గణపతి/పదిహేనవ ప్రకరణము
పదిహేనవ ప్రకరణము
గణపతి మేనమామకూతుఁ నెత్తుకొనిపోయి దొంగ పెండ్లి చేసుకొనుటచేత నతఁడు నీచుఁ డని చదువరులు తలంచు చున్నా రేమో యని భయమగుచున్నది. ఇతర చారిత్రములు బట్టి యతఁడు నీచుఁడో ఘనుఁడో చదువరులు నిర్ణయింపఁనగును గాని, యీ వివాహముచేతనే నీచుండని నిర్ణయింపరాదు. ఏలయన దమకు గూర్చునట్టి కన్యల దొంగిలించుకొనిపోయి పెండ్లియాడిన వారిలో గణపతియే ప్రప్రథముఁడు గాఁడు. ఈతనికంటె బూర్వులనేకులు గలరు. కలరని చెప్పినంతమాత్రమునే కథకునిపై గౌరవము కలిగి యాతని వాక్యంబులు పరమప్రమాణంబు లని విశ్వసించునట్టి మంచికాలము గతించుటచేతను దగిన దృష్టాంతరములు, నుదాహరణంబులు చూపినం గాని యెట్టివారి మాటకైన జిన్న పిల్లవాఁడు సైతము నమ్మని పాడుదినములు వచ్చి యుండుట చేతను నట్టివారు పూర్వు లనేకులు గల రని ఋజువు చేయుటకుఁ గొన్ని యుదాహరణము లిచ్చుట మంచిది. ధర్మసంస్థాపనంబు జేసి శిష్టజనుల ననుగ్రహించి, దుష్టజనుల నిగ్రహించి, భూభారమడంచు తలంపున శ్రీమన్నారాయణాంశమున మహీమండలమున యదుకులమున నవతరించి, కంసశిశుపాల దంతవక్త్ర జరాసంధ ప్రముఖులైన దుష్టుల బరిమార్చి, బ్రహ్మర్షి రాజర్షి దేవర్షి గణములచేతను, భీష్మాదులచేతను గొనియాడబడిన వాసుదేవుడు విదర్భరాజు శిశుపాలున కియ్యఁ దలంచిన రుక్మిణి నెత్తుకొనిపోయి వివాహము జేసికొనుట జగత్ప్రసిద్ధమే కదా! మహేంద్రుడు పుష్కలావర్త మేఘములతో వచ్చినను వాని నొక పూరికైనఁ గొనక ఖాండవవన మగ్నిహోత్రున కర్పించిన ధైర్యసాగ రుఁడును, నివాతకాలకేయాది దానవులను నిర్జించిన మహాధనుర్ధరుడును, ముక్కంటిని గెలిచి పాశుపత మహాస్త్రమును గైకొన్న బాహుశాలియు, గాండీవ మను తెప్పచేత కౌరవసేనాసముద్రము నీఁదిన మేటికోవిదుఁడును, తాను మూర్ధాభిషిక్తుఁడు గాకున్నను దేవేంద్రుని యనుగ్రహమునఁ గిరీటంబు సంపాదించి కిరీటి యను సార్థక నామము బడసిన విఖ్యాతుఁడును నగు పాండవమధ్యముఁడర్జునుఁడు వాసుదేవుని చెలియలగు సుభద్ర నెట్లు వివాహమాడె? శ్రీకృష్ణ బలరాములుం దక్కిన యాదవులు నింటలేని సమయంబున సుభద్రను దొంగతనముగా దీసికొనిపోవలేదా? తన మార్గము నవరోధించిన యాదవులను దండింపలేదా? కురుకుల శిఖామణి యని చెప్పదగిన దుష్యంతుడు కణ్వమహాముని యాశ్రమముజేరి, మాయలు మర్మము లెరుఁగని శకుంతలను మచ్చికచేసి; యిచ్చకములాడి మనసు మెత్తపరచి, పెంపుడుతండ్రి యింటలేని తరి నామెను జేపట్టలేదే? అవి యెవ్వ రెరుంగని రహస్యములు? ఈ పురాణపురుషుల మాట యటుండనిచ్చి సామాన్యుల విషయ మించుక విచారింతము. వత్సదేశముల కధీశ్వరుండైన యుదయనమహారా జొకానొక కారణంబున నుజ్జయినీ పురాధీశ్వరుండైన ప్రద్యోతన మహారాజు నింటఁ గొంత కాలముండి యాతని కూతుఁ రగు వాసవదత్తకు గానము నేర్పుటకై యామె తండ్రిచేత నియుక్తుడై, రాగములు నేర్పుటకు మారుగా ననురాగంబు నేర్పి యెట్టకేలకు నామెను దన వశము జేసికొని యర్థరాత్రమునఁ గోట గోడలు దాటించి తీసికొనిపోయి పరిణయము జేసికొనెను. నరనారాయణాంశ సంభూతులగు పార్థవాసుదేవులును, నుత్తమక్షత్రియుడైన వత్సరాజును, వివాహము నిమిత్తము కక్కుర్తిపడి దొంగపనులు చేయఁగాఁ దనకుఁ బెండ్లి కాదను భయమున గణపతి వంటివాడు కక్కుర్తిపడి పిల్ల నెత్తుకొని పోవుట తప్పా? కృష్ణార్జునులు రాక్షసవివాహములు చేసికొని రనియు, దుష్యంతుడు గాంధర్వవివాహము చేసికొని ననియు, శాస్త్రము లా వివాహము లంగీకరించు చున్న వనియు మీ రనవచ్చును. మహాపురుషులు చేసిన యపరాధములకు మహర్షు లేదో గతి కల్పించిరి. గాని మా గణపతి చేసిన పనియే చేసిరి. వారి కార్యములు దోషములైన పక్షమున వీని కార్యములును దోషము లగును. వారి వివాహములు నిర్ధుష్టములయిన పక్షమున వీని వివాహము నిర్దుష్ట మగును.
ఇది యటు లుండనిండు. గణపతియొక్క భవిష్యజ్జీవితమును గూర్చి విచారింతము. మాతాపుత్త్రులు మూడుదినములహోరాత్రములు విచారించి, పౌర్వాపర్యములు బరీక్షించి, యౌగాముల నరసి, మంచిచెడ్డలు మదిలో దర్కించి, మహాదేవశాస్త్రి యొక్క యాలోచనం గూడఁ గైకొని యేనుఁగుల మహలు విడిచి, వానపల్లి గ్రామమున నివాసము చేయుటకు నిర్ధారణ చేసిరి. తరువాత వానపల్లిలో జీవన మెటులు జేయవలె నని ప్రశ్న వచ్చెను. వచ్చుటయు తల్లి కుమారుని జూచి 'నాయనా! యాయవారము జేసికొని బ్రతుకవచ్చును. అక్కడ మాత్రమిప్పు డందల మెక్కుచున్నామా యేమిటి? రెండు పొట్టలు గడవక పోవునా? బ్రతికితే బలుసా కేరుకొని తినవచ్చును. ఆ దుర్మార్గుని చేతిలో బడకుండ మరెక్కడ నున్నను మంచిదే. దుష్టులకు దూరముగా నుండు మన్నారు పెద్దలు!' అని చెప్పెను. చెప్పుటయు గణపతి చివాలున లేచి "నేను యాయవారము చేయను. ఎల్లకాలము యాయవారమేనా? నేను వట్టి పనికిమాలిన వెధవ ననుకొన్నావా యేమిటి, యాయవారము చేయుటకు? ఈ యూరిలో బడి లేదు. ఇక్కడ బడిపెట్టి చదువు చెప్పుదును. నాలుగు రోజుల నుండి నేను చూచుచున్నాను. పిల్లలందరు గాడిదల లాగున తిరిగి చెడిపోవుచున్నారు. వాళ్ళందరిని బాగుచేయవలె నని యున్నది. చెంబు మూల పడవైచి బెత్తము చేతితో పుచ్చుకోవలెను. ఇదే నా వృత్తి. ఈ యూరువారుకూడ బడిపెట్టు మని నన్ను బలవంత పెట్టుచున్నారు. మహాదేవశాస్త్రి గారు కూడ ఆమాటే అన్నారు. ఆయన నాకు వివాహ విషయములో యెంత యుపకారము చేసినారు! గనుక వారి గ్రామమునకు నే నీ యుపకారము చేయక తప్పదు. గనుక నీవు మన యూరు వెళ్ళి సామానులు తెప్పించు. ఆ నాగ్తన్నగా డున్న గ్రామంలో మన ముండకూడదు. వాఁడు వట్టి దుర్మార్గుడు. అతని మొగం చూచినవారి కన్నము దొరకదు. ఈ గ్రామములో హాయిగా నుండవచ్చును." అనవుడు "సరే మంచిది. అలాగే చేయవచ్చు" నని నాటి మధ్యాహ్నము బయలుదేరి యామె యేనుగుల మహలు వెళ్ళెను.
