కాశీమజిలీకథలు/అయిదవ భాగము/55వ మజిలీ

శ్రీరస్తు

కాశీమజిలీ కథలు

55 వ మ జి లీ

అష్టమోల్లాసము

క. శ్రీకళ్యాణ నికేతన
   లోకానీకస్తుతా ఘలుంటాకాభి
   ఖ్యాకలిత విబుధజన ర
   క్షాకల్పక సుకృతిశరణ కరుణాభరణా.

దేవా ! యవధరింపు మట్లమ్మణి సిద్ధుండు శిష్యునకు శ్రీ శంకరాచార్య చారిత్రమంతయు నెఱింగించి వెండియు నిట్లనియె. వత్సా! యమ్మహాత్ముని గురించి చెప్పికొనెడు కథావిశేషములు కొన్ని గలవని గ్రంథస్థములు కాకపోయినను లోకంబున ప్రఖ్యాతముగా చెప్పుకొనుచుండిరి. వారినెల్ల వివరింతు సావధాన మనస్కుండ వై యాకర్ణింపుము.

మహాశక్తిని గురించి జరిగిన కథ

శ్రీ శంకరాచార్యుండు శాక్తమత ఖండనము గావించిన కొన్ని దినంబుల కొకనాడు శిష్యులతో గూడుకొని యొక యరణ్యమార్గంబున నరగుచుండెను. యా మానవశేష దివసంబున నడుచుచుండెడి యాశిష్యబృందమునకు గమన శ్రమవాయ హాయిగా నప్పుడొక గాలి వీవ దొడంగినది. అందులకు సంతసింపుచు నయ్యంతేవాసు లెల్ల గురుతల్లజుని పాదపల్లవముల ననుసరించి నడుచుచున్నంత నమ్మందమారుతంబు గ్రమక్రమంబున నభివృద్ధినొందుచు నాకులు రాలునట్లు కొమ్మలు విరుగునట్లు మొదళ్లు కదులునట్లు కొండ లెరుగునట్లు విసరఁ దొడంగినది శంకర శిష్యులెల్లరు నయ్యకాండ ప్రళయమునకు వెరచుచుఁ గొంతసేపు ధూళి కలుషితములగు నేత్రంబుల జేతులు గప్పికొని మ్రాకుల మూలముల నొదిగియుండియు గొమ్మలు విరిగి మీదబడిన జడియుచు బయళ్ళకు బోవుచు నందు బెనుగాలిం గాళులు నిలువలేక కొట్టికొని పోవుచుం జెట్టుమొదళ్ళం గౌగలించుకొని --- బ్రయోజనంబుగానక వానితోగూడా దూదిపింజల వలె నెగిరిపోవుచు 'హా! శంకరా! గురువరా ! రక్షింపుము. రక్షింపుము.' అని మొరలిడ దొడంగిరి.

శిష్యజనుల పరిదేవనము జూచియు వారింపనోపక విచారించుచు శంకరుండు తానును జంఝావాత ఘాతంబున శిష్యజనుల కెడమై పెద్దదూరము కొట్టికొనిపోయెను. అతండు వంగి నేలంట బండికొనుచు జేతులకు దొరకిన వానిం గట్టిగ బట్టుకొనుచు నానక వారితోగూడ నెగసిపోవుచు నీరీతి బోయిపోయి మొకచో సజఁ బాలంబైన నేలం బడి యాబురదలో దన రెండుపాదంబులును మొలవరకుం దిగబడుటయు గదలకచేతులాకర్దమము పైనాని నిలువంబడి యుండెను. ఎంత వడిగా విసరినను వడముడి యమ్మహాత్మునందుండి యించుకయు గదల్పలేకపోయెను.

సీ. కనకామలకవృష్టి గలిగించి విప్రకా
          మినినెవ్వ బాపిన మేటితనము
    పూర్నానదినిటెంకి పొంతకు రప్పించి
          జనుల మెప్పించిన సాహసంబు
    మూకాంబి కాగేహమున గతాసునిభూసు
          రార్భకు బ్రతికించి నట్టిశ క్తి
    మిన్నంటఁ బొంగి భూమినిముంచునర్మదా
          ధునిఁ గుంభముననిమిడ్చినమహత్వ.

గీ. మెందడంగెనొయేమూల కేగెనొక్కొ
   భవమహా పంకమునగూలఁ బడెడుజడుని
   పగిదిశంకరు దమ్మహా పంకమందు
   గాలు గదలింపలేక చీకాకునొందె.

ఆహా! కాలంబెంత వారినైన వగ్గము జేసికొనక మానదు. క్రమంబున నాగాలి చల్లారినవెనుక నమ్మహాత్ముండా కర్దమమునుండి యీవలకు రావలయునని యెంతయో ప్రయత్నము జేసెను కాని లాభమేమియు లేకబోయినది. కరపాదంబు లేపనికిని బ్రసరింపఁజేయుటకు శక్తియుడిగినది. క్రమంబునఁ గాయంబా బురదలోనికిఁ దిగిపోవ దొడంగినది. బెండుపడిమేనం బ్రాణములు నిలుచుట గష్టముగా దోచినది అప్పుడమ్మహాత్ముండాలోచించి యోహో ! మోహావేశంబునంజేరి నేనిట్టి యిక్కట్టు

జెందితిని. కానిచో విలయంబునఁగాక నెన్నఁడైన మనుష్యుల నెగరజిమ్మెడు తెమ్మరలు వీచునా ? మదీయాంతస్సారమిట్లు బెండువడుట చిత్రముగానున్నదే. అక్కటా ! నే దెలియక నేదేవతకైన నపచారము గావించితినాయేమి? యూరక యిట్టి యుపద్రవము తటస్తించునా యని యాప్రాజ్ఞుండు పెక్కు తెరంగులఁ దలంచుచుఁ గన్నులు మూసికొని చేదోయిఫాలంబునఁ గీలించి,

గీ. తెలియకెవ్వరినైన నిందించియిట్టి
    వెతలగాంచితి నేనిసద్వృత్తినిపుడు
    మాన్పికొనియెద నా బుద్ధిమాంద్యమెల్ల
    వేగ రక్షింపరయ్యయో వేల్పులార!

