కాశీమజిలీకథలు/ఆరవ భాగము/65వ మజిలీ
మేము మాత్రము వట్టి ఛాందస్సుల మనుకొంటివా యేమి నవరసముల నెరింగినవారమే? మీ యిష్టమువచ్చిన వేడుకం గావింపుఁడు. కోపమేమియుం జేయనని చెప్పెను.
అప్పుడొక్క దాశీకన్యక నలంకరించి దీసికొనివచ్చి మంచముపైఁ గూర్చుండఁ బెట్టిరి. ఆ యతి రెండవదెసఁ గూర్చుండెను. పిమ్మట వధూవరులచే మొదట గంధముఁ బూయించిరి. తరువాత నొక ధూర్త బావగారూ ! మీ జడ లంటించుకొని నట్లున్న వేమని పలుకుచు జడలు లాగినది. అవి చేతిలోనికూడి వచ్చినవి. మరియొక్కతె యీ గడ్డము జటలవంటిదే కాఁబోలునని లాగినది. వేఱొకతె వల్కలము చించినది. ఇంకొకతె ముళ్ళు గ్రుచ్చినది. ఒకతె గోమయోదకముఁ జల్లినది. ఒకతె యుమిసినది. అతండు పెద్దతడవు దనుకఁ బరిహాస కృత్యములని తలంచి యతియిష్టమున నా చర్యల సహించు కొనుచుండెను. అవి క్రమ క్రమముగా ముదిరి ప్రహారణములుగా మారినంతఁ దాళలేక అయ్యో ! అయ్యో ఇదియేమి హాస్యము ఇదియేమి వేడుక? రాజపుత్రికయే మరియు బాధించుచున్నదే ? నిలువలేను రక్షింపుడు. రక్షింపుడు పోనిండు, పోనిండని యరచుచు మంచము దిగి యిటు నటు పరుగిడుచు కేకలు పెట్టుచుండెను. ఆ రోదన ధ్వనివిని రాజపుత్రిక హేమను నట్లు చేయవలదని మందలించినది.
అప్పుడు హేమ ధూర్తాంగనలతో వలదు వలదు. ఇఁకనూరకుండుడు. అయ్యగారికి హాస్యరసము తెలియదు. కోపము చేయుచున్నారని పలుకుచు స్వామీ ? మీరు త్రికాలవేదులుగదా? నేఁడిటుల జరుగునని తెలియదాయేమి? ఒకదినము హాస్యమునకే మీరిట్లు భయపడుచున్నారే? ఇంతకన్నఁ జేయదగిన రహస్యములు చాలఁ గలిగియున్నవి. వానికెట్లు తాళగలరని యడిగిన నతండు వివశుండై యిట్లనియె.
అబ్బా ! ఈ దెబ్బల కెవ్వఁడు తాళఁగలడు. నాకు రాజపుత్రిక యక్కరలేదు. నాదారి నన్నుఁ బోనీయుఁడని బ్రతిమాలుటయు హేమ అన్నన్నా ! మా రాజపుత్రికం బెండ్లియాడి విడచిపోవుదుననిన సమ్మతింతుమా ? నిలు నిలుమని యదలించినది. ఆరాత్రి అతనికి కాళరాత్రివలె భయంకరమై తోచినది.
అని యెరింగించుటవరకు వేళ యతిక్రమించుటయు నవ్వని కథ మణిసిద్ధుండు తదనంతరావ పధంబున నిట్లని చెప్పఁదొడంగెను.
