కాశీమజిలీకథలు/అయిదవ భాగము/54వ మజిలీ

శ్రీరస్తు

కాశీమజిలీ కథలు

54 వ మజిలీ

సప్తమోల్లాసము

అందు మహాకాళనాధు సేవించి తదాలయమున వసియించియున్న సమయంబున హరదత్తుండనువాడు శిష్యులకు వేదాంత ముపదేశించు నీలకంఠుండను తన గురువునొద్దకు జని యల్లన నిట్లనియె.

నీలకంఠుని కథ

ఆర్యా! నీవు వ్యాససూత్రములకు శైవపరముగా భాష్యము చేసియుంటివి. ఇప్పుడు శంకరుండను సన్యాసి భట్ట మండనాది ప్రౌఢ పండితులం జయించి శిష్యులగా జేసికొని వారితోఁగూడ దిగ్విజయము చేయుచు నిన్ను జయించు తాత్పర్యముతో నీయూరుచేరి మహాకాళుని యాలయములో వసియించియున్నాడఁట. అతండు అద్వైతపరముగా సూత్రభాష్యముఁజేసి దేశమెల్లెడల వ్యాపకము చేయుచున్నాడుఁట ఇప్పుడు మనసూత్రభాష్యమును ఖండించుననియు వాదమునకై రప్పింప వలయుననియుఁ దచ్చిష్యుఁ డొక్కడు నాతోఁ జెప్పినాఁడు వానిశిష్యులే లోకాతీతులని వింటిని. తరువాతి కృత్యము మీరే యోచించుకొనుడని పలికిన విని శైవాగ్రేసరుఁడైన నీలకంఠుం డిట్లనియె.

హరదత్తా! నీవిట్లు పిరికితనముగా మాట్లాడుచున్నావేమి? నా సామర్ధ్యము మఱచితివా? పరపక్షార్కములైన తర్కములచే నిప్పుడే వాని వివశుం గావింపుచుండ నీవే చూతువుగా వినుము.

శా. పారావారజలంబులెల్ల గడు దర్పంబొప్ప నింకింప నీ
    ధీరుండై దివినుండి భాస్కరుని ధాత్రింద్రెళ్ళద్రొబ్బింప నీ
    ధారాళంబుగ నాకసంబు నురువస్త్రంబట్లుకైఁజుట్ట నీ
    సారప్రజ్ఞుననుంజయింప యతికిన్ శక్యంబుగా దెన్నఁడున్.

అని బీరములు పలుకుచు నత్యంతకోపాటోపంబున బయలుదేరి రుద్రాక్ష మాలికావిరాజితకంఠుండై నీలకంఠుండు శిష్యులతోఁగూడ శివాలయంబున కరిగి యంద నల్ప తేజఃపుంజంబున రెండవ శంకరునివలె నొప్పు శంకరుంగాంచి విస్మయహృదయుఁడై వాదసన్నద్ధుండై యున్న సమయంబున సురేశ్వరుం డాచార్యున కిట్లనియె.

స్వామీ! మీరు క్షణకాలము విశ్రమింపుఁడు. ఈ నీలకంఠుఁడు మించినవాఁడుకాఁడు. వీనిం ద్రుటిలో బరిభవించి యంపెద. మదీయ వాదశక్తిఁ జూతురుగాక యని పలికిన విని నీలకంఠుం డీసుతోఁ జురచురం జూచుచు సురేశ్వరున కిట్లనియె.

అయ్యారే ! సురేశ్వర ! లజ్ఞావిహీనుండవై యీ సభాముఖంబునఁ దలయెత్తి యెట్లు సంభాషింపు చున్నావో విచిత్రమగుచున్నది. సన్యాసితో వాదించి తానోడుటయేకాక భార్యనుగూడ సభ యెక్కించియు గెలుపుఁగొనక దాసుండవై యతని వెంటం దిరుగుచున్న నీవా నాతో వాదించుట ? ఏమి నీయద్వైతనిష్ఠత. మొన్నటివఱకుఁ గర్మవాదివై బలవంతమున సన్యాసి వైతివి. పోపొమ్ము. నీవు సంభాషణార్హుండవుకావు. రెంటికిం జెడితివని పలుకుచు శంకరున కభిముఖుండై నిలువఁబడియెను.

అప్పుడయ్యతిపుంగవుం డోహో ? నీలకంఠా ! నీవీ సురేశ్వరుని ప్రజ్ఞ యెఱుంగక చులఁగఁదూలనాడితివి. కానిమ్ము. నీకే విద్యయం దభిమానమో చెప్పుము. నీవు వ్యాససూత్రములకు శివపరముగా భాష్యము జేసినావఁట యేదీ నీ భాష్యము చూచి యభినందింతుమని పలికిన విని నీలకంఠుండు తన భాష్యమును చదివి వినిపించెను.

అప్పుడు శంకరాచార్యుండు పరపక్షబిసావళీ మరాళంబులగు వచనంబులచే నతనిభాష్యమును శతధాఖండించి యతనిచేతనే దానినిఁ బూర్వపక్షమైనదానిఁగా నొప్పించెను.

అప్పుడు నీలకంఠుండు స్వపక్షరక్ష జేసికొనలేక చింతించుచు శంకరకృత మగు సూత్రభాష్యము నిట్లు పూర్వపక్షము చేయఁబూనెను

యతీంద్రా ! మీరు తత్త్వమస్యాది నగమాంత వచనములచేఁ దేజస్తిమిరములకుంబోలె విరుద్ధధర్మములుగల జీవేశ్వరులకైక్యమును జెప్పుచుందురు. అది యసంగతము.

మూఢత్వాదిగుణవిశిష్టుండగు జీవుండు సర్వజ్ఞత్వాది గుణ సమంచితుండగు నీశ్వరుం డగుట యెట్లు ? ఇది శుద్ధావివేకము. అద్వైతము బౌద్ధమతమువంటిది.

అని యిట్లనేక యుక్తిప్రయుక్తులచే నద్వైతసూత్ర భాష్యమును బూర్వ పక్షము సేయుటయు నవ్వుచు శంకరాచార్యుం డిట్లనియె.

