కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/194వ మజిలీ

పాకంబునంగాక లభించునా? అది రెడ్డి కోడలైన నేమి? భర్తను విడిచిన నేమి? యుత్కృష్టపుణ్యము జేసినది. తీసికొనిపోయి తేజోలోకాధికారిణిం గావింపుఁడని యాజ్ఞాపించుటయు నప్పుడే యాకింకరు లావిమానము మీఁద నీలోకమునకుఁ దీసికొని వచ్చి విడిచిపోయిరి.

అమ్మరునాడే మీ రరుదెంచిరి. దేవకాంతాశిరోమణినని నన్నుఁ దలంచుచు నాయందెక్కుడు ననురాగము జూపుచున్న మీకు నా వెనుకటి వృత్తాంతముఁ జెప్పితి నేని యిప్పటి గౌరవ ముండకపోవచ్చునని యెఱింగించితిని కాను మిమ్మప్పుడే గురుతు పట్టితిని. విశ్వనాథుఁడే నాకామిత మీడేర్చెనని సంతసించితిని. మీరిక్కడి కెట్టు వచ్చితిరి? నావలెనే మృతినొంది నా యభీష్టము తీర్చుటకై యిట్టి రూపముతో వచ్చితిరని తలంచుచున్నాను. మీతెఱం గెఱింగింపుఁడని యడిగిన నేనాశ్చర్యసాగరంబున మునుంగుచుఁ గాశీనగరప్రభావంబింత యొప్పునీయని యగ్గించుచు మించుబోఁడీ! నేనెవ్వనిఁ జూడ నిల్లు విడిచి బయలుదేరితినో యా మహానుభావుఁడు గంగలో నా చేతికిఁ దగిలి నా యభీష్టమును దీర్చెను. తద్దత్తమహౌషధి ప్రభావంబున నిందుఁ జేరితిని. నీవలననే నాకీభోగము లభించినది. ఈరహస్య మింద్రునికిఁ దెలిసిన నన్ను శిక్షించుఁ గావున నేనింటికిఁ బోయెద. నీవుకూడ వత్తువా? స్వర్గభోగములందుచు నిందేయుండెదవా? అని యడిగిన నాప్రోయాలు చాలు, చాలు. మిమ్ము విడిచిన నాకీ భోగములతోఁ బనిలేదు. మీతో వత్తునని యొత్తిపలికినది.

అప్పుడు నేనా పూవుఁబోఁడిం గౌఁగలించుకొని యా పసరుపాదములకు రాచికొని యింటికిం బోవఁదలచియు నంతలోఁ గానిమ్ము మఱియొక చోటికిఁ బోవుట కాధారమున్న దిగదా? ఇంకొక నక్షత్రలోకవిశేషము జూచి యందుండి యింటికిం బోయెదంగాక. ఊరక యోషధీరసము నిష్ప్రయోజనకారిగాఁ జేయనేల యని యాలోచించి యక్కడికిఁ బడమటిదెస దూరముగానున్న మఱియొక చిన్నచుక్కంగురిజూచి యందుఁ బోవలయునని తలంచి కన్నుల మూసికొని తెరచినంతలోఁ దద్భువనసీమాంతముఁ జేరితిమి అని యెఱింగించి మణిసిద్ధుం డవ్వలికథ పైమజిలీయం డిట్లు చెప్పఁదొడంగెను.

194 వ మజిలీ

తపోలోకము కథ

ఇంచుమించుగా నదియుఁ దేజోలోకమును బోలియే యున్నది. అందుఁ గల మామిడితోఁటలో విహరింపుచున్న మమ్ముఁ జూచి సీమారక్షకుడు వడివడి వచ్చి మీ రెవ్వరు? ఇం దేల వచ్చితిరి ? మీరెందలి వారలని యడగిన నేనిట్లంటి.

మేము దంపతులము. మాచేసిన పుణ్యవిశేషమున లోకములన్నియు స్వేచ్ఛగా దిరుగుటకై వరము లందితిమి. ఇదివరకుఁ జాలపుణ్యలోకములు తిరిగివచ్చి తిమి. ఇది యేలోకము? ఇందలి పుణ్యపురుషులు వచ్చి యెన్నిదినములైనది? ఏ సుకృతముఁ జేసిన నీలోకవాససౌఖ్యము లభించును? ఇందధికారిణి యెవ్వతె? ఇందుఁ బరిచారకులుగా గంధర్వు లెందఱు? కిన్నరు లెందఱు? కింపురుషు లెందరు? విద్యాధరు లెందఱు? విహారసౌధము లెన్నియున్నవి? ప్రధానదండనాథుని పేరేమి? అని యాగుట్టంతయు నెఱింగినవానివలె నడిగిన వాఁడు తల యూచుచు బాబూ? నీ వన్నియు నెఱింగినవాఁడ వౌదువు. వినుమిది తపోలోకము. ఇందుఁ దపశ్శుల్క యనుచిన్నది పుణ్యపురుషునకు మహిషీపదం బధిష్టించి యున్నది. మొన్ననే యొక యోగి కాశీపురోపకంఠంబున గంగలోఁబడి మృతినొంది దివ్యదేహము ధరించి ఈ లోకాధిపత్యము వహించి తపశ్శుల్కతో భోగము లనుభవించుచున్నాఁడు. అని చెప్పిన విని నేను మఱియు విస్మయము జెందుచు ఆహా! నాభాగ్యము వింతలపై వింతలు గనంబడుచున్నవి ప్రేయసీ! వింటివా? మనసిద్దవ్రతుఁడే యిందు వచ్చియున్నవాఁడట. ఎంతచిత్రము? అని యాశ్చర్యమందుచు వానితో నిట్లంటిని.

