కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/193వ మజిలీ

నతండు లేచి యోహోహో? నేడెంత సుదినము! తొలుత నెవ్వరి మొగముఁ జూచితినో? ఎంత ధన్యుండ నెంత ధన్యుండనని యూరక వెఱఁగుపాటుతోఁ బలుకుచు నతనిం గౌఁగలించుకొని సౌహార్దముతో నీ వృత్తాంతము వినుదనక నాకుఁ దొందరగా నున్నది. ఎట్లు బ్రతికితివి? ఈకాంత లెవ్వరి పుత్రికలు? ఎక్కడివారలు? నీయుదంతము సవిస్తరముగాఁ జెప్పుము. అని అడిగిన నతండు నాకథ చాల పెద్దది. ఇంతలో తేలునా? మనము గుడికిఁబోయి విశ్వేశ్వరుని దర్శించి యింటికి బోయిన తరువాత నంతయుఁ జెప్పెదనని చెప్పుచుండగనే బండివాఁడు బండి నిలిపి అయ్యా! బండి యిఁక ముందు రాదు. మీరు దిగి నడచిపోయి స్వామిని సేవించిరండు. నేనిందే యుండెదనని చెప్పఁగా వారట్లు జేసిరి. ఆస్త్రీల వింతగాఁ జూచుచున్న జనుల నదలించుచు వీరొక రాజకన్యకలు పరివారము దూరముగాఁ నుండుట మీరట్లు మీఁది మీఁదికి వచ్చుచున్నారు. సంసారస్త్రీల విషయమై మీరట్లు మూగుట తప్పు, పొండు పొండని సిద్ధార్థుండు పలుకుటయు వారు దూరముగాఁబోయిరి.

అప్పుడు వారిని దేవాలయము లోనికిఁ దీసికొనిపోయి స్వామిదర్శనముఁ జేయించి స్తుతియింపుచు వెండియు బండి యెక్కి వెనుకటి బసలోఁ బ్రవేశించెను. సిద్ధార్థుఁడు మోహనుని నిజవృత్తాంతముఁ జెప్పుమని యడిగిన నతం డొకచోటఁ గూర్చుండి వినోదముగా నాకథ యిట్లు జెప్పఁదొడంగెను. అని యెఱింగించువఱకుఁ గాలాతీతమైనది. తరువాతకథ పైమజిలీ యందుఁ జెప్పందొడంగెను.

193 వ మజిలీ.

తేజోలోకము కథ

మిత్రమా! యోడ మునుఁగువఱకు జరిగినకథ నీవు వినియే యుంటివి కదా! తరువాత నాకర్ణింపుము. వినిమయవాతంబున నాపోతం బోరగిల్ల మా యుల్లములు భేదిల్ల నీరుఁ బోసుకొనుచు బుడుంగున మునింగినది. నే నొకమూల గంగలోఁ బడి మునింగి కొట్టుకొని పోవుచుంటిని. అది నాకుఁ జరమావస్థ యని నిశ్చయించి కాశీవిశ్వనాథుని హృదయంబున సన్నిహితుం గావించుకొని మహేశా? నగరదర్శనముఁ జేసినను నాకీ దుర్మరణము దప్పినదికాదు నా యభిలాషయుఁ దీరినదికాదు. ముందిరిజన్మమునందైన నా యభీష్టము దీర్పుమని నిన్నుఁ బ్రార్థించుచుంటిని మఱియు నా నిమిత్తమై యీ మత్తకాశినులు నీసన్యాసియు బలవన్మరణము నొందుచున్నారు. వీరి కుత్తమగతులు గలుగునట్లు చేయుము స్వామీ! ఇదియే నా కడపటి కోరిక. అని విశ్వపతిని ధ్యానించుచుఁ గొంచె మీదుటకుఁ బ్రయత్నించితిని. అప్పుడు నా చేతులకు గోడలాగున నేదియో తగిలినది. అది పట్టుకొనుటకు నునుపుగా నుండుటచే వీలుపడినది కాదు. ఆ గోడవారే కొట్టుకొని పోవుచుంటిని. ఏమాత్ర మూఁతదొరికినను బట్టికొని గట్టెక్క వలయునను సంకల్పముతోఁ జేతులతోఁ దడుముచుంటిని. ఈశ్వరవిలాసములు కడు విచిత్రములుగదా! ఏ పనికిఁ దనకు స్వతంత్రము లేకున్నను నన్నియుఁ దనవలెనే జరుగుచున్నట్లు తోచును.

కొంతదూరము నీటిలో మునిఁగి నేను గొట్టికొని పోవునప్పటి కొకచోట నా యొడ్డునఁ గూడు గనంబడినది. బ్రతుకుజీవుఁడా! యని యా గూటిలోనికిఁ గొంచెము డేకి దడిమితిని. మెత్తగా నా చేతులకేదియో దగిలినది. దానిం గట్టిగా బట్టికొని విమర్శించితిని. మనుష్యుని పాదమువలె తోచినవి. నేను విడువక చేఁతులతోఁ బట్టుకొని నా శిరంబు వానికిఁ దగిలించి రక్షింపుమని సూచనఁ జేసితిని అందొక యోగి జలస్థంభనఁ బట్టి తపము జేసికొనుచు నప్పుడే బాహ్యప్రచారము గలిగి బైటకుఁ బోవలయునని తలంచుకొనుచుండెను. నా శిరంబు తన చరణంబులు సోకినంత కరంబున నాచి బట్టుకొనెయె నంతపట్టు జ్ఞాపకమున్నది.

