషు లగుదురు, వినతాసుతుమ్రోల నున్నవిషఫణులగతిన్.
| 984
|
మ. |
మును నీచే నని నోడి పాఱినగురుముఖ్యామరశ్రేణితో
నెనఁగా జూచితొ రాఘవప్రవరు నయ్యిక్ష్వాకువంశేంద్రుఁ డా
ర్యనుతుం దుర్వి భవద్వినాశనకరుం డై పుట్టి ని న్నాజిలోఁ
దునుము న్నిక్కము యూపబద్ధపశువుం దున్మాడుచందంబునన్.
| 985
|
క. |
ఆరఘునాథుఁడు ఘనరో, షారుణితాక్షులను జూచినంతనె నీ వి
ద్ధారుణి నీఱై కూలెద, వారయఁ ద్రిపురారిచే ననంగుఁడుఁ బోలెన్.
| 986
|
క. |
అటుగాక యమ్మహాత్ముని, పటుబాణపథంబు నొంది బలవీర్యసము
త్కటతను బ్రతికితి వేనియుఁ, గటకటఁబడి యోడి పాఱఁగలవు నృశంసా.
| 987
|
క. |
ఇనవిధులు గతులు దప్పిన, వననిధు లింకినను హవ్యవహుఁ డాఱిన మే
రునగము విఱిగిన రాముఁడు, నినుఁ బొరిగొన కేల విడుచు నీచచరిత్రా.
| 988
|
తే. |
చెలఁగి యెవ్వాఁడు జలధి శోషింపఁజేయుఁ, జంద్రు నెవ్వాఁడు పడఁగూల్పఁజాలు ధరణి
నట్టివాఁడు సీతను విడు ననెడుమాటఁ, జెప్ప విన నిది మిగులు నచ్చెరువు గాదె.
| 989
|
క. |
దనుజాధమ ననుఁ గొనితె, చ్చిన యప్పుడె నీదుసిరియు జీవితకాలం
బు నశించె యశము చెడె లం, క నిజంబుగ విను మనాథ గాఁ గల దింకన్.
| 990
|
చ. |
అనఘుఁడు మద్విభుండు చరితార్థుఁడు రాముఁడు దండకంబులం
దనుజసహాయుఁ డై నిజభుజాంచితవీర్యము నాశ్రయించి నె
మ్మనమున భీతి దక్కి బహుభంగులఁ ద్రిమ్మరుచున్నవాఁడు త
ద్ఘనశరవృష్టి నీబలము గర్వము వీర్య మడంగి పోవదే.
| 991
|
తే. |
నాథు నెడఁబాసి యున్నచో నన్ను నీవు, మచ్చరంబున ముచ్చిలి తెచ్చి తిట్లు
దానవాధమ యిది శుభోదర్క మగునె, కడఁగి నీవంశమును నిన్నుఁ గాల్చుఁ గాక.
| 992
|
తే. |
కాలనిర్మిత మై భూతజాలములకు, హాని యెప్పుడు సమకొను నపుడు కార్య
మందుఁ గాలవశంగతు లై మనుజులు, కీడు మే లని యించుక చూడలేరు.
| 993
|
తే. |
అట్టికాలంబు నీకు సంప్రాప్త మయ్యె, దనుజపాంసన నాకతంబున సమస్త
రాక్షసక్షయ మయ్యెడి రాముచేత, నమ్ము నావచనమ్ము నిక్కమ్ము గాఁగ.
| 994
|
క. |
రామునిసతి నగునే నీ, చే ముట్ట నశక్య నైతి క్షితి స్రుగ్భాండా
ద్యామండిత మగుసన్మఖ, భూమియుఁ జండాలుచేతఁ బోలె దురాత్మా.
| 995
|
తే. |
రాజహంసను గూడి యశ్రాంత మబ్జ, షండములయందు సంక్రీడ సలుపుహంసి
మఱియుఁ దృణషండగత మైనమద్గురంబుఁ, గాంచి యెబ్భంగి మమతఁ గావించు నీచ.
| 996
|
క. |
రాముని వైభవజితసు, త్రాముని ధర్మవ్రతాభిరాముని సుగుణ
స్తోమునిఁ బాసి నయవిదూ, రా మహి నొకనిమిష మైన బ్రతుకంగలనే.
| 997
|
క. |
పొసఁగ నుపక్రోశమలీ, మన నై బ్రతుకంగవలెనె మనుజాశన న
న్నసమునఁ గట్టినఁ గట్టుము, వెస మ్రింగిన మ్రింగు మేను విన నీమాటల్.
| 998
|
క. |
అని యీగతిఁ గ్రోధంబున, దనుజకులాధమునిఁ జాల దారుణవాక్యం
బున దూఱ నాడి యశ్రులు, చనుదేరఁగ నూరకుండె జానకి యంతన్.
| 999
|
రావణుండు సంవత్సరములోపలఁ దనమాట కొడఁబడకున్నఁ జంపింతునని సీతను బెదరించుట
క. |
సురకంటకుండు మైథిలి, పరుషోక్తులు కలిగి మరల బంధురకోప
స్ఫురితారుణాక్షు డై భీ, కరరవమున నిట్టు లనియెఁ గటము లదరఁగన్.
| 1000
|
క. |
పదిరెండునెలలు నోర్చెద, ముదితా యక్కాలమునకు మొనయకయున్నం
బిదప నిటఁ బాచకులు ఖ, డ్గధారఁ గోయుదు రనేకఖండంబులుగాన్.
| 1001
|
క. |
అని పలికి మఱియు రావణుఁ డనుపమకోపమున రాక్షసాంగనలఁ గనుం
గొని యెట్టులైన మీ రీ, వనితామణి దర్ప మణఁపవలయుం జుండీ.
| 1002
|
ఆ. |
అనిన నట్ల కాక యని రాక్షసాంగన, లతిభయంకరాస్య లగుచు మోడ్పుఁ
గేలుదోయితోడఁ జాలఁ బంటవలంతి, కూఁతు చుట్టుముట్టుకొనిరి యపుడు.
| 1003
|
ఉ. |
క్రమ్మఱ రావణుం డసురకాంతలఁ గన్గొని మీర లీబిడ
న్సమ్మతితో నశోకవిపినంబున నుంచి సమగ్రభక్తి ని
త్యమ్మును బ్రోచుచు న్బహువిధప్రియభాషల నాదరించి నా
సొమ్ముగఁ జేసి సమ్మదము చొప్పడఁ దెండు గజాంగనం బలెన్.
| 1004
|
వ. |
అని యిట్లు చరణఘాతంబునం బుడమి బ్రద్దలువాఱ నిట్టట్టు చలించుచు నాజ్ఞా
పించిన నయ్యసురస్త్రీలు వైదేహి నచ్చటం బాపికొని సర్వపుష్పఫలోపేతంబు
ను సర్వాభిలషితపదార్థఫలవృక్షవిరాజితంబును సర్వకాలమదమృగపక్షినిషే
|
|
|
వితంబు నగునశోకవనంబునకుం దోడ్కొని చనిరి యిత్తెఱంగున నమ్మహీపుత్రి
రాక్షసీవశంగత యై వ్యాఘ్రిమధ్యంబునం జిక్కినహరిణిచందంబున నడలుచు
భయశోకంబులు మనంబునం బెనంగొన రామచంద్రుని దైవతంబుగాఁ దలం
చుచు ననన్యపరాయణ యై యుండె నిక్కడ దండకారణ్యంబునందు.
| 1005
|
రామునికి దుర్నిమిత్తము లగపడుట
చ. |
కపటమృగస్వరూపుఁ డగుకల్మషచిత్తునిఁ దాటకేయునిన్
విపులశరంబునం దునిమి వెండియు రాముఁడు పర్ణశాలకున్
విపినపథంబుఁ బట్టి కడువేగమె వచ్చుచు నుండ వెంటనే
యపుడు వినంగ నయ్యె నశుభావహజంబుకనాద ముగ్ర మై.
| 1006
|
క. |
దారుణ మగుతన్నినదము, నారూఢిగ నాలకించి యడలుచు గాత్రం
బారటపడఁ జిత్తంబునఁ, గూరిన పెనుశంక నిండుకొన ని ట్లనియెన్.
| 1007
|
తే. |
దారుణం బగుజంబుకధ్వాన మరయఁ, దగ నమంగళసూచకం బగుచుఁ దోఁచె
సీత ఘోరాసురులచేతఁ జిక్కకుండ, దండకమునఁ గుశలినియై యుండుఁగాక.
| 1008
|
సీ. |
అక్కడ మృగరూపుఁ డగుతాటకాసుతుం డస్మచ్ఛరాహతి నవనిఁ గూలు
నపుడు మదీయస్వరానుకారంబుగా నాక్రందనముఁ జేసె నయ్యెలుంగు
విని మహీసుత నొంటి విడిచి తదాజ్ఞచే ననుజుండు నాచంద మరయ వచ్చెఁ
గాఁబోలు ఘోరరాక్షసగణోపేతుఁ డై మారీచుఁ డిబ్బంగి మాయఁ బన్ని
|
|
తే. |
సీతను వధించుతలఁపునఁ జెలఁగి నన్ను, దవ్వులకుఁ బాపికొని యేగెఁ దలఁప నిది య
థార్థ మగుఁ గానిచో హా హతోస్మి లక్ష్మ, ణా యనుచు నాదుపలుకుగా నఱచు టెట్లు.
| 1009
|
క. |
తలఁపఁగ నిష్కారణముగఁ, బలువురు రక్కసులతోడఁ బగఁ గొంటి సతీ
తిలకమున కనుజునకు మం, గళము గలుగుఁ గాక ఘోరకాననమందున్.
| 1010
|
క. |
ఘోరనిమిత్తము లెంతయుఁ, దోరంబుగ నాకు నిపుడు తోఁచెడి నకటా
సారసముఖి యె ట్లున్నదొ, వీరుఁడు నాతమ్ముఁ డెట్లు విహరించెడినో.
| 1011
|
వ. |
అని బహుప్రకారంబులఁ జింతించుచు రాక్షసుఁడు మాయామృగస్వరూపం
బునఁ దన్ను దూరంబునకుం గొనిపోవుటయును బదంపడి స్వప్రయుక్తవిశి
ఖాభిహతుం డై మారీచుండు మృగరూపంబు విడిచి రాక్షసరూపం బంగీక
రించి తనమాటగా సీతాలక్ష్మణులం బేర్కొని ప్రాణంబులు విడుచుటయును
ఘోరం బగుజంబుకనాదంబు వినంబడుటయును దీనముఖంబు లై ఖగమృగంబు
లప్రదక్షిణంబుగాఁ దిరిగి భయంకరనిస్వనంబులు సలుపుటయును మఱియు
ననేకదుర్నిమిత్తంబులు దోఁచుటయు నివి యన్నియుం దలపోసి రాముండు
పరిశంకితుం డై తలంకుచు సీతాదర్శనలాలసుం డై శీఘ్రంబున నిజాశ్రమం
బునకు వచ్చుచు ముందఱ.
| 1012
|
రాముఁడు తనకడ కేతెంచులక్ష్మణుఁ జూచి దుఃఖితుం డై సీతాక్షేమం బడుగుట
క. |
గతతేజుం డై తనకడ, కతిరయమున వచ్చుచున్నయనుజన్ముని సు
వ్రతునిం గని మోమున దీ, నత గన్పడఁ గనుల జలకణంబులు దొరుఁగన్.
| 1013
|
చ. |
దనుజనిషేవితం బయినదారుణకాననసీమ నేలకో
జనకజఁ బాసి లక్ష్మణుఁడు సంభ్రమి యై చనుదెంచుచున్నవాఁ
డని ధృతి దూలి డగ్గఱి రయంబున నాతనిచేయిఁ బట్టి నె
మ్మనమున శోకముం గదుర మాటలు తొట్రువడంగ ని ట్లనున్.
| 1014
|
ఉ. |
తమ్ముఁడ మేదినీసుతను దారుణకాననమందుఁ బాసి నీ
కిమ్మెయి నొంటి రాక తగునే వెఱఁ గయ్యెడు నామృగాక్షి ని
క్కమ్ముగ ఘోరరాక్షసమృగంబులచేఁ బడకుండ నేఁడు సే
మమ్మున నున్నదే దనుజమాయఁ దలంచిన శంక దోఁచెడిన్.
| 1015
|
ఉ. |
అక్కట యెందుఁ జూచిన భయంకరవైఖరి దుర్నిమిత్తముల్
పెక్కులు దోఁచుచున్నయవి భీషణజంబుకకాకఘూకముల్
దక్కక నొక్కరీతి భయదధ్వని మ్రోయఁ దొడంగె రక్కసుల్
నిక్కము నేఁడు మాయ నవనీజ హరించి రటంచుఁ దోఁచెడిన్.
| 1016
|
చ. |
అలయక సంతతంబు దనుజాధము లిందుఁ జరింతు రీవు మై
థిలి నెడఁబాసి వచ్చితివి తెంపున దైత్యులచేతఁ జిక్కెనో
పులులు వరాహము ల్శరభము ల్హరు లొక్కట హింసఁ జేసెనో
కలఁగెడి నెమ్మనం బెడమకన్ను చలించెడి శోక మయ్యెడిన్.
| 1017
|
ఉ. |
ఏరమణీమణి న్విడిచి యిచ్చటి కీ వరుదెంచి తిప్పు డే
నీరదవేణి మోదమున నిత్యము నా కెదు రేగుదెంచు నే
కైరవగంధి ప్రాణములకంటె గరీయసి యై తనర్చు నా
సారసనేత్ర చంద్రముఖి జానకి యెక్కడఁ జెప్పు లక్ష్మణా.
| 1018
|
తే. |
సిరియు రాజ్యంబు గోల్పడి చిన్నవోయి, కాననంబున మునివృత్తిఁ బూని తిరుగు
నట్టినా కెంత దుఃఖసహాయ యైన, భూమిపుత్రిక యేజాడఁ బోయెఁ జెపుమ.
| 1019
|
తే. |
ఏవెలందిని బాసి యొక్కింతకాల, మైన జీవింపఁగా నోప నట్టి పంక
జాక్షి నిత్యానపాయిని యైనసీత, యనఘచారిత్ర యేచంద మయ్యెఁ జెపుమ.
| 1020
|
ఆ. |
శక్రరాజ్య మైన జానకి లేనిచో, నాత్మ కిం పొనర్ప దయ్య నాకు
నవ్వెలంది కొక్కహాని గల్గిన మన, మెత్తి వచ్చు టెల్ల రిత్త కాదె.
| 1021
|
క. |
సీతానిమిత్త మిచ్చట, నోతమ్ముఁడ యేను నిధన మొందుచు నుండన్
జాతకుతూహల యై వి, ఖ్యాతిగ సుఖియించుఁ గాదె కైకయి యింటన్.
| 1022
|
క. |
మృతసుత యై కౌసల్యా, సతి సుతసామ్రాజ్యవిభవసంజాతసుఖో
న్నతి వీఁగుకై క కిఁక నే, గతి దాస్యముఁ జేసి బ్రదుకఁగలదు కుమారా.
| 1023
|
తే. |
ఉర్వినందని కుశలి యై యుండె నేని, యచ్చుపడ నాశ్రమమునకు వచ్చువాఁడ
నట్లు గాక వేఱొకభంగి యయ్యె నేని, తడవు గాకుండఁ బ్రాణము ల్విడుచువాఁడ.
| 1024
|
ఉ. |
జీవితతుల్య యై తనరుసీతను గన్నులకర్వు దీఱ హ
ర్షావహభంగి నాశ్రమమునందుఁ గనుంగొనకున్న యప్పుడే
భూవరనందనా వినుము భూరిగభీరవిపత్పయోధిలో
సావయవంబుగా మునిఁగి చచ్చెదఁ గాక మనంగ నేర్తునే.
| 1025
|
క. |
అమ్మహిపుత్రిక ప్రాణయు, తమ్ముగ నున్నదియె లేక దైత్యులచేఁ దా
వమ్మున భక్షిత యయ్యెనొ, తమ్ముఁడ కలరూపు నాకుఁ దడయక చెపుమా.
| 1026
|
తే. |
హతుఁడ నైతిని లక్ష్మణా యనుచు దుష్ట, దైత్యుఁ డాడినమాటకుఁ దలఁకి సీత
నిన్నుఁ బుత్తెంచెఁ గాఁబోలు నెలఁత విడిచి, నీవు రాఁబోలు నింతయు నిక్కువంబు.
| 1027
|
ఆ. |
చాల బాల ముగ్ధురాలు మహాసుకు, మారి యామహీకుమారి దనుజ
మధ్యమందుఁ జిక్కి మద్వియోగంబున, నెంత చింతపడెనొ క్లాంత యగుచు.
| 1028
|
మ. |
ఖరునిం జంపిననాఁటఁగోలె దనుజు ల్కాంతారభాగంబునం
బరమక్రోధపరీతచిత్తు లగుచు న్మాయావు లై యున్నవా
రరయ న్నీ విటు రాఁగఁ జూచి జనకక్ష్మాధీశసత్పుత్రిఁ జె
చ్చెర భక్షింపఁగఁ బోలు నిక్క మిది నిక్షేపంబు గోల్పోయితిన్.
| 1029
|
తే. |
ఇంక నే మని చింతింతు నెందుఁ జొత్తు, నెత్తెఱంగునఁ దాళుదు నెద్ది విధము
ఘోరశోకాంబురాశిమగ్నుండ నైతిఁ, గాంతఁ గన్నులఁ జూడంగఁ గలదె నాకు.
| 1030
|
వ. |
వత్సా మత్కృతాపకారంబునకుఁ బ్రతీకారంబుఁ గావించుటకు రాక్షసుల
కవకాశంబు నీచేత దత్తం బయ్యె నెల్లభంగులఁ గష్టంబుఁ గావించితి వని
బహుప్రకారంబుల వైదేహిం దలంచి దుఃఖించుచు లక్ష్మణునిరాకకు గర్హిం
చుచు క్షుత్పిపాసాభరంబున సోలుచు దీర్ఘంబుగా నిట్టూర్పులు నిగిడించుచు
వదనంబున వైవర్ణ్యంబు దోఁప నేత్రంబుల నశ్రుకణంబులు దొరఁగ సంతాప
విశేషంబునఁ జిఱుచెమ్మట గ్రమ్ముదేర రయంబున జనస్థానంబునకుం జని
యంత నంతఁ గొన్ని విహారదేశంబు లవలోకించుచు శూన్యం బైన నిజాశ్ర
మంబు డగ్గఱి శోకగద్గదకంఠుం డై సౌమిత్రి కి ట్లనియె.
| 1031
|
క. |
ననుఁ బాసి యున్నచో సీ, తను వనమున నొంటి విడిచి తలఁగి రయమునం
జనుదెంచి తేల యీగతి, వనమున నిను నమ్మి విడిచి వచ్చితి ననఘా.
| 1032
|
క. |
వన మనియు దైత్యసేవిత, మనియు నెఱిఁగి సీత విడిచి యరుదెంచినని
న్గనినప్పటినుండి జగ, జ్జనవినుతా నామనంబు శంకిత మయ్యెన్.
| 1033
|
క. |
ఇది యేమి హేతువో ని, న్నదటునఁ గనినంతనుండి యనఘాత్మక నా
హృదయం బగలెడి శోకము, వొదలెడి వామాంకనేత్రభుజము లదరెడిన్.
| 1034
|
లక్ష్మణుఁడు రామునికిఁ దాను సీతను విడిచి వచ్చుటకుఁ గారణంబుఁ దెల్పుట
క. |
నా విని లక్ష్మణుఁ డతిశో, కావిలచేతస్కుఁ డగుచు ననుపమఘనదుః
ఖావేశంబున నడలుచు, భావంబునఁ గుందు రామభద్రున కనియెన్.
| 1035
|
ఉ. |
ఇంతన నేల దేవ మిథిలేశ్వరపుత్రిక నొంటి డించి నా
యంతనె యేను దుష్టమతి నై చనుదెంచినవాఁడఁ గాను మీ
చెంతకుఁ బోయి రమ్మనుచుఁ జెచ్చెర నయ్యమ తూల నాడ నొ
క్కింత సహింపఁజాల కిపు డీగతి వచ్చినవాఁడ నెంతయున్.