ఓయీ! నీవు నాకొక యుపకారము సేయవలయును ఇందున్న పుణ్యపురుషుఁడు నాకు గురువు. తత్పాదసేవలననే నేనిట్టిసుకృతము సంపాదించుకొంటిని. నారాక, ఆయనకుఁ జెప్పితివేని యొక్కమాటాడి పోయెదంగాక. ఈపాటి యుపకారము చేయమని ప్రార్ధించిన నాతడు గడియ నిలువుఁడు అతఁడే యీ పుష్పవనమునకు భార్యతో రాఁగలఁడు. అప్పుడు మాట్లాడుకొనియెదరుగాక అని సమాధానముఁ జెప్పుచుండఁగనే భేరీనినాదము వినంబడినది.

అదిగో మా ప్రభువు వచ్చుచున్నాఁడు. భేరీధ్వని మ్రోగుచున్నది. అందు నిలువుఁడు మాటాడి పోవుదురుగాక యని పలికి వాఁడు వారికిఁ గొంతదూర మెదురుగాఁ బోయెను. ఆ పుణ్యాత్ముఁడు తపశ్శుల్క చేయి పట్టుకొని సముచితపరివారముతో మేమున్న పుష్పవనమునకు వచ్చెను. అతండు రెండవ మహేంద్రుఁడువలె దివ్యాంబరాభరణాలంకృతుండై యొప్పుచుండెను. నేనెట్లు గురుతు పట్టుదును. సీమారక్షకు డతనికిఁ బూగుత్తులు గానుకగాఁ దీసికొనిపోయి యిచ్చి స్వామీ! మీ శిష్యుఁడట. జగన్మోహనుఁ డనువాఁడు భార్యతోవచ్చి మీదర్శనము నిమిత్తమందు వేచి యున్నాఁడు. తీస్వికొని రానా? అని చెప్పినంత ముప్పిరిగొను సంతోషముతో నతండు ఏఁడీ? యెందున్నవాఁడు? వేగము చూపుము. అని పలుకుచు వానివెంట నాకడకు వచ్చెను. నన్ను గురుతు పట్టెను.

ఓహోహో! ప్రాణబంధూ! జగన్మోహనా? నీ విక్కడికెట్లు వచ్చితివి? వెనుకటి రూపముతోనే యుంటివే? గంగలోఁబడి యేమైతివని యడిగిన నే నిట్లంటి. మహాత్మా! మీ యుపదేశబల మెట్టిదో చూడుఁడు. నేను గంగలోబడి మునిఁగి మీరు చెప్పిన సిద్ధుడున్న గూటిలోనికి కొట్టుకొనిపోయితిని. అతని పాదములే నా చేతికిఁ దగిలినవి. అతఁడే నన్నొడ్డున బారవైచి నా యభీష్టము దెలిసికొని పాదలేపనౌషధి నిచ్చి పొమ్మనెను. తత్ప్రభావమునం దేజోలోకమునఁ జేరితిని, అందీ తీర్థశుల్కం బత్నిగాఁ బడసితిని. మన కపిలయే తీర్థశుల్కగా నాకన్న ముందుగా వచ్చి యా లోకమునఁ బ్రవేశించినది. దీనిం గూడి మూఁడు దినము లింద్రభోగము లనుభవించితిని. మీవలె గంగలో మృతినొందినను బాగుండెడిది. ఇప్పు డింద్రునికి నాపై గోపము రాక మానదు. పారిపోవుచు దైవికముగా నీ లోకమునకు వచ్చి సీమారక్షకునివలన మీవృత్తాంతము విని యిందు నిలువంబడితినని జరిగిన వృత్తాంత మంతయు నెఱింగించి యిప్పు డింద్రునిబారి యెట్లు తప్పించుకొందునో యెఱిఁగింపుడని యడిగిన నతండు నాకిట్లనియె.