అంతలోఁ గన్నులం దెరచిచూడ నేనాతీరంబునం బండుకొని యుంటిని. తటాలున లేచి తడిగుడ్డలఁ బిండికొనుచు నలుమూలలు పరికించితిని. ఒకప్రక్క వ్యాఘ్రచర్మోత్తరీయుండు జరామరుఁడు విరాజితుండగు నొక మహాయోగి నాకుఁ గన్నులపండువ గావించెను. గంగలో మునింగి కొట్టుకొనిపోవుచు నేనెట్లు గట్టునం బడితినో తెలియదు. గూటిలోనున్న మహాత్మునివలననే యా యాపద దాటినదని నిశ్చయించితిని. కాని నా మనస్సు వికారము నొందియుండుటచే జరిగినదంతయు స్వప్నమని భ్రాంతిపడుచుంటిని. గూటిలోనున్న యోగి యీవలకు వచ్చెనని తలంతమన్నను జటాజినవల్కలాదులు తడసినట్లు కాన్పింపవు. ఏది యెట్లయినను సరేయని యాయోగి పైకిఁబోవుటకు రెండడుగులు వైచినంతనే నా తడిగుడ్డలతోనే యడ్డమువోయి పాదంబులంబడి మహాత్మా? రక్షింపుము. రక్షింపుము నేనిప్పుడు మోహాంధుండనై యేమియుం దెలియక భ్రాంతుండనైతిని. నాకిది స్వప్నమో, యింద్రజాలమో, దైవమాయయో, తెలియకున్నది. నా వృత్తాంతము గొంచెము విని నా భ్రాంతి బోఁగొట్టుఁడు. మీయట్టి మహానుభావుల ప్రాపునంగాక నాయట్టి నికృష్టుల కష్టములు దీరునా? నేనొక రాజకుమారుండ, నాపేరు మోహనుఁ డందరు. నాకు మా గురు ఖగోళవిషయం బెఱింగించునప్పుడు నక్షత్రమువలన నేమియో తెలిసికొనవలయునని యభిలాష గలిగినది. అది మొదలు సన్యాసుల నర్చించుచుంటిని. కొన్నిదినములకు సిద్ధవ్రతుండను బైరాగి ప్రాపు దొరకినది. అతండు కాశీపురంబున గంగలో జలస్తంభనఁ బట్టి తపముఁ జేసికొనుచున్న యోగివలనంగాక నీకామితము మఱియొకనివలనఁ గాదని యుపదేశించెను. ఆమాట నమ్మి రాజ్యభోగముల విడిచి యతనివెంటఁ బడితిని. దారిలో నిద్దరు స్త్రీలు నామూలమున యోగినులై మావెంటఁ బడిరి. అందరము నిన్న గంగదాటుచుండ నోడ మునుంగ గంగలోఁబడితిమి. నాకొక గూటిలోనున్న మహాత్ముని చరణసేవ దొరికినది. ఈగట్టుపైఁ జేరితిని. మహాత్మా! ఇది యంతయు స్వప్నమో దీనిలోఁ గొంత స్వప్నమో తెలియకున్నది. ఇదెంత నిజమో యెంత యసత్యమో వివరం బెఱింగింపఁ బ్రార్థించుచున్నవాఁడ. సంతతము నీటిలో జలస్తంభనఁ బట్టియున్న యతీశ్వరునిచరణపద్మములు ధ్యానించుచుండ నిట్టికల వచ్చినదని యనుకొనుచున్నాను. నాకు మతిపోయినది. నేనిప్పు డేయవస్థలో నుంటినో తెలియదు. మిమ్ముఁ బార్ధించుటఁ గూడ స్వప్న మేమో యని తలంతును. స్వప్నములోగూఁడ మీయట్టి తపస్వులు గనంబడుట శ్రేయస్కరమేకదా? అని ప్రార్ధించిన నాయోగిసత్తముండు మందహాసచంద్రికలు నాపై వ్యాపింపజేయుచు నిట్లనియె.

ఓరీ! ప్రపంచకమే స్వప్నమువంటిది. సంసారమే యింద్రజాలము వంటిది అందొక్కటియు సత్యమైనది లేదు. అంతయు భ్రాంతియే. నిజమువలెఁ దోచుచుఁ దెలిసికొన నబద్ధమగుచుండును. కానిమ్ము. నీవంత్యకాలమ్మున విశ్వనాథునితోఁ గూడ నాసిద్ధుని ధ్యానించితివి కావున నీకామితమ్ము నెరవేర్పక తప్పదు. నా వెంట రమ్ము అని పలికి యతం డవ్వల నడుచుచుండెను. అప్పుడు నేనోహో! నా పురాకృతసుకృతము ఫలించినది. ఆడఁబోయిన తీర్థ మెదురువచ్చినది. వెదుకఁబోయిన మందు గాలికే తగులుకొనినది. సిద్ధవ్రతుం డెఱింగించిన సిద్ధుం డితండే కావచ్చును. తనచరణములు పట్టిన నన్ను గట్టునఁ బారవైచిన యోగి యితఁడే కావచ్చును. ఆహా! ఏమి నాభాగ్యము? ఏమి నా సుకృతము? కరుణాసనాథుండగు విశ్వనాథుని యనుగ్రహము నాపై వ్రాలినది. కాకున్న నిట్టి యుత్కృష్టుని దర్శన మగునా? సిద్ధవ్రతుని యుపదేశము నేఁటికి సఫలమైనది. ఆ మహాత్ముండును స్త్రీలును నావలెనే యున్నతస్థితి వహింతురుగాక అని తలంచుచు నా యోగివెంటఁ బోయితిని.

ఆసిద్ధుం డెవ్వరివంకఁ జూడక యెవ్వరితో మాటాడక తిన్నగా కాశీపురంబు దాటి యీశాన్యమున క్రోశదూరములోనున్న యొక పాడుపడిన పర్ణశాలకుం బోయెను. నేను వారివెంటఁబడి పోయితిని. నాతో మఱేమియు మాటాడలేదు. అందెందో దాచి యుంచిన యొక చిన్నబరిణదెచ్చి నాకిచ్చి యిది యొక సిద్ధౌషధము. దీనిం బాదములకుం బూసికొని తలంచిన చోటికిఁ బోవచ్చును. ఇది మూఁడుసారులకే యుపయోగించును. నీయిష్టమువచ్చినచోటికిఁ బొమ్ము. పొమ్ము. అని పలికి యాసిద్ధుండు. లోపలికిఁ బోయి మఱల నాకుఁ గనంబడలేదు.

అప్పుడు నేను బెన్నిధింగన్న పేదయుంబోలె మిక్కిలి సంతసించుచు నాబరిణ గట్టిగా మూసిఁగట్టికొని వెండియు గంగాతీరంబున కరుదెంచి భక్తిపురస్పరముగా భాగీరథిం గృతావగాహుండనై విశ్వనాథు నభిషేకాద్యుపచారముల నర్పించి కన్నులు మూసికొని చేతులు జోడించి యిట్లు ధ్యానించితిని.

ఉ. ఓపరమేశ! యోవరద ! యోకరుణాకర ! విశ్వనాథ ! నే
    నీపదపద్మముల్ మదిని నిల్పుటఁజేసి వితత్ప్రభూతసం
    తాపము వాసి దివ్యభువనస్థితివైభవము ల్గనుంగొనం
    బ్రాపు లభింపఁగంటి నిటుపై నెటు జేసెదొ నీదు భక్తునిన్.