| 1036
|
చ. |
అనఘా నీవు మృగంబువెంట మృగయావ్యాసక్తచిత్తుండ వై
చనినం బిమ్మటఁ గొంతసేవునకు యుష్మత్కంఠనాదంబురీ
తి ననుం గావఁగ రారె హాజనకపుత్రీ హాసుమిత్రాసుతా
యనుమాట ల్విన నయ్యె దూరమున దైన్యధ్వానయుక్తంబుగన్.
| 1037
|
ఉ. |
ఆనినదంబు కర్ణపుట మంటినయంతనె శంకితాత్మ యై
జానకి నన్ను నీకడకుఁ జయ్యనఁ బొమ్మటు లంచుఁ బల్కినం
గాననమందుఁ బాయుటది కర్జము గా దటు లైన సీతకు
న్హాని ఘటిల్లు నంచు వినయంబున నంజలిఁ జేసి నమ్రతన్.
| 1038
|
వ. |
దేవీ భవద్వల్లభుం డగురాముండు త్రిలోకఖ్యాతపౌరుషుండు విక్రమవంతుం
డమ్మహానుభావున కెందును గొఱంత లేదు నీవు తప్పు దలంచితివి నా చెప్పిన
ట్లాపైఁడిమెకంబు రాక్షసమాయ యగుటం జేసి రామధనుర్ముక్తసాయకాభి
హతం బై మృగరూపంబు విడిచి దైత్యరూపంబునఁ బ్రాణంబులు విడుచుచు
మనమనంబునకు విషాదంబుఁ గల్పించుకొఱకు రామవాక్యానురూపం బగు
వాక్యంబున ని ట్లాడె నంతియ కాక సురాసురాదు లొక్కటియై యెత్తివచ్చిన
నసహాయశౌర్యంబున వధించుం గాని రఘువల్లభుండు పౌరుషంబు విడిచి
రక్షింపు మనియెడినీచవాక్యంబుఁ బల్కునే యమ్మహాత్ముండు దేవతల నైన
రక్షింప సమర్థుం డిది యేటిచింత రాముండు ముల్లోకంబులయం దజయ్యుం
డప్పరాక్ర మధుర్యునిం దొడరి పోరునట్టిజెట్టిజోదు త్రిలోకంబులయం దింతకు
మున్ను పుట్టినవారిలోన నింకఁ బుట్టెడువారిలో నైనను లేఁడు గావునఁ
గునారీజనసేవితం బైనయీవిచారంబు విడిచి స్వస్థచిత్తవు గమ్మని బహు
ప్రకారంబుల నే నమ్మహాదేవిని బ్రార్థించుచు ధైర్యంబుఁ దెల్పినఁ గటకటం
బడి కన్నీరు నించుచుఁ గోపంబు గదిరినమనంబుతో దారుణవాక్యంబున
నా కి ట్లనియె.
| 1039
|
సీ. |
దురితాత్మ నామీఁద దుష్టభావము సేర్చి యున్నాఁడ విది నీకు యుక్త మగునె
రాముఁడు మృతుఁ డైన రమణతో నన్నుఁ జేకొనఁగ నీకు వశంబె మొనసి మున్ను
దుర్విచారత భరతుండు వరం బనునెపమున సామ్రాజ్య మపహరించె
|
|
|
నన్నకు నెటు లైన హానిఁ బుట్టఁగఁ జేసి నన్నుఁ జేకొనఁ గాననమున కీవు
|
|
తే. |
వచ్చితివి మీకు నిరువుర కచ్చుపడఁగ, నిదియు సంకేత మగునని యిచ్చఁగలఁతు
నట్లు గాకున్న విభుఁడు ని న్నార్తిఁ బిలువఁ, దోడుపడుటకుఁ జనకుందె వేడుకమెయి.
| 1040
|
తే. |
అకట ప్రచ్ఛన్నచారి వైనట్టిరిపుఁడ, వైతి వీవు రంధ్రాన్వేషి వగుచు ననుఁ బ్ర
తిగ్రహించుట కి ట్లరుదెంచినాఁడ, వేల చేకూరు నీ కది హీనచరిత.
| 1041
|
రాముఁడు లక్ష్మణుని దూఱుట
క. |
అని యాడరానిమాటల, నను దూఱిన వగల నెమ్మనంబుం బొగుల
న్ఘనరోషకషాయితలో,చనుఁడ నగుచు నిట్లు విడిచి చనుదే వలసెన్.
| 1042
|
చ. |
అనవుడు రాముఁ డి ట్లనియె నక్కట లక్ష్మణ మత్ప్రభావము
న్ఘనతరవిక్రమంబు బలగర్వ మెఱింగియు నింతిమాటకై
వనమున నొంటిఁ బాసి యిటు వచ్చుట నీ కగు నయ్య మాటి కే
మనఁ గల దింక రోషమున నాపదఁ దెచ్చితి వేమి సేయుదున్.
| 1043
|
ఆ. |
బాల యగుట సీత భర్తృమోహంబున నాడరానిమాట లాడెఁ గాక
తాల్మి విడిచి నీవు తామసంబున నొంటి, విడిచి వచ్చి తిది వివేక మగునె.
| 1044
|
ఉ. |
నీ విటు రాఁగఁ జూచి రజనీచరు లొక్కటఁ బట్టి మ్రింగిరో
పాననశీల నెత్తికొని పాఱిరొ కాననమందు డాఁచిరో
దానమృగవ్రజంబు వనితం గబళించెనొ యేమిఁ జేసెనో
యేవిధ మయ్యెనో యడవి నెట్లు వసించెనొ యెంత గుందెనో.
| 1045
|
వ. |
సీతాప్రచోదితుండ వై క్రోధవశంబున మచ్ఛాసనంబు నుల్లంఘించి వచ్చుటం
జేసి సర్వప్రకారంబుల నవినయంబు నీచేతఁ గృతం బయ్యె నాయందు రాక్షస
సంహారసామర్థ్యాభావంబు శంకించి వచ్చితి వంటివేని మదీయభుజావిక్రమవిశే
షం బనివార్యం బని యెఱింగి యున్ననీ కి ట్లనుట కవకాశంబు లేదు సీతా
పరుషవాక్యంబుల లోకనింద యగు నని తలంచి వచ్చితి వంటివేని యజ్ఞానంబు
నం బలికిన మైథిలిక్రోధవాక్యంబుల గర్హణంబు గలుగనేరదు పరుషవాక్యశ్రవ
ణమాత్రంబున సమాగతుండ నైతి నని యంటివేని సంక్రుద్ధ లగుయువతు
లేమేమి పలుక రమ్మాట కలిగి యట్టివారి విడిచి వచ్చుట యుక్తంబు గా దెల్ల
భంగుల నయుక్తకార్యంబుఁ గావించితి వని పలికి వెండియు ని ట్లనియె.
| 1046
|
చ. |
పసిఁడిమెకంబువెంట బహుభంగులఁ ద్రిమ్మరి పట్ట లేక నే
విసివి శితాస్త్ర మేయ నది వేగ మృగత్వముఁ బాసి ఘోరరా
క్షసుఁ డయి మామకస్వరముగా నిను సీతను బేరుకొంచు ఘో
రశిఖరిమాడ్కి ధాత్రిఁ బడెఁ బ్రాణము లంగముఁ బాసి పోవఁగన్.
| 1047
|
తే. |
మాయరక్కసుఁ డిబ్భంగి మాయమైన, యంత నుండియుఁ దన్నాద మాలకించి
బ్రమసి మీ రెంత వంతలఁ బడుచునున్న, వారొకో యని చిత్తంబు వగలఁ బొగిలె.
| 1048
|
క. |
ఏ మనఁగ వచ్చు నీ విపు, డామానినిఁ బాసి యిచటి కరుదెంచుటచే
నామదికిఁ దోఁచినంతయు, సౌమిత్రీ యిప్పు డిచట సత్యం బయ్యెన్.
| 1049
|
రాముఁడు నిజాశ్రమమునందు జానకిం గానక పరితపించుట
వ. |
అని పెక్కుతెఱంగులం బలవించుచుం బోవుచుండ నమ్మహానుభావునకు వా
మలోచనాధఃపక్షంబు చలించె శరీరంబు కంపించె మఱియు నశుభసూచకం
బు లగుపెక్కుదుర్నిమిత్తంబులు దోఁచినఁ గలంకవడి వైదేహికి సేమంబు
లే దని పలుకుచు సీతాదర్శనలాలసుం డై రయంబునం జని శూన్యం బైననిజా
శ్రమంబుఁ గని మనస్తాపం బంతకంత కగ్గలం బగుచుండ వేగంబున నుద్భ్రాం
తుం డైనవానిపగిది హస్తాద్యవయనంబులు విదుర్చుచుఁ గొండొకసే పయ్యా
శ్రమం బంతయుఁ గలయం దిరిగి యొక్కచోట శోభావిరహిత యై సొబగు
దప్పి యున్నపర్ణశాల నవలోకించి యందు జానకిం గానక శోకసంతాపదళిత
హృదయుం డై వెండియు నామ్లానపుష్పమృగద్విజంబును శోభావిహీనంబును
విధ్వస్తంబును సంత్యక్తవనదైవతంబును విప్రకీర్ణాజినకుశంబును విప్రవిద్ధబ్రుసీ
కటంబును శూన్యంబు నై వృక్షంబులతోఁ గూడ రోదనంబు సేయుచున్నదాని
పగిదిం జూపట్టుచున్న నిజస్థానంబుఁ జూచి జానకి నెందునుం గానక విల
పించుచు.
| 1050
|
చ. |
అసురులు సీతఁ జేకొని రయంబున నేగిరొ లేక చంపిరో
మెసవిరొ గౌతమీనది కమేయగతి న్సలిలార్థ మేగెనో
కుసుమఫలప్రవాళమునఁ గోయుటకు వ్వనవీథి కేగెనో
విసువక పువ్వుటీరములవెంబడి డాఁగెనొ యెందుఁ బోయెనో.
| 1051
|
వ. |
అని తలపోసి నానాప్రకారంబుల జానకి నన్వేషించి యెందునుం గానక శోకా
ర్ణవపరిప్లుతుం డైనవానిపోలిక నున్మత్తునిచందంబునం జూపట్టుచు.
| 1052
|
మ. |
ఘనుఁ డారాముఁడు చెట్టు చెట్టు గలయంగాఁ జూచుచు న్శైలము
ల్వనము ల్పల్వలము ల్నదీనదము లావాసంబు వీక్షించుచు
న్వనితం గానక వెఱ్ఱిపట్టినగతి న్వర్తించుచు న్శోకతా
మ్రనితాంతేక్షణుఁ డై వని న్వెదక నారంభించె నుద్వేగి యై.
| 1053
|
రాముఁడు వనవృక్షాదులను జానకి పోయినతెరు వడుగుట
భుజంగప్రయాతము. |
లతాంగి న్ధృతాగణ్యలావణ్య నబ్జా
యతాక్షిం గదంబప్రియ న్మత్ప్రియ న్స
న్నితంబం గదంబావినీజాతమా చూ
చితే చెప్పుమా యింతిసేమంబు నాకున్.
| 1054
|
చామరవృత్తము. |
లోలనేత్రఁ గానవా విలోలనారికేళమా
సాలమా రసాలమా విశాలకందరాళమా
|
|
|
తాలమా తమాలమా మదస్రవత్ప్రకాండహిం
తాలమా ప్రవాళమా ఘనస్పృశద్ద్రుజాలమా.
| 1055
|
మత్తకోకిల. |
సారసాయతనేత్ర పోయినజాడఁ దెల్పవె నాకు మం
దారమా సహకారమా సముదగ్రరుక్కరవీరమా
సారభూతశమీరమా ఘనసారమా యటవీరమా
భూరికాంతిమయూరమా ఫలపూరమా సుకరీరమా.
| 1056
|
మత్తకోకిల. |
మందయానను గానవా పిచుమందమా వటబృందమా
కుంఠమా యరవిందమా ఘనకోమలాంబరచుంబిమా
కందమా నవకందమా ననుఁ గాంచి పుణ్యము నొందుమా
చందనావనిజాతమా వనజాతమా గిరిజాతమా.
| 1057
|
తోటకవృత్తము. |
ఘనపల్లవకోమలగాత్రిని గాం, చనవర్ణశరీరిణిఁ జారుముఖిన్
ఘనకేశిని సీతను గంటివె కాం, చనవృక్షమ చెప్పు ప్రసన్నమతిన్.
| 1058
|
తరువోజ. |
దనుజులు కాననాంతరమున నొకటఁ దరళాక్షి జానకి దాఁచిరో లేక
గొని పోయిరో లేక క్రూరతఁ బట్టికొని మ్రింగిరో వన్యఘోరసత్వములు
మొనసి హింసించెనో మోహనపాణి ముదిత కల్యాణి భూపుత్రి మత్ఫత్ని
జనకనందని పుణ్యసాధ్వి యేజాడఁ జనియెనో చెప్పు మశ్వత్థపాదపమ.
| 1059
|
పృథ్వీవృత్తము. |
సరోజముఖి నర్జునప్రియను జారుబింబాధర
న్నరేంద్రవరకన్యక న్ఘనరణన్మణీనూపుర
స్వరాభరణభూషితాంగి వరవర్ణిని న్సీత నీ
యరణ్యమునఁ గానవా వికసితార్జునక్ష్మాజమా.
| 1060
|
చామరవృత్తము. |
పరాకు మాని సైఁప రానిబాళి మీఱి వేడునా
మొ ఱాలకించి యెందుఁ బోయె మోహనాంగి సీత నీ
వెఱింగి లేని వేడ్క నమ్మహీజజాడఁ జెప్పి నా
విరాళి మాన్చి ప్రోవవే ప్రవృద్ధబిల్వవృక్షమా.
| 1061
|
తరల. |
మదమరాళమ గానవా యలమందయానను జానకీ
న్ముదితచక్రమ గానవా నృపపుత్రిఁ జక్రపయోధర
న్సదమలాంబుజపాణిఁ గానవె సంభృతాంబుజషండమా
కొదమతుమ్మెద గానవా నవకోమలభ్రమరీకచన్.
| 1062
|
వసంతతిలకావృత్తము. |
రంభావనీరుహమ రాజితపత్రమా యా
రంభోరు వేగినతెఱం గెఱిఁగింపు ప్రీతిం
గుంభీంద్రకుంభకుచఁ గోమలగాత్రిఁ గంటే
కుంభీంద్రమా తెలుపు కోర్కులు మీఱ నాకున్.
| 1063
|
ద్రుతవిలంబితవృత్తము. |
మదవతీజనమానససంభ్రమ, ప్రదవచోరమబంధురకీరమా
|
|
|
మధురభాషిణి మత్త్రియపత్ని యా, సుదతి పోయినచె ప్పెఱిఁగింపుమా.
| 1064
|
వనమయూరవృత్తము. |
చంద్రకిరణప్రతిమచారుదరహాసం
జంద్రముకురాబ్జవిలసన్ముఖవిలాసం
జంద్రనిభవర్ణ నలచంపకసునాసం
జంద్రకిసమూహమ రసాతనయఁ గంటే.
| 1065
|
స్వాగతావృత్తము. |
పద్మకేసరవిభాసితగాత్రిం, బద్మకుట్మలనిభస్తనయుగ్మం
బద్మగంధినరపాలకపుత్రిం, బద్మినీకమల భామినిఁ గంటే.
| 1066
|
మందాక్రాంతావృత్తము. |
కాంతారోర్వి న్నను విడిచి భూకన్య దా నొంటి నేగెం
జింతాశోకంబులు వొడమె మచ్చిత్తముం గాసిలె న్నీ
చెంత న్నేఁ డ ట్లరుగదు గదా చెప్పి వంశంబ నాహృ
త్సంతాపంబుం దొలఁగ నిడుమా చాలఁ బుణ్యంబు గల్గున్.
| 1067
|
మాలినీవృత్తము. |
నిరుపమగుణరాశి న్నీలజీమూతకేశి
న్నరవరవరపుత్రి న్నవ్యహేమాభగాత్రి
న్సరసిజదళనేత్ర న్జానకిం జూప రమ్మ
సరళపవనజంబుక్ష్మాజరాజంబులారా.
| 1068
|
మహాస్రగ్ధర. |
తరలాక్షిం జెప్పుఁ డత్యాదరమునఁ గుసుమోత్తంసచూతంబులారా
హరిమధ్యం గానరే మీ రతిదయఁ జెపుఁ డింపార సింహంబులారా
తెఱఁ గొప్ప న్సీత తా నేతెరువునఁ జనెనో తెల్పుఁ డీరంబులారా
పరపుష్టశ్రేణులారా పలుకుఁ డిపుడు మత్పత్నిసేమంబు నర్ధిన్.
| 1069
|
ఇంద్రవజ్ర. |
బాలామణిం జూపుము పారిజాతా, హేలావతిం గానవె యింద్రభూజా
లోలేక్షణం జూపవె లుంగమా హా, రాలంకృతాంగిం జెపుమా లవంగా.
| 1070
|
ఉపేంద్రవజ్ర. |
వినీల మేఘోపమవేణి లజ్జా, వినమ్రవక్త్రాబ్జను వీర్యశుల్క
న్మనోజ్ఞరూప న్గుణమండన న్రా, జనందనం జూపుము సారసంబా.
| 1071
|
ఉపజాతి. |
సౌదామినీసన్నిభచారుగాత్రి, న్విదేహరాజాత్మజ విద్రుమోష్ఠిం
గాదంబినీ సీతను గానవా స, మ్మదంబునం జెప్పుము మాకుఁ బ్రీతిన్.
| 1072
|
వంశస్థ. |
ధరాసుతం గంటె కదంబగుచ్ఛమా, వరాననం జూపు లవంగమంజరీ
గురుస్తనిం జూపవె కుందబృందమా, కరీంద్రహస్తోరువుఁ గంటె శారికా.
| 1073
|
స్రగ్విణి. |
భామినిం గంటివే బంధుబంధూకమా,భూమిజం గంటివే పుష్పితాశోకమా
కామినిం గంటివే కమ్రకల్హారమా, రామ వీక్షించితే రమ్యమయూరమా.
| 1074
|
శా. |
మల్లీ కేతకి మాధవీ కురవమా మందారమా మాలతీ
వల్లీమంజునికుంజమా కుటజమా వామాక్షి వైదేహి నా
యుల్లం బారట పెట్టి నేఁడు చనె నీయుగ్రాటవీవీథిలో
ఫుల్లాబ్జాక్షి నెఱింగి తేని చెపుమా పుణ్యంబు నీ కయ్యెడిన్.
| 1075
|
వ. |
అని యనేకప్రకారంబుల నయ్యాశ్రమంబునం గలతరులతలఖగమృగంబుల
వైదేహి నడుగుచు నెందునుం గానక.
| 1076
|
తే. |
తోయజేక్షణ నీ వేల దూరమునకుఁ, బరువు లెత్తెదు నాకుఁ గన్పడితి వీవు
పంతమున భూరుహంబులచెంత డాఁగి, యిపుడు నాతో భాషింప వేల చెపుము.
| 1077
|
తే. |
కమలముఖి హాస్యశీలవు గావు నీవు, మించి యీలాగు న న్నుపేక్షించె దేల
కాంత నామీఁదఁ దొల్లింటికరుణ లేదె, నిలునిలుము పోయె దేటికి నీరజాక్షి.
| 1078
|
తే. |
చారుపీతకౌశేయవస్త్రంబుచేతఁ, బద్మలోచన సూచింపఁబడితి విప్పు
డొంటిఁ జనునిన్ను వీక్షించుచున్నవాఁడ, నెనరు నామీఁదఁ గల దేని నిలువు మింక.
| 1079
|
ఉ. |
ఎచ్చటి కేగితే కువలయేక్షణ పల్కవ దేల కోమలీ
ముచ్చట లాడ రా వలదె మోహనరూపిణి యల్కఁ బూని న
న్నిచ్చటఁ బాసి పోవఁ దగవే మధురాధర యీవనంబులో
నెచ్చట నున్నదానవో మహీసుత వేగమె మోముఁ జూపవే.
| 1080
|
క. |
అని పెక్కుగతులఁ జీరుచు, వినతాంగి మృదూక్తి చెవులు వినఁబడ కునికి
న్మనమున నాందోళించుచుఁ, గనుంగొనల నశ్రు లొలుకఁగా ని ట్లనియెన్.