మోహనా! నీకు దైవసాన్నిధ్యము గలిగియున్నది. ఇంద్రు డేమియు నిన్నుఁ జేయలేడు. మేము పూర్వదేహము విడిచి స్వర్గంబునకు వచ్చితిమి. నీవా దేహముతోనే వచ్చితివి మాకంటె నీవే ధన్యుడవు. నీవాసించిన కార్య మెట్లయిన దీరినదిగదా? నక్షత్రలోకము లన నేమియో తెలిసినదిగదా? సంకల్పసిద్ధుఁడవు. నీ కేమియు భయములేదు. మఱియొక యుపాయ మెఱింగింతు వినుము. దేవతలకు రాక్షసులకు సహజవైరము. అయినను నిరృతి తపం బొనరించి దిక్పతిత్వము బొందెను. దానంజేసి యింద్రునకుఁ గ్రిందివాఁడైనను దనలోకము స్వతంత్రముగాఁ బాలించుకొనుచున్నాడు. అందు దేవేంద్రుని యధికారములేదు. అందున్న రాక్షసు లందఱు దేవతలవంటి వారఁట. సత్యాహింసావ్రతస్థులై యధ్యయనసంపన్నులై యొప్పుచుందురట. నిరృతియు బలి, ప్రహ్లాద విభీషణాదులఁ బోలినవాడు. దయాశాలి. మీరా లోకమునకుఁ బోయిన నింద్రుని శాసనమునకు వశము గానేరరు. కొన్ని దినము లందు వసించి యీ యపరాధము మాసినపిమ్మట నా నిరృతి నాశ్రయించి యింటికిం బోవుదురుగాక. ఇదియే నాకుఁ దోచిన యుపాయమని చెప్పినవిని నేను సంతసించుచు నమ్మహర్షికి మ్రొక్కి యనుజ్ఞ పుచ్చుకొని యా మిగిలిన పసరు పాదములకు రాచికొని యా చక్కెరబొమ్మ నక్కునఁ జిక్కబట్టి కన్నులు మూసికొని జయ విశ్వనాథా! యని ధ్యానించుచు నిరృతిలోకమునకు బోవలయునని తలంచితిని. అంతలోఁ దల్లోకసీమాంతరమును జేరి నిలువంబడితిని.

నిరృతిలోకముకథ

వయస్యా ! వినుము. నిరృతిలోకము స్వర్గలోకముకంటెఁ జిన్నదియే కాని యితర పుణ్యలోకముకంటెఁ జాల పెద్దది. మనోహరములైన క్రీడాశైలములు పుష్పవనములు, ఆరామములు పెక్కు గలిగియున్నవఁట. శోభకు స్వర్గముతో సమానమైనవనియే జెప్పవచ్చునఁట. అందున్న పొలిమేరకాపరి మాచెంత కరుదెంచి మీ రెవ్వ రనిన తమగురించి ముందటివలెనే చెప్పి యాతని మాయందిష్టముగలవానిగాఁ జేసికొంటిని. నే నడుగ నతం డాలోకవృత్తాంత మంతయు నిట్లు జెప్పెను.

అయ్యా ! ఇది నిరృతిలోకము. నాకముకన్నఁ జిన్నదైనను ప్రభావమునకు శోభకును దానికిఁ దీసిపోవదు. ఇది స్వతంత్రరాజ్యము. సామాన్యముగా నింద్రునిశాసన మిందు సాగదు, ఇందుఁగల రాక్షసులు నీతిమంతులు. రాక్షసకృత్యములు గలవారు కారు. దేవతలకు సహజవిరోధులగుట వీరియం దేదేనిలోపము గనంబడినప్పుడు మహేంద్రుఁడు వారి శిక్షింపుమని నిరృతికిఁ దెలియజేయునుగాని తాను శిక్షింపఁజాలడు. ఈ లోకమునకు రాజధాని పుణ్యవతి. అందే నిరృతి మహారాజు వసించియున్నవాఁడు. మీరు పోయి చూడవచ్చు. నతండు ధర్మాత్ముండని యాలోకవృత్తాంత మంతయుఁ జెప్పెను.

నేను – అయ్యా! ఇక్కడికిఁ బుణ్యవతి యెంతదూరములో నున్నది ?

వాఁడు - పదియామడల దవ్వులో నున్నది.

నేను - దారిలో నేమైన గ్రామములు గలవా ?

వాఁడు - పెక్కురక్కసుల పల్లెలు గలిగియున్నవి. మార్గము నిష్కంటకము. ఇరుప్రక్కల గుసుమఫలదళపల్లవశోభితములైన వృక్షము లనేకములు నాటఁబడియున్నవి.

నేను – రక్కసులు మమ్ము బాధింపరుగదా ?

వాఁడు - ఇందలి దానవులు మౌనులవంటివారు. వీ రెవ్వరిని బాధింపరు. అతిథుల నాదరించి సత్కరింతురు. మఱియొక్క విశేషమున్నదిఁ పాతాళలోకములో నున్న రక్కసులకు వీరికిని బంధుత్వము గలిగియున్నది. ఎప్పుడైన నందలివా రిందు దేవేంద్రునికిని నిరృతినికిని తెలియకుండ వచ్చుచుందురు. వాండ్రయొద్ద రాక్షసకృత్యములు గలిగియున్నవి. కాని యీ లోకవాసులయందులేవు. అని యెఱింగించిన సంతసించుచు నే నాతనియనుజ్ఞ పుచ్చుకొని పుణ్యవతీనగరంబునకుఁ బోవువాడనై బయలుదేరి భార్య నన్ననుసరించి రా నొకదారింబడి నడువసాగితిని. ఒక పెద్దమార్గము పడమరగాఁ బోయినది. స్ఫటికశిలాఘటితమై ప్రతిబింబము గనబడుచుండెను. యాతుధాను లామార్గమునుండి గుఱ్ఱములెక్కియు వాహనములెక్కియు యంత్రశకటము లెక్కియు విమానము లెక్కి.యు వచ్చువారును బోవువారును, మమ్ముజూచి పల్కరించు చుండఁ దగిన సమాధానముఁ జెప్పుచుంటిమి. మేము మెల్లగా నాదారిం పోవుచుంటిమి. కొంతసేపటికి నక్కోమలాంగి నడువలేక మేన స్వేదకళికావసరము బ్రభవింప నడుగులు తడబడ నడుచుచున్న నా ప్రియురాలిం జూచి జాలిపడి కై గలసి వంగి కొంతదూరము దీసికొని పోయితిని.