అరువది యైదవ మజిలీ కథ
అయ్యో ! స్వయంప్రభాదేవి వరమునం బుట్టియు మనపట్టి యిట్టి నికృష్టపు నింద పాల్పడుచున్న దేమి ? కొన్ని దినములు బెండ్లియే యాడనని బాధపెట్టినది. తరువాత సన్యాసిని పెండ్లియాడితినని చెప్పినది. ఆ మాటనమ్మి ---------- భోగినిఁజేసి తీసికొని వచ్చితిమి. వానింజూచి తాను వరించిన సన్యాసి
మరియొకండని యిప్పుడు తెలియఁజేయుచున్నది. ఆ తగవట్లుండ భూరిశ్రవుని కుమారునికి దీనినిత్తుమని శుభలేఖలు వ్రాసితిమిగదా ? అతండు మన యుత్త రము నిజానిజంబులు విమర్శింపకఁ దన కూఁతుంబెండ్లి కూతుంజూచి మాట్లాడుటకు మన వీటికిం బంపుచున్నాడఁట, ఇంతకు ముందే యా పత్రిక వచ్చినది. ఇప్పుడు మనమేమి చేయఁదగినది. సీ ? ఆఁడుజాతి పాడుజాతికదా? అందువలననే వీరికి స్వతంత్రమీయఁగూడదని ధర్మశాస్త్రవేత్తలు వ్రాసియున్నారు. నే నా యోగిని స్వయంప్రభాదేవి కోవెలమంటపములో నుండఁగా జూచి రుద్రాక్షమాలికఁ గానుకగ నిచ్చితిని. అతం డితండు కాడని నేమి చెప్పఁదగినది. స్నేహముపాశము నా హృదయమునఁ బెనఁగొని కదలనిచ్చుటలేదు. ఇదియే మరియొకరైనచో నెంతపని నైనఁ జేయుదునని యలుకతోఁ బలుకుచున్న ప్రాణనాధు నోదార్చుచు మనోహరిణి యిట్లనియె నాధా ? దానికర్మ మట్లున్నది కనుక మీరట్లు నిందించుచున్నారు. అది యే పాసము నెరుంగదు. అది వరించిన మహర్షిరూపవంతు డనియుఁ దేజశ్శాలి యనియు హేమ మొదటనే నాతోఁజెప్పినది నడుమ వీ డెక్కడనుండి వచ్చెనో
తెలియదు. ఆ విషయము విమర్శింపక యూరక దాని నిందించుచున్నారు. అది కడు మానసుస్థురాలుసుఁడీ ! అవమానము సహించునదికాదు. అందరివలెనే యది భోగముల కాశపడదు. మహర్షియని యంగీకరించినది. గర్భవతియైనది తొందర యేమివచ్చినది. నెమ్మదిగా విమర్శింతుము గాక. భూరిశ్రవుని కూఁతురు వచ్చెనేని మర్యాదగా స్వయంప్రభయొద్దకే యంపుదము. ఈ వృత్తాంత మక్కడనే తెలిసికొని యచ్చెలువ వచ్చినదారిఁ బోవగలదు. దీనికింత వ్యాఖ్యానము సేయనేలయని భార్య పలికిన భూవల్లభుండు మారుమాట చెప్పక యట్లేచేయుటకు నిశ్చయించెను.
ఆ మరునాఁడే సావిత్రి వచ్చినదను వార్తవిని స్వయంప్రభకుఁ దెలియఁజేయుచుఁ గొందరసుందరుల నెదురుఁబంపి యెంతయేని గౌరవముఁ గావింపజేసెను. స్వయంప్రభయుఁ దండ్రిపంపిన యుత్తరముఁ జదివికొని హేమతోఁ బ్రశంసించిన యుద్యాన వనమున కరుదెంచెడి సావిత్రి కెదురు వోయినది రాజపుత్రిక లిరువు రొకరి నొకరుఁ జూచుకొని యాలింగనముఁ జేసికొని యన్యోన్యము కుశల ప్రశ్నలు చేసికొనిరి.