నీలకంఠా ! నీ యకుంఠితపాండిత్యప్రౌఢిమ యంతయు దేటపడినది. మదీయ భాష్యము సురేశ్వరుని యొద్దఁ బాఠముఁ జదువుకొనిన నీకు మంచిబుద్ధి గలుగును. ఇంతకన్న బ్రౌఢములైన పూర్వపక్షముల ద్వైతమతముపై జేయబడినవి. వాని కన్నింటికి సమాధానములు సైతము చెప్పియుంటిమి. తత్పూర్వపక్ష సిద్ధాంతము లన్నియు మా భాష్యమున దేట తెల్లముగా వ్రాయఁబడియున్నవి. అవి యన్నియు నీవు చదువుకొనుము. చక్కగాఁ దెలియగలవు. జీవేశ్వరుఁ కు వాచ్యార్థముచే విరుద్ధధర్మ ములు గలిగియున్నవి. కాని లక్షణార్ధముచే లేవు. చిత్స్వరూపదాసామ్యంబున నిరువురకు నభేదమే చెప్పదగినది. పెక్కులేల? నీ శంకలన్నిటికి మామక భాష్యమందే సమాధానము చెప్పఁబడియున్నది. సురేశ్వరా ! వినుపింపుమని పలికిన నప్పండితుండు భ్రూభంగవిక్షేపంబున నతని నాక్షేపించుచు నందుఁగల పూర్వపక్ష సిద్ధాంతములన్నియు నీలకంఠునికిఁ జదివి వినిపించి చక్కగా బోధించెను.

అప్పుడు నీరకంఠుఁడా భాష్యమును విని సిగ్గుపడి గర్వముతో గూడఁ దనభాష్యమును విడిచి శంకరాచార్యుని చరణసరసిజముల శరణుఁ బొందెను.

అట్లు శంకరాచార్యులు నీలకంఠుని జయించిరనువార్త విని యద్వైతమత విరోధులగు నుదయనాదిపండితులు భయపడి విదేశములకుం బాఱిపోయిరి.

పిమ్మట శంకరాచార్యులు సౌరాష్ట్రాదిదేశముల కరిగి యందందు దన భాష్యమును వ్యాపకముఁ జేయుచు విబుధ ప్రశస్యమానుండై ద్వారవతీపురి కరిగెను.

అందుఁ బాంచరాత్రులను వైష్ణవమతవిభేదులు దప్తశంఖచక్రాకృతి వ్రణపూరితావయవులరై యొప్పుచుందురు. వారెల్ల స్వమతాధిక్యమును బ్రతిష్టించు తలంపుతో గుమిగూడి వాదమునకు వచ్చునంత విచ్చలవిడిఁ బద్మపాదాశిష్యవరు లతి ప్రగల్భవాక్యోపన్యాసముల గజయూధంబుల సింహపోతంబులట్ల యప్పాంచరాత్రుల నెల్లఁ బటాపంచలఁ గావించిరి.

అట్లు జగద్గురుండు శాక్త్రశైవవైష్ణవసౌర గాణపత్య కాపాలిక ప్రముఖప్రౌఢ మతంబుల ఖండించి తన్మతస్థుల నద్వైతబోధచే నుద్దరించి పంచపూజాపరాయణులం గావించిన కతంబున నమ్మహ్మాతునికి షణ్మతోద్ధారకుండని బిరుదమువచ్చినది. పదంపడి భట్టభాస్కరుం డుద్దండ పండితుండని విని యతనితో వాదించుతలంపుతో నగ్గురుం డుజ్జయినీపురంబున కరిగి యందుఁ గాళీశ్వరుని యాలయంబునఁ గళ్యాణమంటపంబున విశ్రమించి పద్మపాదుంజూచి వత్సా! మనరాక భట్టభాస్కరున కెఱింగించి రమ్ము. అతం డిందుఁ బ్రౌఢవాదియని పలికిన విని సమ్మోదమేదుర హృదయుండై యతండరిగి విబుధకులావతంసభూతుండును పునఃపునర్వ్యాకృతనిగమ సంఘాతుండును ప్రతివాది ధ్వాంత భాస్కరుండునగు భట్టభాస్కరుంగాంచి యర్చితుండై స్వాగతపూర్వకముగా నాగమనకారణం బడుగఁబడి గంభీరస్వరంబున -

సీ. కుమతవాద్యున్మత్త కుంభికంఠీరవుం
            డాగమశీర్ష తత్త్వార్థవేది
    దర్శితాద్వైత విద్యారహస్యవిశేషుఁ
            డఖిలదిక్చయతడ వ్యాప్తకీర్తి
    యంగభూగర్వప్రభంగ పావనమూర్తి
            ప్రౌఢార్ధయుత సూత్ర భాష్యకర్త

    ఘనవాదవిజిత పంకజ భూకళత్రుండు
           సమధికారుణ్య సాగరుండు

గీ. సకలవేదపురాణ శాస్త్రప్రసంగ
   చతురమతి శంకరాచార్య చక్రవర్తి
   వచ్చియున్నాఁడు నీతోడి వాదమునకు
   భట్టభాస్కర ! రమ్ము నీ ప్రజ్ఞఁజూప.

గీ. అధమభాష్యంబులెల్ల జక్కాడి యతఁడు
   ప్రౌఢిరచియించె నద్వైత పరముగాఁగ
   సూత్రభాష్యంబు దానికి సుమతి సమ్మ
   తింతువేని శుభంబు కాదేని వినుము.

క. రూఢస్మదుగ్రతర్క
   ప్రౌఢో క్తిస్వరుని సాత పరిఘాతములన్
   గాఢముగఁ ద్రెళ్ళికుందఁగ
   మూఢాభవనీయపక్షములఁగావుమిఁకన్.

అనుటయు నమ్మాటలాలించి భట్టభాస్కరుం డించుకయలుక మొగంబునం దీపింప మందహాసముఁ జేయుచుఁ బద్మపాదున కిట్లనియె.

చ. ఎఱుఁగరుమీరు మామక సమిద్దకథా విభవంబొకింత పెం
    పఱఁ బరకీ ర్తిచంద్రికల నర్కునికైవడి మాపిదేశముల్
    దిరిగి సుధీజనో త్తముల దిక్కురితుల్యుల శాస్త్రవాద సం
    గరమున నోడఁబుచ్చిన యఖండుఁడ నాకడనే ? ప్రతాపముల్.

ఉ. అక్కపిలప్రలాపముల నల్పముగాగణియింతు నెంతయున్
    లెక్కఁగొనం గణాదునవలీలగనెన్నుదు పక్షపాదు ని
    న్మిక్కిలిసర్వశాస్త్రపరి విష్టితబుద్ధి వినేయ ! యిట్టినా
    చక్కినుతింతు వాధునిక సాధుయతింబలుశాస్త్రవేత్తగాన్.