ఒకచోట జదికిలంబడి యింక నేనడువఁజాల నీరేయి యిందే పండుకొందమని పలికిన విని నే నులుకుఁజెంది ప్రేయసీఁ నేను వలదనిచెప్పినను వినక నావెంటఁబడితివి. ఎండకన్నెఱుఁగక నూర్వురు పరిచారకులు లూడిగములుసేయ భర్మహర్మ్యాంతరముల హాయిగా సుఖించుదానవు. ఈ ప్రయానసము లెట్లుపడగలవు? నే నేమి జేయుదును. వాహన మేదియుం దొరకదు. పుణ్యవతీనగరము పదియోజనముల దూరమున్నదట. ఒక క్రోశము దూరము నడిచితివో లేదో కాళ్ళీడిగలఁబడవైచుచున్నదానవు. పాపము నాకతంబున నీకీ యిడుములు వచ్చినవని యోదార్చిన నవ్విద్రుమోష్టి సరి, సరి నా నిమిత్తమై మీరు విచారింపవలదు. మీ ఖేదమునకు విచారించుచున్నదాన నని పలుకుచు బలము దెచ్చుకొని మఱి పదియడుగులు నడచినది.

మాటలు ధైర్యముగాఁ జెప్పినది కాని యట్లు నడువలేకపోయినది. అప్పుడొక చెట్టుక్రింద గూర్చుండి నేను దానియడుగులొత్తబోయితిని. గాని ముట్టనిచ్చినది కాదు. అంతలో నొకగృహస్థుని బండి యా మార్గమున బోవుచుండెను. దానిలో నిరువురు స్త్రీలు మాత్రము కూర్చుండిరి. ముందొక పురుషుండు బండినడుపుచుండెను. నేను దాని కడ్డముగా నిలువంబడి అయ్యా? మేము పుణ్యవతీ నగరంబుకుఁ బోవుచుంటిమి. ఇది నా భార్య. నడువలేక మిక్కిలి యలయికఁ జెందియున్నది. ఈ బండి యెక్కించుకొనియెదరా? మీకు మంచి సుకృతము రాగలదు. ఈ రాత్రి మీయూరిలో నుండి మఱునాఁడు పోయెదమని యడిగిన నందున్న రాక్షసుఁడు అయ్యో? ఈ మాత్రము పనికే యీ స్తోత్రము? రండు రండు. మీ యిరువురు గూర్చుండుఁడు అని పలికి నన్నుఁ దనప్రక్కను నా భార్య స్త్రీలప్రక్కను గూర్చుండబెట్టుకొని యా శకటమును బటురయంబున నడిపించి యోజనద్వయదూరములోనున్న తమ పల్లెకు దీసికొనిపోయి తమ యింటియొద్ద దింపెను.

రాక్షసస్త్రీలు బండిదిగి నా భార్యను దింపి లోపలికి దమతోఁ దీసికొని పోయిరి. నేనా చోదకునితోఁ బోయి యరుగుమీదఁ గూర్చుంటిని. అప్పటికి గొంచెము చీకటి పడినది. ఆ లోకమందు భూలోకమువలె రాత్రింబగళ్ళు గలవు. సూర్యుఁడు క్రిందిభాగముగా గనంబడును. అందున్న రాక్షసస్త్రీలు చక్కనివారనియే చెప్పదగినది కాని పురుషులేమియుఁ జక్కనివారు కారు.

మేము చేరిన రెండుగడియలకు వారింటికిఁ బాతాళలోకమునుండి నలువురు బంధువులు రహస్యముగా వచ్చిరి. ఆ యింటి యజమానుఁడు వారిని సత్కరించెను. ఇంటి యజమానుడు శుద్ధశ్రోత్రియుండు. వేదవేదాంగములు చదివిన విద్వాంసుఁడు. ఆ యింటికి వచ్చిన బంధువులు శ్రోత్రియులవలె నుండిరి కాని రాక్షసత్వము గూడ మొగంబున సూచించుచున్నది. మా కందఱకు నేకపంక్తినే భోజనముపెట్టిరి. చుట్టాలు మాంసభుక్తులైనను యజమాను డట్టివాఁడు కాకపోవుటచే నన్నమే తినిరి.

