సంప్రదాయ కవితలు

సుభద్ర

క. పండుగ దండిగఁ బర్వెను
   గొండకు నలుగడల; నొక్క కోనను విడిగా
   నుండి కిరీటియుఁ గృష్ణుఁడు
   మెండగు మంతనములందు మెలఁగెడు వేళన్.

క. కల కల నగవులు మగువల
    కలభాషలు నంగదముల గలగలరవముల్
    చెలఁగి వన వీధి నొక తఱి
    నల విఱిగిన భంగి విఱివి యణఁగె బొదలలోన్.

ఉ. అంతట నొక్క కాంత, యల
    కాంతము లల్లలనాడఁ దెమ్మెరన్
    జెంత వనాంతము న్వెడలి
    చేరఁజనెం; దొవకావి చీరపై

    వింత మెఱుంగు రశ్మికలు
    వెల్పఁగ బంగరు కత్తళంబు, వి
    క్రాంతవిలాసముల్ నడలఁ,
    గన్నులఁజెన్నుల వెల్లిగొల్పుచున్.

క. అడుగడుగున నూపురముల
    చడి, వీణియ మీటు మాడ్కి సలుప, నరునకున్
    గడు హృదయాహ్లాదము, నొక
    పడఁతుక యేతెంచి నిలిచెఁ బజ్జను హరికిన్.

క. ఈ రెండ దాఁకి చదరఁగ
    నీరజముఖి తళుకు మేన, నెలఁతుక మించెన్
    వారిజ కింజల్క శ్రీ
    వారంబున వెలసి మెలయు వరలక్ష్మి క్రియన్.

క. హరి కెఱఁగి చెలియ నరుఁగని
    మరుఁ గనిన తెఱంగు దోప మదిఁ గొండొక త
    త్తరము వొడను నొయ్యారము
    మెరయ నొఱగెఁ దపసి కలిమి మిన్నులు ముట్టన్.

చ. గరిత హొరంగు గొల్పె నరు
    కన్నులకున్ మిఱుమిట్లు; చూడ్కుల
    మ్మరుని కటారులై పొడువ
    మర్మము, దిగ్భ్రమ మావహిల్లె సుం
    దరి ధనువూను సోయగము
    ధైర్యము ద్రిప్పె; నినుండు దోచె మో
    మరయ; నెఱుంగ డిట్టి యస
    మాద్భుత విక్రమ మెట్టి పోరులన్.

క. “అమ్మా!” యని చెలి శిరమున
    నెమ్మి గరంబుంచి పలికె నీరజనేత్రుం
    “డిమ్మౌని కరుణ సౌభా
    గ్యమ్ముల నవ్వారిగాఁగఁ గాంచెద” వంచున్.

ఆ. కపట మౌనిఁ జూచి కన్నియఁ జూచుచుఁ
    గన్నెఁ జూచి కపట మౌనిఁ జూచి,
    చిత్త మలరఁదలఁచెం జిత్తజ జనకుండు
    నేఁడు గంటి నలువ నేర్పటంచు.

ఆ. మొలక నగవు దోప మోమున, వసుదేవ
    తనయుఁ డనియె మాయ తపసి తోడ;
    “కాదె భావి నీకుఁ గరతలామలకంబు
    మౌనివర్య! కలదు మనవి యొకటి.”

క. “భద్ర యిదె కొలిచె, రైవత
    కాద్రుని, వరుఁగోరి; కరుణుఁ నరసి తెలుపుఁడీ!
    రుద్రుఁడగునొ, వరుణుఁడొ, ని
    ర్నిద్ర పరాక్రముఁడు నరుఁడొ, నీరజభవుఁడో!”

క. ఱెప్పల డాఁచిన నగవులు
   ముప్పిరి గొని ముందు కుబుకు మురహరు మోమున్
   విప్పుఁగనుల వీక్షించుచు,
   నెప్పగిదినిఁ బలుక నేర క్రిందజుఁడున్నన్.

క. హరి యనియె “నిట్టి సిద్ధులు
   మఱుఁగు పఱుతురమ్మ క్రొత్త మనుజుల కడఁదా
   రెఱిఁగిన యర్థంబయినను;
   గురుతర పరిచర్య గోడి కూర్తురు శుభముల్.