అని భక్తిరసవివశమానుండనై ధ్యానించి మఱియు నందుఁగల దేవతలనెల్ల నారాధించి సాయంకాలమున దివ్యభూషాంబరాలంకృతుండనై గంగయొడ్డునఁగూర్చుండి యాకసమువంకఁ జూచుచుండ సూర్యుం డపరాంబునిధిఁ గ్రుంకువెట్ట సంజపెంపుక్రమంబున నంతరింపఁ జుక్కలొక్కటొక్కటిగా నంతరిక్షమునం బ్రత్యక్ష మగుచుండెను. అప్పుడు నేనిట్లు తలంచితిని.

ఇప్పుడు సూర్యలోకంబునకుఁ బోవుటకు దలంచితినేని యందుఁబోయి సంపాతివలె దగ్ధమై పోవుదును. చంద్రలోకంబునకుఁ బోయిన నీరు గారును. మఱియు గ్రహనక్షత్రాదిలోకంబు లెట్లుండునో యెఱుఁగరాదు. ప్రాక్పశ్చిమదిక్కులజోలికిఁ బోఁగూడదు. ఉత్తరము దెసఁగూడ హిమప్రాచుర్యమగుట దుష్ప్రావకమై యుండును. అని తలంచి దక్షిణదిక్కునఁ గ్రిందుగానున్న యొక చిన్నచుక్కపై ద్రుక్కు వ్యాపింపఁజేసి యిందుఁ బోయిన నిర్బాధముగా నుండును. అది తేజమో రత్నమో లోకమో యేదియో యొకటి కావలయుంగదా ? దానింజూచినఁ దక్కినవన్నియు నిట్లే యుండునని నిశ్చయించుకొనవచ్చును. అది యొక్కటిగాక మఱియొక్కటిగూడఁ జూడఁ గురుఁడు ననుగ్రహించి పసరిచ్చెంగదా? ఇప్పుడా నక్షత్రము దాపునకే పోవుట కర్జము. అని యాలోచించి బరిణిలోని పసరు మూఁడవ వంతు పాదములకు రాచికొని కన్నులు మూసికొని జయ పరమేశ్వరా! జయ విశ్వనాథ! జయ యన్నపూర్ణా మనోనాథ! నేనిప్పుడు గురుప్రసాదలబ్దౌషధప్రభావంబున నానక్షత్రలోకంబునకుఁ బోవలయునని ధ్యానించి యంతలోఁ గన్నులం దెరచి చూచితిని.

తీర్ధశుల్క కథ

ఆ. వె. కుదుపులేదొకింత కదలినట్టును లేదు
         మీఁదికెగిరినట్టులదు నాకు
         నెట్లుపొతినొక్కొ యెఱుఁగంగరాదొక్క
         కొత్త నగర మెదుర గోచరించె.

నలుమూలలు పరికించి చూచితిని. భూలోకవిలక్షణముగాఁ గనంబడినది క్రిందికిఁ జూచితిని. నే నిలువంబడియున్న తావు స్ఫటికశిలాఘటితమై స్నిగ్ధమై ప్రతిబింబము గనఁబడుచున్నది. మఱియు విమర్శింప నేనున్న దొక పుష్పవనము. అందలి లతావితానమున కాలవాలములు లేవు. చిత్రలిఖితములట్ల స్ఫటికశిలావేదికలపై నాఁటబడియున్నవి. అవి మనోహరకుసుమవిసరబహుళదళసల్లలితవల్లవల్లరీ సముల్లసితములై నాసాపర్వముఁ గావింపుచున్నవి. ఆహా! తత్ప్రసూనసౌరభ్యం బనుభవైకవేద్యము. మఱియు నాకల్లంతదవ్వులోఁ గనకరత్నప్రభాధగద్ధగితము లగు శిఖరములచే మెఱయుచున్న ప్రాసాదములు గొన్ని కన్నులపండువు గావించినవి. అది పగలో రాత్రియో చెప్పఁజాలను. వయస్యా! వెనుకటి వృత్తాంతము మరచిపోయి నే నది యొక స్వప్నమని తలంచితిని. ఏమి చేయుటకుం దోచక యిటునటు నడచుచుండఁ గొండొకదూరములో నొకపురుషుఁడు నా దండకు వచ్చునట్లు కనంబడినది.

నేను వానికించుక యెదురుగాఁ బోయితిని. వాఁడు దివ్యమణిఘటితకటకకేయూరకుండరాదిమండన పరష్కృతుండై దివ్యాంబరంబు ధరించి బంగారుబెత్తము చేతనొప్పార నద్భుతతేజంబునఁ బ్రకాశింపుచు భటచిహ్నములతోఁ గానిపించెను. వాఁడు నన్నుజూచి యతి వినయముతో నమస్కరించి దేవా! మీరిట్లు పాదచారులై వచ్చితిరేల? విమాన మెందు విడిచితిరి? నేను సీమారక్షకుఁడ. దేవరకొఱకే నిరీక్షించుకొనియుంటిమి? మిమ్ముఁ దీసికొని వచ్చిన దేవదూత లేమైరి? మాకీ వార్తఁ దెలియజేయక యెందుఁబోయిరి? మీరిందు నిలువుఁడు పరివారమును దీసికొనివత్తురని చెప్పగాఁ విని నేను వాని మాటలవలన నదియొక పుణ్యలోకమని యూహించి వానికిట్లంటిని.

ఓయీ! ముందుగా నీ లోకవృత్తాంతము నా కెఱింగింపుము. విని యిష్టమున్న నిందుండెద. లేకున్న మఱియొకలోకమున కేగెదనని యడిగిన నతం డిట్లనియె. దేవా! ఇది తేజోలోకము నాఁబడు పుణ్యలోకము. స్వర్గలోకము క్రిందిది. మహేంద్రుఁడే దీని కధికారి. భూలోకములోఁ బుణ్యము జేసికొనిన వారిందువచ్చి భోగము లనుభవింతురు. ఇందు దీర్ధశుల్కయను దేవకాంత పుణ్యపురుషునికి మహిషీపదం బధిష్టించును. రూపరేఖావిలాసములచే నా చిన్నది యనవద్యయై యున్నది. అమ్మత్తకాశిని క్రొత్తగా మొన్ననే మహేంద్రునిచే నిన్నగరంబున కంపఁబడినది. ఆ కన్యారత్న మా పెద్దమేడలో నున్నది. పుణ్యపురుషుని రాక నభిలషించుచున్నది. ఆమెకు నూర్వురు పరిచారికలు గలరు. ఆ చేడియ లూడిగములు సేయ హాయిగా నా యెలనాగతో నిందు నింద్రభోగము లనుభవింపుము.