భుజింపునప్పుడు నన్నుఁజూచి క్రొత్తరక్కసులు మీరెవ్వరు? ఎందుండి వచ్చితిరి? ఎందుఁ బోవుచున్నారు? అని యడుగఁగా గొంతసేపు నే నేమియు మాటాడితిని గాను పదింపదిగ నా మాటలే యడుగుచుండ నే నిట్లంటి. నేను తపంబు జేసి భార్యతోగూడ బుణ్యలోకంబులెల్ల దిరుగునట్లు వరంబుఁ బొంది స్వేచ్ఛావిహారంబుల భార్యతోగూడ నన్నిలోకంబులు చూచితిని తెలియక నేఁడీలోకము వచ్చితిని. వరశక్తి తగ్గినది కాఁబోలు మేము వచ్చిన దేవయాన మంతర్థానమైపోయినది పాదచారులమై వచ్చుచుండ నీ పుణ్యాత్ముఁడు మాశ్రమరయ బండి యెక్కించి యిందు దీసికొని వచ్చెను. నిరృతి మహారాజుగారి జూచుటకుఁ బుణ్యవతీనగరంబునకుం బోవుచున్న వారమని యెఱింగించితిని.

నా మాటలు విని వారేదియో గుజగుజలాడికొనిరి. భోజనానంతరమునఁ చావడిలో గూర్చుండి తాంబూలములు వైచికొనునప్పు డయ్యింటి యజమానుఁడు నాతో నయ్యా! పుణ్యవతీ నగరంబునఁ బదిదినములలో గొప్పసభ జరుగనైయున్నది. రాక్షస రాజపుత్రికకు స్వయంవర మహోత్సవము జరుగఁగలదు. ఇఁక నాలుగు దినములు చనినపిమ్మట నీ యూరువారు పెక్కండ్రందుఁ బోవుదురు. అంతదనుక మీరిం దుండుఁడు. అప్పుడు పోవచ్చునని చెప్పుటయు నే నట్లే యంగీకరించితిని. మమ్ముఁ జాల గౌరవము చేసిరి. పాతాళనుండి వచ్చిన రక్కసులు నా భార్యపైఁ గన్నువైచి యా యింటివానితో నట్లు చెప్పించిరని నేను గ్రహింపలేకపోయితిని. స్వర్గాది పుణ్యలోకములయం దాహార ముండదు. గాని రాక్షసలోకమందు భూలోకమందు వలెనే భోజనాదికములు సేయుచుందురు. మేము వారింట నాలుగు దినములు శిష్టకృతుగా భుజించితిమి.

ఆ పాతాళతలవాసులే పుణ్యవతీనగరంబునకుం బోవుచున్నవారము. మాతో రండి అని మమ్ముఁ బయనము సేసిరి. వారి కృత్రిమము దెలియక బండియెక్కియే వారివెంట బయలుదేరితిమి. నడుమ నడుమఁ బల్లెలయందు నివసించుటకుఁ దమ బంధువుల యిండ్లకే తీసికొనిపోవువారు. ఇంక రేపుమధ్యాహ్నమునకుఁ బుణ్యవతీ నగరముఁ జేరుదుమనఁగా నా రాత్రి నేను నిద్రించుచుండ నా భార్య నెత్తికొని వా రెక్కడికో పారిపోయిరి. తెల్లవారిలేచి చూచుకొంటిని. ప్రక్కలో బ్లేదు. నలుదిక్కులు పరికించితిని. ఎవ్వరు గనంబడలేదు. కర్దమా! కర్దమా! అని యా రాక్షసముఖునిఁ జీరితిని. ప్రతివాక్యము లేదు.

వారేమైరని మేము పండుకొని యున్న గృహయజమాను నడుగఁగా మా కేమియుఁ దెలియదు. వాఁరెవ్వరో మేమెఱుంగమని సమాధానముఁజెప్పెను. అప్పుడు నేను వారు గుజగుజలాడిన విషయము లన్నియు జ్ఞాపకము జేసికొని యా దుర్మార్గులే మోసముఁ జేసి యెత్తికొని పోయిరని నిశ్చయించి పశ్చాత్తాపముఁ జెందుచు నాహా? విశ్వనాథునకు నాయం దనుగ్రహము తప్పినట్లున్నది. నా బ్రాణబంధువురాలితో వియోగము గలుగఁజేసెనే? అయ్యో స్వర్గసుఖముల లెక్కింపక నా వెంటఁబడి యిడుమలు గుడుచుచున్న నా ప్రియురాలి వియోగము నే నెట్లు సహింతును? ఎందుఁ జొత్తును? ఏమి చేయుదును? ఎవ్వరితోఁ జెప్పికొందునని దుఃఖింపుచుండ నా యింటి యజమానుఁడు యెందుల కేడ్చెదవు? నీవు వోయి నిరృతిమహారాజుగారితోఁ జెప్పుకొనుము. వారు పాతాళరాక్షసులగు రక్కసులు కావచ్చును. ఇందలి వా రట్లుచేయరని బోధించిన విని కొంచెము ధైర్యము దెచ్చుకొని యెట్టకేల కటఁ గదలి మధ్యాహ్నమునకు బుణ్యవతీనగరంబునకుం బోయితిని.