అన విని పద్మపాదుండు నవ్వుచ్చు -

గీ. అవనిభృత్కోటి విదళించు నట్టిటంక
   మించుకయు వజ్రమణిని భేదించనోప
   నట్లునీవెట్టి గురుమతి వైన నమ్మ
   హాత్ము గెలువఁగలేపు విద్యార్థివగుము.

క. పలుపలుకులేల నీకే
   తెలియఁబడుగావె తత్సుధీవరు విద్యా
   బలముదినుచు రుచులడుగఁగ
   వలయునె వడిలేచి భట్టభాస్కరా! రమ్మా !

అని యత్యంతావహేళనపూర్వకముగాఁ బలికిన భట్టభాస్కరుండౌరా ? యెంతెంతమాటలాడుచుంటివి. పోపొమ్ము. మేము వచ్చుచున్నామని శిష్యులతోఁగూడ శంకరాచార్యు నొద్ద కరిగెను.

పిమ్మట భాస్కరమస్కరి ప్రవీరులిరువురు వాదమునకుఁ బూనికొని వీరాలాపములాడుకొనుచు నొండొరుల నాక్షేపించుకొనుచు వాక్యచాతుర్యంబులం జూపుచు సకలశాస్త్రప్రవీణతఁల గాన్పించుచు యుక్తిపాటవంబులఁ దేటపరచుచు నన్యోన్యమత ఖండనంబులఁ గావించుచు మతాంతరంబు నిందించుచుఁ బ్రకృతిపురుషుల భేదమును గురించియు జీవేశ్వరుల యభేదమునుగురించియు మూడహోరాత్రంబు లేకరీతిఁ బ్రసంగము గావించిరి.

అందు భట్టభాస్కరుని ప్రౌఢవాక్యములతోవిదానంబులు పెనుగొనంగ యతి పురందరుండు యుక్తికౌక్షేయకముల ఖండింపుచు నుద్దండపాండిత్యప్రకర్ష తేటపడఁ గ్రమంబున నతని నిరుత్తరం గావించెను.

అట్లు యుక్తిశతములచే భట్టభాస్కరుని వశపరచుకొని శంకరయతి సార్వభౌముండు శ్రుతిభావవిరోధములగు విమతగ్రంథముల నెల్లను న్యూలించెను.

దుర్మతవాదియగు భట్టభాస్కరుండట్లు శంకరునిచేఁ బరాజితుండగుట విని తద్దేశవాస్తవ్యులైన బాణమయూవాది పండితులాచార్యు నాకర్ణించి యనుమోదించి శిష్యత్వము వహించి యరిగిరి.

పిమ్మట నమ్మహాత్ముండు బాహ్లికదేశమున కరిగి యందుంగల కుమత వాదుల ఖండించి యనంతరము నైమిశారణ్యముకరిగి యందుఁగల తాపసుల కామోదముఁ గలుగఁజేసెను.

తరువాత నాపరివ్రాట్సేఖరుండు దరదభరత శూరసేన కురుపాంచాలాది దేశములకరిగి యందుఁగల పండితులనోడించి తనభాష్యమును వ్యాపకముచేయుచుఁ గ్రమంబున ఖండనకారుండగు శ్రీహర్షు నొద్ద కరిగెను. అప్పండితుండు ప్రభాకర భట్టపాద భట్టభాస్కరాది నూరివరేణ్యుల లెక్కగొనకఁ గర్వించియున్నమేటి. అట్టి ఖండకారుని బటుయుక్తి పరంపరలచే నూచియూచి వశంవిదునిగాఁ జేసికొని యయ్యతి చక్రవర్తి యచ్చటనుండి కామరూపములను దేశవిశేషములకరిగి యందు శాక్తభాష్యము రచియించి ప్రసిద్ధినొందియున్న యభినవగుప్తుఁడను పండితుని వాదమునకుఁ జీరినంత నతండాత్మీయ శిష్యులతో నిట్లని విచారించెను. అభినవగుప్తుడు - శిష్యులారా! శంకరసన్యాసి యిప్పుడు మన గ్రామము వచ్చి యాలయములో వసియించి యున్నవాఁడఁట. వాదమునకు రమ్మని యిప్పుడే పిలిచిపోయెను, ఏమి చేయవలయును.

శిష్యు - శాక్తభాష్యము రచించి జగత్ప్రసిద్ధి వహించిన ధన్యుఁడవు. ఆ సన్యాసి నిన్నేమిచేయఁగలఁడు. నీపేరువినినంత నీదేశవాస్తవ్యులెల్ల జడియుచుందురే. అట్టినీవాతనితో వాదించి గెలుపుగొనుట యేమి యాశ్చర్యము !

అభినవ — అతండు సామాన్యుడుకాఁడు భట్టపాదమండనమిశ్ర నీలకంఠ భాస్కరాది పండితులనోడించి దిగ్విజయము చేయుచున్నాఁడు. నేనకాదు. వేదాబ్జబాల భాస్కరుండగు నామస్కరీంద్రునితో సమముగా వాదించు పండితుడీ మూడులోకములలో లేఁడు.

శిష్యులు — అయ్యో యీదేశమున మనకుఁగల ప్రఖ్యాతి చెడిపోవుచున్నదే. ఇఁక మనలను మన్నించువారెవరు? భవదీయ మంత్రశక్తి యంతయు వృథగాఁ బోవలసినదే?

అభినవ — అట్లుచేసిన లోకాపవాదవహింతుము. కపటోపాయంబున లోక కంటకుండైన వీనింబరిమార్చుట యుచితము మదీయ మంత్రసామర్ధ్యంబుజూతురుగాక యతనికి శిష్యుఁడనై వెనువెంటఁదిరుగుచుఁ బ్రాణంబులం గ్రోలెదను. ఈ మాట హృదయంబుల నుంచుఁడు.

అని యాలోచించుకొని యభినవగుప్తుండు శిష్యునితోఁగూడ శంకరాచార్యు నొద్దకరిగి దదీయపాదంబులంబడి మహాత్మా! నేనభినవగుప్తుండ. నిప్పుడు నీకుఁ బ్రియ శిష్యుండనైతి. నీ ప్రభావము లోకాతీతమైనదానిఁగా వినుచుంటిని. భవదీయదర్శనాభి లాషినై యున్నవాఁడనేఁగా కృతార్ధుండనైతినని యనేక ప్రకారముల వినుతించెను.

