కాశీమజిలీకథలు/అయిదవ భాగము/56వ మజిలీ
శ్రీరస్తు
కాశీమజిలీ కథలు
56 వ మజిలీ
నవమోల్లాసము
సత్యలోకములో సరస్వతీమహాదేవి వీణాగానవినోదమునఁ గాలక్షేపము చేయుచున్న సమయంబున సఖురాలు సాధ్వసవిస్మయరసావేశ హృదయయై యరుదెంచి, అమ్మా ! అమ్మా ! అయ్యగారు నేడేమియా పడుకొనియున్నారు. కారణ మేమియో తెలియదు. మాదేవర సృష్టిక్రియావిముఖుండయి నచో లోకమునకుఁ గీడు సంభవించుం గావున నీవు వేగవచ్చి తద్విర క్తికిఁ గారణమేదియో తెలిసికొనవలయునని పలికినవిని పలుకులవెలంది తలచుచు నిట్లనియె.
ఏమీ పరమేష్టి సృష్టి వ్యాపారముమాని పడుకొనియెనా! పగటివేళ విధాత యెప్పుడు నట్టిపనిచేయఁడే! మేరు శిఖరాగ్రమున జరిగిన సభకుఁబోయిన యలసటచే విశ్రమించిరని తలంచెదను. అయ్యో! అచ్చట నేమేమి విశేషములు జరిగినవియో తెలిసికొన మరచితినే ! వచ్చినవెంటనే యడుగవలయునని తలంచితినికాని యప్పుడు కోపముఖముతో నుండుటచేఁ బల్క రించితినికాను ? ఆ సభలో నీయన కేమయిన యవమానము రాలేదుగదాయని యాలోచించుచు విపంచి పాడుట చాలించి యప్పుడు ప్రాణేశ్వరునొద్ద కరిగి మంచముపయిఁ గూర్చుండి ముసుంగించుకయెత్తి, ప్రాణేశ్వరా ! నిమిషమునకనేక జీవరాసుల సృష్టించెడు మీరిటుల పడుకొనిన లోకములకుఁ బ్రళయముకాదా లోకేశా ! మీరెవ్వరిపై గోపింతురు ! కోపకారణం బేమి వక్కాణింపుడని యెంతయో నైపుణ్యముగా నడిగినది.
విధాతయేమియ మాటాడక యర కనుమోడ్పుతో నుస్సురని నిట్టూర్పు నిగుడింపుచు నవ్వలకు దిరిగి మరల ముసుఁగు లాగికొని పడుకొనియెను. సరస్వతి యెన్నిగతులఁ బ్రతిమాలినను మాటాడక లేవక పల్కరించక యట్టె పడియుండెను. అప్పుడప్పల్లవపాణి తల్లడిల్లుచు అయ్యో! ఆ యోలగములోఁ గమలోదరునకేదియో యవమానము గలిగినది. కాకున్న జతుర్ముఖుండిట్లుత్సాహ విముఖుండుకాడు. అత్తెరం గేదియో వైకుంఠమునకుం బోయి లక్ష్మీమహాదేవి వలనం దెలిసికొనియెదను. అక్కాంతకుఁ గాంతుండంతయు వక్కాణింపక మానడు. అని తలంచి సఖులంగూడికొని మయూరవాహనారూఢయై యప్పుడు వాణీదేవి వైకుంఠమునకుం బోయినది. అందు గోవిందుని గురించి భక్తులెద్దియో గుజగుజ లాడుచుండ వెరగుపడుచు నత్తరుణీ లలామ మెల్లన కమలానిలయంబునకుఁ జని యంతఃపురచారిణుల లక్ష్మీ మహాదేవి యెందున్నదని యడిగినది. శుద్ధాంతకాంతలు సరస్వతీ మహాదేవిం గురుతుపట్టి యుచిత సత్కారంబులం గావించిఁ బసిండిగద్దెపయిం గూర్చుండబెట్టి గమనశ్రమ వాయఁ జామరముల వీచుచు, దేవీ ! యిందిరా మహాదేవి యింతకుముందే దామోదరుని సౌధంబున కరిగినది.
అమ్మహాత్ముండేమియో లోకరక్షాణభిముఖుండై కోపగృహంబునఁ బడుకొని యున్నవాఁడనువార్త విని యార్తిజెందుచు నందు వోయినది. మీరాకవినిన నిప్పుడే రాగలదని చెప్పిరి. భాషావధూటి యా మాటలు విని తనసఖుల మొగముచూచుచు మేలుమేలు మంచి చోద్యములే వినంబడుచున్నవి. అని యాశ్చర్య మందుచు సుందరులారా ! గోవిందునకు గోపించుటకుఁ గారణమేమి వచ్చినదని యడిగినది అయ్యంగన లత్తెరంగేమియు మేమెఱుంగము మేరుగిరినుండి వచ్చినదిమొద లొరులతో మాటాడుట లేదట దేవీ ! నీవిందు గూర్చుండుము సత్వరమునఁ గమలాదేవి నిచ్చటికిఁ దీసికొని వత్తుము నీ రాకవినిన నద్దేవి యనుమోదించునుగదా యని పలికి కొంద రిందు ముఖులువోయి భార్గవి కత్తెరం గెరింగించిరి లక్ష్మీయు మురియుచు నరగ నత్తెరవ యొద్దకు వచ్చినది. ఒండొరులు గౌఁగలించు కొనిరి.
అప్పుడు సరస్వతి లక్ష్మితో అత్తా! మచ్చిత్త వైకల్యంబు నీకెరింగించుట కై వచ్చితిని నీకును మనస్వాస్థ్యము లేనట్లు తోచుచున్నది. మామగారు కోపించి పడుకొని యుండిరఁట నిజమేనాయని యడిగిన లక్ష్మి, సాధ్వీ ! నారాయణుండిట్లు దీనవదనుండై పడుకొనియుండుట నేనెన్నడును జూచి యెఱుంగను. కల్పాంత సమయంబున మహాసముద్ర మధ్యంబున జీవజాలంబులనెల్ల నుదరంబున నిడికొని వటపత్రంబున శయనించునని చెప్పుదురు. ఈ యకాండ ప్రళయంబునకుఁ గారణమేదియో తెలియదు. ఎంత పిలిచినను బలుకరు. లోకరక్ష యెట్లగునో తెలియదనిచెప్పి నీచిత్త వైకల్యంబునకు హేతువేమని యడిగినది వాగ్దేవియుఁ జతుర్ముఖుని విరక్తి ప్రకార మంతయుం జెప్పి యప్పడఁతిని వెరగుపడ జేసినది.