అని ప్రార్థించుచున్న సమయంబున నాప్రాంతమందు నూరేండ్లుప్రాయము గలిగి శరీరమంతయు ముడుతలు బారినను బండుటాకు వంటి కాంతితో నొప్పుచు వింతశోభ సంపాదింపఁ జనురీవాలంబులం బోలె నొప్పారు నెరసిన వెండ్రుకలు ధమ్మిల్లముగా దిద్దికొని సుందర ఫాలంబునఁ జంద్రవంకంబోని కుంకుమ రేఖందీర్చి కుడిచేత దండం బూతగాఁబూని నిలువంబడి రెండవచేయి యళికంబున సూర్యకిరణ ప్రసారమున కడ్డముగానిడి యొకవృద్ధాంగన అయ్యా ! దారిఁ దెలియక యిక్కడఁ జిక్కులుపడుచుంటిని. సన్మార్గమేదైన మీకుఁ దెలిసినచో వక్కాణింపుదురాయని బురదలోఁ జిక్కి కొనియున్న శంకరాచార్యు గూర్చి పలికినది.

ఆ ధ్వని విని యతం డబ్బురపాటుతోఁ గన్నులందెరచి యాప్రాంతమందు దండమూతగాఁబూని నిలువంబడియున్న జరాంగనంగాంచి విస్మయము జెందుచు ఆవ్వా! నేను దారి తెలియకయేవచ్చి యీ బురదలోఁ జిక్కుకొనియుంటి దీనిందాటివచ్చుటకు శ క్తిలేకున్నది. నీ దండము గొంచెమూత యిత్తువేని దీనివెడలి రాఁగలనేమోయని యాసగలుగుచున్నదని పలికిన నవ్వుచు నావృద్ద యిట్లనియె. సౌమ్యా ! నీ మాటలు వినఁ గడు చిత్రముగానున్నది నేనీదండమం దిచ్చినంతనే లేని శక్తి యెట్లువచ్చెడిని. అదియునుంగాక నేను నూరేండ్లదాన నీవు ప్రాయములోనుంటివి. శక్తిలేదని చెప్పినను నీవంటివారు పంకమునుండి యుద్ధరింప సమర్థులుకాని మేమట్టి వారముకాము. మాబోటులున్నను లేనివారలలోనే లెక్క నీయభిప్రాయమట్లేయున్నది గదా! పోనిమ్ము నాకీవితర్కమేల మంచిమార్గ మెరింగియుండిన వక్కాణింపుము లేకున్న నాకుఁదోచిన దారింబడిపోయెదనని పలికినంత మేనంబులక లుద్భవిల్ల నాచార్యవర్యుండు చేతులెత్తి మ్రొక్కుచు దేవీ! నీవాదిశక్తివని తెలిసికొంటి నిన్ను లేదని వాదించిన యపరాధంబున కీశిక్ష విధించితివికాఁబోలు.

శా. దేవీ! పురాణశక్తివి భవ ద్దివ్యప్రభావంబు మా
    యా విష్టాత్మ గ్రహింపనేర కటుల న్యఖ్రాంతి వర్తించితిన్
    గావంగాఁదగు నీదుభక్తుఁగరుణన్ గాయత్రి సావిత్రియున్
    నీవే యాత్మవటంచు నేడెరిగితిన్ నిక్కంబు గాత్యాయనీ.

అని స్తుతియించినంత సంతసించుచు నద్దేవి దివ్యరూపంబుధరించి యయ్యతి శేఖరు నాజంబాలంబునుండి లేవనెత్తి యొడలు నివురుచు నల్లన నిట్లనియె.

వత్సా ! శంకర ! నీవుత్తమ తత్వజ్ఞాన సంపన్నుండవగుదువు పరమార్థోప దేశంబున లోకులలెల్లఁ గృతార్ధులం గావింపుచుంటివి. నిన్నుఁబోలిన విజ్ఞాతలేఁడు మెప్పువచ్చినది. నీకుమాత్ప్రభావం బెరిగింపం దలంచి యిట్టిమాయఁ గల్పించితి. హరి హరాదులైన మదీయ మాయామోహితులై నాప్రభావంబు దెలిసికొనలేరు. ఇందులకొక యితిహాసముగల దాకర్ణింపుము.

త్రిమూర్తుల కలహము కథ

తొల్లి నారదుం డొకనాఁడు బ్రహ్మలోకమునకుంబోయి పరమేష్టిచే సన్మానింపఁబడి సుఖాసనా సీనుండైయున్న సమయంబున విరించి నారదా! యెందుండివచ్చుచుంటివి విశేషములేవేని గలిగిన వక్కాణింపు ముబుసుపోకున్నదని యడిగిన నక్కలహశనుం డించుక యాలోచించి యిట్లనియె తండ్రీ! సకలజగన్నిర్మాణ దక్షుండవగు నీకును నుబుసుబోకుండునా! అయినను నాయెరింగినంత వక్కాణించి పని గలిగించెద నాలింపుము. నిన్ననాకములో నొకసభ జరిగినది. అందు బృందారకులను తాపసులకు త్రిమూర్తుల తారతమ్యము గురించి పెద్దగా వివాదము సంప్రాప్తించినది. అందలి సారాంశము దేవర కెరింగింప నాడెందంబు సందియమందుచున్నది.

తండ్రికైన యవమానము కుమారునికికాదా? ముఖస్తుతి వచనములచే దేవర ననేక పర్యాయములు గొనియాడినవారే వేరొక రీతిపలికిన నేమనందగునని యేమేమో సంభాషించిన నాలించి విరించి యించుక యలుక నభినయించుచు వీణాముని కిట్లనియె. పుత్రా! యధార్ధము జెప్పుటకు సందియమందెదవేల? ఏమేమి ప్రసంగము వచ్చినది. మాలోనెవ్వఁ డధికుండని నిశ్చయించిరి. అందుఁ బెద్దలెవ్వరైనఁ గలిగియుండిరా యని యడిగిన లజ్జాభయంబు లభినయించుచు దేవముని యిట్లనియె తండ్రీ! నీ యొద్దనిఁక దాచనేల అందుండవలసినవా రందరు నుండిరి చేయవలసిన ప్రసంగమంతయుం జేసిరి. అప్పుడు హరిహరుల తారతమ్యము గురించి ప్రసంగించిరికాని నీమాట యించుకయుం దేరైరి. అత్తరినుత్తలమందు చిత్తముతోనే నూరుకొనలేక హరిహరులకన్న నీవే యధికుండవని నొక్కివక్కాణించితిని.

