కృషీవలుడు/పద్యాలు 61-70
వనలతయైన నాకవిత పత్రపుటంబుల పూవురెమ్మలన్
దినదిన జృంభమాణమయి తేజరిలెన్ సహజప్రరోహ వ
ర్ధననియమానుసారముగ; దల్లత యెన్నడు దోటమాలిపా
ణిని గనుగోని వన్యరమణీయత జిల్కు నపూర్వపద్ధతిన్. 61
పంజరనిబద్ధకీరంబు బయలు గాంచి
యడ్డుకమ్ముల దాటంగ నాసచేయు
నటు, బహిర్నియమంబుల నతకరించి
మన్మనంబు స్వాతంత్ర్యసీమకు జరించు 62
కాన, యెవ రేమి యనుకొన్న దాననేమి
గలుగు? కాల మనంతము; ఇల విశాల;
భావలోకము క్రమముగా బడయు మార్పు
ఏల హృదయంబు వెలిపుచ్చ నింతయళుకు? 63
సైరికా, నీవు భారతక్ష్మాతలాత్మ
గౌరవ పవిత్రమూర్తివి! శూరమణివి!
ధారుణీపతి పాలనదండ మెపుడు
నీహలంబు కన్నను బ్రార్థనీయమగునె? 64
దైనికావశ్యకమ్ముల దాటిపోవ
వెగుర ఱెక్కలురాని నీయిచ్చలెపుడు;
పైరుపచ్చలె యవధిగా బ్రాకుచుండు
నీవిచారము, నూహయు, నిపుణతయును. 65
ప్రొద్దువొడిచిన దాదిగా బ్రొద్దుగ్రుంకు
వరకు గష్టింతువేగాని యిరుగుపొరుగు
వారి సంపదకై యీసు గూరబోవ
వెంత నిర్మలమోయి, నీహృదయకళిక! 66
పల్లె యెల్లయె సర్వప్రపంచసీమ!
ప్రియ యొకర్తయె రమణీయ విగ్రహంబు!
బంగరుం బంటపొలములే భాగ్యనిధులు!
అనుదిన పరిశ్రమమె మత మగును నీకు. 67
ఉండి తిన్నను లేక పస్తున్నగాని
యాసచేయవు పరుల కష్టార్జితంబు!
నాకలెత్తగ నీపంచ కరుగు నతిథి
తినక, త్రావక, పోయిన దినములేదు. 68
కృషి సకల పరిశ్రమలకు కీలుచీల;
సత్పరిశ్రమ వాణిజ్యసాధనంబు;
అఖిల వాణిజ్యములు సిరికాటపట్లు;
సిరియె భోగోపలబ్ధికి జీవగఱ్ఱ. 69
కావున కృషీవలా, నీవె కారణమవు
సాంఘికోత్కృష్ట సౌభాగ్య సౌఖ్యములకు;
ఫల మనుభవించువారలు పరులు; నీకు
గట్టకుడువను గఱవె యెక్కాలమందు. 70