సావిత్రి స్వయంప్రభా సౌందర్యాతిశయములుజూచి విస్మయము జెందగా యిట్లనియె. సఖీ ! నీ చార్మిత మంతకుముందే యద్భుతముగా వినుచుంటిమి. ప్రేమించుంటిను. దానినన్నపున జారుకుంది. నీ సునందులను పచ్చికొనియే మాతండ్రి నీపు కోగలప గుడువని గురక లూసు కన్నా తం న సంశమెల్ల నికరంబున విఖ్యాతి నౌందగలదని. తముల ఆయుచున్న సిబ్బటి సభినయించుచు స్వయం సమ రామయు సౌవి తికలిములియై దేవి: నీపనట్లు మా రాజపుతు సుగుణమణుల పేటికయ కేమియు సండియములేదు. ఆమెకు వైరాగ్య ప్రవృత్తి వెన్నతోఁ బెట్టంబడినది. ఈమె పుట్టినదిగోలె తండ్రి పెండ్లి చేయవలయునని ప్రయత్నము సేయుచుండెను. ఈమెకు సంసారమునం దిష్టము లేక పెండ్లి యాడనని పల్కుచుండునది. నీయన్న గారి చిత్రఫలక మొకప్పుడుచూచి యతఁడే యీమెకుం దగినవాఁడని మాఱేనితోఁ జెప్పితిని. దాననే యాయన మీకు శుభలేఖ వ్రాసెను. అది యట్లుండఁ గన్నెరికము వదలుటకై తలిదండ్రు లెరుంగకుండ రాజపుత్రిక యొక మునికుమారుం బెండ్లియాడినది. ఇప్పుడా మాటవిని వారు మీకేమి వ్రాయుటకు తోచక సిగ్గుపడుచున్నారు. ఇదియే యిక్కడి వృత్తాంతము. తల్లీ ! ఈమె మహర్షి పత్ని కావున మీకు వంద్యురాలని యప్పటికిఁ దగినట్లామెతో మాట్లాడినది.
ఆ మాటలలో గొన్ని వినిపించుకొనిన యట్లభినయించుచు సావిత్రి హేమా ! నా సహోదరుఁడు రూపమున మన్మధుండైనను విద్యల బృహస్పతియైనను శ్రీశుకుండువోలె పిన్ననాటంగోలె వేదాంత వార్తాశ్రవణాసక్తిఁగలిగి తండ్రి పెండ్లి యాడమనిన వినుపించుకొనక మే మెరుంగకుండ సన్యాసులలోఁ గలసి హిమవత్పర్వత ప్రాంతములకరిగి తిరిగి తిరిగి జడలు పెంచుకొని నారబట్టలు ధరించి మొన్ననే యింటికి వచ్చెను. మా తండ్రి మిగుల సంతసించుచు నిఁక బెండ్లి చేసి విడిచినం గాని వీని వైరాగ్య ప్రవృత్తి మానదని నిశ్చయించుచుండ నింతలో మీ తండ్రిగారు వ్రాసిన శుభలేఖ వచ్చినది. అందులకు సంతోషింపుచు పెండ్లియాడెదవాయని వానినడిగిరి. నా సోదరుండు నవ్వుంచు నాకు మునుపే పెండ్లి యైనదనియు నా భార్య యెక్కడనో యున్నదనియు నిఁక నాకుఁ బెండ్లి యక్కరలేదనియుఁ జెప్పినంత నది వేదాంత ప్రవృత్తియని నిశ్చయించి మా తండ్రిగారు వానికి బలవంతముగా బెండ్లిజేయఁ దలచికొని యున్నారు.
నీ గుణంబులు వాని గుణంబులతోఁ బెనివడఁగలవని యింతగాఁజెప్పు చున్నాను. మీ తండ్రితోఁజెప్పి శుభముహూర్తము వేగముగాఁ బెట్టింపుమని పలుకుటయు హేమయు స్వయంప్రభయు నొండొరుల మొగములు చూచుకొనుచున్నారు. అప్పుడు సావిత్రి హేమతో జనాంతికముగా బోటీ ! నా మాటలకు మీరేమియో యనుకొను చున్నారు. సందియమేదేని గలిగిన నడుగవచ్చుననుటయు హేమ కామినీ! మరేమియును లేదు మా రాజపుత్రిక వరించిన యోగి మీయన్నగారేమోయని సందియపడుచున్నాము. తెలియఁ జెప్పఁగలవాయని యడిగిన సావిత్రి యిట్లనియె.