అప్పుడాచార్యులు ఓహో అభినవగుప్తా ! నీ ప్రఖ్యాతిఁజాల దూరమునుండి వినుచుంటిమే. ఏది నీవు శాక్తభాష్యము చేసితివఁట వినిపింపుమనుటయు నతండు, స్వామీ! చంద్రుఁడులేని సమయమునఁగదా నక్షత్రములు ప్రకాశించునవి. భవదీయ భాష్యార్కబింబము వెలుగుచుండ క్షుద్రగ్రంథాంధకారంబులు నిలువఁబడునా ? నా భాష్యము దేవర చూచుటకుఁ దగదు వినేయుని శిక్షింపుడని వేఁడుకొనియెను.

తృణచ్ఛన్నకూపమగు నద్దురాత్ముని కపట మెరుంగక శంకరాచార్యులు శిష్యునిగా నంగీకరించి యతండు తొడరా మరియు నంగవంగ కోసలాదిదేశముల కరిగి యందుగల కుమతంబుల ఖండింపుచుఁ గ్రమంబున గౌడదేశమునకుం బోయిరి.

అందుఁ బ్రసిద్ధులైన మురారిమిశ్ర ధర్మగుప్తమిశ్రోనయనాది పండితుల నుద్దండవాదంబున నోడించి తనకీర్తి వారిచేఁ గొనియాడింపఁజేసెను. అట్లు శంకరయతి సార్వభౌముండు భూమండలమెల్లఁదిరిగి కుమతకంటక లతావితానంబుల నున్మూలించి యాత్మీయయశోవసరాంకురముల నాటించి సర్వజనులద్వైతమతావలంబకులం గావించి విరాజిల్లుచున్న సమయంబున నభినవగుప్తుండు వెనువెంటఁ దిరుగుచు తదుచ్ఛ్రయముఁ జూడనోపక రహస్యముగా నాభిచారిక హోమముఁ గావించి వైద్యులకు మానుపశక్యముకాని భగందరరోగమానిస్సంగు నకు జనించునట్లు ప్రయోగముచేసి యామాంత్రికుం డెందేనింబోయెను.

అమ్మరునాఁడే యావ్యాధి యమ్మహాత్మునిఁ బీడింపఁ దొడంగినది. సంతత శ్రోణీతస్రావంబున శాటీపటంబు పంకిలంబగుటఁజూచి తద్వస్త్రంబు లుదుకుతోటకాచార్యులు పరితపించుచు నత్తెఱంగు పద్మపాదాదిశిష్యుల కెరింగించెను.

అప్పుడయ్యంతేవాసులెల్ల జింతాక్రాంతస్వాంతులై విలపించచు దద్బాధం బరిగణింపక యుపేక్షించియున్న గురువరుం బ్రార్థించి తదనుమతిఁ బెక్కండ్ర రాజ వైద్యులం దీసికొనివచ్చి చికిత్సలం జేయించిరి. కాని యించుకయు బ్రయోజనము లేక పోయినది. తద్వ్యాధికృతంబగు పరితాపంబు క్రమంబునఁ బ్రబలుచుండుటఁజూచి యాచార్యుండు సకలార్తహరుండగు పురుహరు భక్తివివశుండై స్మరించెను.

భక్తజనవత్సలుండగు వృషభరంగుండు కరుణాపూరితాంతరంగుండై తద్వ్యాధి మాన్ప నశ్వినీదేవతల నాయనయొద్ద కనిపెను. ఆ దేవవైద్యులు బ్రాహ్మణ వేషంబులతో వచ్చి తచ్ఛిష్యులచే నర్చితులై యారోగము పరీక్షించి యోహో! యీ వ్యాధి శాక్తికప్రయోగమువలనం జనించినది. చికిత్సకు సాధ్యమైనదికాదు. ప్రయోగమునకు ప్రతిప్రయోగమే వైద్యమని చెప్పి యాసురవైద్యు లరిగిరి.

అప్పుడు పద్మపాదుండు ముప్పిరిగొను కోపముతో నోహో మదీయ గురు నట్లు రోగపీడితునిఁ జేసిన పాపాత్ము నిప్పుడే ముప్పు నొందించెదఁగాక. అయ్యో! దీని ప్రవృత్తి దెలిసికొనలేక యిన్నాళ్ళుపేక్ష గావించితిగదా; ఈ సాధుశిరోమణి నిష్కారణమట్లు బాధించిన క్రూరుని శిరము నూరువ్రక్కలు చేయకుందునాయని చింతాక్రోధంబులు హృదయంబునవేధింప నప్పుడే నియమము వహించి స్వాభీష్టదేవత యైన నారసింహదేవుని సమంత్రముగా నారాధించెను.

తదారాధనా విశేషంబునం జేసి యమ్మరునాఁడే యభినవగుప్తుఁడారోగము చేతనే పీడింపఁబడి హతుండయ్యెను. శంకరాచార్యులును స్వస్థులైరి. బుద్ధిపూర్వకముగా మహాత్ముల కపకారము గావించినవాఁడు చెడిపోవక సుఖించునా !

గౌడపాదముని దర్శనము

అట్లు రోగవిముక్తుండై శంకరాచార్యు లొకనాఁడు గంగానదీ సైకతంబునఁ గూర్చుండి నిలకణార్ద్రవాత పోతంబులు మేనికి హాయి సేయ నాత్మధ్యానము సేయుచున్న సమయంబున.

మ. శుకశిష్యుండు తపోధనుండు సకల శ్రుత్యర్థపారంగతుం
     డకలంకాత్ముఁడు గౌడపాదముని హస్తాగ్రప్రదీప్తాక్ష మా
     లికసోణాంబుజమమన్ భ్రమన్ భ్రమరముల్వేష్టించిరాద్రిప్పుచున్
     బ్రకటప్రజ్ఞయతీశ్వరుంగ నెడు తాత్పర్యంబుదీపింపఁగన్.

అచ్చోటికి విచ్చేయుటయుంగాంచి హర్షపులకాంకితశరీరుండై యాచార్యుండు శ్రద్ధాభక్తీపూర్వకముగాలేచి తదీయ పాదవంకేరుహంబులపై వ్రాలి కన్నుల కద్దికొనుచు యధావిధి నర్చించి నిటలతట ఘటితాంజలిపుటుండై యెదుర నిలువబడుటయు.

శా. క్షీరాంభోనిధివీచికానిచయనా చివ్యాంచితా పాంగ నీ
    క్షారాశిన్ యతిశేఖరుం దడువుచు న్సౌహార్ధ మేపారగం
    భీరప్రక్రియగౌడపాద యతిరా డ్వేదండుఁడు ద్యద్రద
    స్పారశ్వేతరుచిప్రకాశముల నాశల్వేల్గఁబల్కెంగృపన్.