క. * ఘటనా ఘటన సమర్థులు
      గుటిలపు విధి వ్రాఁతనైనఁ గుదురుపఱచు వా
      క్పటిమ గల పురుషసింహము
      లెట పఱచుఁ గటాక్ష మొదవు నీప్సితము లటన్.

పాఠాంతరం :

క. ఘటనా ఘటన సమర్థులు
    నిటలంబున బ్రహ్మ వ్రాయు నిర్ణయ ఫక్కిం
    బటు నిష్ఠా పాటవమున
    నటునిటు సేయంగ నేర్తు రార్తులఁబ్రోవన్.

క. కేవల నరుఁడే యీతడు
    భూవలయము చుట్టి పుణ్యభూము లరయుచున్
    రావలసి వచ్చె నిట నినుఁ
    బ్రోవను; సేవించి వేడ్కఁ బొందుము శుభముల్.

ఆ. కాంచి నరు సుభద్ర “కంటినా మును వీని”
    నన్న శంక మనసు నలవి కొనఁగ
    "నెఱుఁగకున్న వీని నెఱిగినట్లున్నది;
     మంచిగూర్చు” ననుచు మదిఁదలంచె.

ఆ. “అన్న వీని నెన్న, నధికుఁడు కానోపు
     నెన్నకున్న వీని చెన్నుఁజూడ
     నన్నుఁ బ్రోవ వచ్చె నర రూపమును దాల్చి
     మానవైరి యంచు మదిని దోఁచె.

క. నరుఁగూర్చిన నరుఁగూర్చును |
    నరుఁగూర్పకయున్న నాకు నరుఁడై గుఁరుడై
    దరిఁజేర్చు; నిహము నోఁచమిఁ
    బర సాధనమైనఁ గనుట పాడి దలంపన్.”

ఆ. “పెద్ద యన్న నరుని పేరైన విననొల్లఁ
     డొరుని కెపుడు నన్ను నొసఁగఁ జూచు
     గురుల చేతనుండుఁ దరుణీజనము పెంపు
     వారు మెచ్చు వాఁడె వరుఁడు మరుఁడు.”

ఆ. “కించయేల నాకుగృష్ణుఁడు నాయెడ
     నున్న వాఁడు లోక మెన్ను వాఁడు
     వాని పనుపు సేయ వమ్ముగా దేనాడు
     యతిని గొలిచి విజయు నధిగమింతు.”

ఆ. "అర్జునుండు దలఁచె ‘నమృతంబుఁ గొనునాడు
     వెన్నుఁడెత్తి నట్టి వేస మిదియె
     విప్పు కన్నులందు వెలయు ప్రసాదంబు
     నిప్పు గప్పినట్టి నివుఱు గాదె?”

క. పసితనపు టాటపాటల
    విసువని విలువిద్య దొడ్డ వేడ్కె చెలంగన్
    గుసుమాస్త్రుఁ డెన్నఁడెఱుఁగని.
    యసమాయుధ కౌశలంబు లబ్బె గరితకున్.

క. “లఘ నమనోన్న మనంబును
    లఘు రయమును నంగముల విలసితము లగుటన్
    సుఘటిత లావణ్యం బీ
    జఘన ఘనకుఁ దెచ్చికొనని సౌరులమర్చెన్.”

ఆ. “వీరుఁడన్నవాడు బీరంబుగల యిట్టి
    భామ నేలు భాగ్య మొదవెనేని
    గాల ముండు దనుకఁ గతలందు నుతికెక్కు
    కడిమి మీఱు సుతునిఁ బడయకున్నె.”

ఆ. 'వాసు దేవుఁడపుడే వాగ్దాన మొనరించెఁ
    గొందు దీని నడ్డ మెందఱైన
    రాముఁడొకడు దక్క రౌహిణేయునీఁ బోర
    గడఁగరాదు గనులు గప్పవలయు.'

ఆ. తలఁచె నిట్లు నరుడు; తలఁచొ నంతనె వచ్చెఁ
     దాటి సిడపు జోదు; తప్పుటడుగు
     మేని చందనంబు మైకంపుఁ గనుచూపు
     పండుగాడి నట్టి నిండు దెలుప.