అప్పుడిరువురు విచారించి యత్తెరగు మహేశ్వరివలనఁ తెలియగోరి పరివారములతోఁ బార్వతీ మహాదేవి యొద్దకుంబోయిరి అప్పుడు పార్వతియుఁ బరమేశ్వరుండు విలయక్రియా విముఖుండై మౌనముద్ర వహించి తనతో మాటాడుట మానివేసెనని సఖులతోఁ జెప్పుచు విచారించుచున్నది. పిమ్మట లక్ష్మి సరస్వతుల రాక విని యా యిందిర యానందించుచు నెదురువోయి వారిందోడ్కొనివచ్చి సత్కార పూర్వకముగా గనకాసనములపైఁ గూర్చుండబెట్టి యాగమన కారణం బడిగిన వారు దమతమ వృత్తాంతంబులం నెఱింగించిరి. అప్పుడు పార్వతి విస్మయంబభినయించుచు సతీమణులారా ! ఇది కడు చోద్యముగా నున్నయది మేరుకూటమునుండి వచ్చినది మొదలు మదనవైరియు నెవ్వరితో మాటాడక కైలాసగుహాంతరాళంబున బడుకొని యున్న వాఁడు ఆ సభలోఁ ద్రిమూర్తులకు నేమి ప్రసంగము జరిగినదో తెలియదు. నారదమహర్షియే యీ సభకుఁ బ్రోత్సాహకుఁడు. ప్రాణముల వలె వర్తించెడు హరిహర బ్రహ్మలకు వైరములు గల్పించి కడుపు నిండించుకొనియెను.
ఆ యోగములో జరిగిన విశేషములు దెలిసికొనినంగాని వీరి కోపములకుఁ కారణములు దెలియవు. అవ్వార్తలు తెలిసికొన నందీశ్వరునికి వార్తనంపితి, నింతలో మీరు వచ్చితిరి కూర్చుండుఁడు అతండు వచ్చి సభావిశేషముల వక్కాణింపఁ గలఁడని పలుకుచుండఁగనే నందీశ్వరుఁడిచ్చోటికి వచ్చి పార్వతీ మహాదేవికి నమస్కరించెను. కాత్యాయని నందీశ్వరుని గారవింపుచు, వత్సా! మహేశ్వరులు దేవసభనుండి వచ్చినది మొదలు మౌనము వహించియు దీక్షాభావముతో నున్నవారు భక్తుల మొరలాలింపరు. ఇందులకు గారణమేమియో తెలియదు. ఈయనయేగాక బ్రహ్మాచ్యుతులుగూడ నిట్లె పడుకొని యున్నవారట. లక్ష్మీ సరస్వతులు పరితపించుచు నవ్విధం బెరింగి నా యొద్దకు వచ్చిరి. ఆ సభలో వీరి మువ్వురు కలుషించిరా యేమి ? అచ్చట జరిగిన వృత్తాంత మంతయు వక్కాణింపుమని యడిగిన నందీశ్వరుఁడు ముకుళిత కరకమలుండై, తల్లీ ! ఈ యుపద్రవమునకంతకు నారదుడే కారణుఁడు వినుమని యిట్లని చెప్పదొడంగెను. సభాదివస నిరూపణంబు గావించి నారదుఁడఱిగిన యనంతరము.
సీ. భలితాంగరాగలిప్త సమస్తగాత్రుఁడై
పులితోలు గంకటంబుగబిగించి
ఘనజటావితతిఁ జక్కగఁ దీర్చిము డివైచి
కదలకుండఁ గజంద్రకళ నమర్చి
గరళవహ్నిస్ఫులింగములఁగ్రక్కెడుమహో
రగభూషణముల గాత్రములఁదాల్చి
కరముల ఘనపినాక త్రిశూలప్రముఖ సా
ధనముల ధరియించి తతపిశాచ.
గీ భూతభేతాళ సేనా సమూహములును
ప్రమధగణములు వీరవేషములఁదాల్చి
యనుసరింపఁగ వృషభవాహనమునెక్కి
తరలెఁ బురవైరిమేరు భూధరముకడకు.
మరియుఁ దైత్యారితోఁ గలహింపఁ బురాంతకుండరుగుచున్న వాఁడని విని నముచి, శంబర, పులోమాది దానవులు చతురంగఁబల పరివృతులై మార్గమధ్యంబున హరునిం గలసికొనిరి. అంతకుబూర్వమే చతుర్భుజుండును జతుర్ముఖుండును తమ తమ పరివారములతో వచ్చి మేరుశిఖరాగ్రమలంకరించిరి. వారెల్ల నారదనిర్దిష్టప్రకారంబున నింద్రాదులచే నలంకరింపఁబడిన మేరుశిఖర విశాలశాలాంతరాళంబున నమరింపబడియున్న పీఠంబులం గూర్చుండిరి. ఆ సభాభవనంబున నగ్రస్థానంబున రత్నపీఠం బొండు వేయబడియున్నది దానికి దిగువగా మూడుపీఠము లమరింపఁబడియున్నవి. వాటిమీదనే మొదటఁ త్రిమూర్తులు గూర్చుండిరి. వారినంటియే దిక్పాలురు, దేవతలు, మునులు దమతమకుఁ దగిననెలవులం గూర్చుండిరి.