| 1081
|
చ. |
పిలిచినఁ బల్క దెంతయును భీతమృగేక్షణ యివ్వనంబులోఁ
గల దనుమాట సందియము గావున దారుణరాక్షసాధము
ల్బలిమి గ్రసించుటో మొఱఁగి పట్టుటయో మఱి చంపుటో రహ
స్స్థలమున దాఁచుటో యొకటి తథ్యము గా కిఁక వేఱె యున్నదే.
| 1082
|
మ. |
అని నో రెండఁగఁ బాదము ల్వడఁక మే నాకంపముం జెంద లో
చనయుగ్మం బతిశోకరోదనముచే సంధ్యారుణచ్ఛాయతో
నెన యై యొప్పఁగ మాట తొట్రుపడ నెంతే చిత్తమోహంబు పై
కొన ఫాలంబునఁ జెమ్మట ల్పొడమ సంక్షోభీకృతస్వాంతుఁ డై.
| 1083
|
చ. |
కనుఁగవ మోడ్చు నుస్సు రనుఁ గంపము నొందుఁ గడుం దలంకు హా
జనకకుమారి యంచుఁ బలుచందముల న్విలపించు లక్ష్మణా
వనజసుగంధిజాడఁ గనవా యను మాటికిఁ జీరు దైవమా
యను వనితావియోగజనితార్తిఁ దపించుచు రాముఁ డయ్యెడన్.
| 1084
|
క. |
సోలుచుఁ జింతాభరమున, వ్రాలుచుఁ గైదండ యిడునవరజునిమేనం
దూలుచు శోకాంబునిధిం, దేలుచు మూర్ఛిలుచు మరలఁ దెలియుచు మఱియున్.
| 1085
|
ఉ. |
ఎక్కడ నల్కు డైనఁ దరళేక్షణ వచ్చు నటంచుఁ జూచు నే
యిక్కువఁ జప్పు డైనను మహీసుతపల్కని యాలకించు నే
దిక్కు తళుక్కు మన్న సుదతీమణి మైజిగి గాఁ దలంచు లో
|
|
|
నక్కజ మైనమోహమున నారఘునాథుఁడు భ్రాంతచిత్తుఁ డై.
| 1086
|
వ. |
ఇట్లు దురంతచింతాభరంబున నమ్మేదినీకాంతుండు కాంతాన్వేషణతత్పరుం
డై కొండొకసే పయ్యాశ్రమసమీపంబునం గలశైలంబులును గిరిప్రస్రవ
ణంబులును నదీనదంబులును బుష్పపల్లవోపేతంబు లై సంచారయోగ్యంబు
లైనవనంబులును విషమంబు లైనకాననంబులును విలోకించి యెందునుం
గానక శోకసంతప్తచిత్తుం డై రాక్షసభక్షణంబుకొఱకు నాచేత విడువం
బడియెఁ గావున నమ్మహీపుత్రి పథికసంఘంబుచేతఁ బరిత్యక్త యై బహుబాం
ధవ యగుయువతిపగిది రాక్షసులచేత నిక్కంబుగా భక్షిత యయ్యె నని
తలంచి వలయకంకణాంగదభూషితంబులును జారుపల్లవకోమలంబులును వేప
మానాగ్రంబులు నైనతదీయబాహువులును జంపకవర్ణాభంబును గ్రైవేయ
శోభితంబును గోమలంబు నైనతదీయకంఠంబును బద్మపత్రనిభేక్షణంబును
సంపూర్ణచంద్రప్రతిమంబును శుభదంతోష్ఠంబును రుచిరనాసంబును జారుకుం
డలంబు నైనతదీయవదనంబును మనంబున సంస్మరించి యివి యన్నియు రాక్ష
సులచేత భక్షితంబు లయ్యె నొకో యని తలంచి నానాప్రకారంబుల విలపిం
చుచు శూన్యం బైనయాశ్రమపరంబును సీతావిరహిత యైనపర్ణశాలయును
విధ్యస్తంబు లైనయాననంబులును విలోకించి యస్వస్థహృదయుండును ననిష్ప
న్నమనోరథుండు నై భుజంబు లెత్తి మాటిమాటికి నుచ్చైస్స్వరమున సీతం
జీరుచు లక్ష్మణున కి ట్లనియె.
| 1087
|
మ. |
అనఘా యెక్కడ సీత యేవిషయమం దాసక్తితో నున్న దె
వ్వనిచే భక్షిత యయ్యె నెవ్వఁడు వడి న్వామాక్షిఁ గొంపోయె శో
భనచారిత్రను నన్నుఁ బ్రీతి భజియింప న్వచ్చునే యింక నా
మన మానందరసప్రవాహలహరీమగ్నంబు నై యొప్పునే.
| 1088
|
వ. |
అని పలికి సీత నుద్దేశించి.
| 1089
|
క. |
నాచిత్తము దెలియుట కిపు, డీచాయలఁ దరులపొంత నెక్కడ నున్నా
వో చాలును బరిహాసము, నీచక్కఁదనంబుఁ జూపి నెఱిఁ బ్రోవు మిఁకన్.
| 1090
|
తే. |
చారులోచన నినుఁ గూడి సంతతంబుఁ, గరము క్రీడించు మృగశాబకములు నేఁడు
నిన్నుఁ గానక కన్నుల నీరు గ్రమ్మ, ధ్యాన మొనరించుచున్నవి యాశ్రమమున.
| 1091
|
వ. |
అని పలికి వెండియు లక్ష్మణు నుద్దేశించి.
| 1092
|
ఆ. |
సీత లేనినాకు సిరి యేల బ్రతు కేల, ప్రాణ మేల పూజ్యరాజ్య మేల
తద్వియోగజనితతాపాగ్నిచేఁ గ్రాఁగి, మేనుఁ బాయు టిదియ మేలు గాదె.
| 1093
|
ఆ. |
జానకీవియోగజనితార్తిచే డస్సి, మృతుఁడ నైన నన్నుఁ ద్రిదశలోక
|
|
|
మందు రాజవర్యుఁ డైనమజ్జనకుండు, నేఁడు చూడఁగలఁడు నిక్కువముగ.
| 1093
|
వ. |
మఱియుఁ బరలోకగతుండ నైననన్ను విలోకించి మజ్జనకుం డగుదశరథుండు
చతుర్దశవత్సరంబు లరణ్యంబున నుండు మని నాచేత నియోజితుండ వైతి
వక్కాలంబు పరిపూర్ణంబు గాకమున్నె మత్సకాశంబునకుం జనుదెంచితివి
కామవృత్తుండ వనార్యుండవు మృషావాది వైతి వని ధిక్కరించుం గాదె యని
పలికి యంతకంత కగ్గలం బగుశోకావేశంబున.
| 1094
|
ఉ. |
మానిని దుష్టచిత్తుఁ డగుమర్త్యుని శాశ్వతకీర్తివోలె నన్
దీనుని భగ్నకామితు నతివ్యథితాత్ముని శోకపీడితున్
గాననమందుఁ బాసి లలనామణి యెక్కడి కేగితే నినుం
గానక యున్న నాకు బ్రతుక న్వశమే వెసఁ బ్రోవ రాఁ గదే.
| 1095
|
వ. |
అని యిట్లు పెక్కుచందంబుల సీతాదర్శనలాలసుం డై పంకనిమగ్నం బైనకుం
జరంబుచందంబున నిశ్చేష్టితుం డై విలపించు చున్నరఘుపుంగవుం జూచి
తదీయచిత్తానువర్తి యగులక్ష్మణుండు తత్కాలసదృశం బగువాక్యంబున
ని ట్లనియె.
| 1096
|
చ. |
ఇది బహుకందరోపలమహీరుహ మైనవనంబు గౌతమీ
నదికి జలార్థ మేగెనొ వనంబునకుం గుసుమార్థ మేగెనో
మది దెలియంగఁ బూఁబొదలమాటున నెచ్చట డాఁగి యున్నదో
వెదకుము నన్నుఁ గూడి రఘువీర విషాదము నొంద నేటికిన్.
| 1097
|
క. |
ప్రియవనసంచారయుఁ ద, ద్దయు వనసంచారకోవిదయు వనవాస
ప్రియయును గావున జనకత, నయ యెచ్చట నున్నదో వనంబున నిపుడున్.
| 1098
|
తే. |
కమలములఁ గోసి తెచ్చుట కమలపంక, జాకరంబులచెంగటి కర్థిఁ జనెనొ
స్నాన మొనరించుటకుఁ బ్రీతి నదికిఁ జనెనో, వెదకుదముగాక శోకింప వెఱ్ఱితనమె.
| 1099
|
తే. |
అనుచు సౌహార్దమునఁ దమ్ముఁ డాడినట్టి, మాట కొక్కింతధృతిఁ బూని మనుజనాథుఁ
డతఁడు తానును నవ్విపినాంతరమున, మరల వెదుకంగఁ దొడఁగె నమ్మానవతిని.
| 1100
|
ఉ. |
ఆరఘువర్యు లీకరణి నవ్విపినంబున నానగాళిలో
ఘోరమహీధ్రకందరనికుంజసరిత్సరసీవనాళిలో
నారసి సీతఁ గాన కపు డార్తిఁ దపించుచు నుండి రంత నా
ధీరుఁడు లక్ష్మణుండు వగ చేర్చుచు రామునితోడ ని ట్లనున్.
| 1101
|
ఆ. |
ఓమహానుభావ యీమాడ్కి శోకింప, నేల బలిని గట్టి నేలఁ గొన్న
చక్రపాణిపగిది జానకిఁ బడసెదు, ధైర్య ముడుగు టిదియుఁ గార్య మగునె.
| 1102
|
చ. |
అన విని రాముఁ డాస్యమున నంటినవిన్నఁదనంబుతోడ నె
మ్మనమున శోకముం గదుర మాటలు తొట్రుపడంగ లక్ష్మణుం
గని వనశైలకందరనికాయముఁ జూచితి నిందు నెచ్చటం
|
|
|
గనుఁగొన నైతిఁ బ్రాణములకంటె గరీయసి యైనజానకిన్.
| 1103
|
వ. |
అని యిట్లు బహుప్రకారంబుల విలపించుచు సీతాహరణకర్శితుండును దీనుం
డును శోకసమావిష్ణుండు నగుచు నొక్కముహూర్తంబు విహ్వలుం డై ధై
ర్యంబు వదలి గాంభీర్యంబు విడిచి గౌరవంబు దొలంగం బెట్టి చేష్టలు మాని
యెఱుక మఱచి యవసన్నాంగుం డై తత్తఱంబున సారెసారెకు దీర్ఘంబుగా
వేఁడినిట్టూర్పులు పుచ్చుచు జానకిం బేర్కొని యుచ్చైర్నాదంబున రోద
నంబు సేయుచు సంయతాంజలి యై లక్ష్మణుండు శోకాపనోదకారణంబు లైన
యుపశమనవాక్యంబుల నెంత యనూనయించిన నూఱడిలక సీతావియోగజనిత
వ్యామోహోపహతచేతనుం డై మాటిమాటికి రోదనంబు సేయుచు దురంత
చింతాభరంబునం దూలుచు మదనపరవశుం డై జానకిం గట్టెదుట నున్నదా
నిఁగాఁ దలంచి యద్దేవి సంబోధించి శోకగద్గదకంఠుం డై యి ట్లని విలపించె.
| 1104
|
చ. |
వనకుసుమప్రియత్వమున వారిజలోచన నీవు ముంగలం
బనివడి యీయశోకవిటపంబులమాటున మే నొకింతయుం
గనఁబడకుండ నిట్లు జనకక్షితినాథతనూజ యుండఁగాఁ
జనునె మనంబులోఁ గడువిషాదము పుట్టెడు రమ్ము చెచ్చెరన్.
| 1105
|
క. |
కదళీనిభోరుకాండము, లదటునఁ గదళీమహీరుహంబులచెంతన్
వదలక కనఁబడుచున్నవి, సుదతీ వెస రమ్ము నాకుఁ జూడ న్వశమే.
| 1106
|
సీ. |
వనిత నీకుచముల కెన యని డాఁగితో సదమలపుష్పమంజరులచెంత
సుదతి బాహువులకు జో డని చేరితో వికసితనూత్నవల్లికలచెంత
నింతి నీమోవికి నీ డని డాసితో రమణీయనవపల్లవములచెంతఁ
దరుణి పాదములకు సరి యని చేరితో కర మొప్పుమెట్టదామరలచెంత
|
|
తే. |
యువతి పరిహాసమునకు న న్నొంటి విడిచి, విపినమున డాఁగు టిదియు వివేక మగునె
మగువ యీపరిహాసంబు మాకు బాధ, సేయుచున్నది చయ్యనఁ జేరరావె.
| 1107
|
తే. |
అంబుజేక్షణ శ్రాంతుండ నైననాకుఁ, గరము పరిహాసమున నేమి కార్య మిప్పు
డెలమి నీనుఁ గూడియున్నచో నిచ్చుఁ బ్రీతి, నొసఁగునే నాకు నినుఁ గానకున్న బోటి.
| 1108
|
క. |
పరిహాసప్రియ మగుటయు, నిర వొందఁగ నీదుశీల మెఱుఁగుదు నైనం
దరుణీ యాశ్రమపథమునఁ, బరిహాసము దగదు వీటఁ బరువడిఁ జెల్లున్.
| 1109
|
ఉ. |
అక్కట నన్ను నేఁడు పరియాచకమాడుట కేనగాళిలో
నెచ్చట నున్నదానవొ మృగేక్షణ నీ విట లేమిఁ జేసి నల్
దిక్కులు నిష్ప్రభత్వమున దిక్కఱి యున్నవి పర్ణశాలకున్
గ్రక్కున వచ్చి మెచ్చి ననుఁ గౌఁగిటఁ జేర్చి ముదం బొసంగవే.
| 1110
|
చ. |
అని పలుమాఱుఁ జీరి విభుఁ డవ్వల లక్ష్మణుఁ జూచి తమ్ముఁడా
యనయము సీత నిక్కము నిశాటులచే హృత యయ్యెఁ గాక యుం
|
|
|
డినఁ దనుఁ జీరఁ బల్కదె వని న్మృగయూథము శోకబాష్పముల్
కనుఁగవ నించుచున్ జనకకన్యక పోయినజాడఁ దెల్పెడిన్.
| 1111
|
వ. |
అని వెండియు సీత నుద్దేశించి.
| 1112
|
ఉ. |
అక్కట నన్ను ఘోరవిపినావని నొంటిగ డించి నేఁడు నీ
వెక్కడ కేగితే కువలయేక్షణ నీ విట రాక్షసాలిచేఁ
జిక్కుచు నుండఁ గైకయి వశీకృతసద్విషయస్థలోక యై
చొక్కుచు నుండుఁ గాదె తనసూనుఁడు రాజ్యము నేలుచుండఁగన్.
| 1113
|
తే. |
నీవు పోయినతెరువునఁ బోవు టంతె, గాక క్రమ్మఱఁ బురి కెట్లు నాకుఁ బోవు
టొప్పు నటులైనఁ గడు నిర్దయుండు వీర్య, హీనుఁ డని లోకమెల్ల న న్నెన్నికొనదె.
| 1114
|
ఆ. |
వారిజాక్షి మును భవత్సమన్వితముగ, రమణ వచ్చితిని బురంబు విడిచి
నిన్ను విడిచి యకట నేఁ డెత్తెఱంగునఁ, బురికి నేను మరలఁ బోవువాఁడ.
| 1115
|
క. |
వనవాసము సలిపి పురం, బునకు మరలఁ బోయి యచటఁ బుత్రీస్నేహం
బునఁ గుశల మడుగు జనకునిఁ, గనుఁగొన నేపగిది నోపఁగాఁగల నకటా.
| 1116
|
వ. |
మఱియు సవ్విదేహవల్లభుండు సీతావిరహితుండ నైననన్ను విలోకించి పుత్రి
కాస్నేహసంతప్తుం డై నిక్కంబుగా మోహవశంబు నొందునని వగచి పదంపడి
లక్ష్మణు నాలోకించి.
| 1117
|
ఆ. |
నీరజాక్షి లేనినెలవు నాకం బైన, శూన్య మగుచు నాకుఁ జూడ నొప్పుఁ
గాన వీటి కింక నేను బోవఁగఁజాల, దేవి యట్ల యిచటఁ బోవువాఁడ.
| 1118
|
క. |
జానకిని బాసి నిమిషం, బైనను జీవింపఁజాల నటు గావున నన్
గాననమున విడిచి యయో, ధ్యానగరికిఁ బొమ్ము నీవు తల్లులకడకున్.
| 1119
|
క. |
సీతాపతిచేత నను, జ్ఞాతుఁడ వైతి విఁకఁ బుడమిఁ గావు మనుచు వి
ఖ్యాతిగ భరతునితోఁ జెపు, మాతతమతిఁ గౌఁగిలించి యస్మదనుమతిన్.
| 1120
|
క. |
జనని సుమిత్రయుఁ గైకయు, ననఘా కౌసల్యయును నయంబున నభివం
దనపూర్వకముగ నీచే, ననిశము రక్షింపఁ దగుదు రనఘవిచారా.
| 1121
|
క. |
కావున నావార్తయు సీ, తావృత్తాంతమును జెప్పి తగ మజ్జనని
న్వావిరిఁ బ్రోచుచు నుండుము, పావనగుణ దుఃఖమునకు బాల్పడకుండన్.
| 1122
|
క. |
అని రఘుపతి దీనుం డై, జనకజ నెడఁబాసి శోకసంతాపభరం
బున విలపించుచు నుండం, గని లక్ష్మణుఁ డధికశోకకర్శితుఁ డయ్యెన్.
| 1123
|
ఉ. |
ఘోరవిషాదచిత్తుఁ డగుకూరిమితమ్మునిఁ జూచి రాముఁడున్
దారుణశోకతప్తుఁ డయి దైన్యము దోఁపఁగ శోకబాష్పముల్
గాఱఁగ వేఁడియూర్పు సెలఁగ న్వ్యసనోచితభంగి ని ట్లనెం
గూరినమోహతాపమునఁ గుందుచు రోదనపూర్వకంబుగన్.
| 1124
|
ఉ. |
ఆతతవైభవోచితుఁడ వయ్యును శోకముమీఁద శోక మీ
|
|
|
రీతిఁ దపింపఁజేయ సశరీరుఁడ నై మని యుంటిఁ గావునం
బూతచరిత్ర చూడ ననుఁ బోలినదుష్కృతకర్మకారి క్షో
ణీతలమందు వేఱొకఁడు నిక్కము లేఁడు క్షితీశనందనా.
| 1125
|
ఉ. |
తొల్లిఁటిపాపకర్మ మిటు తోడుతఁ జేకుఱె నాకుఁ గానిచోఁ
దల్లిని జుట్టల న్విడిచి తండ్రిని రాజ్యముఁ గోలుపోయి సొం
పెల్లఁ దొఱంగి శోకమున నిచ్చట గాసిలుచుండ మీఁదఁ బా
టిల్లునె యి ట్లరణ్యమున డెప్పర మైనసతీవియోగమున్.
| 1126
|
తే. |
కడఁగి సీతావియోగదుఃఖంబువలనఁ, గెరలి తొల్లిటిబహువిధక్లేశ మంగ
మేర్చుచున్నది లక్ష్మణా యింధనముల, చేత నుద్దీప్తుఁ డగుతీవ్రశిఖియుఁ బోలె.
| 1127
|
తే. |
రక్కసులచేతిలోఁ బడి రాజపుత్రి, తనదుసుస్వరభాషణత్వంబు విడిచి
సాధ్వసంబున నేఁ డపస్వరముతోడ, నుగ్రవనమున విలపించుచుండుఁ గాదె.
| 1128
|
ఆ. |
అకట లోహితాఖ్య హరిచందనంబున, కనుదినోచితంబు లైనయువతి
వృత్తపీనకుచము లెంతయు రుధిరసి, క్తంబు లగుచు సొబగు దప్పి యుండు.
