కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/192వ మజిలీ

గీ. తిరిగెఁ బలుమారు గుడిచుట్టు వెఱచియైన
    జచ్చెఁ గాశీపురంబున శర్వుమ్రోల
    సూక్ష్మదృష్టి విచారించి చూడ నింత
    కన్న నుత్తమమగు పుణ్యకర్మమేది?

చౌర్యమునకైనను నీఁడు నిత్యము గంగాస్నానంబు చేయుచుండు. వీని పాపంబులు పటాపంచలు గాక నలిచియున్నవా? సామాన్యులకు మహాశివరాత్రి దివసంబునఁ గాశీపురంబున మరణంబు లభించునా? కాశీప్రభావం బెఱుంగక మీరిట్లు వచ్చితిరి. తెలిసికొను డిదిమొద లెన్నఁడును బంచక్రోశమధ్యంబున మృత్యు డగువాఁడెట్టివాఁడైన వానికొఱకు మీరు రాకుఁడు. కాలభైరవునికిఁ దెలిసిన మిమ్మీపాటికే గెంటివైచు పో, పొండు. శివధర్మ మతిగూఢమని పలుకుచు శివకింకరులు యజ్ఞదత్తు నుత్తమలోకంబునకుఁ దీసికొనిపోయిరి. వింటిరా. కాశీపురప్రభావంబని సిద్ధవ్రతుఁడు చెప్పుచుండఁగనే యోడ రేవు చేరినది. అని యెఱింగించువఱకు వేళ యతిక్రమించినది.

192 వ మజిలీ

మోహనుని మరణవార్త కథ

మఱికొన్నిదివసంబులక్రింద మిత్రుండు పుత్రుండు సన్యాసులవెంట దేశాంతర మరిగెనని తెలిసికొని పరితపించుచు వానిని వెదకుటకై ప్రయాణోన్ముఖుండగుటయు వారించుచు సిద్ధార్థుం డారహస్యముం దెలియనీయక తాను బోయి వెదకి తీసికొని వచ్చెదనని చెప్పి తురఁగారూఢుండై బయలుదేరి యుత్తరాభిముఖముగాఁబోయి జాడలు దీసికొని వారు వోయిన తెఱవునుబట్టి కొన్నాళ్ళకుఁ గాశీపురంబున కరిగెను. అందు వ్యాసమఠంబున నున్న యోగులనెల్ల విమర్శింప సిద్ధవ్రతునితో వచ్చిన శిష్యుఁ డొకండు గనంబడియెను.

వానిం గురుతుపట్టి పల్కరించి తనపేరు సెప్పి మీగురుండెం దున్నఁవాడని యడుగుటయు నతండు కన్నీరు నించుచు వారందరు పురందరపుర మలంకరించిరని దద్గదస్వరముతోఁ దెలియపరిచెను.

ఆ! ఏమీ! ఏమి! అని సిద్ధార్థుఁడు శోకవేగంబున నొక్కింత తడ వొడ లెఱుంగక యెట్టకేఁ దెప్పిరిల్లి యుల్లము పగుల దుఃఖించుచు వారెట్లు చచ్చిరో తెలుపుమని యడిగి నాయోగి శిష్యుం డిట్లనియె.

అయ్యా ! మేము మీనగరము విడిచి యుత్తరాభిముఖులమయి పోయి పోయి యనేక జనపదంబులం గడచి కొన్నినెలలకు గంగాతటంబుఁ జేరితిమి. దారిలోఁ గపిలయుఁ జంద్రికయు నను నిరువురు తరుణులు మా గురువునకు శిష్యురాండ్రై వెంటఁబడి వచ్చిరి. మేమోడకై రేవుకాచికొని యుంటిమి. అప్పుడు గంగానది కూలంకషంబుగాఁ బొంగి ప్రవహించుచున్నది. మా గురువు కాశీపురప్రభావము వర్ణింపుచుండ నాలించుచు నోడ రాక వేచియుంటిమి.