అప్పుడు నారదుండా సభాంతరాళమున నిలువంబడి చేయెత్తి ఓహో ! మునులార ! దేవతలార ! దిక్పాలులార ? యిప్పుడు లోకాధిపతులు మువ్వురు నిందున్న వారు. త్రిమూర్తులలో నెవ్వడధికుండని మీకు సందియము గలుగవచ్చును, అది మీ కిప్పుడు తీరఁగలదు. అని పలికి త్రిమూర్తులనుద్దేశించి మహాత్ములారా ? మీలో నెవ్వడధికుండో యని తెలియ లోకులు పెద్దకాలమునుండి సందియమందు చున్నారు. ఇప్పుడా భ్రాంతి వదలింప వలయును. అదిగో యగ్రసింహాసనము. మీలోఁ ప్రధానుఁడెవ్వడో లేచి దానిపయిం గూర్చుండవలయునని పలికి యమ్మునిపతి కూర్చుండెను. అప్పుడు రాక్షసులు భూతభేతాళములు ప్రమధులు మహేశ్వరా! మహేశ్వర శబ్దము నీకుఁగాక యెవ్వనికున్నది. నీవే సర్వాధీశుండవు కావున, నీవాపీఠ మలంకరింపుమని శివునిం బురికొల్పిరి.
విష్ణుపక్షపాతులు మరికొందరు దేవా ! విష్ణుండు సర్వోత్తముండని శ్రుతులు ఘోషింపుచున్నవి. ఈ పీఠము నెక్కుటకు దేవరగాక భూతపతి యెట్లర్హుండు ఉపేక్షించుచుంటివేల లేచి యాసింహాసనముపై గూర్చుండుడు ఎవ్వఁడడ్డము వచ్చునో చూతము గాదాయని ప్రేరేపించిరి. బ్రహ్మపక్షపాతులైన రక్కసులు కొందరు ఆహా ! విష్ణుకింకరు లింతపొగరుపట్టి యున్నా రేమి ఆ సింహాసనం బెక్కిన శివుం డెక్కవలయును లేకున్న బ్రహ్మ యెక్కవలయును. ఈ కపటాత్ము నెక్కనిత్తుమా యని బీరములు పలుకుచు లెమ్ము లెమ్మని పీఠమెక్క వాణిదవుని ప్రోత్సాహపరచిరి.
అప్పుడు త్రిమూర్తులకు నిట్టిసంవాదము జరిగినది.
శివుడు — ఇదిగో ! నేను బీఠమెక్కఁబోవుచున్నాను. వలదను వాఁడెవ్వఁడో చూతునుగా ! [అని లేచుచున్నాడు ]
నారదుఁడు - విష్ణుమొగము జూచి కనుసన్నఁ జేయుచున్నాడు.
విష్ణుండు - ఆ ఆ. నిలు నిలు పశుపతీ. నాయనతిలేక పీఠ మెక్కఁ గలవా !
శివుఁడు — గోపాలా నీ యానతి నాకేల ! వలదనుటకు నీవెవ్వడవు.
విష్ణుండు - నాకంటె నీవేమిట నధికుండవని పీఠమెక్కె.దవు ? నీకు నేను జేసిన యుపచారములన్నియు మరచి నన్నే వెక్కిరించుచున్నావుగా వినుము. సీ॥ భస్మాసురునిచేతఁ బడినీల్గకుందువా?
శాంబరి వానినే జంపకున్న
శివుఁడు — బృందకైయున్మాద వృత్తిగైకొనినాఁడె
మడియవే! నేభూతి నిడకయున్న
విష్ణు - బాణునేమిటికిఁ గాపాడలేవైతివి
వానివాకిలి గాపువాఁడ వగుచు
శివు - బలిచక్రవర్తి వాకిలిగాచుచలనాఁడు
పారితివేల రావణునిఁ గాంచి.
విష్ణు — గీ॥ వార్ధిమునుగుచునుండఁగ వ్వంపుగొండ
నిలుపలేవైతివేమి వేల్పులునుతింప
శివుఁడు - గరళముదయించి యందు లోకములఁజెరుప
దాల్పలేకను గిరిక్రింద దాగితేమి.
విష్ణుడు - ఆహా ? అవసరము మీరిన పిమ్మట నేమియనిన ననవచ్చును.
ఉ. నీవును బ్రహ్మయుం దెలియ నేరక సంస్తుతి జేసినంత దై
త్యావళికిన్వరంబుల ననర్థముగాఁగ నొసంగివాండ్రు దు
ర్భావముతోడ లోకముల బాధలొనర్చుతరిన్ జగంబులం
బ్రోవఁగలేక మచ్చరణముల్ శరణంబులు గోరుకోరొకో.
అదియంతయును మరచి యిప్పుడేమో సర్వాధికుండవని పీఠాదిరోహణంబున కుద్యుక్తుండవగుచున్నావే? చాలు చాలు.
మ. అవతారంబుల నెత్తివేమరు సముద్యద్దర్పమేపార దా
నవులంద్రుళ్ళడగించి వెండియుమహిమన్ ధర్మంబునేనిల్ప కు
న్న విధిప్రజ్ఞయు నీమహత్యమది యెన్న దెల్ల మౌనేటికౌ
నవు ? రక్షించిన దానికిన్పలమిదేనా ? చండికావల్ల భా.
శివుఁడు - ఓహో ? నీవేవియో యవతారములనెత్తి నన్ను రక్షించినట్లుగాఁ జెప్పుచుంటివి. అది ప్రమాదము వినుము. వీరభటుల విజయంబులు ప్రభువులకే చేర గలవు. ప్రేష్యులకు మీరినకార్యములు మాత్రమే ప్రభువులు చేయుచుందురు. అందు వలననే నీవు నాకు బ్రేష్యుండవని చెప్పుచుంటిని
విష్ణు - ఔరా ! పశుపతీ ? మదీయావతార చరిత్రమంతయు నీదాసత్వమునకే హేతువైనదా ? బాపురే యెంతమాట వింటిని.
శివుఁడు - కాకమరేమి ? మ. పురదైత్యుల్వరశ క్తిలోకముల నున్మూలింపగాదేవత
ల్మొర పెట్టన్వినినావొలేదొ మరి తత్పూర్వామరశ్రేణి
సంగరమందేమిటికి న్వధింపవది శక్యంబైనచోనాఁడు
చ్చరణంబుల్ శరణంబువేడినది కృష్ణా ! జ్ఞాపకంబుండెనే.