| 1129
|
చ. |
కమలపలాశలోచనము కౌముదికానిభచారుహాసయు
క్తము మణికుండలోజ్జ్వలితగండము కుంచితనీలకేశపా
శము మృదుభాషణంబు నగుజానకీమో ముపరక్తచంద్రబిం
బముక్రియ నుండు నేఁ డసురపాళివశంగత యౌట నెంతయున్.
| 1130
|
చ. |
ఘనతరహారశోభితము కాంతపయోధరయుగ్మరంజితం
బనుపమహేమకంచుకసమన్విత మై యలరారుమేదినీ
తనయయురంబు సించి భయద క్రియఁ దద్రుధిరంబు శోణితా
శను లగురాక్షసాధములు చయ్యనఁ గ్రోలుదు రేమి సేయుదున్.
| 1131
|
ఉ. |
ఆయతకాంతనేత్ర యగునాగజగామిని మద్విహీన యై
పాయక నిర్జనం బయినబంధురకాననమందు నొంటి దై
తేయులచేతఁ జిక్కి యతిదీనతఁ దత్పరికృష్యమాణ యై
రాయిడి కోర్వఁజాల కల క్రౌంచిగతి న్విలపించునే కదా.
| 1132
|
చ. |
ఇరువుగ నన్నుఁ గూడి తగ నీరమణీయశిలాతలంబునం
గరము సుఖోపవిష్ట యయి కమ్రశుచిస్మిత యై సుహాస యై
పరఁగ నుదారశీల యగుభామిని ని న్నటు చూచి మున్ను భా
సురబహువాక్యజాతమును సొంపు దలిర్ప వచించునే కదా.
| 1133
|
సీ. |
రాజకుమార యారాజాస్య సలిలార్థ మలగౌతమీనది కరిగె నొక్కొ
జలజాక్షి పంకజంబులు దెచ్చుటకుఁ బ్రీతి సరిసిచెంతకు వేడ్కఁ జనియె నొక్కొ
చారుపుష్పితవృక్షషండమండిత మైన యీయీవిపినంబున కేగె నొక్కొ
కమనీయతరపుష్పగంధబంధుర మైన పూఁబొదరిండ్లకుఁ బోయె నొక్కొ
|
|
ఆ. |
అతివ చాలభీరు వగుట మున్నెన్నఁడు, నన్ను విడిచి యొంటి నదికి సరసి
కటవి కీరములకు నరుగదు నేఁ డెట్లు, చనియె నాతలంపు సత్య మగునె.
| 1134
|
ఉ. |
లోకకృతాకృతజ్ఞుఁడవు లోకఋతానృతకర్మసాక్షి వ
స్తోకవిభావసుండ వజితుండవు వేదమయుండ వీవు పు
ణ్యాకర మిత్ర సీత హృత యయ్యెనొ లే కిపు డెందుఁ బోయెనో
శోకవశుండ నై మిగుల స్రుక్కెడు నా కెఱిఁగింపు సత్కృపన్.
| 1135
|
చ. |
అవిరతభక్తి వేఁడెద నరాహిసుపర్వజగంబులందు నీ
కవిదిత మైనయర్థ మరయంగ నొకించుక లేదు దానవు
ల్యువతి హరించిరో గెడపిరో వనవీథిఁ జరించుచున్నదో
పవన రయాహతోపవన భామిని పోయినజాడఁ జెప్పుమా.
| 1136
|
వ. |
అని బహుప్రకారంబుల శోకాధీనదేహుం డై విసంజ్ఞుండుం బోలె విలపించు
చున్నయన్నం జూచి యదీనసత్వుం డగులక్ష్మణుండు న్యాయసంస్థితుం డై కా
లోచితం బగువాక్యంబున ని ట్లనియె.
| 1137
|
తే. |
అధిప శోకంబు విడిచి ధైర్యంబుఁ బూని, యుర్వినందని వెదుకంగ నుత్సహింపు
మరయ నుత్సాహవంతులు ధరణి నెట్టి, దుష్కరపుఁబనులందైనఁ దొట్రుపడరు.
| 1138
|
క. |
అని లక్ష్మణుండు పలికిన, విని విభుఁ డచలుండు గాక విరహజ్వరసం
జనితార్తిఁ జాలఁ దూలుచు, ననుజన్మునితోడ మరల ననియెఁ గృపణుఁ డై.
| 1139
|
మ. |
సుదతీరత్నము పద్మముల్ గొనుటకై సొం పొందఁగా గౌతమీ
నదికిం బోయెనొ తత్సరఃపులినసంతానంబులం జూచి వ
చ్చెదవా యన్న నతండు పోయి మదిరాక్షిం గాన కేతెంచి గ
ద్గదకంఠుం డయి యన్న కి ట్లనియె సంతాపంబు వాటిల్లఁగన్.
| 1140
|
రాముఁడు సీతావృత్తాంతమును గోదావరి నడుగుట
వ. |
దేవా తీర్థవతి యైనగోదావరికిం బోయి తత్తీర్థంబులయందు వెదకి యెందు
నుం గాన నైతి నెంత చీరినఁ దద్వాక్యంబు విని రాదయ్యె మీరు సని వెదుక
వలయును.
| 1141
|
క. |
నా విని రఘునాథుఁడు గోదావరికిం బోయి చాల ధరణీసుత న
చ్చో వెదకి కాన కతిశో, కావిలచేతస్కుఁ డగుచు నన్నది నడిగెన్.
| 1142
|
చ. |
అడిగిన నెట్లు భూతచయ మయ్యమ పోయినచొ ప్పెఱింగియుం
గడువడిఁ జెప్ప దయ్యె నటు గౌతమియుం గలుషాత్ముఁ డాదశా
స్యుఁడు సుడి పెట్టునో యనుభయోద్ధతితో వివరింప దయ్యె న
ట్లుడుగక చెప్పు మీ వని సముద్ధతి భూతము లెంత చెప్పినన్.
| 1143
|
వ. |
ఇట్లు నిరుత్తరుం డై రాముండు లక్ష్మణు నవలోకించి.
| 1144
|
చ. |
జనకజవార్త నించుకయు సమ్మతి నీనది సెప్ప దయ్యె నే
జనకున కేమి చెప్పుదుఁ బ్రసన్నతఁ దల్లికి నేమి చెప్పుదుం
గని కని దైవ మెంత యపకారము నా కొనరించె నేగతి
న్జనియెద నెందుఁ జొత్తును వనంబున నెట్లు వసింతుఁ దమ్ముఁడా.
| 1145
|
చ. |
హితులను బాసి రాజ్యము నహీనబలంబును గోలుపోయి యీ
గతి గహనంబులోఁ దపసికైవడి నాకలము న్భుజించుచున్
ధృతిఁ గని సంచరించుచుఁ దుది న్సతి గోల్పడి నిద్ర లేక దు
ర్మతి విలపించు నా కిచట రాత్రులు దీర్ఘము లై చనుం గదా.
| 1146
|
క. |
జానకి గనఁబడెనేనియు, మానుగ నీకుజములందు మందాకినియం
దీనగములయందు జన, స్థానములం దిచ్చకొలఁదిఁ జరియింతుఁ గదా.
| 1147
|
తే. |
ఈమృగంబులు సారెకు నామొగంబుఁ, జూచెడు మహీజ పోయినచొప్పు చెప్ప
నిచ్చగించిన క్రియఁ దదీయేంగితములు, దోఁచుచున్నవి దుర్జనదూర కంటె.
| 1148
|
క. |
అని పలికి విభుఁడు సతి పో, యినచందముఁ జెప్పుఁ డనిన మృగములు నభముం
గనుఁగొనుచు వేగ దక్షిణ, మునకుం జనియె న్రఘూత్తమునిఁ గనుఁగొనుచున్.
| 1149
|
లక్ష్మణుఁడు రామునికి మృగంబులు సీతజాడఁ దెల్పుటను జెప్పుట
వ. |
మఱియు నవ్వనమృగంబులు శీఘ్రంబున లేచి దక్షిణాభిముఖంబు లై నభస్థ
లంబు విలోకించుచు రావణుఁడు వైదేహి నెత్తికొని చనినమార్గంబుఁ బట్టి రామ
భద్రు నవలోకించుచు దక్షిణాభిముఖంబుగా నరిగి నేకారణంబున మృగంబులు
దక్షిణదిశను దక్షిణదిగ్భూమిని విలోకించుచు దక్షిణదిశకుఁ బరువు లెత్తె
నక్కారణంబున నామృగంబులు లక్ష్మణునిచేత గృహీతచేష్టార్థంబు లయ్యె
నప్పు డాలక్ష్మణుండు మృగంబులచేష్టాభిప్రాయంబు వచనసారంబుగా విలో
కించి యన్న కి ట్లనియె.
| 1150
|
రామలక్ష్మణులు మృగసూచితమార్గమున సీతను వెదకుట
సీ. |
కాకుత్స్థవర యీమృగంబులు మీచేత నవనిజావృత్తాంత మడుగఁబడిన
వగుచు దక్షిణభూమి నందంద చూపుచు యామ్యదిశాభిముఖ్యంబు గాఁగఁ
బోవుచు నున్నవి భూపుత్రి పోయినజాడ గావలయు విచార ముడిగి
వెదకుదమా యన్న విని రాముఁ డగుఁ గాక యని వేగ యనుజసహాయుఁ డగుచు
|
|
తే. |
దక్షిణాభిముఖంబుగా దావమెల్లఁ, గలయఁజూచుచుఁ బోయి మార్గమున నొక్క
జాడ రాలిన క్రొవ్విరిసరులు చూచి, మనుజవిభుఁ డిట్టు లనియె లక్ష్మణునితోడ.
| 1151
|
క. |
మానుగ నీకుసుమంబులు, జానకి ధమ్మిల్లమందు సవరించిన వి
క్కానల నాచే దత్తము, లైనవి గుఱు తెఱిఁగికొంటి ననఘవిచారా.
| 1152
|
వ. |
మఱియు నిక్కుసుమంబుల నమ్లానతచేత సూర్యుండు ననపనయంబుచేత సమీ
రుండును ధారణంబుచేత ధరిత్రియు నీమువ్వురు నాకుఁ బ్రియంబు సేయుటకు
నావచ్చునందాఁక రక్షించుచున్నవా రని తలంచెద.
| 1153
|
తే. |
అనుచుఁ దమ్మునితో నాడి యధిపుఁ డొక్కశైలమును గాంచి గిరినాథ జనకకన్య
సేమ మెఱిఁగింపు మని పల్కి చెప్ప కున్న, నట్టె కోపించి దానికి నిట్టు లనియె.
| 1154
|
చ. |
గిరివర సీతచంద మెఱిఁగింపుము నీ వటు దెల్ప వేని దు
ర్భరశరవహ్నిచేత నిను భస్మముఁ జేసెద నిర్ఝరంబులుం
గరము నవాంబుహీనములు గా భవదున్నతమేదినీరుహో
త్కరములు పర్ణహీనములు గా నొనరించెదఁ జూడు వ్రేల్మిడిన్.
| 1155
|
క. |
పరువడి నీసానువు లఱి, ముఱిఁ ద్రుటితాశ్మములు గాక మున్నె సువర్ణాం
బరధారిణి హేమాభను, సురుచిరగాత్రిని మహీజఁ జూపుము నాకున్.
| 1156
|
ఆ. |
చూప వేని యిపుడె సునిశితశరవహ్ని, భూరితరులు శిలలు నీఱు చేసి
చెలఁగి నిన్ను నేఁ డసేవ్యంబుఁ జేసెద, గౌతమీరయంబుఁ గట్టి వైతు.
| 1157
|
క. |
అని పలికి విభుఁడు కన్నులు, ఘనతరరక్తాంబుజములకైవడి నలరం
గనుఁగొనియె మ్రోల నిడుపై, తనరుదశాననునిపదము ధారుణియందున్.
| 1158
|
తే. |
కాంచి యంతట వెండియుఁ గలయ వెదకి, రామకాంక్షిణియును దైత్యరాజకృష్ణ
యును బ్రధావితయును బ్రీతియుతయు నైన, జనకనందనిపదములజాడఁ గనియె.
| 1159
|
వ. |
ఇట్లు రాముండు ప్రవృత్తనిక్షేపంబు లైనవైదేహీరావణులచరణన్యాసస్థానం
బులు విలోకించి తత్సమీపంబున భగ్నం బై పడియున్నచాపంబును దూణీరం
బును బహుప్రకారంబుల విశీర్ణం బైనరథంబును విలోకించి సంభ్రాంత
చిత్తుం డై ప్రియవాది యగులక్ష్మణున కి ట్లనియె.
| 1160
|
చ. |
అనఘ మహీశపుత్రి వివిధాభరణంబులహేమబిందువుల్
మునుకొని గంధపుష్పసరము ల్ధర నంతటఁ జూడ నొప్పెడిన్
ఘనముగ రక్తబిందువులు గానఁగ నయ్యెడి దైత్యపాళిచే
జనకజ కాననంబున నిజంబుగ భక్షిత యయ్యెఁ జూడఁగన్.
| 1161
|
రాముఁడు జటాయువుచేత భగ్నం బైనరావణరథంబుఁ గని వితర్కించుట
చ. |
గుఱుతుగ భూమిపుత్రికొఱకుం గలహించి నిశాటు లిద్దఱుం
బొరిఁబొరి బాహుగర్వమునఁ బోరినచందము దోఁచెఁ గానిచో
నురుతరహేమభూషితసముజ్జ్వలచాపము భగ్నదండ మై
నిరుపమఘోరభంగి నవనిం బడియుండఁగ నేల చెప్పుమా.
| 1162
|
క. |
తరుణాదిత్యనిభంబును, గురుతరవైడూర్యరత్నగుళికాచితము
న్నిరుపమసువర్ణకవచము, ధరణిం బడియున్న దిచటఁ దమ్ముఁడ కంటే.
| 1163
|
తే. |
సురుచిరము దివ్యమాల్యోపశోభితంబు, శతశలాకంబు నగుసితచ్ఛత్ర మొకటి
భగ్నమణిదండ మై ధరఁ బడి వెలుంగు, చున్న దిచ్చటఁ గంటివె యురుగుణాఢ్య.
| 1164
|
వ. |
మఱియుఁ గాంచనమయతనుత్రాణంబులును బిశాచవదనంబులును మహాకా
యంబులును భీమరూపంబులు నగుఖరంబులు గతప్రాణంబు లై పుడమిం బడి
యున్నయవి దీప్తపావకసంకాశంబును ద్యుతిమంతంబును సమరధ్వజోపేతంబు
నగుసాంగ్రామికరథంబు భగ్నం బై నేలం బడియున్నది చతుశ్శతాంగుళ
పరిమితంబులును దపనీయవిభూషితంబులు నగుబాణంబులు ఖండితాగ్రంబు
లై యభిహతంబు లై విప్రకీర్ణంబు లై రాలి యున్నయవి శరపూర్ణంబు
లగుతూణీరంబులు విధ్వస్తంబు లై పడియున్నయవి పగ్గంబులును దోత్రం
బును గేలం గీలించి సూతుండు మృతుం డై పడియున్నవాఁడు మణిరత్న
మయంబు లైనదివ్యభూషణంబులరజంబు పుడమిం గప్పియున్నది సోష్ణీష
మణికుండలు లగుపురుషు లిరువురు విగతప్రాణు లై చామరహస్తు లై ధరణిం
గూలి యున్నవా రివి యన్నియు సురాసురోచితసాధనంబులు గాని సర్వసా
మాన్యంబులు గావు కావున.
| 1165
|
క. |
క్రూరాత్ము లైనదనుజులు, ఘోరంబుగ సీత నెత్తికొని పోవుటొ లే
కారయఁ జంపుటొ మ్రింగుటొ, కాఱియపెట్టుటొ నిజం బొకటి తలపోయన్.
| 1166
|
క. |
కావున లక్ష్మణ యసురుల, తో వైరము మిక్కుటముగ దొరకొనె నాకు
న్భావింపఁగ మచ్చరముల, క్ష్మావలయ మరాక్షసంబు గాఁ గల దింకన్.
| 1167
|
తే. |
పరఁగ ధర్మంబు రాక్షసాపహృత యైన, యుర్వినందుని రక్షింపకునికి ధర్మ
మాపదలయందు రక్షకం బనెడున్యాయ, మది విచారింప నేఁడు నిరర్థ మయ్యె.
| 1168
|
క. |
అలయక యనారతము వే, ల్పుల నారాధించుచుందు మొనసినభక్తిం
బలలాశనహృత యగుమై, థిలిఁ గావఁ దలంపఁ డొక్కదేవుం డైనన్.
| 1169
|
వ. |
వత్సా కారుణ్యపరుం డగువాఁడు సర్వలోకేశ్వరుం డైనను మహశూరుం డై
నను వానిం జూచి సర్వభూతంబులు తత్స్వభావాపరిజ్ఞానంబువలన నశక్తుం డని
తలంచున ట్లగుటం జేసి మార్దవాదిధర్మయుక్తుండును దాంతుండును లోక
హితయుక్తుండును గారుణ్యపరుండ నైననన్నుఁ ద్రిదశేశ్వరు లందఱు నిర్వీ
ర్యుం డని తలంచుచున్నవారు గావున న న్నధిగమించి మార్దవాదికంబు గు
ణం బైన ననిష్టసాధనత్వంబున దోషం బై ప్రవర్తిల్లె నిప్పుడు చంద్రచంద్రి
కల మాపి సముదితుం డైనసూర్యుండు దేజరిల్లినచందంబున సర్వగుణంబుల
నడుగునం ద్రొక్కి మత్ప్రతాపంబు సకలరక్షోభూతగణనాశంబుకొఱకుఁ బ్ర
కాశించుచున్నది గావున.
| 1170
|
క. |
సురగరుడోరగవిద్యా, ధరచారణసాధ్యదైత్యదానవయక్షా
సురసిద్ధతుషితులం దొ, క్కరుఁ డైనను సుఖము పడయఁగాఁ జాలఁ డిఁకన్.
| 1171
|
రాముఁడు క్రోధం బవలంబించి త్రైలోక్యసంహారంబుఁ జేసెద ననుట
తే. |
శాతశరములఁ ద్రైలోక్యచరుల గమన, ముడిపెద నభంబు నస్త్రసముత్కరమున
నిరవకాశంబుఁ జేసెద నీరనిధుల, నెల్ల శోషింపఁ జేసెద నీక్షణమున.
| 1172
|
సీ. |
సౌమిత్రి విను నేఁడు సన్నిరుద్ధగ్రహ మావారితోడు నిశాకరంబు
విప్రనష్టానలవిధుమరుద్భాస్కరచ్ఛవియు సంతమసాభిసంవృతంబు
విధ్వస్తతరులతావిసరగుల్మంబును శోణితార్ణవమును శుష్యమాణ
సరిదాశయంబును శకలీకృతకులాచలాగ్రంబు నై విలయంబు నొందు
|
|
ఆ. |
విష్టపత్రయంబు విబుధులు సీతను, నా కొసంగ రేని యాకసమునఁ
జెలఁగి తిరుగ లేక చేష్టలు దక్కి వీ, క్షింపఁగలరు మద్విశేషశక్తి.
| 1173
|
మ. |
అలుక న్మత్కరమండితాతతధనుర్జ్యాముక్తనారాచపం
క్తులచే మర్దిత మై నిరంతరము నై తోడ్తో నమర్యాద మై
కలితధ్వస్తమృగాంకజాతగణ మై కాలోద్ధృతం బై సమా
కుల మై యీజగ మంతయు న్మిగుల సంక్షోభించెడుం జూడుమా.
| 1174
|
క. |
ఆకర్ణపూర్ణదుస్సహ, కాకోదరకల్పశరనికాయంబుల నీ
లోకం బరాక్షసంబుగఁ, జేకొని గావింతు నింక సిద్ధము వత్సా.
| 1175
|
తే. |
సముదితమదీయభూరిరోషప్రయుక్త, కార్ముకవిముక్తదూరాతిగామినిశిత
సాయకబలంబుఁ జూచి నిర్జరులు నేఁడు, చాల విత్రస్తు లగుదురు సంభ్రమమున.
| 1176
|
క. |
గురుతరమత్క్రోధంబునఁ, బరువడి లోకంబు లెల్ల భస్మంబు లగు
న్నరయక్షాసురకిన్నర, సురులును బొలిసెదరు నేఁడు చూడు కుమారా.