మ. కుతుకంబొప్ప మదిండలం తెయనఘా! గోపిందతీర్దోప దే
     శితవిద్యం బరతత్త్వ మేమరవుగా సేవించునే శిష్య సం
     తతితత్త్వ గ్రహణేచ్చ నిత్యరిపులం దండింతువేశాంతి దాం
     తితితీక్షాదిగుణంబులందగుదె సాధింతేసదా యోగమున్.

వ. అని యయ్యద్వైతాచార్యవర్యుండు ప్రేమానుబంధపూర్వకముగా నడుగుటయు శంకరయతీంద్రుడు భక్త్యుద్రేకమున గనుల నానందబాష్పంబులు గ్రమ్మ శిరంబున నంజలిపట్టి యల్లన నిట్లనియె.

ఆర్యా! మీరడిగినట్టి దంతయు నేల సిద్ధింపకుండెడిని? కారుణ్యాబ్ధియగు మీ కటాక్షపాత్రుండగు జంతువునకు దుర్లభం బేమియున్నది? భవదపాంగాలోకన ప్రసారమాత్రంబుననే మూగ వక్తయగుంగదా. మందుండు పండితుడగును. పాపాచారమతుండు సుకృతులలో గణింపబడును. కామాసక్తుడు నిస్పృహులలోఁ గీర్తి మంతుడగును. ఆహా ! సీమాతీతమగు భవన్మాహాత్మ్య లేక మగ్గింప నెవ్వనికిని శక్యంబగును ? జాతమాత్రంబుననే విరక్తినొందిన శుకమహర్షికి బ్రియశిష్యుండవైన మహాను భావుండవు. జ్ఞానపాధోనిధివి. ఇట్టి నీపాదద్వంద్వము మదీయ నేత్రగోచరమయినది. మామకభాగథేయ మమేయమైనదని వక్కాణింపనేల? యని యనేక ప్రకారంబుల బొగడిన నమ్మహాత్ముం డిట్లనియె. వత్సా! శంకర ! నీవు మిగుల గుణవంతుడనియు శాంతిమతి వనియు సాధుతత్త్వవేది వనియు మత్కారికావారిజ జగద్బంధువులగు భాష్యాది ప్రబంధములఁ బెక్కు గావించినాడవనియు నీగురుండగు గోవిందతీర్థుం డెఱింగింప విని సంతసించి నిన్నుఁ జూచు తాత్పర్యముతో నరుదెంచితి. నీరచించిన గ్రంథంబుల వినిపింపుమని యడిగినంత శంకరాచార్యులు.

గీ. గరీమమాండూక్యగతములౌ గౌడపాద
   కారికాభాష్యమును వేదసారభాష్య
   మను విశేషించి యమ్మహామునివరునకు
   జదివి వినిపించె శంకరాచార్యుడపుడు.

క. మాండూక్యభాష్యంబులు
   రెండును బఠియింపగా బరిస్ఫుటగతి న
   ప్పండితవర్యుడు విని ముది
   తుండై కరమాప్రశిష్యుతో నిట్లనియెన్.

గీ. అనఘ ! భవదీయభాష్యము లస్మదీయ
   కారికాభావభేదము ల్గామిజేసి
   సరగదచ్చ్రరణోత్థ హర్షంబునీకు
   వరమొసగనన్ను బ్రోత్సాహ పరచుజూవె.

వ. కావున నీ యభీష్టం బెయ్యది తెలుపుమని యడుగుటయు శంకరుం డార్యా ! శుకమహర్షి తుల్యుండగు నీవు సంతసించి ప్రత్యక్షమై వరంబడుగుమని కోరితివి. ఇంతకన్న వరంబేమియున్నది? నీవే భగవంతుడవు గదా! అయినను వలదన నేల ? మదీయ మానసం బెప్పుడు పరతత్త్వ చింతనమం దాసక్తి గలిగియుండునట్లను గ్రహింపుము. ఇదియే నాయభీష్టమని పలికిన సంతసించుచు గౌడపాదమహర్షి యవ్వరం బొసంగి యింతర్హితుం డయ్యెను.

పిమ్మట శంకరయతీంద్రుండా వృత్తాంతం బంతేవాసుల కెఱింగింపుచు నారాత్రి వెళ్ళించెను. అమ్మఱునాఁడు ప్రాతఃకాలంబున శిష్యులతోఁగూడ నయ్యతిపుంగవుండు గంగానదియందు నిత్యక్రియా కలాపములు దీర్చుకొని తత్తీరంబులఁ గూర్చుండి నిదిధ్యాసనలాససుండైయున్న సమయంబున

సీ. పుడమియంతటికి జంబూద్వీపముత్తమ
            మందు భారతవర్ష మధికమందుఁ
    గాశ్మీరదేశము గడుప్రశస్తము శార
            దాపీఠమచ్చోటఁ దనరుకతనఁ

    దచ్చారదానిశాంతమునకు నాల్గు వా
            కిళులొప్పు నాల్గుదిక్కుల విభుధులు
    గాచుచుందురు వాని ఘనపరీక్షలఁదేరి
           సర్వజ్ఞుఁ డవ్వరాసనమునెక్క.

గీ. వలయు నితరుల కదిచేర నలభిగాదు
    దాక్షిణాత్యులలో సమర్థత వహించు
    పండితుఁడు లేమిజేసి తద్వారగత క
    వాటములు మూయఁబడియుండు వరుసనెపుడు.

అని యెవ్వరో చెప్పుకొన నవ్వార్త నాలించి పద్మపాదుండు గురునితో, స్వామీ! కాశ్మీరదేశమున శారదాపీఠమొకటి యున్నదఁట అద్దేవతామందిరమునకు నాలుగు వాకిళులు గలవఁట? అందు దక్షిణద్వార కవాట మెప్పుడును మూయబడి యుండునఁట. సర్వజ్ఞుఁడుకానివాఁడా పీఠము ధరింజేరలేఁడఁట. అందుఁ బెక్కండ్రు కుమతవాదులు కాచివచ్చిన పండితునిఁ బరీక్షించుచుందురఁట. అప్పీఠాధిరోహణమునకు దేవరయే సమర్థులు. వేగమ యచ్చటికిం బోవలయు నిన్నిదినములీవార్త మనకేమిటికిఁ దెలియకున్నదోగదా.

