గణపతి/పదహారవ ప్రకరణము
పదహారవ ప్రకరణము
బడి పెట్టకమునుపె గణపతి కాలువయొడ్డునకు బోయి మంచి యీతబెత్తములు రెండు మూఁడు విరిచి యాకు లూడదీసి నున్నగా జేసి యెకటి చేత బట్టుకొని బడికివచ్చి కొబ్బరి యాకుల చాపమీద గూర్చుండెను. ఉపాధ్యాయుని రూపురేఖా విలాసములు చూచినతోడనే బెత్తపుదెబ్బ లక్కఱలేకయె బాలకుల కడలు జనించెను. ఈ బెత్తము చేతబూని కూర్చుండిన గణపతి బాలురకు సాక్షాద్దండధరుఁడట్లు తోఁచెను. పంతులు దండధరుఁ డైనపుడు పాఠశాల యమలోకము నరకలోకము నగుట యొక యాశ్చర్యములోనిది కాదు. అక్షరములు రాని పిల్లల కక్షరములు బూడిదలోవ్రాసి యివ్వవలసిన దనియు వ్రాసిన యక్షరములు దిద్దించి నోట పలికించవలసిన దనియు పుస్తకములు పట్టిన పిల్లలకు గణపతి యాజ్ఞాపించెను. బాలబోధ చదువువారికి రెండవ పాఠపుస్తకము చదువువారిని గురువులుగఁ జేసెను. ఇంటిదగ్గఱ తల్లి దండ్రులయొద్ద రుక్మిణీకల్యాణము దాశరథీ శతకము మొదలైనవి చదువుకొనివచ్చినవారిని వారికంటెఁ గ్రిందివారి కొజ్జలుగ నేర్పఱచెను. తాను కలము కాగితముబుచ్చుకొని గాని యాకుగంటము బుచ్చుకొని గాని యెన్నఁడు వ్రాసి యెఱుఁగడు. వ్రాత వ్రాయవలసి వచ్చినపుడు పెద్దపిల్లలచేత చిన్న పిల్లకు వరవళ్ళు పెట్టించును. ప్రధానోపాధ్యాయుఁడు పాఠశాలలో బాఠములు చెప్పకుండ దానొక యుపద్రష్టయై సర్వము జక్కఁగా జరుగుచున్నదో లేదో కనుగొనవలసినదని నేటికాలమున బయలువెడలిన క్రొత్త సిద్ధాంతమును మొట్టమొదట కనిపెట్టిన మహాత్ముఁడు గణపతియే యనిమీరు నిశ్చయముగ నమ్మవలయును. గణపతి బడికి బోయినది మొదలుకొని గోడకు జేరబడి దౌడలు నొప్పులెత్తు వఱకుఁబొగచుట్టలు కాల్చును. దౌడలు నొప్పులెత్తిన తరవాత గోడకు జేరఁబడి కొంతసేపు చాపమీఁదఁ బండుకొని నిద్రపోవును. పిల్లల యల్లరి వల్లగాని దానంత టదిగాని నిదుర మెలఁకువ వచ్చిన తరువాత రామరావణ మహా సంగ్రామమున బలాత్కారముగా నిద్ర నుండి మేల్కొలుపఁబడిన కుంభకర్ణుఁడు వలె నల్లరిచేసిన వారిని జేయని వారిని గలిపి దూదేఁకిన తెఱగున నేకి విడిచిపట్టును. బడి కాలస్యముగ వచ్చినవారిని "నీవింత జాగేల చేసితి" వని బాదును. ముందుగ వచ్చికూర్చుండినవారిని "వెధవ నీ కేమీ పనిపాటలు లేవటరా, యింటిదగ్గఱ?" యని మోదును. పాఠము తిన్నగఁ జదువని వానిని చదవనందుకు శిక్షించును. గబగబ పాఠ మప్పగించిన వారిని "వెధవ ! వెనకనుంచి నిన్నెవరైన దఱుము చున్నారా, యేమిటి? అంత తొంద రెందు" కని దండించును. పాఠము మెల్లగా నప్పగించినవారిని "గాడిద, నీ వన్నము తినలేదా? లంఖనాలు చేసినావా? మాట హీనస్వరముగ వచ్చుచున్న దేమి? యని తన్నును. పాఠము బిగ్గరగ జదివినవారిని "మొండివెధవ ! నేను చెవిటివాఁడ ననుకొన్నావా యేమిటి? దాకపిడతలాగున నోరు తెఱచి దయ్యపు గొంతుతో ఆలాగున నఱచెద వెందు?" కని దండప్రయోగము చేయును. ఇన్ని మాట లెందుకు. బడిలో నున్నంతసేపు ప్రతిపిల్లవాఁడు తన వీపుమీఁద నిప్పు డప్పు డనక యిందు కందు కనక బ్రతిక్షణము దెబ్బ పడుచున్న దని తలంపవలసినదే. పంతులువారు చాప మీఁద నుంచి లేచిరనఁగానె పిల్లల గుండెలు పీచుపీచు మనుచుండును. దినమునకు నాలుగై దీతబెత్తములు విరుగుచుండును. బెత్తములు విరిగినప్పుడు కలములతో నెత్తురు వచ్చునట్లు పొడుచును. కలములు లేనప్పుడు గంటము మొదలు గూడ నాయుధము లగును. బందుల పలకలు బోడి పలకలు తాటియాకు పుస్తకములు పుస్తకములను గట్టెడి త్రాళ్ళు చీపురుకట్టలు మొదలగున వన్నియు, ధనుర్వేద పారంగతునకు గడ్డిపరకలు మొద లైనవి యస్త్రములైనట్టు వానికి బరికరము లగుచువచ్చెను. అవి దొరకినప్పుడు చేతితో చరచును. పిడిగ్రుద్దులు గ్రుద్దును. తొడపాశములు పెట్టును. చెవులు పెనవేయును. స్తంభమునకు గట్టి పెట్టి చింతబరికెలు తెప్పించి వెన్ను నెత్తురు గ్రమ్మునట్లు కొట్టును. కోదండము తీయించును. ఎండలో నిలువబెట్టి మీఁద రాళ్ళెత్తును. గోడకుర్చీలు వేయించి వారిపై బాలకులఁ గూర్చుండబెట్టును. కొందఱను వంగబెట్టి కాలికి మెడకు లంకెవేయును. వెయ్యేల! పాపకర్ముల నిమిత్తము యమధర్మరా జెన్ని నరకముల నిర్మించెనో గణపతి తన శిష్యుల నిమిత్త మన్ని దండనలు సృజించెను. తమ బిడ్డలయందు మితిలేని ప్రేమగల గ్రామవాసు లప్పుడప్పుడు పాఠశాలకు బోయి "యేమండీ పంతులుగారూ ! మాపిల్లవాని నంత దారుణముగఁ గొట్టినా రేమి? పిల్లవానివల్ల తప్పులుండవచ్చును. ఉన్నంతమాత్రముచేత నింతచేటు కొట్టుదురా? శరీర మంతట వాతలు బెట్టినట్టు దద్దురులు దేలినవి. అంత మోటదనమా? పసిబిడ్డలు నోరులేనివాళ్ళు చచ్చిపోగల" రని మందలింప గణపతి యుగ్రుడై తారాజువ్వవలె లేచి కోపావేశమున మాటలు తడబడ "మీ పిల్లవాఁడు వట్టి వెధవ. ఆ వెధవను నే నెలాగైన బాగుచేయవలె నని భయభక్తులు చెప్పుచున్నాను. ఈ లాగున వానిని మీరు వెనుక వేసికొని వచ్చి నాతో దెబ్బలాడితే యా వెధవకు భయముండునా? ఛీ! పుణ్యమునకు బోతే పాప మెదురుగ వచ్చినది. ఉపకారమున కివి రోజులు కావు. పిల్లవానిని బాగుచేసినా నని విశ్వాసము లేదు. సరిగదా మీదు మిక్కిలి దెబ్బలాటలకు వచ్చినారా, నా మీఁదికి? మీ పిల్లవాఁడు నా బడిలోనికి రానేవద్దు. తీసుకొని పొండి. పోరా వెధవా! యని లేవగొట్టెను. ఒక పిల్లవాఁడు రెండుదినములు బడికి రాక మూడవదినమున వచ్చినందుకు గణపతి వానికి బుద్ధివచ్చుటకై జుట్టుకు త్రాడువోసి వానిని దూలమునకు గట్టెను. ప్రాతచేఁదత్రా డగుటచే వెంటనే తెగిపోయెను. పిల్లవాఁడు క్రిందపడెను. ఆ పాటున నొడ లెల్ల గాయము లయ్యెను. దెబ్బ తగులక పోయినను తగిలిన ట్లేడ్చుచున్నావా దొంగ వెధవా!" యని పైగా బెత్తముతో రెండు వడ్డించెను. వాఁడు గోలపెట్టి పెద్దపెట్టున నేడువసాగెను. పదుగురు బడిచుట్టు జేరిరి. "దయా దాక్షిణ్యము లేక పశువును గొట్టిన ట్లీ విధమున గొట్టవచ్చునటయ్యా! యని కొందరయ్యలు గణపతిని బ్రశ్నింప గణపతి యాక్షేపణ పూర్వకముగ వారి కిట్లనియె. "కుండలో కూడు కుండలో నుండవలె, పిల్లవాడు దుండుముక్క వలె నుండవలె నన్నారఁట" వెనకటికి ! మీ మాట లాలాగున నున్నాయి. బెత్తము దాచినానా పిల్లవాఁడు చెడిపోయినాడన్న మాటే. ఈలాగున చిత్రవధ చేయుచున్నప్పుడే యీ విధవ లింత పొగరెక్కినారు. నేనూరకుంటినంటే వీళ్ళ ముందర లోకా లాగుతాయా! అతికాయుఁడు మహాకాయుఁడు వంటివాళ్ళీ వెధవలు. ఈ మాత్రమునకే మీరీలాగున భయపడుచున్నారు. నా చిన్న తనములో మా గురువుగారు చేసిన శిక్షలలో నిది యెన్నోవంతు? ఒకనాఁడు మా గురువుగారు గరిటె కాల్చి వాతలు పెట్టినారు. ఒకనాడు ముంతపొగ పెట్టినారు. గోడదగ్గర నేను కూర్చుండగా నా తల గోడకుపెట్టి గొట్టినారు. ఒక నియోగుల కుఱ్ఱవానిని జునపములు పట్టుకొని కొట్టగా జునపము లూడి చేతిలోనికి వచ్చినవి. ఒక కుఱ్ఱవానికి పాఠము రాకపోతే చమురు కాల్చిపోసినారు. ఒక పిల్లవాడు చదువకపోతే కాల్చే కాల్చే చుట్టతో చంటిపిల్లలకు దెబ్బ వేసినట్టు వేసినాడు. ఇంత చేసినప్పటికి మేమేడ్వవలనుగాదు. నోట్లో గుడ్డలు క్రుక్కేవారు. పోనీ చంటిపిల్ల లేడ్చిపోదు రని జాలిచేత నట్టి పద్ధతు లవలంబించనే లేదు. పిల్లలంటే నాపిల్లలే. నేనుపూర్వపు వాళ్ళవలె నంత కఠినపద్ధతులు నేడవలంబించలేదు. నేనంత దయతో జూచుకొను నప్పటికి మీకు విశ్వాసము లేక నన్నడ్డమైన మాటలనుచున్నారు. ఒకమాటు పాఠము చదువకపోతే కంట్లో కారపు పొడి మిరపకాయ పొడి వేసేవారు. ఒక పరియాయము నేను బడికి రాక యాగడముసేయ జుట్టుకు త్రాడుపోసి నూతిలో దింపినారు. అంతంత శిక్షలుచేసి యాయన నాలుగు ముక్కలు చెప్పబట్టి నేనింత బాగుపడి యక్కఱకు వచ్చినాను. ఆ మహారాజు పెట్టిన దీప మిది. ఈ వృద్ధంతా యాయనదే. ఆయనకే దీపము పెట్టి మ్రొక్కవలె. ఈ గ్రామములో పిల్ల లందఱును నాయంత వాళ్లను చేయవలెనని తలంచుకోగా మీ రా పని సాగనియ్యక బాధ పెట్టుచున్నారు. పోనీ నా దేమి పోయినది? చదువు కొన్నారో యింతన్నము దిని బాగుపడ్డారో ! లేకపోతే చెడి పోదురు నాకేమి?"