తుంబురు నారదాదుల మించిన గాయకులు గంధ్వరులు వలయున్నప్పుడు పాడుచుందురు. అప్సరస లాడుచుందురు కిన్నరలు కింపురుషులు వినోదములగు నాటకము లాడుచుందురు పెక్కులేల పుణ్యపురుషుని కేది యిష్టమో యట్లుజరుగును. పుణ్య మున్నంతకాలమతఁడే సర్వాధికారి. మఱియు మాణిభద్రుడనువా డిందుఁ బ్రధాన దండనాయకుఁడు. అతండు మీకడ సర్వదా వసించి మీ కోరికల సవరించు చుండును. పుణ్యపురుషుని రాకఁ దెలిసికొన మొన్ననే యాతండు స్వర్గలోకమున కరిగెను. మీ రాక వినిన నీపాటికే వచ్చువాఁడు. అని యా లోకవృత్తాంత మెఱింగించుటయు నేనించుక యాలోచించి ఓయీ! మేమెంతకాల మిందుండ వచ్చునో నీకుఁ దెలియునా? అని యడగితిని వాఁడిట్లనియె.

సీ. మృష్టాన్నములను సంతుష్టినొందఁగ జనుల్
                 మంచిసత్రములఁ గట్టించినారో?

    మార్గస్థులు సుఖింపమరుభూములను సమ
                భ్యంచితప్రపల నిర్మించినారో?
    కాశీగయాప్రయాగములు మున్నగు తీర్థ
               వితతిసద్భక్తి సేవించినారో?
    వేదశాస్త్రకళాప్రవీణులౌ బధులకు
               క్షితిదానముల నేమి చేసినారో?
గీ. తాపసుల నెందరిని రక్తి దనివినారో?
    గురువులకు నెట్టి శుశ్రూష జరిపినారో?
    కలుగునే యూరకిట్టి లోకప్రభోగ
    కాంత సౌధాంతరాప్తి సౌఖ్యము మహాత్మా.

గీ. మీరు జేసిన పుణ్యంబు తీరుదనుక
    ననుభవింతురు సకలసౌఖ్యముల నిందు
    దేవతాకామినులతోడఁ దేజమరల
    నమరపతితుల్యభోగభాగ్యానురక్తి.

మిమ్ముఁ జూడ మసుష్యదేహముతోనే పుణ్యలోకమునకు వచ్చినట్లు కనంబడుచున్నారు. ఇది చాల యద్భుతము. నే నెఱింగిన తరువాత నిట్లు వచ్చినవారిఁ జూడలేదు. మీ రెట్టి పుణ్యము జేసితిరో మీకేఁ యెఱుక యని జెప్పిన పని నేనెట్లంటి. ఓయీ యీ లోకము స్వర్గమున కొక శృంగారభవనమువంటిదని చెప్పితివి. ఈ లాటివి మఱికొన్ని గలవా ఇది యెక్కటియేనా? అని యడిగిన నాతఁ డిట్లనియె. దేవా వినుండు పుణ్యలోకముల కెల్లఁ బ్రధానపట్టణము అమరావతి. అందు మహేంద్రుఁడు వసించుం గావున దానికి రాజధానియని పేరు వచ్చినది. ఈలాటి భువనములు మహేంద్రుని యధికారము క్రిందఁ గోటానకోటలు గలవు. వానినెల్ల మహేంద్రుఁడే పాలించుచుండును. స్వర్గమన పేరు మాత్రమే కాని పుణ్యపురుషులు స్వర్గమున వసింపరు. భూలోకములో వారు సేసికొనిన పుణ్యనుసారముగా దేవదూత లింద్రునియాజ్ఞానుకూలముగాఁ బుణ్యపురుషులఁ దీసికొనివచ్చి యనుగుణముగ లోకమున నివసింపఁజేయుదురు. అది పంటభూమి. ఇవి వంటశాలలు. భూలోకమున కీ పుణ్యలోకములన్నియు నక్షత్రరూపములఁ గనంబడునని చెప్పుదురు. మీకుఁ తెలియకుండునా? అని చెప్పిన విని నేను సంతసించుచు నాహా! నాకుఁ గలిగినసందియము దీరినది. నక్షత్రములన్నియుఁ బురాణములలోఁ జెప్పినట్లే పుణ్యలోకములని తెల్లమైనది. ఇఁక మరలి నేను భూలోకమునకుఁ బోవుదునా? అని యాలోచించి సిద్దుని కరుణావిశేషంబున నింతదూరము తనే వచ్చితిని. యూరక పోనేల? కొంత భోగమనుభవించియే పోయెదంగాక. విశ్వనాథుని యనుగ్రహముండ నింద్రుండు న న్నేమి జేయఁ గలడు. అని తలంచుచు నోయీ? నీవు వోయి పరివారముల దీసికొనిరమ్ము. పొమ్మని యాజ్ఞాపించితిని.

అతండరిగిన రెండుగడియలకు భేరీశంఖకాహళవేణువీణాదినినాదములతో నొకయుత్సవము నాచెంతకు వచ్చుచున్నట్లు కనంబడినది. నవరత్నస్థగితమగు విమానము మహాసౌధమువలె నంతరము గలిగియున్నది. దాని ముందర మంగళవాయిద్యములు దాని వెనుక నప్సరోనృత్యములు నొకప్రక్క గంధర్వుల సంగీతము వేఱొకప్రక్కఁ గిన్నరుల వీణాగానములు వెలయ దాసదాసీజనంబులు నవ్విమానమును గమించి వెనుక నడుచుచుండ నది యంత్రరథమువలె నాచెంతకు వచ్చుచుండెను. ఆ దేవయానము నడుమ రెండురత్నపీఠము లమరింపఁబడియున్నవి. ఎడమ పెట పీఠముపై దివ్యాభరణభూషితయై తీర్థశుల్కయను దేవకాంతఁ గూర్చుండియుండెను. ఇరువురు గంధర్వకన్యకలు వింజామరల బూని యిరుప్రక్కల నిలవంబడి యుండిరి.