అవ్వరాసన మెక్కితిరేని భవదీయ దిగ్విజయయాత్రకు బూర్ణఫలంబగునని చెప్పిన విని శంకారాచార్యులు సంతసించుచు నప్పుడే కదలి శిష్యులతోఁగూడ నక్కాశ్మీరదేశమున కరిగి యందు -

శా. వేదాంతోరువనాశ్రయంబు విలస ద్విజ్ఞానరూపంబు డు
    ర్వాదివ్రాతగజేంద్రకుంభదళన ప్రఖ్యాతవిస్ఫార వి
    ద్యాదంష్ట్రాభయదంబు శంకరమహా హర్యక్షమేతెంచెఁ బొం
    డో దూరంబుగ క్షుద్రజంతువుల చెండుని ద్వైతకాంతారమున్.

అని శిష్యులు వేత్రపాణులై విజయనాదంబులు సేయుచు ముందునడుచు చుండఁ గ్రమంబున శారదామందిర దక్షిణద్వారంబుఁ జేరంజని కవాటం బుద్ఘాటించి లోనఁ బ్రవేశింపఁ బ్రయత్నము చేయుచున్న సమయంబున నందున్న వాదిగణ మడ్డమువచ్చి -

శా. ఏమీ ! సంభ్రమ మిట్లు సేసెదవు నీ వెవ్వాఁడవో కార్య మిం
    దేమైనంగలదేని చెప్పుమొగి నీ వీరీతి వ్యగ్రక్రియా
    సామర్థ్యంబు వహింపఁ జక్కబడునే సత్కార్యమీవాకిలిన్
    ధీమంతుం డఖిలజ్ఞుఁ డేగవలయు నీబోంట్లకున్ శక్యమే ?

వాడిగణము - మిగుల జంఘాటముతో వచుచున్నావు. నీ వెవ్వఁడవు. నీవు సర్వజ్ఞుండవైతివేని యీ తలుపులు తెఱచి లోపలికి బొమ్ము. ఇతరులకు నీదారిని రా శక్యముగాదు.

శంకరాచార్యులు - నేను సకలవిద్యలలోఁ బరీక్ష నియ్యఁగలను నాకుఁ దెలియని దేమియునులేదు. ఎవ్వనికేదానియందుఁ బాటవమోయం దడుగవచ్చును.

కాణాదమతస్థులు - నీవు సమర్ధుండవైతివేని మా మతరహస్య మొక్కఁటడిగెదము చెప్పుము.

శంక - నిస్సంశయముగా నడుగవచ్చును.

కాణా - షడ్భావము లేవియో యెఱంగుదువా?

శంక — ద్రవ్యగుణకర్మ సామాన్య విశేషసమవాయము లారును షడ్భావములని మీమతమునఁ బేరు పెట్టుకొనిరి.

కాణా - సరియే. వినుము. సంయోగమును బొందిన పరమాణుద్వయము నుండి సూక్ష్మమైన యణుద్వయము గలిగినదనిగదా మామతము.

శంక - అగుఁ దఱువాత.

కాణా - ద్వ్యణుకాశ్రితమగు నణుత్వ మేదిగలదో యది దేనివలన జనించు చున్నదో చెప్పుము.

శంక - చెప్పిననేమి.

కాణా -- నీవు సర్వజ్ఞుండవని యొప్పుకొనియెదము.

శంక - అట్లయిన వినుండు. పరమాణుద్వయనిష్టయైన ద్విత్వసంఖ్యయై ద్వ్యణకగతమైన యణుత్వమునకుఁ గారణమగుచున్నది.

కాణా — నీవు సర్వజ్ఞుండవౌదువు. నీకు నమస్కారము. నీవీ పీఠ మధిష్టింప సమర్దుండవే.

అని కాణాదులు తొలంగినంత నైయాయికు లడ్డమువచ్చి - నీవు సర్వజ్ఞుండవని యొప్పుకొని యెదము.

కాణా — దమమతముకన్న గౌతమమతమునంగల ముక్తివిశేష మెట్టిదో చెప్పుము.

శంక - ఇదియేనా చెప్పవలసినది వినుండు. గుణసంబంధ మత్యంతనాశమగుచుండు నాకాశమువలె నొప్పుచున్నస్థితి యేదిగలదో యదియే ముక్తియని కాణాద మతసిద్ధాంతము. ఆ స్థితియానంద సంవిత్తుతో గూడుకొనుట ము క్తియని గౌతమమతస్థులు చెప్పుచుందురు. ఇదియే భేదము.

నైయా — పదార్థభేదము లెట్టివి ?

శంక - కణాదమతమున ద్రవ్యగుణకర్మసామాన్యవిశేష సమవాయా భావములనిసదార్థములేని సువిధములు గౌతమపక్షమందు బదార్థములు ప్రమాణా ప్రమేయ సంశయబ్రయోజనదృష్టాంత సిద్ధాతావయవతజర్క విణత్ యవాదిజల్ప వితండా హేత్వభాసుచ్చలజాతి నిగ్రహములని పదారువిధముల నొప్పుచుండును. తత్వజ్ఞానమువలన మోక్షము గలుగుననియు గణాదమతంబునంబోలె నీశ్వరుండు సర్వజగన్నిమిత్తకారభూతుండనియు గౌతమమతంబునను చెప్పబడియున్నది.

నైయాలు — స్వామీ ? నీవు శారదాపీఠారోహణ సమర్ధుండవని మేమొప్పుకుంటిమని గౌతమమతస్థులు తొలంగినంతఁ గపిలమతస్థు లడ్డమువచ్చి నిలునిలు మా మాటలకు నుత్తరము చెప్పి యరుగుము.

శం — మీరేమి యడిగెదరు.

సాంఖ్యులు — వినుము మూలప్రకృతి స్వతంత్రురాలై జగత్కారణమగు చున్నదా! లేక చిదధిష్ఠితజగత్కారణమా ! చెప్పుము.

శం — ఆమూల, ప్రకృతియే సత్వరజస్తమోచి దత్రిగుణాత్మకయై బహురూపభాగినియై స్వతంత్రురా లగుచున్నదని కాపిలమత సిద్ధాంతము కాని వేదాంతపక్షమందీమూలప్రకృతి యస్వతంత్రురాలని చెప్పఁబడియున్నది.

సాంఖ్యులు — భవదీయ ప్రజ్ఞాప్రభావంబు లచ్చెరువు గొల్పెడిని నీ యిచ్చ వచ్చిన ట్లరుగుము. అని సాంఖ్యులు మరలినంత బాహ్యార్ధ విజ్ఞానశూన్యులై వాదములు గావింపుచు సౌత్రాంతికవైభాషి యోగాచార్య మాధ్యమిక మతావలంబనులగు బౌద్ధు లడ్డమువచ్చి యోహో ! మాకు సదుత్తరములిచ్చి యరుగుము. నిన్నూరక పోనిచ్చు వారము కాము. వారివీరింబలె మమ్ముదాటిపోవ నీకు శక్యమా.