అని తానొక మహావిద్వాంసు డైనట్లు తానా విద్యలు బహుపరిశ్రమచేసి గురువు పెట్టెడి బాధలుపడి నేర్చుకొన్నట్లు కొన్ని కోతలు కోసెను. అతని పాండిత్యప్రభావ మెఱింగినవారు వాని దంభము విని ముసి ముసి నవ్వులు నవ్వుకొని పోయిరి. ఒకనాఁ డొక గ్రామవాసి వచ్చి "పంతులుగారూ! ఏమండీ! మా పిల్లవాడు మీ బడిలో ప్రవేశించి యాఱుమాసములైనది. ప్రవేశించినప్పు డెంత వచ్చెనో యిప్పు డంతె వచ్చెను. మీరు బొత్తిగా పాఠములు చెప్పుట లేదా యేముటి?" యని యడిగెను. అట్టి ప్రశ్నల కుత్తరము గణపతియొక్క జిహ్వాగ్రమందు సిద్ధముగానే యుండునుగదా. "అయ్యా ! మీ వాడు మిక్కిలి యల్లరిపిల్లవాఁడు. ఆ పిల్లవానికి నేను చదువు చెప్పుట కంటె భయము చెప్పుట మంచిదని యాలోచించి చదువు చెప్పుట మాని ముందుగా భయము చెప్పినాను. వెధవ చదు వెంతసేపు వచ్చును? భయము వచ్చుట చాల కష్టము. చదు వనగా మీయభిప్రాయ మెంతో యున్నదనుకొన్నారు కాబోలు. అంత చదువూ నేను నెల దినములలో చెప్పివేయగలను. అదీగాక చదువు మఱియొక పంతులయిన జెప్పగలఁడు. మీ పిల్లవానికి నావలె భయము చెప్ప గలవారు మఱొకరు లేరు. మీ పుణ్యము చేత నేనీయూరు రాబట్టి మీ పిల్లవాడు బాగుపడినాఁడు. లేక పోతే వాఁ డెందుకు పనికిరాకపోవును. ఇప్పుడు వాని కెంత భయము వచ్చిన దనుకొన్నారు. నాపేరు వింటే వానికి గడగడ వణకు! నేను నడచుచున్న వీధిలో నడవడు. మొన్నరాత్రి మీ యమ్మగారు చెప్పినారు. అన్నమెక్కువయైనది నేను తినలేనన్నాఁ డట మీవాఁడు. 'పంతులుగారిని పిలవనా, తింటావా?' యని మీ యమ్మగా రడిగినాఁరట. ఆ మాట ననగానే చచ్చినట్లు కంచములో నున్న యన్నమంతయు కిక్కురు మనకుండ తిన్నాఁడట. భయ మనగా నాలాగుండ వలె! ఏఁడీ పిల్లలకు నావలె భయము చెప్పగల పంతులును వేలుమడిచి మరొక్కని చెప్పండి. వెధవ చదువు, కూర్చున్న గుడ్డిముండ చెప్పగలదు! చదువు చెప్పుట కష్టమను కొన్నారా యేమిటి? దాశరథీ యని రెండు కూని రాగాలు తీసి చెప్పగానే సరా యేమిటి? భయము చెప్పాలి, అదీ ప్రజ్ఞ! అదీ సొగసు! పంతులును చూడగానే గజగజ వణికి మూర్ఛపోవాలి, పిల్లవాడు. వాఁడే పంతులు. తక్కినవాఁడు పంతులు మెంతులు పావు శేరు మెంతులు, ఎగరేసి కొడితే యేడు మెంతులు! అలాటి పంతుళ్ళు పనికిరారు. పంతులంటే నేనే పంతులును!" అని ప్రత్యుత్తరము చెప్ప నాతఁడు తెల్లపోయి మాఱుమటాడక తన పిల్లవానిని బడి కంపుట మానెను.
గణపతి బడిలో గూర్చుండు నప్పుడు కునికిపాట్లుపడుచు బాలురకడ పాఠము లప్పగించుకొనును. కునికిపాట్లు పడుచునే చెప్పదలచుకొన్న ముక్కలు చెప్పును. ఒకప్పుడు కునికిపాటు పడుచునే చుట్టకాల్చును. ఒకనాఁడు కునికిపాట్లలో నోటనున్న పొగచుట్ట కట్టుకొన్న బట్టపైఁ బడి, బట్ట కాలజొచ్చెను. పంతులుగారు బ్రతికియుండగానే శరీరము దగ్ధమగు నను భయమున, బాలురు కళవళపాటు నొంది "పంతులుగారు! బట్ట కాలుచున్న" దని కేకలు వైచి మేలు కొలిపిరి. ఆ కేకలు విని గణపతి మేల్కొని చేతులతో నలిపి బట్టయార్పి లేచి బెత్తము పుచ్చుకొని "పాడుముండా కొడుకులారా! బట్టంటుకోగానే కాలి చచ్చిపోదు ననుకున్నారా యేమిటి? మెల్లగా లేపలేక పోయినారా? అంతంత కేక లెందుకు? నిక్షేపమంటి నిద్ర చెడగొట్టినారు, వెధవ" లని వరుసగా నొక్కొక్కరినె వీపు బ్రద్దలు కొట్టెను. మఱియొకనా డా విధముగానే గణపతి నోటిచుట్ట కునికిపాట్లలో నుత్తరీయముపైఁడి నది కాలఁజొచ్చెను. లేపిన పక్షమున పంతులుగారు చావగొట్టుదు రని పిల్ల లూరకుండిరి. వీథిని వెళ్ళువా రెవరో యది చూచి గణపతిని మేలుకొలిపిరి. అతఁడు మెలఁకువ దెచ్చుకోని బాలకులఁ జూచి 'యోరి దరిద్రగొట్టు వెధవలారా! నేను కాలి చచ్చిపోతే సుఖముగ నుండవలె ననుకొన్నారా? ఇంతంత దుర్బుద్దులా మీ' కని బెత్తము విఱుగువరకు తాషాలు వాయించినట్లు వీపులమీఁద వాయించెను. ఒకనాడు లెక్కలు చెప్పుదును రమ్మని బాలకులం దనచుట్టుఁ గూర్చుండఁబెట్టుకొని, యంతలో గన్నులు మూఁతపడ కునుకుచు, "ముప్పది రూపాయల పందొమ్మిదణాల యిరువది పైసలు, దీనిని పదకొండు పెట్టి హెచ్చువేయం" డని చెప్పెను. అప్పుడొక పిల్లవాఁడు లేచి "పంతులుగారండి! పందొమ్మిదణాలుండవండి. ఇరువది పైస లుండవండి" యని చెప్పెను. అది విని గణపతి కన్నులు తెఱచి యాపిల్లవాని వంక తేఱిపాఱ జూచి "యోరి తుంటరివెధవా! ఉండవేమి? ఎందు కుండవు? నా కన్న నీ కెక్కువ తెలుసునా? నాలుగు ముక్కలు వచ్చినవో లేదో, యప్పుడే పంతులుగారికే పంగనామాలు పెట్టదలచుకొన్నావా? ఈలాటి వెధవవు నీ వక్కరకు వత్తువటరా?" యని యా దినమున బెత్త మదివరకె