కృషీవలుడు/పద్యాలు 71-80
ఫలము ల్మెక్కెడివారు తత్ఫల రసాస్వాదక్రియాలోలురై
పలుమా ఱమ్మధురత్వము న్నుతుల సంభావింతురేగాని, త
త్ఫల హేతుక్రమవృక్షముం దలపరెవ్వారైన, నట్లే రమా
కలితు ల్భోగములన్ భుజించుచు నినుం గన్నెత్తియుంజూతురే? 71
అట్టి కృతఘ్నులన్ మనమునందు దలంపక సేద్యనాద్యపున్
ఘట్టన నస్థిపంజరముగా తనువెండినగాని, వర్షముల్
పట్టినగాని, క్షామములు వచ్చినగాని శరీరసత్వమే
పట్టుగ స్వశ్రమార్జితము పట్టెడు నన్నము దిందు వెప్పుడున్! 72
రాజకీయ ప్రపంచ సామ్రాజ్యమందు
శౌర్యఖడ్గంబులకు లేదు శాసనంబు;
సంఘరాజ్యంబు నేలు విస్తారశక్తి
సతము నాచార ఘోర పిశాచరాజు; 73
శౌర్యమునకు నాచార చక్రమునకు
మధ్య, లోకంబు దవిలి సమ్మథితమగును;
కాలగర్భంబునం దెట్టి ఘటనగలదొ
పూర్వ పద్ధతి విప్లవ స్ఫురణగొలుప! 74
కల్యకాంతికి మున్నంధకారరాత్రి,
వర్షపాతంబునకు మున్ను వారిదముల
ఢమఢమాడంబరంబులు నమరు; నిదియు
బ్రకృతి భావంబునకు నూత్నపథము గాదు. 75
కష్టసుఖముల నీచోచ్ఛ గతులు గలవు
చక్రదండంబులకు బోలె; సమయమందు
నిట్టిమార్పు లనంతమై యెసగుచుండు
భావి పరిణామ మెవ్వరు పలుకగలరు? 76
ఓకృషీవల! నీవు కష్టోత్కటంపు
దుర్భరావస్థ యందె తోదోపువడగ
నెవరు శాసించువారు, నీకేమి కొదవ?
ఆత్మవిజ్ఞానమయముగా నలవరింపు. 77
దారిద్ర్యంబను పెల్లుటేటి కెదురై దాటం బ్రయత్నించుచుం
బూరావేగమునం జలించి వెనుత్రోపుల్వోవు కాంక్షోడుపం
బేరా పొందక నెట్టు తెడ్లగు మనస్వేచ్ఛాప్రకారంబు కా
ర్యారంభంబును ధైర్యము న్విడకుమయ్యా, నీవు వేయింటికిన్. 78
రార సైరిక, గనుగొమ్ము రమ్యమైన
సస్య కేదార ఖండంబు! సత్కవీశ
భావలోచన మెరవుగా బడయకున్న
గాంచనేర వంతర్లీన కాంతిసరణి. 79
అనిలాలోలవినీలసస్యములు భంగానీకముల్గాగ తె
ల్లని కొంగ ల్పయిదేలు నుర్వులుగ లీలన్ ఱెక్కలల్లార్ప, మ
ధ్యను రాజిల్లు కుజంబు లోడలుగ వాతస్ఫూర్తిగంపింప, స
స్య నికాయావని సాగరం బటుల నేత్రానందముంగూర్చెడిన్. 80