శం — వృధాప్రలాపములతోఁ బనిలేదు మీరడుగవలసిన యర్ధములేవియో యడుగుడు.

బౌద్ధులు - బాహ్యార్ధ మెన్నివిధములు.

శం — రెండువిధములు పౌత్రాంతికమనియు వైభాషికమనియు.

బౌ — దానికిఁగల తారతమ్యమేమి.

శం — సౌత్రాంత్రికమతంబున వేద్యజాతమంతయు ననుమాన గమ్యముగాఁ జెప్పఁబడియున్నది. వైభాషికమతంబునఁ బ్రత్యక్ష గమ్యముగాఁ జెప్పిబడియున్నది. రెంటిబదార్ధములకు క్షణభంగురత్వము సమానమే. రెంటికిని ననుమాన గమ్యత్వాక్ష గమ్యత్వారూపమయిన భేదము గలిగియున్నది.

బౌ — మా విజ్ఞానమునకును వేదాంతవాదుల విజ్ఞానమునకును భేదమేమి యున్నదో చెప్పుము.

శంక — విజ్ఞానమునకును క్షణికత్వము బహుత్వము కలవని మీలో విజ్ఞాన వాదులు చెప్పుదురు. వేదాంతులు స్థిరమయిన జ్ఞానమొక్కటియేయని చెప్పుదు రిదియే భేదము.

అని యీరీతి సర్వశాస్త్రములయందును సర్వమతంబులయందును గిన సదుత్తరములిచ్చినంత నందున్న వారెల్ల నయ్యాచార్యుం బూజించి, మహాత్మా ! నీకు సాటియెవ్వరును లేరు. సర్వమతములు నీకే తెలియును. నీయెరుంగనిది యొక్కటిని లేదు. సర్వజ్ఞుండను విరుదు నీకొక్కనికే చెల్లును. ఈశారదాపీఠకమెక్క నీవొక్కండివే సమర్ధుండవని యనేక ప్రకారముల స్తోత్రములుచేయుచు వాదులందరు తొలంగినంత నమ్మహాత్ముండు శిష్యులెల్ల జయజయశబ్దములు గావింపుచుండ మరియు -

సీ. చిత్రభానుండాత పత్రంబు వహియింపఁ
          దోటకుండలరి పాదుకలువట్ట
    మోదమొప్పవిరించి పాదభానుమరీచు
          లిరుగడఁజారు చామరములిడగ
    నానందగిరి యుశుద్దాత్ముండు క్షేత్రము
         ల్భట్టిముందరబరా బరులు సేయ
    కృష్ణదర్శన శుద్ద కీర్తులు తోరట
         దండముల్బూని చెంతలనటింప.

గీ. చిద్విలాసాది శిష్యప్రశిష్యకోటి
   యనుసరింపఁగ జయజయ ధ్వనులతోడఁ
   బద్మపాదునికైదండఁ బట్టికొనుచుఁ
   గదలె యతినేత శారదా సదనమునకు.

క. ఆరీతిభద్రపీఠం
   బారోహణమాచరింప దరుగంగఁగని యా
   శారద యిట్లనిపలికె శ
   రీర విహీనో క్తినతిప రిన్పుటలీలన్.

సంయమీంద్రా ! నీవు పూర్వమే సర్వవిద్యలయందును పరీక్షింపఁబడితివి. నీయందు సర్వజ్ఞిత్వము పరిపూర్ణముగానున్నది. లేకున్న విరించి రూపాంతరుండగు మండనమిశ్రుండు నీకుశిష్యుం డెట్లగును? అది యట్లుండనిమ్ము. ఏతత్పీఠాధిరోహణమునకు సర్వజ్ఞత్వమె ప్రధానముకాదు నినుమాత్మశుద్ధియుం గావలసియున్నది. అది నీ యందుఁ గలదో లేదో క్షణకాలము విచారించుకొని పీఠమెక్కుము.

నీవు యతిధర్మనిష్ఠుండవయ్యు గామకలారహస్య గ్రహణమునకయి యంగ నాశతముతో గ్రీడించితివి. యాకళంకమును మరచి యిపుడీ సింహాసనమెక్కుట కుద్యోగపడుచుంటివి. చాలుచాలు నిలునిలుమని పలికిన విని యెల్లరు నద్భుతపడిరి. అప్పుడు శంకరాచార్యులు అంబా ! నేను జనించినదివోలె నీశరీరముచేత నట్టికిల్బిష మేమియుఁ జేయలేదని నిశ్చయముగాఁ జెప్పఁగలను. దేహాంతరము సంశ్రయమున గావించిన క్రీడాకళంకము దీనినేలయంటెడినిఁ అది మరియొక శరీరము కాదా ? చిత్తవికారంబున బాపంబు దీనికి సంక్రమించునంటివేని అట్టి వికారము నా మదికి లేదుగదా ? కావునందదంగనా సంగమ కళంకము నాకు దోషమునకుగాదని శాస్త్రప్రమాణము జూపగలను. ఇప్పుడేమి చెప్పెదవని యడిగిన విని యప్పలుకు వెలంది సమ్మతించినటుల ప్రశంసింపుచు నేమియు బలుకక యూరకుండెను.

అటుల సరస్వతియు బండితులును గొనియాడుచు బీఠారోహమున కంగీకరించి రంత శంకరాచార్యులు వినోదముగ సర్వజ్ఞపీఠారోహణము గావించి గార్జ్యచేతను కహోలప్రముఖులగు మునులచేత గొనియాడబడిన యాజ్ఞవల్క్యుండుబోలె మిక్కిలి విరాజిల్లె. నట్టిసమయంబున -

క. గురునాధు శిరముపైని
   ర్జరవరులంబరమునుండి సంతానసుమో
   త్కరవర్షంబులు గురిపిం
   చిరి దుందుభిరవములపుడు చెల్వుగ మ్రోయన్.

అటుల శంకరాచార్యులు స్వాభిమానమునకుగాక స్వమతాధిక్యతకొరకు సర్వజ్ఞ పీఠం బధిష్టించి యందు గొన్ని దినంబులుండి తన శిష్యులలో నొకనిని తత్పీఠాధికారిగా నొనరించి యచ్చటనుండి బదరికారణ్యమునకు జనియెను.

క. చని యయ్యతిపతి బదరీ
   వనమున దపమాచరించు బ్రహ్మర్షులకున్
   దనసూత్రభాష్యమల్లన
   వినిపించుచు గొన్నినాళ్ళు వేగించెనటన్.