విఱిగిపోవుటచే జుట్టు వంగదీసి, చాకలివాడు బట్టలుదికిన తెఱంగున చరుపుమీద చరుపు పడునట్లుగా తనచేయి నొచ్చువరకు గొట్టి, యిటువంటి వెధవలకు లెక్కలే చెప్పనని యూరకుండెను. మఱియొకనాఁడు కునికిపాట్లు పడుచు "ముప్పదియాఱు రూపాయల డెబ్బదియా ఱణాల యఱువది యాఱు పైసలు కలపండి" యని చెప్పెను. "ఒక కచ్చమే చెప్పినారు పంతులుగారూ! రెండవ కచ్చము చెప్పలేదు. ఏలాగున కలపమండి" యని పిల్ల లడిగిరి. అడుగుటయు నతడు కోపోద్దీపితుఁడై యిలాటి వెధవ ప్రశ్నలు వేయకుండ చెంపలు పగులగొట్టెద చూడుండని యొక్కక్కని నాలుగేసి చెంపకాయలు కొట్టి వారి పలకలు వీథిలో గిరవాటులు వైచెను. చాలామంది పలకలు పగిలిపోయెను. పిల్లల తల్లిదండ్రులు సంరక్షకులు వచ్చి పలకలేల పగుల గొట్టినారని గట్టిగా నడుగ గణపతి మీ పిల్లలే పగులగొట్టినారు కాని నేను పగులగొట్టలేదని యబద్ధమాడి, యొట్టు పెట్టుకొని ప్రమాణముచేసి, యాయాపద తప్పించు కొనియెను. ఒట్లు ప్రమాణములు గణపతికి లెక్కలోనివి కావు. అతని దృష్టిచేత నన్నియు గాలికి పోవు మాటలే కావున వాని కనృతభయమనునది లేదు.
గణపతియొక్క పాండిత్యప్రభావము బోధనాశక్తి యెట్లున్నదో తెలిసికొని యానందింపవలె నని చదువరులు కుతూహల పడుచుందురు. కావున నట్టివిశేషములు కొన్ని యుదహరించుట సమంజసము. ఆ బడిలో చదువుకొనని క్రొత్తబాలుఁ డొకనాఁడు పాఠశాలకు వచ్చి గణపతియొక్క వికారరూపమును వికృత చేష్టలను విపరీతపు బ్రసంగమును విని యాతనిచేత మాటలాడించి యానందింప వలయు నని నిశ్చయించి దాశరథీ శతకము లోని "శ్రీరఘురామ చారుతులసీ దళ దామ" యను పద్యము చదివి "పంతులుగారూ ! దీని యర్థము మీ ముఖతః వినవలయు నని యున్నది. మీరు బహు సరసముగ జెప్పగల రని విన్నాను. కావున సెలవియ్యవలయును" నని యడిగెను. అటువంటి ప్రశ్న పాఠశాలలోని బాలుఁ డడిగిన పక్షమున వాని వీపు పుల్ల మజ్జిగ పోసి కాల్చిన రొట్టెవలె దెబ్బలతో నుదికి యుండును. అడిగినవాఁడు పాఠశాల విద్యార్థి గాక పైవాఁడగుటచే గణపతికి యేమియుఁ దోఁచక పచ్చివెలగకాయ గొంతు పడిన ట్లేమాటయు రాక క్రిందు చూచి మీదు చూచి నలు ప్రక్కలు జూచి తన బుద్ధి నుపయోగించి యర్థము చెప్పవలయునని నిశ్చయించి పద్య మా పిల్లవానిచేతనే చదివించి యీవిధముగ నర్థము చెప్పెను. శ్రీరఘురామ=శ్రీరాములువారు, చారు=ఒకనాడు పైత్యముగా నుండి చారు కాపించుకొన్నారు. తులసీ దళదామ=ఆ దేశములో కరివేపాకు లేదు గనుక తులసీ దళములే యందులో వేసి పొంగించినారు. శమక్షమాది శృంగార గుణాభిరామ=శ్రమ యావత్తు పోగొట్టగలిగి బహు శృంగారముగా నున్నదట, ఆ చారు త్రిజగన్నుత శౌర్యరమాలలామ=ఆ చారు త్రాగిన తరువాత ఆ రాములు వారికి కావలసినంత శౌర్యము గలిగిందట, రాక్షసులను చంపుటకు - దుర్వారకబంధ రాక్షస విరామ=వారి కందరకు కఫము పుట్టకుండ పోయినదట. జగజ్జనకల్మషార్ణవోత్తారికనామ= ఆ చారు తారక మంత్రములాగు త్రాగిన జను లందరకు గల్మషము కొట్టివేసినది. భద్రగిరి=వారి కెంతో భద్రము కలిగినది." అంతవర కర్థము చెపునప్పటికే ప్రశ్న మడిగిన పిల్లవాఁడు నవ్వు పట్టలేక నవ్వుచునే "వహవా పంతులు గారూ! వహవా! ఈ పద్యార్థము నే నెందరు పండితులనో యడిగితి, కాని మీ వలె నింత రసవంతముగా జెప్పినవా రొక్కరును లేకపోయినారండి. రాయలవారి వంటి మహారాజొకఁ డిప్పుడున్న పక్షమున మీ వంటివారి కెన్నో యగ్రహారములు లిచ్చు" నని యాతని ప్రజ్ఞా విశేషము నుగ్గడించెను. గణపతి యా ప్రశంస యంతయు నిక్కముగాఁ దలంచి మిక్కిలి వినయముతో "అయ్యా ! నే నెంత వాడను. తమ దయచేత నాలా గనుచున్నారు. కాని నేనంత పండితుఁడను కానండి. ఆ సరస్వతీదేవి దయవల్ల నాకు నాలుగు ముక్కలు వచ్చినవి, కాని నేను పట్టుమని శాస్త్రములు చదువుకోలేదండీ !" యని బదులు చెప్పెను. పై పద్యముయొక్క యర్థమును బట్టి గణపతి యెంత ప్రజ్ఞాశాలియై వానికడ నెటువంటి విచిత్రభావము లున్నవో, యెంత సమయస్ఫూర్తి యున్నదో సరసులు నిష్పక్షపాత మనస్కులు నగువారందరు గ్రహింపవచ్చును. వ్యాకరణ శాస్త్రమొ, తర్కశాస్త్రమొ, చదువుకొని శబ్దమున కపార్థము కల్పించి నిజ మబద్ధ మని, యబద్ధము నిజ మని కల్ల వాదములు సేయు పండితులను జూచి జనులు జోహారులు చేసి వారి చెవులకు సువర్ణ కుండలములు తగిలించి శాలువలు కప్పి యఖండ సన్మానము చేయుదురు. కాని గణపతి 'శ్రీరఘురామ ' యన్న పద్యమునకు స్వకపోలకల్పితముగ నత్యంతరమణీయమైన యర్థము చెప్పినపు డా గౌరవము జూపుటలేదు. సరికదా మీదు మిక్కిలి యపహాస్యము చేయుదురు. ఇవి మెత్తని వారికి దినములు కావుగదా!