నా మాటలువిని యందున్నవారందరు పకపక నవ్విరి. లజ్జావిషాదమేదుర హృదయుండనై యప్పుడేమియు మాటాడక తత్కృతావమానంబు వదనంబునం బొడగట్టుచుండ నట్టె లేచియందలి విశేషమేమి యేనిం గలదేమోయని యాసభముగియకుండ నీయొద్ద కరుదెంచితిని. అక్కటా! నిన్ను హరిహరులతో సమానుండనియు జెప్పరాదట. నేనిదివరకు త్రిమూర్తులు సమానులనియే తలంచుచుంటిని అందలి నిక్కువ మేదియో వక్కాణించి నాసందియము దీర్పుమని ప్రార్ధించిన విని కటమ్ములదరరోమకూపమ్ములఁ బొగలెగయభ్రుకుటీ వికటముఖుండై చతుర్ముఖుం డిట్లనియె.

నారదా! దేవసభలో దేవతలు మునులు నేక వాక్యముగా నన్నథమునిగా నెన్ని రేమి? అగునగు నతిపరిచయంబున నవజ్ఞత వచ్చునను న్యాయంబేలతప్పును. నేను దేవతలకును మునులకు నాపదలు వచ్చినప్పుడు సులభముగా దర్శనమిచ్చి వారి మొర లాలించువాఁడనులే! దానంజేసి వారికట్టిబుద్ధి పుట్టినది. కానిమ్ము నాన్యూనాధిక్యతలతో వారికేమిపని యున్నది. నా ప్రసంగమేల తేవలయును. ఆ మాట యడుగక పోయితివా? యని పలికిన సురయతి. తండ్రీ ? నేనెంతవాదము సేయక యేమియు నడుగక యింతదూరము వచ్చితినా! నీ యవమానము నా యవమానముకాదా! అన్నిటికిని సమాధానము చెప్పఁబట్టియే విషాదముగలిగినదిని మరియుఁ దదీయరోషాగ్ని నింధనాయమానంబులగు వచనంబులచేఁ బ్రజ్వరిల్లంజేసెను.

అప్పుడు రౌద్రావేశముతో వాణీశుండు నారదా! నీవు మరలఁబోయి దేవతలతో హరిహరులకన్న నేన యధికుండననియు మదీయ సామర్థ్యము చూడవలయునని కోరిక కలిగియుండినచోఁ జూపింతుననియు మునులు వినఁ జెప్పిరమ్ము. నేను సృష్టి జేయనిచో హరిహరులేమిచేయుదురో చూతము. గోడయుండినగదా రంగులు వేయుదురు. మందమతులన్నంతనే నేనల్పుండ నగుదునాయని నుడివిన విని మరల నమర ముని యిట్లనియె. తండ్రీ! నీతో జెప్పనేమిటికని యూరకొంటిని. కాని యట్టి తాత్పర్యము వైకుంఠునకు సైతము గలిగియున్నదిసుమీ ? ఒకనాఁడు నాతోఁ దనయభిప్రాయము వెల్లడించెను. అనుటయు నబ్జసూతి యేమీ? వాసుదేవునకు దనకంటె నేనల్పుడనని యభిప్రాయమున్నదా? దేవతలు తెలియని మూఢులనిన నందురుగాక సర్వజ్ఞుండైన దామోదరునకు స్వాతిశయబుద్ధి యేమిటికిఁ గలుగవలయును ? ఏమని ప్రశ్నించుకొనియెనో చెప్పుమని యడిగిన నారదుం డిట్లనియె

లోకేశా! నేనీనడుమ వైకుంఠంబునకుంబోయి రెండుమూడునాళులందుండి వాసుదేవు నారాధించితిని. మాకిరువురకు నాకెన్నాళ్ళు పెక్కు గోష్టులువచ్చినవి. ఆ కథలలో నీప్రస్తాపముదెచ్చి బ్రహ్మ యిట్లు చెప్పుచున్నాడని చెప్పితిని. అప్పుడయ్యచ్యుతుండు పెదవి విరచుచు బాఁడేమియెరుంగు సురజ్యేష్టోనికీ విషయము దెలియదని పలికెను ఆ మాటలలో స్వాతిశయ బుద్ధియు బరనిందా వ్యాపారము సూచించు చున్నది. అప్పుడే నా మదికిఁ గష్టముగాఁ దోచినదికాని యంతవానిముందర నేమనిన నేమి యపరాధమోయని వెరచితిని. నీవు సురలలో నధికుండవేగాని తమతో సమమైన వాడవుకావని వారి యభిప్రాయము. వారికే యట్లుండ దేవతలు మునులు నేమందురు. వారిమీద నలిగిన నేమి లాభము. అలిగిన జతుర్భుజునిపై నలిగి పంతము చెల్లించుకొనుమని పలికెను.

అప్పు డప్పరమేష్టి వత్సా ! నీవనినట్లే కావించెద. నిప్పుడు నీవు మరల వైకుంఠమునకుంబోయి నీమాటలువిని పద్మగర్భుండు చాల చింతించుచున్నాడనియు నీకంటె నేఁనేమిట దక్కువవాడనని పలికితివనియు నట్టి యభిప్రాయ ముండినం జూచుకొనవచ్చుననియు నామాటగా జెప్పిరమ్ము, మరియు మీయట్టివారి కిట్టి యల్పబుద్ధులు తగవని బోధింపుము ? పొమ్మనిపలికి చింతాకులస్వాంతుండై శతానందు డంతఃపురమునకు బోయెను.

అప్పుడు దివిజయంతి తన యుద్యమము కొనసాగుచున్నది గదా యని యంతరంగమున నుప్పొంగుచు హిరణ్యగర్భుని వీడ్కొని యప్పుడు వైకుంఠమునకుం బోయి ద్వారపాలురవలన దనరాక నారాయణున కెఱింగించుటయు కమ్మహాత్ముండు సంతోషింపుచు సవినయముగా నద్దేపమునింతోడి దేర నేకాంతభక్తులం బనిచెను. వా రత్యంత భయభ క్త విశ్వాసములతో నారదుం దోడ్కొనిపోయి వైకుంఠున కాసన్న ప్రదేశమున నిడిన పీఠంబుపై గూర్చుండబెట్టిరి.