హేమా ! మీ సందియములు తీర్చినట్లేయున్నవి. భగవంతుడు విచిత్ర సంఘటనను గావించుచుండును. అద్వైత శివానందయోగి యనిపేరు బెట్టుకొనియే మాయన్న దేశాటనముఁ జేసెను. తెలిసినది. తెలిసినది. మీరు స్వయం ప్రభయను రాజపుత్రికను బెండ్లి చేయుటకు నిశ్చయించితిమని చెప్పగా మాయన్న నవ్వుచు నేనిదివరకే పెండ్లియాడి యుంటినని యుత్తరముసెప్పెను. ఆ మాట మాకేమియు నర్ధమైనదిగాదు. ఇదియా. యని పలుకుటయుఁ బరమానందముఁ జెందుచు హేమ యిట్లనియె.
దేవీ ! నీ మాట సత్యమగుగాక స్వయంప్రభ నోచిన నోములు ఫలించుగాక. దాని తలిదండ్రులు కృతార్దులగుదురుగాక ఇప్పుడు వారు చింతాసాగరములో మునిఁగి యున్నారు. అని పలుకుచు క్రొత్తయోగి వృత్తాంతమంతయుఁ జెప్పి మీయన్నగారి నిచ్చటికి రప్పింపుమని కోరినది.
అప్పుడు సావిత్రి హేమచేయిఁ బట్టుకొని యుద్యానవన దర్శన లాలసత్వంబునంబోలె దూరముగాఁ దీసికొనిపోయి హేమతోఁ దమ వృత్తాంతమంతయు గొంతమరుఁగు వెట్టియుఁ గొంతవెల్లడించియుఁ దెలియఁజేయుటయు హేమ గ్రహించి మించిన సంతసముతో నిట్లనియె సఖీ ! నాకంతయుం దెలిసినది. ఔరా నీసోదరుండెంత వ్యూహముఁబన్నెను. అట్లుకానిచో నావయస్య పరమేశ్వరుడు చెప్పినను పెండ్లి యాడునదియా ? ఆహా ! ఆ యోగిని యెంత యభినయించినది. కానిమ్ము ఈ రహస్యము వెల్ల డి చేయకుమని బోధించినది. ఇరువురు మరల స్వయంప్రభ యొద్దకరిగిరి. హేమ స్వయంప్రభతో యుక్తియుక్తముగాఁజెప్పి సహదేవుఁడే నీవు వరించిన భర్తయని తెలియఁ చేసినది.
ఆవార్త రాజపత్నికిఁ తెలియఁజేయుటకై హేమ తచ్చుద్దాంతమున కరిగినది. ఇంద్రమిత్రుఁ డప్పుడు భార్యతో నిట్లు సంభాషించుచున్నాడు. దేవీ ! మనము కులమునకుఁ దగని నిందపాలు పడుచున్నారము. లోకులెల్ల మనస్వయంప్రభ చరిత్రము పరిహాసముగా జెప్పుకొనుచున్నారు. కవీశ్వరులు పద్యములుగా రచించుచున్నారట వినుము.
గీ. పెండ్లి యాడననుచు భీష్మించుకొనియున్న
ముగుద గోరికొనియె ముగురమగల
నెలతుకల వ్రతంబు నీటిపై చేవ్రాలు
గాలి వెలుగుదీప కళికసూవె.