పూర్వోదాహృత పద్యార్థమును బట్టి యతని యాంధ్రసాహిత్య ప్రభావము తేటపడినది. సాహిత్యమునందే గాక యతనికి శారీరశాస్త్రము నందును మరికొన్ని యితరవిషయములందును గల ప్రవేశము దెలుపుటకై కొన్ని మాటలు చెప్పుట అవశ్య కర్తవ్యము. ఎవఁడో పిల్లవాఁడు జ్వరముచేత బాధపడు చున్నాఁడని తెలిసినప్పుడు జ్వరమునుగూర్చి యతఁడు చేసిన చిన్న యుపన్యాస మెల్లవారు వినఁదగి యున్నది. జ్వరమెందుకు వచ్చు ననగా మన కడుపులో బొడ్డుదగ్గర దీపముండును. ఆదీప మొకప్పుడు భగ్గున మండి పెద్దదగును. అప్పుడు లోపల వేఁడి చాల పుట్టును, లోపల వేడిచేత పై చర్మము గూడ వెచ్చబడును. లోపల దీపము మండుచుండుటచేతనే జబ్బుగా నున్నవానికి కడుపులో మంటలు బయలుదేరును. ఆ దీపము తగ్గి యథాప్రకారమైతే జ్వరము తగ్గిపోవును. ఆ దీప మారిపోయినప్పుడు మనము చచ్చి పోవుదుము. ఆ దీపము వెలుగుటకే మన్నములో నెయ్యి చమురు వేసికొనవలెను. చమురు లేకపోతే దీపాలు వెలుగవు కదా!
ఉరుములు వర్షములు పిడుగులు మొదలగువానిం గూర్చి గణపతి యీ విధముగఁ జెప్పుచుండును. "దేవుడు బండియెక్కి యాకాశముమీఁద తిరుగుచుండును. ఆ బండి చప్పుడే వురుములు. అప్పుడప్పుడా బండి సీల లూడి క్రింద పడుచుండును. అవియే పిడుగులు. దేవుని బండికి గట్టిన గుఱ్ఱాల డెక్కలు రాళ్ళమీఁద తగులుటవల్ల నిప్పులు మంటలు బయలుదేరును. అవే మెరుపులు. వాననగా తిరిగితిరిగి వచ్చినమీఁదట దేవుని వంటిమీఁద పట్టిన చెమట. గాలి వేసినప్పుడు వాన రాకపోవుటకు గారణ మేమో తెలుసునా? గాలి విసరునప్పుడు చెమట యారిపోవును. సూర్యుఁడనఁగా దేవుడుఁగారి యింట బెట్టుకొన్న కుంపటి. చంద్రుఁడంటే దేవుడుగారి యింట్లో యిత్తడి సిబ్బె. ఈ విధముగ గణపతి యనేక శాస్త్రములలో బ్రవేశము గలిగి తాను నేర్చిన విద్య యొరులకు నేర్పనివాఁడు ముందు జన్మమున ముషిణిచెట్టయి పుట్టునని పెద్దల నోటినుంచి వెడలు వాక్యములు పలుమారు విని యుండుటచే నట్టి విషపు చెట్టయి పుట్టుట కిష్టములేక తన కడుపులోనున్న జ్ఞాన మంతయు నిప్పు డప్పు డనక ప్రసంగము వచ్చినపుడు తన విద్యార్థులకు, గ్రామవాసులకు జెప్పుచుండును. సర్పములను గురించియు సర్పస్వభావచేష్టితములను గురించియు నాతనికిఁ దెలిసిన జ్ఞానము లోకోపకారముగ నుండును. కావున గ్రంథ విస్తరతకైనను నొడంబడి నవ్విషయ మందలి ముఖ్యాంశము లిందు బొందుపఱుపఁ బడుచున్నవి.
"పాము దీర్ఘ క్రోధముగల జంతువు. దాని జోలికి పోయిన మనుష్యునిపై నది కసిపట్టి పగ పూని యుండును. పాము కసి, పాము పగ యని మీరు వినలేదా? తన జోలికి వచ్చినవాడు వెంటనే దొరకిన యెడల వానిని వెంటనే కరిచి చంపును. వాఁడు దొరికినప్పుడే దాని సొగసు, దాని తమాషా ! వాఁడు దొరకనప్పుడు పాము పగబట్టి వాఁ డెన్ని మేడలమీఁద బండుకొన్నప్పటికి, యెన్ని మిద్దెలమీఁద దాఁగొన్నప్పటికి, ఎంతమందిలో నిద్రపోయినప్పటికి రాత్రివేళ వెళ్ళి వానిని పట్టి కరిచి చంపును. ఏలాగో తెలుసా? ఎవరిమీద పాము పగపట్టునో వాని యడుగు లనఁగా వాడు నడిచిన చోటు తియ్యగా నుండును. తక్కినవారి యడుగులు చప్పగా నుండును. ఆ యడుగుల తీపినిబట్టి వారున్నచోటికిఁ బోయి మెల్లగ కాటువేయును. అందుచేత పాముపగ గలవాఁడు తిన్నగా నడువక వంకరటింకరగ నడువవలెను. అప్పుడు పాముగూడ వంకరటింకరగ నడచును. ఆలాగున నడచిన యెడల దాని యెముకలు విరిగిపోవును. ఒకప్పుడు పాముపగ గలవాఁడు నడవక బండెక్కి గాని మనుష్యుల భుజమెక్కి గాని వచ్చుట మంచిది. అడుగుల జాడ లేదు గావున వాఁడున్న చోటికి పాము రాఁజాలదు."