విష్ణు - గీ. సఖుడవని యెంచిప్రీతితో సంతతంబు
నీపనుల నెల్ల బూనియె నేయొనర్ప
భటుఁడవనిపల్కితౌ భళి బాగు బాగు
కన్ను మీదికివచ్చెనే గరళకంఠ !
శివు - గీ. తుల్యగౌరవసంపత్తితో సుమిత్ర
బుద్ధిమన్నించుచుండుటఁబో ముకుంద
పీఠమెక్కంగవలదని ప్రేలినావు
నడుమసిరినీకు రాబట్టి చెడితివిట్లు.
నారదుండు — [బ్రహ్మతో] తండ్రీ? నీహరిహరులు సమముగా బోట్లాడుచుండ నీవేమియు మాటాడవేమి నీ యాధిక్యతగూడ వెల్లగపరుపుము.
బ్రహ్మ — నారదా ! తొందర యేమివచ్చినది. వారిలో నొకడు పీఠమెక్కినపుడుగదా తగవు పెట్టఁదగినది.
నారదు — పీఠ మెక్కు మాటయటుండనిమ్ము. లోకాధిపతులము మేము మేమని వారిలోవారే తగవుపడుచున్నారు. నీమాట యెక్కడను ప్రశంసించుటలేదు. నీ యభిప్రాయము వేరుగానున్నది పోయి కలియఁబడి వాదింపుము.
బ్రహ్మ — వారు ప్రశంసింపకపోయినచో నాయాధిక్యత తగ్గునాయేమి ?
నారదు — [హరిహరులతో] ఈ చతుర్ముఖండేదియో చెప్పుచున్నాడు వింటిరా!
హరిహరులు — ఏమనుచున్నాఁడు.
నార - మీ యిరువురకున్నఁ దానే యధికుండట. పీఠము దానే యెక్క నర్హుడఁట.
విష్ణు — ఈ భూతపతికన్న వాని తక్కువయేమి. ఎక్కవలసినదే ?
శివుఁడు — ఈ వాసవావరజునికన్న బ్రహ్మయే యధికుఁడని నా యభిప్రాయము
నారదుఁడు — అయ్యా శివునికన్న బ్రహ్మకొక్క మొగమేగాదా తక్కువ విష్ణువుకన్న నాలుగుజేతులెక్కువ గలిగియున్నవి. మీ యిరువురకు నతండు తీసి పోవఁడు. బ్రహ్మ — మొగములతోఁ జేతులతోఁ బనియేమి. నేను సృష్టి చేయనిచో వీరేమి చేయుదురో చూతునుగాక!
నారదుఁడు - చూడవలసినదే.
విష్ణు — పరమేష్టీ ! సర్వజ్ఞానభిజ్ఞుండవై నీవును శివుండువోలె సంభాషింపు చున్నావేమి ?
బ్రహ్మ - ఆత్మభావంబునఁ బలుమారు నీ యొద్దకు వచ్చుచుండుటంబట్టి కదా నన్నిట్లు చులకనగాఁ బలుకుచుంటిరి ? కానిండు ఇప్పుడు నాబ్రభావమంతయుం బ్రకటించెద వీక్షింతురుగాక ?
శివుఁడు — [నవ్వుచు] మదీయ సఖరాగ్రంబు నీశిరచ్ఛేదంబున గావించినప్పుడే నీ ప్రభావము తెల్లమైనదిగదా ?
బ్రహ్మ — ఆహా ? ఆ కపాలమేగదా! నీకింత యన్న మిడుచున్నది.
విష్ణు — బిచ్చమెత్తి తినుటకు నీకపాలములేకున్న మరియొక చిప్పయేదియు దొరకదాయేమి?
శివుడు — బిచ్చమిడిన వానినే యణిఁగద్రొక్కిన కృతఘ్నులే యాక్షేపించు చుండ నేమని యుత్తర మీయఁదగినది.
నారదుడు —- మీరనినమాట సత్యమే.
బ్రహ్మ - యిరువురకు నేనధముడననియున్నది నేను సృష్టించనిచో చూతురుగా. [అని కోపముతో లేచిపోవుచున్నాడు.]
విష్ణు — మదీయరక్ష క్రియలేనిచో నీ సృష్టితోబనియేమి నీవిక సృష్టించినను నేను రక్షించనని పలుకుచు విష్ణుండు లేచిపోయెను.
శివుడు - నేను లయము జేయుచుండుటకదా సృష్టిస్తితుల కవకాశము గలుగుచున్నది. నా పని నేను జేయనిచో వీరేమి చేయుదురో చూచెదంగాకయని శివుండు కోపించి యరిగెను.
అమ్మా ! యిట్లు త్రిమూర్తులు మువ్వురు రివ్వునలేచి కోపముతో నరిగిన వెనుక దేవతులు, మునులు, దిక్పాలురు భయభ్రాంతిస్వాంతులై కిక్కురమనక గ్రక్కున వచ్చిన చక్కి నెక్కడి వారక్కడనేపోయిరి.
వారికిట్టి పొట్లాట పెట్టి నారదుఁ డేదారిపోయెనో యెవ్వరికిం దెలియదు.
తల్లీ ! తత్కారణంబునంజేసి త్రిమూర్తులును సృష్టిస్తితిలయ వ్యాపారముల మానుకొని పడుకొనియున్నారని చెప్పుచుండగనే ముప్పదికోట్ల వేల్పులయిల్లాండ్రు దిక్పాలురు ప్రోయాండ్రు పరివేష్టింప నింద్రాణి యచ్చటకువచ్చి లక్ష్మీసరస్వతు లిరు వంకలం గూరుచుండి సంభాషింపుచుండ నెద్దియో ధ్యానింపుచున్న కాత్యాయనీ మహాదేవింగాంచి నమస్కరించినది. అప్పుడు వారినెల్ల నాదరించి పార్వతీమహాదేవి స్వాగతపూర్వకముగా నాగమన కారణమడిగిన శచీదేవి యిట్లనియె.