అప్పుడు విష్ణుండు మందహాస శోభిత ముఖుండై మునీంద్రా! ఇప్పు డెందుండి వచ్చుచుంటివి. ఎవ్వరికైనం గయ్యంబులు పెట్టి కడుపునిండించుకొనుచుంటివా విశేషము లేమియని యడిగిన నవ్వుచు నారదు డిట్లనియె. మహాత్మా ? అల్పుల పోట్లాటవలన నాయాకలి యేమి తీరెడిని. దేవసభలో మొన్న సురలకును మునులకును గొంచెము సంవాదము జరిగినది. అక్కలహంబు నాపొట్ట కేమూలకును జాలినది కాదు. ఆ జగడమువిని యందుండి బహ్మలోకమునకుంబోయి చతురాసనుం దర్శించి యిప్పు డిచ్చటికి వచ్చితిని. ఇదియే విశేషములని చెప్పిన నప్పుండరీకాంక్షుం డిట్లనియె. నారదా ! మునులకు సురలకు నేమిటికి సంవాదము జరిగినది. అతైరం గెఱింగింపు మనుటయు నమ్ముని శిఖామణి దేవా ! మరియేమిటికిగాదు. హరిహర హిరణ్యగర్భులలో నెవ్వ డధికుండని ప్రశంస వచ్చినది అందుల గురించి కలహము వచ్చినదని చెప్పెను. ఆ మాటవిని రమానాధుండు యతీంద్రా ! అయ్యోలగములో దుదకెవ్వ రధికులని నిశ్చయించిరి. సంవాద మేరీతి జరిగినదో నుడువుమనుటయు నతం డిట్లనియె.

దేవా ! నుడువుట కేమియున్నది. మునులందరు శివుండధికుం డనిరి. సుర లందరు దేవరయే యధికుండనిరి. బ్రహ్మ యిరువురకన్న నొకయంతరము తక్కువ వాడని యందరుంబల్కిరి. మునులతో వాదింప దేవతలకు సాధ్యము గలదా ? పెద్ద తడవు ప్రసంగించి చివర కేమియు నోరు మెదల్ప లేక సమాధానమును జెందక యూరకొనిరి. ఇదియే యచ్చట జరిగిన విశేషములని చెప్పుటయు గలక జెందిన డెందముతో ముకుందుం డిట్లనియె.

నారదా ! మునులకింత వివేకము లేకపోయినదేమి ? తత్వజ్ఞాన సంపన్నులును బ్రమాదము జెందుదురా! శివునికన్న న న్నల్పునిగా తలంచిరా కానిమ్ము. అట్లనిన మునులు నామంబులేమియో వాక్రువ్వుము. సురలు శాపంబులకు వెరచి తగిన సమాధానము చెప్పక యూరకొనిరి. కాని మునుల పాటి తెలివితేటలు వేల్పులకు గలిగియున్నవి. వారు కడు బుద్ధిమంతులు పనిపాటలేని ఛాందసులతో నూరక వాదించి కాలహరణము చేసికొన నేలనని మాటలాడిరి కారనియు దలంచెదను. సమయము రాక పోవునా ! మునులు నాయొద్దకు రాకపోవుదురాయని యసూయా కలుషితమతియై పలికిన విని నారదుండు వాసుదేవున కిట్లనియె.

అచ్యుతా ! జగత్కారణులయిన త్రిమూర్తుల ప్రభావము దెలిసికొనుటకు మాబోట్లకు శక్యమగునా, ఏదో మాకు దోచినటుల వక్కాణించితిమి. మునులయెడ మీరును సురలయెడ శివుండు నిరువురయెడ బరమేష్టియు నలుక బూనియున్నచో మా బ్రతుకులెటుల సాగును. బ్రహ్మ మీయిరువురికన్న దన్ను దక్కువవాడని సురలును మునులును బలికి మిమ్మెక్కుడుగా బ్రశంసించిరని నావల విని తగని కోపము బూని వారినెల్ల బరిభవింతునని శపధముజేసి యున్నవాడు మీ యిరువురకన్నదానే ప్రధాన దేవతయని వాదించి గెలుపుగొనగలడట. అంత నప్పుడు నాయెదుట దానధికుండను ప్రమాణవచనము లెన్నియేని జదివెను వేదమంతయు దనపరముగా నున్నదని యర్ధము జెప్పెను.

మీ మహిమ మీకుగాక యొరులకు దెలియ శక్యమగునా యని పలికిన విని కమలనాభుండు మరియుం దివియుచు, నారదా! మదీయు నాభికమలంబునం బొడమి కర్తవ్యమెఱుంగక చింతించుచున్న బ్రహ్మకు నేను బ్రత్యక్షమై పుత్రవాత్సల్యముతో సృష్టిక్రియా సామర్థ్యము గలుగజేసితి. నామాటమరచి హిరణ్యగర్భుండు నాకంటె నధికుండనని గర్వపడిన నేమనదగినది ఆ మాటలు విని నీవెట్లు తగిన సమాధానము జెప్పక యూరకొంటివి.

అన్నన్నా ! కాలమెట్టి విపరీతబుద్ధులు పుట్టించును. దేవతలు మమ్మెక్కుడని పలికిరనివిని యీసు జెందనేమి ? ఆత్మప్రభావ సబిజ్ఞు లిట్లే పలుక చుందురు. నారదా ! నీవుపోయి బ్రహ్మతో నామాటగా బోధింపుము. నీయందు బుత్రవాత్సల్య ముంచి గాచుచున్నది. యెఱుగక నాకంటె నధికుండనని గరువము జెందుచున్నవాడ వట. మత్పరాక్రమము చవిచూడ నభిలాష గలిగియుండిన నట్లు తలంపుము. వద్దు వద్దు నీ యధికారమునకు దగినట్లు మాట్లాడుమని చెప్పిరమ్మని పలికిన నంతరంగం బుప్పొంగ సంగనాశనుం డిట్లనియె. స్వామీ! బ్రహ్మ మీ యనుగ్రహపాత్రుండని యెల్లర నెఱింగినదే. తాను సర్వాధికుండనని గర్వపడిన లోకులు సమ్మతింతురా ! నేనామాట లిదివరకే యాయనతో జెప్పితిని. అమాట యటుండనిండు. హరిహర తారతమ్యము గురించి యేవిద్వాంసులు శంకాస్పదులగుచున్నారు. పాపభయంబున మునులకు వెరచి సుర లూరకొనిరని మీ రంటిరికాని మునులుచెప్పిన ప్రమాణవచనములు వినిన బాలునకైన శివుం డధికుండని తెలియకమానదు. మీ విషయమై వాదించువారు విద్యాబలశూన్యులగుట దగిన ప్రమాణములు చూపలేకపోయిరి. మీయొద్ద దాచనేల అప్పు డందరికి మునుల వాక్యములయందు విశ్వాసము గలిగినదిసుండీ !

