కాశీమజిలీకథలు/అయిదవ భాగము/ఉత్తరఖండానుబంధము
శ్రీరస్తు
కాశీమజిలీకథలు
ఉత్తరఖండానుబంధము
కాదంబరి
శూద్రకమహారాజు కథ
గీ. పుడమి గలిభయమునఁ బ్రోగుపడిన కృతయు
గంబనఁగ సర్వధర్మప్రకాశమగుచు
సారవేత్రవతీనదీతీరమందు
విదిశ యను రాజధాని సంపదలఁ బొదలు.
అప్పట్టణంబున కధినాయకుండై శూద్రకుండను రాజు సకలనృపశిరస్సంధానితశాసనుండై రెండవ పాకశాసనుండువోలె భూమండలమంతయు నేకాతపత్రముగఁ బాలించుచుండెను.
అన్నరవరుం డనవరతదానజలార్ద్రీకృతకరుండై దిగ్గజంబువోలెఁ బ్రతిదివసోపజాయమానోదయుండై ప్రభాకరుని చందమున నొప్పుచు సర్వశాస్త్రములకు దర్పణమనియు, గళల కుత్పత్తిస్థానమనియు, సుగుణములకుఁ గులభవనమనియు, మిత్రమండలమున కుదయశైలమనియు, రసికుల కాశ్రయుఁడనియు, ధనుర్ధరులకుఁ బ్రత్యాదేశమనియుఁ బొగడ్త కెక్కెను.
మరియు, దృఢముష్టినిష్పీడనంబునం బయలువెడలిన జలధారయుంబోలె నా భూపాలు కేలంగ్రాలు కరవాలంబు కరికటతడగళితమదజలాసారదుర్దినములగు సంగర సమయములయందు వీరభటకవచసహస్రాంధకారమధ్యవర్తినియై యున్న జయలక్ష్మి నభిసారికవోలెఁ బెక్కు సారు లతనిచెంతకుఁ దీసికొనివచ్చినది.
అయ్యవనీపతి కువలయభరంబు వలయంబువోలె నవలీల నిజభుజాగ్రంబున భరించుచుఁ బలుమారు నీతిశాస్త్రములెల్ల నవలోకించి బుద్ధిబలముచే బృహస్పతినైనం బరిహసించుచుఁ బ్రబుద్ధులని వాడుకజెందిన కులక్రమాగతులగు మంత్రులు సేవింప సమానవయోవిద్యవిభూషితులు ప్రేమానురక్తహృదయులు నసమసమరక్రీడాభిరతులునగు రాజసుతులతోఁ గూడికొని క్రీడించుచుఁ బ్రథమవయస్సు సుఖముగా వెళ్ళించెను.
సీ. అతులస్వరంబు లుప్పతిలంగ వీణ గై
కొనిపాడు హాయిగాఁ గొంతసేపు
మహితప్రబంధనిర్మాణక్రియారత
స్వాంతుఁడై యలరారుఁ గొంతసేపు
దర్శనాగతతపోధనజనారాధనా
కుతుకాత్ముఁడై యుండుఁ గొంతసేపు
చర్చించు సకలశాస్త్రప్రసంగంబులఁ
గోవిదావళిఁ గూడి కొంతసేపు
గీ. కోర్కె చిత్తరువులు వ్రాయుఁ గొంతసేపు
గురుపురాణము లాలించుఁ గొంతసేపు
జంతుసంతతి నాడించుఁ గొంతసేపు
అంగనాభోగవిముఖుఁడై యనుదినంబు.
మిగుల సుందరుండగు నా నృపనందనుండు ప్రథమవయస్సున స్త్రీజనమును దృణముగాఁ జూచుచు సంతానార్ధులగు మంత్రులచే బోధింపఁబడియు సురతసుఖంబునందలి విరోధంబునంబోలె దారసంగ్రహం బనుమతింపఁడయ్యెను.
ఒకనాఁడు ప్రొద్దుట నప్పుడమిరే డాస్థానమంటప మలంకరించియున్న సమయంబున నంగనాజనవిరుద్ధముగ వామకక్షమునఁ గౌక్షేయక మిడికొని సన్నిహితపన్నగంబగు చందనలతవోలె భీషణరమణీయమగు నాకారముతో బ్రతీహారి యరుదెంచి జానుకరకమలంబులు పుడమిసోక మ్రొక్కుచు నిట్లనియె.
దేవా! కుపితుండగు దేవేంద్రుని హుంకారంబున నేలంబడిన త్రిశంకుని రాజ్యలక్ష్మియో యన దక్షిణదేశమునుండి మాతంగకన్యక యోర్తు పంజరముతో నొకచిలుకను దీసికొనివచ్చి ద్వారదేశమునఁ నిలువంబడి దేవరతో నిట్లు విజ్ఞాపన చేయుచున్నది. భువనతలంబునగల రత్నములకెల్లఁ గల్లోలినీవల్లభుండు వోలె దేవరయే యేకభాజనమని తలంచి యాశ్చర్యభూతమగు నీ విహంగమరత్నము నేలికపాదమూలమును జేర్చు తలంపుతో నరుదెంచితిని. దర్శనసుఖం బనుభవింపఁ గోరుచున్నదాన.
అని తత్సందేశ మెరింగించిన ప్రతీహారి వచనంబులు విని యా భూనేత కుతూహలోపేతుఁడై యాసన్నవర్తులగు మిత్రులమోములు పలక్షించుచు దీనందప్పేమి యున్నది, ప్రవేశపెట్టుడని యాజ్ఞాపించుటయు నా ప్రతీహారి సత్వరము యరిగి యమ్మాతంగకుమారిం దీసికొని వచ్చినది.
ముదిమిచేఁ బండిన శిరము గలిగి నేత్రకోణము లెఱ్ఱనిజీరలతో నొప్పుచుండ జవ్వన ముడిగినను బరిశ్రమ గలుగుటచే శిథిలము కాని నేమే బింకముతోఁ దెల్లని వస్త్రములు ధరించి వృద్ధమాతంగుఁ డొకఁడు ముందు నడచుచుండఁ బైడిశలాకలచే రచింపఁబడినను జిలుకరెక్కలకాంతులచే మరకతమయమైనదివోలెఁ బచ్చపడియున్న పంజరమును జేతంబూని కాకపక్షంబులు చలింప నొకచండాలబాలకుఁడు తోడరా నసురాపహృతంబగు నమృతంబు వేల్పులకిడ నవధరించిన మధుసూదనుని మోహినీరూపమును బురడించు మీగాళ్ళదనుక మేలిముసుగు వైచికొనుటచే సంచరించు నింద్రనీలపుబొమ్మవలె నొప్పుచు సంతతము వెన్నుని యురమందు వసించుటఁ దదీయశ్యామప్రభాసంక్రమణంబున నల్లబడిన మహాలక్ష్మియుం బోలె బలరాముని హలాపకర్షణభయంబునఁ బారివచ్చిన యమునచాడ్పునఁ గుపితహరనయనదహ్యమానుండగు మదనుని ధూమమున మలినీకృతయగు రతి ననుకరించుచు నచిరోపారూఢయౌవనయై వచ్చుచున్న యామాతంగకన్యక నిముషలోచనుండై యా రాజమహేంద్రు డీక్షించి విస్మయావేశితహృదయుఁడై యిట్లు తలంచెను.
అన్నన్నా! తగనిచోట హాటకగర్భున కక్కజమగు రూపుగల్పించు ప్రయత్న మేమిటికిఁ గలుగవలయును. అక్కటా! నిరతిశయసౌందర్యవిశేషంబునం బొలుపొందు నియ్యిందువదనను ముట్టరాని నికృష్టకులంబునం బుట్టించెగదా! మాతంగజాతి స్పర్శభయంబున స్రష్ట ముట్టకయే యిప్పూబోణిని నిర్మించెనని తలంచెదను. కానిచోట దదీయకరతలస్పర్శక్లేశితములగు నంగముల కింత వింతకాంతియు లావణ్యము గలిగియుండునా? ఇసిరో! సరసిజభవుం డెప్పుడు నసదృశసంయోగమునే చేయుచుండును గదా? అతిమనోహరాకృతిగల యీనాతి క్రూరజాతియం దుదయించుటచే నిందితసురతయై యసురసంపదవలె నభోగ్యమై యున్నదని నాడెందము మిక్కిలి పరితాపము జెందుచున్నది.
అని యతఁడు తలంచుచుండ నక్కన్యారత్నము మ్రోలకువచ్చి యించుక వంగి ప్రోడవలె నమస్కరించి యమ్మణికుట్టిమంబున నోరగా గూరుచున్నంత నావృద్ధమాతంగుఁడు పంజరములో నుండగనే చిలుకను చేతితో నంటి సవరించుచు గొంచెము దాపునకువచ్చి ఱేనికిం జూపుచు నిట్లనియె. దేవా! యీ చిలుక సకలశాస్త్రార్ధములు గుర్తెరుంగును. రాజనీతియందును పురాణకథాలాపమునందును దీనికి మంచినైపుణ్యము గలదు. కావ్యనాటకాలంకారగ్రంథములు జదువుటయేకాక స్వయముగా రచింపఁగలదు. వీణావేణుమురజప్రభృతివాద్యవిశేషములసార మిదియే చెప్పవలయును. చిత్రకర్మయందు ద్యూతవ్యాపారమునందును గజతురగస్త్రీలక్షణజ్ఞానమందును దీనిని మించినవారు లేరు. ప్రణయకలహకుపితులగు కాముకులం దేర్చు నేర్పు దీనికే కలదు. పెక్కులేల? యాపతత్రిప్రవరంబు సకలభూతలరత్నభూతమని చెప్పునొప్పును దీని పేరు వైశంపాయనము. సర్వరత్నములకు జలనిధివోలె దేవర ముఖ్యభాజనమని తలంచి మా భర్తృదారిక యీ చిలుకను మీపాదమూలమునకుఁ దీసికొనివచ్చినది. దీనిం దయతోఁ బరిగ్రహింపుఁడని పలుకుచు నాపంజర మానృపకుంజరుని ముందర నిడి యా వృద్ధుం డించుక యెడముగాఁ బోయెను.
అప్పు డప్పతంగపుంగవము రాజాభిముఖముగా నిలువంబడి కుడిచరణ మెత్తి మిక్కిలి స్పష్టములగు వర్ణస్వరములచే సంస్కరింపఁబడిన వాక్కులతో జయశబ్దపూర్వకముగా నీపద్యముఁ[1] జదివినది.
గీ. అనఘ! భవదరి నృపవధూస్తనయుగంబు
చిత్తగతశోకదహనంబుచెంత నిలిచి
యశ్రుజలపూరమునఁ దీర్ధమాడి మరి వి
గతమహాహారమై వ్రతిస్థితి దనర్చు.
ఆ చిలుక పలుకులు విని యానృపతిలకుండు వెఱఁగు జెందుచు సంతసముతోఁ జెంతనున్న కుమారపాలితుండను వృద్ధమంత్రిం జూచి, ఆర్యా! యా చిలుక పలుకులయందలి స్పష్టతయు మాధుర్యమును వింటివా? ఇది వర్ణమాత్రానుస్వారస్వరసంకరము గాకుండ నభివ్యక్తముగాఁ బలుకుటయే మొదటిఁ జిత్రము. మఱియు మనుజుండువోలె బుద్ధిపూర్వకమగు ప్రవృత్తితో నభిమతవిషయమై కుడిచరణమెత్తి జయశబ్ద పూర్వకముగా నతిపరిస్ఫుటాక్షరముగా పద్యము జదువుట గడుంగడు నబ్బురము గలుగఁజేయుచున్నది తరుచు పక్షులును, బశువులును నిద్రాహారమైథునభయసంజ్ఞామాత్రవేదులు గదా?
అని పలుకుటయు గుమారపాలితుఁ డించుక నవ్వుచు, దేవా! ఇది యేమి చిత్రము. శుకశారికాప్రభృతివిహంగమువిశేషములు మనుష్యులచేఁ చెప్పబడిన మాటలం బల్కుచుండుట దేవర యెరుంగనిదియా? పూర్వము చిలుకలు మనుజులువలె బలుకుచుండునవి అగ్ని శాపంబునం జేసి శుకవచనము లపరిస్ఫుటములైనవి.
అని యతండు సమాధానము జెప్పుచుండఁగనే చండకిరణుం డంబరతలమధ్యవర్తి యయ్యెనని తెలుపు భేరీనినాదముతోఁ గూడ మాధ్యాహ్నికశంఖధ్వని బయలువెడలినది.
ఆ ధ్వని విని యమ్మహారాజు స్నానసమయమయ్యెనని తటాలున సింహాసనము నుండి లేచి రాజలోకమెల్ల సంభ్రమోత్సేకముతో గద్దియలు విడిచి వినయవినమితోత్తమాంగులై నిలువంబడిన శిరఃకంపమున వారికిఁ బోవుట కనుజ్ఞ నిచ్చుచు నచ్చండాలకన్యకతో మేము వచ్చు నందాక నిందుండుమని నియమించి యచ్చిలుకను లోపలకుఁ దీసికొనిపోయి స్నానపానాశనాదివిధులం దీర్పుమని తాంబులకరండవాహినికిం జెప్పి సముచితమిత్రలోకము సేవింప నభ్యంతరమందిరమున కరిగెను.
అందు స్నానసంధ్యావందనదేవపూజాది నిత్యక్రియాకలాపములు నిర్వర్తించుకొని రాజబంధువులతో గూడ నభిమతరస్వాదంబున బ్రీతుండగుచు భోజనము గావించి ప్రతీహారి మార్గ మెరింగింప మనోహరాలంకారమండితంబైన విశ్రమమంటపమునకుఁబోయి శయనతలంబునఁ గూర్చుండి తాంబూలము వైచికొనుచు నాప్తవర్గంబు చుట్టునుం బరివేష్టించి వినోదకథలచే చిత్తము రంజింపఁజేయుచుండ నిండువేడుకలతో నుండి యాభూమండలాఖండలుఁడు వైశంపాయనమును దీసికొనిరమ్మని బ్రతిహారి కాజ్ఞాపించుటయు నదివోయి యత్యంతశీఘ్రముగా నా జిలుకపంజరము దెచ్చి రాజు మ్రోలబెట్టెను. అప్పుడా భూపతి చిలుకంజూచి పతంగపుంగవా! అభిమతభోజనంబున దృప్తుడవైతివే? యని యడిగిన నది దేవా! సమదకోకిలలోచనరుచిం బురడించు జంబూఫలంబు లెన్నేని యాస్వాదించితిని. హరినఖరభిన్నమాతంగకుంభార్ద్రంబులగు ముక్తాఫలంబులం బోలిన దాడిమీబీజంబుల రుచి యేమనవచ్చును? అన్నన్నా! నళినీదళంబులువోలె హరితములగు ద్రాక్షఫలముల మాధుర్య మెప్పటికైన మరువవచ్చునా? అయ్యారే! ప్రాచీనములగు నుసిరికాయల పస యనుభవించి తీరవలయును. పెక్కేల! భవదంతఃపురకాంతలు స్వయముగాఁ గరతలములచే నాకుఁ దినిపించినవన్నియు నమృతాయమానంబులై యున్నవని పెద్దగాఁ బొగడెను.
ఆ మాట లాక్షేపించుచు నా క్షితిపతి పక్షీంద్రమా! యది యట్లుండనిమ్ము. నీ వేదేశమునం జనించితివి? నీ తలిదండ్రు లెవ్వరు? నీకు వేదశాస్త్రపరిచయ మెట్లు గలిగినది? ఇతర విద్యావిశేషము లెట్లు గ్రహించితివి? జన్మాంతరానుస్మరణమా! లేక వరప్రదానమా? అదియునుం గాక శుకరూపము దాల్చి ప్రచ్ఛన్నముగాఁ దిరుగుచున్న యొకానొకదివ్యుఁడవా? నీకెన్ని యేండ్లున్నవి? యింతకుముందు నీ వెందుంటివి?
నీ కీపంజరబంధము చండాలకన్యకాహస్తప్రాప్తియు నెట్లు కలిగినది? నీ వృత్తాంతము విన మిక్కిలి కుతూహలమగుచున్నది. యెఱింగించెదవే యని యడిగిన నాపతంగప్రవర మాత్మగతంబున నించుక ధ్యానించి యిట్లనియె.
చిలుక కథ
దేవా! నాయుదంతము కడు పెద్దది. వినుటకు దేవర కిష్టమేని వక్కాణించెద నాకర్ణింపుఁడు. వింధ్యారణ్యాంతర్భాగంబగు దండకారణ్యమునఁ బ్రసిద్ధిజెంది యున్న పంచవటితీరమునఁ కనతిదూరములో నున్న పంపాసరోవరము పశ్చిమభాగంబున శ్రీరామశరప్రభంజితములగు సప్తతాళములప్రక్క నొక్కవృద్ధశాల్మలీవృక్షము గలదు.
అత్తరువరంబు మూలంబు దిక్కిరి కరంబులఁబోని జరదజగరంబుచేఁ జుట్టుకొనఁబడి యాలవాలము గట్టఁబడినట్టొప్పుచు శాఖాసమూహములచేఁ దిగంతముల నావరించి విలయవేళాతాండవప్రసారితభుజుండగు శంకరు ననుకరించుచు సాగర జలంబులం గ్రోలి యిటునటు సంచరించుచుఁ బక్షులవలె శాఖాంతరములయం దణఁగియున్న మేఘంబులచేతఁగూడ నావరింపబడని యగ్రభాగము గలదై రవితురంగముల కవరోధము గలుగఁజేయుటచే నలయిక జెందిన యవ్వారువంబులముఖములనుండి వెల్వడుఁ ఫేనపుంజమో యనఁబడు సితతూలికామాలికలచే నగ్రశాఖలు బ్రకాశింప నాకల్పస్థాయియగు నున్నతస్కంధముతో నొప్పుచు నబ్బూరుగు మేరువువలెఁ ప్రఖ్యాతి జెందియున్నది.
మఱియు నత్తరుపు విస్రబ్ధముగా జనుల కారోహింప శక్యము కానిదగుట ఘాతుకులవలనఁ దమ కపాయము రాదని తలంచి శాఖాంతరముల యందునుఁ గోటరోదరములయందునుఁ బల్లవాంతరములయందును జీర్ణవల్కలవివరములయందును మిగులనవకాశము గలిగియుండుటచేత నానాదేశములనుండి వచ్చి శుకసంతతులు గూడులు కట్టుకొని హాయిగా సుఖించుచున్నయవి.
అందొక జీర్ణకోటరమందు జాతిపులుగులతోపాటు కులాయము నిర్మించుకొని భార్యతోఁ గూడ మాతండ్రి చిరకాలము సుఖించెను. విధివశంబున నతనికి ముదిమియందు నేనొక్కరుండ పుత్రుండ నుదయించితిని. నేను బుట్టిన యాక్షణము నందే యతిప్రబలమగు ప్రసవరోగంబున మా తల్లి పరలోకమున కతిథిగా నఱిగినది.
అభిమతజాయావినాశశోకంబున స్రుక్కుచుండియు మా తండ్రి సుతస్నేహంబున నాశోక మడచికొని తానొక్కరుండ యేకొరంతయు రానీయకుండ నన్నుఁ బెనుచుచుండెను.
నా తండ్రి మిగులవృద్ధు డగుట శిథిలములగు రెక్కలతో నెగరలేక వణకుచు స్రుక్కినముక్కుకొనచేత ఫలములజీర నశక్తుండై పరనీడములక్రింద నక్కడక్కడ జారిపడిన ఫలశకలంబులును తండులకణంబులును దెచ్చి నా కిచ్చుచు మద్భుక్తావశిష్టములచేఁ దాను సైత మాకలియడంచుకొనుచుఁ కొన్నిదినములు గడిపెను.
ఇట్లుండ నొకనాఁడు ప్రాతఃకాలమున లేతయెండచే వనతరుశిఖరపల్లవంబులు వింతకాంతిఁ బ్రకాశింపుచుండ గొన్నిచిలుకలు మేతకై దిక్కుల కరుగ, మరికొన్ని పిల్లలతో గూడ గూడులయం దణఁగియుండ నిశ్శబ్దంగా నవ్వవస్పతి శూన్యమైనదివోలె నొప్పుచుండెను.
అప్పుడు నా తండ్రియు నన్ను రెక్కలలోఁ బెట్టుకొని ముద్దాడుచుండ నేనును బాల్యంబున నెగురటకు రెక్కలు రామింజేసి యతని యక్కులోఁ జిక్కి మిక్కిలి సంతోషముతో నుంటిని. అట్టి సమయమున నవ్వనమందు నాకస్మికముగా గుహాసుప్తంబులగు మృగేంద్రంబులు దద్దరిల్ల వనచరంబులు పరవ వరాహంబు లార్వ శార్దూలాదిక్రూరమృగసమూహంబు వెరబునం బార గంగాప్రవాహంబు ననుకరించుచు
సీ. ఇటు రండు గజము లిచ్చటనుండు తుండ వి
ధ్వస్తపంకేజగంధంబు వెడలె
నిందుఁ దప్పక వసియించుఁ గ్రోడములవి
మసలుముస్త వాసనలు గడంగె
వనమహిషంబు లవ్వల నుండు, ఱేఁగె గొ
మ్ములఁ జిమ్ము వల్మీకముల రజంబు
కరికలభంబు లక్కడిఁ గూడు, సల్లకీ
రసకషాయామోగమెసఁగ నెసఁగె.
గీ. రుధిరపాటల కరికుంభ రుచిర మౌక్తి
కాంచితాంబీపదంబు లిందలరు సింహ
గణములవె చూడుఁ డభినవఘాసకబళ
హరిణరోమంధ పేనసంహతులు దోచె.
చ. ఇదె చమరీమృగాళి వసియించెడు తావట నాభివాసనల్
బొదలెడుఁ బారుచున్న వవె మూకలుగా మెకముల్ సమంబుగా
వదలుఁడు వేటకుక్కలను భద్రమువింట శరంబుగూర్చుఁడ
ల్లదె మెక మేదియోచనె రయంబునఁ గొట్టుఁడు పట్టుడుద్ధతిన్.
అని యొండొరులతోఁ బలుకుచున్న వేటకాండ్ర ఘోషమొండు వినంబడినది.
అశ్రుతపూర్వమగు నారొద విని నేను బాలుండనగుట చెవులు బీటలువార భయముచేత మేను గడగడ వడంక వివశత్వము నొంది సమీపము నందున్న తండ్రియొక్క జరాశిథిలములగు రెక్కలసందున దూరితిని.
అప్పుడా యరణ్య మంతయుఁ బారుచున్న గ్రూరసత్వముల యార్పులచే నల్లకల్లోలమైనది. మఱికొంతసేపునకా రొదయంతయు నణఁగి యయ్యడవి కల్లోలశూన్యమగు సాగరము లాగున నిశ్శబ్దమై యొప్పినది.
అట్టి సమయమున నేను శైశవచాపల్యంబునంజేసి యదియేమియో యని మా తండ్రి రెక్కలసందునుండి బైటికి వచ్చి కంఠముచాచి భీతిచే గదలుచున్న తారకలతో యారొదవచ్చిన దెసకే దృష్టి బరికించితిని
అప్పుడా వంకనుండి కార్తవీర్యార్జునభయంబున బారి వచ్చుచున్న నర్మదానది పగిది జంఝామారుతవికీర్ణమగు తమాలకాననము వడువున నేకీభూతమగు కాళరాత్రి సంఘాతముభాతి సూర్యకిరణాకులమైన యంధకారము తీరున నయ్యరణ్య మంతయుఁ జీకటిఁ గలుగఁజేయుచు ననేకసంఖ్యాకమగు శరబసైన్యము నా కభిముఖముగా వచ్చుచుండఁ జూచితిని.
ఆ సైన్యమధ్యంబున నుక్కు చే రచియింపబడినవో యనునట్లు కర్కశములగు నవయవములు గలిగి శ్యామలదేహప్రభాప్రవాహంబున నయ్యడవి యంతయు నిండింపుచు నెఱ్ఱనిదృష్టులు వింధ్యశిలాతలవిశాలంబగు నురంబును మెఱయ స్థూలవరాటికామాలికలచే నలంకరింపంబడి పతులం జంపవలదని తన్నుఁ బ్రతిమాలికొన వచ్చిన యాఁడుసింగంబులోయనఁ గౌలేయకుటుంబిను లనుసరించిరాఁ జమరీవాలంబులు గజదంతంబులు కరిగండముక్తాఫలంబులు మయూరపింఛంబులు పిసితాహిరంబులుగైకొని శబరపరిజనులు వెంటనడువఁ గృతాంతుని యంశావతారమన మహామోహిని సోదరునివలె నొప్పుచుఁ బ్రథమవయసుననున్న మాతంగుడను పుళిందనాథుం గాంచితిని, వారాడుకొను మాటలు వినుటచే వాని పేరు మాతంగుఁడని యెఱింగితిని.
ఆహా! వీని జీవితము మోహప్రాయము. చరితము సాధుజనగర్హితము. ఆహారము మద్యమాంసాదికము. పరిశ్రమయంతయు జీవహింసయంద, త్రాగుటయే యుత్సవము, చెరబట్టిన యుత్తమస్త్రీలే కళత్రములు, మృగములతో సహవాసము, పశురక్తంబున దేవతార్చనము, మాంసమున బలికర్మ ఇట్టి వీనికిఁ గరుణ యెట్లు కలుగును. శాంతి పేరైనం దెలియునా? క్షమ కెంతదూరము. వీనికి వివేక మెన్నఁడైనఁ గలుగు నేమో! యని నే నాలోచించుచుండఁగనే యమ్మాతంగుఁ డరణ్యసంచారప్రయాస మపనయించుకొనుటకై యా బూరుగునీడ కరుదెంచి కోదండ మెక్కు డించి పరిజనోపనీతంబగు పల్లవాసననంబునఁ గూరుచుండెను.
అప్పుడు శబరయువకుఁ డొకండు వడివడి నాసరోవరంబున కరిగి చేతులతో జలంబుపైనున్న మలినంబు విడఁద్రోయుచుఁ గమలినీపత్రపుటంబున నీరువట్టి బిసతంతువులఁ గొన్నిటిని కోసికొనివచ్చి యాయేలిక కర్పించెను. వాఁడా జలంబులం గ్రోలి చంద్రకిరణంబులం గ్రసియించు రాహువువలెఁ దామరతూడుల నమలి క్షుత్పిపాసల నపనయించుకొనియెను. వాఁడట్లు మాచెట్టునీడఁ గొంతసేపు విశ్రమించి పిమ్మట పుళిందసేనాపరివృతుండై యెందేనింబోయెను.
వారిలో నొక వృద్ధపుళిందుఁడు తినుటకు మాంస మబ్బమింజేసి యాఁకలి గొని వారితోఁబోవక యత్తరుమూలమున ముహూర్తకాలము జాగుజేసి మా యాయువుల గ్రోలువాడువలె నెఱ్ఱనిగుడ్లుగల దృష్టులతో నా వృక్షమెక్క నిశ్చయించి యామూల చూడముగాఁ దలపైకెత్తి చూచెను.
ఆ చూపువలననే శుకకులముల ప్రాణముల కుత్క్రాంత సమయమైనది. కటకటా! అక్కటికము లేనివారికిఁ జేయరాని కృత్యము లుండునా? అనేక తాళోఛ్రాయముగల యాపాదపమును సోపానములు గలదానివలె సులభముగానెక్కి యెగిరీ యెగరని పిల్లలను, ఎగరనున్న నిసువులను, గొన్ని దినములక్రిందటఁ బుట్టిన పిట్టలను, రెక్కలు వచ్చుచున్న కూనలను శాల్మలీకుసుమ శంకాజనకములగు పోతముల నరసి యరసి శాఖాసందులనుండియు, గోటరములనుండియు, వేరువేరుఫలములనువలె పెక్కురకముల శుకశాబకముల గ్రహించి ప్రాణములను పోగొట్టి నేలం బడవైచుచుండెను.
అప్పుడు మాతండ్రియు నకాండమునఁ దటస్థించిన యప్రతీకారము ప్రాణ హరమునగు నుపద్రవమునుజూచి మరణభయంబున మేను గంపమునొంద నుద్ర్భాంతదృష్టులతో నలుమూలలు సూచుచుఁ దాలువులెండ నన్ను రక్షించు నుపాయంబుగానక తన రెక్కలసందున నిముడ్చుకొనిఁ గర్తవ్యతామూఢుండై ముక్కునఁ గరచుకొని యుండెను.
పిమ్మట నప్పాపాత్ముఁడు క్రమమ్మునఁ గొమ్మలపై కెక్కి మేమున్న తొర్రలో యమదండమునుంబోలు తన బాహుదండమును జొనిపి సారెకు ముక్కుకొనచేఁ గరచుచు నరచుచున్న మా తండ్రిని గట్టిగఁబట్టి పైకిఁదీసి గొంతునులిమి ప్రాణములు బోఁగొట్టెను.
మిగుల నల్పదేహము గలిగి భయముచేఁ దండ్రి రెక్కలసందున నడఁగియున్న నన్ను నాఁడాయుశ్శేషము గలుగఁబట్టి బరిశీలింపడయ్యెను.
ప్రాణములు విడచి తలవ్రాలవైచిన నా తండ్రిని యానిర్దయుండు అధోముఖముగా నేలంబడవిడచెను. నేనును మాతండ్రితోఁగూడ నేలం బడితినికాని దైవవశంబున జేసి రాశిగానున్న యాకులపై బడుటచే నా కింతయేని యాయాసము గలిగినదికాదు.
అక్కిరాతుండు చెట్టుదిగకమున్న నేను బాలుండనగుట దండ్రిచావు గణింపక ప్రాణపరిత్యాగయోగ్యమగు కాలంబున సైత మించుక ఱెక్కలు విదళించుచుఁ గొంచెము కొంచె మెగిరి కృతాంతముఖకుహరమునుండి వెల్వడినట్లు నాతిదూరములో నున్న యొకతమాలవిటపిం గాంచి దట్టమైన యా చెట్టు మొదలుచేరి పక్షసవర్ణములగు పర్ణములసందున దాగియుంటిని.
అక్కిరాతుఁడు గ్రమముగా నా చెట్టునంగల పిట్టల నెల్లఁబట్టి చెట్టుదిగి యసువులూడి క్రిందఁబడియున్న చిలుక నిసువులను జిక్కములోఁ బెట్టుకొని మాతంగుఁ డరిగిన తెరవుబట్టి యతివేగముగాఁ బోయెను.
తరువాత నేనించుక తలయెత్తిచూచుచు నాకు కదలినను వాఁడే వచ్చుచున్న వాఁడని బెదరుచు పితృమరణశోకఖిన్నుఁడనై మిగుల దాహమగుచుండ నీరుండుతా వరయుచు నామూలమునుండి యెగర దొడంగితిని. ఱెక్కలతో నెగరలేక పాదములతో నడచుచు ననభ్యాసంబునం జేసి యడుగడుగునకు నేలఁబడుచు నెగరబోయి యడ్డముగా బడి యొంటిఱెక్కతో నానుచు నొగర్చుచు మేనెల్ల ధూళిగాఁగఁ నిట్లాయాసముతోఁ గొంచెము దూరమైనను నడువలేక మిక్కిలి దాహము వేధింప మనంబున నిట్లు తలంచితిని.
ఆహా? అతి కష్టములైన యవస్థలయందుగూడఁ బ్రాణులకు జీవితమందు నిరపేక్షత్వము గలుగదుకదా? జంతువులకు జీవితముకన్న నభిమతమైన వస్తువు వేరొండులేదు. నా యందు మిగుల ననురాగముగల తండ్రి పరలోకగతుండైనను నాకు జీవితాశ వదలకున్నది. కటకటా! నా హృదయమెంత కఠినమైనదో? అతండు నాతల్లి పోయినది మొదలు సకలక్లేశములు పడి నన్నుఁబెంచెనే? అట్టివాని ప్రేముడి యంతయు గడియలో మరచిపోయితిని. నా ప్రాణము లెంత కృపణములో? ఉపకారము జేసిన తండ్రి ననుగమించినవి కావు. ఇట్టి సమయములో సైతము నన్ను జలాభిలాష బాధింపుచున్నయది. పితృమరణమును లెక్క సేయని పాతకము నన్నిట్లు బాధింపుచున్నది కాబోలు అయ్యో! జలములు దాపునలేవు, నాలుక యెండిపోవుచున్నది. నడువలేను. వనభూమియంతయు నా తపముచే దప్తమైయున్నది. దాహమునకు నిమిషము తాళజాలను. చూపులకుం జీకటిగ్రమ్ముచున్నది. కటకటా! విధియెంత ఖలుఁడో నాకు వేగము మరణమైనను గలుగజేయకున్నాఁడని యనేకప్రకారములఁ దలపోయుచుంటిని.
ఆ ప్రాంతమందు జాబాలియను మహర్షి యాశ్రమముగలదు. అతని కుమారుఁడు హరీతకుండను వాఁడు సకలవిద్యాపారంగతుండు. సమవయస్కులగు మునికుమారులతోఁ గూడుకొని రెండవ మార్తాండునివలెఁ దపస్తేజంబున వెలుంగుచు నమ్మార్గంబున స్నానార్ధమై పంపాసరస్సునకుఁ బోవుచు దాహపీడితుఁడనై నోరు తెరచుకొని దారిలో నొగర్బుఁచు బడియున్న నన్నుఁ జూచెను.
సత్పురుషుల హృదయములు కరుణాబంధురములు గదా! అట్టి యవస్థతో నున్న నన్నుఁజూచి యమ్మహాత్ముం డంతరంగంబునఁ బరితపించుచుఁ దోడి మునికుమారునితో వయస్యా! అటు చూడుము! ఆ శుకపోతము అజాతప్రతమై తల వాల వైచుకొని యున్నది. శ్యేనాదికము దీనిం బాధింపఁబోలు. దీని ప్రాణములు కంఠగతములై యున్నవి. నీటికొరకుఁ గాబోలు మాటిమాటికి నొగర్చుచు నోరు దెరచుచున్నది. పాపము దీని ప్రాణములు వాయకమున్న జలప్రదేశమును జేర్పుదము లెమ్ము. దీని ప్రాణములు కాపాడిన కడుపుణ్యము రాగలదని పలుకుచు మెల్లన నన్ను మృదులమగు హస్తములతోఁ బట్టికొని యా సరస్స్తీరము జేర్చి దండకమండలము లొకచోటంబెట్టి యతిప్రయత్నముతో ముక్తాఫలంబులంలోని జలబిందువులఁ గొన్నిటి నా నోటం బోసెను.
అప్పుడు నా మేనంతయుఁ జల్లబడినది. పోయిన ప్రాణములు తిరిగి వచ్చినవి. శరీరమున ధారుడ్యము గలిగినది. పిమ్మట న న్నొకచెట్టునీడ నిలిపి తాను స్నానము గావించి నిర్వర్తితనిత్యక్రియాకలాపుండై యమ్మునికుమారుండు మిత్రవర్గముతో జలము వెడలి నన్నొకచేత బట్టికొని తన యాశ్రమమునకుఁ బోయెను.
అధికమహిమాస్పదంబగు నయ్యాశ్రమమున గురుతరయోగనిష్టాగరిష్టుండై యున్న జాబాలిం జూచి నే నంతర్గతంబున నిట్లు తలంచితిని.
ఆహా తపఃప్రభావము! ఈ మునిమార్తాండుని యాకారము శాంతమయ్యు మెరుపుతీగెయుఁబోలెఁ జూట్కులకు మిరుమిట్లు గొలుపుచున్నయది. ఇమ్మహర్షి యుదాసీనుం డైనను ప్రభావసంపన్నుఁడగుట మొదటఁ జూచినవానికి వెరపు గలుగక మానదు. మహాత్ముల నామము స్మరించినంత నెట్టి పాపములైనం బోవుననుచో దర్శనము వచ్చు సుకృతము మాట జెప్పనేల? సకలవిద్యలు నీ మహర్షి ముఖమున నటించుచున్నయవి. అన్నన్నా? ఈ ముదిమి కెంత భయములేదో! యా మహానుభావుని జటాకలాపమును సైతము తెలుపుజేసినది. తేజశ్శాలులలో నీతం డగ్రేసరుఁడు. ఈ మునికుంజరుఁడు కరుణారసప్రవాహము. సంసారసముద్రమునకు సేతువు. సంతోషామృతసారము, శాస్త్రరత్నములకు నికషపాషాణము, ఈ పుణ్యాత్ముని తపోమహిమచేతఁగదా! మృగములిందు జాతివైరము మాని సంచరింపుచున్నవి. అయ్యారే? మహాత్ముల ప్రభావము ఎంత విచిత్రమైనది. అని పెక్కు భంగుల నతని మహిమ నభినుతించుచున్న సమయంబున న న్నాహరీతకుఁడు రక్తాశోకతరుమూలమునకుం దీసికొనిపోయి యొకచోట నిలిపి తండ్రికి నమస్కరించి తానొక మూలఁ గూర్చుండెను.
అప్పుడచ్చటనున్న మునులు నన్నుఁ జూచి శంకించుచు దీని నెచ్చటనుండి తెచ్చితివని హరీతకు నడిగిన నతం డిట్లనియె.
నేను స్నానార్ధమై పద్మసరస్సునకుఁ బోవుచుండగా దారిలో నొకచెట్టుక్రింద నెండతాపమున వాడి దుమ్ములో నోరు దెరచుకొని యొగర్చుచు నీ శుకపోతము నాకుఁ గనంబడినది.
అప్పుడు నాకు దయపుట్టి దీనిని సరస్సునకుఁ దీసికొనిపోయి తోయము ద్రాగించి సేదదీరినంత నిచ్చటికిఁ దీసికొనివచ్చితిని. రెక్కలు వచ్చువరకు నిందొకతరుకోటరమున నిడి, నీవారకణనికరముల చేతను, వివిధఫలరసముల చేతను నేనును నీ మునికుమారులును దీనిం బోషించువారము. రెక్కలు వచ్చిన తక్షణము గగనతలమున కెగిరి యిష్టము వచ్చిన చోటికిఁ బోవునది. ఇదియే నా యభిప్రాయమని పలికిన విని జాబాలి యించుక వేడుకతోఁ దలయెత్తి పుణ్యజలములచేతఁ బవిత్రము చేయువాడుంబోలె నిర్మలమైన దృష్టులచే న న్నుపలక్షించుచు సారెసారెకు సాభిప్రాయముగా వితర్కించి నన్నుఁ జూచి తలయూచి తానుఁ జేసికొన్న యవినయమునకు ఫలం బనుభవించుచున్నాఁడని పలికెను.
తపఃప్రభావసంపన్నంబగు దివ్యదృష్టిచేత సకలప్రపంచమునంగల కాలత్రయవిశేషములు కరతలామలకముగాఁ జూడనోపిన యమ్మహానుభావుఁడట్లు పలికిన తోడనే యందున్న మునులందరు వెరగుపడి, మహాత్మా! ఇది పూర్వజన్మమందెవ్వరు? ఎట్టి యవినయకృత్యము జేసి యిట్టి జన్మమెత్తినది? దీని పేరేమి? ఈ వృత్తాంతము వినుటకు మిగులఁ గుతూహలముగా నున్నది, వివరింపవే! యని ప్రార్ధించిన నతండు మునులారా? దీని చరిత్రము కడువింతయైనది. మనకు స్నానసమయ మగుచున్నది. మీరును నిత్యానుష్టానములు దీర్చుకొని ఫలహారములఁ దృప్తులై రండు. రాత్రి సావకాశముగా నుడివెదనని పలుకగా వారందరు సంతసించి వడిగాఁ బోయి కాల్యకరణీయములం దీర్చుకొని తత్కథాశ్రవణకౌతూహలముతోఁ గ్రమ్మరం జనుదెంచి యమ్మహాముని సమక్షమందు యథానిర్దిష్టముగాఁ గూర్చుండిరి. అర్ధయామావశిష్టమగు రాత్రియందు సుధాకరకిరణములచే జగంబంతయు వెండిపూసినట్లు ప్రకాశింపుచుండ మలయమారుతములు మేనులకు హాయి సేయ హరీతకుఁడు మధురఫలరసంబుల నన్ను దృప్తుంజేసి మునులతోగూడ నతనియొద్దకుఁ దీసికొనిపోయి వేత్రాసనంబునం గూర్చుండి జలపాదుఁడను శిష్యుండు పవిత్రపాణియై మెల్లగాఁ దాళవృంతమున వీచుచుండ రెండవ పరమేష్టివలె నొప్పుచున్న యా జాబాలికి నమస్కరించి నన్నెదుర నిలిపి వినయంబున నిట్లనియె.
తండ్రీ! యీ మునులందరు నీ చిలుక వృత్తాంతము వినుటకు మిక్కిలి వేడుకపడుచున్నారు. ఇది తొలిజన్మమందెవ్వరు! ఎందుండునది? ఏమి కారణమున నిట్టి జన్మమెత్తినది? సవిస్తరముగా నుడువుఁడని యడిగిన నజ్జడదారి సంతసించుచు వారినందరను గలయఁ గనుంగొని యిట్లని చెప్పందొడంగె
తారాపీడుని కథ
క. కల దుజ్జయినీనగరం
బిలను మహాకాళనామకేశ్వరలింగా
మలదీప్తిదీపితాలయ
కలితంబై చారుసౌధకమనీయంబై.
అవ్వీటి కధినాయకుండై తారాపీడుండను రాజు రాజ్యంబు సేయుచుండెను. అతడు నృగ, నల, నహుష, భరత, భగీరథ, ప్రభుతుఁలగు పూర్వనృపతుల నతిశయించిన కీర్తిగలవాఁడై నీతిశాస్త్రపారంగతుండును, ధర్మజ్ఞుండును యజ్ఞపూతవిగ్రహుండునునై రెండవ ధర్మదేవతవలెఁ బ్రజలం బాలింపుచుండెను.
అతనియొద్ద సకలకలానిపుణుఁ డగు శుకనాశుండను మంత్రి ముఖ్యుండు గలఁడు. అతఁడు బ్రాహ్మణుం డయ్యును, క్షాత్రంబున నత్యంతప్రసిద్ధిఁ జెంది యుండెను. చంద్రునకు వెన్నెలవలె నమ్మహారాజునకు నలంకారమై విలాసవతి యను విలాసినీలలామంబు మహిషీపదం బధిష్టించి యెక్కుడు మక్కువ గలుగఁజేయుచుండెను.
ఆ రాజు సప్తద్వీపముద్రితంబైన ధరావలయం బంతయు భుజబలంబున జయించి మంత్రిన్యస్తరాజ్యభారుండై యచ్చలరం బురడించు మచ్చెకంటులం గూడికొని గృహదీర్ఘికలయందును శృంగారసరోవరంబులయందును కేళికోద్యానములయందును గ్రీడాశైలముల యందును నభీష్టకాముడై విహరింపుచు యౌవనమున ననవద్యమగు సుఖం బనుభవించెను.
ఒకనాఁడా యెకిమీడు విలాసవతీభవనంబున కరుగుటయు నప్పు డప్పడఁతి చింతాస్థిమితదీనదృష్టులతో శోకంబున మూకభావము వహించి చుట్టును బరిజనంబు బరివేష్టింపఁ గన్నీళ్ళచేఁ దుకూలము దడుపుచు నెడమచేతిపై మో మిడుకొని శయ్యపైఁ గూర్చుండి చింతించుచు భర్తరాకఁ దెలిసికొని ప్రత్యుదానాదివిధులం దీర్చినది.
అప్పుడా నరపతి యాసతీవతంసంబును దొడపై నిడుకొని కన్నీరు దుడుచుచు దేవీ! నీ వేమిటి కిట్లు ముక్తాఫలజాలంబులఁ బోనియశ్రుబిందుసందోహంబుల రెప్పల గుప్పుచుంటివి? కృశోదరీ! ఏమిటి కలంకరించుకొంటివి కావు? నీ విరక్తికిఁ గారణమేమి? నేను నీకెద్దియేని యనిష్టమైన పనిఁ గావించితినా చెప్పుము. నా జీవితము రాజ్యము నీ యధీనమై యున్నవి. వేగము విచారకారణం బెరింగింపు మని బ్రతిమాలుకొనియెను.
అప్పు డయ్యంబుజాక్షి తాంబూలకరండవాహిని మకరికయనునది మెల్లన నా భూవల్లభుని కిట్లనియె. దేవా! దేవర దేవిగారివిషయమై కొఱఁత యేమియుం జేసి యుండలేదు. వినుండు. నాకీమహారాజుతో సమాగమము విఫలమైనది గదా యని యమ్మగారు చింతించుచుండఁగనే చాలాకాలము గతించినది. శయనాసనస్నానభోజనభూషణపరిగ్రహాదులగు దివసవ్యాపారములఁ బరిజనప్రోత్సాహంబున నెట్టకే కష్టంబునఁ గావింపుచుండునది. అట్టి వికార మెన్నడును హృదయ పీడాజిహీర్షచేఁ దెలియనిచ్చినదికాదు. నేఁడు శివరాత్రియగుట మహాకాళనాథు నారాధింప దేవళమున కఱిగినది. అందొకచో మహాభారతము జదువుచుండఁ గొండొకసేపు కూర్చుండి యాలకించినది. అందు సుతులు లేనివారికి గతులు లేవనియుఁ బున్నామనరకము బుత్రులుగాని తప్పింపలేరనియు లోనగు వృత్తాంతము విని యింటికి వచ్చినదిమొద లావిషయమే ధ్యానించుచు మే మెంత బ్రతిమాలినను గుడువక కట్టక ప్రత్యుత్తర మీయక యిట్లు దుఃఖించుచున్నది. ఇదియే యీమె శోకకారణమని పలికి మకరిక యూరకొన్నది.
ఆ కథ విని యొడయం డొక్కింతతడవు ధ్యానించి వేడినిట్టూర్పు నిగుడింపుచు నిట్లనియె. దేవీ! యూరడిల్లుము. దైవాయత్తమగు కార్యమును గురించి మన మేమిచేయఁ గలము? దేవతలకు మనయెడ గనిగరము లేకపోయినది. వెనుకటిజన్మమున మంచికర్మ చేసితిమి కాము, ఇటుపిమ్మట మనుష్యులకు శక్యమైన పనులనెల్లఁ గావింతముగాక. గురుభక్తి నిబ్బడిగాఁ జేయుము. దేవిపూజలు విశేషముగాఁ గావింపుము. మునిజనసపర్యల నాదరముతోఁ జేయుము. వారు దుర్లభములైన వరముల నియఁగలరు. చండకౌశికప్రసాదంబున బృహద్రథుండు జరాసంధుండను పుత్రుం బడయలేదా? దశరథుండు వృద్ధుండయ్యు విభండకనందను నారాధించియే కాదా ! రామలక్ష్మణ భరతశత్రుఘ్నులను పుత్రులంగాంచెను. మునిజనసేవ యెన్నఁడును వ్యర్థముకాదు. మరి యిం కేమని వక్కాణింతును. రాత్రింబవళ్ళు ననపత్యతాదుఃఖాగ్ని నన్ను దహించుచున్నది. రాజ్యంబును, జన్మంబును విఫలమని తలంతును. తలోదరీ! కమలగర్భుండు మనకు ప్రసన్నుండు కాడయ్యెను. నే నేమి జేయుదును. నీశోకానుబంధము విడువుము ధైర్య మవలంబింపుము. బుద్ధిని ధర్మకార్యములందుఁ బ్రవేశపెట్టుము. అని శోకాపనోదనిపుణంబులగు ప్రియవాక్యంబులచే నత్తలోదరి నాశ్వాసించి కొంతతడ వందుండి యతండు నిజభవనంబున కఱిగెను.
అదిమొద లమ్మదవతియు దేవతారాధనములయందు బ్రాహ్మణపూజల యందును వెనుకటికన్నఁ బెద్దగా నాదరము గలిగియుండెను. పుత్రోదయహేతుభూతమగు వ్రత మెవ్వ రెట్టిది జెప్పినను గష్టముల కోర్చి యట్టిది గావించునది చండికాయతనంబుల శయనించి యనేకోపవాసములఁ గావించినది. వృద్ధగోపవనితలు మన్నింప స్వరలక్షణసంపన్నంబులగు గోవుల పొదుగులదాపున నిలచి సర్వౌషధీమిశ్రితంబులగు పాలతో స్నానంబు కావించినది. కనకమణివినిర్మతములగు తిలపాత్రముల దానము లిచ్చినది. అనేకసిద్ధాయతనముల సేవించినది. ప్రసిద్ధములగు నాగహ్రదంబుల మునింగినది. అశ్వద్ధప్రభృతివనస్పతులకుఁ బ్రదక్షిణము లొనర్చినది. నడివీథుల దధ్యోదనము వాయసములకు బలివైచినది. భక్తితో నగ్నక్షపణకాదుల నెందరినో ప్రశ్నలడిగినది. నిమిత్తజ్ఞుల నారాధించినది. వృద్ధులు జెప్పిన రహస్యక్రియలన్నిటిని గావించినది. ఉపశ్రుతుల నాలించినది నిమిత్తముల గ్రహించినది. తనకువచ్చు స్వప్నవిశేషంబుల గురువులకు నివేదించునది.
ధృతవ్రతయై యయ్యువతి యట్లు చేయుచుండ నొకనాఁడు తారాపీడుండు అల్పావశేషమగు రాత్రియందు సమున్నతసౌధాగ్రవర్తినియై యున్న విలాసవతీదేవి మొగంబున సకలకలాపరిపూర్ణుండగు చంద్రుండు బ్రవేశించుచున్నట్లు కలఁ గాంచెను. దిగ్గున లేచి సంతోషాతిశయముతో నాక్షణమునందే శుకవాసుని రప్పించి యా వృత్తాంత మెరింగించుటయు హర్షపులకితగాత్రుండై యతం డిట్లనియె.
దేవా! శీఘ్రకాలములో మన ప్రజల మనోరథములు సఫలములుఁ గాగలవు. కొలఁదిదినములలో కుమారముఖావలోకసుఖం బనుభవింపఁగలము. మద్ధర్మపత్ని మనోరమ తొడయం దొకబ్రాహ్మణుండు దివ్యవస్త్రాలంకారభూషితుండై సహస్రదళశోభిత మగుపుండరీక మిడినట్లు నాకును నిన్నరాత్రియే కల వచ్చినది. మంచినిమిత్తములు గనంబడుచున్నవి. శుభోదర్కము దాపుననే యున్నదని పలుకుచున్నంతయుఁ దారాపీడుం డతనిచేయి బట్టుకొని హృదయానందమును వెల్లడించుచు నంతఃపురమునకుఁ దీసికొనిపోయి యిరువుర స్వప్నవృత్తాంతములును విలాసవతి కెరింగించి సంతోషసముద్రమున నోలలాడించెను.