దేవీ ! యిప్పుడు లోకమునకు సంభవించినయుపద్రవ మేమని మనవి చేయుదును !మేరుగిరికూటంబున జగదీశ్వరులు మువ్వురును స్వాధిక్యతగురించి కలహించి విధికృతంబుల మానివేసి విరక్తిజెంది యున్నవారట దానంజేసి.
చ. పొంమదు జంతువేదియును బుట్టిన పన్నియు సాధురక్ష జొ
ప్పడమిసమగ్రతేజమున భాసిలరెప్పటికిన్నశింప వ
క్కడపటికాలమంద యినఁ గాని జగంబులకిట్టియార్తి గ
ల్లెడినెకటా ! జగత్ప్రభువులే యిటులల్గిన నేమిదక్కికన్.
సీ. ఇంద్రాదిదిక్పాలు రెల్ల వేల్పులుమునుల్
బలహీనులై కూలఁబడిరియిండ్ల
వర్షముల్గురియవు వారివాహంబులు
మహియెల్ల భగ్గున మండుచుండె
చాలినగతిమంచి గాలివీఁవదొకింత
ప్రజ్వరిల్లదుగదా పావకంబు
క్షుత్పిపాసలురు సంక్షోభంబుగావింప
తెకతెకచావు పుట్టుకలులేక.
గీ. స్రుక్కుచున్నారు భూప్రజల్ జూడవమ్మ
కలుగదిటువంటియార్తి లోకములకెపుడు
బ్రోవఁగదమ్మ! యోయమ్మ! భువనకోటి
పెంపుమీరఁగఁబతికి బోధింపవమ్మ.
దేవీ ! యిదియేమి మాయయోకాని పదునాలుగు జగంబులలోఁ నిపీలికాది బ్రహ్మపర్యంతము పురుషజాతియంతయు వృద్ధిక్షయములు లేక బలహీనమై కదలక మెదలక యట్టెపడియుండెను. స్త్రీజాతి మాత్రము తేజోవిలాసముగాక యధాపూర్వకముగా నొప్పుచున్నదిందులకుఁ గారణంబరసి యీ యకాండ ప్రళయము వారింపుమని యింద్రాణి శర్వాణిం బార్ధింపుచున్న సమయంబున నంతరిక్షమునుండివచ్చి యనంతదివ్యరత్న ప్రభాధగద్ధగితమై కన్నులకు మిరుమిట్లు గొలుపుచు విమానలభామం బొండయ్యండ జయానలదండ నిలువంబడినది. అవ్విమానరత్నమున మువ్వురు పువ్వుబోణులు నిలువంబడి యున్నవారు. వారింజూచి పార్వతీ ప్రముఖపద్మముఖులు వెరగుపడుచుండ నందుండియయ్యిందు వదనలు గ్రిందికిందిగి వారికి నమస్కరింపుచు నిట్లనిరి. సాధ్వులారా! మేము త్రిమూర్తులకు జననియైన యాదిశక్తికి బరిచారికలము ఇప్పుడు త్రిమూర్తులు ప్రధానత్వమునుగురించి కలహించి నియతవ్యాపారముల మానివేసి పడుకొని లోకములకు బీడ గలుగఁజేయుచున్నారని విని యాయాదిశక్తి వారిం దమ యొద్దకు దీసికొనిరమ్మని యీ విమానమిచ్చి మమ్మంపినది. ఆ శక్తి యనేకకోటి బ్రహ్మాండముల కధినాయకురాలు. వీరు కడపడి బ్రహ్మాండాధిపతులు. ఈవార్త మీ భర్తల కెరింగింపుడని చెప్పుటయు గౌరీ లక్ష్మి సరస్వతి లొండొరుల మొగములు జూచి కొనుచు నోహో ఇది కడు చిత్రముగానున్నది. మనభర్తలకుఁ దల్లియున్నదని యెన్నఁడును వినియుండలేదే? ఆహా యిట్టి పుత్రులంగనిన యాయమ్మ సామర్ధ్యము మిక్కిలి స్తోత్రపాత్రమై యున్నదిగదా.
అయ్యారే! ప్రధానత్వమును గురించి వీరిలోవీరే తగవులాడుకొనుచుండ వీరిపై మరియొక ప్రభ్వియున్నఁదట. అనేకకోటి బ్రహ్మాండములలో వీరొక బ్రహ్మాండమును బాలించుచున్నారఁట. అద్దేవి వీరిని మందలించుటకై పిలిపించికొనుచున్నది. బాపురే యీసారి వీరుగర్వములు వదలి వర్తింప గలరని సంభాషించుకొనిరి.
పిమ్మట బార్వతీదేవి యల్లన ప్రాణవల్లభునొద్దకబోయి యాదిశక్తి సందేశ ప్రకారమంతయు వినిపించినది. అప్పుడు ముక్కంటి యక్కజమందుచు లేచి యేమేమీ మాకొకతల్లియున్నదా? వింతలు వినంబడుచున్నవే ఏరీ ఆ దూతికల నిటుదీసికొనిరా? తెలిసికొనియెదనని చెప్పిన శర్వాణి యప్పుడే పోయి శక్తి పరిచారకులఁ దోడ్కొని వచ్చినది.
పురారి వారింజూచి మీరెవ్వరు ఏమిటికై వచ్చితిరని యడిగిన నప్పడతులు, దేవా? మేమనేకకోటి బ్రహ్మాండ జననియైన యాదిశక్తి యంతిక చారిణులము. అంత్య బ్రహ్మాండాధిపతులు తగవులాడి సృష్టి స్థితివిలయ వ్యాపారములుమాని లోకసంక్షోభము గావింపుచున్నారని దూతలవలన విని మాదేవి మిమ్ముదీసికొనిరమ్మని మమ్మంపినది. ఆమె వసించులోక మిచ్చట కనేకకోట్లయోజనముల దూర మున్నది. ఈ విమాన మెక్కిరావలయు నిదియే మావృత్తాంతమని చెప్పినవిని యమ్మహేశ్వరుం డించుక చింతించుచు, నించుబోణులారా బ్రహ్మాచ్యుతులు యొద్దకుఁబోయి వారి కీవార్త నెరింగించి విమాన మెక్కించుకొని యిచ్చటికి దీసికొనిరండు. ఏనును బయనమై సిద్ధముగా నుండెదనని చెప్పుటయు నాదూతిక లతిరయంబున విమానమును దీసికొనిపోయి శతానందగోవిందుల కత్తెరంగెరుంగజెప్పి వారివిస్మయ వారి రాళిముంచుచు నవ్విమాన మెక్కించుకొని సంచశరారియొద్దకు దీసికొనివచ్చిరి.