ఆ తెఱంగున నతఁ డెల్ల విషయముల దనకుగల జ్ఞానము లోకహితార్థముగ వెలిబుచ్చు చుండును. అతని కే విషయమున నెంత జ్ఞాన మున్నదో, యది యెంతవరకు యదార్థమైనజ్ఞానమో, తమ బిడ్డల కతడు విద్య చెప్పుచున్నాడో లేదో, యితని పాఠశాలకుఁ బోయినందునఁ దమ బిడ్డ లెంత బాగుపడు చున్నారో తెలిసికొనువారు గ్రామస్థులలో ననేకులు లేరు. అట్టివాఁడు నూటి కొకఁ డుండవచ్చును. తన పిల్లవానిని మిక్కిలి కఠినముగ శిక్షించినాఁడని యిద్దఱు ముగ్గురు గణపతితో వివాదపడిరేగాని చదువు విషయములో వివాదపడువా రరుదు. 'పంతులుగారు మాకు సరిగా పాఠములు చెప్పుటలే ' దని కొందఱు పిల్లలు తల్లిదండ్రులతో మొఱపెట్టుకొనిరి. కాని యా మొఱలు తల్లిదండ్రుల మనస్సున కెక్కలేదు. పంతులుగారిమీఁద గిట్టక బిడ్డలు లేనిపోని నేర ములు వానిమీద చెప్పుచున్నారని తల్లిదండ్రు లూహించిరే కాని దాని యాథార్థ్యము జక్కగా నరసి కనుగొన వలయునని వారికి తోఁచలేదు. పంతులుగా రతిక్రూరశిక్ష జేయుచున్నారని బిడ్డలు గోల పెట్టినప్పుడు సయితము తమబిడ్డలను మిక్కిలి గారాబమున బెంచుకొను చున్న వారిద్దఱు ముగ్గురు దక్క దక్కినవారా మొఱ చెవినిడక 'పిల్లవా ళ్ళేదో దుండగము చేయఁబట్టి పంతులు కొట్టుచున్నాడే కాని యూరకకొట్టునా? పిల్లల మాటలు పట్టుకొని పంతులుగారితో వివాదపడుట మంచిదికాదు.' అని యా విషయమై వా రెంతమాత్రము విచారింపరైరి. అభిమన్యుఁడు పద్మవ్యూహమందు బ్రవేశించుటయే గాని దానినుండి వెలికివచ్చుట యెఱు గనట్లు గణపతి శ్రుతపాండిత్య ప్రభావము చేత నేవో కొన్ని లెక్కలు చెప్పుటయె యెఱుఁగును. కాని పిల్లలు లెక్కలు చేసిన తరువాత నవి సరిగ నున్నవో లేదో దిద్దుట యెఱుఁగడు. ఎవరిది తప్పో నిర్ణయింపఁజాలడు. ఉన్న పిల్లలలోఁ బెద్దవాఁడు చేసినదె సరి యని దానింబట్టి తక్కినవారి లెక్కలు నిర్ణయించును. అందుచేత నతని ప్రజ్ఞా సారము బాలకు లెల్లరు గ్రహించిరి. చదువు రాకపోవుటయు, దెబ్బలు ప్రతిదినము వర్షధారలవలె పడుచుండుటయు, సంరక్షకులుఁ దలిదండ్రులు తమ మొఱలు వినకపోవుటయుఁ జూచి బుద్ధి మంతులైన కొందఱు పిల్లలు పంతులుగారికి మెల్లమెల్లగ లంచములు మప్పిరి. తిరుపతి వెంకటేశ్వరులు మొదలగు దేవతలే ధనము పండ్లు మొదలగు లంచములు మరిగి భక్తజనుల కుపకారములు చేయుచుండగా పల్లెటూరి పంతులొకఁడు లంచముల కాశపడి విద్యార్థులయెడ నిగ్రహానుగ్రహములు చూపుట యాశ్చర్యమా! ఒకనాఁ డొక పిల్లవాఁడు నాలు గరటిపండ్లు తెచ్చి పంతులుగారికి సమర్పించెను. అవి తిని గణపతి యా దినమున వాని నొక దెబ్బయైన గొట్టలేదు. ఆ పరమ రహస్యము వెంటనే బాలకు లందఱు గ్రహించి గురువు దైవసమానుడు గనుక దైవమున కర్పించినట్లే మరునాటినుండి గురువు గారికి కట్నములు కానుకలు ముడుపులు సమర్పణము జేయఁజొచ్చిరి. వైశ్యబాలకులు బెల్లము పటికబెల్లము పంచదార వక్కలు లవంగములు మొదలయినవి సమర్పింపఁజొచ్చిరి. పంట కాపుల బిడ్డలు పొగచుట్టలు, వీలైనప్పుడు శనగలు కందులు కూరలు మొదలగునవి తెచ్చి యియ్యఁదొడగిరి. బ్రాహ్మణ బాలకులు తలిదండ్రుల నడిగియు, వారీయనప్పుడు గూళ్ళలోను దూలములమీద గదులపెట్టెలలోను దాఁచికొన్నవి దొంగిలించియు డబ్బులు తెచ్చి యియ్యదొడగిరి. ఏదేని వస్తువు నివేదింపఁ బడిననాఁడు విద్యార్థులకు దెబ్బలు తప్పిపోవుటచే, బాలకులు బదులు తెచ్చియొ దొంగిలించియొ తలిదండ్రుల నడిగి తెచ్చియొ యేదో యొకటి పంతులుగారికి సమర్పించి దండనము తప్పించుకొనుచు వచ్చిరి. ఈ పద్ధతి యవలంబించిన తరువాత గ్రామస్తుల యిండ్లలో పెద్దవాండ్రు దాచికొన్న పొగచుట్టలు డబ్బులు కనపడకపోయెను. ఎవరో దొంగలు వచ్చినారని గోల బయలుదేఱెను. ఇంటిదొంగ నీశ్వరుఁడైన బట్టుకొన లేడుకదా! ఇట్లగుటచేట బెత్తమునకు బొత్తిగా పని తప్పిపోయిన దని మీరనుకొనవద్దు. ముడుపులు తెచ్చుటకు శక్తిలేని నిర్భాగ్యులగు బాలకులమీఁద దండము ద్విగుణముగఁ బ్రయోగింపబడుచు వచ్చెను. కార్తవీర్యార్జునుఁడు మొదలగు మాహావీరులు బాహువుల తీట తీరుటకయి లేనిపోని కయ్యములు కల్పించిన విధమున గణపతి తన చేతుల తీట తీరుటకు గొట్టవలయు నను ముచ్చట తీరుటకు నెన్నో వంకలు కల్పించి కానుకలు తేజాలని పేదబాలకులను చిత్రవధ చేయ నారంభించెను. ఆ పీడ తప్పించు కొనుటకయి వారు గూడ బహు విధోపాయముల నన్వేషించి గురు ప్రీత్యర్థము కానుకలు తెచ్చుటకయి చిన్న చిన్న దొంగతనములు చేయ నారంభించిరి. వీథిలో నెండబోసిన వడ్లు దొంగిలించిన వారు కొందఱు, దుకాణములో గూర్చుండినట్లె గూర్చుండి డబ్బులో సరకులో దొంగిలించెడు బాలురు కొందరు,అప్పుడప్పుడీ బాలకు లలవాటు లేని దొంగతనమున బట్టువడ పంతులువారి చేతినుండి తప్పించుకొనదలచిన శిక్ష, వస్తువుగల యజమానుల చేత పడజొచ్చిరి.
