కాశీమజిలీకథలు/ఆరవ భాగము/66వ మజిలీ

యుత్సవములు సేయించెద. లేనిచో వట్టి పాషాణముగా దలంచెదనని పలుకుచున్న సమయంబున హేమ యెదురుకువచ్చి మహారాజా ! ఆ దేవి నేమియు నిందింపవలదు మీ చింతలన్నియు దొలగిపోయినవి. వెదకఁబోయినరత్నము చేతికే దొరికినది. దైవసంకల్పములు కడుచిత్రములుగదా యని పలుకుచు సహదేవుఁడు చేసిన కృత్యములును సావిత్రి చెప్పినమాటలు నామూల చూడముగాఁ జెప్పినది. ఆ వృత్తాంతము విని రాజును, భార్యయు పరమానందసాగరమున మునిఁగి దేలుచుండిరి.

అని యెరింగించువరకు వేళ యతిక్రమించుటయు నవ్వలి మజలీ యందు మణిమసిద్ధుండు తదనంతరొదంతం బిట్లని చెప్పందొడెంగెను.

అరువది యారవ మజిలీ

పుత్రీ ! మీనాక్షీ ! యిటురా ? యేమిపనిచేసితివి? తరతరంబులనుండి దివాణము నాశ్రయించుకొని యుంటిమిగదా? అంతిపురిలోని రహస్యములు వెల్లడి చేయవచ్చునా? ఇప్పుడు మనజీవికకే హానిఁదెచ్చితివి. గొప్పయపరాధమే నీపైఁ బడినది. మాధవస్వామి యర్చకుఁడు శ్రీనివాసాచార్యుని యల్లుడట, వాఁడెవ్వఁడు? వానితో నీకుఁ బరిచయ మెప్పుడు గలిగినది? అందలి నిజమేదియో చెప్పుము. ఇప్పుడు ముప్పువచ్చినదని యడిగిన తల్లి మాటలు విని యించుక వెరచుచు మీనాక్షియను దాసీపుత్రిక యిట్లనియె.

అమ్మా ! నామీదఁబడిన నేర మెట్టివి? యర్చకుని యల్లునిమాట యేమిటికి వచ్చినది ఏమేమివింటివో యంతయుం జెప్పుమని యడిగిన నా దాది అయ్యో ! నీవేమియు నెరుఁకవు కాఁబోలు ! వినుము, మొన్న నేనుఁగనెక్కి యూరేగివచ్చినయోగి మొదట రాజపుత్రిక వరించిన యోగికాడఁట. సహదేవుండను రాజపుత్రుఁడు వైరాగ్యము జనింప యోగియై యందుఁ దపము జేసికొనుచుండ నాతని మన రాజపుత్రిక వరించి పెండ్లియాడినదఁట. ఆతం డిప్పుడువచ్చి తానే భర్తనని చెప్పెను. అప్పు డిరువురు యోగులకుఁదగవు గలిగినది. స్వయంప్రభ గురుతులన్నియుం దెలిసికొని సహదేవునే వరించితినని చెప్పినది.

అప్పుడా కపటయోగిని రాజభటులు నిజము సెప్పుమని తర్జన భర్జనఁ గావించిరి. దెబ్బలకుఁ దాళక యతండు తాను మాధవస్వామి యర్చకుని యల్లుండనియుఁ దనకాపురము కంచియనియు మీనాక్షియను దాసీపుత్రిక ప్రేరణంబున నట్టి కపట వేషము వైచితిననియు నందలి నిక్కువమంతయుం జెప్పివేసెను.

అప్పుడు నిన్నుఁగూడఁ బట్టి దీసికొని రమ్మని రాజు కింకరుల నియోగించెను. ఆ వార్తవిని ముందుగ నేను బరుగిడి వచ్చితిని. నిజముచెప్పుము. కొంపముంచి వేసితినని యడలుచు నడిగిన గడగడ వడకుచు నది యిట్లనియె.