క. ఎఱగిరి భద్రయుఁ గృష్ణుడు
    నరుఁడ వనత వదనుఁడయ్యె; నగి బలరాముం
    “డరసితి” ననె “మిము గానక
    దొరకితి రిపు డిచటఁదోడిదొంగ లిరువురున్.”

క. “సరి, సరి, మునియొకఁ డమరెనొ?
    మఱి కృష్ణుఁడు మఱచు జగము; మన భద్రన్నన్
    వరుఁగోరి తపముఁ జేసెడి;
    గురు జనములఁ గన్న సేవ గురుకొని చేయున్.”

క. కూర్చుండుఁడయ్య మీరలు
    కూర్చుందము మనము; వింటె కురు వీరులలో
    నేర్చు మగఁడతఁ డితండని.
    యేర్చుచు వాదిడిరి బాలు రెఱుఁగుదు చెపుమా!

క. “నరుని యెడఁ బక్షపాతము
    పఱుపక యున్నట్టి మాట పల్కుము; “పల్కెన్
    హరి యెటు పలుకం జెల్లును
    బరులకు? ఈ మేటి తపసి ప్రక్కనె యుండన్”.

క. “ఇల యెల్లం గాలించుచు
    మలసి మలసి, పురుషవరుల మహిమాన్వితులం
    గలసి భవ మీఁదు తెఱవులు
    తెలియుఁ దగులు మనములోనఁ దివిరి కొనంగన్.”

క. “విన్నాఁడట : హరి యీనాఁ
    డున్నాఁడవతారలెత్తి యుర్వినని, యతం
    డన్నారఁట నీవే యని;
    కన్నారఁగ నిన్ను గాంచఁగా నిటు వచ్చెన్”

ఉ. గొంతు కొకింత మార్చుకొని
    గుంతి సుతుండనె “నో బలాఢ్య! నీ
    యంతటివాని ముందొరుల
    నౌనె గణింప; మనుష్య మాత్రులా
    వెంత; భవిష్యమెంత! జను
    లేల యెఱుంగరొ నిన్నెఱింగియున్
    సంతత సత్యవర్తనమె
    సత్వము జీవులకన్న ధర్మమున్.

ఆ. ధర్మముండుచోట దైవ బలంబుండుఁ,
    గలుగ దైవ బలము గలుగు జయము,
    విఱ్ఱవీఁగు జడుడు విజయంబు దనదంచు
    మున్న లోకపాలు రెన్నినట్లు.”

చ. అనిమొన నొంచి రక్కసుల
    నాత్మబలంబులె కారణంబుగాఁ
    గొని రమరుల్ జయంబునకు
    గొండొక యక్ష మెదిర్చి గాలి న
    గ్నిని గని మీరలీ తృణము
    కేల్కొని త్రోయుఁడు కాల్చుఁడన్నవా
    రనువది గామి, గుర్తెఱిఁగి
    రాత్మబలంబుల పారతంత్ర్యమున్.

క. “ఐనను వృష్ణి కుమారులు
    పైన గనంగలరు పోటువాసులు; పోరెం
    దైనఁ బొసఁగ కున్నె దురభి
    మానము కౌరవుల యెడల మల్లడిలంగన్.”

క. కల దంతశ్శత్రుచయం
    బలఘు బలం బాప్తవేష మతిమానుషమై
    యలమంచు నెంత వారల
    వెలి శత్రుల వేతకు వాఁడు వెడఁగు దలంపన్.”

క. కావున శత్రుని మిత్రుఁగ
    నే వెరవుననైనఁజేయు నేర్పరి బలియుం
    డావల నంతశ్శత్రుల
    కావర మణఁగింపగలడు కాల మలవడన్.

క. “ఎఱుఁగనియ ట్లొరు నడుగుట
    మఱుఁగుపఱచి దైవ జన్మ, మానుష లీలల్
    నెఱుపుటగా కీ వెఱుగని
    పరమార్థం బొండు గలదె ప్రజ్ఞాననిధీ.”