గణపతియొక్క చిత్రచేష్టలు విని యింతకు మున్ను చదువుకొనుట కిష్టము లేనివారయ్యు విద్యాభ్యాసమునం దెక్కడ లేని తమకము గలవారై మొట్టమొదట వినయ వినమితగాత్రులయి తమ్ము శిష్యులుగఁ బరిగ్రహింప వలసినదని గణపతిని వేడి యతని యనుగ్రహపాత్రులై యతని శిష్యగణములో జేరిరి. చేరి వీలైనప్పుడు తా మల్లరిచేయుచు, వీలుకానప్పు డేదో చెరుపు చేయుమని తమకంటె జిన్నవాండ్ర బురిగొల్పుచు, వారు చేయునట్టి యల్లరి జూచి మహానందము నొందుచుండిరి. పెద్ద పిల్లలు చేరిన తరువాత చిన్నపిల్లలకు మునుపటికన్న ధైర్యసాహసములు హెచ్చెను. ఒకనాడు గణపతి శిష్యులకు తాను చిన్నప్పుడు నేర్చిన 'ఎవరయా మీరు చక్కనిరాజు లిద్ద ' ఱను పద్య ముక్తలేఖనము జెప్పదొడగెను. పదుగురుబాలకులది వ్రాయుచుండిరి. 'నేనన్నమాట మీరు మరల ననవద్ద 'ని గణపతి వారి కాజ్ఞ యొసగెను. ఆ యాజ్ఞ చెవి నిడక మొదటనున్న బాలకులు 'ఎవరయా మీవరని' గణపతి చెప్పగా 'యెవరయా మీరని' మరల ననజొచ్చిరి. గణపతి కోపావిష్టుడై యాబాలకుల తలలు గోడనుబెట్టి కొట్టి దండించుచుండగా జిట్టచివర నున్న బాలకులు మరల 'ఎవరయా మీరని ' పలికిరి. మొదటి వారిని వదలి గణపతి చివరివారిని దండించుటకయి రాఁగా మధ్య బాలకు లా విధముగ నరవజొచ్చెను. తాడనము చేయుటకయి వారి కడ కతఁడు పోగా మొదటి పిల్లలు జివరపిల్లలు గూడ నొక్కపెట్టున నఱచిరి. అప్పుడు గణపతి కోపావేశమున నిజముగ నొడలు మఱచిపోయి యా బాలకులలొ నొక్క బక్కవానిని బట్టుకొని చేయి నొచ్చువరకు చఱపులు చఱచి క్రింద బడవైచి కాలితో త్రొక్కి "నాబడిలో నుండి లేచిపో వెధవా!" యని యరుఁగు మీదనుండి రెండుకాళ్ళు పట్టుకొని క్రిందికి లాగెను. ఆ పిల్లవాడు సహజముగ దుర్బలుఁ డయ్యుఁ చిరకాలమునుండి దెబ్బల కలవాటుపడి యుండుటచే నాటి దినమున నా దెబ్బలకంత స్రుక్కకపోయినను గణపతి నేడిపింపవలయు నని సంకల్పించి గోలపెట్టి యేడ్చి చచ్చిపోవు వానివలె వగర్చుచు నాయాసపడ జొచ్చెను. ఆ కొంటెతన మెఱిగియు గణపతిని వంచింపఁ దలచి తక్కిన బాలురు 'అయ్యో! అయ్యో! మన మందయ్యను పంతులుగారు చంపివేసినారోయి! చచ్చినాఁడోయి, చచ్చినాఁడోయి!' యని పెద్దపెట్టున నేడ్చి కేకలు వేయజొచ్చిరి. అందులో నొకడు చెవులు మూసెను. రెండవవాఁడు మొగమున చన్నీళ్ళు గొట్టెను. మూఁడవవాడు ముక్కు దగ్గర వేలుపెట్టి చూడజొచ్చెను. చుట్టుప్రక్కల నున్న మనుష్యులు పరుగు పరుగున రాజొచ్చిరి. పశులవాడు పశువులను గొట్టినట్లు గణపతి యుపాధ్యాయుడైన నాటగోలె యిచ్చవచ్చి నటుల బాలకుల దండించెను. ఇటువంటి దురవస్థ యెన్నడు గలుగలేదు. ఆ పిల్లవాని యవస్థ జూడగానే గణపతి కమిత భయముకలిగెను. మేనెల్ల చెమటలు గ్రమ్మెను. కాళ్లు గుడ్డపేలికలై శరీరమును భరింపజాలక పోయెను. గ్రామస్తులువచ్చి తన్ను ముక్కముక్కలుగ నరికివేయుదురనియు, లేనియెడల నరహత్య చేసినందుకు దొరతనమువా రురి తీయుదురనియు నతనికి దోఁచెను. ఆ యాపద దప్పించుకొనుట కప్పుడువాని కే యుపాయము దోఁచలేదు. ఎందుకైనను మంచిదని యాతం డటనుండి మెల్ల మెల్లన నెవ్వరికి గనఁబడకుండ బారిపోయెను. అక్కడ చేరినవా రందరు బాలునకు భయములేదని చెప్పి కొంచెము మంచినీళ్లు త్రావ నిచ్చి మెల్లగా నింటికి బంపిరి. ఆ బాలుని తండ్రి మహాదేవశాస్త్రిగారి యింటికి వచ్చి గణపతితో మాటలాడగోరెను. కాని యెక్కడ వెదకినను గణపతి కానఁబడడయ్యెను. గణపతి పొరబాటుచేత నట్లుచేసి యుండ వచ్చును. కాని మరియొక క్రోధముచేత నతడు కొట్టియుండ డని మహాదేవశాస్త్రి యతనికి జెప్పి యొడంబరిచి పంపెను. అతి భయముచేత గణపతి నూతిలోనో గోతిలోనో దిగి యాత్మహత్య చేసికొన్నాడేమో యని మహాదేవశాస్త్రియు, వాని యింటి