కృషీవలుడు/పద్యాలు 81-90
కుసుమ లతావలీ కలిత కుంజములం, కిసల ప్రకాండముల్
పసరులు గ్రక్కు వృక్షముల బాలతృణంబుల జేలగట్లు సొం
పెసగ, సమస్తరత్నముల నేరిచి కూర్చిన ఱాలబిళ్ళలన్
వసుధ కమర్చిరో కృషికవర్యు లనన్ వరిమళ్ళు శోభిలున్. 81
మరకత చూర్ణవర్ణముల మండితమౌ నవశాలిభూమి సుం
దరతను గాంచ వైదిక దినంబులలో భరతక్షమాధురం
ధరయగు సస్యలక్ష్మి దయదప్పక నేటికి నార్యధారుణీ
భరణ కుతూహలస్ఫురణ భాసిలునో యననొప్పు హాలికా. 82
కడమొదలులేని నీదేహకష్టములకు
బ్రతిఫలంబగు సస్యసంపత్తి గాంచి
కవివి గాకున్న వాగ్మిత గలుగకున్న
బ్రణుతి వర్ణింపు మొకసారి భాగ్యగరిమ! 83
ఆకాశంబున మేఘమాలికల రూపైనం గనన్ రాదు, శు
ష్కాకారంబుల బైరులెల్ల సుదుమై యల్లాడె, దీవ్రంబుగా
సోకెన్ సూర్యమయూఖతాప, మిఁక నేజోకన్ ఫలించున్ వరుల్
మాకీకష్టము వెట్టె దైవమని యేలా మాటికిం జింతిలన్? 84
కఱకుగ నెండగాయ నిక గాసముతప్పె ననంగ నేల? భా
స్కర కిరణాళిలో గలదు సస్యసముద్ధరణైకశక్తి; త
త్కిరణము లబ్ధివారి పయికింగొని యావిరిరూపునన్, నభోం
తరమున మార్చు నీరద వితానముగాగ బునప్రవృష్టికిన్. 85
అల వర్షాగమలక్ష్మి రేఖ యన దివ్యానేక వర్ణంబులం
బొలుపుంబొందు నవాబ్దమాల యదిగో భూభృచ్ఛిరోలంకృతిం
దలపించుం గనుగొమ్మ, వాయునిహతిం దద్దేశముం బాసి కొం
గలబారుల్ వెనువెంట నంట శకలాకారంబులన్ వచ్చెడిన్. 86
బావికి నీటికై యరుగు పల్లెత లంబుధరంబు గాంచి య
ప్పా! వినువీథి హాలికులపాలిటి దైవమె యంబుదాకృతిన్
భావిఫలోదయప్రకటభావమునం జనుదెంచె నంచు మో
దావృత చిత్తలై సరసమాడుచు బోయెదరో కృషీవలా. 87
పొలమున కంచెగా మొలచి పువ్వులుపూచెడు కేతకంబు లు
జ్జ్వల కుసుమోపహారముల బత్రపుటంబుల నుంచి మారుతా
చలితకిసాలయోచ్చలన చాతురి బిల్చెడు, చేరబోయి త
త్కళిక పరిగ్రహించి కులకాంతకు కానుకయిమ్ము తమ్ముడా. 88
ప్రావృడంభోదలక్ష్మి యావాసమునకు
బాఱగట్టిన నవరత్న తోరణంబు
నాఁగ గోమల శబల వర్ణములతోడ
నింద్రచాపంబు శోభిల్లె నిదిగో చూడు. 89
వానతూనీగ లాకాశ పథమునందు
సరస ఝంకార రవములు సలుపుచుండె;
జల్లగాలికి నురుగప్ప లెల్ల మడుల
బెకబెక మటంచు గూసెడి వికటరుతుల. 90