అప్పుడు నేను దేవర భక్తుండనగుట నూరకొనలేక సురలకు రోష మెక్కించి వాదమునకు బురికొలిపితిని. కాని వారు మదీయ భక్తి విశ్వాసములు గ్రహింపనేరక కడుపు నిండించుకొనుటకై యట్లనుచున్నానని తలంచి పెదవి గదపక మునివచనముల కగ్గపడిరి. దేవా! వాది యల్పమతియైనచో మతప్రాబల్యము తగ్గునా? యనుటయు నాశ్యాహుతిఁ బ్రజ్వరిల్లు నగ్నిహోత్రుండువోలె మండుచు నారాయణుండు బీఠము నుండి లేచి నిలువంబడి చక్రము గిరగిరంద్రిప్పుచు నిట్లనియె.

నారదా! ఇప్పుడు నేను విశ్వరూపముదాల్చి విజృంభించుచున్నాను, మదీయ చక్రధార జతుర్దశ భువనములతో గూడ శివునిరూపుమా పెదను. అందు శివుండధికుండని నుడివిన మునుల నడ్డుపడమని చెప్పుము. ఇంద్రునకింత బుద్ధిలేకపోవలయునా ! మునులన్న మాట కాదనక యూరక వినుచుండ.నా. ఇప్పుడు నాచక్రధార గాచుకొను వాడెవ్వడో చూడమని రౌద్రావేశముతో బలుకుటయు వారించి ముకుళితకరకమలయై కమల యెదుర నిలువంబడి యల్లన నిట్లనియె

ప్రాణేశ్వరా ! శాంతస్వభావముగల మీ రిట్లలిగిన నెవ్వరు నిలువగలరు. మునులనినమాటకు శివునిపై గోపింపనేల. ఆదియునుంగాక యీతపని కలహమె భోజనముగా గలవాడు. ఈ జడదారి మాటలెంత సత్యములో విచారింపక లోకముల నాశనము చేయుదురేల? ఎవ్వరికే బోరాటములుపెట్టి కడుపు నిండించుకుంటివా యని యీతడు వచ్చినప్పు డడుగలేదా, అన్నియు మరచి యలుగుట తగదు.

శివుండు మిమ్మెదిరించినప్పు డేమిచేసినను నుచితమని యేమేమో బోధించి వైకుంఠుని గోపాగ్నిని గొంత జల్లార్చినది. అప్పుడు దామోదరుం డించుక శాంతుండై తలయూచుచు, నారదా! నీమాటల గొంత విమర్శింపవలసియున్నది. నిక్కముగా దేవలోకములో సభ జరిగినదా? మునులును సురవరులును వాదించిరా ? యని యడిగిన నతండు స్వామీ! నే మీముందరనే దబ్బరలాడుదునా బ్రహ్మచెప్పిన మాటలన్నియుం జెప్పిన నన్ను గొండెకాడనిపోవుదురనియే వెల్లడించితినికాను. ఈ మహాదేవి చెప్పినట్లు మీ జోలికిరాని శివునిపై నలుగుట యుచితముకాదు. నేను ప్రచ్ఛన్నముగాబోయి యాయన యభిప్రాయ మెట్లున్నదో తెలిసికొని వచ్చెద, బిమ్మట యుక్తానుసారము గావింతురుగాని యని యేమేమో చెప్పి యచ్యుతు నొప్పించి యప్పుడే యప్పారికాంక్షి కైలాసమున కరిగెను.

అప్పుడు పార్వతీ పరమేశ్వరులు కైలాసశిఖరాగ్రమున మందార తరు ప్రాయమున జంద్రకాంత శిలావేదిక పయిన గూర్చుండి వినోద కథాకాలక్షేపము చేయుచుండిరి. పార్వతి నారదునిరాక ప్రమధులవల్ల విని, ప్రాణేశ్వరా! యీతండు మహర్షియయ్యు గలహప్రియుండయ్యెనేమి. ఎట్టి సంక్షోభము కలిగినను సంశయింపక తగవులుపెట్టి యానందింపుచుండునుగదా? మేరువునకు విలస్యమునకు బోరాటము పెట్టుటచే లోకములు తల్లడిల్లలేదా ? అతండు కొండెగాదని నిరసింపక మీబోటులతని సత్కరింపుచుందు రేలయని యడిగిన బరమేశ్వరుండు నవ్వుచు నిట్లనియె. దేవీ! యతండు త్రికాలవేదియగుట రాబోవునది యెరింగియే యది యనివార్యమని యట్టి పోరాటములు పెట్టుచుండును. అతనికి గామ క్రోదాదులులేవు. నిస్సంగుండగుట నతని యెడ యందరికిఁ గౌరవము గలిగియుండు నని చెప్పుచుండగనే సిద్దు లతనిం దీసికొని వచ్చి శివునెదురనున్న రత్నపీఠముపైఁ గూర్చుండఁబెట్టిరి. నారదుండు పార్వతీపరమేశ్వరులకు నమస్కరించి తదాజ్ఞ నుచితపీఠంబునం గూర్చుండెను.