మరికొన్నదినంబులు గతించినంత దేవతాప్రసాదంబున విలాసవతి గర్భవతి యైనది. కులవర్ధన యనుదాసి యొకనాఁడా వృత్తాంతము శుకనాశునితో ముచ్చటించుచున్న ఱేని చెవిలో వైచినది. అశ్రుతపూర్వమగు నవ్వాక్యము విని యజ్జనపతి మేనం బులక లుద్భవిల్ల సంతస మభినయించుచు శుకనాశుని మొగ ముపలక్షించెను. శుకనాశుం డయ్యుత్సవము గ్రహించి దేవా! మనకు వచ్చిన కలలు సత్యములైనవా యేమి? వినుదనుక నా హృదయము తొందరపడుచున్నదని యడిగిన నతండు సంతోషముతో దాదిచెప్పిన మాటల నెరింగించెను.
రాజప్రధాను లిరువురు నిరతిశయసంతోషసముద్రమున మునుంగుచు నప్పుడే శుద్ధాంతమున కరిగి యావార్త సత్యమని తెలిసికొని బ్రాహ్మణులకు షోడశమహాదానంబులును గావించి పుత్రోదయసమయ మరయుచుండిరి.
అంతఁ గాలక్రమంబునఁ బ్రసవసమయము సంపూర్ణమైనంత నద్ధరాకాంతు నిల్లాలు శుభదివసంబున నుత్తమలగ్నంబున నంబుదమాలిక యిరమ్మదమునుబోలె సకలలోకహృదయానందకరుండగు కుమారుం గాంచినది.
అప్పు డంతఃపురజనులు భూమి చలింప నిటునటు పరుగులిడువారును మంగళగీతముల మ్రోగించువారును, తూర్యనినాదములు వెలయించువారునై కోలాహలధ్వనులచే నాదేశమునెల్ల నిండింపఁజేసిరి. ఆ నగరమందే కాక యా దేశమందెల్ల జను లుత్సవములు సేయందొడంగిరి.
తారాపీడుఁడు శుకనాశునితోఁగూడ బుత్రుం జూచు వేడుక ప్రబలదూర్వాప్రవాళమాలాలంకృతంబైన సూతికాగృహంబున కరిగి యందుఁ దొలుత నుదకము నగ్నిని స్పృశించి పిమ్మట విలాసవతి తొడపై దీపమువలెఁ బ్రకాశించుచున్న కుమారు దూరవిస్ఫారితములగు నేత్రములచేఁ బానము జేయువాఁడుంబోలె వీక్షించుచు మిక్కిలి సంతోషించెను. తన్నుఁ గృతకృత్యునిగాఁ దలంచుకొనియెను.
అప్పుడు శుకనాశుం డాబాలకుని యవయవములన్నియు నిరూపించుచు నిట్లనియె. దేవా ! చూడుము. గర్భసంపీడనవశంబునం జేసి యంగశోభస్ఫుటము గాకున్నను జక్రవర్తిచిహ్నములఁ బ్రకటనజేయుచున్నవి.
సంధ్యాకిరణరక్తుండగు బాలశశిరేఖం బురడించు లలాటపట్టిక యందు నళినీతంతువులం బోలిన సూక్ష్మరేఖ లెట్లు ప్రకాశించుచున్నవో పరిశీలింపుము. ఆకార్ణాంతవిశాలములై పుండరీకమువలెఁ దెల్లనై కుటిలములైన కనుబొమ్మలచే ముద్దులు మూట గట్టుచు వెలికాంతుల వెదజల్లుచున్న వీని కన్నుల గంటివా?
సీ. కరతలంబులు సుకోకనదకుట్మలలోహి
తములు చక్రాదిచిహ్నముల నొప్పె
బదయుగం బమరద్రుమపల్లవమృదులంబు
కులిశధ్వజాదిరేఖలఁ దలిర్చె
ఫాలంబు శిశునిశాపాలాభిరామంబు
సార్వభౌమాంకలక్షణత మెఱసె
గనుఁగవ సితపద్మక్రమంబు త్రిభువన
ప్రభుతానుభావవైభవము దెలిపె
గీ. గంటివే వీనిరూప ముత్కంఠ వొడమె
నోనరేశ్వర! వింటివే వీనికంఠ
రవము దుందుభివలె సుస్వరత నెసంగె
వీఁడు బ్రోవఁగఁజాలు నీవిశ్వమెల్ల.
అని యబ్బాలకశిఖామణి యంగశోభావిశేషములు వర్ణించుచున్నసమయంబున ద్వారస్థులనెల్ల ద్రోసికొనుచు నతిరయంబున నొక పురుషుం డరుదెంచి ఱేనికి మొక్కి దేవా! విజయమగుఁగాక. శుకనాశుని భార్య మనోరమకు రేణుకకుఁ పరశురాముండు వోలెఁ గుమారుం దుదయించెనని యెరింగించెను.
అమృతోపమితములగు నప్పలుకులు విని యజ్జనపతి బాష్పపూరితనయనుండై యోహూ! కల్మాణపరంపర! మిత్రమా! శుకనాస! విధి సమానసుఖదుఃఖత్వమును సూచింపుచు నీడవోలె న న్ననుగమించెంగదా? అని పలుకుచు నా వార్త తెచ్చిన పురుషున కపరిమితముగాఁ బారితోషిక మిచ్చి యప్పుడమియొడయఁడు ప్రగ్గడతోఁగూడ నతనియింటి కరిగి తత్సుతముఖదర్శనంబు గావించి పుత్రోత్సవము పంచి పెట్టించెను.
క్రమంబునఁ బురిటిరాత్రులు గడిచినంత మహావైభవముతో యథావిధి జాతకకర్మాదివిధులు నిర్వర్తించి, స్వప్నంబునఁ జంద్రమండలము సతీముఖంబునం బ్రవేశించుచున్నట్లు చూడఁబడుటం జేసి రాచపట్టికిం జంద్రాపీడుఁ డని పేరుపెట్టెను.
శుకనాసుఁడును, రాజానుమతి బ్రాహ్మణకులోచితములైన విధులన్నియుం దీర్చి కుమారునకు వైశంపాయనుడని నామకరణము జేసెను.
కాలక్రమంబున నాఁబాలునకు శైశవ మతిక్రమించినంతఁ దారాపీడుఁ డానగరమున కనతిదూరములో మనోహరమణిశిలాలలితమగు విద్యామందిరము గట్టించి సకలవిద్యాపారంగతులగు నుపాధ్యాయులఁ బెక్కండ్ర నియమించి వైశంపాయనునితోఁ గూడఁ జంద్రాపీడుం జదివింపుచుండెను.
రాజపుత్రుఁడు మంత్రిపుత్రునితోఁగూడ ననన్యగతమానసుండై యచిరకాలములో నాచార్యులవలన మణిదర్పణముల వలె నశ్రమముగా సమస్తవిద్యలుం గ్రహించెను.
సీ. మరి పదవాక్యప్రమాణంబులను శబ్ద
శాస్త్రమ్మునం దర్థశాస్త్రమందు
నయశాస్త్రముల నభినయశాస్త్రములఁ జాప
చక్రకృపాణాదిసాధనముల
గజతురంగాదిశిక్షలఁ జిత్రరత్నప
రీక్షల యంత్రతాంత్రికములందు
గావ్యనాటకవరాఖ్యాయికాదుల సర్వ
లిపిసర్వభాషావిలేఖనముల
గీ. గ్రంథరచనల శిల్పకర్మల నశేష
కళల శృంగారరస దలంకారములను
సకలవిద్యల నక్కుమారకుల కపుడు
కలిగె నత్యంతపాండిత్యకల్పనంబు.
మరియు నారాజపుత్రునకు బాల్యమునందె సర్వలోకవిస్మయజనకమగు మహాబలంబు గలిగియుండెను.
యదృచ్ఛముగా నెదురుపడిన కరికలభంబుల చెవులు పట్టుకొని వంచిన నవి సింహపోతభంజితములవలెఁ గదలలేక నిలువంబడునవి.
కదళీకాండమువలెఁ దాళవృక్షముల నొక్కవ్రేటున నరికివైచును. పరశురాముండువలె నతండేయు బాణములచేఁ బర్వతములు గూడఁ జిల్లులు పడుచుండును. పదుగురు మోయలేని యినుపదండ మవలీలఁ గేలం దాల్చి గిరగిరఁ ద్రిప్పును.
ఒక మహాశక్తితక్క తక్కినవిద్యలన్నియుఁ జంద్రాపీడునితో సమముగా వైశంపాయనుఁడు గ్రహించెను. విద్యాపరిచయబహుమానంబున శుకనాసునియందుఁ గల గౌరవమునఁ బుట్టినది మొదలు పాంశుక్రీడ లాడుచు నేకముగాఁ బెరుగుట లోనగు కారణములచే రాజపుత్రునకు వైశంపాయనుఁడు రెండవ హృదయమువలె విస్రంభపాత్రమగు మిత్రమై యొప్పుచుండెను. నిమిషమైన వాని విడిచి యొక్కఁడు వసింపఁడు.
వైశంపాయనుఁడును సూర్యుని దివసమువలె విడువక సంతత మనుసరించి తిరుగుచుండును. అట్లు విద్యాభ్యాసము చేయుచుండ బ్రదోషమునకుఁ జంద్రోదయమువలె సముద్రున కమృతరసమట్లు కల్పపాదపమునకు ప్రసూనోద్గమముభంగి కమలవనమునకు సూర్యోదయముభాతి సౌందర్యమున కధికశోభ దెచ్చుచు నా నరేంద్రనందనునకు యౌవనోదయమైనది.
సమయము నరసి మన్మథుఁడు సేవకుఁడువలెనే వారి నాశ్రయించెను. లక్ష్మితోగూడ వక్షస్థలము విస్తరించెను. ఇట్లు వారు సమారూఢయౌవనులును సమాప్తసకలవిద్యగులు నగుచుండ వారి వార్త విని తారాపీడుఁడు మిగుల సంతసించుచు బలాహకుఁ డను సేనాపతిఁ బిలిచి శుభముహూర్తమున వారిం దోడ్కొని రమ్మని యాజ్ఞాపించెను.
అతండును విద్యాగృహమునకుఁ బోయి వైశంపాయనునితో విద్యాభ్యాసము చేయుచున్న చంద్రాపీడునిం గాంచి నమస్కరించి తదానతి నుపవిష్టుండై యిట్లనియె.
భర్తృదారక! నీవు సకలవిద్యలయందును బ్రౌఢుడవైనట్లు విని తారాపీడుఁ డెంతేని సంతసించి చంద్రదర్శనమునకు సముద్రుండువలె నిన్నుఁ జూచుటకుఁ గోరుచున్నవాఁడు. మీరు విద్యాభ్యాసమునకుఁ బ్రారంభించి పది సంవత్సరము లయినది ఆరవయేటఁ బ్రారంభించుటచే నేటికిఁ బదియారేఁడుల ప్రాయము గలిగి యుంటిరి. మీ తల్లులు మిమ్ముఁ జూచుటకు మిగుల వేడుకపడుచున్నారు. యౌవనసుఖముతోఁ గూడ రాజ్యభోగ మనుభవింపుము. రాజలోకమును సన్మానింపుము. బ్రాహ్మణులఁ బూజింపుము. ప్రజలఁ బరిపాలింపుము. ఇంద్రాయుధమగు తురగరత్న మిదిగో యధిష్టించిరమ్ము. మీ తండ్రిగారికి దీనిఁ బారశీకదేశపురాజు సముద్రములోఁ బుట్టినదనియు నతివేగము గలదనియుఁ గానుకగాఁ బంపెను. దీనింజూచి పరీక్షించిన వారు ఉచ్చైశ్రవమునకుఁగల చిహ్నము లున్నవని చెప్పుచున్నారు. చూడుఁడని పలుకగా విని యా రాజకుమారుఁడు వైశంపాయనునితోఁ గూడ నా యశ్వలక్షణములన్నియుం బరీక్షించి వెరగందుచు నది యమానుషమని చెప్పుచు దానికి ముమ్మారు వలగొల యాగుర్ర మెక్కెను.
అప్పు డ త్తత్తడి సంతసించుదానివలె తోక నాడించుచు సకిలించినది. అదియే శుభశకునముగాఁ దలంచి విద్యాగృహము బయలు వెడలి వైశంపాయనుఁడును వేరొకతురగ మెక్కి తోడురా రాజమార్గంబున నడచుచుండెను.
రాజపుత్రుండు సమాప్తసకలవిద్యుండై విద్యాగృహమునుండి వచ్చుచున్నవాఁడను వార్త విని పౌరకాంతలెల్ల నుల్లము లుత్సుకోత్ఫుల్లములై యొప్ప దెప్పున నప్పురుషరత్నముం జూడ వేడుకపడుచు సగముసగముగా నలంకరించుకొనియుఁ బూర్తికాకుండఁగనే సౌధాంతరంబులం జేరి మరకతవాతాయనవివరములనుండి యా నరేంద్రనందను నీక్షింపఁదొడంగిరి.
అప్పు డామేడలనుండి మకరధ్వజవిజయనినాదము ననుకరింపుచు రమణీమణుల మణిభూషణఘోషము శ్రోత్రపర్వముగాఁ బయలువెడలినది. ముహూర్తకాలములో నంతఃపురములన్నియు యువతిజననిరంతరము లగుట స్త్రీమయములైనట్లు ప్రకాశించినవి.
కౌతుకప్రసారితనయనలై చూచుచున్న యమ్మగువల హృదయంబు లద్దములవలె నారాజసూనుని యాకృతి నాకర్షించినవి. అప్పు డావిర్భూతమదనరసావేశహృదయలై యమ్మదవతు లొండొరులు సపరిహాసముగా సాక్షేపముగా సాభ్యసూయముగా సోత్ప్రాసముగా నిట్లు సంభాషించుకొనిరి.
ఓసీ! వేగముగాఁ బరిగిడుచుంటివి. నేనుగూడ వచ్చెదఁ గొంచెము నిలువుము.
ఆహా! నీ మొహము! రాజపుత్రుం జూచినతోడనే యున్మత్తురాలవై పోయితివే? యుత్తరీయము స్వీకరింపుము.
చపలురాలా! మోముదమ్మిం గ్రమ్ముచున్న యలకమ్ముల ముడిచికొని మరియుం జూడుము.
మూఢురాలా! శిరముపై చంద్రలేఖ వ్రేలాడుచున్నది. సవరించుకొనుము! జవ్వనీ! ఏమి నీ యౌవనమదము నన్ను నొక్కి స్రుక్కఁ జేయుచుంటివి. వెనుకకు జరుగుము.
సిగ్గులేనిదానా! కట్టిన దుకూలము జారుచున్నది చూచుకొమ్ము.
మత్సరురాలా! ఎంత సేపు చూచెదవు? నీకుకాని యితరులకు వేడుక లేదనుకొంటివి కాబోలు! తొలగి నాకుఁ జోటిమ్ము.
అమ్మా! కాణాచివి. నీవే ముందరకు రమ్ము.
నీవొక్కరితవే గవాక్ష మరికట్టితి వెట్లు?
ఓహోహో! నీ మిథ్యావనీతత్వ మెరింగితినిలే. ఈ వారచూపువేల? విస్రబ్దముగాఁ జూడుము.
ముగ్ధురాలా! మదనజ్వరపులకజాలము మేనం బొడమినది. కప్పికొనుము.
అనంగపరవశురాలా! నాకట్టిన వస్త్రము నుత్తరీయముగాఁ బూనుచుంటివి విడువుము?
శూన్యహృదయురాలా! నీవిప్పు డెక్కడ నుంటివో తెలిసికొన లేకుంటివే?
అత్తగారు చూచి యాక్షేపించుననియా? పరుగిడి లోపలికి బోవుచుంటివి?
లఘుమతీ! రాజపుత్రుం డవ్వలకు బోయెఁ గన్నులం దెరువుము.
ఓహో! పతివ్రతాశిరోమణీ! చూడఁదగిన వస్తువుల జూడక నీ కన్నుల వంచించుచుంటివి గదా!
ప్రియసఖీ! పరపురుషదర్శనపరీహారవ్రతము విడిచి త్రిలోకమోహజనకుండు రతివిహితుండు నగృహీతమకరధ్వజుండు నగు నీమకరధ్వజు నీక్షింపుము. ధన్యురాల వగుదువు.
ఆహా! ఆ మోము అయ్యారే? ఆ తళ్కుజెక్కులు, బాపురే? ఆ బాహువులుఁ భళిరే! పేరురంబు. ఈ సుకుమారుని బుత్రునిగాఁ గనిన విలాసవతి యెంత ధన్ముఁరాలో! వీనిం భర్తగాఁ బడయఁబోవు పూవుఁబోడి యెంత తపంబు గావించినదియో? అని యంతఃపురకాంతలెల్ల స్తుతియింపుచుండఁ జిత్రగమనంబులఁ బెక్కండ్రు వారువపురౌఁతులు చుట్టును పరివేష్టించి నడుచుచుండం గ్రమంబునఁ బోయిపోయి యాస్థానసమీపముఁన కరిగి ద్వారదేశమునందే గుర్రమును దిగి వైశంపాయనుని కైదండఁ గైకొని బలాహకుఁడు వినయముతో ముందు నడచుచు దారిజూపుచుండఁ గాక్షాంతరములు గడచి కైలాసగిరివిలాసమునం బ్రకాశించు గృహసభామంటపంబు చేరంజని యందు,
సీ. కనకవేత్రములఁ గైకొని దర్పము దలిర్ప
ద్వారపాలురు బరాబరులు సేయ
అహిదీప్తపాతాలగుహలట్లు పొలుచు నా
యుధశాలలను యోధు లోలగింప
జము నోలగమున నొజ్జల వోలెఁ దగులేఖ
కులు శాసనసహస్రములు లిఖింప
క్షితినాథదర్శనాగతసర్వదేశభూ
పతితతిస్తవరవార్భటులు సెలఁగ.
గీ. వేశ్య లిరువంక చామరల్ వీచుచుండ
గవులు గాయకవందిమాగధవిదూష
కులు భజింపఁ నిలింపయు కుఁడు మహేంద్రు
కరణిఁ గొలువున్న ధరణీంద్రుఁ గనియె నతఁడు.
కరవినమ్రుడై నమస్కరించుచున్న పుత్రుం జూచి, తండ్రీ! రమ్ము రమ్మని చేతులు సాచుచు నానందభాష్పపూరితలోచనుండై రాజు మేనం బులక లుద్భవిల్ల పుత్రుం కౌగలించుకొనియెను.
తరువాత సుతనిర్విశేషుండగు వైశంపాయనునిం గూడ గాఢాలింగనము గావించి ముహుర్తకాలము వారిం బరీక్షించి చూచుచు, వత్సా! మీ తల్లి నిన్నుఁ జూచుటకై పరితపించుచున్నది సత్వర మామెయొద్ద కరుగుమని నియమించుటయు దండ్రికి నమస్కరించి వైశంపాయనునితోఁ గూడ విలాసవతీ యంతఃపురమున కరిగి యామెకు నమస్కరించెను.
ఆమెయుఁ తొందరగా లేచి బరిజనమున్నను తానే యవతరణమంగళకృత్యంబుల నిర్వర్తించి తదభివృద్ధి నభిలషించుచు శిరము మూర్కొని గాఢాలింగనము గావింపుచు నానందభాష్పములచే నతని శిరంబు దడిపినది. తరువాత వైశంపాయనుని గూడ నాదరించి కరతలంబునఁ గుమారుని శిరంబు దువ్వుచు, వత్సా! నీ తండ్రి కడు గర్మిష్టుఁడు సుమీ! నిన్నింతకాలము నాకుఁ గనఁబడకుండ దూరముగా నునిచి కష్టపర చెనే? కఠినమగు తండ్రిగారి యాజ్ఞ నీవెట్లు కావించితో తెలియదు. నీవు పిల్లవాఁడ వైనను నీ హృదయము శిశుజనక్రీడాకౌతుకలాఘవము గాదు. ఎట్లయినను గురుప్రసాదంబున సమస్తవిద్యాయుక్తుండవై చూడఁ బడితివి. ఇక ననురూపవధూయుక్తుండవగునట్లు చూడగోరుచుంటినని పలుకుచు లజ్జాస్మితావనతముఖుండైయున్న పుత్రుని చెక్కులు ముద్దుపెట్టుకొన్నది.
చంద్రాపీడుం డట్లు కొంతసేపందుండి తల్లి యానతి బూని వైశంపాయనునితోఁ గూడ నటనుండి శుకనాశుని భవనమున కరిగి యందనేక నరపతిసహస్రమధ్యవర్తి యగు శుకనాశునికి వినయముతో దూరమునుండియే యవనతమౌళియై నమస్కారము గావించెను.
అమ్మంత్రిసత్తముం డతని లేవనెత్తి యానందభాష్పపూరితనయనుండై వైశంపాయనునితోఁ గూడ గాఢాలింగనము గావించెను. రాజపుత్రుండును, మంత్రిపుత్రుండును సముచితాసనోపవిష్టులైయున్న సమయంబున నందున్న సామంతరాజులెల్లఁ దమ పీఠంబుల విడిచి నేలం గూర్చుండిరి. అప్పుడు మేనం బొడమిన పులకలచే హృదయగతహర్షప్రకర్షము వెల్లడించుచు శుకనాశుం డిట్లనియె.
తాత! చంద్రాపీడా! సమాప్తవిద్యుండవు సమరూఢయౌవనుండవు నగు నిన్నుఁ జూచుటచే నిప్పటికి మాఱేనికి భువనరాజ్యఫలప్రాప్తి గలిగినది. గురుజనాశీర్వాదము లన్నియు నిప్పటికి ఫలించినవి. అనేకజన్మోపార్జితమగు సుకృతము నేటికి పండినది. కులదేవత లిప్పటికి బ్రసన్నులైరి. పుణ్యహీనులకు మీ వంటి యుత్తములు పుత్రులుగా జన్మింతురా? నీ వయసెంత? అమానుషశక్తి యెంత? విద్యాగ్రహణసామర్ధ్య మెంత? ఆహా! ఈ దేశ ప్రజలందరు ధన్యులుగదా? ఈ భూభార మంతయు దంష్ట్రచే మహావరాహమువలెఁ దండ్రితోఁగూడ వహింపుము.
అని పలుకుచు స్వయముగాఁ గుమారకులకుఁ గుసుమాభరణాంగరాగాదు లొసంగి యాదరించెను. తరువాత నాతని యనుమతి వడసి రాజపుత్రుండు మిత్రునితో గూడ మంత్రిపత్ని మనోరమంజూచి యామె దీవెనలు నంది యటఁ గదలి తండ్రిగారిచేఁ గ్రొత్తగాఁ దమకై నిర్మింపబడిన రాజకులముయొక్క ప్రతిచ్ఛందకము వలె నున్న మేడకుం బోయెను.
మరకతమణులచేఁ దోరణములు గట్టఁబడినవి. అనేకకనకదండచిత్రపతాకము లెగురుచుండెను. తూర్యనాదము మ్రోగించిరి. మహావైభవముతో నమ్మేడఁ బ్రవేశించి చంద్రాపీడుఁడు వైశంపాయనునితోఁ గూడ వేడుకగాఁ గొన్నిదినములు గడిపెను.
మఱియొకనాఁడు కైలాసుండను కంచుకి పత్రలేఖయను నంబుజనేత్రను వెంటఁబెట్టుకుని యచ్చటికి వచ్చెను. శక్రగోపకాతుల్యమగు నరుణాంశుకము ముసుంగుగా వైచికొని బాలాతపమునఁ బ్రకాశించు తూర్పుదిక్కువలె మెఱయుచు రాజకుల సంవాసప్రదల్భయయ్యు వినయమును విడువక రాహుగ్రాసభయంబునఁ జంద్రకిరణముల విడిచి పుడమి కవతరించిన జ్యోత్స్నయోయన లావణ్యయుక్తమగు తెల్లనిదేహకాంతి గలిగి సర్వాంగసుందరియు సకలాభరణభూషితయునై తొలిప్రాయంబున నొప్పుచున్న యా యొప్పులకుప్పం జూచి రాజపుత్రుండు వెరగుపాటుతో నీ వెవ్వండ నీబాలిక నేమిటికిఁ దీసికొనివచ్చితివని యడిగినఁ గైలాసుండు వినయముతో నమస్కరించుచు నిట్లనియె.
కుమారా! విలాసవతీ మహాదేవిగారు తమ కిట్లాజ్ఞాపించుచున్నారు. ఈ చిన్నది కులూతేశ్వరుని కూఁతురు దీనిపేరు పత్రలేఖ. మీ తండ్రిగారు దిగ్విజయము సేయుచుఁ గులూతరాజధానిం జయించి వందిజనముతోఁగూడ నీచేడియం దీసికొని వచ్చి యంతఃపురపరిచారికామధ్యంబున నుంచిరి.
నే నీబాలికామణి వృత్తాంతము విని యనాథయని జాలిగలిగి రాజపుత్రిక యని గౌరవించుచుఁ బుత్రికానిర్విశేషముగా లాలించుచు నింతదనుకఁ బెనిచితిని. ఇప్పు డిప్పడఁతి నీకుఁ దాంబూలకరండవాహినిగా నుండునని యాలోచించి యమ్మించుబోఁడి నీకడ కనిపితిని. నీ వీపూవుఁబోడిం బరిజనసామాన్యదృష్టిం జూడఁగూడదు. బాలికనువలె లాలింపవలయును. చిత్తవృత్తివలెఁ జపలక్రియలవలన మరలింపవలయును. శిష్యురాలిగాఁ జూడఁదగును. మిత్రుఁడువోలె విస్రంభకార్యములకు నియోగింపవలయును. పెనిచినమోహంబునం జేసి కన్నబిడ్డలయందువలె నాకు దీనియం దెక్కుడు మోహము గలిగియున్నది. మహారాజకులప్రసూత కావున గౌరవింప నర్హురాలు. కొలఁదిదినములలో దీని సుగుణసంపత్తి నీకే తెలియఁగలదు. దీనిశీల మెఱుఁగవు కావున నింతగాఁ చెప్పుచుంటిని.
అని చెప్పి కైలాసుఁ డూరకున్నంతఁ దనకు నమస్కరించుచున్న యా చిన్నదాని నొక్కింతతడవు ఱెప్పవాల్పక చూచి రాజపుత్రుండు, కైలాసా! అమ్మగా రె ట్లాజ్ఞాపించిరో యట్లు కావింతునని చెప్పుము, పొమ్ము. అని పలికి వాని నంపెను.
అదిమొద లమ్మదవతియు నిద్రించుచున్నను, మేల్కొన్నను, దిఱుగుచున్నను రాత్రింబగలు నీడవలె రాజపుత్రుని పార్శ్వము విడువక సేవింపుచుండెను. చంద్రాపీడుండును జిత్రలేఖం జూచినది మొద లామెయందుఁ బ్రతిక్షణము వృద్ధిజెందుచున్నప్రీతి గలవాఁడై తన హృదయముతో సమానముగ జూచుచు విస్రంభకార్యములకు నియోగింపుచుండును.
అట్లు కొన్నిదినములు గడచినంత నాభూకాంతుఁడు పుత్రకుని యౌవరాజ్యపట్టభద్రునిఁగా జేయదలంచి సంభారములన్నియు సమకూర్చుచుండెను. అప్పు డొకనాఁడు దర్శనార్ధమై వచ్చిన చంద్రాపీడునిం జూచి శుకనాశుఁడు సంతసించుచు రాజనీతి ని ట్లుపదేశించెను.
రాజనీతి
తాత! చంద్రాపీడ! సమస్తశాస్త్రములు నభ్యసించి వేదితవ్య మంతయు గురుతెరిఁగిన నీకు మేమేమియు నుపదేశింప నవసరములేదు. స్వభావముచేతనే వ్యాపించిన యౌవనతమము సూర్యప్రభచేతను రత్నకాంతులచేతను, దీపరుచులచేతినుఁ బోవునదికాదు. లక్ష్మీమదము సైతము దారుణమైనదే, యైశ్వర్యతిమిరాంధత్వము అంజనసాధ్యమైనదికాదు దర్పదాహజ్వరము శిశిరోపచారముల నుపశమింపదు. విషయవిషాస్వాదనమోహము మంత్రబలంబున నశించునదికాదు రాగమలావలేపనము స్నానంబునం బోవునదిగాదు. గర్భేశ్వరత్వము, యౌవనత్వము, అనుపమసౌందర్యత్వము, నొక్కొక్కటియె యవినయమునకుఁ దావలమగుచుండ నన్నియు నొక్కచో నుండునప్పు డేమి చెప్పఁదగినది?
యౌవనారంభమందు శాస్త్రజలములచేఁ గడఁగబడినను బుద్ధి కాలుష్యము నొందకమానదు తరచు మౌనులదృష్టి రాగముతోఁ గూడుకొని యుండును. నీవంటివారే యుపదేశమున కర్హులు. స్ఫటికమణి యందుఁ జంద్రకిరణములువలె నిర్మలమగు మనంబున నుపదేశగుణములు ప్రవేశించును. గురువాక్యము నిర్మలమైనను జలమువలె దుర్జనులకు శ్రవణగతమై శూలను గలుగఁజేయును. అనాస్వాదితవిషయసుఖుండవగు నీ కిదియే యుపదేశసమయము కుసుమశరప్రసారజర్ఝరితహృదయులగువారి కుపదేశము జలమువలెనే నిలువక జారిపోవును చందనవృక్షమునఁ బుట్టిన యగ్ని మాత్రము దహింపకుండునా? బడబాగ్ని యుదకముచేత నడంగునా? జనులకు గురూపదేశము ప్రక్షాళకాముల వంటిది విశేషముగా రాజుల కుపదేశించువారులేరు. జనులు ప్రతిధ్వని వలెనే రాజవాక్యముల ననుసరించి పలుకుదురు.
ధనమదులు దర్పవ్రణపూరితములగు చెవులుగలవారై గురూపదేశములను వినరు. వినినను గజములవలె గన్నులు మూయుదు నుపదేష్టలను బాధింపుచుందురు. ధనము అళీకాభిమానములఁ గల్పించును. రాజ్యలక్ష్మి తంద్రీప్రదమైనది. రాజ్యలక్ష్మి సరస్వతీయుతుం డగువాని నసూయంబోలె జూడనీయదు. గుణవంతు నపవిత్రుపగిది ముట్టనీయదు సుజను నున్మత్తునివలెఁ బరిహసించును. వినీతు మహాపాతకుపగిది దాపుఁ జేరనీయదు. అది తృష్ణావిషవల్లులకు సంవర్ధనధార, ఇంద్రియమృగములకు వ్యాధగీతి, మోహదీర్ఘనిద్రకు విభ్రమశయ్య, ధనమదపిశాచములకుఁ దిమిరసంహతి, అవినయమున కుత్పత్తిస్థానము. అన్నన్నా! రాజ్యలక్ష్మిచేత నాలింగితులగు రాజు లొడలెఱుంగుదురా? అభిషేకసమయమందే మంగళకలశజలములచే దాక్షిణ్యము కడగఁబడుచున్నది.
అగ్నికార్యధూమముచేత హృదయము మాలిన్యము బొందుచున్నది. పురోహితుని కుశాగ్రసమార్జనముచేత క్షాంతి పోవుచున్నది. చామరపవనముచేతనే సత్యవాదిత యెగిరిపోవుచున్నది.
అతిచంచలమగు రాజ్యసంపదలను జూచుకొని గర్వించుచు రాగమగ్నులై అరుదైనను ననేకసహస్రములుభాతి దోచు నింద్రియసుఖములచేత వివశత్వము నొందుదురు. ఆహా! ధనమదులు ఆసన్నమృత్యులవలె దగ్గిరనున్న బంధువులను సైతము గురుతెరుంగరు. ముఖరోగులు వలె గష్టముగా మాట్లాడుదురు. అంధులువలె దాపున నున్నవారి సైతము జూడలేరు.
జూదము వినోదమనియు, వేట పాటవమనియు, పానము విలాసమనియు, స్వదారపరితాగ్యము అవ్యసనత్వమనియు, నృత్యగీతవేశ్యాప్రసక్తి రసికతయనియు దోషములను సైతము గుణములుగా వర్ణించుచు స్వార్ధనిష్పాదనపరులు ధనపిశితగ్రాసగృధ్రులు నగు వంచకుల మాటలకు సంతసించు రాజుల శిరి యల్పకాలములో నశించును.
అమానుషోచితములగు స్తోత్రవాక్యములు విని యాత్మారోపణము చేసికొనువారు సర్వజనులకుఁ బరిహాసాస్పదు లగుదురు. కుమారా! నీ వెన్నఁడును ఇట్టి దుర్వృత్తుల జిత్తమునుఁ జొరనీయకుము. వంచకుల నంతికమునకుఁ జేరనీయకుము. సర్వదా సజ్జనగోష్ఠిని మెలంగుము. సాధులఁ దిరస్కరింపకుము. కర్ణేజపులమాటల వినకుము. పరిచారకులకుఁ జనువీయకుము. రాగలోభాదుల హృదయంబున నంటనీయకుము. అభిజాతునైనను, పండితునైనను, ధీరునైనను రాజ్యలక్ష్మి దుర్వినీతుని జేయుం గావున నీ కింత సెప్పితిని నీకు నాబోధ యేమియు నవసరములేదు. రాజ్యభారము వహింపుము. ప్రజల దయతోఁ బాలింపుమని రాజనీతి యంతయు నతని కుపదేశించెను.
అప్పుడు చంద్రాపీడుఁడు శుకనాశుని వాక్యంబువులచేతఁ బ్రక్షాళితుండు వోలె నభిసిక్తుని పగిది నభిలిపుని చందమున నలంకృతుని భాతిఁ ప్రీతహృదయుండై కొండొకవడి ధ్యానించి యతని యనుమతి నాత్మీయభవనమునకుఁ బోయెను.
అంతట దారాపీడుఁడు శుభముహుర్తమునఁ జతుస్సముద్రజలంబులం దెప్పించి బ్రాహ్మణాశీర్వాదపురస్సరముగాఁ జంద్రాపీడుని యౌవరాజ్యపట్టభద్రునిం జేసెను.
అప్పుడు ప్రజలందరు నానందసాగరమున నీదులాడిరి. చంద్రాపీడుఁడు సింహాసనమెక్కిన గొద్దిదినములకే తండ్రియనుమతి వడసి శుకనాశుని శాసనప్రకారము చతురంగవాహినీపరివృతుండై వైశంపాయనుఁడు తోడిరాఁ జిత్రలేఖతోఁగూడ దిగ్విజయయాత్ర వెడలి క్రమంబున బూర్వదక్షిణపశ్చిమోత్తరదేశములఁ దిరిగి శరణాగతుల రక్షించుచు దుర్మార్గుల శిక్షించుచు భీతుల నోదార్బుచు రాజపుత్రుల కభిషేకము జేయించుచు రత్నముల స్వీకరించుచు నుపాయనములఁ గైకొనుచుఁ బన్నులఁ దీసికొనుచు విజయచిహ్నము లాయాచోటుల స్థాపించుచు శాసనముల లిఖింపుచు బ్రాహ్మణులఁ బూజించుచు మునుల కాశ్రమములఁ గల్పించుచు బరాక్రమము వెల్లడించుచు గీర్తిని వెదజల్లుచు భూమండలమంతయు దిరిగి విజయస్థంభంబుల నాటిఁ మరలి తనపురంబున కరుదెంచుచు నొకనాఁడు కైలాససమీపమునఁ జరించెడు హేమ జటులను కిరాతులకు నివాసస్థానమై పూర్వసముద్రమున కనతిదూరములోనున్న సువర్ణపురమును జయించి స్వీకరించెను.
మరియు రాజపుత్రుఁడు ఆ నగరమందు నిఖిలధరణీతలపర్యటనమువలన నలసిన తనబలమునకు విశ్రాంతిగలుగుటకై కొన్ని దినములు వసించెను.
కిన్నర మిధునము కథ
ఆ రాజకుమారుం డొకనాఁడు ప్రాతఃకాలమున నింద్రాయుధ మెక్కి యొక్కరుఁడ విహారార్థమై యాప్రాంతారణ్యమునకుఁ బోయి యందందు సంచరించుచు దైవయోగంబున నొకచోఁ బర్వతశిఖరము నుండి దిగుచున్న కిన్నరమిథునమునుఁ జూచెను.
అపూర్వవస్తువిశేషదర్శనంబున మిగుల సంతసించుచు నతం డమ్మిథునమునుఁ బట్టుకొనఁదలంచి తురగమును మెల్లగా దాని దాపునకుఁ బోనిచ్చెను.
అప్పు డెప్పుడును జూడని పురుషునిం గనుటచే నమ్మిథునంబు వెరపు గదురఁ గాలికొలది పరువెట్టదొడంగెను.
చంద్రాపీడుండును మడమలచేఁ గొట్టుచు నత్తత్తడి వడిగాఁ బరుగిడ సేనానివేశమును విడచి యమ్మిథునమువెంట నొక్కరుండ మిక్కిలి దూరముగాఁ బోయెను.
అతని తురగ మతివేగముగాఁ బోవుచుండుటచే నమ్మిథునము దొరకునట్లే కనంబడుచు నెక్కడను జిక్కక యొక్కముహుర్తమాత్రములోఁ బదియేనామడ నడచి యతండు చూచుచుండగనే యందున్న పర్వతశిఖర మెక్కినది.
అంతవరకు నొక్కడులాగునవచ్చి యచ్చటఁ బ్రస్తరశకలము లత్తురగగమనమున కంతరాయము గలుగఁజేయ శ్రమజెంది మేనెల్లఁ జెమ్మటలుగమ్మ నడచుచున్న గుఱ్ఱమునునిలిపి తనకుఁదా నవ్వుకొనుచు నతం డాత్మగతంబున నిట్లు తలంచెను.
అన్నన్నా? పిన్నవాఁడువలె నేనీ కిన్నరమిథునము వెంటవచ్చి యూరక శ్రమపడితిని దొరికినను దొరకకున్నను దీనితో నాకేమి ప్రయోజనమున్నది బాపురే? నిరర్థకవ్యాపారమున నాకింత యాసక్తి యేల పుట్టవలయును? చేసిన కార్యము లేమైనం దీన జెడిపోపుచున్నవా? లేక మిత్రులకుఁ జేసినయుపకృతి నిలుపఁబడుచున్నదా? అయ్యారే! విచారింప దీనివెంట నే నింతదూర మెందులకు వచ్చితినో తెలియకున్నది. తలంచుకొన నాకే నవ్వువచ్చుచున్నది అయ్యయ్యో! ఇచ్చటికి నాబలమెంత దూరములో నున్నదియో తెలియదు. నాతురగము నిమిషములోఁ బెక్కుదూరము నడువ నోపును. నేను గిన్నరమిథునమంద దృష్టియిడి యతివేగముగా వచ్చుటచే నిప్పుడు తిన్నగా నేదారినిఁ బోవలయునో తెలియకున్నది. ఈ యరణ్యములో బ్రయత్నముతోఁ వెదకినను దారినెరిగించు మనుష్యుడెవ్వఁడు గనంబడకున్నాడు. యిది దేవభూమివలె దోచుచున్నది. ఇందు మనుష్యసంచార ముండదు. ఇది యుత్తరదేశముగావున నేను దక్షిణముగా బోయి చూచెదను. తాను జేసిన కర్మలయొక్క ఫలము యనుభవింపవలయునుగదా? అని యూహింపుచు మెల్లగాఁ దురగమును దక్షిణదిశకు మరలించెను.
అట్లు మరలించి అయ్యో! యిప్పుడు సూర్యుఁ డంబరతలమధ్యవర్తియై యున్నవాఁడు. ఈ ఘోటకమును మిక్కిలి యలసినది. యిది కొంచెము మేసినతరువాత నీరు ద్రావించి నేనును నీరు ద్రాగి యలసట దీర్చుకొని ముహూర్తకాలము విశ్రమించి పిమ్మటం బోయెదను.
అని నిశ్చయించి నీరుండుతా వరయుచుండ నొకదండ జలపక్షు లెగురుటయుం గని పట్టి యమ్మార్గంబున బోఁవబోవ మనోహరతరుషండమండితమగు నచ్ఛోదమను సరోవర మొండు గనంబడినది. చూచినంతమాత్రమున మార్గాయాసమంతయు నపనయింపఁజేసిన యక్కాసారంపుశోభం జూచి యతం డాత్మగతంబున నిట్లు తలంచెను.
ఆహా? కిన్నరమిథునానుసరణము నిష్పలమైనను ఇప్పు డీసరోవరము గనఁబడుటచే సఫలమనియే తలంతును. నాకుఁ గన్నులు గలిగినందులకుఁ జూడదగినవస్తువునుఁ నేటికిఁ జూచితిని రమణీయమగుదానిలో నిది చివరిదిగా భావింతును. దీని సృష్టించిన స్రష్ట తిరుగా నమృతసర స్సేమిటికి నిర్మించెనో తెలియదు. ఇది యమృతమువలె సకలేంద్రియముల నాహ్లాదపెట్టుచున్నది. దీనిం జూచియే భగవంతుఁడగు వాసుదేవుండు జలశయనమును విడువకున్నాడు. అన్నన్నా! అమ్మహానుభావుం డిట్టిదాని విడిచి లవణరసపరుషములగు జలధిజలముల నేటికి శయనించెనో తెలియదు. నిక్కము. ప్రళయకాలమం దిందలి జలలేశము గ్రహించి మహావరాహకములు భూమినంతయు ముంచుచున్నయవి.
అని యిట్లు విచారించుచు సికతాలతావికసితమగు తదీయదక్షిణతీరమునఁ దురగమును దిగి దానినీరు ద్రాగించి యొకతరుమూలమునఁ గట్టి యత్తటాకతీరమున మొలచిన దూర్వాప్రవాళకబళములఁ గొన్ని స్వయముగాఁ బెరికితెచ్చి దానిముందు వైచెను.
తరువాత నాత డందు దిగి కరచరణముల గడిగికొని చాతకమువలె జలము గ్రోలి స్మరశరాతురుండు బోలె నళినీదళముల నురమున దాల్చుచు గొంతసే పవ్విలాస మంతయుం జూచి తలయూచి మరలఁ దీరము జేరి యందొకశిలాతలంబునఁ దూఁడులతోఁ గూడ నళినీదళంబులం గొన్ని బెరికికొనివచ్చి యాస్తరణముగా వైచి యందు శిరంబుకు జుట్టికొన్న యుత్తరీయము పరచి కూర్చుండెను.
ముహూర్తకాల మట్లు విశ్రమించినంత నాప్రాంతమున మేయుచున్న యింద్రాయుధము మేత మాని చెవులు నిక్కబెట్టుకొని యట్టెక్కి చూచుటయుఁ దత్కారణ మరయు నతనిచెవులకు వీణాతంత్రీఝుంకారమిశ్రితమగు నమానుషగీత మొండు వినంబడినది. విగతమర్త్యసంపాతముగల యీప్రదేశమునందు నిట్టి గీతధ్వని పుట్టుటకుఁ గారణమెద్దియో? యని శంకించుచు నక్కమలినీపత్రసంసరణమునుండి లేచి యతండు ఆ గీతానాదము నేతెంచినదిశకు దృష్టి ప్రసరింపఁజేసెను. ఆ ప్రదేశ మతిదూరముగా నుండుటచేఁ బ్రయత్నముచేతఁ జూచినను నేమియుఁ గనంబడినదికాదు. అనవతర మా గానస్వానము మాత్రము వినంబడుచున్నది. అప్పు డాగీతము కారణ మఱయుటకు మిక్కిలికౌతుక మందుచు నారాజకుమారుఁడు ఇంద్రాయుధము నెక్కి గీతప్రియమున ముందుగా బయలువెడలిన వనహరిణములు మార్గమును జూపుచుండ నేలాలవంగలవలీలతాలోలకుసుమభాసితములగు సప్తచ్ఛదతరువులచే మనోహరమైన తత్తటాకపశ్చిమతీరము ననుసరించి యఱిగెను.
అట్లు పోవంబోవఁ దదుత్తరతీరంబున మనోఙ్ఞతరులతావేష్టితమైన సిద్ధాయతనమొండు అతనికి నేత్రపర్వము గావించినది. స్ఫటికశిలావినిర్మితమగు నమ్మంటపమధ్యభాగంబున మందాకినీపుండరీకములచే నర్చింపఁబడిన స్ఫటికలింగ మొండు విరాజిల్లుచున్నది.
అమ్మహాలింగమునకు దక్షిణభాగంబున బ్రహ్మాసనము వైచుకొని హంస శంఖ ముక్తాఫల గజదంత పాదరసాది ధవళవస్తుజాతమును గరగించి యమృతరసముతోఁ బదును పెట్టి చంద్రకరకూర్బలచే సవరించి పోసెనోయనఁ దెల్లనిమేనికాంతి దీపింప బాలార్కప్రభాసదృశములగు జటామాలిక లుత్తమాంగమున ముడివైచికొని నక్షత్రక్షాదముఁబోని భస్మము లలాటమున మెఱయ నమలకీఫలస్థూలములగు ముక్తాఫలములచేఁ గట్టబడిన యక్షసూత్రము గంఠమునం గట్టికొని కుచమధ్యంబునం బిగియంగట్టిన కల్పతరులతావల్కలోత్తరీయము ఏకహంసమిథున సనాధయగు శ్వేతగంధం బురడింప స్వభావముచేఁ దెల్లనిదైనను బ్రహ్మాసనమం దుత్తానముగా నిడిన చరణకాంతి సంక్రమించుటచే లోహితాయమానమగు దుకూలములచేత నవృతమగు నితంబము గలిగి నఖమయూఖములు ప్రతిఫలింప దంతమయమైన వీణను దక్షిణకరంబునం బూని మూర్తీభవించిన గాంధర్వదేవతయో యనఁ దంత్రీనాదములతోఁ గంఠస్వానము మేళగించి పాడుచుఁ బాశుపతవ్రత మనుసరించి దివ్యాకృతితో నొప్పుచున్న యొకచిన్నదానిం గాంచి మేను పులకింప నానృపనందనుఁడు సంభ్రమముతో నాతురంగమును డిగ్గి యావారువమును చేరువ నొకతరుమూలమునం గట్టి యమ్మహాలింగము చెంతకుంబోయి నమస్కరించుచు నక్కాంతారత్నము ననిమేషదృష్టుల మరల నిరూపించి చూచి తదీయరూపాతిశయమునకుఁ గాంతివిశేషమునకు వెరగందుచు నిట్లు తలంచెను. అన్నన్నా! జంతువులకు నప్రయత్నముననే వృత్తాంతాంతరములు దోచుచుండునుగదా! నేను యదృచ్ఛముగా వేటకు వెడలినంత గిన్నరమిథునమునుఁ దివ్యజనసంచారయోగ్యమగు ప్రదేశమును గానంబడినది. అందు సలిలము వెదకుచుండ సిద్దజనోపస్పృష్టజలమగు సరోవరము జూడనయ్యె. తత్తీరమున విశ్రాంతి వహించియుండ నమానుషగీతము విననయ్యె. దాని ననుసరించి రాగా నిందు మానుషదర్శనదుర్లభయగు నీచిన్నది కన్నులకు విందు గావించినది.
ఇక్కురంగనయన దివ్యాంగనయని తదాకారమే చెప్పుచున్నయది. ఆహా! మనుష్యాంగనల కిట్టి సౌందర్యమును గాంధర్వమును గలిగియుండునా? దైవవశంబున నీ యోషారత్న మంతర్ధానము జెందనియెడ నీవెవ్వతెవు? నీపేరేమి? ప్రథమవయస్సున నిట్టివ్రత మేమిటికిఁ బూనితివని యడిగెదనుగదా! అని తలంచుచు నాస్ఫటికమంటపములో వేరొకస్థంభము మాటునం గూర్చుండి యానాతిగీతసమాప్త్యవసరము ప్రతీక్షించుచుండెను.
ఆ నాతియుఁ గీతావసానమున వీణంగట్టి లేచి యమ్మహాలింగమునకుఁ బ్రదక్షిణము చేయుచు నొకమూల వినమ్రుఁడై యున్న యారాజుకుమారుని నిర్మలమగు దృష్టి ప్రసారములచేతఁ బవిత్రము చేయునదివోలె మీక్షింపుచు నిట్లనియె.
అతిథికి స్వాగతమె? ఈ మహాభాగుఁ డీభూమి కేటికివచ్చెనో! అతిథిసత్కార మంద లేచి నాతో రావలసియుండునుగదా? యని పలికిన విని యచ్చంద్రాపీడుండు తత్సంభాషణమాత్రమునకే త న్ననుగ్రహించినట్లు తలంచుకొనుచు భక్తితో లేచి నమస్కరించి భగవతీ! భవదాజ్ఞానుసారంబున మెలంగువాఁడ నని వినయమునుఁ జూపుచు శిష్యుండునోలె నయ్యించుబోణి ననుగమించి నడచుచు నిట్లు తలంచెను. మేలుమేలు? నన్నుఁ జూచి యీ చిన్నది యంతర్ధానము నొందలేదు. ఇదియు మదీయహృదయాభిలాస కనుకూలించియే యున్నది తపస్విజనదుర్లభమగు దివ్యరూపముగల యీకలకంఠికి నాయెందుట్లు దాక్షిణ్యము గలుగునో యట్లు మెలంగువాఁడ. అడిగినచో దనవృత్తాంత మిత్తన్వి నాకుఁ జెప్పకమానదు, కానిమ్ము. సమయమరసి యడిగెదనని తలంచుచు నూరడుగులు అప్పడఁతి వెంట నడిచెను.
పగలైననుఁ దమాలతరుచ్ఛాయలచే రాత్రింబలె దోచు నమ్మార్గంబున నడువ మణికమండలు శంఖమయభిక్షాకపాల భస్మాలాబుకాదివస్తువులచే నొప్పుచుఁ బ్రాంతనిర్ఘరీజలకణములచేఁ జల్లనైయున్న గుహయొకటి గానంబడినది.
అయ్యిందుముఖి యచ్చంద్రాపీడుని గుహాముఖశిలయందుఁ గూర్చుండఁ గనుసన్న జేయుచు నవ్విపంచిని వల్కలతల్పశిరోభాగ మందుంచి పర్ణపుటంబున నిర్ఘరజలంబు బట్టి యర్ఘ్యముగా నిచ్చుటయు నతండు భగవతీ! చాలుచాలు అత్యాదరమును విడువుము. నీకటాక్షలేశమే మదీయపాపసముదాయముల బోగొట్టినది శిష్యు ననుగ్రహింపుమని పలుకుచున్నను విడువ కచ్చేడియ బాలాత్కారముగా నతని కతిథిసత్కారము దీర్చినది. అతండును వంచిన శిరస్సుతో నతివినయముగా నయ్యాతిథ్య మందుకొనియెను.