ఆ విమానము నాఁకు బదిబారలలో వచ్చి నిలువంబడినది. అప్పుడు దివ్యరూపసంపన్నులగు గంధర్వకన్యక లాతీర్థశుల్క పరిచారికలు నూర్వురలోఁ గొందఱు ముందర వచ్చి కిన్నరకంఠులు మంగళహారతులు పాడుచుండ నొకతె పాదములు గడిగినది. ఒకతె చేలాంచలంబునఁ దడియొత్తినది. మఱియొకతె పాదుకలు దొడిగినది. ఇరువురు మంగళహారతు లిచ్చిరి. కొందఱు స్తుతిగీతములఁ బాడిరి. కొందఱు వింజామరల వీఁచిరి. కొందఱు పీతాంబరములు దాల్పఁజేసిరి. నూత్నాంబరాభరణాదులచేఁ గొందఱు నాకలంకరించిరి. కొందఱు గంథము బూసిరి కొందఱు శిఖకు మందారదామములం జుట్టిరి ఈ రీతిఁ దలయొక యుపచారము జేసినపిమ్మటఁ దీర్థశుల్క యవ్విమానము దిగివచ్చి దాదులు రత్నపుగొడుఁగు బట్ట నా పాదములకు నమస్కరింపుచు నీవే నా భర్తవని వరించి నా మెడలోఁ బుష్పదామంబు వై చినది. అందఱు కరతాళములు వాయించిరి. పిమ్మట నా చిటికెన బట్టికొని యవ్విమానము మీఁదికిఁ దీసికొనిపోయి కుడివైపు పీఠముపైఁ నన్ను గూర్చుండఁ బెట్టినది. రెండవ పీఠముపైఁ దాను గూర్చుండెను. గంధర్వకన్యక లిరువంకల నిలువంబడి చామరములు వీచుచుండిరి.

అప్పుడా విమానము గిరుక్కున మరలి పట్టణాది ముఖముగా నడుచుచు నడుమ నడుమ నాగుచుండెను. ముందర గంధర్వకన్యక లొకమేళము, కిన్నరు లొకమేళము అప్సరస స్త్రీ లొకమేళము, మూఁడుమేళములు నా విమానము ముంగల నడచుచుండెను. ఒక్కొక్కమా ఱొక్కొక్కమేళము వంతులుప్రకార మాడుచుండును. అట్టి వైభవము ఎట్టి పుణ్యాత్మునికిఁ గలుగునో! ఆహా! ఆ వైభవము చూచిన దంతయుఁ జెప్పుట గష్టముగా నున్నది. ఆవైభవము చూచినవారికి మన భూలోకము తలంచికొన నరక మిదియే యని తోచకమానదు. భూతల మంతయు వెదకి చూచినను పురిలో దాసికి దాసిగానున్న యువతిని బోలిన జవరాలు గాన్పింపదు. పరిచారిక లని సామాన్యముగా జెప్పితిని. వారెట్టి యందమైనవారో యెఱుంగుదువా? చూచినంతనే పురుషుని మోహసముద్రములో ముంపగలరు. అందఱు చీనిచీనాంబరములు ధరించినవారే. అందరు నవరత్నఘటితకుండనములు దాల్చినవారే. అందఱకు భుజకీర్తులు నందఱకుఁ గిరీటములవంటి శిరోభూషణములే. ఎవ్వతెం జూచినను గన్నులకు మిరుమిట్లు గొల్పుచుండును. వారు వారు చేయు పనులంబట్టి సేవ్య సేవక తారతమ్యంబులు దెలియఁబడుచున్నవి. కాని యందున్న స్త్రీ లందఱు సౌందర్యవంతులే. నేనట్టి వైభవ మనుభవింపుచు నే నేసుకృతము జేయకున్నను మహాపుణ్యాత్ముల భోగములనుభవింపుచుంటి. కానిమ్ము . ఇట్టిభోగ మొక్క దివస మనుభవించినఁ జాలదా? పోనిమ్ము. ఇంద్రుఁడు నన్ను తరువాత శిక్షించిన శిక్షింపనీ? ఇదియే చాలునని సంతసించుచు నా నృత్యగానవినోదములు చూచుచుంటిని.

ఆ వీణాగాన మాలించినంత మనసు నీరైపోయి యేదియో యపూర్వమగు నుల్లాసము గలుగుచుండును. అట్టి వైభవముతో నన్నూరేగింపుచు నందలి పెద్దసౌధము చెంతకుఁ దీసికొని పోయిరి. విమన మాగినతోడనే పరిచారికలు వచ్చి గొడుగులు పట్టువారును పాదుకలు దొడుగువారును వింజామరలు విసరువారును హారతు లిచ్చువారునై సేవించుచుండ నేనా వేదండగమన చేయి పట్టుకొని పెండ్లికొడుకువలె నా యింటిలోనికిఁ బోయి యొక సభాభవనంబునం గూర్చుంటిని. ప్రక్కపీఠముపైఁ దీర్థశుల్క వసించినది. తత్సభాభవన ప్రభావిశేషంబుల వర్ణింప నూరునంవత్సరములు చాలవు. నవరత్నములు మలచి నాపరాళ్ళవలే నేలం బరచిరి. గోడల నిటికలవలెఁగట్టి యద్ధములవలె నమరించిరి. మీఁద బల్లవలె స్థాపించిరి. పెక్కేలఁ భూలోకము నందున్న యైశర్వమంతయు దానిలో నొక యద్ధముగా నమరించిన వజ్రమునకు సరికాదు. తద్రత్నప్రభాకిమ్మీరకాంతిపుంజములు సభాంతరాళమునఁ బుష్పమంజరుల వలె మెఱయుచుండును. మేమందు గూర్చుండ గంధర్వులు కొంతసేపు మనోహరవల్లకీగానవిశేషముల వెలయించి మమ్మానందింపఁ జేసిరి. కొంతసేపు అప్పరసలు నాట్యముఁజేసిరి. పిమ్మటఁ గిన్నరులోక ప్రహసనమాడి కడుపు లుబ్బులాగున మమ్ము నవ్వింపజేసిరి.

ఒక వైద్యశాలయందు భిషక్ప్రవరుండు పీఠముపై గూర్చుండియుండఁ బెక్కు వికారములగు రోగములు గలవారు వచ్చి మందులు గోరుట, కాళ్ళును జేతులును విరిగినవారు కట్టులు కట్టించుకొనుట, మూర్చలు పిచ్చలు పిశాచవేశము లోనగు వికృతామయగ్రస్థుల యభినయము, మాతాపితృభ్రాతృసుత ప్రముఖులు మృతినొంది నప్పుడు తత్బంధువులు చుట్టును జేరి విలపించుట, భర్తృవియోగమున స్త్రీలకుగావించు శిరోముండనములు, బంధువుల పరామర్శనము, మొదలగు భూలోక దుఃఖములన్నియు జరుగుచున్నట్లే ప్రదర్శించిరి. అవి యన్నియు మనమఱిఁగిన వైనను వారు ప్రదర్శించునపుడు క్రొత్తవానివలె పుట్టించినవి.