చక్రపాణి కథ

తల్లీ ! నీ యొద్ద నిక్కము దాచనేల? విను మొకనాఁడు నేను మాధవస్వామి యాలయమునకరిగి పూవులు కోసికొనుచుంటిని. ఆ యర్చకుని యల్లుఁడు చక్రపాణియను నాతఁడు అత్తవారింటికి వచ్చెనట. ఆ వయసుకాఁడు పెరటిలోనికివచ్చి నన్నుఁజూచి తలయూచుచు స్మారవికారములు కొన్ని ప్రకటించెను. కాని వయసును హోయలును రూపమును జూచి భాగ్యవంతుఁడని యేను బ్రమఁజెంది వానితో సరసములాడ మొదలు పెట్టితిని. క్రమంబున నిరువురు మనసులు గలిసినవి. తుద కతండు తన యభిలాష వెల్లడించెను. నే నంగీకరించితిని. నాటంగోలె నిద్దరకు సంబంధము గలిగినది.

కొనియో, దొంగిలించియో కాని యప్పుడప్పుడు నాకు మంచి మంచి పుట్టములు దొడవులునుం దెచ్చి యిచ్చుచుండువాఁడు. ఒకనా డతఁడు నన్నుజూచి నీ పని యెక్కడయని యడిగిన స్వయంప్రభయున్న యుద్యానవనములోనని చెప్పితిని. ఆ రాజపుత్రిక సౌందర్య మెట్టిదని యడిగిన ద్రిలోకాభిరామమని చెప్పితిని. ఆమెం దనకుఁ జూపుమని వేడుకొనియెను. ఆ పని నావలనగాదని ప్రత్యుత్తర మిచ్చితిని. అతండు ప్రతిదిన మందులకే నన్నూరక నిర్బంధించుచుండెను

ఆ తోటలో నెంత రహస్యముగా జరిగిన పనులైనను మాకుఁ దెలియక మానవు. రాజపుత్రిక హేమతో రత్నకూటగిరి కరుగుటయు మూఁడుదినము లందుండుటయు నాయోగిని భర్తగా వరించుటయు లోనగు రహస్యకృత్యము లన్నియు నెప్పటి కప్పుడే మాకుఁ దెలియుచుండినవి. మరియొకనాఁ డాయోగి యెవ్వరికిం జెప్పక యెక్కడికోపోయెను. ఆసంగతి నేను గ్రహించి చక్రపాణితోఁ బరిహాసముగా నీ వా యోగి వేషము వైచికొని యందుఁగూర్చుంటివేని నీ కా రాజపుత్రిక దర్శనము కాఁగలదని చెప్పినంత నతండా సంగతియే నన్ను గ్రుచ్చి గుచ్చి యడుగుటయు స్త్రీ చాపల్యంబునం జేసి యాగుట్టంతయు నతని కెరింగించితిని. తరువాత నతం డవ్వేషము వైచికొని యందుఁ గూర్చుండెను. ఇదియే జరిగినకథ, ఇందు నానేర మేమి యున్నదియో చెప్పుమని పలికిన విని యాదాది యురము మోదికొనుచు నిట్లనియె.

ఇంకనేమి ? దారిఁజూపితివి. తరువాతకృత్యంబులన్నియు నతండు పూరించెను, కానిమ్ము. మించినదానికిఁ జేయునదిలేదు. ఇప్పుడు నీవామాటయేమియు నొప్పుకొనవద్దు నా కేమియుం దెలియదని పలుకుము చక్రపాణి యెవ్వఁడో నే నెరుఁగనని బొంకుము, అని బోధించుచుండఁగనే రాజబటులువచ్చి మీనాక్షి యెందున్నదని పలుకుచు నిల్లు ముట్టడించిరి.