అన్నగరంబు వీధులు సౌధంబులు ప్రాసాదంబులు గృహములు వేదికలు అంగళ్ళు అలంకారములు చూచినంత నా హృదయము విస్మయసముద్రములో మునింగిపోయినది. తేజోలోకము దానికడపటి వీధికింబోల నేరదు. అప్పుడీ సౌభాగ్యంబు పరికింపుచుండఁ గొండొకసేపు ప్రియావియోగసంతాపము మరచిపోయితిని.

సీ. అఖిలసామ్రాజ్యంబు హరిసమర్పణఁ జేసి
           పాతాళమునఁ దొక్కబడియె బలియు
    హరిభక్తి నధికవిఖ్యాతిఁజెందియును బ్ర
           హ్లాదుండు తుదకు సన్యాసియయ్యె
    శ్రీరామచంద్రు నాశ్రితుఁడై విభీషణుఁ
          డొకమూల లంకలో నొదిగి యుండె
    రావణాదులు లోక మావలీవలఁ జేసి
          బుద్బదంబుల భంగి పొంగి యడఁగి
గీ. రహహ? దృడభక్తి‌నైన శౌర్యముననైన
   శాశ్వతైశ్వర్యయుత దిగీశ్వరత నిరృతి
   గతి భంజింపఁగ గరిగిరే యితర దనుజు
   లెట్టి తప మాచరించెనో యీ సురారి.

అని తత్పట్టణసౌభాగ్యంబు సూచి నిరృతితపఃప్రభావం బగ్గింపుకు నొక రాజమార్గంబునంబడి పోవుచుండ‌ వొకగేస్తు వెనుకటి దివసమునఁ బస్తుండి నాఁడు బ్రాహ్మణుని కొఱ కెదురుచూచుచు వీధి నిలవఁబడి. యవ్వలఁ బోవుచున్న నన్నుఁ జాచి నీవు ద్విజుండవైతివేని బ్రాహ్మణార్థ మరుదెంతువే? అని యడుగటయు నేను ద్విజుండ నట్లేవత్తునని పలికి వాని వెంట లోపలికిఁ బోయితిని. లోకములన నవియే లోకములు. భవనములన నవియే భవనములు. సీ? భూలోకము నొకలోకమే? మనయైశ్వర్యము లొకయైశ్వర్యములే? జానపదుఁడు వోలె వింతగా నా యింటశోభఁ జూచుచుంటి వంటయైనదని యిల్లాలు చెప్పినంత నన్ను జలయంత్రముల స్నాన మాడఁ జేసి నూత్నపీతాంబరముఁ గట్టనిచ్చి‌ కనకరత్నఘటిత కనకేయూర హార కుండలాది విభూషణముల నలంకృతుం జేసి చందనాగరు కస్తూరీచర్చలఁ గావించి మృష్టాన్నసంతుష్టుం గావించి సుఖాసనోవిష్ణుండనై తాంబూలంబు వైచుకొనుచున్న సమయంబున్న నయ్యజమానుఁడు నన్నుఁ గుశల ప్రశ్నఁ జేసి నీ వెవ్వఁడ వెందుఁ బోవుచున్నవాఁడు విందేమిటికి వచ్చితివని యడిగన నే నిట్లంటిని.

మహాత్మా! నీ యాదరణము వల్లనే నింతకు ముందుఁ బొందిన దుఃఖము మఱచిపోయితిని. తపంబునఁ బరమేశ్వరు మెప్పించి భార్యయు నేను స్వేచ్ఛావిహా రంబులఁ బుణ్యలోకంబు లెల్ల దిరిగి యీ లోకము వచ్చినంతఁ దత్సామర్థ్యము సడలిన నడుచుచు నీ నగరంబునకు వచ్చుచుండ దారిలో నలుగురు రక్కనులు నాతోఁ గలసి మొన్నను నా భార్య నెత్తికొనిపోయిరి. ఆ పరిభవము నిరృతి మహారాజున కెఱింగింప వచ్చితినని నా యుదంతము కొంతమఱుఁగు పెట్ట యప్పటికిఁ దగినరీతి నెఱింగించితిని.

అతండు జాలిపడచు నయ్యా! నిరృతి నేఁటియుదయముననే యింద్రుండు వార్తనంప స్వర్గమునకుఁ బోయి వచ్చెను. మూఁడుగంటల కొక సభఁ జేయునఁట. అప్పు డందరిని రమ్మని పత్రికల నంపినాఁడు, ఎల్లుండి పుత్రికాస్వయంవరమహోత్సవము మఱి మూఁడు దినము లరిగినంగాని యాఱేఁడు నీతో మాటాడుట కవసర మీయుఁడు. అంతదనుక నీవు భద్రముగా మాయింటనుండుము. తరువాతఁ జూతువు గాక యని యాదరించి పలికిన విని నే నహహా! రాక్షసులననేమో యనుకొంటిని. ఇట్టి యుత్తములు మహర్షులలో సైతముండుట దుర్ఘటము. మీరు సేసిన యుపకార మెన్నటికి మరువనని స్తుతియించుచు మహాత్మా! రాజపుత్రిక కెన్ని యేండ్లున్నవి? ఆ స్వయంవరమున కింద్రుండు దిక్పాలురు సురలు వత్తురా? అని యడిగిన నతం డిట్లనియె.