అప్పుడే నే నొహోహో? ఇవి మీ కాశ్చర్యములుగాను బరిహాసాస్పదములుగా నుండునుగాని మాకు వింతలు గావు. అయినను వీనిం జూపి మాకు వేడుక కలిగించితిరి. సంతసించితిమి. మరియు శృంగారరస భూయిష్టమగు దేవలోక నాటక మేదియైన బ్రదర్శింపుఁడని యాజ్ఞాపించితిని. వారు మహాప్రసాదమని తెరవైచి యంతలో భూమికల నమరించుకొని మాలినీజయంతమను నాటకమును బ్రదర్శించిరి. మాలిని యను జవరాలు జయంతుని వరించిన కథ. మిక్కిలి చమత్కారముగా నున్నది. ఆ మాలినీ వేషము జగన్మోహనమై శృంగారరసము మూర్తీభవించినట్లు కాన్పించినది. అహా! దానియభినయము. వలపు, విరహము, వనవిహారము, పుష్పాపచయము, కందుకక్రీడాసఖీసంభాషణము, చూతికాప్రేరణము, పత్రికాలేఖనము, అనురాగనివేదనము లోనగు విశేషములు జూచిన శ్రీశుకునకైన వ్యామోహము గలుగక మానదనినచో మనబోఁటివారల మాటఁ జెప్పనేల ?

అప్పుడు నేను మదనావేశముతో వారినెల్ల నెలవుల కనిపి పరిచారికలు మార్గము సూప నేనాప్రసూనగ్రంధి చెట్టఁబట్టికొని కేళీసౌధంబున కరిగితిని. అందుఁగలవింత నెన్నిదినంబులు చెప్పినను ముగియవు. గోడలయందు గరుడ గంధర్వ కిన్నర యక్ష సిద్ధ విద్యాధరాది దేవయోని విశేషులు యోషామణుల చిత్రఫలకములు గానసాధనములతో వ్రాయబడి యున్నవి. మఱియు,

సీ. గోపకాంతలఁ గూడి గోపాలకృష్ణుండు
                సలిపిన కేళికావిలసనములు
    అమరనాయకుఁ డహల్యా కామినీ మణి
               పొంతఁ జూపిన వలపుల విధంబు
    తారకాధిపుఁడు బృందారకాచార్యుని
              నిల్లాలికై పడిన విరాళి హుయలు
    దాశకన్యకు నై పరాశమునినేత
              నడివాకపడిన మన్మథశరార్తి
గీ. గాధినందనుఁ డల మేనకావధూటి
    వలచి కావించు నర్మప్రవర్తనములు
    దెలియ శృంగారరసము మూర్తీభవించి
    నట్లు చిత్రించినారు కుడ్యములయందు.

చతురశీతి బంధములు చిత్రించిన పటములందు వ్రేలగట్టఁ బడియున్నవి. కనకమణి పంజరంబులం గల లటవింకంబులు శుకపిక ప్రముఖపతంగంబులకు వాత్సాయనాది కామసూత్రంబులు పాఠంబులు సెప్పుచుండు. మఱియును,

సీ. కీలు ద్రిప్పినంత కృత్రిమాంగన మెట్ల
                నెక్కి చక్కఁగఁ బాడు నొక్కచోటఁ

    బల్కరించినఁ గుడ్యభాగాంతరస్థయై
              యొకతె యుత్తరమిచ్చు నొకచోట
    నొక్కతావున మీటఁ ద్రొక్కినఁ దుంపురుల్
             మొగలుగా వ్యాపించి ముసురువట్టు
    నొక్కచోటఁ జంద్రకాంతోపలప్రభ లడ్డు
             తెరలాగఁ బవలు వెన్నెలలు గాయు
గీ. నొక్కచో దీపమాలిక లుద్భవిల్లి
    మరను ద్రిప్పంగ నంతలో మాయమగును
   ఇంద్రజాలము వోలె నా యింటిలోన
   గలవ దెన్నేని వింతలు దెలుపవశమె।

వయస్యా! వినుమనంతర మేనొక తల్పాంతరమున వసించి తత్ప్రాంతమున నిలువంబడి లజ్జాక్రాంతస్వాంతయై యోరచూపుల నన్ను జూచుచున్న యా యన్నుమిన్న నొయ్యన్న శయ్యపై దాగికొని బాహ్యకేళీలాలసుండ నగుటయు నా కుటిలకుంతల కరతలంబులు జోడించి మనోహరా! వినుండు.

క. నానోములు ఫలియించెం
   గా నేఁటికి నేను బడిన కష్టము వోయెం
   బ్రాణేశ ధన్యనైతిం
   బో? నీ యాశ్రయము నేఁడు బొందిన కతనన్.
 
అని నుతించుటయు నేను మందహాసము జేసి,

క. ఓహోహో! నీవేశ్యా
   వ్యాహారంబులను నమ్మువాఁడొనొకొ? వరా
   రోహా ? ఇదివఱకిట్టి మ
   నోహరు లెందఱిని దగఁగనుంగొంటివొకో?

ఇఁక ముందెందఱు గానున్నారో. అందఱిలో నేనొక్కరుండ మీ వలపులు జలముల వ్రాత యని యాక్షేపించిన నమ్మించుబోఁడియు నమ్మిక బుట్ట నేనట్టిదానను గాను. ఇదివర కన్యుని ముట్టి యెఱుఁగ. మీ పాదములతోఁడుఁ మీ కన్న నొక వాసరము వెనుకనే యీ భవనమున కరుదెంచితిని. మిమ్మే ధ్యానించుచుంటి. నా యుదంతంబు ముందు మీ కెఱింగించెద నిప్పుడేమియు నడ గవలదు. అని నమ్మిక పలికిన విని నే నానందపరవశుండనై యప్పు డప్పడఁతితోఁ గూడ ననంగక్రీడాపారావారతరంగములఁ దేలియాడుచు మూఁడు దినము లొక్క గడియవలె వెళ్ళించితిని.

నాలుగవనాఁ డుదయమునకు దేవలోకమునుండి మణిభద్రుఁడు వచ్చుటయుఁ జూచి సీమారక్షకుఁడు ఓహో! నీవింత యాలసించితివేల? పుణ్యపురుషుండు వచ్చి మూఁడు దినములైనది. తీర్థశుల్కంగూడి భోగము లనుభవించు చున్నవాఁడు. ఉన్నవారు వినోదములన్నియుఁ జరుపుచున్నారు. నీవెఱుంగవా? అని యడిగిన నతండు వెఱగుపాటుతో నిట్లనియె.