అప్పుడు హరిహరబ్రహ్మలు మువ్వురు గలసికొని, అక్కటా! మనము మిక్కిలి ప్రమాదము నొందితిమి. కొండెగాడైన వేల్పు తపసి దుండగం బెరుంగలేక యూరక పోట్లాడితిమి. ఆహో! మనలనెట్టి మోహ మావేసించినది.
అయ్యో! అతఁడు కలహాశనుండని యెరింగియు మన మతని మాటలనమ్మి సామాన్యులవలె మోసపోయితిమికదా! బోనిండు దీన మనకొక విశేషము తెలియఁబడుచున్నది. మనకు తల్లియున్నట్లెరుగము. ఆమె యెందున్నదో తెలిసికొనుట యావశ్యకమే. కావున మనము బోవుదమని హరిహరుల మంతనము లాడికొని వైరములు విడిచి యాప్తభావముతో నాలోకపాలకులు మువ్వురును సంతసముతో నావిమాన మెక్కిరి.
అప్పుడు శ క్తిదూతికలు దేవయానము నూర్ధ్వలోకమునకు నడిపింపఁదొడంగిరి. అవ్విమానరత్నము తృటికాలములో ననేకసహస్ర యోజనములు పోయినది. ఆ మూర్తులు తమ వైరముల గురించి మాట్లాడుకొనుచుండగా నొకచోట మరియొక బ్రహ్మయు విష్ణుడు శివుండును వారియొద్దకువచ్చి నమస్కరించి పోయిరి. వారింజూచి వెరగుపడుచు నాభువనాధిపతులు శక్తిదూతికలతో' వీరెవ్వరనియడిగిన నప్పడతులు అయ్యా ! మనమిప్పుడు మీబ్రహ్మాండము దాటివచ్చితిమి ఇది మరియొక బ్రహ్మాండము. వీరు దీనింబాలించు త్రిమూర్తులని చెప్పుచుండఁగనే యవ్విమానము వారిని మరియొక బ్రహ్మాండమునకుఁ దీసికొని పోయినది.
అచ్చట మరియొక హరిహరబ్రహ్మలువచ్చి వారితో ముచ్చటించి యరిగిరి. వారి వృత్తాంతము విని త్రిమూర్తులు లజ్జావిషాదమే దురహృదయులై యిట్లు వితర్కించుకొనిరి.
ఆహా! మనమే యీ లోకములకెల్ల బ్రధానులమని గర్వపడి యొండొరుల నాక్షేపించుకొంటిమి. యిప్పుడు క్రిమికీటకాదులకంటె నధములమని తోచుచున్నది. మనవంటివారు కోటానకోటులున్నారు. ఇందరిలో మన యెక్కువేమియని పశ్చాత్తాపచితులై విచారింపుచున్న సమయంబున నవ్విమాన మత్యంత వేగముగా బోదొడంగినది. అప్పుడు బ్రహ్మవిష్ణుమహేశ్వరు లూరక యవిచ్ఛిన్నముగా గాయగుత్తులవలె వారికిఁ గనఁబడంజొచ్చిరి.
అప్పుడు వారున్మత్తులవలె మతులుచెడి తామెవ్వరో యెరుంగక పలవరింపఁ దొడంగిరి.
అట్లు మనోజవంబున నద్దేవయానంబు శతకోటిబ్రహ్మాండంబులంగడచి యమ్మహాదేవియున్న లోకమునకుం బోయినది. ఆ లోకం బంతయు దివ్యతేజోమయంబై తేరిచూడ శక్యముగాక మెరయుచున్నది. దుర్నిరీక్షమైన తదీయప్రభావిశేష మన కక్కజమందుచుఁ ద్రిమూర్తులును గరకమలంబులు ముకుళించి యమ్మహాశక్తి ననేక ప్రకారముల నగ్గింపఁదొడంగిరి.
అట్లు స్వాభిమానశూన్యులై సిగ్గుతో నగ్గింపుచున్న త్రిమూర్తులయెడఁ గనికరముగలిగి మహాశక్తి తీక్ష్ణతేజం బుపసంహరింపుచు నిజరూపము జూపినది. అప్పుడు వారు తదీయపాదంబులంబడి, తల్లీ ! మేమెరుంగక మేమే లోక ప్రధానులమని గర్వించి జగత్పీడఁ గావించితిమి. బుద్ధి వచ్చినది. యీ తప్పు సైరింపుము. పుత్రుల నేరములు తల్లి లెక్కింపదుగదా. రక్షింపుము. రక్షింపుము. మత్కోపగారణంబునంజేసి భవదీయపాద దర్శనం బైనది. ఇదియే యిందులకు ఫలమనియు మురిచుయున్నవారమని యనేక ప్రకారములు స్తోత్రములు చేయుచు నీవింతకాలముదనుక మాకు దర్శనంబిచ్చితివికావేమి యెరింగింపుమని యడగిన ప్రసన్నయై యమ్మహాదేవి యిట్లనియె.
బిడ్డలారా ! మీ వంటివారు కోటానకోటులు నా పాలనములో నున్నారు. అవసరము వచ్చినప్పుడుగాని నే నెవ్వరికిం గనంబడను. నా యునికి యెవ్వరు నెరుంగరు. మీరిప్పు డన్యోన్యము బద్దమత్సరులై స్వాతిశయబుద్ధితో నియతవ్యాపారముల మానిరని తెలిసి మందలించుటకై రప్పించితి. నింక నెప్పుడు నిట్టి పెడత్రోవలకుం బోకుఁడు. కాలానుసరణముగా వర్తించుఁడు. పొండని యమ్మహాదేవి యానతిచ్చి యంతర్ధాన మొందినది.