అంతలో నాకు దేహబాధకుఁ బోవలసిన యవసరము గలుగుటయు వారికిఁ జెప్పకయే నేనవ్వలికిఁ బోయితిని. నేను మఱల వచ్చునప్పటికి వారోడ నెక్కి యవ్వలికిఁబోవుచున్నట్లు కనంబడినది. అంతలోఁ బెద్దగాలివాన వచ్చుటచే నాకందు నిలువ వీలుగలిగినదికాదు. దాపున నున్న పల్లెకుఁ బోయి నాఁడు గడిపితిని. అందున్న పల్లెవాండ్రు రాత్రి రేవుపడవ గాలి విసరున గంగలో మునిఁగినదనియు నందలి జనులందరు గంగలోఁబడి మృతినొందిరనియు జెప్పికొనఁదొడంగిరి. ఆవార్త విని నేను మిక్కిలి పరితపించుచు మఱునాఁ డుదయంబున గంగయొడ్డునకుఁబోయితిని. నేవిన్న వార్తయే రూఢియైనది. నాఁడు మఱియొక యోడవచ్చినది. అందెక్కిన నావికుల నడిగితిని. వాండ్రు సామీ ? ఇట్టి యుపద్రవ మెన్నఁడును జరుగలేదు. తీరము రెండ బారలలో నున్నది. తెరచాపదించుట కవకాశము గలుగలేదు. ఓడ తలక్రిందులయినది. పాపము బాటసారులు స్త్రీలు పురుషులు వృద్ధులు బాలురు చాలమంది గలరు. అందరు మృతినొందిరి. కాశీరాజుగారు వారి శవములఁ బట్టించి చిత్తరువు చెక్కించి దహనాదిసంస్కారములు గావింపజేసిరి. నావికులుగూడ సమసిరని యా వృత్తాంతమంతయు నెఱింగించిరి.

ఆయుశ్శేషముండఁ బట్టి నేను నిన్న నోడ యెక్కలేదని తలంచి వారికొఱకుఁ జింతించుచుఁ జేయునది యేమియును లేక యీవ్యాసమఠంబునకు వచ్చి కాలక్షేపముఁ జేయుచుంటి. నాఁకిక నట్టి గురుండు దొరకఁడు. పాపము రాజపుత్రుఁ డింటికడ సుఖంబుండక వెర్రితలంపు పెట్టికొని వచ్చి దిక్కుమాలిన శవమై యిందు లాగఁ బడెను. భీమవర్మ కూఁతురు చంద్రిక సర్వభోగముల వీడి నీమిత్రుని వరించి వెంటఁబడి వచ్చినది. అందరికి నిక్కడ మరణము వ్రాసియుండ నెట్లు తప్పును? అని యావృత్తాంతమంతయు నెఱింగించెను.

అయ్యుదంతము విని సిద్ధార్థుండు దుఃఖించుచు నప్పుడు కాశీరాజు కొల్వునకుం బోయి తన కులశీలనామంబులు సెప్పి నాఁడు గంగలో మృతినొందిన వారి చిత్రఫలకములఁ జూపుఁడని యడుగుటయు వానిఁ గనుపరుచుమని యొక యుద్యోగస్థున నాజ్ఞాపించెను. ఆ యుద్యోగి వారినెల్ల సిద్ధార్థునకుఁ జూపెను. సిద్ధవ్రతుఁడు, చంద్రిక, కపిల, వీరి చిత్రఫలకముల గురుతుపట్టి విమర్శించి చూచెను. కపిలాచంద్రికలఁ దానెఱుఁగకున్నను యోగశిష్యుండు చెప్పిన గురుతులంబట్టి వారే యని గ్రహించెను. మఱియు బాటసారుల చిత్రఫలకములు చాల నున్నవి, మోహనుని చిత్రఫలకమందుఁ గనంబడలేదు.

నాఁడు పడవలో మునింగిన వారందరు దొరకిరా అని యడిగిన నాయుద్యోగి జాలమంది దొరికిరి. దొరకనివారు సముద్రముపాలై యుందురని చెప్పెను. అప్పు డతండు తనస్నేహితుఁడు సాగరము పాలయ్యెనని వగచుచుఁ దానింటికి బోలేక యా విషయములన్నియు నింద్రమిత్రునకుఁ బత్రిక వ్రాసి యంపెను. మఱియు నున్మత్తుఁడువలె నాయూరఁ దిరుగుచుండెను.