అట్లాతిథ్య మిచ్చి యచ్బేడియ వేరొకశిలాతలమునఁ గూర్చుండి యొక క్షణ మూరకొని పిమ్మట నతని నాగమనకారణం బడుగుటయు నారాజపుత్రుఁడా పద్మనేత్రకు తాను దిగ్విజయయాత్రకు వెడలినది మొదలు కిన్నరమిథునానుసరణముగా వచ్చి యచ్చిగురుబోడిం జూచువరకు జరిగిన వృత్తాంత మంతయుం జెప్పెను.
అతని వృత్తాంత మంతయును విని యాజవ్వని సంతసించుచు భిక్షాకపాలమును గైకొని యవ్వనతరువులయొద్దకుఁ బోయెను.
అప్పుడు స్వయంపతితములైన ఫలములచే నా పాత్ర నిండినది. వానిం గొనివచ్చి యిచ్చినది యుపయోగింపుఁడని చంద్రాపీడు నొద్ద నుంచినది.
ఆ చిత్రమంతయుం జూచి యతండు తలయూచుచు అన్నన్నా! తపంబున కసాధ్యమైనది లేదుగదా? అచేతనమునగు నీవృక్షములుగూడ నీమె దయనుఁ గోరుచున్నవిపోలె వినమ్రతతో ఫలముల నిచ్చినవి. ఆహా! ఇంతకన్న నబ్బుర మెద్ది అదృష్టపూర్వములగు నాశ్చర్యములం గంటినని మిగుల విస్మయము జెందుచు లేచి యచ్చటి కింద్రాయుధమును దీసికొనివచ్చి యనతిదూరమునఁ గట్టి యందున్న నిర్ఝరజలంబున స్నానము జేసి యమృతరసమధురములగు నా ఫలముల దిని చల్లని నీరు గ్రోలి నాయువతిగూడ ఫలహారము చేసివచ్చువరకు నేకాంతప్రదేశమునం గూర్చుండెను.
నిత్యక్రియాలాపములు దీర్చుకొని ఫలరసముల ననుభవించి యాయించుబోడియు నొకశిలాతలంబునం గూర్చుండునంత నాప్రాంతమునకుఁ బోయి చంద్రాపీడుఁడు ననతిదూరంబునం గూర్చుండి యతివినయముతో నిట్లనియె.
భగవతీ! భగవదనుగ్రహప్రాప్తిప్రేరకమైన సంతోషముచేతఁ దొట్రు పడుచు మానుషసులభమైన లాఘవము నన్ను నిచ్చలేకున్నను బ్రశ్నకర్మకుఁ బ్రోత్సాహపరచుచున్నది. ప్రభువుల యనుగ్రహలేశము గూడ నధీరులకుఁ బ్రాగల్భ్యము గలుఁగఁజేయును. సహవాసము కొంచమైననుఁ బరిచయమును గలుగజేయక మానదు. ఉపచారపరిగ్రహ మల్పమైనను ప్రణయ మారోపించును. నీకు ఖేదకరము కాదేని నాయడుగు ప్రశ్నమున కుత్తర మియ్య వేడెదను. నిన్నుఁ జూచినది మొదలు నాకీ విషయమై మిగుల కౌతకము గలిగియున్నది. సురముని గంధర్వ గుహ్యకాదులలో నీజన్మము చేత నెవ్వారి కులము పావనమైనది? కుసుమకోమలమగు నీవయసున నిట్టి కఠినవ్రత మేమిటికిఁ బూనితివి? అన్నన్నా! ఈప్రాయమేడ? యీయాకారమేడ? యీలావణ్యమేడ? యీతపమేడ? నాకు మిక్కిలి యక్కజముగా నున్నది?
సురలోకసౌఖ్యములు గల యాశ్రమములను విడిచి నిర్జనమగు నీ యడవిలో నొంటిగా నేమిటికి వసించితివి? యిట్టి చిత్రములు నే నెచ్చటను జూచియుండ లేదు. నీ వృత్తాంత మంతయు నెరిఁగించి నా సందియమును దీర్చుమని మిక్కిలి వినయముతోఁ బ్రార్ధించెను.
అతని మాటలు విని యవ్వనిత యెద్దియో హృదయంబున ధ్యానించి ముహూర్తకాల మూరకొని నిట్టూర్పులు నిగిడింపుచు ముక్తాఫలంబు బోలిన యశ్రుజలబిందువులు నేత్రకోణంబులనుండి వెల్వడి స్తనవల్కలమునుఁ దడియఁజేయఁ గన్నులు మూసికొని వెక్కి వెక్కి యేడువఁ దొడంగినది.
అట్లకారణముగా విచారింపుచున్న యాయన్నుమిన్నం జూచి వెరగందుచు నతఁ డాత్మగతంబున నిట్లు తలంచెను. అన్నన్నా! వ్యసననిపాతములు దుర్నివారము లైనవిగదా? మనోహరమగు నిటువంటి యాకృతులను సైతము దమవశముఁ జేసికొనుచున్నయవి. శరీరధర్మము గలవారి నుపతాపము లంటక మానవు. సుఖదుఃఖములయొక్క ప్రవృత్తి బలమైనది ఈమె గన్నీరు గార్చుటచే నేతత్కారణ మరయ నాకు మరియుఁ గుతూహల మగుచున్నది. అల్పకారణంబున నిట్టివారు శోకింపరు. క్షుద్రనిర్ఘాతపాతంబున భూమి గదులునా? అని యిట్లు తద్విధం బరయ దలంచి మదీయశోకస్మరణమునకుఁ దానే కారణమని భయపడుచు లేచి యంజలిచేఁ బ్రస్రవణోదకముదెచ్చి మొగము గడిగికొమ్మని యమ్మగువ కందిచ్చెను.
అయ్యింతి సంతతముగాఁ గారుచున్న యశ్రుధారలచేఁ గలుషములగు నేత్రముల నాయుదకంబునఁ గడిగికొని వల్కలోపాంతముచే నద్దుకొనుచుఁ నుష్ణముగా నిట్టూర్పులు నిగిడించుచు నతని కిట్లనియె.
రాజపుత్రా! మందభాగ్యురాల నావృత్తాంతముతో నీకేమి లాభమున్నది! అయినను వేడుకపడుచుంటివి కావునఁ జెప్పెద నాకర్ణింపుము.
మహాశ్వేతకథ
దక్షునిప్రసిద్ధి నీవు వినియేయుందువు. అతనికి మనియు, నరిష్టయనియు నిరువురు పుత్రికలు జనించిరి. అందు మనికిఁ జిత్రరథుండను కుమారుం డుదయించెను. ఆ చిత్రరథుండు సమస్తగంధర్వులకు నధినాయకుండై యింద్రునితో మైత్రి సంపాదించి యీశ్వరప్రసాదంబున మనోహరముగా నిందు చైత్రరథమను పేర నీయుద్యానవనమును అచ్చోదమను నీ సరస్సును నిర్మించెను.
అరిష్టకొడుకు హంసుడనువాఁడును ద్వితీయగంధర్వకులమునకుఁ బ్రభువగుచు గౌరి యను కన్యకను జంద్రకిరణములం బుట్టినదానినిం బెండ్లియాడి యా కాంతామణితో సంసారసుఖము లనుభవింపుచుండెను.
ఆ దంపతులకు సమస్తదుఃఖములకు భాజనమైన నొక్కరితను పుత్రికగా నుదయించితిని. నాతండ్రియు ననపత్యుఁడగుటచే నప్పుడు సుతజన్మాతిరిక్తమగు నుత్సవమును జేయుచు మిక్కిలి సంతోషించుచు జాతకకర్మానంతరమునందు నాకు మహాశ్వేత యని పేరుబెట్టెను.
నేను బిత్రుగేహంబును మధురములగు మాటలచే బంధువులకు సంతోషము గలుగఁజేయుచు నవిదతశోకాయాసమనోహరమగు శైశవము సుఖముగా వెళ్ళించితిని.
అంతఁ గాలగ్రమంబున నామేన వసంతసమయంబునఁ బుష్పాంకురమువలె యౌవనము బొడసూపినది. సమారూఢయౌవననైయున్న నొక్కవసంతకాలమునఁ దల్లితోఁగూడ స్నానార్ధమై యీసరోవరమునకుఁ జనుదెంచి యందందు శిలాతలముల వ్రాయఁబడిన శంభుమూర్తులకు నమస్కరించుచుఁ గుసుమోపహార రమ్యములగు లతామంటపములను పుష్పించిన సహకారతరువులును వనదేవతాప్రేంఖనలశోభనములగు లతాడోలికలును కుసుమరజఃపటలమృగములగు కలహంసపదలేఖలచే మనోహరములగు తీరభూములునుం జూచినంత మనంబున నుత్సాహంబు దీపింప గొంతసేపు ప్రియవయస్యతో నేనందు విహరింపుచుంటిని.
అట్టిసమయమునఁ గాననకుసుమవాసనలం బరిభవింపుచు ననాఘ్రాతపూర్వమగు పరిమళ మొండు వనానిలానేతమై నాకు నాసాపర్వము గావించినది.
ఓహో! అమానుషలోకోచితమగు నీసౌరభము నా కెట్లు కొట్టినది? యని వెరగందుచు గన్నులు మూసికొని యాసుగంధ మాఘ్రాణించి యాఘ్రాణించి శిరఃకంపముచేయుచుఁ దదుత్పత్తిస్థానమరయు తలంపుతో లేచి నూపురరవఝంకారమునకు సరఃకలహంసల ననుసరించి రాఁగా గొన్నియడుగులు నడిచి నలుమూలలు పరికించి చూచితిని.
అప్పు డొకవంక నఖిలమండలాధిపత్యమును గైకొన ధృతవ్రతుండయిన శశాకుండోయనఁ ద్రిలోచనుని వశముఁజేసికొనఁ దపం బొనరించుచున్న కుసుమశరుని పగిది మనోహరాకారముతో నొప్పుచు మందారవల్కలములు దాల్చి హస్తంబున దండకమండలములు మెరయ ఫాలంబున విభూతిరేఖయు కటీతటి మౌంజీమాలికయు గరంబున స్ఫటికాక్షమాలికయుం ధరించి మూర్తీభవించిన బ్రహ్మచర్యముభాతి బుంజీభవించిన శ్రుతికలాపమట్ల దీపించుచు దేహకాంతులచేఁ బ్రాంతభూజముల బంగారుమయములుగాఁ జేయుచు నవయస్కుఁడగు మునికుమారుతోఁగూడ స్నానార్థమై యరుదెంచిన దాపసకుమారుం డొకండు నాకన్నులకుఁ బండువ గావించెను. అతని చెవియందుఁ గృత్తికానక్షత్రమునుం బోలిన యదృష్టపూర్వమగు పుష్పమంజరి యొండు అమృతబిందువుల స్రవించుచు విరాజిల్లుచున్నది. దానింజూచి నేను ఓహో! మదీయ ఘ్రాణమునుఁ దృప్తిపరచిన సౌరభ మీగుచ్చంబునఁ బుట్టినదే యని నిశ్చయించుచు వెండియు నత్తపోధనకుమారు నీక్షించి మనంబున నిట్లు వితర్కించితిని.
అయ్యారే! చతుర్ముఖుని రూపాతిశయవస్తునిర్మాణకౌశల మెంత చిత్రముగా నున్నది! మొదటఁ ద్రిభువనాద్భుతరూపసంభారుఁడగు మన్మథుని సృష్టించి వానికన్న నెక్కువరూపము గలవానిఁ జేయు సామర్ధ్యము కలదో లేదో యను తలంపుతో మునిమాయచేత రెండవ సుమకోదండునిగా నితనిఁ జేయఁబోలు. మున్ను మున్ను గజదానందకరుండగు చంద్రుని, లక్ష్మీలీలాభవనములగు పద్మములును సృజించుట బరమేష్టి కీతని మొగముజేయు పాటవము నేర్చుకొనుటకే యని తలం చెదను. కానిచో నతనికి సమానవస్తుసృష్టితో నేమి ప్రయోజనమున్నది. బహుళపక్షక్షపాకరుని కిరణములకు దరణుండు హరించుచున్నవాఁ డనుమాట యళీకము ఇమ్మునికుమారుని శరీరమందే యణంగుచున్నవి. కానిచోఁ గ్లేశబహుళమగు తపంబున నొప్పుచున్నను వీనిమే నింత లావణ్యభూయిష్టమై యుండనేల?
అని ఇట్లు విచారించుచున్న నన్ను రూపైకపక్షపాతి యగు కుసుమశరుఁడు బరవశనుఁగా జేసెను.
నిట్టూర్పులతోఁగూడఁ గుడికన్నించుక మూసి తిర్యగ్దృష్టిచే నతనిరూపము పానము చేయుదానివలె నెద్దియో యాచించుదానివలె నీదాననైతినని పలుకునట్లు హృదయ మర్పించుపగిది మనోభవాభిభూతురాలనగు నన్ను రక్షించుమని శరణుజొచ్చుమాట్కి నీ హృదయంబు నాకవకాశ మిమ్మని కోరుతీరునఁ జూచుచు అన్నన్నా! ఇది యేమి మోసము కులస్త్రీ విరుద్ధమగు బుద్ధిపుట్టినది ఇది గర్హితమని యెఱింగిన దాననైనను నింద్రియప్రవృత్తుల మరలించుకొన వశముకాక స్థంభింపఁబడినట్లు వ్రాయబడినట్లు మూర్ఛబొందిన చందమున నవయవములు కదల్పలేక యట్టె నిలువంబడితిని. అప్పటి నాయవస్థ యిట్టిదని చెప్పుటకు శక్యముకాదు. పూర్వము శిక్షింపబడినదికాదు.
తద్రూపసంపత్తుచేతనో మనస్సుచేతనో మన్మథుని చేతనో యౌవనము చేతనో యనురాగముచేతనో దేనిజేతను జేర్పబడితినో కాని యట్టియవస్థ నేనెన్నఁడు నెఱుంగను.
అట్లు పెద్దతడవుచూచి యెట్టకేలకుఁ జిత్తమును దృఢపరచుకొంటిని అప్పు డతని హృదయమున నిల్చుట కవకాశ మిచ్చుటకుఁ గాబోలు నిశ్వాసమారుతములు బయలువెడలినవి. హృదయాభిలాష దెలుపుచున్నదివోలె గుచయుగళము గగుర్పొడిచినది. సిబ్బితిం గరుగుచున్నట్లు మేనెల్ల జమ్మటలు గ్రమ్మినవి. మదనశరపాతభయంబునఁబోలె గంపము వొడమినది. అట్టి సమయమున మనంబున నేనిట్లు తలంచితిని.
అయ్యయ్యో! సురతవ్యతిరేకస్వభాండును మహానుభావుండునగు నిమ్మునికుమారునియందు దుర్మదుండగు మన్మథుండు నాకిట్టి యనురాగము గలుగఁజేయుచున్నవాఁడేమి? అనురాగము విషయయోగ్యత్వమును విచారింపదు, స్త్రీహృదయం బెంత మూఢమైనదో కదా! ప్రాకృతజనులచేఁ బొగడఁబడుచుండెడు మన్మథవిలాసము లెక్కడ? తపోమహత్వ మెక్కడ? మన్మథవికారములచేఁ దొట్రుపడుచున్న నన్నుఁ జూచి యీతండు చిత్తంబున నెట్లు తలంచునో? అట్లెఱింగియు నీ వికారమణగింప లేకున్నదాన నెంతచిత్రమో? ఇది మదీయచిత్తదోషముకాదు తదీయరూపవిశేషమం దట్టి మహిమ యున్నది ఈతఁడు నా వికారములఁ జూడకమున్న ఇందుండి లేచిపోవుట యుక్తము. అప్రియములగు స్మరవికారములఁ జూచి కోపముతో శాపమిచ్చునేమో! మునిస్వభావము పరిభవమును సహింపదుగదా.
అని మరలిపోవుటకు నిశ్చయించియు నతని యాకృతివిశేషము పదములకు నిగళమై తగులుకొని కదలనీయమింజేసి మునిజాతి యశేషజనపూజనీయమయినదికదా? నమస్కరించి యరిగెద, దీనం దప్పేమియని యప్పుడే దాపునకుఁబోయి అతని మొగమునందు చూపులిడుచు బాదంబులకు నమస్కరించితిని.
దుర్లంఘ్యశాసనుండగు మదనుం డప్పుడు మద్వికారదర్శనంబున నపహృతధైర్యుఁ డగు నతని హృదయమునుగూడ విపనుండు దీపమువలెనే చాంచల్య మందఁజేసెను.
యౌవనము అనినయబహుళమైనది కదా! అప్పు డతనికి గ్రొత్తగాఁ జిత్తమును జొచ్చుచున్న మదనుని నెదుర్కొనుచున్నట్లు రోమాంచము పొడమినది నా యొద్దకు వచ్చుచున్న హృదయమునకు దారిజూపుచున్నట్లు నిట్టూర్పులు వెడలినవి. వ్రతభంగమున భయపడుచున్నదివోలె గరతలమందున్న జపమాలిక జారిపడినది.
అప్పుడు నేనతని వికారమును జూచి హృదయంబున మదనావేశము రెట్టింప నిట్టిదని చెప్పుటకు నలవికాని యవస్థం జెందుచు డెందమున నిట్లు తలంచితిని.
అనేకసురతలాస్యలీలావిశేషముల నుపదేశింప నుపాధ్యాయుండగు మన్మథుండే విలాసములను నేర్పునుగదా! లేనిచో శృంగారచేష్టలయందుఁ బ్రవేశింపని బుద్ధిగల యీమునికుమారుని దృష్టిప్రసార మింత మనోహరముగా నెట్లుండును.
ఈతని హృదయాభిలాషనంతయు నతని చూపులే చెప్పుచున్నవి. అని తలంచుచు దాపుగాఁబోయి యతని సహచరుండగు ఱెండవ మునికుమారునితోఁ బ్రణామపూర్వకముగా నిట్లంటిని.
ఆర్యా! యీ మునికుమారుని పేరేమి? యెవ్వని కుమారుండు? ఈయన శ్రవణాభరణముగా ధరించిన పుష్పమంజరి యేకుంజమునఁ బుట్టినది? దీని సౌరభ మాఘ్రాణించినది మొదలు నాహృదయ మెంతేని సంతస మందుచున్నది. ఇట్టి సుమ మెన్నడను జూచియుండలేదని పలుకగా విని యమ్మునికుమారుం డించుక నవ్వుచు నాకిట్లనియె
బాలా! నీ ప్రశ్నముతోఁ బ్రయోజనమేల? కౌతుకమేని వక్కాణించెద వినుము.
పుండరీకుని కథ
దేవలోకంబున శ్వేతకేతుఁడను మహాముని కలఁడు. అతని యాకారము త్రిభువనసుందరమైనది. అమ్మహాముని యొకనాఁడు దేవతార్చనకు సుమములఁ గోయుటకు మందాకినీనదికిఁ బోయెను. అందు బద్మములు గోయుచున్న యమ్మునిపుంగవునిం జూచినంత పద్మసన్నిహితయైన లక్ష్మికిఁ జిత్తచాంచల్యమైనది.
ఆలోకమాత్రంబుననే సురతసమాగమసుఖ బనుభవించిన యమ్మహాదేవికిఁ బీఠంబుగానున్న యప్పద్మంబునంద కుమారుం డుదయించెను.
ఆ శిశువును గ్రహించి యాలక్ష్మి దేవా? యీతండు నీకుమారుండు గైకొనుమని పలుకుచు వాని నాశ్వేతకేతున కిచ్చినది. అమ్మునియు బాలజనోచితకృత్యములన్నియు వానికి నిర్వర్తించి యాతండు పుండరీకమునం బుట్టుటచేఁ బుండరీకుఁడని నామకరణముచేసి యతనికి సమస్తవిద్యలను నేర్పెను. ఆ శ్వేతకేతుసూనుండే యీతండు. మరియు నీ కుసుమగుచ్చము క్షీరసముద్రజాతమగు పారుజాతతరువునం బుట్టినది. పత్రవిరుద్ధముగా నీపూవీతని శ్రవణసంగత మెట్లయ్యెనదియుం జెప్పెద నాకర్ణింపుము. ఈ దివసము చతుర్దశియని యీతండును నేనును దేవలోకమునుండి కైలాసగతుఁడగు శితికంఠు నారాధించుటకై నందనవనము మీదుగా బోవుచుంటిమి.
అప్పుడా నందనవనలక్ష్మి యీ పారిజాతమంజరిని హస్తమున ధరించి వచ్చి యీతనికి మ్రొక్కుచు నిట్లనియె ఆర్యా! త్రిభువనదర్శనాభిరామమగు నీ రూపమున కిది యనురూపమైనది. దీని శ్రవణావసంతముగాఁ దాల్చుము పారిజాతము, జన్మము సాద్గుణ్యము నొందునని పలుకగా నితం డాత్మస్తుతివాదమునకు లజ్జించుచుఁ గన్నులు మూసికొని యామెమాటఁ బాటింపక నడువఁదొడంగెను.
అప్పుడాదేవియు నీపూవుందాల్చి విడువక వెంట వచ్చుచుండుటఁ జూచి, నేను మిత్రుఁడా? దీన దోష మేమి? యిది యద్దేవి యనుగ్రహపరిగ్రహముకాదా! గైకొనుమని పలుకుచు నితం డిచ్చగింపకున్నను నేనుఁ బుచ్చుకొని బలాత్కారముగా దీని నతని శ్రవణాభరణముగా నిడితిని ఇదియే దీని వృత్తాంతమని చెప్పి యతండూరకుండెను.
పిమ్మట నప్పుండరీకుఁడు మందహాసోపశోభితవదనారవిందుఁడై నన్నుఁ జూచి కామినీమణి! నీకీ ప్రశ్నాయానముతోఁ బనియేమి? కావలసినచో నీ పుష్ప గుచ్ఛమును బుచ్చుకొమ్మని పలుకుచుఁ దన చెవియందున్న లతాంతమును దీసి నా శ్రవణపుటంబున నుంచెను.
నాకప్పుడు తత్కరతలస్పర్శలోభంబునంజేసి యవతంసస్తానమున నా పూవు రెండవ హృదయములాగున దోచినది. అతండును మత్కపోలతలస్పర్శసుఖంబున వడంకుచున్న కరతలంబునుండి జారిపడిన జపమాలికను సైతము సిగ్గుచేత గురు తెరుంగడు.
నేనప్పుడా జపమాలికను నేలంబడకుండ గ్రహించి విలాసముగాఁ దద్బుజపాశములచేఁ గూర్పఁబడిన కంఠగ్రహసుఖం బనుభవించుదానివలెఁ గంఠాభరణముగా మెడలో వైచుకొంటిని.
అట్టి సమయమున ఛత్రగ్రాహిణి నాయొద్దకు వచ్చి రాజపుత్రీ! మీతల్లి స్నానము జేసినది. ఇంటికిఁబోవు సమయమగుచున్నది. కావున వేగమ స్నానము చేయుమని పలికినది. ఆమాట విని నేను గుండె దిగ్గుమన నిష్టములేకున్నను నతిప్రయ త్నముతో నతని మొగమునుండి దృష్టి మరలించుకొనుచు స్నానము చేయుటకుఁ బోయితిని. పిమ్మట రెండవ మునికుమారుఁడు ఆ ప్రకారము ధైర్యస్ఖలితుఁడైన యప్పుండరీకుం జూచి యించుక యలుక మొగంబునఁ దోప నిట్లనియె.
మిత్రుడా! పుండరీక! క్షుద్రజనులచేఁ ద్రొక్కంబడిన యీ మార్గము నీకుఁ దగినదికాదు. సాధులు ధైర్యధనులుకదా! ప్రాకృతుండువోలె వివశంబగు చిత్తము నరికట్టవేమి? ఇప్పుడు నీకపూర్వమైన యింద్రియచాంచల్యము గలిగినదే? ధైర్యము, వశీత్వము, ప్రశాంతి బ్రహ్మచర్యనియమము, ఇంద్రియ పరాఙ్ముఖత, యౌవనశాసనత్వము మొదలగు నీసుగుణము లన్నియు నెందుబోయినవి? నీ చదువంతయు నీటఁగలిపితివే, నీవివేకమంతయు నిరర్ధకమైనదే. అయ్యయ్యో! కరతలము నుండి జారిపడిన జపమాలికను సైతము గురుతెరుంగకుంటివి? యేమి నీ మోహము? ఒకవేళ బ్రమాదముచే బుద్ధి చాంచల్యమందినను వివేకముతో మరల్చుకొనరాదా? యున్మత్తునిక్రియ వర్తించుచుంటివేయని పలికిన విని యించుక గుందుచు నతనితోఁ బుండరీకుం డిట్లనియె.
వయస్యా! కపింజల! నన్ను మరియొకలాగునఁ దలంపకుము. నే నట్టివాఁడను కాను. దుర్వినీతయగు నీనాతి నా జపమాలికను గ్రహించిన యపరాధమును నేను మరచిపోయితి ననుకొంటివా? చూడుమని యళీకకోపము దెచ్చుకొని యతిప్రయత్నముతో భ్రూభంగము గావింపుచుఁ జుంబనాభిలాషఁ బోలెఁ బెదవిగరచుచు నా కడకు వచ్చి యిట్లనియె.
చపలురాలా! నా జపమాలిక నాకియ్యక యిందుండి యెందు వోయెదవు? ఇచ్చి కదులుమని పలుకగా విన నేనును నా మెడనుండి యేకయష్టిగల ముత్తెపుపేరును దీసి, ఆర్యా! ఇదిగో! మీ మాలికను స్వీకరింపుఁడని పలుకుచు, మన్ముఖమునందు దృష్టినిడి శూన్యహృదయుఁడై చూచిన యతని చేతియం దమ్మాల నిడి స్వేదసలిలస్నాత నయినను వెండియు స్నానము చేయుటకుఁ దటాకమునకుఁ బోయితిని.
అందు గ్రుంకి తల్లితోఁ గూడ మెరకకుఁబోవు ప్రవాహమువలె నతిప్రయత్నముతో నింటికివెళ్ళి కన్యాంతఃపురము ప్రవేశించి యతని న్వరించుచు నది మొదలు విరహవిధురనై యిట్లు తలంచితిని.
అయ్యో! నేనచ్చటనే యుండక యింటి కేమిటికి వచ్చితిని? ఆ! రాలేదు. నే నచ్చటనే యుంటిని. కాదు యిది గృహమే ఇప్పుడు నేను నిద్రబోవుచున్నానేమో! స్వప్నములో నిట్లు కనంబడినది కాబోలు. అయ్యో! నాకన్నులు తెరవఁబడియే యున్నవి. స్వప్న మెట్లు వచ్చును? ఇది రాత్రియా పగలా? నా కీతాపము రోగమేమో? నే నిప్పు డెచ్చట నుంటిని? యెచ్చటికిఁ బోవుదును? ఎవ్వరితోఁ జెప్పుకొందును? దీనికిఁ బ్రతీకారమెద్ది? అని పెక్కుతెరంగుల నున్మత్తవలెఁ బలవరించుచు నంతఃపురమున కితరుల రాకుండ నియమించి యొంటిగా నొకగవాక్షము దాపునఁ గూర్చుండి ఆ దిక్కునే మిక్కుటమయిన దానిగాఁ దలంచుచు నా దిశనుండి గాలివచ్చినను మనోహరమయిన దానిగాఁ నెంచుచు మౌనమవలంబించి యాతని రూపమును, లావణ్యమును, యౌవనమును మాటిమాటికి స్మరించుకొనుచు మేనం బులకలు బొడమ, దత్కరతం స్పర్శసుఖం బభినయించుకొనుచు క్షణమొక యుగములాగున గడుపుచుంటిని.
అంతలో తాంబూలకరండవాహిని తరళిక యననది నా యొద్దకు వచ్చి నా యవస్థ యంతయుంజూచి చింతించుచు నిట్లనియె.
రాజపుత్రీ! అత్తటాకమునుండి స్నానముఁజేసి నీవు నన్నుఁ బరామర్శింపక ముందుగా నింటికి వచ్చితివి కదా! నీవు వచ్చిన తరువాత నొకవిశేషము జరిగినది, యాకర్ణింపుము. దివ్యాకారములతో నిరువురు మునికుమారులు అచ్ఛోదసరస్తీరంబున మనకుఁ గనఁబడిరి కదా? వారిలో నీ కీపుష్పమంజరి నిచ్చిన యతండు రెండవవానికి గనంబడకుండఁ బుష్పించిన లతావితానముల మాటుగా నా యొద్దకు వచ్చి, బాలికా! యిప్పుడిక్కడ స్నానము చేసిన కన్యక యెవ్వని కూతురు? పేరేమి?యెచ్చటికిఁ బోయినదని నన్నడిగెను.
అప్పుడు నేను వినయములతో ఆర్యా! యీ చిన్నది హంసుఁడను గంధర్వరాజు కూఁతురు. దీనిపేరు మహాశ్వేత యిప్పుడాత్మీయనివాసస్థానమైన హేమకూటమను పర్వతమునకుఁ బోయినదని చెప్పితిని.
నా మాట విని యతండు ముహూర్తకాల మూరకొని యెద్దియో ధ్యానించుచు దేనినో యాచించువాఁడుంబలె రెప్ప వాల్పక నన్నుఁ జూచుచు సానునయముగా వెండియు నా కిట్లనియె.
కల్యాణీ! నీవు చిన్నదానవైనను నీ రూపము నీ గౌరవమును, యోగ్యతను వెల్లడిచేయుచున్నది. నిన్నొండు యాచించుచున్నవాఁడ, కాదనక యాచరింతువే యనుటయు నేను వినయముతో నంజలి ఘటింపుచు మెల్లన నిట్లంటి.
మహాభాగ! మీ రట్లు పలుకుటకు నేనెవ్వతెను. త్రిభువనపూజనీయులగు మీ వంటి మహాత్ములు పూర్వపుణ్యవశంబునంగాక మా యట్టి కృతులయందు దృష్టి ప్రభావమైనఁ బరగింపరనుచో నాజ్ఞాపించుమాటఁ జెప్పనేల? దాసురాలయెడఁ గనికరముం చేయఁదగిన కార్య మెద్దియో చెప్పుఁడు. నమ్మకముగాఁ జేసి యనుగ్రహపాత్రురాల నగుదునని పలికితిని.
అప్పుడు నన్నతండు సఖురాలిగా మన్నించుచు సంతసముతో నా ప్రాంత మందున్న తమాలతరుపల్లవమును దెచ్చి తీరప్రస్తరముపై వైచి నలిపి రసముదీసి యా రసమున వల్కలోత్తరీయ మింత జించి దానియందు కనిష్టికానఖశిఖరముతో నెద్దియో వ్రాసి, కనకగాత్రీ! నీ వీపత్రికం గొనిపోయి యా రాజపుత్రి కేకాంతముగా నున్నప్పుడిమ్ము. పొమ్మని పలుకుచు నది నా కిచ్చెను. నేనును దాని బదిలముగా దెచ్చితి నిదిగో చూడుమని తాంబూలభాజనమునుండి యా పత్రికం దీసి నా కందిచ్చినది.
నేనును దత్సంభాషణముల చేతనే మేన రోమోద్గమము జనింప నతనముట్టినట్లు సంతసించుచు నా పత్రిక నందుకొని తల్లిఖితాక్షరంబులం జూచి కన్నుల నద్దికొనుచు మదనావేశముతో నిట్లు పఠించితిని.
[2]ఉ. తామరతూడువోలె విశదంబగు ముత్తెపుపేరుచేత నా
హా! మహి లోభ పెట్టబడు హంసవిధంబున నాశఁజెంద నెం
తో మదుదారమానససముద్భవభూరితరాభిలాష నీ
చే మహిళావతంసమ? రుచిం గొనిపోఁబడెజూవెఁ దవ్వుగాన్.
అట్టి పద్యము జదివించినంత నాలుకగోసిన మూగవానివలెఁ గల్లుద్రావిన యున్మత్తునపగిది స్మరాతురమగు నా హృదయము ప్రవాహము చేత వ్యాకులమయిన సరిత్తువలె విహ్వలత్వము గైకొనినది.
మరియు, నా పత్రికం జూచుటచే, ద్రిలోకరాజ్యవైభవ మనుభవించినట్లు సంతసించుచు దానిఁ గపోలములయందును అలకలయందును బెట్టుకొనుచుఁ దరళికా! చెప్పుము. చెప్పుము. అతండు నీచే నెట్లు చూడబడియెను? ఏమేమి చెప్పెను? నీ యొద్ద నెంతసేపు నివసించెను? అని పలుమారు దాని నడుగుచు నెట్టకేలకు నా దివసము గడిపితిని.
పిమ్మట నా హృదయముతోఁ గూడ సూర్యబింబము కృతరాగసంవిభాగము కలదియై యొప్పినది. అప్పుడు ఛత్రగాహిణి వచ్చి, రాజపుత్రీ! అమ్మునికుమారులలో నొఁకడు వచ్చి ద్వారమున నిలిచి జపమాలిక నడుగుటకు వచ్చియున్నానని చెప్పుచున్నాడు. అనుజ్ఞయేమని యడుగగా నేను మునికుమారనామగ్రహణముచే మిగులఁ దొందరపడుచు నతనిరాక శంకించుకొనుచు వేగమ తీసికొనిరమ్మని యాజ్ఞాపించితిని.
అమ్మునికుమారుని వయస్యుఁడయిన కపింజ్జలుని నది వోయి తీసికొని వచ్చినది అతని యాకారముఁజూడ విషాదముతోఁ గూడినట్లు కనఁబడినది. అప్పుడు నేను దటాలున లేచి నమస్కరించి యాదరముతో స్వయముగాఁ బీఠము దెచ్చివైచితిని. పీఠపవిష్టుండయిన యతని యడుగులను వలదనుచుండ బలాత్కారముగాఁ గడిగి యుత్తరీయాంశుకముచేఁ దడియొత్తి యతనికిఁ దాపుగాఁ గూర్చుంటిని.
అతం డట్లొక మూహుర్తమాత్రము విశ్రమించి యెద్దియో చెప్పఁదలచుకొని నాదాపుననున్న తరళికపై దృష్టి నెఱయించెను దాన నతని యభిప్రాయము గ్రహించి దేవా! యిది నా శరీరము వంటిది. వక్తవ్యాంశము నిస్సంశయముగాఁ జెప్పవచ్చునని పలుకగాఁ గపింజలుఁ డిట్లనియె.
రాజపుత్రీ! నేనేమని చెప్పుదును? సిగ్గుచేత నా వాక్కు వక్తవ్యాంశమును గ్రహింపకున్నది కందమూలములం దినుచు శాంతముగా నడవులఁ గ్రుమ్మరు మునిజన మేడ? మన్మథవిలాసము లేడ? అంతయు విపరీతముగానే యున్నది. దైవమెట్లు చేయుటకు సంకల్పించెనో చూడుము. భగవంతుఁ డప్రయత్నముచేతనే పురుషునిఁ బరిహాసాస్పదముగాఁ జేయునుకదా! ఇది యే ధర్మోపదేశమో నాకుఁ దెలియకున్నది. నా సందేశము చెప్పక తప్పదు. మఱియొక యుపాయ మేదియు గనంబడుకున్నది. కొండొకప్రతిక్రియయుఁ దోచదు. ప్రాణపరిత్యాగముచేత నయినను మిత్రుని రక్షింపఁదగినదని చెప్పుచున్నాను. వినుము. నీ దాపుననే నిష్ఠురముగా నట్లు కోపపడి యట నుండక పుష్పములు కోయుటమాని మఱియొక చోటికిం బోయితిని. పిమ్మట నీవు నింటికిఁ బోయితివి కదా! అప్పుడు నే నితండొక్కడు నేమిచేయుచున్నవాఁడో చూతమని మరలివచ్చి యచ్చటి కొమ్మల సందున దాగి యా ప్రదేశమును జూచితిని కాని యతండందు గనంబడలేదు.
మే మిరువురము పుట్టిననాటనుండియు నొకక్షణమైన నెడఁబాసి యుండ లేదు. కావున సుహృత్స్నేహతరత్వంబున హృదయంబు దొట్రుపడుచుండ నిట్లు తలంచితిని.
అయ్యో! నా మిత్రుడు మదనపరాయత్తచిత్తుండై యామత్తకాశినివెంటఁ బోయి తిరిగి నా యొద్దకు వచ్చుటకు సిగ్గుపడియెఁ గాఁబోలు, లేక కోపముచేత నన్ను విడిచి యెచ్చటికేనిం బోయెనేమో! ధైర్యస్ఖలనవిలక్షణుఁడైన యతం డేమై పోయెనో కదా యని యమంగళము తలంచుకొనుచుఁ దరులతాగహనములు, చందనవీథులు, లతామంటపములు, సరఃకూలములు మొదలగు ప్రదేశములు పెద్దతడవు తద్దయు శ్రద్ధతో వెదకితిని.
అంత నొక సరస్సమీపమందు లతామంటపమున చిత్తరువు మాడ్కి, స్తంభితుని పగిది యోగస్థునిభంగి గదలక మన్మథశాపభయంబున బోలె నడఁగి నిష్పందనిమీలితమగు కనుదోయినుండి బాష్పజలము ధారగా వెడలుచుండ హృదయమునఁ బ్రజ్వరిల్లు మదనాగ్నిజ్వాలను గైకొని వెడలు నిట్టూర్పుగాడ్పులచేఁ బ్రాంత లతాకుసుమకేసరముల వాడఁజేయుచు వామకరతలంబునఁ గపోలం బిడుకొని యున్మత్తునిక్రియఁ బరాయత్తచిత్తుండైయున్న పుండరీకుం గంటిని.
అపగతనిమేషములగు చక్షుస్సులచే దదవస్థ యంతయుంజూచి హృదయంబున విషాదంబు జనింప నిట్లు తలంచితిని.
మన్మథుఁడు దుర్విషహవేగముగలవాఁడు కదా! నిమిషములో నితని దీర్పరానియవస్థపాలు చేసెను. అన్నన్నా! జ్ఞానరాసియంతయు నొక్కమాటు వ్యర్థమయినదే అయ్యారే! ఎంత చిత్రము. ఈతండు పిన్ననాటినుండియు ధీరస్వభావుండు. అస్ఖలితచిత్తవృత్తిగలవాఁడై మాబోటులకు సైతము నీతి గరపుచుండువాఁడు. అట్టివాఁ డిప్పు డితరుండువోలె జ్ఞానము లెక్క సేయక తపఃప్రభావము నున్మూలించి గాంభీర్యాదిగుణంబులు మట్టుపరచి మన్మథునిచేత జడీకృతుండయ్యె. కానిమ్ము. ఇది యౌవనమహిమకదా యని తలంచుచు నేను మెల్లగా వాని దాపునకుఁబోయి యా శిలాతలమందు వెనుకగాఁ గూర్చుండి భుజముమీఁద జేయి వైచుచు, సఖా! పుండరీక! ఇట్లుంటివేమని యడిగితిని.
అప్పు డతం డతిప్రయత్నముతోఁ గన్నులు దెరచి మందరమగు దృష్టితో నన్ను జూచి ఇస్సురని నిట్టూర్పు నిగుడించుచు సిగ్గుచేత విరాళాక్షరములు గలుగు మాటలతో వయస్యా? కపింజలా! నా వృత్తాంత మెరింగియు నీ విట్లడిగిన నేనేమి చెప్పుదునని మెల్లగా బలికెను.
అప్పు డతని యవస్థ జూచి త్రిప్పరానిదని నిశ్చయించియు మిత్రుని సన్మార్గప్రవృత్తునిగాఁ జేయుట యుచితము, శక్తికొలది చెప్పిచూచెదంగాకయని తలంచి వెండియు నిట్లంటిని.
పుండరీక! నీవృత్తాంత మెఱుంగబట్టియే యిట్లడుగుచున్నవాఁడ. నీవవలంబించిన వ్యాపారము గురూపదిష్టమా, శాస్త్రపఠితమా, నియమవిశేషమా, ముక్తిప్రాప్తికారణమా, మనస్సుచేతనయిన స్మరింపఁదగినదేమో చెప్పుము. అజ్ఞానుండువోలె, మన్మథహతకునిచేతఁ బరిహాసాస్పదత్వమును బొందింపఁ బడుచుఁ దెలియకుంటివేమి? ప్రాకృతజనాభిమతములగు నింద్రియవిషయంబుల సుఖాభిలాష నీ కెట్లు కలిగినది. పరిణయనిరసంబులగు నింద్రియసుఖంబుల బుద్ధిజొనుపుట మహారత్నమను భ్రాంతితో నంగారము ముట్టినట్లగునని యెరుఁగవో? విషయతత్వముల నెఱింగియు స్ఖలితమయిన జ్ఞాన ముద్దరింపవేమి? ఇంద్రియముల నివారింపనేల? చిత్తమును నియమింపవేమి? ఈ మన్మథుఁడన నెంతవాఁడు? ధైర్య మవలంబించి వానిని పరిభవింపుము. అని నేను బలుకుచుండగనే నామాటల నాక్షేపించుచుఁ గన్నీరు దుడుచుకొనుచు నా చేయిపట్టుకొని యతం డిట్లనియె.
కపింజలా! పెక్కుమాటలతోఁ బ్రయోజనమేమి? ఆశీవిషవేగముగల విరితూపుల పోటుపడనివాఁ డెన్నేని బరుల కుపదేశింపవచ్చును. ఇంద్రియములు మనంబును నెవ్వనికిఁ గలిగియుండునో శుభాశుభవివేచన మెవ్వఁ డెరిఁగియుండునో వాఁ డుపదేశమునకుఁ దగినవాఁడు. నాకవి యన్నియును దవ్వైనవి. యుపదేశకాల మతిక్రమించినది. జ్ఞానము నిలుపుకొనుసమయము మించిపోయినది. నీకంటె నాకు సన్మార్గ ముపదేశించువాఁడు లేడు. నీయుపదేశము నేను వినఁదగినదే కాని నామానసవికారము మరలించుకొనుటకు శక్యము కాకున్నది. నేనేమి చేయుదును? మదనసంతాపముచే నాయంగము లన్నియు నుడికిపోవుచున్నవి. దీని కెద్దియేని ప్రతిక్రియ యెరుంగుదువేని యాచరించి నీ ప్రియమిత్రుని బ్రతికించుకొమ్మని పలికి యూరకుండెను.
అప్పుడు నేను మరల నతని మతిమరలింపఁదలంచి శాస్త్రదృష్టాంతముల నితిహాసనిదర్శనములు నగు మాటలచే నెంతేని నీతి నుపదేశించితిని కాని యతం డేమియుఁ జెవియొగ్గి వినకపోయెను.
ఇఁక నుపదేశములతోఁ బ్రయోజనములేదని నిశ్చయించి నేను లేచి యత్తటాకములోనికిఁబోయి తామరతూడులను, కమలినీదళములను, గలువలను, పద్మములనుం గోసికొనివచ్చి యందున్న లతామంటపమునందలి శిలాతలంబునం బాన్పుగా బరచి యతనినందు బరుండఁబెట్టి చందనతరుపల్లవంబులం దెచ్చి రసముతీసి స్వభావసురభియగు నారస మాపాదమస్తకముగా నతనిమేనం బూసి కదళీదళంబున వీచుచుంటి. మిక్కుటమగు తాపముచే నాచేయు శైత్యోపచారములన్నియు నిష్ఫలములగుచుండఁ జూచి నేనిట్లు తలంచితిని అన్నన్నా! మన్మథునికి సాధ్యముకానిది లేదుకదా! హరిణమువలెఁ గ్రుమ్మరుచు స్వభావముగ్దుడగు నీతండేడ? వివిధవిలాసరసరాశియగు గంధర్వరాజపుత్రి యేడ? యెట్లు సంఘటించెనో చూడుము సాగరగంభీరుఁడగు నితని దృణమువలెఁ దేలికపరచెనే? యింతకన్న ప్రౌఢిమ యేమిగలదు? అన్నిగతులచేతఁ దీర్పరాని యాపద తటస్థించినది ఏమిచేయుదును? ఎక్కడ జొత్తును? ఎవరితోఁ జెప్పుదును? యెట్లు వీని ప్రాణములు నిలుచును? ఉపాయ మెద్ది? కర్తవ్య మేమి? యని యనేకప్రకారములఁ దలంచుచు అయ్యో! యీవెర్రియాలోచనఁతోఁ బనియేమి? తత్కాంతాసమాగముకన్న వేరొకండుసాధనమున వీఁడు బ్రతుకఁడు అట్టిపనియే చేయఁదగినది. తాపసజనులకిది యనుచితమని నే నిప్పు డూరకుంటినేని యేకోచ్ఛ్వాసజీవితుండగు నితండు కాలమును సహింపక మృతినొందగలఁడు. గర్హితకృత్యముచేత నయినను మిత్రాసువుల రక్షింపఁదగినదికదా! కావున నే నిప్పు డన్నిగతులచేత నానాతియొద్దకుఁ పోవుటయే యుచితముగా నున్నయది. ఇతని యవస్థ యంతయు నాయింతి కెరింగించెదనని నిశ్చయించుకొనుచు నెన్నఁడును దుర్వృ త్తియందుఁ బ్రవేశింపని యతండు నన్నుఁ జూచి సిగ్గుతో నావృత్తి మరలించుకొనునేమో యని యెద్దియో మిషబన్ని యతనితోఁ జెప్పక యచ్చోటు బాసి నీయొద్దకు వచ్చితిని. తరువాత చేయందగినకృత్య మెద్దియో యాలోచింపుమని పలికి నా మొగంబునఁ జూట్కి నిలుపుచు నామాట విను తాత్పర్యముతో నూరకొనియెను.
అతని మాటలు విని నేను సుఖామృతమయమగు హ్రదంబున మునిఁగినదానివలె సంతసించుచున్నప్పుడు బొడమిన సిగ్గుజేతఁ దలవాల్చుకొని కన్నుల నానందబాష్పములు గ్రమ్మి మనమ్మున నిట్లు తలంచితిని. పాపము, మన్మథుఁడు నన్నుఁ బలెనే యాతనింగూడ బరితాపము నొందజేయుచు నాకు మంచియుపకృతి గావింపుచున్నవాఁడు. అతం డట్టి యవస్థ ననుభవింపుచున్నాఁడను మాటనిక్కువము. స్వప్న మందైనను గపింజలుఁడు అసత్యమాడువాఁడు కాడు. ఊరకింత దూరమువచ్చి యేల ప్రయాసము జెందును. ఇప్పు డీతనికి నేనేమని చెప్పుదును? ఏమి కావింపఁదగినది? యుపాయ మెద్ది? యని యనేకప్రకారములఁ దలంచుచున్న సమయంబునఁ బ్రతీహారి వచ్చి రాజపుత్రీ! నీవస్వస్థతగా నుంటివనుమాట విని నిన్నుఁ జూచుటకై మీ యమ్మగారు వచ్చుచున్నారని చెప్పెను.
ఆ మాట విని కపింజలుడు మహాజనసమ్మర్ధభయంబున నటనుండ వెరచి లేచి, రాజపుత్రీ! సూర్యుం డస్తమించుచున్నవాఁడు, నేనుఁ బోయివచ్చెద; మిత్రప్రాణముల రక్షించుటకై యిదిగో యంజలి ఘటింపుచన్నవాఁడ. కర్తవ్యమెద్దియో యోచించి యట్లు కావింపుమని పలుకుచుఁ బ్రత్యుత్తరమును బొందకయే బయలుదేరి పెక్కండ్ర పరిచారికలతో నామెతల్లి వచ్చుచున్నది కావున నాసమ్మర్ధములోఁ దప్పించుకొని యెట్లో దాటిపోయెను.
మజ్జననియు నాపజ్జకు వచ్చి కొంతసేపు నివసించి తిరిగి వెళ్ళిపోయినది. ఆమె నాయొద్దకు వచ్చి యేమి చేసినదో యేమి పలికినదో శూన్యహృదయ నైన నేనేమియు నెరుంగను.
అంతలో సాయంకాల మగుటయు నప్పుడు కర్తవ్యమెద్దియో తెలియక తరళికతో నిట్లంటిని, తరళికా! నాహృదయ మాకులమయినదనియు నింద్రియములు వికలములయినవనియు నీ వెరుంగవా యేమి? ఇప్పు డేమి చేయఁదగినదో నాకుఁ దెలియకున్నది. కపింజలుఁడు చెప్పిన మాటలన్నియు నీవు వింటివికదా! చక్కగా నాలోచించి నా కుపదేశింపుము. నే నితరకన్యలవలె సిగ్గును విడిచి జనాపవాదమును లెక్కింపక సదాచార మతిక్రమించి తండ్రి యనుమతి వడయక యచ్చోటికిఁబోయి యప్పుండరీకునిం కలసికొంటినేని గురుజనాతిక్రమణదోషంబున నధర్మము రాగలదు.
ధర్మోపరోధభయంబున నేను బోకుంటినేని తప్పక మృత్యువునే యంగీకరింతును, దానంజేసి క్రొత్తగా స్నేహముగలసిన కపింజలుతోడఁ బ్రణయరసభంగము కాగలదు. అదియునుంగాక నాయందాస యుంచుకొనిన పుండరీకుఁడుసైతము ప్రాణత్యాగము చేయును. దాన మునిజనవధ మహాపాతకము రాఁగలదు. ఈ ఱెంటిలోఁ నేది యుత్తమమో నిరూపింపుమని పలుకుచుండఁగనే చంద్రోదయమైనది.
రతికలహకుపితరోహిణీచరణాలక్తకరసలాంచితుండు వోలె నుదయకాలంబున నెఱ్ఱఁబడిన చంద్రునిఁజూచి విహ్వలనై తరళికోత్సంగంబున శిరంబిడి తదీయకిరణజాలంబులు చల్లనివైనను దాహజ్వరఖిన్నునిపై నిప్పులవర్షము గురిసినట్లు సంతాపము గలుఁగజేయ మూర్ఛపోతిని.
అప్పుడు తరళిక నన్నుఁ బలుమారు పిలిచి పలుకకుండుట గ్రహించి తొట్రువడుచు శైత్యోపచారము లెన్నియేని గావించినది అప్పుడు నాకించుక తెలివి వచ్చి కన్నులం దెరచితిని.