వెళ్ళి పుల్లయ్యను గలిసికొని యతని సహాయమున నొక బండి దెప్పించి దానిమీద తన సామాను లన్నియుఁ బడవైచెను. ఆ సామాను లెవ్వియో చదువరులు తప్పక యెరుఁగ గోరుదురు. కాన నందు ముఖ్యమైనవి పేర్కొనుట సమంజసము. పాత్రసామానులు చెప్పఁదగిన వెవ్వియు లెవు. వరతంతు మహాముని శిష్యుఁడైన కౌత్సుం డను మునికుమారుడు యాచించ వచ్చి నప్పుడు రఘు మహారాజు వేనిలో నర్ఘ్యపాద్యములు పెట్టుకొని సంభావించెనో యాపాత్రలె వంటకు నీళ్ళకు వారి యింట నుపయోగపడు చుండుటచే నవి పొరుగూరునకు దీసికొని పోఁదగినవని కావనిఁ యింటివారికిఁ గొన్ని, చుట్టుప్రక్కలవారికిఁ గొన్ని దానముచేసి తక్కిన సామానులు మాత్రమే యామె బండిలోఁ బెట్టెను. అవి యెన్ని యన చాలాచోట్ల తోలూడిపోయి రెండు మూఁడు చిల్లులుగల బోనముపెట్టె యెకటి, మూతలేని తాటియాకుల పెట్టె యొకటి, చెవులు విరిగిన ప్రాత రాచిప్పలు రెండు, చిల్లు లుండుటచే గూటిమైనము మెత్తిన యిత్తడి చెంబులు రెండు, యక్షయపాత్ర చెం బొకటి, యుప్పు పోసుకొను కర్ర తొట్టె యొకటి, యంచు జవయూడి మూలలు చిల్లులుపడిన చేఁటలు రెండు, కఱ్ఱ సోల యొకటి, ప్రాత జల్లెడ యొకటి, జల్లెడవలె తూట్లుపడిన ప్రాత కంబళి యొకటి. ఒకకోడు విరిగిపోయిన నులకమంచము కుక్కె యొకటి. కాడసగము విరిగిపోయిన యినప గరిటె యొకటి. గ్రంధి యూడిపోయిన పీట యొకటి, బల్లచెక్క యొకటి, ఒక సన్నెకల్లు, పొన్నూడిపోయిన రోకలి యొకటి, మరియు నాలుగు మూఁడు తాఁటియాకు బుట్టలు, రెండు మూఁడు వెదురువేళ్ళ బుట్టలు గూడ నుండవచ్చును. ఈ సరుకులు బండిమీఁద వేయించుకొని యామె తాను సోదరుని గృహము వెడలివచ్చిన తరువాత తనకుఁ గుమారునకుఁ దల దాచుకొనుట కిల్లిచ్చి సాయముచేసిన యా యిల్లాలిని పలు తెరంగుల గొనియాఁడి యామెను వీడ్కొని పుల్లయ్య చేసిన మేలునకు వానిని గూడ కొంతతడవు ప్రశంసించి వానికడ సెలవు గైకొని పుట్టినింటివారిఁ దలంచి "వాండ్రు నా యుసురుగొట్టి, పోకపోదురా! ఆఁడుపడుచు నేడిపించినవాళ్ళ వంశములు నాశనము గాకమానవు. దాని పుట్టిల్లుగూడ బుగ్గి యైపోవలె. నా యాశలాగె దాని యాశలుగూడ అడుగంటిపోవలె. దాని కడుపుకాలిపోవలె. దాని వాళ్ళందరు వల్ల కాటిపాలై పోవలె" అని తోచినట్లు తిట్టి "పుల్లయ్యతండ్రీ ! యేనుగుల మహలుకు నాకు ఋణము నేటితో దీరిపోయినది. ఈ పాటిమీఁదనే చావవలె ననుకొన్నాను. ఈ పాఁటిమీదనె మట్టి కావలె ననుకొన్నాను. మా వెధవ నాగన్న మూలమున, ఊరికి దూరమై దేశాలపాలై దిక్కుమాలిన పక్షినై పోవలసివచ్చినది. మా సంగతి కొంచెము కనుక్కో నాయనా ? అన్నింటికి నీవే మా "కని యేడ్చి బండియెక్కి పోయెను. గణపతి వానపల్లి పొలిమేరవద్ద కెదురుగ వచ్చి బండి తోలించుకొని మహాదేవశాస్త్రి గారి యింటి కరిగి సామాను దింపించి