క. ఎద్దానికైన మీరలు
    దిద్దక మముబోంట్లు నిజము తెఱ వెఱుఁగుటగా
    దద్దారి గనక వట్టివి
    సుద్దులు నేర్చితిమి; యగునె సూక్తులను బనుల్.

క. “వసు దేవుని బిడ్డలు మీ
    రసదృశ మహిమానుభావు లాప్తులు చెంతన్
    వసియించి, కొంతకాలము,
    పసగల సద్వస్తు వొకటి పట్టఁదలఁచితిన్.”

క. కంటిని మిము ధన్యుఁడనను
    కొంటిని; మీవంటి వారు కూరుట తపపుం
    బంట కదా; ననుఁ గనుఁడొక
    కంటను, గన్నంత నాకుఁగల్గు శుభంబుల్.

క. ప్రేమ పెనగొన్న చూపున
    రాముఁడు తన తమ్ముఁ జూచి రంజిలి పల్కెన్
    “ధీమంతుం డీ తాపసుఁ
    డేమందును మనదు భాగ్య మెఱిఁగితి మితనిన్.

చ. “కలరిల నెందఱో యతులు
    కాంచి యెఱుంగము వీని యట్టి ని
    స్తుల సదసద్వివేకనిధి
    సూనృత వాక్కల నాభిరాము స
    ల్లలిత శుభానుభావు, విమ
    లాత్ము, విచక్షణు, నిట్టి వానిఁబూ
    జలఁదనియించి కొన్ని దివ
    సంబులు నిల్పుట యింట నొప్పదే”.

క. “యదువీరు లెల్ల నీ ఘను
    నదను లెఱిఁగి భక్తి గొల్వ నాత్మజ్ఞానం
    బొదవు; భవ జలధి గడపెడు
    చదురుం డలవడుట పూర్వ జన్మ ఫలమెకా?”.

క. ఎందెందుఁ గలుగు తీర్థము
    లందలి మహిమముల నీ మహాత్ముని వలన
    న్విందము; పరమార్థంబులం
    గందము; వీనులకు విందు గద సూనృతముల్”.

క. “మన భద్రయు నీ తపసిని
    బనిగొని సద్భక్తి భోజ్య భక్ష్యంబులచేఁ
    దనిపెడుఁగా కద్దానను
    గనకున్నే రాజరాజుఁ గాంతునిఁగాఁగన్”.

క. గారాబ మొల్కు కన్నుల
    నా రాముఁడు భద్రఁగాంచి నరుని కనియె “నీ
    నారీమణి రైవతకము
    నారాధించిన ఫలంబియౌ - నినుఁగాంచెన్”.

క. “నీ దాసిగ గొని చెలియల
    నేదానను లోపమున్న నెఱుఁగఁ దెలుపుచున్
    మోదానఁ గొనుఁడు పూజలఁ
    గాదనకుఁడు ముద్దు గడపి కారుణ్యముతోన్”.

క. “కత్తిమొన బ్రతుకు జోదుల
    పొత్తు గదా బ్రహ్మ వ్రాసెఁ బొలఁతులకు మా
    యుత్తమ రాజ కులంబుల
    నెత్తమ్మికి నిశితకరుని నెయ్యమువోలెన్”.

క. “బాణాసన తూణ తను
    త్రాణము శైశవము నుండి తాల్చుచు నొక వి
    న్నాణంపు జోదు తానై
    ప్రాణంబుల సరకు గొనదు భద్ర మగటిమిన్”.

క. “పుట్టింట నుండు కాలం
    బెట్టెట్టుగ నున్నఁ జెల్లు నింతికి మఱి తా
    మెట్టిన యింటను మెలఁగెడు
    గుట్టు తెలియకున్న నెట్ల కూరు సుఖంబుల్”.

క. "దారుణము క్షత్రధర్మం
    బీరసముల కిరవు దొల్లి యేర్పఱచిరి, యే
    కారణమొ ధర్మకర్తలు
    పూరుషులకుఁ జెల్లుఁగాక పొలఁతుల కేలా?”.

క. “పారంబులేని యోరిమి
    గూరిమి బాంధవుల పట్ల, గురుజనములచో
    గారవము భృత్యవర్గము
    నేరుపెఱిఁగి యేలుకొంట, నెలఁతకు నీతుల్”.