చందనపంకార్ద్రంబులగు కరంబులు జోడింపుచుఁ దరళిక నన్నుఁజూచి, దేవి! నీవిక సిగ్గుపడిన లాభములేదు. ధర్మమునకు వెరచితివేని ప్రమాదము రాక మానదు. నీ సంతాపమంతకన్న నెక్కుడగుచున్నది నా యందు దయయుంచి పుండరీకుఁడున్న చోటికిఁ పోవుదము లెమ్ము. తదీయబాహునాళములఁ బెనవైచినప్పుడు కాని నీ మేనికాక దగ్గదని వినయముగాఁ బలుకుచున్న తరళికంజూచి, ఓసీ! మదనుని మాట జెప్పనేల? ఇప్పుడీ శశాంకుఁడే ప్రాణములును హరింపుచున్నవాఁడు. అట్లే పోవుదము లెమ్ము అతిప్రయత్నముతోఁ బోయి హృదయవల్లభుని సంతోషపెట్టెదనని పలుకుచు మూర్ఛాఖేదవివశములగు నవయవములచే నెట్టకేలకుఁ దరళికం బట్టుకొని బయలుదేరితిని.
అట్టి సమయమున నాకుఁ గుడిక న్నదరినది. అయ్యో! దైవ మిది యేమి యిట్టిసూచన గావింపుచున్నాడు. మరియు నేమి చేయఁదలఁచుకొనెనోకదా యని శంకించుకొనుచుఁ బరిజనమునకు సైతము తెలియకుండ దాంబూలాంగరాగాదిసుగంధద్రవ్యములు గైకొని తరళిక వెంటరా నాపారిజాతమంజరియే ధరించి యామేడ వెడలి నీలపటావకుంఠనముతో రహస్యమార్గమున నయ్యచ్ఛోదసరస్సమీపవనమునకుఁ వచ్చుచుంటిమి.
ఆహా? అడుగు గదిపినఁ బెక్కండ్రుపరిచారికలు వెంట నడచి వచ్చుచుండ నేనట్లు తరళికాసహాయినినై పోవుచుండ నించుకయు వెరపులేకపోయినది. ప్రియునింగూర్చి యేకాంతముగా బయలువెడలువారికి నారోపితశరాసనుండై పుష్పబాణుండు సహాయముగా వచ్చుచుఁ బరిచరక్రియల నుపదేశింపుచుండునుగదా!
లజ్జను వెనుకకుఁ ద్రోసి నాకంటె ముందుగా నింద్రియములతోఁ గూడ హృదయము పరుగిడఁదొడంగినది. అప్పుడు నేను తరళికం జూచి, సకియా! యీ యిందుహతకుఁడు నన్నుఁబలె బుండరీకుని సైతము గరంబులంగట్టి యభిముఖముగా దీసికొని రాఁడుగదా! యని పలికిన నదియు నవ్వుచు, రాజపుత్రీ? నీవు ముద్దరాలవు సుమీ? ఇతని కతనితోఁ బ్రయోజనమేమి ? మదనాతురుండువోలె నీయందట్టి చేష్టలం గావింపుచున్నవాఁడు చూడుము. ప్రతిబింబకైతవంబున స్వేదకణికాంచితమగు నీకపోలముఁ జూపించుచున్నవాఁడు. లావణ్యభూయిష్టమగు కుచభారంబునం బడుచుండెను. కాంచీరత్నముల గరంబుల నంటుచుండె, నిదిగో నఖలగ్నమూర్తియై చరణంబులం బడుచున్నవాఁడు మఱియుం దాపంబున నతని మేను శుష్కచందనలేపపాండు రత్వము వహించి యున్నదో లేదో నిదానింపుము. అని మఱియుం బెక్కుతెరంగులఁ దత్కాలోచితముగా నర్మసంభాషణములఁ గావింపుచుఁ గ్రమంబునఁ దత్ప్రదేశమునుఁ జేరితిమి.
అట్టి సమయమున నాసరోవరము పశ్చిమతీరంబున దవ్వగుటచే ననతివ్యక్తముగాఁ పురుషరోదనధ్వని యొకటి వినంబడినది. కుడిక న్నదరినది మొదలు శంకించుచున్న నాహృదయ మాధ్వని వినినంత మిక్కిలి తొట్రుపడుచుండ, తరళికా? యిది యేమని వెరపుతో బలుకుచు మేను గంపమునొంద నతిత్వరితముగా దదభిముఖముగాఁ బోయితిమి.
ఆ సమయము నిశ్శబ్దముగా నుండుటచే దూరమయినను మరియు నాధ్వని యిట్లు విననయ్యె.
హా! పుండరీక? హా! ప్రాణమిత్ర! హా! మహాభాగ! మన్మథహతకుఁడు నీ కెట్టి యుపద్రవము సంఘటించెనురా! అన్నన్నా! దుర్వినీతయగు మహాశ్వేత మూలముననేకదా? యింత పుట్టినది. కటకటా! శ్వేతకేతున కెంత వచ్చినది? ధర్మమా! నిన్నిఁకఁ నెవ్వరు స్వీకరింతురు? తపంబా! ఇఁక నీ కాశ్రయ మెవ్వరు? సరస్వతీ? విధవవైతివే? సత్యమా! ని న్ననాథఁగా దలంచెదను. మీయాశ్రయుం డన్యలోకమునకుఁ బోయె. అయ్యో! మిత్రమా? నన్నుఁ జూడవేమి? నన్ను విడిచి యొక నిమిషమయిన నుండగలవా? నన్ను విడిచిపోవుట నీకు న్యాయమా? యొక్కసారి మాట్లాడుము. నాకు మిక్కిలి వేడుకగానున్నది. ఇఁక నేనెక్కడికిఁ పోవుదును? ఎవ్వరితో దిరుగుదును? నా యందుగల సుహృత్స్నేహమంతయు నెందుబోయినది? ఎప్పుడును నవ్వుచునే మాట్లాడువాఁడవే. అ ప్రజ్ఞయంతయు నెందుబోయినది? అయ్యయ్యో అక్కటా! హా! హా! అని యీరీతి గపింజలుఁడు విలపించుచున్నట్లు వినంబడినది.
అప్పుడు నాకుఁ బ్రాణములు పోయినట్లేయైనవి. ప్రయత్నముతో నడచుచున్నను నిమ్నోన్నతముల నరయలేక అడుగులు తడఁబడుచుండ నెవ్వడో బలాత్కారముగాఁ దీసికొని పోవున ట్లెట్టకేల కాప్రదేశము జేరి మణిశిలాతలంబున వనకుసుమములచే విరచింపఁబడయున్న శయ్యయందు దీర్ఘనిద్రాముద్రితసయనుండై చందనరసచర్చితమగు నవయవముల మృణాళనాళముల నలంకారములుగా ధరియించి మన్మథవ్యధ సహింపజాలక నిశ్చేతనుండై సుఖించుచున్నట్లు అపూర్వప్రాణాయోగం బభ్యసించుచున్నట్లు అనంగయోగవిద్య నవధరించుచున్నట్లు విగతజీవితుండయినను దేజంబు దప్పక పడియున్న పుండరీకుని మహాపాపాత్మురాలనగు నేఁను జూచితిని.
కపింజలుఁడు నన్నుఁ జూచి రెట్టించిన శోకముతో నతని కంఠమును గౌఁగలించుకొని మరియు నెక్కుడుగా విలపింపఁదొడంగెను. అప్పుడు నేను మూర్ఛాంధకార వివశనగుట నేమని విలపించితినో యేమయితినో యెఱుంగను. నామేనినుండి ప్రాణములు సైత మేమిటికిఁ బోయినవి కావో నాకుఁ దెలియదు. మరికొంతసేపటికి నాకుఁ దెలివి వచ్చినది. అప్పుడు నా దేహమును నగ్నియందు బడినట్లు అసహ్యశోకదహ్యమానమై నేలంబడి కొట్టుకొనుచుండఁ జూచితిని.
హా! యిదియేమి యుపద్రవము, ఇట్లు వచ్చినదని పెద్ద యెలుంగున హా! అంబ! హా! తాత! హా! సఖులారా! యని యరచుచు, హా నాథ! జీవితనిబంధన నన్నొంటిమై విడిచి యెక్కడికిఁ బోయితివో చెప్పుము నీనిమిత్త మెట్టియవస్థ ననుభవించితినో తరళిక నడుగుము, దివసమొక్కటియే సహస్రయుగప్రాయముగా గడిపితిని.
ఒక్కసారి మాటాడుము ? భక్తవత్సలత్వము జూపుము. నా మనోరథము పూరింపుము. భక్తురాల, ననురక్త, బాల, ననాథ, మదనపరిభూత, నిట్టి నాయం దేటికి దయసేయవు? నే నేమి యపరాధము చేసితిని? అయ్యో! నీవు నాకతంబున నెట్టియవస్థ బొందితివి. నా కీబ్రహ్మహత్యాపాతకం బెట్లు పోవును. నేను మహాపాతకురాలను. ఇట్టి నిన్ను విడిచి ఇంటికిఁ బోయితిని. ఇఁక నాకు దల్లిదండ్రులతోఁ బ్రయోజన మేమి? బంధువు లేమిటికి? దైవమా, న న్ననుగ్రహింపుము, వనదేవతలారా, అనాథను రక్షింపరా? తల్లీ! భూదేవి! లోకానుగ్రహకారిణి? నాయందు నీకైనం దయలేదా? యని యనేకప్రకారముల నేమియుం దెలియక గహావిష్టురాలి చందమునఁ బ్రేలుచు విలపింపఁ దొడంగితిని, మరియుఁ దచ్చరీరంబునంబడి కపోలములు ముట్టుచు జటాకలాపములు సవరించుచు హృదయంబున నిడిన నళినీదళంబులఁ దీసివేయుచు మాటిమాటికి మోము చుంబించుచు సారెసారెకు గంఠగ్రహణముచేయుచు, ఆర్యా! యీతనిం బ్రతికింపుమని కపింజలుని పాదంబులం బడుచు, దరళికం గౌఁగలించుకొనుచుఁ బెక్కుగతుల విలపించితిని.
అప్పుడు నా నోటనుండి అశ్రుతపూర్వములు ననుపదిష్టములు నగుచాటూక్తు లెన్నియేని వెడలినవి. తలంచుకొన నాకావిలాపవచనము లెట్లు వచ్చినవో నాకే చిత్రమగుచున్నది. అదియొక యవస్థగదా. జలయంత్రమువలె నశ్రుప్రవాహములు బయలు వెడలుచుండెను. నోటినుండి యంకురించుచున్నట్లు ప్రలాపములు వచ్చుచుండెను. అన్నన్నా! ఆ యవస్థ తలంచుకొనినంత మేను గంపము నొందుచున్నదని పలుకుచున్న యామహాశ్వేత చేతనము మూర్చ హరించినది.
తద్వేగంబునం బడుచున్న యామెను జంద్రాపీడుఁడు కరంబుల నాని పట్టుకొని యశ్రుజలములచేతఁ దడసిన తదుత్తరీయముచేతనే మెల్లగా వీచుచుఁ గొంతసేపునకుఁ దెలివివచ్చి కన్నులు దెరచిన యామెంజూచి దైన్యంబుదోప నిట్లనియె.
భగవతీ! నాకతంబున నీకీశోకము వెండియు దాపము గలుగఁ జేసినది. ఇఁక పైనఁ జెప్పకుము, విరమింపుము, నేను సైతము వినఁజాలకున్నాను. గతించిన వైనను సుహృజ్ఞనదుఃఖములు స్మరించినప్పుడు అనుభవసమమగు వేదన గలుగ జేయునుగదా. అతిప్రయత్నముతో ధరించిన యీ ప్రాణముల శోకానములకు నింధనములుఁ జేయకుమని పలికిన విని యక్కలికియు నిట్టూర్పు నిగిడింపుచుఁగన్నుల నశ్రువులు గారుచుండ విషాదముగా నిట్లనియె.
రాజపుత్రా! అట్టి దారుణశోకసమయమందే విడువని యీ కృపణప్రాణములు నన్నిప్పుడేల విడుచును? నిక్కము. పాపాత్మురాలనగు నాకంతకుఁడు సైతము దర్శన మీయ వెరచుచున్నాడు. కఠినాత్మురాలనగు నా కిప్పు డీశోక మేమిటికో? ఇది శోకమా? అళీకము, సిగ్గులేనివారలలో నేను మొదటిదానను. వజ్రమయమగు హృదయముతో నట్టిదుఃఖ మనుభవించితిని. కాని యనుభూతమయిన దానించెప్పిన నేమి లెక్క యున్నది? తదనంతర వృత్తాంత మాకర్ణింపుము.
నేనట్లు పెక్కుతెరంగులఁ బలవరింపుచుఁ దరళికం జూసి, బోటీ! ఇఁక నా జీవిత మేమిటికి? జింత యేమిటికి? చితి రచింపుము, అగ్నింబడి ప్రాణేశ్వరుం గలిసికొందునని పలికితిని.
అట్టి సమయమున నంతరిక్షమున జంద్రమండలము నుండి వెల్వడి యమృతడిండీరపాండురమగు నుత్తరీయాంశుకము అంసదేశమున వ్రేల మనోహరాలంకారభూషితుండైఁ మహాపురుషలక్షణోపేతుండై దివ్యాకృతితో నొప్పు నొక్కమహానుభావుఁడు ధవళదేహప్రభావితానములు దిగంతముల వ్యాపింప మెల్లన నచ్చటికి వచ్చి అతిశీతలస్పర్శములుగల నంగుళులతో నొప్పు నైరావతకరపీపరములగు బాహువులచే నందు గతాసుఁడైపడియున్న పుండరీకుని దేహము నెత్తుచు న న్నుద్దేశించి దుందుభినాదగంభీరమగు స్వరముతో, వత్సా! మహాశ్వేత! నీ విప్పుడు ప్రాణములు విడువకుము. నీ కితనితో వెండియు సమాగమము కాగలదు. అని తండ్రివలె న న్నోదార్చి యతండు పుండరీకశరీరముతోఁ గూడ గగనతలమున కెగసి యరుగుచుండెను.
అప్పుడు నేను భయవిస్మయకౌతుకంబులు చిత్తంబుల పెట్టఁ దలపైకెత్తి చూచుచు, ఆర్యా! ఇది యేమి యద్భుతమో చెప్పుమని కంపింజలు నడిగితిని.
అతండు నాకేమియుఁ బ్రత్యుత్తర మియ్యకయే తొందరగాలేచి అంతకా? దురాత్మా! నామిత్రు నెచ్చటికిఁ దీసికొనిపోవుచున్న వాఁడవని యలుకతోఁ బలుకుచు నుత్తరీయవల్కలము నడుమునకు బిగించి యమ్మహాపురుషు ననుగమించి యంతరిక్షమున కెగసెను. మేము చూచుచుండగనే వారు నక్షత్రమండలములలోఁ బ్రవేశించి యంతర్ధానము నొందిరి.
ప్రియతమమరణంబునం బోలెఁ గపింజలుగమనంబున శోకం బిబ్బడింప నా హృదయం బప్పుడు ఖేదిల్లినది. అప్పుడు కింకర్తవ్యతామూఢత్వంబునం దరళికం జూచి, యోసీ! ఇప్పుడు నాకేమియుం దెలియకున్నది, యెరింగితివేని నీవు నాకుఁ దెల్లముగా వక్కాణింపుమని యడిగిన నదియు మదీయమరణమున సహింపక నా కిట్లనియె.
దేవీ! పాపాత్మురాల నా కేమియుం దెలియదు. ఐనను నీ దివ్యపురుషుఁడు నిన్నుఁ దయతోఁ దండ్రియుంబోలె నోదార్చుటఁజూడ మిక్కిలి వింతగానున్నది. ఆలోచింప నసత్యముగా నిట్లు పలుకుట కేమియుఁ గారణము గన్పడదు. కావున నిప్పుడు ప్రాణపరిత్యాగవ్యవసాయమునుండి మరలుటయే యుత్తమము. ఆ పురుషుఁ ననుసరించి కపింజలుఁడుగూడఁ బోయెనుగదా! అతని కట్లు పలుకుట కేమి యవసరమో యించుక యాలోచింపుము. మరణమునకేమి తొందర! పిమ్మట బొందవచ్చును కపింజలుఁడు మరల వచ్చువరకైనఁ బ్రాణములు దాల్చియుండుము, తరువాతఁ జూచుకొనవచ్చునని పలుకుచు నా పాదంబులం బడినది.
జీవితాశ యెల్లరకు దుర్లంఘ్యమయినది. కావుననే నే నట్లు చేయుటయే యుత్తమమని తలంచి జీవితమును విడువఁజాలక కపింజలుని రాక గోరుచు నతిదారుణమైన యారాత్రి తరళికాసహాయినినై సహస్రయుగప్రాయముగా వెళ్ళించితిని.
మరునాఁ డరుణోదయంబున నాసరస్సులో స్నానముచేసి పుండరీకునికి బ్రీతిగాఁ దత్కమండలము తద్వల్కము దజ్జపమాలికను ధరించి సంసార మసార మనియు వ్యసననిపాతము లప్రతీకారసాధ్యము లనియు శోకము దుర్నివారమైన దనియు దైవము నిష్ఠురుఁడనియు సుఖము లనిత్యము లనియు నిశ్చయించి తల్లితండ్రుల లెక్క సేయక పరిజనములతోఁ గూడక సకలబంధుజనులకు మనసుచేత నిరసించి యింద్రియసుఖములయందుఁ జొరకుండ చిత్తమును నియమించి బ్రహ్మచర్యవ్రతమును గైకొని భక్తజనతత్పరుం డగు నీ పురహరు నారాధింపఁ దొడంగితిని.
నావృత్తాంతమును విని సకలబంధుపరివృతుండై నా తండ్రి వచ్చి యింటికి రమ్మని యెంతేని బ్రతిమాలెను కాని నామనము తిరిగినదికాదు. పుత్రికాస్నేహంబున నతండు పెద్దతడవు నాకొరకు నిరీక్షించుకొని చివరకు నిరాశుడై దుఃఖముతో నింటికిఁ బోయెను.
నాటంగోలె నేనిందు నమ్మహాపురుషుని కశ్రుమోక్షణమాత్రంబున కృతజ్ఞత జూపించుకొనుచు జపవ్యాజమునఁ దద్గుణముల లెక్కించుకొనుచు బహువిధములగు నియమములచేత శరీరమును వాఁడజేయుచు నీత్ర్యంబకుని సేవింపుచు నాతరళికతోఁ గూడ నీగుహయందు వసించియుంటిని.
మహాభాగ! ఆ బ్రహ్మహత్యాపాతకురాలను నేనే. ఇదియే నా వృత్తాంతమని పలికి యక్కలికి వల్క లోపాంతభాగంబున మోము దప్పించుకొనుచు దుర్నివారమైన బాష్పవేగము నద్దుకొనుచు నుచ్చస్వరముతో నేడువఁదొడంగినది.
చంద్రాపీడఁడు తదీయవృత్తాంతమంతయు విని యా కృతజ్ఞతావిశేషమున కత్యంత సంతోషింపుచు మెల్లగా నిట్లనియె భగవతీ! క్లేశభీరుఁడు నకృతజ్ఞుడునగు జనుండు స్నేహసదృశమైన కార్యమును జేయలేక నిష్ఫలమైన యశ్రుపాతమాత్రముచేతనే మైత్రిం బ్రకటించుకొనును.
అట్లుకాక క్రియచేతనే కృతజ్ఞతను వెల్లడించెడి నీవును నిట్లు నిందించుకొనియెద వేటికి? అతని నిమిత్తము మహైశ్వర్యసుఖములన్నియుఁ దృణముగానెంచి విడిచితివి! తల్లిదండ్రుల కెడమైతివి. వనితాజనదుష్కరములగు నియమములచే గాయమును గ్లేశపరచుచుంటివి.
ఇదియునుంగాక శోకాభిభూతులచేత నాత్మ యనాయాసముగా వినబడుచున్నది. అతిప్రయత్నమున గాని క్లేశముల యందుంచబడదు. మరణమనునది యపండితులు గావింపుచుందురు. తండ్రిగాని, తల్లిగాని, భర్తగాని, మిత్రుడుగాని మృతి నొందునప్పుడు తానును మృతినొందుట కంటె యవివేకములేదు. దీనివలన వానికేమైన నుపకారము జరుగునా? తిరుగాఁ దీసికొనివచ్చునా? పరలోకసౌఖ్యమిచ్చునా? దర్శనమిచ్చునా? యేమియుం జరుగదు. ఆత్మహత్యాపాతక మొండుమాత్రము వేధించి నిరయము నొందఁజేయును.
బ్రతికియుండి జలాంజలిదానాదివిధులచే నుపకృతి జేయవచ్చును. రతీదేవి వృత్తాంతము స్మరించుకొనుము. ప్రియుండు హరనయనహుతాశనదగ్ధుండైనను దాను మృతినొందక వేరొకరీతి నాతనిపొందు గలిగియున్నది. మరియుం బెక్కండ్రు కాంతలు ప్రియులు లోకాంతరగతులైననుఁ బ్రాణములు విడువక నిలిచియుండి సుఖించుచుండుట వినియుండలేదా? అదియునుంగాక భగవతిచే స్వయముగానే పునస్సమాగమసూచకమగు వచనము వినఁబడినదికాదా? ఆ మాట వితధమెట్లగును? నిస్సంశయముగా నమ్మహానుబావుండు తిరుగా సురలోకమునుండి రాగలఁడు. మహాత్ముల ప్రభావ మచింత్యమైనది. పరలోకమున కేగి మరల వచ్చిన చరిత్రలు పెక్కు మనము పురాణముల వినుచున్నవారము. పుండరీకుండు నట్లు రావచ్చును. రాకున్నను నేమి చేయగలము? ఎవ్వరిని నిందింపము? విధి బలవంతమైనది. దైవహతకుని విలాసము లతిపిశునములు. ఆయతస్వభావములు దుఃఖములు, అనాయతస్వభావభంగురములు సుఖములు. ఒకజన్మమునందు సమాగమము, జన్మాంతరసహస్రములయందు విరహము గలుగుచుండును. ఆత్మను నిందించుకొనరాదు. సంసారమే యతిగహనమైనది. దీని ధీరులుగాని దాటలేరు కదా!
అని యిట్లు మృదువులైన స్వాంత్వనవచనములచే నామె నోదార్చుచుఁ జంద్రాపీడుఁడు వెండియు నిర్ఝరజలంబు దెచ్చి బలాత్కారముగా నశ్రుజలకలుషితమగు నామె మొగమును గడిగించెను.
అంతలో మహాశ్వేత వృత్తాంతమును వినుటచే శోకించువాఁడుంబలె దివసవ్యాపారము విడిచి రవి యధోముఖుం డయ్యెను.
అని యెరింగించి మణిసిద్ధుండు గోపా! యిప్పుడు వేళ యతిక్రమించినది, తర్వాతివృత్తాంతము విస్తారముగా నున్నయది కావున ముందటి మజిలీలో దర్వాతికథ జెప్పెద నిప్పుడు లేచి కట్టెలం దెమ్ము. వంటఁజేసికొని భుజింతమని పలికి యెట్టకేలకు వాని సమాధానపరచి యట్లు కావించెను.
మరియు నయ్యతీశ్వరుని వెంట గావడి మోచుకొని నడచుచు వాఁడు నడుమ నడుమ అయ్యా! అమ్మహాశ్వేతతోఁ బుండరీకుఁడు వెండియు గలిసికొనునా? చంద్రాపీడుఁడు తరువాత నేమి చేసెను? ఎచ్చటికి బోయెను? ఏమి జరిగినది? అని యడుగుచుండ హస్తసంజ్ఞచే వారింపుచు నెట్టకేలకా పారికాంక్ష తరువాత మజిలీ చేరి తదనంతరోదంత మిట్లెరింగించెను.
శ్రీరస్తు
కాశీమజిలీకథలు
కాదంబరి కథ
అట్లు సాయంకాలమగుటయు మహాశ్వేత మెల్లగా లేచి పశ్చిమసంజ నుఁపాసించుచుఁ గమండలు జలంబులఁ బాదములఁ గడిగికొని వల్కలతల్పమున నతికష్టముగా గూర్చుండెను.
చంద్రాపీడుండును సంధ్యాప్రణామములు గావించి రెండవశిలాతలమున మృదులతాపల్లవములచేత శయ్య గల్పించుకొని కూర్చుండి యమ్మహాశ్వేతవృత్తాంతమునే పలుమారు తలంచుకొనుచు మన్మథప్రభావమునకు వెరగుపడుచు వినయముతో వెండియు నామె కిట్లనియె.
భగవతీ! వనవాసవ్యసనమిత్ర మగు నీ పరిచారిక తరళిక యెందు బోయినది? అని యడుగుటయు నా సాధ్వి మహాభాగా! చెప్పెద వినుము. గంధర్వకులనాయకుఁడగు చిత్రరథుని ప్రసిద్ది మీరు వినియుందురు. అతనికిఁ గాదంబరి యను కూఁతురు కలదు. అబ్బాలిక నాకు రెండవ హృదయము వంటిది. పిన్ననాటినుండియు నశనపానశయనాదు లేకముగానే మా యిరువురకు జరిగినవి. శిశుక్రీడలును నృత్య గీతాది కళాపరిచయము మా కొక్కచోటనే కలిగినది. ఆ రీతి మా యిరువురచేతను బాలభావము గడుపఁబడినది.
ఆ కాంత యిప్పుడు నా వృత్తాంతములు విని మిక్కిలి శోకించుచుఁ దానుగూడ నిట్లు శపథము చేసినది. నా వయస్యయైన మహాశ్వేత దుఃఖించియుండగా నేను బెండ్లియాడను. మా తండ్రి నాకు బలవంతముగా బెండ్లి చేసినచో రజ్జు, సర్ప, విష, పానకాదుల మృతినొందుదాననని సఖుల చెంతపల్కు పలుకులు కర్ణాక ర్ణికగా విని దాని తండ్రి చిత్రరథుఁడు మిక్కిలి పరితపించుచు నేకాపత్యుఁడగుటచే నేమియు దానిని మందలింపలేక వితర్కించి మరియొక యుపాయ మేమియుంగానక నా యొద్దకు క్షీరోదుఁడను కంచుకి నంపి వత్సా! మహాశ్వేత! నీ నెచ్చెలి కాదంబరి సంపూర్ణయౌవనయయ్యు వివాహమాడనని మూర్ఖము చేయుచున్నది. యెవ్వరు చెప్పినను వినకున్నది. నీ కన్న దాని చిత్తమును మరల్చువారు లేరు. ఎట్లైనను నీవీ కష్టమును మాకుఁ దొలగింపుమని నాకు వార్త నంపెను. నేనా వార్త విని గురువచనమందలి గౌరవముచేతను సఖురాలి యందలి మక్కువ చేతను "అయ్యో కాదంబరీ! దుఃఖించుచున్న నన్ను మిక్కిలి దుఃఖింపజేయుచున్నావేమి? నాకు సంతోషము గలుగజేయు తాత్పర్యము నీకుఁ గలిగియున్నచో నా మాట విని తండ్రిచెప్పిన చొప్పున నడువుము. ఇదియే నాకు బ్రియము"
అని నా మాటగా చెప్పమని తరళికను క్షీరోదుని వెంట నీ దినముననే యంపితిని. అది వెళ్ళిన కొంచెము సేపునకే దేవర దయచేసితిరని పలికి యూర కుండెను.
అంతలోఁ జంద్రోదయమైనది. అప్పుడు మహాశ్వేత వల్కలతల్పంబునం బరుండి నిద్రబోయినది. చంద్రాపీడుఁడును మనంబున అయ్యో! యిప్పుడు వైశంపాయనుఁ డేమి చేయుచుండునో నన్నుఁ గాన కెంత చింతించుచుండునో 'పత్రలేఖ యేమనుకొనునో' రాజపుత్రు లేమందురో యని ధ్యానించుచునే నిద్రబోయెను.
నిశావసానంబున మేల్కాంచి మహాశ్వేతయు నా రాజపుత్రుఁడును కాలకృత్యములు నిర్వర్తించిరి. ఇంతలో మనోహరమైన వేషముతో గేయూరకుండను గంధర్వకుమారునితో గూడఁ దరళిక యచ్చటికి వచ్చినది. ఆ ప్రాంతమందుఁ గూర్చునియున్న రాజపుత్రునింజూచి యాతరళిక విస్మయమందుచుఁ దదీయరూప మక్షులం గ్రోలుచున్నట్లు సవిత్కరముగా జూచిచూచి తల యూచుచుఁ బిమ్మట మహాశ్వేత యొద్దకుఁబోయి నమస్కరించి తదీయ జపావసానమువరకుఁ దాపున గూర్చుండెను.
మహాశ్వేతయు జపము ముగించినవెనుక తరళికంజూచి, బోటీ! కాదంబరి సుఖముగా నున్నదా? నామాటలం జెప్పితివా? యేమన్నది? సమ్మతించెనా? యని యడిగిన విని యవ్వనితయు వినయముతో శిరమువంచి, రాజపుత్రీ! నేను వోయి కాదంబరిని జూచితిని. ఆమె సుఖముగానున్నది. నీ సందేశమంతయు వినిపించితిని. కన్నీరు గార్చుచుఁ గేయూరకుఁడను తన వీణావాహకుని కెద్దియో చెప్పి యిచ్చటికంపినది. సర్వము నతండే నివేదించునని పలికి యూరకుండెను.
అప్పుడు కేయూరకుడు లేచి నమస్కరించుచు దేవీ? మా రాజపుత్రి నీ కిట్లు విజ్ఞాపనజేయుమని నన్నంపినది. వయస్యా! ఇప్పుడు తరళిక చెప్పిన మాటలన్నియు వింటిని. నాచిత్తమును బరీక్షించుటకో లేక గృహవాసాపరాధమును గురించి నిపుణముగా నధిక్షేపించుటయో స్నేహపరిత్యాగమో కాక కోపమో కాని యిట్టివార్త నంపుట నాకు మిక్కిలి వ్యసనముగా నున్నది మిత్రురాలు చింతించుచు నటవిఁ గ్రుమ్మరుచు వ్రతముల గృశించి కష్టముల ననుభవింపుచుండ నాకు ఆహా! సుఖ మెట్లనుభవింప నగును? నిర్వృత్తి యెట్లు గలుగును? సంభోగమెట్లు రుచ్యమగును? పెక్కేల! నవ్వు సైతము వచ్చునా?
క్రూరుఁడగు మన్మథుఁడు నిన్నిట్టి యవస్థ నొందజేసెనే? అట్టి కాముని సకామునిగా నెట్లు చేయుదును? పద్మినులు దివసకరాస్తమయవిధురము లగుచుండ సహవాసపరిచయంబునం జేసి చక్రవాకయువతి సైతము సమాగమసుఖమును విడుచుచున్నదే? నీయందలి ప్రేముడిచే గుమాతిరాజస విరుద్ధమగు స్వాతంత్ర మంగీకరించితిని. గురువచనము తిరస్కరించితిని. లోకాపవాదము గణింపనైతిని. స్త్రీలకు మండన మగు సిగ్గు విడిచితిని. ఇప్పుడు తిరిగి యెట్లు స్వీకరింతును?
అంజలి ఘటించి ప్రార్ధించుచున్నదాన, నన్ననుగ్రహింపుము. నా జీవితముతోడనే నీవు వనములోఁ బ్రవేశించితివి. కోపము సేయక యీవిషయము నన్నెప్పుడు మందలింపవలదు. నా చిత్తము మరలదు. అని చెప్పి కేయూరకుఁ డూరకుండెను.
అతనిమాటలు విని మహాశ్వేత గొంచెము సేపాలోచించి తల యూచుచుఁ గానిమ్ము. కేయూరక! నీవు బొమ్ము. నేను వచ్చి పరిశీలించెదనని పలికి యతని నంపి చంద్రాపీడునింజూచి, రాజపుత్రా! కింపురుషరాజధానియైన హేమకూటమున కిప్పుడు బోవలసియున్నది. అదియు నిచ్చటికి దాపుగనే యుండును. అదృష్టపూర్వములకు పట్టణవిశేషములం జూడ వేడుక గలిగియున్నచోఁ జూచి వత్తువుకాని రమ్ము మద్విశిష్ట యగు కాదంబరిని సైతము చిత్తవిభ్రమమునుండి తొలగింపనగు నొక దివసమేయుండి పోవచ్చును. అకారణబంధుండవగు నిన్నుఁ జూచినది మొదలు నా హృదయపరితాప మొకింత తొలంగినది. సజ్జనసమాగమము శోకమును బోగొట్టును కదా! మీవంటివారు పరులకు సుఖము గలుగుటయే చింతించుచుందురని బలికిన విని చంద్రాపీడుఁ డచ్చేడియ కిట్లనియె.
భగవతీ! నిన్నుఁజూచినది మొదలు నాకును హృదయమున నెద్దియో యపూర్వమగు నుత్సాహము గలుగుచున్నది. నిశ్శంకముగాఁ గర్తవ్యములకు నిన్ను నియోగింపుము. అన్యునిగా భావింపకుమని పలికి యతండు హేమకూటమునకు వచ్చుట కంగీకరించెను.
మహాశ్వేతయుఁ జంద్రాపీడునితోఁగూడ శుభముహూర్తంబునఁ బయలుదేరి క్రమంబున హేమకూట రాజధానికిం జని గంధర్వరాజకులము నతిక్రమించి కాంచనతోరణవిరాజమానములగు కక్ష్యాంతరముల నేడింటిఁ దాటి కాదంబరీకన్యకాంతఃపురద్వారదేశమును జేరెను.
అందు అమ్మహాశ్వేతం జూచినతోడనే తొందరగా దూరమునుండియే ప్రతీహారిజనము వేత్రలతాయుక్తములగు హస్తములతో మ్రొక్కుచు మార్గమెరింగింప నసంఖ్యేయకన్యకాసహస్రములచే నిండియున్న లోపలఁ బ్రవేశించి యంగనాద్వీపమువలె మెఱయుచున్న యందద్భుతలావణ్యపూర్ణవిగ్రహులై దివ్యాలంకారశోభితలై యిటునటు తిరుగుచున్న గంధర్వస్త్రీలం గాంచి రాజపుత్రుండది స్వప్నమేమోయని భ్రాంతి జెంది యామెవెంట నడుచుచుండెను.
అందున్న గంధర్వకన్యకాజనమునకు సఖిహస్తావలంబనములే పాణిగ్రహణమహోత్సవములు. వేణువాద్యములయందే చుంబనవ్యతికరములు. వీణలయందే కరరుహవ్యాపారములు కందుకక్రీడలయందే కరతలప్రహారములు భవనలతానేకకలశకంఠములయందే భుజలతాపరిష్వంగములు లీలాడోలికయందే జఘనస్తనప్రేంఖితములు. అశోకతరుతాడనములయందే చరణాభిఘాతములు కాని సురతవిలాసము లేమియు నెరుంగరు. తత్తత్క్రియలచే శృంగారచేష్టల నభ్యసించుచున్నట్లు కనంబడుచుండిరి.
అట్టి వినోదములం జూచుచుఁ జందాపీడుఁడు మహాశ్వేతవెంట నరుగుచు మరికొంతదూరము బోయినంతఁ గాదంబరీప్రత్యాసన్నలగు పరిజనుల మాటలిట్లు వినంబడినవి.
లవలికా? కేతకీకుసుమధూళులచే లవలీలతల కాలవాలములు గట్టుము.
సాగరికా! గంధోదక కనకదీర్ఘికలయందు రత్నవాలుకల జిమ్ముము.
మృణాలికా! కృత్రిమపద్మలతలయందుఁ గుంకుమజల్లి చక్రవాక మిథునముల విడువుము.
మకరికా! గంధపాత్రములఁ గర్పూరపల్లవరసంబునఁ బరిమళింపఁ జేయుము.
రజనికా! భవనదీర్ఘికలయందలి తమాలవృక్షములచేఁ జీఁకటిగానుండు తావుల మణిదీపములఁ జేర్పుము.
కుముదినికా! దానిమ్మపండ్లను బక్షుల దినకుండ ముత్తెపుపేరులం జుట్టుము.
నిపుణికా! మణిసాలభంజికల కుచములయందు కుంకుమరసపత్రభంగముల రచింపుము.
ఉత్పలికా! కనకసమ్మార్జనులచేఁ గదళీగృహములయందలి మణివేదికలం దుడువుము.
మాలతికా! సిందూరరేణువులచేఁ గామదేవగృహదంతవలభికకు రంగు వేయుము.
కేసరికా! భవన కలహంసలకుఁ గమల మధురసం బొసంగుము.
కదళికా! గృహమయూరముల దారాగృహము జేర్చుము.
కమలినికా! చక్రవాకశిశువులకు మృణాళక్షీరరసం బిడుము.
లవంగికా! చకోరపంజరములయందుఁ బిప్పలీతండుశకలంబులఁ బోయుము.
మధురికా! కిన్నరమిథునములను సంగీతశాలల విడువుము.
అట్టి వినోద సంభాషణములన్నియు నాలింపుచుఁ గ్రమంబునఁబోయి కాదంబరీభవనసమీపమును జేరిరి. అందు సేవార్ధమై యరుదెంచి యుభయపార్శ్వముల వసించియున్న యన్నుమిన్నల మణికనకవిభూషణ కిరణజాలంబులు నదీప్రవాహమువలె వ్యాపించుచుండెను. దివ్యరూపసంపన్నులగు గంధర్వకన్యకలు మండలముగాఁ జుట్టునుం బరివేష్టించి కూర్చుండ దివ్యమణిప్రభాధగద్ధగితమగు శ్రీమంటపమధ్యంబునఁ నీలాంశుకవిరచితంబగు హంసతూలికాతల్పంబునఁ దెల్లనితలగడపైఁ జేతులాని మహావరాహ దంష్ట్రావలంబితయగు భూదేవివలె నొప్పుచు దేహప్రభాజాలజలంబు పెచ్చు పెరుగ భుజలతావిక్షేప పరిభ్రమణములచే విదలించుచుండిరో యనఁ జామరగ్రాహిణులిరువంక వీచుచుండ నొయ్యారముగాఁ బడుకొని సఖులతో ముచ్చటింపుచుఁ బర్యంకము దాపున నేలం గూర్చుండి కేయూరకుఁడను వీణావాహకుఁడు మహాశ్వేతయొద్దకు వెళ్ళివచ్చిన వర్తమానములం జెప్పుచుండ నచ్చెరువుతో నాలింపుచున్న కాదంబరీ తరుణీలలామంబు చంద్రాపీడునకు నేత్రపర్వము గావించినది.
భూలోకములో మహాసుందరులని పేరుపొందిన యిందుముఖులు గంధర్వకన్యలకు దాస్యము సేయఁ బనికిరారు. అట్టి గంధర్వకాంతలలో నిరుపమానసౌందర్యశాలిని యని ప్రఖ్యాతి వడసి గంధర్వకులచక్రవర్తి కూఁతురై నిరతిశయభాగ్యవైభవంబులఁ బ్రకాశించు కాదంబరి నా దివ్యస్త్రీల నడుమఁ గనకమణి శ్రీమంటపమధ్యమున హటాత్తుగాఁ జూచినంతఁ జంద్రాపీడుని హృదయ మెట్లుండునో వ్రాయుట దుర్ఘటము. తద్భూషణమణి కరణజాలంబులు కన్నులకు మిరిమిట్లు గొలుప విభ్రాంతుండై యొక్కింతతడవేమియుం దెలియక మోహముతోనుండి యంతలోఁ దెప్పిరిల్లి ఆహా! నాకన్నులెట్టి పుణ్యము చేసికున్నవో? ఇట్టి లోకైకసుందరి ననివార్యముగాఁ జూడఁగలిగినవి. అయ్యారే! విరించి సర్వరమణీయవస్తువులనేరి యీనారీరత్నమును సృజించెనని తలంచెదను. ఓహోహో! అక్కమలగర్భుండు రూపాతిశయపరమాణువుల నిన్నిటి నెక్కడ సంపాదించెనో? తెలియదు.
నిక్క మీకాంచనగాత్రిం నిర్మించుచున్న విరించనుని కరతల పరామర్శక్లేశంబున నామె కన్నులనుండి జారిపడిన జలబిందువులనుండియే భూమియందుగల కుముదకమలసౌగంధికాది వస్తువు లుత్పన్నంబులైనవి. బాపురే! ఈపూఁబోడి మోమంతయుఁ గన్నులుగానే కనంబడుచున్నది? ఇది కొమ్మయా? బంగరుబొమ్మయా? అని వితర్కించుచున్న యన్నరనాథసూనుని దృష్టిప్రసారము కాదంబరీనయన యుగంబున వ్యాపించినది.
అమ్మదవతియు నదరుపాటుతో నతనింజూచి రూపాతిశయవిలోకనమువలనం గలిగిన విస్మయముచే రెప్పవాల్చకుండ సూటిగాఁ జూపులతనిపై వ్యాపింపఁ జేసినది. తల్లోచనప్రభావ్యాప్తిచేఁ దెల్లఁబడి కాదంబరీదర్శనవిహ్వలుండై యతండు కాదంబరీదర్శనవిహ్వలుండగు బలరామునివలెఁ బ్రకాశించెను.
కాదంబరి యట్లా రాజపుత్రు నబ్బురపాటుతోఁజూచి మేను గగుర్పొడువ భూషణరవ మేపార నట్టెలేచి మేనెల్లం జెమ్మటలుగ్రమ్మఁ గంపముతో నతికష్టంబునఁ గొన్ని యడుగు లెదురువోయి చిరకాల దర్శనమువలనఁ గలిగిన యుత్కంఠతో నాకలకంఠినిఁ గంఠాశ్లేషము గావించినది.
మహాశ్వేతయుఁ బ్రత్యాశ్లేషము గావించుచు సఖీ! ఈతండు రక్షితప్రజాపీడుండగు తారాపీడుండను భూలోకచక్రవర్తి కుమారుండు నిజభుజాస్తంభవిశ్రాంతవిశ్వంభరాపీడుండు చంద్రాపీడుండనువాఁడు. విజయయాత్రాప్రసంగమున నీభూమి కరుదెంచెను. చూచినది మొదలు నాకితండు నిష్కారణబంధుఁడై యొప్పెను. పరిత్యక్తసకలసంగనిష్ఠరమైనను నాచిత్తవృత్తిని స్వభావసరళములగు సుగుణములచే నితం డాకర్షించెను. దాక్షిణ్యపరవశుండు నకృత్రిమహృదయుండు విదగ్ధుండనగు నిర్నిమిత్తమిత్రుండు దొరకుట దుర్ఘటము గదా?
నేనువోలెనీవుగూడ నీసుకుమారునించూచి వాణీభవుని నిర్మాణకౌశలము పృథివికిఁ గల వాల్లభ్యసౌఖ్యము మర్త్యలోకము సురలోకమును మించుటయు మనుజస్త్రీలయొక్క నేత్రసాఫల్యము సర్వకళలు నొక్కచోటనుండు విధముం దెలిసికొనఁ గలవని బలవంతముగా నీతని నిచ్చటికిఁ దీసికొని వచ్చితిని. నిన్ను గుఱించి యాతనితోఁ జాల చెప్పియున్నదానఁ గావున నితండు క్రొత్తవాఁడని సిగ్గుపడక అవిజ్ఞాతశీలుఁడని శంకింపక నాయందెట్టి ప్రీతిగలిగి యుంటివో వీనియందుఁగూడ నట్లే వర్తింపవలయును.
ఈతఁడే మనకుఁ బరమమిత్రుఁడు. ఈతఁడే మనకు దగ్గిరచుట్టము. ఈతఁడే మనకు నమ్మఁదగిన పరిజనుఁడు అని చెప్పినది. అప్పుడు చంద్రాపీడుఁడు కాదంబరికి నమస్కారము గావించెను.
అట్లు నమస్కరించిన చంద్రాపీడు నత్యంతప్రీతిపూర్వకముగా వారచూపులచేఁ జూచుచున్న కాదంబరియొక్క నేత్రకోణములనుండి శ్రమజలకణములవలె నానంద బాష్పబిందువులు రాలినవి. మొగంబున సుధాధవళములగు స్మితజ్యోత్స్న లించుక వ్యాపించినవి. ప్రతిప్రణామంబున నతని సత్కరింపుమని శిరంబున కెరిగించునవివోలె భ్రూలతలు పైకెగసినవి.
అప్పు డందున్న గంధర్వకన్యకలు తిర్యగ్విలోకనముల నతని సోయగము పరికింపం దొడంగిరి.
కాదంబరి సంభ్రమముతో నతనికి నమస్కరించి మహాశ్వేతతోఁగూడఁ బర్యంకమునఁ గూర్చుండెను. పిమ్మటఁ బరిజనులచే దొందరగాఁ బర్యంకశిరోభాగప్రాంతమున వేయబడిన హేమపాదాంకితమగు రత్నపీఠంబునఁ జంద్రాపీడుఁ డుపవిష్టుం డయ్యెను.
అప్పుడు ప్రతిహారులు కాదంబరీ మహాశ్వేతల సంవాదప్రకారము విను తలంపుతో సంవృతముఖన్యస్తహస్తలై హస్తసంజ్ఞలచే వేణువీణాదిగీతధ్వనులు వంధిమాగధజయశబ్దముల నంతటను నాపివేసిరి.
అంతలో గాదంబరి లేచి పరిజనోపనీతమగు నుదకముచే మహాశ్వేతపాదములు గడిగి యుత్తరీయాంశుకమునఁ దడియొత్తి వెండియుఁ దల్పంబునఁ గూర్చుండెను.
పిమ్మటఁ గాదంబరికి బ్రాణసఖురాలు అనురూపరూపలేఖ, మదనలేఖ యనునది రాజపుత్రుం డిచ్చగింపుకున్నను బలవంతమున నతని పాదంబులం గడిగి తడియొత్తినది.
అప్పుడు మహాశ్వేత కర్ణాభరణమణికిరణకిమ్మారిత మగు కాదంబరి యొక్క భుజముపైఁ జేయివైచి చోమరపవనంబునఁ జారుచున్న కుసుమంబు వెండియు వేణికాబంధంబునం గూర్చుచు సఖీ! కాదంబరీ! కుశలముగా నుంటివా? అని యడిగిన గాదంబరియు నిజగృహనివాసంబున నపరాధము జేసినదివోలె సిగ్గుపడుచు నిట్లుత్తరము చెప్పినది.
చ. ప్రియసఖి నారచీరల ధరించి భయంకరభూరికందరా
లయమునుండి యాకలములన్ భుజియింపుచు దారుణవ్రత
క్రియలను గాలము న్గడుప హ్రీరహితాత్మకనైన నాకనా
మయమున కేమిలో టిట సమస్తసుభోగములన్ భజింపగన్ II
గీ. కలికి తత్కాలజనిత శోకప్రవృత్తి
బ్రియవయస్యనుఁ జూచుచుండియుఁ గడంక
నాపలేదయ్యఁ దనచూపు లతనిమీఁదఁ
బడక యుండఁగ నెన్ని యుపాయములను॥
అశ్రుజలపూరితనయనయై యజ్జలజనయన ముహూర్తకాల మూరకొని యంతలోఁ దనకుఁ దాంబూల మీయఁబోవుఁడు వారించుచు మహాశ్వేత యిట్లనియె. సఖీ! మనమందరము క్రొత్తచుట్టమైన యీ రాజకుమారు నారాధింపవలయును. కావున ముందుగా నతనికిఁ దాంబూల మిమ్మని పలికిన విని యక్కలికి యించుక యడ్డముగా మొగము వంచి సన్నని యెలుంగున ప్రియసఖీ! పరిచయము లేకపోవుటచే నిచ్చుటకు నాకు సిగ్గగుచున్నది దీనింగైకొని నీవేవారికిమ్ము. అనవుఁడు మహాశ్వేత ముఖరసనాచలనసంజ్ఞచే వారించుచు నట్లనకుము. నీవే యీయవలయునని పలుమారు బోధింప నెట్టకే యంగీకరించినది.
మహాశ్వేత మొగమునుండి దృష్టుల నాకర్షింపకయే మేను గంపము నొందఁ గన్నులుమూసికొని నిట్టూర్పులు నిగుడించుచు నొడలంతయుఁ జెమ్మటలు గ్రమ్మ సాధ్వసపరవశయై యతిప్రయత్నముతో నప్పల్లవపాణి తాంబూలగర్భహస్తపల్లవము చాచినది.
అప్పుడు చంద్రాపీడుఁడును దనుర్గుణాకర్షణకృతకిరణశ్యామలమయ్యు స్వభావపాటలమై యరుణనఖకిరణ లలితములగు నంగుళులచేఁ బొలుపొందు కరతలంబు తాంబూల మందికొనుటకై చాచెను.
అప్పుడు తద్విలాసములం జూచుటకు వేడుకకలవియుం బోలె నెక్కడి నుండియోవచ్చి రసములన్నియు నామెయందుఁ బ్రవేశించినవి.
శ్వేదజలపాతపూర్వకముగా మన్మథునిచేత నీదాసజనము నీకీయఁబడినది. స్వీకరింపుమని తన్నర్పించుకొనునట్లు ఇది మొదలు మదీయ జీవితము నీ హస్తమందుండఁగలదని స్థాపించుచున్నట్లు కాదంబరి యతనిచేతఁ దాంబూలమిడినది. పిమ్మట భుజలతానుసారముగాఁ గరకిసలయమును లాగికొనుచు ననంగశరభిన్నమధ్యమగు హృదయమువోలెఁ జేతనుండి జారిపడిన రత్నవలయమునుఁ దెలిసికొనజాలదయ్యెను.
మరియొక తాంబూలము మహాశ్వేత కిచ్చి యచ్చేడియ పచ్చవిల్తుని రాయిడిం బడియున్న సమయంబున నొకశారిక వారికడ కరుదెంచి తన్నుఁ దరిమికొనివచ్చిన చిలుకం జూపుచుఁ గాదంబరి కిట్లనియె.
భర్తృదారికా? కాదంబరీ! నన్ను బాధింపుచున్న యతి దుర్వినీతుఁడగు నీపతంగాధము నేమిటికి వారింపవు? వీనిచేఁ బరిభవింపఁబడుచున్న నన్నిఁక నుపేక్షించితివేని నీ పాదములాని తప్పక ప్రాణముల విడిచెదను జుమీ! అని పలికినంతఁ గాదంబరి యించుక నవ్వినది.
అప్పుడు మహాశ్వేత విస్మయముతో నీశారిక యేమనుచున్నదని మదనలేఖ నడిగిన నప్పడఁతి యిట్లనియె. దేవీ? యీశారికను గాళింది యను పేరుపెట్టి మా రాజపుత్రికయే పెంచుచుఁ బరిహాసమను పేరుగల యీ చిలుకకు స్వయముగాఁ బెండ్లి జేసి భార్యాభర్తలగాఁ బిలుచుచున్నది. నేఁటి ప్రాతఃకాలమునఁ గాదంబరీ తాంబూలకరండవాహిని యగు నీ తమాలికతో నేకాంతముగా నేదియో మాటాడుచుండ నా చిలుక జూచినదఁట. అప్పటినుండియు నిర్ష్యారోషకషాయితమతియై యీశారిక యీచిలుకం జూడదు. మాటాడదు చేరనీయదు. మేమెంత బ్రతిమాలినను బ్రసన్నురాలు కాకున్న దిదియే దీని వృత్తాంతమని చెప్పిన విని మందహాసము గావించుచుఁ జంద్రాపీడుఁ డిట్లనియె.