ఒకనాఁడు సిద్ధార్థుండు తనకు నింటికడ మోహనుఁడు జెప్పినమాట జ్ఞాపకము వచ్చుటయుఁ దిన్నఁగా విశ్వేశ్వరుని యాలయంబునకుం జని యందలి కుడ్యభాగంబులన్నియు విమర్శించి చూడ నొకభైరవవిగ్రహముక్రింద నీక్రింది పద్యము వ్రాయఁబడి యున్నది.

క. ఓపికతోఁ బూనిన పని
   యాపదలైనం బొనర్చుటది యుచితంబా
   యాపదలె మేలు సేయు మ
   హోపకృతుల్గాఁ దనర్చు నొక్కొక వేళన్.

ఆ పద్యము మోహనుఁడు వ్రాసినదిగాఁ దెలిసికొని సిద్ధార్థుండు దాని భావము వితర్కింపుచు, వీఁడీ పద్యము నెప్పుడు వ్రాసియుండును ? తాను గొప్ప యాపదపాలైనట్లు నదియె తన కుపకారముఁ జేసినదనియు సూచించుచు నీ పద్యము వ్రాసినాఁడు. ఓడలో మునింగినవారు తీరముఁ జేరలేదని చెప్పుచున్నారు. ఈనగరము జేరకుండ నీపద్యము నెట్లు వ్రాయఁగలఁడు? ఇది మిక్కిలి చోద్యముగా నున్నది. ఈ లిపి వానిదగుట నిక్కువము. దీనిం బట్టిచూడ వాఁడు జీవించియున్నట్లు కనంబడుచున్నది. అని పెక్కుతెఱంగుల విమర్శించుచు గొన్నిదినము లాకాశీపురంబున వసించి యతనిజాడ నఱయుచుండెను.

దేవకన్యకలకథ

ఒకనాఁడు సిద్ధార్థుడు కాశీపురవీథులం దిరుగుచుండ నొక బండివెంట జనులు గుంపులుగా మూఁగిపోవుచు దేవకన్యకలు దేవకన్యకలని యఱచుచుండిరి. ఆ కేకలు విని సిద్ధార్థుఁడు గూడ నా గుంపులోఁజేరి యానారీమణులఁ జూడదొడంగెను. ఒకబండిలో నిరువురు తరుణులు గూర్చుండి తెరవైచికొని పోవుచుండిరి. ఆ తెర సందులనుండి యా తెరవల వింతగాఁ జూచుచుండిరి.

ఆ ముద్దుగుమ్మలు ప్రొద్దున్న గంగాస్నానముజేసి విశ్వేశ్వరుని దర్శించి బసలోనికిం బోవుచున్నారు. స్నానము చేయునప్పుడు వారిం జూచినవారు దేవకన్యలని పేరుపెట్టిరి. ఆ మాటలే పలుకుచు జనులు వారి బండి వెంటఁ బోవుచుండిరి. బండిలో నున్నప్పుడు వారిరూపము లంతగాఁ దెల్లము కాకున్నవి. వీరు విదేశ రాజపుత్రికలు చక్కనివారగుట దేవకన్య లనుచున్నారని తలంచియు మానక యా బండివెంటఁబోయి వారు బండి దిగి బసలోనికిఁ బోవుసమయంబున మెరపుతీఁగెవలె దళుక్కుమని మెరసిన వారిసోయగముఁ జూచి ఆహా! వీరు నిజముగా దేవకాంతలవలె నున్నారు. శ్రీవిశ్వేశ్వరమహాదేవుని దర్శించుటకు దేవతలుగూడ వత్తురని వాడుక యున్నది.వీరట్లే వచ్చిన వారగుదురు. కానిమ్ము. వీరి చక్కదనము మరియొకసారి చూచి నేత్రానందముఁ గావించి కొనియెదనని తలంచి యా బండివాని వెంటఁ గొంతదూరము పోయి సానునయముగా నిట్లనియె.