అను పద్యము నేను నిన్న వీధిలోఁ బోవుచుండ నొకపిల్లవాఁడు నేను వినునట్లు చదివెను. అప్పటినుండియు నా హృదయమున నవమానకృత పరితాపము బాధింపుచున్నది. రాజులందరు నన్ను జూచి సభలో నవ్వుచుందురు. సహదేవుడు మిక్కిలి చక్కనివాడట. వాని నల్లునిగాఁబడయు భాగ్యము లేకపోయినది. మొదటి యోగియెవ్వఁడో తెలియదయ్యె మొన్నటియోగి శంకర మఠంబున నాపఁజేయబడి యున్నవాఁడు. వాఁడెవ్వండో తెలిసికొనుటకు గూఢచారుల నియమించితిని. ఆ మాయావి స్వయంప్రభను లేనిపోని మాటలాడి నిందింపుచున్నాఁడు. చింతా పరంపర లిట్లు బాధింపుచుండ నేమిచేయవలసినది. స్వయంప్రభాదేవి యస్ముగ్రహ మిట్లు దుఃఖములకుఁ గారణమైనదేమి? నన్నీ యాపదనుండి తొలగించిన నద్దేవి కెన్నియేని యుత్సవములు సేయించెద. లేనిచో వట్టి పాషాణముగా దలంచెదనని పలుకుచున్న సమయంబున హేమ యెదురుకువచ్చి మహారాజా ! ఆ దేవి నేమియు నిందింపవలదు మీ చింతలన్నియు దొలగిపోయినవి. వెదకఁబోయినరత్నము చేతికే దొరికినది. దైవసంకల్పములు కడుచిత్రములుగదా యని పలుకుచు సహదేవుఁడు చేసిన కృత్యములును సావిత్రి చెప్పినమాటలు నామూల చూడముగాఁ జెప్పినది. ఆ వృత్తాంతము విని రాజును, భార్యయు పరమానందసాగరమున మునిఁగి దేలుచుండిరి.
అని యెరింగించువరకు వేళ యతిక్రమించుటయు నవ్వలి మజలీ యందు మణిమసిద్ధుండు తదనంతరొదంతం బిట్లని చెప్పందొడెంగెను.
అరువది యారవ మజిలీ
పుత్రీ ! మీనాక్షీ ! యిటురా ? యేమిపనిచేసితివి? తరతరంబులనుండి దివాణము నాశ్రయించుకొని యుంటిమిగదా? అంతిపురిలోని రహస్యములు వెల్లడి చేయవచ్చునా? ఇప్పుడు మనజీవికకే హానిఁదెచ్చితివి. గొప్పయపరాధమే నీపైఁ బడినది. మాధవస్వామి యర్చకుఁడు శ్రీనివాసాచార్యుని యల్లుడట, వాఁడెవ్వఁడు? వానితో నీకుఁ బరిచయ మెప్పుడు గలిగినది? అందలి నిజమేదియో చెప్పుము. ఇప్పుడు ముప్పువచ్చినదని యడిగిన తల్లి మాటలు విని యించుక వెరచుచు మీనాక్షియను దాసీపుత్రిక యిట్లనియె.
అమ్మా ! నామీదఁబడిన నేర మెట్టివి? యర్చకుని యల్లునిమాట యేమిటికి వచ్చినది ఏమేమివింటివో యంతయుం జెప్పుమని యడిగిన నా దాది అయ్యో ! నీవేమియు నెరుఁకవు కాఁబోలు ! వినుము, మొన్న నేనుఁగనెక్కి యూరేగివచ్చినయోగి మొదట రాజపుత్రిక వరించిన యోగికాడఁట. సహదేవుండను రాజపుత్రుఁడు వైరాగ్యము జనింప యోగియై యందుఁ దపము జేసికొనుచుండ నాతని మన రాజపుత్రిక వరించి పెండ్లియాడినదఁట. ఆతం డిప్పుడువచ్చి తానే భర్తనని చెప్పెను. అప్పు డిరువురు యోగులకుఁదగవు గలిగినది. స్వయంప్రభ గురుతులన్నియుం దెలిసికొని సహదేవునే వరించితినని చెప్పినది.
అప్పుడా కపటయోగిని రాజభటులు నిజము సెప్పుమని తర్జన భర్జనఁ గావించిరి. దెబ్బలకుఁ దాళక యతండు తాను మాధవస్వామి యర్చకుని యల్లుండనియుఁ దనకాపురము కంచియనియు మీనాక్షియను దాసీపుత్రిక ప్రేరణంబున నట్టి కపట వేషము వైచితిననియు నందలి నిక్కువమంతయుం జెప్పివేసెను.
అప్పుడు నిన్నుఁగూడఁ బట్టి దీసికొని రమ్మని రాజు కింకరుల నియోగించెను. ఆ వార్తవిని ముందుగ నేను బరుగిడి వచ్చితిని. నిజముచెప్పుము. కొంపముంచి వేసితినని యడలుచు నడిగిన గడగడ వడకుచు నది యిట్లనియె.