అగు నగు నీవార్త నిదివరకే మేము వినియుంటిమి. కాదంబరీదేవియొక్క తాంబూలకరండవాహినియగు తమాలికను వరించి పరిహాసమను చిలుక విరహవేదన చెందుచున్నదని లోకమున జనులు చిత్రముగాఁ జెప్పుకొనుచున్నారు. ఈ వృత్తాంతము కర్ణపరంపరచే రాజకుల మంతయు వ్యాపించియున్నది. సిగ్గుమాలిన యీ తమాలిక మూలమున పతత్రము కళత్రమును విడుచుట వామాచారమై యున్నది. అది యట్లుండ నిండచపలయగు నీదుష్టదాసినిఁ గాదంబరి యేమిటికి మందలింపదు? అగు నీశారిక నీ చిలుకకుఁ బెండ్లిజేయునప్పు డెన్నియో బుద్దులు గరపియే యుండునవి నిలిచియున్నవియా? స్త్రీలకు సాపత్నీపరిభవంబు ప్రధానకోపకారణంబు పెద్ద హేతువుగదా? ఇట్టి పరాభవములయందుఁ దఱుచు స్త్రీలు విషమైనం దిందురు. అగ్నినైనం బడుదురు. ఈశారిక గట్టిదియే! అట్టిపని యేదియుం జేయలేదు. ఇప్పుడు మనమీ చిలుకచే నీ తప్పు గావుమని దీనిం బ్రతిమాలింపఁ జేయుదము. అప్పుడు ప్రసన్నురాలై భర్తను మన్నించుగాక అట్లు మన్నింపదేని యీశారికదే తప్పుగా గణించి దీని విడిచివేయుదము పరాభవము జేసి విడిచిన దీని నెవ్వరాలాపింతురు? యెవ్వరు మన్నింతురు? ఎవ్వరు పోషింతురు? అదియే దీనికిఁ బ్రాయశ్చిత్తమని పలికిన విని కాదంబరీ పరిచారికలెల్లఁ దత్క్రీడాలాపము గ్రహించి నవ్వుకొనిరి.
అప్పుడా చిలుక యతని నర్మాలాపము లాలించి యిట్లు పలికినది. దూర్త! రాజపుత్రా! యీశారిక రాజకులసంపర్కమువలనఁ జతురమతియై యున్నది. నీవుగాని, యితరులుగాని దీనిని భయపెట్టజాలరు. ఇవి పరిహాసజల్పిదములని తెలిసికొనఁగలదు. ఈ వక్రోక్తులు దీనిముందరఁ బనికిరావు. కోపప్రసాదములయొక్క కాలకారణప్రమాణవిషయంబులఁ బాగుగా నెరుంగును. శృంగారభాషితముల కిది నెలవని పలుకుచున్న సమయంబునఁ గంచుకి యరుదెంచి ఆయుష్మతీ! మహాశ్వేతా! చిత్రరథుండును భార్య మదిరామహాదేవియు నీరాక విని మిగుల నానందించుచున్నారు. నీతో ముచ్చటించుటకుఁ దొందరపడుచు వేగఁ దీసికొని రమ్మనిరని పలికినది.
అప్పుడు మహాశ్వేత కాదంబరీ! నేను నీ తలిదండ్రులఁ జూడఁబోవు చున్నాను. నేను వచ్చుదనుక నీతం డెందుండవలయునని యడిగిన నప్పడంతి స్త్రీల హృదయస్థానముల యందలి మనసున ననుకొని ప్రకాశముగా నిట్లనియె. సఖీ! నీవు నన్నిట్లడిగెదవేల? చూచినది మొదలు శరీరమునకు, భవనమునకు విభవమునకు నీతండే పరివృఢుండని తలంచుచుంటి ప్రియసఖి! హృదయమునకుఁ గాని యాయనకుఁ గాని యెందిష్టమో యందేయుండవచ్చునని చెప్పిన మహాశ్వేత యిట్లనియె.
సఖీ! అట్లయిన నీ మేడ సమీపమందున్న ప్రమదవనమునందలి క్రీడాపర్వతముఁ గట్టఁబడిన మణివేశ్మమందు నివసింపజేయుఁమని యుపదేశించి మహాశ్వేత గంధర్వసార్వభౌముం జూడఁబోయినది.
చంద్రాపీడుండును మహాశ్వేతతోడనే బయలుదేరి వీణావాదినులు వేణువాద్యనిపుణలు సంగీతవిద్యాపారంగతులగు గంధర్వకన్యకలు పెక్కండ్రు కాదంబరీసమాదిష్టలై తన్ననుసరించిరాఁ బూర్వపరచితుండగు కేయూరకుండు ముందు నడుచుచు మార్గము జూపుచుండ రెండవజయంతమువలె నొప్పుచున్న యమ్మణిమందిరమున కరిగెను.
పిమ్మటఁ గాదంబరియుఁ బరిజనములెల్ల విడిచి యొక్కరితయే మేడయెక్కి తల్పంబునం బడుకొని యాత్మీయంబులగు వినయముగ్ధతాకుమారభావకులమర్యాదాదివిశేషంబులం దలంచుకొని యగ్గలంబగు సిగ్గు జెందుచు నిట్లు విచారించినది.
అయ్యో! మోహాంధురాలనై యిప్పుడు నే నెట్టిపని గావించితిని? అతం డదృష్టపూర్వుండు. కనబడఁగూడదని యించుకయు శంకింపనైతి. నన్ను లోకులు లఘుహృదయనుగాఁ దలంతురని నిర్లజ్జనై యాకలింపనైతిని. గురుజనములకు వెరవక లోకాపవాదమునకు భయపడక మహాశ్వేత దుఃఖితయైయున్న దనుమాట యాలోచింపక పరిజనము జూచునని తెలియక నష్టచేతననై దష్టమగుపని కావించితిని. నా ప్రమాదము స్థూలబుద్ధులుగూడఁ జులకనగాఁ దెలిసికొనఁజాలదు రనిన నను భూతకందర్పవృత్తాంత యగు మహాశ్వేతయు సకలకళాకుశలలగు సఖురాండ్రును రాజకులసంచారచతురులగు పరిజనులును, గ్రహించుట యేమి యబ్బురము? అంతఃపురదాసు లిటువంటి పనులఁ దెలిసికొన నతినిపుణదృష్టి గలవారుగదా?
అన్నివిధముల నేనిప్పుడు భ్రష్టురాలనైతిని. నాకిప్పుడు మరణమే శ్రేయము. బ్రతుకుట లజ్జాకరము. ఈ వృత్తాంతము విని నా తలిదండ్రులేమందురో! ఏమి జేయుదును? ఇందులకుఁ బ్రతీకారమేది? ఏయుపాయమున నీస్ఖలితమును గప్పికొందును? నా యింద్రియచాపల్య మెవ్వరితోఁ జెప్పికొందును?
అయ్యయ్యో! నాసఖుల ముందరఁ బెండ్లియాడనని శపథముఁజేసి యా వార్త కేయూరకముఖముగా మహాశ్వేతకుఁ దెలియజేసితినే? ఆమాట యించుకయు జ్ఞాపకము లేకపోయినది. శఠవిధి యా చంద్రాపీడు నాకడ కేమిటికిఁ దీసికొనిరావలయును? అతఁ డెవ్వడు? ఎప్పుడైన జూచితినా? వింటినా? తలంచితినా?
వానిం జూచినంతనే నా యింద్రియము లన్నియు విత్తమిచ్చి కొనఁబడినట్లు తద్వశములై పోయినవే? తెలిసికొంటి నా చపలునితో నాకేమియుం బనిలేదు. అని క్షణకాలము ధ్యానించి యంతలో మన్మథునిచేఁ బాణములతోఁగూడ నీధైర్యావలేప మపనయించెదఁ జూడుమని భయపెట్టబడినదివోలెఁ గ్రమ్మరఁ దనహృదయమ్ముఁ జంద్రాపీడాభిముఖమ్ము గావించి ప్రేమావేశంబునఁ బరవశురాలై యట్టెలేచి వాతాయనమునం గూర్చుండి యాక్రీడాపర్వతమునుఁ జూచుచుండెను.
చంద్రాపీడుండును రెండవ కాదంబరీ హృదయమువలె నొప్పుచున్న యమ్మణిమందిరము ప్రవేశించి యందు బహువిదోపధానములతో వెలయుచున్న కుథయందుఁ బడుకొని యథానిర్దిష్టస్థానోపవిష్టలై గంధర్వకన్యకలు సంగీతము బాడుచుండఁ గేయూరకునితొడపై యడుగులిడి దోలాయితచిత్తుఁడై యిట్లు తలంచెను. ఆహా! ఈ గంధర్వరాజపుత్రిక విలాసములు సకలలోకమనోహరములు. ఆరాధింపకయే ప్రసన్నుండై మకరధ్వజుండు నాకీ వైభవము గలుగఁజేసెను. అనురాగముఁతో గూడిన క్రేగంటిచూపులచే నన్నాచపలనేత్ర విలోకించుట, తచ్ఛరపాతంబునం గాదే? నేనామె మొగంబు జూచినప్పుడు చిరునగవుతో నాచూపులఁ దనపై వ్యాపింప జేసికొనుచున్నది.
మఱియు సిగ్గుచే వదన మవ్వలకుఁ దిప్పుకొనియుఁ బ్రతిబింబప్రవేశలోభంబున బోలెఁ గపోలదర్పణంబున నాకర్పించినది. నాకు దాంబూలమిచ్చి యలసినదివోలెఁ దమాలపల్లవమున వీచుకొన్నది. ఇదియంతయుంజూడ నాచేడియ నాయందు బద్ధానురాగయై యున్నట్లు తోచుచున్నది సందియము లేదని తలంచుచు నయ్యో! మానుష సులభమగు లఘుత్వము మిథ్యాసంకల్పసహస్రములచే నన్నిట్లాయాస పెట్టుచున్నది. యౌవనమదము వివేకమును హరించును. యూనుల దృష్టి తిమిరోపహతమై నల్పమునుగూడఁ బెద్దదానిగాఁ జూచును. ఆత్మగౌరవత రూపాభిమానముగల కులటవలె దన లోపము దెలిసికొనఁజాలదు. ఇంద్రజాల పింఛకవనె నాశ లేనిదానినైనను నట్లు తోపించును అని యాలోచించుచు నోహో! నే నిట్లు వృథగా మనసును ఖేదపెట్టుచుంటినేల? నిజముగా నీగజగామినికి నాయం దనురాగము గలిగెనేని మనోభవుఁడే యవిలంబముగాఁ దెలుపఁగలఁడు. నా సందియ మతఁడే తీర్పఁగలడని వితర్కించుచుఁ గొంతసేపు సంగీతవిద్యావినోదంబుల నలరారి యంతలో లేచి యుపవనాలోకనకౌతూహలచిత్తుండై క్రీడాపర్వతశిఖర మెక్కెను.
కాదంబరియు నారాజకుమారుం గాంచి అయ్యో! మహాశ్వేత యింకను రాలేదా? వచ్చుచున్నదేమో చూచెదం గాక యని యాగవాక్షమునుండి లేచి యనంగతప్తచితయై మేడపై కెక్కినది. అప్పుడు విరాళముగాఁ బరిజనులు కూడఁబోయి యెండదగలకుండఁ చతుర్దండయుక్తంబగు ఛత్రంబు బట్టిరి. కొందరు వింజామరలతో విసరుచుండి రప్పుడు.
సీ. ఒకసారి యలతమాలిక యంసమునఁ జేతు
లాని యెుయ్యారము లభినయించు
నొకతేప మదలేఖ నుపగూహనము సేసి
కమ్రశృంగారవైఖరుల నెరపు
నొకపరి యలచిట్టకముల వెలయించి
ఛత్రదండముల హస్తములనాను
నొకమారు ద్వారపాలికల వేత్రాగ్రభా
గములఁ జెక్కుల నాని రమణజూపు.
గీ. గప్పురపువీడె మధరాంతికమునఁ జేర్చు
నవ్వుతో వానిఁ జూచుచు నానలిననేత్ర
యతనిచేఁ జూడఁబడుఁ దానట్టులందు
నెంతసే పాలసించెనో యెఱుఁగదయ్యె ॥
మహాశ్వేత వచ్చినపని ప్రతీహారి చెప్పగా విని యదరుపాటుతో నమ్మేడ దిగి స్నానాదిక్రియలయం దుపేక్ష గలదైనను మహాశ్వేతానురోధంబున దివసవ్యాపారము నిర్వర్తించినది.
చంద్రాపీడుండును పర్వతశిఖరావతరణంబు గావించి యభీష్టదేవతల నారాధింపుచు నమ్మణిమందిరమందే యాహారాదివ్యాపారముల జరిగించెను. భుజించిన తరువాత నతడా క్రీడాశైలము తూరుపు భాగమున లతామంటపము క్రింద సంగీతగృహము ప్రక్కనొప్పుచున్న మరకతశిలాతలంబునం గూర్చుండి తాంబూలము వైచికొనుచు నందలి విశేషంబులం బరికింపుచుండ నమృతరసంబున నాకసంబుఁ బూయబడినట్లు చందనరసవర్షంబున దిగంతములు దడపఁబడినట్లు తెల్లనితేజ మొండతని కన్నులంబడిన వెరగందుచు నిట్లు తలంచెను.
ఆహా! భగవంతుఁడగు శీతభానుం డకాండమున నిందుదయించెను? లేక పాండురజలయంత్రధారలు విడువఁబడినవియా? కాక పవనవిశీర్యమానములగు శీకరములచే భువనమంతయుఁ దెలుపఁజేయుచు నాకాశగంగ భూమికి దిగుచున్నదియా? అని యాలోచించుచు దదాలోకానుసారముగా దృష్టి వ్యాపింపఁజేసెను.
సీ. సురుచిరచ్ఛత్రచామరములఁ బూని గం
ధర్వకన్యకలు ప్రాంతముల నడువ
మాలతీవరపుష్పమాలికఁ గేలఁ గై
కొని తమాలిక పార్శ్వ మనుసరింప
ధౌతకల్పద్రులతాదుకూలములఁ జే
కొని ముందుఁ గేయూరకుండు నడువ
నంగరాగసనాధన మగు పాత్రమును బూని
ప్రతిహారికై దండఁబట్టి కొలువ॥
గీ. వెన్నెలకు జీవితంబున వివిధరత్న
ముల యశోరాశి యనఁగ జూపులకుఁ దెలుపు
ప్రభవనీనెడు తారహారంబు బూని
వచ్చె మదనలేఖ తరళికా వనితతోడ॥
వారింజూచి చంద్రాపీడుండీ తెలుపునకుఁ గారణం బామె చేతనున్న రత్నహారంబని నిశ్చయించి దూరమునుండియే ప్రత్యుద్దానాది సముచితోపచారములం గావించి తనకు నమస్కరించుచున్న మదనలేఖం లేవనెత్తి యమ్మరకతశిలాతలంబున గూర్చుండఁబెట్టెను.
అప్పడతియు నొక్కింత తడవు కూర్చుండి యంతలో లేచి యతని యంగములఁ జందనాద్యంగరాగంబుల నలఁది యాదుకూలంబులఁ గట్టఁజేసి చూలలీదామం బభిరామముగాఁ దచ్చిఖం జుట్టి యప్పేరు చేతంబూని పేటలు సవరించుచు నిట్లనియె.
రాజకుమారా! నీ సౌకుమార్య మేజనుని ప్రీతిపరవశునిఁ జేయకుండెడిని? మనోహరాకారముగల మిమ్మేకామిని జీవితస్వామిగాఁ గోరకుండెడిని? అకారణవాత్సల్యముగల మీ చరిత్ర మెవ్వారికి బంధుత్వము గలపకుండెడిని? స్వభావమధుర మగు మీ వ్యవహార మెవ్వారికి మైత్రిగూర్పకుండెడిని? మీ యనునయమే మా బోటులకు మీతో మాటాడుట కవకాశ మిచ్చుచున్నది. ప్రథమదర్శనము నందే నమ్మకము గలుగఁజేసిన మీ యాకారమునే యుపాలంభింపఁదగినది. స్వయముగా హృదయమునే మాకర్పించిన జీవితస్వామి కేమి యియ్యఁబడదు? మా భర్తృదారిక యీ రూపముగాఁ బ్రణయమును దెల్పుచున్నది. కాని విభవము గాదు. మా నిమిత్తమై జీవితమైన నర్పించి పశ్చాత్తాపము జెందదు సత్పురుషుల మహిమ దాక్షిణ్యము గలదగుటఁ బ్రణయజనుల నిరాకరింపదు. ఈ వస్తుప్రదానమునఁ గాదంబరి మీ విషయమై యపరాధము జేసినదానవలె సిగ్గుపడుచున్నది.
హారమునంగల నాయకమణి సముద్రమధనకాలంబునం బుట్టినది. శేషాభిఖ్యచే నొప్పుచున్నది. దీనిం తొలుత సముద్రుఁడు తన గృహంబున కరుదెంచిన వరుణునకుఁ గానుకగా నిచ్చెను. వరుణుండొకానొక సమయంబునఁ జిత్రరథున కిచ్చెను. అతండు కాదంబరి కిచ్చెను.
ఆమె మీ రూపమున కనురూపమగు నాభరణ మిదియని మీ కడకంపినది. మీవంటివా రితరదత్తాభరణభారము వహింపరు. కాని కాదంబరికిఁ బ్రియముగా దీనిం ధరింపవేడుచున్నాను. యిది తప్పుగా గణింతురేని మహాశ్వేతను నిందింపుఁడు. ఆమెయే యిట్లు చేయమని తరళికను గూఁడ బంపినది అని పలుకుచు మదనలేఖ యా హారమును మెరుపుమీదఁ దారాచక్రమునువలెఁ దద్వక్షస్థలమున సంఘటించినది.
అప్పుడు చంద్రాపీడుఁ డామాటలు విని వెరగుఁజెందుచు సబహుమానముగా నిట్లనియె. తరుణీమణీ? నీవు మంచి నిపుణురాలవు గదా? ప్రత్యుత్తరావకాశము లేకుండఁగనే యుపన్యసించితివి ముగ్ధురాలా? దీని స్వీకరించుటకు మానుటకు మే మెవ్వరము? ఆ కథ ఇదివరకే యస్తమించినది సౌజన్యశాలినునైన మీ గుణములచేత నీ జనుండు కొనఁబడియెను. మీ కిష్టమైన వ్యాపారములకు నియోగించుకొనుఁడు. మిక్కిలి దాక్షిణ్యము గల కాదంబరియొక్క సుగుణము లెవ్వానివశము జేసికొనికుండెడివని పలికి పెద్దతడ వప్పడఁతిని గురించిన కథలే చెప్పికొనుచు గొంతవడికి నమ్మదనలేఖ ననిపి వెండియుఁ గ్రీడాపర్వతశిఖర మధిష్టించెను.
కాదంబరియు మదనలేఖవలన నందు జరిగిన వృత్తాంతమంతయుం దెలిసికొని ఛత్రాచామరాదిచిహ్నముల నేమియుం బూనక తమాలికను మాత్రము వెంటబెట్టుకొని క్రమ్మర నా మేడయెక్కి యుదయగిరిగుతుండగు చంద్రునివలె నొప్పు నప్పురుషరత్నమును జూచి వివిధవిలాసతరంగితములగు విలోకవనములం నతని మనసు హరించినది.
ఆలింగన మొనరింపుమని సంజ్ఞచేయుదానివలె బవనచలితంబగు నంబరంబు సవరింపునెపంబున గుచంబుల రెండుచేతులం గప్పుచు స్మరశరవిధురాల నైతినని తెల్పు చందంబునఁ బుష్పంబుల విరజిమ్ముచు నమస్కరించు దానివలెఁ గేశపాశమునుండి పూవులలాగి దోసిటంబట్టుచు నీరీతి సాయంకాలమువరకు ననేకలీలలు ప్రకటించినది.
అంతలో నంబరమణి యపరాంబునిధిమగ్నుం డగుటయుఁ గాదంబరీహృదయరాగసాగరంబునంబోలె సంధ్యారాగంబున జీవలోకంబు బూరింతంబయ్యె. క్రమంబున దిఙ్ముఖంబులు నీలాయమానంబులై మెల్లమెల్లనఁ జీకటులు వ్యాపింప దొడంగినవి. అంతలోనే లాంచనఛలంబున శర్వరీభార్య నురంబునదాల్చి కుముదినులచే గృహీతపాదుండై ప్రత్యక్షంబైన చందంబున దిక్కులఁ బ్రకాశింపఁజేయుచు రోహిణీకళత్రుండు నేత్రపర్వము గావించెను.
కుసుమాయుధాధిరాజ్యైకాతప్రతుండై కుముదమిత్రుండు పండువెన్నెలలుఁ గాయుచుండ జంద్రాపీడుండు చందనరసప్రక్షాళితంబగు ముక్తామంటపమున వసించి యందలి వింతలంజూచుచు వెన్నెలల సేవించుచున్న సమయంబున గేయూరకుం డరుదెంచి రాజపుత్రా! కాదంబరి మీ దర్శనము జేయ వచ్చుచున్నదని విన్నవించుటయు నతండు సంభ్రమముతోఁ జూచుచుండఁ దత్కాలరమణీయంబగు వేషంబున సాక్షాచ్చంద్రోదయ దేవతవలె నొప్పుచుఁ గాదంబరి మదనలేఖ చేయి పట్టుకొని మందగమనంబునఁ జనుదెంచి ప్రీతిపేశలత్వమునఁ బ్రకటింపుచుఁ బ్రాకృతురాలివలెఁ బరిజనోచితమగు క్షితితలంబున గూర్చుండెను.
వలదు. వలదు. అని మదనలేఖ బ్రతిమాలుకొనుచున్నను వినక చంద్రాపీడుఁడు తాను గూర్చున్న మరకతశిలావేదికిం దిగి యెదిగి యా ప్రాంతమున నేలనే కూరుచుండి మెల్లన నిట్లు నుపన్యసించెను.
దేవీ! దేవీ! దృష్టిపాతమాత్రమునకే సంతసించు దాసజనునివిషయమై సంభావణాదిప్రసాద మవసరము లేదు. అట్టి యనుగ్రహమే కలిగినచోఁ జెప్పదగిన దేమి? నిపుణముగా నాలోచించినిను నీ కిట్టి దయగలుగుటకు గుణలేశమైన నా యందున్నట్లు కనంబడదు. అభినవసేవకునిగూడ నిట్లు చూచుచున్నది నీ సుజనత్వ మతి సరళమైనది గదా? ఓహో! నీ వెవ్వనిఁ బనులకు నియోగింతువో వాఁడే ధన్యుఁడు. కనుసన్న జేసినంతనే పనులు గావించెడు భృత్యుని విషయమై నీ కిట్టి యాదర మేమిటికో తెలియదు. ఈ శరీరము పరోపకారమున కుపకరణమై యున్నది. జీవితము తృణముకన్నఁ దేలిక యగుచున్నది. నీ గౌరవమే కానుకగాఁ గోరి యరుదెంచిన మేమును, ఈ శరీరము ఈ జీవితము, ఈ యింద్రియములు, నీ యధీనములు. నీ ఇష్టము వచ్చిన పనికి నియోగింపుము. అని పలికిన విని మదనలేఖ యించుక నవ్వుచు నతని మాటల కడ్డమై యిట్లనియె. రాజపుత్రా! నీ వనినదే సత్యము కాని యతియంత్రణఁచే గాదంబరి ఖేదమును సిగ్గునుం బొందుచున్నది. ఎందుల కిట్లు పలికెదవు! నియమనము తక్క తక్కినవన్నియు నామె యంగీకరించుచున్నది. ఉపచారఫల్గువగు వచనంబుల నీ బాలికను సందేహడోలిక నెక్కించి యూపుచుంటివిగదా? అని పలుకుచు ప్రస్తావముగా మీ తండ్రి తారాపీడుం డెట్టివాఁడు. విలాసవతి యెట్టిది? మీ రాజధాని యుజ్జయిని యిక్కడి కెంతదూరమున నున్నది? మీరతపవర్ష మెట్లుగా నుండును? మర్త్యలోకవిశేషము లేపాటిరమణీయములని యడుగుటయు నతండు తదనుగుణ్యములగు మాటలచే సంతోషము గలుగఁజేసెను,
ఇట్లు కాదంబరి కొంతసే పందుండి కేయూరకునిఁ జంద్రాపీడుని సమీపమున విడిచి శయనసౌధంబునకుం బోయినది. చంద్రాపీడుండును గేయూరకుఁ డడుగు లొత్తుచుండఁ గాదంబరియొక్క నిరభిమానత్వ గంభీరత్వాభిరూపత్వాది గుణంబులును మహాశ్వేత యొక్క నిష్కారణవాత్సల్యము మదనలేఖయొక్క సౌజన్యము గంధర్వరాజలోకసమృద్ధి కింపురుషదేశరమ్యత్వమును మనసున విత్కరించుచు నామరకతశిలాతలపర్యంకమున శయనించి సుఖముగా నిద్రబోయెను.
మరునాఁ డరుణోదయంబున మేల్కాంచి రాజపుత్రుండు కాల్యకరణీయంబులం దీర్చికొని తాంబూలము చేతంపూని కేయూరకునితో నోయీ! నీవు పోయి మహాశ్వేత యెందున్నదో కాదంబరి యేమి చేయుచున్నదో చూచిరమ్మని పంచుటయు నతం డతిరయంబునం బోయి వచ్చి, నమస్కరించి, దేవా తెల్లని విభూతిరేఖలు ఫాలమునఁ గ్రాల జపమాలికలం ద్రిప్పుచుఁ బాశుపతవ్రతచారిణులై శాటీపటంబులం దాల్చియున్న పరివ్రాజికలును జటాజినమౌంజివల్కలాషాఢధారిణులైన తాపసులును సాక్షాన్మంత్రదేవతలవలె దేవతాస్తుతి శ్లోకములఁ బఠించుచు జుట్టునుం బరివేష్టింప మందరప్రాసాదముక్రింద నంగణసౌధవేదికయందుఁ గూర్చుండి దర్శనాగతులగు గంధర్వ బంధువృద్ధుల సన్మానింపుచు మహాశ్వేత కాదంబరితో ముచ్చటింపుచున్నదని యెరిగించెను.
పిమ్మట గేయూరకుఁడు మార్గ మెరిఁగింపఁ జంద్రాపీడుఁడు అంతఃపురవిశేషంబులం జూచుచుఁ గ్రమంబున మహాశ్వేతయొద్దకు బోయి నమస్కరింపుచు నావేదికయందే కూర్చుండి క్షణకాల మూరకొని మహాశ్వేత మొగంబు పరీక్షింపుచుఁ గపోలముల ప్రకాశించునట్లు మందహాసము గావించెను. అప్పుడు మహాశ్వేత యభిప్రాయము గ్రహించి కాదంబరి కిట్లనియె.
సఖీ! చంద్రకిరణములచేఁ జంద్రకాంతమణివలె నీకనులచే నార్ద్రీకృతహృదయుండై చంద్రాపీడుండు వెళ్ళ నిశ్చగించి నేమియు మాటాడజాలకున్నవాఁడు. ఇతని వృత్తాంతమేమియుం దెలియక రాజచక్రము తొట్రుపడుచుండును. దూరమందున్నను బద్మినీపద్మబాంధవులకుఁ బోలె బ్రళయపర్యంతము మీ యిరువురకు నీ ప్రీతి స్థిరమై యుండక మానదు. ఈ కుమారున కరుగుట కనుజ్ఞ యిమ్మని పలికిన విని కాదంబరి నెచ్చెలీ! బరిజనయుక్తముగా నీజన మీ కుమారునకు తన యంతరాత్మవలెనే స్వాధీనమై యుండ నిందుల కవరోధమేమి? అట్లే పోవచ్చునని పలుకుచు గంధర్వకుమారులం జేరి వీరిఁ స్కంధావారమును జేర్పుఁడని యాజ్ఞాపించినది.
అప్పుడు చంద్రాపీడుఁడు లేచి తొలుత మహాశ్వేతకు నమస్కరించి తరువాతఁ గాదంబరికి మ్రొక్కి ప్రేమపూరితమగు తదీయదృష్టి చేతను, మనసు చేతను గ్రహింపఁబడుచు దేవీ! ఏమందును? లోకమున బహుభాషకుల నాదరింపరుగదా? నన్నుఁ బరిజనకథలయందు స్మరింపుచుండవలయు నిదియే నా కోరిక యని పలికి యతం డయ్యంతఃపురము నుండి బయలుదేరెను.
అప్పుడు కాదంబరితక్క తక్కిన యంతఃపురకాంత లందరు తద్గుణగౌరవముచే నాకర్షింపబఁడి పరవశలై బహిర్ద్వారము వరకు నతని ననుగమించి యరిగిరి. అందరివలనను నామంత్రణము వడసి యతండు కేయూరకానీతమగు నింద్రాయుధమెక్కి గంధర్వకుమారులతోఁ గూడికొని నడుచుచున్న యతనికి హృదయమందే కాక యన్నికడలను గాదంబరి యున్నట్లు కనంబడుచుండెను. అతని మనంబు తన్మయంబగుటఁ బోవలదని వెనుకనుండి లాగుచున్నట్లును ముందడ్డము వచ్చినట్లును దోచుచుండెను. అట్టి విరహముతో నతండు క్రమంబున మహాశ్వేతా శమము మీదుగా నచ్ఛోదసరస్స్తీరమున కరిగి యందుండి యింద్రాయుధ బురపుటానుసారముగా స్కంధావారమును జేరి గంధర్వకుమారుల నంపివేసెను.
తన్నుఁజూచి మ్రొక్కుచున్న రాజలోకమును మన్నించుచు నెదురువచ్చిన వైశంపాయనునిఁ గౌఁగలించుకొని పత్రలేఖ నాదరించి లోపలిభవనమును బ్రవేశించి యేకాంతముగాఁ బత్రలేఖ వినుచుండ వైశంపాయనునితోఁ దాను జూచివచ్చిన విశేషములన్నియుఁ జెప్పుచుఁ దత్కథాలాపముల తోడనే యారాత్రి సుఖముగా వెళ్ళించెను.
మఱునాఁ డుదయకాలమున రాజపుత్రుడు సభాభవన మలంకరించి కాదంబరినే ధ్యానించుచుండ నంతలో ద్వారపాలుని వెంటవచ్చుచున్న కేయూరకునిఁ జూచెను. అతఁడు దూరమునుండియే మౌళిచుంబిత ధరాతలుండై నమస్కారము గావించుటయుఁ రాజపుత్రుం డోహోహో! గంధర్వపుత్రా! రమ్ము. అని పలుకుచుఁ జేతులు సాచి గాఢాలింగనము జేసి తన సమీపమందే కూర్చుండఁ బెట్టికొని వత్సా! పరివారయుక్తముగాఁ గాదంబరి సుఖియైయున్నదా? మహాశ్వేతకు భద్రమా! అని యడిగిన నతం డిట్లనియె.
దేవా! అందరును సుఖులై యున్నారు. కాదంబరి యంజలి పట్టి దేవర నర్చించుచున్నది మహాశ్వేతయు కుశలవాక్యపూర్వకముగ నమస్కరించుచున్నది. మదనలేఖయుఁ దమాలికయుఁ బాదప్రణామపూర్వకముగా నారాధించుచున్నారు మఱియు మహాశ్వేత దేవరకిట్లు విన్నవింపుచున్నది. నీ వెవ్వరికిఁ జక్షుర్గోచరుఁడ వగుచుంటివో వారు ధన్యులు. నీ సమక్షమునఁ జంద్రకిరణములవలెఁ జల్లనైన నీగుణములు వియోగమం దుష్ణకరకిరణములై బాధించుచున్నవి. ఇందలి జనంబులు నిన్నటిదివసంబు నమృతోదయవాసరంబువలె స్మరించుచున్నారు. నీచే విడువబడిన యీగంధర్వరాజనగరంబు వినివృత్తమహోత్సవమైనదిగాఁ దోచుచున్నది. నన్ను సకలసంగపరిత్యాగురాలని యెరుంగుదువుగదా? అయిన నకారణబంధుఁడవగు నిన్నుఁ జూచుటకు నాహృదయ మిచ్చగించుచున్నది. అదియునుంగాక భవదీయస్మేరాననవిలాసముల స్మరించుచుఁ గాదంబరి యస్వస్థశరీరయైయున్నది. కావున బునర్దర్శనగౌరవంబున నామెను సన్మానింపఁగోరుచున్నాను. ఇట్టిసందేశ మనుచితమైనను నీసుజనత్వమే మాకిట్టి ప్రాగల్భ్యమును గలుగఁజేయుచున్నది. ఇదిగో కాదంబరి నీకర్పించిన శేషాహారమును దల్పంబున మరచిపోయితివి. దీనిఁ బంపితిఁ గైకొనవలయునని తదీయసందేశ మెరింగించుచుఁ గాదంబరిచే నంపఁబడిన బిసతంతువులచేఁ గట్టబడియున్న తామరాకు దొన్నె నతనియెదుట విప్పి యందభిజ్ఞానముగా నుంచఁబడిన యాకులును, బోకలును, కర్పూరమును మృగదామోదమనోహరంబగు చందనవిలేపనంబునం దీసి రాజకుమారున కర్పించెను.
అప్పుడు జంద్రాపీడుండును ఆహా? నా భాగ్యము పరిజనకథలయందైన స్మరింపఁదగని నన్నుఁ గాదంబరి మిక్కిలి గౌరవింపుచున్నది. ఇది యంతయు మహా శ్వేతయొక్క పాదసేవవలనఁ గలిగిన ఫలమని పలుకుచు నావస్తువుల నాదరముతో గ్రహించి వామకరంబున నతని భుజము బట్టికొని రాజలోకమునెల్ల విడిచి మెల్లగా గంధమాదనమను నేనుఁగను జూడఁబోయెను. అందొకింతకాలము నిలిచి యటనుండి వాజిశాలకుఁబోయి యందలి గుఱ్ఱములఁ బరీక్షించుచు నింద్రాయుధపృష్ఠభాగము నందలి యవకుంఠనపటం బొకింత జారుటయు సవరించుచుఁ దన్ముఖంబున దృష్టినిరోధముగా వ్రేలాడుచున్న కేసరముల నెగదువ్వుచు నమ్మందిరదారుపునకుఁ జేరఁబడి కౌతుకముతో నిట్లనియె.
కేయూరకా! నేను వచ్చినతరువాత నయ్యంతఃపురమున యేమి జరిగినది? కాదంబరి యావాసరమెట్లు గడపినది? మహాశ్వేత యేమి జేసినది? మదనలేఖ యేమి భావించినది? నన్ను గురించి యంతఃపుర కాంతలెల్ల నేమి జెప్పికొనిరి? సవిస్తరముగాఁ జెప్పుమని యడిగిన నతం డిట్లనియె.
దేవా! వినుండు దేవర యరిగినవెనుకఁ బరిజనముతోఁగూడఁ గాదంబరి సౌధమెక్కి తురగఖధూళిలేఖాధూసరమగు మీమార్గ మాలోకించుచు మీరు తిరోహితు లైనంత మదనలేఖయొక్క భుజంబున శిరంబిడి ప్రీతిచే నాదిగింతమునే చూచుచుఁ బెద్దతడవందే యున్నది. తరువాత నతికష్టమున నామేడ దిగి యాస్థానమంటపమున క్షణకాలము గూర్చుండి యంతలో లేచి మీరు నివసించిన క్రీడాపర్వతమున కరిగినది.
అందుఁ బరిజనులు రాజకుమారు డీలతామంటపమున నీ చలవఱాతఁ గూర్చుండెను. నీమణిశిలయందున స్నానము గావించెను. నిందు నిందుధరు నారాధించె, నిందు భుజించె, నిందు శయనించెనని యెరింగింపుచుండ నాయాచిహ్నముల విలోకింపుచు నాపగలు గడిపినది సాయంకాలమున మహాశ్వేత బలవంతముసేయ నెట్టకే నాశైలశిలాపట్టణమున భుజించినదిఁ అంతలోఁ జంద్రోదయ మగుటయు శశికరంబులకుఁ గపోలములపైఁ గరంబు లడ్డము పెట్టుకొని కన్నులు మూసి యేదియో ధ్యానించుచు క్షణకాలమందుండి యంతలో లేచి శయ్యాగృహమున కేగి పడుకొనినది.
అది మొదలు ప్రబలమగు శిరోవేదనయు దాహరూపంబగు జ్వరంబును బాధింప నేదియో వ్యాధిచేఁ గొట్టికొనుచు నెట్టకే నారాత్రి వేగించినది. నేఁటియుదయంబు నన్నుఁజేరి మీ సేమము దెలిసికొనుటకై సోపాలంబముగా మీకడ కనిపినది. ఇవియే యక్కడివార్తలని యెరింగించిన నాలించి రాజనందనుఁడు తొందరగా నందుబోఁ దలంచి గుఱ్ఱము గుఱ్ఱమని కేక పెట్టెను. అప్పుడశ్వరక్షకుఁడు జీనుగట్టి యింద్రాయుధము నెదురబెట్టుటయు పత్రలేఖను వెనుకఁ గూర్చుండఁబెట్టుకొని వైశంపాయనుని స్కంధావారమున నుండ నియమించి వేరొక గుర్రమెక్కి కేయూరకుండు వెంటరా నాహయంబెక్కి యతిరయంబున నాహేమకూటమున కరిఁగి కాదంబరీభవనద్వారంబున గుర్రమునుదిగి పత్రలేఖ వెంట నడువ లోపలకుఁ బోవుచు నెదురుగా వచ్చుచున్న మరియొక గంధర్వకుమారునిఁ గాదంబరి యెందున్నదని యడిగెను.
అతఁడు నమస్కరించుచు దేవా! క్రీడాపర్వతము క్రిందుభాగమునఁ గమలవనదీర్ఘికాతీరంబున రచింపఁబడిన హిమగృహంబున వసించియున్నదని యెరింగించెను. ఆ మాటవిని కేయూరకుఁడు ముందు నడుచుచు మార్గము దెలుపఁ బ్రమదవనము నడుమనుండి పోవుచు నందలి కదళీవనప్రభలచే రవికిరణంబులు పచ్చనగుట వింతగాఁ జూచుచు నవ్వనమధ్యంబున నళినీదళములచేఁ గప్పఁబడిన హిమసదనంబు చెంత కరిగెను.
సీ. లలితమృణాళదండములును బిసంతంతు
మయములై యొప్పుచామరల బూని
కదళీదళంబులు కమలినీపత్రముల్
బూలగుత్తులు ఛత్రములుగఁ బట్టి
మలయజరసముతో మెలసి మర్దించిన
కర్పూరధూళి పంకంబు దాల్చి
తతకేతకీగర్భదళదీపితతమాల
కిసలయమాలికల్ కేలబూని.
గీ. చెలులు శైత్యోపచారము ల్సేయుచుండ
హిమగృహంబునఁ బుష్పతల్పంబునఁ బండుఁ
కొని దురంతవియోగవేదన దపించు
చిత్రరథపుత్రిఁ గాంచె నాక్షితిపసుతుఁడు
అంతకుముందుగాఁ బోయి తదాగమన మెరింగించుచున్న పరిజనముతో ఆ! ఏమీ? నిజముగా నతండు వచ్చెనా? మీరు చూచితిరా? ఎంతదూరములో నున్నవాఁడని యడుగుచుండఁగనే యతండు గన్నులంబడుటయుఁ దొలిచూపులతనిపై వ్యాపింపఁ జేయుచు జారిన యుత్తరీయాంశుకము హారమును నురంబున సవరించుచు నా విరిబోఁడి పూసెజ్జనుండి యట్టె లేచినది.
చంద్రాపీడుండును సమీపించి పూర్వమువలెనే మహాశ్వేతకుఁ గాదంబరికి నమస్కారములు గావించెను. కాదంబరి ప్రతిప్రణామము గావించి యాపుష్పశయ్య యందుఁ గూర్చుండెను. అప్పుడు ప్రతిహారి జాంబూనదపీఠంబొండు దెచ్చి వైచుటయు నది కాలితో ద్రోసి చంద్రాపీడుండు వినయ మభినయించుచు నేలయందే కూర్చుండెను.
అప్పుడు కేయూరకుఁడు దేవీ! ఈ చిన్నది యీ రాజకుమారుని తాంబూలకరండవాహిని, యీమెపేరు పత్రలేఖ. వీరికి మిక్కిలి యనుగ్రహధాత్రియని యెరింగించెను. కాదంబరియు నాకన్యంజూచి యోహో! మానవస్త్రీలయందుఁ బ్రజాపతికింత పక్షపాతమున్నదా? అని తద్రూపాతిశయమున కచ్చెరువందుచు నమస్కరింపుచున్న యాయన్నుమిన్నను రమ్మురమ్మని సాదరముగాఁ బిలుచుచుఁ దన వెనుకప్రక్కం గూర్చుండఁబెట్టుకొని పరిజనులెల్ల వెరగుపాటుతోఁ జూచుచుండఁ గరికిసలయమున స్పృశించుచుండెను.
చంద్రాపీడుండు నట్టి యవస్థ నున్నఁ గాదంబరిం జూచి అయ్యో? నా హృదయమింత మొద్దువారినదేమి? యిప్పుడుకూడ సందేహమే చెందుచున్నది. కానిమ్ము. నేర్పుగా నడిగి తెలిసికొందునుగాక. అని తలంచి ప్రకాశముగా నిట్లనియె.
దేవీ! ఆవిళసంతాప తీవ్రంబగు నీ వ్యాధి నీకెట్లు కలిగినది? భవదంగభవపరితాపంబు జూడ సత్యము జెప్పుచున్నాను. నీకంటె నన్నెక్కుడుగా బాధించుచున్నది. పెక్కేల? దేహమిచ్చియైన నిన్ను స్వస్థురాలిగాఁ జేయఁదలచుకొంటి నిందులకు నా హృదయము మిక్కిలి తొందరపడుచున్నది. అయ్యయ్యో? మన్మథునికి శరీరభూతములగు నీభుజలతను సంతాపదృష్టులచే గందజేయుచుంటివి? అశ్రుబిందుపాతంబున ముక్తాభరణత్వము గలిగి యొప్పుచుంటివి. పరార్హములగు మంగళప్రసాదనముల వహింపుము. నవలత సకుసుమశిలీముఖయై శోభించునుగదా? అని యడిగిన విని కాదంబరి బాలయు స్వభావముగ్ధయునైనను గందుర్పునిచే నుపదేశింపబడిన ప్రజ్ఞచేఁ దద్వాక్యము లందలి శ్లేషార్ధమును గ్రహించియు నేమియుఁ బ్రత్యుత్తర మీయక యన్యాపదేశముగా మందహాసము గావించినది అప్పుడు మదనలేఖ రాజకుమారా! ఏమందును. ఈ సుందరి సంతాప మకథనీయమై యున్నది. సుకుమారభావముతోఁ గూడిన యీచేడియ కేది సంతాపము గాకుండెడిది? పద్మినికి వెన్నెలయు నెండగా నుండునుగదా? కిసలయతాళవృంతమున విసరుకొనుచున్న యీ పూఁబోడి మనోభవఖేద మేమిటికి తెలిసికొనజాలవు? ఈమెకు ధీరత్వమే ప్రాణసంధారణహేతువు. అని ప్రత్యుత్తర మిచ్చుటయు నాయాలాపములే యతని మాటలకు సరిపడియున్నవని కాదంబరి హృదయంబునం దలంచినది.
చంద్రాపీడుండు నమ్మాటలయందుఁగూడ నర్ధద్వయము గలిగియుండఁబట్టి తన డెందంబున గలిగిన సందియము దీరమింజేసి పరిపరివిధంబులం దలంచుచుఁ బ్రీత్యుపచయచతురములు మధురాలాపగర్భములు నగు కథలచే మహాశ్వేతతోఁగూడఁ కొంత గాలక్షేపము జేసి యతిప్రయత్నముతో నామెను విడిచి స్కంధావారమునకుఁ బోవుటకు బయలుదేరెను.
గుర్రమెక్కఁబోపు సమయంబున గేయూరకుం డరుదెంచి దేవా? మదనలేఖ యిట్లు విజ్ఞాపనజేయుచున్నది. ప్రథమదర్శనప్రీతిచేఁ బత్రలేఖ నిందుంచి వెళ్ళమని కాదంబరి కోరుచున్నది. వెనుక నంపఁగలదు. దేవర చిత్త మే మనవుఁడు రాజనందనుఁడు కేయూరకా! మాపత్రలేఖ ధన్యురాలు. దుర్లభమైన దేవీప్రసాదమునకుఁ బాత్రురాలగు చున్నది. అట్లే యుంచుకొనుడని పలుకుచుఁ నామెను విడిచి తురగ మెక్కి యతివేగముగా సేనానివేశమునకుఁ బోయెను.
అంతకుముందు తండ్రియొద్దనుండివచ్చియున్న లేఖావాహకుం జూచి యీరాజపుత్రుఁడు దూరమునందుండియే గురుతుపట్టి యోరీ! మహారాజు కుశలుఁడేనా? అంబకు భద్రమా? రాష్ట్రమంతయు సుఖముగా యున్నదా? యని యడిగిన వాఁడును వినమ్రుఁడై చిత్తము చిత్తమని పలుకుచుఁ దనచేతనున్న పత్రికాద్వయ మతని కందిచ్చెను. అతండా పత్రిక విప్పి యిట్లు చదివెను.
స్వస్తిశ్రీ మహారాజాధిరాజ! తారాపీడమహారాజ మార్తాండుఁడు శ్రీమంతుఁ జంద్రాపీడు నుత్తమాంగమున ముద్దిడుకొనుచు వ్రాయునది.
ప్రజలు సుఖులై యున్నవారు నీవు దిగ్విజయయాత్రకుఁ బోయి చిరకాలమయినది నిన్నుఁ జూచుటకు మాహృదయము మిక్కిలి యుత్కంఠ నొందుచున్నది. నీతల్లియు నంతఃపురకాంతలతోగూడ గృశించియున్నది. యించుక జాగు సేయక యీ పత్రికం జదివి ముగించినసమయమే ప్రయాణకాలముగాఁ జేసికొని రావలయును.
శుకనాసుఁడు వ్రాసిన రెండవపత్రికలోఁగూడ నిట్లేయున్నది. వైశంపాయనుఁడు సైతమట్టి యర్ధముతోఁ దనకును వచ్చిన యుత్తరముల నతనికిఁ జూపెను.
అప్పుడు చంద్రాపీడుఁడు మిక్కిలి తొందరపడుచు వెంటనే ప్రయాణభేరి గొట్టింప నాజ్ఞాపించెను. మేఘనాథుఁడను సేనాధిపతిని యోరీ! నీవిందుండుము. ఇచ్చటికిఁ బత్రలేఖను గేయూరకుఁడు దీసికొని వచ్చును. దానితోఁగూడ నీవింటికి రమ్మని పలికి వెండియు నిట్లనియె
మానవజాతి దుష్ప్రకృతిగలది. నీ యుపకారములన్నియు నాత్మార్పణము చేసి నీయకారణవాత్సల్యత గణింపక వాజాశ్సిససములకు భిన్నార్ధత్వము గలుగజేసితినని తలంచెను కాబోలు. ఆస్థానమందెక్కుడు దయఁజూపిన నీసాధుత్వ మెన్నటికేని మరువఁదగినదే? నా గుణముల నీయొద్ద మిక్కిలిగా స్తుతిజేసిన మహాశ్వేత నిప్పు డెత్తిపొడుచుచుందువని నా హృదయము మిక్కిలి సిగ్గు జెందుచున్నయది. నే నేమి చేయుదును. తండ్రియాజ్ఞ యెక్కడుదిగదా! అది శరీరమాత్రమునకే యుపయోగించును. హేమకూటనివాసవ్యసనముగల నామనస్సుచేత జన్మాంతరసహస్రముల యందు నీకు దాస్యము చేయుదునని బట్టము వ్రాసి యియ్యఁగలను.
ఇప్పుడు తండ్రియాజ్ఞ నుజ్జయినికిఁ బోవుచున్నవాఁడ. యీ కృతఘ్నుని బరిజనప్రసంగమునందైన స్మరంపుచుండవలయును. బ్రతికియుండిన నెప్పటికైన వెండియు దేవీచరణారవిందవదనసుఖం బనుభవించువాఁడ, మరియు మహాశ్వేతా పదపద్మములకు శిరంబున మ్రొక్కు వాఁడ, మదనలేఖ సేమ మడిగితిని. తమాలికనుఁ గౌఁగలించుకొంటిని.
అని యిట్లుత్తరము వ్రాసి మడిచి యీ పత్రికం గేయూరకముఖముగాఁ గాదంబరి కందింపుమని మేఘనాథునితోఁ జెప్పుచు, వైశంపాయనుని స్కంధావారముతో మెల్లగా రమ్మని నియమించి తానతిజవంబున నింద్రాయుధ మెక్కి వారవపు రౌతులు సేవింప కతిపయప్రయాణముల నుజ్జయినికిఁ బోయెను.
ఆకస్మికముగా నతండు వచ్చుటచేఁ బౌరులు సంభ్రాంతులై సంతసించుచు నెదురువచ్చి నమస్కరింపుచుండఁ గైకొనుచు నతండతర్కితుండై రాజనగరిఁ బ్రవేశించెను.
అప్పుడు ద్వారపాలు రతని వార్త ఱేనికి నహమహమికఁగాఁ బోయి చెప్పిరి. యా వృత్తాంతము విని తారాపీడుఁడు పట్టరాని సంతోషముతో నతనికిఁ గొంత దూర మెదురేగెను.
చంద్రాపీడుఁడును దూరమునందే తండ్రిం జూచి తురగమునుదిగి యతని పాదంబుల సాష్టాంగముగా బడిఁ నమస్కరించెను.
అతండు నప్పుడు పుత్రకుని గ్రుచ్బియెత్తి గాఢముగా గౌఁగలించుకొనుచు నప్పుడే విలాసవతీ భవనమునకుఁ దీసికొనిపోయెను.
ఆమెయుఁ బుత్రునింజూచి యపార సంతోషముతో వదనము వికసింప నాలింగనము చేసుకొని యాత్రామంగళములు దీర్చుచు దిగ్విజయ యాత్రా సంబద్ధములగు కథలచేఁ బెద్దతడవందుంచు కొనియెను.