అప్పుడు శివుండు శరశ్చంద్ర చంద్రికానిచయములతో మందహాస జ్యోత్స్నలు వియ్యమందుచుండ నారదునితో, మునీంద్రా ! నీవెచ్చటనుండి వచ్చు చుంటివి? సురలోకవార్త లేమైనం గలవా? సర్వలోక విశేషములం దెలుప నీవు వార్తా పత్రికవంటి వాడవు. వింతల నెరింగింపుమని యడిగిన నాజడదారి యిట్లనియె. దేవా! నీ వాదిదేవుడవు నీవెరుంగని దేమున్నదిఁ నాకడుపులో నేరహస్యము దాగదని మీ రందరు నెరింగినదేకదా? బ్రహ్మయు విష్ణుండు నిట్లే యడిగిరి. నిజము జెప్పినంత వారికిఁ గోపము వచ్చినది. అన్నన్నా దామోదరున కింత కోప మున్నదని యెన్నఁడు నెరుఁగను. లక్ష్మీ యడ్డమువచ్చినది కాని లేనిచో లోకము లీపాటికి భస్మములై యుండునుబాబూ! ఎప్పుడును నిజము చెప్పరాదు. ఆ వార్త జెప్పిన మీరు మాత్ర మలుగ కుందురా మీకు రుద్రనామము సహజమై యున్నది.

మీకు నిజము చెప్పనేల, లోకసంక్షోభము గావింపనేల. మీ దర్శనమైన డింతియచాలును. అనుజ్ఞయిండు, పోయి వచ్చెదనని పలికిన నవ్వుచు మహేశ్వరుం డిట్లనియె. నారదా! బ్రహ్మయు విష్ణుండును నిన్నేమడిగిరి, నీవేమిచెప్పితివి. వా రేమిటి కలిగిరి. ఆ వృత్తాంత మేదియో చెప్పుము. వినుదనుక మనస్సు తొందరపడుచున్నది. నీవార్త జెప్పిన నాకును గోపమువచ్చునా? పోనిమ్ము వచ్చిన వచ్చుగాక నీ కేల యదార్ధము జెప్పుమని సానునయముగా నడుగుటయు కొంతసే పాలోచించి సంశయించువాఁడుబోలె నభినయించుచు నతం డల్లన నిట్లనియె.

మహాత్మా! నిజము చెప్పెదవినుండు ఈ నడుమ దేవలోకములో సభ జరిగినది. అందు ద్రిమూర్తుల తారతమ్యముగురించి దేవతలకును, మునులకును బెద్ద సంవాదము జరిగినది. మునులు మీరధికులనియు సురలు విష్ణుండధికుండనియు బ్రహ్మను గూర్చి మరికొందరు ప్రసంగించిరి. అందరును మీ ఇరువురుకున్న విరించి యల్పుండనియే నిరూపించిరి. మీరధికులని వాదించిన వారు బ్రహ్మర్షులు యోగులు మొదలగువారు. విష్ణుడధికుండని వాదించినారు భోగులు, సురులు ఆ సంవాదము బెద్దతడవు జరిగినది. ఆ ప్రసంగము విని సంతసించుచు నేను బ్రహ్మలోకమునకుంబోయి విరించిని దర్శించితిని. అతండును నన్ను మన్నించుచు విశేషము లేమని యడిగిన దేవముని సంవాద ప్రకారం బెరింగించి నాయొద్ద నిజము దాగదుగదా! మీ యిరువురకన్న దన్నల్పునిగ దలంచిరని వేల్పులపయి, మునులపయి తగని కోపముజెందుచు సుర జ్యేష్టుండు నా యెదుట దానధికుండని తెలుపు వచనముల చెక్కు చదివి యామాట మీ యిరువురకుం జెప్పిరమ్మని చెప్పెను.

అప్పుడు నేను వెరచుచు మరుమాట పలుకక యటగదలి వైకుంఠమునకుం బోయి హృషీకేశుని దర్శించితిని అతండు నన్ను మన్నించుచు లోకవిశేషము లేమని యడిగెను. దాచనేరక దేవముని సంవాదప్రకారము బ్రహ్మవచన ప్రవృత్తియు నెరింగించితిని.

అప్పుడు వాసుదేవునికి బ్రహ్మపయి నంతకోపము రాలేదుగాని మీ రెక్కుఁ డని పలికిన మునులపయి వచ్చిన కోపమిట్టిదని చెప్పజాలను ఆహా! లోకము లేలు వారికి యట్టి యాగ్రహము గలిగినచో సామాన్యుల నెన్ననేల! అమ్మునుల జంపుదు ననియు, లోకముల భస్మము చేయుదుననియు జక్రము గిరగిర ద్రిప్పుచు దేవరపయి గూడ రోషమును బూనెను. అక్కటా! దామోదరుడు దేవరమహిమ నెరుంగడు. ఏమోయనుకొంటిని. అతని చక్రము మీత్రిశూలము కొనకు దగిలికొనిన జక్కిలము లాగున విరిగి ముక్కలు కాకపోవునా? మీ రాగ్రహించిన నిలుచువారెవ్వరు, భైరవ వీరభద్రాదులు మీయంశజాతులుకారా! కేశవునికిట్టి స్వాతిశయబుద్ధి యేమిటికి గలుగవలయునో తెలియదు. ఇవియే యచ్చట జరిగిన విశేషములు. లక్ష్మి వారింపనిచో నీపాటికి చక్రధార మీ త్రిశూలమునకు దగిలికొనకపోవునా యని చెప్పుటయు త్రిలోచనుండు రోషారుణలోచనుండయి యిట్లనియె.

నారదా! దేవసభలో నేనధికుండని పొగడినంతనే మునులపయి వైకుంఠునకు గోపము వచ్చినదిగా! రానిమ్ము రానిమ్ము. మదీయ శాంతత్వమే యతని నిటులు వాచాలుని గావించినది. గర్వము యుక్తాయుక్తవివేకము గలుగనీయదుగదా! మరియు నతం డలిగి యేమేమి మాటలాడెనో వక్కాణింపుము. మదీయ రుద్రావతారచరిత్ర మరచెనుగాబోలు. భళిరా! యని యడిగిన నారదుండు స్వామీ! నాచే బలుమారేల జెప్పించెదరు దామోదరునకు దా నధికుండనియు మీరు దక్కువవారనియు గట్టియభిప్రాయము గలిగియున్నది మీరుచేసిన తప్పులన్నియు నతండు సవరించుచున్నాడట లేనిచో లోకము లీపాటికి నాశనము నొందునట. మీ బలములు మీరు విచారించుకొన వలసినవే మాబోటులకు దెలియ శక్యముగాదని పలికి రోషమెక్కించెను.