అందఱకు నాహ్యానపత్రికలు పంపిరి. ఎవ్వరో వత్తురు నిశ్చయము. తెలియదు. ఈ చిన్నది సద్యోగర్భమునం జనియించి వృద్ధి బొందినది. ఏండ్లు లేకున్ననుఁ బదియారేండ్ల ప్రాయము దానివలె నుండును. మా ప్రభువున కిదివఱ కింత చక్కని పుత్రిక పుట్టియుండలేదు, విద్యావతియని పేరు పెట్టెను. ఆమె విద్యలతోనే పుట్టినదఁట. ఎవ్వని భాగ్యము పండినదియో తెలియదు. అని యతం డెఱింగించెను.

మఱియు మూఁడుగంటలకుఁ దానాసభకుఁ బోవుచు నన్ను రమ్మని తన బండిపైఁ నెక్కించుకొని యా యోలగమునకుఁ దీసికొనిపోయెను. ఆ సభ బ్రహ్మసభవలె మిక్కిలి శోభిల్లినది. బ్రహ్మతేజముతో నొప్పు రాక్షసులెల్ల నా సభ నలంకరించిరి. ఆహా! ఆ సభామధ్యంబున సమున్నతరత్నసింహాసనమున వసించియున్న నిరృతిమహారాజు నాకుఁ గన్నులపండువుఁ గావించెను. అతని మొగంబున శాంతమైన తేజంబు కళల నీనుచుండెను. విశాలములగు నేత్రకోణములనుండి వెల్వడిన చూపులు త్రిభువనప్రభుత్వలాంఛనమును సూచించుచున్నవి. సభ నిండినపిమ్మట నతండు లేచి యెల్లరు విన మేఘగంభీరస్వరంబున నిట్లుపన్యసించెను.

సభ్యులార ! అఖండలుం డకాండముగ నన్ను రప్పించిన కారణ మెఱింగించెద నాలింపుఁడు. మహేంద్రుఁడు మూడులోకంబుల కధికారి. దిక్పతులకెల్ల ముఖ్యుఁడు. పుణ్యలోకములఁ బాలించు ప్రభువు. ధారుణీతలంబునఁ బుణ్యములఁ గాంచిన సుకృతాత్ముల మరణావసరమందు విమానములతోఁగూడ దేవదూతల నంపి వారి నాయా పుణ్యలోకముల వసింపఁజేయ నధికార మాసురపతియందే యున్నది. రాక్షసులకు దేవతలకు సమానవిరోధమైనను మనలోకమునందున్న దానవులయందుఁగల సాత్వికత్వము ననుసరించి మనకుసు వారికిని మైత్రియే యొప్పియున్నది. పాతాళతలవాసులగు నసురులు దుష్టక్రియాచరణదక్షులని మన మొప్పికొనక తప్పదు. అట్టివారితో మనలోకమందున్న దనుజులకు సంబంధబాంధవ్యంబులు గలిగియున్నవని వారికి దెలియకపోదు. దేవకాంతలఁ గామరూపులగు దానవులు చెఱపట్టుట యనాది సిద్ధమైన పనియేకదా? వినుండు.