మీనాక్షితల్లి దానిం గొట్టకుండ వాండ్రం బ్రతిమాలికొని మీనాక్షితోఁగూడ వారివెంట న్యాయస్థానమున కరిగినది. అందునింద్రమిత్రుఁడు హితపురోహితమంత్రి సామంతాది ప్రకృతివర్గము సేవింపఁ గొల్వుకూట మలంకరించి సహదేవునితో నేదియో ముచ్చటింపుచుండెను. చక్రపాణి యొకదెశ నిలువంబడియుండెను రక్షక భటానీతయగు మీనాక్షింజూచి చక్రపాణి యోసీ ! నన్నీ యోగివేషము వైచుకొని యందుఁ గూర్చుండమని ఉపాయము చెప్పినది నీవుకావా? యని యడిగిన న వ్వగలాడి వానిమొగ మెగాదిగఁజూచి యోహో కల్లు ద్రాగితివా ? యేమి ప్రల్లదము లరచుచుంటివి. నీమొగ మెప్పుడైన నేను చూచితినా? చాలు చాలు అని కన్ను లెర్రజేసి పలికినది.

అప్పు డతం డౌరా ! ఎంతమోసకత్తెవే ! నీవు చెప్పనిచో నా కా యుద్యానవనములోని రహస్యములెట్లు తెలియఁబడును స్వయంప్రభాదేవి కోవెల యేమూల నున్నదియో నేనెరుంగుదునా? రాజపుత్రిక యా యోగిని వరించినట్లే నాకుఁ దెలియదు. ఇట్లుచేయమని ఎంతయు నాకు బోధించి నేనేమియు నెరుఁగననిన నూరకపోవునా? నా ముక్కును మొగ మెరుఁగనని చెప్పితివిగదా, నీయింటిలో నావస్తువాహనముల నెన్ని చూపుదునని మరికొన్ని గురుతులుచెప్పి దానిఁదెల్ల బోవునట్లు చేసెను. ఆ మాటలన్నియు విని మీనాక్షియే యీవ్యూహము పన్నినదని సభ్యులు నిశ్చయించిరి.

అట్టి సమయమున స్వయంప్రభకుఁ బుత్రోత్పత్తియైనదని ఎవ్వరో వచ్చి చెప్పిరి. అప్పుడు రాజును మంత్రులును బరమానందభరితులై యపరాధులని నిరూపించియుఁ జక్రపాణిని మీనాక్షినింగూడ నా వేడుకచే శిక్షింపక విడిచి పెట్టించి యందరు నా యుద్యానవనమున కరిగిరి.

సూతికాగృహంబున సహదేవుని ప్రకృతిపలె మెరయుచు దివ్యతేజ స్సంపన్నుఁడై యున్న యాపాపంజూచి యింద్రమ్మిత్రుఁడు ప్రహర్షవారినిధి నీదులాడుచుఁ బీదల కనేక దానములు గావించి తన దేశమంతయుఁ బుత్రోత్సవములు గావింప నియమించెను. తరువాత సహదేవుఁడే యా బాలునికి జాతకర్మ విధులు నిర్వర్తించి దేవదత్తుఁడని పేరు పెట్టెను. ఇంద్రమిత్రుఁడు సహదేవుని యద్భుత సునీషాకౌశల్యమునకు మిక్కిలి సంతసించుచుఁ దన రాజ్యమప్పుడే యాతని యధీనముఁజేసి పట్టభద్రుం గావించెను. సహదేవుండును దమ బంధువులనెల్ల రావించి తండ్రియనుమతిని దన చెల్లెలిని వసుమిత్రునికిచ్చి వివాహముఁ జేయించి యతనిం దనమంత్రిగాఁ జేసికొని యా రాజ్యము సుఖముగాఁ బాలించుచుండెను.

గోపా ! యీపద్య మా స్వయంప్రభను గురించి యప్పటి వారెవ్వరో రచియించి యిందు వ్రాసిరి. స్వయంప్రభ మొదటఁ బెండ్లియాడనని నియమముఁ జేసికొన్నదిగదా. యోగియొకఁడు సహదేవుఁ డొకండు చక్రపాణి యొకఁడు చివరకు నీమువ్వురును మగలుగాఁ దేలిరి. అందులకై యుత్ప్రేక్షించి యీపద్యము రచియింపబడినది అని యెరింగించి మనిసిద్ధుండు శిష్యునితోఁగూడ నా రాత్రియందు వసించి మరునా డవ్వలి యవసథమునకుఁ జేరెను.


శ్రీ శ్రీ శ్రీ