క. కఱపవలె మీరు భద్రకు
    నిరపాయ సుఖంబు లిచ్చు నీతి పథంబుల్
    వరమీవలె నెన రెఱిఁగిన
    నరవరు, మీయట్టి శాంతు నాథుఁ బడయఁగన్.”

క. తమ్ముఁడు పలికె “తథాస్త" ని
    నెమ్మొగమును వాంచి భద్ర నేత్రాంతములం
    జిమ్మె నరుని యెడఁ జూపులఁ
    గమ్మవిలుతు మాటు వెడలు కఱకు శరములన్.

క. అంతట మదిరను గ్రోలెడు
    చింత మనమునందు దోప, సీరధ్వజుఁ డా
    వింత తపసి వీడ్కొని చనె;
    నంతి పురముఁ జేరె భద్ర యత్యుత్సుకయై.



సుభద్ర

రెండవ భాగము

సీ. కస్తూరి గన్నేరు కావి చీర మెఱుంగు
          మేని చాయకు వింత మిసిమిఁగొలుప
    చెలరేగు ముంగురుల్ చేర్చి కట్టిన జోతి
          యిరులపై రిక్కల కరణి వెలుఁగ
     పైటపైఁ దూఁగాడు పచ్చల హారముల్
          చలదింద్ర చాపంబు చాడ్పుఁజూప
     నిద్దంపుఁ జెక్కుల దిద్దిన పత్రముల్
          మకరాంకు బిరుదాల మాడ్కి వఱల

గీ. మెఱపు, కెమ్మబ్బు లోపల మెఱయునట్లు
    వలిపమున మేల్మి మొలనూలు తళుకులీన
    భద్ర నడతెంచె బంగరు పళ్లెరములఁ
    బండ్లుఁ బూవులు గొనుచు సపర్య కొఱకు.

క. మగని కడకేగు నెలఁతకు
    దగు నీ కైసేత గాక, తపసిని దోడ్తోఁ
    నెగఁజూచుట కాదే! యీ
    సొగసరి, నీ ఠీవి నంప సుమ శరము వడిన్.

క. యతి నియతిఁ గోలుపోని
    మ్మతివను గన్నంత మాత్ర ననిమేషత్వం
    బతను విభూతియుఁ గాంచఁడె,
    యతియై తాఁ బొందఁ జూచు టంతయు కాదే?

క. మంచి నటింతురు తన్పక
    వంచనపరులైన వారు; వారిఁగని జనుల్
    మంచనె పాటింతురు! మఱి
    వంచన వంచకునె చెఱచి వంచించుఁదుదన్.

క. యతి మీదికి మతి వోవుట
    మతిపోవుటగాఁ దలంచి మానిని యెంతో
    ధృతిఁ గడఁగె మరులు మరులుప
    మతి ద్రిప్పిన కొలఁదిఁ జోకు మితి గడచుటయున్.

ఉ. “పొత్తులనుండ బెద్ద లిది
          పోలునటంచుఁ దలంచినట్టి యా
     పొత్తుఁ దలంప కీ మగువ
          పుణ్యవతీతిలకమ్ము నోఁచె, ము
     న్నత్తగఁ గొంతిదేవి నను
          నమ్మల కన్నుల పెంపుదక్క యీ
     రిత్త తపస్విపై మరులు
          రేఁగుట కానక మోసపోయితిన్.

ఉ. నవ్వదొడంగి రీ గతికి
         నా వదినె ల్తలలూపి ఖిన్నులై
    నొవ్వగఁ బల్కఁజొచ్చిరి
         కనుంగవ నశ్రులు గ్రమ్మ చేటు; లీ
    రవ్వఁదలంపఁగాని, మది
         రాల్పడి గుందె, నెఱింగెనేని యా
    కవ్వడి నొచ్చి చుల్కనగఁ
        గాంచు గదాయని నాదు శీలమున్.