చంద్రాపీడుఁడు పిమ్మట శుకనాశుని యింటికిఁబోయి వైశంపాయనుండు స్కంధావారముతో వచ్చుచున్నాడని చెప్పి, మనోరమకుఁ బ్రీతి గలుగఁజేసి యా దివసమంతయు తల్లియొద్దనేయుండి మరునాఁడు తనదగు కుమారభవనమునకుఁ బోయెను.
అతిమనోహరమగు నమ్మందిరము కాదంబరీవియోగచింతాసంతాపంబునఁ దొట్రుపడుచున్న యక్కుమారుని హృదయమునకు శూన్యంబువలె దోచినది.
అట్టి పరితాపముతో నతండు గొన్నిదినములు గడిపినంత నొకనాఁడు మేఘనాథునితోఁగూడ పత్రలేఖ హేమకూటమునుండి వచ్చుటయు దూరమునందు చూచి మోము వికసింప నమస్కరింపుచున్న దాని గ్రుచ్చియెత్తి మిక్కిలి గారవింపుచు నించబోణీ! కాదంబరీ మహాశ్వేతలు సుఖులే కదాయని యడిగిన నప్పుడఁతియు వారి యనామయము జెప్పి, వెండియుం గాదంబరి తమసేమ మడిగినదని వక్కాణించెను.
అప్పు డతఁడయ్యింతి చేయి పట్టుకొని యభ్యంతర మందిరమునకుఁబోయి యందు స్థలకమలినీపలాశచ్ఛాయచేఁ జల్లనై యున్న మరకతశిలామంటపమున నిద్రించు మరాళమిథునమును దోలి యందు గూర్చుండి యల్లన దానితో నిట్లనియె. పత్రలేఖా! నేను వచ్చిన తరువాత నచ్చట జరిగిన విశేషము లెట్టివి? నీవందెన్నిదినము లుంటివి? నిన్నెట్లు చూచినది? యేమేమి గోష్ఠి వచ్చినది? కాదంబరి నామాట యెప్పు డైన స్మరించినదా! యని యడిగిన నబ్బోటి దేవా! దేవర వచ్చిన తరువాత నందు జరిగిన విశేషములం జెప్పెద దత్తావధానులై వినుండని యిట్లనియె.
మీరల్లనాఁ డుదయంబునఁగదా! యఱిగితిరి. మీరు వెళ్ళిన గొంత సేపటికి కాదంబరి పరిజనులను విడిచి నన్ను బాహ్యోద్యానవనమునకుఁ దీసికొనిపోయి అందు మరకతసోపానములచే దీపించు ప్రమదవనవేదికయందు మణిస్థంభ మూతగాఁ గూర్చుండి ముహూర్తకాల మూరకొని యెద్దియో పలుక నిశ్చయించి రెప్పవేయక పెద్దతడవు నా మొగము చూచినది.
అప్పుడు నే నామె యభిప్రాయము గ్రహించి, అయ్యో! తొయ్యలీ! భయపడియెదవేల? యెద్దియేని జెప్పవలసియున్న జెప్పుము. నన్నన్యఁగా దలంపకుమని పలికిన విని యక్కలికి పాదాంగుష్ఠంబున నేల వ్రాయుచు మాటిమాటికి నలుమూలలు సూచుచు జెప్పఁదలఁచు కొనియు సిగ్గుపెంపున గంఠము గద్గదికబూన నెలుంగురాక యూరకొని తలవంచి కన్నులనుండి ప్రవాహంబుగా నీరు గార్చినది.
మఱియు నేను పలుమారు, మగువా! నీకిది తగునా? కారణ మెద్దియో చెప్పుము. ఊరక కన్నీరు నించెదవేలనని యడుగగా నతి ప్రయత్నముతోఁ గన్నీరు దుడిచికొనుచు వక్తవ్యాంశమును నఖశిఖరములచేఁ గేతకీదళముల వ్రాసి యంతలో జించివైచి తెగువలై సిగు దిగద్రోచి తలయెత్తి యత్త్వ సారెసారెకుఁ గన్ను లప్పళించుచు నాకిట్లనియె.
సఖీ! పత్రలేఖా! నిన్నుఁ జూచినది మొదలు నా హృదయము వయస్య లందరికన్న నీయందు విశ్వాసము గలిగియున్నది. కారణమేమియో తెలియదు. బోఁటీ! నాపరిభవ మెవ్వరితోఁ జెప్పుకొందును? నా దుఃఖము పంచుకొని యనుభవించువారెవ్వరు? ఇప్పుడు నా ప్రాణసంకట మెఱింగింప నీకన్న నా కాప్తులు గనఁబడలేదు. కాంతా! నా సంతాపమంతయు నీ కెఱింగించి జీవితము విడుచుచున్నదాన, నిష్కళంకమైన కులము కళంకపరచి కులక్రమాగతమగు సిబ్బితిమబ్బుచేసి సామాన్యకన్యవలె నాబోటి బోఁటి చిత్తచాంచల్యమందఁ దగినదా! అన్నన్నా! అనాథవలె నీచవలెఁ బలాత్కారముగాఁ జంద్రాపీడుని కారణంబున నిందాపాత్రురాల నయితినే! అయ్యో! గొప్పవారికిట్లు చేయుట దగునేమో చెప్పుము. పరిచయమున కిదియా ఫలము అభినవబిససుకుమారమగు నామనం బతండిట్లు పరిభవింపవచ్చునా? కటకటా! యూనులకు గుమారికాజనము పరిభవింపఁదగినదే? సఖీ! నా హృదయము దహించుచున్నది. ఇంక నేను బ్రతుకజాలను. జన్మాంతరమందైన నీ సాంగత్యమే కోరుచున్నదాన. నీవంటి వయస్య నాకులేదు. నా కళంకమును ప్రాణపరిత్యాగప్రాయశ్చిత్తంబునఁ గడిగికొనియెదనని పలికి యూరకుండెను.
అప్పుడు నేనవ్విధమేమియు నెఱుఁగమింజేసి మిక్కిలి భయపడుచు విషాదముగా నిట్లంటి.
దేవీ! చంద్రాపీడుఁడేమి యపరాధము జేసెను? కుసుమకోమలమగు నీ మనంబు నేయవినయమున ఖేద పెట్టెను? వినుట కిచ్చగించుచున్నదాన వడిగాఁ జెప్పుము? విని మొదట నేను మేనుబాసిన తరువాత నీవు జీవితము విడుతువుగాక యని యడిగిన నత్తరుణి యిట్లనియె.
బోటీ! వినుము. ఆధూర్తుండు కలలో వచ్చి వచ్చి శుకశారికలచే రహస్యసందేశముల నంపుచుండెను. వ్యర్ధమనోరథమోహితుండై నిజానురాగంబునంబోలె నా చరణముల నలక్తశరసంబున రంజింపఁజేయును. గపోలస్వేదమును ముఖమారుతమునఁ బోగొట్టుచుండును. ఉపవనంబున నేనొంటిగాఁ గ్రుమ్మరుచు గ్రహణభయంబునఁ బారిపోవ నడ్డమువచ్చి బిగ్గరగా గౌఁగలించును. స్తనతటంబునఁ బత్రరచనలు చేయును. కచగ్రహణముచేసి సురాగండూషములఁ బలుమారు నా ముఖంబున నిడుచుండెను.
పత్రలేఖా! ఆ నిశ్చేతను నేనెట్లు పట్టుకొందునో చెప్పుము. అనుటయు నేనామె మాటలు విని చిత్తంబున అన్నా! యీ చిన్నది చంద్రాపీడుని గురించి మన్మథునిచే మిక్కిలి దూరముగా నాకర్షింపఁబడినది. నిక్క మీ చక్కె రబొమ్మ మూలమున నతండును పుష్పకోదండుని బారిం బడియుండెను.
అని మనంబునఁ దలంచుచు యువతీ! నీవిధ మెఱింగితిని. కోపము విడువుము. కామాపరాధంబున మా చంద్రాపీడుని నిందింపకుము. ఈ చేష్టలన్నియు శఠుండగు మన్మథునివే కాని మా దేవరవికావు అని పలికిన నక్కలికి సంతసించుచు మోమెత్తి యిట్లనియె.
కామినీ! కాముఁడన నెవ్వఁడు? వాని రూపమెట్టిది? వాని చేష్టలెట్టివో! చెప్పుమన నేను తరుణీ! వానికి రూపములేదు. శరీరము లేకయే దహింపఁగలఁడు, జ్వాలావళి జూపకయే సంతాపము కలుగఁజేయును. పొగ లేకయే కన్నీరు పుట్టించును. అట్టి భూత మీభువనత్రయంబునను లేదు. ఎట్టి ధైర్యముగలవారినైన బారింబడిరేని వేధింపక మానఁడు. మఱియు నతనిచే నావేశింపబడిన స్త్రీలకు గగనమంతయు ప్రియుని ముఖచంద్రులుగానే తోచుచుండును. భూమియంతయు దయితాకారములే కనంబడును. వారి చర్యలు కడువిపరీతములుగా నుండునని పలికిన విని యత్తన్వి శిరఃకంపము చేయుచు నాకిట్లనియె.
పత్రలేఖా! నీవిప్పు డెట్లు చెప్పితివో మన్మథుఁడు నన్నట్లు వేపుచున్నవాఁడు. నీవు నాకుఁ బ్రాణమువంటిదానవు కావున నడుగుచుంటిని. ఇప్పుడు నేనేమి చేయఁదగినదో చెప్పుము? ఇంతకు మున్నిట్టి వత్తాంతములేమియు నేనెఱుంగను. ఎవ్వరికినిఁ జెప్పరాని యిట్టి కష్టములఁ బడుటకంటె మ్మృతినొందుటయే మేలని నా హృదయంబునఁ దోచుచున్నదేమి? చెప్పుమని యడుగగా నేనిట్లంటి.
దేవీ! వలదు వలదు. అకారణమరణముతో నీకేమి? ఆరాధింపకయే ప్రసన్నుఁడగు మన్మథుఁడే నీకార్యము జక్క పెట్టును. స్వయంవరవిధులచేఁ బతుల వరించిన సతుల నెందరం జెప్పను! నీమనంబునం బుట్టినతలంపు అనర్థమైనది కాదు. శాస్త్రసమ్మతమైనది. దేవీ! మరణోద్యోగమును విడువుము. నీ పాదములతోడు! వేగపోయి యాతనిం దీసికొనివచ్చెదను. నన్నుఁ బంపుమని పలికిన విని యక్కలికి ప్రీతిద్రవార్ద్రములగు చూపులచే నన్ను జూచుచు సిగ్గువిడిచి యుత్తరీయము సవరించుచు మెడనుండి ముక్తాహారమును దీసి చేతంబూని ప్రహర్షవివశయై యిట్లనియె.
నాతీ! నీ ప్రీతి నేనెంఱుంగుదును. శిరీషమృదుప్రకృతిగల కన్యకాజనమునకుఁ బ్రగల్భవాక్యము లెట్లువచ్చును. ఇప్పుడు నేనేమని చెప్పవలయునో నాకుఁ దెలియదు. నీవు నాకతిప్రియుండవైతివంటినేని పునరుక్తిదోషముకదా. నాకు నీయందనురాగ మెక్కుడనిన వేశ్యాలాపమగును. నీవులేక నేనుజీవింపననిన ననుభవవిరోధము. నన్ను మన్మథుఁడు పీడించుచున్నవాఁడనిన నాత్మదోషోపాలంభము. నన్ను బలాత్కారముగా హరించితివనిన బంధకీధాష్టక్యము. తప్పక రావలయుననిన సౌభాగ్యగర్వ మగును. నేన వచ్చుచున్నదాన వంటినేని స్త్రీచాపల్యముగదా అనన్యరక్తవనస్వభక్తినివేదనలాఘవదోషము వచ్చును. మదీయమరణంబున నాకు నీయందుఁగల ప్రీతినిఁ దెలిసికొనఁగలవు అనిన సంభావముగదా!
[3][ఇంతవరకు కాదంబరీ పూర్వభాగము ఇంతవరకే బాణకవి కవిత్వము]
కావున నేమన్నను దోషమే కనంబడుచున్నది. నాఁడు అంబరంబునఁ గళాధిజ్యోత్స్నావితానంబున దెసల వెదజల్లుచుఁ బ్రకాశింపుచుండఁ గ్రీడాపర్వతకనితంబంబు నందలి కాసారతటంబున శిలాపట్టణమునఁ బ్రకాశించు హిమగృహంబునఁ బుష్పశయ్యయందుఁ బండికొని యక్కుమారునిచేఁ జూడఁబడితిని. రెండుసారులువచ్చి నాయవస్థ యంతయుం జూచి యుపేక్ష జేసిపోయెనే? ప్రియసఖీ! నీతో నేమందును? కూర్చున్నను, దిరుగుచున్నను, నిద్రించుచున్నను, మేల్కొన్నను, రాత్రింబగ లాశ్రీమంటపమున నాయుద్యానవనమున నాలీలాదర్ఘిక యందుఁ గ్రీడాపర్వతమం దా కుమారునిఁ జూచుచునే యుంటి. నా మాటయే నీకుఁ జెప్పుచుంటిఁ దదానయనకథతో నిఁకఁజాలు. ఎక్క డి రాక. అని పలికి యక్కలికి శోకవేగంబున భుజలతలయందు శిరమువంచి మూర్ఛవోయినదివోలె నూరకున్నది.
నేనామాట విని ఆహా! వియోగులు జీవించుట కష్టముగదా! సంకల్పమయుండగు ప్రియుండు గులాంగనల బాధించును. సంకల్పక్రీడలతోఁ బొద్దుపుత్తురు. అని నేను దలంచుచుండఁగనే సూర్యాస్తమయమైనది. అప్పుడు బాలికలు పెక్కండ్రు వచ్చి వింతవింతగాఁ దీపములు వెలిగించిరి. నేనామెం జూచి దేవీ! నీవు దుఃఖింపకుము. నేను వేగమ పోయి యారాజకుమారునిఁ దీసికొని వచ్చెదనని పలికినంత భవదీయ నామ సంకీర్తనముచేత నిషాపహరణ మంత్రంబున సర్పదష్టుండువోలె గన్నులందెరచి స్పృహతో నన్నుఁ జూచుచు నెవ్వరక్కడనని బరిజనమును బిలిచినది. అప్పుడు పెక్కండ్రు జవరాండ్రు ఏమియాజ్ఞ అని పరుగెత్తుకొని వచ్చిరి. వారియందుఁ జూపుల వ్యాపింపఁ జేయుచు మరకతశిలాతలమున గూర్చుండి నాకిట్లనియె.
పత్రలేఖా! ఇది ప్రియమని చెప్పుటకాదు నీరాక జూచుచుఁ బ్రాణముల ధరించి యుండెదను శీఘ్రముగాఁ గార్యము సాధించుకొని రమ్మని పలుకుచు నాహారము నా మెడలోవైచి తాంబూలాంబరాభరణాదు లొసంగి నన్నుఁ బంపినది. అని చెప్ప పత్రలేఖ యించుక తల వంచుకొని వెండియు నిట్లనియె.
దేవా! సూతనమగు కాదంబరి ప్రసాదాతిశయంబునం గలిగిన ప్రాగల్భ్యము చేత దుఃఖించుచు విజ్ఞాపన జేయుచున్నదాన. దేవరకు సైత మట్టియవస్థలో నున్న గంధర్వరాజపుత్రిక నుపేక్షించి వచ్చుట యుచితముకాదు. అపన్నవత్సలులగు మీరు తగనికార్యము జేసితిరి. అని యాక్షేపించుటయుఁ జంద్రాపీడుఁడు లలితమైనను బ్రౌఢమైన తదాలాప మాలించి రెప్పవేయక ఇంచుక యాలోచించి భాష్పోపప్లుతనేత్రుఁడై స్వభావధీరుండైనను వ్యాకులచిత్తుండై బాష్పనిక్షేపంబునఁ వ్యాకులమైన యక్షరములు గలుగునట్లుగాఁ బెద్ద యెలుంగున నిట్లనియె.
పత్రలేఖా! నేనేమిజేయుదును? శృంగారలీలల నుపదేశించెడు చెడుగు పచ్చవిల్తునిమూలమున నామచ్చెకంటి తన హృదయంబునఁ బొడమిన వికారముల నాకుఁ దెల్లముగా నివేదించినదికాదు. దేవతాస్త్రీలయొక్క రూపానురూపలీలాసంభావనాదు లదృష్టపూర్వము లగుట నదియంతయు సహజానురాగ మేమో యని సందేహడోలిక యెక్కి యూగుచు నాప్రేయసిం విరహాగ్నిపాలు సేసి నీచే నిందింపనిట్లుఁ బడితిని.
మరియు నాకీ మనోవ్యామోహము గలుగుట శాపదోషమేమో యని యాలోచించుచుంటిని కానిచో నాచిన్నది యతిస్ఫుటముగా మదనచిహ్నములఁ బ్రకటింపుచుండ నేనెందులకుఁ దెలిసికొనలేక పోయితిని? నాబుద్ధి సురిగిపోయినది పోనిమ్ము! స్మితావలోకనలీలావిశేషము లతిసూక్ష్మములగుటఁ దెలిసికొనుట కష్టము. మరియొక కారణము వలనం బుట్టుచుండును.
చిరకాలమునుండి తన కంఠమందున్న రత్నహారము నూరక నా మెడ యందువైచునా? అప్పుడైనం దెలిసికొనరాదా? అదియునుం గాక హిమగృహకథావృత్తాంతము నీవుగూడఁ జూచినదేగదా! అప్పుడైనఁ బ్రణయకోపమునం గాబోలు శ్లేషగానే పలికినది కాని స్పష్టముగాఁ జెప్పినదికాదు. అదియంతయు నామెదోషమే కాని నాది కాదు.
పత్రలేఖా! ఇప్పుడు గతమునకు వగచినఁ బ్రయోజనములేదు. నా హృదయ మెట్లామెకుఁ దెలియునో యట్లు ప్రవర్తించువాఁడనని పలుకుచుండఁగనే ప్రతీహారి జనుదెంచి నమస్కరించుచు, దేవా! విలాసవతీ మహాదేవి పత్రలేఖతోఁగూడ మిమ్ము రమ్మని యాజ్ఞాపించుచున్నది. పత్రలేఖ దేశాంతరమునుండి వచ్చినదని విన్నదఁట వేగరండని విన్నవించుటయుఁ జంద్రాపీడుఁ డామాట విని అయ్యా! నా జీవితము సందేహడోల యెక్కి యూగుచున్నది. నా తల్లి నిమిషమైన నన్నుఁ జూడలేదు. కాదంబరి యవస్థ పత్రలేఖ యెరింగించినది. జననీస్నేహ మాజన్మక్రమాహిత మగుట బలమైనది.
పితృశుశ్రూషయు నట్టిదే. గంధర్వరాజసుతానురాగ మంతకన్న బలమైనది. జన్మభూమి విడువందగినదికాదు. కాదంబరియుఁ బరిగ్రహింపఁదగినది. ఇప్పు డేమి చేయుదును? అని యాలోచించుచు బత్రలేఖ చేయిపట్టుకొని తల్లియొద్దకుఁ బోయెను.
విలాసవతియు వారిం గారవించి మీరు నిత్య మొక్కసారి యెప్పుడో వచ్చి నాకన్నులంబడుచుండ వలయును లేనిచో నేనోఁపజాలనని పలుకుచు నాదివసమెల్ల దనయొద్ద నుంచుకొని యంపినది చంద్రాపీడుఁ డది మొదలు కాదంబరీవిరహవేదనాకులుండై మదనాగ్నిచే బాధింపఁబడుచు, శుష్కించిపోవుచు గడియ యొక్కయేఁడుగా గొన్ని దివసములు గడిపెను.
మరియొకనాఁ డతండు పత్రలేఖ వెంటరాఁ బాదచారియై బాహ్యోద్యానవనంబున కరిగి యందు విహరింపుచుండఁ గొండొకదూరములో విచిత్రగమనంబుల వారువమును నడిపించుచు వచ్చుచున్న యొకరౌతు నేత్రపర్వము గావించుటయు నతం డెవ్వఁడోచూచి రమ్మని యొకపరిచారకు నంపి తద్వార్త నరయుటకై యెదురుచూచుచుఁ బత్రలేఖా! అతఁడు గేయూరకుఁడువలెఁ గనంబడుచున్నాఁడు చూడుమని పలుకుచుండగఁనే యతండచ్చట కరుదెంచి గుఱ్ఱమును డిగ్గనురికి రాజపుత్రునికి నమస్కరించెను.
చంద్రాపీడుఁడు ప్రీతిచేఁ జేతులుసాచి రమ్ము రమ్ము. అని పలుకుచు నతని గాఢాలింగనము జేసికొని కేయూరకా! నీదర్శనముచేతనే కాదంబరి సేమముగా నున్నదని తెలియఁబడుచున్నది నీ యాగమనకారణము విశ్రాంతి వహించి యెరింగింతువుగాక! అని పలుకుచుఁ బత్రలేఖా కేయూరకులతోఁగూడ నొక యేనుఁగ నెక్కి నిజభవనంబునకుం బోయెను.
లోపలి కెవ్వరిని రానీయవలదని ద్వారపాలురకు నియమించి పత్రలేఖా కేయూరకులతోఁగూడ గృహారామము లోనికిం బోయి యందున్న పరిజనులఁ దూరముగాఁ బొమ్మని రాజపుత్రుండు కేయూరకుని కిట్లనియె. గంధర్వపుత్రా! కాదంబరి యొక్కయు మహాశ్వేత యొక్కయు మదనలేఖయొక్కయు సందేశమేమియో యెరుంగ జెప్పుమని యడిగిన నతం డిట్లనియె.
రాజపుత్రా! అచ్చటి విశేషములు వినుము? బత్రలేఖను దీసికొనివచ్చి మేఘనాథుని కప్పగించి తిరుగాఁపోయి దేవరయొక్క యుజ్జయినీగమనవృత్తాంతము చెప్పి మీయుత్తరము చేతికిచ్చితిని. అది చదివి మహాశ్వేత తలయెత్తి యెద్దియో యాలోచించి నిట్టూర్పు నిగుడించుచు విచారముతో లేచి తపంబుజేయుటకై వెండియుం దనయాశ్రమమునకుఁ బోయినది.
కాదంబరియు నీవార్త విని హృదయము బాదుకొనుచు నెత్తి మోదుకొనుచు మూర్ఛ మునింగి నేలంబడి యంతలో లేచి మహాశ్వేత యరిగిన విధమెరుంగక కన్నులం దెరచి శిరఃకంపముచేయుచుఁ గేయూరకా! యీ సంగతి మహాశ్వేతతోఁ జెప్పుమనియు మదనలేఖా! చంద్రాపీడుఁ డెట్టిపని చేసెనో చూచితివే! యిట్టివాఁ డెందేనిం గలడాయనియు సోపహాసముగాఁ బలుకుచు లేచి పరిజనులవిడిచి యొక్కతియ యేకాంతగృహమునకుఁ బోయి తల్పంబున మేనుజేర్చి ముసుఁగువైచుకొని మదనలేఖతో సైతము మాటాడక తత్పరితాపము లోపలనే యనుభవింపుచు నాదినము గడపినది.
అమ్మరునాఁడుదయమున నే నామె సమీపమున కేగినంత ఆహా! మీయట్టి యాప్తులు గలిగియున్నను, నేనిట్టి యుత్కృష్టకష్టములం జెందుచుంటినే యని యాక్షేపించునదియుంబోలెఁ బాష్పపూరోద్రేకముచేఁ బర్యాకులమగు దృష్టిచే నన్నట్టె చూచినది.
ఆ చూపులవలననే తదీయహృదయాభిప్రాయము గ్రహించి యామెతోఁ జెప్పకయే దేవరం జూడవచ్చితిని. మీనిమిత్త మామత్తపథబాకాశిని మిక్కిలి చిన్నది. ఆమె పడెడు నిడుములఁ జెప్పనలవి కాదు. అబలాజసముయొక్క హృదయము మృదువైనను ముక్తాఫలత్వము నొందిన జలమువలె నుత్కంఠితమయి కఠినమగునని తలంచెదను. కానిచో నామెచిత్తమెన్ని వ్యసనములు జెందినను నశింపకున్నది ఆహా! స్త్రీలకు వల్లభసమాగమాశ దురంతమయినదికదా! అట్టి కష్టములతోడ నయిన బ్రాణముల ధరించియున్నది.
రాజకుమారా! అత్యుత్కటమైన యాకలకంటి యుత్కంఠ నీతోనేమి చెప్పుదును? ఏ యుపాయంబునఁ బ్రదర్శింతును? దేనితోఁబోల్చి చెప్పుదును? ఆమె తాపంబు ప్రచండదినకరసహస్రాతపమును మించియున్నది. శయనముగా వేయబడిన పద్మపత్రము లెండి చూర్ణములైపోవుచున్నవి. కామునిచే మధింపఁబడు నా యాచేష్టలం జేయుచున్నది. వినుండు. మదనవేదన సహింపఁజాలక పరితపించుచుండ సఖులు కుసుమశయనంబునఁ బరుండఁబెట్టి కిసలయతాళవృంతముల వీచుచు సంతాపముచేఁ జూర్ణమైన యలక్తకరసంబున నెఱ్ఱఁబడిన శయనకుసుమంబులం జూచి కుసుమశరప్రహారజనితరక్తమని యడలుచుందురు. మీ పేరు తల పెట్టినంత మేనఁగవచమువలె రోమాంఛము వహించును. ఆమె యవస్థయంతయుం జెప్పుటకుఁ బదినములు పట్టును, పెక్కు లేల? అక్కడి కథలన్నియుఁ ద్వదాలాపముభరితములై యున్నవని యెఱింగించుటయుఁ జంద్రాపీడుఁడు కేయూరకా! చాలుచాలు. పైనఁ జెప్పకుము. వినలేకున్నానని పలుకుచుఁ గన్నులు మూసికొని మూర్ఛయావేశింపఁ గాదంబరిని ధ్యానించుచున్నవాఁడుం బోలె ముహూర్తకాలము మేనెఱుంగక యంతలో దెలిసి గద్గదాక్షరముగా నతని కిట్లనియె.
కేయూరకా! పత్రలేఖవలననే కాదంబరీసంతాపమంతయుఁ దెలిసినది. నేనేమి చేయుదును? కాదంబరియొక్క యాజ్ఞనే నిందింపుము. అధరస్పందమాత్రముననే వియోగములను జేయుచున్న నా విషయమై యిన్నిచిక్కులు పడనేమిటికో విచారింపుము. ఆ యువతి లజ్జావతి యైచో బరిజనమునకంతఁ వ్యామోహ మేల? ఆ లలనకు మదనలేఖ రెండవ హృదయము కదా! తన్ముఖంబున నయినఁ దెలుపరాదా ?
అన్నన్నా! నిష్కారణము అమ్మదవతి మదనునిచేఁ బ్రాణసంకటము నొందుచున్నదే! ఇది యాముదితకుఁ బ్రారబ్ధముగా దలంచెను. కానిచో నేనశ్వముఖానుసారముగా దేవభూమి కెట్లు పోవుదును? పోయియు మహాశ్వేత నెట్లు కాంతును? కనియు మరలక హేమకూట మేటికిఁ బోవుదును? పోయియుఁ గాదంబరిం జూడనేల? చూచియు వితర్కింపక వ్యరథమనోరథుండనై యింత దూరమేలవత్తును? ఇది యంతయు దైవహతకుని కపటముకాని మఱియొకటికాదు. కావున వేగమపోయి యా యింతి నోదార్చుటకు యత్నింపవలయునని పలుకుచుండగా మార్తాండుం డపరగి శిఖర మదిష్టించి కిరణసహస్ర ముపసంహరించుకొనియెను.
అప్పుడు చంద్రాపీడుండు గేయూరకునితోఁగూడ దనమేడకుఁబోయి కాల్యకరణీయములం దీర్చి చంద్రోదయసమయంబునఁ జంద్రమణిశిలాతలంబున శయనించి కేయూరకుఁ డడుగు లొత్తుచుండ నతనితో, గేయూరకా! మనము పోవువరకుఁ గాదంబరి ప్రాణంబుల దాల్చియుండునా? మదనలేఖ యామె నోదార్చుచుండదు? మహాశ్వేత తద్వృత్తాంతమువిని వచ్చి ధైర్యము గరపకుండునా? హరిణశోభకాయతేక్షణమగు నమ్మగువ నెమ్మోము గ్రమ్మరఁ జూడఁగలుగుదునా? యని యడుగ నతఁడు దేవా? ధైర్య మవలంబింపుము. వెరవకుము వేగమ గమనయత్నము చేయుమని బలికెను.
అప్పు డతం డాత్మగతంబున అయ్యో! ఇప్పుడు మా తల్లిదండ్రుల కెఱింగింపక పోయితినేని వారు పుత్రశోకంబునం గుందుచు న న్నరయటకై వెడలి పుడమియంతయుం ద్రవ్వుదురే? అట్టివారిం గష్టపెట్టుట నాకేమి శ్రేయము? పోకున్నఁ గాదంబరి ప్రాణత్యాగము చేయును. ఱెండువిధంబులచేతఁ బ్రత్యపాయమే తోచుచున్నది. యేమి చేయుదును? ఎవ్వరితో చెప్పుదును? ప్రాణతుల్యుండగు వైశంపాయనుండైన దాపునలేడే! యని యనేక ప్రకారములఁ దలపోయుచు నారాత్రి నెట్టకేలకు గడిపెను.
అతండు మరునాఁడుదయంబున లేచి స్కంధావారము సమీపమునకు వచ్చి యున్నదనుట మాట వినియెను. అప్పుడు మిక్కిలి సంతసించుచు గేయూరకా! మన కార్యసిద్ధి హస్తగతమయినదానిగా భావింపుము. నా బ్రాణమిత్రుఁడు వైశంపాయనుఁడు వచ్చుచున్నవాఁడని పలికెను.
పిమ్మట గేయూరకుఁడు ఆ రాజకుమారునికి మ్రొక్కుచు దేవా! దేవర వైశంపాయనుఁడు వచ్చువరకుఁ గాలక్షేపము చేయదగియే యున్నది. ఆచ్చటిసంగతి మీకు విశదపరచితినికదా! దేవర తత్సందేతాపము గ్రహించిరి. కావున నన్ను ముందు బంపుఁడు. నేను బోయి భవదీయవృత్తాంతమంతయు నా కాంత కెరింగించి జీవనధారణోపాయ మాకలించెద. మీవార్తాశ్రవణ మూతగాఁ బూని యానెలంతఁ బ్రాణములు ధరించు ననుగ్రహింపుఁడని పలుకగావిని యారాజనందనుండు వెనుకగూర్చుని యున్న పత్రలేఖం జూచుచు మేఘనాథుఁ డెక్క డనని యడిగెను.
అంతలో మేఘనాథుం డెదుర నిలఁబడుటయు నతనిం జూచి యోరీ! నీవు వెనుక పత్రలేఖం దీసికొనివచ్చుట కెందుంటివో యిప్పు డచ్చట కీపత్రలేఖం దీసికొని కేయూరకునితోఁగూడ ముందుగాఁ బొమ్ము. నేనును వైశంపాయనునితో మాట్లాడి వెనుక వచ్చెదనని నియమించి కేయూరకా! నీవు కాదంబరీసందేశము నాకుఁ దీసికొనిరాలేదు. నేనే నీచేత నామెకు సందేశము పంపుచుంటిని ఆశీకమగు సిగ్గుయొక్క భారమును వహించుటచే నిన్నా యాసపెట్టుచున్నాను. అని దేవితో విజ్ఞాపన చేయుము తక్కిన సంగతులన్నియుఁ బత్రలేఖ యెరింగింపఁగలదు. అని పలుకుచు నమంగళశంకచే నశ్రుజలంబు నరికట్ట యత్నించుటయు నాపలేక కన్నీరుగార్చుచుఁ దనపాదంబులకు నమస్కరింపుచున్న పత్రలేఖ దిక్కు మొగంబై యంజలిపట్టి యిట్లనియె.
పత్రలేఖా! ఈ యంజలితో మత్శిరప్రణామము లర్పించి కాదంబరి కిట్లు విజ్ఞాపన జేయుము. దయగలదగుట ప్రధమదర్శనమందే యనుగ్రహాతిశయమునుఁ జూపిన యామెను నమస్కారము చేతనైన గౌరవింపక విడిచివచ్చిన కృతఘ్నుండనగు నా సుగుణమేదిజూపి తిరుగాఁ బరిగ్రహింపుమని ప్రార్ధింతును. ఆమెమాత్ర మెట్లంగీకరించును? ప్రకృతిపేశలమగు నామె హృదయమపహరించి వెళ్ళలేదనియా? ప్రాణ సంకటమగు నవస్థ జూచియు నుపేక్ష చేయలేదనియా! సర్వదోషాశ్రయుఁడ నైనను బలుమారామె పాద సేవ జేసితిననియా? సర్వగుణవిహీనుండనైనను నామె సుగుణంబులే నన్నవలంబించునని యాసగలిగి యుంటిని. పాదపతితుండనగు నన్ను దత్వాత్సల్యము భయపెట్టఁదని తలంతును. సిగ్గులేనివాఁడనై తిరుగా నామె మొగంబు జూచుటకు యత్నించుట తత్సుగుణంబులే కారణములు. ఆమె సెలవులేకయే దూరముగా వచ్చిన నన్ను బలాత్కారముగాఁ దత్సుగణములే వెండియు నామె పాదమూలమును జేర్చుచున్నవి. ఇష్టములేని గమనాజ్ఞచే వెడలిపోయితినని యేహక్కుచే విజ్ఞాపన జేసికొనుచుంటినో ఆ వాక్కే నీ కిట్లు చెప్పుచున్నది. ఇటుపైన మదాగమన మెట్లు వ్యర్థముగాదో జగమెట్లు శూన్యముగాదో యట్లు దేవి యాత్మ నిలుపుకొనుట కాత్మచేతనే యత్నము చేయవలయును. అని చెప్పుమని చెప్పి వెండియు నతండు ప్రియ సఖీ! నీవు దారిలో మద్వియోగపీడచేఁ గుందుచు శరీరసంస్కార ముపేక్ష జేయుదువు సుమీ! సమయమున కాహారమును గుడుచుచుఁ దెలియనిదారిం బోవక విమర్శించి బస జేయుచుండవలయును. ఏమి జేయుదును? నీ కంటెఁ గాదంబరీప్రాణములు ప్రియములని నిన్నొంటిగాఁ బంపుచున్నాను. నా ప్రాణములు నీ చేతిలో నున్నవి కావున నీ యాత్మ జాగరూకతతోఁ గాపాడికొనుమని పలుకుచు నాలింగనము జేసికొని కేయూరకుని కప్పగించి నన్ను వెండియు మహాశ్వేతాశ్రమములో గలిసికొన వలయునని యుపదేశించి వారినంపెను.
వారు వోయిన వెనుక నితండు వీరు వేగముగా నందుఁ బోవుదురా? దారిలో నేదియైన యంతరాయము రాదుగదా! ఎన్ని దినములకుఁ బోయి యామె నూరడింతురు? అని యాలోచించుచు శూన్యహృదయుండై క్షణమందు వసించి స్కంధావార మెంత దూరమెందున్నదియో తెలిసికొని రమ్మని వార్తాహరునిఁ బంపి వైశంపాయను నెదుర్కొనుటకుఁ బంపుమని యాచించుటకై తండ్రిగారి యొద్ద కరిగెను.
దూరమందె నమస్కరించుచున్న పుత్రుంజూచి తారాపీడుఁడు నిబ్బరస్నేహగర్భమగు స్వరంబున వత్సా! రమ్ము, రమ్ము, అని చేతులు సాచుచుఁ గౌగలించుకొని దాపునఁ గూర్చుండఁబెట్టికొని ప్రత్యవయవము పాణిచే స్పృశించుచు దాపుననున్న మంత్రి ముఖ్యునితో నిట్లనియె.
ఆర్యా! శుకనాస! ఆయుష్మంతుఁడగు చంద్రాపీడునిం జూచితివా? ఇతని మేన యౌవనము పొడనూపినది. వివాహయోగ్యమగు దశ వహించియున్నవాఁడు. విలాసవతితో నాలోచించి వీనికిఁ దగిన రాజకన్యక నరసి పెండ్లి చేయవలయు ననుటయు శుకనాశుఁడు దేవా! దేవర లెస్సగా నాలోచించితిరి. ఇతడు విద్యలన్నియు గ్రహించెను. దిగ్విజయము చేసెను. ప్రజల కుత్సాహముగలుగఁజేసెను ఇఁక మిగిలిన కృత్యము పరిణయమే కదా! అవశ్యము దానిగురించి యాలోచింపవలయునని పలికెను.
అట్టి సమయమునఁ జంద్రాపీడుఁడు సిగ్గుచే తల వాల్చుకొని యాత్మగతంబున భళిరే! వీరి సంవాదము కాదంబరీసమాగమమునకు నుపశ్రుతివలెఁ దోచినది నా విషయమై మా తండ్రి కిప్పు డిట్టిబుద్ధి పుట్టుట సముద్రంబునఁ బడినవానికి యానపాత్రము దొరికినట్లుగా నున్నది. అని పెక్కుతెరంగుల నాలోచించుచు నంతలో వైశంపాయనుని ప్రస్తావన వచ్చుటయు నతని నెదుర్కొనుటకు ననుజ్ఞ యిమ్మని చంద్రాపీడుఁడు శుకనాసముఖముగాఁ దండ్రికి విజ్ఞాపన జేసికొనియెను.
తారాపీడుఁడు వైశంపాయను నెదుర్కొనుటకు బుత్రునకాజ్ఞ యిచ్చుటయు నతం డత్యంతసంతోషముతో నా రాత్రి వేగించి సుహృద్దర్శనలాంసుండై వేగుజాముననే లేచి ప్రాతఃకాలకృత్యముల నిర్వర్తించి యుచితపరివారముతో నింద్రాయుధ మెక్కి యతివేగముగా సేనాముఖమునకుఁ బోయెను.
స్కంధావారమును ప్రవేశించినతోడనే గుర్రముపై నుండియే యత్యాతురముతో వైశంపాయనుఁ డెచ్చట నున్నవాఁడని యడిగెను. ఆ మాట విని యందున్న స్త్రీలు కొందరెద్దియో పని తొందరలో నుండి యతని గురుతుపట్టఁజాలక కన్నీరు విడుచుచు అయ్యో! ఇంకెక్కడి వైశంపాయనుఁడు? అతని నడిగెద రేమిటి కని పలికిరి.
ఆ మాటలు విని ఆ! పాపులారా! అట్లనియెదరేల? యని హృదయంబు ఝల్లుమన వారినదలించుచు మరియొకరి నడుగక భయపడుచు గుంపువీడిన లేడిపిల్లవలె బెదరుచు నేమియుంజూడక యేమియు మాటాడక యేమియును వినక యెవ్వరింజీరక హా! యిప్పుడు నేనెక్కడనుంటిని? యెక్కడికి వచ్చితిని? యేమిటికి వచ్చితిని? యెక్కడికిఁ బోవలయును? యేమి చేయవలయును? అని తలంచుచు నంధునివలె మూకునిపగిది జడునిభాతి నందుఁ గ్రమ్మరుచుండెను.
అప్పుడు తురగమును గురుతుపట్టి రాజకుమారులు చంద్రాపీడుఁడు చంద్రాపీడుఁడని పిలుచుకొనుచుఁ దొందరగా నతనిం జుట్టుకొనుటయు నతండు వారిని వైశంపాయనుఁడెక్కడ నున్న వాఁడని గద్గదస్వరముతో నడిగెను. వారు దేవా! సర్వము నివేదింతుము. గుర్రము దిగి యీ వృక్షచ్ఛాయను విశ్రమింపుడని దీనముఖులై పలుకుటయు నట్లుచేసి తదీయవాగ్ధోరణిం గనిపెట్టి యతండు చిత్తము విభ్రాంతి వహింపఁ బెక్కుతెరంగులఁ దలచుచు నపరాధము చేసినవాడుంబోలెఁ దల వాల్చుకొని మెల్లగా వానితో నిట్లనియె
నేను పోయిన వెనుక దారిలో సంగ్రామము తటస్థించినదా? లేక శీఘ్రములో నసువుల గ్రసియించు వ్యాధియెద్దియేని వచ్చినదా? పిడుగు పడినట్లు వైశంపాయనుని కింత యుపద్రవ మేల రావలయును? వేగమ చెప్పుడనుటయు వారందరు చెవులు మూసికొని శివశివా! అట్లనియెదరేల? పాపము వైశంపాయనుండు జీవించియే యున్నవాఁడు. ఇంక నూరేండ్లు బ్రతుకునని పలుకగా విని యారాజనందనుండు డెందంబానంద సాగరంబునమునుంగవారిఁగంఠగ్రహణముజేయుచు వెండియునిట్లనియె.
వైశంపాయనుండు బ్రతికియుండిన నాయాజ్ఞమీరి మఱియొక చోటికిఁ బోవువాఁడు కాడని యట్లంటి మంచిమాట జెప్పితిరి అతండిప్పు డెచ్చటికిఁ బోయెను? ఇచ్చటి కేల రాడు? అతని విడిచి మీ రేమిటికి వచ్చితిరి? వినువరకు నాచిత్త ముత్తలమందుచున్నది. వేగమ చెప్పుఁడని యుడిగిన నమస్కరించుచు వారిట్లు చెప్పఁదొడంగిరి.
వైశంపాయనుని కథ
దేవా! యవధరింపుము. వైశంపాయనునితోఁగూడ మీరు మెల్లగా రండని మాకు జెప్పి దేవర యరిగితిరిగదా! ఆ దినము మేము ప్రయాణసాధనముల సవరించుకొని మరునాఁడుదయంబునఁ బ్రయాణభేరిని గొట్టించి నంతలో వైశంపాయనుండు వచ్చి వారించుచు నీప్రాంత మందచ్ఛోదమను పుణ్యసరస్సుగలదు. అందు దీర్ధమాడి శంభునర్చించి రేపుపోవుదము. ఈ పుణ్యభూమి కెప్పుడైనను వత్తుమా? యని పలుకుచుఁ బదగమనముననే తా నయ్యచ్ఛోదమునకుఁబోయెను.
ఆ ప్రదేశమంతయు రమణీయముగా నుండుటచే నందందు దృష్టి బరగింపుచు నందందు మెలంగుచు నవ్వనవిశేషములఁజూడఁ గ్రుమ్మరు చున్నంత నత్తటాకప్రాంతమున మణిశిలామంటప మొండు గనంబడినది.
దానిని జిరకాలమునకు గనఁబడిన సోదరునివలెఁ బుత్రకునిభాతి మిత్రునిచందమున నత్యంతప్రీతితో రెప్పవాల్పక చూచుచు స్థంభితుని యట్ల కదలక నిర్వికారహృదయుఁడై యెద్దియో ధ్యానించుచు నధోముఖముగా నందుఁ గూర్చుండుటయు మే మతనింజూచి మనోహరప్రదేశాలోకంబునం జేసి తదీయచిత్త మట్లు వికృతి బొందినదని తలంచి కొంతసే పూరకొంటిమి.
ఎప్పటికిని రాకున్న మేము దాపునకుఁబోయి ఆర్యా! వేళ యతిక్రమించుచున్నది. స్నానము చేయుము. పయనమునకు సైనికులు మీరాక వేచియున్నారు. ఈ ప్రదేశ మెంతసేపు చూచినను జూడవలయు ననియే యుండును. ఆలస్యము చేయక లెండని పలికిన మామాటలు వినిపించుకొనక కదలక మాకేమియుఁ బ్రత్యుత్తరము జెప్పఁడయ్యెను. ఆ లతామంటపమును మాత్రము రెప్పవేయక నిశ్చలదృష్టితోఁ జూచుచుండెను.
పలుమారు మేము తొందరపెట్టుటయు నెట్టకేలకు మమ్ము జూడకయే "నేను రాను. మీరిందుండరాదు. అతండరిగి పెద్దతడవయినది. వేగమ పొండని" పలుకగా విని అయ్యో! యీతం డకారణముగా వైరాగ్యమును జెందెనే! యని శంకించు కొనుచు సానునయముగా బోధించియు నిష్టురముగాఁ బలికియు నీకీ మోహము తగదు. వడిగా రమ్ము చంద్రాపీడుఁడు నిన్ను విడిచి వచ్చిన మమ్ము దండించునని యెన్నియో రీతులం జెప్పిన నెట్టకేలకు విలక్షణహాసయుక్తమగు మొగముతో మా కిట్లనియె.
ఇప్పుడు నాకేమియుం దెలియకున్నది. నన్ను మాటిమాటికి గమనమునకు మీరు బోధన చేయుచున్నారు. నేను చంద్రాపీడుని విడిచి యెప్పుడైన నుంటినా? అంతయు నాకెఱుక యగుచున్నది. కాని నేనేమియుం జేయలేను. తెలిసినను జేయుటకు శక్తుఁడకాకుంటిని. చూచుచున్నను నాదృష్టి మరియొక చోటికిఁ బ్రసరింపదు. పాదములు గదలవు. ఇచ్చట స్థాపనజేయఁబడినదివోలె నాతనువు కదలకున్నది. కావున నేను వచ్చుటకు సమర్ధుఁడనుకాను. నన్నొకవేళ మీరు బలాత్కారముగాఁ దీసికొనిపోయెదరేని నామేనఁ బ్రాణములు నిలువవని తోచుచున్నది. ఇచ్చటనే యుండినచో నాహృదయంబున నెట్లో యున్నది. ప్రాణములు ధరింతునని ధైర్యమున్నది. కావున మీరు నన్ను నిర్బంధింపకుఁడు. మీరు వోయి యావజ్జీవము చంద్రాపీడముఖదర్శనసుఖం బనుభవింపుఁడు నా కట్టిసుఖము లేకుండ దైవము విడదీసెనని పలికిన మే మడలుచు నది కై తపమనుకొని అయ్యో! యిట్లు పలికెదరేల? చంద్రాపీడుని దాపునకు రారాయని నిర్బంధముగా బెక్కుసారు లడిగిన నతం డిట్లనియె.
అక్కటా! మీరూరక నన్ను నిర్బంధించెదరేల? చంద్రాపీడుని జీవితముతోడు! నాకేమియుఁ దెలియకున్నది. నేను వచ్చుటకు సమర్ధుఁ డనుకాను. కారణము నాకుఁ దెలియదు. మీరు చూచుచునే యడిగెదరేల? మీరు పొండు పొండని పలికి ముహుర్తకాల మూరుకొని యందు రమ్యములైన లతాగృహములు సరస్స్తీరములు గ్రుమ్మరుచు నాదేవాయతనమున నెద్దియో మరచిపోయినట్లు వెదకుచు నితరదృష్టి లేక తిరుగుచుండెను..
మేము పొదలమాటుననుండి రెండుయామములవరకు నతని చేష్టలం గనిపెట్టి తిరిగిపోయి రమ్మని నిర్బంధింప నతఁ డయ్యో! నన్నిట్లు వేపెదరేల నాకు నా జీవితముకన్నఁ జంద్రాపీడుని ప్రాణములు ప్రియములు కదా! అని యతని విడిచి బలాత్కారముగా నాయొద్దకు వచ్చినను గార్యము లేదని తోచుచున్నది. ఇంక మీరేల వేడెదరు? పొండని పలికి లేచి యందు స్నానము చేసి కందమూలఫలము లాహారముగా బుచ్చుకొని వనవాసోచితవ్యాపారమును గైకొనియెను.
అప్పుడు మేము విస్మయమందుచు మూఁడహోరాత్రములు వేచి యుంటిమి కాని యతనిబుద్ధి తిరిగినది కాదు. అప్పుడు నిరాశులమై యందుఁ గొందర గావలియుంచి మేము బయలదేరి వచ్చితిమి
అని యెరింగించిన వారి మాటలు విని చంద్రాపీడుఁడు చింతావిస్మయము లొక్కమాటు చిత్తం బుత్తలపెట్ట నిట్లు తలంచెను.
అయ్యో! వైశంపాయనుని నింతలో వైరాగ్యవృత్తి బూనుటకుఁ గారణ మేమియుం గనంబడదు. తారాపీడుఁడు నన్నుఁవలె వానినిసైతము గారవించును. ప్రజలకు సైతము నాయందుకన్న వానియందే మిక్కుట మగు మక్కువ గలిగియున్నది. శుకనాశుఁడు మనోరమయు నతని నేవిషయములోను మందలించి యెరుఁగరు. అతనికిఁ బ్రశాంతికైన నిది సమయముకాదు ఇదివరకు విద్వజ్ఞనోచితఁమైన గార్హస్థ్యమందే ప్రవేశింపలేదు. ఇది యేమియో యని పెక్కుతెరంగులఁ దలంచుచు నతివేగముగా నచ్చోటికి బోవఁదలంచియు తల్లిదండ్రుల కెఱిగింపక పోరాదని నిశ్చయించి యప్పుడే తురగమెక్కి యత్యంతరయంబునఁ దనపట్టణమునకు వచ్చెను.
ఆ వీటిలో ప్రజలందరు గుంపులుగాఁ గూడుకొని వైశంపాయనుని వృత్తాంతమే చెప్పుకొనువారును, వినువారును, అడుగువారును, విచారించువారునై వీథులయం దుండుటఁ జూచి చంద్రాపీడుఁడు అక్కటా! యీవార్త నాకన్న ముందర పట్టణములోనికి వచ్చినది. మాతండ్రిగారికిని శుకనాశునికిగూడఁ దెలిసియేయుండును. వైశంపాయనునిగురించి బాహ్యజనంబే యింత విచారింపుచుండఁ దల్లిదండ్రుల కెట్లుండునో? నన్నేమని శంకింతురో యని పెక్కుతెరంగులఁ దలపోయుచుఁ గ్రమంబున బహిర్ద్వారము దాపునకుఁబోయి యందు గుఱ్ఱమును దిగి యాస్థానమునకుఁ బోవుచున్నంతఁ దారాపీడుఁడు విలాసవతితోఁ గూడ శుకనాథుని గేహమునందున్న వాఁడను వార్త వినంబడినది.
అప్పు డతండును మరలి తానుగూడ నచ్చటికిఁ బోవుచుండఁ సమీపముగా నిట్టిధ్వని వినంబడినది.