గీ ఆపదుద్ధారక మఘ సంహారకంబు
   తాపవారక మర్థి మందారకంబు
   జేరె జనితారకంబు కేదారకంబు
   శిష్యసంయుక్తుడై యతిశేఖరుండు.

మ. అతిశీతంబున నార్తినొందుచుఁ దదీయచ్ఛాత్రులచ్చో సహా
     యతివర్యా! చలి నిల్వలేమిచట దేహంబు ల్వణకెం బ్రతీ
     కతతుల్ముద్ధగుచున్న విప్పుడయయో! కావంగదే శీత బా
     ధితులన్మమ్ము దయానిధీ! యనుచుఁ బ్రార్థింపంగృపార్థాత్ముఁడై.

క. సకల జగదీశుశిశు చం
   ద్రకలా శేఖరు భజించి తద్ధరనా తీ
   ర్థకర ప్రముంఖుడుష్ణో
   దకముం బ్రార్థించే శిష్య తతిరక్షింపన్.

గీ. చంద్రధరుఁ డాత్మపదవారిజములనుండి
   కలుగఁజేసెను తప్తోదక స్రవంతి
   బరగఁ జాటింపుచున్న దిప్పటికి గురుని
   మహిమనటదప్తతో యయన్ లహరియొకటి.

తచ్ఛిష్యులెల్ల దప్తోదకంనది గృతావగాహులయి శీతబాధం బొరయక కృతకృత్యులయి జగద్గురు ననేక ప్రకారములు నగ్గించిరటుల శంకరయతి సార్వభౌముండు ముప్పది రెండేడులలో బుడమియంతయుం గృమ్మరి కుమతవాదులనోడించి యద్వైత జ్ఞానరత్నంబు లెల్లడ వెదజల్లి సుజ్ఞానప్రతిబోధకములగు ప్రబంధములు వేనవేలు రచించి సురేశపద్మపాదహస్తామలక తోటకాచార్యుల నలువురు నాలుగు దెసలం బొలుపొందు శృంగేరి ప్రముఖ మఠంబుల బీఠాధిపతులుగ నొనరించి కృతార్ధుండయి కేదారంబున మహామునులతో గొన్ని దినములు సద్గోష్టి గాలక్షేపము జేయుచుండె. మరియు

గీ. స్వహితపరుడుగాక సన్యాసియై చిన్న
   తనమునందె సర్వ ధనమువిడచి
   దెసలదిరిగి జ్ఞానరసము నిండించిన
   యతడు దేవుడనుట యబ్బురంబె.

సీ. కావించెఁగైవల్య ఘంటాపదములైన
         భాషాదిభూరి ప్రబంధములను
    వెలయించె నద్వైత విద్యావినూత్న మా
         ర్గంబుర్వినిష్కంటకంబుగాగ
    స్థాపించె బుడమి నష్టాదశ పీఠంబు
         లందాదిశక్తుల బొందుపడఁగ
    వాదించెబౌద్ద చార్వాకాదికుమత వా
        దులదోడ దుష్క్రియల్ దొలఁగునట్లు

గీ. కీర్తిమీరఁగ నద్భుత క్రీడితముల
   వెరగుపడఁజేసి దిక్కులఁ పరమ బోధ
   నాప్తులఁ గృతార్థులుగజేసె యతికినింక
   జేయఁ దగినట్టి పనులేమొ చెప్పరయ్య.

అట్లు ధ్వాత్రింశత్సంవరంబులు పరిపూర్తినొందిన యనంతరంబ.

చ. హరి పరమేష్టి నాకవిభుఁ డాదిగగల్గు సమస్తదేవతా
    వరులు వియచ్చరుల్ ప్రమధ వారము సిద్ధులువచ్చి యప్పు డం
    బరమురురత్న కాంచన విమానపరిష్కృతమై యొసంగ నిఁ
    ర్జరతరుపుష్పవృష్టి బెలుచం గురిపించుచుఁ బల్కిరల్లనన్.

ఉ. ఓపరమేశ! నీవు భువనోదయహేతుఁడ వాదిమూర్తి వీ
    వేపనికై ధరియిత్రి నుదయించితివో యదితీరె నింక రా
    వే? పరితోష మొప్ప భవదీయ జగంబు నలంకరింపవే
    తాపసవంద్య! మాకుఁబ్రమదం బొనరింపవె తొంటిరూపునన్.

క. అనివేల్పులు ప్రార్థించిన
   విని యతి నిజ భువనమునకు విచ్చేయఁదలం
   చినయంతఁ జెంతనిలచెన్
   దనవృషభము పార్శ్వభూషిత ప్రమదంబై.

శా. ఇంద్రోపేంద్ర డిగింద్ర ముఖ్యసురులెంతే భ క్తినగ్గింపగా
    సాంద్రంబై దివిదేవయాన చయముల్సమ్మర్దముం జేయ ఋ
    క్షేంద్రంబల్లన నెక్కిశంకరుఁడు వాణీశుండు గేలీ యోయ
    గింద్రుల్ గొల్వఁగజేరె రాజితమహీధ్రేద్రంబు పూర్వాకృతిన్.

సీ. మంగళంబద్రిజా మహిళాకు చాలిప్త
            వరచందనాంచిత వక్షునకును
    జయమంగళము నసుర వోటి కిరీట
            ఘనమణీరుచిరాఘ్రి కమలునకును
    శుభమంగళము బాలశుభ్రభానుకళా వి
            శోభితపటుజటా జూటునకును
    వరమంగళమురూప్య ధరహారడి డీర
            ఘనసారవరశుభ్ర గాత్రునకును.

గీ. భవ్యమంగళమఖిల తాపస సమాజ
   మానసాంభోరుహసహస్ర భానునకును
   దివ్యమంగళమమల భూతిస్పురత్స
   మగ్రమూర్తికిఁ గర్పూర మంగళంబు.

అని యెరింగించి మణిసిద్దుం డప్పుడు వేళయతిక్రమించుటయు గథ జెప్పుట చాలించి పరమానందకందళిత హృదయారవిందుండైయున్న శిష్యునితో గూడం గ్రమంబున నవ్వలిమజిలీ జేరెను.

ఇది శ్రీమధిర సుబ్బనదీక్షతకవి రచితమైన కాశీయాత్రా

చరిత్రమను మహాప్రబంధమున శంకరాచార్యచరిత్రము

సప్తమోల్లాసము సంపూర్ణము

శ్రీశ్రీశ్రీ