సీ. “ఏడు లోకంబుల నెనలేని
          విల్లుకాఁ డెవ్వాఁ డటన్న గవ్వడి యనంగ
     సాటివారల పట్ల సౌహార్థ మొనరించు,
          మేటి యెవఁడన కిరీటి యనఁగ
     నెనరు నేర్పులు గల్గు నెఱజాణుఁ డెవఁడన్న
          నింద్రజుండని లోక మెన్ని పల్క
     పెద్దల కడ భక్తి పిన్నల యెడ రక్తి
          నెరపువాఁ డెవఁడన్న నరుఁడె యనఁగ

గీ. వీను లలరంగ విని విని వేడ్కగదుర
    నరుని నావానిగాఁ గొన్న నాతి నిపుడు
    నాకు నాలోన వింతయ్యె నరుని మఱచి
    మాయ యతి నొక్కరుని గాంచి మరులుకొంట.

క. జగదేక వీరునకు నే
    నగుదును దగు వీరపత్నినని తలఁచి మదిం
    దగిలి విలువిద్య నేర్చితి
    నగవు గదా తపసి కప్పనము సేఁతకడున్.

క. పోనొల్లను యతి కడ కిఁకఁ
    గానిమ్మేమైన; నరుఁడు గానలలోనన్
    గాని, యగచాట్లుఁ గుందగఁ
    గానక నేఁదిరుగుచుంటిఁ గఠిన హృదయనై.

క. అని కన్నియ దలచుటయును
    గనుఁగవ నుప్పొంగి పాఱెఁ గన్నీరు; పరు
    ల్గన రాదని పడకింటికిఁ
    జని పానుపుఁ జేరి కడు విషాదముఁ జెందెన్.

సుభద్ర

మూడవ భాగము

చ. పంచిరి రాచ బిడ్డ నొక పాంథ తపస్వి సపర్యకై గురుల్
    మంచి దలంచి; చేకురక మానునె; నీవిటు వారి పంపుల
    జ్జించి పరిత్యజించి నిరసించితి వేమొకొ యేమి కీడు శం
    కించితివో యటంచు యతి కించల పాల్పడి వేఁగుచుండఁడే.

క. తెత్తును నరునని యతి వా
    గ్దత్తము గృష్ణునకుఁ జేసెఁ గాని వినుమీ
    తత్తరము మాని జనుమ యు
    దాత్తుం డెంతేనిఁ దపసి తప్పునె పలుకుల్.

క. యతి నొకనిఁ గుడుపఁ జేకుఱు
   నతి వేలంబైన భాగ్యమనఁడే హరి, నీ
   మతకరి వదినెల మాటలఁ
   గుతుక మఱియు నూరకుంట కూడునె చెపుమా.

క. కాలము దేశము సిద్దుల
   పాలై యాజ్ఞలను మెలఁగుఁ బార్థుని నీకై
   లీల మెయిం గొనఁగా యతి
   చాలడె? వంతలను మాని చనుమా వేడ్కన్.

క. “కాదని యాదవ వీరులఁ
    గాదని నీ పెద్దయన్నఁ గవ్వడికొగి ని
    న్నీఁదగు ధీరుడు కావలె
    నౌదల మిన్నేఱు దాల్చు నార్యుండొకడే.

క. కారాదొకొ యతి యీశుఁడు,
    రారాదొకొ నిన్నుఁ బ్రోవ రమణిరొ వటుడై
    తా రాఁడొకొ యిటకు నరా
    కారంబన నెంత యతికిఁ గరుణ గలిగినన్.

క. సిగఱ వలె నొక్కొక తఱి
    నెగ్గులఁ దొలగింపఁగోరు నింతులు; దానన్
    లగ్గులు చేకుఱు మఱి నే
    సిగ్గని నాఁడూరుకున్నఁ జిక్కునె హరియున్.

క. కోరి వరించితిఁ గాదే
    నారాయణు నేను నాఁడు నాతులలోనన్
    బేరుఁ బ్రతిష్ఠయుఁ గాంచనె
    పారుఁడొకడు కాదె నాకుఁబట్టై నిలిచెన్.

క. ఉత్తముఁడా తపసి యెడన్
    బత్తెంతయుఁ గల్గియుంట భావ్యం బైనన్
    జిత్తమున నిన్న మొన్నను
    గ్రొత్త తలపు లేరుపడ్డఁ గొంకితి పోవన్.