హా! వైశంపాయనా? హా వంశపావనా! మదీయాంకసీమయందు లాలింపఁ బడుచుండెడి నీవిప్పుడు వ్యాళశతభీషణమయిన కాంతారములో నొంటిగా నెట్లుంటివి? అందు శరీరరక్ష నీకెట్లు జరుగుచున్నది. నీకు నిద్రాశుకమిచ్చుశయ్య నెవ్వరు గల్పించుచున్నారు? నీయాకలి గనిపెట్టి యన్నమిడువారెవ్వరు? పట్టీ! ఎట్టియవస్థవచ్చినది. అయ్యో! నీవు వచ్చినతోడనే మీతండ్రితో జెప్పి తగిన కన్యను వివాహము జేయవలయునని తలంచియుంటినే! మందభాగ్యురాలనగు నాకట్టి యదృష్టమెట్లుపట్టును. నన్నును మీతండ్రిని నీవున్నచోటికి దీసికొనిపొమ్ము. నిన్నువిడిచి మేము నిమషమైనఁ దాళలేము. ఇంత నిష్ఠురత్వము నీవేటికి బూనితివి? చంద్రాపీడునిఁ విడిచి క్షణమైన నుండువాడవు కావే? తద్వియోగమిప్పు డెట్లు సైచితివి? ఆస్నేహమంతయు నేమయిపోయినది? నీవట్టి వైరాగ్యము బూనుటకుఁ గారణమేమి? అయ్యయ్యో! ఎంతవచ్చినది? ఏమిచేతును? పుత్రా! యని యీరీతి పెక్కు తెరంగలఁబుత్రశోకంబున విలపించుచున్న మనోరమ గంఠధ్వని విని యతండు విహ్వలుఁడై మూర్చవోయి యంతలో దెప్పిరిల్లి క్రమంబునఁ దండ్రియొద్దకుఁబోయి యతనిం జూచుటకు సిగ్గుపడుచుఁ దలవంచుకొని నమస్కరింపుచు దూరముగాఁ గూర్చుండెను.
ఆ రాజు పుత్రుం జూచి బాష్పగద్గదస్వరుండయి వత్సా! చంద్రాపీడ! నీకు వైశంపాయనునియందు జీవితముకన్న నెక్కుడు ప్రీతియని యెఱుంగుదును కాని యతనివృత్తాంతము వినినది మొదలు నాహృదయము నీయెడ ననుమానము జెందుచున్నదేమని పలికిన విని యతనిమాట లాక్షేపించుచు శుకనాశుం డిట్లనియె.
దేవా! అగ్ని చల్లబడినదనినను సూర్యుని నంధకారము గ్రమ్మినదనినను సముద్రమింకినదనినను నమ్మవచ్చును కాని చంద్రాపీడుఁ డట్టి దోషమును జేయునని తలంపరాదు. కృతయుగావతారమని చెప్పనోపిన చంద్రాపీడుని సుగుణముల విమర్షింపక మిత్రఘాతకునిగా సూచించితిరేల ? విచారింప వైశంపాయనుఁడే దుర్జనుఁడని తలంచెదను. లోకంబునఁ బుత్రులంగనుట వంశవృద్దికొరకుఁగదా! తండ్రి యానతిఁబూనక నేనెట్లు వైరాగ్యమును బూనుదునని యించుకెంతయు వాని స్వాంతమునఁ బుట్టినదికాదే! అట్టి దుర్మార్గుని విషయమై దయదలపఁ నేటికి? వాడు పెంచిన చిలుకవలె దేవరచేఁ బోషింపఁబడి యంతయు మరచి యిప్పుడు కృతజ్ఞత దలంప విడిచివెళ్ళెనే? ఆత్మద్రోహము చేసిన వానితో మనకేమి? అప్పాపాత్ముని జననము మనకు శోకమునకే కారణమైనది. అని పలికి కన్నీరు నించుచు నిట్టూర్పులు నిగుడించెను.
అప్పుడు తారాపీడుఁ డతనింజూచి యార్యా ! యూరడిల్లుము వ్యజనానిలముచేత వాయువును వృద్దిజేసినట్లు కదా! మీకు మేము బోధించుట! బహుశ్రుతుండైనను బ్రాజ్ఞుండైనను వివేకియైనను ధీరుండయినను దుఃఖాతిపాతంబునఁ జిత్తచాంచల్య మందకమానఁడు. మనస్సు చెడిన వానికేమియుం దెలియదుకదా! వైశంపాయను గురించి కోపావేశముతోఁ బలుకుచున్న నీమాటలు వినుటచే నాకు మిక్కిలి వ్యసనముగా నున్నది. యతనియెడఁ గోపమును విడువుము. వాఁడు మిక్కిలి గుణవంతుడు. కారణ మఱయక వాని నిందింపరాదు. చంద్రాపీడు నంపి శీఘ్రముగా నిచ్చటికి రప్పించి యట్టి విరక్తి నేమిటికిఁ బూనెనో యరయుదముగాక! యరసినపిదప యథాన్యాయముగా నాచరింతమని పలికిన విని వెండియు శుకనాశుం డిట్లనియె.
దేవా! నీకు వైశంపాయనుని యందుగల మక్కువచే నిట్లనుఁచున్నావు. నీయౌదార్యమట్టిదియేకాని యువరాజునువిడిచి యాత్మేచ్ఛచే నుండుట గష్టమని పలికిన విని చంద్రాపీడుఁడు తండ్రియన్నమాట హృదయంబున ములికిపోలికనాఁటియుండ గన్నీరునించుచు గూర్చుండియే మెల్లగా దాపునకుఁబోయి శుకనాశున కిట్లనియె.
ఆర్యా! వైశంపాయనుని విషయమై నావలన నేమియు దోసములేదని చెప్పకపోయినను నేనెఱుంగుదు. అయినను మా తండ్రిగారి కనుమానము దోచుచున్నదని పలికిరికదా! లోకులు సైతమట్లే భావింతురు. అసత్యమయినను లోకాపవాదము భరించుట గష్టము. ఆయశఃప్రసిద్ధి లోకంబున వ్యాపించెనేని పరలోకహాని కాగలదు. కావున దీనికి బ్రాయశ్చిత్తముగా వైశంపాయనుని దీసికొని వచ్చుటకు నన్ను నియమింపుము. మఱియొకరీతి నాకు నిష్కృతి గలుగదు. తురగయానంబునఁ బోయిన నాకేమియు నాయాసము గలుగదు. గమనాభ్యనుజ్ఞ యిమ్ము. నేనుబోయి ప్రియమిత్రునిం దీసికొని వత్తును. అతండు రానిచో నేనుసైత మచ్చటనే యుండెదనని పలికిన విని శుకనాశుఁడు తారాపీడునితో దేవా! యువరాజు గమనమునకు విజ్ఞాపన జేసికొనుచున్నవాఁడు. సెలవేమియని యడిగిననతం డిట్లనియె.
ఆర్యా! మనమొకటి దలఁచికొనియుండ దైవము వేరొకటి తెచ్చి పెట్టెను. కానిమ్ము వైశంపాయను నవశ్యముగా యువరాజు దీసికొనిరావలయును. అతని విడిచి యీతఁ డొక నిమిషమైనఁ తాళలేఁడు తప్పక పోవలసినదే. యతని దీసికొనివచ్చుటకు నాయుష్మంతుని మాట జెప్పనేల, విలాసవతినైనఁ బంపెదనుసుమీ! యని పలికి దైవజ్ఞులరప్పించి యప్పుడే ప్రయాణమునకు ముహూర్తము నిశ్చయించి పిమ్మటఁ జంద్రాపీడునిం జూచి రాజు వత్సా! నీవీవార్త మీ తల్లికిం జెప్పి వేగపొమ్మని పలుకుచు శుకనాశునితోఁగూడ దన భవనమునకుఁ బోయెను.
తరువాత నా రాజకుమారుఁడు తల్లి యొద్దకుఁబోయి నమస్కరించుచు దాపునం గూర్చండి మిక్కిలి విచారింపుచున్న మనోరమ కిట్లనియె. తల్లీ ! నీ వుల్లం బున జింతిల్లకుము. వైశంపాయనుని దీసికొని వచ్చుటకు మా తండ్రి నా కానతిచ్చెను. నేను వెళ్ళి యనఁతికాలములో నాతనిం దెచ్చెదను. నీవుగూడ ననుజ్ఞయిమ్ము. పోయి వచ్చెదననుటయు నామె యిట్లనియె.
వత్సా! నేను వెళ్ళెదనను మాటచే నాకు శోకోపశమనము జేసెదవేల? నాకు నతనియందుకన్న నీయందు మక్కువ మెండు నీవు పోయిన నెవ్వరిం జూచికొని ధైర్యమవలంబింతును? నీవు బోవలదు. దైవానుగ్రహము గలిగిననాఁడే రాగలఁడు. లేక మరియెవ్వరినేని బంపుదురుగాక. యని పలికినవిని విలాసవతి యిట్లనియె. సఖీ! మన యిరువురకు వారిరువురయందును సమానప్రేమ గలిగియున్నది. వానిఁజూడక నేను మాత్రము సైరింపగలనా! వారింపఁకుము. మనము వారించినను జంద్రాపీడుఁడు నిలుచువాఁడుకాడు. యనుజ్ఞ యిమ్మని పలికిన నక్కలికియు నెట్టకేలకు సమ్మతించినది.
అంతలో సాయంకాలమగుటయుఁ జంద్రాపీడుఁడు ఆ రాత్రి భోజనము చేసి తల్పంబున శయనించి సంకల్పశతములచే మనోరధములఁ బూరించుకొనుచు నిట్లు తలంచెను.
నేను ముందుగా నచ్ఛోదసరస్సునకుఁబోయి యందు వెనుక వెనుకగా నరిగి వైశంపాయనుని కంఠగ్రహణము చేసి నీ విం కెందు బోవఁగలవని పలికిన నతండు నా మాట ద్రోయనేరక నాతో వచ్చునుగదా. పిమ్మట మహాశ్వేత యాశ్రమమున కరిగి యందుఁ బరిజనము నునిచి యామెతోఁగూఁడ హేమకూటమునకుఁ బోయెదను.
అందు నన్నుం జూచి కాదంబరి పరిజనము తొందరగా నిటునటు తిరుగుచు నమస్కరింపుచుండఁ గ్రమంబునఁ గాదంబరి యున్నతా వరసి యరిగిన నత్తరుణియు నా రాక సఖులచే నెరింగి తటాలునఁ బుష్పశయ్యనుండి లేచి యత్యాతురముతో స్వాంగాలంకారముల సవరించుకొనును సిగ్గుచేఁ దలవంచుకొని శయ్యాసమీపంబున నిలువంబడియున్న యన్నారీలలామమును గాంచి కన్నులకలిమి సార్ధకము గావించెదను కదా.
తరువాత మదనలేఖను పత్రలేఖను గేయూరకుని యథోచితగౌరవంబున మన్నించుచు సాహసముతో వివాహప్రయత్నము చేయుటకు జిత్రరథునకు వార్త నంపెదను.
పిమ్మట నా కొమ్మను శుభముహుర్తమునం బెండ్లియాడి బహుళకుసుమదామభూషానులేపనాది వస్తుమండితమగు భవనంబునఁ ఋష్పశయ్యపై మత్సమీపమున గూర్చుండి వయస్య లరిగిన వెనుక తానును మొగమువంచి యరుగఁబోవు నయంబున బలాత్కారముగా సందిటిలో నిమిడ్చికొని తల్పంబునఁజేర్చి పిమ్మటఁ దొడయం దిడుకొని యెడమచేతితోఁ గేశపాశము గైకొని కుడిచేతితో నధరము పుడుకుచుఁ గపోలములఁ జుంబించుచు సురలకు సైతము దుర్లభమయిన యధరామృతము తనివితీరఁ గ్రోలెదను. అంత నింతింతనరాని సంతసముతోఁ గంతుసంతాపమునఁ గృశించియున్న యవయవములకు గాఢాలింగన సుఖరసభరంబున నుబ్బుగలుగఁ జేయుచుఁ దరువాత నా నాతితోఁగూడ మదనాగ్ని నార్పునదియు నింద్రియములకు సుఖమిచ్చునదియుఁ బెక్కుసారు లనుభవించుచున్నదైనను గ్రొత్తదానివలె దోచునదియు నిట్టిదని చెప్పుటకు నలవి కాని సంతోషము గలుగజేయునదియు నిర్వాణసుఖసాదృశ్యము గలదియు నచింత్యమయినదియు నగు సుఖ మనుభవించుచు నిమిషమైనను విడువక రమ్యప్రదేశములఁ గ్రీడింపుచు యౌవనమునకుఁ దృప్తిగలుగఁజేసెదను.
ఆ రీతిఁ కాదంబరికి సంతోషము గలుగఁజేసి మదనలేఖను వైశంపాయనునకుఁ బెండ్లిచేసెదను. అని యిట్లు పెక్కు తెరంగుల నంతరంగమ్మునఁ దలపోయుచు మేను గరుపుజెంద ననుభూతుఁడైన వాఁడుంబోలె నా రాత్రి నిద్దురంజెందక తృటిలాగున గడిపి యుదయంబున లేచి సముచిత పరివారంబు సేవింప నింద్రాయుధ మెక్కి యక్కుమారుం డప్పురము వెడలి కతిపయప్రయాణంబుల నచ్ఛోదసరస్స్తీరమునకుఁ బోవుచు నించుకదూరములో నెదురుపడిన మేఘనాథునింజూచి యత్యాతురముగా నిట్లనియె.
మేఘనాథా! అచ్ఛోదస్సరస్స్తీరంబున నీకు వైశంపాయనుఁడు కనంబడియెనా? చూచి మాట్టాడితివా? ఏమనియెను? ఇప్పటి కైనం పశ్చాత్తాపముజెంది యింటికి రావలయునని తలంచుచున్న వాఁడా! నామాట యేమైనం దెచ్చెనా? యతనికి తల్లిదండ్రులు జ్ఞాపకముండిరా? యని యడిగిన నతం డిట్లనియె.
దేవా! దేవర ఇదిగో నేను వైశంపాయనునితో మాట్లాడి నీ వెనుకనే వత్తునని చెప్పితిరికదా! మేమట్లుపోయి మీ రాక వేచియుండ నెప్పటికి వచ్చితిరి కారు. అప్పుడు పత్రలేఖయుఁ గేయూరకుఁడు నన్నుఁ జూచి మన చంద్రాపీడుని వర్షాకాల మగుటచేఁ దల్లితండ్రులు రానిచ్చిరి కారు. నీ విచ్చోట నొక్కరుఁడ వుండనేల ఇంటికిఁ బొమ్మని పలికి వారిరువురు హేమకూటమునకుఁ బోయిరి.
నేను మరికొన్నిదినము లందుండి తిరుగా నింటికి వచ్చుచున్నవాఁడ నింతియకాని వైశంపాయనుని వార్త నాకేమియుం దెలియదు. అతం డచ్ఛోదసరస్సునకుఁ బోవుటయే నేనెరుఁగనని చెప్పినవిని యా రాజకుమారుఁడు వెండియు వానితో నోరీ! అట్లయిన సరియేకాని పత్రలేఖ యిప్పటికి హేమకూటము జేరునో లేదో చెప్పఁగలవా? యని యడిగిన వాఁడిట్లనియె.
దేవా! దైవికమైన యంతరాయమేదియు రాకుండిన నది యాలస్యము చేయునదికాదు. కావున నేటిఁ కబ్బోటిఁ హేమకూటము జేరుననియే, నాయభిప్రాయము. అని చెప్పిన సంతసించుచుఁ జంద్రాపీడుఁడు వానితోఁ గ్రమంబున వైశంపాయనునిం జూచు వేడుకతో నచ్ఛోదసరస్సునకుఁ బోయి యందు గుర్రపురౌతుల కిట్లనియె.
వైశంపాయనుఁడు వైరాగ్యవృత్తింబూని యీ వనములో నెచ్చటనో యణఁగియున్నవాఁడు. మనలను జూచి పారిపోవును. కావున మీ రందరు గుర్రముల నుండియే లతాగహనములను తరుమూలములు లతామంటపములు మొదలగు ప్రదేశములలో విమర్శగా నరయుఁడని పలుకుచుఁ దాను మిక్కిలి శ్రద్ధాపూర్వకముగా నతని వెదకెనుకాని యెందును అతనిచిహ్నము లేమియుం గనంబడినవికావు.
అప్పుడతండు పెక్కుతెరంగులఁ జింతించుచు వైశంపాయనుని వార్త మహాశ్వేతకేమైనం దెలియునేమోయనియుఁ గాదంబరీ విశేషములుగూడఁ దెలియబడు ననియు నూహించి తురగసైన్యమంతయు దదీయాశ్రమమున కనతిదూరంబున నుండ నియమించి సముచిత పరివారముతోఁ దానింద్రాయుధమెక్కి యామె యాశ్రమమునకుఁ బోయి గుహాముఖంబున వారువమును డిగ్గి సన్ననివస్త్రములుదాల్చి యక్కందరాంతమునకుఁ బోయెను.
అందు శోకవేగంబున నవయవంబులు చలింప గన్నులనుండి ధారగా నీరుగార్చుచుఁ గాలివానతాకుడున వాడినతీగెయుంబోలె మొగమువంచి తరళిక కేలు బట్టుకొనఁబడియున్న మహాశ్వేతఁ జూచి యతండు విభ్రాజితుండై అయ్యో! కాదంబరి కెద్ది యేని యప్రియము జరిగియుండఁబోలుఁ! గానిచో నిమ్మానిని యిట్లుండదు. ఏమి దైవమా! యని ప్రాణంబులెగిరి పోయినట్లు సారెసారెకుఁదొట్రుపడుచు మెల్లగాఁదాపునకుఁ బోయి బోటీ! యీమె యిట్లున్న దేమి? యని తరళిక నడిగిన నప్పడతియు నేమియుంజెప్పక యట్టి యవస్థలోనున్నను మహాశ్వేత మొగము జూచినది. అప్పుడా సాధ్వియే క్రమంబున శోకవేగం బడంచుకొని గద్గదస్వరముతో నన్న రవరసూతి కిట్లనియె.
మహాభాగ! సిగ్గులేని యీపాపాత్ము రాలేమిటికి జెప్పకుండును? వినుండు. కేయూరక ముఖముగా భవదుజ్జయినీగమన వృత్తాంతమునువిని మనమెఱియ అయ్యో! మదిరాచిత్రరథుల మనోరథమును దీర్పలేక పోయితిని. కాదంబరికోరికయు సఫలము చేయలేకపోయితిని. యారాజకుమారుని యభీష్టము తీరినదికాదు. నేనువచ్చి యేమిచేసితినని సిగ్గుపడుచుఁ గాదంబరీ స్నేహపాశములంగోసి వెండియు దపంబుజేయుటకై యీ యాశ్రమమునకువచ్చి యిచ్చట దేవరఁబోలియున్న యొక్క బాహ్మణకుమారుం డెద్దియో వెదకుచున్నట్లు శూన్యహృదయుఁడై నలుమూలలు జూచుచుండ గంటిని.
అప్పు డతండు నా యొద్దకు మెల్లగావచ్చి యదృష్టపూర్వుండై నన్ను నెన్నఁడో యెఱిఁగిన వాడుంబోలె నాముఖము రెప్పవాల్పక చూచుచు నాకిట్లనియె.
శోభనాంగి! లోకంబున నెవ్వరును జన్మకును వయసునకును రూపమునకునుం దగినట్లు మెలంగిరేని నిందాపాత్రులుకారు నీవట్లుగాక తగనిప్రయత్నము చేయుచుంటివేమి? కుసుమసుకుమారమగు నీమైదీగె నుత్కృష్టతపఃకరణక్లేశంబున నిట్లు వాడఁజేయనేమిటికి? సుమనోమనోహరంబగు లతయుంబోలె నీయాకృతి ప్రాయమునకుఁ తగినయట్లుగా రసాశ్రయమగు ఫలముతోఁ గూడుకొనకుండుట లెస్సయే. తపంబు పరలోకసుఖప్రదంబు రూపగుణహీనులు సైత మైహికసుఖంబు లనుభవించుచుందురు. ఆకృతిమంతులమాటఁ జెప్పనేల? తుషారబిందుపాతంబున పద్మినీలతయుంబోలె స్వభావసుందరమగు నీశరీర మిట్లు తపఃక్లేశంబునం గృశియించుట జూచిన నాకు మిక్కిలి విచారమగుచున్న యది. మఱియొక నీవంటివాల్గంటియే యింద్రియసుఖంబుల నిరసించి వైరాగ్యమును బూనియుండ నిఁక దర్పకుని పుష్పసాయకధారణము వ్యర్థము సుమీ! చంద్రోదయముతోఁ బనియేమి? వసంతమలయానిలములరాక నిరర్ధకమే! కువలయ కల్హార కమలాకర విలసనములు నిష్ప్రయోజనములు మనోహరోద్యానభూము లెవ్వరికిఁ గావలయునని పెక్కు తెరంగుల వక్కాణించెను.
పుండరీకునికథ జరిగినది మొదలు నే నుత్సాహ ముడిగి యుంటిని కావున వానిమాటలు విని నీవెవ్వడవు? నీ పేరేమి? నీవృత్తాంతమెట్టిది? నన్నిట్లు పలికెదవేల యని యడుగకయే యచ్చటినుండి మఱియెకచోటికి బోయి దేవతార్చన పుష్పములం గోయుచున్న తరళికంజీరి యిట్లంటిని.
తరుణీ! యీతరుణుం డెవ్వఁడే? వీని యాకారముఁ జూడ బ్రాహ్మణకుమారుఁ డట్లతోచుచున్నయది. నన్నుజూచినంత వీనిస్వాంతమున వెర్రి చేష్ట లంకురించుచున్నయవి. కావున వాని నిచ్చటికి వెండియు రాకుండునట్లు చేయుము. కూడఁ గూడ తిరుగుచున్నవాఁడు. నివారించినను వచ్చెనేని తప్పక యమంగళమును జెందగలఁడని పలికితిని.
అదియు నతనితోఁ దగినట్లు చెప్పినది కాని మదనహతకునివృత్తి దుర్నివార్యమైనదగుటచే వానిచిత్తము మరలినదికాదు.
మరికొన్ని దినములు గడచినంత నొకనాఁడురాత్రి జ్యోత్స్నాపూరముచే జగంబంతయు నిండియుండ సంతాపంబువాయ నేనీ శిలాతలంబున శయనించి మందమందముగా నచ్చోదానిలపోతములు వీచుచుండఁ బుండరీకుని వృత్తాంతమే స్మరించు కొనుచు నిద్రపట్టమింజేసి యిందుబింబవిలాస మరయుచుఁ గన్నులుమూయక యట్టె చూచుచుంటిని.
అట్టిసమయమున నా బ్రాహ్మణకుమారుఁడు మదనావేశితహృదయుండై మెల్లగా నడుగులిడుచు నాయొద్దకు వచ్చెను. నిస్పృహురాలనైనను వానిఁజూచినంతనే స్వాంతమున భయము జనింప నిట్లు తలంచితిని. అయ్యో! మంచియాపద తటస్థించినదే! వీఁడు నన్ను ముట్టినంత మాత్రమునఁ బ్రాణములు విడువవలసినదేకదా. పుండరీకునిరాక నిరీక్షించి యిన్నిదినములు ప్రాణములు దాల్చినది వ్యర్థమైపోవునే యని యాలోచించుచున్న సమయమున నతండు నాదాపునకువచ్చి యిట్లనియె.
ఇందుముఖీ! కందర్పునితోఁగూడ నన్నిప్పు డీచందురుఁడు చంపుటకుఁ బ్రయత్నించుచున్నవాఁడు కావున నిన్ను శరణు జొచ్చితిని. అనాథునాతున్ నప్రతీకారాక్షు భవదాయత్తు నన్ను రక్షింపుము. శరణాగతపరిత్రాణము తపస్వీజన ధర్మమేకదా. నీ విప్పుడు న న్నాత్మప్రదానంబున రక్షింపవేని తప్పక నీకు బ్రహ్మహత్యాపాతకము రాఁగలదని పలికెను.
దానిమాటలు విని నేను రోషానలంబున భస్మము చేయుదానివలె బాష్పస్ఫులింగదృష్టిచే వానింజూచుచు నావేశించిన దానివలె నొడలెఱుంగక కోపవేగరూక్షాక్షరముగా హుమ్మని పలుకుచు నిట్లంటి.
ఓరీ పాపాత్ముడా! నన్ను నీ వి ట్లనిన నీతల పిడుగుపడినట్లు నూరువ్రక్కలయినదికాదేమి? నీజింహ లాగికొనిపోలేదే? సకలలోకశుభాశుభసాక్షిభూతములగు పంచభూతములు నీయందు లేవా యేమి? వాని చేతనయిన మడియవైతివే? మూఢుఁడా! ఇట్టి కామవృత్తి గలిగిన నీవు తిర్యగ్జాతియందు బుట్టక యిట్లేల పుట్టితివి? వక్రముఖానురాగము కలిగి స్వపక్షపాతమాత్రప్రవృత్తితో నొప్పుచు స్థానాస్థాననిరూపణవిధం బెరుంగక చిలుకవలె హతవిధిచేఁ బలికింపఁబడితివి. శుకజాతియందైన బుట్టకపోయితివేమి? ఆత్మవచనానుగుణమగు జాతియందుఁ బుట్టితివేని యిట్లు నన్నుఁ గామింపక పోవుదువు కదాయని పలుకుచుఁ జంద్రమండలమున దృష్టి యిడి దేవా? సకలలోకచూడామణీ! లోకపాలా! నేను బుండరీకునిఁ చూచినది మొదలు యితర దృష్టిలేక యతనినే ధ్యానించు దాననైతినేని వీఁడు నా మాటచే హీనజాతియందుఁ బుట్టునని పలికితిని.
అప్పుడతండు మదీయశాపముననో మదనజ్వరవేగముననో పాపవిపాకముననో తెలియదుకాని నేనట్లు పలికినతోడనే నరకబడిన తరువులవలెఁ జేతనము బాసి నేలంబడియెను అతండట్లు గతాసుండగుటయుఁ దత్పరిజనము పెద్దయెలుంగున రోదనము జేసెను. అయ్యాక్రందనము వలననే యతండు దేవర మిత్రుఁడని తెలియవచ్చినదని పలికి తలవంచుకొని మిక్కుటమగు నశ్రుధారచే భూమినిఁ దడిపినది.
అట్టి మాటలు విని చంద్రాపీడుఁ డాకర్ణాంతవిశాలమగు నేత్రములు మూయుచు, భగవతీ! కాదంబరితో నన్ను గూర్చుటకు నీవు తగిన ప్రయత్నము చేసితివి. మందభాగ్యుండనగు నా కట్టి యోగ్యత లేనప్పుడు నీవేమి చేయగలవు? ముందుజన్మమునకైనఁ గాదంబరీచరణపరిచర్యాసుఖము గలుగున ట్లనుగ్రహింపుమని పలుకుచునే హృదయము భేదిల్ల నట్టె నిలువంబడి ప్రాణములు విడిచెను.
చంద్రాపీడుఁడు వయస్యుని మరణవార్తను వినినతోడనే డెందము పగిలి జీవితము వాయుటఁజూచి తరళిక మహాశ్వేతను విడిచి యతనిం బట్టుకొని అయ్యో! చేడియా! యింకను సిగ్గేమిటికే? యీతఁడు ప్రాణములను విడిచినట్లు తోచుచున్నది. మెడనిలుపక వాలవైచెను చూడుము. శ్వాసమారుతము లేమియు వెడలుట గనంబడదు. కన్నులు మూయఁబడియున్నవి? హా! చంద్రాపీడ! కాదంబరీప్రియ! యిప్పు డిప్పడతిని విడిచి యేడకుఁ బోయితివి. యా ప్రేముడియంతయు నెందుఁబోయె నని పెద్దయెలుంగున నేడ్చుచుండజూచి మహాశ్వేతయు నతని మొగమునఁ జూట్కి నిలిపి వైవర్ణ్యమును గనిపెట్టి గాఢశోకంబున జేష్టతక్కి పడియుండెను.
అప్పుడతని పరిజన మా వృత్తాంతమెరింగి హాహాకారములతోఁ బెక్కుతెరంగుల నమ్మహాశ్వేతను దూరుచు నుచ్చస్వరంబున హా! రాజకుమార! హా! వైశంపాయన! హా! తారాపీడ! హా! శుకనాస! హా! విలాసవతీ! హా! మనోరమ! మీ కెట్టి యాపద సంప్రాప్తించినది. కటకటా! ప్రజలెంత భాగ్యహీను లయ్యెయ్యో! ధరిత్రి యనాథయయ్యెఁ గదాయని యనేక ప్రకారంబుల విలపింపఁ దొడంగెను.
అతని గుర్రము దైన్యముగా సకిలింపుచు బలుమారతని మోము చూచుచు ఖురపుటాఘాతంబున భూతల రేణువు లెగర విచారంబు సూచింపుచుఁ జిందులు ద్రొక్కఁ దొడంగినది.
అని చెప్పువరకు వేళ యతిక్రమించుటయు మణిసిద్ధుండు పై మజిలీ జేరి తదనంతర వృత్తాంతమిట్లు చెప్పందొడంగెను.
శ్రీరస్తు
కాశీమజిలీకథలు
వత్సా! వినుము. అంత నక్కడఁ కాదంబరియు బత్రలేఖచే చంద్రాపీడాగమనవృత్తాంతము విని చంద్రోదయమున సాగరవేలయుఁబోలె నలరుచుఁ దల్లిదండ్రుల కెద్దియో మిషజెప్పి వెండియు సుందరముగా నలంకరించుకొని పెక్కండ్రు పరిచారికలు సురభిమాల్యానులేపనాద్యుపకరణములు గైకొని తోడరాఁ కేయూరకుడుఁ మార్గము జూపఁ బత్రలేఖకైదండ గొని నడుచుచు మదనలేఖతో బోఁటీ! యీ పత్రలేఖ చెప్పిన మాటలు వింటివా? అతని విషయమై నేను యశ్రద్ధ జేసితినఁట. నా యవస్థయంతయుఁ జూచియు హిమగృహంబున నైపుణ్యముఁగా బలికిన యతని వక్రభాషితములు నీకు జ్ఞాపకములేదా? నీవు సైతమప్పుడు నవ్వుచుఁ జూచి యతని మాటలకుఁ దగినట్లు ప్రత్యుత్తరము జెప్పితివి. అట్టివాఁ డిప్పుడు మాత్రము నన్ను విమర్శించునా? పయనము మాట దలపెట్టక పాపము నా నిమిత్తమీ మత్తకాశిని యుత్తలముందుచున్నదని చిత్తంబునం దలంచుచున్నవాఁడు గాబోలు! కానిమ్ము! నేనతనింజూచి యేమియు మాట్లాడను. పాదంబులఁబడినను గ్రహింపను. మదనలేఖా! నీవప్పుడు నాతో నేమియుం జెప్పవద్దుసుమీ! పెద్దతడవు చిక్కులు పెట్టి పిమ్మట మాట్లాడెదనని యతని గురించిన మాటలే చెప్పుకొనుచు మార్గమున ఖేదము గురుతెరుంగక క్రమంబున జంద్రాపీడునిఁ జూడ మిక్కిలి తొందరపడుచు నమ్మహాశ్వేతాశ్రమమునకు వచ్చెను.
అట్లు వచ్చి యందు అమృతరహితమగు సముద్రంబు చందంబున నున్ముక్తజీవితుండై పడియున్న చంద్రాపీడునిం జూచి కాదంబరి హా! ఇది యేమి కష్టమని మూర్ఛాక్రాంతస్వాంతయై నేలం బడుచుండ మదనలేఖ తటాలునఁ బడకుండ బట్టుకొనినది. పత్రలేఖయుఁ గాదంబరియొక్క కైదండ విడిచి మోహావేశముతో నొడలెరుంగక నేలంబడిపోయినది.
కాదంబరియుఁ గొంతసేపటికి దెప్పిరిల్లి మూఢయుంబోలె నేమియు నెరుంగక యూర్పులు విడుచుట సైతము మరచి రెప్పవాల్చక నిశ్చలతారకలతో నతని మొగమే చూచుచు వ్రాయఁబడిన ప్రతిమవలె కదలక యట్టె నిలిచియుండం జూచి మదనలేఖ యామె పాదంబులబడి సఖీ! నీవీ శోకమును విడువుము. స్వభావమృదు సరసమగు నీ హృదయము అతివృష్టి భారంబున విచ్చిన తటాకమువలె భేదిల్లును సుమీ! ఈతండు చైతన్యంబు బాసి పరలోకమున కతిథియైనట్లు తోచుచున్నది. ఇఁక వీనికొరకుఁ జింతింపనేల? యింటికిఁబోయి తల్లిదండ్రుల కామోదము గలుగఁజేయుము. నిన్నుఁజూడక వారు నిముషము తాళలేరని పలికిన విని కాదంబరి నవ్వి యవ్విద్రుమోష్టి కిట్లనియె.
ఓసి వెర్రిదానా! నా హృదయమును మృదువుగా జెప్పుచుంటివేమి? వజ్రసారకఠినమైనది. కాకున్న నిట్టి యవస్థఁ జూచియు బగులకుండునా? మరియు జీవించువారికిగదా తల్లిదండ్రులు బంధువులు పరిజనము కావలయును. నాకిక వారితో బనియేమి? స్వర్గగమనోన్ముఖుఁడైన వీనికి నమంగళముగా నేను రోదనముగూడ జేయను. పాదధూళియుం బోలెఁ బాదముల ననుసరించియే పోయెదను. ఎవ్వనికొరకు కులమర్యాద విడిచి ధర్మము గణింపక తల్లిదండ్రుల లెక్క సేయక జనాపవాదము నిరసించి సిగ్గునిడిచి వయస్యల గష్టపెట్టి మహాశ్వేతను గురించి చేసిన శపథము సైతము పరామర్శింపక ప్రయత్నించితినో యట్టివాఁడు నా నిమిత్తము ప్రాణములు విడువ నాయసువుల నెట్లు పాలించుకొందునో చెప్పుము. నా కిప్పుడు మరణమే శ్రేయముగా నున్నది. నాయెడ నీకుఁ గనికరమున్న యెడ నా చెప్పిన చొప్పున జేయఁ బూనుకొనుము. వినుము.
గీ. శూన్యమగు నాదు భవనంబు జూచి చూచి
సఖులు పరిచరులును బంధుజనము లెట్లు
వగవకట వేడ్కఁ బూర్వంబువలె మెలంగు
దురొ యటులు సేయు మిదియ నాకరయ హితము.
క. నాదగు భవనాంగణమున
బోదివెలయనొప్పు చూతపోతకమునకుం
బైఁ దనరు మాధవీలత
కాదరమునఁ బెండ్లి సేయు మనుకొనినగతిన్.
సీ. పడకటింటను దలప్రక్కఁగట్టిన కామ
పటము వ్రక్కలుచేసి పారవేయు
యువిద! ముద్దుగఁ బెంచుచున్న నా లేడిపి
ల్లను విడు మొక తపోవనమునందు
గలికి! నా క్రీడానగము నాశ్రమము గాఁగ
నర్పింపు మొక్క మహాతపస్వి
కలివేణి! శుకశారికల స్వేచ్ఛ విహరింప
విడువుము నా మేని తొడవులెల్ల
గీ. విప్రకాంతల కిమ్ము నా వీణ నీవు
పుచ్చుకొని పాడుకొనుచుండు మిచ్చవచ్చి
నట్లు చేయుము తక్కిన యన్ని వస్తు
వులును నాకుఁ బ్రియంబుగాఁ జెలియ నీవు.
చ. రమణి! మదీయపాదతల రంజితమైన యశోకభూజపో
తము జిగురించె నిప్పుడది తత్కిసలంబుల నేరుకణన్ పూ
రమునకు నైన ముట్టుకొనరాదు సుమీ! మరిమాలతీలతా
సుమముల దేవతార్చనకేసూ ! లవనం బొనరింపఁగాఁదగున్.
క. ఆ వనిమానుషి తాపసిఁ
బో విడువుము కానకేను బోషించెడు నా
జీవం జీవక మిధుము
గావంగాఁదగును కేళికాశైలమునన్.
మరియు నాపాదసహచారి యగు హంసకమున కొకరివలన నపాయము లేకుండ రక్షించుచుండుము. ప్రాణసఖి! నీవే నాకుఁ బుత్రుండవై పరలోకగతనగు నాకుఁ జలాంజలు లొసంగుచుండుము. నే నీచంద్రాపీడుని కంఠమును గౌఁగిలించుకొని ప్రాణం బుల విడుచుదాన నని పలుకుచు నాప్రాంతమందు నిశ్చేష్టితయై పడియున్న మహాశ్వేతను గౌఁగలించుకొని మరియు నిట్లనియె
ప్రియసఖీ! నీవు ప్రియుండు వెండియు వచ్చునని మరణముకన్న నెక్కుడగు నిడుములంబడుచుఁ బ్రాణములఁదాల్చి యాసతో నుంటివి. నాకట్టి యాససైత ముంచుకొన నవసరము లేదుకదా! కావున నాకు మరణమునకు ననుజ్ఞ యిమ్ము. జన్మాంతర మందైన నీ స్నేహము గలుగునట్లు కోరుచున్నదాన నాతప్పుల మన్నింపు మని పలుకుచు లేచి వనకుసుమకిసలయములచే నతనిపాదము లర్పించి హస్తములచే నెత్తి తొడయం దిడుకొని కూర్చుండెను.
అప్పుడు తత్కరసంపర్కంబునంజేసి చంద్రాపీడుని దేహమునుండి యద్భుతతేజం బొండు బయలువెడలి యా ప్రాంతమంతయుఁ దుషారమయము గావింపుచు నంతరిక్షములోఁ గలసి యశరీరముగా నిట్లు పలికినది.
కాదంబరీ! నీవు చింతింపకుము. చంద్రాపీడుఁడు శాపదోషంబునఁ బ్రాణములఁ బాసెను. వీని శరీరమును విడువక నీవు కాపాడుచుండుము. శాపాంతమందుఁ గ్రమ్మర జీవించు నీ శరీరమున కగ్నిసంస్కారము చేయవలదు నీకరసంపర్కంబునఁ దేజంబు దప్పక యట్లే యుండునని పలికిన విని యందరు శిరములెత్తి రెప్పలువాల్పక గగనమును జూడఁదొడంగిరి.
అప్పుడు పత్రలేఖయుఁ దత్తేజస్తుషారశీతలత్వమునం దెప్పిరిల్లి లేచి యావేశించిన దానివలె పరుగిడి యింద్రాయుధము కళ్ళెము పట్టుకొని చంద్రాపీడుఁడు లేక మనమేటికని పలుకుచు నా తురగమును లాగికొని పోవుచు దానితోఁగూడ నచ్ఛోదసరస్సులో దుమికెను.
ఆ వెంటనే యా సరస్సులోనుండి తాపసకుమారుం డొకండు బయలు వెడలి దూరమునుండి చూచుచున్న మహాశ్వేతదాపునకుఁ బోయి శోకగద్గదస్వరముతో గంధర్వరాజపుత్రీ! నన్నెరుంగుదువా? యని యడిగెను.
అప్పు డప్పడతియు శోకానందమధ్యవర్తియై తొందరగా లేచి యతనికి నమస్కరించుచు దేవా! కపింజల! పాపాత్మురాలనగు నే నిట్లు సిగ్గులేక పుండరీకుఁడు స్వర్గగతుఁడైనను జీవించియుంటిని. అతం డెచ్చటికిఁ బోయెను. ఎందుండెను? నీ వెప్పుడైనఁ జూచితివా? యాతని విడిచి నీ వొక్కరుండవు వచ్చితి వేమని యడిగెను.
అప్పుడు చంద్రాపీడుని పరిజన మతనిం జుట్టుకొని వింతగాఁ జూడఁ దొడంగెను. పిమ్మటఁ కపింజలుఁ డామెతో నిట్లనియె.
కపింజలుని కథ
గంధర్వరాజపుత్రీ! వినుము. నీవట్లు శోకసాగరంబున మునిఁగియుండ గగనవాణి ననుసరించి నే నెగిరితినికదా! అతండు నాకుఁ బ్రత్యుత్తర మియ్యకయే యాకాశమార్గంబునఁ బోయిపోయి క్రమంబునఁ జంద్రలోకమునకరిగి యందు మహోశయంబను పేరుగల సభయం దొప్పుచున్న పర్యంకంబున నా పుండరీక శరీరమును పడవైచి నాకిట్లనియె.
కపింజలా! నన్నుఁ జంద్రునిగాఁ దెలిసికొనుము. నేను జగదుపకారమునకై యుదయించి ప్రకాశింపుచుండ నీ ప్రియమిత్రుఁడు పుండరీకుఁడు కామాపరాధంబున శరీరమును విడుచుచు నన్నుఁ జూచి యిందు హతకా! నీ కతంబున నేను ప్రియాసమాగమసుఖం బనుభవింపకయే ప్రాణముల విడుచుచున్నవాఁడ గావున నీవు సైత మిట్లే కర్మభూమియైన భారతవర్షంబునం జనియించుచు జన్మజన్మకు ననురాగము గలిగి ప్రియాసమాగమసుఖం బనుభవింపక తీవ్రమైన విరహవేదన ననుభవించి మృతినొందఁ గలవని శపించెను.
అప్పుడు నేను అయ్యో! అపరాధమేమియు లేకయే నన్నిట్లు శపించితివేల నని కోపాగ్ని ప్రజ్వరిల్ల నతనిం జూచుచు నాయట్టి కష్టముల నీవుగూడ ననుభవించుమని క్రమ్మర శపించితిని.
అంతలోఁ గోపమడంచుకొని వివేకబుద్ధిచే విమర్శింపుచు మహాశ్వేత మత్కిరణసంజాతమగు నప్సరఃకులంబునఁ బుట్టినఁ గౌరివలన జనియించినది. దానం జేసి నాకాప్తురాలుగదా! అమ్మహాశ్వేతచే వరింపఁబడిన నిమ్మునికుమారుఁడు సైతము బంధువుఁడేయగును. నిష్కారణము శపించితినే కానిమ్ము. జన్మజన్మకు నని పలుకుటచే రెండుజన్మములెత్తినఁజాలు. నాతోఁగూడ నితఁడు మర్త్యలోకంబున రెండుపారులు జనియించునని తలంచుచు శాపదోష మంటక నిట్లనియె.
పూర్వ మతని శరీరము గ్రహించి యశరీరవాణిచే మహాశ్వేత నూరడించుచు నిచ్చటికి వచ్చితిని. ఇది బుండరీకుని శరీరము, శాపాంతమువరకు నిచ్చటనే యుండును. నీవుబోయి యీ వృత్తాంతము శ్వేతకేతున కెరిగింపుము. అమ్మహానుభావుఁ డెద్దియేని ప్రతిక్రియఁ చేయనోపునని పలికి నన్ను విడిచెను.
అప్పుడు నేను మిత్రశోకంబున నంధుండుబోలె గీర్వాణమార్గంబున బరుగిడుచుఁ జూడక యొక వైమానికునిం దాటితిని.
దాన నతండు కోపించి నన్నుఁ జురచురం జూచుచు దురాత్మా! మిథ్యా తపోబల గర్విత! మిక్కిలి విస్త్సీర్ణమగు గగనమార్గంబున గుర్రమువలె నన్ను దాటితివి. నీ కెందును జోటు దొరికినదికాదు కాబోలు. కానిమ్ము. నీకట్లు దాటుట యుత్సాహమని తోచుచున్నది నీవు తురంగమై భూమియందు జనింపుమని శపించెను.
అప్పుడు నేను గన్నుల నీరుగార్చుచు నంజలి ఘటించి, దేవా! నేను మిత్రశోకాంధత్వంబున నిన్ను దాటితిని గాని తిరస్కారభావంబునంగాదు. అనుగ్రహించి యాశాప ముపసంహరింపుమని వేడుకొనుటయు నతండు వెండియు నిట్లనియె.
ఆర్యా! నా శాపము త్రిప్పనలవికాదు. నీవు గుఱ్ఱమవై యెవ్వని వహింతువో వాని యవసానమున స్నానము చేసినంత ముక్తుండువయ్యెద. విదియే నాచేయు నుపకారమని పలికిన నే నిట్లంటి.
దేవా! అట్లయిన నేనొండు విజ్ఞాపనజేయుచున్న వాఁడ శాపదోషంబున నా మిత్రున కిప్పుడు చంద్రునితోఁగూడ బుడమియందుఁ బుట్టవలసియున్నది కావున దేవర దివ్యదృష్టిచేజూచి యశ్వజన్మమందు సైత మతనితోఁగలసి కాలము గడుపున ట్లనుగ్రహింపుము. ఇదియే నా కోరికయని పలికిన విని యతం డొక్కింత విచారించి యిట్లనియె.
ధాత్రి నుజ్జయినీపురంబున నపత్యమునకై తపంబుజేయుచున్న తారాపీడునకుఁ బుత్రుండై చంద్రుం డుదయించును. నీమిత్రుండు పుండరీకుండును దదమాత్యుండైన శుకనాశునికి జనియించుం గావున నీవా రాజపుత్రుని యశ్వరత్నమై యుదయింపుము. నీయందుఁగల ప్రేమచే నింత దలంచితి పొమ్మని పలికినతోడనే నే నధోభాగము జూచి సముద్రములోఁ బడి యశ్వమై పుట్టితిని. అట్టి జన్మమునందుగూడ నాకు జాతిజ్ఞానము కలదు. కావున నశ్వముఖమిధునము గనంబడినతోడనే వెంటంబడి యీ భూమికి దీసికొని వచ్చితిని. చంద్రాపీడుఁడు చంద్రుని యవతారము. పూర్వజన్మానురాగంబున ని న్నభిలషించి నీ శాపాగ్నిచే దగ్ధుండైన వైశంపాయనుఁడే పుండరీకుఁడని పలికి యూరకుండెను.
ఆ మాటవిని మహాశ్వేత, హా! దేవ! హా! పుండరీక! నీవు లోకాంతరగతుండవైనను నిన్నే స్మరించుచుంటిని? ఈ రక్కసితో నీకేమి ప్రయోజనమున్నది. నేను వినాశముకొరకే జనించితిని కాబోలు నన్ను సృష్టించి దీర్ఘాయు వొసంగుట పరమేష్టి కేమి ప్రయోజనమో తెలియకున్నది. నే సమసితినేని నీకియాపద రాకుండును గదా! ఇప్పుడు నేనేమి చేయుదును? ఎవ్వరితోఁ జెప్పుకొందును? రక్షించువారెవ్వరు? అయ్యో! అయ్యో! ఇంచుకంతయుఁ దెలిసికొనలేకపోయితినే? యని యనేక ప్రకారముల విలపించుచు నురముబాదుకొనుచు నేలంబడుటయుంజూచి కపింజలుఁ డిట్లనియె.
గంధర్వరాజపుత్రీ! నీవిట్లు నిందించుకొనియెదవేమిటి? నీయందేమి దోషమున్నది? వెండియు నిప్పుడు దుఃఖించుట కవసరమేమివచ్చినది? యలఁతితరిలో సుఖమే యనుభవింపఁగలవు మీయిరువురు తచ్ఛాపాంతమునఁ బతులతో గలిసి కొందురు. అశరీరవాణిని మీరు వినియుంటిరికదా! అంతదనుక తపంబే చేయుచుండుఁడు. తపంబున నన్ని కార్యములు చక్కఁబడును. తపంబునంగాదే! శర్వాణి ఈశ్వరుని యర్ధాంగశరీరము ధరించినది. చింతింపకుమని యూరడించిన మహాశ్వేతయు నతని మాటలచే దేరి స్వాంతమున సంతసము వహించినది.
అప్పుడు కాదంబరి కపింజలుంజూచి మహాత్మా! నీవును పత్రలేఖయు నొక్కసారియే యీ సరస్సులోఁ బడితిరికదా! పత్రలేఖ యేమైనదని యడిగిన నతం డిట్లనియె.
దేవీ! నీటిలోఁబడిన నేమిజరిగినదో నాకేమియుం దెలియదు. నేనిప్పుడు త్రికాలవేదియగు శ్వేతకేతునొద్దకుఁ బోయి చంద్రాపీడునియాత్మ యెక్కడ నున్నదియో పుండరీకావతరమైన వైశంపాయనుఁ డేమయ్యెనో పత్రలేఖ యెక్కడికిఁ బోయినదో యతని నడిగి తెలిసికొనివచ్చెదనని పలుకుచునే యాకాశమునకు నిర్గమించి యరిగెను.
అట్లతఁడరిగిన పిమ్మటఁ గాదంబరి మహాశ్వేతంజూచి ప్రియసఖీ! మన యిరువురకు సమానశోకంబు గలుగఁజేసిన భగవంతుఁ డిప్పుడు నన్ను నిలబెట్టెను. నిన్ను ప్రియసఖీ! యని పిలుచుట కిప్పటికి లజ్జింపకుంటిని. నాకిప్పుడు నెచ్చెలివైతివి. నాకిప్పుడు మరణమైనను దుఃఖము కొరకుగాదు. నీవిప్పుడు నా కుపదేశింపఁ దగియుంటివి. నేనిప్పుడేమి చేయవలయునో నాకుం దెలియకున్నది. నీవు విమర్శించి కర్తవ్య ముపదేశింపుమని పలికిన విని యక్కలికి కాదంబరి కిట్లనియె.
వయస్యా! ఈ విషయమై చెప్పుటకును వినుటకును నేమియున్నది. మనకు ప్రియసమాగమావేశ మేమిచేయించుదునో యట్లు చేయఁదగినదే! పూర్వము వాఙ్మాత్రముచేతనే యోదార్చఁబడితిని. ఇప్పుడు కపింజలుఁడు పుండరీకుని వృత్తాంతమును గురించి స్పష్టముగా జెప్పెను కదా! నీవుమాత్ర మేమి చేయుదువు? నీదొడయం దుంచుకొని చంద్రాపీడుని శరీరమును విడువక వినాశనము కాకుండా నర్చింపుచుండుము. మృద్దారుశిలారూపములైన యప్రత్యక్షదేవతల సేవించుట కంటె ప్రత్యక్షదైవమైన యీ చంద్రాపీడుని శరీరమును బూజించుటయే శ్రేయము. అట్లుచేయుము. ఎప్పటికేని యే దేవునకైన ననుగ్రహము రాకపోవునా? యని చెప్పిన విని కాదంబరి యప్పుడేలేచి తరళికామదనలేఖలు సహాయముచేయఁ జంద్రాపీడుని శరీరమును మెల్లగానెత్తి శీతవాతాతపాది దోషరహితమైన యొకశిలాతలమం దుంచి శృంగారవేషము దీసికొని స్నానముచేసి పరిశుద్ధచిత్తయైన ధౌత దుకూలముఁదాల్చి అధరకిసలయంబున దట్టముగాఁ బట్టియున్న తాంబూలరక్తిమమును బెక్కుసారుల తోమి కడిగి మాటిమాటికిఁ గన్నీరు గార్పుచు ననభ్యస్తము నపూర్వమునైన నియమము ధరించి పూర్వము సురతోపభాగమునకై తెచ్చిన పూవులు గంధము నంగరాగము ధూపములు మొదలగువానిచేతనే చంద్రాపీడమూర్తి నర్చించుచు మూర్తీభవించిన శోకదేవతయుంబోలె జింతించుచు మరణముకన్న కష్టతరమైన యవస్థ ననుభవింపుచు నాహారము గుడువక వెండియు నతని యడుగులు తొడయం దిడుకొని యెత్తుచు నెట్టకేల కాదివసము గడిపినది.