అప్పుడు ఫాలాక్షుండు రూక్షణవీక్షణంబులు వీక్షింపుచు దెసలద్రువ నట్టహాసముజేసి కేల త్రిశూల ముంకింపుచు నౌరా ? నారాయణుండెట్టి వీరుండయ్యెను అతని యండబూని నేను లోకముల బాలించుచున్నానా ? చక్రము నాపయిం బ్రయోగింప యత్నించెనేమి? బాగు బాగు రమ్మనుము. ఫాలేక్షణము దెరచి తృటిలోఁ గొడుకు పోయిన దారి జూపెదను. ఆప్తుండని సమానప్రతిపత్తి యొసంగి మన్నించుచున్నందులకు మంచి యభిప్రాయమే కలిగినది. బ్రహ్మకన్న దన యతిశయమేమియున్నది మదీయ చరణశిరః ప్రదేశముల దెలిసికొనలేక యిరువురు తిరిగిరాలేదా మృషలాడెగాన విరించి శప్తుండయ్యె నింతియెతారతమ్యంబు కేల జక్రముబూని సంగరమునకు రమ్మని మాధవునితో జెప్పుము.

అప్పుడు మా యిరువుర ప్రభావములు దేవతలకు, మునులకు దెల్లమగునని మహా రౌద్రావేశముతో రుద్రుండు విజృంభించి పలుకుచున్నంతజూచి నారదుండు మారుమాట పలుకుటకు వెరచుచు యొదిగి యుండెను. అప్పుడు పార్వతిలేచి నమస్కరింపుచు, మహాత్మా ! యీ నారదుండు కలహప్రియుండు. ఏమేమో నాలుగుమాటలు చెప్పి పోరులు కల్పించుచుండును ఈతని పలుకులునమ్మి వాసుదేవునిపై నలిగెదరేల? నారాయణుండు దూరదర్శనుండు శాంతస్వభావు డూరక తొందరపడువాడుకాడు. కావున విమర్శించి యాగ్రహము బూనుడని స్తుతిపూర్వకముగా నుడివిన విని పినాకపాణి శాంతుండై అవును మాబోటులకవి మృశ్యకారిత్వ ముచితమైనదికాదు. నారదా! నీ వరిగి ముప్పది మూడుకోట్ల వేల్పులతో నింద్రాది దిక్పాలురతో, మునులతో బ్రహ్మతో గరుడధ్వజు నిచ్చటికి దీసికొనిరమ్ము. వెండియు సభజేయింతుము.

ఆ సభలో మేము ప్రసంగింతుము మా బలాబలములు విమర్శించి మునులును దేవతలును ప్రధానత్వము నిశ్చయింతురుగాక వేగము పొమ్మని యానతిచ్చిన విని నారదుండు పరమానందము జెందుచుం దుధరు వీడ్కొని యట గదలి —

గీ. హరిహరుల కింకనుగ్ర సంగరముగాక
   మానదురు లోకసంక్షోభ మైనఁగాని
   కడుపునిండించుకొన మంచికాలమిదియ
   నాకు నిటువంటి తృప్తి యెన్నటికిరాదు.

అని వీణంబాడుకొనుచు వైకుంఠంబునకుంబోయి దైత్యారింగాంచి నమస్కరించుటయు బీతాంబరండు మందహాసముజేయుచు, నారదా! కైలాసమున కరిగితివా ? మహేశ్వరుండు కుశలియైయున్నవాడా ? విశేషములేమని యడిగిన నమ్మునితిలకుండు మహాత్మా ! నేనిప్పుడు కైలాసమునుండియే వచ్చితిని. శంభుండు భద్రముగా నున్నవాడు. మీకు నాలుగుచేతులు గలిగియుండ నాయనకైదు మొగములును, మూడునేత్రములును గలిగియున్నవి. మీచేతచక్రముకన్న నాయన చేతనున్న శూలము బదిమడుగుల బరువెక్కువ గలిగియున్నది మీ యిరువురు నొకరికొకరు తీసిపోయెడువారు కారు. దామోదరా ! నా కిదివరకే కొండీడని వాడుకపడియున్నది. అచ్చట చేష్టలం జెప్పితినేని మీకు గోపమురాకమానదు. పిమ్మట మీ యిరువురును గలహింతురుదాన లోకసంక్షోభ మగును ప్రజలు నన్ను నిందింతురు కావున నచ్చటి నావార్తలేమియు మీ కెఱిగింపకయే పోయెద ననుజ్ఞ యిమ్మని కోరిన నారాయణుండు నవ్వుచు నిట్లనియె.

నారదా! ఒరులన్న మాటలు చెప్పుటచే నీకేమీ తప్పుగలదు. అదియునుం గాక మదీయ సందేశముమీదనేకాదా నీవు కైలాసమునకుఁబోయితివి. తిరిగివచ్చి యచ్చటి వార్తల జెప్పకపోవునా ? నీకేమియుఁ గొదువలేదు. జరిగిన కథయంతయుం జెప్పుమని యడిగిన నాజడధారి యిట్లనియె. కేశవా ! నీ యాదేశమునఁ బోయి నేను జంద్ర శేఖరుం గాంచితి. అతండు నన్ను గౌరవించుచు నెందుండి వచ్చుచున్నావని యడిగెను. నేను దేవరసన్నిధానమునుండి వచ్చితినని చెప్పితి. అచ్చట జరిగిన కధయంతయు సిద్ధుల వలన నంతకుముందు వినియున్నవాఁడు కావున నన్నుజూచి, నారదా! దామోదరుండు నాపైఁజక్రమువైవ నుద్యుక్తుండయ్యెనటకాదా ? తానే యధికుండని విర్రవీగుచున్నావాఁడట తాను నన్ను గాపాడుచున్నానని నీ యొద్ద జెప్పెనట నిజమేనాయని యడిగిన నేను నివ్వెరపడి, స్వామీ ! అది మంచి సమయముకాదు. వాసుదేవుండు మీ కాప్తుండు కాదా ? కాల విశేషమున నాప్తులు తొందరపడినను శాంతస్వభావముగలవారు మన్నింతురని యెంతయో బోధించితిని. కాని నా మాటలు వినినకొలది యతని కాగ్రహమెక్కుడైనది. రుద్రరూపముదాల్చి యట్టహాసము జేయుచు ద్రిశూలము గిరగిరం ద్రిప్పదొడంగెను. తదీయరూపముజూచి నేను వెరచి పారిపోవ బ్రయత్నించునంతలో నాప్రాంతమందున్న పార్వతి మంచిమాటలు జెప్పి కోపము జల్లార్చినది. మీ తగువులు మేము తీర్పజాలుదుమా ! దేవతలను, మునులను, దిక్పాలురను, బ్రహ్మను వెంటబెట్టికొని తన యొద్దకు దీసికొనిర్మమని చెప్పెను. మరల సభజేసి యందులో వాదించునట. తాను రమ్మనిన దేవతలు, మునులును, దిక్పాలురు వత్తురుగాని తదాజ్ఞాబద్దులై మీరు వత్తురా ? మీరక్కడికి బోవనేల తానే మీ యొద్దకు రారాదా ? ఈ మాటలక్కడనే చెప్పవలయునని తలంచితిని కాని బ్రభువులతో బలుపలుకులు పలుకరాదు. మొదటనే విశ్వరూపము దాల్చియున్నవాడు గదాయని తలయూచి మీ యొద్దకు వచ్చితిని. పిమ్మట దేవరచిత్తమని పలికి యూరకొనియెను.