యాడువాండ్రును శంకించిరి. సాయంకాలమువరకు గణపతి కనబడనే లేదు. అతని తల్లి కొడు కెందులోనో దిగి చచ్చియుండు నని నిశ్చయించి "అయ్యో! కొడుకా! అయ్యో కొడుకా! యీ దిక్కుమాలిన యూరికి నిన్ను బలి యిచ్చినానురా నాయనా! నా వరహాలచేట్టు కూలిపోయినదోయి, దేవుడా! నా చిట్టిబాబును చూడండి, నాయనా!" యని వినువారి గుండె లవియునట్లు రోదనము చేయజొచ్చెను. రాత్రి నాలుగు గడియల ప్రొద్దు పోయినప్పటికి గణపతి రాలేదు. మహాదేవశాస్త్రిగారి భార్య యా సమయమున నావకాయ తీసికొనుటకై యటుక యెక్కి కుండదగ్గర చేయిబెట్టెను. చేతికి మెత్తనియొడలు తగిలెను. దీపము దీసికొనకయె వెళ్ళుటచేత నది యేమో యెరుంగక యీ గ్రామములో మర్కటబాధ యెక్కువగ నుండుటచే తన చేతికి తగిలిన దేదో యా జాతి జంతు వనుకొని "కొండమ్రుచ్చు నాయనోయి ! కొండమ్రుచ్చ" ని గట్టిగా నరచి యాకళవళ పాటులో నిచ్చెన యొకచోట నుండగా మరియొకచోట దిగబోయి గుభాలున నేలబడెను. ఇంటిల్లిపాది పరుగెత్తుకొని వచ్చిరి. దైవవశమున నామె కాలుమాత్రమె బెణికెను కాని దెబ్బ మాత్రము విశేషముగఁ దగులలేదు; ఆ గొడవ విని యిరుగు పొరుగువా రందరు జేరిరి. ఏమి టేమి టని యెల్లవా రడిగిరి. కొండమ్రు చ్చటుకమీఁద గూర్చుండినదని యామె చెప్పెను. అప్పు డందులో ధైర్యవంతుఁ డొకడు దీపము వెలిగించుకొని యటుకమీఁద కెక్కెను. ఎక్కి చూచుచునప్పటికి కది కోఁతిగాదు, కొండమ్రుచ్చుగాదు కాని యాకార చేష్టలయందు నిజముగ కొండమ్రుచ్చని చెప్పదగిన మన గణపతియే!
అతఁ డావకాయగూనకుఁ జేరఁబడి గుర్రుపట్టి నిద్రపోయెను. ఇంత గొడవ జరుగుచున్న నతనికి మెలఁకువయే రాలేదు! అటుక యెక్కిన యతఁడు మొదట నది కొండమ్రుచ్చే యనుకొని మీఁదపడి కఱచునొ యను భయమున జాగ్రత్తగ సమీపించెను. కాని దీపపు వెలుగున గణపతి మూర్తి కనఁబడగానే "భయపడకండి భయపడకండి! కొండ మ్రుచ్చుగాదు, కోతిగాదు! మన పంతులుగా" రని క్రింద నిలిచియున్నవారి కందరకు వినబడునట్లు బిగ్గఱగ నరిచెను. అచ్చటనే యున్న గణపతి తల్లి యప్పలుకులు చెవినిబడగానే "యేఁడి యేఁడి ? నా నాయన యేడీ? నా బంగారు తండ్రి యేఁడి? బ్రతికియున్నాఁడా? నాయనా! మూఁడు తవ్వ లావు నేతితో వెంకటేశ్వర్లువారికి దీపారాధన చేసుకుంటాను. క్రిందికి రమ్మను, నయనా!" యని సంతోషించి యిష్టదైవతమునకు మ్రొక్కికొనెను; కుండలదగ్గర గణపతి కూర్చుండి నాఁడని వినిన తోడనే మహాదేవశాస్త్రి తల్లి మిక్కిలి కవలి "అయ్యో అయ్యో! మన యావకాయ తగులుబడిపోయినదిరా, నాయనా! వీఁడమ్మకడుపుకాలా! కుండలు మైలపరిచినాఁడు. ఆ పాడుగుడ్డలతో ముట్టుకొన్నాడు కాఁబోలు. ఈ దిక్కుమాలిన పంతులుకు బస యియ్యవద్దని నేను మొత్తుకొన్నాను. కాని మావాడు నామాట విన్నాఁడు కాఁడు. ఈ యే డావకాయ లేకుండా గొడ్డన్నము తినవలసివచ్చినది. వాడి మొగముమండా, ఆవకాయ కుండదగ్గర కూర్చుండవలెనని యెలా తోచిందమ్మా, వీడికి? ఇంకా నయము నూతిలోఁ గూర్చుండినాఁడు కాఁడు. నూతెడు నీళ్ళు మైలపడిపోను! ఈపాటికి దింపండి, చచ్చుపీనుగును!" అని కేకలు వేయజొచ్చెను. ఆ కఠినోక్తులు తల్లి కెంతో మనస్సంకటము కలిగింప నామె యిట్లనియె "అమ్మా ! నాకొడుకు గనఁబడక నేనెంతో దుఃఖపడుచుండగా నాపుణ్యముచే కనఁబడినాఁడని సంతోషపడుచున్నాను. అలాటి తిట్లు తిట్టకమ్మ. ఒక్క బిడ్డ. వాని నాధారము చేసికొని బ్రతకదలఁచుకున్నాను. మీ దిక్కుమాలిన కొంపలో నుండబట్టి నాకిన్ని పాట్లు కలిగినవి. అనవుడు మహాదేవశాస్త్రి తల్లి "కొడు కా వరసని కుండలు మైలపరచినాడు; తల్లి దిక్కుమాలిన కొంప యని తిట్టుచున్నది. ఇద్ద రిద్దరే. వీళ్ళ కేమి వినాశకాలమో కాని పొండి, మా యింట్లో నుండి లేచిపొండి" యని పలికెను.