పదంపడి త్రిమూర్తులును దేవీప్రభావము వేతెరంగులఁ గొనియాడుచుఁ దత్ప్రసాదలబ్ద సమధిక ప్రభావ సంపన్నులై తృటికాలములోఁ దమ నెలవులంజేరి గర్మవిముక్తులై యథాపూర్వకముగా లోకపాలనము గావింపుచుండిరి.
శంకరా ! అట్టి యాదిశ క్తి ప్రభావ మెరుంగక నీవు శక్తిలేదని వచించితివి. లోకాతీతమగు నీ ప్రవృత్తి నెరుఁగుటంబట్టి నీకు బోధింప నరుదెంచితిని. అమ్మహా శక్తిని నన్నుగా భావింపుము. ఏమరక పూజింపుమని బోధించిన సంతసించుచు నాచార్యవర్యుండు చేతులు జోడించి, అంబా! నేను నిన్ను లేవని వాదింపలేదు. శాక్తేయులు గావించు దురాచారముల నిందించితిని. ఇదియ నా నేరము నీ వాత్మస్వరూపిణివని యెరింగితి నన్నుఁ గృతగృత్యుని గావించితివని పెక్కు స్తోత్రములు గావించెను. పిమ్మట నద్దేవియు నా విద్వత్ప్రవరుని కనేక విద్యల నొసంగి యంతర్థానము నొందినది. శంకరుఁడు నాటంగోలె శక్తియందు భక్తి విశ్వాసములు గలిగి పుడమి యందుఁ బ్రసిద్ధినొందిన శ్రీశైలాది ప్రదేశముల దశపీఠంబుల శక్తిస్థాపన గావించి కృతార్ధుండయ్యెనని యెరింగించి మణిసిద్ధుండు వెండియు శిష్యున కిట్లనియె.
ఈడిగి కాపుల కథ
వత్సా! విను మాచార్యులవారు మండనమిశ్ర పండితుని జయింప మాహిష్మతీ నగరంబునకుంజని యందుఁ జీమ కైనఁ దూరశక్యముగాని సమున్నత ప్రకారములచే నావరింపఁబడియున్న మండనుని మందిరాభ్యంతరము ప్రవేశింపనేరక చింతించుచు నప్పురబాహ్యోద్యానవనంబులో గ్రుమ్మరుచు శిష్యులతో నిట్లు విచారించెను. అయ్యో ! మండనుఁడు యతిమార్గనిరోధకుండై సన్యాసులు తమ యింటికి వత్తురను భయముతో సర్వదా తలుపులు వైచికొని గూఢముగా నున్నవాఁడు. వాని యింటి ప్రహరి మిక్కిలి యెత్తుగా నున్నది. లోపలఁ ప్రవేశించుట యెట్లో తెలియదు. సాధన మేమియుం దోచుకున్నదని విచారింపుచున్న సమయంబున నొకచోట నొక యీడిగవాఁ డొక యీతచెట్టు కట్టెదుర నిలువంబడి యేదియో యుచ్చరించెను. అప్పుడా మ్రాను వాని పాదంబులకు నమస్క రింపుచున్నదో యనునట్లు శిరము నేలంట వంగినది. తరువాత నీడిగవాఁడంతకుముందు దానందు దగిలించియుంచిన కుండలలోని కల్లు దీసికొని వెండియు నా ఘటంబుల వాని గెలలకు దగిలించి మరల నేదియో యుచ్చరించెను.
అప్పుడా యీతమ్రాను రివ్వునఁబోయి యధాప్రకారము నిలచినది. ఆ యీడిగవాఁడందున్న యీతచెట్లకల్లా ఆ ప్రకారము గీచుచుండెను. ఆ వింతఁ గన్నులారఁజూచి శ్రీ శంకరాచార్యులు మిగుల వెరగుపడుచు, నోహో ! యీశ్వరసృష్టిలో నెన్ని విశేషములైనం గలవుగదా ! నాకు వీనివలన నీ విద్య సంగ్రహించుట కర్జము. ఈ విద్య నాకు లభించెనేని మండనమిశ్రు నింటిలోఁ బ్రవేశించుట సులభమని తలంచుచు వాని దాపునకుబోయి మన్నించుచు నిట్లనియె. ఓరీ ! నీ పేరేమి? నీ కాపురం బెచ్చట ? నీవీ విద్య యెవ్వని వలన సంపాదించితివి. నిన్నుఁజూడ నాకు మిగుల సంతసముగా నున్నది. నీ వృత్తాంతము కొంతఁ జెప్పుమని యడిగిన వాఁడు నమస్కరింపుచు యతీంద్రున కిట్లనియె.
స్వామీ! మండన పండిత పుండరీక మండితంబైన మాహిష్మతీపురము నా కాపురము. మేమీడిగవాండ్రము. నాకీవిద్య మా తండ్రియే యెఱింగించెను. మేమిట్లు చేయుచున్న విషయమై లోకులెవ్వరు గ్రహింపలేరు. మీరు దెలిసికొంటిరి. దీన మీరు మహానుభావులని తెల్లమగుచున్నదని వాఁడయ్యాచార్యవర్యు ననేక ప్రకారముల స్తుతి యించెను.
అప్పుడు శంకరులు ఓరీ! నీకీవిద్యవలన శ్రమ కొరంతపడుట తప్ప వేరొక లాభమేదియును లేదుగదా? నీవు నాకీవిద్వ నెఱింగింపుము. నీకు నేను బంగార మయ్యెడి యోగ మెరింగించెద. దాన నీకు విశేషలాభము కాఁగలదని పలుకుటయు నయ్యీడిగవాఁడు మిగుల సంతసించుచు నిట్లనియె.