ఏమేమీ? ఆ పుణ్యపురుషుఁ డింద్రునికిఁ దెలియకుండ నెట్లు వచ్చెను? వాఁడెవ్వఁడు ? ఎవని యాజ్ఞచొప్పున వచ్చెను? వింతగా నున్నదే? వారణాశీ పురంబున నొక యాత్రికుఁడు రేపు మృతినొందునఁట. వాని విమానంబునం దీసికొని వచ్చి తేజోలోకంబునఁ బ్రవేశ పెట్టుమని దేవదూతల కాజ్ఞాపించుచు నన్నుఁజూచి నీవు పొమ్ము. ఆ తీర్థవాసి రేపు మీలోకమునకు రాఁగలడు. తీర్థశుల్కతోఁగూడ భోగము లనుభవించుచుఁ బదివత్సరములు మీలోకమున నుండఁగలఁడు. వాని కిష్టమ్ములగు నుపచారమ్ములఁ గావింపుచు సేవించుమని యాజ్ఞాపించుటయు మహాప్రసాదమని యింద్రునియనుజ్ఞఁబుచ్చుకొని వచ్చితిని. నడుమ వీఁడెట్లు వచ్చెనో తెలియకున్నది. మహేంద్రుని వచనంబుల కన్యధాత్వమ్ము గలుగునా? కానిమ్ము. వానినే యడిగి నిజము దెలిసి కొనియెదంగాక యని నిశ్చయించి యా మణిభద్రుఁడు నాయున్న ప్రాసాదమ్మునకు వచ్చెను. నేనప్పుడు సభాంతరాళమున వసించి విద్యాధరుల సంగీత మాకర్ణించుచుఁ బెద్దతడవు వానికి మాటాడుట కవసరమే యిచ్చితినికాను. వాఁడందుఁ బ్రధానదండనాయకుండు గావున హస్తసంజ్ఞచే వారినెల్ల నూరకుండుఁడని, వారించుచు నాకు మ్రొక్కి అయ్యా! మీరెవ్వరు? ఎవ్వరియాజ్ఞానుసార మీపుణ్యలోకమునకు వచ్చితిరి? నేనిందుఁ బ్రధానరక్షకుండఁ బుణ్యపురుషుని రాఁక దెలిసికొనుటకై స్వర్గమున కరిగితిని. రేపొక పుణ్యపురుషుండు మీలోకమునకు వచ్చుచున్నాడు. పోయి యుపచారములఁ గావింపుమని యనిమిషపతి యానతీయ వచ్చితిని. ఇరువురు పుణ్యపురుషు లొకలోకమం దెప్పుడును వసింపరే. నతండు వచ్చును. తీర్థశుల్క కాతఁడే భర్త. ఈ లోకము నాతఁడే పాలించు నిందులకు మీరేమి చెప్పెదరు? అని యడిగిన నేనించుక యాలోచించి యిట్లంటిని.

ఓరీ? మాణిభద్రా! నీవు నాకు దాసుండవై యధికారము జూపుచున్నావే? శ్రీకాశీవిశ్వనాథుని యాజ్ఞచొప్పున నేనిందు వచ్చితిని. అమ్మహాత్ముని యాజ్ఞనతిక్రమింప మహేంద్రుఁ డెంతవాఁడు! పో పొమ్ము, నీయింద్రునితోఁ జెప్పుకొమ్మని మొండిధైర్యముతో నదలించితిని. వాఁడించుక కొంకుచు దేవా! విశ్వనాథుండు సర్వాధికుఁడగుట నిక్కువమే. తామేర్పరచిన నియమంబులు వారే యతిక్రమించిన నెట్లు సాగును? తాము మీకట్టివర మిచ్చినప్పుడు మహేంద్రునికిఁ దెలిపిన నడుగులకు మడుగు లొత్తుచు మిమ్మా పురుహూతుఁడే యిందుఁ జేర్చుంగదా! అని మెల్లగాఁ బలికిన విని నేనిట్లంటిని

మాణిభద్రా! మహేంద్రుఁడు నీతోఁ జెప్పిన పుణ్యపురుషుండ నేనే యగుదును. అతండు మొన్ననఁబోయి రేపని చెప్పెనని తలఁచెదను. ధీమంతులకుఁగూడ ప్రమాదములు వచ్చుచుండును. వెఱవక నీవిందుండుము. ఇంద్రుండు నీపై గోపిం చిన నేను గాపాడెదనులే యని పలికిన నతండు కానిండు. అట్లైన లెస్సయేకదా! అడిగివచ్చినం దప్పేమి యున్నది. పోయివచ్చెదనని చెప్పి యప్పుడే వాఁడు స్వర్గమునకు నిర్గమించెను. నేనపుడు మనసులో దిగులుదోప నాపరివార మంతయుం బొమ్మని యంతఃపురమునకుఁబోయి తల్పంబునం బండుకొని యిట్లు ధ్యానించితిని. మహేంద్రుఁడు మూఁడులోకముల కధికారి అతనియాయుధము దంబోళి. కొండలనైన వ్రక్కలు సేయఁగలదు. వానికోపమునకు నేనెంతవాఁడ? నాయొద్ద నేమిశక్తియున్నది? ఆ సిద్ధునకు నాయందనుగ్రహము గలుగుటచే నిట్టియోషధి నిచ్చెను. దానంజేసి యిందు రాఁగలిగితిని. మహాపుణ్యాత్ములకుగాని నీలోకము జేరశక్యమా? నాకపట మింద్రుని కడ సాగునా? అతండు వచ్చులోపలనే పారిపోవుట లెస్సయని యాలోచించుచుండ నాతీర్థశుల్క యరుదెంచి మనోహరా? చిన్నబోయి యున్నా రేమి? ఏదియో ధ్యానించు చున్నారు నాకెఱింగింపరాని రహస్యమా? ఏమని యడిగిన నేనిట్లంటిని.