తేజోలోకమున కీ నడుమఁ గామరూపుఁడగు దైత్యుఁ డొకఁ డరుదెంచి పుణ్యపురుషుండనని చెప్పి మూఁడుదినంబు లందుఁ దీర్ధశుల్కతోఁగూడ దివ్యభోగంబు లనుభవించి ప్రధానదండనాథుఁడగు మాణిభద్రుని ధిక్కరించి యతం డెఱుంగకుండఁ దీర్థశుల్క నెత్తుకొని పోయెనఁట. మఱునాఁడు నిజమైన పుణ్యపురుషుం దెచ్చి యందు ప్రవేశపెట్టిరి. తీర్థశుల్క లేదు. మాణిభద్రు డావార్త వృత్రారి కెఱింగించుటయు నతండది దైత్యకృత్యముగా భావించి నాకు వర్తమానము బంపి రప్పించుకొని నాతో నావృత్తాంత మంతయుం జెప్పి తప్పక రసాతలవాసులు నీలోకమునఁగల దానవుల కాప్తులై యున్నట్లు మాకుఁ దెలియవచ్చినది. మీలోకమందట్టి వా రెందున్నారో తెలిసికొని శిక్షించి యాతీర్థశుల్క నాలోకమునకుఁ బంపివేయుము, దానికి బదులుగా మఱి యొక యచ్చర నచ్చటి కనిపితిమన పలికిన విని వినిమితోత్తమాంగుడనై నే నిట్లంటి. మహేంద్రా! నేను నాపరిజనులు మీయాజ్ఞ కెప్పుడు బద్దులమై యున్నాము. నాలోకమందున్నవారు మహాశ్రోత్రియలవలె దయాసత్యశౌచాదులు గలిగి వర్తింపుచున్నారు మాలోకములో నున్నవా రట్టిపని చేయుదురని నే నమ్మఁజాలను. రసాతలవాసులు చేసినం జేయవచ్చును. వారినిగురించి విమర్శించి దేవరకుఁ దెలియఁజేసెదనని జెప్పి యనుజ్ఞ పుచ్చుకొని వచ్చినాఁడ నొక మూలమునుండి దేవేంద్రునితోపాటు దిక్పతి ననిపించుకొనుచు మర్యాదగ గాలక్షేపముఁ జేయుచున్నాను. వారికి వ్యతిరేకము జేసితినేని నా యుద్యోగము గడియలో మడియఁ గలదు, అసురాంతకుండు పూరాంతకుండు వారికిఁ బ్రాపుగా నున్నారు. మీరు మాటఁ దక్కించి యీ యధికారము నిలిపితిరా నిలుపుఁడు, లేకున్న విడుదల యిచ్చి నాదారి నేను బోయెదను. రసాతలవాసు లిందు వచ్చుచున్నారా? లేరా ? నిజము చెప్పుడని యడిగిన నందొక రాక్షసుండు లేచి మహాప్రభూ! వచ్చుచున్నారు. కర్ధముఁడను దానవుని యింటికి ముగ్గుర వెంటబెట్టుకొని దుర్ధముఁడను దానవుడు వచ్చెను. వారే యొక బాటసారిభార్య నెత్తికొని బోయిరఁట. నెత్తి మొత్తుకొనుచు నా తెరువరి నాతోఁ జెప్పెనని చెప్పుటయు నిరృతి యాకర్ధము డిందు వచ్చెనా? అని కేకవేయించుటయు రాలేదని సభ్యు లుత్తరము జెప్పిరి. కర్ధముని యెందున్నను వెదికి తీసికొని రావలయునని యాజ్ఞయిచ్చి నిరృతి యానాటికి నాసభ చాలించెను. అప్పుడు నేను లేచి నాభార్య నెత్తుకొనిపోయిన వార్తఁ చెప్పవలె ననుడు నాతడు దాని కర్దముని విచారించినప్పుడు జెప్పవచ్చునని నాతో నున్న యతం డుపాయము చెప్పుటచే నూరకొంటిని. నాఁటి కందఱము నింటికిం బోయితిమి.

అని యెఱింగించి తరువాయి కథ యవ్వలి మజిలీ యందిట్లు చెప్పదొడంగెను.

195 వ మజిలీ.

విద్యావతికథ

విద్యావతి స్వయంవరసభ మిక్కిలి విశాలముగా నున్నది. శ్రేణులుగా గురుతులు వైచి పీఠము లమర్పించిరి. పద్మవ్యూహము దారివలె మధ్యపీఠము మొదలు గుండ్రముగా నామార్గము తిరిగి పీఠములన్నిటినిం దగిలి బైటకు వచ్చును. విద్యావతి వరించునని వచ్చువారందఱు తమతమ పేరులు నధికారము జాతి మొదలగు చరిత్రాంశముల ముందుగనే తెలియఁ జేయవలయునఁట. గురుతువైచి వారికి పీఠము లుంచుదురఁట. ప్రేక్షకులుగా వచ్చువారి కవి యేమియు నవసరములేదు. మూఁడవనాఁడు పదిగంటలకు సభ కూడినది.

దేవలోకములనుండి యక్షులు గంధర్వులు కిన్నరులు కింపురుషులు విద్యాధరులు లోనగు ప్రముఖులందరు వచ్చి సభ నలంకరించిరి. జయంతుఁడు నలకూబరుఁడు దిక్పతిపుత్రులు కావున వారికి వావులు కుదరమి రాలేదు. తక్కుంగల దిక్పతిపుత్రులును గూడ రాలేదు. వేల్పులు జాతివైరము దలంచి యుపేక్షఁ జేసిరి.

మాయింటి యజమానుని బలవంతమున నేనుఁగూడ దివ్యమాల్యాంగరాగానులేపనములతో నూత్నరత్నభూషాంబరాదుల ధరించి యాసభకుఁ బోయి ప్రేక్షకులు గూర్చుండుచోట నొకపీఠముపైనిఁ గూర్చుంటి.

అప్పు డాయోలగంబున వసించియున్న దేవయోనివిశేషుల వేషములం జూడఁ గన్నులకు మిరిమిట్లు గొలుపుచుండెను. గంట మ్రోగినది. సభాజన కలకల ముడిగినది. సభాంతరాళంబున నున్న తెర లాగఁబడినది. మబ్బు వెల్వడిన మెఱుపు తీగవలె మెరసి యాసరసిజగంధి సభ్యులకు నేత్రపర్వము గావించినది.

సఖీహస్తావలంబినియై ముందొక సఖురాలు వారివారి యుదంతము లెఱింగింపుచు మెల్లఁగా నడుచుచుండఁ దానును వారివారి సోయగముల వారచూపుల నాలోకించుచు నడుచుచుండెను.

సీ. ననల గంధర్వవంశప్రదీపవరుఁడు వి
                    శ్వావసుం డనువాఁడు వాఁడె చూడు
     మితఁడె చిత్రరథుండు మతిమంతుఁ డితఁడు తుం
                    బురుఁడు గానకళాప్రభూతయశుఁడు