మహాత్మా! యీవిద్య పుత్రులకుఁగాక యితరుల కెరిగింపరాదని మాతండ్రి నాకుపదేశించునప్పుడు నావలన ప్రమాణికము జేయించుకొనెను. ఈవిద్య నే మీకిచ్చితినేని నిక మా కులమున నిలువదుగదా ? మీరిచ్చు విద్యవలనఁ గులవృత్తితో బనిలేనంత భాగ్యము గలిగెనేని మీకీవిద్య నిచ్చెద లేనిచో రెంటికిం జెడినఁవాడనగుదును. మరియు మిగుల విలువఁగల విద్యనిచ్చి నల్పవిద్య నావలనం గ్రహించిన మీకేమి లాభము? విచారించుకొని దయచేయుఁడని పలికెను. అప్పుడు శంకరులు వాని మాటలకు మెచ్చు కొనుచు, నోరీ! మాకు భాగ్యముతోఁ బనిలేదు. వైరాగ్యముగాఁ దిరుగుచుందుము. లోకోపకారమునకై పాటుపడుచుంటిమి.
నాయిచ్చు విద్యవలన నీకులమునకు మిగుల భాగ్యమును, వాడుకయు రాగలదు. కావలసినంత బంగారము నిత్యము నీవు చేసికొనవచ్చును. ఇఁక నీకీ నీచ వృత్తితోఁ బనిలేదని చెప్పుటయు నయ్యీడిగవాఁ డంగీకరించి శంకరులకుఁ దొలుతఁ దన విద్య నెరింగించెను. పిమ్మట శంకరులు భర యోగము వాని కెరింగించెను. అట్టి విద్య సంగ్రహించి శంకరులు మండను గృహము దాపునకుఁబోయి ప్రహరిచుట్టును దిరిగి యాగోడప్రక్క నంటియున్న నారికేళవృక్షముల మంత్రించి వంగినంత వానిపైనెక్కి పైకెగసి కోటలోఁ బ్రవేశించి శ్రాద్ధకాలంబున నప్పండితునిగాంచి సంభాషించి పిమ్మట బ్రసంగంబు గావించి యోడించెనని యొకవాడుక యున్నది.
అయ్యీడిగవాడును శంకరులవలనఁ గనకయోగ విద్యను గ్రహించి తత్ప్రభావమువలన ననంతమైన బంగారమును జేయుచుఁ గాసులగాబోయించి లోకమున వ్యాపింపఁజేసెను వానినే యీడిగ కాసులని యిప్పటికిని వాడు చుందురు. ఆ కాసులిప్పటికి నక్కడక్కడ దొరుకుచుండును. హఠయోగాది విద్యల ప్రవీణుండై యాకాశ సంచారము చేయనేర్చిన శ్రీశంకరాచార్యులవారికి మండనుని ప్రహరి దాటుట శక్యమైనది కాదని చెప్పుట హాస్యాస్పదమై యున్నదికాని యల్పులవద్దనుండియైన విద్యా విశేషము సంగ్రహింపవలయునను న్యాయము ననుసరించి దానివలనఁ దనకొక ప్రయోజనము లేకపోయినను గాంచనయోగముజెప్పి యావిద్య గ్రహించియుండవచ్చును.
నాస్తికులలో వాదించునప్పుడు వారు దైవముగలఁడని నిదర్శనము జూప గలవా యని యడిగిన శంకరులు సహస్ర సంభమంటపమున నిలువంబడి యొకతాళ వృక్షము చేతంబూని స్తంభములకుఁ దగులకుండ గిరిగిరం ద్రిప్పి వారి నాత్మశిష్యులగాఁ జేసికొనియెను. మరియొకచోట దైవముగలఁడని యెర్రగాఁగాచిన సీసము పాలం బోలె గ్రోలి జెక్కు జెదరక మెరయుచుండెను. మరియొకచోటఁ గొండయెక్కి నేల కురికెను.
ఈరీతి పుడమిగల దుర్మతంబులనెల్ల ఖండించి ప్రజలనెల్ల సన్మార్గ ప్రవర్తకులుగాఁజేసి యమ్మహాత్ముండు ముప్పదిరెండేడులు పూర్తియైనంతఁ దత్వబోధము గావింప శిష్యులు బీఠాధిపతుల గావించి పిమ్మట బృందారక బృందప్రార్థితుండై వెండియు వెండికొండకు విచ్చేసెనని
క. అద్వైతగురుచరిత్రము
సద్వేత్యంబిది పఠింప సద్భక్తిమెయిన్
విద్వన్నుత నిర్వృతి సం
పద్వైభవములు లభించుఁ బరిపూర్ణమ గాన్.
మంగళమహా శ్రీవృత్తము
స్వస్తియగుఁగాత బుధజాతమున కెప్పుడు ప్రజావిత భూపపతిధర్మ
న్యస్తమతిఁబ్రోవుతఘనంబుగఘనంబు లుచితావసరమందు ననువృష్టుల్
నిస్తులముగాఁగ భువిసించుతధరాస్థలి ఫలించుతను మంగళమహాశ్రీ
విస్తృతగతిన్సదభివృద్ధిగాత సురభివ్రజమువత్సములతోడన్.
గీ. హవ్యవాహనగుణ వారణాంబుజారి
సంఖ్య నొప్పారు వరశాలిశకమునందు.
దనరుచుండు విరోధి కృద్వత్సరమున
దీని రచియించి ప్రకటించితిని ధరిత్రి.
గద్య. ఇది శ్రీమద్విశ్వనాధపదసుకంపాసంపాదిత కవితావిచి
త్రాత్రేయముని సుత్రామగోత్ర పవిత్రమధిరకులకలశ
జలనిధిరాకాకుముదమిత్ర లక్ష్మీనారాయణ పౌత్ర
కొండయార్యపుత్ర సోమిదేవీగర్భంముక్తిముక్తా
ఫలవిబుధజనాభిరక్షిత సుబ్బన్నదీక్షితకవి.
విరచితంబగు కాశీయాత్రావసధచరి
త్రమను వచన ప్రబంధమందు
బంచమభాగమున శ్రీశంక
రాచార్య చరిత్రము
సంపూర్ణము.
శ్రీ