| 1177
|
తే. |
వినుము జరయును మృత్యువు విధియుఁ గాల మనవరత మప్రతిహతంబు లైనరీతి
మహితరోషరసోద్దీప్తమానసుండ, నైనయే ననివార్యుండ నైతి నిపుడు.
| 1178
|
వ. |
అని పలికి మార్తాండవంశమండనుం డగురాముండు సక్రోధుం డై నేత్రం
బులం దామ్రదీధితులు నిగుడ నధరోష్ఠంబు చలింప యుగాంతకాలంబున నొ
ప్పుసంవర్తాగ్నిచందంబున నతిదుర్నిరీక్షుండై జటాభారంబు సవరించి వల
లాజినంబులు బిగించి లక్ష్మణునిచేత నున్నప్రచండకోదండంబుఁ గేల నందు
కొని సజ్యంబుఁ జేసి కాలకటాక్షసన్నికాశంబు లైననారాచంబులు సంధించి
లోకక్షోభంబుగా గుణప్రణాదంబు సేయుచుఁ బ్రత్యాలీఢపాదుం డై నిలువం
బడిన నమ్మహనీయమూర్తిమూర్తివిశేషంబు త్రిపురదహనదీక్షాదుర్నిరీక్షుం
డైనయష్టమూర్తిమూర్తిచందంబునం దేజరిల్లుచుండె నిట్లు సీతావియోగసంజ
నితశోకాతిశయంబునం బుట్టినక్రోధంబున లోకంబుల సన్నింటి నొక్కపెట్ట
భస్మంబు సేయ సమకట్టి నిట్టూర్పులు నిగిడించుచు నదృష్టపూర్వతేజోదుస్స
|
|
|
హుం డై యున్నయన్నం జూచి లక్ష్మణుండు వెలవెలంబోయి చేతులు మోడ్చి
వినయంబున ని ట్లనియె.
| 1179
|
లక్ష్మణుఁడు రాముని మృదూక్తుల ననూనయించుట
సీ. |
అనఘాత్మ నీవు ము న్నతిదయాశాలివి మృదుఁడ వఖిలభూతహితరతుండ
వతిదాంతుఁడవు చంద్రునందు లక్ష్మియు సూర్యునందుఁ దేజము వాయువందు గతియు
ధరయందుఁ దాలిమి దగి యుండు నీయందు నవి యన్ని కీర్తియు నమరియుండు
నట్టిమహాత్ముండ వైననీ వొక్కనియపరాధమున నిప్పు డలుకఁ బూని
|
|
తే. |
భువనములఁ గాల్పఁదగునె యీభూరిరథము, నీపరికరంబు గలవాని నెఱుఁగ మిచట
వీరు లిరువురు కలహించువెరవుఁ గాన, మొక్కరథ మిందుఁ జూపట్టుచున్నకతన.
| 1180
|
వ. |
మహాత్మా యీదేశంబు ఖురనేమిక్షతం బై రుధిరబిందుసిక్తం బై నివృత్తసం
గ్రామం బై యున్న దైనను సైన్యస్థానంబు చూపట్టనికతంబున మన కప
రాధి యగువాఁ డొక్కండే యని తోఁచుచున్నది యొక్కనికిఁగాఁ బెక్కండ్ర
వధించం బూనుట ధర్మంబు గాదు మహీపతులు శాంతి వహించి మార్దవంబున
యుక్తదండు లై చరింపవలయు.
| 1181
|
ఆ. |
జనవరేణ్య నీవు సర్వభూతములకుఁ బరమగతివి సాధుపాలకుఁడవు
నిత్యకామదుఁడవు నీపత్ని నెవ్వాఁడు, తెంపుఁ జేసి యపహరింపఁదలఁచు.
| 1182
|
చ. |
అరయఁగ యాగదీక్షితున కర్థి మహామతు లైనఋత్విజుల్
గర మపచార మించుకయుఁ గైకొని చేయఁగ లేనిమాడ్కి భా
స్కరసురయక్షరాక్షసులు శైలము లంబుధు లుర్వి నీకు సు
స్థిరతరశక్తి విప్రియము సేయఁగ నోప వొకించు కేనియున్.
| 1183
|
క. |
భూపాలవర్య యిచ్చటి, తాపసులను నన్నుఁ గూడి తడయక యిచటన్
భూపుత్రి నపహరించిన, పాపాత్ముని వెదకి కాంచి పడఁ గూల్పు మిలన్.
| 1184
|
తే. |
అనఘచారిత్ర జానకి నసహరించి, నట్టిదుష్టుఁడు గనుపట్టునంతదాఁక
గిరివనాబ్ధిసరిత్సరోవరనరాహి, సురజగంబులు శోధింత మురుజవమున.
| 1185
|
క. |
సదమలమతి సామంబునఁ, ద్రిదశులు సతి నొసఁగరేని తెంపున నవల
న్వదలక యుత్థితకోపం, బదయత సార్ధకము సేయు మస్మదనుమతిన్.
| 1186
|
వ. |
మహాత్మా వినయంబున నయంబున సామంబున శీలంబున మహీపుత్రి వడయం
జాల వేని యవ్వల సురేంద్రవజ్రప్రతిమంబు లైనసువర్ణపుంఖసాయకంబు
లడరించి జగంబులు నిర్మూలంబులు గావింపుదువు గాక యని పలికి లక్ష్మణుండు
తనమాటలఁ దెలివి నొందక శోకసంతప్తుం డై దురంతమోహంబున నస్వస్థ
హృదయుం డై పరిమ్లానవదనుం డై యనాథునిభంగి విలపించుచున్నరామునిం
జూచి తదీయచరణంబులఁ బట్టుకొని కొండొకసేపు సాంత్యవాక్యంబుల ననూ
నయించి వెండియు ని ట్లనియె.
| 1187
|
చ. |
అనిమిషుఁ డాసుధం బడసి నట్లుగఁ బంక్తిరథుండు బల్తపం
బున ఘనయాగధర్మమునఁ బుత్రునిఁ గా నినుఁ గాంచి నీదుపా
వనగుణము ల్దలంచుచు భవద్విరహవ్యసనంబుచేఁ దుదిన్
మనభరతుండు చెప్పినక్రమంబున నేగె సురేంద్రువీటికిన్.
| 1188
|
క. |
త్వాదృశు లైనమహాత్త్ములె, యీదృగ్విధదుఃఖ మిటు సహింపక యున్న
న్మాదృశులు స్వల్పమతు లే, తాదృశదుఃఖమున కెట్లు తాళుదు రధిపా.
| 1189
|
ఆ. |
తొడరి నీవు దుఃఖితుండ వై జగము ల, హీనతేజమున దహించి తేని
యనఘచరిత యార్తులై భూతములు పద్మ, దళజలంబుభంగిఁ దల్లడిల్లు.
| 1190
|
సీ. |
అలనహుషాత్మజుం డగుయయాతి సురేంద్రపదము నొందియు దుఃఖపరుఁడు గాడె
కొడుకుల నూర్వుర గోల్పడి బ్రహ్మర్షి యైనవసిష్ఠుఁ డాయాసపడఁడె
యఖిలభూతంబుల కాధార మైనయీధరణి యొక్కొకమాటు తల్లడిలదె
జగతీప్రవర్తకు లగుచంద్రరవులకుఁ గలుగదె యొకమాటు గ్రహణభయము
|
|
తే. |
శక్రముఖదేవతలు కడుఁజతురు లయ్యు, మున్ను పెక్కువిధముల విపన్ను లగుచు
శోక మొందరె యాత్మీయసుఖము విడిచి, యిదియు లోకస్వభావ మై యెసఁగు నధిప.
| 1191
|
వ. |
దేవా సమస్తభూతంబులు సర్వభూతాదిదేహి యగుసర్వేశ్వరునివశంబు నతి
క్రమింపం జాలవు నీవు ప్రాకృతుండుబోలె వైదేహినిం గూర్చి శోకింప నర్హుం
డవు గావు సమదర్శనులును విషాదరహితులు నగు నీయట్టిమహానుభావు
లెట్టికృఛ్రంబులం దైన శోకింపరు మహాప్రాజ్ఞు లగుపురుషులు సూక్ష్మబుద్ధియు
క్తు లై శుభాశుభంబు లెఱుంగుదురు గావున నీవును బుద్ధిచేత నీదుఃఖంబు నా
చేత నెట్లు సంప్రాప్తం బయ్యె నని యథార్థజ్ఞానంబున విచారింపుము శాస్త్రైక
సమధిగమ్యంబు లగుటవలనఁ గర్మంబులగుణదోషములు ప్రత్యక్షంబుగా విలో
కించుట కశక్యంబులు గావునఁ తత్ఫలం బిట్టిదని నిశ్చయింప నలవి గా దట్టికర్మం
బు లనుష్ఠింపకున్న సుఖదుఃఖంబులు గలుగనేరవు ము న్నేను బుద్ధిమోహంబు
న దైన్యంబు నొందినప్పుడెల్ల బహుప్రకారంబుల ధర్మోపదేశంబునం దేర్చునట్టి
నీవె వైక్లబ్యంబు నొందిన సాక్షాద్బృహస్పతి యైన నిన్నుం దేర్చుటకు సమ
ర్థుండు గాఁడు మముబోంట్లఁ జెప్పనేల మహాప్రాజ్ఞుండ వైననీబుద్ధి దేవతలకైన
దుర్లభంబు శోకంబుచేత నంతర్హితం బైనభవదీయజ్ఞానంబుఁ బ్రబోధించెద
వధానర్హం బైనసాత్వికదేవగంధర్వాదిదివ్యప్రాణివర్గంబును బ్రాహ్మణాదిమనుష్య
వర్గంబును సర్వలోకసంహారసమర్థం బైననిజపరాక్రమంబు నాలోచించి వధా
ర్హు లగువారివధంబుకొఱకు సన్నద్ధుండవు గమ్ము సర్వజగత్సంహారంబునందు
మన కయ్యెడి లాభం బెద్ది సీత నపహరించిన పాపాత్ముని నెఱింగి వాని వధింపు
మని బోధించిన నారఘువల్లభుండు సారగ్రాహి యగుటం జేసి మహాసారం
|
|
|
బైనలక్ష్మణునివాక్యం బంగీకరించి ప్రవృద్ధం బైనకోపం బుజ్జగించి చిత్రం
బైనకోదండం బెక్కు డించి వెండియు లక్ష్మణున కి ట్లనియె.
| 1192
|
ఆ. |
ఎందుఁ బోద మతివ నెచ్చట వెదకుద, మెట్లు పోవువార మెద్ది తెఱఁగు
చెప్పు మనిన నతఁడు చేతులు మోడిచి, యిట్టు లనియె వినయ మెసక మెసఁగ.
| 1193
|
ఉ. |
ఓ నరనాథవర్య యిటు లూరక చింతిల నేల యీజన
స్థానము ఘోరరాక్షసవితానము గావున నిందుఁ గల్గునా
నానగదుర్గకందరవనంబులఁ గిన్నరమందిరంబులన్
మానుగ నంతట న్వెదికి మానినిఁ గాంతము రాఘవోత్తమా.
| 1194
|
తే. |
అన్న మీఁబోటి బుద్ధిసంపన్ను లగుమ, హానుభావులు నాపదలందు మిగులఁ
గంప మొందరు వాయువేగంబుచేత, శైలములుఁబోలె ధృతధైర్యసారు లగుచు.
| 1195
|
రాముఁడు ఖండితపక్షపాదుఁ డై పడియున్నజటాయువుం గనుట
వ. |
అని బుద్ధిమంతుం డగులక్ష్మణుండు పలికిన నారఘువల్లభుం డతనిం గూడి యధి
జ్యధన్వుం డై క్షురాకారముఖం బైనశరంబు సంధించి యవ్వనంబున నెమ
కుచు నొక్కచోట రక్తసిక్తాంగుం డై పర్వతకూటంబుకరణి నేలం బడి
యున్నగృధ్రనాథుం డగుజటాయువుం జూచి యిద్దురాత్ముండు నిక్కంబుగా
నక్కమలగంధిం బట్టుకొని మెక్కినరక్కసుండు తనమాయవలనఁ బక్షి
రూపంబుఁ గైకొని యున్నవాఁడు నిశితంబు లైనఘోరశరంబుల వీనిం దెగ
టార్చెద నని యలుక తొడమినచిత్తంబునఁ దత్తఱించుచు నొక్కకత్తి
వాతియమ్ము చాపంబున సంధించి పుడమి వడంకునట్లుగా నారి మ్రోయిం
చిన నన్నరశార్దూలుం జూచి పక్షీంద్రుండు భయంబు గొని సఫేనం బగురుధి
రంబు గ్రక్కుచు దీనవాక్యంబున ని ట్లనియె.
| 1196
|
తే. |
అధిప యోషధినట్ల నీ వడవిలోన, వరుస నెద్దాని వెదకుచు వచ్చి తట్టి
పరమసాధ్వి మహీజయుఁ బరఁగ నాదు, ప్రాణ ముభయంబు హృత మయ్యెఁ బరునిచేత.
| 1197
|
సీ. |
అవనీశ యేను జటాయువ గృధ్రనాథుండ నీవును లక్ష్మణుండు లేని
యెడ భవద్దేవిని గడువడి రావణుం డనునిశాచరుఁ డొక్కఁ డపహరించి
కొనిపోవుచుండ నేఁ గనుఁగొని యడ్డంబు వచ్చి యాకసమున వాఁడి మెఱసి
యుద్ధంబుఁ జేసి సముద్ధతి నఖతుండహతుల వాని శరీర మంత వ్రచ్చి
|
|
తే. |
రథముఁ బడఁ దన్ని రథ్యసారథులఁ జంపి, విలు దునిమి ఛత్రచామరంబులును జించి
యలసి తుది నిట్లు తన్నిశాతాసిలూన, పక్షపాదుఁడ నై నేలఁ బడినవాఁడ.
| 1198
|
వ. |
మహాత్మా మదీయనఖచంచుపుటపక్షంబులం దెగిపడినతదీయరథరథ్యసారథి
చ్ఛత్రచామరపతాకాధ్వజచాపప్రముఖపరికరంబుల నన్నిఁటి నవలోకింపు మి
త్తెఱంగున శత్రునిం దొడరి పోరి పోరి పరిశ్రాంతుండ నై ఱెక్కలు దెగి నేలం
గూలి యున్ననన్ను నీవును బదంపడి వధించం బూనుట తగవే యని పలికిన
నారఘుసత్తముండు వాని జటాయువుఁగా నెఱింగి సీతావృత్తాంతశ్రవణంబున
ద్విగుణీకృతశోకతాపుం డై మహోపకారి యగుగృధ్రపతి డాయం బోయి
చాపంబుఁ బరిత్యజించి యతనిం గౌఁగిలించుకొని కొండొకసేపు కన్నీరు
మున్నీరుగా రోదనంబుఁ జేసి సంతాపవిశేషంబున నవశుం డై పుడమిం ద్రెళ్లి
యొక్కింతసేవునకుఁ గ్రమ్మఱ లబ్ధసంజ్ఞుం డై లతాకంటకసంకీర్ణం బగుటం జేసి
యెవ్వరికిం బ్రవేశింపరానియరణ్యప్రదేశంబున పరమదుఃఖితుం డై యసహా
యుం డై యతిప్రయత్నంబున నూర్పులు పుచ్చుచున్నజటాయువుం గని లక్ష్మణు
నవలోకించి యి ట్లనియె.
| 1199
|
రాముఁడు జటాయువుపా టెఱింగి దుఃఖించుట
సీ. |
మానదపూజ్యసామ్రాజ్యంబు పోవుట యటవీనివాస మి ట్లావహిలుట
పత్నీవియోగంబు ప్రాప్తించుటయుఁ బితృసఖుఁడు జటాయువు చచ్చుటయును
లోకంబులో నిట్టిశోకంబు లెవ్వాని కైనను గలవె లో నరసి చూడ
నాయభాగ్యం బే మనంగ వచ్చు సమస్తవస్తుదాహకుఁ డగువహ్ని నైన
|
|
తే. |
నీఱు గావింప నోపు పత్నీవియోగ, జనితతాపంబు వాయ నేసలిలరాశిఁ
బడుదు నన్న మదీయదౌర్భాగ్యమహిమఁ, జేసి యదియును జాల శోషించిపోవు.
| 1200
|
తే. |
జనవరకుమార నాచే నసహ్యమైన, వ్యసన మిబ్భంగి సంప్రాప్త మగుటవలనఁ
బరఁగ నాకంటె నన్యుఁ డభాగ్యతరుఁడు, వసుధలోఁ జూడ నింక నెవ్వాఁడు లేఁడు.
| 1201
|
క. |
ప్రియుఁడు పితృసఖుఁడు వృద్ధుఁడు, నయజ్ఞుఁ డీగృధ్రవిభుఁడు నాభాగ్యవిప
ర్యయమున విలూనపక్ష, ద్వయుఁ డై ధరఁ గూలి యున్నవాఁడు కుమారా.
| 1202
|
క. |
అని పలికి విభుఁడు శోకము, మనమున సైరించుటకు సమర్థత లేమిన్
జనకజ యెక్కడఁ జెపుమా, యని ధరణిం బడియెఁ జిత్త మవశత నొందన్.
| 1203
|
వ. |
ఇట్లు శోకమూర్ఛాపరవశుం డై కొండొకసేపునకుఁ దెలి వొంది వెండియు సౌ
మిత్రి కి ట్లనియె.
| 1204
|
ఉ. |
ఈపతగో త్తముండు మన కెంతయుఁ బ్రీతి యొనర్పఁ బూని తా
నేపునఁ బోరి పోరి తుది నిట్లు విలూనపతత్రపాదుఁ డై
యాపృథివీతనూజవిధ మర్మిలిఁ జెప్పఁగఁ బ్రాణసంయుతుం
జై పడి యున్నవాఁ డిట మదాస్యనిరీక్షణకౌతుకంబునన్.
| 1205
|
వ. |
అని పలికి జటాయువు నవలోకించి.
| 1206
|
సీ. |
అండజోత్తమ రావణుండు జానకి నెట్లు వంచించి గొనిపోయె వాని కేమి
|
|
|
విప్రకారంబుఁ గావించితి నేరూపువాఁ డెంత శౌర్యంబువాఁడు వాని
పట్టణం బెక్కడ బల మెంత చల మెంత కుల మెంత దోశ్శక్తి కొలఁది యెంత
గలవాఁడు నిన్ను సంగ్రామతలంబున నేరీతి నిర్జించె నెచటి కేగెఁ
|
|
ఆ. |
జెప్ప నలవి యేని చెప్పుము జానకీ, వనితవార్త నీదువధవిధంబు
నావుడుం బతత్రినాథుండు సన్నపు, టెలుఁగుతోడ విభున కిట్టు లనియె.
| 1207
|
జటాయువు రామునకు రావణుఁడు సీత నెత్తికొని పోయిన తెఱం గెఱింగించుట
చ. |
జనవర రావణుం డనునిశాచరనాథుఁడు బల్మి జానకిం
గొని గగనంబునం జనుచు ఘోరతరంబుగఁ దాఁకి యడ్డ మై
యని యొనరించి బిట్టలసి నట్టిమదీయపతత్రము ల్రయం
బున నసిధారచే నఱికి పోయె నగస్త్యదిగున్ముఖంబుగన్.
| 1208
|
తే. |
అనఘచారిత్ర యేను జరాన్వితుండ, నగుటవలన రణోర్వి బి ట్టలసియుండ
వాతదుర్దినసంకులావార్యమాయ, నలమి న న్నిట్లు చేసి దశాస్యుఁ డరిగె.
| 1209
|
వ. |
దేవా ప్రాణంబులు పరిక్షీణంబు లయ్యె దృష్టి చలించుచున్నది యలంకృతా
గ్రంబు లైనసువర్ణవృక్షంబులు విలోకించుచున్నవాఁడ రావణుం డేముహూ
ర్తంబున జానకి నపహరించి గొని చనియె నమ్ముహూర్తంబు విజయనామకం
బాముహూర్తంబునందు సష్టం బైనతద్ధనంబు విభునిచేతఁ గ్రమ్మఱ లబ్ధం బగు
నని శాస్త్రప్రమాణంబు గలదు రావణుండు సీతామోహితుం డగుట నది
యెఱుంగఁడు.
