పూవుందేనియ లారగించి మధుప వ్యూహమ్ము కర్ణప్రియం
బైవర్ధిల్లు మనోజ్ఞగీతముల రాగలాపముం జేయగా
నీవేలా కలఝంకృతిన్‌ స్వరము లెంతే నైక్యముంబొంద కాం
తా, వాకోవొక పల్లెటూరి పదమైనం జిత్తముప్పొంగఁగన్‌. 51

సిరిగల యాడుబిడ్డలు విచిత్రపుఱాలనగల్‌ ధరించి బం
గరుసరిగంచు చీరలను గట్టి చరింపగ గాంచి యాస లో

బొరయకు కృత్రిమంబులగు భూషలుదాల్ప; నమూల్యరత్నమౌ
సరసపు ప్రేమ చిత్తజలజంబు వెలుంగ నలంకరింపుమీ. 52

వెలగల రత్నభూషలను వేలకుదాల్చిన నిన్నుగాంచు చో
గలుగదు ప్రేమ భర్తకు వికస్వరమౌ వదనారవిందమం
దొలికెడు ముద్దులేనగవు లొక్కనిమేషము దోపకున్న; భూ
షలు ప్రణయానుబంధ సదృశమ్ములు గావు కులాంగనాళికిన్‌. 53

అతుల సంసారసాగర మందు కాల
జలము సుకృత దుష్కృత వాతచలిత మగుచు
సుఖవిషాదపు తరగలై సుడియుచుండ
పడవవై గట్టుచేర్తువు పతిని గృహిణి! 54

ఈయెడ నాతపంబు శమియించెను, నీడయు తూర్పుదిక్కుకుం
బోయెడు భర్తతో నలిగి పొందెడయం జను జాయపోలికన్‌
వాయువు సుప్రసన్నమయి పైబయి వీచెడు లేచిరమ్ము, లే
దోయి విలంబనం బనెడి యుక్తి కృషీవలవాఙ్మయంబునన్‌. 55

మనుజసమాజనిర్మితి సమంబుగ నీకొక ముఖ్యమైన వృ
త్తి నియత, మట్టి ధార్మికవిధిం జిరకాలము గౌరవంబుతో
మనిచిరి నీపితామహు లమాంద్య సుశీలురు సర్వవృత్తిపా
వన కృషిజీవనైక పరిపాలన లోకహితార్థకాంక్షులై. 56

అనుదిన మిట్లు కష్టపడ నావిధి వ్రాసె నటంచు నీమదిం
బనవకు కర్షకుండ, యిలపై జనియించినదాది చెమ్మటల్‌
దొనక శ్రమించి పౌరుషముతో బ్రతికించెదు నీకుటుంబమున్‌,
మనమున కైతవాశయము మందునకైనను లేదు నీయెడన్‌. 57

నేలనూతుల కుగ్గాలు నిలుపువారు,
బోడితలకు మోకాళ్ళకు ముడులువెట్టు
వారు, జిటికెల పందిళ్ళు పన్నువారు
నిన్ను బోలరు, తమ్ముడా, యెన్నడైన. 58

పఱుపులు పట్టెమంచములు పట్టుతలాడలు నంబరంబులుం
గరులు తురంగముల్‌ ప్రియయుగాంచనమున్‌ మఱియేమియుండినన్‌
ధర సకలంబు సొంతమయినం దనివోదు మనుష్యతృష్ణ, త
త్పరిచితులైన వారి నెడబాయదె తృప్తి నిసర్గశత్రుతన్‌. 59

అన్నాహాలిక, నీదు జీవితము నెయ్యంబార వర్ణింప మే
కొన్న న్నిర్ఝరసారవేగమున వాక్పూరంబు మాధుర్య సం
పన్నంబై ప్రవహించుగాని యితరుల్‌ భగ్నాశులై యీర్ష్యతో
నన్నుం గర్షకపక్షపాతియని నిందావాక్యము ల్వల్కరే! 60