ఓరీ? ఈకాంత లెవ్వరు? ఎందుండి వచ్చిరో యెఱుంగుదువా? అని యడిగిన వాఁడు స్వామీ! వీరెవ్వరో నేనెరుఁగ నిన్నటి సాయంకాలమే నాబండి కుదిర్చికొనిరి. ఈ యిద్దరికి నాయన భర్త కాఁబోలు. ఆయనయు మంచి సొగసుకాఁడు. సాయంకాలము తిరుగా విశ్వనాథు నాలయమున కేగుదురఁట. మూఁడుగంటలకు బండి తీసికొని రమ్మనిరని చెప్పి వాఁడవ్వలకుఁబోయెను.

సిద్దార్థుఁ డామాటలు విని కానిమ్ము. సాయంకాలము వారు తిరుగా దేవళమునకుఁ బోవుదురుగదా ! అప్పు దవకాశ మరసి పరిశీలించెదంగాక యని తలంచి యావేళకు వచ్చి యాయింటి ప్రక్కఁ గూర్చుండెను.

ఆవార్త యెట్లు తెలిసికొనిరో పౌరులు గుంపులుగా వచ్చి నాలుగుగంటలవేళకావీథిని మూఁగికొనిరి. బండివాఁడు మఱియొక పెట్టిబండి తీసికొని వచ్చెను. ఇద్దరి స్త్రీలతో నొకపురుషుఁ డాబండిలో నెక్కెను. చోదకుఁడు విశ్వేశ్వరుని యాలయము దెసకు బండిని తోలుచుండెను. జనులు తోసికొని బండి వెంబడి నడుచుచుండిరి. బండిదాపునకుఁ బోవుటచే యవకాశము గలిగినది గాదు. అప్పుడు సిద్దార్థుఁ డాలోచించి,

సీ. ఇంద్రమిత్రుఁడు నామహీమహేంద్రుని పుత్రు
              మిత్రుఁడఁ దన్మంత్రి పుత్రకుండ
    సిద్ధార్థుఁడనువాడఁ జెలికాఁడు మోహనుం
              డనువాఁడు కాశికాయాత్ర వచ్చి
    గంగ దాటుచుఁ బెనుగాలి యోడ మునుంగ
             మునిఁగి తానం నాకమునకుఁ బోయె
    విహితులతో వానివెదకుచు నిటవచ్చి
             యవ్వార్త విని మృతినందలేక
గీ. మొండినై యిమ్మహాపురంబునఁ జరింతు
    నేమియును గామితము లేదదేమొ కాని
    మిమ్ముఁ జూడఁగ నాకభీష్టమ్ము గలిగె
    దర్శన మొసంగు డొకసారి ధన్యుఁడగుదు

క. నన్నిట సౌహార్దముతో
   మన్నించి ప్రియంబుమీర మాటాడ హితుం
   గన్నట్లు సంతసింతుఁగ
   దన్నా! నీమీఁద వ్రాలె నన్సద్వాంఛల్.