| 1210
|
తే. |
పూని బడిశంబు మ్రింగినమీనముగతి, ననఘ జానకి నపహరించినఖలుండు
శీఘ్రమునఁ జచ్చు నీ కింతచింత యేల, పగతుఁ జంపి సుఖంచెదు పడఁతిఁ గూడి.
| 1211
|
జటాయువు మృతుం డగుట
వ. |
మహాత్మా నీకుం జెప్పఁ గలయంత చెప్పితి నింక నీతోడ సంభాషింపం జాల
రావణుని విశ్రవునకుఁ దనయునిఁ గాఁ గుబేరునికిఁ దమ్మునిఁగా నెఱుంగు మని
యిట్లు భ్రాంతిహీనుం డై యుత్తరం బిచ్చుచుండ నప్పుడు సామిషం బగు
రుధిరంబు జటాయువువదనంబున నుండి నిర్గమించెఁ బదంపడి గృధ్రపతి శరీ
రంబు విడిచి ప్రాణంబులు గగనంబున కుద్గమించె నిట్లు దుర్లభంబు లైన
ప్రాణంబులు విడిచి శిరంబు ధరణిం బడవైచి తత్క్షణంబ సంప్రాప్తమరణుం
డయ్యె నిట్లు పంచత్వంబు నొందిన గృధ్రపతిం జూచి పరమదుఃఖాక్రాంత
చిత్తుం డై రాముండు లక్ష్మణున కి ట్లనియె.
| 1212
|
మ. |
చిరకాలంబుననుండి యీవనములో జీవించుచు న్బల్మిచే
నరుదార న్విహరించునీపతగవంశాధీశుఁడు న్నేఁడు నా
కొఱకుం గ్రూరనిశాచరాధమునిచే ఘోరాజిలోఁ జచ్చె ని
ద్ధరలో నిట్టిపరోపకారమృతి యుక్తంబే కదా యేరికిన్.
| 1213
|
ఉ. |
ఎక్కడఁ బట్టణంబు మన కెక్కడఁ బూని యరణ్యసీమకుం
దక్కక వచ్చు టెక్కడఁ బదంపడి సీత నిశాటుచేతిలోఁ
జిక్కుట యెక్కడన్ విహగశేఖరుఁ డీగతి నాజి వానిచే
నిక్కడఁ జచ్చు టెక్కడ హ యేమన వచ్చును దైవతంత్రమున్.
| 1214
|
తే. |
పెద్దకాలంబు జీవించి పిదప నిట్లు, నాకొఱకు నీవిహంగమనాయకులకు
నీవనంబున ననుజుచేఁ జావవలసెఁ, గాలము దుర్యతయం బెంతఘనునకైన.
| 1215
|
రాముఁడు జటాయువునకు దహనాదిసంస్కారంబులఁ గావించుట
వ. |
మఱియుఁ బితృపైతామహం బైనగృధ్రరాజ్యంబుఁ బరిత్యజించి మత్కృతం
బునం బ్రాణంబులు విడిచెఁ దిర్యగ్యోనిగతులయం దైనను సాధులును శూరు
లును ధర్మాత్ములును శరణ్యులు నగువార లిత్తెఱంగునం జూపట్టుచుండుదురు
సీతావియోగదుఃఖంబునకంటె జటాయుర్మరణదుఃఖం బధికం బై యున్నది
యిమ్మహాయశుండు దశరథుండుబోలె మనకుఁ బూజనీయుండు గావున నితని
సంస్కరించుటకుఁ గాష్ఠంబులఁ దెమ్మనిన నతం డట్ల కావింప నారఘువల్లభుండు
పావకునిం బ్రణయించి యపతంగునికళేబరంబు చితామధ్యంబునం
బెట్టి యజ్ఞశీలురును నాహితాగ్నులును భూదానపరులును మొదలుగాఁగల
పుణ్యాత్ములలోకంబు లన్నియుఁ గ్రమంబున నతిక్రమించి నాచేత సంస్కృతుం
డ వై యనుజ్ఞ వడిసి పునరావృత్తిరహితు లైననిత్యముక్తులకుఁ బరమప్రాప్యం
బైన వైకుంఠాఖ్యలోకంబునకుం జని యందు నిత్యనిరతిశయానందం బనుభ
వించుచుండు మని పలికి స్వబంధువునకుంబోలె దుఃఖించుచు జటాయువునకు
మంత్రపూర్వకంబుగా నగ్నిసంస్కారంబుఁ గావించి యనంతరంబ వనంబునం
జని యందు మహామృగంబుల వధించి దర్భాస్తరంబునం దిడి తన్మాంసంబులు
పిండంబులు గావించి హరితశాడ్వలంబునందు జటాయువుకొఱకుఁ బిండప్రదా
నంబుఁ గావించి మృతుం డైనమనుజున కేమంత్రజాతంబు స్వర్గప్రాపకం బని
బ్రాహ్మణులు నొడివి రట్టినారాయణసూక్తయామ్యసూక్తాదికంబు జపించి
గోదావరికిం జని యందు లక్ష్మణసహితంబుగా సుస్నాతుం డై శాస్త్రదృష్టం
బైనవిధిచేత జటాయువునకు సలిలక్రియలు గావించె నిట్లు మహర్షికల్పుం డైన
రామునిచేత సంస్కృతుం డై యప్పతంగకులపుంగవుండు నిత్యం బైనపరమ
గతికిం జనియె నిత్తెఱంగున నారఘుసత్తములు జటాయువునకుం బుణ్యలోకం
బులు కల్పించి యనంతరంబ సీతాన్వేషణతత్పరు లై యచ్చోటు వాసి విష్ణు
వాసవులపగిది మహావనంబుఁ బ్రవేశించి యొక్కింతదూరంబు వరుణదిశాభి
ముఖంబు గా నరిగి క్రమ్మఱ దక్షిణంబునకుం దిరిగి పోవుచు.
| 1216
|
సీ. |
చండదంతావళతుండాగ్రవిదళితచటులకాలతమాలసాలచయము
కరికుంభమాంసభక్షణమత్తమృగరాజఘోషణఘూర్ణితకుంజపుంజ
|
|
|
మతులితభూరినిద్రాసక్తశార్దూలబృందసందీపితకందరంబు
గహనగోచరచరన్మహిషసూకరయూథకర్దమీకృతనిమ్నగాచయంబు
|
|
తే. |
శల్యభల్లూకసారంగచమరసృమర, గోధికాసరఖడ్గప్రఘూర్ణితంబు
నగుమహారణ్యపదమున నర్కవంశ, వర్యు లరిగిరి కోదండపాణు లగుచు.
| 1217
|
వ. |
ఇత్తెఱంగునఁ గ్రోశత్రయమాత్రదూరం బతిక్రమించి యవ్వల.
| 1218
|
క. |
నానాఖగమృగయుక్తము, నానావ్యాధాన్వితము ఘనప్రఖ్యము స
న్మానిత మగుక్రౌంచం బను, కాననమునఁ జనిరి భూరికార్ముకధరు లై.
| 1219
|
వ. |
ఇ ట్లమ్మహారణ్యంబున నర్ధయోజనదూరం బరిగి యంత నంత వైదేహి నన్వే
షించుచు నక్కాననంబు గడిచి యవ్వల మతంగాశ్రమసమీపంబునం బొల్చు
ఘోరారణ్యంబుఁ బ్రవేశించి యపరిక్షుణ్ణమార్గంబునఁ బోవుచుఁ దన్మధ్య
దేశంబున.
| 1220
|
తే. |
కటికిచీఁకటికతమునఁ గాన రాక, మహితపాతాళలోకసమాన మగుచుఁ
గ్రాలు గంభీర మగునొక్కగహ్వరంబు, పోలఁ జూచి తదంతికభూమియందు.
| 1221
|
లక్ష్మణుండు తన్ను మోహించిన రాక్షసి కర్ణనాసికాస్తనముల ఖండించుట
చ. |
వికటను ఘోరరూపిణి వివేకవిహీనను ముక్తమూర్ధజన్
వికృతముఖిం గరాళను బ్రవృత్తహరిద్విపమాంసభక్షణం
గ్రకచసమానదంష్ట్ర నురుకాయను దుస్త్వచ నుగ్రనేత్ర నం
దొకబలురక్కసిం గని తదున్నతి కచ్చెరు వొందుచుండఁగన్.
| 1222
|
తే. |
అది రయంబునఁ జనుదెంచి యన్నమ్రోల, నున్నలక్ష్మణుఁ గౌఁగిట నొత్తిపట్టి
యాలిఁగా నన్ను వరియించి యచలకూట, సానువులయందు సంక్రీడ సలుపు మిచట.
| 1223
|
చ. |
అన విని లక్ష్మణుండు కుపితాత్మకుఁ డై వెస శాతఖడ్గముం
గొని కుచకర్ణనాసికముఁ గోసిన మేఘముభంగి నార్చుచున్
దనుజ భయంబు మైఁ బఱచె దారుణవైఖరి నంత రాజనం
దను లతిదుర్గకాననపదంబునఁ బోవుచు నుండ నంతటన్.
| 1224
|
ఉ. |
అన్నను జూచి లక్ష్మణుఁడు ప్రాంజలి యై సుమృదూక్తిఁ బల్కు నో
సన్నుతశీల మద్విపులసవ్యభుజంబు చలించెఁ జిత్త మా
పన్నత నొందెడు న్మఱియు భవ్యనిమిత్తము లెల్లఁ దోఁచెడుం
బన్నుగ వంజుళాఖ్య మగుపక్షి జయావహభంగిఁ గూసెడిన్.
| 1225
|
వ. |
కావున మనకు ముందఱ నొక్కయసహ్యం బైనభయంబు గలుగుఁ బదంపడి
మితి పెట్టరానిశుభంబు దొరకొను దానిం బరామర్శింపవలయు నని పలికిన
నతనిపలుకు విని రఘువల్లభుం డది యెట్లో యని విచారించుచుం బోవు
నెడ.
| 1226
|
తే. |
అడవిఁ గలభూరుహము లెల్లఁ బుడమిఁ జాప, కట్లు పడఁగ దుమారంపుగాలి విసరెఁ
గోటిపిడుగులమ్రోఁతకు సాటి యగుచు, విపులశబ్దంబు ఘోర మై వినఁగఁబడియె.
| 1227
|
రామలక్ష్మణులు కబంధునిబాహుపాశమునఁ జిక్కువడుట
సీ. |
పొడువుదేహమువాఁడు వెడఁదవక్షమువాఁడు వ్యపగతగళశీర్షుఁ డైనవాఁడు
నిశితంబు లగురోమనిచయంబు గలవాఁడు కడుపున బలుమోము గలుగువాఁడు
నురునగేంద్రముమాడ్కి నున్నతుం డగువాఁడు కాలమేఘముభంగిఁ గ్రాలువాఁడు
నీలజీమూతంబులీల గర్జిలువాఁడు భయదాట్టహాససంభ్రమమువాఁడు
|
|
తే. |
పింగపక్షంబువృత్తంబు భీషణాగ్ని, కణచయోన్మేష మగు నొక్కక న్నురమునఁ
బరఁగ నొప్పెడువాఁడు కబంధుఁ డనెడు, కఠినరాక్షసుఁ డొక్కఁడు గానఁబడియె.
| 1229
|
వ. |
మఱియు నారాక్షసుండు యోజనప్రమాణాయామంబు గలతనబాహువులు
సాఁచి లోఁబడినసింహవ్యాఘ్రతరక్షుభల్లూకవరాహాదివనమృగంబుల భక్షిం
చుచు మత్తుం డై నిలిచియుండ వానిబాహువులనడుమఁ జిక్కి వెడల నుపా
యంబులేక క్రోశమాత్రం బరిగి సమీపస్థు లగుటయు వాఁడు బలాత్కారం
బున బాహుపాశంబుల నమ్మహాత్ముల నాకర్షించిన వారు కబంధబాహుపీడితు
లై వివశత్వంబు నొంది రందు రాముందు శూరాగ్రేసకుండు గావును నొకింత
ధైర్యం బవలంబించి వ్యథితుండు గాక యుండె నప్పుడు లక్ష్మణుండు విష
ణ్ణుం డై యున్న కి ట్లనియె.
| 1230
|
సీ. |
మనుజనాయక మేను దనుజునిచేఁ జిక్కి వివశుండ నైతి న న్వీని కింక
బలిగా సమర్పించి ప్రాణము ల్దక్కించుకొని నీవు తొలఁగి పొ మ్మనఘచరిత
యటు లైన వైదేహి నల్పకాలంబునఁ బొంది పిత్రం బైనపూజ్యరాజ్య
మేలెద వపుడు న న్నెలమి మనంబునఁ గడు సంస్మరింపుము కరుణఁ జేసి
|
|
తే. |
యనఁగ నారాముఁ డింతభయంబు దగునె, యనుచుఁ దమ్ముని బోధించె నంతలోనఁ
గ్రూరుఁ డగు రాక్షసుఁడు ఘనఘోషణమున, నమ్మహాత్ములతోడ ని ట్లనుచుఁ బలికె.
| 1231
|
ఉ. |
ఎవ్వరు మీర లీవనికి నేటికి వచ్చితి రిమహావనం
బెవ్వరు చూడఁగా వెఱతు రింతకు దైవము దెచ్చె మిమ్ము మీ
క్రొ వ్వడగంగఁ బట్టుకొని గొబ్బున మ్రింగెద జీవితంబుతో
నెవ్విధి మీకు నొండుకడ కేగఁగ వచ్చు నిఁక న్రయోద్ధతిన్.
| 1232
|
రాముఁడు కబంధుబాహువులఁ జిక్కుబడుటకు దుఃఖించుట
ఉ. |
నా విని రాఘవుండు వదనంబున దైన్యము దోఁపఁగా సుమి
త్రావరపుత్రుతో ననియెఁ దమ్ముఁడ దుఃఖముమీఁద దుఃఖ మి
క్కైవడి నుత్తరోత్తరము గాఢతరంబుగఁ గాననంబులో
జీవితహాని గల్గునటు చేకుఱుచున్నది యేమి చేయుదున్.
| 1233
|
తే. |
కాల మెంతటిఘను లైనఁ గడవఁజాల, రనఘ పౌరుష మెల్ల నిరర్థకంబు
గాన నిన్నును నన్ను నిక్కాలమందు, దైవ మాపన్నులఁగఁ జేసెఁ దలఁపు లేల.
| 1234
|
వ. |
వత్సా సర్వభూతంబులలోనఁ గాలంబునకే మహావీర్యంబు గల దక్కాలంబు
నకు సర్వభూతసంహారంబు ప్రయాససాధ్యంబు గాదు సులభసాధ్యం బై
యుండు.
| 1235
|
తే. |
ఎంత బలవంతు లైనఁ దా రెంత శూరు, లైన నెంతకృతాస్త్రకు లైనమనుజు
లవని వాలుకసేతువు లట్ల వెస న, శింపుదురు కాలవశమునఁ జేసి వత్స.
| 1236
|
వ. |
అని యిట్లు పెక్కుచందంబులఁ దనదురవస్థకుం బొక్కుచు దృఢసత్యవిక్ర
ముండును మహాయశుండును బ్రతాపవంతుండు నగురాముండు సముదగ్ర
పౌరుషుం డగుసౌమిత్రి నవలోకించి తనచిత్తంబు స్థైర్యయుక్తంబుఁ గావించు
కొని యుండె నప్పు డాకబంధుండు నిజబాహుపాశపరిక్షిప్తు లయిన దాశరథులం
జూచి దైవవశంబునం జేసి మీరు క్షుధార్తుండ నైననాబాహువులం జిక్కితి
రింకఁ దడ వేల నాకు నాహారంబు గం డనవుడు సుమిత్రానందనుండు పర
మార్తుం డయ్యును ధైర్యంబుకలిమి విక్రమంబునందుఁ గృతనిశ్చయుం డై
రామున కి ట్లనియె.
| 1237
|
లక్ష్మణుఁడు రామునితోఁ గబంధుబాహువుల ఖండింపవలయు ననుట
మ. |
అనఘా వీఁడు దురాత్మకుండు గురుబాహాసత్త్వయుక్తుండు లో
కనికాయంబుల నొక్కటం గడఁగి మ్రింగంజాలువాఁ డింక నొ
క్కనిమేషం బెడఁజేసితేని మసలన్ గర్వోద్ధతి న్మ్రింగు న
పనికిం బూనక మున్నె వీనిభుజముల్ భద్రాసి ఖండింపుమా.
| 1238
|
వ. |
దేవా యాగబాహ్యంబు లైనపశువుల వధించినవారికిం బోలె నకృతపరా
క్రము లైనవారి వధించినవారికిఁ బాపంబు గలుగుం గాని యిట్టిదురా
త్మునిం జంపినవారికిఁ బాపంబు లేదు గావున నాలస్యంబు సేయక వీనికరం
బులు ఖండింపుము.
| 1239
|
తే. |
అనుచు లక్ష్మణుఁ డన్నతో నాడుమాట, విని కబంధుఁడు కోపప్రవిష్టుఁ డగుచు
ఘోరపాతాళనిభ మైననోరు దెఱచి, యసముతో మ్రింగ గమకించునంతలోన.
| 1240
|
వ. |
దేశకాలజ్ఞు లగునమ్మహాపురుషులు నిశితంబు లైనకృపాణంబు లంకించి.
| 1241
|
తే. |
దనుజుదక్షిణబాహువుఁ దునిమె రాముఁ, డంతఁ దోడ్తోడ సౌమిత్రి యసురుసవ్య
కరము దునియంగ నేసె నీగతి నికృత్త, బాహుఁ డై వాఁడు రోఁజుచుఁ బడియె నపుడు.
| 1242
|
వ. |
ఇట్లు కబంధుండు విలూనబాహుం డై నెత్తుటం దోఁగి జలధంబుమాడ్కిఁ బుడ
|
|
|
మియు గగనంబు దిక్కులుం బగుల నార్చుచు మహీతలంబునం ద్రెళ్లి దీనుం డై
మీ రెవ్వ రని యడిగిన నద్దానవునకు లక్ష్మణుం డి ట్లనియె.
| 1243
|
ఆ. |
ఇమ్మహానుభావుఁ డిక్ష్వాకుదాయాదుఁ, డనఘమూర్తి రాముఁ డనఁగ నొప్పు
నేను లక్ష్మణుండ నితనికిఁ దమ్ముఁడ, నెపుడు భ్రాతృభక్తి నెసఁగువాఁడ.
| 1244
|
ఆ. |
అంబచేత రాజ్య మపహృత మగుచుండఁ, బత్నితోడఁ గూడి భానుకులుఁడు
మత్సమేతుఁ డగుచు మహితాటవికి వచ్చి, యొక్కచో వసించి యుండు నంత.
| 1245
|
క. |
మ్రుచ్చిలి రక్కనుఁ డొక్కఁడు, సచ్చరితుని రామవిభునిసతిఁ గొని పోయెం
జెచ్చెర నద్దేవిని మే, మిచ్చట శోధించువార మెంతయుఁ గడఁకన్.
| 1246
|
కబంధుఁడు రామలక్ష్మణులకుఁ దనచరిత్రం బెఱింగించుట
వ. |
మా తెఱం గిట్టిది నీ వెవ్వండ వేమి కారణంబున భగ్నజంఘుండ వై యురం
బున ముఖంబు గలిగి కబంధసదృశుండ వై యివ్వనంబునం జరియించెద వని
యడిగిన నారక్కసుండు పరమప్రీతుండై యింద్రవచనంబుఁ దలంచి లక్ష్మణున
కి ట్లనియె.
| 1247
|
సీ. |
అనఘాత్మ సౌభాగ్యమున మిముఁ బొడగంటిఁ బరమకోపమునఁ గృపాణధారఁ
గరములఁ ద్రుంచినకారణంబున నాదువెత లెల్లఁ బాసె నీవికృతరూప
మేను బూనుట కైన హేతువుఁ జెప్పెద విను తొల్లి యసమానవిక్రమమున
సూర్యపురందరసోములచందాన దివ్యరూపముఁ దాల్చి త్రిభువనమున
|
|
తే. |
సంచరించుచు బలగర్వసంభ్రమమున, లోకభీకర మీరూపు వీఁకతోడఁ
దాల్చి వనవాసరతు లగుతాపసులకు, నురుభయము పుట్టఁ దిరుగుచు నొక్కనాఁడు.
