కృషీవలుడు/పద్యాలు 91-100
తటములకు నాకసమున కంతరము లేక
నీలనీరదమాలలు వ్రేలుచుంట
నేలపై మిన్ను పడనీక నిలుపుచుండు
స్తంభము లనంగ గిరులు దృశ్యంబులయ్యె. 91
తపను డంబుదాచ్ఛాదన తతులలోన
మఱుగువడిపోవ గని నీలగిరుల చల్ల
దనము భువి నాక్రమించిన యనువుగాగ
వాయుమండల మీమిరి పట్టియుండె. 92
తెల్లపట్టు మస్లీనుల తెరలలోన
నాడుకొనుచుండు పసిపాప యరువు దోప
వానముత్యాలు గూర్చిన వలల తెరల
దినరమామణి మృదుకాంతి దిరుగుచుండె. 93
త్రావ నీరైన దొరకని తరుణమందు
నిమిషమాత్రాన దొరువులు నిండిపోయె!
నఖిల లోకాశ్రయుండు కృపామృతుండు
కన్నుదెఱచిన జరుగని కార్య మున్నె? 94
జల్లు పెల్లుడుగంగ బిల్లలు, తల్లులు
నిలువబట్టిన నింట నిలువబోక,
వాననీరుల వాఱు పల్లపు టిసుకల
గయ్యగా గట్టలు గట్టి చిన్న
నాగళులం బన్ని లేగదూడల గట్టి
దున్నుచు విత్తులు మన్ను గలిపి
పచ్చయాకులు చల్లి పైరుపట్టె నటంచు
గలుపు దీయుచు కోతకాల మనుచు
వరులు గోయుట నటియించి పనలుగట్టి
కుప్పవేయుటగా మన్నుకుప్ప వెట్టి
కడకు నేల చదునుగాగ గాల దున్ని
యాకలెత్తిన నిండ్లకు నరుగుచుంద్రు. 95
జడివానన్ వలిబడ్డ బక్క మొదవుల్ సంఘంబులై బీళులన్
విడియఱ్ఱాడుచు దొడ్డిజేర నవిగో వేగంబుగ న్వచ్చె; పె
ల్లడుసుల్వోవని మిట్టనేల బసి గొయ్యల్నాటి కట్టించి వెం
బడి వేయింపుము గడ్డిగాదములు చొప్పల్ బొందుపుల్దంటులన్. 96
తమ్ముడు కుఱ్ఱ, గోచయము దాటులువెట్టుచు క్రేపుదామెనం
గ్రమ్ముచు జిఱ్ఱకొట్టుచు పరస్పరముం దల డీలుకొంచు ము
న్గొమ్ముల జిమ్ముచుం దిరుగ గొట్టిన బట్టిన లొగ్గిరావు, సా
యమ్మొనరింపు మీయదన నాలమరల్పగ పల్పువెట్టగన్. 97
తడిసిన పచ్చికట్టియలు తంగెడు తప్పర తాటియాకులం
బడతుక ప్రొయ్యిలో దుఱిగి పై పొగలెత్తగ నూఁదుకాని కూ
డుడుకదు; కాకకుం బొగకు నుప్పతిలెం గడగంట బాష్పముల్;
తడయక యెండు రెమ్మలను దట్టెడు త్రుంచుమ చెట్టుచేమలన్. 98
మును వేసంగిని కుచ్చివిడ్డ పిడకల్ బొప్పర్లు బొళ్ళెంబులన్
వెనుకంబెట్టిన తాటిచుండ్లు బరికెల్ వెళ్ళించె నిన్నాళ్ళు; నిం
క నవాంబోధర మాలికా పిహిత దిగ్జాలంబులై వర్షపున్
దినముల్ డగ్గరె; కాంతబాసనము నేతీరొప్ప సాగించెడిన్. 99
పొలముల బీళులం దిరిగి ప్రొద్దెడగ్రుంకగ నిల్లుసేరి పా
పల నొడిచుట్టు బెట్టుకొని భార్యను నన్నము దెమ్మటంచు వే
పిలిచెద, వొంటికాపురము, పిల్లల గిల్లల బుజ్జగించుకో
వలసిన యాలిపాటు దలపం గరుణింప వదేల హాలికా. 100