అని పత్రికలో వ్రాసి యాపత్రిక మడచి శకట గవాక్ష వివరమునుండి లోపలకుఁ ద్రోసెను. పదినిమిషములలో నాబండిలో నున్న పురుషుఁడు బండి యాపించి తలుపు తెరచి యుత్తమాంగ మీవలఁబెట్టి సిద్ధార్థుండనువాఁ డెక్కడ? ఇటు రావలయునని కేక పెట్టెను. ఆ ప్రాంతమందే యున్న సిద్ధార్థుఁడు దాపునకుఁబోయి నేనే సిద్ధార్థుఁడనని పలుకుటయు లోపలికి రండు, రండు అని పిలుచుచుఁ జేయిపట్టుకొని యెక్కించి తలుపువైచి తనప్రక్కఁ గూర్చుండఁ బెట్టుకొనియెను. ఎదురు బల్లపైఁ దన కభిముఖముగాఁ గూర్చుండియున్న యాయన్ను మిన్నల నిర్వురం జూచి విభ్రాంతిఁ జెందుచు నేమనుటకును నోరు రాక యోహో! యీత డెవ్వఁడో చాల మంచివాఁడు. సంశయింపక యిట్లు నన్నుఁ దన యాఁడువాండ్ర యెదురఁ గూర్చుండఁ బెట్టెనే? కన్నెత్తి వీరి సౌందర్యము చూతమన్న బాగుండదు. అని తలంచుచు సిద్ధార్థుం డోరచూపుల నతని మొగముపై వెలయింపజేసెను అతండేమియు మాటాడ లేదు. ఆ పొన్నకొమ్మలు మేనం జెమ్మటలు గ్రమ్మ నేమనుటకుఁ దోచక తొట్రుపడుచున్న సిద్ధార్థుని నగమొగముతోఁ జూచుచుండిరి.

అప్పు డెట్టకే నెలుంగు దెచ్చుకొని మహాపురుషా! నీవు నాప్రాణమిత్రుండు జగన్మోహనునివలె నుంటివి. మందాకినీగర్భమరణసుకృతంబునం జేసి నాకంబునకేగి యందు దేవతాకన్యకలఁ బరిగ్రహించి వారితోఁగూడ నీపుణ్యభూమి చూడవచ్చినవాఁడవని యుత్ప్రేక్షింపవచ్చును. ఈ పూవుఁబోండ్లు మనుష్యస్త్రీలు కారని తెల్లమగుచున్నది. దానంజేసి నీవు కంతుజయంతవసంతాదులలో నొక్కండవు కావలెను. మిమ్ముఁజూచుట చేతనే నేను కృతకృత్యుండనైతిని. మిత్రవియోగసంతాపం బంతరించినది. మీయుదంత మెఱింగించి శ్రోత్రానంద మాపాదింపుఁడని ప్రార్థించెను. ఆ పురుషుండేమియు మాటాడక యూరక చూచుచుండెను. అప్పు డందొక యొప్పులకుప్ప చిరునగవుతో మనోహరా! వీరేదియో యడుగుచుండ మాటాడరేమి? వారి యభిలాష తీర్పుఁడని పలికినది. అప్పుడాపురుషుండు మోమువికసింపఁ జెప్పుట కేమున్నదిఁ తాననుకొనిన యుత్ప్రేక్ష స్వభావోక్తి యని తలంపవచ్చునని మెల్లఁగఁ బలుకుటయు నతండు స్వరము గ్రహించి ఆ! ఆ! ఏమీ! ఆ! ఆ! నాప్రాణమిత్రుఁడు మోహనుఁడే? మోహనుఁడే? అని పలుకుచు సంతోషము పట్టజాలక వివశుండై కన్నులు మూతఁబడ వెనుకకుఁ జేరఁబడియెను.

అప్పు డాపురుషుఁడు వాని నానిపట్టుకొని యుత్తరీయము చెలుఁగున విసరుచు సిద్ధార్థా! అని పిలుచుచు సేద తీర్చెను. సంతోషము దుఃఖము గూడ నెక్కువగాఁ గలిగినప్పుడు వివశత్వము వహించి యొక్కొక్కప్పుడు ప్రాణములు గూడ వదలుచుందురు. ఆ పురుషుం డతండు పలుకుపలుకు తొంతరపడి పిలుచుచు దాను విసరుచు భార్యలచేత విసరించుచుండ గొండొకసేపున కతండు కన్నులం దెరచెను.