| 1248
|
వ. |
స్థూలశిరుం డనుమునిపతి వెఱపింపంబోయిన ఘోరశాపభాషణశీలుం డైనయమ్మ
హాత్ముండు కోపించి లోకవిగర్హితంబును ఘాతుకంబు నైనయిట్టివికృతరూపంబున
నన్నుఁ దిరస్కరింపవచ్చితివి గావున నీరూపంబునన యుండు మని ఘోరం బగుశాపం
బిచ్చిన నేను భయంబుఁ గొని కరంబులు మోడ్చి శాపమోక్షణం బనుగ్రహింపు
మని ప్రార్థించిన నత్తాపసోత్తముండు దయాళుం డై యిక్ష్వాకునాథుం డగురాముం
డెప్పుడు విజనం బైనవనంబున నీభుజంబులు ఖండించి నీశరీరంబు దహించు
నప్పు డీవికృతరూపంబు విడిచి శుభం బైనపూర్వరూపంబుఁ గైకొనియెద వని
యానతిచ్చె నన్ను దనుపుత్రునిఁ గా నెఱుంగు మదియునుం గాక యీవికృతా
కారంబు గలుగుట కింద్రకోపంబుం గారణం బై యుండు నదియునుం గొంత
యెఱింగించెద వినుము.
| 1249
|
క. |
ఏ నుగ్రతపంబునఁ జతు, రానను ముదితాత్ముఁ జేసి యవ్విభుచేత
న్మానుగ దీర్ఘాయువు స, న్మానంబునఁ బడసి దురభిమానముపేర్మిన్.
| 1250
|
వ. |
పురందరుండు న న్నేమి సేయం గలఁ డని తిరస్కరించి యతనితో రణంబుఁ
గావించినం దేవతావల్లభుం డలిగి శతపర్వం బైనవజ్రంబుఁ బ్రయోగించిన నయ్య
|
|
|
మోఘాయుధప్రభావంబున మదీయకంఠంబును నూరువులును శరీరంబు సొచ్చె
శక్రుండు నాచేతం బ్రార్థితుం డై విరించివచనంబుఁ దలంచి నాకు మృతి
లేకుండఁ బ్రసాదించె నంత నేను భగ్నస్కంధశిరోముఖుండ నై యాహారంబు
లేక బహుకాలం బెట్లు జీవింతు ననిన నయ్యింద్రుండు యోజనాయతంబు లైన
బాహువు లొసంగి తీక్ష్ణదంష్ట్రాకరాళయుక్తం బైనముఖంబు కుక్షియందుఁ
గలుగునట్లుగా సంఘటించి నీవు కాంతారంబుఁ బ్రవేశించి సింహద్విపవరాహ
వ్యాఘ్రంబుల నాకర్షించి భక్షించుచుండుము కొంతకాలంబునకు రాముండు
లక్ష్మణయుతుం డై వచ్చి నిశితకృపాణంబుల నీబాహువులు ఖండించు నప్పు
డీవికృతరూపంబుఁ బాసి నాకంబునకుం జనుదెంచెద వని యాదేశించె నాఁటం
గోలె నేను వికృతదేహత్యాగకృతోద్యోగుండ నై భవదాగమనంబుఁ గోరుచు
నివ్వనంబుఁ బ్రవేశించి యిది భక్ష్యం బిది యభక్ష్యం బని విచారింపక బాహువు
లకుం జిక్కినసత్వంబుల నెల్ల నాకర్షించి భక్షించుచుం జరియించుచున్నవాఁడ
మునిశక్రులచేతఁ బలుకంబడినచందంబున నారామభద్రుండ వీవె యని యెఱింగితి
నీవు దక్క నన్యుండు నన్ను జయించుటకు శక్తుండు గాఁడు మీరు మహానుభా
వుల రగుటం జేసి నన్నుం గృతార్థునిం జేయుటకు నిచ్చటికిం జనుదెంచి మదీ
యభుజంబులు తునియ నేసితి రేను మీతోడ సాచివ్యంబుఁ జేసి కార్యసిద్ధి వడ
యుటకుఁ దగినమిత్రుని నెఱింగించెద ననిన నతనివచనంబులు విని రాముండు
లక్ష్మణుండు వినుచుండ వాని కి ట్లనియె.
| 1251
|
ఉ. |
తమ్ముఁడు నేనుఁ గాననపదంబున దూరము పోయి యుండఁ జౌ
ర్యమ్మున జానికి న్బలిమి రావణుఁ డాఁచికొనెం దదీయనా
మమ్మును దక్క రూపమహిమంబులు వాస మెఱుంగఁ దత్ప్రకా
ర మ్మెఱిఁగించి మమ్మ సుకరమ్ముగ క్షేమము నొందఁ జేయుమా.
| 1252
|
క. |
శోకార్తుల మై ది క్కఱి, తేఁకువ సెడి యివ్విధమునఁ ద్రిమ్మరుమమ్ముం
జేకొని కారుణ్యముతో, భూకన్యకవార్తఁ దెలిపి ప్రోవుము దనుజా.
| 1253
|
తే. |
సత్వరంబుగ శుష్కకాష్ఠములచేత, నిను దహించెద మ ట్లైన ననిమిషత్వ
మొందెదవు మది సందియ మంద వలవ, దెఱిఁగితేనియు జానకితెఱఁగుఁ జెపుమ.
| 1254
|
వ. |
అనినఁ గబంధుండు రామున కి ట్లనియె.
| 1255
|
శా. |
అజ్ఞానాకృతి నుంటఁ జేసి రఘువర్యా శాపదోషంబున
న్విజ్ఞానం బది లేదు గావున సతీవృత్తాంతముం జెప్పఁగాఁ
బ్రజ్ఞాధిక్యము లేదు యీతనువుఁ గాల్పం బిమ్మట న్బూరిది
వ్యజ్ఞానంబున జూచి చెప్పెద మహాత్మా యట్లు గావింపవే.
| 1256
|
రామలక్ష్మణులు కజంధునికళేబరంబు దహించుట
వ. |
మఱియు సూర్యుండు చరమశిఖరిశిఖరాంతర్గతుండు గాకమున్నె మదీయశరీరం
బవటంబున నిక్షేపించి విధిప్రకారంబున వహింపు మ ట్లేని సీతావృత్తాంతం
బును రాక్షసునిచందంబును వానిం బరిమార్చుటకు సఖ్యంబు సేయందగిన
వీరోత్తము నెఱింగించెద నాచేత బేర్కొనంబడినవానితోడ నీవు న్యాయవృ
త్తంబున సఖ్యంబుఁ గావింపు మతండు నీకు సాహాయ్యం బాచరించు ముల్లో
కంబులయందు నతనికి విదిశంబు గాని యర్థం బొక్కిం తైన లే దతండు ము
న్నొక్కకారణంబున ముజ్జగంబులం జరించియున్నవాఁ డని పలికిన నట్ల కాక
యని రఘువల్లభుండు లక్ష్మణుం జూచి రాక్షసునికళేబరంబు దహింపు
మనిన నతండు సమీపంబునఁ గుంజరంబుచేత భగ్నంబు లైనశుష్కకాష్ఠంబు
లొక్కబిలంబులోనఁ గొండపొడువునం గుట్ట వైచి దానిమీఁద ఘృతపిండో
పమం బైనకబంధునికళేబరంబుఁ బెట్టి యనలు దరికొల్పిన నయ్యగ్నిదేవుండు
మేదఃపూర్ణం బగుటవలన వానిమహాకళేబరంబు మందంబుగాఁ గొండొక
సేపునకు నిశ్శేషంబుగా దహించె నంతఁ గబంధుం డవ్వికృతరూపంబు విడిచి
దివ్యరూపధరుం డై యచ్చితామధ్యంబుననుండి గగనంబున కెగసి దివ్యమా
ల్యోపశోభితుండును దివ్యగంధాధివాసితుండును విరజోంబరధరుండును సర్వ
ప్రత్యంగభూషణుండు నై సూర్యునిభంగి వెలుంగుచున్నహంసయుక్తం బగు
దేవయానంబునం గూర్చుండి నిజతేజోజాలంబున దశదిశలు వెలుంగం జేయుచు
నంతరిక్షంబున నుండి రామున కి ట్లనియె.
| 1257
|
కబంధుఁడు దివ్యరూపము దాల్చి రామునితో సుగ్రీవసఖ్యము సేయుమని బోధించుట
సీ. |
భూమిశ యేగుణంబులచేత నీసర్వవస్తుజాతం బనవరత ముర్వి
నతివిచారిత మగునట్టిసంధియు విగ్రహంబు యానం బాసనంబు నాశ్ర
యంబు ద్వైధీభావ మనుగుణంబులు గల వరయంగ దురవస్థ నధిగమించి
నట్టిమర్త్యుఁడు తనయట్టులే దురవస్థ నొందినవానిచే నుత్సుకముగ
|
|
తే. |
సేవ్యుఁ డగు దారధర్షణజవ్యసనము, నధిగమించుటకతన మహానుభావ
యనుజయుతముగ నీవు హైన్యంబు నొంది, యధికదుర్దశాపన్నుండ వైతి విపుడు.
| 1258
|
వ. |
కావున నవశ్యంబు సమానావస్థాపన్నుం డైనవానితో మైత్రి సేయుట యుక్తం
బట్లు సేయనినాఁడు కార్యసిద్ధి దొరకొన దట్టివాని నెఱింగించెద వినుము.
| 1259
|
సీ. |
అనిమిషపతిపుత్రుఁ డగువాలి క్రుద్ధుఁ డై దయమాలి తనుఁబ్రోలుదాఁట ననుప
నతనితమ్ముఁడు మహాచతురుండు సుగ్రీవుఁ డనువానరశ్రేష్ఠుఁ డధికభీతిఁ
బంపాసరోవరపర్యంతశోభితం బగుఋష్యమూకాచలాగ్రమందు
సచివచతుష్టయసహితుఁ డై వసియించియున్నవాఁ డతఁడు శూరోత్తముండు
|
|
తే. |
సత్యసంధుండు విక్రమశాలి సకల, కార్యవిదుఁడు కృతజ్ఞుం డకల్మషుండు
వానితో నెయ్య మొనరించితేని నీదు, కార్య మంతయు సాధింపఁగలఁ డధీశ.
| 1260
|
వ. |
మఱియు నతండు ప్రతాపవంతుండును నమితప్రభుండును ద్యుతిమంతుండును
వినీతుండును మతిమంతుండును మహాబలపరాక్రముండును బ్రగల్బుండును సమ
ర్థుండు నై యుండు.
| 1261
|
ఆ. |
మానవంతు లైనమముబోఁటి యధికులు, హీనజాతిమైత్రి నెసఁగు టెట్టు
లనఁగ వలదు కారణాంతర మదియు దు, ష్కరము గాదె జగతిఁ గాలసరణి.
| 1262
|
చ. |
అతిబలవంతుఁ డైనప్లవగాధిపునిం గన నేగి వానితో
నతిహితబుద్ధి మైత్రి వినయంబునఁ జేయుము వేగ పొమ్ము నీ
వతఁడు కృతజ్ఞుఁ డాప్తుఁడు బలాఢ్యుఁడు దక్షుఁడు నీదుకార్య మం
చితగతిఁ జక్కఁ జేయు నృపశేఖర నెవ్వగ దక్కు నెమ్మదిన్.
| 1263
|
చ. |
మఱియు నతండు వైరికులమర్దనదక్షుఁడు కామరూపి వా
నరవరుఁడు న్సహాయము మనంబునఁ గోరెడువాఁడు గావునం
గర మనురక్తి మీకు నుపకారము సేయఁ గలండు మీరునుం
బరమకృపాప్తి వానివెతఁ బాయఁగఁ జేయుఁడు సత్య మేర్పడన్.
| 1264
|
క. |
సిరి పోవుట కాననమునఁ, జరియించుట మొదలు గాఁగ సర్వావస్థ
ల్నరవర యతనికి నీకును, సరి యై యున్నయవి చూడ జతనము లగుచున్.
| 1265
|
క. |
కావున మీ రన్యోన్యము, పావకసన్నిధిని మైత్రిఁ బ్రకటించి సుసం
భావితు లై ప్రాపుగ నయ, కోవిద కార్యములు దీర్చుకొనుఁ డుచితగతిన్.
| 1266
|
వ. |
దేవా యత్తరుచరశ్రేష్ఠుండు క్షీణదశాయుక్తుం డైనను హితాన్వేషణంబు
నందు శక్తుం డై యుండు నతండు కృతార్థుం డైనఁ గాకున్న భవచ్చికీర్షితకా
ర్యం బవశ్యంబు గావించు నతండు సూర్యున కౌరసుండు ఋక్షజునకు క్షేత్ర
జుండు వాలిచేతఁ గృతకిల్బిషుం డగుటవలన శంకితుం డై పంపాతీరంబునం
జరించుచుండు నాయుధంబు వహ్నిసమీపంబునం బెట్టి సత్యంబున నతని
వయస్యునిం గాఁ బరిగ్రహింపు మతండు లోకంబునందు రాక్షసస్థానంబు లెన్ని
గల వన్నియు నైపుణ్యంబున శోధింపం గలండు గావున.
| 1267
|
సీ. |
నరనాథ భాస్కరకిరణసంచారంబు గలయంతధరణిలోఁ గపికులేంద్రుఁ
డెఱుఁగనిదేశ మొకిం తైన లే దట్లు రూపింపఁగాఁ గామరూపు లైన
కపుల నద్దెసలకు కడఁకతోఁ బనిచి నదీశైలదుర్గప్రదేశములును
వెదకించి రావణు వీటిలోపల నున్నఁ గనకాచలాగ్రభాగమున నున్న
|
|
తే. |
వేచి పాతాళతలమున దాఁచి యున్న, రాక్షసుల నెల్లఁ దెగటార్చి రమణతోడ
జానకిని దోడి తెచ్చి ప్రసన్నభక్తి, నీకు నర్పించు మనమున నెగులు వలదు.
| 1268
|
వ. |
అని సీతాప్రాపణంబునందు రామునకుఁ దగినయుపాయం బెఱింగించి యర్థజ్ఞుం
డగుకబంధుండు వెండియు ని ట్లనియె.
| 1269
|
కబంధుఁడు రామలక్ష్మణులకు సుగ్రీవునికడ కేగుటకు మార్గముఁ జూపుట
క. |
ఇదిగో మార్గము క్షేమా, స్పద మై పశ్చిమము మిగిలి సకలద్రుమసం
పదలం బొలుపొందుచు ను, న్నది కంటకశిలలచేత నరవర కంటే.
| 1270
|
సీ. |
పనసభూరుహములు ప్లక్షవృక్షంబులు కరవీరతరువులు కర్ణికార
కుజములు పటువటకుటజనీలాశోకతిందుకపాటలీచందనామ్ర
మందారపిప్పలీమాతంగపున్నాగపారిభద్రద్రుజంబీరజంబు
తిలకాగ్నిముఖ్యాదిఫలితపుష్పితపల్లవితమహాద్రుమము లద్భుతము గాఁగ
|
|
ఆ. |
నలరుచుండు నందు నమృతకల్పము లగు, ఫలము లవని రాల్చి సలలితముగఁ
గాంక్షఁ దీఱ మెసవి ఘనసత్త్వయుక్తు లై, యధికసత్వరముగ నవలఁ జనుఁడు.
| 1272
|
వ. |
ఇత్తెఱంగున నమ్మహారణ్యం బతిక్రమించి యవ్వల.
| 1273
|
క. |
నందనచైత్రరథంబుల, చందంబున రమ్య మగుచు సర్వస్వాంతా
నందకరం బై జనులకు, నందం బై యొక్కవిపిన మలరారు రహిన్.
| 1274
|
వ. |
అమ్మహావనం బుత్తరకురుదేశంబులచందంబున మనోహరం బై యలరు నందు
మేఘపర్వతసన్నిభంబులును ఫలభారవంతంబులును మహావిటపసంకులంబులును
సర్వర్తుసేవితంబులును సర్వకామఫలంబులు నగుపాదపంబులు తేనియలు
గురియుచుండు నన్నగంబు లెక్కి యమృతకల్పంబు లగుఫలంబులు కోసి తెచ్చి
లక్ష్మణుండు సమర్పించు నవి యుపయోగించి యవ్వనంబు దాఁటి యవ్వల
సదృష్టపూర్వంబు లగుదేశంబులును వనంబులును శైలంబులు నంత నంత
నవలోకించుచుఁ బోవం బోవఁ బంప యనుపేరు గల యొక్కపుష్కరిణి గానం
బడు నది మఱియును.
| 1275
|
క. |
కమలోత్పలసేవితయును, సమతీర్ధయు నిర్మలయు నశైవలయు నవి
భ్రమయు నశర్కరయు నక, ర్ధమయు సువాలుకయు నగుచుఁ దనరారు రహిన్.
| 1276
|
క. |
క్రౌంచంబులు కురరంబులు, నంచలు కారండవంబు లంభోజదళ
ప్రాంచన్మధుపము లనిశం, బంచితముగ మ్రోయుచుండు నతిమధురముగన్.
| 1277
|
వ. |
మఱియు నచ్చటిఖగంబులు జలచరంబులు నెన్నఁడు నొక్కింతభయం బెఱుం
గని వగుటవలన నరులం జూచి భయంబుఁ గొన వచ్చట నున్న ఘృతపిండో
పమంబు లగు స్థూలవిహంగమంబుల నకృశరోహితవక్రతుండనడమీనప్ర
భృతిమహామత్స్యంబులను లక్ష్మణుండు వధించి తెచ్చి శూలప్రోతదగ్ధంబులును
నిష్కంటకంబులునుం గాఁ జేసి ప్రియపూర్వకంబుగా నీకు సమర్పించు భక్షణా
నంతరంబునఁ బద్మగంధబంధురంబును ననామయంబును నక్లిష్టంబును సుఖ
|
|
|
శీతంబును శుభంబును రూప్యస్ఫటికసన్నిభంబు నగుసలిలంబుఁ బుష్కర
పత్రపుటంబునం బట్టి తెచ్చి పానార్థం బొసంగు మఱియు జలావగాహనార్థంబు
గిరిగుహాశయంబులును రూపాన్వితంబులు నగువరాహంబు లచ్చటికిం జను
దెంచి వృషభంబులభంగి గర్జించుచు నిత్యంబును సంచరించుచుండు నచ్చటి
వృక్షంబులు మాల్యాలంకృతంబు లై యుండు నీవు సాయాహ్నసమయంబున
నమ్మహాపుష్కరిణీతీరంబున సంచరించుచుఁ దదీయశీతోదకంబును దత్తీరసం
భూతపుష్పితకాననంబును సంఫుల్లకమలోత్పలంబులును బూర్వోక్తవస్తుజా
తంబును సర్వంబును విలోకించి విగతశోకుండ వయ్యెద వదియునుం గాక.
| 1278
|
సీ. |
ధరణీశ మున్ను మతంగశిష్యులు మునిశ్రేష్ఠు లాఘనసరసీతటమున
వసియించి యుందురు వారు గుర్వర్ధంబు వన్యంబుఁ దెచ్చుచు వన్యభార
పీడితు లగుటయుఁ బృథుపరిశ్రమమునఁ దత్కాయములనుండి తఱచు గాఁగ
ఘర్మజలంబులు గంధవాహప్రేరితంబు లై వెస వ్రాలెఁ దరువులందు
|
|
తే. |
నందుఁ బూచినకుసుకుంబు లనవరతము, వాడవు నశింప వమ్మునివరులభూరి
తరతపోమహిమంబునఁ దాల్ప రెవ్వ, రేమి చెప్పుదు నాచిత్ర మినకులేశ.
| 1279
|
క. |
చిరజీవిని శ్రమణియుఁ ద, త్పరిచారిణియును దపఃప్రభావాన్వితయున్
గురుమతియు శబరి యన నొక, పరమతపస్విని వసించు బాగుగ నచటన్.
| 1280
|
తే. |
దేవసముఁడవు మౌనిసంభావితుఁడవు, మానధనుఁడవు భూతనమస్కృతుండ
వైననినుఁ బోలఁ జూచి కృతార్థ యగుచు, శబరి స్వర్గలోకమునకుఁ జను మహాత్మ.