ప్రేయసీ! నీయొద్ద దాచనేల? నాభోగమైనది. నేనెందేనిం బోయెద. నీకుఁ గ్రొత్తమగఁడు వచ్చుచున్నాఁడు. నేనందరివంటిదానగాను. మీఱే నాకు భర్తలు ఆ రహస్యమెప్పుడో చెప్పెద నంటివి. ఇప్పుడు సమయము వచ్చినది. నేను మీయూరు విడిచి పోవుచున్నాను నాతో వత్తువా? ఇందే యుండెదవా? అని యడిగిన నప్పడఁతి యిట్లనియె. ప్రాణేశ్వరా! నేనన్నమాట తప్పుదానను గాను. నాకు మీతోడిదగతి. మీ రెక్కడికిఁబోయిన నక్కడికి వత్తు. బదుఁడు అందలి కారణంబు వినుండు. నేనెవ్వతె ననుకొంటిరి? అల్లనాఁడు మీరూపములను మోహించి బైరాగి శుశ్రూష నెపంబున మీవెంటఁ బడిన కపిలను. రెడ్డికోడలను. తెలిసినదా? యోడ మునిఁగి గంగలోఁ బడినప్పుడు విశ్వనాథుని హృదయంబున నిల్పి మహాత్మా! నాకేకోరికయును లేదు. ఏ జన్మమందైన నెప్పటికైన నా జగన్మోహనునే నాకు భర్తగాఁ జేయుము. ఇదియే నా కడపటి యభిలాష యని ధ్యానించుచుఁ బ్రాణములు విడిచితిని.

ఆహా! గంగామహాత్మ్య మేమని వర్ణింతును మఱికొంతసేపటికి కన్నులం దెరచిచూడ నీదివ్యదేహము ధరించియుంటిని ఇరువురు పురుషలు నన్నొక విమానముపై గూర్చుండఁబెట్టి స్వర్గలోకమునకుఁ దీసికొనిపోయి మహేంద్రుని యెదురనిలువం బెట్టిరి. ఇది యెవ్వతె? ఏమిపుణ్యము జేసినది? అని యడిగిన వారు దేవా! ఇది యొక రెడ్డికోడలు. పరపురుషుని మోహించి భర్తను విడిచి వానివెంటఁబడి కాశీపురంబున కరుగుచు రేవు దాటునప్పుడు గంగలోఁ బడి విశ్వేశ్వరుని ధ్యానించుచుఁ బ్రాణము విడిచినది. తత్సుకృతంబున దీని కప్సరోజన్మము వచ్చినది. ఈమె నేలోకమందుండమందురో సెలవిండని యడిగిన నా మహేంద్రుఁ డించుక యాలోచించి స్మృతి నభినయించుచు నౌను జ్ఞాపకమువచ్చినది. తేజోలోకమందున్న తీర్థశుల్కకుఁ గొన్ని నెలలు సెలవిచ్చితిమి అది వచ్చు దనుక దీని కయ్యధికార మిచ్చితిమి. కాశీనగరోపకంఠమున గంగాగర్భంబున విశ్వనాథుని ధ్యానించుచు మృతినొందుట యనేకజనన సుకృత పరి పాకంబునంగాక లభించునా? అది రెడ్డి కోడలైన నేమి? భర్తను విడిచిన నేమి? యుత్కృష్టపుణ్యము జేసినది. తీసికొనిపోయి తేజోలోకాధికారిణిం గావింపుఁడని యాజ్ఞాపించుటయు నప్పుడే యాకింకరు లావిమానము మీఁద నీలోకమునకుఁ దీసికొని వచ్చి విడిచిపోయిరి.

అమ్మరునాడే మీ రరుదెంచిరి. దేవకాంతాశిరోమణినని నన్నుఁ దలంచుచు నాయందెక్కుడు ననురాగము జూపుచున్న మీకు నా వెనుకటి వృత్తాంతముఁ జెప్పితి నేని యిప్పటి గౌరవ ముండకపోవచ్చునని యెఱింగించితిని కాను మిమ్మప్పుడే గురుతు పట్టితిని. విశ్వనాథుఁడే నాకామిత మీడేర్చెనని సంతసించితిని. మీరిక్కడి కెట్టు వచ్చితిరి? నావలెనే మృతినొంది నా యభీష్టము తీర్చుటకై యిట్టి రూపముతో వచ్చితిరని తలంచుచున్నాను. మీతెఱం గెఱింగింపుఁడని యడిగిన నేనాశ్చర్యసాగరంబున మునుంగుచుఁ గాశీనగరప్రభావంబింత యొప్పునీయని యగ్గించుచు మించుబోఁడీ! నేనెవ్వనిఁ జూడ నిల్లు విడిచి బయలుదేరితినో యా మహానుభావుఁడు గంగలో నా చేతికిఁ దగిలి నా యభీష్టమును దీర్చెను. తద్దత్తమహౌషధి ప్రభావంబున నిందుఁ జేరితిని. నీవలననే నాకీభోగము లభించినది. ఈరహస్య మింద్రునికిఁ దెలిసిన నన్ను శిక్షించుఁ గావున నేనింటికిఁ బోయెద. నీవుకూడ వత్తువా? స్వర్గభోగములందుచు నిందేయుండెదవా? అని యడిగిన నాప్రోయాలు చాలు, చాలు. మిమ్ము విడిచిన నాకీ భోగములతోఁ బనిలేదు. మీతో వత్తునని యొత్తిపలికినది.

అప్పుడు నేనా పూవుఁబోఁడిం గౌఁగలించుకొని యా పసరుపాదములకు రాచికొని యింటికిం బోవఁదలచియు నంతలోఁ గానిమ్ము మఱియొక చోటికిఁ బోవుట కాధారమున్న దిగదా? ఇంకొక నక్షత్రలోకవిశేషము జూచి యందుండి యింటికిం బోయెదంగాక. ఊరక యోషధీరసము నిష్ప్రయోజనకారిగాఁ జేయనేల యని యాలోచించి యక్కడికిఁ బడమటిదెస దూరముగానున్న మఱియొక చిన్నచుక్కంగురిజూచి యందుఁ బోవలయునని తలంచి కన్నుల మూసికొని తెరచినంతలోఁ దద్భువనసీమాంతముఁ జేరితిమి అని యెఱింగించి మణిసిద్ధుం డవ్వలికథ పైమజిలీయం డిట్లు చెప్పఁదొడంగెను.

194 వ మజిలీ

తపోలోకము కథ

ఇంచుమించుగా నదియుఁ దేజోలోకమును బోలియే యున్నది. అందుఁ గల మామిడితోఁటలో విహరింపుచున్న మమ్ముఁ జూచి సీమారక్షకుడు వడివడి వచ్చి మీ రెవ్వరు? ఇం దేల వచ్చితిరి ? మీరెందలి వారలని యడగిన నేనిట్లంటి.

మేము దంపతులము. మాచేసిన పుణ్యవిశేషమున లోకములన్నియు స్వేచ్ఛగా దిరుగుటకై వరము లందితిమి. ఇదివరకుఁ జాలపుణ్యలోకములు తిరిగివచ్చి