వయస్యా! లెమ్ము. లెమ్ము. నేను నీప్రియమిత్రుఁడ జగన్మోహనుఁడ. నీవనినట్లు నాకమున కేగియే వచ్చితిని. నా యభీష్టము తీరినది. లెమ్మని పలికినంత నతండు లేచి యోహోహో? నేడెంత సుదినము! తొలుత నెవ్వరి మొగముఁ జూచితినో? ఎంత ధన్యుండ నెంత ధన్యుండనని యూరక వెఱఁగుపాటుతోఁ బలుకుచు నతనిం గౌఁగలించుకొని సౌహార్దముతో నీ వృత్తాంతము వినుదనక నాకుఁ దొందరగా నున్నది. ఎట్లు బ్రతికితివి? ఈకాంత లెవ్వరి పుత్రికలు? ఎక్కడివారలు? నీయుదంతము సవిస్తరముగాఁ జెప్పుము. అని అడిగిన నతండు నాకథ చాల పెద్దది. ఇంతలో తేలునా? మనము గుడికిఁబోయి విశ్వేశ్వరుని దర్శించి యింటికి బోయిన తరువాత నంతయుఁ జెప్పెదనని చెప్పుచుండగనే బండివాఁడు బండి నిలిపి అయ్యా! బండి యిఁక ముందు రాదు. మీరు దిగి నడచిపోయి స్వామిని సేవించిరండు. నేనిందే యుండెదనని చెప్పఁగా వారట్లు జేసిరి. ఆస్త్రీల వింతగాఁ జూచుచున్న జనుల నదలించుచు వీరొక రాజకన్యకలు పరివారము దూరముగాఁ నుండుట మీరట్లు మీఁది మీఁదికి వచ్చుచున్నారు. సంసారస్త్రీల విషయమై మీరట్లు మూగుట తప్పు, పొండు పొండని సిద్ధార్థుండు పలుకుటయు వారు దూరముగాఁబోయిరి.

అప్పుడు వారిని దేవాలయము లోనికిఁ దీసికొనిపోయి స్వామిదర్శనముఁ జేయించి స్తుతియింపుచు వెండియు బండి యెక్కి వెనుకటి బసలోఁ బ్రవేశించెను. సిద్ధార్థుఁడు మోహనుని నిజవృత్తాంతముఁ జెప్పుమని యడిగిన నతం డొకచోటఁ గూర్చుండి వినోదముగా నాకథ యిట్లు జెప్పఁదొడంగెను. అని యెఱింగించువఱకుఁ గాలాతీతమైనది. తరువాతకథ పైమజిలీ యందుఁ జెప్పందొడంగెను.

193 వ మజిలీ.

తేజోలోకము కథ

మిత్రమా! యోడ మునుఁగువఱకు జరిగినకథ నీవు వినియే యుంటివి కదా! తరువాత నాకర్ణింపుము. వినిమయవాతంబున నాపోతం బోరగిల్ల మా యుల్లములు భేదిల్ల నీరుఁ బోసుకొనుచు బుడుంగున మునింగినది. నే నొకమూల గంగలోఁ బడి మునింగి కొట్టుకొని పోవుచుంటిని. అది నాకుఁ జరమావస్థ యని నిశ్చయించి కాశీవిశ్వనాథుని హృదయంబున సన్నిహితుం గావించుకొని మహేశా? నగరదర్శనముఁ జేసినను నాకీ దుర్మరణము దప్పినదికాదు నా యభిలాషయుఁ దీరినదికాదు. ముందిరిజన్మమునందైన నా యభీష్టము దీర్పుమని నిన్నుఁ బ్రార్థించుచుంటిని మఱియు నా నిమిత్తమై యీ మత్తకాశినులు నీసన్యాసియు బలవన్మరణము నొందుచున్నారు. వీరి కుత్తమగతులు గలుగునట్లు చేయుము స్వామీ! ఇదియే నా కడపటి కోరిక. అని విశ్వపతిని ధ్యానించుచుఁ గొంచె మీదుటకుఁ బ్రయత్నించితిని. అప్పుడు నా చేతులకు గోడలాగున నేదియో తగిలినది. అది పట్టుకొనుటకు నునుపుగా నుండుటచే వీలుపడినది కాదు. ఆ గోడవారే కొట్టుకొని పోవుచుంటిని. ఏమాత్ర మూఁతదొరికినను బట్టికొని గట్టెక్క వలయునను సంకల్పముతోఁ జేతులతోఁ దడుముచుంటిని. ఈశ్వరవిలాసములు