| 1281
|
వ. |
మఱియు నాపుష్కరిణీపశ్చిమతీరంబున గుహ్యం బగునొక్కమహనీయాశ్ర
మంబు గల దదియె శబర్యాశ్రమం బయ్యరణ్యదేశం బంతయు బహువిధగజో
పేతం బయ్యు నందేకదేశస్థితం బైనశబర్యాశ్రమంబు తదీయతపఃప్రభావం
బున గజరహితం బై యుండు నవ్వనంబు మతంగమునినిర్మితం బగుటం జేసి
మతంగవనం బన విశ్రుతిం గన్నయది నందనచైత్రరథసంకాశం బైనయమ్మహా
వనంబున నిర్వృతుండ వై విహరింపు మదియునుం గాక.
| 1282
|
సీ. |
పంపాసరోవరప్రాగ్దేశమున ఋశ్యమూకనామకమహాభూధరంబు
గల దది బాలనాగములచే రక్షిత మగుట దురారోహ మై తనర్చుఁ
గడువేడ్కతో సృష్టికాలంబునందు విరించి సొంపార నిర్మించె దాని
నెఱిఁ దచ్ఛిరంబుపై నిద్రించి నరుఁడు స్వప్నంమున నేవిత్తంబు వడయు నట్టి
|
|
తే. |
దాని మేల్కొని వడయును దాన నదియు, దార మన విశ్రుతి వహించె ధరణినాథ
పరఁగ నది విషమాచారపరుల కిల న, సౌమ్యులకుఁ బాపరతుల కగమ్య మరయ.
| 1283
|
వ. |
నరేంద్రా విషమాచారులు పాపకర్ములు నగువా రప్పర్వతం బెక్కి నిద్రించిన
రాక్షసులు వారిం బట్టుకొని ప్రహరింతురు బాలగజంబులనిస్వనంబు ని
రంతరంబుగా వినంబడుచుండు మఱియు మేఘవర్ణంబు లగుమహాద్విపంబులు
|
|
|
పరస్పరాభిహతంబు లగుటవలన రుధిరావసిక్తంబు లై పృథక్కీర్ణంబులై సంచ
రించు నొక్కొక్కవేళ జలపానార్థంబు పంపాపుష్కరిణికిం జనుదెంచి శీతోద
కంబుఁ గ్రోలి కొండొకసేపు జలంబులం గ్రీడించి యథేచ్ఛం జనుచుండు
నచ్చటివిశేషంబు లన్నియు విలోకించి శోకంబుఁ బరిత్యజించెదవు.
| 1284
|
చ. |
జనవర యన్నగాగ్రమున సంభృతభూశిలాపిధాన మై
ఘనతరదుష్ప్రవేశ మయి గహ్వర మొక్కటి యొప్పు దానితూ
ర్పున బహుసత్వ మై రుచిరమూలఫలాన్విత మై సురమ్య మై
యనుపమశీతవారియుత మై హ్రద మొక్కటి పొల్చు నయ్యెడన్.
| 1285
|
తే. |
కపిచతుష్టయయుక్తుఁ డై తపనపుత్రుఁ, డైనసుగ్రీవుఁ డాగుహ నధివసించి
యుండు నెపు డైన నొకవేళ నున్నతాద్రి, శిఖరతలమున విహరించు క్షితివరేణ్య.
| 1286
|
రామలక్ష్మణులు శబరిం జూచుట
వ. |
అని యిట్లు సర్వంబునుం దెలియఁ బలికి కబంధుండు కార్యసిద్ధి యయ్యెడు
మని దీవించి దివ్యదేహప్రభాభాసితుం డై వారలచేత ననుజ్ఞఁ కొని యంతరి
క్షంబున యథేచ్ఛం జనియె నంత రామలక్ష్మణులు మహారణ్యంబు సొచ్చి
పశ్చిమదిశాభిముఖు లై కబంధోపదిష్టమార్గంబుఁ బట్టి గిరికందరజాతంబు
లగుక్షౌద్రకల్పఫలద్రుమంబు లందంద నిరీక్షించుచు సుగ్రీవదర్శనకాంక్షు లై
చని చని పంపాపుష్కరిణీపశ్చిమతీరంబుఁ బ్రవేశించి యందు బహుద్రుమ
శోభితం బైనశబరీరమ్యాశ్రమంబుఁ జూచి యత్తపస్వినికడకుం జనుటయు
నది లేచి సంభ్రమంబున నెదుర్కొని రామలక్ష్మణులచరణంబుల కభివంద
నంబుఁ గావించి యర్ఘ్యపాద్యాదికంబు సమర్పించి కృతాంజలి యై కొలిచి
యున్న దాని నవలోకించి రాముం డి ట్లనియె.
| 1287
|
తే. |
తపము సెల్లునె విఘ్నముల్ తలఁగి చనునె, మృగభయంబులు దప్పునె ప్రీతి గలదె
గురువులకుఁ బూజ సేయుదె పరమభక్తి, గలదె నిత్యసుఖస్థితి గలదె నియతి.
| 1288
|
ఉ. |
నా విని యత్తపస్విని మనంబున సంతస మంది యి ట్లనున్
దేవసమాను నిన్నుఁ దమి దీఱఁగఁ జూచుటఁ జేసి నాకు సు
శ్రీవిభవంబు గల్గె సుఖసిద్ధి చెలంగెఁ దపంబు పండె హ
ర్షావహ మయ్యె నాదుమన మన్నియు నేఁడు ఫలించె నీయెడన్.
| 1289
|
ఆ. |
దేవసముఁడ వైననీవు నాచేత సం, పూజితుండ వగుచుఁ బొల్చి యుండ
సకలసిద్ధు లబ్బె జన్మంబు సాఫల్య, మొందె నెలవు దివికి సుద్ది యయ్యె.
| 1290
|
వ. |
భవదీయకరుణాకలితశీతలకటాక్షప్రసరణంబు గలవారికిఁ గొఱంత యేమి భవ
త్ప్రసాదంబున నింక నక్షయంబు లగు పుణ్యలోకంబులకుం జనియెద నీవు చిత్ర
కూటంబునకుం జనుదెంచినపిమ్మట మద్గురువులు సూర్యసంకాశంబు లైన
విమానంబు లెక్కి దివంబునకుం జనుచుఁ బుణ్యం బైనయీయాశ్రమంబు
|
|
|
నకు సౌమిత్రిసహితంబుగా రాముండు ప్రియాతిథి యై చనుదేరఁ గలం డమ్మ
హాత్ముని సందర్శించి యాతిథ్యం బొసంగి యనుజ్ఞఁ గొని యక్షయంబు లగు
పుణ్యలోకంబులకుం జనుదె మ్మందాఁక నిచ్చట నిలిచి రమ్మని నాతో నొడివి
చని రేను నాఁటంగోలె పంపాతీరసంభూతంబు లగువివిధవన్యఫలంబులు నీ
కుపాయనంబు సమర్పించుట కుపార్జించి యున్నదాన నని పలికిన విని రాముం
డు నిత్యంబును విజ్ఞానంబునం దబహిష్కృత యైనశబరి నవలోకించి యి
ట్లనియె.
| 1291
|
శబరి రామునకు మతంగమహర్షిమాహాత్మ్యం బెఱింగించుట
చ. |
దనుఁ డెఱిఁగింప నీగురుని ధర్మమహత్త్వము వింటిఁ గ్రమ్మఱం
గనుఁగొన నిశ్చయించితి ఘనంబుగఁ దెల్పు మటన్న నట్ల కా
కని కడువేడ్కతో శబరి యారఘునాథున కమ్మహావనం
బనుపమభంగిఁ జూపి వినయంబున ని ట్లని పల్కె నెంతయున్.
| 1292
|
క. |
చూచితె సకలఫలతరు, ప్రాచుర్యం బై పయోధరప్రఖ్యం బై
వాచాలపక్షియుత మై, తోఁచెడు నివ్వనపదంబు దూషణవైరీ.
| 1293
|
వ. |
ఇది మతంగవనం బనం బ్రసిద్ధి వహించి యుండు.
| 1294
|
తే. |
ధూతకల్మషు లైనమద్గురువు లిచట, నిమ్మహీధరగుహయందు సమ్మదమునఁ
బూని మంత్రసంపూజిత మైనయాగ, మర్థిఁ జేసిరి ఋత్విక్సమన్వితముగ.
| 1295
|
వ. |
మహాత్మా నాచేత సత్కృతు లైనమద్గురువు లుపవాసపరిశ్రమంబువలన నుద్వే
పితంబు లైనకరంబులచేత నెద్ధానియందుఁ బుష్పోపహారంబులు గావించి రట్టి
యీవేది ప్రత్యక్స్థలి యై యొప్పుచున్నది విలోకింపుము.
| 1296
|
తే. |
విమలచారిత్ర యీయాగవేదు లమ్మ, హాత్ములతపోజనిత హిమాతిశయము
వలన నమలప్రభంబు లై యలరుచున్న, విప్పటికిఁ జూడు మిచ్చట నినకులేశ.
| 1297
|
శబరి శ్రీరామానుజ్ఞం బొంది దివంబున కేగుట
వ. |
మఱియు నుపవాసపరిశ్రమాలసు లగుటం జేసి పోవుట కశక్తు లైనమద్గురువు
లచేతఁ జింతితంబు లై సమాగతంబు లైనసప్తసాగరంబులును జూడుము కృతాభి
షేకు లైనవారిచేతఁ బాదపంబులయందు విన్యస్తంబు లైనయార్ద్రవల్కలం
బులును దేవకార్యంబులు సేయువారిచేత విరచితంబు లైనకుసుమకిసలయమా
ల్యంబులును నేటికి శుష్కించకున్నవి వీక్షింపు మివ్వనంబునం గలవిశేషంబు
లన్నియు నెఱింగించితి నింక నీచేత ననుఙ్ఞాత నై యీకళేబరంబు విడిచి మద్గు
రువులకడకుం బోయెద ననిన విని రఘువల్లభుండు హర్షవిస్మయాకులితచిత్తుం
డై సంశ్రితవ్రత యైనశబరిం జూచి నీచేత నర్చితుండ నైతి నింక యథాసుఖం
బుగా నరుగు మనిన నది చీరకృష్ణాజినావృతంబును జీర్ణంబు నైనశరీరంబు
విడువఁ గోరినదై దాని హుతాశనశిఖల దగ్ధంబుఁ గావించి దివ్యదేహంబు
|
|
|
దాల్చి జ్వలత్పావకసంకాశయు దివ్యాభరణభూషితయు దివ్యమాల్యానులేపన
యు దివ్యాంబరావృతయు నై మెఱుంగుచందంబున నద్దేశంబు వెలుంగం
జేయుచు రామునిచరణంబులు శిరంబు సోఁకం బ్రణమిల్లి యనుజ్ఞఁ గొని
సుకృతాత్ము లగునమ్మహర్షు లెచ్చట విహరింతు రట్టిపుణ్యస్థానంబునకు సమాధి
యోగబలంబునం జనియె నిట్లు శబరి దివంబునకుం జనిన యనంతరంబ రా
ముండు కొండొకసేపు తత్ప్రభావంబు వక్కాణించుచు హితకారి యగు
లక్ష్మణున కి ట్లనియె.
| 1298
|
సీ. |
వివిధవిహంగసేవితము విశ్వస్తమృగవ్యాఘ్ర మద్భుతకరము నైన
మునిపుంగవులతపోవనముఁ జూచితి మిందు సప్తాంబునిధుల మజ్జన మొనర్చి
పితృతర్పణంబు సంప్రీతిఁ గావించితి మశుభంబు తలఁగెఁ గల్యాణ మొదవెఁ
జిత్తంబునకు వేడ్క క్రొత్త యై విలసిల్లె నింక నాసుగ్రీవు నినకుమారుఁ
|
|
ఆ. |
గానఁ బోద మతఁడు గాఁడె సతీపరి,
మార్గణంబునందు మహి సమర్థుఁ
డనిన లక్ష్మణుండు జనపతితో జాగు, సేయ నేటి కట్ల సేయు మనుడు.
| 1299
|
తే. |
అనఘచరితుఁడు రాముఁ డయ్యాశ్రమంబు, విడిచి పుష్పాఢ్య మగుమహావిపినపథము
వివిధతరువులు సరసులు వేడ్క నంత, నంతఁ జూచుచుఁ బంప డాయంగఁ జనియె.
| 1300
|
చ. |
కుసుమితవృక్షము ల్లతలు కోకిలకీరమయూరశారికా
దిసకలపత్రిసంఘము లతిప్రబలద్విపఖడ్గపోత్రిసిం
హసృమరభల్లుకాదికసమస్తమృగంబులు గల్గి రమ్య మై
యసదృశకాంతిచే నలరు నవ్వనముం గలయంగఁ జూచుచున్.
| 1301
|
చ. |
సలలితశీతలోదకము చక్రమరాళబకాళిసంఘముల్
దళితమనోజ్ఞపద్మకుముదంబులు నూతనకైరవోత్పలం
బులు ఘనమత్స్యము ల్కమఠము ల్తటరూఢమహాద్రుమంబులుం
గలిగి గభీర మై పొలుచు కమ్రసరోవరపంక్తిఁ జూచుచున్.
| 1302
|
క. |
జనపతి మతంగసరసం, బనుహ్రద మటు సేరఁ బోయి యందు సుమిత్రా
తనయాన్వితముగ వెస మ, జ్జనముం గావించి యవలఁ జనియె రయమునన్.
| 1303
|
రామలక్ష్మణులు పంపాసరోవరంబుఁ జేరుట
తే. |
అధిపుఁ డీచందమున నేగి యచటికలిక, లచటిపూగుత్తు లలరులు నచటితావు
లచటిక్రొవ్విరు లపుడు తన్నంగజాభి, తప్తుఁ జేయంగ జానకిఁ దలఁచికొనుచు.
| 1304
|
సీ. |
పూరనారంగపున్నాగశోభితయును గమలసంపీడితవిమలజలయు
మత్స్యకరటకూర్మమకరశోభితయును రమ్యోపవనరాజరాజితయును
|
|
|
స్ఫటికాచ్ఛసలిలయు శ్లక్ష్ణనాలుకయును బ్రసవితలతికాభిరంజితయును
గరుడగంధర్వకింపురుషసేవికయును బల్లవితాశోకభాసితయును
|
|
తే. |
గమలతామ్రయుఁ గుముదశుక్లయు వినూత, నోత్పలవినీలయును దటజోరుకుంద
మాలతీసప్తపర్ణతమాలయుతయు, నైనపంపను గాంచె నయ్యవనివిభుఁడు.
| 1306
|
వ. |
మఱియు సఖులచేతంబోలె నేలాలతలచేతఁ బరివృత యగుదానిఁ గుథయుం
బోలె బహువర్ణ యగుదానిఁ బుష్పితామ్రవణోపేత యగుదాని బర్హిణోద్ఘుష్ట
నాదిత యగుదాని మాలతీకుందగుల్మవృత యగుదానిఁ బరిమళోపేతశీతవారి
నిషేవిత యగుదానిఁ దిలకబీజపూరకకరవీరభాండీరనిచుళకేతకీప్రముఖనిఖిల
తరువ్రాతోపేత యగుదాని శైవాలశిరోజయుఁ బద్మముఖియు నీలోత్పలనే
త్రయు శంఖకంధరయు మృణాళదోర్యుతయుఁ జక్రవాకస్తనియుఁ బరిభ్రమ
నాభియుఁ బుళిననితంబయు మకరజంఘికయుఁ గూర్మచరణయు నై విలాసవతి
చందంబున నందం బగుదానిఁ బంపాపుష్కరిణి డాయం జని తత్తీరంబున
నానాధాతుమండితంబును జిత్రపుష్పితకాననంబు నగుపూర్వోక్తఋశ్యమూ
కంబుఁ గనుంగొని రాముండు లక్ష్మణున కి ట్లనియె.
| 1307
|
తే. |
అనఘ యీశైలమందు మహాత్ముఁ డైన, ఋక్షరజునిసుతుండు సుగ్రీవుఁ డుండు
శ్రీఘ్రమున నవ్వలీముఖశ్రేష్ఠుఁ జేర, నేగు మని పల్కి క్రమ్మఱ నిట్టు లనియె.
| 1308
|
క. |
దీనుఁడ రాజ్యభ్రష్టుఁడ, మానధనుఁడఁ దత్ప్రసక్తమానసుఁడఁ గరం
బే నెట్లు మనఁగఁ జాలుదు, జానకి నెడఁ బాసి సాధుజనవినుతాత్మా.
| 1309
|
వ. |
అని బహుప్రకారంబుల రాముండు సీతం దలంచుకొని కామార్తుం డై శోక
విషాదయ౦త్రితుం డై లక్ష్మణునితోడ సంభాషించుచుఁ గ్రమంబున నవ్వనం
బునం గలవిశేషంబులఁ గలయ విలోకించుచుఁ బంపాతీరంబుఁ బ్రవేశించి
యమ్మహాపుష్కరిణీసంజాతప్రభావిశేషనిరీక్షణంబునం గొంత శోకంబు మఱచి
యుండె నని యారణ్యకాండకథాప్రపంచం బంతయు సవిస్తరంబుగా వినిపిం
చిన విని యటమీఁదివృత్తాంతంబు వినిపింపుఁ డని యడుగుటయును.
| 1310
|
వృత్తకందగర్భితచంపకము. |
సురవరసూరిలోకనుత సుందరమూర్తి నమజ్జనావనా
వరవిభవా రణప్రియ నివారితవైరిసమస్తభద్రమం
దిర ధరధీర విష్టపపతీ నిరవద్య సురక్ష్యమాణ ని
ర్ణరకులజారచోరమణి చంద్రకులేంద్ర రమామనోహరా.
| 1311
|
క. |
నిగమాంతవేద్య శుకవా, ఙ్నిగదితమహిమాతిరేక నిత్యానందా
జగదేకనాథ సర్వో, పగ భగవచ్ఛబ్దవాచ్య భద్రాత్మ హరీ.
| 1312
|
పంచచామరము. |
పయోజపత్రనేత్ర యోగిపాల భార్గవీమనః
ప్రియా దయాపయోనిధీ విరించివందితా జగ
త్త్రయావనా నయానయజ్ఞ తార్క్ష్యవాహనా శ్రితా
భయప్రదాయకా మహానుభావ లోకనాయకా.
| 1313
|
గద్యము. |
ఇది శ్రీరామచంద్రచరణావిందమకరందరసాస్వాదనతుందిలేందిందిరాయ
మాణమానసకులపవిత్ర కౌండిన్యసగోత్ర పద్మనాభసూరిపుత్త్ర విద్యాసాంద్ర
వేంకటకవీంద్రప్రణీతం బైనశ్రీమద్రామాయణం బనునాదికావ్యంబునందు
దండకారణ్యప్రవేశంబును విరాధవధంబును శరభంగదర్శనంబును సుతీక్ష్ణ
సమాగంబును సీతానీతిప్రబోధంబును సుదర్శనదర్శనంబును నగస్త్యదర్శ
నంబును జటాయుస్సమాగమంబును బంచవటీప్రవేశంబును హిమవత్కాల
వర్ణనంబును శూర్పణఖాసమాగమంబును వైరూప్యకరణంబును ఖరాదివధం
బును జానకీహరణోద్యోగంబును మారీచవధంబును వైదేహీహరణంబును
రామునివిలాపంబును జటాయువునకు సలిలదానంబును గ్రౌంచారణ్య
ప్రవేశంబును గబంధవధంబును మతంగశిష్యమహిమానువర్ణనంబును
బంపావనప్రవేశంబు ననుకథలుం గలయారణ్యకాండము సంపూర్ణము.
|
|
శా. |
ఈకావ్యప్రతిపాదితుం డయినసీతేశుండు రామప్రభుం
డీకల్యాణకృతీశ్వరుం డయిన శ్రీకృష్ణుండు సంప్రీతితో
సాకల్యంబుగ నిష్టసిద్ధికరు లై చంచత్కృపాపూర్ణతన్
లోకస్తుత్యకుమారయాచధరణీంద్రుం బ్రోతు రెల్లప్పుడున్.
|
|