మరునాఁడుదయంబున నూత్నతేజంబుతో నొప్పుచున్న చందాపీడునిం జూచి వెరగందుచుఁ గాదంబరి మదనలేఖతో నాతీ! యీతని మేనికాంతి యెంతవింతగా నున్నదియో చూచితివా? ప్రేమాతిశయంబున నాకే యిట్లుతోచుచున్నదేమో! నీవు గూడ విమర్శించి చూడుమని పలికిన విని మదనలేఖ యిట్లనియె.
రాజపుత్రీ! ఇందు నిరూపింపవలసిన దేమియున్నది. యీపనికిం జైతన్య మొండు కొరంతగా నున్నది. కాని యథాస్థితిగానే యున్నవాఁడు కపింజలుఁడు చెప్పిన మాట యథార్ధమని దీన స్పష్టమగుచున్న యది లేనిచో మృతుండైనవాఁ డిట్లుండుట యెందేనిం జూచియుంటిమా? ఇది శాపదోషముకాక మఱియొండు కాదని పలికి యక్కలికి నూరడించెను కాదంబరియుఁ బ్రతిదినము చంద్రాపీడమూర్తిని దేవతా విగ్రహమునట్లు త్రికాలములయందుఁ బూజింపుచు ధృతవ్రతయై శాపావసానకాల మరయుచుండెను.
మరికొన్ని దినంబులకుఁ దారాపీడుఁడు చారముఖంబుగాఁ దద్వృత్తాంత మంతయును విని మిక్కిలి పరితపించుచు మనోరమా శుకనాశు లనుగమింప విలాసవతింగూడి యుచిత పరివారములతో నయ్యాశ్రమమునకుఁబోయి యందు జంద్రాపీడుని యవస్థంజూచి పెద్దయుంబ్రొద్దు జంతించి శాపప్రకారమంతయు వినియున్నవాఁడు కావున నెట్టకే శుకనాశునిచే బోధింపఁబడి వైరాగ్యమును వహించి రాజ్యభారము మంత్రులయం దుంచి భార్యతోగూడ నా ప్రాంతమందున్న వనములో మునివృత్తిబూని కాలక్షేపము చేయుచుండెను.
అనిచెప్పి జాబాలి పక్కునవ్వి హారీతప్రముఖులగు మునులతో ననఘులారా! యాకథారసం బెంత వింతగా నున్నదియో వింటిరా? వక్తవ్యాంశమును విడిచి యతిదూరము చెప్పుకొని పోయితిని.
వినుం డాపుండరీకుండు కామోపహతచిత్తుండై తాను జేసిన యవినయదోషంబున దివ్యలోకమునకుఁ జెడి పుడమియందు శుకనాస తనయుండైన వైశంపాయనుఁడుగా జనియించెను.
వెండియు నతండు మహాశ్వేతచే శపియింపబడి యిట్లు చిలుక యోని యందు జనియించెనని యెఱింగించినంత నాకప్పుడు నిద్ర మేల్కాంచినట్లుగా జాతిస్మరణగలిగి బూర్వజన్మోపాత్తవిద్య లన్నియును స్ఫురించినవి మనుజుండువోలె స్పష్టముగా మాట్లాడుటయు సర్వవస్తుజ్ఞానము విద్యోపదేశకౌశలము మిక్కుటముగా లభించినది పెక్కేల? శరీర మొక్కండుదక్క తక్కిన చర్యలన్నియు మనుష్యుండు వలెనే చేయసామర్ధ్యము గలిగినది. అట్టి జ్ఞానము గలిగి నిజవినయశ్రవణంబునఁ గలి గిన సిగ్గుచేత నించుక తలవంచుకొని కొంచెముసే పూరకొని నే నల్లన నా జాబాలి కిట్లంటి.
దేవా! నీ యనుగ్రహంబున మదీయ పూర్వవృత్తాంతమంతయు స్మరణకు వచ్చినది. యాప్తులనందరను స్మరించుకొంటిని. నా మృతిని వినినంత హృదయము భేదిల్లఁ జైతన్యమును విడిచి చంద్రాపీడుఁడు జన్మాంతరమున నే శరీరమును దాల్చెను? దయయుంచి వక్కాణింపుఁడు అతనితోఁ గలసికొంటినేని తిర్యగ్యోని యందున్నను నాకు సంతసముగానే యుండునని యడిగిన నమ్మహర్షి పుంగవుండు కన్నుగవఁ గెంపుగదుర నన్నుఁ జూచుచు, దురాత్మా! నీ చిత్తచాంచల్య మింకను విడువకున్నవాడవే! దాని మూలముననేకదా! ఇట్టియవస్థ ననుభవింపు చున్నవాఁడవు. ఇప్పుడు నీకు రెక్కలైనను బూర్తిగా రాలేదే! తొందర పడియెదవేల? ఎగురుటకు సామర్ధ్యము వచ్చినపుడు నన్నీ సంగతి నడుగుము చెప్పెదనని పలికినవిని హారీతకుం డిట్లనియె.
తాతా! ఈతండు మునిజాతియందు జనియించియు జీవితమును విడుచునంత కంతుసంతాపమును జెందెనేమి? దివ్యలోక సంభూతున కల్పాయువు గలుగు టెట్లు? నాకు మిక్కిలి విస్మయముగా నున్నది ఎఱింగింపవే? యని యడిగిన నమ్మునిమార్తాండుండు వెండియు నిట్లనియె.
వత్సా! యీతండు కామరాగ మోహమయము నల్పసారమునైన స్త్రీ వీర్యమువలనఁ బుట్టుటచే నట్లయ్యె. అల్పసారమగు స్త్రీవీర్యంబునం బొడమిన జంతువు గర్భంబుననే హరించును. లేక చచ్చియైనం బుట్టును జీవించి పుట్టినను దీర్ఘకాలము బ్రతుకదని యాయుర్వేదంబున స్పష్టముగాఁ జెప్పఁబడి యుండ దీనికి విస్మయమేల! దద్దోషంబునంజేసి వీఁడు కామరతుండై మదనజ్వర వేగంబున సమసె. శాపావసానకాలంబున దీర్ఘాయుష్మంతుండై యొప్పునని చెప్పెను.
అప్పుడు నేను వెండియు మహాత్మా! నేను బాపాత్ముండనై యీ తిర్యగ్యోని యందు జనియించితిని. నీ యనుగ్రహంబు నాకు వాక్కు మాత్రము వచ్చినది. యభూతపూర్వమైన జ్ఞానము గలిగినది నాకే సుకృతంబున నీరూపము వాయగలదు? ఆయువెట్లు వర్థిల్లును? నే చేయవలసిన కృత్యమెద్ది? దయామయుఁడవై యెఱింగింపు మని ప్రార్థించిన విని యజ్జాబాలి దిఙ్ముఖంబులు సూచుచు, అయ్యో! ఈ కథామూలంబునఁ దెల్లవారిపోయినది. యనుష్టానవేళ యతిక్రమించినది. యది యట్లుండనిమ్మని పలుకుచు నాగోష్ఠి చాలించి లేచుటయు నమ్మునులందరు తత్కథారసాస్వాదనంబునఁ జేయదగిన కృత్యములు మరచి విస్మయమందుచు నెంతకష్ట మని పలుకుచు నొక్కింత సేపుండి పిమ్మట దమదమ నివాసములకుఁ బోయిరి. హరీతకుండును నన్ను మెల్లగా జేతియందెక్కించుకొని పర్ణశాల యందొక వేదికయందు భద్రముగా నునిచి తాను స్నానార్ధ మఱిగెను.
పిమ్మట నే నాత్మగతంబున అయ్యో! అనేక భవసుకృత పరిపాకంబునం గాని మానుషదేహంబు గలుగదు. దానియందును సకలజాతి విశిష్టమైన బ్రాహ్మణ్యము దుర్ఘటమైనది. అంతకన్న నా సన్నా మృత పదముగల మునిత్వము విశిష్టతరమైనది. దివ్యలోక నివాసిత్వ మంతకన్న విశేషమైనది. అట్టి యున్నతపదమునుండి స్వదోష మూలముననే యధోగతింబడి యిట్టి తిర్యగ్జాతియందుఁ బుట్టితిని. అన్నన్నా! ఎంత మోసము వచ్చినది. సీ! ఇఁక నాకీ జీవితముతోఁ బ్రయోజనమేమి? ఈ శరీర మెట్లయినను సరియే విడిచి విధిమనోరథమును సఫలము జేసెదనని యూహించి జీవితమును విడుచుటకు నిశ్చయించుకొని యుంటిని.
ఇంతలో హరీతకుఁడు వచ్చి అన్నా! వైశంపాయన! నీ పుణ్యము మంచిది. నీ తండ్రియొద్దనుండి నిన్ను వెదకిఁకొనుచుఁ గపింజలు డిచ్చటి కిప్పుడు వచ్చెనని చెప్పుటయు నే నప్పుడు రెక్కలు వచ్చిన దానివలె నెగరబోయి యత్యంత సంతోషముతో నతం డెక్కడనని యడిగితిని.
అప్పుడు హరీతకుఁడు అతండు మా తండ్రి యొద్దనుండి మాటలాడు చున్నవాఁడని చెప్పినవిని నేను ఆర్యా! అతనిం జూచుటన నా హృదయము మిక్కిలి పరితపించుచున్నది. నన్ను వేగమ వాని చెంతకుఁ దీసుకొని వెళ్ళుమని ప్రార్ధించు చుండఁగనే యా కపింజలుఁడు గగనమార్గమునఁ బూర్వరూపముతో నా యొద్దకు వచ్చెను.
వానిం జూచి నేను గన్నీరుగార్చుచు నట్లుండియు నెదురుకొనఁ బ్రయత్నించితినికాని రెక్కలు రామింజేసి శరీరము కదిలినదికాదు. అప్పుడు నేను దీనస్వరముతో వయస్యా! కపింజల! జన్మద్వయాంతరిక దర్శనుండవగు నీ రాక చూచి తొందరగా లేచి యెదురుకొనుచు జేతులుచాచి గాఢముగా నాలింగనము జేసికొనుటకును జేయి పట్టుకొని పీఠంబున గూర్చుండబెట్టుకొనుటకు సుఖాసీనుండవైన నీకు గమనా యాసంబువాయ నడుగులొత్తుటకు నాకు యోగ్యత లేకపోయినది కదా! యని చింతించుచున్న నన్ను గపింజలుడు తన రెండుచేతులతోడ నెత్తి పట్టుకొని యాలింగన సుఖంబనుభవించువాడుఁబోలె వక్షమున నిడుకొనుచు శోకంబున మదీయచరణంబుల శిరంబున నుంచుకొనుచు బ్రాకృతుండువోలె బెద్ద యెలుంగున రోదనముజేసెను.
అట్లు పెద్ద యెలుంగున బ్రాకృతుండువోలె శోకించుచున్న యతని నూర డించుచు నే నిట్లంటిని. సఖా! కపింజల! సకలక్లేశపరిభూతుండనగు నాకీ శోకము తగునుగాని నీవిట్లు విలపించెదవేమిటికి? నీవు బాలుండవైనను సంసారబంధాత్మకములగు రాగాది దోషముల నంటక వర్తింపుచుంటిని. ఈమూఢజనమార్గమును విడువుము. కూర్చుండి చెప్పుము. మా తండ్రి కుశలుడై యున్నవాడా? నన్నెన్నడైన స్మరించునా? ఈ వృత్తాంతము విని యేమనుచున్న వాడు? కోపము సేయుచుండెనా? యేమి? అని నేనడిగిన నతండు హరీతశిష్యునిచే వేయబడిన పల్లవాసనమున గూర్చుండి నన్నుఁ దొడయం దిడికొని హరీతకునిచే నీయబడిన యుదకముచే మొగము గడిగికొని నా కిట్లనియె.
మిత్రుఁడా! మీ తండ్రి కుశలుఁడై యున్నవాఁడు మన వృత్తాంత మంతయు దివ్యదృష్టిచేఁజూచి ప్రతిక్రియకొరకుఁ బ్రయత్నించుచుండెను. అంతలో నేను తురగత్వమును విడిచి ఆయనయొద్దకుఁ బోయితిని. దూరమునందె. నన్నుఁజూచి కన్నుల నశ్రుజలంబుగ్రమ్మ భయపడుచున్న నన్నుఁ జేరదీసి గారవింపుచు నిట్లనియె.
వత్సా! కపింజల! వగవకుము ఈ తప్పు నాది కాని మీది కాదు. పుండరీకుఁడు పుట్టినప్పుడే వాని కిట్టి దోషమున్నదని యెరింగియుఁ బ్రమాదంబున నాయుష్కరమగు కర్మ నిర్వర్తించితిని కాదు. ఇప్పుడన్నియుం దీర్చితిని. కొలఁది దినములలో నీ కష్టములన్నియు బోవగలవు. అంత దనుక నీవు నా యొద్ద నుండుమని యాజ్ఞాపించుటయు నే నిట్లంటి.
తాతా! నీకు నాయందనుగ్రహము గలిగినచో నా మిత్రుఁడెందుండెనో యచ్చటికిఁ బోవుట కాజ్ఞ యిమ్ము. వానిం జూడ నాకు మిగుల లనాతురముగా నున్నదని యడిగిన నమ్మహర్షి యిట్లనియె. వత్సా! వాఁడిప్పుడు చిలుకగా నుదయించి యున్నవాఁడు. నీవు వోయియు వానిం దెలిసికొనఁజాలవు. వాఁడును నిన్నెరుఁగడు. కొంతకాల తిరుగనిమ్మని యాజ్ఞాపించెను. నేనందే యుంటిని. నేఁటి యుదయంబున నన్నుఁ జీరి యా పారికాంక్షి వత్సా! కపింజల! నీ మిత్రుఁడిప్పుడు మహానుభావుండైన జాబాలి యను మహర్షి యాశ్రమములో నున్నవాఁడు. వానికిప్పుడు తత్ప్రసాదంబున బూర్వజన్మస్మృతి గలిగినది. కావున నీవిప్పు డతనిం జూడఁబొమ్ము కర్మ పరిపక్వ మగువరకు నా మహాత్ముని యాశ్రమము విడువవలదని నా మాటగాఁ జెప్పుముఁ అని యుపదేశించెను. మరియు నీ తల్లియగు లక్ష్మియు నీ దుఃఖము విని దుఃఖించుచు నీ విముక్తి కొరకై యమ్మునికిఁ బరిచర్య చేయుచున్నది. ఆమెయు నీకిట్లే చెప్పు మన్నది. అని పలుకుచు శిరీష కుసుమపేశల పక్ష్మమములగు నా గాత్రముల దన మృదుకరతలంబున దువ్వుచు హృదయంబున మిక్కిలి పరితపించెను.
అప్పుడు నేనతనింజూచి వయస్యా! నీవెందులకు విచారించెదవు? మందభాగ్యుండనగు నా మూలమున నీవు తురగమై పుట్టి యనేక కష్టము లనుభవించితివి. అయ్యయ్యో! సోమపానోచితమగు నీ నోటియందు నురగతో గూడిన రక్తము స్రవింపుచుండ దగిలించిన యినుప కళ్లెము యొక్క క్షతము లెట్లుగా సహించితివి?
కిసలయశయనోచితకుసుకుమారగాత్రుండవగు నీవు పడుకొనక సంతతము నిలబడి యెట్లుగానుంటివి? మిక్కిలి కోమలములగు నీ యంగముల గళాఘాతము లెట్లుగా భరించితివి? అక్కటా? బ్రహ్మసూత్రభారమును వహించెడు నీ దేహమున బిడుగుపడినంత బాధగల పీడల నెట్లుగా సహించితివి బాబూ! అని పలుకుచు వానితో బూర్వవృత్తాంతముల ముచ్చటింపుచుండ క్షణకాలము తిర్యగ్జాతి దుఃఖము మరచి యానందించితిని.
అంతలో మధ్యాహ్న సమయమగుటయు హరీతకునితోఁ గూడ గపింజలుడు యథోచితాహారమున నన్ను దృప్తుం గావించి తాను కూడ భుజించి క్షణకాల మూరకొని వెండియు నా కిట్లనియె.
వయస్యా! మీ తండ్రి నీకీ వార్త జెప్పి నన్ను వెంటనే యక్కడికి రమ్మని యాజ్ఞాపించెను. నేనిక బోయి వచ్చెద. నీవు కర్మ పరిసమాప్తి వరకు నీ మహర్షి పాదమూలమును విడువరాదుసుమీ! అని పలికిన విని విషణ్ణవదనుండ నై యిట్లంటి.
కపింజలా! ఇట్టి యవస్థలోనున్న నేను దలిదండ్రుల కేమని సందేశ మంపుదును? అంతయు నీవే యెరుంగుదువు. అనుటయు నతండు నన్నందుండి కదలనీయవలదని హరీతకునకుఁ బలుమారు జెప్పి యప్పగించి నన్ను మరియొకమారు కౌఁగలించుకొని మునికుమారులెల్ల విస్మయముతోఁ జూచుచుండ నంతరిక్షమున కెగిరి యంతర్ధానము నొందెను.
అతండరిగిన వెనుక హరీతకుఁడు నన్నూరడించుచు స్వయముగా నా కాహారాదిక మిడుచు నేకొరతయు రాకుండఁ గాపాడుచుండెను. కొన్ని దినంబులకు నాకు రెక్కలు వచ్చినవి. ఇంచుక యెగురుటకు సామర్ధ్యము కలిగినప్పుడే నాత్మగతంబున నిట్లు విచారించితిని. నా మిత్రుడు చంద్రాపీడుని మహాశ్వేతను జూచుటకు నా మనసుత్సుకము జెందుచున్నది. నేనక్కడికిపోయి వసించెదనని తలంచుచు నొకనాడు ప్రాతఃకాలమున విహారమునకుం బోలె బయలుదేరి యుత్తరదిక్కు ననుసరించి యెగిరి పోయితిని.
స్వల్పదినముల క్రితమే యెగరనేర్చితిని. కావునఁ గొంచెము దూరము పోయినంతనే నా యవయవము లన్నియు విడిపోయినట్లాయాసము గలిగినది. దాహముచే నాలుక యెండఁ జొచ్చినది. శ్వాసలు బయలుదేరినవి. రెక్కలాడింపశక్యము గాకుండెను. కన్నులు తిరుగుచుండెను. ఇక్కడబడియెద నిక్కడ బడియెదనని తలంచుచుఁ దూలుచు నా సమీపమందున్న సరస్స్తీరమందలి జంబూతరు నికుంజముమీద నతికష్టమున మేనుఁజేర్చితిని.
కొంత సేపటికి గమనాయాసమించుక తగ్గినది. మెల్లగాఁ జెట్టుదిగి శీతలంబగు తచ్ఛాయ నాశ్రయించితిని. మరియు గింజల్కర జోదాసితంబగు నా సరస జలంబు దృప్తిగా ద్రావిత్రావి మృదువులగు కమలకరుణికాబీజములచేతను, తీరతరుపర్ణాంకురముల చేతను, పండిరాలినఫలములచేతను ఆకలి యడంచుకొని యపరాహ్ణకాలంబునఁ దిరుగా బయలుదేరిన నెంత దూరము బోవఁగలనో యని యాలోచించుచు మార్గగమన భిన్నములగు నవయవములకు విశ్రాంతి గలుగుటకై నీడతోఁ గూడిన తత్తరుశాఖ నాశ్రయించి మొదటిభాగముననే కూర్చుంటిని. అంతలో నాకు నిద్రపట్టినది. కొంత సేపటికి మేల్కొనిలేచి చూచువరకు త్రెంపరాని తంతుపాశములచేఁ గట్టబడి యుంటిని.
అప్పుడు పాశములేని కాలపురుషుని భాతి నుక్కుముక్కలచే నిర్మింపబడిన రెండవ ప్రేతపతిచందమునఁ బణ్యరాశికిఁ బ్రతిపక్షు వైఖరిని బాపమున కాశ్రయుం డట్ల తోచుచుఁ గోపకారణము లేకయే భ్రుకుటీరౌద్రములైన నేత్రములు గలిగి కృతాంతునికిఁ కూడ భయము గలుగఁజేయు వాఁడుంబలె నొప్పుచు మలినవసనాంగుడై యదృష్టో శ్రుత పూర్వుండైనను స్వరూప ప్రకటిత క్రౌర్య దోషుండగు నొకానొక పురుషు నెదురం గాంచితిని.
వానిం జూచినతోడనే నాకు జీవితమందు నిరాశ గలిగినది. అయినను నించుక ధైర్యము దెచ్చికొని వాని కిట్లంటి. భద్రా! నీవెవ్వడవు? నన్ని ట్లేమిటికి గట్టితివి? మాంసలాలసత్వమున నంటివేని నిద్రలోనే నన్నుఁ జంపఁదగినది. నిరపరాధినగు నాతో నీకేమిపని? విలాసమున కిట్లు పట్టితినంటివేని కౌతుకము తీరినది గదా? ఇఁక వదలుము, మిత్రులంజూడ నేను దూరముపోవలసియున్నది. ఆలస్యమునకు నా హృదయము సహింపదు. నీవును బ్రాణిధర్మమునందే యుంటివి గదా! నీయెరుఁగని ధర్మంబులుండునా? అని ప్రార్ధించిన వాఁడిట్లనియె.
మహాత్మా! నేను జాతిచే ఛండాలుండను. కౄరకర్ముఁడను విలాసమునకు మాంసమునకు నిన్ను నేను గట్టలేదు. ఇక్కడి కనతి దూరములో నున్న మాలపల్లె యందు నా యధికారి గలఁడు. అతని కూఁతురు తొలిప్రాయంబున నొప్పుచున్నది. ఆమెకు జాబాలియను మహర్షి యాశ్రమమున మాటలు నేర్చిన చిలుక గలిగియున్నదని నీ వృత్తాంత మెవ్వరో చెప్పియున్నారు.
ఆ కథ విని యా చిన్నది మిక్కిలి వేడుకపడుచు నిన్నుఁ బట్టి తీసికొనివచ్చుటకై బహుదినములక్రితమే నావంటివాండ్రఁ బెక్కండ్ర నియమించియున్నది. నా పుణ్యము వలన నీ విప్పుడు నాచేఁ బట్టుపడితివి. ని న్నామెచెంతకుఁ దీసికొనిపోయెదను. నీ బంధమోక్షమున కాపద్మగంధియే సమర్దురాలని పలికిన విని నెత్తిపై బిడుగు పడినట్లు అంతరాత్మ బాధపడుచుండ నే నాత్మగతంబున నిట్లు తలంచితిని.
అక్కటా! మందభాగ్యుండనగు నాయొక్క కర్మవిపాకము కడు దారుణమైనదిగదా! సకలసురాసురమకుటమణికిరణనీరాజితచరణకమలమగు మహాలక్ష్మికిఁ బట్టినై పుట్టి జగత్త్రయపూజ్యుండగు శ్వేతకేతుమహామునిచేఁ బెంపఁబడి దివ్యలోకాశ్రమముల వసియించెడు నే నిప్పుడు మ్లేచ్ఛజాతికైనఁ బ్రవేశింపఁదగని మాలపల్లె కరుగవలసినదా? ఛండాలులతోఁ గూడఁ గలసి యుండవలసినదా? మాలెతలచే నీయఁబడిన కబళములచే దేహము బోషించుకొనవలసినదా? ఛండాలబాలకులకు నాటవస్తువును గావలసినదా? ఆహా! దురాత్మా! పుండరీకహతక! సీ! నీజన్మ కడు నింద్యమైనదిరా! నీవు ప్రథమగర్భమందే వేయిముక్కలై చెడిపోయితివేని యీ యిక్కట్లు రాకపోవునుగదా? తల్లీ! లోకమాతా! పద్మశరణా! అశరణజనశరణచరణపంకజా! న న్నీనరకకూపమునం బడకుండఁ గాపాడలేవా? తండ్రీ భువనత్రయత్రాణసమర్ధుండవు స్వయముగాఁ బెనిచిన నీ కులతంతువునగు న న్నీయాపదనుండి రక్షింపుము. వయస్యా! కపింజల! నీవు వేగ వచ్చి నా కీయాపద దాటింపకపోయితివేని జన్మాంతరమందైన నిఁక నాతోఁ గలిసికొనఁజాలవుసుమీ? అని యనేకప్రకారముల విలపించుచు వెండియు వినయముతో వాని నిట్లు ప్రార్ధించితిని.
చంద్రముఖ! నాకు జాతిస్మృతి గలదు. నేనొక మునికుమారుండను. ఈ సంకటమునుండి నన్ను దప్పించిన నీకును బుణ్యము రాఁగలదు. నన్ను బట్టినట్లెవ్వరును జూచియుండలేదు. విడిచినచో నీకుఁ బత్యనాయ మేమియుం గలుగదు. కావున గరుణించి నన్ను వదలుమని బ్రతిమాలుకొనుచు వాని బాదంబులం బడితిని. పక్కున నవ్వి వాఁడు నా కిట్లనియె. ఓరీ! మోహాంధుఁడా! శుభాశుభకర్మలకు సాక్షిభూతములగు పంచభూతములు నీశరీరమున లేవా? అవి చూచుచుండవా? అకార్యకరణమునకు నే నంగీకరింపను. స్వామ్యాజ్ఞచే నిన్నుఁ బట్టికొంటిని. వదలుటకు వీలు లేదని పలుకుచు నన్నుఁ తీసికొని పక్కణాభిముఖుండై యరుగుచుండెను. నేను వానిమాటచే నెత్తిపైఁ గొట్టబడినట్లు మూకీభావము వహించి యే పాపముజేసి యిట్టిఫల మనుభవింపుచుంటినో యని ధ్యానించుచుఁ బ్రాణములు విడుచుటకు నిశ్చయించుకొంటిని. మఱియు వానితో నట్లు తీసికొనిపోఁబడుచున్న సమయంబున ముందు జూచినంత,
సీ. కుక్కలతో గూడికొని గుంపుగుంపుగా
చండాలబాలకుల్ సంచరింప
దూషితమాంసమేదోవళాకర్ధమ
ప్రాయకుటీరరాజితములు వెలయ
గుడిసెలచుట్టు బల్ గోటగాఁ గట్టిన
వెదురుకంపల దడుల్ వీథులంట
నస్థిరాసులఁ జేరి యరపులతో మీఱి
కుర్కురంబులు దాడి గ్రుద్దులాడ
గీ. బురదగుంటలఁ బందులు పొర్లులాడ
విస్రగంధిరజోధూమవితత మగుచుఁ
దలపఁజూడ నసహ్యమై తనరునట్టి
పక్కణము గానఁబడియె నప్పతగపతికి.
నరకవాసులకుఁగూడ నుద్వేగము గలుగఁజేసెడు నామాలపల్లెం జూచి జుగుప్స జెందుచు నాహా! ఆ చండాలకన్యక దూరమునందే నన్నుఁ జూచి కరుణ జనింప వదలివేయుమనునా? వట్టిది వట్టిది జాతికిం దగని యట్టిపని యెన్నడుం జేయదు. కానిమ్ము. నాపురాకృత మిట్లున్నది ఏమి జేయుదును? నిమిషమైన నిందుండ జాలనని తలంచుచుండగనే వాఁడు నన్నామెకడకుఁ దీసికొనిపోయి తల్లీ! అవధారు! ఇదిగో నీవు చెప్పిన చిలుకం దీసికొని వచ్చితిని. చూడుమని నమస్కరించి నన్నుఁ జూపెను.
ఆ మగువ మిగుల సంతోషించుచు మంచిపని గావించితివని వాని మెచ్చుకొని నన్ను వాని కరమునుండి తన రెండు చేతులతోఁ గైకొని పుత్రకా నేటికిఁ దొరికితివి? ఇంకెక్కడికి బోఁగలవు? నీ కామచారదోషమంతయుఁ బోగొట్టెదఁ జూడు మని పలికినది. అప్పుడొక ఛండాలబాలకుఁడు పరుగెత్తుకొనిపోయి లోమశంబై దుర్గంధయుక్తంబగు గోచర్మముచేఁ గప్పబడిన దారుపంజర మొకదానిం దీసికొని వచ్చి యామె ముందర నుంచెను మహాశ్వేతావలోకనమనోరథములతోఁ గూడ నన్ను లాగి “యిందుండుము. కదలకుమని" పలుకుచు న న్నాపంజరములో వైచి తలుపు బిగించినది అప్పుడు నే నాత్మగతంబున నిట్లు తలంచితిని.
అయ్యో! నేనిప్పుడు గొప్ప యాపదలోఁ బడిపోయితిని. శిరస్సుచే నమస్కరించి నా యవస్థయంతయు నీమె కెరిగించి వదలుమని బ్రతిమాలుకొందునా? సరిసరి నేను లెస్సగా మాటాడుదుననియేకాదా? యీ పైదలి నన్నుఁ బట్టించినది. కావున నట్లు బ్రతిమాలుకొనుట వలన లాభములేదు. నా బంధనపీడ యీమె నేమి బాధించును? తనయుండననియా! సోదరుండననియా? బంధువుఁడననియా? కావున మౌనమే యవలంబించుట యుక్తము. దానఁ గోపించి యింతకంటెఁ గష్టదశ నొందించునేమో! అవును. సందియమేలా! దీనిజాతి క్రూరజాతికాదా? ఇంతకన్నఁ గష్టమగుంగాక? యీ ఛండాలులతోఁ గలసి మాట్లాడుట అనుచితము. కావున మౌనమవలంబించుటయే శ్రేయము 'ఇఁక మాట్లాడదు. ఈ మూకశుకంబు నాకేల' యని యెప్పుడైన విసుగుజెంది విడువవచ్చును. మాట్లాడుచున్న విడువనేరదు.
ఆహా! దివ్యలోకభ్రంశము మర్త్యలోకజన్మము తిర్యగ్యోనిపతనము, ఛండాలహస్తోపగమనము, పంజరబంధదుఃఖము. ఇది యంతయు నింద్రియచాపల్యదోషంబునంగదా! కలిగినది. అక్కటా! ఒక్క వాక్కునే కాదు. సర్వేంద్రియములను నియమించెదనని తలంచుచు మౌనము వహించితిని.
పలికించినను, తర్జించినను, గొట్టినను, బలవంతముగాఁ బొడిచినను నేమియు మాటాడక కేవలము సీత్కారము మాత్రము జేయుచుంటిని.
పానాశనములం దెచ్చి పెట్టినను నేమియు ముట్టక యాదివస ముపవాసమే కావించితిని. ఆ మఱునాఁడును నే నేమియుం దినకున్నంతఁ జింతించుచు నా కాంతామణి స్వయముగా నానావిధములగు ఫలంబులు సురభిశీతలమగు జలంబులు దీసికొని వచ్చి నా కిచ్చినది నే నుపయోగించితికాను. అప్పుడు నన్నుఁ దేరిబారి చూచుచు నా చిన్నది నా కిట్లన్నది.
నిర్వికారచిత్తములు గలిగి క్షుత్పిపాసలచే దీపించు పశువులకును, పక్షులకును సిద్ధమైన యాహార మెట్టిదైనను గుడుచుట ధర్మమైయున్నది. నీ వట్టిదానవుగదా? నీకీ భోజ్యాభోజ్యవివేచన మేమిటికిఁ గలుగవలయును? జాతిస్మృతి గలిగి యస్మదీయంబగు నాహారంబు గుడువకుంటివా? అట్లైనను తిర్యగ్జాతియం దుదయించిన నీ నియమ మవసరములేదు.
అత్యుత్తమమైన తాపసజాతియం దుదయించుటయుఁ దిర్యగ్జాతియందుఁ బుట్టఁదగిన పాపకర్మ గావించితివి గదా? ఇప్పుడు నీ కీవిచార మేటికి? మొదటనే వివేకము గలిగియున్నచో నీ ముప్పు రాకయేపోవును. ఇప్పుడు స్వకృతకర్మవిశేషంబునం గలిగి జాతికిఁ దగిన యాహారము గుడుచుట నీకుఁ దోషము కానేరదు. అదియునుం గాక గొప్పవారు గూడ నాపత్కాలముల యందు భక్షింపఁదగినవానిం దిని ప్రాణములు నిలుపుకొందురు. నీ మాట చెప్పనేల? మరియు నీకు చండలాశనశంక గలుగజేయు వస్తువులేమియు నేను దీసికొని రాలేదు. ఈ ఫలములం దినవచ్చును. పుల్కనభాండగతముకన్న నేలఁబడిన యుదకము పవిత్రమని చెప్పుదురు. అట్టిదానినైనఁ ద్రాగరాదా ? ఊరక యేమిటికి క్షుత్పిపాసలచే నాయాసపడియెదవు? మునిజనోచితమైన యీ ఫలముల నేమిటికి భక్షింపవు? ఈ నీరేమిటికి త్రాగవు? అని పలుకుటయు జండాలజాత్యనుచితములైన యాబోఁటి మాటలాలించి విస్మయము జెందుచుఁ జుగుప్ప విడిచి జీవితాశచే క్షుత్పిపాసోపశమనమునకై యశనక్రియ నంగీకరించితిని. మౌనము మాత్రము విడువలేదు.
అట్లు కొంతకాలము జరిగినంత నేను తరుణత్వము వహించిన పిమ్మట నొకనాఁడు ప్రాతఃకాలమున నిద్రలేచి చూచినంత నాదారుపంజర మేమైనదో తెలియదు. నేనీ బంగారుపంజరములో నుంటిని. ఆ కన్యక యిట్టిదివ్యరూపము గలదై యొప్పెను. దేవర జూచియే యున్నారుగదా! మరియు నామాలపల్లి యమరనగరసమానమై ప్రకాశించుచుండఁ జూచి నేను పుల్కనపురవాసపరితాపము విడిచి యాశ్చర్యమందుచు నిది యేమని మౌనము విడిచి యప్పఁడతి నడుగుదమని యెంతలో దలంచుచుంటినో యంతలో నీకాంతారత్నము నన్నిక్కడికిఁ దీసికొని వచ్చినది.
మహారాజా! ఈ సరోజానన యెవ్వతెయో యెందులకై యిట్లు చండాలరూపత్వము ప్రకటించినదో నన్నెందులకుఁ బట్టించినదో ఇప్పుడు న న్నిక్కడి కేమిటికిఁ దీసికొనివచ్చినదో నాకేమియుం దెలియకున్నది. దేవరవోలె నీకథ వినుటకు నేనుగూడ నుత్సుకము గలిగియుంటినని యా చిలుక చెప్పినది.
ఆ కథ యంతయును విని యమ్మహారాజు ఆ వార్త వినుటకు మిక్కిలి కుతూహలము గలవాఁడై వాకిటనున్న యా మాతంగకన్యం దీసికొనిరమ్మని ప్రతీహారి కాజ్ఞాపించెను. అదివోయి యిటు ర మ్మిటు రమ్మని పలుకుచు నా కలికిం దీసికొనివచ్చి యెదుర నిలిపినది అప్పు డావాల్గంటి భూమినంటకయే నిలువంబడి తన తేజంబున నన్నృపునిఁ బరాభవింపుచుఁ బ్రౌఢముగా నిట్లు పలికినది.
భువనభూషణ! రోహిణీనాథ! తారారమణ! కాదంబరీలోచనానందచంద్ర! ఈ దుష్టుఁడు తనయొక్కయు మీయొక్కయు వృత్తాంతమంతయు మీకు వినిపించెం గదా? జాబాలియాశ్రమము విడువవలదని తండ్రిగారిచే నియమింపబడియుఁ దదాజ్ఞ నుల్లంఘించి కామరాగాంధుండై మహాశ్వేతయొద్దకుఁ బ్రయాణమైనవార్తయు మీకు విదితమే.
నే నీదురాత్ముని గన్నతల్లిని, మహాలక్ష్మిని. వధూదర్శనోత్సుకుండై యరుగుచున్న కుమారుని దుర్వృత్తి దివ్యదృష్టింజూచి శ్వేతకేతుఁడు నన్నుంజీరి నీ పుత్రుం డింకను నధోగతిం బొందునట్లు తోచుచున్నది. పశ్చాత్తాపంబునంగాని వాని చిత్తవృత్తి యుపశాంతి వహింపదు. నీవు వోయి వానికిఁ గర్మపరిపక్వ మగుదనుక నొకచోటఁ గట్టిపెట్టి యనుతాపము గలుగునట్లు చేయుము. వేగమ బొమ్మని యాజ్ఞాపించుటయు నేనీ కల్పన యంతయుం గాంచితిని.
క. నీవా చంద్రాపీడుఁడ
వావైశంపాయనుండె యౌ నీశుకమో
భూవర! మీ కిత్తరి శా
పావిలదోషావసానమై యొప్పుటచే.
మీ యిరువురును శాపావసానంబున సమముగా సుఖియింపఁ గలరని వీని నీచెంతకుఁ దీసికొనివచ్చితిని. లోకసంపర్కపరిహారమునకై చండాలజాతిం బ్రకటించితిని.
ఇప్పుడు మీ యిరువురును జన్మజరామరణాదిదుఃఖబహుళములగు శరీరముల విడిచి యథేష్టజనసమాగమసుఖంబుల ననుభవింపఁగలరని పలుకుచు నమ్మాతంగకన్యక మంజీరరవంబు ఘల్లురని మ్రోయఁ బాదంబులం నేలందట్టి యంతరిక్షమున కెగిరి యదృశ్యయై దివమునకుం బోయెను.
పిమ్మట నమ్మనుజపతి యయ్యువతి వచనములు వినినంత జాతిస్మరణ గలుగుటయుఁ గాదంబరిం దలంచుకొనుచుఁ గ్రమంబునఁ గాదంబరీవియోగసంతాపంబునం గృశించి కందర్పశరాసారఘాతంబునం దుదకుఁ గాలధర్మము నొందెను. ఆ చిలుకయు శాపావసానమైనది కావున నయ్యొడయనితో గూడ నయ్యొడలు విడిచినది.
అంత నక్కడఁ గాదంబరియు నొకవసంతకాలంబునఁ గామోత్సవంబు గావించి వాడుకప్రకారము ప్రాతఃకాలంబునఁ జంద్రాపీడుని దేహము నర్చించి యుత్సుకముతోఁ గంఠము గౌఁగలించుకొనినది.
అప్పు డమృతసేకంబునం బోలె నయ్యాలింగనసుఖంబునఁ జంద్రాపీడుఁడు మేనం బ్రాణములు జేరుటయు నాతపసంతాపంబున ముకుళించిన కలువ శరత్కాలకౌముదిచే వికసించినట్లు మెల్లన హృదయ ముచ్ఛ్వాసభాసురంబయ్యె. ప్రాతఃపరామృష్టెందీవరముకుళము మాట్కి కర్ణంతాయతమగు నయనయుగము విడినది. మోము పద్మవికాస వహించినది.
అట్లు నిద్రమేల్కాంచినట్లు లేచి చంద్రాపీడుఁడు మెడఁ గౌఁగలించి యున్న కాదంబరిని జిరవిరహదుర్లభములగు లోచనములచే గ్రోలువాడుంబోలెఁ జూచుచు గంఠంబు గౌఁగలించుకొని వాతాహతబాలకదళియుంబోలె వణంకుచుఁ గన్నులు మూసికొని తొట్రుపడుచున్న యాచిన్నదానికి మనోహరస్వరముచే నానందము గలుగఁజేయుచు నిట్లనియె.
బోటీ! నీవు వెరవకుము. నీకరస్పర్శంబుదగిలి నేను జీవించితిని. అమృతసంభవంబగు నప్సరఃకులంబున నీవు జనియించితివికదా. శాపదోషంబున నిన్నిదిన ములు మనకు వియోగంబు గలిగె. ఇప్పుడు త్వద్విరహదుఃఖప్రమాదమైన శూద్రకనృపశరీరమును విడిచితిని. ఇఁక నీకు సుఖముగలుగును. నీ ప్రియసఖి మహాశ్వేతయొక్క ప్రియుండు సైతము నాతోఁగూడ శాపవిముక్తి వడసె. నప్పఁడతియు సుఖించునని పలుకుచున్న సమయమందే నాగలోకమునుండి కపింజలుని కైదండఁ గొని పూర్వము మహాశ్వేత చూచినరూప మాకంఠమాల యాయక్షసూత్ర మాశాటీపటముతోఁ బుండరీకుఁ డచ్చోటికి వచ్చెను.
అప్పుడు దూరమునం దతనింజూచి కాదంబరి చంద్రాపీడుని వక్షమునుండి లేచి యతివేగముగాఁ బరుగిడి మహాశ్వేతను గౌఁగలించుకొని తదాగమనవృత్తాంతమును జెప్పెను.
అంతలోఁ బుండరీకుఁడును జంద్రాపీడునిచెంతకు వచ్చి యాలింగనము చేసికొనియెను.
చంద్రాపీడుఁ డతని బిగియఁ గౌగలించుకొనుచు, వయస్యా! పుండరీకప్రాగ్జన్మసంబంధంబున నీవు నా కల్లుడ వైతివి. ఎట్లయినను మనము తదనంతరజన్మసంబంధసముపగతమైన మైత్రిచేతనే వర్తింపఁదగినదని పలుకుచున్నసమయంబునఁ గేయూరకు డావార్త జిత్రరథహంసుల కెఱింగింప హేమకూటమునకుఁ బోయెను.
మదనలేఖయు వేగముగాఁబోయి యా ప్రాంతమునఁ దాపసవృత్తితో మృత్యుంజయ జపముచేయుచున్న తారాపీడుని పాదంబులం బడి చంద్రాపీడుఁడు జీవించిన వృత్తాంతమును జెప్పెను.
ఆ మాటవిని తారాపీడుఁడు విలాసవతితోఁగూడ నానందసాగరమగ్నుండై యత్యాతురముగా లేచి శుకనాశుఁడు తోడరాఁ మదనలేఖ వెంటఁ జంద్రాపీడుఁ డున్నచోటికిఁ బోయి యందు బుండరీకునిమెడఁ గౌఁగలించుకొనియున్న కుమారునింజూచి నానందబాష్పములు నేత్రంబుల గ్రమ్మ నపారసంతోషపారావారంబున మునుంగుచుఁ బుత్రుం గౌఁగిలించుకొనియెను.
తల్లియుఁ బాలిండ్లు స్రవింపఁ దనయుం జూచి సంతోషవివశయై యుండెను. అప్పుడు చంద్రాపీడుఁడు దల్లిదండ్రులకు నమస్కరించుచు శుకనాశునికి సైతము గేలుమోడ్చి యతని యాశీర్వాద మందుకొనుచు ఆర్యా! వీఁడే వైశంపాయనుఁడు చూడుమని పుండరీకుం జూపెను.
ఆ ప్రస్తావములోనే కంపిజలుఁడు సమీపింప శుకనాశుని కిట్లనియె.
ఆర్యా! శ్వేతకేతుండు మీ కిట్లు చెప్పమనియె.
ఈ పుండరీకుఁడు నాచేతఁ బెంపఁబడుటయే గాని నీకే పుత్రుండు. వీనికిని నీయందే ప్రేమగలిగియున్నది. కావున వీని వైశంపాయనుఁడే యనుకొని యవినయకార్యముల బ్రవర్తింపనీయకుము. పరుఁడని యుపేక్షింపకుము. వీఁడు నీవాఁడే యనియే శాపావసానమున సైతము నీయొద్దకే పంపితిని.
అదియునుంగాక మదీయంబగు సాత్వికతేజం బిప్పు డింతకన్న నుత్తమలోకంబునకుం బోవనున్నది.
అని యిట్లు శ్వేతకేతుని సందేశము కపింజలుండు చెప్పగా విని శుకనాశుఁడు వినయావనమ్రుఁడై యున్న పుండరీకు నంసంబు బట్టుకొని కపింజలున కిట్లనియె.
కపింజల! సర్వజ్ఞుండైన శ్వేతకేతుఁ డిట్టివార్త బంప నేమిటికి? నేస్తంబున నిట్టిమాట వినినచో సంతోషము గలుగునా? అందరకు నమ్మహానుభావుని యాశ్రయమే కావలయునని యిట్లు పూర్వజన్మసంస్మరణానురూపములైన యాలాపముల చేత నా దివసము గడిపెను.
అమ్మరునాఁ డుదయంబున గంధర్వకులనాయకులగు చిత్రరథహంసులు సపత్నీకులై పెక్కండ్రు పరిచారకులు సేవింప నచ్చోటికి వచ్చి యల్లుండ్రు గూఁతుండ్రం జూచి యెంతేని సంతసము జెందుచుఁ దారాపీడ శుకనాశులచే మన్ననల వడసి తాత్కాలోచితసంభాషణములచేఁ గొంత కాలక్షేపము చేసిరి.
అప్పుడు చిత్రరథుండు తారాపీడునింజూచి యార్యా! మిగుల వైభవము గల భవనములు గలిగియుండ నీ యరణ్యములో వర్తింపనేల? హేమకూటమునకుఁ బోవుదము రండని పలుకగా విని తారాపీడుం డిట్లనియె.
గంధర్వరాజా! ఎచ్చట నిరతిశయమగు సుఖముగలుగునో అదియే భవనము. ఇట్టిసుఖము నే నేభవనమునందును బొందియుండలేదు. అదియునుంగాక మదీయంబులకు భవనసుఖంబు లన్నియు నీ యల్లునియందే సంక్రమించినవి. నాకిఁక యరణ్యమే శరణము. వధూయుతముగా నతనినే తీసికొని వెళ్ళుమని పలుకగా విని చిత్రరథుండు సమ్మతించి యప్పుడ తారాపీడుని యనుజ్ఞవడసి చంద్రాపీడాదులతో గూడ హేమకూటమునకుం బోయెను.
అందు శుభముహుర్తమున సకలగంధర్వరాజ్యముల జిత్రరథుండు కాదంబరిని జంద్రాపీడున కిచ్చి వివాహము చేసెను.
హంసుండు నట్లే మహాశ్వేతనుఁ బుండరీకుని కిచ్చి పెండ్లిచేసెను. అట్లు చంద్రాపీడ పుండరీకులు గంధర్వరాజ్యములతో గూడ నచ్చేడియల స్వీకరించి యమ్మించుబోడులతోఁ గ్రీడించుచు దమ్మాశ్రయించుకొనియున్న యించువిల్కాని కాప్యాయనము గావించిరి. మఱియొకనాఁడు కాదంబరి చంద్రాపీడునితో ముచ్చటింపుచున్న సమయంబున నామె యతని కిట్లనియె.
ఆర్యపుత్రా! మనమందరము మృతిజెంది వెండియుం బ్రదికి యొండొరులము గలిసికొంటిమి. పత్రలేఖ సరస్సులోఁ బడి తిరిగివచ్చినది కాదు. ఆమె వృత్తాంత మెట్టిదని యడిగిన విని చంద్రాపీడుఁ డిట్లనియె. ప్రేయసీ! నా భార్యయగు రోహిణియే పత్రలేఖ. నేను బుండరీకునిచే శపింపఁబడి పుడమి జనించుచుండుటఁ జూచి నన్ను విడువలేక నా శుశ్రూషకై నాకన్న ముందుగనే భూమియం దుదయించినది. అంతకుఁ బూర్వము నేనును నెఱుఁగను. శాపాంతమైనది కావున నిప్పుడంతయు స్ఫురించుచున్న దని యెఱింగించెను.
చంద్రాపీడుఁడు పుండరీకునితోఁ గూడికొని కొన్ని దినంబు లుజ్జయిని యందును, కొన్నిదినంబులు హేమకూటమునందును, గొన్నిదినంబులు చంద్రలోకము నందును, గొన్నిదినంబులు లక్ష్మీసరస్సునందు వసించి దివ్యభోగము లనుభవించు చుండెను.
అని యెరింగించి మణిసిద్ధుండు గోపా! నీవు చూచిన చిత్రఫలకములోని యాకృతులు వీరివే. కాషాయవస్త్రము గట్టికొని గుహాప్రాంతమున నిలువబడినది మహాశ్వేత. చంద్రాపీడుని విగ్రహము నర్చించుచున్నది కాదంబరి. అది మదనలేఖ. అది తరళిక అని యా వృత్తాంతమంతయు నెరింగించుటయు నాలకించి యగ్గోపకుమారుండు సంతుష్టాంతరంగుఁడై యయ్యవారి ననేకప్రకారములఁ గైవారము సేయుచు నతనితోఁగూడఁ దదనంతరావసధంబుఁ జేరెను.
క. కాదంబరీరసం బా
స్వాదించిన నించుకంత పరవశులై సం
మోదింతురు జనులనఁ ద
న్మాధుర్యం బెఱుకపడదె మరి విబుధులకున్.
గీ. బాణకవిచేత రచియింపఁబడియెఁ గొంత
యతనిసుతుచేతఁ బూరితమయ్యెనంత
మదియు నిదియుఁ గథాసంగ్రహంబు దప్ప
కుండఁ దెనుగించినాడ గద్యోపసరణి.
క. నీకర్పించితి నీకృతి
గైకొనుమా బాలచంద్రకలితలలితఫా
లా! కాశీలోలా? శై
లాకర శుభకర మహేశ హరవిశ్వేశా!
గద్యము
ఇది శ్రీమద్విశ్వనాథ సదను కంపాసంపాదిత కవితా విచిత్రాత్రేయ
గోత్ర పవిత్ర మధిర కులకలశ రాకా కుముద మిత్రాలక్ష్మి
నారాయణ పౌత్ర కొండయార్య పుత్ర విబుధ జనాభి
రక్షిత సుబ్బన్న దీక్షతకవి విరచితంబగు కాశీ
యాత్రా చరిత్ర మను మహాప్రబంధ
మున నుత్తర ఖండానుబంధమను
నామాంతరముగలయాంధ్రీ
కృతకాదంబరి
సంపూర్ణము.
శ్రీ విశ్వేశ్వరార్పణమస్తు.
- ↑ శ్లో॥స్తనయుగమశ్రుస్నాతం సమీపతరవర్తిహృదయాశోహాగ్నేః॥
- ↑ శ్లో॥ దూరంముక్తాలతయా బిససితయాప్రలోభ్యమానోమె
హంసఇవదర్శితాశో మానసజన్మా త్యయానీతః.
తా. ముత్తెపుపేరును చూచి తామరతూడనుకొని యాసతో దూరముగాఁ బోయిన హంసవలెనే నీ చేత నా మనోరథము దవ్వుగా దీసికొని పోబడినదని తాత్పర్యము. - ↑ ఇంతవరకు రచించి బాణకవి స్వర్గస్థుఁడయ్యెను. తరువాతఁ జివరకు నతని కుమారుఁడు రచించెను.