అప్పుడు చతుర్భుంజుండు మేలు మేలు మంచిసందేశము దీసికొని వచ్చితివి. పరోక్షమునందు ప్రగల్భములు కొట్టినట్లు సమక్షమందు సాగవు మునులును, సురులును, దిక్పాలురును మాప్రతాపము గన్నులార జూతురుగాక వేగబోయి వారిందీసికొనిరమ్ము పొమ్మని పలికిన నారదుండు, స్వామీ ? మీరు కైలాసమునకు వత్తురా ! యీ సభ యెక్కడ జరుగునని చెప్పవలయును. వైకుంఠమునందే యీ సభ జరిగించిన యుక్తముగా నుండునని నా యభిప్రాయము. అ కొండరుప్పలకన్న యీ పట్టణభూములు రమ్యములు కావాయని యడిగిన దానవాంతకుండించుక చింతించి అవును మన మతని యొద్దకుబోనేల అతనినే యిచ్చటికి రమ్మనుము. లేనిచో మువ్వురకు సంబంధములేని చోట సభనేరుపరుపవలయు. నీ మాట శివుని కెరింగించిరమ్మని చెప్ప- నారదుండు సంతసించుచు వాసుదేవుని యానతింగైకొని బ్రహ్మ యొద్దకుంబోయి హరిహర కలహ ప్రకారము సభావృత్తాంతమును జెప్పి యతనికి రోషమెక్కించి మూడు లోకములందుగాక వేరొకచోట సభజేసినచో వత్తునని యుత్తరం వాయించిపుచ్చుకొని యప్పుడె కైలాసమునకు బోయెను.

శంకరుండు నారదుంజూచి వాసుదేవ చతుర్ముఖులతో నాసందేశము దెలిపి తివా ? వచ్చుటకు సమ్మతించితిరాయని యడిగిన దేవముని చేతులు నలిపికొనుచు, స్వామీ ! ఇప్పుడు మునుపటి హరియ వెనుకటి బ్రహ్మయు ననుకొనుచున్నారు కారు కారు. వారి యభిప్రాయములు చాలమారినవి. కపాలవాణి యాజ్ఞానుసారము వచ్చుటకు మేము కింకరులమాయేమి యని నా మాటలు విని యాక్షేపించిరి. మిమ్మె యచ్చటికి రమ్మని పలికిరి. అప్పుడు నేనొక యుపాయము చెప్పితిని. యీ సభ మీ మూడులోకములయందు గాక మేరుపర్వతశిఖరమున గావించుటకును అచ్చటికందరు వచ్చుటకు నిరూంచితిని. అందులకు మీరును సమ్మతింపవలసినదే అందరు గలసినపిమ్మట నా సభయందు వారి నీ మాట ముదరింపవచ్చును. ఇప్పుడేమియు నడుగవలదని చెప్పి యొప్పించి సభాదివసంబు నిరూపించి తదనుజ్ఞనుగయికొని వాసుదేవ చతుర్ముఖుల యొద్ధకరిగి వారికత్తెరం గెరింగించి సభకు వారివారి పరివారములతో వచ్చునట్లాడంబడిక జేసి యటగదలి నాకంబునకుంబోయి పురుహూతునిచే నర్చింతుడై యిట్లనియె

దేవేంద్రా ! యిప్పుడిందుగూడ సావకాశముగా మాట్లాడుటకు సమయము కాదు. ఇప్పుడు త్రిమూర్తులకు నలవికాని కలహములు బలసినవి. మువ్వురుం గలసికొని ప్రసంగములు జేయుదురట. మేరు శిఖరాగ్రమున సభజేయుటకు నిశ్చయించిరి. తత్ప్రదేశమంతయు మూడు దినములలో బాగుచేయించి యలంకరింపవలయునని త్రిమూర్తులును నీతో జెప్పమనిరి పెక్కేల హరిహరహిరణ్యగర్భుల పట్టణములకన్నను, స్వర్గము కన్నను తత్ప్రభాభవనము సొంపుగా నండవలయును దేవతలతో, మునులతో, దిక్పాలురతో, సిద్ధులతో, సాధ్యులతో, విద్యాధరాది పరిచారకులతో వచ్చి నీవందు వేచియుండవలయు నేటికి నాల్గవనాటి కందరు నచ్చటికి వత్తురని యెన్నియో చెప్పి నారదుం డెందేనిం జనియెను అని యెరింగించి యమ్మహాశక్తి శంకరాచార్యునికి దదనంతరో దంతం బిట్లని చెప్పదొడంగెనని మణిసిద్ధుండు గోపాలునితో నవ్వలిమజిలీయందా కధాశేషము వక్కాణింప దొడంగెను.

అని యెరింగించి మణిసిద్ధుం డప్పుడు వేళయతిక్రమించుటయు గథ జెప్పుట చాలించి పరమానందకందళిత హృదయారవిందుండైయున్న శిష్యునితోగూడ గ్రమంబున నవ్వలిమజిలీ జేరెను.

ఇది శ్రీ మధిర సుబ్బన్నదీక్షితకవి రచితమైన కాశీయాత్రాచరిత్రమను మహా ప్రబంథమున శంకరాచార్యచరిత్రము. అష్టమోల్లాసము.

సంపూర్ణము

శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