వారి పడమటింటి వెనుక పంచపాళిలో పెట్టించెను. మహాదేవశాస్త్రి వెనుక పంచపాళి వారికి బసగ నిచ్చెను. సన్యాసి పెండ్లికి జుట్టుదగ్గరనుంచి యెరువన్నట్లు గణపతియొక్క సంసారమునకు వండికొను కుండ దగ్గర నుంచి యెరువె. వంటకు రెండు మూడు కుండలు దాకలు మూకుళ్లు కొనుటకయిన వారి దగ్గర డబ్బులు లేవు. బండి కిరాయి పుల్లయ్య యిచ్చినందున వారు సామాను తెచ్చుకోగలిగిరి. మహాదేవశాస్త్రి వారి పేదస్థితి నెరిఁగి రెండు మూడు కుండలు తెప్పించి వారి కిచ్చి మరునా డుదయమున తనకు మిత్రులయిన బ్రాహ్మణులను గాపులను జేరబిలిచి యిట్లనియెను. "ఈ గణపతిగారు మన గ్రామములో బడి పెట్టదలఁచు కొన్నారు. అలాగున పెట్టుమని నేనే బలవంతం పెట్టినాను. మన గ్రామములో బడి లేక పోవుటచేత మన పిల్లలు చెడిపోవుచున్నారు. ఈయన చాలా పేదవాడు. అందుచేత మన మందరము ముందుగ గణపతి గారికి కావలసిన ధాన్య మీయవలెను. నా మట్టుకు నేను రెండుకుంచాల ధాన్య మిచ్చెదను. మీ రందఱు తల కొక కుంచెడు రెండుకుంచములు నిచ్చి పాప మా పేద బ్రాహ్మణుని మన గ్రామములో నిలపండి. ఈలా గిచ్చినందువల్ల రెండు విశేషము లున్నవి. ముందుగా బ్రాహ్మణునకు సహాయము చేసెడు వల్ల గలిగెడు పుణ్య మొకటి, మన పిల్లలకు విద్య వచ్చుట యొకటి. అందుచేత స్వలాభ మాలోచించుకొని గాని పుణ్యము వచ్చునని కాని మన మీ సాయము చేయవచ్చును. 'బ్రాహ్మణున కిచ్చుట యనఁగా మనము ముందు జన్మమునకు దాఁచికొనుట ' అని యుపదేశించుటయు నచ్చట చేరిన వారందరు యధాశక్తిగ ధాన్య మిచ్చిరి. మహాదేవశాస్త్రి మాత్రము తన రెండు కుంచముల ధాన్య మీయలేదు. కాని మాటసాయము చేసి యిప్పించి నందుకు మనము సంతసింపవలెను. మాతాపుత్రులయొక్క భోజన ప్రమాణము వారి యాకారములకు వయస్సునకుఁ దగని దగుటచే పదికుంచముల ధాన్యము దంపుకోగా వచ్చిన బియ్య మైదు కుంచములు పదిపన్నెండు దినములలోనె యైపోయెను. భోజనము నిమిత్తమే గాక వారికి గావలసిన సమస్త వస్తువులు గొనుటకు బియ్యమే యుపయోగ పడుచుండెను. ఉప్పు మిరపకాయ చింతపండు మొదలగునవి యెల్ల బియ్య మిచ్చియే కొనవలసి యుండెను. అదిగాక చిరుతిండి తినుటలో గణపతియు తల్లియు నొకరి కొకరు తీసిపోరు. ఈతపండు రేఁగుపండు చెరుకు ముక్కలు నేరేడుపండ్లు మామితాండ్ర తాటిచాప కొబ్బరి కురిడీలు మొదలగున వేవి వీధిలోనికి వచ్చినను తల్లి యరసోలెడు బియ్యము బోసి కొని తిని తీరవలయును. ఈ విధముగ సంసారము చేయుచుండుటచే వారి కిచ్చిన ధాన్య మాటుట కష్ట మయ్యెను. ఏఁడాదికి గ్రామవాసులు పుట్టెడు ధాన్య మిచ్చునట్లు మహాదేవశాస్త్రి యేర్పాటుచేసి మూడు మాసముల కొక యేదుము ధాన్యము చొప్పున నిచ్చుటకు నిర్ణయము చేసి ముందుగ నొక యేదుము వారి కిప్పించి తమ యరుగుమీఁదనే బడి పెట్టించెను.